చాసో తన కథలకు తానే కరకు విమర్శకుడు: చాగంటి తులసి

tulasi 4

చాగంటి తులసి గారితో సంభాషిస్తున్న రామతీర్థ

తెలుగు సాహిత్యంలో చాగంటి తులసి అంటే ‘చాసో’ కూతురు మాత్రమే కాదు. చాసో ప్రసరించిన వెలుగులోంచి కథకురాలిగా, అనువాదకురాలిగా తులసి తనదయిన వేరే దారిని నిర్మించుకుంటూ వెళ్లారు. ఆమె రచనా, ఆలోచనా ఆమె విశిష్ట వ్యకిత్వానికి అద్దం పడతాయి. తులసి గారితో ఈ అపురూపమయిన కాఫీ సమయం…

 

మధ్యాహ్నం మూడు గంటలు.

ముందస్తుగా ” మీ ఇంటికి మేం వస్తున్నామండోయ్! ” అంటూ చెప్పేం కదా, తులసిగారు మాకోసం వీధి తలుపులు బార్లా తీసి ఎదురు చూస్తున్నారు.

“నమస్కారం రండి. మీకోసమే ఎదురు చూస్తున్నా,” అంటూ లోపలికి ఆహ్వానించారు.

పెద్ద హాలు. హాలు మధ్య ఉయ్యాల బల్ల. గోడలకి ఆనుకొని పాతకాలపు టేకు బీరువాలు. చేతుల్లేని టేకు కుర్చీలు. టేకు

గుండ్రబ్బల్ల. పొడుగు చేతుల టేకు బెత్తు పడక్కుర్చీ. గోడలకు గురజాడ, చాసో తదితరుల ఫోటోలు. అంతా పాతపాతగా.

“మీ హాలు ఆధునికంగా లేదే!” అన్నా.

“పాతకొత్తల మేలు కలయిక!” అంటూ హాలుకి ఓ గోడ పొడవునా ఉన్న షోకేసు వైపు చూపిస్తూ ఆవిడ నవ్వేరు.

“అవునవును. ఇదా గురజాడ విజయనగరం. మీరా గురజాడ వారసుడు చాసోగారి  అమ్మాయీ , వారసురాలునూ..!”
మాటలోంచి మాట నా నోట వచ్చింది.

“కాదా మరి! నేను పెరిగిందే పాత కొత్తల మేలు కలయికతో!”

నవ్వులతో మొదలయింది మా సాక్షాత్కారం!!

“మరి అలా ఎలా పెరిగారో చెపుతారా?” అంటూ  నా ప్రశ్నలూ మొదలయ్యాయి.

“నట్టిల్లూ వంటిల్లు పాతవి. సావిడీ నాన్న గది కొత్తవి. బామ్మ, అమ్మ నట్టింటి, వంటింటి వారు. పూజలు  పునస్కారాలు,  పండగలూ పబ్బాలు, సంప్రదాయ వంటలూ శివపూజలు, మనోనైవేద్యాలు! నాన్న, నారాయణ బాబూ, పాటలూ పద్యాలు,  ఫ్రెంచి కవితా గానాలు, కథలూ కబుర్లు, కవిత్వం కొత్త పుస్తకాలు, చర్చలు వాదనలు! చిన్నాజీ కథ నా చిన్నతనం.
“తెలుసు  తెలుసు! చాసో మీ మీద ‘చిన్నాజీ’ కథ రాస్తే, నారాయణబాబు “చిన్నా! అన్న గేయం రాసారు!” అన్నాను.

“చాసో, చాసో స్నేహితులూ గొప్ప సృజనాత్మక రచయితలు, కవులు, మేధావులు, గొప్పవారు అన్న స్పృహ లేకుండా వారి మధ్య వారి వాత్సల్యంతో అతి సహజంగా పెరిగాను. అంతే సహజంగా అమ్మా బామ్మల సంప్రదాయ సంస్కారాల ఉత్తమ నడవడికలతో ఎదిగాను. ఆ పెంపకం ఆవురావురమని ఆకలితో అన్నం తిన్నట్టే, ఆవురావురమంటూ చదవడం  అలవర్చింది. నా నిర్ణయాలు నేను చేసుకునే విధంగా స్వేచ్చా స్వాతంత్ర్యాలు ఇచ్చింది. తీపి చేదుల తలివిడినీ, నలుపు తెలుపుల ఎరుకను కలిగించింది. పైకి కనపడే రంగుడంగులను కాదు. లోపలి గుణాలను గుర్తించడం నేర్పింది. టెనాసిటీని, జోష్‌నీ, జిందాదిలీని ఇచ్చింది. ఆ పెంపకం ఇప్పటి నన్నును నన్నుగా తీర్చి దిద్దింది !!

