రూబా

కె.యన్. మల్లీశ్వరి 

 

malliswariఆఫీస్ నుంచి ఇంటికి వస్తూ మూలమలుపున ఆగి  భయంగా ఆకాశం వేపు చూసాను. ఈశాన్యం నుంచి కరిమబ్బు కమ్ముకొస్తోంది.  పాడు వాన!  కురిసి…పోదు. ఒకటే ముసురు. ఇదెన్ని రోజులుంటుందో! గిజాటుగా అనిపించి తల దించుకున్నాను. ఇంట్లోకి వెళ్ళగానే సతీష్ కనిపించాడు. అల్మయిరాలో కుదురుగా కూచున్న బొమ్మల వంక, ఇంట్లో హాయిగా ఎగురుతున్న పిట్టల వంకా దిగులుగా చూస్తున్నాడు. చేసంచిని దివాన్ మీదికి విసిరి ఉస్సురంటూ కూచోగానే వెనుకగా వచ్చి మెడ, రెండు భుజాలుగా చీలే చోట వేళ్ళతో మృదువుగా రాస్తూ ‘టీ చేసివ్వనా సంజూ ?’ అన్నాడు. తల వెనక్కి వంచి చూసాను. తెచ్చి పెట్టుకున్న మృదుత్వం. ముసురు పట్టిన మొహం. ‘నాకేం వద్దురా…’ ఇంకేదో అనాలనుకున్నా గొంతు పట్టుకుపోయినట్లుగా ఉంది.. మొహం కడుక్కోడానికి సింకు దగ్గరకి వెళ్లి యధాలాపంగా అద్దంలో చూసుకుని ఉలిక్కిపడ్డాను. అదే మొహం నాదీనూ.

ఎక్కడివక్కడ వదిలేసి పడకగదికి పరిగెత్తి మంచానికి అడ్డం పడి భోరుమన్నాను. కాస్త నిదానించి లోపలికి వచ్చి దూరంగా నిలబడి ఏడుస్తున్న నా వంక బెరుకుగా చూస్తూ నిల్చున్నాడు సతీష్. మనసు చివుక్కుమంది. తన గురించీ నా గురించి కూడానూ.

ఇద్దరం ఒక బంధంలోకి వచ్చాక చాలా కాన్షియస్ గా మా మధ్యకి చాలా తెచ్చుకున్నాం. పిచుకలు పుల్లా పుడకా ఏరి గూడు కట్టుకున్నంత ఓపికగా తెచ్చుకున్నాం. సతీష్ అయితే మరీను. ఎపుడూ వట్టి చేతులతో రాడు. రోజుకొక కొత్తరకం పూలను తెచ్చేవాడు. నన్ను ఆశ్చర్యపరచడం అంటే ఎంత ఇష్టమో! ఒక గాలీవానా రోజున వద్దన్నా వినకుండా మా ఇంటికి అరవై మైళ్ళ దూరంలో ఉన్న స్నేహితుడి తోటకి వెళ్లి అంటుగట్టిన సెంటుమల్లి మొక్కను తెచ్చాడు. రెండడుగుల పింగాణీ కుండీలో వేసి ఎంత పోషణ చేసేవాడో! దాని పరిమళం అంతా ఇంతా కాదు.

అరాచకంగా ఉండే మా ఇంటి పద్ధతులంటే ఎంత కోపం ఉన్నా సతీష్ వాళ్ళమ్మ అపుడపుడూ మమ్మల్ని చూడడానికి వచ్చేది. అలా వచ్చినపుడు ఒకసారి ఒక చిన్నసంచి నా చేతికిచ్చి “అవసరం అయినపుడు ప్రయోగించు” ముసిముసిగా నవ్వుతూ అంది. ఆవిడ అటు వెళ్ళగానే తీసి చూసాను. చెక్కతో చేసిన పాతకాలపు తీపిగవ్వల బల్ల. ఇలా ప్రయోగించి అవసరాన్ని కడతేర్చడం కూడా పాత కాలపు ఆలోచనే! నేనూ సతీష్ నమ్మము కూడా. కానీ సన్నటి పొడవాటి గీతల మధ్య బాగా అరిగి నున్నగా మారిన ఆ బల్ల సతీష్ వాళ్ళ అమ్మ, నాన్నమ్మ, తాతమ్మల  కవుర్లు చెపుతుండేది. అవి వింటూ గుట్టలుగా  తీపిగవ్వలు తయారు చేసి డబ్బాలకు ఎత్తేదాన్ని.

