వాన రాత్రిలో…చీకటి దారిలో…మిగిలిపోయిన పాట…మన్నాడే!

Mannadey

 

మన్నా డే, తొంభై నాలుగేళ్ల పాటు ఒక పరిపూర్ణమైన జీవన యాత్రను కొనసాగించి ఇహలోకాన్ని వదలి వెళ్లి ఒక నెల  పైనే కావస్తోంది. “నాస్తి ఏషాం యశః కాయే, జరామరణజం భయం”, అన్న భర్త్రుహరి సుభాషితం, ఆయన నిష్క్రమణ వార్త వినంగానే, ఒక్క సారి కళ్ళ ముందు మెదిలింది.  భువనచంద్ర గారు ఆయనకి అశ్రునివాళిని ఈ పత్రికలోనే తమ వ్యాసంలో కొద్ది వారాల క్రిత్రమే ఎంతో హృద్యంగా అర్పించారు. దాదాపు అరవై ఏళ్ళ పాటు జరిగిన ఆయన  సంగీత ప్రస్థానంలో ఎన్నో తరాల వాళ్ళు వివిధ దశల్లో ఆయనతో పాటు చేరి ఆ గంగలో అలా పరవశంతో తేలుతూనే ఉన్నారు. నాకు తెలిసిన నా మన్నాడే ని మీతో పంచుకొని ఆయన జీవితాన్నీ, సంగీతాన్నీ కూడా సెలబ్రేట్ చేసుకొందామనే ఈ చిన్ని సాహసం!

ఊహ తెలిసిన దగ్గరనుంచీ కిషోర్ పాటలంటే ప్రాణం. భాష తెలియని రోజుల్లో కూడా హిందీ పాటలను వినాలనిపించేలా చేసిన ఆయన గళమే నాకు మన్నాడేని పరిచయం చేసింది. “షోలే” సినిమాలో ధర్మేంద్ర, అమితాబ్ బచ్చన్లు ఒక వింత స్కూటర్ మీద వెళ్తూ రకరకాలుగా విన్యాసాలు చేస్తూ, “యే…దోస్తీ.. హమ్ నహీ తోడేంగే.. తోడేంగే దం మగర్ తేరా సాథ్ నా ఛోడేంగే” అంటూ వాళ్ళ స్నేహాన్ని మనకు పరిచయం చేస్తారు. హుషారైన కిషోర్ గొంతుతో ధర్మేంద్ర పాడుతూ ఉంటే, అంతే ఉత్సాహంతో అమితాబ్ కి పాడిన ఈ పాట ద్వారానే మన్నాడే పేరు, నాకు తెలిసింది.

మళ్ళీ అమితాబ్ సినిమా జంజీర్ వల్లే, మన్నాడే పాటతో పరిచయం మరికొంత పెరిగింది. అందులో అమితాబ్ పిచ్చ సీరియస్ గా మొహం పెట్టుకొని కూర్చొని ఉంటాడు. పఠాన్ ప్రాణ్, “తేరీ హసీ కీ కీమత్ క్యా హై? యే..బతాదే తూ” అంటూ ప్రశ్నిస్తూ, అమితాబ్ ని నవ్వించటానికి ప్రయత్నం చేస్తూ, “యారీ హై…ఈమాన్ మేరా..యార్ మేరీ జిందగీ” అని పాట పాడతాడు. కొద్దిగా హై పిచ్ లో ఉంటుంది ఆ పాట. అయినా కానీ, మెలోడీ, ఆ గొంతు లోని తియ్యదనం,  ఏ మాత్రం తగ్గకుండా పాడిన మన్నాడే గాత్ర మాధుర్యాన్ని, అతని అద్భుతమైన కళనీ గుర్తించే వయసు కాదది. ఆ పాట అమితాబ్ కోసం పాడిన ప్రాణ్ పాట, అంతే!

రిషీ కపూర్, డింపుల్ కపాడియాల, రోమియో, జూలియాట్ల కథ, రాజ్ కపూర్ “బాబీ” సినిమా. రిషీ, అందులో తన కాబోయే మామగారిని (జాక్ బ్రిగాంజా – ప్రేమ్ నాథ్), తమ ఇంటికి ఆహ్వానించటానికి వచ్చినప్పుడు, ఆత్మాభిమానమే తప్ప మరో ధనం లేని, జాక్, చేతిలో విస్కీ బాటిల్ తో, గోవన్ డాన్సర్ల నేపథ్యంలో, “నా చాహు సోనా చాందీ..నా చాహు హీరా మోతీ…యే మేరే కిస్ కామ్ కే?” అంటూ పాటందుకుంటాడు. అదీ, రిషీ పాట, జాక్ బ్రిగాంజా పాట, లేదా రాజ్ కపూర్ పాట, తెర వెనుక గాత్రం మన్నాడేది.

మరింత ఊహ తెలిసిన తరవాత చూసిన సినిమా “పడోసన్”. కిషోర్ కుమార్ పిచ్చి పీక్స్ లో ఉన్నది కూడా ఆ సమయంలోనే. శాస్త్రీయ సంగీత నేపథ్యం లేకుండా, జన్మతః అబ్బిన ఒక అద్భుతమైన టాలెంట్ గల సింగర్ గా, తన నిజజీవితానికి అతిదగ్గరగా ఉండే పాత్రను, కిషోర్ దా, ఈ సినిమాలో పోషిస్తాడు. “పక్కింటి అమ్మాయి”ని పడవేసే ప్రయత్నంలో సునీల్ దత్ ఉంటే, ఆ అమ్మాయిని తన శాస్తీయ సంగీత విద్వత్తుతో బుట్టలో వేసేసుకుందామనే ఒక తమిళ కమీడియన్ పాత్ర మెహమూద్ ది. సునీల్ దత్ కి పాట రాక పోయినా, కిషోర్ ప్లేబ్యాక్ వాయిస్ తో (లిటరల్ గా), మెహమూద్ తో పోటీకి దిగుతాడు. “ఎక్ చతుర్ నార్ కర్ కే సింగార్” అంటూ సుశాస్తీయంగా మెహమూద్ పాటందుకుంటే, “ఎక్ చతుర్ నార్ బడి హోషియార్” అంటూ కిషోర్ కొంటెగా సమాధానం ఇస్తూ, స్వరాల్ని ఎడా పెదా మార్చేస్తూ, ఆ పాట పోటీలో నెగ్గుతాడు. ఆ పోటీ లో ఓడిన గళం  మన్నాడే దే. ఆ సమయంలో కిషోర్ గెలిచినందుకు ఎంత సంబరపడిపోయానో! అదే పాటని కాలేజి సమయంలో పాడటానికి ప్రయత్నించినప్పుడు తెలిసొచ్చింది, మన్నాడే పాడింది ఎంత కష్టతరమో! ఇప్పటికి కూడా ఆ పాట వినంగానే గుర్తుకొచ్చేది, కిషోర్, మెహమూద్ లే! ఈ సన్నివేశం మొత్తం ఈ క్రింది లింకులో చూడండి, మొత్తం సినిమా చూసేసినట్లే!

మన్నాడే పాటలని చెప్పి, ఆయన్ని వదిలేసి, ఆ సినిమాల గురించీ, సినిమాలో పాటానుసారం పెదాలాడించిన నటుల గురించే ఎక్కువ మాట్లాడేశాను కదా! ఒక “సినీ ప్లే బ్యాక్” సింగర్ అంటే, అసలు సిసలు నిర్వచనం అదేనెమో! ఒక పాట విన్నప్పుడల్లా, అది పాడిన వారు కనుమరుగైపోయి, తెర మీద కనిపించిన వారే కళ్ళెదుట మెదిలితే, అది నిస్సందేహంగా ఆ గాయకుడి ప్రజ్ఞే! తన గొంతుని, తెర పైన కనపడే పాత్ర భావావేశ ప్రకటన చేసే పాటకి  పూర్తిగా అంకితం చేసేసి, తాను కనుమరుగైపోవటం ఒక అత్యుత్తమ స్థాయికి చేరుకొన్న కళకు చిహ్నమేమో కూడా!

నిజానికి, రఫీ, కిషోర్, ముఖేష్, లతా, ఆషా లాంటి మహామహులందరి కంటే వయస్సులో, అనుభవంలో కూడా పెద్దవాడు, మన్నాడే. అందరి కంటే ముందర రంగప్రవేశం చేశారు కూడా. కానీ వాళ్ళ పాటలన్నీ వాళ్ళ పాటల్లానే ఈనాటికీ గుర్తింపబడితే, మన్నాడే పాటల్లో మాత్రం ఆయన “స్టాంపు” వెయ్యకుండా, తన గాత్రాన్ని ఒదిగించటం వల్ల, అవి ఆ సినిమా పాటలు గానో లేక ఆ నటుల పాటలు గానో మాత్రమే ఎక్కువగా జ్ఞాపకం ఉండి పోయాయి.

1919లో కలకత్తా లో జన్మించిన మన్నాడే, 1942 లో బొంబాయి వచ్చి, “తమన్నా” అనే చిత్రం ద్వారా తన సినీసంగీత ప్రస్థానాన్ని ప్రారంభించారు.  2012 వరకూ ఆయన పాడుతూనే ఉన్నారు. అంటే గత డెభ్భై సంవత్సరాలుగా మనకు సినిమా సంగీతంలో తెలిసిన (తెలియని) దాదాపు అందరితోనూ పనిచేసిన అనుభవం ఉంది ఆయనకు. హిందీ లోనే కాకుండా, తన మాతృభాష బెంగాలీలో, భోజపురీ, అస్సామీ, పంజాబీ, మరాఠీ, గుజరాతీ,ఒరియా, సింధీ, నేపాలీ భాషలలో నే కాకుండా, మళయాళంలో కూడా పాటలు పాడారు. ఒక్క హిందీలోనే దాదాపు వందకి పైగా సంగీత దర్శకులకు పాడారు. అనేక చిత్రాలకు సంగీత దర్శకత్వం కూడా చేశారు. 2007 లో భారతదేశపు అత్యుత్తమ సినీ పురస్కారం, దాదా సాహెబ్ ఫాల్కే అవార్డుని అందుకున్నారు.

చిన్నప్పుడు హిందుస్తానీ సంగీతం నేర్చుకొని సినిమా పాటలు పాడటం ప్రారంభించినా, తన శాస్త్రీయ సంగీతాభ్యాసం మరి కొంత కాలం కొనసాగిస్తూనే వచ్చారు. మన్నాడే కి శాస్త్రీయ సంగీతం మీద ఉన్న పట్టు వల్లనే నేమో, “బిజు బావ్రా” సినిమాలో భరత్ భూషణ్కి, మొహమ్మద్ రఫీ కొన్ని అద్భుతమైన పాటలు అప్పటికే పాడి ఉన్నప్పటికీ, “బసంత్ బహార్” సినిమాలో ఒక సన్నివేశానికి మాత్రం, శంకర్ జైకిషన్, మన్నాడే నే ఎన్నుకున్నారు. ఆ సన్నివేశానుసారం, “బసంత్” రాగంలో ఒక విద్వాంసుడు పాట పాడుతూ ఉంటే, హీరో వచ్చి, అదే రాగం అందుకొని, ఆ పాటని కొనసాగించి ఆ విద్వాంసుడిని “ఓడించాలి”. ఆ విద్వాంసుడికి గాత్ర దానం చేసింది మరెవరో కాదు, అప్పటికే, హిందుస్తానీ సంగీత సామ్రాజ్యంలో మకుటం లేని మహారాజులా శోభిల్లుతున్న పండిత్ భీమసేన్ జోషీ. హీరోకి పాడటానికి మన్నాడే ని తీసుకొన్నారు సంగీత దర్శకులు. నిజానికి, అది ఒక పెద్ద దుస్సాహసమే! ఆ పాట రికార్డింగు పూర్తికాంగానే, మన్నాడే తనంతట తానుగా వెళ్లి పండిత్ జీకి పాదాభివందనం చేశారని ఆయనే తరవాత చెప్పుకొన్నారు. “కేతకీ గులాబ్ జుహీ చంపక్ వన ఫూలే” అన్న ఈ పాట అద్భుతః!

అలాగే దర్బారీ కానడ లో సాగే “ఝనక్ ఝనక్ తోరి బాజే పాయలియాన్..” పాట, “మేరే హుజూర్” సినిమా నుంచి. మన్నాడే, మేలోడీని తన తియ్యని గళంతో ఆ పాటంతా నింపి చిరకాలం నిలచిపోయేలా పాడితే, ఆ దర్శకుడు మాత్రం దాన్ని అతి ఘోరంగా చిత్రీకరించారు. హెడ్ఫోన్స్ తగిలించుకొని ఈ పాటని వింటూ మన్నాడే గాన మకరందాన్ని ఆస్వాదించుకోవచ్చు కానీ, కళ్ళు మాత్రం మూసుకోవలసిందే!

హిందుస్తానీ భైరవి (కర్నాటక తోడి) లో సాగే “లాగా చునరీ మే దాగ్..ఛుపావూ కైసే? ఘర్ జావూ కైసే?”, పాట మాత్రం “మన్నాడే పాట”. రాజ్ కపూర్ మారు వేషం వేసి తెర మీద పాడతాడు కాబట్టి, ఈ ఒక్క సారికీ ఇది ఆయన పాట కాకుండా పోయింది. “దిల్ హీ తో హై” సినిమా లోని ఈ పాట, 2113 లో జరగబోయే పాటల పోటీలలో కూడా ఎవరో ఒకరు పాడి తీరతారు, మనమెవ్వరూ చూడటానికి మిగలక పోయినా!

రాజ్ కపూర్ అనంగానే గబుక్కున గుర్తుకొచ్చే గాయకుడు ముకేష్ అయినా, నా కిష్టమైన ఆయన పాటలు మాత్రం ఎక్కువ మన్నాడే వే. “దిల్ కా హాల్ సునే దిల్ వాలా..సీధీసీ బాత్ నా మిర్చి మసాలా..కేహకే రహేగా కేహనేవాలా”, “ముడ్ ముడ్ కే నా దేఖ్” “శ్రీ 420” పాటలు సతతహరితాలైతే, నా అభిప్రాయంలో “డ్యూయెట్ ఆఫ్ ది సెంచరీ”, “ప్యార్ హువా ఇక్రార్ హువా హై” పాటకి ఇచ్చెయ్యచ్చు. కాదంటారా? ఆ పాట ఇక్కడ చూసెయ్యండి, తరవాత చర్చిద్దాం.

అలాగే “చోరీ చోరీ” నుంచి, “యే రాత్ భీగీ భీగీ….”. అవిచి వి. మెయ్యప్పన్ (ఎ.వి.యమ్), ఆ చిత్ర నిర్మాత. ముకేష్ తప్ప వేరెవ్వరూ పాడటానికి వీల్లేదని పంతం పట్టుకు కూర్చున్నారట. సంగీత దర్శకులు శంకర్ జైకిషన్లు, ఎలాగొలా ఒప్పించి మన్నాడే చేతే పాడించారు. ఎ.వి.యమ్ గారు, రికార్డింగ్ అవ్వంగానే ఆనందంతో మన్నాడే ని వాటేసుకున్నారని కథనం. “ఆజా సనమ్..మథుర్ చాందినీ మే హమ్”, అదే సినిమాలోని ఇంకొక మర్చిపోలేని యుగళగీతం.

రాజ్ కపూర్ లాంటి హీరోతో పాటుగా, హిందీలో చెప్పుకోదగ్గ అత్యంత శ్రేష్ఠ క్యారెక్టర్ ఆర్టిస్టులైనటువంటి బల్రాజ్ సహానీ, ప్రాణ్ లకి కూడా అజరామరమైనటువంటి పాటలు ఇచ్చారు మన్నాడే. “కాబులీవాలా” లోని “యే..మేరే ప్యారే వతన్, యే మేరె ఉజ్డే చమన్, తుమ్పే దిల్ ఖుర్బాన్” పాటలో “తూహీ మేరీ ఆర్జూ…తుహీ మేరీ ఆబరూ…” అని వేదనతో నిండిన మేలోడిక్ స్వరం విన్నప్పుడు, ఒక సారి రోమాలు నిక్కపోడుచుకుంటాయి. బల్రాజ్ సహానీ కే, “వక్త్” లో పాడిన “ఎ మేరె జోహ్ర జబీన్..” పాట మాత్రం ఎవరు మరువగలరు?

ప్రాణ్ కి పాడిన “యారీ హై…” పాట గురించి పైన చెప్పుకున్నాం. ప్రాణ్ అనంగానే గుర్తుకొచ్చే మరో “హాంటింగ్ మెలాంకొలిక్ మెలోడీ”,  “ఉప్కార్” చిత్రం నుంచి., “కస్మే వాదే ప్యార్ వఫా సబ్ బాతే హై…బాతోం కా క్యా?”.

డెభ్భైల్లోని సూపర్ స్టార్ రాజేష్ ఖన్నా అనంగానే కిషోర్ కుమార్ గుర్తుకొచ్చేస్తారు. కానీ మన్నాడే కూడా అడపా తడపా రాజేష్ ఖన్నాకి పాడారు. “బావర్చీ” లో శాస్త్రీయంగా సాగే “తుమ్ బిన్ జీవన్ కైసా జీవన్…” చాలా మధురంగా ఉంటుంది.

ఆనంద్ సినిమాలో రాజేష్ ఖన్నా కోసం పాడిన “జిందగీ కైసీ యే హాయే పహేలీ హాయే..” పాట లోని లిరిక్స్ ఇలా ఉంటాయి.

“జిన్హోంనే సజాయే యహా మేలే … సుఖ్ దుఖ్ సంగ్ సంగ్ ఝేలే

వోహి చునకర్ ఖామోషీ…యూ చలే జాయే అకేలే కహా?”

మన్నాడే మౌనంగా ఒక్కరే ఏదో లోకాలకి వెళ్లిపోయి ఉండచ్చు, వారి సంగీత సంపద మాత్రం తరతరాలకీ తరగని విధంగా మనకి వదిలేశారు. మరిక బాధేల మిత్రమా?

“దునియా మే ఖుష్ రెహనా హోతో మానో మన్నాడే కీ బాత్”
“ఆవో ట్విస్ట్ కరే… జగ్ ఉఠా మౌసమ్!”

-శివ సోమయాజులు

Siva

 

కలలకే కలవరింతలు,రాగాలకే పులకింతలు!

Ramesh+Naidu+1292932446

“మురళీధరుడైన రాముడు, కోదండధరుడైన కృష్ణుడు, చక్రధరుడైన శివుడు, చంద్రధరుడైన విష్ణువు, బుధ్ధుడి సౌందర్య లహరి, ఆదిశంకరుడి ధర్మపథం, ఈక్వేటర్ లో హిమాలయాలు, ఉత్తర ధృవంలో హిందూ మహాసముద్రం – ఇవి కలుసుకొనే తీరాలు. కలలకే స్వప్నాలు – ఒక్క ముక్కలో చెప్పాలంటే అదృశ్యాలు, అసాధ్యాలు, కల్పనా బలం కొ్ద్దీ తలపెట్టే అఘాయిత్యాలు.

అయినా ఇవి సాధ్యాలే. కల్పనలు కూడా సత్యాలే. అటువంటి అభూతకల్పన అక్షరసత్యంగా మారిన అపురూప సంఘటన పేరే రమేష్ నాయుడు. ”

ఇవి రమేష్ నాయుడు  గురించి, వేటూరి తను రచించిన ” కొమ్మకొమ్మకో సన్నాయి ” పుస్తకంలో రాసిన పరిచయవాక్యాలు. ఇంతకు మించిన అతిశయోక్తులతో రమేష్ నాయుడు గారిని పొగడటం అసాధ్యమేనేమో!

వేటూరి తన పుస్తకంలో ఎవ్వరికీ ఇవ్వనంత గౌరవం రమేష్ గారికి ఇస్తూ రెండు అధ్యాయాలు ఆయనకి కేటాయించారు. కానీ నాకు మాత్రం, రమేష్ నాయుడు, అనంగానే గబుక్కున గుర్తుకొచ్చే కవి, డా.సి.నారాయణ రెడ్డి గారే.

రమేష్ నాయుడు యాభైల్లో, అరవైల్లో అడపా దడపా తెలుగు సినిమాలకి సంగీతం సమకూర్చినా, డెభ్భై రెండులో, “అమ్మ మాట”, “తాతా మనవడు” చిత్రాలకి సంగీతం అందించటం ద్వారా పునఃప్రవేశం చేశారు.

“అమ్మ మాట” లో, “మాయదారి సిన్నోడు నా మనసే లాగేసిండు” అని సినారె మొదలెడితే, “లగ్గమెప్పుడ్రా మావా అంటే మాఘ మాసం  ఎళ్ళేదాకా మంచి రోజు లేదన్నాడే” అంటూ రమేష్ గారు పూర్తి చేసారని భోగట్టా. యల్.ఆర్. ఈశ్వరి గొంతులో ఈ ‘ఐటం సాంగు’ గత నలభై ఏళ్లుగా ఎక్కడో ఒక చోట వినబడుతూనే ఉంది. ఈ బాణీని, ఈ పాటలోని కొన్ని పంక్తులనీ యధాతధంగా ‘దేవదాసు’ (2005) లో మళ్ళీ వాడుకున్నారు.

రమేష్ నాయుడు అనంగానే, సి.నా.రె గుర్తుకు రావటానికి ఈ పాట కారణం అనుకొనేరు. వారివురి కలయిక దీనితో ప్రారంభమైనా, ఆ తరువాత వీరు మన తెలుగు సినీ కవిత్వంలో కలకాలం గుర్తుండిపోయే సాహితీ సృష్టి జరిపారు.

“జనకుని కొలువున అల్లన సాగే జగన్మోహినీ జానకీ

వేణుధరుని రథమారోహించిన విదుషీమణి రుక్మిణీ

రాశీకృత నవరసమయ జీవన రాగచంద్రికా
లలిత లావణ్య భయద సౌందర్య కలిత చండికా”

అంటూ ఒప్పెనలా పొంగుతున్న మోహావేశాన్ని ఒక ప్రియుడు తన నాయిక కోసం వ్యక్తపరచినా

“ఏ ఫలమాశించి మత్త కోకిల ఎలుగెత్తి పాడును
ఏ వెల ఆశించి పూసే పువ్వు తావి విరజిమ్మును
అవధిలేని ప్రతి అనుభూతికి ఆత్మానందమే పరమార్ధం

లలిత కళారాధనలో వెలిగే చిరుదివ్వెను నేను
మధుర భారతి పద సన్నిధిలో
ఒదిగే తొలి పువ్వును నేను”

అంటూ ఒక కళాపిపాసి లలితకళలకు నివాళులర్పించినా

“సరళ తరళ నీహార యవనికల .. మెరిసే సూర్య కళికా

మృదుల మృదుల నవ పవన వీచికల … కదిలే మదన లతికా

నీ లలిత చరణ పల్లవ చుంబనమున  పులకించును వసుధ జయసుధా…
ప్రణయ కావ్యమున ప్రథమ పంక్తివో .. ప్రణయ భావనకు ప్రథమ మూర్తివో

ప్రణయ గగనమున ప్రథమ రేఖవో … రేఖవో శశిరేఖవో సుధవో జయసుధవో”

అంటూ తన ప్రేయసికి తాను చెప్పేది అర్థం అవుతోందా లేదా అన్న ధ్యాస లేకుండా ఓ ప్రియుడు తన చెలిని వర్ణించినా,

ఆ ఘనత, కవి గారితో పాటు రమేష్ నాయుడు గారికి కూడా చెందుతుంది. అంత చిక్కని సాహిత్యం పది మందికీ చేరిందీ అంటే, రాసిన ఆ క్లిష్ఠతరమైన పంక్తులకు ఒక సులువైన బాణీ కట్టటం నుంచీ, వాయిద్యపు హోరు ఆ పదధ్వనులను కప్పేయకుండా చూసుకోవటం, దానికి తోడు, శాస్త్రీయ సంగీత రాగాలలోనే నిబద్ధతతో స్వరపరచటం వరకూ, రమేష్ నాయుడు చూపించిన అసమాన ప్రతిభే కారణం.

అదే సి.నా.రె కవిత్వం, “ఆడవే మయూరి” పాటలో ఆ కట్టిన బాణీ (‘మామ’కి క్షమాపణలతో) వల్లనో, లేక ఆది పాడిన విధానం వల్లనో, అంతగా ఆస్వాదించలేమనిపిస్తుంది.

