మూసలకు లొంగని కవి ఇస్మాయిల్

ismayil painting rainbow

ఎందుకో చెప్పలేను గానీ, నాకు కాలేజీ రోజులనుండీ “బెల్ కర్వ్ (నార్మల్ డిస్ట్రిబూషన్)” అంటే మహా ఇష్టం. బహుశా నా ఆలోచనలు అలా ఏకీకృతం(పోలరైజ్డ్) అయిపోవడం వల్లనో ఏమో గానీ, నాకు ఒక కవి కవిత్వం తీసుకున్నా, కొంతమంది కవులని తీసుకున్నా, వాళ్ళ కవిత్వంలో ఇదే ధోరణి కనిపిస్తుంటుంది. మనిషి జ్ఞానం పరిధి విస్తృతమవుతున్నకొద్దీ అతని ఆలోచనల సారం మన పూర్వీకులూ (దేశకాలపరిధులతో నిమిత్తం లేకుండా), ముందుతరాల మేధావులూ, అందించిన జీవనసారానికి సమీపంగా అతని ఆలోచనలు ప్రయాణిస్తాయని నా నమ్మకం. దీన్ని ఎప్పటికప్పుడు బేరీజువేసుకుంటూంటాను కూడా. అలాంటి నా ప్రగాఢమైన నమ్మకానికి మరింత దోహదం చేసిన కవుల్లో ఇస్మాయిల్ ఒకరు.

ఇస్మాయిల్ కవిత్వం గురించి చాలామంది చాలా విశదంగానే రాసేరు. అతనిది అనుభూతివాద కవిత్వం అని ఒక ముద్రకూడా ఉంది. నాకు ఈ ముద్రలపట్ల నమ్మకం లేదు. అందులోనూ సమకాలీన కవుల్నీ, కథకుల్నీ ఒక మూసలోకి నెట్టి ఊహించుకోవడం నాకు అంతగా నచ్చని విషయం (ఆ కవులూ, రచయితలూ వాళ్ళ దృక్పథాల మేనిఫెస్టోలు చెప్పుకున్నప్పటికీ). ఎందుకంటే, ఒక రచయిత తన ఆదర్శాల సరాసరికి రాయగా రాయగా చేరుకుంటాడు తప్ప రాసిందంతా దాన్నే ప్రతిఫలించదన్నది నా మరో నమ్మకం. వయసూ, అనుభవంతో పాటే, రాస్తూ రాస్తూ కవిగాని రచయితగాని తన ఆలోచనల, విశ్వాసాల సమాహారంనుండి నెమ్మది నెమ్మదిగా తన తార్కికచింతనని రూపుదిద్దుకుంటాడు. మొదటిరచనలోనూ, చివరిరచనలోనూ ఒక్కలాగే ఉంటే రచయితలో పరిణతి లేదని నాకు అనిపిస్తుంది. నిజానికి ఒక కవిని అతని సమకాలీనులకంటే, తర్వాతి తరాలే, నిష్పక్షపాతంగా బేరీజు వేస్తాయి. వాళ్ళకి ఏ రకమైన ప్రలోభాలూ, నిర్భందాలూ ఉండవుగనుక.

ఇస్మాయిల్ లో నాకు నచ్చిన అంశం అతను ఏ భావపరంపర మూసకూ లొంగకపోవడం. కవి అచ్చం గాజుపట్టకంలా ఉండాలి. ఎవరు ఎటునుంచిచూసినా ఏదో ఒక అందం, రంగు కనిపించగలగాలి. ఏకీకృతఆలోచనలుగల కవులకి అది సాధ్యపడదు.

ఒక తుఫాను భీభత్సాన్ని చెపుతూ “వర్షంలో ఊగే చెట్లు” కవితలో చెట్లని సముద్రం చేసి (సాగరంలా ఊగుతోంది… పారం కనిపించని తోట), సముద్రాన్ని చెట్టు (సాగరవృక్షాగ్రానికి చేరుకుంటాయట ఓడలు) చేస్తాడు. ఇందులో అందమైన పదబంధాలున్నాయి. అయితే, ఆ కవితలో నాకు వేరే అందమైన అంశాలు కనిపిస్తాయి. హుద్ హుద్ లాంటి భౌతికమైన తుఫానులు జీవితంలో ఎన్నో రావు. కానీ, ఇక్కడ చెప్పిన తుఫాను మన మౌలిక విశ్వాసాలని వేళ్ళతో సహా పెకలించివేసే సందర్భం. కొందరికయినా ఇలాంటి తుఫానులు జీవితంలో అనుభవం అయే ఉంటాయి. అటువంటి సందర్భం ఎదురైనపుడు, అది మన విశ్వాసాల మూలాల్ని ప్రశ్నిస్తుంది. శ్రీ శ్రీ చెప్పినట్టు అంతవరకూ కాళ్ళ క్రింద పదిలంగా ఉందనుకున్న మన విశ్వాసాల నేల, పగుళ్ళిచ్చి నమ్మకాల చెట్లు ఒక్కొక్కటే కూకటివేళ్లతో కూలుతున్నప్పుడు, మన వైయక్తికమైన భావపరంపరే, స్వయంగా తర్కించి ఏర్పరచుకున్న విశ్వాసపు విత్తనాలే చివరకి మిగులుతాయి. అవే ఇప్పుడు కురిసిన వర్షంలోంచి ప్రాణప్రదమైన తేమను తీసుకుని కొత్త ఆశలు, కొత్త మార్గనిర్దేశన చేస్తాయి. పక్షులు మళ్ళీ కొత్తపాటలు అందుకుంటాయి.

ఈ భావపరంపర పాతవాళ్లకంటే భిన్నం కాదు. చెప్పే తీరులోనే కవి ప్రత్యేకత. అక్కడే మానవ మేధస్సు సరాసరికి సమీపంగా ప్రయాణం చెయ్యడం. ఈ దృష్టితో ఒకసారి ఆ కవితని మళ్ళీ చదవండి.

వర్షంలో ఊగే చెట్లు

.

సాగరంలా ఊగుతోంది.

భోరున కురిసే వర్షంలో

పారం కనిపించని తోట

అహర్నిశీధులు క్షోభిస్తుందేం?

మహాసముద్రం చోద్యంగా ?

గుండెల్లో నిత్యం వానలు

కురుస్తో ఉంటాయి గావును.

అంత కల్లోలంలోనూ

ఎగిరిపడి కసిరేసే

వృక్షతరంగాల్నే

పక్షులాశ్రయిస్తాయేం?

తూర్పున నల్లటి ఉచ్చులు

తుఫాను పన్నుకుంటూ రాగా

చప్పున సాగరవృక్షాగ్రానికి

తప్పించుకుంటాయిట ఓడలు

మూలాల్ని ప్రశ్నించే గాలికి

కూలుతాయి మహావృక్షాలు,

ఊగుతాయి ఆ శూన్యంలో

ఊడిన వేళ్ళ ప్రశ్నార్థకాలు

చుట్టుకుపోయిన మహాసముద్రాల

అట్టడుగున మిగుల్తాయి

బలిసిన ప్రశ్నార్థకాలతో

కుల్కులలాడే మహానగరాలు.

భుజాలు పతనమైనా

బీజాలూ ద్విజాలూ ప్రసరిస్తాయి

కొత్తనీడల్ని పాతుతాయి

కొత్తపాటల్ని మొలకెత్తుతాయి

జలనిధికీ, ఝంఝ కీ

అలజడి పైకే కానీ

హృదయాలతి ప్రశాంతమట

– అదీ ఇస్మాయిల్ కవిత.
.

-నౌడూరి మూర్తి

murthy gaaru

ఆమె ప్రతి అడుగూ రంగుల హరివిల్లు!

images

ఏ దేశకాలాలు పరీక్షించి చూసినా… ఆర్థిక వ్యత్యాసాలలో, కష్టసుఖాలనుభవించడంలో, సమస్యలు ఎదుర్కోవడంలో మనుషులందరినీ ఒక “Normal Curve” మీద గుర్తించవచ్చు.   అయితే ఈ రేఖకి ఎడమప్రక్కనున్నవాళ్ళందరూ దుఃఖంలోనే బ్రతకలేదు, కుడిపక్కనున్నవాళ్లంతా సుఖలోనే బ్రతకలేదు. సంఘటనలు (ప్రకృతిసిద్ధమైనవి) యాదృచ్చికాలు. కొందరు జీవితానికి బానిసలై జీవిస్తే, కొందరు జీవితాన్ని శాసిస్తూ బ్రతికేరు. కొందరు కొంతకాలం జీవితానికి బానిసలైనా, ఒకానొక మహత్తరక్షణంలో తమ జీవితాన్ని 180 డిగ్రీలు తిప్పి, నమ్మశక్యంగాని జీవితానికి తెర తీశారు. జీవించడమనే మహాద్భుతమైన ప్రక్రియని అక్షరాలా అనుభవించిన అటువంటి అరుదైన వ్యక్తిత్వాలలో … సమకాలీన అమెరికను కవయిత్రి మాయా ఏంజెలో ఒకరు.

“నువ్వు మరణించినపుడు నీ చుట్టాలూ బంధువులూ కాక, మరొక వ్యక్తి కన్నీరు కారిస్తే నీది గొప్ప జీవితం” అన్నది ప్రమాణంగా తీసుకుంటే, మాయా ఏంజెలో నిరుపమానమైన విశ్వ నారి; చెప్పిన మాటని ఆచరించి చూపిన ఆదర్శ కవయిత్రి.

కవిగా ఎన్నో నీతి వాక్యాలు, ఎంతో ఉత్సాహాన్ని నింపే మాటలు చెప్పొచ్చు. జీవితాన్ని ఒక ఉదాహరణగా బ్రతకడం చాల కష్టం. వాళ్ళకున్న నేపధ్యంలో జీవితం చితికిపోతే ఎవరూ ఆశ్చర్యపోరు. అందరూ జాలిపడతారు. జీవితంలో ఏదీ సాధించని, సాధించలేని వాళ్ళే ఇతరుల జాలికోసం, తమ అసమర్థతలకి నేపధ్యాన్ని ఒక సాకుగా చేసుకుని ఆత్మవంచన చేసుకుంటుంటారు. అనువుగాని పరిస్థితులకి వ్యతిరేకంగా పోరాటం చేసిన వాళ్ళే వీరులు. కొందరి జీవితాలు అక్షరాల మేనేజిమెంటు సూత్రాలకి అచ్చమైన గీటురాళ్ళు. మాయా ఏంజెలో జీవితమే గమనించండి:

ఆమె మూడవయేట తల్లిదండ్రులు విడిపోయారు; ఆమె బాల్యంలోనే తల్లి ప్రియుడుచే మానభంగానికి గురవుతుంది; వయసులో కుంటెనగాడితో ప్రేమలో పడుతుంది, పర్యవసానంగా తానుకూడా వ్యభిచారవృత్తిలోకి దిగవలసి వస్తుంది; వంటలక్క వంటి ఎన్నో చిల్లరమల్లర ఉద్యోగాలు చేసీ, అదికూడా కుదరనప్పుడు దొంగతనం చేసిన బట్టలు అమ్ముకునీ, పొట్ట పోషించుకోవలసి వస్తుంది; అటువంటి పరిస్థితుల్లోకూడ ఖాళీ ఉన్నప్పుడు చెహోవ్, దోస్తావ్ స్కీ, లని చదివింది. తమ స్థితికి భగవంతుడినో, వ్యక్తులనో నిందించకుండా, జీవితం పట్ల ఆశని వదులుకోకుండా, వ్యక్తిత్వాన్ని నిలబెట్టుకుని తమజీవితాన్ని తామిచ్చిన సందేశాలకి ఉదాహరణగా గడిపిన కవులు అరుదు.

తనజీవితం ఎంత అధః పాతాళానికి పోయిందో తన జీవిత చరిత్ర రెండోభాగంలో ఇలా చెబుతుంది: “కొన్నాళ్ళు మాదకద్రవ్యాలతో కూడా సహవాసం చేసినతర్వాత ఒకరోజు ఒక మిత్రుడు తను హెరాయిన్ తీసుకుంటుండగా చూడమని బలవంతం చేశాడు… ‘తను తల వాల్చేడు, నోటంట మెల్లిగా చొంగ కారుతోంది. అది నా జీవితాన్ని మలుపుతిప్పిన సంఘటన.’ జీవితలో పతనపు అంచులుదాకా నడిచేను. ఒక ఉదాత్తమైన వ్యక్తి ఔదార్యం వల్ల బయటపడగలిగేను,” అని.

 

ang0_007

బహుశా, అందుకే జీవితం పట్ల తరగని ఆశావహ దృక్పధాన్ని అలవరచుకోగలిగింది.

 

1997లో వెబర్ స్టేట్ యూనివర్శిటీలో మాటాడుతూ, ” మన అతి బలహీన క్షణాల్లో, వేదనలతో అతలాకుతలమైన క్షణాల్లో, భయంకరమూ, నిరాశాభరితమైన క్షణాల్లో జీవితం మీద ఆశని రగల్చడానికి భగవంతుడు మేఘాల్లో ఇంద్ర ధనుస్సులు ఉంచాడంటే, మనలో ప్రతి ఒక్కరమూ మరొకరి జీవితంలో ఇంద్రధనుస్సు అవగలిగే అవకాశం ఉందని సూచించడానికే….” అని చెప్పింది.

ఆమె గొప్పబలం, కవిత్వం చదవడం తమకి పెద్దగా అలవాటు లేదని చెప్పుకునే పాఠకులకి సైతం దగ్గరవగలగడం. ఆమె స్వీయ చరిత్ర 17 భాషలలోకి అనువదించబడింది. 5 భాగాలుగా వ్రాసిన ఆమె స్వీయ చరిత్ర, I know why the caged Bird Sings   మిలియను పైగా కాపీలు అమ్ముడుపోయింది.

 

I Still Rise అన్న కవితా ఖండికలో…

 

“నువ్వు కసిగా, వక్రీకరించిన అబధ్ధాలతో,

చరిత్రలో నన్ను విలువలేనట్టు చిత్రీకరించ వచ్చు

నన్ను బురదలో తొక్కి అణగార్చ వచ్చు,

అయినా, నేను ఆ ధూళిలాగ పైకి లేస్తాను.

…..

నువ్వు నీ మాటలతో చంపెయ్య వచ్చు

నీ చూపులతో ముక్కలు చెయ్యొచ్చు

నీ ద్వేషంతో హతమార్చ వచ్చు

అయినా నేను గాలిలా, మళ్ళీ పైకి లేస్తాను. ” అంటుంది.

 

ఆమెకి అజరామరమైన కీర్తి తెచ్చిపెట్టిన కవిత I know Why the Bird in the Cage Sings లో పంజరంలోని పిట్టనీ, స్వేచ్ఛగా ఎగిరే పిట్టనీ సరిపోలుస్తూ,

 

ఒక స్వేఛ్ఛావిహంగము గాలి మూపున పైకెగురుతూ

ప్రవాహ దిశలో గతి మందగించేదాకా తేలియాడి,

సూర్యుని స్వర్ణారుణ కిరణాలలో రెక్కలల్లార్చి

ఆకసం పై తన హక్కును ప్రకటించ సాహసిస్తుంది…

….

పంజరం లోని పిట్ట భయద నిస్వనంతో ఆలపిస్తుంది…

తనకి తెలియనివీ, అయినా ఆకాంక్షించే కలలగురించి.

ఆ గీతం దూరతీరాలనున్న కొండలలో ప్రతిధ్వనిస్తుంది,

ఎందుకంటే, ఆ పంజరపు పిట్ట ఆలపించేది స్వేఛ్ఛాగానం.

*

 

ఒక్కసారి మళ్ళీ జాన్ డన్ (John Donne) గుర్తుకి రాకమానడు.

 

” ఓ మృత్యువా, గర్వపడకు!

ఎవరో కొందరు నిన్ను మహాశక్తిశాలివనీ,

భయంకరమైన దానివనీ అన్నారని.

నీ కంత శక్తులేం లేవు.

.

నువ్వెవర్నో కొందర్ని గెలిచేనని ఊహించేసుకుంటున్నావుగానీ,

వాళ్ళేం మరణించలేదు….

….

వాళ్ళ భౌతికకాయాలు ప్రకృతిలో కలిసినా,

ఆత్మలు నిర్వాణాన్ని చేరుకుంటాయి.

……

 

  1. అయినా, నేను పైకి లేస్తాను… ( I Still Rise)

 

.

నువ్వు కసిగావక్రీకరించిన అబధ్ధాలతో,

చరిత్రలో నన్ను విలువలేనట్టు చిత్రీకరించ వచ్చు

నన్ను బురదలో తొక్కి అణగార్చ వచ్చు,

అయినా, నేను ఆ ధూళిలాగ పైకి లేస్తాను.

.

నా ఎదురుసమాధానం  నిన్ను కలవరపెడుతోందా?

నువ్వెందుకు దుఃఖం లో ములిగి ఉన్నావు?

నా ఇంట్లో చమురుబావులు తోడుతున్నంత

ధీమాగా నే నడుగువేస్తున్నాననా?

.

సూర్య చంద్రుల్లాగా

అలుపెరుగని కడలి తరంగాల్లాగా

ఎగసిపడే ఆశల్లా విరజిమ్ముకుంటూ

నేనింకా పైకి ఉబుకుతాను.

.

నేను క్రుంగిపోతే చూడాలనుకున్నావుకదూ?

శిరసు అవనతం చేసి, కనులు నేలకు వాల్చి

భుజాలు కన్నీరులా క్రిందకి జారిపోతూ

హృదయవిదారకంగా రోదిస్తూ, బలహీనమైపోయి?

.

నా అహం నిన్ను బాధిస్తోందా?

నా పెరట్లో బంగారు గనులు తవ్వుతున్నంత

ధీమాగా నేను నవ్వడం

భరించలేనంత కష్టంగా ఉందా?

.

నువ్వు నీ మాటలతో చంపెయ్య వచ్చు

నీ చూపులతో  ముక్కలు చెయ్యొచ్చు

నీ ద్వేషంతో హతమార్చ వచ్చు

అయినా  నేను గాలిలా, మళ్ళీ పైకి లేస్తాను.

.

నా స్త్రీత్వం నిన్ను తలక్రిందులు చేస్తోందా?

నా ఊరువుల సందులో వజ్రాలున్నట్టుగా  

నేను నాట్యం చెయ్యడం 

నీకు ఆశ్చర్యంగా ఉందా?

.

అవమానాల చరిత్ర కుటీరాల్లోనుండి లేస్తాను

బాధల పునాదుల్లో కూరుకుపోయిన గతాన్నుండి లేస్తాను

నేనొక ఎగసిపడి విస్తరించే నల్ల సముద్రాన్ని,

ఉరకలేస్తూ, ఉప్పెనలా  విరిగిపడే అలని కౌగిలిస్తాను

భయాల్నీ, భీతావహనిశల్నీ వెనక వదిలేసి నే నుదయిస్తాను

అద్భుతమూ, తరళమూ ఐన ఉషోదయంగా ఆవిర్భవిస్తాను.

నేను నా పూర్వీకులనుగ్రహించిన ఆశీస్సులను మోసుకొచ్చే,

బానిస కలనీ, ఆశాగీతాన్నీ.

నేను లేస్తాను

లేస్తాను

లేస్తాను.

 

2

పంజరంలోని పిట్ట ఎందుకుపాడుతుందో నాకు తెలుసు

.

 

ఒక స్వేఛ్ఛావిహంగము గాలి మూపున పైకెగురుతూ

ప్రవాహ దిశలో గతి మందగించేదాకా తేలియాడి,

సూర్యుని స్వర్ణారుణ కిరణాలలో రెక్కలల్లార్చి

ఆకసం పై తన హక్కును ప్రకటించ సాహసిస్తుంది…

.

కాని పంజరం ఇరుకులో ఒయ్యారపు నడలు పోయే పిట్ట

పంజరపు మోజులో తన రెక్కలుత్తరించబడడం గాని,

తన కాళ్ళు బంధింపబడడం గాని గుర్తించలేదు.

అందుకే దాని గొంతుని పాటలాలపించడానికి విప్పుతుంది.

 

పంజరం లోని పిట్ట భయద నిస్వనంతో ఆలపిస్తుంది…

తనకి తెలియనివీ, అయినా ఆకాంక్షించే కలలగురించి.

ఆ గీతం దూరతీరాలనున్న కొండలలో ప్రతిధ్వనిస్తుంది,

ఎందుకంటే, ఆ పంజరపు పిట్ట ఆలపించేది స్వేఛ్ఛాగానం

.

ఆ స్వేఛ్ఛా విహంగం మరొక మరుద్వీచికనీ,

తరుల తాపాన్ని ఉపశమింజేస్తూ లలితంగా వీచే తూరుపు గాలినీ,

ఉషోదయాన్ని తలపించే లేపచ్చికమీద నిరీక్షించే క్రిముల్నీ తలపోస్తూ,

ఆకాశాన్ని తనదిగా ప్రకటించుకుంటుంది.

