చారిత్రక కాల్పనిక నవల “శ్రీకృష్ణ దేవరాయలు”

 

 

కొల్లూరి సోమశంకర్

కొల్లూరి సోమశంకర్

ఒకనాటి పాలకుల, చరిత్రలో పేరుగాంచిన వ్యక్తుల జీవితాలకు కాల్పనికత జోడించి సృజనాత్మక రచనగా వెలువరించడం చాలా కష్టమైన పని. ఆ యా పాత్రలపై అతి ప్రేమ లేదా అతి ద్వేషం చూపితే వాస్తవాలు మరుగునపడే ప్రమాదం ఉంటుంది. కొన్ని వందల ఏళ్ళ క్రితంనాటి పాలకులపై రచన చేస్తున్నప్పుడు – అప్పటి ఆ యా పాలకుల పరిపాలనని లేదా పరాక్రమాన్ని తెగ పొగడడం లేదా ఆ రాజ్యంలో పాలితు లెదుర్కున్న కడగండ్లు, కష్టాలను మాత్రమే ప్రస్తావించడం – సమంజసం కాదు. అప్పటి పరిస్థితులు వేరు, వర్తమాన స్థితిగతులు వేరని గుర్తుంచుకుని; రచనలో ఏ మాత్రం అతిశయోక్తులు, లేదా వ్యక్తిత్వ హననాలు జొప్పించకుండా జాగ్రత్త వహించాలి. లేకపోతే సమాజంలో అనవసరమైన కలతలు రేగుతాయనే అంశాన్ని రచయితలు మనసులో ఉంచుకోవాలి.

ఈ విధంగా, చరిత్రలో సుప్రసిద్ధుడైన ఓ మహారాజుని, అతని పాలనని వివరిస్తూ, అతని వ్యక్తిత్వాన్ని కొత్తగా ఆవిష్కరించే ప్రయత్నం చేసారు కస్తూరి మురళీకృష్ణ. ఆ మహారాజు వేరెవరో కాదు, భారతీయులకు, ముఖ్యంగా దక్షిణాది వారికి సుపరిచితుడైన శ్రీకృష్ణ దేవరాయలు.

నవల ప్రారంభంలో – నిరంతరం శత్రుదాడులతో భారతదేశం బలహీనపడడం గురించి ప్రస్తావిస్తారు రచయిత. భారతీయ సమాజం దిశారహితమై దిక్కుతోచకుండా బిక్కుబిక్కుమంటున్న కాలమని పేర్కొంటు శ్రీకృష్ణ దేవరాయలు పాలనా పగ్గాలు చేపట్టే ముందరి పరిస్థితులని కళ్ళకు కట్టినట్టు వివరించారు. అటువంటి సంక్లిష్ట పరిస్థితులలో మహామంత్రి తిమ్మరుసు, ఇతర ముఖ్యులు కలసి రాజ్యాధికారాన్ని శ్రీకృష్ణ దేవరాయలకు అప్పగిస్తారు. రాజ్యం పరిస్థితి ఏమీ బాగాలేదని విన్నవిస్తాడు తిమ్మరుసు.

పరిస్థితులు ప్రతికూలంగా ఉన్నప్పుడే ఆత్మవిశ్వాసం అత్యంత ఆవశ్యకం.. ఏం చేస్తే పరిస్థితులు బాగవుతాయో సూచనలు కావాలి నాకు. సమస్యలను ఎత్తి చూపించి సమయం వ్యర్థం చేయాల్సిన అవసరం లేదు. సమస్య స్వరూపాన్ని వివరించి, పరిష్కారాలు సూచించండి.” అంటాడు కృష్ణదేవరాయలు.

రాయలు సింహాసనమెక్కి వారమైనా కాకముందే తురుష్కులు విజయనగర సరిహద్దులను దాటి చొచ్చుకువస్తున్నారని తెలుస్తుంది. రాయలకింకా రాజ్యవ్యవహారాలపై అవగాహన పూర్తిగా రాలేదనీ; అప్పుడే యుద్ధానికి వెళ్ళడం అంత క్షేమకరం కాదని తిమ్మరుసు భావించాడు.

అయితే ఓటమి అనే పదాన్ని సైతం ఇష్టపడని కృష్ణదేవరాయలు తన సైన్యాన్ని ఉత్తేజితులను చేసి యుద్ధరంగం వైపు నడుపుతాడు, ఓడిస్తాడు. అదే ఊపులో మరికొన్ని రాజ్యాలను గెలవాలని ఆలోచిస్తాడు. కాని తిమ్మరుసు వద్దంటాడు. రాయలు మౌనంగా వచ్చి గుడారం బయట నిలుచుంటాడు. ఎదురుగా పరవళ్ళు తొక్కుతూ ఉధృతంగా ప్రవహిస్తోంది కృష్ణానది. రాయల దృష్టి, నది నడుమన నిలిచిన బండరాయిపై పడింది. అతి వేగంగా ప్రవహిస్తున్న నీరు బండరాయిని బలంగా తాకుతోంది. దాన్ని కూడా తనతో పాటు ప్రవహింపజేయాలన్న దూకుడు చూపిస్తోంది. కాని రాయి నిశ్చలంగా ఉంది. దాంతో ఓ వైపు రాయిని కోసే ప్రయత్నం చేస్తూనే పక్కకి తిరిగి, రాయి పక్క నుంచి ప్రవహిస్తోంది. అది చూసిన రాయల ముఖంపై చిరునవ్వు వెలసింది. ఆ క్షణంలో ప్రకృతి అతనికి ఓ చక్కని పాఠం నేర్పింది.

ఓ సందర్భంలో, పాలకులకు ఉండాల్సిన లక్షణం గురించి రాయలు ఇలా అంటారు:

ముందుగా మనం మన ప్రజలకు కలలు కనడం నేర్పాలి. జీవితాన్ని అనుభవించడం నేర్పాలి. రకరకాల భయాలతో, బాధలతో, మనవారు జీవించడం మరచిపోయారు, బ్రతుకులోని ఆనందాలను అనుభవించడం మరచిపోయారు. ఎంత సేపూ గతాన్ని తలచుకుంటూ భవిష్యత్తు గురించి భయపడుతూ వర్తమానాన్ని విస్మరిస్తున్నారు. ముందుగా ప్రజలకు ఆత్మవిశ్వాసాన్నివ్వాలి, వారికి భద్రతనివ్వాలి”.  ఈనాటి నేతలకి సైతం వర్తించే సూచనలివి అనడంలో సందేహం ఏ మాత్రం  లేదు.

తర్వాత రెండేళ్ళపాటు రాజ్యంలో అభివృద్ధి పనులు చేపడుతూ, సైన్యాన్ని బలోపేతం చేశాడు. వివాహం చేసుకున్నాడు. రాచరిక, వైయక్తిక ధర్మాలను నెరవేర్చాడు. ఒక్కో శత్రువునీ జయిస్తూ, సామ బేధ దాన దండోపాయాలతో దక్షిణాపథాన్నంతా ఏకఛత్రం క్రిందకి తెచ్చాడు శ్రీకృష్ణ దేవరాయలు. ఎన్నో సంస్కరణలు చేపట్టి జనరంజకంగా పాలించాడు, విశిష్ట కట్టడాలని నిర్మించాడు.

పరిపాలనాదక్షుడుగా, వీరుడిగా, సాహితీప్రియుడిగా, కవిగా, గొప్ప కట్టాడాలను కట్టించిన రాజుగా మనకి తెలిసిన శ్రీకృష్ణ దేవరాయల లోని ఆధ్యాత్మికతను, ధర్మదీక్షని పరిచయం చేసారు రచయిత ఈ నవలలో. విజయనగర రాజ్యాధికారం లభించడమంటే ధర్మరక్షణ చేసే అవకాశం లభించడమేనని శ్రీకృష్ణ దేవరాయలు భావించాడని, దైవం తనకి నిర్దేశించిన కర్తవ్యం అదేనని ఆయన నమ్మాడని రచయిత చెబుతారు. తన సామ్రాజ్యంలో ఎన్నో దేవాలయాలకు నిధులిచ్చి, వాటిని పునరుద్ధరించి, నిత్యపూజలు జరిగేలా చూసాడు. ఆలయాలు జనసామాన్యంలో ధార్మికత నెలకొల్పగలిగే కేంద్రాలని రాయలు విశ్వసించాడు.

శ్రీకృష్ణ దేవరాయలు వేంకటేశ్వరుని భక్తుడు. వీలైనన్ని సార్లు తిరుపతి వెళ్ళి స్వామి వారి దర్శనం చేసుకునేవాడట. “ఏడుకొండలు ఎక్కలేము, ఇంకోసారి రాలేము” అనుకునే వారందరూ కూడా మళ్ళీ మళ్ళీ స్వామి దర్శనానికి ఎందుకు వస్తారో రచయిత చక్కగా వివరించారు. “ఏడుకొండలపై తిష్టవేసుకున్న కోనేటి రాయుడి దర్శనం కోసం ఏడు కొండలు నడిచి వెళ్ళాలి. ఒక్కో అడుగు వేస్తూ.. కొండలెక్కుతుంటే, మానవ ప్రపంచానికి దూరమవుతూ, దైవ ప్రపంచంలో అడుగుపెడుతున్న భావన కలుగుతుంది. ఇంత కష్టపడి ఏడు కొండలు అధిరోహించి, దైవమందిరంలో అడుగిడితే, ఆ చీకటిలో, దీపాల వెలుతురులో ధగధగా మెరిసే వజ్రాభరణాల వెలుగులో, నల్లటి రాతివిగ్రహం నుండి మనల్ని చూస్తున్న ఆ స్వామి విరాట్స్వరూపాన్ని ఎంత చూస్తే తనివితీరుతుంది?” అంటాడు రాయలు.

ఆలయ దర్శనం పూర్తయ్యాక, ఉదయగిరి కోటపై దాడి చేసి గెలుచుకుంటాడు. మరల తన దేవేరులతో కలసి తిరుమల వేంచేస్తాడు. ఎప్పుడూ స్వామి వారి సన్నిధిలోనే ఉండిపోవాలని అభిలషిస్తుంది చిన్నాదేవి. రాయలకి కూడా అదే కోరిక ఉన్నా పాలనా బాధ్యతల దృష్ట్యా సాధ్యం కాని పని. తిమ్మరుసు చేసిన ఓ ఆలోచన వల్ల – నిరంతరం స్వామి దగ్గరే ఉండాలన్న రాయల కోరికను పరోక్షంగా, ప్రతీకాత్మకంగా నెరవేరింది. ఫలితమే – తిరుమల గుడిలో శ్రీకృష్ణ దేవరాయలు తన ఇద్దరి భార్యలతో ఉన్న విగ్రహాల ఏర్పాటు!

రాచకార్యాలు, యుద్ధవ్యూహాల నడుమ సాహిత్య సమాలోచనలు, సాంసృతిక ఉత్సవాలను నిర్వహించేవాడు రాయలు. శ్రీకాకుళ ఆంధ్రమహావిష్ణువు ఆలయంలో దైవదర్శనం చేసుకున్నాకా, రాయల హృదయంలో ప్రేరణ కలిగి ఆముక్తమాల్యద రచనకి బీజం పడుతుంది. ఈ సందర్భంలోనే శ్రీకృష్ణ దేవరాయల నోటి నుంచి “దేశభాషలందు తెలుగు లెస్స” అనే పద్యం వెలువడింది.

ఆముక్తమాల్యద రచన ప్రారంభించినప్పటినుంచి రాయల ప్రవర్తనలోనూ, మానసిక స్థితిలోనూ మార్పు రావడం గమనిస్తాడు తిమ్మరుసు. తన తదనంతరం, విజయనగర సామ్రాజ్యం ఏమై పోతుందో అని చింతిస్తున్న శ్రీకృష్ణ దేవరాయలు మానసిక స్థితిని వర్ణిస్తూ – “తన జీవితంలో ఒక దశకి చేరిన తరువాత ఇతరుల పొగడ్తలు వింటున్న వ్యక్తి మనసులో అహంకారం జనిస్తుంది, దాని వెంటే సంశయం కలుగుతుంది. ఈ పొగడ్తలకు అర్హుడినా అనే అనుమానం కలుగుతుంది, మరో వైపు ‘నేనింత సాధించాను’ అన్న అహంభావం పెరుగుతుంది. ఈ రెండిటి నడుమ జరిగే ఘర్షణలోంచి, ‘ఇది పోతేఅన్న భయం జనిస్తుంది. ఆ భయాన్ని వ్యక్తి ఎలా ఎదుర్కుంటాడన్నది ఆ వ్యక్తి వ్యక్తిత్వాన్ని నిర్ణయిస్తుంది” అని అంటారు రచయిత.

ఈ స్థితిలో రాయలికి ధైర్యం చెబుతాడు తిమ్మరుసు. “మనిషి మనసు ఎల్లప్పుడూ భవిష్యత్తుని తలచుకుని భయపడడానికే ఇష్టపడుతుంది. ఆ భయాన్ని మనం నిర్మాణాత్మకంగా వాడుకోవాలి. ఎప్పుడో ఏదో జరుగుతుందని ఊహిస్తూ, ఇప్పటి నుంచే బాధపడుతుంటే, భవిష్యత్తు అటుంచి, వర్తమానం చేజారిపోతుంది.” అంటూ మృదువుగా హెచ్చరిస్తాడు.

సామ్రాజ్యం విస్తరిస్తుంది, బలపడుతుంది. కాలచక్రం గిర్రున తిరిగి, పుత్రుడికి పట్టాభిషేకం చేసే సమయం ఆసన్నమవుతుంది. రాయలు తన పుత్రుని భవిష్యత్తు గురించి బెంగపడుతున్న సమయంలో యుద్ధానికి వెళ్ళాల్సి వస్తుంది, రాయల అప్పటి మానసిక స్థితిని అద్భుతంగా చిత్రించారు రచయిత. “మనిషికి ఆత్మస్థైర్యం ఇవ్వవలసిన మానవ సంబంధాలే మనిషిని బలహీనం చేయడం సృష్టిలో చమత్కారం” అంటారు.

ఆముక్తమాల్యద రచన పూర్తి కాగానే శ్రీకృష్ణ దేవరాయలు తృప్తిగా కన్నుమూయడంతో నవల పూర్తవుతుంది.

ఉత్కంఠగా చదివించే ఈ నవల తొలుత ఆంధ్రభూమి వారపత్రికలో సీరియల్‌గా ప్రచురితమైంది. నవలగా మొదటిసారి “కస్తూరి ప్రచురణలు” వారు ప్రచురించారు. 124 పేజీలున్న ఈ నవల వెల రూ.60/- ప్రచురణకర్తల వద్ద ప్రింట్ బుక్ లభిస్తుంది. ఈబుక్ కినిగెలో లభ్యం.

~ కొల్లూరి సోమ శంకర్

ప్రచురణకర్తల చిరునామా:

Kasturi Prachuranalu

Plot No. 32, Dammaiguda,

Raghuram Nagar Colony,

Nagaram Post Office,

Hyderabad – 83,

Cell : 98496 17392.

 

కొంత చరిత్రా, కొంత కల్పన – “ఆమ్‌స్టర్‌డాంలో అద్భుతం”

 

~ కొల్లూరి సోమ శంకర్

~

కొల్లూరి సోమ శంకర్

11 సెప్టెంబర్ 2001 – చరిత్ర గతిని మార్చిన రోజు. ప్రత్యక్షంగా అగ్రరాజ్యాన్ని, పరోక్షంగా ఎందరో సామాన్యులని ప్రభావితం చేసిన రోజు. ఉగ్రవాదులు న్యూయార్క్ నగరంలోని వరల్డ్ ట్రేడ్ సెంటర్ యొక్క ట్విన్ టవర్స్‌ను విమానాలతో కూల్చేయడంతో అమెరికాలో ప్రారంభమైన భయం – ప్రపంచంలోని చిన్నా, పెద్దా దేశాలకు పాకిపోయింది. తీవ్రవాదులు ప్రయాణీకుల వేషంలో దాడి చేయచ్చనే భయం నుంచి మొదలైన అనుమానాలు పెనుభూతాలై, భద్రతాచర్యలు విపరీతమయ్యాయి. కొత్త చట్టాల ఏర్పాటుకు నాంది పలికాయి. దేశీయ, అంతర్జాతీయ విమానాలలో అనుమానస్పదంగా కనబడే ఎవరినైనా అదుపులోకి తీసుకుని విచారించడం మొదలైంది. ఈ నేపథ్యంలో ఎందరో అమాయకులను అనుమానితులుగా భావించి, వారిని అరెస్ట్ చేసి, విచారణ జరిపి తాపీగా విడుదల చేయడాలు ఎక్కువైపోయాయి. అంతేకాదు, విమానం గాల్లో ఉన్నప్పుడు కొందరు ప్రయాణీకుల ప్రవర్తన నిబంధనలకు అనుగుణంగా లేకపోయినా భయపడడం, ఉగ్రవాదాన్ని ఓ మతానికి ఆపాదించి – నామరూపాలు విభిన్నంగా ఉంటే – వాళ్ళని అరెస్ట్ చేయడం వంటివి ఎన్నో విమానాశ్రాయాలలో కలకలం రేపాయి.

ప్రముఖ రచయిత శ్రీ మధురాంతకం నరేంద్ర గారి నవల “ఆమ్‌స్టర్‌డాంలో అద్భుతం” కూడా ఈ నేపథ్యంలోనే సాగుతుంది. “రోజురోజుకూ పెరుగుతున్న మత తీవ్రవాదపు పరిణామాలేమిటో అర్థమయింది. ఈ ఆందోళనల్లో సామాన్యుడి జీవితమెంత అతలాకుతలంగా తయారవుతుందో చూపెట్టడంతో బాటూ దీనికంతా మూలకారణమైన మతం, దాని పుట్టుక, స్వభావం గురించిన అన్వేషణకు కూడా నేనీ నవలను రాయడానికి పూనుకున్నాను.” అని చెబుతారు రచయిత.

అనుకోని ఘటనల వల్ల ఆమ్‌స్టర్‌డాం ఎయిర్‌పోర్ట్‌లో ముప్ఫయి గంటలకి పైగా చిక్కుకుపోయిన ప్రయాణీకులలో ఇద్దరి ద్వారా ఈ కథ సాగుతుంది. మెక్సికోలోని ఓ అంతర్జాతీయ యూనివర్సిటీ నిర్వహిస్తున్న సెమినార్‌లో పేపర్ ప్రెజెంట్ చేయడానికి వెడుతున్న ఓ తెలుగు ప్రొఫెసర్‌కి ఢిల్లీ ఎయిర్‌పోర్ట్‌లో పరిచయమవుతాడు ఓ హిందీ భాషీయుడు దమ్మలాల్ చోప్రా. అతనికి ఇంగ్లీషు అంతంత మాత్రంగానే వచ్చు. ప్రొఫెసర్ గారికి హిందీ అంత బాగా రాదు. వీరిద్దరి సంభాషణలు, ఇతరులతో వీరి సంభాషణలు పాఠకులను ఆకట్టుకుంటాయి. దమ్మలాల్ తనకు మార్మిక సంకేతాలు అందుతున్నాయని నమ్మే వ్యక్తి. మన ప్రొఫెసర్ గారేమో హద్దుల్లేకుండా పెరుగుతున్న నేటి సాంకేతిక ప్రపంచం పట్ల అబ్బురపడే మనిషి. మరి వీరిద్దరికి ఎలా పొసుగుతుంది? దమ్మలాల్ చర్యల వల్ల ప్రొఫెసర్ గారు ఏ ఇబ్బందులు పడ్డారు?  అసలీ భయాలకి మూలం ఏమిటి? తోటివారి ప్రాణాలు తీయమని ఏ మతమైనా చెబుతుందా? మత విశ్వాసాలకు విపరీత భాష్యాలు ఎలా మొదలయ్యాయి? ఇలాంటి ఎన్నెన్నో ప్రశ్నలు పాఠకుల మనస్సుల్లో అలజడి కలిగిస్తాయి.

దమ్మలాల్ చోప్రా ప్రవర్తన ప్రొఫెసర్ గారికి అసమంజసంగా అనిపించినా, అతనికి మాత్రం తన నడవడికలో ఏ లోపమూ కనిపించదు. పైగా తాను స్వాభావికంగా ఉన్నట్లే ప్రవర్తిస్తాడు. ఆమ్‌స్టర్‌డాం ఎయిర్‌పోర్ట్‌లో అద్భుతం జరగబోతోందని భావిస్తూంటాడు. అదే మాట పదే పదే వల్లిస్తూంటాడు. ఢిల్లీ ఎయిర్‌పోర్ట్‌లో కూర్చుని ఉన్నప్పుడు తాము 22 గంటల పాటు ఆమ్‌స్టర్‌డాం ఎయిర్‌పోర్ట్‌లో వేచి ఉండాల్సి వస్తోందని ప్రొఫెసర్ గారు వాపోయినప్పుడు తోటి ప్రయాణీకుడైన చైతన్య అనే తెలుగు కుర్రాడు, “ఆమ్‌స్టర్‌డాంలో కాలం గడపడమంటే అదొక పెద్ద అవకాశమంకుల్…. ఆ యెయిర్‌పోర్టొక మాయాబజార్…. యిక ఆ వూరే పెద్ద అమ్యూజ్‌మెంట్ పార్కు. యెన్ని పార్కులూ, యెన్ని కాఫీ షాపులూ, యెన్ని మ్యూజియంలూ…. వొక్క రోజేం చాలుతుంది? యువార్ లక్కీ!…” అని అంటాడు. “వూళ్ళోకి వెళ్ళడానికి మాకు వీసా లేదు… యెయిర్‌పోర్ట్‌లోనే కాలంతోయాలి..” అని ప్రొఫెసర్ గారు విచారంగా జవాబిస్తే, “అయినా పర్వాలేదంకుల్! వోన్లీ ట్వెంటీ హవర్స్…. వొక్కో షాపును చూడ్డానికో అరగంట వేసుకోండి. మీరెంత వేగంగా తిరిగినా షాపులే మిగిలిపోతాయి…” అని అంటాడు. వీళ్ళ దృక్పథాలలో ఎంతటి వ్యత్యాసం? బహుశా అనుభవాలే మనిషికి ధైర్యాన్ని, భయాన్నీ కూడా కలిగిస్తాయేమో!

ఆమ్‌స్టర్‌డాం ఎయిర్‌పోర్ట్‌లో ఆగినప్పుడు రెస్ట్ రూంకి వెళ్ళాల్సివస్తుంది దమ్మలాల్ చోప్రాకి. ఆ సమయంలోనే చైతన్య వాలెట్ పోతుంది. దాన్ని వెతకడానికి చోప్రాని సహాయంగా తీసుకువెడతారు చైతన్య మిత్రబృందం. గంటల సమయం గడిచిపోతూంటుంది. దమ్మలాల్ రాడు. ప్రొఫెసర్ గారికి టెన్షన్ పెరిగిపోతుంది. ఆయన ఎక్కాల్సిన విమానానికి బోర్డింగ్ ఎనౌన్స్ చేస్తారు. ఇద్దరిదీ కలిపి జాయింట్ టికెట్ కావడంతో తన తోటి ప్రయాణీకుడు రాకపోతే ఏమంటారో అని భయపడతాడు. చివరికి తెగించి సెక్యూరిటీ చెక్ ముగించుకుని విమానం ఎక్కేస్తాడు. అదే సమయంలో దమ్మలాల్ కూడా విమానంలోకి వచ్చేస్తాడు. ఎందుకాలస్యం అంటే… ఓ అద్భుతానికి నాందీ ప్రస్తావన జరిగిందని చెబుతాడు? ఏమిటా సంఘటన? అతను అద్భుతానికి టీజర్‌గా భావించిన ఆ ఘటన యొక్క అసలు స్వరూపం తెలిసాక ప్రొఫెసర్ గారికి ఒళ్ళు జలదరిస్తుంది.

***

తిరుగు ప్రయాణంలో మళ్ళీ ఆమ్‌స్టర్‌డాం సమీపిస్తుంటారు. ఇక్కడ విమానం భూమి మీదకి దిగడం గురించి రచయిత చెప్పిన తీరులోని భావుకత పాఠకులను మైమరపిస్తుంది. “విమానం మేఘాల దొంతరలను చీల్చుకుంటూ కిందకి దిగసాగింది. కిటికీలోంచీ కనబడుతున్న భూమి క్రమంగా దగ్గరవసాగింది. నగరాన్ని పాయలు పాయలుగా కమ్ముకున్న నదీ, నదీ పాయల మధ్య పెరుగుతున్న చెట్లూ, చెట్ల మధ్యలో యిండ్లూ, యిండ్ల మధ్యలో యెండిన కాలవల్లాంటి రోడ్లూ, రోడ్లపైన పరిగెడుతున్న వాహనాలూ, అన్నీ క్రమంగా దగ్గరకు వచ్చాక, నిర్జనమైన విమానాశ్రయపు రన్‌వే పైకొచ్చిన విమానం, అలవోకగా టైర్లు దించి, రోడ్డు పైన పరిగెత్తసాగింది.” ఈ వాక్యాలు చదువుతున్న పాఠకులు స్వయంగా తామూ ఆ విమానంలో ఉన్నట్లు, ఆకాశం నుంచి నేలకు దిగుతున్నట్లు భావిస్తారు కదూ?

