నేరాల బతుక్కి ఎదురీత!

trevor-noah-suit

 

రోజు కూడా ఆఫీసునుండి ఇంటికి వెళ్ళడానికి కారెక్కగానే NPRలో టెర్రీ గ్రూస్ ఫ్రెష్ ఎయిర్ ప్రోగ్రాం వస్తోంది. ఆనాటి అతిధి Trevor Noah. అతని గురించి నాకు అంతకు ముందు ఏమీ తెలియదు. తన ఆత్మకథ “Born A Crime:: Stories From a South African Childhood” మీద ఆరోజు ఇంటర్వ్యూ! అదే రోజు ఆ పుస్తకాన్ని అమెజాన్‌లో కొనేయడము, అది వచ్చిన వెంటనే చదవడం మొదలెట్టడమూ.

ట్రెవర్ నోవ తల్లి నల్లజాతి నేటివ్, తండ్రి స్విస్-జర్మన్ తెల్లవాడు. చట్త ప్రకారం జాతుల మధ్య లైంగిక సంబందాలు నిషిద్దం. అలాంటి చట్టాల మధ్య పుట్టాడు గనుక “నేను నేరానికి పుట్టాను” అంటాడు ట్రెవర్. ఈ పుస్తకం ట్రెవర్ నోవా జీవితం అనేకంటే ఆయన తల్లి పాట్రిసియ జీవితం, వివక్ష అధికారికంగా అమలవుతున్న చోట ఓ బాధితురాలి జీవితం, పల్లె నుండి పట్నానికి తన్ను తాను నడిపించుకొన్న పల్లెటూరి పిల్ల జీవితం, పితృస్వామ్య అధిపత్య వ్యవస్థలో నలిగి దానికి ఎదురొడ్డి నిలిచిన పడతి జీవితం, తన కొడుకే సర్వస్వంగా పెంచిన ఒంటరి తల్లి జీవితం, జీసస్‌ను తన రక్షకుడిగా మనఃస్పూర్తిగా విశ్వసించిన ఓ క్రైస్తవరాలి జీవితం.

ఇవి పుస్తకం చదువుతుండగా నాకు కనిపించిన కొన్ని కోణాలు. బహుశా మీరు చదివితే మీకు మరిన్ని కోణాలు కనపడవచ్చు. రచన ఆద్యంతం ఒక ఆహ్లాదకరమైన శృతిలో వుండి చివరిదాకా మూయనీయదు. కన్నీళ్ళు తెప్పించే ఘటనలను కూడా నవ్విస్తూ చెపుతాడు ట్రెవర్. బాధతో కన్నీళ్ళు వస్తుంటాయి..అదే సమయంలో పెదవులపై ఓ చిర్నవ్వుకూడా ప్రత్యక్షమవుతుంది మనకు.

ఉదాహరణకు డిల్లీ “నిర్భయ” దుర్ఘటనను గుర్తుకు తెచ్చే ఓ సంగతి ఇది. తనేమొ ఇంచుమించు ఆరేళ్ళప్పుడట. నెల్సన్ మండేలా జైలులోంచి విడుదయిలయిన రోజుల్లో..రోడ్లమీద తెగల మధ్య ఏవేవో గొడవలు, నిరసనలు. ప్రపంచం తల్లకిందులైనా తన తల్లి ఆదివారంనాడు చర్చికి వెళ్ళక మానదు. ఆరోజు కూడా చర్చికి బయలుదేరారు, ట్రెవర్ రానని ఎంత మొండికేసినా లాభం లేకపోయింది. తమ పాతకారును బయటకు తీద్దామంటే అది స్టార్ట్ అవకుండా మొండికేసింది. అప్పుడయినా ఆమె వెళ్ళకుండా మానేస్తుందేమొనని అతని ఆశ. ఉహు.. ఆమె కొంత దూరం నడిచి ఆ రూట్లో నడిచే ప్రైవేటు బస్సు (నల్లవాళ్ళున్న చోటకు ప్రభుత్వం నడిపే రెగ్యులేటెడ్ ప్రభుత్వ బస్సు సర్వీసులేవీ లేవట) పట్టుకొని వెళ్ళడానికి సిద్దమయింది. ఒకరు బస్సు నడిపే మార్గంలో మరొకరు ప్రయాణికులను ఎక్కించుకోకూడదని అవి నడిపే రౌడీ గుంపుల్లో ఒప్పందం.

అయితే బస్సుకోసం వేచి చూసి, చూసి ఇక రాదేమొననుకొని వాళ్ళు ఓ కారు ఆగితే అందులో ఎక్కబోతుండగా బస్సు వచ్చింది. వీళ్ళను ఎక్కించుకుంటున్నందుకు ఆ బస్సు డ్రైవరు దిగివచ్చి ఈ కారు డ్రైవరును కొట్తడం మొదలెట్టాడు. వీళ్ళు వాడికి ఎలానో నచ్చజెప్పి కారు దిగి బస్సు ఎక్కారు. ఆ బస్సులో వీళ్ళు తప్ప మరెవరూ లేరు. చిన్న పిల్లలను వేసుకొని ఒంటరిగా ఓ ఆడది అపరిచితుల కారులో వెళ్లడం ఎంత ప్రమాదమో ఈ బస్సు డ్రైవరు ఆమెకు నీతులు చెప్పడం మొదలెట్టాడట. కానీ ఈమె మరొకరు తనమీద పెత్తనం చేయడం సహించనిది. “నీ పని నువ్వు చూసుకో” అని చెప్పేసరికి వాడికి కాలింది.

అందులోనూ ఆమె మాట్లాడిన భాషను బట్టి ఆమె చోసా(Xhosa) జాతి అని అతనికి తెలిసిపోయింది. ఆ డ్రైవరేమో జులు(Xulu) జాతివాడు. జులు జాతి ఆడవాళ్ళు ఎక్కువగా సంప్రదాయం పాటించి ఇంటి నాలుగ్గోడలు దాటని వాళ్ళు. ఈమె ఓ మగాడికి ఎదురు చెప్పడం, అందులోనూ ఓ తెల్లతోలు పిల్లవాన్ని కలిగి వుండటం..వాని అహాన్ని దెబ్బకొట్టింది. (నిర్భయ వుదంతం గుర్తుకు రావట్లేదా?) “మీ చోసా ఆడవాళ్లతో ఇదే సమస్య. మీరంతా ఎవడితో పడితే వారితో తిరిగేవాళ్ళు. ఈరాత్రి నీకు బుద్ది చెప్పందే వదలను.” అంటూ వాడు ఎక్కడా ఆపకుండా బస్సు వేగం పెంచాడు. ఇక ఈమెకు ఏమి జరగబోతుందో అర్థమయ్యింది. అక్కడక్కడా రోడ్డు దాటుతున్నపుడల్లా వేగం తగ్గడం గమనించి అలాంటి ఒకచొట నిద్రమత్తులో జోగుతున్న ట్రెవర్‌ను ద్వారం లోంచి తోసేసి, మరో చిన్న పిల్లాడితో తనూ దూకేసింది. దూకిన వెంటనే పరుగు లించుకొని, దగ్గరలోని ఇరవైనాలుగ్గంటలూ తెరిచివుండే పెట్రోలు బంకు చేరారు.

“ఎందుకలా? ఎందుకు మనం పరిగెత్తాం?”

“‘ఎందుకు పరిగెత్తాం?’ ఏంటి? వాళ్ళు మనలని చంపాలని చూశారు.”

“నాతో ఎప్పుడన్నావ్ అలా? బస్సులోంచి అలా తోసేశావ్?”

“సరే నీతో అనలేదే అనుకో, మరెందుకు బస్సులోంచి దూకేశావ్?”

“దూకానా!!నేను నిద్రపోతుంటేనూ.”

“అంటే.. వాళ్ళు చంపేయడానికి నిన్ను వదిలేసుండాల్సింది.”

అలా తల్లీ-కొడుకుల వాదించుకుంటూ పోలీసుల కోసం ఎదురు చూస్తున్నారు.

కొడుకుతో ఆమె అంది, “హమ్మయ్య! దేవుడి దయవల్ల క్షేమంగా వున్నాము.”

అప్పుడు తొమ్మిదేళ్ళ ట్రెవర్ అంటాడు, “లేదు మమ్మీ, ఇది దేవుడి దయ కాదు. దేవుడు మనలని ఇంట్లో వుంచడానికే కారు స్టార్ట్ అవకుండా చేశాడు. మనం బయటకు వెళ్ళేట్లు చేసింది ఖచ్చితంగా దయ్యమే!”

“లేదు లేదు ట్రెవర్. అది దయ్యం పని కాదు. అది దేవుడి పథకమే. మనం ఇక్కడ వుండాలని దేవుడనుకొంటే దానికి ఓ కారణం వుండే వుంటుంది…”

“చూడమ్మా, నాకు తెలుసు నీకు జీసస్ అంటే ఇష్టమని. ఆయనకు అంత ఇష్టమయితే మనల్ని మన ఇంటి దగ్గరే కలవమను. ఈ రాత్రి జరిగిందేమీ సరదా కాదు.”

trevor-with-mother

ఆమె నవ్వుతూ మోకాళ్ళూ, మోచేతులూ పగిలి దుమ్మూ, రక్తం కలిసిపోయిన కొడుకును దగ్గరగా తీసుకొంది. అంత బాధలోనూ ట్రెవర్‌కూ నవ్వు వచ్చింది.

ఇది కేవలం ఓ చిన్న నమూనా మాత్రమే. మరింత సాగదీయకుండా వుండటానికి నేను ప్రతివాక్యాన్ని రాయలేదు గానీ, పుస్తకంలో ఇది చదివుతున్నపుడు, వాళ్ళిద్దరితోపాటు నాకూ బాధతో కూడిన నవ్వు వచ్చింది.

తను చిన్నప్పుడు బయటవాళ్లకు కనపడకుండా తన అమ్మమ్మ ఇంటిలో పెరిగాడు. తెల్ల పోలీసులకు కనపడితే తన తల్లిని “తెల్లవాడితో బిడ్డను కన్నందుకు” అరెస్టుచేసి నాలుగేళ్ళవరకూ జైలుకు పంపగలరు. అది నల్లవాళ్ళకు మాత్రమే ప్రభుత్వం కట్టిన ఒక కాలనీ. వసతులు అంతంత మాత్రం. ఏడెనిమిది ఇళ్ళకు కలిసి ఒక పబ్లిక్ టాయిలెట్ వుండేది. ముడ్డి తుడుచుకోవడానికి పాత వార్తాపత్రికల కట్ట ఆ పక్కన వేలాడదీసివుండేది. ఆ క్రింద వున్న పెద్ద గోతిలోని పెంటమీద ఈగలు ఝామ్మంటూ తిరుగుతుండేవి. ఆ ఈగలన్నా, ఆ వాసన వేసే చోటన్నా ట్రెవర్‌కు తెగ భయం. ఓరోజు బయట వర్షం కురుస్తోంది. తన పొట్ట కుతకుతమంటూ టాయిలెట్టుకెళ్ళమని తొందరపెడుతోంది. ఇంట్లో తన గుడ్డి బామ్మ తప్ప ఎవరూ లేరు. అప్పుడు ట్రెవర్ ఏమి చేశాడో, ఆ తర్వాత దేవుడు-దయ్యాల నమ్మకాలతో తన తల్లి, అమ్మమ్మ ఏమి చేశారో తెలుసుకుంటే పడీ, పడీ నవ్వుతారు.

ట్రెవర్ అమ్మ తన ఇంట్లో రెండో పిల్ల. తనకు ఓ అక్క, ఓ తమ్ముడు. అందరు నల్లవాళ్ళ ఇళ్ళకు వలెనే తన తండ్రి దూరంగా ఎక్కడో ఎదో గనిలో పనిచేస్తూ అప్పుడప్పుడూ ఇంటికివచ్చేవాడు. ఈమె చిన్నప్పట్నుంచి ఇంటికి కట్టుబడి వుండే రకం కాదు, అందుకనేమో బయటకు వెళ్ళి వస్తుండే నాన్న అంటే ఇష్టం. తన అమ్మానాన్నలు విడిపోతుంటే తన అక్కా, తమ్ముడిలా కాకుండా తను తండ్రితోవుంటానని మారాము చేసింది. కానీ తండ్రి తనను ఎక్కడ పెట్టగలడు. దూరంగా ఎక్కడో తెల్ల ప్రభుత్వం నల్లవాళ్ళకు కేటాయించిన రిజర్వు భూముల్లో సేద్యం చేసుకుంటూ వుండిన తన అక్కదగ్గర వదిలేసి వెళ్ళాడు. ఆ యింటిలో ఈమెలా ఇంకా పదిహేనుమంది పిల్లలు.

తెల్లవారింది మొదలు రోజంతా గొడ్డు చాకిరి. పొట్ట నిండని రోజుల్లో బురదమట్టిని నీళ్ళలో కలుపుకొని పొట్టనింపుకొన్న రోజులు. అంత అధ్వాన్నపురోజుల్లోనూ ఒక కాంతిరేఖ ఏమిటంటే ఆవూర్లో మిషనరీ స్కూలు వుండటం. అక్కడ ఈమె ఇంగ్లీషు నేర్చుకుంది. ఈమె తన అత్త చివరిరోజుల్లో వుండగా మళ్ళీ తన తల్లిని చేరింది. అక్కడ నేర్చుకొన్న ఇంగ్లీషు పరిజ్ఞానంతో క్లర్కు కోర్సులు చేసి క్లర్కుగా పనిచేయటం మొదలు పెట్టింది. ఇదేమీ చిన్న విషయం కాదు.

ఓక చోట దక్షిణాఫ్రికా జాతుల గురించి చెబుతున్నపుడు మన దేశపు ఆర్య-ద్రావిడ జాతుల మధ్య కొన్నివేల ఏళ్లకిందట ఇదే జరిగివుంటుందా అని ఆలోచన వస్తుంది. మూడొందల ఏళ్లక్రితం ఇండియా వెళ్ళేదారిలో మజిలీగా ఆగారు డచ్చి వాళ్ళు ఇక్కడ. అక్కడ వున్న నేటివ్స్‌తో సంబంధాల వల్ల, వీళ్ళ పొలాల్లో పనిచేయడానికి తెచ్చుకొన్న వేర్వేరు డచ్ కాలనీలనుండి తెచ్చుకున్న జాతుల వల్ల ఒక మిశ్రమ జాతి ఏర్పడింది. అసలు నేటివ్స్ (Khosian) పూర్తిగా అంతరించిపోయి, ఈ మిశ్రమ జాతులే మిగిలాయి. ఈ మిశ్రమజాతిని “రంగుజాతి”(Colored)గా పిలిచారు.

ఈ మిశ్రమజాతిలో కొందరిలో ఆఫ్రికన్ నల్లజాతి లక్షణాలు వుండవచ్చు, యూరోపియన్ తెల్లజాతి లక్షణాలు వుండవచ్చు, ఇండియన్ లక్షణాలూ వుండవచ్చు. ఇద్దరి రంగుజాతి తల్లిదండ్రులకు వారిద్దరి రంగూకానీ పిల్లలు పుట్టడం అసాధారణమేమీ కాదు. ద్రావిడులు నల్లవారు, ఆర్యులు తెల్లవారు అనుకుంటే, ఇద్దరి నల్ల తల్లిదండ్రులకు తెల్ల రంగుతో బిడ్డ పుట్టడం మనకు ఆశ్చర్యం కాదుగా!

ఇందులో అంతా అమ్మ గురించే కాదు, బాలుడిగా ట్రెవర్ అనుభవాలు, చిన్న చిన్న దొంగతనాలు, యువకుడిగా వాలంటైన్స్ డే గురించిన అవమానాలు కూడా బాగా చదివిస్తాయి. ఒక యూదుల స్కూల్లో, “హిట్లర్” పేరున్న తన మిత్రుడితో వెళ్ళి డాన్సు చేయడం, అక్కడ జరిగిన రసాభాస. మ్యూజిక్ సిడీలను కాపీ చేసి సీడీలు అమ్మే వ్యాపారం, ఓ వారం రోజులు పోలీసు కస్టడీలో జీవితం ఇదంతా అతన్ని మాటల్లోనే చదవడం చాలా గమ్మత్తుగా వుంటుంది.

పితృస్వామ్య వ్యవస్థలో పోలీసులు ఎలా పనిచేస్తారో చూస్తే అది ప్రిటోరియా అయినా మన పిఠాపురం అయినా ఒకటే అని తేలుతుంది. తన తల్లిని తన సవతి తండ్రి కొడితే ఆమె దగ్గర్లోని పోలీస్ స్టేషన్‌కు వెళుతుంది ఫిర్యాదు చేయడానికి. ఆ పోలీసులకు భర్త మీద ఫిర్యాదు చేయడం వింతనిపిస్తుంది. ఎంత గట్టిగా అడిగినా కేసు రిజిష్టర్ చేసుకోరు. చివరికి ఆ సవతి తండ్రి పోలీసు స్టేషనుకే వచ్చి పోలీసులకు అది చిన్న గొడవే అని సర్ది చెప్పి ఆమెను తీసుకెళిపోతాడు. అలాంటి కొన్ని ఘటనల తర్వాత అతను ఆమెను చంపడానికి తుపాకీతో కాలుస్తాడు కూడా!

trevor-grandmother

ఇలా వుంటుంది పోలీస్ స్టేషన్లో సంభాషణ.

ఇద్దరు చిన్న పిల్లలతో రాత్రిపూట కిలోమిటరు నడిచి పోలీస్ స్టేషన్ చేరుకున్న ఆమె అక్కడున్న ఇద్దరు పోలీసులతో..

“ఫిర్యాదు చేయడానికి వచ్చాను”

“దేనిమీద ఫిర్యదు చేయడానికి వచ్చావు?”

“నన్ను కొట్టిన ఓ మగాడి మీద ఫిర్యాదు చేయడానికి వచ్చాను.”

“ఓకే.. ఓకే.. నిదానం, నిదానం. నిన్ను కొట్టిందెవరు?”

“నా భర్త”

“నీ భర్తా? నువ్వేం చేశావు? అతనికి కోపమొచ్చేటట్లా ఏమయినా చేశావా?”

“నేను… చేశానా? లేదు. అతను నన్ను కొట్టాడు. నేను అతనిమిద ఫిర్యాదుచేయడానికి వచ్చాను.”

“నో మాడమ్. ఎందుకు కేసు కేసంటావు? ఏం నిజంగానే కేసు పెడతావా? ఇంటికెళ్ళు, నీ భర్తతో మాట్లాడు. ఒకసారి కేసు పెట్టావంటే మళ్ళి వెనక్కు తీసుకోలేవు. అతనిమీద నేరగాడన్న ముద్ర పడుతుంది. అతని జీవితం మళ్ళీ ఇలా వుండదు. నీ భర్త జైలుకు వెళ్ళాలని నిజంగానే కోరుకుంటున్నావా?”

ఇలా ఆమె కేసు పెట్టమని పోరుతున్నంతలోనే ఆమె భర్త అక్కడికి చేరుకుంటాడు. అతని కళ్ళు ఇంకా మత్తులో వున్నట్లు తెలుస్తూనే వుంది. అయినా లోపలికి వచ్చి “హలో బాస్, మీకు తెలియదా ఆడవాళ్లతో వ్యవహారం? ఏదో కొద్దిగా కోపం వచ్చిందంతే!”

“తెలుసులేవోయ్! మాకు తెలుసు, అప్పుడప్పుడూ ఇలా జరుగుతూ వుంటుంది. ఏం పట్టించుకోకు.”

అంతే, పోలీసులు కేసు రాసుకోలేదు. అతన్ని కనీసం మందలించలేదు. పితృస్వామ్యంలో భర్త కొడితే భార్య పడి వుండాలి. అది మామూలు విశయం. పోలీసులు దాన్ని మామూలు విశయంగా తీసుకోకుండా మరెలా తీసుకుంటారు?!

ఇలా ఈ పుస్తకం నిండా ఎన్నింటినో మనం చూడవచ్చు.

*

 

 

 

 

ఆనందానికి ఒక అడ్రస్ ఇదిగో ఇక్కడ!

aanandaarnavam

 

“ప్రపంచమంతా ఆనందం పొంగి పొర్లి పోతోంది. దాన్ని అందుకోగలిగిన హృదయాలు వుండాలి. లోకం అంతా కాంతి వుంది. కాని కన్ను వుంటే కాని ఆ కాంతి అర్ధం కాదు. ఎంత శక్తి కలిగిన కన్ను వుంటే అంత కాంతి ఉపయోగపడుతుంది. లోకమంతా శక్తి నిండి వుంది. ఆ శక్తి ని వుపయోగపరచుకునే యంత్రాన్ని బట్టి ఆశక్తి వ్యక్తమవుతుంది. అట్లానే ఆనందం. ఆకాశం, సముద్రం, గాలి, ఇసిక, స్నేహం, తోటలు, నదులు,, కీటకాలు, పసిపిల్లలు, నవ్వు అన్నీ ఆనందమే. తెలుసుకునే హృదయం వుండాలి. ఆ హృదయానికి ఎంత శక్తి వుంటే అంత ఆనందాన్ని తీసుకోగలదు.

వెన్నెల అందరికి కాస్తుంది. వెన్నెల రాకుండా కిటికీలు మూసుకునే వాళ్ళు వున్నారు. వెన్నెల చాలదని ఎలక్ట్రిక్ లైట్లు పెట్టుకునే వాళ్ళు వున్నారు. వెన్నెలలోని ఆనందాన్ని భరించలేక గీతాల్లోకి ఆ అనందాన్నిపొల్లేట్లు చేసే వాళ్ళు వున్నారు. ఆ ఆనందం అతీతమై వాళ్ళకే తెలియని పిచ్చి బాధ లో పడిపోయే ఆత్మలూ వున్నాయి.”

అంటాడు తన “ఆనందం” వ్యాసంలో చలం.

‘నా రక్తంలో ఒక ధిక్కారం ఉంది.

దేనినీ సహించని ధిక్కారం.

ఎవరికీ భయపడని ధిక్కారం.

భయమంటే తెలియని ధిక్కారం.

ఈ ధిక్కార స్వభావమే నా వ్యక్తిత్వాన్ని తీర్చిదిద్దింది.’  ఇది అమ్మ మాట… ఇదే అమ్మ బాట…

అవును ఆ ధిక్కారమే మహిళల పాలిట ఆనందహేతువు అయ్యింది.

ఒక ధిక్కారం నుండి ఆనందాన్ని ఎలా విశ్వవాప్తం చెయ్యవచ్చో అమ్మ నిరూపించింది.

చలం అన్నా… అమ్మ అన్నా … వర్షం… వెన్నెల అంత ఇష్టం నాకు.

మనలో అణగారిపోయిన ఉన్న ఒక వ్యక్తిత్వాన్ని మనకే కొత్తగా పరిచయం చేసి, లోకానికి ఒక సరికొత్త దృక్పధాన్ని ఇచ్చిన ఉత్ప్రేరకాలు వీళ్ళు.

***

“తుపాకి మొనపై వెన్నెల” పుస్తకం అందిందా అని ఫోన్ చేసినప్పుడు మొదటి సారిగా తన గొంతు విన్న క్షణం…

విజయనగరంలో కలిసినప్పుడు.. “మహీ” అని నవ్వుతూ రెండు చేతులూ చాపి నన్ను దగ్గరకి తీసుకున్న ఆత్మీయ ఘడియలూ..

04.09.2014 న తన భుజం మీద తల పెట్టుకుని అర్ధరాత్రి దాకా కబుర్లు చెప్పుకున్నాక ” ఇదిగో నా డైరీ ఇప్పటిదాకా ఎవ్వరికీ ఇవ్వలేదు. నీకే ఇస్తున్నా” అంటూ.. ఆనందార్ణవాన్ని నాకిచ్చిన ఆ చేతులూ…

నా జీవితంలో మర్చిపోలేని అత్యంత అద్భుతమైన జ్ఞాపకాలివి.

అలా నాదగ్గరకి వచ్చిన “ఆనందార్ణవం” ఎన్ని సార్లు చదివానో లెక్కలేదు.

దాదాపు తొమ్మిది నెలల పాటు ఆ డైరీ నాదగ్గరే ఉంది.

సంతోషంలో దుఃఖం లో ఎప్పుడూ నాతోనే ఉంది.

సంతోషం అంటే ఏంటి?  ఎలా ఉంటుంది ?  ఎక్కడుంటుంది ? ఎందులో ఉంటుంది ? ఎవరికి దక్కుతుంది ?

సంతోషాన్ని ఎలా నిర్వచించాలి ?  ఎక్కడ వెతకాలి ?

అసలెందుకు సంతోషం? సంతోషం లేకపోతే ఏమవుతుంది ?

అది దొరక్క పోతే దుఃఖమేనా ?

సంతోషానికీ దుఃఖానికి తేడా ఏమిటి ?

పుస్తకం నిండా  ఎన్నో ప్రశ్నలు.

సమాధానం అమ్మ చెప్పిందా… అంటే.. ఉహూ… లేదు… ఎక్కడా చెప్పదు. సంతోషం అనే పదానికి నిర్వచనంగా తన జీవితం చూపిస్తుది. తనెక్కడ పొందగలిగిందీ మనకి చెప్తుంది.

తనతో పాటు గోదావరి గట్ల వెంట వెన్నెల రాత్రుల ప్రయాణాలు చేయిస్తుంది.

అనియమిత ప్రేమ (అన్ కండీషనల్ లవ్) ఎలా ఉండాలో చెప్తుంది.

ఇవ్వడంలో ఉన్న సంతోషం

వదులుకోవడంలో ఉన్న ఆనందం.

ఇవన్నీ తను చెప్తే తెలుసుకోవాల్సిందే.

అసలు ఆనందం ఎక్కడ ఎలా దొరుకుతుందంటే.. మనమైతే  ఏం చెప్తాం.

పదహారేళ్ళప్పుడు ఆకర్షణలో ఊహించుకుంటాం…

పాతికేళ్ళొచ్చాక ఉద్యోగంలో ఉందనుకుంటాం..

నలభైలలో సంపాదనలో వెతుక్కునే ప్రయత్నం చేస్తాం..

యాభైలలో ఆస్తిపాస్తుల్లో చూసుకోవాలనుకుంటాం..

అరవై వచ్చేసరికి విశ్రాంతితో ముడిపెడతాం..

ప్చ్.. ఎక్కడా కనిపించదు!!!

ఆనందమా నువ్వెక్కడున్నావు??

ఆనందం ఎక్కడుంది?

మద్యంలోనా, డబ్బులోనా, భోజనంలోనా,

శృంగారంలోనా, లేక…

మన రాజకీయ నాయకులు చెప్పినట్లు పదవిలోనా..

ఈ ఒక్క ప్రశ్నకి జవాబు దొరికితే, మరే ప్రశ్నకీ జవాబు వెతుక్కోనక్కరలేదు..

ఇంతకీ ఆనందాన్ని వెతికి పట్టుకోవడం ఎలా…

దాని ఉనికి.. అడ్రస్.. కధా కమామీషు ఏమిటి…

అంత వెతకక్కరలేదు..

ఆనందం మజ్జిగలో వెన్నలాగా..

పాలలో మీగడలాగా..

మనలోనే .. మన మనసులోనే కలిసిపోయి ఉంది..

చిలికి చిలికి వెలికి తీస్తామా..

వృధాచేసి పారేస్తామా…

అది మనమే నిర్ణయించుకోవాలి…

ఎనీ.. డౌట్స్????

 

సత్యవతి అమ్మ రాసిన ఈ  “ఆనందార్ణవం” లో ఒక్కసారి మునిగి చూడండి.

ఇరుకు భావాల్లోంచి.. విశాల ప్రపంచంలోకి ఎలా నడవాలో అమ్మ చెప్తుంది.

ప్రేమించడం అంటే ఏమిటో చెప్తుంది.

ఈర్ష్యా.. అసూయా.. ద్వేషం లేని ప్రపంచం ఉంటే అది ఎంత అందంగా ఉంటుందో కూడా మనకి చెప్తుంది.

పౌర్ణమితో పాటు అమావాస్యని ప్రేమించడం..

వెలుగుతో పాటు చీకటిని ఆహ్వానించడం…

ప్రకృతి మనకు ఇచ్చిన దాన్ని యధాతదంగా…

ప్రేమగా స్వీకరించడం….

 

విలువైనదేదీ సులువుగా దక్కదు.

అదే అమ్మ కూడా అంటుందిక్కడ “సంతోషాన్ని వెతికి పట్టుకోవాలంటే.. ప్రమాదాల వెంట ప్రయణం చెయ్యాల్సిందే”

ఎంత గొప్పనిజమిది. సహజ అనుభూతిలో ఒదగనిదేదైనా ఆనందాన్ని తన వెంట తీసుకుని రాదు కదా మరి.

‘ ఒక చోట ఆగిపోవడం అంటే నూతనత్వం లేకపోవడం’ అంటుంది అమ్మ మరో చోట.

అందుకే ప్రవహించాలి… నిరంతర ప్రవాహం గండుశిలల్నీ ఎంత నునుపుగా మారుస్తుందో మనకి తెలియని సంగతా యేమి?  ఒక్కసారి ప్రవాహం మొదలయ్యిందా అది చేరుకునే తీరం ఆనందార్ణవమే అనటంలో ఎలాంటి సందేహం లేదు.   అది చదివాక ప్రవహించాలనిపిస్తుంది. అలా అనిపించటమే ఇది అక్షరాలు పొదిగిన పుస్తకం కాదు జీవితం వొదిగిన కావ్యం అనుకోవడానికి ఋజువు.

పసితనంలో తనకిష్టమైన టీచర్ కోసం 30 కిలోమీటర్ల దూరపు గమ్యంతో మొదలైన తన అడుగులు ఇప్పుడు సప్తసింధువులనీ ఆనందార్ణవాలుగా మార్చే మహాక్రతువులో విశ్వవ్యాప్తమవుతున్నాయ్.

అమ్మ ‘ఒక నిలువెత్తు పసితనం… సాగరమంత ధీరత్వం… విశ్వమంత స్వచ్ఛతా పవనం’. అక్షరాల వెంట నడచి చూద్దాం రండి. ఎక్కడిది అవసరమో అక్కడ అది మనకి దొరుకుతుంది.

చివరిగా ఒక్క మాట మనం ఈ పుస్తకం చదవటం వల్ల తనకు కొత్తగా వచ్చేది ఏమీ లేదు కానీ మనకి మాత్రం మన జీవితాన్ని మన చేతుల్లోకి తెచ్చుకోగలమన్న నమ్మకాన్ని, ధైర్యాన్ని ఇస్తుంది.

*

 

కొందరు స్త్రీలు, కొన్ని సమయాలు!

konninakshtralu-cover-page

 

నేనెన్నో పుస్తకాలను పరిచయం చేశాను. నాకు నచ్చిన పుస్తకాలను చదవమని చాలామందికి చెబుతుంటాను. కాని ఓ పుస్తకం నాకు బాగా నచ్చినా – దాన్ని చదవమని నేను అందరికీ ధైర్యంగా రికమెండ్ చేయలేకపోతున్నాను. అయినప్పటికీ… చదవాల్సిన ఆ పుస్తకం – విమల గారి కథల సంకలనం కొన్ని నక్షత్రాలు కాసిన్ని కన్నీళ్ళు‘. ఎందుకంటే ఈ పుస్తకం చదువరులను ఓ రకమైన నిర్వేదంలో ముంచుతుంది. వాళ్ళ మనసులను వ్యథాభరితం చేస్తుంది. మన చుట్టూ ఉన్న ప్రపంచంలో సమస్యలుంటాయి, కాని మరీ ఇన్నా అని అనిపిస్తుంది. పరిష్కరించలేని, జటిలమైన సమస్యలు ఎందరి జీవితాలను ఊపిరాడకుండా చేస్తున్నాయో ఈ పుస్తకం చదివితే అర్థమవుతుంది.

స్త్రీలు, బాలికలు, ఆసరా కోల్పోయినవాళ్ళూ, నిరాశ్రయులూ, చాలీ చాలని ఆదాయాలు సంపాదించేవాళ్ళూ, కుల మత లింగ భేదాల ఆధారంగా వివక్షకు గురైనవారూ… ఇలా ఎందరెందరివో దుఃఖాలు, వెతలు… భద్రజీవుల మొద్దుబారిన మనసును కదిలిస్తాయి. స్పందించే గుణం ఉన్నా ఏ రకంగానూ సాయం చేయలేని సానుభూతిపరుల నిస్సహాయత… ఇవన్నీ కలగలిసి మన మీద మనకే ఓ రకమైన రోత కలుగుతుంది. మనసులోని కల్లోలాన్ని అదుపు చేసుకుని, గుండెని దిటవు చేసుకుని ఈ పుస్తకాన్ని చదవాలి, ఇతరులతో చదివించాలి కూడా. అభద్రతా వలయంలో బతుకుతున్న అనేకానేక జీవులకు మనమీయగలిగే కనీసపు ఊతం – ఈ పుస్తకం చదివి – వాళ్ళని కాస్తయినా అర్థం చేసుకోవడం! అలాంటివాళ్ళూ తారసపడినప్పుడు తలవంచుకుని తప్పుకునిపోకుండా – కాస్త సాంత్వన కలిగేడట్టు పలకరింపుగా ఓ చిరునవ్వయినా నవ్వగలగడం!

ఇక ఈ పుస్తకంలోని కథలను పరిచయం చేసుకుందాం.

***

నాలుగేళ్ళపాటు భరతనాట్యం నేర్చుకుని, నృత్య కళాకారిణి అవ్వాలనుకున్న ఓ యువతి ఆశలు ఎలా తారుమారయ్యాయో “నల్లపిల్ల నవ్వు” కథ చెబుతుంది. అయినా ఆమె జీవన పోరాటం ఆపదు. ఏం చేసైనా బ్రతకాలనుకుంటుంది. ఇద్దరు పిల్లల్ని పోషించాలి. గత్యంతరం లేక సినిమాల్లోనూ/టీవీ సీరియళ్ళలోనూ గ్రూప్ డాన్సర్‌గా మారి జీవిక కల్పించుకుంటుంది. జీవిక కోసం కష్టపడే వ్యక్తుల ధైర్యాన్ని చాటుతుంది ఈ కథ.

ఉద్యమంలో పనిచేసేవారి అవసరాలు, ప్రాధాన్యతా క్రమాలు వేరు. లక్ష్యం కోసం వ్యక్తిగత ఆసక్తులను/ఆకాంక్షలను అణుచుకుంటారు. విప్లవ నేపథ్యం నుంచి రాసిన ప్రేమ కథ “కొన్ని నక్షత్రాలు కాసిన్ని కన్నీళ్ళు“. జీవితం పట్ల ప్రేమ కథ ఇది. ఒకే ఊరిని కథ ఆరంభంలోనూ, చివర్లోనూ రెండు కోణాలలో చూపించి; మారని జీవితాలనీ, మారిన ఊరుని పరిచయం చేస్తుందీ కథ.

యాభై నాలుగేళ్ళ వయసున్న మాధవి అనే లెక్చరర్‍ మొబైల్‌కి వేళాపాళా లేకుండా ఫోన్లు చేసి అసభ్యంగా మాట్లాడుతుంటారు కొందరు. అత్యంత జుగుప్సాకరంగా వర్ణనలు చేస్తూ ఆమెని వేధిస్తూంటారు. విసిగి వేసారిన ఆమె పోలీస్ కంప్లయింట్ ఇస్తే, ఆ కాల్స్ ఎవరు ఎక్కడి నుంచి చేస్తున్నారో ట్రేస్ చేసి వాళ్ళని పట్టుకుంటారు పోలీసులు. తీరా వెళ్ళి చూస్తే, అందులో ఇద్దరు ఆమె స్టూడెంట్సే! “నీ వయసెంతయినేం, నువ్వెవరైతేనేం..?” అంటూ తన అవయవాల గురించి మాట్లాడిన పిల్లల్ని ఏం చేయాలో ఆమె కర్థం కాదు. పోలీసులు వాళ్ళని తిట్టినా… ఆ తిట్లు కూడా స్త్రీలకే తగులుతున్నాయని గ్రహిస్తుంది. ఆ రాత్రి ఎవరెవరు “దేహభాష“ను మాట్లాడబోతున్నారో… అని అనుకుంటూ ఒకానొక అచేతన స్థితిలో ఉండిపోతుందామె.

విడివిడిగా మంచివాళ్ళయిన ఇద్దరు స్త్రీ పురుషులు ఎందుకు మంచి భార్యాభర్తలు కాలేకపోతారో చెబుతుంది “వదిలెయ్” కథ. పురుషాహంకారంతో భార్యపై చేసే కామెంట్లు, హేళనలు, విసుర్లు – వారినెంత ఆవేదనకి గురి చేస్తాయో, అటువంటి స్త్రీలు తమలోని సృజనాత్మకతని ఎలా కోల్పోతున్నారో చెబుతుందీ కథ. ఇటువంటి పరిస్థితులలో తన జీవితాన్ని తన చేతుల్లోకి తీసుకుని, మరి కొంతమందికి స్ఫూర్తినిచ్చిన ఓ మహిళ కథ ఇది.

మనని వద్దనుకున్న మనిషితో కలసి జీవించాల్సి రావడం ఎంత దుర్భరమో “మా అమ్మా, ఆమె దోస్త్ మల్లి” కథ చదివితే అర్థమవుతుంది. మానసికంగా ఒంటరిగా ఉండడం ఎంత వేదన కలిగిస్తుందో, ఎంత క్రుంగదీస్తుందో తెలుస్తుంది. భౌతికంగా అందరితో కలిసి ఉన్నా, జీవితానందం కోల్పోయిన మహిళ కథ పాఠకులని కదిలిస్తుంది.

ఆడపిల్లల శరీరమే కాదు, వాళ్ళ ఆలోచనలూ ఎందుకో ఒక్కసారిగా ఎదిగిపోయినట్లనిపించిన ఓ తల్లికి – తన కూతురిక లేదనే వాస్తవం జీర్ణించుకోడం కష్టమవుతుంది “దౌత్య” కథలో. ఆ అమ్మాయి ప్రాణాలు తీసుకునే ముందు తల్లిదండ్రులకీ, అన్నయ్యకీ ఓ ఎస్.ఎమ్.ఎస్. పంపుతుంది. చావు బ్రతుకుల మధ్య ఊగిసలాడిన క్షణాల్లో తాము ఆమె దగ్గర లేమని విలవిలలాడిపోతాడా తండ్రి. స్త్రీల హృదయ భాషని అర్థం చేసుకోలేని వ్యక్తిని ప్రేమించి మోసపోయినందుకు బలవంతంగా తనువు చాలించి తల్లిదండ్రులకు క్షోభని మిగిల్చిన ఆ అమ్మాయి లేవనెత్తిన ప్రశ్నలకు ఎవరు జవాబిస్తారు?

అరణ్యంలోకి నిస్సంకోచంగా వెళ్ళిన ఓ మహిళ అడుగులు జనారణ్యంలోకి వచ్చేసరికి ఎందుకు తడబడ్డాయి? తాము నమ్మిన నమ్మకాలపైనే నమ్మకం ఎందుకు సడలిపోయిందామెకు? దేన్నయినా, ఎవరినైనా ప్రశ్నించగల ధైర్యాన్ని, ఒంటరి పోరాటాలలో కోల్పోయిన “కనకలత” జీవితం విషాదమయం!

‘జీవితాన్ని రకరకాల దారులలో తిప్పి, అలసి సొలసి, లోలోన విధ్వంసమై, చివరికి వీధుల పాలై, దేశద్రిమ్మరులై….’ బ్రతుకుతున్న వారితో ఒక రాత్రి గడిపేందుకు ప్రయత్నించిన బృందానికి – కలవరం కలిగించే ప్రశ్నలు ఎదురవుతాయి. “చుక్కల కింది రాత్రి” మనలో ఓ పెనుగులాటకి కారణమవుతుంది.

విశాలమైన ప్రపంచంలో, తానెక్కడో ఒక ఇరుకు మధ్య కూలబడి బ్రతుకుతున్నానని అనుకున్న ఓ యువతి, మిత్రుడి సహాయంతో కొత్త రెక్కలు తొడుక్కుంటుంది. అతని ప్రభావంతో ఉద్యమాలలోకి అడుగుపెడుతుంది. వాళ్ళిద్దరూ పెళ్ళి చేసుకుంటారు. ఇద్దరూ కలసి కొన్నేళ్ళు పని చేశాకా, అతన్నీ మరి కొంతమందిని అరెస్టు చేస్తారు. విచారణ అనంతరం అతనికి యావజ్జీవ శిక్ష పడుతుంది. ‘ఎవరో ఒకరికి ఎడబాటు శాశ్వతమైన చోట, మరొకరు కొత్త జీవితాన్ని ప్రారంభించాలి’ అంటూ ఓ ఉత్తరం ద్వారా ఆమెకి సూచిస్తాడు. ఉద్యమాలలో పని చేసే ఆప్తుల్ని కోల్పోవడం ఎంత విషాదంగా ఉంటుందో “మార్తా ప్రేమకథ” చెబుతుంది.

‘మన చిరునవ్వును, అందాన్ని చూపితే మోజుపడతారే తప్ప, మన మనసు గాయల్ని చూపితే బాధపడి బాధ్యత తీసుకునే వాళ్ళెవరూ ఉండర’న్న వాస్తవాన్ని ముగ్గురు మహిళల జీవన నేపథ్యంతో చెప్పిన కథ “వాళ్ళు ముగ్గురేనా?“. పులిస్వారీ ఆటలో పులి తనని తినేయకుండా కాచుకుని కాచుకుని అలసిపోయిన ఓ స్త్రీ గొప్ప మనోనిశ్చయంతో తనకిష్టమైన జీవన విధానంలోకి మారడానికి ప్రయత్నిస్తుంది.

బయటకి తక్కువగా మాట్లాడుతుందని అనిపించే నీల – తన లోలోపల, తనతో తానే ఎడతెగని సంభాషణ సాగిస్తుంది. జీవితం సంక్లిష్టమైన, పూరించడం కష్టమైన గళ్ళ నుడికట్టులా మారిన యువతి కథ “నీలా వాళ్ళమ్మ, మరి కొందరు“. భార్యాభర్తల మధ్య గొడవ జరిగితే దాని ఆనవాళ్ళు భార్య ముఖంపైనే ఎందుకు కనబడతాయని ఈ కథ ప్రశ్నిస్తుంది. తమకి శారీరకంగా బలం తక్కువ అనీ, పురుషులనే అహంకారంతోనూ భార్యలపై భర్తలు చేసే దాష్టీకాన్ని ఒక్క వాక్యంలో చెప్పారు రచయిత్రి. చావంటే మనుషులు హఠాత్తుగా మాయమైపోవడం’ అని రచయిత్రి మరణం గురించి చెప్పిన మాటలు చదువుతుంటే అప్రయత్నంగానే ఒళ్ళు జలదరిస్తుంది.

‘కలలకీ కన్నీళ్ళకీ కాలం కాదిది’ అని భావించే విరాళి తనిష్టపడిన వ్యక్తితో జీవితం పంచుకోలేకపోతుంది. మనసులో తడి ఆరి, బీటలువారి బండరాయిలా ఘనీభవించిపోతుందామె. ‘మాడుగ వాసన వేస్తున్న జీవితం నాది’ అని అనుకుంటుంది. పాతమిత్రులు కలసినప్పుడు, “ఒక్కోసారి ఒడ్డున కూర్చుని మనం నదిలా ప్రవహించడాన్ని మనమే చూసుకుని నవ్వుకోవాలి” అంటూ ఓ మిత్రుడు చెప్పిన మాటలు ఆమెలో జీవితేచ్ఛని మళ్ళీ రగిలిస్తాయి. మనకి ఇష్టమున్నా లేకున్న మన జీవితాలలోకి చొచ్చుకువచ్చే మార్పులని అధిగమించి ముందుకు సాగాలని సూచిస్తుంది “సూర్యుడి మొదటి కిరణం” కథ.

***

ఇంతమంది స్త్రీల బాధలను మన గుండెల్లోకి పంపి మనల్ని సున్నితం చేయబూనుకున్న విమల కథలను ఇష్టపడటం మొదలుపెడతాం. విమల కథలను ఇష్టపడటం అంటే బాధను అర్థం చేసుకోవడం. బలహీనులను అర్థం చేసుకోవడం. బలహీనులుగా కనిపించేవారిలో బాధితులుగా కనిపించేవారిలో ఉన్న బలాన్ని అర్థం చేసుకోవడం” అంటారు ఓల్గా. ఈ కథలు చదివాక, ఓల్గా గారి అభిప్రాయంతో ఏకీభవించని పాఠకులు ఉండరని నా ఉద్దేశం.

చినుకు ప్రచురణలు, విజయవాడ వారు ప్రచురించిన ఈ 215 పేజీల పుస్తకం వెల 120/- రూపాయలు. ఈ పుస్తకం అన్ని ప్రముఖ పుస్తక విక్రయ కేంద్రాలలోనూ లభిస్తుంది.

వెంటాడే ప్రశ్నల పెరుమాళ్ నవల!

murugan

పెరుమాళ్ మురుగన్ గానీ ఆయన రచనలు గానీ నాకు తెలిసింది ఆయన రాసిన “మాధుర్భగన్” వివాదాస్పదమయ్యాకే. దీన్ని అనిరుద్దన్ వాసుదేవన్ ఆంగ్లంలోకి “One Part Woman” పేరుతో అనువదించారు. తమిళం మాతృక పేరు “మాధుర్‌భగన్”, “మాదోర్‌భగన్”, “మాధోర్‌భాగన్” ఇలా వేర్వేరుగా అక్కడక్కడా రాయబడింది. ఏదీ సరైనదో తమిళం తెలిసిన వారు చెప్పాలి.

కథంతా తృతీయ పురుషలో వుండినా అక్కడక్కడా ఆయా పాత్రల స్వగతంతో ప్రథమపురుషలోనూ వుంటుంది. వరుసక్రమంలో కథ నడిచినట్లున్నా సందర్బాన్నిబట్టి ఆయా పాత్రల ఆలోచనల్లో, సంబాషణల్లో వెనక్కి, ముందుకూ వెళుతూ వుంటుంది. అయినా ఎక్కడా వర్తమానాన్ని వదిలిపెట్టిన స్పృహ వుండదు. చాలా సహజంగా కథ నడుస్తూ వుంటుంది. నాకు అలవాటులేని పాత్రల పేర్లు కావడం వల్లనేమో కథ మొదలయిన చాలా సేపు “కాళి” అనగానే నాలో అమ్మాయి మెదిలేది. కాళి పేరులో అబ్బాయిని చూడటం కాస్తా యిబ్బంది పెట్టింది.

పిల్లలు లేని యువదంపతుల ఆవేదన ప్రతి దృశ్యంలోనూ కనిపిస్తుంది. కాసే చెట్టు, ఈనే ఆవు, పిల్లల కోడి, ఆడే పిల్లలు … ఇలా ప్రతిదీ ఆ కోణంలోనే వారికి కనిపిస్తుంటుంది. పిల్లలు నిజంగా వారికోసం కావాలా? లేక కేవలం సమాజపు మెప్పుకోసం, అంగీకారం కోసం కావాలా అన్న ప్రశ్న మనలను వెంటాడుతూవుంటుంది.

నవలా నేపథ్యం స్వాతంత్య్ర పూర్వం తిరుచెంగోడ్ పట్టణ పరిసర పల్లెలు, తిరుచెంగోడ్ తిరునాళ్ళు. కాళి, పొన్నయి అనే దంపతుల చుట్టూ అల్లబడిన నవల. పెళ్ళి అయిన మూడు నెలల నుండీ ప్రారంభమవుతుంది కథనం. పెళ్ళి అయి నెలలు గడిచేకొద్దీ పిల్లలు కలగని దంపతుల అవస్థలు ఎలా వుంటాయో ఈ ఆధునిక యుగంలో కూడా నాకు కొంత పరిచయమే. అలాంటిది ఎటువంటి వైద్యపరమైన చికిత్సలూ, బిడ్డలు కలగకపోవడానికి గల కారణాలు కనుక్కోగల పనిముట్టులూ లేని ఆ రోజుల్లో ఓ పల్లెటూరిలోనిలోని దంపతుల వ్యథ ఎలావుంటుందో చెప్పనలవిగాదు. కొంతమంది తెలిసీ, మరికొంతమంది తెలియకా పిల్లలు కలగని వారిని మానసిక వత్తిడికి గురిచేస్తూ వుంటారు. ఆ వత్తిడి ఎన్ని మార్గాల్లో, ఎన్ని విధాలుగా వుంటుందో తెలిస్తే ఓ విధమైన షాక్‌కు గురవుతాము.  

కథలోకి వస్తే కాళి, పొన్నయి ఒకరిపై ఒకరికి అనురాగమున్న కొత్త దంపతులు. పెళ్ళి అయిన మరుసటి నెల నుండే నెల తప్పలేదేంటని కంగారు మొదలవుతుంది. పిల్లలు పుట్తకపోవటమన్న బెంగ పీడిస్తూవుంటుంది. వూరి జనాలవల్ల రకరకాలుగా అవమానింపబడతారు. కాళి పెళ్ళికి ముందు తన మిత్రబృందంతో ఎంతో కలివిడిగా, హుషారుగా తిరిగినవాడు. కానీ పెళ్ళయిన కొన్ని నెలలనుండీ ఏదో సందర్భంలో మిత్రులనుండి తను నపుంసకుడు అన్న అర్థంలో మాటలు పడాల్సి వస్తుంది. అప్పటినుండి మెల్లమెల్లగా తనలోకి కుచించుకుపోతాడు. మొదట తన తల్లి రెండోపెళ్ళి గురించి మాట్లాడినా తన భార్య స్థానంలో మరో స్త్రీని వూహించుకోలేడు. అదీగాక తనలోనే లోపముండీ ఆమెకూ పిల్లలు పుట్టకుంటే ..అన్న ఆలోచనే భయంకరంగా అనిపిస్తుంది. తను కేవలం ఇంటికీ, పొలానికే పరిమితమయి ఈ బయటి హేళనల నుండి కాస్తా వుపశమనం పొందినా, పొన్నయి అవమానపడిన ప్రతిసారీ ఆమెను ఓదార్చలేక కృంగిపోతూవుంటాడు. ఇద్దరూ ఒకరిలోఒకరు కరిగిపోవడం ద్వారా వుపశమనం పొందుతూ వుంటారు.

ఆమె గొడ్రాలుతనాన్ని అలుసుగా తీసుకొని ఆమెను పొందాలని ప్రయత్నిస్తాడొకడు. వాళ్ళకు ఎలాగూ పిల్లలు లేరు కదా వారి తదనంతరం ఆస్తి తమపిల్లలకు చేజిక్కించుకోవచ్చని దూరపు బంధువులు తమ పిల్లలను వీరింటికి పంపుతూ వీరికి చేరువ చేయాలని చూస్తూ వుంటారు. ఓ అమ్మాయి పెద్దమనిషి అయినప్పుడు జరిపిన వేడుకలో పొన్నయిని దూరంగా వుంచుతారు. ఓ గొడ్రాలు దీవిస్తే ఆ అమ్మాయికి అశుభం అని వాళ్ళ నమ్మకం.

“కూడబెట్టి కూడబెట్టి ఏమి చేసుకుంటారు డబ్బుని, బాగా తిని, మంచి బట్టలు వేసుకొని హాయిగా వుండండి.” అంటుంది ఆమె ఆడపడచు ఒకసారి. “ఏం, ఇప్పుడు మేము ఆకలితో ఛస్తున్నామా? బట్టలు లేకుండా మీయింటిముందు బిత్తల తిరుగుతున్నామా?” అని పొన్నయి విరుచుకుపడుతుంది. పక్కవూరిలో తన స్నేహితురాలి ఇంట్లో పెళ్ళికి వెళుతుంది ఓసారి. ఆ స్నేహితురాలు ఈమెను తనకు సహాయపడటం కోసం పెళ్ళి సమయం కంటే బాగా ముందే రమ్మన్నా, ఎవరూ తోడులేకపోవడంతో అందరితో పాటే వెళుతుంది. “ముందే రమ్మని చెప్పినా ఇప్పుడు వస్తున్నావు, నీ కూతుర్లను తయారుచేసేసరికి ఇంత ఆలస్యమయ్యిందా?” అని నిష్టూరమాడుతుంది ఆమె. పొన్నయి అక్కడ కోపంతో ఏమేమో అని పెళ్ళి చూడకుండానే తిరిగి వెళ్ళిపోతుంది.

పొన్నయి ఎన్నోసార్లు తన పొలంలో ఏమి నాటినా విరగ్గాసింది. ఏ కోడిని పెంచినా పిల్లల్లని తెగ పొదిగింది. తన యింట్లో మేక, గేదె దూడలని కంటూనే వున్నాయి. తన పొరుగువారి పొలంలో ఒకసారి గొర్రులకు విత్తనం అందించే పనిచేస్తుంది పొన్నయి. అదికూడా ఆ పొలం యజమాని కోరితేనే! అయితే అదనులో విత్తకపోవడంవల్ల పంట ఆశించినట్లు రాదు. వూరంతా గొడ్రాలు చేయి తగిలిన విత్తనం ఎలా పైకి వస్తుందని గుసగుసలు పోతుంది.

గొర్రెలు తనపొలంలో పడి తింటున్న ఆక్రోశంలో పొన్నయి ఆ గొర్రెల కాపరిని తిడుతుంది. ఆ గొర్రెల కాపరి “వారసులు లేని ఆస్తిని మూటగట్టుకొని పోతావా” అని నిందిస్తుంది.

తన యింటికి వచ్చి ఆడుకునే పిల్లలను బాగానే చూసేది పొన్నయి. కానీ ఎప్పుడో ఒకసారి వాళ్ళు ఆడుకుంటూ దెబ్బ తగిలించుకుంటే “పిల్లలుంటే కదా తెలిసేది పిల్లలని ఎలా చూసుకోవాలో” అని ఆ పిల్లాడి తల్లి రుసరుసలు పోతుంది.

ఇలా అనుదినమూ అవమానాలు పడే వాళ్ళకు నల్లుపయ్యన్ మామ ఒకడే ఊరట. అతను పెళ్ళిచేసుకోకుండా వుండిపోయివుంటాడు. పిల్లలు లేనంత మాత్రాన ఏ నష్టమూ లేదని, వూరి మాటలని పట్టించుకోవద్దని వీళ్ళకి స్వాంతన కలిగిస్తూ వుంటాడు.

చివరికి వీళ్ళకు ఇక పుట్టరని నిర్ణయానికి వచ్చిన పొన్నయి తల్లి, తండ్రి, అన్న, కాళి అమ్మ కలిసి పొన్నయిని తిరుచెంగోడు తిరునాళ్ళకు పదులాలుగవ రోజు తీసుకెళ్ళాలని యోచన చేస్తారు. కానీ అది పొన్నయికి, కాళికి ఎలా చెప్పాలో తెలియక తర్జనభర్జన పడతారు. చివరికి ఆ ఆలోచనని కాళి తల్లి కాళితో చెబుతుంది. కాళి సుతారామూ అందుకు ఒప్పుకోడు. ఓ ఏడాది పైగా పొన్నయితో ఆమాట చెప్పడానికి కూడా ఒప్పుకోడు. చెబితే తన ప్రతిస్పందన తీవ్రంగా వుంటుందని, ఒప్పుకోదన్న అంచనాలో వుంటాడు. కానీ ప్రతిసారి తిరునాళ్ళ పండగ రోజులని అత్తవారింట్లో గడిపే వాళ్ళకు ఆ ఏడాది నుండీ ఎందుకు కాళి వద్దంటున్నాడో పొన్నయికి అర్థంగాక నిలదీస్తుంది. అప్పుడు కాళి పెద్దవాళ్ళ ఆలోచనని బయటపెట్టి “పద్నాలుగవ రోజు నిన్ను పంపుతామంటున్నారు. వెళతావా?” అని కోపంగా అడుగుతాడు. అయితే భర్త అంతరంగాన్ని సరిగ్గా అర్థం చేసుకోని పొన్నయి “నువ్వు వెళ్ళమంటే వెళతానంటుంది”. అందులో భర్త పట్ల ప్రేమ, బిడ్డల పట్ల కాంక్ష తప్ప తనకింకో దురుద్దేశం లేదు. అయితే ఈ సమాధానంతో కాళి నిరుత్తరుడవుతాడు.

ఇలా భార్యాభర్తల మధ్య, ఇరుగుపొరుగు మధ్య జరిగే మాటల ఘర్షణ, మనోభావాల ఘర్షణ, అంతరంగాల ఘర్షణ ఈ నవలంతా! ఇంతకీ ఆ తిరునాళ్ళలో పద్నాలుగవ రోజు విశేషమేమిటంటే… పెళ్ళయిన, పిల్లలు కలగని ఆడవాళ్ళు ఆరోజు ఏ అపరిచుడితోనే సంగమించి పిల్లలని కలగడమనే ఆచారం. దాన్నెవరూ తప్పుగా అనుకోరు. ఆ దేవుడే ఆ అపరిచితుడి రూపంలో వచ్చి గర్భదానం చేశాడనుకుంటారు. దాన్ని అప్పటి సంఘం ఆమోదించింది.

పొన్నయి వెళ్ళిందా? కాళి పంపించాడా? ఆ తర్వాత ఏమి జరిగింది అన్నదానికోసమే కాకుండా ఓ పిల్లలులేని దంపతుల ఆవేదన, అవమానాలు, అప్పటి పల్లె జీవితం చుడాలంటే తప్పక చదవాల్సిన నవల ఇది. amazon.comలో కొన్ని ప్రతులు ఇంకా దొరుకుతున్నాయి.

అయిదు మంది భర్తలను కలిగిన ద్రౌపదిని అంగీకరించి, ఇదే పద్దతిలో పుట్టిన పాండవులను, కౌరవులను అంగీకరించిన సమాజంలో, అలాంటి ఒక ఆచారం గురించి చెప్పినంతమాత్రానికి ఈ నవల మీద రచ్చ జరగడం ఆక్షేపణీయం. ఆ ఆచారాన్ని పక్కనబెట్టి ఓ గొడ్రాలు (ఈమాట అనాలంటే మనసు రావట్లేదు, కేవలం పిల్లలు కలగని స్త్రీ అనే అర్థంలో మాత్రమే అంటున్నాను) పడే రోజువారీ అవమానాలు, ఆ భర్త ఎదుర్కొనే అవమానాలు వీటిని గురించి చర్చ చేయాలి. కానీ అది పక్కన బెట్టి కేవలం తనకు నచ్చని ఓ కోణాన్ని మాత్రమే పైకి తెచ్చి రచ్చ చేశారు. ఈరోజుకీ పిల్లలు లేని ఆడవాళ్లని, భర్త చనిపోయిన ఆడవాళ్లని ఎన్నెన్నో మాటలతో అవమానించడం మనం చూడవచ్చు. ఆ విషయమై చర్చ జరిగివుంటే ఈ రచన ఆ బాధలు పడే స్త్రీలకు కొంతైనా స్వాంతన కలిగించి వుండేది!