 

పాపం, పంజరంలోని పిట్ట తన కలల సమాధులపై నిలబడుతుంది,

దాని నీడ పీడకలలోలా కెవ్వున అరుస్తుంది.

దాని రెక్కలుత్తరించబడ్డాయి, పదాలు బందీలయ్యాయి,

అందుకే అది దానిగొంతు గీతాలాపనకై విప్పుతుంది

.

పంజరం లోని పిట్ట భయద నిస్వనంతో ఆలపిస్తుంది…

తనకి తెలియనివీ, అయినా ఆకాంక్షించే కలలగురించి.

ఆ గీతం దూరతీరాలనున్న కొండలలో ప్రతిధ్వనిస్తుంది,

ఎందుకంటే, ఆ పంజరపు పిట్ట ఆలపించేది స్వేఛ్ఛాగానం”.

-నౌడూరి మూర్తి

కాఫ్కా కథ: పల్లెటూరి డాక్టరు

53544-Franz+kafka+famous+quotes+3ఫ్రాంజ్ కాఫ్కా, జర్మను రచయిత

కాఫ్కా కథ- పల్లెటూరి డాక్టర్

 నేను చాలా చిక్కులోపడ్డాను. నేను అత్యవసరంగా ఒకచోటికి వెళ్ళాల్సి ఉంది. పదిమైళ్ళదూరంలోనున్న గ్రామంలో ఒక రోగి నాకోసం నిరీక్షిస్తున్నాడు. అతనికి నాకూ మధ్యం ఒక తీవ్రమైన మంచుతుఫాను అడ్డంగా వచ్చింది. ఈ పల్లె రోడ్లమీద వెళ్ళడానికి అనువైన పెద్ద చక్రాల తేలికపాటి బండీ ఒకటి నా దగ్గరుంది. నా పరికరాలన్నీ పెట్టుకున్న బ్యాగ్ చేత్తోపట్టుకుని, ఉన్నికోటు వేసుకుని నేను సిద్ధంగా ఉన్నాను; కానీ అసలైంది ఇప్పుడు లేదు…. అదే గుర్రం.

నా గుర్రం నిన్నరాత్రి చచ్చిపోయింది…. ఈ హేమంతపు చలికి  బాగా అలిసిపోయి ఉండడం వల్ల. నా సేవకురాలు పాపం ఊరల్లా పరిగెడుతోంది ఎక్కడైనా గుర్రాన్ని ఎరువుతెచ్చుకుందికి వీలవుతుందేమో ప్రయత్నం చేద్దామని, కానీ నాకు తెలుసు, అది వృధాప్రయత్నం, దొరకదని. అందుకే నేను ఏమీ పాలుపోక నిలుచున్నాను అచేతనంగా, మీదనుండి మంచుకురుస్తూ వేళ్లడం ఇంకా కష్టం చేస్తున్నా. సేవకురాలు గేటుదగ్గర కనిపించింది, ఒంటరిగా. ఆమె చేతిలో లాంతరు ఊగుతున్నాది. అయినా ఇటువంటి వాతావరణంలో ఎవరుమాత్రం గుర్రాన్ని ఎరువు ఇవ్వగలరు ప్రయాణానికి?

నేను మరోసారి వాకిట్లో అటూ ఇటూ పచార్లుచేస్తున్నాను. నాకు మార్గాంతరం కనిపించడం లేదు. మనసువికలమై, బాధతో చాలరోజులబట్టీ వాడకుండా వదిలేసిన పాడుబడ్డ పందులదొడ్డి తలుపుని గట్టిగా ఒక తన్ను తన్నేను చికాగ్గా. దాని మడతబందులమీద అటూ ఇటూ కొట్టుకుంటూ ఒక్కసారిగా తెరుచుకుంది తలుపు. గుర్రాలనుండి వెలువడుతున్న వేడినిట్టూర్పులా ఒక వెచ్చని వాసన గుప్పుమని వచ్చింది. లోపల సాలలో తాడుకి ఊగుతూ లాంతరు మసకమసకగా వెలుగుతోంది. పాకలో ఒదుక్కుని కూచున్న ఒక నీలికళ్ళ మనిషి ముఖం కనిపించింది.

“నేను గుర్రాన్ని బండికి కట్టేదా?” అని చేతులమీద కాళ్లమీదా పాకుకుంటూ వచ్చి అడిగేడు.

నాకు ఏంచెప్పాలో తెలియక వంగిచూసేను పాకలో ఎముందోనని. సేవకురాలు నా పక్కనే నిలుచుంది. “మనింట్లో ఏం వస్తువులు దాచేమో మనకే తెలీదు,” అంది. దానికి ఇద్దరికీ నవ్వొచ్చింది.

“తప్పుకొండి, తప్పుకొండి” అంటూ గుర్రపువాడు ఒక గావుకేక వేశాడు. రెండుగుర్రాలు, కండదేరిన పిక్కలతో, ఒకదాని వెంట ఒకటి తోసుకుంటూ బయటకి వచ్చేయి… కాళ్లు శరీరానికి దగ్గరగా ముడుచుకుని, ఒంటెల్లా తలలు దించుకుని ఆ ఇరుకైన తలుపుసందులోంచి తమ వెనకభాగాన్ని గట్టిగా విదిలించుకుని బయటపడ్డాయి. బయటకి రావడమే తడవు, నిలువుగా నిల్చున్నాయి… పొడవైన కాళ్లతో, నిగనిగ మెరుస్తున్న శరీరాలతో.

“అతనికి సాయం చెయ్యి,” అన్నాను ఆ పిల్లతో.

వెంటనే ఆ పిల్ల బండీ పగ్గాలు గుర్రంవాడికి ఇవ్వడానికి వినయంగా పరిగెత్తింది. కాని ఆ పిల్ల అతని పక్కన చేరగానే అతను ఆమెమీద చేతులువేసి తన ముఖాన్ని ఆమె ముఖానికి ఆనించ బోయాడు. దానితో ఆమె ఒక్కసారిగా కేకవేసుకుంటూ నాపక్కకి చేరింది.

“మూర్ఖుడా,” అని కోపంతో అతని మీద అరిచేను, ‘నీకు కొరడా దెబ్బలు కావాలా?” అంటూ.

కాని నాకు వెంటనే గుర్తొచ్చింది… అతను నా సేవకుడు కాదనీ, ఎవడో పరాయివాడనీ; అత నెక్కడినుంచి వచ్చేడో తెలీదు సరిగదా ఇంకెవ్వరూ సాయంచెయ్యడానికి పూనుకోకపోతే తనకుతానుగా వచ్చి నాకు సహాయం చేస్తున్నాడనీని.

నా మనసులో మాట పసిగట్టినట్టు అతను నా బెదిరింపుని తప్పుగా తీసుకోలేదు. గుర్రాలపని చూస్తూనే నా వైపు తిరిగి, “లోపలికి ఎక్కండి,” అన్నాడు. నిజానికి అన్నీ సిద్ధంగా ఉన్నాయి. నేను మునుపెన్నడూ అంత చూడముచ్చటైన గుర్రాలతో ప్రయాణం చేసినట్టు గుర్తులేదు. అందుకని సంతోషంగా అందులో కూచున్నాను.

“నేను పగ్గాలు పట్టుకుంటాను నీకు తోవ తెలీదు,” అన్నాను.

“ఆ మాటకొస్తే నేను మీతో రావడం లేదు, నేను రోజాతో ఉంటా,” అన్నాడు.

“నో…” అంటూ ఇంట్లోకి పరిగెత్తింది రోజా రాబోయే ప్రమాదాన్ని సరిగ్గా గుర్తించి. ఆమె తలుపు సరిగ్గా గడియపెడుతుండగా లోపలి గొలుసు చప్పుడు విన్నాను. తలుపు క్లిక్ మని చప్పుడవడం కూడా విన్నాను. తన ఆనవాలు తెలీకుండా ఉండడానికి లైట్లార్పుతూ వసారాలోంచీ, అన్నిగదుల్లోంచీ పరిగెత్తడం కనిపిస్తోంది.

“నువ్వు నాతో వస్తున్నావు,” అని గట్టిగా గద్దించేను గుర్రంవాడిని, “లేకపోతే నా పని ఎంత అవసరమైనదైనా దాని పర్యవసానంతో నిమిత్తంలేకుండా వెళ్ళడం మానుకుంటాను. నా ప్రయాణానికి మూల్యంగా ఆ పిల్లని నీకు ఇవ్వడం నాకు అభిమతం కాదు.” అన్నాను.

రెండుచేతులతో చప్పట్లుకొట్టి గుర్రాలకి సంకేతం ఇచ్చేడు గుర్రంవాడు, “పరిగెత్తండి” అంటూ. ప్రవాహంలో ముక్కలైన కర్రచెక్కలా, బండి ముక్కముక్కలైపోయింది. ఆ గుర్రపువాడి తన్నులకి నా ఇంటితలుపు ఎలా ముక్కచెక్కలవుతోందో వినిపిస్తోంది. తర్వాత నా చెవులు వినిపించకుండా కళ్ళు కనిపించకుండా ఫెళఫెళమని పెద్దశబ్దం అయింది. అంతే నా ఇంద్రియాలేవీ పనిచెయ్యలేదు.

అంతా ఒక్క క్షణం పాటే. ఏదో మా వాకిలి తలుపు తీస్తే ఆ రోగి ఇల్లు ఉన్నట్టు, నేనక్కడ ప్రత్యక్షమయాను. గుర్రాలు ప్రశాంతంగా నిల్చున్నాయి. మంచుకురవడం ఆగిపోయింది. ఎటుచూసినా వెన్నెల. రోగి తల్లిదండ్రులు లోపలనుండి బయటకి పరిగెత్తుకు వచ్చేరు. అతని అప్పచెల్లెలు వాళ్ల వెనకే వచ్చింది. వాళ్ళు నన్ను బండిలోంచి అమాంత ఎత్తినంతపని చేసేరు. వాళ్ళు ఏమిటి గొణుగుతున్నారో నాకు అర్థం కాలేదు.

రోగిగదిలో గుండెనిండా ఊపిరి తీసుకోవడం ఎవరికైనా కష్టం. ఆపడం మరిచిపోయిన వంటపొయ్యి నుండి పొగలు వస్తున్నాయి. నాకు కిటికీతలుపులు తెరవాలనిపించింది, కానీ ముందు రోగి సంగతి చూద్దామనుకున్నాను. జ్వరంలేదు. అలాఅని చల్లగా కాకుండా, అలాఅని వెచ్చగా కాకుండా చిక్కిన శరీరంతో, ఒంటిమీద చొక్కా లేకుండా, కళ్ళు ఎటో శూన్యంలోకి చూస్తూ ఉన్నాడు. పరుపుమీంచి తననుతాను లేవదీసుకుని, నా మెడచుట్టూ చేతులువేసి వేలాడుతూ, నా చెవుల్లో గొణుగుతున్నాడు: “డాక్టర్! నన్ను చావనివ్వండి.”

నేను చుట్టూ చూశాను. ఎవరూ విన్నట్టులేదు. తల్లిదండ్రులు ముందుకు ఒంగుని తీర్పుకి ఎదురుచూస్తున్నట్టు మౌనంగా నిల్చున్నారు. అతని సోదరి నా బాగ్ ని ఉంచడానికి ఒక చౌకాలి(స్టూలు)బల్ల తెచ్చింది. బాగ్ తెరిచి కావలసిన పరికరాలకోసం వెదుక్కుంటున్నాను.

ఆ కుర్రాడు మాటిమాటికీ నన్ను తడుముతున్నాడు అతని అభ్యర్థనని గుర్తుచెయ్యడానికి. కొవ్వొత్తి వెలుగులో శ్రావణం తీసి పరీక్షించి మళ్ళీ లోపల పెట్టేశాను. “అవును, అందుకేగదా ఇలాంటి సందర్భాల్లో దైవం అన్నీ సానుకూలం చేసిపెడతాడు. ఉన్న ఒక గుర్రం చచ్చిపోయిందని బాధపడుతుంటే, మరొకటి పంపడమే గాక, రెండోదికూడా జతచేస్తాడు అత్యవసరం కాబట్టి; అంతేకాదు బహుమానంగా గుర్రంతోలేవాడినికూడా తోడు ఇస్తాడు,” అని అన్నాను రోగితో పరుషంగా.

ఎందుకో మొదటిసారి రోజా గుర్తుకొచ్చింది.  ఇప్పుడు నేనేం చేస్తున్నాను? ఆ పిల్లని ఎలా రక్షించడం? అదుపుచెయ్యలేని గుర్రాలని నా బగ్గీ ముందుంచుకుని, పదిమైళ్ళదూరంలో ఉన్న ఆ పిల్లని ఆ గుర్రపుబండీవాడినుండి ఎలా రక్షించడం?

కళ్ళేలు ఎలాగో విదుల్చుకోగలిగిన గుర్రాలు బయటనుండి కిటికీ తలుపులు తెరుస్తున్నాయి. ఇంట్లోవాళ్ళ ఏడుపులు లక్ష్యపెట్టకుండా గుర్రాలురెండూ తమ తలలు కిటికీలోంచి లోపలకి దూరుస్తూ రోగిని గమనిస్తున్నాయి. ఆ గుర్రాలేవో నన్ను వెనక్కి పొమ్మని ఆజ్ఞాపిస్తున్నట్టు, “అలా అయితే నే వెనక్కి వెళిపోతాను,” అన్నాను. నేను ఆ గదిలో ఉన్న వేడివల్ల నేనలా మాటాడుతున్నాననుకుంది అతని సోదరి. ఆమె మర్యాదపూర్వకంగా నా ఉన్నికోటు తియ్యబోతే తియ్యనిచ్చాను.

నా కోసం ఒక గ్లాసుడు Rum సిద్ధం చేసి ఉంచారు. ఆ ముసలాయన నా భుజం తట్టేడు; అతని సర్వస్వమూ నాకివ్వడం అతనికి ఆ చనువునిచ్చింది. నేను “వద్ద”న్నట్టు తల అడ్డంగా ఊపాను.  ఆ ముసలాయన  సంకుచితమైన ఆలోచనా పరిథిలో నాకు వంట్లో బాగులేదు… కారణం, నాకు ఇవ్వజూపిన డ్రింకు తాగడానికి తిరస్కరించడమే. తల్లి రోగిమంచంపక్క నిలబడి నన్ను బతిమాలుతోంది. లోచూరుని చూస్తూ గుర్రం ఒకటి గట్టిగా శకిలించింది.

అటు వెళ్లి, రోగిగుండెమీద నా చెవిఆన్చి వినబోతుంటే, నా తడిగడ్డంకింద అతనిగుండె వణుకుతోంది. అది నాకు తెలిసిన విషయమే రూఢిచేసింది: ఆ యువకుడు ఆరోగ్యంగానే ఉన్నాడు. కాకపోతే, అతని నాడి కొంచెం క్రమంతప్పింది, అతని తల్లి గారాబంగా ఇచ్చిన కాఫీ అస్తమానం తాగి తాగి. ఆరోగ్యంగాఉన్న అతన్ని పక్కమీంచి ఒక ఊపు ఊపి తోసెయ్యడమే మంచిది. కానీ నాకెందుకు. నేనేం ప్రపంచాన్ని ఉద్ధరించడానికి కంకణం కట్టుకోలేదు… ఆ కుర్రాడు అలా పడుక్కుంటే అక్కడ పడుక్కోనీ. ప్రభుత్వం నాకు ఉద్యోగం ఇచ్చింది దానికి పూర్తి న్యాయం చేస్తాను; ఎంతగా అంటే, అది వాళ్ళు నాకు చాదస్తం అనుకునేంతగా. జీతం అరకొరగా ఇచ్చినా సరే, నేను ఉదారంగానే ప్రవర్తించి పేదలకి చాతనైనంత సహాయం చేస్తాను. నే నింకా రోజాని సంరక్షించాల్సి ఉంది, తర్వాత కావలస్తే ఈ యువకుడి కోరిక తీర్చొచ్చు; తర్వాత నాకుకూడా చనిపోవాలనిపించవచ్చు.

అంతుపట్టని ఈ చలికాలంలో ఇక్కడ నేనేమి చేస్తున్నట్టు? నా గుర్రమా చనిపోయింది,  గ్రామంలో తమ గుర్రాన్ని నాకు ఎరువిచ్చేవారు ఒక్కరూ కనిపించలేదు. నేను ఆ జట్టుని పందులదొడ్లోంచి బయటకి లాక్కురావలసి వచ్చింది.  అవి అవి గుర్రాలయి ఉండకపోయి పందులయినా, వాటితోనైనా నేను ప్రయాణించవలసి వచ్చేదే. ఆది అంతే. నేను ఆ కుటుంబాన్ని పరామర్శించేను. వాళ్ళకి అది చాలు. నేనెలా రాగలిగేనన్న సంగతి వాళ్ళకి తెలీదు. ఒక వేళ తెలిసినా నమ్మరు. సందర్భం వచ్చింది కనక చెబుతున్నాను: ప్రజలతో అవగాహనకి రావడంకంటే మందుచీటీలు రాసుకోవడమే తేలిక.

ఇంతటితో వైద్యుడిగా నా రాకపోకలు ముగియాల్సిందే, కానీ వాళ్ళు మళ్ళీ రమ్మంటున్నారు అనవసరంగా. నాకిది అలవాటే. నా ఇంటిముందున్న గంట మోగిస్తూ ఈ ప్రాంతం అంతా నన్ను ఇలా వేధిస్తూనే ఉంటుంది. కాకపోతే, ఈ సారి నేను రోజాని విడిచి రావలసి వచ్చింది. ఎంత అందమైన పిల్ల! ఏడాది పొడవునా నా ఇంట్లో ఉంటున్నా నేనెన్నడూ గమనించనే లేదు. ఆమెనలా విడిచిపెట్టి రావడం మరీ బాధగా ఉంది.

ఎలాగోలా నాకు నేను సర్ది చెప్పుకోవాలి; ఈ కుటుంబం వాళ్ళు ఎంతగా అనుకున్నా, తిరిగి ఆమెని నాకు ఇవ్వలేరు కదా!  నేను నా బాగు మూసి ఉన్నికోటుగురించి అడుగుతుంటే, ఆ కుటుంబం అంతా ఎదురుగా నిలబడింది… చేతిలోనున్న గ్లాసుడు rum వాసన చూస్తూ తండ్రీ,… నాదగ్గరనుండి ఇంతకంటే ఏమిటి అభిలషిస్తున్నారో తెలీదు గాని… బహుశా నా సేవకి నిరుత్సాహపడుతూ తన పెదాలుకొరుక్కుంటూ తల్లీ, రక్తసిక్తమైన తువ్వాలుతో రోగికి విసురుతూ సోదరీ. ఇవన్నీ చూస్తుంటే, ఆ యువకుడు అలా ఆరోగ్యంగా  కనిపిస్తున్నప్పటికీ, బహుశా, నిజంగా  అనారోగ్యంగా ఉన్నాడని ఒప్పుకోవాలనిపిస్తోంది.

నే నతని దగ్గరకి వెళ్ళేను. అతను నన్ను చూసి నవ్వేడు… అతనికి నేనేదో జవసత్వాలందించే ఔషధాన్ని తీసుకొచ్చినట్టు… నేను ఇప్పుడు పరీక్షిస్తుంటే, ఆ యువకుడు నిజంగానే అస్వస్థతగా ఉన్నట్టు కనిపిస్తున్నాడు. కుడివైపు తుంటిదగ్గర అరిచేయంత మందంలో ఒక పచ్చిగాయం కనిపిస్తోంది… ఎర్రగా, వేర్వేరు ఛాయల్లో… లోతుగా ఉన్నచోట ఎర్రగా, అంచులదగ్గర ముదురురంగులో, లేతరంగులో రక్తపుజీరలు అక్కడక్కడ కనిపిస్తూ. దానిమీద వెలుగు కేంద్రీకరించినపుడు ఒక తవ్వుతూ తవ్వుతూ ఉన్న గనిలా ఉంది. దూరంనుంచి చూస్తుంటే అలా కనిపిస్తోంది కాని దగ్గరనుండి చూస్తుంటే అందులోని ఉపద్రవం స్పష్టంగా తెలుస్తోంది… అది చూస్తూ ‘అమ్మో’ అని అనకుండా ఎవరు ఉండగలరు? అక్కడ క్రిములు… ఒక్కొక్కటీ నా చిటికినవేలంత… తెల్లగా ఉన్నవి రక్తం తాగి తాగి ఎర్రబడి, అటూ ఇటూ దొర్లుతున్నాయి. దీపం వేసినపుడు గాయంలోపల తమపట్టునుండి వేలాడుతూ కనిపిస్తున్నాయి. పాపం కుర్రాడా! నీ గాయం అయితే కనుక్కోగలిగేను గాని నీకు నేను చేయగల సాయం ఏమీ లేదు. నువ్వు ఈ కురుపుతోనే మరణించబోతున్నావు.

