మిత్రమా! అమెరికాలోనూ నీ కంఠస్వరమే. ..

rajayya-150x150

మిత్రమా!

ఇంకా వెలుగురెకలు విచ్చుకోలేదు. ఆకాశం నిండా కుదురుకున్న మేఘాలు.. అందరు తమతమ బతుకుల్లో ఒదగలేక, బయటకు రాలేక అంతర్ముఖులౌతున్న సందర్భంలో మనుషుల లోలోపల ముట్టుకుందామనే సుదీర్ఘ ప్రయాస,  నడకకు ఒక చిన్న అధారం దొరికినందుకు యమ ఉద్విగ్నంగా ఉన్నది.

ఈ తెల్లవారుఝామున మనం కలిసి తిరిగిన నేలమీద నీ పాత ముద్రలకోసం వెతికాను. చెట్లకొమ్మలమీద మన ఆత్మీయ స్పర్శ గురించి ఆకుల మీద మనం రాసుకున్న మానిఫెస్టోల గురించి వెతికి వెతికి చూశాను. లోలోఫలి ఉద్విగ్నతలాగా – ఆకులు దాచుకున్న బాకుల్లాగా చెట్లు దాచిన సుకుమరమైన గాలి స్వరలయల విన్యాసంలాగా – మనం ప్రేమించి ఆడిపాడిన బృందాగానాలు  నా చెవులనిండా హోరెత్తిపోయాయి. ఇదే నేలమీదినుంచి ఇదిగో ఈ మారుమూల చిన్న మోరి దగ్గరినుండి – అదిగో ఆ కనిపించే తెల్లని చెరువు సాక్షిగా – అందులోని చేపపిల్లల సాక్షిగా నువ్వు నడిచిపోయావు. బహుశా ఆ రోజు నాకింకా తడితడిగా గుర్తున్నది. అప్పుడు నా కళ్లల్లో ఊరిన నీళ్లు ఇంకా కళ్లల్లోనే నిలిచిపోయాయి. నేనెందుకు ఇక్కడ నిలబడిపోయానో నాకిప్పటికీ అర్ధం కాదు..

నువ్వట్లా నడుస్తూ  పోతుండగానే – నడిచిన నేలంతా ఎర్రటి పాదముద్రలు. మనిద్దరికి మాత్రమే తెలిసిన పాట నా చెవుల్లో మారుమోగుతూనే ఉన్నది. కాలం, నీరు. – నువ్వు ఒక్క దగ్గర నిలువవు కదా! కొన్నివేల కిలోమీటర్ల దూరంలో కొన్ని వేలమంది సమూహంలోంచి మీ పిలుపు గుండె చప్పుడు వినిపిస్తూనే ఉంది. ఎన్నో చెప్పాలనుకుంటాను. ఎన్నో కలలు కంటాను. కాని రాయాలంటే ఏ వొక్క మాట పలుకదు..

02-03-12WhiteHouse

నేను అమెరికానుంచి వచ్చి అప్పుడే వారం రోజులు దాటిపోయింది. ఈవారం రోజులుగా మనిషి కనిపించిన చోటల్లా నీ కోసం వెతుకుతూనే ఉన్నాను. విచిత్రంగా గడ్డకట్టిన అమెరికాలో – చీమ కూడా చొరబడకుండా కట్టుదిట్టం చేసుకున్న అమెరికాలో – ఒబామా ఇంటిముందు ఎవరో కంఠంలో విచిత్రమైన మానవస్వరంతో ‘గాటెమాలా’ దీనగాధలు చెప్పుతున్నారు. విచిత్రంగా ఉలిక్కిపడి చూశాను. అది నీ కంఠస్వరమే. .. రకరకాలుగా కనిపించని జైల్లు. తాళ్లు, మాయోపాయాలు చేసి మనుషులను ఒక మందగా, వస్తువుగా మార్చిన చోట గుంపులుగా తిరిగే మనుషుల్లో ఒంటరి కళ్లల్లోకి తొంగి తొంగి చూశాను. మెక్సికన్లు, ఆఫ్రికన్లు, నల్ల జాతీయులు, యూరోపియన్లు, జర్మన్లు, రష్యన్లు, చైనావాళ్లు, జపానువాళ్లు, పాకిస్తాన్, ఇరాక్, ఇరాన్ – ఎన్నిరకాల మనుషులో. మార్కెట్టు కొంతమందిని ఆవహించి వాళ్లను సమూలంగా తొలిచేసి వాళ్లు కుళ్లిపోయి, మొత్తం ప్రపంచాన్ని కుళ్లగొట్టే ప్రయత్నంలో, కుళ్ళిపోవడానికి సిద్ధంగా లేని మనుషులు, వాళ్ల పెనుగులాట బహుశా మళ్లీ నాకిక్కడే కనిపించింది. వినిపించింది. అయినా అంతటా ఒక అబద్ధపు మార్మిక యుద్ధం ప్రపంచమంతటా.. ఒక్క మాట నిజం కాదు.

ఎక్కడా నిలువలేక రైల్లో ఖమ్మం దాకా పోయి వచ్చాను కొన్ని వేలసార్లు రైల్లో నీ జ్ఞాపకాలతో.

కాజీపేట  స్టేషన్ రాగానే నా గుండె కొట్టుకున్నది. ఆ స్టేషన్లో మనం ఎన్నిసార్లు కలుసుకున్నామో? ఎన్ని మాటలు చెప్పుకున్నామో? నాకైతే ప్రతిమాట పోటెత్తింది.. అటుయిటు పచ్చని పంటపొలాల మీదుగా సెంట్రీ చేసే తాడిచెట్లు.. కరిగిపోతున్న రాళ్లగుట్టలు.. నా పక్కన చాలా సంవత్సరాల తరువాత మా తమ్ముడు వీరన్న.

చెప్పాల్సిన విషయాల్లాగే.. దారితెన్నూలేని చెయ్యాల్సిన పనులు చాలా ఉన్నాయి. ఇక్కడ అన్నిరకాల ప్రజలు తీవ్ర ఉద్రిక్తతలో ఉన్నారు. లెక్కకుమించి ఆస్తులు కలిగినవాళ్లు – అధికారం – సంపదను అపారంగా చిక్కించుకున్నవాళ్లు , రవ్వంత శాంతిలేక రాత్రి పగలు దేవులాడుతున్నారు. వాళ్లకు ఏ పని చేతకాదుకనుక వాళ్ల అరుపులకోసం జనాన్ని వీధుల్లోకి ఉసిగొల్పారు. రంగస్థలం ఖాళీ కావడంతోటి, నువ్వు లేవు కనుక విధ్వంసమైన పొలాల్లో, కార్ఖానాలల్లో ఉండలేక ప్రజలు వాళ్ల కారణాల చేత వాళ్లు వీధుల్లోకి వచ్చారు. ఏ లక్షణం లేని కూతగాళ్లు, రాతగాళ్లు, నటులు ఇరవై నాలుగు గంటలు బతుకుకు సంబంధంలేని గాలి కబుర్లు ఊదరగొడుతున్నారు. అదే అపురూపమైన పని అనుకుంటున్నారు.

అట్లాంటి మనుషులందరికి, మనందరికి చెవుల ఊదిన ఆదిమానవుడి మాట చెప్పాలి కదా! బహుశా అది సప్తసముద్రాల్ని, మానవరహిత యుద్ధ విమానాల్ని దాటుకొని మనుషులకు చేరుతుందేమో? అదివాసులు మనుషుల మాటను మంత్రంగా భావిస్తారు.   లోలోపలి నుండి వచ్చిన మాట అది. ఇదిగో నేను చూస్తుండగానే గోదావరి తీరం వెంబడి విస్తరించిన బస్తర్ కొండలమీదగా ఉదయించిన లేలేత సూర్యకిరణంలాంటి మాట. మనిద్దరం గొంతుకు కూర్చున్న ఆ పురాతన గోండు ముసలివాన్ని, గోండు మంత్రం గురించి అడిగితే నీ చెవుల, నా చెవుల చెప్పిన మంత్రం గుర్తుందా? “ఆకుబాకవుతుంది…”

ప్రపంచవ్యాపితంగా మృత్యువులా వ్యాపించిన గంధకం పొగల మధ్యలోంచి మనుషులు కల్సుకుంటారు. ఒంటరితనాల్లోంచి, ఎందుకు పనికిరాని వస్తువుల్లోంచి మనుషులు తమను తాము విముక్తం చేసుకుంటారు.

ఆ చారిత్రక సంధికాలంలోమనం ఆ విజయోత్సవానికి వేదిక సిద్ధం చేస్తున్నాం కదూ!

చెప్పరానంత ఆనందంగా ఉంది. ముట్టుకుంటే జలజల కురిసే మేఘంలా తడితడిగా ఉంది. నీకూ అట్లాగే ఉంటుందని నాకు తెలుసు. నా గురించి.. కోట్లాది నాలాంటి ప్రజల గురించి నువ్వు ఒకే ఒక్క మాట చెప్పినావని. కంకవనం మీదుగా వీచిన గాలి కంఠస్వరం ద్వారా నాకు అందింది. అందుకే ఈ సంతోషం.

తెలంగాణ ఒక చిన్న అడుగు

17.08.2013

 మిత్రమా!

మనం విడిపోయి చాలా రోజులయ్యింది కదూ! అట్లాగే ఎవరి దారిలో వాళ్లం  చాలా చాలా దూరం వెళ్లిపోయాం కదూ! నువ్వు అన్నింటిని కదుపుతూ, లీనమౌతూ, అంతర్లీనమౌతూ – ప్రకృతిలా, పాటలా ఒక అజేయమైన, స్థితికి సుదీర్ఘ ప్రయాణంలో ఉన్నావు…

నేను ఎక్కడ తిరుగుతున్నానో తెలియకుండా! కాని మనం కలిసి పంచుకున్న అపురూపమైన యుద్ధ, భీభత్స, సమ్మోహనమైన, ప్రతి అనుభవం, ప్రతిక్షణం గుర్తుంది. మనం అందరం నిద్రపోతున్న ఒక గాఢమైన రాత్రి… వెలుగు రాసిన గొంతుతో.. అక్టోబరు 17 రష్యా విప్లవానికి ముందటి లెనిన్ మానసిక స్థితి గురించిన నీలం నోట్‌బుక్ గురించి చర్చించుకున్నాం గుర్తుందా?( మిత్రులు ఆర్.కె. పర్స్పెక్టివ్ ప్రచురణలు తనకు ఆ పుస్తకం దొరికిందన్నారు. మళ్లీ చదవాలి.) పాత సమాజం కూలిపోవడం కూడా ఎంత క్లిష్టమైందో చెప్పుకున్నాం కదూ! ఆ తరువాత వెతికి వెతికి ప్రపంచాన్ని కుదిపేసిన “ఆ పది రోజులు” చదువుకున్నాం కదా ?

నేను తెలుగు ప్రాంతానికి దూరంగా ఉన్నాను. అయినా అల్లకల్లోలమౌతున్న ప్రజల మానసిక స్థితుల గురించి తెలుస్తూనే ఉంటుంది. రెండు ప్రపంచ  యుద్ధాలు. పెను మార్పులకు లోనైన ఇక్కడి ముఖ్యంగా యూరప్ సమాజం ఎంత అలజడిని చూసిందో కదా! అందుకే ఇక్కడి మనుషులు, సమాజాలు ఘనీభవించిన ఒంటరితనంతో ఉంటాయేమో? అధికారం రెండు ప్రాంతాల్లో అతలాకుతలమౌతున్నది.

20% లాభం ఉన్నదని తెలిస్తే పెట్టుబడిదారులు తమ మెడ నరుక్కోవడానికి సిద్ధపడుతారట. నాకీ మాట కారల్ మార్క్స్ చెప్పినట్టు కొడవటి కుటుంబరావు రాశారు. అధికారం క్రూరమైంది. అది అంతులేని దాహంతో కూడుకున్నది. ఇప్పుడు అన్ని రకాల తప్పుడు మాటలు  పదే పదే ప్రసార సాధనాల్లో మారు మ్రోగుతున్నాయి. ఇప్పుడు ఇంత చెత్తలో నిజం తెలుసుకోవడం ఎంత కష్టం?

