బతుకమ్మ మునిగింది

 

లోగో: భవాని ఫణి

 

కొన్ని కథలు అనుకోకుండా వెలుగులోకి వస్తాయి. కథల పోటీలూ నవలల పోటీలు ప్రకటించినపుడు పోటీ తత్వంతో రాసిన వాటిలో కొన్ని మంచి ప్లాట్స్ బయట పడతాయి. అలా వచ్చిందే ఈ “బతకమ్మ మునిగింది” నవల.నిజాం పాలించిన తెలంగాణా లో ఊరి పెద్దల దౌర్జన్యాలు వారసత్వంగా కొనసాగే రోజుల్లో చోటు చేసుకున్న కథ ఇది. ఈ నవల ను సాకేతపురి కస్తూరి 1992 లో ఆంధ్ర జ్యోతి నవలల పోటీ కోసం రాశారు. ఆ పోటీలో ఈ నవలకు ప్రథమ బహుమతి వచ్చింది.

సాకేత పురి కస్తూరి పల్లకీ, ఇతర వార పత్రికల్లో కథలు రాస్తూ ఉండేవారు. సీరియల్స్ కూడా రాసినట్లే ఉన్నారు. అయితే కొన్నేళ్ళ నుంచీ ఎక్కడా కనిపించడం లేదు, ఏమీ రాస్తున్నట్లు కూడా లేరు. వివరాలు తెలుసుకోడానికి ప్రయత్నించినా వీలు కాలేదు. నవల లో ఉన్న ఫోన్ నంబర్ ఎప్పటిదో 1996 నాటిది. ఎంత ప్రయత్నించినా ఆమె వివరాలు కనుక్కోలేక పోయాను. ఎవరికైనా తెలిస్తే పంచుకోవచ్చు.

ఏ నవల పరిచయం చేసినా, రచయిత/రచయిత్రి పాయింటాఫ్ వ్యూ, ఆ నవల గురించి వాళ్ళ సొంత భావనా తెలుసుకుని రాస్తే మరింత బాగుంటుంది.

ఈ నవల్లో కస్తూరి ఒక బోల్డ్ ప్లాట్ ఎన్నుకున్నారు ఒక స్త్రీకి సంబంధించి. ఒక వివాహితను ఒక ఊరిపెద్ద కిడ్నాప్ చేసి తీసుకు పోయాక కొన్నాళ్ళకి ఆమె ఆతనితో ప్రేమలో పడుతుంది. ఇది అత్యంత సహజంగా జరిగే ప్రక్రియ గా కస్తూరి చిత్రించడం వల్ల, కథా నాయిక పట్ల పాఠకుడికి ప్రేమే తప్ప కోపం కలగదు.

కథా కాలం వర్తమానం కాదని గుర్తుంచుకోవాలి. రచయిత్రి తెలంగాణాకు చెందిన వారా కాదా అనేది తెలీదు. కానీ, ఆమె భర్త వరంగల్ లో పని చేసే రోజుల్లో దశమి నాటి వెన్నెల్లో బతుకమ్మని పేర్చి దాని చుట్టూ పాటలు పాడుతూ తిరిగే ఆడపడుచుల్ని చూసిన క్షణం ఈ నవల కథ తన మనసులో మెదిలింది అని చెప్పారు ముందు మాటలో!

కథ ఒక పల్లెటూరు లో బతుకమ్మ పండుగ రోజు మొదలవుతుంది. వూర్లోని ఆడవాళ్లంతా చెరువులో బతుకమ్మల్ని వదలడానికి వెళ్ళినపుడు, మునుగుతూ తేలుతూ పోతున్న ఒక బతుకమ్మ దేనికో చిక్కుకుందని గుర్తించి దాన్నుంచి విడిపించే ప్రయత్నం చేస్తారు ఆడవాళ్ళంతా! ఆ ప్రయత్నంలో పసుపు పచ్చని పట్టుచీర కట్టి ఉన్న ఒక బండరాయి ని బయటికి తీయాల్సి వస్తుంది

ఆ చీర లక్ష్మిది

ఏడాది క్రితం చెప్పా పెట్టకుండా వూర్లోంచి మాయమైన లక్ష్మిది ఆ చీర! లక్ష్మి చచ్చి పోయి ఉంటుందనే అనుమానం అందరికీ ఉన్నా, ఆ అనుమానాన్ని ఎక్కడా బయట పెట్టే పరిస్థితులు గానీ, ధైర్యం గానీ అక్కడెవరికీ లేవు. ఆ చీర చూడగానే వాళ్ళకి కొంత అర్థమై పోతుంది. కానీ అది కూడా బయటికి అరిచి చెప్పే ధైర్యం లేదు. అందుకే “లక్ష్మి లచ్చుమమ్మగా వెలిసింది” అని ఆ రాయిని ఆ చీరతో సహా చెరువు గట్టున పెట్టి పసుపూ కుంకుమ పెట్టి దేవతను చేస్తారు.

