అదే కథ ఇక్కడా!!

photo: satya sufi

photo: satya sufi

 

శరీరాలు సముద్రాలు దాటినా మనో కాలుష్యం మనల్ని దాటిపోదు. నరనరాన జీర్ణించుకున్న స్ర్తీ వ్యతిరేకత, హిప్పోక్రసీ ఏ కొత్త విషయాన్ని ఏ ప్రోగ్రెసివ్‌ విషయాన్ని మనలో ఇంకనివ్వవు.

ల్యాండ్ ఆఫ్‌ ఆపర్చునుటీస్‌ అనుకుని అమెరికాకు పయనమైన వారిలో కొంతమంది(కొంతమందేమిటిలే,  చాలామందే) ఇక్కడ ప్రదర్శించే విన్యాసాలు చూస్తే ఆశ్చర్యమేస్తుంది. కిందటి కాలంలో ముట్టు మడీ ఆచారాలతో ఆఫీసుల్లోనూ అదరగొట్టే వాళ్ల గురించి మాట్లాడుకున్నాం. ఈ సారి పిల్లలు-పెంపకాల్లో వారి ప్రతాపం ఏ స్థాయిలో ఉంటుందో చూద్దాం. ఎన్‌ ఆర్‌ ఐలందరూ ఇలా ఉన్నారని చెప్పబోవడం లేదు. నేను పదిహేన్నేళ్ల పైగా ఇక్కడే ఉంటున్న ఎన్ఆర్ఐనే. కాకపోతే  తెలుగే అధికారభాషేమో అన్నంతగా అడుగడుగునా మన స్వరం వినిపించే కాలిఫోర్నియాలో ఉండడం వల్ల అనుభవాలు అనేకం తారసపడుతుంటాయి. అద్దాల భవంతి లాంటి అమెరికా జీవితం వెనుక ఉన్న చీకటి కోణాల గురించి కూడా చర్చించుకోవాల్సిన అవసరం ఉందని భావిస్తూ ఈ విషయాలు మీతో పంచుకుంటున్నాను.

అమెరికా గడ్డమీద అడుగుపెట్టగానే చాలామంది తొందరపడే విషయాలు రెండు. మొదటిది అర్జెంటుగా గ్రీన్‌ కార్డు తెచ్చేసుకోవాలి. రెండు యమార్జంటుగా పిల్లల్ని కనేసి సిటిజెన్‌ షిప్‌ తెచ్చేసుకోవాలి.

మనం ఎంత తొందరపడినా మొదటిది మన చేతుల్లో ఉండే విషయం కాదు. దాని టైం అది తీసుకుంటుంది. రెండోది కూడా పాక్షికంగా మాత్రమే మన చేతుల్లో ఉన్నది. ఒక శుభముహూర్తాన ప్రెగ్నెన్సీ కన్‌ఫర్మ్‌ అవుతుంది. అక్కడినుంచి హడావుడి మొదలు. మరీ పాత సినిమాల్లో మాదిరి ఎత్తుకుని గిరగిరా తిప్పకపోవచ్చేమో కానీ ఇక్కడ భారత్‌లో కంటే ఎక్కువ హడావుడి అయితే ఉంటుంది. పుట్టబోయేది అమ్మాయా, అబ్బాయా అనేది మొదటిది. భారత్‌లో ఐనా అబ్బాయికి అమ్మాయికి మధ్య మధ్యతరగతి వ్యత్యాసం చూపించడం తగ్గిపోతున్నదని అక్కడి మిత్రులు చెపుతున్నారు.

