డయాస్పోరా కథ ఇంకా పసిబిడ్డే!

Gorti

ఉత్తరమెరికా నుండి మొట్ట మొదటి తెలుగు కథ 50ఏళ్ళయిన సందర్భంగా “అమెరికాలో తెలుగు కథ” అన్న అంశంపై ప్రసంగించమని వంగూరి చిట్టెన్ రాజు గారు అడిగారు. ఆ సభలో ప్రసంగమే ఇది.

అమెరికాలో తెలుగు కథ అంటే అమెరికా రచయితలు రాసిన తెలుగు కథా, లేక అమెరికా జీవితం గురించిన తెలుగు కథా అన్న సందేహం వచ్చింది. అమెరికా జీవితం గురించే వారి భావన అయ్యుంటుందని నేను భావించి – ప్రస్తుత అమెరికా జీవిత తెలుగు కథ – దాని బాగోగులూ – భవిత గురించి నా పరిశీలన మీ అందరితో పంచుకుంటాను.

అమెరికాలో తెలుగు కథ పుట్టి ఏభయ్యేళ్ళు దాటినా అమెరికా తెలుగు కథకి ఒక రూపం, గొంతూ వచ్చింది గత పదిహేనేళ్ళుగానే అని చెప్పాల్సి వుంటుంది. అది కూడా ఇంటర్నెట్ సాంకేతిక మాధ్యమం వచ్చిన తరువాత డయాస్పోరా తెలుగు కథ అన్నది అందరి నోళ్ళల్లోనూ నలిగింది. అంతవరకూ తానా, ఆటాలకి సావనీర్లలో కథలు వచ్చినా అవన్నీ కథలుగా గుర్తించడం అన్నది తెలుగు కథా సాహిత్యకారులకి పట్ట లేదు. అడపాదడపా ఒకరిద్దరి పేర్లు వారికి తెలిసినా తెలుగు కథలో డయాస్పోరా అన్న సరికొత్త పాయని గుర్తించింది 1998, 99ల తరవాతనే!

దీనికి మొదటి కారణం కంప్యూటర్ సాంకేతిక ప్రగతి. అమెరికాలో తెలుగువారి సంఖ్యం పెరగడానికీ, సాహిత్య రంగం కొత్త పద్ధతుల్లో పాఠకులకి చేరవేయడానికీ ఇంటర్నెట్టే ముఖ్యకారణం. అప్పటి వరకూ ఎవరైనా కథ రాయాలంటే చిత్తు ప్రతి నుండి అచ్చుప్రతిలో కాగితానికి ఒక వైపునే రాసి ఇండియాలో పత్రికలకి పంపాలి. ఆ పత్రికలు వాళ్ళు అచ్చేస్తారో, చెత్త చేస్తారో తెలియని కాలం. ఇంటర్నెట్ సాహిత్య మార్గాన్ని సుగమం చేసింది. ఈమెయిల్ ద్వారా సరాసరి కథ పంపే మార్గం అయ్యింది. తెలుగులో టైపు చేసుకోవడానికి అనేక సాఫ్ట్వేర్లు వచ్చాయి. ఈ దరిలో చాలామంది కొత్త రచయితలు కలంపట్టారు, నాతో సహా!

వలసదారులతో ఏర్పడ్డ అమెరికా దేశంలో అనేక డయాస్పోరా కమ్యూనిటీలున్నాయి. చైనీస్, ఆఫ్రికన్లు, స్పానిష్ వాళ్ళు, ఐరిష్ వాళ్ళనీ వీరిలో ముఖ్యంగా చెప్పుకోవచ్చు. ఉన్న ఊరునీ, కన్నవాళ్ళనీ, దేశాన్ని వదిలి ఒక కొత్త ప్రపంచంలో అడుగు పెట్టడంటే అంత తేలికయిన విషయం కాదు. భాషా పరంగా, సాంస్కృతిక పరంగా అనేక ఒడిదుడుకులు ఉంటాయి. అవన్నీ నిలదొక్కుకొనీ తమకంటూ ఒక ప్రత్యేక ఉనికిని చాటుకోవడం ఈ డయాస్పోరా కమ్యూనిటీల ప్రత్యేక లక్షణం.

