ఇంకా అవే భ్రమల్లో ఎందుకు?!

 

 

– నంబూరి పరిపూర్ణ

~

ఆదిమానవుల సామూహిక జీవనదశలో- మాతృస్వామిక వ్యవస్థ ఒక సహజ ప్రాకృతధర్మంగా సుదీర్ఘకాలం కొనసాగింది. తదనంతర కుటుంబవ్యవస్థలో స్త్రీకి బదులు పురుషుడు కుటుంబానికి యాజమాన్యం వహించాడు. పర్యవ సానంగా పురుషస్వామ్య, పురుషాధిక్య సమాజం అస్థిత్వంలోకొచ్చి, ‘మాతృ స్వామ్యం’ అంతమయ్యింది. నేటికీ అదే పురుషస్వామ్య వ్యవస్థ అస్తిత్వంలో ఉన్నదన్న చారిత్రక మానవ సమాజ పరిణామ వాస్తవం- విజ్ఞులందరూ ఎరిగిన విషయమే.

పురుషస్వామ్యంగా రూపొందిన సమాజ వ్యవస్థ- స్త్రీ పురుష సంబంధాన్ని- ‘స్వామి-సేవక’ సంబంధంగా మార్చిన విషయమూ తెలిసిన నిజమే. సమస్త కుటుంబ వ్యవహారాలతో పాటు, సమాజ వ్యవహార పోకడల్ని కూడా శాసించే స్థాయికి చేరిన పురుషుడు- భార్యస్థానపు స్త్రీనేగాక యావత్‌ స్త్రీజాతినీ శాసించే స్థితికొచ్చాడు. స్త్రీని- అశక్త, ఆశ్రిత ప్రాణిగా దిగజార్చి అదుపులో పెట్టుకో సాగాడు. ఆమె మేధో, ఉత్పత్తి శక్తుల్ని బలహీనపరిచి, తనకు సేవలందించే ‘సేవిక’గా మార్చాడు.

ఎన్నో పౌరాణిక స్త్రీల గాథలు- యిందుకు తిరుగులేని నిదర్శనాలు. అవి మనకు  సుపరిచితాలు.  ఆనాటి పతివ్రతల సదాచార, త్యాగ మహాత్మ్యాల ఉదంతాల్ని తెలియజేసే గాథలవి. యుగాల కాలానికి చెందిన సీత, ద్రౌపది, శకుంతల మొదలైన రాజవంశ స్త్రీలు సైతం అనేకానేక కష్టనష్టాలకూ, అవమాన విద్రోహాలకూ బలి అయిన తీరును- హృదయాలు ద్రవించేలా వివరించే గాథలవి.
కానీ, యుగాలు గడిచి, ఎంతో ఆధునికత చోటు చేసుకున్న ప్రస్తుత కాలంలోని అధిక సంఖ్యాక సాంప్రదాయిక మహిళల్లో- యిప్పటికీ పాతివ్రత్య సతీత్వం పట్ల ఆరాధన, విశ్వాసాలు మెండుగానే వుంటున్నాయి. ఆనాటి పురుషవ రేణ్యులు తమ స్త్రీలకు కలిగించిన కష్టాలు, క్రూర అవమానాల్ని నిరసించి, ద్వేషించే బదులు- ఆ కష్టాలు ఎదురవ్వడం వల్లనే- ఆ వనితలంతా అంత గొప్ప సతీమణులుగా, పతివ్రతామతల్లులుగా నిరూపించుకోగలిగారు, ఆదర్శనీయులయినారని- పాతతరం గృహిణులు ఆనందపడుతూ వుండడాన్ని చూస్తున్నాం. మరొకపక్క ఆ యువతుల పట్ల పురుషులు జరిపిన కుటిల చర్యల్నీ, దురంతాల్నీ, తీవ్ర ఆవేశంతో ఖండించే యువతులకూ ప్రస్తుత కాలంలో కొదవలేదు. నేనూ ఆ కోవకు చెందిన స్త్రీగా- ఆనాటి మువ్వురు పౌరాణిక స్త్రీల గాథలకు సంబంధించిన మంచిచెడ్డల్ని, న్యాయ అన్యాయాల్ని విశ్లేషించే ప్రయత్నం చేశాను.

