ఉత్తమ నటనకు చిరునామా – ఓం పురీ

  

ఓం పురీ  వెళ్ళిపోయాడు.

66 ఏళ్ల వయసుకే కొంపమునిగిపోయినట్టు ప్రపంచాన్ని వదిలి వెళ్ళిపోయాడు. గుండెపోటు… ఒంటరిగా తన అపార్ట్ మెంట్ లో మరణం.

ఓం పురీ నటనలో ఊసరవెల్లి లాంటివాడు.

అనంత్ వేలంకర్ గా (అర్థ సత్య)… ఉన్నాడు.  హరి మండల్ (ఆరోహణ్) గా అబూ మియా గా (మిర్చ్ మసాలా) ఉన్నాడు. అహుజా గా (జానే భీదో యారో) ఉన్నాడు. దుఖీ గా (సద్గతి), భిక్కూ గా(ఆక్రోశ్) ఉన్నాడు. దుర్యోధనుడు, రాజరాజ చోళుడు ఇంకా ఎందరెందరో చారిత్రక పురుషులు (భారత్ ఎక్ ఖోజ్) గా ఉన్నాడు.  నాథూ (తమస్ టీవీ ఫిల్మ్) గా ఉన్నాడు. ఇంకెన్నో సినిమాల్లో ఎందరెందరుగానో ఉండిపోయాడు.   ‘భారత్ ఎక్ ఖోజ్’ లో తన నిండైనగొంతుతో అతనిచ్చిన కామెంటరీ మరపురానిది.

ఎందరెందరి వ్యక్తిత్వాలలోనో తనని తాను లీనం చేసుకుని, ఆ కష్టాలూ అనుభవాలూ తనవి చేసేసుకుని సినిమాల్లో ఆవిష్కరించాడు. ‘Method Acting’ నుంచి తరచి చూశాడు.  Method Actors నటించరు. పాత్రలోకి ప్రవేశం చేసి, ఆటుపోట్లన్నీ అనుభవిస్తారని సాధారణంగా అనుకునే మాట.

“ముంబైకీ ఫిల్మ్ ఫీల్డ్ కు తనను బలవంతం చేసి రప్పించినందుకు  నాకే ఆ క్రెడిట్ ఇచ్చాడు. అది నాకు బాగానే ఉందిగానీ నిజానికి తనని ఎవరూ తీసుకు రావక్కర్లేదు. స్టేట్ బాంక్ ఆఫ్ పాటియాలా లో పని చేస్తూ ఉండిపోయినా సరే, సినిమాలు అతన్ని వెదుక్కుంటూ వచ్చేవి” – నసీరుద్దీన్ షా.

నేషనల్ స్కూల్ ఆఫ్ డ్రామాలో ఉన్నప్పుడు షా కొంచెం అల్లరిగా ఉంటూ నటనను తేలిగ్గా తీసుకునేవాడట. శ్రద్ధగా నేర్చుకోవటం మీదే దృష్టిపెట్టే ఓం పురీ ని చూస్తుంటే తమాషాగా ఉండేదట.  ఒకసారి అక్కడ ‘కబుకీ’ నాటకం వేస్తున్నారని తెలిసి తానూ అందులో వేద్దామని ఉత్సాహపడ్డాడట. కానీ తనకు అవకాశం రాలేదు. ‘ఇబరాగి’ అనే ఆ కబుకీ ప్లే లో జపాన్ యోధుడిగా ఓం పురీని చూశాక  అతని మీద ఉన్న ఈర్ష్య పోయి, ఆరాధించే స్థాయికి వచ్చానని చెప్తాడు. స్కూల్ ఆఫ్ డ్రామాలో వేసిన తన నాటకాలు ఏవీ ‘ఇబరాగి’ లో ‘ఓం’ చేసిన అభినయానికి కనీసం దగ్గరగా కూడా రాలేకపోయాయని ‘షా’ తన ఆత్మకథ ‘And Then One Day – A Memoir లో  చెప్తాడు.

ఓం పురీ బిడియస్తుడు.

Method Actors, సున్నితమైన వ్యక్తిత్వం ఉన్నవాళ్ళు అందరి జీవితాలూ జీవిస్తూ, వాటిని తట్టుకుంటూ బయటపడాలంటే తప్పనిసరిగా కుటుంబంతో ఉండాల్సిన అవసరం ఉందేమో.  కానీ అతని కుటుంబజీవితం సరిగ్గా లేదు.

జర్నలిస్ట్ నందితా ను పెళ్లి చేసుకున్నాడు. వీళ్ళిద్దరికీ ఒక కొడుకు. నందిత ఓంపురి జీవితకథను రాసింది. తనగురించి ఏవేవో రాసేసిందని బాధపడిపోయాడు. అవసరం లేదు. నసీరుద్దీన్ షా లాగా బతుకు పుస్తకాన్ని తెరిచిపెట్టి, తనను చూసి తాను హాయిగా నవ్వుకోనూ వచ్చు. నవ్వుకోలేదు. బాధపడి పోయాడు. నందితతో విడిపోయి మూడేళ్ళయింది.

ఓం పురీ ధైర్యస్తుడు.

స్ఫోటకం మచ్చలతో పీలగా ఉన్న తను,  చెయ్యీ కాలూ సరిగ్గా ఎలా కదపాలో తెలియకపోయినా మంచి రూపాలే పెట్టుబడిగా సినిమాల్లోకి దిగిన హీరోల పక్కన బతకగలనని అనుకోవటానికి ఎంత ధైర్యం ఉండాలి!  ఎన్. ఎస్. డీ లో మంచి పేరు తెచ్చుకున్నా,  మధ్యమ స్థాయిలో ఉన్న చక్కటి స్వరం ఉన్నా, రూపం కారణంగా ఫిల్మ్ ఇన్స్టిట్యూట్ లో ఇతనికి నటన విభాగంలో చేరటం కష్టమైంది. గిరీష్ కర్నాడ్ జోక్యంతో సీట్ వచ్చింది.  ఇంతగా నటన ఊపిరైపోయిన ఈ పంజాబీ కుర్రాడికి రెండు ప్రిమియర్ ఫిల్మ్ స్కూల్స్ (నేషనల్ స్కూల్ ఆఫ్ డ్రామా, పూణే ఫిల్మ్ ఇన్స్టిట్యూట్) చుట్టివస్తే గానీ నటనలు నేర్చే దాహం తీరలేదు. నేర్చిన నటనకు సార్ధకతను ఇవ్వటానికి అదృష్టంకొద్దీ  సమాంతర సినిమా అనే మంచి చోటు దొరికింది.  ఆ సినిమాలవి అసలే కుదించుకున్న బడ్జెట్ లు. ఏవో కొంచెం డబ్బులు పారేసి (ఇది ఓం పురీ చెప్పిన మాటే)  తనను ఆ సినిమాల్లో వేయమంటే వేసి, ఏం తింటున్నాడో ఏం తాగుతున్నాడో ఎలా బతుకుతున్నాడో లెక్క చెయ్యకుండా గడిపిన కాలంలో మెచ్చుకోళ్ళూ అవార్డులే ముందుకు నడిపించాయి.  హాలీవుడ్ లో అడుగుపెట్టాకే  సంపాదన బాగా పెరిగింది.

ఓం పురీ ధైర్యం, ఆత్మవిశ్వాసం, నేర్చుకునే శక్తి తనకు అబ్బురంగా అనిపించేవని అంటాడు మిత్రుడు నసీరుద్దీన్ షా. స్మితా షబానాల లాగే నసీర్ ఓం పురీల పేర్లు విడదీయలేనివి. నటనలో స్పర్ధతో పాటు ఆకలినీ ఆనందాలనూ కలిసి పంచుకున్న మిత్రులు ఇద్దరూ.

 

ఓం పురీ  ఒక అనంత్ వేలంకర్ 

హిందీ సినిమాలో అప్పట్లో Angry Youngman మూసనొక దాన్ని చేసి సలీం జావేద్ లు అమితాబ్ బచ్చన్ కు తొడిగారు. కానీ అసలైన Angry Youngman ఎలా ఉంటాడో ఎలాంటి పరిస్థితుల్లో తయారౌతాడో మొదటిసారి చూపించాడు గోవింద్ నిహలానీ ‘అర్థ సత్య’లో. జనం బాగా చూసిన సినిమా అది.  అనంత్ వేలంకర్ ఒక పోలీస్ కొడుకు. పీలగా బలహీనంగా ఉన్న అతని తల్లిని బలిష్టంగా ఉన్న తండ్రి కొడుతుంటాడు. కొడుకును కూడా పోలీస్ ఫోర్స్ లో చేరమని బలవంతం చేస్తాడు. సబ్ ఇన్స్పెక్టర్ అయిన అనంత్ తండ్రి లాగ తను జీవితంలో ఎప్పుడూ ఎవరిమీదా జులుం ప్రదర్శించకూడదని అనుకుంటాడు. అందులో చేరిన ప్రతి ఒక్కరినీ ముందు మొరటుగా మార్చిపడేసే పోలీస్ డిపార్ట్మెంట్ బలం ముందు అనంత్ ఎంతపాటి వాడు?

 

“చక్రవ్యూహంలోకి అడుగు పెట్టకముందు నేనెవరిని?ఎలా ఉండేవాడిని?

గుర్తేలేదు.

దానిలోకి వెళ్ళేకగానీ దానికీ నాకూ ప్రాణం తీసేంత దగ్గరితనం ఉందని తెలియనేలేదు.

ఈ చక్రవ్యూహంలోంచి బయటపడితేనే నేను విముక్తుడినౌతాను.

అయితేమాత్రం? చక్రవ్యూహ రచనలో ఏం తేడా వస్తుంది గనుక?”

ఇదీ అనంత్ వేలంకర్ అస్తిత్వ వేదన.

ఓం పురీ అనంత్ వేలంకర్నీ అతని వేదననూ తనమీదికి ఆవాహన చేసుకున్నాడు.

ఎన్నో సినిమాల్లో, టీవీ ఫిల్మ్స్ లో, వేరే దేశాల సినిమాలూ టీవీలలో నటించి మెప్పించాడు. నాటక రంగాన్ని ఎంతో ప్రేమించాడు. తెలుగులో కూడా ‘అంకురం’ సినిమాలో అతను వేసిన ‘సత్యం’ రోల్ చాలామందికి గుర్తుండే వుంటుంది.  ఏ పాత్రలో వేసినా అది ఏ ప్రాంతానికి సంబంధించినదైనా ఏ భాషా చిత్రమైనా, అక్కడి సాంస్కృతిక నేపధ్యానికి అనుగుణంగా అన్నీ కూలంకషంగా తెలుసుకుని నటించేవాడు.  పోచంపల్లి నేతపనివాళ్ళ మీద శ్యాంబెనెగల్ తీసిన ‘సుస్మన్’ లో నేతగాడుగా ఆవిర్భవించాడు. అప్పట్లో నేతపని నేర్చేసుకుని మరీ నటించాడు. అవన్నీ ఒకెత్తు. ‘అర్థసత్య’ ఒకెత్తు. చిన్నపాత్ర వేసినా ప్రధానపాత్రలో కనిపించినా, వాటికి ప్రత్యేకమైన గుర్తింపు వచ్చేలా నటించాడు.

తానెంతో ప్రేమించిన నటనతో కలిసి చివరిదాకా నడిచాడు కానీ అర్థాంతరంగా జీవితనాటకం నుంచి నిష్క్రమించాడు ఓం పురీ.

–ల.లి.త.

 

 

వాగర్థాలు కలిసి మురిసిన మురళి!

mangalam

ఆయన  తల్లి గారి పేరు సూర్యకాంతమ్మ గారు.  కృతుల సంకలనానికి ఉంచిన పేరు ‘ సూర్య కాంతి ‘ . ఆయన మాత్రం చల్లని వారు –  మేలుకొలుపులు పాడినప్పుడూ వెన్నెట్లోకి రమ్మన్నట్లే ఉంటుంది. చూడలేక కళ్ళు చిట్లించుకోవలసినది అందులో ఏవేళ లోనూ లేదు.  అమ్మ ఒళ్ళో కూర్చున్న పిల్లాడు ” దా ! దా ! ” అన్నట్లు. అమ్మ ఆయన కి సొంతం కనుక మనందరినీ అలాగే చూస్తుందనే పసి నమ్మిక అది – నిజమెందుకు కాదు ,  ఆయన ఉండగా. అరటి పండు ఒలిచిపెట్టిన వెండిపళ్ళెం మనకే.

  అపండితులకూ ” ఆహా , సంగీతం వింటున్నామ ” న్న గర్వాన్ని ఆయన సృష్టిస్తారు.  ప్రాసాదాల నడవా లలోకీ  సాదా పెంకుటిళ్ళ  పంచల లోకీ ఒక్కలాగే  కురిసిన చంద్రిక ఆయన పాట. అరుదుగా –  సమయా సమయాలున్నాయేమో కాని వృద్ధి క్షయాలు లేవు.

ఎటువంటి సంగీతజ్ఞానమూ లేని మాడ్రైవర్ ,  పాతిక ముప్ఫై ఏళ్ళ యువకుడు – రోజూ కార్ లో వినబడే రామదాసు కీర్తనలని వినీ వినీ గొంతు కలపేసేవాడు. వినకుండా  ఉండలేకపోయేవాడు. ఆ పని   మరింకొక విద్వాంసుల వలన కాదు ,  నాకు తెలియదు. తన స్వరూప స్వభావాలనేమీ మార్చుకోకుండానే వసంతం తరలి వచ్చింది .   దిగి రాలేదు. ఆ పైన నువ్వు అందిస్తే నీ చేయి పుచ్చుకుని తీసుకుపోతుంది – మరింకా వేర్వేరు చోట్లకి. నాతో సహా ఇంకెంతెంత మందికో మంగళంపల్లి బాలమురళీకృష్ణ గారు చేసిపెట్టిన ఉపకారం అది.

  ఖంగున మోగే గొంతులూ సర్కస్ చేసే  పాటలూ తెలుగువారికి ఇష్టం . చలం గారెన్నడో అని ఉన్నట్లు , కష్టమైన సంగతుల విన్యాసానికి  మాత్రమే చప్పట్లు కొట్టే మోటుతనం మనది. సహజ ప్రశాంతమైన మాధుర్యం చప్పున లాగదు  . అటువంటి గుండెల్లోకీ చొరబడగలగటం ఆయనకి చేతనయిన ఒక విద్దె. సంగీతాన్ని దాని అన్ని రూపాలలోనూ ఆయన కౌగలించుకోగలరు , సినిమా పాటలతో సహా. దేన్నీ చిన్నబుచ్చగలిగే నిర్దయ అక్కడ ఉండే అవకాశం లేదు.

ఈ వైపునుంచి  –  సమస్త  ప్రపంచం లోని అన్ని విధాలైన పద్ధతులనూ కర్ణాటక సంగీతం తనలో ఎలాగ ఇముడ్చుకోగలదో చేసి చూపించిన పని అది. మీరూ నేనూ మాట్లాడుకునే మాటలకీ స్వరాల ఆధారాన్ని ఇవ్వగలరు . లయ సమంగా ఉందో లేదో తేల్చగలరు.  నాదం , దాని వెనుక శబ్దం – అది సర్వవ్యాప్తమైన ఆకాశలక్షణం గా చెప్పబడే భారతీయత – మన కాలానికి ఎంచుకొని ధరించిన రూపమది , ఇంతకాలమూ. భాష తెలియనివారికీ భావమేదో స్ఫురించేలాగా , తెలిసినవారికి తెలిసివచ్చేలాగా – వాగర్థాలు కలిసి ఉండటానికి బ్రహ్మాండమైన నమూనా  .

  అరే, అదేమి నవ్వు , అదెంతటి ఉల్లాసం !!! స్మితమో మందహాసమో మొహాన కనిపించకుండా పాడటం ఎప్పుడన్నా ఉందా ? ఒక కొత్త కల్పనను వేదిక మీద అప్పటికప్పుడు చేశాక వచ్చే దరహాసం- ఆ   బంగారపు జరీ అంచుల తళతళ…  ఎవరన్నా పలకరించి మాట్లాడినా ఆహ్లాదమే తిరిగి వచ్చేది. ఇంకొందరు ఉన్నతులలో లాగే ఆ హాస్య స్ఫూర్తి  ” అబ్బే. తూచ్ ! ఇందులో ఏమీ లేద ” నే ఎరుక. మనుషుల పైన అనురాగం ప్రతి చేత లోనూ కవళిక లోనూ చిందిపోవటం అదొక దివ్యమైన బహూకృతి – ఆయనకూ మనకూ. బహుశా కళ మనిషిలో లీనమైతే రాగల బహిఃఫలం.

ఉత్సాహం పోకుండా, ఫిర్యాదులు రాకుండా –  అంతా తెలిసిందనీ లక్ష్యాలు లేవనీ అనకుండా – అది గొప్ప పుట్టుక !

” మా రోజుల్లో అయితేనా ..” అన్న మాటలు రాలేదు కడదాకా.

వినా దైన్యేన జీవనం.

   ఏ వ్యక్తిగత పరిచయమూ లేని ఎన్నో లక్షల మందికి ఆయన తమవాడు – నాకూనూ.  రోజూ చూడని వాడైనా మళ్ళీ కనిపించని బాధ అందరిదీ , నాది కూడా. మాట్లాడే అర్హత ఉందీ లేదూ కాదు – ఒక చంద్రుడు సమస్త జీవులకు తానొక్కొకడయి తోచును గనుక, నూలుపోగును  తప్ప ఇవ్వలేను గనుక.

     వేయికి పైనే పున్నములు గడిచినాయి గానీ చాలదు.  అద్దం లోనూ నీళ్ళలోనూ  పట్టి దాచుకున్నదే  చాలుతుండాలి ఇక మీదట .  

      అంతే.  

          *                                     

 

బ‌తుకుపాట‌ల జాడ‌..మ‌న గూడ‌

 

g1

                    -డా.ప‌సునూరి ర‌వీంద‌ర్‌

~

“నేను మీ చ‌ప్ప‌ట్ల కోసం పాడ‌టం లేదు

నేను మీ అభినంద‌న‌ల కోసమూ పాడ‌టం లేదు

నేను నా దేశ స్వాతంత్య్రం కోసం పాడుతున్నాను” అన్నాడు చీలీ దేశ ప్ర‌జాగాయ‌కుడు విక్ట‌ర్ జారా. స‌రిగ్గా అంత‌టి ప్ర‌జావాగ్గేయ‌కారుడు గూడా అంజ‌య్య‌. ప్ర‌జ‌ల‌కు విముక్తి క‌లిగించే ఉద్య‌మాల‌కోసం పాట‌ల ప‌హారా కాసిన క‌న్ను గూడ అంజ‌య్య‌. తెలుగు స‌మాజానికి సుప‌రిచ‌త‌మైన ప్ర‌జార‌చ‌యిత‌ గూడ అంజ‌య్య‌. ఆయ‌న పాట‌ల‌న్ని గురిచూసి గుండెల్ని తాకే చూపున్న పాట‌లు. ఆయ‌న పాట పాడుతున్నా, వింటున్న ఈ దేశంలో తిండి, బ‌ట్ట‌, నీడ‌కు అల్లాడే పేద‌ల దుఃఖం ఒక దృశ్య‌కావ్య‌మై మ‌న‌ల్ని క‌దిలిస్తది. రోమాలు నిక్క‌బొడుచుకునేలా చేసే నెత్తుర‌సొంటి శ‌క్తి అంజ‌న్న పాట‌ల‌ది. అవి ఉద్య‌మాల్ని ర‌గిలించి మండించి, పేద ప్ర‌జ‌ల వేద‌న‌ల్ని, అంట‌రానివాళ్ల సంవేద‌న‌ల్ని అర్థం చేయిస్తాయి. దోపిడి కోట‌ల్ని కూల్చ‌డానికి, బ‌డుగుజీవుల‌కు స‌రికొత్త శ‌క్తిని నూరిపోస్తాయి.

 

పాట రాయాలంటే, మిగిలిన ర‌చ‌యిత‌ల లాగ ఆయ‌న పుస్త‌కాల్లోకి తొంగిచూడ‌డు. ప్ర‌జ‌ల మ‌ధ్య‌లోకి పోయి, వారితో మాట్లాడి, వారి బాధ‌ల‌ను ప‌ల్ల‌వులుగా, వారి క‌ష్టాల‌ను చ‌ర‌ణాలుగా మ‌లుస్తాడు. అందుకే గూడా అంజ‌య్య పాట‌లు మ‌న‌లో ఒక తాత్విక చ‌ర్చ‌ను రేపుతాయి. అల‌తి అల‌తి ప‌దాల‌తో బ‌తుకును స‌జీవంగా కండ్ల‌ముందుంచ‌డం, ఆ జీవితాలు అలా ఎందుకు అయ్యాయో విడ‌మ‌రిచి చెప్ప‌డం అత‌ని పాట‌ల ల‌క్ష‌ణం. అందుకే బ‌తుకును పాట‌ల‌కు ఒంపిన జాడ మ‌న గూడ‌.

 

నాలుగు ద‌శాబ్దాలుగా తెలుగు నేల మీద అంజ‌య్య పాట‌లు ఉద్య‌మాల‌కు  ఊపిరిపోశాయి. ఒక్క ఉద్య‌మంలో పాల్గొంటేనో, ప‌నిచేస్తేనో ఒక మ‌నిషి జీవితకాలం పూర్త‌వుతుంది. కొన్నిసార్లు ఆ ఉద్య‌మం గ‌మ్యానికి చేరుకోక ముందే ఉద్య‌మ‌కారుడు అల‌సిపోవ‌డమో, అందులోనుండి నిష్క్ర‌మించ‌డమో జ‌రుగుతుంది. అలాంటిది గూడా అంజ‌య్య మాత్రం త‌న ప‌ద‌హార‌వ‌యేట‌నే విప్ల‌వోద్య‌మంలో అడుగు పెట్టి, అందులో అనేక పాట‌లు రాసి పాడి, ప్ర‌జ‌ల మ‌ధ్య, జీవితాన్ని ఆరంభించాడు. అలా విప్ల‌వోద్య‌మమే కాదు తెలుగునేల మీద పుట్టిన ద‌ళితోద్య‌మంలో త‌న వంతు పాత్ర‌ను పోషించాడు. రెండు ఉద్య‌మాల్లో ప‌నిచేసినా స‌రే త‌ను అల‌సి పోలేదు. ప్ర‌పంచం త‌ల‌తిప్పి చూసిన మ‌హ‌త్త‌ర తెలంగాణ ఉద్య‌మంలో కూడా త‌న‌దైన పాత్ర‌ను విజ‌య‌వంతంగా పోషించాడు. తెలంగాణ ప్ర‌జ‌ల విముక్తి కోసం కూడా సిద్ధ‌మై ప‌దునైన పాట‌ల‌నందించాడు. ఇలా అనేక ఉద్య‌మాల్లో ముందుండి ప‌నిచేసిన ఘ‌న‌త గూడ అంజ‌య్య‌దే.

 

నిత్యం పోరాటాల‌తో అల‌రారే తెలంగాణ నేల మీద అనేక మంది వాగ్గేయ‌కారుల‌న్నారు. వారంద‌రిలో గూడా అంజ‌య్య పాట‌ది ప్ర‌త్యేక‌మైన శైలి. ప్ర‌జ‌ల ప‌దాల‌తో పాట‌గ‌ట్టి, చ‌దువురాని మ‌ట్టిబిడ్డ‌ల‌కు సైతం క‌మ్యూనిజాన్ని అలవోక అర్థం చేయించింది. అలా పుట్టుకొచ్చిందే ఊరు మ‌న‌దిరా…ఈ వాడ మ‌న‌దిరా పాట‌. నిజానికి ఈ పాట క‌మ్యూనిస్టు మ్యానిఫెస్టో ఏం చెబుతున్న‌దో, స్థానిక ప‌రిస్థితుల‌కు సుల‌భంగా అన్వ‌యం చేశాడు అంజ‌య్య‌. ఉద్య‌మాల‌కు పాట‌ల‌ను అందించింది ద‌ళితులే. అలా ద‌ళితునిగా పుట్టిన అంజ‌య్య భార‌త‌దేశ గ్రామీణ స్వ‌రూపాన్ని స‌రిగా ప‌ట్టుకున్నాడు. ఊరిలో చాలా కులాలు శ్రామిక కులాలే. అగ్ర‌వ‌ర్ణాలే భూస్వాములుగా పెత్త‌నం చేస్తుండ‌డం అంజ‌య్య‌ను క‌ల‌వ‌ర ప‌ర‌చింది. విప్ల‌వోద్య‌మం ప్ర‌జ‌ల‌కు అర్థం కావాలంటే ఈ దోపిడిని విడ‌మ‌రిచి చెప్పాల‌ని భావించాడు. అందుకే ఊరు మ‌న‌దే, వాడా మ‌న‌దే…న‌డుమ దొరా ఏందిరో, వాని పీకుడేందిరో అని ఘాటుగానే నిల‌దీశాడు అంజ‌య్య‌. అదే ప్ర‌జ‌ల‌కు న‌చ్చింది. అది తెలంగాణ ప్ర‌జ‌ల్లో ర‌గులుతున్న భావ‌న‌. ఆ భావ‌న‌కు పాట‌రూప‌మిచ్చాడు అంజ‌య్య‌.

 

ఈ పాట విన్న మ‌ట్టిబిడ్డ‌లు ఇది నా పాటే. ఇది మా ఊరి చ‌రిత్రే అని ఓనే చేసుకున్నారు. ప్ర‌జ‌ల నాలుక‌ల మీద ఈ పాట ద‌శాబ్దాల కాలం న‌డ‌యాడింది. ఈ పాట‌లో అంజ‌య్య‌లోని ద‌ళిత‌త‌త్వం కూడా పాట‌కు మ‌రింత అద‌న‌పు అందాన్ని తెచ్చింది. అన్ని ప‌నుల కాడ ముందుండే ద‌ళితుల జీవితం ఎందుకిట్ల కూన‌రిల్లుతున్న‌ది. ఏ ప‌నిచేయ‌ని ప‌టేల్‌, ప‌ట్వారి దొర‌లు ఎలా కూర్చుండి తింటున్నార‌నే చ‌ర్చ‌ను ముందుకు తెచ్చింది.

గూడ అంజ‌య్య తొలిపాట “ఊరిడిసి నేబోదునా…అయ్యో ఉరిపెట్టుకొని స‌ద్దునా”.  ఈ పాట‌కూడా గ్రామాల్లో దొర‌ల దాష్టికాన్ని బ‌ట్ట‌బ‌య‌లు చేసింది. రైతుల‌కు అప్పులిచ్చి పంట‌లు జ‌ప్తు చేసే దొర‌ల దుర్మార్గాల‌కు బ‌లై, ఊరిడిసి వ‌ల‌స‌పోయే ఓ పేద‌రైతు బాధ‌ను పాటీక‌రించాడు అంజ‌య్య‌.

 

ఈ పాట‌లో రైతు బాధ‌ను ఉన్న‌ది ఉన్న‌ట్టుగా, త‌న‌ను ప‌ల‌క‌రిస్తే వ‌ల‌పోసే తీరును స‌రిగా ప‌ట్టుకున్నాడు ర‌చ‌యిత‌. అందుకే అప్పుతెచ్చిన మాట‌నిజ‌మే. అది వ‌డ్డీకి తెచ్చింది నిజ‌మే అంటాడు. ఈ పాట‌తో మొద‌లైన అంజ‌య్య ప్ర‌స్థానం విప్ల‌వోద్య‌మం మీదుగా ద‌ళిత‌, తెలంగాణ ఉద్య‌మాల‌ను చేరి మ‌రింత ప‌దునెక్కింది. గూడా అంజ‌య్య పాట‌ల్లో బాణీలు కఠినంగా ఉండ‌వు. సామాన్యుడు సైతం, కోర‌స్‌గా గొంతుక‌లిపే విధంగా ఉంటాయి. తెలంగాణ సాయుధ రైతాంగ పోరాటంలో ప్ర‌జ‌ల బాణీల‌ను తీసుకొని, ప్ర‌జా స‌మ‌స్య‌ల‌ను వ‌స్తువుగా జ‌త‌చేసిన  బండియాద‌గిరి, సుద్ధాల హ‌నుమంతుల‌కు వార‌సుడు గూడ అంజ‌య్య‌. అందుకే వారి బాట‌లోనే వారిలాగే ప్రాణ‌మున్న పాట‌ల‌ను ర‌చించాడు. పాట‌కు త‌గిన బాణి, భావానికి త‌గిన ప‌దాల పొందిక‌, అందులో అంజ‌య్య జాగ్ర‌త్త‌గా ఇమిడ్చే ప్ర‌జ‌ల నుడికారాలు, సామెత‌లు పాట‌ను శ‌క్తివంతంగా తీర్చిదిద్దుతాయి.

తొంభ‌య‌వ ద‌శ‌కంలో తెలుగునేల మీద ద‌ళితోద్య‌మం పుట్టింది. ఆ ఉద్య‌మంలో కూడా అంజ‌య్య ముందున‌డిచాడు.

 

“ద‌ళిత ర‌చ‌యిత‌ల క‌ళాకారుల మేధావుల ఐక్య‌వేదిక” ఏర్పాటుకు 1992లోనే పునాది వేశాడు. కంచిక‌చ‌ర్ల‌ల‌లో ద‌ళితుడైన కోటేశును స‌జీవ‌ద‌హ‌నం చేసిన‌పుడు అంజ‌య్య ఆ దారుణం మీద పాట రాశాడు. అప్ప‌టిదాకా పాట‌లు మాత్ర‌మే రాసిన అంజ‌య్య‌, ద‌ళితోద్య‌మంలో ప‌నిచేసే క్ర‌మంలోనే సాహిత్యంలోనే మిగిలిన ప్ర‌క్రియ‌ల వైపు మ‌ర‌లాడు. అంబేద్క‌రిజం ప‌రిచ‌య‌మ‌య్యాక అంజ‌న్న‌కు సాహిత్య ప్ర‌క్రియ‌ల‌తో మ‌రింత ప‌రిచ‌యం ఏర్ప‌డ్డ‌ది. ద‌ళిత‌క‌థ‌లు రాసి పుస్త‌కం వెలువ‌రించాడు. అలాగే “పొలిమేర‌లు” అనే న‌వ‌ల రాసి, తెలుగు విశ్వ‌విద్యాల‌యం చేత‌, ఆ యేటి ఉత్త‌మ న‌వ‌లగా అవార్డు కూడా అందుకున్నాడు. ఇది అంజ‌య్య‌లో మాత్ర‌మే ఉన్న ప్ర‌త్యేక ల‌క్ష‌ణం. వాగ్గేయ‌కారులంతా పాట‌ల ర‌చ‌న‌వ‌ర‌కే ప‌రిమిత‌మ‌వుతారు. అంజ‌య్య మాత్రం ఉద్య‌మ అవ‌స‌రాల్లో భాగంగా, ద‌ర‌క‌మే సాన్నిహిత్యంతో క‌థ‌కునిగా, న‌వ‌లాకారునిగా మారాడు.

 

తెలంగాణ ఉద్య‌మానికి పాటే ప్రాణం పోసింది. క‌నిపించ‌ని శ‌త్రువును, కాటేసే కుట్ర‌ల‌ను కండ్ల‌ముందుంచింది పాటే. తెలంగాణ ఉద్య‌మం అర‌వైతొమ్మిదిలో పాల‌కుల చేతిలో ద‌గాకాబ‌డి మ‌ళ్లీ 90ల త‌ర్వాత పుంజుకోవ‌డానికి పాటే ఆయుధంగా నిలిచింది. అలాంటి స‌మ‌యంలో గూడా అంజ‌య్య ర‌చించిన అనేక పాట‌లు తెలంగాణ ఉద్య‌మాన్ని ప‌ల్లెప‌ల్లెకు చేర్చాయి. “నా తెలంగాణ…న‌నుగ‌న్న నా త‌ల్లి నా తెలంగాణ” అంటూ పాట‌రాశాడు.  అది మొద‌లుగా తెలంగాణ ఉద్య‌మం కోసం అంజ‌న్న రాసిన పాట‌ల్లో పుడితె ఒక‌టి స‌త్తెరెండు రాజ‌న్న ఒరె రాజ‌న్న అన్న పాట సుమారు ద‌శాబ్దంన్న‌ర కాలం పాటు తెలంగాణ ప‌దిజిల్లాలో మార్మొగింది. ప్ర‌జ‌ల‌ను ఉర్రూత‌లూగించే ఈ పాట బాణీ, ఉద్య‌మానికి జ‌వ‌జీవాల‌నిచ్చింది.

 

అంజ‌న్న ఈ పాట‌లో ఉద‌హ‌రించిన ఊర్ల‌పేర్లు, వ్య‌క్తుల పేర్లు తెలంగాణ‌లో బాగా పాపుల‌ర్‌వే కావ‌డం మ‌రింత ప్ర‌జ‌ల‌ను ఆక‌ర్షించింది. ఈ పాట‌లో తెలంగాణ ఉద్య‌మానికి ఒక దిశానిర్ధేశం చేశాడు. తెలంగాణ రాదేమో అని నిరాశ చెందేవారికి గొప్ప ధైర్యాన్నిచ్చిండు. బ‌రిగీసి బ‌డితందుకోర రాజ‌న్న ఒరె రాజ‌న్న‌, తెలంగాణ రాకుంటె ఒట్టు రాజ‌న్న మా రాజ‌న్న అంటూ ఈ పోరాటం వృధాపోదు, తెలంగాణ వ‌చ్చి తీరుతుంద‌ని ధీమాను వ్య‌క్తం చేశాడు. ధూంధాం వేదిక‌ల మీద ఈ పాటొక ఫిరంగిలా పేలింది.

ఆక‌లిపోరాటం మాత్ర‌మే కాదు, తెలంగాణ ఉద్య‌మంలో ఆత్మ‌గౌర‌వ స‌మ‌స్య కూడా ఇమిడి ఉంది. అందుకే గూడ అంజ‌య్య పాట‌లో ఆ ఆరాటం ప్ర‌తిధ్వ‌నించింది. తెలంగాణ ప్ర‌జ‌ల యాస‌ను బాస‌ను కించేప‌రిచిన వారిని నిల‌బెట్టి క‌డిగిపాడేసాడు. “అయ్యోనివా నువ్ అవ్వోనివా…” అనే పాట‌లో ఆంధ్రాపెట్టుబ‌డిదారులను నిల‌దీశాడు. అంతేకాదు వారిని తెలంగాణ కోసం ఏం చేశార‌ని ప్ర‌శ్నించాడు. “చార్మినారుకు సున్న‌మేసిన‌వా…గోలుకొండ‌కు రాళ్లు మోసిన‌వా” అంటూ అంజ‌న్న తెలంగాణ ప్ర‌జ‌ల ఆవేద‌నకు పాట రూప‌మిచ్చాడు.

 

తెలంగాణ ఉద్య‌మంలో ప్ర‌తీ వేదిక మీద ఈ పాట మార్మోగింది. అయిదున్న‌ర ద‌శాబ్దాల న‌లిగిపోయిన త‌నం నుండి వ‌చ్చిన ఈ ప్ర‌శ్న‌లు అంజ‌య్యవి మాత్ర‌మే కాదు, ఇక్క‌డి ప్ర‌జ‌ల‌వి కూడా అందుకే జ‌నం గుండెను సూటిగా తాకి ఆక‌ట్టుకున్నాయి. అలాగే ఆధిప‌త్యాన్ని పెంచి పోషించేవారికి ముచ్చెమ‌ట‌లు పోయించాయి.

 

అంజ‌య్య పాట‌లే కాదు, చాలా వ‌ర‌కు సామాజిక ఉద్య‌మాల్లో వ‌చ్చిన పాట‌లు కూడా రెండు ర‌కాల బాణీల్లోనే ఎక్కువ‌గా వెలువ‌డ్డాయి. ఒక‌టి ప్ర‌జ‌ల జీవితాన్ని పాట‌లుగా మ‌లిచేట‌పుడు వారు ప‌డుతున్న బాధ‌ల తీవ్ర‌త‌ను అర్థం చేయించ‌డానికి క‌రుణ‌రాస‌త్మ‌క బాణీలు, రెండవ‌ది ఉద్య‌మానికి సిద్ధం చేసే వీరర‌సబాణీలు. అందుకే అంజ‌న్న పాట‌ల్లో ఈ రెండు ర‌కాలైన బాణీల‌తో కూడిన పాట‌లే క‌నిపిస్తాయి. అవి కూడా సాదాసీదాగా రాయ‌డం అంజ‌న్న‌కు తెలియ‌దు. ఉద్య‌మ‌ల‌క్ష్యం నెర‌వేరేందుకు అందులో సంపూర్ణస్థాయికి చేరేలా పాట‌ను మ‌లుస్తాడు.  అందుకే ఉద్య‌మాల‌తో స‌మానంగా అంజ‌న్న పాట‌లు సినిమారంగంలో కూడా చెర‌గ‌ని స్థానాని ఏర్ప‌ర్చుకున్నాయి. “భ‌ద్రం కొడుకో నా కొడుకో కొముర‌న్న జ‌ర” అంటూ ముప్ఫై ఏళ్ల  క్రితం తాను రాసిన సినిమా పాట అత్యంత ప్ర‌జాద‌ర‌ణ‌ను పొందింది.

 

అలాగే స‌ర్కార్ ద‌వ‌ఖాన‌ల దీనావ‌స్థ‌ను తెలుపుతూ రాసిన నేను రాను బిడ్డో స‌ర్కారు ద‌వాఖాన‌కు పాట, కొడుకు కొముర‌న్నా…నువ్ కొల‌క‌టేరువ‌నూకుంటునిరో అంటూ రాసిన పాట వెండితెర మీద అంజ‌న్న మార్కు సంత‌కాన్ని చేశాయి.

 

ప్ర‌జ‌ల‌కోస‌మే క‌లం ప‌ట్టి, కడ‌దాకా ఉద్య‌మాల‌కోస‌మే బ‌తికిన ప్ర‌జావాగ్గేయ‌కారుడు గుడా అంజయ్య‌. అడ‌విబిడ్డెల అమ్మవొడి ఆదిలాబాద్‌లో ఒక మారుమూల గ్రామం లింగాపురంలో 1955లో పుట్టిన అంజ‌న్న 61 సంవ‌త్స‌రాలు మాత్ర‌మే జీవించాడు.  అందులో నాలుగున్న‌ర ద‌శాబ్దాలుగా ఉద్య‌మాలకే కేటాయించాడు. ఫార్మ‌సిస్టుగా కొలువు చేసిన‌ప్ప‌టికీ, పోరాటాల్లోనే అత‌ని జీవిత‌మంతా గ‌డిచింది. అలా ప్ర‌జ‌ల‌కోసం బ‌తికి, ప్ర‌జ‌ల‌కోసం క‌లంప‌ట్టి జీవ‌మున్న పాట‌ల్ని రాసిన అంజన్న‌ను కోల్పోవ‌డం, తెలంగాణ‌కే కాదు యావ‌త్ తెలుగు స‌మాజానికి ఒక తీర‌నిలోటు. ఆయ‌న క‌ల‌గ‌న్న పీడ‌న లేని లోకాన్ని సాధించ‌డ‌మే ఆ మ‌హావాగ్గేయ‌కారునికి నిజమైన నివాళి.

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

ఆయన ఇంకా పాడుతున్నారు!

             

     – పన్నాల సుబ్రహ్మణ్యభట్టు

~

 

రజనిగారిని చూస్తుంటే ఇన్ని పాటలు  రాసి స్వరపరచిన ఆయన భుజబలం  ఎంత గొప్పదో ఎన్ని కల్పనల  లేసులు  అల్లినదో అని ఆశ్చర్యం కలుగుతుంది.  ఆయన సృజన ఒక ప్రహేళిక వంటిది.  జటిలంగా పాట రాసి అంత జటిలంగానూ సంగీతం సమకూర్చడం ఎలా సాధ్యమయిందీ అని ప్రశ్న ఉదయిస్తుంది.  వింటున్న కొద్దీ వివేచన పెరుగుతుంది.  సరే సంగీతం వింటుంటే ఆలోచించడానికి వీలవుతుందా, వివేచనకి వీలు  అవుతుందా అనేది సెమినారు మడి సంభాషణ. అదో సరిపెట్టలేని తీర్మానం.

ఈ కాలానికి ఆయన రాసిన కొన్ని పాటలనీ, వరుసల్నీ తలచుకొని మురిసిపోవటమే సరైన పని.  అయినా అందర్నీ చకితుల్ని చేసే మాట ఒకటి నేను చాలాకాలంగా చెప్తున్నాను ‘త్యాగరాజు తర్వాత అంతటి వాగ్గేయకారుడు పాట, సంగీతం రెండూ సమకూర్చినవాడు రజనిగారు తప్ప వేరొక ప్రతిభావంతుడు లేడు ’ అని ఆ ప్రకటన సారాంశం.  ఒకసారి తెలివిమీరిన నేను ఆయనకి ఆమాటే చెప్పి ‘మీకు బాగా గాలిపెట్టానా’ అని నవ్వాను కుర్రతనంతో. ఆయన ‘ఎక్కువే’ అని నవ్వారు.

rajani2

కానీ, ఆ గాలి ఎక్కువ కాదనే తోస్తుంది నాకు ఇప్పటికీ.  త్యాగరాజుగారి లక్ష్యయాత్ర వేరు, కాని ఇద్దరి శోధననాళిక దారీ ఒక్కటే.  స్వామివారికి రాము వారి చరిత్రగానం లక్ష్యం.  అందుకు ఆయన తీసుకున్న రాగతాళాల ఎంపిక ఒక సంగీత విధాన నిరూపణ కోసం. మళ్ళీ ఆ రాగాల లోతుపాతుల అన్వేషణ కీర్తన తెచ్చే పదాల ముళ్ళను స్వరసంచారంతో పులమడంలో గల రక్తి ప్రసాదం ఆయన పని. అదొక మేథోపరమైన కృషి.  ఆ కాలపు వాగ్గేయకారులకు అదొక కాంట్రాక్టు.

రజనిగారి లక్ష్యం మాత్రం వేరు.  త్యాగయ్యగారి లాంటి ఏకముఖమైన నైవేద్యం, నివేదన కాదు ఈయన లక్ష్యం.  ఈయన రాసిన గీతాలు అనేక రసాల దృష్టినీ, సంఘటనలనీ, ఇతివృత్తాలనీ పోగులుగా ఎత్తే పూలసేవ ఇది.  సన్నివేశ కల్పనకీ, మానసికమైన వ్యవహారగతులకీ, కాల్పనికమైన లౌకికమైన దక్షతకీ రెక్కలు  కట్టే దృష్టి గల పాటలు  ఇవి.  ఆనాటి వాగ్గేయకారుల కీర్తనలవలె ` ఇవన్నీ భజన సంప్రదాయానికి లొంగవు.

bhattu

రజనితో భట్టు

అయినా ఇదొక రకంగా భజనే ` ప్రేమభజన, ప్రేయసికి లేఖ, ఆకాశంలో మేఘం నడిచిన రీతుల  వర్ణన, సూర్యుడి ప్రతాపం, నదీ ప్రవాహ ఝరి, ప్రకృతి ప్రకోపాలు, ఇలా ఇన్ని వర్ణించి, పాట చివరి తీగ లాగుతూ, సంగీతం డొంకమీదకి ఎక్కించాలి…  కష్టమైన ప్రొసీజర్‌, ఈ భజనల్ని శ్రోతలకు అందించటం ఎలా? త్యాగరాజుగారికి శిష్యులే శ్రోతలు, మూలవిరాట్టే వేరుగా ఉన్నారు.  కాని రజనిగారికి గల శిష్యులు, శ్రోతలు, తనపాట నచ్చే శ్రోతల్ని ఆయనే తెచ్చుకోవాలి.  అలా అక్కడే ఉంచుకోవాలి, వారికి అనేక పాటలనే వంటకాల్ని సంగీతంలో వేయించి ఊరిస్తూ ఉంచుకోవాలి.  ఇందుకు వేరే పల్లకీ ప్రబంధాలనీ, నౌకా యాత్రలనీ రచించాలి.  అంటే గేయనాటికలు, సంగీతరూపకాలు, స్వరసంకలనాలు  రచించి సంగీత వాక్యాలతో సిద్దపరచాలి.  రజనిగారిది భక్తి సామ్రాజ్య అనురక్తి కాదు. ప్రజాస్వామ్యంలో శ్రోతలనే ఓటర్ల సేవ.  అందులో సినిమా సంగీత కల్పనా  ఘట్టం కూడా తప్పదు.  పురాణ గాథ సందర్శన కూడా తప్పదు.  ఆకాశంకేసి చూసి విస్తుపోవటం భూమిలో చూసి కూరుకుపోవటము తప్పదు. రాములవారిని కాదంటే ఇంతలా జటిలమైపోయే దృశ్యం లలిత సంగీత రచనలో ఉంది.  ఈ రచనకి తనే పదకర్తయి పాటలుగా కూర్చడం గొప్పే.  నిజానికి రజనిగారికి పాట పుట్టడమే పేగు సంబంధంతో పుడుతుంది.  ఆ ముడిని ఆయన మోసినా శ్రోత మోసినా కత్తిరించలేరు.  ఆ పాట రచనలోని పరుసవేది సంగీతంతోనే ప్రకాశిస్తుంది.  ముచ్చట గొల్పుతుంది.  మురిపిస్తుంది.  విడదీసి చూస్తే ఇదొక పాట రచనా అని విసిగిపోతారు, విస్తుపోతారు.   వాటిలో తాళగతులకు ఇరికేలా రాదామనే సగటు పాట రచయిత తాపత్రయం కనబడదు.  గుర్తుకు తెచ్చుకోండి ` ఎలాగయినా, ఏ గీతశకమైనా, ఏ వరుస గుర్తుకున్నదైనా ! సంగీతాన్ని తోసుకుంటూ, పొదలోంచి పాములా, సంగీతం నాలుకలు  చాచే కనబడుతుంది కదా!

ఉదా : ‘తొంగలి రెప్ప చెంగల్వ పూవే…. తొంగి చూచెనదిగో కన్నావే!’

rajani3

ఆంద్ర విశ్వవిద్యాలయ విద్యార్థి గా – 1937-40

సంజెకెంజాయవీవనలు, క్రొంజిగువురు గుబురు జాలరులు,  తల్లీ, నీయడుగు

దామరులు!  అరుణ దరహాసమో, చందనమరున్ని శ్వాసమో’

ఇలా ఎన్నయినా గుర్తుకు తెచ్చుకోవచ్చు.  ఆ పదాల మేరకు ఊహించనివీ, ప్రకృతి రమణీయంగానో, పదగుంభనంగానో ఎవరూ దర్శించని నీతి, రచన, దృశ్య పేటికలు.  ఆ పదాలతో తెరవడం  రజనిగారి పాటల్లో ఒక మాట ‘క్రీడ’.  ఒక సంగీతపు ఊయల ఊపు.

పాట అనే ఫుట్‌బాల్‌ క్రీడలో బంతి అనే మాటను ఈ కోణంలో ఆటగాడు ఇలా నడిపిస్తాడు అని ఊహించేవారుంటారు కాని అందుకు భిన్నంగా రజనిగారు మాటని నడుపుతారు.  ‘మెస్సీ’ అనే విజేతలాగ. అంత చలన వేగంతో గోల్‌ కొట్టే శక్తి రజనిగారిది.  ఆయనకే తెలిసిన లయ విభ్రాంతితో ఆ పదాన్ని అలవోకగా అక్కడకు చేర్చడం ఆయన నేర్పు.  తెలుగు గేయ / గీత సాహిత్యంలో రజనిగారి లాంటి ఆటగాడు అవతరించలేదు.  కారణం సంగీతమనే ప్రేగుతో సహా పదం జనిస్తుంది.  లౌకిక భావకవితారక్తిమతో అలా పాట పొట్ట తట్టడం ఎవరికీ అబ్బలేదు.  త్యాగరాజు తర్వాత కొంతమందికి ప్రయత్నపూర్వకంగా సాహిత్య రచనలో ఈ విద్య అబ్బి ఉండవచ్చు.

rajani1

అలవాటులో లేని రాగాలలో పాటకి వరుస కూర్చడం ఎక్కడైనా ఉంటుంది అనుకున్న వరుసలో రాగాలలో పాటనప్పడం ఆనాటి వాగ్గేయకారుల నుండి ఈకాలపు సంగీత దర్శకులకీ అలవాటే.  పట్నం సుబ్రహ్మణ్య అయ్యర్‌ అనే స్వామి వారి శిష్యుడి నుండి ఈనాటి ఆసామీ గాయకులకీ సాగే విద్యే వారికి తాళాలూ  మాటలూ  సర్దడం సమకూర్చుకుంటూ పోవటం శ్రమే.

కానీ లలిత సంగీతంలో పాట ముందు ఆముఖం వినిపించే పరిచయ ఆహార్యం, చరణాలకీ, చరణానికీ మధ్య పొడిగించే, నడిపించే సుఖనిద్ర కల్పించే, సకల భోగాలు వండటం అందరికీ అలవడే విద్యకాదు.  రజనిగారు అందులో స్పెషలిస్టు వరసిద్ధిపొందినవారు.  సంగీతంలో నుండే పాటను పుట్టించి తానే సంగీత చరణాల మధ్య అలంకరాలనూ, ఘోష చైతన్య స్ఫూర్తినీ స్వరబంధంగా మలచి ఒక సాకారమూర్తిని ప్రదర్శించటం రజనిగారి పాటలోని విశేషం.  ఆయనది అంతటి కల్పనా  ప్రకాశం.  ఎన్నో ఉదాహరణలు చూపవచ్చు.  అటు పాటగానూ, సంగీతంగానూ ఆ పాట ఎంత ముద్ర వేయగలదో చూపవచ్చు.  లేకపోతే తుఫాను గురించి ‘నిష్పడన మంధానం’ అని కూర్చగలరు?  తుఫాను నాశనం చేసిందని ‘ధ్వంస విధి విధానము, నివాత శూన్య స్థంభం అని ఎత్తుగడను శూన్యంలోకి దించటం ఎంత రిస్కు.  ఇంకా గగుర్పాట్లు! అది ‘పరిభ్రామ్యమాణరోదసీ రాక్షసి నిటలాక్షం’ట.  పశుపక్షి మనుష్య సౌఖ్యహరణ జీవనాటంకం’  పాటకి ఇన్ని ఆటంకాలా అని మరొకరెవరైనా జారిపోయేటంత ప్రతిభ రజనిది.  ఇక ఆ పాట ఆముఖ సంగీతం వినవలసినదే.  ఇంకా ఆశ తీరక ‘పలువంకల స్వార్థ ప్రజపాపాల్‌ చిలికే కవ్వం’ అన్నారు.  అందుకే ఆయన సూటి సంగీత తంత్రవేత్త మాట మంత్రవేత్త దేశంలోని సమకాలీన లయకారులలోనే ఉండరు.  తెలుగు జాతి భాషలో మాత్రం త్రిమూర్తుల తర్వాత ఇలా సంగీత సాహిత్యాలని సాగు చేసినవాడు లేడు.  ఆయనా వారిలాగే, మనలాగే ఈ నేల మీద నడిచారనీ, ఇప్పటికీ 96 ఏళ్ళుపైనా బడినా నిజంగా నడుస్తున్నారని  ఒక ఆనందం.  ఇంత పులకింత.

*

ఒక Enigma ఆత్మకథ..

 

-నరేష్ నున్నా

~

మోహన్‌కి అరవై ఐదేళ్లు! !

అందమైన వాక్యం (అన్న భ్రమ)లో చెప్పాలంటే… మోహన్‌కి అరవై ఐదు వసంతాలు!!

ఇంతకంటే విచిత్రమైన, విపరీతమైన, విడ్డూరమైన వాక్యంనా దృష్టిలో మరొకటి లేదు.

ఈ విరిగిన కుర్చీ పదేళ్ళుగా పడి ఉంది
నా పదవీ విరమణకి ఇంకా నాలుగు సంవత్సరాలు
ఆ కూలిన బ్రిడ్జి కట్టి గట్టిగా పుష్కరమైనా అయితేనా…
……. ఇలాంటివే కాదు మరికొన్ని అర్థవంతమైన వాక్యాల్నిచెవికెక్కించుకోగలను. ఇంకా జియాలజిస్టులు పళ్లూడిన రాళ్ళ వయసు, బోటనిస్టులు గూడు జారినచెట్ల ఆయుష్షు….. అన్నేళ్లు….ఇన్ని శిశిరాలు…అంటూ లెక్కలు కడుతుంటారు. అవేవీతప్పని, నేరమనీ అనిపించదు గానీ, మోహన్‌కి ఈడొచ్చిందనో, జోడుకు వయసొచ్చిందనో….అంటూంటే ఆశ్చర్యమేస్తుంది.

అక్కడెక్కడో మహాశూన్యంలోమన అగణిత బుర్రలకి ఊహకైనా అందని మహావేగంతో భూమండలం చేస్తున్న ఆత్మప్రదక్షణలకి, సూర్యచంద్రుల ఋజువర్తనా చమత్కారాల కనుగుణంగా ఎగిరే కాలం రెక్కలకి ఖగోళ గందరగోళాల లెక్కలు వేలాడదీశాం, మన దుర్భలత్వానికి చిహ్నంగా. ఆ లెక్కల జమాబందీ ఉచ్చుల్లో చిక్కుకుని, గడియారాలు పంచాంగాల్లో ఇరుక్కున్న ఏళ్ళూపూళ్లు, వారాలూ వర్జ్యాలు, ఘడియలు-విఘడియలతో ‘సమయా’నికి తగు ‘తాళం’ వేస్తుంటాం, మన దిక్కుతోచనితనానికి గుర్తుగా. అంతమాత్రం చేత ఎంత అల్పత్వాలున్నప్పటికీ, ‘తగుదునమ్మా’ అని మోహన్ వయో పరిమితుల్ని, ప్రాయ- చిత్తాల్ని కొలిచే యశః కాయకల్ప చికిత్సకి తెగబడతామా? ఏకాంతాన్ని భగ్నం చేసే,  చైతన్యాన్ని నిలువరించే, మధుమోహాల్ని రద్దుపరిచే వస్తువులు, స్థలాలు, రాళ్లురప్పలకి గానీ, అటువంటి జడపదార్థాల్లానే బతికేస్తున్న మనుషులకేమో గానీ,మోహన్ వంటి చైతన్యశీలికి వయస్సేమిటి?

ఆయన ‘కాలం’ మనకి తెలిసిన, అర్థమైన కాలం కాదు. ‘టైమ్’కి మాత్రమే కాదు, ఆయన ‘టెన్స్’కి కూడా సాధారణ వ్యాకరణార్థంలో తెలిసిన భూత, వర్తమాన, భవిష్యత్ అర్థాలు లేవు. చూరునుంచి ఒక్కొక్కటిగా జారి ఇసుకలో ఇంకిపోతున్న వానచుక్కని ఒంటరిగా పట్టి ‘కాలనాళిక ‘లో ఒకసారి పరీక్ష చేయాలి. అందులో కదలాడే ఆయన టెన్స్‌ ని. అది గతించిన గతమా? తళుక్కుమనే తక్షణమా? ఆగామి అగమ్య గోచరమా?ఈ మూడు కలగలిసిపోయిన  ఫోర్త్ పర్సన్ సింగ్యులర్‌లా, ఫోర్త్ డైమన్షన్ ఇన్విజిబుల్లాంటి హ్యుమన్ టెన్సా?

ఇసుక డొంకల్లో నగ్న పాదాల్తో చేతిలోని ఇప్పపూల దోనెతో పరుగులు తీస్తున్నప్పడు అందులోంచి చిందిపడే తేనేబిందువుల తుళ్లింతను పోలిన హ్యుమన్ టెన్స్‌ తో సంతులితమైన క్షణాలు. ఆ క్షణాల సమాహారమే మోహన్. అందుకే, 365 తేదీలుగా రద్దయిపోయే కేలండర్‌లో ‘డిసెంబరు 24’ అన్న ఒక్క రోజుమాత్రమే ‘పుట్టిన రోజు ‘ పేరిట ఆయనకి సంబంధించినదని అనడం విడ్డూరంగా ఉంటుంది.

mohan1

వ్యావహారిక పరిభాషలో మోహన్ ఒక చిత్రకారుడు, కార్టూనిస్టు, యానిమేటర్, ఇంకా మంచి రచయిత, చింతనాశీలి. ఇంత బహుముఖ ప్రజ్ఞ ఉన్న ఆర్టిస్టు గురించి రెండుముక్కలు రాయడానికైనా కొంత అర్హత అవసరం. రాత- గీత రంగాలలో పాత్రికేయ స్థాయి ఉపరితల అవగాహనైనా ఉండాలి. ఆంధ్ర దేశంలో ఆర్టు గురించి తెలిసిన అతిమైనారిటీ వర్గానికి చెందకపోయినా, అధిక సంఖ్యాకులకి ఉండే బండ బలమున్నా చాలు. పువ్వుల నేవళం గురించి తెలియకపోయినా, వాటిని గుదిగుచ్చిన దారాన్నివిడిచిపెట్టని మొండితనమున్నా చాలు. ఆ బండ, మొండితనంతోనే నా ఈ వ్యాసమనే ఉపరితల విన్యాసం: మోహన్ అనే ‘అసలు’గురించి కాదు, మోహనీయమనే ‘కొసరు’ గురించి. ‘మోహనీయమంటే మోహన్ తనమే,అదే దారం అనే motif!

సుమారు పాతికేళ్లు (మధ్య మధ్యలో విరామాలున్నప్పటికీ) దాదాపుగా ఆయనను రోజూ చూస్తూనే ఉన్నాను. అరికాళ్ల అంచున అలల ఘోష నిరంతరాయంగా ఉన్నా, కడుపులో చల్ల కదలనట్టుగా ప్రశాంతంగా తోచే సముద్ర గర్భాన్ని రోజూ చూసినా ఏం అర్థమవుతుంది? గుండుసూది కూడా దూరని రాతి ఒంపుల్లోకి ఉలిని పరుగులెత్తించి మలచిన మహాశిల్పాన్ని నిత్యం చూసినంత మాత్రాన ఏం తెలుసుకోగలం? అందులోనూ ఎన్ని పరిమళాల్తోను ఎదురొచ్చి ఆహ్వానించినా పరిచయమున్న పూలమొక్కంటే చులకన ఉన్నట్లు, పరిచయమైన కొద్దీ మనుషులుకూడా చవకవుతారు. అయినా ‘రోజూ చూస్తూ ఉండటం’ అనే బోడి క్వాలిఫికేషన్‌తోనే రాయక తప్పడం లేదు.

పైన ఇంతకుముందు ఏదో నాన్ సీరియస్ స్థితిలో, ఒక ఊపులో ‘చైతన్యశీలి ‘ అన్న విశేషణం వాడేశాను గానీ,మోహన్ ఎంతమాత్రం చైతన్యశీలికారు. ఒక సాధారణ అర్థంలో రక్తమాంసాలు, కామక్రోధాలు ఉన్న మనిషే కాదు. ఆయన ఒక phenomenon గామారిపోయారు కాబట్టి తరచి చూడకపోతే, ఆయనని పైకి స్థితప్రజ్ఞుడంటూనే జడుడని, enigmatic అంటూనే కొరకరానికొయ్యని అంటాం. పెదాల్తో నవ్వుతూ నొసట్లతో వెక్కిరించే అల్ప మానుషత్వంతోనే ఆయన స్నేహశీలిఅని, ఆపద్భాంధవుడని రకరకాల ముసుగు పేర్లతో శ్లాఘిస్తాం. మనఃశరీర సంబంధిత రాగద్వేషాల్లోనే రెండు కాళ్లునిలిపి, కుదుళ్ళుజొనిపి, మామూలుకంటికి కనిపించని సృజనాత్మక సౌందర్యం, తాత్విక సృజనావరణాల్లోకి తన మూర్తిమత్వపు శాఖోపశాఖల్నిచాపి విస్తరించిన మహావృక్షాన్ని పెరట్లో చెట్టులా చూస్తే అసలు రూపం ఎప్పటికీ బోధ పడదు.కుదుళ్ళకి, కొమ్మలకి ఉన్న బంధంలాంటి అంతర్నిహిత ప్రసారం ఒకటి ఆ వృక్షం లోపల జరుగుతుంటుంది. వేర్లలోని భౌతిక శక్తిని కొమ్మల్లోని ఆదిభౌతిక సత్తాలో అనుసంధానించడమనేది మోహన్‌లో నిరంతరం జరిగే ప్రక్రియ. అటువంటి మానవాతీతమైన అనుభవం వల్ల నిత్యమైన సృజనశీలిలో అన్నిభావోద్వేగాలు ఒక ఉచ్ఛస్థాయికి వెళ్లిపోతాయి. సుఖదుఃఖాలు, బాధానందాలు, వెలుగుచీకట్లు, నలుపుతెలుపుల వంటి ఎన్నోవిరోధాభాసలకి అందని ఒక ద్వంద్వాతీత స్థితికి చేరుకుంటాయి. అటువంటి ఆర్టిస్టులు ఏ ఉద్యమాల్నినడపరు; ‘ఎయిడ్స్ నుంచి రక్షణగా కండోమ్స్ వాడండ’ని జనాల్ని మేలుకొలపరు; ‘కల్లుమానండోయ్ బాబు కళ్ళు తెరవండోయ్’ అని పిలుపులివ్వరు; ఒక భార్య, ఒక జాణ, ఒకే బాణమని సుద్దులు చెప్పరు………దేనితో తలపడరు, దేనినీ మార్చరు. వాళ్లు చైతన్యశీలమైన ప్రవాహాలు కానే కాదు, ప్రవాహ గతిని మార్చే నిశ్చలమైన రెల్లు దుబ్బులు. సమాజాన్ని మార్పు దిశగా నడిపించే నాయకులకి స్ఫూర్తి దాతలు!

