ఆదర్శ మిలియనీర్

ఆస్కార్ వైల్డ్

ఆస్కార్ వైల్డ్

 

సంపద లేకుంటే మనిషి ఎంత ఆకర్షణీయంగాఉన్నా ఉపయోగం లేదు. కొత్తది, ఇష్టమైనది అనుభవించగలగడం డబ్బున్నవాళ్ళ ప్రత్యేకతగాని నిరుద్యోగుల నిత్యకృత్యం కాదు. డబ్బులేనివాళ్ళెప్పుడూ నిస్సారంగాజీవిస్తూ ఏది అందుబాటులోఉంటే దాన్ని అనుభవించడం నేర్చుకోవలసిందే. మనిషి మనోహరంగా కనిపించడంకంటే, స్థిరమైన ఆదాయంవచ్చే ఉద్యోగం కలిగి ఉండడం మేలు. ఈ ఆధునిక సత్యాలేవీ హ్యూయీ ఎర్స్కిన్ కి వంటబట్టలేదు. పాపం హ్యూయీ!  తెలివితేటల విషయంలో, ఏ మాటకి ఆ మాటే ఒప్పుకోవాలి, అతనంత చెప్పుకోదగ్గవాడేం కాడు.

అతని జీవితకాలంలో ఒక సరసమైన మాట, కనీసం విరసమైనదికూడా చెప్పి ఎరగడు. అయితేనేం, చూడడానికి బహుచక్కగా ఉంటాడు… గోధుమరంగు ఉంగరాలజుత్తూ, చక్కనికళ్ళూ, తీర్చినట్టున్న ముఖంతో. అతనికి మగవాళ్ళలో ఎంత పేరుందో, ఆడవాళ్లలోనూ అంత ప్రఖ్యాతి ఉంది, అతనికి అన్ని ప్రావీణ్యతలూ ఉన్నాయి… ఒక్క డబ్బు సంపాదించగల నేర్పు తప్ప. వాళ్ళ నాన్న అతనికి వారసత్వంగా మిగిల్చినవి… తను ఆశ్వికదళంలో పనిచేసినప్పటి కత్తీ, “A History of Peninsular War” 15 సంపుటాలూ. హ్యూయీ మొదటిదాన్ని తన అద్దంముందు వేలాడదీశాడు, రెండోవి పుస్తకాలబీరువాలో Ruff’s Guide కీ, Bailey’s Magazine కీ మధ్య (ఈ రెండూ గుర్రపు పందాలకు సంబంధించినవి) దాచి, అతని ముసలి మేనత్త ఏర్పాటుచేసిన సాలుకి రెండువందల పౌండ్ల జీవన భృతితో కాలక్షేపం చేస్తున్నాడు.

అతను చెయ్యని ప్రయత్నం లేదు.  ఆరునెలలపాటు స్టాక్ ఎక్స్ఛేంజిలో తన అదృష్టాన్ని పరీక్షించుకున్నాడు కూడా; అయినా, బుల్స్ కీ బేర్స్ కీ మధ్య పాపం సీతాకోకచిలుకకి పనేమిటి? అంతకంటే ఎక్కువకాలమే టీ వ్యాపారంలో వేలుపెట్టేడు, కానీ ‘పెకో’ తోటీ ‘సూచాంగ్’ తోటీ విసిగెత్తిపోయాడు. తర్వాత అతను ‘డ్రై షెరీ’ అమ్మడానికి ప్రయత్నించేడు. అదీ ఫలితం లేకపోయింది; షెరీ మరీమందకొడిగా సాగింది. చివరికి అతను ఏదీ కాకుండాపోయాడు… ఎందుకూ కొరగాని, ఏ వ్యాపకమూ లేని, ఆహ్లాదకరమైన అందమైన యువకుడిగా మిగిలిపోయాడు.

