ఒక పాఠక దృక్కోణంలో… కథా రచన!

Book

 – కె.వి.కరుణా కుమార్

~

 

ఈ పుస్తకం మార్చి 20, ఆదివారం నా చేతికొచ్చింది. పూర్తి పుస్తకాన్ని నాలుగు పనిదినాల ఒత్తిడి మధ్య పూర్తి చేశాను. ఉదయం, మధ్యాహ్నం, రాత్రి, ప్రయాణంలో, ఎవరి కోసమైనా వేచి చూస్తున్నప్పుడు, ఎప్పుడు సమయం దొరికితే అప్పుడు. ఇది ఏకబిగిన చదవగలిగే పుస్తకం కాదని ఖదీర్‌బాబు అన్నారు. కానీ అలా అనిపించలేదు. ఈ పుస్తకాన్ని ఏకబికిన చదవొచ్చు. అల్మైరాలో దాచుకుని ప్రతీ పదిరోజులకూ ఓసారి మొత్తం చదువుతూ ఉండొచ్చు. లేదా పోటీ పరీక్షలకు తయారయ్యేవారిలా ఒక్కో అధ్యాయాన్ని చదువుతూ ఆకళింపు చేసుకుంటూ అవసరమైనపుడు మననం చేసుకుంటూ చదవొచ్చు.

అంతగా పదిలపరుచుకోదగిన అపురూప రచన ఇది.

అయితే ఇదంతా కథలు రాసేవాళ్లకేనా? నాలాంటి పాఠకుడికి ఇందులో ఏమీ లేదా? ఉంది.  ఖచ్చితంగా ఇది పాఠకుడి కోసం కూడా. ప్రతి మనిషీ కథకుడే. కనీసం తన స్వంత కథనైనా అతడు రాయగలడు.  దానిని నలుగురూ చదువుకునేలా రాయించడానికి అవసరమైన తర్ఫీదు కోసమే ఈ పుస్తకం రాశారేమో అని కూడా అన్పిస్తుంది. ఒక సాధారణ పాఠకుడిగా ఈ పుస్తకం  పూర్తి చెయ్యగానే నాకు బలంగా అన్పించిన విషయాలు మూడు.

మొదటిది:

ఎప్పుడో రాయటం ఆపేసిన చెయ్యికీ, రాయించే బుర్రకూ మళ్లీ ఏదైనా రాయాలని బలంగా అన్పించేలా ఈ పుస్తకం చేస్తుందని. ఉదాహరణకు నా సంగతే చూడండి. నేనేమీ రచయితను కాను. ఎప్పుడూ రచనలు చేయలేదు. బ్రతుకు బండిని లాగటానికి గుండెల్లో ఉన్న కాస్త చెమ్మనీ, భావుకత్వాన్ని కప్పిపెట్టి నిరంతరం అమ్ముతూ…. కొంటూ.. తాకట్టు పెడుతూ… తాకట్టుగా ఉంటూ నలిగిపోయే కాంక్రీటు జీవిని. నాలాంటి వాడికి కూడా ఏదైనా రాయాలనిపించేలా చేయటం ఈ పుస్తకపు మొదటి గొప్పతనం. అందుకే ఆలస్యం చేయకుండా ఇది రాయటం మొదలుపెట్టాను. ప్రారంభం ఏదైనా మంచిదే కదా!

రెండవది:

ఇది మన తల్లినో తండ్రినో ఒక గొప్ప శ్రేయోభిలాషినో గుర్తు చేస్తుందని కూడా అనిపించింది. నా వరకైతే ఈ పుస్తకం ఆద్యంతమూ నా తండ్రిని గుర్తుచేసింది. ఖదీర్‌బాబు ఈ పుస్తకాన్ని రాసిన విధానం ఒక తండ్రి- కొడుకు వేలు పట్టుకుని నడుస్తూ మంచీ చెడ్డలు మాట్లాడుతున్నట్లుంది. మా నాన్న కూడా ఇలాగే. కొన్ని వెన్నెల రాత్రులు… కొన్ని చీకటి రాత్రులు… ఆరు బయట ఆకాశాన్ని చూస్తూ పక్కపక్కనే పడుకుని ఇద్దరం మాట్లాడుతూ ఉండేవాళ్లం. ఆయన కథలు, పద్యాలు చెప్పేవారు. ఊ… కొట్టుకుంటూ ఆయన చెమట వాసనను పీలుస్తూ, గట్టిగా వాటేసుకుని నిద్రపోయిన ఆ రోజుల్ని పుస్తకాన్ని చదువుతున్నంతసేపు గుర్తుచేశాడు ఖదీర్‌బాబుగారు. పుస్తకం అంతా ఒక తండ్రి కొడుకునో కూతుర్నో వేలు పట్టుకుని నడిపిస్తూ ఓర్పుగా వివరిస్తూ ఉన్నట్లుంది. స్థిరంగా మన అడుగు పడేవరకు నేర్పించటమే అతని ఉద్దేశ్యం. ఆ నడకతో నువ్వు శిఖరాన్ని అధిరోహిస్తావో, పాదయాత్ర చేస్తావో, తాగి బజారులో తూలుతూ నడుస్తావో అతడికనవసరం. నడకను నేర్పించటమే అతని పని.

