సహచరి

220px-Portrait_of_Washington_Irving_by_John_Wesley_Jarvis_in_1809

వాషింగ్టన్ ఇర్వింగ్

మూల రచయిత పరిచయం :  వాషింగ్టన్ ఇర్వింగ్ అనగానే మనకి ముందుగా గుర్తుకొచ్చేది అతని ప్రసిద్ధమైన కథలు ‘రిప్ వాన్ వింకిల్”, “ది లెజెండ్ ఆఫ్ స్లీపీ హాలో”. అవి సుమారు రెండు వందల సం వత్సరాలు కావస్తున్నా, ఇప్పటికీ వాటి కొత్తదనం, చదివించేగుణం కోల్పోక ప్రపంచం మొత్తమ్మీద పిల్లలనీ  పెద్దలనీ అలరిస్తూనే ఉన్నాయి.  ఇర్వింగ్ మంచి కథా రచయితేగాక, వ్యాసకర్తా, చరిత్రకారుడూ కూడా. అతను  ఆలివర్ గోల్డ్ స్మిత్, ముహమ్మద్, క్రిష్టఫర్ కొలంబస్, జార్జి వాషింగ్టన్ మొదలైన వాళ్ళ జీవిత చరిత్రలు రాయడంతో పాటు, 1842-46 ల మధ్య స్పెయిన్ లో అమెరికన్ రాయబారిగా పనిచేశాడు.

 అతను జర్మన్, డచ్చి జానపదకథలలోంచి కొన్ని సంఘటనలు స్వీకరించినా, కథ నేపథ్యాన్ని మాత్రం అమెరికాలోనే ఉంచుతూ, “అమెరికను కథ” కి ఒక నిర్దిష్టమైన రూపం ఇచ్చిన తొలి రచయితే గాక, కేవలం సాహిత్య సృజనవల్ల మాత్రమే జీవితాన్ని నడపగలిగిన రచయిత వాషింగ్టన్ ఇర్వింగ్.”

ఒక స్త్రీ ప్రేమబంధంలో చిక్కుకున్నవ్యక్తి అనుభవించే కనిపించని సౌఖ్యాలతో సరిపోల్చినపుడు సముద్రంలో దొరికే నిధులు ఏమంత విలువైనవి కావు. నేను ఇంటిని సమీపిస్తుంటే చాలు, నా అదృష్టపు సుగంధాలు నన్ను తాకుతుంటాయి. ఆహ్! వివాహం ఎంత కమనీయమైన శ్వాసలనందిస్తుంది! దానిముందు ఏ తోటసువాసనలైనా దిగదిడుపే…..

 

                          థామస్ మిడిల్టన్. ఆంగ్ల నాటక కర్త (1570- 1627)

 *

 జీవితంలో అకస్మాత్తుగా ఎదురయ్యే తీవ్రమైన కష్టనష్టాలని స్త్రీలు ఎంత ధైర్యంగా ఎదుర్కోగలరో ప్రస్తావించవలసిన సందర్భాలు నాకు చాలా ఎదురయ్యాయి. ఆ దుర్ఘటనలు మగవాడి మానసికస్థైర్యాన్ని దెబ్బతీసి వాడు వాటికి దాసోహమని నేలపై సాష్టాంగపడేలా చేస్తే, కోమలహృదయులైన స్త్రీలలో మాత్రం తమ అంతరాల్లోంచి ఎక్కడలేని శక్తుల్నీ కూడదీసుకునేలాచేసి, మొక్కవోని ధర్యంతో నిలబడగల సాహసానికి ప్రేరేపించి, వాళ్ల వ్యక్తిత్వాలకు ఎంత ఉదాత్తత కలిగిస్తుందంటే, వాళ్లకి ఏవో మహత్తులున్నాయేమోననిపిస్తుంది. జీవితంలో అన్నీ సుఖంగా సజావుగా జరిగిపోతున్నప్పుడు, అన్నిటికీ మగవాడిమీదనే ఆధారపడుతూ, బేలగా, ప్రతి చిన్న విషయానికీ విలవిలలాడే ఆ అబలే, కష్టాలపరంపర చుట్టుముట్టి ఊపిరిసలపనివ్వనపుడు, ఒక్కసారిగా ధైర్యాన్ని చిక్కబట్టుకుని, కష్టాల్లో మగవాడికి ఆశ్వాసననివ్వడమేగాక, అండగానిలబడడం గమనించినపుడు, అంతకుమించి హృదయాన్నితాకగల సందర్భం మరొకటి లేదనిపిస్తుంది.

