కొత్త స్వతంత్ర మానవ సంబంధాల ప్రతిబింబం ‘ఫ్రిజ్ లో ప్రేమ’ !

సచిన్ కుండల్కర్

సచిన్ కుండల్కర్

సచిన్ కుండల్కర్ ‘ఫ్రిజ్ మధే ఠేవ్ లేలా ప్రేమ్’, ‘పూర్ణవిరామం’ రెండు నాటకాలు రెండు విభిన్నమైన శైలుల్లో రాశారు. స్థూలంగా చెప్పాలంటే ‘పూర్ణవిరామం’ యొక్క శైలి వాస్తవిక వాదానికి సంబంధించింది. నిజ జీవితాల్లోని తర్కవితర్కాలు ఈ నాటకంలోని సంఘటనలకి అన్వయించు కోవచ్చును. ఈ నాటకంలోని మధ్యతరగతి వ్యక్తి రేఖా చిత్రాలైన ప్రసన్న, అతని స్నేహితురాలు శ్రేయల ప్రవర్తనకి కారణాలు, అందులోని సంఘటనలపరమైన ప్రశ్నలకి జవాబులు మనకి సాధారణ మానసిక శాస్త్రం లేదా సామాజిక శాస్త్రాల్లో దొరికిపోతాయి. కుండల్కర్ రాసిన మొదటి నాటకం ‘ఛోట్యాశా సుట్టీత్’ (చిన్నపాటి సెలవు) మరియు మొదటి నవల ‘కోబాల్ట్ బ్లూ’ ఈ రెండు కళాకృతులు వాస్తవికవాద శైలిలోనే రాయబడ్డాయి.

‘ఫ్రిజ్ మధే ఠేవ్ లేలా ప్రేమ్’ (ఫ్రిజ్ లో ప్రేమ) నాటకం శైలి కుండల్కర్ రెండవ నాటకమైన ‘చంద్రలోక్ కాంప్లెక్స్’కి దగ్గరగా ఉంటుంది. ఈ శైలిని మనం స్థూలంగా ప్రతీకాత్మక శైలిగా అభివర్ణించవచ్చును. ఇందులోని ఘటనలు, వాటికి ఓ ఆకారాన్నిచ్చే తత్వం, ఏవీ సర్వసామాన్య తత్వానికి సంబంధించినది. ఇక్కడ ప్రేమ ఫ్రిజ్ లో గడ్డ కడుతుంది లేదా కుక్కలకి పూల వాసన చూపించి లొంగదీసుకోవడమూ జరుగుతుంది. ఈ నాటకంలో కూడా మళ్ళీ ప్రసన్న పాత్ర ఉంటుంది. కాకపోతే ఇందులో అతని జోడి ‘పూర్ణవిరామం’ లోని శ్రేయకి పూర్తిగా విరుద్ధమైన పార్వతి. వీళ్ళిద్దరితో పాటుగా వాళ్ళ హృదయాల్లోని ప్రతిబింబాలైన అతి ప్రసన్న, పార్వతిబాయి కూడా ఉంటారు. ఈ రెండు కాల్పనిక పాత్రల వల్ల నాటకానికి ఒక అవాస్తవిక వాదపు స్థాయి లభిస్తుంది.
ఈ రెండు నాటకాలు భిన్నమైన శైలుల్లో రాయబడినప్పటికీ రెండింటికి మానవ సంబంధాలే కేంద్రబిందువు. ‘పూర్ణవిరామం’ లోని ముఖ్య పాత్ర ప్రసన్న కుటుంబాన్ని వదిలి, కొన్ని చేదు జ్ఞాపకాలతో కొత్త జీవితాన్ని ప్రారంభిద్దామని చూస్తుంటాడు. అతనికి తోడుగా ఉండే ‘మిత్ర’ ప్రసన్నకి తోడుగానే ఉందామనుకుంటాడు. ప్రసన్నని తన మీద ఆధారపడే బలహీనుడిని చేయరాదని గట్టిగా అనుకుంటాడు. ఈ పాత్ర ‘ఫ్రిజ్ లో ప్రేమ’ లోని అతి ప్రసన్నలా ప్రసన్న హితవుకోరే అంతర్ మనస్సు అయి ఉండాలి అన్పిస్తుంది.

