మాస్టారి కథలకు ఆయువుపట్టు కథనం

సాహిత్యాన్ని తానెందుకు రాస్తున్నారో, ఎవరికోసం రాస్తున్నారో అనే విషయంలో కథారచయితగా కాళీపట్నం రామారావుకు చాలా స్పష్టత వుంది. ఈయన కథలు గ్రామీణ జీవితంలోని మానవ సంబంధాలను మార్క్సిస్టు తాత్విక దృక్పథంలో నుండి చూసాడు. అయితే తన కథల్లో ఎక్కడా ఆ పరిభాషను వాడలేదు. ఆ పరిభాషను వాడకుండానే కథా జీవితమంతా పరుచుకున్న మార్క్సిస్టు దృక్పథాన్ని పాఠక అనుభవంలోకి తీసుకు రావడంలో కాళీపట్నం రామారావు సఫలీకృతులయ్యారు.ఇదంత సామాన్యమైన విషయంకాదు. కథనం విషయంలో మంచి పట్టు వుంటే తప్ప ఇలాంటి నేత (craft) సాధ్యంకాదు. అందుకే ఆయన పాఠకులలో మార్క్సిస్టులు, మార్క్సిస్టు తాత్వికతను అభిమానించేవాళ్ళెంతమందున్నారో మార్క్సిస్టు భావజాలంతో సంబంధంలేని వాళ్ళు కూడా అంతమందున్నారు. దీనికి కారణం జీవితంపట్ల మనుషులపట్ల ఆయనకు గల నిశిత పరిశీలన వల్లనే పాఠక విస్తృతి సాధ్యమయ్యింది. పాత్రల విషయంలోగానీ, సన్నివేశం విషయంలోగానీ, మరే విషయంలోగానీ ఎప్పుడూ, గందరగోళ పడిన దాఖలా ఒక్క కథలో కూడా కనిపించదు. ఈ స్టేట్‍మెంట్ రాయకుండా ఉండలేని లౌల్యం నాకు మరోరకంగా రాయటంలో కనపడలేదు. మార్మికత పేరుతోనూ మాజిక్ రియలిజం పేరుతో తాము చెప్పదలచుకున్న అంశాన్ని ఏమాత్రం అర్థం కాకుండా కథ మొత్తాన్ని నిర్వహించే మేథో / గొప్ప కథకులకు నేర్పించే పాఠాలు కాళీపట్నం మాష్టారు కథలే. తానెంచుకున్న పాఠకులకు తన సాహిత్యం ద్వారా చేరువ కావడానికి, విషయాన్ని అవగతం చేయించడానికి, ఎంత విడమరచైనా, వాస్తవ సామాజిక స్థితిగతుల్ని ఎదిరించి పోరాడే శక్తిని, అవగాహనను అందించేందుకు తన జీవిత అనుభవాన్నంతా రంగరించి, ఎంతో ఓపికగా బుద్ధి తెలియని పిల్లలకు అనునయించి చెప్పే పాఠంలా ఆయన కథన శైలి సాగుతుంది. రచయితగానే కాదు ఆయన నివసిస్తున్న సమాజంలోని ప్రతి మనిషికి అందుబాటులో వుండే కథన శైలి ఆయనది. తన పాఠకుల్ని – గురువులను అనుసరించి నడిచే బడిపిల్లల్లాగా తన వెంట తిప్పుకుంటారు. తన కథలో సృజించిన ఒక సమస్య. ఆ సమస్యను అతి సమర్థవంతంగా ఒక్కొక్క స్టెప్‍ను సాధించిన రూపం. ఆతర్వాత మరో స్టెప్. వృత్తిరీత్యా లెక్కల మాష్టారవటం వల్ల ఒకొక్క లెక్కను సాధించి సమాధానాన్ని రాబట్టుకునే శైలి ఆయన కథల్లో కనిపిస్తుంది. సువిశాల కథా ప్రపంచంలో ఎవరిలోనూ ఎక్కడా కనిపించని ప్రత్యేకమైన శైలి. వర్తమాన కథకులు ముఖ్యంగా గ్రామీణ బడుగు వర్గాల కోసం రచన చేసే కథకులు ఆలోచించి, అలవరుచుకోవలసిన శైలీ శిల్పం కాళీపట్నం కథలది. . ( ఒక్క పి. సత్యవతి కథనంలో మాత్రం ఇలాంటి టెక్నిక్ చూడగలం. )