*

‘దాట్లే’సిన గోదారి

godvari

ఎడిటర్జీ

మేము ఒట్టి హాస్యము తప్ప చదవరాదని ఒట్టు పెట్టుకున్నవారము. 2013 సం II లో, దాట్ల లలిత గారు    ” ఈదేసిన గొదారి” శీర్షికన  సారంగ  పత్రిక లో  కథలు రాసిరి.

” నా రాతలన్నీ కాలక్షేపం బఠానీలు ”  అని లలిత గారు చెప్పిన కారణాన, ఈ కథలు ఒట్టి హాస్యం అనుకుని మేము చదివినాము. కానీ వెళ్ళగా వెళ్ళగా  జీవితం అంత, గోదారి అంత లోతైన కథలు అని అర్ధం అయినవి. మేము చెప్పిన దానికి వలయు సాక్ష్యములు కింద దఖలు చేయుచుంటిమి. ఇందుకు పరిహారము గా లలిత గారు మరిన్ని కథలు రాయాలని మేము కోరుచున్నాము.

O – O – O – O

అందరూ ” భానుమతి గారి “అత్త గారి కథలు ” లాగా ఉన్నాయి అన్నారు కానీ, నా ఉద్దేశం లొ ఆ పోలిక అత్త గారి వరకే. నాకైతే  – ముళ్లపూడి , నామిని – కథల్లాగా అనిపిస్తాయి.

కేవలం  హాస్యం వేరు. అది తక్కువని కాదు. అదో దారి! నిత్య జీవితం లో జరిగే విషయాలని అల’వోకల్’ గా చెబుతూ – కరుణరసం అంతర్లీనం గా పొంగే హాస్య రసం పండించడం కత్తి మీద సాము – రచనా వ్రుత్తి మీద సాము.

X X X X X

 

“అలసిన వేళనే చూడాలీ….” కథ లో –

“చంద్రుడు వెండి కంచంలా లేడూ”  అన్నారు   ఆకాశంలోకి చూస్తూ.

నేను “ఊహు…” అని తల అడ్డంగా ఊపేను.

“పోనీ… వెన్నముద్దలా  ఉన్నాడా”అన్నారు.

నేను వూహుహు…అని తల అడ్డడ్డంగా ఊపేను.

పోనీ నువ్వే చెప్పవోయ్ అన్నారు  గారంగా.

నేను రెప్పవాల్చక చందమామని చూస్తూ,” మధ్యలో ఆ మసేవిటండీ మాడిపోయిన అన్నం తెపాళాలా  చిరాగ్గా . ఏవండీ ఓసారి చందమామను కిందికి దించండి సుబ్బరంగా తోమి బోర్లించేస్తాను “ అని  చూద్దునుకదా మబ్బు మాటున ఆ చందమామ , ముసుగు చాటున నా చందమామ భయం భయంగా నన్నే చూస్తూ ….

 

X X X X X

చందమామ లొ   మసిపట్టిన  అన్నం  తపాళా   చూడటం – ఒట్టి హాస్యం కాదు !!

కొందరు  తోమేది  గిన్నెలనయితే –

ఇంకొందరు  రోజూ  తళతళా  తోమేది  ఉద్యొగాన్నీ, ఆశించేది – బాసు ఫేసులో  కటాక్ష వీక్షణాల తాలూకు వన్నెలనీ , చిన్నెలనీ.

 

X X X X X

ఎంత నేర్చినా…? కథ లో –

 

ఆయేడు శ్రీరామ నవమికి చందాలిచ్చినవారి పేర్లు మైకులో చదువుతూ చివరాకర్లో వరాల్రాజు గారి పేరు కూడా ఒక్కరూపాయెక్కువేసి చదివేసి, మర్నాడు పొద్దున్నే ఆయనింటికెళ్ళి చూస్తే తాళం పెట్టుందట . గడపమీద ఆయేటి చందా వందలకట్టతో పాటు ఓ రూపాయి బిళ్ళ ఒత్తెట్టి కనిపించిందట . కొన్నాళ్ళకి రామిండ్రీ నుంచీ , అనపర్తినుంచీ అప్పులోళ్ళొచ్చి తాళం పగలకొట్టి విలువయినవి అనుకున్న సామానులన్నీ పంచుకు పోయారట. అప్పటివరకూ ఆహా అన్నవాళ్ళే అంతా స్వయంకృతం తేల్చేసారట . మాటలేవన్నా కొనితేవాలా? నాలుక మడతేసి ఎటు కావాలంటే అటు ఆడించడమేకదా !రాజంటే వరాల్రాజే అన్నవాళ్ళెవరూ ఆయన గురించి బెంగిల్లిపోలేదు , మనకింత చేసిన మారాజు ఏవయిపోయేడో అని ఆరా తీయలేదు. ఎందరో వరాల్రాజుల్నీ బంగార్రాజుల్నీ మర్చిపోయినట్టే మర్చిపోయి ఊరుకున్నారట . అంతెందుకూ …వరాల్రాజుగారు చేయించి వేసిన ముత్యాల హారాలు, వెండి కిరీటాలు ధరించిన సీతారాములే ప్రతిఏటా ఆ పాడుబడ్డ ఇంటిముందునించీ ఏవీ తెలీనట్టు చిరునవ్వుతో ఊరేగుతూ వెళ్ళిపోతుంటే ఇంక మనుషుల్ని అనుకోటానికేవుందని అత్తగారు తరచూ బాధ పడేవారు

X X X X X

 

ఎంతటి జీవిత సత్యం !! “అమరావతి కథలు” గుర్తుకొచ్చాయి !!

” నా రాతలన్నీ కాలక్షేపం బఠానీలు ” అన్న లలిత గారి మాట నిజం కాదు. ఆవిడ కథలన్నీ విలువైనవి. నా లాంటి వాళ్ళు  ఉజ్యోగం తపాళా తోమటం లో – అలిసిన వేళ ల సేద దీర్చే అద్భుత ఔషధం.

 

లలిత గారూ

రాయమని మిమ్మల్ని అడగడం తేలికే ; రాయడమేకష్టం.

మరంచాత – మీకు వీలయినప్పుడూ, ఏమీ తోచనప్పుడూ, తోచినప్పుడూ రాయమని శాయంగల విన్నపాలు.

హెబ్బెబ్బే చిన్నయ్య గోరూ – పైన  మొదాట్లో కోర్టు నోటీసు భాష అంతా వుత్తిదే… మిమ్మల్ని నవ్వించడానికి ! ఆయ్ !!

సరే !!!  అలాక్కానివ్వండి .. మీరు  కొత్త కథ   రాసే లోగా  మీ గోదారి  మళ్ళీ  ఓసారి  ఈదేసి వస్తాం !!

మూడు కావ్యాల ముచ్చట!

mani-92మనకి తెలుగులో ఐదు పంచకావ్యాలు (మనుచరిత్ర, వసుచరిత్ర, రాఘవపాండవీయము, పాండురంగ మహాత్మ్యము, శృంగార నైషధము)  ఉన్నట్లే తమిళంలో కూడా ఐదు పంచకావ్యాలు ఉన్నాయి.  అవి శిలప్పదిగారం, మణిమేఖల, జీవక చింతామణి, వళయాపతి, కుండలకేశి.

వీటిలో అత్యుత్తమ రచనలు, జంట కావ్యాలు అయిన శిలప్పదిగారం, మణిమేఖల కావ్యాలను  ఎమ్.ఎ తెలుగు పాఠ్యపుస్తకాలు చదివీ,   నెట్ లోని సమాచారం సేకరించీ,  అన్నిటికంటే ముఖ్యంగా నా కొలీగ్స్,  తమిళ ఫ్రెండ్స్ ని అడిగి తెలుసుకునీ గతంలో సారంగ పాఠకులకు సంక్షిప్తంగా పరిచయం చేశాను.  అదే విధంగా ఇప్పుడు మిగిలిన మూడు కావ్యాలను పరిచయం చేయడమే ఈ వ్యాసం ఉద్దేశం.  ఇవి నేను విన్న,  తెలుసుకున్న కథలు మాత్రమే గమనించగలరు.  తప్పులు ఉంటే మన్నించి మీకు ఇంకా ఈ కావ్య విశేషాలు తెలిసి ఉంటే ఇక్కడ పంచుకోవలసినదిగా కోరుకుంటున్నాను.

  1. శిలప్పదిగారం లింక్
  1. మణిమేఖల  లింక్

మిగిలిన మూడు కావ్యాలను ఈ క్రింది వ్యాసంలో చదవండి –

  1. జీవకచింతామణి

తమిళ పంచకావ్యాలలోని మూడవది “జీవక చింతామణి”.  కావ్య నాయకుడు జీవకుడు పుట్టినప్పుడు ఆకాశవాణి “జీవ”  అని పలికిందనీ,  అతని తల్లి “చింతామణీ,  నువ్వు నాకు లభించావా?”  అన్నదనీ ఈ కావ్యానికి జీవక చింతామణి అనే పేరు వచ్చిందంటారు.

శృంగార కావ్యమైన ఈ జీవక చింతామణి కావ్యాన్ని తిరుత్తక్కదేవర్ రచించారు.  ఈ కావ్యం 3145 వృత్త పద్యాలతో రచింపబడినది.    తమిళంలో వృత్తపద్యాలతో కావ్యరచనకి నాంది పలికినవాడు తిరుత్తక్కదేవర్.    ఈయన జైన మత సంప్రదాయానికి చెందినవాడు.

ఒకసారి తిరుత్తక్కదేవర్ మధుర పండిత పరిషత్తుకు వెళ్ళినప్పుడు అక్కడి పండితులు ‘మీరు – జైన సంప్రదాయవాదులు – ఎంత సేపటికీ సన్యాస దీక్ష గురించి రాయమంటే రాయగలరు గాని ప్రణయానికి సంబంధించిన రచనలు చేయలేరు”  అని అన్నారుట.  తిరుత్తక్కదేవర్  దానిని సవాలుగా తీసుకుని ఈ జీవక చింతామణి కావ్యాన్ని ఎనిమిది రోజుల్లోనే పూర్తి చేశారుట.

ఇది చక్కని కావ్యంగా పండితుల ప్రశంసలను అందుకొన్నది.

కథా సంగ్రహం :

హామాంగద రాజ్యానికి రాజు సత్యంధరుడు.  ఇతడు దయార్ద్ర హృదయుడు.  ప్రజలను కన్నబిడ్డలవలె చూసుకునేవాడు.  అతని మేనమామ కూతురైన విజయను వివాహం చేసుకున్నాక అతిలోక సౌందర్యవతి, అపురూప లావణ్యవతి అయిన ఆమెని వదలకుండా ఆమెతోనే కాలం గడపసాగాడు.  రాజ్యవ్యవహారాలన్నీ మంత్రులు చేజిక్కించుకున్నారు.

కాష్టాంగాకారుడు అనే మంత్రి రాజుని మట్టుపెట్టి తాను రాజవ్వాలనే దురుద్దేశంతో సైన్యాన్ని సమీకరించుకుని  సమయం కోసం వేచి చూస్తున్నాడు.

ఇది ఇలా ఉండగా విజయ గర్భవతి అయింది.  నెలలు నిండాయి.  రేపో మాపో బిడ్డ పుట్టబోతాడని రాజు సత్యంధరుడు భార్యని విడవకుండా రేయింబవళ్ళు ఆమె చెంతనే ఉండసాగాడు.  అది అదనుగా భావించిన కాష్టాంగాకారుడు తన సైన్యంతో అంతఃపురాన్ని ముట్టడించాడు.  సత్యంధరుడు తన ఎగిరే యంత్ర విమానంలో భార్యను కూర్చుండబెట్టి ఆమెని పుట్టినింటికి వెళ్ళమని చెప్పాడు.   అక్కడున్న కొద్దిపాటి సైన్యంతో కాష్టాంగాకారుడిని ఎదుర్కొన్నాడు కాని యుద్ధంలో వీరమరణం పొందాడు.

విజయను తీసుకెళ్ళిన విమానం ఓ స్మశానంలో ఆగిపోయింది.  అక్కడ ఆమె ప్రసవించింది.  నిస్సహాయతతో హృదయవిదారకంగా ఏడుస్తున్న విజయని కాపాడాలన్న ఉద్దేశంతో ఓ దేవత మనిషి రూపంతో వచ్చి ఆమెని ఓదార్చింది.

ఆ సమయంలో రాజ్యంలోని ఓ ప్రముఖ వాణిజ్యశ్రేష్టి తన బిడ్డ చనిపోవడంతో కుమారుని ఖననం చేసిన చోటు కొచ్చి ఏడ్చుకుని  తిరిగి ఇంటికి వెళుతున్నాడు.  బిడ్డను ఎలా పెంచాలో ఏం చేయాలో తెలియక దుఃఖిస్తున్న విజయకు దేవత ఉపాయం చెప్పింది.  దానికి ఒప్పుకున్న విజయ బిడ్ద వేలికి రాజముద్రికను తొడిగి ఆ శ్రేష్టి వచ్చే దారిలో పరుండబెట్టి చెట్టు చాటుకి తప్పుకుంది.  బిడ్డను చూసిన శ్రేష్టి తన బిడ్డ చనిపోయినా భగవంతుడు మళ్ళీ ఈ బిడ్డను ప్రసాదించాడని భావించి చేతుల్లోకి తీసుకున్నాడు.  అప్పుడు చాటునుండి చూస్తున్న దేవత “జీవ”  అంది.  అది విన్న శ్రేష్టి ఆకాశవాణి ఆ మాటలు పలికిందని భావించి బిడ్డకు ‘జీవకుడు’  అని నామకరణం చేసి బిడ్డను తీసుకెళ్ళి భార్యకి ఒప్పచెప్పాడు.  బిడ్డ చేతికున్న రాజముద్రికను చూసిన వారు అతను రాజకుమారుడని తెలుసుకున్నారు.  రాజముద్రికను తీసి దాచిపెట్టి అతడు తనకి దొరికిన బిడ్డ అని అందరికీ చెప్పి అల్లారుముద్దుగా పెంచుకోసాగాడు.

విజయ స్మశానం నుండి బయటపడి అడవిని దాటి వెళ్ళి అడవికి ఆవలనున్న ఓ జైన ఆశ్రమంలో చేరిపోయింది.

***

జీవకుడు ఆర్యనంది అనే ఓ రాజగురువు దగ్గర విద్యను అభ్యసించసాగాడు.   సకల విద్యలను నేర్చుకున్నాడు.  మనోహరాకారుడైన అతని ప్రతిభ అందరినీ ఆశ్చర్యపరచసాగింది.  అతని విద్య పూర్తయ్యాక ఆర్యనంది జీవకుడికి అతని పుట్టుక రహస్యాన్ని తెలియచేశాడు.  కోపోద్రేకుడైన జీవకుడిని ఆర్యనంది శాంతపరచి కాష్టాంగాకారుని చంపడానికి ఇది తరుణం కాదు.  ఓ ఏడాది తర్వాతనే నీకది సాధ్యమవుతుంది.  అప్పటివరకూ దేశాటన చేయమని ఆజ్ఞాపించాడు.  గురువుకి మాట ఇచ్చి ఇంటికి చేరాడు జీవకుడు.

ఆ సమయంలో రాజ నగరానికి సమీపంలోని అడవిలో వేటగాళ్ళ గుంపు తయారై పశువులని ఎత్తుకుపోసాగారు.  రాజు కాష్టాంగాకారుడు వాళ్ళ మీదికి సైన్యాన్ని పంపాడు కాని ఆ అడవి ఆనుపానులు తెలియక చిత్తుగా ఓడిపోయాడు.  జీవకుడికి అది తెలిసి తన స్నేహితులైన కొంతమంది వీరులని వెంటబెట్టుకు వెళ్ళి వేటగాండ్రను పారద్రోలాడు.  ప్రజలు అతన్ని కొనియాడారు.  అది కాష్టాంగాకారునికి నచ్చలేదు.  జీవకుడి ధైర్యసాహసాలని చూసి అసూయాద్వేషాలతో రగిలిపోసాగాడు.  జీవకుని చర్యల మీద కన్నేసి ఉంచాడు.

నగరంలో శ్రీదత్తుడు అనే వ్యాపారి ఉన్నాడు అతనికి ఓ కుమార్తె ఉంది.  నిజానికి ఆమె ఒక గంధర్వుడి కుమార్తె.  ఈ నగరంలోనే ఆమె వివాహం అవాలని ఉందని ఆమె జాతకంలో ఉండటం వల్ల ఒకప్పుడు శ్రీదత్తుడిని కాపాడిన ఆ గంధర్వుడు కుమార్తెని శ్రీదత్తుని ఇంట్లో ఉంచాడు.  ఆమె పేరు గంధర్వదత్త.  గంధర్వదత్తను వీణావాదనలో ఎవరైతే ఓడిస్తారో వాళ్ళకి ఆమె భార్య అవుతుందని శ్రీదత్తుడు ప్రకటన చేస్తాడు.  ఎంతోమంది యువకులు ప్రయత్నించి విఫలులవుతారు.  జీవకుడికి సంగతి తెలిసి ఆ పోటీలో పాల్గొని గంధర్వదత్తని ఓడించి ఆమెని వివాహమాడతాడు.

ఇద్దరూ సంతోషంగా కాలం గడపసాగారు.  ఒకరోజు ఓ ఏనుగు సంకెళ్ళని తెంచుకుని కోమటి వీధుల్లో పరిగెడుతూ గుణమాల అనే యువతిని తరుముకు రాసాగింది.  ఆమె కూడా నగరంలో ఓ ప్రముఖ వ్యాపారి కుమార్తె.   ఆ సమయంలో ఆ వీధిలోనే వెళుతున్న జీవకుడు ఏనుగును అదుపులో పెట్టి గుణమాలని రక్షించాడు.   అతని చేతిలో వాలిన ఆమె అద్భుత సౌందర్యాన్ని చూసిన జీవకుడు ఆమెపై మరులుగొన్నాడు.  ఆమె కూడా జీవకుడిని మొదటి చూపులోనే ప్రేమించింది.  తన చిలుక ద్వారా అతనికి ప్రణయసందేశాన్ని పంపింది.  జీవకుడు సంతోషపడి ఆమె తల్లిదండ్రులతో మాట్లాడి గుణమాలని వివాహమాడాడు.

తన కుమారుడైన మదనునికి గుణమాలనిచ్చి వివాహం చేయాలని సంకల్పించుకున్న కాష్టాంగాకారుడు ఇది సహించలేకపోయాడు.  మదనుడిని పిలిచి జీవకుడి మీద ఏదో ఒక రాజద్రోహం మోపి సంహరించి రమ్మని పంపాడు.  పెద్ద సైన్యంతో జీవకుడి ఇంటి మీదకు వచ్చాడు మదనుడు.  సంవత్సరం పాటు కాష్టాంగాకారునిపై యుద్ధం చేయనని గురువుకిచ్చిన మాట నిలబెట్టడం కోసం తన భార్య గంధర్వదత్త మంత్రమహిమతో ఎవరికీ కనపడకుండా అక్కడ నుండి తప్పించుకుని మాయమైపోతాడు.

దేశ సంచారం చేస్తూ వివిధ దేశాలల్లోని ప్రముఖుల కుమార్తెలని ఐదుగురిని వివాహమాడతాడు.

పాము కాటు నుండి కాపాడి ఓ దేశ రాజకుమారి అయిన పద్మను మూడవభార్యగా స్వీకరిస్తాడు.   యుక్తవయస్తు వచ్చినా ఎవర్ని చూసినా సిగ్గుపడని ప్రముఖ వ్యాపారి కుమార్తె ఖేమచరి జీవకుడిని చూసి సిగ్గుపడటంతో అతనే ఆమె భర్త అని జ్యోతిష్యులు చెప్పడంతో ఆమెని వివాహమాడతాడు.  ఆ తర్వాత మరో రాజకుమార్తె కనకమాలను వివాహమాడాడు.

జీవకుడు కనకమాల దగ్గర ఉన్నప్పుడు,  జీవకుడు ఎక్కడున్నాడో అని గంధర్వదత్త తనకున్న మంత్ర ప్రభావంతో చూసి “దారిలో కనపడుతున్న యువతులందరినీ పెళ్ళి చేసుకుని సాగిపోతున్నారు బాగానే ఉంది.  కాని ఇక మీరు వెంటనే తిరిగి వచ్చి కాష్టాంగాకారుడిని సంహరించి రాజ్యాన్ని పొందవలసిన సమయం ఆసన్నమైంది” అని  ఉత్తరం రాసి రాజమిత్రుడికి ఇచ్చి పంపింది.

ఉత్తరం చదువుకున్న జీవకుడు కనకమాలకి చెప్పి రాజమిత్రుడితో పర్వతాలను నగరాలను దాటుకుంటూ తన తల్లి ఉన్న జైన ఆశ్రమానికి చేరుకుంటాడు.  అక్కడ విజయను చూసి గుర్తుపట్టిన ఆ రాజమిత్రుడు జీవకుడే ఆమె బిడ్డ అని చెప్తాడు.   తల్లీ బిడ్డలిద్దరూ ఆనందంతో ఆలింగనం చేసుకుంటారు.

అమ్మని మేనమామ ఇంటికి పంపి తన రాజ్యానికి చేరుకుంటాడు జీవకుడు.   అక్కడ ఉద్యానవనంలో స్నేహితులతో కలిసి విశ్రమిస్తాడు.  ఆ సమయంలో బంతి ఆడుకుంటూన్న  విమల అన్న ఓ యువతిని చూసి మోహిస్తాడు.  ఆమె కూడా జీవకుడినే పరిణయం చేసుకోవాలని ఉబలాటపడుతుంది.  ఆమె తల్లిదండ్రుల అనుమతితో ఆమెని వివాహమాడతాడు.

నగరంలో సకలైశ్వర్యాలతో తులతూగే మరో ప్రముఖ శ్రేష్టి కుమార్తె సురమంజరి.  అహంకారి.  పురుషద్వేషి.  విమలని వివాహమాడానని  జీవకుడు తన స్నేహితులతో చెప్తున్నప్పుడు  “వివాహేచ్ఛ ఉన్న యువతులని వివాహమాడటం గొప్ప కాదు ఈ పురుషద్వేషిని వివాహమాడు చూద్దాం”  అని సవాలు చేశారు.

జీవకుడు ముసలివేషంతో సురమంజరి ఇంటికి చేరి స్పృహ తప్పినట్లు నటించి ఆ రాత్రికి ఆమె ఇంట్లోనే ఉంటాడు.  ఆ రాత్రి మైమరిపించే సంగీతంతో ఆమెను తన గదికి రప్పించుకుని ముసలి వేషాన్ని తీసివేస్తాడు.  మన్మధాకారుడైన జీవకుడిని చూసిన ఆమె తాను పురుషద్వేషినన్న సంగతి కూడా మరిచి అతన్ని వివాహమాడుతుంది.

ఈ విధంగా జీవకుడు తన దేశాటనలో  ఐదుగురు కన్యలను వివాహమాడతాడు.

***

download

ఆ తర్వాత జీవకుడు మేనమామ ఇంటికి వెళతాడు.  మామ సహాయంతో కాష్టాంగాకారుడిపై దండెత్తి అతడిని సంహరిస్తాడు.  రాజ్యలక్ష్మిని వరించిన జీవకుడికి మేనమామ తన కుమార్తె అయిన లక్షణను ఇచ్చి వివాహం జరిపిస్తాడు.

రాజైన జీవకుడు తన అష్టభార్యలతో సుఖంగా కాలం గడుపుతున్నాడు.  కొన్నాళ్ళయ్యాక అతని తల్లి విజయ తిరిగి జైన ఆశ్రమంలో చేరిపోయింది.   ఒక్కో భార్యకూ ఒక్కో కుమారుడు కలిగారు.

ఒకరోజు జీవకుడు భార్యలూ బిడ్డలతో ఉద్యానవనంలో కూర్చుని ఉన్నాడు.  ఎక్కడ నుండో పనసపండుని తెచ్చిన ఓ మగ కోతి దానిని సగంగా చీల్చి తన పక్కనే ఉన్న ఆడకోతికి ఇచ్చింది.  అదే సమయంలో తోటమాలి వాటిని తరిమి అవి కిందపడేసిన పనసపండుని తీసుకున్నాడు.  క్షణం ముందు ఆ పండుని కోతులు తింటాయని ఊహించుకుంటూ వాటిని తిలకించాలనుకున్న జీవకుడు క్షణంలో మారిపోయిన విధిని చూసి ఆశ్చర్యపోయాడు.

ఏ నిమిషానికి ఏమి జరుగునో తెలియని ఈ అశాశ్వతమైన భోగభాగ్యాలలోనే తానూ ఓలలాడుతున్నానని గ్రహించుకున్నాడు.  ఒక్కసారిగా అతనిలో ఏదో మార్పు.  అప్పటికప్పుడే తన పరివారాన్ని అందరినీ పిలిచి సన్యాసాశ్రమం తీసుకుంటున్నానని చెప్పాడు.  పెద్దకుమారుడైన సత్యంధరుడికి రాజ్యాన్ని ఒప్పగించాడు.   ఆ రాత్రి హాయైన స్నానం చేసి తృప్తిగా భోంచేసి సన్యాస దీక్షని స్వీకరించాడు.

మహావీరుడు బోధించిన మార్గంలో ప్రవర్తిల్లుతూ తపస్సు చేసి కర్మబంధాలను వదిలించుకుని జ్ఞాని అయ్యాడు.  దివ్యలోకాలు చేరాడు.   ‘నీ యీ కథను విన్న వారందరికీ శుభాలు కలుగుతాయ’ని దేవతలందరూ ఆయన్ని ఆశీర్వదించారు.

***

  1. వళయాపతి

వళయాపతి కావ్యం సంపూర్ణంగా లభించడం లేదు.  కేవలం డెబ్భై పద్యాలు మాత్రమే దొరికాయిట.  ఈ కథ అచ్చం ధృవుడి కథలా అనిపిస్తోంది.  ఈ కావ్య రచయిత ఎవరో కూడా తెలియదుట.

కథా సంగ్రహం

పుహార్ పట్టణంలో నారాయణుడు అనే వజ్రాల వ్యాపారి ఉండేవాడు.  అంతులేని సంపద ఉన్న ఇతన్ని నవకోటి నారాయణుడు అని పిలుస్తారు.  అతనికి పెళ్ళయి భార్య ఉన్నా కూడా వేరే కులం ఆమెని ప్రేమించి పెళ్ళి చేసుకుంటాడు.  తక్కువ కులపు స్త్రీతో సంసారం చేస్తున్నాడని అతన్ని అతని బంధువులు, అతని కులపెద్దలు నిందిస్తారు.  ఆవిడని వదిలెయ్యకపోతే కులాన్నించి వెలివేస్తామని అనడంతో నిండు గర్భిణి అని కూడా చూడకుండా రెండవ భార్యని వదిలేస్తాడు.

ఆమె కాళికాలయానికి చేరి అక్కడ బిడ్డను ప్రసవిస్తుంది.  భక్తులు ఇచ్చిన దక్షిణలతో ప్రసాదాలతో కడుపునింపుకుంటూ ఉంటుంది.  తన భర్తతో తనని చేర్చమని నిత్యమూ ఆ కాళికాదేవిని ప్రార్థిస్తూ ఉండేది.

బిడ్డ పెరిగి పెద్దవాడవుతాడు.   ఓరోజు ఆ పిల్లవాడు తోటి పిల్లలతో ఆడుకుంటుండగా వాళ్ళ మధ్య ఏదో తగాదా వస్తుంది.  “పోరా నీకు తండ్రే లేడు,  తండ్రి పేరు కూడా తెలియని వాడవు”  అని వాళ్ళల్లో ఒకడు ఎగతాళి చేస్తాడు.  ఆ బాబు ఏడ్చుకుంటూ వచ్చి తల్లిని తన తండ్రెవరో చెప్పమని నిలదీస్తాడు.  ఆమె తండ్రి పేరు చెప్పగానే నేరుగా నవకోటి నారాయణుడి ఇంటికి వెళతాడు.   బిడ్దని వెంబడిస్తూ తల్లి కూడా వస్తుంది.

నిలదీస్తున్న కొడుకుకి సమాధానం చెప్పలేక తలవంచుకుని నిలబడి ఉంటాడు నవకోటి నారాయణుడు.  చోద్యం చూడను గుంపుగా చేరిన ప్రజలు ఆమెని నిందిస్తుంటారు.  ఆమె మౌనంగా కళ్ళు మూసుకుని కాళికాదేవిని ప్రార్థిస్తుంది.  దేవి ప్రత్యక్షమై అందరూ వినేట్లుగా ఈమె శీలవంతురాలు.  ఆమెని భార్యగా స్వీకరించు అని నారాయణుడికి చెప్తుంది.

నారాయణుడు సంతోషంగా రెండవ భార్యని తన ఇంట్లోకి పిలుచుకుంటాడు.  కొడుకుని ప్రయోజకునిగా చేసి తనంత గొప్ప వ్యాపారిని చేస్తాడు.

***

  1. కుండలకేశి

తమిళ పంచకావ్యాలలో ఐదవది కుండలకేశి. ఈ కావ్యం కూడా సంపూర్ణంగా లభించడం లేదు.  కుండలకేశి అనే యువతి బాధాకరమైన కథ ఇది.  ఈమె సన్యాసినియై  జైన మత గురువైన నాదగుత్తాచార్యులతో వాదించి గెలవడం ఈ కథలోని విశేషంగా చెప్పుకుంటారు.

కథా సంగ్రహం

రాజుగారికి చాలా దగ్గరివాడైన ఓ ప్రముఖ వ్యాపారవేత్త కుమార్తె ‘కుండలకేశి’.  అసమాన సౌందర్యవతి.  ఒకసారి ఆమె తన భవనం పైభాగానికి చల్లగాలి కోసం వచ్చింది.   ఆ సమయంలో రాజభటులు ఓ యువకుడిన సంకెళ్ళు వేసి వీధిలో నడిపించుకుంటూ తీసుకెళుతున్నారు.    వాళ్ళని అనుసరించి ఏవేవో మాట్లాడుకుంటూ ఓ గుంపు అనుసరిస్తోంది.  ఆ కలకలం విన్న ఆమె కిందికి చూసింది.  సంకెళ్ళు వేసి తీసుకెళుతున్న యువకుడిని చూడగానే ఆమె అతని పట్ల ఆకర్షణకి లోనయ్యింది.

ఆ యువకుడి పేరు కాలుడు.  అతను గజదొంగ.  దొంగతనం చేస్తూ పట్టుబడిన అతనికి మరణదండన విధించి ఉరి తీయడానికి తీసుకువెళుతున్నారు.   చెలికత్తెని కిందికి పంపి అతని గురించి ఈ వివరాలు తెలుసుకున్న కుండలకేశి హృదయం ద్రవించిపోయింది.  తొలిచూపులోనే అతనిపై మరులుగొన్న ఆమె అతన్ని ఎలాగైనా విడిపించి వివాహం చేసుకోవాలని నిర్ణయించుకుంది.

అప్పటికప్పుడే తండ్రికి తన కోరికను చెప్పింది.  కూతురు ఏది అడిగినా కాదనలేని బలహీనత కలిగిన ఆ తండ్రి ఎంతో ధనం పోసి (లంచాలు ఇచ్చి) కాలుడిని విడిపించాడు.  అంగరంగ వైభవంగా ఇద్దరికీ వివాహం జరిగింది.  ఇరువురూ ఆనందంగా కాలం గడపసాగారు.

కొన్నాళ్ళయ్యాక ఇద్దరి మధ్యా తీవ్ర విభేదాలు మొదలయ్యాయి.  ఒకరోజు ఒకరినొకరు తీవ్రంగా నిందించుకుంటున్నప్పుడు కుండలకేశి “నువ్వు గజదొంగవు.  ఆ పాత బుద్ధులు ఎక్కడకి పోతాయి?  ఆరోజు నేను నిన్ను కాపాడకపోయినట్లైతే ఏమై ఉండేవాడివో ఆలోచించుకో”  అని అవమానించింది.

ఆ మాటలకి కాలుడు విపరీతోద్రేకానికి లోనయ్యాడు.  అప్పటికప్పుడే ఆమెని చంపేయాలన్నంత కోపం కలిగిందతనికి.    అది సమయం కాదు అని ఆవేశాన్ని అణచుకున్నాడు కాని  సమయం చూసి ఎవరికీ అనుమానం రాకుండా ఆమెని కొండ మీద నుండి తోసి చంపేయాలని మనసులో నిర్ణయించుకున్నాడు.

ఆ రోజునుండీ ఆమెతో ప్రేమగా ఉన్నట్లు నటించసాగాడు.  కుండలకేశి కూడా తన భర్తకి మంచి బుద్ధి కలిగిందని సంతోషపడింది.  ఒకరోజు భార్యని పిలిచి “మనిద్దరి మధ్యా ఏ కలతలూ రాకుండా ఉంటే కొండమీది దేవాలయానికి వస్తానని మొక్కుకున్నాను.  మొక్కు తీర్చుకుని వద్దాం, బయలుదేరు”  అన్నాడు.

ఆమె నిజమేననుకుని చక్కగా అలంకరించుకుని భర్త వెంట బయలుదేరింది.   కొండ ఎక్కుతున్నప్పుడు  అతను మాట్లాడుతున్న విషపు మాటలు, వ్యంగ్యపు మాటల ద్వారా అతని పన్నాగాన్ని కనిపెట్టింది.  వంచనని వంచనతోనే గెలవాలని మనసులో తలపోసిన కుండలకేశి ఏమీ బయటపడలేదు.  పరిస్థితి అంతవరకూ వస్తే ఏం చేయాలో పథకం వేసుకుంది.

కొండ శిఖరం చేరాక “ఇప్పుడు నిన్ను కిందకు తోసి చంపబోతున్నాను”  అన్నాడు.  నిర్ఘాంతపోయి ఏడుస్తూ భర్త కాళ్ళ మీద పడుతుందనుకున్నాడేమో పాపం – ఆ మాట చెప్పి వికటంగా నవ్వుతున్న అతన్ని గభాల్న కిందకి తోసేసింది.  అతడు శిఖరం మీద నుండి కింద పడి ప్రాణాలు వదిలాడు.

ఇక ఆమెకి జీవితం పట్ల రోత కలిగింది.  సన్యాసినియై బౌద్ధమతాన్ని స్వీకరించి వివిధ ప్రదేశాలు తిరుగుతూ మహనీయులని కలుసుకుని బౌద్ధమత సారాన్ని పూర్తిగా అర్థం చేసుకుంది.  బౌద్ధమత ప్రచారం చేస్తూ బౌద్ధమత ప్రచారకురాలిగా పేరు పొందింది.

******

సైసైరా నరసింహారెడ్డి!

palegadu

The importance of history is two folds. One is to draw the awesome inspiration of the heroes born before us. The other one is to learn to cultivate the virtues leading to soliderity and prosperity of a nation, and how to avoid the defects leading to contrary results.

– పుల్లెల రామచంద్రుడు గారు రాజతరంగిణి గురించి రాస్తూ అన్న మాటల సారాంశం అది. ఆయన చారిత్రకుడు కారు కానీ చరిత్రకు ఒద్దికైన పాఠకుడు, అనుశీలి అనుకోవచ్చు. ఆయన అన్న ఆ మాటలు ఏ కొంచెం ప్రామాణికత ఉన్న చారిత్రక రచనకైనా వర్తిస్తాయి.

**********

నేటి రాయలసీమ ప్రాంతాల్లో ఓ సామెత/నుడికారం ఉన్నది. “పోవేయ్, పెద్ద పాలేగాడు తయారయినాడు”. ఇతర ప్రాంతాల వారికి, ఇదేదో తిట్టులా తెలుస్తున్నా, కొంచెం విచిత్రమైన, వింతయిన మాట. అయితే ఆ ’పాలెగాడు’ అన్న మాట వెనుక కొంచెం బరువైన చరిత్రే ఉంది. అందుకనే ఏమో, ’పాలెగాడు’  అన్న ‘పేరు’ మీదే ఎస్.డి.వి. అజీజ్ గారు ఉయ్యాలవాడ నరసింహారెడ్డి పోరాటచరిత్రను నవలగా రచించారు. ఈ చరిత్ర క్రీ.శ. 1846 లో మొదలయ్యింది. అంటే – ప్రథమస్వాతంత్రపోరాటానికి పదకొండు సంవత్సరాలకు ముందు.అప్పటికి  ఆ ప్రాంతాలకు ’రాయలసీమ’ అన్న శబ్దం స్థిరపడలేదు. అప్పటికది ’రేనాడు’.  విజయనగర సామ్రాజ్యపు రాజులు ఆ రేనాటిసీమలో 100 లేదా 200 గ్రామాలకు గుత్తగా ఓ అధికారిని పర్యవేక్షణకై నియమించారు. ఆ అధికారిని పారుపత్తెందారు లేదా ’పాళెయగారు’ అనేవారు. పాళెయగారు- పాలేగారు – పాలేగాడు అయింది. ఆ పాలేగాళ్ళలో కొందరు తాము రాజుకన్నా గొప్పగా అధికారులమన్నట్టు భావించేవారు. అలా ఆ సామెత పుట్టుకొచ్చింది.

అయితే ఆ ‘పాలేగాడు’ కు నిస్వార్థ పోరాట చరిత్ర కూడా ఉంది.

క్రీ.శ. 17 వ శతాబ్దం తర్వాత కుంఫిణీ ప్రభుత్వం భారతదేశంలో ఒక్కొక్క సంస్థానాన్ని లోబరుచుకుంటూ వస్తూంది. క్రీ.శ. 1799 లో టిప్పుసులతాను మరణించాడు. ఆ యుద్ధం తర్వాత రేనాటి సీమ, దుట్టుపక్కల ఇతర ప్రాంతాలు నిజాం నవాబుకు దక్కింది. ఆపై క్రీ.శ. 1800 అక్టోబరు 12 న నిజాం – సీమను బ్రిటీషు వారికి లీజికు ఇచ్చాడు. అప్పటి నుంచి ఈ ప్రాంతాలు సీడెడ్ డిస్తిక్ట్స్ గా పిలువబడుతూ వచ్చాయి.  ఆపైన బ్రిటీష్ ప్రభుత్వం 80 మంది పాలెగాళ్ళను కుట్రతో గుత్తికోటలో బంధించి లొంగదీసుకుంది. ఆ పైన భూమి శిస్తుకు తట్టుకోలేక కర్నూలులో తెర్నేకల్లు గ్రామస్తులు తిరుగుబాటు చేసి అమరులయ్యారు. 1839లో కర్నూలు నవాబు వాహబీ తిరుగుబాటు చేస్తే ఆంగ్లేయులు కుట్రతో అతణ్ణి బంధించారు. ఆ నేపథ్యంలో కర్నూలు జిల్లా కోయిలకుంట్ల, కడప జమ్ములమడుగు మధ్యన ఉన్న అరవై గ్రామాలకు చెంచురెడ్ల వంశానికి చెందిన జయరామిరెడ్డి పాలేగారు. ఇతణ్ణి నొస్సం పాలేగారు. ఇతని నివాసం నొస్సంకోట. ఈ పాలేగారుకు సంతానం లేకపోవడంతో – అతని మేనల్లుడు ఉయ్యాలవాడ నరసింహారెడ్డికి అధికారం దక్కింది. నరసింహారెడ్డి – రూపనగుడిలో పుట్టాడు. జయరామిరెడ్డి ఆంగ్లేయులకు లొంగిపోయింది. ఆ ప్రభుత్వం అతనికి కేవలం 11 రూపాయల తనర్జీ (భరణం/నెలజీతం) ఏర్పాటు చేసింది. ఇది ఆ సంస్థానానికి ఏ మాత్రం చాలని భరణం.

ఆ నేపథ్యంతో మొదలైన నవల యిది.

 

*************

నరసింహారెడ్డి మీద రాయలసీమలో వీథిగాయకులు పాడుకునే జానపదగీతం ఒకటి ఉంది. దాన్ని ’రాయలసీమ రాగాలు’ అన్న పుస్తకంలో మల్లిక్ గారు ప్రచురించారు. అది ఇలా సాగుతుంది.

సైరా నరసింహారెడ్డి

నీ పేరే బంగార్పూకడ్డీ

 

రాజారావు తావుబహద్దరు నారసింహారెడ్డి

రెడ్డి కాదు బంగార్పుకడ్డి నారసింహారెడ్డి

ముల్ కోల్ కట్టె సేతిలో ఉంటే మున్నూటికీ మొనగాడు

రెడ్డి మాటలు ఏదాలురా రాండి సూరులారా (సైరా)

 

మొనగాండ్రకు రేనాటి గడ్డరా – రోషగాండ్రకు పెద్ద పేరురా

దానధర్మములు దండిగ జేసే – పురిటిగడ్డలో పుట్టినావురా

కల్వటాల దండదిగో రా సై – ముక్క ముళ్ళ దండదిగోరా సై

సంజామల దండదిగోరా సై – కానాల దండదిగోరా సై (సైరా)

….

….

బానిసగుండి పాయసం తాగుట మేలుకాదురన్నా

పచ్చులలాగా బతికితె రెండే గింజలు మేలన్నా (పచ్చులలాగా = పక్షులలాగా)

బయపడి బయపడి బతికేకంటే సావే మేలన్నా

ఈరుడు సచ్చిన జగతిలొ ఎప్పుడు బతికే ఉండన్నా (సైరా)

 

నరసిమ్మా అని దూకినాడురా రణంలోన రెడ్డి

తెల్లోలందరి కుత్తుకలన్ని కోసినాడు రెడ్డి

“కోబలీ” యంటా తెల్లసర్కరును నరికెను దండంత

గడ్డ కోసము సావో బతుకో తేల్చుకున్నరంత (సైరా)

 

(పూర్తి పాటకై తెలుగు అకాడెమీ వారి ’రాయలసీమ రాగాలు’ పుస్తకం చూడగలరు)

 

*************

narasimhaఉయ్యాలవాడ నరసింహారెడ్డి కథ – క్లుప్తంగా.

1846, జూలై పది.

కర్నూలు కోవెలకుంట్లలో బ్రిటీషోల్ల ట్రెజరీ కొల్లగొట్టి అక్కడి సైనికులను చంపి భీభత్సం సృష్టించాడు రెడ్డి. అతని పేరు బయటకు వచ్చింది. జూలై 26 న బ్రిటీషు వాళ్ళు లెఫ్టినెంట్ వాట్సన్ అనే వాణ్ణి, సైన్యాన్ని నొస్సంకోటకు పంపారు. భయంకరమైన యుద్ధం జరిగింది. బ్రిటిష్ వాళ్ళ దగ్గర ఆధునిక ఆయుధాలు ఉన్నాయి. అయినా సరే, వాళ్ళ  సైన్యం రెడ్డి అనుచరుల చేతిలో చచ్చింది. వాట్సన్ యుద్ధంలో అంగవికలుడై పారిపోయాడు.

అక్కడి నుంచి రెడ్డి, ఆకుమళ్ళ గోసాయి వెంకన్న, ఓబన్న ..ఇలా నలుగురైదుగురు సహచరులతో,  నల్లమల అడవులకు స్థావరాన్ని మార్చినాడు. అక్కడ పీటర్స్ అనే ఫారెస్ట్ ఆఫీసర్ ఉండేవాడు. వాడు అక్కడ చెంచు వాళ్ళను తెగ హింసలు పెడుతున్నాడు. రెడ్డి అతణ్ణి చంపేశాడు. ఉద్యమం ప్రజా ఉద్యమంగా మారింది.

బ్రిటిష్ వాళ్ళు ఇంగ్రిస్ అనే వాణ్ణి స్ట్రాటెజీ కోసం, కాక్రెన్ అనే వాణ్ణి ఫీల్డు మార్షల్ గా పెట్టి పథకం ఆలోచించారు. రెడ్డి తలకు పదివేల వరహాలు బహుమతి ప్రకటించారు. ఆ బహుమతి కాశపడి శ్రీనివాసరావు అనే వాడు (రుద్రవరం) రెడ్డి ఆనవాళ్ళు తెల్లవాళ్ళకు అందించాడు. కోళ్ళ పందేలు నడుస్తుండగా రెడ్డిని మాయోపాయంతో బంధించదల్చుకుంటే – ప్రజలే తిరగబడి, రాళ్ళతో కొట్టి చంపారు. రెడ్డి పట్టుబడలేదు. ఆంగ్లేయులు భంగపడ్డారు.

ఆపై ఆంగ్లేయులు నరసింహారెడ్డి తమ్ముని వరస అయిన మల్లారెడ్డికి ఆశ చూపి లోబరుచుకున్నారు. అతని ద్వారా నరసింహారెడ్డిని లోబరుచుకుందామనుకున్నారు. ప్రయత్నం బెడిసి కొట్టింది. నరసింహారెడ్డి భార్యాపిల్లలను బంధించారు. అదీ విఫలమయ్యింది. అతను అపూర్వ శౌర్యసాహసాలతో వారిని విడిపించుకుంటాడు రెడ్డి. చివరకు ఆంగ్లేయులు రెడ్డి ప్రాణస్నేహితులైన ఓబన్నను, గోసాయి వెంకన్నను వేరు చేసి చంప ప్రయత్నించారు. ఈ ప్రయత్నం పూర్తీగా ఫలించకపోయినా వారిద్దరూ గాయపడ్డం జరుగుతుంది.

ఆపై రెడ్డి ఎర్రమలకు వెళ్ళాడు. బ్రిటిష్ వాళ్ళు నాలుగు వైపులా ముట్టడి జరిపారు. ఆ యుద్ధంలో రెడ్డి బ్రిటీషు వాళ్ళను చాలామందిని చంపాడు. వాట్సన్ కూడా మరణించాడు. చివరకు దొరికాడు. అతని కాళ్ళు, చేతులకు సంకెళ్ళేసి కోవెలకుంట్లకు తెచ్చి విచారించి ఉరి తీశారు. (1847 ఫిబ్రవరి 6).

ఇది అజీజ్ గారు రచించిన నవల వృత్తాంతం చాలా క్లుప్తంగా. ఈ కథలో ఇక్కడ చెప్పని వివరాలు నవలలో చాలా ఉన్నాయి.

*************

నరసింహారెడ్డి చేసిన యుద్ధాలను, ఆంగ్లేయుల కపటోపాయాలను, స్థానిక సాంప్రదాయాలను, స్థానిక ప్రదేశాల వివరణనూ, ఆ నాటి భారతదేశ పరిస్థితినీ వివరిస్తూ రచించిన నవల యిది.

ఈ కథను పాపులర్ నవల లా రచించినా, అజీజ్ గారు – స్థానిక సాంప్రదాయాలు, సంస్కృతినీ చాలా లోతుగా వివరించేరు. ’బూతపిల్లి’, పెద్దమ్మ దేవర వంటి విషయాల వివరణ విస్మయకరంగా ఉంటుంది. ఆరంభంలోనే ’పొలికేక’ అన్న శబ్దం – దానివెనుక స్థానిక సాంప్రదాయాల వివరణ విశదంగా, కథలో భాగంగా ఉంది. ఈ జాతరలు, గ్రామ సాంప్రదాయాలు తెలియని వారికి, ఆ నేపథ్యం కాస్త ’భీభత్సం’ ఎక్కువయినట్టు అనిపించవచ్చు కానీ ఇవి చరిత్రలో భాగం. చారిత్రక నవల – ఇలా నిక్కచ్చి గానే ఉంటేనే బాగు. అలవి మాలిన వర్ణనలు గుప్పించి పేజీలు పెంచే ప్రయత్నాలు లేవు ఈ చారిత్రక రచనలో. చివరన ఆయా ఘట్టాలకు చెందిన ఫుటోలను జోడించారు.

ఒకట్రెండు సందర్భాల్లో బ్రిటీషు అధికార్ల గురించి కాస్త హాస్య ధోరణిలో వ్రాశారు. ఎన్నదగిన లోపం కాదు కానీ చారిత్రక రచనలో ఇటువంటివి అంత బాగోవని ఈ వ్యాసకర్త వ్యక్తిగత అభిప్రాయం.

ఈ నవలకు కళాప్రపూర్ణ. డా. కొండవీటి వెంకటకవి ముందు మాట రాశారు.

చరిత్రలో ఎందరో వీరులు కులమతాలకతీతంగా స్వాతంత్రోద్యమంలో పోరాడి అసువులు బాశారు. అయితే కొందరి పోరాట చరిత్ర మాత్రమే బాగా ప్రచారం కావడం జరిగింది. అది విచారకరం అని ప్రస్తావిస్తూ అజీజ్ గారి మాటలు అక్షరాలా నిజం.

తెలుగునాట పుట్టిన విప్లవవీరుడు ఉయ్యాలవాడ నరసింహారెడ్డి మీద విస్తృతమైన రచనలు లేవు. ఉన్నా ప్రాచుర్యం లేదు. ఈ నేపథ్యంలో మరుగుపడిన ఈ మహావీరుని చరిత్ర గురించి ఆసక్తి గలవారికి ఈ నవల తప్పక నచ్చుతుంది.

 

***

తెలిసిన కథే నవల అయితే…!

 

-మణి వడ్లమాని

~

 

“అబ్బా! భారతం విప్పకు ,లేదా చేట భారతం చెప్పకు. తొందరగా అసలు సంగతి చెప్పు”  లాంటి  మాటలు మనం  సాధారణంగా వింటూ ఉంటాము. అంటే ఒక విషయం గురించి చెబుతూ మరో దానిలోకి వెళ్ళిపోవడం,లేదా దానికి అనుబంధమైన విషయం మాట్లాడటం వల్ల  మూల విషయం లోకి వెళ్ళడానికి కొంత సమయం పడుతుంది. కాబట్టి.

కానీ అదే సరాసరి మూల విషయం లో నేరుగా  వెళితే? అవును, అదే వ్యాసమహర్షి రాసిన కావ్యం ‘జయేతిహాసమ్’  24 వేల శ్లోకాల భారతం, లక్షశ్లోకాలకు మించి మహాభారతం అయింది.

మూల కధ జయమ్ ని ఉపాఖ్యానానలు లేకుండా రచయత నాయుని కృష్ణమూర్తి   నవలా రూపంగా వ్యావహారికంగా,ఆధునిక దృక్పథం తో  రాసారు .

జయమ్ ఒక ఇతిహాసం. ఇది నిజంగా జరిగింది అని చరిత్ర కారులు విశ్వసించారు. ఆ నాడు  వ్యాసుడు జీవించిన కాలం లోని వారె పాండవులు,కౌరవులు  వారి మధ్య జరిగిన ఘర్షణ ఒక మహా యుద్ధానికి దారి తీసింది. తన కళ్ళముందే తన వాళ్ళందరూ సర్వ నాశనమవడం తో వ్యాసుడు క్షోబతో  ఆ పరిస్థితి రావడానికి గల కారణాలను వివరిస్తూ  జయమ్ అనే కావ్య  రచన చేసాడు.

రచయత  మాటలలో:

అయితే ఈ కావ్యం ఎక్కడా విడిగా లేదని  వ్యాసుని తరువాత ఈ కావ్యాన్ని జనమేజయుడికి  వైశంపాయనుడు కొన్ని వివరణలు,పూర్వకధలు చరిత్రలు చేర్చి భారతంగా మార్చాడని లక్ష శ్లోకాలకు పైగా ఉన్న మహా భారతం లో నే ఈ  8800 శ్లోకాలతో ఉన్న  జయమ్ ను వెతకాల్సిన పరిస్థితి ఏర్పడింది.

కొన్ని వేల సంవత్సరాలనుంచి పౌరాణికులు భారతాన్ని పెంచి చెబుతున్నారు కాని అసలు మూలకధ  ఏమయి ఉంటుంది అన్న  ఆలోచన చేయలేదు.

1883- 1894  లో ఒక స్కాండేవియన్ సాహిత్య వేత్త సోరెన్-సోరన్ సన్ మహా భారతం నుండి మూల కధను వేరు చేసే ప్రయత్నం మొదలు పెట్టాడు. లక్ష శ్లోకాలనుండి 27 వేల శ్లోకాలు వేరు చేసి  ఆ క్రమం లో దాన్ని 7-8  వేలకు తగ్గించే సమయం లో ఆయన మరణించాడు.  ఆ తరువాత 80 ఏళ్ళకి గుజరాత్ రిసెర్చ్ ఇన్స్టిట్యూట్ అహమ్మదాబాదు బ్రాంచి  గౌరవ డైరెక్టర్  ప్రొఫెసర్ కే కే .శాస్త్రి ఒంటరిగానే మహాభారతం నుండి విజయవంతంగా 8801 సంస్కృత శ్లోకాలతో  ‘ జయమ్’ ని వేరు చేసారు. తరువాత గుజరాత్ రిసెర్చ్ ఇన్స్టిట్యూట్ వారు  దాన్ని ‘జయసంహిత’ గ ప్రచురించారు.

జయమ్ ను యధాతధంగా కాకుండా నవలా రూపంలో రాయాలని అనుకున్న ఉద్దేశ్యం ఇలా జరిగి ఉంటుందని ఊహించి రాసే అవకాశం కొంత స్వేచ్ఛ లబిస్తాయని.

ఇక నవల లోకి వెళితే:

తింటే గారెలే తినాలి,వెంటే  మహాభారతమే వినాలి. ఒక వేళ ఇది కల్పన అయితే మహా గొప్ప గ్రంధం, నిజం అనుకుంటే భలే అద్భుతం. మనం కూడా టైం మెషిన్ లో ఆ కాలానికి  వెళ్లి ఆ పాత్రలను చూసి కలిస్తే! అప్పుడు  అది మహాద్భుతం.

jayam

ఇక కధ మొదలు  కురుదేశపు వర్ణన తో  మొదలవుతుంది. శంతనుడికి సత్యవతికిపుట్టిన కొడుకులు చిత్రాంగదుడు,విచిత్రవీర్యుడు. వీరిద్దరూ సంతానహీనులుగా మరణించటం వల్ల వంశం  అంతరించి పోయే పరిస్థితి ఏర్పడింది. అప్పుడు సత్యవతి తనకి పెళ్లి కాకుండా పుట్టిన కొడుకు కృష్ణద్వైపాయనుడుని పిలిచి దేవర న్యాయం ప్రకారం  తన  కోడళ్ళ కి సంతానం కలిగేలా చేసింది  ఈ కృష్ణద్వైపాయనుడే వ్యాస మహర్షి గ ప్రసిద్ధి కెక్కాడు.

వ్యాసుడు చూస్తూ ఉండగానే అందరూ పెరిగి పెద్దవారు అయ్యారు. అన్నదమ్ముల మధ్య  రాజ్యం కోసం ఒకళ్ళతో ఒకళ్ళు యుద్ధం చేసే పరిస్థితి కి  ఏర్పడుతుంది.అందువల్ల వంశం నాశనం అవుతుందని వ్యాసునికి తెలిసినా  ఎవరూ అతని మాట వినలేదు. తన మూలంగా ఏర్పడిన కురువంశం తన కళ్ళముందే సర్వ నాశనం అవడం వ్యాసునికి క్షోభ కలిగించింది.

దాయాదుల మధ్య వైరం రెండు కుటుంబాల మధ్య ఘర్షణ  ఏ విధంగా వినాశనానికి దారితీసిందో ఆ  చరిత్రనే  కావ్య రూపంగా తేవాలన్న ఆలోచన వచ్చింది.

మహాభారత యుద్ధం ప్రకటించబడిన మూడేళ్లు కాలం లో  దీక్షతో ఈ కావ్యాన్ని రచించాడు.

“రెండుకుటుంబాల మద్య జరిగిన ఇతివృత్తం. పాండురాజు మరణం తరువాత అడవుల్లోనుండికుంతీదేవి పాండవులను వెంట బెట్టుకొని హస్తినకు రావడం తో మొదలయ్యి కౌరవ పాండవుల మధ్య జరిగిన మహా భారత  యుద్ధం చివరి రోజు రాత్రి  అశ్వద్ధామ నిద్రపోతున్న ఉపపాండవులని చంపడం తో కధ పూర్తవుతుంది.”

ముగింపు :

గంగా నది లో తర్పణాలు వదిలి శోకం తో కుమిలిపోతున్న ధర్మరాజు తో అక్కడే ఉన్న ధృతరాష్ట్రుడు అంటాడు “ నువ్వు ఇప్పుడు ఎందుకు దుఃఖిస్తున్నావు.అర్ధం లేకుండా  వందమంది .కొడుకులని, మనవలన్ని పోగొట్టుకున్న నేను గాంధారి ఏడవాలి ‘అంటాడు. పక్కనే ఉన్న శ్రీకృష్ణుడు  ధర్మరాజుకి చేయి అందిస్తూ “పోయిన వాళ్ళను నువ్వు ఎలాగూ చూడలేవు.జరగాల్సినది జరిగింది. అంతా విధి నిర్ణయం. తెలివిలేనివాడిలా ఏడవకు” అంటాడు.

ధర్మరాజు హస్తినలోకి అడుగు పెట్టగానే వృద్ధులు,స్త్రీలు,పిల్లలు చావగా మిగిలిన సేనలు జయమ్, జయమ్ అని అంటారు.

అది విన్న ధర్మరాజు  పెదవులు కూడా  ఆ పదానికి అర్ధం వెతుకుతున్నట్లు  జ…య…మ్ అని గొణిగాయి.

ఇక్కడ తో నవల ముగుస్తుంది

తెలిసిన కధనే నవలా రూపంగా చదవటం  కొత్తదనంగా  బావుంది. సరళమయిన బాషతో చదువుతున్నంత సేపు చాల  ఆసక్తి కరంగా ఉంది.

