వెలుతురు పూవుల జాలు 

 

 

ఆమె కల్లోలం లో పుట్టి పెరిగారు , అందుకని దాన్ని తిరిగి సృష్టించాలని అనుకోలేదు.

యూదు జాతి తలిదండ్రులకి , 1925 లో , ఆస్ట్రియాలోని వియన్నా లో జన్మించి – నాజీ ల విద్వేషం తో ఎంత పడాలో అంతా పడ్డారు.

బ్రిటన్ లో ఆశ్రయం పొంది తన జీవితాన్ని తిరిగి మొదలుపెట్టుకున్నారు కనుక , ఆ ఆశను రాసినదానిలో నింపి ఇచ్చారు, మరింకే నిరాశ లోనైనా చదివితే పనికి వచ్చేందుకు.

చిన్న వయసు లోనే అమ్మా నాన్నా విడిపోయారు – ఇద్దరి మధ్యనా తిరిగే నిలకడ లేని బాల్యం. అయితేనేం  , అమ్మమ్మ , ఆంట్ లూ ఉన్నారు కదా, లంగరు గా. విడాకులు తీసుకున్న తలిదండ్రులకి పుట్టిన పిల్లల వివాహాలూ నిలబడవనే పరిశీలనని అబద్ధం చేసి ,  ప్రేమించి పెళ్ళాడిన భర్త తో-   ఆయన వెళ్ళిపోయేదాకా ,  యాభై ఒక్కేళ్ళ పాటు ప్రేమించే ఇల్లాలి గానే బ్రతికారు.

పిల్లల కోసం రాసిన రచయిత్రులు వాళ్ళ పిల్లలతో సరిగ్గా లేరని – మనకి అక్కర్లేని కొన్ని నిజాలని A.S.Byatt – వంటి వారు చెప్పుకొచ్చారు[ The Children’s  Book] . ఈవిడ దానికీ మినహాయింపే – ముగ్గురు కొడుకులూ ఒక్క కూతురు …అందరినీ గారాబంగా , ఇష్టం గా పెంచుకున్నారు .

ఇలా కూడా జీవించవచ్చుననే విశ్వాసాన్ని , నిన్న మొన్నటి వరకూ ఇస్తూనే ఉన్నారు నా వంటి వారికి.

రాసినవాటి లో ఎక్కువ ప్రఖ్యాతి వచ్చింది చిన్న పిల్లల పుస్తకాలకే. The Great Ghost Rescue తో 1975 లో మొదలు పెట్టి 2010 వరకూ దాదాపు 15 నవలలు. పిల్లల తోబాటు వాటిలో దయ్యాలు – మనసులున్న దయ్యాలు, మంచి దయ్యాలు, నవ్వించే దయ్యాలు , ఇక్కట్లు పడే దయ్యాలు …అబ్బే , భయపెట్టవు ఏమాత్రం, మనుషులని పట్టవు కూడానూ. తొమ్మిది నుంచి పన్నెండేళ్ళ పిల్లలకి తెలియవలసినన్ని నిజాలు, ఇవ్వవలసినంత వినోదం , చెప్పీ చెప్పకుండా నేర్పగలిగినంత జ్ఞానం.  కళ్ళు మూసుకుని recommend  చేయచ్చు అన్నిటినీ.

Dated 02-08-2004 Childrens author Eva Ibbotson at her writing desk at home in Newcastle upon Tyne. FAO: Kate - Daily Telegraph

Eva Ibbotson 

వాటిలో ఒకటైన  Secret  of Platform 13  అనే పుస్తకం లోంచి ఒక విషయాన్ని J.K.Rowling  తన  Harry Porter లో వాడుకున్నారని అందరికీ తెలుసు.

