ఇక కథా నిలయం తెలుగు ప్రజల బాధ్యత : కారా మాస్టారు

IMG_0011

 

ఒక వీసెడు బరువున్న పదార్ధమేదో సుందరరామయ్య ఒడిలో పడింది … (తీర్పు కధ మార్చి 1964)

టక్ దబ్ మన్న శబ్దంతో ఒక తలా, చిన్న దేహమూ … పంచాయితీ మండపం ముందు గోనెసంచీలోంచి రాలేయి. (యజ్ఞం కధ రచనాకాలం 1964 జనవరి – ఏప్రిల్ ప్రచురణ 01-01-1966)

బహుశా, ఇటువంటి బరువైన పదార్ధం, ఇటువంటి శబ్దం, అంతకు ముందర తెలుగు కధాసాహిత్యం యెరిగుండదు. ఆనాటి నుండీ, తెలుగు కధా సాహిత్యావరణాన్ని తొలినాట పెను శబ్దంతోనూ, యిపుడు పెను మౌనంతోనూ ప్రభావితం చేస్తున్న యేకైక వ్యక్తీ .. శక్తీ శ్రీ కాళీపట్నం రామారావు. యజ్ఞం రాసినందుకు కధా సోమయాజి అనంటుంటారు. (సోమయాజి యజ్ఞం వేరూ, కారా యజ్ఞం వేరూ అయినా సరే, మరో పోలిక లేకేనేమో?) ఒక సడలని దీక్ష, అంకిత భావం, విరామమాశించని శ్రమతత్వం … కలగలసిన వ్యక్తిత్వం కాళీపట్నం! కధ పట్ల గల వల్లమాలిన ప్రేమకీ, సమాజమ్మీద యెనలేని గౌరవానికీ (సాహిత్య సమాజం), సమాజం నుంచి పొందినదేదయినా ఋణమనీ, దాన్ని తిరిగి తీర్చాలన్న ఆదర్శానికీ … నిలువెత్తు రూపం కాళీపట్నం రామారావు నిర్మించిన, శ్రీకాకుళంలోని కధానిలయం!

వృత్తిరీత్యా మాస్టారయిన కాళీపట్నం ప్రవృత్తి రీత్యా గూడా కధ మాస్టారైనారు. ఎందరెందరో సవ్యసాచులూ, ఏకలవ్యులూ (గురుదక్షిణ చెల్లించకుండానే!) వున్నారతని శిష్యబృందంలో! కధల మాస్టారు, కాళీపట్నం రామారావు మాస్టారు తొంబయి ఒకటవ జన్మదిన శుభ సందర్భాన, సారంగ పత్రిక మాస్టారి రచనలను మళ్ళీ పరిచయం కాదు .. పరిశీలించడం చేస్తుండడమేగాక, మాస్టారిని ఇంటర్వ్యూ చేయదలచి, నన్ను సంప్రదించడం, మాస్టారి అనుమతి తీసుకోవడం (సహజంగా ఆయన ఇంటర్వ్యూలకు సాధ్యమయినంత యెడంగా ఉంటారు, అందులోనా యిపుడు వయోభారం) జరిగింది. మాస్టారితో ఇంటర్వ్యూకి నేను యేవో కొన్ని ప్రశ్నలు సిద్ధం చేసుకొని వెళ్ళి, ఆరంభించినా, యెక్కువగా కబుర్ల రూపంలో సాగింది. ఆ కబుర్లలో, నా ప్రశ్నలకేగాక, అదనంగా, వీటివలన ఆయనకు గుర్తుకొచ్చిన యెన్నెన్నో భోగట్టాలు చెప్పారు (సాహిత్యపరమైనవే). ఆ భోగట్టాలల్లో ఆయన తన వ్యక్తిత్వాన్ని, సాహితీ వ్యక్తిత్వాన్నీ యెలా నిర్మించుకొచ్చారో, యేమేమి నేర్చుకున్నారో, (ఇప్పటికీ నేర్చుకుంటుంటానంటూ – ఒక వివినమూర్తి, రాయుడు గారు, రజనీకాంత్ వగైరా కొన్ని పేర్లు చెపుతూ) తెలియజేశారు.

యేదయినా కొత్త విషయాన్ని వినడానికి సంశయించకూడదనీ, వినీ దానిని మనదైన పరిశీలనతో మంచి, చెడ్డల విశ్లేషణ చేసుకొని నిర్ధారణకు రావాలనీ … అపుడే మార్పులపట్ల సాంప్రదాయక ఆలోచనాధోరణిని తొలగించుకోవడం సాధ్యమవుతుందనీ (ఇది మార్క్సిస్టులకూ, నాన్ మార్క్సిస్టులకూ యిరువురికీ వర్తించుతుంది) చెప్పారు.