తన అందమైన తీవెలబంధాలతో అల్లుకోనిచ్చి పైపైకి ఎగబ్రాకడానికి ఓక్ చెట్టు అవకాశమిచ్చినందుకు ప్రతిగా ఎలాగైతే ద్రాక్షతీగ పిడుగుపాటుకి ఆ చెట్టు రెండుగా చీలిపోకుండా, దానికొమ్మలు విరిగిపోకుండా తన లలితమైన నులితీగెలతో దృఢంగా, గాఢంగా బంధించి కాపాడుతుందో, అలాగే, దైవంకూడా మగవాడికి ఒక కళనిస్తూ, అతని సుఖసౌఖ్యాల్లో కేవలం అతనిమీదే అన్నిటికీ ఆధారపడే స్త్రీని, అతను అకస్మాత్తుగా కష్టాలపాలయినపుడు అతనికి బాసటగా, ఊరటగా ఉండేటట్టు నియమించింది; మొరటైన అతని వ్యక్తిత్వపులోతులలోకి చొరబడి లతలా అల్లుకుని, వాలిన అతని తల నిటారుగా ఉండేట్టు చెయ్యడమే గాక, పగిలిన అతని హృదయాన్ని అతికి ఆమె మనశ్శాంతి అందిస్తుంది.

ప్రేమాభిమానాలూ, చిక్కని అనుబంధాలతో వర్ఠిల్లుతున్న కుటుంబంగల మిత్రుని అభినందించడానికి ఒక సారి వెళ్ళాను. “నీకింతకంటే ఉత్తమమైన ఆకాంక్షలివ్వలేను,” అని ఎంతో ఆర్ద్రంగా ఇలా అన్నాడతను: “నువ్వుకూడా భార్యాపిల్లలతో సుఖంగా ఉండాలి. నువ్వు సిరి సంపదలతో  తులతూగుతున్నావనుకో, దానిలో భాగస్వాములవడానికి వాళ్ళుంటారు; దానికి భిన్నంగా ఉన్నా వనుకో, నీకు ఓదార్పునివ్వడానికి వాళ్ళుంటారు.”

నా అనుభవంలో కష్టాలొచ్చినపుడు ఒంటరిగా జీవించేవాళ్ళకంటె  ఎక్కువగా వివాహితుడు వాటినుండి బయటపడడాన్ని గమనించేను. దానికి కారణం, తనకి ప్రేమాస్పదులైన వాళ్లందరి జీవితాలూ అవసరాలకి అతనిమీదే ఆధారపడడంవల్ల వాటిని సమకూర్చడంలో కలిగే అలసటకి అతను అలవాటుపడడం ఒక ఎత్తైతే, రెండోది తనే సర్వాధికారై తనకోసం ప్రేమతో ఎదురుచూసే కుటుంబం ఉండడం వల్ల, బయట ఎన్ని అవమానాలూ, ఎంత నిరుత్సాహమూ ఎదురైనా, వాళ్ల ప్రేమపూర్వకమైన పలకరింపులు అతనికి ఊరటనిచ్చి అణగారిన అతని ఉత్సాహమూ, ఆత్మగౌరవమూ తిరిగి పుంజుకునేలా చేస్తాయి; అదే ఒంటరిగా జీవించే వ్యక్తి తనకెవరూ లేరనీ, తన్నందరూ విస్మరించేరనీ భావించి, మనుషులు నివసించని పాడుబడ్డ భవనంలా మనసు వికలమై, తన్ను తాను అశ్రద్ధచేసుకుని చెడిపోడానికే  అవకాశాలున్నాయి.

ఈ పరిశీలనలు నేను ప్రత్యక్షంగా గమనించిన ఒక ఆత్మీయమిత్రుడి కథని గుర్తుచేస్తున్నాయి.

లెస్లీ అని నాకో ప్రాణ మిత్రుడుండేవాడు. అతను చాలా అందమైనదీ, సమర్థురాలూ, నాగరీకంగా పెరిగిన ఒక అమ్మాయిని పెళ్ళిచేసుకున్నాడు. ఆమె పెద్ద ధనవంతురాలేమీ కాదు గాని, మా స్నేహితుడు మాత్రం బాగా ధనవంతుడే; అందుకని అందమైన స్త్రీని మగవాడు ఎన్నిరకాల సొగసులతో, అలంకారాలతో ముంచెత్తగలడో తలచుకుంటూ ఊహల్లో తేలిపోతూ మురిసిపోతుండేవాడు. “ఆమె జీవితం ఒక గాథలా సాగిపోవాలి” అని అంటుండేవాడు.