ఇక మూడవది:

దాహం… అన్యాయమైన దాహం. వెంటనే తీర్చుకోలేని దాహం. ఈ దాహం అందరికీ కలిగేలా చేస్తుందని ఈ పుస్తకం చదివితే బలంగా అనిపించింది. ముఖ్యంగా  ‘కథలెందుకు రాస్తారు’, ‘మంచి ప్రారంభాలు – గొప్ప ముగింపులు’, ‘కథలెప్పుడు రాస్తారు’, ‘థీమ్-ప్లాట్’ ఇలాంటి అధ్యాయాల్లో ఇంతవరకు నేనెరుగని, చదువని సాహిత్యకారుల్నీ, కథలనూ పరిచయం చేస్తూ, ఆ కథలను అసలు కథలంత బలంగా తిరిగి చెప్తూ, ఊరిస్తూ ఉంటే వాటన్నింటినీ ఇప్పటికప్పుడు చదివేయాలనీ అన్ని పనులనూ ఒక సంవత్సరం పాటు ఆపేసి, ఆ పుస్తకాలన్నీ కొనుక్కుని, దొరకనివి ఎక్కడ దొరుకుతాయో కనుక్కుని ఏకబిగిన దీక్షగా చదువుతూ ఆ ప్రపంచంలో మునిగిపోవాలన్నంత దాహం వేయటం ఈ పుస్తకం చదువుతుండగా కలిగిన ఇంకో భావన.

saranga6

ఖదీర్‌బాబు ఈ పుస్తకం రాసి నాలాంటోడికి చాలా మేలు చేశాడు. మిడిమిడి జ్ఞానం, ఉడికీ ఉడకని అవగాహన ఉన్న నాలాంటి పాఠకుడికి ప్రపంచ కథాసాహిత్యం వైపు కుతూహలం రేకెత్తించాడు. అట్టను చూసి పుస్తకాలను నిర్లక్ష్యం చేసిన నా చవుకబారు తెలివితేటలను అపహాస్యం చేశాడు. రాసేవాళ్లకు సరే… కానీ చదివేవాడికి కూడా బోలెడు తాయిలాలు ఈ పుస్తకంలో…

 

 మచ్చుకు… మెచ్చుకు… కొన్ని. నేను ఇష్టపడినవి!

* ‘కథలెవరు రాస్తారు?’ అధ్యాయంలో ‘ప్రతీదానికి చిలువలు, పలువలుగా ఊహించుకుంటూ ఉండాలి’ అని మొదలుపెట్టి ‘తర్వాతి పేరా అప్పటికే సిద్ధమైపోయి ఉంటుంది’ అని ముగించే ఓ పేరా ఉంటుంది. అది చదువుతూ ఉంటే పెదవులు మెల్లగా విచ్చుకుని మందహాసంగా మొదలై, ఫక్కున నవ్వటం మీరు చేయకపోతే నన్నడగండి.

* అదే అధ్యాయంలో ‘రాత్రి శ్వాస సోకితే చాలు ఆయువు వదిలేసి రాలిపోయే పూల మృత సౌందర్యాన్ని పరికిస్తూ’అని మనలో భావుకత్వం ఏ స్థాయిలో ఉండాలో వివరిస్తాడు రచయిత. మృత సౌందర్యం అనే ఆ పదాన్ని వాడినందుకు ఖదీర్‌బాబు వేళ్లను ముద్దాడాలనిపిస్తుంది.

* ‘అవంతీపుర రాజ్యాన్ని విక్రమవర్మ అనే రాజు పాలిస్తున్న రోజులవి’ అని మొదలెట్టి ‘వక్కాకు ఊంచి అరుగు మీద కూర్చున్నాడు గోవిందప్పా’ అని పాతకథలను గుర్తు చేస్తూ ఏకబిగిన నోస్టాల్జియాను కళ్ల ముందు మెరిపిస్తాడు. ఒక్క క్షణం గిర్రున కాలం వెనక్కు వెళ్తుంది.  పక్కింట్లో, ఎదురింట్లో, రెండు వీధుల తర్వాత ఉన్న మేనత్తగారి ఇంట్లో, షావుకారు కొట్టు ముందుర, మంగలిషాపులో వేచి ఉన్నప్పుడు, ముత్యాల చెరువు గట్టుమీద గ్రంథాలయంలో దీక్షగా బాసింపట్టు వేసుకుని మర్రిచెట్టు గాలికీ, చెరువు పైనుంచి వచ్చే వింత వాసననూ పీలుస్తూ చదువుకున్న అన్ని పుస్తకాలు, రచయితలు వచ్చి పలకరించి వెళ్తారు. స్థలం మారొచ్చు. పాత్రలు మారొచ్చు. ఒక్కొక్కరికీ ఒక్కో నోస్టాల్జియా మాత్రం నిశ్చయం.