IMG_0006

చాలా సందర్భాల్లో యెన్నో విషయాలు (నేను గ్రహించాననుకున్నవి) –

జీవితాన్ని చిత్రించడం, విశ్లేషించడం, అవగాహన పెంచడం, పాఠకుణ్ణి కార్యోన్ముఖుణ్ణి చేయడం కధ లక్ష్యం…

జీవితంలో దుఃఖముంది. కానీ దానికి కారణం సమాజంలో వుంది. సమాజంలోని వర్గమూలాల్లో వుంది….

లోకంలో జరుగు అతి చిన్న దోషాల నుండి మహాదోషాల వరకు వాటి మూలాలను చూసి కారణాలను వెదికి పట్టుకొని చిత్రించితే రచన నిజాయితీగా, ఆదర్శంగా వుంటుంది….

మనం అనుభవించే సౌకర్యాలుగానీ, మనం తీర్చుకునే రోజువారీ జీవనావసరాలుగానీ, కేవలం మన శ్రమతో మాత్రమే లభించడంలేదు గదా, అనేకుల శ్రమ వలన లభిస్తున్నవి గదా, గనుక అనేకుల పట్ల మనకు బాధ్యత వుంది. అనేకులే సమాజం –

యిలా కొన్ని చెప్పాననీ … ఇంటర్వ్యూలిచ్చాననీ, నేనెందుకు రాసేనూ, నేనూ నా జీవనదృక్పధం వంటి శీర్షికల పేర్లు చెప్పారు. అలాగే యజ్ఞం, కుట్ర, తీర్పు వంటి కధల మీదా, వాటి నేపధ్యం (ఇటీవల జీవధార నేపధ్యం, కధా నేపధ్యం-1) గురించీ చెపుతూ, తాను ఆదిలో రాసిన కధల దారి నుంచి మళ్ళడం వెనక మారిన తన దృష్టికోణం, దృక్పధాల గురించీ గూడా చెప్పాననీ, అవన్నీ మనసు ఫౌండేషన్ కాళీపట్నం రామారావు రచనలు పుస్తకంలో వుండొచ్చనుకుంటానన్నారు (ఉన్నవి గూడా).

దీంతో అటువంటి పాత ప్రశ్నలు వేయకు సుమా అని మాస్టారు చెప్పక చెప్పారనిపించింది. మాస్టారు తన సృజనాత్మక రచనల్లో చెప్పక చెప్పడమనే మార్మిక శైలి ఉండదు … కుండలు బద్దలు గొడతారు. సృజనాత్మకేతర రచనల్లోనే యీ గుప్తతా, మర్మం. అది అతని వ్యక్తిత్వ శిల్పం. దీన్ని ఆతని రచనాశిల్పమని కొందరు విమర్శకులు సూత్రీకరించేరు, గాని ఆ సూత్రీకరణ కరెక్టు కాదు.

‘చావు వంటి కధలో మాస్టారు, పాఠకునికేమి యెరుక చేయాలనుకున్నారో, కధాంతాన (మొత్తం కధలో వ్యక్తమైనా సరే) .. “ముసిల్ది నిన్న పోతే యీ వేళ్టికి రెండు. కాని, సంధికాలంలో తెలివేసి వున్నవాళ్ళకలా అన్పించదు. నిన్నానేడూ అంతా ఒక్క లాగే వుంటుంది.” అని చెప్పారు. ఇది మాస్టారి మరికొన్ని కధల్లో గూడా చూడవచ్చు.

అలాగే, చెప్పక చెప్పడం, గుప్తం, మర్మం వంటి వాక్యాలు వ్యాసాల్లోనా, అభిప్రాయాల ప్రకటనల్లోనా, లేఖల్లోనా చూడగలం. ఇందుకొక ఉదాహరణ … చావు కధ మీద ఒక సంపాదకుడి అభిప్రాయానికి జవాబుగా రాసిన సంజాయిషీ! (మనసు ఫౌండేషన్ ప్రచురించిన ‘కాళీపట్నం రామారావు రచనలు’, పుట.344) ఇది చదివితే మాస్టారు, తనదైన అభిప్రాయాన్ని, ఆలోచననీ, తన ధోరణినీ చెప్పక చెప్పారనిపిస్తుంది. నిజానికది సంజాయిషీ శీర్షికతో వున్నదిగానీ, అది సంజాయిషీ కాదు, తన రచనా దృష్టి కోణాన్నీ, శైలినీ సమర్ధించే వాదన. వాదన మాత్రమే కాదు అవతలివారికి బోధన (వెల్చేరు నారాయణరావుగారు పోల్చుకున్నారు!) ఈ విషయాన్ని ఔనంటారా, కాదంటారా మాస్టారూ అనడిగితే నవ్వుతూ ఔనన్నారు.

అప్పుడే – మాస్టారొకచోట, తనమీద తన మిత్రుడు (టీచర్ ట్రైనింగ్ కాలంలో ) రాసిన పద్యాన్ని తన పుస్తకంలో రాసుకోగా చూశాను … “వచన కవిత్వం వైఖరుల వ్రాయసకాడు…” అని ఆరంభమయి “… రామారావు మొగమాటమొకింతయు లేనివాడా, రామారావు మాస్టారని!’ ఆ ముక్కే అడిగేను.