వాళ్ళిద్దరి వ్యక్తిత్వాల్లోని తేడాయే వాళ్ళిద్దర్నీ ఒక పొందికైన జంటగా చేసింది; అతనెప్పుడూ ఊహల్లో తేలుతూ, కొంచెం గంభీరంగా ఉంటాడు; ఆమె ఎప్పుడూ ఆనందంగా జీవంతో తుళ్ళిపడుతూ కనిపించేది. చుట్టూ ఎంతమంది ఉన్నప్పటికీ, అతనామెనే మౌనంగా ఆరాధనగా పరికిస్తూ పారవశ్యంలో మునిగిపోవడం చాలాసార్లు గమనించేను; ఉల్లాసమూ, చురుకుదనం వంటి ఆమె వశీకరణశక్తులే ఆ ఆనందానికి హేతువులు. ఎంతమంది కరతాళధ్వనులు చేస్తున్నా, ఆమె చూపులు అతనివైపే మరలేవి, అతని ఒక్కడిదగ్గరనుండే అభినందననీ, మెప్పుకోలునీ ఆశిస్తున్నట్టు. అతని భుజం మీద వాలినప్పుడు ఆమె నాజూకైన శరీరం, చూపరులకి పొడవుగా మగతనం ఉట్టిపడే అతని శరీరంతో చక్కని వ్యత్యాసాన్ని గుర్తుచేసేది. అతన్ని చూస్తున్నప్పుడు ఆమె కళ్లలో తొణికిసలాడే బులపాటమూ, విశ్వాసమూ అతనిలో ఆమెను గెలిచినందుకు గొప్ప గర్వంతో పాటు, ఆమె సౌకుమార్యం పట్ల గారాబం కలిగిస్తూ ఆ అశక్తత లోనే అతనికి మోజు ఉందేమోననిపిస్తుంది. నాకు తెలిసి ఆనందమయమైన భవిష్యత్తు నాకాంక్షిస్తూ వైవాహిక జీవితపు పూలబాటపై తరుణవయస్సులో మరే చక్కని జంటా కాలుపెట్టలేదు.

దురదృష్టవశాత్తూ నా మిత్రుడు అతని సంపదని హామీలేని ఊహాత్మక పెట్టుబడులలో పెట్టడానికి ప్రయత్నించేడు. పెళ్ళి అయి ఎక్కువ నెలలు కూడా కాలేదు, వరుసగా సంభవించిన నష్టాలపరంపరవల్ల అతను సర్వమూ కోల్పోయి దారిద్ర్యం అంచుకి చేరుకున్నాడు. చెదిరిన గుండెతో, వాడిన ముఖంతో, ఎవరికీ కొంతకాలం ఈ విషయం చెప్పకుండా తనలోనే దాచుకున్నాడు. అతని జీవితం క్రమంగా సుదీర్ఘమైన యాతనగా మారింది; అంతకుమించి అతని భార్య సమక్షంలో పెదాలకు చిరునవ్వు తగిలించుకోవలసి రావడం ఇంకా దుర్భరమైపోయింది, ఎందుకంటే ఈ విషయం ఆమెకు చెప్పే ధైర్యం అతను చెయ్యలేకపోయాడు. అయితే, అనుకంపతో కూడిన ఆమె నిశితమైన చూపులు అతనిలో కలిగిన మార్పులు గుర్తించి అంతా సవ్యంగా లేదని పసిగట్టేయి.

అతని చూపులు ఆమె చూపులని తప్పించుకుందికి చేసే ప్రయత్నాలూ, అతను బలవంతంగా అణచుకుంటున్న నిట్టూర్పులూ గుర్తించింది; ఉల్లాసంగా ఉన్నట్టు ఆమెని నమ్మించడానికి అతను చేస్తున్న వ్యర్థప్రయత్నాలు ఆమె దృష్టిని దాటిపోలేదు. అందుకని ఆమె తన సర్వ సమ్మోహ శక్తులూ అతన్ని ఉత్సాహపరచి ఆనందంగా ఉంచడానికే వినియోగించనారంభించింది. దాని వల్ల అసంకల్పితంగానే ఆమె అతని గాయాన్ని మరింత తీవ్రం చేసింది. ఆమెని అభిమానించడానికి కారణాలు పెరుగుతున్నకొద్దీ, ఆమెని దారిద్ర్యానికి గురిచేయవలసివస్తుందే అన్న ఆలోచన అతన్ని ఇంకా చిత్రహింసకి గురిచెయ్యడం ప్రారంభించింది. కొద్దికాలంలోనే ఆమె బుగ్గలమీదనుండి చిరునవ్వు మాయమవబోతోంది కదా… త్వరలోనే ఆమె పెదవులమీదనుండి పాత అంతరిస్తుంది కదా… ఆ కళ్ళలోని మెరుగులు దుఃఖంతో కప్పబడి, ఆనందంతో కొట్టుకుంటున్న ఆమె గుండె ఇకమీదట నాలాగే ఈ ప్రాపంచిక విషయాల బరువుబాధ్యతలతో  క్రుంగిపోవలసిందేగదా… అని చింతించసాగేడు.

