సాహిత్యానికి భారతరత్నం రాదా?

bharathratna
దేశానికి గర్వకారణమైన వ్యక్తులను గౌరవించుకునేందుకు ఏర్పడ్డ అత్యున్నత పురస్కారమైన భారతరత్న తన చరిత్రలో మరో మేలిమలుపు తీసుకుంది. ఆరుపదుల ప్రస్థానం చేరుకుంటున్న ఈ పురస్కారం సాంఘికసేవా, రాజకీయ, శాస్త్రసాంకేతిక, కళారంగాల పరిమితి నుంచి ఏ రంగంలో అత్యున్నత ప్రతిభ చూపినవారికైనా ఇవ్వవచ్చని నిబంధనలు మార్చడమేకాక తొలిగా సచిన్ టెండూల్కర్ ను క్రీడారంగం నుంచి ఎంపికచేశారు. ఇక జాతిభేదాలకు 1980దశకంలో భారత్ లో జన్మించని భారతపౌరురాలు మదర్ థెరెసా, బ్రిటిష్ ఇండియాలో భాగమైన నేటి పాక్ ప్రాంతంలో జన్మించిన విదేశీపౌరుడు ఖాన్ అబ్దుల్ గఫర్ ఖాన్ లకు, 90ల్లో ఈ దేశంలో జన్మించని, ఈ దేశపౌరుడూ కాని నెల్సన్ మండేలాకు పురస్కారం ఇచ్చి వసుధైవ కుటుంబమన్న భారతీయ ఆదర్శాన్ని చాటారు. లక్ష్యాల్లో ఇంతటి సువిశాలమైన అవార్డు మాత్రం తొలి నుంచీ మార్గదర్శకాల్లో భాగమైన సాహిత్యరంగాన్ని విస్మరించడం ఆశ్చర్యకరం, బాధాకరమూను.
భారతరత్న పురస్కారం పొందినవారిలో కొందరు బహు గ్రంథరచయితలు ఉన్నారు. వారిని రచయితలని పేర్కొంటూ భారతరత్న సాహిత్యానికి దక్కిందని భావించే వీలు లేదు. పురస్కార గ్రహీత జవహర్లాల్ నెహ్రూ భారత చరిత్ర, ప్రపంచ చరిత్రవంటి అంశాలపై గ్రంథరచన చేసినవారే. ఐతే వారిని గురించి పేర్కొనాల్సి వస్తే భారత తొలిప్రధాని, స్వాతంత్ర సమరయోధుడు అనితప్ప సాహిత్యవేత్త అనరు. ఆయన మౌలికంగా రాజనీతి రంగానికి చెందినవారు. భారతరత్న పొందిన రాజకీయనేతలు చక్రవర్తుల రాజగోపాలచారి, గోపీచంద్ బోర్డోలోయ్ , తత్త్వవేత్త సర్వేపల్లి రాధాకృష్ణన్, సంస్కృత పండితుడు, సంఘసంస్కర్త పాండురంగ్ వర్మన్ కానే,శాస్త్రవేత్త ఎ.పి.జె.అబ్దుల్ కలాం, తదితరులు ఎంతో విలువైన సాహిత్యాన్ని రాసినా వారు మౌలికంగా వేర్వేరు రంగాలవారు. ఏ రంగానికి చెందిన నిష్ణాతులైనా తమ ఆవిష్కరణలను వెలువరించడానికి సాహిత్యాన్నే ఉపకరణం చేసుకోవడం సాహిత్య ఔన్నత్యాన్ని తిరుగులేనివిధంగా నిరూపిస్తోంది. సాహిత్యమనే రంగం తొలినుంచీ అవార్డుల నిబంధనల్లో ఉన్నా, సాహిత్యవిభాగంలో ఎవరికీ భారతరత్న దక్కలేదనే చేదునిజం తేలుతోంది.
మానవ హృదయనిర్మాతలుగా, జాతి భవిష్యత్ నిర్దేశకులుగా ప్రపంచంలోని ప్రతి జాతిలోనూ, ప్రతి దేశంలోనూ సాహిత్యకారులకు గౌరవం దక్కుతోంది. కిర్గిజ్ జాతికి ఛెంగిజ్ ఐత్మోతావ్ జాతిపితగా పేరొందగా షేక్స్పియర్, టాల్ స్టాయ్ వంటి ఎందరో సాహితీవేత్తలను ఆయా దేశాలు తమ సాంస్కృతిక సంపదగా గౌరవించుకుంటున్నాయి. విగ్రహాలు, స్మృతిచిహ్నాలు మొదలైన ఎన్నో విధాలైన గౌరవాలతోపాటు కొన్ని దేశాల్లో రచయితలు జీవించిన వాడలు, చిన్న ఊళ్లు వారు జీవించిన కాలంలో ఎలా ఉండేవో అలాగే టైం ఫ్రీజ్ చేసిన సందర్భాలూ ఉన్నాయి. ఇదంతా వారి స్మృతికే కాక వారి సృజనలకు ఇచ్చే నివాళి. ఒక్కో కవి, రచయిత తన భావజాలాల పరిధి వందల, వేల ఏళ్లకు, దేశాల సరిహద్దులు దాటి విశ్వమానవాళికీ విస్తరింపజేశారు. మరో కోణంలో చెప్పాలంటే శాస్త్రసాంకేతిక, తత్త్వశాస్త్రాది రంగాల్లోనైనా అత్యుత్తమ స్థాయి ప్రతిభ చూపినవారు వాటిని వ్యక్తపరచడానికి కూడా సాహిత్యాన్నే ఎన్నుకున్నారు. వివిధ మతాలు, రకరకాల ఇజాలు తమ ప్రభావాన్ని చూపేందుకు అక్షరమే ఆయుధమైంది.
ప్రపంచ మానవాళి అంతటిలాగానే భారతీయుల్లో కూడా సాహిత్యమనే దీపాన్ని వెలిగించి జాతిజనుల హృదయాలకు వెలుగులు పంచిన మహాకవులు, రచయితలూ సహజంగానే ఉన్నారు. వారి కవితాపాదాలు నినాదాలై  దేశాన్ని కుదిపేశాయి, వారి కవితల్లో భావచిత్రాలు శ్రోతల, పాఠకుల హృదయాల్లో జన్మాంతరమైన భావాలు రేపాయి. అలాంటి సహజరత్నాలైన ఎందరో సాహిత్యకారుల్ని భారతరత్నాలుగా గుర్తించకపోవడం వెనుక ఏ కారణాలున్నాయో తరచి చూసుకోవాల్సిన అవసరం ఉంది.