IMG_0007

మాస్టారెంతటి మొగమాటో అని లోకమనుకుంటోంది. ఏది నిజం మాస్టారూ..?

అప్పుడూ, యిప్పుడూ, యెప్పుడూ భావజాలం దగ్గరా, దృష్టికోణం దగ్గరా నిర్మొహమాటినే. కాకపోతే, ఆ సంజాయిషీలా వుంటుందిప్పటి శైలి – అని బదులిచ్చేరు! “బాబయ్యా! నువ్వెంతకైనా సాహసివి …” (యజ్ఞం కధలో అప్పల్రాముడు, శ్రీరాములు నాయుడితో) అనుకున్నాను మనసులో.

దేశీయత, కధా నిర్మాణం, వ్యక్తీకరణ మొదలైన వాటిలో నేర్పు వల్ల శిల్ప సౌందర్యమేర్పడుతుంది… అని మాస్టారు అంతకుముందర చెప్పిన విషయమేగానీ శైలి విషయం చర్చకు రావడంతో మళ్ళీ వివరించేరు. దాంతో – శిల్పం కోసం సాహిత్యాన్నీ, వస్తువు కోసం జీవితాన్నీ అధ్యయనం చేయాలని కొ.కు. అన్నారు గదా… మీ అనుభవంలోంచి దీని సాధికారత చెప్తారా? అంటే, నాకిక్కడ కొ.కు.తో విభేదమేమీ లేదు గానీ, వస్తువే రూపాన్ని(శిల్పాన్ని) యెంచుకుంటాదంటారు …. ఈ మాటకీ పై మాటకీ తేడా వున్నట్టుంది కదా? పైగా శిల్పానికి ప్రాధాన్యతనిచ్చినట్టుగా మీ కధలుండవు, కొ.కు. కధలు గూడా! శిల్పమనే అంశమ్మీద చర్చించే యెక్కువమందికి శిల్పం మీదగల భావనను దృష్టిలో పెట్టుకుని యీ సంశయం నాకు … మీరేమంటారు, అని ప్రశ్నించేను.

మాస్టారు కాసేపు మౌనంగా తలవాల్చి , తర్వాత కిల్లీ కోసం కళ్ళతో వెదకబోయేరు. నాకర్ధమైంది. యే సందర్భాల్లో కిల్లీ యెందుకు వేయబోతారో, యెరిగున్న వాణ్ణి గనక మాస్టార్నీ ఈ ప్రశ్న నుంచి మళ్ళించదలచి – ఆదివారం వంటి మంచి కధను గూడా మీరు నాలుగేళ్ళు అచ్చుకివ్వకుండా దాచిపెట్టానన్నారుగదా, యెందుకలా? ఏ అసంతృప్తి వలన? మాకేమో యివ్వాళ గూడా అందులో అసంతృప్తేమీ కనబడలేదు, చెప్పరా అనడిగేను.

అప్పటికాయన సర్దుకున్నట్టుంది – వుండుండు… శిల్పం గురించి గదా, అడిగేవు” అనంటూ – నా వరకు శిల్ప సౌందర్యమంటే ప్రయోజనమే! ఇంతకుముందీ విషయమ్మీద యెవరెవరో ప్రశ్నిస్తే చెప్పాను గూడా … మైసుర్ దగ్గర డామ్, తాజ్ మహల్ అనేదో అన్నాను. ఇపుడూ, శ్రీపాద వారి ‘వడ్లగింజలు’, రావిశాస్త్రిగారి ‘తప్పు, పిపీలికం, వేతనశర్మ’ వంటి కధలున్నాయా? అవి, ప్రయోజనాన్ని సాధించడంతోపాటు అవి అందంగా తయారవడానికి శిల్ప సౌందర్యం కారణం… అని ఆగిపోయేరు. ఇంక మరి దీని మీద మాటాడరు, మనమే యిప్పుడు మాటాడినదాన్ని బట్టీ, గతంలో చెప్పినదానిని బట్టీ, దీని గురించి ఆతని అభిప్రాయానికి రావాలంతే! రావచ్చు గూడా!

కాసేపటి తర్వాత, ‘ఆదివారం’ కధ గురించి – “ఆ కధ బాగానే ఒచ్చింది. అయితే, అందులో శ్రమ ఉత్పత్తి శ్రమ కాదు. సేవకశ్రమ, ఉత్పత్తి శ్రమ వేరు, సేవాశ్రమ వేరు. గడుసుదా పిల్ల. అటువంటి పాత్రను సృష్టించేను. నాకేమిటంటే ఆ అత్తగారికీ పోటీ పెడితే తెలివైనదనుకున్న కోడల్నిగూడా యీ పిల్ల జయించడం…. దీని కోసం కధ రాసేను. అది తక్కిన వాటి లాంటి సబ్జెక్టు కాదు. అంచేత వుంచేశాననుకుంటాను…. అని చెప్పారు.

