అమ్మా! ఇదిగో నీ కుమారుడు

rafi

Art: Rafi Haque

 

అవునమ్మా!

నీ కొడుకే దొరుకుతాడు

హంతకుల చేతికి ఉరి తాడు

నిజమేనమ్మా !

నీ కొడుకు ఏం నేరం చేసాడని

పొట్టనపెట్టుకున్నారు ?

నీ విలాపాల వాక్యాల నిండా

నీ కడుపుకోత కనిపిస్తూనే వుంది

నీ గొంతు ఘోష లోంచి

అరణ్య హింస వినిపిస్తూనే వుంది

నీ కొడుకేమైనా

యువ రాజకీయ నాయకుడా

సినిమా కథా నాయకుడా

నిలువెత్తు  ఫ్లెక్సీలలో

నిలబడి కనబడడానికి

నీ కుమారుడేమైనా వీధి రౌడీ నా

నెంబర్ వన్  కేడీనా

బలిసిన మంత్రిగారి కుమారుడా

తెలిసిన కుర్రకారు కుబేరుడా

ఏం చేసాడని

మగత నిద్రలో మట్టుపెట్టారు

ప్లాస్టిక్ సంచిలో కలిపికుట్టారు

నీ కొడుకు మాన భంగం చెయ్యలేదే

నిర్భయ కేసులో  ఇరుక్కోలేదే

తాగి వాహనం నడపలేదే

కారు చక్రాల కింద ఎవరినీ చంపలేదే

బాల చంద్రుడిలాంటి వాణ్ణి

బలితీసుకున్నారు  కదా

నువ్వు నెత్తీ నోరు బాదుకొని

గుండె బావిలోంచి నెత్తుటి కన్నీళ్ళని చేదుకొని

ఎంత ఏడిస్తే మాత్రం

కొడుకొస్తాడా తల్లీ

వేట గాళ్ళ ఉచ్చుల్లో

ప్రాణం పోయిన పసికూన

రెండు పదులు దాటకుండానే

తెగిపోయిన అడవి వీణ

న్యాయం ఇక్కడ అమ్ముడవుతుంది

ధర్మం ధరకు లొంగిపోతుంది

దీన్ని ధిక్కరించిన వాడే  నీ కొడుకు

కొత్త సమాజం కోసం

గొంతెత్తిన వాడు

కొత్త సర్కారుని స్వప్నించిన వాడు

శిరీష కుసుమం లాంటి కుమారుణ్ణి కోల్పోయిన దుఖ్ఖితు రాలా

నిజంగా నీ కొడుకు

చనిపోలేదమ్మా!

అడవి తల్లి కడుపులో

దాచుకుంది చూడు

తునికాకు పచ్చదనంలో ఉన్నాడు

తుడుం మోతలో వున్నాడు

కొమ్ము బూర లో ధ్వనిస్తున్నాడు

తూర్పు వనంలో వికసిస్తున్నాడు

పాల పిట్టలా నవ్వుతున్నాడు

పూల బుట్టలా పరిమళిస్తున్నాడు

తేనె తుట్టె లో వున్నాడు

అగ్గి పెట్టెలో వున్నాడు

రేపటి వాగ్ధానం కోసం

వసంత కాల మేఘమవుతున్నాడు

భూమి పుత్రుల నాగేటి చాళ్ళ కోసం

రేపటి  భూపాల రాగమవుతున్నాడు

తట్టుకో తల్లీ

కడుపు ఒడిని పట్టుకో తల్లీ

రేపటి కాలం మరో కొత్త కొడుకుని ప్రసాదిస్తుంది

కొత్త ఉద్యమ సూర్యుణ్ణి ప్రసవిస్తుంది

కొత్త నక్షత్రమై ప్రభవిస్తుంది

×××××

 

ఆత్మ హత్యే ఆయుధమైన వాడు..

 

-ఎండ్లూరి సుధాకర్

~

 

అలంకారాలూ వద్దు

కళంక రాజకీయ రాద్ధాంతాలూ వద్దు

అనవసరమైన ప్రతీకలూ వద్దు

నిన్ను చంపిన హంతకులెవరు?

నీ నిండు ప్రాణాన్ని దోచిందెవరు?

దోషులెవరు? ద్రోహులెవరు?

నీ కోసం పరితపిస్తున్న

నీ దోస్తులెవరు?

శిబిరంలో అహోరాత్రాలు

శిలువెక్కిన ఆ క్రీస్తులెవరు?