కానీ ఇక్కడ ఇంకా తీవ్రంగానే కొనసాగుతోంది. ఇక్కడ లింగనిర్ధారణ పరీక్షలు నిషేధమేమీ కాదు కాబట్టి తెలుసుకున్నప్పటి నుంచి ఒకటే రంథి. మొగబిడ్డే బిడ్డ. ఆడపిల్ల అయితే మూతి ముడుపులు కనిపిస్తూనే ఉంటాయి. వర్జీనియాలో ఉన్నపుడు ఒక కాబోయే తల్లి కడుపులో ఉన్నది ఆడపిల్ల అని తెలిసి హిస్టీరియా వచ్చినట్టు గుండెలు బాదుకుంటూ ఏడవడం చూసి నవ్వాలో ఏడవాలో తెలీక చాలా కష్టపడాల్సి వచ్చింది. ముఖంలో కోపం కనిపించకుండా ఉండడానికి బూతులు తిట్టకుండా నిగ్రహించుకోవడానికి చాలా కష్టపడాల్సి వచ్చింది. ఇండియాలో సైంటిస్ట్‌గా పనిచేసిన పెద్దాయన తన కూతురు కడుపులో ఉన్నది ఆడపిల్ల అని తెలిసి కళ్లమ్మట నీళ్లు పెట్టుకోవడం చూసినపుడైతే అరేయ్‌ నీకు సైన్స్‌ డిగ్రీ ఇచ్చిన గాడిద కొడుకెవర్రా అని అడగాలనిపించేంత కోపమొచ్చేసింది. కొంతమంది ఆడవాళ్లు అయితే ఇంకో రకమైన భయాలు చెప్పేస్తారు కూడా భోళాగా. అమ్మాయి ఇక్కడ ఏ తెల్లోణ్ణో డేటింగ్‌ చేస్తే ఎలా! ఇనుపకచ్చడాలు తయారుచేయవే తల్లీ అని కచ్చగా అనాలనిపిస్తుంది కానీ ఏం చేస్తాం! అబ్బాయి అయితే ఏం చేసినా ఎలా తిరిగినా పర్లే అన్నమాట!

ఇంతకంటే దారుణమైన అసహ్యకరమైన ప్రక్రియ ఉంది. మనం అసహ్యం అంటున్నాం కానీ దాన్ని వాళ్లు విశ్వాసం అనే అనుకోవచ్చు. ముహూర్తాలు పెట్టుకుని పిల్లల్ని కనడం. ఈ విషయంలో కొంత మంది మరీ పట్టుదలగా ప్రాణాలు పోయినా పర్లేదు అన్నంత నిబద్ధంగా ఉంటారు.

బిటెక్‌ కంప్యూటర్స్ చేసి ఇక్కడికొచ్చిన ఒక అమ్మాయి కథ వింటే మీకే తెలుస్తుంది వారి నిబద్దత విలువ. ఆ అమ్మాయికి నొప్పులొస్తే ఆస్పత్రిలో చేర్పించారు. ఈ లోపు అమ్మలక్కల ద్వారా ముహూర్తాలు వగైరా తెలుసుకున్నారు. ఇంకా టైముంది ఇపుడే కనకూడదు అని ఆ అమ్మాయి కఠినాతికఠినంగా భీష్మ ప్రతిజ్ఞ చేసేసుకుంది. అంత నొప్పిలోనూ కాళ్లు దగ్గరపెట్టి  బిడ్డ బయటకు రాకుండా కొన్ని నిమిషాల పాటు ఆపడానికి విశ్వప్రయత్నం చేసింది. నమ్మశక్యం కానీ విషయమే. కానీ ఇది స్వయంగా ఆ అమ్మాయి గర్వంగా వినిపించిన కథ.

బిడ్డ సరైన సమయంలో భూమి మీదకు వస్తే ఆతని భవిష్యత్తు బంగారంలా ఉంటుందని భావించి ఒక తల్లి పడ్డ వేదన అన్నమాట! ఓహ్‌! అమాయక డాక్టర్లకు మొదట ఏమవుతుందో అర్థం కాక చివరకు ఏదో అర్థమై నానా తిట్టూ తిట్టి ఏదో రకంగా ఆలస్యంగానైనా బిడ్డను బయటకు తీశారనుకోండి. ఈ ఆలస్యం ఫలితం ఏమిటనుకున్నారు. బిడ్డను అలా బలవంతంగా కాసేపైనా ఆపితే ఏమవుతుంది?  బిడ్డకు ఆక్సిజన్ అందాల్సినంత అందక ఎదుగుదల లోపాలు ఏర్పడ్డాయి. ఇంకేవో సైంటిఫిక్‌ పరిభాషలో ఉండే సంక్లిష్ట సమస్యలు. వాడు అందరిలా పిలిస్తే పలకడు. అందరితో కలిసి ఆడుకోడు. నాలుగేళ్లు దాటినా మాటలు రాలేదు. ఆ తల్లి త్యాగం ఆ బిడ్డకు అంత బంగారు భవిష్యత్తునిచ్చింది మరి! ఇక్కడ కథలో ఇంకో ట్విస్టు ఉంది. ఇంత జరిగినా ఆ తల్లిలో మార్పేమీ లేదు. వాడికేం మగపిల్లాడు, మాటలదేముంది కాస్త ఆలస్యంగా వస్తాయి, డాక్టర్లు చెపుతున్నారుగా కాస్త ఆలస్యంగానైనా వస్తాయని పర్లే, మగపిల్లాడేకదా అని మగజపం ఒకటికి వందమార్లు చేసేది.