ఇటువంటివారు ముక్కుమూసుకుని ఏ గుహాంతర్భాగాల్లో ఉన్నా వారి ప్రభావం మాత్రం అమేయం. కానీ మోహన్ అలా అజ్ఞాతంగా, అజ్ఞేయంగా ఉండేవారేం కాదు. ఆయన మీద ప్రేమతో రకరకాల సందర్భాల్లోవ్యాసాలు రాసిన వారి ప్రకారం, మోహన్ ఒక గ్యాంగ్‌లీడర్. గొప్ప మాస్ ఫాలోయింగ్ ఉన్న హీరో. ఆయన డెన్ ఎప్పడూ కోలాహలంగా ఉంటుంది. ఆయన తన పరివారం, బంధుగణం శిష్య ప్రశిష్యుల మధ్య పరివేష్టితులై ఉంటారు. ఈ నిత్యకృత్యం లాంటి దృశ్యంలో అబద్ధం లేదు, దృశ్యాల్ని అన్వయించుకోవడంలో తేడా ఉందేమో. నాతో సహా ఆయన బంధుమిత్ర సపరివారమంతా మోహరించి ఉన్నప్పడు, ఒక అనంతమైన విషాదం ఆ దృశ్యంమంతా పిగిలి పొర్లిపోతుంటుంది. ఈ ప్రపంచగతిని మార్చే నెత్తురు మండే శక్తులు నిండే సైనికుల్నిపుట్టించి, ఎగదోయగలిగిన ఆర్టిస్టు ఒక వీల్‌ఛైర్‌లో కూర్చొన్న సాధారణ భంగిమలో మామూలు కంటికికన్పిస్తూనే, వేరే ఉన్నతపార్శ్వంలో యోగముద్రలో ఉన్నప్పడు ఆ టేబుల్‌కి ఇటుపక్కన ఆ planeకి ఏ మాత్రం సంబంధంలేని ఒక పోచుకోలు గుంపు ఉండటం-

– ఒక దుర్భర విషాద దృశ్యం!

మానుష స్థాయిలో మోహన్‌లోకొన్ని తెంపరి లక్షణాలు ఉన్నాయి (లేదా ఉన్నాయని నా పరిశీలనా ఫలితం). స్థిర, లేదా చర సంపదల పట్ల పూర్తి వైముఖ్యం, అధికారం, హోదాల పట్ల మహా నిర్లక్ష్యం, స్వోత్కర్ష ఏ రూపంలో లేకపోవడం, పొగడ్తల పట్ల చెడ్డ యావగింపు, …..ఇంకా వ్యక్తీకరణల్లోకి ఇమడని ప్రేమా బాధ్యతల్ని వర్షించడం, చదువుకి- జ్ఞానానికి వంతెనలు వేసుకునే బాల్య కౌమార తృష్ణల్నిసజీవంగా నిలుపుకోవడం మొదలైనవి మరెన్నో. ఇన్ని దశాబ్దాలుగా ఆయన చుట్టూ తిరిగే ఏ ఒక్కరికీఈ లక్షణాల్లో ఏ ఒక్కటి సావాసదోషంతోనైనా అంటుకోకపోవడం విచిత్రమైతే, అసలా లక్షణాల ఉనికే వారికితెలియక పోవడం మరోవిచిత్రం. దొంగ మర్యాదలు, కుర్చీని బట్టి గౌరవాలు, అవసరార్థం అరదండాలు….వంటి లౌకికనైచ్యాన్ని తన పరిసరాల్లోంచి పూర్తిగా నిషేధించాలని ఆయన చేసిన అకర్మక క్రియ వంటి అప్రయత్నప్రయత్నం మరోలా వికటించింది. అదేదో సినిమాలో ‘ఈ పూట మనం ఫ్రెండ్స్’ అని ప్రొఫెసర్ అన్న వెంటనే’సరే సోడా కలపరా’ అనికుర్ర స్టూడెంట్లు చనువుతీసుకున్నట్లు, భేషజాలు లేని వాతావరణం ఉండాలని మోహన్ ఆశిస్తే, ఆకాశమంత ఎత్తున ఉన్నఆయన భుజంమీద చెయ్యేసి, వారివారి స్థాయి ఊకదంపుడు ఉపన్యాసాలకి ఆయన్ని శ్రోతని చేసి,కోటలు దాటే ఆ కోతలతో అంతులేని  కాలహరణం చేస్తుంటారు.

బాపు వెనక నీడలా..ఇంకెవరూ మోహనే!

బాపు వెనక నీడలా..ఇంకెవరూ మోహనే!

ఇవన్నీ చూస్తుంటే నాకొకటి అనిపిస్తుంది- ఆయన అలిగి కూర్చున్నారేమోనని. అలిగిన వారిని బుజ్జగించడం అయిన వాళ్ళకి ఒక ముచ్చట, ఒక మురిపెం, అంతకు మించిన బాధ్యత. అయితే అలిగినట్లే అర్థంకాక పోవడం కంటే దురదృష్టం మరేముంది? ‘నా కొరకు చెమ్మగిల్లు నయనమ్ము లేదు…’ అని దిగులు పడటం కంటే మించిన దురదృష్టం. నాలుగు దశాబ్దాల పై చిలుకు ఆయన చేస్తున్న సంతకం ఆయనది కాకపోవడం, అది ఒట్టి ఫోర్జరీసంతకమని ఎవరికీ పట్టకపోవడం ఎంత అన్యాయం! నీకోసం, నా కోసం మరేదో జెండా కోసమో గీసినగీతలు కాకుండా, తనకోసం తాను గీసుకున్న బొమ్మలెన్నో, గీయాలనుకున్న బొమ్మలెన్నెన్నో! ఎగ్జిబిషన్ల పేరిటో, కేలండర్ల కిందనో తనవైన ఆ బొమ్మల్ని ప్రదర్శించుకోవడం చెడ్డ చిరాకు ఆయనకి. కే.సి.డే మధుర స్వరాన్ని పందుల గురగురలు, వాహనాల చీదుళ్ళ మధ్య వినడానికి చలం పడిన చికాకులాంటిదది. అంకార్ వాట్, రామప్ప దేవాలయం….ఇంకా ఎన్నో మహోన్నతమైన చిత్ర, శిల్పకళాఖండాల దిగువున ఏ సంతకాలున్నాయని ఎదురు దెబ్బలాడతారు మోహన్. సంతకం చేయకపోవడమే భారతీయత అంటారు. ఇది కాళిదాసు విరచితమని, కవి నృప జయదేవ కృతియని, ఇంకా ఎందరో కవులు పద్య, శ్లోక మకుటాల్లో చేసిన సంతకాల్నిచూపించి, ‘ఇవి భారతీయం కాదా మోహన్!’ అని దబాయించి, ఆయన దాచుకున్నవి బయటకు లాగొచ్చు, ఆయన చేత బలవంతాన నిశానిముద్రలేయిస్తూ.

అయితే అంత కంటే ముందు ఆ స్థాయి ఆర్టిస్టు ప్రతి ఒక్కరికీ తమని ఏకాంత పరిచే ఒక అనంగరాగాన్నివినే వెసులు బాటు కల్పించాలి. ఆ  labyrinth of solitude లో కళాకారుడు చిక్కుకుపోవాలి; అలా చిక్కుకుపోయే సావకాశం ఏర్పాటుచేయాలి- నిజమైన బంధుమిత్ర సపరివారం. అప్పడే సృజనకి అవకాశం. అలా లేనప్పడు ఏ కళాకారుడైనా మోహన్‌లానే అలుగుతాడు. ఆయన అలక తీర్చేవాళ్ళలో కాకుండా, దానికి కారణమైన గుంపులో నేనొక్కడ్నిఅయినందుకు నన్ను ఎంతో కక్షతో ఐనా క్షమించుకోగలనా?

*

తుమ్మపూడి కంటి వెలుగు చంద్రమౌళి

 

                                                                                

-సి.బి. రావు

~

సజ్జనుడు, సాహితీ ప్రియుడైన  చంద్రమౌళి గారు నవంబరు 28, 2015 న మరణించారన్న వార్త  మనసును విచారంతో నింపింది. సంజీవదేవ్ రచనలతో కూడిన కొన్ని చిన్న పుస్తకాలు మిత్రుడు సురేష్ తెనాలి నుంచి తీసుకొచ్చి నా కిచ్చినప్పుడే మొదటగా చంద్రమౌళి గారి పేరు నేను విన్నాను. చంద్రమౌళి గారి ఆర్థిక సహాయంతో  ఆ పుస్తకాలను ప్రచురించారు. సంజీవదేవ్ కుమారుడు  మహేంద్రదేవ్ హైదరాబాదు లోని  Centre for Economic and Social Studies, (CESS), Hyderabad, India, లో 1999 నుంచి మే  2008 వరకు Director గా పనిచేశారు. CESS నుంచి కొత్త ఢిల్లీ కు Chairman, Commission for Agricultural Costs and Prices, Ministry of Agriculture గా బదిలి అయిన సందర్భంలో అమీర్‌పేటలోని CESS కార్యాలయంలో జరిగిన వీడ్కోలు సభలో నేను చంద్రమౌళిగారిని చూడటం, పరస్పర పరిచయం జరిగాయి. అప్పటినుంచి వారు నా మిత్రులయ్యారు.

చంద్రమౌళి గారు Chief Engineer R & B గా పనిచేసి విశ్రాంత జీవనం గడుపుతున్నారప్పుడు. టెలిఫోన్లో సంజీవదేవ్, సాహిత్య విషయాలు గురించి మాట్లాడుకుంటూ ఉండే వాళ్ళం. కొన్నిసార్లు వారిని, వారింట చూశాను. పాతతరం రచయితలంటే ఆయనకు మిక్కిలి ప్రేమ ఉండేది. సంజీవదేవ్ రచనలంటే ప్రాణం పెట్టేవారు. వారితో తనకు వ్యక్తిగత పరిచయం లేదని, అంతటి మహావ్యక్తిని తాను కలుసుకోనందుకు మిక్కిలి బాధపడేవారు. సంజీవదేవ్ వియ్యంకుడు ఈయన సహొద్యోగి అయ్యుండీ, సంజీవదేవ్‌ను తన సహొద్యోగి, సంజీవదేవ్ కుమారుడి వివాహం జరిగిన సందర్భంలో పరిచయంచెయ్యలేదని బాధపడుతూ చెప్పేవారు.  

Chandramouligaru rs

చిత్రం: దామరాజు నాగలక్ష్మి గారి సౌజన్యంతో

   సంజీవదేవ్ రచనలు ఎక్కడా లభ్యం కాకపోవటం వీరిని బాధించింది. తనే దేవ్ రచనలు కొన్ని, చిన్ని పొత్తాలుగా ముద్రింపించారు. సంజీవదేవ్ జీవిత చరిత్ర అసలు ప్రతి దొరకక  జీరాక్స్ ప్రతి తెప్పించుకుని చదివి ప్రభావితమయ్యారు. జుజ్జవరపు చంద్రమౌళి గారు  సంజీవదేవ్ స్వీయవాణిని జనం చేత చదివించాలన్నదే తమ అభిమతమని చెప్పి, సంజీవ్‌దేవ్ రచించిన ‘తెగిన జ్ఞాపకాలు’, ‘స్మృతిబింబాలు’, ‘గతంలోకి’ పుస్తకాలను  రాజాచంద్ర ఫౌండేషన్ పేరిట ‘తుమ్మపూడి’  అనే సంకలనంగా తీసుకొచ్చారు. సంజీవదేవ్ స్వీయచరిత్ర అయిన ఈ మూడుభాగాల సంకలనానికి ఆయన స్వస్థలమైన దుగ్గిరాల మండల గ్రామమైన తుమ్మపూడి పేరిట నామకరణం చేశారు. ఏప్రిల్ 4, 2011 న సంజీవదేవ్ నివాసం ‘రసరేఖ’లో సంజీవదేవ్ సతీమణి సులోచన పుస్తకావిష్కరణ చేశారు.

tummapudi_rs (1)

రాజాచంద్ర ఫౌండేషన్ అధ్యక్షుడిగా చంద్రమౌళిగారు తుమ్మపూడి (సంజీవదేవ్), నా స్మృతిపథంలో.. సాగుతున్న యాత్ర (ఆచంట జానకిరాం), రమణీయ భాగవత కథలు (ముళ్ళపూడి వెంకట రమణ), సురపురం (మెడోస్ టైలర్ ఆత్మ కథ), జానకితో జనాంతికం (దువ్వూరి వేంకట రమణ శాస్త్రి), డాక్టర్ యెల్లాప్రగడ సుబ్బారావు (అబ్బూరి ఛాయాదేవి), సంజీవదేవ్ లేఖలు (శ్రీనివాసాచార్య దర్భాశయనం కు వ్రాసినవి), అమ్మకు జేజే నాన్నకు జేజే గురువుకి జేజే, వగైరా పుస్తకాలు ప్రచురించారు.

చంద్రమౌళిగారికి సాహిత్యాభిలాష మెండు. వారి ఇంటిముందు వసారాలో కూర్చుని తనకిష్టమైన పుస్తకాలు చదువుతూ వాటిగురించి మిత్రులతో చర్చించే వారు. అముద్రిత వ్యాసాలను లేక ఆసక్తికరమైన వ్యాసాలను జీరాక్స్ తీసి మిత్రులకు పంపేదాకా ఆయనకు నిద్రపట్టేది కాదు. తనకిష్టమైన పుస్తకాలను రచయితలవద్దనుంచి టోకుగా కొని మిత్రులకు పంచేవారు. ఒకసారి సోమరాజు సుశీలగారి పుస్తకం, మరికొన్ని పుస్తకాలు  నాకు ఇచ్చారు. వారికి కోపం ఎక్కువ. ఒకసారి ఎందుకో నా పై కోపం ప్రదర్శిస్తే కొన్నాళ్ళు వారింటికి నే వెళ్ళలేదు. తనకోపం వలన, నాకు మనస్తాపం కలిగితే, అందుకు విచారం వ్యక్తం చేస్తూ,, పెద్దమనసుతో తనను క్షమించాలని కోరుతూ జాబు వ్రాసారు. ఇది ఆయన సహృదయతకు తార్కాణమై నిలుస్తుంది. కాలపాలన విషయంలో క్రమశిక్షణతో ఉండటం ఆయనకు ఇష్టం. ఇతరులు కూడా అలాగే ఉండాలని కోరుకునేవారు.

  నా వియ్యంకుడు సత్యనారాయణగారు (Retired Chief Engineer, R & D) ఆయనకు Junior. వారు నాతో   మాట్లాడుతూ “చంద్రమౌళి గారు చాలా నిష్కర్షగా, నిష్కాపట్యముగా, అవినీతికి దూరంగా ఉండేవారు. అందరికీ సహాయకారిగా ఉండే వారు. ఆయన Senior కావటంతో, కార్యాలయంలో ఎక్కువ మందితో పరిచయాలుండేవి. ఎవరైనా చనిపోతే తనే అందరికీ ఫోన్ చేసి సమాచారం అందించేవారు. పుస్తకాలు బాగా చదువుతుండేవారు.” అన్నారు.

మరణాంతరం జరిగే కర్మకాండలపై చంద్రమౌళిగారికి విశ్వాసం లేదు. తన తదనంతరం తన శరీరం వృధా పోవటమూ వారికిష్టం లేదు. వారి కోరిక మెరకు వారి కుటుంబ సభ్యులు, వారి పార్థివ దేహాన్ని ఉస్మానియా వైద్య కళాశాలకు అందచేశారు. ఎలాంటి కర్మకాండలు జరపటం లేదని వారి కుటుంబ సభ్యులు తెలియచేశారు. రాజాచంద్ర ఫౌండేషన్ అధ్యక్షులైన చంద్రమౌళిగారు భౌతికంగా మన మధ్య లేనప్పటికీ, ఎప్పటివలెనే రాజాచంద్ర ఫౌండేషన్, ఉత్తమ సాహిత్యం, తెలుగు ప్రజలకు అందిస్తుందని ఆశిద్దాం. ఆ పుస్తకాలు  చదివి ఆనందిస్తే, అదే  సాహితీబంధు చంద్రమౌళి గారికి మనమిచ్చే  నిజమైన నివాళి.

*

 

 

 

 

 

పెనుచీకటి నిమిషంలో వెలుగు రవ్వ ఆలూరి బైరాగి!

 

‘చాయ’ సాంస్కృతిక సంస్థ ఆరవ సమావేశం ఆదివారం నవంబెర్ 1న హైదరాబాద్ ప్రెస్ క్లబ్, సోమాజిగూడ లో “కవి బైరాగి” రచనల మీద జరిగింది. అంబటి సురేంద్ర రాజు, తెలిదేవర భానుమూర్తి, ఆదిత్య కొర్రపాటి, అనంతు చింతలపల్లి “కవి బైరాగి” గురించి ఎన్నో కొత్త కోణాలు ముందుకు తెచ్చారు . ఈ ముచ్చట్లన్ని youtube  లో “Chaaya Conducts Chikati Thovalo Prasnala Jadi” link  లో మీరు చూస్తూ వినవచ్చు. సభకి వచ్చిన వారందరికి వందకు పైగా బైరాగి సంపూర్ణ రచనలు కానుకగా ఇవ్వడం జరిగింది. గత మూడు దశాబ్దాలలో బైరాగి మీద హైదరాబాద్ లో సభాముఖంగా చర్చించలేదన్నది మిత్రుల మాట. ఈ కార్యక్రమం కోసం బి. యల్. నారాయణ తెనాలి నుంచి రాసిన ప్రత్యేక వ్యాసం మీకందిస్తున్నాం.

 

BLఆలూరి బైరాగి .. ద్వితీయ సహస్రాబ్ది మహాకవి. ప్రపంచానుభుతితో తన స్వీయానుభూతిని మేళవించి ఆధునిక తెలుగు కవిత్వంలో తనదైన ముద్ర వేసుకున్నాడు. జీవుని వేదనకు స్వరమిచ్చిన కవి ఆయన. జీవించింది తక్కువ కాలమే.. ఆ సమయంలోనే త్రికాల మానవ వేదనను కవితార్చన చేసాడు. జీవతంలో రాజీపడకుండా ‘బైరాగి’ జీవితాన్ని గడిపి, ఈ ప్రపంచంతో కూడా పేచీపడ్డట్టుగా అనిపించిన బైరాగి, కవిగా పూర్నాయుష్కుడనని నిరూపించుకున్నారు. నిరాశావాదిగా, సంశయాత్మక కవిగా ఆయనను విమర్శించేవారున్నా, ‘ఆగబోదు తుపాను’ అని గర్జించిన బైరాగి నిరాశావాది ఎలా అవుతారని ప్రశ్నించేవారూ లేకపోలేదు.

తెనాలిలోని అయితానగర్ లో 1925 సెప్టెంబర్ 5న జన్మించిన ఆలూరి బైరాగి చౌదరి, అమ్మ ఒడిలోంచి చదువుల బడిలోకి అడుగిడినా అనుదిన విద్యావ్యాసంగం ఆయనకు రుచించలేదు. తండ్రి వెంకట్రాయుడు జాతీయాభిమానంతో బైరగికి హిందీ అక్షరాభ్యాసం చేయించారు. గాంధేయవాది యలిమించిలి వెంకటప్పయ్య తెనాలిలో 1935లొ ప్రారంభించిన హిందీ పాఠశాలలో మధ్యమ చదివాడు. అప్పటికి బైరాగికి పదేళ్ళు. మరో గురువు   ప్రజనందన శర్మ వద్ద రాష్ట్రభాష, విశారద పూర్తి చేశాడు. అప్పటికే పుస్తకాలంటే ఆశక్తి కలిగిన బైరాగి, కనిపించిన పుస్తకన్నల్లా చదువుతూ జ్ఞాన తృష్ణను తీర్చుకునేవాడు. 13వ ఏట హిందీ లో ఉన్నతవిద్య కోసమని బీహార్ లోని  ముజాఫర్ ఫూర్ కు వెళ్లి నాలుగేళ్ళు హిందీ, సంస్కృతం నేర్చుకున్నాడు. అక్కడే తన 15వ ఏట తొలిసారిగా హిందీ కవిత రాసి, కవి సమ్మేళనంలో పాల్గొని ప్రశంసలు పొందాడు. 1941 లో స్వస్థలం తిరిగొచ్చాడు. తల్లి సరస్వతి మరణం ఆయనను కుంగదీసింది. క్విట్ ఇండియా ఉద్యమానికి ఆకర్షితుడై రహస్యంగా కరపత్రాలను పంచాడు. ఎం ఎన్ రాయ్ ప్రారంభిన రాడికల్ డెమోక్రాటిక్ పార్టీ నాయకులతో పరిచయాలేర్పడి, బైరాగి జీవతంలో ముఖ్యమైన మలుపుకు దారితీసింది. మార్కిస్టు తత్వశాస్త్రం, ఎం ఎన్ రాయ్ సిద్ధాంతాలు బైరాగిని ఒక విలక్షణమైన దార్శ కునిగా, విశ్వ మానవ ద్రుష్టి పథగామిగా తీర్చి దిద్దాయి.

ఇరవై ఏళ్లకే తెలుగు, హిందీ, ఇంగ్లీష్, ఉర్దూ, సంస్కృతం, బెంగాలీ భాషల్లో పాండిత్యాన్ని సంపాదించిన బైరాగి, 1946 లో గుంటూరు జిల్లా ప్రత్తిపాడులోని హై స్కూల్ ఉపాధ్యాయుడిగా ఉద్యోగ జీవితం ఆరంభించాడు. అక్కడనుంచి తన తెలుగు కవితా సంకలనం ‘చీకటి నీడలు’ వెలువరించాడు. సినీనిర్మాత, తన పినతండ్రి చక్రపాణి కోరిక ప్రకారం మద్రాసుకు మకాం మార్చాడు. హిందీ ‘చందమామ’ సంపాదకుడిగా మరో మజిలీని ప్రారంభించిన బైరాగి, కమ్మని నీతి కథలను గేయరూపంలో అందిస్తూనే, హిందీ కవితా సంకలనం ‘పలాయన్’ తెచ్చారు. పిల్లల కోసం అయన రాసిన నీతి కథలు బాలసాహిత్యంలో వాటికవే సాటి అంటారు. తెలుగులో రాయని వైయుక్తిక ప్రేమ కవిత్వాన్ని అయన హిందీ లో అద్భుతమైన సౌందర్య ద్రుష్టిలో వెలువరించారు. స్వేచ్చాప్రియుడైన బైరాగి, చందమామ పత్రిక నుంచి కొద్దికాలానికే బయటకొచ్చేసాడు. తన కవితా ప్రస్థానంలో ముఖ్యమైన ‘నూతిలో గొంతుకలు’ తో మానవ సహజవేదనకు గాఢమైన అభివ్యక్తిని ఇచ్చారు. ‘దివ్యభవనం’ కథ సంపుటిని తీసుకొచ్చాడు. మహాజలపాతం వంటి పద గుంభనం, అనన్యమైన భావోద్వేగం, అనితర సాధ్యమైన ధారాశుద్ధి కలిగిన బైరాగి ఎప్పుడూ సమూహంలో ఒంటరిగానే ఉండేవాడు. అతడి కవితల్లోని నిరాశను చూసి విరాగి అనేవారు. అయినా బైరాగి జీవతంలో తలమునకలు కాలేదు. ప్రవాహంలో పడికొట్టుకుపోలేదు. వీక్షణంతో పరికించి జీవితాన్ని వివిధ కోణాల్లో చూశాడు.  ఎక్స్-రే కళ్ళతో చీకటిని చీల్చి వెలుగు చూశాడు. తనకంటూ ప్రత్యేకంగా నిర్మించుకున్న సాహితీ జగత్తులో నివసించిన బైరాగి, సమాజంలోని పీడిత, తాడిత ప్రజల బాధామయ జీవిత గాధలను తన కవిత్వపు ప్రతి పంక్తిలోను జీవింప జేశాడు.

బైరాగికి 14వ ఏడూ వచ్చేసరికి స్వాతంత్ర్య సమరం ముమ్మరంగా సాగుతోంది. రెండో ప్రపంచయుద్ధం ఆరంభమైంది. విపరీతంగా జననష్టం జరుగోతోంది. అందుకు స్పందించిన బైరాగిలోని కవి హృదయం, ఈ హత్యలకై జవాబు ఏ ద్రోహుల నడగాలో/ ఈ రుధిరం చేసిన మరకలు ఏ రుధిరం కడగాలో‘ అంటూ పలికింది. ఇదే దశలో తెలుగునాట కవితా ధోరణుల్లో మార్పు వచ్చింది. భావ విప్లవ జ్వాలలకు ప్రభావితుడైన కవుల్లో బైరాగి కూడా ఒకరు. సమాజాన్ని మార్చటమెలాగని ఆరాటపడ్డ బైరాగి, ‘శబ్దం లేదు గాలి లేదు / చీకటికి జాలి లేదు / చూపులేని రూపులేని / రేపులేని మాపులేని / ఈ పెనుచీకటి నిముసం/బ్రతుకుల నల్లని కుబుసం‘ అని నిస్పృహ వెలిబుచ్చారు.

మరో చోట ప్రగల్భ నిరీక్షణతో నిండిన పండిన ఈ నిశ్శబ్దంలో / వేచివున్నవాడే ప్రతి ఒక్కడు / మార్పుకొరకు తీర్పుకోరకు/ఓర్పుగలిగి/ చరమ ఘంటారావం కొరకు / తప్పిపోయిన భావం కొరకు‘ అంటూ ఆశావాదం ప్రకటించాడు. ‘వినతి’ అనే కవితలో ‘ప్రతి అక్షరమొక భటుడు / ప్రతి పదమూ ఒక శకటూ/ ప్రతి ఊహ ఒక వ్యూహం / జీవన శకాంతక సంకుల సమరంలో కవితను, ఏమనుకున్నావు? అని కవి గమ్యాన్ని నిర్దేశించాడు. బైరాగి రాసిన ప్రతి వాక్యంలో పాతమీద తిరుగుబాటు, కొత్త కోసం ఆరాటం కనిపిస్తాయి. సంఘంలోని ఏ ఒక్క అనాచరమూ, అనర్థమూ అయన ద్రుష్టిని తప్పుకోలేదు. అవినీతి, అక్రమాలతో నిండిన ఈ జీవితపు చీకటి నుంచి ఆకాశపు వెలుతురులోకి చొచ్చుకుపోయే విహంగ స్వేచ్చ బైరాగి జీవితం, కవిత్వమంతటా ప్రసరించింది. అయన కవిత్వాన్ని అందంగా రాయలనుకోలేదు. ఆవేశం తో రాసాడు .

హైదరాబాద్ లో జరిగిన ఈ సభ బైరాగి పునః సమీక్షకి కొత్త ఆగమ గీతి.

హైదరాబాద్ లో జరిగిన ఈ సభ బైరాగి పునః సమీక్షకి కొత్త ఆగమ గీతి.

రాజకీయ ప్రత్యర్థులను వేలాదిగా జైళ్ళలోకి పంపిస్తున్న 1965లొ వీరులు నీలఖంటులు మృత్యుంజయులు /వేదనల విషం త్రాగి జనతకు /మహితకు / సమతామృతం పంచుతారు / మృత్యువు వారికీ వంగి చేస్తుంది జోహారు/ వగపు వలదు ‘ అంటూ ఆశారేఖలు చిందిచాడు. వర్తమాన సమాజంలో ఆశించిన ఫలితాలు మృగ్యమైనపుడు ఉన్న సమాజాన్ని మార్చాలని ఆరాట పడటం సహజమే. అలాగని, బైరాగి పడక కుర్చీలో పడుకుని కలల్లోకి పలాయనం చేయలేదు. చీకటి, తుపాను, విధ్వంసం, నెత్తురు బైరాగి కవిత్వమంతటా అలుముకున్నాయి. వినాశ సుందరరుపం వీక్షించిన వాడెవడూ వికాస జడస్తూపం రక్షింప బూనడెవడూ, జగుప్స మన ఆదర్శం, ప్రేయసి మన విద్వంసం’ అంటాడు. సమాజంలోని లోటుపాట్లను, సామాన్యుల జీవితాల్లోని ఒడిదుడుకులను, పీడితుల పాట్లను చూసి హృదయం ద్రవించి, ఆ వేదననే కవిత్వంగా హృదయానికి హత్తుకునేలా చెప్పారాయన. ‘కిర్తికనక సౌధపు తలవాకిట పడిగాపులు’ అయన ఎన్నడూ కాయలేదు. మేధకు, క్రియకు మధ్య, ఆశయానికి సంశయానికి మధ్య, సాధనకు, సాధ్యానికి మధ్య పడిన నీడలు తుడిచేందుకు నడుం బిగించి నడిచాడు.

వేదన నుంచి సంశయానికి, సంశయం నుంచి హేతుబద్దతతో బతుకు బాటలోకి పయనం సాగించాడు. నిస్సహాయ మానవ జీవితాలను అవలోకిస్తూ, ఆకలి! తన శిశువులనే చంపే తల్లుల ఆకలి / పూటకూటికై శీలం అమ్మే కన్యల ఆకలి‘  అంటూ ఆకలి కేకల అర్థం చెప్పాడు. దిక్కు లేక వ్యభిచార వృత్తిలోకి దిగిన వారిని, అణాపూలు/కానీ తాంబూలం / నలిగిన చీరలు / చీకటి ముసుగులు / ఇదా నీకు జివతమిచ్చిన బహుమానం’ అని జాలిచూపుతూ, ప్రపంచపు ఫార్సు పైన నీ బతుకు వ్యంగ్య చిత్రం’ అంటాడు.

అనిల్ అందరికీ కానుక చేసిన బైరాగి పుస్తకాలు

అనిల్ అందరికీ కానుక చేసిన బైరాగి పుస్తకాలు

పీడిత జనావళికి ప్రతినిధిగా బైరాగి వెలువరించిన గ్రంథాలు తక్కువే అయినా అవే ఆయనను తెలుగు, హిందీ సాహిత్యంలో ధ్రువతారగ నిలిపాయి. అయన రాసిన ‘ఆగమగీతి’ కావ్యానికి రాష్ట్ర సాహిత్య అకాడమి, కేంద్ర సాహిత్య అకాడమి అవార్డులు లభించాయి. ‘చీకటి నీడలు’, ‘నూతిలో గొంతుకలు’ తెలుగు కవితా సంకలనాలు, ‘పలాయన్’ హిందీ  కవితా సంకలనం, ‘దివ్యభవనం’, ‘త్రిశంకు స్వర్గం’ తెలుగు కథా సంకలనాలు. తెలుగులో ఆధునిక కవితా, ప్రముఖ ఆధునిక తెలుగు కవితల హిందీ కావ్యానువాదం, ఇంకా అనేక కవితలు పలు పత్రికల్లో ప్రచురితమయ్యాయి. ‘వినతి’, ‘రంగులతోట’, ‘పగిలిన అద్దం’, ‘నైశ్యగీతి’, ‘పుడమికి కన్నెరికం’, ‘కెందామర’, ‘మూడు సంకేతాలు’, ‘అరచిత కవితా’ వంటి కవితలు అయన భావుకతను, కల్పనాశక్తికి ప్రతీకలు. ‘నాక్కొంచం నమ్మకమివ్వు’ కవిత ఆయనకు బాగా పేరు తెచ్చి పెట్టింది. ఈ కవితను శ్రీ శ్రీ ఇంగ్లిష్ లోకి అనువందించారు. ‘ముఝె కించిత్ విశ్వస్ దేవ్’ శిర్షికతో దీనిని నిఖిలేశ్వర్ 1962 లోనే హిందీలోకి అనువందించగ, స్వయంగా బైరాగి, ఆ తర్వాత యార్లగడ్డ లక్ష్మి ప్రసాద్ కూడా ఈ కవితను హిందీ లోకి అనువందించారు.

తన రచనలతో సాహితీ సమాజంలో ఎంతగా ఎదిగినా బైరాగి జీవితాన్ని చాలా నిరాడంబరంగా గడిపారు. పరిస్తితులను బట్టి అవసరాలను తగ్గించుకొన్నాడు. కవిత్వం, కథలు, వ్యాసాలతో వచ్చే అదాయంతోనే కాలక్షేపం చేశాడు. అతడికి ముగ్గురు సోదరులు ఎదిగివచ్చి, బైరాగి కోసం ఎంతటి త్యాగానికైనా సిద్దపడినా, ఎందుచేతనో ఒంటగారిగానే జీవించాడు. ఆరోగ్యం క్రమంగా క్షిణించిన ఆహార నియమాలు పాటించలేదు. 1978 సెప్టెంబర్ 9న కన్నుమూశారు.

 *

 

 

 

నాస్తికోద్యమ మేరుపర్వతం లవణం…

రాలిపోయింది.
నాస్తికోద్యమ మేరుపర్వతం నేలకొదిగి పోయింది.
ప్రజాస్వామిక విప్లవకారుడి ప్రస్థానం ఆగిపోయింది .
స్వాతంత్ర సమరయోధుడే కాదు సాంఘిక సమర సైనికుని  జీవితం ముగిసింది. కానరాని సుదూరతీరాలకు పయనమై వెళ్లిపోయింది.
నిత్యం నూతన సాధనాల అన్వేషణ చేసే ఆ శ్వాస నిలిచిపోయింది.
నవయువకుడిలా ఆలోచించే ఆయన జీవితం ముగిసిపోయింది.
మేమంతా నాన్నగారు అని గర్వంగా చెప్పుకునే, అభిమానంతో పిలుచుకునే  గోపరాజు లవణం ఇకలేరు.  మరణం అనివార్యం అని తెలుసు. అయినా ఆ వాస్తవాన్ని జీర్ణించుకోవడం చాలా కష్టంగా ఉంది.  కానీ తప్పదుగా…భారత్‌ కే కాదు  ప్రపంచ దేశాలకు మహత్మాగాంధీజీ మార్గాలు, నియమాలు సూక్తులు సర్వదా అనుసరణీయమని నమ్మిన గాంధేయవాది,  మానవతావాది లవణం గారితో నాకున్న పరిచయం, అనుబంధం తక్కువేమీ కాదు. ఆయన్ని మేమంతా (సంస్కార్ కార్యకర్తలు )అంకుల్ అనీ,  నాన్నగారూ అని పిలుచుకుంటాం.

లవణం గారితో నా పరిచయం ఈనాటిది కాదు. ముప్పై ఏళ్ళ క్రితం 1985లో మొట్టమొదటి సారి ఆయన్ని కలిశాను. అయితే , అంతకు ముందే మా నాన్న నోట ఆయన గురించి విని ఉండడం వల్లేమో మొదట చూసినప్పుడు ఒకింత ఎగ్జైట్ అయ్యాను.   తిరుపతిలోని  శ్రీ వెంకటేశ్వరవిశ్వద్యాలయం వారు అంతర్జాతీయ జాతీయ సేవాపథక కార్యక్రమం  శ్రీకాళహస్తి లో నిర్వహించారు. ఆ కార్యక్రమంలో నేనూ శ్రీ పద్మావతి విశ్వవిద్యాలయం నుండి కార్యకర్తగా పాల్గొన్నాను. అది పది రోజుల కార్యక్రమం. ఆ కార్యక్రమంలో పాల్గొన్న జాతీయ , అంతర్జాతీయ వాలంటీర్ లనుద్దేశించి ప్రసంగించడానికి ఓ రోజు  స్పీకర్ గా వచ్చారు లవణం దంపతులు.

అంతకు కొద్దిగా  ముందే యూరోప్ లో పర్యటించి వచ్చిన లవణం యువతని ఉత్తేజితం చేసే  ప్రసంగం చేశారు. అదే రోజు సాయంత్రం నుండి పొద్దుపోయే వరకూ మా మిత్ర బృందం లవణం గారితో నాస్తికత్వంపై వాదప్రతివాదనలు. తన వదనా పటిమ, వాక్చాతుర్యంతో ఎదుటివారిని తన వాదనని ఒప్పుకునేలా చేసే అద్భుతమైన తీరు, ఏ విషయమైనా అనర్ఘళంగా మాట్లాడగల శక్తిని, వ్యక్తిని చూడడం అదే మొదటిసారి. నాస్తికత్వం గురించి చేసిన వాదనలు ఎంతోకాలం వెంటాడుతూనే ఉండేవి. ఆ తర్వాత పదేళ్ళ కాలం గడచిపోయింది. విచిత్రం ఏంటంటే నేను వివాహానంతరం నిజామాబాద్ జిల్లా వర్నికి వెళ్ళాను.  అప్పటికే అక్కడ నాస్తిక మిత్రమండలి కార్యక్రమాలు , జోగినీ దురాచార నిర్మూలన కార్యక్రమాలు చేపట్టారు లవణం దంపతులు. అదిగో అప్పుడు మళ్లీ కలిశాను. అప్పటి నుండీ కలుస్తూనే ఉన్నాను . కారణం వారి సంస్థ సంస్కార్ కార్యకలాపాల్లో నేనూ భాగస్వామిని కావడమే. లవణం గారెప్పుడూ తమ దగ్గర పనిచేసే కార్యకర్తగా  చూడలేదు. ఓ కూతురుగానే చూసేవారు.  నేను సంస్కార్ లో చేరడానికి కొద్దిగా ముందు నా కన్న తండ్రి వల్లూరిపల్లి రంగారావు గారు పోవడం వల్లేమో లవణం గారితో మాట్లాడుతుంటే మా నాన్న గుర్తోచ్చేవారు.  బహుశా ఆ లోటు భర్తీ లవణంగారితో చేసుకున్నానేమో !

lavanam2005 అక్టోబర్ వరకూ ఆయన సంస్కార్ చైర్మన్ గానూ, నాస్తికోద్యమ నాయకుడిగానూ,  నాన్నగారిగానూ  మాత్రమే చూశాను. ఆతర్వాత CIDA/KRIS ఆహ్వానం మేరకు ఆయన నేతృత్వంలో  స్వీడెన్ , ఫిన్లాండ్ దేశాల పర్యటనకు బృందంలో నేనూ ఉండడంతో  ఆయన్ని లోతుగా చూసే, పరిశీలించే అవకాశాన్నిచ్చింది.  సమాజాన్ని ఆయన చూసే దృక్కోణం ఏమిటో కొద్దిగా నైనా అర్ధం చేసుకునే అరుదైన సమయం దొరికింది.

లవణం గారు  ఓ మానవతావాదిగా, నాస్తికుడిగా , దేశ గౌరవం ఏమాత్రం తగ్గకుండా చేసే ఉపన్యాసాలు , అక్కడి మిత్రులతో జరిపిన సంభాషణలు ,గాంధీ అంటే రాట్నం – మార్క్స్ అంటే తుపాకినేనా ? కాదంటూ చేసిన ప్రసంగాలు అక్కడి పత్రికలలో చోటుచేసుకోవడం, Political violence in India – A Gandhian Approach to Peace అనే అంశంపై స్వీడెన్ లోని ఐక్యరాజ్యసమితికార్యాలయంలో చేసిన ప్రసంగం, ఫిన్లాండ్ లోని  హెల్సింకి, కార్హులా, తుర్కు పట్టణాలలోను  చేసిన ప్రసంగాలు, నక్సలైట్లతో చర్చలకు సిద్దం అంటూ ఆయన వేసిన కరపత్రాలపై అక్కడిమిత్రులతో చేసిన చర్చలు ఆయనలో నాకు తెలియని ఎన్నో కోణాలని చూపాయి.  నా ఆలోచన విస్తృతం కావడానికి,  విశాలమవడానికి మార్గం దోహదం చేశాయి.

విప్లవం ,ప్రజాస్వామ్యం  రెండూ ప్రజల కోసమే అయినప్పుడు రెండూ కలసి ప్రజల కోసం పనిచేసే అవకాశాలు రావాలని కోరుకున్నారు లవణం.  ప్రతి పౌరుడు ఒక ప్రజాస్వామిక విప్లవవీరుడు అయితే ప్రజాస్వామిక పద్దతిలో విప్లవాత్మక సమస్యలు పరిష్కారం అయ్యే అవకాశాలు తప్పక ఉంటాయని అయన ఆలోచన.మారుతున్న సమాజంలోని సమస్యలకు అనుగుణంగా నూతన సాంఘిక విప్లవ సాధనాలు వెతకాలన్న ఆలోచనలోంచే, కొత్తబాటలు వేయాలన్న కలల్లోంచే పదేళ్ళక్రితం  నక్సలైట్లకు బహిరంగలేఖ రాసి ఉండవచ్చు. సర్వోదయ నాయకుడిగా , గాంధేయవాదిగా ప్రపంచానికి తెలిసిన లవణం తుపాకీ తమ అవయవాల్లో అంతర్భాగంగా ప్రకటించుకున్న నక్సలైట్లతో కలసి నూతన విప్లవ మార్గాలు వెదుకుదాం అంటూ పిలుపు నివ్వడం, వారితో కలసి చర్చించడానికి వారెక్కడికి రమ్మంటే అక్కడికి వస్తానని ప్రకటించడం చూసి చాలా ఆశ్చర్యం కలుగుతుందెవారికైనా .  రెండు విభిన్న మార్గాల్లోని వ్యక్తుల మధ్య, వ్యవస్థల మధ్య సమన్వయం ఎలా కుదురుతుందని సందేహం కలుగుతుంది. కానీ లవణం గారు మాత్రం గాంధీ – మావోల మధ్య సమన్వయము కోరుకున్నారు. అందుకు తనవంతుగా కృషి చేస్తానని ప్రకటించారు.
IMG_1450
గుంటూరు జిల్లాలోని స్టువార్టుపురం నేరస్తుల సంస్కరణ, నిజామాబాద్ , మెదక్ జిల్లాల జోగినీ వ్యవస్థ నిర్మూలన , పునరావాస కార్యక్రమాలతో లవణం దంపతులు స్వాతంత్ర్యానంతర సంఘ సంస్కర్తలు గానే కాక సాంఘిక విప్లవకారులుగా అనేక కార్యక్రమాలు నిర్వహించారు. రహస్యం కంటే బహిరంగంలో ఎక్కువ శక్తి ఉందేమొనని వివిధ కార్యక్రమాలు చేసిన అనుభవంతో అంటారు లవణం గారు.  తను చైర్మన్ గా ఉన్న సంస్కార్ లో తీవ్ర  సంక్షోభం తలెత్తినప్పుడు ఎదుటివారితో ఆయన వ్యవహరించిన తీరు మరచిపోలేనిది. ఆ సమయంలో ఆయనలో ఉక్కుమనిషిని చూశాను.
స్వీడన్ పర్యటనలోను, మనదేశంలోనూ  ఫండింగ్ ఏజెన్సీస్ తో ఆయన నిక్కచ్చిగా వ్యవహరించిన తీరు నాకు చాలా ఆశ్చర్యం కలిగించేది. తమ సంస్థలకి  విదేశీ నిధులు సంపాదించడం కోసం దేశాన్ని అత్యంత పేదరికంలో మగ్గుతున్న దేశంగా , ఇక్కడి పేదరికాన్ని భూతద్దంలో చూపించి నిధుల వేట సాగించే సంస్థలు ఎన్నో ఉన్న సమయంలో తన గౌరవాన్ని , సంస్థ గౌరవాన్ని , దేశ గౌరవాన్ని తాకట్టుపెట్టని అయన గొప్పదనం, వారితో వ్యవహరించిన ఖచ్చితమైన తీరు నన్ను అబ్బురపరిచాయి. ఆనందపరిచాయి.లవణం గారిపై తండ్రి గోపరాజు రామచంద్ర రావు గారి ప్రభావం ఎంత ఉందో అంతే ప్రభావం గాంధీ , మార్టిన్ లూథర్ కింగ్ లదీ ఉన్నట్లుగా అనిపించేది. 1966-67లలోనూ ఆ తర్వాత అమెరికా వెళ్లినప్పుడు మూడుసార్లు మార్టిన్ లూథర్ కింగ్ ను కలసి మాట్లాడానని చెప్పేవారు.   అహింసకు సత్యాన్వేషణ ముఖ్యమైనప్పుడు సత్యాన్వేషణ ఆస్తికుల సొంత హక్కు కానప్పుడు, నాస్తికులు కూడా సత్యాన్వేషణ చేస్తున్నారని అంగీకరించినప్పుడు తమ ఆస్తికత్వాన్ని చూసుకునే పద్ధతిలో పెద్ద మార్పు వస్తుంది. అది గాంధీజీలో వచ్చింది. గాంధీని ఆయుధంగా స్వీకరించిన మార్టిన్‌ లూథర్‌ కింగ్‌లో కూడా అటువంటి ఆలోచనే వచ్చింది. అందుకే ఆయన ప్రపంచ శాంతికొరకు నా వంటి నాస్తికులతో కలసి పనిచేయాలని అనుకున్నారు. దురదృష్టం కొద్దీ కింగ్‌ హత్య వల్ల నాకు ఆ అవకాశం లేకుండా పోయింది అనడం చాలా  సార్లు విన్నాను.గత శతాబ్దాన్ని నాలుగు భాగాలుగా విభజించి మొదటి అర్ధభాగాన్ని age of active morality అనీ, ఆ తర్వాతి ఇరవై ఎళ్ళని Age of passive morality అనీ, ఆ తర్వాతి పది పదిహేనేళ్ళ కాలాన్ని Age of passive immorality అనీ , ప్రస్తుతం మనం జీవించేది Age of  active immorality అని చాలా సార్లు చాలా సందర్భాలలో చెప్పేవారు.  సాంఘిక విప్లవంలో ఎంత చిన్న త్యాగమైనా వృధా పోదు . ఎంత పెద్ద త్యాగమైనా సరిపోదు . అసమర్ధతతో పెద్ద త్యాగాలు చేయలేక, అహంకారంతో చిన్న త్యాగాలు చేయక సమాజంలో అన్యాయాలు , అక్రమాలు, దోపిడీని మనమే కొనసాగిస్తున్నాం అంటూ ఆవేదన వ్యక్తం చేసేవారు లవణం.

IMG_1499

కుల మత రహిత వ్యవస్థ ప్రగాధంగా కోరుకునే వారు నాన్నగారు. కులాంతర, మతాంతర వివాహం చేసుకున్నారు. మానవతావాదం వైపు నడిచిన అయన వర్ణాంతర వివాహాలు చేసుకున్న వేలాదిమంది ముందుకువచ్చి తాము కులరహిత మతాతీత సమాజానికి పునాదులమని నిర్భయంగా చెప్పుకోవలసిన అవసరముందని అనేవారు. అందుకు మనం ఒక సామాజిక శక్తిగా రూపొందాలి. వివాహం ఒకప్రక్క వ్యక్తిగత విషయమైతే, మరొకప్రక్క సమాజానికి పునాది అయిన కుటుంబ వ్యవస్థకి శుభారంభం. అందుకే  మా వివాహం వ్యక్తిగతం అనడానికి వీల్లేదు. వివాహంతో కుటుంబాన్ని ప్రారంభిస్తున్నాం. కుటుంబం సమాజ వ్యవస్థకి మూలం. సమాజ వ్యవస్థ విలువల నుంచి పతనమవుతున్నప్పుడు కుటుంబం కూడా దిగజారిపోతుంది అని చాలా సందర్భాల్లో చెప్పేవారు.  మనం కులాల వేర్పాటు మనస్తత్వం నుంచి బయటపడాలి. ప్రస్తుతం ప్రతి కులంలోని ధనికులని ఆ కులంలోని పేదలే రక్షిస్తున్నారు అంటే ప్రతి కులంలోని దోపిడీ దారులను ఆకులంలోని దోపిడీకి గురవుతున్నవాళ్ళే రక్షిస్తున్నారు. అదే ఈ దేశపు ముఖచిత్రం అంటూ పరిస్థితిని విశ్లేషించేవారు.

గత మే లో అనుకుంటా ఫోన్ చేసినప్పుడు మాట్లాడుతూ – రాజకీయాలు కార్పొరెట్‌ చేతికి వెళ్లిపోవడంతో  వాటిలో మానవ విలువలు తగ్గిపోతున్నాయి .  రాజకీయాలలో తగ్గిపోయిన మానవ విలువలను మత విలువలతో నింపాలన్న ప్రయత్నం జరుగుతోంది. ఇలాగే సాగితే  సెక్యులర్‌ వ్యవస్థ రానురాను మతవ్యవస్థగా మారిపోతుందని ఆవేదన చెందిన లవణం గారి మాటలకి అర్ధం చేసుకుంటూ పరిస్థితుల్ని అన్వయించుకుంటూ ఉన్నా .  చాలా కాలమయింది నాన్నగారితో మాట్లాడి అనుకుంటూనే ఫోన్ చేయడంలో జాప్యం. నాన్నగారికి ఫోన్ చేయడమంటే కాస్త సమయం చూసుకుని చేయాలి. ఆయన చెప్పేవన్నీ వినాలి అప్పుడప్పుడూ ప్రశ్నలు వేయాలి . ఆయన చేసే సామాజిక విశ్లేషణల వెంట పరుగులు పెట్టాలి.

అందలోనే పిడుగులాంటి వార్త . లవణం గారి ఆరోగ్యం బాగుండలేదని. పరిస్థితి క్లిష్టంగా ఉందని. ఆ వార్త తెలియగానే గత నెల 29 న వెళ్లి చూసి వచ్చా. ICU లో ఉన్న ఆయన్ని చూడగానే దుఃఖం పొంగుకొచ్చింది. దాన్ని అలానే అణచివేస్తూ చూస్తూ నుంచున్నా.   నా చేయి పట్టుకుని నేను బాగానే ఉన్నానురా .. మన వాళ్ళందరికీ చెప్పు. అక్కడ అందరూ బాగున్నారా .. పిల్లలు ఎట్లా ఉన్నారు కుశల ప్రశ్నలు వేసి ప్రమాదం దాటేశానులే ఇక పర్వాలేదు అంటూ మాట్లాడడం మొదలు పెట్టారు.  మాట్లాడుతోంటే కొద్దిగా ఆయాసం వస్తోంది. మీరు ఎక్కువగా మాట్లాడకండి అంటే వింటేనా మాట్లాడుతూనే ఉన్నారు.  నిత్యచైతన్య శీలి అలా మాట్లాడుతూనే ఉంటారని ఓ 15 నిముషాల తర్వాత బయటికి వచ్చేశా.  లవణంగారి చిన్న చెల్లెలు నౌ గోరా గారితో కలసి నాస్తికకేంద్రంకి వెళ్ళాను. వాళ్ళు చెప్పారు పరిస్థితి ఎప్పుడు ఎలా ఉంటుందో చెప్పడం కష్టం, డాక్టర్ల అబ్సర్వేషన్ లోనే ఉండాలని.   లవణంగారు హాస్పిటల్ నుండి తిరిగివస్తారని  ఆశతో వెనుదిరిగా.

ఎవరికీ లేని విధంగా ఉప్పు సత్యాగ్రహసమయంలో పుట్టినందుకు ‘లవణం ‘ చాలా భిన్నంగా ఆలోచించడం చిన్నపుడే అబ్బింది. పదిపన్నెండేళ్ళ వయస్సులోనే 7వతరగతిలో ఉండగా బ్రిటిష్ విద్యావిధానంలో చదవనని బడి మానేశారు. కానీ నడుస్తున్న ఎన్సైక్లోపీడియాలాగా ఆయనకి తెలియని అంశంలేదు. ఏ విషయమైనా ధారాళంగా మాట్లాడేవారు.  పన్నెండేళ్ళ వయస్సులోనే క్విట్ ఇండియా ఉద్యమంలో పాల్గొన్నారు. 1944 – 46 లో మహాత్మాగాంధీ వెంట సేవాగ్రాం ఆశ్రమంలో ఉన్నారు. వినోభాభావే , జయప్రకాశ్ నారాయణ్ లతో కలసి భూదానోద్యమంలో పాల్గొన్న లవణం సహచరి విశ్వనరుడు గుర్రం జాషువా కుమార్తె హేమలత.  ఇద్దరూ కలసి అనేక సాంఘిక సమస్యల, రుగ్మతల పరిష్కారం కోసం నూతన మార్గాల్లో పయనించారు.

ఎనిమిదేళ్ళ క్రితం వెళ్ళిపోయిన హేమలత దగ్గరకి వెళ్ళిపోయారు లవణం.  లవణం దంపతులు చేసిన కృషి వృధా పోదు. వారు నాటిన స్పూర్తి బీజాలు ఎందరిలోనో అంతర్లీనంగా  ఉన్నాయి. అవి మరెన్నో బీజాలకు ప్రాణంపోస్తాయి. లవణం గారి ఆశయాలకు జవం , జీవం ఇస్తాయి. వారి నైతిక వారసత్వాన్ని, సామాజిక విప్లవాన్ని ముందుకు తీసుకుపోతాయి. అలా చేయడమే ఆయనకి మనమిచ్చే అసలైన నివాళి.

*

శివారెడ్డి జీవితమంతా కవిసమయమే!

నారాయణ స్వామి వెంకట యోగి 

(శివారెడ్డి 72వ పుట్టిన రోజు సందర్భంగా)

  swamy1“ఏం నాన్నా యెంత సేపైంది వచ్చి?’ అంటూ ఆప్యాయంగా సార్ బుజం తడితే చదువుతున్న పుస్తకం లోంచి ఉలిక్కి పడి తలెత్తి చూసి లేచి నిల్చుని “ఇంతకు ముందే సార్ “ అంటూ నమస్తే పెట్టాను. “నువ్వు చదువుతూ కూర్చో. మరో వరస క్లాస్ ఉంది నేనిప్పుడే వెళ్ళి త్వరగా ముగించుకుని వచ్చేస్తా. తర్వాత వెళ్ళిపోవచ్చు మనం” అంటూ లాకర్ లోంచి మరో టెక్స్ట్ బుక్ తీసుకుని క్లాస్ కు బయలుదేరారు. “సరే సార్ ఈ కవి కవిత్వం చాలా బాగుంది మీరొచ్చే లోపు మరిన్ని పద్యాలు  చదువుతా “ అంటూ పుస్తకం లో తలదూర్చేసా. యిప్పుడే వస్తానన్న సార్ మరో గంట దాకా కాని రాడని తెలుసు. పాఠం చెప్పడం ఆయనకెంత యిష్టమో అదీ ఆధునిక కవిత్వం బి ఏ బి యెస్సీ పిల్లలకు చెప్పడం యింకెంత యిష్టమో నాకు అంతకుముందే  యెరుక. సారు ఆధునిక కవిత్వం పాఠం చెప్తుంటే వినడం ఒక గొప్ప అపురూపమైన అనుభవం.

కాలం – 1983. స్థలం హైదరాబాదులో జాంబాగ్ కోఠిలో వివేక వర్ధిని సాయంకళాశాల.

దాదాపు గంటంబావు  తర్వాత హడావిడిగా తరగతి లోంచి బయటకు వస్తూ గడియారం చూసుకుని “యెనిమిదిన్నర అయిందే!  యివాళ్ళ ఫుల్ వర్క్ లోడ్.  సారీ నాన్నా లేట్ అయిపోయింది. యింక మనం బయలుదేరదాం పద” అంటూ బుజం మీద చెయ్యి వేసి బయటకు నడిపించుకుపోయారు. యింక అక్కడ్నుంచీ హరిద్వార్ హోటల్ దాకా నడక. నేను చదువుతున్న కవి కవిత్వం నుండి (అది సార్ అంతకు ముందు వారం ఇచ్చిన పుస్తకమే) మొదలు పెడితే ప్రపంచం మొత్తం చుట్టేసే వారు సారు. నిండా  పద్దెనిమిదేళ్ళు కూడా సరిగా నిండని నా బుజం మీద చనువుగా చేయి వేసి నాన్నా అని పిలుస్తూ,  తనతో గడిపిన ప్రతిక్షణమూ ప్రపంచ కవులనీ  కవిత్వాన్నీ పలవరిస్తూ విడమరిచి చెప్తూ మధ్య మధ్య లో, గొప్ప నవలల గురించీ, కథల గురించీ,  మంచి సినిమాల గురించీ, మంచి సంగీతం గురించీ ప్రస్తావిస్తూ మళ్ళీ కవిత్వలోకి దూకేవారు.  అప్పుడప్పుడే యీత నేర్చుకుంటున్న నాకు ఆ మహా సముద్రం లో అండగా చుక్కానిగా నిలబడిన సార్ యింకెవరో కాదు కె.శివా రెడ్డి గారు. వివేక వర్ధిని సాయంకళాశాల లో యింగ్లీషు అధ్యాపకునిగా పనిచేస్తూ తనకు దొరికిన ప్రతి క్షణాన్నీ కవిత్వం కోసమే, కవిత్వం తోనే, యిప్పటికీ,  గడపడాని కిష్టపడే మహా  కవి, గొప్ప మనిషీ.

అప్పుడప్పుడే పోతన మందార మకరంద మాధుర్యాలనుండీ,  బాలరసాల సాల నవపల్లవ కోమల కావ్య కన్యకలనుండి బయటపడి  శ్రీ శ్రీ ని, దిగంబర కవులనీ, తిరగబడు కవులనీ , రాత్రి కవితా సంకలనాన్ని, వీ వీ చలినెగళ్ళు, జీవనాడులనీ ,  కె, శివారెడ్డి రక్తం సూర్యుడు,చర్య, నేత్రధనుస్సు, ఆసుపత్రి గీతాలని చదివిన గొప్ప విసురూ, ఆవేశమూ ఆకలిలతో,  సమాజం మీద వ్యవస్థ మీద ధిక్కార భావంతో  , ఉన్న పరిస్థితి ని మార్చడానికి కవిత్వం రాయాలని కంకణం కట్టుకున్న కౌమార ప్రాయమది. జే యన్  టీ యూ నాగార్జునసాగర్ యింజనీరింగ్ కళాశాల లో 1981 లో చేరిన నాకు, సిద్దిపేట నుండి వచ్చినా యేచ్ పీ యెస్ లో ఐదేండ్ల చదువు పుణ్యమా అని హైదరాబాద్ కొత్తేమీ కాదు. యేచ్ పీ యెస్ లో యెలీటిస్ట్ ఆధిపత్యమూ అణచివేతలకింద నలిగిపోయిన నాకు సిద్దిపేటలో సాహిత్య వాతావరణం కొత్త ఊపిరులనిచ్చింది.

అట్లా కె. శివారెడ్ది గారు పరిచయమయ్యారు. కొత్తగా రాస్తున్న వారికీ, యువ,  నవ కవులకూ సార్  సాన్నిహిత్యం   అపురూపమైందనీ , కవిత్వ, సాహిత్య, సంగీత, సినిమా రంగాలలో కొత్త ప్రపంచాలను పరిచయం చేస్తుందని సిద్దిపేటలో నందిని సిధారెడ్డి సారు, యెస్. ప్రవీణ్ చెపితే శివా రెడ్డి గారి తో పరిచయం చేసుకున్నాను. ఆ పరిచయం యింతింతై అన్నట్టుగా అతి కొద్ది కాలం లోనే చాలా గాఢమైన సాన్నిహిత్యంగా మారడానికి ముఖ్య కారణం సారే! అప్పటికే నాలుగు కవితా సంకలనాలు ప్రచురించి ప్రముఖ కవిగా చలామణీ అవుతున్నా,  అట్లాంటి యావే లేకుండా నాతో పాటు తనూ  18 యేండ్ల వాడై పోయి  బుజం మీద చేయి వేసి అత్యంత ఆప్యాయంగా,  ఆత్మీయంగా దగ్గరైన అత్యంత సన్నిహితులైన వారు శివారెడ్డి సార్. యేనాడూ తాను సీనియర్ కవినని కానీ (యిప్పటికీ కూడా) తనకు చాల తెలుసనీ తాను సాధించింది యెక్కువనీ అనుకోకుండా, నిర్లక్ష్యం గానీ , చిరాకు గానీ కోపం కానీ   దగ్గరకు రానీయకుండా యెంతో స్నేహంగా మసలుతారు. అరమరికల్లేకుండా మాట్లాడ్డం, హిప్పోక్రసీ, ద్వంద్వ విలువలూ, యేదో దాచుకుని మాట్లాడ్డం, రాజకీయంగా మాట్లాడ్డం, పొడిపొడిగా రెండు ముక్కలు కవిత్వం గురించి చెప్పేసి, ‘ ఇప్పుడు సమయం లేదు  తర్వాత కలవ’ మనడం లాంటి యేనాడూ చేయలేదు సారు. ఉన్నదంతా బాహాటంగా చెప్పేసెయ్యడం, యింకా నేర్చుకోవాలి, చదవాలి, ప్రపంచ కవిత్వం లో నిండా మునిగి తడిసిపోవాలి అన్న దాహం తో తపించిపోయే వారు శివారెడ్డి సారు.( యిప్పటికీ యిన్ని యేండ్ల తర్వా త యెప్పుడు కలిసినా యే కొత్త కవిత్వ పుస్తకాన్ని తెచ్చావని అడిగి  , తీసుకుపోయిన పుస్తకా న్ని అపురూపంగా ఆనందంతో మిలమిలలాడే కళ్ళతో అందుకుంటారు. ) అందువల్లే  ప్రతి సాయంత్రమూ కాలేజీ హాస్టల్ నుండి వీ వీ కాలేజి కి రావడం,సార్ తో క్లాసులయ్యాక అయితే హరిద్వార్ కో,  లేకపోతే  ఖైరతాబాద్ లో ద్వారకా కో వెళ్ళిపోయే వాణ్ణి.

siva1

శివారెడ్డి అంటే నిరంతర అధ్యయనమే!

అప్పుడు శివారెడ్డి గారితో మా సంభాషణలకు ప్రదానమైన అడ్డా ద్వారకా హోటల్. దాదాపు ప్రతి సాయంత్రమూ అక్కడ కవులూ, కవిత్వాభిమానులూ  గుమిగూడే వారు శివారెడ్డి  గారి కోసం. యెన్ని ముచ్చట్లు యెన్ని ముచ్చట్లు, ప్రపంచ కవిత్వ వీధుల్లో యెంత నిరంతర నిర్విరామ చంక్రమణం, మహాకవుల కవితా వాక్యాల చుట్టూ పరిభ్రమణం, సార్ తో గడిపిన ప్రతి క్షణమూ అమోఘమూ   అద్భుతమూ, అపురూపమున్నూ. కొన్ని సమయాల్లోనైనా కవిత్వం మాట్లాడక యింక మరే సంగతి మాట్లాడినా –  అది ప్రత్యక్ష పరోక్ష జీవితానుభవం కావచ్చు లేదా యింకేదైనా కావచ్చు –  అందులోనూ  కవిత్వానికి సంబంధించిన ముడిసరుకు తప్పనిసరిగా ఉండేది. తవ్వుకోవాలే కానీ కవిత్వ జల నిరంతరం ఊరే  గొప్ప చెలిమ శివారెడ్డి గారు. కవిత్వ దాహంతో ఉన్నవారందరికీ  అలవోకగా అమృతాన్ని పంచి ఇస్తారు.