ఇది చాలనట్టు, అతను ప్రేమలో పడ్డాడు. అతను ప్రేమించిన పిల్ల పేరు లారామెర్టన్ … ఇండియాలో పనిచేస్తున్నప్పుడు అతని నిగ్రహాన్నీ, జీర్ణక్రియనీ పోగోట్టుకుని, అందులో ఏదీ తిరిగిపొందలేకపోయిన ఒక రిటైర్డ్ కల్నల్ కూతురు. లారాకి అతనంటే ఆరాధన, అతనామె పాదాలనుసైతం ముద్దుపెట్టుకుందికి సిద్ధం. లండనులో అత్యంత సుందరమైనజంటగా గుర్తించబడ్డారు గాని, వాళ్ళిద్దరి దగ్గరా తంతే దమ్మిడీ లేదు.  కల్నల్ కి హ్యూయీ అంటే ఇష్టమే గాని అతని దగ్గర  పెళ్ళి ఊసు మాత్రం ఎత్తకూడదు.

“కుర్రాడా, నీ దగ్గర పదివేలపౌండ్లు చేకూరినపుడు కనిపించు. అప్పుడు పెళ్ళిమాట ఆలోచిద్దాం,” అని అంటూండేవాడు ఈ విషయం వచ్చినప్పుడల్లా. ఆ రోజు హ్యూయీ ముఖం విచారంగా వేలాడేసుకుని, మళ్ళీ లారా దగ్గరకే చేరేవాడు ఉపశమనం కోసం.

ఓ రోజు, హ్యూయీ మెర్టన్స్ నివసిస్తున్న హాలండ్ పార్కుకి వెళుతూ వెళుతూ మార్గమధ్యంలో అతని ఆప్తమిత్రుడు ఏలన్ ట్రెవర్ దగ్గరకి వెళ్ళేడు. అతనొక చిత్రకారుడు.  ఈ రోజుల్లో చిత్రకారుడు కాకుండా ఎవడూ ఉండలేడనుకొండి. అదివేరే సంగతి. అయితే అతను కళాకారుడు కూడా. కళాకారులు మాత్రం చాలా అరుదు. మనిషి చూడ్డానికి మహా చిత్రంగా, మొరటుగా, ముడతలు పడిన ముఖం, ఎర్రని చింపిరిగడ్డంతో కనిపిస్తాడు. కానీ, ఒకసారి కుంచె పట్టుకున్నాడా, అతనిలో ఒక మహాకళాకారుడు కనిపిస్తాడు. అతని బొమ్మలంటే ప్రజలు ఎగబడి కొనుక్కుంటారు. అతనికి మొదటగా హ్యూయీ అంటే ఇష్టం కలగడానికి కేవలం అతని రూపమే కారణం అని చెప్పక తప్పదు. తరచుగా అతను, “ఒక చిత్రకారుడు ఎటువంటి వాళ్లతో స్నేహం చెయ్యాలంటే సహజమైన అందంతో, జీవకళతో ఉట్టిపడే వాళ్ళూ, కళాత్మక దృష్టితో చూసినపుడు ఆహ్లాదం కలిగించే వాళ్ళూ, మేధోపరమైన చర్చలకు పనికొచ్చేవాళ్ళూ,” అని అంటుండేవాడు. అయితే హ్యూయీగురించి బాగా తెలుసుకున్నకొద్దీ, అతనిలో తొణికిసలాడే ఉత్సాహానికీ, దేన్నీ లక్ష్యపెట్టని స్వభావానికీ కూడా ఇష్టపడి, అతను ఎప్పుడు పడితే అప్పుడు అతని చిత్రశాలలోకి రావడానికి  అనుమతి ఇచ్చేడు.

2

హ్యూయీ లోపలికి వచ్చే వేళకి ట్రెవర్ ఒక నిలువెత్తు బిచ్చగాడి అద్భుతమైన చిత్రానికి తుదిమెరుగులు దిద్దుతున్నాడు. ఆ బిచ్చగాడే స్వయంగా చిత్రశాలకి ఒకమూల ఎత్తైన ఒక అరుగుమీద కూచున్నాడు. ఆ వ్యక్తి … బాగా చిక్కిపోయి, నలిపేసిన కాగితంలా ముఖంమీద ముడుతలతో, జాలిగొలిపే ఒక ముసలివగ్గు.  అతని భుజాలమీద బాగా మరకలుపడి చిరుగులైన ఒక ముతక గోధుమరంగు దుప్పటీ ఉంది; అతని కాలికి తొడుక్కున్న దుక్కబూట్లు అతుకులుబొతుకులుతో ఉన్నాయి; ఒక చేత్తో నాటుకర్ర పట్టుకుని దానిమీద ఆనుకుని, రెండో చేత్తో చివికిపోయిన ఒక టోపీ పట్టుకుని ఉన్నాడు అడుక్కుందికి.

