నిజ జీవిత చెరసాలల్లో…

art: satya sufi

art: satya sufi

నీడలతో క్రీడిస్తూ
నిజంతో సహజీవిస్తున్నాననుకొని
భ్రమల సాలెగూటిలో
బంధాల ఆశలల్లుతూ ఎడతెగక.
తలుపుకవతల ఏవో పిలుపులు..
నన్నేనని నమ్మి
ఆత్రంగా పరిగెడతా గదికడ్డంగా.
వీధి గుమ్మం ముందర తచ్చాడుతున్న
నిరూపమైన దేహపు అలికిడి,
స్పృశించే విఫలయత్నంలో తడబడి,
శూన్యపు సౌధాలలో
నీ పిలుపుల ప్రకంపనలలు
అలసిన నా శరీర కంపనలతో కలిసి,
అభావపు చిరునవ్వై..
పొడి పెదవులపై నిర్జీవంగా.
దేహపు సడి వెచ్చగా చేతికంటదు.
మాటల తడి చెమ్మగా గుండెకు చిక్కదు
ఆలోచనా స్వేఛ్ఛాలోకపు ఆకారాలతో
నిజ జీవిత చెరసాలల్లో సంభాషిస్తూ,
వసారాలో,కిటికీ మూలల్లో
పడక గదిలో, నీళ్ళగదిలో..
వెతుకులాటలు.
చిరుచినుకుల సవ్వళ్ళకు
విప్పారి విరబూసే మరిన్ని మనసుల ఉనికికై
రెపరెపల బ్రతుకులాటలు.
ఇల్లంతా ఒంటరితనపు వాసన
దండాలపై వేలాడుతున్న ఏకాకితనపు వస్తాలు
ఎండిన పూలన్నీ ఒక్కొక్కటిగా రాలిపోతూ
వేదాంతం విరజిమ్ముతుంటే
చివుక్కుమన్న మనసుతో
చిన్నబుచ్చుకున్న మోము.
పూబాలల సౌరభాల్ని ఒడిసిపట్టి
గుదిగుచ్చిన దారపుపోగు.
నల్లని కనుపాపల్లో విఛ్ఛిల్లిన ఆపేక్షకెరటం.
చెమ్మగిలిన కనుల గడపదాటి
చెప్పరాని గుబుళ్ళ దోవన
అడియాసలైన నిన్నటి ఆశల పరావర్తనం.
దారిపోడవునా తోడొస్తున్న
తెలియని సాన్నిహిత్యపు స్పర్శ.
నామకరణం చెయ్యను
ఎవరివి నీవనీ అడగను.
ఎందాకా వచ్చినా నవ్వుతూ నేస్తం కడతాను.
గమనమే గమ్యం.
ఆసాంతం కలిసొస్తావనే చిగురాశే..
సుదూరపయనానికి మనసైన ఇంధనం.
*

మనసులో వాన

 

Art: Mandira Bhaduri

Art: Mandira Bhaduri

అరుణ గోగులమండ
~
చూరును వీడి జారబోయే చినుకు క్షణకాలపు ఊగిసలాటలో
నూనెరంగుల చిత్రపు వెలిసిపోయిన వెర్షన్లా..
నువు ఓగుబులు తెరై కదలాడతావు.
గది గోడకున్న నిలువుటద్దంపై ఉషోదయపు ఏటవాలు కిరణంలో
తెలిమంచు వేళ్ళతో లిపికందని ఊసుల్ని రాసి మాయమౌతావు
“యువర్ థాట్స్ సర్ఫేస్ సో ఆఫెన్ డియర్ నోబడీ”.
ఉన్నదేదో ఇదిమిద్దంగా తెలియని గమ్మత్తైన స్థితి.
లేనిదెపుడూ.. నిజంగా లేనిదెపుడు?
తలపుల గోతాముపరుగులో ఆ నాలుగుగదులెంత అలిసాయో తెలిసేదెవరికి?
రమ్మనీ అనకుండా వద్దనీ చెప్పకుండా
వాటంత అవే పాదాలను చుట్టుకున్న పాశపు పోగులు
కొన్ని ముడులలో చిక్కుబడి, పీఠముళ్ళై బంధించబడి
బంధాలుగా కట్టబడి
వలయాలు వలయాలుగా బ్రతుకంతా ఆక్రమిస్తూ.
ఏం చెప్పమంటావోయ్.. కలలలో నిరంతరం నాతో నడిచే చెలికాడా..!
మర్రి చెట్టు ఊడల్లా దిగబడి మనసులోతుల దాగున్న చిత్రం నీవు.
నిద్దురలో నడిచే ప్రాణమున్న మతిలేని జీవి నేను.
బాధ్యత మరవను.
కాలాన్ని వెనుదిప్పనూలేను.
చిటికెలేసి నీ ఉనికి చాటుతూ నాకోసం వెతికిన రోజుల దిగులుమేఘం ..
నడిరేయంతా మాగన్ను నిదురల కళ్ళలో కదులుతూ.
చిమ్మ చీకటిలో వరస గదులకావల పిట్టగోడపై నీ ఒంటరి మనసు
వేళ్ళాడిన మౌనసందేశపు గేయాల సుడులు తలపై రివు రివ్వున తిరుగుతూ.
వేర్ ఆర్ యు మై బోయ్? మస్ట్ బీ సంబడీ ఎల్సెస్ మేన్ నౌ..!
ఆనాడు వికసించిన వాత్సల్యం శిలాజమై మిగిలినా సౌరభం మదిని వీడదు.
ఏ లోకాల సరిహద్దుల నీ అడుగులు సాగుతూపోయినా
ఈ అంచుల ఒంటరై నిలుచున్ననా దేహాన్ని పొగమంచులా తాకకమానవు.
లైఫ్ స్టిల్ రిమైన్స్ మై డార్లింగ్..
థో,నథింగ్ లాస్ట్స్ ఫరెవర్..
మెమరీస్ లాస్ట్.
టిల్…లాస్ట్.
*

ఒక బందీ కథ!