సార్ దగ్గర సముద్రమంత గ్రంథాలయం. యింటి నిండా సందు లేకుండా పుస్తకాలు. ఆకలిగా పుస్తకాలను చూస్తుంటే,  తడుముతుంటే “ యిదిగో ఈ ఆఫ్రికన్ కవి కవిత్వం చదువు, యిదిగో ఈయన గ్రీకు దేశపు మహాకవి రిట్సాస్ ఇది తీసికెళ్ళి చదువు,  ఇదిగో ఇది నెరూడా పుస్తకం ఈయన బ్రేటన్ బ్రేటన్ బా దక్షిణాఫ్రికా కవి తీసికెళ్ళి   చదువు”  అంటూ యెంతమాత్రం సంకోచం లేకుండా, ప్రేమగా ఆప్యాయంగా బాగా ఆకలిగొన్న వాడికి అద్భుతమైన భోజనం  యెంతో ఆత్మీయంగా పెట్టినట్టుగా పుస్తకాలనిచ్చేవారు. అయితే జాగ్రత్తగా తీసుకుని రమ్మనే వారే తప్ప యేనాడూ “ యేదా పుస్తకం యేమైందీ”  అంటూ అడిగే వారు కాదు. సెంఘార్, చికాయా యూ టాంసీ, సిల్ చినీ కోకర్ , డేవిడ్ డయోప్ , రిట్సాస్  ఐమీ సెజేర్, సెజార్ వయేహో లాంటి ప్రపంచ మహాకవులెందరినో పరిచయం చేసారు. వాళ్ళలో అప్పటికే చాలా మందిని అనువాదం చేసి ఉన్నారు. శ్రీ శ్రీ తర్వాత, నిజానికి అంతకన్నా యెక్కువగా విస్తారంగా అనేక ప్రపంచ మహాకవులను తెలుగు లోకి అనువాదాలు చేసి పరిచయం చేసిన వారు శివారెడ్డి గారు.

ప్రపంచ వ్యాప్తంగా  మహాకవుల కవిత్వాన్ని యెందుకు చదవాలో కలిసిన ప్రతి సారీ  నొక్కి చెప్పే వారు. ‘యితర కవుల కవిత్వాన్ని చదవడం వల్ల మూడు గొప్ప ప్రయోజనాలున్నై’  అనే వారు… ఒకటి – ఆ కవి ఒక వస్తువుని యెట్లా  కవిత్వం చేసాడు, యెట్లా ఊహించాడు ,ఒక పద్యాన్ని యెట్ల్లా నిర్మించాడు, యేయే పదచిత్రాలని, యే యే ఉపమానాలని, ఉత్ప్రేక్షలని వాడాడు, యేట్లా పద్యం conceive చేసాడు అనేది తెలుస్తుంది, రెండు – యే యే వస్తువులని యెంచుకున్నాడు, తన అనుభవం లోకి వచ్చిన ఆ వస్తువుని, అనుభూతినీ , యే ప్రాపంచిక దృక్పథంతో,  యెట్లా తన పద్యంలో ప్రతిఫలించాడు అని తెలుస్తుంది,  మూడు – అనేకానేక కవుల తర్వాత రాస్తున్న మనం వారందరికంటే భిన్నంగా పద్యం యెట్లా రాయగలం? యింతకు ముందు యెవరూ చేయనట్లు  యెట్లా ఊహ చెయ్యగలం, వస్తువుని చూడగలం , కొత్తగా  పద్యం చెప్పగలం –  అనేది వాళ్ళందరినీ చదవడం వల్ల నేర్చుకొగలుగుతాం. యితర కవుల కవిత్వాన్ని చదవడం వల్ల మనం రాసే కవిత్వానికి కొత్త బాట యేర్పడుతుంది, మనకు కవులుగా కొత్త గొంతుక యేర్పడుతుంది. అట్లాంటి కొత్త గొంతుక, మనదైన ముద్ర, వ్యక్తిత్వం , మనదైన పద్యం రాయగలగాలంటే తప్పకుండా అందరి కవుల పద్యాలని చదవాలి వారి పోకడలని పరిశీలించి విశ్లేషించి మనం కొత్త పోకడలు పోవాలి అనే వారు.  దేని గురించైనా రాయి, ముందు కవిత్వం,  మంచి కవిత్వం రాయి,  మనదైన ప్రాపంచిక దృక్పథంతో (worldly outlook) ప్రతి వస్తువును మంచి  కవిత్వం చేయడం అన్నింటికన్నా ముఖ్యం అనేవారు. పీడిత ప్రజల పక్షం వహించే ప్రాపంచిక దృక్పథం లేక పోతే యెంత మంచి కవిత్వం రాసినా దాని వల్ల  ప్రయోజనముండదనీ, మంచి  కవిత్వం కానప్పుడు నువ్వెంత గొప్ప దృక్పథం తో వస్తువుని చెప్పినా  అది కవిత్వంగా నిలబడదనీ గుర్తుపెట్టుకొమ్మనే వారు.

అట్లానే ‘ప్రతీదీ కవిత్వానికి ఉపయోగపడేట్టుగా యెట్లా చూడాలి, ప్రతి క్షణమూ ప్రతి సంఘటనా  మనం కవిత్వం రాయడానికి ఉపయోగపడేలా యెట్లా చేసుకోవాలా అనే ఆలోచించాలి’   అని చెప్పేవారు. ఉదాహరణకు, ఒక మంచి సినిమా చూసినప్పడు మన స్పందన కవిత్వంగా యెట్లా మార్చుకోవాలో ఆలోచించమని చెప్పేవారు. అప్పటికే హైదరాబాదు లో మంచి సినిమాలని యెంపిక చేసి ప్రదర్శించే ఫిల్మ్ క్లబ్ ఒకటి నడుస్తూ ఉండేది. అక్కడా, మాక్స్ ముల్లర్ భవన్, అలైన్స్ ఫ్రాంసై  లో మంచి సినిమాలనెన్నో చూసే అవకాశం దొరికింది. ఒక సినిమాని యెట్లా ‘ కవి దృష్టి’ తో చూడాలి, దాన్ని కవితాత్మకంగా యెట్లా అనుభవించి పలవరించాలి అని శివారెడ్డి గారి దగ్గరే నేర్చుకున్నా నేను. అకిరా కురొసావా ‘దెర్సూ ఉజలా’ సినిమా చూసినంక శివారెడ్డి గారు రాసిన  ‘అడవులు భయపెడతాయి’ అనే కవిత ఒక సినిమా ని కవిత్వంలోయెట్లా ప్రతిబింబించవచ్చో అద్భుతంగా చూయిస్తుంది. సినిమా అనేక కళల సమ్మేళనం కాబట్టి. ఆయా కళల్లో ప్రతి దానిలోనూ కవిత్వం ప్రతిధ్వనించే అవకాశం ఉంది కాబట్టి (నటన కావచ్చు, చాయాగ్రహణం కావచ్చు, సంగీతం కావచ్చు, మాటలు కావచ్చు ) సినిమా ప్రతి క్షణమూ కవితాత్మకంగా ఉండాలి అనే వారు. అప్పుడే మళయాళ దర్శకుడు, గొప్ప సెల్ల్యులాయిడ్ కవీ  అరవిందన్ రెట్రాస్పెక్టివ్ ప్రదర్శిస్తే ‘ఒరిదతు’, ‘కాంచన సీత’,’ తంపు’,’వాస్తుహార’, ‘ఉత్తరాయణం’ లాంటి అద్భుత కావ్యాలాంటి సినిమాలు సారూ, ప్రకాషూ , నేనూ చూసి తడిసిపోయాం.  ఆ సినిమాలు ప్రత్యక్షంగానో పరోక్షంగానో అనేక కవితలకు ప్రేరణయ్యాయి కూడా. యూరుగ్వాయి   రాజకీయ ఖైదీలగురించి తీసిన ‘ఐస్ ఆఫ్ బర్డ్స్ ‘ అనే సినిమా చూసాక నేను రాసిన పద్యం విని శివారెడ్డి గారు నీళ్ళు నిండిన కళ్ళతో గాఢంగా కౌగలించుకున్నారు. ఒక మంచి పద్యం గానీ ఒక గొప్ప కవితా వాక్యం గానీ వింటే నిలువెల్లా పులకించి, పరవశించి పోయి కళ్ళనీళ్ళ పర్యంతమై కరిగిపోయే కవితామూర్తి శివారెడ్డి గారు.

1983-84 కాలంలో మా హాస్టల్ గన్ ఫౌండ్రీ లోని ఒక పాడుబడ్డ భవంతిలోకి మార్చారు. కింగ్  కోఠీ నుండి బషీర్ బాగ్ చౌరస్తాకి నడిచి వెళ్తుంటే మధ్యలో భారతీయ విద్యాభవన్ ని ఆనుకుని ఉండేదది. అప్పుడంతా కలినడకే – హైదరాబాద్ వీధి వీధినా కాలినడకతో  రాత్రింబవళ్ళు తిరిగి తిరిగి మహా నగరం మారుమూలలనీ, జీవితపు చీకటి కోణాలనీ , వెల్తురు  ఛాయల్నీ ప్రతి నెత్తురు బొట్టులో యింకించుకుని రంగరించుకున్నాం. మా సంచారానికి  శివారెడ్డి గారి కవిత్వ కరదీపిక తోడైంది. సారిచ్చిన కవిత్వం టార్చిలైటు తో నగరం మూల మూలలా శోధించాం జీవితానుభవ రహస్యాలకోసం , కవిత్వం ముడిసరుకు కోసం. అట్లే యేదైనా కవి కవిత్వం చదివినా ఒక సారి కాదు,  ఆ కవి మన ఆలోచనల్లో, చైతన్యం లో, చివరికి  నరనరాల్లోపూర్తిగా యింకే దాకా చదవమనే వారు. ఒక పద్యాన్ని చదివాలి. మళ్ళీ మళ్ళీ చదవాలి,  ప్రతి  కవితా పాదాన్నీ  చదివి మననం చేసుకోవాలి, ఆ కవిలో మనం పరకాయ ప్రవేశం చేయాలి అప్పుడే అనేకానేక కవుల కవిత్వ మెళకువలు మనకు అర్థమౌతాయ్. మన చైతన్యం లో భాగమై మనకి  కొత్తగా  చూడడం ఊహించడం నేర్పి, ఒక  కొత్త గొంతుకనిస్తాయి.  అందుకే యిప్పటికీ యే కొత్త ప్రపంచ కవి కవిత్వం కనబడినా ఆప్యాయంగా అక్కున చేర్చుకుని   తన స్వంతం చేసుకుంటారు. ఆ కవి కవిత్వాన్ని తనలో  భాగం  చేసుకుంటారు. తనదైన కొత్త గొంతుకని నిత్య నూతనంగా పలికిస్తారు.

యేది చూసినా దీన్ని కవిత్వమెట్లా చేయాలా అనే దృష్టి తోనే చూడాలి అని సార్ చెప్పిన పాఠాన్ని నరనరానా యింకించుకున్నాం. అప్పుడు పీ డీ యెస్ యూ లో చాలా చురుగ్గా పని చేస్తున్న రోజులు. అయితే కవిత్వం లేదా విద్యార్థి ఉద్యమం అన్నట్టు ప్రతి క్షణాన్ని గడిపేవాణ్ణి. నాకు తోడు,  కవిత్వం రాయకపోయినా ప్రకాషూ (ఒకటే కవిత రాసాడీయన – ‘Eyes of the Birds’ చూసి), కవిత్వం రాస్తూ సుధాకిరణ్ ఉండేవారు. మా హాస్టల్ లో పీ డీ యెస్ యూ ప్రభావం చాలా బలంగా ఉండేది. చాలా మంది విద్యార్థులు మా తోడుండే వారు. అవతలి  పక్షం లో యే బీ వీ పీ కూడా ఉండేది. అయితే పీ డీ యెస్ యూ లో ఉన్న విద్యార్థులు చాలా మంది పుస్తకాలకు దూరంగా మరీ ముఖ్యం కవిత్వానికి బహు దూరంగా ఉండే వారు. క్లాస్ టెక్స్ట్ బుక్స్ చదవడమే యెక్కువ యింక వేరే పుస్తకాలా అని పెదవ్విరిచే వారు. ప్రకాషూ నేనూ ఆదివారం రాగానే ఆబిడ్స్ వీధుల్లో ఆకలితో వీర విహారం చేసి కనీసం రెండు మూడు పుస్తకాలు కొనుక్కొస్తే తెగ ఆశ్చర్యపోయే వారంతా. చక్కగా ఉన్న కొద్ది పాకెట్ మనీ తో యేదో సినిమా చూడక వీళ్లకిదేమి పిచ్చి అని మమ్మల్ని చూసేవారు.

వీళ్ళతో యెట్లా అయినా పుస్తకాలు చదివించాలి కనీసం అటువైపు దృష్టి మళ్ళించాలి అనుకుని ఒక సారి శివారెడ్డి గారితో ప్రస్తావించి ‘సార్ మీరొకసారి మా హాస్టల్ కి వచ్చి మాట్లాడాలి – పుస్తకాలూ  సాహిత్యమూ యెందుకు చదవాలో మా వాళ్ళకి చెప్పాలి’ అని అన్నాను. ‘ ‘సరే అట్లాగే ఒక ఆదివారం సాయంత్రం వస్తాన’న్నారు. మా వాళ్లందరినీ ఒక రూం లో జమ చేసాము. సారు వచ్చారు. పరిచయాల తర్వాత దాదాపు గంటన్నర పైగా ఉపన్యాసం – నెమ్మది గా చిన్న నీటి ఊటలాగా మొదలై,  మెల్ల మెల్ల గా పుంజుకుంటూ,  ఒక మహా ప్రవాహమై, వుధృత జలపాతమై అందరినీ తడిపి ముద్ద చేసింది. ఆ పాడుబడ్డ హాస్టభవంతిలో రూం లకు పూర్తిగా గోడలు లేక దాదాపు అన్ని రూముల్లోకీ సార్ మార్దవ గంభీర స్వరంలో ఉపన్యాసం ప్రవహించి ఒక్కొక్కరే విద్యార్థులు రూం లోకి  రావడమూ, లోనా బయటా కిక్కిరిసి పోవడమూ జరిగింది.

ఉపన్యాసం అయిపోగానే ఒక మహా జలపాతం కింద నో ఒక వెచ్చని ఆత్మీయ వర్షం లోనో తడిసి ముద్దయినట్టు విద్యార్థులంతా తన్మయత్వంతో మమేకమయ్యారు. పుస్తకాలూ , సాహిత్యమంటే యేమిటి, వాటిల్లో యేముంటుంది, వాటిని యెందుకు చదవాలి, యెట్లా చదవాలి, మంచి సాహిత్యానికి చెడ్డసాహిత్యానికి తేడా యేమిటి, వ్యాపార సాహిత్య లక్షణాలేమిటి (యండమూరి తదితరులు వ్యాపార సాహిత్య రంగాన్ని  రాజ్యమేలుతున్న కాలమది) , మంచి సాహిత్యాన్ని చదవడం వల్ల మనకు యేమిటి ప్రయోజనం, అది మనల్ని యెట్లా ప్రభావితం చేస్తుంది, యెట్లా వికాసమిస్తుంది, మన జీవితాలని మార్చేశక్తి మంచి సాహిత్యానికీ కవిత్వానికీ యెట్లా ఉన్నది-  అని అనేక విషయాలని అత్యంత సులువుగా అర్థమయ్యే ప్రపంచసాహిత్యలోంచీ , జీవితానుభవాలనుంచీ ఉదాహరణలతో, దారాళంగా ఆకట్టుకునేలా అద్భుతంగా చెప్పారు. విద్యార్థులంతా ఆలోచనలు ఝుమ్మని  చుట్టుముడుతుంటే  ఒక కొత్త ప్రపంచంలోకి వెళ్ళిపోయారు. అప్పట్నుండీ సార్ కి అభిమానులైపోయారు. మేము కొన్న పుస్తకాలకు ఆ రోజునుండీ డిమాండ్ పెరిగిపోయింది. ఒక చిన్న నోట్ బుక్ లో తీసుకున్న పుస్తం పేరూ తమ పేరూ రాయమని పెడితే అది ఒక నెల రోజుల లోపే నిండి పోయింది కూడా. యిద్దరు ముగ్గురు కవిత్వ రాసే ప్రయత్నాలు చేసారు కూడా. అదీ సార్ ఉపన్యాస శక్తి  ప్రభావం.

siva2

శివారెడ్డి గారిలో మరో గొప్ప లక్షణం కవిత్వాన్ని, మంచి కవిత్వాన్ని సర్వకాల సర్వావస్థలలోనూ ప్రేమించడం – ఇది అందరికీ సాధ్యమయే పని కాదు. జీవితంలో అనేకానేక సందర్భాలుంటై. కొన్ని దుఃఖ సందర్భాలు, చిరాకూ కోపాల తో కూడిన  సందర్భాలు, కష్టనష్టాల్లొ ఉన్నప్పుడూ ‘యిది కవిత్వానికి సమయం కాదనీ ’  ,’ ఇప్పుడు కవిత్వమేమి టీ వేళా పాళా లేకుండా’  అని యెందరో అనడం ప్రత్యక్షంగా  చూసాను నేను. కానీ ఒక్క శివారెడ్డి గారి విషయంలోనే యెప్పుడైనా, యెక్కడైనా యెట్లాంటి పరిస్థితుల్లోనైనా కవిత్వం గురించి సాహిత్యం గురించీ   నిరభ్యంతరంగా నిర్మొహమాటంగా మాట్లా డ వచ్చు, కవిత్వం వినిపించవచ్చు ‘యెట్లుంది సార్ యేమైనా సూచనలివ్వండి’ అని కూడా అడగవచ్చు. అదీ సార్ గొప్ప తనం.

ఓ సారి ఒక పద్యం రాసి దాన్ని యెట్లాగైనా సరే సార్ కి వినిపించాలని కాలేజీ కి వెళ్ళా. అప్పటికే యెనిమిది దాటటం వల్ల సార్ వెళ్ళి పోయారు. అక్కడ్నుంచి నడిచి హరిద్వార్ హోటల్ కి వెళితే అక్కడా లేరు. వనస్తలిపురం బస్సెక్కి సార్ ఇంటికెళ్ళే సరికి రాత్రి పదకొండు దాటింది. యేమనుకుంటారో అనే మొహమాటం లేకుండా తలుపు తడితే ఆంటీ తలుపు తీసి ఆశ్చర్య పోయి, ‘సారు బాగా అలసి పోయి పడుకున్నారు నాన్నారేప్పొద్దున మాట్లాడుదువు  కానీ’  అని ఈ రాత్రి పొద్దు పోయింది కదా ఇక్కడే పడుకో’ మంటూ హాలు లో నాకోసం జాగా చేస్తున్న సమయానికి సారు లేవనే లేచారు.  ‘యేమైంది స్వామీ యింత రాత్రి? ’ అంటూ హాలులోకి వచ్చారు. నేను వచ్చిన సంగతి విని కళ్ళనీళ్ళ పర్యంతమయ్యారు. ‘స్వామి కేదైనా పెట్టు తినడానికి’  అని నా పరిస్థితి నెరిగి ఆంటీ కి చెప్పారు. ముందు పద్యం వినిపించమని పద్యం విన్నాక ‘అద్భుతం స్వామీ’ అని కళ్ళ నిండా  నీటితో కౌగలించుకుని, నేను తినే దాకా ముచ్చట్లెన్నో చెప్పి తిన్నాక కూడా చాలా సేపు గడిపారు నాతో. అదీ సార్ కి కవిత్వం మీదా కవులమీదా ఉన్న అభిమానమూ, ప్రేమా వాత్సల్యమూ.  అట్లాగే యెప్పుడు కలిసినా ‘డబ్బులున్నాయా నాన్నా? పుస్తకాలవీ కొంటున్నావు కదా, ఇదిగో ఇవి ఉంచు’ అంటూ తన దగ్గర సరిపడా ఉన్నా లేకున్నా,తనకి సరిపోతాయా లేవా అనే ఆలోచన లేకుండా డబ్బులు తీసి జేబులో కుక్కే వారు. ‘వద్దు సార్ ‘ నా దగ్గర ఉన్నాయ’న్నా యెక్కడ నీ మొహం అంటూ బలవంతంగా ఇచ్చే వారు. తానిచ్చే డబ్బులు వృధా కావనే గొప్ప నమ్మకం సారుకు. డబ్బుని లెక్క చేయని ఆత్మవిశ్వాసమూ, చిత్తు కాగితాలుగా చూసి దాని మాలిన్యాన్నంటనివ్వని మహోన్నత మానవీయ లక్షణం. మాననీయ కవితా స్వభావం శివారెడ్డి గారిది.

అంతగా  కవిత్వానికి జీవితాన్ని అంకితం చేసారు కాబట్టే యింకెవ్వరికీ రానన్ని కష్టాలొచ్చినా , యెడతెగని దుఃఖ సందర్భాలెదురైనా,  అంతులేని శోక అగాధాలోకి నెట్టి వేయబడ్డా కవిత్వాన్నే నమ్ముకున్నారు, కవిత్వాన్నే  ప్రేమించారు, ఆరాధించారు, తానే కవిత్వం,కవిత్వమే తాను – సర్వస్వం కవిత్వమే అయ్యారు. కాలు విరిగి రెండు సంవత్సరాలు మంచం పాలయినా కించిత్తైనా చెదరని ఆత్మ విశ్వాసంతో, సడలని కవిత్వం మీద ప్రేమతో అధ్బుతమైన కవిత్వం ‘అంతర్జనం’ రాసారు. తాను అప్పటిదాకా రాసిన కవిత్వం కన్నా భిన్నంగా తనదైన కొత్త గొంతుకని పలికించారు. యెందరో మంది కవులకు కరదీపిక, గురువూ, సన్నిహితుడూ, ఆత్మీయుడూ అయ్యారు.  పదిహేను కవితా  సంకలనాలని ప్రచురించి,  యింకా నవనవోన్మేషమైన కవిత్వాన్ని సృష్టిస్తూ   నిరంతర కవితా వ్యవసాయం చేస్తున్న అలుపెరుగని రైతూ,  పసి పిల్లవాడూ శివారెడ్డి గారు. 72 వసంతాలు పూర్తి చేసుకున్న నవ యవ్వనుడు శివారెడ్డి సారు కు  హార్థిక శుభాకాంక్షలు.

*

చలసానికి మావోయిజం ఒక way of life!

 

 కూర్మనాథ్

ఒక శిఖరం కూలిపోయింది.
మా ఉత్తరాంధ్ర పెద్దదిక్కు పోయింది.
తెలుగు సాహిత్యం ఓ చుక్కానిని,
విప్లవోద్యమం ఓ సహచరుడ్ని కోల్పోయింది.
తెలుగు ప్రజలకి ఒక తోడు లేకుండాపోయింది.
యారాడ కొండ చిన్నబోయింది.

***
స్వార్ధంలేని మనిషి వుంటాడా? వ్యాపారమయమైన, వస్తుమయమైన ఈ ప్రపంచంలో స్వార్ధంలేకుండా వుండగలిగే అవకాశం వుందా? ఉందనే నిరూపించాడు ప్రసాద్. విప్లవాసాహిత్యోద్యమానికీ, మిత్రులకీ సీపీగా తెలిసిన చలసాని ప్రసాద్ తనని తాను రద్దు చేసుకుని బతికేడు. రెండు రాష్ట్రాల్లో వందలాదిమందికి ఆయన ఆప్తుడు. మానవసంబంధాలు నిలబెట్టుకోవడంలో ఆయన తర్వాతే ఎవ్వరైనా.

ఆయన పరిచయాల  విస్తృతి చూసి ఎవరైనా ఆశ్చర్యపడక తప్పదు. వరంగల్ రైల్వే స్టేషన్లో కావచ్చు, నాంపల్లి పోస్టాఫీసులో కావచ్చు, పుస్తక ప్రచురణ కేంద్రాల్లో కావచ్చు, పత్రికాఫీసుల్లో కావచ్చు, రచయితల్లో కావచ్చు – ఆయనకి విస్తారంగా పరిచయాలుండేవి. అవి ఏవో మొక్కుబడి పరిచయాలు కావు. ఒకసారి పరిచయం అయితే, ఆయన లేదా ఆమె ఇక ఎప్పటికీ మిత్రుడో, మిత్రురాలో.

జీవితమంతా సాహిత్యం, సాహిత్య ప్రచారం, విప్లవం, పౌరహక్కులు తప్ప ఇంకోటి తెలియని సీపీ. అత్యంత నిరాడంబరుడు. జీవితంలో ఒక్కసారికూడా దువ్వెన వాడని, ఒక్కసారికూడా ఇస్త్రీ చేసిన బట్టలు వేసుకుని, ఒక్క క్షణం కూడా టీవీ చూడని – సీపీ. ఆకలి దప్పులు లేనివాడు లేదా పట్టించుకోని వాడు. కానీ, ఆకలి దప్పులతో, అవసరాలతో వున్నవాళ్లని అనుక్షణం పట్టించుకున్నవాడు. సరిగ్గా యేనన్ ప్రసంగంలో మావో చెప్పినట్టు, నిజమైన మేధావి ప్రజల్లో ఒకడిగా, ఎలాటి బేషజాలు లేకుండా కలిసిపోవాలని చెప్పాడో, నిరాడంబరంగా వుండాలని చెప్పాడో, సీపీ సరిగ్గా అలా వుండేవాడు. మార్క్సిజాన్ని, మావోయిజాన్ని ఒక జీవిత విధానంగా మార్చుకుని, ఒక శ్వాసగా మార్చుకుని బతికినవాడు ప్రసాద్.

cp8

సీపీలేడన్న దుఖం రక్తంలోకి ఇంకుతున్నకొద్దీ ఆయన లేని లోటు లోతు పెరుగుతూ కనిపిస్తూవున్నది. ఏ కృష్ణా తీరాన్నుంచి ఎప్పుడు విశాఖ వచ్చాడోగాని ఉత్తరాంధ్రని సొంత వూరు చేసుకున్నాడు. శ్రీకాకుళం వుద్యమం ఆయన్నెంత కదిలించిందో, ఉత్తేజపరిచిందో, దిస్టర్బ్ చేసిందో ఆయన “ఈ విప్లవాగ్నులు ఎచటివని….” పాడినపుడు తెలుస్తుంది.
“మా ‘పంచాది’ ఎలావున్నాడు,” అని అడిగేవాడు, మా అమన్ గురించి అడుగుతూ. సీపీకి మనుషులు సతతహరితాలు. అంతిమంగా మనిషి నిలుస్తాడు అని నమ్మినవాడు.  అందుకే విప్లవోద్యమం ఒడిదుడుకులకు గురైనపుడు, సెట్ బేక్లకు గురైనపుడు, ఎదురుకాల్పుల్లో విప్లవకారులు మరణించినపుడు మ్రాన్పడి, దిగులుపడి ఏనాడూ కూచోలేదు. అసలు అలుపన్నదే, అనారోగ్యమన్నదే తెలియదు ప్రసాద్ కి.

పుస్తకాల మీద ప్రసాద్ కి ఎంత ప్రేమో చెప్పక్కర్లేదు. ఆయన ఇంట్లో మేడ మీద ఓ పెద్ద లైబ్రరీ.
వామపక్ష ఉద్యమాలకి, సాహిత్యానికి సంబంధించి ఎవరు ఏ యూనివర్సిటీలో పరిశోధన చేస్తున్నా, ఎవరికి ఏ సందేహం వచ్చినా విశాఖలో ఆయనింటికి వెళ్ళాల్సిందే. ఎక్కడ ఏ పుస్తకం వుందని చెప్పడమే కాదు, ఏ పుస్తకంలో ఏముందో, ఎవరు ఏం చెప్పారో అలవోకగా చెప్పేసేవాడు. ఇక శ్రీశ్రీ, రావిశాస్త్రి, కొకుల సాహిత్యం మీద ఆయనకున్న పట్టు గురించి కొత్తగా చెప్పాల్సింది ఏముంటుంది? ఆయనలేకుండా, వాళ్ళ సాహిత్య సర్వస్వాల ప్రచురణ ఊహించలేం.

అక్కడికెళ్లకుండా పని అయేది కాదు. ఓ మూడు సంవత్సరాలుగా లెక్కలేనన్ని సార్లు ఫోన్ చేసేడు – మా కొలీగ్  ఒకాయన ఇరవైఏళ్ల క్రితం తన దగ్గర తీసుకున్న పుస్తకాల గురించి. ఓ రోజు, రాసుకో ఏయే పుస్తకాలు తీసుకెళ్లాడో అని పేర్లు చెప్పేడు. అడిగేవా, ఇస్తానన్నాడా, ఎప్పుడిస్తాడట, అసలు ఇస్తాడా – అని ప్రశ్నల మీద ప్రశ్నలు వేసేవాడు. మా కొలీగ్ రెస్పాన్స్ చాలా పూర్ గా వుండేది. వున్నాయనీ చెప్పేవాడు కాదు, లేవనీ చెప్పేవాడు కాదు. ఇస్తానని ఒకసారి, ఇంతకుముందే ఇచ్చేశానని ఇంకోసారి, వున్నాయో లేదోననీ చెప్పేవాడు.

మూడేళ్ళ గొడవ తర్వాత మొత్తానికి ఆ పుస్తకాల్లో కొన్నిటిని ఇచ్చేడు ఈ మధ్యనే. ఆ సంగతి ఫోన్లో వెంటనే చెప్తే ఎంత సంతోషించాడో! కానీ ఆ పుస్తకాలు చూసుకోకుండానే వెళ్లిపోయాడు.

నాకు ప్రసాద్ పరిచయం చోడవరం లైబ్రరీ స్టడీ మిత్రులు వర్మ, వేణుల ద్వారా. ఆ తర్వాత విశాఖలో జర్నలిజం చదువుతున్నపుడు పరిచయం కొంచెం పెరిగినా, అనుబంధం ఏర్పడింది మాత్రం నేను హైదారాబాద్ వచ్చాక, విరసంలో చేరేకే. తనకి ఇష్టమైన చిన్ని నా సహచరి అయ్యాక, ఎంత సంతోషించాడో.

***

ఫోటోలు: కూర్మనాధ్ 

ఆ పూట మున్నేరు పాడలేదు!

(మహాకవి దాశరథి జయంతి) 

అఫ్సర్ 

 ఆరో తరగతి సెలవులకి ముందే మా ఇంట్లో హడావుడి మొదలయ్యింది.

“మనం ఖమ్మం వెళ్లిపోతున్నాం” అని ఆ సెలవుల ముందే నాన్నగారు ఇంట్లో చెప్పారు.

ఆ ఎండాకాలం చింతకానిలో నాకు చివరి ఎండాకాలం అవుతుందని తెలియదు. నా చదువు మొదలయ్యింది చింతకానిలో! వీధిబడిలో పంతులయ్య గారి మొదటి బెత్తం దెబ్బ తిన్నది చింతకానిలో! తరవాత ప్రైమరీ స్కూలు. ఆరో తరగతి దాకా అక్కడే! బాల్యం దానికదే వొక ప్రపంచం అనుకుంటే, నా ప్రపంచానికి మొదలూ చివరా చింతకానే!

అక్కడే  మా నాన్న గారు బడి పిల్లల కోసం నడిపిన గోడ పత్రిక “మధుర వాణి” లో నేను మొదటి కవిత రాశాను . నాన్నగారికి “కన్యాశుల్కం” కంఠతా వచ్చేది. అప్పుడప్పుడూ స్నేహితులు ఇంటికి వచ్చినప్పుడు ఆయన ఆ సంభాషణలు అలా అప్పచెప్పేసే వారు. మధురవాణి ఆయనకి నచ్చిన పాత్ర. అందుకనే, మా గోడ పత్రికకి ఆయన ఆ పేరు పెట్టారు.

మా బడి వార్షికోత్సవానికి ఆ ఏడాది దాశరథి గారిని తీసుకు వచ్చారు నాన్నగారు. అంతకు ముందు రాత్రే నాన్నగారు ఖమ్మం వెళ్ళి, అక్కడ బస చేసి వున్న దాశరథి గారిని చింతకాని పిలుచుకు వచ్చారు.

నాన్నగారు ఎక్కడ పని చేస్తే అక్కడ బడి పిల్లలకి కవుల గురించి చెప్పీ, వాళ్ళ కవిత్వాలూ, పద్యాలూ పాడి వినిపించి సాహిత్యం మీద వొక అంతులేని ప్రేమని పుట్టించే వాళ్ళు.  దాశరథి గారు స్టేషనులో దిగగానే మా బడిలో ఎనిమిది, తొమ్మిది, పదో తరగతి పిల్లలతో పాటు దాదాపు వంద మంది పైనే అక్కడ ఎదురుచూస్తూ కూర్చున్నాం “మహాకవికి స్వాగతం” అని పోస్టర్లు పట్టుకొని – దాశరథి గారు స్టేషన్లో దిగగానే, అందరం వొక పెట్టున “ దాశరథి జిందాబాద్” అని నినాదాలిస్తూ ఆయన్ని స్టేషన్ బయటికి తీసుకువచ్చాం. (మా వూళ్ళో కమ్యూనిస్టులు ఎక్కువే కాబట్టి, అలాంటి నినాదాలూ, ఊరేగింపులు మాకు కొట్టిన పిండి)

అప్పుడు స్టేషను నించి చింతకాని వూళ్ళోకి పావు గంట పైనే నడిచి వెళ్లాల్సి వుండేది. దాశరథి గారిని ఎడ్ల బండి మీద కూర్చోబెట్టి, ఆయన వెనక మా బడి పిల్లలంతా నినాదాలు ఇస్తూ వూళ్ళోకి తీసుకువచ్చాం. మా ఇంటి దగ్గిర బండి ఆగింది. మా ఇంటి ముందు పెద్ద కోలాహలం. “సాయంత్రం దాశరథి గారు బళ్ళో మాట్లాడతారు. అందరూ అక్కడికి రండి.” అని నాన్నగారు మిగిలిన బడి పిల్లల్ని వెళ్లిపొమ్మన్నారు. దాశరథి గారు అందరికీ వందనం చేస్తూ “ మిమ్మల్ని చూస్తే చాలా ఉత్సాహంగా వుంది నాకు, మీ కౌముది సార్ ఇంత పని చేస్తాడని నేను అనుకోలేదు. అందరినీ సాయంత్రం కలుస్తాను.” అని దాశరథి గారు అందరికీ అప్పటికి వీడుకోలు చెప్పారు.

పిల్లలంతా వెళ్లిపోయాక దాశరథి గారి తో కలిసి మేం మా ఇంటి  ముందు గదిలో కూర్చున్నాం. మాది ఇరుకు కొంప. రెండు గదుల ఇల్లు. ఆరుగురు పిల్లలు.ఒకరు అడుగు పెట్టాలంటే ఇంకొకళ్లు ఖాళీ చెయ్యాలి. అంత ఇరుకు!  మొదటి గది నిండా పుస్తకాలు; నాన్నగారి రాత కుర్చీ, అంటే పడక కుర్చీ.

అయినా అప్పటికే ఇల్లు బాగా సర్ది పెట్టి వుంచింది అమ్మ. అయినా ఇబ్బంది పడుతూ  వుంది. అది గమనించి దాశరథి గారు “ఇల్లు అద్దంలా పెట్టావు బహెన్-జి! నాకేం కావాలే, ఇదిగో కూర్చోడానికి ఈ చోటు చాలు. ఏడీ మా అఫ్సూర్యుడు?” అంటూ ఆయన పడక కుర్చీలో శరీరం వెనక్కి వాల్చి ఆరాంగా కూర్చుని నన్ను దగ్గిరకి తీసుకున్నారు. “నీ పేరులో చంద్రుడు(కౌముది) వున్నాడు కాబట్టి, వీడి పేరులో సూర్యుడు వుండాల్రా!” అని నాన్నగారికి చెప్పి నా పేరుకి ఆ తోక తగిలించారు ఆయన.

(ఆ తరవాత రుబాయిలు రాసే కాలంలో నాన్నగారికి రాసే వుత్తరాల్లో ఈ పేరు మీద ఆయన చాలా రుబాయిలు రాశారు. నాకు గుర్తుంది ఇది:

“ఖమ్మం లో ఎండలు మండిపోతున్నాయని విన్నా. అయినా , కౌముదీ! రేయెండ నువ్వుండ/ ఇంకేల మండుటెండ?)

“బేటా! షాయరీ చదువుతున్నవా?” అని అడిగారు.

లేదు అని తలూపాను, సిగ్గు పడుతూ. అదొక్కటే అప్పుడు తెలిసిన భాష కాబట్టి.

“అరె, యే క్యా హై బేటా! నువ్వు షాయర్ బిడ్డవి!’ అంటూ ఆయన నాన్నగారి వైపు తిరిగారు.

“వాడు రహస్య కవిలే..దాశరథీ!” అని నాన్నగారు అనడం గుర్తు!

ఆ సాయంత్రం దాశరథి గారి సభ బ్రహ్మాండంగా జరిగింది. ఇప్పటికీ చింతకానిని తలచుకున్నప్పుడల్లా ఆ సాయంత్రపు సభ గుర్తొస్తుంది. కానీ, అది చింతకానిలో నా చివరి స్కూలు వార్షికోత్సవ సభ!

అదే మొదటి సారి నేను దాశరథి గారిని చూడడం! చింతకానిలో అలా ఎంత మంది కవులూ రచయితలూ మా బడికి / మా ఇంటికి వచ్చారో లెక్క లేదు, వచ్చిన వాళ్ళంతా మా ఇంటికి రావడం గొప్పగా వుండేది. చింతకాని వదల్లేకపోవడానికి వున్న అనేక కారణాల్లో ఆ గొప్ప అనుభూతి పెద్ద కారణం!

* * * * * *

Dasarathi_Portrait

మేం ఖమ్మానికి మారడం నాకు పెద్దగా నచ్చలేదు.

“వీడొట్టి పల్లెటూరి మొహం రా!” అని చాలా కాలం బడి పిల్లలు ఎడ్పిస్తూ వుండడం వల్ల ఆ అయిష్టం ఇంకా పెరిగేది అప్పట్లో!పల్లె నించి రావడం వల్ల నాకు పెద్దగా దోస్తులూ ఏర్పడ లేదు. ఆ ఖాళీని భర్తీ చెయ్యడానికి నేను కవిత్వంలో మొహం దాచుకోవడం లేదా తలదాచుకోవడం మొదలు పెట్టాను.

కానీ, కొద్ది రోజుల్లోనే ఖమ్మానికి అలవాటు పడిపోయాను. ఆ రోజుల్లో దాశరథి గారు దాదాపూ ప్రతి నెలా ఖమ్మం వచ్చే వారు, ఆయనంటే ఖమ్మం వాళ్ళకి వున్న విపరీతమయిన గాఢాభిమానం వల్ల!

దాశరథి గారు వచ్చినప్పుడల్లా నన్ను తోడు బెట్టుకొని ఆయన దగ్గిరకి తీసుకు వెళ్ళే వారు నాన్నగారు. లేకపోతే, ఆయనే మా ఇంటికి వచ్చి మా అందరినీ వొక సారి చూసి వెళ్ళే వాళ్ళు. ఖమ్మం రావడం వల్ల ఇదే నాకు జరిగిన మేలు.

దాశరథి గారికి స్నేహితులంటే మహా ప్రేమ!ఒకసారి  స్నేహం కుదిరిందంటే ఇక వాళ్ళు ఆయనకి కుటుంబ సభ్యుల కిందనే లెక్క! ఆయన “యాత్రాస్మృతి” చదువుతుంటే ఆయన ఎంత స్నేహజీవో ఇట్టే అర్థమవుతుంది. లేకపోతే – ఆళ్వార్ గురించి అంత గొప్పగా రాయడం సాధ్యమా?

అసలు ఆళ్వార్లు పన్నెండు మందే

పదమూడో ఆళ్వార్ మా వట్టికోట ఆళ్వార్ స్వామి!

దేవునిపై భక్తి లేకున్నా

జీవులపై భక్తి వున్నవాడు

శరీరంలో ప్రతి అణువూ

ఆరోగ్య స్నానం చేసే రీతిని

నిష్కల్మషంగా నవ్వగలవాడు

రాముడి తెలివితేటలు లేని

అమాయకుడు ఆళ్వార్!

అతను పోయినప్పటి నుంచీ

అమృత హృదయం విచ్చి

నవ్వగలవాడు లేకుండా పోయాడు లోకంలో.

ఈ కవిత నాకు చాలా సార్లు గుర్తొచ్చేది. నిజానికి అది ఆళ్వార్ కంటే బాగా దాశరథి గారికే సరిపోతుందని అనిపిస్తుంది, ఆళ్వార్ నాకు వ్యక్తిగతంగా తెలియదు కాబట్టి!

ఖమ్మంలో వుండగా ఆయన మా ఇంటికి రాగానే మొదట నన్ను పలకరించే వాళ్ళు.“జనాబే ఆలం! క్యా హాల్ హై?” అని నవ్వుతూ అడిగే వారు.

అలా అనేక యేళ్ళు, అనేక  సాయంత్రాలు, అనేక  గంటలు ఆయనతో నాన్నగారి సమక్షంలో  చాయ్ పానీ కబుర్లు నడిచేవి. (వాళ్ళిద్దరూ మద్యసేవనం చేసే వాళ్ళు కానీ, ఇంట్లో ఎప్పుడూ నేను చూడలేదు. మా ఇంట్లో చాయ్ అయిన తరవాత వాళ్ళిద్దరూ బయటికి వెళ్ళే వాళ్ళు. అప్పుడు నాన్నగారు ఆలస్యంగా ఇంటికి రావడమే నాకు గుర్తు) వాళ్ళ మాటలు ఏమీ అర్థం కాకపోయినా నేను అక్కడే చెవులు రిక్కించుకుని కూర్చునే వాడిని. ఆయన పద్యమో/కవితో పాడితే వినాలని! వొక చుక్క చాయ్ గొంతులో పడగానే, ఆయన చప్పున వొక రుబాయీనో, గజల్నో ఎత్తుకుని తీయగా పాడేవారు.

అలా గాలిబ్ గీతాలు ఆయన గొంతులో విన్నాను. అప్పుడే ఆయన రాయడం మొదలు పెట్టిన తెలుగు రుబాయిలూ విన్నాను. అప్పట్లో నాకు ప్రాచీన సాహిత్యం మీద విపరీతమయిన ఆసక్తి వుండడం వల్లా, అదే సాహిత్యం అనే భ్రమల్లో బతుకుతూ వుండడం వల్లా, తెల్లారి లేస్తే పద్యాలు బట్టీయం పాడుతూ, వృత్తాలతో కుస్తీ పాట్లు పడుతూ వుండడం వల్లా – ఆ రోజుల్లో ఆయన వచన కవిత్వం అప్పట్లో పెద్దగా నచ్చేది కాదు. ఆయన వచన కవిత్వం మొదలు పెట్టగానే నా మనసు యాంత్రికంగా స్విచ్ ఆఫ్ అయ్యేది.

కొన్నాళ్ళ తరవాత – అప్పటికి నేను కాలేజీకి వచ్చేశాక –  ఆ ముక్క దాశరథి గారిని ముఖం మీద అడిగేశాను, మా నాన్నగారు నావైపు కాస్త కోపంగా చూస్తూ వుండగా-

దాశరథి గారు నవ్వి,నా భుజమ్మీద చెయ్యి వేసి:

“మంచిదే, బిడ్డా! కానీ, ఎంత పద్య కవి అయినా ఏదో వొక నాడు వచన కవిత్వం రాయాల్సిందే.   పద్యం గొప్ప పద్యానిది, వచనం గొప్ప వచనానిది. నువ్వు ఇప్పటి దాకా కవిత్వంలో ఒక రకమయిన లయకే అలవాటు పడ్డావు. పైగా నువ్వు వృత్తాల మాయలో వున్నావు కనుక, నీకు వచన కవిత్వంలో వుండే కొత్త లయ తెలియడం లేదు. ఎందుకూ, ఉర్దూలో ఘజల్ అంత గొప్ప సంప్రదాయం కదా! ఇప్పుడు వాళ్ళు కూడా ఫ్రీవర్సు కి వచ్చేస్తున్నారు. వొక్కటే గుర్తు పెట్టుకో – ఇదే అద్భుతం అనుకోని వొక్క చోటే ఆగిపోవద్దు. కాలం నిన్ను ఎటు తీసుకువెళ్తుందో చూడు. వీలయితే కాలం కంటే ముందు వెళ్ళు, లేదా, కాలం వెంట వెళ్ళు. అంతే కానీ, కాలం ఎక్కడో నువ్వెక్కడో వున్నావనుకో – నీ కథ ముగిసినట్టే!” (అంట రాని వారెవరంటే/ మన వెంట రాని వారే! అని అప్పట్లో దాశరథి పాట కొంచెం పాప్యులర్ కూడా!)

బాగా గుర్తు- దాశరథి గారికి ఖమ్మం వూరి బయట పారే మున్నేరు అంటే చాలా ఇష్టం. ఆయన జ్ఞాపకాలు ఎప్పుడూ దాని చుట్టే తిరిగాయి. ఆ మున్నేరు మా ఇంటికి దూరంలో వుండేది. బ్రిడ్జి దాటి వెళ్ళాలి.

వొక సారి  ఆయన అడిగారు “నువ్వు ఎప్పుడయినా మున్నేరు వొడ్డుకి వెళ్ళావా?” అని.

“లేదు” అన్నాను నేను అప్పుడే కొంచెం మాట్లాడడం నేర్చుకుంటున్న వాడినై-

‘అరె…సాయంత్రం వూరికే అట్లా నడుచుకుంటూ వెళ్ళు. అక్కడ కాసేపు కూర్చొని రా…ఆ రాత్రి నువ్వు కనీసం వొక్క లైను అయినా రాస్తావ్ తప్పక!”

“నిజమా?’

“అవును, మంచి కవిత్వం రాయాలంటే నువ్వు మంచి ప్రకృతిలో వుండాలి. కాస్త నీళ్లూ, కాసిని చెట్లూ, కొన్ని పక్షులూ…వీటితో నీకు దోస్తీ కుదరాలి.”

తరవాత చాలా వుత్తరాల్లో/ సంభాషణల్లో  ఆయన మున్నేరు గురించే రాసే వారు/ చెప్పే వారు. ‘ఈ మధ్య వెళ్ళావా?లేదా?” అని గుచ్చి గుచ్చి అడిగే వారు. “ఈ మున్నేరు లేకపోతే నాకు కవిత్వమే తెలియదు” అన్నారు వొక వొక సారి !

ఆ రోజుల్లో ఎందుకో, నాకు అటు వెళ్లాలని అనిపించేది కాదు. అక్కడ పక్కనే శ్మశాన వాటిక వుండేది. నేను వెళ్ళిన రెండు మూడు సార్లు అక్కడ శవాలు తగలబెట్టడం చూశాను. బహుశా, అది నా మనసులో నాటుకు పోయి వుండాలి. ఆయన తన చిన్నప్పటి మున్నేరు అలానే వుందని అనుకుని ఎప్పుడూ అలా అడుగుతూ వుంటారులే అని వూరుకున్నా.

కానీ,దాశరథి గారు  చనిపోయారని  తెలిసి నాన్నగారు హడావుడిగా బ్యాగ్ సర్దుకొని కన్నీళ్ళ  పర్యంతం అవుతూ హైద్రాబాద్ వెళ్ళిన సాయంత్రం నేను మున్నేరు వొడ్డుకి వెళ్ళాను.

ఆ సాయంత్రం మున్నేరు అలసిపోయిన తల్లిలా ప్రశాంతంగా పడుకుని వుంది.

దాని గలగలలు నాకు వినిపించక కాసేపటికి వెనక్కి మళ్లాను!

–      మళ్ళీ ఎప్పుడూ నేను మున్నేరు దాకా వెళ్లనే లేదు!

 

(దాశరథి గారితో ఇంకా అనేక స్మృతులున్నాయి. అవి తరవాత)

ఆవకాయ సౌజన్యంతో 

 

ఇప్పుడు కావాల్సింది శ్రీశ్రీ వచనం!

అఫ్సర్ 

 

1980.

అప్పుడు కాలేజీ అంటే వొక ఉద్యమం. రోజూ సాయంత్రాలు ఖమ్మంలోని రిఖాబ్ బజార్ స్కూలు ముందో వెనకో కూర్చొని, లోకం మీద ఆగ్రహాన్ని ప్రకటిస్తున్న రోజులు. పట్టలేని ఆగ్రహాన్ని చల్లార్చుకోలేక పక్కనే వున్న కాప్రి హోటెల్లో ఇరాని చాయ్ పంచుకొని “మన సోషలిజం ఇంతవరకేనా? ప్చ్…” అని ఆ పూటకి చప్పరించేసుకొని, రంగు డబ్బాలు తీసుకుని ఖమ్మం గోడల్ని ఎరుపెక్కించిన రాత్రులు. “నీ రాత స్ట్రోక్స్ శ్రీ శ్రీలా వున్నాయి” అని వొకరికొకళ్ళం కితాబులు ఇచ్చి పుచ్చుకునే అమాయక కాలం. కాని, ఇంకా శ్రీ శ్రీ కవిత్వం పూర్తిగా చదవలేదు అప్పటికి.

అలాంటి వొకానొక సాయంత్రం చీకటి వైపు పరుగు తీస్తుండగా…

అది చరమ రాత్రి అయితే బాగుణ్ణు అనిపించిన రాత్రి అది. ఆ రాత్రి శ్రీ శ్రీని కలిశాను. ఆయన వొక నిజం నిషాలో, నేను మరో రకం నిషాలో వున్నాం. ఆలోచన అలలు మాటల రూపంలో కొన్ని సార్లు అందంగా పెనవేసుకుంటున్నాయి.

ఆ రాత్రి మా ఇద్దరినీ కలిపినవాడు జేంస్ జాయిస్. అది కూడా నిజమే! పిచ్చి పట్టినట్టు జాయిస్ రచనలు చదువుతూన్న ఆ సమయంలో నా దగ్గిర వొక అమూల్యమయిన పుస్తకం వుండేది. దాని పేరు ” పిక్టొరియల్ గైడ్ టు యులిసిస్”. పుస్తకం ఎంత అందంగా వుండేదంటే,ఇంటికి తీస్కువెళ్ళి మరీ చాలా మందికి ఆ పుస్తకం చూపించేవాణ్ణి. అది నేను హైదరాబాద్ ఆబిడ్స్ లో వొక ఆదివారం రోడ్డు పక్క ఆ రోజుల్లో నాలుగు వందలు పెట్టి కొన్న పుస్తకం.

మాటల మధ్యలో ఆ పుస్తకం సంగతి చెప్పాక, శ్రీ శ్రీ గబుక్కున లేచి,గబ గబా చొక్కా వేసేసుకొని “ఇప్పుడే ఈ క్షణమే ఆ పుస్తకం చూడాలి” అంటూ నన్ను బయటికి లాక్కు వచ్చాడు.
“మీరు ఇక్కడే వుండండి. నేను తీసుకొస్తా.” అన్నాన్నేను.
“ఇక్కడ వున్నట్టే , రా!” అని హుకుం జారీ చెయ్యగానే నేను నా డొక్కు సైకిలు(చలం గారి భాషలో ముసలి గుర్రం) మీద రెక్కలు కట్టుకుని యెగిరిపోతున్నట్టుగా, రివ్వున దూసుకుపొయి, ఆ పుస్తకం తెచ్చి శ్రీ శ్రీకి చూపించడం మొదలెట్టాను. విద్యార్థి రాజకీయాల వల్ల, చదువు వెనక్కి పట్టి, ఇంట్లో అసమ్మతి పవనాల్ని యెదుర్కొంటున్న వొక ఇంటర్మీడియట్ కుర్రాడి అసంత్రుప్త బతుకులో అదొక అపూర్వ క్షణం. చాలా రోజుల శ్రమ, చాలా కన్నీళ్ళు ఆ పుస్తకం సంపాదించడం వెనక వున్నాయి. వొక్క క్షణంలో అవన్నీ యెగిరిపోయాయి.

ఆ పుస్తకంలో జాయిస్ “యులిసిస్”లో వర్ణించిన వూళ్ళూ, భవనాలూ, వాటి చరిత్రా వున్నాయి. ఆ నలుపూ తెలుపూ బొమ్మలు చాలా కాలం నా కలల్లోకి వచ్చి వెళ్ళిపొయేవి. ఒక రచయిత నిజం నించీ ఊహలోకీ, కల నించి తన ఇరుగుపొరుగులోకీ ఎలా ప్రయాణిస్తాడో బొమ్మ గీసినట్టుగా చూపించే పుస్తకం అది.

ఆ చిత్రాల్ని చూస్తూ, తన వృద్ధాప్యంముసురుకున్న వేళ్ళతో ఆప్యాయంగా తాకుతూ ఆ పుస్తకం తను చదివిన అనుభవాల్ని, అసలు తన వచనంలోకి చాలా భాషల చాలా మంది రచయితలు పరకాయ ప్రవేశం చేయడాన్ని ఆయన చెప్పుకుంటూ వెళ్ళాడు. ఆ రాత్రి శ్రీ శ్రీతో కలిసి వుండకపోతే, శ్రీ శ్రీ అంటే చాలా మందికి మల్లెనే నా ఆలోచన కూడా ‘మహాప్రస్థానం’ దాకానో, ‘మరో ప్రస్థానం’ దాకానో ఆగిపొయ్యేది. ఆ రెండు విస్తృతమయిన ప్రపంచాలని కాసేపు పక్కన పెట్టి, వచనంలో శ్రీ శ్రీ ఆవిష్కరించిన తనదయిన ప్రపంచాన్ని అర్ధం చేసుకునే ప్రయత్నం ఈ వ్యాసం.
*
శ్రీ శ్రీ అనే సంతకంలో వున్న ప్రత్యేకత ఏమిటంటే, అది ఎప్పుడూ వొక కొత్త గాలిని వెంటబెట్టుకొని వస్తుంది. దాన్ని ఇప్పుడు మనం “ఆధునికత” అనుకున్నా, ఇంకో పేరుతో పిలిచినా, ఏదో వొక కొత్తదనం కొట్టొచ్చినట్టు కనిపించడం దాని తక్షణ లక్షణం. ఈ కొత్తదనం వస్తువులోనూ, రూపంలోనూ కనిపిస్తుంది. వస్తుపరంగా శ్రీ శ్రీ ఎప్పుడూ రాజీ పడలేదని ఇప్పుడు నేను విడిగా చెప్పకరలేదు, కాని, ఆ వస్తు నవీనత ఎలాంటి రూపాల్లో అతని వచనంలో వ్యక్తమయ్యిందో ఇప్పటికీ ఒక సంక్లిష్టమయిన విషయమే. ఒకే దృక్పథాన్ని అంటి పెట్టుకున్న అనేక వస్తువుల భిన్న రూపాల కలయిక శ్రీ శ్రీ వచనం.
వచనంలో శ్రీ శ్రీ – అటు సొంత రచనలూ, ఇటు అనువాదాలూ చేశాడు. అవి రెండూ వొక యెత్తు అయితే, ఉత్తరాల రూపంలోనో, వివిధ వ్యాసాల రూపంలోనో, ప్రసంగాల రూపంలోనో శ్రీ శ్రీ విస్తారమయిన/ సారవంతమయిన వచన సేద్యం చేశాడు. ఆ ప్రతి వచన రచనా విడిగా కూలంకషంగా చర్చించదగిందే. కాని, అది ఒక పెద్ద పరిశోధనా గ్రంధమే అవుతుంది. కాబట్టి, ఆయా వచన రచనలు వడపోసిన వొక సారాంశాన్ని మాత్రమే ఇక్కడ చూద్దాం.
శ్రీ శ్రీ కవిత్వం కానీ, వచనం కానీ వొకే వొక అంతస్సూత్రాన్ని అంటి పెట్టుకుని వుంటాయి. అది శ్రీ శ్రీ భవిష్యత్ వాదం: అంటే, రేపటిని ఈ క్షణాన దర్శించగలిగిన ముందు కాలపు చూపు. శ్రీ శ్రీ కవిత్వం రాస్తున్న కాలానికి అతను మార్క్సిజం చదివాడా లేదా అన్న ప్రశ్న ఇప్పటికీ వుంది. కానీ, మార్క్సిజాన్ని ఒక పుస్తక రూపంలోనో, సిద్ధాంత రూపంలోనో చదవడానికి ముందే శ్రీ శ్రీ చుట్టూ ఒక పారిశ్రామిక వాడ వుంది. కార్మిక సమూహం అతనికి ఇరు వైపులా కాకపోయినా కనీసం వొక వైపు అయినా వుంది. ఆ స్థానిక ప్రపంచంలో శ్రీ శ్రీ లీనం అయి వున్నాడనడానికి అతని జీవన కథనాల్లో చాలా దాఖలాలు చూడ వచ్చు. అది శ్రీ శ్రీ చూస్తున్న వర్తమానం. కాని, అక్కడితోనే నిలిచిపోతే అది శ్రీ శ్రీ వ్యక్తిత్వం కాదు.
స్థానికత, వర్తమానం గీసిన బరిని దాటుకుని వెళ్ళే చూపు శ్రీ శ్రీది. ఒక వలస రాజ్యం సృష్టించిన నగరం విశాఖ. అక్కడి పరిశ్రమలూ, జన జీవనం, కళా సాంస్కృతిక రంగాల మీద ఆ వలస పాలన నీడలు కనిపిస్తాయి. శ్రీ శ్రీకి వాటి స్పృహ కూడా వుంది. కాని, వాటిని దాటి వెళ్ళే వలసానంతర వాదం శ్రీ శ్రీది. ఈ ప్రయాణం మనకి శ్రీ శ్రీ వచనంలోనే స్పష్టంగా కనిపిస్తుంది. ఈ వచనంలో శ్రీ శ్రీ స్థానికతని బయటి లోకంతో ముడి పెట్టే అంతర్జాతీయ వాది. వర్తమానాన్ని విమర్సనాత్మకంగా చూసే భవిష్య వాది.
ఈ వ్యాసాన్ని నేను జేంస్ జాయిస్ పుస్తకం పట్ల శ్రీ శ్రీ చూపించిన అభిమానంతో మొదలు పెట్టాను. జేంస్ జాయిస్ పుస్తకం పట్ల శ్రీ శ్రీ చూపించిన ఆతృతని జాగ్రత్తగా గమనిస్తే, అందులో ఒక శ్రీ శ్రీ సాహిత్య వ్యక్తిత్వానికి సంబంధించిన వొక అంశ వుంది. అది తన పరిసరాలకీ, తన స్థానికతకీ ఎడంగా స్పందించడం! (బహుశా, కొత్త అంశాల పట్ల తెగని ఆకర్షణ కూడా వుంది). తన కాలానికి చెందని వొక ఆలోచనని అందుకోవాలన్న వొక ఉబలాటం వుంది. శ్రీ శ్రీ వచన రచనల్లో నేను ఆ లక్షణం చూశాను. అయితే, ఆ ఆలోచనని తన కాలంతో ముడి వేసి, ప్రయోగించడం శ్రీ శ్రీ దారి. శ్రీ శ్రీ తన వచనాన్ని వూహించే ముందు ఇలాంటి కొంత మంది రచయితలు తనని ఆవహించేంతగా ఆ పఠనంలో మునిగిపోయాడు. కాని, ఆ మునక తరవాత మళ్ళీ వొడ్డుకి చేరడం ఎలాగో తెలిసిన వాడు కనుక, అతని అంతర్జాతీయ దృష్టి మళ్ళీ స్థానికతలోకి క్షేమంగా చేరుకుంది.
శ్రీ శ్రీ వచనంలో అనువాదాలు ఎక్కువే.అవి వివిధ దేశాల వివిధ రచయితలవి. కాని, ఈ అనువాదాలన్నీ ఒక్క సారిగా చదివితే, ఆ విడి విడి లోకాల్ని శ్రీశ్రీ ఒకే సూత్రంతో కట్టే ప్రయత్నం చేసాడని మనకి అర్ధం అవుతుంది, విలియం సారోయన్ మొదలుకొని ఆంటాన్ చెఖోవ్ దాకా. అదే చేత్తో, అతను చిన్న కథల్నీ, నాటికల్నీ, వ్యాసాల్నీ, సంభాషణల్నీ కలిపాడు. అనువాద వచన రచనలు శ్రీ శ్రీలో ఎదుగుతున్న/ క్రమ పరిణామం చెందుతున్న ఒక నవీన పంథాని ఆవిష్కరిస్తాయి. ఈ పనిని రెండు రకాలుగా చేశాడు శ్రీ శ్రీ. ఒకటి: అనువాదాల్ని అందించడం; రెండు: ఆ అనువాదాల వచనాన్ని తన సొంత రచనల్లోకి ప్రయోగించి చూడడం. ఇవి రెండూ విడదీయలేని కోణాలు.

అనువాదంలో శ్రీ శ్రీ ఆయా రచయితల వచన రూపాన్ని పట్టుకునే ప్రయత్నం చేస్తే, తన సొంత రచనల్లో ఆ రూపాలను స్థానిక సంస్కృతికి మార్చి, పరీక్షించి చూసుకున్నాడు. ఇలా చెయ్యడం ద్వారా కొత్త రూపాలు తెలుగు సాహిత్య సాంస్కృతిక వాతావరణంలోకి ఎలా తీసుకు రావచ్చో బేరీజు వేసుకున్నాడు. “చరమ రాత్రి” దీనికి బలమయిన ఉదాహరణ. అది ఎంత బలమయిన వుదాహరణ అంటే, శ్రీ శ్రీ సాధారణ కవిత్వంతో తృప్తి పడని వాళ్ళు కూడా ఆ రచనని వొప్పుకునేంతగా!