తెలంగాణా ప్రాంతం అరవై సంవత్సరాలుగా యుద్ధరంగంలా ఉన్నది. శ్రీకాకుళం, అదిలాబాదు, కరీంనగరే వచ్చింది. సింగరేణి, మాచెర్ల గుంటూరుకు వెళ్లింది. సృష్టికర్తలైన ప్రజల మధ్య ప్రేమ తప్ప యుద్ధం లేదు. కాని స్వార్ధపరులు తమ దురాశపూరితమైన అధికారదాహాన్ని అందమైన, సున్నితమైన పేర్లతో అందరికీ పూస్తున్నారు. బహుశా ఇది అతి పురాతనమైన ఎత్తుగడ. ప్రతి దోపిడి అందమైన ముసుగులతో ఉంటుంది. ప్రపంచ పోలీసు  ప్రపంచంలో శాంతిని కాపాడడానికి తనకు లొంగని దేశంలో తనే ఉద్యమాలు సృష్టించి ఊచ కోతలు కోస్తాడు. ఈ చిత్రమైన  నాటకానికి ప్రపంచీకరణ అనేక అందమైన పేర్లు కనుక్కొన్నది. అంతా మార్కెట్టు. అధికారం. రెండు ప్రాంతాల ప్రజలకు ఆస్థి తగాదాలు లేవు. తగాదాలల్లా  వాళ్లు కోల్పోయిన సంపదను తిరిగి దక్కించుకోవడమే.

అంతటా అద్భుతమైన పంటభూములు.. చెయ్యిపెడితే పిడికెడు అన్నం దొరికే భూములు ముక్కలుగా కత్తిరించి రియల్ ఎస్టేట్లయ్యాయి. సెజ్‌లయ్యాయి. చెమట చుక్క చిందించనోడు, శ్రమంటే తెలియనోడు. దళారి అవతారమెత్తి లక్షల కోట్లు సంపాదించి అన్నిరకాలుగా కల్లిలి పోయాడు. ఊళ్ళు వల్లకాడులయ్యాయి. వందల గ్రామాలు ఓఫెన్‌ కాస్టులయ్యాయి. నామరూపాలు లేకుండా పోయాయి. ప్రజలు వాటిని తిరిగి గెలుచుకోవాలి.

అతిసుందరమైన అడవులు ఆక్రమించి మైనింగు మాఫియా లక్షలకోట్ళు సంపాదించింది. ఒకటేమిటీ సమస్తం ఒక పెను విధ్వంసానికి అటు తెలంగాణా, ఆంధ్రాలో ముంచెత్తింది. చిన్న పెట్టుబడిదారులు గుత్త పెట్టుబడిదారులయ్యారు. అంతటా సంపద కొల్లకొట్టారు. అతి నైపుణ్యంగా సంపద చేతులు మారింది. అడిగిన వాళ్లందరిని తరిమి కొట్టారు. శ్రీకాకుళంలో నైతేనేమి, వెంపెంట, గోదావరిఖని, మందమర్రి ఎక్కడైనా ఏ చిన్న అలికిడైనా వీధులు రక్తసిక్తమౌతాయి. కోర్టులు, జైళ్లు, నోళ్లు తెరుస్తాయి.

ప్రజలంతా తమ సర్వసంపదలు రోజురోజుకు  పోగొట్టుకుని నిరాయుధులుగా వీధుల్లో నిలబడుతున్నారు. తెల్లబట్టలేసుకున్న ప్రతివాడు అక్రమ సంపాదనాపరుడు, సాయుధుడై తిరుగుతున్నాడు. అధికారం ప్రజల సొమ్ముతో సాయుధ గార్డ్సుతో తిరుగుతోంది. సాయుధ గార్డ్సులేని ప్రజానాయకుడే లేడు. ప్రజలు  అధికారం – సంపద ఎంత క్రూరంగా ఎదురు బొదురుగా నిలుచున్నారో? నిత్యం నిరంతరం  వాళ్ల అంతరంగంలో ఊపిరైన  నీకు నేనేం చెప్పాలి ?

తెలంగాణా ఉద్యమం అనేక అనుభవాల సారంగా వచ్చింది. ప్రజల పక్షానా నిలబడ్డ తమ బిడ్డలు అయితే ఎన్‌కౌంటర్ లేకపోతే జైలుపాలో, అడవిపాలో అయిన తర్వాత అనేక అనుభవాల సారంగా వచ్చింది. ఈ ఒత్తిడిని చిత్తడిని పెంచిందెవరు? రాష్ట్ర, దేశ, విదేశ హస్తాలు ఇక్కడిదాకా సాచి లేవా?

దీనికి తెర తీసిందెవరు? దొంగలు దొంగలు ఊళ్ళు పంచుకున్నారు. హైటెక్ ద్వారాలు తెరిచి విద్యాలయాలను వద్యశాలలుగా మార్చారు. విద్యార్థులను యుద్ధవీరులైన విధ్యార్థులను ఆత్మహత్యలు చేసుకునే దయనీయ స్థితి మన విద్యారంగం కల్పించలేదా? రైతుల ఆత్మహత్యలకు కారకులెవరు? రెండు ప్రాంతాలలో రైతులు ఎంత హీనంగా ఉన్నారు. ధాన్యాగారం క్రాపు హాలిడేస్ ప్రకటించలేదా? అంతటా విస్తరించేదెవరు? రైతులను, వ్యవసాయాన్ని విధ్వంసం చేసిందెవరు?

మనిషిలోపల చేపల్లోపల కుళ్ళడం మెదడులో మొదట ఆరంభమౌతుందని మహాశ్వేతాదేవి అంటారు. కుళ్లిన మెదళ్ళ వీళ్లు మనుషులను వేటాడుతున్నారు. లూషున్ పిచ్చివాడి డైరీ జ్ఞాపకం వస్తోంది. ఆ కథలో హీరో సమస్త మానవభాష మనుషులను తినడానికే అనే నిర్ధారణకు వస్తాడు. అడవిలోని మూడువందల గ్రామలు పోలవరం ముంపు బలిపీఠం మీదుగా ఆదివాసులు నిలుచున్నారు. నోరువాయిలేని ఆదివాసుల మీద యుద్ధం అంతకంతకు విస్తరిస్తూనే ఉన్నది. ప్రజలు ప్రేమిస్తారు. ఆ ప్రేమ కోసం మనమింకా ప్రతి చోటికి తిరుగుతూనే ఉన్నాం కదా! ఉన్నవ లక్ష్మీనారాయణ, చలం, కొడవటిగంటి, గోపిచందు, గురజాడ, భూషణం, పాణిగ్రాహి, రావిశాస్త్రి, కారా మాస్టారు, శ్రీశ్రీ, చలసాని, రుక్మిణి, సత్యవతి, బండి నారాయణస్వామి, పాణి, కె.వి.రమణారెడ్డి, కేశవరెడ్డి, మధురాంతకం, సురవరం, కాళోజీ, దాశరధి, వట్టికోట, ఆల్వారు, స్టాలిను, గద్దర్, ఉమా మహేశ్వరరావు, వోల్గా, రంగనాయకమ్మ, బోయ జంగయ్య, శశికళ, త్రిపురనేని మధుసూధనరావు, వరవరరావు , హరగోపాల్, బాలగోపాల్, గోరేటి వెంకన్న, వల్లంపాటి వెంకట సుబ్బయ్య, సుద్దాల, సుంకర, వాసిరెడ్డి, మహిందర్, జాషువా,,,  ఎందరెందరో ప్రజల కోసం రవ్వంత సుఖశాంతికోసం అంతటా కవులు, రచయితలు విస్తరించి లేరా? ఇప్పుడు  కొన్ని వందలమంది రచయితలు కవులు అంతట విస్తరించలేదా?

తెలంగాణా, అంధ్రా తెలంగాణా, రాయలసీమ ప్రజల వ్జయం. దోపిడీదారులు ఏకమౌతున్న దశలో ఒక చిన్న విజయం ఇప్పుడు రెండు ప్రాంతాలల్లో విచ్చిన్నమైన వ్యవసాయం, పెచ్చరిల్లిన అధికార దోఫిడి, చిన్నాభిన్నమైన పరిశ్రమలు, మానవ సంబంధాలు నిర్మిద్దాం. ప్రజలతో కలిసి నిర్మించే దిశగా నువ్వాలిస్తావని నాకు తెలుసు.

భారతదేశంలో క్రూరుడైన, జిత్తులమారి బ్రిటిష్ పరిపాలన దురాశపూరితులైన ఫ్యూడల్ సంబంధాలు అస్తవ్యస్త అభివృద్ధి ప్రాంతాలకు తావిచ్చాయి. వీటన్నింటినీ సరిచేసి పీడిత ప్రజల పక్షాన పోరాటం చేపట్టింది శ్రీకాకుళం నుండి .. నేటి పోరాటం కదా! వనరులను అభివృద్ధి చేసే విధ్వంసాన్ని ఆపి మనుషులను నిర్మించే పోరాటంలో తెలంగాణ ఒక చిన్న అడుగు.

భారతదేశం యుద్ధంలోకి నెట్టబడుతోంది. స్థానిక ప్రజలకు దోపిడీదారులకు, గగ్గోలౌతున్న మన దగ్గరి టక్కరి పెట్టుబడిదారులకు, ప్రజలకు, రెండు ప్రాంతాల ప్రజలు కలిసి పోరాడుదాం. దారి తెన్నూ లేని  నాలోపలివెన్నో నీతో పంచుకోవాలనుకున్నాను. నీకు ఈ విషయాలన్నీ సర్వ సమగ్రంగా తెలుసు. నీకు ఇంత డొంక తిరుగుడుండదు కదా! నువ్వు మాటల కన్నా చేతలు నమ్మినావు కదా !

నీ మిత్రుడు

 

మనం కలిసి కన్న కలలున్నాయి, అవి జర భద్రం!

మిత్రమా,

చాలా రోజులయ్యింది ఉత్తరం రాసి..

ఈ మాటలు రాస్తున్నప్పుడు కోటానుకోట్ల అక్షరాలు పోటెత్తాయి. ఉద్విగ్నమైన, అమాయకమైన, బహుశా 1861 నుండి 1865 వరకు దక్షిణ ఉత్తర ప్రాంతాలకు జరిగిన భీభత్స అమెరికా అంతర్యుద్ధ భావజాలం, హింస మనం చూసినం కదా! అయినా ఆ యుద్ధం ఆంధ్ర, తెలంగాణా, ఇంకా మన దగ్గర ఇప్పటికీ కొనసాగుతుంది కదా!

అదిగో అక్కడినుండి ప్రవాసిలాగా ఇక్కడికి వచ్చాను. నేనిప్పుడు చుట్టూ ఆవరించిన ఎత్తైన ఓక్ చెట్ల మధ్య ఉన్నాను. మార్మికమైన ధ్వనులేవో విన్పిస్తున్నాయి. పేరు తెలియని పిట్టేదో తన భాషలో మాట్లాడుతోంది. ఎర్ర బుట్టు పిట్ట బద్ధకంగా, లాన్‌లో ఫురుగులేరుకుంటోంది. జులై మాసపు ఎండ పాకుతోంది. వాతావరణం వేడిగా ఉంది. నేనిప్పుడు న్యూయార్కుకు రెండు గంటల కారు ప్రయాణం దూరంలో ఎక్స్‌టన్ ఫిలడెల్ఫియా రాష్ట్రంలో ఉన్నాను. కాలం కత్తి అంచు మీద నడిచినట్టుగా ఉంటుంది. ఎన్నెన్నో జ్ఞాపకాలు చుట్టుముడతాయి. ఏదీ నిలువదు. ఏదీ కొనసాగదు. నిద్రో, మెలకువో తెలియకుండా విచిత్రమైన ఈ మానసిక స్థితి..