కొద్దిగా ఏకాంతం దొరికితే చాలు మా చుట్టూ పంచ వన్నెల సర్పం పడగ విప్పి ఆడుతుండేది. అపుడు సతీష్ ఎంత బావుంటాడో! బ్లష్ అవుతున్న తన మొహాన్ని చూడడం ఇష్టంగా ఉంటుంది…ఇపుడలా కనిపిస్తాడా! దూరంగా నిల్చున్న తన వంక మళ్ళీ చూసాను. చూస్తూనే ఉన్నాను. ఆశాభంగమయింది. ఇపుడు ఎట్లా కనిపిస్తున్నాడు సతీష్ నా కంటికి!? రెడీ, వాన్..టూ..త్రీ.. స్టార్ట్.. ఎగిరిపోతే ఎంత బావుంటుందీ…అతని కళ్ళలో సీతాకోక చిలుకల స్వైర విహారం.

ఈ ఇరుకిరుకు గదిని బోర్ గా చూస్తూ బిగబట్టుకున్న తన ఓపిక వెనుక ఉన్నది నా మీది ప్రేమేనా కాదా?  ఒకపుడు నేను అలిసిపోయి ఇంటికి రాగానే నా కన్నా ముందు ఇంటికొచ్చిన సతీష్ ‘టీ చేసివ్వనా?’ అన్నపుడు దాని అర్ధం కాక ఆ టోన్ ఎంత సేద దీర్చేది! క్రమేపీ ఆ స్వరం మాయమై, టీ టైం, ఒక అలవాటు సందర్భం కావడాన్ని నేను జీర్ణించుకోలేకపోతున్నాను. కాలం తన పొరల్ని తాను ఒల్చుకుని ఊరుకోదు కాబోలు! ఎన్నెన్నో భయాలను మీదికి విసురుతుంది. తను నాతో ఉన్నాడు సరే, నాతోనే ఉన్నాడా?  ఇంద్రజాలికుడి మాజిక్ సంచి నుంచి మాజిక్కే మాయం అయిపోతే ప్రదర్శన రక్తి కడుతుందా!  ఈ మహా నౌకాయానంలో ఒంటరి నావికురాలిగా మిగిలిపోతానా? భయం. భయం. భయం వేలు చూపి బెదిరిస్తోంది.

Kadha-Saranga-2-300x268

 

ఇంట్లో చేరిన ముసురుకి భయపడి నేనూ సతీష్  వైజాగ్ సెంట్రల్ కి వచ్చాం. రెండు గంటల్ని విజయవంతంగా కిల్ చేసి సంపాదించిన రెండు చేతుల లగేజీని కారు లో డంప్ చేసాక తను ఫ్రంట్ మిర్రర్ కి  నేను సైడ్ విండో మిర్రర్ కి చూపుల్ని అతికించి బొమ్మల్లా కూచున్నాం. ఏం జరిగిందో తెలీదు, గురజాడ కళాక్షేత్రం దగ్గరకి వచ్చేసరికి కారు మొరాయించింది. మెకానిక్ కి ఫోన్ చేసి కారు అప్పగించి అరగంట సమయం పడుతుందనేసరికి ఓపెన్ ఆడిటోరియంలోకి వెళ్లాం.

ఎదురుగా బోర్డ్ మీద  ఫోక్ లోర్ ఫెస్ట్ – 2015 అన్న అక్షరాలు మిలమిల మెరుస్తూ కనిపించాయి. లోపలంతా చాలా హడావిడిగా ఉంది. తప్పెటగుళ్ళు, గరగలు, థింసానృత్యాలు వరుసలుగా ప్రదర్శనలు సాగుతున్నాయి. రకరకాల వాద్య విశేషాలు ఏకమై గమ్మత్తు స్వరాన్ని ఆలపిస్తున్నాయి. చిలక జోస్యకాడు ప్రలోభపెడుతూ చాలా సేపు వెంటపడ్డాడు. నవ్వుతూ తప్పించుకుని పై మెట్ల మీద మసక వెలుతురులో కూచున్నాం. మా పక్కనే ఒకామె అటు తిరిగి ఏవో సామాన్లు సర్దుకుంటోంది. ఆమెకి ఎడమ చేతివైపు పాత బట్టల మూట, ఒక చేట, చిన్న కర్రముక్క కనిపించాయి. వాటి వంక చిత్రంగా చూస్తూ  మాలో మేము సైగలు చేసుకుంటుండగా మా అలికిడికి ఇటు తిరిగిందామె. ఆకుపచ్చ రంగు ముతక నేత చీర కట్టుకుని ఉంది. పెద్దవైన కాటుక కళ్ళతో మమ్మల్ని చూస్తూ నవ్వింది. చేతిలో చిన్న కర్ర ముక్క పట్టుకుని దాంతో చేటలో ఏదో రాస్తూ ‘సోది సెపుతానమ్మ సోది…ఉన్నది ఉన్నట్టు లేనిది లేనట్టు సెపుతానమ్మ’ అంటూ దగ్గరకి జరగబోతుంటే ఇద్దరం గాభరాగా లేచాం. ‘చాల్లెమ్మా సోది!’ సతీష్ వెక్కిరింపుగా అని కదలబోతుండగా వినపడింది ఉరుము లాంటి ఆమె గొంతు.