తమ రంగాల్లోని అత్యున్నత ప్రతిభతో జాతికి సేవచేసిన, భారత జాతి ప్రతిష్టను పెంచిన వ్యక్తులు ఈ అత్యున్నత పురస్కారానికి అర్హులని మౌలికంగా చెప్పుకోవచ్చు. 1954లో నాటి రాష్ట్రపతి రాజేంద్రప్రసాద్ ప్రారంభించిన ఈ పురస్కారం ప్రకటించిన సచిన్, శాస్త్రజ్ఞుడు రావులను కలుపుకుంటే 43మందిని వరించింది. ఈ అవార్డు పొందినవారి జాబితా పరిశీలిస్తే కొన్ని ఆసక్తికరమైన అంశాలు కనిపిస్తాయి.
1.భారతజాతీయుల ప్రతిభ, కృషి అంతర్జాతీయ సమాజాన్ని ఆకర్షించినప్పుడు, అంతర్జాతీయ స్థాయిలో వారికి ప్రతిష్టాత్మక గౌరవాలు, పురస్కారాలు లభించినపుడు భారతరత్న ప్రదానం చేశారు.
అవార్డు ఏర్పరిచిన తొలిసారే నాటికి 20ఏళ్లనాడు ప్రతిష్టాత్మక నోబెల్ అందుకున్న సి.వి.రామన్ ను, ప్రపంచ ప్రఖ్యాతిపొందిన తత్త్వవేత్త సర్వేపల్లి రాధాకృష్ణన్ ను అవార్డు వరించింది. ఆపైన నోబెల్ పొందిన ఏడాది తిరగకుండానే అమర్త్య సేన్, ప్రతిష్టాత్మక ఆస్కార్ జీవితసాఫల్య పురస్కారం తానై కలకత్తా చేరి వరించిన ఏడాదే సత్యజిత్ రాయ్ లకు భారతరత్న లభించడం కూడా ఈ ధోరణిని చూపిస్తుంది. ఇలా చాలామందే అంతర్జాతీయ స్థాయి సత్కారాలు పొందిన తర్వాత భారతరత్న అందుకున్నారు. వీరికి అవార్డు లభించడంతో అవార్డుకు గౌరవం వచ్చింది.
2.మరో ధోరణి దేశ చరిత్రలో పలు మేలిమలుపుల వెనుకనున్న ఒకరికి సత్కారం లభించడం. దేశ విభజన అనంతరం స్వతంత్ర రాజ్యాలుగా ఉన్న భారతదేశాన్ని ఏకీకరణకు కృషి చేసిన వల్లభాయ్ పటేల్, 1944-1950 అస్సాంలో ప్రతిపక్ష నేతగానూ, పదవిలోనూ తన జాగ్రత్తతో ఆ ప్రాంతం తూర్పు పాకిస్థాన్ పరం కాకుండా కాపాడి, ఆపై సరిహద్దుల్లో చైనా దూకుడుకూ కళ్లెం వేసిన గోపీచంద్ బోర్డోలోయ్, ఆహారధాన్యాల కొరతతో విలవిలలాడుతున్న దేశానికి సుభిక్షతనిచ్చిన “హరిత విప్లవ” సారధుల్లో ఒకరైన నాటి వ్యవసాయమంత్రి చిదంబరం సుబ్రమణియం, దేశ ఆయుధరంగంలో కృషిచేసి సార్వభౌమత్వానికి పాటుపడ్డ ఎ.పి.జె.అబ్దుల్ కలాం తదితరులు ఈ కోవలోని వారు. వీరి కృషితో వచ్చిన గౌరవాన్ని అవార్డులకు ఆపాదిస్తారు. ఐతే వీరి ఎంపికలో రాజకీయపర కోణాలుంటాయి. ఒక్కో మేలిమలుపు వెనుక, ఒక్కో అపురూప ఘటన వెనుక కనీసం మరో నలుగురైదుగురు మూలమూర్తులు ఉంటారు. వారిలో ఎవరికి ప్రాతినిథ్యం కట్టబెట్టాలన్నప్పుడు ఆ స్వేఛ్ఛను వాడుకుంటారు.
3.కొన్ని భావజాలాలకు ప్రతినిథులను కూడా ఈ పురస్కారాలకు ఎంపికచేశారు. అలాగే వివిధరంగాల్లో మేరుసమానులనూ ఎంపిక చేశారు. వీరినే ఎందుకు ఎంచారన్నదానిలో కూడా అధికారంలోని వ్యక్తుల తాత్త్విక, రాజకీయ భావజాలాలు, ఆనాటి స్థితిగతులు ఉంటాయి. ముఖ్యంగా 1999లో కార్గిల్ విజయోత్సాహంలోని ఎన్.డి.యే. హయాంలో అస్సాం(నేటి ఈశాన్యరాష్ట్రాల్లో అధిక భాగం అస్సాంగానే ఉండేది)ను భారతదేశంలో విలీనం చేసిన అర్థశతాబ్ది నాటి గోపీచంద్ కు అవార్డు దక్కిందంటే దాని వెనుకనున్న కారణాలు చెప్పనక్కర లేదు కదా. అలాగే వారణాసి, గంగ, విశ్వేశ్వరాలయం నాతో అమెరికా తీసుకురాగలరా అని తనను ఆహ్వానించిన పాశ్చాత్యులను ప్రశ్నించిన షెహనాయ్ మేరుశిఖరం బిస్మిల్లా ఖాన్ కు కూడా వారి హయాంలోనే అవార్డు వచ్చింది. తాను ప్రధాని అయ్యేనాటికి కాంగ్రెస్ రాజకీయాల్లో చక్రం తిప్పిన కామరాజ్ కు ఇందిర హయాంలో అవార్డు రావడం మొదలుగా చెప్పుకుంటూపోతే ఏ అవార్డు వెనుకనైనా ఏదోక రాజకీయకోణం తొంగిచూస్తూంటుంది. దేశంలోని కొన్ని భాషలు, కొన్ని వర్గాల వారు అభిమానించి ఆరాధించేవారెందరికో అవార్డు రావడం వెనుక అది కారణంగా నిలిచింది. రాజకీయ కారణాలతో పాటు పురస్కారాలు అందుకున్నవారు చాలామంది ఈ పురస్కారం విలువను పెంచినవారే అయ్యారు.