అలాగే,ఈ వ్యాసం మొదట్లో నేను సమకాలీన సాహిత్యంతో నా అసంతృప్తిని కూడా చెప్పాను, వొక పాఠకుడిగా! శ్రీ శ్రీ వచన రచన ద్వారా ఏం చెప్పాడన్న దానికి అందులో ఒక సమాధానం వుంది.
శ్రీ శ్రీ వచన రచనలో పాఠకుడు చాలా ముఖ్యమయిన కోణం. తన పాఠక వర్గాన్ని తానే సృష్టించుకున్నాడు శ్రీ శ్రీ. అది ఎలాంటి వర్గం అన్నది అతని కవిత్వంలో కన్నా బలంగా అతని వచనంలోనే కనిపిస్తుంది. అది – పూర్వ సాహిత్య రూపాలని ప్రశ్నించి, కొత్త జవాబులు వెతుక్కునే తరం- పాత భావాలని ధిక్కరించి ఆధునికతని అక్కున చేర్చుకునే వర్గం. ఈ పాఠక వర్గానికి కావల్సిన కొత్త అలవాట్లని నేర్పే అనువాదాలూ, ప్రయోగాత్మక వచనం కొంచెం కొంచెం రుచి చూపించి, అభిరుచిని పెంచిన లాబరేటరీ ఆ వచనం అంతా!
ఈ రోజు శ్రీ శ్రీకి మనం ఇవ్వదగిన కానుక – ఆ వచన పాఠాల్ని తిరగదోడడమే!

(పాత వ్యాసమే…పునర్ముద్రణ…అఫ్సర్ బ్లాగ్ నించి…http://afsartelugu.blogspot.com/2010/08/blog-post_05.html)

ఒకే ఒక బలమైన ఆయుధం- ” అంబేద్కర్ “!

పి.విక్టర్ విజయ్ కుమార్

దళితులు , గిరిజనులు, వెనుకబడిన వర్గాలు, మైనారిటీలు , ప్రజాస్వామిక వాదులు – మదిలో  కొవ్వొత్తులు వెలిగించి మరో జీవన వైవిధ్యాన్ని , జీవన శైలిని నేర్పించిన మహానుభావునికి మదిలో వెల్లువెత్తిన కృతజ్ఞతతో  ఆయన జన్మ దినాన్ని స్మరించుకున్నారు…ఎప్పటిలానే.
అంబేద్కర్ ఒక వర్గానికి కులానికి సంబంధించిన మేధావి కాదు. ఆయన 1990 లలో ఒక  Parallel Thinker . ఒక సాంప్రదాయక ఆలోచనా విధానాన్ని బద్దలు కొట్టి ” సాంఘిక చైతన్యం ” అనే అంశాన్ని ప్రతి మేధావి ఆలోచనలో భాగం చేయాల్సిన పరిస్థితిని కల్పించిన మొదతి భారతీయ తాత్విక వేత్త. 1920 ల నుండి గాంధీ తో సహా ప్రతి నాయకుడికీ –  ఏ రాజకీయ వేదిక అయినా సరే – కొరకరాని కొయ్యగా నిలబడ్డాడు. ఆయన ఆర్థిక శాస్త్రం లో కొలంబియా యూనివర్సిటీ నుండి  MA, PhD,    London School of Economics  నుండి  D Sc  పట్టభద్రుడయ్యాడు. లండన్ నుండి బారిష్టర్ డిగ్రీ పొంది అకడమిక్ గా సాధించిన అద్భుత విజయాన్ని ఆ రోజుల్లో తన కుల వ్యతిరేక తపనను తీర్చుకోవడానికి ఉపయోగించుకున్నాడు.  ఆయన ఈ దేశం సంపాయించిన మొట్ట మొదటి ఆర్థిక వేత్త అనే విషయం మనం ఇక్కడ గుర్తించాలి. ఇదే విషయాన్ని అమర్త్య సేన్ స్వయానా అభిమానంగా చెప్పుకుంటాడు.
అంబేద్కర్ , గాంధి,  కాంగ్రెస్ గురించి ప్రస్తావిస్తూ ఇలా అంటాడు  ” కాంగ్రెస్ హిందూ పెట్టుబడిదారులు చేరవేసిన మధ్య తరగతి హిందువుల సంస్థ. వీరి ఉద్దేశ్యం భారతీయులను స్వతంత్రులను చేయడం కాదు. బ్రిటీష్ వారి నుండి విముక్తి పరచడమే. బ్రిటీష్ వారి ఆధిక్య స్థానాన్ని వీరు ఆక్రమించుకోవడం. ఇదే స్వాతంత్ర్యం ఐతే హిందువులు తర తరాలుగా అస్పృశ్యులను ఎలా పరిగణిస్తూ వచ్చారో అదే కొనసాగుతుంది “
అంబేద్కర్ ఈ దేశం లో దళితులకే కాదు , ప్రతి మేధావికి నేర్పించింది ” వ్యక్తిత్వం ” ” స్వతంత్రత ” (  Individuality and independent thinking  )  . చెప్పదల్చుకున్న విషయాన్ని నిర్మొహమాటంగా వ్యక్తీకరించడం , మెజారిటీ అభిప్రాయాన్ని కాలదన్ని స్వంతంత్ర ఉద్దేశ్యాన్ని ప్రకటించడం లో అంబేద్కర్ ప్రతి మేధావికి మార్గ దర్శకుడు.
1918 లో మాంటేగ్ – ఛేంస్ఫర్డ్ సంస్కరణల ప్రక్రియలో భాగంగా ఇండియాలో ఎలక్షన్ విధానాన్ని పునర్నిర్వచించే ఉద్దేశ్యం తో  ‘ సౌత్ బరో కమిటీ ‘ ని నిర్మించారు.  అంబేద్కర్ యొక్క విద్యా ప్రఙలు  తెలుసుకున్న ప్రబుత్వం , అంబేద్కర్  యొక్క అభిప్రాయాలు తెలపమని ఆహ్వానించింది. అప్పుడు అంబేద్కర్ కు 28 సంవత్సరాలు. స్వాతంత్ర్య ఉద్యమం ఇవ్వలేని గుర్తింపు  బ్రిటిష్ ప్రభుత్వం ఇవ్వాల్సి వచ్చిందంటే – మన దేశం లో స్వాతంత్ర్య ఉద్యమ పోరాటం లో పాతుకు పోయిన కుల పిచ్చి తీవ్రత ఏంటో మనకు తెలుస్తుంది. ఈ రోజు ” భారత్ మాతా కీ జై ” ” వందే మాతరం ” లాంటి స్వాతంత్ర్యా పోరాట నినాదాల్ని వల్లించే ప్రతి ఒక్కరు ఆలోచించాల్సిన విషయం ఏంటంటే ఈ నినాదాల్లో కుల వ్యవస్థ ఎలా గంగ వెర్రులెత్తిందా అని.
కానీ అంబేద్కర్ 1930 లో అఖిల భారత నిమ్న వర్గాల కాంగ్రె సభలో తన ఉపన్యాసంలో ఇలా అంటాడు ” మన దేశం లో మన దురదృష్ట పరిస్థితులను నిర్మూలించే ప్రయత్నం చేస్తున్నట్టు బ్రిటిష్ చెప్పుకుంటుంది.  అది కేవలం ఈ దేశ రాజకీయ పురోగతిని అడ్డుకోవడం కోసమే అలా చేస్తుంది “
అదే ఉపన్యాసం లో ఇలా అంటాడు –
” మన దేశానికి స్వయంప్రతిపత్తి ఇవ్వడం నేను వ్యతిరేకించలేను. ఎందుకంటే బ్రిటిష్ ప్రభుత్వం మన సమస్యను ఎప్పటికీ తీర్చలేదు. ఐతే కాంగ్రెస్ తో కలవడం వలన మనం సమస్యను ఎలా పరిష్కరించుకోగలమో నాకు అర్థం కాదు. …”
ఈ ఉపన్యాసం తర్వాత ” యూ టూ బ్రూట్ ! ”  ( You too Brutus ! )  పేరుతో తిలక్ తన ” కేసరి ‘ పత్రికలో అంబేద్కర్ ను ” దేశ ద్రోహి ” గా ” బ్రిటిష్ ఏజంట్ ” గా అభివర్ణించాడు.
అంబేద్కర్ కు ఉన్న స్పష్టత , వ్యక్తిత్వం అబ్బురమైనవి.  కులం లాంటి నికృష్ట సాఘిక సమస్య పై అవగాహన లేకున్నా  కేవలం స్వాతంత్ర్య ఉద్యమాన్ని ముందు ఉండి నడిపిస్తుందనే ఒక్క కారణం వల్ల కాంగ్రెస్ గొప్పదైపోదు అని అంబేద్కర్ అభ్రిప్రాయ పడ్డాడు.
ఇలా చూస్తే విప్లవ ఉద్యమాలు కూడా కేవలం కుల సమస్యను దాని లోతుల్లో పరిశిలించడం లో ఫెయిల్ అయ్యినప్పుడు ( తర్వాత దిద్దుబాటు కనిపించినా ) ఇదే వాదనలు వినబడ్డాయి. దళిత వాదులకు వచ్చిన ‘ కాన్ ఫిడెన్స్ ‘ ఇక్కడి నుండే. మీరు విప్లవ ఉద్యమం నడుపుతున్నారనే ఒకే కారణం వలన మేము మీతో ఉండలేము అని ఎదురు వినిపించారు. ( ఐతే ఆ దళిత వాణిలో పదును ఎక్కువ రోజులు నిల్వలేదు. అది తర్వాత చూద్దాం )
అంబేద్కర్ 1930 లో జరిగిన రౌండ్ టేబుల్ సమావేశానికి , కాంగ్రెస్ బహిష్కరించినా, తను  హాజరౌతాడు. ( రెండొ రౌండ్ టేబుల్ సమావేశానికి కాంగ్రెస్ అలక తీరి హాజరుతుంది ).  అంబేద్కర్ తనకు కావల్సిన విషయాన్ని సాధించడనికి  Diplomatic tactics  చాలా వాడాడు. తప్పని తెలిసిన చాలా విషయాలను ఎత్తుగడల కింద మలిచాడు.  Absolute sense of facts  ను  relative sense of facts  ను జాగర్తగా అంచనా కట్టాడు.  అలా కాక అంబేద్కర్ సాయుధ విప్లవ కారుడై ఉండి ఉంటే ఒక అద్భుతమైన అమరుడై మన పుస్తకాలలో వెలిగే వాడు కాని అదెలా ఉంటుందంటే – మృత శిశువుకు జన్మనిచ్చి చనిపోయిన తల్లిలాంటి స్థానం. ఇన్ని సంవత్సరాల సాయుధ పోరాటం ఎన్ని ఒడిదుడుకులకు లోనైందో ఊహించలేము. ఐతే అదే దళిత పక్ష పాత దృష్టితో చూస్తే – చివరకు దళితులకు ఏమి మిగిలి ఉండేది – అమరుడైన అంబేద్కర్  అద్భుతమైన చారిత్రక  గుర్తులా ?  అసలు ‘ మతమంటేనే మత్తు మందు ‘ అనే ఒక  absolute fact  ను పట్టుకుని వేలాడుతూ ఉండి ఉంటే దళితులకు ఎటువంటి మత ప్రత్యామ్నాయం చూపించకుండా ఉండి ఉంటే హిందూత్వాన్ని వెల వెల బోయేట్టు చేయగలిగే వాడు కాదు. ఈ విషయాన్ని సూక్ష్మంగా అర్థం చేసుకోకుండా అంబేద్కర్ మతాన్ని ప్రోత్సాహించాడు అని కొంతమంది ప్రగతిశిల వాదులు అనుకోవడం అవివేకం.  
అంబేద్కర్ వికృత బ్రాహ్మణ ఛాందస శక్తుల మధ్య ఒక్కడే ఒక్కడై హిందువులను ద్వేషించి , సిగ్గు పడేట్టు చేసి – ఆర్ ఎస్ ఎస్ బలమైన స్థావరమైన నాగ్ పూర్ లో బుద్ధిజం స్వీకరించాడు. అంబేద్కర్ తెగువకు తార్కాణాలెన్నో !
అంబేద్కర్ కమ్యూనల్ అవార్డ్ విషయంలో దళితులకు ” ప్రత్యేక ఓటు పద్ధతి ” ని బలంగా ముందు తీసుకువచ్చాడు. అదే జరిగి ఉంటే ఈ రోజు దళితులు అనూహ్యంగా ఒక సమాంతర రాజ్యాన్ని సాధించగలిగే వాళ్ళు. వాళ్ళ వోటుతో వారి అభ్యర్థులను ఎన్నుకునే పద్ధతి ఒక రాజకీయ ఎత్తుగడతో కూడిన ప్రణాళిక. బ్రిటిష్ ప్రభుత్వం ఒప్పుకున్నా, గాంధి హిందు వ్యవస్థ యొక్క ప్రయోజనాలు దృష్టిలో పెట్టుకుని ఒప్పుకోక పోవడం వలన జరిగిన ” పూన ఒడంబడిక ” లో ” రిజర్వ్డ్ ఓటింగ్ సిస్టం ” వచ్చింది.
చరిత్ర చదివితే మనకర్థమయ్యేది – హిందూ వ్యవస్థ చిన్నాభిన్నం అవ్వకుండా హిందూ వ్యవస్థ ప్రతిపాదించిన రాజీ ఫార్ములానే రిజర్వేషన్ లు !
అంబేద్కర్ సాంఘిక మార్పు కోరుకున్న ఒక బూర్జువా ఆలోచన కలిగిన మేధావిగా ఇప్పటికీ ఎంతో మంది విప్లవ మేధావుల్లో ఉంది. రంగనాయకమ్మ లాంటి మేధావులు – ఒక 500 పేజీల పుస్తకం కూడా విడుదల చేసారు – అంబేద్కర్ లోని తప్పులు ఎత్తి చూపిస్తూ.
అంబేద్కర్ కు సాంఘిక మార్పు ఒక దీర్ఘ కాలిక ప్రక్రియ అనే విషయం తెలీదు అనడానికి ఏ విధమైన ఆధారాలు లేవు. అలాగే తాను ప్రతిపాదించిన పద్ధతుల వల్ల విప్లవాత్మక మార్పు వస్తుందనే నమ్మకాన్ని వెలువరించిన సందర్భం ఒక్కటి కూడా లేదు. అంబేద్కర్ దీర్ఘ కాలిక పోరాటం మృత శిశువుగా మిగలనీయ కూడదనే ప్రయత్నం లో – దళితుల చైతన్యాన్ని నిశితంగా అంచనా వేసుకుని  existing institutions  ను తన మనుష్యుల కొరకు వాడుకున్నాడు. ప్రతి ప్రజాస్వామిక మేధావిని విప్లవ కారుడుగా ఉండాల్సింది అని కోరుకునే ఒక వెర్రి అంచనా అంబేద్కర్ ను తక్కువ చేస్తుంది. రంగ నాయకమ్మ చేసిన పెద్ద పొరపాటుఇదే ! ఆమె అంబేద్కర్ తప్పులు విజయవంతంగా ఎత్తి చూపింది కాని – అంబేద్కర్ లేని దళితుల జీవితం ఎలా ఉండేదో ఒకే ఒక్క క్షణం ఊహించి ఉండి ఉంటే – ఈ కుల వ్యవస్థ ఉన్నంత కాలం అంబేద్కర్ లో తప్పులు ఎన్నడం ప్రధానం కాదు, ఆయన కృషిని , ఆయన సిద్ధాంతాలను కులవ్యవస్థలో మగ్గిపోయిన అణగారిన వర్గాలకు ప్రేరేపితంగా ఎలా ప్రెజెంట్ చేసి ఉండల్సిందో ఆలోచించడం ప్రధానమై ఉండేది. ఇంతా చేసి ” మృత శిశువు ” లాంటి ఆదర్శ రాజకీయ సొల్యూషన్ తో ముగించింది తప్ప – కాంక్రీట్ గా ఈ కుల వ్యవస్థ ఎలా నిర్మూలింపబడి ఉండొచ్చో తెలియ జేయడం చాత అవ్వలేదు.  రంగ నాయకమ్మ లాంటి మేధావులకు  ” self-goal ”  కొట్టుకోవడం లో ఉన్న ఆనందం , కుల వ్యవస్థకు వ్యతిరేకంగా రాజీ లేకుండా ఆలోచించే ఉద్దేశ్యం లో లేదు.  
అకడమిక్  మార్క్సిస్ట్ ల పరిస్థితి ఇలా ఉంటే –  Dalit fundamentalism  ఒక దృక్పథంగా ఒక మార్గంగా ముందుకొచ్చి – 1980-90 లలో వచ్చిన దళిత చైతన్యాన్ని సరిగ్గా గైడ్ చేయడం లో విఫలం అయ్యింది. ” కుల నిర్మూలన ” కు ముందు మాటగా ” డాక్టర్ అండ్ సెయింట్ ” అనే ఒక అద్భుతమైన విశ్లేషణ అరుంధతి రాయ్ వ్రాయగలిగింది కాని మన దేశం లో దళిత వాణిని ఎత్తి పట్టిన దళిత వాదులు కాదు. అంబేద్కర్ వీళ్ళకు నేర్పించిన ” ధిక్కార స్వరం ” ధిక్కారం దగ్గర , ” ఆత్మ గౌరవాన్ని ” ఆంజనేయ దండకంగా చదవడం లోనే మిగిలిపోయింది. దళిత వాదులు రాజకీయ కెరీరిస్టులుగా, ఆచరణ లేమి కలిగిన వ్యక్తులుగా మిగిలి ఒక  Group force  గా ముందుకు రాలేకపోయారు. ఆచరణ అవలంబనం లేని ధిక్కారం ఛాందస వాదంగా మిగిలిపోతుంది తప్ప బలమైన రాజకీయ వాదంగా నిలబడలేదు. దళిత వాదం స్త్రీ వాదం లాగే  Urban middle class  కు పరిమతమై సహజ మరణానికి దగ్గరగా ఉంది. ధిక్కార స్వరం వినిపించిన దళిత వాణికి ఆధిపత్య సంక్షోభం తో కొట్టుమిట్టాడుతుంది. ఏ ఒక్క నాయకత్వము కూడా దళిత వాదులను ఎక్కువ కాలం ఒకే గాటికి కట్టలేక పోవడానికి ప్రధాన కారణం ఈ  Dalit fundamentalism  ప్రధాన కారణం.
ఇక అంబేద్కర్ ను ఇప్పటి పరిస్థితుల్లో చూడాలంటే – రోజు రోజుకు ఆయన ప్రాధాన్యత పెరుగుతుందే తప్ప తరగడం ఉండడం లేదు. గుజరాత్ గొడవల వెనుక ఉన్నదెవరో బీ జే పీ కి ఓటేసిన ప్రతి హిందువుకూ తెలుసు. అయినా సరే దళిత, గిరిజన, మైనారిటీల సంక్షేమానికి వ్యతిరేకంగా పని చేసే రాజకీయ నాయకున్ని ప్రధానిగా ఎన్నుకోవడం ఈ దేశం లో పాతుకుపోయిన హిందూ ఛాందస వాదానికి ప్రతీక. ఈ హిందూ ఛాందస వాదానికి ప్రత్యామ్నాయంగా అంబేద్కర్ యొక్క ఆలోచనా విఢానాన్ని బలంగా తీసుకు వెళ్ళాల్సిన అవసరం ఎంతో ఉంది. ” మైనారిటీ  ఒక పేలుడు పదార్థం లాంటిది. అది పేలిందంటే రాజ్యం యొక్క మనుగడ ఛిన్నాభిన్నం అవుతుంది ” ” హిందుత్వం ఒక మతం కాదు. ఒక వ్యాధి ” ” ఈ దేశం లో హిందువులు వ్యాధి గ్రస్థులు. వారి వ్యాధి ఈ దేశ ఆరోగ్యానికి , ఆనందానికి హాని కలిగిస్తుందనే విషయం తెలియ జేసేట్టు చేస్తే నాకు సంతృప్తి కలుగుతుంది ”  ” హిందువులకు నేను తోటలో పాము లాంటి వాడిని ” ‘ హిందువులు అత్యంతగా ద్వేషించే వ్యక్తి ఈ దేశం లో నేనే ” అని ఎంతో ధైర్యంగా చాతీ విరిచి హిందూ ఛాందస సమాజాన్ని ఎదుర్కున్న అంబేద్కర్ మన సమకాలీన పరిస్థితులకు ఎంతో అవసరం. ఈ విషయం గ్రహించిన కాషాయ సంస్థలు ముందుగానే అంబేద్కర్ ను తమ వాడిగా సృష్టించే ప్రయత్నం చేయడం కాకతాళీయం కాదు. హిందూ ఛాందస వాదం క్రిస్మస్ ను మిగేస్తుంది. ఈస్టర్ ను మింగేస్తుంది. మన జీవితం లో అనుభవించే ప్రతి చిన్న హక్కును చిదిమేస్తుంది. ఇదే ఫాసిజం గా రూపాంతరం చెందుతుంది. దానిని ఎదుర్కోగలిగిన ఒకే ఒక బలమైన ఆయుధం ” అంబేద్కర్ ” ఒకటే !!!
వినిపించని ఓ కేకలా
వినిపించినా క్షణ కాలమే కొట్టూ మిట్టాడిన ఓ ఆర్తనాదం లా
అతని భాష మిగలాలని కోరుకోలేదు
ఒక దృఢ నిశ్చయం తో బండ రాళ్ళను ఛేదించి
మేరువులా ఒక నిట్ట నిశీధిన  ఆయన వచ్చాడు
పగిలిన పిగిలిన గొంతులకొక భాష
ధారపోస్తున్నప్పుడు
ఆయన ఊహించాడు
ఒకే భాష – ఒకే మాటగా ఒక పునాదిని మిగిలిద్దామనుకుంటే
తన భాషకో ఆయుష్షు కావాలనుకున్నాడు
అర్థమయ్యే భాషను సిద్ధం చేయడానికి
తనకో ప్రాణం కావాలనుకున్నాడు
అంతే తప్ప
పిడికిలితో మెరుపులు రాజేస్తున్నప్పుడు
అగ్ని స్నానం చేస్తాడు
నిజానికి లావా ఉప్పెనల్లో  ఎన్నో సార్లు మరణించి తిరిగి లేచాడు
ఆయన ఎంచుకున్నది మృత శిశువుకు జన్మనిచ్చి
తనువు చాలించిన తల్లి పాత్ర కాదు
అమరత్వానికి వ్యర్థార్థాలు వెదికే సమయం కాదప్పుడు
ఆయన భాష నేర్చిన స్వర పేటికలు నెత్తుటి గడ్డలు
కక్కినా మరణాన్ని కాంభోజ రాగం లో ఆలాపిస్తాయి
మొదట ఒక భాష కావాలి
ఆ భాష కోసం
మృత్యు ధారియై ఆయన నిలవాలి
ఆయన నమ్మిందంతే  !
*

ఒక రైతులా, ఒక యానాదిలా…కేశవ రెడ్డి!

రెండు నెలల కిందట బోధన్ లో స.వెం. రమేశ్ ‘కతలగంప’, శౌరీలు గారి ‘సిలువగుడి కతలు’ పుస్తకాల ఆవిష్కరణ కార్యక్రమం జరిగింది. తిరుపతి నుంచి మధురాంతకం నరేంద్ర, నేనూ, విష్ణుప్రియా వెళ్ళాం. ముందు రోజు కుంతల జలపాతం ప్రయాణం. బుల్లి బస్సులో గలగలా ఉన్నారు మనుషులంతా. పచ్చని చిక్కని అడివిలో ప్రయాణం హాయిగా సాగింది. దారిలో నిర్మల్ లో బొమ్మల కోసం దిగాం. డాక్టర్ కేశవరెడ్డి నిజామాబాద్ లోనే కదా ఉండేది, ఇంత దూరం వచ్చి కలవకుండా ఎలా?

అలసిపోయిన చాలా మంది బోధన్ వెళ్ళిపోయారు. నేనూ, నరేంద్ర, సడ్లపల్లి చిదంబరరెడ్డి, నంద్యాల శ్రీనివాసులురెడ్డి, బత్తుల ప్రసాద్, గొరుసు జగదీశ్వరరెడ్డి, శిరంశెట్టి కాంతారావు నిజామాబాద్ వెళ్ళాల్సిందే అని పట్టుబట్టాం. విష్ణు తనూ వస్తానంది. బస్సులోంచి మేం మాత్రం ఒక కారులోకి మారాం. ఫోన్ లో అడ్రస్ కనుక్కుని వెతుక్కుంటూ వెళ్ళాం . చదవడమే తప్ప నేను అప్పటిదాకా కేశవరెడ్డిని చూడనేలేదు. ఉద్వేగభరితంగా పేజీల వెంట పరుగులు తీయించే అరుదైన తెలుగు రచయితని కలుసుకోబోతున్న ఉత్సాహం. ఏం మాట్లాడాలి?

స్నేహితుల మధ్య..

స్నేహితుల మధ్య..

మాలో చాలా మందికి ఆయనతో పరిచయం బానే ఉంది. మాటలు అవే దొర్లుతాయి. కరెంటు స్తంభం పక్కన కారు ఆగింది. పాత అపార్ట్ మెంట్..పాత ఇల్లు..కొంత దుమ్ముబారినట్టున్న అరలు..లోపల పాతబడిన పుస్తకాలు.. కుర్చీలో కేశవరెడ్డి. గళ్ళ లుంగీ, అరచొక్కా. పలచగా తెల్లని పోచల్లా తల మీద మిగిలిన వెంట్రుకలు.. ఎందుకో చూడగానే కొంచం దిగులుగా అనిపించింది. పొడి నవ్వుతో పలకరించారు. కొంచం మొహమాటంగా కనిపించారు. భార్యను పరిచయం చేశారు. ఇదంతా ఆయన స్వభావం.

అక్షరాల్లోనూ ఆయనేం ఆడంబరంగా ఉండరు. ఆయన రచనల్లోని ఒక పాత్ర లాగే కనిపించారు కేశవరెడ్డి నాకు. ఒక రైతు, ఒక యానాది, మనేదతో తనతో తనే మాట్లాడుకునే ఒక స్త్రీ. వీళ్ళంతా కేశవరెడ్డేనా?! బహుశా వీళ్ళలో చాలా పాళ్ళు ఆయనే కావచ్చు.

కేశవరెడ్డి పాత్రలు వెంటాడుతూ ఉండేది అందుకే. కథకీ, నవలకీ మధ్య ఎక్కడో ఒక గీత గీసుకుని రాసుకుంటూ పోయాడు ఆయన. చిత్తూరు జిల్లా తలపులపల్లె లో పుట్టి, ఈ పరిసరాల్లోనే పెరిగి, పాండిచ్చేరిలో చదువుకుని డాక్టరై, డిచ్ పల్లిలో వైద్యం చేసిన ఈయన మాటల్లో, వాక్యంలో ఈ ప్రయాణం ప్రభావం ఉంటుంది. ఇష్టంగా చదువుకున్న ఆంగ్ల రచనలు ఆయనను అంటిపెట్టుకునే ఉన్నాయి. పాత్రలు చిత్తూరు జిల్లా పల్లెలోనే ఉన్నా, కథా ఇక్కడే నడిచినా, నడకలో తేడా అందుకే అనిపిస్తుంది. కేశవరెడ్డి పుస్తకం తెరిస్తే, ఇంటర్ లో మధుబాబునో, ఇంకా ముందు జానపద కథలనో, ఇంకా కొంచం ముందు చందమామనో పట్టుకున్నట్టే.

ఎన్నడూ చూడకపోయినా ఆయన నన్ను గుర్తుపట్టారు. బిస్కెట్లు, టీలు, అందరికీ చాలినన్ని కుర్చీల కోసం వెతుక్కోవడం, దుమ్ము దులిపి, కడిగి కప్పుల్లో టీ అందించడం…ఎందుకో ఇష్టంగా అనిపించింది. నలుగురు వస్తే, ఒక స్టూలునో, కుర్చీనో, మంచాన్నో లాక్కుని సర్దుకుని కూర్చునే ఊళ్ళోని మా ఇల్లే ఇది. పరిసరాలు సహా ఆయనా, ఆమె కూడా పరిచయం లేనివాళ్ళలా కనిపించలేదు.

మాటలు నడిచేకొద్దీ ఆయన ఇంకా దగ్గరవుతున్నట్టనిపించింది. పొడి మాటలే గానీ, చతురమైన వాడే! వైద్యం వల్ల తల ఇట్లా తయారైందని చెప్పారు. ఆ మాటల్లో ఎక్కడో ఒక నిర్వేదపు గీర. ఇంతలో డాక్టర్ నక్కా విజయరామిరెడ్డి వచ్చారు. కేశవరెడ్డి మీద ఎంతో శ్రద్ధ. కొడుకంత బాధ్యతగా కనిపించాడాయన. ఒక గంట గడిపి బోధన్ కి బయలు దేరాం గానీ, దిగులు దిగనేలేదు. పుస్తకాల సభకి ఆయన రానేలేదు.
ఫిబ్రవరి 13న ఉదయం నరేంద్ర ఫోన్.. మునిసుందరం గారు చనిపోయారని. కోటకొమ్మల లేఅవుట్ ఇరుకు సందులోని ఆయన ఇంట్లోనే గాజుపెట్టెలో ఆయన. కాసేపు అక్కడే తచ్చాడి, ఆఫీసుకి రాగానే, మళ్ళీ నరేంద్ర ఫోన్..ఇంకో బ్యాడ్ న్యూస్ అంటూ.

ఒకే రోజు చిత్తూరు జిల్లా రచయితలు ఇద్దరూ వెళ్ళిపోయారు. ఒకరు ఇక్కడ. ఇంకొకరు నిజామాబాద్ లో, జ్ఞాపకాలుగా మారిపోయి.

-ఆర్. యం.ఉమా మహేశ్వర రావు 

నూరేళ్ళ రజని: పాట ఆయన ఎగరేసిన పావురం!

2001_photo

” లలిత సంగీతం అనే పేరు ఎలా వచ్చింది ? ” అన్న నా ప్రశ్నని కొంత మార్చి ” లలిత సంగీతం ఎలా వచ్చింది ? ” అని నవ్వుతూ అడిగారు ఆయన కుమారులు బాలాంత్రపు హేమచంద్ర గారు.

” నా లోంచి ” – వంద గండుతుమ్మెదలు పలికాయి గొంతులో. ఆ చెప్పుకోవటం లోనూ పాటే ఉంది … విడిగా ఆయన ఉనికి లేదు ఇప్పుడు. బహుశా ఎప్పుడూ ఉండి ఉండదేమో కాని, ఈ శైశవ మౌగ్ధ్యం లో అసలు తెలియటం లేదు. కళా దేవి తన ప్రేమికులను యౌవనం నుంచి, ప్రౌఢత్వం నుంచి వృద్ధులను చేయక ఇలాగ పసివారిని చేస్తుందేమో.

అలా అని వారికి ఏవీ పట్టటం లేదనేమీ కాదు, మాకు అతిథిమర్యాదలూ పర్యవేక్షిస్తూనే ఉన్నారొక కంట.
‘’ Her whole life became a poem and a song ‘’ అని సరోజినీ నాయుడు గారి గురించి అన్నారని తెలుసు, ఇక్కడ దాన్ని దర్శించే వీలు కలిగింది. ఆ పాట కేవలం కలల్లో మ్రోగి ఊరుకునేది కాదు, పరిసరాలనూ పరిచయస్తులనూ ఆప్తులనూ సేవకులనూ తడిపి స్వచ్ఛం చేయగలిగినది.

ఈ 31 వ తేదీకి అధికమాసాలతో కలిపి వారికి నూరు సంవత్సరాలు పూర్తవుతాయట. ఆంగ్లమానం ప్రకారం తొంభై ఆరు. కొద్దిపాటి శారీరక అశక్తత లకు సాయం చేసేందుకు ఒక యువకుడు ఉన్నారు వారితో. అతను ప్రేమగా అడుగుతున్నాడు ” అది పాడండి, ఇది పాడండి ” అని.
ఇంటికివచ్చినవారి దగ్గర బిడ్డను పద్యాలు చెప్పమన్నట్లు ఉంది ఆ అడగటం. అతని మనసులో అంత మెత్తదనాన్ని మేల్కొలిపిన ఈయన ఆర్ద్రత ఎంతదో కదా..హాయిగా అనిపించింది చూస్తుంటే.
తెలుగు సాహిత్యపు సుకృతాలలో ఒకటి వేంకటపార్వతీశ్వర కవుల సాహిత్యం. ఆ జంట లో ఒకరి, బాలాంత్రపు వేంకటరావు గారి – పుత్రులు రజనీకాంతరావు గారు. వేంకటరావు గారి సేవకు సంతుష్ట అయిన సరస్వతి , తన మరొక కారుణ్యాన్ని, సంగీతాన్ని – వారి బిడ్డ పైన వరంగా కురిపించింది. ఆ గులాబీ నీటి జడి ఇంచుమించు అరవై ఏళ్ళ పాటు ఆంధ్రదేశాన్ని ముంచెత్తింది, ఇప్పటి శాంతపు విశ్రాంతి లోనూ ఆ సౌరభం స్ఫురిస్తూనే ఉంది.

రజని అంటే ఒక ఉత్సాహం, ఒక ఉత్సవం, ఒక జీవన సందేశం. ముదిమి లేని కౌముది.. (ఫోటో: దాసరి అమరేంద్ర)

రజని అంటే ఒక ఉత్సాహం, ఒక ఉత్సవం, ఒక జీవన సందేశం. ముదిమి లేని కౌముది.. (ఫోటో: దాసరి అమరేంద్ర)

” ఆయన వినికిడి అంత బాగాలేదు, ముఖాముఖీ వంటిదేమీ సాధ్యం కాదేమో ” నని వారి అబ్బాయి ముందే హెచ్చరించి ఉన్నారు. ఊరికే చూసేందుకు వస్తామని చెప్పాను. నా జీవన కాలం రజనీకాంతరావు గారి కాలాన్ని స్పర్శించగలగటమే గొప్ప సంగతి, మరింకేదైనా అదనమే. మేము వెళ్ళేసరికి చక్కగా, ఒక కేంద్రప్రభుత్వపు ఉన్నతోద్యోగి ఎలా ఉండాలో అలా, తయారై హాల్ లో కూర్చుని ఉన్నారు.

”ఏమైనా పాడతారా, వీళ్ళకోసం ? ” -వారి అబ్బాయి అడిగారు.
నేను ధైర్యం చేసి ” స్వైరిణీ అన్నారు నన్ను శ్యామసుందరా ” కోరుకున్నాను. లత గారి మోహనవంశీ మొదటి పుటలో ‘ theme song ‘ గా నాకు పరిచయమై, వెంటాడిన పాట అది. ఆయన ముఖం వెలిగింది, ” మీకు మంచి పాటలు తెలుసూ ” అని కితాబు ఇచ్చారు. పాడారు. ఇంతలో వారి కోడలు ప్రసూన వచ్చేశారు. ” ఆవిడ అడిగితే బోలెడు విషయాలు చెబుతారు, పాడతారు ”-అట. ఎదురుగా కూర్చుని లాలనగా వారి మోకాలి పైన అరచేయివాల్చి మృదువుగా ఆజ్ఞాపిస్తున్నారు ఆమె.

‘ ఓంకార పరివృత్తం విశ్వం ‘ పాడండి
పాడారు.
‘ ఓ విభావరీ ‘ పాడండి..
పాడారు.
‘కొండవాలులో ‘ పాడండి..
పాడారు.
‘ ప్రతిశ్రుతి ‘ … ఆ పాట ఎలా రాశారు ?
” మా పిఠాపురం లో బడికి వెళ్ళేప్పుడు ఒక వీధిలో అలా ప్రతిధ్వనులు వినిపించేవి , దాని గురించి రాశాను ”
‘’ మధువనస్వప్నం లోవి పాడండి. పాడారు.
” Puck,అదే, Robin good felow గుర్తున్నాడా ? ” నన్ను ప్రశ్నించారు.
” గుర్తున్నాడండీ ”
” అతను పాడతాడు ఇది ” – వివరించారు.

మనుమడు బాలాంత్రపు తేజతో ....

మనుమడు బాలాంత్రపు తేజతో ….

Shakespeare నాటకం ‘ Midsummer night’s dream ‘ ని సంగీతరూపకంగా మలచి పాటలు రాసి, స్వరపరచారు. అదొకటే కాదు, ‘ ఉమర్ ఖయాం ‘ , ‘ అవంతిసుందరి ‘[దశకుమార చరిత్ర నుంచి ] , ‘ దేవదాస్ ‘ , ‘ సిద్ధేంద్రయోగి ‘ , రవీంద్రుల ‘ చిత్ర ‘ , ‘ లైలా మజ్ఞు ‘, ‘ చండీదాస్ ‘ , ‘ శిలప్పదిగారం’ , ‘ కులీకుతుబ్ షా’ …లెక్కలేనన్ని రూపకాలు . వసంత , గ్రీష్మ, వర్ష, శరత్, హేమంత , శిశిరాలా పత్రాలుగా అలవోకగా రాలిన పాటలు. సాహిత్యం పట్ల గాఢమైన అభినివేశం ఉన్నవారు సంగీతరసజ్ఞులైతేఎటువంటి కళాకృతులు రాగలవన్నదానికి తార్కాణాలు అవన్నీ . వారి లోని కవిని సంగీతకారుడు కొన్ని సార్లు అధిగమించారనిపించినా, మెట్లవరుసలు వంటి గేయాలలో ఏ ఉత్తమ ఆధునిక కవికీ తీసిపోని ప్రతిభ కనిపిస్తుంది.

”గగనసీమలు కాలపరిధులు
గడచిపోయే మెట్లవరుసలు
జీవితమునకు మరణమునకూ
ఈవలావల కదలు వరుసలు
కుడిఎడమలే కానరాని
తుదిమొదళ్ళే తోచబోని –మెట్లవరుసలు
స్వప్నమధువుల జడులలోపల
స్వాంతమున జ్ఞాపకపు పొరలు
పొరలలోపల తెరలు తెరలుగ
పూర్వజన్మల ప్రేమకథలు- మెట్లవరుసలు..

పిఠాపురం రాజా వారి కళాశాలలో చదువు అయాక ఎం.ఏ కి ఆంధ్ర విశ్వవిద్యాలయం తోబాటు శాంతినికేతన్ కి కూడా దరఖాస్తు చేశారట. రెండు చోట్లా సీట్ వచ్చింది.

” వెళ్ళలేదేం మరి ? ” హేమచంద్ర గారు అడిగారు.
” అంధ్రా లో వచ్చిందిగా, దగ్గర గా ” – ఆరాటం లేదన్నమాట, హెచ్చేమో అనిపించే సౌందర్యం కోసం కూడా. అనవసర తాపత్రయాలు లేని జీవనం, అలాగని క్రియాశూన్యమైనది కాదు. అటువంటి తూకం ఉండటం అంత మేధావినీ pervert కాకుండా ఆపిందనిపించింది. సాటిలేని ప్రతిభ కారణంగా తోటివారు ఈర్ష్యాసూయలు చూపెట్టినా అవి వారిని తాకలేదు ఏనాడూ. చిన్నప్పుడు అన్నగారు నళినీ మోహన రావు గారు మంచి స్పోర్ట్స్ పర్సన్ గా ఉండేవారట. వీరూ ఆ పనేదో మొదలెడదామని ఒకనాడు పరుగుపందెం లో పాల్గొనబోయారట. మాస్టర్ విజిల్ వేసినా పరిగెత్తాలని తోస్తే కద, అక్కడే ఉండిపోయారు. తమకు అది సరిపడదని తెలుసుకున్నారట… ఆ తర్వాతెప్పుడూ ఏ పరుగు మీదా ప్రీతి లేదు , దారిప్రక్కన గులాబీలను ఆఘ్రాణిస్తూ హాయిగా నడిచారు, గమ్యం కోసం కాదు. ఆ నిశ్చింత వారికి ఆయుష్షునూ ఆరోగ్యాన్నీ ప్రసాదించింది.

కొడుకు హేమచంద్ర , కోడలు ప్రసూనతో

కొడుకు హేమచంద్ర , కోడలు ప్రసూనతో

సంగమేశ్వర శాస్త్రి గారి శిష్యులు మండా కృష్ణమూర్తి గారి దగ్గర సంగీతం నేర్చుకున్నారు.బాల్యంలో పాటలు కట్టుకుంటున్నప్పుడే స్వరాలు వచ్చేసేవి, ఒక రాగపు ఛాయలో ఒదిగేవి. ఇరవై ఏళ్ళు దాటుతుండగా, 1937-40 మధ్యలో పూర్తి స్థాయి వాగ్గేయకారుడైనారు. తమ అభిరుచికి తగిన ఉద్యోగం లో ప్రవేశించారు. అలాగ కుదరటం ఎవరికోగాని పట్టని అదృష్టం. ఆచంట జానకిరాం, అయ్యగారి వీరభద్రరావు వంటి భావుకులూ ఉద్దండులూ అయినవారి దగ్గర రేడియో మాధ్యమాన్ని అవగాహన చేసుకున్నారు. గొప్ప సాహిత్యాన్నంతటినీ రేడియో ద్వారా వినిపించే పనిని ఆయన తానుగా మీద వేసుకున్నారు, ఆ క్రమం లో రెండు తరాల అభిరుచిని ఉన్నతం చేశారు. ఆ ఘనతేదో తామొక్కరికే దక్కాలని అనుకోనూలేదు. ఫలితంగా రేడియో కి ఒక సామూహిక నిత్యోత్సవంగా పేరు వచ్చింది.

తెలుగు లో శాస్త్రీయానికి మార్దవాన్ని జోడిస్తూ సుగమమైన సంగీతం మొదలైన కాలం అది-రజనీకాంతరావు గారు , ఎస్.రాజేశ్వర రావు గారు, రావు బాలసరస్వతి గారు, సీతా అనసూయ గార్లు- వీరంతా ఆ వైతాళికులు. ఇందరిలో వాగ్గేయకారులు రజని గారొక్కరే. ఆ తర్వాతి కాలం లో కొన్ని సినిమాలకు పనిచేస్తూ, ప్రభుత్వోద్యోగపు నిబంధనల వల్ల అన్నగారి పేరనా, బావ మరిది బుద్ధవరపు నాగరాజు గారి పేరనా పాటలు చేస్తూ పోయారు. బహిరంగరహస్యం ఒకటి – కృష్ణశాస్త్రి గారి ‘ జమీందారీ బద్ధకం ‘ కారణం గా పాటలు అందించలేకపోతే రజనిగారు రాసేసేవారు.

అలా కృష్ణశాస్త్రి గారి పేర చలామణీ అయిన పాటలలో ముఖ్యమైనది ‘ కొలువైతివా రంగశాయి ‘. పాట వారిది అంటే నూటికి తొంభైతొమ్మిది సార్లు రచన, వరస రెండూ అనే అర్థం. బి.ఎన్.రెడ్డి గారు, గోపీచంద్ గారు – వీరి సినిమాలలో రజని గారు తప్పకపనిచేయవలసిందే. రాజమకుటం లో ‘ ఊరేది పేరేది ‘ రజని గారి అద్భుతాలలో ఒకటి. గోపీచంద్ గారి ‘ మానవతి ‘ లో ‘ తన పంతమే ‘ , అరుదైనరాగం రసాళి లో చేశారు. బాలసరస్వతి పాడారు. అది వి.ఎ.కె. గారికి చాలా ఇష్టమని హేమచంద్ర గారు చెప్పారు. ఆ పాటను రజని గారి పేరన ప్రస్తావించనందుకు బాలసరస్వతి గారి పైన వి.ఎ.కె. గారికి కొంచెం కోపం కూడానట.

1950 తర్వాతి కాలం లో మీర్జాపురం రాజావారి సినిమా కి పనిచేస్తున్నప్పుడు ఎదురైన ఇబ్బంది వల్ల ఆయన సినిమాల్లోంచి తప్పుకున్నారు. అక్కడా వారి ‘ మట్టసం ‘ కనిపిస్తుంది, తమకు తగనిదేదో తెలుసుకొనే స్పష్టత. రేడియో లో ఉండిపోవటం ఎంతో స్థిమితాన్ని ఇచ్చింది, కీర్తితోబాటు. ఇక్కడ తమ పేరు ని దాచుకొనే అవసరం లేకపోయింది. తమ పాటలు మరొకరి పేర ఉంటే వారికి పట్టదు కాని, తమది కానిది తమది అనటాన్ని వెంటనే ఖండిస్తారు. చలం గారి మ్యూజింగ్స్ లో ‘ ఆ తోట లోనొకటి ఆరాధనాలయము ‘ పాట ను మెచ్చుకుంటూ అది రాశారు కనుక రజని అప్పటిదాకా రాసిన దేశభక్తి గేయాలన్నిటినీ క్షమించవచ్చు అంటారు. ఆ మాటలు అంతా చెప్పుకుంటారు. ఇంతకూ అది రాసినవారు ఎస్.రాజేశ్వర రావు గారి తండ్రి సన్యాసి రాజు గారు. మేము ఉండగా హేమచంద్ర గారు రజని గారిని సరదాగా మళ్ళీ అడిగారు ” ఆ తోటలోనొకటి పాట ఎవరు రాశారు ? ” అని.
” నేను కాదు ” ఖచ్చితంగా, చిన్న ఉక్రోషం తో బదులిచ్చారు రజని గారు.

1947 ఆగస్ట్ పదిహేను న ఉమ్మడి[14 వ తేదీ అర్థరాత్రి ] మద్రాస్ రాష్ట్రపు రేడియో కేంద్రం నుంచి ప్రసారమైన పాటలలో మొదటిది పట్టమ్మాళ్ గారు పాడినది. రెండవది టంగుటూరి సూర్యకుమారి గారు పాడిన రజని గారి పాట – ‘ మ్రోయింపుము జయభేరి ‘ . పెద్ద సంతోషం ,ఆ విషయం వింటూంటే అంతకన్న ప్రసిద్ధమైనది- ” మాదీ స్వతంత్ర దేశం , మాది స్వతంత్ర జాతి ‘ ఇవాళ విన్నా ఒళ్ళు జలదరిస్తుంది. ముఖ్యంగా ప్రారంభం లో వచ్చే trumpet ధ్వనులు. ఆ పాట 1948 ఆగస్ట్ పదిహేనున ప్రసారమైందట.

చిన్నపిల్లల కోసం ‘ జేజిమామయ్య పాటలు ‘ బోలెడన్ని కూర్చారు. .. ‘ దిబ్బరొట్టె అబ్బాయి ‘ వంటివి. 1961 లో రవీంద్రుల శతజయంతి. మొత్తం రవీంద్రసంగీతాన్నంతా తెలుగులోకి తెచ్చేశారు రజని. బెంగాలీ లో ఇంతకన్న బావుంటాయనిపించదు నాకు. అదొక ఆనంద సం రంభం ఆకాశవాణిలో. అపురూపమైన పాటలు అవి..కృష్ణనీ గోదావరినీ దాటించి సరాసరి పద్మానది తీరానికి ప్రయాణం చేయిస్తాయి. [వేంకటపార్వతీశ్వర కవులు చాలా బెంగాలీ నవలలని తెలుగులోకి అనువదించారు. వేంకటరావు గారి తమ్ముడు కలకత్తా విశ్వవిద్యాలయం లో చదువుకుంటూ బెంగాలీ పుస్తకాలు ఇంటికి తెచ్చేవారు. వీరు భాష నేర్చేసుకున్నారు. వారి ద్వారా రజని గారికి బెంగాలీ వచ్చిఉండటం గొప్ప మేలు చేసింది శ్రోతలకి]

ఆయన దిద్దినవారూ అంతేవాసులూ అనంతరకాలం లో ప్రసిద్ధులైనారు . బాలమురళీకృష్ణ గారు రజని గారిని గురుసమానులుగా చూసేవారిలో ఒకరు అంటే ఆశ్చర్యంగా ఉండవచ్చు, కాని అది నిజం. శ్రీరంగం గోపాలరత్నం గారితో కలిసి బాలమురళి గారు పాడిన రజని గేయం ‘ మనప్రేమ ‘ ఈ మధ్య , తిరిగి ఫేస్ బుక్ లోఆహ్లాద విహారం చేసింది. రజని గారి గేయాల సంపుటి ‘ శతపత్రసుందరి ‘ కి బాలమురళి గారు వినయంగా రాసిన ముందుమాట ఉంది .ఘంటసాల గారు ఎదుగుతూన్న దశ లో రజని గారి ఊత ను అందుకున్నారు.
1972 లో చలం గారిని చేసిన ఇంటర్ వ్యూ రజని గారి గొప్ప achievements లో ఒకటి. చలం గారి పరంగా రజని ఆప్తత, అధ్యయనం, గౌరవం కనిపిస్తాయి అందులో. వీటితోబాటు [అభిమానులని మినహాయిస్తే ] లోకం చలం గారిని చూసే చూపు రజని గారికి తెలుసు, చూడవలసిన చూపు ఎలా ఉండాలో కూడా.

కృష్ణశాస్త్రి గారితో రజని గారి అనుబంధం అతి ప్రత్యేకమైనది. అది ఇరుగుపొరుగుల ఆత్మీయతగా మొదలై ఇద్దరూ కలిసి కూర్చుని పాటలు చేసేవరకూ విస్తరించింది. ‘కృష్ణ రజని ‘ అని తమ గేయాల సంపుటికి పేరు ఉంచారు కృష్ణశాస్త్రి గారు.

ఆకాశవాణిలో సీనియర్ అధికారిగా ఆంధ్రప్రదేశ్ కు బయట కూడా పనిచేశారట. ఆ ఇతర రాష్ట్రాలలో ఏమి చేసి ఉంటారు ? బెంగళూరు కేంద్రం లో పనిచేస్తూ కన్నడం నేర్చేసుకున్నారు, కన్నడం లో పాటలు రాసేటంతగా. వాణీ జయరాం గారు పాడిన ఒక పాట ఆవిడకి చాలా ఇష్టమని హేమచంద్ర గారు చెబుతూండగానే ఆ పాట అందుకుని పాడేశారు రజని. డార్జిలింగ్ దగ్గరి కేంద్రం లో పనిచేస్తూ జయదేవుడి అష్టపదులను కొత్తగా పాడి, పాడించి రికార్డ్ చేశారట. ‘ శతపత్రసుందరి ‘ సంపుటం లో డార్జిలింగ్ చుట్టు పక్కల ప్రకృతి గురించి రాసిన రమ్యమైన గేయం ఉంది.

వ్యక్తిగా ఆయన గొప్పగా విజయవంతమైన వారని ఆ సాయంత్రం అర్థమైంది. కోడలు ప్రసూన గారి తల్లి దూబగుంట ఇందుమతి గారు అక్కడే ఉన్నారు. ఎంతో ఆప్యాయం గా చెబుతున్నారు వారి గురించి, తెల్లారగట్లే లేచి పాడుకుంటారని. ” మీరు ముందే బంధువులా ? ”- అడిగాను. ” లేదు, వీళ్ళ పెళ్ళి అయాకే ” ఆవిడ చెప్పారు. రజని గారి మానవసంబంధాలు అందమైనవి, అవ్యాజమైనవి.మనవలు ఇద్దరూ ఉన్నారు, తాతగారిని ముద్దుగా చూసుకుంటున్నారు. సంక్రాంతి పండగ కోసం బంధువులు వచ్చి ఉన్నారు. వారిలో ఒక అమ్మాయికి రజని గారే పేరు పెట్టారట ‘ తన్వి ‘ అని. మేఘదూతంలో నాయికను అలా సంబోధిస్తారట. అందుకని ఆ పేరు. పరమసౌందర్యవతి అయిన యువతిని వర్ణిస్తూ ‘ తన్వీ శ్యామా ‘ అని మొదలయే ఆ శ్లోకం స్పష్టంగా, పూర్తిగా ఉచ్ఛరించారు రజని. ‘’ యా తత్రస్తయత్ద్యువతి విషయే సృష్టిరాద్యేవ ధాతుః ” అన్న చివరి పాదాన్ని తన్మయంగా నొక్కి చెబుతూ.

నా తరపున ప్రసూన గారు అడుగుతున్నారు- ” మీకు ఇష్టమైన కవి ? ”
” ఏ భాషలో ?”
” ఒక్కొక్క భాషలో చెప్పండి, తెలుగులో ? ”
” శ్రీనాథుడు ” [ వారి తండ్రి గారు బాలాంత్రపు వేంకట రావుగారికీ శ్రీనాథుడు ఇష్టమట ] ” ఇంగ్లీష్ లో ?”
” షెల్లీ, కీట్స్ ”
” సంస్కృతం లో ? ”
” కాళిదాసు .కాళిదాసును మరచిపోతే నేను పనికిరాను ” రెట్టించి చెప్పారు. శాకుంతలం లోని ప్రఖ్యాత శ్లోకం” రమ్యాణి వీక్ష్య ” ను ప్రియమారా తెనిగించి స్వరపరచారు.

” బెంగాలీ లో ?”
” టాగూర్ ”
” ఒకరి పేరే చెప్పాలంటే ?”
అనుమానం లేకుండా చెప్పేశారు – ” టాగూర్ ” అని. కాళిదాసును తనలో ఒదిగించుకున్న కవి ఏమో, టాగూర్.

రాత్రి కొంత గడిచింది, ఆయన విశ్రాంతి తీసుకునే సమయమైంది. ఆయన కోసం ఇంటి ఎదురుగా అందమైన కుటీరం వంటిది నిర్మించి ఉంది , అందులోకి నిష్క్రమించారు. ఆయన గ్రంథాలయమంతా అక్కడ ఉంది. పాడనప్పుడంతా చదువుకుంటూనే ఉంటారట. కాసేపటికి , మేము వెళ్ళేందుకని బయటికి వస్తూ ఉంటే వెన్నెట్లో పూలమొక్కల మీదినుంచి తిరిగి ఆయన కంఠం వినబడుతూ ఉంది. ఆయన నిద్రపోయేదాకా పాడుకునే పాటలు కాబోలు అవి. రజని గారు వర్ధిల్లుతూన్న మధువనస్వప్నం .

-మైథిలి అబ్బరాజు

కొన్ని పాటలు 

[ఓ విభావరీ ]

 

[మన ప్రేమ – బాలమురళికృష్ణ , శ్రీరంగం గోపాలరత్నం ]

https://www.youtube.com/watch?v=GEq9MlJERvU

[ రవీంద్ర సంగీతం ]

https://www.youtube.com/watch?v=IYNUQPsRqn0

[చలం గారి తో ఇంటర్వ్యూ ]

తాడిగిరి పోతరాజు: అగ్నిసరస్సున వికసించిన వజ్రం

10922018_1044900048857391_1205721763_n

( తాడిగిరి పోతరాజు : 1937-2015 )

 తాడిగిరి పోతరాజు అనగానే వెంటనే ఆయన రాసిన ‘ఎర్రబుట్ట’ కథ గుర్తొస్తుంది. తెలుగు కథ నుదుట దిద్దిన ఎర్రబొట్టు ఎర్రబుట్ట. ఆ కథని ప్రచురించిన కారణంగా విజయకుమార్ , యం.వి. తిరుపతయ్యల సారథ్యంలో కరీంనగర్   సాహితీ మిత్రులు నిర్వహించిన ఉద్యమ మాసపత్రిక ‘విద్యుల్లత’ నిషేధానికి గురైంది. ఆ తర్వాత 1971 లో ‘మెజార్టీ ప్రజలకి మనదేశంలో జరుగుతున్న అన్యాయాలతో , సాహిత్యరంగంలో , రాజీలేని పోరాటం సాగించటం , నిజాయితీని నిర్మాణ మార్గంలో మళ్ళించడం’ లక్ష్యంగా యేర్పడ్డ న్యూవేవ్ సంస్థ ప్రచురించిన ‘హోరు’ సంకలనం ద్వారా ‘ఎర్రబుట్ట’ పాఠకులకు అందుబాటులోకి వచ్చింది.

పార్లమెంటరీ ప్రజాస్వామ్యంలోని డొల్లతనాన్ని యెలక్షన్ల సాక్షిగా యెండగట్టిన ఆ కథ అప్పట్లో గొప్ప సంచలనం. నిషేధించడానికి పాలకులకి కావాల్సిన వనరులన్నీదిట్టంగా దట్టించిన కథ అది. దేశంలో జరిగే యెలక్షన్లకి ‘పిచ్చగుంట్ల’ విశేషణం తగిలించి , అవి వొట్టి బోగస్ అనీ ప్రతి మూడు సంవత్సరాలకు వచ్చే జాతర్ల లాంటివనీ – జాతర్లకు మేకలు , గొర్రె పోతులు బలయితే యెలక్షన్ల జాతర్లకి మనుషుల పుర్రెలు యెగిరి పోతుంటాయనీ అపహసించిన పోలీస్ కానిస్టేబుల్ సత్తెయ్య చెప్పిన కథ అది. ఆ తర్వాత చానాళ్ళకి నిద్ర లేచిన పతంజలి ‘ఖాకీ వనం’కీ , స్పార్టకస్ ‘ఖాకీ బతుకులు’ కీ నిప్పు అందించాడు. నిప్పు రవ్వగా వున్నప్పుడే నిషేధించాలని గద్దెలెక్కిన ప్రభువుల ఆరాటం. అది ఉక్రోషంగానో భయంగానో మారి ఎమర్జెన్సీ నాటికి రచయితని నిర్బంధించే వరకు వెళ్ళింది. విప్లవోద్యమలో ఎన్నికల బహిష్కరణ పిలుపుకి సైద్ధాంతికంగా వత్తాసు పల్కిన ఆ కథ ఇప్పటికీ బూటకపు ప్రజాస్వామ్యం అరికాళ్ళ కింద మంటలు పెట్టేదిగానే కనిపిస్తుంది.

‘రచయితలారా మీరెటువైపు?’ అన్న విశాఖ విద్యార్థుల ప్రశ్న సున్నిత మనస్కులైన కవుల్నీ రచయితల్నీ బుద్ధిజీవుల్నీ కుదురుగా కూర్చోనివ్వలేదు. అది కేవలం శ్రీశ్రీ షష్టిపూర్తి సందర్భం మాత్రమే కాదు. శ్రీకాకుళం గిరిజన రైతాంగ పోరాటం క్రూరమైన అణచివేతకి గురైన సందర్భం. పసి పిల్లల్ని కూడా వదలకుండా కాల్చి చంపి ప్రజా ఉద్యమాన్ని నెత్తుటి మడుగుల్లో ముంచిన సందర్భం. ప్రజల పక్షంలో అక్షరాన్ని సాయుధం చేసిన పాణిగ్రాహి శ్రీకాకుళ పోరాట వారసత్వం ఉత్తర తెలంగాణాకి వ్యాపించడానికి రాజకీయంగా రంగం సిద్ధమైన కాలం. ఉద్దానం మహాదేవపూర్ లో రెక్కలు విప్పుకొంటున్న రోజులు. శ్రీకాకుళం ‘కాక’ శ్రీశ్రీ , కొకు , రావిశాస్త్రి , కారా లాంటి ఆ ప్రాంతపు రచయితల్తో పాటు కరీంనగర్ జిల్లా హూజూరాబాద్ తాలూకాలో మారుమూలన ‘కోతులనడుమ’ ( వల్లభాపూర్ శివారు గ్రామం) లాంటి పల్లెటూరి వ్యవసాయ కుటుంబం ( తల్లి సారమ్మ – తండ్రి రాయపరాజు) నుంచి వచ్చిన పోతరాజు ని సైతం తాకింది. 1970 నుంచీ విరసంతో కలసి నడుస్తూ – పీడితుల విషాదాశ్రువుల్ని కాదు ; విలాపాగ్నుల్ని అక్షరీకరించాలని అతను నిశ్చయించుకొన్నాడు.

‘1969 తరువాత దేశంలోని రాజకీయ సంక్షోభాల కారణంగా నాలో మానసికమైన మార్పు వచ్చింది. కన్నీటి సాహిత్యం చదువుతూ , కన్నీటి సాహిత్యం సృష్టిస్తూ అన్ని వర్గాల ప్రజలను కదిలించలేమని అభిప్రాయపడ్డాను. కన్నీటికి కారకులైన దోపిడదారులను శిక్షించాలని , ఈ దోపిడీ వ్యవస్థను సమూలంగా మార్చివెయ్యాలన్న సంకల్పంతో కరీంనగర్ జిల్లాలోని ప్రజా ఉద్యమాలలో పాల్గొన్నాను. తత్ఫలితంగా ఉద్యోగరీత్యా ఎన్నో ఇబ్బందులుపడ్డాను.’( పాతికేళ్ళ క్రితం – 1981 నవంబర్ స్వాతి సచిత్ర మాసపత్రిక కథల పోటీ లో ‘ఆరోహక గీతం’ కథకి బహుమతి వచ్చినప్పుడు చెప్పిన మాటలు).

ఎర్రబుట్ట రాయడానికి పది పన్నెండేళ్లకి ముందునుంచే ఆయన రాసిన కథలు ( తొలి కథ ‘గృహోన్ముఖుడు’ కథ 1958లో భారతి లో వచ్చింది) యెన్నోప్రసిద్ధికెక్కాయి. గాజుకిటికీ (1963) , ‘చివరి అంచున’ (1964) కథలు ఆంధ్ర ప్రభ కథలపోటీల్లో అవార్డులు పొందాయి. ‘మట్టి బొమ్మలు’ నవల ఆంధ్ర పత్రిక ఉగాది సంచిక (1966) పురస్కారాన్ని గెలుచుకొంది( సరిగ్గా కారా యజ్ఞం కథ రాసింది యీ రోజుల్లోనే ). ఎర్రబుట్ట కారణంగా విద్యుల్లత మీద విధించిన నిషేధమే ఆన్నిటికన్నా ‘నాకు పెద్ద అవార్డ’ని ఆయన పేర్కొన్నాడు. నిషేధ – నిర్బంధాలని అవార్డు రివార్డులుగా భావించిన నిబద్ధరచయిత తాడిగిరి పోతరాజు.