“ఆలుమగల మద్దెన ఉండాల్సిందే లేదు. వెళ్ళండిరా వెళ్లి వెతుక్కోండి. జగడాలు మాని జట్టు కట్టి కొండ కొన కొమ్ముకి చేరి వెతకండిరా! తలుపులమ్మోరుకి దండం బెట్టి లోయలోకి  చూడండిరా! అడివితల్లికి దండం బెట్టి అడివిని  జల్లెడ పట్టండిరా! జగడాలు మాని జట్టు కట్టి వెతకండి. వెతికి వెతికి ఒక కుక్కపిల్లని తెచ్చుకోండిరా. అంత వరకు మీకు శాంతి లేదు. కనకమాలచ్చిమి ఆన.”  పలుకు చెప్పి మరి మావైపు చూడకుండా పక్కకి తిరిగిపోయింది పౌరుషంగా. కొద్ది క్షణాల పాటు మాతో సహా లోకమంతా మాయమై ఆ ఒక్క స్వరమే రివైండ్ అవుతూ ఉంది. తలంతా ఒకటే హోరు. అక్కడ నుంచి ఎలా బయట పడ్డామో ఎలా ఇంటికి వచ్చి చేరామో గుర్తు లేదు.

***

శృంగవరపు కోట చేరగానే టీ తాగుదామని  అనడంతో అయిష్టంగానే బ్రేక్ వేసాడు సతీష్. మేము స్లో కాగానే సర్రున మా పక్క నుంచి దూసుకుపోయింది నల్లరంగు జాగ్వార్. అందులోంచి ఇద్దరమ్మాయిలు మొహాలు బైటకి పెట్టి హే..అంటూ అరిచి వేళ్ళు ముడిచి బొటనవేలు కిందికి చూపుతూ అల్లరిగా వెక్కిరించారు. నవ్వుతూ చేతులూపాను. రోడ్డు పక్కన చిన్న బండి మీద రకరకాల తినుబండారాలు కనిపిస్తున్నాయి. పక్కన స్టవ్వు మీద టీ మరుగుతోంది. కారు దిగి  రెండు టీలు తీసుకున్నాం.

“నాలుగైంది.. ఆరున్నరకల్లా అరకు చేరిపోతాం.” పక్కన ఉన్న సతీష్ మాటలు ఎక్కడో ఉన్నట్లు వినపడ్డాయి. అప్పటికే నా మనసు రెక్కలు కట్టేసుకుంది. సుదూరపు కొండల్ని ఆత్రుతగా చూస్తున్న నా వంక చూసాడు చూస్తున్నాడు సతీష్. ఏం కనిపించిందో ఏమో అకస్మాత్తుగా తన చూపుల్లో బెదురు.

మునుపెపుడో ఇలాంటి బెదురే చూసాను. ఎపుడబ్బా?!  ఆ… ఓ సారి  తంతడి బీచ్ లో నేను సర్వ సంకోచాలూ వదిలి ఆడుతూ నా ఎత్తు లేచిన అలకి ఎదురొడ్డి , కలియబడి చివరికి అదీ నేనూ రూపాలు వదిలి చుట్టుకుపోయి ఒక విన్యాసపు తహతహతో అంతెత్తుకు లేచి ఒక్కసారిగా విరిగిపడినపుడు  ఒడ్డున నిలబడి ఇలానే బెదురుగా చూసాడు. నేను  బైటకి వచ్చి టవల్ కోసం చేయి చాపితే ఒకడుగు వెనక్కి వేసి “ నువు చాలా అందంగా ఉంటావు…అది కాదు సమస్య. ఆ  సంగతి నీకు బాగా తెలుసు…అదే సమస్య” అన్నాడు. అదిపుడు గుర్తొచ్చి కొంచెం రిలీఫ్ గా అనిపించింది. నాకు ఏ భయం ఉందో, నాకు ఏ సందేహం ఉందో సతీష్ కీ అవే భయ సందేహాలు ఉన్నాయని  తెలిసినప్పటి రిలీఫ్. మునిగిపోవడంలో కూడా మరొకరు తోడున్నారన్న విచిత్రమైన రిలీఫ్.

