గురి తప్పిన కథన బాణాలు!

 

-టి.చంద్ర శేఖర రెడ్డి 

~

అనిల్ ఎస్. రాయల్  రాసిన కథాయణం-వ్యాససంకలనంలో దృక్కోణం-1, దృక్కోణం-2 అని రెండు అధ్యాయాలున్నాయి. ఈ అధ్యాయాల్లో,  రాసే కథని ఎవరి పరంగా చెప్పాలి అనే దానిమీద ఒక వర్గీకరణ ఉంది.

అందులో మొదటిది ‘ఉత్తమ పురుష’.

ఉత్తమపురుష కథనంలో కథకుడే స్వయంగా ఒక పాత్ర ధరించి కథ చెబుతాడు. అది ఒకటే పాత్రయితే ‘నేను’ కథ చెబుతాడు/చెబుతుంది. పాత్రలు అంతకన్నా ఎక్కువైతే ‘మేము’ కథ చెబుతారు.

దృక్కోణం-1 అనే అధ్యాయంలో ‘ఉత్తమపురుష’ కథనం ఎలా సాగాలి అన్న విషయం మీద కొన్ని సూచనలున్నాయి. ఈ సూచనలు ఇతర రచయితలు/రచయిత్రులు రాసిన కొన్ని తెలుగు కథల్లో ఎలా అమలయ్యాయి, ఎంతవరకు అమలయ్యాయి అన్నది తెలుసుకోవటానికి నేను-కథ 2014 అనే కథల సంపుటిని పరిశీలనకు ఎన్నుకున్నాను.

ఈ కథల సంపుటిలో మొత్తం 14 కథలు ఉన్నాయి. వీటిలో ఉత్తమపురుషలో చెప్పబడ్డ కథలు ఆరు.  అవి చావుదేవర-రచయిత్రి బత్తుల రమాసుందరి, గోధుమరంగు ఆట- రచయిత భగవంతం, నూనె సుక్క-రచయిత కొట్టం రామకృష్ణా రెడ్డి, భీష్మా…నాతో పోరాడు-రచయిత్రి రాధిక, ఐ హేట్ మై లైఫ్-రచయిత సాయి బ్రహ్మానందం గొర్తి.

నూనె సుక్క కథలో కొంత భాగం, అమ్మ చెపుతుంది. కాని, అమ్మ చెప్పిన కథాభాగం, కొడుక్కి  సంభాషణ రూపంలో చెప్పినట్లు ఉంటుంది. అంతే కాని ఆమె తనంతట తాను ‘నేను’ అని కథని చెప్పదు. మిగిలిన కథంతా, కొడుకు ‘నేను’ అని చెపుతాడు. కథలో సింహభాగం ఈ కథనమే ఆక్రమించింది.  అందుకని, అమ్మ మాటల తాలూకు భాగాన్ని పరిగణనలోకి తీసుకోకుండా, ఈ కథలో కథనాన్ని ఉత్తమపురుష కథనంగానే  స్వీకరించటం జరిగింది.

‘థూ’ కథని రెండు పాత్రలు; బసివిరెడ్డి నాయుడు, జోసెఫ్- ‘నేను’ అంటూ చెప్పాయి.   అందుకని దీన్ని ఉత్తమపురుష లోనే బహుళ దృక్కోణ (Multiple Point of View) కథనంగా తీసుకోవడం జరిగింది. ఉత్తమపురుషలోఇది కథాయణంలో ప్రస్తావించబడని ఇంకో రకమైన ధోరణి.

పైన ఉదహరించిన ఆరు కథల్లో ఏ కథ కూడా, ‘మేం’ పరంగా చెప్పబడలేదు.

ఈ ఆరు కథల్లో-కథాయణంలో చెప్పబడ్డ సూచనలు ఎలా పాటించబడ్డాయో చూస్తే ఇదీ ఫలితం.

సూచన 1:

ఉత్తమపురుషలో కథ చెప్పేప్పుడు ‘నేను’ అనబడే కథకుడు, తన గురించి తాను వర్ణించుకుంటే ఎబ్బెట్టుగా ఉంటుంది. ఆ పాత్ర ఆకార విశేషాల, వేషభాషల వివరణ కథనానికి అత్యంత అవసరమైతే తప్ప చేయకూడదు. తప్పనిసరి పరిస్థితుల్లో పరోక్షవర్ణనకి దిగటం మెరుగు (వేరే పాత్ర ద్వారా సంభాషణలో చెప్పించటం, అద్దంలో పరికించి చూసుకోవటం, వగైరా).