“ఎంత అద్భుతమైన మోడల్!” అని గుసగుసలాడేడు హ్యూయీ మిత్రుడితో చేతులుకలిపి అభినందిస్తూ.

“అద్భుతమైన మోడలా?” అనిగట్టిగా అరిచేడు ట్రెవర్; వెంటనే సంబాళించుకుని, “అవును, అవును, ఒప్పుకోక తప్పదు. ఇలాంటి బిచ్చగాళ్ళు మనకి రోజూ తగలరు. నిజానికి ఇతనొక అద్భుతమైన ఆవిష్కరణ. మరుగుపడ్డ మాణిక్యం. ఒక జీవం ఉట్టిపడే వెలాక్జెజ్! నా అదృష్టం. ఇదే రెంబ్రాంట్ అయితే ఇతనితో ఎంత గొప్ప కళాఖండాన్ని తీర్చి దిద్దుండేవాడో!

“ఫాపం ముసలాడు!” అని నిట్టుర్చాడు హ్యూయీ, “ఎంత దయనీయంగా కనిపిస్తున్నాడు!  కానీ, మీలాంటి చిత్రకారులకి అతనొక నిధి అనుకుంటాను,” అన్నాడు మళ్ళీ.

“సందేహం లేదు,” అన్నాడు ట్రెవర్. “అయినా, నువ్వు బిచ్చగాడు ఆనందంగా కనిపించాలని అనుకోవు, అవునా?” అని అడిగేడు.

“ఇంతకీ, ఈ మోడల్ కి ఇలా కూచున్నందుకు ఎంత కిడుతుందేమిటి?” కుతూహలంగా అడిగేడు హ్యూయీ, దీవాన్ మీద అనుకూలమైన జాగా చూసుకుని కూర్చుంటూ.

“గంటకి ఒక షిల్లింగు.”

“ఏలన్, మరి నీ చిత్రానికి ఎంత దొరుకుతుంది?”

“ఓహ్! దీనికా? దీనికయితే రెండువేలు!”

‘పౌండ్లా?”

“కాదు. గినీస్1. చిత్రకారులకీ, కవులకీ, డాక్టర్లకీ ఇచ్చేది గినీలలో.”

“అలా అయితే, నా ఉద్దేశ్యంలో ఈ మోడల్ కి కూడా అందులో కొంతభాగం దక్కాలి,” అన్నాడు హ్యూయీ నవ్వుతూ; “పాపం, వాళ్ళుకూడా మీ అంత కష్టపడుతున్నారు.”

“అలాంటి పిచ్చి మాటలు మాటాడకు. చూడు! ఒక్కణ్ణీ ఈ ఈజెల్ పక్కన రోజల్లా నిలబడి ఇలా రంగుపులమడం ఎంత కష్టమో! హ్యూయీ! నీలాంటి వాళ్ళు అలా మాటాడడం బాగానే ఉంటుంది కానీ, ఒకోసారి, కళ కూడా శరీరశ్రమ అంత గౌరవాన్ని2 సంతరించుకునే సందర్భాలు ఉంటాయని నీకు చెప్పక తప్పదు. కనుక నువ్వు పిచ్చిపిచ్చిగా మాటాడకు; నేను పనిలో నిమగ్నమై ఉన్నాను. హాయిగా సిగరెట్టు తాక్కుంటూ, బుద్ధిగా మాటాడకుండా కూచో!”

wilde

3

కొంతసేపు గడిచేక, ఒక సేవకుడు ప్రవేశించి చిత్రాలకి పటంకట్టేవాడు అతనితో మాటాడడానికి వచ్చేడని ట్రెవర్ తో చెప్పేడు.

