అద్దం లాంటి రోజొకటి

swatikumariప్రతికవీ ఏదో ఒక సందర్భంలో తన కవిత్వ స్వరూపమేమిటో, కవిత్వంతో తన అవసరమేమిటో ప్రశ్నించుకుంటాడు. యాధృచ్ఛికంగానో , ప్రయత్నపూర్వకంగానో దొరికిన ఆధారాల్ని సమకూర్చుకుని కొన్ని నిర్వచనాల్ని రచించుకుంటాడు. అలాంటి ఒకానొక సందర్భంలో “అనంత దూరాల యానంలో నిరంతరమూ సాగే కాంతి వేగాల జలపాత ఉరవడి” గా కవిత్వాన్ని అభివర్ణిస్తారు అవ్వారి నాగరాజు  గారు.

ఆయనే మరొకచోట “అపురూపమైనవేవీ ఈ కవితలలో పలకవు/చెక్కిళ్ళ మీద జారిన పాలచారికలలాంటి ఙ్ఞాపకాలనేమీ ఈ పదాలు పుక్కిట పట్టవు.” అని తన పదాల స్వభావాన్ని చెప్పుకుంటారు. కవి చెప్పుకున్న ఈ లక్షణాలతో “దిగంతాలకు విస్తరించిన కనుదోయి చూపు”లాంటి కవితనొకదాన్ని ఇక్కడ చూద్దాం;

 

అవ్వారి నాగరాజు కవిత “”ఒక రోజు ​గడవడం”

 

౧.ఎప్పటి లాగే ఉదయం :

 

నిర్ణయాలన్నీ ఎప్పటికప్పుడు ఎలా తారుమారవుతాయో ఆలోచిస్తూ ఉండగనే

చేజారి భళ్ళున ఎక్కడో బద్దలవుతుంది

ఊపిరి వెన్నులో గడ్డకట్టి

తీగలు
తెగిపోతూ మిగిలిన శబ్ధ స్తంభన ఒక్కటే

ఇక దేహమంతా ప్రేమలు లేవు

 

లేత రంగుల అల్లికతో గాఢంగా పెనవేసుకునే సంస్పందనల

ఉదయాస్తమయ జమిలి మేలిమి అనుభూతులు లేవు

సున్నితమైనవన్నీ ఒక్కొక్కటీ

రెక్కలు విరిగి –

 

ఈ క్షణం ఇది  మూలాల కుదుళ్ళను

తలకిందులు చేసి సుడివేగంతో ఎక్కడికో విసిరివేసే పెను ఉప్పెన

మనుషులు ఎందుకింత యాతన పడాలో

ఈ శాపాన్ని తలదాల్చి ఎన్నాళ్ళు ఇలా మోయాలో

 

౨. పగటి పూట:

 

ఈ దారులకు అలవాటయిన పాదాలు

ఎక్కడికెక్కడికో కొనిపోతూ

 

నువ్వు నడుస్తున్నప్పుడు ఎచటికో తెలియని నీ పయనాన్నీ నిన్నూ

అన్నీ తెలిసిన ఒక తల్లి, బిడ్డను తన  చేతులలోకి సుతారంగా తీసుకున్నట్టుగా

తన లోనికి, తన శరీరంలో శరీరంగా తనలోనికి తీసుకొని దారులన్నీ నీతో నడుస్తూ ఉన్నప్పుడు –

కాసేపు నువ్వు

 

వెక్కివెక్కి ఏడ్చే చంటి బిడ్డవు.

తెలియని దన్ను ఏదో  ఒక ఎరుకగా

నీలో నీకే పొటమరించిన తల్లి చన్నయినపుడు

నువ్వే ఒక ఓదార్పు మాటవు.

 

నీ చుట్టూ నువ్వే అనేక యుద్ధాలను అల్లుతూ,

ఉన్నవి  నీకు రెండు చేతులేనని  సమయానికి గుర్తురాక చివరకు వేసటపడీ,

అలసీ, నీ పైన నువ్వే గురి చూసుకొనే నిర్ధాక్షణ్యతవు

 

౩. రాత్రి:

 

ఉన్నది ఇక కేవలం అలసట

గుడ్డి దీపం వెలిగించిన ఒక గుహ-

నెత్తురు కరుడు కట్టి కొసలపై తడి ఆరని రాతి ఆయుధాల చీకటి కారడివి-

 

ఏ యుగమో తెలియదు

ఈ రాతిరికిక ఈ ఆదిమ మానవుడు నిదురించాలి

***

ఒకరోజు గడవడమంటే,

వేలాదిగా విరజిమ్మబడ్ద జీవితశకలాల్లోంచి ఒక ముక్క తనకు తానొక రూపాన్ని దిద్దుకోవడం. ఒక నిర్ధిష్టత లేకుండా అస్తవ్యస్త కోణాల్లో పదునుతేలిన అంచుల్ని సానపట్టి నునుపుతేలుతున్న గాజు ముక్కొకటి అద్దంలా మారే ప్రయత్నం. అటువంటి ఒకరోజు గడవడంలోని గమనింపు, గమనమూ, గగుర్పాటు అవ్వారి నాగరాజు  కవితలో వ్యూహాత్మకంగా కనపడతాయి.

