ఇక్కడి దాకా వచ్చాక !

SUMANASRI_PHOTO

ఇక్కడి దాకా వచ్చాక -ఇక వైరాగ్యాన్ని కౌగిలించకోక తప్పదుమరి!

ఎవర్ని నిందిచీ ప్రయోజనం లేదు-ఇప్పుడు నిన్ను నీవు నిందించుకో వడమూ నిష్ఫలమే
కాలచక్రంలో కాకులూ ప్రకాసిస్తాయి, హంసలూ పరిహసించ బడతాయి.

ఏముంది ఆశ్చర్యం -పిల్లలు ఇవాళ ప్రేమిస్తారు, రేపు అసహ్యించుకుంటారు,
ఎల్లుండి ద్వేషిస్తారుకూడా- ఎవర్ని నిందించీ ప్రయోజనంలేదు

ఇటుపక్క దిగుడుబావిలో బొక్కెన శబ్దంలా వెక్కి వెక్కి ఏడుస్తున్న దాయాదులు
నీకోసమో నీవు వదిలి వెళ్తున్న ఆస్తికోసమో తెలీదు
హమ్మయ్య! శని విరగడైందని, ఇక ఇతని నస ఉండదని సంతోషిస్తున్న శత్రుగణం ఆప్రక్క-

ఇక్కడిదాకా వచ్చాక ఇక ఎవర్ని తల్చుకునీ దుఃఖపడవలసిన అవసరంలేదు
ఇక ఎప్పటి సుఖాల్నో తవ్వితీసుకుని ముచ్చటపడే అవకాశమూలేదు
సమయంలేదిక ఏ సరసానికీ మానసిక స్వర్గానికీ!

ఇక ఈ శ్మశానం దాకా వచ్చాక, మనుమల గురించీ మనవరాళ్ళ గురించీ
మధనపడి ఆలోచించగలిగే సమయం ఉండదు
ఇక నాలుగు సంస్కృత శ్లోకాలు చదువుకొని పవిత్రత పొందాలితప్ప
ఈ నాన్చుడు వ్యవహారం నీకెంత మాత్రమూ శోభనివ్వదు

స్నానంచేయిస్తున్నారుకదా-

కాస్తంత ఇప్పుడైనా శుభ్రంగా ప్రతి అంగాన్ని కడుక్కో

brazilian-modern-art-original-acrylic-painting-on-mdf-title-forest-on-fire-1343319474_b

మానసిక విహంగానికిక మరణశాసనం వ్రాయి
కోటానుకోట్ల ప్రజాసమూహానికి చివరిసారిగా నమస్కారం చెయ్యి
నీ తప్పులన్నింటినీ కాస్తంత పెద్దమనసుతో క్షమించమని కోరుకో
పిత్రుదేవతల్ని తల్చుకొని వారి ఆశీస్సుల్ని తీసుకో
ఆ ప్రత్యక్ష దైవానికి చివరిసారిగా సాష్టాంగ నమస్కారం చెయ్యి-
ఆ సూర్యభగవానుడు నీవైపు చురచురా చూస్తున్నాడు
ఎందుకో తెలీదు -జీభూతంలా చీకటి తరుముకొస్తూనే ఉంది
ఆ పాలపుంతలోని నక్షత్రాలన్నీ నీ కళ్ళనిండా
కాంతుల్ని నింపుతాయనుకుంటే పొరపాటు పడ్డట్లే-
ఆఖరిక్షణంలో అవన్నీ ఆరిపోతాయి నీ కళ్ళతోసహా –
ఎవరి ఆప్యాయతా ఇంక నీదరి చేరదు, ఎవరికన్నీటితడీ ఇంక నిన్ను అంటదు.
ఇప్పుడైనా నాలుగు శ్లోకాలు స్మరించుకో
ఇక సంతు గురించీ సంతానం గురించీ వ్యధ చెందకు
ఇన్నాళ్ళూ  భరించిన అవమానాల గురించీ ఘన సన్మానాల గురించీ ఆలోచించకు
ఇక ఆ చితిచింత వ్యవహారం నీకేమాత్రమూ శాంతి ప్రసాదించదు.
ఇక్కడిదాకా వచ్చాక- ప్రశాంతంగా కళ్ళుమూసుకొని ధ్యానంలోకి వెళ్ళిపో
నీ శరీరాన్ని ఆ పవిత్రాగ్నిలో దగ్ధంచేసుకొని
వైరాగ్యాన్ని వేదమంత్రంలా జపించుకో నెమ్మదిగా నిశ్శబ్దంగా!
   — డాక్టర్ సుమనశ్రీ