అసలు విషయానికి వస్తే అదే తల్లి రెండో సారి గర్భవతి అయ్యింది. ఈ సారి రివర్స్‌. డెలివరీ డేట్‌ అమావాస్య అయ్యేట్టు ఉందని తెలిసి నొప్పులు రాకపోయినా ముందుగానే ముహూర్తం పెట్టుకుని డాక్టర్ల దగ్గరకు వెళ్లి నొప్పులు నటించడం వాళ్లు ఇవి లేబర్‌ పెయిన్స్‌ కాదమ్మా అని చెప్పి పంపించడం, ఎలాగోలా ఇపుడు ఆపరేషన్‌ చేసి బిడ్డను బయటకు తీయండి డాక్టర్ అని వాళ్లతో అంటే ఈమెకేమిటి పిచ్చా అని వారు తిట్టి పంపించడం ఇదో ప్రహసనం.

ఇంకో అంకం ఉంది. పిల్లలు పుట్టాక తమ తల్లిదండ్రుల మీద అమాంతం ప్రేమ పెరిగిపోతుంది. అంతకుముందు స్కైప్‌లో మాత్రమే చూసి మాట్లాడి తరించే తల్లిదండ్రులను ముఖ్యంగా తల్లిని(తండ్రి అంత ముఖ్యం కాదు) దగ్గరగా చూడాలనిపిస్తుంది. అమెరికా చూపించాలనిపిస్తుంది. అమెరికాలో బేబీ సిట్టర్స్‌ని ఏర్పాటు చేసుకోవాలనుకుంటే ఖర్చు ఎక్కువ. మనం ప్రతినెలా జీతంలో ఎక్కువభాగం మిగుల్చుకోవాలి. అక్కడ మన గడ్డమీద నేల కొనేయాలి కదా! తల్లికి  సమన్లు పంపిస్తాం అత్యంత ప్రేమగా.  వాళ్లకు వేరే ఆప్షన్‌ ఏముంది కనుక. అదే పదివేలు అనుకుని వచ్చేస్తారు. మనుమడో మనుమరాలో అంటే చూడాలని ఉంటుంది కదా!

ఆ రకంగా బేబీ సిట్టర్ని ఫ్రీగా ఏర్పాటు చేసుకుంటాం. వాళ్లు ఇక్కడ ఎక్కువ కాలం ఉండే పరిస్థితి లేకపోతే ఏకంగా బిడ్డల్ని వాళ్లతో పంపించేస్తాం. రోజూ స్కైప్‌లో పాలు తాగాడా, విరోచనాలయ్యాయా, జలుబు చేసిందా, అని ఇక్కడినుంచి అడుగుతూ ఉంటాం. ఎవరైనా బేబీ సంగతేంటి అని అడిగితే చాలు రెండు కళ్లల్లోంచి జలపాతాలే. పిల్లల్ని ఎంత మిస్ అవుతున్నారో వైనవైనాలుగా వర్ణించి చెప్పడమే. ఎవరుంచుకోవద్దన్నారు.ఎవరి ఆశ. ఎవరి అత్యాశ? మిమ్మల్ని కూడా అలాగే మీ తల్లిదండ్రులు మిస్ అవుతుంటారు కదా, బేబీ సిట్టింగ్‌ కోసం కాకుండా మామూలుగా కూడా పిలవొచ్చు కదా, వెళ్లి చూసి రావచ్చు కదా!

