వేల  నక్షత్రాలు నడిచిన గది!

eleanor-farjeon-4

Eleanor Farjeon ప్రధానంగా కవయిత్రి. తర్వాతి రోజుల్లో  బాలసాహిత్యాన్ని సృష్టించారు. సంపూర్ణమైన జీవితాన్ని  పువ్వులతోటీ  మనుషులతోటీ పుస్తకాల తోటీ ప్రేమగా నింపుకుని ఆఘ్రాణించినవారు.

 చిన్నతనం, పుస్తకాల మీది మోహం – రెండూ కలిసి ఉండిపోయాయి నాకు. అర్థ శతాబ్దపు వయసు పూర్తయిన ఈ రోజుకీ ‘ పిల్లల కోసం ‘ రాసిన పుస్తకాలూ romance లూ fairy tales  – బలం గా లాగుతూంటాయి. Ms. Farjeon లో నేనొక  kindred spirit ని కనుగొన్నాను. ఆమె తన పుస్తకానికి తానే రాసుకున్న పరిచయం ఇది. స్నేహితులతో పంచుకోవాలని – ఇలా, ఈ సారికి.

*****

చిన్నప్పుడు మా ఇంట్లో మాకు ‘ బుల్లి పుస్తకాల గది ‘ ఉండేది. అసలైతే ఇంట్లో ప్రతీ గదీ పుస్తకాలదే – మేడ మీద మా పిల్లల గదుల నిండా పుస్తకాలే. కిందని నాన్న చదువుల గది లోనూ అవే. భోజనాల గది గోడల పొడవునా పుస్తకాలే , అవి పొంగి పొర్లి అమ్మ కూర్చుని కుట్టుపని చేసుకునే గదిలోకీ, పడక గదుల్లోకీ ప్రవహిస్తూనే ఉండేవి. దుస్తులు లేకుండా బ్రతకటం సాధ్యమేమో – పుస్తకాలు లేకుండానా ? ఆహారం ఎంత సహజమైన అవసరమో , చదవటమూ అంతే.

మా  బుల్లి పుస్తకాల గది – యథేచ్ఛగా పెరిగేందుకు వదిలేసిన తోట లాంటిది. పువ్వులూ పిచ్చి మొక్కలూ అన్నీ కలగలసిపోయి ఉండేలాగా. అక్కడ ఒక ఎంపిక గానీ పద్ధతి గానీ ఏమీ లేవు. తక్కిన గదులన్నిటినీ శ్రద్ధగా తీర్చి దిద్ది అమర్చేవారు – ఇది  మటుకు ఒక నానా జాతి సమితికి మల్లే ఉండేది. ఎక్కడా ఇమడని, పట్టని – అల్లరి చిల్లరి పుస్తకాలూ ఆకతాయి వీ , టోకున తగ్గింపు ధరల్లో నాన్న కొనుక్కొచ్చి పడేసిన బంగీ లూ- ఇంకా ఏమిటేమిటో. చాలా చెత్త, మరింకా చాలా సంపద . దేశ దిమ్మరులూ మర్యాదస్తులూ కులీనులూ అందరూ ఒక్కచోటే.   ఏ పుస్తకాన్ని ముట్టుకుని తిరగేసేందుకైనా మా ఇంట్లో పిల్లలకి అనుమతి ఉండేది – ఇక తవ్విన కొద్దీ దొరుకుతుండే నిధులూ నిక్షేపాలూ – అంతు లేకుండా.

MythiliScaled

ఆ గది కిటికీ లు మూసి బిగించి ఉండేవి . గాజు అద్దాలలోంచి  పడుతుండే సూర్యకాంతి తడవకొక్క మారుమూలకి వెలుతురు ఇచ్చేది  . పేరుకు పోయి ఉన్న దుమ్ము బంగారపు తునకల్లాగా మిల మిల మనేది.   మంత్రపు గవాక్షాలు నాకు తెరుచుకున్నది అక్కడే – అప్పటివీ అక్కడివీ కాని కాలాల్లోకీ దేశాల్లోకీ వాటిలోంచి తొంగి చూశాను- వచనమూ కవిత్వమూ వాస్తవమూ అద్భుతమూ నిండి ఉన్న లోకాల్లోకి.

