కొన్ని గళాలకు శబ్దాలుండవు!

 

vairamuthu2

 

 

 

 

 

 

 

 

 

 

రచయిత : కవిరారాజు వైరముత్తు

కవిత :   సిల కురల్‌కళుక్కు ఒలియిల్లై

ఆరోసారి జాతీయ ఉత్తమ గేయరచయిత పురస్కారాన్ని అందుకున్నారు తమిళ గేయ రచయిత కవిరారాజు వైరముత్తు గారు. ఆయన రచనలు తెలియని తమిళవారుండరు. తెలుగువారిక్కూడా చాలామందికి ఈయన పరిచయం. తమిళంలో ఈయన రాసిన పాటల్ని తెలుగులోకి డబ్బింగు చేసినప్పుడు అక్కడక్కాడా ఈయన రచించిన కొన్ని గొప్ప భావాలు తెలుగువారినీ అలరిస్తూనే ఉంటాయి.

ఇదికాదు నేనుకోరినది

సమయం సందర్భం చూడకుండ

కామ శంఖము మోగించి

నిరాయుధహస్తురాలితో

యుద్ధమొకటి మొదలుపెట్టి

 

ముద్దుపెట్టడం చేతగాక

మోహంలో కొరికి

ఫేన్ తలకి తగిలేలా

పైకెత్తుకుని తెచ్చి

భయంతో బిగుసుకుపోయి
నేను కేకలుపెడుతుంటే
పరుపుపై నా దేహాన్ని పడేసి
ఎసరు కాగక ముందే
తొందర్లో బియ్యంవేసినట్టు
నీలోని కామపుపొగరుని
కరిగించి కరిగించి
నాలోపోసి
అవసరం తీరగానే
తిరిగిపడుకుని
తడికురులారబెట్టుకుని వచ్చేలోపు
గుర్రుపెట్టి నిద్రపోయే భర్తా!
ఇదికాదు నేనుకోరినది
**
సున్నితత్వం కావాలి నాకు
గడ్డిపరకపై జారుతున్నమంచుచుక్క ప్రయాణంలా

శంఖంలోదూరి
సంగీతమయ్యే గాలిలాగా
సున్నితత్వం కావాలి నాకు

**

ప్రవాహానంతరం
చిరుజల్లుతో మొదలుపెట్టు
ఏది చేస్తే నా ప్రాణం విరబూయునో!
నేను చెప్పను
నువ్వు కొలంబస్
నేను అమెరికాకనుగొనుట నీ బాధ్యత

పదివేళ్ళని నెమలీకలుగా మార్చి
అణువణువునీ పూవుల్లా పూయించు
నా అంగాలని
ఒక్కదానికొక్కటి పరిచయం చెయ్
ఆత్రగాడా!
వీణవాయించేందుకు
గొడ్డలి తెచ్చినవాడా!
పిడుగులు పంపికాదు
పూలను కుశలమడగడం!
**
ఇదికాదు నేనుకోరినది
నువ్వు ముగించినచోట
నేను మొదలుపెడతాను
నేనడిగినదెల్లా –
ఆధిక్యత ముగిశాకకూడా
సడలిపోని అదే పట్టు
గుసగుసలాడగాచెవులని తాకే

నీ వెచ్చని శ్వాస

ప్రతి సంయోగానంతరమూ
“నీకే నేను” అన్న హామీ
నా జుట్టుతడిమే
నీ అరచేతివేడి
చెదరియున్న నన్ను
చేరదీసే అక్కర
నేను ఎలా ఉండాలంటే అలా
ఉండనిచ్చే స్వాతంత్రం
తీయని అలసటలో
చిన్నచిన్న సేవలు
నిద్రొచ్చేంతవరకు
చిలిపి సతాయింపు
గుండెకత్తుకున్నప్పుడు
మదినింపే నమ్మకం
**
ఇదిగో!
దుప్పటిలోచేరి నీ చెవికినేనుపెట్టుకునే విన్నపము

మోహమంతా ఇంకిన
జీవితపు రెండో అధ్యాయంలోనూనాపట్ల ఇదే తీవ్రత ఉంటుందా?

పరులముందర చూపే అదే గౌరవాన్ని
ఏకాంతంలోనూ చూపుతావా?
ఏ చీర నువ్వు ఎప్పుడు కొనిచ్చావో
తారీకులు చెప్పి నన్ను ఆశ్చర్య  పరుస్తావా?
ఐదువేళ్ళ సందుల్లోనూఆలివ్ నూనెరాసి

నెమ్మదిగా శ్రద్దగా ఆప్యాయతనొలకపోస్తావా?

మాణిక్యపు వేళ్ళని ఒడిలోపెట్టుకుని
నాకు తెలియకనే నా గోళ్ళుగిల్లుతావా?
మేను మెరుగులను కోల్పోయిఅందం తగ్గుముఖంపడుతున్న అంత్యంలో

విముఖం చూపకుండ వినయుడైయుంటావా?
రుతుస్రావమనే పవిత్రతవిరతిచెందే శుభదినంబున

పిచ్చెక్కిన మదిపలువిధంబులా విలపిస్తుంటే

తనివితీరా ఏడవడానికినీ విశాల ఛాతీ అందజేస్తావా?

నిజం చెప్పు,
ఈ హామీలివ్వగలవా?
నమ్మొచ్చా?
ప్రసవించిన కబురువిని
కరిగమనంతో వచ్చి
పసిబిడ్డ నుదురు
ప్రియంగా తాకి

నా అరచేయైనా అంటక

పరుగు తీసినవాడివిగా నువ్వు?

 

అనుసృజన : అవినేని భాస్కర్

Avineni Bhaskar

ఆవినేని భాస్కర్