ఈ నేపథ్యంలో చూస్తే ప్రపంచంలోనే ప్రఖ్యాతి చెందిన పురస్కారాలు పొందినవారు, తమ కవితలోని రెండు పదాలు నినాదాలై చరిత్ర గతి మార్చిన ఉద్యమపతాకం పొందినవారు, నేటి మన ప్రతి భావజాలానికి ప్రతీకలై నిలిచినవారు గత శతాబ్ది సాహిత్యవేత్తల్లో ఉన్నారు. రెండుదేశాలకు జాతీయగీతాలుగా తాను రాసిన పాటలు వెలిగి ఆ కారణంగా ప్రపంచంలోనే అరుదుగా నిలిచిన సాహితీవేత్త భారతీయుడే. దేశంలో ప్రతిభాషలోనూ తమ జాతిజనులను ప్రభావితం చేసి అజరామరమూ, సర్వకాలీన, సార్వజనీన సాహితాన్ని సృష్టించినవారున్నారు. పోనీ రాజకీయ కారణాలని అనుకుంటే రాజకీయంగా వర్గాలుగా విడదీసుకుని చూసినా ఒక్కో సాహిత్యవేత్తనీ తమ భావజాలాలకు ప్రతినిధిగా చూసే అశేషప్రజానీకం ఉన్నారు.
వివిధ భాషా వైవిధ్యాలతో విలసిల్లే దేశంలో భాష ప్రధానాంశమైన సాహితీవేత్తలకు పురస్కారాలు ఇస్తే ఇతర భాషాసమాజాల నుంచి వ్యతిరేకత వస్తుందని భావించే అవకాశం ఉంది. కానీ జాతి భవిష్యత్తును నిర్మించేందుకు, సంస్కృతిని తమ రచనల్లో ప్రతిబింబించేందుకు కృషి చేసి ఋషిత్వాన్ని పొందిన సాహిత్యకారులకు నిష్పాక్షికంగా భారతరత్నకు ఎంపికచేస్తే బహుళత్వాన్ని కాపాడుకుంటూ వస్తున్న భారతీయులు సంతోషిస్తారు తప్ప వ్యతిరేకించరు. మరణానంతరం పురస్కారం ప్రదానం చేసే సంప్రదాయం ఉంది కనుక ఇన్ని ఏళ్లుగా పురస్కారం పొందని పలువురు అర్హులైన సాహిత్యవేత్తలకు ఇకనైనా ప్రదానం చేయవచ్చు. జాతి సామూహిక మేధలో, హృదయంలో తమ రచనలతో భాగమైపోయిన సాహిత్యకారులను అత్యున్నత పౌరపురస్కారంతో గౌరవించడం సముచితమే కాదు అత్యవసరం.
santhosh—సూరంపూడి పవన్ సంతోష్

అంట్లు.. పాచి… కూసింత ఆత్మీయత!

amma and satavathi

పనిమనిషి, పనమ్మాయి మా ఇంట్లో వినిపించనేకూడని ఒకేఒక్క పదం.

                 ఐతే మా ఇంట్లో ఎవరూ పనిచేయరని కాదు. పనిచేస్తారు. సబ్బు లక్ష్మి, సముద్రం(మనిషి పేరు), సిరి, నాగవేణి, నాగమణి, సత్యవతి-ఇలా ఎందరు మా ఇంట్లో పనిచేసినా పేర్లతో పిలవడమే తప్ప “మా పనమ్మాయి” అని ఎప్పుడూ అమ్మ అన్నది లేదు. మేము “పనమ్మాయి వచ్చిందమ్మా” అని చెప్తే ఊరుకున్నదీ లేదు. స్వావలంబన, సమానత్వం, వ్యక్తి గౌరవం లాంటి పెద్ద పదాల గురించి మా అమ్మ చదివినట్టు లేదు కానీ నాకు తెలిసినంతలో వాటి స్పృహ, ఆచరణల్లో ఆమెని మించినవారిని నేనెన్నడూ చూడలేదు. ఇంకో విశేషమేంటంటే మా అమ్మ సహృదయత, సంస్కారం మా చుట్టపక్కాలకే కాదు మాకే స్పష్టంగా తెలిసేది కాదు. కొడుకును కాబట్టి అమ్మ ఆచరణను దగ్గరనుంచి చూస్తూండగా ఏళ్లకేళ్లలో నాకు అర్థమైంది మా ఇంట్లో పనులు చేసేవాళ్లను ఆమె చూసుకునే పద్ధతి. అమ్మా నువ్విలా చేస్తున్నావు తెలుసా అంటే ఆమె కూడా ఆశ్చర్యపోయిందంటే చూడండి.
                అమ్మ నాకు మా తాతముత్తాతల గురించీ,పెదనాన్నలు, అత్తయ్యల గురించి తెలుసుకున్న విశేషాలు(పుకార్లు చెప్పేది కాదు. కచ్చితంగా తెలిసినవే చెప్పేది), వాళ్ల జీవితంలో చీకటివెలుగులు చెప్తూంటుంది. అలాంటి వాటిలో ఒకటి మా పెదనాన్న-అతని నౌకరు కథ. మా తల్లిదండ్రులది మేనరికం. మా నాన్నారి అక్కకూతురు మా అమ్మ. ఇద్దరూ మేనమామ-మేనకోడళ్లు. పైగా ఆమె బాల్యం చాలావరకూ(దాదాపు ఆమె 10ఏళ్ల వయసు వరకూ) మా పెదనాన్నలు, పెద్దమ్మలు, అత్తయ్యలు, నాన్నమ్మలతో మా స్వగ్రామంలో ఉమ్మడి కుటుంబంలోనే గడిచింది. మా పెదనాన్న(అంటే అమ్మకి పెదమావయ్య) గ్రామ కరణం. బహుశా ఈ కథ 1975-80 కాలంలోనిది. ఓరోజు నౌకరు కొడుకు వెంకడు(పేరుమార్చాను) మా ఇంటికి వచ్చాడట. అతనిదీ చాలా చిన్న వయసే. మా అమ్మ బయటకి వచ్చి “పెదమావయ్య స్నానం చేస్తున్నాడు. అలా అరుగు మీద కూచో” అందట. మంచినీళ్లేమైనా కావాలా అనడిగి, పెద్దాయనకి చెప్పేందుకు వెళ్ళింది. స్వతహాగా మా పెదనాన్నది ప్రథమకోపం.