పాత కాలపు నాటకాలుండేవి, చరిత్ర గ్రంథాలుండేవి, ప్రాచీన కాల్పనిక గాథలు…’ నిరాధారపు ‘ విశ్వాసాలూ ఇతిహాసాలూ పుక్కిటి పురాణాలూ – సాహిత్యపు ఉత్కంఠ అంతా రాసులు గా నివసించేది.  నన్ను మోహ పెట్టిన  ‘ Florentine Nights’ , జడిపించిన  ‘The Tales of Hoffman  ‘ అక్కడ ఎదురు పడ్డాయి. ఇంకో పుస్తకం – దాని పేరు ‘The Amber Witch ‘ . మామూలు గా నేను చదువుకునే fairy tales  లో మంత్రగత్తె కీ ఇందులో witch కీ ఏమీ సంబంధం లేదు – చాలా రోజులపాటు ఆమె ని తలచుకుంటే ఒళ్ళు జలదరించేది.

అన్ని రకాల అక్షర  పదార్థాలతో   కిక్కిరిసిన అల్మైరాలు అవి – ఇరుకు ఇరుకుగా గోడల కి సగం ఎత్తు వరకూ. వాటి మీదని అడ్డదిడ్డంగా పేర్చిన కుప్పలు పై కప్పుని తాకుతుండేవి. నేల మీది దొంతరల పైకి ఎక్కి చూడాల్సి వచ్చేది , కిటికీ అంచుకి బోటు పెట్టినవి ముట్టుకుంటే మీద పడేవి. ఒక లావుపాటి బౌండ్ పుస్తకం ఆకర్షించేది, దాన్ని అందుకునేలోపున మరొక వింత కాలికి తగిలేది. ముందే అనుకుని వెతకబోయినా వేరేవే ఒళ్ళో వాలేవి. అక్కడ – ఆ బుల్లి గదిలోనే – ‘ పుస్తకం ‘ అని పిలవదగిన ప్రతిదాన్నీ చదవటం నేర్చాను –  Charles Lamb లాగా.

The Little Bookroom

నేలమీద కూలబడో బీరువాకి ఆనుకునో – మహా అసౌకర్యపు భంగిమలలో స్తంభించిపోయి,  మైమరచి చదువుకుంటూంటే-  ముక్కుల్లోకీ కళ్ళలోకీ దుమ్ము పోయి దురదలు పెట్టేవి . నిజం కన్నా ఎక్కువ నిజమనిపించే ఆ గంధర్వ ప్రపంచాల లోంచి దిగి వచ్చిన తర్వాత గానీ కాళ్ళూ చేతులూ పట్టేయటమూ గాలి అందని ఉక్కిరి బిక్కిరీ తెలిసేవి కావు. తరచూ వచ్చే గొంతు నొప్పులు ఆ దుమ్ము వల్లనేనేమో అని అనుకోబుద్ధేసేది కాదు.

చీపురో పాతబట్టో పట్టుకుని ఆ గదిలోకి ఏ నౌకరూ అడుగు పెట్టిందే లేదు.  అద్దాల మీదా నేల మీదా అది అతి ప్రాచీనమైన ధూళి. అదే లేక పోతే అసలది ఆ గదే కాదు . అది నక్షత్ర ధూళి, సువర్ణ ధూళి, వృక్షాల ధూళి, భూమి అడుగున ధూళి లోకి చేరిపోయే ధూళి[dust to dust ] , తిరిగి భూమి ఒడిలోంచి పుష్పం గా రత్నం గా విరిసే ధూళి, వెలిగే ధూళి. ఆ నిశ్శబ్దపు ధూళి ని అమెరికన్ కవయిత్రి Emily Dickinson వర్ణించారు –

” ఇది, ఈ శాంత  ధూళి – ఇది స్త్రీలూ పురుషులూ అబ్బాయిలూ అమ్మాయిలూ అందరూ.

ఇది నవ్వులు, సామర్థ్యం, నిట్టూర్పులు – అన్నీ. ”

ఇంగ్లీష్ కవయిత్రి –Viola Meynell , ‘ రహస్యంగా ప్రవేశించి  ముంగిట్లో కమ్ముకున్న ‘  ధూళిని శుభ్రం చేస్తూ చేస్తూ – ఒకింత ఆగి అంటారు ఇలా –

” ఈ ధూళి ని తుడిచేస్తూంటే – పువ్వులని తుడిచేస్తున్నా నేమో, చక్రవర్తులని తుడిచేస్తున్నా నేమో – ఆలయాలనూ కవులనూ నగరాలనూ…”