శాస్త్రీయ రాగాలు, వాయిద్యాల మాట వచ్చింది కాబట్టి ఇక్కడ రమేష్ నాయుడి గారి బాల్యకౌమార్యాల గురించి కొంత ప్రస్తావించుకోవాలి. 1933లో కృష్ణా జిల్లా కొండపల్లిలో జన్మించిన రమేష్ నాయుడు చిన్న వయసు లోనే బొంబాయి కి పారిపోయి అక్కడ ఒక వాయిద్యాలు అమ్మే దుకాణంలో ఎన్నో సంవత్సరాలు పని చేసి, యుక్త వయసులోనే బెంగాలీ, మరాఠీ, హిందీ భాషలలో సినిమాలకి సంగీతాన్ని అందించారు.
ఆ వాయిద్యాల దుకాణంలో పని చేసిన అనుభవం వల్లనే నేమో, వాటిని ఎంతో సంయమనంతో, చాలా పొదుపుగా వాడేవారు, తన పాటల్లో. అలాగే, శాస్త్రీయ సంగీతం ఏ గురువు దగ్గరా నేర్చుకోకపోవటంవల్ల, ఆ రాగాలు వాడినప్పుడు ఎక్కువ ప్రయోగాలు చెయ్యకుండా, ఎంతో నిబద్ధతతో బాణీలు కట్టేవారు.  “ఎక్ తారా” ని ముఖ్య వాయిద్యంగా  ఉపయోగించి, కల్యాణి లో కట్టిన “జోరు మీదున్నావు తుమ్మెదా” పాట అజరామరం.

ఆయనకి కల్యాణి చాలా ఇష్టమైన రాగాల్లో ఒకటనుకుంటాను. పైన చెప్పుకున్న సినారె పాటల్లో “లలిత కళారాధనలో”, “ప్రణయ కావ్యమున”, ఈ రాగంలో కట్టినవే.

వేటూరితో చేసిన పాటల దగ్గర కొచ్చేసరికి ఒక చిన్న పక్క దోవ పట్టి నా అనుభవం ఒకటి చెప్పుకోవాలి. నాగార్జున సాగర్ లో, ప్రభుత్వ రెసిడెన్షియల్ కాలేజీలో ఇంటర్ చదువుతున్న రోజులవి. శనివారం రాత్రి టి.వి. లో వచ్చే తెలుగు సినిమా కోసం చాలా మంది వేచి చూసే వాళ్ళం. ఓ శనివారం “సువర్ణ సుందరి” అని సినిమా మొదలయ్యింది. చంద్రమోహన్ హీరో. కలలో ఎవరో సుందరి కనపడుతుంది. హీరో కవిత్వం చెప్పేస్తూ ఉంటాడు. హాలు మొత్తం ఖాళీ! నేను, నా మిత్రుడు ఒక్కడు మాత్రమే మిగిలాం. ఆ వయస్సుకి, ఆ కథా, కవి అయిన ఆ హీరో చెప్పే కవిత్వం అద్భుతంగా అనిపించాయి. ఇద్దరం సినిమా పూర్తయ్యే దాకా అస్సలు కదలలేదు.

ఆ తరువాత ఎన్నో ఏళ్ళకి గానీ  అది హిందీ సినిమా “నవరంగ్” కి రీమేక్, ఆ సినిమాలో మా ఇద్దరినీ కట్టి పడేసిన కవిత్వం వేటూరిదీ, సంగీతం రమేష్ నాయుడిదీ, అని తెలిసిరాలేదు. ఎక్కువగా ప్రాచుర్యం పొందక పోయినా కానీ, ఆ సినిమా పాటలు అలా గుర్తుండి పోయాయి.

“ఇది నా జీవితాలాపనా…ప్రియదేవతాన్వేషణా
ఏమైనదో? ఎట దాగున్నదో! ఎన్నాళ్ళు ఈ వేదనా…?”

“ఊహవో ఊపిరివో..నా జీవన రసమాధురివో

వివర్ణమైన ఆశల ముంగిట..సువర్ణసుందరివో”

“మధువనాంతముల  మరు  వసంతములు  చిరు లతాంతములు వెదజల్లగా

దశ దిశాంతముల జత శకుంతములు గల  మరందములు ఎద జల్లగా”

వేటూరి ముందరే సమకూర్చిన స్టాకు బాణీల్లో పదాలు ఇరికించే కష్టం లేకుండా స్వేచ్చగా తన కలాన్ని కదిపితే ఎలా పాటలు వ్రాయగలరో ఈ సినిమాలోని పాటలే ఒక నిదర్శనం. ఇవి వినదలుచుకున్న వాళ్ళు ఈ క్రింది లింకులో ఆ పాటలు వినచ్చు.
http://www.allbestsongs.com/telugu_songs/Search-Telugu-Movie-Songs.php?st=suvarna+sundari&sa=Go%21

డెభ్భైల తరవాత వచ్చిన సంగీత దర్శకులలో, కవి పాటను వ్రాసిన తరవాతే బాణీలు కట్టిన సంగీత దర్శకుడు, బహుశా రమేష్ నాయుడు ఒక్కళ్ళేనేమో! వేటూరికి అందువల్లనే రమేష్ నాయుడు అంత ప్రీతిపాత్రుడయ్యాడని నా అనుమానం.

“నవమి నాటి వెన్నెల నేను ..దశమి నాటి జాబిలి నీవు..
కలుసుకున్న ప్రతి రేయి.. కార్తీక పున్నమి రేయి..”

“మెరుపులా మెరిశావు… వలపులా కలిసావు

కనులు మూసి తెరిచేలోగా..నిన్నలలో నిలిచావూ… నిన్నలలో నిలిచావూ”

“సిగ్గూ పూబంతీ యిసిరే సీతా మాలచ్చీ
మొగ్గ సింగారం ఇరిసే సుదతీ మీనాచ్చీ”

లాంటి మరవలేని పాటలెన్నో రమేష్ నాయుడు, వేటూరి కాంబినేషన్ లో వచ్చాయి.

రమేష్ నాయుడు సంగీతం సమకూర్చిన మొత్తం తెలుగు సినిమాలు వందకి మించవు. దానికి ఆయన పనిచేసిన విధానం ఒక కారణమేమో. రోజుకి అయిదారు పాటలు అవలీలగా “కొట్టి పారేసే” దిగద్దర్శకులున్నప్పుడు, వాళ్ళు కొట్టిన బాణీలకి అర్థం పర్థం లేకపోయినా, అర్థమేదో ఉన్నట్టుగానే ఉంది, అనిపించేటటువంటి కొత్త కొత్త  పద ప్రయోగాలు చేసి అంతే స్పీడులో పాట రాసి పారేసేందుకు సిద్ధమైన కవికోవుదులున్న వాతావరణంలో, రమేష్ నాయుడు చాదస్తం మనిషే!

రమేష్ నాయుడు బాణీ కట్టాలంటే ఆయనకి ఆ పాట సందర్భం, పాత్రల స్వభావం లాంటి వివరాలే కాకుండా, ఆ పాట పంక్తులు కూడా అతడికి స్పూర్తి నిచ్చేవి లాగా ఉండాలి. ఇన్ని సమకూరితే కానీ ఆయన బాణీ కట్టడానికి కూర్చోనే వాడు కాడట.

ఆయన ఆచారాలకి అలవాటు పడ్డ దర్శకులు మటుకూ ఆయనతోనే తమ సినిమాలకు సంగీతం చేయించేవారు. దాసరి నారాయణరావు గారు, తన తొలి చిత్రం “తాతా మనవడు” సినిమాతో మొదలైన రమేష్ నాయుడి సంగీత సాంగత్యాన్ని, తను నిర్మించిన దాదాపు అన్ని సినిమాలలోనూ కొనసాగించారు.

“అనుబంధం ఆత్మీయత అంటా ఒక బూటకం..

ఆత్మ తృప్తికై మనుషులు ఆడుకొనే నాటకం”

ఈ సినిమాలోని ఇప్పటికీ ప్రాచుర్యంలో ఉన్న పాట. దీని తరువాత వరుసగా “సంసారం సాగరం”, “బంట్రోతు భార్య”, “తూర్పు పడమర”, “రాధమ్మ పెళ్లి”,  “జయసుధ”, “శివరంజని”, “చిల్లరకొట్టు చిట్టెమ్మ”, “సుజాత” వీరిద్దరి కాంబినేషన్ లో వచ్చాయి.

Megha_Sandesham

“మేఘసందేశం” సినిమాతో తో వీరిద్దరూ తమ తమ కేరియర్స్ లోని శిఖరాగ్రాలకి చేరుకొన్నారు. ఇద్దరూ జాతీయ అవార్డులను అందుకొన్నారు. తెలుగు సినీ సంగీత చరిత్రలో ఈ రోజుకి కూడా జాతీయ అవార్డును గెలుచుకొన్న ఏకైక తెలుగు సంగీత దర్శకుడు రమేష్ నాయుడు (మామ, రాజాలకు తెలుగు సినిమాలకు అవార్డులు వచ్చినా, వారు తెలుగు వారు కారు).

దేవులపల్లి భావకవిత్వ ప్రేరణతో రమేష్ నాయుడు కట్టిన ఈ బాణీ కొన్ని శతాబ్దాలు నిలుస్తుందనటం అతిశయోక్తి కాదు.

“తరులెక్కి ఎలనీలి గిరినెక్కి మెలమెల్ల… చదలెక్కి జలదంపు నీలంపు నిగ్గునై

ఆకలా దాహమా చింతలా వంతలా… ఈ కరణి వెర్రినై ఏకతమా తిరుగాడ

ఈ అడవి దాగిపోనా ఎటులైనా ఇచటనే ఆగిపోనా..

ఆకులో ఆకునై, పూవులో పూవునై… కొమ్మలో కొమ్మనై నునులేత రెమ్మనై

ఈ అడవి దాగిపోనా ఎటులైనా ఇచటనే ఆగిపోనా”

http://www.youtube.com/watch?v=xBh2z9CWhkM

 

జయదేవుని అష్టపదులు “ప్రియే చారుశీలే”, “రాధికా, కృష్ణా రాధికా”, వేటూరి, “నిన్నటి దాకా శిలనైనా”, “పాడనా వాణి కల్యాణిగా”, ఇక దేవులపల్లి పద్యాలూ, పాటలూ, వెరసి, తెలుగు సినీ సంగీతంలో ఒక మైలురాయి, ఈ సినిమా సంగీతం!

రమేష్ నాయుడి చెయ్యి విడువక నడచిన దర్శకులలో దాసరి తరవాత చెప్పుకోవలసిన వారు విజయనిర్మల. వారి కాంబినేషన్ లో కూడా ఎన్నో సినిమాలు, గుర్తుండి పోయే పాటలు.
నాకు అన్నిటి లోకి ఇష్టమైన పాట “మీనా” చిత్రంలోని “శ్రీరామ నామాలు శత కోటి, ఒక్కొక్క పేరూ, బహుతీపి”. ఆ నామాల్లోని తియ్యదనం రామభక్తులకే అనుభవసాధ్యమేమో కానీ, ఆ పాటలోని రమేష్ నాయుడు గారు జొప్పించిన తియ్యదనం, నిస్సందేహంగా అందరూ ఆస్వాదించవచ్చు.  “మల్లె తీగ వంటిది మగువ జీవితం..”, “పెళ్ళంటే నూరేళ్ళ పంట” అదే సినిమాలో  ఆ రోజుల్లో బహుళ ప్రాచుర్యం పొందిన పాటలు.

వీరిరువురి కాంబినేషన్ లో “ఈ కాలం పది కాలాలు బ్రతకాలనీ…” (దేవుడే గెలిచాడు), “అరవైలో ఇరవై వచ్చిందీ..” (భోగిమంటలు), “ఏ ఊరు, ఏ వాడ అందగాడా, మా ఊరు వచ్చావు సందకాడ” (హేమాహేమీలు) లాంటి కొన్ని గుర్తుపెట్టుకోదగ్గ పాటలతో బాటు,  కొన్ని మర్చిపోదగ్గ ఫక్తు కమర్షియల్ బీట్ పాటలూ ఉన్నాయి.

ఆయన ఘన విజయాలతో పాటు కొన్ని అపజయాల గురించి కూడా చెప్పుకోవాలి. విజయనిర్మల, రమేష్ నాయుడు కాంబినేషన్ లో వచ్చిన “స్పెక్టాక్యులర్ ఫైల్యూర్”, “దేవదాసు”. నిజానికి “సుబ్బరామన్-ఘంటసాల-సముద్రాల” పాత దేవదాసు పాటలు మన మనస్సులో ఎంతగానో అల్లుకుపోయిన నేపథ్యంలో, మళ్ళీ ఆ సినిమా రీమేక్ చేయ్యలనుకోవటం, దానికి రమేష్ నాయుడు సంగీతం అందించటం, ఒక పెద్ద దుస్సాహసం.

ఓ “పల్లెకు పోదాం పారును చూదాం చలో చలో..” పాటని ఎంత “మేఘాల మీద సాగాలి” అనిపించినా అందుకోవటం సాధ్యమా! ఈ సినిమా పాటల పైన ఇంకా అంత కంటే పునరావలోకనం అనవసరం.

విజయనిర్మల తరవాత, జంధ్యాల రమేష్ నాయుడు గారితో కలిసి పనిచేసి మరి కొన్ని ఆణిముత్యాలు అందించారు.

Mudha-Mandharam

“ముద్దుకే ముద్దొచ్చే మందారం ముద్ద మందారం…” అంటూ 1981 లో మొదలైన వీరి సాహచర్యం, రమేష్ నాయడు 1987లో తుది శ్వాస తీసుకొనే వరకూ కొనసాగింది.  “అలివేణీ ఆణిముత్యమా..”, “నా షోలాపూరు చెప్పులు పెళ్ళిలో పోయాయి” పాటలు కూడా వారి తొలి చిత్రం (కాంబినేషన్ లో)  “ముద్దమందారం” లోనివే.

“మల్లెపందిరి” కింద  “ఓ సతీ నా గతీ.. ఓహో నా శ్రీమతీ ఆహా సౌభాగ్యవతీ” అంటూ, “రెండు జళ్ళ సీత” తో  “కొబ్బరి నీళ్ళ జలకాలాడి”, “తొలి సారి మిమ్మల్ని చూసింది మొదలు..” అంటూ “శ్రీవారికి ప్రేమ లేఖ”  వ్రాసి, కొన్ని మధుర జ్ఞాపకాలు మిగిల్చారు.

“మనసా త్రుళ్ళి పడకే..అతిగా ఆశ పడకే

అతడికి నీవు నచ్చావో లేదో..ఆ శుభ ఘడియ వచ్చెనో రాదో

తొందర పడితే అలుసే తెలుసా.. మనసా త్రుళ్ళి పడకే”

పెళ్లి చూపుల తరువాత, రిజల్టు కోసం ఎదురు చూసే ఆ కన్నె మనసుని వేటూరి ఎంత అందంగా వర్ణించారో, అంత సున్నితంగానూ, రమేష్ నాయుడు దానికి బాణీ కట్టారు. పూర్తి తెలుగుదనం ఉట్టి పడే పాట ఇది.
http://www.youtube.com/watch?v=7_YMMsNXNl4

Srivariki Premalekha

 

“మేఘసందేశానికి” తన  సంగీతాన్ని జతచేసి ఉన్నత శిఖరాలను అధిరోహించి ఉన్న రమేష్ నాయుడు ఆనందభైరవి తో తన స్థానాన్ని అక్కడే పదిలం చేసుకున్నాడు.

అమృతవర్షిణి రాగంలో కట్టిన “చైత్రము కుసుమాంజలి” పాట, నాకు ఆ సినిమా పాటలన్నిటిలోకీ ఇష్టమైన పాట. ఆ పాట సాహిత్యం వేటూరి రాగ జ్ఞానానికి కూడా ఒక ప్రతీక. ఆ రాగంలోని స్వరాలనే పాట సాహిత్యంలో జొప్పించి చక్కటి ప్రయోగం చేశారు.

“పిలిచిన మురళికి వలచిన మువ్వకి ఎదలో ఒకటే రాగం..”,  “బ్రహ్మాంజలీ..”, “కొలువైతివా రంగశాయి” లాంటి పాటల సృష్టీ ఈ సినిమాలోనే జరిగింది. కానీ 1983 తెలుగు సినీసంగీతంలో ఒక స్వర్ణ సంవత్సరం. “సాగర సంగమం”, “మేఘసందేశం” కూడా అదే సంవత్సరం లో విడుదల అవ్వటంతో, ఈ సినిమా పాటలకి దక్కాల్సిన అవార్డులు దక్కలేదేమోననిపిస్తుంది.

రమేష్ నాయుడు గారి ఆఖరి సినిమా, “స్వయంకృషి”. ఆ సినిమా విడుదల ఒక్క రోజు ముందు ఆయన దివంగతులయ్యారు. అందులోని ప్రతి పాటా బాగుంటుంది. “పారా హుషార్”, “హల్లో హల్లో డార్లింగ్…” లాంటి సరదా పాటలతో పాటు ““సిన్నీ సిన్నీ కోరికలడగ” వంటి కలకాలం నిలిచిపోయే పాటలూ ఉన్నాయి.

రమేష్ నాయుడు, “కల్యాణి” రాగం చాలా విరివిగా వాడారని ముందర చెప్పుకున్నాం. పైన ప్రస్తావించిన చాలా పాటలు ఈ రాగం లోనివే. అయితే “శివరంజని”లో కూడా చాలా చక్కని పాటలు కట్టారు. “శివరంజనీ, నవరాగిణీ”, అని “తూర్పు పడమర” చిత్రం లో కడితే, “అభినవ తారవో.. నా అభిమాన తారవో” అంటూ “శివరంజని” సినిమాలో ఆ రాగాన్ని వాడారు.

అదే రాగానికి, జేసుదాసు గాత్రం, వేటూరి సాహిత్యం కలిసినప్పుడు, రమేష్ నాయుడు కట్టిన బాణీకి, ఆయనకూ, జేసుదాసుకూ కూడా నేషనల్ అవార్డులొచ్చాయి. ఆ “ఆకాశ దేశాన మెరిసేటి మేఘం” పసుపులేటి రమేష్ నాయుడు నేడు మన మధ్య లేకపోయినా, ఆయన కట్టిన స్వరహారాలు, స్వయంప్రకాశంతో ఎప్పటికీ మెరుస్తూనే ఉంటాయి!

http://www.youtube.com/watch?v=59h1_ZDnfcA

వేటూరి పరిచయవాక్యాలతో ప్రారంభించిన ఈ వ్యాసాన్ని,  ఆయన రమేష్ నాయుడుకి నివాళులర్పిస్తూ రాసిన చివరి మాటలతోనే ముగిస్తాను.

“నేను ఆర్జించుకున్న ఆప్తమిత్రుడు ఆయన. ఆయన భౌతికంగా దురమయ్యాక నేను ఆయనకు రాసిన పడవ పాటలోని ఈ చరణం ఆయనకు గుర్తుగా మిగిలిపోయింది.

ఏటి పాప శాపమ్మ ఎగసి.. తాను సూసింది
ఏడి నావోడంటే ఏటిలోన మునిగింది

శాప మునిగిన కాడ శతకోటి సున్నాలు

శాపమైన గుండెలోని సెప్పలేని సుడిగుండాలు

ఏరెల్లిపోతున్నా నీరుండి పోనాది
నీటిమీద రాతరాసి నావెల్లిపోనాది”

 

(కృతజ్ఞతలు: ఉమా ఏలూరి. అడగంగానే, అర్థరాత్రి, “కొమ్మ కొమ్మకో సన్నాయి” పుస్తకం లోని, రమేష్ నాయుడి అధ్యాయాలని, ఓపిగ్గా తన సెల్ ఫోన్ తో ఫోటోలు తీసి పంపించినందుకు.)

Siva_336x190_scaled_cropp –యాజి

 

కల తెగిపోతే…అల ఆగిపోతే..అది సాహిర్ పాట!

sahir11

“కహా హైన్? కహా హైన్? ముహాఫిజ్ ఖుదీకే….జిన్హే నాజ్ హై హింద్ పర్ ఓ కహా హైన్?”

“తూ హిందు బనేగా న ముస్సల్మాన్ బనేగా..ఇన్సాన్ కి ఔలాద్ హై ఇన్సాన్ బనేగా!”

“దేఖ్ తేరే భగవాన్ కి హాలత్ క్యా హోగయా ఇన్సాన్…కిత్నా బదల్ గయా భగవాన్!”

ఇవి సాహిర్ లుధియాన్వి కలంలోంచి ఆవేదన తో మిళితమైన ఆవేశంతో తన్నుకు వచ్చిన కొన్ని కవిత్వపు తునకలు. మనలో నిస్తేజంగా పడిఉన్న అంతరంగాన్ని కొట్టి లేపే కొన్ని పదునైన పదశరాలు. తెలుగు వారికి పెద్దగా పరిచితమైన పేరు కాదు కనక సాహిర్ గారి గురించి క్లుప్తంగా చెప్పుకొని ముందుకు సాగుదాం. అబ్దుల్ హాయి గా లుధియానా (పంజాబ్) లో 1921 లో ఒక జమీందారి వంశంలో జన్మించిన సాహిర్, తన చిన్నతనంలోనే తల్లి తండ్రులు విడిపోయి, తన తల్లితో పెరగడం వల్ల, కటిక దారిద్ర్యాన్ని అనుభవించాడు. లాహోర్ లో కొద్ది కాలం ఒక పత్రిక నడిపి, అతని రాతల కారణంగా అరెస్టు వారెంట్ జారీ అవ్వటంతో, బొంబాయి చేరుకొన్నాడు. తరవాత ముఫ్ఫై సంవత్సరాల పాటు, ఏడు వందల పై చిలుకు సినిమా పాటలు, ఉర్దూ కవితా సంపుటాలు వ్రాసుకుంటూ, హిందీ సినిమా పాటలకి ఉచ్ఛస్థాయి కవిత్వస్థానం కలగజేస్తూ, సాటి లేని కవిగా తన పేరుని ఎవ్వరూ చెరపలేని విధంగా ముద్రించుకొని  1980లో మనలోకం వదిలేశారు.

నిజానికి సాహిర్ లుధియాన్వి వ్రాసిన పాటలు చిన్నపడినుంచి వింటూ పెరిగినా, ఒక కవిగా ఆయన పట్ల ఆసక్తి,  ఆయన శైలి పట్ల అభిమానం పెరగటం మాత్రం కొద్ది కాలం క్రితం జరిగిన విశేషమే!  షుమారు ఒక పదిహేనేళ్ళ క్రితం నేనూ, మా ఆవిడ కలిసి చికాగో నుంచి కాలిఫోర్నియాకి వెకేషన్ మీద వెళ్ళినప్పుడు రూట్ 1 లో  శాన్ఫ్రాన్సిస్కో  నుంచి లాస్ ఏంజిలీస్ వరకూ డ్రైవ్ చేసుకెల్దామని డిసైడ్ అయ్యాం. ఈ రోడ్డు పసిఫిక్ కోస్టంబడి ఒక వైపు ఎత్తైన కొండలతో, మరొక వైపు అందమైన సముద్రపు అలల మధ్యన సాగుతూ, అమెరికా లోని టాప్ త్రీ సీనిక్ డ్రైవుల్లో ఒకటిగా పేరు తెచ్చుకొంది. నా మిత్రుడు దారిలో వినటానికని “The Genius of Sahir Ludhianvi” అని ఒక సి.డి ఇచ్చాడు.

“జాయే తో జాయే కహా..”, “వో సుబహ కభీ తో ఆయేగీ”, “యే దునియా అగర్ మిల్ భి జాయే తో క్యా హైన్?”, “ప్యార్ పర్ బస్ తో నహీ హై మేరా లేకిన్ ఫిర్ భీ”, “ఔరత్ నే జనమ్ దియా మర్దోంకో…ఔర్ మర్దోంనె ఉసె బాజార్ దియా!” అంటూ ఒకదాని తరువాత మరొక “ఏడుపుగొట్టు పాటలు” కారంతా వ్యాపించాయి. ఒక పక్కనేమో కళ్ళు తిప్పుకోలేని ప్రకృతి సౌందర్యం, అటూ ఇటూ చూస్తూ డ్రైవ్ చేస్తున్నందుకు నాకు సన్నగా మందలింపు, మధ్యలో ఈ పాటలు! వాల్యూం తక్కువ చేసి, మా ఫ్రెండుని తిట్టుకుంటూ కొంత దూరం ప్రయాణం చేశాం.  ఇంతకు ముందు ఎప్పుడూ వినని గొంతుతో ఒక పాట మొదలయ్యింది.