ఎలా పాటించబడింది:

ఈ ఆరు కథల్లో, ఏ కథలో కూడా ‘నేను’ తనని తాను వర్ణించుకోలేదు.

సూచన 2:

ప్రధానపాత్రకి తెలిసిన విషయాలు, కథకి కీలకమైనవి, సస్పెన్స్ పోషించటానికో లేక ముగింపు దాకా పాఠకుల్ని మభ్యపెట్టటానికో ఉద్దేశపూర్వకంగా తొక్కిపెట్టకూడదు.

ఎలా పాటించబడింది:

అలా తొక్కిపెట్టటం, ఏ కథలోనూ జరగలేదు.

సూచన 3:

కథ చెబుతున్న ‘నేను’ అనబడే వ్యక్తి పురుషుడా, మహిళా, చిన్నపిల్లవాడా, ముదుసలా… ఇటువంటి వివరాలు వీలైనంత త్వరగా పాఠకులకి చేరవేయాలి(ఆ వివరం దాచటం కథకి కీలకమైతే తప్ప).

ఎలా పాటించబడింది:

చావుదేవర,  ఐ హేట్ మై లైఫ్ కథల్లో; ‘నేను’ స్త్రీ అనే విషయం తో పాటు చిన్న పిల్లలనే విషయం కూడా  “పిల్ల భయపడింది’ అనే వాక్యం ద్వారా, “పరువు తీస్తున్నావు కదే?” అనే పదాల ద్వారా తెలుస్తుంది.

గోధుమరంగు ఆట, నూనె సుక్క కథల్లో; ‘నేను’ పురుషుడు అనే విషయం “ఈ ఎదురుగా ఉన్నవాడు తొందరగా వెళ్లిపోతే బాగుండును.” అనే వాక్యం ద్వారా,  “అమ్మ తాన కూకున్నోడ్ని”అనే పదాల ద్వారా  తెలుస్తుంది. ఇవే పదాలు, నూనె సుక్క కథలో ‘నేను’ చిన్నపిల్లాడు అనే విషయం కూడా చెపుతాయి.

భీష్మా…నాతో పోరాడు కథలో ‘నేను’ పేడి అనే విషయం 117 వ పేజీలో ఉన్న “మగ పిల్లవాడు పుట్టటం” అనే పదాలూ, అది ‘పాక్షికంగా నిజం’ అన్న విషయాన్ని 118 వ పేజీలో ఆ పాత్ర ప్రవర్తనా తెలుపుతాయి. ఆ తర్వాతి కథనం, ‘నేను’ పెరిగి పెద్దవాడయ్యాడనే విషయం చెపుతుంది.

ఈ వివరం చెప్పటానికి ‘గోధుమరంగు ఆట’ కథారచయిత అవసరమైనదానికన్నా ఎక్కువ సమయం తీసుకున్నట్లు కనపడ్తోంది. అయితే, అది, పాఠకుడు కథను అనుసరించడానికి ఆటంకంగా పరిణమించలేదు.

థూ- కథని చెప్పిన రెండు పాత్రలు; బసివిరెడ్డి నాయుడు, జోసెఫ్ గురించిన వివరాలని ఆ పేర్లే చెప్పాయి.

 

 

సూచన 4:

కథ చెపుతున్న పాత్రకి తెలిసే అవకాశం లేని విషయాలు (ఇతరుల ఆలోచనలు, తాను లేని సన్నివేశాల్లో సంఘటనలు, వగైరా) ప్రస్తావించకూడదు.

ఎలా పాటించబడింది:

చావుదేవర, గోధుమ రంగు ఆట, ఐ హేట్ మై లైఫ్ కథల్లో ఈ సూచన ఖచ్చితంగా అమలైంది. నూనె సుక్క కథ ముందుకు నడవాలంటే, ‘నేను’ కి తాను లేని కొన్ని విషయాలు గతంలోవి తెలియాలి. కాని, అలా తెలియడం కథనానికి ఎన్నుకున్న ధోరణికి సరిపడదు. అందుకనే, కథకుడు అమ్మ మాటల ద్వారా ‘నేను’ కి ఆ విషయాలు తెలిసేలా చేశాడు. ఉత్తమ పురుష కథనానికి ఈ వెసులుబాటు లేదు. అయినా, కథలో సింహభాగం ఉత్తమపురుష కథన ధోరణికి లోబడి ఉంది కనక ఈ వైరుధ్యం ప్రశ్నార్థకంగా అనిపించలేదు.

