జయహో మాతా!

 

కొరతబోయిన జానకి

 

పరమ పూజనీయ మహామహోపాధ్యాయ శ్రీశ్రీశ్రీ ప్రతివాది భయంకర సాధ్వీమణి ఆశ్రమమూ, అశేష కోటి భక్తజన సందోహమూ గగ్గోలుగా ఉన్నాయి. ఆగ్రహావేశాలతో రగిలిపోతున్నాయి. కేకలతో అరుపులతో నినాదాలతో హోరెత్తుతున్నాయి.

“జయహో మాతా” నినాదాలు ఆకాశంలో ప్రతిధ్వనిస్తున్నాయి.

“పేడ విసిరే హక్కు మాతాజీది మాత్రమే” అనే శంఖారావాలు దిక్కులు పిక్కటిల్ల జేస్తున్నాయి.

ఆశ్రమం ఆశ్రమమంతా రణగొణధ్వనులలో మునిగి ఉంది.

ఆశ్రమమంటే ఆశ్రమం అని కాదు. ఆ ఆశ్రమంలోకి అతి కొద్దిమంది ఆంతరంగికులకు మాత్రమే ప్రవేశం గనుక లోకమంతా ఆశ్రమమే. భక్తశిఖామణుల మనసులన్నీ ఆశ్రమాలే. ప్రతి భక్త శిఖామణీ మాతా స్వరూపమే.

భక్తకోటి అంటే నిజంగా భక్తకోటి అని కూడ కాదు. అది నిజంగా భక్త డజనో భక్త ద్విడజన్లో అని కొందరు అంటారు గాని ఒక్కొక్కరిదీ లక్ష గళార్చన. పామర భాషలో చెప్పాలంటే నోరు పెద్దది.

మాతాజీ పూర్వజన్మ సత్కర్మల ప్రభావపు మత్తు ఇంకా వదలని వాళ్లూ, ఆ సత్కర్మలకు ఇంకా ధన్యవాదాలు చెప్పాలనే వాళ్లూ కొందరు.

మాతాజీ పస్తుత జన్మలో చేస్తున్న పనులలో కొన్ని తమకు గిట్టనివాళ్లకు ఎక్కుపెట్టినవి గనుక శత్రువుకు శత్రువు మిత్రులు సూత్రాన్ని పాటించే అవకాశవాద భజనపరులు కొందరు.

మాతాజీ చెప్పేదీ అవతలివాళ్లు చెప్పేదీ అక్షరం కూడ తెలియకపోయినా లక్ష గళార్చనలో గొంతు కలిపితే సరిపోతుంది గదా అని పెదాలు కదిపే గాలివాటాలు కొందరు.

అంతా కలిసి తలలు వందా, నోళ్లు కోటీ కలిపి భక్తకోటి అనవచ్చు.

మాతాజీకి అసలు నరవాసన గిట్టదు. అందువల్లనే మాతాజీ నాలుగు దశాబ్దాలలో నాలుగు ఆశ్రమాలు మార్చారు.

ప్రతిసారీ, పాపం, నరవాసన లేనిచోట ఆమె ఆశ్రమం నిర్మించుకోవడం, త్వరలోనే అక్కడ చుట్టూ ఇళ్లూ మనుషులూ నిండిపోయి, ఆ నరవాసన గిట్టక ఆమె మరొక చోటికి ఆశ్రమాన్ని తరలించడం.

ఈసారి మాత్రం ఇక మరొకవైపు ఇళ్లు రావనే నమ్మకంతో ఒక సరస్సు తీరాన ఆమె ఆశ్రమం నిర్మించుకున్నారు. కాని అప్పటి మహారాజు ఆ సరస్సు తీరాన్ని దేశదేశాల వ్యాపారస్తులకు పంపిణీ చేయడం మొదలెట్టాడు. ఒకటే నరవాసన.

పాపం, మాతాజీ ఇబ్బందులు ఎవరర్థం చేసుకుంటారు?

అప్పటికే నాలుగు ఆశ్రమాలు మార్చిన అలసటతో, ‘పోనీలే, ఇక ఇది భరిద్దాంలే’ అని ఆమె తనకు తాను నచ్చజెప్పుకున్నారు.

కాని ఆశ్రమంలోపలికి మాత్రం అత్యంత సన్నిహిత భక్తులకు మాత్రమే ప్రవేశార్హత ఉంది. ఇతరులకు లేదు.