ఈ సారి డ్రైవింగ్ సీట్ లోకి నేను వచ్చాను. సతీష్  నా పక్క సీట్లో కూచుని సీట్ బెల్ట్ చేతిలోకి తీసుకుని దానివంక విసుగ్గా చూసి పెట్టుకుంటూ “ ఇంత ప్రయాణం పెట్టుకున్నాం. కుక్కపిల్ల దొరుకుతుందంటావా?” అన్నాడు. నా ఆలోచనలు సోదెమ్మ మాటల మీదకి పోయాయి. ఆ స్వరం ఎందుకట్లా ఉందో!! అంత శక్తి ఏంటో! మా ఇద్దరి మధ్యా అన్నీ ఉన్నా, లేనిదేదో అంత సులువుగా ఎలా చెప్పగలిగింది? ఆ లేనిదే తెచ్చుకోమంది. ఒక కుక్కపిల్లని తెచ్చుకోమంది! ఆ మాటలు ఇప్పటికీ పక్కనే ఉండి నడుపుతున్నట్లుగా ఉన్నాయి. కంటికి కనపడకుండా ఆవరించి ఉన్న ఆ మాటల్ని పదేపదే తల్చుకుంటూ “ కుక్కపిల్ల తప్పకుండా దొరుకుతుంది. మనం మచ్చిక చేసి ఇంటికి తెచ్చుకుంటాం కూడా” ధీమాగా అన్నాను.

roobaకారు ఘాట్ రోడ్ ఎక్కింది. శృంగవరపు కోట నుంచి ఘాటీ మీదకి రాగానే ఒక లోకం లోంచి చప్పున ఇంకో లోకంలోకి దుమికినట్లు ఉంటుంది.  రోజుకి పదహారు గంటలు స్మార్ట్ ఫోన్ల వంటి బాగా దగ్గర వాటిని చూడటం అలవాటైన చూపుకి సుదూరంగా చూడమని చెప్పడం కష్టమే. అంతదూరంలోకి, ఆ దూరమంతా వ్యాపించి ఉన్న వెలుగులోకి వెళ్ళడం అలవాటు తప్పి కనుపాపలు ముడుచుకుని చూపు అల్లల్లాడిపోతోంది. కాసేపటికి అలవాటు పడ్డాం.

పోడు కోసం చదును చేసిన కొండవాలు పలకలుగా మెట్లుగా కనిపిస్తోంది. ఆ వైపంతా పసుపు పచ్చని వలిసెపూలవనం, అంతకి మరింత పైపైన దట్టమైన ఆకుపచ్చని అడవీ చేతులు చేతులు పట్టుకుని ఒప్పులకుప్పా ఒయ్యారి భామా ఆడుతున్నట్లున్నాయి. అసలకి ఆకుపచ్చ పసుపుపచ్చ రంగులు అందమైన అక్కచెల్లెళ్ళ వంటివి. వాటి సఖ్య సౌందర్యం ఇంత కన్నా బాగా ఎక్కడ చూడగలం!! లోయ పై అంచుకు కట్టిన సిమెంటు గట్టు మీద కోతులు గుంపులుగా కనిపించాయి. పసికోతుల్ని పొట్టకి అదుముకుని తాపీగా దిక్కులు చూస్తున్నాయి తల్లికోతులు. తామరతూడుల వంటి నునుపైన పొడవైన నూగారు తోకల్ని కిందకి వేలాడేసి తల మాత్రం పక్కకి తిప్పి చూస్తున్నాయి మరి కొన్ని. ఈ వాహనాల చప్పుళ్ళకి బెదిరేది లేదని  నిర్లక్ష్యంగా ఓ చూపు విసురుతున్నాయి.

సతీష్ ఏదో ట్రాన్స్ లోకి వెళ్ళినవాడిలా ఉన్నాడు. ఇపుడతని కళ్ళలో అరకులోయ స్వైర విహారం చేస్తోంది. ఉన్నట్లుండి నా తల నిమురుతూ “ ప్రియురాలా! నీ తల వెండ్రుకలు గిలాదు పర్వతము మీది మేకల మందను పోలి ఉన్నవి” అన్నాడు విస్మయంగా. మైండ్ బ్లోయింగ్! నేను పరిచయం అయిన కొత్తల్లో ఓ సారి తలారబెట్టుకుంటున్న నన్ను చాటుగా ఫోటో తీసి తన లాపీ డెస్క్ టాప్ మీద పెట్టుకుని, ఫోటోలోని శిరోజాల మీద బంగారపు రంగు అక్షరాలతో  ఈ కొటేషన్ టైప్ చేసుకున్నాడు. అది నేను చూసిన రోజే కదా, ఆ వాక్యం వెనుక ఉన్నది పైకి కనిపించే భావం కాదని గ్రహించడం! తను నాతో పరమగీతం ఆలపించడానికి సిద్ధంగా ఉన్నాడని అర్ధమై, అపుడు తనేం చెప్పకుండానే తనని కావిలించుకున్నాను! కావిలించుకున్నాను మళ్ళీ  ఒంటి చేత్తోనే.