అంత వరకూ అమెరికా కథగా చెలామణీ అవుతూ వస్తున్న తెలుగు కథకులకి డయాస్పోరా అన్నది అన్వయించి, ఆ స్పృహ కల్పించింది వేలూరి వేంకటేశ్వరరావు గారు. అసలు డయాస్పోరా అంటే ఏవిటి? “The word diaspora often invokes – the imagery of traumas of seperation and dislocation, and this is certainly a very important aspect of the migratory experience. But diaspora are also potentially the sites of – hope and new beginnings. They are contested cultural – and political terrains – where individual and collective memories collide, reassemble and reconfigure.” – అని లండన్ యూనివర్శిటీలో సోషియాలజీ ప్రొఫెసర్ – Avtar Brah – “Cartographies of Diaspora” పుస్తకంలో చెప్పిన మాటలివి.

గత వందేళ్ళుగా డయాస్పోరా మీద కొన్ని వందల వ్యాసాలూ, పుస్తకలూ వచ్చాయి. ఎన్నో సిద్ధాంతలూ, ప్రతిపాదనలూ, చర్చలూ జరిగాయి. వాటిలో ఈ మధ్య పుట్టుకొచ్చిందే – Third Space Theory. ఈ పదాన్ని సృజన లేదా కోయిన్ చేసింది – Oxford University లో హోమీ.కె.భాభా అనే ఒక ఇండియన్ ప్రొఫెసరు. ఈ డయాస్పోరా కమ్యూనిటీల గురించి చెబుతూ – The diasporic communities occupy a unique interstitial third space, which enables negotiation and reconfiguration of different cultures through hybrid interactions. Third Space Theory explains the uniqueness of each person, actor or context as a “hybrid”.

దీన్ని బట్టి చూస్తే డయాస్పోరా కమ్యూనిటీల ప్రత్యేకత – మిశ్రిత జీవనం; ఏకత్వంలో భిన్నత్వం.

వీరికి రెండు కాదు – మూడు ప్రపంచాలు – మొదటి రెండూ, సొంత, వలస దేశాలయితే మూడోదే ఈ “కొత్త జాగా”. ఆ జాగాలో ఊపిరి పోసుకున్నదే డయాస్పోరా సాహిత్యం. ఈ మూడో జాగాలో రెండు పార్శ్వాలున్నాయి. ఒకటి తమదైనా డయాస్పోరా అనుభవాలకి సాహిత్య రూపం ఇవ్వడం. రెండోది – తమ సాహిత్యాన్ని వలస దేశానికి చేరవేయడం.

మొదటిది అమెరికా కథకులు చేస్తున్నారు. రెండోది – వెల్చేరు నారాయణ రావు గారు లాంటి వారు చేస్తున్నది. అంటే – మన సాహిత్యాన్ని ఇక్కడి భాషలో అంటే ఇంగ్లీషులోకి అనువదించి మన సాహిత్యాన్ని అందించడం. మొదటి చాలా తేలిక. రెండోది అతి కష్టమైనది.

ఈ డయాస్పోరా లక్షాణాల్లో మొదటి నుండి పదివరకూ ఒకటే ఉంటుంది. అది – నాస్టాల్జియా (మాతృదేశపు జ్ఞాపకాలు). మిగతావి ప్రధానంగా మూడు వర్గాలు – 1) ఎన్నేళ్ళు వలస ఉన్నా పరాయి వాళ్ళమే అన్న భావన 2) భాష, సాంస్కృతుల సంఘర్షణ 3) విలువలు, ఉనికి, ఉమ్మడితనం, దృఢమైన ఏకత్వ నిరూపణ

కారణాలు ఏమయితేనేం, సాధారణంగా డయాస్పోరా కమ్యూనిటీలన్నిటిలో ఈ పైన చెప్పిన అన్నిలక్షణాలూ కనిపించాల్సిన అవసరం లేదు. ఏ కొన్నిలక్షణాలు ఉన్నా, దానిని డయాస్పోరా గా చెప్పవచ్చు.

మాతృదేశం వదిలి వలస వచ్చిన కొత్తలో ప్రతీ ఒక్కరినీ cognitive dissonance ఆవరించుకొని ఉంటుంది. cognitive dissonance అంటే – cognitive dissonance is the mental stress or discomfort experienced by an individual, who confronted by new information that conflicts with existing beliefs, ideas, or values. రెండు విభిన్న సంస్కృతులూ, నమ్మకాల మధ్య ఊగిసలాడే డోలాయమాన స్థితి. ఈ సంఘర్షణకి అంతర్లీనగా సంస్కృతీ, అలవాట్లే హేతువులు అయ్యే అవకాశం చాలా వుంది.

