చివరాఖరి ప్రశ్న

Art: Srujan Raj

Art: Srujan Raj

 

-కోడూరి విజయకుమార్

~

vijay

‘కొక్కొరోకో’ … మొబైల్ అలారం లెమ్మని అరుస్తోంది

నిద్ర పట్టని మహానగర రాత్రుల యాతనల నడుమ ఉదయమే లేవడమొక పెను సవాలు!

చిన్నతనంలో ఊరిలో కోడి కూతకు మేల్కొనే అలవాటు ఇంకా పోనందుకో లేక  కొట్టి మరీ నిద్ర లేపే లక్షణం వున్నందువల్లనో అతడు ఊళ్ళోని కోడికూతలా భ్రమింపజేసే ఈ విచిత్ర యంత్రశబ్దాన్ని ఎంచుకున్నాడు.

కొట్టి చెబితే కూడా మెలకువలోకి రాకుండాపోతోన్న జీవితాన్ని తల్చుకుని క్షణకాలం దిగులు పడ్డాడు.

ఇట్లా అప్పుడప్పుడూ జీవితాన్ని తలుచుకుని దిగులుపడే సున్నిత హృదయ శకలం ఒకటి ఏ మూలనో ఇంకా మిగిలి వున్నందుకు ఒకింత సంతోషించాడు కూడా !

‘సరే గానీ … దిగులు దేనికి ?’ ప్రశ్నించుకున్నాడు.

జబ్బులతో మంచాన పడిన తలిదండ్రులు జ్ఞాపకం వొచ్చారు.

‘వృద్ధాప్యం కదా … జబ్బులతో మంచాన పడడం మామూలే కదా’

సంసారంలో ఇబ్బందులు పడుతోన్న తన తోడబుట్టిన వాళ్ళు జ్ఞాపకం వొచ్చారు.

‘ఏ ఇబ్బందులూ,  గొడవలూ, మనస్పర్థలూ లేకుండా ఎవరి సంసారాలు వున్నాయి? చాలా అందంగా సాగుతున్నట్టుగా పైకి కనిపించే సంసారాలన్నీ నిజంగా అందంగానే సాగుతున్నాయా?’

సరే … సరే …. లోన లుంగలు చుట్టుకు పోతున్న ఈ దుఃఖం మాటేమిటి ?

అరచేతులనూ జుత్తు లోనికి జొనిపి,  కణతలను చిన్నగా రుద్దుకుంటూ, గట్టిగా శ్వాస పీల్చుకుని వదిలాడు.

ప్రశ్నలు …. ప్రశ్నలు …. నిన్న సాయంత్రం నుండీ ఎడ తెరిపి లేని ప్రశ్నలు …  ఏవేవో సమాధానాలు దొరుకుతున్నాయి గానీ, అసలైన ఆ ప్రశ్నకు మాత్రం సమాధానం దొరకడం లేదు. ఇంతా చేసి, ఆ ప్రశ్న వేసింది అప్పుడప్పుడూ ఆర్టీసీ చౌరస్తా దగ్గర తారసపడే పిచ్చివాడు.

రోజుల తరబడి స్నానం చేయక  పోగచూరినట్లు నల్లగా వుండే శరీరం … చీలికలు పేలికలుగా శరీరం పైన వున్న పొడవాటి షర్టు, పొట్ట దాకా పెరిగిన తెల్లటి గడ్డం, చింపిరి జుట్టు, గుంటలు పడి లోనకు పోయిన కళ్ళు!

‘ఎవరికీ పట్టని వాళ్ళు, ఎవరినీ పట్టించుకోని వాళ్ళు ఇట్లాగే వుంటారేమో?’ అనుకున్నాడు.

‘పిచ్చివాడు ‘ … ఆ మాట ఎందుకో ఒక క్షణం చిత్రంగా అనిపించింది!

ఫలానా విధంగా కనిపిస్తే, లేక ఫలానా విధంగా మాట్లాడితే‘పిచ్చివాడు’ అని ప్రమాణాలు నిర్ణయించింది ఎవరు?

ఒక చిన్న కారణంతో ఏళ్ల తరబడి దెబ్బలాడుకునే భార్యాభర్తలూ …. తిడితే తప్ప కింది వాళ్ళు పనిచేయరనే ఆలోచనలతో తిరిగే యజమానులూ…  అత్యంత రద్దీ సమయంలో  పొరపాటున దాష్  కొట్టిన స్కూటర్ వాడితో నడి రోడ్డు పైన పెద్ద గొడవకు దిగే కారు ఓనర్లు …. వీళ్ళందరూ ‘నార్మల్’ మనుషులేనా ?

కిటికీ పరదాని పక్కకు జరిపాడు

ఉదయం వెలుగు జొరబడి గది అంతా పరుచుకుంది.

‘గడిచిన రాత్రి నుండి బయట పడి, ఇట్లా ఈ కొత్త రోజు లోకి వచ్చాను కాబట్టి సరిపోయింది గానీ, లేకపోతే ?’ ప్రశ్నించుకున్నాడు.

‘లేకపోతే ఏముంటుంది ? ఏదీ …. ఏ …. దీ వుండదు !’ ఎవరో గట్టిగా చెప్పినట్టు అనిపించింది.

తల తిప్పి చూసాడు –  కుండీలో మందార పువ్వు నవ్వుతోంది.

`ఈ బాధలు పడడం కన్నా, ఈ పువ్వులా పుట్టి వుంటే ఎంత బాగుండేది?’ నిట్టూర్చాడు.

‘పువ్వులా పుట్టకపోయినా పువ్వులా బతకొచ్చు అని ఎప్పుడైనా అనుకున్నావా?’ కుండీ లోని పువ్వు గల గలా నవ్వినట్టు అనిపించింది.

కళ్ళు నులుముకుంటూ బెడ్ రూం లో నుండి బయటకు వచ్చాడు.

తను వంటగదిలో ఉన్నట్టుంది. పిల్లల అలికిడి లేదు.

బాబు ఉదయం నాలుగు గంటలకే ఐ ఐ టి కోచింగ్ కీ, పాప ఉదయం ఐదు గంటలకే మెడిసిన్ కోచింగ్ కీ వెళ్ళిపోతారు.

బాల్యం కోల్పోయారు … కౌమారం కోల్పోతున్నారు … రేపు యవ్వనం కూడా కోల్పోతారు …

ఇన్ని కోల్పోయిన తరువాత రేపు జీవితం కోల్పోకుండా ఉంటారా ?

కానీ, అది కోల్పోకుండా వుండడం కోసమే కదా ఈ తెల్లవారు ఝాము కోచింగులు !

ఏది కోల్పోకుండా వుండడం కోసం మరి దేనిని కోల్పోతున్నట్టు ?

Kadha-Saranga-2-300x268

స్కూలు రోజుల వరకూ అతడు చాలా పాటలు పాడేవాడు. ఎక్కడ  పాటల పోటీ జరిగినా మొదటి బహుమతి సాధించేవాడు. ఒక బాలమురళి లాగా, ఒక జేసుదాసు లాగా పాటలు పాడుకుంటూ బతికేయాలని అతడి అప్పటి కల!

శాస్త్రీయ సంగీతం నేర్చుకుంటానని తండ్రికి చెప్పినపుడు, ‘ముందు చదువు పైన శ్రద్ధపెట్టు’ అన్న సమాధానం వెనుక డబ్బులు కట్టలేని  తండ్రి బేలతనం వుందన్న రహస్యం అతడికి కొంత ఆలస్యంగా అర్థం అయింది. కాలేజీ రోజుల లోకి వచ్చేసరికి అతడికి కుటుంబ బాధ్యతల సెగ తగిలి, క్రమ క్రమంగా ఒకప్పుడు తాను అద్భుతంగా పాటలు పాడే వాడిని అన్న సంగతినే మర్చిపోయాడు.

చదువు … పోటీ పరీక్షలు … నెల తిరిగే సరికి కుటుంబం కాస్త ప్రశాంతంగా బతికేందుకు అవసరమైన సంపాదన తెచ్చే ఒక మంచి ఉద్యోగమే లక్ష్యం!

సరే … అదంతా గతం … ఇప్పుడు తాను చేస్తున్నది ఏమిటి ?

పాప చక్కగా పాటలు పాడుతుంది … ఎంత తియ్యని గొంతు దానిది !

సంగీతం క్లాసులు మాన్పించి, మెడిసిన్ కోచింగ్ క్లాసులకు వెళ్ళమని చెప్పిన రోజున అన్నం తినకుండా అలిగి కూర్చుంది.

బుజ్జగించి, లేక, సంగీతాన్నే నమ్ముకుని ముందుకు వెళితే మిగిలే జీవితాన్ని బెదరగొట్టే రూపాలలో వర్ణించి, మొత్తంమీద పిల్లని సంగీతం నుండి దారి మళ్ళించాడు !

నేల పైన మొదలైన తన జీవితం ఇప్పుడు మేడ పైన కాస్త సౌకర్యవంతమైన స్థాయికి చేరిన దశలో అజాగ్రత్తగా వుంటే, రేపు పిల్లలు ఎక్కడ నేల పైకి జారి పడతారో అని ఒక భయానక అభద్రతా భావం … ఎవరు జొప్పించారు ఈ జీవితాల లోనికి ఇంత అభద్రతా భావాన్ని ?

‘ఎక్కడి నుండో ఇక్కడి ఈ లోకం లోకి విసిరి వేయబడి, ఇక్కడి ఈ సంచారంలో నిరంతరంగా ఒక భారాన్ని మోస్తూ, చివరన మళ్ళీ ఎక్కడికో తిరుగు ప్రయాణమై …’ తన ఊహలకు తానే నవ్వుకున్నాడు!

‘టేబుల్ పైన టిఫిన్ రెడీగా వుంది …. లంచ్ బాక్స్ అక్కడే పెట్టాను ‘ స్నానం చేసి వచ్చేసరికి, బాల్కనీలో మొక్కలకు నీళ్ళు పోస్తోన్న భార్య చెప్పింది.

‘భూమ్మీద పడి, తిరిగి వెళ్లి పోయేదాకా ఏమి తప్పినా వేళకు తిండి తినడమైతే తప్పదు గదా!’  తనలో తాను గొణుక్కున్నాడు.

‘అందమే ఆనందం …. ‘ వివిధ భారతి లో ఘంటసాల పాట తియ్యగా సాగుతోంది.

పాటలు వింటూ టిఫిన్ చేయడం అలవాటు అతడికి.

‘ఆనందమే జీవిత మకరందం’ వినడానికి ఎంత సరళంగా, ఎంత అందంగా వుంది?

ఇంత సరళమైన, ఇంత అందమైన ఈ అనుభూతి ఒక జ్ఞానం లాగ బయటే నిలబడి పోతున్నది తప్ప, గుండెలోకీ, రక్త నాళాలలోకీ, జీవితంలోకీ ఇంకడం లేదెందుకని ? పిచ్చివాడు వేసిన ప్రశ్న భయపెడుతున్నదా? … లేక, వాడికి దొరకిన జవాబు తనకు దొరకనందుకు దిగులుగా వున్నదా?