సరే, మొత్తానికి విమానం నేలని తాకుతుంది. కానీ ప్రయాణీకులెవరూ కిందకి దిగడానికి అనుమతి లభించదు. కారణం, ప్రయాణీకులలోని కొందరి ప్రవర్తన. ఎయిర్ మార్షల్స్ వారిని అదుపులోకి తీసుకుని, దూరంగా తీసుకెళ్ళాక గాని మిగతా ప్రయాణీకులకి విముక్తి లభించదు. వీళ్ళిద్దరూ ఓ మూల లాంజ్‌లో కూర్చుంటారు. సెక్యూరిటీ చెక్‍లో దమ్మలాల్ సంచీలో ఉన్న మందులు, పుస్తకాలు తీసుకుంటారు విమానాశ్రయపు అధికారులు. సమయం గడుస్తూ ఉంటుంది. దమ్మలాల్ చోప్రా డైరీలోని రాతలని చదివి అర్థం చెప్పమని ప్రొఫెసర్‌ని పిలుస్తారు అధికారులు. డైరీలో రాసి ఉన్నది కవిత్వమనీ… ఆ కవితల భావాన్ని వివరిస్తాడు ప్రొఫెసర్. “అనంతమెపుడూ యేకవచనమే! అనంతమెపుడూ అద్వయితమే! అనంతానికి మధ్యవర్తులెందుకు? అనంతానికి చేతులెందుకు? అనంతానికి మాటలెందుకు?” అని రాసున్న ఓ కవితని చదివి వినిపిస్తే, “టెల్ మీ ది ఆన్సర్ ఆల్సో!” అంటూ అడ్డు తగులుతాడో సెక్యూరిటీ ఆఫీసర్. అప్పుడక్కడ జరిగిన ఉదంతం పాఠకులని ఉక్కిరిబిక్కిరి చేసేలా నవ్విస్తుంది.

జరగబోయే అద్భుతం కోసం ఎదురుచూస్తున్న దమ్మలాల్ తన మాటలతో, చేష్టలతో ప్రొఫెసర్ గారిని బెంబేలెత్తిస్తాడు. జేబుల్లో ఉన్న నాలుగువేల రూపాయల ఇండియన్ కరెన్సీ ఇక్కడ చెల్లకపోవడం పట్ల అంతర్జాతీయ విప్లవం లేవదీయాలనుకుంటాడు. అతని మాటలకు జాలి చూపెడుతూ, సానుభూతి చెందుతూ, కంగారు పడుతూ, వంత పాడుతాడు ప్రొఫెసర్. అద్భుతం జరగబోతోందంటూ ఊదరగొడతాడు దమ్మలాల్. వీళ్ళిద్దరిని తీసుకెళ్ళి ఓ హోటల్లో హౌస్ అరెస్ట్ లాగా పడేస్తారు అధికారులు. “మేము తీవ్రవాదులయివుంటామనే అనుమానం, దేశాల ఎంబసీలే చేయలేని పనిని చిటికెలో చేసి పారేసింది. యిప్పుడిక్కడ మాకు పైసా ఖర్చు లేకుండా, అయిదు నక్షత్రాల హోటల్లో వసతీ, భోజనమూ దొరుకుతున్నాయి. యింతకంటే చిత్రమేముంటుంది? మొదటి నుంచీ దమ్మలాల్ చోప్రా చెబుతున్న అద్భుతం యిదేనేమో!” అనుకుంటాడా ప్రొఫెసర్.

చివరికి ఢిల్లీ వెళ్ళే విమానం ఎక్కి కూర్చుంటారు. ఈ విమానం కూడా సమయానికి ఎగరదు. ప్రయాణీకులందరూ ఎక్కినా విమానం బయల్దేరదు. ఓ పిల్లాడి దుందుడుకు చర్య వల్ల బాగా ఆలస్యం అవుతుంది. చివరికి విమానం గాల్లోకి ఎగురుతుంది. ప్రయాణం కొనసాగి ఢిల్లీ సమీపిస్తుంది. ఆమ్‌స్టర్‌డాంలో అద్భుతం జరిగిపోయిందని అంటాడు దమ్మలాల్ చోప్రా. “యింత ప్రమాదకరమైన పరిస్థితులలో, చివరకు సెక్యూరిటీ వాళ్ళు మనల్ని అనుమానించినా, తప్పకుండా తీవ్రవాదులే అనిపించే వ్యక్తులతో బాటూ మనం కలిసి తిరగవలసి వచ్చినా, యిలా తప్పించుకుని తిరిగీ మనం మన దేశానికి చేరుకుంటున్నాం చూడూ, అదీ అదీ అద్భుతం!” అంటాడు ప్రొఫెసర్.

విమానం ఢిల్లీలో లాండవుతుందనగా… వాళ్ళిద్దరు అప్పటిదాక దాచివుంచిన తమ మనోభావాలను వెల్లడించుకుంటారు. పాకిస్తానీలాగానో, అఫ్ఘనిస్తాన్ వాడిలానో అనిపించే దమ్మలాల్‌తో కలసి ప్రయాణం చేసినందుకు ప్రొఫెసర్ భయపడినట్లే, ముస్లిం అయిన ప్రొఫెసర్‌తో కలసి ప్రయాణించినందుకు దమ్మలాల్ భయపడతాడు. అయితే ఇందుకు తామిద్దరం కారణం కాదని అంటాడు ప్రొఫెసర్. మరెవరు కారణం?

***

కారణాలను, కారకాలను అన్వేషించే ప్రశ్నలతో పాఠకులను ఆకట్టుకుంటుందీ పుస్తకం. ఉత్కంఠగా చదివించే ఈ నవలని 2013లో “కథాకోకిల ప్రచురణలు” వారు ప్రచురించారు. 100 పేజీలున్న ఈ నవల వెల రూ.60/- (ప్రస్తుతం ధర మారి ఉండచ్చు). ప్రచురణకర్తల వద్ద, విశాలాంధ్ర వారి అన్ని కేంద్రాలలోనూ ప్రింట్ బుక్ లభిస్తుంది. ఈబుక్ కినిగెలో లభ్యం.

 

ప్రచురణకర్తల చిరునామా:

Kathakokila Prachuranalu

15-54/1, Padmavathi Nagar,

Tirupati West – 517 502

Phone: 0877-2241588

 

సామాన్యుల గొంతుని వినిపించే ‘గడీలో దొరల పాలన’

 

కొల్లూరి సోమశంకర్

కొల్లూరి సోమశంకర్

డా. నారాయణ భట్టు మొగసాలె గారు కన్నడ భాషలో రచించిన “ఉల్లంఘన” నవల బంట్ కుటుంబంలోని ఐదు తరాల గాథ. బంట్ సముదాయం ఒకనాటి క్షత్రియులు. ప్రస్తుత కర్నాటకలోని ఉడుపి, దక్షిణ కన్నడ, కేరళ లోని కసర్‌గోడ్ జిల్లాల మధ్యలో వ్యాపించి ఉండిన “తుళునాడు”కు చెందిన భూస్వాములు బంట్ వంశీకులు. ఇటువంటి భూస్వాములు, వారి ఆస్థానాలు, పాలనా పద్ధతులు, పాలితులు, ఆచారవ్యవహారాలను నమోదు చేసిన విశిష్ట రచన ‘ఉల్లంఘన’.

తుళునాడులోని ప్రజల భాష తుళు. ఈ భాషకి లిపి లేదు. వ్రాయడానికి కన్నడ లిపినే ఉపయోగిస్తారు. తుళునాడు జనాలది విశిష్టమైన సంస్కృతి. 19వ, 20వ శతాబ్దాలలో ఈ సంస్కృతిలో వచ్చిన మార్పులు, ఈ ప్రాంతపు చరిత్రలో సంభవించిన ఘటనలను వివరిస్తుంది ఈ నవల. అటువంటి ప్రశస్తమైన నవలను “గడీలో దొరల పాలన” పేరిట తెలుగులోకి అనువదించారు శ్రీ శాఖమూరు రామగోపాల్. మూల రచన ‘ఉల్లంఘన’ ఇప్పటికే హింది, ఇంగ్లీషు, మరాఠి, మళయాళం, తమిళ భాషలలోకి అనువాదమైంది. 2008లో ప్రచురితమైన ఈ మూలకృతి కన్నడంలో ఎం.ఎ. విద్యార్థులకు పాఠ్యపుస్తకంగా ప్రవేశపెట్టబడింది. మూల రచయిత డా. నారాయణ భట్టు మొగసాలె వృత్తిపరంగా వైద్యులైనా, ప్రవృత్తిపరంగా గొప్ప సాహితీవేత్త.

సుమారు నూటయాభై సంవత్సరాల కాలంలో తుళునాడునీ, దానిలోని గడీలను ప్రభావితం చేసిన సామాజిక, రాజకీయ, ఆర్థిక అంశాలను కళ్ళకి కట్టినట్లుగా వివరిస్తుందీ పుస్తకం. రాచరిక/భూస్వామ్య వ్యవస్థకి ప్రతిరూపాలైన బంట్లు కూడా గడీలను అధికార కేంద్రంగా చేసుకుని తమ అజమాయిషీ కొనసాగించారు. ఆస్థానం, సంస్థానం, కోట.. వంటి పదాలను గడీ అనే పదానికి సమానార్థాలుగా భావించవచ్చు. గడీల చరిత్ర పాలకులు – పాలితుల మధ్య ఉండే సంబంధాన్ని వ్యక్తం చేస్తుంది. భూస్వాములు, రైతు కూలీలు, కౌలుదార్ల సామాజిక జీవనంలోని భిన్నకోణాలను ప్రతిబింబించింది ఈ నవల.

తుళునాడులో మాతృస్వామ్య వ్యవస్థ ప్రధానంగా ఉంది. కుటుంబపు ఆస్తి వారసత్వంగా స్త్రీలకు దక్కుతుంది. పుట్టిన పిల్లలకు భార్య ఇంటిపేరునే పెట్టుకుంటారు. కుటుంబంలోని మగవాళ్ళు ఆస్తిపాస్తుల వ్యవహారాలను మేనేజర్లుగా నిర్వహిస్తుంటారు. ఇటువంటి గడీలలోని ఒకటైన సాంతేరుగడీ చరిత్ర ఇతివృత్తమే ఈ నవల కథాంశం. గడీ ఆధీనంలోని భూమిలో కొంతభాగాన్ని కౌలుదారులు సేద్యం చేస్తుండగా, మిగతా భూమిని వెట్టి కూలీలతో భూస్వాములే సాగు చేస్తారు. ఇటువంటి ఫ్యూడల్‌సమాజంలో కౌలుదారులకు, వెట్టి కూలీలకు; దొరసానికి (బళ్ళాల్ది), దొరకి (ఉళ్ళాయి) మధ్య ఉండే సంబంధాన్ని ఈ నవలలో దర్శించవచ్చు. వెంకప్ప, శీనప్ప, సంకప్ప, సుందర, ప్రశాంత్‌హెగ్డె గార్ల జీవితాలు; అలాగే తుంగక్క, శాంతక్క, అంబక్క, శారదక్క, ప్రజ్ఞల జీవితాలు ఈ నవలలో విస్తృతమైన కాన్వాస్‌పై అద్భుతంగా గోచరిస్తాయి

భుజించి దర్బారులోకి వచ్చి కూర్చున్న దొరవారితో, దోస్తుగా ఉన్న పావూరు గడీకి చెందిన పూంజగారు ‘సాంతేరుగడీలో అష్టమినాడు ఎందుకు చేసారు ఈ కోలాహలం విందును?’ అని ప్రశ్నించారు కుతూహలంగా. అందుకు దొరవారు ‘అష్టమి అముఖ్యం కాదు మాకు. మేము వ్యవాసాయం చేసేవాళ్ళం. అందుకే మాకు మేము పండించిన కొత్త బియ్యం వండి పండుగ లాగ తినేది ముఖ్యం అనేది గడీలో సాంప్రదాయంగా వృద్ధి చెంది వచ్చింది. గోకులాష్టమి, వినాయక చవితి, అమావాస్యలోని దీపావళి మొదలైన రోజుల కట్టుబాట్లలోని ఆచరణాలన్నీ గడీ భవంతిలో ఉన్నవి. అవన్నీ అక్కరలేదా మన సమాజంకు?’ అన్నారు.

పూంజగారికి సంతృప్తి అయ్యింది దొరవారి రైతు జ్ఞానం నుంచి. వారు, ‘ఔను, మన జాతులలో ప్రాదేశిక వ్యత్యాసాలకు అనుగుణంగా పండుగ పబ్బాలలో వివాహ, దినకర్మకాండలలో వ్యత్యాసం ఉండేది సహజమే’ అని ఒప్పుకున్నారు.

బ్రిటీషు వారి రాకతో దేశంలోని అన్ని ప్రాంతాలలో లాగానే తుళునాడులోనూ దొరల అధికారాలు క్షీణించి, పరిస్థితులు మారడాన్ని ఈ నవల చక్కగా వర్ణిస్తుంది. ఆంగ్ల పాలకులు చేసిన కొత్త చట్టాల వల్ల భూస్వాములు, కౌలుదార్లు, వెట్టికూలీల సంబంధాలలో వచ్చిన మార్పులనూ, మనుషులలో కలిగిన కొత్త ఆలోచనలను ఈ నవల ప్రతిబింబిస్తుంది.

స్వాంతంత్ర్యం కోసం జరిపిన పోరాటంలో ఈ ప్రాంతపు యువకులు పాల్గొన్న వైనాన్ని, గాంధీ గారి అనుచరులుగా మారిన జైళ్ళకు వెళ్ళిన వైనాన్ని తెలుపుతుంది ఈ నవల.

“ఆ రోజు గడీ భవంతి వర్ణించలేనట్లుగా సంబురపడింది. ఆ సంబురం ఒంబత్తుకెరె గ్రామంలోని కౌలుదార్ల నుంచి మొదలై కూలినాలి చేసి జీవించేవాళ్ళ ఇళ్ళ వరకూ వ్యాపించింది. యువకులు, వృద్ధులు అనకనే ఆబాలగోపాలం గడీ ప్రాంగణంకు ఒకరి వెనుక ఇంకొకరుగా వచ్చారు. సంకప్పకు వారందర్నీ చూసి ఎంతో సిగ్గైంది. ‘నేనేమి యుద్ధం గెల్చి వచ్చానేమి! ఉత్తిగనే ఎందుకు నన్ను చూసేందుకు వచ్చారు?’ అని అనాలని అన్పించింది అతనికి. ప్రతి యొకరు వచ్చి ‘ఎలాగున్నారు చిన్నపటేలా?’ అంటూ అడిగారు. జనం నొచ్చుకోవచ్చని అతను ప్రాంగణంలో కుర్చీ వేయించుకుని కూర్చున్నాడు. వచ్చినోళ్ళందరితోనూ సంకప్ప ‘నేనేమి ఘనంగా దేశమాత సేవ చేయలేదు. గాంధీజీతో పాటు నేను ఉండివచ్చాను వివిధ చోట్ల అంతే మరి.’ అన్నాడు.

AuthorSakhamuru

స్వతంత్ర్యం వచ్చాకా ఎదురైన పరిస్థితులు ఏలాంటివి? గ్రామం తన స్వయంప్రతిపత్తిని పోగొట్టుకుని, పట్టణాల మీద ఎందుకు ఆధారపడింది? మాతృస్వామ్య వ్యవస్థ తన ప్రాభవాన్ని ఎలా కోల్పోయిందో ఈ నవల వెల్లడిస్తుంది. కొత్త వ్యవస్థలో ఎవరు ఎవరిపై ఆధిపత్యం చలాయించారు? ఆ యా మార్పులు ఎవరెవరిని ప్రభావితం చేసాయి? ఈ వివరాలన్నింటినీ తెలుసుకోవాలంటే ఈ నవల చదవాలి.

సంకప్ప హెగ్డె గంభీరులయ్యారు. వారు ‘మన కర్నాటకలోని ఈ భూపరిమితి చట్టం లాంటి ప్రగతిపర మరియు విప్లవాత్మక … భూసంస్కరణల చట్టం… ఈ భరతభూమిలో మరే యితర రాష్ట్రంలో జారీ అయ్యింది లేదనేది నాకు గుర్తే! దాన్ని నేను వేరే వేరే మూలాల నుంచి చదివి తెల్సుకున్నాను. నిజంగా ఇది మంచి చట్టమే. అందులోనూ తీరప్రాంత జిల్లాల్లో, ముఖ్యంగా మన దక్షిణ కన్నడ జిల్లాలో ఇది అమలౌతున్న పద్ధతిలో, ఎన్నో అవాంతరాలు ఎదురౌతున్నవి. మనలో తండ్రి నుంచి సంతానంకు భూమి హక్కు వచ్చి కలిగే సంప్రదాయం ఎంతో తక్కువ. తల్లి నుంచి సంతానంకు హక్కు వచ్చే సాంప్రదాయమే ఎక్కువగా ఉంది. అయితే మారుతున్న వాతావరణంలో ప్రతీ కుటుంబం ఈ పురాతన పరంపరను ఇప్పుడు తోసి వేస్తోంది. కానూను ప్రకారం మాతృప్రధాన వ్యవస్థ అనేది ఇప్పుడు లేదు! అందుచేత మన కర్నాటకలో ఈ భూపరిమితి చట్టం ఇక్కడ ఈ జిల్లాలో అమలు చేసేడప్పుడు ఎన్నెన్నో కుటుంబాలలో ఘర్షణలు ప్రారంభమైనవి. మనుష్య సంబంధాలన్నీ నాశనమైపోయే స్థితి వచ్చింది’ అని చెబుతూ ఒక నిమిషం మౌనం దాల్చారు.

ఉడుపి ప్రాంతంలోని కన్నడిగులు హోటల్ యజమానులుగా ఎలా ఎదిగారో, తమవారిని ఎలా వృద్ధిలోకి తెచ్చారో ఈ నవల రేఖామాత్రంగా తెలియజేస్తుంది.

ఎవరికి కావాలి ఈ పొలాలు, మడులు? కాడి నాగలి మోసుకుంటూ వాన ఎండా అది ఇదీ అని మూడొందల అరవై ఐదు రోజులూ మడిగట్టు మీద గోచి బిగించి చెమట్లు కురిపించుతూ శ్రమించేదానికన్నా ‘చుయ్’ అని రెండు మసాలా దోసెలు వేసి, ఒక ముక్కుళ్ళి (గుటక పరిమాణం) కాఫీనో చాయ్‍నో టేబుల్ మీద పెట్టి ‘రండి రండి గిరాకీదారులారా’ అంటే చాలు, నోట్ల కట్టే తలొంచి క్యాష్ బాక్స్ లోపలికి వచ్చి బుద్ధిగా కూర్చుంటందంటే అదెంత కుశాలో అని అంబక్కకి అప్పుడు నవ్వు వచ్చింది. అందుకే ఇంత జనం, ఉన్న ఊరు వద్దు అంటూ పట్టణాలకు వలస వెళ్తున్నారని చెప్పారు సంకప్పణ్ణ.

వ్యవసాయాధారితమైన కుటుంబాలు క్రమంగా వ్యాపారాలవైపు మొగ్గు చూపడాన్ని ఈ నవల చిత్రిస్తుంది.

ఆదంకుట్టి క్తెతే ఆకాశంలో ఉన్న స్వర్గమే చేతికి అంది వచ్చినట్లుగా అయ్యింది. అతను తన అంగడికి వచ్చి వెళ్ళే గిరాకీదారులందరికీ కలల బీజాల్ని విత్తసాగాడు. అటువంటోళ్ళంతా తమ ఇళ్ళలోనూ ఇటువంటి బంగారు కలల విత్తనాల్ని విత్తసాగారు. జాతీయ రహదారిని ప్రారంభించే కేంద్ర మరియు రాష్ట్ర రవాణాశాఖా సచివ మహోదయులు ఆ తర్వాత తమ వాహనాలలో కాసరగోడు దాకా పయనించేదాన్ని చూసేందుకు వేలసంఖ్యలో జనం ఉదయం నుంచే జాతీయ రహదారి అంచుకు చేరారు. అక్కడక్కడ లేచి నిలబడి నిరీక్షించసాగారు.

సంస్థానాలను కేవలం చారిత్రక దృక్పథంతో మాత్రమే పరిశీలించి వ్రాసే పుస్తకాలలో కథ ఉండదు. ప్రజల వ్యథ ఉండదు. సామాజిక చిత్రణ ఉండదు. సామాన్యుల ఘోష వినిపించదు. పాలకుల శౌర్యం, మగతనానికి ప్రతీకలుగా మాత్రమే నిలిచే చరిత్ర పుస్తకాలకు భిన్నంగా, ఉల్లంఘన నవలలో సామాన్యుల గొంతు ప్రబలంగా వినిపిస్తుంది.

తెలుగు అనువాదం బావుంది. అయితే అనువాదకులు ఉపయోగించిన తెలుగు కన్నడం కలగలసిపోయిన యాస – పాఠకులకు కాస్త ఇబ్బందిగా తోచవచ్చు. ఏదేమైనా శ్రీ శాఖమూరు రామగోపాల్‌ ఒక మంచి కన్నడ నవలను తెలుగువారికి అందించారని చెప్పడంలో అతిశయోక్తి లేదు.

పుస్తకం చివర్లో “కర్నాటకలో నా తిరుగాట” అనే పేరుతో వ్రాసిన వ్యాసంలో సుప్రసిద్ధ కన్నడ రచయిత శ్రీ తమ్మాజీరావుతో కలసి తాను చేసిన సాహితీయాత్రలను పాఠకులకు కుతూహలం కలిగించేలా వివరిస్తారు శ్రీ రామగోపాల్. ఆయా అనుభవాలు చదువుతుంటే, మనం కూడా ఆయనతో ప్రయాణించినట్లు, ఆయా ప్రదేశాలు స్వయంగా దర్శించిన అనుభూతి కలుగుతుంది.

అభిజాత తెలుగు – కన్నడ భాషా అనువాద (సంశోధన) కేంద్రం వారు ప్రచురించిన ఈ పుస్తకం విశాలాంధ్ర వారి అన్ని శాఖలలోనూ లభిస్తుంది. 650 పేజీల పుస్తకం వెల రూ.600/-. ఈబుక్ కినిగెలో లభిస్తుంది.

 

రచయిత, ప్రచురణకర్త చిరునామా: Sakhamuru Ramagopal,
5-10, Road No. 21,
Deeptisri Nagar, Miyapur (post),
Hyderabad – 500 049;
Ph: 09052563666; email: ramagopal.sakhamuru@yahoo.co.in

పదుగురికీ తెలియాల్సిన నడత – వికర్ణ

cover page and back page quark4.qxd

కొల్లూరి సోమ శంకర్

కొల్లూరి సోమ శంకర్

పురాణాలలోని కొన్ని పాత్రల గురించి చాలామందికి సమగ్రంగా తెలియదు. ముఖ్యంగా పురాణగాథలని పునః కథనం చేసేడప్పుడు ఆ యా పాత్రల స్వరూప స్వభావాలు మార్పులకు లోనవుతుంటాయి. కొన్ని పాత్రలు ప్రజల నోట్లో నానుతాయి, మరికొన్ని మరుగున పడిపోతాయి. వందల మందిలో ఒకడిని గుర్తుంచుకోవాలంటే ఆ వ్యక్తి గుణవంతుడైనా అయ్యుండాలి లేదా పరమ నీచుడైనా అయ్యుండాలి. దుష్టుల దుష్కార్యాలను ఎక్కువగా ప్రాచుర్యంలోకి తేవడం వల్ల, కొందరు మంచివాళ్ళు చేసిన  సత్కార్యాలు, చూపిన తెగువ వెలుగులోకి రావు. మహా భారతంలోని పాత్రలలో చాలా మటుకు ఇలా విస్మృతికి గురైనవే ఎక్కువ. దుస్సల కాకుండా, మిగిలిన నూరుగురు కౌరవ సోదరులలో మహా అయితే నలుగురు లేదా అయిదుగురు పేర్లు గుర్తుంటాయేమో. మిగతావారి ప్రస్తావన చాలా తక్కువగా ఉంటుంది. ఇలాంటివాడే వికర్ణుడు. అతడు గాంధారి పుత్రుడు. కౌరవులలో పదిహేడవవాడు. వికర్ణుని జీవితానికి కాల్పనికతను జోడించి నవలగా సృజించారు డా. చింతకింది శ్రీనివాసరావు. రచయితకి ఇది తొలి నవల.