ఇలాంటి అనుభవాలు అనేకం చూసి చూసి ఇండియాలో సాధారణమైన టీచర్‌ ఉద్యోగం చేసుకుంటున్న ఒక ఫ్రెండ్ని అడిగాను. నీకు ఒకతే ఆడపిల్ల కదా, మగపిల్లాడు లేడని చిన్నతనంగా ఫీల్‌ అవుతున్నావా అని? నువ్వు ఇంత చదువుకుని అమెరికాలో ఉద్యోగం చేస్తున్నా ఇంత వెనుకబాటు తనం ఏమిటి అని మర ఫిరంగి లాగా మండిపడింది.

ఇక్కడ కబుర్లు చెపితే భారత్‌ మధ్యతరగతి ఈ మధ్య బాగానే ఎదుగుతోందని ఇంత అన్యాయమైన వ్యవహారాలు తక్కువే చూస్తున్నామని చెప్పింది. ఇండియానుంచి వచ్చేపుడు ప్రియా పచ్చళ్లతో పాటు మెదడులో ఇంత ఇక్కడి మట్టి పెట్టుకుని పోయినట్టున్నారు. దాన్ని ఎరువేసి పెంచుకుంటున్నారు. ఇక్కడ మట్టి తగ్గిపోతోంది కానీ అక్కడ పెరిగిపోతున్నట్టుందే, మరీ ఇంత ఘోరమైన విషయాలు ఇపుడు ఇక్కడ వినిపించడం లేదు అనేసింది. అదన్నమాట!

ఏవో పరీక్షలు అవీ రాస్తే మంచి జీతం రావచ్చు. కావాలనుకున్న దేశంలో ఉద్యోగమూ రావచ్చు. కానీ ఆరోగ్యకరమైన మంచి జీవితం గడపడానికి పరీక్షలు లేవు. ఎవరు నేర్పిస్తారు? ఆధునికత అంటే చేతికి బ్రాస్‌లెట్లు, చేతిలో లేటెస్ట్‌ ఐఫోన్లు కాదుకదా!

 

*

 

 

అక్కడి గార్బేజ్…ఇక్కడి హెరిటేజ్!!

 

 

ఏ దేశమేగినా పొగడరా నీ తల్లి భూమి భారతిని అని రాయప్రోలు ఏ కోశాన అన్నారో తెలీదు. దాన్ని అనేక రకాలుగా అన్వయించుకునే వారు పెరిగిపోయారు. భూమి భారతిని పొగడడం అంటే వెనుకబాటు తనాన్ని పొగుడుకోవడం కాదు. నలుగురి దృష్టిలో నవ్వుబాటు కావడం కాదు. సంస్కృతి సంప్రదాయాల పేరుతో పాత చెత్తనంతా నెత్తికెత్తుకుని ఊరేగడం కాదు. కానీ కొందరు సంస్కృతీ రక్షకులు విదేశీ గడ్డమీద చేస్తున్నదేమిటి? మా మూలాలు ఇవి మా సంస్కృతి ఇది అంటూ హేయమైన ఆచారాలను ప్రదర్శిస్తూ భారత్‌ అంటే ఇంకా ఈ స్థితిలో ఉన్న దేశమా అని అంతా నోరెళ్లబెట్టేట్టు చేస్తున్నారు.

విదేశీ గడ్డమీద అడుగుపెట్టి అక్కడ జీవనం సాగిస్తున్నవారికి సొంత మూలాలకు సంబంధించిందేదో ప్రదర్శించుకోవాలని ఉంటుంది. తప్పులేదు. కానీ ఈ మూలాల కోసం కాలంలో వెనక్కు ప్రయాణించనక్కర్లేదు. సొంత గడ్డమీద కూడా ఎబ్బెట్టు అనిపించే విషయాలను పరాయి గడ్డమీద పదిమంది ముందు చాటాల్సిన అవసరం లేదు. మిగిలిన అన్ని అంశాల్లాగే సంస్కృతి సంప్రదాయాలు కూడా ప్రవహిస్తూ ఉంటాయి. పురోగామి అంశాలు, ఆహ్వానించ దగిన అంశాలు కూడా మన సంస్కృతిలో ఉంటాయి. అవి వదిలేసి ఆధిపత్య చిహ్నాలైన వాటిని అవమాన కరమైన వాటిని ప్రదర్శనకు పెట్టి ఇవి మా మూలాలు అంటే ఎలా అర్థం చేసుకోవాలి? ఎంతో చదువుకుని దేశాలు దాటిన వారి ప్రపంచం విస్తృతమవుతుందని ఎవరైనా ఆశిస్తాం. కానీ ఇక్కడ సాగుతున్న కొన్ని పరిణామాలు చూస్తే ఎవరికైనా ఆశ్చర్యమనిపిస్తుంది.నమ్మాలని పించదు. ఇది అవసరమా, ఇది దేశభక్తా, తెలుగు సంస్కృతి అంటే ఇదేనా! అని చర్చించుకోవాల్సిన అంశాలు ఉన్నాయి. ఆ రకమైన చర్చ కోసమే అమెరికాలో ఉద్యోగం చేస్తున్న ఒక ఎన్‌ఆర్‌ఐగా ఒక అనుభవాన్ని ఇక్కడ నలుగురితో పంచుకోవాలనుకుంటున్నాను.