కొంతసేపు ఆ కధ గురించే ఆలోచించారో, యేమోకాని….. అన్నింటికి డిపెండెంట్లుగా మనుషులు తయారైనారు. కొన్నింటికి మనుషుల మీద, కొన్నింటికి యంత్రాల మీద. ఇదెక్కువయ్యిందిపుడు. సేవలు కావాలి. సేవల్ని మార్కెట్ సొమ్ము జేసుకోవడం చూస్తున్నాం కదా? ఇదీ… అని దీర్ఘం తీస్తూ ఆగిపోయేరు, యిక మనం తర్వాతది ఆలోచించుకుంటే బోధపడుతుంది.

మార్కెట్ గురించి వచ్చింది గనక వ్యాపార సాహిత్యమనీ, వ్యాపార పత్రికలనీ వేటినయితే మీ కాలంలో (అపుడవి మీకెంతో స్థానాన్నిచ్చినాయి కూడా) అనేవారో (పెట్టుబడికీ కట్టుకధకీ పుట్టిన పత్రికలనీ శ్రీ శ్రీ అన్నారు గదా) అవే యీ నాడు అందరికీ ఆధారభూతమైనాయి. అందులోనే అందరూ కధలు రాయాల్సొస్తోంది, ఏటేటా కధా సిరీస్ లోకి కధలను యీ పత్రికల నుంచే యెక్కువగా తీసుకుంటున్నారు…. కధల పట్ల అసంతృప్తిని వ్యక్తపరుస్తున్నారొకవేపు. పత్రికల ఆలోచనల్లో మార్పు రావాలని అపుడే గొప్పకధలూ, మంచి కధలూ వస్తాయని కొందరంటున్నారు. దీని గురించి చెప్తారా- అని పెద్ద ప్రశ్నయే అడగ్గా…

సమాజంలో అన్ని విషయాల్లో నిన్నటికీ, నేటికీ మార్పులు వచ్చినట్లే పత్రికల విషయంలోనా వచ్చింది. వ్యాపారమన్నాక, దృష్టి లాభాల మీద వుంటుంది. పత్రికల వలన మాత్రమే మంచి కధలు రావు… అని చెప్తూ ఆగిపోయేరు.

ఆ ఆగిన సంభాషణ, తొలి ప్రశ్నకు అనుబంధంగా – మీరు కధలు రాయడమారంభించిన నాటి కాలంలోని పత్రికారంగ పరిస్థితులకీ, నేటికీ చాలా మార్పు వచ్చింది గదా, ఈ మార్పు సాహిత్యానికి మీ కాలంలోలాగా దోహదపరిచేదిగా వుందంటారా– అన్న మలి ప్రశ్నతో కొనసాగింది.

ఆ కాలపు పత్రికల వ్యవస్థాపకులు సంఘ సంస్కరణకీ, జాతీయ దృక్పధానికీ, సేవాభావానికీ కట్టుబడి వుండేవారు. ప్రసిద్ధ సాహితీపరుల సంపాదకత్వంలో పత్రికలు నడిచేవి. 1950ల్లో పెట్టుబడి ప్రవేశించింది. అంతకుముందూ పెట్టుబడే గానీ, 50ల తర్వాతి పెట్టుబడివంటిది గాదు. అదీ గాక యింకొవేపు భారీ యంత్రాలు వచ్చేయి. పనిగంటలు మిగిలేవి, ఫలితంగా గొలుసు పత్రికలు రావటం, వాటి నిర్వహణ… దానితో విలేకరులు, సంపాదకులు, విస్తరణా, పోటీ … దాంతో గతకాలపు వారి స్థాయికి తక్కువవారి ప్రవేశం జరిగింది. పెట్టుబడి లబ్ది కోసం విలువల రాహిత్యం, పిల్లలు, ఆడవారు, యువత –వార్ని ఆకర్షించడం లక్ష్యం… వార్తలకూ, జీవితమ్మీద విశ్లేషణకూ బదులు సరుకుల ప్రచారం కోసం … నేటి పత్రికలు ప్రాధాన్యమిస్తున్నాయనిపిస్తోంది. ఈ మార్పు సాహిత్యానికి దోహదపడుతుందని యెవరయినా అనగలరని అనుకోనన్నారు….