అరుగుమీడకి వచ్చీరాగానే పిచ్చగా తిడుతూ కొట్టినంత పని చేసాడు.  అతని మాటల్లోనే తేలిన విషయమేమిటంటే- కచేరీ చేసే అరుగు మీద నౌకరు కొడుకు కూర్చోవడమేంటి? ఊళ్ళో రాజులేవరైనా చూస్తే మళ్లీ మా అరుగెక్కుతారా? నిజానికి మా అమ్మ అప్పటికి చాలా చిన్నది. ఇలా కూడా ఉంటుందా లోకం అని కొత్తగా తెలిసింది ఆమెకి. ఐతే మా అమ్మ కథ ఇక్కడితో ఆపలేదు. ఓ పదేళ్లు తిరిగేసరికి వెంకడల్లా గ్రామనౌకరుగా ప్రభుత్వంచే నియమింపబడ్డాడు. మా పెదనాన్న ఉద్యోగం సక్రమంగా చేయాలంటే నౌకరు చక్కగా సహకరించాలి కదా. పైగా నాటికి సాంఘికమైన కొన్ని కట్టుబాట్లు, మూర్ఖపు పట్లు పలచబడ్డాయి. వెంకడితో మండల కేంద్రానికి వెళ్ళే పని పడింది. పాత విషయాలేవీ గుర్తులేని ఆయన “రా ఎక్కు” అని (మోటారు)బండి ఎక్కమని పిలిచాడు. అతను గతం మర్చిపోలేదు. “మీ బండి ఎక్కితే పెద్దమనుసులు ఎవురైనా మళ్లీ ఎక్కుతారాండీ” అని గతం గుర్తుచేసుకుని బాధపడ్డాడు. మా పెదనాన్న అయ్యో ఏదో అప్పుడు అలా జరిగిపోయింది లే బాధపడొద్దని సముదాయించాడు. ఆ తర్వాత అతను రెవెన్యూ ఉద్యోగి కూడా అయ్యాడు. అప్పుడు కూడా “మీ అరుగు మీదకి నేనెక్కితే పెద్దమనుషులు ఎవరైనా మీ అరుగు తొక్కుతారాండీ” అని వేళాకోళంగా అనేవాడు. గతం తిరగదోడాడు. అప్పటికి మా అమ్మకి పెళ్లయింది, దీనికీ అమ్మ ప్రత్యక్ష సాక్షిగా నిలిచింది. ఇలాంటివి ఎన్నో ఆమె దృక్పథం వెనుక ఉండి ఉంటుంది. “పనివాళ్లయితే మనుషులు కాదా. జరుగుబాటు లేని ఇళ్ళలో వాళ్ళు పుట్టారు. ఎంతో కొంత జరుగుబాటున్న ఇంట్లో మనం పుట్టాం. అంతే కదమ్మా తేడా” అంటుంది అమ్మ. అందుకే మా ఇంట్లో పనిమనుషులన్న మాట చాలా తప్పు మాట.
                           అమ్మ పెళ్ళవగానే “ఎంప్లాయర్” అయ్యింది; మా అమ్మ దగ్గర పని చేసిన మొదటి పనిమనిషి పేరు సబ్బు లక్ష్మి. పల్లెటూళ్ళో కాపురం. 2 పెద్ద అరుగులు, కాఫీ వసారా, ఉత్తరంపు వసారా, విశాలమైన చావిడి, వంట గది, పూజగది, తూర్పువైపు గది, పెద్ద మెట్టు(వీధి వైపుంటే అరుగంటారు అది మగాళ్ల సామ్రాజ్యం, మరి ఏ వైపున్నా మెట్టంటారు. అక్కడ అమ్మలక్కల కబుర్లు సాగుతూంటాయి).బయట దస్త్రాల గదితో సహా 500గజాల్లో ఉండే పేద్ద ఇల్లు అంతా మా అమ్మ చక్కబరుచుకోవాల్సి వచ్చేది. మిగిలిన పెద్దనాన్నలు ఇల్లు వాటా వేసుకున్నా ఊళ్ళో ఒకరు, పక్కూరిలో మరొకరు, హైదరాబాదులో ఇంకొకరు అద్దెకుండేవారు. దాంతో మా అమ్మ వాళ్ళ వాటాలతోపాటు ఇల్లంతా తుడిచి,అలికి,బాగుచేసుకోవాల్సి వచ్చింది. మాకు పనిచేసే లక్ష్మి ఈ భారమంతా తన మీద వేసుకునేదిట. మొత్తం ఇల్లంతా ప్రతీ నెల రెండుసార్లు అలికి, రోజూ తుడిచి, పండగ వచ్చినపుడల్లా బూజు దులిపేది. మిగతా అంట్లు, చుట్టూ ఉన్న మరో 500గజాల స్థలం ఊడ్పులు సరేసరి. అలికినప్పుడు మా అమ్మే లక్ష్మి వాళ్ల ఇంటిలో పొయ్యి వెలిగే పనిలేకుండా వంట చేసేది.
                            అలాంటి లక్ష్మికి ఓరోజు పెద్ద కష్టం వచ్చిపడింది. తాగుడికి డబ్బులివ్వడం లేదని, పుట్టింటివాళ్ళతో తనకెన్ని గొడవలున్నా లక్ష్మి పుట్టింటికి వెళ్తూనే ఉందని, ఇలా చిన్నా చితకా, పెద్దా పరకా గొడవలతో లక్ష్మి భర్త ఆమెతో పెద్ద దెబ్బలాట పెట్టుకున్నాడు. తిట్టుకున్నంత సేపు ఇద్దరూ సమ ఉజ్జీలుగానే ఉన్నారు గానీ అతను లక్ష్మిని రోకలిబండ పుచ్చుకుని కొట్టాకా ఆమె ధైర్యం సడలిపోయింది. దానికితోడు లక్ష్మిని చంపుతానంటూ కత్తి పట్టుకుని వెంటపడ్డాడు. పారిపోతూ రక్షణ కోసం ఊరంతా తిరిగింది. “ఆడు కత్తి పట్టుకుని తిరుగుతున్నాడంటే నిన్నేమీ నరికేస్తానికి కాదు. ఏదో భయపెడతన్నాడు అంతే”, అని కొందరు “మొగుడూ పెళ్ళాలు మళ్ళీ ఒకటవుతారు. మధ్యలో చేడేది మేమే” అని ఇంకొందరు.
ఆ స్థితిలో 19ఏళ్ల వయసున్న మా అమ్మ(చిన్నవయసు పెళ్లి లెండి తనది) ఆమెని దాచిపెట్టింది. ఊళ్ళో కావాల్సినవాళ్లు”వాడు పెద్ద పిచ్చెదవ. పసిపిల్లలు ఉన్నదానివి నీకెందుకీ గొడవ. దాన్ని వదిలెయ్” అన్నారు, ఇరుగుపొరుగు “మీకెందుకు సాయి గారో ఈ గోల. ఆళ్ళూ ఆళ్లు ఒకటైపోయి మీకు సెడ్డ పేరు మిగులుద్ది” అని సలహాలిచ్చారు.   లక్ష్మి భర్త రోజూ కత్తి పట్టుకుని,”లచ్చీ బైటికి రా. కరణం గారింటో ఉంటే ఏటీ సెయ్యలేనని అనుకుంటన్నావేమో. నీ సంగతేంటో సూత్తాన”ని బెదిరించేవాట్ట. కానీ మా అమ్మ లక్ష్మిని ఆమె మొగుడి చేతికి వదలలేదు.