ఆ కుటుంబం ఇప్పుడు సంతోషంగా ఉంది… నేను ఏదో ఒకటి చెయ్యడం చూసి. అతని సోదరి వాళ్లమ్మతో ఆ విషయమే చెబుతుంటే, ఆమె అతని తండ్రితో చెబుతోంది, అతను తెరిచిఉన్న తలుపులోంచి, చేతులుజాచుకుని మీగాళ్ళమీదనడుస్తూ తమని తాము నిలువరించుకుంటూ వెన్నెట్లోంచి వస్తున్న అతిథులకి చెబుతున్నాడు. “నన్ను ఎలాగైనా బ్రతికించండి?” అని ఆ కుర్రాడు వెక్కివెక్కి ఏడుస్తూ అస్పష్టంగా గొణుగుతున్నాడు, గాయంలోపల క్రిములు పెట్టే సలుపు కళ్ళుమూసుకుని భరిస్తూ.

మా ప్రాంతంలో ప్రజలతీరే అంత. ఎప్పుడూ వైద్యుడుదగ్గరనుండి అసంభవమైనవి ఆశిస్తుంటారు. వాళ్ళకి పూర్వంఉన్న విశ్వాసం పోయింది. మతాధికారి ఇంటిదగ్గర కూచుని, ఒకదాని వెనక ఒకటిగా తన దుస్తుల్ని పీలికలుగా చించేస్తున్నాడు. అతనిదగ్గరనుండి విశ్వాసాన్ని ఆశించరు. కాని వైద్యుడు దగ్గరకి  వచ్చేసరికి మాత్రం, అతను తన శస్త్రచికిత్సా నైపుణ్యంతో అన్నీ సాధించాలి. సరే, అది వాళ్ళ ఆలోచనా సరళి. నేనేమీ చేస్తానని హామీ ఇవ్వలేదుగదా. వాళ్ళు మతసంబంధమైన పనులకి వినియోగించుకుంటే, నేను దానికీ ఊ కొడతాను. సేవకురాలిని పోగొట్టుకున్న ముసలి పల్లెటూరి వైద్యుడు అంతకంటే ఏమిటి చెయ్యగలడు?

అంతలో ఆ ఊరి పెద్దలూ, కుటుంబసభ్యులూ వచ్చి నా దుస్తుల్ని ఊడదీస్తున్నారు. స్కూలుపిల్లల వాద్యబృందం ఒకటి వాళ్ళ టీచరు అజమాయిషీలో వచ్చి ఇంటి గుమ్మం ముందు నిలబడి పాడుతున్నారు ఇలా:

“అతని దుస్తులు తీసేయండి అతనే రోగం నయం చేస్తాడు,

అలా రోగం నయం చెయ్యకపోతే, అతని రోగం కుదర్చండి

ఎంతైనా వైద్యుడు,  ఎంతైనా వైద్యుడు కదా!”

 

అంతే! అలా అంటూ వాళ్ళు నా దుస్తులు ఊడదీసేరు. నేను నా వేళ్ళు గడ్డంలో పెట్టుకుని, ముఖం ఒక పక్కకితిప్పి అలా మనుషులవంక చూస్తున్నాను. నేను ప్రశాంతంగా, స్పష్టమైన అవగాహనతో అలా నిలుచున్నాను కానీ దానివల్ల ప్రయోజనం ఏమీ లేకపోయింది. వాళ్ళు నా తలా, కాళ్లూ పట్టుకుని పక్కమీదకి ఈడ్చుకెళుతున్నారు. రోగిగాయంఉన్నవైపు గోడకి నన్ను నిలబెట్టారు. తర్వాత అందరూ గదిలోంచి బయటకి వెళ్ళి తలుపుగడియపెట్టారు. పాట ఆగిపోయింది. చంద్రుణ్ణి మేఘాలు ముసురుకున్నై. పక్కమీది దుప్పట్లు వెచ్చగా నన్ను కమ్ముకున్నై. కిటికీపక్కన ఆరుబయట గుర్రాల ముఖాలు నీడల్లా కదుల్తున్నాయి.

“నీకు తెలుసా?” ఎవరో నా చెవిలో చెబుతున్నారు, “నీ మీద నాకు పెద్దగా నమ్మకం లేదు. నీ అంత నువ్వు ఇక్కడకి నడుచుకు రాలేదు. ఎక్కడినుండో నిన్నెత్తుకు వచ్చేరు. నాకు సాయంచెయ్యడానికి బదులు, నా మరణశయ్యని ఇంకా ఇరుకు చేస్తున్నావు. ఇప్పుడు నేను చెయ్యగల మంచిపని ఏదైనా ఉందంటే అది నీ కళ్ళు పీకెయ్యడమే.”

“అవమానం. నేనొక వైద్యుణ్ణి. నే నేమిటి చెయ్యాలిప్పుడు? నా మాట నమ్ము. నే నేమీ సుఖపడిపోవడం లేదు,” అన్నాను.

“ఈ సంజాయిషీకి నేను సంతృప్తి పడలా? బహుశా సంతృప్తి పడాలేమో. నే నెప్పుడూ సర్దుకుపోవలసి వస్తోంది. నే నీ లోకంలోకి రావడమే ఈ గాయంతో వచ్చేను. నాకున్న ఆభరణం అదొక్కటే”

“యువమిత్రమా!” నేను చెప్పడం ప్రారంభించేను, “నీకున్న లోపమల్లా నీకంటూ ఒక స్వంత అభిప్రాయం అంటూ లేకపోవడం. నేను దేశమల్లా తిరిగి చాలమంది రోగుల్ని చూసేను. నీ గాయం అంత ప్రమాదకరమైనదేమీ కాదు. అది తుంటికి ఒక పక్కకి రెండుసార్లు గొడ్డలి పడడం వల్ల తగిలిన గాయం. చాలా మందికి అడవిలో గొడ్డలి చప్పుడు వినిపించడం  కష్టం. అది అంతదగ్గరగా గొడ్డలి వచ్చిందంటే, ఎవరైనా ముందు వళ్లు ఇచ్చెస్తారు.”

“నిజంగానా? లేదా నేను జ్వరంగా ఉన్నానని నన్ను మభ్యపెడుతున్నావా?”

“నిజమే. నామాట నమ్మొచ్చు. ఒక వైద్యుడిగా నా వృత్తిమీద ఒట్టువేసి చెబుతున్నా.”

అతను నా మాట నమ్మి మారుమాటాడలేదు.

ఇప్పుడు నేను ఇక్కడినుంచి ఎలాబయటపడాలో ఆలోచించవలసిన సమయం వచ్చింది.  గుర్రాలు నమ్మకంగా ఉండవలసినచోట కదలకుండా ఉన్నాయి. నా దుస్తుల్నీ, ఉన్నికోటునీ, బాగునీ చకచకా ఒకచోట కట్టగట్టేను. బట్టలు వేసుకోడానికిపట్టే సమయంకూడా వృధాచెయ్యదలుచుకోలేదు. ఇంతకుముందు వచ్చిన వేగంతోనే గుర్రాలుగనక దౌడుతీస్తే నేరుగా నేను ఇక్కడనుండి నా పక్కమీదకే గెంతగలుగుతాను.

ఒక గుర్రం కిటికీ పక్కనుండి వెనక్కి తగ్గింది వినయంగా.  నేను ఈ కట్టనంతటినీ బండిలోకి విసిరేసేను. ఉన్నికోటు మరీదూరంపోయి ఒకకొక్కేనికి దాని చెయ్యితగులుకుని వేలాడుతోంది. మంచిదే. నేను గుర్రంమీదకి దూకేను. కళ్ళేలు వదులుగా వేలాడంతో గుర్రాలు రెండూ సరిగా బండికి పూన్చబడలేదు. దాంతో బగ్గీ వెనక ఊగుతోంది. అన్నిటికంటే చివర, మంచులో ఉన్నికోటు ఎగురుతోంది.

గుర్రాలని చూస్తూ “పరిగెత్తండి” చప్పట్లుకొడుతూ గుర్రంబండీవాడిలా అన్నాన్నేను. కానీ అవేమీ పరిగెత్తడం లేదు. ముసలివాళ్లలా మంచులో కాళ్ళీడ్చుకుంటూ నడక ప్రారంభించేం.  చాలసేపు ఆ పిల్లవాళ్ళు పాడిన పాటే అస్పష్టంగా నా వెనక రింగు మంటోంది.

“రోగులారా మీరు నిశ్చింతగా ఉండండి

వైద్యుడుకూడ మీతోనే పక్కమీద పడుకున్నాడు.”

ఈ వేగంతో వెళితే నే నెప్పటికీ ఇల్లుచేరుకునేట్టు కనిపించడం లేదు.  తిరుగులేని నా ప్రాక్టీసు, మందగిస్తుంది. నా వెనకే వైద్యం ప్రారంభించినవాడు నొర్లుకుంటాడు. అయినా ఏం లాభం లేదు. అతడు నన్ను అధిగమించలేడు. చిరాకు తెప్పిస్తున్న ఆ గుర్రపువాడు ఇంట్లో పెద్ద ఉపద్రవం సృష్టిస్తూ ఉండి ఉంటాడు. రోజా అతనికి బలయిపోయి ఉండి ఉంటుంది. ఇక నేను దానిగురించి ఆలోచించను. నగ్నంగా, ఈ వయసులో గడ్డమంచుకి దొరికిపోయి, చాలా సాధారణమైన బండీ, గుర్రాలతో, ముసలాణ్ణి ఒక్కణ్ణీ అలా తోలుకుంటూ పోవలసి వస్తోంది.  నా ఉన్నికోటు బండికి వేలాడుతోంది నాకు అందనంత దూరంలో. ఇంత చురుకైన రోగుల్లో ఒక్క నీచుడూ అయ్యో అనడు. అంతా మోసం! దగా! ఒకసారి రాత్రిపూట తప్పుగా మోగిన గంటకి స్పందిస్తే పరిణామాలిలాగే ఉంటాయి. వాటిని చక్కదిద్దుకోవడం జరగదు … ఎన్నటికీ .

murthy gaaruఅనుసృజన : నౌడూరి మూర్తి

కిటికీ దగ్గర…

మనలో ఉత్తములైన వారికి కూడా భద్రతాభావాన్ని కలుగజేసే

నిరాశావాదం మీద అంత ఖచ్చితమైన అభిప్రాయముండేది కాదు నాకు.

నా మిత్రులు నన్ను చూసి పరిహసించిన రోజులున్నాయి.

నే నెన్నడూ మాటలమీద అంత పట్టున్నవాడిని కాను.

 

ఎందుకో, ఓ రకమైన నిర్లక్ష్యం, ఉదాసీనత,

చెప్పదలుచుకున్నది సరిగా చెప్పిన పేరూ లేదు నాకు,

దానికి కారణం చాలా సార్లు చెప్పడానికి ఏమీలేకపోవడమూ

ఏదో చెప్పాల్సి రావడం, ఎవరూ వినకూడదనుకోవడమూ.

 

నా జీవితం ఒకే ఒక దారప్పోగుకి వేలాడుతోంది.

నాకేమీ అర్థం కావడం లేదని అనిపించిన రోజులున్నాయి.

నా సంకెళ్ళు నీటిమీద తేలియాడుతున్నాయి.

నా కోరికలన్నీ నా కలల్లోంచి పుట్టినవే.

 

నా ప్రేమని నేను మాటలతో ఋజువుచేసేను.

నన్ను నేను ఎటువంటి అద్భుతమైన జీవరాశికి సమర్పించుకున్నాను!

నా ఆలోచనలు నన్ను బలవంతంగా, ఎంత దుఃఖమయమైన ప్రపంచంలోకి బంధిస్తున్నాయి!

నాదైన ఒక వింత ప్రపంచంలో నేను ప్రేమించబడ్డానని నమ్మకంగా అనిపిస్తుంది

 

నా ప్రేమిక భాష ఈ మానవభాషకి ఎంతమాత్రం చెందదు.

ఈ మానవ శరీరం నా ప్రేమిక శరీరాన్ని తాకనైనా తాకదు.

నా ఆలోచనలలో మోహ వాంఛలు అధికమూ, అనవరతమూ…

అయినప్పటికీ, నన్ను తప్పుచేయడానికి ఏదీ ప్రేరేపించలేదు.

 

***

సూచన: ఈ అనువాదంలో “ప్రేమిక” అన్న పదం స్త్రీ, పురుషులిద్దరికీ సమంగా వర్తిస్తుంది.

220px-Paul_Éluard_circa_1930

ఈ కవిత చాలా మానసిక విశ్లేషణతో కూడిన కవిత. దీన్ని అర్థం చేసుకుందికి కొంచెం పరిశ్రమ కావాలి. ఈ కవిత Platonic Loveకి ఒక ఉదాహరణ. మొదటివాక్యంలోనే ఒక అద్భుతమైన థీసిస్ ఉంది. “నిరాశావాదం చాలామందికి ఒక భద్రతాభావం ఇస్తుంది”… ఇది ఒక రకంగా Oxymoron. అంటే, పక్కపక్కనే రెండు వైరుధ్యభావనలని చెప్పడం. నిరాశావాదంలో భద్రత ఎక్కడినుండి వస్తుంది?  అభద్రతవల్లే కదా నిరాశ వస్తుంది? కాని, ఇందులో కవి చెప్పదలుచుకున్నది, కొందరు ప్రేమించడం కంటే, ప్రేమించామనుకున్న భావనను ప్రేమిస్తారు; లేదా, అవతలి వ్యక్తి నిజంగా ఎంత గాఢంగా ప్రేమిస్తున్నా, వాళ్ళ అసంతృప్తికి కారణం తిరిగి ప్రేమింపబడకపోవడం కాదు; అంతకుమించి వాళ్ళు కోరుకుంటున్నదేదో వాళ్ళకి దొరకకపోవడం.

మొదటి పద్యాన్ని, రెండవపద్యాన్ని ఇప్పుడు పోల్చి చూడండి. కొంతమంది ప్రేమని ప్రకటించేటప్పుడు మాటలు ఆచి తూచి వాడతారు. అంటే, వాళ్ల మనసులో ఉన్న ఆలోచనలు బహిర్గతమవకుండా ప్రయత్నిస్తారు. అందుకే “వాళ్ళు పరిహసించిన రోజులున్నాయని కవి అంటాడు. నాకు మాటలమీద అంతపట్టులేదనీ, చెప్పదలుచుకున్నది సరిగా చెప్పగలిగిన పేరూ లేదనీ” అంటాడు. నిజానికి ప్రేమని ప్రకటించడానికి భాష ఆవశ్యకం కాదు, ఒక ఉపకరణం. “చాలా సార్లు చెప్పడానికి ఏమీ ఉండదు” అందుకని అతనికి భాషమీద పట్టు లేకపోయినా అది ఒక అవరోధం కాదు. అయినా, ఆ మాటాడేది కూడా ఏదో మాటాడాలి కాబట్టి. అది వినకపోయినంత మాత్రం చేత వచ్చిన నష్టం కూడ లేదు. ఎందుకంటే ప్రేమికులు ఒకరి సమక్షంలో ఒకరు, మాటాడిన విషయాలకంటే, మాటాడకుండా ఒకరితో ఒకరు సంభాషించుకునే విషయమే ఎక్కువ ఉంటుంది. Just you feel like spending eternity in the presence of your love… without speaking a word. అ సామీప్యం ఇచ్చే ఆనందం అటువంటిది.

 

తర్వాత పద్యంలో కవి తన మానసిక వ్యధను వెళ్ళగక్కుతున్నాడు. జీవితం ఒక దారప్పోగుకి వేలాడుతోంది… అంటే డెమొకిల్స్ కత్తిలాటిది కాదు. (అది జీవితాన్ని నిత్యం భయంతో ఉంచేది). ఇది గాలిపటంలాగ స్వేచ్ఛగా ఎగరడం లాటిది… ఒకే ఒక దారప్పోగుతో. నిజమైన ప్రేమ జీవితాన్ని తేలిక పరుస్తుంది. ఆ ప్రేమ అవతలి వ్యక్తినుంచి వచ్చేది కాదు… మనం అనుభవించే ప్రేమభావన. మనకు కలిగే ప్రేమభావన. అటువంటి మానసిక స్థితిలో మనం ఉన్నప్పుడు, లేదా ఉండగలిగినప్పుడు, “ప్రేమిక” భాషకూడా అలౌకికంగా కనిపిస్తుంది. ఆ స్నేహం, ఆ ప్రేమా, భౌతికపరిమితులుదాటి భద్రంగా దాచుకోవాలనిపిస్తుంది. అదికూడా చెబుతున్నాడు కవి. నిజానికి అవతలివ్యక్తి మనం అనుకున్నంతగా మనల్ని ప్రేమించకపోవచ్చు. మనకి నిజానికి ఆనందం ఇచ్చేది అవతలివ్యక్తి మనల్ని అమితంగా ప్రేమిస్తున్నారని మనం మనసులో అనుకునే భావన. More than the other person loving us, we will be elated with our conception of other person loving us.

అలాగని ఇద్దరు స్త్రీపురుషుల స్నేహంలో శరీరక వాంఛలకి చెందిన భావనలు ఉండవా? ఉంటాయి. నైతిక ప్రమాణాలతో చూస్తే ఆ భావనలు అంత స్వచ్ఛమైనవేం కావు. అంతమాత్రంచేత అవి నిష్కల్మషంగా అవతలివ్యక్తితో ప్రవర్తించడానికి అడ్డురావు… ఒక ఆలోచన ఒక ఆలోచన. అంతే. అది ఆచరణ కాదు. ఆలోచనలని నియంత్రించలేము. కానీ మన ప్రవర్తనని మనం అదుపులో ఉంచుకోగలం. కానీ ఎప్పుడు? అటువంటి వ్యక్తిత్వాన్ని తీర్చిదిద్దుకోగలిగినప్పుడు. అలా ఉంచుకోగలిగినవారికే ఈ Platonic Love అర్థం కాగలదు.

 

ఇంతకీ, ఈ కవితకి కిటికీ అని శీర్షిక ఎందుకు పెట్టినట్టు? కిటికీ మనసుకి, మన అంతర్లోచనకి ఒక ప్రతీక. కిటికీలోంచి అన్ని ఇష్టమైన వస్తువుల్నీ చూస్తుంటాం. కానీ మనకు వాటిని అందుకోవాలన్న గాఢమైన కోరిక ఉండదు. అందలేదన్న నిరాశ ఉండదు. అందులోంచి వస్తువుల్ని పదే పదే చూస్తూ ఆనందించగలుగుతాం. అది ఒక రకమైన మానసిక ప్రేమ.

 

English Translation of Original:

 

At the Window

.

I have not always had this certainty,

this pessimism which reassures the best among us.

There was a time when my friends laughed at me.

I was not the master of my words.

A certain indifference,

I have not always known well what I wanted to say,

but most often it was because I had nothing to say.

The necessity of speaking and the desire not to be heard.

My life hanging only by a thread.

There was a time when I seemed to understand nothing.

My chains floated on the water.

 

All my desires are born of my dreams.

And I have proven my love with words.

To what fantastic creatures have I entrusted myself,

in what dolorous and ravishing world has my imagination enclosed me?

I am sure of having been loved in the most mysterious of domains, my own.

The language of my love does not belong to human language,

my human body does not touch the flesh of my love.

My amorous imagination has always been constant

and high enough so that nothing could attempt to convince me of error.

.

Paul Eluard

murthy gaaru— నౌడూరి  మూర్తి

బిలియర్డ్స్ ఆట…

220px-Alphonse_Daudet_2

ఆల్ఫోన్స్ డాడెట్

(13 May 1840 – 16 December 1897)

ఫ్రెంచి నవలాకారుడు, కథా రచయిత, కవీ.

*

రెండురోజులబట్టీ పోరాడుతున్నారేమో, సైనికులు పూర్తిగా అలసిపోయి ఉన్నారు. వర్షం పడుతూ, క్రిందనుండి నీళ్ళు ప్రవహిస్తున్నా లెక్కచెయ్యకుండా వాళ్ళు వీపులకి తగిలించిఉన్న సంచీలతోనే నిద్రపోతున్నారు. ఆయుధాలు పక్కనబెట్టి, చెరువులయిపోతున్న రాజమార్గం మీదా, నీరు ఊరుతున్న బురద పొలాలల్లోనూ ప్రాణాలు ఉగ్గబట్టుకుని అలాగే మూడు గంటలపాటు అలా నిరీక్షించవలసి వచ్చింది.

అలసటవల్ల, నిద్రలేమివల్ల, యూనిఫారంలతో నిలువునా తడిసిముద్దయిపోవడం వల్లా శరీరం కొంకర్లుపోయి వెచ్చగా ఉండడానికి ఒకరికొకరు దగ్గరగా ఆనుకుని పడుకున్నారు;  కొందరయితే ఒకరి భుజానికున్న సంచికి మరొకరు చేరబడి నిలబడే నిద్రపోతున్నారు; ఆ నిద్రలో ప్రశాంతంగా వాళ్ల ముఖాలు కనిపిస్తున్నా, వాళ్ళల్లో అలసటా, ఆకలీ కొట్టొచ్చినట్టు కనిపిస్తున్నాయి.