“తు ముఝే భూల్ భి జావో తో యే హక్ హై తుమకో…మేరీ బాత్ ఔర్ హై మైనే తో ముహౌబ్బత్ కీ హై!” విన్నది నిజమా కాదా అని నిర్ధారించుకోటానికి వాల్యూం పెంచాను. అనుమానం లేదు, విన్నది కరక్టే! ప్రతిపదానువాదంలో (కవితానువాదం చేసే సాహసం చెయ్యలేను) ఇది, “నన్ను మర్చిపోటానికి నీకు హక్కుంది…నా విషయం వేరు, నేను ప్రేమించాను కదా(నిన్ను)!” ఆ లాజిక్ చాలా ఆసక్తి కరంగా అనిపించింది.

http://www.youtube.com/watch?v=dJAIEEwHTqU

“మేరె దిల్ కి మేరె జస్బాత్ కి కీమత్ క్యా హై (నా హృదయానికీ, భావావేశానికీ, విలువేముంది?)
ఉల్ఝి ఉల్ఝి సి ఖయాలత్ కి కీమత్ క్యా హై (నా క్లిష్ఠమైన ఆలోచనలకి విలువేముంది?)
మైనే క్యోం ప్యార్ కియా..తుమ్ నే న క్యోం ప్యార్ కియా (నేనెందుకు ప్రేమించాను..నువ్వెందుకు ప్రేమించలేదు?)
ఇన్ పరేషాన్ సవాలాత్ కి కీమత్ క్యా హైన్? (ఇలాంటి ఇబ్బంది పెట్టే ప్రశ్నలకు విలువేముంది?)
….
మై తుమ్హారీ హు..యాహి మేరె లియే క్యా కమ్ హై? (నేను నీదానాను…ఇది చాలదా నాకు?)

తుమ్ మేరే హో కే రహో..యే మేరి కిస్మత్ న సహి” (నువ్వు నావాడుగా ఉండటం…నా తలరాతలో లేనప్పటికీ)

ఈ పాట ప్రేయసీ ప్రియుల మధ్య ఒక సంభాషణ లాగా సాగుతుంది. ఒక రోమాన్స్ డ్యూయెట్ లో ఇంత వింత లాజిక్ కనిపించటం మొదటిసారి అవ్వటం వల్లనేమో, ఆ తరవాత వచ్చే ప్రతి పాట లిరిక్స్ నూ చెవులు రిక్కించి వినటం ప్రారంభించాం. ఆ పైన రూట్ 1 సౌందర్యం కూడా మా ధ్యానాన్ని ఆ పాటల పైనుంచి మరల్చలేకపోయింధి. వెకేషన్ అయిపోయిన తరువాత సాహిర్ పైన రిసెర్చ్ చేసి ఆయన పాటలన్నీ జాగర్తగా పరిశీలించటం ప్రారంభించాను. ఒక సముద్రం లోకి దూకాననిపించింది, అదీ ఈత రాకుండా! ఆయన పాటలలో ఉర్దూ పదాలు చాలా విరివిగా దొర్లుతాయి. ఎదో సందర్భానుసారం అర్థం అయినట్లనిపించినా, ఆ భాషలో పట్టు లేకపోవటం వల్ల, శబ్దసౌందర్యాన్ని ఆస్వాదించటమే ఎక్కువగా ఉండేది. ఆన్లైన్ ఉర్దూ నిఘంటువుల పుణ్యమా అని తరవాత రోజుల్లో ఆ బాధ తొలగిపోయింది. కవి ఎవరో తెలియకపోయినా, ఇంతకు ముందు నాకు నచ్చిన, నా నోట్లో నానుతూ ఉన్న అనేక పాత హిందీ పాటలు కూడా ఆయన కలాన్నే చీల్చుకు పుట్టాయన్నవి కూడా నాకా సమయం లోనే తెలిసింది.

ఆయన పాటలు వింటున్నప్పుడు చాలా సార్లు నాకు, జీవితం పట్ల ఆయనకున్న ఫిలాసఫీ, ఆయనలోని రొమాంటిక్ ఇంటెన్సిటీ, ఆయన సొంత కథ, భావాలనే, ఆయన పాటలలో ప్రతిబింబించేవాడనిపించేది, అది ఆయన ఉద్దేశపూర్వకంగా చేసుండకపోయినా.

సాహిర్ స్వయంగా చిన్నతనంలో ఎన్నో కష్టాలని అనుభవించి ఒక గొప్ప కవిగా పేరునేర్పర్చుకున్న నేపథ్యంలో “హమ్ దోనోం” సినిమాలోని పాట ఇది.

“మై జిందగీ కా సాథ్ నిభాతా చలాగయా.. (నేను జీవితానితో వెన్నంటి సాగుతున్నా)

హర్ ఫిక్ర్కో ధువే మే ఉడాతా చాలాగయా.. (అన్ని దిగుళ్ళనూ పొగలాగా ఊదేసుకుంటూ సాగుతున్నా)

బర్బాదియోంకా శోక్ మనానా ఫిజూల్ థా… ( వినాశనాల (ఓటముల) గురించి విచారం వ్యర్థం)

బర్బాదియోంకా జష్న్ మనాతా చాలా గయా.. (వాటినే పండగ చేసుకొని సాగుతున్నా)

గమ్ ఔర్ ఖుషీ మె ఫర్క్ న మెహసూస్ హో జహా.. (దుఖానికీ సుఖానికీ మధ్య వ్యత్యాసం ఎక్కడైతే ఉండదో)
మై దిల్ కో అస్ మకామ్ పె లాతా చాలా గయా..” (ఆ స్థానానికి నా హృదయాన్ని తీసుకెళ్తూ సాగుతున్నాను)

http://www.youtube.com/watch?v=IzC0_XVE3Vk

గురుదత్ సినిమా ప్యాసా గురించి, దానిలోని పాటల గురించి, కొన్ని Ph.D వ్యాసాలు వ్రాయచ్చు. హీరో ఒక గుర్తింపు లేని కవి. అతడు చనిపోయాడనుకున్న తరవాత, అతడి కవితలు వెలుగులోకొచ్చి, గొప్ప కవిగా గుర్తింపబడతాడు. “నేను బ్రతికేఉన్నాను” అని ఎంత మొత్తుకున్నా వినకుండా పిచ్చోడికింద జమకట్టిన సమాజాన్ని, ఆ కవి  వెలివేసి వెళ్ళిపోవటంతో కథ ముగుస్తుంది. ఒక ఫలించని ప్రేమ కథ, మంచి మనసున్న ఒక వేశ్యతో మరో ప్రేమ కథ, సబ్ ప్లాట్స్ గా ఉంటాయి. ఒక కవికి ఇంతకంటే మంచి అవకాశం దొరుకుతుందా? సాహిర్ ఈ సినిమా పాటల్లో తమ విశ్వరూపాన్ని ఆవిష్కరించారు. ఎంతగా అంటే, ఆ సినిమా పాటలకి చక్కని బాణీలు కట్టిన యస్.డి.బర్మన్ కి కూడా లభించనంత గుర్తింపు సాహిర్ సాహెబ్ కు దక్కేంతలా.

సాహిర్ తన నిజజీవితంలో కూడా రెండు సార్లు విఫలప్రేమాబాధితుడై ఆజన్మ బ్రహ్మచారి గానే మిగిలిపోయాడు. తన భవిష్యత్తుని ముందుగానే గుర్తించి ఈ పాట వ్రాశారా?
“జానే వో కైసే లోగ్ థే జిన్కే ప్యార్ కో ప్యార్ మిలా..” పాట నుంచి.
“బిఛడ్ గయా హర్ సాథీ దేకర్ పల్ దో పల్ కా సాథ్.. (అందరూ దూరమయ్యారు ఒకటి రెండు క్షణాల సాహచర్యం తరవాత)

కిస్కో ఫుర్సత్ హై జొ థామే దీవానోంకా హాథ్.. (ఎవరికి ఓపిక ఒక పిచ్చివాడి చెయ్యి పట్టుకోవటానికి)

హమ్కో అప్నా సాయా తక్ అక్సర్ బేజార్ మిలా..”(చివరికి నా నీడకు కూడా నేనంటే అలసటొచ్చింది)

http://www.youtube.com/watch?v=cmWZHQAKMEk

 

సాహిర్ షాయారీలో స్త్రీల పట్ల, సమాజంలో వారి అణచివేతపట్ల కూడా తీవ్రమైన ఆవేదన కనపడుతుంది. ఆయన దానిని వ్యక్తపరచటంలో ఎక్కడా “రొమాంటిసైజ్” చెయ్యకుండా సూటిగా శులాల్లాంటి మాటల ప్రయోగంతో శ్రోతలను కలవరపెట్టేవారు. ఆ మాటల తీవ్రత ఒక్కోసారి మనని ఎంత బాధ పెడుతుందంటే, అసలు ఆ పాటే వినటం ఆపేద్దాం అనేంత! 1958 లో విడుదలైన “సాధనా” చిత్రం లోని “ఔరత్ నే జనమ్ దియా మర్దోంకో .. మర్దోంనే ఉసే బాజార్ దియా” అనే పాట లోని కొన్ని వాక్యాలు ఇవి.

“జిన్ హోటోన్ నె ఇన్కో ప్యార్ కియా..ఉన్ హోటోన్ కా వ్యాపార్ కియా (ఏ పెదవులైతే ప్రేమనందించాయో, వాటితోనే వ్యాపారం చేసాడు (మగవాడు))

జిస్ కోఖ్ మె ఉస్కా జిస్మ్ ఢలా..ఉస్ కోఖ్ కా కారోబార్ కియా (ఏ గర్భంలో అయితే జన్మించాడో…దానితోనే వ్యాపారం చేశాడు) ……

యే వో బద్కిస్మత్ మా హైన్ జో…బేటోంకి సేజ్ పే లేటీ హై” (ఈమె ఎంత దురదృష్టవంతురాలు అంటే….తన బిడ్డల పరుపుల మీద పడుకుని ఉంది)

http://www.youtube.com/watch?v=dRnHoAI2Pm4

యాభై, అరవై దశాకాలలోనే, సమాజంలో పేరుకుపోతున్న ధనదాహానికీ, నీతిమాలినతనానికీ, అణచివేతకూ, కులమత వివక్షకూ అద్దం పట్టేలా ఎన్నో పాటలు సాహిర్ కలంనుంచి పెల్లుబికాయి.

ప్యాసా లోని “యే దునియా అగర్ మిల్ భి జాయే తో క్యా హై?” కవిత (పాట) బహుళ ప్రాచుర్యం పొందింది.

“జలాదో ఇసే ఫూంక్ డాలో యే దునియా..జలాదో జలాదో జలాదో..

మేరే సామ్నేసే హటాలో యే దునియా

తుమ్హారీ హై తుమ్హీ సంభాలో యే దునియా”

“సమాజాన్ని తగల పెట్టెయ్యండి,  నా ముందరి నుంచి తీసెయ్యండి, మీదైన సమాజాన్ని మీరే ఉంచుకోండి” అన్న వీరావేశం ఈ పాటలో చూపిస్తే, అదే సమాజం పై ఆవేదన వ్యక్తపరుస్తూనే, ఒక మంచి ఉదయం మనకు రాబోతోంది అన్న ఆశాభావం “వో సుబహ కభీ తో ఆయేగీ…” అన్న పాటలో మనకి కనబడుతుంది.

“మానా కే అభీ తేరే మేరే అర్మానోంకి కీమత్ కుచ్ భీ నహీ  (సరే, మన ఆశలకెలాంటి విలువా లేదు)

మిట్టీ క భీ హై కుచ్ మోల్ మగర్, ఇన్సానోంకి కీమత్ కుచ్ భీ నహీ  (మట్టికైనా  కొంత విలువుంది కానీ, మనుషులకు ఏ మాత్రం లేదు)

ఇన్సానోంకీ ఇజ్జత్ జబ్ ఝూటే సిక్కోం మె న తోలీ జాయేగీ (ఏ రోజైతే మనుషుల ఆత్మగౌరవాన్ని డబ్బులతో తూయరో)

వో సుబహ కభీ తో ఆయేగీ” (ఆ ఉదయం ఎపుడో వస్తుంది)

http://www.youtube.com/watch?v=hQYQUo5X6F0

ముస్లిం కుటుంబంలో పుట్టిన సాహిర్, ఒక నాస్తికుడు. ఆ నాస్తికత్వం ఆయన కొన్ని పాటలలో కనపడుతూనే ఉంటుంది. 1954 లో “నాస్తిక్” అనే సినిమాకి కవి ప్రదీప్ “దేఖ్ తేరే ఇన్సాన్ కి హాలత్ క్యా హోగయి భగవాన్..కిత్నా బదల్ గయా ఇన్సాన్” (దేవుడా, చూడు మానవుడి పరిస్థితి – ఎంత మారిపోయాడో మానవుడు) అనే పాట వ్రాసి తానే పాడారు. దానికి జవాబుగా సాహిర్ 1955 లో “రైల్వే ప్లాట్ఫారం” అనే సినిమాకి పాట రాస్తూ ఇలా జవాబు ఇచ్చారు. “దేఖ్ తేరే భగవాన్ కి హాలత్ క్యా హో గయి ఇన్సాన్…కిత్నా బదల్ గయా భగవాన్!” (ఓ మనిషీ చూడు దేవుడెలా మారిపోయాడో!) ఈ పాటలో దైవదూషణ కంటే కూడా, సమాజంలో అవినీతిపరుల ఇంటే లక్ష్మీదేవి ఇంకా ఎక్కువ కొలువుంటోందన్న వాపోతే ఎక్కువగా కనపడుతుంది. ఈ రెండు పాటల బాణీ కూడా ఒకటే!

భగవాన్, ఇన్సాన్ బదల్ గయా: http://www.youtube.com/watch?v=1_5LLtxAB4I

ఇన్సాన్, భగవాన్ బదల్ గయా: http://www.youtube.com/watch?v=geBkwLHtJA8

అలాంటి నాస్తికుడైన సాహిర్ హిందీలో కలకాలం గుర్తుండి పోయే భజన్ కూడా వ్రాసారంటే అది వెంటనే నమ్మబుద్ది కాదు. “హమ్ దోనోం” సినిమాలో, లతాజీ అత్యంత మృదుమధురంగా పాడిన “అల్లా తేరో నామ్..ఈశ్వర్ తేరో నామ్” మరి ఈయన కలంనుండి వచ్చినదే!

సాహిర్ మతం మానవత్వం. ప్రేమే అతని దైవం. ఈ భావం స్ఫురించేటట్లు వ్రాసిన పాటలనేకం. కొన్ని పాటలు టైంలెస్. “తూ హిందూ బనేగా న ముసల్మాన్ బనేగా…ఇన్సాన్ కి ఔలాద్ తు ఇన్సాన్ బనేగా!” ఈ పాట ఎన్నో తరాల అంతరాత్మలను తొలుస్తూనే వస్తోంది. ఈ పాటలో ఒక వ్యక్తి ఒక అనాథ బాలుడిని సాకుతూ, నువ్వు హిందువువీ అవ్వవూ లేక ముస్లిమ్ వీ అవ్వవూ, ఒక మనిషికి పుట్టావు కనక, తప్పక ఒక మనిషివే అవుతావు అని ముచ్చట పడుతూ ఉంటాడు. యష్ చోప్రా దర్శకుడిగా రంగ ప్రవేశం చేసిన “ధూల్ కా ఫూల్” సినిమా లోని పాట ఇది.

“అఛ్ఛా హై అభీ తక్ తేరా కుఛ్ నామ్ నహీ హై (మంచిదయ్యింది, నీకు ఇంకా నామకరణం కాలేదు)

తుమ్కో కిసీ మజహబ్ సే కోయీ కామ్ నహీ హై (నీకు ఏ మతంతోను ఇక పని లేదు)

జిస్ ఇల్మ్ నే ఇన్సానోంకో తక్సీమ్ కియా హై (ఏ జ్ఞానము అయితే మనుషులను విభజించిందో)

ఉస్ ఇల్మ్ కా తుమ్ పర్ కోయీ ఇల్జామ్ నహీ హై” (ఆ జ్ఞానము యొక్క అపవాదు నీ మీద లేదు)

http://www.youtube.com/watch?v=jqcyUkUFzrc

 

సాహిర్ లుధియాన్వి కి మరికొన్ని విశిష్టతలు కూడా ఉన్నాయి. మ్యూజిక్ కంపెనీల నించి రాయల్టీలు రాబట్టిన మొట్టమొదటి గేయరచయిత ఈయన! అలాగే అప్పట్లో చాలా మందికి కొరుకుడు పడని భావాలూ, ప్రవర్తన కూడా ఆయన సొంతం. లతా మంగేష్కర్ ఒక తిరుగులేని గాయనిగా రాజ్యమేలుతున్న ఆ రోజుల్లో ఆమెకు సంగీత దర్శకుడి తరువాత, అత్యంత ఎక్కువ పారితోషికం ఇచ్చేవారు. గేయరచయితకు ఆమెతో పోలిస్తే తక్కువగా ఇచ్చేవారు. అలాంటిది, సాహిర్ మటుకు, లత కంటే ఒక్క రూపాయి ఎక్కువ చెల్లించనిదే పాట రాయనని ఘోషణ చెయ్యటంతో, ఒక రకమైన ఇబ్బందికరమైన పరిస్థితే ఏర్పడింది వారిద్దరి మధ్య. అందుకేనోమో, ఆషా భోంస్లే నే సాహిర్ పాటలు అందరి గాయనీ గాయకుల కంటే ఎక్కువ పాడారు. అయినా సరే ఆయనతోనే ఆయన జీవితాంతం పాటలు వ్రాయించుకున్న దర్శక దిగ్గజాలు ఉన్నారు. దాదాపు ముఫ్ఫై సంవత్సరాల పాటు వీరి సినిమాలన్నిటికీ, సాహిర్ ఒక్కరే గేయరచయిత. వారెవరో కాదు, బి.ఆర్.చోప్రా, యష్ చోప్రా సోదర ద్వయం.

వీరి సినిమాల్లో పాటలన్నీ బహుళ ప్రాచుర్యం పొందినవే. ఒకటా, రెండా, డజన్ల కొద్దీ సూపర్ హిట్ పాటలు! వీళ్ళు వేర్వేరు సంగీత దర్శకులను, గాయనీ గాయకులను వాడుకున్నారు కానీ, గేయ రచయితను మాత్రం మార్చలేదు. అదీ సాహిర్ గొప్పతనం!

సాహిర్ కవిత్వంలోని ఉర్దూ పదాల వాడుక గురించి ముందర చెప్పుకున్నాం. 1964లో విడుదలైన “చిత్రలేఖ” అనే సినిమా నేపథ్యం చంద్రగుప్త మౌర్య కాలం నాటిది. ఉర్దూ పదాలకు ఆస్కారం లేదు. నిజానికి శైలేంద్ర, ప్రదీప్ లాంటి గేయరచయితలు ఇటువంటి సంస్కృత భాషా ప్రాధాన్యం కావాల్సిన పాటలకి పెట్టింది పేరు. సంగీత దర్శకుడు రోషన్ మటుకు సాహిర్ మాత్రమే రాయాలని పట్టుబట్టారుట. అది ఒక సవాలు గా తీసుకొని, తన ప్రకృతికి విరుద్ధంగా సాహిర్ ఎంతో కష్టపడి వ్రాసిన పాట ఇది. ఈ పాట ఒక మూడేళ్ళ క్రితం ఔట్లుక్ వారు జరిపిన పోల్ లో, అత్యంత ఉత్తమమైన పాటగా గుర్తించబడటం కూడా ఒక విశేషమే. ఈ పాటకు మాత్రం సాహిర్ తో సమానమైన ప్రశంశ పాట పాడిన రఫీకీ, బాణీ కట్టిన రోషన్ కీ చెందాల్సిందే!

“మన్ రే తు కాహే న ధీర్ ధరే? (ఓ మనసా ఎందుకు సంయమం వహించలేకపోతున్నావు?)

వో నిర్మోహీ, మోహ న జానే.. జిన్కా మోహ కరే! (ఎవరినైతే నువ్వు మోహించావో…వారు మోహం తెలియని నిర్మోహి)

ఉత్నాహీ ఉప్కార్ సమఝ్ కోయీ..జిత్నా సాథ్ నిభాయే (అంత వరకూ చేసింది ఉపకారమనుకో..ఎంతవరకైతే నీ తోడు నిలిచారో)

జనమ్ మరణ్ కా మేల్ హై సప్నా, యే సప్నా బిస్రా దే (జనన మరణ చక్రం ఒక స్వప్నం..ఈ స్వప్నాని వదలివేయి)

కోయీ న సంగ్ మరే…” (ఎవ్వరూ చావులో నీ తోడు రారు)

http://www.youtube.com/watch?v=uA2FhgF6VY4

రోహన్, సాహిర్ కాంబినేషన్ లో వచ్చిన తాజ్మహల్ సినిమా లోని పాటలు కుడా అజరామరం. “జో వాదా కియా వో నిభానాపడేగా, రోకే జమానా చాహే, రోకే ఖుదాయీ తుమ్కో ఆనా పడేగా” పాట ఈ సినిమాలోదే.

గుమ్రాహ్ చిత్రం లోని “చలో ఎక్ బార్ ఫిర్ సే..అజ్నబీ బాన్ జాయే హమ్ దోనోం”, సాహిర్ వ్రాసిన టాప్ 10 పాటలలో ఒకటిగా నిలచిపోయే పాట. ముఖ్యంగా దానిలోని ఆఖరి చరణం ఆవేదనకీ మరెంతో ఆలోచనకీ గురిచెయ్యక మానదు. విడిపోయిన ప్రేయసీ ప్రియులు మళ్ళీ ఎదురుపడిన నేపథ్యంలో “పద మళ్ళీ ఒక సారి అపరిచుతులుగా మారిపోదాం  మనిద్దరం” అంటూ సాగే ఈ పాట లోని ఆఖరి చరణం ఇది.

“తార్రుఫ్ రోగ్ హో జాయే..తొ ఉస్కో భూల్నా బెహతర్ (ఎప్పుడైతే ఒక పరిచయం, రుగ్మతగా మారుతుందో, దాన్ని మరువటమే మంచిది)

తాల్లుక్ బోఝ్ బన్ జాయే..తొ ఉస్కో తోడ్నా అఛ్ఛా (ఎప్పుడైతే ఒక సంబంధం, బరువు లాగా అనిపిస్తుందో, దాన్ని తెంచుకోవటమే మంచిది)

వో అఫ్సానా జిసే అంజామ్ తక్ లానా న హో మున్కిన్ (ఎప్పుడైతే ఒక కథని దాని యొక్కసరైన ముగింపుకి చేర్చలేకపోతామో)

ఉసే ఎక్ ఖూబ్సూరత్ మోడ్ దేకర్ ఛోడనా అఛ్ఛా” (దానికి ఒక అందమైన మలుపునిచ్చి వదిలేసి ముందుకు సాగటమే మంచిది)

http://www.youtube.com/watch?v=y8GnY2eddzM

సాహిర్ అన్నీ ఇలాంటి గంభీరమైన పాటలూ, వేదాంతం లేక ఘాటైన రోమాన్స్ పాటలు మాత్రమే వ్రాశారేమో అనుకునేరు! అనేక సరదా డ్యూయెట్లు, మరెన్నో హాస్య పాటలూ కూడా రచించారు. అన్నిటి గురించీ చెప్పుకుంటూ పోతే ఓ పుస్తకమే అయిపోతుంది కనక, నాకు నచ్చిన పాటలన్నీ క్లుప్తంగా ప్రస్తావిస్తా. ఆసక్తి కలవారు వీటిలోని పద, భావ చమత్కారాలను నింపాదిగా తరవాత చదువుకొని సాహిర్ కవిత్వాన్ని మరింత ఆస్వాదించచ్చు.