నీకు మైల ఉందా! ఈ హఠాత్ ప్రశ్నకు ఒక్క క్షణం ఊపిరాడలేదు. ఇది సాధారణమే అనుకునే వారు కూడా ఉండొచ్చు. అది వారి సంస్కృతి. అమెరికాలో ఇక్కడ …సంస్థలో సాంకేతికంగా ఉన్నతమనుకునే …ఇండస్ర్టీలో ఈ మాట వినిపించడం నాకైతే షాక్‌. ఆరోజు గురువారం. ఆ మాట వినిపించిన వైపు చూశాను. ఫ్యాంటు, చొక్కా, చెవులకు జుంకీలు , మెళ్లో నల్లపూసలు , నుదుటన ఇంత పెద్దబొట్టు, దాన్ని డామినేట్‌ చేస్తూ దేవుని కుంకుమ, వెరసి ఆవిడ పేరు ఎక్స్‌ అనుకుందాం. పేరు బయటపెట్టి ఆమెను ఇబ్బంది పెట్టడం ఇష్టం లేదు. సాయి భక్తురాలు. భక్తి ఉండడం లేకపోవడం వారి వైయక్తిక విషయం. ఆవిడ మైల భక్తి కూడా ఉండవచ్చును. కానీ ఆఫీసులో పదిమంది ముందు అంత గట్టిగా నీకు మైల ఉందా అని వినిపిస్తే ఏమనుకోవాలి?

ఆగండి.

కథ ఇంతటితో అయిపోలేదు. ఈ ప్రశ్న ఎందుకొచ్చిందో మూలాల్లోకి పోవాలి. ఆవిడకు కూడా ఒక లాజిక్‌ ఉంటుంది కదా! మనం ఎవరినైనా విమర్శిస్తున్నామంటే వారి కోణాన్ని కూడా అర్థం చేసుకుని విమర్శించడమే న్యాయం. ఆవిడ ప్రతి గురువారం సాయి ప్రసాదం తీసుకువస్తారు. ఆ ప్రసాదం పంచేముందు అడిగే ప్రశ్న ఇది. ఎవరు పంచమన్నారు? మేము అడిగామా! అంత గట్టిగా అడుగుతుంటూ పదిమంది ముందు అందులోనూ మగవారి ముందు ఎంత ఎబ్బెట్టు అని ఆలోచించే జ్ఞానాన్ని ఆ మైల తాలూకు భక్తీ భయం మింగేశాయి. ఇక్కడ తెలుగువారు ఎక్కువే. అందులోనూ మగవాళ్లున్నారు. ఈ బాధితురాలిని నేనొక్కదాన్నే కాదు. ఇంకా భారతీయులు ఉన్నారు. ఈ మైల గొడవ పశ్చిమదేశాల వారికి లేదు కాబట్టి బతికిపోయారు. చివరకు గురువారం వచ్చిందంటే ఆమె రాకను చూసి తప్పించుకోవాల్సి వచ్చేది. నాలాంటి వారంతా అదే పనిచేయడం కూడా గమనించాను. ఇది ఒక తరహా.

