గురువు, స్నేహితుడు, నాయకుడు గంటి ప్రసాదం

venu and ganti prasad

వ్యాసకర్త ఎన్.వేణుగోపాల్ మధ్యలో, కుడి వైపున గంటిప్రసాద్

 

ఒక ఎండాకాలపు ముసిముసి వేకువ ఔరంగాబాద్ స్టేషన్ లోకి రైలు ప్రవేశిస్తుండగా దిగడానికి తలుపు దగ్గరికి వచ్చి ప్లాట్ ఫారం మీద నిలబడిన వ్యక్తిని చూడగానే నేను వస్తున్నది ఆయనకోసమే అని పోల్చుకున్నాను. అప్పటికి ఆయన పేరు చాలసార్లే విని ఉన్నాను గాని ఆయనను చూడలేదు. పూర్తిగా ఆయన పోలికలతోనే ఉన్న  తమ్ముడిని విశాఖపట్నంలో ఎన్నోసార్లు కలిశాను గనుక ఆయనను గుర్తు పట్టడం కష్టం కాలేదు. అయినా మా కలయిక సంకేతస్థలం రైల్వే స్టేషన్ లో కాదు గనుక నా మానాన నేను రైలు దిగి గేటు దాటి ఓ వంద గజాలు నడిచి చాయ్ కొట్టు దగ్గర ఆగాను. ఆయన నా వెనుకే వచ్చి చెయ్యి కలిపారు. అది మొదలు.

లవ్ ఎట్ ఫస్ట్ సైట్ అనేది మామూలుగా నిజమో కాదో తెలియదు గాని ఆయనతో నాకు కుదిరిన ప్రేమానురాగాలు మొదలయినది మాత్రం ఆ క్షణాన్నే. ఆయనతో మొదటి ముఖ పరిచయమే తొలిచూపు వలపు లాగ మొదలయింది. వెనక్కి తిరిగి చూస్తే ఆయన నా జీవితంలోకి ప్రవేశించి ఎనిమిది సంవత్సరాలు మాత్రమేనా అని ఆశ్చర్యం వేస్తుంది. ప్రాణసమానమైన ఆత్మీయ మైత్రి అది. యావజ్జీవిత సాన్నిహిత్యం అనిపించేంత గాఢమైన సంబంధం అది. పరస్పరం ఎంత విమర్శించుకున్నా, ఎంత గట్టిగా అరచుకున్నా, ఎన్ని అభిప్రాయ భేదాలు తలెత్తినా మరుక్షణం అదంతా మరచిపోయి అల్లుకున్న స్నేహం అది. ఒకరిపట్ల ఒకరికి సంపూర్ణమైన నమ్మకం, గౌరవం, చనువు ఉన్న సమస్థాయి సంబంధం అది. పన్నెండు సంవత్సరాల వయసు తేడా ఉన్నదని ఏ ఒక్కక్షణమూ అనిపించని స్నేహాదరం అది. ఆయన పట్ల నాకు అపారమైన గౌరవమూ ప్రేమా ఉండేవి. ఆయనకు నాపట్ల చెప్పలేనంత వాత్సల్యమూ అభిమానమూ ఉండేవి.

ఆయన గంటి ప్రసాదం.