“మాంగ్ కే సాథ్ తుమ్హారా .. మైనే మాంగ్ లియా సంసార్”  (నయా దౌర్)

“ఉడే జబ్ జబ్ జుల్ఫే తేరీ..కువారియోం కా దిల్ ధడ్కే” (నయా దౌర్)

“సర్ జొ తేరా చక్రాయే…యా దిల్ డూబా జాయే” (ప్యాసా)

“తేరా ముజ్హ్సే హై పెహ్లే కా నాతా కోయీ…జానే తూ యా జానే నా” (ఆ గలే లగ్ జా)

“మేరే దిల్ మె ఆజ్ క్యా హై..తు కహే తో మై బతాదూ” (దాగ్)

“గాపుచీ గాపుచీ గమ్ గమ్…కిషీకి కిషీకి కమ్ కమ్” (త్రిశూల్)

“యూ తో హమ్నే లాఖ్ హసీ దేఖే హై..తుమ్సా నహి దేఖా” (తుమ్సా నహి దేఖా)

“ఏ మేరె జోహ్రజబీ తుఝే మాలూమ్ నహీ” (వక్త్)

1976 లో యశ్ చోప్రా నిర్మించిన కభీ కభీ లో ప్యాసా తరవాత మళ్ళీ హీరో ఒక కవి, ఒక భగ్న ప్రేమికుడు. అందులోని హీరో పాత్ర సాహిర్ లుధియాన్వి ప్రేరణతోనే రూపుదిద్దుకున్నదేమో అన్న అనుమానం రాక తప్పదు. హిందీ పాటలతో పరిచయం ఉండి ఈ సినిమా టైటిల్ సాంగ్ తెలియని వారు ఉన్నారంటే నమ్మలేని విషయం; అంత ప్రాచుర్యం పొందింది ఆ పాట! సాధారణంగా తన రచనా శక్తి పట్ల అపరిమితమైన నమ్మకం ఉన్న సాహిర్ ఎదో “ఇంట్రాస్పెక్టివ్ మూడ్” లో జారిపోయి ఈ కవిత వ్రాసినట్లున్నారు. ఈ కవిత నాకు ఎంత నచ్చినా, దీనిలో ఆయన చెప్పిన విషయం, ఆయన పట్ల నాకున్న అవధుల్లేని అభిమానం వల్ల అనుకుంటా,  నా జీవితకాలంలో జరగదేమోనని అనిపిస్తూ ఉంటుంది! నా కాలమ్ ముగింపు కి ఇంత కంటే ఉచితమైన పాట కూడా ఇంకొకటిలేదేమో!

“కల ఔర్ ఆయేంగే నగ్మోంకే ఖిల్తీ కలియా చున్నేవాలే  (రేపు మరిన్ని కవితాపుష్పాలు వస్తాయి, ఏరుకోటానికి)

ముజ్హ్సే బెహ్తార్ కెహ్నే వాలే..తుమ్సే బెహ్తార్ సున్నేవాలే (నా కన్నా బాగా చెప్పకలిగే కవులొస్తారు..మీ కంటే మంచి శ్రోతలోస్తారు)

కల్ కోయీ ముజ్హ్కో యాద్ కరే..క్యోం కోయీ ముజ్హ్కో యాద్ కరే (రేపు నన్ను ఎవరైనా గుర్తుకుతెచ్చుకుంటారు.. అసలు నన్నెందుకు గుర్తుకుతెచ్చుకోవాలి?)

మస్రూఫ్ జమానా మేరె లియే..క్యోం వక్త్ అప్నా బర్బాద్ కరే? (ఈ తీరుబడి లేని ప్రపంచం…నా కోసం ఎందుకు తమ సమయం వ్యర్థం చేసుకోవాలి?)

మై పల్ దో పల్ కా షాయర్ హూ.. పల్ దో పల్ మేరీ కహానీ హై!” (నేను ఒకటి రెండు క్షణాల కవిని..ఒకటి రెండు క్షణాలదే నా కథ!)

http://www.youtube.com/watch?v=bI10wgbeXgc

Siva_3–   యాజి

 

 

 

 

కనసలూ నీనె – మనసలూ నీనె!

“యే…జీవన్ హై..ఇస్ జీవన్ కా”, “రజనీగంధా ఫూల్ తుమ్హారే…”, “జానేమన్, జానేమన్, తేరే దో నయన్”, “తుమ్ కో దేఖా..తొ యే ఖయాల్ ఆయా”, “ఎ తేరా ఘర్..ఎ మేరా ఘర్” లాంటి హిందీ పాటలు విన్నప్పుడల్లా, నాకు వాటన్నిటిలో ఒక కామన్ థ్రెడ్ కనిపిస్తూ ఉంటుంది. చక్కటి “మధ్యతరగతి మెలోడీ!” ఉన్న వర్గీకరణలతోటే తికమకగా ఉంటే, మళ్ళీ ఇదొకటేమిటనుకుంటున్నారా? అంత కంటే అతికే పదబంధం నాకు దొరకలేదు మరి. కళ్ళు మూసుకొని కనక ఈ పాటలు వింటుంటే, అందమైన మెలోడీ తో పాటు ఎవరో మధ్యతరగతి ప్రేయసీప్రియులు పాటలాడుకొనేటటువంటి దృశ్యాలు కళ్ళ ముందు కదలాడతాయి!

అసలీ కన్నడ శీర్షికేమిటీ, హిందీ పాటల గోలేమిటి, దేని గురించి ఈ వ్యాసం, అని అనుకుంటున్నారు కదూ? అక్కడికే వస్తున్నా. ఈ పాటలన్నీ కూడా డెభ్భైల్లో వచ్చినవే. తెలుగులో కూడా, ఈ తరహాలో, పాటలు అదే సమయంలో వచ్చాయా అని చూసుకుంటే, కొన్ని అద్భుతమైన మెలోడీలు తగిలాయి. వాటిల్లో చాలా వాటికి స్వరకర్తలు రాజన్-నాగేంద్ర సోదరద్వయమే! వారి “మధ్యతరగతి మెలోడీ” పాటల గురించే ఈ సారి కమామీషంతా.

 

rajan

 

మీకు వికీని గూగ్లించే శ్రమ లేకుండా, వారి పూర్వాపరాల గురించి టూకీగా చెప్పేసుకుంటే, తర్వాత వారి స్వరధారల్లో తడిసి ఆటలాడేసుకోవచ్చు. చిన్నప్పుడే, కర్ణాటక రాష్ట్రంలో సంగీత కాలేజిలో విద్యనభ్యసించిన  ఈ ఇరువురు సోదరులూ, 1953 లో కన్నడ సినిమా రంగంలోనూ,  1960 లో తెలుగు సినిమా రంగంలోనూ, జానపద బ్రహ్మ విఠలాచార్య సినిమాల ద్వారా రంగప్రవేశం చేశారు. కన్నడ సినిమా రంగంలో అగ్రతారలైనటువంటి రాజ్ కుమార్, విష్ణువర్ధన్ సినిమాలకి సంగీతాన్ని అందిస్తూ ఆ రంగంలో బిజీగా ఉన్న వీరికి, తెలుగులో అడపాదడపా తప్ప ఎక్కువగా అవకాశాలు రాలేదు. 1975 లో కన్నడ సినిమా “ಎರಡು ಕನಸು” తెలుగు రీమేక్ “పూజ” ద్వారా వీరి పునఃప్రవేశం జరిగింది. ఆ తర్వాత జరిగినది, “హిస్టరీ” అని చెప్పేసి సులువుగా తప్పుకొనే అవకాశం లేదిక్కడ. కలకాలం గుర్తుండి పోయే మేలోడీలు అందించిన వీళ్ళు, ఆ తరువాత సంగీతం అందించిన తెలుగు చిత్రాల సంఖ్య ఇరవైకి మించదు!

 

“పూజ” చిత్రం నుంచే  “పూజలు చేయ పూలు తెచ్చాను, నీ గుడి ముందే నిలిచాను..తియ్యరా తలుపులనూ రామా..” అంటూ మృదుమధురంగా వాణీజయరాం గళంనించి జాలువారిన ఈ గీతాన్ని, ఇప్పటికీ ఎంతో మంది గాయకురాళ్లు పాటల పోటీలలో పాడుతూ ఉండటం మనం గమనిస్తూనే ఉంటాం. “ఎన్నెన్నో జన్మల బంధం..నీది నాది”, ఎవరగ్రీన్ పాట. దాదాపు ఒక పదిహేడేళ్ళ తరవాత హిందీలో, ఆనంద్ మిలింద్, ఎక్కువ మొహమాట పడకుండా, అదే ట్యూన్ ని, “జాన్ సే ప్యారా” అనే సినిమాలో మక్కీకి మక్కీ దించేశారు. మూడు భాషలలోనూ యీ సతతహరిత పాటని ఇక్కడ చూడచ్చు!

 

కన్నడ: http://www.youtube.com/watch?v=TwKVyj9hf7k

తెలుగు: http://www.youtube.com/watch?v=GfCnYnXhyIw

హిందీ: http://www.youtube.com/watch?v=knPnX5G3PAU

 

1977: తెలుగు సినీ రంగం ఎన్నో మలుపులు తిరిగిన సంవత్సరం. అడవిరాముడు తో అన్నగారు తన మాస్ ఇమేజ్ ని సోషల్ సినిమాలలో సుస్థాపితం చేసుకుంటే, వేటూరి ఒక ప్రభంజనం లా చెలరేగి, “ఆరేసుకోబోయి పారేసుకున్నాను హరీ…”, “అమ్మ తోడు, అబ్బ తోడు, నీ తోడు, నా తోడు…” లాంటి లిరిక్స్ తో, ఒక కొత్త మాస్ తెలుగు పాటకి శ్రీకారం చుడితే, తన లేత గళంతో అప్పటికే అందరినీ అలరిస్తున్న బాలూ, తన స్వరవైవిధ్యంతో అన్ని వర్గాల శ్రోతల గుండెల్లో తిష్ఠ వేసుకున్న సంవత్సరం. అదే సంవత్సరంలో నవతా వారు నిర్మించిన “పంతులమ్మ” చిత్రం లోని పాటలు, అటు సాహిత్యపరం గానూ, ఇటు సంగీత పరంగానూ అనేక ప్రశంశలందుకున్నాయి.

 

రాజన్-నాగేంద్రలకు ఉత్తమ సంగీత దర్శకులుగా నంది పురస్కారం తో పాటు, వేటూరి “మానస వీణా….” మధుగీతానికి కూడా ఉత్తమ గేయ రచయితగా నంది పురస్కారాన్ని అందించాయి ఈ సినిమా పాటలు. యాధృచ్చికమో, సాంగత్య బలమో తెలియదు కానీ, రాజన్-నాగేంద్రలు స్వరపరచిన మెలోడీలకి, వేటూరి పేర్చిన మాటలతో మరపురాని మధురగీతాల్లా రూపు దిద్దుకొని, ఒకరినొకరు మరింత ప్రకాశింపజేసేందుకు పూనుకున్నారా అనిపించక తప్పదు.

“ఎరిగిన వారికి ఎదలో ఉన్నాదు..

ఎరుగని వారికి ఎదుటే ఉన్నాడు…

శబరీ ఎంగిలి గంగ తానమాడిన పేరు…

హనుమ ఎదలో భక్తి ఇనుమడించిన పేరు..

మనసెరిగిన వాడు మా దేవుడు .. శ్రీ రాముడు

మధుర మధుర తర శుభ నాముడు … గుణ ధాముడు “

 

త్యాగయ్య తరవాత రామభక్తిని అంత అందంగా, అంత సరళంగా వర్ణించటం, వేటూరి వారికే సాధ్యమేమో అనిపిస్తుంది ఈ పాట వింటుంటే. ఎప్పటిలా కన్నడ పాటనుండి కాకుండా, నేరుగా తెలుగు పాటకే బాణీ కట్టారనుకుంటా, అద్భుత:!

 

“ఏ రాగమో ఏమో మన అనురాగం..వలపు వసంతాన హృదయ పరాగం..

ఎద లోయలలో నిదురించిన నా కోరిక పాడే కోయిల గీతం

శతవసంతాల దశదిశంతాల సుమ సుగంధాల…భ్రమరనాదాల కుసుమించు నీ అందమే

విరిసింది అరవిందమై..కురిసింది మకరందమై..

 

మానసవీణా మధుగీతం…మన సంసారం సంగీతం”

 

మన సంసారాలలో ఉన్న సంగీతసారాన్ని ఇంత అందంగా ఆవిష్కరించిన వేటూరి, రాజన్-నాగేంద్రలకు, హృదయపూర్వకంగా ధన్యవాదాలు చెప్పుకోవలసిందే!

 

http://www.youtube.com/watch?v=5HPwgaRoV8w

 

ఇక్కడ మన గాన గాంధర్వుడి గురించి కూడా కొంత చెప్పుకోవాలి. “ఏ దివిలో విరిసిన పారిజాతమో” లాంటి మంచి మెలోడీ పాటలు అప్పటికే ఒకటీ అరా పాడి ఉన్నా, ఇంకా తన ప్రతిభకు తగ్గ గుర్తింపు అతడికి దక్కలేదు. రాజన్-నాగేంద్రలు కట్టిన బాణీలతో పాడిన బాలూ పాటలకు అవార్డులు రాకపోయినా, చిరకాలం మన మదిలో నిలచిపోయే మంచి మెలోడీ పాటలుగా మాత్రం అతడి ఖాతాలో జమైపోయాయి. ఒక్కసారి కళ్ళు మూసుకొని, బాలూ పాడిన అన్ని వేల పాటలలో, మంచి మెలోడీ పాటలు, గబుక్కున గుర్తుకొచ్చేవాటిల్లో చాలా వరకూ డెభ్భైల్లో వచ్చినవే. బాలూ-వేటూరి-రాజన్-నాగేంద్ర కాంబో పాటలు, ఈ కోవలో కొచ్చేవే.

 

“సిరిమల్లె నీవే, విరిజల్లు కావే, వరదల్లె రావే, వలపంటే నీవే, ఎన్నెల్లు తేవే, ఎద మీటి పోవే…”

ఇది మొదట కన్నడలో కట్టిన బాణీనే. కన్నడలో య.స్.జానకి పాడిన పాటని తెలుగులో బాలూ చేత పాడించటం ఒక విశేషం. అప్పటికి, అనుభవంలో చిన్నవాడైనా, బాలూ అంత చక్కగానూ తెలుగులో పాడారు.

 

కన్నడ: http://www.youtube.com/watch?v=R58a5Ht4-Ok

తెలుగు: http://www.youtube.com/watch?v=RxF-jon6LNg

 

“మల్లెలు పూసే, వెన్నెల కాసే, ఈ రేయి సాక్షిగా” – ఇంకొక “మధ్యతరగతి మెలోడీ”, కన్నడ, తెలుగు భాషలలో బాలునే పాడారు.

 

“మల్లె తీగ వాడి పోగా, మరల పూలు పూయునా?” – ఈ పాటని కన్నడలో పి.బి.శ్రీనివాస్ పాడితే, తెలుగులో బాలునే. పెద్దాయనకి క్షమాపణలతో, నాకు బాలూ వర్షన్ ఈ రెంటిలోను బాగుందనిపిస్తుంది.

 

“వీణ వేణువైన మధురిమ కన్నావా…” హిందోళంలో ఇంత మెలోడీ ఉన్న డ్యూయెట్ దీని తరవాత మరొకటి రాలేదేమో! కన్నడలో మొదట వచ్చిన ఈ పాట, తరువాత తెలుగులోనూ, తమిళంలో కూడా వచ్చి, అందరినీ డోలలూగించింది. ఇంత హాయిగా సాగిపోయే ఈ మెలోడీని ఇప్పటికి కూడా, మళ్ళీ మళ్ళీ వినాలనిపించేంతలా స్వరపరిచారు ఈ సంగీత ద్వయం! డ్యూయెట్ గా సాగే ఈ పాట తమిళం లో మాత్రం సోలోగా జానకి గారి చేతే పాడించారు.

 

కన్నడ: http://www.youtube.com/watch?v=qyDb7bag9YI

తెలుగు: http://www.youtube.com/watch?v=QebPpYEBJ-w

తమిళం: http://www.youtube.com/watch?v=hd5NfjYfD1Y

ఆ తరువాత వచ్చిన “నాగమల్లివో…తీగ మల్లివో” అనే మరో అందమైన మెలోడీతో ఎనభైల్లోకి అడుగు పెట్టారు రాజన్-నాగేంద్రలు. “ఆకాశం నీ హద్దు రా…అవకాశం వదలద్దురా” అంటూ బీట్ పాట ఇచ్చినా, అందులో కూడా, తమ బ్రాండు మెలోడీని జొప్పించి, తమ ముద్ర మాత్రం మిస్ అవ్వకుండా చూసుకున్నారు వీరు.

వరుసగా ఇన్ని పాటల గురించి చెప్పుకున్నాం కదా అని, ఆ సినిమాలు వెళ్ళ మీద లెక్కెట్టుకుంటే, ఒక్క చెయ్యి సరిపోతుంది. పూజ, పంతులమ్మ, ఇంటింటి రామాయణం, సొమ్మొకడిది సోకొకడిది, నాగమల్లి, ఇంతే!

 

అంత తక్కువగా అవకాశాలు లభించినా వీరి పాటలు ఇలా గుర్తుండి పోవటానికి కారణం, అది వారి పాటల్లో స్వరస్వరానా ఇంకిపోయున్న మెలోడీనే. అలా అని, వీరు అన్నీ గుర్తుండిపోయే పాటలే చేసారని కాదు. వీరు వందకు పైబడి కన్నడ చిత్రాలకి సంగీతాన్ని సమకూర్చారు. కానీ మన తెలుగు సినిమాల వద్దకు వచ్చేసరికి, వారి వంద చిత్రాల సంగీత సారాన్ని ఈ అరడజను చిత్రాలలో పొందుపరిచి ఇచ్చేశారని అనిపిస్తుంది! వీటికి తోడు, వేటూరి వారి సినీప్రస్థానప్రారంభం, బాలూ పతాకస్థాయిని చేర్కొనే దిశలో ఉండటం కూడా వారి పాటలను అజరామరంగా ఉండటానికి దోహద పడ్డాయనిపిస్తుంది.

 

ఎనభైలలో కూడా వీరు జంధ్యాల వారికీ, మరి కొద్ది దర్శకుల సినిమాలకీ సంగీతాన్ని అందించారు. “నాలుగు స్తంభాలాట” చిత్రం లోని ఈ సెన్సేషనల్ పాట రెండు సార్లు తెలుగులో రావటమే కాకుండా, హిందీలో కూడా ఒక పదేళ్ళ తరవాత స్వేచ్ఛగా వాడుకున్నారు. “బయలు దారి” అనే 1978 లో విడుదలైన కన్నడ చిత్రానికి కట్టిన ఈ బాణీ, “కనసలూ నీనె…మనసులూ నీనె” అనే పల్లవితో మొదలవుతుంది. దీని తెలుగు అనువాదం “కలలో నీవె..మనసులో నీవే” అని. ఐదేళ్ళ తరవాత 1982 లో,  జంధ్యాల గారి చిత్రం “నాలుగు స్థంభాలాట”కి, వేటూరి ఆ బాణీ విని వ్రాసిన పాట ఇది!

 

“చినుకులా రాలి

నదులుగా సాగి

వరదలై పోయి

కడలిగా పొంగు

నీ ప్రేమ నా ప్రేమ

నీ పేరే నా ప్రేమ

నదివి నీవు కడలి నేను

మరచి పోబోకుమా మమత నీవే సుమా!”

 

ఈ పాట వింటున్నప్పుడల్లా ఎదో ఒక ప్రవాహంలో కొట్టుకు పోతున్నటువంటి అనుభూతి కలుగుతుంది నాకు. ఆ పాట ఎంత “ఎవరగ్రీన్” అంటే, దాదాపు ఇరవై సంవత్సరాల తరువాత అదే లిరిక్స్ తో “అహ నా పెళ్ళంట” అనే సినిమాకి రఘు కుంచె దానిని రీమిక్స్ చేసి మన కందించారు. హిందీలో మెలోడీ కింగ్స్ నదీం-శ్రావణ్ లు కూడా ఇదే బాణీని యధాతధంగా “ఐసి దీవానగీ…దేఖి నహీ కహీ” అని వాడుకున్నారు.

కన్నడ: http://www.youtube.com/watch?v=y1ntRcP_et4

తెలుగు: http://www.youtube.com/watch?v=2Tw7v5R2700

హిందీ: http://www.youtube.com/watch?v=m-vIYe_KY34

తెలుగు2: http://www.youtube.com/watch?v=_wbYsNwR4IU

 

ఈ సంగీత సోదరుల్లో చిన్నవాడైన నాగేంద్రగారు 2000 సంవత్సరంలో పరమపదించారు. వారి పాటలు మాత్రం మరెన్నో తరాల నోళ్ళలో నానుతూ ఉంటాయన్నది మాత్రం చాలా ఈజీ ప్రెడిక్షన్! కన్నడ సినీ రంగంలో అగ్ర సంగీత దర్శకులుగా తమ పేరును సుస్థిరపరుచుకున్న వీరు, కన్నడ కంఠీరవ రాజ్ కుమార్ పైన చిత్రీకరించిన “గంధద గుడి” అనే చిత్రం లోని ఈ టైటిల్ సాంగ్ ను గుర్తుకుచేసుకుంటూ ముగిస్తున్నాను.

 

http://www.youtube.com/watch?v=d4vqbRonJgU

 

 

 

 

స్వేచ్ఛ

Siva

తెనాలిలో పుట్టి పెరిగి గత పదహారేళ్లుగా అమెరికాలో ప్రవాస జీవితం గడుపుతున్నాను. “మై హార్ట్ ఇస్ బీటింగ్..అదోలా” అనే సినిమాకి డైలాగులు వ్రాయటంతో,

నా రచనా వ్యాసంగం మొదలయ్యింది. తరువాత రెండు షార్టు ఫిల్ములకు స్క్రిప్ట్ లు, సినిమాల కోసమని అనేక కథలు (అవి తీసే సాహసవంతులు ఇంకా ఎదురవ్వలేదు)
వ్రాసాను. వాకిలిలో కథల ద్వారా నాకు తెలుగు సాహితీరంగంతో పరిచయం ఏర్పడింది. నా కథలు వాస్తవికతకి దూరంగా, సినిమాటిక్ గా ఉంటాయన్న అభియోగం ఉంది.
నేను ఆ “నేరాన్ని” అంగీకరిస్తూనే, “సినిమాటిక్ అవాస్తావికతకి”, నేటి తెలుగు కథలలో కనిపిస్తున్న “రియలిజానికి” మధ్య, “మిడిల్ గ్రౌండ్” ని వెతుక్కుంటూ, నా

కథలలో నా ముద్ర మాత్రం ఒకటి వేద్దామనుకుంటున్నాను.  నాకు కథలతో పాటు సంగీతం పట్ల కూడా చాలా ఆసక్తి ఉంది.

   ***
Swetcha1
“నీక్కాబోయేవాడు ఎలా ఉండాలే?” అరకిలోమీటరు జాగ్ వల్ల కలిగిన ఆయాసంతో బరువుగా ఊపిరి పీలుస్తూ అడిగింది సుజాత.

మూడు కిలోమీటర్ల దూరాన్నిసునాయాసంగా పరిగెత్తి, సుజాత అలసట వల్ల ఆగిన స్వేచ్ఛ, దానికి బదులిస్తూ, “నావి చాలా చిన్న కోర్కెలే..అతడు బయట ప్రపంచానికి కాన్ఫిడెంట్, ఆర్టిక్యులేట్, మెట్యుర్ పర్సనాలిటీని, నా ఎదుట మాత్రం ఒక చిన్న పిల్లాడి లాగా నా ఒడిలో ఒదిగిపోయే మెంటాలిటీ కలిగి ఉండాలి”
“ఊ..ఇంకా?”

“పదునైన సెన్స్ ఆఫ్ హ్యుమర్, కంట తడి చూపించటానికి భయపడని నైజం, ఒక మంచి సోషల్ సర్కిల్, నా కంటే ఈ ప్రపంచంలో తనకెవ్వరూ ఎక్కువ కాదన్నట్లుండే స్వభావం, ఆర్ట్స్ అంటే ఆసక్తి, కావాలనిపించినప్పుడల్లా నాకు ఆసరా ఇచ్చే భుజం… ఇలా ఏవో చిన్న చిన్న లక్షణాలుంటే చాలే! మిగిలినవాటితో నేను సర్దుకు పోతా..” అంటూ ఒక చిలిపి నవ్వుతో ముగించేసింది స్వేచ్ఛ.

“నీకు చిన్నప్పుడు మీ అనాధశరణాలయంలో ఏమి నేర్పించారో కానీ..బాగానే ఎక్కింది…పిచ్చి! నీకు కావాల్సిన ఈ లక్షణాలు ఒకడిలో ఉన్నాయంటే..వాడికి స్ప్లిట్ పర్సనాలిటీ డిజార్డర్ ఉందన్నమాటే!” తేల్చేసింది సుజాత.