స్కూటర్ తీసుకుని ఆఫీస్ కు బయల్దేరాడు ….

గత వారం రోజులుగా ఆఫీస్ కి వెళ్ళాలంటే చాలా దిగులుగా ఉంటోంది.

మధు … ఆఫీస్ లో వున్న సన్నిహిత మిత్రులలో ఒకడు ….. వారం కిందట క్యాన్సర్ తో పోయాడు.  మనిషి మృత్యువుకు చేరువ అయ్యేటప్పటి ప్రయాణం ఎంత భారంగా వుంటుందో దగ్గరగా చూసాడు. పరీక్షలు జరిపి చెప్పారు డాక్టర్లు – ‘ క్యాన్సర్ చివరి దశలో వుంది – సమయం లేదు’.

‘ఛ …. ఇంతేనా జీవితం ….ఎన్నెన్ని ఊహించుకుంటాము …. ఎన్నెన్ని కలలు కంటాము … అన్నీ దేహం లోపలి ఒక్క కుదుపుతో దూది పింజలలా తేలిపోవలసిందేనా?’ డాక్టర్ గది నుండి బయటకు వచ్చి స్నేహితుడు దుఖించిన రోజు ఇప్పటికీ వెంటాడుతూనే వుంది.

 

వీధులు దాటి, మెయిన్ రోడ్డు మీదకు చేరుకున్నాడు. రోడ్లు ఈనినట్లుగా జనం …. బస్సుల్లో, కార్లలో, ఆటోల్లో, బైకుల పైన ….ముందు వాడిని కదలమని వెనుక వాడూ, ఆ ముందు వాడిని మరింత త్వరగా వెళ్ళమని ఈ ముందు వాడూ …  అందరూ ఆదరా బాదరాగా పరిగెత్తడానికి సిద్ధంగా వుంటారు గానీ ఎవరూ టైంకి గమ్యానికి చేరే అవకాశం వుండదు. వాడెవడో భలే చెప్పాడు …. మహానగరంలో మనుషులు కాంక్రీటు బోనులలో బంధింపబడిన జంతువులు …. బయటికి వెళ్లి బతకలేరు … లోపలి ఉక్కపోతను భరించలేరు!

వి ఎస్ టి సెంటర్ దగ్గరకు చేరున్నాడు అతడు.  అర కిలోమీటరు మేర ట్రాఫిక్ వుంది. వాహనాలు మెల్లిగా కదులుతున్నాయి. పక్కనే పోలీసుల కాపలా మధ్య ఎర్ర జెండాల నీడలో, చేతులలో ప్లకార్డులతో  ఊరేగింపు కదులుతోంది.

‘భూటకపు ఎన్ కౌంటర్లు నశించాలి’

‘హై కోర్టు సిట్టింగ్ జడ్జి తో విచారణ జరిపించాలి’

అతడి పక్కనే కదులుతోన్న ఊరేగింపులో ఇద్దరు మాట్లాడుకుంటున్నారు –

‘ఇంజనీరింగ్ చదివే పిల్లలు … పేద ప్రజల పట్ల ఎంత కరుణా, ప్రేమా లేకపోతే బంగారం లాంటి జీవితాలని వొదులుకుని అట్లా అడవుల్లోకి వెళ్ళిపోతారు?’

అతడిని ఆ మాటలు కాసేపు సిగ్గు పడేలా చేసాయి.

తను … తన వాళ్ళు … తన బాధలు  … తన వాళ్ళ బాధలు …. ఈ కలుగు నుండి ఎప్పుడైనా బయటపడ్డాడా తను? మరి, ఆ యువకులు ? …. తమకు ఏమీ కాని పేద వాళ్ళ కోసం, గెలుస్తామన్న నమ్మకం ఇసుమంతైనా లేని యుద్ధం లోకి దూకి ప్రాణాలని తృణ ప్రాయంగా వొదిలి వేసారు.

జీవితమంటే ఇతరుల కోసం జీవించేదేనా ?

‘జీవితమంటే తెలిసిందా నీకు …. తెలిసిందా నీకు ? … హ్హ హ్హ హ్హ …. నాకు తెలిసింది …. నాకు తెలిసింది …. ఇదిగో ఈ గుప్పిట్లో దాచేసాను … హ్హ హ్హ హ్హ’

ఆర్ టి సి చౌరస్తా దగ్గర పడేసరికి, మూసిన గుప్పిలి చూపిస్తూ, నిన్న హటాత్తుగా తన స్కూటర్ కు అడ్డంగా వచ్చి ప్రశ్న వేసిన పిచ్చివాడు జ్ఞాపకం వచ్చాడు అతడికి.

ఇవాళ మళ్ళీ కనిపిస్తాడా ?

కనిపిస్తే బాగుండు …. ఆ గుప్పిట్లో ఏం దాచిపెట్టి, జీవితమంటే తెలిసిందని అంత ఆనందంగా  ప్రకటించాడు వాడు?  వాడిని కొంచెం మంచి చేసుకుని మాటల్లో పెట్టి తెలుసుకోవాలి! పిచ్చివాళ్ళు మహా మొండిగా ఉంటారని అంటారు – వాడు గుప్పిలి తెరిచి చూపిస్తాడంటావా ?

అయినా, పిచ్చి వాడి మాటలకు అర్థాలు వుంటాయా ?

ఇక్కడ జీవితాలకే అర్థం లేకుండా పోతోంది ….. అంటే, జీవితానికి అర్థం ఉంటుందా ? … ఉండాలనే నియమం ఏదైనా వుందా ?

ఆలోచనల నడుమ ఆర్ టి సి చౌరస్తా సిగ్నల్స్ దగ్గర ఆగాడు అతడు.

చుట్టూ చూసాడు – ఆ పిచ్చివాడు ఎక్కడైనా కనిపిస్తాడేమో అని. ఊహూ … కనిపించలేదు. అయినా, ఫలానా టైంకి, ఫలానా చోటులో వుండాలనే కాలనియమం పాటించడానికి వాడేమైనా మామూలు మనిషా?

‘సర్ … నిన్న సాయంత్రం ఇక్కడ ఒక పిచ్చివాడు వుండాలి ‘ మాటల్ని కూడబలుక్కుంటూ పక్కన నిలబడి వున్న ట్రాఫిక్ కానిస్టేబుల్ ని అడిగాడు అతడు.

‘ఏమైతడు నీకు? అట్ల రోడ్ల మీద వొదిలేసి పోతే ఎట్ల?’

‘అయ్యో …. అతడు నాకేం కాడు …. నాకేం కాడు’ తత్తర తత్తరగా అన్నాడు.

కానిస్టేబుల్ అతడిని తేరిపార చూసాడు.

అప్పుడే గ్రీన్ బల్బు వెలగడంతో ఇక కానిస్టేబుల్ మొహం చూడకుండా ముందుకు వెళ్ళిపోయాడు.

సుదర్శన్ టాకీస్ లో ఎవరో స్టార్ హీరో కొత్త సినిమా విడుదల ఉన్నట్టుంది. టాకీసు ముందు అభిమానుల కోలాహలం! ….అభిమాన హీరో సినిమా మొదటి రోజు, మొదటి ఆట చూడకపోతే జీవితానికి అర్థం లేదనుకునే జనం …. ఒక వేళ టికెట్ దొరక్కపోతే ఆత్మహత్య చేసుకోవడానికైనా వెనుకాడని సాహసులు!

అశోక్ నగర్ చౌరస్తా దాటి ఇందిరా పార్కు దగ్గరికి వచ్చేసరికి ఒక చోట జనం మూగి వున్నారు. గుంపు ముందర ఆర్ టీ సి బస్సు ఆగి వుంది.

ఎప్పట్లాగే, ఏమీ పట్టనట్టుగా ముందుకు సాగిపోతూ వుండగా పక్కన ఎవరిదో మాట వినిపించింది -‘ఎవరో పిచ్చివాడు …. బస్సుకు అడ్డంగా వెళ్లి, దాని కిందపడి చచ్చి పోయాడు’

స్కూటర్ సడెన్ బ్రేక్ వేసి, కొంచెం దూరంగా పార్క్ చేసి, గుంపుని చేరుకున్నాడు అతడు. గుంపులోకి దూరి, ఒకరిద్దరిని బలవంతంగా పక్కకు జరిపి రక్తం మడుగులో పడి వున్న పిచ్చివాడిని చూడగానే కొన్ని సెకన్ల పాటు అతడి ఒళ్ళు జలదరించింది.

రోడ్డు పైన నిర్జీవంగా పడి వున్న పిచ్చి వాడిని పరికించి చూసాడు.

ఏదో గొప్ప అలౌకిక ఆనంద స్థితిలో మరణించినట్లుగా వాడి పెదవుల పైన ఇంకా మెరుస్తోన్న నవ్వు! సరిగ్గా నిన్న సాయంత్రం అతడి స్కూటర్ కి అడ్డంగా వచ్చి, ‘జీవితమంటే నాకు తెలిసింది’ అని గొప్ప సంతోషంతో ప్రకటించినప్పుడు అతడి కళ్ళల్లో, పెదవుల పైన కన్పించిన మెరుపు నవ్వు లాంటి నవ్వు !

అతడు, అప్రయత్నంగా నిర్జీవంగా వెల్లకిలా పడి వున్న పిచ్చివాడి అరచేతుల వైపు చూసాడు.

అరచేతులు రెండూ తెరుచుకుని, ఆకాశం వైపు చూస్తున్నాయి.

మనసు వికలమై, అతడు గుంపులో నుండి బైటకు వచ్చాడు.

‘నారాయణగూడా సెంటర్ లో పెద్ద బట్టల దుకాణం వుండేది ఈ పిచ్చాయనకి … వ్యాపారంలో కొడుకే మోసం చేసే సరికి తట్టుకోలేక ఇట్ల అయిపోయిండు’ అక్కడ చేరిన వాళ్ళలో ఒకరు, మిగతా వాళ్లకు చెబుతున్నారు.

‘ఏముంటే మాత్రం ఏమున్నది బిడ్డా … పోయేటప్పుడు సంపాయించిన పైసలొస్తయా …. రక్తం పంచుకున్న బిడ్డలస్తరా?’  ముసలమ్మ ఒకావిడ అంటోంది!

అతడికి ఆఫీసుకి వెళ్ళాలనిపించలేదు. ఫోను చేసి చెప్పాడు రావడం లేదని.

స్కూటర్ వెనక్కి తిప్పి ఇంటి దారి పట్టాడు.

ఇంటికి చేరుకొని, గబ గబా బెడ్ రూమ్ లోకి చేరుకొని మంచం పైన వాలిపోయాడు.

‘ఏమయింది ఈ మనిషికి ఇవాళ ‘ అనుకుంటూ బెడ్ రూమ్ లోకి వచ్చింది అతడి భార్య.