[ ఆ మాటకొస్తే J.K.Rowling   రాసినదానిలో పాత రచనల నుంచి తీసుకున్నది ఎక్కువే ఉంటుంది. ఆమె కి ముందరా ఆంగ్ల సాహిత్యం లో పిల్లల కోసం  గొప్పfantasy  లు రాసిన ఉద్దండులు –Lloyd Alexander , Diana Winnie Jones  ,Madeleine L ‘Engle  , Ursula Le guin , Susan Cooper –  ఇంకా చాలా మంది ఉన్నారు .  వారెవరికీ రాని ప్రసిద్ధి J.K.Rowling కి వచ్చినప్పుడు సహజం గానే వారిలో కొందరు  చిరాకు పడ్డారు. సీరియస్ young adult fantasy చదువరులకి Harry Potter series   మీడియోకర్ పుస్తకాల నే అనిపిస్తాయి. ]

ఆ మాట అడిగితే ఈ పెద్దావిడ అంటారూ – ” Ms. Rowling తో నేను కరచాలనం చేస్తాను. మేమంతా రచయితలం   కదా- ఒకరి నుంచి మరొకరు అరువు తెచ్చుకోకుండా ఎలా కుదురుతుంది ? ” అని. వ్యంగ్యం గా కాదు, మనస్ఫూర్తిగా. ఆమె అలాంటివారు.

చిన్నప్పటి విధ్వంసాల గురించి పారిపోవాలనుకోలేదు –  ఆ వెళ్ళగొట్టబడటం, ఎవరికీ చెందక పోవటం – అవన్నీ కొన్ని నవలలలో అతి విపులంగా , కానీ సున్నితంగా కనిపిస్తాయి. ఆ పాత్రలు కష్టాలు పడుతూన్నా చిన్న చిన్న ఆనందాలకి అంధులు కారు. చుట్టూ ఉండేవారిలో ముళ్ళ కంచెలూ ఫలవృక్షాలూ పూల తీగ లూ – అన్ని రకాల మనుషులూ ఉంటారు. ప్రవాసం ఆమె చెప్పిన కథలలో ప్రధానమే , కాని ముఖ్యంగా ప్రతిపాదించినది అమాయకత్వాన్ని , అందులోంచి వచ్చే ఆహ్లాదాన్ని.

నా వరకు ఆమె రచనల లో మాణిక్యం అనదగిన Star Of Kazan లో – అప్పటి ఆస్ట్రియా వాతావరణమంతా అతి సాధికారం గా ఉంటుంది …అక్కడి అతి ప్రత్యేకమైన కేక్ ల, పేస్ట్రీ ల సువాసన ఉంటుంది ఆ పుటలకి. తర్వాత – సంగీతం. ఓపెరాల ఒద్దికలు, నాటకశాలలు , ఆ శాంతి మీద పడిన నాజీ పిడుగులు…

ఆమె రొమాన్స్ లు గా ఉద్దేశించి రాసిన నవలలు – 2000 సంవత్సరం తర్వాత , సహజం గానే , young adult సాహిత్యం గా ముద్రించబడుతున్నాయి. The Countess Below Stairs, The Secret Countess అని రెండు పేర్లున్న నవల ఎంత బావుంటుందో చెప్పలేను. రష్యన్ విప్లవం తర్వాత , ఇంగ్లండ్ కి పారిపోయివచ్చిన ఒక జమిందారీ కుటుంబం.  సేవికా వృత్తి ని అవలంబించిన ఒక ముగ్ధ అయిన అమ్మాయి. చివరలో ఆమె మళ్ళీ జమిందారిణి అయిపోవటమేమీ ఉండదు కనుక మనకి అభ్యంతరం ఉండక్కర్లేదు – హాయిగా చదువుకోవచ్చు. నిజానికి ఆమె కులీనత ని గొప్ప చేసిన వారూ కారు. 1998 లో భర్త మరణించాక , కాస్త గంభీరం గా రాసిన నవల Journey To River Sea  లో ఒక పెద్ద జమిందారీ కి హక్కుదారుడైన కుర్రాడు  తన స్థానం లో ఇంకొక అబ్బాయి  ని పంపించేసి తను దేశ దిమ్మరి గా ఉండిపోతాడు. ఆ రెండో పిల్లాడికి అది ఇష్టమే కూడానూ- తెరప !

ఒక ముఖాముఖి లో తనను ప్రభావితం చేసిన పుస్తకాల గురించి ప్రశ్నిస్తే Frances Hodgson Burnett  రాసిన అన్ని పుస్తకాలు , ముఖ్యం గా The Secret Garden  ;  L.M.Montgomery రాసిన Anne Of Green Gables అని చెప్పారు. ఉల్లాసం , చిన్న గర్వం – నాకు, జాడలు తీయగలిగినందుకు.