కొంచెం సీరియస్ గానే, “నేను పెరిగిన చిన్నప్పటి వాతావరణం వల్లే కావచ్చు…నాకు అందరి ఆడపిల్లల లాగా ఆలోచించటం రాదే…నాలో ఎందుకో, ఈ మేల్ డామినేటెడ్ సొసైటీ ఏర్పర్చిన రూల్స్ అన్నీ చెరిపేసి, ఒక మగాడి కున్న స్వాతంత్ర్యాన్నీ, బాధ్యతలేనితనాన్నీ అనుభవించెయ్యాలని అనిపిస్తూ ఉంటుంది. కరణేషు, భోజ్యేషు, శయనేషు, నా బొందేషు అంటూ స్త్రీల నించి రకరకాలుగా ఎక్స్పెక్ట్ చేసేవాళ్ళనించి, ఆ మాత్రం లక్షణాలు ఆశించడం తప్పుకాదనుకుంటాను?” సంధించింది  స్వేచ్ఛ.

“ఆశించటం తప్పు కాదు కానీ..ఆచరించటం నీ వల్ల కాదే. నీకు రాసిపెట్టి ఉన్నవాడు ఎదురైనప్పుడు, లక్షణాలు లెక్కెట్టటానికి నీ మెదడు పని చేయదు..మనసు మాత్రమే పని కట్టుకొని నిన్ను పడేస్తుంది…అతడి ప్రేమలో”
“అదీ చూద్దాం…ఆఫీసుకి టైం అవుతోంది. ఈ రోజు మన బ్యాంక్ లో ఎవరో కొత్త ఎంప్లాయీ జాయిన్ అవుతున్నాడు.. ఇన్వెస్ట్మెంట్స్ సెక్టర్ లీడ్ కాబట్టి, అతడిని నేనే రిసీవ్

చేసుకోవాలన్నాడు..బాస్.” జాగ్ చేసుకుంటూ తన అపార్ట్మెంట్ వైపు మళ్ళింది స్వేచ్ఛ.

***

“సూర్య..”

“స్వేచ్ఛ..”

“చాలా అందమైన పేరు…”

“పేరొక్కటేనా?”

“ఇప్పుడే కదా కలిసింది…ఇంకా ఏమేం నచ్చాయో అప్పుడే చెప్పేస్తే బాగోదేమో నని….”

“నాట్ బ్యాడ్.. కొత్తగా జాయిన్ అవుతున్నారంటే, ఎవరో ఫ్రెషర్, ర్యాగింగ్ చెయ్యచ్చనుకున్నాను.. కాన్ఫరెన్స్ రూమ్, దిజ్ వే”

***

“మొదటి రోజు కాబట్టి, ఈ రోజు మీ లంచ్ కి కుడా, నేను పే చేస్తున్నాను”

“ధాంక్ యూ…ఇందాక ట్రైనింగ్ లో, మన బ్యాంక్ ఇన్వెస్ట్మెంట్స్ గురించి కొన్ని డౌట్స్ ఉన్నాయి…మీతో క్లియర్ చేసుకోవాలి.”

“సారీ సూర్యా..లంచ్ టైంలో వర్క్ విషయాలు అస్సలు మాట్లాడను..”

“వెరీ గుడ్..పర్సనల్ విషయాలు మాట్లాడుకొని ఒకరి నొకరు తెలుసుకోవచ్చన్న మాట.”

“పరిచయాలు పెంచుకోవాలని చాలా తొందరగా ఉన్నట్టుందే..మన వర్క్ మ్యాటర్ చాలా కాన్ఫిడెన్షియల్..ఇలా పబ్లిక్ లో మాట్లాడకూడదు అని.”

“ఆ.. ఒకే.. సేఫ్ సైడ్ కి పర్సనల్ మ్యాటర్సే బెటర్…. నేను ఇంజనీరింగ్ వరంగల్ లో చేసాను. యం.బి.ఎ, ఐ.ఐ.యం అహ్మదాబాద్ లో..మా నాన్నగారు……”
సూర్య చెప్పిన దంతా విని,  స్వేచ్ఛ, “మీకు కళలంటే ఆసక్తి ఉందా?”

“మీరు మళ్ళీ ర్యాగింగ్ మొదలెట్టేశారు….”

“లేదు..సీరియస్ గానే అడుగుతున్నాను…సాహిత్యం, సంగీతం, నాట్యం…ఇలాంటివి”, చిరునవ్వును, పంటితో బిగిస్తూ.

“నాకు అంత పాండిత్యం లేదు…రహమాన్, సీతారామ శాస్త్రి, ప్రభు దేవా నా ఫేవరెట్స్. నవలలు ఎక్కువ ఇంగ్లీష్ వే చదువుతాను.”

“అర్ధం అయ్యింది..ఇక వెళ్దామా?”, తన లంచ్ ట్రే తీసుకొని లేచింది, స్వేచ్ఛ.

“అయ్యో..నా గురించి అంతా చెప్పను కాని…మీ గురించి తెలుసుకోటానికి టైం సరిపోలేదు”

“ఫర్లేదు..ముందు ముందు చాలా టైం ఉంటుంది. ఒకే డివిజన్ లో ఉన్నాం కదా…”

***

“బై స్వేచ్ఛ..” అంటూ పార్కింగ్ వైపు నడుస్తున్నసూర్యని చూసింది  సుజాత.

“వావ్…చాలా హ్యాండ్సం గా ఉన్నాడే, మీ కొత్త కుర్రాడు.”
“నాట్ బ్యాడ్..వెరీ షార్ప్ ఫెలో”

“మరింకేం…ఇంక కౌంటింగ్ మొదలెట్టు, నీక్కావల్సిన లక్షణాలు..”

“నువ్వే చెప్పావు కదా…మెదడు ఆగిపోతుంది..అది, ఇదీ అని…అంత సీన్ ఉన్నప్పుడు చూద్దాం”

***

“మనం కలిసిన ఈ నాలుగు నెలల్లో, వర్కులోను, బయటా నీతో స్పెండ్ చేసినంత టైం ఇప్పటి వరకూ ఏ అమ్మాయితోనూ చెయ్యలేదు తెల్సా!” సినిమా హాల్లో, పక్కనే కూర్చొన్న స్వేచ్ఛతో అనేశాడు  సూర్య.

“నిన్ను ఇంత కాలం భరించిన అమ్మాయి ఎవరూ లేరంటావ్..అంతేనా?” కొంటెగా బదులిచ్చింది   స్వేచ్ఛ.

“జోకద్దు. ఎన్నో విషయాలు పంచుకొన్నాం. నేనెప్పుడూ చెప్పకపోయినా, నువ్వంటే నాకు పిచ్చ, పిచ్చ, ఇష్టం అని నీకు తెలిసే ఉంటుంది. నువ్వే నా గురించి ఏమనుకుంటున్నావో, నాకు క్లారిటీ రావట్లే!” సీరియస్ గానే అడిగేశాడు సూర్య.

“నీ పైన ఇష్టాన్ని నేను చెప్తే గానీ తెలుసుకోలేనంటావ్? నీతో పాటు సినిమాలు, షికార్లు లాంటివి చేసినా నీకు అనుమానమే నంటావ్? అందుకే నువ్వు నాకు చాలా, చాలా నచ్చావ్!”, తేరుకొనే లోగా, ఒక్క సారి సూర్య పెదాలను తన పెదాలతో లిప్త పాటు తడి చేసింది స్వేచ్ఛ. సినిమా మొదలయ్యింది.

***

“నేను కోరినవన్నీ ఉన్నాయా అంటే… లేవనే చెప్పాలి. నిజంగానే అన్నీ కావాలా అని ఆలోచింఛి నిర్ణయం తీసుకోవటానికి  ఇంత సమయం పట్టింది”, సంజాయిషీ ఇస్తున్నట్లుగా, సుజాత తో అన్నది స్వేచ్ఛ.

“అదేదో పెద్ద తప్పైనట్లు అలా నానుస్తూ చెప్తావెందుకు? వెరీ హ్యాపీ ఫర్ యు!” అంటూ గట్టిగా హగ్ చేసింది సుజాత.

“ఎంత వరకూ వెళ్ళారేంటి? హద్దులు దాటేశారా?”, బిగించిన హగ్ ని విడుస్తూ, క్యాజువల్ గా అడిగేసింది సుజాత.

“లేదే.. అతను ఆ విషయాల్లో కొద్దిగా స్లోనే. ఆఫీసులో కలిసి ఉన్నా, ఎప్పుడూ పని మీద ధ్యాసే. వర్క్ లో అన్నీ వెంటనే నేర్చేసుకోవాలని తెగ తొందరపడిపోతూ ఉంటాడు. బయట మాత్రం, రొమాంటిక్ గానే మాట్లాడతాడు కానీ, ముద్దుకు మించి, ముందుకెళ్ళడు, అదీ చొరవ చేసి, నేను మొదలెట్టిన తరవాతే..”  అంటూ నిజాయితీగా బదులిచ్చింది స్వేచ్ఛ.

“మరీ మంచాడి లా ఉన్నాడే…నీకు సూట్ అవ్వడేమో” అంటూ ఒక నవ్వు నవ్వేసి, స్వేచ్ఛ ఉత్తుత్తి ఆగ్రహాన్ని పట్టించుకోకుండా, తన ఆఫీసు వైపు మళ్ళింది సుజాత.

***

“కమాన్ సూర్యా..ఇంత హటాత్తుగా జాబ్ మారాల్సిన అవసరం ఏముంది?” కొంత చిరాగ్గానే అడిగింది స్వేచ్ఛ.

“వాళ్ళ ఫారిన్ ఇన్వెస్ట్మెంట్ డివిజన్ కి లీడ్ రోల్ ఆఫర్ చేశారు. ఇంకొక బాడ్ న్యూస్ కూడా…”, నెమ్మదిగా నసిగాడు సూర్య.

“ఏంటి? నిన్ను అండమాన్ బ్రాంచ్ లో జాయిన్ అవ్వమన్నారా? శుభం. రోజూ ఫేస్బుక్ లో చాట్ చేస్తూ ఏడాదికొకసారి కలుస్తూ ఉండచ్చు.”

“ప్లీజ్ .. మరీ అంత కోపమా.. అండమాన్ కాదు కానీ ఒక మూడు నెలలు అమెరికా వెళ్ళమన్నారు, ట్రైనింగ్ కోసం. రోజూ కాల్స్, చాటింగ్..ఇట్టే గడిచిపోతాయి.” అంటూ తన చేతులను స్వేచ్ఛ చుట్టూ వేసి, ఆమెను ముద్దులతో ముంచేత్తేశాడు సూర్య. వాళ్ళ అందమైన ఏకాంతాన్ని భగ్నం చెయ్యటానికా అన్నట్లు, సూర్య సెల్ ఫోను మ్రోగటం మొదలెట్టింది. కాలర్ ఐ.డి.

“తేజ” అని చూపిస్తోంది.

“తీస్కో…మీ ఫ్రెండు ఎప్పుడూ మంచి టైం చూసి కాల్ చేస్తూ ఉంటాడు”, అని చురకేసి లోపలి కెళ్ళింది స్వేచ్ఛ. కాసేపాగి బయటకు వచ్చిన స్వేచ్ఛకి సూర్య ఎదో పరధ్యానంగా కనపడ్డాడు. తేజ, సూర్యా చిన్నప్పటినిండీ మంచి స్నేహితులు. వారానికొకసారైనా మాట్లాడుకోందే వీళ్ళకి తోచదని, స్వేచ్చకి తెలుసు.

“ఏమంటున్నాడు తేజ?”, అంటూ సూర్య పక్కన కూర్చోంది స్వేచ్ఛ.

“ఐ.టి సెక్యూరిటీ లీడ్ గా ఒక మల్టీ నేషనల్ లో హైదరాబాద్ లోనే జాబ్ వచ్చింది వీడికి. నెక్స్ట్ వీక్లో ఇక్కడికి వచ్చేస్తున్నాడు వాడు. కానీ నేను అమెరికా వెళ్ళాల్సింది కుడా అదే టైం లో. అదే ఏం చెయ్యలా అని ఆలోచిస్తున్నా.”

“అతడేం చిన్న పిల్లాడు కాదుగా, నువ్వు వర్రీ అవ్వటానికి. ముందు మన గురించి ఆలోచించు…” అంది స్వేచ్ఛ టాపిక్ డైవర్ట్ చెయ్యటానికి ప్రయత్నిస్తూ.

“అది కాదు రా. వాడికి ఊరు పెద్దగా తెలీదు. వాడిని నా అపార్ట్మెంట్ లోనే ఉండమంటాను. వాడికి కొంచెం సిటీ చూపించి సెటిల్ అవ్వటానికి నువ్వే సాయం చెయ్యాలి…” అంటూ అభ్యర్ధించాడు సూర్య.

“నీ గర్ల్ ఫ్రెండ్ని, నువ్వు, నా ఫ్రెండ్ ని చూస్కో, అని అప్పగిస్తున్న నీ నమ్మకానికి జోహార్లు అర్పించాలో లేక నీ అమాయకత్వాన్ని తిట్టాలో, డిసైడ్ చేసుకోలేకపోతున్నాను…” రాని కోపం నటిస్తూ అడిగింది స్వేచ్ఛ.

***

“బై..స్వీట్ హార్ట్..” అంటూ పెదాల పై ఒక ముద్దిచ్చేసి సెక్యురిటీ వైపు నడిచాడు సూర్య.

“ఏంటీ..అంత డ్రై గా కిస్ చేసి వెళ్ళిపోయాడు…వాడికి మొహమాటం ఎక్కువనుకుంటా…” చాల క్యాజువల్ గా అడిగాడు తేజ.
కొద్దిగా ఎరుపెక్కిన చెక్కిళ్లతో, “నీకస్సలు సిగ్గు లేదన్న విషయం చెప్పాడు సూర్య…కానీ ఇంత లొడ లొడా వసపిట్ట లాగా వాగుతూనే ఉంటావన్న విషయం  మాత్రం దాచాడు. ఇంటి నించి ఎయిర్పోర్ట్ దాకా త్రోవ పొడవునా నాన్ స్టాప్ గా.. నీ కసలు అలసట రాదా?” సిగ్గు, విసుగు, కోపం అన్నీ మేళవించిన స్వరంతో అడిగింది స్వేచ్ఛ.

“నీకు కొంచెం కోపం ఎక్కువే అని చెప్పాడు సూర్య…కానీ ఆ కోపం లో నువ్వెంత అందంగా ఉంటావో చెప్పటం మాత్రం దాచాడు” తడుముకోకుండా తేజ.

జవాబు ఇవ్వకుండా పార్కింగ్ లాట్ లో కార్ వైపు దారి తీసింది స్వేచ్ఛ. కార్లో, పిచ్చ సీరియస్ గా మొహం పెట్టుకొని కూర్చొని ఉన్నాడు తేజ. ఆ నిశ్శబ్ద వాతావరణం కలగజేసే ఇబ్బందిని తట్టుకోలేక, స్వేచ్ఛ రేడియో ఆన్ చేసింది. “కయీ బార్ యూహి దేఖా హై..యే జొ మన్ కి సీమ రేఖా హై..మన్ యూ బెహెక్నే లగ్తా హై” అంటూ ముఖేష్ తియ్యని గళంతో పాడుతున్నాడు. పాటను చక్కగా ఆస్వాదిస్తూ, స్టీరింగు వీల్ మీద వేళ్ళతో తాళం వేస్తూ డ్రైవ్ చేస్తున్న స్వేచ్ఛ, తరువాతి పాట “షీలా..షీలా కీ జవానీ” అని రావటం తో రేడియో ఆపేసింది.

“I’m too sexy for you, మై తేరే హాత్ నా ఆనీ…అంత మంచి పాట..ఎందుకు ఆపేశావ్?” నవ్వుతూ అడిగాడు తేజ.

“నీ టేస్టు కి తగ్గట్టే ఉంది ఆ పాట కూడా”

“నా టేస్టుకి చాలా పెద్ద రేంజ్. ఇంతకు ముందు నువ్వు అంతగా ఎంజాయ్ చేశావే, ఆ పాట గురించి తెలుసా నీకు?”

“మంచి పాట…ముఖేష్ పాట…అంత తెలిస్తే చాలు”

“ఆ పాట కి నేషనల్ అవార్డు వచ్చింది, ముఖేష్ కి. రజనీగంధ సినిమా లోది. సినిమాలో ఆ పాట నేపధ్యం గురించి తెలిస్తే ఇంకా ఎంజాయ్ చేసేదానివేమో!” వస్తున్న చిరునవ్వును పంటితో బిగిస్తూ అన్నాడు, తేజ.

“ఎందుకంట?” కొంచెం అనుమాదాస్పదం గా అడిగింది స్వేచ్ఛ.

“తన బాయ్ ఫ్రెండ్ వేరే ఊరికి వెళ్తే, తన పాత స్నేహితుడిని రిసీవ్ చేసుకొని, కారులో వెళ్తూ, ఆ స్నేహితుడి వైపు, ఆకర్షితురాలవుతున్న మనస్సుని ఉద్దేశింది పాడుకున్న పాట అది…” ఈ సారి, గట్టిగా నవ్వేస్తూ అనేశాడు, తేజ.

స్వేచ్ఛ కుడా అతడి నవ్వులో శ్రుతి కలిపింది.

“నువ్వు అందరి అమ్మాయిలతో కలవంగానే ఇలాగే ఫ్లర్ట్ చేస్తావా?”

“అందరితో కాదు. అందమైన, నేను అందుకోలేని, అమ్మాయిలతో మాత్రమే… నువ్వు నా ఫ్రెండు తో ఆల్రెడీ బుక్ అయిపోయావు కాబట్టి, మనిద్దరి మధ్య ఎలాంటి ఛాన్స్ లేదు కాబట్టి..నీతో డైరెక్ట్ ఫ్లర్టింగ్ అన్నమాట.. ఒక వేళ నేను ఎవరైనా అమ్మాయిని పటాయించాలంటే మాత్రం నా నైజాన్ని దాచి, బుద్ధిగా ప్రవర్తించే వాడిని,” వివరించి చెప్పాడు, తేజ.

“నీ నిజాయితీ…నీ పొజిషన్ మీద నీకున్న అవగాహన, నీలో నాకు నచ్చేసిన అంశాలు. నాతో బుద్ధిగా కాకుండా, కావలసినంత ఫ్లర్టింగ్ చేసుకో ” అంటూ నవ్వేసింది, స్వేచ్ఛ.

“నువ్వదే మాట మీదుండు… రేపు సాయంత్రం డేట్ కి వెళ్దామా?”, తన అపార్ట్ మెంట్ దగ్గర కారు దిగిన తరవాత అన్నాడు, తేజ.

“నో..ధ్యాంక్ యూ. నిన్ను రోజూ భరించాలంటే కొంచెం కష్టమే”

“అదీ చూద్దాం…రేపు నాతో ఎలా రాకుండా ఉండగలవో. నీ విల్ పవర్ కి టెస్ట్ అన్నమాట”, కవ్విస్తూ అన్నాడు తేజ.
“నీకు అంత సీన్ లేదు…” అంటూ విండో రోల్ చేసుకొని డ్రైవ్ చేసుకొని వెళ్లి పోయింది, స్వేచ్ఛ.

***

“నేను రానని చెప్పను కదా.. నాకు చాలా పనులున్నాయి. నా ఆఫీస్ కి వచ్చి చాలా టైం వేస్ట్ చేసుకొన్నావు” మందలింపు ధోరణి లో చెప్పింది స్వేచ్ఛ.

“ఓకే..నా దగ్గరో ఎక్స్ ట్రా టికెట్ ఉంది, ఈ మ్యూజిక్ కాన్సర్ట్ కి. ఏం చేస్తాం మరి…ముఖ్యమైన పనులున్నప్పుడు వదులుకోలేం కదా..” అంటూ తన దగ్గర ఉన్న టికెట్ ను చూపించాడు, తేజ.

బాలమురళీకృష్ణ, జాకీర్ హుస్సేన్, హరిప్రసాద్ చౌరాసియా జుగల్బందీ. “యూ…ఈవిల్, ఈవిల్ మాన్.. ఒక్క టూ మినిట్స్ లో వచ్చేస్తాను” అని చెప్పి లోపలి పరిగెత్తింది, స్వేచ్ఛ.
హిందుస్తానీ, కర్నాటక రాగాలలో తేజ పరిజ్ఞానాన్ని చూసి చకితురాలయ్యింది స్వేచ్ఛ. సాహిత్యంలో కుడా విశ్వనాధుడి నించీ నేటి తరం రచయితల వరకూ అతడి విశ్లేషణాత్మక అభిప్రాయాలు, అతడి అభిరుచులు కూడా ఒకింత ఆకట్టుకున్నాయి స్వేచ్ఛని. వీకెండ్ సాయంత్రాలన్నీ ఇలాంటి డేట్స్ తోను, తదనంతరం డిన్నర్స్, కొన్ని సార్లు రాత్రి మొత్తం కొనసాగిపోయే చర్చల తోను రెండు నెలలు ఇట్టే గడచిపోయాయి.

***

“నువ్వేం చేస్తున్నావో నీ కేమైనా తెలుస్తోందా?” సీరియస్ గా అడిగింది సుజాత.

“నువ్వనుకుంటున్నలాంటిదేమి లేదు… తేజాకి, నాకు అభిరుచులు బాగా కలిశాయి. అతనితో ఉన్నప్పుడు సమయం ఎలా గడిచిపోతుందో అస్సలు తెలీదు. అతని తో మాట్లాడకపోతే మాత్రం ఎదో వెలితి గా ఉంటుంది” అంటూ సిన్సియర్ గా సమాధానం ఇచ్చింది స్వేచ్ఛ.

“రోజూ మాట్లాడుతున్న నీకు తెలియకపోవచ్చేమో గానీ…మాకు మాత్రం అతని కళ్ళల్లో నీతో మాట్లాడుతున్నప్పుడు కనపడే మెరుపు, ఆత్మీయత, బాడీ లాంగ్వేజ్ చూస్తుంటే, స్నేహం కంటే ప్రేమే ఎక్కువగా కనపడుతోంది”

“నీకు అతని గురించి తెలియదు… మా ఇద్దరికీ, మా రిలేషన్ గురించి మంచి క్లారిటీ ఉంది”

“ఐ హాప్ సో! మేము కన్విన్స్ కాకపోయినా నష్టం లేదు…మిమ్మల్ని మీరు వంచించుకోకపోతే చాలు” అంటూ తన పని అయిపోయినట్లుగా లేచి, ఆలోచనలోకి నెట్టిన స్వేచ్చను వదిలేసి, క్యాంటీన్ బయటకు నడచింది సుజాత.

***

సాయంత్రం డాన్స్ ప్రోగ్రాం ముగిసిన తరువాత, స్వేచ్ఛ అపార్ట్ మెంట్ కి చేరుకున్నారు, ఇద్దరూ. స్వేచ్ఛ, ఇద్దరికీ వైన్ ఇచ్చి, ఒక్క అరగంటలో డిన్నర్ సిద్ధం చేస్తానంటూ కిచెన్ లోపలికి వెళ్ళింది. సోఫా మీద వదిలేసిన స్వేచ్ఛ ఆఫీస్ ల్యాప్టాప్, తీసుకొని, కీబోర్డ్ మీద టకటకా టైప్ చెయ్యటం ప్రారంభించాడు తేజ.

“ఔను తేజ… ఈ మధ్య ఏమిటి నాతో ఫ్లర్టింగ్ తగ్గించేసావు…ఐ యాం మిస్సింగ్ మై ఓల్డ్ తేజా..” అంటూ కిచెన్ నించే ప్రశ్నించింది స్వేచ్ఛ.

“నాకు నిజంగానే అలా చెయ్యాలనిపించట్లేదు…ఎందుకో అనిపించట్లేదో తెలుసుకోవాలంటే కుడా భయమేస్తోంది.”