వేద కాలం నుంచి

కేంద్రీయ వెలివాడ దాకా

ఎవరో ఒకరు మనల్ని మట్టు పెడుతూనే ఉన్నారు

ఉరి తీసి చెట్లకు వేలాడదీస్తున్నారు

కనబడని కత్తులతో నాల్కలు కోస్తున్నారు

కంటికి కనిపించకుండా

చెవుల్లో సల సల కాగే సీసం పోస్తున్నారు

నలందాలూ తక్షశిలలూ వారణాసులూ

మనకు నిషిద్ధ విశ్వవిద్యాలయాలు

అక్షరాలు రాకపోవడమే బావుండేదేమో

ఆ రోజుల్లో అంటరాని ప్రాణాలైనా దక్కాయి

ఆనాటి అమ్మలెంతో ధన్యులు

కనీసం పిల్లల్ని కళ్ళారా చూసుకున్నారు

ఈనాటి తల్లులెంతో వేదనా మూర్తులు

ఆధునిక వెలివాడల్లో

అక్షరాలా గర్భకోశాలు కోసుకున్నారు!

జింకల్ని లోపలేసి

పులుల్ని ఎగదోసి

శాంతి వచనాలు పలికే

ఏ రాజ్యమైనా క్షేమంగా ఉండదు

దోషులెంతటి దొరలైనా

ఏదో ఒక రోజు దొరకకపోరు

చరిత్ర పొడుగునా

అస్పృశ్య క్షతగాత్రుల ఆర్తనాదాలే

వేముల రోహితా!

వెంటాడిన మృత్యు మోహితా!

నీ బలిదానం

భారద్దేశాన్నే కాదు

ఈ ప్రపంచాన్నే విప్లవీకరించింది

నీ మరణం

అంబేద్కర్ నీలి విగ్రహాలకు

ఎరుపెక్కిన కొత్త ఊపిరి పోసింది

నీ ఉనికి

కునికే ఉద్యమాలకు

ఉరుకులెత్తే శక్తినిచ్చింది

ఇప్పుడు నీ తల్లి ఒంటరిది కాదు

కోట్లాదిమంది కొడుకులున్నారు

నీకోసం ఉద్యమించిన కూతుళ్ళున్నారు

పోరాట యోధుడా!

ఆత్మహత్య ఆయుధంతో

అంటరాని యుద్ధంలో

అమ్మ ముందే అమరుడవయ్యావు

మూలవాసుల ముద్దు బిడ్డా!

ఈ మనుచరిత్ర

నీ సమాధి ముందు

నిత్య దోషిలా తల వంచుకునే ఉంటుంది

రేపటి సూర్యుడు రోజులా కాకుండా

రోహిత్ లా ఉదయిస్తాడు!

 

*

 

వర్గీకరణ  వ్యథ 

 ఎండ్లూరి సుధాకర్ 

 

”వర్గీకరణ పేరిట

నోరెత్తితే నాలుక కోస్తాం

నామ రూపాలు లేకుండా చేస్తాం

ఏ పార్టీ అయినా

ఏ నాయకుడికైనా ఇది తప్పదు ”*

ఈ మాటలు

తూటాలు పేల్చే ఉగ్ర తాలిబాన్లవి కావు

దళితుల తలలు నరికే అగ్ర సైతాన్లవి కావు

మా వాళ్ళవే

మాలో వాళ్ళవే

‘కావడి కుండల్లా కలిసుందాం

అన్నదమ్ముల్లా విడిపోదాం’

అన్నవాళ్లవే

ఇంగిత జ్ఞానం

ఇంగ్లీషు జ్ఞానం వున్న వాళ్ళవే

‘బుద్ధి’స్టులు  పచ్చి టెర్రరిస్టుల్లా మాట్లాడుతున్నారు

దయతో న్యాయం చెప్పండి మీరైనా

నాలుగు ముద్దల్ని

నలుగురం పంచుకుందామంటాము మేము

కాదు కుండ మాకే కావాలంటారు వాళ్ళు

మేము ఇప్పుడిప్పుడే చదువుకుంటున్నాం

మాకు మెరిట్ వుంది పోటీ పడమంటారు వాళ్ళు

ఈ పంతం పంతుళ్ళ ముందు ఏమైందో గానీ

 మా అంతం చూసే దాకా వదిలి పెట్టడం లేదు వాళ్ళు

ఏమడిగాం మేము  ఎ బి సి డి లే కదా

ఎవరి మానాన వాళ్ళం బతుకుదామనే కదా

ఎంగిలి మెతుకుల కోసం

ఎగబడుతుంటే ఏం చేయాలో చెప్పండి

ఈనాటిదా ఈ కథ ?

