స్నేహనామా

“అయితే  యూరోప్ లో అంతా ఫ్రీ లైఫ్ అన్నమాట!” ఆశ్చర్యంగా అడిగింది పక్క ఫ్లాట్ మిత్రురాలు సురేఖ.     “ ఒకరకంగా అలాగే అనుకోవాలి రేఖా! ఇరవయ్యేళ్లొచ్చేవరకే తల్లిదండ్రుల బాధ్యత,  తర్వాత తమ కాళ్ళ మీద తాము బతకాల్సిందే, వేరుగా ఉండాల్సిందే! మన దేశం లో లా కాదు.      ఇక్కడ కొంతమంది పిల్లలు ఎంత వయసొచ్చినా తల్లి తండ్రుల మీద ఆధార పడతారు.    మరికొంతమంది ఉద్యోగం వచ్చేవరకు తల్లిదండ్రుల్ని పీక్కుతినడం,   ఆ పైన ఆస్తుల కోసం పీల్చుకు తినడం కూడా మనం చూస్తూ ఉంటాం.   కానీ  అక్కడ  ఆడపిల్లైనా, మగపిల్లాడైనా  ఇరవై దాటగానే  ఏదో ఉద్యోగం  చూసుకొని  వేరే ఇంట్లో ఉండాల్సిందే!” అంది ఈ మధ్యే  ప్రాజెక్ట్ పని మీద బల్గేరియా వెళ్లొచ్చిన  ప్రొఫెసర్  నీహారిక.

“ మరి పెళ్ళి మాటో?” కుతూహలంగా అడిగింది సురేఖ.  “ ఆ, అక్కడికే  వస్తున్నా.    మన ఇండియా లో లా  పెద్దవాళ్ళు కుదిర్చి, కట్నాలు మాట్లాడి ,లగ్నాలు  పెట్టి   పెళ్లిళ్లు చేయడాలేమీ ఉండవు.    పిల్లలే  తమకి నచ్చిన వాళ్ళని చేసుకుంటారు. కాదు కాదు,  సహజీవనం సాగిస్తారు ”  “అంటే  పెళ్ళి చేసుకోరా?”   విస్తుపోయింది సురేఖ.  “ చేసుకోరు.    పెళ్ళనేది చాలా ఖర్చుతో కూడుకున్న వ్యవహారం.    పెళ్ళి తంతు  వాళ్ళ  సంస్కృతి లో అంత ప్రధానమైన అంశం కాదు రేఖా!  సహజీవనం.    దీన్నే రిలేషన్ షిప్  అంటారు వాళ్ళు.    అది చాలా సీరియస్ మాటర్.    ఏదో ఇవాళ చూసి, రేపు నచ్చి,ఎల్లుండి కాపరం పెట్టి , వారం లో వదిలేసి వేరే వాళ్ళ వెంటబడ్డం కాదు.    చాలా రోజులు పరిశీలించి , ఒకళ్లకొకళ్ళు  నప్పుతారు అనుకుంటేనే పెద్దవాళ్లతో చర్చించి  నిర్ణయానికి వస్తారు.    ఒక్కసారి రిలేషన్ షిప్ లోకొచ్చాక  చాలా కమిటెడ్ గా ఉంటారు , మన వివాహబంధం లాగే! కొన్నిసార్లు  కంఫర్టబుల్ గా లేదనిపిస్తే   స్నేహంగానే విడిపోతారు.  ఈ కల్సిఉండడం అన్న కాన్సెప్ట్  మనకి విడ్డూరంగా అన్పిస్తుంది కానీ వాళ్లకిది తరతరాలుగా వస్తున్న ఆచారం అనుకోవచ్చు.” అంది నీహారిక ఆరెంజ్ జ్యూస్ సురేఖకి అందిస్తూ.

“అవునులెండి  మనలో కూడా  లక్షణం గా  మంత్రాల సాక్షిగా  చేసుకున్న పెళ్ళిళ్ళు ఎన్ని  పెటాకులు కావడం లేదు? బంధం పట్ల గౌరవం, భాగస్వామి పట్ల  ప్రేమ, నమ్మకం ఉండాలి కానీ పెళ్లి దేముంది లెండి!”   తేల్చేస్తూ పెదవి విరిచింది సురేఖ.    “నిజమే రేఖా! యూరోప్ సంస్కృతి  కాస్త తేడాగా ఉన్నట్టనిపించినా వాళ్ళనించి  మనం నేర్చుకోవాల్సినవి కూడా ఉన్నాయి తెల్సా? ముఖ్యం గా కష్టపడి పనిచేయడం, ఎవరి మీదా ఆధారపడకపోవడం ,  సాటివారికి సాయం చేయడం, గౌరవించడం ….  ఇలా! పిల్లలకి కూడా ఇవే అలవాటు చేస్తారు.”   అంటూ కితాబిచ్చింది నీహారిక.

