అనువాదాల అవసరం

 

 

-వేలూరి వేంకటేశ్వర రావు

~

(జూలై 3 వతారీకున ఆటా సాహిత్యసదస్సులో ఇచ్చిన ఉపన్యాసం)

తెలుగు వాళ్ళు  అమెరికాలో దేశవ్యాప్తంగా పెద్ద ఎత్తున  సాంస్కృతిక సంబరాలు చేసుకోవటం 1977 లో మొదలయ్యింది. కొన్నేళ్ళపాటు రెండేళ్ళకోసారి ఈ పండుగ చేసుకొనేవారు.  మరి పండుగలు ప్రతిఏడూ జరుపుకోవాలిగదా! అందుకనో, మరెందుకనో, ప్రతిఏడూ ఈ సాంస్కృతిక సంబరాలు జరుపుకోవటం పాతికేళ్ళక్రితం మొదలయ్యింది. నా శ్రీమతి  ఇంగ్లీషు పుట్టింరోజు, తెలుగు పుట్టింరోజూ చేసుకుంటుంది; అంటే సంవత్సరంలో రెండు పుట్టింరోజులు!  అల్లాగే ఈ మధ్యకాలంలో తెలుగు వాళ్ళు ఈ సాంస్కృతిక సంబరాలు ఏడాదికి రెండుసార్లు జరుపుకుంటున్నారు.

తెలుగు సినిమా మన సంస్కృతిలో ప్రథానమైనది.  అందుకని, సంస్కృతి పేరుతో తెలుగు సినిమాల వాళ్ళు ముమ్మరంగా వస్తారు, అమెరికాకి!  సంస్కృతి పేరుతో రాజకీయనాయకులు కూడా వస్తారు; సంస్కృతికి రాజకీయానికీ ఉన్న సంబంధం  నాకు ఇంతవరకూ అర్థం కాలేదు.  నాకు ఇకముందు అర్థం అవుతుందన్న ఆశకూడా లేదు.

ఈ సాంస్కృతిక సంబరాలలో సాహిత్యానికి ప్రత్యేకంగా ఒక చిన్ని పీట ఎప్పుడూ ఉంటుంది. ఒక్కక్కప్పుడు అది ముక్కాలిపీట అవుతుంది కూడా!  తెలుగు నాడు నుంచి, కవులు, కథకులు, నవలా రచయితలు. విమర్శకులు, పత్రికలవాళ్ళు వగైరా వగైరా ఆహ్వానితులుగా వస్తారు. వారికి తోడుగా చిన్న తమ్ముళ్ళుగా అమెరికా రచయితలు కూడా పిలిపించుకుంటారు, –“ డయాస్పోరా”  రచయితలం అనుకుంటూ!

(కథలో కథ చెప్పాలి, పిట్టకథలాగా! 1985 లో నారాయణరెడ్డి గారిని అడిగాను; మీకు ఇప్పటివరకూ వచ్చిన కీర్తి చాలదూ? ప్రతిఏడూఒక కవితా సంకలనం అచ్చువెయ్యాలా?  మా బ్రాహ్మలు సంవత్సరీకాలు పెట్టినట్టు, అన్నాను. ఆయన మృదువుగా తనశైలిలో చెప్పారు: అలా ప్రతిఏడూ ఒక సంకలనం అచ్చువెయ్యకపోతే జనం మనని  మరిచిపోతారు” అన్నారు.)

పోతే, అక్కడి నుంచి వచ్చిన వాళ్ళు చాలామంది  ముక్తకంఠంతో మనభాష ఎంతగొప్పదో, మనసాహిత్యం ఎంతగొప్పదో, మన సంస్కృతి  ఎంత పురాతనమైనదో మనకి మరీమరీ నూరి పోస్తారు. ఇక్కడి వాళ్ళు—అంటే అమెరికా డయాస్పోరా రచయితలు  “ మమ మమ” అని అర్ఘ్యమ్  పుచ్చుకుంటారు.  పునః పునః.  ఏడాదికి రెండు సార్లు!

నిజమే! మనభాష, సాహిత్యం, సంస్కృతీ గొప్పవే! కాదనం.