చివరకి ఎలాగయితేనేం ఒక రోజు నా దగ్గరకు వచ్చి, విషయాన్నంతటినీ తీవ్రమైన నిస్సహాయతతో కూడిన గొంతుతో విశదీకరించేడు. అతను చెప్పడం అంతా పూర్తయిన తర్వాత అడిగేను, “నీ భార్యకి ఈ విషయాలన్నీ తెలుసా?” అని. అనడమే తడవు బాధతో ఒక్కసారి కన్నీళ్ళు పెట్టుకున్నాడు. “దేముడిమీద ఒట్టు!” అన్నాడతను,”నా మీద నీకు ఏమాత్రం జాలీ కనికరం ఉన్నా, నా భార్యకి ఈ విషయం తెలియనీ వద్దు; అసలు ఆమె భవిష్యత్తు గురించి ఆలోచన వస్తే చాలు నాకు పిచ్చెక్కినంతపని అవుతుంది.”

“ఎందుకు చెప్పకూడదూ?”అని అడిగేను నేను. “ఇవేళ కాకపోతే రేపయినా ఆమెకు తెలియవలసిందే; ఆమెనించి ఈ విషయం నువ్వెంతకాలమో దాచలేవు; ఈ విషయం ఆమెకి పరోక్షంగా తెలిసి ఆమె ఆశ్చర్యపోయేకంటే, నువ్వు చెప్పడమే మంచిది. ఎందుకంటే, మనం అభిమానించే వాళ్ల మాటలు రాబోయే ఎంతటి కష్టాన్నయినా ధైర్యంగా ఎదుర్కొనేలా చెయ్యగలవు. అదిగాక, ఆమె చెప్పబోయే ఓదార్పువచనాలు నువ్వు కోల్పోతున్నావు. అంతకు మించి, రెండుహృదయాలను దగ్గరగా కలిపి ఉంచగల బంధం… ఇద్దరిమధ్యా ఏ అరమరికలూ లేని ఆలోచనలూ, అనుభూతులూ… దానికి విఘాతం కలిగిస్తున్నావు. ఏదో విషయం నీ మనసు దొలిచేస్తోందని ఆమె త్వరలోనే తెలుసుకోగలుగుతుంది. నిజమైన ప్రేమ రహస్యాలను దాచడాన్ని తట్టుకోలేదు. తను ప్రేమించిన వాళ్ళు తమ బాధల్ని తననుండి దాచినప్పుడు తనని కించపరిచినట్టూ, అవమానించినట్టూ బాధపడిపోతుంది.

“ఓహ్! ఏమి చెప్పను మిత్రమా! ఆమె భవిషత్తుకి నేను ఎటువంటి కోలుకోలేని దెబ్బ తీస్తున్నానో…ఆమె భర్త ఒక యాచకుడిగా మారేడని చెప్పి ఆమె ఆశల్ని ఎంతగా నేలపాలు చెయ్యాల్సి వస్తుంది! జీవితంలోని అన్ని విధాలైన సుఖాలనీ వదులుకోవలసి వస్తుందని ఎలా చెప్పను? పదిమందిలో తిరిగే అవకాశం పోతుందనీ, నాతో పాటే పేదరికంలోకి, తెరమరుగుకి వెళ్ళిపోవలసివస్తుందనీ ఎలా చెప్పేది? ప్రతికంటికీ వెలుగుగా, ప్రతి హృదయానికీ అబ్బురంగా ఉంటూ నిత్యమూ కళకళలాడుతుండవలసిన ప్రపంచంలోంచి,  ఆమెని అధోస్థితికి లాక్కొచ్చేనని ఎలా చెప్పడం? ఆమె పేదరికాన్ని ఎలా తట్టుకోగలదు? ఆమె కలిమి ఇవ్వగల అన్ని రకాల నాజూకులతో పెరిగింది. ఇప్పుడు ఆమె లేమిని ఎలా భరించగలదు? సమాజంలో ఆమె ఒక ఆదర్శ స్త్రీ. అయ్యో! ఆమె హృదయం బ్రద్దలవుతుంది! హృదయం బ్రద్దలవుతుంది!”

అతను అమితంగా దుఃఖపడడం చూసి, అతని మాటలప్రవాహాన్ని ఆపడానికి ప్రయత్నం చెయ్యలేదు; ఎందుకంటే, దుఃఖం మాటలలో తనకుతానే ఉపశమిస్తుంది. అతని ఉద్వేగం చల్లారిన తర్వాత అతనొక నిర్వేదపు మౌనంలోకి వెళ్ళిపోయాడు. అందుకని, నేను తిరిగి ఈ విషయాన్ని శాంతంగా లేవనెత్తి, అతని పరిస్థితిని భార్యకి చెప్పమని అర్థించేను. అతను ససేమిరా ఒప్పుకోలేదు బాధతో అడ్డంగా తలూపుతూనే.