భీష్మా…నాతో పోరాడు కథలో మాత్రం; ఒక్క చోట, 121 పేజీలో కుంతి తన కుమారులను సంస్కారవంతులుగా పెంచింది…దగ్గరనుంచి, ద్రౌపదిని అయిదుగురికి భార్యగా చేసింది-అనే పదాల వరకు; కథలో ’నేను’ తాను లేని చోట ఏం జరిగిందో తెలియపరుస్తుంది. ఈ భాగం ఒక్కటే, ఈ కథలో ఉత్తమపురుష కథనధోరణికి వ్యతిరేకంగా నడిచింది.

దృక్కోణం-2 అధ్యాయం మిగిలిన రెండు రకాల కథనం గురించి వివరిస్తుంది.

దాంట్లో ఒకటి  మధ్యమపురుష.

మధ్యమపురుష

ఉత్తమపురుష కథనంలో కథ ‘నా’ కోణం నుండి నడిస్తే, మధ్యమ పురుషంలో అది ‘నీ’ కోణంలో నడుస్తుంది. అలాంటి కథలు అరుదుగా కాని కనిపించవు. తెలుగు కథల్లో ఆ పద్ధతిలో చెప్పబడ్డ కథ వి. ప్రతిమ గారు రాసిన ‘విత్తనం’ కథ. ప్రాతినిధ్య- కథ-2014 సంకలనంలో ఉంది. సంకలనంలో చేరటానికి ముందు ఈ కథ చినుకు మార్చి 2014 సంచికలో, ‘మనిషి విత్తనం’ పేరుతో ప్రచురితమైంది. కథనంలో; నీ, నువ్వు, నిన్ను, నీకు-అనే పదాలే కాకుండా, ప్రధాన పాత్ర భర్తని మీరెడ్డి-మీ ఆయన, మీ అత్తగారు, మీ మామగారు, మీ అత్తగారి తల్లి, మీ అత్తమామలు అనటం కథ పఠనీయతని కొంచెం దెబ్బతీసింది. ఈ సందర్భాల్లో కూడా ‘నీ’ అని రచయిత్రి రాసి ఉండొచ్చును. కాని, అలా జరగలేదు.

మధ్యమ పురుష ధోరణిలో కథ చెప్పినపుడు; కథని చెపుతున్న వ్యక్తి తప్పనిసరిగా కథలో సంఘటనలకి సాక్షి అయి ఉండాలి. అది రచయిత/రచయిత్రి లేదా మరే ఇతర వ్యక్తి అయి ఉండాలి.  కాని, ఈ కథ ఇతివృత్తం దృష్ట్యా ఈ కథలో చోటు చేసుకున్న కొన్ని సంఘటనలు బయటి వ్యక్తికి తెలిసే అవకాశం లేనివి. అందువల్ల ఈ కథనధోరణి ఈ కథకి పూర్తిగా నప్పిందని అనిపించలేదు.

 

ప్రథమపురుష

మిగిలిన మూడో పద్ధతి కథనం-ప్రథమ పురుష. నా వర్గీకరణ ప్రకారం కథ 2014 కథాసంకలనంలో ఉన్న-ఆకులు రాల్చిన కాలం-రచయిత పాలగిరి విశ్వప్రసాద్, రోహిణి-తల్లావజ్ఝల పతంజలి శాస్త్రి, ఇస్సాకు చిలక-అద్దేపల్లి ప్రభు, నిశ్శబ్దపు చప్పుడు-మధురాంతకం నరేంద్ర, ప్రవల్లిక నిర్ణయం-యాజి, పాంచాలమ్మ పాట-స.వెం. రమేశ్, ది కప్లెట్-కల్పనా రెంటాల, వాళ్లు ముగ్గురేనా?-విమల; ఈ ఎనిమిది కథలూ ఈ పద్ధతి కథనంలో చెప్పినవి.

ఈ కథలు, ‘ప్రథమ పురుష’ కథనానికి ఎలా, ఎంతవరకు లోబడి ఉన్నాయి- అన్న విషయం మీద పరిశీలన మరో సారి.

-o)O(o-