వస్తువు, భాష, శైలీ వంటి విషయాల పట్ల , యిప్పటి పత్రికలు అప్రకటితంగా తమ విధానాన్ని అమలుచేస్తున్నాయి. మాండలికాలపట్ల, గ్రామీణ జీవిత చిత్రణపట్ల, రాజకీయార్ధిక సంబంధ అంశాల కధల పట్ల పెదవి విరుపుడు, నాన్పుడూ, తిరస్కారమూ కనిపిస్తోంది… అని యెక్కువమంది రచయితలంటున్నారు. మీరు రాయకపోయినా నిత్యం సాహిత్యపఠనంలోనూ, సాహిత్యావరణం లోనూ వుంటున్నారు కదా, మీకేమన్పిస్తోందన్న ప్రశ్నకు –

ఇది నిజమే కావచ్చు. ఇప్పటిలానే, యింతకుముందరా యీ ధోరణి వుంది. ఒక నాడు స్త్రీల రచనలకు, యింకో నాడు సస్పెన్స్, ధ్రిల్లర్ వగైరాలకూ స్థానమిచ్చి, మిగిలిన వాటిని నిర్లక్ష్యం చేసేవారు. రావిశాస్త్రిగారి రచనలనే పైన పేర్కొన్న రచనల గేప్ లల్లో ప్రచురించేవారు… పెట్టుబడి యిబ్బడిముబ్బడిగా ప్రవేశించాక జరిగిన పరిణామమిదనుకుంటాను … అని ఆగిపోయేరు.

కధల్లో అంతరంగ విశ్లేషణ కనబడే కధలు గొప్ప శిల్పనిపుణతకు ఉదాహరణలంటారు గానీ, మీ కధల్లో అంతరంగ విశ్లేషణ (సంకల్పం, అన్నెమ్మ నాయురాలు, అంతకుముందరి తొలినాటి కధలు తప్పా) తక్కువని నేనంటాను. కానీ గొప్ప దృశ్యీకరణ, నాటకీయత, సహజసిద్ధత, వస్తువులోంచి యెరుకపరిచే కధాంశం… యివీ మీ కధల గొప్పతనాలని నాకన్పిస్తోంది. అపుడు అంతరంగ విశ్లేషణ మాత్రమే గొప్ప శిల్పమనే భావన తప్పు గదా?

నీ విశ్లేషణ సరయినదే… వారి వారి అభిరుచులను బట్టి శిల్పం పట్ల అభిప్రాయాలుంటాయి. ప్రతివ్యక్తికీ అంతరంగం వుంటుంది. ఆ అంతరంగమ్మీద లేదా ఆ వ్యక్తి మీద బాహ్యప్రభావాలుంటాయి. కుటుంబ, సమాజ ప్రభావాలుంటాయి… వీటికి మళ్ళీ ఆ వ్యక్తి ప్రభావం లేదా ప్రమేయం వుటుంది. ఈ పరస్పర ప్రభావాల పట్ల అవగాహన ముఖ్యం…

మీ తొంబయ్యేళ్ళ జీవితమ్మీద మీ వ్యాఖ్య?

ఫలవంతమైనదని అనుకోవచ్చేమో

మీ సాహిత్యమ్మీద మీ వ్యాఖ్య?

రాయవలసినవి కొన్ని రాయలేకపోయా, కానీ రాసినవరకూ దాదాపు తృప్తినిచ్చాయి. కొన్ని అసంతృప్తి కలిగించేవి గుర్తించేను, వాటిని తర్వాత తెలుపుతా…

ఈ ముక్క ఆయనన్న తర్వాత అసంతృప్తి గురించి వివరాలడగాలనిపించింది గానీ, ఆయన యింకేవో కబుర్లలోకి వెళ్ళారు. అవి వింటుండగా, వారి పాత కధలు గుర్తురాగా, ఒక ప్రశ్న వేయాలన్పించింది. అదేమిటంటే- మాస్టారు, తొలి కధల్లో స్త్రీ జీవన అస్తిత్వానికీ, ఆత్మ గౌరవానికీ, పురుషాధిపత్య వ్యతిరేకతకీ (‘పురుషపులి జాతి స్వభావానికి యెలా అప్పగించనూ?’ అని కధా నాయక అంతరంగంలో తర్కించుకుంటుంది. – ‘అవివాహితగానే ఉండిపోతా’ కధ, 1946) ఆలోచనలు రేకెత్తించే (రేవతి, నవచైతన్యం, అవివాహితగానే ఉండిపోతా .. వగైరా) కధలు రాసిన మాస్టారు, ఆ తర్వాత అటువంటి కధలను రాయలేదు. ఇటీవల అస్తిత్వవాదాల సాహిత్యం (స్త్రీ వాద) పై మాస్టారి అభిప్రాయమేమిటి?

మాస్టారు నవ్వేసి, ఆదిలో రాసిన మాట నిజమే. అప్పటికది ఆదర్శవాద దృష్టి కోణం. ఆ కోణానికీ ఈ నాటి స్త్రీవాదానికీ సరిపోల్చగూడదు. అది సానుభూతివాద ఆదర్శం. నేటి స్త్రీ వాదులు తమ అస్తిత్వ చైతన్యాన్ని ప్రకటిస్తున్నారు. ఇది అనివార్యం. నేనెందుకు రాయలేదంటే, నా దృష్టి కోణం మారిన దశలో యెక్కువగా వర్గ వైరుధ్యాల గురించే పట్టించుకున్నాను. అదీగాక నేను రాయడమే చాలా తక్కువ సంఖ్యలో…. అంచేతనుకుంటానని ముగించారు.