ఇపుడు ఇంకో “వై” దగ్గరికి వద్దాం. ఈ “వై”లు ఒకరు కాదు. అనేక “వై”లున్నారు. వీరు పెద్ద ముత్తయిదువ బాపతు. వీరు ఏకంగా ఆఫీసులోనే వ్రతాలు నోములు జరిపించేవారు. పశ్చిమదేశాల వారు ఇది భక్తికి సంబంధించిన వ్యవహారం కాబట్టి గౌరవం తోనో సహనం తోనే ఉండిపోయేవారు. కన్నడిగులైతే మంగళవారాలు, తెలుగువారైతే శ్రావణ శుక్రవారాలు. ఈ వైలలో ఒక పెద్ద ముత్తయిదువ అయితే ఏకంగా ఇంకో అడుగు ముందుకేసింది. ఆఫీసులో ఇద్దరు మగవాళ్ల భార్యలు గర్భం దాలిస్తే ఆమె పట్టుబట్టి వారిద్దరికీ బేబీ షవర్‌ జరిపించింది. వాళ్లిద్దరూ ఎంత సిగ్గుపడిపోయారో తల్చుకుంటే సిగ్గేస్తుంది.

ఇంకొందరు. భర్తతో పాటు వస్తారు. గ్రీన్‌ కార్డ్ వచ్చాక క్యుఏ ట్రైనింగ్‌ క్లాసులకు వెళ్లి ఎలాగోలా ఉద్యోగంలో చేరిపోతారు. తప్పేమీ లేదు. ఆర్థిక స్వతంత్రం ఆహ్వానించదగిన అంశం. కానీ ఏం చేస్తారు? తెలుగు సీరియల్స్ లో లాగా అమ్మలక్కల కబుర్లు మొదలెడతారు. అన్నీ మానవసంబంధాల చర్చలే. తామెంత పతివ్రతలు-అవతలివారు ఎంత అపతివ్రతలు. అంతా తెలుగులోనే. ఆఫీసుకు సంబంధించిన అంశాలు కూడా తెలుగులోనే మాట్లాడతారు. పరాయివాళ్లు కలిసిన గ్రూప్‌లో మాట్లాడుతున్నపుడు అందరికీ
అర్థమయ్యే భాష మాట్లాడాలనే కనీస ఇంగితం ఉండదు. చివరకు మీటింగ్స్లో కూడా తెలుగులోనే మాట్లాడతారు. ఇంగ్లిష్‌ మాట్లాడడం గొప్ప అని కాదు. కాకపోతే ఇక్కడ ఉద్యోగ అవసరం కదా! ఎక్కువ మంది తెలుగువాళ్లు ఉండడం వల్ల జరిగిపోతుందనే నమ్మకం. ఒక టీమ్‌ లీడర్‌ ఇంగ్లిష్‌లో మాట్లాడమని రిక్వెస్ట్‌ చేస్తే నువ్వొక్కడివి తెలుగు నేర్చుకుంటే ఖతం అనేశారు. అతను నాదగ్గరకి వచ్చి తెలుగు ఎలా నేర్చుకోవాలి అని అడిగాడు. ఎందుకు నీకు అంత కస్టం అంటే ఐ నీడ్‌ దిష్‌ జాబ్ అనేశాడు. అలాఉంటుంది కథ.

ఈ వైలలోనే ఇంకో పులిహార బ్యాచ్‌ఉంది. బాస్‌లను మేనేజ్‌ చేయొచ్చు ఇంప్రెస్‌ చేయొచ్చు అని నమ్ముతారు.తప్పుగా అనుకోకండి. ఒకావిడ ప్రతి శుక్రవారం మేనేజర్‌కు పులిహోర పట్టుకువస్తుంది. పైగా క్రిస్‌కి నా పులిహోర చాలా ఇష్టం అంటుంది. క్రిస్‌ వెజిటేరియన్‌ కాబట్టి ఇంకో ఆవిడ ఎగ్‌ లెస్‌ కేక్‌ చేసి తరచుగా పట్టుకు వస్తుంది.

ఈ ఆచారాలు అనే కాదు. ఈ పెద్ద ముత్తయిదువల్లో మరి కొందరున్నారు. వారు సలహాలివ్వడం తమ హక్కు- పాటించడం ఎదుటివారి బాధ్యత అని స్థిరంగా నమ్ముతారు. వయోధిక్యాన్ని ఆధిక్యంగా మార్చుకుని ప్రదర్శిస్తుంటారు. ఫలానా అమ్మాయి, బ్యాడ్‌-మగవాళ్లతో మాట్లాడుతుంది-ఆమెతో మాట్లాడొద్దు అని డిక్రీ జారీచేస్తూ ఉంటారు. వినకపోయామో మనపేరు కూడా ఆ అమ్మాయి పేరు పక్కన జత చేస్తారు.