లక్ష్మి అలా రాలి పోయి, దేవతగా అవతరించడానికి వెనక కథ వ్యధా భరితమైందే

తెలంగాణ లోని ఒక చిన్న పల్లెటూరులోని బ్రహ్మయ్య కూతురు పదహారేళ్ల లక్ష్మిని వేరే గ్రామానికి చెందిన స్వర్ణకారుడు లక్ష్మయ్య కి ఇచ్చి పెళ్ళి చేశారు. లక్ష్మికి సవతి తల్లి కావడంతో ఆ పిల్ల పడే బాధలు చూడలేక తండ్రి వీలైనంత త్వరగా పెళ్ళి సంబంధం వెదికి పెళ్ళి చేసి కాపరానికి పంపిస్తాడు. వరసకు చుట్టాలైన ఒకరిద్దరుతప్ప ఎవరూ లేని లక్ష్మయ్య భర్యను అపురూపంగా కాపురానికి తెచ్చుకుంటాడు. ఇంకా మొదటి రాత్రయినా  గడవని ఆ జంట కి అదిక జరగనే జరగని విపత్తు సంభవిస్తుంది. ఆ వూరి పెద్ద దొర రామచంద్రా రెడ్డి చుట్టాల పెళ్ళి వేరే వూర్లో మరో మూడు రోజులో జరుగుతుండటంతో నగలు చేయడానికి అతన్ని అప్పటికపుడు తమతో రమ్మంటారు.

ఎదురు చెప్పలేక, తప్పని సరి పరిస్థితుల్లో లక్ష్మయ్య భార్యను పక్కింటి పోచమ్మ, లక్ష్మయ్యకు వరసకు చెల్లెలైన చుక్కమ్మల సంరస్ఖణ లో వదిలి రెడ్డి తో పెళ్ళికి వెళ్తాడు.

చుక్కమ్మ అందమైన  పడుచు. ఆమెగురించి వూళ్ళో ఎవరికీ సదభిప్రాయం లేదు. ఎందుకంటే ఆమెకు రామ చంద్రారెడ్డి దొర తో శారీరక బంధం ఉంది. చుక్కమ్మ లక్ష్మికి తోడు గా ఉంటూ, లక్ష్మయ్య మంచివాడనీ, అతనితో సఖ్యంగా ఉండి జీవితాన్ని సుఖంగా మల్చుకోమనీ పసితనం వీడని లక్ష్మికి దాంపత్య జీవితం పట్ల ఆసక్తిని కల్గించేందుకు ప్రయత్నిస్తుంది.

రోజూ వూళ్ళోని చెరువు కి నీళ్ళు తేవడానికి తనతో పాటు లక్ష్మిని తీసుకుపోతుంది చుక్కమ్మ. బంగారు రంగుతో బారెడు జుట్టుతో దేవకన్యలా ఉన్న లక్ష్మిని చూసి వూళ్ళో అంతా అబ్బురపడి మనసులో దిగులు పడతారు “దొర కళ్లలో పడిందంటే ఈ పిల్ల బతుకేమవుతదో” అని. లక్ష్మి చెరువులో చేపపిల్లల్లే ఈత కొడుతుంటే చుక్కమ్మ ఆశ్చర్యపడుతుంది. తనకు మాత్రం నీటిగండముందని ఎవరో చెప్తే నమ్మి నీటి వైపు కూడా పోదు.