ఈ సంఘర్షణలో – కొంత అస్పష్టతా, గందరగోళమూ, అపార్థమూ లేదా విబేధం ఏర్పడచ్చు. ఇవి కాకుండా కొంత ఉద్రిక్తతా, అఘాతం కూడా కలగవచ్చు. ఇవన్నీ వేరే జాతులు – అంటే అమెరికాలో ఉండే అమెరికన్లూ, ఆఫ్రికన్లూ, స్పానిష్ వాళ్ళూ, చైనీయులు, వంటి వారితో కలిసినప్పుడు కలగుతాయి. కేవలం మనుషుల మధ్యే కాకుండా వస్తుగతంగా కూడా ఉండచ్చు.

imagesX3953B67

ఈ లక్షణాల కలబోత వల్ల ఒక కొత్త మిశ్రిత జాగా ఏర్పడుతుంది. దాన్నే హైబ్రిడ్ స్పేస్ అని కూడా అంటారు. డయాస్పోరా కమ్యూనిటీల ప్రత్యేకత ఈ మిశ్రిత జాగా – కేవలం వారికొక్కరికే పరిమితమైన ప్రపంచం. అందులో అనుభవాలూ, జ్ఞాపకాలూ వారికే సొంతం. అందుకే డయాస్పోరా అన్నదానికి అంత ప్రాముఖ్యత వచ్చింది. డయాస్పోరా అనుభవాల్లోంచే కొత్త సాహిత్య రూపం వెలిసింది. ఇదంతా ఎందుకు చెప్పాల్సి వచ్చిందంటే ఇక్కడ అమెరికాలో ఉన్న మనలాంటి వాళ్ళకి రెండు ప్రపంచాలు కాదు. ముచ్చటగా మూడున్నాయి. రెండు ప్రాంతాల సాహిత్యాలకి వారధిగా ఉంటూ మనకి మనం ఏర్పరుచుకున్న కొత్త సాహిత్య వాతావరణం ఈ తెలుగు డయాస్పోరా! ఇంటర్నెట్ రాక మునుపు కొంతమంది డయాస్పోరా కథలూ, అనుభవాలూ రాసినా అవి పదిమందికీ, ముఖ్యంగా తెలుగునాట అంతగా ఎవరికీ అవగాహన లేదు. ఇప్పుడు ప్రతీ పది తెలుగు కుటుంబాలకి ఒకళ్ళు అమెరికాలో ఉన్నారు. అందువల్ల వాళ్ళకీ అవగాహన పెరిగింది. తద్వారా ఇక్కడి సాహిత్యాన్ని కూడా గుర్తించడం మొదలయ్యింది. ముఖ్యంగా ఇంటర్నెట్ ఈ తెలుగు డయాస్పోరా వేదికయ్యింది. వాళ్ళకీ ఇక్కడి అలవాట్లూ, పద్ధతులూ జీవన విధానంపై కొంత అవగాహన ఏర్పడింది. అందువల్ల ఇక్కడి వాతావరణాన్ని ప్రతిబింబిస్తూ వచ్చిన సాహిత్యాన్ని అర్థం చేసుకోడం సులభం అయ్యింది. ప్రపంచపు డయాస్పోరా సాహిత్యంలో ప్రత్యేకంగా చెప్పుకో తగ్గవి – మొదట ఆఫ్రికన్లూ, రెందు స్పానిష్ వాళ్ళూ. వీళ్ళు కాకుండా చైనీస్, వియత్నమీస్ వాళ్ళూ ఉన్నారు. భారత దేశాన్ని తీసుకుంటే ఎక్కువ డయాస్పోరా సాహిత్యం వచ్చింది పంజాబీలో. వాళ్ళ తరువాతే మిగతా వారిది. దక్షిణ భారత దేశం తీసుకుంటే డయాస్పోరా కథా సాహిత్యంలో తెలుగువాళ్ళే ముందున్నారు. ఇప్పటివరకూ నాకు లభించిన వివరాల ప్రకారం సుమారు నూట ఏభైకి పైగా డయాస్పోరా కథలు వచ్చాయి. ఉజ్జాయింపుగా సుమారు 50 మంది పైగా కథకులు కనిపించారు. వారిలో విరివిగా కొంతమంది రాస్తే, ఒకటి రెండు రాసినవాళ్ళు మరికొంతమంది ఉన్నారు. ఈ నూట ఏభై కథల్లో 90 శాతం 1995 తరువాత వచ్చినవే ఎక్కువ. నేను కేవలం కథలు గురించే మాట్లాడుతున్నాను, వేరే సాహిత్య ప్రక్రియల గురించి కాదు. **

