ఊపేసిన కారా కధలు

 

నేను సీరియస్ కధలు చదవడానికి ముందు నుంచే కధల పుస్తకాలు సేకరించి పెట్టుకోవడం అలవాటుగా ఉండేది. అలా సేకరించి పెట్టిన పుస్తకాల్లో “యజ్ఞంతో తొమ్మిది” పుస్తకం కూడా ఒకటి. పేపర్లలో, వీక్లీల్లో జరిగే చర్చను బట్టీ, బాగా వొచ్చిన సమీక్షల్ని బట్టీ పుస్తకాలు సేకరించేవాడిని. ఆ రోజుల్లో బాగా చర్చ జరిగిన పుస్తకాలలో ఇదీ ఒకటి కావడంతో నా దగ్గరకు చేరిందా పుస్తకం.

ఏదైనా మంచి పుస్తకం అని తెలిసి కొన్న వెంటనే చదవడానికి ప్రయత్నం చేసేవాడిని. మొదటిసారి అర్ధమయీ కానట్టుండేది. తరువాత్తరువాత మళ్ళీ పట్టుపట్టి చదివినపుడు కొంత కొంత అర్ధమయ్యేది. అర్ధమయ్యేకొద్దీ పాత్రలు నా చుట్టూ ఉన్నట్టనిపించేవి. జీవితం సంక్లిష్టంగా ఉన్నదశలో, పేదరికం మనుషుల్ని కసాయి వాళ్ళుగా చేసే రోజుల్లో, వివక్ష రాక్షసంగా రాజ్యమేలుతున్నపుడు ఈ కధల్ని చదివి ఊగిపోయాను.

కధల్లో పాత్రలు ఎంతో సజీవంగా ఉండేవి. నా చుట్టూ జరుగుతున్న జీవితం కధల రూపంలోకి వచ్చినట్లనిపించేది. పాత్రల మధ్య ఘర్షణ మనసును పిండేసేది. నా చుట్టూ జనాలకి జరుగుతున్నది, నాకు జరుగుతున్నది కధల రూపంలోకి వొచ్చినట్లనిపించేది. ప్రతి కధా చదివిన తరువాత గాఢమైన అనుభూతి కలిగేది. అర్ధంగాని విషయాలేవో అర్ధమవుతున్నట్టుగా అనిపించేది.

‘యజ్ఞం’ కధ మీద చర్చోపచర్చలు ఎక్కువగా జరిగాయి. కాబట్టి ఆ కధని ప్రత్యేకంగా చదివేవాడిని. చాలా పెద్ద కధ అయినా పట్టు బట్టి చదివేవాడిని. అయితే అప్పుడు ఆ కధలో అంత తాత్వికత ఉందని కానీ, ఒక్కో పాత్ర ఒక జీవితాన్ని సమగ్రంగా చిత్రీకరించిన వైనాన్నిగానీ, కధ నిండా అంతర్గతంగా రాజకీయాలు చిత్రితమైనవని గానీ తెలియలేదు. కధ ముగింపు మాత్రం సంచలనాత్మకం కావడంతో ఎక్కువగా ఆకర్షించింది. ఈ కధని ఆ రోజుల్లోనే రెండు మూడు సార్లు చదివాను. మొత్తమ్మీద ఈ కధలు చదివినప్పుడు కధలిలా రాయాలి అనేది అర్ధం అయ్యింది. భాషను ఈ విధంగా ఉపయోగించవచ్చు అని తెలిసింది. అక్కడక్కడ ఒకటీ అరా కధలు చదివిన దానికంటే కూడా ‘యజ్ఞంతో తొమ్మిది కధలు’ చాలా దగ్గరగా అనిపించిన కధలు. ఈ కధల ప్రభావం నా మీద ఎక్కువగానే ఉన్నాయనిపిస్తుంది.

మొదట కధలు రాసేటప్పుడు పేరున్న కధల్ని అనుకరించడం సహజంగా జరిగేదే. అలాగా నేను యజ్ఞం కధని అనుకరించి కధ రాయడానికి ప్రయత్నించాను. నిరుపేద కుటుంబంలో పుట్టిన ఒకమ్మాయి చాలా అందంగా ఉంటుంది. అయితే పేదరికమొక శాపమైతే ఆ అమ్మాయికి అందం కూడా మరొక శాపమౌతుంది. అందువల్ల ఎంతో క్షోభ అనుభవిస్తుంది. ఎంతోమంది చేత హింసింపబడుతుంది. బలాత్కరించబడుతుంది. కట్టుకున్న భర్త అసహ్యించుకుంటాడు. ఆమె కూడా చనిపోవాలనే అనుకుంటుంది కానీ తనకొక కూతురు పుట్టడం వల్ల ఆ పిల్ల గురించి ఆలోచిస్తుంది. తరువాత తన కూతుర్ని గురించి ఆలోచిస్తే తాననుభవించిన హింస తన కూతురు కూడా అనుభవిస్తుంది కదా! అచ్చం తన పోలికలతోనే పుట్టిన ఆ పిల్ల పెరిగి పెద్దయి తనలాగే కష్టాలు అనుభవించగూడదని ఆ పిల్ల గొంతులో వడ్లగింజ వేసి చంపేస్తుంది. ఇలా యజ్ఞం కధని అనుకరించి కధ రాశాను. ఆ కధ ముగింపులాంటి ముగింపు ఇవ్వడానికొక కధ రాశానంటే ఆ కధ ప్రభావం నా మీద ఎంత ఉందో అర్ధమవుతుంది. హింస, నో రూమ్, ఆర్తి కధలు కూడా బాగా గుర్తుండిపోయిన కధలు. ఎందుకంటే పల్లెటూరి జీవితం, పేదరికం, అమాయకత్వం, దోపిడీ, కుటుంబ హింస, నిరక్షరాస్యత, అజ్ఞానం ఎంత దుర్భరంగా ఉండేవో చూసేవాడిని. కాబట్టి ఆ జీవితమే కధల్లో చదవడం వల్ల అర్ధమయీ కానట్టుండే జీవితం మరింత అర్ధం కాసాగింది.

భాష కూడా బాగా ఆకర్షించింది. ఉత్తరాంధ్ర మాండలికమైనప్పటికీ కారా మాష్టారు ఆ రోజుల్లోనే భాషను సరళం చేశారనిపిస్తుంది. ఎందుకంటే అస్తిత్వం పేరుతో, అర్ధంకాని మాండలికంతో రాసిన తెలంగాణా కధలెన్నో చదవలేక, చదివినా అర్ధం కాక ప్రక్క పెట్టేవాడిని. సంక్లిష్టం కాని మాండలీకం కావడం వల్ల కధలు చదవడానికి, అర్ధం చేసుకోవడానికి సులువయ్యేది. కధల శైలి, అతికిపోయినట్టుండే శిల్పం, జీవితాన్ని యధాతధంగా చిత్రించిన తీరూ ఖచ్చితంగా నేను కధలు రాయడానికి ఎంతో దోహదం చేశాయి. ప్రకాశం జిల్లా మాండలికం ఉపయోగించి కధలు రాయడానికి ‘యజ్ఞం’ కధ నాకు ప్రేరణ అయ్యింది.

DVR_7884–మంచికంటి వెంకటేశ్వర రెడ్డి