తెరిపిలేకుండా కురుస్తున్న వర్షం… ఎక్కడచూసినా బురద, తినడానికి ఏమీ లేకపోవడం, కొండదిగిన నల్లని మబ్బులు, ఎప్పుడు వచ్చి మీదపడతాడో తెలియని శత్రుభయంతో… చుట్టూ మృత్యువాతావరణం అలముకుని ఉంది.

వాళ్ళక్కడ ఏం చేస్తున్నట్టు? అక్కడ ఏం జరుగుతోంది? ఫిరంగులు వాటి మూతులు అడవిపక్క గురిపెట్టి చూస్తూ, అక్కడ వేటినో పరీక్షగా చూస్తున్నట్టు కనిపిస్తున్నై. ఆకస్మికంగా దాడి చెయ్యడానికి పొదల్లో మెషిన్ గన్ లు ఆకాశంవంక నిరీక్షిస్తూ సన్నద్ధంగా ఉన్నాయి. అన్నీ దాడి చెయ్యడానికి ఆయత్తమయి ఉన్నాయి. అలాంటప్పుడు మరి ఎందుకు దాడి చెయ్యడం లేదు? దేనికోసం నిరీక్షిస్తున్నట్టు?

వాళ్ళు ఉత్తరువులకోసం ఎదురుచూస్తున్నారు… కేంద్ర కార్యాలయం ఏ ఉత్తర్వులు పంపదు. పోనీ అదేమన్నా చాలా దూరంలో ఉందా అంటే అదేం లేదు. లూయీ XIII  కోట కనుచూపు మేరలో కొండ మధ్యలో ఉంది… వానకడిగిన ఎర్రని కోట ఇటుకలు చెట్లమధ్యనుండి మెరుస్తున్నాయి. అది నిజంగా రాజభవనమే… సేనాధిపతి నివాసం అన్న ముద్ర ధరించడానికి తగిన యోగ్యత కలిగి ఉంది. రోడ్డుకి దూరంగా, ముందున్న వెడల్పైన కందకాన్నీ వెనకున్న రాతిగోడనీ వేరుచేస్తూ మెత్తని తివాచీలాంటి పచ్చిక … తలవాకిలి వరకూ వరసగా పువ్వులతో అలంకరించినట్టు వ్యాపించి ఉంది.

రెండోపక్క, ఆ భవనానికి వెనకభాగంలో, ఏకాంతంగా ఉండే స్థలంలో చుట్టూ కంచెలా నిలబడ్డ చెట్ల మధ్య ఖాళీలు కనిపిస్తున్నాయి; అక్కడ హంసలు ఈదుతున్న చిన్న కొలను అద్దంలా మెరుస్తోంది; గోపురంలా ఉన్న అసంఖ్యాకమైన పక్షులు వసించే చూరు క్రింద, చెట్టుకొమ్మల మధ్య, నెమళ్ళూ,అడవి కోళ్ళూ తమ పురులు విప్పి సోయగాలు ప్రదర్శన చేస్తూ, సన్నగా క్రేంకారాలు చేస్తున్నాయి. యుద్ధం వల్ల యజమానులు ఇల్లువీడి వెళ్ళిపోయినా, అక్కడ మనుషులెవ్వరూ లేనట్టూ, ఆలనాపాలనా చూసేవాళ్ళెవరూ లేనట్టూ కనిపించడం లేదు. దేశపతాకం చలవ వల్ల పచ్చికబయళ్ళలో అతిచిన్న పువ్వు కూడా చెక్కుచెదరకుండా పరిరక్షింపబడి ఉంది. యుద్ధభూమికి సమీపంలో చక్కగా తీర్చినట్టున్న పొదలతో, గంభీరమైన నిశ్శబ్దం అలముకున్న రాచబాటలతో  అంత మనోహరమైన  ప్రశాంతత లభించడం అరుదే.

దూరంగా కనిపిస్తున్న రోడ్లని చికాకుకలిగించేలా బురదతో ముంచెత్తుతూ, లోతుగా గోటులుతవ్వుతున్నట్టు కురుస్తున్న ఆ వర్షమే, ఇక్కడకొచ్చేసరికి రాజసంగా సన్నని చిరుజల్లులా కురుస్తూ, పచ్చికకి పచ్చదనాన్నీ, ఇటుకలకి పూర్వపు ఎర్రదనాన్ని తెస్తూ, హంసల రెక్కలనీ, నారింజ బత్తాయిచెట్ల ఆకుల్ని మెరుగుపెడుతోంది. ప్రతీదీ తళతళలాడుతూ, అంతా ప్రశాంతంగా ఉంది. నిజానికి ఇంటికప్పుమీద ఎగురుతున్న జండా, గేటుకి ముందు పహారా కాస్తున్న ఇద్దరు జవానులేగనక లేకపోతే అది సైనికాధికారి కేంద్రకార్యాలయమని ఎవరూ తెలుసుకోలేరు. గుర్రాలు అశ్వశాలలో విశ్రాంతి  తీసుకుంటున్నాయి. అక్కడక్కడ ఉండీ ఉడిగీ  మనకి  ఒక అశ్వ రక్షకుడో, వంటగది దగ్గర పచార్లూ చేస్తూ యూనిఫారంలో లేని ఆర్డర్లీనో, విశాలమైన ఆవరణలో ఎర్రని ఫేంటు తొడుక్కుని నిర్లిప్తంగా అరగొర్రు లాగుతూ తోటమాలీవో కనిపిస్తున్నారు.

ముఖద్వారంవైపు కిటికీలు తెరుచుకున్న భోజనాలగదిలో, సగం శుభ్రంచేసి ఉన్న ఒక టేబిలు కనిపిస్తోంది; దానిమీద నలిగిపోయిన గుడ్డా, ఇంకా మూతతియ్యని సీసాలూ, ఖాళీవీ, మరకలుపడిన సగం తాగి వదిలేసినవీ గ్లాసులు ఉన్నాయి; అక్కడనుండి అతిథులందరూ  నిష్క్రమించడంతో విందు ముగిసినట్టు తెలుస్తోంది. దాన్ని ఆనుకుని ఉన్న గదిలోంచి పెద్దగా మాటలూ, నవ్వులూ, గ్లాసులు ఒకదాన్ని ఒకటి సున్నితంగా తాకినపుడు చేసే ఘల్లుమన్న చప్పుడుతోపాటు, బంతులు ఒకదాన్ని ఒకటి ఢీకొడుతున్న చప్పుడుకూడ వినవస్తోంది. సైన్యాధ్యక్షుడు(మార్షల్) ఇక్కడ బిలియర్డ్స్ ఆడుతున్నాడు… అందుకనే అక్కడ సేన అతని ఉత్తర్వులకోసం ఎదురుచూస్తోంది. అతను ఒకసారి ఆట ప్రారంభించేక, మిన్ను విరిగి మీద పడ్డా, అది పూర్తిచెయ్యకుండా ప్రపంచంలో ఏదీ ఆపలేదు.

బిలియర్డ్స్! ఆ యోధుడికున్న ఒక పెద్ద బలహీనత. అతను ఆటకు వచ్చేడంటే, పూర్తి యూనిఫారంలో, గుండేమీద పతకాలు వేలాడుతూ, యుద్ధానికి వచ్చినంత గంభీరంగా ఉంటుంది అతని ముఖం;  విందు భోజనమూ, త్రాగుడూ, ఆటా ఇచ్చిన ఉద్రేకంతో కళ్ళు నిప్పుల్లా వెలుగుతూ, బుగ్గలు ఎర్రబారి ఉంటాయి. అతని అంగరక్షకులు వెన్నంటే ఉంటారు… భక్తీ, వినయమూ చూపిస్తూ అతను “క్యూ”తో కొట్టే ప్రతి దెబ్బకీ మెచ్చుకోలుగా చప్పట్లు చరుస్తూ. మార్షల్ ఒక పాయింటు సాధించేడంటే అది ప్రత్యేకంగా చెప్పుకుంటారు; అతనికి దాహం వేస్తే అతనికి మదిర అందించడానికి సిద్ధపడతారు. ఇక్కడ భుజకీర్తుల రాపిడులూ, తురాయిల కదలికలూ, ఒంటిమీద పతకాలపట్టీలు చేసే గలగలలూ నిరంతరాయంగా సాగుతూ ఉంటాయి. ఉద్యానవనాలకీ ఉన్నతమైన దర్బారులకీ ఎదురుగా ఉంటూ, గోడలకు ఓకు పలకలు తాపడంచేసి ఉన్న విలువైన ఆ మందిరంలో అందమైన చిరునవ్వులూ, సభాసదులు చేసే వినయపూర్వక వందనాలూ, సరికొత్త యూనిఫారాలూ, వాటిమీది బుటాలనగిషీలూ చూస్తుంటే, కాంప్య్ర్న్యూ (Compiègne)లోని రోజులు గుర్తొస్తూ, అదిగో అక్కడ దూరంగా రోడ్లమీద, వర్షంలో తడిసి వణుకుతూ, బట్టలు మట్టికొట్టుకుపోయిన బాధాకరమైన దృశ్యం నుండి కళ్ళకి కాస్త  ప్రశాంతత లభిస్తుంది.

మార్షల్ ప్రత్యర్థి ఒక యువ కేప్టెన్… ఉంగరాలజుట్టుతో, తేలికైన చేజోళ్ళు ధరించి బిలియర్డ్స్ ఆటలో ప్రపంచంలోని అందరు మార్షల్స్ నీ ఓడించగల సత్తా ఉన్న అగ్రశ్రేణి బిలియర్డ్స్ ఆటగాడు. అయితే అతనికి మన మార్షల్ నుండి ఎంత గౌరవప్రదమైన దూరంలో ఉండాలో ఆ మెలకువ బాగా తెలుసు. తన శక్తినంతా ఆట ఎలా గెలవకూడదో దానికి వినియోగిస్తున్నాడు. అలాగని సులువుగా ఓడిపోవడమూ లేదు. సరిగ్గా చెప్పాలంటే, మంచి భవిష్యత్తు ఉన్న అధికారి అతను.

ఓ యువకుడా, బహుపరాక్! అప్రమత్తంగా ఉండు. మార్షల్ వి పాయింట్లు పదిహేనూ, నీవి పదీను. అసలు విషయం ఏమిటంటే, చివరిదాకా ఈ ఆటని అలాగే కొనసాగనివ్వాలి. అలా చేస్తే నీ పదోన్నతికి, అదిగో బయట మిగతా వాళ్లతోపాటే దిక్కుల్ని ముంచెత్తుతున్న వర్షంలో తడుస్తూ, నీ యూనిఫారాన్నీ దానిమీది ఉపకరణాల్నీకుళ్ళు చేసుకుంటూ, రాని ఉత్తర్వులకోసం ఎదురుచూస్తూ చేసినదానికంటే …. ఎక్కువ చేసినట్టే.

ఆట నిజంగా ఆసక్తికరంగా ఉంది. కర్రబంతులు దొర్లుకుంటూ, ఒకదాన్నొకటి ఢీకొట్టుకుంటూ రంగులు కలగలుపుకుంటున్నట్టున్నాయి. అంచున ఉన్న మెత్తలు వాటిని వెనక్కి పంపుతున్నాయి. ఉండుండి ఆకాశంలో ఒక ఫిరంగి పేలిన చప్పుడు(కేనన్-షాట్)తోపాటు ఒక మెరుపు మెరుస్తుంది. దానితో పోలిస్తే కిటికీలు బహు నెమ్మదిగా కొట్టుకుంటై. అందరూ ఒక్కసారి ఉలిక్కిపడి ఒకరి వంక ఒకరు చూసుకుంటుంటారు ఆందోళనగా. ఒక్క మార్షల్ కే అతని ఏకాగ్రతలో ఏదీ వినిపించదు,కనిపించదు; టేబిలుమీద ఆనుకుని అతనిప్పుడు అద్భుతమైన డ్రా-షాట్ ఎలా కొట్టడమా ఆలోచనలో నిమగ్నమై ఉన్నాడు. డ్రాషాట్లు కొట్టడంలో అతను నేర్పరి.

కాని ఇంతలో ఒక దాని తర్వాత ఒకటి మెరుపులూ, వెనకనే ఫిరంగులు పేలడమూ వినిపిస్తోంది. అతని అంగరక్షకులు కిటికీలదగ్గరకి పరిగెడుతున్నరు. కొంపదీసి ప్రష్యన్లు గాని దాడి చెయ్యడం లేదుకదా!

“వాళ్లు దాడి చేస్తే చెయ్యనీయండి!” అన్నాడు మార్షల్ క్యూకి సీమసున్నం పూస్తూ. “కేప్టెన్, ఇప్పుడు మీ వంతు.”

అక్కడి ఉద్యోగులు ఆనందంతో పులకలెత్తారు. యుద్ధ భూమిలో ఉంటూ కూడా అంత ప్రశాంతంగా బిలియర్డ్స్ ఆదగలుగుతున్న తమ మార్షల్ ధైర్యం ముందు ఫిరంగులు మోసుకెళ్ళే వాహనం మీదే పడుక్కున్న టూరెన్ (1611-75 మధ్య జీవించి, 30 సంవత్సరాల యుద్ధంలో ఫ్రాన్సు సైన్యాధ్యక్షుడుగా ఉన్నాడు)సాహసం ఏమీ కాదు అనుకున్నారు. ఫిరంగి గుళ్ళమోతతో మెషీన్ గన్లూ, తుపాకులమోత కలగలిసిపోయి వినిపిస్తోంది. ఈ మధ్యలో ఇక్కడ కోలాహలం కూడా రెట్టింపవుతోంది. అంచులంట నల్లగా ఉంటూ ఎర్రని కాలువల ప్రవాహం పచ్చికనానుకుని ప్రవహించడం ప్రారంభించింది. పక్షిశాలలో నెమళ్ళూ అడవికోళ్ళూ భయంతో అరుస్తున్నాయి. అరబ్బీ గుర్రాలు తుపాకుమందు వాసన పసిగట్టడంతో గుర్రాలశాలలో అసహనంగా వెనకకాళ్ళమీద లేస్తున్నాయి. కేంద్రకార్యాలయంలో ఆందోళన ఎక్కువయ్యింది. కబురు తర్వాత కబురు వస్తోంది. వార్తాహరులు ఒకటే పరుగులు. సైన్యాధ్యక్షుడు ఎక్కడ అని అడుగుతున్నారు.

కానీ మార్షలు కనిపించడే. నే చెప్పలేదూ, అతను ఆట ప్రారంభించేక ముగించేదాకా ఏదీ అడ్డదని?

“కేప్టెన్! ఇప్పుడు మీ వంతు.” అన్నాడు మార్షల్ మళ్ళీ.

కానీ కేప్టెన్ బాగా కలవరపడుతున్నాడు. కుర్రతనం అంటే అదే. లేకపోతే చూడండి. అతని మనసు మనసులో లేదు. వ్యూహాలు మరిచిపోయేడు. వరసగా రెండు పాయింట్లు సాధించి ఆట గెలిచేసేంత పని చేశాడు. దాంతో మార్షలుకి పట్టలేని కోపం వచ్చింది. ఆశ్చర్యం, ఆగ్రహం అతని ముఖంలో స్పష్టంగా కనిపిస్తున్నాయి. సరిగ్గా అదేక్షణంలో ప్రాంగణంలోకి బాగా పరిగెత్తి నిట్టూరుస్తున్న గుర్రం ఆగింది. మట్టికొట్టుకుపోయిన ముఖంతో అతని సంరక్షకుడొకడు కాపలాదారులందర్నీ తప్పించుకుంటూ ఒక్క ఉదుటులో మెట్లన్నీఎక్కి వచ్చేడు. “మార్షల్! మార్షల్!”… అతను ఎలా అభివాదం చేశాడో చూసితీరవలసిందే. కోపంతో ఊగిపోతూ, కోడిపుంజులా ముఖం ఎర్రబారిపోయి మార్షల్ చేతిలో క్యూతో కిటికీ దగ్గరకు వెళ్ళేడు.

“ఏమిటి సంగతి? ఇదంతా ఏమిటి? అక్కడ కాపలాదారులెవ్వరూ లేరా?” అని అరిచేడు.

“కానీ, మార్షల్…” అంటూ అతనేదో చెప్పబోయాడు.

“సరే, ఒక్క క్షణం; నేను ఉత్తర్వులిచ్చేదాకా నిరీక్షించు.”

కిటికీ దభాలుమని మూసుకుంది.

అతని ఉత్తర్వులకోసం నిరీక్షించాలి! పాపం, సైనికులు. ఇంత సేపూ వాళ్ళు చేస్తున్నపని అదే. గాలి వర్షాన్నీ, తుపాకీ గుళ్ళనీ వాళ్ల ముఖాలమీద కొడుతోంది. కొన్ని బెటాలియన్లకి బెటాలియన్లు అప్పుడే తుడుచుపెట్టుకు పోయేయి; కొన్ని ప్రతిచర్యకి సిద్ధంగా ఉన్నా తమ అచేతనకి కారణం తెలియక నిరర్థకంగా నిలబడి ఉత్తర్వులకోసం నిరీక్షిస్తున్నాయి.  చచ్చిపోడానికి ఏ ఉత్తర్వులూ అక్కరలేదు కనక, వందలకొద్దీ సైనికులు పొదల్లోనూ, కందకంలోనూ, ప్రశాంతంగా ఉన్న ఆ కోట ముఖద్వారందగ్గరా చచ్చి పడి ఉన్నారు. వాళ్ళు చచ్చిపోయినా, నిర్దాక్షిణ్యంగా ఫిరంగులు వాళ్ళని చీల్చి ముక్కలుచేసి పారెస్తున్నాయి; తెరిచి ఉన్న వాళ్ల గాయాల్లోంచి ఫ్రాన్సు రక్తం మౌనంగా పారుతోంది. పైన, బిలియర్డ్స్ గది మాత్రం ఆట తీవ్రతతో వేడేక్కిపోతోంది. మార్షల్ మళ్ళీ తన ఆధిపత్యాన్ని చేజిక్కించుకున్నాడు; అయితే, కేప్టెన్ మాత్రం సింహంలా పోరాడుతున్నాడు.

పదిహేడు. పద్ధెనిమిది. పంథొమ్మిది.

వాళ్లకి పాయింట్లు లెక్కపెట్టడానికి సమయం లేదు. యుద్ధం చప్పుడు మరింతదగ్గరగా వచ్చేస్తోంది. మార్షల్ కి ఇంక ఒక్క పాయింటు మాత్రమే కావాలి. అప్పటికే పార్కులో గుళ్ళవర్షం కురుస్తోంది.  అకస్మాత్తుగా ఫిరంగి గుండు ఒకటి కొలనులో పేలింది. గదిలో అద్దం భళ్ళున పగిలి ముక్కలయింది. రక్తం ఓడుతున్న రెక్కలతో హంస ఒకటి ప్రాణభయంతో అరుస్తూ కొలనులో పిచ్చెక్కినట్టు ఎటుపడితే అటు ఈదుకుంటూ పొతోంది… అదే మార్షలు కొట్టిన చివరి స్ట్రోక్ కూడా.

అంతే! అంతా చెప్పలేని నిశ్శబ్దం ఆవరించింది. వినిపిస్తున్న చప్పుడల్లా కేవలం తుప్పల్లో పడుతున్న వర్షానిది. కొండ మొదలులో ఏదో గందరగోళం; బురదకొట్టుకుపోయిన రోడ్లమీద పరిగెడుతున్న సైనికుల అడుగుల చప్పుడు. సైన్యం పూర్తిగా పలాయనం చిత్తగిస్తోంది. మార్షల్ మాత్రం తన ఆట గెలిచాడు.

Read the Original in English here: http://www.bartleby.com/313/4/4.html

 

చలిమంట

Dog_team_Dawson_Yukon_1899

 

మూలం: జాక్ లండన్

murthy gaaru

అప్పుడే తెల్లవారుతోంది… ఆకాశం క్రమంగా బూడిదరంగులోకి మారుతోంది. విపరీతంగా చలి వేస్తోంది. ప్రధానమైన యూకోన్ (Yukon) నది జాడవదిలి, అతను పక్కనే బాగా ఎత్తుగా ఉన్న మట్టిదిబ్బ ఎక్కేడు; ఆ మట్టిదిబ్బ మీదనుండి తూర్పుగా, దట్టమైన స్ప్రూస్ చెట్ల మధ్యనుండి ఎక్కువమంది వెళ్ళినట్టు కనపడని సన్ననిజాడమాత్రం ఒకటి కనిపిస్తున్నాది. ఆ దిబ్బ చాలా ఏటవాలుగా ఉండి ఎక్కడానికి కష్టంగా ఉండడంతో, దిబ్బమీదకి చేరగానే ఊపిరి నిభాయించుకుందికి వాచీ చూసుకునే మిషతో కాసేపు ఆగేడు.