వూర్లో ఆడవాళ్ళంతా చుక్కమ్మ మంచిది కాదని , దొరతో దానికి సంబంధం ఉంది కాబట్టి దానితో తిరగ వద్దని లక్ష్మి కి హితబోధ చేస్తుంటారు గానీ లక్ష్మి పట్టించుకోదు

ఒకరోజు  చుక్కమ్మ కనిపించని కారణాన, ఒక్కతే పోవడానికి ఇష్టపడక లక్ష్మి పోచమ్మ కొడుకు మల్లిగాడితో చెరువుకి బయలు దేరి వెళ్తుంది. నిండుగా ఉన్న చెరువుని  చూసి సరదా పడి , మల్లి గాడిని చింతకాయలకు  పంపి ఈతకి దిగుతుంది. గంటల తరబడి ఈతకొట్టి కొట్టి అలసి పోతుంది. కట్ట మీదుగా వెళ్తున్న చంద్రారెడ్డి దొర కళ్ళ బడనే పడుతుంది. బంగారు చేపల్లే ఈదుతున్న ఈ సౌందర్య రాశిని చూసి అలాగే కట్టుబడి పోతాడతడు. కాసేపలాగే చూసి చెరువులో అవతలి వైపు దిగి ఈదుకుంటూ వచ్చి లక్ష్మి ని అడ్డగిస్తాడు. ఆ తర్వాత లక్ష్మి ఎంత గింజుకున్నా లాభం లేకపోతుంది. పురుష స్పర్శే ఎరగని లక్ష్మి ని బలాత్కరించి, సొమ్మసిల్లిన లక్ష్మిని చెరువు గట్టున పారేసి పోబోతాడు. ఎవరో వస్తున్న అలికిడి కావడంతో ఆమెను వెనుక తుప్పల్లో పడేయాలని తీసుకు పోతాడు. స్పృహ తప్పి పడున్న లక్ష్మిని పరిశీలనగా చూసిన రెడ్డి ని లక్ష్మి కనుముక్కు తీరు , శరీర సౌష్టవం ముగ్ధుడిని చేస్తుంది

“తీస్క పోయి తోట బంగళాల పెడతా, ఎవరేమంటరో జూస్తా” అని బుజాన వేసుకుని తీసుకు పోయి ఇంటి పక్కనే ఉన్న తోట బంగళాలో గదిలో పడేస్తాడు

తోటకి కాపలాగా పెట్టిన మల్లమ్మ, ఆమె కొడుకు వీరన్నలని పిల్చి గదిలో ఉన్న పిల్లకి ఏం కావాలో చూడమని, జాగర్తగా చూసుకోమని ఆదేశిస్తాడు. “ఎవరీ పిల్ల దొరా? సెర్లో పడ్డదుండీ?” అని మల్లమ్మ అడిగితే “ఔ, లచ్మయ్య పెండ్లాం ఇక సెర్లో పడిన లెక్కనే” అని చెప్తాడు. లక్ష్మి కి స్పృహ వచ్చాక జరిగింది తెలిసి ఏడ్చి గోల చేస్తుంది గానీ ఆమె గోడుని పట్టించుకునే నాథుడు లేడు. మల్లమ్మ ఎంతగా నచ్చజెప్పినా వినదు.

నీళ్ళకు వెళ్ళిన లక్ష్మి బిందె గట్టునే ఉంది గానీ లక్ష్మి జాడ లేక పోవడంతో లక్ష్మి చెర్లో పడి కొట్టుకు పోయిందని ఊర్లో అందరూ నిర్ధారణకొస్తారు. అయితే చుక్కమ్మ నమ్మదు. ఈత బాగా వచ్చిన లక్ష్మి చెరువులో ఎలా కొట్టుకు పోతుందని సందేహంతో చెరువు గట్టున మొత్తం వెదుకుతూ పోతుండగా లక్ష్మి కాలి పట్టీ దొరుకుతుంది. అది పట్టుకుని ఎందుకో అనుమానం వచ్చి దూరంగా చెట్ల మధ్యలో కనిపిస్తున్న  చంద్రారెడ్డి దొర తోట బంగ్లా కంచె దగ్గరికి వెళ్ళి చూస్తే బంగ్లా గదిలో లక్ష్మి! గుస గుస గా ఎంత పిల్చినా లక్ష్మికి వినపడదు! ఎలుగెత్తి పిలిచే పరిస్థితి లేదు. ఈ లోపు పెళ్ళి నుంచి తిరిగొస్తున్న చంద్రా రెడ్డి, వీరన్నలు చుక్కమ్మని చూడనే చూస్తారు.

తనను ఇష్టంతో దగ్గరికి తీసుకునే దొర ఇంకో స్త్రీని, అందులోనూ లక్ష్మిని తెచ్చాడంటే చుక్కమ్మ నమ్మలేక పోతుంది. “మా కులం ల పుట్టుంటే నిన్ను గూడా లగ్గం చేసుకునేటిదుందే చుక్కీ” అని మరులు గొల్పిన దొర, ఒక్కరోజు తను తోటకి రాక పోతే “రాత్రి రాక పోతివి తోటకి? నీ కోసం నడిజాము దాక జాగారం చేస్తూ కూచుంటి చుక్కీ”అని నిష్టూరాలు పోయిన దొర..