అందువల్ల తాడిగిరి రచనాప్రస్థానాన్ని ఎర్రబుట్ట కి ముందు ఎర్రబుట్ట కి తర్వాతగా విడదీసి చూడాలి. తాడిగిరి రచనా ప్రస్థానాన్నే కాదు; మొత్తం తెలంగాణా కథనే ‘ఎర్రబుట్ట కి ముందు ఎర్రబుట్ట కి తర్వాత’ అని అంచనా వేయాల్సి వుంటుంది. కవిత్వంలో ఝంఝా – మార్చ్- తిరగబడు ల్లాగా తెలుగు కథకి అందునా తెలంగాణా కథకి ఎర్రబుట్ట కూడా ఒక మైలురాయి. ఆ తర్వాతే కరీంనగర్ ఉద్యమ సాహితి నుంచి ‘బద్ లా’ కథా సంకలనం (1973) వెలువడింది. అందులోని ‘బ్లాక్ అండ్ వైట్’ కథ ఎర్రబుట్టకి కొనసాగింపులా కనపడుతుంది. ‘బద్ లా’ కోసం అల్లం రాజయ్య రాసిన ‘ఎదురు తిరిగితే…’ ఎమర్జెన్సీ తర్వాత సృజనలో అచ్చయింది. ఉత్తర తెలంగాణా రైతాంగ పోరాటాన్నీ , చరిత్రనీ , చైతన్యాన్నీ సాహిత్యంలోకి సాధికారంగా తీసుకొచ్చిన రాజయ్య లాంటి వాళ్ళు రాసిన కథలకి స్ఫూర్తి ఎర్రబుట్ట ద్వారానే లభించింది. ‘బద్ లా’ కథా సంకలనంలోని రచయితలంతా – ఒక్క పోతరాజు తప్ప – కొత్తవాళ్ళే.

పోతరాజు లాగానే ఎమర్జెన్సీ ‘చీకటి రోజుల్లో’ జైలుకెళ్ళిన  యం.వి. తిరుపతయ్య రాసిన ‘న్యాయం’ కథ కూడా ఈ సంకలనంలోనే వుండడం యాదృచ్ఛికమేమీ కాదు. ఎన్నో కలలతో ఈ నేల ప్రత్యామ్నాయ రాజకీయాలవైపు ఆశగా దృష్టి సారించింది అనడానికీ , ఆ కలల్ని రాజ్యం పాశవికంగా చిదిమివేయడానికి పూనుకొంది అనడానికీ వుదాహరణ మాత్రమే. ఆ తర్వాత రాజయ్య , సాహూ , రఘోత్తం , రాములు , పి చంద్ … వీళ్ళంతా విప్లవోద్యమ సాహిత్యంలో పోతరాజుకి కొనసాగింపే. సాహిత్య రచనని సామాజిక బాధ్యతగానే కాదు విప్లవాచరణలో భాగంగానూ స్వీకరించిన పోతరాజుకి సాహూ (శనిగరం వెంకటేశ్వర్లు / వెంకన్న) అన్నివిధాలా శిష్యుడే. ముందస్తు జాగ్రత్తల ( పి డి ఆక్ట్ కింద ) కోసమో – భవిష్యత్తుల భద్రత కోసమో (ఎమర్జెన్సీలో) ఇద్దరూ అరెస్టయి జైలుని తరగతి గదిగా మార్చుకొన్నారు.

రెండు రెళ్ళు నాలుగంటే జైళ్ళు నోరు తెరిచిన రోజులవి. దేశమే జైలయిన ఆ కాలంలో ప్రగతి శీలమైన ఆలోచనలుండటమే నేరం. అధ్యాపకులూ న్యాయవాదులూ డాక్టర్లూ పౌరహక్కుల గురించి మాట్లాడే బుద్ధి జీవులూ కవులూ రచయితలూ కార్మికులూ విద్యార్థులూ … ప్రజాస్వామ్య హక్కుల గురించి ప్రశ్నించిన ప్రతి వొక్కర్నీ రాజ్యం శత్రువుగానే పరిగణించింది. తల మీద ఎర్రబుట్ట పెట్టుకొన్న పోలిస్ కానిస్టేబుల్ పాత్రముఖత: తీవ్రవాదులుగా పరిగణించే పీడితుల భాషని పలికించిన పోతరాజు పొలిటికల్ డెటిన్యూ కావడంలో వింతేమీ లేదు. జైలు జీవితం పోతరాజుని రచయితగా మరింత నిబద్ధుడయ్యేలా చేసింది. ఆయన ఎంతగానో అభిమానించే శ్రీశ్రీ మాటల్లో చెప్పాలంటే ‘అగ్ని సరస్సున వికసించిన వజ్రమ’య్యాడతను.

వరంగల్ సెంట్రల్ జైల్లో గడిపిన స్వీయ అనుభవాలనూ , తోటి డెటిన్యూల ఖైదీల ఆవేదనలనూ, నిండా రెండు పదుల వయస్సులేని బిడ్డలు జైలు పాలైనప్పుడు వారిని చూడటానికి వచ్చే తల్లుల తండ్రుల మనోవ్యధనూ , భర్తలతో మిలాఖత్ కోసం నెలల తరబడి ఎదురుచూసే భార్యల దైన్యాన్నీ , డబ్బుతో పెరోల్ కొనుక్కొనే బూర్జువా రాజకీయ ఖైదీల డ్రామాలనూ, క్షమాభిక్ష అడిగితే కేసు మాఫీ చేస్తామన్నా తిరస్కరించిన యువకుల ధీరోదాత్తతనూ (ఆరోహక గీతం లో విద్యార్థి ఖైదీ అంభయ్య పాత్ర – సాహూనే కావొచ్చు) , మార్సిస్ట్ లెనినిస్టు రాజకీయ భావజాలాన్ని విశ్వసించిన వాళ్ళని జైలునుంచి మాయం చేసి అడవుల్లో ఎన్ కౌంటర్ పేర్న చంపేసే పోలీసు దురాగతాలనూ వొక రచయితగా , పౌర హక్కుల కార్యకర్తగా తర్వాతి కాలంలో ( 1980ల్లో) పోతరాజు కథలుగా మలిచారు. వట్టికోట ఆళ్వారు స్వామి ‘జైలు లోపల’ కథల్లా కాల్పనికతకి చోటులేకుండా యథార్థ జీవిత గాథల్లాంటి వాటిని ‘కెటిల్(ఎమర్జెన్సీ కథలు)’ పేరుతో హుజూరాబాద్ జనసాహితి సంపుటిగా వేసినప్పుడు (2009) సాహూకి అంకితం యివ్వడం గమనిస్తే విప్లవసాహిత్యోద్యమంతో పోతరాజుకి ఆజీవితం వున్న అనుబంధం , ఉద్యమ సహచరుడై తనతో నడిచిన విద్యార్థికి నివాళి ఘటించడంలో ఆయన వుదాత్త వ్యక్తిత్వం వ్యక్తమయ్యాయి. పాలకుల ఫాసిస్టు స్వభావాన్నీ , రాజ్య హింస వికృత రూపాన్నీ యెంతో బలంగా చెప్పిన యీ కథలు పోతరాజు ప్రాపంచిక దృక్పథాన్ని వెల్లడిస్తాయి.

విద్యార్థి దశలో శ్రీ శ్రీ మహాప్రస్థానం గీతాల స్ఫూర్తితో మార్క్సిజం చదవకుండానే మార్క్సిస్టునయ్యానని చెప్పుకొనే తాడిగిరి పోతరాజు తాను నమ్మిన రాజకీయ భావజాలాన్నే జీవితాంతం విశ్వసించి ఆచరించారు. నాజర్ బుర్రకథలూ , సుంకర ‘మాభూమి’ , వల్లం సాంస్కృతిక ప్రదర్శనలూ విని చూసి తాను కూడా రంగస్థల నటుడు కావాలని ఆశించారు. నటుడికి కావాల్సిన అన్ని హంగులూ ఆయనకున్నాయి. చెయ్యెత్తు మనిషి. స్ఫురద్రూపం. దృఢకాయం. ఉరుము లాంటి కంఠస్వరం. ఆక్స్ ఫర్డ్ ఇంగ్లీషు డిక్షన్ , తెలుగులో అనర్గళంగా వుపన్యసించగల వాగ్ధోరణి ( మధ్యలో శ్రీశ్రీ కవితా పంక్తుల్ని వుటంకిస్తూ) యివన్నీ ఆయన్ని మంచి నటుణ్ణి చేసేవి. ఏ కారణంగానో నటుడు కాలేక రచనా రంగానికి పరిమితమై పోయారు.

అయితే నాటక శైలి ఆయన కథలకి అదనపు మెరుగులు తెచ్చింది. దారికి అడ్డొచ్చిన వాణ్ని ఎవర్నయినా ‘నగ్జలైటని కాల్చి పారేస్తే మాత్రం మనని అడిగేవాడెవడు’ అని బహిరంగంగా ప్రకటించే ‘బ్లాక్ అండ్ వైట్’ కథలో పోలీస్ హెడ్ నరసింహం సుదీర్ఘ సంభాషణలు రావిశాస్త్రి తర్వాతి కాలంలో అనితర సాధ్యం అనిపించేలా సృష్టించిన గవర్రాజెడ్డు( రత్తాలూ-రాంబాబు) , సూర్రావెడ్డు (మూడుకథల బంగారం) లకి సైతం పాఠం చెప్పే స్థాయిలో వుంటాయి. పోలీసు రాజ్యం లోతు పాతుల్ని , ధాష్టీకాన్నీ దగ్గరగా చూసి స్వయంగా చవి చూసిన యిద్దరు రచయితల మధ్య యీ పోలికలు సహజమే. 2008లో రాచకొండ రచనా పురస్కారం తీసుకొంటూ రావిశాస్త్రి రచనా శైలి పట్ల తన అభిమానాన్ని పోతరాజు చాలా స్పష్టంగానే పేర్కొన్నారు.

1963లో వొక లంపెన్ పాత్ర సుదీర్ఘ స్వగతంగా గుంటూరుజిల్లా మాండలికంలో రాసిన ‘గాజు కిటికీ’ పోతరాజు రచనా శిల్పానికి నిలువెత్తు నిదర్శనం. మాగోఖలే తర్వాత గుంటూరు భాషని కథల్లో యింత అద్భుతంగా పట్టుకొన్నది పోతరాజేనేమో. ఆ భాషా సౌందర్యానికి ముచ్చటపడే పాపినేని శివశంకర్ తమజిల్లా రచయితగా ఆయన్ని own చేసుకొన్నాడు (దక్షిణ తీరాంధ్ర కథ – నిశాంత , పే.105). ఎర్రబుట్ట రాసేదాకా ఆయన్ని ‘గాజుకిటికీ పోతరాజ’ని పిల్చేవారంటే ఆ కథ వస్తు శిల్పాలు యెలాంటివో అర్థమౌతుంది.

నిజానికి తెలంగాణలో ‘కోతుల నడుమ’ లాంటి కుగ్రామం తన సొంతూరు అని చెప్పుకొన్నప్పటికీ పోతరాజు జీవితం కోస్తా ప్రాంతంతో యేదో వొక మేరకి ముడివడి వుంది ( బాల్యం తణుకు లో గడిచిందనీ , గుంటూరులో చదువులు నడిచాయనీ ఆయనే యెక్కడో పేర్కొన్నట్టు గుర్తు). అందుకే కథల్లో అవసరానుగుణంగా పాత్రోచితమైన కోస్తా భాషని గొప్ప మెలకువతో వుపయోగించడం చూస్తాం.

పోతరాజు కథల్లో యెత్తుగడలూ ముగింపులూ ఆయన ప్రత్యేకతకి కొండగుర్తులు. చాలా కథలు యెత్తుగడ వాక్యంతోనే ముగుస్తాయి. కథల్లో యిటువంటి ముగింపుల్ని తాడిగిరి మార్కు ముగింపులని పేర్కోవడం కూడా వుంది. మంచి కథల్లో రచయిత దృక్పథం ముగింపుల్లో స్పష్టమోతుంది. అయితే దృక్పథాన్ని ఆవిష్కరించే పనిలో ఆయన కళాత్మక విలువలతో యెక్కడా రాజీ పడలేదు. ఏ ముగింపూ స్లోగన్ లానో అవాస్తవికంగానో వుండడమో చూడం.

నికార్సైన రాజకీయ దృక్పథంతో ప్రజాస్వామ్య హక్కులకోసం పిడికిలి బిగించే గొంతులు బలపడాల్సిన యివాల్టి సందర్భంలో మత ఫాసిస్టు శక్తులు సామ్రాజ్య వాద గూండాలూ కొత్త పొత్తుల కోసం దారులు వేస్తున్న దశలో వొక పూనికతో పీడిత జన పక్షం వహించి నూతన మానవ ఆవిష్కరణ కోసం తన సాహిత్యాన్ని అంకితం చేసిన తాడిగిరి పోతరాజుని స్మరించుకోవడం అంటే ఆయన నమ్మిన రాజకీయ భావజాలానికి పునరంకితం కావడమే.

రెండు తరాల విప్లవ రచయితకి ఎర్రెర్రని పూల నివాళి.

  • -ఎ.కె.ప్రభాకర్

 

 

‘లాల్ బనో ….’ కవి: అలుపెరగని ఎర్ర కవిత!

10801896_10152571579726700_7233801900523835577_n ఒకానొక జనవరి నెల సంక్రాంతి రోజుల యెముకలు కొరికే చలి కమ్ముకున్న ఉదయపు కాలం! దాదాపు 24 గంటల విరసం సర్వసభ్య సమావేశం తర్వాత చర్చల్లో వేడెక్కిన వాతావరణంలో శీతాకాలపు మంచుతెరల్ని చీలుస్తూ ఒక కంఠస్వరం – వొక కవిది ….

“తోటా రాముని తొడకు కాటా తగిలిందాని

చిలుకా చీటీ తెచ్చెరా ఓ విలుకాడ ..”

శివసాగర్ పాట – గొప్ప ఉద్విగ్నత తో పాడుతున్నది – కళ్ళు మూసుకుని పూర్తిగా లీనమై – మూసిన కళ్ళ వెనుక తడి –

మధ్యలో “వాగూ వల వల యేడ్చెరా …” అనే చరణం పాడుతున్నప్పుడు తానే వాగై వల వల యేడుస్తూ .

పాట ప్రవహిస్తోంది –

“చెల్లెలా చెంద్రమ్మా …” అంటూ మరొక పాట శివసాగర్ దే మరింత ఉద్విగ్నతతో –  ఒక చరణం లో

“కత్తి యెత్తి వొత్తి పొత్తి కడుపులో గుచ్చి …”

భూస్వామి కడుపులో చెంద్రమ్మ గుచ్చిన కత్తి కసిని గొంతునిండా నింపుకొని పదునుగా ….

ఆ పాట కాగానే మరొకటి శివసాగర్ దే ….

“మేరిమి కొండల్లో మెరిసింది మేఘం …”

ఉద్యమాల్లో వెనుదిరుగక మునుముందుకే యెన్ని త్యాగాలకైనా సిద్ధమై పడవను నడిపే విప్లవకారుల నుద్దేశించిన పాట –   అట్లా వరుసగా పాడుతూనే ఉన్నారాయన! అలుపు లేదు – గొంతులో అదే ఉద్విగ్నత జీరగా – అరమోడ్పు కళ్ళ వెనుక అదే తడి – అదే ఆవేశం, అదే యెమోషన్ –

ఆయనే యెన్ కే. యెన్ కే పేరు తో కవిత్వం రాసి కవి గా ప్రసిద్దికెక్కిన అతని పూర్తి యెన్ కే రామారావు అని తర్వాత తెలిసింది. వరంగల్ కాకతీయ విశ్వవిద్యాలయంలో కెమిస్ట్రీ లాబ్ లో రసాయనాలతో పని చేసే ఆయన జీవిత సత్యాలని మానవ సంబంధాల రసాయనాలతో ప్రయోగాలు చేసి కనుక్కుని వచన కవిత్వం లోనూ పాటల్లోనూ అద్భుతంగా పలికించాడు. ముఖ్యంగా విరసం సమావేశాలకు, ఆయన వస్తాడు పాడతాడు అని, ఆశగా వెళ్ళేవాళ్ళం.

యెందుకంటే మాకు ఆ అవకాశం వేరే సందర్భాల్లో దొరికేది కాదు. ఆయన కనబడగానే యెన్ కే పాట పాడవా అని అడిగామో లేదో ఒక పక్క కూర్చుని కళ్ళు మూసుకుని పాడే వాడు. శివసాగర్ అగ్నాతంలోనుండి రాసి పంపే ప్రతి పాటకు బహుశా తనదైన ట్యూన్ కట్టి గొప్ప నిమగ్నతతో ఉద్విగ్నతతో పాడే వారు యెన్ కే. ఆయన కవిత్వం కూడా అంతే ఎమోషనల్ గా ఉండేది. ఆయన రాసిన పాటల్లోనూ తనదైన ఒక విశిష్టత – ముఖ్యంగా చిత్తూరు లో బూటకపు యెంకౌంటర్ లో పోలీసులచే హత్య చేయబడ్డ నాగరాజు గురించిన పాట

ఒక చేత్తో కన్నీరు తుడుచుకుని

వేరొక చేత్తో ఎర్ర జండ యెత్తుకుని

అంటాము మేము నాగరాజు

గుండెల మండేవు రాజుకుని రోజు రోజు

తెనాలి సభలో ... (జుగాష్ విలి సౌజన్యంతో)

తెనాలి సభలో …
(జుగాష్ విలి సౌజన్యంతో)

యిది యెన్ కే పాడుతుంటే వినడం ఒక అనుభవం. మొదటి సారి విన్నప్పుడే విపరీతంగా నచ్చేసి నాకు వచ్చీ రాని శ్రుతి లయ తాళాలతో పాడడానికి ప్రయత్నించే వాణ్ణి. ఈ పాట నాకూ నా సన్నిహిత మిత్రబృందం సుధాకిరణ్, ప్రకాష్ లకు చాలా యిష్టం కూడా! అట్లే మిత్ర (అమర్ ) కూడా బాగా యిష్టపడేవాడీ పాటను. నా ట్యూన్ మిత్ర నుండే నేర్చుకున్నా (యెన్ కే పాడే ట్యూన్ కొంచెం వేరని తెలుసు, కానీ నాకెప్పుడూ అది పట్టుబడలేదు – ఆ విషయం విమల (కవి) చెప్పే దాకా నాకు తెలియలేదు ).

దూరాన తెరచాప అంచు

క్రమించి నావ తీరమాక్రమించు

ఉదయించే తొలివెలుగుల తూర్పు

ఆర్పలేదు విప్లవాన్ని యే పడమటి గాడ్పు

తెరచాపలు గాలి లోన ఆడుదాక

ఆకాశం యెర్రకాంతులీనుదాక

అంటాము మేము నాగరాజు

నువ్వు అమరుడివీ అమరుడివీ యీ రోజూ యే రోజూ …

 

యెప్పుడు ఈ పాట గుర్తుకొచ్చినా, నాలో నేను పూర్తిగా పాడుకుని యెన్ కే నూ, విప్లవం లో అమరులైన వేలాది మందినీ గుర్తు తెచ్చుకోవడం నాకు అలవాటయిపోయింది. యింక ఆ యెన్ కే గొంతు యెన్నడూ వినబడదంటే చాలా దుఃఖంగా ఉంది. గొంతు కు శాశ్వతంగా యేదో అడ్డం పడ్డట్టుంది. గ్నాపకాలు తేనెటీగల్లా ఝుమ్మంటూ ముసురు కుంటున్నాయి.

గద్వాల విరసం సభ్లలో యెన్ కే ఒక్ అద్భుతం చేసారు. ఆ రోజుల్లో ప్రగతి శీల శక్తులపై యే బీ వీ పి, ఆర్ యెస్సె స్ శక్తుల దాడులు విపరీతంగా ఉండేవి. దాదాపు వారానికి రెండు మూడు సంఘటనలు జరిగేవి. చాలా మంది ఆర్ యెస్ యూ పీ డీ యెస్ యూ కార్యకర్తలు ఆ దాడుల్లో అమరులయ్యారు కూడా! హైదరాబాదు లో వరంగల్ లో చాలా గోడల మీద యే బీ వీ పి వాళ్ళు ‘లాల్ గులామీ ఛోడో బోలో వందే మాతరం’ అంటూ రాసేవారు . దేశభక్తి అంటే తమ స్వంత సొత్తు అయినట్టు వందేమాతరం పై తమదే హక్కు అన్నట్టు యే బీ వీ పీ కార్యకర్తలు ప్రవర్తించే వారు. దౌర్జన్యానికి పాల్పడేవారు. ప్రగతిశీల విద్యార్థులది విదేశీ సిద్దాంతమని వారి ప్రధాన ఆరోపణ! అట్లా మతోన్మాద శక్తులు విచ్చలవిడిగా చరిత్రను వక్రీకరించి వీరవిహారం చేస్తున్న రోజుల్లో వారికి ధీటైన సరైన సమాధానం చెప్పడానికి మేమంతా ప్రయత్నాలు చేస్తున్న సమయంలో ‘లాల్ బనో గులామీ ఛోడో బోలో వందేమాతరం’ అంటూ ఒక అద్భుతమైన దీర్ఘకావ్యాన్ని రాసారు యెన్ కే!

మొత్తంగా ప్రపంచ, భారత దేశ చరిత్రనూ, నాగరికతనూ కవిత్వాత్మకంగా చెప్తూ , జాతీయోద్యమ కాలంలో వందేమాతరం యెట్లా ఉద్భవించిందో అది యెట్లా ప్రగతిశీలమైందో సోదాహరణంగా వివరిస్తూ చాలా ఉద్విగ్నంగా అద్భుతంగా , ఒక్కొక్క కవితా చరణం ఒక గొప్ప నినాదమంత గొప్పగా (కవిత్వం నినాదప్రాయం అవుతుందనే వారు, ఒక చరణం నినాదం కావాలంటే యెంత గొప్ప కవిత్వం కావాలో మనకున్న గొప్ప నినాదాలని పరిశీలిస్తే అవగతమౌతుంది) మొత్తం దీర్ఘ కావ్యం సాగుతుంది. ఆ రోజుల్లో మాకు ఆ కావ్యం గొప్ప ఆయుధం. యెక్కడ మతోన్మాద శక్తులతో తలపడాల్సి వచ్చినా ఆ కావ్యం గొంతెత్తి బిగ్గరగా చదివేది. ఆ కావ్యానికి మా ప్రత్యర్థుల దగ్గర సమాధానం ఉండేది కాదు. అట్లా ఆర్ యెస్సె యెస్ యేబీ వీ పి శక్తుల ప్రాబల్యం చాలా బలంగా ఉన్న గద్వాల లో విరసం మహాసభలు జరిపింది.

చివరి రోజు జరిగిన మహా సభలో పాటలు, ఉపన్యాసాల మధ్య యెన్ కే ను ‘లాల్ బనో గులామీ చోడో ..’   చదవమన్నారు. యేకబిగిన ఒక అరగంట పాటు అరుదైన శైలితో, గొప్ప ఉద్విగత, ఆవేశమూ , తడి నిండిన తన గంభీర కంఠస్వరంతో యెన్ కే కావ్యాన్ని గానం చేసారు. వచన కావ్యమైన ‘లాల్ బనో …; ను లయబద్దంగా యెన్ కే చదువుతుంటే వినడం ఆ రోజు ఒక జీవితకాల అనుభవం! యిప్పటికీ యెప్పటికీ మర్చిపోలేని గొప్ప మహత్తర అనుభవం! దాదాపు పది వేల మందికి పైగా హాజరైన ఆ బహిరంగ సభ మొత్తం నిశ్శబ్దంగా పూర్తి నిమగ్నమై విన్నారా కావ్యాన్ని! అయిపోగానే కెరటాల చప్పుడులా కరతాళధ్వనులు! యెన్ కే ను మనసారా అభినందించి కౌగలించుకున్నాము – ఆ రోజునుండీ ప్రగతిశీల శక్తుల చేతుల్లో గొప్ప ఆయుధమైంది యెన్ కే ‘లాల్ బనో ..’ కావ్యం! మా హృదయాల్లో శాశ్వత స్థానం సంపాదించుకున్నారు యెన్ కే !

తర్వాత దాదాపు పదికి పైగా సభల్లో (నేను హాజరైనవి..) యెన్ కే ‘లాల్ బనో ..’ కావ్యాన్ని గానం చేసారు. రాష్ట్రవ్యాప్తంగా ఆ కావ్యం చాలా ప్రాచుర్యం పొందింది. అనేక ముద్రణలు పొందింది. పాపినేని శివశంకర్ సంకలనం చేసిన ‘కవితా ఓ కవితా ‘ లో చోటు సంపాదించుకుంది. మళ్ళీ మతతత్వ శక్తులు పేట్రేగిపోతున్న ఈ రోజుల్లో యెన్ కే ‘లాల్ బనో …’ మళ్ళీ వెలుగు చూడాల్సిన అవసరం యింకా యెక్కువ ఉన్నది. ‘లాల్ బనో…’ కావ్యం ప్రగతిశీల శక్తుల అమ్ముల పొదిలో ఒక విలువైన బాణం.

యెన్ కే సృజన సాహితీ మిత్రుల్లో ఒకరనీ, బహుళ ప్రాచుర్యం పొందిన పాటలూ, కవిత్వమూ అనేకం రాసారని తెలిసి ఆయన మీద గౌరవం పెరిగింది.తర్వాత ఆయనను యెక్కువ ప్రత్యక్షంగా కలవలేకపోయినా ఆయన సమాచారం తెలుస్తూ ఉండేది. ఆయన కవిత్వం, పాటలు యెప్పుడూ గుండెల్లో మార్మోగుతూ ఉంటుంది. అద్భుతంగా అనేక పాటలని తన గొంతులో ప్రతిధ్వనించిన యెన్ కే అనారోగ్యం పాలయ్యారని, సరిగా మాట్లాడలేని పరిస్థితిలో ఉన్నారని తెలిసి చాలా బాధ కలిగింది. ఇవాళ్ళ యెన్ కే యింక మనకందనంత దూరం వెళ్ళిపోయారని తెలిసి హతాశుణ్ణయ్యాను. ఆయన కంఠస్వరం. కళ్ళలోనూ మనసులోనూ యెన్నడూ ఆరని తడి, గొప్ప ఆత్మీయతా , స్నేహస్వభావం యెన్నడూ మర్చిపోరానివీ, యెప్పుడూ వెన్నంటే ఉంటాయి.

-నారాయణస్వామి వెంకట యోగి

 

ఏ గాలివానలకూ కొట్టుకుపోని స్నేహ బంధాలు అవి!

Paparaju Mastar1

మా నాన్నగారు- పి.వి శర్మ- ఇంటర్ చదువుతుండగా పాలగుమ్మి పద్మరాజు గారు, వారికి గురువులు. మా పెద్ద నాన్నగారు పి. ఎల్.ఎన్.శర్మగారు (మహా విద్యావేత్త,అధ్యాపకుడుగ, ప్రిన్సిపాల్ గా కూడా విధులు నిర్వర్తించారు) పాలగుమ్మి పద్మరాజు గారు ఇరువురు కూడా భీమవరం కాలేజి లో సహద్యాయులు. పక్క పక్క ఇళ్ళలోనే వుండే వారు.

మానాన్నగారు, మాఅత్తయ్య గారు(ప్రస్తుతం వాళ్ళు ఈ లోకం లోనే లేరు) మా అమ్మగారితో చెప్పిన విషయాలని,అమ్మ నాతో చెప్పగా, నాకు గుర్తుకు ఉన్నంత మటుకు వారి శత జయంతి సందర్భంగా చంద్రునికో నూలుపోగు లా వారి గురుంచి స్మరించు కోవాలని, అవి మన సారంగా మిత్రులతో పంచుకోవాలన్న ఉద్దేశ్యంతో రాసిన నాలుగు మాటలు.

పద్మరాజు గారి వివాహం ఆయన 21వ ఏట సత్యానందం గారితో జరిగింది. అప్పుడు ఆవిడ వయస్సు 12,13సంవత్సరాలు మించి లేదట. మా అత్తయ్యగారితో,మా నాన్నమ్మ గారి తో వారి కుటుంబ సభ్యులు చాల స్నేహం గా ఉండేవారుట. వారు మద్రాసు వెళ్ళిపోయినా కూడా ఆ స్నేహబంధం కొనసాగిందిట.

వారిని గురించిన ఒక అరుదైన జ్ఞాపకం ఈ సందర్భంగా చెప్పుకోవాలి. ఆ సంఘటన బహుశా 1950-52 మధ్య జరిగినట్లుగా చెప్పారు. అప్పుడు వచ్చిన అతి పెద్ద గాలివానలో వారు నివసిస్తున్న ఇంటి గోడ కూలి వారి శ్రీమతి గారికి దెబ్బతగలటం తో ఒక ఏడాది పాటు ఆవిడ కోలుకోలేకపోయారు. అప్పటి గాలివాన ఉదృతం చూసిన ఆయన తనలో కలిగిన భావాలకి అక్షరరూపం ఇచ్చిన కధే “గాలివాన”

తెలుగు కథను ప్రపంచ సాహితీ చరిత్రలో సగౌరవంగా నిలబెట్టిన ఘనత పాలగుమ్మి పద్మరాజు గారిదే. ప్రపంచ కథల పోటీని న్యూయార్క్ హెరాల్డ్ ట్రిబ్యూన్ పత్రిక నిర్వహించింది. భారతదేశం తరఫున హిందుస్థాన్ టైమ్స్ వారు ఈ పోటీని నిర్వహించారు. ఆంధ్రదేశం తరఫున ఆంధ్రపత్రికవారు నిర్వహించారు. ఆయన బహుభాషాకోవిదుడు. ఆయన బహుసౌమ్యుడు అని కూడా చెప్పేవారు మా నాన్నగారు.

మనుషుల్లో ఉండే వ్యతిరేక భావనలని ప్రతికూలంగా చూడటం అనేది అలవాటు చేసుకొమ్మని విద్యార్ధులకు చెప్పేవారట ఆయన.
ఆయన రాసిన కథల్లోని పాత్రలలో చాలా వరకు మన చుట్టూ సజీవంగా ఉన్నవాళ్ళే. దీనివల్ల కొన్ని సార్లు ఆయనకు చిక్కులు కూడా ఎదురయ్యాయంటాయి. బతికిన కాలేజీ, నల్ల రేగడి, రామరాజ్యానికి రహదారి, రెండో అశోకుడి మూన్నాళ్ళ పాలన ఇవన్నీ మా నాన్నగారికి ఇచ్చారు. కానీ నా దగ్గర మిగిలినది రెండో అశోకుడి మూన్నాళ్ళ పాలన నవల మాత్రమే. అదీ శిధిలావస్థలో ఉంది.
కాకపోతే వారిని చూసి మాట్లాడే అవకాశం మాకు 1978 లో వచ్చింది. అప్పుడు మేము రాజమండ్రిలో, బిజిలీ ఐస్ ఫ్యాక్టరీ దగ్గర గోటేటి రామారావు గారింట్లో ఉన్నప్పుడు. పక్కనే ఉన్న హనుమంతరావు గారింటికి వచ్చారు.

వారు ఇంకా రిక్షాలోనే ఉండగా మా నాన్నగార్ని చూసి,“ఏం తంబి బావున్నావా?” అని పలకరించారు శిష్యుల కి గురువు గుర్తు ఉండటం సహజం. కాని గురువు శిష్యుడుని గుర్తుపెట్టుకోవడం అరుదు అది విని మా నాన్నగారు ఎంతగానో చెప్పుకొని మురిసిపోయారు. తరువాత వారి కుటుంబ సహితంగా మా ఇంటికి వచ్చారు.

మా నాన్నగారు వారికి పాదాభివందనం చేసి మమ్మల్ని పరిచయం చేసి కాళ్ళకి నమస్కారం చేయమని చెప్పారు. ఏం చదువుతున్నారని నన్ను, మా చెల్లెలిని అడిగారు. డిగ్రీ చదువుతున్నామని చెప్పాము. అప్పటికే వారి పెద్ద అమ్మాయికి పెళ్లి చేసేసారు. కొంతసేపు మాట్లాడుకున్నాకా, మా నాన్నగారు మమల్ని, వాళ్ళకి ఊరంతా చూపించమని చెప్పారు. అప్పుడు నేను మా చెల్లెలు, వారి భార్యని, రెండో అమ్మాయిని తీసుకొని రాజమండ్రి బజారు, కోటగుమ్మం,గోదావరి గట్టు అదీ చూపించాము. వారు ఏదో షాపింగ్ కూడా చేసారు.

వారు వెళ్లి పోయాక మా నాన్నగారు ఒక తమషా సంగతి చెప్పారు. నాన్నగారు కాలేజి నుంచి వెళ్లిపోయేటప్పుడు జరిగిన ఫేర్వెల్ పార్టీ లో తమగుర్తుగా లెక్చరర్ల కి గిఫ్ట్ లు ఇచ్చారుట. అందులో మా నాన్నగారు కొంటె తనంతో పద్మరాజు గారికి ఒక పేస్ పౌడర్, నాన్నగారి స్నేహితుడు మా పెదనాన్న గారికి ఒక తెలుగు కాపీరైటింగ్ పుస్తకం ఇచ్చారుట. వాళ్ళు వాటిని ఏంతో స్పోర్టివ్ గా తీసుకున్నారని ఏ మాత్రం ఫీల్ అవలేదని అన్నారు. అప్పట్లో వాళ్ళ మధ్య ఆ బాంధవ్యం అంత సరదాగా ఉండేది అని అర్ధమైంది.

ఈ సందర్భంగా మరొక విషయం – 2013 లో శిరా కదంబం వారు నిర్వహిస్తున్న కార్యక్రమంలో చదివి వినిపించిన కథ- పడవ ప్రయాణం.

వారి సౌజన్యంతో ఆ లింక్ ఇక్కడ ఇస్తున్నాను.
http://www.divshare.com/download/24123097-361

Shabdakadambam – Playlist – DivShare
www.divshare.com
ఫోటో సహకారం: కే.కే. రామయ్య                                                                                                                                  -మణి వడ్లమాని

 

 

ప్రతి పాఠంలో చేరా ముద్ర !

10534397_326754877475156_564669077665495274_n

అప్పటి అకడమిక్ స్టాఫ్ కాలేజీ, ఒకప్పటి భాషా శాస్త్ర విభాగం. లింగ్విస్టిక్ డిపార్ట్మెంట్. అన్నయ్య ఎం.ఏ. లింగ్విస్టిక్స్ చదువుతున్న రోజులు. నేను పదవ తరగతిలో ఉన్నాను. అన్నయ్య తన డిపార్ట్మెంట్కు తీసుకుపోయాడు. అప్పటివరకూ పల్లెటూర్లో చదువుకున్న నాకు ఉస్మానియా యూనివర్శిటీ క్యాంపస్ చూడడమే ఒక గొప్ప అనుభూతి. మొదటిసారిగా యూనివర్శిటీ క్యాంపస్ను చూడడం, మొట్టమొదటి పరిచయం చేకూరి రామారావుగారితో. ఆయనను మొదట చూడగానే భయమేసింది. ఇంత పెద్ద యూనివర్శిటీలో పెద్ద టీచరంట అనుకున్నాను. ఆయన గంభీరమైన రూపం వెనక చిన్న చిర్నవ్వు. అంతే, ఆ మొదటి పరిచయం తర్వాత మళ్ళీ పెద్దగా చూసింది లేదు.

మళ్ళీ నేను ఎం.ఏలో పరీక్షలకు చదవడానికి పుస్తకాలు లేవు. అప్ప్పుడు అన్నయ్య చెప్పాడు. చేకూరి రామారావు గారి దగ్గర మంచి లైబ్రరీ ఉంటుంది వెళ్ళమని, అప్పటికే వాళ్ళమ్మాయి సంధ్య ఆంధ్ర మహిళా సభ కాలేజీలో నాకు ఫ్రెండ్. ఆ పరిచయంతో, కొంచెం బెరుకు బెరుకుగా భయం భయంగా, ఆరాధన సినిమా థియేటర్ వెనక ఉన్న యూనివర్శిటీ క్వార్టర్స్కు వెళ్ళాను. ‘‘ఆ ఏం అన్నారు’’ పుస్తకాలు కావాలి అన్నాను. ‘‘ఇక్కడే కూచుని చదువుకో సరేనా’’ అన్నారు.

అప్పటికే సంధ్యతో ఉన్న పరిచయంతో వాళ్ళింట్లో చనువుగా తిరిగేదాన్ని. పొద్దంతా నేనూ, సంధ్య చదువుకుంటూ కబుర్లు చెప్పుకుంటూ గడిపేవాళ్ళం. వాళ్ళింట్లో తినేదాన్ని. పుస్తకాల గురించో, పుస్తకంలోని విషయాల గురించో మాట్లాడాలంటే భయమనిపించేది. ఆయన బీరువాల నిండా పుస్తకాలు చూసి, అమ్మో ఏం మాట్లాడితే ఏమంటారో అని భయమేసింది.

అట్లా ఎం.ఏ. అయిపోయింది. ఆ తర్వాత ఎం.ఫిల్., పి.హెచ్డి. చేసేటప్పుడు, అప్పుడప్పుడు వెళ్ళేదాన్ని. పెద్దగా సాహిత్యం గురించో, పుస్తకాల గురించో మాట్లాడేదాన్ని కాదు. ఊరికే గుర్తుపట్టినట్టు ఒక నవ్వు నవ్వేవారు.

ఆ తర్వాత అప్పుడప్పుడూ సభల్లో కనిపించేవారు. దాదాపు 15 ఏండ్ల తర్వాత, నేను మొదటిసారి ఓపెన్ యూనివర్శిటీలో అడుగుపెట్టినప్పుడు అంటే 2007లో ఆయన గురించి నాకు తెలిసింది. సార్వత్రిక విశ్వవిద్యాలయంలో సులువైన తెలుగు పాఠాలను ఆయనే రూపకల్పన చేసారని అర్థమైంది. మేము ఎం.ఏ తెలుగు పుస్తకాలు తయారుచేస్తున్న క్రమంలో చేకూరి రామారావు గారికి ఈ మెటీరియల్ ఇచ్చి రావాలమ్మా అని రమణగారు పంపించారు. అప్పటికే ఆయన ఆరోగ్యం అంత బాగాలేదు. అయినా ఓపికగా నేనిచ్చిన మెటీరియల్ అంతా చదవడానికి ఒక వారం రోజుల టైమ్ అడిగారు. ఆ తర్వాత ఆయన అన్న టైముకి మెటీరియల్ తిరిగి ఇచ్చారు. అంతేకాదు, ఆరోజు భాష గురించి, వాక్యాల గురించి, పెద్దాయన తనకున్న అభిప్రాయాలను నాతో చెప్పారు. అంత నాతో మాట్లాడటం చాలా బాగా అనిపించింది. పైగా ఓపెన్ యూనివర్శిటీ సిలబస్ ఎంత సరళంగా ఉండాలి అన్న విషయాన్ని కూడా ఆరోగ్యం బాగాలేకపోయినా వివరించారు.

ఆరోజు తర్వాత నుంచి ప్రతిసారీ మా యూనివర్శిటీ పుస్తకాలు తిరగేస్తున్నప్పుడల్లా చేకూరి రామారావుగారి వాక్యమో, వారి పేరో కనిపిస్తూనే వుంటుంది. ఆయన చనిపోయే ముందురోజు పరిష్కృత పాఠ్య ప్రణాళికా బృందంలో ఆయన పేరు రాస్తుంటే రమణగారు గుర్తొచ్చారు. చేకూరి రామారావుగారు మన పుస్తకాలకు ఎప్పుడూ గౌరవ సభ్యుడే అంటుండేవారు. ఇప్పుడు కొత్తగా వచ్చే పుస్తకాలలో వారి జతన చేకూరి రామారావుగారు కూడా చేరారని బాధగా ఉంది.

ప్రాథమిక విద్య కూడా లేని వారి కోసం ఏర్పరచిన అంబేద్కర్ సార్వత్రిక విశ్వవిద్యాలయం విద్యార్థులకు ఒక కొత్త దృష్టి కోణాన్ని తెలుగంటే పద్యాలు కాదు, తెలుగంటే ఒక భాషా శాస్త్రమని, దాన్ని ఎంత సులువుగా అందజేస్తే అంత ఉపయోగమనే దూరదృష్టితో కొత్త విషయాలను రూపకల్పన చేసిన ఉన్నత వ్యక్తి చేకూరి రామారావు గారు. వారు అంబేద్కర్ సార్వత్రిక విశ్వవిద్యాలయానికి చేసిన సేవలు మరపురానివని వారిని స్మరిస్తూ వారికిదే నా నివాళి.

వ్యక్తిగత పరిచయమా, సాహిత్య పరిచయమా, కుటుంబ పరిచయమా ` ఏ పరిచయమైనా ఆయనతో మాట్లాడిన సందర్భాలు అతి కొద్ది అయినా, నామీద వారి ప్రభావం మాత్రం చాలా ఎక్కువ. ప్రతి పుస్తకంలో, ప్రతి పాఠంలో వారి ముద్ర కనిపిస్తూనే ఉంటుంది.

` డా॥ ఎన్. రజని

rajani

చిత్రరచన: రాజు

అవును కదా గుల్జారే లేకపోతే –

M_Id_419679_Gulzar

అవును కదా గుల్జారే లేకపోతే –

సంతోషానికి పర్యాయ పదమేదో  తెలిసేది కాదు.
కన్నీటికి వుప్పుతనం వుందనీ  తెలిసేదే కాదు.
ప్రేమకి స్పర్శ వుంటుందనీ  తెలిసేది కాదు.
కోల్పోవటానికి వునికొకటి వుంటుందని తెలిసేది కాదు.

రహస్య స్థావరాల్లో మెలుకువే ఆయువని  తెలిసేది కాదు.

అవును ఆ ‘పూలతోటే ‘ లేకపోతే హృదయం అత్యంత భావరహిత పేదరికాన్ని చవిచూసేదేమో  బహుశా!!!
ఆ ‘మకరంద హృదయమే’ లేకపోతే –
మంచువాలుల్లో పాటల పూలవనాన్ని  విరగబూయించేదెవ్వరు.
ఆకాశాన్న వేలవేల అక్షర తారకల్ని  వెలిగించెదెవ్వరు.
నదీమ ప్రవాహంలో పదాల పడవల తెరచాపల్ని రెపరెపలాడించెదెవ్వరు.
నగర వీధుల్లో రణరణధ్వనులని జలపాతపు సవ్వడిలో నాట్యం చెయించెదెవ్వరు.
పురాత సైధీల్యపు నిశబ్ధంలోంచి రెండు ప్రేమల గొంతుని వెలిగించెదెవ్వరు.
అవును ఆ ‘పరాగ రేణువే’ లేకపోతే నిదురలేని రాత్రులల్లో భగ్న  ప్రేమికులకు ఆలపించేందుకు పాటలు మిగిలేవి కాదు కదా!!!
ఆ ‘శీతాకోకచిలుకే’ లేకపోతే –
ఆకుపచ్చని తోటల గాలినిండా శతసహస్ర రంగుల్ని మరెవ్వరు వెదచల్లేవారు.
అడివి దారుల్లో పేరు తెలియని పువ్వుల సోయగాన్ని వేరెవ్వరు పోల్చుకునేవారు.
లోయల వాలుల్లో మొలిచే గరిక పచ్చదనాన్ని చెవి వొగ్గి వినేదెవ్వరు.
మైదానాల సువిశాల మట్టి దారుల్లోని స్వేచ్చా సుగంధాన్నిశ్వాసించేదెవ్వరు.   
యెడారి చురచుర యెండమావుల్లో అసలుసిసలు వోయాసిస్సుని పట్టించెదెవరు.
గుల్జార్!!!
నువ్వే లేకపోతే పాట వొకే శిఖరం మీద నిలిచి వుండేది. పాటని మహాన్నత సంగీత శిఖరాలని అధిరోహింప చేసావ్.
అరవై వసంతాలుగా మా కవిత్వదాహం తీరుస్తున్న సజల నేత్రాలకవికి యెనభైవ పుట్టినరోజున వేలవేల రంగురంగుల తులీఫ్ పూల శుభాకాంక్షలు.!!!

-కుప్పిలి పద్మ.

Kuppili Padma Photo

ఆమిషాస్థుల పతనోన్ముఖ సేతువు: ‘The Visceral-Corporeal’, బైరాగి కవిత్వం

aluri-bairagi

1.

మనకు జీవితకాలం పాటు ‘నిరంతరానంద భిక్ష’  పెడుతూవుండే కవితో మనకు – వైయక్తిక స్థాయిలో – చాలా సంక్లిష్టమైన, ambivalent అయిన సంబంధం ఉంటుందనిపిస్తుంది.

 

గాథాసప్తశతి ని ‘The Absent Traveller’ అనే పేరుతో ఆంగ్లంలోకి అనువదించిన  Arvind Krishna Mehrotra,  ఆయన  Translator’s Note లో ఇలా అంటారు: ‘As readers we sometimes feel possessive about certain authors. They are our discoveries, and write only for us. When the whole world comes to know of them, the magic of their pages is destroyed and we feel robbed.’ ఈ వాక్యాలు రాస్తున్నప్పుడు ఆయన మనస్సులో ఏ రచయిత మెదిలారో గాని, ఆలూరి బైరాగి కవిత్వంపైని నా లుబ్ధత్వం గురించే రాసారనిపించింది. బైరాగిని అందరూ చదవాలనీ, చర్చించుకోవాలనీ వుంటుంది. అదే సమయంలో, నేను మాత్రమే unlock చేయగల రహస్యమేదో ఆయన encrypt చేసి వదిలివెళ్ళారనిపిస్తుంది.‘రంగుల తోట’ అనే కవిత చివరలో ‘నీతో ఒకటి చెప్పలేదు-/నా రంగుల తోటలోకి అప్పుడప్పుడు నిన్ను తప్ప/ ఎవ్వరినీ రానివ్వను’ అని నన్నుదేశించి రాసారనే అనుకుంటూవుంటాను. ‘ప్రశ్నను ప్రశ్నించిన కవి బైరాగి’ (‘మో’ మాట) ని కేవలం eulogize చేయడంవల్ల ఒరిగేదేమీ లేదు. మన సాహిత్యలోకం బైరాగిని అర్థంచేసుకోవడానికి చేసిన కృషి స్వల్పం. అలాగని గణించదగ్గ విమర్శ రాలేదనికాదు. ఇంతకంటే pressing, urgent  అవసరాల్ని literary mainstream పట్టించుకోవడం వల్ల ఆయన అర్థవిస్మృతుడు. అంతే.

 

2.

జెర్రులు ప్రాకుతున్నై, తేళ్ళు, త్రాచుపాములు నాచుట్టూ,

కత్తిరించి కుడుతున్నారు నన్నెవరో చొక్కాలా

శ్వాసనాళంలోంచి  శ్వాస త్రాగుతున్నారు హుక్కాలా

ఏదో ప్రవాహంలో(బహుశా అది నెత్తురేమో)

కొట్టుకుపోతున్నాను. నాచుట్టూ నాతోబాటు వందలు వేలు

చేతులు, కాళ్ళు, తెగిన శిరస్సులు, మొండాలు, పీకిన గ్రుడ్లు

వెంట్రుకలు నాచులాగ, ప్రేవులు నరాలు కాడల్లా;

పొగచూరిన ఎర్రకిరసన్ వెలుతురులో

కనుపించని ఒక చిక్కని ద్రవంలోన (నెత్తురే అయిఉంటుంది)

గిలగిల తన్నుకొంటున్నాను మాంసపు ముద్దలాగ;

అరుస్తున్నాను భయంతో చుట్టూచూసి, వినరాని కేకలువేసి,

సమస్త జీవకోటులు కొట్టుక వస్తున్నాయి

ఎటువైపు తిరిగినా ఏదో ఒకటి తగులుతోంది

మెత్తగా, నున్నగా, చీదరగా.

బిలబిల ప్రాకుతున్నవి పురుగులు నా ముక్కులోకి, చెవుల్లోకి

ఒంటినిచుట్టి పట్టుకొనే జలగలమూక.

అదిగదిగో, కొట్టుకొని వస్తున్నది శిరస్సొకటి,

దాని నొసట ఎర్రని నోరు, మూడవకన్ను,

తెరచిన రంధ్రమొకటి వెక్కిరిస్తోంది

పుర్రెలపాటలాగ గుడగుడమనే సుడిగుండం

కొంగ్రొత్త ఉపనదులవి, మహానగరాల మురుగు మోస్తూ

ఆసుపత్రి కాల్వల్లోంచి చీముతో, రసితో నిండి.

వినీల లోహకాంతులు విరిసినాయి దిక్కులలో

మసిగుడ్డవలే గగనం పరుచుకొన్నది నల్లనిదై

ప్రవాహవేగంవల్ల కదులుతోంది ప్రతి జీవం

చావులోకి, బ్రతులోకి, నిదుర మగతల మూర్ఛలోకి.

 

ముందున్నది క్షితిజం కాదు, అంతులేని సొరంగమది

గోడలు మెరుస్తున్నవి కొలిమిలో ఇనుములాగ

జీవంగల రుధిరామిషబిలం అదే

గోడలు చలిస్తున్నవి ప్రాకుతున్నపురుగుల్లా

ప్రవాహం ప్రవేశించింది గుహలో, సృష్టి రంధ్రంలో,

ఆవలనున్న సాగరంలో, రజనీ నైశ్శబ్ద్యంలో

నే నెవణ్ణి, ప్రభువునా, బానిసనా,

మెదులుతున్న మాంసపుముద్దనా, మానిసినా?

ఈ అగ్నిశిఖల్లోంచి, ఈ రక్తమఖం లోంచి

నూతన జననమా, లేక ప్రాక్తన మరణమా?

 

Literary Modernism యూరోప్ లోనూ, మన దేశంలోకూడా alienation/dehumanization ని చిత్రించడం ప్రధాన లక్షణంగా కలిగివుందని అందరికీ తెలిసిందే. కానీ, ఈ విషయాన్ని కవిత్వంగా మార్చేక్రమంలో కవి వాడే tropes, techniques అతడి విలక్షణతని పట్టిస్తాయి.

 

‘నూతిలో గొంతుకలు’ కవితాసంపుటిలో ‘హామ్లెట్ స్వగతం’, ‘అర్జున విషాదయోగం’, ‘రాస్కెల్నికోవ్’ అనే మూడు భాగాల ముందు eponymous కవితైన ‘నూతిలో గొంతుకలు’ ఐదు భాగాలుగా వుంది. ఈ ప్రారంభకవితలోని concerns నీ, themes నీ తరువాత వచ్చే మూడు స్వగతాలు dramatize చేస్తాయి. ‘అర్జున విషాదయోగం’, ‘రాస్కెల్నికోవ్’ అనే భాగాలు స్థూలంగా చూస్తే స్వగతాలు కావుగానీ, జాగ్రత్తగా గమనిస్తే అవీ స్వగతాలే.

ప్రారంభ కవితలో digressions , సంవాదం, exposition , illustration  లాంటి discursive పద్ధతులెన్నో కనిపిస్తాయి. కొన్ని దృశ్యాల్ని condense చేస్తూ, కొన్నింటిని extend చేస్తూ సాగే శైలి దీర్ఘకవితల్లో కానవచ్చేదే. పైన quote చేసిన extended image అటువంటిదే.

 

‘కత్తిరించి కుడుతున్నారు నన్నెవరో చొక్కాలా

శ్వాసనాళంలోంచి  శ్వాస త్రాగుతున్నారు హుక్కాలా

 

Loss of autonomy of the individual ని పైపంక్తుల్లో వ్యక్తీకరించిన పద్ధతి బైరాగి aesthetic (noun form లో) లోని ఒక కీలకమైన అంశాన్ని తెలియజేస్తుంది. ఎవరో తనని చొక్కాలా కత్తిరించి కుడుతున్నారనడంలో – bodily mutilation , invasion of the corporeal (ఇంకా చెప్పాలంటే, ‘body snatching’) ని ఆయన alienation కు సంకేతంగా వాడుతున్నారు. అప్పటి (1951) తెలుగు కవిత్వంలో కనిపించని ఆశ్చర్యకరమైన associations బైరాగి ఏర్పరిచారు. ఆయన కవిత్వ ‘ecosystem’ (కావ్యాంతర్గత జగత్తు) లో కొన్ని ప్రత్యేకమైన motifs పరిభ్రమిస్తూవుంటాయి. వేరే కవితల్లో ‘దేహపు పరిధానంలోంచి’ , ‘మాసిన చొక్కాలా దేహాన్ని వదలి’ వంటి మెటఫర్స్ కనిపిస్తాయి. భగవద్గీతలో శరీరాన్ని వస్త్రంతో పోల్చే శ్లోకం ప్రసిద్ధం.  పై image మిగతా related images ని ఎలా meta-morphose చేస్తోందో గమనించండి.

 

నేను ఈ కావ్యభాగాన్ని ఎంచుకోవడానికి ప్రధాన కారణం, బైరాగి,  శరీరాన్ని (ఇది hyper-sexualized స్త్రీదేహం  కాదు)  కేంద్రంగా చేసుకొని ‘దుర్భరతర జీవిత బాధావధి’ ని దృశ్యమానం చేసారని చెప్పటానికే. ‘దైహికత’ (corporeality) గురించిన మన received, a priori knowledge అంతటినీ దైహికానుభవం defy చేస్తూనేవుంటుంది. అసలు ఒక శరీరావయవం కలిగుండటమంటే ఏమిటి? Surrealist paintings లోలా disembodied limbs, torso, eyes, nose ని శరీరపు ‘presumed’ unity నుంచి వేరు చేసి చూడటమంటే ఏమిటి? బైరాగి వాడిన విశేషణాలు చూడండి – ‘మెత్తగా’ , ‘నున్నగా’ , ‘చీదరగా’. ఆ disconcertingly visceral experience ద్వారా ఆయన సూచిస్తున్నదేమిటి? చుట్టూరా అవయవాలు, తనే  ఒక మాంసపుముద్ద. పోతున్నది ‘రుధిరామిష బిలం’ లోకి. ఆ contiguity , juxtaposition of visceral images ద్వారా fluid స్థితిలో ఉన్న subjectivity ని allegorize చేస్తున్నారు. ఇటువంటి interpretation ని బలపరిచే imagery ఇతర modernists లోనూ కనిపిస్తుంది. అలాగని, కేవలం allegorical potential (మరీ ముఖ్యంగా, ప్రతిదీ potential allegory అయినప్పుడు) ఉండటమే ఇక్కడ ప్రత్యేకత కాదు. బైరాగి కల్పనలో ముఖ్యమైంది ఆ visceral, visual immediacy.

 

చిన్న detour. ఈ పంక్తులు –

 

‘గోడలు మెరుస్తున్నవి కొలిమిలో ఇనుములాగ

జీవంగల రుధిరామిషబిలం అదే

గోడలు చలిస్తున్నవి ప్రాకుతున్నపురుగుల్లా

ప్రవాహం ప్రవేశించింది గుహలో, సృష్టి రంధ్రంలో,’

 

చదివేటప్పుడు Roberto Bolano రాసిన Anne Moore’s Life కథలోని (ఆయన Last Evenings on Earth కథాసంకలనం లోది) ఈ భాగం స్ఫురిస్తుంది: ‘…It was as if the walls of the hotel room were made of meat. Raw meat, grilled meat, bits of both. …she looked at the walls and she could see things moving, scurrying over that irregular surface…’ పై రెండు సన్నివేశాలూ (కథ చదివి చూడండి) ఎక్కడో దిగంతంలో కలిసేవే.

 

ఇక ‘రక్త మఖం’ గురించి. ‘యజ్ఞం’ motif  బైరాగి కవితల్లో చాల చోట్ల కనిపిస్తుంది.’ఆగమగీతి’ కవిత ‘మానస యజనవాటిక పై మరల నేడు…’ అనే మొదలవుతుంది.’మృత్యు యజనపు జీవమంత్రం’, ‘యజనారణులు విఫలమైనవి/ ఇక ప్రజ్వరిల్లదీ హోమాగ్ని’ – యిలా. ఈ recurring motifs ని ఆయన మరింత శక్తిమంతం చేసుకుంటూపోయి, ఇంచుమించు ఒక private cosmogony వంటిది తయారుచేస్తారు.

 3444572043_9c3ce9bb22_o

 

3.

‘త్రిశంకు స్వర్గం’ బైరాగి దీర్ఘకవితల్లో అత్యంత విశిష్టమైనది. అది Nausea (Sartre) లా, The Stranger  (Camus) లా ఒక గొప్ప existentialist text. కానీ, దాని నిజమైన precursor మాత్రం, Soren Kierkegaard  రాసిన ‘Sickness Unto Death’ అనే తాత్త్విక రచన. Kierkegaard ని ‘Father of Existentialism’ అన్నారు. ఆయన దర్శనం theistic existentialist thought కి అత్యున్నత ఉదాహరణ.

 

(A section of the book relevant to this discussion and analysis can be accessed with this link (……………). Reading the whole excerpt will be helpful for understanding the drift of Kierkegaard’s argument.)

 

Kierkegaard దేన్ని ‘ఆమరణ రుగ్మత’ అంటున్నాడు? మరణహేతువైన వ్యాధి – అంటే terminal illness

– ‘Sickness Unto Death’ కాదు. మరణం రోగానికి అంతమేమో కాని, అదే అంతం కాదు. Kierkegaard ప్రకారం, మరణం అనేది పరమచరమాంతం అని భావించడమే రుగ్మత. Kierkegaard ‘నిస్పృహ'(despair) ని Sickness Unto Death అంటున్నాడు. ఈ నిస్పృహ భౌతికమృతితో ముగిసేది కాదు. అది ఎటువంటిది? Kierkegaard మాటల్లో –

 

‘On the contrary, the torment of despair is precisely this inability to die. Thus it has more in common with the situation of a mortally ill person when he lies struggling with death and yet cannot die. Thus to be sick unto death is to be unable to die, yet not as if there were hope of life; no, the hopelessness is that there is not even the ultimate hope, death. When death is the greatest danger, we hope for life; but when we learn to know the even greater danger, we hope for death. When the danger is so great that death becomes the hope, then despair is the hopelessness of not even being able to die.’

 

సరిగ్గా, ఈ స్థితినే ‘త్రిశంకు స్వర్గం’ లో బైరాగి చిత్రించారు. ‘రంగుల తోట’ అనే కవితలో, ఆయన ‘జీవిత జ్వరం’ అన్నది ఈ స్థితినే. Kierkegaard ‘నిస్పృహ’ – బైరాగి కవితలో ‘మెలకువ’ గా మారింది. ఆ మెలకువ – ఆ ‘స్వాప్నికసంయోగాల స్వేదదుర్భర జాగరణ’ – సర్వస్వం పొట్టబెట్టుకున్న రక్కసి.

 

ఈ కవితలో కేవలం psychological , spiritual torment  మాత్రమే లేదు. Mortality ఒక corporeal – visceral reality గా పరిణమించటమే కవిత ఇతివృత్తం. Kierkegaard అన్నట్లు అది – ‘to die dying, i.e., live to experience dying’.

 

‘జపాపుష్ప కాంతిలాగు, పచ్చిపుండు వాంతిలాగు

పసినెత్తురు కారుతున్న ఒక్క క్షణం!

చావు పుట్టుక బ్రతుకుల, విషమబాహు త్రిభుజంలో

మధ్యనున్న ఒక అదృశ్య బిందువులా

ఘనీభూత వాస్తవ కేంద్రీకరణం, ఒక్క క్షణం!’

 

Conscious selfhood ను పొందటమంటే ‘కంది కనలి కెంపెక్కిన ఒకే ఒక జ్వలితజీవిత క్షణం’ – ఆ epiphanic second – కోసం సంసిద్ధమవటం. కాని కేవలం ఇదే బైరాగి ఎరుక కాదు.

 

‘విసుగు! విసుగు!

కనులముందు విసుగులేని ఇసుకబయలు

జీవితపు శూన్యంపై ముసుగు విసుగు!

ఎంతకూరాని తుమ్ము, వెళ్ళిపోని వాంతి

కడుపులో త్రిప్పుతోంది విసుగు త్రేపు!

….

మెరసే నున్నని చర్మంపై ప్రాకే దురద విసుగు!

విసుగు! జీవితాల ముసుగు

 

‘This too shall pass.’ ఆ రక్తోజ్వల ముక్తిక్షణం తరువాత ఏమిటి? Tedium. Banality. Boredom. Ennui. ఇదీ బైరాగి దర్శనం.

 

Kierkegaard పుస్తకం బైబిల్ లోని Lazarus ప్రస్తావనతోటి మొదలవుతుంది. బైరాగికి intense reading of the scripture వల్ల ఆయా పురాగాథల connotative possibilities అర్థమైనాయని చెప్పవచ్చు (T. S.Eliot ‘The Love Song of J.Alfred Prufrock’ లో ఒక్కసారి Lazarus ప్రస్తావనొస్తుంది). బైరాగి మొత్తం రచనల్లో Lazarus ఒక central myth . బైరాగి లోని మరో ముఖ్య లక్షణం – a Modernist predilection for the mythic: Gulliver, Hamlet, Jesus, నహుషుడు, మార్కండేయుడు, ‘జగతీవిషసార పాయి(శివుడు)’ పదేపదే ప్రస్తావించబడతారు.

