మరో మొనాలిసా

Mamata K.
న్యూయర్క్ జిలుగుల 
నీడల్లో ఓ పక్కకి ఒదిగి 
నెలలు నిండిన పొట్ట నిమురుకుంటూ 
ఒక మెక్సికన్ యువతి.
ఆమె చేతిలో
వడలి పోతున్న ఎర్రగులాబీ 
బొకేలనుంచి తేలివచ్చింది
దశాబ్దకాలపు గ్నాపకం.
ప్రపంచానికి ఆవలి తట్టున, ఇలాంటివే 
మసిబారిన కాంక్రీటు దుమ్మల మధ్య
ఒక చేతిలో చిట్టి చెల్లాయిని
మరో చేతిలో 
తాను మోయలేనన్ని మల్లెమాలలతో
నా కారులోకి ఆశగా చూస్తూ
ఏడెనిమిదేళ్ళ పాప.
తన దగ్గరనుంచి 
ఒక్క పువ్వూ 
తెచ్చుకోలేకపోయిన
ఊగిసలాట  మరుగున నా స్వార్థం
ఇదిగో ఇప్పుడిలా నా రీర్ వ్యూ మిర్రర్లో
నిరాశ దు:ఖాన్ని దాచేసి
నిర్వికారమైన చిరునవ్వు నావైపు విసిరి
ఎన్నటికీ మాయని గాయాన్నింకొకదాన్ని 
నా గుండెలో రేపి
రోడ్డు మలుపులో మాయమయ్యింది.

ఎండమావి

Mamata K.
ఎర్రమట్టి కాలిబాట
పక్కన గడ్డిపూలతో ఎకసెక్కాలాడుతోంది
పిల్ల గాలి
నన్ను
ఒంటరి బాటసారిని అనుకున్నట్టుంది
అప్పుడప్పుడు వచ్చి కమ్ముకుంటోంది
అనునయంగా
తెలీని భాషలో పాడుతోంది
కమ్మని కబుర్లు.
కరకరమంటూ హెచ్చరికలు పంపుతున్నాయి
బూట్లకింద నలుగుతున్న ఒకటో రెండో గులకరాళ్ళు.
ఉవ్వెత్తున ఎగసి
అబ్బురపరచే విన్యాసాలు చేసి
అల్లంత దూరంలో వాలి
నిక్కి చూస్తున్నాయి
గుంపులు గుంపులుగా నల్ల పిట్టలు.
కీచురాళ్ళతో కలిసి చేస్తున్న సంగీత సాధన
మాని
రెక్కలు ముడుచుకు కూర్చున్నాయి జిట్టలు.
unnamed
దూరంగా మలుపులో
తెల్లపూలతో నిండుగా ఓ చెట్టు.
బొండు మల్లెలు
అని ఆశగా పరిగెత్తి చూస్తే
ఒంటి రేకుల జపనీస్ చెర్రీ పూలు.
సగం ప్రపంచానికావల సొంత ఊరిని
తానుకూడా
గుండెల్లో గుక్కపట్టినట్టుంది
ఆ చెట్టు
మెత్తగా
ఇన్ని పూరేకులను రాల్చింది.
ఎన్నోఏళ్ల్లప్పుడు
విమానమెక్కిస్తూ “మళ్ళెప్పుడు జూచ్చనో నిన్ను”
అంటున్న అవ్వ కళ్లల్లో పొంగిన కన్నీళ్ళు
ఇక ఆగక
నా బుగ్గలపై రాలాయి జలజలా.
– కె. మమత