కొన్ని గుర్తుంచు కో దగ్గ  వాక్యాలు:

  • ఎవరు యెంత చేర్చినా కొన్నివేల సంవత్సరాల బాటు భారతం నిలబడింది అంటే అది ఆ కధ గొప్పదనం. మూల కధలో కృష్ణుడు ఒక రాజనీతిజ్ఞుడు.
  • నాగరికత ఒక స్రవంతి.పుట్టినప్పుడు చిన్న చెలమ. కాలం గడిచిన కొద్దీఎన్నో జ్ఞాన,అ జ్ఞానప్రవాహాలు ఏకమై చెలమలో చేరి ఉంటాయి. చెలమ ఏరుగా సాగి నదిగా మారి తన వేగాన్ని విస్తృతిని పెంచుకొని ఉంటుంది.
  • ఉరుములు మెరుపులు,వర్షాలు,వరదలు,ఎండలు సుడిగాలులు,పెనుతుఫానులు మానవుణ్ణి అయోమయ స్థితి లో పడ వేశాయి. పైన ఆకాశం లో మహోన్నతమైన వ్యక్తులు ఉన్నారని నమ్మారు.
  • భయం భగవంతుడిని పుట్టించింది
  • ప్రాణికోటికి మేలు జరగడానికి చెప్పబడిన అసత్యం సత్యం కంటే గొప్పది. కీడు కలిగించే సత్యం అసత్యం తో సమానం.
  • భారతం లో ఉన్నది ఇంకెక్కడయినా ఉంటుంది. భారతం లో లేనిది ఎక్కడా ఉండదు

***

మైత్రీ మకరందం  “స్నేహఫలము”

visanaa

— శివరామకృష్ణ

~

 

“మానవర్మ రాను క్రొత్తగా నిర్మించిన మహా సౌధమునకు నామకరణము చేసెను. ఆ పేరు కోట ముందు ప్రభాతోరణము మీద, మంచి రంగులతో అర్థ యోజనము దూరము కనిపించునట్లు పెద్ద యక్షరములతో చెక్కించెను.

ఆ మహా సౌధము పేరు “స్నేహ ఫలము”

 

***

 

వెయ్యి పేజీల వేయి పడగలు వచన మహాకావ్యాన్ని రచించిన విశ్వనాథ సత్యనారాయణ గారు కొన్ని చిన్న నవలలను కూడా రాసారు. నలభై పేజీల ‘వీరవల్లడు’, యాభై పేజీల ‘హాహా హూహూ’, తొంభై పుటల ‘స్నేహ ఫలము’ వాటిలో కొన్ని.

 

రాజవంశీయులైన ఇద్దరు పురుషుల మధ్య ఏర్పడిన మైత్రీ బంధం గురించి, దాని పరిణామంగురించీ విశ్వనాథ వారు చారిత్రక సత్యాలకు కొంత కల్పన జోడించి రాసిన రమ్యమైన చిన్న  నవల ‘స్నేహఫలము’. దీని చారిత్రక నేపధ్యాన్ని చూద్దాం. దక్షిణ భారత దేశాన్ని ఏలిన వారిలో ప్రముఖులు పల్లవులు. దాదాపు ఐదు వందల సంవత్సరాలపాటు పల్లవ సామ్రాజ్యం నిరాఘాటంగా వర్ధిల్లిందట. పల్లవ సామ్రాజ్యం తమిళ దేశంలో చాలా ప్రాంతాలను, కృష్ణా నదికి దిగువనున్న తెలుగు ప్రాంతాలనూ, కన్నడ ప్రాంతాల్లో కొంత భాగాన్నీ కలుపుకొని వర్ధిల్లింది. పల్లవ చక్రవర్తుల్లో మామల్ల నరసింహ వర్మ ఒకరు. ఈయన సుమారు  క్రీ. శ. 630-675 మధ్య కాంచీపురం రాజధానిగా పల్లవ రాజ్యాన్ని యేలిన మహా పరాక్రమవంతుడైన రాజు. ఈయన కాలంలో పల్లవులకూ, కాదంబ రాజు లకూ, పశ్చిమ చాళుక్యులకూ మధ్య అనేక యుధ్ధాలు జరిగాయి. పల్లవులకు ప్రధాన శత్రువు పశ్చిమ చాళుక్య రాజు రెండవ పులకేశి. అనేక మార్లు కాంచీపురంపై ఆతడు దండెత్తివచ్చినా, మామల్ల నరసింహ వర్మ పరాక్రమానికీ, ఆయన ప్రధాన సేనాని పరంజ్యోతి ధాటికీ ఆగలేక పలాయనం చిత్తగించాడు. పులకేశిని దక్షిణాపథం వైపు రాకుండా వీరు అడ్డగించారు. అంతే కాదు, చక్రవర్తి అంగరక్షకుడైన  మానవర్మ చక్రవర్తిని పలుమార్లు మృత్యుముఖం నుంచి తప్పించాడు, తనప్రాణాలను లెక్కచెయ్యకుండా. ఈ నేపధ్యంలో నడిచిన కథ ‘స్నేహఫలము’. చక్రవర్తి మామల్ల నరసింహ వర్మకు సింహళ దేశపు రాజపురుషుడు మానవర్మకు యేర్పడిన అపూర్వ స్నేహబంధమే ఈ నవలలో వస్తువు.

***

వసంత ఋతువులోని ఒక మధ్యాహ్నం పల్లవ చక్రవర్తి తన అలవాటు ప్రకారం వాహ్యాళికి బయలుదేరాడు, ఏనుగు మీద. వెంట అంగరక్షకుడు మానవర్మ ఉన్నాడు. దారిలో చక్రవర్తికి దాహం వేసింది. దగ్గరలో కనబడిన కొబ్బరితోట వద్ద ఏనుగుని నిలిపి కొబ్బరి బొండాలు కొట్టించాడు మావటి. రాజు తనకు సరిపడినత నీరు తాగి, తన వెనకనున్న మానవర్మకి బొండాన్ని ఇచ్చాడు, పారవేయమనే ఉద్దేశంతో. కాని, మానవర్మ మిగిలిన నీటిని తనను తాగమనే ఉద్దేశంతో రాజు తనకిచ్చాడని అనుకున్నాడు.

బొండమును పుచ్చుకొని మానవర్మ “ఈ రాజు నాకు మిత్రుడు. నాకాశ్రయమిచ్చినవాడు. మిగిలిన నీరు నేను త్రావవలయునని ఇచ్చెను కాబోలు. తన యెంగిలి నన్ను త్రావమనునా? రాజు ధూర్తుడు కాడు. దురహంకారి కాడు. సాధువైన సత్పురుషుడు. నాయందు మిక్కిలి ప్రేమకలవాడు. గతిలేక తన పంచన చేరిన నన్ను మిత్రునివలె, ఆంతరంగికునివలె పరిపాలించుచున్నాడు. నాయందెంత ప్రేమలేకున్నచో తా నెంగిలి చేసిన నీటిబొండమును నాకందించును? నేను దీనిని పారవేయుట దురహంకారమగును. న్యాయము కూడ కాదు. నేను యెంగిలి నీరమును త్రావినచో నాకు వ్యాధి పుట్టదు. నాకు మర్యాద భంగము లేదు” అనుకొని వెంటనే ఆ నీటిబొండాన్ని తాగుతుండగా రాజు చూశాడు.

“తాను అతణ్ణి తాగమని ఇచ్చాననుకున్నాడు కాబోలు. మానవర్మ గొప్ప వంశము నందు పుట్టినవాడు. అతడొక రాజ్యమునకర్హుడు. దినములు బాగుండక తన్నాశ్రయించినవాడు. అతనికి తనయందింత స్నేహభావమున్నదని ఇదివరకు తనకు తెలియలేదు.  తానిట్లీయగ మరొకడైనచో మనసస్సులో మిక్కిలి కోపము తెచ్చుకొనును. ఇది రాజయోగ్యమైన పనికాదు”  అనుకొని రాజు నరశింహ వర్మ వెంటనే మానవర్మ చేతిలోని బొండాన్ని తీసుకొని మిగిలిన నీటిని తాగేశాడు. మానవర్మ ఆశ్చర్యపోయాడు.

ఈ సంఘటన చూసిన మావటి ఆశ్చర్యపోయి, మానవర్మ మంచితనాన్ని, రాజు ఔదార్యాన్ని మనసులో మెచ్చుకున్నాడు. “మానవర్మ లేకుండా మహారాజు కాలు బయటపెట్టడు. మానవర్మదే అదృష్టము. ఇదివఱకు నేనెప్పుడూ చూడలేదు. మహరాజు కొంత త్రావి మానవర్మకిచ్చెను. అతడు కొంత త్రావి మరల మహారాజున కందిచ్చెను. ఇట్లు సురాపానము చేయువారు చేయుదురు. పరమ మిత్రులు చేయుదురు” అని తన పరిధిలో అనుకున్నాడు.

మానవర్మ కూడా మహారాజు యెంతటి సత్పురుషుడోనని అనుకున్నాడు. సేవకుడైన తన యెంగిలిని మళ్ళీ ఆయన త్రాగాడంటే తనని ప్రాణస్నేహితుడిగా తలచాడు కదా అనుకున్నాడు. “రెండు మూడు సార్లు నేను రాజును రక్షించిన మాట నిజమే. అది సేవకుని ధర్మము. రాజులు మెచ్చినచో ధనమిత్తురు. అధికారమిత్తురు. ప్రాణమీయరు. ఈ రాజు తన ప్రాణములు నాకిచ్చుచున్నాడు. నేనీ రాజును ఆశ్రయించి నా రాజ్యమును నేను సంపాదించుకొనవలయునని యనుకొనుచున్నాను.ఇట్టి ప్రాణస్నేహితుని వదిలిపెట్టి నేనెట్లు పోగలను?”

అప్పుడు మహారాజు కూడా ఇలా అనుకున్నాడు “ఈ నాటితో మానవర్మ నాకు పాణస్నేహితుడైనాడు. ఇతడు నా ప్రాణములను రెండుమూడు సార్లు రక్షించెను. అర్థరాత్రముల యందైన నీడ సూర్యునెడబాసి యుండును. కాని ఇతడు నన్నెడ బాయడు. రాజ్యభ్రష్టుడై నన్నాశ్రయించెను. నేను గొప్ప పదవినిచ్చితిని కాని, యతనిని రాజును చేయలేదు కదా! నేటి నుండి యతడును నేనును నా రాజ్యమున కిద్దరు రాజులము. నా మాట యెట్లు చెల్లునో నేటి నుండి యీతని మాట కూడ యట్లే చెల్లును. ఇతడు నా మీద చూపిన ప్రేమకు వేరొక విధముగా నేను కృతజ్ఞత చూపలేను. చూపకపోయిన నరకమునకు పోయెదను. ఒక ప్రాణదాతకు కృతజ్ఞత చూపుట వేరు, యెడములేకుండ ఇంతటి ప్రేమ చూపిన వానియందు కృతజ్ఞత నెఱపుట వేరు”

ఇలా అనుకొని రాజు మానవర్మని ఏనుగుమీద తన పక్కనే కూర్చోబెట్టుకొని, అతని భుజం మీద చెయ్యివేశాడు. “ప్రొద్దు వాటారిన తరువాత ఇంటికి తిరిగి వచ్చు రాజును, మానవర్మను ప్రజలిట్లు చూచిరి”

నవల మొదట్లోనే విశ్వనాథ వారు ఈ స్నేహబంధానికి బలమైన పునాది వేశారు ఈ సంఘటనతో.

 

***

 

మానవర్మ సింహళదేశ రాజకుమారుడు. యువరాజు. కొన్ని వ్యాపారసంబంధ విషయాలను పరిష్కరించడానికి మలయా దేశానికి వెళ్ళాడు.  అక్కడ ఉండగా మలయా రాజకుమారి సంఘను వివాహమాడాడు. మానవర్మ అక్కడ ఉండగానే సింహళరాజు చనిపోయాడు. మలయా రాకుమారిని పెళ్ళాడి అకార్యం చేశాడని మానవర్మపై దుష్ప్రచారం చేసి, అతని జ్ఞాతి దధోపతిస్సుడు అనే అతను సింహళ సింహాసనాన్ని ఆక్రమించాడు.  ఇది తెలుసుకున్న మానవర్మ ఖిన్నుడై, తన రాజ్యాన్ని తిరిగి సంపాదించుకోవాలంటే బలవంతుడైన పల్లవ చక్రవర్తి అండ అవసరమని భావించి, కాంచీపురం చేరాడు. భార్యను మలయాలో పుట్టింటనే ఉంచాడు. అంతకు కొన్నేళ్ళ క్రితం అతడు కాంచీపురం లో విద్యాభ్యాసం చేసిం ఉన్నందున పరిచయమైన వారున్నారు. వారి సహాయంతో మహాసేనాని పరంజ్యోతి అనుగ్రహం సంపాదించి మహారాజు కొలువులో చేరాడు.  కొద్దిరోజుల్లోనే పల్లవ రాజ్యం మీద రెండవ పులకేశి దండెత్తి వచ్చాడు. మహారాజు, సేనాపతి  వేరొకచోట యుధ్ధంలో ఉండగా, పెద్ద శత్రువుల దండు కంచి కోట ద్వారాన్ని స్వాధీనపరచుకోడానికి వచ్చింది. అప్పటికి పల్లవ యువరాజు మహేంద్రవర్మ చిన్నవాడు. ఆ సమయంలో కోటలోనున్న మానవర్మ తన పటాలంతో కోట తలుపులు తెరిచి, శత్రుసమూహం మీద విరుచుకుపడ్డాడు. శత్రువులను ఊచకోతకోశాడు. కోటను కాపాడాడు. పులకేశి సేనలను ఓడించి రాజు, సేనాని కంచికి తిరిగివచ్చి, మానవర్మ పరాక్రమమాన్ని మెచ్చుకున్నారు. నరసింహవర్మ మానవర్మను తనకి అంగరక్షకుడిగా నియమించుకున్నాడు.

ఆ తరువాతి కాలంలో రాజుకి మానవర్మ కేవలం మహావీరుడే కాదు, సాహిత్యం, శిల్పం, జ్యోతిషం, సంగీతం వంటి కళల్లో కూడా నిష్ణాతుడని తెలిసింది.

ఇలా ఉండగా మానవర్మ చక్రవర్తి జాతకాన్ని సంపాదించి, ఆయనకున్న అనేక యోగాలను పరిశీలించాడు. ఆయనకు ఆపదలు వచ్చే కాలాన్ని పసిగట్టి చక్రవర్తిని అనేక హత్యాప్రయత్నాలనించి రక్షించాడు. ఒకసారి కాపాలికులనించి, మరొకసారి పల్లవ రాజవంశీయుడైన గోవింద వర్మ రాజుపై చేసిన చేతబడి ప్రయోగం నించి రక్షించాడు. ఈ గోవిందవర్మే రహస్యంగా మరోసారి అంత:పుర ఉద్యానం లో రాజును హత్యచేయించ డానికి పన్నిన కుట్రను కూడా మానవర్మ విఫలం చేశాడు. కాని ఎప్పుడూ తన గొప్పని చక్రవర్తి వద్ద చెప్పుకోలేదు. ఈ కారణాల వల్ల రాజుకి అభిమానపాత్రుడయ్యాడు. మరొకసారి సేనాని పరంజ్యోతి తో కలిసి రాజు చాళుక్య రాజధాని బాదామిపైకి దండెత్తుతుంటే అది తగిన సమయంకాదని వారించి, వారిని ఆపదనించి కాపాడాడు.  మొదట పరంజ్యోతి, తనవల్ల రాజు వద్ద చేరిన మానవర్మ రాజునే శాసిస్తున్నాడని విసుగు చెందినా, మానవర్మ ప్రవర్తన చూసి ” అతనికి గర్వము లేదు. అహంకారము లేదు. అతనికవి యుండవలసిన యవసరమునూ లేదు. అతడొక రాజ్యమున కధిపతి. మఱియొక యల్పునకు వచ్చిన యధికారము వలె అతనికి ఈ యుద్యోగము గర్వహేతువు కాదు” అనుకొని మానవర్మ పట్ల స్నేహంతో ఉన్నాడు.   మరొక సందర్భంలో పరంజ్యోతి “ఆతని యందు రాజు యొక్క మైత్రి ఆతని నహంకార కలుషితుని చేయక, పరమ సుకుమారభావుని, ఆర్ద్ర మనస్కుని చేసెను. సత్పురుషులిట్లుందురు కాబోలు” అని అనుకున్నాడు.

యుధ్ధాలు సమసి, శాంతి నెలకొన్న కొన్నాళ్ళకి, చక్రవర్తి మానవర్మతో మలయా దేశంలో ఉన్న అతని భార్యని కాంచీపురానికి తీసుకురమ్మని చెప్పాడు. తాను చక్రవర్తి ఆజ్ఞను తిరస్కరించలేడు కనుక, మానవర్మ సంఘని కాంచీపురం రప్పించాడు. ఆమె వచ్చి, తన సత్ప్రవర్తన చేత చక్రవర్తికి, పట్టపురాణికీ అత్యంత ప్రీతిపాత్రురాలయింది. మహాసేనాని పరంజ్యోతి కూడా ఆమెని తన కుమార్తెగా ఆదరించాడు.  మానవర్మకి తన కోట అంతటి మరో మహాసౌధాన్ని నివాసంగా సమకూర్చాడు చక్రవర్తి.

 

మరికొన్నాళ్ళకి గత పరాజయానికి  ప్రతీకారం తీర్చుకోవాలని చాళుక్య రాజు పులకేశి తన రాజ్యం లోని ఒక మండలానికి అధిపతైన వల్లభుడు అనే మొరటువాడైన మహావీరుడిని కాంచీపురంపైకి పంపాడు. పల్లవరాజు నరసింహవర్మని కడతేర్చడమే వల్లభుడి పని. ఆ సమయంలో సేనాని రాజ్యం లో లేడు. యువరాజుని, మానవర్మని కోట రక్షణకి ఉంచి, చక్రవర్తే బయలుదేరాడు వల్లభుడితో యుధ్ధానికి. కాని రాజుకి రానున్న ఆపదని ఊహించిన మానవర్మ, ఆయనకి తెలియకుండా బయలుదేరి, యుధ్ధంలో రాజు అత్యంత ప్రమాద పరిస్థితిలో ఉన్న సమయంలో వల్లభుడి మీద విరుచుకుపడి అతన్ని పరాజితుడిని చేసి, బంధించి, తన రాజుని రక్షించుకున్నాడు. “మానవర్మ ఇప్పుడు గొప్ప స్థితిలో ఉన్నాడు. భార్యను కూడా తెచ్చుకున్నాడు. ఆమె గర్భవతి. ఐనా, తనయాజ్ఞను ఉల్లంఘించి కూడా కోటను విడిచివచ్చి తనను రక్షించిన విధానము ఆతని నిజమైన స్నేహశీలతకు గుర్తు”  అని చక్రవర్తి ఆనందించాడు.  “మానవర్మ లేకున్న తాను చక్రవర్తి కాడు”

 

చక్రవర్తి నరసింహవర్మ విజయోత్సవ సభ చేసి, వీరసైనికులను సత్కరించాడు. తరువాత ఆయన మానవర్మ పరాక్రమాన్ని కొనియాడి, ప్రజలతో  “నేను జీవితములో అతనికి ఋణపడి యున్నాను. లోకములో కృతజ్ఞత యన్న గుణము సులభ్యము కాదు. రాజులయందది మృగ్యము. రాజు తన సేవకుడు తన కుపకారము చేసినచో అది వాని ధర్మమనుకొనును. అట్లు చేయుట వాని విధి యనుకొనును.  ఇట్టి  దుష్టలక్షణము రాజులయందుండును. కృతఘ్నుడు నరకమునకు పోవును. మీరు నా ప్రజలు….నా కృతజ్ఞత మానవర్మకు చూపించవలెనన్న నేనేమి సేయవలయునో మీరే చెప్పుడు” అన్నాడు. అప్పుడు సేనాని పరంజ్యోతి “మానవర్మ రాజ్యము మానవర్మకిప్పించుట యొక్కటియే మహారాజు కృతఘ్నలోకములకు పోకుండ చేసెడిది. ఆ సైన్యములను నేను నడిపించుకొని పోయెదను” అన్నాడు.

మానవర్మ మహారాజుకి నమస్కరించి, ” పరంజ్యోతి దయామయులు. ఆయన నా భార్యకు పెంపుడు తండ్రి వంటివారు. అందుచేత నా మీద అంత దయ చూపించుచున్నారు. మహారాజు యొక్క అనుజ్ఞ యైనచో నేను నా దండు నడుపుకొనగలను. నేనే దండయాత్ర పోవలయును. నేనే నా రాజ్యమును సంపాదించుకొనవలయును.” అన్నాడు.

 

అనంతరం మానవర్మ సింహళం పైకి దండెత్తి వెళ్ళాడు. మొదటి సారి ఆ దేశాన్ని వశపచుకోవడంలో ఇబ్బందులు ఎదురైనా, మరొకసారి ప్రయత్నించి, దధోపతిస్సుని ఓడించి, తన రాజ్యాన్ని తాను సాధించుకున్నాడు. మానవర్మ తన దేశం లో వ్యవసాయాన్ని వృధ్ధి చేశాడు. భారత దేశంతోనూ, మలయా తదితర ద్వీపాలతోనూ సత్సంబంధాలు ఏర్పరచుకున్నాడు. సర్వమతాలనూ అభిమానిం చాడు. ప్రజలు అధికులు బౌధ్ధులు కనుక ఆ మతాన్ని ప్రోత్సహించాడు.

సింహళ రాజభవనం అంతకుముందు సామాన్యంగా ఉండేది. దాని బదులు కంచిలోని  వైకుంఠపెరుమాళ్ళు కోవెల వంటి రాజభవనాన్ని నిర్మించాడు. దాని పేరే “స్నేహఫలము.”

 

***

 

ఈ నవలలో కథాసంధర్భంలో విశ్వనాథవారు పలుచోట్ల హృదయానికి హత్తుకునే మాటలు రాశారు.

“మధురమైన సంగీతము వినుచు, శాస్త్రములు, కవిత్వములు నిత్యాభ్యాసము చేయుచు, హృదయమునందు పరమ సుకుమారుడైన మనుష్యునకు ఇట్టి ధ్వనులు (మనకు తెలియకుండా చెవుల్లో పడే పక్షి కూజితాలు మొదలైనవి) వినిపించును. ఆలోచన లేని వాని కేవియు వినిపించవు.”

“అందరును మనుజులే కాని వారిలో కొందరు రాక్షసులు. కొందరు దేవతలు.  రాక్షసాంశ కలవారును మానవులవలెనే కనిపింతురు.”

ఇంకా ప్రాస్తావికంగా బౌధ్ధ మతం గురించి, కాపాలిక మతం గురించీ కూడా వివరించారు. పల్లవుల నాటి దాక్షిణాట్య సంగీతానికీ, మలయా దేశపు సంగీతానికీ భేదాలను వివరించారు తన సంగీత శాస్త్ర పరిజ్ఞానంతో. ఈ వ్యాసంలో ఎక్కువగా తెలపని గోవిందవర్మ రాజవంశంవాడైనా, సకల భ్రష్టుడై దొమ్మరి వాళ్ళతోనూ, కాపాలికులతోనూ తిరిగి, ఆ రోజుల్లో ప్రాచుర్యంలో ఉన్న ప్రయోగ విద్య (చేతబడి) నేర్చుకున్న వైనం, గొడగూచి అనే ఒక నాట్యకత్తె రాజు ముందు నాట్యం చేసే సమయం లో ఆయనపై ప్రయోగం చెయ్యడానికి కుట్రపన్నడం, దాన్ని మానవర్మ భగ్నం చెయ్యడం చాలా ఆసక్తికరంగా చెప్పారు విశ్వనాథ.   ఆ సమయంలో రాజు “నాకు  రాబోవు సకలాపదలను నీవు ముందు చూతువు. వానికి ప్రతిక్రియలాలోచింతువు. నీవు దీనినెట్లు పసిగట్టితివి?” అని అడుగుతాడు ఆశ్చర్యపడుతూ.

 

ఒకరు ఒక మహా సమ్రాజ్యానికి చక్రవర్తి. మరొకరు ఒక రాజ్యానికి వారసుడైనా విధి వశాన ఆ చక్రవర్తి కొలువున చేరిన వ్యక్తి. వీరిద్దరి మధ్య నెలకొన్న మైత్రి ఎంతో గొప్పగా వర్ణించారు విశ్వనాథ. చక్రవర్తి దయకు మానవర్మ ప్రతివచనం చాలు వీరిద్దరి ఆత్మీయతను, హృదయాలనూ ఆవిష్కరించడానికి:

 

“మహామల్లుడా, నేనిది వరకు తమ సద్గుణములకు, తమరికి నా యందుగల కృపకు మనస్సులో బానిసనై యున్నాను. మరియు అధికమైన దయ చూపించినచో మనుష్యుడైనవాడు బానిస యగుటకంటె తక్కువ స్థితి యేమి పొందగలడు? నా యందు తమరికి ఎంత ప్రేమయున్నను నన్ను తమ యంగరక్షకునిగా నుంచుకొనుటయే నాకు చేసెడి మహోపకారము. తమ యేనుగు మీద నన్ను తమ ప్రక్కన గూర్చుండ బెట్టుకొనుటకంటె అధికమైన గౌరవ మేమి చేయవలయును?”

 

ఏకబిగిని చదివించే మంచి నవల ‘స్నేహఫలము’

 

*

 

ఆమె – మనము –  గుర్తుండని కాలం!

 

lakshmi

– సి.ఉమాదేవి

~

 

ఏదైనా కథ చదువుతున్నారా?ఆ సమయంలో ఎవరైనా మిమ్మల్ని పలకరిస్తున్నారా? ఆ…ఊ… మాత్రమే మీ సమాధానమా? అయితే అతను-ఆమె-కాలం చదువుతున్నారన్నమాటే! చదవడంలేదంటారా? అయితే ఈ విభిన్న కథారాగవిపంచిని మీటాల్సిందే! తప్పక చదవాల్సిన బహుమతి కథల మణిహారమే జి.యస్.లక్ష్మిగారి ‘ అతను-ఆమె-కాలం’ కథాసంపుటి. ఆమె రచించిన కథలు మనము చదవడం ప్రారంభించామా మరిక కాలం గుర్తుండదంటే అతిశయోక్తికాదు. చదివేకొలది మన మనసు పొత్తళ్లలో నిక్షిప్తమయేలా రచించిన కథలు ఓ వంక హాస్యలాలనగా,మరోవంక మానవతారాగాలాపనగా వెరసి సమకాలీన సమాజ గీతాలాపనగా మన ప్రక్కనే కూర్చుని మనిషి మనవలసిన విధమిదీ అని అనునయంగా చెప్తున్నట్లు కథనల్లడం లక్ష్మిగారికి వెన్నతోకాదు మనసుతో పెట్టిన విద్య.

ఉదాహరణకు వీరు రచించిన దాంపత్యం కథే తీసుకుందాం. ఎన్నో కుటుంబాలలో సాధారణంగా తారసపడే అంశం. అయితేనేం కథ నడిపిన తీరు మాత్రం అసాధారణం. అడుగడుగునా ఉత్సుకతలేపే సంభాషణా చాతుర్యం కథను పూర్తిగా చదివేదాకా కట్టిపడేస్తుంది. తరువాతయినా వదలిపెడుతుందా? ఊహూ! మనమెక్కడికెళ్తున్నా మనలోనే తిష్టవేసి మన మనసును చిలుకుతూనే ఉంటుంది. కథ వెంటాడటమంటే ఇదేమరి! భార్యంటే కేవలం అలంకరణతో నిండిన ఆహార్యానికే పరిమితమైన ఉత్సవవిగ్రహంలా భావించే భర్త రామేశం. భర్తలోని ఎంతటి కోపాన్నయినా,మాటల తూటాలనయినా భరించిన భార్య రాజేశ్వరి కాలక్రమేణా సహనం అసహనమై భర్తను విడిచి వెళ్లిపోతుంది. ఓదార్పు అందకపోతే శక్తికి మించిన ఓర్పు కూడా మున్ముందు  ప్రజ్వరిల్లే బడబాగ్నికి బీజమే! అయితే దాంపత్యబంధంలో గాలివాన కలకాలం నిలవకూడదు.పిల్లల పలకరింపు, సమర్థింపు ఇచ్చిన స్థైర్యంతో తన ఇంట మళ్లీ మహరాణిలా అడుగు పెడుతుంది రాజేశ్వరి.  భర్త మౌనంలో రాజీ ధోరణి ఆహ్వానించదగ్గ పరిణామమే. బంధంలోని అనుబంధానికి అద్దం పట్టిన కథ.

ఇక ‘చందమామ రావె’ కథ. ఒకనాటి బాల్యానికి చందమామ రావె అని అమ్మపాడే పాట నిత్యశ్రవణమే. కాని నేటి చిన్నారులకు అందివచ్చిన సాంకేతికత అనేక వరాలు కురిపిస్తూనే తెలియని శాపంగా కూడా పరిణమించడం బాధాకరం. అమ్మనాన్నలు ఆఫీసు పనులలో నిమగ్నమై బున్నీకి ఆశ అనే కేర్ టేకర్ ను నియమిస్తారు. బుర్రకే కాదు నోటికీ స్పూను ఫీడింగ్ చేసే ఆశ బున్నీలోని అసంతృప్తికి మరో భాష్యం చెప్తుంటుంది. బున్నీ చందమామ కావాలంటున్నడని ఆశ చెప్తే తమ బిడ్డ చంద్రుడిపై నడవాలనుకుంటున్నాడని సంబరపడతారు సాఫ్ట్ వేర్ తల్లిదండ్రులు. అయితే తమ బిడ్డకు చందమామ రావె అంటూ అమ్మ అందించే నోటిముద్దలు కావాలన్న నిజం తెలిసినపుడు వారికేకాదు మనకు మనసు చివుక్కుమంటుంది.

‘పాపం మాలతి’ అనే కథ అమెరికా జీవనవిధానంలో అగ్రభాగాన్ని ఆక్రమించుకున్న పెట్ పోషణకు సంబంధించినదే. పెట్స్ తో అనుబంధానికి అక్కడ పెద్దపీటే! నిజానికి పక్షులనుకాని పెంపుడు జంతువులను కాని పెంచుకోవడం సర్వసామాన్యమేయైనా అవసరార్థం వేరే ఎక్కడికైనా వెళ్లాల్సివస్తే పెంచుకున్నవాటి పోషణ కష్టమే. ఈ సన్నివేశంతో మాలతి పడ్డ అవస్థలను హాస్యస్ఫోరకంగా చిత్రీకరించిన కథ. తనకిష్టంలేకపోయినా ఇంటికి తెచ్చిన కుక్కపిల్లకు తోడు అనుకోకుండా హామ్ స్టర్స్ బాధ్యత మీదపడిన మాలతి వీటితోపడ్డ కష్టం ఆయాచితంగా వచ్చిన తకధిమే! బోనులోనే తలలు వేలాడేసిన హామ్ స్టర్స్ స్థానంలో వేరేవి వచ్చి చేరేవరకు మనకు గుబులే!

మనిషి ఆలోచనా సరళిలో ఎన్నో కోణాలుంటాయి.విభిన్నకోణాలలో జరిగే ఆలోచనా మథనం ఒకొక్కసారి అర్థవంతమైనా మరొక్కసారి అర్థరహితం కూడా అవుతుంటుంది. వృద్ధదంపతుల వ్యాహ్యాళికి వచ్చి పార్కులోనే గంటకు పైగా కూర్చుండిపోవడానికి  కారణం  కొడుకు కోడలి నిరాదరణే కారణమన్న నిర్ణయానికి వచ్చిన యువతి వారికి తాను అండగా నిలబడతానని, చేయూతనందిస్తానని తన వెనుకనున్న బలాన్ని వివరిస్తుంది. ఉద్యోగాలలో అలసి ఇంటికి వచ్చిన కొడుకు కోడలికి కాస్తయినా ఏకాంతం లేకపోతే పరస్పరం ఏదైనా ఎలా చర్చించుకుంటారన్న సహజమైన కారణాన్ని వివరించిన వృద్ధస్త్రీ మాటలు తానాలోచించిన కోణం ఎంత తప్పయిందో తెలుసుకుని ఆ వృద్ధులకు నమస్సులర్పిస్తుంది. ఇదే ‘నాణానికి మరోవైపు’ కథలో చెప్పినది.

కాస్త ఆలోచిస్తే కథ నిజంగా కాస్తకాదు, చాలా ఆలోచించాల్సిన కథ. అర్ధరాత్రయినా ఇంటికిరాక స్నేహితులతో బలాదూర్ తిరిగే కొడుకు చందును ఆవేశంతో చెంపపై కొట్టడమే కాదు ఇంట్లోకి రానివ్వనంటాడు తండ్రి . తండ్రి మాటలకు రోషం ఉవ్వెత్తున ఎగిసిన చందు ఇల్లు వదిలి వెళ్లిపోతాడు.ఇక్కడే అసలు కథ మొదలవుతుంది.స్నేహితుడు రాజారాం ఇంట్లో రెండు రోజులున్నా రాజారాం తల్లిదండ్రులు తననెలాగైనా ఇంటికి పంపించే ఆలోచనలో ఉన్నారని గ్రహించి చిన్నగా ఆ ఇంటినుండి కూడా తప్పుకుంటాడు. తదుపరి చదువెలా అన్న మీమాంస, బ్రతకడమెలా అనే బ్రతుకు భయం పొటమరించినా ఇంటికి మాత్రం వెళ్లకూడదనుకుంటాడు.  బ్రతుకు రహదారిలో తన బాటనెలా నిర్మించుకోవాలో తెలియని చందు అనుకోకుండా మామయ్య దృష్టిలో పడతాడు. నడిరోడ్డుపై దొంగసొత్తు తనకు వదలి దొంగలు పారిపోతే దెబ్బలు తింటున్న చందును మేనమామ కాపాడి చందు ఆకలి తీర్చి తానేమి ఆరా తీయకుండానే చందు ద్వారానే విషయం తెలుసుకుంటాడు. చందులో రగిలే ఆకలి తీర్చడమే కాదు ఆలోచనలను రగిలిస్తాడు అతడి మామయ్య. కొడుకు ఆచూకీ తెలియని తల్లిదండ్రులకు చందు మేనమామ చందు వివరాలనందిస్తాడు. తనకోసం వచ్చిన తల్లిని ఆప్యాయంగా చుట్టుకుపోతాడు చందు. ఆ దృశ్యాన్ని చూసిన సూర్యం ముఖం కాంతివంతమవుతుంది. పనిలో పనిగా సూర్యానికి ఆవేశం తగ్గించుకోవాలని సున్నితంగా చెప్తాడుచందు మేనమామ. ఈ కథకు బహుమతి రావడం ముదావహం.నిజానికి పాఠకులకే ఈ కథ ఓ చక్కని బహుమతి.

ఇంకా జయహో వదినా ,వెఱ్ఱిబాగుల వదిన వ్రతకథ,ఇస్తినమ్మ వాయనం,డిజైనర్ ఫుడ్ వంటి చక్కటి హాస్యకథలు అలరిస్తాయి. తప్పక చదివి తీరవలసిన పుస్తకం అనడంలో సందేహం లేదు.

“అతను – ఆమె – కాలం” అనే ఈ పుస్తకం అన్ని ప్రముఖ పుస్తక విక్రయకేంద్రాలలోనూ  లభిస్తుంది. కినిగె.కామ్ లో ప్రింట్ బుక్, ఈ బుక్ కూడా లభిస్తాయి.

*

తెలుగు హాస్యానికి కొత్త లెవెలు!

?

?

 -కొల్లూరి సోమశంకర్ 

~

 

తెలుగులో వ్యంగ్య రచనల ప్రాభవం కాస్త తగ్గుతోందని అనిపిస్తున్న సమయంలోనే ప్రసన్నకుమార్ సర్రాజు గారి కథల సంకలనం వెలువడి ఆ లోటుని కాస్త అయినా తీర్చింది.

ప్రస్తుత కాలంలో వ్యంగ్యం తగ్గడానికి కారణమేమిటో ముందుమాట వ్రాసిన ప్రముఖ హాస్య రచయిత శ్రీరమణగారు వెల్లడించారు. “వ్యంగ్యం అంటే సత్యానికి ఆమడ దూరంలో ఉండి నవ్వు పుట్టించేది. ఇప్పుడు అంత దూరాన్ని సృష్టించడం కష్టమై వ్యంగ్యం తేలిపోతోంది” అన్నారాయాన.

మరో ముందుమాట వ్రాసిన ప్రముఖ కార్టూనిస్ట్ మోహన్ గారు ఈ పుస్తకం గురించి చెబుతూ, “తెలుగు సినిమా లాంటి వల్గారిటీకీ, మీలో (పాఠకులలో) చక్కని సంస్కారానికి అప్పీల్ చేసే హాస్యానికీ తేడా ఉంటుంది. ప్రసన్న కథలీ పని చేస్తాయి” అన్నారు.

ప్రతీ మాటలో, పనిలో, జీవితాల వివిధ కోణాల్లో, ఏది తాకితే నవ్వొస్తుందో కొంతమందికే తెలుసు” అంటూ ఆ కొద్దిమందిలో సర్రాజు ఒకరు అంటారు డా. మాచిరాజు రామచంద్రరావు.

వీరి మాటలు, ఈ అభిప్రాయాలు చదివితే, ఓ మంచి పుస్తకం చదవబోతున్న నమ్మకం కలుగుతుంది. నిజమే… ఆ నమ్మకం వమ్ము కాదు.

ఈ పుస్తకంలో పన్నెండు కథలున్నాయి. అన్ని కథల్లోనూ హాస్యమూ, వ్యంగ్యమూ బాగా పండాయి. రాజకీయాలు, సినిమా, కార్పోరేట్ విద్య, పత్రికలు, టీవీ తదితర రంగాల తీరుతెన్నులపై పంచ్‌లు వేసిన కథలివి.

అనైటెడ్ స్టేట్స్ ఆఫ్ ఇండియా” కథ దేశంలోని రాజకీయాలపై గొప్ప సెటైర్. ఒకప్పటి రాష్ట్రాలన్నీ చిన్న చిన్న రాష్ట్రాలుగా విడిపోతే ఎలా ఉంటుందో ఈ కథలో హాస్యంగా వివరించారు. విజయవాడ నగరమే ఈ కథలో అనేక చిన్న రాష్ట్రాలుగా విడిపోయింది. కాలువల జలాల పంపకాలపై విబేధాలు, ఒక రాష్ట్రం నుంచి మరో రాష్ట్రానికి వెళ్ళడానికి వీసాలు, బోలెడుమంది గవర్నర్లు, వాళ్ళ పిఎలు, ప్రతిపక్ష నేతలు… కథ రంజుగా ఉంటుంది. ఒక రాష్ట్రం ముఖ్యమంత్రి పక్క రాష్ట్రానికి వెళ్ళి వైద్యం చేయించుకుంటాడు. “ఆపరేషన్‌కి పక్క రాష్ట్రానికెళ్ళడం మన రాష్ట్ర వైద్యులను అవమానించడమే. విరాష్ట్రీ మారక ద్రవ్యాన్ని వృధా చేసే హక్కు మీకెవరిచ్చారు?” అంటూ ప్రతిపక్ష నాయకుడు గొడవ చేస్తాడు. ఇలా పదే పదే ఏదో కారణం మీద గొడవలు చేసి, అరెస్టయి, బెయిల్ పై విడుదలయితే గానీ తోచదట ఆయనకి. పైగా ఇదొక యోగాట. పేరు ధర్నాయోగ లేదా యాగీయోగ. దాంతో ఆయనకున్న షుగరు, కీళ్ళవాతాలు అన్నీ పోయి చక్కగా రక్తప్రసరణ అయి, పదికాలాల పాటు అరెస్టయి బ్రతకొచ్చట!! చదువుతున్నంత సేపూ నవ్వుతూనే ఉంటాం.

రాజకీయాలపైనే మరో వ్యంగ్య కథ “ఇండిపెండెంట్స్ డే“. స్వతంత్ర్య అభ్యర్థులు ఎన్నికల్లో గెలవడం ఎంత అపరాధమో చెబుతుందీ కథ. ఓ ఇండిపెండెంట్‌ని తమ పార్టీల్లోకి లాగేసుకోడానికి జాతీయపార్టీలు ప్రయత్నిస్తాయి. హై కమాండ్‌తో ఇక్కడి ఛోటా మోటా నాయకులు తెలుగు హిందీ కలగలసిన భాషలో మాట్లాడడం నవ్విస్తుంది. ‘పాత సూట్‍కేస్‌లకు కొత్త సూట్‌కేసులిస్తాం’ అంటూ ఇండిపెండెంట్ ఇంటిముందు తచ్చట్లాడిన రాజకీయ బ్రోకర్ “ఏ సూట్‌కేసులో ఎంతుందో ఎవరు చెప్పగలరు?” అని అనడం; లాబీలో మాట్లాడితే లాబీయింగ్ అనడం సరదాగా ఉన్నాయి.

దేవదాసు వెడ్స్ పార్వతి” కథ సినీరంగంపై చక్కని వ్యంగ్యాత్మక విమర్శ. మనవాళ్ళు తీసిన కథలనే అటూ ఇటూ మార్చి మళ్ళీ మళ్ళీ ఎందుకు తీస్తుంటారో చెప్తారు రచయిత. “మన జనాలకి చెప్పిందే చెప్పడం, చేసిందే చెయ్యడం, చూసిందే చూడడం అలవాటయ్యా. అవి జీవితాలు గానీ, రాజకీయాలు గాణీ, సినిమాలు గానీ… కథలు కొత్తగా చెప్పాలి గాని కొత్తవి చెప్పకూడదు. ఓ పట్టాన అరిగించుకోలేరు” అంటాడో నిర్మాత కథా రచయితతో. దేవదాసు పార్వతి కథనే మళ్ళీ తీస్తూ, దానికి బీభత్సమైన పబ్లిసిటీ ఎలా ఇవ్వాలో చెబుతుంటే నవ్వూ వస్తూందీ, నిజంగానే కొంతమంది నిర్మాతలు ఇలా ప్రయత్నిస్తున్నారు కదా అని గుర్తొచ్చి కించిత్ బాధా కలుగుతుంది. ఈ కథలో హాస్యం కన్నా వ్యంగ్యం పాలే ఎక్కువ.

సొంత పేరుతో సినిమాలు తీస్తే అచ్చిరావడం లేదని, బెంగాలీ డైరక్టర్ సత్యజిత్‌‌రాయిలా గంభీరంగా ఉండాలనుకొని, ‘విశ్వజిత్ రప్పా’గా పేరు మార్చుకుంటాడు ఓ నిర్మాత. సినీ నిర్మాణానికి డాన్‌లే తెరవెనుకగా నిధులందిస్తున్నారని నమ్మి, తన సినిమాకి నిధులు అందించవలసిందిగా డాన్‍లకు బహిరంగ ప్రకటన జారీ చేస్తాడు “డాన్‌ల భూగర్భ శత్రుత్వం” కథలో. తర్వాత ఏం జరిగిందనేది ఆసక్తికరంగా ఉంటుంది. అండర్‌గ్రౌండ్ డాన్‌లు తమ వ్యవహారాలను భూగర్భంలో జరుపుతారని చెబుతూ, డాన్‍ డెన్‌లో ప్రవేశించడానికి వాడే కోడ్ సాంగ్ ఏమిటో చెప్పినప్పుడు నవ్వకుండా ఉండలేం.

తన కొడుకుని హీరోని చేయాలనుకుంటాడు ఓ నిర్మాత. “అదేంటి బావా, మనోడికి ఏవీ రావు కదా?” అంటాడు అతని బావమరిది. బావమరిది లేవనెత్తిన ప్రతీ ప్రశ్నకి జవాబిచ్చి అతని నోరు మూయిస్తాడు. అంతే… తెలుగు సినీ కళామాతల్లికి మరో నట వారసుడి సేవలు మొదలవుతాయి. ఇదే నిర్మాత ఓ డబ్బింగ్ సినిమా తీయాలని చెన్నై బయల్దేరుతాడు. బొంబాయి ముంబయిగా, మద్రాసు చెన్నై గారి మారకా, హైదరబాద్‌కు కూడా పేరు మారిస్తే, ఏం పేరు పెట్టాలో ఈ నిర్మాత సూచిస్తాడు. నవ్వాగదు ఆ పేరు వింటే. డబ్బింగ్ చిత్రాల ప్రహసనాన్ని చదివి నవ్వుకుంటాం “ఏకె97” అనే ఈ కథలో.

సినిమారంగాన్ని పరిశ్రమగా గుర్తించమని సినీరంగం పెద్దలు ప్రభుత్వానికి పెట్టుకున్న అర్జీని ఆమోదించి సినిమా రంగాన్ని పరిశ్రమగా గుర్తిస్తుంది ప్రభుత్వం “ఏ టేల్ ఆఫ్ ఇండియన్ సినిమా ఇండస్ట్రీ” అనే కథలో. పరిశ్రమ కాబట్టి ఫ్యాక్టరీ గొట్టం ఉండాలని ఓ స్టూడియోలో భారీ పొగ గొట్టాన్ని ఏర్పాటు చేస్తారు. సినిమా బడ్జెట్ పై ఆంక్షలు విధిస్తుంది ప్రభుత్వం. చేసే ప్రతీ ఖర్చుకి ఆడిట్ ఉండాలంటుంది. సినిమా నిర్మాణానికి జాతీయ బ్యాంకులు లోన్‌లు ఇస్తాయి. లోన్ శాంక్షన్ అవ్వాలంటే ఏమేం చెయ్యాలో ఓ బ్యాంక్ మేనేజర్ చెబుతాడు. సినిమా తీయడం అంటే ఓ డ్యూటీగా మారిపోయిన ఉదయం తొమ్మిది నుంచి సాయంత్రం అయిదు వరకు ఏదో ఆఫీసుకెళ్ళొచ్చినట్లుగా సినిమా తీయడం తన వల్ల కాదని సినిమా నిర్మాణాన్ని విరమించుకుంటాడో నిర్మాత.

కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల సంక్షేమ పథకాలకి ఆధార్ కార్డుని తప్పనిసరి చేయడం జనాల కొంప ఎలా ముంచుతోందో హాస్యంగా చెబుతారు రచయిత. ఉరి తీయబోతున్న ఓ ఖైదీకి ఆఖరి క్షణంలో మరణశిక్ష వాయిదా పడుతుంది.. ఏ రాష్ట్రపతి క్షమాభిక్ష పెట్టడం వల్లో కాదట. ఉరితీసే ఖైదీలకి తప్పనిసరిగా ఆధార్ కార్డ్ ఉండాలనే నిబంధన కొద్ది సేపటి క్రితమే అమల్లోకి రావడం వల్లట. ఆధార్ కార్డ్ లేనందువల్ల ఆ ఖైదీ ఉరి నుంచి తప్పించుకున్నాడట. ఓ పెళ్ళిలో పిలిచిన అతిథులకంటే రెండు రెట్ల కన్నా ఎక్కువమంది వచ్చి విందు తిని పోయారట. ముష్టోళ్ళు కూడా కాస్త మంచి బట్టలేసుకొచ్చి తినేసి వెళ్ళారని ఆ కుటుంబం అనుమానపడింది. అందుకని ఆ కుటుంబంలో జరుగుతున్న తర్వాతి వివాహానికి శుభలేఖ పంపుతూ… ‘ప్రవేశం ఆధార్ కార్డ్ ఉన్నవారికి మాత్రమే’ అని వ్రాయిస్తారు దాని మీద. సబలాదేవి అనే ఉద్యోగినిని ఎత్తుకెళ్ళి అత్యాచారానికి ప్రయత్నిస్తారు నలుగురు దుండగులు. “మీరు మగాళ్ళయితే మీ ఆధార్ కార్డులు చూపించండి” అంతే…. ఆ నలుగురు తమ ప్రయత్నాన్ని విరమించుకుని సబలాదేవిని సగౌరవంగా – అటుగా వచ్చిన బస్‌లో ఎక్కిస్తారు. హస్యం, వ్యంగ్యం కలగలసిన కథ “నీవే నా మదిలో…“.

ఇప్పుడంటే ‘సెల్ఫీ’ల కాలం కాని, ఒకప్పుడు ‘సెల్ఫ్’ల కాలం! తమకి విపరీతమైన పలుకుబడి ఉందని, ఫలానావాడికి నేనెంత చెబితే అంతేనని తమ గురించి ఘనంగా – ఎదుటివారికి అనుమానమే కలగకుండా సొంతడబ్బా కొట్టుకునే డబ్బారాయుళ్ళు అప్పుడూ ఉండేవారూ, ఇప్పుడూ ఉన్నారు. అలాంటివారి కథే “వెంకీ! ఎక్కడున్నావ్‌రా ఇంతకాలం?“.

విద్య వ్యాపారం అయిపోయాకా, విద్యార్థులు ప్రాడక్ట్స్ అయిపోయారు. విద్యార్థుల కలల్ని తాము అమ్ముకొంటున్న కొన్ని కార్పోరేట్ కాలేజీల పైత్యాన్ని చెబుతుంది “డ్రీమ్ మర్చంట్స్“. హాస్యంగా చెప్పినా, ఈ కథలో ప్రస్తావించిన విద్యార్థుల సమస్యలు, ఒత్తిడి నిజంగానే ఉన్నాయని అర్థమవుతుంది, బాధ కలుగుతుంది.

టీవీ చూడడం ఓ నిత్యావసరంగా మారిపోయిన ఓ ఇంట్లో, ఇంటాయన టీవీ ముందు కూర్చుంటాడు “స్త్రీ ఛానల్” కథలో. పెద్ద టీవీ ‘నిమిత్తమాత్రురాలిగా’ ఆయన్ను చూస్తుంది. ఈయన మాత్రం ఏదో మైకంలో ఉన్నవాడిలా ‘నిమత్తు మాత్రుడిగా’ ఆన్ చేస్తాడు. ఒక్కో ఛానెల్ మార్చుకుంటూ పోతూంటాడు. ఉన్నట్లుండి ఓ కొత్త ఛానల్ కనబడుతుంది. ఆ ప్రోగ్రామ్‌ చేస్తున్న యాంకర్‌కీ కొత్తేమో –  మాట తడబడి – ‘అంతరంగిక మధనం’ అనే పదాన్ని తప్పుగా పలికిన వైనం నవ్వు తెప్పిస్తుంది. ఇంటాయన చాలాసేపు ఈ ఛానల్ కార్యక్రమాలు చూస్తూంటాడు. చివరికి ఇంత కలుపుగోలు ఛానల్‌ని చూడడం ఇదే మొదటిసారి అనుకుంటూ టీవీ కట్టేసి పడుకుంటాడు. బాగా నవ్విస్తుందీ కథ.

పాఠకుల కాలక్షేపం కోసం ఓ రచయిత ఒక కథ రాస్తే, ఆ కథ చదివిన పాఠకులు పత్రికకి ఉత్తరాలు వ్రాస్తారు. ఆ కథ వల్ల ఫైనాన్స్ సమస్యలు చెలరేగి, జెండర్ రాజకీయాలు పెట్రేగి విదేశీ సమస్యలు పెచ్చరిల్లే పరిస్థితి వస్తుందని రచయిత భయపడేలా చేస్తారు “పాఠకుల తోకకు నిప్పు” కథలో.

ప్రైవేటు ఎయిర్‌లైన్స్ విపరీతంగా పెరిగాకా, అవి అందిసున్న సేవల తీరుతెన్నులను హాస్యంగా చెప్పిన కథ “విమాన సంచరరే…“.

అన్ని కథలలో ఆరోగ్యకరమైన హాస్యం ఉంది, సున్నితమైన వ్యంగ్యం ఉంది. ఈ కథలలో “గొప్ప సందేశాలు లేవుగానీ, హాయిగా చదివిస్తాయి” అనే శ్రీరమణ గారి అభిప్రాయంతో నిరభ్యంతరంగా ఏకీభవించవచ్చు.

మిహిర పబ్లికేషన్స్ వారు జనవరి 2016లో ప్రచురించిన ఈ 137 పేజీల పుస్తకం వెల రూ.100/-. విదేశాలలో ఉండే తెలుగువారికి $10. నవోదయా బుక్ హౌస్, కాచీగుడా, హైదరాబాద్ వారు సోల్ డిస్ట్రిబ్యూటర్స్.

~ కొల్లూరి సోమ శంకర్

 

నాగలక్ష్మి పాడిన “మేలు”కొలుపులు

 

వేకువ పాట ముఖ చిత్రం

 

-సువర్చల చింతల చెరువు 

~

వారణాసి నాగలక్ష్మిగారి “వేకువపాట” కథాసంపుటి, వేకువనే పాడవలసిన “మెలకువ పాట” లా అనర్ఘమైనది. వేకువన మాత్రమే వినిపించే పిట్టల కువకువలా ఆహ్లాదమైనది.

వెదురు చివుళ్ల కోసం ఎగిరొచ్చే గువ్వలు ఈ కథాసంపుటి ముఖచిత్రం. రచయిత్రి చిత్రకారిణికూడా కావటంతో పుస్తకానికి ఈ బొమ్మ మరింత భావస్ఫోరకంగా నిలిచింది.  వేకువనే చిన్ని విహంగాలు తమ కలకలారావాలతో జగతిని మేలుకొలుపుతాయి. వెదురు పొదలు ఆమాత్రం గాలులకే ఈలపాటలు వినిపిస్తాయి. ప్రకృతిలో మమేకమైన  ప్రతి చిన్న ప్రాణీ తన జీవనగీతాన్ని సక్రమంగా పాడుకుంటుంటే.. మానవులం, అన్ని తెలివితేటలూ ఉన్నవాళ్లం చేస్తున్నదేమిటీ అనే ప్రశ్నే ఈ వేకువపాట అని  సూచించారేమో ఈ రచయిత్రి అనిపిస్తుంది. ఈ చిత్రాన్ని చూస్తుంటే ఈ చిన్ని పక్షులే, ఈ  వెదురు వేణువులే మనకాదర్శం అని చెప్పినట్లు తోస్తుంది.

ఇందులో కథలన్నీ  బెల్లం,మిరియాలు కలిపిన పాలు. పౌష్టికతతోబాటు, ఔషధీకృతమైనవి. పాల మనసులకు, తీయని మనసులకు అవసరమైన ఘాటైన సత్యాలు లేదా పరిష్కారాలను సూచించేవి. తిండి కలిగితే కండ కలగి, కండ కలిగినవాడే మనిషి అయినట్లు, ఇలాంటి పాలను సేవిస్తే మానసిక ఆరోగ్యం!  దారుఢ్యం! ఈ కథలు  సమాజపు ఆధునిక రుగ్మతలను ఎదుర్కోటానికి ఉపకరించే ఔషధాలు. వీటిని సేవించిన పాఠకుడు మనసైన మార్గాన్ని కాకుండా మనసున్న మార్గాన్నిఅనుసరించగలుగుతాడు .

ఈ కథల్లో తమ జీవితానుభవాలతో తీర్చిదిద్దుకున్న వ్యక్తిత్వాలను చూసి మన మెదళ్లు వికసిస్తాయి. ఇవి రచయిత్రి బోధించే నీతికథలు కాదు. జీవితాన్ని ఇష్టపడమని చెప్పే చేయూతలు! చదివించేతనం, మొదలుపెడితే చివరివరకూ ఆగనివ్వని తత్వం, మళ్లీ  చదివించే తీరు ఈ కథల్లోని ప్రత్యేకతలు.  ఈ సంపుటిలో ముందుమాటలో విశ్లేషించిన కథలను వదిలి మిగతా కథలను చర్చిస్తాను.

“ఆనాటి వానచినుకులు”: ఈ కథాసంపుటిలో విభిన్నమైనది “ఆనాటి వానచినుకులు” కథ. ఇది పచ్చకర్పూరం, కలకండ కలిపిన పాలలా..కమ్మని అనురాగగంధంతో ఘుమఘుమలాడింది. మితిమీరిన ఆశల, ఆశయాల సాధనలో పిచ్చిపరుగులు తీసిన జంట అలసిన తమ మనసులను తీపిసంగతుల భావుకతతో సేదతీర్చి మమేమకమైన ప్రేమకథ. ఏది అవసరమో అది తేల్చుకున్న గొప్ప కథ. ఎల్లలులేని వలపుల ఔన్నత్యాల విలువను తెలియచేసే  ఈ కథ ఈ కాలపు జంటలకో ఓ చక్కని వికాస బోధన!   కావ్యోపేతమైన ఈ కథలో ప్రతి ఒక్క పదం  వాసంత సమీరమే! మలయమారుత గమనమే! ఇది చదివినంతసేపూ ఒక ఆహ్లాదకరమైన లలితగీతం మనకు వినబడుతుంది.

పుష్యవిలాసం: పువ్వుల మాసం పుష్య మాసం  అంటూ మొదలయ్యే ఈ కథ పువ్వుల్లాంటి సుకుమారమైన హృదయాల వర్ణనతో  విలసితమైనదే! ఆటో నడిపే సూర్యారావు కి  కనువిప్పు కలిగించిన తల్లీకూతుళ్ల సంభాషణ, జీవితపు ఆవేశకావేషాలను, తొందరపాటు తనాలను ప్రశ్నిస్తుంది.   ఆటోలో కూతురు మాటాడే మాటలు ప్రేమలోని పౌరుషాన్ని చూపిస్తే, తల్లి మాటలు స్త్రీ అనుభవపు క్షమాగుణాన్ని చూపిస్తాయి.  అర్ధవంతంగా మలచిన సంభాషణలు, భాషతో ఊహాచిత్రాన్ని గీసిన  రచయిత్రి నేర్పు సౌందర్యభరితం!  ఈ కథ చదువుతున్నంతసేపూ ఏదో పునర్జీవనగీతం మనసుని తడుతూనే ఉంటుంది. కథన కౌశలం కమనీయం.

అమ్మా, నాన్నా ఓ కాలేజీ అబ్బాయీ, సరళీస్వరాలు: ఒకటి పిల్లలు తెలుసుకోవాల్సినదైతే, మరోటి పెద్దలు గ్రహించాల్సినది. తల్లిదండ్రుల పట్ల, తమ చదువు, నడవడికల పట్ల పిల్లలు ఎంత బాధ్యతాయుతంగా ఉండాలో, పిల్లల జీవితాన్ని తీర్చిదిద్ది, వారి జీవనరాగం అపశృతిలేకుండా చేయాలంటే తల్లిదండ్రులూ ముఖ్యాముఖ్యాలను దృష్టిలో ఉంచుకోవాలని, సరైన బాధ్యతాయుత  పెంపకం అదేనని రెండు కోణాలనూ విశదీకరిస్తూ, సమాజంలోని ఆకర్షణలు, రుగ్మతల గురించి ప్రస్తావిస్తారు ఈ రెండు కథలలో!  మానసిక విశ్లేషణతోబాటు ఓ సాంఘిక విశ్లేషణ అవసరాన్నీ సూచిస్తారు. కుటుంబ సంబంధాలను రచయిత్రి,  ముందే ఏర్పరుచుకున్న భావజాలంతో కాకుండా మన కళ్లముందు కనబడుతున్న సంఘటనల ఆధారంగా చిత్రిస్తారు. ఒకసారి,  మారిన వ్యవస్థలోని లొసుగులు మనముందు సున్నితంగా విప్పుతారు. మరోమారు,  కంటికి కనిపించే వ్యవస్థలో ఎవరికీ కనిపించని వాస్తవిక కోణాలను ఓసామాజిక విశ్లేషకురాలుగా తేటతెల్లంచేస్తారు. మానసిక విశ్లేషకులే ముక్కుమీదవేలేసుకునేంతగా, వారు చూడలేని లోతైన అంశాలను చెప్పిస్తారు. ఈరెండు కథలూ విద్యార్ధులకు పాఠ్యాంశాలు కాదగినవి.

