హేమంతం గోధుమ రంగు ఊహ

 
వసంత లక్ష్మి
 
హేమంతంలో ఆకులు 
నేలపై గోధుమ రంగు ఊహలా 
పరచుకుని ఉన్న రోజున 
సూది మొన లాంటి కర్ర పట్టుకుని 
ఒక్కో ఆకూ గుచ్చుతూ 
తోటమాలి  తిరుగుతూ ఉంటాడు …
 
కాలం అంతే నిర్దాక్షిణ్యం గా 
ఒక్కోక్షణంలో గుచ్చిగుచ్చి ఎన్నుకుంటుంది నిన్ను 
నా వంతు తప్పింది అని 
గుండెలపై చేయి వేసుకోవు నీవు 
ఏం జరుగుతోందో నీకు 
తెలియదు అంత అజ్ఞానివి నీవు .
 
ఆకుపచ్చగా 
పైలాపచ్చీసుగా గాలికి ఊగుతావు 
నీ కొమ్మన ఓ పూవు పూసిందని 
మురుస్తావు … పూలూ మాయం అయిపోతాయి 
అయినా ఆ బాధే లేదు నీకు 
 
కాండం నాకు అండ 
అని గర్వంగా ఎగురుతావు 
హేమంతం చెప్పాపెట్టకుండా తటాలున
ఆకు మొదలుని తుంచితే 
ప్రకటనలుండవు ..అంతా ప్రతీకార చర్యలే 
ఏ తప్పు చేసావో అని 
విచారణా ఉండదు , ఆకాశంతో ముచ్చట్లాడుతూ 
మరుక్షణంలో నేల మీద పడి ఉంటావు 
నీ ఆక్రోశం ఎండి గలగలమని 
ప్రతిధ్వనిస్తుంది . 
 
ఒక్క కణం అగ్ని చాలు 
ఖాండవ దహనానికి అన్నట్టు , 
నేల పడిన ఆకులని ఇంక 
మంట పెట్టాల్సిందే అని ఎవరో 
ఒకరు పిలుపు నిస్తారు ..
 
గోధుమ రంగుగా 
మారినప్పుడే నీ అంతం ప్రారంభం అయింది 
ఇంకా తెలుసుకోలేవా ? 
ఇంకా జవాబు కావాలా ? 
 
వసంతం అదిగోఆ మలుపునే 
ఆగి ఉంది  సమయం రానీ మరి ..
*
vasanta lakshmi