కధా నిలయం గురించి మాటాడకుండా ముగిస్తే మీరొప్పుకోరు. ఆవు వ్యాసంలా యెటూ నుంచి తిప్పినా కధా నిలయంకే వస్తారని మీ గురించంటారు. చెప్పండి, కధా నిలయం నేటి స్థితీ, భవిష్యత్ స్థితి పట్ల మీ ఆలోచనలు…

నేను ఊహించిన దానికంటే బాగుంది. కానీ ఆశ్చర్యపోయేట్టుగా, ఆధునిక టెక్నాలజీ వలన యింకా అభివృద్ధి కావాలి. వివినమూర్తి ఆ దిశలో కృషి చేస్తున్నాడు. ఆదిలో యగళ్ళ రామకృష్ణ, రామారావునాయుడూ, నువ్వూ, మరికొంతమందీ… యిపుడు, వివినమూర్తి, సుబ్బారావు, దాసరి రామచంద్రరావు ప్రత్యక్షంగానూ, యెంతోమంది పరోక్షంగానూ కధా నిలయానికి సేవలందిస్తున్నారు. ట్రస్ట్ సభ్యులూ, కధానిలయం అభిమానులూ … కధా నిలయం భవిష్యత్ పట్ల దిగులు పడాల్సిన అవసరం లేదన్న నమ్మకాన్ని కలిగించారు. ఇంకా తెలుగు ప్రజలు కధా నిలయాన్ని తమ పరం చేసుకోవాలి, యిదీ నా కోరిక…

దాదాపు మాస్టార్ని ప్రశ్నించదలచినవన్నీ అయిపోయేయి. నిజానికి మాస్టారు, నా ప్రశ్నల కంటే యెక్కువ కబుర్లను కలబోసుకున్నారు. యజ్ఞంకధ మీద కొండపల్లి సీతారామయ్య, (సీతారాముడు తన కొడుకుని చంపుకోడం అన్యాయం అంటూ అజ్ఞాత పత్రికలో రాసేరట…) రంగనాయకమ్మ నుంచి యిటీవల విమర్శ రాసిన విద్యాసాగర్ దాకా ప్రస్తావించేరు. వీరెవరికీ సమాధానం రాయలేదనీ, ఆదిలో రంగనాయకమ్మగారి విమర్శకు ఆగ్రహమొచ్చి సమాధానం రాస్తే, చూసిన రావిశాస్త్రి గారు ఆపి వేశారనీ… కధను రాసేసి బయటకు వొదిలేక, యిక దాని గురించి లోకం యేమయినా అనుకుంటుందనీ, దాని గురించి మనం పట్టించుకోకూడదనీ, కన్నకూతురి గురించి తల్లడిల్లే కన్నతండ్రిలా కధ గురించి తల్లడిల్ల రాదనీ… యిలా యేవో రావిశాస్త్రిగారు చెప్పారు. నేనూ ఆలోచనలో పడ్డాను. ఆనాటి నుంచీ, నేను నా కధల మీద వచ్చే యే విమర్శకూ సమాధానం రాయలేదంటూ.. ఆఫ్ ది రికార్డుగా, ముఖ్యమైన, పైన పేర్కొన్న అన్ని విమర్శలకూ తన సమాధానం చెప్పారు.

కాసేపు తర్వాత, మళ్ళీ యజ్ఞం కధ రాయడం గురించి చెప్తూ – ఈ కధలో నేనొక టెక్నిక్ పెట్టుకున్నాను మానసికంగా. ఇందులో ఒక్కొకరినీ, యింకొకళ్ళు ఎక్స్పోజ్ చేస్తారు. శ్రీరాములు నాయుడి గురించి చాలా మంచి అభిప్రాయం మొట్టమొదట్లో వుంటుంది. గమనించేరు గదా, ఆ తర్వాత శ్రీరాములునాయుడేమిటో, యెలాంటి వాడో, అతని నిజస్వరూపమేమిటో అప్పల్రాముడు తన కధనంలో బహిర్గతం చేస్తాడు. ఆ అప్పల్రాముడేమిటో, యెలాంటివాడో, వాడి గురించి సీతారాముడు ఎక్స్పోజ్ చేస్తాడు … యిలా మనసులో అనుకొని ఆ టెక్నిక్ ని ఉపయోగించి రాసేను. కధా వస్తువు సరే …