“పాపాయి పుట్టినవేళ”  కథలో పాత ఆచారాలను మూఢాచారాలుగా కొట్టివేయకూడదన్న సత్యం తెలుస్తుంది. అంతేకాదు, చిన్న చిన్న సాయాలందించే ఆత్మీయహస్తం ఎంత విలువైనదో, అది తనవారికి మానసికంగా ఎంతటి ఊరటను అందిస్తుందో తెలియచేస్తుంది.   చాలారోజుల తర్వాత ఇంటికి వచ్చి ఆత్మీయంగా పెనవేసుకున్న బంధువులా అపురూపంగా అలరించే కథ ఇది

కొమ్మకొమ్మకో సన్నాయి : ప్రకృతికి, జీవితానికీ అన్వయంకూరుస్తారు ఎప్పుడూ రచయిత్రి అనిపిస్తుంది మనకు. ప్రకృతి నేర్పే పాఠాలను నిరంతరం ఓ భావుక హృదయంతో నేర్చుకోవాలని, ఋతువులకనుగుణంగా తమనితాము మార్చుకునే వృక్షరాజాలే మనకు ఆదర్శమనీ, ఒడిదుడుకులు ఎదురైనా ఉత్సాహంతో ముందుకు సాగే పరవళ్ల జలపాతాలే మనకు జీవనాడిని వినిపిస్తాయని  మృదువుగా హెచ్చరిస్తారు.

విముక్త : తల్లిదండ్రులను వదిలి తమ జీవితాలను విదేశాలలో కొనసాగించే పిల్లల్ని తప్పుబట్టకుండా, వారికోసం ఎదురుచూస్తూ నిరాశతో మనసుల్ని కృంగదీసుకోకుండా “నేనున్నాను, నన్ను స్మరించుకోండి, నాతో మాట్లాడండి” అంటూ పద్మశ్రీ శోభానాయుడుగారు కృష్ణుడిగా వేసిన కూచిపూడి నృత్యనాటికను చూసిన అనుభూతి కదిలింది  విముక్త కథ చదివాక. జీవితాలపై మోహం వద్దంటూనే జీవనాల్ని సమ్మోహనపరిచే కృష్ణతత్వం కనిపించిందీ కథలో.  ఎన్నో నేర్చుకోవాల్సినవి ఎప్పటికప్పుడు ఉంటూనే వుంటాయి. అతీతంగా జీవించాల్సిన సమయాన్ని గుర్తించి, గౌరవంగా ఆహ్వానించాలని చెప్పే ఈ కథంతా చదివాక గుండె బరువెక్కకమానదు.

పరిమళించే పూలు: మాలతి పాత్ర స్ఫూర్తినిచ్చేదిగా తోస్తుంది. ఈమెకి తన జీవితం పై చాలా స్పష్టత కనిపిస్తుంది. తనకేం కావాలో  ఖచ్చితంగా తెలిసిన పాత్ర ఇది. అలాగని స్వార్ధపరురాలుకాదు. తనపై నిందలువేసినవారిని సైతం జాలిపడి క్షమించి, మానసికంగా వారికి  చేయూతని అందించే మంచిమనసున్న అమ్మాయి. ఈ మాలతిలో రచయిత్రి మనసు కనిపిస్తుంది మనకు.

ఏ కథలోనూ, ఇబ్బందిపెట్టిన పాత్రలను   విమర్శచేయని విశాలదృక్పథం రచయిత్రిలో కనిపిస్తుంది.  కారణాలను విశ్లేషించుకోవాలేగానీ, అవే తమకు అడ్డంకులన్న సంకుచితత్వం వద్దని, తమనితాము మెరుగుపరుచుకోవాలేగానీ, పరదూషణ అత్యంత అనవసరమన్న విశాలతత్వం కనిపిస్తుంది.  ఈ  కథలలో కథానాయికలు పరిస్థితులకు బానిసలయినవారే కానీ బానిస మనస్కులు కారు.  ఆత్మాభిమానపు అస్తిత్వానికై తలపోసే సుమనస్కులు!  తమ గుర్తింపు తమకోసమే కానీ, ఇతరులకోసం కాదు అని, ఇతరులు తమని గుర్తించి చేయూతనందిస్తారని ఎదురుచూస్తూ, పరిస్థితులను తిట్టుకుంటూ కూర్చోవద్దని, తామిలా ఉండటానికి కారణం తామే కాని మరెవరూ కాదన్న నిజాన్ని తెలుసుకుని, చీకటిలోంచి తమంత తాముగా వెలుగుదారి వెతుక్కోవలసిన  అవసరాన్ని తెలియచేస్తారు.

పూర్వపు విలువలను ఏమాత్రం వదలని ఈ కథలు ఆధునిక విశ్వాసాలకూ అత్యంత ప్రాముఖ్యాన్నీ ఇస్తాయి. ఇప్పటి సామాజిక సమస్యలనే మన ముందుకు తెచ్చి, ఈ కాలానికి అవసరమైన దిద్దుబాట్లనే సూచించి వర్తమానాన్ని సంక్లిష్టతలనుండి కాపాడుకొంటూ పరిపక్వ హృదయాలతో ముందుకు సాగేలా  ఉంటాయి. మాసిపోయిన సమస్యలని లేవనెత్తని ముందడుగు రచనలుగా ఇవి నిలుస్తాయి.  వారణాసి నాగలక్ష్మిగారికి ఎన్ని అభినందనలూ చాలవు!

*

 

తమిళతల్లి మేఖలాభరణం ‘మణిమేఖల’

 

 

– రాధ మండువ

~

photoతమిళ పంచకావ్యాలలో రెండవది ‘మణిమేఖల’. ఈ కావ్యాన్ని చేరదేశరాజైన చేరన్ చెంగట్టువన్ ఆస్థానకవి శీతలైశాత్తనార్ రచించాడు. ఈ కావ్యం క్రీ.శ రెండో శతాబ్దంలో రచింపబడినది. తమిళ పంచకావ్యాలలో మొదటిదైన ‘శిలప్పదిగారం’ కి ఈ మణిమేఖల కావ్యం పొడిగింపుగా చెప్పుకోవచ్చు. ఇది ఆ రోజుల్లోనే సంఘసంస్కరణని ప్రోత్సహించే దిశగా సాగిందనీ, సర్వమతాలూ ఒకటే అని చాటి చెప్పిందనీ అంటారు. అందుకే తమిళ పండితులు ఈ కావ్యాన్ని తమిళతల్లి నడుమున ధరించే మేఖలాభరణం (ఒడ్డాణం) గా అభివర్ణిస్తారుట.

తమిళ పంచకావ్యాల్లో మొదటిది సారంగ పాఠకులకి పరిచయం చేశాను. దానికి కొనసాగింపుగా ఉన్న ఈ కథని కూడా పరిచయం చేయాలనే అభిలాషతో దీన్ని క్లుప్తంగా పరిచయం చేస్తున్నాను. ఎమ్ ఎ తెలుగులో మా పాఠ్యాంశంగా ఉన్నదీ, నాకున్న తమిళ ఫ్రెండ్స్ ను అడిగీ, కొంత ఇంటర్నెట్ సాయంతోనూ ఈ కథని రాశాను. ఈ కథని తెలిసిన వారు వారి వారి అభిప్రాయాలనీ, ఇంకా ఇక్కడ తెలియచేయని విషయాలనూ పంచుకోవలసినదిగా కోరుకుంటున్నాను.

కథాసంగ్రహం

1.

చోళ రాజ్యంలోని పూంపుహార్ పట్టణంలో కోవలుడు అనే వ్యాపారి ఉండేవాడు. అతని భార్య కణ్ణగి. ఇద్దరూ ఎంతో అన్యోన్యంగా జీవించేవారు. చోళరాజు ప్రతి సంవత్సరం నిర్వహించే ఇంద్రోత్సవాలలో మాధవి అనే వేశ్య నాట్యం చేసింది. అప్పుడు మాధవిని చూసిన కోవలుడు భార్యను పూర్తిగా విస్మరించి మాధవితో జీవించసాగాడు. మాధవి కూడా కోవలుడు అంటే ఎంతో ప్రేమగా ఉండేది. వారిద్దరికీ పుట్టిన పాపే మణిమేఖల. మాధవే లోకంగా జీవిస్తుండటంతో కోవలుడి వ్యాపారం పూర్తిగా నాశనమైంది. తన భార్య కణ్ణగికి ఆమె పుట్టింటి వాళ్ళు ఇచ్చిన నగలతో సహా మాధవికి సమర్పించుకుని పేదవాడయ్యాడు. మాధవి అమ్మ చిత్రావతి కోవలుడిని వదిలించుకోవాలని అతన్ని నిందించడం, మాధవికి అతని మీద చెడు మాటలు చెప్పడం చేయసాగింది. ఫలితంగా – ఇద్దరికీ ఒకరి మీద ఒకరికి అనుమానం కలిగింది.

భార్యని మోసం చేశాననే బాధతో, పాశ్చాత్తాప హృదయంతో మాధవిని వదిలి ఇంటికి చేరాడు కోవలుడు. పూలమ్ముకున్న చోట కట్టెలు కొట్టుకునే స్థితిలో ఉండలేక ధనం సంపాదించి తిరిగి తన ఊరికి రావాలని భార్యని తీసుకుని మధురైకి వెళ్ళాడు. అక్కడ దొంగతనం ఆరోపింపబడి హతుడయ్యాడు.

(చూడండి ఈ లింక్ )

కోవలుడు మరణించాడన్న వార్త విని మాధవి విపరీతమైన దు:ఖానికి లోనయింది. ప్రాపంచిక విషయాల పట్ల విరక్తియై బౌద్ధ సన్యాసినిగా మారి తన బిడ్డ మణిమేఖలతో సహా ఆశ్రమానికి వెళ్ళిపోయింది.

ఆ ఏడు చోళ రాజ్యంలో జరుగుతున్న ఇంద్రోత్సవంలో మాధవి పాల్గొనలేదని ఆమె తల్లి చిత్రావతికి అసంతృప్తిగా ఉంది. మాధవిని ఎలాగైనా మళ్ళీ వృత్తిలోనికి దించాలనే పన్నాగంతో “మాధవి నాట్యం చేయకపోవడం వలన పూహార్ పట్టణ ప్రజలంతా అసంతృప్తులై ఉన్నారని, దూషిస్తున్నారని తెలియచేసి మాధవిని పిలుచుకురా” అని మాధవి చెలికత్తె అయిన వసంతమాలని ఆశ్రమానికి పంపింది చిత్రావతి.

వసంతమాల ఆశ్రమానికి చేరి చిత్రావతి చెప్పమన్న మాటలు మాధవికి చెప్పింది. “కోవలుడు చనిపోయినా నేను ఇంకా బ్రతికే ఉన్నాను. మహాపతివ్రత అయిన మా అక్క కణ్ణగికి నేను చేసిన అన్యాయానికి ప్రతిఫలం ఇప్పటికే అనుభవిస్తున్నాను. ఈ మణిమేఖలని నా కూతురుగా కాదు. కణ్ణగి కూతురుగా పెంచదలచుకున్నాను. ఈ ఆశ్రమంలో ఉంటేనే అది సాధ్యం. ఇక్కడే బుద్దుడి పాదాలను ఆశ్రయించుకుని ఉంటామని, ఈ దు:ఖజలధిని దాటడానికి నాకిదే మార్గమని నా తల్లితో చెప్పు” అంది మాధవి ఏడుస్తూ.

అక్కడే కూర్చుని పూలమాలని కట్టుకుంటున్న మణిమేఖల తన తల్లి ఏడుస్తుంటే తనూ ఏడ్చింది. మాధవి మణిమేఖలని ఓదార్చింది. దు:ఖాన్నించి తేరుకున్న తర్వాత మాధవి మణిమేఖలను చూస్తూ “మన కన్నీటితో తడిచిన ఈ మాలని ఆ భగవంతుడికి సమర్పించరాదు. నువ్వు ఉద్యానవనానికి వెళ్ళి పూలు కోసుకుని వచ్చి మరో మాల అల్లు” అంది.

మణిమేఖల ‘సరే’నని వెళుతుండగా ఆశ్రమంలో ఉండే సుతమతి అనే ఆవిడ “ఈ ఉత్సవాల సమయంలో యుక్తవయస్సుకి వచ్చినవారు ఒంటరిగా ఉద్యానవనానికి వెళ్ళడం మంచిది కాదు. అలా వెళ్ళడం వల్ల నేను పూర్వ జీవితంలో చాలా దు:ఖానికి లోనయ్యాను. శీలాన్ని పోగొట్టుకున్నాను. నేను మణిమేఖలకి తోడుగా వెళతాను” అంది. మాధవి ఆమెకి కృతజ్ఞతలు చెప్పుకుంది.

మణిమేఖల, సుతమతులిద్దరూ ‘బుద్ధుడి విగ్రహం ఉన్న ఉద్యానవనంలోకి వెళ్దామనీ, అదైతే సదా పుష్పాలతో అలరారుతుంటుంది కనుక త్వరగా పువ్వులు కోసుకుని రావొచ్చుననీ’ అనుకున్నారు.

వసంతోత్సవాల సందర్భంగా పట్టణంలో చేసిన ఏర్పాట్లను, ఎక్కడెక్కడి నుండో వచ్చిన ప్రజలను, గారడీ వాళ్ళు చేస్తున్న వివిధ విన్యాసాలను, వింతలను చూస్తూ ఇద్దరూ వీధిలో నడుస్తున్నారు. మణిమేఖలని గమనించిన ప్రజలు ఆమె అందానికి విస్తుపోయి నిలబడ్డారు. ఆమె ఎవరో తెలిసిన వారు ‘అయ్యో! ఇంత అందమైనదాన్ని, కోమలాంగిని తల్లి సన్యాసినిగా మార్చిందే’ అనుకోసాగారు. ఆ సమయంలో వీణని వాయించుకుంటున్న ఒకడు – కోవలుడుకి అతి సన్నిహితుడు మాధవిని చూసి “అయ్యో, కోవలా నీకు, నీ కూతురుకి ఎంత అన్యాయం జరిగిపోయింది?” అని ఏడవసాగాడు. ప్రజల మాటలని, ఆ ఏడుస్తున్న వాని బాధనీ విని తల మరింతగా భూమిలోకి దించుకుని నడిచి వెళ్ళసాగింది మణిమేఖల.

manimekalai-film

 

2.

ఉద్యానవనంలోని అందమైన పువ్వులను, పొదరిళ్ళను, మండపాలనూ చూస్తూ మణిమేఖల తన దు:ఖాన్ని మర్చిపోయింది. ప్రతి మొక్కనీ, పువ్వునీ పలకరిస్తూ సున్నితంగా కొన్ని పువ్వులని కోసుకుంది. వీళ్ళు ఉద్యానవనంలో ఉండగా బయట వీధిలో ఒక ఏనుగు – మావటి వాడికి కాని, సైనికులకి కాని లొంగకుండా – వీధుల్లో పరిగెత్తసాగింది. ప్రజలు భయకంపితులై అరుస్తూ పరిగెత్తుతున్నారు. విషయం తెలిసిన చోళరాజ కుమారుడైన ఉదయకుమారుడు తన రథంలో వేగంగా అక్కడకి వచ్చి ఏనుగుని అదుపులోకి తెచ్చాడు. ప్రజలందరూ జయజయధ్వానాలు చేస్తూ అతన్ని వీధుల్లో ఊరేగించారు. ఆ సమయంలో అక్కడ వీణని చేతిలో పట్టుకుని ఏడుస్తున్న కోవలుడి సన్నిహితుడిని చూసిన ఉదయుడు అతడిని దగ్గరకి పిలిచి అతని దు:ఖానికి కారణమేమిటని అడిగాడు.

“ఇప్పుడే ఈ వీధిలో నడిచి ఉద్యానవనానికి వెళుతున్న మణిమేఖలని చూశాను. ఆమె పరిస్థితిని చూసీ, నా స్నేహితుడు కోవలుడు గుర్తుకు వచ్చీ బాధతో ఏడుస్తున్నాను” అన్నాడు.

అది విన్న ఉదయకుమారుడు “మణిమేఖల ఆశ్రమం నుండి బయటకి వచ్చి ఈ దారిలో వెళ్ళిందా?” అని అత్రంగా అడిగాడు. ఇంతకు పూర్వమే ఉదయకుమారుడు ఆమెని చూశాడు. ఆమె సౌందర్యానికి దాసోహుడై ఆమెనే వివాహమాడాలని ఎన్నో ప్రయత్నాలు చేసి విఫలమయ్యాడు. ‘ఔనంటూ’ వీణాధరుడు చెప్పింది విన్న ఉదయుడు ఆమెని ఇప్పుడు తనతో రాజమందిరానికి తీసుకు వెళ్ళడానికి అవకాశం కలిగిందన్న సంతోషంతో తన రథాన్నెక్కి వాయువేగంతో ఉద్యానవనం వైపుకి సాగిపోయాడు.

అతడిని దూరం నుంచే గమనించిన మణిమేఖల సుతమతితో “ఉదయకుమారుడు నాపై ఆశలు పెట్టుకున్నాడన్న సంగతి నీకు తెలుసు కదా! ఆశ్రమంలో ఉన్న నన్ను అతను చేరలేడు కాని ఇప్పుడు ఇక్కడ అతను నన్నేమైనా చేయగలడు. నేనిప్పుడు అతన్నించి తప్పించుకునే మార్గమేమిటో చెప్పి పుణ్యం కట్టుకో” అంది ఆందోళన పడుతూ.

వెంటనే సుతమతి ఆమెని ఉద్యానవనంలో ఉన్న బలిమండపం లోపల ఉంచి బయట తాళం వేసి ఏమీ తెలియనట్లు పువ్వులు కోయసాగింది. రథాన్ని బయట నిలిపి లోపలికొచ్చిన ఉదయుడు సుతమతితో “ఇక్కడకి మణిమేఖల వచ్చిందని విన్నాను, ఆమె ఎక్కడ ఉందో దయచేసి చెప్పు. ఆమెని వివాహమాడాలని తపించిపోతున్నాను. దయతో ఆమెని నాకు చూపించు” అని వేడుకున్నాడు.

“రాజకుమారా, ఆశ్రమవాసియైన మణిమేఖల నిన్ను చూడదు. వెంటనే ఇక్కడ నుండి వెళ్ళిపో” అంది.

అతను ఆమె మాటలను పట్టించుకోకుండా ఉద్యానవనం అంతా వెతుకుతూనే ఉన్నాడు. బలిమండపంలో ఉందేమోనన్న అనుమానంతో లోపల ప్రవేశించాలని ప్రయత్నించాడు కాని వెళ్ళే మార్గం తోచక మండపం చుట్టూ తిరగసాగాడు. ఇదంతా గమనిస్తున్న మణిమేఖల భయంతో మండపం లోపల స్పృహ తప్పి పడిపోయింది.

సుతమతి అతన్ని చేరి “ఉదయకుమారా, నీకు చెప్పేంతటి దాన్ని కాదు. మణిమేఖల తపశ్శక్తి సంపన్నురాలు. నిన్ను శపించగల సమర్థురాలు కూడా… ఆడదానికి ఇష్టం లేకుండా బలాత్కరించరాదు. ఆ సాహసం చేయడం కరికాళచోళుని వంశస్థుడివైన నీకు తగదు. దయచేసి నీ మనసు మార్చుకుని ఇక్కడ నుండి తక్షణమే బయటకి వెళ్ళు” అంది.

ఉదయకుమారుడికి ఆమె చెప్పిందేమీ తలకెక్కలేదు.

మణిమేఖలని ఎలాగైనా చూడాలనే మోహంతో ఉన్న ఉదయకుమారుడు సుతమతిని మాటల్లో పెట్టి మణిమేఖల ఎక్కడుందో తెలుసుకోవాలనుకుని “నువ్వు ఇంతకు ముందు జైన ఆశ్రమంలో ఉండేదానివి కదా! ఇప్పుడు బౌద్ధ ఆశ్రమానికి చేరావా? నీవెవరు? నీ వృత్తాంతమేమిటి?” అని అడిగాడు.

 

“ఉదయకుమారా, నా తల్లి చనిపోగానే నా తండ్రి నిత్యమూ వ్రతాలు చేస్తూ ఆశ్రమజీవితం గడిపేవాడు. ఒకసారి ఆయన పువ్వులు తెమ్మని నన్ను ఉద్యానవనానికి పంపాడు. విద్యాధరుడు అనేవాడు నన్ను చూసి మోహించి బలవంతంగా తీసుకెళ్ళిపోయాడు. కొన్నాళ్ళు నన్ను అతని వద్ద ఉంచుకుని తర్వాత ఇక్కడ వదిలేసి వెళ్ళిపోయాడు. నేను ఎక్కడికి వెళ్ళిపోయానో తెలియని మా నాన్న నన్ను వెతుకుతూ దేశాలు తిరగసాగాడు. చివరికి ఇక్కడ కావేరీ నదిలో స్నానం చేయడానికి వచ్చి నన్ను చూసి నా వద్దకు పరుగున వచ్చాడు. ఇద్దరం జైన సంఘంలో ఉండసాగాం. అయితే ఒకరోజు ఒక ఎద్దు మా నాన్నని కడుపులో కుమ్మింది. స్పృహ కోల్పోయిన మా నాన్నని కాపాడమని జైన సంఘంలో ఉన్న వాళ్ళని అడిగాను. వాళ్ళు ఏమీ సహాయం చేయలేకపోయారు. అప్పుడు అదే దారిలో వెళుతూ మా దీనస్థితిని చూసిన ఒక బౌద్ధ సన్యాసి మమ్మల్ని తన ఆశ్రమానికి చేర్చాడు. నాన్న ప్రాణాలని కాపాడాడు. ఆ విధంగా బౌద్ధ ఆశ్రమానికి చేరుకున్నాం” అంది.

తన మాటలు అన్యచిత్తుడై వింటూ బలిమండపం వైపే చూస్తున్న ఉదయునితో సుతమతి “దయచేసి నీవు ఇక్కడ నుండి వెళ్ళిపో యువరాజా!” అంది. చెప్పిందే చెప్తూ అక్కడ నుండి తరుముతున్న సుతమతిని విసుగ్గా చూస్తూ “చిత్రావతి సహాయంతో మణిమేఖలని నా మందిరానికి రప్పించుకోనిదే నేను నిద్రపోను” అంటూ శపధం చేసి అక్కడ నుండి వెళ్ళిపోయాడు ఉదయుడు.

అప్పటికి బాగా చీకట్లు అలుముకున్నాయి. ఆ రాత్రికి అక్కడే నిద్రించి ఉదయాన్నే ఆశ్రమానికి వెళ్ళాలనుకుని ఇద్దరూ బలిమండపంలోని బుద్ధుని విగ్రహానికి దగ్గరగా కూర్చున్నారు. “నాకు కూడా ఉదయకుమారునిపై మనస్సు పోతోంది. అతను ఇంత అనుచితంగా ప్రవర్తిస్తున్నా నాకు అతనిపై కోపం రావడం లేదు. నా హృదయంలో ఈ కోరిక నశించిపోవుగాక” అని మణిమేఖల బుద్ధునికి నమస్కరిస్తూ వేడుకుంది.

ఆ సమయంలో ఇంద్రోత్సవాలు చూడటానికని వచ్చిన ‘మణిమేఖలాదైవం’ (మాధవి, కోవలులు ఈ దేవత పేరే పెట్టుకున్నారు మణిమేఖలకి) తాపసి రూపంలో బలిమండపంలోకి వచ్చింది. బుద్ధునికి ప్రదక్షిణం చేసి అక్కడ ఉన్న సుతమతిని, మణిమేఖలని చూస్తూ “ఎందుకు మీరింత విచారంగా ఉన్నారు?” అని అడిగింది. జరిగింది తెలుసుకుని “ఉదయకుమారుడు పోయిన జన్మలో నీకు భర్త. అప్పుడతని పేరు రాహులుడు. ఒకసారి మీ ఇద్దరూ ఉద్యానవనంలో ఉన్నారు. అతని పట్ల నువ్వు కోపంగా ఉన్నావు. రాహులుడు నిన్ను సముదాయిస్తూ నిన్ను కోపాన్ని వీడమని బ్రతిమాలుతున్నాడు. ఆ సమయంలో సాధుచక్రి అనే బౌద్ధబిక్షువు అక్కడకి వచ్చాడు. అతన్ని చూసి నువ్వు లేచి నమస్కరించావు కాని రాహులుడు అతన్ని విసుక్కున్నాడు.

ఆ తర్వాత నువ్వు ‘అలా కోప్పడకూడదు, పూజ్యులకి నమస్కరించాలి’ అని రాహులుడికి చెప్పావు అతను ఇష్టం లేకుండా, తప్పదన్నట్లు అతనికి అతిథి సత్కారం చేశాడు. ఆ రోజు ఆ బౌద్ధ బిక్షువుకి ఇచ్చిన ఆతిథ్యపుణ్యమే ఈ జన్మలో నువ్వు ఇలా బౌద్ధ ఆశ్రమవాసినిగా మారడానికి కారణం. లోకంలో ఉన్న దీనులకి నువ్వు ఆకలి బాధ తీర్చాల్సి ఉంది. నిన్ను మణిపల్లవంలోని బౌద్ధపీఠానికి చేరుస్తాను. అక్కడ నీకు అక్షయపాత్ర లభిస్తుంది. దానితో ప్రజల ఆకలి బాధను పోగొడుదువుగాని. నీకు పూర్వజన్మలో అక్కచెల్లెళ్ళు తారై, వీరై అని పేర్లు గల వారు – వాళ్ళే ఇప్పుడు మాధవి, సుతమతులు. వాళ్ళు ఈ జన్మలో కూడా నీ వెన్నంటే ఉండి ప్రజలకి సేవ చేసి తరిస్తారు” అంది.

 

తర్వాత సుతమతితో “మణిమేఖలని నేను మణిపల్లవం దీవిలో ఉన్న బౌద్ధపీఠానికి తీసుకువెళుతున్నాను. నువ్వెళ్ళి మాధవికి విషయం తెలియచేయి” అని ఆ దైవం సుతమతికి చెప్పి మణిమేఖలని తీసుకుని వెళ్ళిపోయింది.

మణిమేఖలని అక్కడ వదిలి “మణిమేఖలా, ఉదయకుమారుడు పోయిన జన్మలో నీ భర్త కనుక ఈ జన్మలో కూడా వ్యామోహాన్ని పెంచుకున్నాడు. నీ మనసు కూడా అతని పట్ల ఆకర్షణకి లోనవ్వడానికి కారణం అదే. నీలోని ఆ మోహం నశించడానికే నిన్ను ఇక్కడకి తీసుకువచ్చి బుద్ధభగవానుని పాదపీఠికను చూపించాను. నీ చేతికి అక్షయపాత్ర రాగానే నువ్వు ఆశ్రమానికి వెళ్ళు. ఆశ్రమంలో ఉన్న అరవణముని నువ్వు తర్వాత చేయవలసిన విధులని తెలియచేస్తాడు” అని చెప్పి “అవసరమైనప్పుడు నువ్వు ఎక్కడకి కావాలంటే అక్కడకి ఆకాశమార్గాన వెళ్ళవచ్చు, ఏ రూపము కావాలంటే ఆ రూపము ధరించవచ్చు” అంటూ మణిమేఖలకు ఆ శక్తులని ప్రసాదించింది.

ఆ తర్వాత మణిమేఖలాదైవం నేరుగా ఉదయకుమారుని దగ్గరకి వచ్చి “రాజకుమారా, రాజులు ధర్మమార్గాన ప్రవర్తించాలి. తపోదీక్షని స్వీకరించిన మణిమేఖల పట్ల వ్యామోహం పెంచుకుని ఆమెని బలవంతపెట్టడం నీకు మంచిది కాదు. ఆమె మీదున్న మోహాన్ని విడనాడు” అని చెప్పింది.

 

3.

 

మణిపల్లవంలో మణిమేఖల బుద్ధుని పాదపీఠానికి ప్రదక్షిణం చేస్తుండగానే ఆమె చేతికి అక్షయపాత్ర వచ్చింది. అది తీసుకుని ఆమె ఆశ్రమానికి వచ్చింది. ఆమెని చూసి మాధవి, సుతమతులు సంతోషించారు. అందరూ కలిసి ఆ పాత్రని తీసుకుని అరవణమునీశ్వరుల దగ్గరకి వెళ్ళారు. మణిమేఖల జరిగినదంతా మునీశ్వరునికి చెప్పింది.

ఆయన “మణిమేఖలా! దేశంలోని అనాథలకు, వృద్ధులకి – ఆకలిగొన్న ప్రతివారికీ ఈ అక్షయపాత్ర ద్వారా ఆకలి తీర్చగలవు. ఈ అక్షయపాత్ర నీకు అందించిన అపుత్రుడు అనే వాని గురించి చెప్తాను విను……

కాశీ నగరంలో అభంజికుడు అనే బ్రాహ్మణుడు ఉండేవాడు. అతని భార్య శాలి. భర్తకు తెలియకుండా తన ప్రియునితో కలవడం వల్ల గర్భవతి అయింది. గర్భవతి అయ్యాక ఆమెలో పాశ్చాత్తాపం కలిగింది. భర్తకి ద్రోహం చేశాననే బాధతో ఇక అతని ముఖం చూడలేక, ఎక్కడికి వెళ్ళాలో దిక్కు తోచక కన్యాకుమారి వైపు సాగిపోయింది. సముద్రతీరాన మగబిడ్డను ప్రసవించి ఆ బిడ్డని కనికరం అన్నా లేకుండా అక్కడే వదిలి ఎటో వెళ్ళిపోయింది.

ఏడుస్తున్న ఆ బిడ్డని చూసి ఓ ఆవు తన పొదుగునుండి పాలని స్రవించి ఆ బిడ్డడికి తాపించింది. అలా ఏడు రోజులపాటు ఆ బిడ్డని కాపాడింది. ఏడో రోజు అటు వైపుగా వెళుతున్న ఓ బ్రాహ్మణుడు ఏడుస్తున్న శిశువునీ, ఆ శిశువుకి పాలిస్తున్న ఆవును చూశాడు. ఆ బిడ్డను తనతో తీసుకెళ్ళి ‘అపుత్రుడు’ అని పిలిచి, పెంచుకుని అన్ని వేదశాస్త్రాలలోనూ శిక్షణ ఇప్పించాడు.

ఒకరోజు అపుత్రుడు ఒక యజ్ఞానికి వెళ్ళాడు. అక్కడ యజ్ఞానికి బలి ఇవ్వాలని వథశాలలో ఒక ఆవుని కట్టేసి ఉంచారు. ఆ ఆవు దయనీయంగా జాలికొలిపేట్లు అరుస్తోంది. అపుత్రుడు ఆ రాత్రి ఎవరికీ తెలియకుండా వచ్చి ఆవుని విప్పి బయటకి తోలాడు. యజ్ఞశాల కాపలాదారులది చూసి అపుత్రుడిని పట్టుకుని బంధించారు. ‘నోరులేని పశువులను, అందునా కమ్మని పాలిచ్చే ఆవుని వధించడం ఎందుకు? దేవుడు తను పుట్టించిన బిడ్డలని తనకి బలివ్వమని ఎప్పటికీ కోరడు’ అన్నాడు అపుత్రుడు.

అందరూ అతని మాటలని గేలి చేశారు. ఇంతలో గుంపులో ఉన్న ఒకడు ‘ఈ అపుత్రుడు ఎవరో నాకు తెలుసు. శీలాన్ని కోల్పోయిన శాలి కొడుకు. ఇతను హీనుడు. హీనజాతికి చెందినవాడు. ఇతన్ని ఊళ్ళోంచే గెంటి వేయండి’ అన్నాడు.

ఆ మాటలు విన్న అపుత్రుడు ‘మీ కులం ఏమిటో, మీ కులాల పుట్టుక ఏమిటో మీకు తెలుసా? మూలాలు తోడితే అందరూ హీనజాతికి చెందినవారే, అందరూ ఉన్నతజాతికి చెందినవారే’ అన్నాడు. అక్కడున్న అందరికీ – ఆఖరికి అతన్ని పెంచుకున్నబ్రాహ్మణుడికి కూడా అపుత్రుడి వైఖరికి కోపం వచ్చింది.

అపుత్రుడు ఇక ఆ దేశాన్ని వదిలి మధురైకి చేరుకున్నాడు. అక్కడ బిక్షమెత్తుకుని తను తిని మిగిలినది చింతాదేవి ఆలయప్రాంతాల్లో ఉన్న గుడ్డివారికీ, నడవలేని వారికీ, వృద్ధులకి పంచేవాడు. ఆ ఆలయంలోనే నిద్రించేవాడు.

ఆ సమయంలో దేశం అంతా క్షామం వచ్చింది. తిండిలేక జనం అల్లల్లాడిపోతున్నారు. ఒకరోజు కొందరు బిక్షకుల గుంపు ఆకలికి తాళలేక అపుత్రుడున్న చింతాదేవి ఆలయానికి వచ్చి తమ ఆకలి తీర్చమని అడిగారు. ఏమీ చేయలేక ఆవేదనతో చింతాదేవి ముందుకి వెళ్ళి ఆపద గట్టెక్కించమని ఆమెని వేడుకున్నాడు. చింతాదేవి ప్రత్యక్షమై అతనికి ఒక బిక్షాపాత్రని ఇచ్చి ‘దీనితో అందరి ఆకలీ తీర్చు. ఇది ఎంతమంది ఆకలినైనా తీరుస్తుంది. ఎప్పటికీ వట్టిపోదు. క్షామం వచ్చినప్పుడు దీన్ని ఉపయోగించు’ అంది.

అప్పటి నుండి క్షామం పోయేంతవరకూ అపుత్రుడు ఎంతో మంది ఆకలి తీర్చాడు. తర్వాత దాన్ని మణిపల్లవంలో ఉంచాడు. అదే ఈ అక్షయపాత్ర” అని చెప్పి “మణిమేఖలా! నీ పుణ్యఫలం వల్ల ఇప్పుడు ఇది నీ చేతికి వచ్చింది. నువ్వు కూడా ఈ పాత్ర సహాయంతో అన్నార్తులకి సహాయం చెయ్యి. ముందుగా ఎవరైనా సాధుగుణం కలిగిన స్తీ్ర చేతితో ఈ అక్షయపాత్రలో బిక్షని స్వీకరించు. తర్వాత దానిలోకి బిక్ష వస్తూనే ఉంటుంది” అన్నాడు అరవణుడు.

అక్కడే ఉండి వాళ్ళ మాటలు విన్న కాయచండిక అనే ఆమె తనకి అలాంటి సాధుగుణం కలిగిన స్తీ్ర తెలుసని ఆమె పేరు అదిరై అని చెప్పింది.

ఈ కాయచండిక కంచి నగరానికి చెందినది. ఆమె భర్త పేరు కాంచనుడు. కాయచండిక ఒకసారి పొదిగై పర్వతప్రాంతాల్లో ఉన్న మునిపుంగవులని గేలి చేసి ‘ఎల్లప్పుడూ ఆకలితో బాధపడాలన్న’ శాపానికి గురై దేశాల వెంట తిరుగుతున్నది. అదిరై దగ్గర బిక్షని స్వీకరిస్తూ తన ఆకలిని తీర్చుకుంటూ పూంపుహార్ పట్టణంలో నివసిస్తోంది.

కాయచండికతో కలిసి మణిమేఖల అదిరై దగ్గరకి వెళ్ళి మొదటి బిక్ష స్వీకరించింది. అప్పటి నుండీ కాయచండిక మణిమేఖల వెన్నంటే ఉంటూ బిక్షని స్వీకరిస్తూ తన ఆకలిని తీర్చుకున్నది. కొన్నాళ్ళు మణిమేఖల వెన్నంటే ఉండి ప్రజలందరికీ మణిమేఖల దగ్గరున్న మహాన్వితమైన అక్షయపాత్ర గురించి చెప్పింది. తర్వాత తపోధారియై వింధ్యపర్వతాలకి ప్రయాణమై వెళ్ళిపోయింది కాయచండిక.

Manimekalai_Indian_epic

4.

మాధవి, మణిమేఖలలు పూర్తి సాధువులుగా మారి చింతాదేవి ఆలయ ప్రాంతంలో ఉన్నారని, అక్షయపాత్రతో అందరికీ భోజనం పెడుతున్నారని తెలుసుకున్న చిత్రావతి దిగులు చెందింది. ఎలాగైనా వారిద్దరినీ ఇంటికి రప్పించి తమ పూర్వ వైభవాన్ని పొందాలనే తపనతో ఉదయకుమారుడిని కలుసుకుని విషయం చెప్పింది. ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న ఉదయకుమారుడు చిత్రావతికి అనేక బహుమతులు ఇచ్చి మండపానికి వెళ్ళాడు. మణిమేఖలని కలుసుకుని ఆమెని అనేక విధాలుగా బలవంతపెట్టాడు. ఆమె అతనికి ఎంత చెప్పినా వినకుండా లాక్కుపోవడానికి యత్నించసాగాడు. ఆమె అతన్నించి తప్పించుకుని ఆలయంలోకి పరిగెత్తింది. సాయంత్రం వరకూ ఆమె కోసం ఆలయం బయటే వేచి ఉండి ఇక ఏమీ చేయలేక ‘తర్వాత రోజు వస్తాననీ, మనసు మార్చుకోమనీ’ చెప్తూ అక్కడనుండి వెళ్ళిపోయాడు.

తర్వాత రోజు నగరంలో చెరసాలలో ఉన్న వాళ్ళు ఆకలికి అలమటిస్తున్నారని తెలిసి మణిమేఖల చెరసాలకి ప్రయాణమైంది. అయితే ఉదయకుమారుడు ఆమెని చూస్తే వెంబడిస్తాడని తెలుసు కనుక కాయచండికలాగా రూపం మార్చుకుని నగరంలోకి వెళ్ళింది. చెరసాలలో ఉన్న వారితో మాట్లాడుతూ వాళ్ళ బాధలని వింటూ వాళ్ళకి అన్నం పెట్టింది. రాజు దగ్గరకి వెళ్ళి చెరసాలని ధర్మశాలగా మార్చమని కోరింది. ఆమె మృదుమధురమైన మాటలకి రాజుగారు ఎదురు చెప్పలేక ఆమె కోరిక ప్రకారం చెరసాలని ధర్మశాలగా మార్చారు.

ప్రతిరోజూ ఇలా ఏదో ఒక సమయంలో ఆమె కాయచండిక రూపంతో చెరసాలకి వెళ్ళి అక్కడున్న వారికి భోజనం వడ్డించసాగింది. మణిమేఖల ఎక్కడుందో తెలుసుకోవాలని కాయచండిక రూపంలో ఉన్న మణిమేఖల దగ్గరకి వచ్చి మాట్లాడుతున్నాడు ఉదయకుమారుడు. ఆమె అతనికి మంచి మాటలు బోధిస్తున్నది. ఆ సమయంలో కాయచండిక భర్త కాంచనుడు భార్యని వెతుక్కుంటూ అక్కడకి వచ్చి వారిని చూశాడు.

ఉదయకుమారుడితో ప్రేమగా మాట్లాడుతున్న మణిమేఖలని కాయచండికే అనుకున్నాడు. ‘ఆమెకి ఉదయకుమారుడితో మాటలేల? ఈతనితో ఏదో సంబంధం పెట్టుకున్నట్లుంది. అందువల్లనే శాపం తీరినా నా వద్దకు రాలేదు’ అనుకుని ఆమెని నిందించసాగాడు. కాయచండిక రూపంలో ఉన్న మణిమేఖల కాంచనుడితో “నువ్వు చింతాదేవి ఆలయానికి వెళ్ళు అక్కడ నీకు అన్ని విషయాలూ అవగతమవుతాయి, ఇప్పుడేమీ మాట్లాడవద్దు” అని చెప్పి పంపింది. మళ్ళీ ఉదయకుమారుని దగ్గరకి వెళ్ళి ‘ఈ భవబంధాలు అశాశ్వతమైనవనీ, మణిమేఖల పట్ల మోహాన్ని వదులుకోమనీ’ చెప్పింది.

ఆమె మాట్లాడుతుందేమిటో వినపడక అతనితో ఏదో గుసగుసలాడుతుందని భావించి కోపంగా చూస్తూ కాంచనుడు వెళ్ళిపోయాడు. కాసేపటికి మణిమేఖల కూడా మండపానికి చేరింది. ఆమె వెనుకనే దూరంగా వస్తున్న ఉదయకుమారుడిని గమనించి ఏం జరగబోతుందో చూడాలని కాంచనుడు ఆలయం బయట స్తంభం ప్రక్కన దాక్కున్నాడు. మోహోద్రిక్తుడైన ఉదయుడు మణిమేఖల కోసం కాయచండిక రూపంలో ఉన్న మణిమేఖలని ఆమెకి తెలియకుండా దూరంగా అనుసరిస్తూ మండపానికి వచ్చాడు. చాటునుండి అంతా గమనిస్తున్న కాంచనుడు తన భార్య కోసమే ఈ చీకట్లో కూడా వచ్చాడని ఉదయకుమారుడి మీదకి దూకి తన కరవాలంతో అతని తలని నరికివేశాడు.

కాయచండిక రూపాన్ని వదిలేసి బయటకి వచ్చిన మణిమేఖల ఉదయుడి మృతదేహాన్ని చూసి ఏడుస్తూ ‘కాయచండిక రూపంలో ఉన్నది తనేనని, తొందరపాటుతో ఉదయకుమారుడిని చంపి మహాపాపం చేసావని’ కాంచనుడితో అంది. కొన్ని నెలల క్రితమే కాయచండిక వింధ్యపర్వతాలకి వెళ్ళిందని చెప్పింది. చేసిన పనికి కుమిలిపోతూ కాంచనుడు అక్కడ నుండి వింధ్యపర్వతాల వైపు సాగిపోయాడు.

తన బిడ్డ ఉదయకుమారుడిని చంపేసింది మణిమేఖలేనని తలచి రాజుగారు మణిమేఖలని బంధించి చెరసాలలో వేశారు. అరవణస్వామిని, సుతమతిని వెంటబెట్టుకుని మాధవి అంత:పురానికి వెళ్ళి రాణికి జరిగినదంతా చెప్పింది. అరవణులకి నమస్కరించిన మహారాణి మణిమేఖల తప్పేమీ లేదని తెలుసుకుని ఆమెని బంధవిముక్తురాలిని చేసింది.

ఆశ్రమానికి చేరిన మణిమేఖల “రాకుమారుని చంపిన స్తీ్ర’ అని నన్ను ఇక్కడ జనులు నిందిస్తూనే ఉంటారు. నేను వంజి నగరానికి వెళ్ళి కణ్ణగి అమ్మకి సేవ చేసుకుంటాను, వెళ్ళడానికి అనుమతినివ్వండి” అంది. వారు ముగ్గురూ ఆమెకి దు:ఖంతో వీడ్కోలు పలికారు.

వంజి నగరానికి చేరిన మణిమేఖల కణ్ణగి దేవాలయంలోనే ఉంటూ ఆ నగరంలోని వివిధ మతాచార్యులని కలుసుకుని అన్ని మతాలలోని సారాన్ని గ్రహించింది. అన్ని మతాలూ ఒకటే అని తెలుసుకుంది. అదే అందరికీ బోధిస్తూ తన అక్షయ పాత్రతో అన్నార్తుల క్షుద్బాధని తీరుస్తూ గడపసాగింది.

మణిపల్లవంలో ఉన్నట్లుగానే వంజి నగరంలో కూడా బుద్ధభగవానుని పాదపీఠికను, చుట్టూ దేవాలయాన్నీ నిర్మించింది. బుద్ధభగవానుని దయ వల్ల మణిమేఖల జనన మరణాల రహస్యాన్ని గ్రహించుకుని తపోదీక్షలో లీనమైంది.

కొన్నాళ్ళకి మాధవి, సుతమతులు, అరవణమునులు – ముగ్గురూ మణిమేఖల దగ్గరకి చేరుకున్నారు. ఆమె వారిని సంతోషంగా స్వాగతించి వారికి కావలసిన సదుపాయాలను సమకూర్చింది. ఆ తర్వాత ఆమె తన జీవితమంతా బౌద్ధధర్మాలను బోధిస్తూ జీవితాన్ని ధన్యతగావించుకుని ముక్తినొందింది.

 

*****

 

 

 

 

 

ఓ సామాన్యుడి సాహసయాత్ర

kolluri

-మధు చిత్తర్వు 

~

ప్రయాణాలంటే చాలామందికి ఇష్టం. అయితే మనం సౌకర్యవంతంగా రైలులోనో విమానంలోనే ఆ ఊరు చేరుకుని స్థానికంగా దొరికే టాక్సీ మాట్లాడుకుని చుట్టూ ఉన్న ముఖ్యమైన ప్రాంతాలు చూడడం, ఫోటోలు తీసుకోవడం చేసి సావనీర్‌లు కొనుక్కుని తిరిగి వస్తాం. ఇది చాలా మాములుగ చేసే యాత్ర. మహా అయితే ఒక పోస్ట్ కార్డ్ కొంటాం. లేదా బ్లాగ్‌లోనో ఫేస్‌బుక్ లోనో ఓ పోస్ట్ పెడతాం.

అయితే గమ్యం కంటే గమనమే ముఖ్యం, ప్రయాణానికే జీవితం, సాహసమే ఊపిరి అనుకునే వాళ్ళు చాలా తక్కువమంది ఉంటారు.

ఈ పుస్తకం రాసిన అజిత్ హరిసింఘాని అలాంటివాడే. పూనెలో స్పీచ్ థెరపిస్ట్‌గా పనిచేసే ఇతనికి, పక్షవాతం వచ్చి మాట పడిపోయిన “డీకోస్టా” గారికి చికిత్స చేయడమనేది ఒక గొప్ప స్ఫూర్తి అయింది. డీకోస్టా జె.ఆర్.డి. టాటాకి వీరాభిమాని. ఆయనకి బి.ఎం.డబ్ల్యూ కారంటే ఇష్టం. అజిత్‌కి మోటార్ సైకిల్ ఇష్టం.  జె.ఆర్.డి. టాటా రాసిన “కీ నోట్” అనే పుస్తకంలో గుర్తు పెట్టుకున్న వాక్యం…

“…జీవితాన్ని కాస్త ప్రమాదకరంగా గడిపితే… ఆనందం, ఆత్మఫలసిద్ధి…” అనే వాక్యాన్ని గుర్తు చేసుకుంటూ “ఎప్పుడైనా నా కోసం… సాహసం… మోటార్ సైకిల్… ” అని అడుగుతారు డీకోస్టా.

అదే ఈ యాత్రకి నాంది. ఈ అజిత్ హరిసింఘాని యాభై నాలుగేళ్ళ వయస్సు.. నెరసిన జుట్టుతో అసలు హీరోలానే లేడు. కానీ ఈ పుస్తకం ముగిసే సరికి అతన్ని ఆరాధించడం మొదలుపెడతాం. అతనితో పాటు మోటార్ సైకిల్ మీద ప్రయాణిస్తాం.

ప్రమాదం అంచుకి రమ్మని పిలిస్తే భయపడతాం. పడిపోతామని భయపడతాం. చివరికి కొండ మీద నుంచి తోస్తే ఆకాశానికి ఉజ్వలంగా ఎగిరి పోతాం.

పూనె నుంచి జమ్ము దాకా కేవలం మోటార్ సైకిల్ మీద ప్రయాణించాడు అజిత్ – చాలా తక్కువ బడ్జెట్‌తో. దారిలో అతని అనుభవాలు భారతదేశపు అసలైన ఆత్మని చూపిస్తాయి. అహ్మదాబాదు, మౌంట్ అబూ, ఆజ్మీర్, పుష్కర్ లాంటి ఎడారి ప్రాంతాల నుంచి సాధారణ వ్యక్తుల ఆతిథ్యం తీసుకుంటూ మనం కూడా ప్రయాణిస్తాం. రోడ్డు పక్కన సూఫీ బాబా సైకిల్ మీద మక్కా బయల్దేరానని చెబితే అతని కథ వింటాం. “భగవంతుడిచ్చిన రాజప్రాసాదంలాంటి భూమి మీద పడుకోడానికి రెండు గజాల స్థలం ఎక్కడైనా దొరుకుతుంది” అంటాడు సూఫీ బాబా. అతను చెప్పిన కథలో అమాయకుడైన యువభిక్షువు.. “ఒక్కరోజుకి ఆహారం చాలు. రేపటి గురించి భగవంతుడు చూసుకుంటాడ”ని ఎందుకు నమ్ముతాడో గ్రహిస్తాం. గురుద్వారాలో ఉచితంగా మకాం వేస్తాం. ఇనుప వంతెనని దాటుతుంటే పిట్టల గుంపులు తల మీదుగా ధ్వనులు చేసుకుంటూ వెళ్తాయి. అస్తమిస్తున్న సూర్యుడి బంగారు రంగు కాంతిలో గురుద్వారాలో కీర్తనలు వింటాం.

ఆ తర్వాత రోహతాంగ్ కనుమ దాటి నీలాకాశంలో ఎగిరే గద్దలను చూస్తాం. అజిత్‌తో రోడ్లు మాట్లాడుతాయి, వంపులు తిరిగే రోడ్డు మీద ఉన్నత పర్వత మార్గాలు దాటి ఎముకలు ఒణికించే రక్తం గడ్డకట్టే చలిలో ప్రయాణిస్తాం. “వెండి అనకొండ”లాంటి నదులనీ, ఆకాశంలో చందమామని చూస్తూ రాత్రుళ్ళు గడుపుతాం.

లేహ్ అంటే.. లడాఖ్ రాజధానిలో 3520 మీటర్ల ఎత్తులో బౌద్ధ మతస్థుల పండగలు, ఆరామాలను దర్శిస్తాం. విదేశీ యాత్రికులతో పరిచయాలు చేసుకుంటాం. టైగర్ హిల్ దగ్గర ద్రాస్ లోయ చూస్తాం. ఇంటి బెంగతో ఉన్న సైనికులతో స్నేహం చేస్తాం.

ఇంతెందుకు, ఈ అద్భుతమైన అనుభవాలు అన్నీ మాటల్లో చెప్పలేనివి. ఈ పుస్తకాన్ని చక్కగా అనువదించిన కొల్లూరి సోమ శంకర్ తన అద్భుతమైన భావుకతతో కథనాన్ని మరింత రక్తి కట్టించారు.

అజిత్ హరిసింఘాని గారు జమ్మూ దాకా విజయవంతంగా యాత్ర చేసి తిరిగి ఇంటికి రైల్లో వస్తుంటే.. మనకీ అదే సాహసం చేసి తిరిగి వచ్చిన “హమ్మయ్య” అనే అనుభూతి కలుగుతుంది.

జోరుగా ప్రవహించే పార్వతి నది గలగలలు, మనాలి లోని దేవదారు అడవులలోంచి వీచే చిరుగాలులు, బౌద్ధారామాలలోని గంటల చప్పుడు, మంచులో కూరుకుపోతే వచ్చే ప్రాణభయం, ప్రపంచంలో కెల్లా ఎత్తైన రహదారిలో వెచ్చగా పలకరించే సూర్యకిరణాలని అనుభవించాలంటే ఈ పుస్తకం చదవండి.  ఎందుకంటే ఇది కథ కాదు, కల్పితం కాదు. ఒక సామాన్యుడు చేసిన సాహసయాత్ర. నిజంగా నిజం.

 

***

“ప్రయాణానికే జీవితం” పుస్తకం హైదరాబాద్‌లో నవోదయ బుక్ హౌస్‌లోనూ, విజయవాడలో నవోదయ పబ్లిషర్స్ వద్ద దొరుకుతుంది. షాపులకి వెళ్ళలేని వాళ్ళు కినిగె ద్వారా పుస్తకాన్ని ఇంటికే తెప్పించుకోవచ్చు. కినిగెలో ఈబుక్ (http://kinige.com/book/Prayananike+Jeevitam) కూడా లభిస్తుంది. 176 పేజీల ఈ పుస్తకం వెల రూ. 120/-

 

 

బతుకు బొంగరంపై ఫోకస్ ‘ప్రపంచాక్షరి’

గరిమెళ్ళ నాగేశ్వరరావు  ప్రపంచాక్షరి కవితా సంపుటి 1997 నుండి 2008 ల మధ్య దశాబ్ద కాలములో వ్రాసిన 51 కవితల సమాహారం. ప్రపంచాక్షరి అన్న పేరుతోనే వినూత్నంగా విశ్వమానవ కళ్యానానికి శ్రీకారం చుట్టిన ఈ కవి దృక్కోణం గురించి పూర్తిగా ఆశ్చర్యం నుండి తేరుకోకముందే, కవితలకు ముందూ వెనుకా ఉన్న పేజీలలో పొందుపరచిన అవార్డులు స్వీకరిస్తున్న ఫోటోలు, పురస్కారాల వివరాలు ,పెద్దలు వ్రాసిన మాటలు ఇవన్నీ కలిసి ఈ మాస్టారి అప్రతిహత బహుముఖ ప్రజ్ఞ ‘రాష్ట్రపతి చేతుల మీదుగా ఉత్తమ ఉపాధ్యాయ పురస్కారాన్ని అందుకునే వరకూ’ సాగి ఇంకా అదే వేగం తో పరుగెడుతోందని తెలిసి మరెంతో ఆశ్చర్యంగా అనిపిస్తుంది.

కవి స్వయంగా రూపొందించిన ముఖచిత్రం ఈ కవితా సంపుటి శీర్షికకు తగ్గట్టూ శాంతి (పావురం), వీణ (కళ), బాలిక (స్త్రీ హిత), బిడ్డను పొదవుకున్న మైనర్ తల్లి ( అవాజ్య ప్రేమ)  దీన బాలుడు (అన్నార్తుల వేదన) ప్రతీకలు సృజించి  లోపలి  కవితా వస్తువుల గురించి చెప్పకనే చెబుతుంది .

కవిత్వాన్ని ఒక రైలు బండిలా మార్చుకుని నేల నలుచెరగులా దాన్ని కవి నడిపించడమే కాకుండా, పట్టాలు తప్పే ప్రమాదమున్న సందర్భాలను ముందే అంచనా వేసి తదనుగుణంగా హెచ్చరికలు చేసి, ఆగే ప్రతి స్టేషన్ గురించి కూలంకషంగా చెబుతూ, ఎక్కే దిగే ప్రయాణికుల భద్రతను కాంక్షిస్తూ, వారి గాధలని ఆలపిస్తూ కవి చేసిన చైతన్య ప్రయాణమే ప్రపంచాక్షరి. ముల్లు మొదలు తల వరకూ బొంగరానికి తాడుని పకడ్బందీగా చుట్టి, గచ్చు నేల మీదికి లాఘవంగా విసిరి తాడు లాగి ఆ బొంగరం చేసే గింగిరాల వీరంగాన్ని వీక్షిస్తే ఆ ఫోకస్ (తదేకత) లో ఎంత సంతృప్తి కనబడుతుందో… ప్రతి కవితలో కూడా అంతే చక్కటి ఫోకస్ ని దట్టించి పాఠకుడి మనోఫలకం మీద తిప్పగలగటం గొప్పగా గోచరిస్తుంది. అందుకే ఈ పుస్తకాన్ని ఊసుపోనప్పుడో, నిద్రపోవడానికి ముందో చదవాలనుకునే కన్నా, రోజంతా శ్రమలో మునిగి తేలిన రాత్రి ఎనిమిదిగంటల పాటూ నిద్ర పోయి మర్నాడు ఉదయం లేచిన తరువాత తిరిగి చైతన్యానికి శ్రీకారం చుట్టే సమయాలలో చదివితే చాలా బాగుంటుందనిపిస్తుంది.

Cover Page Prapanchakshari

ప్రారంభం లోనే స్వాగతం పలికే ‘ప్రపంచాక్షరి’శీర్హిక కవిత, కవి అతని కవిత్వం  విస్తృత పరమార్ధాన్ని, విశాల భావజాలాన్ని, వస్తు సందర్శనాన్ని బలీయంగా చెబుతుంది. “బండరాళ్ళ… మొండి శిలల మీద వాక్యాలు జల్లి కన్నీరు చెమర్చడం నేర్పాను.… అక్షర మూర్తిని, నేను కవిని” అని తనను గురించి పరిచయం చేసుకుంటూనే కదన రంగం లో ఆయుధాన్ని పూనిన సైనికుని ఆత్మవిశ్వాసం మాదిరిగా ఉత్సాహం తో కవిత్వాన్ని చెబుతారు.నెల్సన్ మండేలా, రెండు జర్మనీల మధ్య కూలిన అడ్డుగోడ, సోమాలియా ఆకలి, హిరోషిమా బూడిద వగైరా చారిత్రక సందర్భాలను ఆయా వస్తు నేపధ్యాల ప్రయాణంతో కవితను ఆవిష్కరించిన తీరు అబ్బురపరుస్తుంది. అందులో …

నదీ తీర తవ్వకాలలో బయల్పడిన

నాగరికతల ముఖాల మీద

నవ్విన సంతకాన్ని నేను

 

జైలు గోడల మధ్య సూర్యోదయమయిన

నెల్సన్ మండేలా బిగిపిడికిలి విప్పిన చప్పుడులో

వినిపించిన విజయధ్వానాన్ని

 

కల్పనా చావ్లా రెప్పల వెనుక చేజారిన స్వప్నాన్ని

సునీత కళ్లతో నేలకు చేర్చినప్పుడు

మురిసి పోయిన తారకల్లో మెరిసింది నేనే

 

అంతరిక్షం నుండి పాతాళం వరకూ

… శాంతి కోరి తపిస్తూ జపించే …ప్రపంచాక్షరి ఇది

 

మరొక కవిత ‘సైబర్ కూలీ స్వగతం’ లో డాలర్ల దాహంతో పరాయి దేశానికి అంగలార్చిన సాఫ్ట్ -వేర్ ఇంజనీర్ దైనందిన జీవితం ఎంత యాంత్రికంగా సాగుతుందో వివరంగా చెప్పారు. “ అత్యాధునిక శ్రామికుణ్ణి..కీ బోర్డు దేహాన్ని మీటుతూ కొత్త సృష్టికి ఊపిరి పోసే కృత్రిమ బ్రహ్మని..” అని అతని లోకి పరకాయ ప్రవేశం చేసి స్వగతంగా పూర్తిగా చెప్పాక,దూరాన అతను కోల్పోతున్న దగ్గర వారి గురించి టార్చ్-లైట్ వేసి మరీ చూపించి అతను తిరిగి తనవారి మధ్య కు వచ్చి అదే వృత్తిని కొనసాగించే వీలు ఎంత సాధ్యమో “అవును ప్రపంచం పల్లెటూరయ్యాక పొలిమేరలు దాటాల్సిన పనేముంది?” అని  ప్రశ్నిస్తూ చెబుతారు.

