ఆమె మనసులో దాచుకున్న వ్యథ..కోసూరి ఉమాభారతి కథలు “విదేశీ కోడలు”!

videshi-kodalu

ఆసక్తి ఉంటే ఎంచుకున్న ప్రవృత్తిని ఎప్పుడైనా అభివృధ్ది చేసుకోవచ్చు. వయో పరిమితి లేదు. కాల పరిమితి కూడా ఉండదు. చిన్నతనం నుంచీ సాహిత్యం మీద నున్న అభిమానం, అభిరుచి.. జీవనయానంలో తారసపడిన వ్యక్తుల వ్యక్తిత్వ పరిశీలన, మనస్తత్వాల విశ్లేషణ, నిరంతర శోధన.. వృత్తి రీత్యా పెంచుకున్న భాషాభిమానం  శ్రీమతి ఉమాభారతిని కలం పట్టేట్లు చేశాయని చెప్పచ్చు.

ఈ సంకలనంలో పన్నెండు కథలున్నాయి. అన్నీ ఒక సంవత్సరం వ్యవధిలో రాసినవే. భరతముని కథలో తప్ప అన్నింటి లోనూ స్త్రీలదే ప్రధాన పాత్ర. కూతురిగా, చెల్లెలిగా, అక్కగా, అమ్మగా, స్నేహితురాలిగా ఎదుర్కొన్న అనేక అనుభవాల ఫలితం, వాటి ప్రభావం.. మానసిక వ్యవస్థలు, వాటి విశ్లేషణ తో నడిపించిన కథల సంపుటి ఇది.

కవయిత్రిగా రచనా ప్రస్థానం ప్రారంభించిన రచయిత్రి తన కవితలతో వర్ణనలు సాగించడంతో కొన్ని కథలు ఆధునిక చంపూ పధ్ధతిలో(కొంత పద్యం, కొంత గద్యం కలిసిన కావ్యాన్ని చంపూ కావ్యం అంటారు.) నడిచాయని చెప్పచ్చు. అన్నీ స్త్రీ ప్రధానమైనవే ఐనా..  పోలికలున్నాయని పించిన కథలు తీసుకుని పరిశీలిద్దా మను కుంటున్నాను.

మొదటిది ‘కాఫీ టిఫిన్ తయ్యార్..’. ఆర్ధికంగా వెనుకబడి అధిక సంతానం ఉన్న కుటుంబాలలో, అబ్బాయిలకీ వారి చదువులకీ ప్రాధాన్యం ఇవ్వడం, ఆడపిల్లలు పిన్న వయసు నుంచే అమ్మలకి సహాయం చెయ్యడం సామాన్యమే. అన్నలు చెల్లెళ్ల మీద పెత్తనం చెలాయించడం, పెద్దలు సర్ది చెప్పడానికి ప్రయత్నించడం తప్ప అంతకు మించి ఏమీ చెయ్యలేకపోవడం కూడా సహజమే. అయితే.. ఇంట్లో వారెవ్వరూ, ఆడపిల్ల కాశీ పెళ్లి మాట ఎత్తక పోవడం కొంచెం అసహజంగా అనిపించింది.. అందులో కింది తరగతి కుటుంబాలలో అమ్మాయిలకి త్వరగా.. మళ్లీ మాట్లాడితే మైనారిటీ తీరకుండానే వయో భేదంతో పని లేకుండా చెయ్యడం అందరికీ తెలిసిన విషయమే.

అందరికంటే చిన్నది.. ఆడపిల్ల సంపాదన మీద ఇంటిల్లి పాదీ ఆధారపడి, ఇంచుమించు శ్రమ దోపిడీ చేస్తుంటే.. కన్నతండ్రి కళ్లు మూసుకుని కూర్చోవడం కొంత ఎబ్బెట్టుగా అనిపించక మానదు. మధ్యలో స్నేహితురాలు చెప్పిన హితవు కూడా పెడచెవిని పెడ్తుంది అన్నదమ్ములంటే ఉన్న అభిమానంతో ఆ అమ్మాయి.. అప్పటికి స్త్రీ అయింది.. పరిస్థితులు అవగాహన చేసుకోగలదు. అయినా సరే.. అతి మంచితనమో, అన్నదమ్ముల మీద గుడ్డి ప్రేమో.. తన గురించి ఆలోచించకుండా జీవితం మూడువంతుల భాగం గడిచాక మేలుకుంటుంది.