బహుశా ఒక కఠోర సమయంలో మాక్సింగోర్కి 1906లో న్యూయార్కుకు ప్రవాసం వచ్చాడు. అతి కష్టంగా. ఏమి చెయాలో తోచక, తన చుట్టే తిరిగినప్పుడు తను కలెగలిసి మెదిలిన మనుషులంతా, తన సహచరులంతా అతనికి కొత్తగా వింతగా కన్పించారు, విన్పించారు. తాము భాగమైన మొత్తం జీవితం కుదురు ఆరాటం అర్ధమయినట్టె అన్పించింది. ఆ వియోగ సంయోగంలో నుంచే అమ్మ నవల పుట్టింది. ప్రతి మనిషిలో లోపల ముట్టుకోవడానికి చేసిన ప్రయత్నమే అమ్మ నవల. అట్లాంటిదేదో రూపు కట్టినట్టే ఉంటుంది. నలభై సంవత్సరాల సుదీర్ఘ యుద్ధఘట్టాలేవో సలుపుతాయి. రకరకాలుగా నా జీవితంలో భాగమైన అనేకమంది సహచరులు పోటెత్తుతారు. వాళ్ల అడుగుల సవ్వడి తపన – వాళ్ళు అంతకంతకు చెట్టు తన ఆకును, బెరడును త్యజించి మళ్లీ కొత్త రూపం సంతరించుకున్నట్లుగా స్వంత ఊరు, ప్రాంతం, జీవితం నుండి మనుషుల్లోకి, మహారణ్యాల్లోకి విస్తరించడం తెలుస్తూనే ఉంటుంది. లోలోపలి విధ్వంసాల్ని ఎదుర్కొని నిలబడి మనుషులుగా రూపుదిద్దుకున్నందుకు. ఆ అపురూపమైన, అందమైన మనుషులను, పూర్తిగా విచ్చిన్నమైన మనుషులు వేటాడి సంహరించడం తెలుస్తూనే ఉంటూంది. సమస్త మానవ ప్రవర్తన తెలుస్తుంటుంది. అయినా ముందుకు సాగదు.

గత పదమూడు సంవత్సరాలుగా ఇక్కడెక్కడో చిక్కు దారుల్లో కాటగల్సిపోయినట్టుగా ఉంటుంది. టాల్‌స్టాయ్ రిజరక్షన్ కన్నా ముందుకు జరగాలి. అన్నా కరెనీనా ఒంటరిగా, దిగాలుగా రైల్వేస్టేషన్లో ఆత్మహత్య చేసుకోగూడదు. విధ్వంసంలో పూర్తిగా కూరుకుపోయిన 90% ప్రజలకు విధ్వంసం తెలియదు. దారి తెలియదు. ఆ దారి కనుక్కున్న ప్రపంచం పదే పదే కుప్పకూలింది. అయినా మళ్ళీ మళ్లీ నిర్మించే క్రమంలో నా సహచరులున్నారు. ఎక్కడికో పోతున్నాను. ఈ దేశంలో చాలా తిరిగాను. మనుమడు సాకేత్ సాన్వీల కోసం డిస్నీల్యాండు నాలుగు రోజులు తిరిగాను. అదో పెద్ద ప్రపంచం. బహుశా రెండవ ప్రపంచ యుద్ధం కాలంలో పిల్లల కోసం నిర్మించిన ఒక అద్భుత కల్పనా ప్రపంచం. రాణులు, అరేబియన్ కథలు, పక్షులు, జంతువులు, అనేక దేశాల ప్రత్యేక కథలను యూనీఫాం వేసి కట్టిన కథలు…s-US-DIVERSITY-large1

అమెరిక అంతట సెలవులు కనుక చాలమంది పిల్లలు, తల్లిదండ్రులు వచ్చారు. అనేక జాతులవారు, మెక్సికన్స్, జూస్, జర్మన్, చైనీస్, ఇండియన్సు, అన్ని రకాల మనుషులను ఒక దగ్గర చూడడం అదొక అనుభవం.

లాస్ఏంజిల్స్ లోని ఇర్విన్‌లోనే గుగీ ఉంటారు. అతన్ని కలుద్దామా వద్దా అని ఊగీసలాడాను. అతను నాకు పూర్తిగా తెలుసు. నేనతనికి తెలియదు. కెన్యాలో తన వూరు, తన భాషను ప్రేమించినందుకు వేటాడబడినవాడు. ఇంకా ఎప్పటికైనా తన దేశం తాను పోతాననే కలలో బతుకుతున్న మనిషి. ఆ మధ్య ఎందరు చెప్పినా వినకుండా వెళ్లి హోటల్ గదిలోనే దుండగుల దాడికి గురై ఆయన సహచరిని అవమానపరిస్తే మళ్లీ అమెరికా వచ్చినవాడు. లోలోపల అతని స్థితి నా స్థితికి భిన్నమైంది కాదు. బహుశా ఈ స్థితి దాటిన తరువాత నేనతనికి తెలిసిన తరువాతనే కలువాలా? పిల్లలను అడగడానికి మొహమాట పడ్డాను. ఇది ఎలాంటి స్థితి అని చెప్పలేను. మన దగ్గర ఎప్పటిలాగే అనేకం పోటెత్తుతున్నాయి. పరిశుభ్రమైన తెల్లబట్టలేసుకున్నవాళ్లు తళతళలాడే సంపదలో ఓలలాడేవాళ్లు. వెగటు, వెలపరం పుట్టించే నాటకాలకు తెరదీస్తారు.

వార్తాపత్రికల నిండా వెంట్రుకవాసి కూడా నిజం కాని నటనలు.. నేనెందుకో ఆ ముఖాలు చూడలేను. సంపదతో, అధికారంతో కుళ్లిన ముఖాలవి. అప్పుడెప్పుడో బహుశా 1985లోనో యేమో కాళీపట్నం మాస్టారు చిన్న కొడుకు యింట్లో భూషణాన్ని చూశాను. అతనేమీ మాట్లాడలేదు. నేనేమీ అడగలేదు. అతనంతా చెప్పనే చెప్పాడు కదా! ఆ యుద్ధ భీభత్స, వీరోచిత గాథలన్నీ నేను చదివినవి, విన్నవే కదా! జీవితాన్ని, మనుషులను ప్రేమించడం నేర్చుకున్నదక్కడే కదా! ఆయన పక్కన కూర్చుంటే ఆ జీవితపు స్పర్శలోపలికి… ఆ తరువాతెప్పుడో విరసం సభలో అప్పలనాయుడు కార్మికుల కోసం ఏదో పత్రిక నడుపుతున్న ప్రసాదును పరిచయం చేశాడు. ఆయన ఏమీ మాట్లాడలేదు. నేను ఏమీ అడగలేదు. అప్పటినుండి మళ్లీ చూడలేదు. కాని నిరంతరం వింటూనే ఉన్నాను.

మనుషులు మంచికో, చెడ్డకో మన జీవితంలోకి వచ్చిన తరువాత వాళ్లు మనం పోయేదాకా మన వెంట నడుస్తారు. మొన్న నెల్లూరులో చంపేశారతన్ని. ప్రసాదు సౌమ్యుడు. ఆయన పొరపాటున కూడా దురుసుమాట మాట్లాడినట్లుగా గాని, ఎవరికన్నా అపకారం చేసినట్టుగా కాని ఇన్ని సంవత్సరాలుగా వినలేదు. కాని అయన మనుషుల అద్భుత కలల గురించి అడుగుతున్నాడనిపించేది.

కథానిలయం కోసం శ్రీకాకుళం వెళ్ళినప్పుడల్లా అక్కడి ఆత్మీయులైన మనుషుల స్పర్శ తెలిసేది. ప్రసాదు కొడుకు మౌనంగా కనిపించేవాడు. ప్రసాదు సహచరి గురించి తెలిసేది. తనకంటూ ఏమీ లేనివాడు. ఎంత అందమైన మనసు అతనిది. ఆకాశంలా తెరిచిన హృదయం.. ఇరుకు ఇరుకు జీవితాల్లో కుట్రలు, కుతంత్రాలలో నిత్యము మునిగిపోయే వాళ్లు పైకి తెల్ల బట్టలతో అలంకరించుకొని కన్పిస్తారు. శ్రీకాకుళమంత అందమైన వాడు. కనుకనే రాక్షసులు, మనుషులు కానివాళ్లు అతన్ని  బతకనియ్యరు.

che

బహుశా స్పార్టకస్‌ను అందుకే… ఘనత వహించినవారు ఇలాంటి సంస్కారం నేర్పుతే వస్తుందంటారు. అదీ తెలంగాణాలొ పుట్టిందంట. అది మనిషితో పాటే పుట్టింది. స్పార్టకస్‌ను, లెనిన్‌ను, చేగువేరాను, మార్క్సును నేను చూడలేదు. కాని వాళ్లందరూ నాతో పాటు కోట్లాది మనుషులతో ఉన్నారు. ఈ జ్ఞాపకం తుడిచెయ్యగలమా? మహద్భుతమైన మనుషుల కలల్లో మెదిలిన ప్రసాద్‌ను తుడిచెయ్యగలమా?

కోట్లాది మానవులు పుట్టారు, చచ్చారు. కాని కాని.. ఈ వెలుగును కాపాడుతున్నదెవరు? ఈ వెలుగును ఊదేస్తున్నదెవరు? అయితే అంతకంతకు క్రూరమృగాల సంచారం పెరుగుతున్న చోట మనుషులు వాళ్ల ఆత్మ, కలలు జాగ్రత్తగా ఉండాలి.. మరింత తేజోవంతంగా ఉండాలి.. ఏమో? ఇదంతా నీకు తెలుస్తుందా?

 

నీ మిత్రుడు

 

విప్లవాల్లోని ఒంటరితనం గురించి రాయాలి : అల్లం రాజయ్య

rajayya1

 అల్లం రాజయ్య గారితో ఇంటర్వ్యూ కోసం ఫోన్ చేసాను. అసలు ఆయనను ఇంటర్వ్యూ చేసే అర్హత నాకు ఉందా.. అని ఎన్నో ప్రశ్నలు.

మరో అరగంటాగి వస్తారా, కూర వండుతున్నా అన్నారు. అయితే ఇప్పుడే వస్తాను, ఇంటర్వ్యూ అంటే మరీ ఫార్మల్ కాదులెండి అని మరో పది నిమిషాల్లో ఇంటి బెల్లు కొట్టాను. ఆయన తన కథల్లోని సామాన్య రైతు పాత్రల్లా సజీవంగా కళ్ల ముందు ఎటువంటి భేషజం లేకుండా లోనికి ఆహ్వానించారు.  అంత వరకు ప్రశ్నలు వేసిన మనసుని పక్కకు నెట్టి పరిచయంగా వంటింట్లో నిలబడి, ఆయన చేస్తున్నది గమనిస్తూ మాట్లాడడం మొదలు పెట్టాను. వాళ్ల చిన్నమ్మాయి  ఇంట్లో ఉన్నారు రాజయ్య గారు. అమ్మాయి వచ్చే లోగా కాస్త వండి పెట్టాలన్న ఆప్యాయత కలిగిన ఆ తండ్రి హృదయానికి . అందుకు జోహార్లు మనసులో అర్పించకుండా ఉండలేకపోయాను. అలా  ఆయన్ని చూడగానే మా నాన్నగారు జ్ఞాపకం వచ్చి క్షణం లో బిడియాలన్నీ పోయాయి నాకు.