జంతువులు , వాటి పట్ల మన విధులైన వాత్సల్యం, స్నేహం ,  బాధ్యత – అతి సుందరం గా చాలా పుస్తకాలలో ఉంటాయి. The Beasts Of Clawstone Castle లో ఆ జంతువులు గోవులు – వాటిని పూజించే సంస్కృతి గురించిన ప్రస్తావన. [ఆమె ఫిజియాలజీ లో పట్టా పుచ్చుకున్నారు గాని అందులో ముందుకి వెళ్ళాలనుకోలేదు – ఆ పరిశోధనలలో ప్రాణులని బాధ పేట్టాల్సి వస్తోందని.]

కొన్ని కోట్స్ ని ఇక్కడ అనువదిస్తున్నాను – ఆమె ఏమిటో మచ్చు చూపేందుకు.

” మంచి సంగతులని మటుకే గుర్తుంచుకుంటే ఎలా ” – ఆమె అంది – ” చెడ్డవాటిని కూడా గుర్తుంచుకోవాలి, లేదంటే అదంతా నిజమేననిపించదు కదా ”

*****

eva1

” బాధ్యత అనేది ఉంది, అది వాస్తవం. మనం పొందిన కానుకనో మనకి ఉన్న సామర్థ్యాన్నో అక్కర ఉన్న వారితో

పంచుకోవలసిందే. అది నిర్భయత్వం, స్వార్థం లేకపోవటం – మనని మనం తెరిచి ఉంచుకోవటం ”

*****

 

” ఆ రోజుల్లో  ప్రపంచం ఎంత అందమో తెలుసా , అన్నికా ! పువ్వులు, సంగీతం, పైన్ చెట్ల సుగంధాలు… ‘  ఇప్పుడూ ఉంది అలాగే ‘ – అన్నిక అంది – ‘ నిజంగానే ఉంది ‘ ”

*****

 

” ‘ అయితే,  దేని గురించి భయం నీకు ? ‘- అతను అడిగాడు.

ఆమె ఆలోచించింది. ఆ అలోచన మొహం లో ఎంత కనిపిస్తుందో చేతుల్లోనూ అంతే – అతనికి తెలుసు. తన ఆలోచనలని అరచేతుల్లో నింపుకునేలాగా దోసిలి పడుతుంది.

‘ చూడలేకపోవటం- దాని గురించీ భయం నాకు ‘

‘ అంటే , గుడ్డితనమా ? ‘

‘ ఉహూ. కాదు. అది చాలా కష్టమే గాని, హోమర్ ఉండగలిగారు గా అలాగ. మా పియానో టీచర్ మాత్రం..ఎంత ప్రశాంతం గా ఉంటారని ! నేననేది – ఒక గొప్ప మోహం కప్పేసి తక్కిన ప్రపంచాన్ని మూసివేయటం గురించి. వ్యామోహమో , వ్యసనమో – మరింకేదో – ఆ భీషణమైన ప్రేమ …ఆకులూ పక్షులూ చెర్రీ పూగుత్తులూ – వేటినీ కనిపించనీని ప్రేమ – కేవలం,  అవేవీ అతని ముఖం కాదు గనుక… ‘ ”

*****

 

ఆమె  చెప్పిన ఒక నిజమైన  ఉదంతాన్నీ అనువదిస్తున్నాను ఇక్కడ – పంచుకోక ఉండలేక .

‘’ బ్రిటన్ కి శరణార్థిగా వచ్చినప్పుడు నాకు ఎనిమిదేళ్ళుంటాయి. అంత ఉత్సాహం గా ఉన్నానని చెప్పలేను . వియన్నా లో మా స్కూల్ లో ప్రతి ఏడూ క్రిస్మస్ ముందు క్రీస్తు జననం నాటిక[nativity scene ]  ఉంటుంది  కదా- అంతకు ముందంతా ఆవు వేషమో గొర్రె వేషమో వేస్తుండేదాన్ని …ఆ యేడు ,  ఎట్టకేలకి  నాకు కన్య మేరీ వేషం ఇచ్చారు .