లక్ష్మి కి కొత్తగా పెళ్ళయిందని, తననేమీ చేయొద్దని, పై పెచ్చు తాను చంద్రా రెడ్డి వల్ల గర్భవతినయ్యాయని చెప్పి కాళ్లమీద పడి వేడుకుంటుంది

“నీ అసుంటి చెడిన దాని బిడ్డకి నేనెట్ల తండ్రైతనే” అని ఈసడిస్తాడు దొర.”లచ్మి సంగతి గానీ ఊర్ల ఎవరికైనా చెప్పినవంటే, రేపీయేల కి పాలెం చెర్ల నీ పీనుగ బతకమ్మ లెక్క తేలి ఆడతది, యాదుంచుకో” అని హుంకరిస్తాడు.

బతుకమ్మని పీనుగతో పోల్చినందుకు చుక్కమ్మ అగ్రహోదగ్రురాలై చంద్రా రెడ్డిని నానా శాపనార్థాలు పెడుతూ ఊర్లోకి పరిగెత్తి ఎలుగెత్తి అందర్నీ పేరు పేరునా పిలుస్తూ లక్ష్మి దొర చెర లో ఉన్న సంగతి అరిచరిచి చెప్తుంది. అందరూ గుండెలుగ్గబట్టుకుని ఇళ్ళలో వుండే వింటారు తప్ప ఒక్కరూ బయటికి రారు. రాలేరు. ఈ లోపు దొర మనుషులు వెంటాడటం తో చుక్కమ్మ చెర్లో దూకి మునిగి పోతుంది. నీటి గండముందని భయపడిన చుక్కి నీటికే బలై పోతుంది. ప్రేమను నమ్మిన చుక్కమ్మ జీవితం ఎవరికీ అర్థరాత్రి నీళ్లలో ఆమె భయపడినట్టే ముగిసి పోతుంది.

వూరునుంచి తిరిగొచ్చిన లక్ష్మయ్య కి పోచమ్మతో సహా మిగతా జనమంతా నెమ్మది మీద విషయం చెప్పి అతడికి పోచమ్మ కూతురితోనే పెళ్ళి చేసి వేరే వూరికి పంపేస్తారు.

ఈ విషయం మల్లమ్మ ద్వారా తెలుసుకుని లక్ష్మి కుమిలి పోతుంది.”నా మొగుడికి నేనంటే ఎంతో ఇష్టమనుకున్నాను, ఎంతో ప్రేమ ఉందనుకున్నాను. నన్ను ఎలా  మర్చిపోగలిగాడు” అని ఎంత ఏడ్చినా లాభం లేక పోతుంది.

ఇంత జరిగాక ఇక వూరిలో తాను చచ్చిన దానితో జమ అయినట్టే అని గ్రహిస్తుంది. ఇక లక్ష్మికి దొరని అంగీకరించడం తప్ప వేరే గత్యంతరం లేక పోతుంది. మల్లమ్మ మంచి మాటలతో లక్ష్మి మనసుని మళ్ళిస్తుంది. “దొరకి నువ్వంటే ఎంతో ఇష్టం! నీ కోసం చీరలు నగలు తెస్తాడు. మనిషి మాత్రం ఎంత బాగున్నాడో చూడు. ఆయన్నే నమ్ముకో! సంతోషంగా కాపురం చెయ్యి. నీకిక బయట జీవితం లేదు, నీ మొగుడు కూడా ముట్టక ముందే దొర తెచ్చాడు నిన్ను. నిన్ను మొదట తాకింది దొరే! ఇక ఈయనే  మొగుడనుకో” అని వాస్తవాన్ని వివరంగా చెపుతుంది.

కాలం గడిచే కొద్దీ చంద్రా రెడ్డినే భర్తగా భావిస్తూ,ప్రేమిస్తూ అతనికి వశమై పోతుంది లక్ష్మి. చంద్రా రెడ్డి ఎప్పుడూ స్త్రీలను వాడి పడేసే రకమే తప్ప ఇలా ప్రాణ ప్రదంగా ప్రేమించే అవకాశ్సం ఏ స్త్రీకీ  ఇచ్చినవాడు కాక పోవడంతో లక్ష్మి ప్రేమ అతనికి కొత్త, వింత అనుభూతిని కల్గిస్తుంది. లక్ష్మి ప్రేమలో పిచ్చి వాడై, వేరే స్త్రీల జోలికి కూడా పోకుండా ఎక్కువ కాలం తోట బంగ్లాలోనే గడపటం మొదలు పెడతాడు. సర్వస్వం లక్ష్మే అతనికిప్పుడు