అమెరికా లో మీకు బోరుగా లేదాండీ. అనడిగాను, ఏమీ లేదమ్మా, ఎక్కడుంటే అక్కడ ఏదో ఒక పనితో పొద్దు పోతుంది. ఈ పిల్లల్ని వాళ్ల చిన్నప్పుడు పట్టించుకునే సమయం లేకపోయింది. ఇప్పుడైనా వీళ్లతో గడపడం బావుంది. అన్నారు. మనుమరాలిని ఒక పక్క ఆడిస్తూ. అక్కడ గంట సేపు ఉందామనుకున్న నేను నలభై ఏళ్ల తన జీవన యానం గురించి ఆయన చెప్తూంటే ఆ దృశ్యాలన్నిటిలోకి ప్రవేశిస్తూ, ప్రవహిస్తూ మైమరిచి మూడు గంటలైనా అక్కడే ఉండిపోయాను. ప్రతి సంఘటన ఆయన మాట్లాడుతూంటే ఆ వెనుకే నేను అక్కడ అడుగుపెడ్తూ ఉన్నాను. అదొక అద్భుతమైన భావన. గుండె చెమ్మగిల్లిన కన్నీటి అలజడి. పోరాటాల అలుపెరగని ఆయాసం. సమాజం, మనుషుల మధ్య  సంబంధ బాంధవ్యాల తాత్త్విక యోచన. అడవి పొడవునా పరుచుకున్న మట్టి తీగెల రక్త సింధూరం.   రాయడం తక్షణ అవసరమని భావించి నలభై ఏళ్ల పాటు ఉధృతంగా రచనోద్యమాన్ని భుజానికెత్తుకున్న అలుపెరగని శ్రామికుడు.
ఒక శ్రమ జీవి, ఒక ఉద్యమ కర్త, పీడిత జనం తరఫున నిలబడ్డ కథకుడు, ఉపాధ్యాయుడు….రకరకాల రూపాల్లో నా చుట్టూ ప్రత్యక్షమైన అల్లం రాజయ్యలలో కథకుడితో ఇంటర్వ్యూ ఇది.

rajayya-geeta

Qకథా రచయిత కావడానికి దోహదపడిన మీ  తొలి రోజుల గురించి చెబుతారా?

నేను  తెలంగాణాలోని  కరీంనగర్ జిల్లా, మంథని తాలూకా లోని దగ్గరలో ఉన్న మారుమూల గ్రామమైన గాజుల పల్లి లో  పేద రైతు కుంటుంబానికి చెందిన వాడిని. అప్పట్లో  గ్రామాలలో భూస్వామ్య వివక్ష  ఉండేది. పేద వాళ్ల పట్ల చాలా వివక్ష ఉండేది. అంతరానితనం బాగా ఉండేది. మేం మధ్య కులాలకు చెందిన వాళ్లం. మా నాన్న ఊర్లో పెద్దమనుషులలో ఒకరు. సహజంగానే మా ఇంటి ముందు పంచాయితీలు జరిగేవి. వాటి సారాంశమంతా పేద ప్రజల్ని ఎలా అణిచిపెట్టాలనే. ఇవన్నీ చూసి చిన్నతనంలో నాకు బాగా బాధ కలిగేది.  నా మీద చెరగని ముద్ర వేసాయి. మాతో పాటూ పొలాలలో పనిచేసే మనుషులపట్ల వివక్ష అంతా అన్యాయమైందనే భావన కలిగేది.

1965 ప్రాంతం లో నేను అయిదో తరగతి చదివే సమయంలో మా అమ్మమ్మ ఊరుకు వెళ్లాను. అది మా ఊరి కంటే పెద్ద గ్రామం. వ్యవసాయం బాగా అభివృద్ధి చెందిన గ్రామం. అక్కడే దొరల వ్యవస్థని, అనేక గ్రామీణ వృత్తుల్ని నేను చూసాను.  అక్కడికి వెళ్లాక ఇంకా బాగా అంతరాలకు సంబంధించిన విషయాలు బాగా అర్థం అయ్యాయి. అక్కడి నుంచి మంథనికి హైస్కూలు చదువు కోసం వెనక్కు  వచ్చాను మళ్లీ.
Qస్వయంగా మీరు వివక్షని అనుభవించేరా?
అంతే కదా. నేను వెనక్కు వచ్చే సమయానికి నాకు బాగా ఊహ తెలిసింది. క్లాసులలో మొదలుకుని అన్ని చోట్లా ఒక కులాన్ని, మరొక కులం వాళ్లు వివక్ష గా చూసేవారు. హైస్కూలుకు లో అడుగు పెట్టిన తొలి నాళ్లలోనే ఒక యుద్ధవాతావరణం ఏర్పడింది. మేం గ్రామీణ పిల్లలం దుమ్ము కొట్టిన కాళ్లతో, ఒంటి నిండా వెండి ఆభరణాలతో, జుట్టు తో, వ్యవసాయ పిల్లల్లా, ఎక్కడో అడివి నుంచి వచ్చిన వాళ్లలా కనిపించే వాళ్లం. మమ్మల్ని అంతా విచిత్రంగాచూడడం, ప్రతీ దానికీ అపహాస్యం చేసేవాళ్లు. దాంతో మా హైస్కూల్లో రెండు గ్రూపులుగా ఏర్పడి అస్తిత్వాల కోసం కొట్లాటలు జరుగుతూ ఉండేవి.
అప్పటి భయంకరమైన భూస్వామ్య సమాజాల్లో మనుషుల మధ్య వివక్ష, హింస, దోపిడీ అన్నీ బాగా ఉన్న వ్యవస్థ అది. ఆ క్రమంలో విద్యార్థి నాయకుడిగా ఎదిగిన నేను జూనియర్ కాలేజీ నిర్మాణం కోసం పిల్లలందర్నీ పోగుచేసి చుట్టు పక్కల గ్రామాలన్నీ తిరిగి కర్రల్ని సంపాదించి స్వయంగా పాటుపడ్డాను.1969 లో చివరి హెచ్ ఎస్సీ లో స్కూల్లో జనరల్ సెక్రటరీగా అగ్ర కులాలకు వ్యతిరేకంగా నిలబడి గెలిచాను.

ఇక విద్యార్థి జీవితం ముగిసాక ఉద్యోగాలలో ఎవరు ఉంటున్నారు అనే ఆలోచన మొదలైంది. సహజంగా అన్ని ఉద్యోగాలలోనూ ఆంధ్ర ప్రాంతం వారే ఉండే వారు. అప్పట్లోనే నేను ప్రత్యేక తెలంగాణా ఉద్యమం లో బాగా ఉధృతంగా పాల్గొన్నాను. అందువల్ల మా చదువు కూడా ఒక సంవత్సరం పోయింది. కేవలం విద్యార్థి ఉద్యమం కావడం వల్ల అప్పట్లో ఉద్యమం  పూర్తిగా నిలబడలేకపోయింది. అది కొంత హింసాత్మకంగా మారింది కూడా.

Q
పుస్తకాలతో మీ అనుబంధం గురించి-

అదే వస్తున్నా. ఇక మరో పక్క నా జీవితంలో రచయితగా అంకురార్పణ జరుగుతూ వచ్చింది. ఎనిమిదో తరగతి నుంచీ నాకు పుస్తకాలు చదివే అలవాటు ఉండేది. మా మేనత్త, మా ఇండ్లల్లో ఓరల్ ట్రెడిషన్లో చాలా కథలు చెప్పేవారు. అంతే కాకుండా గ్రామాలలో జానపద కళాకారులు చెప్పే కథల్ని బాగా వినే వాళ్లం. ఎనిమిది లో లైబ్రరీకి మొదటిసారి వెళ్లాను. లైబ్రరీ ఎంతగా ఇష్టమైందంటే దాదాపు హెచ్ ఎస్సీకి వచ్చే సరికి నేను లైబ్రరీలో పుస్తకాలన్నీ  చదివేసాను. అక్కడే రష్యన్ సాహిత్యం, రవీంద్రనాథ్ టాగూర్, బంకించంద్ర , ప్రేం చంద్ ఇలా భారతీయ సాహిత్య కారులే కాకుండా, ప్రపంచ సాహిత్య కారులందరూ రాసిన సాహిత్యాన్ని చదివేసాను.

Qమీరు చదివిన సాహిత్యం ఎలా ప్రభావితం చేసింది?

ఒక పక్క ప్రత్యేక తెలంగాణా ఉద్యమం, మరో పక్క వ్యక్తిగత జీవితంలో సాహిత్య పరిచయం. ముఖ్యంగా చలం రచనలతో బాగా ప్రభావితమయ్యాను.
సమాజానికి ఏదో ఒకటి చెయ్యాలనే తపన తో అస్తవ్యస్త, గందరగోళ జీవితం ప్రారంభమైంది. రాజకీయాలు, సాహిత్యమూ మధ్య చదువు వెనక పడిపోయింది.
70 లలో వరంగల్ లో కాలేజీలో చేరాను. చేరాక పునరాలోచన మొదలయ్యింది. చదువైన సంవత్సరం తర్వాత కొంత గందరగోళ పరిస్థితినించి బయటికి వెళ్లాలనిపించి వ్యవసాయం చేసాను. మళ్లీ అక్కడా గిట్టుబాటు ధరలు లేకపోవడం, గ్రామాల్లో ఉండే సంక్షోభం వల్ల మళ్లా బయటికి వెళ్లిపోయాను. ఆనాటి గ్రామీణ సంక్షోభం, బయటి నుంచి వచ్చిన నాగరికతకు చెందిన కొత్తఆలోచనలు, గత జీవితంలోని పరిస్థితుల నించి వరంగల్ కు వెళ్లాను. అక్కడ సాహితీ మిత్రులు కలిసారు. కరీంనగర్ చుట్టు పక్కల పేద ప్రజలకు ఏదైనా న్యాయం జరిగేదుందా అని నిరంతరం ఆలోచన చేసేవాణ్ణి. నేనుచదివిన సాహిత్యంలో ఇతర ప్రాంతాలలో ఉన్న హాయైన జీవితం మా తెలంగాణా ప్రాంతంలో ఎందుకు లేదనే ప్రశ్న వెంటాడేది. 73 ప్రాంతం లో ఒక పక్క ఉద్యమ జీవితంతో బాటూ వివాహ జీవితం ప్రారంభమైంది. వెనువెంటనే నేను ఉద్యోగం వెతుక్కోవలసిన పరిస్థితి ఏర్పడింది.  ఆ ప్రయత్నంలో భాగంగా నాకు 75 లో అదిలాబాద్ లో ఉద్యోగం రావడం తో నా ప్రస్థానం కరీంనగర్ నుంచి ఆదిలాబాద్ కు మారింది.

Qమీ మొదటి కథ “ఎదురు తిరిగితే” గురించి చెప్పండి.

ఎమర్జెన్సీ సమయానికి  గ్రామాలకు వెళ్ళడం, ప్రజల్ని కొంత ఉత్తేజితుల్ని చేసేవాళ్లం. పత్రికలకు కరపత్రాలు రాసేవాణ్ని మొదట. మా ఊరికి పి.వి.నరసింహారావు వచ్చినపుడు ఆ సభలో  ఉన్న ఒక హరిజనుడు ఈ ప్రాంతానికి సంబంధించిన అన్యాయాల గురించి  అడిగిన ప్రశ్నలకు స్పందించి నేను మొట్టమొదట “ఎదురు తిరిగితే” కథని యథాతథంగా పేర్లు కూడా మార్చకుండా రాసేను. ఆ కథలో గ్రామీణ దోపిడీ, అణిచివేత, అసంబద్ధ సంబంధాలు, గ్రామీణ వ్యవస్థ కు సంబంధించి ఒక పరిపూర్ణ చిత్రం అది. తర్వాత “క్రాంతి ” అనే పత్రికను కొద్దిరోజులు నడిపాం. ఇక కరీంనగరలో మిత్రులందరం కలిసి “విద్యుల్లత” అనే పత్రికను ప్రారంభించారు.

Q
మీ రచనా ప్రస్థానం గురించి చెప్పండి.