మాటలలోని తీవ్రతని పసిగట్టినా, ముఖకవళికలని గమనించే అవకాశం లేకపోవటం వల్ల, ఒక్క క్షణం గుగుర్పాటు చెందిన గుండెను సంభాలించుకొని, స్వేచ్ఛ “జోక్ చెయ్యద్దు…తేజా..నీ మనసులో ఏముందో చెప్పు..” అన్నది. తేజ నెమ్మదిగా నడచివచ్చి, ఆమె చెయ్యి పట్టుకొని, లివింగ్ రూమ్ లో ఉన్న సోఫా దగ్గరకి తీసుకొచ్చాడు. ఆమె ల్యాప్టాప్ తెరచి చూపించాడు. హార్ట్ షేప్ లో బెలూన్స్ ఎగురుతున్నాయి. “స్వేచ్ఛ.. I love your name.. I love your confidence.. I love your presence… I love everything about you..కానీ నీకు ఐ లవ్ యూ అని చెప్పటానికి మాత్రం భయపడుతున్నాను. కొన్ని సార్లు కొన్ని భావాలు వ్యక్త పరచటానికి  ఒక జీవిత కాలం పడుతుందేమో కదా?”
ఊహించని ఈ సంఘటనతో ఒక్క సారిగా ఆశ్చర్యపడింది స్వేచ్ఛ. ప్రతిస్పందనకి తావివ్వకుండా, స్వేచ్చని తన బాహువులలో బంధించాడు తేజ. స్వేచ్ఛ పెదవులపై తన పెదవులతో ముద్ర వేశాడు. మొదట ప్రతిఘటించినా ఆమె పెదవులూ విడిపోయి అతనికి పూర్తి సహకారాన్ని అందించాయి. స్వేచ్ఛ మొబైల్ రింగు తో మళ్ళీ మామూలు ప్రపంచం లోకి వచ్చారిద్దరూ. సూర్య నించి కాల్.

సూర్య ఎంతో ఉత్సాహం గా “గుడ్ న్యూస్… నేను అనుకున్నదాని కంటే ముందుగా పని ముగించుకొని వచ్చేస్తున్నాను. రేపే ల్యాండ్ అవుతున్నాను.”

“లేదు, సూర్యా…ఇప్పటికే చాలా ఆలస్యమైపోయింది! రేపు కలుద్దాం” అని చెప్పి స్వేచ్ఛ ఫోన్ కట్ చేసింది.

***

స్వేచ్ఛ, సూర్య, తేజ, ముగ్గురూ, గుడిలో కలుసుకున్నారు. స్వేచ్ఛ ముందర మాట్లాడటం మొదలెట్టింది.

“మీ ఇద్దరిలో ఎవ్వరినీ నేను తప్పు పట్టటం లేదు. ఇద్దరికీ చేరువై నేనే ఈ పరిస్థితి కి బాధ్యురాలిని. మీరు ఒకరి కోసం ఒకరు త్యాగాలు చేసుకోవటం నాకస్సలు ఇష్టం లేదు. అలా అని మీ ఇద్దరిలో నేను ఎవ్వరినీ వదలుకోలేను. దానికి ఒక్కటే మార్గం…”

“ఏమిటది?” అన్న ప్రశ్నార్ధకమైన చూపుతో ఇద్దరూ స్వేచ్ఛ వైపు చూశారు.

“మన మధ్య ఈ “ప్రేమ” అనే జంజాటాన్ని తీసేస్తే, మన ముగ్గురం మంచి స్నేహితుల్లాగా ఉండిపోవచ్చు.”

“ఫ్యూచర్ సంగతేమిటి?” అంటూ సూర్య ప్రశ్నిస్తే, “ఇది మరీ తొక్కలో తెలుగు సినిమాలా ఉంది” అంటూ తేజ తనదైన శైలిలో స్పందించాడు.

“మనకి జోడైన వాళ్ళు మనకు తగలక పోరు. ప్రేమ ఒక్కసారే కలగదు అనటానికి వేరే ఋజువులఖ్ఖర్లేదనుకుంటాను?” ఒక రకమైన నిర్లిప్తతతో పలికింది స్వేచ్ఛ.

సూర్యా, తేజా లు కొంచెం దూరంగా వెళ్లి మంతనాలు జరిపారు. తిరిగి వచ్చి, “ఈ వీకెండ్ లో నువ్వేమీ తొందరపడి నిర్ణయాలు తీసుకోకు. మేమిద్దరం కలిసి ఒక నిర్ణయానికొచ్చి, నీకు మండే మార్నింగ్ చెప్తాం, ఏం చేయాలో” అంటూ స్పష్టత లేకుండా చెప్పి, శలవు తీసుకున్నారు.

***

మండే మార్నింగ్ ఆఫీసు కొచ్చిన స్వేచ్ఛ చాలా అసహనంగా ఉంది. వెబ్ సైట్లు ఒక్కక్కోటే తెగ తిప్పేస్తోంది. ఇ-మెయిల్ ఒకటి ఇన్ బాక్సు లో కొచ్చి కూర్చోంది.

“స్వేచ్ఛ,
నీకు మా మీద ఏ మాత్రం ప్రేమ, నమ్మకమూ ఉన్నా, మేం చెప్పేది జాగర్తగా విను. ఇంకొక అయిదు నిమిషాలలో నువ్వు ఆఫీసు వదిలేసి బయటకు వచ్చెయ్యి. అక్కడ సిద్ధంగా ఉన్న టాక్సీ ఎక్కి ఎయిర్పోర్ట్ కి వెళ్ళిపో. నీ కోసం ఒక ఏజెంటు నీ పాస్పోర్ట్, బోర్డింగ్ కార్డు తో సిద్ధంగా ఉంటాడు. అది తీసుకొని ఫ్లైట్ ఎక్కేయి. నీ కెక్కువ సమయం లేదు. ల్యాప్టాప్ వదిలేసి, బయటకు పరిగెత్తు, ప్లీజ్!
సూర్య, తేజ.”

స్వేచ్ఛకి ఆలోచించటానికి సమయం కూడా లేదు. గబుక్కున తన బ్యాగ్ తీసుకొని బయట పడింది. చెప్పినట్లుగా ఒక టాక్సీ రెడీ గా ఉంది. ఎయిర్పోర్ట్  చేరుకొని, బోర్డింగ్ కార్డ్ తీసుకొని, ఫ్లైట్ లోకి చివ్వరి నిమిషంలో అతి కష్టం మీద అడుగు పెట్టింది. బాగ్ లోని, బ్లాక్ బెర్రీ వైబ్రేట్ అవుతోంది. తీసి చూస్తే, రెడ్ ఫ్లాగ్ తో టాగ్ అయ్యున్న ఇ-మెయిల్, బ్యాంక్ సెక్యురిటీ నించి. “బ్యాంక్ లో సెక్యురిటీ ఫైల్యూర్. ఎవరో ఎంప్లాయీ ల్యాప్టాప్ ద్వారా సెక్యురిటీ బ్రేక్ చేసి, బ్యాంక్ నించి అయిదు మిల్లియన్ డాలర్ల మొత్తాన్ని ఫారెన్ బ్యాంక్ కి బదిలీ చేశారు. అందరు ఎంప్లాయీలు క్యాంపస్ లో ఉండమని, ఎవ్వరినీ కదలద్దని,” ఆ మెయిల్ సారాంశం. “Bastards! చాలా మోసం చేశారు. కానీ నన్నెందుకు తప్పించారు?”

***

Cayman Islands – సూర్య, తేజ, స్వేచ్ఛని రిసీవ్ చేసుకోవటానికి ఎయిర్పోర్ట్ కి వెళ్తున్నారు.

“బాంక్ ఫారిన్ ఇన్వెస్ట్మెంట్ వివరాలను రాబట్టి, ఇక్కడ అకౌంట్స్ సెట్ అప్ చెయ్యటమే నీ పని.. మధ్యలో ఈ ప్రేమ గొడవెందుకు పెట్టుకున్నావు?” అడిగాడు తేజ.

“నువ్వేమన్నా తక్కువ తిన్నావా? స్వేచ్ఛ తో పరిచయం పెంచుకొని తన ల్యాప్టాప్ ద్వారా సెక్యురిటీని బ్రేక్ చేసి, నేను సెట్ అప్ చేసిన అకౌంట్స్ లోకి డబ్బు పంపటమే నీ పని. పైగా నేను తనని ప్రేమిస్తున్నానని తెలిసి కుడా ఇంత మిత్రద్రోహం చేస్తావా?” అన్నాడు సూర్య.

“ఒకే.. నా ప్రపోజల్ విను. ఆ అయిదు మిలియన్ డాలర్లు నువ్వు తీసేసుకో. స్వేచ్ఛను నాకు వదిలెయ్!”

“అదే ప్రపోజల్…నా సైడ్ నించి కుడా…” బదులిచ్చాడు సూర్య.

“పోనీ కాయిన్ టాస్ చేద్దామా?”

“మన మాటలు కానీ స్వేచ్ఛ విన్నదంటే, ఇద్దరినీ తన్ని తగలేస్తుంది.”

ఇద్దరూ నవ్వుకుంటూ స్వేచ్ఛని రిసీవ్ చేసుకోటానికి గేటు దగ్గరకెళ్ళారు. స్వేచ్ఛ బయటకు వస్తూనే కనపడిన సూర్యను, చాచి ఒక్కటి కొట్టింది చెంప అదిరేటట్లు. వెనక దాక్కున్న తేజ కుడా, అది చూసి, ముందుకు వచ్చి బుద్ధిమంతుడి లాగా కళ్ళు మూసుకొని నిలబడ్డాడు. అతడి గూబా గుయ్యిమనిపించింది స్వేచ్ఛ.

***

కారు, సముద్రపు ఒడ్డున ఉన్న ఒక భవంతి బయటకొచ్చి ఆగింది. “జరిగినదంతా నీకు కారులో వివరంగా చెప్పాం.. ఏం చేస్తావో నీ ఇష్టం. మాలో ఎవరో ఒకరిని ఎంచుకో. డబ్బు రెండు వాటాల్లో పంచుకుందాం. నిన్ను పొందలేని వాడు జీవితాంతం నిన్ను మర్చిపోయేందుకు తాగడానికి సరిపోయే డబ్బు ఎలాగూ ముడుతుంది…” అంటూ డైరక్టు గా చెప్పేశాడు తేజ.

“ముగ్గురం ఫ్రెండ్సు అని మాత్రం మొదలెట్టద్దు….” అనేశాడు, సూర్య.

“మనం మనకు తెలిసిన సమాజాన్ని వదిలేసి వచ్చేశాం. ఇంకా వాళ్ళు పెట్టిన రూల్స్ మనం ఎందుకు ఫాలో అవ్వాలి? మన దగ్గర కావలసినంత డబ్బు ఉంది. మన రూల్స్ మనమే రాసుకోలేమా?” అంటూ స్వేచ్ఛ వారిద్దరి చేతులను తన రెండు చేతులతో తన ఇరు వైపులా పట్టుకొని, ఇసుక బీచ్ లో ఆ భవంతి వైపు నడవ సాగింది. మరింత అందంగా ఆ చిత్రాన్ని దిద్దుదామనేమో సూర్యుడు వేగంగా సముద్రంలోకి దిగిపోనారంభించాడు.

రెహ్మాన్ తుఝే సలాం!

AR-Rahman_1290837c

ఓ జనవరి మాసంలో, కాలేజి హాస్టల్లో, బయట కొంకర్లు పోయే చలినుండి తప్పించుకొనే ప్రయత్నంలో, రజాయి క్రింద పూర్తిగా దూరిపోయి నిద్ర పోతున్న ఓ ఉదయాన, హటాత్తుగా, నా రూం గోడలు కంపించటం ప్రారంభించాయి. విపరీతమైన “బేస్” తో, హార్డ్ రాక్ మెటల్ మ్యూజిక్ పెట్టి నన్ను తెగ చికాకు పెట్టే వింగ్ చివరి పామ్ గాడి పనయ్యుంటుందని ఊహించి, రజాయిని ఇంకా గట్టిగా కాళ్ళతో నొక్కి పట్టి బిగించా. పాట మొదలయ్యింది.

.

“కొంజెం నిళవు… కొంజెం నెరుప్పు…ఒండ్రాయి సీంతాల్ ఎందం దేహం..” ఒక్క సారి నిద్ర వదిలిపోయింది. ఎంత మంది తమిళులతో సావాసం చేసినా, అంతుబట్టని ఆ భాషను విసుక్కుంటూనే చెవులను రిక్కించా. మన పాటలలో పెద్దగా వినపడని ఏవో శబ్దాలతో నేపథ్య సంగీతం హోరెత్తిస్తోంది.

“కొంజెం నంజు…కొంజెం అముతం…కొంజెం మిరుగం..కొంజెం కడువల్…” ఆ బీట్ కి ఇంకా ఆగలేక రజాయి పూర్తిగా లాగి పారేశా. “చంద్రలేఖా……”, గబుక్కున మంచం మీద నుంచి దూకి, రూం డోర్ తీసి ఆ శబ్దం వస్తున్న దిశ వైపు వడిగా నడిచా. వింగ్ చివరి పామ్ గాడే! వాడి లైఫ్ లో, ఇంగ్లీషు పాటలు తప్పించి ఇంకే భాషా సంగీతం వినటం నేను చూడలేదు!
వాడి రూమ్ తలుపు నెమ్మదిగా నెట్టి లోపలికి తొంగి చుస్తే, అయిదారుగురు “ఛోమ్స్” (మా కాలేజి లింగోలో నార్త్ ఇండియన్స్ ని సంబోధించే తీరు), గాలి గిటార్లు కొడుతూ తన్మయత్వంతో ఊగిపోతున్నారు. వాళ్లనలాగే చూస్తూ పాట పుర్తయ్యేవరకూ ఆగి లోపలికెళ్ళా. అదేదీ కొత్త రాక్ బ్యాండ్ కాదు, “తిరుడా తిరుడా” అనే తమిళ్ సినిమాలో, రహ్మాన్ పాటని తెలిసి విస్తూపోయా. భాష ఏ మాత్రం తెలియని జనాలని కుడా తన సంగీతంతో ఉర్రూతలూగించగలిగిన ఈ మాంత్రికుడితో ఒక సుదీర్ఘప్రయాణం మొదలవ్వబోతోందన్న విషయం, అప్పట్లో తట్టలా.

“రోజా” చిత్రం తో అప్పటికే పరిచయమైన రెహ్మాన్ అంటే ఒక రకమైన నిరసన భావం ఉండేది. దానికి కారణం, ఆ చిత్ర దర్శకుడు మణిరత్నం ఒక పత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యు నే.  రోజా పాటలు దక్షిణభారతమంతా మారుమోగిపోతున్న సమయంలో, “రెహ్మాన్ బాగా టాలెన్టెడ్. క్రొద్ది రోజులలో నే ఇళయరాజా ని మించిపోతాడు” అన్న అతగాడి మాటలు చదివి  నాకు చిరాకు తో మిళితమైన ఆవేశం వచ్చింది. అప్పటి వరకూ వచ్చిన మణిరత్నం సినిమాలన్నిటికీ అద్భుతమైన సంగీతాన్ని అందించిన రాజా ని, కేవలం ఒక్క సినిమా కి పాటలు కొట్టిన రెహ్మాన్ తో పోల్చటమే కాకుండా, అతడిని దాటి వెళ్తాడు అనేసరికి, రాజా వీరాభిమనినైన నాకు కాలదు, మరీ!

కానీ, ఒక ఆర్టిస్టు లోని ప్రతిభను అంత లోతుగా గుర్తించి, ఇంకా ఏమీ సాధించని ఆ జూనియర్ మీద అంత ధైర్యం గా జోస్యం చెప్పగలగటం, మణిరత్నం యొక్క గొప్పతనం అని నాకర్ధమయ్యింది, నా 20/20 వెనకచూపుతోనే.

“తిరుడా తిరుడా” పాటలలో రెహ్మాన్ చేసిన పెద్ద ప్రయోగం, పరిచయమున్న గొంతులను (మనోను మినహాయించి) ఏ పాటలకూ వాడకపోవటం. ఆ ప్రయోగం, మున్ముందు, అగ్ర సంగీత దర్శకులలో  రెహ్మాన్ యొక్క స్థానాన్ని మరింత పటిష్టపరుస్తుందన్న విషయం, బహుశా అతడు కుడా ఊహించిఉండకపోవచ్చునేమో! అతని “చలవ” వల్లనే, చాలా మందికి ఇప్పటికీ ఆ పాటలు పాడిన గాయనీ గాయకుల పేర్లు తెలియవు. ఆ పాటలన్నీ రెహ్మాన్ పాటలు! అంతవరకూ పాటలన్నీ చాలా వరకూ వాటిని పాడిన వారి గళాలతో తో ముడిపెట్టి గుర్తించేవారు.

రెహ్మాన్ తెలుగులో ఇప్పటి వరకూ డైరెక్టుగా చేసిన సినిమాల్లోని పాటలేవీ అంత గుర్తుపెట్టుకోదగ్గవి కావు. “సూపర్ పోలిస్”, “గ్యాంగ్ మాస్టర్” నించి రెండేళ్ళ క్రితం విడుదలైన “కొమరం పులి” వరకూ ఏవో ఒకటీ, అరా జనాదరణ పొందినా, తమిళం లో, హిందీలో చూపించిన చిత్తశుద్ది తెలుగులో చూపించలేదేమోనన్న అనుమానం రాక తప్పదు, కారణాలేవైనా. అతడి డబ్బింగు పాటలు మాత్రం, ఆ లిరిక్స్ ఎంత అతకనివైనా, విపరీతమైన జనాదరణ పొందాయి. జంటిల్మెన్ చికుబుకులూ, ఇండియన్ టెలిఫోన్ ధ్వనిలో నవ్వటాలూ, ప్రేమికుడు పేట ర్యాప్ లు, ప్రేమ దేశం ముస్తఫ్ఫాలూ, ఇలా సరదా పాటలతో నా రెండేళ్ళ జీవితం గడచిపోయింది.  మణిరత్నంతో చేసిన బోంబే పాటలు మాత్రం వీటన్నిటికీ భిన్నంగా రెహ్మాన్ లోని దాగున్న ఆ

“జీనియస్” ని, ఛాయామాత్రంగానైనా చూపించాయి.

“మెరుపు కలలు” పాటలు మార్కెట్ లోకి విడుదలైనంతనే వెళ్లి క్యాసెట్ కొనుకొచ్చి పాటలన్నీ ఒకసారి వినేశా. ఏ ఒక్కటీ నచ్చలేదు. అప్పటికీ రాజా పిచ్చ వదలని నేను, అదే సమయం లో విడుదలైన “చిన్నబ్బాయి” పాటల క్యాసెట్ కుడా కొన్నా. విన్న వెంటనే, ఒకటి రెండు పాటలు నోట్లో ఆడటం ప్రారంభించాయి. “ఎంతైనా రాజా రాజానే” అనుకొని తృప్తిపడిపోయి, ఆ రెండూ పక్కన పడేశా. కానీ ఆ సమయంలో బెంగుళూరులో ఉంటున్న నాకు, ఎక్కడికి వెళ్ళినా ఆ “మెరుపు కలలు” పాటలే తమిళం లో వినిపించేవి. విన్న ప్రతిసారీ అంతకు మునుపు కంటే ఇంకా ఎక్కువగా నచ్చటం ప్రారంభించాయి. ఆ పాటలు ఆ తరువాత ఎన్ని వందల సార్లు విన్నానో నాకు గుర్తు లేదు. కానీ రెహ్మాన్ సంగీతంలో ఒక నిశ్చితమైన మార్పుని గమనించింది మాత్రం ఈ సినిమా పాటలతోనే! ఆ పాటల తరువాత అతని ఆల్బమ్స్ అన్నిటిలోనూ దాదాపుగా అదే వైఖరి నాకు కనిపించింది. చాలా పాటలు విన్న వెంటనే నచ్చెయ్యవు; కొద్ది సార్లు విన్న తరువాత మాత్రం ఆ పాటలను వదలిపెట్టలేం; ఎన్నో ఏళ్ళు వెంటాడతాయి. “వెన్నెలవే వెన్నలవే”, “అపరంజి మదనుడే, అనువైన సఖుడులే” అవే కోవలోకొస్తాయి.

అదే సమయంలో నేను అమెరికా వచ్చెయ్యటం జరిగింది. ఎన్నో సార్లు “అపరంజి మదనుడే” అని పాడుకొని, “ఆహా ఎంత మధురమైన  ప్రేమ గీతం! ఒక ప్రియురాలు తన ప్రియుడిని ఎంత చక్కగా వర్ణిస్తోంది” అని నా మందమతి మురిసిపోయేది, ఆ తరువాత వచ్చే లిరిక్స్ ఏమీ పెద్దగా అర్థం కాకపోయినా. అప్పటికే రంగీలా పాటలతో ముదిరిపోయిన నా రెహ్మాన్ పిచ్చిని గుర్తించిన నా స్నేహితురాలొకావిడ, “సప్నే” క్యాసెట్ ను నాకు ఇండియా నించి పంపించింది.

మొదటి పాట: “రోషన్ హుయీ రాత్, ఓ ఆస్మా సే జమీ పె ఆయా.. రోషన్ హుయీ రాత్, మరియం కా బేటా ముహొబ్బత్ కా సందేస్ లాయా”. ఆ క్షణంలో నాకు రెహ్మాన్ తెలుగు పాటంటే కలిగిన విరక్తి, నా అభిమాన గీత రచయిత వేటూరి చేసిన అరాచకం పైన నాకు కలిగిన ఆగ్రహం, నన్ను పూర్తిగా రెహ్మాన్ హిందీ పాటల వైపుకి త్రోసేసాయి. ఎంతగా అంటే, “విశ్వవిధాత” అనే హిందీ సినిమాకి రెహ్మాన్ సంగీతం అందించాడని తెలిసి, ఒక డెభ్భై అయిదు మైళ్ళు, ఆదివారం రాత్రి డ్రైవ్ చేసుకెళ్ళి, క్యాసెట్ కొనుక్కొని వినేంతగా!

అదే సంవత్సరం విడుదలైన “ఇరువర్” లోని “శశివదనే శశివదనే, స్వరనీలాంబరి నీవా”, రెహ్మాన్ సంగీతంలోని ఒక కొత్త పార్శ్వాన్ని నాకు పరిచయం చేసింది. “ఓ చెలియా నా ప్రియ సఖియా” లాంటి పాటలు అడపా దడపా రెహ్మాన్ సంగీతంలో వినిపించినా, ఆతని పాటల్లో దాగున్న కర్నాటక రాగాల పోకడల గురించి ఎప్పుడూ పెద్దగా పట్టించుకోలేదు. “ఇద్దరు” సినిమాలోని ఆ పాటలో మాత్రం ఆ రాగాలతో ఒక కొత్త ప్రయోగమే చేసాడు. ఆ పాటలో  వినిపించిన రెండు మూడు రాగాలు సాంప్రదాయ రాగమాలిక లాగా కట్టలేదు. మగ గొంతుక ఒక రాగం, ఆడ గొంతుక దాదాపుగా అదే రాగమైనా, కొద్ది పాటి తేడాలు, చరణం కొంత భాగం ఇంకొక రాగం, ఇలా అన్నమాట. శాస్త్రీయ సంగీత నేపథ్యం పెద్దగా లేకపోవటం వల్ల అవేమిటోకొన్ని ఏళ్ల తరవాత గానీ గుర్తు పట్టలేదు, అదీ గూగుల్ దయ వల్లే. కానీ రెహ్మాన్ ఈ రాగాల తో చేస్తున్న విన్యాసాలను కొంచెం జాగర్తగా గమనించాలి, ఇక ముందు, అని మాత్రం అనిపించింది, ఈ పాట తరువాతనే.

రెహ్మాన్, మణిరత్నం కలిసినప్పుడల్లా మాత్రం ఒక సంచలనమే సృష్టించారు. “దిల్ సే” ఆల్బం రెహ్మాన్ ని జాతీయస్థాయి లోని అగ్రసంగీత దర్శకుళ్ళలో చేర్చేసింది. సుఖవిందర్ సింగ్ “ఛయ్య ఛయ్య” తో దేశాన్ని ఒక ఊపు ఊపితే, “ఏ అజ్నబీ”, “జియా జలే, జాన్ జలే”, “దిల్ సే రే” పాటలు ఇప్పటికీ పాటల రియాలిటీ షోలలో తరచుగా వినపడుతూనే ఉంటాయి. సినిమా సక్సెస్ తో సంబంధం లేకుండా ఈ పాటలు సూపర్ హిట్టై, మన భారతదేశమే గర్వించదగ్గ దర్శకులలో ఒకరైన మణిరత్నం ప్రకాశాన్ని కూడా, రెహ్మాన్ వెలుగులో కప్పేశాయి. ఒక దక్షిణభారతీయుడిగా, ఒక్కసారిగా నాకు చెప్పలేని, ఆనందం, గర్వం కలిగింది, ఈ పాటలు దేశమంతటా ప్రాచుర్యం పొందగానే. ఒక ఘంటసాల, ఒక ఇళయరాజా దాటుకెళ్ళలేని ఉత్తర, దక్షిణదేశాల మధ్య ఉన్న అడ్డుగోడ అవలీలగా దాటేసి,  “యూనివర్సల్” ఆమోదాన్ని ఇతగాడు సాధించగలిగాడన్న ఆనందం అసలు కారణమేమో!

