నాలో మా ఊరు

 GOWRINAIDU

ఊరొదిలి పట్నం వొచ్చినప్పుడు

నాతో తెచ్చుకున్నానొక పచ్చని పంట పొలాన్ని,

తీసుకొచ్చేనొక నదిని,

ఒక చెట్టునీ.. మడిగట్టునీ..

నలుగురు నేస్తాల్నీ,

నాగలి సరే ..

అమర్చుకున్నాను నా పుస్తకాల నడుమ

అద్దాల పలకల మధ్య బొబ్బిలి వీణలా.

అక్కడ మా ఊరిలో

ఇంటిముందు మా అమ్మ కల్లాపు జల్లే వేళ

పట్నంలో నా ఇరుకు గదిలో

పూలజల్లు కురిసి

పరిమళిస్తుంది వేకువ.

అక్కడ మా ఇంటి గడపలో

చెల్లెలు వేసిన తిన్నని పిండిముగ్గు కర్ర

నా గది కిటికీలోంచి కిరణమై తాకి

పులకరిస్తుంది మెలకువ.

పట్నం కదా

నా చుట్టూ విస్తరిస్తున్న ప్రపంచం

నా బతుకేదో నన్ను బతకనివ్వదుగదా,

వేషమూ, భాషా నన్ను నాలాగా ఉండనివ్వవుగదా,

నాకునేను పరాయినైపోతున్నాననుకున్నప్పుడల్లా

ఆకుపచ్చ పంటపొలాన్ని ఎదురుగా పరుచి

పైరగాలిరెపరెపల్లో తేలిపోతాను మైమరచి.

నాతో తెచ్చుకున్న నదిని తెరిచి

తలారా స్నానంచేసి ఈతలుకొడతాను

నేస్తాలతో కలిసి.

నొప్పితెలీకుండా కొంచెం కొంచెం

నన్ను కొరుక్కు తింటుంది నగరమని నాకు తెలుసు,

మత్తేదో జల్లి మెల్లగా

లొంగదీసుకుంటుంది నగరమని నాకు తెలుసు,

అనేకానేక బలహీనతలతో  ఘనీభవించి

నన్ను నేను అసహ్యించుకుంటున్నప్పుడల్లా

చాళ్ళుచాళ్ళుగా దున్ని దున్ని నాగలి

నా హృదయక్షేత్రాన్ని సస్యశ్యామలం చేస్తుంది.

గంటేడ గౌరునాయుడు