మిత్రులు “బద్లా”  అనే కథా సంపుటి వేసారు. అది ఆ తర్వాత బాన్ అయ్యింది. అందుకోసం నన్నొక కథను అడిగారు. అప్పటికే నేను కథ రాసినా అందులో చేర్చే సాహసం చెయ్యలేదు. నిజానికి పదోతరగతి నుంచి డైరీలు, కవితలు, కథలు రాసేవాణ్ణి. “ముగింపులు-ముందడుగులు” అని నవల కూడా రాసేను. అప్పటి సాహిత్యం అంటే సుమారుగా మూణ్ణాలుగు వేల పేజీలు రాసి  ఉంటాను. అదంతా గాంధీ ప్రభావంతో రాసిన అహింసా రాతలు. అవన్నీ ఎక్కడా ప్రింట్ చేయించలేదు. కాలక్రమంలో అన్నీ ఎటో పోయాయి. అయితే అలా నాకు రచన అలవాటు అయ్యింది. అయితే నా ప్రాంతపు  ప్రత్యేకత అప్పటికి నా రచనల్లోకి అడుగుపెట్టలేదు.  మొట్ట మొదటగా “ఎదురు తిరిగితే” తో సిసలైన కథా ప్రస్థానం ప్రారంభమైంది.
Qకథల గురించి-

భారతీయ సమాజంలో ఉత్పత్తి విధానంలో ఉండే అమానవీయతని గురించి నేను సిరీస్ ఆఫ్ స్టోరీస్ రాసాను. అందులో మొదటిది మహదేవుని  కల- ఉత్పత్తి విధానంలో ఉత్పత్తికి, వ్యక్తిగత ఆస్తికి వచ్చిన సంఘర్షణ కు రూపం ఆ కథ. రెండోది “మనిషి లోపలి విధ్వంసం”. వ్యవసాయాధార భారతీయ సమాజంలో ఉత్పత్తి విధానం మనిషి లోపల విధ్వంసానికి ఎలా కారకమవుతుందో చిత్రించాను. తర్వాత మధ్యవర్తులు. చదువు భూమి పుత్రుల్ని వేరుచేసి, మరలా వాళ్లనే వాహికలుగా చేసుకుని కింది సెక్షన్లని దోపిడీ చెయ్యించడం.
నీల, కమల కథలు స్త్రీల సమస్యలకు సంబంధించినవి. ఏ సమాజం మారినా స్త్రీ పాత్ర మరలా ఒకటే. అత్యంత అమానవీయ, అప్రజాస్వామికంగా మహిళల్ని చూడడానికి వ్యతిరేకంగా రాసినవి.
ప్రత్యర్థులు- రాజకీయ నాయకులకు  సంబంధించినది. ఒక సమాజంలో ఎందుకు ఒక వ్యక్తి భూస్వామి గానూ, మరొక వ్యక్తి దోపిడీకి గురవుతూ కనిపిస్తాడు. అనేది ప్రశ్న.

చివరిది “అతడు” – ఇలాంటి అమానవీయ సమాజంలో నేడు అన్ని రకాల వైరుధ్యాలను అర్థం చేసుకుని, పరిష్కరించి, ప్రజలను ముందుకు తీసుకుపోయే కార్మిక వర్గ పార్టీ గురించి రాసినది.

ఇక కార్మిక కథలు. బొగ్గు గనులకు సంబంధించిన కథలు అనేకం రాసేను. నాతో రచయితలు అందరి కథలూ కలిపి సమిష్టిగా దాదాపు 50,60  అన్ని రకాల పుస్తకాలు

ప్రచురించేం. నాకు ఉద్యోగం, ఉద్యమం, వ్యక్తిగతం, రచన..ఇలా నాలుగు జీవితాలుండేవి. అన్నీ సమతూకం గా చూసుకుంటూ క్రమంగా  రాసిన కథలన్నీ మొదట ప్రజా తంత్ర లో, తర్వాత ఎక్కువగా సృజన ,అరుణ తార, ఆంధ్ర జ్యోతి  లాంటి అన్ని పత్రికలలో   అచ్చయినాయి.

Qమీ “మనిషి లోపలి విధ్వంసం” కథ అన్ని భారతీయ భాషలలోకి అనువాదం అయ్యింది కదా? ఆ కథ లో ఉన్న గొప్ప ఫిలసాఫికల్ థాట్ గురించి చెప్పండి.

Allam Rajaiah
మాడ్ ఆఫ్ ప్రొడక్షన్  “మనిషిలోపలి విధ్వంసం”. భారతీయ ఉత్పత్తి విధానం మనుషుల్ని వ్యక్తిత్వం లేకుండా ఎందుకు తయారుచేస్తూంది?  ఆత్మహత్యలకు ఎందుకు ప్రేరేపిస్తూంది?
మనిషికి చావు, పుట్టుకలు ఎక్కడి నించి ప్రారంభం అవుతాయి? నా ఉద్దేశ్యంలో మనిషికి చావు పుట్టిన మొదటి సంవత్సరం నుంచే ప్రారంభమవుతుంది. చిన్నతనం నుంచీ వేసే ప్రతి ప్రశ్ననీ సంహరించి రోజూ మనిషిని చంపుతూ ఉంటాం. ముందుగా కుటుంబం ఒక భయంకరమైన యూనిట్, తర్వాత స్కూలు , ఉద్యోగం, ఉత్పత్తి విధానం ఇవన్నీ అంత కంటే  భయంకరమైన యూనిట్లు, కాంపులు. ఇన్నిటిని తప్పించుకుని మనిషి ఎక్కడ బతుకుతాడు? ఒక రోజులో నిర్ణయమవుతుందా మనిషి చావు?  విధ్వంసమనేది ఎక్కడ జరుగుతుందనే కథ”మనిషి లోపలి విధ్వంసం”. ఇది అన్ని భారతీయ భాషల్లోకి ట్రాన్సిలేటయ్యింది.  ఇంటర్నెషనల్ లెవెల్ కు కూడా పోయింది. అలెక్స్ అనే అతను ఈ కథ మీద ఎంఫిల్ చేయడానికి అమెరికా నుంచి వచ్చాడు నా దగ్గరికి.
Qనవలల గురించి-
జగిత్యాల జైత్యయాత్ర 79 లో జరిగిన తర్వాత మొత్తం గ్రామాలలో ఉండే భూమి సమస్య, రైతు కూలీ పోరాటాల సంఘటనలకు ప్రతి స్పందనగా “కొలిమి అంటుకున్నది” నవల రాసేను. ఆ తర్వాత ఊరు, అగ్ని కణం నవలలు. “అగ్నికణం”భూస్వామ్య ప్రాంతంలో మహిళలకు సంబంధించిన మానవీయ జీవితాలకు సంబంధించిన నవల.
ఇక గ్రామాలలో నిర్బంధం వచ్చాక అడవి పరిశీలన మొదలైంది. ఇక అప్పటి నుంచీ ఆదివాసీ కథల్ని రాయడం మొదలుపెట్టాను. చాలా మంది రాసేరు. అందులో భాగంగా నేను, సాహు కలిసి రాసిన పరిశోధనాత్మక నవల “కొమరం భీం”. నా చివరి నవల “వసంత గీతం”. అదంతా సాయుధ దళాల చిత్రీకరణ.

Q
విరసంతో మీ అనుబంధం గురించి చెప్పండి.

రైతు కూలీ సంఘాల ఏర్పాటు, విరసం లో సభ్యత్వం ఇదంతా ఒక ప్రయాణం. ఆ ప్రయాణం లో భాగంగా నేను తెలంగాణా, రాయల సీమ, కోస్తా ఆంధ్ర  జిల్లాలన్నిటి తో పాటు, ఇతర రాష్ట్రాలలో   కూడా తిరుగుతూ ఉండేవాణ్ణి. విరసంలో నేను ఎప్పుడూ సభ్యుడిగానే ఉన్నాను. నేను ప్రధానంగా రచయితను. సమాజంలోని మార్పులని రికార్డు చేసేవాణ్ణి. అందుకే  నేనెప్పుడూ నాయకత్వ సమస్యలకు పోలేదు. ఆ జిల్లాలకు సంబంధించిన అనేక కథలు అంటే రైతుకూలీ సంఘాలు, ఉద్యమాలు-మారేదశలు, సంఘాల్లో వచ్చే సమస్యలు వీటికి సంబంధించిన కథలు రాసేను.

Q
ఎవరికోసమైతే మీరు రచనలు చేసే వారో వాళ్లకు మీ రచనలు చేరేవంటారా?

నా మొదటి రోజుల్లో నేను ఓరల్ ట్రెడిషన్ లో రాసేవాణ్ని గనుక అనేక గ్రామాల్లో అవి చదువుకునే వాళ్లు.
ఎమర్జన్సీ తర్వాత నా మొదటి కథ అచ్చయ్యింది. నేను మా ఊరికి పోతూంటే ఒక చోట ఒక అరవై మంది నిలబడి ఒకతను కథ  చదువుతుంటే వింటున్నారు. అది తీరా చూస్తే నా కథ. అందులో ఉన్న వ్యతిరేకులు నన్ను కొట్టటానికి కూడా సిద్ధమయ్యారు. అలా నా కథ నా మీదనే ఎదురు తిరిగింది కూడా.

కార్యకర్తలకు చెప్పుకోవడానికి వీలైన కథలు కొన్ని రాసాను. అవి ముఖ్యంగా చైనా మొ.న దేశాల్లో ఉద్యమాల పాత్రను తెలియజేసేవి. మేధావి-మూర్ఖుడు-బానిస మొ.న చైనా కథలు  ఇలాంటివి. రైతుకూలీ మహాసభలు జరిగినప్పుడు అప్పటి వరకు జరిగిన అన్ని సంఘటనలూ అర్థంకావడానికి 3 గంటల వ్యవ్యధిలో ప్రదర్శించే పెద్ద నాటకాన్ని రాసేను.
Qసమాజంలో పీడన ఏదైనా మారిందంటారా ఇప్పటికి?
కింది సెక్షన్లలో కొంచెం తిండి దొరుకుతూంది ఇప్పుడు. పీడన రూపం మారినా భయంకరమైన దోపిడీ,హింసా  తగ్గిపోయాయి. ప్రపంచ వ్యాప్తంగా వచ్చిన ఉద్యమాలు, ఎకనామిక్ గ్రోత్, మార్కెట్ వ్యవస్థ లో పెరిగిన స్కిల్డ్ వర్కర్ అవకాశాలు  ఇవన్నీ కారణాలు. ఇక దోపిడీ అన్ని రంగాలకు విస్తరించింది.
Qఆదివాసీ సమాజాలలో ఏదైనా మార్పు వచ్చిందా?

వనరులకు తప్ప ఆ సమాజం దగ్గర మార్కెట్ ఎకానమీకి పనికొచ్చే స్కిల్ లేదు. కనుక వాళ్లను నిజంగా అభివృద్ధి చెయ్యడానికి సంబంధించి మనస్ఫూర్తిగా ఏ సమాజమూ సిద్ధంగా లేదు. ఇప్పుడూ వనరుల దోపిడీ కొనసాగుతూనే ఉంది.  అక్రమ గనులు తవ్వకాల వల్ల నిర్వాసితులయిపోయిన జీవితాలెన్నో. ఆదివాసీ సమాజాలు సామ్రాజ్యవాద వ్యతిరేకంగా సమీకరించబడుతూ ఉన్నాయి. ప్రజలు తిరుగుబాటు చేస్తున్నారు.