అమెరికా డయాస్పోరా కథల్లో తరచుగా కనిపించే వస్తువులు

0) ఇక్కడి రూల్సునీ, పద్ధతుల్నీ అవహేళన లేదా వెక్కిరించిన హాస్య రచనలు 1) అమెరికా చెత్త – ఇండియా గొప్ప 2) ఇక్కడి వయలెన్స్, టెర్రరిజం 3) పెళ్ళి, డేటింగ్ కల్చర్ లేదా వివాహేతర సంబంధాలు 4) కుటుంబ సమస్యలు – ముఖ్యంగా పిల్లల పెంపకం, ఇండియాలో తల్లి తండ్రులకి ఆసరా 5) ఇండియా తిరిగి వెళ్ళి పోవడం. 6) స్త్రీల గృహ హింస

అక్కడక్కడ ఒకటో, రెండో వేరే అంశాల మీద కథలు వచ్చినా స్థూలంగా ఈ కథాంశాలు దాటి ముందుకెళ్ళ లేదు. ముందుకెళ్ళక పోవడానికి కారణాలు కూడా ఉన్నాయి.

అమెరికాకి తెలుగు వారి వలస సంఖ్య గణనీయంగా పెరిగింది గత 16, 17 ఏళ్ళగానే! మిగతా జాతుల్లాగ అంటే చైనీస్, వియత్నమీస్, స్పానిష్ వాళ్ళల్లా సమాజంలో అన్ని తరగతుల విభిన్న వ్యక్తులూ ఇండియా నుండి ఇక్కడికి వలస రాలేదు. వచ్చిన వాళ్ళందరూ సరాసరి ఉద్యోగానికో, లేదా పై చదువుకో వచ్చిన వాళ్ళు తప్ప వేరే రకం వాళ్ళు కాదు. గత పదహారేళ్ళుగా వలస వచ్చిన తెలుగువాళ్ళల్లో 90 శాతం పైగా పెద్ద పెద్ద జీతాలకి వచ్చిన వాళ్ళే!

ఇక్కడున్న తెలుగువాళ్ళు అమెరికన్ మధ్య తరగతి వాళ్ళకంటే పైనే ఉన్నట్లు లెక్క. అంటే “యెబవ్ మిడిల్ క్లాస్” క్రిందకి వస్తారు. వీళ్ళందరికీ అమెరికా వ్యవస్థ లేదా జీవితంలో భాగం కావడం అన్న అవసరం లేదు.

ఎందుకంటే – ఉదయాన్నే ఆఫీసుకెళ్ళడం – సాయంత్రం రావడం – ఇంటికొచ్చి డిన్నర్ చేసి రాత్రి ఆగడో, దూకుడో సినిమా చూసుకోవడం – వీలయితే ఇండియాలో సొంత వాళ్ళని పలకరించుకోవడం – ఇంకాస్త టైము దొరికితే గ్రేట్ ఆంధ్రా సైటుకెళ్ళి గాసిప్ చదవడం – ఇవే రోజువారీ దినచర్య. వీకెండ్ వస్తే గ్రోసరీ, లేదా బర్త్ డే పార్టీలూ, మాల్స్ చుట్టూ ప్రదక్షిణాలూ ఇవి దాటి ఉండవు.

అందువల్ల వీళ్ళకి అమెరికన్ సమాజంలో భాగం అవడం కానీ, లేదా వారి జీవితాలతో సంబంధం ఏర్పరచుకోవడం కానీ చాలా చాలా తక్కువ. పోనీ పనికెళ్ళినప్పుడయినా వేరే వాళ్ళతో సంబంధం ఉంటుందా అంటే అదీ తక్కువే! అక్కడా ఇదే ఇండియన్ గ్యాంగ్! కొద్ది చైనీయులూ, మరికొంతమంది అమెరికన్లూ! వీరితో కలిసి మెలిసి తిరిగేదీ తక్కువే!