 

బైరాగి వాడే భాష గురించి కొంత చెప్పుకోవాలి. ఆయన శైలిలోని ఆసక్తికరమైన సమస్య గురించి ఆరుద్ర ఇలా అంటారు: ‘సరే, కల్తీలేని భారతీయ పద్ధతుల్లో వ్రాసే బైరాగి సంస్కృతపదభూయిష్టమైన మంచి కవిత్వం కూడా ఈ పండితులు గుర్తించరేం అని మధనపడ్డా.’ ప్రతి ప్రతిభావంతుడైన కవికీ తనదైన idiolect ఉంటుందని అనుకున్నా, బైరాగి భాషలోని సంస్కృతం పూర్తిగా క్లాసికల్ తెలుగుకావ్యాల సంస్కృతం కాదు. అలాగని సంస్కృతకావ్యాల లలితమృదుల సంస్కృతమూ కాదు. ఆయన, హిందీసాహిత్యంలో వాడే సంస్కృతపదాల కూర్పు వంటిది ఉపయోగించడం వల్లనూ, కఠిన శబ్దాలు – కర్ణపేయంగా అనిపించనివి – ఎన్నుకోవడం వల్లనూ పాఠకులు defamiliarization కి లోనవుతారు. పైగా, ఈ సంస్కృతం status-quoist కాదు. ‘Sanskrit cosmopolis’ (Sheldon Pollock) తాలూకు భాషా కాదు. ఆయన భాష సంస్కృతభాష లోనుంచి gothic, baroque  లక్షణాల్ని వెలికితీసి తయారుచేసుకున్న భాషనవచ్చు. అందుకే, ఆయన ‘దేవముఖ్యులు’ , ‘నవయుగ దైత్యులు’ లాంటి పదాల్ని వాడుతున్నప్పుడు, వాటిని మామూలు అర్థాల్లో వాడటంలేదనీ  , subvert చేస్తూ, problematize చేస్తూ ఉన్నారనీ తెలుస్తూంటుంది. ఇందుకు ఆధారాలు చాల కవితల్లో (‘రెండు క్రిస్మస్ గీతాలు’, ‘దైత్యదేశంలో గెలివర్’) కనిపిస్తాయి.

 

‘Beowulf’ epic ని గానం చేసిన అజ్ఞాత Anglo-Saxon కవులు సముద్రాన్ని whale-road అనీ, swan-road అనీ అన్నారు. మరీ అద్భుతంగా , శరీరాన్ని bone-house (banhus) అనగలిగిన ప్రజ్ఞ వారిది. ‘మేలుకొన్నవాడు’ అనే కవిత చివరలో –

 

‘విచ్ఛిన్న నైశసైన్యపు ప్రాణావశిష్ట భటుడు

అగ్రేసరుల ప్రథమ దూత,

ఆమిషాస్థుల పతనోన్ముఖ సేతువు పై ఉదర్కపు ఊహోద్ఘటుడు.

 

అన్న పంక్తుల్లో శరీరాన్ని ‘ఎముకలూ , మాంసముతో నిర్మించిన, కూలే స్థితిలో ఉన్న సేతువు’ అన్నారు. దేహం – లేదా ఒక  highly dynamic visceral-corporeal presence – గురించి ఇంత potent metaphor బైరాగి కవిత్వ తపః ఫలం.

 

(1978 లో మరణించిన బైరాగి- వాడ్రేవు చినవీరభద్రుడు, కవులూరి గోపీచంద్ అనే ఇద్దరు యువకుల సాహిత్య   చర్చల్లో పునరుత్ధానం పొందాడు. వారిలాగే ’80ల్లో చాలామంది ఎవరికి వారే బైరాగిని rediscover చేసారని తెలుస్తోంది. బైరాగి కవిత్వం గురించి వీరభద్రుడిగారితో మాట్లాడుతూ rhapsodic trance లోకి వెళ్ళి, తిరిగి  మర్త్యలోకానికొచ్చాక రాసుకున్న యాత్రాచరితమే యిదంతా. కాబట్టి ఈ వ్యాసానికి authorship నిర్ణయించటం చాలా nebulous/dubious విషయం. బైరాగి సాహచర్యంలో నిదురలేని రాత్రులు గడిపిన వారందరిదీ.. యిది.)

 

– ఆదిత్య

Painting : Robert Matta, Untitled Drawing, 1938.

‘మాట’ కోసం దేశం దాటిన తస్లీమా!

Innaiah discussing with Taslima

2006 ఫిబ్రవరి 24న తస్లీమా  ఇంటివద్ద ఆమెతో చర్చిస్తున్న ఇన్నయ్య

శటానిక్ వర్సెస్ రచయిత సల్మాన్ రష్డీ ఫత్వాలకు గురయి న్యూయార్క్ లో స్వేచ్ఛగా వుంటున్నారు.  ఆయనే మహిళా సల్మాన్ రష్డీ అని తస్లీమాను సగర్వంగా పిలిచారు.

సుప్రసిద్ధ మానవవాది, ఇస్లాంలో  మూఢ నమ్మకాలకు వ్యతిరేకిగా ప్రసిద్ధి చెందిన తస్లీమా నస్రీన్ ను మొట్టమొదటిసారి  1994లో అమెరికాలోని మేరీలాండ్ యూనివర్సిటీలో నేను, నాతోపాటు నా భార్య కోమల, కుమార్తె డా.నవీన కలిశాము. యూనివర్సిటీలో ఇరాన్ విద్యార్థుల సెక్యులర్ సంఘం ఏర్పాటు చేసిన సమావేశంలో తస్లీమా  తన కవితలు చదివి వినిపించింది. ప్రశ్నలకు సమాధానమిచ్చింది. ఆమె ఇంగ్లీషులో నెమ్మదిగా మాట్లాడింది. రాతలో ఉన్న బలం మాటలలో కనిపించలేదు.

సమావేశానంతరం ఆమెను కలిసి, మాట్లాడి ఫొటోలు తీయించుకుని యింటికి ఆహ్వానించాము. అప్పటికే ఆమెపై ఛాందస ముస్లిములు ఫత్వా జారీ చేయటం, ఆమె తన స్వదేశమైన బంగ్లాదేశ్ వదలి స్వీడన్ ఆశ్రయం పొందటం ఒక చరిత్ర. తస్లీమా తన జీవితాన్ని కవితా రచనలతో ప్రారంభించి వచన రచనలకు విస్తరించింది. ‘ది గేమ్ ఇన్ రివర్స్’ అనే కవితల సంపుటితో ఆరంభించింది.

1996లో రెండవసారి న్యూయార్క్ లో వారెన్ ఎలెన్ స్మిత్ (‘హూ ఈజ్ హూ ఇన్ హెల్’ ఫేమ్) తో కలిసి చేసిన విందులో తస్లీమా నస్రీన్ తో చాలాసేపు కాలక్షేపం చేశాం. అప్పట్లో తస్లీమా విపరీతంగా సిగరెట్లు తాగేది. నేను చనువుగా అది మానేయమని సలహా ఇచ్చాను. నా సలహా వలన కాకపోయినా ఉత్తరోత్తరా మానేసింది. అప్పటినుండీ వారెన్ ఆమెకు సంరక్షకుడుగా ఉంటూ, ఆమె వెబ్ సైట్ ఏర్పాటు చేసి, ఎన్నో విధాల తోడ్పడ్డాడు.

తస్లీమా కవితలు అనేకం వెలువడ్డాయి. ఆమె అనుమతితో వాటిలో కొన్నిటిని నా భార్య కోమల తెలుగులోకి అనువదించింది. హేతువాది ఇసనాక మురళీధర్, కొన్ని గేయాలు తెలిగించారు. తస్లీమా బెంగాలీలో ప్రధానంగా రచనలు చేస్తుంది. వాటిని వివిధ భాషలలోకి అనువదించారు.

తస్లీమా విదేశాలలో పర్యటించటం, ఐక్యరాజ్య సమితి బహుమతులందుకోవడం, సెక్యులర్ హ్యూమనిస్టులు ఆమెకు మద్దతుగా నిలవడం, క్రమేణా ఆమె కీర్తి ప్రతిష్ఠలు  ఇనుమడించడం జరిగింది. మరోవైపు ఆమె రచనలను ఖండిస్తూ, ఇస్లాం పైన దాడి చేసినదని కనుక ఆమెను చంపేయాలని ముస్లిం సనాతనులు పిలుపు ఇచ్చారు. అందువలన భారత దేశంలో కూడా ఆమె రహస్యంగానే బతకవలసి వచ్చింది.

ఢిల్లీలో పునర్వికాస సంస్థ (రినైజాన్స్) వారు ఏర్పాటు చేసిన సభలో ఆమె ప్రసంగించింది. నేను సభలో పాల్గొన్నాను. ఇది 2002లో జరిగిన విషయం. గాంధీ పీస్ ఫౌండేషన్ లో ఆమెకు వసతి కల్పిస్తే బొత్తిగా సౌకర్యాలు లేవని బాధపడింది.అక్కడ కేవలం శాకాహరమే ఉన్నది. ఆమెను ఢిల్లీలో కానాట్ సర్కస్ లో హోటలుకు తీసుకువెళ్లి భోజనాలు చేశాం. ఢిలీ్లో చాలామంది  ముస్లింలు ఉన్నప్పటికీ తస్లీమాకు ఎలాంటి ఇబ్బందీ కలుగలేదు.

తరువాత 2006లో నేను, ఇసనాక మురళీధర్ కలకత్తాలో ఆమె నివాసానికి వెళ్ళాము. అప్పట్లో ఆమె రౌడెన్ వీధిలో వుండేది. ఆమె స్వయంగా వంట చేసి వడ్డించింది. తన పెయింటింగులు చూపింది. ఎన్నో విశేషాలు మాట్లాడుకున్నాం. కలకత్తాలో సమావేశాలకు వెడుతూ వుండేది. శిబ్ నారాయణ్ రే మాట్లాడుతున్న సమావేశానికి వచ్చింది. అది కలకత్తా మధ్యలో రినైజాన్స్ సంస్థలో ఉన్నది.  అయినప్పటికీ ఆమెకు ఇబ్బంది కలుగలేదు. కానీ, రెండవ అంతస్తులో ఉన్న సమావేశానికి రావడానికి మెట్లు ఎక్కలేక కిందనే వుండిపోయింది. మేము కిందకు వెళ్ళి కాసేపు మాట్లాడి పంపించేశాము. కలకత్తాలో ఆమెకు శిబ్ నారాయణ్ రే పెద్ద అండగా వుండేవాడు. ప్రభుత్వం ఆమెకి సెక్యూరిటీ ఇచ్చింది.

బెంగాలీ రచయితలను కలుసుకోవటం చర్చించడం ఆమెకు ఇష్టం. బెంగాలీ సంస్కృతిలో పెరిగిన తస్లీమా ఆ వాతావరణంలోనే వుండడానికి ఇష్టపడింది. కానీ, ఆమె భావాల వలన ముస్లింలు ఆమెను ఉండనివ్వలేదు.

తస్లీమా ‘లజ్జ’ అనే పుస్తకంలో బంగ్లాదేశ్ లో హిందువులపై ముస్లిములు జరిపిన అత్యాచారాలను ఏకరువు పెట్టి తీవ్ర నిరసన తెలిపింది. అంతటితో ముస్లిములు విచక్షణ విస్మరించి ఆమెపై విరుచుకు పడ్డారు. తస్లీమాకు డాక్టరుగా ప్రాక్టీసు ఉండేది. అది వదిలేసి పారిపోవలసి వచ్చింది. మళ్లీ తల్లి చనిపోయినప్పుడు రహస్యంగా వెళ్లి చూచి ఏదో ఒక విధంగా బయటపడింది. ఆమె విస్తృతంగా తన జీవిత చరిత్రను రాసి ముస్లిం సమాజాన్ని స్త్రీలపట్ల వారి అమానుషత్వాన్ని, చిన్నతనం నుండీ ఇస్లామును నూరిపోసి, పురుషులలో నిరంకుశత్వాన్ని ప్రబలింప చేయడాన్నితీవ్రంగా విమర్శించింది. ఆమె గ్రంథాలన్నీ బంగ్లాదేశ్ లో నిషేధించారు. చివరకు చాలా అభ్యుదయ వాదులమని చెప్పుకునే కమ్యూనిస్టులు పశ్చిమ బెంగాల్ లో పరిపాలిస్తూ కూడా ఆమె రచనలు నిషేధించటం సిగ్గు చేటు. కలకత్తా హైకోర్టు ఆ నిషేధాన్ని తొలగించింది.

protecting Taslima

2008లో ప్రెస్ క్లబ్ హైదరాబాదులో ముస్లింలు దాడిచేసినప్పుడు తస్లీమా రక్షణకు ప్రయత్నిస్తున్న ఇన్నయ్య

‘షోద్’ అనే తస్లీమా రచనను ‘చెల్లుకు చెల్లు’ అనే పేరిట తెలుగులో కోమల అనువదించింది. దాని ఆవిష్కరణకు తస్లీమా 2007 ఆగస్టు 9న హైదరాబాదు వచ్చింది. హైదరాబాదు బేగం పేట ఎయిర్ పోర్టులో ఆమెకు స్వాగతం పలికి ఈనాడుకు ఎదురుగా ఉన్న ప్రెస్ క్లబ్ కు తీసుకువచ్చాము. ఆమె రాక గురించి పబ్లిసిటీ ఇవ్వలేదు. భద్రతా దృష్ట్యా పరిమితంగానే విలేఖర్లను, కొందరు మిత్రులను ఆహ్వానించాము. ఆనాడు వేదిక మీద ఈనాడు జర్నలిజం స్కూలు ప్రిన్సిపాల్ ఎమ్. నాగేశ్వరరావు, సుప్రసిద్ధ రచయిత్రి ఓల్గా, కోమల, నవీన ఉన్నారు. తస్లీమా చాలా మృదువుగా తన తీవ్రభావాలను వెల్లడించి, షోద్ నవల గురించి సంక్షిప్తంగా చెప్పింది. ఆ నవలలో ఇస్లాం ప్రస్తావన లేదు. మతపరమైన వాదోపవాదాలు లేవు. ఆమెపై ఉన్న ఫత్వా కారణంగా ఛాందస ముస్లింలు వెంటపడ్డారు.

కోమల అనువదించిన యంగ్ చాంగ్ పుస్తకం ‘అడవి గాచిన వెన్నెల’ (చైనాలో దీనిని నిషేధించారు.)ను ఆగస్ట్ 9, 2007 న తస్లీమా, ‘చెల్లుకు చెల్లు’ తోపాటు విడుదల చేశారు. రంగనాయకమ్మ దీనిపై 100 పేజీల సమీక్ష రాసి కోమల అనువాదాన్ని మెచ్చుకుంటూ అందరూ చదవాలన్నారు.

ప్రెస్ క్లబ్బులో కార్యక్రమమంతా ముగిసిన తరువాత ముగ్గురు మజ్లీస్ శాసన సభ్యులు తమ అనుచరులను వెంట బెట్టుకుని తస్లీమాపై అమానుషంగా దాడి చేశారు. పోలీస్ సహాయంతో ఆమె కలకత్తా వెళ్లినా ముస్లిం సంఘాలు వెంటబడ్డాయి. పశ్చిమ బెంగాల్ ప్రభుత్వం కానీ, భారత ప్రభుత్వం కానీ ఆమెకు అండగా నిలవలేదు. దేశంలో ఉండనిస్తామంటూ జైలులో పెట్టినట్లు ఆంక్షలు విధించారు. దేశం వదిలి వెళ్ళిపోయి కొన్నాళ్ళకు తిరిగి వచ్చినా పరిస్థితి మారలేదు. సెక్యులర్ ప్రభుత్వమని చెప్పుకునే వారు ఇలాంటి ధోరణి అవలంబించటంతో తస్లీమా వెళ్లిపోవలసి వచ్చింది. కలకత్తాలో ఉంటే బెంగాలీ మాట్లాడుకోవచ్చని, తను పుట్టి పెరిగిన సంస్కృతికి చేరువగా ఉంటానని ఆమె ఆశించింది. చివరకు సాల్మన్ రష్డీ, అయన్ హర్షీ అలీ విదేశాలలో ఉండవలసి వచ్చింది.

తస్లీమా బంగ్లాదేశ్ కు పనికిరాకపోయినా ప్రపంచానికి, ప్రజాస్వామ్యవాదులకు హీరోయిన్. ఎన్నో దేశాలు ఆమెను ఆహ్వానించి ఘనంగా సత్కరిస్తున్నాయి. అనేక రచనలు వెలువరిస్తూనే వుంది. ప్రస్తుతం కొన్ని నిబంధనలకు లోబడి ఢిల్లీలో వుండనిచ్చారు. బయటి ప్రపంచం మాత్రం ఆమెను స్వేచ్ఛగా పర్యటించడానికి, అభిప్రాయాలు వెల్లడించడానికి పిలుస్తున్నది. ఆమెతో స్నేహంగా వుండగలగడం నాకు ప్రత్యేక విశేషం. అనేక నాస్తిక, మానవవాద, హేతువాద సభలలో నిరంతరం పాల్గొంటున్నది. ప్రతిష్ఠాత్మకమైన అవార్డులు అందుకుంటున్నది. బాల్య, యౌవన దశలో బంగ్లాదేశ్ లో మతపరమైన చిత్రహింసలు అనుభవించినా స్వేచ్ఛా లోకంలో మాత్రం స్త్రీలకు ఆమె ఆదర్శప్రాయంగా నిలిచింది. వేబ్ సైట్ లో ట్విట్టర్లో ధైర్యంగా, శాస్త్రీయంగా ఆలోచనలను అందిస్తున్నది. అక్కడక్కడా కొంతమంది ముస్లింలు భావ బంధాలు తెంచుకుని స్వేచ్ఛగా రచనలు సాగిస్తున్నారు.

Taslima,me, prof Amlan Datta

ఇన్నయ్య, తస్లీమా, ప్రొఫెసర్ అమ్లాన్ దత్

వారితో కూడా ఆమెకు పరిచయాలున్నాయి. ‘నేనెందుకు ముస్లింను కాదు’ అనే పేరిట ఇబన్ వారక్ రాసిన సుప్రసిద్ధ రచన కూడా బహుళ ప్రచారంలోకి వచ్చింది. ఇరాన్, సోమాలియా తదితర దేశాలలో రచయిత్రులు బయటకు వచ్చి స్త్రీలకు స్వేచ్ఛ కావాలని రచనలు చేస్తున్నారు. అయన్ హర్షీ అలీ అలాంటివారిలో ప్రముఖులు. ఆమె రచనలు కూడా కొన్ని కోమల తెలుగులోకి అనువదించింది. తస్లీమా చరిత్రలో నిలుస్తుంది. ఆమెతో స్నేహంగా వుండగలగడం మానవ వాదిగా నాకు గర్వకారణం.

తస్లీమా ప్రధానంగా బెంగాలీలో రాస్తుంది. ఇంగ్లీషులో వ్యాసాలు, కొన్ని కవితలు రాసింది. ఆమె ఉపన్యాసాలన్నీ రాసి, చదువుతుంది. అవి చాలా ఆలోచనతో ఉద్వేగంతో  జరుగుతున్న అన్యాయాలను వ్యతిరేకిస్తూ, సమానత్వం కోసం, మానవ హక్కుల కోసం ఆక్రందించేవిగా వుంటాయి. ప్రపంచంలో ఆమె ఉపన్యాసాలు చాలా ఆకట్టుకున్నాయి. బెంగాలీ రచనలలో ముఖ్యంగా ఆమె జీవిత చరిత్ర ‘లజ్జ’ వంటి నవల, బంగ్లాదేశ్ లో నిషేధించారు. జీవితచరిత్ర ఏడు భాగాలుగా ప్రచురితమైంది.

అందులో ఇంకా కొన్ని ఇంగ్లీషులోకి రావలసినవి ఉన్నాయి. ‘ఫ్రెంచి లవర్’ అనే నవల చాలా గొప్పగా వుంటుంది. అందులో ఆమె స్వీయగాథ కూడా తొంగి చూస్తుంది. ఆమె రచనలు స్పానిష్, జర్మన్, ఫ్రెంచి భాషలలోనికి అనువాదమయ్యాయి. భారతదేశంలో హిందీ, మరాఠీ, తెలుగుతో సహా వివిధ భాషలలోకి కొన్ని పుస్తకాలు వ్యాసాలు వచ్చాయి. ఆమె వెబ్ సైట్ (taslimanasrin.com) నిర్వహిస్తున్నది.

– నరిసెట్టి ఇన్నయ్య

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

ఒక స్నేహ దీపం ఆరిపోయింది!

ప్రముఖ కథా రచయిత, గేయ రచయిత, సంగీతజ్ఞుడు గిడుగు రాజేశ్వర రావు గారు (1932-2013) హఠాత్తుగా కన్ను మూయడం ఆయన అభిమానులనందరినీ దిగ్భ్రాంతుల్ని చేసింది. చివరి దాకా ఆయన పూర్తి ఆరోగ్యంగా, తాజాగా,ప్రసన్నంగా వున్నారు.  ముఖంలోని చిరునవ్వుగానీ, ఆరోగ్యసూచకమైన వెలుగుగానీ ఏమాత్రం చెదరలేదు.ఆయన దినచర్యలో ఏమీ మార్పు రాలేదు. చదవడం, రాయడం, షికారుకు వెళ్ళడం, సాహిత్యకార్యక్రామాల్లో పాల్గొనడం అన్నీ మామూలుగానే చేసేవారు. యింకా 10 యేడ్లు యేమీ ఢోకా లేదనిపించేవారు, యితరులకు కూడా అలా ఉండాలనే ప్రేరణ కలిగించేవారు. ఒక వారం క్రిందట నేను ఉదయం నుండి సాయంత్రం దాకా ఆయన వద్దనే ఉన్నాను. అదే నేనాయనతో గడిపిన ఆఖరు రోజు.
ఆ రోజు ఆయన కొంత కాలంగా రాయడం మొదలుపెట్టిన  నవల లోని రెండు అధ్యాయాలు చదవమని నాకిచ్చారు. కొంత ఆత్మకథ కలగలసిన ఆ నవల అంశాలు చదివి  వినిపించాను. దాన్ని గురించి కొంత చర్చించుకున్నాము కూడా.యిక తన కాలాన్నంతా నవలకే కేటాయిస్తున్నట్లు, అహమదాబాదులోని ఒక సంస్థ ఆయనను ఆగస్టునెలలో సత్కరిస్తున్నట్లు, ఆ సంర్భంగా అక్క్కడికి ఎళ్తున్నట్లు చెప్పారు. అంతే కాక నేను అంతకు మునుపు మా సాహితీ మిత్ర మండలిలో చదివిన జైనేంద్ర కుమార్ హిందీ కథ–తాత్వికతతో కూడిన కథ— ’తత్సత్’ బాగా నచ్చినందువల్ల దాన్ని తెలుగు లోకి అనువదించాలనే కోరిక ఆయనకున్నందువల్ల ఆ కథ సాంతం మళ్ళీ వినిపించి అర్థాలు చెప్పాను. ఆయన అర్థాలన్నీ నోట్ చేసుకున్నారు.
మరుసటి రోజు అనువాదం పూర్తి అయిందని చెప్పడానికి ఫోను కూడా చేశారు.అంత దీక్షతో పనిచేసేవారు. ఇంతకు మునుపు  కూడా ఆయన ఈ విధంగానే మా మిత్రమండలిలో నేను చదివిన కొన్ని హిందీ కథలను అనువదించి ప్రచురించారు కూడా. ఉదాహరణకు యశపాల్ కథ ’కర్వా వ్రతం’(కర్వా కా వ్రత్) భీష్మ్ సాహనీ కథ ’సర్దార్నీ’. ఇలాగే మరికొన్ని కథలు కూడా అనువదించాలనే కోరిక ఆయనకు ఉండేది. ఈ అనువాదాల్ల్లో ఆయనకు సహకరించడం నాకు చాలా ఆనందం కలిగించేది. ఈ పనిగా ఆయన వద్దకు వెళ్ళి నప్పుడంతా ఉదయం నుంచి సాయంత్రం దాకా ఆయనతో గడిపే అవకాశం నాకు లభించేది. కొన్ని సందర్భాల్లో  నేను హిందీ నుంచి తెలుగులోకి చేసిన అనువాదాలు  ఆయనకు చూపించేవాణ్ణి. ఆయన శ్రద్ధగా చదివి అవసరమైన మార్పులు సూచించేవారు. ఈ విధంగా మా సాన్నిహిత్యం బాగా పెరిగింది. ఆయన హఠాన్మరణం గురించి తెలియగానే ఈ ప్రసిద్ద్ద శ్లోకం మనసుకు వచ్చింది:
అనాయాసేన మరణం, వినా దైన్యేన జీవితం,
దేహాంతే తవ సాయుజ్యం, దేహి మే పార్వతీ పతే
(దేవా! పార్వతీ వల్లభా! బ్రతికినన్నాళ్లు దైన్యములేని జీవితమును, కాలము తీరినపుడు అనాయాస మరణమును, దేహమును  వదలినపిమ్మట నీలో కలియుటను ఈ మూడింటిని నాకు అనుగ్రహింపుము).ఇలాంటి కోరిక తీరిన వ్యక్తిలాగానే ఆయన వెళ్లి పోయారు. స్విచ్ ఆఫ్ చేసినట్లు. తానూ ఆయస పడలేదు, ఇతరులనెవ్వరినే ఆయాస పెట్టలేదు.  సార్థకము, సఫలము అయిన   జీవితం జీవించి, పలువురిని మన్ననలందుకొని   వెళ్లిపోయారు.
     భగవద్గీతలోని కర్మయోగి ఆయన. చివరి క్షణం వరకు క్రియాశీలుడుగానే ఉన్నాడు.  గొప్ప  యోగులు,సాధకులు యోగంద్వారా తనువు చాలిస్తారని అంటారు. రాజేశ్వర రావుగారు కూడా అలానే చేశారనిపిస్తుంది.
    నా ఒకనితోనే కాదు, డిల్లీ లోని మా సాహితీ మిత్రమండలిలోని ప్రతి ఒక్కరికి ఆయన సన్నిహితుడైపోయాడు. గత పది-పడ్రెండేళ్లలో– మధ్యలో కొంత కాలం తప్ప— డిల్లీలో  మా అందరికీ ఆత్మబంధువుగా, పెద్దదిక్కుగా,  ప్రేరక శక్తిగా ఉంటూ వచ్చారు . ఆయన సౌజన్యం మమ్మలనందరినీ కట్టి పడేసేది. అందరితో ఆప్యాయంగా మాట్లాడేవారు.  శ్రమపడి ఎంతో దూరం నుంచి  మా సమావేశాలకు వచ్చేవారు. వాటిలో తన రచనలు చదివి వినిపించేవారు, యిక్కడి రచయితల రచనల పైన తన అభిప్రాయం వెలిబుచ్చేవారు.
    సంగీతంలో ఆయనకున్న ఆసక్తిని గురించి, అభినివేశాన్ని గురించి, ఆయన చేసిన కృషి గురించి చాలా కాలం దాకా మాకు తెలియదు. తెలిసినప్పుడు చాలా ఆశ్చర్యపోయాం. ఉత్తరాది, దక్షిణాది సంగీతాలను, జానపద సాహిత్యాన్ని తనివితీరా ఆస్వాదించిన రాజేశ్వర రావు గారు సందర్భం వచ్చినప్పుడంతా ఆ పాటల చరణాలను  లీనమై పాడేవారు.  హిందీ పెద్దగా రాకపోవడం ఆయన సంగీత సాధనకు అడ్డంకిగా ఉన్నట్లు  నాకు తోచలేదు. యెన్నో పాత హిందీ-తెలుగు పాటలు ఆయన జిహ్వాగ్రం పైన ఉండేవి. ఆయనకు సంగీతం అంటే ఎక్కువ ఇష్టమా, లెక సాహిత్యమంటేనా అనేది చెప్పడం కష్టమనిపించేది. సంగీతం బాగా తెలిసి ఉండడం ఆయన రాసిన గీతాలకు బాగా తోడ్పడిందని నిస్సందేహంగా చెప్పవచ్చు. రేడియోలో, టీవీలో ప్రసారం పొందిన ఆయన అనేక గేయాలు శ్రోతలకు చిరపరిచితమే. శ్రీమతి రాజేశ్వర రావు గారు, ఆయన కుమార్తె స్నేహలతగారు కూడా సంగీతం బాగా తెలిసినవారే.
    రాజేశ్వర రావు గారు  ప్రధానంగా మానవీయ విలువలను, ఆదర్శ మానవ జీవితాన్ని  చిత్రించిన రచయిత.  మొత్తం ఆయన సాహిత్యంలోని భావాల్లో, ఆలోచనల్లో  యీ విలువల గురించిన చింతే మనకు ఎక్కువగా కనిపిస్తుంది. ఈ రోజుల్ల్లో మనుషుల్లో  సాధారణంగా కనిపించే స్వార్థపరత్వాన్నీ, అవినీతిని, విచ్చలవిడితనాన్ని, విలువలు లేకపోవడాన్నీ చూసి ఆయన తీవ్రమైన ఆవేదన చెందేవాడు. తన జీవితం ద్వారా, సాహిత్యం ద్వారా ఆ విలువలకు బలం చేకూర్చడం  కోసమే ఆయన తాపత్రయపడ్డారు, శ్రమించారు,. తన కల్పనలో ఉన్న గంభీరమైన మానవ జీవితాన్ని. బలమైన నైతిక భావాల్ని, సౌహార్ద్రం నిండిన మానవ సంబధాలను  చిత్రించారు. ఆయనలో కళా దృష్టి కంటే ప్రయోజనపరమైన దృష్టే ఎక్కువగా ఉంటుంది.  అయితే  భావాల్ల్లో తీవ్రత, ఉధృతి  ఉండవు.  సున్నితంగా, మృదువుగా. హితవు చెప్పినట్లుగా చెప్పడం ఆయనకు ఇష్టం.  ఆయన స్వయంగా కూడా సౌజన్యశీలి, మితభాషి, మృదుస్వభావి. ఉదాత్త వ్యక్తిత్వం కలవాడాయన.. తీవ్ర భావాభివ్యక్తి ఆయన ప్రవృత్తికి సరిపడదు. ఆ గుణమే ఆయన సాహిత్యంలో కూడా ప్రతిఫలించి అందులో సారళ్యం, మాధుర్యం చోటు చేసుకున్నాయి..  మానవుని జీవితాన్ని సృష్టి లయతో మేళవించడానికి, సృష్టితో దానికి సామరస్యం స్థాపించడానికి ఆయన తన సాహిత్యం ద్వారా కృషి చేశాడు. చెప్పదలచుకున్నది సూటిగా చెబుతారు. అందువల్లే ఆయన సాహిత్యంలో ఎలాంటి వాద వివాదాలకు చోటు లేకుండా పోయింది.
    ఆయన తత్వమేమిటో ఆయన మాటల్లోనే ఇలా చెప్పుకున్నాడు ” నిరంతరం తిరిగే సృష్టిచక్రానికి కందెన ప్రేమతత్వమే  కానీ పగ, ద్వేషం కాదు. మానవూడు ప్రకృతికి దూరంగా  జరిగిపోతున్నాడని వందేళ్ల క్రితం  డేవీస్  విచారించాడు.  కానీ ఇటీవలి పరిణామాలు చూస్తే చెప్పలేనంత దూరమే మళ్లిపోతున్నాడు.
    “ఈ సృష్టిని  వినయంతో ఆరాధించి, భావి తరాల  పట్ల శ్రద్ధ వహించడంలో తేనెటీగలు, వానపాములు వంటి అల్పజీవులు చూపిన పాటి దీక్ష, సహజీవన కాంక్ష బుద్ధిజీవులని విర్రవీగే  నరజాతి చూపకపోవడానికి కారణం ఒకటే.  ప్రేమ జీవితానికి అత్యవసరమన్న సత్యాన్ని గుర్తించక పోవడమే. విధ్వంసకారకాలైన పగ, ద్వేషం, జనాన్ని, ముఖ్యంగా యువతని తమవేపుకు లాక్కుంటున్నాయి…..ప్రకృతి దృశ్యాల వెనక అంతర్లీనంగా ఉన్న ప్రేమతత్వం, రానున్న తరాల పట్ల శ్రద్ధ, గమనించినప్పుడు  మానవ హృదయంలో కాసింత పరివర్తన, మృదుత్వం చోటు చేసుకుంటుంది.  విధ్వంసకోన్మాదమే సామాజిక సమస్యల పరిష్కారానికి ఒక మార్గం అన్న అభిప్రాయం తగ్గుముఖం పడుతుంది– అని నమ్ముతున్నాను. ప్రకృతిని ప్రేమించి ఆరాధించే సాధనకు మించిన భక్తి ఏమతంలోనైనా వేరే ఏముంటుంది? “
    గిడుగు రాజేశ్వర రావు గారు మొత్తం పధ్నాలుగు రచనలు ప్రచురించారు. (1)గిడుగు రాజేశ్వర రావు కథలు (2) రాగవీచికలు (లలిత గేయాలు) ఇది గరికపాటి సాహిత్య పురస్కారం పొందింది (1993) (3) కాళిందిలో వెన్నెల (కథల సంపుటి) (4)పూలతేరు (కథల సంపుటి)  (5) భావ వీచికలు ( ఆకాశవాణి, దూరదర్శన్ కార్యక్రమాల్లో ప్రసారమైన లలిత గేయాలు)  (6)మల్లె పందిరి ( ఆంధ్ర సారస్వత సమితి, మచిలీపట్నం వారి ’ముదిగొండ సాహిత్య పురస్కారం-2003 పొందిన బాలల గేయాల సంపుటి) (7) మా ’కంద’ స్పందనలు (కంద పద్య శతకం)  (8) శబ్ద చిత్రాలు (రేడియో నాటికలు)  (9) ఉదాత్త చరితుడు గిడుగు ( రామమూర్తి పంతులు గారి  జీవిత చరిత్ర)  (10) అమూల్యక్షణాలు (కథల సంపుటి) (11) పిల్లలకు పిట్టకథలు  (12)రాజమకుటాలు  (వ్యంగ్య  పద్యరచన) (13) కవన కదంబం (కవితలు) (14) సృష్టిలో మధురిమలు ((సచిత్ర  పద్య రచన)
     రాజేశ్వర రావు గారి కథలు జీవితంలోని అతి సున్నితమైన అంశాలను స్పృశిస్తాయి, ఏ అలంకారాలూ లేకుండా, నిరాడంబరంగా,  నిసర్గ సుందరంగా ఉంటూ తమ లక్ష్య శుద్ధి తో, నిజాయితీతో,  ఆర్ద్రతతో పాఠకుణ్ణి ఆకట్టుకుంటాయి,ఆలొచింపచేస్తాయి. సరళమైన భాష, కథను నడిపించడంలో మంచి నేర్పు, అందులోని సందేశం ఆయన కథల్లోని మరి కొన్ని విశేషతలు.  ఈయన అనేక కథలు  పత్రికలు నిర్వహించిన కథల పోటీల్లో బహుమతులు గెలుచుకున్నాయి.   వీరి  బాలల గేయాలు, లలిత గేయాలు  ఉదాత్తమైన భావాలతో నిండి, రాగ-తాళయుక్తంగా పాడడానికి అనువుగా ఉంటూ,పాడేవారికి, వినేవారికి, చదివేవారికి. అందరికి రసానుభూతిని కలగజేస్తాయనడంలో సందేహం లేదు.
  ఎంతో శ్రమపడీ సేకరించిన సమాచారంతో   తన తాత గిడుగు రామమూర్తి పంతులు గారి జీవిత విశేషాలను పొందుపరచి రాసిన ’ఉదాత్త చరితుడు’ ఒక విశిష్ట రచన . మునుపెన్నడు వెలుగులోకి రాని విశేషాలెన్నో ఇందులో ఉన్నాయి.
   రాజేశ్వర రావు గారి చివరి ప్రచురిత రచన ’సృష్టిలో మధురిమలు’  మరో విశిష్ట రచన. తాను తీసిన ఫోటోల్లోని, సేకరించిన ఫోటోల్లోని  ప్రకృతి  దృశ్యాలకు తగినట్లుగా  తానే రాసిన గీతాలను చేర్చి ప్రచురించిన  పలు రంగుల చిత్రాలతో కూడిన  రచన ఇది.  దాన్ని ఆయన ’సప్తవర్ణ దృశ్యకావ్య ప్రయోగం” అని అన్నారు.  ఈ రచన  రాజేశ్వర రావు గారు  ప్రకృతితో  ఎంత తాదాత్మ్యం చెంది ఉండేవారో,  ఎంత సూక్ష్మ పరిశీలన చేసేవారో స్పష్టంగా తెలుపుతుంది.
 “నిండు దోసిట పట్టిన నీరు కూడ
వేలి సందులలో జారి నేల రాలు,
మధురమైన క్షణాలను మరచి పోక 
భద్రపరచు ప్రయత్నమీ పద్య రచన!”
అని ఆరంభించిన ఈ  రచనలోపశు -పక్షులనుంచి, క్రిమికీటకాలనుంచి, ప్రకృతి నుంచి మానవుడు  తన మనుగడకు, తన ఉన్నతికి  నేర్చుకోవలసిన అనేక పాఠాలను దర్శింపచేసే చిత్రాలు, వాటిని హృద్యంగా వర్ణించిన  గేయాలు ఉన్నాయి.   సారిసారికీ  చూస్తూ, చదువుతూ ఉండడానికి  ప్రక్కనే ఉంచుకోదగ్గ పుస్తకం.
     తన ఆలోచనలను. ఆదర్శాలను, చింతలను వెలిబుచ్చే రెండు కథలు ఆయన ఈ మధ్యనే ప్రచురించారు. ఒకటి వన మహోత్సవం, రెండోది ధర్మసందేహం.
జె. ఎల్. రెడ్డి
Dr. J.L Reddy

త్రిపుర traits:ఒక జ్ఞాపకపు ఛాయ!

tripura_336x190_scaled_cropp

ఎవరైనా సమకాలీన రచయిత గొప్ప అక్షరంగా పరిచయమయ్యాక, నన్ను తరచి తవ్విపోశాక, చెప్పరాని చనువై మనసయ్యాక, ఆ రచయితని వ్యక్తిగతంగా కలవడానికి ఆరాటపడను. తీరా కలిస్తే- సిరా మరకలు కూడా అంటని కుదురైన జమాబందీలానో, మహా పోతరం కమ్మిన ఆరోగ్య సూత్రంలానో, అతి భద్రమైన జీవిత బీమాలానో, ఫక్తు డీఏ ఎరియర్‌లానో, జున్ను ముక్కల్ని దాష్టికంగా కప్పెట్టిన మిరియాల పొడిలానో ఎదురవుతాడేమోనన్న జంకు వల్ల కావచ్చు; లేదా దురద పుడితే నాలానే గోక్కుంటున్నాడేమిటన్న లౌకిక విస్మయాలతో సదరు రచయిత (కవి) చవకవుతాడేమోనన్న నా వెరపు వల్ల కావచ్చు- నాలోకి తెగబడిన రచయితని బయట కలవాలని ఎగబడను.

కానీ త్రిపురని కలుసుకోవాలని ఆత్రపడకపోవడానికి పై శంకలేవీ కారణాలు కాదు; వస్తు-రూప ద్వంద్వానికి అంతు చిక్కని, నెపం వంటి కేవల రూపాన్ని మించి ప్రచ్ఛన్నంగా పరుచుకొని సారమై నిలిచిన త్రిపుర రాతల లోంచి ఆయన మూర్తిమత్వాన్ని ఊహిస్తూ… గుట్టలుగా పోగుపడ్డ నా appraisals  వల్లనే ఆయనని కలవాలని వెంపర్లాడలేదు. ‘త్రిపుర ఎలా ఉంటారు?’ అన్న ప్రశ్న త్రిపురని కలవడం కంటే మనోహరంగా ఉండేది.

“మెత్తగా నల్లగా చుంచులాంటి ముఖాలు. రహస్యంగా నక్కలాంటి ముఖాలు. అప్పుడే చంపిన గేదెని చీరుతున్న పులి ముఖాలు. దుమ్మలగొండి ముఖాలు. బెదిరిన కుందేలు ముఖాలు. సన్నగా పగగా పాము ముఖాలు. మార్కోవిచ్ సిగరెట్ ప్యాకెట్ మీద ముఖం లాంటి ముఖాలు. డిటెక్టివ్ ముఖాలు. దొంగ ముఖాలు.”

బింబం మాటున సత్యాన్ని అద్దం వెనక వార్నిష్‌ని గోకి తెలుసుకోవాలన్న ఆయన ఉత్సుకతకి అక్షరాలై బద్దలైన అద్దంలో మన ఇన్నిన్ని ముఖాలు చూపెట్టిన త్రిపుర ముఖం ఎలా ఉండి ఉండొచ్చు?

-బిత్తరపడి చేజారిన బాల్యంలోంచి చేజేతులా చేసుకున్న యవ్వనానికి పారిపోయిన కాలనాగు శేషాచలపతి. ‘మృదువైన కాంతిలో పడగెత్తి నాట్యం చేసే’ నాగుబాము శేషు convulsive స్ఫురద్రూపంతో వణికిస్తుందా?

-గదుల్లో ఇమడని ధ్యానం, చింతన చినబోయిన మౌనం, దారులు ఒగర్చే యానం- భాస్కరం. అనుభవాలు అంటని, రంగులు ముంచని, మనసు మళ్లిన ‘ఓల్డ్ టెస్ట్‌మెంట్ ప్రొఫెట్’ భాస్కరం ఒంటరితనంలా వణికిస్తుందా?

-పోటీ… పొగరు… పంతం… పరుగు… పాముల నిచ్చెన్ల బండ బతుకు కొత్త altruistic  గమ్యాల దిశగా తీసుకున్న యూ టర్న్- వీరాస్వామి. ‘పసుపు కాని, ఆకుపచ్చ కాని, మిరమిట్లు గొలపని, నాలుగు ముఖాల అందం’- జర్కన్ వంటి వీరాస్వామిలా విలువ, ఖరీదు అర్థం కానట్టుంటుందా?

-‘కనిపించని ద్వారం’మీద దిష్టిచుక్క కాదు, నిన్నలోకి నెర్రెలిచ్చిన తలపోతల అద్దంలో ‘పాపిటి దగ్గర గరుకు నల్లటి పుట్టుమచ్చ’ మాత్రమే కాదు, కొంకర్లుబోయిన ముఖంలో కవళికలు మారినా కాంతి తరగని కళ్ల కింది నల్లని వలయం- నారాయణ. కెరటాల హోరులో బదుళ్ల నిశ్శబ్దాన్ని భరించలేకి ఆ ప్రళయ తరంగ తాండవంలోకి జారిన నారాయణ ఒకానొక బుడగై చిట్లినట్టుంటుందా?

-‘పిలకలు, కిర్రుచెప్పులు, చెవులకి కుండలాలు, ఆరవేసిన అంగవస్ర్తాలతో’ భగవంతం సనాతనత్వంలా ఉంటుందా?

కళ్లు ‘బోధిసత్వ అవలోకితేశ్వరుడివిగా, ఒళ్లు హెర్క్యులస్‌ది’గా గొప్ప విరోధాభాసలా ఉంటుందా? పోనీ ఇవేమీ కాకుండా, ఇన్ని అక్షర అతిశయోక్తుల్ని కలగన్న సుబ్బారాయుడిలా next door సుబ్బారావులా సాదాసీదాగా ఉంటుందా? సీజరు కాని, జుడాస్ కాలేని, ఎటుకీ చెందని ఆ ముఖాన్ని ఏమరుపాటుగా ఉన్నప్పుడు పొంచి చూసేయాలి. నా ఎడతెగని ఎక్స్‌పెక్టేషన్ల కుంచెలతో గీసుకున్న ముఖాలతో పోల్చి చూసుకోవాలి.

కనక, త్రిపురను చూడటం కంటే, తొంగి చూడటానికి ఎక్కువ ప్రాధాన్యం ఇచ్చాను. అందుకే ఆయనను కలిసిన దాని కంటే పొంచి చూసిన సందర్భాలే ఎక్కువ. వైజాగ్‌లో నేనున్నప్పుడు రామలక్ష్మీ ఎస్టేట్స్‌కి అలా ఉట్టినే వచ్చి వెళ్లిపోతుండటం చూసి లక్ష్మి గారి కళ్లలో ‘మిలియన్ డాలర్ల ఆశ్చర్యం.’  ‘బెంగాలీ కథల మీ అనువాదం అద్భుతమ’ని (నిజమే కావచ్చు) ఎన్నిసార్లు చెప్పగలను?

ముఖాముఖినో, పొంచి ఉండో చూడడానికి త్రిపుర ఇప్పుడు లేరన్న ఆలోచ తెరలుతెరలుగా సంవేదనై కమ్ముతుంటే అనిపిస్తోంది – ఆయనతో ఇంత ముడివడిపోయానా అని.

నన్ను అనుక్షణం అంటిపెట్టుకుని ఉండే కవులు, రచయితలు… అన్నమయ్య, కృష్ణశాస్త్రి, బాదెలేర్, చలం, బుచ్చిబాబు, ఫ్లెబర్, మొపాసా. వీరందరూ నేను పుట్టకముందే నన్ను దొంగిలించిన తీవ్ర నేరం వల్ల నా వాళ్లయ్యారు. అటువంటి సారూప్యాలేవీ లేని కాఫ్కా, త్రిపుర, మో… వంటివారు కూడా నా వాళ్లు కావడం నాకెప్పుడూ ఆశ్చర్యమే.

వాళ్ల ప్రపంచాలు ఆత్మాశ్రయాలనే ఆరోపణల మాటున అత్యంత విశాలమైనవి. వారి రచనల ద్వారా వారు చేసిన అన్వేషణ అనంతమైనది. ఆధునికత అనే ఔషధం వికటించి కలిగిన సైడ్ ఎఫెక్ట్స్ వీరిని బాధించినంతగా నన్ను ఇబ్బంది పెట్టలేదు. త్రిపుర విషయానికొస్తే,  ‘భౌతికంగానూ, మానసికంగానూ ఈ కథల పరిధి చాలా పెద్దది’(పాలగుమ్మి వారి మాటల్లో). ఆయన పాత్రలు చాలా elitist, ఐతే ఆర్థికంగా, లేదా తాత్వికంగా. శేషు లాంటి దాష్టికరాయుళ్లకి బెలూచిస్థాన్, జర్మనీలు స్పిరుచ్యువల్ హోమ్స్, భాస్కరం వంటి ఏక్ నిరంజన్‌లకి ‘తెల్లగా నిర్మానుష్యంగా ఉందనిపించే సైబీరియా’ స్పిరిచ్యువల్ హోమ్. రాణీవాసపు చెర వైభవాల లలితాదేవి, విమల ప్రభాదేవీలు, ఇన్‌గ్రెడ్ బెర్గ్‌మెన్‌లా ఉండే జాహ్నవులు, Monty Clift లా ఉండే శివరామన్‌లు… అవే కావు, మురికివాడలు, గల్లీలు, పేదరికం, నక్సలిజం… కూడా ఉన్న ప్రపంచం త్రిపురది. అందులో ‘గొలుసులు-చాపం-విడుదల భావం’ ఒక్కటే నాది. మా హోమియో డాక్టర్ (నా గురువుగారు కూడా) ఎన్‌వీ బ్రహ్మం గారు- నేను Argentum nitricum కేసు అనేవారు.

‘ఎందులోనూ ఏ చెయ్యీ బాగా ఎట్టకుండానే ఎళ్దామనుకుంటాను, మన దారిని మనం. అయితే అన్నిట్నీ గుద్దేస్తూ.

…ఎందుకు అన్నిట్నీ గుద్దేస్తుంటారూ? కళ్లకి చూపు తక్కువా, వొళ్లు ఊపు ఎక్కువా? మతిమరుపా, కండ కావరమా, మదవా రోగమా? అసలు తత్వమే అంతా? నడుస్తూ యింట్లోనే అందర్నీ అలా గుద్దేయడమేమిటి? బుర్ర దువ్వుకుంటూ అద్దాన్నే గుద్దేయడం… అలా గుద్దుకుంటూ నడిస్తే గాని…’- ఇవే లక్షణాలు!

‘మెదడులోని మతడల్ని చూశావా ఎప్పుడేనా, తమ్ముడూ, మెదడులోని మెకానిజం? ఆలోచింపజేస్తుందే ఆ మెకానిజం? చూళ్ళేదూ, అవును నీకెందుకూ అలాటివి. పోయి, వీధుల్లో ఆడపిల్లల్ని చూస్తానంటావ్ కాబట్టి నీకేం తెలీదు, వెళ్ళి చూడు…’

– వాళ్లన్నయ్య ఆ కథా నాయకుడితో అన్నాడా, త్రిపుర నాతో అన్నారా?

(పై కథని మినహాయిస్తే) త్రిపుర కేవలం శైలీగత కారణాలతోనే నాకు దగ్గరయ్యారా? నాకూ సరైన స్పష్టత లేని ఈ ప్రశ్నే బహుశా ఆయనని, ఆయన రచనల్ని కొన్నిసార్లు scepticalగా చూసేలా చేసిందేమో.

ఉపరితలంలో చూస్తే ఆయన కథలు రాసిన కాలం 1963- 73 (ఆ తరవాత నాదీ అని పైన చెప్పుకున్న కథ 1981లో, 1987లో మరొకటి). అంటే 1928లో పుట్టిన రాయసం వెంకట త్రిపురాంతకేశ్వర్రావ్ అనే త్రిపుర తన 35-45 ఏళ్ల మధ్య ఓ 13 కథలు రాశారు. సాధారణంగా రచయితలు తమ యవ్వన ప్రాదుర్భావ వేళ కవిత్వం రాస్తారు. జలపాతం ఉధృతిని మైదానం నెమ్మదించాక వచనం వైపు మళ్లుతారు. కానీ త్రిపుర విషయంలో ఇది తిరగబడింది. ఆయన 50 ఏళ్లు పైబడ్డాక కవిత్వం మొదలెట్టారు (తన 47వ పుట్టినరోజు నాడు 1975లో రాసిన సెగ్మెంట్స్ ఇంగ్లీష్ దీర్ఘ కవిత సెమీ ఆటోబయోగ్రాఫికల్). ఇంకా కచ్చితంగా చెప్పాలంటే తన 70వ పడిలో రాశారు కవిత్వం. ఇటువంటి విలోమ ప్రయాణం గురజాడలో మాత్రమే ఉంది. అయితే, గురజాడ సీరియస్ సాహిత్యవేత్త. అంటే త్రిపుర నాన్ సీరియస్ అని కాదు. సవాలక్ష వ్యాపకాల వల్ల తాను రాయాలనుకున్న, ‘రాయవల్సిన’ దాంట్లో పదో వంతు మాత్రమే రాసినా (యుగకర్త, మహా కవి వంటి విశేషణాలు తీసేసి చూసినా), గురజాడ ఓ సాహిత్య ఉద్యమకారుడు.

ఈ విధంగా చూస్తే, త్రిపుర సాహిత్యం తెలుగు పాఠక లోకానికి ఏమవుతుందో గానీ, త్రిపురకి మాత్రం తన సాహిత్యం ఓ passing cloud, ఆ మబ్బు రాల్చే సాంత్వన జల్లు అయితే కావచ్చు. అసలు తానొక రచయితగా కూడా claim చేసుకోవడానికి ఆయన ఇష్టపడలేదు (తనమీద, తన రచనల మీద రచయిత చేసుకునే ఏ తెలుపు నలుపు క్లెయిమ్స్ అయినా పట్టించుకోవాల్సిన అవసరం పాఠకుడికి లేదనుకోండీ). ఆయనకి తన రాతలంటే ఖాతరు లేదు గానీ సాహిత్యం, ముఖ్యంగా ఇంగ్లీషు సాహిత్యంతో జన్మాంతర బంధం, ఆత్మగత సంబంధం. గురజాడని ఆధునికతకి ఒక కొండ గుర్తుగా తీసుకుంటే ఆయన మొదలు, స్వాతంత్ర్యానికి ముందటి వరకూ పుట్టిన కవులూ రచయితలు (ముఖ్యంగా బ్రిటిషిండియాలో ఉన్న కోస్తాంధ్ర రచయితలు) అందరూ ఇంగ్లీష్ సాహిత్య ప్రేమికులే. అందులోనూ వ్యాహాళికి నాయుడుపేట నుండి మద్రాసు వెళ్లి ఆల్బర్ట్ కామూ, సార్ర్త్‌లతో తిరిగి రాగలిగిన వెసులుబాటున్న పెద డాక్టరు గారబ్బాయి త్రిపుర పేరు ప్రత్యేకంగా ప్రస్తావించవలసిందేముంది? ఎమ్మే ఇంగ్లీష్ చేసిన కలోనియల్ బుర్రలు రెండాకులు ఎక్కువ చదవడంలో విడ్డూరమేముంది? ఉంది! ఆ విషయంలో త్రిపుర మహా తేడా. బెనారస్ యూనివర్సిటీలో అగ్రికల్చరల్ ఎమ్మెస్సీ అర్ధాంతరంగా ఆపేసేనాటికి కూడా ఆయనకి వ్యవసాయంలో ఓనమాలు తెలియవు; ఫీల్డ్ ఫిజియాలజీ చేయవలసి వచ్చిన నాటికి అసలు వరి కంకే తెలియదు. పాత గురువు గారి సలహా మీద ఎమ్మే ఇంగ్లీష్ ఆనర్స్‌లో చేరడం-ఎకడమిక్ ఎదుర్రాయి కొట్టుకోవడం కాదు.

అలాగని అది తోవ చూపించిన వేలు కూడా కాదు. రెక్కమాను శిథిలమైన కూడలిలోకి ఆయనని నడిపించిన చేయి. ఏ తోవ ఎటు పోతుందో వెదుక్కోవడమే ఆయన చదువు.

అధ్యయన విషయంలో కూడా త్రిపుర గొప్ప తేడా మనిషి. ఆయన ఏ పుస్తకాన్నీ ఏకబిగిన చదవగలిగేవారు కూడా కాదు (ముఖ్యంగా తనని డిస్కవర్ చేసి సారూప్యాల్ని ఘనంగా ఎత్తిచూపిన బెకెట్, కాఫ్కా, కామూ వంటి రచయితల్ని). కొన్ని పుస్తకాలు ఏళ్లు గడిచినా పేజీలుగా ముందుకు నడవని సందర్భాలు కోకొల్లలు. తెల్లని కాగితాల మీద కథలని చీమలబారుల్లా ఎడమ నుంచి కుడికి పరుచుకున్న అక్షరాల్ని వాటి నిజ రూపాలతో దర్శించడమనే శాపాన్ని ఆయన జన్మతః పొందారు.  Genuine poetry can communicate before it is understood అన్న టీఎస్ ఎలియట్ రివలేషన్‌కి మరికొంత పొడిగింపు త్రిపుర అభిశప్తానుభవం: ‘పూర్తి’గా చదవకముందే ఎన్నో గ్రంథాల ఆత్మదర్శనం కావడం.

‘ఆలోచన’కి ‘తెలుసుకోవడాని’కి మధ్య అఖాతాన్ని గెంతి, దుమికి ‘సీసాలో బాతు పైకి వచ్చేసింది’ అని మాండో రూపంలో చెప్పే జవాబులు సృజన సాహిత్యంలోనో, తాత్విక వాఙ్మయంలోనో కుదురుతుందేమో కానీ ఇలా ఒకానొక పచ్చి వచన వ్యాసంలో ప్రతిపాదించడం ‘గేమ్ రూల్’ కాదని, అబ్సర్డ్ అని ఇంగిత జ్ఞానం నాకు లేకపోలేదు. అయితే త్రిపుర విషయంలో ఆయన సాహచర్యం వల్ల, అంతకుమించి, ఆయనను పొంచి చేసిన అపరాధ పరిశోధన తరహా పరిశీలన వల్ల నేను గ్రహించిన సత్యమది.

గ్రంథ సారాన్ని దివ్య చక్షువులతో గ్రహిస్తారన్న మిత్‌ను గానీ, ’రాబో’ సినిమాలో యంత్రుడిలా అలా అలవోకగా పుస్తకాలని స్కాన్ చేసిపారేస్తారన్న సోషియో ఫాంటసీనో ఏకరువు పెట్టడం లేదు నేను. ప్రభావాలకి గురికావడంలో కూడా తన, తన ముందు తరం రచయితల (ఒక్క తెలుగులోనే కాదు)కి కూడా త్రిపుర పూర్తిగా భిన్నమైన వారని గ్రహించినట్లు విన్నవించుకోడమే నా అభిమతం. శామ్యూల్ బెకెట్ ‘వెయిటింగ్ ఫర్ గోడో’ ప్రభావంగా చెప్పుకునే ‘భగవంతం కోసం’ రాసేనాటికి ఆ నాటకాన్ని త్రిపుర చదవలేదు. దానిమీద వచ్చిన సమీక్ష (కూడా) చదవలేదు, చూశారంతే. విశాఖపట్నం ఏవీఎన్ కాలేజీలో చదువుకునే రోజుల్లోనే ఓ మలయాళీ కాకా హోటల్లో కూర్చుని కబుర్లాడుకునేటప్పుడే – భగవంతం పదమూడో నంబర్ బస్సులోనో, ఇటు ఏడో నంబర్ బస్సులోనో వస్తాడని త్రిపుర ఎదురు చూశారు. నాటి ఎదురుచూపు కథగా ఆకారం తీసుకోవడానికి ‘వెయిటింగ్ ఫర్ గోడో’ అన్న శీర్షిక ఒక ప్రేరణ వంటి నెపం. అలానే, ఆయనకి కాఫ్కా రచనల కంటే Kafkaesque తనమే ఎక్కువ చేరువని ఆయన కాఫ్కా థీమ్ కవితా సంకలనం (త్రిపుర కాఫ్కా కవితలు) చెప్పకనే చెబుతుంది.

తన సృజనాత్మక రచన విషయంలోనే కాదు, ఆయన ప్రసంగాలలో కూడా ఇదే ఒరిజినాలిటీ కనబడుతుంది. ఓసారి విజయవాడలో యూజిన్ అయొనెస్కో మీద ప్రధాన ప్రసంగానికి ‘మో ఆయనను ఆహ్వానించారు. మూడు గంటలు పైగా సాగిన నాటి ప్రసంగంలో ది న్యూ టెనెంట్, ది చైర్స్, ది లెసన్, అమెడీ వంటి అయొనెస్కో నాటకాల ప్రస్తావనైతే ఉంది గానీ, స్థూలంగా ఆ ప్రసంగమంతా అయొనెస్కో ఆత్మతో (అప్పటికి అయొనెస్కో చనిపోయాడు) త్రిపుర చేసిన సంభాషణ; ఏ అకడమిక్ పుస్తకాల్లో కనిపించని వ్యాఖ్యానం, ప్రకాశంగా చేసిన స్వగతం. ఈ సమావేశానికి హాజరు కూడా కాని విలేకరులు తమ సాహితీ ‘source’ల ద్వారా కనుక్కుని రాసిన వార్త శీర్షిక ఇది: అబ్సర్డ్ నాటకకర్త అయొనెస్కోపై మరో ప్రముఖ అబ్సర్డ్ రచయిత త్రిపుర ప్రసంగం!

 

**      **      **      **

సౌరభమ్ములేల చిమ్ము పుష్పవ్రజంబు, చంద్రికలనేల వెదజల్లు చందమామ, గాడ్పేల విసురు, ఏల సలిలమ్ము పారు… అన్న కవిత గుర్తుకు తెస్తూ, రచన కూడా ఒకానొక ప్రాకృతిక ధర్మమేమో అన్పించేలా సృజన చేసిన త్రిపుర స్వయంప్రకాశకత్వాన్ని సూక్ష్మంగానైనా గ్రహించాను. నాకు తెలిసిన అక్షర ప్రపంచంలో మహా కవుల్ని, గొప్ప రచయితల్ని కలిశాను గానీ, నేను దర్శించిన తొలి ‘ఒరిజినల్’ రచయిత త్రిపురే. ఆ రెవలేషన్ తాలూకు ఉద్వేగం జ్వరంలా నిలువెల్లా కమ్మిన ఓ సందర్భంలో ఒక catharsis ఉపశమనం లాంటి సాష్టాంగ దండప్రమాణం చేశానాయనకి.  ‘a’uthor గా కూడా గుర్తింపుకి ఇష్టపడని తనని ‘A’uthor గా డాబు చేసిన నా సాష్టాంగ నమస్కారం ఆయనని చాలా గాయపరిచింది. ఆ భంగపాటుని ఎంతమాత్రం దాయనితనం ఆయన కళ్లలో ప్రస్ఫుటంగా కన్పించి మళ్లీ కలవడానికి కొంతకాలం ముఖం చెల్లలేదు.

పాద నమస్కారాల కాలం పరిఢవిల్లుతున్నందువల్ల ఆయన నన్నప్పుడు ఆశీర్వదించి తన అనుంగు శిష్యుడిగా స్వీకరించి అక్కున చేర్చుకున్నా అంతకంటే ఎక్కువ సిగ్గుపడేవాడ్నే. అంటే, ఆ క్షణం ఒక్కటే ఒక స్థితి; ముందు వెనకలు పొడిగింపులు లేని స్థితి, ఆయనకైనా, నాకైనా. రచయితగా ఆయన విస్తృతిని నేను దర్శించిన ఆ క్షణంలోనే, రచయితగా తన పరిధిని ఆయన ప్రదర్శించారు. అటువంటి అపురూపమైన క్షణం వెలిగించగలగడం ఒక్క త్రిపురకు తప్ప తెలుగుదేశంలో మరొకరికి సాధ్యమవుతుందని అనుకోను. జీవితాన్ని గాఢంగా తరచి, మథించి, శోధించి, అనుభవించి, అంతలోనే తామరాకు మీద నీటిబీట్టులా తటస్థమవడమే సాహితీ తత్వవేత్త త్రిపురలోని వెలుగునీడలు. కాలక్రమణికతో గణాంకాల బట్టీ త్రిపురని చూస్తే చాలా ప్రశ్నలు ఎదురవుతాయి. 85 ఏళ్ల నిండైన జీవితంలో (63 ఏళ్లు సాహిత్యంతో, తత్వ శాస్త్రంతో మమేకమై ఉండి కూడా) ఆయన పట్టుమని పదిహేను కథలకి మించి ఎందుకు రాయలేదు, దేశంలోనే ప్రతిష్టాత్మకమైన బెనారస్ హిందూ వర్సిటీలో వామపక్ష రాజకీయాల్లో ఉండి, ఆ తరవాత ఉద్యోగరీత్యా దేశదేశాలూ తిరిగి, అగర్తలాలో నక్సల్స్‌తోనూ సంబంధాలు పెట్టుకొని, ఒకపక్క మార్క్స్‌నీ మరోపక్క బుద్ధుడ్నీ మధ్యలో స్పినోజా, షొపన్ హావర్‌లనీ చదువుకున్న త్రిపుర తన 35 వ ఏట (1963) వరకూ రాయాలని అనిపించకపోవడమేమిటి? 45వ ఏడు వచ్చేసరికి, అంటే పదేళ్లలో 13 కథలు రాసేసి, ఇహ కలం మూసేయడమేమిటి? లెడ్జర్ బుక్కు జీవితంలో లౌకిక, సాంసారిక బ్యాలెన్స్ షీటు తయారు చేసుకునే భద్రమైన జీవితాన్ని ప్రేమించేవాడైతే తనని తాను Segments గా నిర్దాక్షిణ్యంగా కోసుకుని చూసుకునేవారా?