డౌన్-లోడ్ చేసిన ఫైల్లో … పెరటి చింతచెట్టు

కొత్తగా చిగురించినట్టు కనిపిస్తోంది

 

ప్రేమ ఫైల్ ఓపెన్ చేసేందుకు

పాస్వర్డ్ ఎక్కడా దొరకడం లేదు

 

అభిమానం ఆచూకీ రీసైకిల్ బిన్ లోనైనా

రీస్టొర్ చేసేందుకు అందదు

 

అని కంప్యూటర్ పదాల పరిభాషలో యాంత్రికత్వాన్ని నిరసించి, ద్వేషించి బాధపడి… పొలిమేరలు దాటాల్సిన పనేముంది?” అని తనకి తాను పూర్తిగా సమాధానపడటం ప్రశ్నతో ముగుస్తుంది.

ఈ రెండు కవితలలోనూ కదిలించిన చరిత్ర, కదులుతున్న వర్తమానం అంశాలుగా కవి చేసిన ప్రయాణం అతని తపననీ, జ్ఞానాన్ని మనముందు రంగరించి పోస్తాయి.

అనంత జీవన యానంలో శిధిలమైపోతున్న రంగుల స్వప్నాలని ప్రస్తావించి మానవత్వపు మేడొకటి నిర్మించాలని సూచించిన “ మా విద్వి షాహహై ” అనే కవితా, తడారిపోతోన్న మట్టి పొరలల్లోంచి ప్రపంచానికి పట్టెడన్నం పెట్టడానికి రూపాయి చూపులను మరోసారి మట్టిదారి పట్టించాలని చెప్పే “ మట్టిదారిలో మరోసారి..” లాంటి ప్రతి కవిత లో సమస్యలను ఎత్తి చూపించడమే కాకుండా పరిష్కార మార్గాలనూ సూచించారు.

‘ ప్రశ్నలు ‘ లో ఇరాక్ మీద అగ్ర రాజ్యం దాడినీ, ‘ గుండెలోతుల్లోంచి ’ లో మన విలాస స్వార్ధాలకు ప్రకృతిలో కోతీ, పామూ, ఆవు, కప్ప, ఉడుత, తూనీగ  లాంటి జీవుల ప్రాణాలను నిర్దాక్షిణ్యంగా, నిర్లజ్జగా ఆహుతి చేస్తున్న తీరునీ చదివాక, చుట్టూ పేరుకున్న హింసలో కలిసిపోయి బతికేస్తున్న మనకి గగుర్పాటు కంపరం కలుగుతుంది.

అమ్మ, మాస్టారుకో పద్యం, పండగ, మొదలైన జ్ఞాపకాలలో సౌమ్యంగా ఉన్నత మూర్తులకు చేసిన సన్మానాలను చూడొచ్చును.

ఓటు వజ్రాయుధాన్ని సరిగ్గా ఎక్కు పెట్టమని నిర్దేశం చేసిన ఆ కలం తోనే, పిచ్చుకల లాంటి అంతరించి పోతున్న పక్షుల మీద కాలుష్యపు వజ్రాయుధాల్ని ఎక్కుపెట్టొద్దని చెప్పి కట్టడి చేశారు.

ప్రేమ పేరుతో స్వైర విహారం చేస్తున్న ప్రేమ-చిరుతల పట్ల మిక్కిలి జాగురూకతతో వ్యవహరించాలని ‘లేడీ (ఆడ)’ పిల్లలను కవి హెచ్చరించిన తీరు ‘ప్రేమ-చిరుత’ కవితలో సమగ్రంగా ఉంది. ఇది ఇప్పటి కాలానికి…అందరు ఆడపిల్లలకూ తప్పని సరి పాఠం. ఈ కవితను రెండు తెలుగు రాష్ట్రాలు ఇంటర్మీడియట్ లేదా పదవ తరగతి తెలుగు వాచకములలో చేరిస్తే బాగుంటుంది.

‘నగరంలో ఇప్పుడు…

ప్రేమ చిరుతలు తిరుగుతున్నాయి

“లేడీ” పిల్లల్లారా….జాగ్రత్త!’

అని ప్రారంభమవుతుంది ‘ప్రేమ-చిరుత’ కవిత.

‘ ప్రేమంటే వెంబడించిన వాడి వెంట

అడుగేసి గుడ్డిగా నడుస్తూ…

దారి తప్పిపోవడం కాదు కదా?!’

ప్రాణాలు తియ్యడం, తీసుకుంటామని భయపించడం ,యాసిడ్ దాడులు చెయ్యడం, ఇంట్లో వారినీ, బంధు మిత్రులనీ, చుట్టు పక్కల వారినీ భయభ్రాంతులని చేసి మరీ అడ్డూ అదుపూ లేకుండా సాగిపోయే పైశాచిక ప్రేమల గురించి ఆడపిల్లలు తప్పని సరిగా అలెర్ట్ కావాలి.

మొదట ‘ప్రపంచాక్షరి’ కవిత లో కవిత్వ పరమార్ధాన్ని చెప్పి, అఖరున ‘ కలాన్ని మోసే వాడు ‘ కవితలో ” మిత్రమా కలాన్ని మోయడం కాలాన్ని మోసినంత సులువు కాదు” అనడం చదివాక ఈ రెండు కవితలూ అటూఇటూలుగా  మిగిలిన కవితలతో చక్కగా అల్లిన దండ ప్రపంచాక్షరి కవితా సంకలనమని అవగతమౌతుంది.

చీకటికి ఆనవాలమవుతున్న అనైతికత, నిర్లక్ష్యం, స్వార్ధం, అవకాశ ధోరణులు; వెలుగు దివిటీలు పట్టుకు తిరిగిన నాయకులు, కవులు… ఇంకా వెలుతురు మయం గావించాల్సిన మూల మూలల్లోని విషయాలు; కూలగొట్టవలసిన అడ్డుగోడలు; వేయ వలసిన వంతెనలూ; కట్టాల్సిన ఆనకట్టలూ, నిర్మాణాలు వీటన్నీంటి గురించి ప్రపంచాక్షరి కవితలు అనేక విషయాలను చెప్పకనే చెబుతాయి.

“చుట్టూ పక్కల చూడరా చిన్నవాడా, చుక్కల్లో చూపు చిక్కుకున్నవాడా “ అని కవి గరిమెళ్ళ నాగేశ్వర రావు గారు పిలిచి చూపించిన విషయాలు, వెలుతురు ప్రసరించిన దారులూ, కొనియాడి అధిరోహింప జేసిన ఆదర్శవంతమైన శిఖరాలు బహుదా ప్రశంసనీయం, సర్వదా అభినందనీయం.

కవి తపన, తదేకత, మమేకత ,సంస్కరణాభిలాష,వస్తుగతజ్ఞానము మొదలైన అనేక విషయాలను ఈ కవితా సంపుటి ప్రస్ఫుటంగా ప్రతిఫలిస్తుంది. విలువలు ప్రాతిపదికగా కవిత్వాన్ని ఆస్వాదించి అనుభూతించి ఆ మార్గాలను అనుసరించాలనుకునే ప్రతి ఒక్కరి దగ్గరా తప్పక ఉండాల్సిన పుస్తకం ఈ‘ ప్రపంచాక్షరి ‘.

ప్రతులకు సంప్రదించండి.

Email: gvsnrao08@gmail.com

 -నారాయణ గరిమెళ్ళ.

Photo Narayana Garimella

తమిళ పంచకావ్యం శిలప్పదిగారం

  375px-Statue_of_Kannagi

తమిళ పంచకావ్యాలలో మొదటిది శిలప్పదిగారం. మహాకవి ఇళంగో వడిగళ్ ఈ కావ్యాన్ని రచించాడు. చేర రాజకుమారుడైన ఈయన బుద్దుడి లాగానే రాజ్యాన్ని పరిత్యజించి సన్యాసం స్వీకరించాడు. ఒకసారి ఇళంగో వడిగళ్ తన సోదరుడైన చేర రాజ్యపు రాజు చేరన్ సెంగట్టువన్, వారి ఆస్థాన కవి శీతలై శాత్తనార్ లతో కలిసి కొండ ప్రాంతానికి వాహ్యాళికి రాగా ఆ ప్రాంతపు గిరిజనులు ‘ఒక యువతి తన భర్తతో కలిసి విమానంలో ఆకాశమార్గాన వెళ్ళడం చూశామనీ, ఆ వింత వాళ్ళకి ఎంతో ఆశ్చర్యం కలగజేసిందనీ, ఆమె ఎవరో మీకు తెలిస్తే చెప్పండనీ’ ఆసక్తిగా అడిగారు.  

మధురానగరంలో కణ్ణగికి జరిగిన అన్యాయాన్ని అప్పటికే చారులు ద్వారా విన్నాడేమో మహాకవి శీతలై శాత్తనార్ ఆ యువతి పేరు కణ్ణగి అనీ, ఆమె భర్త పేరు కోవలుడనీ తెలిపి వారి వృత్తాంతాన్ని అందరికీ వివరంగా చెప్పాడు. అది విన్న ఇళంగో వడిగళ్ కణ్ణగీకోవలుల చరిత్రని శిలప్పదిగారం పేరుతో కావ్యంగా రచించాడు.

ఇళంగో జైనుడు అయినప్పటికీ ఈ కావ్యంలో శ్రీవేంకటేశ్వరస్వామిని స్తుతిస్తూ చేసిన వర్ణనలు ఆళ్వారుల భక్తి గీతాలని పోలి ఉన్నాయనీ, కొన్ని గీతాలలో నిసర్గ భక్తి భావం కనిపిస్తుందనీ అంటారు.   ఈ కావ్యంలో చాలా వరకు జానపద గేయ ధర్మాలు కనిపిస్తాయట. అన్ని మతాలను గౌరవించిన వాడిగా ఈ కావ్యకర్తని గౌరవిస్తారు తమిళులు.

శిలంబు అంటే గజ్జె. (అందియ, మంజీరం). అదిగారం అంటే అధ్యాయం. కాలి అందియ వలననే ప్రాణాలు కోల్పోయిన ఆ భార్యాభర్తల జీవితం గురించిన కథ కనుక ఈ శీర్షిక ఎంతో సముచితమైనదని అందరూ భావిస్తారు. ఈ కావ్యం పుహార్ కాండం, మధురై కాండం, వంజి కాండం అని మూడు కాండాలుగా విభజింపబడి ఉందిట. ఈ కావ్యం క్రీ.శ రెండవ శతాబ్దానికి చెందినది. ఈ కథ చోళ, పాండ్య, చేర రాజ్యాలకి సంబంధించినది. చోళ రాజ్యంలో పుట్టి, పాండ్య రాజ్యంలో తన భర్త ప్రాణాలు కోల్పోగా చేర రాజ్యానికి చేరి అక్కడ తన భౌతిక కాయాన్ని త్యజించిన ఈ కావ్య నాయకి కణ్ణగి చరిత్ర పవిత్రమైనదిగా పేరొందింది.

ద్రవిడ విశ్వవిద్యాలయంలో ఎమ్ ఎ – తెలుగులో ఈ కావ్య చరిత్ర ని పాఠ్యాంశంగా చదువుకున్నప్పటినుండీ ఈ కథని చాలా మందికి చెప్పాను. ఈ కథని వినని సారంగ పాఠకులకు కూడా పరిచయం చేయాలనిపించి ఆ కథని సంగ్రహంగా రాశాను.   ఇప్పటికే చాలా మందికి ఈ కావ్య విశేషం, విశిష్టతల గురించి తెలిసి ఉండవచ్చు. వారు వారి అభిప్రాయాలని పంచుకోవలసిందిగా కోరుకుంటున్నాను.

                                                        కథాసంగ్రహం

1.

చోళ చక్రవర్తులలో గొప్పవాడైన కరికాలచోళుని రాజధాని పుహార్ పట్టణం. ఈ పట్టణంలో నివసించే ప్రముఖ వ్యాపారి కుమార్తె కణ్ణగి. రూపంలో, గుణంలో ఈమెకి ఈమే సాటి. ఆమెకి పెళ్ళీడు రాగానే తల్లిదండ్రులు ఆమెకి తగిన వరుణ్ణి వెతకసాగారు. ఆ నగరంలోనే ఉన్న మరో వ్యాపారి కొడుకైన కోవలుడుని తన కుమార్తెకి తగిన వరుడిగా నిర్ణయించారు. ఓ శుభ ముహుర్తాన కన్నుల పండుగగా కణ్ణగిని కోవలునకిచ్చి వివాహం జరిపించారు. కణ్ణగీకోవలులు అన్యోన్యంగా జీవించసాగారు.

చోళ చక్రవర్తి అయిన కరికాలచోళునికి కళలంటే అత్యంతాసక్తి. ప్రతి ఏడాదీ చేసే ఇంద్రోత్సవాల్లో భాగంగా ఆ ఏడు ఆస్థాన నర్తకి మాధవి అనే అతిలోక సౌందర్యవతి నాట్య ప్రదర్శన ఇచ్చింది.

కరికాలచోళుడు ఆమె నాట్యానికి మెచ్చి ఆకుల హారాన్ని, బంగారు నాణాలని బహుకరించి సత్కరించాడు. ముందు వరుసలో కూర్చుని ఆమె నృత్యాన్ని తిలకిస్తున్న కోవలుడు ఆమె రూపానికి పరవశుడైనాడు. అతని మనసు పూర్తిగా ఆమె సౌందర్యానికి దాసోహమయిపోయింది. అతని మనసులో కణ్ణగిపై ఉన్న ప్రేమానురాగాలు మాయమై మాధవి పట్ల మోహంగా అవతరించాయి.   నాట్య ప్రదర్శనయ్యాక ఇంటికి బయలుదేరిన కోవలునకి ఒక ప్రకటన వినిపించింది.

“చక్రవర్తి గారు మాధవికిచ్చిన హారాన్ని వేలం వేస్తున్నారు. ఎవరైతే ఎక్కువ ధర ఇచ్చి కొనుక్కుంటారో వారికి మాధవి ప్రియురాలవుతుంది” అన్నదే ఆ ప్రకటన. కామ పరవశత్వంతో ఒళ్ళెరగని కోవలుడు ఆ హారాన్ని కొని మాధవి ఇంటికి వెళతాడు. కణ్ణగిని మర్చిపోయి పూర్తిగా మాధవికి వశుడవుతాడు.

తన భర్త వేశ్య వలలో చిక్కుకున్నాడని తెలిసిన కణ్ణగి శోక మూర్తియై రోదించసాగింది.

imgNdKannagi_01

మాధవిని కోవలుడు, కోవలుడిని మాధవి ఒక్క నిమిషమైనా ఎడబాయకుండా ఉన్నారు. మాధవి వేశ్య అయినా కోవలుడిని మనస్ఫూర్తిగా ప్రేమించింది. వారి ప్రేమానురాగాల ఫలితంగా వారికి ఒక అమ్మాయి జన్మించింది. కూతురికి మణిమేఖల అని పేరు పెట్టుకున్నారు. కోవలుడు వ్యాపారాన్ని విస్మరించి మాధవితోనే కాలం గడపడం వలన అతని వ్యాపారం దెబ్బతింది. కుమార్తె పుట్టేనాటికే అతనికి ఉన్నదంతా, ఆఖరికి తన భార్య కణ్ణగికి ఆమె పుట్టింటి వారిచ్చిన నగలతో సహా ఊడ్చిపెట్టుకుపోయింది.

కోవలుడి సంపదంతా ఎప్పుడైతే కరిగిపోయిందో అప్పుడు మాధవి తల్లి చిత్రావతి కోవలుడిని వదిలించుకోవడానికి ప్రయత్నాలు ప్రారంభించింది. కూతురికి చెప్పుడు మాటలు చెప్పడం, కోవలుడిని నిందావాక్యాలతో బాధ పెట్టడం పనిగా పెట్టుకుంది. వారిద్దరికీ ఒకరి పట్ల ఒకరికి విపరీతమైన ప్రేమ ఉండటం వలన ఆమె మాటలు పట్టించుకునే వారు కాదు.

రోజులు గడుస్తున్నాయి. ఆ ఏడు చోళ రాజ్యంలో జరుపుకునే ఇంద్రోత్సవం పండుగనాడు మాధవీ కోవలులు సముద్రస్నానానికి వెళ్ళారు. స్నానమయ్యాక ఇసుకతిన్నెల మీద సేద తీరుతూ విశ్రమించారు. చల్లని సముద్రపు గాలి వారి మేనులను సృశిస్తోంది. ఆ వెన్నెలలో మాధవి మనోహర రూపం కాంతులీనుతోంది. కోవలునకి ఆమెని ఎంత సేపు చూసినా తనివి తీరడం లేదు. ఆ సమయంలో మాధవి అతన్ని ఓ పాట పాడమని కోరింది.

“ప్రేయసీ! నీ రూపం నన్ను దహించి వేస్తుంది. నువ్వు నన్ను వరించకపోతే నేను ఈ విరహాగ్నికి ఆహుతినై పోవడం నిజం” అనే అర్థం వచ్చేట్లు ఓ విరహగీతాన్ని ఆలపించాడు.

‘అతను ఎవరి కోసం ఈ పాట పాడుతున్నాడు? ఎవరా ప్రేయసి?’ అన్న అనుమానం ఆమెని పట్టి పీడించసాగింది. అయితే ఆమె తన అనుమానాన్ని వ్యక్తపరచలేదు. కొంచెం సేపయాక కోవలుడు మాధవిని పాడమన్నాడు. అనుమానం తద్వారా అసూయాద్వేషం తో మండుతున్న ఆమె మనసుకి అతన్ని రెచ్చగొట్టాలనిపించింది. అతను పాడిన దానికంటే ఎన్నో రెట్లు ప్రేమని కురిపిస్తూ ‘తను పాత ప్రియుడి కోసం ఎదురుచూస్తున్నట్లూ, పూర్వం ఈ సైకత శ్రేణుల్లో ప్రియునితో కలిసిన రోజులను గుర్తుకు తెచ్చుకుని మళ్ళీ ఆ మధురమైన క్షణాలు రావేమోనని దిగులు పడుతున్నట్లూ’ పాడింది.

ఆ పాటని విన్న కోవలుని హృదయం ఒక్కసారిగా బద్దలైనట్లనిపించింది. మాధవి తల్లి చిత్రావతి మాటలకి వేదనాభరితుడై ఉన్న కోవలుడు మాధవి పాడిన పాటతో తల్లడిల్లాడు. ‘ఈమెని నా దేవతగా ఆరాధించాను. ఈమె కోసం నన్నే నమ్ముకున్న నా భార్యని, నన్ను కని పెంచి పెద్ద చేసిన తల్లిదండ్రులని మరిచాను. వ్యాపారాన్ని నాశనం చేసుకుని బికారినైనాను’ అని అనుకోసాగాడు. ఆలోచించే కొద్దీ అతనిపై అతనికి అసహ్యం కలగసాగింది.

ఒక్క ఉదుటున కూర్చున్న చోటునుండి లేచి మాధవిని చీదరగా చూస్తూ అక్కడ నుండి నిష్క్రమించాడు. అతని కోపాన్ని, ఆవేశాన్ని, అసహ్యాన్ని కనిపెట్టిన మాధవి తను చేసిన పనికి పశ్చాత్తాప పడసాగింది. శోకతప్తహృదయినిగా మారింది.

3.

 

సౌందర్య దేవతగా ఉండే కణ్ణగిని శోకదేవతగా చూసిన కోవలుని హృదయం ద్రవించింది. ఆమెని పట్టుకుని విలపిస్తూ తన దైన్యాన్ని వెళ్ళబోసుకున్నాడు. మాధవికి ఇవ్వడానికి ఏమీ లేదని విచారిస్తున్నాడనుకున్న కణ్ణగి “దిగులు పడకండి నా దగ్గరున్న ఈ మంజీరాలను తీసుకెళ్ళి ఆమెకివ్వండి” అంటూ తన కాలికున్న విలువైన అందెలను తీసి ఇవ్వబోయింది.

భార్య అన్న ఆ మాటలతో అతను మరింత సిగ్గుతో చితికిపోయాడు. భార్యకి క్షమాపణలు చెప్పుకుని “ధనవంతుడిగా బ్రతికిన ఈ రాజ్యంలో పేదవాడిగా ఉండలేను. మధురానగరానికి వెళ్ళి వ్యాపారం చేసి ధనం సంపాదించి తల్లితండ్రులను, అత్తమామలను కలుసుకుంటాను. పద బయలుదేరు” అన్నాడు. భర్త మాటకు ఏనాడూ జవదాటని కణ్ణగి అతని మాటలకి ఆనందభరితురాలై ప్రయాణానికి ఏర్పాట్లు చేసింది. దారి మధ్యలో సత్రాల దగ్గర, ఆరామాల దగ్గర ఆగి విశ్రాంతి తీసుకుంటూ మధురానగరం వైపుకి నడవసాగారు.

ఇక్కడ మాధవి కోవలుని కోసం రేయంబవళ్ళు విలపిస్తోంది.   రోజులు గడుస్తున్నా అతను రాకపోవడంతో తనని క్షమించమని కోరుతూ ఉత్తరం రాసి నమ్మకమైన బ్రాహ్మణునకిచ్చి కోవలునకి అందజేయమని ప్రార్థించింది. ఆ బ్రాహ్మణుడు కోవలుడు మధురానగరానికి బయలుదేరాడని తెలుసుకుని వేగంగా ప్రయాణించి మార్గమధ్యంలో కలుసుకుని ఉత్తరాన్ని ఇచ్చాడు. ఉత్తరాన్ని చదువుకున్న కోవలుడు “బ్రాహ్మణోత్తమా! నా అవివేకంతో మాధవిని అనుమానించి బాధపెట్టాను. త్వరలో వస్తానని చెప్పండి. నా తల్లిదండ్రులకి కూడా ఈ విషయాన్ని చెప్పండి” అని ముందుకు సాగాడు.

దారిలో కౌంతి అనే జైన యోగిని ఆశ్రమంలో విశ్రాంతి కోసం ఆగారు. కౌంతి యోగిని వారి గురించి తెలుసుకుంది. వారికి సహాయం చేయాలని ఆమెకెందుకనిపించిందో మరి ‘ముందంతా దుర్గమమైన అరణ్యమనీ, మంచి మార్గం తనకి తెలుసనీ, తాను కూడా మధురానగరానికి తోడుగా వస్తాననీ’ అంది.   అడక్కుండానే ఆమె చేస్తున్న ఆ సహాయానికి కణ్ణగీకోవలులు అనేకంగా కృతజ్ఞతలు చెప్పుకున్నారు. ఆ రాత్రికి ఆమె ఆశ్రమంలో విశ్రాంతి తీసుకుని మర్నాడు ముగ్గురూ కలిసి ప్రయాణం సాగించారు.

అందమైన ప్రదేశాలను, ఆహ్లాదభరితమైన పక్షుల కిలకిలారావాలను, దారిలో కానవచ్చే పల్లెపడుచుల ఆదరాభిమానాలను, వారు పాడుతున్న పల్లెపదాలను చూస్తూ, వింటూ కౌంతి యోగిని దారి చూపుతుండగా ఆమెని అనుసరించసాగారు కణ్ణగీకోవలులు.

వైఘనదిని దాటుకుని కొన్నాళ్ళకి క్షేమంగా మధుర మీనాక్షి కొలువై ఉన్న మధురానగరానికి చేరుకున్నారు. కౌంతి యోగిని శిష్యురాలైన మాధురి ఇంట్లో బస చేశారు. మాధురి వీళ్ళను ఆదరంగా ఆహ్వానించి భార్యాభర్తలు ఉండటానికి తగిన ఇంటిని, కావలసిన సామగ్రిని ఇచ్చింది.

ఆరోజు చాన్నాళ్ళ తర్వాత తన భర్తకి తన చేతులతో వంట చేసి వడ్డించింది కణ్ణగి. కోవలుడు తృప్తిగా భోంచేశాడు. కోవలుడు మాధవికిచ్చి కాజేయగా మిగిలి ఉన్న కణ్ణగి కాలి అందెల్లో ఒక దాన్ని అమ్ముకుని, వచ్చిన డబ్బుని పెట్టుబడిగా పెట్టి వ్యాపారం చేయాలని వారిద్దరూ సంకల్పించుకున్నారు. ఆ నిర్ణయాన్ని తీసుకున్న ఆ రాత్రి ఇద్దరూ ప్రశాంతంగా నిద్రించారు.

మర్నాడు కౌంతి యోగినికి అనేక వందనాలు సమర్పించుకున్నాడు కోవలుడు. కణ్ణగి ఇచ్చిన మంజీరాన్ని తీసుకుని ఆమెకి జాగ్రత్తలు చెప్పి బయలుదేరాడు.   భార్య దగ్గర సెలవు తీసుకునేప్పుడు ఎందుకో తెలియకుండానే అతని కళ్ళ నుండి కన్నీళ్ళు ప్రవహించసాగాయి.   కణ్ణగి కూడా వీడ్కోలు పలుకుతూ దు:ఖానికి లోనయింది.   కోవలుడు తన వేదనని అణచుకుని భార్యని ఓదార్చాడు, ఆమెని వదలలేక వదలలేక వెళ్ళిపోయాడు.

పాపం ఆ రోజు అతను వెళ్ళకుండా ఉన్నట్లయితే అతని ప్రాణాలు నిలిచేవేమో!! కాని విధిని మార్చడం ఎవరి తరం!!?

temple

4.

పాండ్య దేశ రాజు నెడుంజెళియన్ ధర్మంగా రాజ్యాన్ని పరిపాలిస్తున్న కాలమది. పాండ్య రాజులు రాజ్యంలో ఎక్కడ ఏ అన్యాయం జరిగినా రాజుగారికి విన్నవించుకోవడానికి రాజస్థాన ప్రాంగణంలో ఒక గంటను ఏర్పాటు చేశారు. ఎవరైనా ఆ గంటను మ్రోగిస్తే మహారాజే స్వయంగా వారికి జరిగిన అన్యాయాన్ని గురించి విచారించేవారు. దానికి కారకులైనవారిని కఠినంగా శిక్షించేవారు.

ప్రజారంజకంగా పరిపాలిస్తున్న ఆ మహారాజు నెడుంజెళియన్ కే ఇప్పుడొక సమస్య వచ్చింది. రాణిగారి అంత:పుర మందిరంలోనే దొంగతనం జరిగింది. రాణి కొప్పెరుందేవి తన నగలని మెరుగు పెట్టించడానికి నగల పెట్టెను కొన్ని మాసాల క్రితం ఆస్థాన స్వర్ణకారుడికి ఇచ్చింది. ఆ స్వర్ణకారుడు నగలకి మెరుగు పెట్టి వెంటనే పెట్టెను తిరిగి ఆమెకి ఇచ్చాడు. ఆమె వాటిని పరిశీలించకుండా అలా ఉంచేసింది. నాలుగు రోజుల క్రితం ఆమె కాళ్ళకి అందెలు ధరించాలని నగల పెట్టె తెరిచి చూడగా ఒక మంజీరం కనిపించలేదు. రాణిగారికి కంసాలి మీదే అనుమానంగా ఉంది. నిజంగానే ఆ మంజీరాన్ని స్వర్ణకారుడు కాజేసి వెంటనే అమ్ముకుని డబ్బు చేసుకున్నాడు. నెడుంజెళియన్ స్వర్ణకారుడిని పిలిపించి “వారం రోజులలో అందియని దొంగిలించిన దొంగ ఎవరో తెలియాలి లేకపోతే నిన్ను శిక్షించి నిజాన్ని బయటికి రాబట్టక తప్పదు” అంటూ హెచ్చరించాడు.

ఈ సమస్యలో కొట్టుమిట్టాడుతున్న ఆ సమయంలో కోవలుడు మధురానగరంలో స్వర్ణకారులుండే వీధికి వచ్చాడు. విధి వైపరీత్యం చూడండి ఎలా నడుస్తున్నదో!!! అదే సమయంలో ఆ ఆస్థాన స్వర్ణకారుడు తన అనుచరులతో కలిసి నడుస్తూ కోవలుడికి ఎదురు వచ్చాడు.

కోవలుడు ఆ కంసాలికి నమస్కరించి “నేను ఈ దేశానికి కొత్తవాడను. వ్యాపారం చేయాలనే సంకల్పంతో ఈ నగరానికి వచ్చాను. నా దగ్గరొక విలువైన మంజీరమున్నది. దానికి వెలకట్టగలరా?” అని అడిగాడు. స్వర్ణకారుడు సరేననగానే కోవలుడు తన అంగీలోని మంజీరాన్ని తీసి ఇచ్చాడు. దాన్ని చూడగానే స్వర్ణకారుడి కళ్ళు మెరిసిపోయాయి. తన అదృష్టానికి అతని మనశ్శరీరాలు ఉప్పొంగిపోయాయి – కారణం – ఆ మంజీరం అచ్చంగా రాణి గారి మంజూషం లో నుండి తాను కాజేసిన మంజీరం లాగా ఉండటమే….

కోవలుడిని దోషిగా నిలబెట్టాలని మనసులో నిర్ణయించుకున్న కంసాలి కోవలుడిని తన ఇంట్లో కూర్చుండబెట్టి తన అనుచరులతో వెళ్ళి రాజుని కలుసుకున్నాడు. “ప్రభూ! దొంగ దొరికాడు. అతడు అంత:పురంలో చొరబడి మంజీరాన్ని కాజేశాడు. నాకే అమ్మజూపాడు. వీళ్ళంతా సాక్ష్యం” అన్నాడు అతని అనుచరులను చూపుతూ.

కోపోద్రేకుడైన రాజు సైనికులని పిలిపించి “అతనెవరో… అతని దగ్గరున్న మంజీరం రాణి గారిదేనా అని నిర్థరించుకుని, రాణి గారిదే అయితే ఆ దుర్మార్గుడిని వధించండి” అని ఆజ్ఞాపించాడు. సైనికులు కంసాలి ఇంటి వరండాలో కూర్చుని ఉన్న కోవలుని దగ్గరున్న మంజీరాన్ని తీసుకుని పరీక్షించారు. అది రాణిగారి మంజీరాన్ని పోలి ఉండటంతో అతన్నే దొంగగా నిర్ణయించి ఒక్క వేటుతో అతని తలని నరికారు. రక్తసిక్తమైన అతని శరీరం వీధిలో పడి ఉంది.

ప్రజలందరూ ఆ దృశ్యాన్ని చూస్తూ జరిగిన విషయాన్ని కథలు కథలుగా చెప్పుకుంటున్నారు. ఆలయంలో పూజ చేసుకుని తిరిగి వస్తున్న మాధురికి సంగతి తెలిసింది.   చూసిన జనం వర్ణిస్తున్న దాన్ని బట్టి అతను కోవలుడేమోనన్న అనుమానంతో ఆ స్వర్ణకారులున్న వీధిలోకి వెళ్ళి చూసింది. విగతజీవుడై పడి ఉన్న కోవలుడుని చూడగానే దిగ్భా్రంతి చెంది పరుగు పరుగున ఇంటికి చేరి విషయాన్ని కణ్ణగికి తెలిపింది. “కోవలుడిని వధించారు” అన్న వార్త వినగానే కణ్ణగి స్పృహ కోల్పోయినట్లుగా కూలబడిపోయింది. కనుల నుండి ధారాపాతంగా కన్నీళ్ళు కారిపోతున్నాయి. భర్తను తల్చుకుని దు:ఖిస్తున్న ఆమె తన భర్తపై అన్యాయంగా దొంగతనం మోపి వధించారన్న విషయం గుర్తొచ్చి కోపావేశంతో లేచింది. కళ్ళ నుండి అగ్ని కణాలను కురిపిస్తూ ఇంటి లోపలకి వెళ్ళి రెండవ మంజీరాన్ని చేతిలో ఉంచుకుని భూమి కదిలిపోయేట్లుగా నడుస్తూ నగరం వైపుకి సాగింది.   జనం గుంపులు గుంపులుగా ఆమెని అనుసరించసాగారు.

వీధిలో పడి ఉన్న భర్త శవాన్ని కౌగలించుకుని కణ్ణగి హృదయవిదారకంగా ఏడవసాగింది. అక్కడున్న జనం నిజమా, భ్రమా అని విభ్రమంతో చూస్తుండగా నిర్జీవుడై పడి ఉన్న కోవలుడు లేచి కూర్చుని భార్యని ఓదార్చి ఆకాశంలోకి వెళ్ళిపోయాడు. భర్త భౌతికకాయాన్ని అక్కడే విడిచి కణ్ణగి ఆవేశంతో ఊగిపోతూ రాజస్థానానికి బయలుదేరింది. అక్కడ జరిగిన మహిమని గమనించిన జనం ఆమెని వదలకుండా వెంబడించారు.

5.

కణ్ణగి నేరుగా వెళ్ళి సభామంటపం లోని గంటను మో్రగించింది. ఆ గంటను విన్న రాణి కొప్పెరుందేవి భయభ్రాంతురాలై పరుగున రాజు దగ్గరికి వచ్చి “స్వామీ! నిన్న ఆ మంజీరం నా మందిరం చేరినప్పటినుండీ నా మనస్సు కీడు శంకిస్తోంది. మన రాజ్యం నశించిపోయినట్లుగా రాత్రంతా పీడకలలు. ఇప్పుడే నా చెలికత్తెలు వార్తని మోసుకొచ్చారు. ఏం జరగబోతుందోనని నాకు భయంగా ఉంది” అంది. వీళ్ళిద్దరూ మాట్లాడుతుండగానే సైనికుడొకడు వచ్చి “ప్రభూ! ఎవరో స్త్రీ. చేతిలో కాలి అందెను పట్టుకుని రౌద్ర రూపంతో ఉంది. ఆమె భర్తని అన్యాయంగా హత మార్చారని ఆరోపణ” అన్నాడు. ఆశ్చర్యపోయిన నెడుంజెళియన్ “ఆమెని ప్రవేశపెట్టండి!” అన్నాడు.

కణ్ణగి సభలోకి వచ్చింది. జుట్టు ముడి వీడి శిరోజాలు చిందరవందరగా భుజాల మీద పరుచుకుని ఉన్నాయి. కట్టుకున్న చీర మట్టిగొట్టుకుని ఉంది. ముఖమంతా కన్నీటి చారికలతో తడిసి ఉంది. ఆమె పెట్టుకున్న కుంకుమ బొట్టులా కళ్ళు ఎర్రగా మారి నిప్పుకణాలను వెదజల్లుతున్నాయి. దయార్థ్రహృదయుడైన నెడుంజెళియన్ ఆమెని చూసి ఆవేదన చెందాడు. “తల్లీ! నీవెవరు? నీకు జరిగిన అన్యాయమేమిటి?” అన్నాడు.

“నా పేరు కణ్ణగి. మాది చోళ దేశం లోని పుహార్ పట్టణం. వ్యాపారం చేసుకోవాలని ఈ దేశానికి వచ్చాం. పెట్టుబడికి డబ్బు కోసం నా పెళ్ళిలో నా తల్లిదండ్రులు నాకిచ్చిన మంజీరాలలోనొకదానిని నేను స్వయంగా నా భర్తకిచ్చాను. అన్యాయంగా దొంగ అని నింద వేసి నా భర్తని హత్యగావించిన నువ్వు దోషివి” అంది వేలెత్తి చూపుతూ. “సాక్ష్యాధారాలు దొరికాయి కనుకనే నీ భర్తకి దండన విధించాము” అన్నాడు రాజు.

“కాదు నా భర్త నిర్దోషి. నిరూపించడానికే వచ్చాను. ఇదిగో ఇది నా రెండవ కాలి మంజీరం. ఇప్పుడు చెప్పండి, మీ మంజీరం లోపల ఏమున్నాయి?” అంది కణ్ణగి ఆవేశంగా తన కుడి చేతిలో ఉన్న మంజీరాన్ని ఎత్తి చూపిస్తూ.

“మా మంజీరంలో ముత్యాలున్నాయి” అన్నాడు నెడుంజెళియన్.

“అయితే తెప్పించండి, నా భర్త నుంచి మీరు తీసుకున్న మంజీరాన్ని పరీక్షించండి. నా మంజీరంలో రత్నాలున్నాయి” అంది. రాజు అజ్ఞ మేరకు సేవకుడు మంజీరాన్ని తెచ్చాడు. దాన్ని చూడగానే అది తనదే అని గుర్తించిన కణ్ణగి మంటలా ప్రజ్వరిల్లుతూ “ఓ రాజా! ఇది నా మంజీరం.   కావాలంటే చూడండి, ప్రజలారా చూడండి” అంటూ మంజీరాన్ని లాక్కున్నట్లుగా తీసుకుని నేల మీదకి విసిరి బద్దలు కొట్టింది. మంజీరం పగిలి లోపల ఉన్న రత్నాలు చెల్లాచెదురుగా సభామంటపం అంతా పడ్డాయి. కొన్ని రత్నాలు నెడుంజెళియన్ ముఖాన, సభాసదుల ముఖాన పడ్డాయి.

పాండ్య చక్రవర్తి ముఖం వెలవెలబోయింది. భీతి శరీరంలో చేరి కడుపును దోసిళ్ళతో దేవినట్లయింది. అతనికి భరించలేని వేదన మూలుగు రూపంలో హృదయం నుండి మెదడుకి ప్రాకి మతి చలించింది. “అయ్యో! పాండ్య వంశానికే కళంకం కలిగింది. అపరాధిని నేనపరాధిని” అని పలవరిస్తూ సింహాసనం మీద నుండి పడి ప్రాణాలు విడిచాడు. కాళికలాగా ఉన్న కణ్ణగి స్వరూపాన్ని చూస్తూ నిశ్శేష్టురాలైన కొప్పెరుందేవి తన భర్త ప్రాణాలు కోల్పోగానే కణ్ణగి పాదాలపై పడి క్షమించమని వేడుకుంది. భర్త శవం పై పడి రోదించి రోదించి కొంత సేపటికి తన ప్రాణాలను కూడా వదిలివేసింది. రాజు, రాణి ఇద్దరూ ప్రాణాలు కోల్పోవడంతో ప్రజలందరూ దు:ఖసాగరంలో మునిగిపోయారు.

కణ్ణగికి మాత్రం తన ఆవేశం చల్లారలేదు. తనను తాను శిక్షించుకోవడానికేమో తన ఎడమరొమ్ముని నరుక్కుని   మీదికి విసిరి “నేను పతివ్రతనే అయితే దుష్టరాజు పరిపాలించిన ఈ మధురానగరం తగులపడిపోవాలి” అని శపించింది.

మరుక్షణం రాజభవనంలో మంటలు వ్యాపించాయి. నగరం తగలపడసాగింది. ప్రజలు భయంతో మీనాక్షి అమ్మవారి ఆలయానికి పరుగులు తీశారు. మధురకి తల్లి అయిన మీనాక్షీదేవి కణ్ణగి ఎదుట ప్రత్యక్షమై “కణ్ణగీ! పాండ్యరాజులు ధర్మస్వరూపులు. నెడుంజెళియన్ ఉత్తముడు. నీ భర్తకి ఈ గతి పట్టడానికి కారణం పూర్వజన్మఫలం. శాంతించు. అగ్నిని ఉపసంహరించుకో. ఇప్పటినుండి సరిగ్గా పదునాలుగు దినాల్లో నువ్వు నీ భర్తని దివ్యలోకాల్లో కలుసుకుంటావు” అని పలికింది. ఆ దేవి ఆజ్ఞ ప్రకారం కణ్ణగి అగ్నిదేవుడిని ప్రార్థంచి అగ్నిని ఉపసంహరించుకోమని కోరింది కాని ఆమెకి మనశ్శాంతి కలగలేదు. ఆవేదన తీరలేదు.

వేశ్యావలలో చిక్కుకున్న భర్త కోసం ఏళ్ళు ఎదురు చూసి చూసి ఇప్పుడు తన తప్పు తెలుసుకుని తన దగ్గరకి చేరుకున్న భర్తతో సుఖంగా ఉందామనుకుని ఎంతో ఆశ పడ్డ ఆమె భాధని వర్ణించడం ఎవరి తరం?

6.

ఇక ఆ నగరంలో ఉండలేక వైఘనదీ తీరాన్ని వెంబడిస్తూ పడమరగా ప్రయాణించింది కణ్ణగి. ఆమెకి ఆకలిదప్పులు లేవు. పగలేదో రాత్రేదో తెలియలేదు. అవిశ్రాంతంగా అలా ప్రయాణించిన ఆమె పద్నాలుగో రోజుకి చేర దేశానికి చేరింది.   పర్వతప్రాంతాలలో ఉన్న సుబ్రమణ్యస్వామి ఆలయంలోనికి వెళ్ళి స్వామికి నమస్కరించింది. ఆలయ ప్రాంగణంలో ఉన్న నేరేడు చెట్టు మొదట్లో కూలబడింది.

ఆ ప్రాంతపు గిరిజనులు పొలం పనులకి వెళ్ళి తిరిగి వస్తుండగా ఆకాశంలో నుండి మిరుమిట్లు గొలుపుతూ దేవ విమానం కిందికి దిగింది. ఆ విమానంలో నుండి సుందరాకారుడైన యువకుడు చేయినందివ్వగా నేరేడు చెట్టు కింద నిలబడిన యువతి అతనే చేయందుకుని విమానమెక్కింది. విమానం గాలిలోకి లేచి మెల్లమెల్లగా అదృశ్యమైపోయింది. అది చూసిన ఆ గిరిజనులు అబ్బురపడ్డారు. ఆ దృశ్యాన్ని వర్ణించి వర్ణించి చెప్పుకోసాగారు. ఆ సమయంలోనే చేర రాజు అక్కడకి రావడంతో గిరిజనులు రాజుని దర్శించుకుని జరిగిన వింతని తెలియపరిచారు. మహాకవి శాత్తనార్ కణ్ణగీకోవలుల చరిత్రని చేర రాజుకి, ఆ గిరిజనులకి చెప్పి, ఇళంగో వడిగళ్ ని ఆ కథని కావ్యంగా రచించమని అడిగాడు.

ఆ పతివ్రతా శిరోమణి కథను విన్న సెంగట్టువన్ ఆమెకి గుడి కట్టించాలని నిర్ణయించుకున్నాడు. తనే స్వయంగా హిమాలయాలనుండి శిలను తెచ్చి కణ్ణగి విగ్రహాన్ని తయారు చేయించాడు. వంజి నగరంలో దేవాలయాన్ని నిర్మించి మంత్రి సామంతులు, బంధుమిత్రులతో కూడి పురోహితులు మంత్రోచ్ఛారణ జరుపుతుండగా శాస్త్రోస్తకంగా ఆమె విగ్రహాన్ని ప్రతిష్టించాడు. చోళ, పాండ్య, చేర రాజ్యాల నుంచి ప్రజలు తండోపతండాలుగా తరలి వచ్చారు. దివ్యభూషణమనోహరాకారంతో కణ్ణగి అక్కడున్న వారి ముందు సాక్షాత్కరించి అందరినీ దీవించింది.

ఆమెను దర్శించుకున్న వాళ్ళకి, ఆమె కథని విన్న వాళ్ళకి సుఖ సంతోష ఆయరారోగ్యాలు కలుగుతాయని పురోహితులు ఆశీర్వచనాలు పలికారు.

 

-రాధ మండువ

12513_1465986130323886_882400752089238785_n

 

 

 

 

 

Tamil Arts. Silapathikaram – Beautiful sculptures of Poombukar Art Gallery, Tamil Nadu, India. కింద లింక్ లో చూడండి. మొత్తం కథని చదివినట్లే ఉంటుంది.

ఆదివాసీల ఉత్తేజిత ఊపిరి – కొమురం భీం

unnamed

ఒక చారిత్రక జీవితం తాలుకూ అన్ని ఛాయలను స్పృశించుకుంటూ ఒక నవల రాయడం లోని కష్టాలు ఎన్నో. వాస్తవాన్ని, కల్పనలను, వక్రీకరణలను నింపుకున్న రాశులలోంచి నిజాలను రాబట్టుకోవడం అంత సులభమైన పనేం కాదు.

1910 తరువాత నిజాం నవాబులు అటవీ చట్టాల తీసుకురావడం, వాటి వల్ల గోండులు, కొలామ్ లు మొదలగు ఆదివాసులు జీవితాలలో వచ్చిన పెను మార్పులలో నుంచి ఉద్భవించినదే కొమురం భీం చరిత్ర.

దీన్ని ఒక కొలిక్కి తెచ్చి  ఒక వాస్తవ ప్రజా పోరాట యోధుడిని మిగతా ప్రాంత ప్రజలకు పరిచయం చేయడం కోసం, నేల కోసం పరితపించే వాళ్లల్లో ఒక స్పూర్తిని నింపడం కోసం అల్లం రాజయ్య గారు, మరియు సాహు గారు, చరిత్రకారులు కాకపోయినప్పటికి  హేమన్ డార్ఫ్ నివేదికలు, ప్రభుత్వ రికార్డులు, గోండులతో కలసి మాట్లాడి తెలుసుకున్న విషయాలు, భీం దగ్గర ముఖ్య అనుచరుడిగా పని చేసిన కొమురం నూరు చెప్పిన విషయాల ఆధారంగా తమ తొలి చారిత్రక నవలను ప్రతిభావంతంగానే తీర్చిదిద్దారు అని చెప్పుకోవచ్చు.

స్థానిక షావుకారులు, అధికారులు, దొరల వంచనకు గురైన కుటుంబాలకు చెందిన సాధారణమైన గోండు బాలుడు, ఎలా తిరుగుబాటు జెండా ఎగరవేసాడో, హత్యచేసి, పారిపోయి,దేశమంతా తిరిగి, ఎక్కడ చూసిన అదే దుర్మార్గాలతో విసిగిపోయి, మన్నెం పోరాట స్ఫూర్తితో, తిరిగి తన ప్రాంతానికే తిరిగివచ్చి పోరాటం చేసిన క్రమాన్ని తెలుసుకోవాలంటే  ఈ నవల ఒక్కసారైన చదవాల్సిందే. ముందు మాటలో వరవరరావుగారు, ఈ పుస్తకాన్ని చెంఘిజ్ ఖాన్,స్పార్థకస్ లతో పోల్చినా, దీన్ని చదవగానే నాకు గుర్తొచ్చిన పుస్తకం  ఏడుతరాలు. అది నేరు బానిసత్వానికి ప్రతీకగా నిలిస్తే, బానిసల కంటే హీనంగా తోటివాడు ఎలా దోచుకోబడతాడో వివరించిన పుస్తకం ఇది.

అల్లం రాజయ్య

అల్లం రాజయ్య

15సంవత్సరాల వయసు నుంచి ప్రారంభమయ్యే కొమురం భీమ్ చరిత్రను ప్రధానంగా ఐదు భాగాలుగా చేసి చూడవచ్చు. ( పుస్తకంలో అధ్యాయాలు చేయలేదు. ఇది కేవలం నా ఆలోచన మాత్రమే, మార్పులు చేర్పులు ఎవరైన సూచించగలరు)

1915 – 1920 ( భీం వయస్సు 15 – 20ల మధ్య)

ఆదిలాబాద్ జిల్లా, అసిఫాబాద్ ప్రాంతంలో సంకేపల్లి గూడెం లో గోండుల జీవన విధానాన్ని పరిచయం చేస్తూ ఈ నవల మొదలవుతుంది. అడవిలో చెట్టు పుల్లలు విరిచినా వేళ్లు తెగ్గోట్టే జంగ్లాత్తోల్లు(అటవీ అధికారులు) అరాచకాలు, నిత్యం అటవీ జంతువులతో పోరాడుతూ కాపాడుకున్న పంటలను వడ్డి లెక్కలతో మాయ చేసి మోసం చేసే మైదాన షావుకార్లు చేసే వంచనలు సహిస్తూ, పేన్కు (దేవుడు) మీద నమ్మకంతో సాగిపోతున్న గోండుల (భీం) జీవితంలో అతని తండ్రి చిన్ను మరణం ఒక  పెద్ద కుదుపవుతుంది.  సంకేపల్లి లో పంటలు సరిగా పండక పోవడంతో ఆ ప్రాంతాన్ని వదిలి, ధనోరా ప్రాంతంలో నర్దేపూర్ గూడెన్ని నిర్మించుకొంటారు. పోడు కోసం రెక్కలు ముక్కలు చేసుకుని అడవులను నరికి, సాగు చేస్తారు. పంటలు కోతకొచ్చిన సమయంలో ఆ ప్రాంత పట్టేదార్ నంటూ వచ్చిన సిద్దిక్ తో జరిగిన గొడవలో, భీం సిద్దిక్ ను తలపగలగొట్టి చంపేసి, భయంతో అక్కడ నుంచి పారిపోతాడు. పోలీసులు కోపానికి సర్దేపూర్ గూడెం, పంటలు సర్వనాశనమై, భీం చిన్నాయనలు, అన్నలు, మిగిలిన గోండులు చెట్టుకొకరు, పుట్టకొకరుగా చెదిరిపోతారు.

1920 – 1925 ( భీం వయస్సు 20 – 25 ల మధ్య)

బలార్షా మీదుగా చంద్రపూర్ చేరుకున్న భీమ్ అక్కడ జాతీయవాదులు రహస్యంగా నడిపే ఓ ప్రెస్ లో పనిచేస్తాడు. అక్కడే కొద్దిగా చదవడం, రాయడం నేర్చుకుంటాడు. కొద్ది రోజులకే పోలీసులు ఆ ప్రెస్ మూసేయడంతో రైల్వే స్టేషన్లో మేస్త్రీల మాటలు విని అస్సాం తేయాకు తోటల్లో కూలీగా పనిచేయడానికి వెళ్తాడు. అక్కడ అత్యంత హేయమైన బతుకుల్ని చూస్తూ, అనుభవిస్తూ, దేశంలోని అన్ని ప్రాంతాల నుంచి తీసుకురాబడే కూలీల కథలను వింటూ భారంగా రోజులు దొర్లిస్తాడు. హిందీ, ఉర్దు మాట్లాడటంలో కొంత నేర్పు సంపాదిస్తాడు. అక్కడే ఓ మిత్రుని ద్వారా మన్నెం దొర అల్లూరి గురించి తెలుసుకుని, ఉత్తేజితుడవుతాడు. అక్కడ జరిగిన ఒక తిరుగుబాటులో పాల్గొని, నిర్భంధించబడి, అక్కడి నుండి తప్పించుకొని పారిపోయి,. కాకాన్ ఘాట్ లోని తన అన్నల దగ్గరికి తిరిగి చేరుకుంటాడు.

1925 – 1935 (భీం వయస్సు 25 – 35 ల మధ్య)

దేవడం లచ్చుపటేల్ దగ్గర పాలేరుగా చేరి అతనికి అత్యంత నమ్మకస్తుడిగా వుంటాడు. సోంబాయి, పైకు బాయి లను వివాహం చేసుకుంటాడు. భీం జీవితంలో ఇదొక ప్రశాంతమైన అధ్యాయంగా చెప్పుకోవచ్చు. (అతని సంతానం గురించి వివరాలు పుస్తకంలో ఇవ్వలేదు.) లచ్చుపటేల్కు చెందిన భూ లావాదేవీలలో (తెల్లచొక్కలతో) అధికారులతో మాట్లాడి ఒక కేసును గెలిపిస్తాడు. ఇది గొండులలో భీం ప్రతిష్టను పెంచుతుంది.

1935 – 38 ( భీం వయస్సు 35 – 38 ల మధ్య)

భీం చిన్నాయనలు కుర్దు, యేసులు ప్రజలను కూడదీసి బాబేఝరి ప్రాంతంలో అడవులు నరికి, పన్నెండు గూడెంలను నిర్మించుకొని, ప్రభుత్వంతో పోరాటం సాగిస్తూ,అధికారులతో వ్యవహరించడానికి ఉర్థూ బాగా తెలిసిన భీం ను, రాత పనికి మహదును నియమించుకుంటారు. ఈ పోరాట క్రమంలో భీం నాయకునిగా ఎదగడం, ఆ పన్నెండు గ్రామాలలో ఒక సమాంతరమైన ప్రభుత్వాన్ని జోడెన్ ఘాట్ ప్రధానకేంద్రంగా భీం నడిపించగలుగుతాడు. ఇక్కడే భీం మూడో పెళ్లిని చేసుకుంటాడు.  అధికారులను, పోలీసుల ఆగడాలను ఎదుర్కోవడం, వారిని పారద్రోలడానికి ఒక చిన్న సైన్యాన్ని కూడా సమకూర్చుకోగలుగుతాడు. కొంత మంది సన్నిహితుల సలహా మేరకు నిజాం నవాబుని కలవాలని హైదరాబాద్ వచ్చి, రాజు దర్శనం దొరకకపోవడం తో అవమానంగా భావించి తిరిగి వచ్చే లోగానే పోలీసులు జోడెన్ ఘాట్ ను, అక్కడి పొలాలను నాశనం చేస్తారు. ఇది పూర్తి స్థాయి పోరాటానికి భీం ను ఉసిగొల్పుతుంది.

సాహు

సాహు

1938 – 1940( భీం వయస్సు 38 – 40 ల మధ్య)

బర్మార్లు( ఒక రకమైన తుపాకులు) తయారు చేసుకుని,  పోలీసులకు దీటైన సమాధానం ఇస్తూ గోండు రాజ్యస్థాపన దిశగా భీం పయనిస్తాడు. 50 మంది సైనికుల దాడిని తిప్పికొట్టి విజయం సాధిస్తారు. చర్చలకు వచ్చిన సబ్ కలెక్టర్ 12 గ్రామాల ప్రజాలకు పట్టాలిచ్చి, అప్పులు మాఫీ చేస్తానన్నా భీం రాజ్యాధికారానికే కట్టుబడడంతో అవి విఫలమవుతాయి. ఆశ్వయుజమాసం ,శుద్దపౌర్ణమి,.గోండులకు అత్యంత పవిత్రమైన దినం, 1940 సెప్టంబర్ 1 న మూడు వందల మంది నిజాం సైనికులు జరిపిన దాడిలో, కుర్దుపటేల్ అనే గోండు చేసిన ద్రోహంతో  భీం మరణిస్తాడు. స్వయంపాలనకై కలలు కన్న ఓ వీరుడి స్వప్నం కల్లలైన రోజు, రక్తం చిందించి,నేలకొరిగిపోయిన రోజు అది. ఆ తరువాతి ఘటనలలో ఆ పన్నెండు గ్రామాల ప్రజలు చెల్లచెదురైపోతారు.

ఇది జరిగి ఇప్పటికి దాదాపుగా 75 సంవత్సరాలు కావస్తుంది. కాని నేటికైనా గోండులు వంటి ఆదివాసీల బతుకుల్లో ఏమన్నా మార్పులు వచ్చాయా, వారి సమస్యలేమన్నా తీరాయా, అనేది ప్రశ్నార్దకం కావడం సిగ్గుపడాల్సిన విషయమే.

అడవిలో వుంటే తిండి కావాలి, తిండి కావలంటే అడవి నరకాలి, పంటలేయాలి, అది చేస్తే పట్టేదార్లో, జంగ్లాతోల్లో వస్తారు, వాళ్లు అడిగిందంతా ఇవ్వాలి., ఇస్తే ఆకలికి చస్తాం,.ఇవ్వకుంటే వాండ్లు చంపుతరు., కొట్లాటకు బోతేనేమో ఇలా పారిపోవాలి అంటూ భీం ఒక చోట చెబుతాడు.

వాళ్లకి ఇప్పటికైన భూములకు పట్టాలిచ్చి, కొత్త వ్యవసాయ పద్దతులు నేర్పి, పాఠశాలల్లో కాస్తంత చదవు నేర్పిస్తే వారి జీవితాలు మారతాయేమో. ప్రస్తుత వారి పరిస్థితి పట్ల నాకు ఎలాంటి అవగాహన లేకుండా వ్యాఖ్యానించడం కూడా సరికాదు,. కాని భీముడి సంతానంగా చెప్పుకునే గోండుల జీవితాలలో వెలుగులు నిండాలనే మనస్ఫూర్తిగా ఆశిస్తున్నాను.

ఆదివాసీ ప్రచురణలు, జోడెన్ ఘాట్ వారు 83,93 ప్రచురణల తరువాత 2004 లో ఈ పుస్తకాన్ని మళ్లీ ముద్రించారు,. తరువాత మరో ఎడిషన్ వచ్చిందేమో నాకు తెలియదు. తెలుగులో వెలువడ్డ మంచి పుస్తకాలలో ఇది ఒకటి, వీలైతే ఖచ్చితంగా చదవండి. వెల ఇరవైరూపాయలు, 238 పేజీలు.(2004 ఎడిషన్)

– భాస్కర్ కె

ఒక నేల కన్నీరు

నీటిపై రాత్రి పరిచిన మౌనాన్ని 

ఒక్క వెలుగు పరుగులెత్తిస్తుంది. 

ఏళ్ళుగా మనిషి గుండెలో నెలకొన్న స్తబ్ధత ని 

ఒక్క అక్షరం బ్రద్దలు చేస్తుంది

”సొన కాలువల అపూర్వ పురా గాధ ” లెనిన్ ధనిశెట్టి వ్రాసిన 36  పేజీల చిన్న పుస్తకం చదివినప్పుడు నాకు కలిగిన భావం ఇది .

జీవితపు ఒడ్డున నడుస్తున్నప్పుడు ఎన్నో పోరాటాల చైతన్యపు  అలలు అక్షరాల నురగను అద్దుకొని మనను తాకి ఉలికిపాటును తెస్తూనే ఉంటాయి . కాని కొన్ని మన సమాంతర ఆలోచన దోరణి తో మమేకమై హృదయాన్ని ముంచేస్తూ ఉంటాయి .

”ప్రకృతి మన ఆశకు తగినంత ఇస్తుంది ,దురాశకు కాదు ”…. మహాత్మ గాంధి .

కోస్తా తీరం లో ముఖ్యంగా నెల్లూరు జిల్లా లో సముద్రతీర ఇసుక దిబ్బలలో తమకు తామే ఊరుతూ ఎన్నో వేల ఎకరాల పంటకు ఆలవాలం అవుతూ ముప్పై ఊర్లకు జీవాన్ని పోస్తూ పడమర నుండి తూర్పుకు ప్రవహిస్తున్న రెండువందల వేల ఏళ్ళ క్రితపు ”సొన కాలువలు ” పారిశ్రామిక పాదాల కింద  స్వార్ధపరులకు సంపదలుగా మారుతూ ఎలా ఉనికిని కోల్పోతున్నాయో  చెప్పే పరిశోధన , వేదన , రోదన ల పుస్తకం ఇది .