                      మా నాన్నగారేమీ అడ్డు చెప్పలేదట కానీ నిర్ణయమూ, నిర్వహణా పూర్తిగా మా అమ్మదే. రోజుకో గదిలో దాచిపెట్టి, పొద్దుట కాఫీ నుంచి రాత్రి భోజనం వరకూ అమ్మ లక్ష్మికి గదిలోకే పట్టుకెళ్లేది. కాలకృత్యాలు, స్నానం లాంటివాటికైతే అదాటున పరుగెత్తి బాత్రూంలో దూరి, ముగించుకుని టకీమని మళ్లీ ఇంట్లోకొచ్చేసేదట. అమ్మ చీరలే మూడురోజులు కట్టేది. మూడు రోజులు అలా గడుస్తూండగా మా అమ్మ ముందు ఇంక రంకెలు చెల్లవని అర్థం చేసుకుని లక్ష్మి భర్త పెద్దమనుషులతో మా ఇంటికొచ్చాట్ట. తాగనని పోలేరమ్మ మీద, పెళ్లాన్ని కొట్టనని వాళ్ళ అమ్మ మీద, లక్ష్మి డబ్బు పాములా చూస్తానని ఒట్టు పెట్టుకుంటే తప్ప లక్ష్మిని పంపనని తెగేసి చెప్పింది అమ్మ. బెట్టు చేసి, బెట్టు చేసి చివరకు తలొగ్గి ఒట్లు పెట్టి, లక్ష్మిని తీసుకెళ్ళాడట. దేవతలకీ, ప్రమాణాలకి జడిసే రకం కాబట్టి ఇంకెపుడూ ఆ పనులు చెయ్యలేదు. అయితే “సాయి గారు ఊరుకుని ఉంటే నేను ఇలా అయిపోయేవోణ్ణి కాదు. ఇంకెప్పుడూ ఆరింట్లో పనికి ఎళ్లొద్దని”, భార్యపై ఆంక్ష పెట్టాడు. కళ్ల నీళ్ల పర్యంతమై ఆ మాట మా అమ్మకి చెప్పి మా ఇంట్లో కొలువుకి సెలవు పుచ్చుకుంది సబ్బు లక్ష్మి.  ఆ తర్వాత పల్లె నుంచి పట్నం వచ్చేవరకూ పదేళ్లకు పైగా అంతటి ఇల్లంతా మా అమ్మే అలికింది అక్కడ ఉన్నన్నాళ్లూ. విచిత్రం ఏంటంటే లక్ష్మి భర్తకి మా అమ్మ మీద ఉన్న కోపం కోపమే కానీ మళ్లీ “ఆరోజు సాయిగారు ఆపకపోతే మా లచ్చిని ఆ ఊపులో నరికేద్దునో ఏమో” అని కృతజ్ఞతగానూ మాట్లాడతాడు.
                  పల్లెటూళ్ళో చంద్రమ్మ, పట్టణం వచ్చాకా సముద్రం, నాగవేణి, నాగమణి, సత్యవతి ఇలా చాలామంది పనిచేశారు కానీ  సబ్బు లక్ష్మిలా ఇంట్లో మనిషల్లే చేసిన వాళ్లు ఇంకెవరూ లేరు అంటుంది మా అమ్మ.
                  మా అమ్మ నన్ను కడుపుతో ఉండగా ముమ్మరమైన చలికాలంలో “మామిడిపళ్ళ”డిగిందట. మా నాన్నగారు తణుకు, అత్తిలి, భీమవరం తెగతిరిగి చివరికి ఓ జ్యూస్ షాపులో మామిడిపళ్లు పట్టకున్నారట. జ్యూస్ షాపు వాడు జ్యూసులే తప్ప పళ్లు ఇవ్వం అని పట్టుపట్టాడు. నానా రకాల ప్రయత్నించి కళ్లుతిరిగే రేటుకు ఓ మూడు మావిడి పళ్లు కొని మా అమ్మకి ఇచ్చారట నాన్నారు. సంగతేమిటంటే మా అమ్మ నుంచి కడుపులో ఉన్ననాడే మా చెల్లెళ్లకి, నాకూ మావిడి పళ్లంటే పిచ్చి ఇష్టం పట్టుకుంది. ప్రతీ వేసవికీ అన్ని రకాల మావిడిపళ్లు కొనిపెడుతూ ఆ పిచ్చిని ఆనందంగా భరించిన మా నాన్నారు ఓ వేసవిలో మాత్రం కొనితేలేదు. మా నాన్నమ్మకు విపరీతమైన అనారోగ్యం చేస్తే మా అమ్మానాన్నలే ఆర్థికంగా, శారీరికంగా పనిచేయడం వల్ల, మేము చదువులకు ఎదిగి రావడం, అప్పుడే మా ఇల్లు కట్టుకోవడం వంటివి ఆర్థికంగానూ, మానసికంగానూ మా నాన్నారిని ఉక్కిరిబిక్కిరి చేశాయి. ఆ హడావుడి రోజుల్లో మావిడి పళ్ళు లాంటి చిన్న చిన్న సరదాల కోసం పర్సు తీయలేకపోయారు. పాపం ఏమనుకున్నారో వేసవి ముగుస్తుండగా ఓ పరక మంచి రసాలు కొని తీసుకువచ్చారు. “పోనీలే పిల్లలు ఒకటికి మూడు తిననీ” అనుకుని ఉంటారు. పెద్దవాళ్ళకి చెరో పండు, పిల్లలకు చెరి 3పళ్ళు వాటా పెట్టాల్సింది పోయి మా ముగ్గురికీ రెండేసి పళ్లే పంచింది. తనకి ఒక్కపండూ అక్కరలేదని మొత్తం నాలుగు పళ్ళూ ఇంట్లో పనిచేసే నాగవేణికి మా చేత్తోనే ఇప్పించింది. “ఇంటిల్లి పాదీ చెరో పండు తినండి”అని పంపింది నాగమణిని.