ఆలోపే ,  అప్పుడు –  హిట్లర్ వచ్చాడు.

చిర్రుబుర్రులాడే అమ్మమ్మ, అయోమయపు పిన్ని, ఎక్కడో ఆలోచిస్తుండే కవయిత్రి  అమ్మ – మా అడ్డదిడ్డపు గుంపు అంతా 1934 లో లండన్ చేరాము. బెల్ సైజ్ పార్క్ కి అప్పట్లో ఏమంత మంచి పేరుండేది కాదు, అక్కడి ఇళ్ళూ బాగుండేవి కావు – ఇంచుమించు కూలిపోబోతున్న ఒక మూడంతస్తుల మిద్దె  ఇంట్లో అద్దెకి దిగాము. మాతోబాటు అందులో ఇంకా చాలా మంది కాందిశీకులు – అందరూ చేతిలో డబ్బు ఆడనివారే. వాళ్ళలో లాయర్ లు, డాక్టర్ లు, పరధ్యానపు ప్రొఫెసర్ లు – ఎవరికీ జర్మన్ తప్పించి మరే భాషా రాదు. నాకు స్నేహితులెవరూ లేరు, బళ్ళోకి వెళ్ళటం లేదు, ఆడుకుందుకు చోటు లేదు.

అప్పుడొక రోజు- అమ్మమ్మ ఏవో సరుకులు పట్టుకు రమ్మంటే , హాంప్ స్టెడ్ వైపు వెళ్ళాను. ఒక గుట్ట మీద , తెరిచి ఉన్న తలుపులతో- పెద్ద భవనం. లోపలికి అడుగు పెట్టాను. అంతా నిశ్శబ్దం గా ఉంది. బోలెడన్ని పుస్తకాలు ! తేలిక రంగు జుట్టున్న ఒకావిడ బల్ల ముందు కూర్చుని ఉన్నారు .  నన్ను వెళ్ళిపొమ్మంటారనుకున్నాను – కాని ఆమె చిరునవ్వు తో , ” లైబ్రరీ లో చేరతావా ? ” అని అడిగారు.

నాకు ఇంగ్లీష్ బాగా రాదు గానీ ఆ మాటలు అర్థమైనాయి. ‘ చేరటం ‘ అనే మాట ఎంతో అందం గా వినిపించింది. నా దగ్గర డబ్బులు లేవన్నాను. ఆవిడ – మిస్ పోల్ – చెప్పారు – ” ఊరికే చేరచ్చు. డబ్బు కట్టక్కర్లేదు గా ” అని.

చేరాను. చేరి అక్కడ ఉండిపోయాను. జర్మన్ చదివినంత బాగా ఇంగ్లీష్ చదవటం ఎప్పుడు మొదలు పెట్టానో సరిగా గుర్తు లేదు గానీ ఎక్కువ రోజులైతే పట్టలేదు. కొద్ది వారాలు గడిచేసరికి వాడుక గా వచ్చేవారంతా తెలిసిపోయారు – ఒకాయన న్యూస్ పేపర్ లో రేసు ల వార్తలు చదువుతుండేవారు  .  ఆయన బూట్లకి చిల్లులుండేవి – వెచ్చదనం కోసం కూడా వచ్చేవారనుకుంటాను. మరొకావిడ , ఇంట్లో అత్తగారి పోరు పడలేక కాస్త గాలి పీల్చుకుందుకు వచ్చేవారు. ప్రత్యేకించి – నాకు మంచి స్నేహితులైన హెర్ డాక్టర్ హెలర్. నా లాగే ఆయనా శరణార్థే – కాకపోతే బెర్లిన్ నుంచి వచ్చారు.