సుంకరమెట్ట దాటుతుండగా గాలికొండ మీద మెరుపు మెరిసింది. ఆకాశంలో దాక్కున్న గొప్ప ఇంజినీరు ఎవరో విద్యుత్ రేఖలతో లోకం కాన్వాస్ మీద స్కెచ్ గీస్తున్నాడు. కొండ కొనకొమ్ము వంటి చోట కారాపి చేతులు చేతులు పట్టుకుని గట్టు మీద కూచుని కుక్కపిల్ల కోసం ఆశతో లోయ లోకి తొంగి తొంగి చూసాం.. అప్పటివరకు సన్నగా వీస్తున్న గాలి వేగం పెంచుకుని విసురిసురుగా తోసేయడం మొదలు పెట్టింది.  అకస్మాత్తుగా వ్యాపించిన మసకచీకటికి పిట్టలు గోలగోల చేస్తున్నాయి.

మేం కూచున్న కొండకీ ఎదురుగా ఉన్న కొండకీ మధ్య కొన్ని మైళ్ళ దూరం విస్తరించిన లోయ మీదుగా వాన తెర ఒయ్యారంగా ఊగుతూ వస్తోంది. అదుగో వచ్చేస్తోంది…వచ్చేసింది..సంబరంతో కెవ్వున అరుస్తూ పరిగెత్తి కారులో దూరిపోయాము. గాల్లో ఎగురుతున్న దూదిపింజెలా కనిపించిన వాన మమ్మల్ని ఎంత బలంగా తాకిందో కారు పైభాగంలో డమడమ చప్పుళ్ళను వింటే అర్ధమవుతుంది.

వాన ఉధృతికి గాలి కూడా తోడయి ఎత్తైన చెట్ల కొమ్మలు విరిగి పడుతున్నాయి. వాటి ఆకులు గాల్లోకి లేచి ఆకాశాన్ని కమ్మేస్తున్నాయి. ఆ చీకట్లో, ఆ భయానకమైన  చప్పుళ్ళ మధ్య కారు స్టార్ట్ చేసాను. రెండు ఫర్లాంగులు పోగానే చిన్న చిన్న కొండరాళ్ళు రోడ్డు మీదికి దొర్లి పడటం మొదలైంది. ఏ బండరాయో వచ్చి కారు మీద పడితే! నాలుక పొడారిపోయి చెమట్లు పట్టాయి. ఎడం చేతి వైపు చెట్లు ఎక్కువ ఉన్న చోట కారు పక్కకి తీసి ఆపుతూ ఎదురుగా చూసి అరవబోయి బలవంతంగా ఆపుకున్నాను. అప్పటివరకూ చెట్టు చాటున ఉన్న ఆకారం ముందుకు రావడం హెడ్ లైట్స్ కాంతిలో కనపడింది.

“ఫర్వాలేదు. ఎవరో మనలాగే.” లిఫ్ట్ అడుగుతున్న అతన్ని పరిశీలనగా చూసి అన్నాడు సతీష్. వాన విసిరివిసిరి కొడుతోంది. వేరు ఆలోచనకి సమయం లేదు. అతను లోపలికి వచ్చాడు. దాదాపు నలభై ఏళ్ల వయసు ఉండొచ్చు. మాటల వల్ల తెలిసింది అతని పేరు సింహాద్రి. వైజాగ్ లో ఒక పెద్ద ఫాక్టరీలో చిన్నవర్కర్.  సతీష్ బాగ్ లోంచి తన చొక్కా, తువ్వాలు తీసిచ్చి మార్చుకోమని చెప్పాడు. అవలా చేతిలో పట్టుకునే ఎన్నో విషయాలు చెప్పాడు. ఫాక్టరీ యజమానులతో సమస్యలు, సమ్మెలూ, తిరుగుబాట్లూ  పోరాటాలూ, చిరు విజయాలు, భరించలేని ఓటములు…ఒక్కో మాటా అగ్నికణం. చీకట్లో అగ్నికణం.

అతని మాటలు వింటుంటే నాకు మల్లేనే సతీష్ కి కూడా  గాభరాగా అనిపించింది కాబోలు, మధ్యలోనే  అడ్డు తగిలి చొక్కా మార్చుకోమని చెప్పాడు . అపుడు చూసాము అతని చొక్కా మాటున తడిచిపోయి గిజగిజలాడుతున్న కాకిని. “ఇద్దరికి లిఫ్ట్ ఇస్తున్నాం” సతీష్ నా చెవిలో గొణిగాడు. నవ్వొచ్చింది.