మహాభారతంలో ద్రౌపదిని అవమానించిన దుర్యోధన దుశ్శాసనులను – నేటికాలంలో మహిళలను అగౌరవపరిచేవారికి ప్రతీకలుగా వ్యవహరిస్తున్నారు. “దేశంలో సందుకో గాంధారి సుతుడు”న్నాడనే నానుడి ఏర్పడిపోయింది. దేశ రాజధానిలో జరిగిన నిర్ఘయ ఘటన పౌరులందరినీ కలచివేసింది. అదే ఈ నవల వ్రాయడానికి ప్రేరణగా మారింది. ‘‘అక్కడా ఇక్కడా అని లేదు. వారూవీరూ అని తేడాలేదు. ప్రతీ వీధిలోనూ, వాడలోనూ, కోటలోనూ, పేటలోనూ స్త్రీలమీద దాడులు దారుణంగా సాగిపోతున్నాయి. వీటన్నింటి గురించి బాగా ఆలోచిస్తున్నప్పుడే మహాభారతంలోని వికర్ణుణని ఘట్టం గుర్తుకువచ్చేది. ద్రౌపది చీర వొలిచేయాలని తలచిన దుర్యోధనునికి వికర్ణుడే అడ్డుతగలటం ఆశ్చర్యమనిపించింది. ఎందుకంటే వీళ్ళిద్దరూ గాంధారీ సుతులు. ఏకోదరులు అప్పుడనిపించింది. అప్పటి భారతంలో ఒక వికర్ణుడున్నాడు గానీ, ఇప్పటి భారతావనిలో వీధికో వికర్ణుడుంటేనే కానీ కాంతల కష్టాలు తీరబోవని. అలా వికర్ణుడు నా మటుకు నాకు హీరో అయిపోయాడు’’ అంటారు రచయిత. అధర్మాన్ని ఎదిరించి, ధర్మాన్ని నిలబెట్టడానికి ప్రయత్నించేవారే నేటి భారతావనికి అవసరం. అటువంటి ఋజువర్తన కలిగినవాడే మహాభారతంలోని వికర్ణుడు.

వికర్ణుడంతటి నిజాయితీపరుడు బాల్యంలో ఎలా ఉండి ఉంటాడు. కాస్త పెద్దయ్యాక మరెలా ఉంటాడు. ఇంకాస్త పెరిగాక ఇంకెలా ఉంటాడు… వంటి అంశాలను నాలో నేనే తర్కించుకున్నాను. ఆ విధంగా ఈ పుస్తకానికో రూపం వచ్చింది” అంటారు రచయిత.

వికర్ణుడి జీవితం విలక్షణమైనది. అతని ధీరోదాత్తమైన జీవితానికి – “మహోదయం, విషభేది, ప్రతిభకు పట్టం, నీతిబాట, కణికవ్యూహం, గురి..సిరి.., తప్పిన శిక్ష, రాజ(అ)సూయం, బహిష్కరణ, పూరుడు.. పూర్వజన్మ, త్రివిష్టపం కొండల్లో, యుద్ధం యుద్ధం, పునరాగమనం, మహాభినిష్క్రమణం” అనే అధ్యాయాలతో నవలారూపమిచ్చారు రచయిత.

వికర్ణుడి జననం, తోటి సోదరుల కంటే విభిన్నంగా పెరగడం, దుర్యోధనుడి కుతంత్రాలకు అడ్డు చెప్పడం, ధృతరాష్ట్రుడికి సుఖదకు పుట్టిన యుయుత్సుని మర్యాద కోసం సభలో వాదించడం, ద్రౌపదీ వస్త్రాపహరణ ఘట్టంలో దుర్యోధనుడిని ఎదిరించి రాజ్య బహిష్కరణ శిక్షకి గురవడం, తుదకు గాంధారి మాటకు కట్టుబడాలన్న ‘ధర్మానికి’ బద్ధుడై కురుక్షేత్రంలో కౌరవుల పక్షాన పోరాడి తనువు చాలించడం వరకూ సాగుతుంది కథ.

ధర్మాధర్మ విచక్షణ ఏ యుగంలోనైనా మానవులకు అవసరమైనదే. తాను తప్పు చేస్తున్నాడా ఒప్పు చేస్తున్నాడా అనేదీ ప్రతీ మనిషికి తెలుస్తునే ఉంటుంది. కానీ ఆ క్షణంలో మనిషిని ఏదో ఉన్మత్తత్తో లేదా దురావేశమే ఆవరిస్తుంది. ఒక్క క్షణం పాటు తనని తాను నిలవరించుకుని ఆలోచిస్తే.. ధర్మమార్గంలో చరించడానికి అవకాశం లభిస్తుంది. తనది కాని దానికి ఆశపడడం, బలవంతంగా చేజిక్కించుకోవాలనుకోవడం, విపరీతంగా కూడబెట్టాలనుకోవడం, ఎదిరించినవారిని అడ్డు తొలగించుకోవాలనుకోవడం, కుయుక్తులు పన్ని అప్రతిష్ఠ పాలు చేయడం, శారీరకంగా… కుదరకపోతే మానసికంగా వేధించడం, రాజనీతి పేరుతో తాము చేసేవాటిని సమర్థించుకోడం, పలుకుబడి సాయంతో తాము చేసిన నేరాలకు శిక్షను తప్పించుకోడం వంటివి ప్రతీ యుగంలోనూ ఉన్నాయి. ఇలాంటివి చేయకూడదు, తప్పు అని చెప్పేవాళ్ళూ అప్పుడూ ఉన్నారు, ఇప్పుడూ ఉన్నారు. అయితే ఆ కాలంలో వారి గొంతులు దృఢంగా వినబడేవి. ఈనాడు బలహీనమయ్యాయి. మంచి మాటలు చెబుదామన్నా, సమాజపు పోకడలకు వెరచి మాకెందుకులే అనుకునేవాళ్ళు ఎక్కువైపోయారు. మంచితనం చేతకానితనమైన కాలంలో వికర్ణుడిలాంటి వారి అవసరం ఎంతైనా ఉందని భావిస్తున్నారు రచయిత.

ఓ ధర్మపరుడి కథని సులభమైన శైలిలో, తేలికపాటి పదాలతో ఆసక్తిగా చదివించేలా వ్రాశారు రచయిత. పౌరాణిక కథకి తగ్గట్టుగా సంభాషణలున్నాయి.

‘‘సమయం వచ్చినపుడు మాట్లాడగలగాలి. వేళ మించిపోకుండా బలం చూపగలగాలి. కలసిరాని కాలంలో సైతం మంచివైపు నిలవగలగాలి. ధర్మం మాట్లాడగలగాలి. అదీ మనిషి జీవితానికి అర్థం. మానవ జీవితానికి పరమార్థం’’ అని నిండుసభలో ధర్మరాజుతో వికర్ణుడు పలికిన మాటలు ఏ కాలంలోనైనా ఆచరించదగ్గవే.

యుద్ధం ఎటువంటి వినాశనానికి దారితీస్తుందో వికర్ణుడు గాంధారితో చెప్పిన ఈ మాటలు – యుద్ధపిపాసులందరికీ ఓ హెచ్చరిక లాంటివి. “గౌరవం యుద్ధాల వల్ల రాదమ్మా. ధర్మం వల్ల వస్తుంది. నీతి నిజాయితీల వల్ల వస్తుంది. సమరం అంటే ఏమనుకుంటున్నావమ్మా. అది కలిగినవారి కొంగుబంగారం. లేనివారి దౌర్భాగ్యం. రాజులు చేసే యుద్ధంలో ఓడిపోయేది ఎవరమ్మా. పేదలే కదా. మహా అయితే కొందరు రాకుమారులు ఈ పోరులో చనిపోవచ్చు. కానీ, అక్షౌహిణీల కొద్దీ మరణించే సైనికులు బీదలు కాదూ. మీ వద్ద సేవకులుగా పనిచేస్తున్నవారూ కాదూ. రాజ్యకాంక్ష ఎంతటి ప్రమాదకరమో తెలుసా అమ్మా. అది కన్నవారిని, తోబుట్టువులను, బంధుమిత్రులను కూడా పాము తన పిల్లల్ని తానే తిన్నట్లు కబళిస్తుంది…”.

యుద్ధం తర్వాతి పరిణామాలు ఎంత వేదనాభరితంగా ఉంటాయో అద్భుతంగా చెప్పారు రచయిత. “ఇరుపక్షాలవారు ఒక్కలానే ఉన్నారు. యుద్ధానికి ముందు వారిలో ఎన్నయినా తేడాలుండవచ్చు. ఇప్పుడు మాత్రం వారిలో సమానతలు చాలానే ఉన్నాయి. కన్నీరు. బాధ. బెంగ. యాతన… ఇవీ ఇప్పుడు వారు సాధించుకున్నవి.”

“పోరాటంలో ఓడేవాడు మనిషి, ఓడించేవాడు మనిషే. మనిషి అనగానే ఎక్కడో ఒక మూల మానవత ఉండకపోదు. అది ఏదో ఒక క్షణాన బహిర్గతం కాకనూపోదు.” అంటారు రచయిత. ఆ మానవతకి వెలికితీయడానికి దోహదం చేసే వ్యక్తుల గురించి తెలుసుకోవడం అవసరం. అటువంటి వాడే వికర్ణుడు. వికర్ణుడి జీవితాన్ని తెలియజెప్పే ఈ పుస్తకం ఆశించిన ప్రయోజనం గొప్పది.

‘‘రాజ్యాన్ని సక్రమంగా పాలించడానికి, పేదలను ఆదుకోవడానికి కొన్ని సందర్భాల్లో శాస్త్రాలు ఉపకరించకపోవచ్చు. ధర్మగుణం, నీతి నిజాయితీలు తప్పక ఉపయోగపడతాయి. స్త్రీలు గౌరవాన్ని అందుకునేచోట మానవత ప్రకాశిస్తుంది. మహిళల ఔన్నత్యాన్ని కాపాడగలిగేది వికర్ణుని వంటివారే. వీరి సంఖ్య ఎంత పెరిగితే ప్రపంచానికి అంత ప్రయోజనం. వికర్ణుని చరితను ఔదలదాల్చగల సమాజం అమ్మలను గౌరవించగలదు. ఆరాధించగలదు. అందుకే వికర్ణుని నడత పదుగురికీ తెలియజేయండి. అతని గుణగానం చేయండి. ఇదే నేను ప్రధానంగా చేయగల ధర్మబోధ. ఈ యుగానికైనా, రేపటి కలియుగానికైనా…’’అని భీష్ముడి ద్వారా నవల చివరలో పలికించిన మాటలకు క్రియారూపం ఈ నవలే.

వృత్తిరీత్యా విలేఖరి అయిన డా. చింతకింది శ్రీనివాసరావు గారు రచించిన అలివేణీ ఆణిముత్యమా, దాలప్ప తీర్థం, నవ్య కవితారూపం నానీ – వివేచన, స్వరూపసుధ పుస్తకాలు కూడా ప్రఖ్యాతిగాంచినవే.

శ్రీనిజ ప్రచురణలు, విశాఖపట్నం వారు ప్రచురించిన ఈ 160 పేజీల నవల వెల 110/- రూపాయలు. ఈ పుస్తకం అన్ని ప్రముఖ పుస్తక విక్రయ కేంద్రాలలోనూ లభిస్తుంది. ఈబుక్ కినిగెలో లభ్యం.

కొల్లూరి సోమ శంకర్

ప్రచురణకర్త చిరునామా:

శ్రీనిజ ప్రచురణలు,

6-60/1, రవీంద్రనగర్, పాత డెయరీ ఫారం

విశాఖపట్నం-40

దేవరహస్యాన్ని వెల్లడించిన ‘సేతు రహస్యం’

SetuRahasyamFrontCover

 కొల్లూరి సోమ శంకర్

~

SomaSankar2014ఒక బర్నింగ్ ఇష్యూని ప్రధానాంశంగా తీసుకుని చేసే రచన ఆ ఇష్యూ ప్రజలలో నానుతున్నంతవరకూ వెలుగులో ఉంటుంది. సమస్య విస్మృతికి గురయ్యేసరికో లేదా తాత్కాలికంగా పరిష్కారమయ్యేసరికో, ఆ రచన మరుగున పడే ప్రమాదం ఉంటుంది. అయినా రిస్క్ చేసి ఆ రచనని ప్రచురించడం అంటే రచయితకి తనమీద, కథావస్తువుమీద అంత గట్టి నమ్మకం ఉన్నట్లు. ఈ విషయాన్నే మరోసారి ఋజువు చేసారు గంగ శ్రీనివాస్.

2005లో అప్పటి కేంద్ర ప్రభుత్వం సేతుసముద్రం షిప్పింగ్ కెనాల్ ప్రాజెక్టును ఆమోదించడంతో దేశవ్యాప్తంగా సంచలానికి దారితీసింది. రవాణా నౌకలు భారతదేశపు తూర్పుతీరం నుంచి పశ్చిమ తీరానికి చేరాలంటే శ్రీలంక మీదుగా వెళ్ళవలసి ఉంది. అంతే కాకుండా సమయం ఎక్కువ పడుతోంది. ఈ సమస్యని అధిగమించేందుకు గాను రామాయణ కాలంలో శ్రీరాముడిచే నిర్మించబడిందిగా భావిస్తున్న రామసేతువును కూల్చి ఆ ప్రాంతంలో కాలవ ఏర్పాటు చేయడం ద్వారా భారీ నౌకల ప్రయాణానికి వీలు కల్పించి, సరుకు రవాణా సమయాన్ని తగ్గించవచ్చనీ, ఇంధనాన్ని ఆదా చేయవచ్చని ప్రభుత్వం భావించింది. దేశవ్యాప్తంగా వెల్లువెత్తిన నిరసనలు, ఆందోళనలతో ప్రభుత్వం పలు కమిటీలు వేసింది. ప్రజల మధ్య వాదోపవాదాలు జరిగాయి.

విశ్వాసానికి, హేతుబద్ధతకీ పొసగడం ఎప్పుడోగాని జరగదు. శ్రీరాముడు కట్టించిన వారధిని కూలిస్తే ఊరుకోమని హిందూ సంస్థలు, ప్రాజెక్టును అమలుచేస్తే ఆ ప్రాంతంలో వాణిజ్యం అభివృద్ధి చెంది, పరిశ్రమలు వస్తాయనీ, స్థానికులకు ఉద్యోగాలు లభిస్తాయని మరికొన్ని సంస్థలు జగడానికి దిగాయి. ఈ నేపథ్యంలో రామసేతు పూర్వపరాలను వివరిస్తూ వ్రాసిన నవల “సేతు రహస్యం”. వాస్తవాలకి కాస్త కల్పన జోడించి రామాయణ గాథలోని పద్యాలను అవసరమైన చోట ఉపయోగించుకుంటూ కథని నడిపారు రచయిత.

దేశ విదేశాలలో రామసేతువు ఒక బర్నింగ్‌ ఇష్యూగా మారి, ఈ సెగలు విదేశాలలోని ప్రవాస భారతీయులను కూడా తాకుతాయి. అక్కడ కూడా వాదోపవాదాలు జరుగుతాయి, కాని సత్యాన్వేషణ మాత్రం జరగటం లేదని తలచి, ఆ దిశగా సన్నాహాలు చేస్తారు ప్రవాస భారతీయులు. వివిధ దేశాలలో ఉంటున్న ప్రవాస భారతీయులంతా కలసి ”వరల్డ్‌ విశ్వశాంతి ఫెడరేషన్‌” గా ఏర్పడి, వివిధ సంస్థలతో కలసి పని చేయాలని ఏకాభిప్రాయానికి వస్తారు.
వారి ప్రయత్నాలలో భాగంగా ఒక కోర్‌ టీమ్‌ భారతదేశానికి సత్యాన్వేషణకై వస్తుంది. వారు ఎటువంటి ప్రయత్నాలు చేస్తారు, ఏవిధంగా వారి సత్యాన్వేషణ సాగుతుంది, సత్యం ఏమి అనేదే ఈ నవలలోని అంశం.

GangaSrinivas

లక్ష్యానికి తగిన కార్యసాధకులను ఎంచుకోవడంతోనే విజయానికి తొలి అడుగు పడుతుంది. సాగర గర్భంలో అన్వేషణలు కొనసాగించడంలో అనుభవమూ, విశేష నైపుణ్యం ఉన్న శ్రీధర్ చాగంటి, ఓ పరిశోధనా నౌకలో సిస్టమ్ అనలిస్ట్‌గా పనిచేసే రాజేశ్, సముద్ర సంపదనీ, పర్యావరణాన్ని కాపాడడానికి కృషి చేసే కేథరిన్, శ్రీలంక ఆర్కియాలజీ డిపార్ట్‌మెంట్ రిటైర్డ్ ఆఫీసర్ డా. విజయ సోమదేవ రామసేతువు సహజసిద్ధమైనదా, మానవ నిర్మితమైనదో నిగ్గు తేల్చే బృందంలో కీలక సభ్యులు.

తమ ఈ ప్రయత్నాలనీ అమెరికాలోని ఓ యూనివర్సిటీ, భారతదేశంలోని మరో ప్రముఖ విశ్వవిద్యాలయం యొక్క సంయుక్త పరిశోధనా ప్రాజెక్టుగా ప్రారంభిస్తారు. కార్యాచరణ మొదలై, బృందంలోని సభ్యులు తమ ప్రయత్నాలను వేగవంతం చేసేసరికి కొత్త కొత్త సమస్యలు ఎదురవుతాయి. రామాయాణాన్ని సంపూర్ణంగా తెలుసుకోవాలనుకుంటారు. రామాయణాన్ని వ్యాఖ్యానించడంలో విశేష అనుభవం ఉన్న భట్టుమూర్తి అనే పండితుడిని కలసి రామాయణం గురించి తెలుసుకుంటారు, తమ సందేహాలు తీర్చుకుంటారు. వీరు తమ పరిశోధనలలో ఎదురైన ఆటంకాలను ఎదుర్కోడానికి ఆధ్యాత్మికతనీ, శాస్త్రీయతని సమన్వయం చేస్తారు. ప్రాచీన గ్రంథాలలో చెప్పిన అంశాలకు వర్తమాన సాంకేతికని అన్వయించి ఆ యా అంశాలను ధృవీకరించుకుంటారు.

రామసేతువుని నలుని ఆధ్వర్యంలో ఐదు రోజులలో నిర్మించారు. వరుసగా, 14, 20, 21, 22, 23 యోజనాల చొప్పున నూరు యోజనాల పొడవు, పది యోజనాల వెడల్పు ఉన్న వారధి నిర్మించబడింది. రోజుకి 20 యోజనాలు కాకుండా, ఇలా వివిధ సంఖ్యలతో నిర్మించడం వెనుక ఉన్న దేవరహస్యం ఏమిటి? దానిని ఈ బృందం ఎలా కనిపెట్టిందనేది ఆసక్తికరం. అసలు యోజనం అంటే ఎంత దూరం? క్రోసు అంటే ఎంత దూరం? రాజస్థాన్‌లోని థార్ ఎడారి ఇసుక అడుగున ఒకప్పుడు ఎంతో ఘనమైన సంస్కృతి ఉన్న నాగరికత వర్ధిల్లిందా? ఆ నాగరికతకీ రామాయణానికి సంబంధం ఏమిటి? నవల ముగింపులో రామసేతువు నిర్మాణంలో వాడిన ఓ భారీ శిలను సముద్రం నుంచి బయటకి తెచ్చినట్లు, దానిలో ఓ రహస్య గది ఉన్నట్లు చెబుతారు రచయిత. ఆ గదికున్న తలుపు తెరవడానికి శ్రీధర్ ఏం చేసాడు? ఇంతకీ ఆ గదిలో ఏముంది? ఇలా ఎన్నెన్నో ప్రశ్నలకు ఈ నవల జవాబులు చెబుతుంది.

రామాయణ ఘట్టం ఆధారంగా ఈ నవలని సృజించినా, మతం ముద్ర పడకుండా జాగ్రత్త వహించారు రచయిత. ఎక్కడా విసుగనిపించకుండా, ఆసక్తిగా చదివింపజేస్తుందీ నవల.

పుస్తకంలో అక్కడక్కడా బాక్స్ ఐటమ్స్‌లా ప్రాచీన సాంకేతికతకి, రహస్యాలకి సంబంధించిన చక్కని వివరాలు అందజేసారు. ఎటువంటి సాంకేతిక ఉపకరణాలు లేని రోజులలోనే వెనిస్‌కి చెందిన జెనో సోదరలు 14వ శతాబ్దిలోనే గ్రీన్‌లాండ్, ఐస్‌లాండ్‌ల మాప్ అత్యంత ఖచ్చితంగా తయారు చేయడం; 1895లో దేశంలో మొట్టమొదటి విమానయానం జరిగిన వైనం; సౌదామిని కళ గురించి, అమ్ముబోధిని గురించి చెప్పిన స్వల్ప వివరణ వాటి గురించి పూర్తిగా తెలుసుకోవాలనే ఆసక్తి కలిగిస్తుంది. శ్రీలంకలో సీతను ఉంచిన గాధకి సంబంధించి ఇప్పటికీ అక్కడ ఉన్న సీత ఏలా, సువార ఎలియా అనే ప్రదేశాల గురించి వివరించారు. సప్తఋషులలో ఒకరైన భారద్వాజ మహర్షి రచించిన అంశుబోధిని అనే వైమానిక శాస్త్రం గురించి, ప్రాచీన విమానాల గురించి చెప్పారు. 12 రకాల మేఘాల గురించి, వాటి లక్షణాల గురించి, 64 రకాల విద్యుల్లతల గురించి, 32 రకాల పిడుగుల గురించి అత్రి మహర్షి విశదీకరించినట్లు తెలియజేసారు. ప్రకాశ స్థంభన బిడలోహంతోనూ, తమోగర్భలోహంతోనూ నిర్మించే విమానాలు ప్రత్యర్థుల రాడార్లకు అందవని తెలియజేసారు. గల్ఫ్ ఆఫ్ మన్నార్‌లో ఒకప్పుడు డ్యుగోంగ్ అనే మత్స్య జాతి ఉండేడని, ఈ చేపలు క్షీరదాలని, చూడ్డానికి మత్స్యకన్యలుగా ఉండేవని చెప్పారు. ప్రస్తుతం ఈ జాతి చేపలు అంతరించిపోతున్నాయని తెలుస్తోంది. ఈ బాక్స్ ఐటమ్ అంశాలన్నీ ఆసక్తికరంగా ఉంటాయి.

రామసేతువుని అసలైన ప్రేమచిహ్నంగా నిలపాలన్న రచయిత ఆలోచన వినూత్నమైనది. సృష్టి ప్రచురణలు వారు 2008లో ప్రచురించిన ఈ 168 పేజీల నవల వెల రూ. 120/- అన్ని ప్రముఖ పుస్తక కేంద్రాలలోనూ, కినిగె.కాం లోను లభిస్తుంది.
*

ఉత్కంఠగా చదివించే “భైరవ వాక”

?

-కొల్లూరి సోమశంకర్ 

 

~

కొల్లూరి సోమశంకర్

ఓ సుప్రసిద్ధ ఆలయం, దాని చరిత్ర, అక్కడి ఆచార సంప్రదాయాలను కథలో భాగంగా చెబుతూ ఆ ఆలయాన్ని దోచుకోవాలనుకునే ముఠా ప్రయత్నాలను, తమని తాము పేల్చేసుకుని భయంకరమైన ఉత్పాతం సృష్టించాలన్న తీవ్రవాద శక్తుల కుట్రలనూ వెల్లడిస్తూ, పాఠకులను అనుక్షణం ఉత్కంఠకు గురిచేసే నవల “భైరవ వాక“.

ప్రసిద్ధ రచయిత ఇందూ రమణ వ్రాసిన ఈ నవల తొలుత 16 వారాల సీరియల్ పోటీలో బహుమతి పొంది స్వాతి సపరివార పత్రికలో ప్రచురింపబడింది.

ఆరుగురు సభ్యులున్న ఓ ముఠా ముంబయిలో సమావేశమై పథక రచన చేస్తుండగా కథ ప్రారంభమవుతుంది. తమ రహస్యం వినిందనే అనుమానంతో పనిమనిషిని అత్యంత దారుణంగా హత్య చేయడంతో ముఠా సభ్యులు ఎంత క్రూరులో పాఠకులకు అర్థమవుతుంది. ముందుగా వేసుకున్న ప్రణాళిక ప్రకారం ముఠా సభ్యులు తమకి అప్పగించిన బాధ్యతలను నిర్వర్తించడానికి విడిపోతారు. కథ ఆంధ్ర రాష్ట్రానికి మారుతుంది.