మాతాజీ పూర్వజన్మలో అద్భుత కళానైపుణ్యాన్ని వరంగా పొంది వేలాది అభిమానులను సంపాదించుకున్నారు. ఆ పూర్వజన్మ వాసనలు ఎంత గాఢమైనవంటే, గాఢ గంధకికామ్లం లాగ అవి ఈ జన్మకు కూడ సాగి వచ్చాయి. భూమ్యాకర్షణ శక్తిలాగ వలయాన్ని సృష్టించాయి. నరవాసన గిట్టని మాతాజీకి, నరసమాజ భక్తకోటి ఏర్పడింది.

ఇక ఈ జన్మలోనూ ఆమె భక్తజనకోటి పెరగడానికి కలిసివచ్చిన కారణాలున్నాయి.

ఆమె ఒక పేడ ముద్దల విసురుడు యంత్రాన్నీ, ఒక కొలతల కార్యశాలనూ, ఒక అబ్రకదబ్ర రసాయన కర్మాగారాన్నీ ఏర్పాటు చేశారు. అవి ఆమెకు భక్తకోటిని సమకూర్చడంలో మహత్తర దోహదం చేశాయి.

ఏమాటకామాటే చెప్పుకోవాలి. పేడముద్దల యంత్రం అసాధారణమైన కృషి. ఆ పేడముద్దలు దశదిశలా విసరడంతో మాతాజీ ప్రతిష్ఠ దశదిశలా మార్మోగిపోయింది.

అయితే పేడముద్దలు విసరడంలో మాతాజీ తగిన జాగ్రత్తలు తీసుకుంటారని గిట్టనివాళ్లు అంటారనుకోండి.

మాతాజీ పేడముద్దల్ని ప్రతిసారీ ఉడతల మీదా, కుందేళ్ల మీదా, లేళ్ల మీదా విసిరారు గాని పొరపాటున కూడ క్రూరమృగాల మీదా, పులుల మీదా, తోడేళ్ల మీదా, నక్కల మీదా విసరలేదు. మనుషుల మీద, మనుషుల్ని ప్రేమించేవాళ్ల మీద విసిరారు గాని మనుషుల్ని చంపేవాళ్ల మీద, తినేవాళ్ల మీద ఎప్పుడూ ఎంతమాత్రమూ విసరలేదు. చనిపోయిన మంచి మనుషుల మీద విసిరారు గాని బతికి ఉన్న దుర్మార్గుల జోలికి వెళ్లలేదు.

మాతాజీ పేడముద్దల విసురుడుకు ఒక పద్ధతి ఉంది. తాము స్థాపించిన కొలతల వ్యవస్థ ప్రకారం ‘కొలత తగ్గింది, కొరతవేయాలి’ అని ధ్రువీకరణ పత్రం వచ్చిన వాళ్ల మీద మాత్రమే ఆమె పేడముద్దలు విసురుతారు. మనుషుల్ని తినేవాళ్లను కొలిచే ప్రయత్నమే ఎప్పుడూ చేయలేదు గనుక వాళ్లకు ‘కొలత తగ్గింది, కొరతవేయాలి’ అనే నిర్ధారణ వచ్చే అవకాశమే లేదు.

తమకు ఎర కాదగిన చిన్నా చితకా జంతువుల మీద, తమను ప్రశ్నించే వాళ్ల మీద పేడముద్దలు విసిరితే మరీ మంచిది, తాము చంపదలచిన కుక్కకు పిచ్చి కుక్క అని పేరు పెట్టే మహత్తర బాధ్యత మాతాజీ తీసుకున్నారు గదా అని క్రూర మృగాలు సంతోషించాయి. మనుషుల్ని తినేవాళ్లు మహదానందపడ్డారు.

ఈ పేడముద్దలు విసిరే కార్యక్రమం మాతాజీకి కొందరు అభిమానులను సంపాదించిపెట్టింది.

ప్రతి మనిషికీ ఏదో ఒక అసంతృప్తి ఉంటుంది గదా. చాలామందికి ఆ అసంతృప్తికి కారణాలూ తెలియవు. ఆ అసంతృప్తి ఎలా పోతుందో తెలియదు. ఆ నిస్పృహాహావరణంలో ఏమి చేయాలో తోచక వాళ్లు దారిపక్క నిలబడి గారడీవాడు ముంగిసతో పామును ఎప్పుడు కొరికిస్తాడా అని ఎదురుచూస్తుంటారు. వీథిలో ఒకరి మీద ఒకరు విసురుకునే తిట్లను ఆసక్తిగా వింటూ కాలక్షేపం చేస్తారు. మనిషిలోని ఈ బలహీనతను మాతాజీ కనిపెట్టారు.