rooba

దానిని పదిలంగా పక్కన కూచోబెట్టి తను చొక్కా మార్చుకుని మళ్ళా చేతిలోకి తీసుకుని దానితో ఏదో మాట్లాడుతున్నాడు సింహాద్రి. అచ్చం మనిషితో మాట్లాడినట్లే. మా సీట్ల లోంచి వెనక్కి తిరిగి ఆ సంభాషణని ఆసక్తిగా చూస్తున్నాము. చిలుకల్నీ కోయిలల్నీ రంగురంగుల పిట్టల్నీవెంటపెట్టుకు తిరిగే వాళ్లకి కొదవ లేని లోకంలో ఇలా కాకిని మోసుకుంటూ తిరిగే సింహాద్రి కొత్తగా ఉన్నాడు. వానకి తడవడం వల్లనేమో కాకి తల మీద బూడిద రంగులో ఉన్న ఈకలు నిక్కబొడుచుకుని ఉన్నాయి. వాటిని వేళ్ళతో పుణుకుతూ “ ఏటే! జావేద్ అబీబ్ కెల్లి కటింగు సేయించు కొచ్చినవేటే లంజికూతురా!  సోకు సూసుకుంతవేటే? అద్దం తెచ్చీమందువా?” అంటూ సింహాద్రి దానితో పరాచకాలాడుతుంటే సతీష్ అయోమయంగా తన స్పైక్స్ తలకట్టుని తడుముకుని, పగలబడి నవ్వుతున్న నన్ను చూసి సిగ్గుపడిపోయాడు.

కదలడానికి వీలులేని ఆ కాళరాత్రిని దాటడానికి సతీష్  గోలగోలగా సింహాద్రికి తన బాధలన్నీ చెపుతూనే ఉన్నాడు. మధ్య మధ్య నేను కూడా అతనికి అర్ధం అవుతుందా లేదా అన్న నిమిత్తం లేకుండా చెప్పుకుపోయాను.  విని విని ‘అలగయితే ఏటి సేస్తారు!  ఎవళ దోవ ఆళు సూసుకోండి’ అన్నాడు తాపీగా. బిక్కచచ్చిపోయాం. “ మాకు ఇంత పెయిన్ ఉందని చెపుతుంటే అసలేమాత్రం కన్సర్న్ లేకుండా…” సతీష్ ఆవేదనగా ఇంకా ఏదో అనబోతుంటే  అతను తల అడ్డంగా ఊపేసి తీవ్రంగా ఉన్న  గొంతుతో ‘మన నొప్పుల్తో లోకానికేటి పని? దాని ఒళ్ళు ఆ ఫళంగా సీల్చి సూడుమీ! గుండె కాయన్నదే అవుపడదు. నీవైనా నానైనా అలగే ఉన్నాం..” అన్నాడు. మేమట్లా నివ్వెరపోయి చూస్తుండగా గాలికొండ మీద పిడుగు పడిన వెలుగుని చూస్తూ చెప్పాడు సింహాద్రి  ‘అల్లందుకే నాను ఏటకుక్క కోసం పారొచ్చీనాను.’

తెల్లారింది.

వాన తగ్గగానే రోడ్డుకి అడ్డంగా ఉన్న చిన్న చిన్న రాళ్ళనీ చెట్ల కొమ్మల్నీ తొలగించుకుంటూ అరకు చేరుకున్నాం. రణజిల్లెడ జలపాతానికి వెళ్ళే తోవలో చుట్టూ రకరకాల పచ్చని చెట్లు. పూతకొచ్చిన మావిడి చెట్ల నుంచి వగరు వాసన వస్తోంది. అడ్డుకట్టు చీరతో, పక్క కొప్పు చుట్టి, బులాకీలు పెట్టుకున్న గిరిజన స్త్రీలు కొడవళ్ళు పట్టుకుని మట్టసంగా ఉన్న కాళ్ళని నేలకి గుచ్చుతూ చులాగ్గా గుట్టలు మిట్టలు ఎక్కేస్తున్నారు. ఒక వైపు కొండరాళ్ళ మధ్య నుంచి జలజల దూకుతున్న ధార, మరోవైపు చూపు నిలవని లోయ. సింహాద్రి లోయ అంచున నిలబడి మా ఇద్దరి చేతులూ చెరోవైపూ పట్టుకుని, ‘అమ్మా! అడివి తల్లీ  మా వొరాల దేవతా! నానొచ్చీనాను. ఇల్లిదిగో ఇద్దరు బిడ్డల్నీ తెచ్చినాను. కనికరం సూపుమీ. మా కోరికలు విన్నవించుకుంతాం ఆలించుమీ!’ అంటూ రాగంతో మాట్లాడటం మొదలు పెట్టాడు.

లోకం చీదరించుకునే కాకుల్ని, భుజాన మోసే ఆ మనిషితో కలిసి సాయంత్రం వరకూ అడవిని జల్లెడ పట్టి అలిసిపోయాం. కుక్కపిల్ల దొరకనే లేదు. రాత్రయ్యేసరికి గెస్ట్ హవుస్ కి చేరుకున్నాం. ఎత్తైన దేవదారు చెట్ల మధ్యనుంచి కిందికి రాలిపడిన పువ్వులా ఉంది ఆ కట్టడం. బడలిక తీరేలా గోర్వెచ్చని నీళ్ళతో స్నానం చేసి వచ్చేసరికి ఆరుబైట వేసిన నెగడు చుట్టూ కొటియా జాతి స్త్రీలు నృత్యం చేస్తున్నారు. వాళ్ళు వడ్డించిన బాంబూ చికెన్, రొట్టెలు తింటూ నెగడు వద్ద ఉండిపోయాం చాలా సేపు. రాత్రి చిక్కనయ్యాక అనిపించింది, రాత్రిలో అడవిని, అడవిలో రాత్రిని నిసర్గంగా చూడాలని. చలో అంటే చలో అనుకున్నాం.