ఉత్తరాంధ్ర ప్రాంతంలో ప్రసిద్ధి చెందిన చందనపురి, భైరవ వాక క్షేత్రాలను దర్శించడానికి పక్క రాష్ట్రమైన ఒరిస్సా నుంచి కూడా ఎందరో భక్తులు వస్తూంటారు. పాత్రో అనే మధ్యతరగతి కుటుంబీకుడు తన ముసలి తల్లిదండ్రులు, భార్యాపిల్లలు, పనిమనిషితోనూ చందనపురికి రైల్లో బయల్దేరుతాడు. ఓ తెలుగు మిత్రుడి సలహాతో విశాఖపట్నం వరకు వెళ్ళకుండా చందనపురి స్టేషన్‍లో దిగుతాడు. ఉత్సవదినాలు కావడంతో ఆ ప్రదేశమంతా వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన భక్తులతో కిటకిటలాడుతూంటూంది. ఏం చేయాలో తోచదు పాత్రోకి.

ఆ సమయంలో పాత్రోని ఒరియాలో పలకరిస్తాడు పాండే అనే వ్యక్తి. పరాయి ప్రాంతంలో సొంత భాషలో మాట్లాడిన పాండేని చూడడంతో కాస్త ధైర్యం వస్తుంది పాత్రోకి.  తానొక గైడ్‌నని, క్షేత్ర దర్శనం చేయిస్తానని, వాళ్ళకి తోచినంత డబ్బు ఇవ్వమని బ్రతిమాలుకుంటాడు పాండే. అయిష్టంగానే అంగీకరిస్తాడు పాత్రో.

ఇక్కడ ప్రముఖ క్షేత్రాలలో యాత్రికులు పడే అవస్థలను ప్రస్తావిస్తారు రచయిత. బస్ టికెట్ల నుంచి, బస, ఆహారం, స్నానాలు, పూజలు, అమ్మకాలు, పూజాదికాలు వరకూ… దివ్యక్షేత్రాలలో అడుగడుగునా జరిగే మోసాలు, దోపీడీల గురించి కథాక్రమంలో వివరిస్తారు.

పాండే కన్ను ఈ కుటుంబంలోని ఆడవాళ్ళపై పడుతుంది. పాత్రో భార్య శశికళని, పనిమనిషి అరుంధతిని ఏకకాలంలో కామిస్తాడు. అరుంధతి కూడా పాండే పట్ల ఆకర్షితురాలవుతుంది. అతడిని రెచ్చగొడుతుంది. చందనపురి చేరాకా అక్కడి వ్యాపారులు, అధికారుల వల్ల అడుగడుగునా ఇబ్బందులని ఎదుర్కుంటుంది పాండే కుటుంబం.

కర్రపుల్లలు, బియ్యం, కూరలు కొనుక్కొచ్చి, నానా తంటాలు పడి అన్నం వండుకుంటారు పాత్రో వాళ్ళు. ఆకుల్లో వడ్డించుకుని తినబోతున్న సమయానికి ఓ పిచ్చిది వచ్చి అన్నాన్ని చెల్లాచెదురు చేసేసి వాళ్ళ ఆకుల్లోంచి గబగబా నాలుగు ముద్దలు తినేసి పారిపోతుంది. ఆ కుటుంబం నిస్సహాయంగా చూస్తూ ఉండిపోతుంది. కాసేపటికి తేరుకున్న పాత్రో తన వాళ్ళందరిని దగ్గరలోని హోటల్‍కి తీసుకువెడతాడు. పాచిపోయిన అన్నం పెట్టి, ప్లేటుకి యాభై రూపాయలు వసూలు చేస్తాడా హోటల్ యజమాని. ఇదేమని ప్రశ్నిస్తే పాత్రోని అవహేళన చేస్తాడు.

పిచ్చి యువతి పాండేకి ఎదురుపడడంతో కథలో మరో ఘట్టానికి నాందీ ప్రస్తావన జరుగుతుంది. ఆ యువతి నిజానికి పిచ్చిది కాదనీ, అలా నటిస్తోందని, ఆమె పేరు మోనిషా అని తెలుస్తుంది. పాండే కూడా గైడ్ కాదని, మోనిషాతో కలసి ఆ క్షేత్రంలో తిష్ట వేసి చోరికి మార్గం సుగమం చేయడమే అతని పనని తెలుస్తుంది. ఈ క్రమంలో అరుంధతితో మరింత సన్నిహితమవుతాడు పాండే. పాత్రో కుటుంబం నుంచి ఆమెని దూరం చేయాలని ఆలోచిస్తాడు.

మందిరం దోచుకోవాలనుకునే సమయం ఆసన్నమవుతూంటుంది. ముఠాలోని మిగతా సభ్యులంతా చందనపురి, భైరవ వాక చేరుకుంటారు. భక్తుల్లా నటిస్తూ ముందుగా అనుకున్న ప్రకారంగా ఆలయంలోకి ప్రవేశించాలనేది వారి పథకం.

?

ఇదే సమయంలో పాత్రో కుటుంబం కూడా భైరవ వాక చేరుతుంది. తాను లోపలికి రాకూడదని చెప్పి అరుంధతి ఆలయం బయటే ఆగిపోతుంది. అది చూసి ఆమెకి తోడుగా పాండే కూడా బయటే ఆగిపోతాడు. గుడిలోకి వెళ్ళాకా పాత్రో అక్కడ జరుగుతున్న అక్రమాలను చూసి నివ్వెరపోతాడు. నిర్వాహకులను ఏమీ అనలేక, నిస్సహాయంగా ఉండిపోతాడు. అరుంధతితో పాటు గుబురుగా ఉన్న పొదల చాటుకి చేరుతాడు పాండే. తమ కోరిక తీర్చుకోబోతుండగా వినబడిన మాటలు, కనబడిన దృశ్యం పాండేని నివ్వెరపరుస్తాయి. ఇద్దరు తీవ్రవాదులు పొదలమాటున నక్కి తమ రూపాలు మార్చుకుని నడుములకి బెల్ట్ బాంబులు ధరించి భక్తుల వేషాలలో మందిరం వైపు కదులుతారు. ఒకడు భైరవ వాక ఆలయం వైపు వెడితే, రెండో వాడు చందనపురిలో విధ్వంసం సృష్టించడానికి బయల్దేరుతాడు.

విపరీతమైన రద్దీగా ఉన్న ఆ ప్రాంతంలో ఆత్మాహుతి దాడి జరిగితే ప్రాణనష్టం అధికంగా ఉంటుందనీ, దాంతో పోలీసులు, అధికారుల బెడద తీవ్రమవుతుందని భావించిన పాండే ఆ తీవ్రవాదిని పట్టుకోడానికి ప్రయత్నిస్తాడు. అది గమనించిన తీవ్రవాది కొంచెం దూరం పరిగెట్టి తనని తాను పేల్చేసుకుంటాడు. ఆ ప్రాంతమంతా రణభూమిగా మారిపోతుంది. తీవ్రవాది చేతిలో ఉన్న సంచీని చేజిక్కించుకుని అరుంధతితో సహా పారిపోతాడు పాండే. ఆ సంచీని తెలివిగా పోలీసులకు అందేలా చేస్తాడు.

ఈ లోపు మరో తీవ్రవాది చందనపురి చేసి దర్శనం క్యూలో కలసిపోతాడు. పాత్రో కుటుంబం, అరుంధతి, పాండే, మోనీషా, ముఠాలోని ఇతర సభ్యులు అందరూ దర్శనం క్యూలో చేరతారు. జనాలు విపరీతంగా ఉండండంతో క్యూ అసలు కదలదు. లభించిన ఆధారాలతో చురుకుగా వ్యవహరించిన పోలీసులు రెండో తీవ్రవాది క్యూలోనే ఉన్నాడని తెలుసుకుంటారు. అతడిని పట్టుకోడానికి రకరకాలుగా ప్రయత్నిస్తారు. ఓ దశలో భక్తులందరికీ మత్తు కలిపిన ప్రసాదం పంచాలని ఆలోచిస్తారు. ఈలోపు పాండే ఓ ఉపాయం పన్ని తీవ్రవాది దొరికిపోయేలా చేస్తాడు. పాత్రో కుటుంబం, ముఠా సభ్యులు ఆలయంలోకి ప్రవేశిస్తారు. పాత్రో కుటుంబం బయటకి వస్తుంది గాని ముఠా సభ్యులు ఆలయం ప్రాంగణం లోపలే దాగి ఉంటారు.

చీకటి పడి ఆలయం మూసేసి పూజారులు అధికారులు వెళ్ళిపోయాకా, చోరికి పాల్పడతారు. ఆఖరినగ తీసుకోబోతుంటే అలారం మ్రోగుతుంది. పోలీసులు చుట్టుముట్టే లోపు దొంగలందరూ తప్పించుకుంటారు.

ఇంటికి వెడదామని బయల్దేరిన పాత్రో తన సూట్ కేసులు, ఇతర వస్తువులని పోగొట్టుకుంటాడు. చేతిలో పైసా కూడా లేకుండా తమ ఊరు వెళ్ళడం కోసం చందాలు అడుగుతూ పాండేకి కనబడతాడు. తన దగ్గర ఉన్న దేవుడి నగలలోంచి ఓ నగని ఇచ్చి అది అమ్ముకుని వచ్చిన డబ్బుతో ఊరు వెళ్ళమంటాడు. కాని ఆ నగని అమ్మే ప్రయత్నంలో పోలీసులు పాత్రోని అనుమానించి, దోపిడీలో అతనికి భాగం ఉందని అరెస్టు చేస్తారు. విశాఖపట్నంలో అరుంధతితో లాడ్జిలో ఉన్న పాండే టీవీ ద్వారా ఈ విషయం తెలుసుకుంటాడు. తనని ఎంతగానో ఆదరించిన పాత్రో కుటుంబానికి ఇలా జరిగినందుకు ఎంతగానో బాధపడుతుంది అరుంధతి. తన వల్ల ఓ కుటుంబం అపాయంలో చిక్కుకోడం భరించలేకపోతాడు పాండే.

నిజమైన ప్రేమ పాషాణ హృదయాన్ని సైతం కరిగిస్తుందనే నానుడిని నిజం చేస్తూ, పాండేలో పరివర్తన కలుగుతుంది. అప్రూవర్‌గా మారి, పోలీసులకు సహకరించి ముఠాని, సొత్తుని పట్టిస్తాడు. పాత్రో కుటుంబాన్ని రక్షిస్తాడు.

నవలలోని ప్రథాన సంఘటన పాఠకులకి ముందుగానే తెలిసిపోయినా, కథని చివరిదాకా చదివించడంలో కృతకృత్యులయ్యారు రచయిత. ఓ క్రైమ్, సస్పెన్స్ నవలలో ఉండాల్సిన బిగి, ఒడుపు అన్నీ ఈ నవలలో పుష్కలంగా ఉన్నాయి. పాఠకులను ఏకబిగిన చదివించి, వారి మనసులను రంజింపజేస్తుందీ నవల. ఉత్కంఠగా చదివించే ఈ నవలని 2012లో “శ్రీ లోగిశ ప్రచురణలు” వారు ప్రచురించారు. 224 పేజీలున్న ఈ నవల వెల రూ.150/- (ప్రస్తుతం ధర మారి ఉండచ్చు). ప్రచురణకర్తల వద్ద, విశాలాంధ్ర వారి అన్ని కేంద్రాలలోనూ ప్రింట్ బుక్ లభిస్తుంది. ఈబుక్ కినిగెలో లభ్యం.


 

ప్రచురణకర్తల చిరునామా:

శ్రీ లోగిశ ప్రచురణలు, డోర్ నెంబరు 7-50, శ్రీ సాయి నిలయం, బంగారమ్మ గుడి దగ్గర, సింహాచలం, విశాఖపట్నం 530028

 

గిలిగింతలు పెట్టి నవ్వులు పూయించే నవల “ప్రేమలేఖ”

 

 

SomaSankar2014

కొల్లూరి సోమశంకర్

ప్రముఖ రచయిత్రి శ్రీమతి పొత్తూరి విజయలక్ష్మి గారు రచించిన తొలి నవల “ప్రేమలేఖ”. ఎందరో రచయిత్రులు తమ రచనల ద్వారా తెలుగు సాహిత్యాన్ని ప్రభావితం చేసినా, పొత్తూరి విజయలక్ష్మి గారి ప్రభావం విలక్షణమైనది. సాంఘిక ఇతివృత్తాలతో కొన్ని రచనలు చేసినా, హాస్యకథలు ఆవిడ ప్రత్యేకత. సున్నితమైన హాస్యంతో, కథన నైపుణ్యంతో రచనలు చేయడం పొత్తూరి విజయలక్ష్మి గారి శైలి. తొలుతగా 1982 అక్టోబర్ నెల చతుర మాసపత్రికలో ప్రచురితమైన ఈ నవల “శ్రీవారికి ప్రేమలేఖ” సినిమాకి మూలం.

***

కథానాయకుడు ఆనందరావు అమాయకుడు, అందగాడు. బి.ఇ. పాసయి తల్లిదండ్రులకు దూరంగా హైదరాబాదులో ఏదో ఓ పెద్ద కంపెనీలో ఉద్యోగం చేస్తూంటాడు. ఆనందరావుకి తండ్రి పరంధామయ్య పెళ్ళి సంబంధాలు చూస్తూంటాడు. త్వరగా పెళ్ళి చేసుకోమని ఉత్తరాల మీద ఉత్తరాలు రాసేస్తు ఉంటాడు. పరంధామయ్యది అదో రకం స్వభావం. తాటాకుమంటల్లా ఎప్పుడూ చిటపటలాడిపోతుంటాడు. తండ్రి అంటే మా చెడ్డ భయం ఆనందరావుకి. ఒక్క ఆనందరావుకేం ఖర్మ, అతని అన్నయ్య భాస్కరరావుకి, అక్క కామేశ్వరికి, వదిన అన్నపూర్ణకి, బావ సూర్యానికి, అమ్మ మాణిక్యంబకీ కూడా భయమే.

ఈ నేపథ్యంలో ఓ నడి వేసవి రోజున మిట్టమధ్యాహ్నం లంచ్ చేయడానికి తన కాబిన్‍లోంచి బయటకి వస్తాడు ఆనందరావు. అతని సెక్రటరి మార్గరెట్ అతనికొచ్చిన పర్సనల్ లెటర్స్ అందిస్తుంది. ఏసి హోటల్లో కూర్చుని ఒక్కో ఉత్తరం చదువుతూంటాడు. మొదట తండ్రి ఉత్తరం, తరువాత అక్క ఉత్తరం చదువుతాడు. మూడోదే.. అసలైనది… “ప్రియా” అనే సంబోధనతో మొదలవుతుంది. ఉలిక్కిపడతాడు. తనకేనా సంశయపడతాడు. ఆ ప్రేమలేఖ చదివి తన్మయుడవుతాడు. పరవశుడవుతాడు. ఇక అక్కడ్నించి, ఆ ఉత్తరం వ్రాసిన సోనీ ఎవరో తెలుసుకోడానికి నానా పాట్లు పడతూంటాడు.

ఇక కథానాయకి స్వర్ణలతకి పెద్దగా చదువబ్బదు. తండ్రి బలవంతంమీద ఏదో చదువుతున్నానని అనిపించుకుంటుంది. తనకి పెళ్ళీడు వచ్చేసిందని, తండ్రి గ్రహించకుండా ఇంకా చదువు చదువు అని పోరుతున్నాడని ఆమె అభిప్రాయం. ఆమె తండ్రి తిలక్‌కి కూతుర్లిద్దరినీ బాగా చదివించాలని ఆశ. పెద్ద కూతురు హేమలత బిఎ పూర్తి చేయగానే మధుసూదనం ఆమెని ఇష్టపడి పెళ్ళిచేసుకుంటాడు.  సరే పెద్ద కూతురు పెళ్ళి చేసుకుని వెళ్ళిపోయిందికదా, చిన్న కూతురినైనా గొప్ప విద్యావంతురాలిని చేయాలని ఆయన తపన. కానీ స్వర్ణ కేమో చదువుకన్నా పెళ్ళి మీదే ధ్యాస ఎక్కువవుతుంది. చివరికి అనుకున్నదే అవుతుంది. బిఎస్సీ తప్పుతుంది, ఇక స్వర్ణకి పెళ్ళి చేసేయడమే మంచిదనే నిర్ణయానికొస్తాడు తండ్రి.

Premalekha back cover

సోనీని మనసులో ఉంచుకుని ఆనందరావు, ఆడపిల్లలు మగపిల్లలకి ఏ మాత్రం తీసిపోరనే భావంతో స్వర్ణలత తమకొచ్చిన సంబంధాలను తిరగగొడుతుంటారు. చివరికి ఆనందరావుకి పిచ్చి అని, స్వర్ణకి పొగరు అని ముద్ర పడిపోతుంది. ఆనందరావుకి వచ్చే సంబంధాల క్వాలిటీ ఏ 1 నుంచి సి 3కి పడిపోతుంది. స్వర్ణ గురించి పుకార్లు వ్యాపించిపోతాయి.

అదృష్టవశాత్తు, రెండు కుటుంబాల పెళ్ళిళ్ళ పేరయ్యలు బంధువులు కావడంతో, ఆనందరావు కుటుంబానికి, స్వర్ణలత కుటుంబం గురించి చెప్పి పెళ్ళి చూపులకి వప్పిస్తారు.

ఇక ఇక్కడ్నించి కథ వేగం పుంజుకుంటుంది. అపార్థాలు, అలకలు, అనుమానాలు, సందేహా నివృత్తులు… అన్నీ జరిగిపోయి కథ సుఖాంతం అవుతుంది.

 

***

కథ చాలా వరకు సంభాషణల రూపంలో నడవడం వల్ల హాస్యం జొప్పించడం తేలికైంది. కథనంలో సన్నివేశాన్ని హాస్యభరితంగా సృజించడం కన్నా, పాత్రల మధ్య సంభాషణలని హాస్యంతో నింపితే ఆ సంఘటన పాఠకుల మనస్సులను సులువుగా తాకుతుంది. నవలలోని ఒక్కో పాత్రకి ఒక్కో లక్షణం. వాటన్నింటిని మేళవిస్తూ, కుటుంబ సభ్యుల్లో అంతర్లీనంగా ఉండే ఆపేక్షలు, అనుబంధాలను వెల్లడిస్తుందీ నవల.

సినిమాగా వచ్చిన నవల కాబట్టి నవలనీ, సినిమాని పోల్చుకోకుండా ఉండలేరు. సినిమాలో “తొలిసారి మిమ్మల్ని చూసింది మొదలు..” పాటకి ఏ మాత్రం తీసిపోదు నవలలోని ప్రేమలేఖ.  ఆ పాట విని పెళ్ళి కాని వారు ఊహాలోకాల్లోకి వెళ్ళిపోతారు. నవలలోని ప్రేమలేఖని చదివినా కూడా అదే ఎఫెక్ట్. పెళ్ళయిన వాళ్ళు తమ తొలినాళ్ళని గుర్తు చేసుకుంటారు.

సినిమాలోని సంభాషణలు, సన్నివేశాలు కూడా చాలా వరకు నవలలోవే కావడం వల్ల దర్శకుని సృష్టిగా భావించినవి.. నిజానికి మూల రచయిత్రి సృజన అని తెలుసుకుని విస్తుపోతారు పాఠకులు.

***

హాయిగా నవ్విస్తూ, చివరిదాకా ఆసక్తిగా చదివించే నవల “ప్రేమలేఖ”. 142 పేజీల ఈ నవలని శ్రీ రిషిక పబ్లికేషన్స్ వారు ప్రచురించారు. రూ. 80/- వెల గల ఈ పుస్తకం సోల్ డిస్ట్రిబ్యూటర్స్ నవోదయ పబ్లిషర్స్, కాచీగుడా, హైదరాబాద్. ఈ-బుక్ కినిగెలో లభ్యం.

*

 

ఇరవయ్యేళ్ళ తరవాత కూడా…ధ్యేయం!

 

కొల్లూరి సోమ శంకర్

కొల్లూరి సోమశంకర్

సుమారు పాతికేళ్ళకు పైగా సాహిత్య రంగాన్ని ప్రభావితం చేసిన ఓ సుప్రసిద్ధ రచయిత రచించిన పుస్తకాలలో ఏది మంచిది లేదా ఏది ఉత్తమమైనదనే ప్రశ్న తలెత్తినప్పుడు పాఠకులందరూ ఒకే నవలని లేదా ఒకే పుస్తకాన్ని ది బెస్ట్‌గా పేర్కొనడం చాలా అరుదు.

యండమూరి వీరేంద్రనాథ్! ఈ పేరు చదవగానే ఎన్నో అద్భుతమైన నవలలు మనసులో మెదులుతాయి. వెన్నెల్లో ఆడపిల్ల, ఆనందోబ్రహ్మ, అంతర్ముఖం, అంకితం, యుగాంతం, చీకట్లో సూర్యుడు, కాసనోవా 99, ఆఖరి పోరాటం, 13-14-15, డబ్బు టు ది పవర్ ఆఫ్ డబ్బు, డబ్బు మైనస్ డబ్బు, మరణ మృదంగం, రాక్షసుడు, అనైతికం, రెండు గుండెల చప్పుడు, ప్రార్థన, నల్లంచు తెల్లచీర, ప్రేమ, డేగ రెక్కల చప్పుడు, ఓ వర్షాకాలం సాయంత్రం… ఇలా నవల ఏదైనా… విభిన్నమైన ఇతివృత్తాలతో చదువరులలో ఉత్కంఠను రేకెత్తిస్తూ, ఆసక్తి కలిగేలా వ్రాయగలడంలో దిట్ట శ్రీ యండమూరి వీరేంద్రనాథ్. కమర్షియల్ నవలలోనూ చక్కని సందేశాన్ని అంతర్లీనంగా జొప్పించి పాఠకులకు, ప్రచురణకర్తలకూ ఉభయతారకంగా ఉండేలా వ్రాయగల నేర్పరి ఆయన.

యండమూరి గారు నవలలతో పాటు మనోవిశ్లేషణ/వ్యక్తిత్వ వికాసం పుస్తకాలు కూడా రచించారని పాఠకులందరికీ తెలుసు. “మిమ్మల్ని మీ పిల్లలు ప్రేమించాలంటే?” అనే మనోవిశ్లేషణా రచన వెలువడిన తర్వాత సుప్రభాతం పక్షపత్రికకి ధారావాహిక వ్రాయాల్సి ఉన్నప్పుడు – “నాకు కమర్షియల్ గిమ్మిక్కులు లేకుండా సామాజిక ప్రయోజనం ఉండేట్లు నిజ జీవితాన్ని ప్రతిబింబించేలా ఒక నవల వ్రాయండి” అని ఆ పత్రికాధిపతి రత్తయ్య గారు అడిగారట! ఫలితమే “ధ్యేయం” అనే నవల!

20 జనవరి 1993 నుంచి 5 మార్చి 1994 వరకు, కథనానికి తగ్గ బొమ్మలతో (చిత్రకారుడు ‘గడియారం శ్రీ’) సుప్రభాతం పత్రికలో సీరియల్‌గా వెలువడింది [సీరియల్‌ పూర్తయ్యాక ఈ నవలని నేను బైండ్ చేసి ఉంచుకున్నాను… ఈ తేదీల వివరాలన్నీ అందులోంచే…]. తొలిసారి ప్రచురితమై దాదాపు 21 ఏళ్ళు దాటినా నవల ప్రాసంగిత ఏ మాత్రం తగ్గలేదనడంలో అతిశయోక్తి లేదు.

సీరియల్ ఆఖరి భాగంలో ‘ఇదీ కథ’ అనే బాక్స్ ఐటమ్‌లో “చెట్టుని చూసి మనిషి నేర్చుకోవలసింది చాలావుంది. కాండాన్ని కత్తిరించినా పక్కనుంచి చిగురేస్తుంది. కానీ మనిషి – చిన్న కష్టానికే బెంబేలు పడిపోతాడు. అలా పడకూడని శక్తి, పిల్లలకి పెద్దలే ఇవ్వాలి. .. పెద్దలకే ఆ శక్తీ, అవగాహన లేకపోతే మరి పిల్లల భవిష్యత్? తన లక్ష్యాన్ని చేరుకోడానికి మనిషేం చేయాలన్నదే ‘ధ్యేయం’ ఇతివృత్తం.” అంటూ నవల సారాంశాన్ని క్లుప్తంగా చెప్పారు.

***

పిల్లల ఎదుగుదలలో కౌమార, యవ్వన దశలు అతి ముఖ్యమైనవి. వారి జీవితాలను నిర్దేశించే దశలు కూడా ఇవే. ‘చిన్న పిల్లలు, వాళ్ళకేం తెలుసు’ అనుకునే తల్లిదండ్రులు కొందరు; ‘పిల్లల్ని స్వేచ్ఛగా వదిలేస్తే, వాళ్ళే నేర్చుకుంటారు’ అనుకునే అమ్మానాన్నలు మరికొందరు. ఇద్దరిదీ తప్పే!