అందువల్ల ఇక్కడి అమెరికన్ సమాజంలో వుండే సమస్యలూ, తద్వారా వచ్చే ఘర్షణలూ, మంచి చెడ్డలూ తెలిసే అవకాశం సున్నా! ఇప్పుడు చెప్పినవన్నీ కథా రచయితలకీ వర్తిస్తాయి. అందువల్ల వారు రాసే కథలు కానీ, కథా వస్తువులు కానీ, పైన చెప్పిన అంశాలు దాటి వెళ్ళడం లేదు. కథా వస్తువు నేపథ్యం మాత్రమే అమెరికా అవుతోంది తప్ప మిగతాదంతా అచ్చమైన ఇండియా జీవితమే!

పేరుకి డయాస్పోరా కథ అనుకుంటున్నాం, అంతే తప్ప కథకి నేపథ్యం అమెరికానే అవ్వాల్సిన అవసరం లేని కథలు కూడా వున్నాయి. అదేకథ అమలాపురం, ఆముదాల వలసలో అయినా చక్కగా చెల్లుతుంది.

ఇది చాలా విచారించదగ్గ విషయం. మిగతా డయాస్పోరాలు, అంటే చైనీస్, మెక్సికన్ డయాస్పోరాల్లో వచ్చిన సాహిత్య వైవిధ్యం మన తెలుగు కథకి లేదు. ఎందుకంటే – మనకి ఒక స్థాయి మనుషులతోనే ప్రతీ రోజూ ప్రతిస్పందన ఉంటోంది. ఈ పరిస్థితి మారి తెలుగు కథా రచయితలు మరింత లోతుగా ఇక్కడి అధ్యయనం చేస్తే మంచి కథలు వచ్చే అవకాశం ఉంది. ** ఇహ ఈ అమెరికా తెలుగు కథలు వండి వార్చే రచయితల్ని చూస్తే – నాలుగు తరగతులుగా కనిపిస్తారు:

1) ఇక్కడి వాళ్ళు ఇక్కడి జీవితం గురించి రాసేవాళ్ళు 2) ఇక్కడి వాళ్ళు అక్కడి జీవితం లేదా అనుభవాలు గురించి ఎప్పడం ( ఇదే ఎక్కువ ) 3) అక్కడి వాళ్ళు ఇక్కడి సందర్శకులుగా వచ్చి ఇక్కడి జీవితం గురించి రాసేవాళ్ళు ఇవి కాకుండా నాలుగో కేటగరీ వుంది. ముందు ఈ మూడా చర్చించాక నాలుగోది చూద్దాం. ముందు చెప్పిన మొదటి రెండింటితే పేచీ లేదు. ఎందుకంటే ఇక్కడున్నవాళ్ళకి ఇక్కడి జీవితం బాగానే తెలిసే అవకాశం ఉంది. తెలుగునాట పెరిగి చదువుకున్నారు కనుక అక్కడి జీవితం గురించీ బాగానే తెలుస్తుంది. కాబట్టి ఆ కథల్లో కనీసం 80 శాతమయినా సాధికారత ఉండే అవకాశం చాలా ఎక్కువ.

అసలు పేచీ అల్లా మూడోది – అంటే అక్కడి వాళ్ళు నెలకో రెణ్ణెల్లకో, మహా అయితే మూణ్ణెల్లకో అమెరికా వచ్చి – ఇక్కడి జీవితాన్ని కాచి వడబోసినట్లుగా కథలు రాయడం.

కేవలం కథలే కాదు, నవలలూ, ట్రావెలాగ్లూ, చాలా వచ్చాయి. 1) అమెరికాలో ఉండే తెలుగు వారికి డాలర్లు తప్ప ఏం కనిపించవు. 2) ఎంతో యాంత్రికంగా, ఆర్టిఫిషీల్ గా బ్రతుకారు. 3) పగలు కారూ, రాత్రి గుర్రమ్మీద స్వారీ చేస్తారు. 4) రోజూ మంచి నీళ్ళ బదులు మందు తాగుతారు. 5) వాళ్ళందరివీ డొల్ల జీవితాలే తప్ప ప్రేమా ఆప్యాయతలు వుండవు. 6) ఇక్కడున్న పిల్లలు తల్లితండ్రుల్ని పట్టించుకోరు. (అక్కడికేదో ఇండియా కుటుంబాల్లో తల్లి తండ్రుల్ని మహా ప్రేమగా చూస్తున్నట్లు. ఒకే వూళ్ళో ఉండి తల్లి తండ్రుల్ని పట్టించుకోకపోయినా అక్కడ పరవాలేదు. చెల్లుతుంది కూడా)

