తండ్రి లేని దేవుడు లేని అనాథ లోకం!

Art: Mandira Bhaduri

Art: Mandira Bhaduri

నీషే చెప్పినట్లు దేవుడు మాత్రమే కాదు, అసలు తండ్రి అనే వాడే అంతరించి పోవడమే ఆధునిక కల్లోలానికి మూలం. ఇంతకీ దేవుడు పరమ పిత కదా, పురుషోత్తముడే కదా! అంటే ఆదర్శవంతమైన తండ్రి. అసలు తండ్రి అనే భావనకే కాలం చెల్లిపోతున్న సూచనలు కనపడుతున్నాయి. దాంతోపాటూ అతన్ని కేంద్రంగా చేసుకొని తిరిగిన కుటుంబ వ్యవస్థ కరిగిపోతోంది. వొకప్పుడు తండ్రి పాత్ర పోషించిన రాజు, తర్వాత ఆధునిక రాజ్యం, జాతీయత యొక్క జనగణమన అధినాయకత్వమూ తండ్రి అనదగ్గ చిహ్నాలన్నీ క్రమేపీ కనుమరుగవుతున్నాయి. దాంతో కుటుంబ సంక్షేమం, రాజ్యం యొక్క సంక్షేమ భావం మొత్తంగా సంక్షేమ భావం నిలువనీడలేనిదిగా మారిపోతోంది.
పితృస్వామ్యంలో తండ్రి ఆధిపత్యస్థానాన్ని వహించడం నిజమే కానీ అతని కుటుంబ సభ్యుల సంక్షేమాన్ని చూడవలసిన బాధ్యత ఉంది. మనం సూర్యకుటుంబం అంటూ కాస్మిక్ చింతనలో కూడా కుటుంబ భావనని ప్రవేశపెట్టి , సూర్యుడికి తండ్రి స్థానాన్నీ,  యితర గ్రహాలకి అతనిపై ఆధారపడి  పరిభ్రమించే స్థితినీ కల్పించాం. ఇదొక అత్యాధునిక విఫల యత్నం. ఎందుకంటే నిజానికి ఆధునిక కాలంలో తండ్రిపాత్ర  క్షీణించింది. మానవుడే కనుమరుగయ్యాడు.  అయినప్పటికీ సూర్యకుటుంబం అనడం ఒక  భ్రమాత్మక కొనసాగింపు. ఇలాంటి కొనసాగింపు అన్ని రంగాల్లోనూ సాగింది. దీన్ని నేను తర్వాత వివరిస్తాను.
నిజానికి భూకేంద్రక సిద్ధాంతం అంతరించి విశ్వం నక్షత్రగుచ్చాలుగా ఉందనే వైఙ్ఞానిక దృక్పథం బలపడాక మనిషి యొక్క కేంద్ర స్థితే పూర్తిగా దెబ్బ తింది. దిక్కులు దిక్కులేనివయ్యాయి. కిందా మీదులనేవి లేకుండా పోయాయి. విశ్వం అనంతంగా అంతరించి మనిషి చిన్నబిందువుగా మారిపోయాడు. మనిషి కనుమరుగైపోయాడు. అంతరించాడు. అతనితో పాటుగా దేవుడు అంతరించాడు. దేవుడు మరణించాడని నీషే గగ్గోలు పెట్టాడు.
ఆధునిక యుగం చనిపోయిన దేవున్ని, అతని ప్రతిరూపమైన మనిషిని లేక మనిషికి ప్రతిరూపమైన దేవున్ని పునరుద్ధరించడానికి చాలా ప్రయత్నం చేసింది. మానవునిపై తీవ్రమైన మూఢ విశ్వాసంతో మానవ చరిత్ర పురోగమనం అనే స్వర్గ కాంక్షతో ప్రొటెస్టెంటిజం నుంచీ కమ్యునిజం దాకా అనేక ప్రయత్నాలు సాగాయి. మానవుడే నా సందేశం, మనుష్యుడే నా సంగీతం, మనిషి మరణిస్తాడు కానీ మనుషులు మిగులుతారంటూ శ్రీశ్రీ చేసిన ఆశావాదపూరిత ప్రకటన దైవ పునరుద్ధరణ లేక మానవ పునరుద్ధరణ కోసం యూరప్ వేసిన పొలికేకకి ప్రతిధ్వని మాత్రమే.
జీవ శాస్త్రంలోనూ, ఖగోళ శాస్త్రంలోనూ జరిగిన పరిశోధనలు మానవుడి ప్రత్యేకతనే సవాలు చేసాయి. మనిషి జంతువు నుంచీ వచ్చాడనే కాదు, అసలు నిర్జీవ పదార్ధం నుంచే సజీవ పదార్ధం ప్రమాదవశాత్తూ ఆవిర్భవించిందన్న ప్రతిపాదన మనిషికి ప్రత్యేకత లేకుండా చేసింది. అతని పుట్టుక వెనుక దైవసంకల్పం మాట దేవుడెరుగు, అతని పుట్టుక వెనుక అసలు డిజైను అనేదే లేదని చెప్పి, అతని పుట్టుకని వొక యాక్సిడెంట్ స్థాయికి పడదోసింది. ఖగోళ శాస్త్రం, సాపేక్షవాదం విశ్వంలో మనిషి ఉనికిని అనిశ్చితం చేసేసాయి. దీంతో పాటు యాంత్రిక నాగరికత మనిషికి గ్రామాల్లో ఉన్న స్థిరమైన ఐడెంటిటీని ముక్కలు చేసింది.