అయితే ప్రపంచ సాహిత్యంలో మన సాహిత్యానికి  ఉన్న స్థానం ఏమిటి? మనని ఎవరు గుర్తిస్తున్నారు? మనం ఎంతవరకూ గుర్తింపబడ్డాం? పాశ్చాత్య సాహితీ వేత్తలు, పాఠకులు, అసలు ఎవరైనా  మనని గుర్తిస్తున్నారా? మన ఘోష వింటున్నారా?

సరేనయ్యా!  వాళ్ళు మనని గుర్తించవలసిన అవసరం ఏముంది? లేదా వాళ్ళు గుర్తించనంతమాత్రాన మన ఘనత తగ్గుతుందా? అని అనే వారితో నాకు పేచీ లేదు. వారితో నాకు వాదించే ఓపిక కూడాలేదు.  అంతర్జాతీయంగా తమతమ సాహిత్యాలు గుర్తించబడాలని ప్రతి భాషలో రచయితలు, సాహితీపరులూ కోరుకుంటారు.  వాళ్ళ ఆలోచనలు, అనుభవాలు  మనకి, మన ఆలోచనలు మన అనుభవాలు వాళ్ళకీ పరస్పరం తెలుపుకోవటం అవసరం అనుకునే వాళ్ళల్లో నేను ఒకణ్ణి. ఈ విషయమై నాతో ఏకీభవించేవాళ్ళు ఉన్నారని అనుకుంటాను.

మన సాహిత్యం గురించి ఇక్కడ అమెరికాలో గాని, యూరప్‌ లోగాని ఎంతమందికితెలుసు, అని మనని మనం ప్రశ్నించుకున్నప్పుడు, మన భవిష్యత్ కర్తవ్యం బోధపడుతుంది.

మనసాహిత్యం, — సంప్రదాయ సాహిత్యం, ఆథునిక సాహిత్యం ముందుగా ఇంగ్లీషులోకి తర్జుమా  చేసుకోవలసిన అవసరం ఉన్నది.  ఆ తరువాత ఇతర యూరోపియన్ భాషలలోకి అనువదించేచే ప్రయత్నాలు మనం చేసుకోవాలి.  ఇంగ్లీషులోకి అనువదించటం కేవలం వాళ్ళకోసం కాదు; నిజం చెప్పాలంటే మనకోసమే! మనపిల్లలకి తెలుగు చదవటం రాదు;  తరువాతి తరం వారికి  తెలుగు అంటే ఏమిటోకూడాతెలియని పరిస్థితి రాకూడదు. భాష రాకపోయినంతమాత్రాన, ఆ భాషలో సాహిత్యం, ఆ సాహిత్యానికున్నప్రత్యేకత, మన వారసులకి తెలియవలసిన అవసరం ఉన్నdi. ఇంగ్లీషులోకి అనువదించటం మూలంగా,  You kill two birds at one shot.

veluri

ఆటా సాహిత్య సదస్సులో…

ఒక ఉదాహరణ:  “#Zoque#” అనే భాష కేవలం 70,000 మంది మాత్రమే మాట్లాడుతారు.  ఆ భాషలో కవిత్వం ఇవాళ ఇంగ్లీషులోకి అనువదించబడుతున్నది.

తెలుగు ప్రాచీన సాహిత్యం, ఏవో ఒకటి రెండు ప్రబంధాలనో, కావ్యాలనో తీసివేస్తే నిజంగా అంతా అనువాద సాహిత్యమేకదా! ఇప్పటికే మనకి, ఇంగ్లీషునుంచి, ఫ్రెన్‌చ్‌ నుంచి, రష్యను నుంచి కొల్లలుకొల్లలుగా అనువాద సాహిత్యం వచ్చింది. ఇప్పటికీ, దక్షిణ అమెరికను సాహిత్యాన్ని, స్పానిష్ సాహిత్యాన్ని మన రచయితలు విరివిగా అనువదిస్తున్నారు. అది వద్దనను.  అయితే, అదే బిగిలో  మనసాహిత్యం వారిభాషల్లోకికూడా వెళ్ళేటట్టు చేయగలగాలి.