‘ ఆఫీస్ కు వెళ్ళ లేదా? ఏమైనా ప్రాబ్లంగా ఉందా ఒంట్లో?’

‘నో ప్రాబ్లం … ఐ యాం ఆల్ రైట్’ అంటూ తెరిచి వున్న కిటికీ వైపు చూసాడు అతడు. పొద్దున్న కన్పించిన మందార పువ్వు లేదక్కడ!

‘ఈ కుండీలో పొద్దున్న మందార పువ్వొకటి వుండాలి ‘ భార్యను అడిగాడు

‘ఓ అదా … పక్కింటి వాళ్ళ ఇంట్లో దేవుడి పూజ ఏదో వుందని కోసుకు పోయారు. హ్మ్ …. అయినా ఎప్పుడూ లేనిది ఇంట్లో కుండీలలో పూసే పూవుల గురించి అడుగుతున్నావు … ఒంట్లో బాగానే ఉందా అని అడిగితే నో ప్రాబ్లం అంటున్నావు’ కొంచెం కంగారుగా అడిగింది

.

* * * * *

 

                     

        

 

 

ఇల్లు

 vijay

 కోడూరి విజయకుమార్

మా నాన్నకు ఒక కల వుండేది

కిరాయి ఇళ్ళ యజమానుల గదమాయింపులతో

ఇబ్బంది పడినపుడల్లా

‘మనకొక సొంత ఇల్లుండాలిరా బాబూ !’ అంటూ

తన కలల బొమ్మరిల్లుని నా ముందు పరిచేవాడు

 

ఒక పేద బడి పంతులు మా నాన్న

బడి వేళల పిదప ట్యూషన్లు చెప్పడం కూడా

నేరమని తలచిన పాతకాలం పంతులు 

కళ్ళు మిరుమిట్లు గొల్పే రంగుల కల కాదు

హాలు – ఒక పడగ్గది – ఒక వంట గది – చిన్న వరండా

ఒక సాదా సీదా బొమ్మరిల్లు ఆయన కల

 

సీదా మనుషుల సాదా కలలకు చోటు లేని లోకంలో

నాన్న కల అట్లా బాధ్యతల కందకాల మీదుగా సాగీ సాగీ

ఉద్యోగ విరమణ తరువాత ఎప్పుడో

మూడు గదుల ఒక చిన్న ఇల్లుగా సాకారమయింది

కొత్త ఇంట్లోకి అడుగు పెట్టిన రోజున

ఇంటి గడపపై వెలిగిన రెండు దీపాలు – మా నాన్న కళ్ళు

 

గవ్వల తోరణాలతో గుమ్మాలను అలంకరించీ

ఇంటి గేటుకి నీలి రంగు వేయించీ

గడపలకు రంగుల పూల చిత్రాలు అద్దించీ

మూడు గదుల ఇంటిని

ముచ్చట గొలిపే ప్యాలెస్ లా చూసుకుంటాడు

* * * * *

నాన్నను వెంటాడిన ఈ సొంతఇంటి కల ఏదో

ఒక పీడ కలై నన్నూ వెంటాడింది

మకాం మా వూరి నుండి మహా నగరానికి మారాక

ఇల్లంటే నాదైన స్థలంలో కొన్ని గదుల

బొమ్మరిల్లు కాదని అర్థమై పోయింది

 

 

వున్న భూమిని ప్రభువులు కొందరు

ఎకరాలకు ఎకరాలు మింగి వేసాక  

మరణించిన మనుషులకు ఆరడుగుల నేల కూడా

కరువైన మహానగరంలో

బతికున్న మనుషులు కొన్ని చదరపు అడుగుల

పిట్టగూడులలో తలదాచుకోవలసిందే 

 

మూడు గదుల ఇంటితో ముగిసిన తన కల

ఒక సుందర సువిశాల భవనమై

తన ఇంజినీరు కొడుకు కలగా కొనసాగుతుందని

నా తండ్రికి ఇటీవలి కల

 

ఇక నేనంటారా ….

ప్రతిరోజూ నగర రద్దీ రహదారులని ఈదలేక

మా సకలావసరాలకూ చేరువలో వుండే చోటులో

ఒక నివాసాన్ని కలగన్నాను

నగరం మధ్యలో కూడా మా ఊరిని కలగన్నానేమో

గేటెడ్ కమ్యునిటీ లో నివాసాన్ని కలగన్నాను

 

విలాసంగా బతికింది లేదు – విహార యాత్రలు చేసింది లేదు

వున్న సేవింగ్స్ అంతా వూడ్చేసి, చివరికి

నా భవిష్యత్ ఆదాయాన్నీ తనఖా పెట్టి

తండ్రీ! నేనీ మహానగరంలో ఇంటివాడినయ్యాను

ఇక ఈ శేష జీవితం ఇంటి అప్పు వాయిదాలకు తాకట్టు

 

మిత్రమా ! .. తండ్రీ కొడుకుల ఈ కలల యాత్రల

కథలు విన్నాక నీకేమనిపిస్తోంది ?

*

డియర్ రెడ్!

untitled

ఏ ఇందిరా పార్క్ దగ్గరో కొందరు బక్కపలచని స్త్రీలు
ఎర్ర జెండాలని భుజాలపై పెట్టుకుని
గొంతు తుపాకుల్లోంచి నినాదాల
తూటాలు పేలుస్తూ సాగిపోతుంటారు

డియర్ రెడ్ !
నీవు ఎప్పుడు ఇట్లా రెపరెపలాడుతూ కనిపించినా
కొన్ని పురా జ్ఞాపకాలు వెంటాడుతాయి
చిన్నతనంలో ఉదయం లేచి చూస్తే
తెల్లటి ఇళ్ళ గోడల పైన ఎరుపెరుపు అక్షరాలు వుండేవి
‘కామ్రేడ్ జన్ను చిన్నాలు అమర్ హై ‘
‘కామ్రేడ్ జార్జిరెడ్డి అమర్ హై’
‘విప్లవం వర్ధిల్లాలి ‘

‘డాక్టర్ రామనాథం ని చంపేశారు
స్కూలుకి సెలవని’ తెలిసిన రోజున
నా జ్వరానికి తీయటి మందులిచ్చిన డాక్టర్ని
ఎందుకు చంపారో తెలియక
ఏడ్చిన రోజు ఆ రోజు గుర్తుకొస్తుంది

ఎవరీ జన్ను చిన్నాలు ?… ఎవరీ జార్జిరెడ్డి?
ఎందుకు విప్లవం ? డాక్టర్ రామనాథం చేసిన నేరమేమి ?
డియర్ రెడ్ ! నీ కోసం మొదలైన ఒక అన్వేషణ ఏదో
కొంత ముందుకు సాగేక,
ఆకర్షణలో, బంధాలో, బాధ్యతలో, మరేవో ….
ఊపిరి సలపని ఏవో వలయాలలో చిక్కుబడి పోయాను
* * * *

కాసేపటి తరువాత, ఆ ఇందిరా పార్క్ దగ్గరి స్త్రీలు
కొన్ని లాటీలు, భాష్పవాయు గోలాల దాడులతో
బహుశా, చెల్లాచెదురు కావొచ్చు

డియర్ రెడ్ !
అన్ని విజ్ఞాపనలు, వేడుకోళ్ళు అయిన పిదప
చివరగా నిన్నే నమ్ముకుని వాళ్ళు రోడ్డెక్కి వుంటారు
రోజూ ఎవరో ఒకరు, నిన్నే నమ్ముకుని
ఈ నగర రహదారుల పైకి దూసుకొస్తుంటారు

కానీ డియర్ రెడ్ !
అసలీ నగరాలు, నగర అమానవులు
మనుషులుగానే పరిగణించని కొందరు మానవులు
పూర్తిగా నిన్నే నమ్ముకుని, అక్కడెక్కడో
ఒక ప్రపంచాన్ని నిర్మిస్తున్నారట
దగా పడిన జాతికి అంతిమంగా విముక్తి కలిగించేది
నీవు మాత్రమేనని వాళ్లకు మాత్రమే అర్థమయిందా ?

(డిసెంబర్ 2014)

కోడూరి విజయకుమార్

vijay

అతడు ఈ నేల మీది వాడల ఆస్తి!

10527627_758258257546728_5310203278332013818_n

 

‘ తెరేష్ ఈస్ నో మోర్ ‘ …. మొన్న సెప్టెంబర్ 29 న కవి మోహన్ రుషి పంపిన మెసేజ్ చూడగానే లోపలెక్కడో కాస్త అపనమ్మకంగానే కట్టుకున్న చిన్న ఆశ ఏదో ఒక్కసారిగా కుప్పకూలి పోయిన బాధ ! వార్త తెలిసిన వెంటనే  ఆఫీస్ నుండి సోమాజిగూడ లోని యశోద ఆసుపత్రికి వెళ్ళడం అయితే వెళ్లాను గానీ తెరేష్ అన్నని ఒక విగత జీవిగా దగ్గరనుండి చూసే ధైర్యం లేకపోయింది. బహుశా, తెరేష్ అన్నని కాస్తో కూస్తో సమీపంగా తెలిసిన ఎవరికైనా ఇదే అనుభవం ఎదురై వుంటుంది. ఎప్పుడు కలిసినా గొప్ప జీవకళతో వెలిగిపోతూ, మనుషుల్ని ఆలింగనం చేసుకునే మనిషిని ఒక్కసారిగా అట్లా చూడవలసి రావడం మనసుకి ఎంత కష్టం !

 

అంతకు క్రితమే నేను పాల్వంచలో ఉద్యోగం చేసే కాలంలో కవి మిత్రుడు ఖాజా ద్వారా తెరేష్ కవిత్వం గురించి విని వున్నప్పటికీ, 1996 లో తన ‘అల్పపీడనం ‘ కవితాసంకలనం విడుదల సందర్భంలో తెరేష్ అన్నతో నా తొలి పరిచయం. తెలుగు కవిత్వంలో నాకు పరిచయమైన కవులలో తొలి పరిచయ కాలంలోనే నేను ‘అన్నా ‘ అని పిలిచిన అతి కొద్దిమంది కవులలో తెరేష్ ఒకడు! … తను కూడా ఎట్లాంటి అనవసర మర్యాదలు లేకుండా ‘విజయ్ ‘ అనే పిలిచాడు.  పరిచయమైన కొద్దికాలం లోనే మనుషులు దగ్గరి వాళ్లై పోయే గొప్ప మానవాంశ ఏదో తెరేష్ అన్నలో వుండేది !