నాటకంలోని మూడవ పాత్ర శ్రేయ. ప్రసన్న మాదిరిగానే తను కూడా కుటుంబానికి ముంబయిలో దూరంగా ఒక్కర్తే ఉంటుంది. కాకపోతే ఇంకాస్త ఎక్కువ ఆత్మవిశ్వాసంతో. ఆమెలో కన్పించే స్నేహభావం ప్రస్ఫుటంగా వ్యక్తమవుతుంది. నిద్రపోతున్న ప్రసన్న మీద దుప్పటి తెచ్చి కప్పే సహజమైన స్నేహభావమిది. తను గర్భవతినని తెలిసి, ఆ బిడ్డ తండ్రి ఈ విషయం విని పారిపోయాడని తెల్సి ఆశ్చర్య పడుతూ ఇలా ఉంటుంది. “ఉద్యోగం గురించి ఆలోచించలేదు నేను, కెరియర్ గురించి కూడా. నెల తప్పిందని తెలియగానే నాకు కేవలం ఆనందంగా అనిపించిందంతే. ఇంత మంచి విషయం తెలిసిన తర్వాత ఎవరికైనా భయం, దిగులు ఎలా కలుగుతాయి ? ఆ మాత్రం చూసుకోలేమా ముందేం జరిగితే అది. తనని తాను జీవితపు లాలసతో ముంచెత్తుకునే ఈ శ్రేయకి పూర్తి భిన్నమైన పాత్ర ” ఫ్రిజ్ మధే ఠేవ్ లేలా ప్రేమ్” లోని పార్వతిది. ప్రేమని ఆచితూచి కొలిచి ఇస్తుంటుంది. కుక్కల మీద ప్రేమ వర్షం కురిపించే పార్వతి ప్రసన్నని మాత్రం ఆ ప్రేమ నుంచి వంచితుడ్ని చేస్తుంది.
ఈ రెండు నాటకాల్లోని ప్రసన్న జీవితంలోని ఒక్కో మలపులో ఒకే వ్యక్తిగా దర్శనమిస్తాడు.ఇద్దరు రచయితలే.ఇద్దరి వయస్సుల్లో తొమ్మిది సంవత్సరాలు తేడా ఉందంతే.’పూర్ణ విరామం’ లోని ప్రసన్న సున్నిత మనస్కుడు.ఈ నాటకం చదివేటప్పుడు కుండల్కర్ తన ‘కోబాల్ట్ బ్లూ’ నవలలోని నాయకుడు తనయ్ తన పేరు ప్రసన్న గ మార్చుకొని, కుటుంబాన్ని వదిలి ముంబైకి వచ్చాడా అనిపిస్తుంది.తన సామాను నుండి అతను ఆ నీలివర్ణపు పెయింటింగ్ తీసినపుడు మాత్రం కచ్చితంగా ఇతను తనయ్ నే అన్నది నిర్ధారణగ అనిపిస్తుంది.తనయ్ మిత్రుడు అతనింట్లో పేయింగ్ గెస్ట్ గా ఉన్నప్పుడు నీలివర్ణపు చిత్రాలు వేస్తాడు.ఆ మిత్రుడు జ్ఞాపకార్థంగా కొన్ని చిత్రాలు వేస్తాడు.ఆ మిత్రుడి జ్ఞాపకార్థంగా కొన్ని చిత్రాలు ఇతను ముంబై కి తెచ్చుకున్నట్టు గా అనిపిస్తుంది.ఆ మిత్రుడు స్మృతి ‘పూర్ణ విరామం’ లో సుప్త దశ లో ఉంటుంది.నాటకం చివర్లో వచ్చే ఒక పార్సెల్ లో ఉన్న నీలివర్ణపు చిత్రం దీనికి నిదర్శనంగా చెప్పవచ్చును.
నిష్కల్మష్కుడైన తనయ్ కి జీవన సంబంధ విషయలేన్నిటినో నేర్పించిన మిత్రుడు అతడిని మోసగించి వెళ్ళిపోయాడు.దాంతో తనయ్ లో వచ్చిన మార్పులు, 26 ఏళ్ళ ‘పూర్ణ విరామం’ లోని ప్రసన్న లో కనిపిస్తాయి. ‘ఫ్రిజ్ లో ప్రేమ’ లోని ప్రసన్న మాత్రం 35 ఏళ్ళ వాడయాడు.కాని ప్రేమ కోసం అదే అలమటింపు,అయితే ఈ నాటకం ముగింపు లో మాత్రం,జీవితం లో వేరు వేరు స్థితిగతుల్లోని అనేక అనుభవాల తర్వాత,జీవితం ఎలా ఎందుకు జీవించాలి అన్నది అతనికి స్ఫురిస్తుంది.ప్రసన్న ఈ పరిపక్వారుపం మొదటి చిహ్నం మనకు ‘పూర్ణ విరామం’ లో కనబడుతుంది.ఒకప్పుడు తండ్రి దగ్గర నుండి దూరమైన ప్రసన్న ‘పూర్ణ విరామం’లో ఆయనతో సహ అనుభూతి అనుబంధాన్ని జోడించుకుంటాడు.