#Quid Pro Quo# అనండి.

మన దురదృష్టం ఏమిటంటే, మన భారతీయభాషల సాహిత్యమే ఒకభాషనుంచి మరొకభాషలోకి  ఎక్కువగా అనువదించబడలేదు. ఎక్కడో ఒకటో రెండో కవితలు, కొన్ని కథలూ అడపా తడపా ఒకటో అరో నవల ఇతరభాషలలోకి వెళ్ళాయి. అది చాలులే అని సమర్థించుకొని సంతృప్తి పడే మంచి లక్షణం నాకు లేదు.

అయితే ఈ పని ఎవరుచేస్తారు?  ఈ దేశంలోను, ఇతర యూరోపియన్‌ దేశాలలోనూ యూనివర్శిటీలు పురమాయించో, ప్రోత్సహించో ఈ పని చేస్తాయి. ఆంధ్రలో గాని, తెలంగాణాలో గాని ఉన్న విశ్వవిద్యాలయాలు ఇటువంటి పని ఇప్పట్లో చేస్తాయని నేను అనుకోను. అక్కడ వాళ్ళకున్న ఈతి బాధలు వాళ్ళవి. వాళ్ళ సాహిత్యరాజకీయాలు వాళ్ళవి.  మరి, ఇక్కడి సాంస్కృతిక సంస్థలు పూనుకోగలవా?  ఈ సంస్థలు తమంతతామే చేయలేకపోయినా,  ఊతం ఇవ్వగలvu.  అందుకు డయాస్పోరా కమ్యూనిటీ యే పూనుకొని, సంస్థలని ప్రోత్సహించాలి.

ఈ సందర్భంలో నారాయణరావుగురించి ప్రస్తావించాలి. అతను ఒక్కడూ, మరొకరిద్దరి   సహకారంతో, ఎన్నో సంప్రదాయసాహిత్యగ్రంధాలని ఇంగ్లీషులోకి అనువదించాడు. ఇంగ్లీషులో కవితా సంకలనాలు తెచ్చాడు. శ్రీనాథుడి సాహిత్యచరిత్ర (#Literary Biography#) రాసాడు. A first of its kind. ఆథునికుల కవితలు, కథలూ  కూడా అనువదించాడు.  వ్యాఖ్యానాలు రాసాడు. అవి ఓపికగా, జాగ్రత్తగా చదవకండా  తెలివితక్కువ విమర్శలు చేసే బదులు, అంతకన్నా మంచి అనువాదం తేవాలన్న అభిలాషతో, నిష్పాక్షికంగా పనిచేయాలి.  ఆ పని అసాధ్యం కాదనుకుంటున్నాను.

నాకు ఈ కోరిక 2002-2003 లో 20th Century Telugu Poetry, Hibiscus on the Lake, —  ఈ రెండుపుస్తకాలు వచ్చిన తరువాత కలిగింది. నా స్వంత అనుభవం: మా మేనకోడలికి ఇస్మాయిల్‌ కవితల అనువాదాలు చదివి వినిపించాను. ఆ పిల్ల అప్పట్లో ఇక్కడ కాలేజీలో పేపర్‌కి సబ్-ఎడిటర్‌. ఆ అనువాదాలు విని ఇవి, elijabeth barret browning పద్యాల్లా వినపడుతున్నాయి అన్నది.  ఆహా!  That’s it అనిపించింది.  అంటే ఇక్కడి పాఠకుల “ఇడియం “ పట్టుకొని అనువదించాలన్నమాట!

1960 లో #UNESCO# రెండు తెలుగు పుస్తకాలు ఫ్రెన్‌చ్‌ లోకి అనువదించమని  ఆంధ్రా యూనివర్సిటీకి ఒక “ఆల్బర్ట్” ని పంపింది. మొదటిది వేమన శతకం. అతను అనువదించాలి. అది జరిగిందోలేదో తెలియదు కాని, అతనితో స్నేహం పట్టిన మాకు వైన్‌ తాగటం మాత్రం అలవాటయ్యింది.  రెండో పుస్తకం కళాపూర్ణోదయం.  అది నారాయణరావు ఈ మధ్యనే అనువదించాడు, ఏ అంతర్జాతీయ సంస్థయొక్క ప్రమేయం లేకుండానే! అప్పుడప్పుడు UNESCO సాహిత్య అకాడమీ తో షరీకయి భారతీయ భాషల పుస్తకాలు అనువదింపజేస్తుంది. తెలుగు పుస్తకం ఒక్కటికూడా వాళ్ళ జాబితాలో లేదు.