అలా ఔరంగాబాద్ స్టేషన్ ముందు కలుసుకున్న మేం అప్పటికే ఆయన దిగిన లాడ్జికి వెళ్లి అది ఖాళీ చేసి, ఆయన వెంట ఉన్న సహచరుడు సురేందర్ తో సహా మహారాష్ట్ర టూరిజం గెస్ట్ హౌజ్ గది లోకి మారాం. ఆ తర్వాత ఓ గంటా గంటన్నరలో చెంచయ్యగారు, పాణి, రవి వచ్చేశారు. కాని అప్పటికే ఆయనా నేనూ లోకం మీది విషయాలన్నీ మాట్లాడేసుకుంటున్నాం. ఇక అందరమూ చేరాక మొదలుపెట్టిన సమావేశం మధ్య మధ్య భోజనాలు, చాయలు, కొన్ని గంటల నిద్ర మినహాయిస్తే మర్నాడు సాయంత్రం దాకా నిర్విరామంగా సాగింది. ప్రసాదం గారి పట్ల గౌరవం ఇనుమడించడానికి ఆ సుదీర్ఘ సమావేశం మరొక మెట్టు. సాహిత్యం, సాహిత్య విమర్శ, రాజకీయాలు, పార్టీ చరిత్ర, విరసం చరిత్ర, వ్యక్తులు, వ్యక్తుల సామర్థ్యాలు, బలహీనతలు, వ్యక్తుల పట్ల అంచనాలు, భవిష్యత్తు కార్యక్రమాలు, సాంకేతిక అంశాలు, బహిరంతర రహస్యాలు… ఎన్నెన్నో. కొన్ని వందల అంశాలు చర్చకు వచ్చాయి. ప్రతి ఒక్క అంశం లోనూ ఆయన సంధించిన ప్రశ్నలు, ప్రతిపాదనలు, అభిప్రాయాలు, చర్చలు, వ్యాఖ్యానాలు, వివరణలు, విశ్లేషణలు, ముక్తాయింపులు ఆయన విశ్వరూపాన్ని చూపాయి. ఆయన నోటి నుంచి వెలువడిన పరిహాసాలు, చరిత్ర నుంచి అనుభవాలు ఎంతో బరువైన సందర్భాన్ని కూడ ఆహ్లాదకరంగా తేలికపరచాయి. ఆయన మాటలన్నిటితో ఏకీభవించానని కాదు, అబ్బురపడినవీ ఉన్నాయి, తీవ్రంగా విభేదించినవీ ఉన్నాయి. కాని ఒక విప్లవోద్యమ నాయకత్వానికి ఎటువంటి సమయస్ఫూర్తి, అవగాహన, సంయమనం, విశాల దృక్పథం ఉంటాయో నాకు మరొకసారి చూపిన అనుభవమది. ఆ విశిష్టత నానాటికీ విస్తరిస్తున్న, పరిణతి చెందుతున్న విప్లవోద్యమ ఫలితం అని ఎంతగా అనవచ్చునో, ఆ విశిష్టతను వ్యక్తీకరిస్తున్న ప్రత్యేక వ్యక్తిలోని నిత్య చలనశీల, ప్రవాహ, విస్తరణ స్వభావానికి సూచిక అని కూడ అంతగా అనవచ్చు.

నిజానికి ఆ రెండు రోజులు జరిగిన సంభాషణంతా నోట్స్ రాసుకున్నాను, ఆయన మాటల్లో ఎక్కువభాగం ఆ నోట్స్ లో ఉండి ఉంటాయి. కాని రెండో రోజు రాత్రి భోజనానికి లేవడానికి ఇంకో అరగంట ఉందనగా ఆ గది మీద దాడి చేసిన ఎస్ ఐ బి తోడేళ్ల గుంపు మా వస్తువులన్నిటితో పాటు ఆ నోట్స్ కూడ ఎత్తుకుపోయింది. దాడి చేసిన వాళ్లెవరో మేం గుర్తించే లోపుగానే ఒక్కొక్కరి మీద పడి మొట్టమొదట చేసిన పని కళ్లకు గంతలు కట్టడం. చేతులు వెనక్కి విరిచి కట్టడం. ఆ తర్వాత మూడు రోజులు అక్రమ నిర్బంధంలో పెద్దగా మాట్లాడుకునే అవకాశం దొరకకపోయినా ఒకరికొకరం తోడుగా ఉన్నాం. చిన్న చిన్న మాటలతోనే, స్పర్శతోనే ఒకరికొకరం ధైర్యం చెప్పుకున్నాం. ఆ నిర్బంధాన్నీ, ప్రశ్నల దాడినీ ఎదుర్కున్నాం.