తెలుగు కవిత్వం నిండా దళిత కవిత్వం పరుచుకున్న కాలంలో ఆ దళిత కవిత్వ జెండాని రెప రెప లాడించిన ఇద్దరు బాబుల్లో ఒకరు తెరేష్ బాబు అయితే మరొకరు మద్దూరి నగేష్ బాబు. అప్పుడప్పుడే హైదరాబాద్ కి వొచ్చి కవిత్వాన్ని సీరియస్ గా చదువుకుంటూ వున్న నాకు ఆ ఇద్దరి కవితలు, దళిత జీవితంలోని అవమానాలనీ, దళితులు సవర్ణ వ్యవస్థ పైన ప్రదర్శించే ధర్మాగ్రహం వెనుక వున్న నిత్య గాయాల పుళ్లనీ చిత్రిక కట్టాయి.  ముఖ్యంగా, తెరేష్ ఎంచుకున్న మార్గం కొంత విభిన్నం! …. కొన్ని తరాల పాటు తనని అవమానాల పాలు చేసిన ఈ సవర్ణ వ్యవస్థ సిగ్గుతో చితికి బిక్క చచ్చి పోయేలా చేయడానికి ఉపయోగించవలసిన సాధనం ‘తిట్లూ – శాపనార్థాలూ ‘ కాదనీ, పోలీసు దెబ్బల్లా పైకి మరకలేవీ కనిపించకుండా కొట్టాలంటే అందుకు పదునైన వ్యంగ్యమే సరైనదని అతడు భావించినట్టు తోస్తుంది. అతడి చాలా కవితలు ఎంతో కసితో రాసినట్టు తెలిసిపోతూ వుంటుంది.  ఎవరో గాట్టిగా తంతే పెద్ద సింహాసనం ముక్కలు ముక్కలై గాల్లోకి ఎగిరిపోతున్నట్టుగా వుండే ‘అల్పపీడనం‘ కవర్ పేజి ఇందుకు మంచి ఉదాహరణ! తన ‘నిశానీ’ కవితా సంకలనం లో బూతులు యధేచ్చగా దోర్లాయని ఫిర్యాదులు వొస్తే, ‘కమలా కుచ చూచుకాల్లో / వేంకటపతికి అన్నమయ్య పట్టించిన సురతపు చెమటల్లో / నీకు బూతు అగుపడదు ‘ అని దూకుడుగా జవాబు చెప్పిన కవి తెరేష్ !

తెరేష్, తెలుగు భాష పైనే కాదు – ఉర్దూ పైన కూడా మంచి పట్టు వున్న కవి. ముఖ్యంగా పాత హిందీ సినిమా పాటలు, గజల్స్ అంటే తనకు ఎంతో యిష్టం. తనదైన శైలిలో అద్భుతమైన దళిత కవిత్వం మాత్రమే కాదు – సగటు టి వి ప్రేక్షకులని ఉర్రూతలూగించిన సీరియల్స్ కూడా రాసాడు. అంతేగాక గొప్ప గాయకుడు. తెలుగులో తాను రాసిన గజల్స్ లో ‘నీ ప్రేమలేఖ చూసా – నే గాయపడిన చోటా ‘ కి వున్న అసంఖ్యాకమైన అభిమానులలో నేనూ ఒకడిని! … ఆ మధ్యన ఎక్కడో కలిసినపుడు ఆ గజల్ టెక్స్ట్ కావాలని అడిగితే గుర్తు పెట్టుకుని మరీ పేస్ బుక్ లో ‘విజయ్ – ఇది నీకోసం’ అని పోస్ట్ చేసాడు.

మరీ ముఖ్యంగా, తెలంగాణ ఉద్యమానికి తెరేష్ తన కవితల ద్వారా యిచ్చిన సపోర్ట్ మరిచిపోలేనిది. తెలంగాణ ఉద్యమానికి మద్దతుగా సీమాంధ్ర కవులు తెచ్చిన కవితా సంకలనానికి పెట్టిన పేరు ‘కావడి కుండలు‘, తెరేష్ రాసిన కవిత శీర్షిక నుండి స్వీకరించినదే ! …. పార్లమెంట్ లో తెలంగాణ బిల్లు ముందుకు సాగే క్రమంలో తెలంగాణ కు వ్యతిరేకంగా జరిగిన కుట్రలను హేళన చేస్తూ పేస్ బుక్ లో క్రమం తప్పకుండా ‘విభజన గీత’ శీర్షికతో తెరేష్ పోస్ట్ చేసిన పద్యాలు / వ్యాఖ్యానాలు పెద్ద హిట్ ! చాలా మంది తెలంగాణ కవులలో కూడా లుప్తమైన గొప్ప రాజకీయ పరిజ్ఞానంతో అప్పుడు జరిగిన సంఘటనల వెనుక దాగిన కుతంత్రాలని తన విభజన గీత పద్యాలలో విప్పి చెప్పాడు!

కొంతకాలంగా తెలుగు కవిత్వంలో ‘దళిత కవిత్వం ఎక్కడుంది ?’ అని ఒక ఫిర్యాదు వుంది. నగేష్ , తెరేష్ , యువక లాంటి కవులని అభిమాంచిన నా లాంటి వాడికి కూడా ‘ఉధృతంగా సాగిన దళిత కవిత్వం పూర్తిగా మందగించింది. అచ్చమైన దళిత కవిత్వం రాయగలిగిన తెరేష్ లాంటి కవులు విస్తృతంగా రాయడం లేదు’ అన్న ఒక ఫిర్యాదు వుంది. తనకు ఆరోగ్యం బాగోలేదని తెలిసి, ఐదు నెలల క్రితం ఇంటికి వెళ్లి పలకరించినపుడు… ఈ ఫిర్యాదుని తన ముందు పెడితే, ‘నేను మళ్ళీ విజ్రుంభిస్తా!’ అని తనదైన శైలిలో గొప్ప ఆత్మ విశ్వాసంతో చెప్పాడు. అతడే కాదు … నా లాంటి మిత్రులు చాలా మందిమి విశ్వసించాము … కాదంటే, ఆశపడ్డామేమో ?! …. ఇంతలోనే ఇట్లా జరిగిపోయింది !

ఈ నేల మీది కొన్ని లక్షల మంది దళిత వాడల తల్లులు ఎన్నెన్ని పురిటి నొప్పులు పడితే, ఆ వాడల అవమానాల గాయాలని గానం చేసే, వాడలలో సృష్టించే అల్ప పీడనంతో ఊళ్ళ లోని సింహాసనాలని కూల్చి వేసే,  ఒక తెరేష్ లాంటి కవి జన్మిస్తాడు. ఆ దళిత వాడల అపురూప ఆస్తి కదా అతడు! ….ఇంకా చేయవలసిన యుద్ధాలు ఇన్నేసి మిగిలే వున్నా, ఇట్లా తొందర పడి, ఈ నేలని విడిచి వెళ్ళిపోయే హక్కుని ఆ కవికి ఎవరిచ్చారు ?

కోడూరి విజయకుమార్    

ఫోటో: కాశిరాజు   

 

నీడ భారం


vijay

నేను మీ ముందుకు వొచ్చినపుడల్లా
నా లోపలి నీడ ఒకటి
నన్ను భయపెడుతూ వుంటుంది
ఈ నీడ ఎక్కడ మీ ముందు పడి
నన్ను అభాసుపాలు చేస్తుందో అని
అపుడపుడూ కంగారు పడుతుంటాను

నీడ చిక్కటి చీకటి లాంటి నీడ
రంగులు మార్చుకునే రాకాసి నీడ
తన అస్తిత్వాన్ని గుర్తించినపుడల్లా
నాకు మరింత భారంగా పరిణమించే నీడ

నీడ బయట కదా కనిపించేది
అని మీరంటున్నారు గానీ
నేను చెప్పేది నా లోపలే తిరుగాడే నీడని గురించి
అందు వలన చేత అది మీకు కనిపించదు లేక,
మీకది కనిపించకుండా నేను జాగ్రత్త పడతాను

ఈ నీడ ఇలా నాలో ఎప్పుడు జొరబడిందో మరి ?

నా పసితనపు అమాయకపు రోజుల్లో
నాలో స్ఫటిక స్వచ్చమైన నాకు తప్ప
మరే చీకటి నీడకీ స్థానం లేని జ్ఞాపకం
పెరిగే కొద్దీ నీడలేవేవో కమ్ముకుని ఇపుడిలా
నేనొక నీడకు ఆవాసమై వుంటాను

అప్పుడప్పుడూ
ఏ ఒంటరి గదిలోనో ఒక్కడినే వున్నపుడో, లేక,
వీధి కుక్కలూ , నేనూ తప్ప
మరొక జీవి యేదీ మేల్కొని వుండని ఏ అర్థరాత్రో
ఈ నీడ నాలో జడలు విప్పి నాట్యమాడుతుంది

1540514_505395279575961_1379096292_o

* * * * *

ఈ నీడని పూర్తిగా వొదిలించుకుని
నా పురా స్ఫటిక స్వచ్చ తనంతో
మీ ముందుకు రావాలనే నా ప్రయాస అంతా!

సరే గానీ
మీ లోపలి నీడ
మీకెపుడైనా తారస పడిందా ?

–      కోడూరి విజయకుమార్

painting: ANUPAM PAL

ఇంద్రధనుసుపై ఎగిరిన సీతాకోక ఒకటి

 

కోడూరి విజయ్ కుమార్

కోడూరి విజయ్ కుమార్

 

ఒక పరిమళమేదో అపుడపుడూ అల్లుకుంటుంది

పరిమళమే కాదు … పరిమళాన్ని పంచిన

పూల చాటు ముళ్ళ గాయాలు  కూడా

 

ఒక ఉత్సవ గీతమేదో వెంటాడుతుంది  అపుడపుడూ

ఉత్సవగీతమే  కాదు ….

గీతాలాపన నడుమ దొర్లిన అపశ్రుతులూ

జీర పోయిన విషాదాలూ తరుముతాయి

2

మరిచిపోయాననే   అనుకుంటాను

లోపలెక్కడో పదిలంగా ఒక నేలమాళిగలో

నిన్ను పడేసి, పెద్ద తాళం వేసి

హాయిగా వున్నాననే అనుకుంటాను

 

నిజానికి హాయిగానే వున్నాను కదా

నేను తప్ప మరో లోకం లేని

ఒక స్త్రీ సాంగత్యంలో సుఖంగానే వున్నాను కదా

మరి, దేహాంతర వాసంలో తూనీగ  వలె  ఎగిరే

అప్పటి నీ జ్ఞాపకాన్ని దోసిట్లోకి

తీసుకుని పలకరించేది యెలా ?