“కానీ నువ్వీ విషయాన్ని ఆమెనుండి ఎలా దాచగలవు? ఆమెకి ఈ విషయం తెలియవలసిన అవసరం ఉంది, ఎందుకంటే, మారిన పరిస్థితులకి తగిన చర్యలు తీసుకోవాల్సి ఉంది. నీ జీవన సరళి మార్చుకోవాలి, అంతే కాదు,” నేనా మాట అంటున్నప్పుడు అతని ముఖం మీద వేదన ఛాయ దొరలడం గమనించి, “ఆ ఆలోచన నిన్ను పట్టి పీడించకూడదు. నాకు తెలుసు నీ ఆనందం తెచ్చిపెట్టుకున్నది కాదు… ఇప్పటికీ నీకు మంచి స్నేహితులున్నారు, నువ్వంటే ప్రాణం ఇస్తారు. వాళ్లు నీ పరిస్థితి మారినంత మాత్రంచేత నిన్ను తక్కువగా అంచనా వెయ్యరు; నిజానికి సుఖంగా బ్రతకడానికి ఒక విలాసవంతమైన భవనమే ఉండవలసిన పని లేదు.”

“ఆమెతో నేను పూరిపాకలోనైనా సుఖంగా ఉండగలను,” వెక్కి వెక్కి ఏడుస్తూనే, మళ్ళీ, “ఆమె తోడుంటే నేను పేదరికంలోకే కాదు… చివరకి మట్టిలోకూడా హాయిగా కలిసిపోగలను… భగవంతుడు ఆమెని కనికరించాలి నావల్ల అటువంటి దుస్థితి ఆమెకి కలుగకుండా.” ఆమెమీద అతనికున్న ప్రేమవల్ల ఆ మాటలు అంటున్నప్పుడు దుఃఖం తెరలు తెరలుగా తన్నుకురావడంతో ఏడుపు కట్టలుతెంచుకుంది.

అతనికి దగ్గరగా జరిగి, తనచెయ్యి నా చేతిలోకి లాలనగా తీసుకుని, “మిత్రమా! నా మాట నమ్ము. ఆమె ఎప్పటిలాగే ఆత్మీయంగా ఉంటుంది; కాదు, ఇప్పటికంటే కూడా ఆత్మీయంగా ఉంటుంది; తన సర్వ శక్తుల్నీ కూడదీసుకుని నీ మీద తనకున్న ప్రేమ నిన్ను నిన్నుగా చూసి, అంగీకరించడంవల్లనే తప్ప నీ సంపదవల్ల కాదన్న సత్యాన్ని ఋజువు చేసుకుందికి ఇదొక అవకాశంగా భావించి గర్వపడుతుంది. నిజానికి ప్రతి స్త్రీ హృదయంలోనూ భోగభాగ్యాలలో తులతూగుతున్నప్పుడు బయటకి కనిపించని ఒక దివ్యాంశ అంతరాలలో నిద్రాణమై ఉంటుంది; కష్టాలు ఎదురైనపుడు ఆ రవ్వ మేల్కొని, దేదీప్యంగా ప్రకాశిస్తుంది. ఈ ప్రాపంచికమైన కష్టాలలో ఆమె తోడుగా నడిచేంతవరకూ ఏ భర్తకీ తన జీవిత సహచరి ఎంతటిదో, ఆమె తనని నడిపించే ఎంత గొప్ప దేవతో అవగతం కాదు.

నేను చెప్పిన తీరులోని అతనికి కనిపించిన నిజాయితీ, నేనుపయోగించిన ఉపమానాలూ బహుశా లెస్లీ వేదనాభరితమైన హృదయాన్ని ఎక్కడో తాకేయి. నేను వ్యవహరిస్తున్న శ్రోత సంగతి నాకు బాగా తెలుసును; అందుకని, నా మాటలు అతనిపై చూపించిన ప్రభావాన్ని పురస్కరించుకుని, ఇంటికి వెళ్ళిన వెంటనే ఆమెకి ఈ విషయాన్ని విపులంగా విశదీకరించి తన గుండె బరువుని తగ్గించుకోమని  సలహా ఇచ్చి ముగించేను.

అయితే, ఇక్కడ ఒక విషయం ఒప్పుకోక తప్పదు. నేను ఎంతగా చెప్పినప్పటికీ దాని ఫలితం నేననుకున్నట్టు వస్తుందో లేదోనన్న చింత అయితే లేకపోలేదు. జీవితంలో ఎప్పుడూ సుఖాలనుభవించిన స్త్రీ నైతిక ధైర్యాన్ని అంచనా వేసేదెలా? సంతోషంగా గలగలలాడే ఆమె, అకస్మాత్తుగా కళ్ళకెదురుగా కనిపించే పేదరికాన్నీ, తద్వారా కలుగబోయే దైన్యాన్నీ నిరాకరించి, ఆమె అలవాటుపడ్డ సుఖాలెక్కడదొరుకుతాయో వాటిదోవనే వెతుక్కోవచ్చు. అదిగాక, మొదటినుండీ బాగా బ్రతికినవారు చెడిన తర్వాత చాలా చేదు అనుభవాలు దిగమింగుకోవలసి వస్తుంది; మొదటినుండీ పేదరికంలో ఉన్నవాళ్ళకి అలాకాదు.  ఒక్క ముక్కలో చెప్పాలంటే, మరునాడు ఉదయం లెస్లీని కలిసినపుడు గుండె జోరుగా కొట్టుకోవడం మానలేదు. అతనామెకి ఉన్న విషయం చెప్పేడట.