ఆ తర్వాత నిజామాబాద్ డిఐజి కార్యాలయంలో మమ్మల్ని పత్రికల వారి ముందు ప్రవేశపెట్టి అక్కడ్నించి నిజామాబాద్ ఫోర్ టౌన్ పోలీస్ స్టేషన్ కూ, మర్నాడు బోధన్ కోర్టుకూ, అక్కడ్నించి ఆ సాయంత్రానికి నిజామాబాద్ ఖిలా జైలుకూ తీసుకుపోయిన ప్రయాణమంతా ప్రసాదం గారు మాట్లాడుతూనే ఉన్నారు. ఆ తర్వాత ప్రసాదం గారినీ, నన్నూ పోలీసు కస్టడీకి తీసుకుపోయారు. అప్పటికే డికె బసు కేసు తీర్పులో పోలీసు కస్టడీలో ఖైదీకి ప్రశ్నలకు జవాబు చెప్పకుండా ఉండే హక్కు ఉందనీ, పక్కన న్యాయవాదిని ఉంచుకునే హక్కు ఉందనీ విని ఉన్నాం గనుక మళ్లీ ఫోర్ టౌన్ పోలీస్ స్టేషన్ కు తీసుకువెళ్లి దాదాపు డజను మంది అధికారులు ఏ ప్రశ్న అడిగినా మేం చెప్పం అని మొండికేశాం. వ్యక్తిగత వివరాలు పేరూ ఊరూ చదువూ ఉద్యోగమూ కుటుంబసభ్యుల పేర్లూ తప్ప మరేదీ చెప్పబోమన్నాం. ఆ తతంగంలో కడప నుంచి వచ్చిన ఒక సిఐ మామీద విపరీతంగా కోపం తెచ్చుకుని, పక్కన న్యాయవాదులు ఉండడంతో ఏమీ చేయలేక పళ్లు పటపట కొరకడం, చూపులతోనే మమ్మల్ని ఎన్ కౌంటర్ చేయడానికి ప్రయత్నించడం ఎనిమిది సంవత్సరాల తర్వాత కూడ కళ్ల ముందు ఆడుతోంది. మూడు రోజుల కోసం తీసుకున్నవాళ్లు అలా ఒకటిన్నర రోజు గడవగానే నన్ను వెనక్కి పంపేశారు. ప్రసాదం గారిని ఏమైనా చేస్తారా అని భయం. న్యాయవాదులకు కూడ చెప్పకుండా ఆయనను హైదరాబాదుకు తరలించారు. బహుశా నిజామాబాదుకు రాలేని అధికారులు హైదరాబాదులో ఆయనను ప్రశ్నించారు. కళ్లకు గంతలవల్ల వాళ్లెవరో ఆయన పోల్చుకోలేక పోయారు గాని పైస్థాయి వాళ్లెవరో అయి ఉంటారని అన్నారు.

నాలుగో రోజు ఆయనను మళ్లీ నిజామాబాదు జైలుకు తీసుకువచ్చారు. ఆ తర్వాత మాకు బెయిల్ దొరికి విడుదలయ్యే వరకూ రెండువారాలకు పైగా రోజుకు ఇరవైనాలుగు గంటలూ మేం పంచుకోని విషయం లేదు. చర్చించుకోని అంశం లేదు. కేవలం మాటల్లోనే కాదు, మౌనంలోనూ, రోజువారీ శారీరక, మానసిక కార్యకలాపాలన్నిటిలోనూ ఒకరేమిటో మరొకరికి పూర్తిగా తెలిసివచ్చిన అద్భుతమైన, అనివార్యమైన, నిర్బంధశిబిర సాన్నిహిత్యం అది. బహుశా ఆ తర్వాత ఎనిమిది సంవత్సరాల ప్రగాఢ సంబంధానికి మూలం ఆ రెండు వారాలలో ఒకరి పట్ల ఒకరికి ఏర్పడిన నమ్మకమూ అంచనాలే కావచ్చు. ఆ తర్వాత ఆ కేసు వాయిదాల కోసం ఇరవై ముప్పై సార్లు నిజామాబాదుకు కలిసిచేసిన ప్రయాణాలు, చివరికి సాక్షుల విచారణ, వాదనల సమయంలో నిజామాబాదులో వారం రోజులు కలిసి గడపడం, ఈ మధ్యలో మా ఇంట్లోనూ, రాష్ట్రంలో ఎన్నో చోట్ల సభల సందర్భంగానూ వందలాది గంటల సంభాషణలు అరుణారుణ స్మృతులు. హైదరాబాదు వచ్చిన ప్రతిసారీ పది నిమిషాల కోసమైనా సరే, ఒక రోజో, రెండు రోజులో గడపడానికైనా సరే నా దగ్గరికి వచ్చేవారు. వనజతోనూ, అమ్మతోనూ, విభాతతోనూ కూడ సన్నిహితంగా ఉండేవారు. రావడానికి అసలే కుదరకపోతే ఫోన్ చేసి, ‘ఈ సారి కుదరడం లేదు, మళ్లీ వస్తాను’ అనేవారు.