* ‘కథలెందుకు రాస్తారు?’ అధ్యాయంలో రచయిత మానసిక పరిస్థితినీ, కథా రచయితకుండే అవగాహనను, సమాజం పట్ల చిత్తశుద్ధినీ నిజాయితీగా ఆవిష్కరించాడు రచయిత. ‘అదొక పిచ్చి… సైకలాజికల్ ప్రాబ్లమ్’ అన్న పేరాను చదువుతూ ఉంటే దుఃఖం కలుగుతుంది. కళ్లల్లో నీటి పొర ఏర్పడుతుంది. ‘ఆలోచన… ఆలోచన… ఆలోచన’ అని ఒక వాక్యం ఉంటుంది. అదే పేరా కూడాను. ఆలోచనకు ఆలోచనకు మధ్యన పెట్టిన చుక్కల్లో మనస్సు చిక్కుబడిపోతుంది. ఆ చుక్కల్లో రచయిత పడే మానసిక ప్రసవ వేదన ప్రస్ఫుటంగా అర్థమవుతూ ఉంటుంది.

* ఒకే జానర్ లేదా ఒకే కాన్‌ఫ్లిక్ట్‌ను ముగ్గురు రచయితలు ఎలా రాశారో ‘పోత్తి చోరు’, ‘ఎస్తర్’, ‘సావుకూడు’ కథలను ఉదహరించినపుడు కరూర్ నీలికంఠ పిళ్లైకు, వణ్ణనిలవన్‌కు, బండి నారాయణ స్వామికి సాష్టాంగ నమస్కారం చేయాలనిపిస్తుంది. ఆ కథలు మనలోకి విసిరికొట్టే కథావస్తువు అలాంటిది.

ఇక ఎంత చెప్పినా తక్కువే అన్న విభాగం ఒకటుంది ఈ పుస్తకంలో. అది ‘ఫుట్ నోట్స్’.

ఎందరో రచయితలు, ఇంకెన్నో కథలు, మరిన్నో ప్రదేశాలు, చాలా జ్ఞాపకాలు, కాలంతో నిలబడిన, ఎదురొడ్డిన సాహిత్యం అన్నింటినీ సమగ్రంగా అధ్యాయం వారీగా ఆ వివరాలను ఫుట్‌నోట్స్‌లో పొందుపరిచిన ఖదీర్‌బాబు ఎలా రుణం తీర్చుకోగలం. ఎంత సాహిత్యం… ఎంతమంది కథకులు… ఎంత అదృష్టం. అంతా ఒకేచోట. ఒకే పుస్తకంలో. కథకుడికైనా, పాఠకుడికైనా ఈ పుస్తకం అదృష్టం. గొప్ప అదృష్టం. ఇది మామూలు విషయం కాదు. చాలా ఓపిక, తను చెప్పాలనుకున్నది చెప్పే తీరాలి అన్న పట్టుదల లేకపోతే అంత సమాచారం అంత పొందిగ్గా పొందుపరచటం దుర్లభం.

karmikulu

పుస్తకం అంతా ఒకటే తపన.

నువ్వు కథకుడివా, పాఠకుడివా నాకనవసరం. నాకు తెల్సిందీ తెలుసుకున్నదీ నీకు చెప్తున్నా… నిజాయితీగా ప్రయత్నిస్తున్నా.. బదులుకు నువ్వొక కథ రాయి, అది నీ కథైనా కావచ్చు. కుదరకపోతే ఒక మంచి ఉత్తరమైనా రాసి ప్రారంభించు.., కథ రాయాలని తాపత్రయపడేవాడికి ఈ పుస్తకమివ్వు… ఓనమాలు దిద్దటం నుంచి కాగితంపై గొలుసుకట్టు రాతను ధారగా రాయటం వరకూ ప్రస్తావించాను… నేర్చుకో… అని ఖదీర్‌బాబు మనల్ని సుతారంగా అభ్యర్థించాడని నాకనిపిస్తూ ఉంది.

‘విమర్శను ఎదుర్కోవటం అంటే ఇంకా మంచి కథ రాయటానికి ప్రయత్నించటమే’ అని చెప్తుందీ పుస్తకం. దానికి  సద్విమర్శను స్వీకరించకపోతే నువ్వూ, నీ కథ సంకనాకి పోతాయి అని కూడా హెచ్చరిస్తుందీ పుస్తకం.

ఇన్ని సంగతులు, జాగ్రత్తలు విపులంగా మనకెవరు చెప్తారు? తప్పటడుగులు వేయకుండా జాగ్రత్త పడమని ఎవరు బోధచేస్తారు? ఈ పుస్తకం ఇప్పుడేమవుతుందో తెలీదు. భవిష్యత్ రచయితలకు మాత్రం పాఠ్య గ్రంథంగా పనికొస్తుందని గట్టిగా అనిపిస్తోంది నాకు. చదివితే మీకూ అన్పిస్తుంది. నిజం.

*