సెగ్మెంట్స్ ఒక సెమీ ఆటోబయాగ్రఫికల్ కవిత. 1975లో తన 47వ పుట్టినరోజు సందర్భంగా ఈ దీర్ఘ కవిత రాశారు త్రిపుర. ప్రపంచ ప్రఖ్యాత పెరూ మహాకవి César Vallejo కవిత  »El alma que sufrió de ser su cuerpo’  శీర్షికే ఎపిగ్రాఫ్‌గా మొదలవుతుంది దీర్ఘ కవిత. 46 ఏళ్లు మాత్రమే బతికిన  వల్లెజో  (1892`1938) తన జీవిత కాలంలో వెలువరిచినవి కేవలం మూడు సంపుటాలే (అందులో ఒకటి ఆయన మరణానంతరం విడుదలైంది). కానీ ఆధునిక కవుల్లో ప్రపంచవ్యాప్తంగా అంతటివాడు లేడన్న పేరు. మౌలికంగా ఆయన విప్లవ కవి, స్వయంగా స్పెయిన్ అంతర్యుద్ధంలో కమ్యూనిస్టుల తరఫున పోరాడిన యోధుడు. చే గువేరాని అత్యంత ప్రభావితం చేసిన కవి  వల్లెజో. అమెరికా చే గువేరాని మట్టుపెట్టాక, చేగువేరా సంచీలో దొరికిన పుస్తకంలో తన స్వదస్తూరీలో రాసుకున్న  వల్లె, నెరూడా వంటి అతి కొద్దిమంది కవితలు బయటపడ్డాయి. మన మహాకవి శ్రీశ్రీ కూడా  వల్లెజో కవిత్వాన్ని అనువాదం చేశారు. అయితే, త్రిపుర ఎంచుకున్న  వల్లె కవిత పూర్తిగా భిన్నమైంది, తాత్వికంగా చాలా గాఢమైనది,  వల్లె దాదాపు మృత్యుశయ్య మీద ఉన్నప్పుడు రాసినది. ఆ కవితా శీర్షికకి అర్థం ‘దేహమై క్షోభ పడ్డ ఆత్మ’. అంతుచిక్కని రుగ్మతతో అర్ధాంతరంగా కన్నుమూసిన  వల్లెజో దేహాత్మల ద్వంద్వాన్ని ప్రదర్శిస్తూ, అంతలోనే ఆ ద్వైతాన్ని రద్దు చేయడమే ఆ కవిత.

సెగ్మెంట్స్ కవిత రాసేటప్పటికి త్రిపుర మనఃస్థితి కూడా అంతటి సంక్షోభమయమే, సంవేదనాత్మకమే.

1950 ప్రథమార్ధం నాటికే బెనారస్‌లో చదువు, ఉద్యోగం, విరమణ కూడా అయిపోయాయి. 1954`57 వరకు మాండలే (బర్మా)లో ఉద్యోగం;  1957`59 మధ్య మదనపల్లి, విశాఖల్లో చిన్న మజిలీల తరవాత ఆయన అగర్తలా (త్రిపుర)లోని మహారాజా బీర్‌బిక్రమ్ కాలేజీలో చేరారు. ఆయనకి నక్సల్స్‌తో సంబంధాలుండేవి, వారికి సాయం చేయడానికి బ్యూరోక్రసీతో సన్నిహితంగా మెలిగారు కూడా. ఆయనలో ‘జుడాస్’ ఎలిమెంట్ లేకపోవడం వల్ల తమ రహస్య బృందంలో ‘జుడాస్’ని కనిపెట్టలేక, ఆ ద్రోహాన్ని తట్టుకోలేక ఆత్మహత్యకు ప్రయత్నించి, మతి చెడి పిచ్చాస్పత్రి పాలయ్యారు. ఇదంతా ఆయన వెదుకులాట. తోవలు వెదుక్కున్నారు, కనుక ఎదురు దెబ్బలూ తిన్నారు, అసలు తోవంటూ ఏదీ లేదన్న తాత్విక స్థితికి చేరుకున్నారు 1963`73 మధ్య రాసిన 13 కథల్లో, ఆ కథల్లో కదలాడిన భాస్కరం, శేషు, వీరాస్వామి, రాజు, మున్నీ, ముక్తాదేవి, కల్యాణి… అనేక పాత్రలతో ఆయన చెప్పాలని ప్రయత్నించిన వాక్యం

‘చచ్చిపోలేదు గానీ, జీవితంలో మిగిలి ఉంది ఏమీ లేదు’.

ఆ ప్రకారం చూస్తే కథలకి కలం మూసేసిన రెండేళ్లకి రాసిన Segments ఆయన అర్ధాంతర సాహిత్య ప్రస్థానానికి ఒక ముగింపు; ఆత్మకథలో ఆఖరి అంకం. ఏదో తనకి సానుకూలమైన సమాధానం చెప్పుకుని తప్పుకోవడమో, సౌలభ్యం చూసుకుని తప్పించుకోవడమో కాదు, దారి లేదని తెలుసుకోవడం. తనకు తాను కూడా మిగలని స్థితిలో శాంతి లేదు, సుఖం అంతకంటే లేదు. వెయ్యి యుద్ధాలతో తలపడే తెగువును మించినదేదో ఉండాలి, ఆ లోన పెనుగులాటని తట్టుకోవడానికి.

సోదరుడు Abel ని హత్య చేసి కూడా, »…am I my brother’s keeper? అంటూ దేవుడ్నే బుకాయిస్తాడు Cain. »…am I my brother’s keeper?? అన్న వాక్యాన్నొక allusion లా వాడతారు త్రిపుర తన  Segmentsలో. ప్రలోభాలకి లొంగి  ద్రోహం చేసి తమ్ముడి దుర్మణానికి కారణమవడమే కాకుండా, తన మతిస్థిమితం కోల్పోవడానికి కూడా కారణమైన ‘జుడాస్’ ల ప్రస్తావన ఉండే గానీ, వారి మీద నింద లేదు; స్వీయనింద ఉంది.

Couldn’t you too have died you’re your brother did,/ or at least bled… (నువ్వూనూ నీ తమ్ముళ్లానే/ చావలేకపోయావా?/ కనీసం గాయపడనైనా లేకపోయావా? ..అనువాదం ‘మో’)

YOUR WERE CLEVER / you did not spill a single/ drop of your brother’s / blood coarsing in your arteries..  అంటూ తనని తాను నిర్దాక్షిణ్యంగా చీల్చుకుంటారు. ఓ నిరపాయకర ప్రేక్షకుడిగా కేవల సానుభూతిపరుడిగా రణక్షేతాన్ని చూడడం, తమ్ముళ్ల త్యాగాన్ని భద్రంగా కీర్తించడం ఆయనను ఆత్మనిందకు పురిగొల్పుతాయి. కానీ కన్ఫెషన్‌తో కుమిలిపోతున్న ఈ కవి స్వాభావికంగా ఏకాకి.

..the skeletal arms of giant trees/ bend close from either side darkly to embrace me/ into/ their land of ‘No’/ which’s but/ a heartbeat away/ gurgling its marshy messages:/ soft black whispers./ “vanish into Zero the Perfect State”

సంపూర్ణమైన సున్నాలోకి అదృశ్యమవ్వాలనే వాంఛ మరో పక్క. ఇదీ ఆయన పెనుగులాట. సామాజికతకి, ఆత్మాశ్రయతకి మధ్య ఆయన నలిగిపోయారు. I see now CLEARLY/ my mirror reflects my terrible shame…..  అని కుంగిపోతారు తన నలభయ్యేడు సాయంతనాల సాంధ్యధూళిలో.

‘చచ్చిపోలేదు గానీ, జీవితంలో మిగిలి ఉంది ఏమీ లేద’న్న దిగులే ఆయన చేత సెగ్మెంట్స్ అనే ఎపిలోగ్ రాయించింది. ఆ తరవాత రాసిన కథలు (గొలుసులు-చాపం-విడుదల భావం  1981;  వలస పక్షుల గానం  1987), కవిత్వం (బాధలూ సందర్భాలూ 1990; త్రిపుర కాఫ్కా కవితలు  2001) ఆయన తనని ఏకాంతపరచుకునేందుకు మీటుకున్న ఏక్‌తార సాంత్వన సంగీతం మాత్రమే.

**      **      **      **

పట్టుమని పదమూడు కూడా లేని ఆయన కథల్ని text కి సంబంధం లేకుండా context పరంగా చూస్తే మరొకటి స్ఫురిస్తుంటుంది. అదేమిటో చెప్పాలంటే, ముందు ప్రదీప్ చౌధురి గురించి, ఆయనకి త్రిపురతో ఉన్న అనుబంధం గురించి చెప్పుకోవాలి. పశ్చిమబెంగాల్ సాహిత్య ప్రపంచంలో 1961`65 మధ్య వచ్చిన ఉప్పెన- హంగ్రీ జనరేషన్. మన దిగంబర కవులకు మల్లే హంగ్రీ జనరేషన్ కవులు మలయ్‌రాయ్ చౌధురి, అతని సోదరుడు సమీర్‌రాయ్ చౌధురి, శక్తి చటోపాధ్యాయ, దేవీరాయ్ (హరధోన్ ధార) కూడా అమెరికా ‘బీట్ జనరేషన్’తో ప్రేరణ పొందారు. అయితే బీట్ కవుల్లో ‘పేరుమోసిన’  ఎలెన్ గిన్స్‌బర్గ్ మన కాశీఘట్టాలు, కలకత్తా వీధుల్లో తిరిగి, మన అఘోరాలతో, బూడిద స్వాములతో చెట్టపట్టాలేసుకుని బతికినప్పటి (1963) వరకూ బీట్ కవిత్వాన్ని హంగ్రీ జనరేషన్ కవులు చూడనేలేదని కొందరు సాహిత్య చరిత్రకారులు వాదిస్తారు. ఈ వివాదాలు సాహిత్య పరిశోధకులకే వదిలేసి స్థూలంగా చెప్పుకుంటే, పశ్చిమబెంగాల్ హంగ్రీ జనరేషన్, మన దిగంబర కవులూ, కొలంబియా Papelipolas, స్పానిష్ Generation µ68 వంటి కవి బృందాల ఆక్రోశం, ఆగ్రహాల్లో సారూప్యాలున్నాయి.

Statusquoని నడ్డి విరిచి, ధ్వంసం చేసి కొత్త దారి వేయాలన్న వారి ఉద్రేకాల్లో పోలికలున్నాయి. అటువంటి హంగ్రీ జనరేషన్ కవులలో ప్రదీప్ చౌధురి ఒకడు. మాతృభాష బంగ్లాతో పాటు ఇంగ్లీషు, ఫ్రెంచిలలో కూడా అదే స్థాయి అభివ్యక్తి ఉన్నవాడు.అందరిలోనూ బహుశా చిన్నవాడైనందు వల్లనేమో కొంచెం దుందుడుకువాడు కూడా. 13,14 ఏళ్లకే కవిత్వం మొదలెట్టి ‘చెడి’పోయాడు. నలభయేడేళ్లకే చనిపోయిన బీట్ కవి, రచయిత Jack Kerouac తో మమేకమైనవాడు (Kerouac స్మరణలో శుద్ధ కవిత్వమై, పచ్చి వచనమై కూడా తేలిపోయినవాడు). తండ్రి ఉద్యోగరీత్యా కలకత్తా వదిలి ఢిల్లీ, అగర్తలాల్లో చదువుకున్న ప్రదీప్‌కి పాఠాలు చెప్పినందుకే కాదు, ప్రేరణ అయినందువల్ల కూడా త్రిపుర గురువు అయ్యారు, మిత్రుడయ్యారు, తరవాత సహోద్యోగి కూడా అయ్యారు (ప్రదీప్ కొంతకాలం జూనియర్ లెక్చరర్‌గా మహారాజా బీర్‌బిక్రమ్ కళాశాలలో పని చేశారు). ఈ గురుశిష్యుల మైత్రి ఆనాటి నుంచీ కొనసాగింది. త్రిపుర Segments(1975)ని ప్రదీప్ తాను నడిపే త్రిభాషాపత్రిక ‘స్వకాల్’ లో 1979లో ప్రచురించారు కూడా.

ప్రదీప్ గురించి త్రిపుర నాకు చెప్పిన అనేక సంగతుల్లో ఒకానొక అప్రధానమైన సంఘటన:

పేరున్న ఓ కళాశాల వారు విశ్వకవి రవీంద జయంతి సందర్భంగా అట్టహాసంగా కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి, ప్రదీప్‌ని ముఖ్య అతిథిగా రవీంద్రుడి మీద ప్రధాన ప్రసంగానికి ఆహ్వానించారు. ఆర్భాటమైన ఆవరణ, మంద్రంగా రవీంద్ర సంగీతం, రంగులన్నీ అక్కడే పుట్టాయా అన్నట్టున్న శోభాయమానమైన ఆ ప్రాంగణం చుట్టూ ఒక చెయ్యి త్రిపుర భుజం మీద వేసి, మరో చేత్తో నాటు సారా ప్యాకెట్లు తాగుతూ కలియదిరుగుతున్నాడు ప్రదీప్. అప్పటికే నిలదొక్కుకోలేని స్థితిలో తప్పతాగి ఉన్న ప్రదీప్, త్రిపుర ఎంత వారించినా వినకుండా జేబులోంచి ప్యాకెట్ల మీద ప్యాకెట్లు తీస్తూ తాగుతూనే ఉన్నాడు. సభ ఆరంభమై ముఖ్య అతిథి ప్రదీప్‌ను వేదిక మీదకి ఆహ్వానించారు నిర్వాహకులు. అతికష్టంమీద వేదిక మీద మైకు దగ్గరకు వెళ్లిన ప్రదీప్, భళ్లున పెద్ద వాంతి చేసుకుని,  ‘రవీంద్రుడు బెంగాలీ సాహిత్యానికి, ప్రపంచ సాహిత్యానికి చేసిన కాంట్రిబ్యూషన్ పట్ల నా అభిప్రాయం ఇదే’ అన్నాడు(ట).

త్రిపుర కథలని contextual గా చూస్తే- తెలుగు కథ స్తబ్ధత మీద, వస్తు-రూపాల మొనాటనీ మీద నిరసనగా భళ్లున కక్కిన వాంతి అని అనిపిస్తోంది. తెలుగు కథకి గురజాడ కంటే ముందు ఓ సాంఖ్యాయన శర్మ, లేదా మరో భండారు అచ్చమాంబ కథలు రాశారంటూ సాహితీ పరిశోధకులు నిగ్గుతేల్చుతున్నారు గానీ, ఆ తొలినాటి కథకుల ఔత్సాహిక తప్పటడుగుల్ని పక్కన పెట్టి, సీరియస్ కథకి pioneer గా గురజాడని తీసుకుంటే 20వ శతాబ్దపు తొలి దశకంలో ప్రారంభమై, రెండు, మూడు, నాలుగో దశకాల్లో ఉచ్ఛ దశకు చేరుకున్న తెలుగు కథ, 1950ల్లో నెమ్మదించి, ఆ దశకం చివరి నాటికి క్షీణ దశకి చేరుకుంది. ఆధునికతకి ముందటి కంటే ఆధునిక యుగంలో కాలం నడకలో వడి హెచ్చింది. అంతకుముందు పరిణామాలన్నీ ఒకెత్తు, ఒక్క 20వ శతాబ్దపు మార్పులన్నీ ఒకెత్తుగా దూకిన కాలంలో పుట్టి, కలం పట్టిన వారిలో కూడా అదే దూకుడు ఉండాలి. దశాబ్దంలోపే దూసుకొస్తున్న కొత్త తరం వెనకటి తరం కంటే ఎక్కువ సౌకర్యాలు పొందే సుఖానికే కాదు, మరింత చిక్కని సంక్లిష్టతలు ఎదుర్కోవాల్సిన కష్టానికీ సిద్ధం అవాల్సి వచ్చింది. వెనకటి తరం వేసిన దారిలో కొంత అనాయాసమైన ప్రయాణం చేస్తూనే, ఆ దారిని మరింత వెడల్పు చేయాల్సిన తరాలు, అలా చేయకపోగా దానిని ఒక ఇరుకు డొంక చేసేశాయి. కథంటే ప్రాపగాండా, ముందే సిద్ధం చేసుకున్న ఒక ప్రతిపాదన, ఎత్తులు నిర్ణయమైపోయిన శకుని పాచిక. పాత్రలు తాను ఆడించినట్లు ఆడే తోలు బొమ్మలు, తానొక సృష్టికర్త. కథ చెప్పే గొంతుకలో గొప్ప గోరోజనం. ఆ కనిపించని కన్ను, తెర వెనక మూకీకి తెలియని సంగతులే లేవు, చూడని లోతులూ లేవు, ఆడా మగా తేడాల్లేకుండా పాత్రల అంతరంగాల అల్లకల్లోలాల్ని అక్షరాల్లోకి అలవోకగా ఆవిష్కరిస్తుంది.

Leo Tolstoy ‘వార్ అండ్ పీస్’ కథానాయిక నటాషా పాత్రకి పూర్తి ప్రేరణగా పరిశోధకులు నిర్ధారించిన ఆయన చిన్న మరదలు  Tanya Behrs ఆయననొక ఉత్తరంలో నిలదీస్తుంది-  ‘సైనికాధిపతుల్ని, యోధుల్ని, భూస్వాముల్ని పాత్రలుగా మలచటంలో ఎంతో నేర్పు ఉండొచ్చు. కానీ ప్రేమలో మునిగి ఉన్న ఒక స్త్రీ మనసులోకి మీరెలా తొంగిచూడగలరు?’ అంటే ఆధునిక సాహిత్యం అనుభవాత్మకమే కానీ, ఊహాత్మకం, వ్యూహాత్మకం కాదని, కాకూడదన్నదే టాన్యా నిలదీత అంతరార్థం. రాయడానికి ముందు తన పాత్రలు చెప్పేది శ్రద్ధగా వింటానని Charles Dickens అంతటి మహా రచయిత వినయంగా ప్రకటించిన చోటే author- authority కి పర్యాయపదమైపోయాడని,  ‘కొత్తా దేవుడి’ అవతారమెత్తాడని  Roland Barthes (Death of the author)  వంటి విమర్శకులు గోలపెట్టారు. రచయిత అంటే author కాదని, అతనొక

scripter మాత్రమేనని అన్నారు. రచనతో పాటు పుట్టాడే తప్ప సర్వాంతర్యామిలా సకలం తెలిసిన మిడిసిపాటుతో ‘వివరించటం’, ‘ప్రబోధించటం’ కూడదని గగ్గోలుపెట్టారు.

గొప్ప రచనలు ఏవైనా ఏ కాలంలోనైనా సిద్ధాంతాలకి precursors లాంటివే గానీ, సైద్ధాంతిక దిశానిర్దేశం నుంచి పుట్టనే పుట్టవు. 1960 దశకం చివరి దశలో పుట్టి, మరో దశాబ్దం ఆలస్యంగా భారతదేశంలో ప్రవేశించిన రోలాండ్ బార్త్ వంటి కొత్త తరం విమర్శకుల స్ఫూర్తి 1963 నాటికే త్రిపుర రాసిన కథలలో between the lines తొణికిసలాడటం ఓ అద్భుతం.

రచనతో పాటే పుట్టటం అన్న స్ఫూర్తిని మరో రకంగా అన్వయించుకుని,  ‘నేను’ కేంద్రకంగా, డాబుసరిగా ఒక సొంత డప్పులా, అద్దం ముందూ ఆత్మవంచనలా ‘ఉత్తమ పురుష’ కథల శైలి కూడా కదం తొక్కింది (తొక్కుతోంది) తెలుగు సాహిత్య సీమలో.

“మీలో ఒక గొప్ప గుణముంది. ఏ అనుభవాన్నీ కాదనరు. కానీ వాటిని మీ రక్తంలోకి అరబడనీయరు. అవునా?’ అన్నాడు, మళ్లీ రాత్రి అనుభవం నా కళ్లలో ఇంకా మిగిలి ఉందేమో అని పరీక్షగా చూస్తూ.

అవునో కాదో అప్పుడు చెప్పలేకపోయాను. జవాబు ఇదీ అని ఊహించుకుని మాటల్లో చెప్పదలచుకుంటే, చెప్పడానికి ప్రయత్నిస్తే ఒఖ్ఖసారిగా గర్వం,  ‘అహం’ తెలియకుండా వెనకపాటుగా ముట్టడి చేసి… మాటల్లో విపరీతమైన ‘ట్విస్ట్’, అసత్యం… బంగారు పూత… వెలిగే అసత్యం. ‘నిజం’ యొక్క కఠోరత్వాన్ని కప్పి పుచ్చే అసత్యపు ఆకర్షణ… ఇవీ, నిజం యొక్క అసలు వెలుగును చూడలేక బెదరడం, భయం; మనసుతో ‘తెలుసు’కోగలిగినా,  ‘తెలుసుకోవడం’ నా శిక్షణలో ఒక భాగమైనా, ’నేను’ అన్న మాటలలో ఖంగుఖంగుమని సత్యం ఎప్పుడూ మోగదని, ఏది నిప్పులాగ నిజమో, ఏది వేషధారణో చెప్పలేననీ…”

 

ఇది జర్కన్ కథలో వీరాస్వామి, కథకుడు భాస్కరం మధ్య సంభాషణ, స్వగతం. ఇదే సాహిత్యంలో ఉండాలని త్రిపుర పదేపదే ప్రస్తావించే కన్ఫెషనల్ ఎలిమెంట్. ‘నేను’ని నిర్దయగా చీల్చి చూసుకోవడం. స్వోత్కర్ష గొప్ప సుఖమే గానీ, ఈ నేరాంగీకారం ఎంతమాత్రం సులువు కాదు.

‘యవ్వన ప్రౌఢ దశల్లో నేను తిరిగిన ప్రదేశాలు, పడ్డ మధనలు కథల్లో ప్రాణం పోసుకున్నాయి. ముఖ్యంగా నేను విద్యార్థిగా బెనారస్ హిందూ యూనివర్సిటీలో ఉన్న రోజులు, ఆ రోజుల్లో నాకు బాగా చనువైపోయిన నగువా, యూనివర్సిటీ గేట్, యూనివర్సిటీ ఘాట్, బిర్లా, బ్రోచా హాస్టల్సు, దశాశ్వమేథ్ ఘాట్, గల్లీలు, గంగ, ఆనాటి కొత్త ప్రభావాలు, ఊహల్లో నమ్మకాల్లో ఉప్పెనగా వచ్చిన పరిణామాలు, మానసిక సంఘర్షణలు, ఎన్నో- వాటిని గురించి నేను రాయలేకపోయాను. ఈ కథకుడు రాయగలిగాడు. నేను, నా మూలతత్త్వం, కథల్లో బయటపడితే నేనేదో బట్టబయలైపోతానన్న సంకోచం ఉండేది నిన్న మొన్నటిదాకా. అంచేత కథల్లో సన్నివేశాలకు, పాత్రలకు రవంత దూరంగా వుండడానికి ప్రయత్నించేవాణ్ణి, వాటితో నాకెంత గాఢమైన బంధం వున్నా. ఈ కథకుడు ఆ బంధాన్ని స్పష్టంగా బయటపెట్టడానికి సిగ్గుపడలేదు, సంకోచించలేదు. అందుకు నా జోహారులు’ అన్నారు పాలగుమ్మి, త్రిపుర కథలకు రాసిన ముందుమాటలో. స్వాభావికమైన వినయం, విస్తృతమైన అధ్యయనం వల్ల అబ్బిన జ్ఞానం వల్ల సర్వశక్తిమంతులమని, అపరబ్రహ్మలమని పాలగుమ్మి వంటి మహా రచయితలు అహంకరించలేదు గానీ వారు కూడా రచనల్లో తమని దాచుకోవడానికే ప్రయత్నించారు. గొప్ప సాహితీవేత్త కావడమే కాకుండా, బెనారస్ నేపథ్యముండటం వల్ల కూడా పాలగుమ్మిని ‘త్రిపుర కథల’ ముందుమాటకు ఎంచుకున్నారేమో అత్తలూరి నరసింహారావు.

నిజానికి బెనారస్ విశ్వవిద్యాలయం పాలగుమ్మి జీవితంలో ఓ మజిలీ కాదు, అతి ముఖ్యమైన మలుపు. బెనారస్‌కి ముందు పాలగుమ్మి మీద సంప్రదాయ సాహిత్య ప్రభావం ఎక్కువ. సంస్కృత వాఙ్మయం కూడా కరతలామలకం. ఆయన అప్పటికే అష్టావధానాలూ చేసేవారు. బెనారస్ విశ్వవిద్యాలయం ఆయన ఆలోచనల్ని ఆధునికత వైపు మళ్లించింది. ఈ మార్పు పాలగుమ్మి సాహిత్య జీవితాన్ని పరిశీలిస్తే అర్థమవ్వాలే గానీ ప్రత్యక్షంగా ఆయన ఎక్కడా ప్రస్తావించలేదు, త్రిపుర కథలకి రాసిన ముందుమాటలో తప్ప (‘ఆనాటి కొత్త ప్రభావాలు, ఊహల్లో నమ్మకాల్లో ఉప్పెనగా వచ్చిన పరిణామాలు, మానసిక సంఘర్షణలు, ఎన్నో- వాటిని గురించి నేను రాయలేకపోయాను’). ఆ విధంగా ‘త్రిపుర కథలు’ ఆయన నాస్టాల్జియాని కెరలించాయి. ‘నేను, నా మూలతత్త్వం, కథల్లో బయటపడితే నేనేదో బట్టబయలైపోతానన్న సంకోచం ఉండేది నిన్న మొన్నటిదాకా’ అన్నారాయన. నిన్నామొన్నటి వరకంటే ఎప్పటివరకు? 1980లో ఈ పరిచయ వాక్యాలు రాయకముందటి వరకు; ఇంకొంచెం hypothetical గా చెప్పుకుంటే ‘త్రిపుర కథలు’ తనని పట్టి కుదపక ముందువరకూ అనుకోవచ్చేమో. ఎందుకంటే, ఆ ‘నిన్నామొన్నటి’ తరవాత కలిగిన కొత్త ఎరుకతో పాలగుమ్మి ఏ రచనా చేయలేదు. కనుక ఎంత కాదన్నా పాత నమ్మకాలు, అలవాట్లు ఓ పట్టాన పోవు కాబట్టి ‘ఇటువంటి కథలు నేను రాయగలనా’ అని నిట్టూర్పు వంటి ప్రశంసతో ముగించారు పాలగుమ్మి.

చైతన్యవంతమైన 1980ల నాటికే అలా ఉంటే, అప్పటికి 20 ఏళ్ల క్రితం, ఆధునిక కథాసాహిత్యం నిలవ నీరైపోయిన 1960లలో ఎంత స్తబ్ధత, మొఖం మొత్తే మొనాటనీ ఉండి ఉండొచ్చు? గబ్బిలాలై వేలాడే నిన్నటి నమ్మకాలు, పాత హాంగోవర్లు, మార్పు పట్ల ససేమిరాలు, ముఖం తిప్పేసుకోవడాల మీద ప్రదీప్ కక్కిన నిరసన వంటివే త్రిపుర కథలు కూడా. ‘అబ్సర్డ్ నాటకకర్త అయొనెస్కోపై మరో ప్రముఖ అబ్సర్డ్ రచయిత త్రిపుర ప్రసంగం’ అంటూ రాసేసిన విలేఖరుల మిడిమిడి జ్ఞానాన్ని పోలిన అజ్ఞానంతోనే- ఆయనని ప్రముఖ అబ్సర్డ్ రచయితగా చేసి, తనకి సంబంధం లేని విశేషణాల భుజకీర్తులు తగిలించిన తెలుగు సాహితీ ప్రపంచం పట్ల ఏవగింపు కూడానేమో.

అయితే, ఊసిన కారాకిళ్లీ మరకలో ఎరుపు మెరుపులు చూసినట్టు, ఆ కథల టెక్స్ట్‌లోని వచన కవిత్వాల జమిలీకి వ్యామోహపడి, తన నిగూఢ తాత్విక శైలీ విన్యాసానికి వ్యసనపడింది తెలుగు సాహిత్యం. పాపులర్ అయ్యే ప్రమాదం తప్పింది గానీ, context  అర్థం కాని సాహిత్యలోకానికి ఓ cult figure గా మిగిలారు త్రిపుర.

నరేష్ నున్నా

 

‘జ్ఞాపకాలే మైమరుపు’

  హైదరాబాద్ లామకాన్ లో శుక్రవారం సాయంత్రం   ముళ్ళపూడి వెంకట రమణ 82 వ పుట్టిన రోజు Kinige , కథ గ్రూప్ ల సంయుక్త నిర్వహణలో జరుగుతోంది. ఈ సందర్భంగా రమణగారి స్మరణ వ్యాసాలు ఈ వారం ప్రత్యేకం . 

ఎవరైనా శాస్త్రీయ సంగీతంలో కృషి చేస్తూ వుంటే, బాలమురళి కృష్ణలాగా పాడాలనుకుంటారు. దాదాపు ప్రతి కార్టూనిస్టు బాపూగారిలా బొమ్మలు వేద్దామనుకుంటాడు. క్రికెట్ ఆడే ప్రతి కుర్రాడూ తను కూడా తెండూల్కర్ లాగా అడాలనుకుంటాడు. అదేరకంగా కథలు వ్రాసే నాబోటి వాళ్ళు రమణగారిలా వ్రాయలనుకుంటారు. ముఖ్యంగా హాస్య కథలు వ్రాసేవాళ్ళు. కనీసం ఒక్క కథయినా ఆయన బాణిలో వ్రాస్తే, వ్రాశారని ఎవరైనా అంటే, ఇక వారి జన్మ తరించినట్టే!        

నేనూ చేశాను ఆ పని. గోపాలం, భామ అనే పేర్లు పెట్టి భార్యాభర్తల మధ్య జరిగే తీయటి చేదు నిజాల్ని హాస్యం రంగరించి మూడు కథలు వ్రాశాను. శయనేషు రంభ, కార్యేషు దాసి, కరణేషు మంత్రి అని. ఆంధ్రభూమి వారపత్రికలో ఆ కథలు ప్రచురింపబడ్డాయి. కొంతమంది పాఠకులు రమణగారి శైలిలో వున్నాయి అంటే, ఎవరూ చూడకుండా ఎగిరి గంతేసినట్టు కూడా గుర్తు. ఈ మధ్యనే యువ జంట సీత, సీతాపతిలతో భోజ్యేషు మాత కూడా వ్రాస్తే స్వాతి మాసపత్రికలో ప్రచురించారు. ఇదెందుకు వ్రాశానంటే కథా రచయితల మీద రమణగారి ప్రభావం ఎంత వుందో చెబుదామని. మరి అది ప్రభావమా, కాపీనా అనే వాళ్ళు కూడా వున్నారు. ఇక్కడ నేను కానీ, ఇంకొకరు కానీ అయన కథలని కాపీ కొట్టటం లేదు. ఆయన రచనా శైలిని మాత్రమే. ఇలా భుజాలు తడుముకునే నాలాటి వాళ్ళ గురించి కూడా రమణగారు అన్నారు, కాపీ రైటు అంటే కాపీ కొట్టటం రైటు అని!

రమణగారి రచనల గురించి ఇక్కడ చెప్పటం, హనుమంతుడి ముందు గుప్పికంతులు వేసినట్టే! అందుకే ఆయన రచనల మధుర స్మృతులు మీకే వదిలేస్తున్నాను.

పంథొమ్మిది వందల అరవై – డెభైలలో అనుకుంటాను, రమణగారు గవర్నమెంటాలిటీ అనే కథ వ్రాశారు. ఆయన వ్రాసిన కథలు, పుస్తకాలూ అప్పటికే జీర్ణించుకుని ఆయనకి వీరాభిమానిగా మారిపోయిన నాకు, ఆ కథ ఎంతో నచ్చింది. అదీకాక ఆంధ్రప్రదేశపు ప్రభుత్వంలో రెండేళ్లు ఉద్యోగం వెలగబెట్టి, ఇక బెట్ట లేక, ఆ లంచాల అరాచకాన్ని భరించలేక, తిరువనంతపురంలో విక్రమ్ సారాభాయ్ స్పేస్ సెంటర్లో చేరాను. అమెరికా వచ్చాక ఆ ఆంధ్రప్రదేశ ప్రభుత్వంలోని నా చేదు  అనుభవాల్ని కాస్త హాస్యం, వ్యంగ్యం రంగరించి, గవర్నమెంటాలిటీ కథలు అని పధ్నాలుగు కథలు వ్రాస్తే, రచన మాసపత్రికలో శాయిగారు శీర్షికగా ఒక సంవత్సరం పైన ప్రచురించారు. ఎంతో మంది మిత్రులూ అభిమానులూ ఆ కథలు నచ్చాయనీ, పుస్తక రూపంలో తెమ్మని అడిగారు. రమణగారి చేత  ముందు మాట వ్రాయించుకొని, ఆ పుస్తకాన్ని ప్రచురించాలని ఆశ పడ్డాను. ఆయనకి వ్రాతప్రతి పంపించి, ముందు మాట వ్రాయగలరా అని అడిగితే, గలను అన్నారు, టీవీ భాగవతం సీరియల్ వ్రాస్తూ ఎంతో బిజీగా వుంటూ కూడాను. మళ్ళీ ఇంకోసారి సంతోషంతో ఎగిరి గంతులు వేయాల్సి వచ్చింది.

అంత బిజీగా వున్నా రమణగారు ముందుమాట అద్భుతంగా వ్రాశారు. నా కథలు పధ్నాలుగూ త్రాసులో ఒక పక్కన పెట్టి, ఆయన వ్రాసిన రెండు పేజీలు ఇంకో పక్కన పెడితే, తులసిదళంలా అదే బరువు తూగుతుంది.

“అసలు ఈ గవర్నమెంటాలిటీలూ, ఈ అవినీతి భాగోతాలూ మన వేదాలలోనే వున్నాయిష. వేదాలేమిటి, వాటిని పల్కించిన పురుషోత్తముడు సాక్షాత్ శ్రీమహావిష్ణువువారి వైకుంఠద్వారంలోనే ఆరంభామయాయిష! కలియుగంలో ఇదేమీ గొప్పకాదు. సనక, సనందన, సనత్కుమార, సనత్సుజాత బాలరూప ఋషులను, ద్వార పాలకులు జయవిజయులు గడప దగ్గరే, మద అహంకారాల కొద్దీ పో పొమ్మని అవమానించారు. దానితో వాళ్ళు కోపగించి, మామూళ్ళు ఇచ్చే బదులు, వాళ్లకి మామూలయిన శాపం ఇచ్చారు. విష్ణుమూర్తి పరుగున వచ్చి, తప్పు తన సేవకులదయినా వైకేరియన్ లయబిలిటీ సూత్రం ప్రకారం, బాధ్యత యజమానిగా తనదేనని చెప్పి, ఋషులని సముదాయించాడు. ఆయన ఆశ్రిత పక్షపాతం అంతటిది. దరిమిలాను ఏడు జన్మల కాలం భక్తులుగా, మంచివాళ్ళుగా బ్రతుకుతూ స్వామికి దూరంగా వుండలేమనీ, రాక్షసులుగా పాపాలూ పాడు పనులూ చేసి మూడు జన్మల్లోనే వెనక్కొచ్చేస్తామనీ వాళ్ళు వేడుకుంటే, వాళ్ళ ‘ఇది’కి పొంగిపోయిన స్వామివారు ‘సరే! అలాగే కానీయండి’ అన్నారు. దానివల్ల ఆ సేవకులు రాక్షసులై పుట్టి ముల్లోకాలనూ నానా హింసా పెట్టారు. సేవకులపై స్వామి కరుణ అమాయకులపై హింసకు అలా దారి తీసింది. తప్పు చేసినా తన వాళ్ళని కాపాడటం అనే గవర్నమెంటాలిటీ కూడా ఆ కాలంలోనే వుండేదష మరి!”

“మొత్తం మీద ఒక్క నిజాన్ని అందరూ గుర్తించటం శ్రేయస్కరమని తోస్తుంది. లంచం తీసుకునేవాడిది తప్పు అయితే, ఇచ్చేవాడిది తప్పుముప్పావు.. నిజానికి వీళ్ళందరూ కలిసి నడిస్తే, లంచం తీసుకునే వాళ్లందరూ చితికిపోతారు. కానీ వీళ్ళు, మనవాళ్ళు – కలవరు కదా! ఐకమత్యం లేదు గదా! అది లేకనే కదా గవర్నమెంటు. దానివల్లనే కదా గవర్నమెంటాలిటీ!” అన్నారాయన.

 satyam1

తర్వాత చాల రోజులకి ఇండియా వెళ్లాను. బెంగుళూరులో పని పూర్తిచేసుకుని, మద్రాసు మీదుగా గుంటూరుకి బయల్దేరాను. కాస్తో కూస్తో ముఖాముఖి పరిచయం వుంది కనుకా, వారి భక్తుడిని కనుకా, కొంచెం చనువు తీసుకుని ముందుగానే బాపు-రమణగార్లకు ఫోన్ చేశాను. వీలయితే మద్రాసులో దిగి ఒక మధ్యాహ్నం మీతో గడపాలని వుంది, మీకు ఫరవాలేదా అని అడిగాను. ఫరవా లేదంటే లేదన్నారు బాపుగారు. అయ్యో తప్పకుండా రండి అన్నారు రమణగారు. మా ఇల్లు ఎక్కడ అంటే ఆటో అతనికి తెలీదు, మాముట్టి ఇంటికి ఎదురుగా అని చెప్పండి ఏ ఇబ్బందీ లేకుండా తీసుకువస్తాడు అన్నారు బాపుగారు.

ఆయన చెప్పినట్టుగానే, మద్రాసు సెంట్రల్ స్టేషన్లో దిగగానే ఆటో ఎక్కి మాముట్టి ఇంటికి పోనిమ్మన్నాను. ఆటో అంకుల్ (ఇప్పుడు ఇండియాలో ఆటోవాడు అనకూడదు) నావేపు ఒక మలయాళం చూపు విసిరి, మెరీనా బీచ్ మీదుగా మాముట్టి ఇంటికి తీసుకు వెళ్లాడు. అప్పుడు మధ్యాహ్నం దాదాపు పన్నెండు గంటలయింది. ఆ ఎండలో, తెల్లటి చొక్కా లుంగీ వేసుకుని, ఇంటి ముందర ఎండలో నుంచొని వున్నారు రమణగారు. నన్ను చూడగానే, నవ్వుతూ “అమ్మయ్య! వచ్చేశారా, రండి” అంటూ ఆహ్వానించారు.

నేనూ చేతులు జోడించి “నమస్కారం, గురువుగారు. ఎండలో నుంచున్నారేమిటి సార్!” అన్నాను.

“ఏం లేదు. మీకు ఈ రోడ్లు కొత్త కదా.. కనుక్కోవటం కష్టమేమోనని.. “ అన్నారాయన.

“అదేమిటి సార్! అమెరికానించీ ఇక్కడికి వచ్చినవాడిని, స్టేషన్నించి మీ ఇంటికి రాలేనా.. పెద్దవారు ఎండలో నిలబడ్డారు..” అన్నాను నొచ్చుకుంటూ.

ఆయన నవ్వి, భుజం మీద చేయి వేసి “పదండి!” అని ఇంట్లోకి తీసుకు వెళ్లారు.

బాపూగారికి కూడా నమస్కారం చేశాను. రమణగారు బాసింపట్టు వేసుకుని కుర్చీలో కూర్చుంటే, బాపుగారు బాసింపట్టు వేసుకుని నేలమీద కూర్చున్నారు. నేనూ బాపుగారికి ఎదురుగా బాసింపట్టు వేసుకోకుండా, వజ్రాసనం వేసుకుని నేల మీదే కూర్చున్నాను.

ఆ మధ్యాహ్నం నేను ఏనాటికీ మరువలేని రోజు. సాహిత్యం, సంగీతం, సినిమాలు… ఎన్నో విషయాలు.  బాపు-రమణగార్లతో మాట్లాడటమే ఒక పెద్ద ఎడ్యుకేషన్. నేనూ ఎన్నో పుస్తకాలు చదివాను కనుక, తెలుగు సాహిత్యం అంటే  నాకు ప్రాణం కనుక, ప్రతి నిమిషం ఒక అనుభూతిని మిగిల్చింది. మందహాసాల నించీ అట్టహాసాల దాకా పడీ పడీ నవ్వించిన రోజు. భలే మంచి రోజు! పసందైన రోజు!!

“గోదావరి కథలు చదివారా?” అని అడిగారు రమణగారు. లేదన్నాను.

“అదేమిటి. మీరు తప్పకుండా చదవాలి. ఉండండి నా కాపీ ఇస్తాను” అని అది తెచ్చి ఇచ్చారు.

“అయ్యో! ఇది మీ పుస్తకం. మీరు వుంచుకోండి. నేను విశాలాంధ్రలో కొనుక్కుంటాను” అన్నాను.

“ఏం ఫరవాలేదు. తీసుకోండి” అన్నారాయన.

“పోనీ, చదివి పోస్టులో తిరిగి పంపిస్తాను” అన్నాను.

“లేదు, అచ్చంగా వుంచుకోండి” అన్నారు నవ్వుతూ.

అంతేకాదు, ఆయనకి నా గవర్నమెంటాలిటీ కథలు బాగా గుర్తున్నాయి.

“అందులోని మీ సరస్వతీ నమస్తూభ్యం కథ నాకు బాగా నచ్చింది. అలాటి విషయం మీదే నామిని సుబ్రహ్మణ్యం నాయుడుగారు చదువులా చావులా అని ఒక పుస్తకం వ్రాశారు. మీకు బాగా  నచ్చుతుంది. నా దగ్గర ఒక కాపీ వుంది. తీసుకోండి” అని, వద్దన్నా వినకుండా అది కూడా తెచ్చి ఇచ్చారు.

తర్వాత వారితోపాటే అక్కడ భోజనాలు. భాగ్యవతిగారు, శ్రీదేవిగారు దగ్గర వుండి ఎంతో అప్యాయంగా,

ఆత్మీయంగా అన్నీ అడిగి, అడిగి వడ్డించారు.

భోజనాలయాక మళ్ళీ రమణగారు కుర్చీలో, బాపుగారు నేల మీదా బాసింపట్టు వేసుకుని కూర్చున్నారు. “ఇక వెడతాను సార్! ట్రైనుకి సమయమయింది. వెళ్ళేముందు మీ పాదాలకి దణ్ణం పెట్టి వెడతాను. కాళ్ళు

చాపండి” అన్నాను, ఆ బాసింపట్టు లోపల భద్రంగా దాచుకున్న పాదాలను  చూస్తూ.

“మీరు అమెరికా వాళ్ళు, షేక్ హ్యాండ్ ఇవ్వండి చాలు” అన్నారు రమణగారు.

“నేను అమెరికాలో వుంటున్నా, భారతీయుడినే సార్! కాళ్ళు చాపరూ..” అన్నాను.

ఆయన కాళ్ళు క్రిందికి దించారు. పాదాభివందనం చేశాను.

“బాపుగారూ, మీరూ కాళ్ళు చాపండి” అడిగాను.

“నేను నా కాళ్ళు ఇవ్వనుగాక ఇవ్వనుగాక ఇవ్వను” అన్నారు బాపుగారు కాళ్ళు ఇంకా ముడుచుకుంటూ.

“అదేమిటి సార్! నాకు తృప్తిగా వుంటుంది.. మీరు కాళ్ళు చాపేదాకా నేను వెళ్ళను. తూర్పు వెళ్ళే రైలు తప్పిపోతుంది. ప్లీజ్..” అన్నాను.

ఆయన పాదాలు ముందుకి పెట్టారు. నేను పాదాలకి నమస్కరించాను.

రమణగారు చెప్పులు వేసుకుంటూ, “రండి మా కారులో వెడదాం” అన్నారు.

“వద్దండీ ఈ ఎండలో మీరెందుకు.. నేను ఆటో తీసుకు వెడతాను” అన్నాను.

“ఏం ఫరవాలేదు.. పదండి” అన్నారు రమణగారు.

వాద ప్రతివాదాలయాక, న్యాయవాది బాపుగారు “పోనీ వెంకట్రావ్ రాడులెండి. మా డ్రైవర్ మిమ్మల్ని దించి వస్తాడు” అన్నారు జడ్జిమెంట్ ఇస్తూ.

కారులో స్టేషనుకి వెడుతుంటే, నా కెందుకో కళ్ళల్లో నీళ్ళు తిరిగాయి. బాపు రమణలు వారివారి రంగాల్లో ఎంతో గొప్పవాళ్ళు. చిత్రకళారంగంలోనూ, సినిమారంగంలోనూ, సాహిత్యంలోనూ తిరుగులేని మనుష్యులు. ప్రప్రంచ ప్రఖ్యాత ప్రముఖులు. వయసులో నాకన్నా ఎంతో పెద్దవారు. మరి నేనో.. రమణగారి బుడుగు భాషలో చిన్నవాడిని, ఎంతో చితకవాడిని. అసలు నేను వాళ్లకి ఏమవుతాను? స్వంత ఇంటి మనిషిలా నా మీద ఇంత ప్రేమ, అభిమానం, ఆప్యాయత ఎందుకు చూపించాలి? రమణగారు మిట్ట మధాహ్నం మండుటెండలో అలా నుంచొని ఎదురు చూస్తున్నారే, ఎందుకు? దానికి ఒక్క మాటలో ఒక్కటే సమాధానం. అది వారి సంస్కారం. అక్కడ నేను.. నేను కాకుండా ఇంకెవరైనా వున్నప్పుడు కూడా, బాపు రమణగార్లు అలాగే గౌరవమిస్తారు. ఆ గౌరవం నాకు దక్కింది కానీ, వాళ్ళు ఇచ్చిన గౌరవం నిజంగా వారి సంస్కారానికి! వారి సహ్రుదయతకి!

తర్వాత ఏడేళ్ళకి, 2007లో హైదరాబాదులో వంగూరి ఫౌండేషన్ వారి ప్రప్రధమ ప్రపంచ తెలుగు సాహిత్య సదస్సు జరిగింది. అక్కడ బాపు రమణల స్నేహానికి షష్ఠిపూర్తి ఘనంగా జరిపారు మిత్రులు వంగూరి చిట్టెన్ రాజు. బాపు రమణగార్లని పరిచయం చేస్తూ, ఒక వ్యాసం వ్రాసి చదవమంటే, వెంటనే ఒప్పేసుకుని నా ప్రాణం పెట్టి చక్కటి వ్యాసం వ్రాసి, వారిని పరిచయం చేశాను. ఆ రోజే నా ఎన్నారై కబుర్లు ఒకటి, మరోటి పుస్తకాలు బాపు రమణగార్లు ఆవిష్కరించారు.

అంతకన్నా నాకు జీవితంలో కావలసిందేముంది!

రమణగారి రచనల్లో నన్ను బాగా ఆశ్చర్యపరిచే విషయం ఒకటుంది. సరదాగా వ్రాస్తూనే, హఠాత్తుగా సాంఘిక, రాజకీయ, మానవతావాదంతో చెంప చెళ్లుమనేలా కొట్టి మరిచిపోకుండా చేసే రచనా చాతుర్యం.

మచ్చుకి కొన్ని: (అంటే అరడజను)

“నవ్వొచ్చినప్పుడు ఎవడైనా నవ్వుతాడు, ఏడుపొచ్చినప్పుడు నవ్వేవాడే హీరో”

“సిఫార్సులతో కాపురాలు చక్కబడవు”

“సత్యాన్వేషికి సమాధానమేమిటని ఒక గణిత శాస్త్రజ్ఞుడిని అడిగితే స్క్వేర్ రూట్ ఆఫ్ మైనస్ వన్ అంటాడు”

“పగటి కల అనేది మనిషికి దేవుడిచ్చిన వరం. మనసులో పేరుకుపోయిన దురాశలనీ నిరాశలనీ, అందీ అందని ఆశలుగా పరిమార్సివేసే మందు. మితంగా సేవిస్తే, గుండెకూ, కండకూ పుష్టినిచ్చే దివ్యౌషధం”

“టైము అనగా కాలము. చాల విలువైనది. బజార్లో మనం మిరపకాయలు కొనగలం. చింతపండు కొనగలం. ఇడ్లీలు, కిడ్నీలు కొనగలం. గొడుగులు, గోంగూర కొనగలం. బాల్చీలు, లాల్చీలు కొనగలం. కానీ కాలాన్ని మాత్రం కొనలేం. కాలాన్ని వృధా చేయటం క్షమించరాని నేరం”

“వారానికి అర్ధ రూపాయి ఇస్తే, రోజూ హోటల్ భోజనపు ఎంగిలాకులన్నీ నువ్వొచ్చే వరకు వుంచి, నువ్వు రాగానే పడేస్తా!”

ఇలాటివి చదువుతుంటే, శ్రీశ్రీలా ఆకలేసి కేకలే వెయ్యఖ్కర్లేదు, రమణగారిలా ఆకలేసినప్పుడు జోకులేసి కూడా చెప్పొచ్చు అనిపిస్తుంది.

దటీజ్ రమణ!

వెంకట రమణ!!

ముళ్ళపూడి వెంకట రమణ!!!

మీరు ఎక్కడికీ వెళ్ళలేదు సార్!

ఇక్కడే సజీవంగా వున్నారు!

మీ రచనల్లో!

తెలుగు సాహిత్యంలో!

మా హృదయాల్లో!

0                           0                           0

 

సంజీవదేవ్ జీవితమే ఒక కళ!

san2

అమెరికా సందర్శించే యాత్రికులెవరైనా న్యూయార్క్ నగరంలో అప్ టౌన్ లో 107 వ వీధిలోకి వెడితే నికొలస్ రోరిక్ మ్యూజియం కనిపిస్తుంది. అందులో సంజీవదేవ్ కు రష్యన్ చిత్రకారుడు రోరిక్ కు జరిగిన ఉత్తర ప్రత్యుత్తరాలు భద్రపరిచారు. లోగడ ఈ మ్యూజియంను సందర్శించినవారిలో మిత్రుడు చలసాని ప్రసాద్ ఉన్నారు. ఆయన ఆసక్తిని వెతుక్కుంటూ వచ్చిన ధోరణిని గమనించిన మ్యూజియం డైరెక్టర్ ఆయనకు ప్రత్యేకంగా ‘ఆర్ట్ పిక్చర్స్’ పుస్తకాన్ని బహూకరించారు. సంజీవదేవ్ చివరి రోజులలో ఈ ఉత్తర ప్రత్యుత్తరాలను మ్యూజియంకు బహూకరించమని నేను కోరాను. ఆయన ఒక పట్టాన ఒప్పుకోలేదు. నేను పట్టు వదలక నేడు ‘మిసిమి’ సంపాదకుడుగా ఉన్న వల్లభనేని అశ్వనీకుమార్ ను తుమ్మపూడి పంపించాను. అమెరికా నుండి సంజీవదేవ్ కు ఫోన్ చేసి ఆ ఉత్తరాలు నికొలస్ రోరిక్ మ్యూజియంలో ఉంటే వాటికి భవిష్యత్తు ఉంటుందని, సరైన చోటికి చేరినట్లుంటుందని నచ్చచెప్పాను. ఆయన ఆ ఉత్తరాలను కుమార్ కు అప్పగించగా అవి భద్రంగా మ్యూజియంకు చేర్చారు. ఎంతో సంతోషించాను.

జీవిత చివరి దశలో కులు వాలీలో స్థిరపడిన నికొలస్ రోరిక్ ను కలిసి కొన్నాళ్ళు ఆయనతో గడిపిన సంజీవదేవ్ ప్రకృతిని ఆయనతో కలిసి ఆస్వాదించి, కబుర్లు చెప్పుకుని పరస్పరం చిత్రాలు వేసుకున్నారు. కళాకారుడుగా సంజీవదేవ్ కు అది గొప్ప అనుభూతి.

గుంటూరు జిల్లా తెనాలి తాలూకా తుమ్మపూడి గ్రామంలో పుట్టి, చిన్నతనంలో కొన్నాళ్ళు కృష్ణాజిల్లాలో బంధువుల దగ్గర పెరిగిన సంజీవదేవ్ చదువులో స్కూలు దాటి పోలేదు. పిన్న వయసులోనే ఉత్తరాది సాహస పర్యటన చేసి అనేక అనుభవాలతో తిరిగి వచ్చారు. ఆయనలోని ప్రతిభను పసిగట్టిన నార్ల వెంకటేశ్వరరావు ఆంధ్ర ప్రభ సంపాదకుడుగా సంజీవదేవ్ రచనలను, జీవితాన్ని దినపత్రికలో ప్రచురించి ప్రజలకు అందించారు. అంచెలంచెలుగా జీవిత అనుభవాలను రాసిన సంజీవదేవ్ ‘గతంలోకి’, ‘స్మృతిబింబాలు’, ‘తెగిన జ్ఞాపకాలు’ అంటూ గ్రంథస్తం చేశారు. బెంగాలీ ప్రభావం మరికొంత హిందీ ప్రభావం ఆయనపై ఉన్నా, రచనలలో కొత్తరకమైన తెలుగుదనాన్ని చూపారు. వాక్య నిర్మాణం, పదప్రయోగాలలో వినూత్నత కనిపిస్తుంది.

సంజీవదేవ్ కు విస్తృత పరిచయాలున్నాయి. రాహుల్ సాంకృత్యాయన్, అసిత్ కుమార్ హల్దార్, భగవాన్ దాస్ (లెన్స్ లైన్ పత్రిక సంపాదకుడు), దేవులపల్లి కృష్ణశాస్త్రి, బెజవాడ గోపాలరెడ్డి, ఆచంట జానకిరామ్, గొర్రెపాటి వెంకట సుబ్బయ్య వంటివారి పరిచయాలతో చాంతాడంత జాబితా తయారవుతుంది.  ఆయన లేఖారాక్షసుడు. ఎవరిదగ్గర నుంచైనా ఉత్తరం వచ్చిందే తడవుగా సమాధానాలు రాసి పోస్టు చేసేవారు. కొందరికి తాను గీసిన బొమ్మలు కూడా జతపరిచేవారు. ఆ లేఖలన్నీ చాలావరకూ గ్రంథాలలో తొంగిచూశాయి. సంజీవదేవ్ చేత పీఠికలు రాయించుకున్నవారు చలం దగ్గర నుండి తపస్వి వరకు ఎందరో ఉన్నారు. సంజీవదేవ్ మాత్రం తుమ్మపూడి గ్రామం వదలలేదు. పెద్దా చిన్నా అందరూ ఆయన దగ్గరకే వచ్చేవారు. కొందరు రోజుల తరబడి ఆయన భార్య సులోచన ఆతిథ్యం స్వీకరిస్తూ ఇంట్లోనే ఆయన చెప్పేవి వింటూ ఆనందించేవారు. ఆంధ్ర విశ్వవిద్యాలయం వారు ఒక దశలో డాక్టరేట్ డిగ్రీ ఇవ్వబోగా సంజీవదేవ్ నిరాకరించారు. అప్పుడు డిలిట్ డిగ్రీ ఇవ్వగా ఆయన స్వీకరించారు.

san1

సంజీవదేవ్ తో నా సన్నిహిత పరిచయ వయస్సు 35 ఏళ్ళు. కొన్నిసార్లు  ఆయన మా ఇంటికి రావడం మా పిల్లలకు బొమ్మలు గీసి ఇవ్వటం, మరికొన్నిసార్లు నేను కోమలతో సహా తుమ్మపూడి వెళ్ళి ఆయన ఆతిథ్యాన్ని స్వీకరించి, బోలెడు కబుర్లు చెప్పుకోవడం మంచి మధురానుభూతి. 1970 ప్రాంతాలలో నేను, చీమకుర్తి భాస్కరరావు, వెనిగళ్ళ వెంకటరత్నం, శ్రీరమణగా మారిన రాధాకృష్ణ కలసి సంజీవదేవ్ పుస్తకాలు ప్రచురణకు పూనుకున్నాం. ఇంగ్లీషులో రెండు, తెలుగులో రెండు స్టేట్ బుక్ క్లబ్ పేరిట ప్రచురించాము. అంతటితో ఆ ప్రయత్నం ఆగిపోయింది.

సంజీవదేవ్ తో నేను కొన్ని విశిష్టమైన వ్యాసాలు రాయించాను. తెనాలిలో మిత్రులు సూర్యదేవర హనుమంతరావుతో కలసి తుమ్మపూడి వెళ్ళి, ఆచార్య నరేంద్రదేవ్ రాసిన ‘బౌద్ధధర్మదర్శన్’ గ్రంథాన్ని ఇచ్చి, దాని ఆధారంగా వ్యాసం రాయమన్నాను. ఆయన నిర్దుష్టమైన వ్యాసం రాసి, ‘ప్రసారిత’ సామాజిక త్రైమాస పత్రికకు అందించారు. ఆ పత్రికను నేను, పోలు సత్యనారాయణ సంపాదకులుగా హైదరాబాదు నుండి కొన్నేళ్ళు నడిపాము. సంజీవదేవ్ కు ఎవరైనా కోరితే రాసే అలవాటు ఉంది. చాలా పత్రికల వాళ్ళు అలాగే రాయించుకునేవాళ్ళు. అందులో చిన్నా పెద్దా అనే తారతమ్యం చూసేవారు కాదు. అదీ ఆయన గొప్పతనం.

సంజీవదేవ్ హైదరాబాదు వచ్చినప్పుడల్లా తెలుగు యూనివర్సిటీలో గాని, అకాడమీలో గాని చిన్న సమావేశం ఏర్పాటు చేసేవారు. సంజీవదేవ్ రంజింపజేసే ఉపన్యాసకుడు కాదు. విషయ పరిజ్ఞానం ఉంటుంది కానీ, ఆకర్షణ కనిపించదు.

ఇంగ్లీషులో కొన్ని రచనలు, కవితలు, రాసిన సంజీవదేవ్ ఒక విధంగా పరోక్ష జీవిత చరిత్రను – హర్ లైఫ్ – అనే రచనలో ప్రతిబింబించారు. నేను అది చదివి అందులోని హీరోయిన్ మానస నీ జీవితాన్ని అద్దం పడుతున్నట్లున్నదే అన్నాను. కాదనలేదు గాని సమాధానంగా నవ్వి ఊరుకున్నారు.

san3

సంజీవదేవ్ కు నాకూ కామన్ గా అనేక మంది మిత్రులున్నారు. అందులో కొందరితో కలిసి మేము తుమ్మపూడి వెళ్ళి వస్తుండేవాళ్ళం. ‘రేపు’ పత్రిక సంపాదకుడు సి. నరసింహారావు, తుమ్మల గోపాలరావు, మండవ శ్రీరామమూర్తి ఉన్నారు. నేనూ, కోమల వెళ్ళినప్పుడు  కలసి భోజనం చేస్తుండగా ఆయన ఆవకాయ పచ్చడితో అన్నం కలిపి ఎర్రని రంగును సూర్యోదయం వలె ఉన్నది కదూ అంటూ భుజించేవారు. నాకు మాత్రం చూస్తుంటేనే కళ్లలోకి నీళ్ళొస్తున్నాయి, తింటే ఎలా వుంటుందో అనే వాణ్ణి. జీవితంలో కళాత్మకంగా గడవడం సంజీవదేవ్ ఆర్ట్. హైదరాబాదు వచ్చి, నార్ల వెంకటేశ్వర రావు ఇంట్లో ఉన్నప్పుడు నార్ల ‘గ్రంథాలయంలో ఉంటున్నాడు ఇంట్లో కాదు’ అనేవారు. నార్ల ఇల్లంతా పుస్తకాల మయం కావటమే అందుకు కారణం. జగదీష్ మిట్టల్, పి.వి.రెడ్డి వంటి కళాకారులతో సంప్రదిస్తుండేవారు. తెలుగు అకాడమీ సంజీవదేవ్ ను ఆహ్వానించి, ఆయన చేత రచనలు చేయించుకున్నది. అప్పుడే శ్రీధర్ (ఆర్టిస్ట్)  వంటివారు ఆయనకు తోడ్పడ్డారు. ఒకేఒకసారి అమెరికా వచ్చి తానాలో కూడా పాల్గొన్నారు.

మేమిద్దరం కలిసి కొన్ని సందర్బాలలో ఆలపాటి రవీంద్రనాథ్ (జ్యోతి, మిసిమి పత్రికల సంపాదకులు) ఇంట్లో ఇష్టాగోష్ఠిగా కాలక్షేపం చేసేవాళ్ళం. తనకెలాంటి నియమాలూ పట్టింపులూ లేవని సంజీవదేవ్ అన్నారు. లోగడ ఆయన ఆవుల గోపాలకృష్ణమూర్తిని ఒక విందులో సరదాగా ఏడిపించారు. అది శాకాహార, మాంసాహార విషయాలలోనూ, సిగరెట్టు పీల్చే విషయంలోనూ వచ్చింది. అది గుర్తుంచుకొని ఆయనకు చిన్న పరీక్ష పెట్టాము. భోజనానికి ముందు వేదోక్తంగా కొంచెం ఔపోసన పడదాం అన్నాము. మన రుషుల సంప్రదాయంలో మనం కూడా సోమపానం సేవిద్దాం అన్నాము. మా ముందు విదేశీ విస్కీ ఉన్నది. గ్లాసులలో పోసి ఇవ్వగా, అన్నమాట తిప్పుకోలేక ఆయన కొంచెం చప్పరించక తప్పలేదు. ఈ విషయం తెలిసిన ఆయన శిష్యపరమాణువులు కొందరు గురువుగారి చేత విస్కీ సేవింపచేసిన మీ సాహసం చాలా గొప్పదని అన్నారు. మేము కేవలం చమత్కారంగా చేసిన పని అది.