చాల లోతయిన, సైద్ధాంతికమైన, నిబద్ధమైన, మానవీయమైన దృక్పథం, స్పష్టత ఉంటూనే ఆయనలో చాల ఆశ్చర్యకరమైన అమాయకత్వమూ పసితనమూ కూడ ఉండేవి. ఒక్క క్షణం కింద తత్వవేత్తలా, నాలుగు దశాబ్దాల ఆచరణతో తలపండిన అనుభవజ్ఞుడిగా మాట్లాడిన ఆయనేనా అనిపించేంత అమాయకంగా, స్వచ్చంగా, పసితనంతో ప్రవర్తించేవారు. తనకు తెలియని విషయం తెలియదని ఒప్పుకోవడంలో, అమాయకంగా అడగడంలో ఆయనకు ఎప్పుడూ భేషజం ఉండేది కాదు. మేం జైల్లో ఉన్నప్పుడు వనజ నాకు అదనంగా చొక్కాలు తెచ్చింది. అవి చర్మాస్ లో దొరికే మామూలు నూలు చొక్కాలు. కాని వాటి రంగులు ఆయనను చాల ఆకర్షించాయి. నిజామాబాద్ జైల్లో జాలీ ములాఖాత్ లోనే ‘వనజా నాకు అటువంటి షర్ట్ కావాలి’ అని చిన్న పిల్లవాడిలా అడిగారు. జైల్లో అది వేసుకుని చాల సంతోషించారు. విడుదలై వచ్చాక కూడ మళ్లీ అటువంటిది కొనిపించుకున్నారు. అలాగే జైలులో ఉన్నప్పుడూ, బైటికి వచ్చాక కూడా నశ్యం పొడి కోసం ఆయన ప్రయత్నాలూ, చిరాకూ, అది సమయానికి అందకపోతే చిన్నపిల్లవాడిలా మంకూ ఆయనలోని స్వచ్ఛతకూ, నిష్కల్మషత్వానికీ అద్దం పట్టేవి.

ఇక ఆయనలోని అమాయకత్వానికీ, చిన్నపిల్లవాడి మనస్తత్వానికీ చెప్పుకోవలసిన చిహ్నం తెలుగు పజిల్స్ నింపడం మీద ఆయనకు ఉండిన పిచ్చి. నాదగ్గరికి చాల పత్రికలు వస్తాయి గనుక ఆయనకు పండగలా ఉండేది.  వచ్చినప్పుడల్లా పాత పత్రికలన్నీ వెతికి ముందేసుకుని ఆ పజిల్స్ నింపడంలో మునిగిపోయేవారు. ముఖ్యమైన విషయం మాట్లాడుతుంటే వినకుండా, లేదా పరధ్యానంగా వింటూ పజిల్స్ లో మునిగిపోతున్నారని కోప్పడేవాణ్ని. సారూ, ఇంకెప్పుడూ కోప్పడను, ఒక్కసారి వచ్చిపోరూ….

అట్లాగే, ఆయనకు రచన చేయాలని చాల కోరిక ఉండేది. పనుల్లో ప్రయాణాల్లో తీరిక దొరకక ఎక్కువ రాయలేక పోయారు గాని రాస్తే చాల బాగా రాసేవారు. చంచల్ గూడ జైల్లో ఉండగా తెలంగాణ మీద ఒక వ్యాసం రాసి ఇచ్చారు. ఆరు సంవత్సరాల కింద వీక్షణంలో అచ్చయిన ఆ వ్యాసం ఇప్పటికీ చాల తాజాగా, గొప్ప విశ్లేషణతో ఉంది. నిజంగా తెలంగాణ ఉద్యమం మీద ఆయన అవగాహన చాల సరయినది. ఇటీవల కిషన్ జీ హత్య తర్వాత రాజ్యం జరిపిన దుష్ప్రచారం మీద అరుణతారలో ఒక మంచి వ్యాసం రాశారు. ఈ రెండు మూడు వ్యాసాలు, అమరుల బంధుమిత్రుల సంఘం చరిత్ర, ప్రణాళిక మినహాయిస్తే మిగిలిన రచనలు ఎక్కువగా కరపత్రాలే. కాని రాసిన ప్రతి కరపత్రమూ చూపెట్టి, కూచుని చదివించి, బాగుందా అని చిన్న పిల్లవాడిలా, కొత్త రచయితలా అడిగేవారు. అలాంటప్పుడు, ఆయన చదవాల్సిన కొత్త పుస్తకాలు, వ్యాసాలు ఎన్నెన్ని ఉన్నాయో చెప్పి పనులు కొన్ని తగ్గించుకుని అయినా చదవమని కోప్పడేవాణ్ని. చదువు మానేశారని విమర్శించేవాణ్ని. కాని ఆయన అసలు చదవడం లేదని కొన్నిసార్లు అనిపించేది గాని, ఆశ్చర్యకరంగా ఆయన చాల విషయాల్లో చాల అప్ టు డేట్ గా, తాజా వివరాలతో ఉండేవారు. ఒక పత్రిక వెలువడిన రోజు సాయంత్రం జరిగిన సభలోనే ఆ పత్రిక సంపాదకీయాన్ని ఉటంకిస్తూ విశ్లేషించడం చూసినప్పుడు ఆయన అవసరమని అనుకున్నవి వెంటనే చదువుతారని అనిపించేది.