ముందుకు నడుస్తున్న కొద్దీ వెనుక అలజడి పల్చబడుతోంది. రోడ్డు, ఎత్తు నుంచి పల్లానికి దిగుతోంది. విద్యుత్ వెలుగుల్ని దాటి ముందుకు వచ్చేసాక వెన్నెల బాగా కురవడం స్పష్టంగా కనపడుతోంది. రాత్రి పన్నెండున్నరకి ఉండే చల్లదనంతో పాటు సముద్ర మట్టానికి ఐదువేల అడుగుల ఎత్తులో ఉన్న కొండ మీద ఉండే చల్లదనం కూడా తోడయింది. వీచే గాలితో వచ్చే చల్లదనం కాదు. కదలక మెదలక స్థిరంగా ఉండే చల్లదనం. చెట్లమీదా గట్లమీదా కొండల్లోనూ లోయల్లోనూ అన్నింటా కుదురుగా కూచున్న చల్లదనం.

రోడ్డు పక్కన గుబురుగా గుండ్రంగా ఎత్తుగా ఉన్న ఒక చెట్టు, రోడ్డు మీద ఇరవై అడుగుల మేరా నల్లటి నీడని పరిచింది. అదెంత చిక్కని నీడంటే  మేము దాని మధ్య నిల్చున్నామన్న జాడే కనపడదు. కాస్త దూరంలో మూసేసిన కాఫీ హవుస్ నుంచి కాఫీ గింజల అరోమా చుట్టూ వ్యాపించింది. అక్కడ ఆరుబయట వేసిన నల్లని తెల్లని ఇనుప కుర్చీలు, రాజులూ రాణులూ మంత్రులూ సామంతులూ సైనికుల తలల ఆకారంలో చిత్రంగా ఉన్నాయి. అదాటున చూస్తే వారంతా ఒక చోట కొలువు తీరి మంతనాలాడుతున్న గుసగుస ధ్వనులు.

మా మధ్య మాటలు లేవు. అర్ధరాత్రి అడవి చేస్తున్న ప్రతి చిన్న సవ్వడినీ గ్రహించడానికి ధ్యానంలోకి జారిపోయాం. పక్షులూ అడవి జంతువులూ మత్తులోకి సోలినట్లున్నాయి. రోడ్డుకడ్డంగా ఒక ముంగిస అటు నుంచి ఇటు పరిగెత్తింది. వినగా వినగా, నిశ్శబ్దం లోంచి పుట్టే శబ్దాల్ని వినగా వినగా చెవికి ఆనించుకున్న శంఖం నుంచి వినిపించే అతి సన్నని హోరు. పర్వతాగ్రం నుంచి కిందకి దూకుతున్న కొండవాగు హోరు. ‘అమ్మా గోస్తనీ తల్లీ!’ గొణిగి ఊరుకున్నాడు సింహాద్రి.

మళ్ళీ నిశ్శబ్దం. కాలి పక్కన  కొఱివిచీమలు పాకుతున్న చప్పుడు కూడా వినిపిస్తోంది.. చెట్లని అల్లుకున్న అడవితీగెల ఉయ్యాల నుంచి బరువైనదేదో జారి దబ్బున తుప్పల్లో పడింది. మళ్ళీ తెరలు తెరలుగా నిశ్శబ్దం కమ్మేసింది. చుట్టూ వెన్నెల పాలమున్నీరులా పొంగుతుంటే దాని మధ్య గుండ్రని పుట్టిలా ఉంది మేము నిల్చున్న చెట్టునీడ. ఉద్విగ్నంగా సతీష్ చెయ్యి పట్టుకోబోతుండగా కొండ గుండెలు ఝల్లుమనేలా వినిపించిందొక గొంతు. “రూ….బా…”

అంతెత్తున అదిరిపడ్డాం. ఎవరిదా గొంతు!! ఎవరిని పిలుస్తున్నారు? భయంభయంగా చూస్తూ చెట్టు నీడ నుంచి వెన్నెల్లోకి వచ్చి చుట్టూ చూసాం. అనాదిగా మనిషి వెతుకులాట బెంగనీ  దిగులునీ  బరువునీ  మోస్తున్న గొంతుతో పిలుస్తున్నారెవరో! “ రూబా…”