సంజీవదేవ్ పై అనేక వ్యాసాలు కవికుమార్ సేకరించగా, నేను ఎడిట్ చేసిన ‘సంజీవదేవ్ రచనల సమీక్ష, విశ్లేషణ’గా వెలువరించాము.

సంజీవదేవ్ చనిపోతున్న రోజులలో నేను అమెరికాలో ఉన్నాను. ఆ తరువాత మిత్రులు భాస్కరరావు వెబ్ సైట్ (www.sanjeevadev.tripod.com) ఏర్పరచగా అందుకు నేను పూర్తిగా సహకరించాను.

Photograph (197)

ఒక సభలో ఇన్నయ్య, సినారె, సంజీవ దేవ్

సంజీవదేవ్ తన అవగాహనలోకొచ్చిన ఏ విషయాన్నయినా తెలుగులో గాని, ఇంగ్లీషులో గాని అవలీలగా రాయగలరు. ఆయన రచనలు ఇంచుమించు అన్నీ వెలుగు చూశాయి. వాటిలో కొన్ని పునర్ముద్రణ కావలసి ఉన్నది. చలం ‘గీతాంజలి’కి సజీవదేవ్ రాసిన సుదీర్ఘ పీఠికను ఉత్తరోత్తర వచ్చిన ప్రతులను ఎందుకోగాని తొలగించారు. జెన్ బౌద్ధంపై ఎంతో బాగా రాశారు. వీటన్నింటికి మించి, సుప్రసిద్ధ చిత్రాలెన్నో వేయగా ఎస్వీ రామారావు మొదలైన చిత్రకారులు ఆశ్చర్యపడ్డారు కూడా.

జుట్టుతో ఉన్న సంజీవదేవ్ ను ఎవరైనా చూశారా అని, కనీసం ఫోటోలైనా ఉన్నాయా అని నేను అడుగుతుండేవాడిని. చూశామన్నవారు నాకు కనిపించలేదు. సంజీవదేవ్ పెళ్ళి ఫోటోను సి. భాస్కరరావు సేకరించి వెబ్ సైట్లో పెట్టినట్లు గుర్తు. ఏమైనా ఒక అరుదైన విశిష్ఠ మానవుడు సంజీవదేవ్. తన తత్వాన్ని లోతుపాతులతో కూడిన ఆలోచనలను Bio symphony  అనే ఇంగ్లీషు రచనలో ఆయన స్పష్టీకరించారు.

బాలబంధు బి.వి.నరసింహారావు అత్యద్భుతంగా రాసిన పాలపిట్టలు గేయాలను సంజీవదేవ్ ఇంగ్లీషులోకి అనువదించారు. అది పునర్ముద్రణ కావలసిన అంశం. సంజీవదేవ్ కు మూఢనమ్మకాలు, మతఛాందసాలు, బాబాలకి ప్రదక్షిణలు లేవు. ఆయన స్వేచ్ఛా ప్రియుడైన కళాజీవి.

 

సృజనలో అబద్ధాన్ని భస్మం చేసిన త్రినేత్రుడు త్రిపుర

 

నాటి-నేటి త్రిపుర

“మీరు డాంటెలాగ జీవితపు లోతుల్ని తవ్వుకుంటూ, వెతుక్కుంటూ అలా ఓవర్ కోటు వేసుకుని, పలచబడుతున్న జుట్టుతో ప్రపంచంలోని విషాదాల్నీ, బాధల్నీ భుజాన వేసుకుని మొగల్ సరాయ్ ప్లాట్ ఫాం మీద తిరుగుతున్నారు. మీ బియట్రిస్ మీకు ఎప్పుడో దొరుకుతుంది. నేను కుంటి కాలుతో ఇక్కడ ఈ కుర్చీలో సరిగ్గా నిద్ర పట్టక చస్తున్నాను”

పాతికేళ్ళ వయసులో పై వాక్యాలు మొదటిసారి చదివినప్పుడు డాంటే సంగతేమో తెలీదుగానీ ఈ రచయిత మాత్రం ప్రపంచంలోని విషాదాన్నీ, బాధల్నీ భుజాన వేసుకుని తిరుగుతున్నట్టూ, నేనేమో నిస్సహాయంగా ఆ కుర్చీలో కూలబడ్డట్టూ అనిపించింది. ఆ కథలు చదివాకా నాలోని అస్పష్టమైన తపనకీ, అలజడికీ ఆయన అక్షరరూపం ఇచ్చినట్టు అనిపించింది. అందుకే ఆ అక్షరాలు నన్ను తీవ్రంగా వెంటాడేయి. రాత్రులు రాత్రులు ఆ కథలతోనే గడిపాను. ఆయనలా రాద్దామని ప్రయత్నించి చేతులు కాల్చుకున్న సందర్భాలెన్నో!

“జ్ఞాపకాల ముక్కల అస్తవ్యస్తపు సముదాయమే జీవితం కాబోలు. మనం ఉందనుకున్న పేటర్న్ అసలు ఉన్నది కాదు. మానవ జీవితం మీద మనం మన అవసరాల కోసం ఇంపోజ్ చేసింది. ఆ పేటర్న్ లేకపోతే జీవితం సాగదు”

 “కానీ ఇంకా నీ రహస్య మూలల అస్తిత్వపు లోతుల్లో మొహం చెల్లని అపరాధ భావనలో నువ్వింకా ఊపిరొదుల్తునే ఉన్నావు తెలివాన దారాల పరదాల కిటికీ అద్దాల మీద ఈ ప్రపంచాన్ని మరోసారి దర్శిద్దామని ఆశిస్తూ”

 “తుడవాలి. ఇనప చీపుళ్ళు పెట్టి దేశాన్ని తుడవాలి. మిగిలిన చెత్తని కాల్చాలి. ఒకసారి అంతా కాల్చి శుభ్రం చెయ్యాలి”

 “అంచనానాలూ, పద్దతులూ, చరిత్రలూ, చరిత్ర నేర్పే పాఠాలూ మరిచి, వదిలి, క్షణ క్షణం ఎదురయ్యే జీవితాన్ని ఎదుర్కొంటూ గడిపితే?”

 “జీవితంలో ఎప్పుడోగాని సమయాలు రావు, మనిషి శక్తినంతటినీ పరీక్షించేందుకు. ఆ సమయాల్లోనే నిద్రకళ్ళతో జవాబులిచ్చానా? ఇచ్చిన జవాబులూ, చేసిన పనులూ, వాటి అర్ధాలను వెతుక్కోవడం.. ముళ్ళు బిగుస్తాయి.. విప్పబోతే ఇంకా గట్టిగా..”

ఆయన కథనంలో ఒక మహానదికున్నంత వేగం ఉంది. అందుకే ఆ ప్రవాహంలో కొట్టుకుపోనివాళ్ళు అరుదు. ముందునుంచీ ఎక్కువ చదువుకున్నదీ, ఎక్కువ ఇష్టపడ్డదీ కవిత్వమేననీ అందుకే తన వచనం కూడా కవిత్వంలాగే వుంటుందనీ అంటారాయన. ఆ అక్షరఝరి ఎవరిదో ఈ పాటికే మీకు అర్ధమై ఉండాలి. “నేను ఇలాంటి కథలు రాయగలనా” అని పాలగుమ్మి పద్మరాజు గారి చేత అనిపించిన కథకుడు త్రిపుర. రమణ జీవి మాటల్లో చెప్పాలంటే “ప్రతి క్షణమూ అనుభవిస్తున్నప్పటికీ అపరిచితంగానే మిగిలిపోయే అస్తిత్వ సముద్రాన్నీ , దాని మీద గదులు గదులుగా నివసించే అర్ధపు నురగనూ ఏక కాలంలో స్పృశించిన త్రిపుర వంటి కథకుడు భారతదేశంలో మరొకరు లేరు”

చుట్టూ చీకటి

అలల కల్లోలం

దూరంగా చూడు

నిరంతరం నీ కోసం

కొండ మీద ఒక దీపం

తిరుగుతునే ఉంటుంది

దీపపు కాంతిని చూసి దీపాన్ని వెతుక్కున్నట్టు , పాట విని చెట్టు గుబురుల్లో పక్షిని వెతుక్కున్నట్టు నేను నా లైట్ హౌస్ త్రిపుర గారిని వెతుక్కున్నాను.

 * * *tripura1

                                                                                                                                                                                                                                                                        సుమారు ఆరేళ్ళ క్రితం అప్పటి అవగాహనతో ఒక కళాకారుడి అన్వేషణ గురించి అమరావ్రతం అనే కథ రాసాను. ఆ కథలో ఏదో లోపం ఉందని తెలిసేది గానీ అదేమిటో అంతుచిక్కేది కాదు. అలా దాదాపు ఏడాదిన్నర పాటు ఆ కథని ఎవరికీ చూపించకుండా అలా ఉంచేసాను. తర్వాత ఒకసారి పప్పు నాగరాజు గారికి పంపిస్తే ఆయన చదివి, “కథలో సాధన పరిపూర్ణత చెందని కళాకారుడు జీవితంలో దెబ్బలు తట్టుకోలేక గుడి మెట్లపై పడుకుంటే, ఊరి ప్రజలు బౌద్ధ గురువు దగ్గరకి వెళ్ళి అతని విషయం మొరపెట్టుకున్నట్టు ఉంటుంది. అది అతకదండీ. గురు శిష్యుల కలయిక ఎప్పుడూ ఒక ఏక్సిడెంట్. కానీ మరో ప్లేన్లో చూస్తే అది ఏక్సిడెంట్ కాదు. అలా ఉండాలి” అన్నారు. అప్పుడు దీపాలు వెలిగాయి. తర్వాత ఆ కథని మార్చి పూర్తి చేయడమూ, అది పొద్దులో ప్రచురితమవడమూ వేరే సంగతి.

త్రిపురగారితో నా మొదటి పరిచయం కూడా ఏక్సిడెంటల్ గానే జరిగింది. 2004 లో బెంగుళూరులో బాపు బొమ్మల కొలువు, ఇంకా కొన్ని పుస్తకాల ప్రదర్శన ఉందంటే వెళ్ళాం. అక్కడ పుస్తకాల్లో “త్రిపుర కథలు” పుస్తకం చూసాను. రచయిత పేరు వినలేదు. వాంగో “స్కేరీ నైట్స్” పెయింటింగ్ ఆ పుస్తకానికి కవర్ పేజీ.  లోపలి పేజీలు తిరగేసాను..

Who calls my poems poems?

My poems are not poems.

Knowing my poems are not poems

Together we can begin to speak of poetry.

— Ryokan

నాకు బాగా ఇష్టమైన జపనీ కవిత. ఈయనకి కూడా నచ్చిందే అని ఒక అబ్బురం. ఇంకేమీ ఆలోచించకుండా పుస్తకం కొనుక్కున్నాను. ఇంటికి వచ్చి మొదటి కథ”పాము” చదివాను. కొత్తగా ఉందే అనిపించింది. మిగతా కథలు కూడా చదివాను. మొదట్లో అర్ధం కాకపోయినా ఆ కథలు నన్ను చదివించాయి. మళ్ళీ మళ్ళీ చదివించాయి. ఆ కథల్లో కల్పించిన వాతావరణం అంతా నాకు కొత్త. బెనారస్ హిందూ యూనివర్సిటీ పరిసరాలు, మొగల్ సరాయ్ రైల్వే స్టేషన్, బర్మా ఇవన్నీ. వ్యక్తుల మనస్తత్వం కూడా నాకు కొత్త. ఉన్నత తరగతిలోంచి వచ్చిన మనుషులు. అయినా చిత్రంగా కథలన్నీ నాకు విపరీతంగా నచ్చాయి.

ఆయన పదాలతో బొమ్మ కట్టే తీరు, సముద్రపు హోరులో కెరటానికీ, కెరటానికీ మధ్య ఉన్న అమోఘమైన నిశ్శబ్దాన్ని తన కథల్లోకి ప్రవేశపెట్టగల ప్రజ్ఞ నన్ను అబ్బుర పరిచింది. రెండు మూడు బ్రష్ స్ట్రోక్స్ తోనే ఒక బొమ్మ గీయగల నేర్పు కూడా ఆయన కథల్లో చూడొచ్చు. సాఫీగా తాపీగా సాగే “అనగనగా…” కథలకి అలవాటు పడిన నన్ను ఒక్కసారిగా ఒక మహాప్రవాహంలోకి తోసేసినట్లైంది. మనిషి సాటి మనిషి కోసం చెయ్యగలిగిన త్యాగం ఒక వైపు, ద్రోహం మరోవైపు ఈ రెండిటి మధ్యా ఈయన కథలు ఊగిసలాడతాయి.

అక్షరాల్లోకి ఆత్మని పొదిగే మంత్ర విద్య ఏదో ఈయనకి పట్టుబడినా కేవలం పదిహేను కథలు మాత్రమే రాసి పెన్ను మూతపెట్టీసిన కథకుడాయన. త్రిపుర గారు గత పాతికేళ్ళ నుంచీ వైజాగులోనే ఉంటున్నా , చాలా సార్లు బీచ్ కి వెళ్ళినప్పుడు పాండురంగాపురం డౌన్లోంచే వెళ్ళినా, ఆ సముద్రపొడ్డున చిన్న అపార్టుమెంటులో మరో సముద్రం నివాసం ఉందని నాకు తెలీలేదు. 2011 లో కనక ప్రసాద్ గారు, మరొక త్రిపుర గారి వీరాభిమాని రామయ్య గారు వీళ్ళిద్దరి ద్వారా త్రిపుర గారి ఫోన్ నంబరు సంపాదించాను.

* * *tripura 3

2011 జూన్ 27  ఉదయం 11 గంటలు. వాళ్ళ అపార్టుమెంటు తలుపు తట్టాను. ఆయనే తలుపు తీసారు. నా ఎదురుగా నేనిన్నాళ్ళనుంచీ వెతుక్కున్న త్రిపుర గారు. “శేషాచలపతి, భాస్కర్ , కల్యాణి, సుశీల, వీరాస్వామి” పాత్రల సృష్టికర్త. మాటల్లో చెప్పలేని అనుభూతి అది. ఆయన అక్షరాలకంటే కాంతివంతంగా కనిపించాయి ఆయన కళ్ళు. మూర్తీభవించిన కరుణలా ఉన్న ఆయన్ని చూసి “ఈయన ఈ ప్రపంచానికి చెందిన వ్యక్తి కాదు” అని నమ్మకంగా అనుకున్నాను.

కూచున్నాకా బెంగుళూరులో ఏం చేస్తుంటావు, వైజాగులో ఇల్లెక్కడ ఇలా అన్ని వివరాలూ అడిగారు. You look very young అంతా విని అన్నారు నవ్వుతూ. ఆయన కాఫ్కా కవితల పుస్తకం ఇచ్చారు. నా “ఏటి ఒడ్డున” ఇస్తే తీసుకున్నారు. ఏవేవో ప్రశ్నలడిగాను. అన్నిటికీ చాలా క్లుప్తంగా స్పష్టంగా సమాధానాలిచ్చారు. త్రిపుర మౌనం గొప్పది. తర్వాత ఈ రెండేళ్ళలో ఆయన్ని ఒక పది సార్లు కలిసుంటాను.  ఎన్నోసార్లు ఫోనులో మాట్లాడాను.  త్రిపుర గారి మాటల్లో ఎవరినీ కటువుగా విమర్శించడంగానీ, మంచి చెడ్డలు బేరీజు వెయ్యడం గానీ చూడం. “Your stories didn’t suit my taste. I like your poetry, write more poems” అన్నారు నా రచనలు చదివి.

మిమ్మల్ని influence చేసినవి  ఏమైనా ఉన్నాయా? అని అడిగితే, “Passing influences అన్నీ.. కొంతమంది ఊసరవెల్లి అని కూడా అంటారనుకో” అని నవ్వేరు. బెనారస్, JK(జిడ్డు కృష్ణమూర్తి) , Zen, Kafka, Naxalism, Existentialism వీటన్నిటి గురించీ చెప్పారు. “I was actively involved in radical student movements in West Bengal” అన్నారు. JK బెనారస్ వచ్చినప్పుడు ఆయనకి రోజూ ఉదయాన్నే మిల్క్ కూడా తీసుకెళ్ళి ఇచ్చేవాణ్ణనీ ,  తర్వాత క్రమంగా ఆయన ప్రభావం తగ్గిపోయిందనీ, You should think freely  అన్న JK నే మరణశయ్య మీద ఉన్నప్పుడు How to preserve Krishnamurthy’s thought for the future generations అని మథనపడ్డాడని చెప్పి నవ్వేరు. నాక్కూడా జెన్ బౌద్ధంలో ఆసక్తి ఉండడంతో మళ్ళీ మళ్ళీ అడిగేవాణ్ణి. మీకు జెన్ బుద్ధిజం మీద ఇష్టం ఎలా కలిగింది? అని, ఆయన బర్మాలో ఉద్యోగం చేస్తున్నప్పుడు practicing Buddhists కోసం ఒక జెన్ యోగి సూచన మేరకు బుద్ధిస్ట్ టెక్స్ట్స్ చదివి వినిపించేవారుట. “Zen నాకు నచ్చుతుంది. It suits my nature. It doesn’t ask you to practice anything. నాకు ఇలా కూచోడం ఇష్టం. ఇలా కూచుంటాను అంతే” అంటారు.

“షేక్స్పియర్ వర్కే కానక్కరలేదు నా పేరు త్రిపురాంతకేశ్వర రావు అని రాసినా I consider that as work of literature because you are giving a concrete form to something that is abstract”అన్నారు ఒక సందర్భంలో. మీకు ఇంగ్లీషులో అంత ప్రావీణ్యం ఎలా వచ్చింది? అంత ప్రావీణ్యం ఉన్నా మీరు ఇంగ్లీషులో కథలెందుకు రాయలేదు? అని అడిగితే,  బాల్యం అంతా ఒరిస్సాలోనే అవడం వల్ల ఫౌండేషన్ అంతా ఇంగ్లీషులోనేననీ, తొమ్మిదేళ్ళ దాకా ఫాదర్ రాండ్ అని ఒక న్యూజీలాండ్ స్కాలర్ దగ్గర ఇంగ్లీషు నేర్చుకున్నాననీ, తర్వాత వైజాగు AVN college లో టేకుమళ్ళ రామారావు అని మంచి లెక్చరర్ వల్ల కూడా ఇంగ్లీషు బాగా అబ్బిందనీ చెప్తారు. “ఇంగ్లీషులో నాకు తెలీని పదం లేదు (ఈ మాట చెప్తున్నప్పుడు కూడా ఆయనలో ఎక్కడా కొంచెం కూడా గర్వం లేకపోవడం చూసి నేను చకితుణ్ణయ్యాను). తెలుగు మాత్రం చాలా కష్టపడి నేర్చుకున్నాను. తొమ్మిదో ఏట బాపట్లలో అక్షరాభ్యాసం జరిగింది. 1960 లో మా నాన్న గారు పోవడం రకరకాలుగా నన్ను మార్చింది. మా నాన్న గారు పోవడానికీ, తెలుగులో రాయడానికీ కనెక్షన్ ఉంది. అదేమిటి అంటే చెప్పలేను. But there is a deep connection. అందుకని తెలుగులోనే రాసాను” అంటారు. భారతి పత్రికలు చదివి తెలుగు నేర్చుకున్నాననీ, ఒక్కొక్క పదానికే అర్ధం రాసుకుంటూ స్వయంగా డిక్షనరీ తయారు చేసుకున్నాననీ చెప్తారు.

బెనారస్ అనుభవాలు ఉత్సాహంగా చెప్తారు. వైజాగునుంచి బెనారస్ వెళ్ళగానే ఒక్కసారి పంజరంలోంచి బయటికెళ్ళినట్టైందిట. టెన్నిస్ ఆడేవాణ్ణనీ, అక్కడే బలంగా తయారయ్యాననీ. ఒక పక్క థియోసఫికల్ సొసైటీతో, మరో పక్క సిపిఐ తో సంబంధాలు, గంగా నది, ఘాట్లు ఇరవై యేళ్ళ వయసులోని ఉత్సాహం, విద్యార్ధులతో ఇంగ్లీషు డ్రామాలు వేయించడం, అగ్రికల్చరల్ బిఎస్సీ అయిపోయాక MSc మధ్యలో ఆపేసి వెనక్కి వచ్చెయ్యడం, తర్వాత ఒక మిత్రుడి సలహామేరకు తిరిగి BHU లోనే ఇంగ్లీషు సారస్వతంలో MA చెయ్యడం, ఫైనల్ పరిక్షలో  పాఠ్యాంశాలకి పరిమితం కాకుండా ఒక ఫిలాసఫర్లా రాసి తీరా బయటికొచ్చాక పాసవుతానా లేదా అన్న భయంతో షిమోగాలో లింగప్ప అనే మిత్రుడి దగ్గరకి వెళ్ళిపోవడం, జోగ్ ఫాల్స్ దగ్గర పోకతోటల్లో బండేసుకుని తిరుగడం, ఆ కాలంలోనే నాయుడుపేట నుంచి నాన్న గారు పంపించిన ఉత్తరాల కట్టలో తను యూనివర్సిటీ ఫస్టు వచ్చినట్టూ, అదే కాలేజిలో ఇంగ్లీషు ప్రొఫెసర్ గా నియమిస్తూ Appointment letter అందుకోవడం , బెనారసులో ఆయన పరిచయాలు, తర్వాత మదనపల్లె, వైజాగు, మాండలే, జాజ్ పూర్, త్రిపురలో ఉద్యోగ అనుభవాలు. ఇలా ఎప్పటెప్పటి అనుభవాలో చెప్తుంటే ఆయన జ్ఞాపకశక్తికి అబ్బురపడుతూ మనం అన్నీ మరిచిపోయి వింటూ కూచుంటాం.

Qమీ కథల్లో ఆటోబయోగ్రఫికల్ ఎలిమెంట్స్ ఉంటాయంటారు కదా అంటే

“సాహిత్యం మనల్ని ప్రతిబింబించాలి. మనకి తెలిసిన జీవితాన్ని రాయాలి. ఏదో స్లమ్స్ లో రెండు చక్కర్లు కొట్టొచ్చి రాస్తే దాన్లో ఆత్మ ఉండదు. All my stories are in some way related to my life”  అంటారు.

Qమీ కథలు అర్ధం కావు అంటారు కదా అంటే

“అవును. Incomplete వాక్యం అంటే నాకు ఇష్టం. జీవితంలోనూ, కవిత్వంలోనే కొంత అర్థం కాని తత్వం ఉంది” అంటారు నవ్వుతూ.

తర్వాత ఆయన కథల నేపథ్యాల గురించి, బెనారస్ లో చదువుతున్న రోజుల్లో మన్మోహన్ దాస్ అని ఒరియా స్టూడెంట్ ఇన్స్పిరేషన్ తో సృష్టించిన బలమైన పాత్ర  శేషాచలపతి, బర్మాలో కార్గో సామ్రాజ్యపు అధిపతి తర్వాత ఫకీరుగా మారిన కృష్ణారెడ్డి “జర్కన్” కథలో వీరాస్వామిగా మారిన వైనం, వైజాగు కలెక్టరాఫీసు జంక్షన్లో షణ్ముకానంద విలాస్ అనే హోటల్లో కూచుని వచ్చీపోయే వాళ్ళని గమనించినప్పటి అనుభవాలు “హోటల్లో” , శామ్యూల్ బెకెట్ “వెయిటింగ్ ఫర్ గోడో” టైటిల్ మాత్రమే చదివి ఆ ఇన్స్పిరేషన్ తో రాసిన “భగవంతం కోసం”, హౌరా టు ఢిల్లీ రూట్లో ఉన్న పెద్ద జంక్షన్ అన్ని రైళ్ళు అర్ధరాత్రే వచ్చే మొగల్ సరాయ్ అంటే ఆయనకి ప్రత్యేకమైన ఇష్టం. స్టేషనుకి ఎవరిని రిసీవ్ చేసుకోవాలన్నా  రాత్రి పదింటికి బయలుదేరి వెళ్లాలి, అర్ధరాత్రి ప్లాట్ ఫాం మీద చలిలో, ట్రాలీ మీద కూచుని.. సిగరెట్ కాల్చుకుంటూ బ్రిడ్జి మీద చీమల్లా కదుల్తున్న మనుషుల్ని పరిశీలించడం..  రైటర్ కి గొప్ప వాతావరణం అంటారు. ఆ వాతావరణాన్ని అద్భుతంగా చిత్రించిన “చీకటి గదులు”, త్రిపురలో ఉద్యోగం చేస్తున్నప్పుడు ముగ్గురు నక్సలైట్లకి నెలరోజులు ఆశ్రయిమిచ్చిన తర్వాత, సహాయం చేసినవాడే ద్రోహం చెయ్యడంతో, నెర్వస్ బ్రేక్ డౌన్ అయి పిచ్చాసుపత్రిలో కొంత కాలం ఉండి బయటికొచ్చిన తర్వాత రాసిన “అభినిష్క్రమణ”, చుట్టూ హౌరానది , వందలాది సరస్సులు, వెదురు కాటేజీ, రెక్కలొచ్చి ఎగిరిపోయిన పిల్లలు, ఆ సరస్సుల్లోకి వలస వచ్చే పక్షులు ఈ నేపథ్యంలో అగర్తలా మొదలుపెట్టి వైజాగులో పూర్తి చేసిన అద్భుతమైన ఆఖరి కథ “వలస పక్షులగానం” ఇలా కథా నేపథ్యాలు చెప్తుంటే వినే అరుదైన భాగ్యం నాకు దక్కినందుకు ఎంత సంబరపడ్డానో.

ఒక ఇంటర్వ్యూలో ఆయన ఇలా అన్నారు.

“Confessional element  లేని సాహిత్యం సాహిత్యం కాదు. ఇది ఇంకేమైనా కావచ్చు. ఎంత మంది సమాజం గురించి రాయడం లేదు. అది వేరే సాహిత్యం. టెలిఫోన్డైరెక్టరీ కూడా ఒక సాహిత్యమే. దాన్ని చూస్తూ కూడా ఇమాజినేషన్లోకి పోవచ్చు. కన్ఫెషనల్ ఎలిమెంట్ లేనిది సాహిత్యం కాదు అనేది నాకు సంబంధించిన అభిప్రాయం.  నా కథల్లో కన్ఫెషనల్ ఎలిమెంట్ ఉంటుంది. అటువంటి సాహిత్యానికే నేను రెస్సాండ్అవుతాను. రాజకీయ పోయిట్రీ కూడా కన్ఫెషనల్ఎలిమెంట్తో లేకపోతే మియర్ప్రాపగాండాగా అవుతుంది. నాది సాహిత్యం కాదనే వాళ్లని నేను వ్యతిరేకించను. ప్రతిదీ ఒకే రకంగా వుండాలని అనుకోకూడదు. వాటిని Condemn చేయడం నాకిష్టం వుండదు. నాకిష్టం అయినది ఎలా వుండాలో చెప్తున్నాను.”

త్రిపుర కథల్ని అర్ధం చేసుకోడానికి ఈ వాక్యాలు చాలా అవసరమని నేనకుంటాను. అసలు త్రిపుర ప్రతిపాదిస్తున్న ఈ Confession ఏమిటి అని నేను చాలా కాలం ఆలోచించీ, త్రిపుర గారినీ, కనకప్రసాదు గారినీ రకరకాలుగా అడిగి నేను తెలుసుకున్నదీ , నాకు అర్ధమైనది ఇదీ. రచయితలకి చాలామందికి అనుభవమే , మనం రాయాలనుకున్నది వేరు , తీరా రాసాక చూస్తే రాసింది వేరు. ఇలా ఎందుకు జరుగుతోంది? ఎందుకంటే మన మౌలికమైన మ్యూజ్ ఏదైతే ఉందో దానికి భయం వల్లనో, భ్రమల వల్లనో కొన్ని అబద్దపు తొడుగులు, ముసుగులు వేసి ప్రదర్శించడం వల్ల. అవేవీ లేని సృజనలు ఎలా ఉంటాయి అంటే ఇదిగో త్రిపుర కథల్లా ఉంటాయి అని చెప్పొచ్చు. నామిని కథలు, కనకప్రసాద్ గారి కథలు కూడా అలా ఉంటాయి. అందుకే వాటిలో కరిగించగల శక్తి ఉంటుంది.

Qచివరగా మీ కథల గురించి మీ అభిప్రాయం చెప్పండి అంటే

అసలు నేను రైటర్ని అవాలని ఎప్పుడూ అనుకోలేదు. ఏదో ఏక్సిడెంటల్ గా మొదలుపెట్టాను. ఏదో ఆవహించి రాయించినట్టు, తప్పక పదేళ్ళపాటు కథలు రాసాను. Existential story రాద్దామనీ, Absurd Story రాద్దామనీ, Philosophical Story రాద్దామనీ, Predetermined state of mind తో ఎప్పుడూ రాయలేదు. కథ మొదలుపెట్టిన దగ్గరనుంచీ, అంతమయ్యేదాకా చచ్చాను. ఆ కథని చంపాను. ఆ చచ్చిన కథతో నేను చాలా కాలం జీవించాను. అవి అలాగే ఉన్నాయి. నేను ఇలాగే ఉన్నాను.

ఇతర రచయితల్లో కనిపించే కీర్తి కాంక్ష, రచనల మీద విపరీతమైన మమకారం ఇలాంటి బలహీనతలు ఆయనలో మచ్చుకైనా కనిపించవు. నిజంగా ఒక దీపస్తంభంలా గత యాభై యేళ్ళుగా ఒంటరిగా స్థిరంగా నిలబడ్డారు. త్రిపుర గారి భార్య లక్ష్మీదేవమ్మ గారి గురించి చెప్పకుండా త్రిపుర గురించి ఎంతచెప్పినా అసంపూర్ణమే అవుతుంది. ఒకవైపు ఉపాధ్యాయినిగా పనిచేస్తూ (1982లో ఉత్తమ ఉపాధ్యాయినిగా నేషనల్ అవార్డు తీసుకున్నారు), మరోవైపు చిన్నపిల్లాడి మనస్తత్వం ఉన్న త్రిపురని అన్నివైపులనుంచీ అరవైయేళ్ళుగా కాపాడుకుంటూ వీటన్నిటితోపాటు బెంగాలీ నుండి సునీల్ గంగోపాధ్యాయ, మహాశ్వేతాదేవి, త్ ప్రేమేంద్ర మిత్రా వంటి ఎందరో రచయితలని తెలుగులోకి అనువదించారు. త్రిపుర గారు రిటైరైపోయి అగర్తలా నుండి వైజాగు వచ్చేసిన చాలా యేళ్ళకి పతంజలి శాస్త్రి గారి అబ్బాయి ఒకసారి ఏదో పని మీద త్రిపుర వెళ్ళి అప్పటి ముఖ్యమంత్రి, మానిక్ సర్కార్ గారిని కలిసారుట. మాటల సందర్భంలో త్రిపుర గురించి వస్తే , “He was our professor. we had a great respect for him. But his wife Smt Lakshmidevamma was worshipped here” అన్నారుట.

ఇప్పుడు త్రిపురకి ఎనభై అయిదేళ్ళు. “I lost interest in everything. బుక్స్ అన్నీ అందరికీ ఇచ్చేసాను. నాకింక లిటరేచరు, ఆర్టు ఏవీ అక్కరలేదు” అంటారు. హారతి కర్పూరంలోని పరమార్ధం నాకు ఆయన్ని చూసాకే అర్ధం అయ్యింది. అందుకే “ఉజ్వలంగా వెలిగిన కర్పూరపు గుర్తులేవీ లోపలే తప్ప బయట మరి కనిపించవు” అని రాయగలిగాను. ఆయన కథలు చదివాను. ఆయన్ని కలిసాను. ఆయన వాత్సల్యాన్నీ, ప్రేమనీ, కరుణనీ పొందగలిగాను. “Subrato (ఆయన సరదాగా నాకు పెట్టిన పేరు) was certainly one of the very few most lovable persons i had come across in my long life of 84 years” అని ఆయన చేత అనిపించుకోవడం నాకు దక్కిన గొప్ప అదృష్టంగా భావిస్తాను.

“త్రిపుర కథలు ఆయన ప్రజ్ఞ లోతులకి చిన్నపాటి మచ్చుతునకల్లా ఉండి త్రిపుర గారే ఉండగా ఇవెందుకులే అనిపిస్తాయి” అన్న కనకప్రసాద్ గారి మాటలు అనుభవించగలిగాను. త్రిపుర గారినే దృష్టిలో పెట్టుకుని రాసిన మరో కవితతో వ్యాసాన్ని ముగిస్తాను.

ఏదీ దాచుకోదు

ఆత్మకథ రాసుకోదు

ఎంత అందమైన పూలనైనా

సాయంత్రానికి రాల్చేసుకుంటుంది

ఈ చెట్టుని చూస్తే

నాకసూయ

నిజంగా ‘నెలబాలుడ’తడు!

hema-sivasagar2004 వ సంవత్సరం లో రాజమండ్రి తెలుగు విశ్వవిద్యాలయం సాహిత్య పీఠం లో వివిధ అంశాలపై ప్రపంచీకరణ ప్రభావం అనే సెమినార్ జరిగింది. ఆ సెమినార్ లోని అన్నీ సెషన్స్ కి నేను హాజరయ్యాను. అప్పటి యువ కవుల నుండి పెద్ద పెద్ద కవులు, రచయితలు, రచయిత్రులు ఈ సదస్సులో తమ పత్రాలను సమర్పించారు. నేను ఎంతో కాలం గా శివసాగర్ నీ, ఉద్యమం నెలబాలుడు పుస్తకాన్నీ చదువుతూ అభిమానిస్తూ వస్తున్నాను. శివసాగర్ కూడా ఈ సదస్సు లో పాల్గొనటం నాకు చాలా సంతోషాన్ని ఇచ్చింది.

ఉద్యమాలు, విప్లవం, విప్లవ సాహిత్యం, విప్లవ కవుల ప్రస్తావన వస్తే మనసు చైతన్యవంతవమవుతుంది. సమాజం పట్ల, ఆర్ధిక సంబంధాల పట్ల ఒక బాధ్యత గుర్తుకు వస్తుంది. అంతర్లీనం గా ఆవేశం ముంచుకొస్తుంది.

విప్లవ కవుల్లో ఒక ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకున్న వాడు శివసాగర్. ఆయన రాసిన నా చేల్లీ చంద్రమ్మ, ఆమె, ఉద్యమం నెలబాలుడు, జనం ఊపిరితో, ఆకాశం లో సగం నీవు కవితలను చదువుతూ ఎంతో కొంత ఆ భావజాలాన్ని మనస్సు కు పట్టించుకున్న దాన్ని.

ఆ రోజు సభ పూర్తయ్యాక, సాయంత్రం మాతో పాటు మా ఇంటికొచ్చి రెండు రోజులు బస చేశారు శివసాగర్.

ఆయనను కలవటానికి ఎంతో మంది సాహిత్య అభిమానులు ఆ రాత్రి వరకూ వస్తూనే ఉన్నారు. ప్రత్యేకంగా ఆయనతో కూర్చొని మాట్లాడే అవకాశమే దొరకలేదు. అతిధులకు కావల్సిన సౌకర్యాలు సమకూర్చటం లో నాకు సమయం దొరకలేదు. ఆ రాత్రంతా- ఉదయాన్నీ కాఫీ త్రాగే సమయం లో చాలా సేపు తీరిక గా ఆయనతో మాట్లాడే అవకాశం దొరికింది. ఆయన కవిత్వాన్ని గురించి, ఉద్యమం గురించి చాలా సేపు మాట్లాడారు.

సాధారణ స్కూల్ టీచర్ కు తనయుడి గా పుట్టినా, ఆ తండ్రి వృత్తి ని మాత్రం స్వీకరించలేదు. ఎం.ఏ. పూర్తి చేశాక, కమ్యూనిస్ట్ పార్టీ లో సభ్యుడై నక్సల్బరీ ఉద్యమానికి ప్రభావితుడయ్యారు. శ్రీకాకుళం రైతాంగ పోరాటం లో కూడా క్రియాశీలకంగా పని చేశారు. కొండపల్లి సీతారామయ్య తో అనుబంధం ఏర్పడింది.

‘నా చెల్లీ చెంద్రమ్మ’ కవితా ను ప్రస్తావించాను. ఈ కవిత రాయడం లో గురజాడ ప్రభావం ఏదైనా ఉందా? అన్న వాదాన్ని గురించి అడిగాను. మనం ఎక్కువగా చదివే సాహిత్యాన్ని, భావజాలాన్ని , పదాలను మన ప్రమేయం లేకుండానే వాడుతూ ఉంటాము అన్నారు. గురజాడ నాకు ఇష్టమైన కవి. అందువల్లే ఆ ప్రభావం పడి ఉంటుందని అన్నారు. విద్యార్థి గా ఉన్నప్పుడు నేను చదవటానికే ఎక్కువ ప్రాధాన్యత ను ఇచ్చాను. శ్రీశ్రీ, ఆరుద్ర, శిస్ట్లా, కృష్ణశాస్త్రి, నండూరి సుబ్బారావు, చలం, పఠాభి, నారాయణ బాబు వంటి వారు రాసిన సాహిత్యాన్ని విపరీతం గా చదివాను.చలం సాహిత్యం అయితే చదివే కొద్దీ విశాలమవుతూ ఉంటుంది. దిగంబర కవుల కవిత్వం కూడా నాకు చైతన్యాన్ని కలిగిస్తూ ఉండేది.

“ఆదివారము నాడు గోదారి నాడు
పొద్దు గుంకిన వేల, సద్దు మణిగిన వేళ
పొలమో, స్థలమో చూచి తిరిగి వచ్చే దొరకు”

లయబద్ధంగా ఆ రోజు శివసాగర్ పాడిన జానపద గీతం మరో సారి నాలో  ఆవేశం పెల్లుబుకేలా చేసింది.

చెల్లీ! చెంద్రమ్మా! అనే పద్యాన్ని మననం చేసుకుంటూ ఇలా చెప్పారు.

“భూస్వాములకు శిక్ష విధించటం ఎంతవరకు సబబు అనే విషయం పై మాకు జరిగిన ఒక చర్చకు జవాబే” చెల్లీ! చెంద్రమ్మా!” నేను ఒకరి ఇంట్లో రహస్య జీవనం చేస్తున్నప్పుడు నాకు ఆశ్రయం ఇచ్చిన వ్యక్తి కూతురు ఎక్కువగా పల్లెపదాలు పాడుతుండేది. ఆ పాటలు వింటున్నప్పుడల్లా నాకు ఈ పాటల పై బాణీలపై ప్రత్యేకమైన ఆసక్తి కలిగింది. నాకు కూడా పాటలు రాయాలని ఆమె పాడే బాణీలోనే దాన్ని కూర్చాలని అనుకుంటూ ఉండేవాణ్ణి. అప్పుడు పుట్టిందే ఈ పాట.

“నేను అడవుల్లో, పల్లెల్లో కాలినడకన వెళ్ళేటప్పుడు “చెల్లేలా చెల్లేలా ఓహో! చెల్లేలా” అని పాడుకుంటూ వెళ్ళేవాడ్ని. ఎదురుగా కనిపిస్తున్న ప్రతి దృశ్యాన్ని పదాలుగా మార్చుకుంటూ తరువాత రాసుకునేవాడ్ని.  వాళ్ళ ఇంటి ముందు ఉన్న ఇప్ప చెట్టు కింద కూర్చొని ఆ తండా వారికి వినిపిస్తూ పాడుతూ ఉండేవాడ్ని. ఆ పాటను వింటూ వాళ్ళు ప్రకటించే హావభావాలే ఆ పాటకు విమర్శకులు. ఆ రకంగా దాన్ని సరిదిద్దుకుంటూ ఈ రూపానికి తెచ్చాను,” అని చెప్పారు.

1976 లో సికింద్రాబాద్ జైల్లో ఉన్నప్పుడు “ఆమె” కవిత రాశారు. అందులో ఉన్న విప్లవ యోధుల్ని గుర్తు చేసుకుంటూ రక్తసిక్తమైన భూమిని అరుణారుణ చరిత గా అభివర్ణించాడు.

“ఆకాశం లో సగం నీవు
అనంత కోటి నక్షత్రాల్లో సగం నీవు సగం నేను” అంటూ మనిద్దరం కలిసి ఉద్యమిస్తే
చిటపట చిటపట చినుకులు చిల్లంగ
కాసిరెడ్డి ఒళ్ళు చిటపట లాడే
పులపుల పుల పుల చినుకులు చిందంగ
కాసిరెడ్డి వొళ్ళు పులకరించంగ
జెల్లు జెల్లుమని వర్షమ్మూ కురియంగ
కాసి రెడ్డి వొళ్ళు జెలదరించంగ

అంతవింతరెడ్డి వగలు పోయాడ!
కందిరీగ నడుమ వంటి నడుము దానా!
వాన జోరు హెచ్చే! గాలి హోరు హెచ్చే!
పసుల కొట్టము వద్ద మసలు కొందము రావే !
నీ మొగుడు పోతేపోయే ! నీవు దక్కవాయే!

జారు కొప్పుదానా! జాగీలీ నడుముదానా!
వానజోరు హెచ్చే! గాలిహోరు హెచ్చే!
నా ఆశ కాపు కాసి నా దాపు వస్తివి గాదె!
రవ్వరవ్వ గాలిసీరే రవ్వలేల మనకు?

“ఓ దొరా! ఓ దొరా! వగలమారీ దొరా!
నా ఆశ కాపు కాసే నీ దాపు నేను వస్తీ ” అంటూ

ఎత్తిన కత్తి కుత్తుకతో దిగగుచ్చే చెంద్రి కత్తి  ఎత్తివొత్తి పొత్తికడుపు లో గుచ్చే ఈ పంక్తులను నేను చదువుతూ ఆగినప్పుడు చిన్నగా నవ్వి “మావో మాటల నుంచే స్పూర్తి ని తీసుకున్నాను. స్త్రీ ప్రమేయం లేకుండా ప్రకృతే లేదు.  మనం ప్రకృతి లో మమేకం అయిపోయిన జీవులం. ప్రకృతి, స్త్రీ, పురుషుడు కలిస్తే విప్లవిస్తే విజయమే కదా! ” అని నవ్వారు. “నాకు జీవితం, ఉద్యమము వేరు వేరు కాదు. నేనే ఉద్యమాన్ని. ఉద్యమమే నేను. అజ్నాతమ్ లో ఉన్నప్పుడూ జన జీవన స్రవంతి లో ఉన్నప్పుడు కూడా నేను పరిసరాలకు ప్రభావితుడ్ని. ప్రకృతి లో మమేకం అయినవాడ్ని,” అన్నారు.

ఆ రోజు తిరిగి వెళ్ళటానికి సన్నాహమవుతూ ఎక్కడెక్కడికో ఫోన్లు చేశారు. ఇప్పుడు ఏ వూరు వెళ్తున్నారని అడిగాను. కాసేపు ఆలోచించి “ఎక్కడికి వెళ్తాను, ఏమో? ఆలోచించాలి,” అన్నారు. కాసేపు అయ్యాక, విశాఖపట్నం వెళ్దామని అనుకుంటున్నా అమ్మా అని కాసేపు పెద్దగా నవ్వారు. ఎక్కడికి వెళ్లాలో తెలియడం లేదంటే నా మిత్రులు కూడా ఇలాగే కంగారుపడుతుంటారు. నేను పక్కనే నుంచోని దువ్వెన అందించాను. దువ్వుకొని తిరిగి ఇచ్చాక పౌడర్ కావాలని అడిగారు. నేను పాండ్స్ పౌడర్ డబ్బా ఇచ్చి పక్క గది లోకి వెళ్ళాను. ఓ రెండు నిముషాలయ్యాక ఆ గది లోకి వెళితే అద్దం లో అలాగే చూసుకుంటూ పౌడర్ డబ్బాని చేతిలో పట్టుకొని అలాగే నుంచోని ఉన్నారు. నేను దగ్గరకు వెళ్ళి ప్రశ్నార్ధకంగా చూశాను.

“దీన్ని ఎలా తీయాలి?” అని అడిగారు.

నాకు ఆశ్చర్యం తో నోట మాట రాలేదు. ఆయన నవ్వుతూ నా మొఖం లోకి చూస్తూ ఉన్నారు. సరదాగా అడుగుతున్నారా? అని కూడా అనిపించింది. మళ్ళీ చప్పున ఆయన మరిచిపోయి ఉండొచ్చేమో అనిపించింది.

ఇలా తీయాలని త్రిప్పి ఆయనకు అందించాను సందేహం గానే. శివసాగర్ నవ్వి అవును కదా, నేను మర్చిపోయాను అని పౌడర్ రాసుకున్నారు.

నేను పౌడర్ రాసుకుంటున్న శివసాగర్ చేతుల్ని తదేకంగా చూశాను.

ఎన్నెన్ని ఉద్యమాల్లో పాల్గొని అరుణారుణ కవిత్వాన్ని రచించిన చేతులే కదా ఇవి! మరెన్ని పోరాటాల్లో తుపాకుల ట్రిగ్గర్లు  నొక్కిన వేళ్లే కదా ఇవి! ఇప్పుడు నిజంగానే నెలబాలుడు అవుతున్నాడు….అనుకున్నాను మనసులో.
మల్లెప్పుడైనా ఆ సందర్భాన్ని శివసాగర్ కి గుర్తు చేద్దామనుకున్నాను. మరెప్పటికీ ఆ అవకాశం రాలేదు…రాదు…

డా. పుట్ల హేమలత, సంపాదకురాలు, www.vihanga.com

రాజారాం గారి ఏకలవ్య శిష్యుడ్ని: డా. కేశవరెడ్డి

naanna2

( ఏప్రిల్ 1, మధురాంతకం రాజారాం గారి వర్థంతి సందర్భంగా )

“మునెమ్మ” నవలను చతుర మాస పత్రిక (అక్టోబర్ 2007)లో ప్రచురించినప్పుడు స్వపరిచయం రాస్తూ “మధురాంతకం రాజారాంగారి వద్ద ఏకలవ్య శిష్యరికం చేసి సాహిత్య ప్రస్థానం చేశాను”, అని పేర్కొన్నాను. నేను తెలుగు సాహిత్యంలో ఎంతో కొంత నిలదొక్కుకోగలిగినానంటే దానికి రాజారాంగారే కారణం. నేను మొట్టమొదట చూసిన, మాట్లాడిన రచయిత రాజారాంగారే. మొట్టమొదట చదివిన పాఠ్యేతర పుస్తకం రాజారాంగారి కథల పుస్తకాలే. వారిది మా పొరుగు గ్రామము కావడమే అందుకు కారణం.

రాజారాంగారిది, మా అమ్మగారు పుట్టిన ఊరు ఒకటే. అది చానా చిన్న పల్లెటూరు. నా చిన్నతనంలో మా అమ్మగారితో పాటు చాలా సార్లు ఆ ఊరికి వెళ్ళుతుండేవాడిని. మావాళ్లు చెప్పేవాళ్లు, “అద్దో ఆయనే రాజారాం అయ్యవారు. ఆయన కథలు రాస్తాడు,” అని. ఆయన ఆడ్డపంచ కట్టుకొని భుజంపైన కండువా వేసుకొని వీధి వెంబడి నడిచి వెళుతూ ఉంటే నేను పిట్టగోడమీద కూర్చొని చూస్తుండేవాడిని. అలా కొంతకాలం అయ్యాక, నాకొక ఐడియా వచ్చింది. ఇలా ఒక మారుమూల పల్లెటూల్లో పుట్టి పెరిగిన ఒక మనిషి కథలు రాయగా అదే నేపథ్యం కలిగిన నేను రాయలేనా? అని ఆలోచించాను.

ఇంతకీ ఆయన రచనలు ఎలా ఉంటాయి? వెంటనే వారి కథా సంపుటాలు రెండింటిని సంపాదించాను. తాను వెలిగించిన దీపాలు, కమ్మతెమ్మర అనే రెండు సంపుటాలను సంపాదించి చదివాను. అవే నేను మొట్టమొడట చదివిన పాఠ్యేతర పుస్తకాలు. ఒక్కొక్క కథను ఎన్నిసార్లు చదివానో లెక్కలేదు. చదివీ చదివీ వాటిలో ప్రతి వాఖ్యమూ కంఠతా వచ్చేసింది. ఆ కథల ద్వారా ఎంత ప్రభావితుడనయ్యానంటే నా తొలి రచనలలో రాజారాంగారి ముద్ర స్పష్టంగా కనిపిస్తుంది. అవే పదబంధాలు, అవే వాక్యనిర్మాణం. అలా కొన్ని కథలు రాసాను. ఆ తర్వాత నవలలు వ్రాయడం ప్రారంభించాను.

చదువుల నిమిత్తము, ఉద్యోగ నిమిత్తము, పాండిచ్చేరిలో గాని, నిజామాబాద్‌లో ఉన్నప్పుడు ఎప్పుడు ఊరికి వెళ్లినా రాజారాంగారిని కలవకుండా తిరిగి వచ్చేవాడిని కాదు. కల్సినప్పుడల్లా ఏవేవో మాట్లాడుకునేవాళ్ళం, కాని సాహిత్య మర్మాలను గురించి నేను ఎప్పుడూ అడిగింది లేదు, ఆయన చెప్పింది లేదు. ఆయన నాకొక గొప్ప ప్రేరణ ఇచ్చారు. సాధకుడిని నేనే.

ఆనాడు ఏకలవ్యుడు చేసింది ఇదే. ఏకలవ్యుడు గొప్ప విలుకాడు. కాని ద్రోణాచార్యుడు అడివికి వెళ్ళి అతనికి విలువిద్య నేర్పలేదు. అతనొక ప్రేరణ ఇచ్చాడు. అంతే సాధకుడు ఏకలవ్యుడే. బమ్మెర పోతన “పలికెడిది భాగవతమట పలికించెడివాడు రామభద్రుండట,” అన్నాడు. అతడు తన భక్తి పారవశ్యంలో అలా అని ఉండవచ్చు కాని.. రామభద్రుడు దిగివచ్చి ఒంటిమెట్ట గ్రామానికి వెళ్ళి పోతనకు వ్యాకరణము, ఛందస్సు నేర్పలేదు. అతడొక ప్రేరణ ఇచ్చాడు. సాధకుడు పోతనామాత్యుడే. సాహిత్యం అత్యంత బౌద్ధికమైన ప్రక్రియ. ఇదొక ముక్తి మార్గము. దీనిని ఎవరూ ఎవరికీ నేర్పించలేదు. ఎవరికి వారు సాధన చేసి నేర్చుకోవలసిందే. అయితే ప్రతి రచయితకు ఏదో ఒక దశలో ఒక వ్యక్తి ప్రేరణగా నిలుస్తాడు. అలా నాకు ప్రేరణ ఇచ్చిన మధురాంతకం రాజారాంగారిని ఈ సందర్భంగా స్మరించుకోవడం నాకు చాలా ఆనందంగా ఉంది.

వొక మాంత్రికుడితో కొన్ని మాటలు

 మార్చి 10 కేశవరెడ్డి గారి పుట్టిన రోజు 

MaheshVenkat_KesavReddy1

(ఎడమ వైపు నుంచి) డా. కేశవ రెడ్డి, వెంకట్ సిద్ధారెడ్డి, కత్తి మహేష్ కుమార్

ధైర్యం కూడగట్టుకుని ఫోన్ చేశాను. అటువైపు రింగ్ అవుతోంది. ఊపిరిబిగబట్టి ఆ రింగ్ వింటున్నాను. ఆ రింగ్ కన్నా నా ఊపిరి నాకే ఎక్కువగా వినిపిస్తోంది. అటువైపునుంచీ ఫోన్ రిసీవ్ చేసుకున్నారు.

“హలో”

“సర్, నాపేరు మహేష్ అండీ, కేశవరెడ్డిగారేనా!” అంటూ నేను కొంచెం లోవాయిస్ లో…

“అవునబ్బా! కేశవరెడ్డినే. చెప్పండి.”

***

సంవత్సరం 2009.

“మునెమ్మ” చదివాక ఒక ఉన్మాదం ఆవరించింది. అప్పుడప్పుడే ఒక డబ్బింగ్ చిత్రాలకు మాటలు రాయడం, కొన్ని సినిమాలకి స్క్రిప్టు సహకారం అందించడం ద్వారా మెయిన్ స్ట్రీం సినిమా రంగంలోకి అడుగుపెడుతున్న తరుణం. మునెమ్మ గురించి విన్నప్పుడే ఒక శక్తివంతమైన సినిమాకు సంబంధించిన సరంజామా అనిపించింది. ఒకసారి చదివాక ఆగలేని ఉత్సాహం నిండుకుంది. కాలేజిలో హెమింగ్వే  ‘ఓల్డ్ మెన్ అండ్ ది సీ’ చదువుతున్నప్పుడు తెలిసిన  రెఫరెన్స్ తో “అతడు అడవిని జయించాడు” పుస్తకం చదవటంతో డాక్టర్ కేశవరెడ్డి అనే పేరు పరిచయం అయ్యింది. మా చిత్తూరు రచయిత అనే అభిమానమో ఏమోగానీ, పేరు మాత్రం అలాగే గుర్తుండిపోయింది. మళ్ళీ మునెమ్మ దెబ్బకి ఆ పేరు మర్చిపోలేని విధంగా మెదడులో నిక్షిప్తమైపోయింది.

నా మిత్రుడు, సహరచయిత సిద్దారెడ్డి వెంకట్ (‘కేస్ నెంబర్ 666/2013’ సినిమా దర్శకుడు) తో మునెమ్మ గురించి చర్చిస్తున్నప్పుడు “అరే! నువ్వు కేశవరెడ్డిగారిని ఇన్నాళ్ళూ మిస్ అయ్యావా. చదవాలి బాస్. ఆయన నవల ‘సిటీ బ్యూటిఫుల్’ చదివాకగానీ నాకు తెలుగులో అంత గొప్ప పుస్తకాలు ఉన్నాయని తెలీదు” అంటూ ‘సిటీబ్యూటిఫుల్’ నవలని పరిచయం చేశాడు. ఒక్కబిగిన చదివిన నవలలు నాజీవితంలో తక్కువే. సిటీ బ్యూటిఫుల్ ఆ కోవలోకి చేరింది. చైతన్య స్రవంతి శైలిని గురించి వినడం చదవడం అప్పటికే చేశాను. తెలుగులో అంపశయ్య నవీన్, వడ్డెర చండీదాస్ రచనలు ఆ శైలితో సుపరిచితమే. కానీ కేశవరెడ్డి విన్యాసంలోఆశైలి ఇంకో అద్వితీయమైన స్థాయికి చేరిందని నేను ఖరాఖండిగా చెప్పగలను. చైతన్య స్రవంతికి జేమ్స్ జాయ్స్ ఆద్యుడైతే, తెలుగులో చలం తరువాత ఆ శైలిని ఉఛ్ఛస్థితికి తీసుకెళ్ళిన రచయిత డాక్టర్ కేశవరెడ్డి. కాశీభట్ల వేణుగోపాల్ లాంటివాళ్ళు దీన్ని ఇంటర్నల్ మోనోలాగ్ అన్నా, నాకైతే స్ట్రీమ్ ఆఫ్ కాంషస్నెస్ గానే అనిపిస్తుంది.

ఇక వేట మొదలయ్యింది. ఇన్ క్రెడిబుల్ గాడెస్, చివరి గుడిసె, స్మశానం దున్నేరు, మూగవాని పిల్లనగ్రోవి, రాముడుండాడు రాజ్జిముండాది చదివాకగానీ ఆకలి తీరలేదు. ప్రతిపుస్తకం చదువుతుంటే ఒక అద్భుతమైన సినిమా చూసిన అనుభవం. ధృశ్యాలు కళ్లముందు కదలాడి, ఉద్వేగాలతో శరీరాన్ని ఊపేసిన అనుభూతి. ఇంత సులువుగా, ఇంత శక్తివంతంగా, ఇంత ప్రభావవంతంగా రాయగలగడం ఒక సాధన.

***

“మీ మునెమ్మ నవల చదివాను సర్”

“ఎట్లుంది? బాగుందా?”

“అద్భుతంగా ఉంది సర్. ఆ నవలను సినిమాగా తియ్యాలనుంది సర్.”

“మునెమ్మనా…సినిమాగానా! మనోళ్ళు చూస్తారా? అయినా సినిమా అంటే పెద్ద కష్టం లేబ్బా.”

“నిజమే…కానీ తీస్తే బాగుంటుంది అనిపించింది సర్. మిమ్మల్ని కలవాలనుంది. మీరు హైదరాబాద్ కి ఎప్పుడైనా వస్తున్నారా సర్”

“హైదరాబాదా…ఇప్పట్లో రాలేనుగానీ, నువ్వే మా నిజామాబాద్ కి రా ,కూచ్చుని మాట్లాడుకుందాం.”

“సరే సర్….సార్ మాదీ చిత్తూరు జిల్లానే సర్..పీలేరు దగ్గర యల్లమంద.”

“అవునా…నాకు బాగా తెలుసునే ఆ ఏరియా అంతా…సరే ఇబ్బుడు క్లినిక్ లో ఉండాను. మధ్యాహ్నంగా ఫోన్ చెయ్ మాట్లాడుకుండాము.” అంటూ అటువైపునుంచీ నిశ్శబ్ధం.

నేను ఫోన్ పెట్టేసాను.

***

అప్పట్నించీ అడపాదడపా ఫోన్లో మాట్లాడుకునేవాళ్లం. నేను అవడానికి చిత్తూరువాడినే అయినా, చదువురీత్యా, ఉద్యోగ రీత్యా ఎక్కడెక్కడో తిరగడం కారణంగా భాష చాలావరకూ న్యూట్రలైజ్ అయిపోయి ఏవోకొన్ని పదాలలో తప్ప మా యాస నాకు దూరమయ్యింది. కానీ డాక్టర్ కేశవరెడ్డిగారితో మాట్లాడుతుంటే, ఆ యాస వింటుంటే ఏదో తెలీని ఆత్మీయత. ఆయన జీవితమంతా నిజామాబాద్ లో గడిపినా, అక్కడి యాసతో భాషతో ఒదిగిపోయినా తన ఇంటొనేషన్, కొన్ని టిపికల్ పదాలువాడటం అన్నీ ‘సిత్తూరు’తీరే.

కొన్నాళ్లకు మిత్రులసహాయంతో ధైర్యం చేసి మునెమ్మ నవల హక్కులు తీసుకోవడానికి నిర్ణయించుకుని నిజామాబాద్ ప్రయాణం అయ్యాను. కలిసాను. ఫోన్లో ఎంత సింప్లిసిటీ వినిపించిందో అంతకన్నా సింపుల్ గా మనిషి కనిపించారు. క్లినిక్ నుంచీ పికప్ చేసుకుని ఇంటికి వచ్చాం. మధ్యాహ్నం కలిసినవాళ్లం మాటల్లో సాయంత్రం ఎప్పుడయ్యిందో తెలీలేదు. ప్రపంచ సినిమాపై కేశవరెడ్డిగారికున్న పట్టు, తన దగ్గరున్న స్క్రీన్ ప్లే కలెక్షన్లూ చూశాక ఆయన నవలలు చదువుతుంటే సినిమా ఎందుకు కనిపించిందో అర్థమయ్యింది. నాదగ్గరున్న చిట్టాకూడా ఏకరువు పెట్టాను. వెనుదిరిగి వచ్చాక పోస్టులో కొన్ని డివిడి లు.  పుస్తకాలు పంపాను.

మునెమ్మ మా సొంతమయ్యింది. పుస్తకం మీదో లేక నా ల్యాప్ టాప్ లోనో ఏదో పిచ్చిగా నోట్స్ రాసుకోవడం. మునెమ్మ పాత్రను, కథను, ఉపకథల్ని పొడిగించుకోవడం, కొత్త కోణాల్ని జోడించడం కేశవరెడ్డిగారికి ఫోన్ చేసి విసిగించడం. పాపం ఆయన ఎప్పుడూ విసుక్కున్న దాఖలాలు మాత్రం కనిపించలేదు. కొన్నిరోజులకి ఇప్పట్లో మునెమ్మను సినిమాగా తియ్యలేమనే నిజం తెలిసొచ్చింది. నేను నిరాశపడ్డా కేశవరెడ్డిగారు నిరాశపడలేదు. “సినిమా తియ్యాలంటే ఎంత కష్టపడాలో నాకు తెలుసులేబ్బా! చూద్దాం ఏమవుతుందో” అనేవాళ్ళు. నేను చెప్పిన క్లైమాక్స్ మార్పులకు మించిన ముగింపులు కొన్ని తనే తయారుచేశారు. ఆయన స్వప్నించి మునెమ్మని సృష్టిస్తే నేను ఆ మునెమ్మను ఇంకా శ్వాసిస్తూ ఉన్నాను.

***

డాక్టర్ కేశవరెడ్డిగారు హైదరాబాద్ వచ్చినప్పుడల్లా ఏదో విధంగా కలిసే ప్రయత్నం చేస్తుంటాం. అప్పుడప్పుడూ ఫోన్లు. సాహితీచర్చలు. సినిమాల గురించి మాటలు. మునెమ్మ గురించి తక్కువగా మాట్లాడతాం.

***

తెలుగు నవలాకారుల్లో డాక్టర్ కేశవరెడ్డి ఒక మాంత్రికుడు. అత్యుత్తమ కథకుడు. ల్యాండ్ స్కేప్ ను, మిథ్ ను, మ్యాజిక్ ను, ఫోక్ లోర్  ని, జీవజంతువుల్ని కలగలిపి వాటితోనే మనుషులకు కథ చెప్పించగలిగిన అరుదైన కళాకారుడు. డాక్టర్ కేశవరెడ్డిగారికి జన్మదిన శుభాకాంక్షలు.