3

మీ వీధి మలుపు తిరిగినపుడల్లా

నీవు అప్పటి రూపంతో ఎదురైనట్టే వుంటుంది

కొన్ని నవ్వుల్ని నాకు బహుమతిగా ఇచ్చేందుకు

నీవు మీ పాత ఇంటి గుమ్మం లో

నిలబడి ఎదురు చూస్తున్నట్టే వుంటుంది

 

కళ్ళతో కళ్ళని కలిపే ఇంద్రజాలమేదో తెలియక

కొన్ని పొడి పొడి మాటల తీగ మీద

ఒడుపుగా నిలబడలేక ఓడిపోయిన రోజులవి

 

4

జీవితం తెగిన వంతెనలా వెక్కిరించి

నన్ను పూర్తిగా ఓడించ లంఘించిన రోజుల్లోనే కదా

వంతెన చివర ఇంద్ర ధనుసులా నువ్వు మెరిసింది

 

మబ్బుల ఆకాశం పైన రంగుల ఇంద్ర ధనుసు

నిలిచే ఉండునని భ్రమసిన అమాయక రోజులవి

ఇంద్ర ధనుసు అదృశ్యమయినాక

సాగిన ప్రయాణమొక దుర్భర జ్ఞాపకం

butterfly-2

5

ఈ గడ్డి పోచల గూడులో ఒక

నిప్పుని రాజేసి నీవు నిశ్శబ్దంగా కనుమరుగయ్యాక

తగలబడిన గూడుతో ఒక్కడినే

రాత్రులని కాల్చేసిన రోజులవి  ….

 

అప్పుడే కదా తెలిసింది

దేవదాసు మధువు దాసుడెందుకు అయింది

ఇదంతా నీకు తెలిసి వుండక  పోవొచ్చు

తెలిసినా ఒక నిర్లక్ష్యపు చూపు విసిరి వుండ వొచ్చు

6

ఏం చేస్తూ వుంటావని అనుకుంటాను కాసేపు

ఎవరమైనా ఏం చేస్తూ వుంటాము ?

 

సూపర్ మార్కెట్లలో సరుకులు కొంటూ

సరుకులుగా మారిన మనుషుల రణగొణ ధ్వనుల

నడుమ తల తెగిన కోడిపిల్లలా కొట్టుకుంటూ

రంగుల పెట్టెల్లో, అంతర్జాలలో

మనల్ని మనం కోల్పోతూ

ఇంటి పనీ, బైటి పనీ అని అలసిపోతూ ….

 

ఒకనాడు నీ ఊహల్లో కాలిపోయిన గూటిలో

ఇవాళ కొన్ని సరదా ఊహలు

7

ఒక వర్షాకాలపు సాయంత్రం నేను

నా స్త్రీ వొడిలో తల పెట్టుకుని

లోకపు ఆనందాన్నంతా ఒక్కడినే లాగేసుకున్నపుడు

చల్ల గాలిలో తేలి వొచ్చే కిషోర్ పాట

పరిమళమై నన్ను ఆక్రమించుకుంటుంది –

 

‘యే షామ్ కుచ్ అజీబ్ హై …

వో షామ్ భీ అజీబ్ థీ ‘

 

నేను జీవిస్తోన్న ఇప్పటి రోజులే కాదు

తొలిసారి నేనొక రంగుల సీతాకోకనై

ఇంద్రధనుసుపై  ఎగిరిన

అప్పటి రోజులూ అపురూపమే

–      కోడూరి విజయకుమార్

తెలంగాణా కవులు/ రచయితలూ ఇపుడేం చేయాలి?

 

(చిత్రం: అన్నవరం శ్రీనివాస్)

(చిత్రం: అన్నవరం శ్రీనివాస్)

యివాళ్ళ తెలంగాణ రచయితలు ఒక చౌరస్తాలో నిలబడి ఉన్నారు. గత దశాబ్ది కాలంగా తెలంగాణ రచయితలు, తెలంగాణ అస్తిత్వాన్ని, విముక్తి, స్వేచ్చా స్వాతంత్ర్యాకాంక్షలను, ప్ర్రత్యేక రాష్ట్ర  ఆకాంక్షలను యెలుగెత్తి చాటారు. తమ రచనల్లో – పాట, కవిత్వం, కథ, నవల, సాహిత్య విమర్శ – అన్ని సాహితీ ప్రక్రియల ద్వారా ప్రధానంగా  వారు చాటింది ఈ ఆకాంక్షలనే! అయితే కేవలం ప్రత్యేక రాష్ట్ర ఆకాంక్ష్లని మాత్రమే చాటితే తెలంగాణ సాహిత్యం రాజకీయ ప్రచార సాహిత్యం మాత్రమే అయి ఉండేది. కానీ గత దశాబ్దంన్నర కాలంగా తెలంగాణ రచయితలు సృష్టించిన సాహిత్యం ప్రత్యేక రాష్ట్ర ఆకాంక్షను మాత్రమే కాకుండా,  అనేక విషయాలని తడిమింది.

ముందుగా తెలంగాణ రచయితలు తమ అస్తిత్వాన్ని కనుక్కొన్నారు. తెలుగు భాష, సంసృతి, సాహిత్యం మొత్తం కూడా యెట్లా ఆంధ్ర ప్రదేశ్ లోని కొన్ని జిల్లాలలోని కొన్ని సామాజిక వర్గాల  వారి గుప్పిట్లోనే ఉండిపోయి, వారు రాసిందే సాహిత్యం, వారు మాట్లాడిందే భాష, వారిదే అసలైన సంస్కృతి అనే పద్దతిలో చలామణీ అయిందో, ఈ క్రమంలో మిగతా వెనుకబడ్డ ప్రాంతాల వారి సాహిత్యం, భాష, సంస్కృతుల లానే తాము కూడా యెట్లా అణచివేతకు గురయ్యారో, అయితే తాము గురయిన అణచివేత కు ప్రత్యేక చారిత్రిక కారణాలూ, ప్రత్యేక సందర్భమూ యెట్ల్లా ఉన్నయో గుర్తించారు. నిజానికి ప్రజా సాహిత్యం లో ప్రజల భాషకు పెద్ద పీట వేసినప్పటికీ , మాండలిక భాష అంటూ తెలంగాణ భాషకున్న ప్రత్యేక అస్తిత్వాన్ని, చారిత్రిక నేపథ్యాన్ని ప్రగతిశీల వాదులుగా చెప్పుకుంటున్న వారు కూడా   గుర్తించ నిరాకరించారో, తెలంగాణ రచయితలు బట్టబయలు చేసారు. తెలంగాణ లో మరుగున పడ్డ అనేక గొప్ప సాహిత్యకారులను, వారు సృష్టించిన సాహిత్యాన్ని వెలికి తీసారు. సాహిత్య విమర్శకు కొత్త తెలంగాణ దృష్టిని దృక్కోణాన్ని అందించి పదునెక్కించారు. గత తెలుగు సాహిత్య చరిత్రనూ దృక్పథాలను తెలంగాణ దృక్పథంతో వినిర్మాణం చేసి సాహిత్య చరిత్రనూ, సాహిత్య విమర్శనూ తిరగ రాసారు. కొత్త తెలంగాణ సాహిత్య శకాన్ని సృష్టించారు.

అట్లే తెలంగాణ ప్రజా జీవితంలో, సంస్కృతిలో, చరిత్రలోని అనేక అంశాలని వెలికితీయడమే కాకుండా , కొత్తగా కనుగొన్నారు, సూత్రీకరించారు, సిద్ధాంతీకరించారు . దీని వెనుక – తెలంగాణ సాహిత్యకారులు తమ సాహిత్య చరిత్రను (గత చరిత్రనూ, నడుస్తున్న చరిత్రనూ)   పునర్నిర్మించడానికీ, పునర్లిఖించడానికీ,  వినూత్నంగా కనుక్కోవడానికీ (discover ), “కేవలం తెలంగాణ దృష్టీ దృక్పథమూ మాత్రమే ప్రధానం”  అనే ‘సంకుచితంగా’ కనబడుతున్నట్ట నిపించే భావన ఆలంబన ఐంది. ‘సర్వే జనా సుఖినోభవంతు’ నుండి ‘ప్రపంచ కార్మికులారా యేకం కండి”  నుండి, ‘రైతాంగ ఆదివాసీ విముక్తి పోరాటాలు వర్దిల్లాలి’ నుండి ఒక ప్రాంతీయ వాద దృక్పథానికి సాహిత్యంలో localized outlook కీ, expression కీ ప్రయాణించారు తెలంగాణ రచయితలు.

అయితే ఈ ప్రయాణానికి తెలంగాణ ఉద్యమ  చారిత్రక సందర్భం యెంత దోహదపడిందో , తాము తెలంగాణ సమాజపు అనేక దశల్లో సాధించిన పరిణామాలు, పరిణతీ, acquire చేసుకున్న చారిత్రిక అనుభవమూ, జ్ఞానమూ అంతే దోహదపడ్దాయి. యేదీ సమాజంలో చరిత్ర లేకుండా ఊడిపడదు కదా! అయితే కొన్ని సందర్భాల్లో తెలంగాణ రచయితలు ఒక తీవ్రమైన దృక్పథాన్ని అవలంబించి కొంత గత చరిత్రని నిరాకరించిన సందర్భమూ లేక పోలేదు. అచారిత్రికంగా అనిపించినా ఇది అన్ని అస్తిత్వ వాద ఉద్యమాల్లో మనకు సాధారణంగా కనబడే లక్షణమే! తమని తాము  నిర్మించుకునేందుకు, స్థాపించుకునేందుకు చాలా సార్లు పునాదుల్నీ, నేపథ్యాన్నీ పూర్తిగా నిరాకరించే ధోరణి సరైంది కాకపోవచ్చేమో కాని అసందర్భమూ అచారిత్రికమూ మాత్రం కాదు. ముఖ్యంగా ఒక ప్రాంతం విముక్తి కోసం పోరాడుతున్న ఉద్యమ నేపథ్యంలో, అన్ని రంగాల్లో  జరిగే assertions లో ఇది మనం చూస్తాం. అదే తెలంగాణ రచయితల్లో సాహిత్య విమర్శకుల్లో కూడా వ్యక్తమైంది.