ఇంత రాత్రిలో ఇంత నిశ్శబ్దంలో ఆ గొంతు ప్రకంపనలతో అడవి మార్మోగిపోతోంది. ఎవరు, ఎందుకోసం ఇంత అల్లాడిపోతున్నారు!! చుట్టూ భయంగా చూస్తుండగా మాకు కాస్త దూరంలో ఎండిన చెట్ల ఆకుల మీద ఏదో పరిగెడుతున్న చప్పుడు వినపడింది. ఒళ్ళు జలదరించింది. శ్రద్ధగా వినగా  అది మా వైపే వస్తున్న అలికిడి.. అప్రయత్నంగా ముగ్గురం దగ్గరగా చేరాం. ఆ చప్పుడుని వెంబడిస్తూ వస్తోంది “ రూబా ”  అన్న పిలుపు కూడా.  అటే చూస్తూ నిల్చున్నాం. రెండు నిమిషాలకి చెంగుచెంగుమని దూకుతూ సరాసరి మా వద్దకే వచ్చింది నల్లని తెల్లని మచ్చల కుక్క ఒకటి.

ఇదేనా రూబా! ఇదేనా మేం వెతుకుతున్న గమ్యం! మా మధ్య ఉండాల్సిన కుక్కపిల్ల ఇదేనా? దగ్గరకి వెళ్లి పట్టి పట్టి చూసాము.

ఉద్వేగం ఆపుకోలేక కేకలు వేస్తూ ‘అవును ఇదే మాకు కావలిసిన కుక్కపిల్ల’ పదేపదే అరుస్తూ నేనూ సతీష్ ఉద్రేకంగా దానిని నిమరబోతుండగా సింహాద్రి అడ్డంగా వచ్చి నిలబడ్డాడు. ‘ ఇది నాకు కావలసిన వేటకుక్క’ అన్నాడు. ముగ్గురం ఒకరి మొహాల్లోకి మరొకరం అయోమయంగా చూసుకుంటూ వాదులాడుకుంటూ ఉండగా తుడుం దెబ్బలా వచ్చాడొక కోదు జాతి గిరిజనుడు. రూబాని వెంబడిస్తూ వచ్చినవాడు. ఎండు కొమ్మ మాదిరి ఉన్న ఒంటికి చిన్న గోచీ పెట్టుకుని చేతిలో పంగల కర్ర పట్టుకుని ఉన్నాడు.

అలిసిపోయినట్లు అక్కడ ఉన్న బండరాయి మీద కూచుని మా వాదులాటని ఆలకించి రూబా వంక చూస్తూ నిర్లిప్తంగా, ‘ రూబా మచ్చిక కాదు, ఏట సెయ్యదు. అది మందబేపి ( ఆవులు, మేకలమందని కాపలా కాసే కుక్క ) దాని ఎనకాల మనము పడిపోవడమే’ అన్నాడు. వినగానే నిశ్చేష్టులమయ్యాం.

“మరి మా కుక్కపిల్ల?! అది లేకుండా వెనక్కి ఎలా వెళ్ళడం? రోజుకో భయంతో ఎలా బతకడం?” సతీష్ దిగులుగా అంటుంటే ఆ గిరిజనుడు నిట్టూర్చాడు. “మీ మద్దెన కుక్కపిల్ల ఉండాలంటే ఉట్టినే వస్తాదా! దానికో తల్లి కడుపు ఉండొద్దా? ముందుగాలా రూబా వెంట నడిస్తే అదే కుక్కపిల్లని పెసాదిస్తాది. అల్లదిగో… మల్ల పారిపోతున్నాది. పాండి… ఎలగైనా సూపు దాటకుండా సూసుకుందారి” మా అందరినీ వదిలి అల్లిబిల్లిగా పరుగులు తీస్తున్న రూబా వెంటబడ్డాడు. అదెప్పటికీ మచ్చిక కాదు. అది ఎవరి పెరటి జంతువు కాదు. మేము కూడా దాని వెంటపడాలి, పరిగెత్తాలి. చూపు దాటకుండా చూసుకుంటూ ఉండాలి.  ఓపిక కూడగట్టుకుంటూ “రూబా…” అంటూ అది వెళ్ళిన తోవలోకి  ఆ గిరిజనుడితో పాటు నేనూ సతీష్ దారి తీస్తూ సింహాద్రిని రమ్మని పిలిచాము.

“ రూబా మా లావు గొప్పదాయే! కానీ దారి తప్పిపోనాది. దానెంట నానెలగ ఒచ్చీదీ!?” అంటూ కాకుల్ని మోసే సింహాద్రి మాతో రానన్నట్లు తల అడ్డంగా ఆడించి వేటకుక్కని వెతుక్కోడానికి కాబోలు ఇంకో తోవలోకి మాయమయ్యాడు.

*