“అవునుగాని నీహారిక గారూ!  మీ అమ్మాయి శ్రీజ చదువు  వచ్చే సంవత్సరం తో అయిపోతుందనుకుంటా.    సంబంధాలు చూడ్డం మొదలెట్టారా?  విదేశీ సంస్కృతి మోజులో కొట్టుకుపోతున్నారు మనవాళ్ళసలే!”   ఆసక్తిగా అడిగింది సురేఖ గ్లాస్ బల్ల మీద పెడుతూ.    ఫ్రిజ్ లోంచి  మల్లెపూలు, అల్మైరా నించి దారబ్బండి  తెస్తూ “ అమ్మో నాకూ అదే భయం రేఖా.    నీలాగా మగపిల్లలా  ఏమైనా?   ఎన్ని దేశాలు తిరిగినా, ఎన్ని ఉపన్యాసాలిచ్చినా మన సంస్కృతిని ఎలా వదులుకుంటాం?  శ్రీజకి సంబంధాలు వెతికే  ప్రయత్నంలో ఉన్నాం.”   అంది నీహారిక.     “అయినా మీ ఫ్రెండ్ డాక్టర్ శ్వేత గారబ్బాయి నవీన్  ఉన్నాడుగా, ఇంక వేరే సంబంధం ఎందుకు?” అంది ఏదో గుర్తొచ్చినట్లు రేఖ.    “చిన్నప్పటినించీ  ఫ్రెండ్స్ మే గాని పిల్లనివ్వాలని అనుకోవడం లేదు.    తనకి  శ్రీజ ని కోడలిగా చేసుకోవాలని ఉందని నాకూ చూచాయగా తెల్సు.    అయినా…”.     “ఏం? నవీన్ అందంగా ఉంటాడు, బుద్ధిమంతుడు, పైగా మంచి ఉద్యోగం లో ఉన్నాడు.    బాదరబందీలేమీ  లేవు.    ఇంకేంటి?”  ఆశ్చర్యంగా అడిగింది.

“ఏమీ  కాదు.    జాతకాల పట్టింపు లేదు, కట్నం సమస్యా లేదు అదృష్టవశాత్తూ! శ్వేత ఆశించే రకమూ కాదు.    వాళ్ళాయన ఉత్తముడు.    నవీన్ బంగారుకొండ.”    “ అన్నీ మీరే చెప్తున్నారు.      మరింకేంటి  అభ్యంతరం?  ఓహో పిల్లలకిష్టం లేదా కొంపదీసి?”  అనుమానం గా అడిగింది.    “ అదేం లేదు.    శ్రీజ మాకే వదిలేసింది పెళ్లి విషయం, నవీన్ కూడా శ్వేత చెప్పినట్లే వింటాడు.    తానే అంది ఒకసారి ఏదో మాటల్లో.     నాకెలా చెప్పాలో తెలియడం లేదు “ అంది మాల కట్టడం పూర్తి చేసి.    “పర్లేదు ఎలా చెప్పినా అర్ధమవుతుంది, చెప్పండి ముందు” అంది రేఖ మల్లె చెండు జడ లో తురుముకుంటూ.    “మా పిల్లలు ఆట కెళ్లారు ఇంకో గంటగ్గాని  రారు, మా ఆయనేమో క్యాంప్ కెళ్లారు.    సో నేను ఫ్రీ! మీ వారు, శ్రీజ శిరిడీ నించి రేపు కదా వచ్చేది.    కాబట్టి మనం ఎంతసేపు మాట్లాడుకున్నా అడిగేవాళ్లు లేరు.   ” అంటున్న రేఖ మాటలకి అడ్డు తగులుతూ “తల్లీ, రేపు క్లాస్ కి ప్రిపేర్ అవ్వాలి, నన్నొదిలిపెట్టు, తర్వాతెప్పుడైనా చెప్తాలే “ అంది నవ్వుతూ నీహారిక.   “నో వే , నాకిప్పుడే తెలియాలి, తెలియాలి”  అంది సినీ ఫక్కీలో రేఖ.