తాము చేరుకోలేని గమ్యాలకి తమ పిల్లలని చేర్చి తృప్తి పడాలనుకునే తల్లిదండ్రులది మరో రకం తప్పు. తాము తప్పులు చేస్తూ, ఆత్మవంచన చేసుకుంటూ, ఎదుటి వారి గోరంత పొరపాట్లను కొండంత చేసి ఎగతాళి చేసే పెద్దలది మరో తరహా తప్పు.

ఇన్ని తప్పుల మధ్య ఒప్పుగా పిల్లలని పెంచడం అతి తక్కువ మందికే సాధ్యమవుతుంది. పిల్లల బాల్య, యవ్వన దశలు తల్లిదండ్రులకే కష్టమైన కాలం. పిల్లల వయసుని దృష్టిలో పెట్టుకుని ఆ స్థాయిలోనే ఆలోచించాలి.

ఒకప్పుడు ఉమ్మడి కుటుంబాలలో పెద్దల ప్రేమా, ఆప్యాయతల మధ్య హాయిగా గడిచేది బాల్యం. కౌమార యవ్వనాలలో ఇబ్బందులు ఎదురైనా తమవారంటూ కొందరున్నారనే భరోసాతో సమస్యలని ఎదుర్కునేవారు.

మారుతున్న కాలంతో పాటు (.. నిజానికి ఈ పద ప్రయోగం సరైనది కాదు. కాలం ఎన్నడూ ఒకేలా ఉంటుంది. మారేది మనుషులే.) సమిష్టి కుటుంబాలు అంతరించి, వ్యష్టి కుటుంబాలు ఏర్పడ్డాకా బంధాలు సడలుతున్నాయి. జీవనాన్ని వేగవంతం చేసుకుని, బ్రతుకుని దుర్భరం చేసుకుంటున్నారు జనాలు. పిల్లలకి మార్గదర్శకులుగా ఉండాల్సిన పెద్దలే దారి తప్పుతున్నారు.

పిల్లలకి మొదటి పాఠశాల ఇల్లు. తల్లిదండ్రులే మొట్టమొదటి ఉపాధ్యాయులు అన్న సత్యాన్ని ఈ నవల మరోసారి చాటుతుంది.

***

Yandamooriఒకే కాలనీలో నివాసముండే ఐదు జంటలు, వారి పిల్లల చుట్టూ నడిచే కథ ఇది. దశరథ్, కౌసల్య ఒక జంట. రాము, నిఖిత వీరి సంతానం. విశ్వేశ్వర్, అన్నపూర్ణ మరో జంట. మహతి, సుకుమార్ వీళ్ళ పిల్లలు. కృష్ణమూర్తి, రుక్మిణి ఇంకో జంట. ప్రియతమ్, ప్రీతి వీళ్ళ పిల్లలు. శంకరం, పార్వతి నాల్గవ జంట. అవినాష్ వీళ్ళ కొడుకు. విష్ణు, శ్రీలక్ష్మిలది ఐదవ జంట. ధాత్రి వీళ్ళ అమ్మాయి.

నిఖిత, రాము, ప్రీతి, ప్రియతమ్, ధాత్రి, అవినాష్, సుకుమార్, మహతిల బాల్యం ఒకే చోట గడచినా, కొన్నేళ్ళ పాటు వాళ్ళంతా ఒకే కాలనీలో పెరిగినా వాళ్ళ ఆలోచనలు, దృక్పథాలు వేర్వేరు. పిల్లల పట్ల తల్లిదండ్రుల ప్రవర్తన ఒక్కో ఇంట్లో ఒక్కోలా ఉంటుంది.

చదువు పేరుతో కొడుకుని పుస్తకాలకే పరిమితం చేసి, ఎమోషనల్ బ్లాక్‌మెయిల్ చేసి తమ అదుపులో ఉంచుకోడానికి ప్రయత్నిస్తారు శంకరం, పార్వతి. నృత్యం, టెన్నిస్ పేరుతో కూతురికి ఊపిరాడనివ్వదు శ్రీలక్ష్మి.  విష్ణు సెక్స్ పర్వర్ట్. కృష్ణమూర్తి, రుక్మిణిల ప్రవర్తన వాళ్ళ సంతానం అదుపు తప్పేలా చేస్తుంది. మగపిల్లాడిపై మోజుతో తొలి కాన్పు ఆడపిల్ల పుట్టిన తర్వాత, అబార్షన్లు చేయించుకుని చివరికి కొడుకుని కంటారు విశ్వేశ్వర్, అన్నపూర్ణ. వీళ్ళందరికి భిన్నంగా ఒకరినొకరు అర్థం చేసుకుంటూ, పిల్లలకి అనురాగం పంచుతారు దశరథ్, కౌసల్య.

ప్రేమించిన ముగ్గురు కుర్రవాళ్లూ మూడు రకలుగా మోసం చేస్తే – వారి మీద పగబడుతుంది ప్రీతి. తనకన్న పదిహేనేళ్లు పెద్దయిన ‘ఆంటీ’ని మంచి చేసుకుంటే ‘జేబు ఖర్చుకు’ లోటుండదని భావిస్తాడు పద్నాలుగేళ్ల ప్రియతమ్. తాను చెడిన ప్రియతమ్ సుకుమార్‌నీ చెరుపుతాడు. ప్రియతమ్‌తో స్నేహం చేసి అతనితో బాటు తాను ఊబిలో కూరుకుపోతాడు సుకుమార్. ప్రియతమ్ చేతిలో వంచనకి గురవుతుంది ధాత్రి. చిన్నప్పుడు తనని నిర్లక్ష్యం చేసినందుకు, గొప్పింటి కోడలుగా వెళ్ళి తల్లిదండ్రులను సాధించాలనుకుంటుంది మహతి. సర్వనాశనమైపోయాడనుకున్న స్థితి నుంచి ఎదగడానికి ప్రయత్నిస్తాడు అవినాష్. తల్లిదండ్రులిద్దరూ అయిదు నిముషాల వ్యవధిలో రెండు వేర్వేరు ఆస్పత్రుల్లో మరణిస్తే, అన్న చదువులకు భంగం రాకుండా తన కర్తవ్యం నిర్వర్తిస్తుంది నిఖిత.

***

తను నిరంతరం శ్రమిస్తూ, ఎదుగుతూ, తనతో పాటు మరికొందరికి ఎదిగే మార్గం చూపించిన నిఖిత లాంటి వ్యక్తులు ప్రస్తుత యువతరానికి ఎంతో అవసరం. “When the going gets tough, the tough get going” అనే నానుడిని నిజం చేస్తుంది నిఖిత పాత్ర!

అలాగే తక్కువ నిడివి ఉన్నా, తన పరిధిలో ఒక ప్రయోజన కార్యాన్ని సాధించి, సమాజం పట్ల తన నిబద్ధతని చాటుకుంటుంది ఓ ఇన్వెస్టిగేటివ్ జర్నలిస్ట్ పాత్ర. ఆమె పేరు సాధన. ఎంసెట్ ర్యాంకుల భాగోతాన్ని ఆధారాలతో సహా బయట పెట్టి అక్రమార్కులను జైల్లో పెట్టిస్తుంది. కోచింగ్ సెంటర్ల మోసాలు, పలుకుబడి ఉన్న వ్యక్తుల పైరవీలు… ఇలా వ్యవస్థలోని లోపాలని ప్రస్తావిస్తూ తన పరిధిలో తాను చేయగలిన పనిని సక్రమంగా చేస్తుందీ పాత్ర.

“జీవితంలో ఏదో ఒక ఎదురుదెబ్బ తగిలే వరకూ మనిషి ఎంత దూకుడుగా ప్రవర్తిస్తాడో తెలియడానికి తరాలు, అంతరాలు ఉంటాయా?” అని అడుగుతుందో పాత్ర. అందరూ ఆలోచించాల్సిన ప్రశ్న ఇది.

***

యండమూరి గారి నవలలు చదివాక, అందులోని కొన్ని వాక్యాలను కోట్స్‌గా వ్రాసుకునే వాళ్ళు చాలా మందే ఉంటారు. ఈ నవలలోనూ అలాంటి అద్బుతమైన వాక్యాలున్నాయి. ఎన్నో విధాలుగా ప్రేరణిస్తాయి. మచ్చుకు కొన్ని:

జ్జానం పుస్తకాల్లో ఉండదు. అనుభవాల్లో ఉంటుంది. అనుభవాలన్నీ కూర్చి గుచ్చిన జీవితపు దండతో ఉంటుంది.

కష్టం గురించి నిరంతరం ఆలోచించడం కన్నా, దాంట్లోంచి బయటపడే మార్గం ఆలోచించడం మంచి పద్ధతి. కానీ, చాలామందికి మానసికంగా అది సాధ్యం కాదు. కొంతమంది మాత్రమే తమకొచ్చిన కష్టాల్ని భవిష్యత్తులో విజయాలకి సోపానాలుగా వాడుకుంటారు.

విజయం సాధించాలంటే నిరంతర ఘర్షణ ఉండాలి. ఒక ధ్యేయం ఉండాలి. ఆ ధ్యేయం వైపు సాగిపోవాలన్న కృషి, దీక్ష ఉండాలి. కష్టపడాలి.

అస్థిత్వం ఋజువు చేసుకోడం జీవిత ధ్యేయం అయినప్పుడు మనిషి సిన్సియర్‌గా కష్టపడతాడు. అందులో ఆనందం పొందుతాడు.

పరమపద సోపానంలో పెద్ద పాము చేత మింగబడి మొదటికి వచ్చిన వ్యక్తి ఆట మానేస్తే నష్టం అతనికే. చిన్న చిన్న మెట్లు మళ్ళీ ఎక్కి పైకి వెళ్ళడానికి ప్రయత్నించడమే జీవితం.

వర్షిస్తే బరువు తగ్గి మేఘం తేలికపడుతుంది. రోదిస్తే బరువు తగ్గి మనసు తెరిపిన పడుతుంది.

ముందుకు పోవడం తప్ప వెనుకడుగు వేయడం కాలానికి తెలియదు. అందుకే జరిగిన దాన్ని గురించి విచారించకు. జరగబోయేదాని గురించి ఆలోచించు.

***

వయసులో పెద్దలైనా, బుద్ధులలో పిల్లల కంటే హీనంగా ప్రవర్తించేవారున్నట్లే, వయసులో చిన్నవారైనా పెద్దరికం ఆపాదించుకుని హుందాగా ప్రవర్తించేవారు అరుదుగానైనా ఉంటారని చెబుతుంది ఈ నవల.

ఆధునిక జీవితాలకు అద్దం పడుతూ… మధ్యతరగతి మనస్తత్వాలను చిత్రిక పడుతూ… ఎదిగొస్తున్న బాల్యానికి… భవిష్యత్ చిరునామాను వెతుక్కుంటున్న యవ్వనాలకు భాష్యం చెప్పిన నవల ఇదని “సుప్రభాతం” పత్రిక పేర్కొంది. ఏ మాత్రం అతిశయోక్తి లేని వ్యాఖ్యానం ఇది.

టీనేజ్ పిల్లలు… కొత్త కొత్త ప్రలోభాల బారిన పడే ప్రమాదం ఒకప్పటికంటే ఇప్పుడు మరింత అధికంగా ఉంది కాబట్టి ఈ నవల ఇప్పటికీ ఉపయుక్తమనే అనే భావించాలి.

విజయవాడ నవసాహితి బుక్ హౌస్ వారు ప్రచురించిన “ధ్యేయం” నవల అన్ని ప్రముఖ పుస్తక కేంద్రాలలో లభిస్తుంది. పుస్తకం వెల రూ. 90/-

గమనిక:

సీరియల్‌లో ప్రీతి అని ఉన్న పేరు నవల పుస్తకంగా ప్రచురితమయ్యాకా, వరూధిని అని మారింది.

~

 

మహోజ్వల జానపద నవల “మృత్యులోయ”

కొల్లూరి సోమ శంకర్

 

కొల్లూరి సోమశంకర్

సాహిత్యంలో బాలసాహిత్యం ఓ అవిభాజ్యమైన అంగం. పిల్లల మానసిక వికాసానికి బాలసాహిత్యం ఇతోధికంగా దోహదం చేస్తుంది. పిల్లలో ఉత్సుకతని రేకెత్తించి, విజ్ఞానాన్ని అందిస్తుంది. వీటితో పాటు భాషాజ్ఞానమూ అబ్బేలా చేస్తుంది.

పిల్లలలో ఊహాశక్తిని పెంపొందిస్తూ, చక్కని నడవడి నేర్పే కథల కోసం ఒకప్పుడు చందమామ, బొమ్మరిల్లు, బాలజ్యోతి, బుజ్జాయి… వంటి పత్రికలు ఉండేవి. చందమామ చదవని తెలుగువారు ఉండరంటే అతిశయోక్తి ఏమాత్రం కాదు. చందమామ పత్రిక అంతలా జనాదరణ పొందడానికి వ్యవస్థాపకుల విలువలు ఒక కారణమైతే, చక్కని కథలని ఎంచి పత్రికని పరిపుష్టం చేసిన సంపాదకుల దూరదృష్టి, వివేకం మరో కారణం.

పిల్లలను, పెద్దలనూ ఆకట్టుకునేలా చందమామని తీర్చిదిద్దడంలో శ్రీ దాసరి సుబ్రహ్మణ్యం గారి పాత్ర విస్మరించలేనిది. పత్రిక బాధ్యతలు నిర్వర్తిస్తూనే, చందమామలో 12 జానపద సీరియల్స్ వ్రాసి ప్రచురించారు. ఒక్క చందమామలోనే కాదు, బొమ్మరిల్లు, యువ, స్నేహబాల, ప్రమోద వంటి పత్రికలలో జానపద నవలలు ధారావాహికంగా వెలువరించారు.

మృత్యులోయ’ నవల బొమ్మరిల్లు ప్రారంభసంచిక (1971) నుంచి 39 నెలలపాటు (1974) ధారావాహికంగా ప్రచురింపబడింది. జానపద నవలలంటే, రాజులు, రాణులు, రాజకుమారులు, రాకుమార్తెలు, మంత్రులు, మంత్రి కుమారులు, సైన్యాధికారులు, దండనాయకులు, విదూషకులు, కుట్రలు, కుతంత్రాలు, అడవులు, జంతువులు, మాయలు, మంత్రాలు, మాంత్రికులు, ఋషులు, మరుగుజ్జులు, మహాకాయులు… ఇలా ఓ కొత్త ప్రపంచంలోకి పాఠకులను తీసుకువెడతాయి. ఈ నవల కూడా అలాంటిదే.

లలాటమనే దేశాన్ని యశోవంతుడనే రాజు ధర్మబద్ధంగా పాలిస్తూంటాడు. మంత్రి జయవర్మ రాజుకి అన్ని విధాలుగా సహకరిస్తుంటారు. రాజు గారి శూరత్వానికి, మంత్రిగారి వ్యూహచతురతకి జడిసిన పొరుగు రాజులు లలాటం మీదకి దండెత్తాలని ఉన్నా, వెనుకడుగు వేస్తుంటారు. రాజకుమారుడు యశపాలుడు, మంత్రి కుమారుడు జయకేతుడు అనుంగు మిత్రులు. రాచవిద్యలు, యుద్ధవిద్యలన్నింటిలోను ప్రావీణ్యం సంపాదించుకున్న యువకులు. తమ నైపుణ్యాలను కదనరంగంలో ప్రదర్శించే వీలు లేక, అడవిలో వేటకి వెళ్ళి, తమ విద్యలను మెరుగుపెట్టుకుంటూ ఉంటారు. అలా ఓ సారి అరణ్యంలో వేటకి వెళ్ళి, ప్రమాదానికి గురై, మృత్యులోయలోకి జారిపోతారు. పేరులోనే మృత్యువున్న ఆ లోయలో ఎన్నో ప్రమాదాలను ఎదుర్కుంటారు, చిత్రవిచిత్రమైన జంతువులు, పక్షులు, నరవానరాలు, రాక్షసులు ఎదురయినా ఆ లోయలోంచి వారు బయటపడిన విధానం చాలా ఆసక్తికరంగా ఉంటుంది.

Dasari Subrahmanyam

***

ఆ లోయ ఎంత భయంకరంగా ఉంటుందంటే… “ఆ ప్రదేశమంతా అంతంగా లోతులేని మడుగులతో, వాటి మధ్య చిన్న చిన్న దిబ్బల మీద ఎత్తుగా పెరిగిన రెల్లు పొదలతో, చెట్లతో, రకరకాల పక్షులతో భీకరంగా వున్నది”.

ఈ లోయలోంచి బయట పడే మార్గం కోసం వెతుకుతారు యశపాలుడూ, జయకేతుడు.

“ఒకసారి యీ లోయలోకి వచ్చి పడిన వాళ్ళు తిరిగి బయటపడడం అంటూ జరగదు. చుట్టూ నిటారుగా వున్న కొండలు చూశారా? వాటిని పాకి పైకి పోవడం ఉడుములాంటి జంతువుకైనా సాధ్యం కాదు” అంటాడు, వీళ్ళిద్దరికన్నా ముందుగానే ప్రమాదవశాత్తు లోయలో పడిన విదూషకుడు.

“ఈ మృత్యులోయ లోంచి పైకి వెళ్ళేందుకు ఎక్కడో ఒకచోట సొరంగమార్గం లాటిది వుండకపోదు” అంటాడు యశపాలుడు ఆశావక దృక్పథంతో.

***

“పాముల కన్నా, క్రూరమృగాల కన్నా పగబట్టిన మనిషి ప్రమాదం. ఈ మృత్యులోయలో భల్లూకనాయకుడి వంటి వాళ్ళను వేళ్ల మీద లెక్కించవచ్చు. క్రూరత్వంలో వాడు రాక్షసి మృగాన్ని మించినవాడు.” అంటుంది సర్పవతి, భల్లూక నాయకుడు అపహరించ ప్రయత్నించిన సర్పజాతి నాయకుడి కూతురు. భల్లూక నాయకుడిని చంపి తమ దేశానికి వెళ్ళిపోతాం అని చెప్పిన జయకేతుడి మాటలు విని ఆశ్చర్య పోతుంది.

“ఈ మృత్యులోయలోంచి బయటకి పోవటమా? అదెలా సాధ్యం? మార్గం ఎక్కడున్నది?” అని అడుగుతుంది.

“మార్గం లేకపోతే, మేం సృష్టించి, మా దేశానికి తిరిగి పోతాం…” అంటాడు యశపాలుడు. తమ శక్తి సామర్థ్యాల మీద అమితమైన విశ్వాసం!

 

***

F1

రాక్షసుడి విదూషకుడైన ముసలివాడికి భల్లూక జాతి వాళ్ళ ప్రవర్తనలో ఏదో మోసం వున్నట్లు అనుమానం కలిగింది. సర్పవతిని ఎత్తుకుపోతున్న వాళ్ళ వైపు నుంచి, ఆ పిల్ల పేరూ, రక్షించమన్న పిలుపూ ఎలా వస్తుంది?  ఆ కంఠస్వరాలు యశపాల జయకేతులవి కావు. బహుశా, భల్లూక జాతివాళ్ళు తమను రెండుగా చీలదీసి తరువాత తేలిగ్గా హతమార్చేందుకు ఏదో ఎత్తు వేసి వుంటారు.

ప్రమాదాలు చుట్టు ముట్టినప్పుడు, సంయమనం కోల్పోకపోతే, దాన్నుంచి బయటపడే ఉపాయం సులువుగా తడుతుంది.

***

ఒకటా రెండా, ఇలా నవలంతా ఎన్నో ఘటనలు. ప్రమాదాలని, అడ్డంకులని కథానాయకులు సానుకుల దృక్పథంతో ఎదుర్కునే తీరు.. నేటి వ్యక్తిత్వ వికాస సూత్రాలకు సరిపోతాయి.

సాహిత్యం ఏదైనా మంచి చెడుల సమ్మేళానాన్ని ప్రతిబించించి, చెడును విసర్జించి, మంచిని స్వీకరించమనే చెబుతుంది. ఈ కథా అంతే. పాత్రధారులలో మంచి వాళ్ళుంటారు చెడ్డవాళ్ళుంటారు. మంచికి చెడుకీ మధ్య పోరాటం ఉంటుంది. అంతిమంగా చెడుపై మంచి విజయం సాధిస్తుంది. ఏ దేశపు సాహిత్యమైన చెప్పేది ఇదే.

మాయలు మంత్రాలు, రాక్షసులు, విచిత్రమైన జంతువులు.. ఇవన్నీ ప్రతీకాత్మకమైనవి. రెండు తలల మహాసర్పం, నరవ్యాఘ్రం వంటి జీవులు కల్పనే కావచ్చు… కాని ఆయా పాత్రలను సృష్టించడం వెనుక ఓ నీతి ఉంది. పిల్లల ఎదిగి, జీవితాన్ని అవగతం చేసుకునే వయసొచ్చే సరికి నిత్యజీవితంలో ఎదురయ్యే ఆటుపోట్లు, కష్టం నష్టం, భీతి, భయం, దిగులు, నిరాశ వంటి ప్రతికూల లక్షణాలు కూడా ఇలాంటి కల్పితాలేనని, ఎటువంటి స్థితిలోనూ ధైర్యం కోల్పోకుండా స్థిమితంగా ఉంటే విజయం తధ్యమని గ్రహిస్తారు.

అలాగే, తాము ఎంతటి ప్రమాదంలో ఉన్నా, తోటివారిని కాపాడడానికి చివరిదాకా ప్రయత్నించడం గొప్ప లక్షణం. ఈ నవలలోని నాయకులు కనపర్చిన అనేక సానుకూల దృక్పథాలలో అదీ ఒకటి.

మంత్రాలు, మాయలు ప్రయోగించడం – తమ లక్ష్యం చేరుకోడానికి అడ్డదారులు తొక్కడం లాంటిది. గొప్ప విలువలున్న వ్యక్తులు కూడా అప్పుడప్పుడు మాయమంత్రాల బారిన పడి తమ విద్వత్తును, పాండిత్యాన్ని నాశనం చేసుకుంటారు. విజయానికి అడ్డదారులు లేవని చెబుతుంది ఈ నవల.

Mryutyuloya Front Cover

నిత్యం ప్రమాదాలతో పోరాడుతున్నా, ఆశావాదం విడువరు కథానాయకులిద్దరూ. చిన్న చిన్న విషయాలకే బెంబేలెత్తిపోయి, జీవితాన్ని విషాదభరితం చేసుకునే వ్యక్తులు ఈ పాత్రల నుంచి ఎంతో నేర్చుకోవచ్చు. పాఠకులలో ఉత్కంఠ రేకెత్తించే ఈ నవల పిల్లలకి, పెద్దలకి సైతం ఎన్నో జీవిత పాఠాలు చెబుతుంది.

ఈ నవలకి కథానుగుణంగా గీసిన బొమ్మలు అదనపు ఆకర్షణ. అద్భుతమైన కథనానికి అందమైన బొమ్మలను గీసింది ఎం. కె. బాషా, ఎం.ఆర్.ఎన్. ప్రసాదరావులు.

వాహిని బుక్ ట్రస్ట్, మంచి పుస్తకం వారు సంయుక్తంగా ప్రచురించిన “మృత్యులోయ” అన్ని ప్రముఖ పుస్తక కేంద్రాలలో లభిస్తుంది. కినిగె వెబ్‌సైట్ ద్వారా ఆర్డర్ చేసుకుని పుస్తకాన్ని మీ ఇంటికే తెప్పించుకోవచ్చు. 312 పేజీల ఈ పుస్తకం వెల రూ. 150/-

~

 

నాలుగో సహస్రాబ్ది స్పేస్ ఒపేరా “కుజుడి కోసం”

కొల్లూరి సోమ శంకర్

 

కొల్లూరి సోమశంకర్

కొల్లూరి సోమశంకర్

ఆకాశం’ మనిషికి ఎప్పుడూ ఉత్తేజాన్నిస్తుంది. మాములు జనాలకి నీలి ఆకాశం ప్రశాంతతని అందిస్తే, జిజ్ఞాసువులలో ఎన్నో ప్రశ్నలు రేక్తెత్తిస్తుంది. నాలో ఏముందో తెలుసుకోండంటూ సవాలు విసురుతుంది.  శూన్యం తప్ప అక్కడేం లేదని తెలిసినా మనిషి అన్వేషణ ఆగదు. శూన్యంలో భూమికి పైన ఎంతో ఎత్తులో ఉండే అంతరిక్షం పట్ల కుతూహలం అంతరించదు. మొదట చందమామ, ఆ తర్వాత ఇతర గ్రహాల పరిశోధన కొనసాగిస్తున్నారు. చంద్రుడి తర్వాత, ఖగోళంలో మనిషిని ఎక్కువగా ఆకర్షించింది కుజ గ్రహమేననడంలో ఎటువంటి అనుమానం లేదు.