ఇక్కడ పదవశతాబ్దపు లాక్షణికుడు  రాజశేఖరుడి శ్లోకం గుర్తుచెయ్యటం అవసరం.

ఏకస్య తిష్ఠతి కవేర్గృహ  ఏవ కావ్యమ్

అన్యస్య గచ్ఛతి సుహృద్భవనాని యావత్,

న్యస్యా విదగ్ధవదనేషు పదాని శశ్వత్

కస్యాపి ఞ్చరతి విశ్వకుతూహలీవ. –  రాజశేఖరుని కావ్య మీమాంసా, 4:10

 

ఒక కవిరచించిన కావ్యము అతని ఇంటిలోనే పడి ఉంటుంది. మరొకడురాసిన కావ్యము మిత్రుల ఇంటి వరకూ పోతుంది. ఒక్కొక్కని కవిత్వము, ప్రపంచయాత్ర చేయుటకు కుతూహలము చూపిస్తూ ఎల్లప్పుడూ సంచరించుతుంది. ( అంటే,  సామాన్య విద్యావంతులు కూడా చదువుతూ ప్రచారము చేస్తారు, అని భావం)

ఈ కాలంలో,  మనసాహిత్యం ప్రపంచయాత్ర చేయడానికి  మనప్రేరణ, ప్రయత్నం  ఉండాలి.

ఆఖరిగా ఈ మాట చెప్పాలి.

ఇజం నిజం కాదు; నిజం ఇజంలోకి పోదు.  ఇజాల గందరగోళంలో పడకుండా మనం ఉమ్మడిగాఏమిచేయగలం అన్న విషయంపై నాకుకొన్ని అభిప్రాయాలు ఉన్నాయి. అవి మరొక వ్యాసంలో పొందు పరుస్తాను.

ఇప్పుడు మీ ప్రశ్నలకి సమాధానం చెప్పటానికి ప్రయత్నిస్తాను.

శలవ్‌

 

‘ఎమరీ’లో కొప్పాక తెలుగు పీఠం!

వేలూరి వేంకటేశ్వర రావు

 

తెలుగు సాహిత్యానికి, పశ్చిమగోదావరి జిల్లాలో చిన్న ఊరు  వసంతవాడకి, ఈనాటికీ  వాడకంలో ఉన్న కేన్సర్ ఔషధం మిత్ర మైసీన్ కి, అమెరికాలో  ఎమరీ విశ్వవిద్యాలయానికీ ఒక  విచిత్రమైన అనుబంధం ఉంది.   ఆ అనుబంధం   తెలుసు కోవాలంటే, కొప్పాక విశ్వేశ్వర రావు గారి జీవిత చరిత్ర తెలుసుకోవాలి.  నిజం చెప్పాలంటే, ఆయన జీవితం ఒక అద్భుత కాల్పనిక కథలా కనిపిస్తుంది.