                     అలా ఇచ్చేందుకు మాకు ముందే చెప్పి ఒప్పించింది అమ్మ. “మీరు కొంచెం పెద్ద పిల్లలు కదా మీకే ఇంతగా తినాలనిపిస్తూ ఉంటే, పాపం నాగవేణి పిల్లలు చాలా చిన్నపిల్లలు కదా మరి వాళ్ళు ఎంత మొహం వాచి ఉంటారో కదా. మనలాంటి ఉద్యోగస్తులమే కొనలేకుండా ఉన్నామే, ఇళ్లల్లో పనిచేసే నాగవేణి ఏమి కొనిపెడ్తుంది. మన ఇంట్లో డస్ట్ బిన్ ఖాళీ చేసేప్పుడు మావిడి టెంకలు చూస్తె పిల్లల్ని తలుచుకుని ఎంత బాధపడుతుంది”అంటూ మాకు సర్ది చెప్పే చేసింది అమ్మ. ఇది ఓమారు మా ఇంట్లో ఆర్థికంగా ఇబ్బంది కలిగిన సమయంలో జరిగిన కథ. ఐతే అంతకు ముందూ, ఆ తరువాతా కూడా ప్రతి వేసవి కాలంలోనూ మా అమ్మ రహస్యంగా నా చేత కనీసం రెండు పరకలు మామిడిపళ్లు తను కష్టపడి తేనెటీగలా కూడబెట్టిన డబ్బులు వాడి తెప్పించేది. అప్పుడు మా ఇంట్లో ఎవరు పనిచేస్తే వారికే ఇప్పించేది. రహస్యం ఎందుకూ అంటే ఇంట్లో ఎవరికైనా తెలిస్తే ఇల్లు గుల్లవుతోంది అంటారేమోనని.
మా నాన్నమ్మ జీవించి ఉన్నన్నాళ్ళూ ఇంట్లో పనిచేసే అమ్మాయికి కాఫీ, నీళ్లు ఇచ్చేందుకు వేరే గ్లాసులు, టిఫిన్ పెట్టేందుకు వేరే ప్లేట్ పెట్టాలనే పధ్ధతి ఉండేది. మా అమ్మకి అలా వాళ్లని అవమానించడం ఇష్టం ఉండేది కాదు. ఎవరినీ ఇబ్బందిపెట్టడం ఇష్టంలేక తాను ఆ గ్లాసుని, ప్లేటునీ వాళ్లకే ఇచ్చి కాఫీకి వచ్చినప్పుడల్లా తెచ్చుకోండి అనకుండా మా అమ్మే రహస్యంగా మెయింటైన్ చేసేది. మా అమ్మ చేతికి పూర్తిగా ఇంటి వ్యవహారం వచ్చిన తర్వాత మొదట చేసిన పని ఆ గ్లాసుల పధ్ధతి మానెయ్యడమే. ఇప్పుడు మా ఇంట్లో వేరే గ్లాసుల పధ్ధతి లేదు.
                మరోమాటు మా అమ్మ వీధిలోకి వచ్చి “బాబూ! చేపలూ ఇటు రా” అని పిలిచింది. వీధి వీధంతా బిత్తరపోయింది శుద్ధ శాకాహారులమైన మా ఇంటి నుంచి ఆ పిలుపు విని. ఆ చేపల బుట్ట ముంగిట్లోకి వచ్చాకా మా వంటింట్లో పనిచేస్తున్న నాగమణిని పిలిచి “ఎలాంటి చేపలు కావాలో ఏరుకో. డబ్బులు గురించి ఆలోచించకు. ఇవన్నీ నీ జీతంలో కొయ్యను. బహుమతి అనుకుని తీసుకో” అంది. జీవితంలో ఎప్పుడూ అలాంటివి ఎరగదో ఏమో ఆమె చాలా కరిగిపోయింది. అసలేం జరిగిందంటే-మేము మూడంతస్తుల బిల్డింగులో మొదటి అంతస్తులో ఉండేవాళ్లం. మా ఇంటి వాకిట్లో నిలబడ్డ మా అమ్మ నాగవేణి కిందకి తొంగి చూడడం చూసింది. మళ్లీ తలతిప్పేసుకుని లోపలికి వచ్చేస్తున్న ఆమెని ఆపి అలా ఏం తొంగి చూసి వస్తున్నావని అడిగింది చాలా మామూలుగా మా అమ్మ.
ఆమె ఇబ్బందిగా, సిగ్గుగా, అవమానభారంతో “ఏం లేదమ్మా” అనేస్తుంటే ఏదో ఉందనుకుని కిందికి వంగి చూసింది అమ్మ. అప్పుడే చుట్టుపక్కల వాళ్ళు చేపల బేరం చేసి ముగించుకుని చేపలతో కింది ఫ్లోర్ వాళ్లూ, పక్కింటివాళ్లూ ఇళ్లలోకి వెళ్తున్నారు చేపలబుట్టతో అమ్మే అతను వీధిదాటి వెళ్లిపోతున్నాడు. “ఏమ్మా చేపలు చూసి ఎందుకలా వచ్చేస్తున్నావు?” అంది అమ్మ. “ఏమీ లేదమ్మా ఊరికే కొందామని…” అంటూ అర్థోక్తితో ఆగిందామె. “అదే ఎందుకు కొనలేదు?” “డబ్బులెక్కడివమ్మా..” అంటూ నవ్వులో బాధని కలిపేసే ప్రయత్నం చేస్తూ చెప్పిందామె.
                 ఇక మా అమ్మ ఆగలేదు స్వయంగా పిలుచుకొచ్చి ఇంటిముందు తొలిసారి చేపలబుట్ట దింపించింది. ఆమె మొత్తానికామె ఓ చేప తీసుకుంది. మా అమ్మకు అంచనా తెలియదు కానీ ఒకటి ఇంట్లోవాళ్లకి సరిపోతుందా అని అనుమానమొచ్చి చేపలతన్నే అడిగితే ఇద్దరికైతే సరిపోద్దండీ నలుగురైతే సరిపెట్టుకోవాలని చెప్పాడు. “మీ పిల్లలు ఇంకాస్త కూర వెయ్యి అని అడిగితే ఏం చేయ్యగలవు? అసలు పెట్టకపోయినా పర్లేదుగానీ పసివెధవల్ని అర్థాకలితో లేపి ఏడిపించకూడదు. ఇంకో చేప తీసుకో” అని బలవంతాన ఒప్పించింది. వీటితో కూర ఐపోదు కదాని ఉల్లిపాయలు, బియ్యం, ఇతర దినుసులు కూడా మా ఇంటి నుంచే ఇచ్చింది ఏమేమి అవసరమౌతాయో పక్కింట్లో మా అమ్మ ఫ్రెండ్ ఒకావిణ్ణి అడిగి తెలుసుకుని. మా ఇంట్లో లేని కొన్ని మసాలా దినుసుల్ని వాళ్ళింట్లో అరువడిగి ఇప్పించింది.
నాగవేణి భర్త ఇదంతా తెలుసుకుని “ఏదో ఆరు కొనిపెట్టారే అనుకో ఇదే అదునని ఒకటికి రెండు తీసేసుకుంటావా?” అని తిట్టాట్ట.