అతడు ‘పూర్ణ విరామం’ లో ఆపేసిన రచనా వ్యాసంగం ‘ఫ్రిజ్ లో ప్రేమ’ చివర్లో మొదలవడం,అదీ అతి జోరుగా సాగే సూచనలతో మొదలవడం మనం గమనిస్తాం.మనం మన ముఖ్యమైన పనులని ఇతరులు చేసిన దగా వల్ల వదిలేయడమో,మన స్వయం ప్రతిపత్తిని మన చేతులారా పోగొట్టుకోవడం,మనకి మనం చేసుకునే హాని అన్నది ప్రసన్నకి స్ఫురించినదని నాటకం ముగింపు సూచిస్తుంది.ఇక్కడ అతి ప్రసన్న ఎప్పుడైతే ప్రసన్న ని ‘అయితే ,ఎలా ఉంది కొత్త ఇల్లు’ అని అడిగినప్పుడు అతను ‘బాగుంది.ముఖ్యంగా శాంతంగా ఉంది.అమ్మ నాన్న వాళ్ళ ఇంట్లోకి వచ్చినట్లుగా పిచ్చుకల అరుపులు కూడా వినవస్తాయి’.ఇంట్లోని శాంతే ప్రసన్న మనఃశాంతికి సాక్ష్యం పలుకుతున్నట్టుగా ఉంటుంది.

 

‘పూర్ణ విరామం’ లో ప్రసన్న శ్రేయకి చెప్పిన జీవన తత్వమే మరో రూపంలో ‘ఫ్రిజ్ లో ప్రేమ’ లో చెప్పబడుతుంది.’పూర్ణ విరామం’ లో ప్రసన్న అంటాడు,”కళాకారుడే ఎందుకు,నేనంటాను, అసలు మనిషి స్వతంత్రుడు కానేకాడు.కానవసరం లేదు కూడా.ఇలాంటి కాస్త కూస్త భావనిక ఆలంబనలోనైనా మనం ఒకళ్ళ మీద ఒకళ్ళం ఆధారపడతాం కదా ! ” ఇలాంటి ఆలంబన మనిషిలోని మానవతా మర్మాన్ని తెలియచేసేదైతే,ఆ గుణాన్ని అలవర్చుకోవాలంటే శ్రేయలాంటి విశాల దృక్పథం కావాలి.అతి ప్రసన్న కొత్త ఇంటి కోసం కావాల్సిన వస్తువుల జాబితా తయారు చేస్తూ ఎప్పుడైతే ఫ్రిజ్ గురించి ప్రస్తావిస్తాడో ప్రసన్న చప్పున వెంటనే అంటాడు.”ఇంట్లో ఫ్రిజ్ వద్దు.మనం రోజు తాజాగా వండుకుందాం.ఏ రోజుది ఆరోజే తినేద్దాం.నిలువ ఉంచడం వద్దు.దీనితో జీవితం సరళంగా సాగిపోతుంది”.

friz
ఈ రెండు నాటకాలు మానవీయ సంబంధాలకి సంబంధించి ఉద్భవించే సమస్యలు నాటకకర్త వ్యక్తిగత సమస్యల్లాగా భాసిస్తాయి.ఈ నాటకాలు రాస్తున్నప్పటి సృజనాత్మక సెగ తాకిడి అనుభవం,ఎదుర్కొన్న ప్రశ్నలకి వెదుక్కున్న జవాబులు దీనికి కారణం కావచ్చు.ప్రతి రచయిత కొద్దో గొప్పో తనకి ఎదురైనా అనుభవాల్లోని ప్రశ్నలని తన రచనల్లో పొందుపరుస్తాడు.కానైతే కుండల్కర్ విషయంలో అదింకా ఎక్కువగా కనిపిస్తుంది.కారణం కుండల్కర్ రచనల్లోని ప్రధాన పాత్రలు రచయితలు అవి మొదట విచలితులై,నిలదొక్కుకుని,ఆ తర్వాత జీవితార్థన్ని వేదుక్కుంటాయి.ముఖ్యపాత్ర రచయిత అయినప్పుడే నాటకకర్త యొక్క ఆత్మ నిష్టాపరమైన ముద్ర స్పష్టంగా తెలుస్తుంది.కుండల్కర్ నవల మరియు ఈ రెండు నాటకాలని కలిపి చూస్తే ఇందులోని విషయ వివరాలు భావనాత్మకంగా పెనవేయబడి ఉంటాయి.రచయిత ఆత్మనిష్ట వీటిలో స్పష్టంగా ద్యోతకమవుతుంది.