అతి స్వల్ప కారణంతో- అగ్నిపునీత సీతను శ్రీరాముడు మభ్యపరిచి, అడవులకు తోలడం; జూదవ్యసనంతో- ధర్మజుడు భార్యను సైతం పణంగా పెట్టి, నిండు సభామధ్యంలో ఆమె వలువలూడ్చేంతటి అవమానానికి గురి చెయ్యడం; మున్వాశ్రమ, అనాథ అమాయిక బాలిక శకుంతలను గాంధర్వ విధిని పెండ్లాడి, ఆమె గర్భవతిగా ఉన్న స్థితిలో- దుష్యంతుడు ఆమెను వెడలగొట్టడం- యివి మచ్చుకు కొన్ని. పురుషుల విద్రోహ, కపట చర్యలు నాలో అగ్నినీ, నిరసనజ్వాలల్నీ రగిల్చి- నాదైన దృష్టితో- ఆ ఉదంతాల గాథల పునశ్చరణానికి పురికొల్పాయని సవినయంగా తెలియపరుస్తున్నాను.

పురాతన సాంప్రదాయక ఆచారాల్ని భక్తిశ్రద్ధలతో కొనసాగిస్తూ- హింసించి, వేధించే భర్తల పట్ల విధేయత, అణకువ చూపే వనితల్ని చూస్తున్నప్పుడు- మనసు  వికలమవుతుంటుంది.  భర్తల క్షేమం  కోసం-  ఎన్నెన్నో  పూజలు, ఉపవాసాలు, వ్రతాలు చేస్తున్న మహిళలు చాలామంది కనబడుతుంటారు. కొందరు ఉన్నత విద్యలు చదివిన స్త్రీలు కూడా- ఈ తంతుల్ని సదాచారాలుగా భ్రమిస్తుండడం- వింతైన విషయం. మార్కెట్‌ సరుకులై, లక్షలు గుమ్మరిస్తేగాని భర్తలుగా దొరకని యువ విద్యావంతుల వ్యాపార సంస్కృతిని అర్థం చేసుకో లేని మనస్తత్వమే స్త్రీలది యిప్పటికీ! ఉన్నత, సాంకేతిక, వైద్యవృత్తుల్లో రాణిస్తున్న విదుషీమణులు కూడా యిందుకు మినహాయింపుగారే!!

కుటుంబ, సామాజిక స్థితుల్లో- సమాన ప్రతిపత్తి, వ్యక్తిత్వహక్కుల సాధనకు ప్రేరణ కాగలవన్న ఆశతో వ్రాసిన నా వ్యాసాలను- నాటి ఆంధ్రజ్యోతి ‘నవీన’ స్త్రీల అనుబంధం తరచుగా ప్రచురించి, వెలుగులోకి తేవడం ఎంతో తృప్తిని కలిగించిన విషయం. అలాగే వార్త, ప్రజాతంత్ర, విజేత పత్రికలు కూడా- తమ సహకారమందించాయి.

పలురకాల స్త్రీల సమస్యల్నీ, వారెదుర్కొంటున్న సాంఫిుక దురన్యాయాల్నీ- శాస్త్రీయంగా విశ్లేషించి ఖండించే వైఖరినీ, శక్తినీ- దేశభక్తీ, ప్రజల ప్రగతీ కేంద్రంగా కలిగిన రాజకీయ నేపథ్యమున్న మా కుటుంబం నాకు కలిగిం చింది. మార్క్సిస్టు, భౌతికవాద సిద్ధాంత బలం- మరింత తోడ్పడింది. ఇందుకు తోడు- మహిళాసంక్షేమ శాఖలో నా ఉద్యోగ నిర్వహణ- గ్రామీణ మహిళలను నా శక్తిమేర చైతన్యపరిచే సదవకాశాన్ని నాకు గొప్పగా కలిగించింది.

గత ఐదారు దశాబ్దాల నుంచీ విద్య, ఉద్యోగ, పారిశ్రామిక రంగాల్లో సమర్థ నిర్వాహకులుగా స్త్రీలు ముందుకొస్తున్నకొద్దీ- అనేక కొత్త సమస్యల్నీ, హింసల్నీ ఎదుర్కొనవలసి వస్తున్నది. అయినప్పటికీ- అన్ని రంగాల్లో స్త్రీల పురోభివృద్ధి కొనసాగుతూనే వుంది. స్త్రీల ప్రత్యేక హక్కుల పరిరక్షణ, ప్రగతి- ఆశయంతో రచనలు చేస్తున్న రచయిత్రుల సంఖ్య రోజురోజుకూ పెరుగుతోంది. అనేక మహిళాసంస్థలూ దీక్షతో కృషి చేస్తున్నాయి.

‘వేయిపూలు వికసించనీ’ అన్న నినాదంతో అభ్యుదయ రచయిత్రులూ, మహిళా సామాజిక కార్యకర్తలూ- నిర్మాణాత్మక కృషి సల్పుతూ ముందుకు సాగుతూ ముందడుగు వెయ్యగలరన్న ఆకాంక్ష నాది.

*