కుటుంబీకులు ఇంటి ఆడపడుచు మీద అంత అశ్రధ్ద చూపడానికి కారణం కథాంతానికి ముందు తెలుస్తుంది. ఆడపిల్ల సంపాదనమీద ఆధారపడ్డ తండ్రుల స్వార్ధానికి బలై పోయిన స్త్రీ.. నడి వయసు దాటాక ఒక అండ చూసుకుని అనాధల్ని ఆదుకోవడంతో కథ ముగుస్తుంది.

దీనికి వ్యతిరేకంగా కన్న కూతురి స్వార్ధానికి బలైన ఒక తండ్రి ఆవేదన ‘మా నాన్న పిచ్చోడు’ లో కనిపిస్తుంది. ఈ రెండు కథల్లోనూ పెంచుకున్న అనాధ పాప ప్రేమ పాఠకులను కదిలిస్తుంది.  ఏ విధంగా తల్లిదండ్రుల నాదుకుందో, వారి మీద ఎటువంటి ప్రేమ, ఆప్యాయతలు కనపరుస్తుందో.. తండ్రి కళ్లల్లో ఆనందాన్ని చూడటం కోసం అవసరమైతే కోర్ట్ చుట్టూ సంవత్సరాల తరబడి ఏ విధంగా తిరగ గలదో.. రచయిత్రి చెప్పిన విధానం మనసుకు హత్తుకుంటుంది. అదే కన్న కూతురు, తండ్రిని పిచ్చాసుపత్రి పాల్చేసి పెన్షన్ కాజేస్తుంది. ఒక కథలో కూతురి పరంగా, ఇంకొక కథలో తండ్రి పరంగా ఉత్తమ పురుషలో సాగుతుంది కథనం.

స్వార్ధ పరురాలైన స్త్రీ కుటుంబ సభ్యులతోనే కాకుండా స్నేహితులతో కూడా నిస్సంకోచంగా, నిర్దాక్షిణ్యంగా, అమానుషంగా ప్రవర్తించి వారిని సంక్షోభానికి  గురి చెయ్యడం ‘ఎ ఫ్రెండ్ ఇన్ నీడ్’ లో కూడా కనిపిస్తుంది. కళ్యాణి వంటి వ్యక్తులు మనకు తారసపడుతూనే ఉంటారు.. ఎంతో కొంత క్రమంలో. మన టి.వి సీరియల్స్ లో ఇటువంటి వారినే చూపిస్తుంటారు. ఎవరికైనా ఏ సహాయమైనా చేసేటప్పుడు “భగవద్గీత గుర్తుకుచేసుకుంటూ ఉండాలి, మనం నిమిత్త మాత్రులమే సుమా..” అని ఈ కథలో ప్రధాన పాత్ర గుర్తు చేస్తుంటుంది.

‘నాకోసం తిరిగి రావూ’ లో మనవరాలి మీద తాతయ్య ప్రేమ, అభిమానం చూస్తాం. పల్లెటూరి వర్ణన ప్రధానంగా సాగే ఈ కథని స్కెచ్ అనుకోవచ్చు.

‘ముళ్లగులాబీ’, విదేశాల్లోనే కాదు.. స్వదేశంలో కూడా యువత ఎదుర్కుంటున్న సంక్షోభం. ఇందులో ఆడ, మగ తేడా లేదు. పెళ్లికి ముందు ఒకలాగ, పెళ్లయ్యాక ఇంకొకలాగ ప్రవర్తించే కోడళ్లు (అల్లుళ్లు) కోకొల్లలు. కనీసం మాలిని రంగులు నిశ్చితార్ధం నాడే బయట పడ్డాయి. కిరణ్ తల్లిదండ్రుల ఆవేదన కొద్దికాలంలోనే, అతను కాబోయే భాగస్వామి అంతరంగం ముందుగానే తెలుసుకుని తగిన చర్య తీసుకోవడంతో ముగిసింది. ప్రస్థుత పరిస్తితుల్లో పిల్లలు స్థిరపడే వరకూ కన్నతల్లి పడే ఆదుర్దాని రచయిత్రి చాలా బాగా వివరించారు. నాకు ఈ కథ బాగా నచ్చింది. కాబోయే కోడల్ని చూసిన ఆనందం, అమ్మాయి నచ్చిందని భర్తతో తన సంతోషాన్ని పంచుకోవడం.. ఆ తరువాత.. అదే అమ్మాయితో కొడుక్కి పెళ్లైతే ఆ పై జీవితం ఎలా.. ఆ అమ్మ అంతరంగాన్ని బాగా ఆవిష్కరించారు రచయిత్రి.