“ఆమె దాన్ని ఎలా తీసుకుంది?” అడిగేను లోపలి ఆందోళన బయటకి కనపడనీయకుండా.

“ఒక దేవత లాగే! ఆమె మనసుకి ఇది ఒక ఊరటలా అనిపించిందేమో, నా మెడచుట్టూ చేతులు వేసి ‘అయితే, ఈ మధ్య మిమ్మల్ని ఇంతగాపట్టి పీడుస్తున్న విషయం ఇదేనన్నమాట ‘ అంది.” అంటూ, “పిచ్చిపిల్ల. తనకి ఏమీ తెలీదు. ఎటువంటి మార్పులకి తను లోనుగావలసి వస్తుందో. ఆమెకి పేదరికం అంటే ఒక ఆధిభౌతికమైన భావనే తప్ప, నిజమైన అవగాహన లేదు; ప్రేమకి అనుబంధంగా ఉన్న పేదరికంగురించి ఆమె కవిత్వంలో చదువుకుంది అంతే! లేమి అన్నది అనుభవంలోని విషయం కాదు; అలవాటుపడిన సౌకర్యాలకి ఇంకా లోటు రాలేదు ఆమెకి. పేదరికంలోని దౌర్భాగ్యం, తగ్గించుకోవలసిన అవసరాలూ, దానివల్ల ఎదుర్కోవలసిన అవమానాలూ, అనుభవంలోకి వచ్చిన తర్వాత అసలు పరీక్ష మొదలవుతుంది.” అన్నాడు.

“సరే, నీ భార్యకు తెలియపరచడమనే కఠినమైన పని ఒకటి అయింది కాబట్టి, నువ్వీ విషయాన్ని లోకానికి ఎంత తొందరగా వీలయితే అంత తొందరగా తెలియపరచడం మంచిది. అలా తెలియపరచడం చాలా అవమానకరమే; కానీ, అది ఒక్కసారితో పోతుంది; అది తెలియపరచకపోవడం వల్ల నువ్వు ప్రతి రోజూ, ప్రతి క్షణమూ ఆ బాధ అనుభవించడం తప్పుతుంది.  నిజానికి, పేదరికం కన్నా, అదిలేనట్టు భ్రమింపజెయ్యడమే … ఖాళీ జేబుకీ, అహంకారానికీ మధ్య జరిగే పోరాటమే… ఆర్థికంగా చితికిపోయిన వ్యక్తిని కృంగదీసేది. ఉన్నదున్నట్టుగా కనిపించడానికి ప్రయత్నించి చూడు, పేదరికానికి ఉన్న బాధించగల పదును పోతుంది,” అన్నాను. ఈ విషయంలో లెస్లీ పూర్తిగా సన్నద్ధుడై ఉన్నట్టు గ్రహించేను, అతని భార్య కూడా మారిన విధివ్రాలుకి అనుగుణంగా మారడానికి ఆతురతతోనే ఉంది.

 *

 కొన్ని రోజుల తర్వాత ఓ రోజు సాయంత్రం అతనే నన్ను కలవడానికి వచ్చేడు. అతను పూర్వం ఉన్న భవంతి అమ్మేసి పట్నానికి కొన్ని మైళ్ళదూరంలో పల్లెలో ఒక కుటీరం తీసుకున్నాడు. ఆ కొత్త ఇంట్లో రోజువారీ అవసరమైన అతిసామాన్యమైన గృహోపకరణాలు తప్ప పెద్దవి ఏవీ అవసరం పడలేదు; అందుకని, తన భార్య వీణ తప్ప, పాత ఇంట్లోని గొప్ప గొప్ప సామగ్రి అంతా అమ్మేసేడు. అది వాళ్ల ప్రేమకీ, వాళ్ళ ప్రేమకథకీ సంబంధించినది కనుక వదిలేసేడట; అతని ప్రేమాయణంలో మధురమైన క్షణాలు … ఆమె మృదు మధురమైన కంఠంతో పాడుతూ వీణవాయిస్తుంటే, దానిపై అతను వాలి విన్న సందర్భాలేనట. భార్యని అంత వెర్రిగా ప్రేమించే అతని ప్రేమ కథలో ఈ సరసమైన సందర్భాన్ని విని హర్షంతో చిరునవ్వు నవ్వకుండా ఉండలేకపోయాను.