కధావస్తువు దగ్గర ఆగిన సంభాషణతో – మీ తొలినాటి కధలేమో గాని, యజ్ఞం, తీర్పు వంటి కధల తర్వాత ప్రతికధకూ మీరు లోతుల్లోకి వెళ్ళి, ఆ కధా వస్తువులోంచి, యెరుకగావాల్సిన కధాంశాన్ని చిత్రించడానికి చాలా శ్రమ పడినట్టనిపిస్తుంది. ఏ కధనూ పై పైకి చూసి రాయలేదు. జీవధార గానీ, నో రూమ్ గానీ చివరికి సంకల్పం గానీ! ఒక కధావస్తువు నుంచి పూర్తిగా గ్రహించాల్సిన అంశాల్ని గమనంలోకి తీసుకొని … పాత్రలూ, సంఘటనలూ చిత్రిస్తారు. ఇక వస్తువు నుంచి చెప్పడానికి యేమీ మిగలనంత దాకా వెదుకుతారు. అంచేత, మీ కధలు వైవిధ్యంతో వుంటాయి. చాలా మంది రచయితలు ఒకే వస్తువుని (గతంలో గొప్ప రచయితలు గూడా) మళ్ళీ మళ్ళీ రాసేరు, రాస్తున్నారు. నిజం కాదంటారా? మీ అనుభవాన్ని చెప్పండని ప్రశ్నించగా …

ఇతర రచయితల సంగతేమో గానీ, తొలినాళ్ళల్లో, నేను రచనలారంభించిన కొత్తలోనే అచ్చుకాని నా తొలి రచనల్లో ఒకదానిని చదివిన మా నాన్న – కధలూ, నవలలూ ఏదో చెప్పడానికి రాస్తారు. అవి రాయదలిస్తే ఇతరులకేమైనా చెప్పగల తాహతుండాలి – యిలా యేవో చెప్పారు, ఆ తర్వాత మలినాళ్ళల్లో కొ.కు., రావిశాస్త్రి గార్లను చదువుకోగా, మరికొందరు మిత్రుల సాంగత్యంతో నాలో యేర్పడ్డ దృష్టికోణం కారణంగానూ – రచన యే మంచికి హానీ, యే చెడ్డకు మేలు చేస్తుందో చూసుకోవాలన్న రావిశాస్త్రిగారి మాట కారణంగానూ, నేను నా రచనను అన్ని విధాలా ఆలోచించుకుని తృప్తి కలిగితేనే ప్రచురణకు పంపుతాను. ఇదిగాక, నేనెప్పుడూ నన్ను ప్రేరేపించిన సంఘటననే కధగా రాయను. ఆ సంఘటన పూర్వపరాల వివేచన చేసి, దాని క్రమాన్ని గ్రహించి రాస్తాను. అంచేత మీరన్నట్టుండొచ్చు నా కధలు … అని నవ్వేరు. ఆ నవ్వు వెనక నా మిగిలిన ప్రశ్నకు జవాబున్నది.

మాస్టారు, యెలాగూ తొలినాళ్ళలో అన్నారు గనక, యించుమించు, ఆనాటి కధ అయిన – అప్రజ్ఞాతం రాయడానికి మీకేదో ప్రేరణ వుండి వుంటాదనిపిస్తోంది. అందులో కుర్రాడు, మీరేనేమో అన్పిస్తాది .. ఒక్కోసారి ఆ కబుర్లలోకి వెళ్దామా, అని అడగగా…. నిజమేననీ, ఆ కధలో కుర్రాడు తనేననీ, కాకపోతే ఆ షావుకారికొడుకు జబ్బు పడడం, కుర్రాడు పరీక్ష పోవడం మాత్రం కల్పితమనీ చెప్పారు. దీనికి అనుబంధంగా –

మాస్టారూ, అప్రజ్ఞాతం కధా వస్తువే మీ అవగాహన, రచనా శక్తీ పెరిగాక ‘యజ్ఞం’ అయ్యింది కదా అనంటే, ఔననీ .. అదనంగా యజ్ఞం కధలో కమ్యూనిష్టు పార్టీ ఆలోచనావిధానం పై విమర్శ వుందేమో అనన్నారు.