శాస్త్రవేత్తలు శాస్త్రీయ కోణంలో ఆలోచిస్తూ, అన్వేషణలు జరుపుతుంటే రచయితలు ఫిక్షన్ ద్వారా సైన్సు పట్ల పాఠకులలో ఆసక్తిని పెంచుతారు. సైన్సు ఫిక్షన్‌లో రచయితలు ఊహించిన కల్పనలెన్నో తరువాతి కాలంలో నిజమయ్యాయి. గత శతాబ్దంలో సైన్స్ ఫాంటసీలనుకున్న ఎన్నో కల్పనలు ఈ శతాబ్దంలో ఫాక్ట్స్ అయిన సంగతి అందరికీ తెలిసినదే.

ప్రముఖ వైద్యులు డా. చిత్తర్వు మధు వైద్యం నేపధ్యంతో ‘ఐసిసియు‘, ‘బై బై పోలోనియా‘, ‘ది ఎపిడమిక్‘ వంటి నవలలు రాసారు. తెలుగులో సైన్స్ ఫిక్షన్ రాసే అతి కొద్ది మంది రచయితల్లో మధు గారు ఒకరు. ఏలియన్స్,  గ్రహాంతర ప్రయాణాలు, రోబోలు, కాలంలో ప్రయాణం… వంటి ఇతివృత్తాలతో రచన చేసి పాఠకులను మెప్పించడం అంత సులువు కాదు. ఖగోళశాస్త్రంపై ఎంతో ఆసక్తి, అవగాహన ఉన్న మధు గారు శాస్త్ర విజ్ఞానాన్ని, ఊహని మిళితం చేసి “కుజుడి కోసం” అనే సై.ఫి రాసారు. స్థూలంగా ఈ నవల కథ ఇది:

కథాకాలం నాలుగో సహస్రాబ్ది 3260. అణుయుద్ధాలూ, ప్రకృతి వైపరీత్యాల వల్ల భూమిలో చాలా భాగం నశించి మనుషులు ఇతర గ్రహాలకి వలస వెళ్ళి అంతర్‌గ్రహ నాగరకత విలసిల్లుతున్న రోజులు. వెనకబడిన భూమి నుంచి  గ్రహాలకి వలసపోయే ప్రజలూ, స్పేస్ ప్లాట్‌ఫారంలూ, వివిధ జాతుల మానవులూ, మానవులని పోలిన హ్యుమనాయిడ్స్…. అది ఒక సరికొత్త విశ్వం! భూగ్రహంలోనూ అంతర్‌గ్రహ యానాలు, సమాచార వ్యవస్థా, వైద్య రంగాల్లో  మానవులు ఎంతో ప్రగతిని సాధించారు. ఇంటర్ గెలాక్టిక్ ఫోన్లు, సెవెన్త్ జనరేషన్ రోబోలు, ఇంటర్‌ గలాక్టిక్ నెట్, కాంతివేగంతో ప్రయాణించే అంతరిక్ష నౌకలూ…. ఇలా ఎంతో అభివృద్ధి చెందినా మనిషి భావాలు, ఆలోచనలూ, వ్యక్తిత్వమూ మాత్రం పెద్దగా మారలేదు.

అసలు ఈ నాలుగో సహస్రాబ్ది చాలా వింతైన కాలం. ఒకపక్క అద్భుత విజ్ఞాన సాంకేతిక ప్రగతి. మరొకపక్క ఆధ్యాత్మిక మంత్రశక్తులు. ఇదివరకు విజ్ఞాన శాస్త్రంలో తెలియని విశ్వశక్తిని మనుష్యుడు మేధస్సుతో వశపర్చుకోవడం – రెండూ అద్భుతమైన మార్పులే! విశ్వశక్తి (Universal Force) అనేది ఈ నాలుగో సహస్రాబ్దిలోని ఒక అద్భుతమైన, అర్ధంకాని పరిణామం. విద్యుదయస్కాంతశక్తీ, భూమ్యాకర్షణశక్తీ, అణుశక్తీ తర్వాత, ఈ విశ్వశక్తి అనేది కొత్తగా కనిపెట్టబడి, మాంత్రికులచేత స్వాధీనంలోకి తెచ్చుకోబడింది. ఈ శక్తి భూమిలో విజ్ఞాన శాస్రవేత్తలకి ఎవరికీ తెలియదు.

కథా నాయకుడు హనీ మధ్య ఆసియాలోని ఇండికా సెంట్రల్ యూనివర్సిటీలో బయోమెడికల్ ఇంజనీర్‌గా పనిచేస్తూంటాడు. అతనికి చిన్నప్పటి నుంచి సయోనీ అనే అందమైన కుజ యువతి కలలోకి వస్తుంటుంది. ఆమెని చూడాలనే కోరికతో కుజగ్రహం చేరుకున్న అతని జీవితంలో అనూహ్యమైన మార్పులు సంభవిస్తాయి. సయోనీ అద్భుత శక్తులున్న ముసలి మంత్రగత్తె అనీ, ఒక పిచ్చి అన్వేషణలో తనను కుజ గ్రహానికి రప్పించగలిగిందని హనీ గ్రహిస్తాడు. తన తండ్రికీ, తనకి అమరత్వం సాధించాలనే కోరిక తీర్చుకోడానికి హనీని ఉపయోగించుకోవాలనుకోవాలనుకుని అతడిని కుజగ్రహానికి వచ్చేలా చేస్తుంది.

Dr.ChittarvuMadhu2

హనీకి విశ్వాంతరాళపు విశ్వశక్తిని అదుపులోకి తెచ్చుకోగలిగే ప్రత్యేకమైన శక్తులు వున్నాయనీ, అతనికి తెలియకుండనే అతనికి కాస్మిక్‌ ఎనర్జీ, దానికి ప్రతిస్పందించగలిగిన ప్రకంపనలు అతని మెదడులో, శరీరంలో వున్నాయనీ, తను మాత్రమే ఆ అమరత్వ శక్తిని సంపాందిచగలడని ఒత్తిడి చేస్తుంది. ఆమె తండ్రి, అరుణభూముల చక్రవర్తి సమూర హనీని బెదిరిస్తాడు. షాక్‌ తిన్న హనీ – చక్రవర్తి ఆశయసాధనలో తానేం చేయాలో అడుగుతాడు.  బదులుగా చక్రవర్తి – ”హనీ! నువ్వొక గొప్ప శాస్త్రవేత్తవి. మంత్రశక్తులు కలిగిన గొప్ప మానవుడివి. అయితే నీ శక్తి నీకే తెలియదు! నీకు ఇంకా మంత్రశక్తిని సాధించే శిక్షణ ఇచ్చి ఒక ముఖ్యమైన లక్ష్యసాధన కోసం పంపుతాను. భూమి, గురుగ్రహం, శని ఉపగ్రహం టైటాన్‌, కుజుని మానవ కాలనీ – ఇంకా అరుణ భూముల నుంచి ఎన్నుకుని, వాళ్ళ మనసులని ప్రభావితం చేసి ఇక్కడికి తీసుకువచ్చిన కొందరి వ్యక్తులకి నువ్వు నాయకత్వం వహించాలి. వాళ్ళందరూ కూడ నీ వలెనే అద్భుత శక్తులు కలిగివున్నవాళ్ళు. అయితే నువ్వు నాకు, సయోనీకి విశ్వాసపాత్రుడిగా వుండాలి. విశ్వశక్తిని వశపర్చుకుని ఉపయోగించే నేర్పు సంపాదించుకోవాలి నువ్వు. మా కోసం అమరత్వం ప్రసాదించే మహా ఔషధం తీసుకుని రావాలి! ఆ విషయంలో తప్పక కృతకృత్యుడిని కావాలి!” అని చెబుతాడు.

గత్యంతరం లేక, అందుకు అంగీకరించి, విశ్వశక్తి అనబడే ఆ మంత్రవిద్యలో కొంత పట్టు సాధిస్తాడు హనీ. రకరకాల ఇబ్బందులు ఎదుర్కుని ఒలంపస్ శిఖరంపై దాచబడ్డ అమరత్వాన్ని ప్రసాదించే ఔషధాన్ని సంపాదిస్తాడు. ఇదే సమయంలో కుజునిలో నివసిస్తున్న మానవ కాలనీకీ, అదే గ్రహంలో అరుణ భూముల రాజ్యంలో ఉన్న మాంత్రికులకీ ఎప్పటినుంచో ఉన్న ఆధిపత్య పోరు మళ్ళీ రగులుకుని ఓ మహా యుద్ధంగా మారుతుంది.

ఏ సహస్రాబ్దిలోనైనా యుద్ధం భయంకరమైనదీ, మానవత్వానికి వ్యతిరేకమైనదే! మనిషి మనిషిని చంపుకోవడం – దానికోసం వివిధ రకాల సిద్ధాంతాలు, సంజాయిషీలు చెప్పుకోవడం, అనేక విధాల ఆయుధాలు వాడటం – ఇది అప్పటికీ, ఇప్పటికీ ఎప్పుడూ జరుగుతున్నదే! అసలు యుద్దమే ఒక నేరం! మాంత్రికులు ఎంత క్రూరులో మానవులు కూడా అంతే క్రూరులు, చెడ్డవారు. చిత్రహింసలు, జైలు… మళ్లీ గొప్పగా, నిబంధనలు పాటిస్తున్నట్లు మాట్లాడటం. ఎన్ని యుగాలు, సహస్రాబ్దులు గడచిపోయినా, యుద్ధాలలో ఈ ప్రవర్తనలన్నీ మారనే లేదు.

నాలుగో సహస్రాబ్దిలో కుజునిలో మానవులకీ, మాంత్రికులకీ జరిగిన ఈ యుద్ధం కూడా అలాంటిదే! అయితే ఈ సహస్రాబ్దిలో యుద్ధాలలో కొన్ని విశేషాలున్నాయి. మానవుల దగ్గర ఇదివరకటిలాగానే అణ్వాయుధాలున్నా వాటిని ఆఖరి ఆయుధాలుగానే వాడుతున్నారు. దానివల్ల గలిగే ప్రాణనష్టం, రేడియో ధార్మిక శక్తివల్ల వచ్చే అపాయాలూ అనేకం! మానవులు యుద్ధాల్లో ప్రాణనష్టం జరగకుండా ఎన్నో జాగ్రత్తలు తీసుకుంటున్నారు.

దీనికి ఒక పద్ధతి ఏమిటంటే సైనికుల స్ధానంలో రోబోలని వాడటం. వాటిని రిమోట్‌ కంట్రోల్‌తో పనిచేయించడం! కానీ మానవుల హైటెక్‌ యుద్ధం చేసే యంత్రాంగమంతా, ఎవరికీ తెలియని విశ్వశక్తి అనే మాంత్రికుల శక్తి ముందు ఓడిపోతుంది. అదే సమయంలో నానా తిప్పలు పడి హనీ, ఆ ఔషధాన్ని సమూరికి అందజేస్తాడు. అయితే ఆ ఔషధం తాగిన వారికి మంత్రశక్తులన్నీ నశిస్తాయన్న నిజం దాచిపెడతాడు. ఆ ఔషధం తాగిన సమూరా, తన ప్రత్యర్థి కుజుడి మీది మానవుల కాలనీ అధ్యక్షుడైన కాన్‌స్టాన్‌టైన్‌‌ని వెక్కిరిస్తాడు.

బదులుగా, మంత్రశక్తులు ఉపయోగించకుండా తనతో ద్వంద్వయుద్ధం చేసి ఓడించమని సమూరాని రెచ్చగొడతాడు కాన్‌స్టాన్‌టైన్‌‌. ఆ ఔషధం తాగిన ప్రభావంతో సమూరా మంత్రశక్తులు క్షీణించి, ద్వంద్వయుద్ధంలో పరాజితుడై పారిపోతాడు సమూరా. కుజుడి మీద మానవులు, మాంత్రికుల మధ్య సంధి కుదురుస్తాడు హనీ. అరుణభూములకు రాజుగా తన మిత్రుడయిన మీరోస్‌ని ప్రతిపాదిస్తాడు. అందరూ ఆ ప్రతిపాదనకి అంగీకరిస్తారు. హనీ గౌరవార్థం  గొప్ప విందు ఏర్పాటు చేస్తాడు కాన్‌స్టాన్‌టైన్‌‌. హనీకి కానుకగా – అమృత ఔషధం కోసం ఒలంపస్ పర్వత శిఖరానికి వెళ్ళిన బృందంలోని రోబోని కానుకగా ఇస్తాడు కాన్‌స్టాన్‌టైన్‌‌. కుజుడి లోని మానవ కాలనీ సైన్యాధ్యక్షుడైన గ్యాని ఆన్‌ గారక్‌ పశుశాలలో జంతురూపంలో బందీలుగా ఉన్న ఏనిమాయిడ్‌, డిమిట్రీ, పోసయిడన్‌‌లను విడిపించే క్రమంలో జనరల్ గ్యాని సైనికులతో పోరాడుతాడు హనీ. ఎలాగొలా సైనికులను తప్పించుకుని అంతర్‌గ్రహ కౌన్సిల్‌ మరియు అంతర్‌ గెలాక్టిక్‌ కౌన్సిల్ శరణు పొందుతారు. ఆయా గ్రహాల అధికారుల సహాయంతో ఏనిమాయిడ్‌ని గురుగ్రహపు ఉపగ్రహమైన గ్వానిమెడ్‌కి; డిమిట్రీ, పోసయిడన్‌‌లను శనిగ్రహపు ఉపగ్రహమైన టైటన్‌కి పంపే ఏర్పాట్లు చేస్తాడు హనీ. అలాగే, భూ గ్రహనికి చెందిన అధికారులు కూడా హనీ నేరస్తుడు కాదనీ, శరణార్థి అని నిర్ధారించి భూమికి పంపుతారు.

ప్రేమ కోసం బయలుదేరిన హనీ తన గురించి కొత్త విషయాలు తెలుసుకోడం, అద్భుత శక్తులు సంపాదించడం, కొత్త లక్ష్యంతో భూమికి తిరిగి రావడంతో కథ ముగుస్తుంది. కథాక్రమంలో కుజగ్రహం గురించి ఎన్నో శాస్త్రీయ వివరాలు అందించారు రచయిత.

పాఠకుల చేత ఔరా అనిపించుకున్న ఈ కథకి కొనసాగింపు (సీక్వెల్) ”నీలీ ఆకుపచ్చ భూమికి తిరిగిరాకకినిగె పత్రికలో ధారావాహికంగా ప్రచురితమవుతోంది. తాజా ఎపిసోడ్‌ని ఈ లింక్‌లో చదవచ్చు.

వాహిని బుక్ ట్రస్ట్ వారు ప్రచురించిన “కుజుడి కోసం” ప్రింట్ పుస్తకం నవోదయ బుక్ హౌస్, హైదరాబాద్ వారి వద్ద, రచయిత వద్ద, కినిగెలోనూ లభిస్తుంది. 228 పేజీల ఈ పుస్తకం వెల రూ. 150/-. ఈ-బుక్ కినిగెలో లభ్యం.

 

 

Dr. C. MADHU, M.D.

Consultant Physician & Cardiologist

Vijaya Medical & Heart Clinic

2-2-23/2, SBH Colony,

Behind CTI, Bagh Amberpet,

Hyderabad – 500 013

e-mail : madhuchittarvu@yahoo.com

 

శ్మశానం రంగస్థలం…కాటికాపరి, శవవాహకులు ముఖ్యపాత్రలు

కొల్లూరి సోమ శంకర్

 

కొల్లూరి సోమశంకర్

అన్యులు సృజించని అంశాలపై రచనలు చేసే రచయితలు తెలుగులో చాలా తక్కువ. సమాజంలో హీనమైన పనులుగా ముద్రబడ్డ చర్యల ఇతివృత్తాలతో సాహితీసృజన చేసి మెప్పించడం అందరికీ సాధ్యం కాదు. సాహిత్యంలో జనన మరణాల సంఘటనలెన్నో ఉంటాయి. కానీ శ్మశానం రంగస్థలంగా, కాటికాపరి, శవవాహకులు ముఖ్యపాత్రలుగా చేసిన రచనలు చాలా అరుదు.

మృత్యువంటే చాలా మందికి జడుపు. కొందరికి ఆసక్తి.. ఎందరికో రోత… జీవమున్నంత కాలం గౌరవించి, ఆదరించిన వ్యక్తులను సైతం, మరణించగానే వీలైనంత త్వరగా అంత్యక్రియలు ముగించడానికి తొందరపడతారు జనాలు. చావంటే మనుషులకున్న భయం అలాంటిది. ఇక శ్మశానం, రుద్రభూమి, వల్లకాడు లాంటి పదాలను ఉచ్ఛరించడానికి కూడా ఇష్టపడని వ్యక్తులు ఎందరో ఉన్నారు.

అయితే అంత్యక్రియలపై ఆధారపడే జీవనం గడుపుకునే వారెందరో ఉన్నారు. కాటికాపరి, శవవాహకులు, శ్రాద్ధ కర్మలు చేయించే బ్రాహ్మలు… ఇలా మాములు మనుష్యులు ఏనాడు పట్టించుకోని ఓ సమూహాం గురించి, వారి జీవితాల గురించి తెలిపే నవల “పితృవనం“. పితృవనం అంటే శ్మశానం. శీర్షికలోనే ఇతివృత్తం ఏమిటో అర్థమయ్యే ఈ నవలని శ్రీ కాటూరి విజయసారథి  వ్రాసారు.

పేదరికం తాండవిస్తూ, నిలకడైన సంపాదన లేని మధ్యతరగతి కుటుంబాలలో ఓ మనిషి చనిపోతే, అంత్యక్రియలకీ, కర్మకాండకీ చాలా డబ్బు ఖర్చు చేయాల్సి ఉంటుంది. చనిపోయినవారి కోసం అంత ఖర్చు చేయడం అవసరమా అంటే… చనిపోయిన వ్యక్తుల ఆఖరి కోరిక  అంత్యక్రియలు సక్రమంగా చేయించమనే అయ్యుంటుంది. ఎందుకంటే…. కర్మకాండలు సరిగ్గా జరగకపోతే… ఏదో అయిపోతుందనే భయం… తదుపరి జన్మ మంచిది లభిస్తుందో లేదో అనే అనుమానం.

అయితే కర్మకాండ నిర్వహించవలసినవారి ఆర్ధిక స్థితిగతులను గూర్చి ఎవరూ పట్టించుకోరు. తరతరాలుగా వస్తున్న ఆచారాలు కొనసాగించవలసిందే అంటారు. ఇదే అంశంతో ప్రారంభమవుతుంది నవల. ఒకప్పటి వాల్తేరు ఈ నవలకి కార్యరంగం. శవాలను మోసే సూరిగాడిని వెతుక్కుంటూ వస్తాడో కుర్రాడు. అతని తండ్రి చనిపోయాడు. చాలా తక్కువ డబ్బులుంటాయి. ఎలాగొలా శవసంస్కారాలు కానివ్వమని సూరిని బ్రతిమాలుకుంటాడు. మొదట కటువుగా మాట్లాడినా, ఓ లాయర్ దగ్గరికి తీసుకెళ్ళి ధన సహాయం చేయిస్తాడు. మిగతా శవవాహకులను, మంత్రం చెప్పే బ్రాహ్మడు సుబ్బావధానినీ, పాడె కోసం మేదరవాళ్ళకీ పురమాయిస్తాడు.

చివరికి శవం లేస్తుంది. ఊరికే లేచిందా? వందలు చేత్తో పట్టుకుంటే లేచింది. ముష్టెత్తినా, ఎత్తుకొచ్చినా వందలు చేత్తో పట్టుకోకపోతే ఏ శవమూ గుమ్మం ముందు నుంచీ లేవదు. చివరికి శవదహనం పూర్తవుతుంది. ఆ కుర్రాడి పేరు ఆనంద్ అనీ అతని భార్య పేరు శాంత అని తెలుస్తుంది. ఇంటర్ చదివి, టైప్ రైటింగ్ పాసయిన ఆనంద్ జీవిక కోసం ఇద్దరు లాయర్ల దగ్గర పనిచేస్తూంటాడు. వారిచ్చే కొద్దిపాటి డబ్బుతో రోజులు నెట్టుకొస్తుంటాడు. మొత్తం ఖర్చెంతయ్యిందో లెక్కలు వేయించి, ఎవరికి ఇవ్వాల్సిన డబ్బులు వారికి ఆనంద్ చేత ఇప్పిస్తాడు సూరి. తన వాటా మాత్రం తీసుకోకుండా ఊరుకుంటాడు. ఆనంద్ ఇంటికి వెళ్ళిపోయాక, కాటికాపరి వీరబాహుడు అడుగుతాడు ఎందుకింత తక్కువ ఇప్పించావని, సూరి ఎందుకు డబ్బులు తీసుకోలేదని. ఇంకో శవమేదయినా వస్తే అప్పుడు సరిగానే ఇస్తాలే… అని చెప్పి విశ్రాంతి కోసం కాసేపు కునుకు తీస్తాడు సూరి. నిద్రలేచే సరికి ఇంకో శవం కాలుతూ కనబడుతుంది. ఆనంద్‌ని జ్ఞాపకం చేసుకుని ఈ జనారణ్యంలో ఏ ఒక్క మృగమూ అతని గోడు ఆలకించనందుకు బాధ పడతాడు.

సూరిలో అంతర్మథనం జరుగుతూంటుంది. ఎన్నెన్నో ప్రశ్నలు. సమాజం తీరు పట్ల కలత. ఆలోచనల నుంచి తేరుకుని వీరబాహుడితో కబుర్లలో పడతాడు. ఊసులయ్యాక, ఆ కాలుతున్న శవం ఎవరిదో వాకబు చేస్తాడు. ఆ శవం పీర్ల కోనేరు సందు మొదట్లో టీ కొట్టు నడిపే నాయర్‌‌దని తెలుసుకుంటాడు. ఆ చీకట్లో ఎవరో పడుకుని ఉండడం చూసి ఎవరో మరో శవాన్ని అక్కడ వదిలేసి పోయారేమోననుకుంటారు సూరి, వీరబాహుడు. అయితే ఆ వ్యక్తి ఇంకా చావలేదనీ, బ్రతికే ఉందనీ గ్రహిస్తారు. ఆమె నాయర్ కొట్లో పనిచేసేదని తెలుస్తుంది. వేరే ఆధారం లేకపోయేసరికి తన ఇంటికే తీసుకువెడతాడు సూరి. ఆమె పేరు జయ అని తెలుసుకుంటాడు. ఆమెకో ఆధారం దొరికే వరకు తనకు వంట చేసి పెడుతూ తన ఇంట్లోనే ఉండమని చెబుతాడు.

సద్బ్రాహ్మణ వంశంలో పుట్టిన సూరి అసలు పేరు సూర్యనారాయణ మూర్తి. చిన్నప్పుడు బడిలో హెడ్మాస్టర్ అకారణంగా దండించడంతో చదువు మానేస్తాడు. చదువు అబ్బకపోవడం వల్ల ఏ ఉద్యోగం దొరక్క తన ఈ వృత్తి చేపట్టాల్సివచ్చిందని బాధపడతాడు. చనిపోయిన నాయర్ టీ కొట్టు సామన్లను అమ్మేస్తున్నారని తెలిసి, వాటి యజమానితో మాట్లాడి వాటిని తను కొనుక్కుంటానని ఎవరికీ ఇచ్చేయద్దని చెబుతాడు. ఇంతలో ఓ బేరం వస్తుంది. చనిపోయినది డబ్బున్న ఆసామి వాళ్ళ నాన్న. ఆ ఆసామి గీరగా మాట్లాడితే తగిన సమాధానం చెప్పి అతని పొగరు దించుతాడు సూరి.  ఈ శవదహనమూ అయ్యాకా ఇల్లు చేరుతాడు. జయ గతం తెలుసుకుంటాడు.. సొంత మనుషులే ఆమెని దుబాయ్ షేకులకి అమ్మేస్తారు. వారి బారినుంచి తప్పించుకుని, ఎన్నో కష్టాలు పడి నాయర్ పంచన చేరుతుంది. నాయర్ దగ్గరనుంచి తమ వాటా డబ్బులు పట్టుకుపోతుంటారు ఆమె బంధువులు. నాయర్ ఆదరణతో మాములు మనిషైన జయ భవిష్యత్తు… నాయర్ చావుతో అగమ్యగోచరమయింది.

PithruvanamFrontCover

నాయర్ అస్థిసంచయనం చేసొచ్చాక సూరిని కలుస్తాడు ఆనంద్. లాయర్ల దగ్గర పనిమానేసి టీ కొట్టు నడుపుకోమని ఆనంద్‌కి సలహా ఇస్తాడు సూరి. తాను హామీగా ఉండి ఆ కొట్టుని ఆనంద్‌కి ఇప్పిస్తాడు. టీ పాటు టిఫిన్లు కూడా అమ్మేలా శాంతను, జయను కుదురుస్తాడు.