Q“సాహిత్య ప్రక్రియల్లో మీకు ఏ ప్రక్రియ అంటే ఎక్కువ ఇష్టం?”

“కథంటేనే చెవి కోసుకుంటాను. అన్ని ప్రక్రియల సాహిత్యాన్నీ చదువుతాను.”

Qచాసో తక్కువ సంఖ్యలో కథల్ని ఇచ్చారు. పాత సంకలనాన్ని ఆరో ముద్రణగా తిరిగి ఇటీవలే విశాలాంధ్రవారు వేసారు. ఆ సంకలనంలోకి రాని కథలు ఇంకా ఏమన్నా ఉన్నాయా?”

“చాసో తన కథలకు తానే కరకు విమర్శకుడు. ఏ కథలైతే తనకు తానుగా పెట్టుకున్న గీటురాయికి నిల్చాయో వాటినే సాహిత్య జగత్తుకు ఇచ్చాడు. అదీకాక, తాను కథ రాసే రచనా విధానం కూడా విరివినీ, నిడివిని పెంచేది కాదు. ఢంకా, వినోదిని, వందేమాతరం, ఆంధ్రజ్యోతి, అభిసారిక,  జ్యోతి పత్రికల్లో అచ్చయి  నాకు లభ్యమయిన కొన్ని కథలు ఉన్నాయి. ఆ కథలు సంకలనంలో లేవు.

‘ఆఁవెఁత’ అన్న కథను ఆ సంకలనంలో వేసుకుందామని ఎంత ప్రయత్నించినా ఆ కథ చాసోకు దొరకలేదు. దానిని రాంషా తన అభిసారిక పత్రికలో ఆ మాండలికపు పేరు పాఠకులకు అర్ధం కాదనుకున్నాడో ఏమో, దానిని “విందు” అన్న పేరుతో అచ్చు వేసాడు. పేరు మారిపోవడంతో “ఆఁవెఁత” కోసం ఎంత వెతికినా, చాసోకు తన కథలు తానే జాగ్రత్త పెట్టుకునే లక్షణం తక్కువైన కారణం చేత. తాను బతికి ఉండగా ” ఆఁవెఁత”  దొరకలేదు. చాసో కన్ను మూసాక భరాగో రాంషాగారి అబ్బాయి ద్వారా ‘అభిసారికల’ ప్రతులన్నిటినీ తిరగా బోర్లా వేయించి ఆ కథని లోకం ఎదటకి తెచ్చాడు!!

tulasi 1

చాగంటి తులసి గారితో రామతీర్థ, జగద్ధాత్రి

‘తవ్వెడు బియ్యం’, ‘భాయి భాయి’, ‘సువార్త’ అన్న కథలన్నీ తాను వేసుకునే సంకలనంలో చాసో వేసుకోదల్చుకోలేరని అనిపిస్తోంది. ఆ కథల కాపీలు తన కాయితాల్లో ఉన్నాయి!.. ‘మట్టి’,  ‘పణుకుల వాగు’, ‘లాడ్జింగు హవుసు’, ‘పెంకుపురుగు’, ‘వఱపు’ , ‘దొరలు’ అనే కథలు ఉన్నాయి. ఇంకా ఏవన్నా ఉన్నాయేమో తెలీదు. సాహితీ మిత్రులు తవ్వి తెస్తే అచ్చయినవి ఇంకా కొన్ని దొరుకుతాయేమో.

రాంషాగారు ఉత్తరాంధ్ర మాండలిక మాట ‘ఆఁవెఁత’ అంటే ‘విందు’ అని తెలియపరుస్తూ ఆ కథని అచ్చు వేసి ఉన్నట్లయితే బాగుండి ఉండేది. కాలంతో పాటు బాషా ప్రవాహంలో కొన్ని పాత మాటలు వెనక్కి పోతాయి. కొన్ని పలుకుబడులు నిలుస్తాయి. కొన్ని కొత్తవి వచ్చి చేరతాయి. పాత పలుకుబడులకు, మాండలిక పదాలకు వివరణలు ఇవ్వాలి. వాటి సొగసును తర్వాతి తరాలవారికి అంద చెయ్యాలి. కొన్ని పలుకుబడులు తిరిగి చెలామణిలోకి రావొచ్చు.!!

Q“చాసో వాడిన అలాంటి పలుకుబడులు, మాటలు ఓ రెండింటిని చెప్తారా?”