“అయితే విను.    మా అమ్మ, మేనత్త బెస్ట్ ఫ్రెండ్స్ చిన్నప్పటి నించి.    ఆ స్నేహం తోనే మా అత్త తన  అన్నతో అంటే మా నాన్నగారితో అమ్మకి పెళ్లయ్యేలా చేసింది.    కానీ ఆశ్చర్యం ఏంటంటే  ఏ స్నేహం శాశ్వతం కావాలని  మా అమ్మ ఆశపడి  పెళ్లి చేసుకుందో ఆ స్నేహితురాలు తర్వాత పూర్తిగా మారిపోయింది.    ఆడపడుచు గా రూపాంతరం చెంది మిగిలిన అక్కలతో, తల్లితో కలిసి అమ్మ ని సాధించడం మొదలెట్టింది.    అదేంటో చదువుకొని   ఉద్యోగాలు చేసేవారే  గాని ముగ్గురత్తలు పెళ్లిళ్లు చేసుకోలేదు.    దాంతో ఎప్పుడూ ఇంట్లో కళకళ్ళాడుతూ తిరిగే అమ్మని సూటిపోటి మాటలనడం,  అన్నిటికి వంకలు పెట్టడం.     అమ్మమ్మ వాళ్ళని కూడా ఆడిపోసుకోవడం .     దీంతో అమ్మ మనసు బాగా గాయపడింది.    ఫ్రెండ్ అన్నని చేసుకుంటే  తమ మధ్య అనుబంధం మరింత బలపడుతుందని నమ్మిన అమ్మకి ఇది ఎదురుచూడని దెబ్బ.    కొన్నాళ్ళకి నాన్న ట్రాన్స్ఫర్ రీత్యా మేము వేరే ఊరు వెళ్ళిపోయాము.   అత్తలూ, నాన్నమ్మ కలిసి ఉండేవారు.    ఎప్పుడైనా సెలవులకి వెళ్తే నన్ను, తమ్ముడిని  బానే చూసేవారు కానీ  అమ్మంటే పడేది కాదు.   ఆశ్చర్యమేంటంటే మా అమ్మ ఎప్పుడు వెనకాల కూడా అత్తల్ని తిట్టడం గాని, ద్వేషించడం  గాని చేయలేదు.    తనకి తోబుట్టువులు లేకపోవడంతో నాన్న కుటుంబం లో ఆ లోటు తీర్చుకోవచ్చని ఆశ పడింది, కానీ అది అడియాసే అయింది.     నాన్నకి కోపమొచ్చేది అత్తల ప్రవర్తనకి.     అమ్మ వాళ్లకేమన్నా ఇవ్వమని చెప్తే నాన్న తిట్టేసేవారు అమ్మని…., “వాళ్ళు నిన్ను అకారణంగా ఆడిపోసుకుంటున్నా బుద్ధి లేకుండా ఇంకా వాళ్ళని బాగా చూసుకోవాలి, ఆడపడుచులు సింగినాదం అంటా వేంటి?” అని.    మా అమ్మ ఎప్పుడూ బాధ పడేది.      స్నేహితురాలి అన్నని చేసుకోవడం వల్ల  మంచి భర్త అయితే దొరికాడు గాని ఒక ఆప్తమిత్రురాల్ని పోగొట్టుకున్నాను అని.    ఇంకెవరినో చేసుకొని ఉంటే  తన ఫ్రెండ్ తనకి శత్రువయ్యేది కాదుగా.    ఎప్పుడైనా ఏ సమస్య వచ్చినా అత్త తోనే షేర్ చేసుకొనే అమ్మ  తర్వాత కాలం లో అత్త తిరస్కారాన్ని తట్టుకోలేకపోయింది.