డా. హెలర్ , లైబ్రరీ కి బాగా పొద్దుటే వచ్చేసేవారు, చాలా రాత్రయే దాకా ఉండిపోయేవారు. ఆయన ముందు గుట్టలు గుట్టలు గా మెడికల్ పుస్తకాలు  – మోకాళ్ళ వ్యాధులు, లింఫ్ గ్రంథుల అస్తవ్యస్తాలు … ఇంకా చాలా. అవన్నీ ఇంగ్లీష్ లో ఉండేవి. జర్మనీ లో ప్రసిద్ధికెక్కిన ప్రసూతి వైద్యశాల లో Head of the department  అయిన ఆయన, ఆ గొప్ప స్త్రీ వైద్య నిపుణుడు –  ఇంగ్లీష్ లో మళ్ళీ పరీక్షలకి కూర్చుని పాసయితే గాని ఇక్కడ ప్రాక్టీస్ చేసేందుకు లేదు.

eva2

అప్పటికి ఆయన వయసు ముప్ఫై అయిదూ నలభై మధ్య ఉండేదనుకుంటాను. ఒక భాష నుంచి మరొకదానికి అవలీల గా మారిపోవటం ఆ వయసు లో కష్టం – చిన్నపిల్లలకైతే సులువు గాని. ఆయన చాలా సార్లు నిట్టూర్చటం చూశాను . కొన్నిసార్లు – నిస్పృహ తో కళ్ళు తుడుచుకోవటమూ గమనించి – మిస్ పోల్ , నేనూ ఒకరి మొహాలొకరు  చూసుకునేవాళ్ళం. ఆవిడ కి ఆయన పట్ల చాలా అక్కర ఉండేది – ఆయన వచ్చీ రాగానే లావుపాటి జర్మన్- ఇంగ్లీష్ dictionary ని తెచ్చి అక్కడ పెట్టేసేవారు. తరచూ ఆయన కోసమని లైబ్రరీ ని ఇంకొంత ఎక్కువ సేపు తెరిచి ఉంచేవారు. డాక్టర్ గారు ఉండేది చిన్న ఇరుకు గదిలో, దాన్ని వెచ్చగా ఉంచుకుందుకు ఆయన దగ్గర డబ్బు లేదు –  అందుకని చదివేదేదో లైబ్రరీ లోనే కానివ్వాలి.

వేరే బాధ లూ ఉండేవి ఆయనకి. ఆయన భార్య ‘ ఆర్యన్ ‘ జాతికి చెందినదట- అందుకని ఆమె జర్మనీ లోనే ఉండిపోయింది , ఈయన వెంట రానందట. ఎప్పుడో పదిహేనేళ్ళ కిందట  చదివి మర్చిపోయిన పాఠాలన్నింటినీ , ఇప్పుడొక పరాయి భాషలో – గొప్ప సహనం తో చదువుకుంటుండేవారు.

అంతలో – అనుకోకుండా , నాకొక బోర్డింగ్ స్కూల్ లో సీట్ వచ్చింది. ఒక దూరపు  పల్లెటూళ్ళో Quaker  మతస్తులు నడిపే బడి అది. అందరం లండన్ వదిలేసి వెళ్ళిపోయాము. మా లైబ్రరీ ని మూసేసి వేరే ఇంకొక పెద్ద లైబ్రరీ లో కలిపేశారు.

అప్పుడు యుద్ధం మొదలైంది.  మిస్ పోల్ సహాయకదళం లో చేరారని తెలిసింది. ఆశ్రయం కోసం వచ్చిన శత్రు దేశాల మనుషులకి ప్రత్యేక శిక్షణ లు ఇచ్చే కార్యక్రమాలని బ్రిటిష్ ప్రభుత్వం మొదలుపెట్టింది.

నా జీవితమైతే తర్వాత సజావు గానే నడిచింది. స్కూల్ లో చదువు అయాక యూనివర్సిటీ లో చేరాను. ఆఖరి సంవత్సరం లో ఉండగా – అప్పుడే బర్మా లో పనిచేసి విరమించి వచ్చిన ఒకరిని కలుసుకుని , ఆ తర్వాత పెళ్ళి చేసుకున్నాను. మరుసటి ఏడు – ప్రసవం కోసం క్వీన్ ఆలిస్ ప్రసూతి వైద్యశాల లో చేరాను. ఆ హాస్పిటల్ చాలా పేరుమోసినది, కేవలం అదృష్టం కొద్దీ నే నాకు అక్కడ ప్రవేశం దొరికింది.