సమయం తొమ్మిది గంటలు అయింది. ఆకాశంలో ఒక్క మబ్బుతునకా లేకపోయినా, సూర్యుడుగాని, సూర్యుడువచ్చే సూచనలుగాని ఏ కోశానా కనిపించడం లేదు. ఈ రోజు ఆకాశం చాలా నిర్మలంగాఉన్న రోజు…. అయినా, సూర్యుడు లేకపోవడంతో, పరిసరాలు చెప్పలేని విషాదం కమ్ముకున్నట్టు, నిరుత్సాహంగా చీకటిగా కనిపిస్తున్నాయి. ఆ విషయం అతన్ని ఏమాత్రం కలవరపెట్టలేదు. సూర్యుడు లేకపోవడానికి అతను అలవాటు పడిపోయాడు. అతనసలు సూర్యుడిని చూసి ఎన్నో రోజులయింది. అతనికి తెలుసు. దక్షిణదిశనుండి అందమైన ఆ బింబం దిక్కుల చివరనుండి మొదటిసారిగా తొంగిచూసి వెంటనే గుంకిపోడానికి మరికొన్ని రోజులు పడుతుందని.

ఆ మనిషి తను వచ్చినత్రోవని ఒకసారి సింహావలోకనం చేసుకున్నాడు. అక్కడ యూకోన్ నది ఒకమైలు వెడల్పుగా ఉండి, మూడడుగుల మందమున్న ఘనీభవించిన మంచులో కప్పబడి ఉంది. ఆ మంచుగడ్డమీద మరో అంత మందంలో కొత్తగా కురిసిన మంచు ఉంది. గడ్డకట్టుకుపోయిన నీటితావులమీద అలలు అలలుగా పరుచుకుని తెల్లని తెలుపు. ఉత్తరం నుండి దక్షిణం వరకూ కనుచూపు మేర ఎక్కడచూసినా ఖాళీలేని తెలుపు…

ఒక్క దక్షిణ దిశగా ద్వీపంలాఉన్న దట్టమైన స్ప్రూస్ చెట్లచుట్టూ తలవెంట్రుకలా వంపులుతిరిగి, ఉత్తరానఉన్న మరో స్ప్రూస్ చెట్ల ద్వీపంలో కనుమరుగైపోయిన త్రోవ మినహాయిస్తే. ఈ తలవెంట్రుక లాగా కనిపిస్తున్న త్రోవే అసలు మార్గం… ఉన్న ఒకే ఒక్క త్రోవ… దక్షిణానికి 500 మైళ్ళు వెనక్కి Chilcoot కనుమ, Dyea, Salt Water కి వెళ్తుంది … ఉత్తరానికి Dawson 70 మైళ్ళూ, Nulabo కి మరో వెయ్యి మైళ్ళూ, అక్కడనుండి St. Michael on Bering Sea మరో 1500 మైళ్ళూ ఉంటుంది.

అయితే ఇవేవీ… తలవెంట్రుకలా కనీ కనిపించని సుదీర్ఘంగాఉన్న గహనమైన మార్గంగాని, ఆకాశంలో సూర్యుడు లేకపోవడంగాని, విపరీతంగా వేస్తున్న చలిగాని, భయంకరమైన పరిచయంలేని ఆ పరిసరాలుగాని అతనిమీద ఏమాత్రం ప్రభావాన్నీ చూపించలేకపోయాయి. దానికి కారణం, ఇవన్నిటికీ బాగా అలవాటు పడిపోయాడనికాదు; నిజానికి అతనీ ప్రాంతానికే కొత్త; మొదటిసారి వస్తున్నాడు. ఇదే అతని మొదటి శీతకాలం ఇక్కడ. అతనితో ఉన్న చిక్కు ఏమిటంటే అతనికి బొత్తిగా ఆలోచన లేదు. లౌకికమైన విషయాలయితే తొందరగా గ్రహించి, స్పందించగలడు. అయితే ఆ స్పందనకూడా విషయాలకే పరిమితంగాని, వాటి పర్యవసానాలకు కాదు.

సున్నాకి దిగువన యాభై డిగ్రీలు ఉష్ణోగ్రత అంటే, ఎనభై డిగ్రీల దరిదాపు కొరికే మంచు అన్నమాట. అంత చలీ, అందులో వణకడం గట్రా సరదాగా అనిపించి అతనికి బాగా నచ్చేయి. అంతవరకే! తను చలిప్రదేశంలో బ్రతకలేని బలహీనుడినన్నఊహ గాని, అసలు మనిషే… వేడి అయినా, చలి అయినా కొన్ని అతిచిన్న ఉష్ణోగ్రతల పరిమితులమధ్య బ్రతకగలిగిన ప్రాణి అన్న ఆలోచనగాని; ఆపైన విశ్వంలో మనిషి స్థానం గురించి, అతని శాశ్వతత్వమూ మొదలైన ఊహాత్మకమైన విషయాల జోలికిగాని అతని ఆలోచన సాగలేదు.

యాభై డిగ్రీలు మైనస్ అంటే అర్ధం మంచుకొరికితే అది విపరీతంగా బాధిస్తుంది; దానినుండి ఎలాగైనా కాపాడుకోవాలి … చేతికి గ్లోవ్జ్ తొడుక్కోడం, చెవులకి తొడుగులూ, కాళ్ళకి దట్టమైన మేజోళ్ళూ, మొకాసిన్లూ… ఖచ్చితంగా ఉండితీరాలి. కానీ, అతనికి యాభైడిగ్రీల మైనస్ అంటే యాభైడిగ్రీలు మైనస్ … ఒక అంకె… అంతే. తను అనుకుంటున్నట్టు కేవలం ఒక అంకెకాకుండా అంతకుమించి దానికి ఏదైనా అర్ధం ఉండడానికి అవకాశం ఉందన్న ఆలోచనే అతని బుద్ధికి తట్టలేదు.

అతను ముందుకుపోడానికి ఇటు తిరిగి, ఎంత చలిగా ఉందో పరీక్షించడానికి ఉమ్మేడు. అది చేసిన పదునైన చిటపట శబ్దం అతన్ని ఆశ్చర్యపరిచింది. అతను మళ్ళీ మళ్ళీ గాలిలోకి ఉమ్మేడు క్రిందనున్న మంచుమీద పడకుండా. అతనికి తెలుసు యాబై డిగ్రీల మైనస్ దగ్గర మంచుమీద ఉమ్మితే అది శబ్దం చేస్తుందని. కానీ, ఇది గాలిలోనే శబ్దం చేస్తోంది. అంటే, ఉష్ణోగ్రత మైనస్ యాభై డిగ్రీలకంటే ఇంకా తక్కువే ఉందన్న మాట — కానీ ఎంత తక్కువో తెలీదు. అయినా, ఇపుడు తనకి ఉష్ణోగ్రతతో పనిలేదు.

తనిప్పుడు హెండర్సన్ క్రీక్ చీలికకి ఎడమవైపునున్నతన పాత హక్కుభూమి వైపు వెళుతున్నాడు. ఇప్పటికే పిల్లలు అక్కడ చేరి ఉంటారు. వాళ్ళు ‘ఇండియన్ క్రీక్ కంట్రీ’ దగ్గర చీలిన రోడ్డునుండి అడ్డంగా వెళ్తే, తను యూకోన్ నదిలోని లంకలనుండి వేసవిలో దుంగలు తేవడానికిగల సాధ్యాసాధ్యాలు పరీక్షించడానికి చుట్టూతిరిగి వెళ్తున్నాడు. తను శిబిరం చేరేసరికి సాయంత్రం 6 గంటలు అవుతుంది, అప్పటికే బాగా చీకటిపడిపోతుంది.

అయితేనేం, కుర్రాళ్ళు అక్కడే ఉంటారు, చలిమంట మండుతూ ఉంటుంది, తన కోసం వేడివేడిగా రాత్రిభోజనం సిద్ధంగా ఉంటుంది. మధ్యాహ్నం భోజనం విషయానికి వస్తే, అని అనుకుని, తన జాకెట్ లోంచి ఉబ్బెత్తుగా కనిపిస్తున్న పొట్లాంమీద చెయ్యివేసి తణిమేడు. ఆ పొట్లాం కూడా, రుమాల్లో చుట్టి, ఒంటికి ఆనుకుని తన చొక్కాలోపల ఉంది.

బిస్కట్లు చలికి గడ్డకట్టుకుపోకుండా ఉంచాలంటే అదొక్కటే మార్గం. ఆ బిస్కట్ల గురించి ఆలోచన రాగానే, తనలో తనే హాయిగా నవ్వుకున్నాడు… ఎందుకంటే ఒక్కొక్క బిస్కత్తూ చీల్చి అందులో వేచిన పంది మాంసం బాగా దట్టించి, పంది కొవ్వులో ఊరవేసినవి అవి.

అతను బాగా ఏపుగా ఎదిగిన స్ప్రూస్ చెట్లలోకి చొరబడ్డాడు. తోవ చాలాసన్నగా కనీకనపడకుండా ఉంది. ఇంతకుముందు వెళ్ళిన కుక్కబండీ (sledge) జాడమీద అప్పుడే ఒక అడుగు మందం మంచు కురిసింది. అతను బండీ ఉపయోగించకుండా వంటిమీద బరువులేకుండా తేలికగా నడుస్తున్నందుకు ఆనందించేడు. నిజానికి అతను మధ్యాహ్నభోజనానికి మూటగట్టుకున్న బిస్కత్తులుతప్ప వంటిమీద ఇంకేవీ లేవు. అతనికి ఈ చలిచూస్తే చాలా ఆశ్చర్యం వేసింది.

వాతావరణం బాగా చల్లగా ఉంది. తిమ్మిరెక్కిన తన ముక్కునీ, బుగ్గల్నీ చేతికున్న గ్లోవ్జ్ తో ఒకసారి గట్టిగా రాసేడు. అతను చాలాదట్టంగా గడ్డంపెంచే వ్యక్తి; అయినా ఆ గడ్దం ముందుకి పొడుచుకువచ్చిన దవడ ఎముకలని, మంచుకురుస్తున్నగాల్లోకి చాలా కుతూహలంగా తొంగిచూస్తున్న ముక్కునీ వెచ్చగా ఉంచలేకపోతోంది.

ఆ మనిషివెనక అడుగులోఅడుగు వేసుకుంటూ ఒక కుక్క పరిగెడుతోంది. అది ఆ ప్రాంతంలో పుట్టి పెరిగినదే; బలిష్టంగా, గోధుమరంగులోఉండి దాని చూపులలో, ప్రవర్తనలో తోడేలుకి ఏమాత్రం తేడా కనిపించక, తోడేళ్ళని వేటాడడానికి పనికివచ్చే వేటకుక్క అది.

విపరీతంగా ఉన్న ఆ చలిలో నడవడం ఆ జంతువుని చాలా అసహనానికి గురిచేస్తోంది. దానికి తెలుసు అది ప్రయాణానికి అనువైన సమయం కాదని. మనిషికి వాడి వివేకం చెప్పిన దానికంటే, దానికి తన సహజప్రవృత్తి అసలు పరిస్థితి స్పష్టంగా తెలియజేస్తోంది. నిజానికి అప్పుడున్న ఉష్ణోగ్రత సున్నాకి దిగువన యాభై డిగ్రీలూ కాదు, అరవై డిగ్రీలూ కాదు, డెబ్భై డిగ్రీలు కాదు; అది డెబ్భై అయిదు డిగ్రీలు మైనస్. నీటి ఘనీభవన ఉష్ణోగ్రత సున్నాకి ఎగువన ముఫై రెండు డిగ్రీలు కనుక, దాని అర్థం నూట ఏడు డిగ్రీల చలి అన్నమాట.

ఆ కుక్కకి ఉష్ణమాపకాలగురించి ఏమీ తెలియదు. బహుశా దానిమెదడులో, అతిశీతలత్వాన్ని మనిషిమెదడు గుర్తించగలిగినట్టు గుర్తించే ఇంద్రియజ్ఞానం ఉండకపోవచ్చు. కాని, ఆ జంతువుకి దాని జంతుప్రకృతి దానికి ఉంది. లీలగా ఏదో చెప్పలేని భయం ఊహించింది గాని దాన్ని అణుచుకుని మనిషి వెంట నక్కి నక్కి నడుస్తోంది; ఆ మనిషి ఎక్కడో ఒకచోట ఏదైనా శిబిరంలోదూరి చలిమంటవేసుకోకపోతాడా అని ఊహిస్తోందేమో, దాని నడక అలవాటులేని అతని అడుగుల్ని ప్రశ్నిస్తున్నట్టు ఉంది. కుక్కకి చలిమంటగురించి తెలుసు. దానికి ఇప్పుడు చలిమంటైనా కావాలి, లేదా, ఈ చలిగాలినుండి రక్షించుకుందికి, మంచులో గొయ్యితీసి అందులో ముడుచుకుని పడుక్కోనైనా పడుక్కోవాలి.

దాని ఊపిరిలోని తేమ దాని ఒంటిబొచ్చుమీద సన్నగా మంచుపొడిలా రాలి ఉంది; ముఖ్యంగా దాని చెంప దవడలూ, మూతీ, కనుబొమ్మలూ గడ్డకట్టిన నిశ్వాసపు తేమతో తెల్లగా కనిపిస్తున్నాయి. ఆ మనిషి ఎర్రని గడ్డమూ, మీసమూ కూడా అలాగే అతని ఊపిరిలోని తేమకి, అంతకంటే ఎక్కువగా ముద్దకట్టేయి గానీ, ఆ ముద్దకట్టినది మంచురూపం దాల్చి, అతను ఊపిరివిడుస్తున్నప్పుడల్లా మరింత పేరుకుంటున్నాది.

దానికితోడు, ఆ మనిషి పుగాకు నములుతున్నాడు; అతని మూతిదగ్గర పేరుకున్నమంచు అతని పెదాల్ని ఎంత గట్టిగా పట్టిఉంచిందంటే, ఆ పుగాకురసం ఉమ్మిన తర్వాత అతని చుబుకాన్ని అతను తుడుచుకోలేకపోతున్నాడు. దాని పర్యవసానం, అతని చుబుకం మీద తెల్లనిగడ్డం క్రమక్రమంగా దట్టమైన జేగురు రంగులోకి మారుతోంది. అతనుగాని ఇప్పుడు క్రింద బోర్లపడితే, అది గాజులాగ చిన్నచిన్నముక్కలుగా పగిలిపోతుంది. అతనిప్పుడు తనగడ్డం రంగుమారడం గురించి పట్టించుకోవడం లేదు. ఆ దేశంలో పుగాకు నమిలే వాళ్లందరూ చెల్లించే పరిహారం అది. ఇంతకు ముందు రెండుసార్లు చలివాతావరణంలో బయటకు వెళ్ళేడు గాని, అప్పుడు ఇంత చలి లేదు. అరవయ్యవ మైలురాయి దగ్గర అక్కడి స్పిరిటు థర్మా మీటరు మైనస్ దిగువ యాభై అయిదు డిగ్రీలు నమోదు చెయ్యడం తను చూసేడు.

అలా ఓపిక బిగబట్టుకుని సమతలంగా ఉన్న మైళ్ళపొడవైన అడవిదాటి, విశాలమైన పొగాకు తోటలు దాటి, గడ్డకట్టిన ఒక చిన్నసెలయేటిగట్టు దిగేడు. అదే హెండర్సన్ క్రీక్. అతనికి తెలుసు తను ఈ క్రీక్ చీలికకి పదిమైళ్ళదూరంలో ఉన్నానని. అతను చేతివాచీ చూసుకున్నాడు. పదిగంటలు అయింది. అంటే, తను గంటకి నాలుగుమైళ్ళచొప్పున నడుస్తున్నాడన్నమాట. ఆ లెక్కన తను ఈ క్రీక్ చీలిక చేరడానికి రెండున్నరగంటలు పడుతుంది, అంటే పన్నెండున్నరకి చేరుకుంటాడు. అక్కడకి తను చేరుకున్న ఆనందంతో, తన మధ్యాహ్న భోజనం అక్కడ చేద్దామని నిర్ణయించుకున్నాడు.

ఎప్పుడైతే అతను గడ్దకట్టిన సెలయేటి ఉపరితలం మీద నడక ప్రారంభించాడో, ఆ కుక్క నిరాశతో తోకవేలాడేసుకుని, దాని మడమలమీద వాలిపోయింది. ముందువెళ్ళిన కుక్కలబండి చక్రాల చాళ్ళు స్పష్టంగానే కనిపిస్తున్నాయి, కాని పరిగెత్తిన కుక్కల అడుగులమీద అప్పుడే పన్నెండంగుళాల మందం మంచు కురిసింది. నెలరోజుల వ్యవధిలో ఈ నిశ్చలమైన సెలయేటిమీద అటునుంచి ఇటుగాని, ఇటునుంచి అటుగాని ఎవ్వరూ వెళ్ళిన జాడ కనిపించదు.

ఈ మనిషిమాత్రం స్థిరంగా నడక సాగిస్తున్నాడు. అతనికి పెద్దగా ఆలోచించే అలవాటూ లేదు, అతనికి ఇప్పుడు ప్రత్యేకించి ఆలోచించడానికికూడా ఏమీ లేదు. అతను ఈ సెలయేటి చీలిక చేరిన తర్వాత మధ్యాహ్నభోజనం చేస్తాడన్నదీ, సాయంత్రం ఆరు గంటలకల్లా పిల్లలతో శిబిరందగ్గర ఉంటాడన్నదీ తప్ప. నిజానికి మాటాడ్డానికి తోడు ఎవరూలేరు; ఒకవేళ ఉన్నా, మూతిమీద గడ్డకట్టుకుపోయిన మంచువల్ల మాటాడడం సాధ్యపడదు కూడా. అందుకని, ఆ జేగురురంగులోకిమారుతున్న గడ్డం పొడవుపెంచేలా, విరామంలేకుండా అలా పొగాకు నములుకుంటూ పోతున్నాడు. ఉండుండి ఒక్కసారి అతని మనసుకి ఇవాళ చాలా చల్లగా ఉందనీ, ఇంత చలి ఇదివరకెన్నడూ తను యెరుగననీ తడుతోంది.

నడుస్తూనడుస్తూ చేతికున్న ఉన్ని గ్లోవ్జ్ తో తన ముక్కుకొననీ, పొడుచుకువచ్చిన బుగ్గఎముకలనీ గట్టిగా రుద్దుతున్నాడు. ఆ పని అసంకల్పితంగానే అప్పుడప్పుడు చేతులు మార్చిమార్చి చేస్తున్నాడు. కానీ, అతను ఎంత రుద్దనీ, అతను రుద్దడ ఆపగానే బుగ్గఎముకలు తిమ్మిరెక్కేవి, మరుక్షణంలో ముక్కుకొస చైతన్యం కోల్పోయేది. అతని బుగ్గలు ఇక మంచుకి గడ్డకట్టుకుపోవడం ఖాయం; ఆ విషయం అతనికీ తెలుసు. అందుకనే ముక్కుకి Buds (హిమపాతమప్పుడు వేసుకునే ముక్కుపట్టీలు) వేసుకోలేదే అని ఒక్కసారి విచారం వేసింది; ఆ పట్టీలు బుగ్గ ఎముకలమీదనుండి పోతూ వాటికికూడా రక్షణ కల్పించి ఉండేవి. అయినా ఇప్పుడనుకుని ఏం ప్రయోజనం? బుగ్గలు గడ్డకడితే ఏమౌతుందట? కొంచెం బాధగా ఉంటుంది. అంతే గదా; దానివల్ల పెద్ద ప్రమాదం ఏమీ వచ్చిపడదు.

ఎపుడయితే ఆలోచనలు లేక అతని మనసు ఖాళీగా ఉందో, అతని చూపులు పదునెక్కి, సెలయేటి ఉపరితలం మీద దుంగలు మార్గాన్ని మూసేసినచోట్లూ, అది వంపులుతిరిగిన చోట్లూ, అది లోయల్లోకిదిగినచోట్లూ నిశితంగా గమనించడంతోపాటు, తను అడుగువేసే ప్రతిచోటూ అతిజాగ్రత్తగా గమనిస్తున్నాడు. ఒకసారి ఒకవంపుని చుట్టివస్తూ, భయపడ్డ గుర్రంలా ఒకచోట అకస్మాత్తుగా ఆగి, నడుస్తున్నమార్గం వదిలి, తన అడుగులజాడలోనే వెనక్కి వచ్చేడు.