అలాగే నేను ‘చౌరస్తాలో తెలంగాణ ఇంకెన్నాళ్లు’ అని వీక్షణం నవంబర్ 2012 సంచికలో ఒక వ్యాసం రాస్తూ తెలంగాణ ఉద్యమంలో ఉన్న అన్ని శక్తుల బలాబలాలను గురించి చర్చించినప్పుడు, ఒక వారంలోపే ప్రసాదం గారు కలిశారు. ‘అందరి గురించీ విమర్శలు ఉన్నాయి మావోయిస్టు పార్టీ గురించి, దాని ప్రభావంలోని తెలంగాణ సంస్థల గురించి విమర్శ లేదేమిటి’ అని వ్యాఖ్యానించారు. ‘ఈ మాటలు మరొక పేరుతో ఉత్తరంగా వేయనా’ అని అడిగితే సరేనన్నారు. ఒకరకంగా ఆయన విప్లవ నిర్మాణంలో చాల కీలక స్థానాలలో ఉండి కూడ అక్కడి సమస్యల గురించి బైటివాళ్లు ఎలా ఆలోచిస్తారో అలా ఏమాత్రం స్వీయాత్మకత లేకుండా వస్తుగతంగా ఆలోచించేవారు. మరొకవైపు బహిరంగంగా మాత్రం తనకు విభేదం ఉండిన అంశాలను కూడ సంపూర్ణంగా సమర్థించే ఉక్కు క్రమశిక్షణతో ఉండేవారు.

చివరి రోజుల్లో ఆయన పదే పదే చర్చించిన అంశం ఒకటి ఆయనలోని చదువరిని, సిద్ధాంతకర్తను నాకు పట్టి ఇచ్చింది. ‘ఎందుకు ఇటీవలి కాలంలో పాలిమికల్ (సైద్ధాంతిక వాదవివాదాల) రచనలు మనకు తగ్గిపోతున్నాయి? మార్క్స్ ఎంగెల్స్ లు తమ సిద్ధాంతాన్ని అభివృద్ధి చేసినది పాలిమిక్స్ తోనే. మన పార్టీ చరిత్రలో ప్రధానమైన పాత్ర పాలిమిక్స్ దే. విరసం కూడ తొలిరోజుల్లో పాలిమిక్స్ ద్వారానే తన అవగాహనలను స్థిరపరచింది, ప్రచారం చేసింది. ఎందుకు ఇప్పుడు ఎవరు ఏమి రాసినా, ఎన్ని తప్పులు రాసినా మీరందరూ పట్టించుకోకుండా ఉండిపోతున్నారు? ఎందుకు పాలిమిక్స్ రాయడంలేదు?’ అని ఆయన చాల తీవ్రంగా ప్రశ్నించేవారు. అలా అడిగి అడిగి ఎవరూ పూనుకోవడం లేదనే అసహనంతోనేమో ఆయనే పాలిమికల్ వ్యాసాలు రాయడానికి పూనుకున్నారు.