ఐతే తెలంగాణ జీవితాన్ని అనేక సందర్భాల్లోంచి, అనేక పార్శ్వాలనుంచి, అనేక కోణాలనుంచి తెలంగాణ సాహిత్యం తెలంగాణ ఉద్యమ బీజాలు మొలకెత్తడం ప్రారంభించిన 1990 దశాబ్దం అర్ధ భాగం నుండే అద్భుతంగా ఆవిష్కరించడం ప్రారంభించింది. యే కాలంలో నైనా , యే స్థలంలో నైనా సాహిత్యం ఉద్యమం రాకని యెలుగెత్తే వైతాళిక పాత్ర పోషిస్తుంది అనేది తెలంగాణ విషయం లో అక్షర సత్యం. కథల్లో, నవలల్లో, కవిత్వంలో, మరీ ముఖ్యం పాటలో తెలంగాణ జీవితం లోని, చరిత్రలోని మున్నెన్నడూ వెలికిరాని ప్రతిఫలించని అనేక కొత్త కోణాలు ఆవిష్కరించబడ్డాయి. సాహిత్య విమర్శ కొత్త దృక్పథాలని ప్రకటించింది. ఐతే ప్రాంతీయ వాద అస్తిత్వ సాహిత్యమూ ఉద్యమంగా కనబడ్డా,  తెలంగాణ ఉద్యమమూ సాహిత్యమూ ప్రధానంగా ప్రపంచంలోని బడుగు దేశాలనీ, ప్రాంతాలనీ, ప్రజలనీ ముంచెత్తి వేసిన ప్రపంచీకరణకు ధీటుగా తన అస్తిత్వాన్ని నిలబెట్టి,  సవాలు చేసి, ప్రత్యామ్నాయంగా ఒక కొత్త సామాజిక నమూనాని ప్రకటించి, తన వనరులని తానే అనుభవించగలిగే రాజ్యనియంత్రణ, అధికారమూ కోసం చేసిన, చేస్తున్న  ఒక గొప్ప చారిత్రిక యుద్ధం ! యెలుగెత్తిన ప్రజాగ్రహ ప్రకటన! ఇందులో తెలంగాణ రచయితలు గొప్ప చారిత్రిక పాత్రను పోషించారు. పోషిస్తున్నారు. యిట్ల్లా ప్రపంచవ్యాప్తంగా ముందుకొచ్చిన అస్తిత్వ ఉద్యమాల్లో తెలంగాణ అగ్రభాగాన నిలుస్తుంది, తెలంగాణ సాహిత్యమూ సాహిత్యకారులూ తెలంగాణ ఉద్యమానికి జెండాలై రెప రెప లాడుతారు.

యివాళ్ళ తెలంగాణ రచయితలు ఒక చౌరస్తాలో ఉండడానికి కారణం తెలంగాణ ప్రస్తుతం ఎదుర్కొంటున్న సంధి దశ!

ఒక వైపు కేంద్రంలో అధికారం లోనున్న ఒక ప్రధాన జాతీయపార్టీ అనేక సంవత్సరాల జాప్యం తర్వాత ప్రజా ఉద్యమాల పెను ఉప్పెనల ఒత్తిడికీ, మరుగుతున్న తెలంగాణ ప్రజాగ్రహానికి జడిసి, యెడతెరపిలేకుండా కొనసాగుతున్న తెలంగాణ యువకుల ఆత్మబలిదానాలకు తలవంచి తెలంగాణ రాష్ట్రాన్ని ప్రకటించింది. అయితే ఇప్పటిదాకా యెక్కడుందో కూడా తెలియని సమైక్యాంధ్ర ఉద్యమం తెలంగాణ రాష్ట్రాన్ని ప్రకటించిన మరుక్షణమే ప్రత్యక్షమై నాటినుండి నేటి దాకా అనేక కుట్రలూ, కూహకాలతో కేంద్రప్రభుత్వం మీద వత్తిడి పెంచి వచ్చిన తెలంగాణ రాష్ట్రాన్ని వెనక్కి నెట్టివేయాలని రాజకీయ పార్టీలకు అతీతంగా సీమాంధ్ర పెత్తందార్ల నాయకుల కనుసన్నల్లో నడుస్తూ చేతననంతగా ప్రయత్నించినస్తున్నది. తిరిగి 2009 డిసంబర్ ను పునరావృతం చేయాలని శాయశక్తులా కుట్రలు పన్నుతున్నది. అందుకే తెలంగాణ రచయితల మీద బాధ్యత నాలుగు రెట్లవుతున్నది.

నారాయణస్వామి వెంకట యోగి

నారాయణస్వామి వెంకట యోగి

ఒకటి: గతంలో లాగే (వీలయితే ఇంకా ఉధృతంగా) తెలంగాణ అస్తిత్వం నిలుపుకునే సాహిత్యం సృష్టిస్తూ పోవడం,

రెండు: వచ్చిన తెలంగాణ యేదో ఒక రాజకీయ పార్టీ అనుగ్రహిస్తేనో, దయాదాక్షిణ్యాల భిక్షలాగానో రాలేదని అది తెలంగాణ ప్రజా ఉద్యమాల వల్ల, ఆత్మ బలిదానాల వల్ల వచ్చిందనీ స్పష్టంగా గుర్తెరిగి దానిని కాపాడుకునే దిశగా ఉద్యమ సాహిత్య సృష్టి చేయడం,

మూడు: జరుగుతున్న సమైక్యాంధ్ర ఉద్యమం స్పష్టంగా సీమాంధ్ర పెత్తందార్ల , దొపిడీ దార్ల నాయకత్వంలో వారి ప్రయోజనాలకోసం సాగుతున్న ఉద్యమమనీ దానికి నిజంగా సీమాంధ్ర ప్రజల ప్రయోజనాలు యెంతమాత్రమూ పట్టవనీ (నిజంగా సీమాంధ్ర ప్రజల ప్రయోజనాలే ప్రధానమై ఉంటే శ్రీకాకుళం నుండి అనంతపూర్ దాకా ప్రజలని పట్టి పీడిస్తున్న అనేకానేక సమస్యలమీద ఉద్యమం జరిగి ఉండేది) కేవల హైదరాబాదుని గుప్పిట్లో పెట్టుకోవాలని చూస్తున్న  రాజకీయార్థిక శక్తుల ప్రయోజనాలే ముఖ్యమనీ  యెలుగెత్తి చాటాలి.

నాలుగోదీ ముఖ్యమైనదీ – ఇప్పుడు పెత్తందార్ల కనుసన్నల్లో జరుగుతున్న సమైక్యాంధ్ర ఉద్యమం కుట్రపూరితంగా  తెలంగాణా ప్రజలకూ, సీమాంధ్ర ప్రజలకూ మధ్య సృష్టిస్తున్న తీవ్రమైన వైషమ్యాలనూ, వైమనస్యాలనూ రూపుమాపేందుకు, తిరిగి సామాన్య తెలుగు ప్రజల మధ్య స్నేహపూరిత సుహృద్భావ వాతావరణాన్ని సృష్టించేందుకు పూనుకోవాలి. ఈ పని రచయితలే చేయగలరు.

బాధ్యత సీమాంధ్ర రచయితలమీదా ఉన్నప్పటికీ, ప్రధానంగా ఈ ప్రయత్నానికి నాయకత్వం వహించాల్సింది తెలంగాణ రచయితలే! యిరు ప్రాంతాల తెలుగు ప్రజల మధ్య ఒకరి హక్కులను ఒకరు, ఒకరి స్వేచ్చను యింకొకరు, ఒకరి వాటాను యింకొకరు, ఒకరి అభివృధ్ధిని యింకొకరు, ఒకరికొకరు భంగం కలుగకుండా గౌరవించుకుని facilitate చేసుకుని, పంచుకునే ప్రజాస్వామిక వాతావరణాన్ని నెలకొల్పే అత్యవసర కర్తవ్యానికి  తెలంగాణ రచయితలు పూనుకోవాలి. ఈ పని యిరు ప్రాంతాల రాజకీయ పార్టీలు వాటి నాయకులూ చెయ్యరు – అందుచేత దీనికి తెలంగాణ రచయితలే పూనుకోవాలి! అప్రజాస్వామిక వలస  పాలకులనీ, అన్ని రంగాల్లో  వారి అంతర్వలసీకరణ ఆధిపత్య ఆజమాయిషీ కుట్రలనీ యెట్లా ఐతే వ్యతిరేకించి తిప్పికొట్టడానికి పదునైన సాహిత్యాయుధాలని సృష్టించారో, అట్లే యిరుప్రాంతాల ప్రజలు విడిపోయి సఖ్యంగా ఉండేందుకు, విభజన సృష్టించే అభద్రతలను పోగొట్టేందుకు, విభజన తర్వాత పంపకాలు ప్రజాస్వామ్యయుతంగా జరిగేందుకు, యిరుప్రాంతాల ప్రజల్లో ఉన్న ప్రజాస్వామిక సంస్కృతినీ , ఆకాంక్షలను కలిసికట్టుగా నిలబెట్టేందుకు తెలంగాణ రచయితలు పెద్ద యెత్తున పూనుకోవాలి – నాయకత్వం వహించాలి! యీ క్రమంలో సీమాంధ్ర ప్రాంతపు రచయితలను ప్రజాస్వామ్యయుతంగా కలుపుకుని పోవాలి. విడిపోయి కలసి ఉండే ఒక సాంస్కృతిక వారధి నిర్మించాలి.

అంతే కాదు – విభజన జరింగితర్వాత జరిగే సాహిత్య, సాంస్కృతిక పునర్నిర్మాణానికి అవసరమయ్యే ఒక్కొక యిటుకరాయినీ యిప్పట్నుంచే సమకూర్చుకోవడమూ ప్రారంబించాలి! అందు కోసము అవసరమైన భవిష్యత్తు దృష్టినీ , నిర్మాణాత్మకమైన దృక్కోణాన్నీ దృక్పథాన్నీ అభివృద్ధి చేయాలి. అంటే యిప్పటిదాకా చేస్తూ వచ్చిన వినిర్మాణాన్ని కొనసాగిస్తునే కొత్తని ప్రయత్న పూర్వకంగా నిర్మించే చారిత్రిక దృష్టిని సమిష్టిగా యేర్పర్చుకోవాలి.

– నారాయణస్వామి వెంకట యోగి

index

———————————————————————-

తెలంగాణా కవులు నిశ్శబ్దంగా వున్నదెపుడని?

ప్రస్తుత పరిస్థితులలో ఈ ప్రశ్నని ఎలా స్వీకరించాలన్నదే మొదటి సవాలు –

‘తెలంగాణా ప్రజల స్వప్నం’ సాకారమవుతోన్న వేళ ‘తెలంగాణా కవులు ఇపుడేం చేయాలి?’ అన్నదే అడిగిన వారి ఉద్దేశ్యమైతే నేనందుకు సిద్ధంగా లేను –

ఇంకా సవాలక్ష సందేహాలున్నాయి …

గతానుభవాలు మిగిల్చిన నమ్మక ద్రోహపు గాయాల సాక్షిగా, తెలంగాణా రాష్ట్ర సాకారం కల ‘ సంపూర్ణంగా’ నిజమైతే తప్ప, తెలంగాణా ప్రజలెవరూ నమ్మడానికి సిద్ధంగా లేరు-

ప్రజాకవి కాళోజీ మాటల్లోనే చెప్పాలంటే- “ప్రజలూ – నేనూ కలిసి ప్రజల్లో ఒకనిగా ‘నా గొడవ’ బద్మాశులైన పాలకులకు చెబుతున్నాను”

కాబట్టి, తెలంగాణా రాష్ట్ర కల ఇంకా సాకారం కాలేదు కాబట్టి, తెలంగాణా కవులు తెలంగాణా ని తర  తరాలుగా  ఎలా గానం చేస్తూ వొస్తున్నారో ఆ పనిని ఇక ముందూ కొనసాగిస్తారు …

ఆ మాటకొస్తే, తెలంగాణా కవులు నిశ్శబ్దంగా వున్నదెపుడని? ….