మనిషి ఈ శూన్యాన్ని భరించలేడు. అతనికి వొక కేంద్రం కావాలి. దేవుడు కావాలి. రాజు కావాలి. తండ్రి కావాలి. నిజానికి ఈ మూడూ వొకటే. అది పితృ భావన. పితృహననాన్ని మనిషి జీర్ణించుకోలేకపోయాడు. పరమపిత శిక్షించడం మాత్రమే కాదు. రక్షణ కూడా చూసాడు. యూదులకు ఒక స్థిర నివాసాన్ని వాగ్ధానం చేసాడు. దైవధిక్కారం వల్ల యూదులు కష్టాలు అనుభవించారు. తండ్రినీ, తండ్రి ఆఙ్ఞనీ ధిక్కరిస్తే అవ్యవస్థే, అనిశ్చితే. భారతదేశం పరిస్థితి వేరు. ఇక్కడ రాజుకి సరిహద్ధులు ముఖ్యం కాదు. వర్ణ వ్యవస్థ ముఖ్యం. ఎవరి వృత్తులు వారు నిర్వహించాలి. దాన్ని ధిక్కరిస్తే మరణ దండనే. శ్రీరాముడు శంబూకున్ని చంపింది అందుకే. యిక్కడ కులవృత్తులు ముఖ్యం. దాని మీదే వ్యవస్థ ఆధారపడి ఉంది. రాముడు అడవులకు వెళ్ళిపోతుంటే ప్రజలు చాలా దూరం అనుసరిస్తారు. మధ్యలో వొక నదీ తీరంలో అందరూ నిద్రపోతున్న రాత్రి వేళ రాముడు నిష్క్రమిస్తాడు.
వొక ఆదర్శప్రాయుడైన తండ్రి అవసరం, రామాయణంలోని ఆదర్శాలు యీనాడు మనకు పూర్తిగా ఆమోదయోగ్యం కాకపోవచ్చు. కానీ వొక నాయకుడూ, తండ్రీ అవసరం అని అందరూ భావించారు. దీనిలో ఎరిక్ ఫ్రాం చెప్పినట్లు స్వేచ్చ నుంచీ పలాయనం చిత్తగించే మానవ ప్రవృత్తి దాగి ఉంది. తన నిర్ణయాల్ని భరించే వొక పిత,  పరమ పిత, నాయకుడు, వొక నిర్ణయం తీసుకోవడంలోనూ, వొక చాయస్ ఎంచుకోవడంలోనూ గల కష్టనష్టాలనుంచీ, మంచీ చెడూ ఫలితాలనుంచీ రక్షిస్తాడు.  ( అందుకే దేవుడికి సర్వసమర్పణ భావన మొదలైంది) అందుకే “తండ్రి” భావన. మరణ వేదన పడ్తున్న సమయంలో తండ్రి కావాలి, తండ్రి కావాలి అని గగ్గోలు పెట్టాడు. కానీ ఎగ్జెన్షియలిజం మనిషి సారాన్ని తిరస్కరించి, బాధ్యతనంతా మనిషి మీదే మోపేసింది. మనిషి స్వేచ్చాశాపగ్రస్తుడని ప్రకటించింది. కానీ యీ ఙ్ఞానం మనిషికి వూరటనివ్వలేదు. కనీసం వొక పిశాచంగా, వొక భ్రమగానైనా తండ్రికావాలి. తన భారాన్ని మోసే నాయకుడూ, దేవుడు కావాలి.
శ్రీరాముడేమన్నాడు. ” ఆరాధనాయ లోకస్య మంచతో నాస్తి మే వ్యధా” ( ఉత్తర రామచరితం- భవభూతి) ప్రజలనీ లోకాన్నీ మెప్పించడం కోసం భార్యని కూడా విడిచి పెట్టడానికి కూడా సిద్ధమే. దానిలో యిసుమంత బాధకూడా లేదన్నాడు. స్టాలిన్ రెండవ ప్రపంచ యుద్ధ సమయంలో రాజ్యాన్నీ ప్రజలనీ కాపాడడం కోసం తన కొడుకు ని బలి పెట్టడానికి కూడా వెనుకాడలేదు. ఎర్ర సైన్యం చేతిలో బంధీలుగా ఉన్న నాజీలని విడచిపెట్టడానికి స్టాలిన్ తిరస్కరించాడు. దాంటో అతని కొడుకుని శత్రువులు చంపేసారు. ( దైవ కుమారుడు క్రీస్తు పాపుల కోసం శిలువ నెక్కిన సంగతి తెలిసిందే) మన నిర్ణయాల్నీ, మన మంచి చెడ్దల్నీ మోసే నాయకుడూ, తండ్రీ కావాలనే కోరిక మానవ సహజమైనది. అది స్వీయ బాధ్యతల నుంచీ పలాయనం కూడా.
కానీ మనిషి తండ్రిని ఎంతగా ప్రేమిస్తాడో అంతగా ద్వేషిస్తాడు కూడా. ఎందుకంటే తండ్రి స్వేచ్చకు పెద్ద అడ్డంకి. మనిషిలో స్వేచ్చాపిపాస ఉంది. అదే సమయంలో “పోదాం పద పారిపోదాం పద”( భైరాగి) అనే పలాయన వాదం ఉంది. ఈ రెండూ పరస్పర ఆశ్రితాలు. ఎందుకంటే స్వేచ్చలో అంతులేని బాధ్యత ఉంది. దాని వల్ల వచ్చే పెయిన్ ఉంది. నిర్ణయాన్ని తీసుకోలేకపోవడంలో, నిర్ణయాన్ని  యితరులపై మోపెయ్యడంలో శిశు సహజమైన భద్రతవుంది.
కానీ ఇలా తండ్రి మీదో నాయకుడి మీదో ఆధారపడి అతని చేతులకు బాధ్యతనప్పగించి బతికేయడం వల్ల ఆ తండ్రి, ఆ నాయకుడు స్వేచ్చని హరించే సైతానుగా మారిపోయే ప్రమాదం ఉంది. యీ ప్రమాదమే కాఫ్కా లాంటి రచయితల్ని వూపిరాడకుండా చేసి పితృ ద్వేషులుగా చేసింది. జర్మన్ రచయిత కాఫ్కా, లెటర్ టూ హిజ్ ఫాదర్, మెటామార్ఫాసిస్ – ఈ రెండూ స్వేచ్చని హరించే తండ్రి పైశాచిక రూపాన్ని బహిర్గతం చేస్తాయి. కుటుంబమూ, దానిపై ఆధిపత్యము వహించే తండ్రీ,  కథానాయకుడు- గ్రిగరీని వొక కీటకంగా మార్చేస్తారు. అతడు తన అస్తిత్వాన్ని