Qతెలంగాణా రచయితగా మీకు ఎప్పుడైనా ఐడెండిటీ క్రైసిస్  ఏదైనా వచ్చిందా?
లేదు. నాకెప్పుడూ రాలేదు.  ముందుకుపోతున్న జీవితంలో ముందుకు తీసుకెళ్తున్న అనేక మందితో  కలిసి నడవడం పట్ల ఉన్నదృష్టి నా రచనలపట్ల ఎప్పుడూ లేదు నాకు.
ఆచరణ ముఖ్యమైనది.   అదీగాక ఎవరు మంచి కథ రాసినా అది నాదే అన్న భావనకు లోనవుతాను. నాకు తెలిసినంతవరకు సాహిత్యం వ్యక్తిగతమయింది కాదు. అది నా స్వంత ఆస్తి కాదు. అందుకే నాకు సంక్షోభం లేదు.
Q2000 తర్వాత మీరు రచనలు చెయ్యకపోవడానికి కారణం ?
నా వరకు నేను భూస్వామ్య, పెట్టుబడిదారీ, ఉద్యమ సమాజాల్ని చిత్రించాను. 2000 నుండీ ఇప్పటివరకూ జరుగుతున్న ఈ పెను మార్పుల్ని చిత్రించలేదు.
అంతా ఇంకా పరిశీలన చేస్తూ ఉన్నాను. ప్రపంచ విప్లవాల్లో వచ్చిన ఒంటరితనం గురించి రాయాలని అనుకుంటున్నాను.  ఏదో ఒక ప్రక్రియ రోజూ రాస్తాను. కానీ ఫిక్షన్ రాయలేదు.  చాలా మంది రచయితలు రాసిన వాటీకి చేదోడు, వాదోడుగా ఉండడం, చదవడమూ చేస్తున్నాను ఇప్పటికీ.  అవసరమైతే క్లాసులు, చర్చావేదికలు పెట్టడం  మొత్తంగానైతే సాహిత్యం తోనే తిరుగుతున్నా.వీరోచితమైన, విషాద భరిత ఉప్పెన లాంటి  జీవితంలో నడిచొచ్చిన వాణ్ణి. నాకు తప్పకుండా రాయాలనిపిస్తే రాస్తాను ఎప్పుడైనా. రాయాల్సిన అవసరం పడాలి అంతే.

ఇంటర్వ్యూ: కె.గీత

రాజయ్య గారి ఫోటో: అల్లం చందన

 

అంతా భీకర యుద్ధాల సారాంశమే కదా..!

rajayya-150x150

నాన్నా వంశీ,

బాగున్నావా? నేను అమెరికా వచ్చి అప్పుడే నెల కావస్తోంది. సమస్త దైనందిన వ్యవహారిక ముసుగులన్ని వొదిలిపెట్టి జీరో దగ్గర మొదలుపెట్టినట్టుగా ఉంది. అప్పుడెప్పుడో అల్లకల్లోలంగా తిరుగుతున్నప్పుడూ రష్యా కుప్ప కూలిందని,  చైనా దిక్కు మారిందని, అదేదో మన స్వంత వ్యవహారమన్నంత దిగులుగా తిరుగుతున్నప్పుడు, ఇంద్రగంటి కిరణ్మయి సీపెల్‌లో ఒక బెంగాలీ సినిమా చూయించారు. అది రికరింగు  ఫ్రమ్ జీరో.. నక్సల్బరీ ఉద్యమంలొ జాదవపూర్ యూనివర్సిటీ విద్యార్థి ఉద్రిక్త, ఉద్విగ్న రాజకీయాలలో తిరుగుతూ అరెస్టయి.. పదేండ్ల తరువాత విడుదలై, కలకత్తాలో, తనకు రాజకీయాలు నేర్పిన ఉపాధ్యాయుడి ఇంట్లో మళ్లీ జీవించడం ఆరంభించడం, మళ్లీ పనిలోకి, ప్రజల్లోకి, సూర్యరశ్మిలోకి వెళ్లడం ఆ సినిమా…

నాకు ఈలాంటి విచిత్ర భారీ జీవితంలో అంతఃచేతనంలో ఉన్న అనేక విషయాలు పోటెత్తుతున్నాయి. గుడిమెట్టు కింది చిన్న పల్లెటూరు, గుట్ట మీది నుండి పారుతూ వచ్చిన బూరుగు వాగు – గుడిసెలు – పశువులు, పక్షులు , పంటలు… ప్రతి చిన్న విషయము పోటెత్తుతున్నాయి. మొన్న మే 19నాడు ఇక్కడ సముద్ర తీర ప్రాంత సాహిత్యాభిమానులు ‘వీక్షణం’ అనే సమావేశానికి గొల్లపూడి మారుతీరావుగారితో పాటు నన్ను పిలిచారు.

ఎన్నో రకాల అద్భుత అతీంద్ర శక్తులు, చదువులు, సాంకేతిక పరిజ్ఞానం ఉన్నవాళ్లు వీళ్లు. సముద్రాలు దాటి, దేశాలు దాటి, నిత్యము నిరంతరం అప్రమత్తతతో వేగవంతమైన జీవితం జీవిస్తున్నవాళ్లు వీళ్లు. వీళ్ల మధ్యలో ఎక్కడో మారుమూల  పల్లెటూల్లో పుట్టిన నేను, బెరుకుగా వెళ్లాను. నా నలభై యేళ్ల దండ్లాట, వెతుకులాట, మనుషులకోసం పరితపించడం, అమానవీయ ప్రపంచంలో తలపడటం గురించి అస్తుబిస్తుగా మాట్లాడాను. వాళ్లకేమర్ధమయ్యిందో తెలియదు. నిత్యమూ  నిరతరం అస్థిర అస్తవ్యస్త సంక్షోభం. జీవితం గడిపే రైతాంగం, ప్రపంచీకరణ మాయలో,  ఉప్పెనలో కొట్టుకపోతున్న, పట్టుకోల్పోతున్న కోరు పారిశ్రామిక కార్మికులు. ప్రకృతివనరులు, నీరు , నేల, ఖనిజాలు తవ్వుకపోతూ, నిలువ నీడలేక అనివార్యంగా యుద్ధరంగంలో నిలబడ్డ మన దేశ ఆదివాసులు, వీళ్లందరి గురించి ప్రపంచానికి ఆ లోలోపల తడిని చెప్పడానికి ఆ తడిని, ఆర్తిని, వీరోచిత తిరుగుబాటును చెప్పడానికి నాకు భాష సరిపోలేదు. అయినా ఇంత పకడ్బందీగా ప్రోగ్రాం చేయబడిన దేశంలో కూడా మనుషులకు లోలోపల దారితెన్నూ కానని తడి ఉన్నది. ఈ మహేంద్ర జాలంలో కూడ వీళ్లందరు నిత్యము, నిరంతరం మనిషి కోసం వెతుకుతున్నట్టుగా అనిపించింది.

గొల్లపూడి మారుతీరావుగారు – జీవితంలోని వెలుగునీడల మర్మమెరిగినవారు.వారు గత కొంత కాలంగా హెచ్ ఎమ్. టీవీ వాళ్ల కోసం వందేళ్ళ తెలుగు కథ చేస్తున్నారు. తెలుగు కథ పరిణామం గురించి బాగా మాట్లాడారు. తెలుగు నాటకం గురించి … ఒక జాతి ఆత్మను, గుండెకాయను కాపాడుకోవాల్సిన ప్రజల ప్రభుత్వాల బాధ్యత గురించి ప్రశ్నించారు.   ప్రపంచ సాహిత్యంలోని మనిషి కోసం వెతికే కథల గురించి అద్భుతమైన కంఠస్వరంలో విన్పించారు. చెహోవ్ నిద్ర లేని పిల్ల కథ. తను సాకుతున్న పిల్లవాడి గొంతు నొక్కడం. మనసు వికలమయ్యింది. ఈ కథ 1980లో ఒక సమావేశంలో రావిశాస్త్రిగారు చెప్పారు. అప్పటినుండి ఆ కథ నన్ను వెంటాడుతూనే ఉన్నది. కవితలు, ముచ్చెట్లు, అక్కడికి వచ్చినవాళ్లంతా తమలోలోపలికి.. సమావేశకర్త కె.గీతగారు మా మిత్రురాలు ప్రముఖ రచయిత్రి కె.వరలక్ష్మిగారి కూతురు. కథకురాలు. కవయిత్రి.. ఒక చిన్న సూర్యకిరణాన్ని తన చేతులతో ఇక్కడ విత్తుతున్నారు.

ఎక్కడినుండో మరెక్కడికో వచ్చాను. చాలామంది గురించి రాయాలి. చురుకైన నిజామాబాదు అబ్బాయి గురించి. సి.నారాయణరెడ్డిగారి బంధువు అబ్బాయి. తను ఏదో చేయాలనే తపనతో బుచ్చిబాబన్నట్లు మండుతున్న కాగడాల్లాగే తిరిగే ఈ మనుషుల గురించి శక్తి చాలదు. తెలిసింది కొద్దిగా.. ముఖ్యంగా కుమారపల్లి హన్మకొండ సోమయ్యగారి గురించి..

ఒక ఆదివారం స్ఫూర్తి, చందూ, శ్రీధర్ కలిసి శాన్‌ఫ్రాన్సిస్కో వెళ్ళాం. ఏడో  వింతలో ఒకటైన గోల్డెన్ బ్రిడ్జ్ అదివరకే చూశాను. ఈ భయంకర బంగారు నగరం గురించి లోలోపల అధో జగత్ సహోదరులు  పడే యాతన  గురించి, నేను ఒక చైనా నవల చదివాను. శుభ్రమైన, ఎత్తైన, మహాద్భుతమైన, దృఢమైన మహా సాధనాలు చూస్తుంటే.. నాలోలోపల తగలబడిపోయిన బాగ్దాదు నగరం, ఆరని కుంపటి ఆఫ్ఘనిస్తాన్, నిత్యము, నిరంతరం యుద్ధరంగంగా అతలాకుతల మవుతున్న ప్రపంచం. బస్తర్ దండకారణ్యం మానవులు తమ శ్రమతో నిర్మించుకున్న సమస్త నాగరికత తుడిచి పెట్టుకుపోయి, వ్యాపార విధ్వంసం. లోలోపల కదిలింది. వీధుల్లో ఆ దేశాల  నమూనాల్లాగా అనాధలు, ఇల్లు  లేని విధం కడుపులో దేవినట్లయింది…

110621-Civil_War_art-AP248502718257_620x350

ఆసియా మ్యూజియంకు వెళ్లాం. అబ్బో… చైనా, వియత్నాం, కొరియా, బంగ్లాదేశ్, పాకిస్తాన్, ఇండియాలాంటి దేశాల  అపురూపమైన, విలువైన రాతి, లోహ యుగ నమూనాల నుండి ఇప్పటి పెయింటింగ్స్ దాకా.. ఒక అపురూపమైన యుద్ధ,బీభత్స, మహా పరిణామ క్రమం కళ్లముందు మెదిలింది. ఎక్కువగా చైనీయులు కన్పించారు. భౌద్ధానికి సంబంధించి వివిధ కాలాలకు సంబంధించిన దేవతలు, పురాతన శిల్పాలు, వస్త్రాలు, కర్ర శిల్పాలు వందలు, వేలున్నాయి. అప్పటినుండి ఇప్పటిదాకా మానవుని అన్వేషణ, వెతుకులాట.. చరిత్ర సమస్తం భీకర యుద్ధాల సారాంశమే కదా.. అయితే చైనా విప్లవానికి సంబంధించినవేవీ లేకపోవడం ఈ మ్యూజియం విశేషం. అరువై యేళ్లకు నేనిక్కడ తిరుగుతున్నా స్ఫూర్తి తను పుట్టిన దగ్గరినుండే తిరుగుతోంది. తిరిగి తిరిగి ఇల్లు చేరుకున్నాము.

నేనిప్పుడున్నది కాలిఫోర్నియాలోని  సన్నివేలు. ఇక్కడ గూగుల్, యాహూ లాంటి అనేక సాఫ్టువేరు కంపెనీలున్నాయి … తమిళ, తెలుగు, గుజరాతీ, పంజాబీ వాళ్లు ఎక్కువగా కన్పిస్తున్నారు. ఇందులో కూడా తెలంగాణా వాళ్లు తక్కువే. మొత్తంగా ఇంత దూరం ఇన్ని రకాల సాహసాలు చేసి రాగలగడం కింది కులాలకు సాధ్యం కాదు.