తన స్నేహితుడు రాజుకి ఉద్యోగం రావడం కోసం ఓ అధికారితో వాదన వేసుకుంటాడు. కాలు జారినా, తన తప్పు తెలుసుకొని కొత్త జీవితం గడపాలనుకునే ఓ అమ్మాయికి దారి చూపిస్తాడు. నాయర్ చనిపోయాడని తెలిసిన జయ బంధువులు ఆమెని బలవంతంగా ఎత్తుకుపోవాలని ప్రయత్నిస్తే, తన తోటివారందరితోనూ కలసి అడ్డుకుని ఆమెను కాపాడుతాడు. జయని పెళ్ళి చేసుకుంటాడు.

సూరి, వీరబాహుడు జానకిరామయ్య తాత, అరుణ, జయ, నాయర్.. ఒక్కొక్కళ్లది ఒక్కో కథ. అందరినీ అంతఃసూత్రంగా కలిపేది పేదరికం, అవసరం… అంతకుమించి మానవత్వం.

రిజర్వేషన్ల వ్యవస్థపైనా, కులమతాల మీద, ఆచార వ్యవహారాల మీద మనుషుల నీతి నిజాయితీల మీద ఎన్నెన్నో ప్రశ్నలున్నాయి, మనసుని కదిలించే వ్యాఖ్యానాలున్నయి ఈ నవలలో.

శ్రామికులూ, కార్మికులు ఒకటికారా? కాదనే అంటుందీ నవల. శ్రామికులందరూ కార్మికులు కారు. కర్మాగారాలలో పనిచేసే కార్మికులకు చట్టపరమైన హక్కులుంటాయి. సంఘటితమైన శ్రామికులను కార్మికులు అనచ్చేమో. అసంఘటితంగా ఉన్న శ్రామికులను తోటి కార్మికులు కూడా పట్టించుకోరని ఈ నవలలో ఓ ఉదంతం తెలుపుతుంది. కార్మికులవలె, తమకు కూడా కనీస సదుపాయలను కల్పించాని, సాంఘిక భద్రత కల్పించాలని అపరకర్మలు చేసే శ్రామికులు కోరితే… వాళ్ళసలు కార్మికుల విభాగంలోకి రానే రారని, చట్టపరమైన నిబంధనలను వారికి వర్తింపజేయనక్కర్లేదని వాదిస్తారు కార్మికులు, వారి నేతలు. అన్ని రకాలుగా నిస్సహాయులైన శవవాహకులు కృంగిపోతారు.

కాలక్రమంలో వచ్చిన ఓ మార్పు మానవ సంబంధాలను తీవ్రంగా ప్రభావితం చేసిందని సూరి అంటాడు. ఓ మనిషి విగతజీవుడయ్యాక, అంతిమ సంస్కారానికి శవాన్ని మోయడానికి కూడా వెనుకాడుతున్నారని, అదే ఇతర మతాలలో శవాన్ని మోయడం ఓ గౌరవంగా భావిస్తారని.. వాపోతాడు.

KaturiViajayaSarathi

కాటూరి విజయసారధి

 

పేదలూ మనుషులేనని, అవకాశాలు లేక, మరింత పేదలుగా మారుతున్నారని, ఒకరికొకరు సాయం చేసుకుంటే, కొందరైనా ఎదిగి మిగతావారి ఎదుగుదలకి తోడ్పడవచ్చనేది సూరి దృక్పథం. మాట కటువు మనసు వెన్న.. అనే నానుడి సరిగ్గా సరిపోయే మనిషి సూరి. ఇదే అర్థం వచ్చేలా ఓ సందర్భంలో తాత “పల్కు దారుణాఖండల శస్త్రతుల్యము – నవ్యనవనీత సమానము నిండు మనమ్ము” అని మహాభారతంలోని పద్యాన్ని అన్వయిస్తాడు  సూరికి.

తాను చేసే వృత్తి పాడుదని తాను అనుకోవడం లేదని, అందరూ అలా అనుకుంటున్నందుకే తాను బాధ పడుతున్నానని అంటాడు సూరి. తనకి వీలయినయింత మేర తోటివారికి సాయం చేసి వాళ్ళు జీవనసాగరాన్ని ఈదేలా చూస్తాడు సూరి.

“డబ్బు మీద నమ్మకం పెరిగిన కొద్దీ మనుషుల మీద నమ్మకం తగ్గిపోతుంది మరి.” అంటాడు సూరి ఓ సందర్భంలో. ఈ ఒక్క వాక్యాన్ని ఎన్ని ఇజాలకి అన్వయించుకోవచ్చో!

ఈ నవల చదువుతున్నంత సేపూ సమాజం పట్ల ఓ రకమైన ఏవగింపు కలుగుతుంది. శ్మశాన వైరాగ్యం వల్లకాడులోంచి బయటకొచ్చాక పోతుంది, మరి సమాజ వైరాగ్యం ఎలా పోతుంది? భద్రజనులు, బాధసర్పద్రష్టులు పరస్పర ఘర్షణ లేకుండా జీవనం గడపగలరా? జీవితాలలోని విలువలని పునర్నిర్వచించుకోవాలని అన్యాపదేశంగా సూచించే నవల “పితృవనం”.

1989 దీపావళి సందర్భంగా ఆంధ్రప్రభ వారపత్రిక వారు నిర్వహించిన నవలల పోటీలో ప్రథమ బహుమతి గెలుచుకున్న నవల ఇది.  1992లో తెలుగు విశ్వవిద్యాలయం వారిచే ఉత్తమ నవలగా వార్షిక పురస్కారం పొందిన నవల “పితృవనం”.

గోకుల్ చంద్ర & రాహుల్ చంద్ర మెమోరియల్ చారిటబుల్ ట్రస్ట్, విశాఖపట్నం వారు ప్రచురించిన ఈ నవల అన్ని ప్రముఖ పుస్తక విక్రయ కేంద్రాలలోనూ, జేష్ఠ లిటరరీ ట్రస్ట్ వారి వద్ద, ఇంకా ప్రచురణకర్తల వద్ద దొరుకుతుంది. 141 పేజీల ఈ పుస్తకం వెల రూ.100/-.  కినిగెలోనూ ప్రింట్ బుక్ లభ్యం.

ప్రచురణకర్తల చిరునామా

గోకుల్ చంద్ర & రాహుల్ చంద్ర మెమోరియల్ చారిటబుల్ ట్రస్ట్

c/o. విజయ్ నిర్మాణ్ కంపెనీ

 సిరిపురం జంక్షణ్, విశాఖపట్నం – 530003.

ఫోన్: +91 891 2575755

 

విశ్వనాథ షట్పదీ శింజానం ” మ్రోయు తుమ్మెద “

                                                                                శివరామకృష్ణ

 

sivaramakrishnaఒక ఉపాసకుడైన నవలాకారుడు తాను కూడా ఒక పాత్రగా మారి, తనకు బాగా పరిచయం ఉన్న వ్యక్తి జీవితాన్నే కథావస్తువుగా తీసుకొని నవల రాస్తే ఎలాఉంటుంది? ఆ రచయిత కూడా విశ్వనాథవారి వంటి ఉన్నతశ్రేణి రచయిత ఐతే ఇంకెలా ఉంటుంది? ఈ ప్రశ్నలకు జవాబే విశ్వనాథ సత్యనారాయణ గారి మ్రోయు తుమ్మెద నవల.

 పురిటిలోనే తల్లిదండ్రులను కోల్పోయిన బాలుడు తనకు భూమిమీద నూకలున్న కారణంవల్ల సంతానంలేని ఒక సామాన్య కుటుంబానికి చెందిన దంపతులకు అడవిలో దొరుకుతాడు.  అతనికి జన్మత: మధురమైన కంఠం, అందరినీ సమ్మోహితులను చేయగల స్వరజ్ఞానం ఉంటాయి. బాల్యం లో నీలకంఠం అనే బైరాగి, తరువాత కూచిపూడి భాగవతుడైన వెంపటి వెంకట నారాయణ గారు అతనికి సంగీతంపై అనురక్తి పెరిగేలా చేస్తారు. అప్పటికి అతనికి రాగాలు, వాటి లక్షణాలూ తెలియకపోయినా, శ్రావ్యత అంటే ఇలావుంటుంది అనేలా పాడేవాడు.

ఒకనాడు వెంకటనారాయణగారు అతనికి  శాంతము లేక సౌఖ్యము లేదు అనే త్యాగరాజ కీర్తన వినిపించి, శాంతరసాన్ని ”పిల్లవాని జీవశక్తిలో ప్రవేశ పెట్టెను. ఆ కీర్తనయొక్క యర్థమా పిల్లవాని ప్రాణములో జొచ్చెను. జీవశక్తిలో నాడెను. అతని భవిష్యజ్జీవితమునంతయు పాలించుటకు, నాతని యాయుర్దాయమునకు భంగము లేకుండ జేసెను. ”

ఐతే పిల్లవాని తండ్రికి మాత్రం అతడు బాగా చదువుకొని ఉద్యోగంచెయ్యాలని కోరిక. కాని బాలుడు మాత్రంపాటలు పాడుకుంటూ, ఆ వూరికి వచ్చిన ఉత్తరదేశానికి చెందిన నాటకబృందంవారివద్ద హిందుస్తానీ సంగీతాన్ని మొదటిసారి విని, దాని పట్ల మక్కువ పెంచుకుంటాడు. జీవితమంటే సంగీతమనే భావం ఆ దశలో అతనికి కలుగుతుంది. “తాను జన్మించినది పరీక్షలందుత్తీర్ణుడై సంపాదించి చివరకు చనిపోవుటకు మాత్రము కాదు. మరి దేనికి జన్మించినాడు? తాను గాయకుడు అని తాననుకొనినప్పుడెల్ల తనకే నవ్వు వచ్చును. ఏ రాగము యొక్క స్వరూపమెట్టిదో తెలియదు.  తానెవ్వరి యొద్దనూ శుశ్రూష చేయలేదు. మహా విద్వాంసులతో పరిచయము లేదు. కాని తాను పాడుచుండగా వినుచున్నవాడెల్ల తన్ను గాయకుడనుచున్నాడు. దీనిని వదిలిపెట్టి సుఖము గోచరించని లౌకికపు చదువు వెంట పడుట యెందులకు ” అనుకుంటూ ఉంటాడు.

***

ఇంతవరకూ విశ్వనాథ వారు ఆ బాలుడి పేరు చెప్పలేదు. ఇంతవరకే కాదు, 216 వ పేజీ వరకూ చెప్పరు. ఈ నవలను తమ తండ్రిగారు 1960 లో ఈ నవల వ్రాసినట్టు విశ్వనాథ పావనిశాస్త్రి గారు నవల మొదట్లో పేర్కొన్నారు.  ఆ రోజుల్లో కరీంనగర్ పట్టణం లో ఉండే న్యాయవాది, గాయక సార్వభౌముడు నారాయణరావు గారి జీవితాన్ని ఆధారం చేసుకొని రాసిన నవల ఇది. విశ్వనాథవారు నిజజీవిత వ్యక్తుల జీవితాల్ని ఇలా నవలీకరించడం పరిపాటే! ముంజులూరి క్రిష్ణారావు అనే నటుడి కథను ‘ తెరచిరాజు ‘ నవలగా రాయగా, భావకవి నాయని సుబ్బారావు గారిని వేయిపడల్లోని కిరీటి పాత్రగా మలచారు.

 

కరీంనగర్ పరిసరాల్లో మ్రోయు తుమ్మెద అనే వాగు ఉన్నదట. దాని ప్రవాహపు సవ్వడి తుమ్మెద మ్రోతని పోలి ఉంటుందట.  ఆ మ్రోతని, దాని సమీపం లోనే  పుట్టిపెరిగిన ఈ సంగీతసార్వభౌముడి గళధర్మాన్నీ ముడిపెట్టి ఈ నవలకి మ్రోయుతుమ్మెద అని పేరుపెట్టారు విశ్వనాథ.  నవలలో నాయకుడిని తుమ్మెద అనే పిలుస్తారు విశ్వనాథ

***

పెంచిన తల్లిదండ్రులు తుమ్మెదకి వివాహం చేసారు. ఈ దశలో అతనికి హైదరాబాదు వెళ్ళి పై చదువులు చదువుకోవాలనిపిస్తుంది. తల్లిదండ్రులను ఒప్పించి అక్కడికి వెడతాడు. తుమ్మెద బస్సెక్కి హైదరాబాదు వెళ్ళడాన్ని మనోహరంగా వర్ణిస్తారు విశ్వనాథ. దారిలో షామీరుపేట వద్ద బస్సు చెడిపోవడం, తుమ్మెద బస్సుదిగి పరిసరాల్లోని పొలాల్లో ఆ వెన్నెలరాత్రిలో విహరించడం, అక్కడ అతనికి వినిపించిన పక్షికూతల్లోను, చేలగట్లవెంబడె ఉన్న నీటిబోదెలలోని తరగల సవ్వడుల్లోనూ కలగలిసి ఆతని నోట మధురాతిమధురమైన రాగం పలుకుతుంది.

   హైదరాబాదు చేరిన తుమ్మెద చదువులో రాణిస్తూనే, సంగీతసాధన కూడా చేస్తూ ఉంటాడు. పలువురు సంగీతవిద్వాంసులతో పరిచయం కలుగుతుంది. అతడు చక్కని పాటగాడని విన్న నిజామునవాబు కొడుకు మోఅజ్జంషా అతన్ని మిత్రుడిగా సమ్మానిస్తాడు. తుమ్మెదకి శాస్త్రీయ సంగీతం లో సరైన శిక్షణ లేకపోయినా, అతడు ఏ రాగాన్నైనా, యే గాయకుడు పాడినదాన్నైనా వింటే చాలు, అది అతని నోట అమృతవాహినిలా ప్రవహిస్తూ ఉంటుంది.  కాలక్రమం లో తుమ్మెద చదువుపై  శ్రధ్ధ పెంచుకుంటాడు.

      కాని కొన్నికారణాలచేత తుమ్మెద హైదరాబాద్ వదిలి నాగపూర్ లో చదువు కొనసాగించడానికి వెడతాడు. అక్కడ కూడా చదువు, సంగీతసాధన కొన సాగుతూనే ఉంటాయి. కొందరు సంగీత విద్వాంసులను చూస్తాడు. వారిగురించి విశ్వనాథ ఇలా అంటారు: ” వారభ్యాసము చేసిన వాటిలో పది పన్నెండు కీర్తనలు, వారు రాచి రంపానపెట్టి, నూరి, లేహ్యము చేసి యుండలు చేసినవి. ఆ కీర్తనలలోనే వారు యథేచ్చగా  విహరింతురు.”  శంకరరావు ప్రవర్తక్ అనే విద్వాంసుడి దగ్గర హిందుస్తానీ సంగీతం లోని మెళుకువలు తెలుసుకుంటాడు. అతని పాట అమృతధునీప్రవాహంలా సాగుతూ ఉంటుంది.  

MroyuTummeda600

అతని పాటకు ముగ్ధుడైన ప్రవర్తక్ ” ఓయి నాయనా! నీవభ్యాసము చేయుచుండగా శతవిధాల సరస్వతీదేవి వచ్చి నీ యెదురుగా కూర్చుండియుండును. సాక్షాత్సరస్వతీదేవి కుసుమించినప్పుడెవ్వడేమి చెప్పగలడు” అంటాడు. క్రమంగా ప్రవర్తక్ వల్ల  సంగీతవిద్యతో పాటు దానికి సంబంధించిన అనేక విషయాలూ, కావ్యపరిచయం అబ్బుతాయి తుమ్మెదకి. సంగీతకచేరీలు, ఆకాశవాణిలో పాడే అవకాశాలూ వచ్చి అతడు మంచి కీర్తితో పాటు జీవికకి అవసరమైన ధనాన్నికూడా సంపాదించుకుంటూ ఉంటాడు. ఐనా, యెప్పటి డబ్బు అప్పుడే ఖర్చైపోయి, “ఆదివారమునాడందలము, సోమవారమునాడు జోలె ” అన్నట్టు ఉంటుంది.

అప్పటికే వివాహమైన తుమ్మెదకి రెండేళ్ళ కొడుకు కూడా ఉంటాడు. చదువుకోసం హైదరాబాదు వెళ్ళినతరువాత అతడు మళ్ళీ అరిపిరాల పోలేదు. బాగా డబ్బూ, పేరూ సంపాదించాకే తిరిగివెళ్ళాలని అతడి ఆలోచన. ఆ లక్ష్యాన్ని సాధించాలంటే బొంబాయి వెళ్ళి మరింత సంగీతవిద్యను పెంచుకొని, అక్కడ సినిమాల్లో ప్రవేశించి పేరుప్రఖ్యాతులు, వాటితో డబ్బూ పోగుచేసుకోవచ్చు ననుకుంటాడు. బొంబాయి చేరి, అక్కడ తన  గానవిద్య ప్రదర్శించి నలుగురినీ ఆకట్టుకుంటాడు. డబ్బు కూడా బాగానే వస్తూ ఉంటుంది. కొంతకాలానికి మళ్ళీ సంపాదన తగ్గిపోతుంది. కారణం తుమ్మెదకున్న intellectual arrogance.

ఒకసారి ఒక ప్రముఖ గాయకుడితో విదేశాలకు వెళ్ళే అవకాశం వచ్చినా ఇతని అవిధేయ ప్రవర్తన వల్ల చేజారిపోతుంది. ఇంతలో రెండవప్రపంచ యుధ్ధం వచ్చి, బొంబాయిమీద బాంబుదాడులు జరుగుతాయన్న భయం తోను, భార్యాబిడ్డలు, తల్లిండ్రులపైనా గాలిమళ్ళి స్వగ్రామం చేరుతాడు. అక్కడ తన చిన్నప్పటి గురువు మల్లికార్జునరావుగారి సలహామీద ఉద్యోగం చెయ్యడానికి ఇష్టపడతాడు. ఆ ప్రయత్నంలోనే కొన్నాళ్ళు ఇదివరలో తనను అభిమానించిన నిజాము రాజకుమారుడి దగ్గర ఆంతరంగికుడుగా ఉండి, తన స్వేచ్ఛ కు అది భంగంగా ఉందని తలచి, మానేస్తాడు. తరువాత శ్యామరాజబహద్దరు అనే జాగీర్దారు దగ్గర కొన్నాళ్ళుంటాడు. అనవరంగా ఆయననతో తగవుపెట్టుకొని బయటపపడతాడు. ఆయనన మళ్ళీ పిలిచినా నిరాకరిస్తాడు. “ఈ నిరాకరించుట సిరి రా మోకాలడ్డుట యని యతడికి తెలియును. ఐనా అంతే! ”

మళ్ళీ దేశాటనం! ఈసారి బెంగుళూరు! అక్కడ కూడా తన గాత్రమాధుర్యం తో నలుగురినీ ఆకట్టుకుంటాడు. అక్కడ ఒక వైద్యునికి బాగా దగ్గరౌతాడు. ఆయనదగ్గరికి వచ్చిన కృత్తికోటి స్వామివారు సౌందర్యలహరిలోని ‘అవిద్యానామంతస్తిమిరమిహిర ద్వీపనగరీ’ అనే శ్లోకాన్ని నిత్యం జపిస్తూ ఉండమని, శ్రీచక్రార్చన చేయమనీ ఉపదేశిస్తారు. ఆ ఉపదేశాన్ని తుమ్మెద పాటిస్తూ ఉంటాడు.

ఈలోగానే తుమ్మెద తన కుటుంబంపెరుగుతూ ఉండటంతో ఉపాధ్యాయవృత్తి వదిలిపెట్టి, న్యాయవిద్య నభ్యసించి, కరీంనగర్లో న్యాయవాదవృత్తి స్వీకరిస్తాడు. సంపాదన కూడా వృధ్ధిపొందుతుంది.

***

ఇదే సమయంలో మనదేశానికి స్వతంత్ర్యం  వస్తుంది. కొన్నాళ్ళకి కరీంనగర్లో నారాయణరావుకి (తుమ్మెదే, ఇక్కడినించీ విశ్వనాథవారు అతన్ని అసలు పేరుతోనే సంబోధించారు) జువ్వాడి  గౌతమరావు గారు పరిచయంఅవుతారు. ఆయనద్వారా ఆ వూరి కళాశాలకి అధ్యక్షుడు గా వచ్చిన విశ్వనాథ సత్యనారాయణ గారూ పరిచయం అవుతారు.  రోజూ రాత్రి వీరంతా నారాయణరావు ఇంట్లో సమావేశం అవుతూ, అతని సంగీతాన్ని విని ఆనందిస్తూ ఉంటారు. వేములవాడనించి రాధాక్రిష్ణ శాస్త్రి అనే ఆయన వచ్చి తుమ్మెదకి శ్రీచక్రాన్ని ఇచ్చి దాని ఉపాసనాక్రమాన్ని నేర్పుతారు.  కాలక్రమం లో తుమ్మెద అనబడే నారాయణరావు గొప్ప దేవీ ఉపాసకుడై, న్యాయవాదవృత్తి కూడా చేసుకుంటూ సుఖంగా ఉంటాడు.

***

ఈ నవల విశ్వనాథవారి నవలల్లో అగ్రేసరాలని చెప్పదగ్గ వాటిలో ఒకటి అని నా అభిప్రాయం.  అప్పటికి సజీవుడై ఉన్న ఒక మహా కళారాధకుడి జీవితాన్ని ఒక కథగా నవలీకరించడం మాటలు కాదు. అందులో తాను కూడా ఒక పాత్రగా ఉండడం కూడా అబ్బురపరిచేదే! తనకు కథానాయకుడితో గల పరిచయాన్ని ఇది తెలియచేస్తుంది.

నవల ఆరంభం లోని ” శ్రీవాణీగిరిజా సమష్ఠి రూపమైన యొక శక్తి అనంతాకాశమున అణ్వణ్వంతర సూక్ష్మవియత్సమ్మర్ద క్లిష్టముగా నున్న యొక వేళ, నెగువనున్న యొక గుట్టపై చక్కగా క్రమ్మికొనియున్న  జాజిమొగడలలోని కింజల్కముల తావికి తాత్కాలికముగా దూరమై పశ్చిమాభిముఖముగా దవ్వునగల మాఘ్యవనీపరీమళాశాగత ప్రసార రమణీయముగా  తెల్లనిరెక్కలుజాచి నేలపారుగా నిస్తులాపురమునకు ప్రక్కగా నెగురుచున్న యొక తుమ్మెద అరిపిరాల వచ్చి, హైదరాబాదు పోయి, నాగపురమున విహరించి, బొంబాయిలో తన కంఠనాదమునందు విద్వత్తునలవరించుకొని అటునిటు తిరిగి మరల నరిపిరాల చేరినది” అన్న వాక్యాలనే అంతంలో కూడా చెబుతారు. దీనివల్ల నారాయణరావు జీవితం ఒక చక్రం లా ఎలా పరిభ్రమణం చెందిందో చెప్పినట్టయింది.

 అరిపిరాలకు సమీపం లో ఉన్న వాగు పేరు మ్రోయు తుమ్మెద. దాని అలలసవ్వడి తుమ్మెదరొదలా ఉంటుందట.  ఆ సమీపం లోనే పుట్టిపెరిగిన నారాయణరావు జీవితమంతా సంగీత సాధన లోనె తుమ్మెదఝంకారం లా సాగుతుంది. ఆ వాగుకీ, ఇతని జీవితానికీ సామ్యం ఈ నిరంతర జుంజుంరావమే!    

    ఇక ఈ నవలలో మనకి ప్రముఖం గా కనిపించేది కవిసమ్రాట్టు యొక్క సంగీతవిద్యాపరిజ్ఞానం. రాగాలూ, వాటి లక్షణాలూ, స్తాయీభేదాలూ, ఒక స్వరాన్ని మారిస్తే యే రాగం ఎలా మరోరాగం గా ధ్వనిస్తుందో అన్నీ చదువరికి ఆశ్చర్యం కలిగేలా చెబుతారు. ఈ నవల చదివిన వారికి విశ్వనాథవారికి ఈ భూమండలం లో తెలియని విషయం లేదేమో ననిపిస్తుంది.  చివరంచులు లేని విస్తృతి ఆయన జ్ఞానసాగరానిది. ఈయన ఇన్ని విషయాలు ఎప్పుడు ఎలా తెలుసుకున్నారా అనిపిస్తుంది.  