కప్పి పుచ్చుకోవడం కోసం సోఫా కింద నక్కుతుంటాడు. గదినుంచీ బయటకు వచ్చాడన్న కోపంతో తండ్రి విసిరిన ఆపిల్ గ్రిగరీ దేహంలో యిరుక్కపోయి తీవ్ర వేదనని మిగల్చడాన్ని నేనెప్పటికీ మరిచిపోలేను. ( మెటామార్ఫాసిస్) ఎప్పటికీ ప్రారంభం కాని, నిరీక్షణంలోనే జీవితం ముగిసిపోయే న్యాయ విచారణ లాంటి విషయాల ద్వారా కాఫ్కా ఆధునిక మానవుడి జీవన అనిశ్చితినీ, క్రూరమైన రాజ్యాన్నీ కళ్ళముందు కడతాడు. నిజానికి రాజ్యమనే తండ్రి, వ్యవస్థ అనే తండ్రి యెలా మానవ స్వేచ్చని హరిస్తారో కాఫ్కా తన కథల్లో స్పష్టం చేసాడు. ( చలం కూడా తండ్రినీ, అతని నియంతృత్వాన్నీ ద్వేషిస్తాడు. బిడ్డల శిక్షణ పుస్తకంలో పిల్లల స్వేచ్చని బోధిస్తాడు)
కాఫ్కా చనిపోయిన కొంత కాలానికి అతని కుటుంబం మొత్తం నాజీ కాన్సంట్రేషన్ క్యాంపుల్లో కడతేరడం అతని కథల్లోని బీభత్సాన్నీ, జుగుప్సనీ నేల మీదకు దించింది.
            ఈ బీభత్సానికి కారణం ఆధునిక జాతిరాజ్యాన్ని ఫాసిజంగా నిర్వచించిన ఆధునిక  పిత హిట్లరే కారణం. ఇంతకు ముందు చెప్పినట్లు విఙ్ఞాన శాస్త్ర ఆవిష్కరణల ద్వారా పారిశ్రామిక నాగరికత ద్వారా పాత వ్యవస్తల్నీ, పాత ఆలోచనల్నీ కుదిపేసిన ఆధునిక యుగం మళ్ళీ తండ్రి కోసం పరమపిత కోసం (దేవుడి కోసం) అన్వేషణ మొదలెట్టింది. దానివల్ల యిద్దరు ఆధునిక  ఆదర్శాలతో  నిండిన తండ్రులూ, దేవుళ్ళూ ,నాయకులూ లభించారు.  ౧) హిట్లర్ ౨) స్టాలిన్. హిట్లర్ జాతీయ వాద ఆదర్శాన్నీ, స్టాలిన్ కమ్యునిస్ట్ ఆదర్శాల్నీ ప్రాతిపదికగా చేసుకొని నాయకులుగా మారారు. నియంతలుగా మారారు. దేవుళ్ళుగా మారారు. వారి పేర విగ్రహారాధన మొదలైంది. కానీ వారిద్దరూ విఙ్ఞాన శాస్త్ర ఆరాధకులే. కానీ స్టాలిన్ మరణిస్తే అతని శవాన్ని కూడా భద్రపరిచి శాశ్వత ప్రాతిపదికన ప్రదర్శనకు పెట్టారు. యింతటి గౌరవం, భక్తి భావం బుద్ధభగవానునికి దక్కలేదు. దీనిలో వైరుధ్యం లేదా? విఙ్ఞాన శాస్త్రాన్నీ, హేతువాదాన్నీ ప్రమాణంగా భావించే వ్యక్తులే దేవుని స్థానాన్ని ఎలా ఆక్రమించారు?
కాలంలో వెనక్కి వెళ్ళి బుద్ధుడు బుద్ధభగవానుడు ఎలా అయ్యాడు అని ప్రశ్నించుకుందాం. బుద్ధుడు తనని దేవుడ్ని చేయవద్దన్నాడు. సొంత బుద్ధితో అన్వేషణ చెయ్యమన్నాడు. నిజమే, ఆ మాట స్టాలిన్ కూడా అంటాడు. కానీ బుద్ధుడు విహారాలని స్థాపించాడు. అక్కడ అతడే తండ్రి పాత్రని పోషించాడు. కఠోరమైన సన్యాసాశ్రమ వ్యవస్థని పోషించాడు. సెక్సుని అణచి వేయడానికి తీవ్ర ప్రయత్నం చేసాడు. ఎవరైనా ఆ నియమాన్ని అతిక్రమిస్తే తీవ్రంగా నిందించాడు. అలాగే వొక సన్యాసి శిష్యున్ని, తన మాజీ భార్యతో సంగమించినందుకు నిందిస్తాడు. ” అంగాన్ని నిప్పుల్లో కాల్చుకోలేక పోయావా కోరిక తీరకపోతే”- అని దుమ్మెత్తి పోసాడు. (బుద్ధ చరియ- రాహుల్ సాంకృత్యాయన్)
పారిపోయివచ్చిన సైనికుల్నీ, బానిసల్నీ విహారంలో ప్రవేశించడానికి నిరాకరించి రాజుకు సహకరించాడు. స్త్రీల ప్రవేశాన్ని కూడా నిరాకరించినా, శిష్యుడు ఆనందుని మాట విని తర్వాత వొప్పుకున్నాడు. కానీ స్త్రీల వల్ల వొక వెయ్యి సంవత్సరాల్లో బౌద్ధం క్షీణిస్తుందన్నాడు. బుద్ధుడు కుటుంబ స్థానంలో సన్యాసాన్ని స్థాపించి దానికి నాయకత్వాన్నీ, తండ్రి పాత్రనీ పోషించాడు. బుద్ధుడు మంచి తండ్రిలా కనపడవచ్చు కానీ తండ్రే. ఆ పాత్రలో నియంతృత్వధోరణి తప్పదు. మిగిలిన వాళ్ళ కంటే వొక అతీత స్థితీ, ఉన్నత స్థితీ తప్పదు. అదే బుద్ధున్ని దేవునిగా మార్చింది. అంటే బౌద్ధ విహారాల్లోనూ , వారి సన్యాస దీక్షలోనూ కూడా పితృస్వామిక లక్షణాలు బలంగానే ఉన్నాయి.