అతనికి తెలుసు ఆ సెలయేరు అడుగు వరకూ గడ్డకట్టిపోయిందని — నిజానికి ఈ ఆర్కెటిక్ చలికి ఏ సెలయేటిలోనూ నీళ్ళన్న ఊసు ఉండదు — అయితే, కొండవాలులంట పైనకురిసిన మంచుబరువుకి అడుగునఉన్నమంచు కరిగి ఊటలై ప్రవహించి, ఒకోసారి ఇలాంటి గడ్డకట్టిన సెలయేటి తలాలపై ప్రవహిస్తుంటాయన్నవిషయంకూడా అతనికి తెలుసు; అవి ఎంతచలివాతావరణంలోనైన గడ్డకట్టవనీ తెలుసు; వాటివల్ల వచ్చే ప్రమాదము గురించీ బాగా తెలుసు. నిజానికి అవి ఉచ్చులు. పైన పేరుకున్న మంచుకింద మూడు అంగుళాలనుండి మూడడుగులలోతువరకూ ఎంతవరకైనా నీటిగుంటలు ఉండవచ్చు. ఒక్కొసారి వాటిని అరంగుళంమాత్రమే మందంగల మంచుపలక కప్పిఉండొచ్చు. మంచుపలకపై ఒక్కోసారి మంచుపేరుకుని ఉండొచ్చు. లేదా కొన్ని వరుసల్లో ఒకదాని మీద ఒకటిగా నీరూ- పలకా, నీరూ-పలకా ఉండి, ఒకసారి మనిషి వాటిమీద కాలుపెడితే, మంచుపలకలు ఒకటొకటిగా విరిగి మనిషి మొలబంటి వరకూ మంచునీటితో తడిసిపోవచ్చు.

అందువల్లనే అతను అంత గాభరాపడి వెనక్కి అంతతొందరగా అడుగులువేసింది. అతను అడుగువేసినచోట మంచుపొరక్రింద మంచుపలక విరిగిన చప్పుడు విన్నాడు. అటువంటి చల్లనివాతావరణంలో కాళ్ళు తడవడమంటే … కష్టమేకాదు, ప్రమాదం కొనితెచ్చుకున్నట్టే. తక్కువలోతక్కువ అతనికి ఆలస్యం అవడం, ఎందుకంటే అపుడతను తప్పనిసరిగా చలిమంట వేసుకుని, దాని వేడిమిలో వట్టికాళ్ళు రక్షించుకుంటూ, మేజోళ్ళనీ, మొకాసిన్లనీ ఆరబెట్టుకోవాలి. అందుకని, సావధానంగా నిలబడి జాగ్రత్తగా సెలయేటిఉపరితలాన్నీ, దానిగట్లనీ పరిశీలించి, నీటిప్రవాహం కుడిపక్కనుండి వస్తోందని గ్రహించేడు.

ముక్కునీ బుగ్గలనీ రాపిడిచేసుకుంటూ, క్షణకాలం విషయాలన్నీ మదింపుచేసుకుని, అప్పుడు ఎడమప్రక్కకి తిరిగి, భయంభయంగా అడుగువేస్తూ, వెయ్యబోయే ప్రతిఅడుగునీ పరీక్షించుకుంటూ, సెలయేటిని దాటేడు. ఇక ప్రమాదంలేదు అనుకున్నతర్వాత కొత్తగా మరొక ‘పట్టు’ పుగాకుతీసి నములుతూ, తన మిగిలిన నాలుగు మైళ్ళ ప్రయాణానికి ఉత్సాహంగా అడుగులెయ్యడం ప్రారంభించాడు. తర్వాతి రెండుగంటలప్రయాణంలోనూ అలాంటివి చాలాఉచ్చులు ఎదుర్కొన్నాడు. నీటిగుంటలమీద పొరలా పేరుకున్నమంచు పీచుమిఠాయిలా ముడుచుకుపోయిఉండి ప్రమాదాన్నిసూచిస్తుంది.

అయినాసరే, అతను మరొకసారి తృటిలో ప్రమాదాన్ని తప్పించుకున్నాడు; అప్పుడు ప్రమాదాన్నిశంకిస్తూ, ముందు కుక్కని పొమ్మన్నాడు, అది పోనని మొరాయించింది. చివరికి అతడు దాన్ని ముందుకి తోసేదాకా వెళ్లలేదు; తోసినతర్వాత విరగని పలకమీదనుండి తొందరగా పరిగెత్తింది; ఇంతలో పలకవిరిగి, అది ఒకపక్కకి ఒరిగిపోయినా, గట్టి ఆనుదొరికి వెళ్లగలిగింది. దాని పాదాలూ, ముందుకాళ్ళూ, తడిసిపోవడమేగాక, కాళ్లకుఅంటుకున్ననీళ్ళు వెంటనే గడ్డకట్టుకుపోయాయి. పేరుకున్నమంచుని విదిలించుకుందికి ప్రయత్నంచేసి, మంచుమీద వెల్లకిలా పడుకుని, కాలివేళ్ళ మధ్య చిక్కుకున్న మంచుని నోటితో కొరకడం ప్రారంభించింది. అది అసంకల్పితంగా చేసిన చర్య. మంచుని అలా వదిలెయ్యడం అంటే, కాళ్ళు ఒరిసిపోనియ్యడం. ఆ విషయం దానికి తెలీదు. దానికి తెలిసిందల్లా, ఆ జీవిలో రహస్యలిపిలో లిఖించబడ్డ అద్భుతమైన ప్రతిచర్య ప్రకారం నడుచుకోవడమే.

కాని మనిషికి ఈ విషయమ్మీద ఖచ్చితమైన అవగాహన ఉండడంతో, కుడిచేతి చేజోడు తొలగించి గడ్డకట్టిన మంచుముక్కలు తొలగించడంలో సాయం చేసేడు. ఒక నిముషందాటి అతని వేళ్ళని బయట పెట్టలేదు. అయినప్పటికీ, అంతలోనే అవి కొంకర్లుపోడం అతనికి ఆశ్చర్యం కలిగించింది. వాతావరణం చాలా చల్లగా ఉంది. తొందర తొందరగా చెయిజోడు తొడిగి, గుండెకేసి మోటుగా చెయ్యిని కొట్టేడు.

సరిగ్గా మిట్టమధ్యాహ్నం వేళకి రోజంతటికంటే వెలుగు బ్రహ్మాండంగా ఉంది. అయినా సూర్యుడు శీతకాలపు పొద్దవడంచేత క్షితిజరేఖకి చాలా దగ్గరలో ఉన్నాడు. కారణం హెండర్సన్ క్రీక్ దగ్గర నేల బాగా ఎత్తుగా ఉంది. అతను అక్కడ నడుస్తున్నప్పుడు నీడ కాళ్ళక్రిందే ఉంది. సరిగ్గా పన్నెండున్నర అయేసరికల్లా తననుకున్న చీలిక దగ్గరికి చేరేడు. అతను అనుకున్నవేళకి రాగలగడంతో నడుస్తున్న వేగానికి అతనికి చాలా సంతృప్తి కలిగింది.

తను అదేవేగంతో నడవగలిగితే సాయంత్రం ఆరోగంటకల్లా కుర్రాళ్ళని కలవగలుగుతాడు. అతను జాకెట్టు, చొక్కావిప్పి లోపలదాచిన మధ్యాహ్నభోజనం పొట్లాం బయటకితీసాడు. దీనికి పావునిమిషంకూడా పట్టలేదు. అయినా, ఆ తక్కువ వ్యవధిలోనే, తొడుగుతీసిన చేతివేళ్ళు తిమ్మిరెక్కిపోయాయి. వెంటనే గ్లోవ్జ్ వేసుకోకుండా, ఆ చేతిని కాలికేసి ఒక డజనుసార్లు దబదబ బాదేడు. తర్వాత మంచుతోకప్పబడిన ఒక దుంగమీద కూర్చున్నాడు తిందామని.

అతను చేతిని కాలికేసిబాదినపుడు కలిగిన చిన్ననొప్పి అంతలోనే మాయమవడం చూసి ఆశ్చర్యపోయాడు. అతనికిప్పుడు ఆ బిస్కట్లు కొరికే అవకాశం లేదు. పదేపదిసార్లు చేతులు కాలికేసికొట్టుకుని, చేతికి మళ్ళీ గ్లోవ్జ్ తొడిగి, రెండో చేత్తో తిందామని దాని గ్లోవ్జ్ విప్పేడు. నోటినిండా ఒక ముక్క కొరుకుదామని ప్రయత్నించేడు గాని, మూతిదగ్గర పేరుకున్న మంచు సాధ్యపడనీలేదు. అతను చలిమంటవేసి దాన్ని కరిగించడం మరిచిపోయేడు. తన తెలివితక్కువదనానికి అతనికి నవ్వు వచ్చింది. నవ్వుతూనే, ఇప్పుడు తొడుగులేని చేతివేళ్ళుకూడా కొంకర్లుపోవడం గమనించేడు. అలాగే తను కూచుంటున్నప్పుడు కాలివేళ్లలో కలిగిన నొప్పి అప్పుడే తగ్గిపోవడం కూడా గమనించేడు. అతనికి అనుమానం వచ్చింది కాలివేళ్ళు వెచ్చగా ఉన్నాయా లేక అవికూడా తిమ్మిరెక్కాయా అని. మొకాసిన్ లోంచే వాటిని కదిపి అవి స్పర్శకోల్పేయన్న నిర్థారణకి వచ్చేడు.

చేతికి ఆతృతగా గ్లోవ్జ్ తొడిగి నిలబడ్డాడు. కొంచెం భయపడ్డాడు. కాళ్ళలోకి మళ్ళీ చైతన్యం వచ్చేదాకా కాసేపు గెంతేడు. ఇప్పుడు నిజంగానే వాతావరణం చాలా చల్లగాఉందని అభిప్రాయపడ్డాడు. ఈ దేశంలో ఉండుండి వాతావరణం అకస్మాత్తుగా చల్లబడిపోతుందని ఆ సల్ఫర్ క్రీక్ లో కలిసిన వ్యక్తి సరిగ్గానే చెప్పేడు. తనే ఆ మాటకి పరిహాసంగా నవ్వేడు గాని! దాని అర్థం మనిషి ఎప్పుడూ ఏ విషయాన్నీ రూఢిగా తీసుకో కూడదు. వాతావరణం బాగా చల్లగా ఉందనడంలో ఎంతమాత్రం సందేహం లేదు అనుకున్నాడు.

వంట్లో మళ్ళీ వెచ్చదనం ప్రవహిస్తోందని రూఢి అయ్యేదాకా అతను క్రిందకీ మీదకీ గబగబా నేలమీద కాళ్ళు బలంగా వేస్తూ, చేతులూపుకుంటూ నడిచేడు. అప్పుడు జేబులోంచి అగ్గిపెట్టెతీసి చలిమంట వేసుకుందికి ప్రయత్నించేడు. అక్కడ చుట్టుపక్కల కలుపుమొక్కలలో క్రిందటిమాటు వర్షాలకు కొట్టుకొచ్చి చిక్కుకున్న కర్రా కంపా ఏరి తెచ్చుకున్నాడు మంట రగల్చడానికి. నెమ్మది నెమ్మదిగా ప్రారంభించి, త్వరలోనే మంట గట్టిగా అందుకున్నాక తనముఖం మీద గడ్డకట్టిన మంచు కరిగించుకుని, ఆ వేడిలోనే తన భోజనం కానిచ్చేడు. ఆ కాస్సేపు అక్కడి చలి వెనుకంజ వేసింది. కుక్కకూడా ఇటు వేడి తగిలేంత, అటు వొళ్ళు చురకనంత దూరంలో మంటకి దగ్గరగా సంతోషంగా కాళ్ళుజాచుకుని కూచుంది.

ఆ మనిషి తన భోజనం అయిన తర్వాత హుక్కా దట్టించి, ప్రశాంతంగా పొగతాగేడు. అప్పుడు తనచేతికి మళ్ళీ మిటెన్స్ తొడుక్కుని, చెవులు పూర్తిగా కప్పేలా తన టోపీ సరిచేసుకుని క్రీక్ లోని ఎడమవైపు బాట పట్టేడు. కుక్కకి చాలా నిరాశ కలిగింది. దాని మనసు మళ్ళీ మంటవైపే లాగుతోంది. ఈ మనిషికి చలి అంటే ఏమిటో తెలీదు. బహుశా అతని వంశంలో ఎవరికీ తెలిసి ఉండదు, చలంటే మామూలు చలికాదు, నిజమైన చలి, నీరు గడ్డకట్టే ఉష్ణోగ్రతకి నూట ఏడు డిగ్రీల దిగువ ఉండే చలి… కానీ, కుక్కకు తెలుసును; దాని వంశం అంతటీకీ తెలుసును, ఆ పరిజ్ఞానం దాని నరనరాల్లోనూ జీర్ణించుకుంది. దానికితెలుసు: ఇటువంటి భయంకరమైనచలిలో బయటకు అడుగుపెట్టడం క్షేమంకాదని. ఇప్పుడు మంచులోగొయ్యిచేసుకుని, వాతావరణంలో అకస్మాత్తుగా వచ్చిన ఈ తేడాకి మూలకారణమైన అంశం తొలిగేదాక నిరీక్షిస్తూ గుమ్మటంగా పడుక్కోవలసిన సమయం.