పుస్తకాల గదిలోంచి మంట పెడుతూన్న కళ్ళతో బయటికి వచ్చాక కూడా ఆ చిత్ర వర్ణాల ధూళి మనస్సులో నర్తిస్తుండేది. ఆ సాలెగూడుల వెండి దారాలు బుద్ధికి పట్టుకునే ఉండేవి. అందుకనే – ఎన్నో ఏళ్ళ తర్వాత , సొంతగా నేను రాయటం మొదలెడితే అది – కల్పనా వాస్తవమూ,  సత్యమూ స్వప్నమూ కలిసిపోయి తయారైందంటే ఏం ఆశ్చర్యం ఉందని ? ఒక దాన్నుంచి మరొకదాన్ని విడదీయటం నాకెప్పుడూ పూర్తిగా సాధ్యం కాలేదు – నా కథలలో.  మాయమైన ఆలయాలూ మహారాజులూ , అందగత్తెల గిరజాలూ పువ్వులూ, పిల్లల నవ్వులూ కావ్యకర్తల నిట్టూర్పులూ – వీరందరి దుమ్మునీ – ఏడుగురు అమ్మాయిలు ఏడేసి చీపురులు చేతబట్టి అర్థ శతాబ్దం పాటు చిమ్మినా నా లోపల అది నశించలేదు. అదృష్టవంతులూ కానివారూ అందరూ – ఏదో ఒక బుల్లి పుస్తకాల గదిలోకి చేరి ధూళి గా మణిగేవారే – ఎప్పుడో ఒక్క లిప్త పాటు , కాంతివంతమవుతారేమో – ఏమో !

*

మీ మాటలు

  1. Rajyalakshmi says:

    “అసలైతే ఇంట్లో ప్రతీ గదీ పుస్తకాలదే – మేడ మీద మా పిల్లల గదుల నిండా పుస్తకాలే. కిందని నాన్న చదువుల గది లోనూ అవే. భోజనాల గది గోడల పొడవునా పుస్తకాలే , అవి పొంగి పొర్లి అమ్మ కూర్చుని కుట్టుపని చేసుకునే గదిలోకీ, పడక గదుల్లోకీ ప్రవహిస్తూనే ఉండేవి.”
    ఇదైతే అచ్చంగా మా ఇల్లే! కుర్చీలూ, బల్లల మీద కూడా పుస్తకాలే.

    “ఆహారం ఎంత సహజమైన అవసరమో , చదవటమూ అంతే. ”
    ఎంత నిజం

    “నేలమీద కూలబడో బీరువాకి ఆనుకునో – మహా అసౌకర్యపు భంగిమలలో స్తంభించిపోయి, మైమరచి చదువుకుంటూంటే – ముక్కుల్లోకీ కళ్ళలోకీ దుమ్ము పోయి దురదలు పెట్టేవి ”
    మా చిన్నప్పుడు మా చిన్నమామయ్య వాళ్ళింట్లో చెక్క partition ఉండేది. దానికి బీటికలు పడ్డాయని ఒక పాత పేపర్ అతికించాడు. అది సరిగ్గా అన్నాలు తినే చోటు. మేము వెళ్ళినప్పుడల్లా దాని దగ్గర కూర్చుని అన్నం తినటం మానేసి చదువుతూ ఉండేవాళ్ళం వెనక్కి గోడవైపుకి తల మాత్రమే తిప్పి – మా అత్తయ్య అలా వంకరగా కూర్చోకండని అరిచినా పట్టించుకోకుండా. మా కోసం మా మామయ్య ఆ పేపర్ని 15/20 రోజులకోసారి మార్చి కొత్తది అతికించేవాడు.

  2. “ఆ చిత్ర వర్ణాల ధూళి మనస్సులో నర్తిస్తుండేది.” నిజమే మైథిలీ, ఎన్నెన్ని ఇంద్రధనుస్సులని నింపుకొని ఉంటాయో చిన్నప్పుడూ, దానికి ఒకటి రెండు మెట్ల పైనా చదివిన పుస్తకాలు.
    “అదృష్టవంతులూ కానివారూ అందరూ – ఏదో ఒక బుల్లి పుస్తకాల గదిలోకి చేరి ధూళి గా మణిగేవారే – ఎప్పుడో ఒక్క లిప్త పాటు , కాంతివంతమవుతారేమో – ఏమో !” అలా ధూళి ధూసరితం కావడం వల్లనే మనసు బహువర్ణితం అయింది. ఇప్పుడు ఆలోచనల పట్టకంద్వారా ఆ వర్ణాలని బయటికి పంపిస్తోంది.
    చక్కటి వ్యాసం, చదివాకా మళ్ళీ ఆ ఇంద్రధనుర్వలోకాల్లోకి మళ్ళీ ప్రయాణం సాగింది.