కొప్పాక విశ్వేశ్వర రావు (1925-1998), సీతాపతి, విజయలక్ష్మి గార్ల రెండవ కుమారుడు.   వాళ్ళది వసంతవాడలో ఒక పేదకుటుంబం. విశ్వేశ్వర రావు గారు వారాలు చేసుకొని చదువుకున్నారు. క్రమంగా ఆయన  ఇరవమూడేళ్ళ వయసులో ఆంధ్రా యూనివర్సిటీ నుంచి   రసాయనశాస్త్రంలో డాక్టరేట్‌ పట్టా పుచ్చుకొని, తరవాత అమెరికాలో విస్కాన్‌ యూనివర్శిటీ లో బయోకెమిస్ట్రీలో మరొక డాక్టరేట్‌ డిగ్రీ తెచ్చుకున్నారు.  1954 లో ఆయన, భార్య సీత గారితో సహా  – అమెరికాకి వలస వెళ్ళారు.  అక్కడ  ఫైజర్‌ కంపెనీలో పరిశోధకుడిగా చేరారు.  సహజంగా ప్రకృతిలో దొరికే పదార్థాలు కేన్‌సర్‌ నివారణకి ఔషధాలుగా ఉపయోగించడానికి ఆయన చేసిన పరిశోధన ఆయనకి అంతర్జాతీయ ఖ్యాతి తెచ్చింది. ఆయన కనిపెట్టిన  “ మిత్రమైసీన్,” అనే మందు ఇప్పటికీ కేన్‌సర్‌ నివారణకి వాడుతున్నారు.

విశ్వేశ్వర రావు గారికీ,  సీతగారికీ  ప్రాచీన తెలుగు సాహిత్యంఅన్నా, సంగీతం అన్నా, వల్లమాలిన ఇష్టం.  ఆయన తిక్కన్ననీ, పోతన్ననీ తన  పిల్లలకీ  ఆప్యాయంగా వినిపించేవారు. ఆయనజీవితం చివరి రెండు సంవత్సరాలలో, తెలుగు, సాహిత్యం, సంస్కృతి, చరిత్ర, సంప్రదాయం  – అమెరికాలో పెరుగుతున్న భారతీయులకీ, అమెరికనులకీ చెప్పవలసిన అవసరం ఉన్నదని గ్రహించి, ఆపని చెయ్యడానికి  విశ్వవిద్యాలయాలే తగిన స్థానాలని గుర్తించి  అమెరికాలో ఏదయినా ఒక పెద్ద విశ్వవిద్యాలయంలో తెలుగు పీఠం ఏర్పాటు చేయాలని స్థిరంగా నిశ్చయించుకున్నారు.  కాని, అది  ఆయన బతికి ఉండగా చెయ్యలేకపోయారు.

ఆయన కోరిక తీర్చడానికి వారి సతీమణి సీత గారు,  పిల్లలు, విజయ లక్ష్మీ రావు, వెంకటరామా రావు,   జయ రావు,  – 2000 సంవత్సరంలో  కొప్పాక ఫేమిలీ ఫౌండేషన్‌ స్థాపించారు.

అట్లాంటాలో ప్రసిద్ధికెక్కిన ఎమరీ యూనివర్శిటీలో తెలుగు పీఠం ఏర్పాటు చెయ్యడానికి  పదిహేను లక్షల డాలర్లు (సుమారు తొమ్మిది కోట్ల రూపాయలు)  కావాలి.  అందులో సగం, అంటే 750,000 డాలర్లు (దాదాపు నాలుగున్నర కోట్ల రూపాయలు) ఇచ్చి, మిగతా సగం ఎమరీ యూనివర్సిటీని ఇతర దాతల సహాయంతో కూడబెట్టుకోమని చెప్పారు.  కాని గత ఐదు సంవత్సరాలలో, దేశవ్యాప్తంగావున్న తెలుగు సాంస్కృతిక సంస్థలు, తెలుగు దేశపు  ప్రభుత్వాధికారులు, ఇక్కడి తెలుగు ధనవంతులూ – ఎవరూ ముందుకు వచ్చే పరిస్థితి కనిపించకపోవడంతో, ఈ ఆచార్య పదవి ఏర్పడదనే అనుమానం వచ్చింది.  అప్పుడు, కొప్పాక ఫేమిలీ ఫౌన్‌డేషన్‌ వారే కల్పించుకొని, ఆరెండవ భాగం, తామే ఇస్తామని వాగ్దానం చేసారు.

about-visiting-quad-students-walking-530

ఇప్పుడు, మార్చ్‌ 26, 2015 న ఎమరీ యూనివర్శిటీలో తెలుగు ఆచార్యపదవి నెలకొల్పబడబోతున్నది.  దాని పేరు  ఆధికారికంగా # The Visweswara Rao and Sita Koppaka Professorship in Telugu Culture, Literature, and History#.  విశ్వేశ్వర రావుగారి కోరిక తీర్చడానికి  వారి పిల్లలు ముందుకు వచ్చి, మాటలతో కాకండా, చేతలద్వారా మార్గదర్శకత్వం వహించడం  అందరు తెలుగువాళ్ళూ గర్వించదగ్గ విషయం.