కామధేనువుని కోసుకు తిన్నప్పటినుంచి

కయ్యం కాలు దువ్వుతూనే వుంది

మెత్తని చియ్యలు వాళ్ళు తిన్నారు

ఉత్త ఎముకలు మాకు మిగిల్చారు

చెప్పుకుంటే సిగ్గుపోతుంది కానీ

చెప్పకుంటే ద్రోహం మిగుల్తుంది

ఏ జాంబపురాణమో విప్పండి

జాతిపితలు నిజాలు చెప్తారు

సూటిగా అడుగుతున్నాను

 సోదరులారా! నిజం చెప్పండి

ఏనాడైనా

ఒక పాకీ మీలోకి నడిచి వచ్చాడా ?

మీతో చేతులు కలిపి

ఐక్యవేదికపై  పూలమాలై వికసించాడా ?

ఏ రోజైనా

ఒక గోసంగి గోస విన్నారా ?

ఎడారిలాంటి  కుల బిడారులో

ఒక గొడారిని కలుపుకున్నారా ?

ఏ హోదా లేని స్మశానంలో

జీవచ్చవంలాంటి  కాపరిని కన్నారా ?

ఏ ఒక్కరైనా మీ పక్కన ఉన్నారా ?

నిజమే సుమా !

‘సంచారమే ఎంతో బాగున్నది’

ఒక్క సంచార జాతి వాడైనా

మీ పంచన నిలబడ్డాడా ?

తెల్లటి బట్టలతో కనబడ్డాడా ?

ఏ రెల్లి చెల్లైనా

మీ వేదిక మీద గొంతు వినిపించిందా  ?

ఏ డక్కలి పిల్లైనా నీలిజెండాతో కనిపించిందా?

ఎక్కడ వినిపిస్తాయి సమైక్యతా రాగాలు?

ఎప్పుడు వెదజల్లుతాయి

మల్లె మాలల పరాగాలు ?

ఈ శతాబ్దపు పెద్ద అబద్ధాలు

ఒకటి సమైక్యత

రెండు ఐక్యవేదిక

కడుపు కోసుకుంటే కాళ్ళ మీద పడుతుంది

మేము తలలు వంచుకుని

వేల సంవత్సరాలుగా చెప్పులు కుడుతూనే వున్నాం

ఒక్క సారి తలెత్తే సరికి

ఎక్కడికో చేరిపోయారు

ఎస్కిమోల్లాగా మేము మంచు గుహల్లో  వుంటే

ఎస్కలేటర్ల మీద

 పార్లమెంటుకు తరలిపోయారు కదా

ఏరోజైనా మాకు బోధించారా ?

మమ్మల్ని సమీకరించారా ?

పోరాటాలకు బాటలు వేశారా ?

రెప్ప పాటులోనే తెప్ప తగలేశారు కదా

చూస్తూ ఉండగానే రిజర్వేషనంత ఎత్తుకి ఎదిగి పోయారు

ఒక్కొక్కరి చేతిలో ఒక్కొక్క అమృత భాండం

మా చేతుల్లో ఖాళీ కుండలు

ఒక సుదీర్ఘ నిద్ర తర్వాత

ఒక కొత్త సూర్యోదయం తర్వాత

దండోరా ధర్మ ఘంటికలు మోగిస్తే

కడుపు కాలి మాట్లాడితే

కన్నీటి నాల్కల మీద

కారం చల్లుతారా ?

ఆకలి బతుకుల మీద

మేకులు కొడతారా ?

బువ్వ తినాల్సిన వారసుల్ని

భ్రూణ  హత్యలు చేస్తారా ?

కలిసి ఉందాం

కలిసి తిందాం అంటే

కత్తులు దూస్తారా ?

నాల్కలు కోస్తారా ?

ఒక్కసారి బాబా సాహెబ్

చూపుడు వేలు వైపు చూపు సారిస్తారా !

అంబేద్కర్ సాక్షిగా

వర్గీకరణ రథాన్ని

ముందుకు తీసుకెళ్లమంటున్నాడు

మీరూ వస్తారా ఆనందంగా రండి

ఉపకులాలతో  బాధిత గళాలతో

హస్తిన వైపు రథాన్ని మళ్ళిద్దాం !

ఏదో ఒక రోజు ఎర్రకోటలో

నీలిపతాకం ఎగరక పోదు !