ఈ విధంగా సాగుతాయి ఆ కథాంశాలు. ఈ కథలు చదివి అమెరికాలో ఉన్న తెలుగువాళ్ళందర్నీ పాఠకులు రాక్షసుల్లా పరిగణించే ప్రమాదం ఉంది. ఈ కేటగిరీ కథకుల్ని Diaspora Story Visitors అనచ్చు. ఇహ నాలోగోదీ, చిట్ట చివరిదీ – ఇక్కడ అంటే అమెరికాలో ఒక్క సారీ కాలు మోప కుండా ఇక్కడి జీవితం గురించి రాసే అక్కడి వాళ్ళు. నా దృష్టిలో ఇది అత్యంత ప్రమాదకరమయిన గుంపు. వీరి సాహిత్య సేద్యానికి ఆయువు పట్టు ఇంటర్నెట్. రాత్రిబవళ్ళు నెట్టులో దున్నేసి కథలు రాసేస్తారు. అవి అచ్చుకూడా అయిపోతాయి. ఖర్మా కాలి – నా లాంటి వాళ్ళు ఎవరైనా అదేవిటని ప్రశ్నిస్తే – అంతే – సరికొత్త ప్రపంచ యుద్ధానికి తెర తీసిన వాళ్ళమవుతామన్నమాట. వాళ్ళు రాయకూడదని కాదు. రాసినదానికి సాధికారత ఉండాలి కదా? పది శాతం మించి కూడా ఉండదు, ఆ రచనల్లో! ఇంటర్నెట్ వచ్చి కొత్త రచయితల్నే కాదు, సరికొత్త రచనా రీతుల్ని కూడా మోసుకొచ్చింది. ఇలా రచనలు చేసే వాళ్ళని Distance writers లేదా దూరసంచార కథకులు అనచ్చు.

ఈ విధంగా అమెరికా తెలుగు కథ సరికొత్త పుంతలు తొక్కుతూ ఇంటెర్నెట్ క్లౌడ్ మీదుగా ఎగురుతోంది. ఆశ్చర్యకరమయిన విషయం ఏవిటంటే – వలస జీవితమ్మీద వచ్చిన కథల్లో ఇక్కడ అమెరికాలో ఉన్న పోజిటివ్నెస్స్(positive aspects) మీద కథలు ఒకటో, రెండో వచ్చాయంతే! మనం అందరం సొంతూరిని, కుటుంబాలనీ వదిలేసి ఇన్ని వేల మైళ్ళ దూరం వచ్చి హాయిగా గడుపుతున్నామంటే కారణం ఇక్కడ ఉండే positiveness వలనే! నేను అమెరికా వచ్చాకా చాలా మంచి పద్ధతులు అలవర్చుకున్నాను. మొట్టమొదటిది – Time management – అంటే టైముని మేనేజ్ చెయ్యడం కాదు. మన టైముకీ, ఇతరుల కాలానికీ విలువనివ్వడం. ఉదాహరణకి – మీరెప్పుడైనా అమెరికన్ల పార్టీలకి వెళితే తెలుస్తుంది. అందరూ ఠంచనుగా టైం పాటిస్తారు. అనీ పద్ధతిగా ఉంటాయి. అలాగే – పదిమందితో కలిసి TEAM గా పనిచేయడం. ఇలా చెప్పడానికి చాలా ఉన్నాయి. అమెరికా వచ్చిన ఈ ఇరవయ్యేళ్ళల్లో ఒక్కసారి కూడా నేను లంచం ఇవ్వలేదు. ఇంకా – ఇక్కడ ఎంతో మంది వ్యాపారాలూ గట్రా చేస్తున్నారు. ఇండియాలో మనకి పక్క రాష్ట్రం వాళ్ళ పొడే గిట్టదు. అలాంటిది వేరే దేశాల వాళ్ళు వలస వస్తే మన ఇంత open గా ఉండగలమా? ఏమో – నాకు డౌటే!