ధర్మం పేరిట, న్యాయంపేరిట కొనసాగుతున్న అన్యాయాలకు అక్రమాలకు గల ముసుగును తొలగించి పాఠకుల చైతన్యాన్ని ఆచరణలోకి తేవటం రామారావు కథల్లో కనిపిస్తుంది. ఏపాత్రకూడా స్థాయీ బేధం లేకుండా పాత్రలన్నీ ఒకానొక నీతికి కట్టుబడి ప్రవర్తిస్తాయి. అయితే నీతి అవినీతి మధ్యగల మర్మ రహస్యాన్ని తన తాత్విక భావజాలంతో బద్ధలు చేసి సమాజం కప్పిన ముసుగును క్రమక్రమంగా బట్టబయలు చేయడంలో ఆయన తాత్విక దృక్పథం నిర్వర్తించిన బాధ్యత ఈయన కథల్లో బహిర్గతమవుతుంది. ఆ తాత్వికత వల్లనే మనుషుల్ని కొట్టు, తరుము, నరుకు, పోరాడు, పొలికేక వేయించు లాంటి ఉద్వేగాలతో కాకుండా నింపాదిగా తత్వబోధ చేస్తాయి. వాటిని అందిపుచ్చుకున్న పాఠకులే కథాంశంలోని సారాన్ని గ్రహించగలుగుతారు.

సమస్యకు రచయిత పరిష్కారం చెప్పాలా వద్దా? అన్నది రచయిత చైతన్యానికి సంబంధించిన అంశం. ఏ పరిష్కారం చెప్పాలి అన్నది రచయిత భావజాలానికి సంబంధించిన అంశం. పరిష్కారాన్ని ఏ పద్ధతిలో చెప్పాలి అన్నది రచయిత శిల్ప పరిజ్ఞానానికి సంబంధించిన అంశం. శిల్పం ముసుగులో ఏది చెప్పకుండా ఏదో చెప్పినా, ఏమి చెప్పారో తెలియకుండా అస్పష్టంగా వదిలిపెట్టడం మంచిది కాదనేది కాళీపట్నం రామారావుగారి కథల్లో ఆవిష్కృతమయ్యే వాస్తవం. అందుకు అనుగుణంగానే ఆయన కథలలోని పరిష్కారాలుంటాయి. ఇది అవునా కాదా అన్న మీమాంసకు పాఠకుడు ఎక్కడా గురి కాడు. జీవితం అర్థం కావాలంటే జీవితాన్ని నడిపించే ఆర్థిక సాంఘిక రాజకీయ శక్తుల పాత్ర అర్థం కావాలి. కేవలం సాహిత్య ప్రమాణాలతోనే ఒక రచనను సమగ్రంగా అర్థం చేసుకోవటం సాధ్యం కాదు

కథనం విషయంలో కనిపించే సుదీర్ఘత, సంభాషణల్లో కనిపించదు. సంభాషణల్లో రచయిత చాలా జాగ్రత్తగా, పొదుపుగా, గాఢమైన ముద్రను అందించేవిగా పాత్రల స్వభావాన్ని తీర్చిదిద్దుతారు. ఉద్యమాలు జీవితానుభవంలోంచి రావాలి తప్ప, పుస్తకాలలోంచి కాదు. ఉత్పత్తితో ప్రత్యక్ష సంబంధంలేని జీవితాలలో కూడా ఆర్థికసూత్రం ప్రధాన ప్రాత నిర్వహిస్తున్న తీరును కాళీపట్నం చాలా కథల్లో కనబడుతుంది. సమస్యా పరిష్కారాలలో జీవితాన్ని నడిపే గతితార్కిక సూత్రాలను తన కథలకు అంతస్సూత్రంగా చేసి ఆవిష్కరించటమే రచయితగా కాళీపట్నం రామారావు కథా రచనలోని ఉద్దేశిత లక్ష్యం.

మాజికల్ రియలిజమ్ పేరుతో పాఠకులకు అర్థంకాని ప్రయోగాలతో గందరగోళ పరిచే రచయితలు గొప్ప రచయితలుగా, మేథో రచయితలుగా గుర్తించబడటమే లక్ష్యంగా వున్న రచయితలు . ఒక కాఫ్కానో, డెరిడానో, మరో పుకోవ్ ,మార్క్వెజ్ లను చదివితేనే అర్థమయ్యే కథా రచయితలందరు కాళీపట్నం రామారావు కథల్ని మళ్ళీ మళ్ళీ చదవాలి. సాహిత్య రచన ద్వారా సామాజిక బాధ్యతా నిర్వహణలో చురుకైన, సజీవమైన పాత్ర నిర్వహించాలి. సాహిత్యాన్ని ప్రజలకు అత్యంత సమీపానికి తీసుకు పోవాలి. అంటే సమస్యలని ఆవిష్కరించటానికే పరిమితం కాకుండా పరిష్కారాల వైపుకు కూడా పోవాలనే సూచనను తన కథాసాహిత్యం ద్వారా గుర్తుచేయడమే కథల గురువు కాళీపట్నం రామారావు కథా దృక్పథం.

sreedevi k–కిన్నెర శ్రీదేవి