ఈ సంగతి వూర్లో కూడా న్యూస్ అవుతుంది. లక్ష్మి దొరని వల్లో వేసుకుని పూర్తిగా వశం చేసుకుందనీ,పట్టు చీరెలు నగలు మోయలేక పోతుందనీ, త్వరలోనే దొరని దివాలా తీయించడం ఖాయమనీ, లక్ష్మి ఇంత గుండెలు దీసిన బంటని తాము ఊహించలేదనీ, దొర భార్య ఉసురు లక్ష్మికి తగిలి నాశనమౌతుందనీ .. ఎన్నో మాటలు. ఒకప్పుడు వీళ్ళే లక్ష్మి బతుకుని రెడ్డి దొర నిలువునా నాశనం చేశాడనీ, పూవు లాంటి లక్ష్మి దొర కాళ్ల కింద నలిగిందనీ, నలిపిన దొర దాన్ని విసిరి బయట పారేస్తాడనీ ఆవేదన చెంది జాలి చూపించిన వాళ్ళు. వాళ్ళు ఆశించినట్లు జరగక దొర లక్ష్మిని నెత్తిన పెట్టుకున్నపుడు విస్తుపోయి లక్ష్మి నాశనం కావాలని ఆశిస్తారు

లక్ష్మి ఎంత చెప్తే అంత అన్నట్టు నడుస్తున్నాడు రెడ్డి.

అయితే పార్వతమ్మ అన్న నాగిరెడ్డి దొర చుట్టపు చూపుగా వచ్చి లక్ష్మి మీద కన్నేసిన నాటి నుంచీ లక్ష్మి కి కష్టాలు ప్రారంభమవుతాయి. చంద్రా రెడ్డి ఉండబట్టి ఆమె వైపు కన్నెత్తి చూసే సాహసం చేయలేక పోతాడు.

రెడ్డి భార్య పార్వతమ్మకి అతని వ్యవహారాలు అలవాటే కాబట్టి అతనితో ఏ సంబంధమూ లేక ఒక కప్పు కింద ఉంటుందంతే! వూర్లో గుడి ని రెడ్డితో చెప్పి బాగు చేయిస్తుంది లక్ష్మి. అలాగే దేవదాసి నాగరత్నం ని తిరిగి  బంగళా వైపు చూడకుండా చేసి పంపేస్తుంది. రెడ్డి ఇదివరకటి అహంకారి కాదు. ప్రతి దానికీ అంతెత్తున ఎగిరి పడే అతను సౌమ్యంగా మారి పోతాడు. ఇదంతా లక్ష్మి చలవే అని భావించి పార్వతమ్మ లక్ష్మి మీద అభిమానంగా ఉంటుంది.

కొన్నాళ్ళకి పార్వతమ్మ తనకీ లక్ష్మి కీ కలిపి బట్టలు ఇతర వస్తువులు తెప్పించేంత దగ్గరవుతుంది లక్ష్మి కి. ఆమెను తనతో పాటు వూరి జనం మధ్యలోకి బతకమ్మ ఆడటానికి గౌరవంగా తీసుకుపోతుంది పార్వతి. మొగుడు ఉంచుకున్న దాన్ని తనతో పాటు వూరి మధ్యలోకి తెచ్చిన పార్వతిని గురించి వింతగా చెప్పుకుంటారు జనం

అయితే బతకమ్మ పండగ రాత్రి వెన్నెల్లో తోట బంగ్లాకి బయలు దేరిన చంద్రా రెడ్డికి చుక్కమ్మ దెయ్యమై తనను వెంటాడుతున్న భ్రమ కల్గుతుంది. వెన్నెల్లో చెట్ల నీడలు చూసి జడుసుకుంటాడు. చుక్కమ్మ తన ఎదురుగా నిల్చుని మాట్లాడుతుంది. అతడు తనకు చేసిన ద్రోహానికి బదులు తీర్చుకోక వదిలి పెట్టనంటుంది. నీ శవం బతుకమ్మ వోలె నీళ్ళలో తేలిస్తా చూసుకోమని వెంటబడుతుంది. ఆ భ్రమలో చంద్రా రెడ్డి భయపడి చెరువు కట్ట మీద పరిగెడుతూ, పట్టు తప్పి చెరువులో పడి పోతాడు. ఎంతటి ఈతగాడైనా, చుక్కమ్మ దెయ్యం తనను చంపబోతున్నదన్న భయంతో నీళ్ళలోంచి బయటికి రాలేక చెరువులోనే ప్రాణాలు వదిలేస్తాడు.