స్వతంత్ర భారతం యాభై ఏళ్ళు పూర్తిచేసుకుంటున్న సందర్భంగా రెహ్మాన్ “వందేమాతరం” ఆల్బం చెయ్యబోతున్నాడన్న వార్త వినగానే, నా ఆశలు ఆకాశాన్నంటాయి. ఎదో, ఒక్క రోజు పని, మీద న్యూయార్క్ వెళ్ళాల్సివచ్చినప్పుడు, అక్కడ చుడాల్సినవి ఎన్నో ఉన్నా, తిరుగు  ఫ్లైటు ఎక్కటానికి ముందు మిగిలున్న నాలుగు గంటలు మాత్రం నేను ఒకే పనికి అంకితం చెయ్యాలని నిశ్చయించేసుకొన్నా.  “జాక్సన్ హైట్స్” కి వెళ్లి అక్కడ ఆ రోజే విడుదలైన ఆ ఆల్బం కొందామని. సి.డి. కొన్నప్పటినుంచీ ఎప్పుడెప్పుడు విందామా అని తెగ ఆరాటపడిపోయా. పిట్స్బర్గ్ లో ఫ్లైట్ లాండ్ అయిన ఇరవై నిమిషాలకి ఆ అవకాశం దొరికింది.

కారులోని ప్లేయర్ లోకి, సి.డి.ని తోసేసి, హైవే ఎక్కంగానే సిస్టం ఆన్ చేశా. ఆరు స్పీకర్లనించి మొదలయ్యింది, “మా తుఝే సలాం” అంటూ హై పిచ్ లో రెహ్మాన్ పాట.  ఒళ్ళు ఒక్కసారి గుగుర్పొడిచి శరీరంలో  ఒక కంపన మొదలయ్యింది. ఒక రకమైన ఆవేశంతో, ఒళ్ళు తూలిపోతూ, కారు వశం తప్పి ప్రమాదం జరుగుతుందేమో అనిపించేంతలా, కదిలించేసింది, ఆ పాట. “వందేమాతరం” అన్న రెహ్మాన్ చేసిన నినాదం తలుచుకుంటూ౦టే ఇప్పటికీ అది నా చెవుల్లో, ప్రతిధ్వనిస్తూనే ఉంటుంది. ఏ మూలో, నిస్తేజంగా పడిఉన్న దేశభక్తిని ఒక్కసారి ఉవ్వెత్తున లేపినందుకేనేమో, ఆ పాట అంటే అంత మోహం!

“ఇస్క్”బినా అంటూ మొదటి పాటతో బాగా ఇరిటేట్ చేసినా, “తాల్” చిత్రంలో రెహ్మాన్ పాటలలో చూపించిన నేర్పు, వైవిధ్యం, సామాన్యమైనది కాదు. “రాంఝణావే, సోణియావే, మాహియావే” అంటూ పక్కా పంజాబీ పాట, “కరియేనా, కరియేనా కోయి వాదా కిసిసే కరియేనా” అంటూ ఒక యూ.పి. పల్లె పాట, సింఫనీ స్టైల్లో టైటిల్ పాట ఇలా, ఏ పాట కా పాటే అద్భుతంగా స్వరపరిచారు, రెహ్మాన్. ఈ ఆల్బమ్ తో ఇక హిందీలో కూడా ఎవ్వరూ పట్టించుకోనంత (చేరుకొనే శక్తి లేదని గ్రహించుకొని) ఎత్తుకు ఎదిగిపోయాడు, అతడు.

ఇక “లగాన్” పాటల గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే అవుతుంది. ఆ సినిమా ఆస్కర్ అవార్డులకి ఎంపిక అవ్వటంతో, రెహ్మాన్ పరిచయం బయట ప్రపంచానికి కూడా తెలిసిపోయింది. ఆండ్రూ ల్లాయాడ్ వెబ్బర్ సారధ్యంలో, “బోంబే డ్రీమ్స్”, మ్యూజికల్ కి రహ్మాన్ పెద్ద కష్టపడకుండా సంగీతం అందించి, అంతర్జాతీయ మ్యూజిక్ సీన్ లో తనకొక ఐడెంటిటీ ని ఏర్పర్చుకున్నాడు. ఆఫీసు పని మీద లండన్ వెళ్ళిన నేను, ఆ షో ముందరి వరస సీటు కోసం ఎక్కువ ధర చెల్లించి, నా వంతు దక్షిణని నేను సమర్పించుకున్నాను.
“స్వదేశ్” సినిమాలోని “యే జొ దేశ్ హై తేరా..”, ఇంకొక వీడని నీడ లాగా వెంటాడే పాట.

నేను అమెరికా పౌరసత్వాన్ని స్వీకరించాలన్న ఆలోచనలో ఉన్నప్పుడు వచ్చిన ఆల్బం ఇది. ఈ పాట వింటున్నప్పుడల్లా, నా దేశ పౌరసత్వాన్ని కోల్పోబోతున్నానే, అని గుండె ఎక్కడో కలుక్కుమనేది. ఆ పాట నా నిర్ణయాన్ని మార్చలేదు కానీ,  నా భారతీయ ఉనికికి నేను మరింత కట్టుబడి ఉండటానికి ఎంతో కొంత దోహదపడింది. అలాగే “లెజెండ్ అఫ్ భగత్ సింగ్” లోని “సర్ఫరోష్ కి తమన్నా అబ్ హమరే దిల్ మే హై!” తీసుకున్నా, అదే సినిమాలోని “మాయే..రంగ్ దే బసంతి ఛోలా”, “రంగ్ దే బసంతి”  సినిమాటైటిల్ సాంగ్ తీసుకున్నా, ఆ పాటలు మనలో కలగజేసే అనుభూతులతో, రోమాలు నిక్కబోడుచుకోక మానవు!

భక్తి పాటలు తీసుకున్నా కూడా, రెహ్మాన్ చాలా గుర్తుండిపోయేవి అందించారు. సూఫీ శైలిలో, “పియా హాజీ అలీ”, “ఖ్వాజా మేరె ఖ్వాజా”, భజన ఫక్కీలో “ఓ పాలన్ హారే”, “మన్ మోహనా” అని శాస్త్రీయంగానూ తన ముద్ర వేస్తూనే అందరి ఆమోదాన్ని పొందగలిగారు. శాస్త్రీయ సంగీత రాగాలతో రెహ్మాన్ చేసిన ప్రయోగాలు కుడా కోకొల్లలు. “మామ” రాగాలకు ఎంతో నిబద్ధుడై తన పాటలను స్వరపరిస్తే, “రాజా” అదే రాగాలను జనాలకు బాగా తాకే రీతిలో సులువైన బాణీలు కట్టి తన వైదుష్యాన్ని ప్రదర్శించారు. రెహ్మాన్ ఆ రాగాలకే క్లిష్ఠతరమైన బాణీలు తనదైన శైలిలో కూర్చటంతో, ఎంతో పరిజ్ఞానం ఉంటే గానీ ఆ ప్రయోగాలని గుర్తించటం కష్టం. నేను రెహ్మాన్ ఆల్బమ్లు విడుదల అవ్వంగానే మన తమిళ సోదరులు ఆ పాటలలోని రాగాలను చీల్చి, విశ్లేషించి వ్రాసే బ్లాగుల కోసం ఎదురు చూసేవాడిని.
ఎంత చెప్పుకున్నా తరగదు అనిపించేలా ఉన్న  రెహ్మాన్ ఖజానా లోని పాటలను నిజంగా లెక్కెట్టి చూసి, తన సమకాలీన దర్శకులతో పోలిస్తే, ఆ సంఖ్య తక్కువే. “క్వాంటిటీ” కంటే “క్వాలిటీ” ముఖ్యమనుకొని, ప్రతి పాటనూ ఎంతో ప్రయాసతో శ్రద్ధగా చెక్కుతూ ఎక్కువ సమయం తీసుకోవటం ఒక కారణమైతే, అన్ని చెత్త సినిమాలకూ తన సంగీతాన్ని అందించటం ఇష్టం లేక, తన పని కి ఒక “ప్రీమియం” ఛార్జి చేస్తూ, అనేక “పాట్ బాయిలర్” సినిమాలకు అందుబాటు లో లేకుండా ఉండటం మరొక కారణం. రెహ్మాన్ ఆస్కార్ అవార్డు సందర్భంగా వ్రాసిన తన బ్లాగులో రాం గోపాల్ వర్మ, రెహ్మాన్ పని తీరుపై ఎన్నో ఆసక్తికరమైన విషయాలు చెప్పారు. దానిలో నాకు బాగా గుర్తుండి పోయిన వాక్యాన్ని ఇక్కడ యధాతధంగా కోట్ చేస్తున్నాను.
“I’ve decided that whatever goes from here has to be good”. He said it with neither arrogance nor extreme confidence.”

రెహ్మాన్ సంగీతం, కొంచెం ఎక్స్త్రాపోలేట్ చేస్తే అతని వ్యక్తిత్వం వెనకనున్న ఫిలాసఫీ, పైనున్న ఆ ఒక్క వాక్యం లో ప్రకటితమవుతుందనిపిస్తుంది.

నేను ఇంతగా అభిమానించే రెహ్మాన్ చికాగో కాన్సర్ట్ ఇవ్వటానికి వస్తున్నాడని తెలియంగానే, నేనే కాకుండా నాకు తెలిసిన వారందరి చేతా టికెట్లు కొనిపించి తీసుకెళ్లా. 2007 లో జరిగిన ఈ ప్రోగ్రాం, ఎన్నో మధురమైన జ్ఞాపకాలను మిగిల్చింది. అప్పుడే విడుదలైన “గురు” సినిమా లోని “జాగే హై దేర్ తక్ హమే..కుచ్ ఔర్ సోనే దో”, ఒక శ్లోకం స్టైల్లో సాగే పాటతో ప్రారంభమైన ఆ ప్రోగ్రాం, “వందేమాతరం” తో పతాకస్థాయికి చేరింది. కార్యక్రమం ముగిసింది అని తెలిసినా కూడా, కొద్ది నిమిషాల పాటు ఎవ్వరూ కదలకుండా మౌనంగా ఉండిపోయారు. మరికొద్ది నిమిషాల పాటు చప్పట్లతో మారుమ్రోగి పోయిన ఆ స్టేడియం నించి బయటపడేడప్పుడు కూడా, ఎదో అసంతృప్తి, అప్పుడే అయిపోయిందే అని.

“జై హో!” – ఆస్కార్ వచ్చినా, విమర్శలు ఎన్నో, “అసలా స్థాయి పాటేనా అది!” అని. తొంభై తొమ్మిది పరుగులు ఎంతో లాఘవంగా సాధించిన బ్యాట్స్మన్, అ వందో పరుగుని, సుందరమైన స్క్వేర్ కట్ ద్వారా సాధించాడా, లేక, స్లిప్పుల లోంచి నిక్ చేసి కొట్టాడా అని విశ్లేషణ చేస్తూ కూర్చుంటే, పాయింట్ పూర్తిగా మిస్ అయినట్టే. ఎన్నో ఏళ్ళు అద్భుతమైన సంగీతాన్ని అందించటం వల్లే రెహ్మాన్ కి ఒక ఆస్కార్ స్థాయి సినిమాకి పని చేసే అవకాశం వచ్చింది, దాని కోసం స్వరపరచిన పాటలకూ, ఆ సినిమా ద్వారా గుర్తింపు వచ్చింది. కాబట్టి, “నిక్” చేసిన వందో పరుగు లాంటి “జైహో” ని గుర్తించి అవార్డు ఇచ్చినా, నేను ఆ అవార్డుకు పాత్రుడైన ఒక గొప్ప సంగీతకారుడికిచ్చి  గౌరవించారనే సరిపెట్టుకుంటాను.

గత నాలుగైదేళ్ళలో, రెహ్మాన్ చేసిన చాలా ఆల్బమ్లు నాకు నచ్చలేదు. “యవరాజ్”, “గజని”, “బ్లూ”, “రావణ్”, “పులి”, “రోబో”, “ఝూటా హీ సహీ”, “జబ్ తక్ హైన్ జాన్” లాంటివన్న మాట. కానీ మధ్యలో ఒకటి, రెండు మెరుపు తీగలు, “ఏ మాయ చేశావే!”, “ఢిల్లీ-6” లాంటివి వచ్చి, “లేదు, పాత రెహ్మాన్ ఇంకా మిగిలున్నాడు” అని గుర్తు చేస్తాయి.  ఎందుకిలా అని ఆలోచించినప్పుడు నన్ను సంతృప్తిపరచిన సమాధానం, మన సినీ సంగీతంలో ఎక్కాల్సిన శిఖరాలన్నీ ఎక్కేసి, ఒక రకంగా ఒంటరి వాడిపోయిన రెహ్మాన్ ని, మోటివేట్ చేసే సినిమాలు, ఫిల్మ్ మేకర్స్ మన దేశంలో కరువై ఈ పరిస్థితి ఏర్పడిందని. ఇక ముందు ప్రపంచ సంగీత పటంలో ఇంకెన్ని విజయకేతనాలు ఎగరెయ్యనున్నాడో నేను జోస్యం చెప్పలేను గానీ, ఇంతవరకూ అందించిన తన సంగీతవర్షధార చాలు, తను నా మనసులో ఎప్పటికీ చెరగని గుర్తుగా మిగిలిపోవటానికి.

రెహ్మాన్ తుఝే సలాం!

రఫీ – ఘంటసాల: ఇద్దరూ ఇద్దరేనా?

“రఫీ, ఘంటసాల – వీళ్లిద్దరిలో నీకెవరెక్కువిష్టం?” ఇదొక క్లిష్ఠమైన ప్రశ్న. దీనికి సమాధానం గత ముప్ఫై ఏళ్లలో కనీసం మూడు నాలుగు సార్లన్నా మారింది, వాళ్ళ పాటలు పది కాలాలు అలాగే నిలబడి ఉన్నా. “నాకిద్దరూ ఇష్టమే” అని చెప్పి చల్లగా తప్పించుకోవటం ఈ మధ్య అబ్బిన డిప్లోమసీ గానీ, “అన్నీ తెలిసిన” రోజుల్లో బీభత్సం గా  వాదోపవాదాలు జరిపిన ఉదంతాలున్నాయి.

“అసలీ పోలికలెందుకు” అంటారా? ఎప్పుడో పుట్టిన బ్రాడ్ మ్యాన్ ని, సదాబాలుడైనటువంటి టెండూల్కర్ ని, పోల్చి, పోల్చి, మన సచిన్ కే ప్రధమస్థానాన్ని అంటకట్టేసి తృప్తి పడిపోయాం కదా. అలాంటప్పుడు, సమకాలీకులు అయిన ఈ ఇద్దరు మహాగాయకులను పోల్చటాన్ని ప్రశ్నించటం, కొంత వింతగానే ఉన్నా, సమాధానం మాత్రం,  వారిద్దరి పాటలను మరల గుర్తు చేసుకొని తూగిపోవటానికేనని! పన్లో పని, ఎవరు కాస్త ఎక్కువ గొప్పో తేల్చేసుకుంటే, ఓ పక్కన పడి ఉంటుంది, మళ్ళీ మనసు మారే దాకా.

తెలుగుదేశంలో పుట్టి, ఘంటసాల పాటలతో పరిచయం గురించి ప్రత్యేకించి చెప్పుకోదగ్గ విషయం ఏమీ లేదు. ఈ గడ్డ మీద పుట్టాం, ఈయన పాటలు వింటూ పెరిగాం. ఆ రోజుల్లో, రేడియోలో “భూలే బిశ్రే గీత్”, ఢిల్లీ దూరదర్శన్ వారు ప్రసారం చేసే చిత్రహార్ పుణ్యమా అని అనేక హిందీ పాటలు కుడా వినే అవకాశం ఉండేది. కానీ “యోడేలే..యోడేలే యోహూ…” అంటూ పాడే కిషోర్ కుమార్ పాటలు క్యాచ్ చేసినంత త్వరగా, రఫీ పాటలు తలకెక్కేవి కావు. కటీ పతంగ్, ఆరాధనా, ఇలా రాజేష్ ఖన్నా, కిషోర్ కలయికలో వచ్చిన పాటలంటే పిచ్చ క్రేజ్ ఉండేది.

ఆ నేపధ్యంలో, ఇంజనీరింగ్ చదువుతున్న నా మావయ్య ఓ వేసవి శలవల కోసం ఇంటికి వచ్చాడు. “క్యా హువా? తేరా వాదా!” అంటూ రఫీ పాటను తను హమ్ చేస్తుంటే, నా ప్రతిభ చూపించుకోటానికి, కిషోర్ పాటలు హై వాల్యూం లో పాడేస్తూ, అతడెంత గొప్పవాడో అని, తెగ పొగిడేశాను. “ఆరాధనా పాటల్లో నీకు అన్నిటి కంటే బాగా నచ్చిన పాట ఎంటో చెప్పు” అని మావయ్య అడగటంతో, ఆలోచనలో పడిపోయా. నాకసలు “మేరె సప్నోంకి రాణీ కబ్ ఆయేగీ తు” తప్ప ఏ పాటా తెలియదు, ఆ సినిమా నుంచి. మావయ్యే ఒక క్యాసెట్ ఇచ్చి, విని, మర్నాడు చెప్పు అన్నాడు.

మరుసటి రోజు నేను గర్వంగా మా మావయ్య ముందుకొచ్చి “గున్ గునా రహే హై భవర్…ఖిల్ రహి హై కలి కలీ” అంటూ పడేశా. నీకెందుకా పాట నచ్చిందని ప్రశ్నిస్తే, “ఆ పాట వింటూ ఉంటే, నిజంగానే ఎదో తుమ్మెద మెలమెల్లగా తోటలో పువ్వుల మీద ఎగురుతున్నట్లుగా కళ్ళ ముందు కనిపించింది” అని చెప్పినట్లు గుర్తు. ఆ తరువాత అది పాడింది రఫీ అని తెలియటం, ఇంకా అనేకమైన రఫీ పాటలు విని, కేవలం కిషోర్ పాటల్నే వినాలనే యావ, తగ్గటం జరిగిపోయాయి.

రఫీ-ఘంటసాల పోలిక మాత్రం ఇంజనీరింగ్ చదువుకై పిలానీ లో ప్రవేశించిన తరువాతే మొదలయ్యింది. మా వింగ్ లో ఉన్న నార్త్ ఇండియన్లకి ఘంటసాల అంటే ఎవరో, అస్సలు తెలియకపోవటం చూసి బాధేసింది. ఘంటసాల అనే మహా గాయకుడు ఒకాయన సౌత్ లో అనేక పాటలు రఫీ కి దీటుగా, కొన్ని పాటలు రఫీ కంటే అద్భుతంగా పాడేశారని చెప్తే, అనుమాదాస్పద లుక్స్ ఇస్తూ పెదవి విరిచెయ్యటం చూసిన నాకు, ఘంటసాలని వాళ్ళ ముందు ప్రూవ్ చేసేద్దాం అని పట్టుదల పెరిగిపోయింది. ఫలితంగా ఎన్నో వాదాలు, వివాదాలు, దెప్పిపోడుపులతో, చాలా  సెమిస్టర్ల రాత్రులు గడచిపోయాయి. ఆ గిల్లికజ్జాలని ఇప్పుడు గుర్తుకు చేసుకొని నవ్వుకున్నా, ఆ పాటలు మాత్రం అలాగే గుర్తుండిపోయాయి.

సంగీత దర్శకుడు నౌషద్ తన పాటలకి హిందుస్తానీ సంగీతం లోని రాగాలను ఆధారం చేసుకొని బాణీలు కట్టేవారు. అవి పాడాలంటే రఫీ వల్లే సాధ్యం అనుకొనేవాళ్ళుట ఆ రోజుల్లో. ”బిజు బావరా” లోని ప్రతి పాటా బాగుంటుంది. అన్నిటిలోకి ప్రాచుర్యం పొందిన పాట “ఓ..దునియా కే రఖ్ వాలే”. దర్బారీ (కర్నాటక సంగీతం లో దర్బారీ కానడ) రాగంలో కట్టిన ఈ పాటని, రఫీ పదిహేను రోజుల పాటు ప్రాక్టీసు చేసిన తరువాత  కానీ రికార్డు చెయ్యలేదట. ఇది చాలా క్లిష్ఠమైన రాగం, దానికి తోడు నౌషద్ గారు దీనికి ఎనుకున్న శ్రుతి కూడా హెచ్చు గానే ఉంటుంది. ఈ పాట చివర్లో “రఖ్ వాలే” అంటూ తారాస్థాయిలో రఫీ గళం వింటుంటే, శ్రోతలుగా మనకే భయం వేస్తుంది, ఆయన గొంతు పగిలిపోతుందేమోనని.
http://www.youtube.com/watch?v=FIZ3EHG15co

మన ఉత్తర భారత మిత్రులు రఫీ గాన సౌరభాన్ని కొనియాడాలంటే విరివిగా ఉదహరించేది ఈ పాటనే. అదే రాగంలో ఘంటసాల వారు పాడిన పాట “శివశంకరి, శివానంద లహరి”, “జగదేకవీరుని కధ” నించి. కానీ ఈ అమరగాయకుని గొప్పతనం ఈ పాటలో ఏమిటంటే, ఆ రాగం లోని క్లిష్ఠతని, ఆ పాటలో ఆయన ఇటు మందర స్థాయి నించీ అటు తార స్థాయి లో స్వరాలను తాకిన రేంజ్ ని కానీ ఎక్కడా కష్టపడినట్లుగా కాకుండా అవలీలగా పాడినట్లుగా శ్రోతల అనుకొనేలా చెయ్యటమే. సినిమాలో, ఆ పాటకి పరవశించి, రాయి కరగటం అతిశయోక్తే అయినా, ఆ పాట విని ద్రవించని హృదయం ఉంటుందా?
http://www.youtube.com/watch?v=Atr2iOXvzaQ

ఈ రెండు పాటల ఆధారంగా నచ్చిన గాయకుడికి ఓటు వెయ్యమంటే మాత్రం, నా ఓటు నిస్సందేహంగా ఘంటసాల వారికే!

అలాగే తెలుగులో “కులదైవం”, హిందీలో “భాభీ” సినిమాలలో, ఇంచిమించు ఒకటే సమయంలో పాడిన, “పయనించే ఓ చిలుకా…”, “చల్..ఉడ్ జా రే పంఛీ” పాటలని తీసుకుందాం. ఈ రెండూ, హిందుస్తానీ పహాడీ రాగం ఆధారంగా కట్టిన బాణీలైనా, ఆ శాస్త్రీయ పోకడలు పెద్దగా కనపడవు. పాటలోని ఉదాస భావ వ్యక్తీకరణకే పెద్ద పీట. ఈ రెంటినీ ఒకటే లింకులో క్రింద చూడచ్చు.
http://www.youtube.com/watch?v=TvO3MYzdOqA

ఈ పాటలో ఇద్దరూ దానిలోని  మాధుర్యాన్ని చక్కగా అందిస్తూ, తమ గాత్ర మాడ్యులేషన్ ద్వారా భావాన్ని అంతే అద్భుతంగా వ్యక్త పరిచారనిపిస్తుంది. కానీ కణత మీద గన్ను పెట్టి, ఏదన్నా ఒక్క గాయకుడినే ఎంచుకోవాలంటే మటుకు, తప్పని సరి పరిస్థితుల్లో రఫీ కి నా ఓటు వేసేస్తా. పాట చివరిలోని ఆలాపనలో, ఓ పిసరంత  న్యాయం రఫీ ఎక్కువ చేశారేమోనన్న చిన్న సందేహం వల్ల.

ఒక సినిమాని, రీమేక్ చేసినప్పుడు, చాలా సార్లు సిట్యుయేషన్ ఒకటే అయినప్పటికీ, పాటలకి వేర్వేరు బాణీలు ఉంటాయి, ముఖ్యంగా సంగీత దర్శకులు వేరైనప్పుడు. “గుడిగంటలు” సినిమా లోని “జన్మమెత్తితిరా అనుభవించితిరా…”, “ఆద్మీ” సినిమా లోని “ఆజ్ పురానీ రాహోం సే..” పాటలు ఈ కోవలోకే వస్తాయి. రెంటిలోని సారూప్యం, ఆ పాటల చలనంలో కనిపిస్తుంది. కానీ, ఈ పాటల్లో కుడా భావ ప్రకటనకే ఎక్కువ ప్రాముఖ్యత కనపడుతుంది. ఎవ్వరి పాట మనల్ని ఎక్కువగా కదిలిస్తుంది అని నిజాయితీగా పరిశీలిస్తే మాత్రం మనం ఏ ఒక్క దాన్నీ ఎంచుకోలేకపోవచ్చు.