కొందరిని ఎంచుకుని పేడముద్దలు విసురుతూ ఉంటే మనుషులలోని ఈ హింసాకాలక్షేప ప్రవృత్తిని ఆకర్షించగలనని మాతాజీ గుర్తించారు. ఆ పేడముద్దలు బలహీనుల మీద విసిరితే మరింత చప్పట్లు పడతాయి. ప్రజల అభిమానాన్ని చూరగొని కొందరిలోనైనా అసూయ పుట్టించిన వారి మీద విసిరితే కూడ చప్పట్లు పడతాయి.

ఎప్పుడో ఒకసారి మాతాజీ పేడముద్దలు నిజంగానే తప్పులు చేసినవారి మీద కూడ పడేవి. అయినా తప్పులు చేయని మానవమాత్రులు ఉంటారా? అది చూపించి ఆమె పరమపావన న్యాయమూర్తి అని, తప్పులు చేసినవారి మీదనే ఆమె పేడముద్దలు విసురుతారని భక్తజనం పారవశ్యగీతాల హోరెత్తించేది. ఆ ఘోషలో అనుమానాలూ ప్రశ్నలూ మణగిపోయేవి.

తనకు గతజన్మలో అందిన కళానైపుణ్య వరం ఈ జన్మలో శాపవశాన రద్దయి పోయింది గనుక అంతమంది భక్తులను మళ్లీ కూడగట్టుకోవాలంటే పేడముద్దలు విసరడమే ఏకైక మార్గమని మాతాజీ కనిపెట్టారు.

మాతాజీ స్థాపించిన కొలతల వ్యవస్థ అయితే కనీవినీ ఎరగనిది. ప్రపంచంలో ఎక్కడా ఎప్పుడూ ఈ స్థాయిలో లేనిది. మాతాజీ దగ్గర ఒక కొలబద్ద ఉండేది. అది ఐదు ఫీట్ల నాలుగు ఇంచుల, మూడు లైన్ల, ఎనిమిది థౌ ల పొడవు కొలబద్ద. (క్షమించాలి, ఈ కొలతలు నాకూ ఇప్పుడే తెలిశాయి. లైన్ అంటే అంగుళంలో పన్నెండో వంతు, థౌ అంటే అంగుళంలో వెయ్యోవంతు!)

ఈ కొలబద్ద సరిగ్గా మాతాజీ పొడవు అని, ప్రపంచానికి తానే ప్రమాణం అనే ప్రగాఢ విశ్వాసంతో ఆమె అది తయారు చేశారని గిట్టనివాళ్లంటారు గాని నిజంగా మాతాజీ పొడవు ఎంతో మానవమాత్రులం మనం గ్రహించగలమా?

కళానైపుణ్యం ఉండిన పూర్వజన్మలో మాతాజీ అన్ని రకాల మనుషులనూ మనుషుల మధ్య సంబంధాలనూ చాల బాగా చెప్పేవారు. ఆ కళానైపుణ్యానికి కన్నీళ్లు పెట్టుకుని ఆమె అభిమానులైపోయి, ఇప్పటికీ ఆ అభిమానం వదలని వాళ్లెంతో మంది ఉన్నారు.

ఈ జన్మలో మాత్రం మాతాజీకి మనుషులూ మనుషుల మధ్య సంబంధాలూ అనేవి కంటగింపైపోయాయి. మనుషులందరూ ఒక్కటే అని ఆమెకు కొత్త ఆలోచన వచ్చింది. మనిషి అంటే నిర్వచనం మారిపోయింది. తన కొలబద్దకు సరిగ్గా సరిపోతేనే మనిషి. అంతే. ప్రతి ఒక్కరినీ మాతాజీ ఆ కొలబద్దతో కొలిచేవారు. “నువ్వు ఐదు ఫీట్ల నాలుగు ఇంచుల మూడు లైన్ల, ఏడు థౌల పొడవున్నావా, ఒక్క థౌ కొలత తగ్గింది, ఫో, కొరత వేయాల్సిందే” అనేవారు. “నువ్వు ఐదు ఫీట్ల నాలుగు ఇంచుల మూడు లైన్ల  తొమ్మిది థౌల పొడవున్నావా, కొలత మారింది, ఫో, కొరత వేయాల్సిందే” అనేవారు.