ఇలాంటి అంశాలమీద కథలు అంతగా రాలేదు. వచ్చిన కథల్లో చాలా భాగం వ్యంగ్యంగా, హాస్యంగా, ఎగతాళి చేస్తూ వచ్చినవే! ఈ నేపథ్యం మారి మంచి కథలు రావాలి.

ఉదాహరణకి – చాలా కాలం క్రితం అంటే దాదాపు పదేళ్ళ క్రితం ‘ఒంటరి విహంగం’ అన్న కథొకటి రాసాను. భార్య పోయిన తరువాత ఇండియా నుండి ఓ పెద్దాయన కొడుకు దగ్గరకి అమెరికా వస్తాడు. కూతురు కూడా ఇక్కడే ఉంటుంది. కొడుకు ఒక సారి తను పనిచేసే కంపెనీ వైస్ ప్రెసిడెంట్ ఓ అమెరికన్ పెళ్ళి రిసప్షెన్ కి తండ్రిని కూడా తీసుకెళతాడు. ఆ అమెరికన్‌కది రెండో పెళ్ళి. మొదటి పెళ్ళంతో విడాకులు తీసుకొని ఒంటరితనం భరించలేక పెళ్ళి చేసుకున్నాడని కొడుకు తండ్రికి పెళ్ళి కెళుతూ చెబుతాడు. కొంతకాలం ఇక్కడున్నాక తండ్రి ఇండియా వెళిపోతాడు. ఇండియా వెళ్ళిన తరువాత అతనికి హార్ట్ ఎటాక్ వస్తుంది. సరిగ్గా అదే సమయానికి అమెరికాలో కోడలి ప్రసవం రావడంతో కొడుకు ఇండియా వెళ్ళడు. కొన్ని పరిస్థితుల వల్ల అది కాస్తా వాయిదా పడుతూ వస్తుంది.

సరిగ్గా అదే సమయంలో తనకి అనారోగ్యం చేసినప్పుడు సాయం చేసిన ఒకామెను తండ్రి పెళ్ళి చేసుకుంటున్నాడనీ విషయం తెలుస్తుంది. కొడుకూ, కూతుళ్ళిద్దరూ పెళ్ళిని తిరస్కరిస్తూ తండ్రిని ఆడిపోసుకుంటారు. చివరి దశలో తనెందుకు పెళ్ళి చేసుకోవల్సి వచ్చిందో చెబుతూ ఉత్తరం రాస్తాడు తండ్రి. కొడుకు ఆయన ఉత్తరాన్ని అంగీకరించక చెత్త బుట్టలో పడేస్తాడు. స్థూలంగా ఇదీ కథ.

ఈ కథ చదివాక అందరూ ముసలి వయసులో తండ్రి పెళ్ళి అవసరమని కొందరూ, అవసరం లేదని ఇంకొందరూ వ్యాఖ్యలు చేసారు తప్ప ఇది ఒక డయాస్పోరా జీవితంలో ఎదురైన సంఘర్షణగా ఒక్కరంటే ఒక్కరు వ్యాఖ్యానించ లేదు. దృష్టి అంతా తండ్రి మీదకీ, ఆయన సమస్య మీదకీ మళ్ళింది తప్ప కొడుకు తండ్రిని అంగీకరించక పోవడానికి కారణం రెండు సంస్కృతుల ఘర్షణగా ఎవరూ గుర్తించ లేదు. ఆ ఘర్షణలో అతను తన పాత అభిప్రాయం వైపే వంగాడు. కథలో కొడుకు పాత్ర #cognitive dissonance# మానసిక స్థితికి ఉదాహరణ. ఇండియాలో ఉన్న పాఠకులని వదిలేస్తే అమెరికాలో ఉన్న పాఠకులూ, కథకులూ ఇది డయాస్పోరా కథ అని చెప్పడానికి సాహసించలేదు. ఈ ఒక్క కథేకాదు, చాలామంది కథకుల రచనలకీ ఇదే పరిస్థితి వుంది. ఇది చాలా దురదృష్టకరమైన అంశం.