రఫీ పాట లింకు: https://www.youtube.com/watch?v=ekqWt98qaWc
ఘంటసాల పాట లింకు: https://www.youtube.com/watch?v=Lz7-toTMMQw

జీవితంలో అన్ని రకాలుగా ఓడిపోయి, తన గతంలోని  అంధకారాన్ని గుర్తు చేసుకుంటూ, చివరికి వెలుగుని చూసిన ఒక వ్యక్తి వ్యధే, ఈ పాటలో మనకు వినిపించేది. ఇద్దరి గళాలలోను ఆ పాత్ర యొక్క ఆవేదననూ, పశ్చాత్తాపాన్నీ, వెలుగు చూసిన ఆనందాన్నీ, ఒలకటాన్ని మనం గమనించవచ్చు. ఈ సారి గన్ను పెట్టినా, కాల్చుకో అని కళ్ళు మూసుకుంటానే తప్ప ఏ ఒక్కరినీ ఎంచుకోలేనేమో అనిపిస్తుంది.

వీరిద్దరి మధ్యా నా ఉహాలోకంలో చిత్రీకరించుకున్నటువంటి సంగీత సమరంలోని ఆఖరి అస్త్రం సువర్ణసుందరి సినిమా నుంచి. ఆ సినిమా పేరు వినంగానే మనకు గబుక్కున గుర్తుకు వచ్చే పాట “హాయి హాయి గా ఆమని సాగే..ఊగిపోవు మది ఉయ్యాలగా~~~~~~ జంపాలగా~~~~~~”. ఈ సినిమాని అదే పేరుతో అదే తారాగణంతో తెలుగులోనూ హిందీలోను నిర్మించటం తో పాటు, ఒకే సంగీత దర్శకుడు ఒకే బాణీని తెలుగులో ఘంటసాల, జిక్కీ, హిందీలో రఫీ, లతా లతో పాడించటంతో, ఆ ఇద్దరూ మహాగాయకుల్నీ తూచటానికి, ఇంతకన్నా మంచి అవకాశం మనకి దొరకదేమో!

కుహూ కుహూ: https://www.youtube.com/watch?v=WCRaxeEe2IU
హాయి హాయి గా: https://www.youtube.com/watch?v=O5ajXn9j1bM

సంగీత దర్శకుడు ఆదినారాయణరావుగారు, రాగమాలిక కట్టి, హంసానందీ, కానడ, జువన్ పురి, యమన్ కళ్యాణ్ లాంటి కర్నాటక, హిందుస్తానీ రాగాల సమ్మేళనంలో ఈ పాటను అజరామరంగా స్వరపరిచారు. కానీ హిందీ, తెలుగూ వర్షన్ లలో ఒక తేడా ప్రస్ఫుటంగా కనపడుతుంది. హిందీలో, తెలుగులో కంటే కొంచెం హెచ్చు శృతిని ఎంచుకున్నారు దర్శకులు. దీనికి  కారణం, రఫీ బేస్ శృతి హెచ్చుగా ఉండటం కావచ్చు. రఫీ పాటలను మనం కనక పాడే ప్రయత్నం చేస్తే మనకే తెలిసిపోతుంది, రఫీ తారా స్థాయిని మనం అందుకోవటం కష్టమని.

ఈ పాట శాస్త్రీయసంగీతం ఆధారంగా చేసిన పాటలు పాడటంలో గల రఫీ యొక్క “లిమిటేషన్సు” ని తేటతెల్లం చేస్తుంది. ఘంటసాల వారు, ఎంతో అవలీలగా, హాయిగా, తమ స్వరలహరిలో మనను డోలలూగిస్తే, రఫీ మాత్రం చాలా కష్టపడ్డట్టుగా కనిపిస్తారు. ఇది గమనించటానికి పెద్ద సంగీతజ్ఞానం అవసరంలేదు. ఒక్క సారి కళ్ళు మూసుకొని ఆ రెండు పాటలనూ వింటే చాలు!

కానీ, వింత ఏమిటంటే, జాతీయస్థాయిలో తెలుగు పాటకు అంత గుర్తింపు రాకపోగా, రఫీకి నేషనల్ అవార్డు రావటం! ఈ ఒక్క పాట విని ఘంటసాల, రఫీలలో ఎవరు కొంచెం ఎక్కువ గొప్పో ఎంచుకోమంటే, ఒక్క క్షణం ఆలోచించకుండా ఘంటసాలకి బ్రహ్మరధం పట్టేయ్యచ్చు.

ఇప్పుడు చర్చించుకున్న నాలుగు పాటల ప్రకారం ఘంటసాలకి రఫీ కంటే కొద్దిగా ఎక్కువ ఓట్లు వచ్చాయి కాబట్టి, ఘంటసాల వారే కొంచెం ఎక్కువ గొప్పని డిసైడ్ అయిపోదామా? మరి అక్కడే వచ్చింది అసలు చిక్కంతా!

వీటిలో చాలా పాటలు శాస్త్రీయ సంగీతానికి దగ్గరగా ఉండే పాటలు. కేవలం వీటిని బట్టి ఎవరు ఎక్కువ గొప్పో నిర్ణయించటం సబబేనా? సినిమా సంగీతంలో అత్యధిక శాతం వినపడేది లలిత సంగీతం. ఎక్కువ సంగతులూ, గమకాలూ లేకుండా, అనేక రసాలనూ, భావాలనూ తమ గాత్ర వైవిధ్యం ద్వారా పలికించటమే, ఈ సంగీతానికి కావాల్సిన ముఖ్య క్వాలిఫికేషన్. మరి ఈ కోణం నించి ఒక సారి రఫీని, ఘంటసాలని పరిశీలించినట్లైతే, పరిణామం వేరుగా ఉండచ్చేమో?

ఒక సాఫ్ట్ రొమాంటిక్ జానర్ ని గనక మనం తీసుకొంటే, రఫీని మించిన వారు లేరనిపిస్తుంది. “పుకార్ తా చాలా హు మెయిన్…”  అంటూ పట్టు లాగా జారి పోయే గళం తో పాడినా,  “దీవాన హువా బాదల్…సావన్ కి ఘటా ఛాయీ” అంటూ ఒక విరుపు విరిచినా, “చాహే ముఝె కోయి జంగ్లీ కహే…యాహూ” అంటూ ఆనందావేశంతో అరిచేసినా, “బహారోం ఫూల్ బర్సావో…మేరె మెహబూబ్ ఆయా హై” అంటూ తేనెలోలికే స్వరంతో ప్రియురాలికి స్వాగతం పలికినా, రఫీ ని మించిన సింగర్ లేడేమో అన్న అనుమారం రాక తప్పదు. ఘంటసాల వారికి రొమాంటిక్ గీతాలు లేవని కాదు, ఆ భావాలు పలకాలంటే రఫీ గారి గళానికే కొంచెం ఎక్కువ నప్పుతుందని నా నమ్మిక.

భక్తిరసాన్ని తీసుకుంటే ఘంటసాల వారిదే నిర్ద్వందంగా పై చేయి. “హే కృష్ణా ముకుందా…” అంటూ గళమెత్తి ఆ గోవిందుదిని సంబోధించినా, “నీలకంధరా దేవా..దీన బాంధవా రావా” అంటూ ఆ పరమశివుడిని బ్రతిమాలినా, “దినకరా…శుభకరా” అంటూ సూర్యభగవానుడికి స్వాగతం పలికినా, “శేషశైలావాస..శ్రీ వేంకటేశా” అంటూ శ్రీపతికి మేలుకొలుపు పాడినా, గీతాగానం చేసినా, ఆయన కలిగించే భాక్తిభావావేశం బహుశా ఇంకెవ్వరూ కలిగించలేరేమోననుకోవటం, అతిశయోక్తి ఎంత మాత్రమూ కాదు.

మొదట్లో చెప్పాను, ఇద్దరిలో ఎవరెక్కువ ఇష్టం అనే దానికి సమాధానం మూడు నాలుగు సార్లైనా మారిందని. దానికి కారణాన్ని కనుక పరిశీలించుకొని చూస్తే, అది మన మానసిక పరిస్థితి, జీవితం లో మనం ఉన్న మైలురాయి, ఇటువంటి వాటి మీద ఆధారపడి ఉండవచ్చనిపిస్తుంది.

రొమాంటిక్ పాటలు మాత్రమే వినాలనిపించేటటువంటి మూడ్ లో కానీ వయస్సులో కానీ, రఫీ వైపు కొంచెం ఎక్కువ మనసు లాగినా, శాస్త్రీయ సంగీతాన్ని సినిమా సంగీతంలో వెతుక్కుందామనో, లేక భక్తి సంగీతాన్ని ఆస్వాదిద్దమానో అనిపించినప్పుడు మాత్రం ఘంటసాల వారి వైపు, మన ధ్యాస మళ్ళటం అనివార్యమనిపిస్తుంది.

ఇలా వివిధ కోణాల నించి ఈ ఇద్దరు మహాగాయకుల్నీ చూసిన తరువాత మాత్రం, నాకు లభించిన సమాధానం: “ఘంటసాల, రఫీ, ఇద్దరూ సమానమే, ఘంటసాల మన తెలుగు వాళ్లకు కొంచెం ఎక్కువ సమానం!” మరి, మీకో?

“ఇది పాట కానే కాదు…ఏ రాగం నాకు రాదు”

Siva_3అఫ్సర్ గారు, “మీకు సినిమా సంగీతం, అదే.. తెలుగు, హిందీ, తమిళం, ఇంగ్లీషు, అరవం, కరవం అంటే బాగా ఇంట్రెస్ట్ ఉన్నట్టుందే…మీరు వాటి గురించి ఎందుకు రాయకూడదు,? ” అని అడిగినప్పుడు, “నేనెప్పుడూ రాయలేదండీ..అయినా ప్రయత్నిస్తాను,” అని చెప్పాను. నాలో నేను అనుకున్నాను, “నేను మెలకువగా ఉన్నంత సేపూ ఏదో ఒక సినిమా పాటని ఖూని రాగం చేస్తూనే ఉంటాను, ఏదో ఒకటి రాయలేకపోతానా,” అని.

వ్రాద్దామని కుర్చొంటే అప్పుడు అర్ధం అయ్యింది అసలు విషయం ఏంటో! ఇది టి.వి లో ఎన్నో ఏళ్లుగా టెన్నిస్ చూసాం కదా, దాని పైన బుక్కు రాయటం ఏం పెద్ద పనా అని అనుకొని ప్రయత్నించటం లాంటిదని.

బుర్ర బ్లాకై పోయింది. ఒకటా, రెండా, డజన్ల కొద్దీ పాటలు వాన తుంపర్ల లాగా ఎడతెరిపి లేకుండా కురవసాగాయి. ”నిన్ను తలచి గుణగానము చేసి, దివ్యనామ మధుపానము చేసి,” అంటూ అమరగాయకుడు ఘంటసాల వారిని తలచుకొని ముందుకు సాగుదామనీ, ఏదన్నా ఒక అంశాన్ని ఎంచుకొని, ఏకాగ్రతతో, కలానికి పని చెబుదామనీ, కూర్చొన్నా.

“మనసున మల్లెల మాలలూగెనే, కన్నుల వెన్నల డోలలూగెనే….కొమ్మల గువ్వలు గుస గుస మనినా, రెమ్మల గాలులు ఉసురుసురనినా, నీవు వచ్చేవని,” అంటూ మంద్రస్థాయిలో మృదు మధురంగా భానుమతి గళం ఎక్కడి నించో వినిపించి ఇబ్బంది పెట్టేస్తోంది. ఒక సారి తల విదిలించుకొని, “ఫోకస్..ఫోకస్”, అని నాలో నేనే అనుకొని, కలం కదిపే లోపు, మళ్ళీ అదే గొంతు, “పిలచిన బిగువటరా? అవురవుర! చెలువలు తామే వలచి వచ్చినా” అని   మందలింపు. లెంపలేసుకొని, స్ఫూర్తి కోసం, కొన్ని భానుమతి పాటలు హమ్ చేస్తుండగా, “సడి సేయకో గాలి, సడి సేయ బోకే” అని లాలిత్యం ఉట్టిపడుతూ లీల సున్నితంగా నా పాట నాపేసి, ఏదో మత్తు లోకి తోసింది. “లాలీ..లాలీ..లాలీ..లాలీ.. వట పాత్ర శాయికీ వరహాల లాలీ” అంటూ సుశీలమ్మ నన్ను మరింత నిద్ర లోకి నెట్టే లోపల, “ఘల్లు ఘల్లునా గుండె ఝల్లన పిల్ల ఈడు తుళ్లి పడ్డది,” అంటూ గుర్రపు డెక్కల తాళం లో జానకమ్మ నన్ను మొట్టి లేపింది.

మనస్సు పరిగెత్తినంత వేగంగా నా కలం పరిగెడితే ఈ పాటికి పది పేజీల కాలమ్ పూర్తయ్యేది అన్న ఆలోచన పూర్తయ్యేలోపే  మరొక ఆలోచన  నా వ్రాతకు ఆనకట్ట వేసింది.

“కొత్త పాటల తుంపరలు ఒక్కటీ నా మీద ఇంకా పడలేదేమిటబ్బా!  ఏ పార్టీ జరిగినా మా ఇంట్లో మ్రోగేవి, నేను రెండు గ్లాసుల వైన్ తాగిన తరువాత గెంతేవి ఆ పాటలకే కదా! ఇప్పుడేమిటీ పాటల గురించి వ్రాద్దామని కూర్చొంటే మాత్రం ఒక్కటీ నోట్లో ఆడట్లేదు? నేను మరీ ముసలాడినైపోతున్నానా? చాదస్తంగా ఓల్డంతా గోల్డేనని పాతవే పట్టుకు వేళ్ళాడుతున్నానా?” అంటూ కొన్ని నిమిషాల పాటు సెల్ఫ్ అనాలిసిస్ చేసుకుంటూ ఉండిపోయా. “కొంత మంది కుర్రవాళ్ళు పుట్టుకతో వృద్ధులు” అంటూ శ్రీశ్రీ నా చెవిలో దూరి అరుస్తున్నా సరే, ఆ నెగటివ్ ఆలోచనలను పక్కకు నెట్టి మళ్ళీ పన్లో పడిపోయా.

“మీకిష్టమైన పాటలేంటి?” అని ఎవరైనా అడిగితే, చటుక్కున నేను పుట్టకముందు పుట్టిన సినిమా పాటలే గుర్తుకొస్తాయి. ఒకసారి ఉండబట్టలేక, మా ఫ్రెండు ఒకడు కడిగేసాడు. నువ్వింకా “కునుకు పడితే మనసు కాస్త కుదుట పడతది, కుదుటపడ్డ మనసు తీపి కలలు కంటది” అని ఇక్ష్వాకుల కాలం నాటి పాటలు పాడుకుంటూ ఉంటే, రేపు మీ మనవళ్ళ కాలం వచ్చేనాటికి అంతే తాదాత్మ్యతతో, “సార్..రొస్తా రొస్తారా రొస్తా రొస్తా రొస్తా రా..” అనో “మై లవ్ ఇస్ గాన్.. మై లవ్ ఇస్ గాన్” అనో పాడుకుంటావా అని.

వాడెంత చురకేసినా నేను మాత్రం సీరియస్ గానే చెప్పా, శంకరాభరణం శంకరశాస్త్రి నన్ను ఆవహించినట్లుగా. “బాల్య, కౌమార్య, యౌవన, వృద్ధాప్యాలు పాటలు పాడేవాళ్ళకీ, శ్రోతలకీ ఉంటాయేమో కానీ, పాటలకు కాదురా! ఎప్పుడో వందల సంవత్సరాల క్రితం దైవాంశసంభూతులైన కొందరి వ్యక్తుల భక్త్యావేశాలు ఒక ప్రవాహమై, శబ్ద రూపేణ ప్రాణం పోసుకొంటే, ఆ ధ్వనులేరా సాంప్రదాయ సంగీతమై, కొన్ని కోట్ల గళాలలో ప్రతిధ్వనిస్తూ, మన సంస్కృతి ఉమ్మడి ఆస్థిలా తరతరాలకూ సంక్రమిస్తూ, శాస్త్రీయబద్ధమైన కర్నాటక సంగీతంలా పక్వత చెంది, లలిత సంగీతంలా సరళీకృతమై,  పాశ్చాత్య రీతులతో సంగమించి, కొంత ప్రకాశించి, మరింత కృశించిన, నేటి మన తెలుగు పాట!”

ఏనాడో రచించిన అన్నమయ్య, రామదాసు కీర్తనలు, త్యాగరాజు, శ్యామశాస్త్రి పాడిన కృతులు ఈనాటికీ  పాడుకుంటున్నాం. కనుక నా మనవళ్ళకు నేను వినిపించపోయే పాటల గురించి నువ్వు జోక్ చెయ్యకు. ఇంకొక వంద  ఏళ్ళు గడచినా “జగదానంద కారకా, జయ జానకీ ప్రాణ నాయకా” అని పాడేవాళ్ళు, అది విని ఆనందావేశాలలో తూలిపోయేవాళ్ళు, ఉంటూనే ఉంటారు”, అని నేను ఏకబిగిన ఇచ్చిన ఉపన్యాసానికి అలసిపోయి ఆగిపోయాను.

“అదే మరి, సంగీత రాజా ఇళయరాజా అత్యద్భుతంగా స్వరపరిస్తే అమృతం జాలువారే గాత్రాలతో బాలూ, శ్రేయా ఘోసాల్ పాడిన పాటేగా…నేను నా కార్లో ఎప్పుడూ అదే వింటూ ఉంటా” అంటూ తన సంగీతజ్ఞాన ప్రదర్శన చెయ్యటంతో నా బి.పి తార స్థాయిలోని నిషాదాని కంటింది.

“స్వరబధిరుడా (టోన్ డెఫ్), త్యాగరాజు, పల్లవి, అనుపల్లవి, పది చరణాలతో, వెయ్యేళ్ళు నిలిచిపోయేలా, నట రాగంలో చేసిన రామ సంకీర్తన గురించి నేను ప్రస్తావిస్తే, నువ్వు వేరే రాగం కూస్తావా,” అని విరుచుకు పడ్డాను. “ఇంతకు ముందు వీడి పాటే భరించలేమనుకున్నాం, వీడి మాట కుడా కర్ణ కఠోరం,” అని నాకు వినబడేలా  విసుక్కుంటూ వెళ్ళిపోయాడు.

ఇంతకూ ఇదంతా ఎందుకు చెప్పుకొచ్చాను? అదే నా పాత పాటల పైత్యం గురించి కదూ అసలిదంతా మొదలయ్యింది. పాత పాటలంటే ఏదో కొత్తగా అబ్బిన అభిరుచి గానీ, పెరిగిందీ, ఏళ్ల తరబడి ఆస్వాదించింది “కొత్త” పాటలనే. కొత్తవంటే ఏదో శాస్త్రీయ సంగీతం, ఉదాత్త సాహిత్యం, సింగినాదం అని ప్రాకులాడే కళాతపస్వి సినిమాల్లో పాటలే కాదు, “వినదగు నెవ్వరు కొట్టిన” అని అన్నిరకాల పాటలకూ, తలకాయ అడ్డంగా కొన్నిసార్లు, నిలువుగా మరిన్ని సార్లు ఊపుకుంటూ ఎంజాయ్ చేస్తూనే పెరిగాను. అయినా మరీ దారుణం కాకపోతే, “సంగీతాన్ని కొట్ట్టటం” ఏమిటో! లావుపాటి బెత్తాలతో విపరీతంగా బాదే వెస్టర్న్ డ్రమ్ముల ప్రయోగం మన పాటలలో ప్రారంభించిన దగ్గరనించీ పాట కట్టటం నించి కొట్టటం అయ్యిందేమోనని నా వెధవనుమానం.

ఇలా కొత్త పాటల మేఘాలు కమ్ముకున్నాయో లేదో, తుంపర్లు కాదు, ఏకంగా వడగళ్ళే పడటం మొదలెట్టాయి, గానగాంధర్వ గళంలో. గత నలభై ఏళ్ళలో, నలభైవేల పై చిలుకు పాటలు పాడిన బాలు స్వర తరంగాలు చేరని చెవులు తెలుగు దేశం లో అస్సలు ఉండే ఛాన్సే లేదు. అన్ని పాటలున్నందుకేనెమో, ఓ పట్టాన గబుక్కున ఏదీ మనసుకు తట్టక పోయినా, ఒక సారి మొదలయ్యిందంటే మాత్రం తుఫానే.

“ఏ దివిలో విరిసిన పారిజాతమో…” అని అబ్బురపడ్డా, “చుట్టూ చెంగావి చీర కట్టాలే చిలకమ్మా..” అంటూ పాఠాలు చెప్పినా,  “ఓలమ్మీ తిక్కరేగిందా? ఒళ్లంతా తిమ్మిరెక్కిందా?” అంటూ అన్నగారి గొంతుతో వదినెమ్మను కవ్వించినా, తన గాత్ర వైవిధ్యంతో, అన్ని వర్గాల శ్రోతలని ఆకట్టుకోవటం, బాలూ కే చెల్లింది. అద్గదీ, దొరికింది నేను వ్రాయటానికి టాపిక్. “ఈ ఒక్కాయన కోటు తోకలు పట్టేసుకొని మన సినిమా పాటల సంద్రాన్ని అవలీలగా ఈదెయ్యచ్చు,” అనుకున్నానో లేదో, ఫుల్ వాల్యూం లో “సరసస్వర సురఝరీగమనమౌ సామవేద సారమిది” అంటూ “చేతన పొందిన స్పందన ధ్వనించు హృదయ మృదంగధ్వానం” అకంపెనీమెంట్ తో, వినిపించే సరికి మళ్ళీ తెలివిలోకొచ్చా.

సినిమా పాటంటే, ఓన్లీ గాయకులేనా గుర్తుకొచ్చేది? “పాటల గురించి వ్రాద్దామని కూర్చోన్నావు, పాటలు వ్రాసేవాళ్ళ నేల మరచితివీవు?” అంటూ మల్లాది రామకృష్ణ శాస్త్రి, దేవులపల్లి కృష్ణశాస్త్రి నుండి, వేటూరి, సీతారామశాస్త్రి గార్ల వరకూ కళ్ళ ముందుకొచ్చి కళ్ళెర్ర చేసినట్లుగా అనిపించింది.

స్వరకర్తల సంగతేమీటంటూ సాలూరి, పెండ్యాల నుండి కోటి, తమన్ వరకూ నిలదీసి ఇరుకున పడేశారు. వారందరికీ స్ఫూర్తినిచ్చి వాళ్ళ నించి అంత గొప్ప వర్క్ ని రాబట్టుకున్న యల్.వి.ప్రసాద్, ఆదుర్తి, విశ్వనాథ్ లాంటి దిగద్దర్శకులు మాత్రం మందహాసాలతో మాటల్లేకుండా నన్ను అయోమయంలోకి నెడుతుంటే, “ఏ తావున రా? నిలకడ నీకు?” అంటూ భానుమతి పాటే మళ్ళీ రియాలిటీ లోకి లాక్కొచ్చి పడేసింది.

“అసలు వీళ్ళందరి గురించి వ్రాయడానికి నీ కున్న అర్హతేంటి? పెద్ద పెద్ద పరిశోధనా గ్రంధాలే వచ్చాయి. మరిక నువ్వు కొత్తగా చెప్పొచ్చేదేంటి?” అంటూ సీరియల్ సెల్ఫ్ డౌట్ చుట్టేసింది.

“ఇది పాట కానే కాదు..ఏ రాగం నాకు రాదు” అన్న పాట కూడా  ఇప్పుడే గుర్తుకురావాలా! అసలు ఇంత ఆలోచన అవసరమా? నేను వ్రాయబోయేది చదివేది కూడా నాలాంటి సగటు పాట ప్రేమికులే కదా. నా కోసం, నా మూడ్ బట్టీ, నాకు నచ్చిన ఏ పాట(ల) నైనా, నాది చేసుకొని, నా భావాలను, అనుభవాలను, అనుభూతులను శ్రుతి మించకుండా వ్యక్తపరిస్తే, నచ్చి ఆదరిస్తారేమో! ఒక కొత్త ఆశ చిగురించినా, అఫ్సర్ గారికి ఏమీ వ్రాయలేదనీ, ఆలోచనలతోనే సమయం అంతా గడిపేశాననీ, ఎలా చెప్పాలా అన్న చిన్న విచారంతో నా కలానికి మూత బిగించా.