కానీ సన్యాసం అనేది కొత్త మార్పే. ముఖ్యంగా కుటుంబంలాగే అదొక వ్యవస్థగా మారడం. బుద్ధుడు వ్యవసాయక సమాజం ఏర్పడ్తున్న దశకు సంబంధించిన వాడుగా నిర్ధారిస్తాడు డి. డి. కోశాంబి. వ్యవసాయం విస్తరిస్తూ ఉండడం సొంత ఆస్తి ఆవిర్భావానికి కారణం. సంపద మిగులుకు కారణం. దీనివల్ల పనిలోకి పోకుండా బౌద్ధిక చింతన చేసే వర్గం ఆవిర్భవించింది. వాళ్ళే బౌద్ధ బిక్షువులు. రిచ్యువల్నీ, యఙ్ఞయాగాదుల్నీ, కర్మకాండనీ పరమమైనదిగా  భావించే బ్రాహ్మణులు సన్యాసాశ్రమాన్ని చాలాకాలం వ్యతిరేకించారు. కుటుంబ వ్యవస్థనే బలపరిచారు. అందుకే ఎనిమిదవ శతాబ్ధానికి చెందిన శంకారాచార్యుల్ని సన్యాసం తీసుకున్నందుకు మండన మిశ్రుడిలాంటి బ్రాహ్మణపండితులు మొదట తీవ్రంగా నిందించారు. స్త్రీ సంపర్కాన్ని నీచమైనదిగా భావించడాన్ని వ్యతిరేకించారు. కానీ తర్వాత పీఠాలు వెలిసాయి. పీఠాధిపతులు వెలిసారు. వాళ్ళు రాజులుగా, తండ్రులుగా గౌరవాన్ని పొందారు.
అంటే మానవ సమాజం కుటుంబ వ్యవస్థని, సెక్సుతో సహా తిరస్కర్తించినప్పటికీ తండ్రి పాత్రని ఆరాధించడం విడిచిపెట్టలేదు. దేవుడికి మూలాలు యిక్కడే ఉన్నాయి. దేవుడ్ని తార్కికంగా హేతుబద్ధంగా తిరస్కరించినా  కొత్త దేవుళ్ళు వెలుస్తూనే ఉంటారు. కారణం దేవుడు పితృస్వామిక వ్యవస్థ యొక్క ఆదర్శ రూపం.
బ్రాహమణ ఫిలాసఫీ అయిన పూర్వ మీమాంస దేవుడి ఉనికినే హేతుబద్ధంగా తిరస్కరించింది. కుమారిలభట్టు యిటువంటి తర్కాన్ని అభివృద్ధిపరిచాడు. కానీ జాతి వ్యవస్థనీ, బ్రాహ్మణ అధిపత్యాన్నీ బలపరిచాడు. మనువు ఏమంటాడూ? అగ్రవర్ణాల్ని అనుసరిస్తూ , తమ నడవడికని తీర్చిదిద్దుకోవాలంటాడు. అంటే వర్ణ వ్యవస్థలో భూసురుడే దేవుడు. అతడే పరమ పిత. వేరే ఆకాశ దేవుళ్ళు అవసరం లేదు.
అందువల్ల పితృస్వామ్య మూలాల్లోనే దేవుడున్నాడు. యీ దేవుడు వొక్కొక్క సారి నిర్గుణుడు, మరొకసారి సగుణుడు, మరొక సారి మానవ ఆకారం ధరించిన వాడు, శ్రీరాముడూ లేక స్టాలినూ, హిట్లరు.
అదేమిటండి నాస్తికత్వానికీ, దేవుడికీ ఎలా పడుతుంది? యెలా సంధి కుదుర్తుంది అని మీరడగవచ్చు. ప్రాచీనకాలంలో బౌద్ధం వల్ల, ఆధునిక కాలంలో కమ్యునిజం వల్ల విగ్రహారాధన పెరగలేదా? అంటే మనం పితృస్వామ్యాన్ని తిరస్కరించడంలేదు. రంగనాయకమ్మగారు రామాయణనీతిని తిరస్కరించడం లేదు. ఆదర్శవంతమైన ఆధునిక హేతుబద్ధతతో కూడిన రామాయణ నీతి మోనోగమీ కావాలంటున్నారు.
కానీ రంగనాయకమ్మ గారికీ, రామాయణ నీతికీ ముప్పు ఏర్పడింది. వొకప్పుడు ఓల్గాలాంటి రచయితలు కుటుంబ వ్యవస్థతో సంబంధం లేని సెక్సు, స్వేచ్చ గురించి మాట్లాడారు. దానికి విరుద్ధంగా రంగనాయకమ్మగారు విరుచుకపడి ఆదర్శవంతమైన మోనోగమీని సమర్ధించారు. కానీ కుటుంబమనేదే పితృస్వామికం.
బ్రాహ్మణులే కాదు, ఆదిమవాసులు కూడా పితృదేవతల్ని నమ్ముతారు. కొన్ని సంవత్సారాల క్రితం వొక వార్త చదివాను. అమెజాన్ అడవుల్ని కొట్టేసి, అమెరికన్లు సోయాబీన్ పండిస్తున్నారు. అక్కడ గిరిజనుల గోడు ఏమిటంటే – ఇది పితృ దేవతల నిలయం.  యీ అడవులు వీటిని చేధించవద్దని వారి ప్రార్థన. బహుశా యీ పితృ దేవుడు చాలా ప్రాచీనుడు. పితృ దేవుడి నుంచే, పితరుల ఆత్మ నుంచే దేవుడు పుట్టాడు. కొడుకు వల్ల పున్నామ నరకం తప్పుతుంది. అలాగే తండ్రీ తాతలకి కర్మ ద్వారా పితృ ఋణం తీరుతుంది. యిదొక చక్రభ్రమణం, పితృ భ్రమణం.