ఒక అమ్మాయి గురించి చెప్పాలి ఇక్కడ. తను కష్టజీవి. మంచుకురిసే కాలంలో కూడా ఎన్నడూ లేట్‌కాకుండా గడియారానికే టైం నేర్పుతున్నట్టు ఠంచన్‌గా వస్తుంది. కొత్తగా జాయిన్‌ అయిన వారికి చాలా చాలా సాయం చేస్తుంది. డిగ్రీ అవగానే పెళ్లి చేశారు. భర్త శాడిస్ట్‌. కూతురు పుట్టాక విడాకులు తీసుకుంది. వేరే దేశస్తున్ని పెళ్లి చేసుకుని ఇక్కడ స్థిరపడింది. అదో పెద్దనేరం మనవాళ్ల దృష్ఠిలో. పెద్ద ముత్తయిదువులకు ఆమె ఒక విలన్‌. పాత సినిమాల్లో చేతిలో సిగరెట్‌ పట్టుకుని డాన్స్‌ వేస్తూ మామయ్య వస్తే పనిమనిషి అని పిలిచే కోడలు ఉంటుందే అలాంటి దర్శకుల ప్రతిభ వీళ్లలో పుష్కలంగా ఉందన్నమాట. ఆమెను బిచ్‌ అని బ్యాడ్‌ అని ఏమేమో అనేవారు. అందరూ నీవెనుక ఇలా అనుకుంటారు ఎందుకు అయినా అందరితో మంచిగా ఉంటావు. సాయం చేస్తావు అంటే ఆ అమ్మాయి చెప్పిన మాట ఇది. వాళ్లు నన్ను అలాగే పిలుచుకుంటారు అని తెలుసు. ఇలా ఉండడం వల్ల పాజిటివ్‌ స్పిరిట్ తో గతకాలపు గాయాలను మర్చిపోగలుగుతున్నా. ఇలా ఉండడమే బిచ్‌ అయితే “ఎస్‌ ఐయామ్‌ బిచ్‌ ” అని చెప్పింది. “ఐ యామ్‌ ప్రౌడ్‌ టు బి ఎ బిచ్‌ రాదర్‌దాన్‌ ఏ పతివ్రత” అని కూడా చెప్పింది. సూటిగా స్పష్టంగా. ప్రాజెక్ట్‌ అయ్యాక మిగిలిన వాళ్లు అలా ఇలా వెతుక్కుంటూ ఉంటే ఆ అమ్మాయికి మూడు ఆఫర్లు వచ్చాయి.

అందరికీ ఇలాంటి అనుభవాలు లేకపోవచ్చు. కానీ ఈ అనుభవాలు అయితే నా జీవితంలో నేను కళ్లెదురుగా చూసినవి. ఇది ఏ సంస్కృతి. ఏ సంస్కృతిని మనం అక్కడినుంచి మోసుకొచ్చాం. ఇది మనకు గౌరవం తెచ్చే సంప్రదాయాలా!వాస్తవానికి ఇవాళ భారత్‌లో కూడా ఆఫీసుల్లోకి ప్రసాదం తెచ్చి అందరి ముందూ నీకు మైల ఉందాఅని అడుగుతూ పోయే ఆడవాళ్లని ఊహించుకోలేమని అక్కడివారు చెపుతున్నారు. అక్కడ మహిళలు ఎంతో కొంత పురోగతి సాధిస్తూ ఉంటే ఎంతో ఎదిగామని రెక్కలు కట్టుకుని వచ్చి ఇక్కడ వాలిన వాళ్లు సంస్కృతి పేరుతో ఆచారాల పేరుతో అక్కడ గార్బేజ్‌లో వదిలేసిన సంస్కృతిని జాగ్రత్తగా ఏరుకుని మూటగట్టుకుని ఇక్కడకు తెచ్చి అందరిముందూ ప్రదర్శనకు పెట్టడాన్ని ఎలా అర్థం చేసుకోవాలి?

*