అయితే కుక్కకీ మనిషికీ ఏ విధమైన అనుబంధమూ లేదు. ఒకటి రెండో దానికి అవసరానికి పనికొచ్చే బానిస. అతని దగ్గరనుండి దానికి లభించిన ఏకైక లాలన కొరడాతో కొడతానని గట్టిగా చేసిన బెదిరింపులూ, అప్పుడప్పుడు కొరడాతో నిజంగా వేసిన దెబ్బలూను. అందుకని కుక్క తన భయాన్ని అతనికి తెలియపరచడానికి ప్రయత్నించలేదు. దానికి ఆ మనిషి శ్రేయస్సుతో సంబంధం లేదు. అది తన శ్రేయస్సుకోసం మళ్ళీ వెనక్కి మంటవైపు పోదామని ప్రయత్నించింది. కానీ, అతను గట్టిగా ఈలవేసి, కొరడా ఝళిపించేసరికి, వెనుదిరిగి అతన్ని అనుసరించసాగింది.

~~~~~~~~

ఆ మనిషి ఒక పుగాకుపట్టుతీసి నమలడం ప్రారంభించాడు. అతనిగడ్డం తిరిగి జేగురురంగులోకి మారడం ప్రారంభించింది. అలాగే అతని ఊపిరిలోని తేమ అతని మీసాలపై, కనుబొమలపై, కనురెప్పలపై తెల్లటిపొడిలా రాలడం ప్రారంభించింది. ఈ హెండర్సన్ క్రీక్ కి ఎడమప్రక్క ఎక్కువగా కొండవాగులున్నట్టు కనిపించడం లేదు ఎందుకంటే ఒక అరగంట దాకా అతనికి అలాంటి ఛాయలేవీ కనిపించలేదు. అదిగో అప్పుడు అనుకోని సంఘటన జరిగింది. అక్కడ ఏ చిహ్నాలూలేనిచోట, మెత్తగా, మధ్యలోఖాళీలులేకుండా బాగా గట్టిగాఉన్నట్టు కనిపించినచోట, విరిగి అతను లోపలికి పడిపోయాడు. అది పెద్దలోతేం కాదు. గట్టినేల దొరికేవరకు తొట్రుపడి, ముణుకులకి సగానికి పైగా తడిసిపోయేడు.

అతనికి బాగాకోపంవచ్చి తన దురదృష్టానికి గట్టిగా బయటకు తిట్టుకున్నాడు. అతను తన కుర్రాళ్ళదగ్గరికి ఆరుగంటలకి చేరుతానని లెఖ్ఖవేసుకున్నాడు. ఇప్పుడు అధమపక్షం గంట ఆలస్యంఅవుతుంది. ఎందుకంటే ఇప్పుడు తప్పనిసరిగా చలిమంట వేసుకుని తన పాదరక్షలని పొడిగా ఆరబెట్టుకోవాలి. అంత తక్కువ ఉష్ణోగ్రతలవద్ద అది తప్పనిసరి— అంతమట్టుకు అతనికి తెలుసు. అందుకని అతను గట్టువైపు నడిచి ఒడ్డు ఎక్కేడు. గట్టుమీద చాలా చిన్నచిన్న స్ప్రూస్ చెట్ల మొదళ్లచుట్టూ వర్షానికి కొట్టుకొచ్చి అక్కడి కలుపుమొక్కల్లో చిక్కుపడిపోయిన ఎండుపుల్లలూ, విరిగిన కొమ్మలతోపాటు, క్రిందటేడువి పెద్ద దుంగలూ, ఎండిన రెల్లుగడ్డి దుబ్బులుకూడా ఉన్నాయి.

మంచుమీద పెద్ద దుంగలు పడేసి, మంటకి మంచుకరిగినపుడు మండుతున్న చిన్నచిన్న చితుకులు ఆరిపోకుండ ఒక పునాదిలాంటి వేదిక తయారుచేశాడు. అతని జేబులొంచి ‘బర్చ్(Birch)’ బెరడుతీసి దానికి అగ్గిపుల్లగీసి మంటవెలిగించేడు. అది కాగితంకంటే వేగంగా మండింది. దాన్ని పునాదిలో ఉంచి, పిడికెడు ఎండుగడ్డి, చిన్నచిన్న ఎండు చితుకులతో మంట పెద్దది చెయ్యడం ప్రారంభించాడు.

చాలా నెమ్మదిగా, జాగ్రత్తగా, రాబోయే ప్రమాదాన్ని బాగా ఎరిగిమరీ మంటని ప్రజ్వలనం చేశాడు. క్రమక్రమంగా, మంట పెద్దదవుతున్న కొద్దీ, అందులో వేసే చితుకులప్రమాణం పెంచుతూ మంట నిలబెట్టేడు. అతను మంచులో చతికిలబడికూర్చుని, పొదల్లో చిక్కుకున్న కట్టెలని లాగుతూ సరాసరి మంటలో వెయ్యనారంభించేడు. అతనికి తెలుసు ఇందులో తను కృతకృత్యుడు అయితీరాలి.

అందులోనూ, సున్నాకి దిగువన డెబ్బై అయిదు డిగ్రీలు ఉష్ణోగ్రత ఉండి, కాళ్ళుతడిసిపోయేయంటే, మొదటిప్రయత్నంలోనే సఫలమయితీరాలి. అతని పాదాలేగనక పొడిగాఉండిఉంటే, మొదటిప్రయత్నంలో విఫలమైనా, త్రోవంట ఒక అరమైలు పరిగెత్తి అతని రక్తప్రసరణని యధాస్థితికి తెచ్చుకోగలడు. కానీ డెబ్బైఅయిదుకి దిగువన ఉష్ణోగ్రత ఉన్నప్పుడు తడిసిపోయి, చలికి గడ్దకట్టుకుపోయిన పాదాలలో రక్తప్రసరణని పరిగెత్తడం వల్ల తిరిగి రాబట్టలేడు… తను ఎంతవేగం పరిగెత్తనీ, తడిపాదాలు ఇంకా గడ్డకట్టుకుపోతాయి.

అదంతా ఆ మనిషికి ఎరుకే. క్రిందటి ఏడు శీతకాలంలో సల్ఫర్ క్రీక్ దగ్గర ఒక పాతకాపు మాటల్లో ఈ విషయాలన్నీ చెప్పేడు, ఇప్పుడు ఆ సలహా ఎంత విలువైనదో అతను గ్రహించగలుగుతున్నాడు. ఇప్పటికే అతని పాదాల్లో స్పర్శజ్ఞానం పూర్తిగా నశించిపోయింది. ఈ నెగడు వెయ్యడానికి చేతికున్నతొడుగుకూడా విప్పేయడంతో చేతివేళ్ళుకూడా తొందరగా తిమ్మిరెక్కిపోయేయి. గంటకి నాలుగుమైళ్ళ వేగం అతను నడిచిన నడక చర్మమూ, శరీరంలోని మిగతా అన్నిమూలలకీ గుండెనుండి రక్తం ప్రసరించేలా చేసింది. ఒకసారి అతను నడక ఆపెయ్యడంతో గుండెవేగంకూడా తగ్గింది.

వాతావరణంలోని శీతలపవనం భూమ్మీద ఏ రక్షణాలేని ఆ కొనని తాకితే, ఆ కొనదగ్గర అతనుండడంతో, అది పూర్తితీవ్రతతో అతన్ని తాకింది. శీతలపవనం ముందు శరీరంలోని రక్తం గడగడలాడింది. కుక్కలాగే, రక్తంకూడా సజీవంగానే ఉంది; దానిలాగే ఏదైనా రక్షణక్రింద దాగుని, ఈ భయంకరమైన చలినుండి కాపాడుకోవాలనుకుంటోంది. అతను నాలుగుమైళ్ళవేగంతో నడుస్తున్నంతసేపూ, ఇష్టంఉన్నా లేకపోయినా చర్మంమీది అన్నిభాగాలకీ రక్తం పరిగెత్తింది. ఇప్పుడు అది వెనక్కితగ్గి శరీరంలోని అంతరాంతరాల్లోకి జారుకుంది. అది లేని లోటును ముందుగా అనుభవిస్తున్నవి శరీరంఅంచుల్లో ఉన్న అవయవాలు.

అతని తడికాళ్ళు త్వరగా గడ్డకట్టుకుపోవడం ప్రారంభించేయి. చేతులు గడ్డకట్టుకోకపోయినా, త్వరగా తిమ్మిరెక్కిపోయాయి. ముక్కూ, బుగ్గలూ అప్పుడే గడ్డకట్టుకుపోవడం ప్రారంభించేయి, అతని చర్మం రక్తప్రసరణ లేకపోవడంతో అప్పుడే చల్లబడిపోయింది.

అయితే, అతనిప్పుడు క్షేమంగానే ఉన్నాడు. కాలివేళ్ళు, ముక్కూ, బుగ్గలు మాత్రమే ప్రస్తుతానికి చలికి గడ్డకట్టుకు పోయాయి, మంట నిలిచి కాలుతోంది. ఇప్పుడతను తన వేలిపొడుగుపుల్లలు వేస్తూ మంట నిలబెడుతున్నాడు. ఇక కాస్సేపటిలో తన చెయ్యిమందం కొమ్మల్ని మంటలో వెయ్యగలుగుతాడు; అప్పుడు తడిసిపోయిన తన కాలితొడుగులు తీసి ఆరబెట్టుకోగలుగుతాడు. ఒకపక్క అవి ఆరుతుంటే, తన వట్టికాళ్ళని మంటదగ్గర వెచ్చచేసుకుంటాడు, కాలిపోకుండా ముందు మంచుతో రుద్దుకునే అనుకొండి. చలిమంట పూర్తిగా సఫలమైనట్టే. ఇపుడతనికి ప్రమాదం తప్పినట్టే.

సల్ఫర్ క్రీక్ దగ్గర ఆ పాతకాపు చెప్పిన మాటలు గుర్తుకొచ్చి అతని ముఖంమీద చిరునవ్వు మొలిచింది. ఆ పాతకాపు వాతావరణం యాభై డిగ్రీలకు తక్కువగా ఉంటే “క్లోండైక్” ప్రాంతంలో ఒంటరిగా సంచరించకూడదని సిద్ధాంతరీకరించేడు. కాని ఇప్పుడు తనక్కడే ఉన్నాడు; ప్రమాదం జరిగింది; తను ఒంటరిగానే ఉన్నాడు కూడా; అయినా తనని తను రక్షించుకోగలిగేడు. ఆ పాతకాపులు ఆడవాళ్లలా పిరికివాళ్ళు; కనీసం అందులో కొందరు, అని మనసులో అనుకున్నాడు. ఇలాంటిసమయాల్లో మనిషిచెయ్యవలసిందల్లా ఆవేశపడిపోకుండా, వివేచనకోల్పోకుండా ఉండడం.

అప్పుడు అతనికి ఏమీ కాదు. మగవాడన్నవాడెవడైనా నిజంగా మగతనంఉంటే ఒంటరిగా ప్రయాణం చెయ్యగలడు. కాని ఎంతవేగంగా అతని ముక్కూ, బుగ్గలూ గడ్డకట్టుకుపోతున్నాయో చూస్తే ఆశ్చర్యంవేస్తోంది అతనికి. అంత తక్కువసమయంలో అతనివేళ్ళు స్పర్శకోల్పోగలవని ఊహించలేదు. నిజంగా వాటిలో ప్రాణంఉన్నట్టు అనిపించడం లేదు. ఎందుకంటే, అతను చేతులతో ఒక పుల్లని పట్టుకుని కదపలేకపోతున్నాడు. అవి తననుండీ, తన శరీరంనుండీ ఎక్కడో దూరంగా ఉన్నట్టు అనిపిస్తోంది. అతను ఒక కట్టెను తాకితే, అతను పట్టుకున్నాడో లేదో అటువైపు తిరిగి చూస్తేతప్ప తెలియడం లేదు. వేళ్లకొసలనుండి తనకి నరాలు తెగిపోయినట్టు, ఏ రకమైన సమాచారమూ అందటం లేదు.

వాటివల్ల ఇప్పుడు వచ్చిన ఇబ్బంది ఏమీ లేదు. ఇప్పుడు నెగడు వెయ్యడం అయింది, అందులో మండుతున్న ఒక్కొక్క కట్టె ఠప్ ఠప్ మని శబ్దం చేసి విరుగుతూ, నృత్యం చేస్తున్నట్టు లేస్తున్న ప్రతి కీలతోనూ జీవితం మీద ఆశని పెంచుతోంది. అతనిప్పుడు కాళ్లకున్న మొకాసిన్లు విప్పడం ప్రారంభించేడు. అవి మంచు పూతపూసినట్టున్నాయి. దళసరిగాఉన్న జర్మనుసాక్స్ ముణుకులకి సగందాకా ఒక ఇనపతొడుగులా కనిపిస్తున్నాయి ఇప్పుడు. మొకాసిన్ లకి ఉన్న తాళ్ళు ఏదో పెద్దమంటలోచిక్కుకుని అష్టవంకరలుపోయిన ఇనపకడ్డీల్లా ఉన్నాయి. క్షణకాలం తన స్పర్శకోల్పోయిన చేతివేళ్లతో విప్పడానికి ప్రయత్నం చేసేడు గాని, అది ఎంత తెలివితక్కువో వెంటనే గ్రహించి, మొలలో ఉన్న ఒరలోంచి కత్తి బయటకు తీసేడు.

అతను తాళ్లని తెంచేలోగా అది జరిగిపోయింది. అది అతని తప్పిదమే… కాదు, కాదు, చేసిన చాలా పెద్ద పొరపాటు. అతను ఒక స్ప్రూస్ చెట్టుక్రింద మంటవెయ్యకుండా ఉండవలసింది. అతను ఆ మంట ఆరుబయటవేసి ఉండాల్సింది. కానీ అతనికి పొదల్లోంచి ఎండుకట్టెలులాగి మంటలోకి నేరుగావెయ్యడం సులువని ఆ పనిచేశాడు. అతను ఏ చెట్టుకిందయితే మంటవేశాడో దానికొమ్మల్లో మంచుపేరుకుపోయి ఉంది.

వారాలతరబడి అక్కడ గాలివీచకపోవడంతో ప్రతికొమ్మమీదా అది భరించగలిగినంత మంచు గడ్దకట్టి ఉంది. అతను మంటలోకి పుల్లవేసిన ప్రతిసారీ, అతని వరకు ఆ విషయం గ్రహించలేకపోయినా, చెట్టులోకొంత కదలిక తీసుకువచ్చాడు… ఆ కదలికే ఈ విపత్తుకి దారితీసింది. ఒక చిటారుకొమ్మ దానిమీదపేరుకున్న మంచుబరువుకి తలవాల్చడంతో ఆ మంచు క్రిందికొమ్మమీదా, అది దానిక్రిందకొమ్మమీదా పడి మొత్తం చెట్టుమీదఉన్నమంచుఅంతా ఒక్కసారి దబ్బున పడిపోయింది. ఆ పడడం పడడం కొండమీంచిదొర్లిపడ్డ హిమపాతమై అతని మీదా, మంటమీదాపడి ఒక్కసారిగా మంట ఆరిపోయింది. ఇంతవరకు మంట ఉన్నచోట ఇప్పుడు చెల్లాచెదరైన మంచు తప్ప మరోటి లేదు.
ఆ మనిషి ఒక్కసారిగా నిర్ఘాంతపోయాడు.

అది అతని మరణశిక్ష ప్రకటించినట్టు అనిపించింది. ఒక్క క్షణకాలం తాపీగా కూర్చుని అంతవరకు మంట ఉన్నప్రదేశాన్ని కళ్ళప్పగించి చూశాడు. బహుశా సల్ఫర్ క్రీక్ లోని పాతకాపు చెప్పిందే నిజమేమో. అతనికి మరొకతోడు ఉండిఉన్నట్టయితే అతనిప్పుడు ప్రమాదంలో చిక్కుకుని ఉండేవాడు కాదు. సరే, ఏం చెయ్యగలం. మళ్ళీ మంటని ప్రజ్వలింపజెయ్యవలసిన బాధ్యత తనదే. ఇక రెండోసారి వైఫల్యానికి ఆస్కారమే లేదు. ఒకవేళ అతను సఫలమైనా అతను కొన్ని కాలివేళ్ళు నష్టపోవడం ఖాయం. ఈ పాటికి అతని కాళ్ళు గడ్దకట్టుకుపోయి ఉంటాయి. ఈ రెండో మంట మళ్ళీ బాగా వెలగడానికి కొంతసమయం తీసుకుంటుంది కూడా.

అతని ఆలోచనల సరళి అలా కొనసాగుతోంది. అలాగని ఆలోచిస్తూ అతను కూర్చోలేదు. అతని మనసులో ఒకప్రక్క ఆలోచనలు కదలాడుతుంటే రెండోప్రక్క అతను పనిచేసుకుంటూపోతున్నాడు. మంటకోసం కొత్తగా వేదిక తయారుచేశాడు. వరదకికొట్టుకొచ్చిన ఎండుగడ్డీ చితుకులూ మళ్ళీ సేకరించాడు. అతను వేళ్లతో ఆ పనిచెయ్యలేకపోయినా చేతులు మొత్తంగా ఉపయోగించి చెయ్యగలిగేడు.

ఈ క్రమంలో అతను అవాంఛనీయమైన తడి పుల్లలూ, పచ్చగాఉన్న నాచుకూడా పోగుచేశాడు. శక్తివంచనలేకుండా అతను చెయ్యగలిగినది అదే. అతను చాలా క్రమపద్ధతిలో మంట బాగావెలిగినతర్వాత ఉపయోగించడానికని పెద్ద ఎండుకొమ్మలు కూడ సమీకరించేడు. ఈ తంతు జరుగుతున్నంతసేపూ కుక్క అలా కూచుని అతని చర్యలని గమనిస్తోంది కళ్లలో ఎంతో ఆశతో. ఎందుకంటే ఇప్పుడు దానికి నెగడు ఏర్పాటు చెయ్యడానికి ఉన్న ఒకే ఒక్క ఆధారం అతనే. నెగడు వెయ్యడం ఆలస్యం అవుతూనే ఉంది.

అన్నీ సమకూర్చుకోవడం పూర్తయినతర్వాత, అతని జేబులో ఉన్న రెండో బర్చ్ బెరడుకోసం చెయ్యి పెట్టేడు. చేతులకి స్పర్శలేకపోవడంవల్ల తెలియకపోయినా, దాన్ని వెతుకుతున్నప్పుడు అది చేసిన చప్పుడువల్ల అక్కడ ఉందని తనకి తెలుస్తోంది. అతను ఎంతప్రయత్నించినా దాన్ని చేతితో పట్టుకోలేకపోతున్నాడు. అలా దానికోసం ప్రయత్నిస్తున్నంత సేపూ అతని తనకాళ్ళు గడ్డకట్టుకుపోతున్నాయన్న విషయం తెలుస్తూనే ఉంది, ఆ ఆలోచన మనసులో మెదులుతూనే ఉంది. ఈ ఆలోచన అతన్ని ఆందోళనకి గురిచేస్తున్నప్పటికీ, దాన్ని ధైర్యంగా నిలదొక్కుకుని ప్రశాంతంగానే ఉన్నాడు.

చేతులకి పళ్లతో పీకి మిటెన్స్ తొడిగి, చేతుల్ని అటూ ఇటూ గట్టిగా జాడించి, శక్తికొద్దీ తుంటికి దబదబా గట్టిగా బాదేడు. ఆ పని అతను కాసేపు కూచునీ, కాసేపు నిలబడీ చేసేడు. ఇంతసేపూ కుక్క మంచులోనే కూర్చుని తన ముందటికాళ్లచుట్టూ తోడేలు తోకలాంటి తనతోకని కప్పి వెచ్చగా ఉంచుకుంది. దాని చెవులు రిక్కించి ముందుకి జాచి అతని చేస్తున్న ప్రతి పనినీ జాగ్రత్తగా గమనిస్తోంది. ఆ మనిషి తన చేతులు జాడిస్తూ, ఒంటికేసి కొట్టుకుంటూ చలిని తట్టుకుందికి దాని శరీరానికి ఉన్న సహజ నిర్మాణానికి కొంచెం అసూయపడ్డాడు కూడా.

అలా కొంతసేపు కొట్టిన తర్వాత ఎక్కడో లోలోపల లీలగా స్పర్శజ్ఞానంజాడ తగిలింది చేతుల్లో. అది క్రమంగా పెద్దదై పెద్దదై భరించలేనినొప్పిగా మారింది. అయినా దానికి అతను సంతోషంగానే ఉన్నాడు…స్పర్శ తెలుస్తున్నందుకు. వెంటనే అతని కుడిచేతినుండి మిటెన్ తీసి బర్చ్ బెరడు బయటకి తీసేడు. నగ్నంగా ఉన్నవేళ్ళు వెంటనే కొంకర్లుపోవడం ప్రారంభించేయి. అతని దగ్గర ఉన్న సల్ఫరు అగ్గిపుల్లలు తీసాడు. అప్పటికే విపరీతమైపోయిన ఆ చలి ఆ వేళ్లలో స్పర్శ లేకుండా చేసింది.

ఆ పుల్లల్లోంచి ఒకటి వేరుచేసే ప్రయత్నంలో మొత్తం అన్నిపుల్లలూ మంచులో పడిపోయేయి. మంచులోంచి బయటకి తీయడానికి ప్రయత్నించేడు గానీ, విఫలమయేడు. స్పర్శలేని చేతులు వాటిని తాకనూ లేకపోయాయి, పట్టుకోనూ లేకపోయాయి. అతను చాలా ఏకాగ్రతతో ఉన్నాడు. కాళ్ళు, ముక్కూ, బుగ్గలూ గడ్డకట్టుకుపోతున్నాయన్న విషయం తనమనసులోంచి తీసేసి, అతని దృష్టి అంతా ఆ అగ్గిపుల్లల్ని బయటకుతియ్యడం మీద లగ్నంచేసి ఉంచాడు. స్పర్శజ్ఞానానికి బదులు చూపుని ఉపయోగించి అతని చేతులు రెండూ అగ్గిపుల్లలకి రెండుప్రక్కలా రాగానే రెండు చేతుల్నీ దగ్గరకు తీసాడు… లేదా, దగ్గరకు తియ్యాలనుకున్నాడు. కానీ, చేతివేళ్లకు సమాచారం అందకపోవడంతో, వేళ్ళు సహకరించలేదు. వెంటనే కుడిచేతికి తొడుగుతొడిగి చాలా గట్టిగా ముణుకులకేసి కొట్టసాగేడు. అప్పుడు తొడుగు ఉన్న చేతులతోనే అగ్గిపుల్లల్ని కొంత మంచుతోసహా తన ఒడిలోకి తీసాడు. దానివల్ల పెద్దతేడా ఏమీ పడలేదు.

కొంత నేర్పుగా ప్రయత్నంచేసిచేసి ఆ అగ్గిపుల్లలకట్టని చేతితొడుగుల మడమలమధ్యకు తీసుకురావడంలో సఫలమయ్యాడు. అలాగే మీదకి ఎత్తి తన నోటిదాకా తీసుకు వచ్చేడు. అతను తల గట్టిగా విదిలించి నోరు తెరవ ప్రయత్నించడంతో, మూతిమీద పేరుకున్న మంచు ముక్కలుగ విరిగి నోరు స్వాధీనంలోకి వచ్చింది. క్రింది దవడని లోపలికి లాగి, పై పెదవి అడ్డుతగలకుండా వొంచి, పంటితో ఆ కట్టనుండి ఎలాగైతేనేం అతిప్రయత్నం మీద ఒక పుల్లను వేరు చెయ్యగలిగాడు, కానీ, అది అతని ఒడిలో పడిపోయింది. దాంతో అతనికి ప్రయోజనం లేకపోయింది. దాన్ని చేత్తో తియ్యలేకపోయాడు. అందుకని ఒక పథకం ఆలోచించాడు. దాన్ని పంటితోతీసి కాలికేసి రుద్దేడు. అలా ఒక ఇరవైసార్లు రుద్దిన తర్వాత చివరకి దాన్ని వెలిగించగలిగేడు. వెలుగుతున్న ఆ పుల్లని అలాగే బర్చ్ బెరడుదగ్గరకి నోటితోనే తీసుకెళ్ళేడు. కాని మండుతున్న గంధకము అతని ఊపిరితిత్తులనిండా నిండిపోయి అతనికి ఆపుకోలేని దగ్గుతెర వచ్చింది. ఆ దగ్గుకి వెలుగుతున్న అగ్గిపుల్ల తుళ్ళిపోయి మంచులోపడి ఆరిపోయింది.

ఒక్క క్షణం నిస్పృహ కలిగింది గాని, దాన్ని అణుచుకుంటూ, సల్ఫర్ క్రీక్ దగ్గరి పాతకాపు చెప్పినదే సరి: మైనస్ యాభై డిగ్రీలు ఉష్ణోగ్రత ఉన్నప్పుడు మనిషి ఒక తోడుతీసుకుని ప్రయాణం చెయ్యాలి అనుకున్నాడు. అతను చేతుల్ని దబదబ బాదేడు కాని వాటిలో ఏ చైతన్యాన్నీ తీసుకురాలేకపోయాడు. అతనొక్కసారి రెండు చేతులకున్న తొడుగుల్నీ విప్పేసేడు పళ్ళతో. మొత్తం అగ్గిపుల్లలకట్టనంతటినీ మోచేతులమధ్య గట్టిగా అదిమిపట్టేడు. అతని భుజాల కండరాలు ఇంకా చలికి గడ్డకట్టుకోకపోవడం అతనికి ఉపయోగించింది.