మా పాప పుట్టాక ఆ మర్నాటి ఉదయం హాస్పిటల్ అంతా పెద్ద హడావిడి. నర్స్ లు యూనిఫారాలు సర్దుకుంటున్నారు, పేషెంట్ లని శుభ్రంగా తయారు చేస్తున్నారు, పక్క బట్టలు సవరిస్తున్నారు, వార్డ్ లన్నిటినీ అద్దాల్లాగా తుడుస్తున్నారు…మాట్రన్ కుర్చీ లోంచి లేచి నిలబడే ఉన్నారు.  అప్పుడొచ్చింది ఊరేగింపు. ఆ గొప్ప మనిషి, సీనియర్ నిపుణులు – మందీ మార్బలం తో  – morning rounds కి వచ్చారు. ఒక పక్కన registrar , ఈ పక్కన house surgeon  , ఇద్దరు వైద్య విద్యార్థులు – ఆయన నోట్లోంచి రాగల ప్రతి మాటకోసమూ ఆత్రంగా వేచి చూస్తూ.

మెల్లగా ఆయన పేషెంట్ ల మంచాల మధ్య నడుస్తున్నారు.  పలకరించే సాహసం చేయాలనుకోలేదు కాని, నా మంచం దగ్గరికి వచ్చినప్పుడు బాగా తేరిపార చూడకుండా ఉండలేకపోయాను – గుర్తు పడతారేమోనని ఆశ. గుర్తు పట్టారు. ఒక్క క్షణం నుదురు చిట్లించి వెంటనే నవ్వేశారు. ” నా చిన్నారి లైబ్రరీ నేస్తం !!! ” అని సంతోషంగా  ప్రకటించుకుని, తన పరివారానికి నా గురించి చాలా చెప్పారు. నేను ఆయనకి సాయం చేశాననీ ప్రోత్సహించాననీ ఎంతో ధైర్యం ఇచ్చాననీ …అవునా ? ఇచ్చానా ? ఇచ్చాను కాబోలు !!!

ఇంకొక్క మాట మిగిలింది , అదీ చెప్పాలి. డిస్చార్జ్ అయాక పాప తోబాటు వాళ్ళింటికి వెళ్ళాను. ఆ చక్కని డ్రాయింగ్ రూం లో టీ పాట్ వెనక…ఆమె ఎవరు ? ఓహ్ ! మిస్ పోల్ …ఆయన ఆమెని పెళ్ళాడారు ! ఎంత బావుంది….ఎంత బావుంది ! ”

https://en.wikipedia.org/wiki/Eva_Ibbotson

http://www.amazon.in/s/ref=nb_sb_ss_i_1_12?url=search-alias%3Dstripbooks&field-keywords=eva+ibbotson&sprefix=Eva+Ibbotson%2Caps%2C316

 

 

 

 

 

 

 

 

 

 

 

మీ మాటలు

  1. vilaskar says:

    చాలా బావుంది

  2. Baavundandi

  3. నేనెప్పటినుంచో మీ రచనలు చదువుతున్నానండీ. అసలు మీ “గాజు కెరటాల వెన్నెల” అనే శీర్షికే ఒక్కసారి ఆ వెన్నెల ని ముట్టుకోగలిగితే ఎంత బావుంటుందో అనిపిస్తుంది. మీ రచన చదివిన ప్రతీసారీ కళ్ళు మూసుకుని విజువల్ గా ఎలా వుంటుందా అని ఊహించుకుంటే – అందమైన అల్లి బిల్లి ముగ్గులా అనిపిస్తుంది. అభినందనలు మీకు!

    ~లలిత

  4. Mythili Abbaraju says:

    ఓహ్!! ఎంత బాగా చెప్పారండీ… thank you so much! You made my day :)

  5. కె.కె. రామయ్య says:

    ” ఎంత బావుంది….ఎంత బావుంది ! ఇప్పుడు “గాజు కెరటాల వెన్నెల” పాత సంచికలకేసి పరుగులిడాలనిపిస్తోంది.
    ” The Star Of Kazan by Eva Ibbotson ” PDF కాపీ ఇంటర్నెట్ లో ఫ్రీ డౌన్లోడ్ చేసుకోవచుచనుకుంటా.