అమ్మ మాకు తన చిన్నప్పటి సంగతులు చెప్పిందంటే మూడొంతులు అత్త ముచ్చట్లే ఉండేవి.    నువ్వు నమ్మవు తెల్సా?  మా నాన్న కంటే ఎక్కువగా అమ్మ దగ్గరే అత్త గురించి విన్నానేమో? తను ఎంత అందంగా ఉండేదో? క్లాసులో ఎంత చలాకీ గా ఉండేదో? ఎంత బాగా చదివేదో?  అన్నీ  వర్ణించి చెప్పేది మా అమ్మ.    అంత అడ్మిరేషన్ అత్తంటే తనకి.    కానీ ఎప్పుడూ  అత్త మాతో అమ్మ గురించి ఒక్క మంచి మాట కూడా చెప్పలేదు.   ఎన్నోసార్లు అడగాలనుకొనేదాన్ని నీకు మా అమ్మంటే ఎందుకు పడదు? అని , కానీ అంత చనువు లేదు మా మధ్య.     సో, మా అమ్మ, అత్తల  మాటర్ చూశాక ఫ్రెండ్షిప్ పదికాలాలు నిలవాలంటే అది బంధుత్వం గా మారకూడదు అని  తెల్సుకున్నాను రేఖా!  అందుకే  నా శ్వేత ఎప్పటికీ నా బెస్ట్ ఫ్రెండ్ గా ఉండాలనే స్వార్ధం తోనే నా కూతురి సుఖాన్ని కూడా పక్కన పెట్టి ఈ పెళ్లి వద్దనుకుంటున్నాను.    శ్రీజకి ఇంతకంటే మంచి సంబంధం దొరుకుతుందో లేదో కానీ శ్వేత కంటే మంచి ఫ్రెండ్ నాకీ జన్మ లో దొరకదు.    మా అమ్మ చివరి రోజుల్లో కూడా  తన ఫ్రెండ్ గురించే కన్నీరు పెట్టుకోవడం నేనింకా మర్చిపోలేదు.    నేను…. నేను….. మా అమ్మలా అవదల్చుకోలేదు.    అసలు….” దుఖంతో  నీహారిక మాట పూర్తిచేయలేకపోయింది.

“అంతా మీ అత్త లాగే ఉంటారా? మీ అమ్మగారిలా కూడా ఉండొచ్చని ఎందుకనుకోవు?” మాటలకి ఉలిక్కిపడి చూశారిద్దరూ.    ఎప్పుడొచ్చిందో శ్వేత డైనింగ్ హాల్ గుమ్మం దగ్గర నిలబడి ఉంది.    “ఏయ్ శ్వేతా రా రా ! ఏంటీ అకాల ఆగమనం?”  సంతోషంగా ఆహ్వానించింది నీహారిక.  “ నీ ఉపన్యాసమంతా విన్నానే నీహా!   నాకంతా అర్ధమైంది.    నేను పని మీద బైటకి వెళ్తూ దార్లో నిన్ను చూసిపోదామని  ఇలా రావడం మంచిదయ్యింది.    నీ మనసులో ఏముందో తెలుసుకోగలిగాను.”    అంది నిష్ఠూరంగా.    “ అది కాదే “ అంటూ ఏదో చెప్పబోతున్న నీహారిక తో “ నే వెళ్తాను మేడమ్! మా పిల్లలు వచ్చేసి  ఉంటారు.   ” “వస్తానండి” అని శ్వేత తో కూడా  చెప్పి బైటకి నడిచింది సురేఖ.    ఆమె వెళ్ళాక  నీహారిక వైపు తిరిగి  “నవీన్ కి శ్రీజ ని  అడగాలని ఎప్పటినించో నేను, మీ అన్నయ్య గారు అనుకుంటున్నాం.    ఇంకా అది చదువుకుంటోంది కదా, తీరిగ్గా మాట్లాడుకోవచ్చులే, నీహా కూతురే గా, పరాయివాళ్ళా ఏమన్నానా? అనుకున్నా… .  ” శ్వేత మాట పూర్తి కాకుండానే  “అంతా అర్ధమయ్యాక కూడా మళ్ళీ ఎందుకే  మొదటికొస్తావ్? నాకంటూ ఆత్మీయురాలివి, ఆప్తురాలివి నువ్వే! ఏదైనా నీతోనే కదే నేను షేర్ చేసుకుంటాను!  నాకు తెల్సు నవీన్ కంటే ఉత్తముడు నాకు అల్లుడు గా రాడు.    అలాగే నీ అంత మంచి  అత్తగారు శ్రీజకి  ఖచ్చితంగా దొరకదు.   కానీ నేను చాలా స్వార్ధపరురాల్నే శ్వేతా! కూతురి  పెళ్లి కోసం స్నేహాన్ని పణం గా పెట్టలేను.   ” కళ్ళు తుడుచుకుంది నీహారిక.