తను అపుడు పల్లెలోని కుటీరానికి వెళుతున్నాడు. అక్కడ రోజల్లా ఏర్పాట్లన్నీ అతని భార్య పర్యవేక్షించిందట. ఈ కుటుంబం కథ ముందుకి ఎలా వెళుతుందా అన్న కుతూహలం చాలా ఎక్కువగా ఉండడం కారణంగానూ, అది సాయంత్రం అవడం చేతా, నేనే తనని అనుసరించడానికి సుముఖత వ్యక్తపరిచేను.

ఆ రోజు పడ్డ శ్రమకి అప్పటికే అలసిపోయి ఉన్నాడతను. మేము అలా వెళుతుంటే, విషాదం నిండిన ఆలోచనల మౌనంలోకి జారుకున్నాడతను.

“పాపం మేరీ!” ఎలాగైతేనేం అతని పెదాలనుండి ఒక గాఢమైన నిట్టూర్పుతో ఒక మాట బయటకి వెలువడింది.

“ఏమిటి సంగతి , ఆమెకేమయినా జరిగిందా?” అని అడిగేను.

“ఏమిటీ,” అన్నాడు అతను నాపక్క ఒక అసహనపు చూపు చూస్తూ, “ఇలాంటి స్థితికి దిగజారిపోవడం కంటే వేరే ఏమి జరగాలి? ఒక దిక్కుమాలిన గుడిశలో ఉండవలసి రావడం, అతి సామాన్యమైన జీవితావసరాలకోసం ప్రాకులాడవలసి రావడం చాలదూ?”

“అయితే ఆమె ఈ మార్పుకి విచారిస్తోందా?”

“విచారమా? అది ఏ కోశానా లేదు. ఆమె ఆనందంగా, ఎంతో హాయిగా నవ్వుతూనే ఉంది. నిజానికి, ఆమె ఇప్పుడున్నంత ఉల్లాసంగా ఇంతకుముందు ఎప్పుడూ ఉన్నట్టు నేను ఎరగను; ఆమె నా పాలిట ప్రేమైక మూర్తి, సుకుమారి, కొండంత ఆసరా.”

“అయితే తప్పక అభినందించవలసిన పిల్ల,” అన్నాను నేను మనఃస్ఫూర్తిగా మెచ్చుకుంటూ. “నువ్వు బీదవాడివని అంటున్నావు కాని మిత్రమా, నువ్వింతకు ముందెన్నడూ ఇంత భాగ్యవంతుడివి కావు… ఆ స్త్రీలో ఉన్న ఎన్ని అంతులేని నిధులకు యజమానివో నీకు తెలీదు,” అన్నాను.

“ఓహ్. చెప్పకు మిత్రమా. ఈ పూరిపాకలో మొదటిరోజు గడిస్తే నేను ధన్యుడినే. నిజమైన పేదరికపు అనుభవానికి ఇవాళ ఇంకా మొదటిరోజు మాత్రమే. ఆమెకి పేద గుడిశ ఎలాగ ఉంటుందో పరిచయం అయింది. రోజల్లా ఇక్కడ  ఉన్న సాదా సీదా వస్తువుల్ని సర్దడానికే సరిపోయి ఉంటుంది. మొట్ట మొదటిసారిగా ఇంటిచాకిరీ చెయ్యడంలోని శ్రమ, అలసట ఆమెకి అనుభవంలోకి వచ్చి ఉంటాయి. మొదటిసారి ఆమె తన చుట్టూ ఏ విలాసవంతమైన వస్తువూ, ఏ కనీస సౌకర్యమూ లేకపోవడాన్ని గమనించి ఉంటుంది; బహుశా అలసిపోయి, ఉత్సాహం క్షీణించి రేపు ఎలా గడపాలా అన్న చింతతో కూలబడి ఆలోచిస్తూ ఉంటుంది.”

అతను చెప్పిన దాంట్లో కొంతసంభావ్యత ఉండడంవల్ల నేను మరి వాదన పొడిగించకపోవడంతో, ఇద్దరం మౌనంగా నడుస్తున్నాము.