అదే మొండితనం, బద్ధకం కలగలిపిన.. భాష, సంస్కృతి వేరైన ‘విదేశీ కోడలి’ విన్యాసాలు.. ఏవిధంగా ఉంటాయి..

అమాయకంగా ఒక్కగా నొక్క కొడుకు అడిగిందల్లా ఆస్థులు అమ్మి ఇచ్చి, విదేశాలకి పంపుతే.. ఆ కొడుకు, నాలుగు రోజులు కూడా తల్లిదండ్రులు తన దగ్గర ఉండలేని పరిస్థితికి క్షణిక వ్యామోహం లో తీసుకొస్తే.. ఆ తల్లిదండ్రులు పడే వేదన కళ్లకి కట్టినట్లు కనిపిస్తుంది ఈ కథలో.

కోసూరు ఉమా భారతి

కోసూరు ఉమా భారతి

పై రెండు కథలూ చదివిన పెళ్లి కాని యువకులు, జీవిత భాస్వామిని ఎంచుకునే ముందు ఒక్క నిముషం ఆలోచిస్తారు. ఆ విధంగా ఉమాభారతి ప్రయత్నం కొంత సఫలం ఐనట్లే.

అమెరికాలోనే కాదు.. ఎక్కడైనా, వృధ్దాప్యంలో ఒంటరితనం భయంకరమైన శాపమే. దానికి మతి చాంచల్యం తోడైతే.. ఇంక అంతకంటే ప్రత్యక్ష నరకం ఉండదు. కథలో కనుక రేణు కుమార్ కి తార వంటి స్నేహితురాలు దొరికింది. నిజ జీవితంలో.. నిర్దయులైన కొడుకులు గాలికి వదిలేస్తే రెపరెపలాడే పిచ్చి తల్లిని ఎవరాదుకుంటారు.. ‘త్రిశంకుస్వర్గం’ చదువుతుంటే ఒళ్లు గగుర్పాటు చెందకమానదు. ఇది చదివిన వారు తమ మాతృమూర్తిని అక్కున చేర్చుకుంటే రచయిత్రి ఎంతో మధనపడి వ్రాసిన ఈ కథ గమ్యం చేరినట్లే.

‘తొలిపొద్దు’, తండ్రి నిరాదరణకు గురై, భర్త నిర్లక్ష్యంతో దిక్కు తోచని స్త్రీ ఎటువంటి నిర్ణయాన్ని తీసుకోవాలో సూచిస్తుంది. అమ్మ, అమ్మమ్మల ప్రేమతో గారాబంగా పెరిగిన భానుమతి, ప్రేమ రాహిత్యానికి గురైతే.. తనకున్న ఒకే ఆలంబన అయిన బాబుని తన ఆదర్శాలకి అనుగుణంగా పెంచాలని.. మానసికంగా ఒంటరితనం అనుభవిస్తూ.. భౌతికంగా కూడా ఒంటరి పోరాటాన్ని  సాగించడానికి నిశ్చయించుకుంటుంది. ఇది ఆ తరం మహిళకి కష్ట మయిన పనే.. అయినా అటువంటి వారూ ఉన్నారు సమాజంలో..

ఇందులో అన్నీ స్త్రీ సమస్యలకి సంబంధించిన కథలైనా.. ప్రత్యేకించి అమ్మ గురించి రాసిన కథలు రెండున్నాయి.