ఇది మనుషుల పొడవుకు సంబంధించిన వ్యవహారం మాత్రమే అనుకునేరు, ఇంకా చాల కొలతలున్నాయి. చుట్టుకొలత, జుట్టుకొలత, కట్టు కొలత, చొక్కా రంగు, ఆలోచనలు, కనుముక్కు తీరు, కులం, ప్రాంతం, స్త్రీలైతే మాతాజీ కట్టుకున్న పట్టుచీర లాంటి పట్టుచీరే కట్టుకున్నారా లేదా, మాతాజీ మడమల మీద చీర ఎక్కడిదాకా ఉందో వాళ్లకూ అక్కడిదాకే ఉందా లేదా, యువతులైతే చున్నీ నిండుగా కప్పుకున్నారా లేదా, చేతుల్లేని రవికలు తొడుక్కున్నారా చేతులున్న రవికలు తొడుక్కున్నారా…ఇలా ఎన్నెన్నో. కాదేదీ కొలతకనర్హం.

ఒకసారి ఒక బాటసారి తన ఐదు సంవత్సరాల మనుమరాలితో ఆమె ఆశ్రమం ముందునుంచి పోతున్నాడు.

పాపం, ఆ చిన్నారి పాప గలగల మాట్లాడుతూ చెంగుచెంగున ఎగురుతూ ఆశ్రమం ఆవరణలో పూలమొక్కలు చూసి లోపలికి ఒక్క ఎగురు ఎగిరింది.

“ఏయ్ ఆగక్కడ. ఎవరు నువ్వు? ఆ భుజాలు కనిపించే గౌను ఏమిటి? ఎంత అప్రదిష్ట. శరీరభాగాలు ప్రదర్శిస్తూ ఆ గంతులేమిటి? భుజాలు కనిపించని నిండు జాకెట్టు పరికిణీ వేసుకోవాలి గాని ఆ చేతుల్లేని గౌనేమిటి? మోకాళ్ల కిందంతా కనబడడం ఏమిటి? నిండు జడ వేసుకోవాలి గాని ఆ కురచజుట్టు ఏమిటి? కొలత తగ్గింది, ఫో కొరత వేయాల్సిందే” అని గర్జన వినబడింది.

అలా ఆమె కొలతకు తగ్గి కొరతకు గురైన వాళ్లు ఎందరెందరో. ఎన్ని రకాల వాళ్లో.

అలా కొందరిమీద పేడముద్ద విసిరీ, కొందరిని కొరత వేసీ మాతాజీ మరే వ్యాపకమూ లేక నిస్పృహలో ఉన్నవారెందరికో నిరతాన్నదానం వంటి నిరంతర హాస్య కాలక్షేపదానం కలిగించి వారందరినీ భక్తులుగా మార్చుకున్నారు.

ఈ రెండు కార్యక్రమాలతో పాటు మాతాజీ ప్రారంభించిన మూడో కార్యక్రమం మరింతగా ఆమెకు అభిమానులను సంపాదించి పెట్టింది.

పూర్వజన్మలో ఆమె కళానైపుణ్యం చూసి ఇంత ప్రతిభావంతురాలు మన అభిప్రాయాలు చెపితే మనకెంత గొప్ప, మనకెంత ఆదరణ దొరుకుతుంది అని పావన నవజీవన సమాజం అనే అభిప్రాయాలు గల భవిష్య సాహితి సంస్థవారు తమ కాగితాలూ కరపత్రాలూ పుస్తకాలూ మాతాజీకి సమర్పించుకున్నారు.

మాతాజీ అవన్నీ గంభీరంగా చదివారు. వాటిలో ఉన్నది మాతాజీకి ఎంత అర్థమయిందో తెలియదు గాని ఆమె పునర్జన్మ ఎత్తారు. కొత్త అవతారంలో పాత కళానైపుణ్యం మిగలలేదు. ఇంగువవాసన మాత్రం మిగిలిపోయింది.

మాతాజీ కొత్త పుస్తకాలను తనకు తోచినట్టుగా అర్థం చేసుకుని తనకు అర్థమైనవి మాత్రమే పావన నవజీవన సమాజం పరమ గురువుల ఆదేశాలని చెప్పడం ప్రారంభించారు.