కోడూరి విజయ్ కుమార్

కోడూరి విజయ్ కుమార్

తెలంగాణా సాయుధ రైతాంగ పోరాట కాలంలో ప్రజల చేతిలో శక్తివంతమైన గేయాలనీ/కవితలనీ పెట్టి వాళ్ళని సాయుధులని చేసి, తాము కూడా స్వయంగా ఆ పోరాటం లోకి దిగిన కాళోజీ, సుద్దాల హనుమంతు లాంటి కవులు ఎందరో ?

అనంతర కాలంలో తెలంగాణా భారత దేశం లో విలీనమైన తరువాత కూడా భూస్వాముల/దొరల ఆగడాలను ప్రతిఘటిస్తూ సాగిన అద్భుత ప్రజా ఉద్యమాలనూ, ఆ ఉద్యమాలను అణిచివేసే క్రమంలో ప్రభుత్వాలు తెలంగాణా పల్లెలని రణభూములుగా, మరుభూములుగా మార్చి వేసినపుడు కూడా చెరబండరాజు, వరవర రావు, జ్వాలాముఖి, సిద్దారెడ్డి, అలిశెట్టి ప్రభాకర్, దర్భశయనం లాంటి కవులు గొప్ప కవిత్వాన్ని సృజించారు.

ఇక గద్దర్, గోరటి వెంకన్న లాంటి తెలంగాణా  ప్రజా వాగ్గేయకారుల గురించి ప్రత్యేకంగా చెప్పేదేముంది? …. బహుశా, తెలంగాణా ప్రజా ఉద్యమాలతో కలిసి నడిచిన గత చరిత్ర వల్లనే అనుకుంటాను, మలి  దశ తెలంగాణా ఉద్యమంలో ‘పాట’ తరువాత,  తెలంగాణా కవిత్వమే ముందు వరుసలో నిలబడి ఉద్యమానికి బాసటగా నిలిచింది-

కాబట్టి, ఇంకా తెలంగాణా కల సాకారం కాలేదు గనుక, తెలంగాణా కవులు ఇప్పటిదాకా తాము పోషిస్తూ వొచ్చిన పాత్రనే మరింత శక్తివంతంగా పోషిస్తారు. ‘పోషించాలి’ అనే మాట ఎందుకు వాడడం లేదంటే, తెలంగాణా కవులు ఇప్పటి దాకా పోషించిన పాత్రని ఎవరో ఆదేశిస్తేనో / సలహా యిస్తేనో పోషించలేదు. తిరిగి కాళోజీ మాటనే తీసుకుంటే, తెలంగాణా కవి తన ప్రజా సమూహపు గొంతునే వినిపించాడు ఏ కాలంలోనైనా!

‘తెలంగాణా కవులు ఇపుడేం చేయాలి?’ … అనే ప్రశ్నని మరో విధంగా స్వీకరిస్తే … అంటే, ఒక వేళ తెలంగాణా కన్న కల సంపూర్ణంగా సాకారమైతే ….. అప్పుడు తెలంగాణా కవులేం చేయాలి?

ఒక్క కవులు మాత్రమే అని ఏముంది? …. ఆలోచనా పరులైన పౌరులు ఎవరైనా తెలంగాణా రాష్ట్రం ఏర్పడిన తరువాత, ఏ అన్యాయాలని సరిదిద్ద వలసి వున్నదని తెలంగాణా ఉద్యమించిందో ఆ దిద్దుబాట్ల ప్రక్రియ నిజాయితీగా జరుగుతున్నదీ, లేనిదీ జాగరూకతతో గమనించాలి. సాటి మనుషుల పట్ల, సమాజం పట్ల బాధ్యతతో మెలిగే పౌరులకు కవిత్వ కళ కూడా వుంటే, సమాజంలోని అసమానతలని  చూస్తూ ఏమీ ఎరగనట్లు సాక్షీ భూతులుగా పడి వుండ  లేరు … రేపటి తెలంగాణా లో కవులు అసలు ఉండలేరు.

బహుశా, ప్రజాకవి కాళోజీ లా “దోపిడి చేసే ప్రాంతేతరులను /దూరంగా తన్ని తరుముదాం /ప్రాంతం వారే దోపిడి చేస్తే /ప్రాణాలతో పాతరేస్తం ” అని మరొక యుద్ధ దుందుభి మోగిస్తారు!

అయితే, కవిత్వం ఒక కళ … కవులెవరైనా పనిగట్టుకుని, అది తెలంగాణ కోసమైనా, మరొక దాని కోసమైనా, కవిత్వం రాస్తే అది మిగలదు. ప్రజల ఉద్యమాలతో, వాళ్ళ సమస్యలతో మమేకం అయిన వాళ్ళు  స్పందించకుండా ఉండలేరు  … కవిత్వం చేయగల శక్తి వున్న  వారు ఆ వేదనని కవిత్వ రూపంలో వ్యక్తం చేస్తారు … అంతే  తేడా!

తెలంగాణా ఏర్పడిన తరువాత కవులు/రచయితలు చేయవలసిన పని, మిగతా వాటి సంగతి ఎలా వున్నా, ఒకటి మాత్రం వుంది అనిపిస్తుంది. కారణాలేమైనా, కారకులెవరైనా ప్రస్తుతం తెలుగు మాట్లాడే ప్రజల మధ్య ఒక భయానక అమానవీయ వాతావరణం కమ్ముకుని వుంది. బహుశా, కాలక్రమంలో ఒక మానవీయ వాతావరణాన్ని సృష్టించేందుకు ముందుగా తెలంగాణా కవులు చొరవ తీసుకోవలసి వుంది-

తెలంగాణా ఏర్పడినా, ఏర్పడక పోయినా ఎపుడేమి చేయాలన్న సంగతి తెలంగాణా కవులకు ఎవరూ చెప్పవలసిన అవసరం లేదనే అనుకుంటున్నాను …

ఎందుకంటే, “పరిస్థితులేట్లా వున్నాయని కాదు …. పరిస్థితులలో మనమెట్లా ఉన్నామని?” అన్న కాళోజీ లాంటి తెలంగాణా వైతాళికుల మాట ఒకటి వారికి ఎప్పుడూ దారి చూపిస్తుంది –

 

కోడూరి విజయకుమార్ 

హైదరాబాద్ – 17 సెప్టెంబర్ 2013

(చిత్రం: అన్నవరం శ్రీనివాస్)

(చిత్రం: అన్నవరం శ్రీనివాస్)

————————————————————————————

సాహిత్య చరిత్ర నిర్మాణం జరగాలి

ఆరుపదుల పైబడిన ఉద్యమంలో ఈ  ప్రత్యేకరాష్ట్రకల సాకారమవడానికి ఇప్పుడు అతిదగ్గరలో ఉంది తెలంగాణా. ఈ కాలంలోనే రాష్ట్ర సాధన చివరిపేజీలోనించే ఓ భవిష్యత్ దర్శనం కావాలి. నిజానికి గత దశాబ్దిని “తెలంగాణా సాంస్కృతిక పునరుజ్జీవన దశ”గా అభివర్ణించుకోవలసిన అవసరం ఉంది.

తెలంగాణా సంస్కృతి, సంప్రదాయం,జీవితం సమైక్య రాష్ట్రంలో నిరాదరణకి , అణచివేతకి గురయ్యాక ఉద్యమంతో సాధించుకున్న ఫలాలు నిండుగ కనిపిస్తున్నాయి. గతంతో పోలిస్తే తెలంగాణా కవులు,కళాకారులు,మేథావులు భాష పట్ల ఈకాలంలో ఎక్కువ శ్రద్దని కనబరిచారు.ఇది పొక్కిలి,మత్తడి మొదలైన సంకలనాలతో పాటు మునుం వరకు కూడా కవిత్వంలో ఒక ప్రధాన పరికరంగా జీవధారలా సాగుతుంది.

ఎం. నారాయణ శర్మ

ఎం. నారాయణ శర్మ

ఈ కాలాన్నించి గతకాలపు అనుభవాలను దృష్టిలో పెట్టుకుని భవిష్యత్తరానికి గతాన్ని ఎలా అందించాలనేది ఇప్పుడాలోచించ వలసిన సమయం. తెలంగాణా సాహిత్యం ,చరిత్ర,భాష  రేపటి తరానికి అందడానికి ఏంచేయాలనేది ఇప్పుడాలోచించ వలసిన అంశం.

అందుకోసం రూపొందించవలసిన ప్రధాన అవసరాలు భాషాచరిత్ర,సాహిత్య చరిత్ర,నిఘంటువు.తెలుగులోనే అధికశాతం నిఘంటువులు సాహిత్యనిఘంటువులే.ప్రజా సమూహంలో ఉన్నభాషని నిఘంటువు రూపంలోకి తేవాలి. గతంలో వచ్చిన  నలిమెల భాస్కర్-“తెలంగాణా పదకోశం”, రవ్వా శ్రీహరి “నల్ల గొండ జిల్లా ప్రజల భాష”కొంత మేరకు ఈ అవసరాన్ని తీరుస్తాయి.కాని ఇది ఇంకా విస్తృత రూపంలో రావాల్సిన అవసరం ఉన్నది.

తెలంగాణా భాషకుండే ప్రత్యేక లక్షణాలను బట్టి సాహిత్య , ఔపయోగిక,మౌఖిక,జాన పద ధోరణులనుండి , కళలనుండి వర్ణం , పదం, వాక్యం మొదలైన స్థాయిల్లో భాషనిర్మాణాన్ని విశ్లేషించుకోవాల్సిన అవసరం ఉంది.ఇందుకోసం ఒక భాషా చరిత్ర కావాలి.

సుమారు ఆరువందల సంవత్సరాలు సుల్తానుల పరిపాలనలో ఉన్నా, రాజ భాష మరొకటైనా అవసరాల మేరకు ఆ పదజాలాన్ని తనలో సంలీనం చేసుకుంది కాని తన ఉనికిని కోల్పోలేదు.దేశీ మాధ్యమంగా ఉండటం వల్ల ద్రవిడ జాతుల ప్రభావమూ ఎక్కువే.ఆయా మార్గాలనించి భాషని విశ్లేషించు కోవల్సిన అవసరం ఉంది.

తెలంగాణాలో జానపద,మౌఖిక  సాహిత్యంతో పాటు లిఖిత సాహిత్యం అధికమే. వీటన్నిటినీ బయటికి తేవడమే కాక అన్ని ప్రక్రియలను సమగ్రంగా చిత్రించ గల, అన్ని వాదాలను సమూలంగా నిర్వచించ గల”సాహిత్య చరిత్రను “అందించ గలగాలి.ఈ క్రమంలో తొలిదశలో తెలంగాణ రచయితల వేదిక తీసుకొచ్చిన కథా సంకలనం గాని, ఆతరువాత వచ్చిన “నూరు తెలంగాణా కథలు”గాని గమనించ దగినవి. ఈ మార్గంలోనే  సాహిత్య చరిత్ర నిర్మాణం జరగాలి.