“హ్యూయీ, పారిపోకు, ఇప్పుడే క్షణంలో వచ్చేస్తా,” అని బయటకి వెళ్ళేడు ట్రెవర్.

ట్రెవర్ అలా బయటకి వెళ్ళడం గమనించి, ఆ ముసలి బిచ్చగాడు తన వెనక ఉన్న కర్రబెంచీమీద కాసేపు విశ్రాంతి తీసుకుందామని నిశ్చయించుకున్నాడు ట్రెవర్ తిరిగి వచ్చేదాకా.  అతను ఎంత దిక్కుమాలిన, దౌర్భాగ్యస్థితిలో కనిపించేడంటే, హ్యూయీ జాలిపడకుండా ఉండలేక, అతనిజేబులో ఏమైనా కాసులున్నాయేమోనని తణుము కున్నాడు. అతనికి ఒక సావరిన్ (పౌండ్) మరికొన్ని చిల్లర పెన్నీలూ దొరికేయి.  “పాపం, నిర్భాగ్యుడు,” అని మనసులో  అనుకుని, ” నాకంటే అతనికే వీటి అవసరం ఎక్కువ, కానీ, ఇవి లేకపోవడమంటే, పదిహేను రోజులపాటు వాహనయోగం లేనట్టే,”  అని మనసులో అనుకుని, స్టూడియోలో ఆ చివరకి నడిచి బిచ్చగాడి చేతిలో ఉంచాడు.

ఆ బిచ్చగాడు ఒక్కసారి గతుక్కుమన్నాడు. కనీ కనపడని చిరునవ్వొకటి అతని వడలిన పెదాలమీద దొర్లింది. హ్యూయీకి ఎన్నో ధన్యవాదాలు చెప్పేడు.

ట్రెవర్ వచ్చినతర్వాత హ్యూయీ శలవుతీసుకున్నాడు, తను చేసిన పనికి కొంచెం సిగ్గుపడుతూనే.  ఆ రోజంతా లారాతో గడిపి, అతని ఔదార్యానికి ఆమెతో నాలుగు తిట్లుతిని, ఇంటికి నడుచుకుంటూ వెళ్ళేడు.

ఆ రోజు రాత్రి 11 గంటల వేళ ‘పేలెట్ క్లబ్’ లోకి నడుచుకుంటూ వెళ్ళేడు హ్యూయీ. అక్కడ ట్రెవర్ ఒక్కడూ సోడాకలుపుకుని వైన్ తాగుతూ, సిగరెట్టుకాల్చుకుంటూ కనిపించేడు.

హ్యూయీ సిగరెట్టు ముట్టించుకుంటూ, ” ఏలన్, మొత్తానికి నీ చిత్రం పూర్తయినట్టేనా?” అని అడిగేడు.

“పూర్తిచెయ్యడమేమిటోయ్, పటంకట్టించడం కూడా పూర్తయింది!” అన్నాడు ట్రెవర్. అని, “ఇంతకీ చెప్పొచ్చేదేమిటంటే, నువ్వొక ఘన విజయం సాధించేవు. ఆ ముసలి బిచ్చగాడు ఇపుడు నువ్వంటే పడి ఛస్తున్నాడు.  నువ్వెవరో, నువ్వెక్కడుంటావో,  నీ ఆదాయం ఎంతో,  నీ భవిష్యత్తు ఎలా ఉంటుందో… అన్నీ చెప్పవలసి వచ్చింది అతనికి”.

“ఓహ్హో ఏలన్!” అని అరిచినంత పనిచేసేడు హ్యూయీ, “నేనింటికి వెళ్ళే వేళకి నాకోసం ఎదురుచూస్తుంటాడేమో! నువ్వు ఊరికే హాస్యం ఆడుతున్నావు, అవునా? పాపం ముసిలాడు.  నాకు చేతనయితే ఏదైనా సహాయం చేస్తే బాగుణ్నని అనిపిస్తోంది. ఒక మనిషి అంత దుర్భరమైనస్థితిలో ఉండడం ఊహించడానికే భయమేస్తోంది.  మా ఇంట్లో పాత బట్టలు గుట్టలు గుట్టలు పడి ఉన్నాయి. అతను వాటిని తీసుకుంటాడంటావా? పాపం అతని బట్టలు పీలికలు పీలికలు అయిపోయి ఉన్నాయి.”