దీన్ని ప్రచురించిన అనంతుడు ఫౌండేషన్ వారు దీని గూర్చి వివరిస్తూ  ”విభజనానంతరం సీమాంద్రకు ఇవ్వబోయే ఒక సామాజిక సమస్యను పరిచయం చేసే మొట్ట మొదటి స్నేహపూర్వక సాహిత్య కానుక ఇది ” అనడం దీనిలో ఉన్న రచయిత చిత్త శుద్ధి ని ,రచానా శైలిని మనకు పరిచయం చేస్తుంది .

ఒకానొక రోజు తనను తియ్యటి నీళ్ళతో చల్లటి నీడతో సేద తీర్చిన సొన కాలువలు ,తామే రచయిత ఆలోచనగా మారి తమ సమస్యల సాధన వైపు ఉపక్రమించేలా చేయడం …. రచయిత తన మాటల్లో చెప్పడం ఈ పుస్తకానికి మంచి శైలి ని చేకూర్చింది . ఇక రచయిత  సొన కాలువల మీద చేసిన చారిత్రక  పరిశోదనలు , తిరిగి తిరిగి సాధించిన సాక్ష్యాలు, సమస్యను ప్రతిబింబించిన శైలి …. సొన కాలువల ఆవేదన మన కళ్ళ ముందు కదిలి మోయలేని ఆవేదనతో పుస్తకాన్ని  ఆపకుండా చదివిస్తాయి . నిజానికి ఇదేమి కాలక్షేపపు పుస్తకం కాదు , కాని వర్తమాన సమస్యని మన గుండె గదిలో ఉంచి  ఆలోచనలో పడవేయాలన్న లెనిన్ గారి ఆలోచన సఫలం అయింది .

లెనిన్ ధనిసెట్టి

లెనిన్ ధనిసెట్టి

”సొన కాలువల సోయగాలు చూసాను. సంవత్సరాలు తరబడి అనేక ఋతువుల్లో, అనేక సమయాల్లో, నిశ్శబ్దంగా … సడి చేయకుండా వాటి ఉచ్వాస నిచ్వాసాలు వింటూ సొన కాలువలతో పాటు నేను  ప్రవహించాను ” అనే రచయిత మాటలతో మనం కూడా ఆ ఇసుక దారుల వెంట ,వాటి చారిత్రిక వైభవాల వెంట, వెన్నెల వెలుగుల వెంట ,అవి పండించే పాడి పంటల వెంట, వాటితో అల్లుకున్న జీవ సమూహాల వెంట ,తాటి చెట్ల గుంపుల వెంట, ఒక జియోలాజికల్ అద్భుతం వెంట , ఒక నిస్వార్ధ ఆశయం వెంట, ఒక తవ్వుతున్న నేలతల్లి గుండె మంట వెంట ….. మనసున్న మనిషిగా కదలిపోతాము .

తాను వ్రాసే ప్రతి వాక్యానికి సాక్ష్యంగా రచయిత చూపే ఒక వ్యాసమో, ఒక చరిత్రో ,ఒక జి . ఓ నో చూస్తూ ఉంటె ఒకింత ఆగి అతనిని అభినందించాలి అనిపిస్తుంది .

”The Earth has music for those who can listen ” అంటారు రచయిత ఒక దగ్గర. వినగలిగిన వాళ్లకి ఇందులో సొన కాలువల రోదన వినిపిస్తుంది. మనసుగల వాళ్ళని కదిలిస్తుంది. ఎక్కడో నెల్లూరు జిల్లా లోని సొన కాలువల సమస్యకి, దానిని మనముందు ఉంచిన  రచయితకి , ఎక్కడో నల్గొండ లో ఉన్న ప్రచురణ కర్తలకు ఉన్న సంబంధం ఏమిటి? ఇద్దరు అదే సముద్రం పై నుండి వచ్చిన మేఘాలు ఇచ్చిన నీరు తాగి భూమాత ఇచ్చిన గింజలు తిన్న ఋణం తప్ప .

”In man vs Nature ,nature laughs at last ” అంటారు రచయిత . ఇంకా చివరిగా ”Iam not in them,they are in mine ” అని ప్రకృతి తో తన మమేకాన్ని వివరిస్తారు. ప్రకృతి పై మమకారం కలిగి వాస్తవ జీవిత పధం లో దానికి ఏర్పడే ముప్పు గురించి హృదయమున్న మనిషిగా తెలుసుకోవాలి అనుకున్న ప్రతి వారు కొని చదవవలిసిన పుస్తకం.

Price:20/-

for orders: Anantudu Foundation, Kondagadapa (vi), Mothukuru (Mandal), Nalgonda Telangana. ph:9866061350

mail id :

doctorlenin@gmail.com, mothkurusrinivas@yahoo.co.in

 – వాయుగుండ్ల శశి కళ

సింహాసనాల వింతాట

ఎన్నో రాజ్యాలు , ఎందఱో రాజులు , రాజ్యం కోసం వాళ్ళు చేసే రాజకీయాలు , వేసే ఎత్తులు, తీసే ప్రాణాలు, చేసే త్యాగాలు ఇవన్నీ ఎన్నో కథల్లో కథనాల్లో చదువుతూ ఉంటాం . “A game of thrones” కూడా అటువంటి రచనే అయినా ఒక కొత్తరకమైన ప్రాచీన జీవన విధానాన్ని మన కళ్ళ ముందు ఆవిష్కరిస్తుంది . ఇందులో కొంత మాయాజాలం కూడా ఉంటుంది సుమా అని చిన్న క్లూ ఇస్తూ అదేమిటో తెలుసుకోవాలన్న ఆసక్తిని కలిగిస్తూ ఆద్యంతం చదివేలా చేస్తుంది . అద్భుతమైన కథనం మనల్ని మంత్రం ముగ్దుల్ని చేసి చెయ్యి పట్టుకుని ముందుకి నడిపిస్తుంది . (కొంత అడల్ట్ కంటెంట్ ఉంది కనుక పిల్లలకి నిషిద్ధం .)

అదే George R. R. Martin రాసిన “A Song of Ice and Fire “సిరీస్ . ఇవి మొత్తం ఏడు పుస్తకాలట. ప్రస్తుతానికి ఐదు మాత్రమే పబ్లిష్ అయ్యాయి. అందులో మొదటిది ‘A Game of Thrones ‘ లో ఏముందో చూద్దాం .

ముందుగా కథ ఒక పెద్ద గోడ తో ప్రారంభమవుతుంది . పురాతన, మానవేతర జాతులనుండి రక్షించుకోవడం కోసం వేల సంవత్సరాల కి పూర్వం, వందల మైళ్ళ దూరం పాటు ఉత్తర దిశగా కట్టబడిన గోడ అది . అంతరించి పోయిందనుకున్న ‘అదర్స్’ అనబడే ఓ అనాగరిక పురాతన జాతి ఉంది ఉందంటూ ముందుగా ఒక చిన్న ఆధారాన్ని చూపించి కథలోకి తీసుకెళ్తాడు రచయిత .

కథ వింటర్ ఫెల్ అనే ఒక రాజ్యం లో ప్రారంభమవుతుంది . ఒక్కో అధ్యాయం ఒక్కో పాత్ర దృక్పథం లో సాగుతుంది . అది వారి వారి అంతరంగాల్ని మనకి చూపడంతో పాటు కథని కూడా ముందుకి నడుపుతూ ఉంటుంది .
index

ఉత్తర దేశానికి అధిపతి అయిన లార్డ్ Ned Eddard Stark కి ముగ్గురు అబ్బాయిలు (Robb ,Bran, Rickon), ఇద్దరు అమ్మాయిల(Sansa ,Arya )తో పాటు ఒక bastard son (Jon Snow )కూడా ఉంటాడు . వీళ్ళకి ఒక dire wolf కి చెందిన ఆరు పిల్లలు దొరుకుతాయి . సరిగ్గా వాళ్లకి సరిపోయేలా నాలుగు మగ,రెండు ఆడ తోడేళ్ళు కావడంతో Eddard పిల్లలు వాటిని పంచుకుని పెంచుతూ ఉంటారు . స్టార్క్ ల వంశం తోడేళ్ళకి సంబంధించిన వంశంగా పేరుపొందింది కూడా .

ఇంతలో మహారాజు Robert Baratheon తన కుటుంబంతో వింటర్ ఫెల్ కి వస్తాడు . Eddard ని తన సహాయకారి ( hand)గా రాజధానికి రమ్మని ఆహ్వానిస్తాడు . ఆ సమయం లో ఎనిమిదేళ్ళ Bran అనుకోకుండా ఒక చూడకూడని దృశ్యం చూడటం వల్ల , మహారాజు బావమరిది Jaime Lannister, ఆ బాబుని భవనం పై నించి క్రిందికి తోసేస్తాడు. ఆ కుర్రవాడు చావు బ్రతుకుల మధ్య కొట్టుమిట్టు లాడుతుంటాడు . ఏం జరిగిందో మిగిలిన వాళ్ళకి తెలీదు . ఇటువంటి కష్ట సమయం అయినా Eddard, మహారాజు కి ఇచ్చిన మాటకి కట్టుబడి తన ఇద్దరు కుమార్తెలని తీసుకుని రాజధానికి తరలి వెళ్తాడు . తన రాజ్యభారాన్ని భార్య Catelyn , పెద్ద కుమారుడు Robb లకి అప్పగిస్తాడు .

స్టార్క్ద్ ల పెద్దమ్మాయి పదకొండేళ్ళ Sansa అందగత్తె మాత్రమే కాదు, రాచరికపు కట్టుబాట్లు బాగా తెల్సిన అమ్మాయి . ఆ అమ్మాయికి మహారాజు కుమారుడు Joffrey తో నిశ్చితార్ధం అవుతుంది . రెండో అమ్మాయి తొమ్మిదేళ్ళ ఆర్యా కి కత్తి యుద్ధాలు చెయ్యడం , గుర్రపు స్వారీ చెయ్యడం ఎక్కువ ఇష్టం . అక్కా చెల్లెళ్లకి అంతగా సరిపడదు .

రాజధానికి వెళ్ళగానే Eddard ఒక రాజ రహస్యం తెలుసుకుంటాడు . మహారాణి Cersei కి ఆమె కవల సోదరుడు Jaime తో అక్రమ సంబంధం ఉందని , మహారాజు పిల్లలు గా చెలామణి అవుతున్న ముగ్గురు పిల్లలు వాళ్ళ పిల్లలేనని అతనికి తెలుస్తుంది . అంటే రాజు తర్వాత సింహాసనం అధిష్టించేందుకు వాళ్ళు అర్హులు కాదన్నమాట . రాజుతో ఈ విషయం ఎలా చెప్పాలా అని అతను ఆలోచిస్తుండగానే వేట కి వెళ్ళిన రాజుని ఒక ఎలుగుబంటి తీవ్రంగా గాయపరిచిందన్న వార్త వస్తుంది .

మహారాజు మరణం తో పరిస్థితులు ఒక్కసారిగా తారుమారవుతాయి . Eddard ని , Sansa ని మహారాణి బంధించగా ఆర్యా మాత్రం పారిపోతుంది . రాజ ద్రోహం అనే చేయని నేరం మోపి Eddard తల నరికేసి Sansa ని మాత్రం బందీ గా ఉంచుతుంది మహారాణి . రాజ్యానికి అసలైన వారసుడు కాకపోయినా కుమారుడు Joffrey కి రాజ్యాభిషేకం చేస్తుంది . Sansa తోడేలు ‘Lady’ కూడా చంపివేయబడుతుంది .

Eddard పెద్ద కుమారుడు Robb, తన తండ్రి మరణానికి ప్రతీకారం గా యుద్ధానికి సిద్ధ పడతాడు . మహారాణి తండ్రి Tywin Lannister వైపు సైన్యం తో తలపడి మొదటి దశ విజయం సాధిస్తాడు . మరోవైపు ఆర్యా , అబ్బాయిలా నాటకమాడుతూ తిండి కూడా లేని దీన స్థితి లో ఎన్నో కష్టాలు పడుతూ తన దేశం చేరుకోవడానికి ప్రయత్నం చేస్తుంటుంది .ఆమె తోడేలు ‘Nymeria’ కూడా ఆమెకి దూరమై పోతుంది . సహజంగా చాలా ధైర్య వంతురాలు కావడం వల్ల ఈ ఆటు పోట్లన్నీ ఎదుర్కుంటూ ముందుకు సాగిపోతూ ఉంటుంది. ఆర్యా వెర్షన్ లో ఉండే అధ్యాయాలు ఎంతో ఆసక్తికరంగా అనిపించాయి( నాకైతే).

అసలే భయస్తురాలైన Sansa ని Joffrey చాలా హింసిస్తుంటాడు . అక్కడ Winterfell లో Bran బ్రతికి బట్టకట్టినప్పటికీ పడిపోవడం వల్ల నడిచే శక్తి ని కోల్పోతాడు . ఆఖరి వాడైన నాలుగేళ్ళ Rickon, తన కుటుంబ సభ్యులందరూ ఒక్కొక్కరు గా తనని వదిలి వెళ్లి పోతుండటంతో చాలా అసహనానికి గురవుతుంటాడు .

ఎడ్డార్డ్ Bastard son అయిన Jon snow , కథ మొదట్లోనే గోడ కాపలా కోసం వెళ్ళిపోతాడు . అక్కడ అతనికి చనిపోయిన మనుషులు బ్రతికి రావడం వంటి వింతలు ఎదురవుతాయి . ఎందుకు ఇలా జరుగుతోందో తెలుసుకోవడం కోసం , గోడ సంరక్షణ కి నియమింప బడిన Night’s Watch బృందం తో పాటుగా అతను గోడ వెనుకకి వెళ్లేందుకు సిద్ధమవుతాడు .

మరో పక్క మహారాజు Robert , ఒకప్పుడు ఓడించి తరిమి కొట్టిన డ్రాగన్ వంశానికి చెందిన అమ్మాయి Daenerys కథ కూడా సమాంతరం గా సాగుతుంది . ఆమె తన రాజ్యాన్ని వదిలి వచ్చిన సమయానికి పాలు తాగే పసిపిల్ల . తల్లి తండ్రుల్ని పోగొట్టుకున్న ఆ చిన్నారి పాపని తీసుకుని అప్పట్లో ఆమె అన్నగారు తూర్పు వైపుకి పారిపోతాడు . ఆ తర్వాత పద్నాలుగేళ్ళ ప్రాయానికి వచ్చాకా ఆ అమ్మాయి ఒక మొరటు రాజుని పెళ్లి చేసుకుని ఎటువంటి జీవనాన్ని గడిపిందో , ఎలా ఒక యుద్ధంలో భర్త ని కోల్పోయిందో , ఒక మంత్రం గత్తె వల్ల ఎలా మోసగింపబడిందో , ఆఖరుగా ఎప్పుడో అంతరించి పోయాయనుకున్న డ్రాగన్స్ కి ప్రాణం పోసి మూడు డ్రాగన్ ల తల్లిగా ఎలా మారిందో రచయిత ఆసక్తికరం గా వివరిస్తాడు . అటువైపు Robb తో పాటుగా ఇక్కడ ఈ అమ్మాయి Daenerys కూడా రాజ వంశం పై ప్రతీకారం తీర్చుకునే రోజు కోసం ఎదురు చూస్తూ ఉండటం తో మొదటి పుస్తకం ముగుస్తుంది .

ఈ పుస్తకం కొన్ని ప్రతిష్ఠాత్మక మైన అవార్డ్స్ గెలుచుకోవడం తో పాటు , మరికొన్ని గొప్ప అవార్డ్స్ కి నామినేట్ అయింది కూడా . కొసమెరుపు ఏమిటంటే ఈ రచన లోని పాత్రల పేర్లని అమెరికన్లు చాలా మోజుగా తమ పిల్లలకి పెట్టుకుంటున్నారట.

కుదిరితే రెండో పుస్తకం A Clash of Kings తో మళ్ళీ కలుద్దాం .

– భవానీ ఫణి

bhavani phani.

స్త్రీ వాదిని కానంటూనే ……కాదు కాదంటూనే..

sasi1

“ డార్క్ హోల్డ్స్ నో టెర్రర్ “ – చాలా అప్రయత్నంగా మరే పుస్తకమూ లేదు కదా ఏదో ఒకటి అన్న ధోరణిలో చదవడం మొదలు పెట్టాను.

మొదటి రెండు పేజీలు  చదివేసరికే నన్నిలా గాలం వేసి లాగేసింది ఆమె రచనా సంవిధానం.

ఆ ఆసక్తి తోనే వెళ్లి బెంగుళూర్ లో జయనగర్ లో ఆవిడను ఒకసారి చూసి వచ్చి చాలా కాలమే అయింది.

అద్దం లాటి ఇల్లే కాదు అద్దంలాటి ఆలోచన వ్యక్తీకరణ ఆవిడ సొంతం.

రచన వృత్తిలా ఉదయం నుండి సాయంకాలం వరకు ఫోన్ కాల్ కూడా తీసుకోకుండా రాస్తారని విని ఆశ్చర్యపోయాను. ఒక నవల కోసం దాదాపు 1500 పేజీలు  రాసి ఎడిట్ చేసుకుని ౩౦౦ పేజీల్లోకి కుదిస్తారని విన్నాక తెలిసి వచ్చింది ఆవిడ రచనలో చిక్కదనం రహస్యం.

చదువుకున్న మధ్య తరగతి మహిళల సంఘర్షణ , నగర జీవనం, అస్తిత్వ పోరాటం ఆమె ఆయుధాలు.

ఈ దశాబ్దం లోనూ చదువుకుని వివిధ రంగాలలో రాణిస్తున్న మారని మధ్య తరగతి స్త్రీ మనస్తత్వం చిత్రణ ఒక విధంగా రచయిత్రిని స్త్రీ వాద రచయిత్రిగా చిత్రీకరిస్తాయి. కాని ఎంత అభ్యుదయం సాధించినా ఇంకా భారతదేశ సమాజం అణువణువునా విస్తరి౦చిపోయిన పురుషాధిక్యత స్త్రీ నుండి ఏవిధమైన విధేయత ఆశిస్తొ౦ది, ఎలా చిన్నచూపు చూస్తోంది ఈ శతాబ్దంలోనూ మిగిలిపోయిన ఆనవాళ్ళు ఆమె నవలలు.

సాంప్రదాయకంగా సౌమ్యత ,విధేయత పుణికి పుచ్చుకుని ఇంట్లోని మగవారి అదుపాజ్ఞలలో ఉండాలనేది తరతరాలుగా వస్తున్న ఆనవాయితీ.వేష భాషల్లో మార్పు వచ్చినా ఆలోచనా విధానంలో ప్రవర్తనలో ఇంకా అనుకున్నంత అభ్యుదయం రాలేదేమో నన్న వాస్తవం ఆవిడ నవలల్లో తొంగి చూస్తూ వుంటుంది.

అలాటి నవలలోకి రచయిత్రికి అతి ప్రియమయిన నవల ఇప్పుడు ఒకసారి చూద్దామా !

sasi2

“ డార్క్ హోల్డ్స్ నో టేర్రర్స్” లో కధానాయిక సారు ఒక అసాధారణ మధ్యతరగతి మహిళ, సంతృప్తి నివ్వని వివాహం.చిన్నతనంలో ఎదురైన గొప్ప అవమానం, నిర్లక్ష్యం, పెళ్లి అయినా పెద్దగా మారని స్థితి.తల్లిదండ్రులకున్న

పక్షపాతం కొడుకు కావాలన్న బలీయమైన కోరిక, ఆడపిల్లకు మగ బిడ్డకు మధ్య చూపే వివక్ష ,పెళ్లి తరువాత భర్త కన్నా ఎక్కువ పేరు ప్రఖ్యాతులు రావడం వల్ల సామాజిక జనాల ప్రవర్తన వల్ల శాడిస్ట్ గా మారిన భర్త , అతని ఆత్మా న్యూనత , ఆ అసహాయత , విసుగు అదంతా మను ఆమె పైన రాక్షసంగా పైశాచికంగా దాంపత్య జీవనంలో స్పష్టం గా చూపడంలో వైవిధ్యం స్పష్టత కనబరిచారు.

తల్లీ బిడ్డల మధ్య అదీ కూతురికీ తల్లికీ మధ్య సఖ్యత లేకపోవడం ముఖ్య మైన విషయం గా, తల్లి ప్రవర్తన వల్ల సారూ కూడా తల్లిపట్ల ఆమెకు సంబంధి౦చిన విషయాలైన ఆచార వ్యవహారాల పట్ల విముఖత పెంచుకోడం, ఎదుగుతున్న సమయం లో సారూ అనుభవాలు స్త్రీ త్వాన్ని ఏవగి౦చుకునేలా చేస్తాయి.

నవలంతా తల్లితో ఆమెకు గల విముఖత చుట్టూనే అల్లబడి౦ది.తల్లికి అయిష్టమనే ఆమె మెడిసిన్ చదవడం , కాని కులంలో పెళ్లి చేసుకోడం జరుగుతాయి.

కధానాయిక ముఖ్య పాత్రగా మిగతా మగ పాత్రలు నాయిక చుట్టూ పరిభ్రమిస్తాయి. భర్తలో పురుషాధిక్య భావన అహంకారం కనబడితే , తండ్రిలో వాత్సల్యం ప్రేమ విశాలమైన భావాలు పెంపొందుతాయి. మిత్రులు మాత్రం సానుభూతి పరులు. మొత్తానికి మగ పాత్రలన్నీ నాయిక వ్యక్తిత్వాన్ని ,ఉనికిని స్పష్టంగా చూపడానికి సహకరిస్తాయి.

పురుషాధిక్య సమాజంలో , ముఖ్యంగా సంప్రదాయబద్ధమైన పరిసరాల్లోఉక్కిరిబిక్కిరయిపోయే భారతస్త్రీ జీవనాన్ని ఆమె దౌర్భాగ్యాన్నీ సచిత్రంగా చిత్రీకరించారు రచయిత్రి.ఆమె స్త్రీ పాత్రలు వారి వారి భయాలు, ఆశలు, ఆశయాలు, నిస్పృహల్లో ఊయలూగుతారు. వారికి వారి బలాలూ తెలుసు బలహీనతలూ తలుసు.

అయినా పురుషాధిక్య ప్రపంచంలో తృణీకరణ కు గురవుతారు.

మధ్యతరగతి స్త్రీ జీవనాన్ని సున్నితంగా వాస్తవంగా ఆవిష్కరించిన నవలలు ఆమెవి.

 

 -స్వాతి శ్రీపాద

swathi

ఆ తప్పిపోయిన పిల్లడు…మళ్ళీ దొరికాడు!

మిమ్మల్నో మాట అడగనా? ఒక చక్కని పుస్తకం……మీ చేతిలోకి వస్తే ఎలా ఉంటుంది? సరే, ఆ చక్కని పుస్తకం మీరెప్పటినుంచో వెతుకుతున్నదైతే? మీకిష్టమై, మీరు ఒకసారి చదివేసి, విపరీతంగా ప్రేమించి, తరవాత తప్పిపోయిన పిల్లాడిలా ఆ పుస్తకం కోసం వెతికి ఇక వీల్లేదనుకున్న సమయంలో ఎవరో దయతలిచి, ‘నా దగ్గరుంది, సర్లే తీసుకో’ అని ప్రేమగా ఇస్తే? !!

అంతకు మించిన గొప్ప అనుభవం జరిగింది నాకు. ఉషోదయాన, హైదరాబాదు రోడ్లలో, కారులో ఒక్కదాన్నే రేడియోలో వచ్చే ‘భూలేబిసేరేగీత్’ వింటూ..అలా లోయర్ ట్యాంక్ బండ్ రోడ్డులో ఉన్న ఇంకా పూర్తిగా సన్నిహితురాలు కాని మిత్రురాలి ఇంటికి వెళ్తుంటే ఆనందం నావెంటే వచ్చింది. అదే ఆనందంతో నా స్నేహితురాలితో కలిసి మీటింగ్ పూర్తిచేసుకుని, వెనక్కు వచ్చేదారిలో బోల్డన్ని కబుర్లూ చెప్పుకుంటూ, ఇద్దరమూ ఒకరినొకరిలో ఇంచుమించుగా చూసుకొంటూ, తబ్బిబ్బవుతూ, దారిలో ఒకచోట ఆగి పున్నాగ పూలు ఏరుకుని వాళ్ళ ఇంటిదాకా వచ్చాము. అదే ఉత్సాహంతో తను కారునుంచి ఒక్క గంతున ఇంట్లోకి, తరవాత చెంగున పెరట్లోకి దూకింది, నన్ను పిలుస్తూ! తన వెనుకే ‘ఏమిటా’ అని వెళ్లి అక్కడ నేలరాలిన పారిజాతాలను చూసి నేను ఆశ్చర్యపోతుంటే, తను ఆర్ద్రంగా నా చేతినిండా ఏరినపూలు పోసి ఇచ్చింది. అప్పటికే మూగబోయిన నాకు లోపలికి పిలిచి “ పెద్దప్రపంచం లో చిన్న పిల్లడు(వి. పనోవ)” నాచేతిలో పెట్టి సాగనంపితే……, ఏం చెప్పాలి!

2013-11-19 23.18.48

 

ఇదిగో, ఈ నెలన్నారా ఆ పుస్తకాన్ని చదివి ప్రతి వాక్యమూ ఆస్వాదిస్తూ ఇష్టంగా రాయాలకున్న కోరిక ఇప్పటికి తీరింది! పుస్తకం గురించి చెప్పాలంటే వెనుక అట్టతో మొదలుపెడతాను. అందులో ఇలా ఉంది:

“సెర్యోషకి ఆరేళ్లోస్తాయి. నాన్న యుద్ధంలో మరణించాడు. అమ్మ ఉంది, పాషా అత్తయ్య ఉంది, ల్యుకానిచ్ మావయ్య ఉన్నాడు. మరి సెర్యోషకి తను చుసుకొవలసినవీ, తను అనుభవించవలసినవీ ఎన్నో ఉన్నాయి- ఏమంటే తన జీవితంలో ప్రతిరొజూ ఏదో ఒక అద్భుతం జరుగుతూనే ఉంటుంది.
మరి, ఇప్పుడేమో, తన జీవితంలోకెల్లా అతి ముఖ్యమైన విషయం జరిగింది- తనకి మారు తండ్రి వచ్చాడు. ఈ పిల్లడికీ వాడి రెండవ తండ్రికీ ఉన్న సంబంధాల గురిచి ఈ పుస్తకం మనకి చెబుతుంది. “
************

ఇంతేనా?
ఈ పుస్తకం మనకు ఇంకా చాలా విషయాలు చెబుతుంది. అనుభూతిని పొందడం, స్పందించడం అనే మాటలు తెలుసుకోవాలంటే ఇది చదివాక మన మనస్ధితిని అర్థం చేసుకోగలిగితే చాలు.

సెర్యోష! మన పెద్దప్రపంచంలో చిన్న పిల్లడు! తన ఊరూ, ఇల్లూ, స్నేహితులూ, ఇరుగు పొరుగు…అవేగాకుండా తను గమనించవలసిన విషయాలు ఎన్నో…వీటితోనే తను అలిసిపోతుంటే ఇప్పుడింటిలో కొత్తనాన్న రాక… ఇదివరకు కుటుంబానికి మిత్రుడు, ఇప్పుడు కొత్తనాన్నగా మారిన కొరొస్తల్యేవ్ వచ్చాక సెర్యోష మామూలుగా అడుగుతాడు. “నన్ను బెల్టుతో చెమ్డాలెక్కగొడ్టావా?” కొరొస్తల్యేవ్ ఆశ్చర్యపోతూనే చెప్తాడు, “మనం ఒక ఒప్పందం చేసుకుందాం. మన మధ్య బెల్టు వ్యవహారం ఎప్పటికి వొద్దు,” అని. సైకిలు కొనివ్వడం తో సెర్యోష అభిమానాన్ని సంపాదిస్తాడు కొరొస్తల్యేవ్. అంతేనా? కాదు, తనకెంతో ముఖ్యమైన తన బొమ్మలను, కొరొస్తల్యేవ్ బీరువా జరిపి ఇవ్వడంతోనే అతని బలానికి సెర్యోషకు తెలియని ఆరాధన కలుగుతుంది. చిన్నపిల్లలు ఎన్ని చిన్నవిషయాలు గమనిస్తారో! ‘అంత బీరువా ఎత్తగలిగిన మనిషి తనని ఎత్తలేడా’, అనే భరోసాతో రెండో రోజే సెర్యోష కొరొస్తల్యేవ్ భుజం మీద ఎక్కి గర్వంగా తిరుగుతాడు.

మొదటి పావువంతు పుస్తకం చదవగానే కొరొస్తల్యేవ్ కి సెర్యోష మీద ఉన్న గౌరవం అర్థమవుతుంది. నిజానికి ఈ పుస్తకంలో సెర్యోషతో పాటు కొరొస్తల్యేవ్ కూడా నాయకుడే.. కొరొస్తల్యేవ్ ఎప్పుడూ సెర్యోషని చిన్నపిల్లాడిలా చూసినట్లనిపించడు. అంతెందుకు కొరొస్తల్యేవ్ భోజనాల సమయంలో అందరితో పాటు సేర్యోషకు కూడా వైన్ అందించడంవంటి గౌరవాన్ని మరి ఎవరూ సేర్యోషకు అప్పటిదాకా ఇవ్వలేదు!!

అసలు ఈ పుస్తకం ఒక రకంగా ,“a book on parenting” అనవచ్చు. నిజమే, ఇది ఒక సుతిమెత్తని భావనను మిగిల్చే పుస్తకం మాత్రమే కాదు, తెలియకుండానే పేరెంటింగ్ టెక్నిక్స్ నేర్పే పుస్తకం కూడా. సెర్యోష ప్రకారం పెద్దవాళ్ళు చాలా అనవసరపు మాట్లాడుతారు- ‘ఎందుకు పాడుచేసావు’ లాంటి మాటలన్న మాట! వస్తువులు పాడుచేసినందుకు పిల్లలేమీ సంతోషించరు, ఇంకా సిగ్గుపడుతారు. అయినా ఈ పెద్దవారెందుకు ఆ విషయం గుర్తించకుండా అనవసరంగా మాట్లాడతారు? అదే వాళ్ళు పాడుచేస్తే ఎవరూ ఏమి మాట్లాడరు, అదేదో సరైనపనే జరిగినట్లు! ఇంకో విషయం- ‘దయచేసి(please)’ అన్నమాట వాడడం. ‘ఏదన్నా కావాలంటే దయచేసి అన్న మాట జత చేస్తే ఇస్తాను,’ అంటుంది, సెర్యోష అమ్మ. ‘మరైతే, ఏదైనా ఇయ్యి’ అని అడిగినప్పుడు, ‘నాకది కావాలని నీకు అర్ధం కాదా?’ అని అడుగుతాడు సెర్యోష. ‘దయచేసి అని అడగడం వల్ల ఇచ్చేవారు సంతోషంగా ఇస్తారని’ వివరిస్తుంది అమ్మ. అంటే ‘దయచేసి అని అడగకపొతే సంతోషం లేకుండా ఇస్తావా’, అనడుగుతాడు సెర్యోష. అమ్మ అప్పుడు, “అసలు ఇవ్వనే ఇవ్వను”, అని చెప్తుంది. “సరే అలాగే అంటాను” అనుకుంటాడు సెర్యోష. కాని కొరొస్తల్యేవ్ పెద్దవాళ్ళలాగా ఇలాంటి ‘ఉత్తుత్తి మాటలు’ పట్టించుకోడు. అంతేగాకుండా తను ఆడుకుంటున్నప్పుడు ల్యుకానిచ్ మావయ్య లాగా అనవసరంగా పిలిచి తనని ముద్దుచేసి చిరాకు పెట్టడు!

పేత్యమామ వచ్చి చాక్లట్ అని చెప్పి ఖాళీ కాగితం చుట్టిన ఉండను సెర్యోషకిస్తాడు. సెర్యోష మర్యాదగా దాన్ని అందుకొని మోసాన్ని గ్రహించి సిగ్గుపడితే, పేత్యమామ పగలబడి నవ్వుతాడు. సెర్యోష అసహనంతో ‘ పేత్యమామా, నీకు బుద్దిలేదా?’ అని నిర్మొహమాటంగా అడుగుతాడు. ఆ మాటలకు అమ్మ అదిరిపడి, సేర్యోషను మందలించి, క్షమాపణ అడగనందుకు శిక్షిస్తుంది. సెర్యోష ఆత్మాభిమానంతో ఏమి బదులు చెప్పడు. అతనికి తన తల్లి మీద కూడా కోపం వస్తుంది. తనను మోసం చేసిన పేత్యమామతో అమ్మ ఇంకా ఎలా కబుర్లూ చెప్తుంది? అని. సాయంత్రం సెర్యోష లేడనుకుని జరిగే చర్చలో కోరోస్తల్యేవ్ సెర్యోష మాటలను ‘న్యాయమైన విమర్శ’ అంటాడు. ‘ బుద్ధిలేనివాడిని బుద్ధిలేని వాడని అన్నందుకు ఏ బోధనాశాస్త్రం ప్రకారము శిక్షించకూడదు.’ ఈ మాటలకు అర్థం సెర్యోషకు తెలియక పోయినా కోరోస్తల్యేవ్ తన తరఫునే మాట్లాడాడని మనసులో కృతఙ్ఞతలు చెప్పుకుంటాడు.

సెర్యోషకు కొరొస్తల్యేవ్ మీద పూర్తినమ్మకం ఏర్పడినందుకు గీటురాయిగా, సెర్యోష తనకు ఈ బ్రహ్మాండవిశ్వంలో భూమికాక ఇతర గ్రహాలతోబాటు భూమివంటి మరో గ్రహం ఉంటే, అందులో సెర్యోషవంటి మరో కుర్రవాడి ఉనికిని గురించి వచ్చిన అద్భుతమైన ఊహ ఒక్క కొరొస్తల్యేవ్ కు మాత్రమే చెబుతాడు. అవును మరి, సెర్యోష ప్రకారం అటువంటివి పంచుకోవడానికి ఒక్క కొరొస్తల్యేవ్ మాత్రమే అర్హత ఉంది!

సేర్యోషకు తమ్ముడు పుట్టినప్పుడు, కొరొస్తల్యేవ్ మాటల ప్రకారం తన తమ్ముడిని బాగా చూసుకోవలనుకున్నాడు సెర్యోష. కానీ అదేంటదీ, ఇంత చిన్నగా ఉండే తమ్ముడిని అమ్మే సరిగ్గా ఎత్తుకోలేకపోతోంది! పైగా ఆ పిల్లాడి వ్యవహారం కూడా నచ్చలేదు సెర్యోష. కాస్త పాలకోసం ఏడ్చి గొడవచేసి, పాలుతాగిన వెంటనే చప్పున నిద్రపోయే తమ్ముడిని చూసి, “ఏం పిల్లాడమ్మా” అని అలసటగా అనుకుంటాడు సెర్యోష. కానీ కొరొస్తల్యేవ్ సర్దిచెప్పగానే కుదుటపడతాడు. అమ్మ తమ్ముడితో ఎప్పుడు పనిలో ఉంటుంది కాబట్టి ఇప్పుడు కొరొస్తల్యేవ్ వీలు చిక్కినప్పుడల్లా- అంటే బట్టలు మార్చుకునే సమయాల్లో, నిద్రపోయేముందు కథలు చెప్తాడు సెర్యోషకి. కాని కొరొస్తల్యేవ్ కు పూర్తిగా తీరిక అంట తేలిగ్గా ఎప్పుడూ చిక్కదు. అతను చాలా ముఖ్యమైన మనిషి- అతను లేకపొతే పనివాళ్ళకు జీతలుండవు, కావాలనుకుంటే వాళ్ళను ఉద్యోగాలనుండి తీసివేయగలడు. కొరొస్తల్యేవ్ ను అందరికీ అధికారిగా నియమించారంటే అర్థం, అతను అందరికన్నా మంచివాడు, గొప్పవాడు అని సెర్యోష గ్రహిస్తాడు.

కానీ కాలం ఎప్పుడు ఒకేలాగా ఉండదు. జీవితాన్ని ఇంతగా అర్థం చేసుకుంటున్న క్రమంలో సెర్యోషకు విపరీతమైన అనారోగ్యం. ఒక జబ్బు తగ్గగానే మళ్ళి ఇంకొకటి. సెర్యోష కుదుటపడుతుండగా అదే సమయంలో కొరొస్తల్యేవ్ కు బదిలీ అయింది. సేర్యోష ఆరోగ్య పరిస్ధితుల దృష్ట్యా అతనిని కొంతకాలం వారు కదల్చలేని పరిస్ధితి. కాని సెర్యోష వేదన చెప్పనలవి కాదు. అమ్మ, కొరొస్తల్యేవ్, ల్యోన్య వెళ్ళిపోతుండగా తనను మాత్రం వదిలి వెళ్ళడం దుర్భరంగా ఉంది సేర్యోషకు. ఒక రోజు సెర్యోష బాధను చూసి కొరొస్తల్యేవ్ బయటకు తీసుకువెళ్తాడు. కొరొస్తల్యేవ్ ఎంతో ముద్దుగా మంచిగా మాటలు చెప్పి, సేర్యోషను వదిలి వెళ్ళడం తనకు కూడా ఇష్టం లేదు అనే విషయాన్ని వివరించాడు. దాని వల్ల రవ్వంత శాంతి కలిగినా సెర్యోష పూర్తిగా సమాధనపడలేదు. ఇదివరకు అమ్మ తనని వదిలి స్కూల్ లో పనికి వెళ్ళింది. కాని అప్పుడు అమ్మ ఒకతే- పైగా అప్పుడు తానింకా చిన్నవాడు, తనకు తెలియలేదు. ఇప్పుడు అలా కాదు. కొరొస్తల్యేవ్ కూడా వెళ్ళిపోతున్నాడు. అన్నింటికన్నా ఘోరం, ల్యోన్యను తీసుకెడుతున్నారు, తనను వదిలేసి! ఆ రాత్రి, చిట్టడివిలో సెర్యోష తో కొరొస్తల్యేవ్ చెప్పిన మాటలు విన్నా సమాధానపడని సెర్యోష గురించి రచయిత ఇలా అంటారు. :

“సెర్యోషకి తన మనసులో ఇలా జవాబు చెప్పాలనిపించింది. ఎంత ఆలోచించిన సరే, ఎంత ఏడ్చినా సరే, ఏమి ప్రయోజనం లేదు, మీరు పెద్దవాళ్ళు, మీరు అన్నీ చేయగలరు. ఇది చెయ్యవచ్చని, ఇది చెయ్యకూడదనీ మీరే అన్నీ శాసిస్తారు; కానుకలిచ్చేవారు మీరే; దండిచేవారూ మీరే; మరి నన్ను ఉంచేస్తామని మీరు అన్నారూ అంటే, నేను ఉండిపోవాల్సిందే, నేను ఏమన్నా, ఏం చేసినా కార్యం ఉండదు. తన మనసులో ఉన్నది చెప్పగలిగే సామర్ధ్యం ఉండి ఉంటే ఇలా అని సెర్యోష జవాబు చెప్పి ఉండేవాడు.”
ఇంత వేదనను అనుభవించిన సెర్యోష కథ చివరికి ఊహించని మలుపు తిరిగి చదివినవారి హృదయాన్ని చాలా సున్నితంగా తాకుతుంది. ఒకవేళ ఎవరైనా ఈ పుస్తకాన్ని చదివి చివరలో కంటతడి పెట్టకుండా ఉన్నట్లయితే వారిని ఇక పుస్తకపఠనం ఆపేయమని శాపం ఇవ్వొచ్చు.

ఇంతేనా ఉన్నదీ నవలలో..కానేకాదు…కథకు మించిన పాత్రలు- పెద్దరికాన్ని చూపే వాస్య, కష్టాలు పడిన జేన్య, కుళ్లుబోతు లీద, పెద్దవాళ్ళ నీచబుద్ధికి ప్రతీక జేన్య పెద్దమ్మ, జైలు నుంచి విడుదలైవచ్చి సెర్యోష ఇంటి ఆతిధ్యాన్ని అందుకున్న అనుకోని అతిధి(ఇక్కడ సెర్యోష గమనించిన విషయాలని ఎప్పటికీ గుర్తుంచుకోవాలి), వాస్య మావయ్య, ఆయన పచ్చబొట్లు, పచ్చబొట్ల కోసం పిల్లల తిప్పలు- ఇలా ఎన్నో పాత్రలతో తియ్యని సన్నివేశాలతో మధురంగా గడిచిపోతుందీ నవల.

*****************
ఇంకొకటి! ఎవరికైనా నేను ఈ పుస్తకం గురించి నేను న్యాయంగా రాయలేదు అనిపిస్తే దయచేసి బాధపడకండి. ఎందుకంటే, మీరనుకున్నది నిజమే కావొచ్చు! ఈ పుస్తకమే అంత అందమైంది! దీని గురించి నేను రాస్తానన్నప్పుడు, ఒక అమ్మాయి రాయోద్దనికుడా బ్రతిమాలింది. ఆమెకి భయం- అలా రాసి ఈ పుస్తకం లో అందమైన అనుభూతిని అందరికీ దగ్గరగాకుండా చేస్తానేమో అని. ఆమె బాధ చాలా న్యాయంగా అనిపించడమే కాదు, అలా బాధపడడం వల్ల ఆమె మీద ప్రేమ కూడా కలిగింది.
ఒక చిన్న నవలలా కనిపించే ఇంత చక్కని కథ రాసింది వి. పనోవ. పుస్తకం అట్ట వెనుక రాసినట్లు ‘ఈమె పేరు విదేశీయ పాఠకులకు సుపరిచితమే. ఆమెకు మూడుసార్లు రష్యన్ ప్రభుత్వ బహుమానం లభించింది. వేరా పనోవ నాలుగు పెద్ద నవలలని, ఐదునాటకాల్ని, ఎన్నో నవలికల్ని రాసింది. అన్నీ ప్రజాదరణ పొందాయి. వీటిలో అనేకం వెండితెర పై ప్రదర్శితమయాయి.’

ఈ రచయిత్రి రాసిన అత్యంత కవితాత్మకమైన కృతులలో ఒకటి- “పెద్ద ప్రపంచంలో చిన్నపిల్లడు.” దీని అనువాదం ఉప్పల లక్ష్మణరావు గారు చేసారు. ‘రాదుగ పబ్లికేషన్స్’ వారు ప్రచురించిన ఈ నవల మొదటి ముద్రణ 1968లో, రెండవ ముద్రణ 1987 లో అయింది. ప్రస్తుతానికి కాపీలు అందుబాటులో లేవు. మీరు నిజంగా చదవాలనుకుంటే మీకు తెలిసిన, పుస్తకాల పిచ్చి ముదిరిన మిత్రుల దగ్గర ఖచ్చితంగా దొరకొచ్చు – ముందు లేదని దబాయించినా కాళ్ళు పట్టుకొంటే మెత్తబడో, మొహమాటపడో ఒకసారి చదవడానికి ఇవ్వొచ్చు!

విజయీభవ!

 – అపర్ణ తోట

aparna

ఒక రోజా కోసం…

 oka roja kosam -2 (2)

సాధారణంగా తల్లిదండ్రులు – అందులో అత్యంత వైభవోపేతమైన జీవితం గడిపేవాళ్ళు – తమ పిల్లలు ఇంకా ఉన్నత వర్గానికి ఎదగాలని, సమాజంలో పేరు ప్రఖ్యాతులు పొందాలని, తమ కంటే విలాసవంతమైన జీవితం గడపాలని కోరుకుంటారు.  కాని సెర్దర్ ఓజ్కాన్ ‘ఒక రోజా కోసం’ నవల లోని తల్లి తన కూతురు  అంతరాంతరాల్లో ఉండే ‘నేను’  ని కనుగొనాలని కోరుకుంటుంది.

ఈమె చాలా చిన్న వయసులోనే భర్తను పోగుట్టుకుంటుంది.   ఎంతో ఆత్మవిశ్వాసంతో, ఎరుకతో బ్రతికే ఈమె ఇతరుల కళ్ళల్లో ఆరాధనని చూడటం కోసం తన కలని కూడా విస్మరిస్తున్న కూతురు డయానాని చూసి బాధపడుతుంది.  ఇతరుల కోసం కాక తనకై తాను స్వేచ్ఛగా   బ్రతకడానికి అడ్డుపడుతున్న అహాన్ని డయానా తొలగించుకోవాలని, తాను ప్రవేశించిన ఆనందపు తోటలోని గులాబీలతో మాట్లాడుతూ తన కూతురూ తిరుగాడాలని, కూతురు తన లోలోపలి పరిమళాన్ని ఇతరుల కోసం కోల్పోకూడదని కోరుకుంటుంది.

డయానాకి రచయిత్రి అవాలనే కల బలంగా ఉంది కాని మంచి రచయిత్రి కాకపోతే సమాజం నుండి నిరసన ఎదురవుతుందేమోనన్న భయంతో,  ,తను సమాజంలో గొప్పగానే ఉండాలన్న అహంతో తన కలను చంపుకుని లాయరు అవాలనుకుంటుంది.   చుట్టూ తిరిగే  స్నేహితుల మెప్పుదల కోసం బ్రతుకుతున్న కూతురు డయానాని  వ్యక్తిత్వం కలిగిన బిడ్డగా మార్చుకోవాలని ప్రయత్నిస్తుంది తల్లి.  అయితే తన బిడ్డకి నెమ్మదిగా తెలియచెప్పడానికి ఆమెకి భగవంతుడు సమయం ఇవ్వలేదు.  మరో ఐదు నెలల్లో ఆమె చనిపోతుందని డాక్టర్లు  చెప్పడంతో తను చనిపోయిన తర్వాతైనా సరే డయానాలో మార్పు రావాలని పటిష్టమైన పథకం తయారు చేసుకుంటుంది ఆ తల్లి.  తన బిడ్డను విచార మార్గంలో పయనింప చేయడానికి చనిపోయిన భర్త బ్రతికి ఉన్నాడని అంటుంది.  లేని మరో కూతురిని (మేరీ) సృష్టిస్తుంది.  మేరీ రాసినట్లు ఉత్తరాలు రాసింది.  తన స్నేహితురాలైన జైనప్ హనీమ్ అనే తాత్త్వికురాలిని తన బిడ్డని దివ్యత్వానికి దగ్గరగా వచ్చేట్లు చేయమని కోరింది.  ఆఖరికి బిచ్చగాడి సహాయాన్ని కూడా అర్థిస్తుంది.

చనిపోయేముందు రోజు తనకి మరో కూతురు ఉందని, తన భర్త తన నుంచి విడిపోతూ ఆ కూతురిని తీసుకువెళ్లాడని, ఇప్పుడు మేరీ  ఇంటి నుండి ఎక్కడికో వెళ్లిపోయిందని డయానాకి చెప్తుంది.  మేరీ రాసినట్లుగా తనే రాసిన ఉత్తరాలను డయానాకిచ్చి ఆ ఉత్తరాల ఆధారంతో మేరీని అన్వేషించమని ఆఖరి కోరికగా కోరుతుంది. ఆ అన్వేషణా మార్గంలో తన స్నేహితురాలు, తాత్త్వికురాలు అయిన జైనప్ హనీమ్ ని కలుసుకునేట్లు చేస్తుంది.

తన కవలసోదరిని వెతుకుతానని తల్లికిచ్చిన మాట కోసం ఇల్లు వదిలి జైనప్ హనీమ్ ని కలుసుకుంటుంది డయానా.  అక్కడ – జైనప్ హనీమ్ దగ్గర ‘తన గులాబీకి బాధ్యత వహించడం అంటే ఏమిటో తెలుసుకుంటుంది.  గులాబీలతో మాట్లాడటం, వాటి మాటలను వినడం నేర్చుకుంటుంది.  దేవుడు మన జీవితంలోని అన్ని విషయాల్లోనూ భాగస్వామి అవుతాడని తెలుసుకుంటుంది.   ప్రగతిని సాధిస్తుంది.  చివరికి నీ వరకు మిగిలిన అన్ని తోటలకంటే నీ తోట వేరేదే అయితే మిగిలిన అన్ని గులాబీలకంటే నీ గులాబి వేరేదే అయితే ఆ తేడా నీకు ఆధిక్య భావనని కాక నిన్ను భూమి మీద నిలిపి ప్రపంచమంతటినీ హత్తుకునేలా చేస్తే నీకు దివ్యత్వం లభించినట్లే బిడ్డా! ఇక నువ్వు నన్ను కోల్పోవునీ జ్ఞాపకాల వెనక ప్రతి ఒక్క దాని ద్వారా నేను నీతో మాట్లాడతానుఅని అమ్మ రాసిపెట్టిన ఉత్తరం డయానాకి దొరుకుతుంది.

అప్పుడు – ఆ క్షణంలో డయానా అంతరంతరాల్లో ఉన్న ‘నేను’ ని కనుగొంటుంది.  ముఖంలో అద్వితీయమైన మెరుపుని పొందుతుంది.

oka roja kosam -2 (1)

క్లుప్తంగా ఇదీ కథ

సెర్దర్ ఓజ్కాన్ కి జీవనయానానికి సంబంధించిన లోతైన అర్థాలు వెలికి తీసే రచనలు చేయడం ఇష్టమట.  ‘The Missing Rose’ – ‘ఒక రోజా కోసం’ ఇతని తొలి నవల.  ఈ పుస్తకం ఇప్పటికి 27 భాషల్లోకి అనువదింపబడి ఎంతో ఆదరణ పొందింది.  దీన్ని తెలుగులోకి మంచిపుస్తకం.నెట్ (సురేష్ ) వాళ్లు అనువదించి ప్రచురించారు.

  • ఇతరుల కంటే భిన్నంగా ఉండటానికి మాత్రమే విచారమార్గంలో పయనించేవారికి గర్వం తప్ప ఏమీ మిగలదు.
  • మేథోశక్తితో ఊహించడం ద్వారా అసలైనదేదో తెలుసుకోలేము.
  • హృదయం ద్వారా ప్రకృతిని వినగలిగే శక్తి పుట్టుకతో అందరికీ ఉంది కానీ ఎందుకో కాలం గడిచేకొద్దీ గుండెలు చెవిటివవుతున్నాయి.
  • శిఖరాన్ని చేరుకోవాలని ఉన్నా చేరుకోలేమోనన్న భయంతో ప్రయత్నాన్ని విరమించుకుంటాం.  పట్టు వదలకుండా చిన్న చిన్న అడుగులు వేసుకుంటూ వెళితే శిఖరాన్ని చేరుకోగలము.  మనకి శిఖరాన్ని చేరుకోవాలనే ఇచ్ఛ కలిగితే అన్ని వైపులనుండీ సహాయం అందుతుంది.
  • నువ్వు అలవి కావు ఒడ్డుని ఢీ కొని మాయమైపోతానని భయపడటానికి.  నీవు సముద్రానివి.
  • గులాబీగా ఉండటం అంటే ఇతరులు పొగిడినపుడు బ్రతికి వాళ్లు తిరస్కరిస్తే అంతరించిపోవడం కాదు.
  • ఇప్పుడు నిన్ను ఇంతగా ఆరాధిస్తున్నవారే ఏదో ఒక రోజు నిన్ను త్యజిస్తారు. ఎందుకంటే వాళ్లు ఆరాధిస్తున్నది నిజంగా నిన్ను కాదు.  వాళ్ల కోరికల్ని.  వాళ్ల పొగడ్తలలో నీ ఉనికి ఉన్నప్పుడు వాళ్లు నిన్ను త్యజించగానే నువ్వు లేకుండాపోతావు.
  • నువ్వు మోజుపడే ఆత్మ తియ్యటి మృత్యువుని చవి చూసిన తర్వాత నీకు పునర్జన్మ లభిస్తుంది  –    ఇలాంటి వాక్యాలు ఎన్నో పుస్తకం నిండా.  జీవితం పట్ల ఎంతో పరిణితి ఉంటేనే రాయగలిగిన వాక్యాలు.

మనకి నిజంగా ఇష్టమైన పని ఒకటైతే డబ్బు సంపాదన కోసమో, అధికారం కోసమో, ఎంచుకున్న రంగంలో పరిణితి సాధించలేకపోతే ఎదుర్కొనబోయే పరిస్థితులని ఊహించుకొనో ఇష్టమైన రంగాన్ని వదిలేసి సమాజ ఆమోదయోగ్యమైన రంగాన్ని ఎంచుకుంటాం.  మనల్ని అర్థం చేసుకోలేని ప్రపంచాన్ని ఒంటరిగా ఎదుర్కోవడానికి భయపడతాం.  దాని వలననే మనకి లోలోపల సంఘర్షణ, అసంతృప్తి.  తద్వారా జీవితం పొడవునా అశాంతి.

తమ బిడ్డలు ఇంజనీర్లు, డాక్టర్లు, కలెక్టర్లు కావాలనే కాంక్షతో పిల్లల మనస్సుకి నచ్చినదేమిటో తెలుసుకోలేకపోతున్న తల్లిదండ్రులు, ఇతరుల ఆరాధనతో బ్రతుకుతూ, ఇతరుల కళ్లల్లో తమని చూసుకుంటూ మరుగుజ్జులుగా మారుతున్న యువతీయువకులు తప్పకుండా చదవవలసిన పుస్తకం ఇది.

అప్పుడు కనీసం కొన్నైనా నాట్యం చేయవలసిన చేతులు గరిటను తిప్పుకుంటూ (ఇక్కడ నా ఉద్దేశం ‘వంట చేయడం మంచిది కాదు’  అని కాదు) , సంగీత కచ్చేరీలు ఇవ్వవలసిన నోళ్లు గాసిప్స్ మాట్లాడుకుంటూ ఉండవు.

మన కలని అనుసరించకపోవడానికి అడ్డుపడే అహాన్ని చంపుకుని చేరుకోవలసిన శిఖరాన్ని ఎలా చేరుకోవాలో,  శాంతిని పొందుతూ ప్రపంచాన్ని ప్రేమతో ఎలా హత్తుకోవాలో ఈ నవల ద్వారా విశదపరిచిన సెర్దర్ ఓజ్కాన్ చిరస్మరణీయుడు.

–    రాధ మండువ

 

 

 

 

 

 

 

 

నిత్య నూతనం అన్నమయ్య పాట !

కాలంతో పాటు పాత బడేవి ఉంటాయి. కాని కాలంతో పాటు నడచి వస్తూ ఎప్పుడూ సరికొత్తగా కనిపిస్తూ ఆనందాన్ని కలిగించేవి కొన్ని ఉంటాయి. సూర్యుడు ఎంత పాత వాడో ఎప్పుడూ అంత సరికొత్త వాడు కూడా. నేను ఇటీవలే ఒక మంచి పాట విన్నాను. అందులోని భావ సౌకుమార్యం, కొత్తదనం చూస్తే ఇది ఆరువందల ఏండ్ల నాడు కట్టిన పాటా, కాని ఇంత సరికొత్తగా ఉందే అని ఆనందం ఆశ్చర్యం కలిగాయి. అది అద్భుతమైన భావనా శక్తిని దాచుకున్న పాట అనిపించింది. పరమానందం కలిగింది అదీ గొప్ప గాయనీమణుల నోట వింటుంటే. ముందు పాటను ఇక్కడ చూపి దాన్ని గురించి రాస్తా.

పొద్దిక నెన్నడు వొడచునే పోయిన చెలి రాడాయెను

నిద్దుర కంటికి దోఁపదు నిమిషంబొక ఏడు                   || పొద్దిక ||

 

కన్నుల నవ్వెడి నవ్వులు, గబ్బితనంబుల మాటలు

నున్నని ఒయ్యారంబులు, నొచ్చిన చూపులును

విన్నఁదనంబుల మఱపులు, వేడుక మీరిన వలపులు

సన్నపు చెమటలు దలచిన, ఝల్లనె నా మనసు                     || పొద్దిక ||

 

ఆగిన రెప్పల నీరును, అగ్గలమగు పన్నీటను

దోగియు దోగని భావము, దోచిన పయ్యెదయు

కాగిన దేహపు సెగలును, కప్పిన పువ్వుల సొలపులు

వేగిన చెలి తాపమునకు, వెన్నెల మండెడిని                || పొద్దిక ||

 

దేవశిఖామణి తిరుమల, దేవునిఁ దలచిన బాయక

భావించిన ఈ కామిని భావము లోపలను

ఆ విభుడే తానుండిక ఆతడె తానెరుగగవలె

ఈ వెలదికి గల విరహంబేమని చెప్పుదము.               || పొద్దిక ||

 

పైన పాట నిర్మాణాన్ని చూస్తేనే ఇది అన్నమయ్య పాట అని తెలిసిపోతుంది. పైన చెప్పిన పాటలో ప్రత్యేకతని గురించి ఇందులోని నేటికీ కనిపించే కొత్తదనాన్ని గురించి చెప్పే ముందు. అన్నమయ్యపాటను గురించి నాలుగు మాటలే చెప్పాలి.

annamayya-telugu-movie1

అన్నమయ్య పాటలో రెండు పాదాల పల్లవి ఉంటుంది. మూడు చరణాలు ఉంటాయి ప్రతి చరణంలో నాలుగు పాదాలుంటాయి వాటిలో యతి మైత్రి ఉంటుంది, కాని ఎక్కడ అనే నియమం లేకుండా ఏదో ఒకచోట తప్పని సరిగా ఉంటుంది. అంతే కాదు పాదాలు నాలుగింటిలో ప్రాసనియమం ఉంటుంది. ఎంచుకున్న ఈ పాట నిర్మాణం పాడడానికి చాలా బాగా ఒదిగి పోతుంది. లయ సాధ్యం అవుతుంది. అయితే మూడు చరణాలకంటే ఎక్కువ ఉన్నవి లేదా తక్కువ ఉన్నవి ఎక్కడో ఒకటి కనిపిస్తాయి. కాని సాధారణంగా అన్నమయ్య పాటలు అత్యధికంగా ఒక పల్లవి మూడు చరణాలు పెన చెప్పిన పద్ధతిలో ఉంటాయి.

ఇది సుమారు ఆరు వందల ఏండ్ల నాడు కట్టిన పాట.  ఇక్కడ నేను రాసిన పాట అని అనలేదు. కారణం అన్నమయ్య కూర్చుని పాటలు రాయలేదు. ఆయన పాటకట్టి పాడుకుంటూ పోయాడు. తర్వాత వాటిని ఆయన కుమారులు శిష్యులు రాసారు. అంతే కాదు వాటిని రాగిరేకుల మీద చెక్కించారు. ఈ కీర్తి ఎక్కువ ఆయన మనవడికి దక్కుతుంది. అన్నమయ్య 32 వేల పాటలు కడితే నేటికి మనకు పద్నాలుగు వేలకు పైగా దొరుకుతున్నాయి. వీటిలో ఏ పాటను పట్టుకున్నా తియ్యదనం జలజలలాడుతుంది.