“అవ్వాకులు చెవ్వాకులు” అనడం ఎప్పుడన్నా విన్నారా? అయినవీ కానివీ అయిన మాటలు అని దాని అర్ధం. అవ్వాకులు చెవ్వాకులు పేలుతున్నాడు అంటాం. ఇది చెరుకు పంటకు సంబంధించినది. ‘ఆగు ఆకు’ అవ్వాకు. చెరుకుకు చెరుకుగడే విత్తనం. గడకే మొలక ఉంటుంది. మొలుస్తుంది కనక అది ఆగు ఆకు. చెడు అంటే మొలవనిది. మొలకలేని గడలోని భాగం. అది చెవ్వాకు. చెవ్వాకులు పిల్లలు తింటారు. అవ్వాకుల్ని నాటుతారు. రెండింటిని కలిపి ఉపమానంగా భావించి అయినవీ కానివీ అని వాడతారు. ‘పరబ్రహ్మం’ కథలో చాసో పిచ్చివాణ్ణి పిలిచి ప్రతీవాళ్లు అవ్వాకులు చెవ్వాకులు పేలించి తిండిపెట్టేవారు అని వాడారు.

‘లేడికి పాములు’ అంటే ఏమిటో తెలుసా??  ఉత్తరాంధ్ర ప్రాంతపు మాట. ఈ పాములు పొలాల్లో పాకుతూ ఉంటాయి. పొట్టిగా ఉంటాయి. తల పైకెత్తలేవు. మట్టిని దొలుస్తూ ఉంటాయి. ‘ఎందుకు పారేస్తాను నాన్నా!’ కథలో పిల్లాణ్ని ఈర్ష్యా, దుఃఖం రెండూ రెండు లేడిక పాములై బాధిస్తున్నాయన్న సందర్భంలో వాడారు.

Qఈ మధ్య ప్రముఖ సాహితీవేత్తల సమగ్ర ప్రచురణలు వస్తున్నాయి. మరి అలాంటి ప్రయత్నం చాసో సమగ్ర సాహిత్య ప్రచురణ గురించిన ప్రస్తావన ఏమన్నా జరిగిందా?

ప్రస్తావన రావడం అయితే వచ్చింది. అయితే చాసోకూ, ఇతర రచయితలకూ పెద్ద వృత్యాసం ఉంది. చాసో రాశికన్నా వాసికి ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చిన రచయిత. తాను రాసినవైనా అన్నిటినీ అచ్చుకు ఇవ్వని రచయిత. ఆయన రాసిన రచనలు రాశిలో తక్కువ.

ఏడు కథలలో ‘చిన్నాజీ’ అన్న పేరుతో తను 40ల్లో వేసుకున్న మొదటి సంకలనం లభ్యం కాలేదు.

చాసో లోకాన్ని విడిచి వెళ్ళిపోయాకే ఆయన రాసిన కవితలు ‘చాసో కవితలు’గా పుస్తక రూపంలో వచ్చాయి. నేను కవిని అని చెప్పుకోలేదు. నా ప్రారంభం కవితా రచనే అయినప్పటికీ నేను కథకుడిని అంటూ కవితలను వదిలివేసారు.

అప్పుడప్పుడు ఎవరెవరో అడగగా తను రాసిన వ్యాసాలు కొన్ని ఉన్నాయి.

తన నమ్మకాలు, తన దృక్పథం, తాత్వికత గురించి, తన కథల గురించి వివిధ పత్రికలకూ, ఆకాశవాణికి ఇచ్చిన ఇంటర్వ్యూలు ఉన్నాయి.

తన స్నేహితులూ, అరసం, తదితర విషయాల గురించి తను చెప్పగా రామినాయుడు రికార్డు చేసినవి ఉన్నాయి.

పండిత అయల సోమయాజుల నరసింహ శర్మగారూ, నేను సిద్ధపరిచిన చాసో కథల మాండలిక పద వివరణలు ఉన్నాయి.

శ్రీ ద్వారం దుర్గాప్రసాద్‌రావుగారు రచించిన చాసో కథల్లోని సంగీత సంబంధమైన పదాల వివరణలు ఉన్నాయి.

విజయనగరం రాఘవ మెమోరియల్ నాటక పోటీల్లో ఉత్తమ రచనగా పురస్కారం అందుకున్న చాసో నాటిక ‘మెరుగు’ ఉంది.

చాసో శతజయంతి సంవత్సరం 2014 – 2015 లో వీటన్నిటిని కలిపి పుస్తక రూపంలో తేవలసి ఉంది. అయినా మిగతా రచయితల పుస్తకాల్లాగ ఇది బృహత్ గ్రంధం  అవుతుందని నేను అనుకోవడం లేదు.