ఒక్క తెలుగు కుటుంబ ధార్మిక సంస్థ ఒక యూనివర్శిటీ లో తెలుగు ఆచార్య పదవికై  మూలధనం ఇవ్వడం ప్రపంచంలో ఇదే మొట్టమొదటిసారి అని చెప్పవచ్చు.  దేశవ్యాప్తంగా పనిచేస్తున్న తెలుగు సాంస్కృతిక సంస్థలకీ, తెలుగు మీద నిజమయిన అభిమానం ఉన్న వ్యక్తులకీ, ఇది ప్రేరణ అవాలని వాంఛించడం  అనుచితం కాదు.

ఇది కాక కొప్పాక ఫౌండేషన్‌ వారు, ఇంకా చాలా జనహిత కార్యక్రమాలకి  అమెరికాలోను, తెలుగునాటా  విరాళాలు ఇస్తున్నారు.

 

విశ్వేశ్వర రావు గారికి  1998 లో గుండె పై శస్త్ర చికిత్స జరిగింది. ఆయన వైద్యశాలలో ఉండగా, వారి పిల్లలు – ఇద్దరు వైద్యులు—వారికి వైద్య వ్యవస్థలో ఉన్న లోపం  చాలా బాధ కలిగించింది.   డాక్టర్లకీ, రోగులకీ, వారి కుటుంబ సభ్యులకీ  మధ్యన  అన్యోన్యత పెంపొందిచడం చాలా అవసరమని, ప్రస్తుతం వైద్యవిద్యాలయాలలో  పరిస్థితులు అందుకు అనుకూలంగా మారేటట్టు చెయ్యాలని వారు అనుకున్నారు. అందుకోసం ఇప్పటివరకూ, పదిహేడు వైద్యవిద్యాలయాలలో ఇరవై ఆరు సందర్శకాచార్య పదవుల కోసం  విరాళాలు  ఇచ్చారు. వర్జీనియా వైద్యవిద్యాలయంలో ఉపన్యాసక పదవికి  శాశ్వత నిధి నెలకొల్పారు.  (ఈ కార్యక్రమానికి ప్రేరణ అయిన సందర్బాలని చర్చిస్తూ డా. వెంకటరమణ రావు, డా. జయ రావు గారు కలిసి రాసిన  వ్యాసం, “శాంతి” అన్న మకుటంతో ప్రసిద్ధ వైద్య  శాఖ పత్రిక (#Annals of Internal Medicine, Volume  137, Number 10, 19 November 2002#)  లో ప్రచురితమయ్యింది.  అంతే కాకండా, ఆర్థికంగా, సాంఘికంగా వెనుకబడిన విద్యార్థులకి ప్రత్యేక సహకారం కోసం కొప్పాక ఫౌన్‌డేషన్‌  నిధులు కేటాయిండానికి ప్రయత్నిస్తున్నారు.

విశ్వేశ్వర రావు గారు సహజ వనరుల ఔషధపరిశోధనలో ప్రపంచ ప్రసిద్ధులు. ఆయనకి తెలుగు భాషమీద, తెలుగు సాహిత్యం మీదా ఉన్న అధికారం, మమకారం ప్రపంచానికి తెలియదు గాని, ఆయన పిల్లలకి తెలుసు. వారు ఇప్పుడు, కొప్పాక ఫౌండేషన్‌ పేరుతో తెలుగు భాషకి అమెరికాలో చేసిన ఉపకారం, ఇంతకు పదింతలై పదిమందికి మార్గదర్శకం కాగలదని ఆశిద్దాం. తెలుగు భాష ప్రపంచ భాష అవడానికి నిజమైన దారి ఏర్పడుతుందని నమ్ముదాం.

అంధ్ర జ్యోతి  – మార్చ్‌, 25, 2015 సౌజన్యంతో