               కొసమెరుపేమిటంటే- “సాయిగారు చేపల బుట్టని పిలిచేరేంటి. ఆళ్లు బ్రేమ్మలు కదా” అని చాలామంది అడిగారట నాగవేణిని. ఇలా నాకోసం అని చెప్తే ముక్కున వేలేసుకుని, మా అమ్మ దగ్గరకి వచ్చినప్పుడు “పనోళ్లని మరీ అంత ఇదిగా చూడకూదదండీ. లోకువకట్టేత్తార”ని బోధించే ప్రయత్నం చేశారు. “జరుగుబాటు లేక కానీ వాళ్లకీ కొనుక్కోవాలనే ఉంటుంది కదండీ. నేనేం వాళ్ల జీవితాలు బాగు చేసెయ్యలేను. ఏవో చిన్న సరదాలు తీర్చాను. మీ ఇంట్లో చేపలు రుద్దేప్పుడు మాకు లేవే అని బాధపడితే మంచిదా ఏంటి?” అని చెప్పుకొచ్చింది. వాళ్ల గొడవ అమ్మకి పట్టదు. అమ్మ లెక్క వాళ్లకి రాదు. అయినా మా అమ్మకి పనిచేసే వాళ్ల మనసులు చివుక్కుమన్న చప్పుడు కూడా వినిపిస్తుంది.
                       సత్యవతి మా ఇంట్లో పనిచేసేప్పుడు “సత్య.. సత్య” అని పిలిచేది ఆమెని. అలా కాలేజి పిల్లలా సత్య అని పిలిపించుకోవాలని ఆమె ఆశట. నీకు ఎలా పిలిస్తే ఇష్టం అని తెలుసుకుని మరీ అలా పిలిచేది అమ్మ. అప్పుడే మాటలు వస్తున్న మా మేనకోడలి చేత కూడా “సత్య”(సచ్చ అని పిలవడమే వచ్చేది తనకి) అని పిలిపిస్తే సత్యవతి “మాయమ్మే ఎంత ముచ్చటగా పిలుస్తున్నావమ్మా” అని మురిసిపోయేది. చాన్నాళ్ళు మా ఇంట్లో పనిచేశాకా  మేము ఇల్లు మారిపోతే రెండు కిలోమీటర్లకు పైగా దూరం నుంచి నడిచి వచ్చేది. చివరకి “మిమ్మల్ని వదల్లేక పోతున్నానండీ సాయి గారూ” అనంటూనే మానేసింది సత్య.
              నాగలక్ష్మి పిల్లలు కాన్వెంట్లో పనిచేస్తోంటే మా నాన్నారి పరిచయాలు ఉపయోగించి ఫీజులు బాగా తగ్గించడం లాంటివి మొదలు చిన్నవీ చితకవీ ఇంకా చాలానే ఉన్నాయి గానీ విషయం మాత్రం ఒకటే. అన్నం ఉడికిందో లేదో తెలియాలంటే రెండు మెతుకులు ముట్టుకుంటే చాలు కదా.
santhosh-సూరంపూడి పవన్ సంతోష్

సంస్కృతీ విరాట్ స్వరూపాన్ని అద్దం లో చూపగలమా?

ఆట సంస్కృతిలో భాగం, వేట సంస్కృతిలో భాగం, మాట సంస్కృతిలో భాగం, పోట్లాట సంస్కృతిలో భాగం, వివాహం సంస్కృతిలో భాగం, వివాదమూ సంస్కృతిలో భాగమే. మడిగట్టుకోవడం సంస్కృతిలో భాగం. అమ్మవారికి వేట వెయ్యడమూ సంస్కృతిలోని భాగం. బొట్టు పెట్టుకోవడం, కత్తిపట్టుకోవడం, మట్టి కాల్చి కుండలు చెయ్యడం అన్నీ అన్నీ సంస్కృతిలో భాగాలే. ఒక జాతి చేయగల మంచి, చెడూ సంస్కృతిలో భాగాలే. తెలుగునాట ఒక పీరియడ్ ఆఫ్ టైంలో ఎలా నోములు నోచుకుంటారు. ఎలా భిక్షాటన చేస్తారు. ఎలా పెళ్లి చేస్తారు. ఏ విధంగా విడాకులు తీసుకుంటారు. యుద్ధాల్లో ఎలా పాల్గొంటారు. ఓటమిని ఎలా ఎదుర్కొంటారు. వృద్ధాప్యంలో ఎలా ఉంటారు. యౌవనాన్ని ఎలా ఆస్వాదిస్తారు ఇలాంటివన్నీ సంస్కృతిలో భాగమే. దొంగలు, దొరలు, పూజారులు, వేశ్యలు, అధికారులు, సామాన్యులు, వీరులు, భిక్షకులు, విద్యావేత్తలు, నిరక్షరాస్యులు ఇలా ఎందరుండే వీలుందో అందరూ సంస్కృతిలోనే ఉండగలరు. ఏం చేసినా సంస్కృతిలోనే చెయ్యగలరు. తెలుగు దొంగలు ఎలా జేబులు కొడతారు, తెలుగు వేశ్యలు ఎలా విటులను ఆకర్షిస్తారు,  తెలుగు పిల్లలు ఎలాంటి ఆటలాడుకుంటూంటారు వగైరా అన్నీ ఆ పేద్ధ వృత్తంలొ భాగం. ఇది సంస్కృతి గురించి నా అనుకోలు, అవగాహనానూ. “కాలుమోపితే ఎండిపోయిన కందిచేను పూత పెట్టే లచ్చుమమ్మ”, “ఎద్దోలె ఎనుకాకు  ఒక్కొక్క అడుగేసి నాట్లేసి నాట్లేసే లచ్చుమమ్మ” సంస్కృతిలో భాగమైతే అణాకాసంత బొట్టు పెట్టుకుని పేరంటాలిచ్చిన వాయినాలతో నోము నుంచి తిరిగొస్తున్న సోమిదేవమ్మా సంస్కృతిలోని భాగమే. “శిలువ  మోస్తున్న ఏసుక్రీస్తులా నాగలి భుజాన వేసుకున్న” రైతూ, ఇవాళ్టికేమైనా వస్తుందేమోనని చూసి చూసి ఇంటికి వెళ్లి భార్య ఇచ్చిన తులసి ఆకుల తాంబూలం తృప్తిగా తిని వెర్రినవ్వు నవ్వుకునే పూజారీ సంస్కృతిలోనివారే.
