ఇలా ఎప్పటికప్పుడు…

మనస్సు కకావికలం అయినప్పుడు
కేవలం నేనొక శకలం లా మిగిలినప్పుడు
ఒక చిన్న మాట కూడా తుత్తునియ చేస్తుంది

కానీ మరుక్షణం లోనే
నేను ముక్కలు ముక్కలుగానైనా
మళ్ళీ జీవం పోసుకుంటాను ,
జీవితేచ్చ తో కెరటమల్లె ఎగిసిపడతాను
అయినా ఇలా ఎప్పటికప్పుడు
కొత్తగా పురుడు పోసుకోవడం
నేనేన్నిసార్లు చూడలేదుకనుక

ఇన్నేళ్ళ జీవితోష్ణానికి ఇంకిపోయిన
చల్లని భావసంద్రమంతా
బడబాగ్నిలా మారి దహించి వేస్తుంది
బహుశా నీరు నుండి నిప్పు పుట్టడం అంటే ఇదేనేమో

ఆ దహనకాండ ఎలా ఉంటుందంటే
ఏమని చెప్పుకుంటాం చెప్పు
లోలోని పీడలన్నీ దగ్దం చేసే ఆ సెగ ని
సంక్రాంతి  భోగితో సరిగా సంభోదించాలి

ఎక్కుపెట్టిన ఒక్కో ప్రశ్నారవళిని
సవ్యసాచి అమ్ములపొదిలోని
అక్షయ తూణీరంతో
సరిసమానం అని చెపితేనైనా సరిపోతుందా

ఎలా వర్ణించినా వర్ణననకు
చిక్కనిది ఇంకా మిగిలే ఉంటుంది
తెనేటీగకే పట్టు దొరికే తేనే లాగ
అనుభూతికే చిక్కే అంతర్జనిత ఆహ్లాదం లాగా

ఇక షడ్రుచులు అనుభూతిస్తూ
ఉగాది కి పిలుపునిచ్చి
వసంతాన్ని ఆహ్వానించాల్సిందే

-పూర్ణిమా సిరి 

purnima siri

ఎదురెదురుగా…

పూర్ణిమా సిరి

పూర్ణిమా సిరి

ఒకే దారిలో నడుస్తున్నాం
ఒకరికొకరం తారసపడాలంటే
ఎదురెదురుగా నడవాల్సిందే
ఎవరికి వారు ముందుకు సాగిపోవాల్సిందే..
కనపడిన దారిలోనే
కనుమరుగు కాకూడదనుకుంటే
ఒకే వైపుకు నడవాల్సిందే
దగ్గరి దూరాలనూ చవి చూడాల్సిందే
dc1d71e1661ed1922996aa8f5d364479
ఎప్పటికప్పుడు  పలకరించుకుంటూనే
పరిచయాలని పదిలపరుచుకుంటూ
అడుగుల్లో దూరాలను
లెక్కల్లో జీవితాలను
సరిచూసుకుంటూ
ఒకే రేఖకి రెండు చివర్లలా మిగిలిపోవాల్సిందే
ఎంతోకొంత దూరం వచ్చాక
మనం చేయగల్గిందల్లా ఒక్కటే
అపరిచితుల్లా విడిపోవడమో
ఆనందక్షణాలుగా మిగిలిపోవటమో
ఎదురెదురుగా కదలటమో
ఎటు కదిలినా యదలో నిలవటమో..
– పూర్ణిమా సిరి

ఎక్కడికో ఈ నడక!

poornima
ఆలోచనా దారాల వెంట
ఒక్కో పోగు లెక్కేస్తూ
నడుస్తున్నాను….
నడుస్తున్నాను
నిజానికి నాది నడకేనా?
ఎక్కడికో ఈ నడక
ఎడతెరిపిలేని ఆలోచనల నడక
అలా అనంతంలో నేనో
నాలో అనంతమో
ఏమో…చిక్కీ చిక్కని
చిదంబర రహస్యo
అదేదో తెలుసుకోవాలని
ఆశతో ఇంకో రెండడుగులు
ఈ ఆలోచనా సుడులు
నిరంతరం నాలో సంచరిస్తూ
అప్పుడప్పుడు నేను వాటిల్లో సంచలిస్తూ
కదిలే కెరటాలపై కలలధారలు
ఎప్పటికప్పుడు కొత్త నీరుని ఆస్వాదిస్తూ…
నేనే ఒక జాగృత స్వప్నాన్నో
స్వప్నకాల లిప్తావస్థకు సమాధానరూపాన్నో
స్వప్నంతో సంచరిస్తున్నానో
స్వప్నంలోనే చరిస్తున్నానో
ఎంత నడిచినా
అంతూ పొంతూ లేని నడక
నిజానికిది నడకేనా?
అక్కడిక్కడే తిరుగాడే చక్రభ్రమణమా?
చంచలమైన ఆలోచనల
అచంచల గమనమా ఇది!?
అలుపెరుగని ఆత్మశోధనల
ఆగని అంతర్మధనమా ఇది!?
ఏమో..
ఏదో ఒక దరి చేరితే కానీ తెలియదు
నడక ఆగితేకానీ  నిర్ణయం కాదు
నిర్ధారణకొస్తే కానీ నడక ఆగదు…