మెదడు, చేతులు ఖాళీ.. గోనెడు జొన్నలు చాలని చేను దగ్గర మూడు నెలలు రికామిగా కావలి కాసే ఆదివాసి గోండు దాదా లాగా ఉన్నది మానసిక స్థితి.

ఉరుకులు పరుగులు.. పోటీ.. ఒత్తిడి కత్తి అంచుమీద అతి చాకచక్యంగా, నైపుణ్యంగా బతికే ప్రపంచంలోని అత్యంత ఆధునికమైన, అధికారికమైన,.. అందులో బే ఏరియాలో… సుడిగాలిలా ప్రపంచవ్యాపితంగా వ్యాపించి అల్లకల్లోలం చేస్తున్న గ్లోబలైజేషన్ మార్కెటు ఉన్మత్త అంతరంగంలో ఇదిగో ఇట్లా నేను ఖాళీగా.. భిన్నంగా…

ఇలాంటి స్థితిలో ఉన్నప్పుడల్లా.. నేను  1993 వేసవికాలంలో అహోబిలం కొండమీద చూసిన మొలకు చిన్న తుండు గుడ్డ, చేతిలో చిన్న కట్టె.. ప్రపంచ ప్రసిద్ధి గాంచిన అదిలాబాదు కొలిమిలో తయారుచేసిన ఉక్కు చాకులాంటి శరీరం. నేరేడు రంగు, విచిత్రమైన, లొంగని కళ్ళు కల ఆ పిల్లవాడు గుర్తొస్తాడు. అతను మాకు కొండ మీదికి దారి చూపిన గైడు. అతనికి యిస్తామన్న అయిదు రూపాయలు. మార్గమధ్యంలో అతను మెరుపు వేగంతో పట్టుకున్న ఉడుము.. నేనతనికి పదిరూపాయలిస్తే తీసుకోలేదు. అయిదే కావాలన్నాడు. అతను దేనికీ లొంగకుండా.. బహుశా నా విషాద, వైఫల్యాలలో నాకిప్పటికీ అతను గైడే.

బహుశా  ఈ భూగోళాన్ని ఫుట్‌బాల్‌లా ఆడగల ధీరుడతను.. ఏ ప్రోగ్రాములకు అందనంత ఎత్తైనవాడు. ఏ వస్తువుకు, ఆస్తికి లొంగనంత ధీరోదాత్తుడతను. ఈ ప్రపంచం మన కలల ప్రపంచం. సకల విధ్వంసాల నుండి కాపాడుదాం..

మేం భూస్వామిక ఊపిరి సలుపని ప్రపంచం నుండి వచ్చిన వాళ్లం. ఆ అమానవీయ పరిస్థితులలో తలపడి పెనుగులాడి  మార్చడానికి తాపత్రయపడ్డవాళ్లం. ఈ క్రమంలో మన ప్రాంతంలో నా సహచరులు ఈ మాట రాస్తున్నప్పుడు నా కళ్లు నీళ్లతో నిండిపోయి అక్షరాలు అలుక్కుపోతున్నాయి. సహచరులు, కొడుకులు, కూతుళ్లు ఆహుతయ్యారు. అయినా కొత్త ప్రపంచాన్ని నిర్మించడానికి కలలు కంటున్నారు. మళ్లీ ఇరువై సంవత్సరాల తరువాత ప్రపంచీకరణ  నేపధ్యంలో ప్రగాఢమైన విషాదకరమైన అయినా వీరోచితమైన మా సామూహిక అనుభవాన్ని నాన్నా వంశీ!  నీతో పంచుకుంటున్నాను . అంటే ఈ లేఖ నీవొక్కనికే కాదు. రాసేది నీ పెదనాన్న మాత్రమే కాదు. తండ్రులు కొడుకులతో మాట్లాడే మాట యిది.

బహుశా కరెంటు వైర్ల మధ్య, తుమ్మ ముళ్ల మధ్య రాత్రి పగలు వొంటరిగా నిరంతరం శ్రమ పడుతూ కూడా కూనిరాగం తీస్తూ, అద్భుతమైన పాటలు, కథలు రాసిన మీ నాన్న, పెట్టుబడి  యంత్రాంగం, వేగవంతమైన జీవితంలో మన వూళ్ల గురించి పలవరించే ముళ్ళ దారిలో కాక..

నా కాలం పోయింది . మీ కాలంతో మీతో పంచుకోవడం..

ఇట్లు ..

పెదనాన్న..

ఆదివాసీ సంస్కారం మనిషిగా నన్ను నిలబెడుతోంది!

rajayya-150x150

నాన్నా వంశీ,

ఎట్లా ఉన్నావు? పట్నంలో చిక్కుకపోయి ఒంటరి అయ్యావా??

ఘడియఘడియకు మాటమార్చే మాయల మరాఠి, గజకర్ణగోకర్ణ టక్కుటమారా విద్యలవాళ్ళు- సృష్టికర్తల మూలుగులు పీల్చినవాళ్ళు- పట్నాలు చేరుతారంటాడు ఒక రచయిత.. జీవించదలుచుకున్నవాళ్ళు-పోరాడ దల్చినవాళ్ళు అడువులు చేరుతారట-నిత్య అనే రచయిత రాసిన లక్షణరేఖ కథలో సారాంశం…

గోర్కీ “స్వర్ణపిశాచి” నగరం అన్నాడు. అలాంటి నగరంలో నివాసం యాతనే.. ఏదో కోల్పోయినట్టు…
దండకారణ్య రచయితల కథల పుస్తకానికి ముందుమాట ఈరోజే పూర్తి చేసాను.. వివిధ పత్రికల్లో ఇదివరకు అచ్చైన కథలే..

ఈ రోజు ఏప్రిల్ 20.

ఆకాశంలో మబ్బులు అస్తుబిస్తుగా పరుగెత్తుతునాయి.. చత్తీస్ ఘర్ దండకారణ్యం మీదుగా తెలంగాణ దాకా అల్పపీడన ద్రోణి ఏర్పడి ఉక్కగా, ఉద్రిక్తంగా ఉంది..గల్లామీగా ఉంది.. పరాకుగా ఉంది.. నాయవ్వనారంభ ఉద్విగ్న విప్లవ సాహిత్యరోజులు పోటెత్తుతున్నాయి.. నేను మాత్రమే మిగిలి- నా నులువెచ్చని మహత్తర నైతిక వర్తనగల త్యాగమూర్తులైన సహచరులెందరో-అసహజ మరణాలపాలై వెళ్ళిపోయారు.. ఆ అడుగుజాడలు-వాళ్ళు నిర్మించిన త్యాగ నిరతి నా మదిలో మెదిలి తడితడిగా ముద్ద ముద్దగా రోజంతా తిరిగాను.. ఎంత చెప్పినా ఈ సుధీర్ఘ గాయాల చరిత్ర ఒడువదు.

ముప్పైరెండు సంవత్సరాల క్రితం ఇదే రోజు- ఆదిలాబాదు జిల్లా ఇంద్రవెల్లిలో-తాము తరతరాలుగా సాగుచేసుకుంటున్న అటవీ భూములకు పట్టాలు కావాలని-ఆదివాసుల మీద అటవీ, రెవీన్యూ, పోలీసు అధికారుల వేధింపులు పోవాలనీ- తమ పంటలకు గిట్టుబాటు ధరలు కావాలని- ఆదివాసేతరుల దోపుకం పోవాలనీ.. రైతుకూలి సభలు పెట్టుకోవాలనుకున్నారు. అప్పుడు  ఈ ప్రాంతంలోని యువకులందరం ఇలాంటి కార్యకలాపాల్లోనే ఉన్నాం… మేమంతా 1969 తెలంగాణ ఉద్యం మోసగింపబడి వీధుల్లోకి వచ్చినవాళ్లం-అప్పటికే కరీంనగర్ జిల్లాలో “జగిత్యాల జైత్రయాత్ర” నలభైవేలమంది రైతులతో జరిపిన వాళ్లం..

మేమంతా పేదప్రజల తరపున ఉన్నాం… నా మిత్రుల్లో అప్పటికి నా ఒక్కడికే చిన్నవయసులో పెళ్ళి జరుగుడు మూలంగా పిల్లలూ, ఉద్యోగం ఉన్నాయి… మిగతా వాళ్ళెవరూ ఈ ఝంఝాటంలోకి దిగలేదు.. అయితే ఉద్యోగరీత్యా ఆదిలాబాదుకు వచ్చిన నాకు రెండు గదుల ఇల్లు పికపికలాడేది. ఇంటినుండి బియ్యం తెస్తే, నా జీతం కూరగాయలకు సరిపోయేది కాదు..

వందలాదిమందిమి ఒకే కుటుంబంగా ఒకే మాటగ- వార౦ రోజులనుండీ ఇంద్రవెల్లి తయారి. వచ్చేవాళ్లను, అథితులను రిసీవ్ చేసుకుని ఇంద్రవెల్లికి పంపడం నా విధి. వరంగల్ నుండి వచ్చిన ఉస్మానియా విద్యార్థి నాయకుడు లింగమూర్తి, గద్దర్ తదితరులు… గద్దర్ వచ్చి రెండు రోజులముందే వెళ్ళిపోయాడు- గూడాలల్లో ఆటపాటలు చేసేందుకు.. లింగమూర్తీ తదితరులను ఉదయమే పంపాను.. అందరినీపంపి చివరివాడిగా నేను సాయింత్రం నాలుగు గంటలకు బయలుదేరాను. అప్పటికే కాల్పులు జరిగిపోయినట్టుగా గాలికంటే వేగంగా వార్తవచ్చింది.. నేను మళ్ళీ ఆగిపోయాను. కకావికలైన స్థితిలో- మళ్ళీ నా అవసరం కలగదేమోనని? అది ఒక మానని గాయం.. ప్రత్యక్ష సాక్షులు నా మిత్రులు చెప్పిన సమాచారం బట్టి, నేను వందలసార్లు అక్కడ తచ్చాడడం బట్టి నాకర్తమయ్యింది అక్కడ జరిగింది.. మీటింగు పర్మిషన్ చివరి నిమిషంలో ఇవ్వలేదు… 144 సెక్షన్ ఆదివాసులకు తెలియదు.

అడవుల్లోనుండి వందలాదిగా వేలాదిగా తరలి వచ్చిన ఆదివాసులకు ఇప్పటికీ వాళ్లకు మీటింగు ఎందుకు పెట్టుకోకూడదో తెలియదు.

స్వాతంత్ర్యం వచ్చి ఇన్నేండ్లయినా పాలకుల భాష ప్రజలకూ-ప్రజల గోడు పాలకులకు పట్టదు.. “అందరు జమగూడి మీటింగులు పెట్టుకోంగా లేనిది తామెందుకు మీటింగు పెట్టుకోకూడదు” అనే ప్రశ్నకు ఇప్పటికీ జవాబులేదు.. అడవి దారులనుండీ, రేగడి చేండ్లనుండీ- కోసిన జొన్నచేండ్లనుండీ వచ్చే ఆదివాసులను పోలీసులు ఆపలేకపోయారు..

వాళ్ళడిగిన ప్రశ్నకు జవాబుగా లాఠీచార్జి చేశారు.. ఒక ఆదివాసీ యువతి మీద పోలీసు దెబ్బ.. తోపులాట.. దెబ్బకు దెబ్బ పోలీసుల మీద పడ్డది.. కాల్పులు షురూ అయ్యాయి.. ఇంద్రవెల్లి రక్తసిక్తమైంది.. ప్రభుత్వం చనిపోయినవాళ్లు పదమూడంది.. 60 పైన్నే చనిపోయారు.. వందలాదిమంది గాయపడ్డారు.. ఇంద్రవెల్లి మరో జలియన్ వాలా బాగ్ అయ్యింది.. అప్పటినుండీ ఆదివాసులు ఘనత వహించిన సర్కారుకు బద్దశత్రువులయ్యారు.. మానసికంగా నేను గాయపడ్డాను.. ఈ అన్యాయం, హత్యాకాండా నాకు నిద్రలేకుండా చేసిందీ..