ఆధునిక కాలంలో కమ్యునిష్టులు దీన్ని చేధించాలని చూసారు. కానీ కొత్త రూపంలో కొనసాగించారు. అంటే తండ్రి స్థానంలో సంస్కారవంతుడైన మంచి తండ్రినీ, మంచి నాయకుడ్నీ, హేతుబద్ధమైన దేవుడ్నీ స్థాపించాలని చూసారు. హిందూత్వ సిద్ధాంతకర్త సావర్కర్ పితృ కర్మలని తిరస్కరించాడు. తాను చనిపోయినా కర్మ జరపవద్దని వీలునామా రాసాడు. ఆయన దృష్టిలో హిందూ జాతీయవాదమే పరమపిత. హిందూ జాతీయవాదం హిట్లర్ జాతీయవాదం యొక్క శిశువు. ప్రపంచానికి యిద్దరు పరమ పితలు. ౧) హిట్లర్ ౨) స్టాలిన్.
ఆధునిక రాజ్యం తండ్రిగా కొన్ని బాధ్యతలు కూడా నిర్వర్తించింది. కొన్ని సంక్షేమ లక్షణాలని పుణికిపుచ్చుకుంది. ఎంత దుర్మార్గాలకీ, క్రూర చర్యలకీ పాల్పడ్డా ప్రజల పురోగతే తన లక్ష్యమని ప్రకటించుకుంది. టీచర్ పిల్లల్ని దండించడం వారి అభివృద్ధి కోసమేనని చాటుకున్నట్లు రాజ్యం తన హింసాత్మక చర్యల వెనుక కూడా ప్రజా సంక్షేమమే దాగి ఉందని చాటుకొంది. కానీ “సంక్షేమం” అనే మాటని విడిచి పెట్టలేదు. హిట్లరు కూడా నిరుద్యోగాన్ని రూపుమాపే చర్యల్ని చేపట్టాడు. సంక్షేమ రాజ్యం అనే పదబంధం కూడా పుట్టుకొచ్చింది. ఈ సంక్షేమ భావనే స్టాలిన్, ఇందిరాగాంధీల నియంతృత్వ పోకడలకి సమ్మతిని చేకూర్చింది. ప్రాచీన కాలంలో రాజు సామదానభేద దండోపాయాల్ని అవలంభించాలని రాజనీతి. ఆధునిక యుగంలో కూడా అదే కొనసాగింది.
కానీ అత్యాధునిక మార్పులూ, ప్రపంచీకరణ క్రమేపీ పితృస్వామ్యానికి ముప్పుగా పరిణమిస్తున్నాయి. దాంతో తండ్రి, నాయకుడు, దేవుడు నిజంగానే మరణ శయ్యపై చేరుతున్నారు. దాంతో పితృస్వామ్యం వహిస్తూ వచ్చిన సంక్షేమ భావన కొండెక్కింది. మంచికైనా చెడుకైనా ప్రశ్నించడానికీ, నిలదీయడానికీ తండ్రే లేకుండాపోయాడు. రావిశాస్త్రి వొకసారి అంటారు. “దేవుడు ఉన్నాడనే నేను భావిస్తాను. ఎందుకంటే తీవ్ర దుర్మార్గాలని చూసినపుడు నిదించడానికీ, నిలదీయడానికీ దేవుడు పనికొస్తాడు”. వొకప్పుడు రాజ్యం అపనిందల్ని భరించేది. తిరుగుబాట్లని ఎదుర్కొనేది. అణచివేయాలని చూసి, చివరికి రాజీకొచ్చేది. కొన్ని సంస్కరణలనైనా చేపట్టేది. గిరిజనులకి ఇలాగే కొన్ని హక్కులు లభించాయి.
యిప్పుడూ సంస్కరణ అన్న పదమే మారిపోయింది. రాజ్యం అన్ని సంక్షేమ బాధ్యతలనీ తప్పుకోవడమే సంస్కరణగా పిలవబడ్తోంది ( అంటే తండ్రి బాధ్యత నుంచీ తప్పుకోవడం).వొకప్పుడు రాజ్యం యొక్కపితృస్వామిక సహకారంతోనే అగ్ర వర్ణాలు పెట్టుబడిదారులుగా , మధ్యతరగతిగా బలపడ్డారు. దళితులూ, గిరిజనులూ, ముస్లీములూ కడగొట్టు బిడ్దలుగా తక్కువ పలితాన్ని పొందారు.రాజ్యం సంక్షేమ భావనని విడిచిపెట్టడంతో,  తండ్రి బాధ్యతని త్యజించడంతో వీరిపరిస్థితి మరింత అధ్వాన్నంగా మారింది.
కొంతమంది దళిత మేధావులు ప్రపంచీకరణ వల్ల దళితులకి మేలు జరుగుతుందని, కుల వివక్ష తగ్గిపోతుందనీ వాదించారు. చంద్రభాను ప్రసాద్ అలాగే వాదించారు. నిజానికి రాజ్యం పితృస్వామ్య బాధ్యతని విడనాడి, మార్కెట్‍కు అంతా వదిలేయడంతో వొక అరాచక పరిస్థితి ఏర్పడింది. ఆధునిక రాజ్యం ఏర్పడక ముందునుంచీ ప్రశ్నిస్తూ, పోరాడుతూ వొచ్చిన నిమ్నకులాలు యిప్పుడు ఎవరితో పోరాడాలో తెలియక, యెవరిని నిలదీయాలో తెలియక దిక్కులు చూసే పరిస్థితి ఏర్పడింది. దీనివల్ల తిరుగుబాట్లు మాయమయ్యాయి. ఆత్మహత్యలు మొదలయ్యాయి. రైతాంగ తిరుగుబాట్లు, విద్యార్థి పోరాటాలూ లేవు. ఆ స్థానాన్ని రైతుల ఆత్మహత్యలూ, విద్యార్ధుల ఆత్మహత్యలూ భర్తీ చేస్తున్నాయి. ప్రభుత్వ విద్య, ఉద్యోగాలూ అంతరించి దళిత మధ్యతరగతి పెరుగుదల నిలిచిపోయింది.