భవిష్యత్ సాహితి వంటి సంస్థలకు పావన నవజీవన సమాజ ఆశయాలే తెలియవని, అసలు తనకు తప్ప మరెవరికీ అవి తెలియవని చెప్పడం ప్రారంభించారు. ఆ ఆశయాలు అమలు చేయడానికి వీథుల్లోకి రావాలనీ పోరాటాలు జరపాలనీ కొందరు అంటారు గాని అదంతా అనవసరం అని మాతాజీ ఉపదేశించారు. గుహలో కూచుని పరమ గురువుల పాఠాలు, వాటికి మాతాజీ భాష్యాలు అధ్యయనం చేస్తే చాలునని కొత్త సిద్ధాంతం తయారు చేశారు.

ఈలోగా వయసు పెరిగిపోవడం వల్లనో, జన్మ మారినందువల్లనో, పాత కళానైపుణ్యం పోయినందువల్లనో కారణం తెలియదు గాని మాతాజీకి పైత్యరసం ప్రకోపించింది. దానికి దివ్యౌషధం ఒక్క మాదీఫల రసాయనం మాత్రమేనని మాతాజీ భక్తుడైన వైద్య శిఖామణి సలహా ఇచ్చాడు. ఒక్క చెమ్చాడు మాదీఫల రసాయనంతో పైత్య ప్రకోపం ఇట్టే మాయమైపోయింది.

దానితో పావన నవజీవన సమాజ సాధనకు తాను తయారు చేసిన కొత్త సిద్ధాంతాన్ని ఇలా సర్వరోగ నివారిణిగా మార్చి అందరిచేతా చప్పరింపజేస్తే బాగుంటుందని మాతాజీ సంకల్పించారు.

అలా మాతాజీ సృష్టిగా అబ్రకదబ్ర రసాయనం తయారయింది.

సమాజ మార్పు కొరకు ఏదో దివ్యౌషధం కావాలని చాలామందిలో ఉన్న కోరిక వల్ల అబ్రకదబ్ర రసాయనానికి విపరీతమైన గిరాకీ ఏర్పడింది. ఈ అబ్రకదబ్రకూ పావన నవజీవన సమాజపు పరమగురువుల పాఠాలకూ సంబంధం ఉందా లేదా తరచిచూసే ఓపిక లేని వారూ, పోరాటాల్లో పాల్గొని పులుల నోటా, తోడేళ్ల నోటా పడనక్కర లేకుండానే తమవి కూడా పావన నవజీవన సమాజపు ఆదర్శాలేనన్నట్టు నటించవచ్చునని గ్రహించినవారూ మాతాజీ భక్తులైపోయారు.

అట్టి విధంబుగా, మాతాజీ పూర్వజన్మ వాసనల కళానైపుణ్య ప్రభావంలో కొందరు, ప్రస్తుత జన్మలో పేడముద్దలకు అంటిస్తున్న హాస్యరస గుళికల వల్ల ఆత్మశాంతీ వినోదమూ పొంది కొందరు, కొలతల కొరతలతో అంచితానంద శాంత సామ్రాజ్యం చేరి కొందరు, సమాజ పరివర్తనా ఔషధ అబ్రకదర్బ రసాయనం గురించి అమాయకత్వం వల్ల కొందరు, మాతాజీ భక్తకోటి పెరిగిపోయింది.

పాపం, ఆశ్రమం నుంచి కాలు బైట పెట్టగూడదనే ముని శాపం వల్ల మాతాజీ ఎన్నడూ సూర్యుణ్ని కూడ సరిగా చూసి ఎరగరు. భక్తులు ఆశ్రమానికి రావడానికీ వీల్లేదు, మాతాజీ ఆశ్రమం వదలడానికీ వీల్లేదు. అయినా మాతాజీ మాహాత్మ్యం ఎంత అరివీర భయంకరమైనదంటే ఆమెను ఒక్కసారి కూడ చూడనివాళ్లెందరికో ఆమె ఆరాధ్యదేవత అయిపోయారు.

ఆమె మీద ఈగవాలితే (అది వాళ్లెట్లాగూ చూడలేరు గాని), ఈగ వాలిందని తెలిస్తే వెంటనే చతురంగబలాల అక్షోహిణులు రంగంలోకి దిగిపోతాయి. ‘ఈగ మీదనే అంత యుద్ద సన్నాహాలు జరిగినప్పుడు, అమ్మో మనమెంత’ అని మామూలు మానవులు నిర్లిప్త మౌన ముద్రాంకితులైపోయారు. ఆ అప్రతిహత వాతావరణంలో జయహో మాతా భీషణ నినాదాలు ఎల్లవేళలా ఆకాశంలో ప్రతిధ్వనిస్తుంటాయి.