  6. Mythili Abbaraju says:

    థాంక్ యూ వెరీ మచ్ అండీ!!

    free download ఉండదేమో, రచయిత్రి 2015 లోనే కదా మరణించారు!!
    e book ( kindle format) దొరుకుతుంది

  7. Venkat Suresh says:

    ఎంత బాగుంది!! అయ్యో ఇంత మంచి రచయిత్రి గురించి అసలు తెలియని కూడా తెలియదు నాకు. ఆమె రచనలు ఇక్కడేమైనా దొరుకుతాయేమో చూడాలి, లేదా epub ఏ శరణ్యం

  8. satyanarayana says:

    ” Believe It or Not ” అని ఒక ప్రముఖ డైలీ లో చిన్న box item బొమ్మలతో పాటు వచ్చేది . అందులో విచిత్రమయిన విషయాలు ఇచ్చేవారు .
    వెలుతురు పూవుల జాలు ,అలానే నిజమేనా ! అనిపించింది .
    మీరనుభవించిన ఆనందం జాడలు కనిపించాయి పోస్ట్ చదువుతుంటే .
    తప్పక చదవాలనిపించాయి ఆ కథలు .
    లైబ్రరీ లు ,ఆ పరిసరాలు పుస్తక ప్రియులకు ఒక Nostalgic జర్నీ డౌన్ the memory lane ,కి తీసుకెళ్తాయి
    చిన్నప్పుడు పిచ్చిగా ,లైబ్రరీ లో ఆ వాసన లో మునిగి ,అన్ని పుస్తకాలూ చదవాలనిపించేది .
    ఈ ప్రపంచం ఎంత విస్తృత మయినదీ ,ఎంత వైవిధ్య మయినదీ ,ఇలాటి విషయాలు చదువుతుంటే గుర్తుకొస్తూ ఉంటుంది ,కొట్టుకుపోతున్న వాళ్ళకి .
    మీ ” గాజు కెరటాల వెన్నెల ” మెరుపు లన్నీ చూడాలి ,ఇంతకాలం పట్టించుకోలేదు .

    • Mythili Abbaraju says:

      థాంక్ యూ అండీ . లైబ్రరీ ,పాత పుస్తకాల వాసన…పుస్తకాల షాపులు, కొత్త పుస్తకాల సౌరు….

      తర్వాత ఈ మాల్ ల లోంచి వచ్చే పుస్తకాల కి ఆనందపు స్వాగతం…

      ఇప్పుడు కినిగె లో కళ్ళ ముందుకి దిగి వచ్చే అక్షరాలు ఇచ్చే ఆశ్చర్యపు ఆహ్లాదం …ఎన్నని !

  9. Vijaya Karra says:

    ఆశావాదం పెంచే వ్యక్తులు, వారి జీవితం ఇచ్చే స్ఫూర్తి చాలా అవసరం ప్రతి మలుపులో. ఇంత చక్కగా ఇంకెవరూ పరిచయం చెయ్యలేరు మైథిలి గారు! Thanks for the article .

  10. Amarendra Dasari says:

    ఎంత బావుంది ? ఎంత బావుంది ? మీ పరిచయం చాలా చాలా బావుంది..మెనీ థాంక్స్ అండీ

  11. అద్భుతం … ఏ ఒక్క ప్రియమైన మాటా మిగిలిపోలేదు ఇంత అందమైన పరిచయంలో ! మీ వాక్యాల్లో దగ్గరితనం ఉంటుంది …, మరీ పరిచయవ్యాసాలు రాసేటప్పుడు అవి చదివే వారిని పరిచయం చేసే వారికి అతిదగ్గరగా నిలబెట్టేస్తాయి. మొదటిసారి లైబ్రరీకి వెళ్లిన రోజుల్ని ఎంత అద్భుతంగా పట్టి తెచ్చారో మా జ్ఞాపకాల్లోకి _/\_ థాంక్ యూ సో మచ్ :) :)

  12. Mythili Abbaraju says:

    Thank you as always Rekha.
    ఒక ముఖ్యమైన సంగతే మర్చిపోయాను.. ఆమె చాలా బాగా నవ్విస్తారు!

  13. వెన్నెల కెరటాలు ఎంత ఆహ్లాదకరంగా ఉంటున్నాయో కదా! కథా సుధా, రచనా జ్యోత్స్నా రెండూ కలిసి తడిపేస్తున్నాయి మైథిలీ!

మీ మాటలు

*