యూరప్‍ని అనుకరిస్తూ  జాతి రాజ్యం(నేషనాలిటీ) ని ఏర్పరుచుకున్నప్పుడు, కొన్ని సంక్షేమ ఆదర్శాల్ని మనం ఆశించాం. కానీ స్వదేశీ, స్వజాతి అభిమానం వంటివి కనుమరుగవుతున్నాయి. దాని స్థానంలో కుహనా జాతీయవాదం మొదలైంది. విచిత్రంగా యీ కుహనా జాతీయవాదాన్ని ఎన్నారైలు భర్తీ చేస్తున్నారు.
రాజీవ్ మల్హోత్రా యిటువంటి కుహనా జాతీయవాదే. ఆయన బ్రేకింగ్ యిండియా అనే పుస్తకం రాసారు. ఇస్లాం, క్రైస్తవం వంటి మతాలూ, ప్రగతి శీల చరిత్రకారులూ, మావోయిష్టులూ … వీళ్లందరూ జాతీయతకి ముప్పుగా పరిణమించారంటారు. బ్రిటీష్ పాశ్చాత్య వలసవాద సంస్కృతి ఆధిపత్యం గురించి తెలివిగా మాట్లాడ్తారు. కానీ దేశాన్ని బహుళ జాతికంపెనీలకి బార్లా తెరవడంలో, పాశ్చాత్య దేశాల్లో కూడా నిషేధించిన అణూకర్మాగారాల్ని ఎటువంటి నిబంఢనలూ విధించకుండా విచ్చలవిడిగా అనుమతించడంలో , విదేశీ విశ్వవిద్యాలయాలు, రక్షణ రంగంలో విదేశి పెట్టుబడులూ… యివేవీ ఆయనకు జాతీయతకు  ముప్పుగా  ఆయనకు కనపడలేదు. పైగా వీటిని ప్రోత్సహించే హిందూ జాతీయ వాదుల్లో “స్వదేశీ” కనపడ్తుంది. సామ్రాజ్యవాదం వూసెత్తరాయన.
నిజానికి మరణ శయ్యపై చేరిన తండ్రి- జాతీయవాదం యింకా మరణించలేదనే భ్రమని యీ మేధావులు కలగజేస్తారు. పైగా జాతీయతకి ముప్పుగా పరిగణించిన విదేశి భక్తులలోనే దేశభక్తినీ, దేశ సంస్కృతినీ చూపుతారు. తద్వారా పరోక్షంగా స్థానిక సంస్కృతుల్ని పాతర వేసి పాశ్చాత్య అమెరికన్ సామ్రాజ్యానికి బ్రాండ్ అంబాసిడర్లుగా వ్యవహరిస్తారు. పశ్చాత్తాపం లేని దళారులు వీళ్ళు.
నిజానికి తండ్రి మరణించాడు. కుటుంబ వ్యవస్థ రూపు మాసిపోయే స్థితిలో ఉంది. సంతానాన్ని భాగ్యంగా వరంగా భావించే స్థితి పోయి, కొన్ని దేశాలు సంతానాన్ని కంటే రాయితీలు యిస్తానంటున్నాయి. యిదే సమయంలో కొన్ని కంపెనీలు ఉత్పత్తి పెంచడం కోసం, ప్రసవాన్ని వాయిదా వెయ్యమని, పిండాల్ని భద్రపరిచే సౌకర్యం కల్పిస్తామని అంటున్నాయి. అద్దె గర్భాలు లభిస్తున్నాయి. వృద్ధాశ్రమాలు పెరుగుతున్నాయి. యివన్నీ పితృస్వామ్యం అంతరించిపోతుందనడానికి , అదే సమయంలో వ్యాపిస్తున్న శూన్యానికీ చిహ్నాలు. ( సాంకేతిక అభివృద్ధి గల మనిషి స్థల కాలాల్ని పోగొట్టుకుంటున్నాడు. దాంతో బంధాలు, అనుబంధాలు కోల్పోయాడు).
యింక రాజ్యం దగ్గరికి వస్తే వొకప్పుడు తండ్రి పాత్ర పోషించిన హిట్లర్, స్టాలిన్, ఇందిరాగాంధీ వంటి నియంతలలో కనపడే నిజాయితీ నేటి పాలక వర్గంలో కనపడదు.
హిట్లర్ తన ఆత్మకథ(మెయిన్ కుంఫ్)లో యూదు వ్యతిరేకతని బహిరంగంగానే చాటుకుంటూ , దానికి మేధావుల తాత్విక మద్ధతుని ప్రకటించుకున్నాడు. స్టాలిన్ కూడా తన దృక్పథాన్ని కప్పిపుచ్చుకోలేదు. ఇందిరా గాంధీ  ఎమర్జన్సీ విధించడానికి కూడా వెనుకాడలేదు.
కానీ నేడు హిందూ ఆధిపత్య వర్గానికి ఆ నిజాయితీ లేదు. కొందరు దాడులు చేస్తారు. కానీ మా ఫిలాసఫీ ఫాసిజమేనని ప్రకటించే తండ్రి స్థానంలోని నాయకుడు ఉండడు. అంతా అరాచకం. స్థలకాలాలు అంతరించిపోయిన శాటిలైట్ ప్రసారాల కాలంలో మనం ఉన్నాం. మన ప్రత్యేకతని మనం కోల్పోయాం.
దీనికి కారణం మనని మనం పాలించుకోవడం లేదు. మనకి నాయకుడు లేడూ. తండ్రి లేడూ. తండ్రి మరణించాడు. మార్కెట్ అరాచకం రాజ్యం చేస్తోంది. యిటువంటి అసంబద్ధపు ప్రపంచపు లోగుట్టుని బయట పెట్టబోయిన వికీలీక్స్- అసాంజే వొక దేశపు రాయబార కార్యాలయంలో స్వయం బంధీ  అయ్యాడు. అతడి తరుపున వాదించే అమెరికన్ లాయర్ అనుమానపు స్థితిలో చనిపోయాడు. అంటే అత్యాధునిక ప్రసార సాధనాలు సత్యాన్ని కప్పిపుచ్చే ముసుగులు మాత్రమే.
తండ్రి లేని, నాయకుడు లేని, దేవుడు లేని సత్యం లేని అనాథల ప్రపంచం మనది.
*