లోపలెక్కడో కల్లోలం సుడులు తిరిగింది. అప్పటినుండి గూడాలు, ఆదివాసుల సుట్టూ తిరుగుతూనే ఉన్నాను.

1983 ఇదే రోజు నా మిత్రుడు సాహూ, నేను కలిసి రాసిన “కొమురం భీం” నవల వచ్చింది.. మాలాగే పోరాడి చనిపోయిన కొమురం భీం ను నైజాం పోలీసులు జోడేఘాట్ లో సెప్టెంబరు 9, 1940 లో కాల్చేశారు. 1983 ఆ సభలో గోండు తల్లి దాదాపు గంటసేపు మాట్లాడింది.. ఇందిరా గాంధీ కన్నా గొప్పగా..లాజిక్ గా, తాత్వికంగా..

అప్పటినుండి గత ముప్పై రెండేళ్ళుగా ఇంద్రవెల్లి సలుపుతూనే ఉన్నది..

విచిత్రంగా ఈ దిక్కుమాలిన వ్యక్తి కేంద్రంగా నడిచే ప్రపంచంలో-అప్పటినుండి నాలో భాగమైన కొమురం భీం ఆదివాసీ సంస్కారం మనిషిగా నన్ను నిలబెడుతోంది. వాళ్లు శారీరకంగా, మనసికంగా అందమైన వాళ్లు.. మట్టిని, చెట్ల పసురును, సూర్య రశ్మిని కలిపి చేసినట్టుంటారు.. విచిత్రంగా రష్యాలో కార్మికులు, చైనాలో రైతాంగం, విముక్తి సాధించారు. బహుశా ఆదివాసీలు భారతదేశంలో ఆ దిశలో పోరాడుతున్నారు.. లక్షల కోట్ల విలువైన ప్రకృతి సంపదలైన ఖనిజాలు వాళ్ళు.. వాళ్ళను కొల్లగొట్టడానికి.. అల్పపీడన ద్రోణి దండకారణ్యమ్మీద కేంద్రీకరింపబడి ఉంది.. ఉరుములు.. మెరుపులు.. వడగళ్ళ వాన…

-పెదనాన్న..

ఇవ్వాల మానవ ప్రతిస్పందన ప్రతీది సరుకు… అమ్మకపు సరుకు…!

rajayya

22.03.2013

డియర్ వంశీ,

పట్నంల ఎట్లున్నవ్? చదువుల పరుగుపందెంలో లెవ్వుగనక ఎట్లున్నా బాగుంటవ్ లే.. ప్రపంచీకరణ తర్వాత గత్తర బిత్తర చదువు.. పరుగో పరుగు.. ఆ మధ్య యునెస్కో ప్రచురించిన (1996) ప్రపంచీకరణకు అవసరమున్న విద్యకు సంబంధించి ఒక ప్రణాళిక పత్రంలాంటిదది. మొన్న ఎందుకో చదివిన, అందులో ముఖ్య విషయం “నైపుణ్యం నుండి యోగ్యత” వరకు.  ఈ యోగ్యత ఎవరు నిర్ణయిస్తారు? ఇందులో అంతర్లీనంగా ఉండే “పోటీ” మొత్తం ప్రపంచాన్ని అతలాకుతలం చేసింది.. పాఠశాలలూ, కాలేజీలూ, యూనివర్సిటీలూ ఒక కాన్సంట్రేషన్ క్యాంపులయ్యాయీ..  విచ్చలవిడి హింసా, ఆత్మహత్యలు పెరిగాయి.. ఇక్కడ అన్ని రకాలుగా హింసించబడి, నిలదొక్కుకొని.. ఒక నైపుణ్యంగల కూలీ-సరుకులు ఉత్పత్తిచేసే…

సరేలే… ఈ గోలనుండి బయటపడి.. ఫార్మసీలో పోస్ట్ గ్రాడ్యుయేషన్ దాకా చదివి- నువ్వు మనుషులను చదువుకోడానికి కొద్ది కాలమైనా ఎంచుకోవడం సాహసమే… ఈ దారి అందరూ నడిచే దారి కాదు.. మా కాలంలో ఐతే విద్యార్థులు ఉద్యమాల్లోకి వెళ్ళారు….. ఇదంతా రాయాలనుకోలేదు.. ఒక తుఫాను గాలిలో హోరెత్తే ఫోనుల దడదడలోంచి ఎప్పుడో వదిలిపెట్టిన “ఉత్తరం” రాద్దామనుకుంటూనే- తిరుగుతున్నా…

నీకిష్టమైన “గాన్ విత్ ద విండ్”  తెలుగు చేసిన ఎం.వీ రమణారెడ్డి గారికి ఉత్తరం రాయడంతో ఉత్తరాలు రాయడం మొదలుపెట్టాలనుకున్న. ఆయన ప్రేమతో (ఆ మధ్య కలిసినప్పుడు) చాలా పుస్తకాలు ఇచ్చారు. పైగా 1978 నుండి వారినెరుగుదును. ఒకసారి మన జీవితంలోకి వచ్చిన వ్యక్తి పరిణామక్రమాలన్నీ మనకు ఎట్లనో గట్ల చేరుతుంటాయి. ఉద్విగ్న రాయలసీమలో ఒరుసుకుని- వొత్తుకుని కొనసాగే- కార్మిక నాయకుడిగా- ముఠా తగాదాల అతలాకుతలంలో గాన్ విత్ ద విండ్ లోని రెడ్ బట్లర్ ను, స్కార్లెట్ లను మనకందించడం ఏ చిక్కురు బొక్కురు దారుల గుండా నడుస్తారు  లోపలి మనుషులు..!! ఓహ్..!! ఇదంతా కూడా కాదు నేన్ రాయాలనుకున్నది… ఉత్తరం అఫ్సర్ గుర్తుచేసేదాకా తెలియనే తెలియదు.. కూడ దీసుకుని మాట్లాడేసరికి సర్రున దిగే కత్తిలాంటి ఫోనులో ఆ మధ్య ఫోన్ చేసిన కల్పన గారేమనుకున్నారో? కల్పనగారు అఫ్సర్ సహచరి. వాళ్ళిద్దరిప్పుడు అమెరికాలో ఉన్నారు.

మనిషి కంఠస్వరం.. ఎంతగొప్పదీ.. మన గతవర్తమాన, భవిష్యత్తు నిండిన కల్పనల కలబోతకదా!! సమస్థ శరీర ధ్వని ప్రతిధ్వని కాదా కంఠస్వరం!! మౌన స్వరాల మార్పరి కాదా కంఠస్వరం.. ప్రపంచీకరణలో మహాద్భుత మానవ సమూహాల వ్యక్తీకరణను గుండె గొంతుకులోన కొట్లాడే భాషను.. కంఠస్వరాన్ని “సరుకు” చేశారుకదా!

“దప్పిక” ఎంత గొప్ప అనుభవం.. అలాంటి అనుభవాన్ని శీతలపానీయాలుగా ఎన్ని లక్షల కోట్ల సరుకు చేశారు! ఇవ్వాల మానవ ప్రతిస్పందన ప్రతీది సరుకు.. అమ్మకపు సరుకు..

అట్లాగే ఫోన్ కూడానేమో! నాకెందుకో ఫోన్ ఒక యాంత్రిక భూతంలాగా కనిపిస్తుంది. గోడదూకే సాంప్రదాయంలోకి వెళ్తున్నానా??  ఆధునికంగా ఆలోచించడమంటావా?? అప్పుడప్పుడూ ఇంతగొప్ప మానవ సాంకేతిక ఆవిష్కరణలో మనుషులకు నిజంగా ఉపయోగపడేవెన్ని?? …బహుషా నీకు రాయాలనుకున్నది ఇదికూడా కాదు..

ఈ మధ్య రిటైర్ అయిన తర్వాత తెలిసింది నేను చాలా కాలం ఉద్యోగిగా, ఖైదిగా ఉన్నానన్న సంగతి..

బయటికి వచ్చి చూస్తే… అబ్బో… రెండో ప్రపంచ యుద్ధం మీద తీసిన రష్యన్ సినిమాల్లోని యుద్ధ రంగంలోకి వెళ్ళే సైనికులకు వీడుకోలు పలికే రైల్వే స్టేషన్లలో లాగా చదువులకూ, కుటుంబాలకూ, ఉద్యోగాలకూ ఆవలగల మానవ ప్రపంచాన్ని చూస్తున్నాను.. కానీ నాకు అర్థమైతేనా? విచిత్రంగా ఒకపక్క “నియమిత”పరిధిలోకి మనుషులు ఇమడకుండా బయట జనాలు ఎక్కువ సంఖ్యలో ఉన్నారూ.. కనిపిస్తున్నారూ.. వీళ్ళంతా బయట వొదగకుండా ఉన్నవాళ్ళు..

ఒక మంచిర్యాల చుట్టుపక్కల అనియత రంగంలో లక్షమంది పనిచేస్తున్నారు.. 60% రైతులు అట్లాగే ఉన్నారు. పల్లెలు అల్లల్లాడుతున్నాయి… అంటే రూల్సూ, రెగ్యులేషన్స్ వగైరా వగైరా లేనివాళ్ళు….

సరే ఎప్పుడూ విషాదానికే అలవాటుపడిన నాబోటివాడు కొత్తగా నిర్మాణమౌతున్నదేమిటో? వెతకాలనుకున్నాను..

అస్తుబిస్తు రోడ్ల మీద చిత్ర విచిత్రమైన మనుషులను చూసుకుంటూ దేశదిమ్మరిలా తిరగటం ఎంత బాగుంటుంది? మనుషులు కొంతమంది ఎంత బాగుంటారంటే…

మొన్న పదకొండో తారీఖు నాడు మిర్యాల గూడేం నుంచి బోనగిరికి బస్సులో మిత్రుడు భాసిత్, నేనూ వస్తున్నాం.. బస్సులో ఫుల్లు జనం. వెనకవైపు నుంచి కండక్టర్ “బాపూ.. ఏ ఊరు పోవాల్నే”..  “బోనగిరి బిడ్డా!”… “సరే పిలడా జర పక్కకు జరిగ్గూసో, బాపును పక్కకు కూకుండబెట్టుకో”.. “అమ్మా, ఎన్ని టికిట్లూ??”.. “ఓటి ఫుల్లూ, ఓటి హాఫూ”….   “అట్లనా? మరి చిన్న పిల్లగానికో?”… “అయ్యో ఇంక ఆనికి పండ్లన్న ఊశిపోలేకదా”…. “పండ్లేందీ, ఏడేండ్లదాంక ఊడయి.. టికిట్లు తియ్యకపోతే నాకు కిరికిరి అయితది”…

ఆ భాష.. కంఠస్వరం.. అబ్బో..

కండక్టరును చూసాను..  అంత ఒత్తిడిలో ఎంత ప్రశాంతంగా, ఎంత అందంగా ఉన్నాడూ.. “భలే మంచిగ మాట్లాడ్తానవన్నా” అన్నా.. నా దిక్కు చూసి చిరునవ్వు నవ్వి ముందుకు పోయిండు..

ఒకరినొకరు ద్వేషించుకునే సరుకు అయిపోయిన పోటీ చదువులూ, ఉద్యోగాల మధ్య… రణగొణ ధ్వనుల మధ్య.. ఆ కండక్టరు తనను తాను ఒక మనిషిగా మనుషుల పట్ల అపారమైన ప్రేమస్పదునిగా ఎట్లుంచుకోగలుగుతున్నాడో!

బహుషా మన కాలంలో, మన ప్రాంతంలో మనుషులను నిలబెట్టడానికి, కలిపి ఉంచడానికీ, ప్రేమించడానికీ జరిగిన అనేక ఉద్యమాలు కారణం కావచ్చును.. ఇలాంటి కొత్త మనుషుల కోసం మనందరం ఏం చెయ్యాలి?

ఎక్కడో తేలిన కదా!!

పెదనాన్న