ఇప్పుడు ఆ కట్టనంతటినీ కాళ్లతో రుద్దడం ప్రారంభించాడు. ఒక్కసారి డెబ్భైఅగ్గిపుల్లలూ మండటంతో భగ్గుమని మంటవచ్చింది. ఆరిపోతుందని భయపడడానికి ఇప్పుడు గాలిలేదు. ఆ మంటవల్ల శ్వాసకు ఇబ్బంది కలగకుండా అతను తలని ఒకపక్కకి వాల్చి, ఆ మండుతున్న పుల్లల్ని బర్చ్ బెరడు దగ్గరకి తీసుకువచ్చేడు. అతనిలా పట్టుకోవడమేమిటి, అతనికి అతని చెయ్యి చర్మం కాలుతోందన్న స్పృహకలిగింది. ఆ వాసన అతనికి తెలుస్తోంది. ఆ స్పృహ మెల్లిగా నొప్పిలోకి, తర్వాత భరించలేని బాధలోకి మారింది. అయినా దాన్ని అతను సహిస్తూ, బర్చ్ బెరడు దగ్గరికి తొట్రుపడుతూ, తొట్రుపడుతూ తీసికెళ్ళేడు. అతని చేతులు అడ్డుగా ఉండి, ఉన్న వేడి అంతా అవే తీసుకోవడంతో అది అంత త్వరగా అంటుకోవడం లేదు.

చివరకి ఇక భరించలేక చేతులు ఒక్క కుదుపుతో వేరుచేసాడు. ఆ మండుతున్న అగ్గిపుల్లలు మంచులోపడి ‘చుంయ్’ మని చప్పుడు చేస్తూ ఆరిపోయేయి. అయితే బర్చ్ బెరడుమాత్రం అంటుకుంది. అతను ఎండుగడ్డీ చిన్నచిన్న ఎండుపుల్లలూ దానిమీద వెయ్యడానికి ప్రయత్నించేడు. కానీ, అతను సరియైనవాటిని ఎంచుకుని మిగతావి పారేసే స్థితిలో లేడు. ఎందుకంటే ఇప్పుడు అతను పనిచెయ్యగలిగింది మోచేతులతోనే. తడిసి కుళ్ళిపోయిన కర్రలూ, పచ్చనినాచూ కూడా అంటుకుపోయిఉన్నాయి పుల్లలకి. వాటిని సాధ్యమైనంతవరకు నోటితోకొరికి పారేస్తున్నాడు. అతని పనితనంలో నేర్పులేకపోయినా, నెమ్మదిగా మంటని రక్షించుకునే ప్రయత్నంలో ఉన్నాడు. అది అతనికి జీవన్మరణ సమస్య.

మంట ఎట్టిపరిస్థితిలోనూ ఆరిపోకూడదు. అతని చర్మంమీద రక్తప్రసరణ లేకపోవడంతో అతనిప్పుడు వణకడం ప్రారంభించేడు, దానితో అతని కదలికలు ఇంకా మొరటుగా కనిపిస్తున్నాయి. ఆ వెయ్యడంలో ఒక పెద్ద పచ్చని నాచుముక్క తిన్నగా ఇంకా సన్నగా ఉన్న మంటమీద పడింది. అతను తన వేళ్లతో దాన్ని తొలగించడానికి ప్రయత్నించేడుగాని, అతనిశరీరం బాగా వణుకుతుండడంతో నిభాయించుకోలేక, మంట ఎక్కువ కదిపేయడం, మొదలునుండీ మంట కెలకబడి, మండుతున్న గడ్డీ, పుల్లలూ వేటికవి వేరయి, చెల్లాచెదరుగా పడిపోవడం జరిగిపోయింది. వాటిని దగ్గరగా పోగుచెయ్యడానికి ప్రయత్నించేడు గాని, ఆ ప్రయత్నంలోని ఒత్తిడితో బాటు, అతనిశరీరం అదిమిపెట్టలేనంతగా వణకడంతో అవన్నీ దారుణంగా చెల్లాచెదరైపోయాయి.

మండుతున్న ప్రతిపుల్లా ప్రాణంపోయినట్టు ఒక్కసారి పొగవదిలి ఆరిపోయాయి. ఆ ప్రకారంగా నెగడు వెయ్యడం విఫలమైంది. అతను నిరాశగా నాలుగుపక్కలా చూస్తుంటే, అతని దృష్టి ముందుసారి తను వేసినమంట ఆరిపోయిన చోట కూర్చున్న కుక్క మీద పడింది. అది మంచులో ఒదిగికూర్చుని, ఒకసారి ఒక కాలూ, రెండోసారి రెండో కాలూ లేపుతూ, మంట ఎప్పుడు తయారవుతుందా అన్న ఆదుర్దాతో తన శరీరభారాన్ని ముందుకాళ్లనుంచి వెనకకాళ్ళకీ, వెనకకాళ్లనుండి ముందుకాళ్లకీ మార్చుకుంటూ, అసహనంగా ఉంది.

“అతను తన తన చేతులమీదా మోకాళ్లమీదా వాలి పాకురుకుంటూ దాని వైపు వెళ్ళేడు.”

కుక్కమీదకి దృష్టి మరలగానే అతనికి ఒక కథ గుర్తుకొచ్చి మనసులో ఒక పిచ్చిఆలోచన వచ్చింది. అందులో ఒకడు మంచుతుఫానులో చిక్కుకుంటాడు. కానీ, ఒక ఎద్దు అందుబాటులో ఉంటే, దాన్ని చంపి, దాని చర్మంలోదూరి తన ప్రాణాలు రక్షించుకుంటాడు. అలాగే, తనుకూడా దీన్ని చంపి, దీని వెచ్చనిశరీరంలో తన చేతులు తిమ్మిరివదిలేదాకా దాచుకుంటే, అప్పుడు ఇంకో మంటవేసుకోవచ్చు అనుకున్నాడు. అందుకని కుక్కని తనదగ్గరకు రమ్మని పిలుస్తూ, సంభాషణ మొదలుపెట్టాడు. కాని ఇంతకుమునుపెన్నడూ అతను దాన్ని అలా పిలవకపోవడంచేతా, అతని గొంతులో ఏదో వింతభయం తొంగిచూస్తూఉండడంచేతా అది జడుసుకుంది. ఏదో విషయం ఉంది…

దాని అనుమాన ప్రవృత్తి ఇదమిత్ధం అని పోల్చుకోలేకపోయినా, ఎక్కడో, ఏదో ప్రమాదంఉందని మాత్రం దాని మెదడులో అనుమానం రేకెత్తించింది. ఆ మనిషి మాట చప్పుడుకి దాని చెవులు కిందకి వాల్చి, ముందుకాళ్ళూ వెనకకాళ్ళూ బారజాపుకుని, ముందుకాళ్ళు చాలా అశాంతితో ఇటూ అటూ కదుపుతూ ఉంది కాని, అది మాత్రం అతని దగ్గరకి పోలేదు. దాంతో, ఆ మనిషి చేతులమీద కాళ్ళమీదా వాలి కుక్కవైపు పాకరడం ప్రారంభించేడు. అతని ఈ అసాధారణమైన శరీరభంగిమ దాని అనుమానాన్ని మరింత రగిల్చి అది అతనినుండి సంకోచిస్తూనే దూరంగా పక్కకి తప్పుకుంది.

ఆ మనిషి మంచులో లేచికూచుని, ప్రశాంతంగా ఉండడానికి ప్రయత్నించేడు. అతను చేతులకి మళ్ళీ తొడుగులు పళ్ళ సాయంతో వేసుకుని, లేచినిలబడ్డాడు. పాదాల్లో స్పర్శలేక, భూమికీ తనకీ అనుబంధంఉన్నట్టు అనిపించకపోవడంతో ఒకసారి నిజంగా నిలుచున్నాడో లేదో నిర్థారణ చేసుకుందికి క్రిందికి చూసుకున్నాడు. అతను కాళ్ళమీద నిలబడడంతో కుక్క మనసులో అనుమానాలు తొలగిపోయాయి. అతనెప్పుడైతే కొరడాతో కొట్టినట్టు గట్టిగా అరిచాడో, అది పూర్వపు విధేయతతో తోకాడించుకుంటూ అతనిదగ్గరికి వచ్చింది.

అది అతనికి అందుబాటులో ఉన్నంతదూరంలోకి రాగానే మనిషికి పట్టుదప్పింది. కుక్కని పట్టుకుందామని అతను ఒక్కసారి చేతులు గాల్లోకి విదిలించి ప్రయత్నించేడు గాని, అతని చేతులు వంగనూ వంగక, దాన్ని పట్టుకోనూ పట్టుకోలేకపోవడం అతనికి ఆశ్చర్యం కలిగించింది. చేతుల్లో ఏ కోశాన్నా స్పర్శతెలియడంలేదు. అవి ఎప్పుడో స్పర్శజ్ఞానంకోల్పోయేయనీ, అవి త్వరత్వరగా గడ్డకట్టుకుపోతున్నాయనీ అతను మరిచిపోయాడు. ఆ జంతువు తప్పించుకునేలోగా అతను దాన్ని తన మోచేతులలో చుట్టేసేడు. అతను మంచులో కూచుండిపోయి ఆ కుక్కని అలాగే పట్టుకున్నాడు. అది మూలుగుతూ, గుర్రు గుర్రు మంటూ, తప్పించుకుందికి విశ్వప్రయత్నం చేస్తోంది.

అదొక్కటే ఇప్పుడతను చెయ్యగలిగింది… దాన్ని కౌగలించుకుని కూచోడం. అతనికి దాన్ని తను చంపలేడని విశదమైపోయింది. ఆ పని ఏ రకంగానూ చెయ్యలేడు. సత్తువలేని చేతులతో మొలలోంచి కత్తి తియ్యనూ లేడు, పట్టుకోనూ లేడు, కనీసం దాని పీకని నులమనైనా నులమలేడు. దాన్ని అతను వదిలేసేడు. దాని తోకని కాళ్లమధ్య దాచుకుని ఒక్క గెంతు గెంతింది ఇంకా గుర్రు మంటూనే. నలభై అడుగుల దూరంలో ఆగి, చెవులు రిక్కించి అతనివంక తిరిగి, కుతూహలంగా పరీక్షించసాగింది.

అతని చేతులెక్కడున్నాయో తెలుసుకుందికి అతను క్రిందకి చూసేడు; అవి అతని మోచేతుల చివరలకి వేలాడుతున్నాయి. చేతులెక్కడున్నాయో తెలుసుకుందికి కళ్ళతో చూడవలసివచ్చిందని తలుచుకుని అతనికి చిత్రంగా అనిపించింది. అతను అతని మోచేతుల్ని ముందుకీ వెనక్కీ గట్టిగా విదిలించసాగేడు… తొడుగులున్న చేతుల్ని పక్కలకేసి కొట్టసాగేడు. అలా ఒక ఐదు నిమిషాలు గబగబా చేసిన తర్వాత అతని గుండెనుండి పై చర్మానికి తగినంత రక్తప్రసరణ జరగడంతో, అతనికి వణుకు తగ్గింది. కానీ చేతుల్లోమాత్రం ఏ స్పర్శా లీలగాకూడా కలగలేదు. అతనికి అతని చేతులు మోచేతుల చివరలకి తూకపురాళ్ళలా వేలాడుతున్నాయన్న భావన కలిగింది, కానీ వాటిని వెతికితే కనిపించలేదు.

ఇక మృత్యువు తప్పదన్న సన్నని భయం, నిర్వీర్యంచేసే భయం అతనికి కలిగింది. అది క్రమక్రమంగా ఆలోచిస్తున్నకొద్దీ అతని చేతులూ, కాలివేళ్ళూ గడ్డకట్టుకుపోవడమో; లేదా చేతులూ, కాళ్ళూ కోల్పోవడం కాదనీ, అది కేవలం జీవన్మరణసమస్య అనీ, అందులో తనకి జీవించడానికి అవకాశాలు ఎక్కువగా ప్రతికూలంగా ఉన్నాయనీ స్పష్టమైపోయింది. దాంతో అతను ఆందోళనకు గురై, వెనక్కి తిరిగి, క్రీక్ ఉపరితలంమీద కనీకనిపించని అతని అడుగుల జాడవెంట పరిగెత్తడం ప్రారంభించేడు. కుక్క అతన్నిఅనుసరిస్తూ వెనకే పరిగెత్తడం ప్రారంభించింది.

ఇంతకు మునుపు ఎన్నడూ ఎరగని భయంతో, ఒక లక్ష్యం, గమ్యం అంటూ లేకుండా గుడ్డిగా పరిగెత్త సాగేడతను. నెమ్మదిగా మంచుని తవ్వుకుంటూ, తొట్రుపాటు పడుతూ పరిగెత్తగాపరిగెత్తగా ఇపుడతనికి కొన్ని స్పష్టంగా కనిపించసాగేయి, ఆ సెలయేటి గట్లూ, పెద్దదుంగలు మార్గాన్ని మూసేసినచోట్లూ, ఆకుల్లేని ఏస్పెన్(Aspen) చెట్టూ, ఆకాశం… అన్నీ.

పరిగెత్తడంవల్ల అతనికిప్పుడు కొంచెం సుఖంగా ఉన్నట్టు అనిపిస్తోంది. అతనిప్పుడు వణకడం లేదు. బహుశా అలా పరిగెత్తుతూ ఉంటే అతని కాళ్ళుకూడా వేడేక్కుతాయేమో; లేకపోయినా అతను అలా పరిగెడుతూఉంటే అతను తన శిబిరమూ చేరుకోవచ్చు, పిల్లల్నీ కలుసుకోవచ్చు. అతను కొన్నిచేతివేళ్ళూ, కాలివేళ్ళూ కోల్పోడం ఖాయం; అయితేనేం, అతనక్కడికి వెళ్ళగలిగితే కుర్రాళ్ళు తనని సంరక్షిస్తారు, శరీరంలో మిగతా భాగమైనా మిగులుతుంది.

దానితోపాటే అతనికి ఇంకోఆలోచనకూడా వచ్చింది: తను తన శిబిరంకి చేరడం గాని, పిల్లల్ని కలవడం గాని అసాధ్యం అని; తన శిబిరం ఇంకా చాలామైళ్ళదూరం ఉందనీ, అప్పుడే తను గడ్డకట్టుకుపోవడం ప్రారంభించడంతో, త్వరలోనే అతను బిరుసెక్కి చనిపోవడంఖాయం అని. ఈ ఆలోచననిమాత్రం పరిగణించక ఆలోచనలవెనక్కి నెట్టేసేడు.

ఒక్కోసారి అది ముందుకువచ్చి తనమాట వినమనిచెప్పినా దానినోరునొక్కి మిగతావిషయాలగురించి ఆలోచించడం ప్రారంభించేడు.

అతని కాళ్ళు అంతలా గడ్డకట్టుకుపోయి, అవి ఎప్పుడు నేలమీద ఆనుతున్నాయో, తనబరువు ఎలా మోస్తున్నాయో కూడా తనకి తెలియకపోయినాప్పటికీ, తనుపరిగెత్తగలగడం అతనికి కొంచెం చోద్యంగా అనిపించింది. అతనికేమో గాలిలో ఈదుతున్నట్టు, భూమితో ఏమీ సంబంధంలేనట్టూ అనిపించింది. అతనికెక్కడో దేవదూత మెర్క్యురీ(Mercury)ని రెక్కలతో ఎగురుతూ చూసినట్టనిపించి, అతనుకూడా భూమిమీద తనలాగే ఈదుతున్నట్టు భావిస్తాడా అన్న సందేహం కూడా వచ్చింది.

“చాలా సార్లు అడుగులు తడబడి, చివరకి తూలిపోయి, ఒళ్ళంతా కూడదీసుకుని, క్రింద పడిపోయాడు…”

అతను తన శిబిరంనీ, పిల్లల్నీ కలిసేదాకా పరిగెత్తడం అన్న వాదంలో ఒక లోపంఉంది: అతనికి దాన్నితట్టుకోగల శక్తిలేదు. చాలాసార్లు అడుగులుతడబడి, చివరకి తూలిపోయి, ఒళ్ళంతా దగ్గరకు లాక్కున్నట్టు పడిపోయాడు. అతను లేవడానికి ప్రయత్నించేడుగాని విఫలమయ్యాడు.

తనింక కూర్చుని విశ్రాంతితీసుకోవాలనీ, మళ్ళీసారి తను పరిగెత్తడం కాక నడకే కొనసాగించాలనీ నిర్ణయించుకున్నాడు. లేచికూచుని, కాస్త ఊపిరి సంబాళించుకున్నాక, అతని వొళ్ళు వెచ్చగా ఉన్నట్టూ, తనకిప్పుడు బాగానే ఉన్నట్టూ అనిపించింది. అతను వణకడం లేదు, అతని గుండెలోకీ, శరీరంలోకీ, కొంత వేడిమి వచ్చినట్టుకూడా అనిపించింది. అయితే అతను తన ముక్కూ, బుగ్గలూ ముట్టుకుంటే ఏ స్పర్శజ్ఞానమూ కలగటం లేదు.

పరిగెత్తడం వల్ల వాటి పరిస్థితిలో మార్పు రాదు. చేతులకీ, కాళ్ళ సంగతి కూడా అంతే. అప్పుడతనికి గడ్డకట్టుకుపోవడం శరీరం అంతటా వ్యాపిస్తోందన్న భావన కలిగింది. దీన్ని మరిచిపోడానికీ, నిర్లక్ష్యంచేసి మిగతావిషయాలు ఆలోచించడానికీ ప్రయత్నించేడు. దానివల్ల వచ్చే ఆందోళన ఎలాంటిదో అతనికి తెలుసు; అందుకని ఎక్కడ ఆందోళన కలుగుతుందో అని భయపడ్డాడు.

కానీ ఆ ఆలోచన పదేపదే రాసాగింది… విడవకుండా; అతని శరీరంఅంతా గడ్డకట్టుకుపోయినట్టు ఒక భ్రమ కల్పించసాగింది. అది అతనికి భరించశక్యం కాలేదు. అందుకని మరోసారి పిచ్చిగా పరిగెత్తసాగేడు. ఒకసారి అతను వేగంతగ్గించి నడుద్దామనుకున్నాడు గాని, తను గడ్డకట్టుకుపోతానేమో నన్న భయం అతను మళ్ళీ పరిగెత్తేలా చేసింది.
ఇంతసేపూ, కుక్క అతని వెనక, అతని అడుగుల వెంటే పరిగెత్తింది. అతను రెండోసారి పడిపోయినప్పుడు, దాని ముందుకాళ్ళచుట్టూ తనతోకనిచుట్టి, అతని ముందు, అతనిముఖానికి ఎదురుగా, ఏమయిందా అన్న కుతూహలంతో కూర్చుంది. ఆజంతువు క్షేమంగా, వెచ్చగాఉండడం అతనికి కోపంతెప్పించి, అతణ్ణి శాంతపరచడానికా అన్నట్టు అది దాని చెవులని వాల్చేదాకా దాన్ని తిడుతూనే ఉన్నాడు.

ఈమాటు వణుకుడు ఒక్కసారి అతని శరీరం అంతా కమ్మేసింది. అతను కొరికే మంచుతో తన పోరాటంలో ఓడిపోతున్నాడు. అతని శరీరంలోకి అన్ని వైపులనుండీ అది ప్రవేశిస్తోంది. ఆ ఆలోచన అతన్ని ముందుకి తోసింది గాని, అతను వంద అడుగులకు మించి పరిగెత్తలేక, కాళ్ళు తడబడి, తలక్రిందులుగా పడిపోయాడు. అదే అతను చివరగా భయపడింది. అతను ఊపిరి తీసుకుని నిలదొక్కుకున్నాక అతను మృత్యువును గౌరవప్రదంగా ఎదుర్కోవడం ఎలాగా అని ఆలోచించేడు. అతనికి ఇప్పుడతను చేసినపని అంతగౌరవప్రదంగా కనిపించలేదు.

అతను మెడ కోసిన కోడిలా అన్నిదిక్కులా పరిగెత్తుతున్నట్టు అనిపించింది. సరిగ్గా ఆ పోలిక అతనికి తట్టింది. ఇక అతను ఎలాగూ గడ్డకట్టుకుపోక తప్పదు. అలాంటప్పుడు మృత్యువును మర్యాదగా స్వీకరించడం మంచిది అనుకున్నాడు. ఎప్పుడైతే ఈ ఆలోచన కలిగిందో అతనికి మొదటితెర మత్తు ఆవహించింది. నిద్రలోనే చనిపోవడం మంచిదే అనుకున్నాడు. అది ఒక మత్తుమందు తీసుకున్నట్టు ఉంటుంది. గడ్డకట్టుకుపోవడం మనుషులనుకున్నంత ఘోరమేం కాదు. ఇంతకంటే ఘోరంగా ఎన్నో రకాలుగా చావొచ్చు అనుకున్నాడు.

అతను కుర్రాళ్ళు తన శరీరం కనుక్కోవడం ఊహిస్తున్నాడు. తనని వెతుక్కుంటూ దారివెంట వెళ్ళిన తను, హఠాత్తుగా వాళ్ళని కలిసాడు. వాళ్లతో ఉంటూనే, త్రోవవెంట ఒక మలుపు తిరిగేక తనని తను మంచులో పడి ఉండగా చూశాడు. అతనిప్పుడు తనకి చెందడు, అలా అనుకున్నా, ఇప్పుడతను, అతనిలోంచి బయటకు వచ్చేసేడు, పిల్లలపక్కన నిలబడి మంచులో తనని చూస్తున్నాడు. అబ్బో చాలా చల్లగా ఉందనుకున్నాడొక్కసారి.

తను అమెరికా తిరిగి వెళ్ళిన తర్వాత వాళ్ళకి అసలు చలి ఎలా ఉంటుందో వాళ్ళకి చెప్తాడు. తర్వాత అతని ఆలోచనలు సల్ఫర్ క్రీక్ లోని పాతకాపు వైపు మళ్ళేయి.

తనిప్పుడు ఆ పాతకాపుని స్పష్టంగా చూడగలుగుతున్నాడు… పైపులో పొగాకు పీలుస్తూ, హాయిగా, వెచ్చగా ఉన్నాడతను.

“నువ్వు చెప్పిందే నిజం. ఎంతైనా యుద్ధంలో రాటుదేరిన గుర్రానివి. నువ్వు చెప్పిందే నిజం,” అని ఆ పాతకాపుతో ఏదో గొణుగుతున్నాడు.

తర్వాత ఆ మనిషి ఎన్నడూ ఎరగని సంతృప్తినిచ్చే, సుఖనిద్రలోకి జారుకున్నాడు. ఆ కుక్క అతని ఎదురుగానే నిరీక్షిస్తూ కూచుంది. సాగి సాగి కొనసాగిన సంధ్య, చీకట్లకు త్రోవ ఇవ్వడంతో రోజు పరిసమాప్తమైంది. ఆ మనిషి ఎక్కడా చలిమంటవేయడానికి ప్రయత్నిస్తున్న జాడ కనిపించలేదు దానికి. దాని అనుభవంలో మంచులో అలా మంటవెయ్యకుండా కూచున్న మనిషిని ఎరగదు అది.

చీకట్లు ముసురుతున్నకొద్దీ దానికి చలిమంటమీద కోరిక ఎక్కువై ముందుకాళ్లు ఎత్తుతూ దించుతూ నెమ్మదిగా మూలగడం ప్రారంభించింది; మళ్ళీ అతను తిడతాడేమోనని చెవులు క్రిందకి వాల్చింది. కాని మనిషి ఏం మాట్లాడలేదు. తర్వాత గట్టిగా అరిచింది. మరికొంచెంసేపు గడిచిన తర్వాత మనిషికి దగ్గరగా వెళ్ళి చావువాసన పసిగట్టింది. ఒక్కసారి దానికి గగుర్పాటుకలిగి వెంటనే వెనక్కి తగ్గింది.

నక్షత్రాలు స్పష్టంగా పైకిలేచి, మిణుకుమిణుకుమంటున్న ఆకాశంలోకి చూసి అరుస్తూ, కాసేపు అక్కడే తచ్చాడి, తర్వాత వచ్చినత్రోవలోనే వెనుతిరిగి, తనకి పూర్వపరిచయంవల్ల ఎక్కడ తిండీ, చలిమంటా దొరుకుతాయో అటువైపు పరిగెత్తుకుంటూ పోసాగింది.

***

To read the original story in English please visit this link:

http://www.jacklondons.net/buildafire.htm

Front page image by Edwin Tappan Adney [Public domain or Public domain], via Wikimedia Commons. Photograph, A. C. Company’s dog team, Dawson, YT, 1899, Edwin Tappan Adney, Silver salts on glass – Gelatin dry plate process – 10 x 12 cm