ఒకటి.. ‘అమ్మతనం అద్భుతవరం..’ మదర్స్ డే సందర్భంగా జరిగిన సమావేశంలో వక్తలు వెలిబుచ్చిన అభిప్రాయాలు.. శ్రావణి తన స్వానుభవంలో చెప్పిన, సర్జన్ గారు తల్లిని ఇంట్లోనే జైలు పాలు చెయ్యడం.. ఆ తల్లి రోజుకొక్క సారైనా కొడుకు, మనవలు కంట పడతారు కదా అని ఒంటరి జీవితం గడపడం చదువుతుంటే మనసు ద్రవించక మానదు. అలాగే పక్కింటి వినీత కొడుకు కోసం పడుతున్న తాపత్రయం.. ఈ ఒక్క కథలోనే చాలా కథలు చెప్తారు రచయిత్రి. కొన్ని తీసేసి, కొన్నింటి నిడివి పెంచితే బాగుండేదనిపించింది.

రెండవది.. ‘అమ్మకి సరయిన స్థానం స్వర్గమే..’ అమ్మ కష్టం, ఆవిడ ఆవేదన చూడలేని, దూరాన ఉన్న ఒక కూతురి కోరిక ఇది. వినడానికి వింతగావే ఉండచ్చు.. కానీ కథంతా చదివేశాక మనం కూడా అదే అనుకుంటాము. ఆప్యాయతకి, త్యాగానికి మారుపేరు అమ్మ.. అమ్మ కంటి నీరు తుడవలేని ఒక కూతురి ఆక్రందనని ఆమె మాటల్లోనే వ్యక్తీకరిస్తారు శ్రీమతి ఉమ.

అమ్మ మీద వచ్చిన కవితల్ని, కథల్ని ఎందరు రాసినా, ఎన్ని సార్లు చదివినా భావోద్వేగం కలుగక మానదు ఎవరికైనా. అదే భావం ఈ సంపుటి లో అమ్మ కథలకి కూడా కలుగుతుంది.

ఇంక స్వర్గ లోక వాసుల భూలోక విహారం వివరించే కథలు ‘మానసపుత్రి’, ‘భరతముని భూలోక పర్యటన’. ఈ కథానికల్లో కవితలదే పైచేయి. మానసపుత్రి, నృత్య రూపకం కథగా మలచబడిందని రచయిత్రే చెప్పుకున్నారు. చదువరికి అదే భావం కలుగక మానదు.  ఇవి చదువుతుంటే కథలు చదువుతున్నామని అనిపించక పోయినా.. ప్రాచీనత నుంచి ఆధునికతకి ప్రయాణం.. రెంటినీ మిళితం చేసే ప్రయత్నం పాఠకుడ్ని ఆకట్టుకుంటాయి. భరతముని, సినిమా షూటింగ్ లో నాట్యవిన్యాసాల్ని చూసి ఆవేశపడతాడనుకున్న నాకు.. ఆయన ఆశ్చర్యపోవడంతో ఆపెయ్యడం నిరాశ కలిగించిన మాట వాస్తవం.

ఈ కథల సంపుటి రచయిత్రి తొలి ప్రయత్నం. తక్కువ వ్యవధిలో ఇన్ని కథలు రాసి, పాఠకుల మెప్పు పొందడానికి కారణం ఉమాభారతిగారికి సాహిత్యం మీద ఉన్న తపన.. కళాకారిణిగా భాష మీదున్న పట్టు.

కథలన్నింటినీ పూల గుఛ్ఛంలా అందించేటప్పుడు వస్తు వైవిధ్యం ఉంటే ఇంకా బాగుండేది. ఉదాహరణకి, అనాధ పాపల్ని పెంచుకున్న కథల్లో.. సామాజిక సేవలతో ముగింపు, ఆ అమ్మాయిలిద్దరూ కుటుంబం మీద చూపించే ప్రేమ వంటివి, విడివిడిగా పత్రికల్లో చదివినప్పుడు తెలియదు కానీ.. ఒక దగ్గరున్నప్పుడు సారూప్యం కనిపించక మానదు.

ఒక్కోసారి వర్ణనలు కథని మించి పోయాయేమో అనిపించింది. ఇటువంటి చిన్న చిన్న విషయాలు తప్పిస్తే ఒక మంచి ఆలోచనా పూరితమైన కథలు చదివిన తృప్తి కలిగింది.

శ్రీమతి ఉమాభారతి మరిన్ని మంచి కథలు వ్రాయగలరనటంలో ఎటువంటి సందేహం లేదు.

          — మంథా భానుమతి.