పై పాటలో ఒక స్త్రీ దూరంగా వెళ్ళిన చెలికాని గురించి బాధపడుతూ విరహాన్ని అనుభవించే ఘట్టాన్ని వర్ణించాడు. ఇందులో పోయిన చెలి రాడాయెను అని అన్నాడు. ఇక్కడ చెలి అనే మాటను చెలికాడు ప్రియుడు భర్త అనే అర్థంలో వాడాడు. చెలి అనగానే స్త్రీ అని అనుకుంటాము. పురుషుని కూడా చెలి అనిడం ఉందని దీన్ని బట్టి మనకు తెలుస్తుంది. అయితే ఇక్కడ స్త్రీ తన భర్త దూరంగా వెళ్ళి ఉన్నాడు అతనినే తలుస్తూ ఉంది ఈమె. ఆమె ఈ స్థితిలో ఉన్న బాధని లోతైన భావాన్ని వర్ణిస్తున్నాడు కవి.

రాత్రి సమయంలో ఉన్న ఆమెస్థితిని చెబుతూ  పొద్దిక (పొద్దు ఇక) ఎన్నడు వొ (పొ)డచునో పోయిన చెలి రాడాయెను. ఈ పొద్దు ఎప్పుడు పొడుస్తుందో రాత్రి ఎలా ఎప్పటికి గడుస్తుందో పోయిన చెలికాడు రాలేదు అన్నాడు పల్లవి లో, తర్వాత ఏ మంటాడో చూడండి. నిద్దుర కంటికి తోపదు నిమిషంబొక ఏడు. నిద్ర రావడం లేదు నిముషమే ఒక ఏడాదిగా గడుస్తూ ఉంది.

మొదటిపాదంలో  కన్నుల నవ్వెడి నవ్వులు గబ్బితనంబుల మాటలు. నవ్వులు ఆమె నోటి తో కాకుండా కన్నులతో నవ్వుతూ ఉంది అనడం అన్నమయ్య కాలంనాటికి ప్రచలితంగా కావ్య ప్రబంధ వర్ణనలలో ఎక్కడా కనిపించదు. పాటలో సరికొత్తగా కన్నులతో నవ్వడం అని చెప్పాడు. ఇది ఈనాటికీ కొత్తగా కనిపిస్తూ ఉంది. గబ్బితనంబుల మాటలు అంటే పైకి గంభీరంగా పలికే పలుకులు అని ఇక్కడి భావం. గబ్బితనం అంటే కపటపు మాటలు అనే అర్థం కూడా ఉంది వీరోచితమైన మాటలు అని కూడా ఉంది. కాని ఇక్కడ లోపలి బాధను వ్యక్తం చేయకుండా పైకి గంభీరంగా చెప్పే మాటలు అనే భావం. నున్నని ఒయ్యారంబలు నొచ్చిన చూపులను అనే పాదంలో రెండూ కొత్త భావనలే ఒయ్యారం అంటే అందం దాని హొయలు.  నున్ననిది అని చెప్పడం అంతే కాదు రెండిండిని తెలుగు పదాలను వాడడం తర్వాత చూపులు గురించి చెబుతూ నొచ్చిన చూపులు అని అనడం బాధను అంటే విరహాన్ని వ్యక్తం చేసే కళ్ళను గురించి చెప్పడం ఆనాటికి సాహిత్యంలో చాలా కొత్త భావన. తర్వాత విన్నతనంబుల మఱపులు వేడుక మీరిన వలపులు అనే పాదం గురించి స్పష్టం. దీని తర్వాతి చరణంలోని నాలుగో పాదం చూడండి సన్నపు చెమటలు దలచిన ఝల్లనె నామనసు. అన్నాడు. సన్నపు చెమటలు. అవి ధారగా కారుతున్న చెమటలు కావు. సన్నగా ఆ విరహస్థితిని చూపే చెమటలు వాటిని తలచుకుంటే మనసు ఝల్లుమందట.

తర్వాతి చరణం మరింత బాగుంటుంది. మొదటి పాదంలో ఆగిన రెప్పల నీరును అగ్గలమగు పన్నీటను దోగియు దోగని భావము, దోచిన పయ్యెదయు అని రెండుపాదాలలో ఒక భావాన్ని చెప్పాడు. కన్నీరు రెప్పల వెనుకే ఆగింది కాని చెక్కిలి మీదికి జారలేదు. చాలా అధికమైన పన్నీటిలో చల్లదనం కోసం మునిగినా అంటే దోగినా తన లోపలి విరహం ఆ పన్నీటిలో మునగలేదు అంటే ఆమె భావన  చల్లారలేదు. ఆతర్వాత చూడండి. కాగిన దేహపు సెగలు కప్పిన పువ్వుల సొలపు, దేహం కాగుతుంటే పువ్వులను కప్పారట ఇది ఆనాటి ప్రబంధ ధోరణి వర్ణనే కాని తర్వాత వేగిన చెలి తాపమునకు వెన్నల మండెడిని అన్నాడు. వెన్నెల చల్లదనాన్ని ఇవ్వకుండా వేడి సెగలు పుట్టిస్తున్నాడు అని చెప్పడం ప్రబంధాలలో ఆయన కాలానికి ఉన్నది. కాని వేగిన చెలి తాపానికే వెన్నల మండుతూ ఉంది అని చెప్పడం మరొక తీరు. ప్రత్యేకంగా కనిపిస్తూ ఉంది.

దోచిన పయ్యెద అని చెప్పడం అద్భుతం. ఆమె పయ్యెదను అంటే పైటను దోచుకున్నాడట. ఇక్కడ దోచుకున్నది పైటను కాదు మరేదో అని  ఎంత సున్నితంగా శృంగారాన్ని వర్ణించడో గమనించవచ్చు. ఇప్పటికి ఎంత మంది చేస్తున్నారు ఇలా. అదృష్టవంతులు అనే సినిమాలో చింతచెట్టు చిగురు చూడు అనే పాటలో ఒక సినిమా కవి (ఆత్రేయ) పాలవయసు పొందు కోరి పొంగుతున్నది, నా పైట కూడ వాడి పేరే పలవరిస్తది. అని చరణంలో రాసాడు. వింటే వాహ్ ఎంత అద్భుతంగా చెప్పాడు అని అనిపిస్తుంది. ఇక్కడ అన్నమయ్య పాట కూడా దోచిన పయ్యెద అని అనగానే వాహ్ ఎంత అద్భుతం అని అనిపిస్తుంది.

ఇక చివరి చరణంలో అన్నమయ్య తన ముద్రను వేంకటేశ్వరుని పేరిట ఏదో ఒక తీరులో వేస్తాడు. దాన్ని దేవశిఖామణి తిరుమల దేవుని తలచిన బాయక, భావించిన ఈ కామిని భావము లోపలను ఆవిభుడే తానుండి అతడే తనను  గురించి తెలుసుకోవాలని అని అనడమే కాకుండా ఈ వెలదికి కమ్మిన ఈ మాయను ఏమని చెప్పాలి అని అంటాడు.

ఇక్కడ ఏ స్త్రీవిరహాన్ని గురించీ అన్నమయ్య వర్ణించలేదు. ఇక్కడ కవే స్వయంగా ఆ స్త్రీ అన్నమయ్య వేంకటేశ్వరుని పరమ పురుషుడుగా తన నాథుడుగా భావించడం ఆ విరహంలో (భక్తికి చెందిన విరహం)  తనను తాను ఒక స్త్రీగా భావించి వర్ణించడం ఉంది. భగవంతుడే పురుషుడు అని తమను తాము భగవద్విరహంలో ఉన్న స్త్రీ అని చెప్పుకోవడం భక్త కవులు అన్నమయ్యలా చెప్పినవారు ఇంకా ఉన్నారు. ఈయన కూడా ఇంకా వేరే పాటల్లో చెప్పడం ఉంది. కాని ఈపాటలో చేసిన వ్యక్తీకరణలు తెలుగు పదాల సొంపు సరికొత్త సమాసచాలనం గమనిస్తే దీనిలో ఈనాటికీ నిలిచిన కొత్త దనం కనిపిస్తుంది.

ఈ నాటి వచన కవులు భావించేలా అతి నవ్యమైన తాజాగా ఉండే భావనలు ఈ పాటలో ఉన్నాయి. కన్నులతో నవ్వే నవ్వులు, నున్నని ఒయ్యారాలు, విన్నతనంబుల మరపులు, సన్నని చెమటలు, ఆగిన రెప్పల నీరు, దోచిన పయ్యెద అని చెప్పడం అన్నీ కూడా వాహ్ వాహ్ అనే అద్భుతమైనవే కాదు, ఆనాటికి లేనివి తాజావి. తర్వాత ఈనాటికి ఇలాంటివి సరికొత్త సృజనకు ప్రతీకలుగా ప్రతిభావంతంగా కనిపించిడం ఈ పాటలోని విశేషం. ఇటీవల హైదరాబాదులోని ఒక సంగీత కార్యక్రమంలో ప్రియ సోదరీమణలు (ప్రియసిస్టర్స్ అని పిలిచే హరిప్రియ షణ్ముఖ ప్రియలు) ఈ పాటని పాడారు. పాటలోని విరహాన్ని అత్యంత మధురంగా పాడి కొన్ని వందలమందిని మంత్రముగ్ధుల్ని చేశారు. విన్నవారికి ఆ పరవశంలోనుండి బయటికి రావడానికి చాలా సేపు పట్టింది. ఆరువందల ఏండ్లనాడు కట్టిన అచ్చతెలుగు పాటకి మాటకి ఇంత శక్తి ఇంత కొత్త దనం ఉందా అని ఆశ్చర్యపోవడం, దాని ఫలితమే ఈ వ్యాసం.

పులికొండ సుబ్బాచారి

చిత్రరచన: బాపు (తాడేపల్లి  పతంజలి గారి పుస్తకానికి వేసిన బొమ్మ)

చెప్పులో ముల్లులాంటి భాషలో…!

 

 maakuOkaBhashaKaavaaliByWilsonSudhakar

(గత వారం తరువాయి)

నిర్భయ మరణంతో చలించి ఒకేసారి ‘గుడ్‌బై ఇండియా’ వీడ్కోలు నిర్వేదం. ఈ దేశంలో స్త్రీలపై జరిగే దాడులనీ, వేదనలనీ, రోదనలనీ సాహిత్య రూపంగానో లేకపోతే మంచి కళాకారుడి చేతిలో బొమ్మగా మారటం అంత తేలిక కాదు. ఘర్షణలన్నీ గొప్ప కథలుగా కొంతలో కొంత మలచగలుగుతున్నారు. అంటే ఇక్కడ కథలే గొప్ప అని కాదు. అవన్నీ కవిత్వంగా మలచటం అదీ ఒక పరిపక్వమయిన కవిత్వంగా మలచటం లేదా సాహిత్యంగా మారటం చాలా తక్కువగానే జరుగుతుంది. నిర్భయపై చూడండి..

‘నువ్వు బతికొస్తే ఒక్క తల్లి కొడుకయినా

మానవ పునరుజ్జీవన మహోత్సవ పెళ్లి

పీటల వయిపు నీతో నడుస్తాడా

అమ్మల ఆదర్శ స్వరాల హార్మోనియం వినిపిస్తుందా?”

నిజంగా నిర్భయ బతికి ఉంటే ఈ మొదటి లైన్లకి పులకించిపోయేదేమో. పునరుజ్జీవన మహోత్సవ పెళ్లి .. ఎంత అద్భుతమయిన ఊహాదృశ్యం. ఎంతో పొంగిపోయే లోపల కఠోర, కర్కశ నిజాన్ని , సత్యాన్ని పీటలపయిన నడిచే మగపురుగులు ఉండరా?  అమ్మల ఆదర్శ స్వరాలు వినిపిస్తయా?. అని బాధితురాలు తరఫున మన మనస్సులోకి దూరి, నిలేసి మేకులు దిగ్గొడతారు. నిజంగా జాతి సిగ్గుతో ముడుచుకుపోవలసిన క్షణాలు.

ఆదివారం సెలవురోజంత అందంగా చెబుతా. మళ్లీ  వచ్చే సోమవారాన్ని కళ్లలో కారం కొడతాడు. బతుకు పందెంలో ఉరుకు పరుగులు, చింతలు – వంతలు, వంకరలు, తిరకాసులు, ఎంచక్కా నాయితే సెలవొచ్చింది. మా పిల్లలకి టీవీలో సినిమా ఒచ్చింది. మా అవిడ వంటగదిలో కెల్లాల్సి వచ్చింది. ఆడవాళ్లకి కావలసిన విశ్రాంతి, సెలవ గురించి బద్ధకంగా తీరిగ్గా కూచ్చుని కోడికాలు తిన్నత బాగుంది.

‘గుహని మార్చినంత మాత్రాన

పులిని సింహంగా మారవలేమనీ తెలుసు’

ఆమె మతం కూడా ఏమాత్రం ఉద్ధరించదని, ఇవాంజెలికల్ చర్చి పరంపరలో ఉన్న రాజకీయాల కుళ్ళుని , అందులో దూరే సవర్ణులని, ఓ.సి., క్రీస్తు భక్తులని మీకేం పని, మీవల్లనే మేము జాన్ పుల్లయలం, ఫ్రాన్సిస్ చల్లయలం అవుతున్నాం అని అటు ఆళ్లు, ఇటు ఈళ్లు ఎవరూ మమ్మల్ని కలుపుకోరని సమాజంపయిన, సవర్ణ బోధ  గురువులపైనా, ఆ సమాజంపైనా నిరసన జెండా ఎగరేశాడు.

నిన్నటిదాకా రూపాయి చూడని మనం ఏదో ఇవాళ కొద్దిగా పచ్చకాయితాలతో అన్నం తింటంటే, పేరులో రైస్ ఉంది కదా అని భూమి మీద పండే ప్రతి బియ్యం గింజా నేను చెబితేనే తినాలనీ, మా అనుమతి లేకపోతే ఆకలితో చావనయినా చావాలిగాని మాకు ఇష్టం ఉంటేనే ఏ దేశానికయినా కూడెడ్తాం లేదా సముద్రంలో పారబోసుకుంటాం. ఇంక ఎక్కువ మాట్టాడితే ఇరాక్‌లాగా  మసి చేసి నేలమట్టం చేయగలం. ఇంకా ఎక్కువయితే మేం సముద్రంలో అన్నీ దొల్లిచ్చుకుంటాం అనే కండకావరపు అమెరికాని ఎత్తి చూపిచ్చే రొట్టెల తనిఖీ. వీళ్లు పిజ్జాలు, బర్గర్‌లు, కోక్‌లు ఎన్నయినా తినొచ్చు, పీకలదాకా పీలవొచ్చు. మనం మన మాంసం, చేపలు, గుడ్లు ఆడికి ఎగుమతి చెయ్యకుండా తింటే ద్రవ్యోల్బణం పెరుగుతుందనే ‘యాంకీ’బాబు ఒంకర బుష్‌గారి పళ్లు పీకాడు. బడుగులపై బలవంతుడిలాగా, పేద దేశాలమీదేగా అమెరికా ప్రతాపం. మొక్కుబడుల పేరుతో తిరిగి మొలిచే జుట్టుని ఎన్నిసార్లయినా గుండు కొట్టించుకుంటాం. అదే ఏలో, కాలో ఇవ్వాల్సి వత్తే ఇత్తామా? ఇదీ అంతే. మనం  ఇప్పటికే రెండుపూటలా బ్రేవ్‌మని ఏడిసిందెక్కడ?. ఆయనకి తెలుగురాదుగా ఈ విషయాలన్నీ ఎవరు చెబుతారు.

ఒకరోజు  నేనూ  నా స్నేహితుడూ మాట్లాడుకుంటూ పిట్ట పోరు, పిట్ట పోరు పిల్లి తీర్చిందనే కథ చెప్పుకున్నాం. ఇంత పెద్ద మంద ఉండి ఈ A B, C, D ల పేరుతో ఎదురు పడితే అనాధల్లాగా నొసలు ముడేసుకుని, కళ్ళతో అదేదో కక్కుకుంటున్నారు. ఆప్యాయంగా అందరూ పాలు నీళ్లయితే అధికారపు హంసలకి ఆహారం అందదు కదా. ఎన్నాళ్ళీ Kingmakers బతుకు. మా ఊరిలో మా దగ్గిరలో ఉండే అందగత్తెలు, ఒద్దికయిన వాళ్లు, మానవత్వపు మహిళలు ఇద్దరు, కాళావు, మాంకాళి.  ఆళ్ళు ఏది మాట్టాడినా ఎంత బాగున్నా లేక అలంకరించుకున్నా ఆళ్లని సంబోధించటమే వేరు. లంజ, లంజముండ, లంజలభాష, లంజకొడుకులు, ఒసివి చేస్టలు అనే భాషఘోష నాకు తిరిగి తిరిగి తగులుతున్నది. నా మిత్రుడు, మా పక్క ఊరివాడు ‘విజయవాణి'(కన్నడ పత్రిక) సంపాదకుడు పంపన గౌడ మాటల్లో “ఎంతో అభివృద్ధి చెందాం అనుకుంటాం బుజ్జమ్మా, నువ్వు రచయిత్రివయ్యావు. నేను రిపోర్టర్నయ్యాను. కానీ మన ఊళ్లో రెండూ జాంబుల (గ్లాసుల)పద్ధతిని మార్చలేకపోయాం. చీ! ఏం బతుకులు” అని ఇప్పటికీ సిగ్గుపడతాం. వైద్యుడిగా మా నాన్న ఈ డిస్పోజల్స్ రాకముందు  గాజు సిరంజితో మా దగ్గెరి వాళ్ళకి జరం వచ్చినపుడు సూది మందేత్తే మూడూర్లు మా నాన్న వైద్యాన్ని బహిష్కరించారు. కానీ మా నాన్న అంతకన్నా మొండోడు. వాళ్లు వచ్చినా వైద్యం చెయ్యనని వాళ్లనే బహిష్కరించిన రోజులున్నాయి. మా ఊరి ‘మాంకాళి’ బ్యాడరు కులానికి చెందిన ‘వీరభద్రి’ అనే దర్జీని ప్రేమించినందుకు ఊరూరూ ఆమెని చంపాలంటే, రండిరా చూసుకుందాం అని మా ఇంట్లోనే ఆరునెలలు దాచాడు. ఈ అడ్డనామాల దురాగతాలు ఒకటా? రెండా? సమస్‌కృతం కలిసిందా భాషంటే, మరి పామరుడిదీ,  శ్రమజీవులదీ, చేనుదీ,  చెమట చుక్కదీ, కొట్టంలో నించీ కొట్టే మురికిప్యాటల్ది,  పశువుల పాలకులదీ, సోమరులదీ, సూటుబూటు బొఱ్ఱల బాబులది కాదు.

భాషంటే జాతరది, చర్చిది. సంస్కృతి మన ఒక్కళ్ళదేనా? సృష్టి కన్నా ముందే సంస్కృతి పుట్టిందా? మా ఊరి బుడకజంగాల నడిగితే  విద్య అంటే తెలివే ముందు. గురువే తరవాత. మూర్ఖుడు మాత్రమే గురువులని ఆశ్రయించి కొలుస్తాడు అని అంటారు. మరికొన్ని వేల సంవత్సరాల క్రిందట రాయబడిన ‘పాత నిబంధన’ గ్రంధంలో భాషలు తారుమారయిన ఈ బాజెల్ నగరం కథలు చదువుకోలేదా? పెద్ద మనం డాబులు చెప్పుకునేవాళ్లమేమో. సాటివాళ్లని పశువులకన్నా హీనంగా చూస్తా పెద్ద పెద్ద రిసెర్చి స్కాలర్లు, మేధావులు ఎందుకు అసహ్యించుకుంటున్నారు? గుఱ్ఱం సీతారాములు ఎంత నలగ్గొట్టబడితే గుఱ్ఱం సీతారావణ్‌లవుతారు?

శ్రీలంకలోని నాలుగు మూలజాతులున్నవి. వెడ్డా, అహికుంటిక, రామకుళూవర్, వాగ. ఈ నాలుగింటిలో ఒక్క వెడ్డా తప్ప మిగతా మూడు జాతులు తెలుగు జాతులు. వీళ్లు సింహళం, తమిళం, తెలుగు మాట్లాడగలరు. అదీ ఇంగిలీసు కలవని తెలుగు. అంటే పల్లె తెలుగు. వెడ్డా అనే తెగ దాదాపు అంతరించిపోయే దశలో ఉంది. వెడ్డాల పేర్లు ఇలా చెప్పాడంట. బంటన్న, ఎఱ్ఱ బండన్న, నల్లమ్మ ఇట్టా ఉండి, వాళ్ల భాష మన మూల వాసుల భాషకి చాలా దగ్గరగా ఉందంటే చాలా ఆశ్చర్యపోయాం. ఇవన్నీ ఎవరు పరిశోధనలు చేత్తారు. ఎవరిగోల వాళ్లది. భాష  దళితీకరించబడినప్పుడే కదా బాధితులకి నమ్మకం కలిగేది. ఇక్కడ ఒక ఉదా:- చూడండి. వాళ్లలో బతికి ఉన్న మసెన్న అనే శ్రీలంకవాసితో మాట్లాడుతు ఉంటే (పాములు పట్టటం , ఆడిచ్చటం అతని వృత్తి) ఆ తెలుగు  మన మూలవాసుల తెలుగుతో కలిసి ఉన్నది. అలాగే భోపాల్ వాసులయిన ఆదీవాసుల్లో ఒక భాగస్తులయిన “శుభాష్ సింగ్, దుర్గాబాయి’కు పర్దాన్ గోండు కళలో నిష్ణాతులు. వాళ్లు సంప్రదాయ బొమ్మలు, పుస్తకాల వ్యాకరణాన్ని అందిస్తూ చిత్రించిన “భీమాయణం (అంబేత్కర్ జీవిత యాత్ర)” ప్రతి ఒక్కరు (H.B.T) చూడదగిన పుస్తకం.

సుధాకర్ విల్సన్

సుధాకర్ విల్సన్

Happy New Year

కొత్త యాడాది సంబరాలు

అంటే ఏది తీసుకుంటాం. ఇక్కడ కవి ఎంత పెద్ద తలలో గుజ్జయినా తోడందే వదలనన్నాను. ఈ వ్యంగ్యం మీరూ చూడండి. అమ్మో! రామాయణం అంటే సామాన్యం కాదు.

‘ఇప్పుడు కవిత్వమూ వ్యభిచారమయ్యింది

సమాజంకోసం మొదట్లో రాస్తాం

పోనుపోను కీర్తికిరీటాల కోసం

రాసి రాసి రంపాన పెడుతుంటాం.

నిజమే ఒక్కోసారి మన వల్ల అవతలవాడు చస్తాడని తెలిసినా మన పిశాచ ఆనందం కోసం రచనా హత్యలు చేత్తానే ఉంటాం. ఒక సభలో  ఢిల్లీ ప్రొఫెసర్ చిన్నారావు ఇలా అన్నాడు. “చిన్నప్పుడు ఊరి బయట, ఇప్పుడు రాష్ట్రం బయట” అని. డోంట్ వర్రీ బ్రదర్ కాలం మారింది. మీరు లేందే ఊళ్ళేలేని రోజు ఇవ్వాళ. ఈ దేశంలో ప్రతికులంలోనూ ఒక అంబేత్కర్ రావాలని, అంబేత్కర్‌ని ఉపయోగించుకునే వాళ్లు చెప్పే దళిత బ్రాహ్మణిజానికి కూడా రేవు పెట్టాడు. ఏరు దాటినాక తెప్ప తగలేసినట్టుగా తమకు దళిత అన్నపదమే అసహ్యంగా ఉందని we are more than that  అనీ తాము ఆ స్టేజీ దాటామనీ, శుచీ శుభ్రతలో బ్యామ్మర్లతో సమానమనీ అంటుంటే పిచ్చివాళ్లలారా,  పడకండి పడకండి ఏ వ్యామోహపు గుండాలలో అని ఆరవాలనే ఉంటది. మొదటిసారి చదివినప్పుడు ఎవరీయన అనే ఆశ్చర్యం, చదవగా చదవగా మనవాడై, వేడై, మెదడులో పురుగులాగా, చెప్పులో ముల్లులాగా గుచ్చుకుంటాడు. చేనేత ఉరినేతలా మారటంపై  చూడండి.

‘మా నేతల్ని మేమే నేసుకోవాలి

మా శవాలపై గుడ్డల్ని నేయటమయినా

మా పిల్లలకి నేర్పాలి,

కొడుకులు బట్టలు నెయ్యటం నేర్పారుగానీ

ఉరితాళ్లు పేనటమయినా

వేట కత్తులు నూరటమయినా

నేర్పలేక పోయారు..

ఇది చదివినాక గుండె భగభగమని, తుప్పు పట్టిన సూరులో కత్తి నూరటంలో, ఏ ఉద్యమంలోకో దూకి జండా పట్టటమో, అన్యాయానికి ఉరి వెయ్యటమో, ఏదో లేకపోతే మన పళ్ళనే పటపట, టకటక, కటకట నూరటమో చెయ్యకుండా ఉండం.

‘కామ్రేడ్‌లతో తినిపిచ్చిన ప్రశ్నల ఎండుమిరగాయలు చూడండి.

‘ఆయుధాలు పట్టటం ఇక్కడ ఉద్యమం

మనువుని సంహరించకుండా

మనిషిని వర్గ శత్రువనటం వికటం

పాపం మన కామ్రేడులు మిరపకాయలే కాదు వాటి పొగేసినా చలిచ్చరు.

ఉద్యమ నెలబాలుడి గురించిన గొప్ప వాక్యాలు.

చెట్లెన్ని పడినా వీచెగాలి ఆగదన్నాడు. జనం గుండెల్లో తనెప్పటికీ చచ్చిపోలేదన్నవార్త, తన సమాధినీ చూడగలిగినవాడు. దళితసాగర గీతాన్ని శివమెత్తి పాడుతున్నవాడు రాసినవాడు ఈ కవి. ఇకనించీ మనం కూడా వాళ్ల బతుకు బాసని మాట్టాడదాం. కనీసం ఇందాం. ఫూలన్‌దేవి ఎందుకు తుపాకీ పట్టిందో లోతుగా అధ్యయనం చేద్దాం. పొట్టిలంక మారణహోమం విషయం మరిచిపోయాం,  లక్సింపేట అందమయిన సంకలనం అయింది. భాషలో అరసున్న పోయినప్పుడే గుండుసున్న మిగిలిందని దేన్ని కొట్టి చెప్పాలి. దేనితోనూ కొట్టకుండానే మనకి తగిలేట్టు చెప్పాడు.

మిత్రుడు చంద్ర గురించి ఎవరితను అని చెప్పినపుడు, చదివి నేను రాసినంత సంబరపడ్డా. ఆప్తులయినవాళ్లని అరిచేతులమీద నడిపిత్తారని, అంతులేని కన్నీళ్లతో గుండెల్ని తడుపుతారని, బెంగలతో ఊరేగింపు యాత్రలో పూలవుతారని, కాళ్ళకి అడ్డం పడే బంధువులవుతారనిపిచ్చింది. ప్రేమనాలుకల తడిలవుతారు.

మద్దూరి, శిఖామణి, ఎండ్లూరి తరవాత ఎవరంటే ‘విల్సీ’నే . అలా అచ్చంగా వాళ్లకి చెందినాడేం కాదు. ఆశ్చర్యంగా అప్పుడపుడూ ‘మో’గారి పదాలు కూడా పడతయ్యి. “బ్లాక్ కీ నీగ్రో’ తేడా తెలుసుకున్న మిత్రుడు. నిజంగా కవితా ప్రేమికులకి నచ్చే పుస్తకం మాకూ ఒక భాష కావాలి.

 

దొరికే చోటు: అన్నీ ప్రముఖ పుస్తకాల షాపుల్లో

Ebook: Kinige.com

 

 

– మన్నెం సింధు మాధురి

sindhumadhuri

ప్రేమ కూడా ఒక సహజాతమే !

osho dont kill him

ప్రేమ రెండున్నరక్షరాల మాట మాత్రమేనా ? జీవితాల విలువ కాదా ?

“ఢాయి అక్ఖర్ ప్రేమ్ కే” అన్నాడు కబీర్ నిజమే ఈ రెండున్నర శబ్దాల పదాన్ని ఎలా అర్ధం చేసుకోవడం? దీన్ని ఎలా వివరించడం ?

ప్రేమ అనేదే లేదు అదంతా ఒక మానసిక రుగ్మత అని కొట్టి  పారేసే వారున్నారు. . కానీ ఒక నాటికి  ఎంతటి వారలు కూడా ఈ ప్రేమ అనే పదానికి దాసోహమనే అన్నారు అని చరిత్ర చెప్తోంది,జీవితంనేర్పించింది .  ప్రేమా పిచ్చీ ఒకటే నని పదేపదే వెక్కిరించినా నిజమే ప్రేమ పిచ్చే , అందుకే ఆ ప్రేమలోఏమన్నా చేస్తాడు మనిషి .దీనికి చాలా దాఖలాలు ఉన్నాయి మన చుట్టూ. ఈ లోకం లో ద్వేషమనేది లేనే లేదు కేవలం ఒక దాని పైన ఎక్కువ  ప్రేమ మాత్రమే మిగిలిన వాటి నుండి మనుషుల్ని దూరం చేస్తుంది అంటారు ఎడ్ డెల్ సాప్రియో దంపతులు  వారి పుస్తకం “Unconditional love” లో.
.

ప్రపంచంలోవికృతరూపాలుదాలుస్తోందన్నది కూడా ప్రేమే నని సమర్ధిస్తావా ? అడిగారు నన్ను కొందరు . లేదు నిజమైన ప్రేమే కనుక అయితే అది ఇలా విషపూరితమవ్వదు. ఈ ప్రేమ కి సరిహద్దులున్నాయా? దీనికి నిర్వచనం ఉందా? పెద్ద ప్రశ్నలు ?! ఇక మరో ముఖ్యమైన ప్రశ్న, ప్రేమ అంటే కేవలం ఇరువురు స్త్రీ పురుషుల నడుమ ఉండేదేనా ?

ప్రేమకి సరిహద్దులంటూ ఏమీ లేవు . నిర్వచనం  కూడా లేదు ఎవరి అనుభవం అనుభూతి ప్రకారం  వారు ఏర్పరుచుకునేదే తప్ప . కేవలం శారీరిక బంధం మాత్రమే ప్రేమ  కాదు . ఈ ప్రేమ ఎవరి పట్ల అయినా జనించవచ్చు . ఒకసారి కలిగాక పోవడమంటూ ఉండదు ప్రేమకి. నాకు ఆ మనిషి మీద ప్రేమ పోయింది అన్నవారిని చూస్తే ఆశ్చర్యం   కలుగుతుంది నాకు . ఈ ప్రేమను ఎందరో మహానుభావులు వారి అభివ్యక్తి లో చెప్పేరు ఈ విశ్వానికి . అలాంటి ఒక సంచలనాత్మక ప్రేమ గురువు ఆచార్య రజనీష్ . ఒక మామూలు మధ్య తరగతి కుటుంబం లో పుట్టిన ఈ మనిషి , ఉన్నత విద్యను ,జీవితాన్ని చదువుకుని శోధించి సాధించి చివరికి భగవాన్ రజనీష్ గా మారి ఆ పైన ఓషో (సాగరమంత జ్ఞానం కలిగిన ) గా లోకానికి  చిరపరిచితుడు . మన తెలుగు రచయితల్లో చలానికి మల్లె అయితే ఇతనికి భక్తులు లేదా ద్వేషులు ఉన్నారు.

“సెక్స్ టు సూపర్ కాంషన్స్” (భోగం నుండి యోగం లోకి ) అనే పుస్తకాన్ని రచించి విపరీతమైన సంచలనాన్ని సృష్టించిన  ఈ ఓషో గురించిన ఒక నవ్య కధనం అతని అనుయాయురాలు , సెక్రెటరీ గా ఎన్నో ఏళ్ళు పనిచేసి అతని అనుగ్రహం లో మెలిగి , ఓషో ఆశ్రమ నిర్మాణానికి , ఓరెగాన్ లో అతని కోసం రజనీష్ పురం నిర్మించడం లో నాలుగు స్తంభాలూ తానే  అయి నిలిచి ఆపైన తన పదవిని త్యజించి వెళ్ళిపోయిన మా ఆనంద శీల రాసిన “డోంట్ కిల్ హిమ్” (అతన్ని చంపకండి) , అనే పుస్తకం లో భగవాన్ తో తన సామీప్యం , సాన్నిహిత్యం,జీవితం గూర్చి కొన్ని లోకమెరుగని సత్యాలను బయటపెట్టేరు. అయినా అది ఓషో మీద అభియోగంగా ఒక నింద నిష్టూరంగా కాక కేవలం జరిగిన విషయాలను యధాతధంగా మన ముందుంచారు.

ముందుగా ఈ పుస్తకం చదివిన నాకు కాసేపు మతి పోయినట్లనిపించింది. ఆశ్చర్యం కలిగింది. పుస్తకం పూర్తి చేసేసరికి మా ఆనంద శీల వ్యక్తిత్వం ప్రేమతత్వం పై అమితమైన గౌరవం కలిగింది. ఈ పుస్తకం గురించి కొన్నిసంగతులు మీతో పంచుకుందామని ఒక చిన్న ప్రయత్నం చేస్తున్నా .

చాలా చిన్న వయసులోనే తన తండ్రి వలన భగవాన్ (ఆమె పుస్తకం లో ప్రతి చోటా భగవాన్ అనే సంబోధిస్తుంది తప్ప వేరొక రకంగా చేయదు), ఆమె జీవితం లో పరిచయం కావడం, చూసిన మొదటి క్షణం లోనే నేను భగవాన్ ప్రేమలోపడిపోయాను అంటుందిషీలా. గుజరాత్ లోని ఒక   నగరం లో ఒక మధ్య తరగతి కుటుంబానికి చెందిన ఈ అమ్మాయి ఎలా ఓషో కి కుడి భుజమై చిన్న వయసులోనే అతని సెక్రెటరీ కాగలిగింది, అతని కోసం ఏమేం చేసింది , దాని ఫలితాన్ని ఎలా అనుభవించింది ఒక్కో సంఘటనా చదువుతుంటే ఆశ్చర్యం తోనూ ఆర్ద్రతతోనూ గుండెలు చెమరించాయి. భగవాన్ ని ఆమె ప్రేమించడం లో ఒక రాధా , ఒక మీరా , ఒక జయదేవుడు, ఒక తుకారాం ఇలా ఎందరెందరో భక్తుల అవ్యాజ్య ప్రేమ, భక్తి అడుగడుగునా అగుపిస్తాయి. చాలా విషయాలు లోకానికి తెలియనివి తెలుస్తాయి.

ఇందులో ముఖ్యంగా తెలిసిన మొదటి విషయం ఏమిటంటే ఇంతటి సర్వసంగ పరిత్యాగి అయిన గురువు కి కూడా కొన్ని అపరిమితమైన , విపరీతమైన కోరికలు ఉండటం. సరే అది లైంగిక మై౦ది ఒక్కటే కాదు , అది చాలా మందికి ఓషో విషయం లో విదితమే. లైంగిక స్వేచ్ఛను బోధించిన గురువుల్లో ఓషో చాలా మొదటి వారిలో ఒకరు. కానీ ఇక్కడ మనకి తెలిసే విషయం అది కాదు . ఈ భగవానునికి 99 ఉన్న సరే ఇంకా మరిన్ని రోల్స్ రాయీస్ కార్లు కావాలని , ప్రపంచం లో ఉన్న అందమైయన ఖరీదైన రిస్టు వాచీల మోజు . ఇవి ఎలాగైనా కొనాల్సిన బాధ్యత అతని శిష్యులదే .అలాంటి సమయం లో షీలా ప్రవేశం జరిగింది ఓషో ఆశ్రమం లోకి. అప్పటికి అతనికి లక్ష్మి అనే ఒక పెర్శనల్ సెక్రెటరే ఉంది . ఇతని  గొంతెమ్మ కోరికలు తీర్చలేక డబ్బులు తేలేక సతమత మౌతున్నది ఆమె.

ఇక్కడ మనకొక మరో విషయం అర్ధం అవుతుంది అదేమిటంటే , ఏ గురువూ తనంతట తను గా గొప్ప కాదు, అతనిని పిచ్చిగా ప్రేమించి అతని కోసం ఏదైనా చెయ్యగల శిష్య బృందం ఉంటే గానీ. అలాంటి శిష్యులను గుర్తించడం వారి శక్తి సామర్ధ్యాలను అంచనా వేసి తన కొలువులో చేర్చుకోవడం ఈ మహా గురువులు చేసే పని . ఇలాంటివి మరి ఏతంత్రం తో పట్టుబడతాయో వీరికి. సిద్ధ పురుషులు కదా బహుశా అందుకేనేమో , రజనీష్ సరిగ్గానే షీలా శక్తిని పసి గట్టి ఆమెను దగ్గరికి చేర్చుకున్నారు. ఇది శీలకి ఒక దివ్య వరం . ఎని జన్మల పుణ్యమో అనుకుంది ఆమె మొదట్లో. కానీ ఆ తర్వాత ఆ ఆశ్రమాన్ని ఒక కొలిక్కితీసుకురావడానికి , మళ్ళీ ఓరెగాన్ లో ఆశ్రమం ఏర్పరచడానికి షీలా కారణ భూతురాలౌతుందని ఆమె  అనుకోలేదు. ఇదంతా కూడా నేను భగవాన్ అనుగ్రహం తోనే చేశాననంటుంది షీలా ఈ పుస్తకం లో కూడా.

ప్రేమ నేది ఒకరు నేర్పితే వచ్చేది కాదు . నా వరకూ నాకైతే ప్రేమ కూడా ఒక సహజాతమే . అలాంటి ప్రేమలో మునిగిపోయింది షీలా . ఆశ్రమానికి నిధులు సమకూర్చడం లోనూ, పద్ధతిగా ఆశ్రమాన్ని నడపడం లోనూ నిష్ణాతురాలైంది. ఇప్పటికీ మా ఆనంద షీలా (ఈ పేరు భగవాన్ ఇచ్చిందే ఆమెకు ,రజనీషీ అయిన ప్రతి వ్యక్తికి ఏదో ఒక పేరు తను స్వయంగా ఇవ్వడము, ఆ వ్యక్తి మెడలో ఓషో చిత్రమున్న ఐడెంటిటీ కార్డ్ ఉండటము అక్కడి ఆనవాయితీ), నిజాయితీ, క్రమ శిక్షణ రజనీష్ పురం గురించి ఆమె తీసుకున్న శ్రమ మరవని వారున్నారు .

ఆమె చెప్పిన కొన్ని విషయాలను మీ ముందు యధాతధంగా ఉంచుతున్నాను:

ఆశ్రమం లో చాలా దేశాలనుండి జోగినులు వచ్చి చేరేవారు శిష్యులుగా . వారిలో బాగా డబ్బున్న వారిని ఎక్కువగా ఆదరించేవారు ఓషో . వారి నుండి తనకు కావల్సిన డబ్బును రాబట్టుకోవడం ఆయనకి బాగా తెలుసు .

ఏదైనా కావాలంటే కొనాలంటే డబ్బు అవసరమైతే వారిని ప్రైవేటు గా వేరుగా కలిసి వారికి తన మీద ఉన్న భక్తిని ఫ్రేమను డబ్బు రూపం లోకి ఎలా మార్చుకోవాలో ఆయనకి బాగా తెలుసును.

ఆశ్రమ నిర్వహణ లో కొందరు డబ్బులున్నవారు ఉండేవారు.  వారు ఓషోకి డబ్బులిచ్చాం కనుక తాము అత్యంత సన్నిహితులమన్నట్టు ఆశ్రమ ధర్మాలను కూడా నిరసించి ప్రవర్తించేవారు. ఇక ఆశ్రమం లో ఉన్న కొందరు డబ్బు లేని వారు ఏయే సేవలు చేయ్యగలరో వారిని కూడా సరిగ్గానే గుర్తించి వారి చేత చేయించుకోవాల్సిన శ్రమ అంతా రాబట్టేవారు భగవాన్ .

ఎక్కడెక్కడినుండో వచ్చిన జోగినుల కు అన్ని సదుపాయాలు కల్పించడం ,ముఖ్యంగా విదేశీయుల , గొప్ప వారి మీద ఎక్కువగా శ్రద్ధ చూపమని ఓషో  షీలా  కి చెప్పేవారు. కొంచెం  సమయం లోనే షీలా చాలా సమర్ధవంతంగా భగవాన్ తనకి  అప్పగించిన పనులను చక్కగా చేసి చూపించేది. తద్వారా భగవాన్ ఇచ్చే ఒక చిన్ని మెప్పు కోసం పరితపించేది . తల్లి , తండ్రి, తమ్ముడు ఉన్న చిన్న కుటుంబాన్ని వదిలి షీలా పూర్తిగా ఆ భగవాన్ కే అంకితమై పోయింది .

ఆచర్య రజనీష్ ఒక విశ్వవిద్యాలయం లో తత్వ శాస్త్ర అధ్యాపకునిగా పనిచేసేవారు . అతని విలక్షణ , విచిత్ర విపరీత బోధన చూసి విద్యాలయం  వారు ఇతనికి ఉద్వాసన పలికారు.

షీలా రజనీష్ వద్దకు వచ్చేటప్పటికి ఆయన గుజరాత్ లో ఒక మామూలు ఇంటిలో ఉండేవారు , ఆయన ప్రవచనాలు వినడానికి కొద్దో గొప్పో కొంతమంది ఉండేవారు. ఆ తర్వాత రజనీష్ తన స్థాయిని పెంచి ఆంగ్లం లోనే ఉపన్యసించి కొందరు అక్కడి స్థానీయుల అభిమానాన్ని కావాలనే దూరం చేసుకున్నారు. ఆ పైన ఇక రజనీష్ ఓషో గా మారిన వైనం ఎలాంటిదంటే :

అక్కడినుండి ముంబై ఒక ఫ్లాట్ లోనికి రజనీష్ ప్రవేశించారు. అక్కడ ఆర్ధికంగా కాస్త బలమున్న వారి ఆశ్రయం సంపాదించారు. అతనికి వ్యక్తిగతంగా ఉండే బలహీనతల మాట ఎలా ఉన్నా అతని ఉపన్యాసం విన్న వారు , అతని కన్నుల్లోకి చూసిన వారు అతనికి  అయిస్కాంతలా అతుక్కు పోతారు అంటారు షీలా .
ఎన్నో మతపరమైన నైతికమైన   ఛాందసాలను కాదని , స్త్రీ కి  కూడా లైంగికత ఉంటుందని , శీలం అనే మాట ఒక వ్యర్ధ పదమని బోధించే ఓషో బోధనలు ఆ సంప్రదాయపు కట్టలను తెంచుకుని పైకి రావాలనుకునేవారికి బాగా ఉపయుక్తంగా అనిపించాయి అనడం లో సందేహం లేదు. ఇలా 1929 లోనే ఒక తెలుగు ప్రాంతీయ రచయితగా మాట్లాడిన  వాడు మన చలం అయితే మళ్ళీ 1975 ప్రాంతాల్లో ఒక ప్రేమ గురువుగా ఇదే విషయాన్ని  ప్రస్తావించి  ప్రబోధించి ఆచరింపచేసిన వ్యక్తి ఓషో.  (ఓషో  “దబుక్ ఆఫ్ ఎ వుమన్ ” చలం “స్త్రీ” ని సరిపోలుస్తూ ఒక పరిశీలనా వ్యాసం రాయాలని ఎప్పటినుండో ఉంది నాకు ).

అతను బోధించే విషయాలలో ఎక్కడా తప్పు లేదు. సార్వజనీనమైన ప్రేమను బోధించారు అంటారు షీలా. అతని బోధల పట్ల ఆమెకు ఇసుమంత కూడా ఫిర్యాదు లేదు . ఆయన తో సాహచర్యం లో తాను ఏమేమి చేశారో ఎలా చేశారో అది కూడా భగవాన్ నేర్పిన ప్రేమ తత్వమనే చెప్తుంది నేటికీ షీలా . ఇది భగవాన్ మీద అభియోగం కోసం రాసింది కాదు . కానీ 39 నెలలు కారాగార శిక్ష  నిష్కారణంగా అనుభవించాల్సి రావడం అదీ ఒక పరాయి దేశం లో ఆమెను ఎలా ఒక వ్యక్తిగా నిలబెట్టాయో ఎలా శక్తిని పుంజుకుని పనిచేయగలిగిందో అంతా చెప్తుంది.

గురువుల గొప్పతనాన్ని ప్రచారం చేయడమే కాక వారి కోసం ఆర్ధికంగా నూ, హార్ధికంగానూ ఉపయోగపడే ప్రియ శిష్యులను గుర్తించే అనితర సాధ్య విద్యకలిగిన ఓషో  షీలాకు  ఆశ్రమ నిర్వహణ అనతి కాలం లోనే అప్ప చెప్పేరు. ఆమెను తన ప్రైవేట్ సెక్రెటరీ గా నియమించారు . ఇది ఆమె భుజాలపై చాలా  భారమైంది .
ఆశ్రమం లో అందరినీ ఒక తాటిన నడిపించాలని , ఒక క్రమశిక్షణ అమలు జరపాలని ఆమె తీసుకున్న శ్రమ చెప్పనలవి కానిది. పొద్దున్న వేకువఝాము నుండి రాత్రి పన్నెండు వరకు ఆమె ఒక యంత్రం లా పనిచేసేది . ఓషో హోం లో అన్నీ విషయాలలోనూ ఆమె నిర్ణయం తీసుకోగలిగేది. ఆమెకు మనసుకి నచ్చిన ఆమెతో పాటు చివరి వరకు  తోడున్న కొందరు వ్యక్తులు ఉండటం వలన ఆమె ఈ పనులు చేయగలిగాను అంటుంది.

రజనీష్ హోమ్ లో మేడిటేషన్ కాంప్ నిర్వహించేవారు . ఓషో ప్రవేశపెట్టిన మేడిటేషన్ విధానం చాలా కఠినమైనది . అందులో ఆరితేరితే ఇక ప్రపంచం లో అన్నీ చేయగలం అంటుంది షీలా. కానీ భగవాన్ అదుపులేని ఖర్చు లు కోరికలు ఆమెను ఆమె తో బాటు పని చేసే కొందరిని బాగా భయపెట్టేవి. అందరినీ తన రక్షణ లో ఒక తల్లి లాగా సాకేది షీలా. ఎన్నో కార్లుండగా మళ్ళీ మరొక కారు , మరికొన్ని వాచీలు , ఈ బలహీనతేమితో అస్సలు అర్ధం కాదు నాకిప్పటికీ  అంటుందీమే. పోనీ అన్నీ పెట్టుకోగలరా అంటే అన్నీ
కార్లలో  ఒకేసారి తిరగగలరా అంటే అసంభవం అని మనకు తెలుసు . అయినా ఈ పిచ్చి వెర్రి కోరికలేమిటో. వీటన్నిటిని సహనంతో భరిస్తూ ఆర్ధికంగా ఎలా నిధులు సమకూర్చాలన్న ధ్యాసతోనే రోజులు గడిచిపోయేవి ఆమెకు.

ఇక మరో సమస్య విదేశాలనుండి వచ్చే జోగినుల ప్రవర్తన . లైంగిక పరమైన స్వేచ్ఛ ఉండటం తో ఆశ్రమం లో నూ డబ్బుల కోసం బయటా కూడా వ్యభిచారానికి పాల్పడే వారు కొందరు. వారికి ఎటువంటి ఆరోగ్య  సమస్యలొచ్చినా (సుఖరోగాలు, గర్భాలు) ఇవన్నీ కూడా తానే పర్యవేక్షిస్తూ పరిష్కరించాల్సి  వచ్చేది . రజనీష్ కి తన ఆశ్రమం లో ఏ ఒక్కరికీ గర్భాలు రావడం ఇష్టం ఉండేది కాదు, ఒక వేళ వస్తే వెంటనే అబార్షన్ చేయించేసి వారిని స్టెరిలైజ్ చేయించేవారు, ఇక పిల్లలు ఉన్న వారు వస్తే వారికోసం వేరే ఏర్పాట్లు. ఈ  జోగినుల పిల్లల కోసం ఒక  నర్సరీ కూడా నడపాల్సి వచ్చేది  ఆశ్రమం  అవతల అంటారు షీలా. ఆసుపత్రి మందుల ఖర్చు గాక , ఓషో అనారోగ్యానికి మందులు (విదేశాలనుండి) , అలాగే కొన్ని మేడిటేషన్లలోకి వాడటానికి మాదక ద్రవ్యాలు (హెరాయిన్, బ్రౌన్ షుగర్) లాంటివి కొనడానికి చాలా ఖర్చు అయేది . అవన్నీ ఒక్క చేతి మీద , మధ్యలో రజనీష్ ఎవరికి చెప్పకుండా కొనుక్కోచ్చే కార్ల లోన్లు ఇవన్నీ వచ్చే ఆదాయానికి మించి పోయేవి. తలకు మించిన బాధ్యత చిన్న వయసులోనే తలపై పడిన షీలా ఆత్మ విశ్వాసం తో తిరుగు లేకుండా ఈ పనులన్నీ ఎలా గో చక్క బెట్టేది. ఏదైనా సమస్యను భగవాన్ కి చెప్తే ఆయన విసుక్కునేవారు.

అంచేత తాను తన బృందం రేయింబగళ్లు కష్టపడేవారు. నిధుల సేకరణకు తరచూ తాను విదేశాల్లో పర్యటించి పోగు చేసుకుని వచ్చేది షీలా. తీరా వచ్చేసరికి ఏదో ఒక అవాంతరమైన ఖర్చు ఎదురు చూస్తుండేది. తాను దాదాపు రోజూ అని విషయాలను భగవాన్  తో చర్చించేదాన్నని , చెప్పేదాన్నని అంటారు షీలా. అతని ఆజ్ఞమేరకు మళ్ళీ పని చేసుకు పోయేదాన్ని . భగవాన్ మాట కాదనే శక్తి మాత్రం ఎవరికి ఉండేది కాదు అంటారామే. ఆమె తొలి భర్త కూడా భగవాన్ శిష్యుడుగా మారి ఉండేవారు. అతనికి తమ పెళ్లి అయేనాటికే కాన్సర్ అని రెండు మూడేళ్లకన్న బ్రతకడని తెలిసినా వారు వివాహం చేసుకున్నారు. ఇది భగవాన్  కి తెలుసు . రాను రానూ  జనసందోహం ఎక్కువ అవ్వడం తో ఉండటానికి కూడా సరైన  స్థలం ఉండేది కాదని కొన్ని సార్లు షిఫ్ట్ ల పద్ధతి లో నిద్ర పోయేవారమని చెప్తారు.

ఇక కొందరు డబ్బున్న జోగినులు డబ్బులు ఇచ్చాము  గనుక మాకే రజనీష్ మరింత దగ్గర అన్నట్టు క్రమ శిక్షణ లేకుండా అసహ్యంగా  వర్తించేవారు మిగిలినివారితో. ఈ గొడవలు తగువులూ అన్నీ షీలా మాత్రమే చూడాల్సి వచ్చేది. సవితా అని ఒక మంచి అమ్మాయి తనకి సహాయం చేసేదని, అలాగే మునుపటి సెక్రెటరీ లక్ష్మి కూడా వారి సహాయం లేకుంటే తానేమీ చేయలేక పోయేడాన్ని అంటారు షీలా. ఇక మరో సమస్య హోమ్ లో ని డాక్టర్లు . కొందరు  రోగులను తమ  లైంగిక స్వార్ధం కోసం వాడుకునేవారనీ. అదేమంటే వ్యతిరేకించేవారనీ ఆ సమస్యలు కూడా తానే పరిష్కరించాల్సిన పని బడేది అని చెప్తుంది. రజనీష్ ఆశ్రమంలో ని వేసుకునే బట్టలు దగ్గరనుండి , అన్నీ విషయాలూ వివరిస్తుంది . ఒక పొడవాటి అంగీని వేసుకోవాలని అందరూ అది ఒక్కొక్కరికి ఆయన నచ్చి చెప్పే రంగులవి ధరించాలని. ఎక్కడా బిగుతూ లేని బట్టలు ధరిస్తే దేహామంతా ప్రాణవాయువు ప్రసరిస్తుందని ఓషో చెప్పేవారు.

ఇక మేడిటేషన్ సమయాల్లో  కొందరు విపరీతమైన  మానసిక ఒత్తిడి కి గురవుతున్నవారికి డ్రగ్స్ ఇచ్చేవారు. ఈ విషయం ఇటు ప్రభుత్వానికి , అటు ప్రజలకి తెలియకుండా కాపాడటం చాలా కష్టమయ్యేది . ఇన్ని చేసీ భగవాన్ కి ఎప్పుడూ ఆరోగ్య సమస్యలతో బాధ పడేవారు. ఆయనకి ఆస్త్మా ఎటాక్ వస్తే మెలికలు తిరిగి పోతున్న భగవాన్  ని చూస్తే ఏడుపొచ్చేదట.  డైబెటిస్ , ఆస్త్మా ,నడుం నొప్పి తో బాధలు పడేవారు భగవాన్. ఇక ఒకనాడు షీలా చెయ్యి దాటిపోయిన పరిస్థితులను చూసి తాను ఆశ్రమం నుండి వెళ్లిపోదల్చుకున్నానని ఒక లేఖ ఓషో కి పంపింది. వెళ్లడానికి వీల్లేదని కోపగించుకున్నారు భగవాన్ . అయినా ఇక తట్టుకునే ఓపిక లేక ఆమె రజ్నీష్ పురం నుండి వచ్చేసింది . ఇక్కడితో ఆమె జీవితం అయిపోలేదు . అసలు కష్టాలు ఇక్కడే ఆరంభమయ్యాయి .
ఆమె ఆశ్రమ నిధుల నుండి 55 వేల డాలర్ల సొమ్మును దొంగిలించి తీసుకుపోయిందని ఆమె పైన కేస్ పెట్టారు ఓషో. ఆమె తో బాటు ఆశ్రమం నుండి వచ్చేసిన వారు కూడా కొందరు ఉన్నారు . అయినా షీలా మీద కోపం తో కేస్ పెట్టేరు భాగ్వాన్. ఇక ఆమె తనను తాను నిర్దోషిగా నిరూపించుకోవడానికి , కొన్ని నేరాలు ఆశ్రమం లో చేసినట్లు ఒప్పుకున్నప్పటికి , డబ్బులు తీసుకు రావడం మాత్రం అసత్యమని తెలిసేసరికి ఆమె ముప్పై తొమ్మిది నెలలు కారాగార వాసం అనుభవించింది. అమెరికా, స్వీడెన్, ఇలా దేశాలు తిప్పి ఆమెను కారా గరం లో ఉంచేవారు . అక్కడ కొన్ని  జైళ్లలో కొందరు మంచి వారు ఉండేవారని అదీ ప్రేమ గొప్పతనమే అంటుంది షీలా . ఎంతో కష్టపడిన షీలా కారాగార వాసం లో చెయ్యని నిందను భరిస్తూ ఎలా బ్రతికిందో అంతా వివరిస్తుంది . నా ఆత్మ స్థైర్యం నా ప్రేమ మాత్రమే నన్ను రక్షించింది అంటుంది . ఒక సారి జైల్లో ఒక పిచ్చి అమ్మాయి సెల్ లోనే తననూ పడేస్తే , కొద్ది రోజులకు ఆ అమ్మాయి లో మార్పు తీసుకోచ్చి అందరి మన్ననలు పొందుతుంది షీలా. అలాగే ఒక జైల్ లో అధికారిని మా ఆనంద షీలా అంటే ప్రాణం పెట్టి తనకి ఇష్టమైన వేడి నీళ్ళ స్నానం ఏర్పాటు చేస్తుందని. మరొక చోట ఫిలిప్పైన్స్ లో జైల్ నుండి వచ్చేసేక ఒక జపాన్ రచయిత్రి తో కలిసి ఒక రూమ్ లో కొన్నాళ్లు గడుపుతుంది . ఆ రచయిత్రికి కాన్సర్ , ఆమె ప్రశాంతంగా నవల రాసుకుందామని అక్కడికి వస్తుంది అటువంటి ఆమె షీలా ను తనతో ఉండటానికి ఇష్టపడుతుంది. ఆమెను ఆమె అద్వితీయ  పట్టుదలను ప్రేమను జీవితాంతం మరువలేనంటుంది షీలా.  షీలా కు సహాయం చేసిన లాయర్ ని వివాహం చేసుకోవాలనుకుంటుంది కానీ అతనికి వేరే భార్య పిల్లాడు ఉండటం తో కుదరదు. మరొక అతన్ని వివాహం చేసుకుంటుంది. జైల్ నుండి వచ్చాక తన కుటుంబం ఎప్పుడూ తనను అదరిస్తూనే వచ్చారని వారి ప్రోత్సాహం తోనే ఈ పుస్తకాన్ని రాస్తున్నానని చెప్తుంది .

తనిప్పుడు ఒక వృద్ధాశ్రమం నడుపుతున్నానని , అది వృద్ధుల ఇల్లు అంతే కానీ ఆశ్రమం అనను అంటుంది. వాళ్ళంతా ఒక కుటుంబంలా ఉంటారు. వారందరికి తానే తల్లి తండ్రి లా సాకుతుంది . ఇన్ని విషయాలను చెప్పిన ఆమె ఇప్పటికీ భాగ్వాన్ పైన అనురాగం పోలేదంటుంది. ఈ ప్రేమ శక్తి అంతా భగ్వాన్ ప్రసాదమే అని నమ్ముతుంది. ఈ విషయాలు ఎందుకు చెప్పేనంటే నేను ఏ దొంగతనమూ చేయకుండా భాగ్వాన్ కోపం తో నా మీద మోపిన అభియోగం గురించి వివరించడానికి. తను ఆశ్రమం నుండి వచ్చేసిన కొద్ది రోజులకే భాగ్వాన్ కూడా అరెస్ట్ అయ్యారు. తాను జైల్ నుండి వచ్చేసిన కొద్ది రోజులకే భగవాన్ ఇక భౌతికంగా లేరన్న  వాస్తవం కూడా తనకి  మీడియా ద్వారా తెలిసింది అంటుంది షీలా .