అంతటి ఘనకీర్తి గల పరమ పూజనీయ మాతాజీ భక్త శిఖామణులలో ప్రస్తుత ఆందోళనకు, హఠాత్తు గగ్గోలుకు ఒక కారణం ఉంది.

దారిన వెళ్లే దానయ్య ఒకరు కాలికి పేడ ముద్ద తగిలిందే అని తీసి పక్కకు విసిరాడట. ఆ పేడముద్ద ఆశ్రమం నుంచి బైటపడినదేనట. దానికి మాతాజీ అంటించిన హాస్యరస గుళికలు కూడా అట్లాగే ఉన్నాయట.

స్వయంగా మాతాజీ తయారుచేసిన రంగరించిన ఆ హాస్యరస గుళికల పేడముద్ద నేరుగా మళ్లీ మాతాజీ తలకు తగిలిందట. విలువిద్యా నిపుణులు విసిరిన బాణం తిరిగివచ్చి వారి అమ్ములపొది లోనే పడినట్టు, ఈ పేడముద్ద ఇటువంటి పేడముద్దలు అసంఖ్యాకంగా వెలువరించిన బుర్రకే తగిలిందట. (మహా ప్రజ్ఞావంతమైన మాతాజీ మేధను బుర్ర అంటారా అని భక్తులు నన్ను కోప్పడవచ్చు గాక, కాని సరిగ్గా తగిలింది అక్కడే గనుక, నన్ను క్షమించాలి).

ఎంతటి అపచారం. ఎంత ఘోరం. ఎంతటి దారుణం. ఎంత అన్యాయం. ఎంత అక్రమం. ఎంత… ఎంత…ఎంత…

ఎవరి మీదనైనా పేడ విసిరే ఏకైక సమస్త గుత్తాధికారం మాతాజీకి మాత్రమే గాని దానయ్యకు ఉండవచ్చునా? భోషాణాలకొద్దీ పేడకుప్పలు సమకూర్చుకుని అందరిమీదా విసిరే మహత్తర వరప్రసాదిని హక్కును మరొకరు కొల్లగొట్టడం ఎంత అన్యాయం?

అసలు ఆ పేడముద్దను చేతితో తాకే అర్హతా యోగ్యతా మరొకరికి ఉన్నాయా?

పోనీ, తాకారే అనుకో, మహాప్రసాదం అని కళ్లకు అద్దుకోవలసింది, పక్కకు విసిరిపారేస్తారా?

పారేశారే అనుకో, అది ఆశ్రమం వైపు గురిచూసి విసురుతారా?

విసురుతారే అనుకో, ఆ సమయంలో మాతాజీ అక్కడ నిలబడి ఉంటారనీ, ఆ పేడముద్ద ఆమె మీద పడుతుందనీ స్పృహ లేకుండా ఉంటారా?

ఎంతటి అపచారం!

ఇదివరకు మాతాజీ వేల పేడముద్దలు విసరలేదా, ఈ ఒక్కదానికి ఏమొచ్చె అని అడిగే గడుగ్గాయిలూ ఉంటారా?

ఎంతటి దుర్మార్గం!

దానయ్య అపచారానికి మద్దతు కూడానా, సమర్థన కూడానా, ప్రచారం కూడానా…?

లోకం ఎంత చెడిపోయింది!

లోకానికి అబ్రకదబ్ర అవసరం ఎంతగా ఉంది!

వాడు నన్ను తిరిగి కొట్టినప్పుడు కదా కథ మొదలయింది. దాని ముందు కొట్టింది నువ్వే కదా అని తప్పుడు తర్కం తీస్తారా? ఏమి బేహద్బీ?

అపచారం అపచారం అనే నినాదాలతో భూనభోంతరాళాలు దద్దరిల్లాయి. దానయ్యను మాత్రమే కాదు, ‘ఆ దానయ్య ఏం చేశాడబ్బా, దారిలో కాలికి పేడముద్ద తగిలితే పక్కకు విసరగూడదా’ అన్నవారినీ, ‘ఆశ్రమమే పేడముద్దల కర్మాగారం కదా, ఎంతోమంది ఆ పేడముద్దల బారిన పడ్డారు గదా, అప్పుడు లేని అపచారం ఇప్పుడొచ్చిందా’ అన్నవారినీ నరికి పోగులు పెట్టవలసిందే అని భజన బృందం ఆందోళన ప్రారంభించింది.

*