  3. చొప్ప.వీరభధ్రప్ప says:

    కల్పనా సాహిత్యపు తీరేవేరు.అది ఒక అద్భుత ప్రపంచం .ఆ కథలు చదువు చుంటే ప్రపంచం గుర్తురాదు.బొమ్మలో కనబడు అమ్మాయి అంత శ్రద్ధగా చదువుచుంది.ఏమోగాని ఆ కథలు అంత ఇంటరెష్టుగావుంటాయి. ఆ వయస్సు తోడు అలాంటిదే. ఆయాకథల్లో సాహసాలు గంధర్వ దేవతాలోక ప్రయాణాలు చిన్నతనం గమ్మత్తులగుర్తులు…బాలసాహిత్యం పిల్లలకు చెప్పడం .చదివించడం .చాల మంచిదనిపిస్సుంది. వ్యాసం బాగుంది .ఇంకా వివరణగావ్రాసింటే మరింత ఆనందం.

  4. Mythili Abbaraju says:

    ధన్యవాదాలు…అసలు మన నివాసాలే ఆ ‘ మధుర సుషమా గాన మంజువాటికలు ‘ కదా…

  5. Venkat Suresh says:

    మూడేళ్ళ కిందట, కొత్త ఇల్లు కడుతూ, తాత్కాలికంగా ఒక బాడుగ ఇంట్లో కొన్ని రోజులు ఉండవలసి వచ్చి, షిఫ్టింగ్ అయ్యేప్పుడు పాత సామానులు, అవసరం లేని వస్తువులతో పాటు, ఒక రెండు ట్రంక్ పెట్టెల నిండా ఉండే పుస్తకాలు స్నేహితులకి ఇచ్చేయవలసి వచ్చింది. ఆ పుస్తకాలని ఇచ్చినప్పుడు ఏమీ అనిపించలేదు…. కొత్త ఇంటికి మారిన తరువాత తెలిసింది బాధ… పుస్తకాల కోసం కట్టిన రాక్ చూస్తే కళ్ళల్లో నీళ్లు వచ్చాయి. మీ వ్యాసం గురించి చెప్పే దైర్యం లేదు నాకు. అద్భుతం, అద్భుతం అంతే

    • Mythili Abbaraju says:

      కళ్ళనీళ్ళు…అవును. 13 పెట్టెలు నింపాకా గుండె గట్టి చేసుకోవలసే వచ్చింది మాకు !థాంక్ యూ సురేష్

  6. “ఆ గది కిటికీ లు మూసి బిగించి ఉండేవి . గాజు అద్దాలలోంచి పడుతుండే సూర్యకాంతి తడవకొక్క మారుమూలకి వెలుతురు ఇచ్చేది . పేరుకు పోయి ఉన్న దుమ్ము బంగారపు తునకల్లాగా మిల మిల మనేది. మంత్రపు గవాక్షాలు నాకు తెరుచుకున్నది అక్కడే – అప్పటివీ అక్కడివీ కాని కాలాల్లోకీ దేశాల్లోకీ వాటిలోంచి తొంగి చూశాను- వచనమూ కవిత్వమూ వాస్తవమూ అద్భుతమూ నిండి ఉన్న లోకాల్లోకి.” _/\_ మీరు ఏమి చెప్పినా అలా హత్తుకుపోతుంది, ‘నక్షత్ర ధూళి’అంటుకున్న సంబరం ఇచ్చారు … !! బ్యూటిఫుల్ Mam

  7. Mythili Abbaraju says:

    థాంక్ యూ రేఖా. అవి Ms. Farjeon మాటలే.

  8. ఆర్.దమయంతి. says:

    పుస్తకాల గదిలోంచి నేనూ ఒక రవ్వంత ధూళిని అంటించుకుని బయటకొచ్చినట్టు అనిపించింది.
    ఒక నక్షత్రం నా శిరస్సు మీద మెరుస్తూ అగుపించడంలేదూ!? :-)
    రచనలో మీరు గుమ్మరించే అక్షరాలలోనే ఆ కాంతి ఇమిడివుంటుంది.
    ఏదీ కూడా, ఇది అనువాదమనిపించదు. అదే మీ ప్రత్యేకత.
    చాలా చాలా బావుందండి.
    అభినందనలు.

    • Mythili Abbaraju says:

      అవును,కనిపిస్తోందిగా !! ధన్యవాదాలండీ. :)

మీ మాటలు

*