చదవడానికి సమయం దొరకకపోయినా గొప్ప ఆచరణ జ్ఞానం వల్ల ఆయన సాధారణంగా సరైన వైఖరే తీసుకునేవారు. చర్చలలో చాల కచ్చితమైన, నిర్దిష్టమైన, నిర్దుష్టమైన వ్యాఖ్యలు చేసేవారు. ఆయనకు అలవాటైన భాష కొంత పాతదిగా, సాగదీసినట్టుగా అనిపించేది గాని సారంలో ఆయన విశ్లేషణ మాత్రం పూర్తిగా సైద్ధాంతికంగా, ఆచరణాత్మకంగా, సరిగ్గా ఉండేది.

మార్చ్ చివరి వారంలో లెఫ్టిస్ట్ స్టడీ సర్కిల్ విజయవాడలో భారత ఉత్పత్తి విధానం మీద సదస్సు పెట్టినప్పుడు మొదట ప్రసాదం గారికీ నాకూ చిన్న ఘర్షణ జరిగింది. అర్ధభూస్వామ్య, అర్ధవలస సూత్రీకరణను పూర్తిగా నమ్ముతూ ఆచరిస్తూ ఉన్న పార్టీ ప్రతినిధిగా ఆయన దానికి తప్పనిసరిగా హాజరు కావలసి ఉంటుందని, ఆయనను పిలవమని నిర్వాహకులకు సూచించాను. కాని కుదురుతుందో లేదో అని ఆయన వారితో అన్నారని తెలిసి నేను ఫోన్ చేశాను. ‘నువ్వున్నావు గదా, నేనెందుకూ, చాల పనులున్నాయి’ అన్నారు. ‘నేనేమీ మీ ప్రతినిధిగా వెళ్లడం లేదు. నేను అర్ధభూస్వామ్య అర్ధవలస సూత్రీకరణను నమ్మే ఒక రాజకీయార్థశాస్త్ర విద్యార్థిగా వెళుతున్నాను. అయినా నేను మీకు అస్పృశ్యుడిని కదా. అక్కడ ఆ సూత్రీకరణను సమర్థించుకోవలసిన బాధ్యత పూర్తిగా మీదే’ అని కటువుగా అన్నాను. నిజానికి మరెవరి మీద కోపమో ఆయన మీద తీర్చుకున్నాను గాని ఆయన నన్నెప్పుడూ ఒక్క క్షణం కూడ అస్పృశ్యుడిలా భావించలేదు. నేనలా మాట్లాడాక వచ్చి ఒక పూటంతా ఉండి, ఆ విషయానికి సంబంధించిన రెండు పుస్తకాలు జిరాక్స్ చేయించుకుని వెళ్లారు. బెజవాడలో కనబడగానే, ‘ఇదిగో వచ్చాను’ అని చిన్నపిల్లవాడిలా చెప్పారు. మొదటి రోజు సాయంత్రం చర్చలో జోక్యం చేసుకుని చాల బాగా మాట్లాడారు. క్లుప్తంగానైనా చాల సూటిగా, స్పష్టంగా ఇటువంటి చర్చల పరమ లక్ష్యం ఏమై ఉండాలో చెప్పారు.

నాలుగైదు నెలల కింద నక్సలైట్ ఉద్యమం మీద ఎవరో పోలీసు ఆఫీసర్ రాసిన పుస్తకం ఒకటి తెప్పించి పెట్టమన్నారు. నేనది తెప్పించి మరుసటిసారి వచ్చినప్పుడు ఇస్తే, నీదగ్గరే ఉండనీ, నాకు అవసరమైనప్పుడు తీసుకుంటానులే అన్నారు. రెండుమూడు నెలల కింద విశాఖ నుంచో, కోమర్తి నుంచో ఫోన్ చేసి కొలంబియా విప్లవోద్యమ సంస్థ ఫార్క్ (కొలంబియా విప్లవ సాయుధ సైన్యం) మీద, టర్కీ పికెకె (కుర్దిస్తాన్ వర్కర్స్ పార్టీ) మీద, లాటిన్ అమెరికా ప్రజా ఉద్యమాల మీద సమాచారం కావాలని, తీసిపెట్టమని అడిగారు. అవి పోగేస్తుండగానే తీసుకోలేని చోటికి వెళ్లిపోయారు.