ఇదే ఆత్మనిష్ట యొక్క మరో ఆవిష్కారం పార్వతి పాత్రలో కనపడుతుంది. కుండల్కర్ రచనలన్నింటిని చూస్తే తెలిసేదేమంటే ఉద్యమాలు, అవి ఏ మానవ సమస్యలకి సంబంధించినవైనప్పటికీ, అతనికి అసమ్మతాలే.అంతేకాక అతనికి ఉద్యమాల మీద కించిత్తు కోపం కూడా.’ఛోట్యాశా సుట్టిత్’ లో ఇదే కోపం అందులోని స్త్రీవాద పాత్రల మీద పరిణామం చూపిస్తుంది.అదే కోసానుభుతి ‘ఫ్రిజ్ మథె ఠేవ్ లేలా ప్రేమ్’ లోని పార్వతి పాత్ర చిత్రీకరణలో కనిపిస్తుంది.ఈ పాత్ర ద్వారా ఉద్యమాల్లోని కార్యకర్తలు మానవ సంబంధాలకు దూరమైనా ధోరణులను,రీతులను వెలికి తీస్తారు.వీటన్నిటి వెనకాల అతనిలోని నిఖార్సైన మానవతావాది కనపడతాడు.మానవ సంబంధాలను అరచేతులలో దీపంలాగా సంబాళీస్తాడు నాటకకర్త.అందుకే ఈ సంబంధాల్లోని ఆ పాత్రలేమో కర్కశంగా,బోలుగా,చదనుగా అనిపిస్తాయి.అయినప్పటికీ మానవతవాదంలోని ప్రతి వ్యక్తికీ న్యాయం జరగాలనే సూత్రాన్ని కుండల్కర్ ఒప్పుకోరు.ఉద్యమాల్లోని పాత్రల మానవత్వాన్ని ఉద్యమం లాగేస్తుంది.’ఫ్రిజ్ మథె ఠేవ్ లేలా ప్రేమ్’ లోని పార్వతి వ్యక్తీరేఖా చిత్రణ ఈ నాటకపు అస్తిత్వవాద శైలి యొక్క సుస్థిర భాగంగా చుస్తే,అదే రీతిలోని ‘ఛోట్యాశా సుట్టిత్’ లోని యశోద పాత్ర విభిన్నంగా కనిపిస్తుంది.స్త్రీవాది అయిన యశోద అభినేత్రి ఉత్తర తల్లి చేసిన ప్రతిపాదనలతో ఏకిభవించదు సరికదా విచారం వ్యక్తం చేస్తుంది.”ఆడవాళ్లేమైనా డైనోసార్సా ఏమిటి ! వాళ్ళ గురించి,వాళ్ళ స్వాతంత్రం గురించి పరిశోధనలు చేయడానికి?” అంటుంది.స్త్రీవాద ఉద్యమకారులు కర్కశ మనస్కులుగా ఉండవచ్చును.చాలాసార్లు ఉంటారు కూడాను.కానీ ఏ రచయితకైతే ఉద్యమం పట్ల సహానుభూతి ఉంటుందో అప్పుడు ఆ ఉద్యమపు ప్రాతినిధ్యం ఇలాంటి పాత్రల చేతుల్లోకి వెళ్ళవద్దన్నది ముఖ్యమైన అంశం.