తెలంగణ లోని సాహిత్య మూర్తుల జీవితాలను రానున్న తరాలకు అందించేందుకు వారి ఆదర్శ జీవితాలను చిత్రించాల్సిన అవసరముంది.చరిత్ర రచన రచయితల బాధ్యత కాకపోయినా  గతంలో వచ్చిన ఒకే ఒక తెలంగాణా చరిత్ర (సుంకి రెడ్ది నారాయణ రెడ్డి)రచయితలందించిందే.ఈ అవసరం దృష్ట్యా మరింత లోతైన పరిశీలనలు జరగాలి. మతాలకతీతంగా జరిగే పండగల గురించి ,సంస్కృతి సంప్రదాయాల గురించి అందించ గలగాలి.

ఈ క్రమంలో రచయితలు గతానికంటే ఎక్కువగా శ్రమ పడాల్సి వస్తుందనేది సత్యమే అయినా కాపాడుకొని, సాధించుకున్న దానిని తరువాతి తరాలకు అందించ వలసిన అవసరమూ ఉంది.

              -ఎం.నారాయణ శర్మ

 

నాలో బయటిలోకం కల్లోలమే ఎక్కువ!

60051_703360903013918_1420695648_n

  ‘అనంతరం’  నేపథ్యం గురించి ఎవరైనా అడిగితే, కొంచెం తటపటాయిస్తాను. 

కారణం, ‘అనంతరం’ వివిధ సందర్భాలలో నేను రాసుకున్న  కొన్ని  కవితల సమాహారం కావడమే! …

‘అయితే, అందులోని కవితల నేపథ్యమే చెప్పు’ అని వొకరిద్దరు మిత్రులు మారు అడిగితే, సరే, యిదేదో యిక తప్పేట్టు  లేదని  ఈమధ్య ఒక సారి పుస్తకం తెరిచి ఒక సారి మళ్ళా కవితలని చదువుకున్నా !

ఈ క్రమం లో నాకొక విషయం మరో సారి  అర్థం అయింది … నేను చాలా బద్ధకస్తుడినని  … కనీసం, రాయడం విషయం లో !…1997 లో నా మొదటి పుస్తకం ‘వాతావరణం ‘ వొస్తే, 2000 లో రెండవ పుస్తకం ‘ఆక్వేరియం లో బంగారు చేప’, తిరిగి పదేళ్ళ తరువాత, 2010 లో  ఈ ‘అనంతరం’ వొచ్చాయి. ఈ మూడు సంపుటాలలో కలిపి మొత్తం కవితలు 100 కూడా లేవు . నిజంగానే రాయలేదా అంటే, ప్రపంచం ముందు ప్రదర్శనకు పెట్టిన దానికన్నా, నాకే నచ్చక వొదిలేసినవో /చించేసినవో  ఎక్కువ.

చుట్టూ వున్న సమాజం , రాజకీయాలు, హేతుబద్ధంగా వ్యవహరించని మనుషులూ వగయిరా నన్ను ఎక్కువగా డిస్టర్బ్ చేస్తాయి. కాబట్టి, అంతర్లోక కల్లోలాలు, ఉల్లాసాలు వగయిరా కన్నా ఈ అంశాలే నా కవిత్వం లోకి చొరబడతాయి అని భావిస్తున్నాను. నిజానికి మన దైనందిన జీవితంలో కూడా జరుగుతున్నది అదే కదా!

నా మూడో పుస్తకం కాళోజీ సోదరులకు అంకితం ఇవ్వాలని ముందే అనుకున్నాను . ఒక ముఖ్య కారణం, ఒక నలుగురి నడుమ రాసుకున్న పద్యాన్ని చదివి, దాని బాగోగులకు సంబంధించిన చర్చ లో పాల్గొనడం, తద్వారా, రాసిన దానిని ఎడిట్ చేసుకోవడం అనే ఒక మంచి అలవాటు నాకు కాళోజి  సోదరుల ‘మిత్ర మండలి’ నుండి  అబ్బింది-

ఇక పుస్తకం పేరు గురించి ఆలోచించినపుడు , అంతకు ముందు రాసి పెట్టుకున్న ‘అనంతరం’ కవిత జ్ఞాపకం వొచ్చింది . మిత్రులు కూడా బాగుందన్నారు . ‘అనంతరం’ కవిత ఆజాద్  ఎన్ కౌంటర్ నేపథ్యం లో రాసింది . ఆ సంఘటన నన్ను బాగా డిస్టర్బ్ చేసింది . బహుశా, ఆజాద్ వరంగల్ రీజినల్ ఇంజనీరింగ్ కాలేజీ విద్యార్థిగా ఉంటూ ఉద్యమం లోకి వెళ్లిపోయాడని వినడం కావొచ్చు. తదనంతర కాలంలో నేను అక్కడే చదువుకోవడం కావొచ్చు. ఒక్క  రీజినల్ ఇంజనీరింగ్ కాలేజీ అనే కాదు, వరంగల్ మెడికల్ కాలేజీ నుండి కూడా ఆ కాలంలో ఎంతో మంది ఉద్యమం లోకి వెళ్లిపోయారని మా నాన్న చెప్పేవారు . . వెలుగు జిలుగుల సౌకర్యవంతమైన జీవితాన్ని ప్రసాదించే చదువుల్ని తృణప్రాయంగా వొదిలేసి , దిక్కులేని ప్రజల కోసం జీవితాన్ని ఫణంగా పెట్టి ఉద్యమం లోకి వెళ్ళిపోవడానికి ఏమీ కాని సామాన్యులైన మనుష్యుల పట్ల ఎంత గొప్ప ప్రేమ వుండాలి?

2001 నుండి ప్రారంభిస్తే 2010 లో ‘అనంతరం’ వెలువడే వరకు నేను గడిపింది, మహా నగరంలో స్థిరపడిన ఒక   సగటు మధ్య తరగతి జీవితం … అంటే, ఇప్పుడేదో భిన్నమైన జీవితం గడుపుతున్నానని కాదు . సహజంగానే మహా నగర జీవితంలో ఎదురయ్యే ఆకర్షణలు, ప్రతిరోజూ తప్పనిసరిగా మహా నగర రహదారుల మీద జరపవలసిన నరక యాత్రలూ , స్నేహితులని క్రమం తప్పకుండా కలవాలని ఎంత బలంగా వున్నా కుదరనీయని నిస్సహాయతలూ  లాంటివి అన్నీ కవిత్వం లోకి చొచ్చుకొచ్చాయి . అలా రాసినవే, ‘నగరంలో పద్యం మరణిస్తుంది’, ’40 ఇంచుల కల’, ‘జలపాశం’, ‘నగర జీవితమూ-శిరచ్చేదిత స్వప్నాలూ ‘ , ఒక మహానగర విషాదం’ లాంటివి –

 vijay

అంతకు క్రితం రెండు సంపుటాలకూ , ఈ ‘అనంతరం’ కు  నడుమ నా వ్యక్తిగత జీవితానికి సంబంధించినంతవరకూ  ఒకటుంది . అది,  రెండవ కవితా సంకలనం తరువాత, ‘కుటుంబ రావు’ ని అయిపోవడం! పెళ్లి తరువాత ఒక విషయం నాకు స్పష్టంగా బోధపడింది . స్త్రీ వాద దృక్పధాన్ని కలిగి వుండడం చాలా  సుళువు , ఆ దృక్పధాన్ని ఆచరణలో పెట్టి సంసారం చేయడం చాలా కష్టం!

ఇంటిపనీ, అంట్ల పనీ పంచుకోవడం , కబుర్లు చెప్పినంత సుళువు  కాదు . సరే, ఈ సొంత గొడవని పక్కన పెడితే, స్త్రీ వాద కవిత్వం విషయంలో నాకొక చిన్న ఫిర్యాదు ఏమిటంటే, అది  ఆధునిక కాలంలో స్త్రీ-పురుష సంబంధాలకు సంబంధించి ఒక స్థాయి దగ్గరే ఆగిపోయింది . ఆధునికానంతర  కాలంలో వివక్ష చాలా సంక్లిష్ట రూపాలలో ఇంకా కొనసాగుతోంది  అనీ, దానిని స్త్రీ వాద కవిత్వం శక్తివంతంగా పట్టుకోలేదనీ నా అభిప్రాయం . బహుశా ఇన్ని ఆలోచనల నడుమా, కొంత నా సొంత గొడవ నడుమా పుట్టిందే ‘ ఒక ఆధునికానంతర మగ దురహంకార పద్యం’

మరొక సంగతి-ఈ దేశం లో  ప్రస్తుతం అత్యంత సంక్షోభం  లో వున్నది మధ్య తరగతి. దానికి సంబంధించిన బాధలు, ఆకర్షణలు  కవిత్వం లోకి పెద్దగా రాకపోవడానికి కారణం ఏమిటి? అందులోనూ, ఈ మధ్య తరగతి ఎదుర్కొంటోన్న ఆర్ధిక పరమైన ఇబ్బందులు, అందులోని కొత్త పద బంధాలు వగయిరా కవిత్వం లోకి ఎందుకు రాలేదు? … ఇలాంటి ఆలోచనలేవో సుప్త చేతనావస్థలో వుండడం వల్ల  అనుకుంటాను , 40 ఇంచుల ఎల్సిడి  టీవీ   నన్ను తన వలలో వేసుకున్న రోజుల్లో ’40 ఇంచుల కల’ రాసాను.

‘అనంతరం’ లో తెలంగాణా ఉద్యమ నేపథ్యం లో రాసిన కవితలు రెండు వున్నాయి. ఒకటి, ‘బాల్య మిత్రుడి ఫోన్ కాల్’, రెండవది , ‘కొంతకాలం తరువాత కొన్ని కొత్త ప్రశ్నలు’. వరంగల్ లో సకలజనుల సమ్మె ఉధృతంగా సాగుతున్న కాలంలో అక్కడ వున్నా నా బాల్య మిత్రుడు రోజూ నాకు కాల్ చేసి ఆ విశేషాలు చెప్పేవాడు . ఆ నేపథ్యం లో నుండి రాసింది  ‘బాల్య మిత్రుడి ఫోన్ కాల్’.

ఇక రెండవ కవిత నేపథ్యం  మా ఇల్లే! … ఒక ప్రాంతం తనకు జరిగిన అన్యాయాలకు పరిష్కారం ‘రాష్ట్ర ఏర్పాటు’ తప్ప మరొకటి కాదు అని నిశ్చయించుకుని పోరాడుతున్న నేపథ్యం లో ‘ప్రాంతం’ అనేది కులం / మతం అనే వాస్తవాలను మించిన అంశమా?… భారతదేశం లాంటి దేశం లో ఇది సాధ్యమేనా?… నన్ను బాగా బాధపెట్టిన ఈ అంశమే ఈ ‘కొంతకాలం తరువాత కొన్ని కొత్త ప్రశ్నలు’ కవిత నేపథ్యం!

 -కోడూరి విజయకుమార్