ప్రధాన రహదారి నుండి మళ్ళి, బాగా దట్టంగా పెరిగిన చెట్ల మధ్యనుండి పోతుండడం వల్ల ఏకాంత సంతరించుకున్న సన్నని బాటపట్టేక అల్లంత దూరంలో వాళ్ల కుటీరం కనిపించింది. ప్రకృతినారాధించే కవికి చాలా సహజంగా కనిపించగల సామాన్యమైన కుటీరం అది. అయినప్పటికీ, దానిలో కనువిందు చేయగల ఒక అందమైన గ్రామీణ ఛాయలున్నాయి. ఒక వైపు ఆకులూ కొమ్మలతో విశృంఖలంగా పెరిగిన ద్రాక్షగ కప్పితే, రెండో వంక కొన్ని చెట్లు ఏపుగా పెరిగి వాటి కొమ్మల్ని విలాసంగా ఇంటిమీదకి జాచేయి. ద్వారానికి ముందరా, ఇంటి ముందు పరుచుకున్న పచ్చికదగ్గరా కుండీలలో పూలమొక్కలు అందంగా అలంకరించినట్టు వేలాడుతుండడం గమనించేను. ముందరనున్న కర్రగేటు నుండి ప్రారంభమైన కాలిబాట కొన్ని పొదలమధ్యనుండి వంపులు తిరుగుతూ ఇంటి ద్వారందాకా సాగుతోంది. మేం ఇంటిని సమీపించేసరికి మంద్రంగా సంగీతం వినిపిస్తోంది; లెస్లీ నా భుజాన్ని ఒత్తేడు; మేం ఒక క్షణం ఆగి సంగీతం వింటున్నాం. ఆ పాట పాడుతున్నది మేరీనే, లెస్లీకి చాలా ఇష్టమైన సరళమైన రీతిలో పాడుతోంది.

లెస్లీ చెయ్యి నా భుజం మీద వణకడం నేను గ్రహించేను. అతను మరింత స్పష్టంగా విందామని ముందుకి మరొక అడుగు వేశాడు. ఆ అడుగు వెయ్యడంలో కంకర బాటమీద చప్పుడు అయింది. కిటికీలోంచి ఒక అందమైన ముఖం తొంగిచూసి అంతలోనే మాయమయ్యింది. ముందు తేలికగా వేసిన అడుగుల చప్పుడు వినిపించి, తర్వాత తడబడుతూ మమ్మల్ని కలుసుకుందికి మేరీ పరిగెత్తుకుంటూ రావడం జరిగింది. చక్కని తెల్లటి గ్రామీణ స్త్రీ ఆహార్యం ధరించి ఉందామె. ఆమె సిగలో కొన్ని కొండపూలు తురుముకుంది; ఆమె బుగ్గమీద సిగ్గు విరుస్తోంది; ఆమె ముఖమంతా చిరునవ్వులు చిందిస్తోంది. మునుపెన్నడూ ఆమె అంత అందంగా కనిపించినట్టు నాకు గుర్తు లేదు.

నౌడూరి మూర్తి

“ప్రియతమా, జార్జ్,” అని ఆనందంతో కేరి, “హమ్మయ్య. నువ్వు ఇంటికి వచ్చేసేవు. నాకిప్పుడు ఎంత ఆనందంగా ఉందో చెప్పలేను. నువ్వు ఎప్పుడు ఎప్పుడు వస్తావా అని ఎదురుచూస్తున్నాను; వీధి చివరకి పరిగెత్తుతూ వస్తున్నావేమోనని వెతుకుతున్నాను! మన ఇంటివెనక చెట్టుక్రింద టేబిలు సర్ది ఉంచేను. నీకు ఇష్టమని ఎన్ని తియ్యని స్ట్రా బెర్రీలు కోశానో. వాటితో మంచి క్రీం కూడా తయారు చేశాను. అన్నీ ఎంత బాగున్నాయో. ఇంకా మనం ఇక్కడే ఉన్నామేమిటి?” అంటూ  అతని చేతిలో ఆమె చెయ్యివేసి, అతని ముఖంలోకి తృప్తిగా చూస్తూ, “ఓహ్! మనకింక ఏ దిగులూ ఉండదు. ఎంత హాయిగా ఉంటామో చెప్పలేను” అంది.

పాపం లెస్లీ, తట్టుకోలేకపోయాడు. ఆమెని గుండెకి గాఢంగా హత్తుకుని, ఆమె చుట్టూ చేతులు వేసి, ఆమెని మాటి మాటికీ ముద్దులలో ముంచెత్తేడు. పాపం నోట మాట రాలేదు కానీ కళ్ళంట ఆనంద భాష్పాలు ధారాపాతంగా పెల్లుబికినై.

ఆ తర్వాత అతని పరిస్థితి మెరుగైంది, అతని జీవితం ఎంతో ఆనందంగా గడిచింది. అయితే అతను నాతో తరచు చెబుతుండే వాడు, ఆ క్షణాన్ని మించిన ఆనందం తిరిగి జీవితంలో ఎన్నడూ పొందలేదని.

( ఈ కథ ను ఇంగ్లీష్ లో ఇక్కడ చదవొచ్చు. Text Courtesy:: http://classiclit.about.com/library/bl-etexts/wirving/bl-wirving-thewife.htm)

( వ్యాసం లోని వాషింగ్టన్ ఇర్వింగ్ ఫోటో వికీపీడియా సౌజన్యం తో …http://en.wikipedia.org/wiki/Washington_Irving)