ఇప్పుడే ఇలా ఉంటే తెలుగు డయాస్పోరా కథ భవిష్యత్తు ఎమీ అంత ఆశాజనకంగా కనబడడం లేదు నాకు. ఇంతకు ముందు చెప్పినట్లు తెలుగు డయాస్పోరా ఇంకా శైశవ దశలోనే ఉంది. ఇప్పటివరకూ వలస వచ్చిన వాళ్ళు చాలా మందికి తెలుగు సెకండ్ లాగ్వేజ్ గానో లేదా తెలుగు మీడియం లోనో చదువుకున్నారు. అందువల్ల మా తరంలో వలస వచ్చిన వాళ్ళకి తెలుగుతో సంబంధం పోలేదు. ఎంత ఇంగ్లీషు మాట్లాడినా, తెలుగులోనే అంటే మాతృభాషలోనే ఆలోచనలు ఉంటాయి. అవే మెదడు తర్జుమా చేసి ఇంగ్లీషులో చెప్పేస్తుంది. కానీ 2000 తరువాత వచ్చిన చాలా మందికి తెలుగు చదవడం రాయడం వచ్చినా, తెలుగు భాషతోనూ, ముఖ్యంగా సాహిత్యంతో సంబధం తెగిపోయింది. అందరివీ ఇంగ్లీషు మీడియం చదువులే! ఒకళ్ళొ ఇద్దరికో తెలుగు రాయడం, చదవడం వచ్చు. అందులో వెతికితే కొంతమంది రాయడం పైన ఆసక్తి ఉండచ్చు. అందువల్ల ఇక్కడికొచ్చిన యంగ్ తెలుగు జెనరేషన్ కథకులు తయారయ్యే అవకాశాలు చాలా తక్కువ. పోనీ కొత్తగా వచ్చే వాళ్ళతో ఆశాజనకంగా కనిపిస్తోందా? అంటే అదీ లేదు.

ముందు ముందు రాబోయే వాళ్ళ పరిస్థితి ఇంకా అధ్వాన్నం. వారు పేరుకి తెలుగువాళ్ళే కానీ, తెలుగు రాయడం, చదవడం రాని వాళ్ళు. ఇప్పటికే తెలుగు పాఠకుల సంఖ్య గణనీయంగా పడిపోయిందని అనుకుంటూ ఉంటాం. ఇలాంటి వారు అమెరికా వలసవస్తే తెలుగులో రాయాల్సిన అగత్యమూ, అవసరమూ కనిపించడం లేదు. ఇప్పుడున్న పాతిక లేదా అయిదు పదుల తెలుగు కథకులే, అంటే నాలాంటి వాళ్ళు, ముసలితనం వచ్చే వరకూ కథలు రాస్తూ ఉండచ్చు. ఇవన్నీ ఆలోచిస్తే కొత్త కథకులు తయారయ్యే అవకాశాలు మృగ్యం అయ్యే సూచనలు కనిపిస్తున్నాయి. అందువల్ల ఇప్పుడున్న తెలుగు డయాస్పోరా కొత్త కథకుల్ని తయారు చేసుకోవాలి. కొత్త కథకులకి మార్గమూ, అవకాశమూ కలిగించాలి.

దానికి వంగూరి ఫౌండేషన్, లేదా ఇతర సంస్థలు తానా, ఆటా దోహదం కలిగించాలి. తెలుగు కథని పరిపుష్టం చేసుకోవడానికి సాహిత్య సమావేశాలూ, వర్క్షాపులూ, చర్చలూ వంటివి తరచుగా నిర్వహించాలి. అలాగే సావనీర్లకే అమెరికన్ తెలుగు కథా రచయితల్ని పరిమితం చెయ్యకుండా ఇక్కడ వచ్చిన డయాస్పోరా కథల్లో కొన్ని మంచివి ఏరి ఒక పుస్తకంగా తీసుకువస్తే బావుంటుంది.

అలాగే డయాస్పోరా రచనలమీద వచ్చిన సమీక్షలూ, విమర్శా కూడా పెరిగే అవకాశమూ, పరిస్థితులూ కలిగించాలి. తెలుగు సాహిత్యం అంటే ఆంధ్రా నుండి దిగుమతి చేసుకునే స్థాయి నుండి మనకి మనమే ఒక కొత్త సాహిత్య ప్రపంచాన్నీ అభివృద్ధి చేసుకోవాలి. డయాస్పోరా కథ మనకే సొంతమయినా మూడో జాగా. దానికి అమెరికాలో ఉన్న తెలుగు వాళ్ళందరి సహకారమూ, కృషీ అవసరం.

 -గొర్తి సాయి బ్రహ్మానందం