మీ పక్కనే రావిచెట్టులా అమోఘమైన ప్రతీకలతో వర్ణనలతో రావిశాస్త్రి రచనలు చేస్తుండగా, మీరెలా మీదయిన శైలిని విజయవంతంగా నిలుపుకోగలిగేరు? వస్తుబలం వల్ల మాత్రమే అననకండి. ఇక, మీరు గూడా ఒకటి రెండు కధలు శాంతి, స్నేహం వంటి కధల్లో చిన్నగా రావిశాస్త్రి శైలి జాడల్లాగా కొన్ని దృశ్యాలు, వాక్యాలు రాసేరు. నిజమేనంటారా, కాదా – అన్న ప్రశ్నలకు కాసేపు మౌనం వహించి – శాంతి, స్నేహం కధల్లో శాస్త్రిగారి జాడలు ఉండొచ్చేమో, వస్తువులు పట్నానికి చెందడం వలన అలా వచ్చేయేమో … అనంటూ … యిక నాదయిన శైలి గురించంటావా – అది బహుశా నువ్వొద్దన్నా వస్తువే కారణమేమోననక తప్పదు. కొడవటిగంటి కుటుంబరావుగారు మధ్యతరగతి జీవితాలను రాసేశారు. శాస్త్రిగారేమో అధోజగత్ సహోదరుల జీవితాలను రాసేరు (పట్నపు). ఇక నాకు మిగిలినది గ్రామీణ జీవితం … దాన్ని రాస్తున్న క్రమంలో, ఆ జీవితమే వీరికి భిన్నమైన శైలినిచ్చిందనుకుంటాను… ఆ తర్వాత చాలాసేపు యింకేమీ మాటాడలేదు. నాగ్గూడా యింకే ప్రశ్నా తోచలేదు. మౌనంగా కాసేపు కూచున్నాం. ఈ లోగా దాసరి రామచంద్రరావుగారొచ్చారు .. గత రెండు రోజులుగా రామచంద్రరావుగారు కూడా , యిలా మా కబుర్ల మధ్య లోనో, చివర్లోనో వస్తున్నారు. ఏవో కబుర్లను కదుపుతున్నారు. ఈ సారి ప్రపంచీకరణ గురించి కదిలింది. మాస్టారేమో – ప్రపంచీకరణ ఫలితాలు మాత్రమే కధలలో రాస్తున్నారనీ, దాని వెనుక ఉన్నది రాయలేకున్నారనీ, ప్రపంచ రాజకీయాలనర్ధం చేసుకుంటే తప్పా ప్రపంచీకరణ గురించి సరయిన అవగాహన రాదంటారు. మతమూ, ఆర్ధికమూ, భాషా, సంస్కృతీ వగైరా విషయాల మీద యే శక్తులకు పట్టు వున్నదీ, దాని బలమేమిటీ, వాటి ఐక్యత యెలా జరుగుతున్నదీ, ప్రపంచీకరణనెదిరించే శక్తులేమిటి, వాటి బలహీనతలూ, అనైక్యతలూ వీటి గురించిన పరిశీలనుండాలనన్నారు. ఆశ్చర్యమేసింది … మాస్టారీనాటికీ ప్రపంచాన్నాడించే శక్తుల పట్ల యెంత జాగరూకతనాలోచిస్తారో అన్పించింది. ఈ సారి రామచంద్రరావేదో కదపబోతే … మర్లేదు, మరేం కబుర్లు లేవు. అన్నట్లు .. నవంబర్ తొమ్మిది తర్వాత నేనింకేమి మాటాడను … కష్ట సుఖాలూ, మామూలు పలకరింపులు తప్పా, అని ప్రకటించేరు. మాస్టారు ప్రకటించేరంటే యిక మరి తిరుగు లేదు .. ఎందుకో దిగులు కలిగింది. తెలుగు కధకులందరి దిగులది … మాస్టారి మౌనం పట్ల!

బహుశా, గురజాడ తెలుగు కధను గతంలో నుంచి వర్తమానంలోకి, గ్రాంధికం నుంచి వాడుక భాషలోకి, బ్రాహ్మణ మండువాల్లోకి (దేవుళ్ళారా మీ పేరేమిటి కధ మినహాయింపు) నడిపిస్తే, రావిశాస్త్రి గారు వీధుల్లోకీ , బజారులోకీ నడిపించారు. ఆ కధను పల్లెల్లోకీ , పంటభూముల్లోకీ, పంచాయితీల్లోకీ నడిపించినారు కాళీపట్నం రామారావు మాస్టారు. కధంటే జీవితాల్ని విశ్లేషించడమనీ, సామాజిక చలన మూలాలను యెరుకపరచడమనీ, సాహితీకారులకదో యజ్ఞమనీ … కారా మాస్టారి సాహితీ వ్యక్తిత్వం భోదిస్తుంది. లోకంలో పొందే సకల సదుపాయాలూ… సామాజిక శ్రమ ఫలితాలనీ, (సాహిత్యం గూడాననీ …) సామాజిక సాహిత్య ఋణాలనుతిరిగి తీర్చడాన్ని బోధిస్తుంది … కారా ‘కధానిలయం’! కాళీపట్నానికి పాదాభివందనాలు. రామారావు గారికి జన్మదిన శుభాకాంక్షలు.

(మాస్టారితో నాలుగురోజులుగా, రోజుకు నాలుగు గంటలు కబుర్లు. చాలా చాలా కబుర్లు దొర్లేయి. అవన్నీ ఒక క్రమంలో పెట్టడంలో, సారంగకందించాల్సిన కాల వ్యవధి తక్కువ కావడాన, యింటర్వ్యూ యింకొంత బాగా చేయెచ్చేమోగాని సాధ్యం కాలేదు. ఈ నాలుగు రోజులు మాస్టారినుంచి విలువైనవెన్నో తెలుసుకున్నానని నేనంటే.. మాస్టారు, నా వలన చాలా తెలుసుకున్నాననీ, ఆ విషయం యిందులో రాయమనీ అన్నారు. ఈ మాట నాకెంతో ఆనందాన్నీ, నా పట్ల ఆయనకు గల నమ్మకానికి భయాన్నీ కల్గించేయి. ఈ సందర్భంగా రమాసుందరి గారికీ, సారంగ పత్రికకూ కృతజ్ఞతలు!)

– అట్టాడ అప్పల్నాయుడు