ఆయనలోని ఈ గుణాలూ ప్రత్యేకతలూ విశిష్టతలూ, ఆయనతో ఆత్మీయ మైత్రీ, ఆయన ఆదరాభిమానాలూ అన్నీ నా ఒక్కడి అనుభవమే ఎంత మాత్రమూ కాదు. ఆయన గురించి సరిగ్గా ఇలాగే భావించేవాళ్లు రాష్ట్రంలో కొన్ని వందల మంది ఉండి ఉంటారు. బహుశా ఆయనతో నేను అనుభవించినంత ఆత్మీయతనూ, అంత కన్న ఎక్కువ ఆత్మీయతనూ కూడ అనుభవించిన వారు నాకు తెలిసే డజన్ల కొద్దీ ఉన్నారు. ‘ఆయన నాకు దగ్గరి వారు, నా హృదయంలోని మనిషి. అత్యంత ఆప్తుడు. ఆయన దగ్గర నాకు రహస్యాలేమీ లేవు. నన్ను ఆయన పూర్తిగా తన విశ్వాసంలోకి తీసుకున్నారు’ అని ప్రతి ఒక్కరూ అనుకున్న వ్యక్తి గంటి ప్రసాదం. ఒక మనిషి జీవితంలో అంతకన్న కావలసింది లేదు. ఒక మనిషిని మనీషిగా మార్చేది అదే. గంటి ప్రసాదం అనే మనిషి మార్క్సిజంలో విశ్వాసం వల్ల, నాలుగు దశాబ్దాలకు పైబడిన విప్లవోద్యమ ఆచరణ వల్ల మనీషిగా మారారు. అటువంటి మనీషుల అవసరం మరింతగా పెరుగుతున్న సమయాన రాజ్య దుర్మార్గం ఆయనను మననుంచి దూరం చేసింది. ‘ఆ బుల్లెట్లు నన్ను చంపగలవేమో గాని, నా ఆశయాన్ని కాదు’ అని ఆయన తన వీలునామా లాగ చెప్పిన మాటలే ఆయన మిత్రులందరికీ మిగిలిన ఆశ్వాసం.

–          ఎన్ వేణుగోపాల్

జూలై 13, 2013

మండుటెండలో మోదుగుపువ్వు

అతనొక మోదుగుపువ్వు

మండుటెండలో వసంతాగమన వీచిక

భవిష్యత్ వర్షహర్షానందాల మానవ సూచిక

అతని మునివేలు కొసన ఎప్పుడూ ఒక కంటి తడి

ఎవరెవరి కన్నీళ్లు తుడిచివచ్చాడో

తన కన్నీళ్ల చెలియలికట్టనే ఎన్నిసార్లు కట్టుకున్నాడో

 

వాలిన గరికపోచల చివర్ల అతని ప్రోత్సాహాశ్రు బిందువే

రాలిన తురాయి పూల కనుకొలకుల అతని అనునయ స్పర్శే

కూలిన నిర్మాణాల చెంపల చారికల మీద అతని సాంత్వన బాసలే

ఆగిన దారుల మూలమలుపుల్లో నెత్తుటి మరకలపై అతని గురుతులే

 

అందరూ దూరం కొట్టిన అస్పృశ్యులను ఆలింగనం చేసుకున్నదతడే

కంటిపాప కరువైన తల్లి శోకానికి తల వాల్చే భుజం అందించినదతడే

సహచరుల్ని కోల్పోయిన బంధుమిత్రులకు బాసటగా నిల్చినదతడే

బిడ్డను పోగొట్టుకున్న ఊరికి ఓదార్పు మాటల లేపనాలు పూసినదతడే

ముఖాలు చూసుకోని గడ్డి పరకలను కలిపి

మదగజాలను లొంగదీసే తాళ్లు పేనినదతడే

రాజ్య దుర్మార్గం మీద పెదాల చివరినుంచి నిప్పుకణికలు విసిరినదతడే

ఎప్పుడాగిపోతుందో తెలియని గుండెను అదిమి పట్టుకుని

వేల మైళ్ల దూరాల్ని వందల అవరోధాల్ని అవలీలగా దాటినదతడే

అరెస్టులనూ అనారోగ్యాన్నీ దాడులనూ దుర్భాషలనూ

తోసిరాజని జీవిత చదరంగాన్ని గళ్ల నుడికట్టులా ఆడినదతడే

 

దైవ ప్రసాదం కాదు, జన హృదయ ప్రసాదం, ప్రజా పోరాట ప్రసారం

 

–          వి. కవిత, జూలై 14, 2013