 

-అరుణ గోగులమండ

~

 

ఆమె..
అద్దాలమేడలాంటి అందమైన లోగిలిలో
నగిషీ పట్టిన బొమ్మల్లో ఓ అందమైన బొమ్మగా
ఆమె కదులుతుంటుంది.
యెత్తైన గోడల ఆవల-
కట్టుదిట్టమైన భధ్రత మధ్యన
ఖరీదైన ఖైదీలా
ధిలాసాగా బ్రతుకుతుంటుంది.
తులసికోట పూజలూ లెక్కలేనన్ని వ్రతాలూ
దీపారాధనలూ, మడీ తడీ ఆచారాల్లో
తన ఉనికిపట్టు మర్చిపోయి,
మసిబారిన దీపపు సెమ్మెలా,
అఖండజ్యోతిలోని ఆరిపోని వత్తిలా
నిరంతరంగా కాలుతూ
రెపరెపలాడుతూ బ్రతుకీడ్చుతుంటుంది.
సాంప్రదాయపు పంజరంలో
పంచదార చిలకలా-
ప్లాస్టిక్ నవ్వుల్నియెండినపెదవులపైపూసి
నిప్పులుకడిగే వంశాల అసలు కధల్ని మరుగుచేసే
నివురుగా మిగులుతుంది.

 

ఊరిచివర విసిరేసిన
చీకటిగుడిసెల సముదాయంలో
మట్టిలో మకిలిలో
పేడకళ్ళెత్తుతూ కట్టెలు చీలుస్తూ
తాగుబోతు మొగుడి దాష్టీకానికి బలైన
ఆమె వెన్నుపూస.వాతలుతేలిన ఒళ్ళు
చేవలేని యెముకలపై వేలాడుతున్న చర్మం.
అంటరాని వాడలో..అగ్రకులపు అహంకారంతోయేకమై
తమ పురుషాహంకారం సైతం..
వెలివేసిన ఆడతనం ఆమెరూపం.
చీత్కారాలు మింగుతూ
బలత్కారాల శిలువల్ని
ఇంటాబయటా నిర్వేదంగామోస్తూ,
నాట్లలో కోతల్లో
తమ బ్రతుకుల్నే పాతేసుకుని
మొలకెత్తడం మరచిన నిర్జీవపు విత్తనంలాంటి ఆమె
తరతరాల బహురూపపీడనా పర్వాల
మూర్తీభవించిన నగ్నత్వం.

తానుండే ఇంటిలాగా
తమ ఉనికినిసైతం ఎత్తు గోడల ఆవల మూస్తూ
మూడుసార్లు బొంకితే ఓడిపోయే కాపురాల్ని,
తుమ్మకుండానే ఊడిపోయే భరోసాలేని జీవనాల్ని
బురఖాల మాటున దాచి..
లిప్ స్టిక్ రంగుల చాటున పెదవుల నిర్వేదాన్నీ
నల్లని సుర్మాలకింద ఉబికొచ్చే కన్నీటినీ
అదిమిపట్టి బ్రతుకుతూ..
మతమౌఢ్యపు తంత్రాలకు బలైన
పాతకాలపు యంత్రం ఆమె.

అందమైన శరీరాలనే అద్దింటి బ్రతుకుల్ని..
యేడాదికోసారి కనిపించిన భర్తల యాంత్రిక కాపురాల
గురుతుల పెంపకంలో ఖర్చుచేస్తూ
రోజుకైదుసార్లు పిలిచినా
బదులివ్వని దేవుడికి నిష్టగా మొరపెడుతూ..
నల్లటిపరదాల మాటున
మతం మత్తు ఇరికించిన
ఊపిరాడని దేహంతో
చాందసవాదపు చీకటికి అనాదిగా బందీ ఆమె.

తమదనే బ్రతుకేలేని అతివల బ్రతుకు చిత్రపు నలిగిన నకలూ
గెలుపెరుగని తరతరాల శ్రమజీవీ
నిలువెత్తు పురుషాహంకారం నిర్మించిన
నిచ్చెనమెట్ల సమాజంలో కొట్టేయబడ్డ మొదటి మెట్టూ
హక్కుల లెక్కల్లో అట్టడుగుకు నెట్టేయబడి,
కుటుంబవ్యవస్థ సిద్ధంచేసిన
కుట్రపూరిత బంధనాల తరతరాల బలిపశువూ..
నిత్య పరాన్నజీవిపాత్రకే కుయుక్తితో నిర్దేశింపబడ్డ
అసమాన ప్రతిభాశాలి

మె.

*