ఇక సాహిత్యం అంటే టీషర్టుల మీద రాసిన రాతలు మొదలుకొని జనుల నాల్కలు తాటియాకులుగా లిఖింపబడ్డ పద్యాల వరకూ అంతా సాహిత్యమే. దాని ప్రయోజనమూ వేర్వేరు పద్ధతుల్లో ఉంటుంది. ఉదాహరణకు ఒక చక్కని ఊహ చదివితే ఒళ్లు పులకించింది అది సాహిత్య ప్రయోజనమే. ఒక చిన్న జోకు చదివితే పేద్ద నవ్వు కాకున్న చిరునవ్వు పొటమరించిందీ అదీ ప్రయోజనమే. ఒక రచన చదివి జీవితంపై మనకుండే అవగాహనే మారిపోయిందనుకోండి అదీ ప్రయోజనమే. ఐతే వాటి మధ్య చాలా అంతరువులున్నాయి. కానీ ఒక స్తరంలో చూస్తే లక్ష్యసిద్ధి ఉన్న సాహిత్యమే అవి మూడూను. ఆ సాహిత్యానికి ఎన్నో రూపాలుండవచ్చును. సామెతగా లోకరీతులు చెప్పినా, పేదరాశి పెద్దమ్మకథగా మరోలోకాల్లోకి తీసుకుపోయినా అవి చక్కని సాహితీప్రక్రియలే. సరే నాకు సాహిత్యం పట్ల ఉన్న అవగాహన ఇది.(అటు ఇటుగా మిగిలిన సృజనాత్మక ప్రక్రియలకు కూడా ఇంత పరిధీ ఉంటుంది)
ఇప్పుడు ఒక సృజనాత్మక ప్రక్రియ సంస్కృతిని ప్రతిబింబించింది అన్నమాటకు అర్థమేమిటి చెప్పండి? నా అవగాహన వరకైతే సంస్కృతి అన్న పేద్ద కాంపౌండును ఒక రచనలో ప్రతిబింబించడం ఎలా సాధ్యపడుతుంది? సంస్కృతిలోని చాలా అంశాలను చక్కగా వివరించొచ్చు. పైగా ఎన్నో ప్రాంతాల, వృత్తుల సంస్కృతులని(పైన నేను చెప్పుకున్న వివరణనే సంస్కృతి విషయంలో గుర్తుతెచ్చుకోండి) కలగలిపితేనే ఒకనాటి తెలుగువారి సంస్కృతి ఏర్పడుతుంది. అందువల్ల ఆ విరాట్ స్వరూపాన్ని మనం ఎంతవరకూ దర్శించగలమో అంతవరకే కనిపిస్తుంది. బ్రాహ్మణుల జీవన విధానం రూపుకడితే సంస్కృతిలోని కొన్ని విశేషాల్ని ఎట్టేదుట పరిచినట్టే, ఐనంత మాత్రాన తెలుగు సంస్కృతినంతా ఆవిష్కరించంచినట్టు అవదు. అంత పని చేయాలంటే మహాభారతమంత లోతూ, విస్తృతీ కలిగిన ఉద్గ్రంథం అవసరమవుతుంది తప్ప చిన్న కథ, కవిత, నవలికలకు కుదరదు. విస్తృతీ, లోతూ ఒనగూడినా సంస్కృతి అంతటి మహా సాగరాన్ని మొత్తంగా ప్రతిబింబిస్తాయా అంటే కాదనే చెప్పాలి. ఆ పని ఎలాంటిదంటే ఆకాశమంతటినీ ఒక అద్దంలో చూపడం లాంటిది. ఆకాశాన్ని అద్దంలో చూపగలమా? చూపగలం. ఆకాశమంతటినీ ఒకే అద్దంలో చూపగలమా? ఏమో ఇప్పటివరకూ ఆ ప్రయత్నం చేసి విజయం సాధించినవారు ఉన్నట్టు నాకు తెలియదు. ఐతే సంస్కృతిని అనే ఆకాశాన్ని సాహిత్యమే సాగరం అత్యంత అరుదైన సందర్భాల్లో ప్రతిబింబించి ఉండొచ్చు. కాని మన చిన్న స్కేళ్లు దాన్ని నిరూపించలేవు.
మరి చేయగలిగింది ఏమిటంటే ఎవరి స్థాయిలో వారు సంస్కృతి విస్తృతిని అర్థం చేసుకుని తమ తమ స్థాయిల్లో ప్రతిబింబించగలగడమే. అలా చేస్తూన్నారు కూడా. అందుకే తెలుగు వారి సంస్కృతిని ప్రతింబింబించే సృజనగా దేన్నైనా చెప్తున్నారు అంటే వారు దాన్ని వాచ్యార్థంగా చెప్పలేదనో, సంస్కృతి అన్న పదానికి ఉన్న విస్తృతి వారికి తెలియదనో అర్థం చేసుకోవాలి.
ఇక మరో అంశం. ఎవరైనా సంస్కృతిని ప్రతిబింబించే సృజన అని అన్నప్పుడు సంస్కృతిలో భాగాన్ని ప్రతిబింబించి సారస్వతాన్ని సంపన్నం చేస్తోందన్న అర్థం స్వీకరించడం మాని ఇదే తెలుగు సంస్కృతా అని ప్రశ్నించి అంతటితో ఆగక ఇది జనాభాలో ఇంతశాతం మాత్రమే ఉన్నవారి అనుభూతులు, అనుభవాలు, ఆశలు, ఆశయాల సమాహారం మాత్రమే కనుక ఇది తెలుగు సంస్కృతి కాదని తిరస్కరిస్తున్నారు. ఐతే వారు కూడా తెలియకుండానే సంస్కృతి అనే విశాలమైన బంజరును కంచె వేసి సంకుచితం చేసేస్తున్నారు. ఫలానా వారి రుచులు, అభిరుచులు మాత్రమే సంస్కృతి కాదు అని చెప్పేప్పుడు అది ఫలానావారి సంస్కృతి అని దాన్ని సృజనాత్మకంగా చెప్పగలగడం వారి హక్కు అని మరచిపోతున్నారు.
నిజంగా సంస్కృతీ అన్వేషకులు చేయాల్సిన పని అది కాదు. ఏ అంశాలను తెలుగు సారస్వతం విస్మరించిందో పట్టుకోవాలి. సృజన గలవారైతే దాన్ని సృజనాత్మకంగా వ్యక్తీకరించాలి. డబ్బున్నవారు అలాంటి విషయాన్ని సాహితీకరించడమో, తెరకెక్కించడమో చేసేవారికి దన్నుగా నిలవాలి. ఇవేవీ లేనివారు అలాంటివారిని కనీసం ప్రోత్సహించాలి. అప్పుడే సాహిత్యం సుసంపన్నమవుతుంది. ఆకాశం అరచేతిలో ఇముడుతుంది.
“జయంతి తే సుకృతినోః రససిద్ధా కవీశ్వరః
 నాస్తి తేషాం యశఃకాయే జరామరణజం భయం”
santhosh—సూరంపూడి పవన్ సంతోష్