4

“అయితేనేం? వాటిలోనే అతను చూడానికి అద్భుతంగా ఉంటాడు,” అన్నాడు ట్రెవర్.  “అదే అతను ఒక మంచి పొడవాటి కోటు వేసుకుని ఉండి ఉంటే, ఎవరెంత డబ్బుముట్టచెబుతానన్నా ఛస్తే అతని బొమ్మగీసి ఉండేవాడిని కాదు. నువ్వు పీలికలు అంటున్నవి, నా కంటికి మనోహరంగా కనిపిస్తాయి. నీకు ఏది పేదరికంగా కనిపిస్తుందో, అదినాకు చిత్రరమణీయంగా కనిపిస్తుంది. అయినప్పటికీ, నువ్వు బట్టలు ఇద్దామనుకుంటున్నావన్న విషయం అతనికి చెప్తాను.”

“ఏలన్,” హ్యూయీ ముఖం చాలా గంభీరంగా పెట్టి, ” ఎంతైనా మీ చిత్రకారులు హృదయంలేని మనుషులు,” అన్నాడు.

“ఒక కళాకారుడి హృదయం అతని మెదడులో ఉంటుంది,” అన్నాడు ట్రెవర్; అదిగాక, మాపని ప్రపంచాన్ని ఉన్నది ఉన్నట్టు చిత్రించడం తప్ప, మాకు తెలిసినరీతిలో దాన్ని సంస్కరించడం కాదు. ఎవడిపని వాడు చేసుకోవాలి.  అది సరేగాని, లారా ఎలా ఉంది?  ఆ ముసలి మోడల్ కి ఆమెగురించి తెలుసుకోవాలని ఉంది.”

“అంటే, ఆమె విషయాలుకూడా అతనితో చెప్పేసేవా?” అడిగేడు హ్యూయీ.

“ఆహా! అన్నీ చెప్పేసాను … అతనికి పట్టువదలని కల్నల్ గురించీ, అందమైన లారా గురించీ, పదివేల పౌండ్ల షరతుగురించీ …అన్నీ తెలుసు.”

కోపంతో జేవురించిన ముఖంతో, హ్యూయీ, “ఆ ముసిలి బిచ్చగాడికి నా వ్యక్తిగత విషయాలు ఎందుకు చెప్పావు?” అని గట్టిగా కేకలేసేడు.

“ఓరి పిచ్చి కుర్రాడా,” అని చిరునవ్వు నవ్వుతూ మొదలెట్టేడు ట్రెవర్, “నువ్వు అంటున్న ఆ బిచ్చగాడు యూరోపులో అత్యంత భాగ్యవంతుల్లో ఒకడు. రేపు లండన్ ని అమ్మకానికి పెడితే అతనిఖాతాలో పెద్ద తరుగేమీలేకుండా కొనెయ్యగలడు. అతనికి ప్రతి దేశ రాజధానిలోనూ ఒక ఇల్లు ఉంది. అతను బంగారుపళ్ళెంలో తింటాడు. తలుచుకుంటే రష్యా యుద్ధానికి వెళ్ళకుండా ఆపగలడు…”

“నువ్వు చెబుతున్నదేమిటి?” ఆశ్చర్యంతో అడిగేడు హ్యూయీ.