[ ఆంధ్ర జ్యోతి : *మార్చి 28న ఏలూరులో జరిగిన ‘మాలల సింహగర్జన’ సభలో కారెం శివాజీ వ్యాఖ్యలు ]

అక్షరం ఆత్మహత్య చేసుకోదు

images
అన్నా!పెరుమాళ్ మురుగన్ 
రచయితగా మరణించానన్నావు 
అక్షరాల అస్త్ర సన్యాసం చేశానన్నావు 
ఇంకెప్పుడూ కలాన్ని ముట్టుకోనన్నావు 
రాసిన పుస్తకాలను వెనక్కి రప్పించుకున్నావు 
ఆవేదనతో అజ్ఞాతంలోకి వెళ్ళిపోతానన్నావు 
అన్నా!కన్నీటి మురుగన్
నీ ఆర్తికి ఏ రాతి వర్ణాల 
కరకు గుండెలు కరుగున్ 
ఏ రాజ్యం నీ భావ జాలం వైపు ఒరుగున్? 
అన్నా!పెరుమాళ్ !
నీ ఉదంతం ఈ ప్రపంచానికొక పెను సవాల్ 
ఈ మట్టి మీద రచయితగా గిట్టడమంటే 
సరస్వతీ పుత్రుడు బతికిన సమాధి కావడమే
 వాల్మీకి వ్యాసుల  స్వేచ్చకు వాస్తవంగా నీళ్ళు ఒదలడమే  
రచయితగా పుట్టడమంటే 
కలం చుట్టూ కత్తులు కట్టుకోవడం 
భావాల చుట్టూ కవచాలు పెట్టుకోవడం 
ఒక్క మాటలో చెప్పాలంటే 
మృత్యువు భుజాల చుట్టూ 
శాశ్వతంగా శాలువా కప్పుకోవడం 
అందరం మనుషులమే 
కానీ మనుషులందరూ ఒక్కటి కాదు 
గంగాజలం ఒకటే కానీ 
మునిగి లేచే వాళ్ళంతా ఒక్కటి కాదు 
దుర్మార్గులు వర్ధిల్లే దేశంలో 
నీలాంటి వాళ్లకు చోటు లేదు 
ఎంత మంచి వాడవన్నా 
ఎంత మెత్తటి వాడవన్నా 
చెప్పుతో కొట్టినట్టు 
ముఖాన ఖాండ్రించి ఉమ్మేసినట్టు 
నువ్వు ప్రకటించిన నిరసన 
నీ వర్ణ శత్రువుల సరసన 
ఖచ్చితంగా నీకు పెద్ద పీటే వేసి వుంటుంది 
ఎంత క్షోభ పడకపోతే 
ఎంత మనసు గాయపడక పోతే 
అంత నిర్ణయం తీసుకున్నావు
అంత నిర్దయగా కలం రెప్పలు మూసుకున్నావు 
ఈ ప్రపంచంలో రచయితంటే 
​​
చీకటి కళ్ళకు చూపిచ్చే  సూర్యోదయం
అధర్మంపై ఆగ్రహం ప్రకటించే అగ్ని పర్వతం
అభాగ్యులపై కరుణ కురిపించే వెన్నెల జలపాతం
అన్నా!మురుగన్ 
ఆయుధాలకు భయపడే రోజులు పోయాయి 
ఇప్పుడు అక్షరాలకు జడుసుకునే రోజులొచ్చాయి 
మన అలిశెట్టి ప్రభాకర్ చెప్పినట్టు
‘మరణం నా చివరి చరణం కాదు’
అన్నా! మన కల నెరవేరింది 
నువ్వు రచయితగా మరణించలేదు 
మరణించింది నీ శత్రు మూకలు 
నువ్వు అక్షరాలా అమరుడివి 
నీ భాష ఏదైతేనేం 
నువ్వు ఆ చంద్రతారార్కుడివి 
అక్షరాలు ఆత్మహత్యలు చేసుకోవు   
అక్షరాలు మరణ శాసనాలు రాసుకోవు 
అన్నా! నువ్వు విజయుడివి 
అక్షరం దాల్చిన వజ్రాయుధుడివి
సాహిత్య సమరాంగణ సాయుధుడివి
నువ్వు ఒంటరివాడివి కాదు 
నీది ఒంటరి పోరాటమూ కాదు 
నీ చుట్టూ లక్షల కలాలున్నాయి 
నీ వెంట కోట్ల గళాలున్నాయి 
– ఎండ్లూరి సుధాకర్
75663_237877626338350_67663514_n