మొదటగా ఉదయం- ఉదయాలన్నీ పదిలం కావు, మెలకువలన్నీ మేలుకొలుపులూ కావు. ఒక్కో పొద్దు ఎలా మొదలౌతుందంటే,  వేకువ సంరంభం తన బింబాన్ని చూపేలోపే చేజారి బద్ధలైన అద్దంలో ముక్కలైన  బలహీనపు నిర్ణయాల భ్రమలా భళ్ళున తెల్లారుతుంది. అప్పుడు ఊపిరి వెన్నులో గడ్డకట్టి / తీగలు తెగిపోతూ మిగిలిన శబ్ధ స్తంభన ఒక్కటే” మిగుల్తుంది. తెగిపోతున్న తీగల మధ్య శబ్ధం దిక్కుతోచక నిలిచిపోవడం ఒక దృశ్యంగానూ, శ్రవణానుభవంగానూ కూడా ఒకేసారి స్ఫురిస్తుంది. వెన్నులో జలదరింపు, వణుకు వల్ల ఊపిరి ఒక పదార్థంలా బరువుగా మారి గడ్దకట్టే సాంద్రతలో కవితలోని అనుభూతి తీవ్రమౌతుంది.

“లేత రంగుల అల్లికతో గాఢంగా పెనవేసుకునే సంస్పందనల /ఉదయాస్తమయ జమిలి మేలిమి అనుభూతులు లేవు”  ముదురురంగుల కలయికలా అధికారికంగా, దర్పంగా, కొన్నిసార్లు వెగటైన ఎబ్బెట్టుగా కాక లేతరంగుల పెనవేత కళ్లద్వారా ఊహలోకి అందించే అహ్లాదం సున్నితమైన. హృద్యమైన అనుభూతులని ప్రతిబింబిస్తుంది. అటువంటి ఇరుసంధ్యల కలనేతలోని జతని పొందలేని రంగువెలసినతనం నిద్ర లేచిన నిముషాల్లో నిరీహను నింపుతుంది. రెక్కలు విరిగి అసరా చేసుకున్న చెట్టుని పెనుఉప్పెనేదో కుదుళ్లతో పెకిలించి ఆచోటులో వేల యాతనల కొమ్మలేసే శాపాల విత్తనాన్ని వదిలిపోతుంది. లేతదనంతో గాఢతని స్ఫురింపజేయడంలో కవి సాహసమూ, ’సున్నితమైనవన్నీ రెక్కలు విరిగి’ అన్నప్పుడు ఎగరడం, ఊహించడం, కలలు కనడం వంటి సున్నితత్వపు లక్షణాలను వాక్యాల చాటున దాచిన నేర్పరితనమూ కనపడతాయి.

పగటిపూట –  “ఉన్నవి  నీకు రెండు చేతులేనని  సమయానికి గుర్తురాక చివరకు వేసటపడీ,“  అన్న పంక్తుల్లో పగలంతా తల పైకెత్తుకున్న పనులు, నిర్దాక్షిణ్యంగా తనపై తను మోపుకున్న పదింతల బరువుల లక్ష్యాలు మనిషిని సతమతం చెయ్యడ౦ తెలుస్తాయి. అలాంటి సమయాల్లో బుద్ధితో ప్రమేయం లేకుండా, ఆలోచనల్తో పొత్తు లేకుండా అలవాటు ప్రకారం పాదాలు నడుస్తూ ఉంటాయి. పాదాలకి నడక ఎలానో, దారులకి గమ్యం అలానే అనివార్యం అని తెలిసి, దింపుకోతరం కాని బరువుని మరో భుజానికి మార్చుకునే నెపంతో తెలియకుండానే వెక్కిక్కి ఏడుపు తనలోంచి తనకి వినపడినప్పుడు, కన్నీళ్లతో తెరిపిన పడ్ద వేదన కరిగిపోతూ ఒక ఓదార్పుమాటని వదిలిపోతుంది. “తెలియని దన్ను ఏదో  ఒక ఎరుకగా, నీలో నీకే పొటమరించిన తల్లి చన్నయినపుడు” అనడంలో ప్రకృతి సహజమైన బాసట, భరోసా మనిషి లోపలినుండే అవసరానుగుణంగా బయటికి రావడం అరుదైన ప్రతీక ద్వారా వ్యక్తమౌతుంది.

రాత్రి – రోజంతా గడిచి వెంట తెచ్చుకున్న అలసటనూ, వేసటనూ;  మాటలతో, వివరణతో, తర్కంతో  వదిలించుకోలేక  లోపలి రాపిడితో రాజీ ప్రయత్నంగా  కాస్త మసకనూ, మత్తూనూ ఎరగా వేసేందుకు రాత్రి వస్తుంది. చివరి మజిలీగా “గుడ్డి దీపం వెలిగించిన ఒక గుహ-“ స్వాగతిస్తుంది. గూడుని గుహగా భావించడం రాత్రి తాలూకూ ఆలోచనారహితమైన ఆదిమత్వాన్ని సూచిస్తుంది. నిజమనే నిప్పును నిద్ర నివురుగా కప్పేసి రాతి ఆయుధాల రాపిడిలోని రవ్వల దిశగా చూపు మలుపుతుంది. అడవితనాన్ని వదల్లేని అనాది అనాగరిక ప్రవృత్తేదో కొనలపై తడి ఆరని కటిక చీకట్లో కరుడుకడుతుంది.

—-