“అవును. నే చెప్పొచ్చేదేమిటంటే,” మళ్ళీ అందుకున్నాడు ట్రెవర్, “నువ్వు ఇవాళ చిత్రశాలలో చూసింది బేరన్ హాజ్బెర్గ్ ని. అతను నాకు చాలా మంచి మిత్రుడు. నా చిత్రాలన్నిటినీ, వాటిని పోలినవాటినీ కొంటుంటాడు. నెల్లాళ్ళక్రిందట అతన్ని ఒక బిచ్చగాడిగా చిత్రించమని నాకు బయానాకూడా ఇచ్చాడు. అంతకంటే ఏమిటి కావాలి? ఆ మిలియనీర్ కి అదో వెర్రి. నిజం చెప్పొద్దూ, చిరుగుపాతల దుస్తుల్లో బిచ్చగాడుగా చాలా గొప్పగా కనిపించాడు. నిజానికి ఆ చిరుగుపాతలు అతనివి కావు, నావి. ఆ పాతసూటు నేనే స్పెయిన్ లో కొన్నాను.”

“బేరన్ హాజ్బెర్గా!” తలపట్టుకుని నిశ్చేష్టుడై పక్కనున్న చేతికుర్చీలో కూలబడుతూ, “ఎంతపని జరిగిపోయింది. బిచ్చగాడనుకుని అతని చేతిలో నేనో సావరిన్ కూడా పెట్టేను,” అన్నాడు హ్యూయీ.

5

“ఏమిటి? అతని చేతిలో ఒక సావరిన్ పెట్టేవా?” అని ఆశ్చర్యంగా అడిగి, వెంటనే పగలబడి నవ్వడం ప్రారంభించేడు. “నాయనా, మరి దాన్ని తిరిగి కానవు. ఆ డబ్బులుకి నీళ్ళధారే.”

“నువ్వు నాకు ముందే చెప్పాల్సింది, ఏలన్,” అని అతనిమీద విసుక్కుంటూ, “నన్నలా ఒక  తెలివిమాలిన వాడిగా చెయ్యకుండా ఉండవలసింది,” అన్నాడు హ్యూయీ.

“సరే, కథ ఏమిటంటే, హ్యూయీ,” అంటూ చెప్పనారంభించేడు, “నువ్విలా విచ్చలవిడిగా ఎవడికిపడితేవాడికి నిర్లక్ష్యంగా డబ్బులు దానం చేస్తావని అసలు ఊహించలేదు. నువ్వు ఒక అందమైన మోడల్ ని ముద్దుపెట్టుకుంటే అర్థం చేసుకోగలను; కానీ, నువ్విలా ఒక అందవిహీనమైన బిచ్చగాడికి ఒక సావరిన్ ఇవ్వడమేమిటి? లేదు, నేనసలు ఊహించలేదు. అదిగాక, నిజానికి ఇవేళ ఎవరొచ్చినా నేనింట్లో ఉన్నట్టు చెప్పొద్దని చెప్పాను. తీరా నువ్వొచ్చిన తర్వాత హాజ్బెర్గ్ తనని పరిచయం చేస్తే ఒప్పుకుంటాడో ఒప్పుకోడో తెలీదు. నువ్వు చూసేవుకదా… అతని వొంటినిండా బట్టలుకూడా లేవు.”

“నన్నెంత చవటకింద అతను జమకట్టేసి ఉంటాడో!” అన్నాడు హ్యూయీ విచారంగా.

“అదేం లేదు. నువ్వెళ్ళిన దగ్గరనుండీ పట్టలేనంత హుషారుగా ఉన్నాడు. తనలో తనే నవ్వుకుంటూ ముడుతలుపడ్డ అతని చేతులు రెండిటినీ పదేపదే రాపిడి చేసుకోడం  ప్రారంభించేడు. నీ గురించి ఎందుకు అతను అంత ఇదిగా తెలుసుకోదలుచుకున్నాడో నాకు అర్థం కాలేదు. ఇప్పుడు నాకు అర్థం అయింది. హ్యూయీ, నువ్విచ్చిన ఆ సావరిన్ ని నీకు బదులు అతను మదుపు పెడతాడు. ప్రతి ఆరు నెల్లకీ వడ్డీ చెల్లిస్తాడు. రాత్రి డిన్నర్ తర్వాత దానిగురించి అద్భుతమైన కథ చెబుతాడు.”

“నేనో దురదృష్టవంతుణ్ణి,” అంటూ గొణుక్కున్నాడు హ్యూయీ, “ఇప్పుడు ఇంటికెళ్ళి పడుక్కోడం ఉత్తమమైన పనిలా కనిపిస్తోంది. ఏలన్, కనీసం ఈ విషయం ఇంకెవరికీ చెప్పకు. పదిమందిలో నా ముఖం చూపించలేను.”