కుండల్కర్ నిర్మించే భావవిశ్వం ఇవాల్టిదన్నదాంట్లో ఏ అనుమానం లేదు.ఇంతవరకు వచ్చిన మరాఠీ నాటకాల్లోని స్త్రీ పురుష పాత్రల సంబంధాలు ప్రసన్న-శ్రేయల సంబంధంలాగా స్పష్ట స్నేహభావంతో నిండిలేవు.స్త్రీ పురుషుల మధ్య నుండే అంతరం ‘పూర్ణ విరామం’ లో ఎక్కడా కనిపించదు.శ్రేయతో పాటుగా ప్రసన్న వంటింట్లో పనులు చూసుకుంటాడు. ఇక్కడ ఎవరూ ఎవరి మీద, కేవలం వాళ్ళు పురుషుడు- స్త్రీ అనే అస్థిత్వ వర్చస్సుని ఇంకొకళ్ళ మీద రుద్దరు. ఇద్దరు వ్యక్తులు సమాన సంబంధాలతో ఒకిరికొకరు ఆసరాగా నిలబడతారు. ఆధారాన్ని ఇచ్చి పుచ్చుకుంటారు. చివర్లో శ్రేయ ప్రసన్న బిడ్డకి తల్లిని కావాలనుకుంటుంది. ప్రసన్న విచలితుడవుతాడు. అప్పుడు శ్రేయ అతడితో అంటుంది. “నీకు నామీద విశ్వాసం ఉంది కదా! నేనేం నిన్ను కట్టిపడేసుకోను. నన్ను పెళ్ళి చేసుకోమని కూడా అనను.”

ఇలాంటి స్వతంత్ర, సమాన సంబంధాలు ఇతని ఇతర రచనల్లో కూడా తగుల్తుంటాయి. అతి వేగంతో మారుతున్న ప్రస్తుత ప్రపంచ పరిస్థితుల సందర్భంలో మానవ సంబంధాలను ఒక్కసారి పరిశీలించుకొని, ఇదే మానవ సంబంధాల పరదాల వెనక విశృంఖలంగా మారుతున్న సంబంధాలను వేదిక మీదకి తెద్దామన్న బాధ్యత కుండల్కర్ సునాయాసంగా తనమీద వేసుకున్నాడు. ఈ కొత్త స్వతంత్ర మానవ సంబంధాల రూపాన్ని కొత్త రచయితలందరూ పరిశీలించాలి. ఇవే సంబంధాలు మరాఠీ రచయితలైన మనస్విని, లతా రవీంద్ర, ఇరావతీ కర్ణిక్ నాటకాల్లో కూడా కనపడతాయి. కాబట్టి కుండల్కర్ నాటకాలని ఈ తరహా ప్రాతినిధ్యంతో పాటుగా ఆత్మనిష్ట లేఖనంగా కూడా పరిగణించవచ్చు.

కుండల్కర్ తన నాటకాల్లో అందమైన పారదర్శక మానవ సంబంధాల విశ్వాన్ని నిర్మిస్తాడు. ఈ విశ్వం సౌమ్యం,సరళమైనప్పటికీ సున్నిత, సుమధురమైంది కాదు. సంబంధాలని నిర్మించుకోవాల్సి వస్తుంది. అందుకోసం పోట్లాడుకోవాల్సి ఉంటుంది. ఈ పోట్లాటలో తమ తమ మూల జీవనతత్వానికి విభిన్నమైన పరిణామం కలగకుండా జాగ్రత పడవలసిన అవసరమూ ఉంటుంది. అందుకే ‘ఫ్రిజ్ మధే ఠేవ్ లేలా ప్రేమ్’ నాటకాంతంలో ప్రసన్న పార్వతి కోసం ప్రేమలేఖ ఒకటి రాసిపెడతాడు. అతిప్రసన్న ఆ లేఖ అవసరమేమిటని ప్రశ్నించినప్పుడు, ప్రసన్న చెప్తాడు.”జీవితం చాలా చిన్నది. ఈ ప్రపంచమయితే మరీ చిన్నది. అందులోను గుండ్రమైనది. మనుషులు అందులోనే తిరుగుతూ, ఎప్పుడో ఒకప్పుడు ఒకరికొకరు ముఖాముఖిగా ఎదురెదురుగా నించోవాల్సిందే. అలాంటప్పుడు నేనూ, పార్వతీ ఎప్పుడో ఒకప్పుడు ఎదురెదురుగా నిలబడ్డ క్షణం శాంతంగా, సమంజసంగా ఉండాలన్న ప్రయత్నం ఈ ఉత్తరం.”
ఎక్కడికక్కడ హింసాప్రవృత్తి ప్రబలిపోతున్న సమాజంలో కుండల్కర్ ప్రేమ, సమంజసతని గురించి చెబుతూ వాటితో జీవించాలని సూచిస్తారు. ఇది అతని మానవ జీవన దృష్టి కోణం.

 

శాంతా గోఖలే

శాంతా గోఖలే

-శాంతా గోఖ్లే , ముంబాయి

–అనువాదం : గూడూరు మనోజ