ఆయన కు వ్యక్తిగత బలహీనతులున్నాయేమో గానీ అతని బోధనలో శక్తి ఉందని నమ్ముతుంది షీలా. ముఖ్యంగా భాగ్వాన్ అమితమైన జ్ఞానానికి , అతని ప్రసంగానికి, అతని ప్రేమ తత్వానికి దాసోహమనక తప్పదు ఎటువంటి వారైనా. అందుకే అతన్ని కాదు అతని బోధనలను ప్రేమించండి. అవి లోకానికి ప్రేమ మార్గాన్ని చూపుతాయ్ అని చాటి చెప్తుంది ఈ నాటికి మా ఆనంద షీలా . ఒక చిత్రమైన  అనుభూతి కలిగించే పుస్తకం వీలైతే చదవండి . ఇంకా చాలా విషయాలు తెలుస్తాయి మిత్రులారా . భాగ్వాన్ పరిచయం తో తనలో నిండిన ప్రేమే తనని ఇంకా బ్రతికిస్తోందన్న మహా విశ్వాసం కలిగిన మా ఆనంద షీలాను చూస్తే ఆశ్చర్యం ఒక్కటే కాక ప్రేమ అనే రెండున్నరక్షరాలకు ఇంతటి శక్తి ఉందా అన్న ఆనందం కలుగుతుంది . భాగ్వాన్ తో ఆమె ఉన్న కొన్ని ఫోటోలను కూడా ఇందులో ప్రచురించారు. ఫాక్ట్ ఈస్ స్ట్రేన్జర్ దాన్ ఫిక్షన్ అన్నది నిజమైతే ,ప్రేమ జీవితం కన్నా గొప్పనైనది అనిపిస్తుంది ఈ పుస్తకం చదివితే  ఓషో భక్తులకు కూడా అతని పట్ల ద్వేష భావం కలగదు పైగా అయ్యో అవునా అనిపిస్తుంది.

.

1231658_539630582777569_2120927918_n-జగద్ధాత్రి

 

తొలి ప్రేమ జ్ఞాపకాల సహారా ఈ కథ!

 

ప్రియ కారుమంచి

ప్రియ కారుమంచి

‘తేరా నామ్ ఏక్ సహారా?!’

– చదివేసి, ఈ పుస్తకాన్ని మూసేశాక, నరేష్ ఎదురుగా ఉంటే (లేదా ఉన్నట్టు అనుకొని) ఇలా చెప్పాలనిపిస్తుంది:

నరేష్ … నువ్వొక ప్రేమ పిపాసివి!

నీకు ప్రేమించటం అనే చిత్కళ తెలుసు.

‘నిరంతరమూ వసంతములే…. ‘ అని నమ్ముతావు, లేదా ‘హాయిగా పాటపాడే కోయిలే మాకు నేస్తం.. తేనెలో తానమాడే తుమ్మెదే మాకు చుట్టం’ అని నమ్మబలుకుతావు.

నువ్వు చాలా సులువుగా కనిపించే గడ్డిపువ్వు, లేదా బహు అరుదని అనిపించే గగనకుసుమం, పోనీ పారిజాతం; ఈ లోకాలకి చిక్కని, దొరకని ప్రేమ పరిమళాలు చిమ్మే దేవ పారిజాతం.

‘తేరా నామ్ ఏక్ సహారా?!’

viewer

చదివేసి, ఈ పుస్తకాన్ని మూసేశాక, ఒక ఎమోషనల్ స్థితిలో పైవిధంగా చెప్పాలని అనిపించడం రెండు రకాలుగా అర్థం చేసుకోవచ్చు.

ఒకటి- స్టేజ్ మీద నాటకానికి తెర పడ్డాకో, తెరమీద బొమ్మల కథ ముగిశాకో ఒక ఈలవేసి బరువు దించుకోవడం, లేదా ఆ ప్రదర్శనతో మమేకం కావడం వల్ల ఆ మూలాన్ని తలకెత్తుకోవడం-

….. ఈ రెంటిలో నాది ఏ స్థితి అని తరిచి చూసుకోవడానికి మళ్లీ పుస్తకంలోకి వెళ్లాలి.

ఇప్పటికే ఈ పుస్తకం మీద చాలా మంది రివ్యూలు రాసారు (ఏం రాశారో చదవడం పడలేదు).

అసలు ఇది పుస్తకం అని ఎలా అనగలం.. కాదు ఇది ఒక పుస్తకం మాత్రమే కాదు ఇదీ ప్రేమతో మనల్ని తడిపేయడానికి వచ్చిన శ్రావణ మేఘం. చేయిపట్టుకుని తన కలల ప్రపంచంలోకి నడిపించుకెళ్ళే జ్ఞాపకాల శరచ్చంద్రిక. రచయిత తనదైన ఒక nutshellలో భద్రంగా దాచుకున్న తన జ్ఞాపకాల దొంతరను మనముందు పరిచి, ఆ దిగుడుబావి మెట్ల మీదుగా తన మనసు అగాధాల్లోకి నడిపించిన ఒక మెత్తని, కల్పన అనిపించని ప్రేమ కథ. శ్రావణమే గానీ, ఒక దిగులు మేఘం కరిగి రాల్చిన వలపువియోగాల వాన చినుకు.

– ఇలా రాసేసి చూసుకున్నాక, కనిపించని నిట్టూర్పు, వినిపించని ఈల వేసిన ఒక రిలీఫ్ అనిపించింది. ఇది చదివిన ఎవరైనా ‘MY AUTOGRAPH- Sweet Memories’ అంటూ, అంత బాహాటంగా కనిపించని పోపు డబ్బాల్లో రహస్యంగా, అపురూపంగా దాచుకున్న మారుతాళం చెవులతో స్మృతుల పేటికల్ని తెరుచుకుంటూ పోతారు. కానీ, నన్ను నేను కొత్తగా కనుక్కున్నట్టు, నేను కొత్తగా పుట్టి, పుట్టిన వెంటనే దేనికోసమో వెదుక్కున్నట్టు చేసిన పుస్తకం తర్వాత ‘రిలీఫ్’, ‘రిలీవ్’అయిపోవడం నాకు ఎంతమాత్రం నచ్చలేదు; లేదా సరిపోలేదు.

ఈ కధలో రచయితే Protagonist. ఆమె నమ్మకానికి, అతని ప్రేమకి మధ్య సంఘర్షణ. చివరిలో, తన ప్రేమ మీద దాటవేసిన పరీక్షకి ఎవరో సంబంధం లేని మూడోవ్యక్తి జారీచేసిన రిజల్ట్ ని భారంగా మోసుకొచ్చిన తన ప్రేయసి చెప్పిన చివరిమాట- “వద్దన్నారు , నీకూ నాకూ అస్సలు కుదరదన్నారు , ఇక ముందెప్పుడూ నిన్ను కలవకూడదన్నారు”. తన నిస్సహాయతకు క్షమాపణ చెపుతూ చివరిగా తన చేతిని చాచిన ఆమె చేయి అందుకోకుండా రెండడుగులు వెనక్కు వేస్తాడు;ఎందుకంటే అలిగి కాదు ..తన తొలి స్పర్శే చివరిదై ఎడబాటు కరచాలనంగా మిగలడం ఇష్టం లేక-

పైన చూచాయగా చెప్పుకున్నట్టు ఈ ప్రేమకతలతో పెద్ద గొడవ ఉంది. ‘ప్రేమకు లేదు వేరే అర్ధం ప్రేమకు ప్రేమే పరమార్ధం ప్రేమించు, ఆ ప్రేమకై …….జీవించు’ అనే ప్రతిపాదన లాంటి, ప్రేమ పాటలతో ఉన్న గొడవ లాంటిది. వీటిని ‘బాగున్నాయి’, లేదా ‘బాగోలేదు’ అని అనుకోవడానికి ముందే చదువరుల (శ్రోతల) అనుభవాలూ,జ్ఞాపకాలు తగుదునమ్మా అని ముందుకు తోసుకొచ్చి, వాటి బాగోగుల్ని తరిచి చూడనివ్వక్కుండా తగు ఎమోషనల్ బ్లాక్ మెయిలింగుకి దిగుతాయి. పాఠకుల సదరు బలహీనత మీద దెబ్బకొట్టి పబ్బం గడుపుకుందామని అనుకోకపోవడమే- నరేష్ నిజాయితి. అలాగే, ఇది విఫల ప్రేమ అంటే నేను ఒప్పుకోను; ఎందుకంటే రచయిత నరేష్ గుండెల్లో ఈ ప్రణయ గురుతులు ఇంకా పదిలంగా, సజీవంగా ఉన్నాయి కాబట్టి.

నున్నా నరేష్

నున్నా నరేష్

ఒకచోట సత్యసాయి గురించి చెప్తూ “సత్య సాయి ఒక రూపం కాదు, సారం- అనుకుంటే పాత్రని బట్టి ద్రవం రూపం తీసుకుంటే ప్రేమ మూర్తి అయిన అనిల్ అంకుల్ దృష్టిలో సాయికి పర్యాయ పదం ప్రేమ ….అదే శాస్త్రీయ సాక్ష్యాల మీద బ్రతుకు భవనం కట్టుకునే అచ్యుతుల వారికి సాయి ఒక మహత్తు.. అష్టైశ్వర్యాలూ కట్టబెట్టే ఒక మహత్తు ….శల్య పరీక్షలతో నిగ్గుతేల్చి అసలు రంగు బయట పెట్టాలనుకునే చార్వాకులకు బాబా వట్టి బురిడి …సంరక్షణ సాకుతో ఆయన బోను చుట్టూ నిఘా నీడలుగా మోహరించిన అంతరంగికులకు సాయి ఒక తరగని గని”, అంటాడు రచయిత.

“ఒక నమ్మకాన్ని గుడ్డిగా నమ్మే వాళ్ళ ఇళ్ళల్లో వధువుల పరిస్థితి హోమగుండంలో కాలీకాలని పచ్చికట్టేల పొగకి కళ్ళు మండి, పక్కనున్న వరుడే కాదు, ముందు పొంచిఉన్న జీవితం కూడా ఆనని, అర్థంకాని అయమయమే కొత్తపెళ్లి కూతురిది” అన్నప్పుడు చలం ముద్రలు కనిపించాయి.

ఇక పోతే కధలోని ఒక పాత్ర ‘సౌభాగ్యమ్మ’ మీద వేసిన సెటైర్లు చదువుతున్నంత సేపూ నాకైతే సౌభాగ్యమ్మ విసావిసా విదిలించుకుని వెళ్ళిపోతున్న దృశ్యం కళ్ళముందు కదలాడి ‘ఇలాంటి వాళ్ళతో సరిగ్గా ఇలాగే మాట్లాడాలి , భలే అన్నాడు’ అనిపించిది.

ఈ పుస్తకంలో ప్రతి అక్షరంలోనూ, ప్రతి పదంలోనూ జీవాన్ని పొదిగి, తన భావాలతో జోడించి ఒక వాస్తవ ప్రేమకథని మన కళ్ళకు కట్టిన నరేష్ – ఒక కార్మేఘమై మనల్ని కమ్మేసి, చదివిన ప్రతి ఒక్కరూ అందమైన తమ తొలి ప్రేమ జ్ఞాపకాల్ని తవ్వుకొని, తమని, ప్రేమ రూప- భావాల్ని తరిచి చూసుకోవడానికి మళ్లీ మళ్లి చదివేలా చేశారు. గొప్ప రచనల ఉద్దేశం ఇదేగనక అయితే,  ‘తేరా నామ్ ఏక్ సహారా?!’ మంచి పుస్తకం అనడానికి ఇంతకు మించి రుజువు లేదు నా దగ్గర.

– ప్రియ కారుమంచి

ఆమె మనసులో దాచుకున్న వ్యథ..కోసూరి ఉమాభారతి కథలు “విదేశీ కోడలు”!

videshi-kodalu

ఆసక్తి ఉంటే ఎంచుకున్న ప్రవృత్తిని ఎప్పుడైనా అభివృధ్ది చేసుకోవచ్చు. వయో పరిమితి లేదు. కాల పరిమితి కూడా ఉండదు. చిన్నతనం నుంచీ సాహిత్యం మీద నున్న అభిమానం, అభిరుచి.. జీవనయానంలో తారసపడిన వ్యక్తుల వ్యక్తిత్వ పరిశీలన, మనస్తత్వాల విశ్లేషణ, నిరంతర శోధన.. వృత్తి రీత్యా పెంచుకున్న భాషాభిమానం  శ్రీమతి ఉమాభారతిని కలం పట్టేట్లు చేశాయని చెప్పచ్చు.

ఈ సంకలనంలో పన్నెండు కథలున్నాయి. అన్నీ ఒక సంవత్సరం వ్యవధిలో రాసినవే. భరతముని కథలో తప్ప అన్నింటి లోనూ స్త్రీలదే ప్రధాన పాత్ర. కూతురిగా, చెల్లెలిగా, అక్కగా, అమ్మగా, స్నేహితురాలిగా ఎదుర్కొన్న అనేక అనుభవాల ఫలితం, వాటి ప్రభావం.. మానసిక వ్యవస్థలు, వాటి విశ్లేషణ తో నడిపించిన కథల సంపుటి ఇది.

కవయిత్రిగా రచనా ప్రస్థానం ప్రారంభించిన రచయిత్రి తన కవితలతో వర్ణనలు సాగించడంతో కొన్ని కథలు ఆధునిక చంపూ పధ్ధతిలో(కొంత పద్యం, కొంత గద్యం కలిసిన కావ్యాన్ని చంపూ కావ్యం అంటారు.) నడిచాయని చెప్పచ్చు. అన్నీ స్త్రీ ప్రధానమైనవే ఐనా..  పోలికలున్నాయని పించిన కథలు తీసుకుని పరిశీలిద్దా మను కుంటున్నాను.

మొదటిది ‘కాఫీ టిఫిన్ తయ్యార్..’. ఆర్ధికంగా వెనుకబడి అధిక సంతానం ఉన్న కుటుంబాలలో, అబ్బాయిలకీ వారి చదువులకీ ప్రాధాన్యం ఇవ్వడం, ఆడపిల్లలు పిన్న వయసు నుంచే అమ్మలకి సహాయం చెయ్యడం సామాన్యమే. అన్నలు చెల్లెళ్ల మీద పెత్తనం చెలాయించడం, పెద్దలు సర్ది చెప్పడానికి ప్రయత్నించడం తప్ప అంతకు మించి ఏమీ చెయ్యలేకపోవడం కూడా సహజమే. అయితే.. ఇంట్లో వారెవ్వరూ, ఆడపిల్ల కాశీ పెళ్లి మాట ఎత్తక పోవడం కొంచెం అసహజంగా అనిపించింది.. అందులో కింది తరగతి కుటుంబాలలో అమ్మాయిలకి త్వరగా.. మళ్లీ మాట్లాడితే మైనారిటీ తీరకుండానే వయో భేదంతో పని లేకుండా చెయ్యడం అందరికీ తెలిసిన విషయమే.

అందరికంటే చిన్నది.. ఆడపిల్ల సంపాదన మీద ఇంటిల్లి పాదీ ఆధారపడి, ఇంచుమించు శ్రమ దోపిడీ చేస్తుంటే.. కన్నతండ్రి కళ్లు మూసుకుని కూర్చోవడం కొంత ఎబ్బెట్టుగా అనిపించక మానదు. మధ్యలో స్నేహితురాలు చెప్పిన హితవు కూడా పెడచెవిని పెడ్తుంది అన్నదమ్ములంటే ఉన్న అభిమానంతో ఆ అమ్మాయి.. అప్పటికి స్త్రీ అయింది.. పరిస్థితులు అవగాహన చేసుకోగలదు. అయినా సరే.. అతి మంచితనమో, అన్నదమ్ముల మీద గుడ్డి ప్రేమో.. తన గురించి ఆలోచించకుండా జీవితం మూడువంతుల భాగం గడిచాక మేలుకుంటుంది.

కుటుంబీకులు ఇంటి ఆడపడుచు మీద అంత అశ్రధ్ద చూపడానికి కారణం కథాంతానికి ముందు తెలుస్తుంది. ఆడపిల్ల సంపాదనమీద ఆధారపడ్డ తండ్రుల స్వార్ధానికి బలై పోయిన స్త్రీ.. నడి వయసు దాటాక ఒక అండ చూసుకుని అనాధల్ని ఆదుకోవడంతో కథ ముగుస్తుంది.

దీనికి వ్యతిరేకంగా కన్న కూతురి స్వార్ధానికి బలైన ఒక తండ్రి ఆవేదన ‘మా నాన్న పిచ్చోడు’ లో కనిపిస్తుంది. ఈ రెండు కథల్లోనూ పెంచుకున్న అనాధ పాప ప్రేమ పాఠకులను కదిలిస్తుంది.  ఏ విధంగా తల్లిదండ్రుల నాదుకుందో, వారి మీద ఎటువంటి ప్రేమ, ఆప్యాయతలు కనపరుస్తుందో.. తండ్రి కళ్లల్లో ఆనందాన్ని చూడటం కోసం అవసరమైతే కోర్ట్ చుట్టూ సంవత్సరాల తరబడి ఏ విధంగా తిరగ గలదో.. రచయిత్రి చెప్పిన విధానం మనసుకు హత్తుకుంటుంది. అదే కన్న కూతురు, తండ్రిని పిచ్చాసుపత్రి పాల్చేసి పెన్షన్ కాజేస్తుంది. ఒక కథలో కూతురి పరంగా, ఇంకొక కథలో తండ్రి పరంగా ఉత్తమ పురుషలో సాగుతుంది కథనం.

స్వార్ధ పరురాలైన స్త్రీ కుటుంబ సభ్యులతోనే కాకుండా స్నేహితులతో కూడా నిస్సంకోచంగా, నిర్దాక్షిణ్యంగా, అమానుషంగా ప్రవర్తించి వారిని సంక్షోభానికి  గురి చెయ్యడం ‘ఎ ఫ్రెండ్ ఇన్ నీడ్’ లో కూడా కనిపిస్తుంది. కళ్యాణి వంటి వ్యక్తులు మనకు తారసపడుతూనే ఉంటారు.. ఎంతో కొంత క్రమంలో. మన టి.వి సీరియల్స్ లో ఇటువంటి వారినే చూపిస్తుంటారు. ఎవరికైనా ఏ సహాయమైనా చేసేటప్పుడు “భగవద్గీత గుర్తుకుచేసుకుంటూ ఉండాలి, మనం నిమిత్త మాత్రులమే సుమా..” అని ఈ కథలో ప్రధాన పాత్ర గుర్తు చేస్తుంటుంది.

‘నాకోసం తిరిగి రావూ’ లో మనవరాలి మీద తాతయ్య ప్రేమ, అభిమానం చూస్తాం. పల్లెటూరి వర్ణన ప్రధానంగా సాగే ఈ కథని స్కెచ్ అనుకోవచ్చు.

‘ముళ్లగులాబీ’, విదేశాల్లోనే కాదు.. స్వదేశంలో కూడా యువత ఎదుర్కుంటున్న సంక్షోభం. ఇందులో ఆడ, మగ తేడా లేదు. పెళ్లికి ముందు ఒకలాగ, పెళ్లయ్యాక ఇంకొకలాగ ప్రవర్తించే కోడళ్లు (అల్లుళ్లు) కోకొల్లలు. కనీసం మాలిని రంగులు నిశ్చితార్ధం నాడే బయట పడ్డాయి. కిరణ్ తల్లిదండ్రుల ఆవేదన కొద్దికాలంలోనే, అతను కాబోయే భాగస్వామి అంతరంగం ముందుగానే తెలుసుకుని తగిన చర్య తీసుకోవడంతో ముగిసింది. ప్రస్థుత పరిస్తితుల్లో పిల్లలు స్థిరపడే వరకూ కన్నతల్లి పడే ఆదుర్దాని రచయిత్రి చాలా బాగా వివరించారు. నాకు ఈ కథ బాగా నచ్చింది. కాబోయే కోడల్ని చూసిన ఆనందం, అమ్మాయి నచ్చిందని భర్తతో తన సంతోషాన్ని పంచుకోవడం.. ఆ తరువాత.. అదే అమ్మాయితో కొడుక్కి పెళ్లైతే ఆ పై జీవితం ఎలా.. ఆ అమ్మ అంతరంగాన్ని బాగా ఆవిష్కరించారు రచయిత్రి.

అదే మొండితనం, బద్ధకం కలగలిపిన.. భాష, సంస్కృతి వేరైన ‘విదేశీ కోడలి’ విన్యాసాలు.. ఏవిధంగా ఉంటాయి..

అమాయకంగా ఒక్కగా నొక్క కొడుకు అడిగిందల్లా ఆస్థులు అమ్మి ఇచ్చి, విదేశాలకి పంపుతే.. ఆ కొడుకు, నాలుగు రోజులు కూడా తల్లిదండ్రులు తన దగ్గర ఉండలేని పరిస్థితికి క్షణిక వ్యామోహం లో తీసుకొస్తే.. ఆ తల్లిదండ్రులు పడే వేదన కళ్లకి కట్టినట్లు కనిపిస్తుంది ఈ కథలో.

కోసూరు ఉమా భారతి

కోసూరు ఉమా భారతి

పై రెండు కథలూ చదివిన పెళ్లి కాని యువకులు, జీవిత భాస్వామిని ఎంచుకునే ముందు ఒక్క నిముషం ఆలోచిస్తారు. ఆ విధంగా ఉమాభారతి ప్రయత్నం కొంత సఫలం ఐనట్లే.

అమెరికాలోనే కాదు.. ఎక్కడైనా, వృధ్దాప్యంలో ఒంటరితనం భయంకరమైన శాపమే. దానికి మతి చాంచల్యం తోడైతే.. ఇంక అంతకంటే ప్రత్యక్ష నరకం ఉండదు. కథలో కనుక రేణు కుమార్ కి తార వంటి స్నేహితురాలు దొరికింది. నిజ జీవితంలో.. నిర్దయులైన కొడుకులు గాలికి వదిలేస్తే రెపరెపలాడే పిచ్చి తల్లిని ఎవరాదుకుంటారు.. ‘త్రిశంకుస్వర్గం’ చదువుతుంటే ఒళ్లు గగుర్పాటు చెందకమానదు. ఇది చదివిన వారు తమ మాతృమూర్తిని అక్కున చేర్చుకుంటే రచయిత్రి ఎంతో మధనపడి వ్రాసిన ఈ కథ గమ్యం చేరినట్లే.

‘తొలిపొద్దు’, తండ్రి నిరాదరణకు గురై, భర్త నిర్లక్ష్యంతో దిక్కు తోచని స్త్రీ ఎటువంటి నిర్ణయాన్ని తీసుకోవాలో సూచిస్తుంది. అమ్మ, అమ్మమ్మల ప్రేమతో గారాబంగా పెరిగిన భానుమతి, ప్రేమ రాహిత్యానికి గురైతే.. తనకున్న ఒకే ఆలంబన అయిన బాబుని తన ఆదర్శాలకి అనుగుణంగా పెంచాలని.. మానసికంగా ఒంటరితనం అనుభవిస్తూ.. భౌతికంగా కూడా ఒంటరి పోరాటాన్ని  సాగించడానికి నిశ్చయించుకుంటుంది. ఇది ఆ తరం మహిళకి కష్ట మయిన పనే.. అయినా అటువంటి వారూ ఉన్నారు సమాజంలో..

ఇందులో అన్నీ స్త్రీ సమస్యలకి సంబంధించిన కథలైనా.. ప్రత్యేకించి అమ్మ గురించి రాసిన కథలు రెండున్నాయి.

ఒకటి.. ‘అమ్మతనం అద్భుతవరం..’ మదర్స్ డే సందర్భంగా జరిగిన సమావేశంలో వక్తలు వెలిబుచ్చిన అభిప్రాయాలు.. శ్రావణి తన స్వానుభవంలో చెప్పిన, సర్జన్ గారు తల్లిని ఇంట్లోనే జైలు పాలు చెయ్యడం.. ఆ తల్లి రోజుకొక్క సారైనా కొడుకు, మనవలు కంట పడతారు కదా అని ఒంటరి జీవితం గడపడం చదువుతుంటే మనసు ద్రవించక మానదు. అలాగే పక్కింటి వినీత కొడుకు కోసం పడుతున్న తాపత్రయం.. ఈ ఒక్క కథలోనే చాలా కథలు చెప్తారు రచయిత్రి. కొన్ని తీసేసి, కొన్నింటి నిడివి పెంచితే బాగుండేదనిపించింది.

రెండవది.. ‘అమ్మకి సరయిన స్థానం స్వర్గమే..’ అమ్మ కష్టం, ఆవిడ ఆవేదన చూడలేని, దూరాన ఉన్న ఒక కూతురి కోరిక ఇది. వినడానికి వింతగావే ఉండచ్చు.. కానీ కథంతా చదివేశాక మనం కూడా అదే అనుకుంటాము. ఆప్యాయతకి, త్యాగానికి మారుపేరు అమ్మ.. అమ్మ కంటి నీరు తుడవలేని ఒక కూతురి ఆక్రందనని ఆమె మాటల్లోనే వ్యక్తీకరిస్తారు శ్రీమతి ఉమ.

అమ్మ మీద వచ్చిన కవితల్ని, కథల్ని ఎందరు రాసినా, ఎన్ని సార్లు చదివినా భావోద్వేగం కలుగక మానదు ఎవరికైనా. అదే భావం ఈ సంపుటి లో అమ్మ కథలకి కూడా కలుగుతుంది.

ఇంక స్వర్గ లోక వాసుల భూలోక విహారం వివరించే కథలు ‘మానసపుత్రి’, ‘భరతముని భూలోక పర్యటన’. ఈ కథానికల్లో కవితలదే పైచేయి. మానసపుత్రి, నృత్య రూపకం కథగా మలచబడిందని రచయిత్రే చెప్పుకున్నారు. చదువరికి అదే భావం కలుగక మానదు.  ఇవి చదువుతుంటే కథలు చదువుతున్నామని అనిపించక పోయినా.. ప్రాచీనత నుంచి ఆధునికతకి ప్రయాణం.. రెంటినీ మిళితం చేసే ప్రయత్నం పాఠకుడ్ని ఆకట్టుకుంటాయి. భరతముని, సినిమా షూటింగ్ లో నాట్యవిన్యాసాల్ని చూసి ఆవేశపడతాడనుకున్న నాకు.. ఆయన ఆశ్చర్యపోవడంతో ఆపెయ్యడం నిరాశ కలిగించిన మాట వాస్తవం.

ఈ కథల సంపుటి రచయిత్రి తొలి ప్రయత్నం. తక్కువ వ్యవధిలో ఇన్ని కథలు రాసి, పాఠకుల మెప్పు పొందడానికి కారణం ఉమాభారతిగారికి సాహిత్యం మీద ఉన్న తపన.. కళాకారిణిగా భాష మీదున్న పట్టు.

కథలన్నింటినీ పూల గుఛ్ఛంలా అందించేటప్పుడు వస్తు వైవిధ్యం ఉంటే ఇంకా బాగుండేది. ఉదాహరణకి, అనాధ పాపల్ని పెంచుకున్న కథల్లో.. సామాజిక సేవలతో ముగింపు, ఆ అమ్మాయిలిద్దరూ కుటుంబం మీద చూపించే ప్రేమ వంటివి, విడివిడిగా పత్రికల్లో చదివినప్పుడు తెలియదు కానీ.. ఒక దగ్గరున్నప్పుడు సారూప్యం కనిపించక మానదు.

ఒక్కోసారి వర్ణనలు కథని మించి పోయాయేమో అనిపించింది. ఇటువంటి చిన్న చిన్న విషయాలు తప్పిస్తే ఒక మంచి ఆలోచనా పూరితమైన కథలు చదివిన తృప్తి కలిగింది.

శ్రీమతి ఉమాభారతి మరిన్ని మంచి కథలు వ్రాయగలరనటంలో ఎటువంటి సందేహం లేదు.

          — మంథా భానుమతి.

 

 

 

 

 

 

 

 

 

 

 

దేశం నుదిటిపై పచ్చబొట్టు ‘బంజారా నానీలు ‘

 sri
 
       బంజారాలు అనగానే స్మృతి పథంపై మెదిలేవి మోదుగు పూల రంగు దుస్తులు, అద్దాల కాళీ (రవిక ), వెడల్పాటి భుర్యా (ముక్కుపోగు ), చెవులకు బుట్ట లోలాకులు, అలవోకగా వేసుకునే టుక్రీ (మేలి ముసుగు ), కాళ్ళకు బరువైన కడియాలు ధరించి ఇప్ప పువ్వంతటి ముగ్ధత్వంతో తండాలో చలాకీగా తిరిగే అమాయక యువతులు. కట్టెల మోపు ఎత్తుకుని సమీప నగరపు వాడల్లో తిరిగే చెమట పూలు, ఎడ్ల బండ్లు కట్టుకొని ఊరూరా తిరిగి ఉప్పమ్మే దేశదిమ్మరి తనం, ఎన్నో యేండ్ల తరువాత అంగట్లో కలుసుకొని దుఖాన్ని కలబోసుకునే తల్లీ కూతుళ్ళు, మోసం నేర్వని తండాలు, గాసం కోసం అడవంతా గాలించే స్త్రీ, పురుషులు ఇలా ఎన్నో..  ఎన్నెన్నో… ఇవ్వన్నింటినీ రంగరించి నానీలలో పోత పోసి తెలుగు కవిత్వపు వేదిక పై తండా ఆత్మ గౌరవ పతాకాన్ని ఎగుర వేశారు డా. సూర్యాధనంజయ్.
       సాహిత్యం జీవితానికి ఉపనది లాంటిది. నదీ ప్రవాహంలో రాళ్ళు, రప్పలు, ఎత్తులు, పల్లాలు, ఆటంకాలు, వేగం, విశాలత్వం, ఉన్నట్టే ఈ నానీల నిండా బంజారా జీవితాల్లోని అనేక సంఘర్షణలు, మిట్ట పల్లాలు, సంసృతి, తండా బతుకు చిత్రాలు అడవి పూల పరిమళంలా పరచుకుని ఉన్నాయి.
      బంజారాలు, ఎరుకల, సుగాలీలు.. వీళ్ళంతా ప్రధాన స్రవంతికి దూరంగా తమ బతుకేదో తాము బతుకుతూ నిశ్శబ్దంగా ఈ లోకం లోకి వస్తున్నారు, కాల గర్భంలో కల్సి పోతున్నారు. ఎస్సీ, బీసీ, ముస్లిం మైనార్టీ జీవితాలు, 1980 నుండి సాహిత్యంలో చోటు చేసుకుంటున్నా, గిరిజన జాతుల జీవితాలు, వారి అనుభవాలు ఎక్కడా సాహిత్య పుటల్లోకి ఎక్కలేదు. ఎక్కినా అతి తక్కువ. అలాంటి అమలిన, నాగరికత సోకని తండా పైకి ఒక కవిత్వపు కిరణాన్ని ప్రసరింపజేసి, బంజారా సంస్కృతి లోని అనేక రంగుల కాంతి పుంజాన్ని ఆవిష్కరిస్తున్నారు డా. సూర్యధనంజయ్.
      విత్తు తన కడుపులో మహా వృక్షాన్ని దాచుకున్నట్లు ఒక్కో నానీ ఒక్కో గాయాన్ని, శిథిలత్వాన్ని, బతుకు లోతును, తండా శకలాల్ని, జీవితపు పాకుడు రాళ్ళపై పైకెగబాక లేక అంతకంతకూ లోలోతుల్లోకి జారిపోయే తనాన్ని పట్టిచూపుతుంది. ఇటుకపై ఇటుక పేర్చినంత మాత్రాన ఇల్లు కానట్టు నానీ రాయడమంటే పిడికెడు  అక్షరాల్ని కుప్పగా పోయడం కాదు. ఇటుకల్ని కలపడానికి పదార్ధం పూసినట్టు, పదాల్ని  కలపడానికి, ఒక భావాన్ని ఆవిష్కరించడానికి కవిత్వాంశ ఏదో కావాలి. ఆ కవిత్వమనే పదార్థాన్ని కడవ నిండా నింపుకొని నానీల ముఖ ద్వారం గుండా తెలుగు కవిత్వ ప్రాంగణంలోకి అడుగు పెట్టిన కవయిత్రి డా. సూర్యాధనంజయ్. ఒక్కో వ్యక్తీకరణ పాఠకుడిని కుదుపు కుదిపి, తండా చట్టూ గిర్రున తిప్పి, ఆ తిరుగుడు తనం దేహం నుండి దూరం కాకముందే బతుకు చిత్ర పటంపై నెమ్మదిగా నిలుపుతుంది. అప్పుడు అసలు భావ శకలంలోకో, బతుకు పుటల్లోకో ప్రవేశిస్తాం. కొన్ని నానీలు రోజంతా వెంబడించి కలల్లోకి కూడా దూసుకు వచ్చి కలవరపెడతాయి. స్వప్న ప్రలాపన చేపిస్తాయి. మనసు లోతుల్లో రోజుల తరబడి నానీ నానీ, ‘నానీ’ రూపాన్ని సంతరించుకున్నాయేమో చాలా నానీలు తడి తడిగా మట్టి ముద్రల్ని హృదయపు గోడలపై వేస్తాయి. కొన్ని పద చిత్రాలు కవయిత్రి ప్రతిభకు గీటురాళ్ళుగా నిలిచి అబ్బుర పరుస్తాయి.
                                     పడిలేచే
                                     కెరటాలు వాళ్ళు
                                     వారి జీవితాలు
                                     జయించిన కన్నీళ్లు
  “జయించిన కన్నీళ్లు” అనే పదచిత్రాన్నిబహుశా తెలుగు కవిత్వం ఇప్పటిదాకా చూళ్ళేదేమో . జ్ఞాపకాల బొట్లు, శ్రామిక తపస్సు, కళ్ళల్లో చెలిమల్ని మోయడం, గాయాల గూడు, కడుపమ్ముకోవడం, పచ్చపచ్చని మాటలు, విషాదానికి ఊరే గుణం, శ్రమలోంచి పుట్టిన మయూరం, బానెడు కష్టాలు, వలసల అలజడి వంటి పదచిత్రాలు పఠిత మనసు ముంగిట్లో మేలిమి రత్నాల్లా జలజలా రాలుతాయి. నానీల విలువను కవిత్వపు నిచ్చెన మీదుగా నెల వంకను ముద్దాడేలా చేస్తాయి.
          ప్రపంచీకరణ ఇనుప పాదం పల్లెల మీదా, బతుకుల మీదా మోపిన సందర్భంలో ఆయా ప్రాంతాలు, ఆయా కులాలు, ఆయా జాతులు తమ తమ అస్తిత్వాన్ని పదిలంగా రెండు చేతుల మధ్య కాపాడుకుంటున్నాయి. అందుకు బంజారాలు కూడా అతీతం కాదు. తండా నడి బొడ్డున నిలబడి అక్కడి సంస్కృతిని. జీవితాన్ని, కన్నీళ్లను, గాయాలను, అనుభవించి, కలవరించి, పలవరించి ఒక్కో నానీలో జీవితమంత విశాలత్వాన్ని, గాఢతను 20-25 అక్షరాల్లో సర్దేశారు కవయిత్రి. అందుకే తండా ప్రతీ ముఖం, ప్రతీ కోణం మనకు కనిపిస్తుంది. పుస్తకం నిండా తండా ముచ్చట్లే. ఒక్కటి కూడా ఊహపోహలతో రాసిన నానీ లేదు. ప్రతీ నానీ ఇప్ప పూల అందంతో తొణికిసలాడుతూనే, మట్టి పరిమళాన్ని వెదజల్లుతుంది. అంతే కాదు అక్కడక్కడ బంజారా భాషా పదజాలం కూడా అందంగా ఒదిగి పోతుంది. తీజ్ పండుగ నాటి మొలకల సహజత్వాన్ని చాటుతుంది. కవయిత్రి ఇందులో తన జాతి ఔన్నత్యాన్ని, సొబగుల్ని చెప్తూనే మూఢ ఆచారాల్ని, అమానవీయతను ఎండగడుతుంది.
                                   నోట్లో సారా చుక్కేసి
                                   ఆడ శిశువును చంపేస్తారా?
                                   తండాకు
                                   గుండె లేదా?
  అని ప్రశ్నిస్తుంది. తండా పట్లా. సమాజం పట్ల, సంపూర్ణ బాధ్యతతో రాసిన నానీలు ఇవి. నానీలన్నీ చదివేసిన తరువాత గుప్పెడు నెత్తురు మనసు పొరల్లోకి చిమ్ముకొస్తుంది. అంతరంగాన్నంతా అతలా కుతలం చేస్తుంది. అదే సమయంలో నానీలన్నీ బంజారా డ్రెస్ వేసుకున్న కన్నె పిల్లల్లా మారిపోయి ఒకరి చేతులు ఒకరు పట్టుకొని అందంగా మెలికలు తిరిగే లంబాడ నృత్యాన్ని చేస్తూ సుతి మెత్తని సందడి చేస్తాయి. ఈ నానీలు బంజారా సాహిత్యానికి సరి కొత్త చేర్పు. తండాకు నగరానికి మధ్య ఒక కవిత్వపు వంతెన.
                                   తాండే చ్వారి
                                   పోంటిల్ పక్డన్
                                   అబ్
                                   కాగజ్ శీత్లా కర్లత్!
                                         వెల్దండి శ్రీధర్

“గడిచిపోయిన నా జీవితాన్ని వెనక్కి పిలువరా..!”

శరత్ కుమార్

శరత్ కుమార్

 

ఒక దశాబ్దం క్రితం వచ్చిన “యాదే”(హిందీ) సినిమాలో ఒక పాట ఉంటుంది. “నగ్మే హై, షిక్వే హై, కిస్సే హై, బాతే భూల్ జాతే హై, యాదే యాద్ ఆతే హై” అని. అలా కలకాలం గుర్తుండిపోయే యాదే, సామల సదాశివగారి “యాది”.

సామల గారి రచనా శైలి విలక్షణం, తనదైన ప్రత్యేక శైలిలో,పాఠకుడిని మంత్ర ముగ్దుడిని చేస్తారు. వారి శైలి విశిష్టత ఏంటంటే మన పక్కనే కూర్చుండి, మనతో మాట్లాడుతూ ఆ జ్ఞాపకాల్నితను నెమరు వేసుకుంటుంటే మనం విన్నట్టుగా ఉంటుంది. “రచయిత-పాఠకుడు ” అన్న గీతని చేరిపివేస్తారు. అప్పటి పరిస్థితుల్లోకి మనల్ని తీసుకెళ్ళి మనల్ని తన జీవితపు మధుర జ్ఞాపకాల్లో విహరింపజేస్తారు.

నీ యాదిలోని ముచ్చట్లు చెప్పు తాతా….! అని తన మనవడు అడిగిన విషయాన్ని గుర్తుచేస్తూ, తనకోసం ఈ ముచ్చట్లు గుర్తు చేసుకుంటున్నట్లుగా- మనవడా ఇదిగో విను..అంటూ తన జ్ఞాపకాల దొంతరలోంచి ఒక్కొక్కటిగా విడమరచి చెబుతుంటారు.

“గడిచిపోయిన నా జీవితాన్ని వెనక్కి పిలువరా..!” అని వేడుకుంటున్నాడు ఉర్దూ కవి “సఫీ లఖ్నవీ”. పిలిస్తే మాత్రం గడిచిపోయిన జీవితం తిరిగి వస్తుందా? రాదు. ఆ సంగతి కవికి తెలుసు- మనకి తెలుసు. కాబట్టి మనమే గతం లోకి వెళ్లి, కొన్ని తీయని జ్ఞాపకాలు పట్టి తెచ్చి,పాఠకుల ముందు పరిస్తే మంచిది-అంటారు సదాశివ. ఈ “యాది” మొత్తం ఆ ప్రయత్నమే. “జో సునా ఉస్కా భళా- జోనసునా ఉస్కా భళా”..ఎవరు విన్నారో వాళ్లకు మేలగుగాక-ఎవరు వినలేదో వాళ్ళకూ మేలగుగాక.

సదాశివ గారు రుబాయిల గురించి, సూఫీ కవుల వేదాంతం గురించీ చెబుతారు. సూఫీ వేదాంతపు లోతులను అర్థం చేసుకుని, దాన్ని భారతీయ వేదాంతం తో అన్వయించుతూ తను ఎలా ఆ సూఫీ కవుల రచనల్ని (కవితల్ని) అనువదించారో చెబుతారు. ఇందులో మొదటగా చెప్పుకోవలసింది “అమ్జద్” గారి గురించీ.ఆయన్ని “హజ్రత్ అమ్జద్ హైదరాబాది” అంటారు. అతనొక సూఫీ కవి. అతని రుబాయీలు ప్రశస్తమైనవి.

“రామ్ కా జిక్ర్ హర్ నామ్ మే హై
రామ్ సబ్ మే హై సబ్ రామ్ మే హై”
“అన్ని పేర్లలో రాముని ప్రసక్తి ఉన్నది. అన్నింటిలో రాముడున్నాడు. రామునిలో అన్నీ ఉన్నాయి”. అంటారు అమ్జద్.

సూఫీలలో  చిస్తియా సంప్రదాయానికి చెందిన మరొక సూఫీ “యాషిన్ షా” గురించీ చెబుతూ, ఈ మౌల్వీ సాహెబ్ గొప్పదనానికి ఒక విషయం చెబుతారు. “మౌలానా అబుల్ కలాం ఆజాద్” ఖురాన్ షరీఫ్ కి భాష్యం రాసేటప్పుడు సందేహాలు వస్తే, ఈ మౌల్వీ సాహెబ్ కి ఉత్తరాలు రాసి ప్రత్యుత్తరాల ద్వారా తన సందేహాలు తీర్చుకునేవారట.

కాళోజీ రామేశ్వర రావు గారు అసలు ‘కవిత’ కి ఇచ్చిన నిర్వచన అద్భుతంగా అనిపిస్తుంది.
“జరాసా జోష్ థోడా దర్ద్ థోడా ఖులూసే దిల్
మిలాకర్ డబ్సే దిల్ కి బాత్ కహ్ దో షాయిరీ హోగీ”
“కొంచం ఆవేశం, కొంచం ఆవేదన, కొంచం సహృదయత ఇవన్నీ కలిపి ఒక పద్ధతిలో మనసులోని మాటను చెప్పండి. అది కవిత్వమవుతుంది” అని అర్థం. పద్ధతి అంటే “శైలి”, “రీతి”. భావం మనసులోనిది ఉండాలి. కవిత్వానికి ఇంతమంచి నిర్వచనం చదవలేదనిపిస్తుంది.

సదాశివ

సదాశివ

కాళోజీ నారాయణ రావు గారు మిర్జా గాలిబ్ కవితనొకటి చెప్తారు.

“ఖైదే యయాత్ బందే గమ్ అస్లమే దోనో ఏక్ హై
మోత్ సే పహారే ఆద్మీ గమ్ సే సజాత్ పాయే క్యోం”

తాత్పర్యం ఏంటంటే “జీవిత బంధంలో ఉన్నంత కాలం బాధలు ఉండేవే. మృత్యువు కంటే ముందు మనిషి బాధల నుండి ఎలా తప్పించుకుంటాడు?” అని. ఈ సమయం లో నాకు జగ్జిత్ సింగ్ ఘజల్ ఒకటి గుర్తొస్తుంది. “వొహ్ కౌన్ హై దునియా మే జిసే గమ్ నహీ హోతా..కిస్ ఘర్ మే ఖుషీ హోతీ హై మాతం నహి హోతా?”

అర్థం ఏంటంటే “ప్రపంచం లో బాధలు /దుఖం లేని మనిషి ఎవరు ? సంతోషం తప్ప మృత్యువు ఉండని ఇల్లు ఉంటుందా?”  అని.
ఈ రెండూ ఒకే సత్యాన్ని తెలియజేస్తున్నాయన్న భావనతో ఈ ఘజల్ ని ప్రస్తావించటం జరిగింది.

మీర్జా గాలిబ్ కి కఠినం గా ఉండే కవిత చెప్పటం ఇష్టమట. అతని సమకాలీనులు “అయ్యా..! ,ఈ కవిత మీకే అర్థం కావలె లేదా పైవానికి అర్థం కావలె. మా లాంటి వాళ్లకు అర్థం అయ్యేది కాదు” అని పరిహసించేవాళ్ళట.

“జిస్ ఖదర్ లోగోంకో నా తిఖ్..! యాద్ హై
హై వహీ దీవనె-మత్బూ -ఆ మేరా ”

    అంటే ‘ఎంతవరకు నా కవిత లోకుల నాలుకల మీద నిలచివున్నదో అదే ముద్రితమైన నా దివాన్ అని అంటారు “నాతిఖ్ లఖ్నవీ” అనే కవి. (దివాన్ అంటే కవితా సంకలనం)సామల గారి రచనలు కూడా అంతే. లోకుల హృదయాల్లో చెరగని ముద్ర వేసుకుని కూర్చుంటాయి. మధురానుభూతులుగా పదే పదే నెమరువేసుకునేలా చేస్తాయి. పాఠకులకి ఎన్నో యాదిలు (జ్ఞాపకాలు) మిగిల్చే పుస్తకం యాది. “అయ్యో ఉర్దూ రాదే, నేర్చుకుంటే ఇంకా బాగా ఈ కవితా మాధుర్యాల్ని ఆస్వాదించవచ్చు” అనిపిస్తుంది.అమరగాయకుడు కె. ఎల్. సైగల్ ఎవరి దగ్గరా నేర్చుకోకున్నా దైవదత్తమైన అద్భుత కంఠంతో ఎన్నటికీ మర్చిపోలేని పాటలు పాడారు. అతని పాటలకు పరవశించని వారెవరు? అని అడుగుతారు సదాశివ.అవును.!ఆ గాన మాధుర్యానికి పరవశించని వారేవరుంటారు? ప్రస్తుత కాలంలో కేవలం రనగొనధ్వనుల సంగీతం తో ఐపాడ్ లో పాటలు వింటూ తామూ  సంగీతాన్ని ఆస్వాదిస్తున్నాము, అనుకునే నేటి తరానికి సైగల్ పాటలు రుచించవేమో కాని, సంగీతం, గానం లోని రసాస్వాదానికి అలవాటున్న వారికి ఇప్పటికీ ,ఎప్పటికీ సైగల్ పాటలు మరచిపోలేని “గాంధర్వ గాన మాధుర్యాలే”.తన నవలల్ని సినిమాలుగా తీస్తూ కె. ఎల్. సైగల్ కు హీరో పాత్ర అప్పగించి ఉచ్చారణ అంత సరిగాలేని బెంగాలి పాటలు అతని నోటివెంట పాడిస్తూ విని శరత్ బాబు అంతటివాడు పరవశించినాదట. శరత్ బాబు సుప్రసిద్ధ నవలా రచయితే కాక చిత్ర లేఖనం, శాస్త్రీయ సంగీతం లో ప్రవేశమున్నవాడు.సినిమా రంగంలో సైగల్ పాటలకు లభించిన కీర్తికి అసూయ పడే వాళ్ళు కొందరు అతన్ని “బేపీర్” అని ” బే ఉస్తాదియా” అని పరిహసించేవాళ్ళట. అంటే ఏ గురువు దగ్గరా సంగీతం నేర్చుకొని వాడని.

ఆగ్రా ఘరానా ను రంగీలా ఘరానా అని అంటారు. ఆ ఘరానా లో నాయకమణి వంటివాడు ఉస్తాద్ ఫయ్యాజ్ ఖాన్ సాహెబ్”.

ఒకసారి ఎక్కడో ఒక చోట ఉస్తాద్ ఫయ్యాజ్ ఖాన్ కాళ్ళు జాపి పడుకుని శిష్యులతో మాట్లడుతున్నాడట. కె. ఎల్. సైగల్ అతని కాళ్ళు అదుముతూ కూర్చున్నాడట. అది గమనించిన ఉస్తాద్ లేచి కూర్చుండి “ఇదేమిటి కుందన్ లాల్?” నువ్వు ఇప్పటికే గొప్ప గాయకునివి మేమంతా నీ పాటలకు ముగ్దులము అవుతున్నాము. ఈ సేవ ఎందుకు?” అని ప్రశ్నించాడట.

“ఉస్తాద్ నన్నంతా బే పీర్ అని బనాయిస్తున్నారు.మీ వంటి ఉస్తాద్ శిష్యుణ్ణి అనిపించుకోవటం నాకు గర్వ కారణం. మిమ్మల్ని ఇలాగే సేవించుకుంటాను. ఏదైనా అనుగ్రహించండి” అని వేడుకున్నాడట కె. ఎల్. సైగల్. ఉస్తాద్ అతన్ని శిష్యునిగా స్వీకరించి కొన్ని రాగాలు శ్రద్ధగా నేర్పినారట. అందులో ముఖ్యమైన రాగం భైరవి.
గురుశిష్యుల అనుభంధం అలా ఉండేది ఆ రోజుల్లో. సైగల్ అంతటి స్థాయిలో ఉండి కూడా గురు శుశ్రూషకి అంతటి విలువనిచ్చాడు.

– శరత్ కుమార్ గడ్డమీది

మెలకువలోనూ వెంటాడే కల ‘లెనిన్ ప్లేస్’!

aparna
ఏదో మంచి పుస్తకం అనుకుంటూ చదవడం మొదలుపెట్టాను  కానీ ఇంతలా ఉంటుందనుకోలేదు. ఇది పుస్తకమా…?!! మొదటి  మూడు పేజీలూ చదివాక, ఆ అక్షరాల ధాటికి దిమ్మెరిపోయాను. ఉధృతంలా  సాగే  ఆ  వాక్యాల్లొ ఉన్న పదును, వాడి, ఆవేశం, సెన్సిటివిటీ నన్నింకా  దిగ్భ్రాంతికి గురి చేస్తూనే ఉన్నాయి. 
 
ఈ పుస్తకంలో నన్నంతగా  ఉద్రేకపరిచిన విషయం ఏంటి? కథావస్తువా..,కథనమా..,శైలా…, మరేదైనానా? బహుశా..ఈ కథల్లోని ఆత్మేమో.. ఆత్మ కన్నా ఆత్మలు అనే అనాలనిపిస్తుంది. చాలా కథలు చదువుతున్నపుడు నా గుండె దడదడలాడడం, నా రక్తం వేగంగా ప్రవహించటం  తెలుస్తుంది. కథ ముగించి పుస్తకాన్ని మూసిన కాసేపూ ఇంకా ఆ పాత్రలు, మెలకువ వచ్చాక కూడా వెంటాడే క్రితం రాత్రి కలల్లా నాలొనే  మెదలుతూ, కథల్లొ వారు అనుభవించిన వ్యథనూ,  పోరాటాన్నీ గుర్తుచేస్తునే ఉన్నాయి. కథలు, కథలలో  ఉద్యమాలు, ఉద్యమాల్లొ పాల్గొనే  వ్యక్తులూ..వారి నేపథ్యాలూ..వ్యక్తిత్వ, వ్యక్తిగత పోరాటాలూ..బాక్వార్డ్ లెర్నింగ్లా, అలా నన్ను తీసుకెళ్ళిపొయాయి.
‘లెనిన్ ప్లేస్’ కి ముందు ‘నల్ల మిరియం చెట్టు’ను చదివి రచయిత ఎంత బాగా రాసారో  అని అడ్మైర్  చెసాను. కానీ లెనిన్ ప్లేస్ చదివాక ‘నల్ల మిరియం చెట్టు’   అంతగా ఒప్పించలేదు నన్ను.అంతేగాక రచయిత మీద కోపం కూడా  వచ్చింది..ఇంత బాగా రాయగలిగినప్పుడు, నల్ల మిరియం చెట్టు ఇంకా బాగారాసుండొచ్చుగదా అని.
ఈ పుస్తకం లొ ఒకటి, రెండు కథలకు తప్పించి, మిగిలినవాటికి  సుఖాంతం లేదు. ఎక్కువగా  విప్లవానికి మొదలుగానో, కొనసాగింపు గానో ముగించారు. బహుశ విప్లవమే సుఖాంతం అనుకున్నారేమో ..మాలతి, మోహన సుందరం, శంకరం, పార్వతి  పాత్రలు  పదేపదే ఈ కథలలో  రకరకలుగా  ప్రవర్తిస్తుంటాయి.
లెనిన్ ప్లేస్ అనే టైటిల్ ఈ పుస్తకానికి పెట్టి ఈ కథకి సరైన గౌరవాన్నిచ్చారనిపిస్తుంది. ఈ కథ అంతా సొవియట్ కూలిపొయినందుకు క్షోభను అనుభవిస్తున్న లెఫ్టిస్టులది. కథలలో పదీపదిహేను పాత్రలున్నా సంధ్యా, రాజశేఖరాల జీవితం గురించే ఎక్కువగా ఉంది. బహుశా కమ్యూనిజం  కూలిపోతే  ఎక్కువగా నష్టపోయే వారి గురించిన చిన్న ఉదాహరణ అయ్యుండొచ్చు. అంతేగాక, వారు జీవితంలోఎంత చేదును అనుభవించి ఈ మార్గాన్ని నమ్ముకున్నారో తెలిపే ప్రయత్నంగావొచ్చు. ఇందులో రాఘవరావు పాత్ర చిన్నదైనా,  ఆ రోజు క్లాసులో తనకెదురైన అనుభవం  చెప్పినప్పుడు, అతని బాధని తరచి చూస్తే రేపటి మీద యువతకుండే నిరాశా, ఎద్దేవా మారుతున్న పోకడలు ఇలా  ఎన్నో విషయాలు బోధపడుతున్ననిపిస్తాయి. ఒక్కో నేపథ్యం నుంచి వచ్చిన వీరు సొవియెట్ కు వీడ్కోలు వందనాలిస్తూ బాధల్ని కలబొసుకుంటున్నా, మిత్ర సముదాయంలో అందరికీ ఒకటే ప్రశ్న. తమలో రగిలిన మంటని తన ఆలోచనలతో, రచనలతో మరింత రాజేసిన తమ మిత్రుడు –  మోహన సుందరం ఎక్కడా? అని.
‘ఇన్సెస్ట్’ గురించి చివరలొ ప్రస్తావిస్తూ శంకరం జీవితం లో చెసిన సెటైరికల్  జర్ని ‘ ఎక్కడికి పొతావీ రాత్రి.’ ‘చిట్టచివరి రేడియో నాటకం’- తీవ్రమైన ఈ కథలో నాలుగు పాత్రలూ, వారి జీవిత గాధలూ, తెగిన కలలూ, ఛిధ్రమైన బ్రతుకులూ, శకలాల్లా మిగిలిన దేహాలతో, బలమైన వ్యక్తిత్వాలూ…;’ వెలుగు ఎక్కడ సోనియా,’ ‘మోహనా! ఓ మోహనా!’ ఒకేలా  ఉన్నట్టనిపించినా రెండూ వేరువేరు కథలు.
‘మోహనా! ఓ మోహనా!’ ఒక ప్రత్యేక నవలికగా ప్రచురించవలసింది. ఇందులో మోహనసుందరం పాత్ర  దాదాపు ఎంతోకొంత  పేరుమోసిన చాలామంది దళితనాయకులను మనోగతానికి అతిదగ్గరగా ఉంది. చదువుకున్న దళితుల ఆలోచనలలో కాంప్లెక్సిటీని, ఇంత  బాగా ఎలా అర్ధం చేసుకున్నారబ్బా!  అని ఆశ్చర్యపోతూ చదివాను. మోహనసుందరం  గురించి అతని జీవితగాధ(ఒకటి మేధావుల కోసం, ఒకటి సామాన్య జనం కోసం అతనే రాసుకుంటున్నది) ద్వారా కొంత తెలిసినా, ఎక్కువ గా, కేశవదాసు డైరీ లో   అసలు మోహనసుందరం  గురించీ మాలతి గురుంచీ అతని అభిప్రాయాల వలనా , మోహనసుందరం నిత్యం అనుభవించే వేదన వలనా ఎక్కువ తెలుస్తుంది . ఈ కథలో మోహనసుందరాన్ని ఎంతగా ద్వేషిస్తామో అంతగా జాలిపడతాము కూడా.
ఈ పుస్తకం లోని కథలలో ఇంకొన్ని విశేషాలు- పాత్రల పేర్లూ, లేక స్వభావాలూ రిపీట్ అవడం. ‘చిట్టచివరి రేడియో నాటకం’ లో మాధవీ, ‘లెనిన్ ప్లేస్’ లో సంధ్యా ఇంచుమించు  ఒకేలా మాట్లాడినట్లనిపిస్తే,  ‘ఎక్కడున్నావు సోనియా’ లో రాజశేఖరానికీ, ‘లెనిన్ ప్లేస్’లో రాజశేఖరానికీ చాలా  పోలికలుండడం, ఇక  చిట్టచివరి రేడియో నాటకం లో శివయ్యా, మృతులభాష లో శివయ్యా ఒకరే! ‘మోహనా! ఓ మోహనా ‘ లో మోహనసుందరం  ఎక్స్ టెన్షన్ ‘నల్ల మిరియం చెట్టు’ ప్రతినాయకుడు రాజశేఖరం అని ఆ నవలను చదివినవారికి తెలిసిపోతుంది. ఇలాంటివే ఇంకొన్ని. కథలన్నీ రచయత సొంత అనుభవాలే అనడానికి ఇంతకన్నా నిదర్శనం  ఏముంటుంది?
రచయిత మేధావితనాన్ని చూపడానికి పై కథల్లొ ఒక్కటి చదివినా చాలు.  మన ఆలొచనాశక్తి విస్తరింపజేసుకొనేందుకు మాత్రం  అన్ని కథలూ తప్పక చదవాలి. పైన ప్రస్తావించినవిగాక ఇందులో ఇంకొన్ని మామూలు కథలు ఉన్నా శైలి కోసం  చదవవలసిందే. పుస్తకానికి ఇంకో  ప్లస్ పాయింట్- ముందు మాటలూ, అనవసరమైన ఎండొర్స్మెంట్లు లేవు, ఎలా ఉందో పాఠకులే నిర్ణయించుకోవాలి. ఈ పుస్తకం అనుకోకుండా నా దగ్గర చేరింది. ఒక మంచి రచన తో పాటు  చివరలో ‘నేపధ్యం’  ద్వారా ఒక గొప్ప రచయతను కూడా పరిచయం  చేసింది.
ఇప్పుడు నా నెక్స్ట్ ప్లాన్ ఆఫ్ ఆక్షన్- రచయతను ఒకసారి కలిసి మాట్లాడాలి. :)
అపర్ణ తోట
(నోట్: లెనిన్స్ ప్లేస్ పుస్తకం ముఖ చిత్రం కానీ, రచయిత ఫోటో కానీ అందుబాటు లోకి  రాకపోవటం తో వ్యాసకర్త ఫోటో మాత్రమే వాడుతున్నామని గమనించగలరు.)