“అవేం పిచ్చిమాటలు హ్యూయీ! నువ్వుచేసిన పని నీలోని పరోపకారబుద్ధికి ఒక మంచి ఉదాహరణ. అలా వెళ్ళిపోకు. ఇదిగో మరో సిగరెట్టు తీసుకో. లారా గురించి నీ మనసుతీరా ఎంతసేపు చెప్పినా వింటాను.”

కానీ, హ్యూయీ మాత్రం వెనుతిరగలేదు… ట్రెవర్ ని పగలబడి నవ్వుకోమని వదిలేసి, విచారంతో ఇంటిముఖం పట్టేడు.

మర్నాడు ఉదయం ఫలహారం చేసే వేళకి అతని సేవకుడు ఒక కార్డు తీసుకువచ్చి వచ్చి ఇచ్చేడు. దాని మీద ఇలా రాసి ఉంది: గుస్తావ్ నాడిన్… బేరన్ హాజ్బెర్గ్  సేవలో.”

6

“బహుశా క్షమాపణలు చెప్పడానికి పంపించి ఉంటాడు,” అని హ్యూయీ తనలో తాను అనుకున్నాడు; సేవకుడితో వచ్చినతన్ని లోపలకి ప్రవేశపెట్టమని చెప్పేడు.

వయసు పైబడ్డ ఒక పెద్దమనిషి బంగారురంగు కళ్ళజోడూ, నెరిసినతలతో గదిలోకి ప్రవేశించాడు. “శ్రీ ఎర్స్కిన్ గారి తోనేనా నాకు మాటాడే మహద్భాగ్యం దక్కుతున్నది?” అని వినమ్రంగా అడిగేడు. ఉచ్ఛారణ స్పష్టంగా అతను  ఫ్రెంచివాడని  తెలుస్తోంది,

హ్యూయీ కూడా గౌరవసూచకంగా  తలవంచి అభివాదం చేశాడు.

“నేను బేరన్ హాజ్బెర్గ్ పంపగా వచ్చేను.  బేరన్…” అని వచ్చినవ్యక్తి చెప్పబోతుండగా మధ్యలో అందుకుని,

“సర్, మిమ్మల్ని నా తరఫున బేరన్ కి క్షమాపణలు తెలుపవలసిందిగా అభ్యర్థిస్తున్నాను,” అని తడబడుతూ చెప్పేడు హ్యూయీ.

“బేరన్,” అని ఆ వృద్ధుడు నవ్వుతూ మళ్ళీ అందుకున్నాడు, “నన్ను మీకీ ఉత్తరం అందజేయవలసిందిగా ఆదేశించారు,” అంటూ ఒక సీలువేసిన కవరు హ్యూయీకి అందించేడు.

దాని మీద ఇలా రాసి ఉంది: “హ్యూయీ ఎర్స్కిన్ – లారా మెర్టన్ దంపతులకు పెళ్ళికానుక … ఒక ముసలి బిచ్చగాడిదగ్గరనుండి.”

అందులో పదివేల పౌండ్లకు ఒక చెక్కు ఉంది.

లారా, హ్యూయీ  దంపతులయ్యేక మరుచటిరోజు ఉదయం సుప్రభాత విందులో బేరన్ ప్రసంగించేడు కూడా.

“మిలియనీర్ మోడల్స్ చాలా అరుదు, సందేహం లేదు,” కానీ, దేవుడిమీద ఒట్టేసి చెప్పగలను… మోడల్ మిలియనీర్ లు అంతకంటే అరుదు.” అని వ్యాఖ్యానించేడు ఏలన్.

***

Notes:

  1. గినీ పౌండ్ కంటే ఒక షిల్లింగు ఎక్కువ.
  2. అంటే కూలికిట్టకపోవడం.

మూలం: ఆస్కార్ వైల్డ్

murthy gaaruఅనువాదం: నౌడూరి మూర్తి