పగిలే మాటలు

prasad atluri
నాలుగు రోడ్ల కూడలిలో
నలుగురు నిలబడేచోటు

చేతికర్ర ఊతమైనాడెవడో

నోరుతెరిచి నాలుగు పైసలడిగితే 

పగిలే ప్రతిమాట ఆకలై అర్ధిస్తుంది !


దర్నాచౌక్ దరిదాపుల్లో

కలక్టరాఫీస్ కాంపౌడుల్లో

ఒకేలాంటోళ్ళు నలుగురొక్కటై

తమలోని ఆవేదనల్ని వ్యక్తపరుస్తుంటే 

పగిలే ప్రతిమాట పోరాటమై నినదిస్తుంది   !


తలోరంగు అద్దుకున్న  

ఓ నాలుగు ఖద్దరు చొక్కాలు

టీవీ చానళ్ళ చర్చావేదికలపై

ప్రాంతాల్నితొడుక్కుని రచ్చచేస్తుంటే

పగిలే ప్రతిమాటా వాదమై విడిపోతుంది!       


నడిచే బస్సులో నల్గురుంటారని

హాస్టల్ రూముల్లో అందరుంటారని

ఆశపడ్డ ఆడపిల్ల వంటరిదై చిక్కినప్పుడు

మృగాలు మూకుమ్మడిగా కమ్ముకుంటే  

పగిలే ప్రతిమాటా ఆక్రందనై కేకలేస్తుంది!  


మాట పగిలిన శబ్దానికి ఉలిక్కిపడతామే కాని
 
పగిలే మాటలు తగులుతాయని తప్పుకుంటామే కాని 
అవసరాన్ని గుర్తించి ఆలంబనగా నిలబడలేమేం?
-ప్రసాద్ అట్లూరి