మతము-నాస్తికత్వము-నాస్తిక మతము                                                                                        

 

                                                                                                                       – రాణి శివ శంకర శర్మ

~

 

మనం ఆధునిక కాలంలో మతచాందసత్వాన్ని కాదు. ఎథీస్ట్ ఫండమెంటలిజాన్ని అంటే నాస్తిక చాందసత్వాన్ని పూర్తిగా అధ్యయనం చేయాలి. అలా అధ్యయనం చేయడం ద్వారా మనం సంఘర్షిస్తున్నాయి అని అనుకుంటూన్న శక్తులు ఒకే కుదురులోనివనీ, తోబుట్టువులనీ అర్థమవుతుంది. వైరుధ్యాలు అనుకున్నవి మిత్ర వైరుధ్యాలనీ వైరుధ్యం ముసుగులోని మైత్రీపూర్వక సంబంధాలనీ అవగతమవుతుంది. అప్పుడు కమ్యూనిజము, హిందూవాదము లాంటి అనేక పేర్లు ఒకే సత్యానికి సహస్ర నామాలని అవగతమవుతుంది.

నిజానికి కమ్యూనిజం వ్యాన్ గార్డులుగా వ్యవహరించిన కొన్ని అగ్ర కులాలని గ్రామీణ బంధనాల నుండి విముక్తం చేసి పెట్టుబడి దారీ వ్యవస్థలో తగిన భాగస్వామ్యం పొందడానికి అవకాశం కల్పించింది. ప్రభుత్వ పరిశ్రమలు ప్రైవేటు పరిశ్రమల ఆవిర్భావానికి చోదక శక్తిగా పని చేసినట్లేనన్న మాట. చైనాలో కూడా అంతే. కమ్యూనిజం చిన్న కమతాలని సమిష్టి వ్యవసాయంలోకి లయం చేసి ప్రాచీన గ్రామీణ వ్యవస్థని బలహీనపరిచింది. ఇప్పుడు అలా సమీకరించబడిన భూమి పెట్టుబడికి ప్రశ్నకవకాశం లేని వనరుగా మారింది. ప్రజా ప్రభుత్వం పేరుతో ఆవిర్భవించిన కమ్యునిష్టు వ్యవస్థ పెట్టుబడిదారీ వ్యవస్థకి దుర్భేధ్యమైన కవచంగా మారింది. తావోయిజం ప్రకారం ప్రతీదీ పూర్తి విరుద్ధంగా మారుతుంది. ఆ మాటని మావో తాత్వీకరించాడు. ఇప్పటి పరిణామాలు కూడా ఆ తాత్వీకరణలో భాగమేనా? తాత్విక సూత్రాలు స్వయం చలనంగా ఉండి తమ అర్థాలని తామే నిర్ణయించుకుంటాయా? మానవ ప్రగతి అనే భావనలో ఏ మానవుడి ప్రగతి, ఏ జాతి ప్రగతి అనే ప్రశ్నలకి సరైన సమాధానం లేదు. దురదృష్టవశాత్తూ కమ్యూనిజం ఈ భావన మీదే కాళ్ళూనుకొని ఉంది. నిజానికి ఆధునికత అంతా అంతే.

 

హిందూ వాదం కూడా పురోగతి అనే భావన మీదే ఆధారపడి ఉండి. చరిత్ర పురోగమనం అనే విశ్వాసం మీదే ఆధారపడి ఉంది. హిట్లర్ నేషనలిజం అన్నా, సావర్కర్ హిందూ నేషనలిజం అన్నా ఈ ఆధునిక అభివృద్ధి భావనల మీదే ఆధారపడ్డాయి. అందరూ ఏదో రూపంలో త్యాగశీలతనే కొనియాడారు. కానీ త్యాగం చేసేవారూ, నాయకత్వం వహించేవారి మధ్య అగాథం అలాగే నిలిచిపోయింది. మొత్తం మీద కమ్యూనిజం, హిందూయిజం- ఈ రెండూ,  కొందరు అగ్రవర్ణాల వారు పెట్టుబడిదారీ వ్యవస్థలో రాణించడానికి పునాదిగా పని చేసాయి. కమ్యూనిజం, కమ్యునిష్టు ఉద్యమాలు పునాది అయితే పెట్టుబడిదారీ వ్యవస్థ, గ్లోబలైజేషన్ ఉపరితలం అనవచ్చు. అంటే కమ్యునిజం మానవుల్ని, అంటే అగ్ర కులాల్ని మాత్రమే సంప్రదాయ బంధనాల నుంచి విముక్తం చేసి, నగరీకరణలో, గ్లోబలైజేషన్లో భాగం చేసాయి. గుంటూరు, కృష్ణా జిల్లాలు ఇందుకు మంచి ఉదాహరణలుగా నిలుస్తాయి.

 

ఈ క్రమంలో పెట్టుబడి దారీ వ్యవస్థలో, గ్లోబలైజేషన్లో తగిన భాగం పొందలేక, గ్రామీణ వ్యవస్థ విచ్చిన్నమై నూతన అవకాశాలు కూడా పొందలేక బాధపడుతున్న దళిత, బహుజనులు, ముస్లీంలు తమ అస్తిత్వాలతో, మతాలతో, సంస్కృతులతో ముందుకు వచ్చి వాటినే అగ్ర కులాల ముందు ప్రశ్నలుగా ఎగరవేశారు. దాంతో అగ్ర కులాలు నాస్తికత్వం, ఆర్థిక సమానత్వం, హిందూ నేషనలిజం లాంటి సెక్యులర్ అబ్స్ట్రాక్ట్ పదాల్ని ఆశ్రయించారు. దళితులు, బహుజనులు తమ ప్రత్యేక అస్తిత్వాలని కరిగించుకొని అబ్స్ట్రాక్ట్ గా మారిపోవాలని ఆదేశిస్తున్నారు. పెట్టుబడిదారీ వ్యవస్థ అబ్స్ట్రాక్ట్ స్వభావాన్ని ఇష్టపడుతుంది. ప్రత్యేక అస్తిత్వాలని కాక కొనుగోలుదార్లని వాంఛిస్తుంది. నగరీకరణలో ప్రత్యేకతలు, ప్రత్యేక సంస్కృతులు లయమైపోవాలని ఆదేశిస్తుంది. కమ్యునిష్టు, హిందూ ముసుగుల్లోని అగ్రవర్ణాలది మొదటి నుంచీ అబ్స్ట్రాక్ట్ పరిభాషే. భూస్వామి అన్నా, బూర్జువా అన్నా, పెటీ బూర్జువా అన్నా, హిందుత్వ అన్నా, నేషనలిజం అన్నా అంతా వలసవాదుల నుంచీ దిగుమతి చేసుకున్న అబ్స్ట్రాక్ట్ సరుకే. ఈ పదాలతోనే వీళ్ళు నగరీకరణలోకీ, గ్లోబలైజేషన్లోకీ సులభంగా ఎగబాకారు. అదే సమయంలో దళిత, బహుజన, ముస్లీంలు ఈ నిచ్చెన మెట్లు ఎక్కకుండా ఉండడం కోసం ప్రత్యేకతల్నీ, కులాల్నీ, మతాల్నీ, సంస్కృతుల్నీ ఉపరితలం అంటూ అగ్రకులాలు విసిరి కొట్టారు. హిందూవాదులైతే బహుళత్వాన్ని హిందూ జాతీయతకి ముప్పుగా పరిగణించారు.