విశ్వనాథవారి నవలలన్నింటిలోనూ స్థూలం గా చూసే చదువరులకి పేజీలకొద్దీ చర్చలు కనిపిస్తాయి. కానీ సూక్ష్మంగా చూస్తే వాటన్న్నింటికీ కథతో ఏదో ముడి ఉంటుంది. నేనేది రాసినా తెలిసే రాస్తాను అని ఆయన అన్నదే1

ఈ నవలలో కూడా అటువంటివి చాలానే ఉన్నాయి. మచ్చుకి కొన్ని చూద్దాం:

శాస్త్రంఅంటే యేమిటోచెబుతున్నారు: “లోకమునందున్న విషయములను పరిశీలించి, విభజించి, వానియందు రసభావములెచ్చటనుండునో నిర్ణయించి, ఆ రసభావములు ప్రకటితములగుటకు నే మార్గము నవలంబించవలెనో యా మార్గమును నిరూపించి బోధించునది శాస్త్రము.”

మరో చోట మతానికి ప్రాణభూతమైనది శమాది షట్కము. అది లేని మతము మతము కాదు అంటారు. నిజమేగా!

“కవులకు ఊహలు సమృధ్ధిగా గలుగుటకు మన వేదశాస్త్ర  పురాణేతిహాసములందు ననంతములైన వస్తువులు కలవు. కవితాదరిద్రులు మన భాషల నాశ్రయించినచో కవితాసముద్రులగుదురు. ”

కథానాయకుడైన తుమ్మెదను ఒకచోట ఇలా వర్ణిస్తారు విశ్వనాథ వారు:

” అది యొక  పుష్పితోద్యానము! జాజులు, మల్లెలు, పొగడలు, మావులు, తంగెళ్ళు, అవిసెలు పూచియున్నవి. ఒక మదబంభరము జుమ్మని మ్రోయుచు పుష్పోద్యానము నందలి బహు పుష్పముల మీద వ్రాలుచు తన సంచారము చేత పుష్పవనవీధిని పులకితము చేయుచున్నది. ప్రాతర్మందమలయానిలములు వీచుచున్నవి. తోట నడిభాగమున దీర్ఘిక కలదు. దానిలో కపిలను తోలుచున్నారు. కపిలత్రాడు-బరువుగల నీటిబాన పైకి వచ్చునప్పుడు క్రొత్త కట్టె నొరసికొని బొంయి మని ధ్వనిచేయుచున్నది. నీరు తూములోనికి జొచ్చి ప్రక్కకు మరలి బిల్లుమని పోవుచున్నది. చిన్నపిట్ట యేదో యాకాశమున కూయుచున్నది… అట్టి సుందరమైన బాలాతప విహారభూమియైన పూదోటలో సంచరించుచున్న తుమ్మెదవలె నాతడున్నాడు.”

తుమ్మెద ఒకసారి వరంగల్లు కోటను చూడడానికి వెడతాడు. ఆ కోటను చూసేక అతడికి ఆ “దుర్గము సంగీతశాస్త్ర పధ్ధతి మీద నిర్మించినట్లనిపించెను. సంగీతశాస్త్రము సప్తస్వరముల మీద నిర్మింపబడినది. ఓరుగల్లు రాజ్యము సప్తప్రాకారముల మీద నిలువబడెను. కాకతీయప్రభువుల సంఖ్య యేడు. అదియును సప్తస్వరములకు సంబంధించినదే! సహస్ర మంటప నిర్మాణము కూడ సంగీతశాస్త్రము మీదనే నిర్మించబడినది. ఇప్పటికిని జూడవచ్చును, ఏడేడు స్తంభములు గుంపుగా నిర్మించబడిన కట్టడమది. ”

విశ్వనాథవారు ఎక్క డో ఒకచోట మన చదువుల ఔన్నత్యాన్నీ, పాశ్చాత్య విద్య లోని డొల్లతనాన్నీ యెత్తిచూపుతూనే ఉంటారు. ఈ నవలలో ” కడుపున కన్నతల్లి విస్తరిలో నన్నము వడ్డించుచున్నది. పూటకూటింటి యమ్మయు వడ్డించుచున్నది. ఈ రెండు భోజనములకును భేదమున్నదందువా, లేదందువా? ఇది మన చదువయ్యా, మన చదువు! మన ఇంటిలో మనము తినుచున్న యన్నము, వారి ఇంట తినుచున్న యన్నము నొకటి కావు. మనము చదువుచున్న వారి చదువు యెట్టిది? పూటకూటింటి తిండి వంటిది. ఆకలియగుచున్నది కనుక తినుటయే కాని, యది మన యిల్లా? మన కచ్చట స్వేచ్చయున్నదా? ”

ఇక ఈ నవలలోని చివరి అధ్యాయం నవలంతటికీ మకుటాయమానంగా ఉంటుంది. అప్పటికే సిధ్ధసంకల్పుడైన నారాయణరావును మ్రోయు తుమ్మెదతో పోలుస్తూ విశ్వనాథవారు ఇలా రాస్తారు:

” (తుమ్మెద సేకరించిన మధుకణములు) సర్వరోగహర మధురరాగ సంభరితములై, సర్వరక్షాకర మధురనినాద మేదురములై, సర్వార్థసాధక మంత్రాక్షర సముద్గీర్ణములై, సర్వసౌభాగ్యదాయకములై, సర్వసంక్షోభణ విచిత్రారోహణావరోహణ సంచాలన క్షమములై, సర్వాశాపరిపూరకములై త్రైలోక్యమోహనములై విరాజిల్లుచున్నవి. ”

“దాని సవ్వడి ఒకప్పుడు సకార హకారములుగా మారి ‘సోహం’ అన్న పధ్ధతిగా కనిపించును. ఉచ్చ్వాసము సకారమై, నిశ్వాసము హకారమై హంసాకృతి నవలంబించుచుండెను. ఇదియే అజపా గాయత్రి. ఈ తుమ్మెదయొక్క మ్రోత నిరంత కృతోచ్చ్వాస నిశ్వాసరూపపరిణతాజపాగాయత్రి రూపమున కూడ ప్రవర్తిల్లుచుండెను.”

నారాయణరావు శ్రీచక్రార్చకుడయ్యాడు. అతని ఉపాసన పరిపక్వస్థితిని చేరుతుంది. అతడొక మ్రోయు తుమ్మెద. “ఆ బంభరము ఆ తల్లినుపాసించుచున్నది. ఆమెను స్తోత్రము సేయుచుండును. తన యుచ్చ్వాసనిశ్వాసములనామెకు సమర్పించుచుండును” అంటారు విశ్వనాథ. ” మ్రోయు తుమ్మెద యొక్క మధురరావము దేవీచరణకమల మధువన విహారి బంభరారావముగా, మధుర యామినీ సంచరదనిల నవనవాధ్వానములు పులకింపజేయుచున్నవి”  అని ముగిస్తారు విశ్వనాథ వారు.  రచయితకి తనపాత్రల మీద ఉండే మమకారమంతా విశ్వనాథవారికి తుమ్మెద మీద ఉంది. కనుకే అతడు దేవీచరణమంజీరాలవద్ద కూడా వాటికి తోడుగా సుస్వరాలు పాడుతున్నట్టు ముగించారు.

ఇది రచయిత ముందు రక్తమాంసాలతో నడిచిన మనిషి జీవితం కాబట్టి మానవుడి జీవితం లోని సహజమైన విరుధ్ధ భావాలన్నింటినీ మనం తుమ్మెదలో చూడవచ్చు. ముందు సంగీతమే ప్రాణం అనుకోవడం, తరువాత కుటుంబం కోసం ధనాన్ని అధికం గా సంపాదించాలనుకోవడం, కోపతాపాలకు గురవడం, అనవసరమైన పట్టుదలకిపోయి అందిన అవకాశాలు దూరం చేసుకోవడం వంటి గుణాలన్నీ అతనిలో చూస్తాం. ఐనా అతని జీవలక్షణం లో శాంతగుణాన్ని వెంపటి వెంకటనారాయణ గారు బాల్యం లోనే బలంగా నాటారు. చివరికి అదే అతనికి దారి చూపించింది, పురాకృతపుణ్యఫలం అతన్ని గొప్ప ఉపాసకుడిని చేసి దేవీకటాక్షానికి దగ్గరచేసింది.

     ఈ నవలలో విశ్వనాథవారు తన పుత్రవియోగ దుర్భరదశను, తరువాత మధ్యాక్కరలు శివార్పణంగా రాయడాన్నీ కూడా చెప్పారు. ” ఆంధ్ర సారస్వత ప్రక్రియ దేశమునందు మారిపోయినది. పూర్వపధ్ధతియందభిమానము తగ్గినది. తగ్గనిచో నా క్రొత్త మార్గము కొన్నియేండ్లు గడచిన తరువాత సమాదరింపబడును….నా మార్గమునకు కాలముమీద నంగీకృతి కలుగును” అంటారు. అది ఇప్పుడు ఆయన రచనలపట్ల నిజమౌతున్నది.

మ్రోయుతుమ్మెద నవల నిజంగా విశ్వనాథ అనే తుమ్మెద చేసిన మధురమంజుల జుంజుంరావమే!

   ***

అస్తవ్యస్త వ్యవస్థపై రెండు బాణాలు!

కొల్లూరి సోమశంకర్

కొల్లూరి సోమశంకర్

 

సాహిత్యానికున్న ప్రధాన ప్రయోజనం మార్పుకి బీజం వేయడం. కథ, కవిత, నవల, నాటకం – సాహితీరూపం ఏదైనా, దాని పరమార్థం హితం చేకూర్చడమే.

గత కొన్ని సంవత్సరాలుగా భారతీయ సమాజాన్ని… ముఖ్యంగా తెలుగువారిని పట్టి పీడిస్తున్న సామాజిక జాడ్యాలు – స్వార్థం, అవినీతి, జవాబుదారిలేనితనం, వస్తు వ్యామోహం, పర్యావరణ విధ్వంసం, మానవ సంబంధాల విచ్ఛిన్నం వంటి అంశాలను స్పృశిస్తూ ఎన్నో రచనలు వచ్చాయి.

ఒకప్పుడు ఉజ్జ్వలంగా వెలిగిన భారతదేశం, ఇప్పుడిలా ఎందుకు మారిపోయిందని విచారణ చేస్తూ, భారతీయ వ్యవస్థలు అస్తవ్యస్తం కావడానికి బాధ్యులెవరు? పరిస్థితులను చక్కదిద్దాలంటే ఏం చేయాలి? ఎవరు నడుం కట్టాలి?… లాంటి ఎన్నో ప్రశ్నలకు జవాబులిస్తాయి రామా చంద్రమౌళి గారి నవలికలు – “పరంపర”, “ఎటు.?”

***

వ్యక్తి ముఖ్యమా, సమాజం ముఖ్యమా అనే ప్రశ్న చాలా కాలం నుంచి ఉంది. వ్యక్తులు తమ దారి తాము చూసుకుంటూ తమ చర్యలతో సమాజానికి సంబంధం లేదని, అవి తమ వ్యక్తిగతమని భావిస్తారు. తాత్కాలికంగా ఓ చర్య వ్యక్తిగతమనిపించినా… దీర్ఘకాలంలో అది సామాజికం అవుతుంది. వ్యక్తి సమాజానికి బాధ్యత వహించపోయినా, సమాజం వ్యక్తులను దూరం చేసుకోదు, కలుపుకుపోవాలనే చూస్తుంది. కొంతమంది అపరిమితమైన వ్యక్తిగత స్వేచ్ఛ లభించినప్పుడు దానిని తమ స్వార్థం కోసమే ఉపయోగించుకుని, మేధావి అని గుర్తింపు పొంది కెరీర్‌లో అత్యున్నత స్థానాలకు చేరినా, కుటుంబం పరంగా, సమాజం పరంగా ఏమీ విలువ పొందలేక ఆత్మీయులకు దూరమైపోతారు. మరికొందరు వ్యక్తిగత స్వేచ్ఛని, మేధస్సుని సమాజం కోసం ఉపయోగిస్తారు. ఎవరికోసమో అన్నీ వదులుకుంటున్నట్లు కనబడినా, నిజానికి ఎన్నో పొందుతారు, ఎందరినో తమవారిని చేసుకుంటారు. అటువంటి వ్యక్తుల కథ “పరంపర“.

చైతన్య అనే యువ ఏరోస్పేస్ ఇంజనీరు అమెరికా నుంచి ఇండియాకి విమానంలో బయల్దేరడంతో నవలిక ప్రారంభం అవుతుంది. పైన విశాలమైన ఆకాశాన్నీ, క్రింద అనంతమైన జలరాశిని చూస్తూన్న చైతన్యలో ఎన్నో ఆలోచనలు.. అతని అంతరంగంలో ఎంతో అలజడి. ఎన్నో ప్రశ్నల నడుమ తాతయ్య రామాన్ని గుర్తు చేసుకుంటాడు.

అయితే అతనిలో తాతయ్యని చూడబోతున్నాననే ఆనందం లేదు. తాతయ్య పార్థివ దేహాన్ని మాత్రమే చూడగలుగుతాననే దిగులు. తన జీవితానికి దిశానిర్దేశనం చేసిన తాతయ్య ఇకలేడని తెలిసాక… వెల్లువలా పొంగుతున్న దుఃఖాన్ని అణుచుకుంటూ ప్రయాణం… అతని ఆలోచనల్లో గతం.

ParamparaYetu Cover

రామం, రాజ్యలక్ష్మి భార్యాభర్తలు. రామం నాగార్జునసాగర్ డ్యాం నిర్మాణంలో ఇంజనీరు. వాళ్ళది హెవీ మెషనరీ వర్క్‌షాప్‌ ప్రక్కన ఉన్న సి-216 నంబర్‌ క్వార్టర్‌. చైతన్య బాల్యం, చదువు అక్కడే గడిచాయి. చైతన్య లోని ప్రతిభని  తాతయ్య గుర్తించి, సానబెట్టింది అక్కడే. తాతయ్యంటే ఒక ఆదర్శప్రాయుడు. చైతన్యకి అమ్మా నాన్నా లేరా అంటే ఉన్నారు. దూరంగా, రమ్మన్నపుడు రాలేనిచోట ఉన్నారు. తమ ఉద్యోగ బాధ్యతలే తమకు ముఖ్యమనుకునే కెరీరిస్టులు!

అమ్మ పేరు చైత్ర… పెద్ద చదువులు చదివి.. తల్లినీ తండ్రినీ వదిలి ఉద్యోగరీత్యా దేశదేశాలు తిరుగుతూంటుంది. బహ్రేన్‌లోని ఉద్యోగం చేస్తుండగా.. అక్కడ ఓ ప్రముఖ భారతీయ దినపత్రికకు ఈస్ట్‌ ఏసియన్‌ బ్యూరో చీఫ్‌గా పని చేస్తున్న రాజేంద్రకుమార్‌ బన్సల్‌ను పెళ్ళి చేసుకుంటుంది. కొన్నాళ్ళకి చైతన్య పుడతాడు. మూడు నెలల శిశువుగా ఉన్నప్పుడే కొడుకుని తన తల్లిదండ్రుల దగ్గర వదిలేసి వెళ్ళిపోతుంది చైత్ర. దాంతో చైతన్యని అమ్మమ్మ తాతయ్యలే తల్లీ తండ్రీ అయి పెంచుతారు.

ఒక ఇంజనీర్‌గా ఎన్నో ప్రమాదకర సందర్భాలలో రామం చేసిన సాహసోపేత సేవల గురించి ఆయన రిటైర్‌మెంట్ సభలో వక్తలు చెబుతూంటే, చైతన్యలో గర్వం, సంతోషం.. పులకింత, ప్రేరణ! భాషకందని ఏదో తృప్తిని అనుభవిస్తాడు చైతన్య.  ఆ క్షణాన్నే ఒక నిర్ణయం తీసుకుంటాడు.. ఏదో ఒక విలక్షణమైన పనిని తను చేసి ఒక అపూర్వ విజయాన్ని సొంతం చేసుకోవాలని. ఫలితమే తాతయ్యకి దూరంగా రెసిడెన్షియల్ కాలేజీలు, ఉన్నత విద్యా సంస్థలలో చదువు, పరిశోధనా- ఆపై నాసాలో ఉద్యోగం!

రిటైరయ్యాక.. సొంత ఊరిపై మమకారంతో ‘కాకతి’కి వచ్చి స్థిరపడతారు రామం, రాజ్యలక్ష్మి దంపతులు. అస్తవ్యస్తంగా ఉన్న ఆ ఊరిని సంస్కరించడానికి సిద్ధమవుతారు రామం. అందరినీ కలుపుకుని, వాళ్ళల్లో చైతన్యం కలిగిస్తారు. బాగుపడదాం అన్న ఆశావహమైన కోరికని కలిగిస్తారు. ఊరి వారందరినీ కలుపుకుని, నమ్మశక్యంకాని విధంగా.. యిరవై ఏళ్లలో ‘కాకతి’ గ్రామాన్ని తీర్చిదిద్దుతారు రామం. గ్రామస్తులలో స్వార్థరాహిత్యాన్ని, అభ్యుదయ దృక్పథాన్ని, సహనశీలతను అలవర్చి కలను నిజం చేసి చూపిస్తారు.

రామం శవయాత్ర ప్రారంభమయ్యే సమయానికి చైత్ర, రాజేంద్రకుమార్, చైతన్య కాకతి చేరుతారు. అక్కడి అభివృద్ధి చూసి విస్తుపోతారు. రామంగారి కోరిక మేరకు శవాన్ని వైద్యకళాశాలకి అందజేశాక, రాజేంద్రకుమార్ బన్సల్ వెళ్ళిపోతాడు. చైత్ర, చైతన్య ఇంటి కొస్తారు. రామం జ్ఞాపకాలను స్మరిస్తూ తల్లీ కొడుకులు చెరో గదిలో అంతర్ముఖులవుతారు. ఇద్దరూ తమ జీవితంలోకెల్లా క్లిష్టమైన నిర్ణయాలు తీసుకుంటారు. కాకతిలోనే ఉండిపోడానికి నిశ్చయించుకుంటారు. తాతయ్య లక్ష్యాలను కొనసాగించడం కోసం, ఊరిలో మహత్తర అభ్యుదయ కార్యాలు చేపట్టడం కోసం చైతన్య కార్యోన్ముఖ్తుడు కావడంతో నవలిక ముగుస్తుంది.

***

ఎటు.?” నవలిక తన జీవితం తనకి నచ్చడం లేదని హిమ అనే ఇరవై మూడేళ్ళ అమ్మాయి తన తల్లికి ఉత్తరం రాస్తూండడంతో ప్రారంభమవుతుంది. జీవితం తనకెందుకు నచ్చడంలో చెబుతుంది హిమ. ఆమె తల్లి ఐ.ఎ. ఎస్, తండ్రి ఐ.పి.ఎస్ ఆఫీసర్లు. విపరీతంగా కరప్టడ్. ఒక అతి సామాన్యమైన నిరక్షరాస్యుడు చేసే తప్పుతో పోలిస్తే, ఉన్నతమైన చదువులు చదివిన తన తల్లిదండ్రులు చేస్తున్న దోపిడి కోటిరెట్లు పెద్దది, ఎక్కువ తీవ్రమైనదని హిమకి తెలుసు.

తల్లిదండ్రుల విపరీత ధోరణిని భరించలేని హిమ వాళ్ళని మార్చడానికి ప్రయత్నిస్తుంది. వాళ్ళలో మార్పు రాదు. నిరాశ చెందిన హిమ హాస్టల్ ఏడో అంతస్తులోని తన గది కిటికీలోంచి దూకి ఆత్మహత్య చేసుకోవాలనుకుంటుంది. ఆఖరి క్షణంలో ఆమెలో ఆలోచన! తను చనిపోయినంత మాత్రాన వాళ్ళిద్దరూ మారుతారన్న ఆశేమీ లేదని గ్రహిస్తుంది. అలాంటప్పుడు చచ్చి సాధించేదుముందని తనని తాను ప్రశ్నించుకుంటుంది.

రమణ అనే ఇంజనీరు మరో ముఖ్యమైన పాత్ర ఈ నవలికలో. తెలుగు రాష్ట్రాలలో విచ్చలవిడిగా ఇంజనీరింగ్ కాలేజిలు ఏర్పడడం, ప్రమాణాలు, అర్హతలు లేకుండా…. ప్రతి సంవత్సరం మూడు లక్షలకి పైగా  – ఉద్యోగాలకు పనికిరాని మానవచెత్తను తయారు చేస్తూ దేశం మీదకి వదలడం గురించి దుఃఖించే వ్యక్తి.

ప్రభుత్వం వారి వీధి బడిలో అక్షరాభ్యాసం చేసుకుని, ప్రభుత్వ పాఠశాలలో చదువుతూ, కార్పోరేట్ స్కూళ్ళల్లో చదివే విద్యార్థులకు ఏ మాత్రం తీసిపోకుండా ఉన్నత చదువులు చదివి తనని తాను తీర్చిదిద్దుకున్న మరో పాత్ర జయ. ఎమ్మెస్సీ పూర్తయి, డాక్టరేట్ అయిపోవస్తుండగా… తల్లితండ్రుల ఒత్తిడి మీద పెళ్ళి చేసుకుంటుంది. అంతే, ఆ వివాహంతో – నిప్పులాంటి తెలివైన పిల్ల ఒక భల్లూకపు గుహలోకి ప్రవేశించినట్లయింది. భర్త తనని శారీరకంగా, మానసికంగా ఎంతలా హింసిస్తున్నా భరిస్తుంది, సహిస్తుంది…

కాని ఎంత కాలం? ఈ ముగ్గురు తమ తమ అసంతృప్తుల నుంచి బయట పడాలనుకుంటారు. తమకు వీలైనంతలో సమాజానికి ఉపయోగపడాలనుకుంటారు. జీవితంలో ఎటు వెళ్ళాలో తెలుసుకుంటారు. కొత్త విషయాలు నేర్చుకుంటారు. తోటి వారికి మార్గదర్శకులవుతారు.

శీర్షికలోనే ప్రశ్న ఉన్న ఈ నవలికలో ఎన్నెన్నో ప్రశ్నలు… సమాధానాలు లేని ప్రశ్నల్లా అనిపించినా… నిజాయితీగా ఆత్మశోధన చేసుకుంటే జవాబులు దొరకగలిగే ప్రశ్నలు.

***

Prof.RaamaaChandramouliమనిషి మనుగడకు మూలమైన, మౌలికమైన సకల సూత్రాలన్నీ భారతీయ చింతనలో నిక్షిప్తమై ఉన్నాయని ఈ రెండు నవలికలూ స్పష్టం చేస్తాయి.  వీటిల్లో లోతైన తాత్త్వికత ఉంది. పద గాంభీర్యమే గాని పదాడంబరం లేదు. “మనిషి బుద్ధికి మాత్రమే విద్యనిచ్చి, నైతిక విలువల గురించి ఏమీ నేర్పకపోయినట్లయితేఅతను సమాజానికి చీడ పురుగులా తయారౌతాడ”ని థియోడర్ రూజ్‌వెల్ట్ చెప్పిన సత్యాన్ని రమణ పరంగా చెప్పడం బావుంది. మొదటి నవలికలో చైతన్యకి మార్గదర్శనం చేసినది తాతయ్య రామం అయితే, రెండో నవలికలో రమణకి దిశానిర్దేశనం చేసింది రాములు సార్. పేర్లలోనే కాదు, వ్యక్తిత్వంలోనూ సారూప్యత ఉన్న మహోన్నతులు వాళ్ళిద్దరు. అటువంటి వారు ఊరికొకరు ఉన్నా, మన వ్యవస్థల్లోని అస్తవ్యస్తతలని సరిదిద్దుకోగలుగుతామేమో.

ఈ రెండు నవలికలలో ఎన్నో మౌలికమైన అంశాలను తేలికైన పదాలతో పాఠకులు సులభంగా గ్రహించేలా వ్యాఖ్యానిస్తారు రచయిత. ప్రపంచీకరణకి విరుగుడు స్థానికీకరణ అని, ఆ చింతనని ఒక ఉద్యమంలా అభివృద్ధి చేస్తే జన జీవనంలోని అశాంతి క్షీణించి భారతదేశం పురోగమిస్తుందని రచయిత సూచిస్తారు.

“పరంపర” చిత్ర మాసపత్రిక మార్చి 2013 సంచికలో అనుబంధ నవలికగా ప్రచురితం కాగా, “ఎటు.?” చిత్ర మాసపత్రికలో 2014 జూన్ నుంచి నవంబర్ దాకా ధారావాహికంగా ప్రచురితం. ఈ రెండు నవలికలను ఒకే సంపుటంగా సృజనలోకం, వరంగల్లు వారు ప్రచురించారు. 142 పేజీలున్న ఈ పుస్తకం వెల 150 రూపాయలు. నవోదయ బుక్ హౌస్, హైదరాబాద్ వారి వద్ద, రచయిత వద్ద పుస్తకం దొరుకుతుంది. ఈ-బుక్ కినిగెలో లభ్యం.

*