“ ఆపుతావా  తల్లీ నీ దండకం? ఎప్పుడో మీ అమ్మ, అత్తల మధ్య స్నేహం దెబ్బతిందని ఇప్పుడు మనం వియ్యంకులం కాకూడదని శపధం చేస్తావేంటీ? అప్పుడంటే మీ నాన్నగారిది  మధ్యతరగతి  కుటుంబమవడం, అత్తలు అవివాహితలుగా ఉండిపోవడం తో అన్నావదినలు  పిల్లలతో హాయిగా సంసారం చేసుకోవడం…    వాళ్ళకి మీ అమ్మగారి మీద కసిని, ద్వేషాన్ని రగిల్చాయి.    వాళ్ళకి పెళ్లి చేసుకోవడం ఇష్టం లేక మంచి సంబంధాలొచ్చినా, మీ నాన్నమ్మ ఎంతగా చెప్పినా ఒప్పుకోలేదని చెప్పావు… నాకు గుర్తుంది.    తను సెలక్ట్ చేసిన అమ్మాయే అయినా, తన ఫ్రెండే అయినా, తన కళ్ల ముందు పెళ్లి చేసుకొని కళకళ్ళాడుతూ తిరగడాన్ని వాళ్ళు జీర్ణించుకోలేక మీ అమ్మగార్ని ఏదో రకంగా సాధించి రాక్షసానందం పొందుంటారు.    అందుకే వాళ్ళ స్నేహం దెబ్బతింది.    ఇక మన విషయానికొస్తే  పెళ్లయ్యాక పిల్లలు మన దగ్గర ఉండమన్నా  ఉండరు.     అంతా ఫారిన్  మయం కదా! మనమూ ఉద్యోగస్తులమాయే! వాళ్ళకి అవసరమైతే మనల్ని రమ్మంటారు.    అతిధుల్లా వెళ్ళి చూసి , సాయం చేసి రావడమే.    వాళ్ళకి పిల్లలు పుట్టాక వాళ్ళ పెంపకాలు, చదువులు, బాధ్యతలు.     ఇలా తమదైన లోకం లో తాముంటారు.    మనం మాత్రం ఇక్కడ వాళ్ళ గురించి ఆలోచిస్తూ ఉంటాము.    ఇంతోటి దానికి మన స్నేహాన్నిమర్చిపోయి గొడవలు పడుతూ ఎందుకుంటామే?అయినా దేనికి గొడవలు? అన్నిట్లో మనం సమానమే.    మన మధ్య ఏ దాపరికాలు,అసూయలు లేవు.   పోనీ “స్నేహనామా” రాసుకుందామా?”ఆవేశం గా అడిగింది శ్వేత.

“ అంటే?” అర్ధం కాలేదు నీహారికకి.    “ అదేనే వీలునామా లాగా! మనం వియ్యంకులమైనా ఎప్పటికీ మంచి మిత్రులుగానే ఉంటామనీ, మన స్నేహానికి ఏ  హాని కలగనివ్వబోమని, స్నేహబంధాన్ని జీవితాంతం గౌరవిస్తామనీ, ఒక వేళ పిల్లల మధ్య పొరపొచ్చాలొచ్చినా  మనం దెబ్బలాడుకోకుండా  సామరస్యంగా పరిష్కరిస్తామనీ  పేపర్ మీద రాసుకుందాం.    ఈ స్నేహనామా నీకు ఓకే నా నీహా?” ప్రేమగా, అనునయoగా  చెప్తున్న శ్వేతని ఆప్యాయంగా దగ్గరకి తీసుకుంది  నీహారిక.

“చాలే, నీ లాటి ఉత్తమురాలు నా ఫ్రెండ్ అయినందుకు నాకు  చాలా గర్వంగా ఉందే! ఏ స్నేహనామాలూ అక్కర్లేదు.    నా ఫ్రెండ్ ఎప్పటికీ నాతో ఉంటుందంటే  ఇంతకంటే ఏం కావాలి? నేను, నా కూతురు కూడా అదృష్టవంతులమే శ్వేతా!” ఆనందబాష్పాలతో అంది నీహారిక.

**  **  **

ఆచార్య పి. కె.  జయలక్ష్మి