 

అందుకే ఇప్పుడు కమ్యునిష్టులు, దళిత బహుజనుల్ని, వారి ప్రత్యేక మతాలనీ , సంస్కృతులనీ  గ్లోబలైజేషన్ దుష్పరిణామాలుగా వాదిస్తున్నారు. ఐక్యతకి ముప్పుగా భావిస్తున్నారు. నిజానికి గ్లోబలైజేషన్‍కీ వాటి ఫలితాలకీ కారణం ఆ కులాల వాళ్ళే. ఐక్యత అనే విశాలార్థం కల  పదం ఎప్పుడూ కొద్దిమంది అభివృద్ధికి అనేక మంది అణచివేతకి కారణమవుతూ వచ్చింది. మాదిగ దండోరా ఆవిర్భావానికి కారణమదే. మాదిగల ప్రత్యేక అస్తిత్వ ప్రకటన సాంస్కృతికంగా మరుగుపడిపోయిన అనేక అంశాల్ని బయటికి తెచ్చింది. సంస్కృతి గురించి అగ్రవర్ణాలు కమ్యునిష్టు హిందూవాదులు వ్యక్తం చేసిన ఆధిపత్య కోణాల్ని బట్టబయలు చేసింది.

 

ఉదాహరణకి ద్రోణుడు ఏకలవ్యుడికి విద్య చెప్పడానికి నిరాకరించాడనే కథని, కమ్యునిష్టులు కూడా యాధార్ధంగా స్వీకరించారు. ద్రోణుడిని వ్యాన్ గార్డ్ గా ఏకలవ్యుడిని కార్యకర్తగా చూసారు. అసలు ద్రోణుడు గిరిజనుడైన ఏకలవ్యుడికి విలువిద్య నేర్పడమేమిటని ఎవరూ ప్రశ్నించలేదు. ఎందుకంటే కమ్యునిష్ట్ హిందూ అగ్ర వర్ణాలవారు తాము ప్రజలనుంచీ నేర్చుకోవడం కంటే వారికి నేర్పే వారిగానే తమని తాము చిత్రీకరించుకున్నారు. తాము గురుత్వం వహించారు. అందుకే జాంబ పురాణం వంటి ప్రత్యామ్నాయ పురాణాలని అధ్యయనం చేయలేదు. దళితులు అవిద్యావంతులనీ, అగ్రకులాలు విద్యావంతులనే స్టీరియో టైపుని బద్దలు చేయలేక పోయారు. డక్కలి వారికి చదవడం, రాయడం వచ్చని, వేద పండితులకి రానే రాదనే విషయాన్ని వాళ్ళు పట్టించుకోనే లేదు. ఎందుకంటే అగ్రకులాలే ఙ్ఞానవంతులనేది వారి అభిప్రాయం. కానీ డక్కలి వారి దృష్టి వేరు. వాళ్ళు ఙ్ఞానాన్ని అగ్ర కులాలు తమ వద్దనుంచే దొంగిలించాయంటారు.

 

వలసవాద విద్య వల్ల అగ్రకులాలు తమరిదొక్కరిదే ఙ్ఞానమని, విద్య అనీ, మతమనీ ఇతరులందరినీ బ్రిటీషువారిలాగే సంస్కరించే వైట్ మ్యాన్స్ బర్డేన్ తమ మీద ఉందనీ భావించడం మొదలు పెట్టారు. ఇతర సంస్కృతుల్ని అంటరానివిగా చూడడం కాక, వాటిని మొత్తంగా నిర్మూలించి, వాటి స్థానంలో తాము సంస్కృతీ, మతం, నాగరికత అనుకున్నదాన్ని బలంగా ప్రతిష్టించాలని వారు భావించారు. ఈ భావనలకి    అత్యాధునిక ప్రతిధ్వనులే గోగినేని బాబు, హెచ్చార్కే, రంగనాయకమ్మ. వీరిది నాస్తిక మతం. ఎథీస్ట్ ఫండమేంటలిజం. గోగినేని బాబు గద్దరు అనే ప్రజా గాయకుడు శివుడ్నీ, బసవడ్నీ సమానత్వ భావాలకి నిలయంగా భావించి పాట రాసినందుకు తీవ్రంగా నిందిస్తాడు. అదే సమయంలో రవీంద్రనాథ్ ఠాగూర్ జాతీయ గీతంలో అబ్స్ట్రాక్ట్ విశాల దృష్టినన్వేషిస్తాడు. హెచ్చార్కే కులమతాలు పోవాలనీ, తానే మైనారిటీననీ అంటాడు. రంగనాయకమ్మ బ్యాక్ టూ మార్క్స్ అంటుంది. అంటే తనలోనూ, మార్క్స్ లోనూ తప్ప అన్ని చోట్లా లోపాలే ఉన్నాయని అంటుంది.   ఇంతవరకూ లోపాలు లేని వ్యక్తులు, వ్యవస్థలు, సంఘాలు బయట ఎక్కడా ఉదాహరణగా నిలచి లేవు కనుక తన హృదయంలోని మార్క్స్ కలగన్న సమాజం కోసం జపం చేస్తూ ఉండాలని బోధిస్తుంది. మొత్తం మీద వీళ్ళందరూ వాళ్ళు నిర్మించుకున్న అబ్స్ట్రాక్ట్ ఏకాంత మందిరంలో లోపాలు, పక్షపాతాలూ ఏవీలేని స్వచ్చమైన నాస్తిక మతంలో నాస్తికతనే దేవుడిగా ఆరాధిస్తూ జీవిస్తారు. ఈ స్వచ్చతని పాటించడం కోసం అన్ని మతాలకీ, అన్ని కులాలకీ సమదూరం పాటిస్తున్నట్టూ నటిస్తారు.

 

 

నట సామ్రాట్

నీ ఇంట్లో అరలెన్నో మరలెన్నో

నాకు తెలుసు నాకు తెలుసు

నీ పాత్ర చిలుం పట్టింది తోముకో

-మహాస్వప్న

 

 

*