ఆ తర్వాత జరిగిన పరిణామాలేమిటి? లక్ష్మి ఎలా మరణించాల్సి వచ్చింది. ఆత్మ హత్య చేసుకుందా హత్య చేశారా? Concubine ముద్ర వేయించుకున్నా ఒకడితోనే చివరి వరకూ ఉండి పోయిన లక్ష్మి కథేమైంది?నిజంగా చంద్రా రెడ్డి ని చంపింది చుక్కమ్మ దెయ్యమేనా? కాక పోతే ఆ వేషంలో వచ్చిందెవరు?

మల్లమ్మ వీరన్నలేమయ్యారు? ఈ నవల తిరిగి ప్రచురణకి వస్తే ఇవన్నీ అందులో చదవొచ్చు. నిజానికి ఈ నవల తిరిగి ప్రచురణ కావడానికి ఇది సరైన సమయం కూడానేమో, మల్లమ్మ గతమేమిటి?

ఈ నవలలో కథ చాలా చాలా బలమైనది. తన ప్రమేయం లేకుండా అన్యాయమై పోయిన ఒక యువతి కథ. దొరల చరిత్రలో ఒక మామూలు పేజీ. నేల పాలై రాలిన జీవితాల్లో ఒక నిర్భాగ్య జీవితం లక్ష్మిది.

ప్రతి పాత్రనూ రచయిత్రి సజీవంగా చిత్రీకరిచడానికి వీలైనంతగా ప్రయత్నించారు. లక్ష్మి, పార్వతి, రాంచంద్రా రెడ్డి,నాగి రెడ్డి , మల్లమ్మ, వీరన్న ప్రతి పాత్రా పాఠకుడిని ఆకర్షిస్తుంది. మల్లమ్మ వీరన్నల కథలోని మలుపు కొంత సినిమాటిక్ గా అనిపించినా అది కూడా దొరల వారసత్వపు  దౌర్జన్యాలకు అద్దం పట్టేదే కాబట్టి కథకు అతికేదిగానే ఉంటుంది తప్ప, విడిగా తోచదు.

ఇది సినిమాగా తీసి హిట్ చేయగలిగినంత గొప్ప కథ. అయితే కథనంలో గానీ భాషలో గానీ బలం లేదు. రచయిత్రి మాటల ప్రక్రారం ఆమె వరంగల్ లో నివసిస్తున్నపుడు చుట్టు పక్కల జరిగే బతకమ్మ సంబరాలు చూసి ప్రేరణ పొంది నవల రాశారు. అంతే తప్ప ఆమెకు తెలంగాణా మాండలికంతో  దగ్గరి పరిచయం ఉన్నట్టు కనిపించదు, పైగా నవల లో మాండలికాన్ని ప్రభావశీలంగా ప్రయోగించలేక పోయారనేది స్పష్టంగానే తెలుస్తుంది. సంభాషణలన్నీ తెలంగాణా భాషలోనే నడిచినా, కథ నెరేషన్ మాత్రం (పత్రికల) ప్రామాణిక భాషలోనే నడుస్తుంది. అందువల్ల కథ ఎంత బలమైనదైనా, ఒకరకమైన తేలిక దనం నవలంతా పరుచుకుని ఉంటుంది. నవలలో ని నేటివిటీ కూడా తెలంగాణా దే అని తెలియజెప్పే శిల్పం ఎక్కడా కనిపించదు. వూరు చెరువు తప్ప మిగతా జన జీవనం ద్వారా తెలంగాణా పల్లెను స్ఫురింపజేయలేక పోయారు. తెలంగాణా ప్రాంతపు సంభాషణలన్నీ ఆమె అదే భాషలో రాయడానికి ప్రయత్నించి దాదాపుగా 90 శాతం సఫలమయ్యారు గానీ, గాఢత కనిపించదు.

బలమైన కథకు తగ్గట్టు మిగతా అంశాలన్నీ అమరి ఉంటే ఇది చాలా పేరు తెచ్చుకుని ఉండేది. సీరియల్ గా ఆంధ్ర జ్యోతిలో ప్రచురితమైనపుడు ఆసక్తి కరమైన కథ కోసం ప్రతి వారమూ పాఠకులు ఎంతో ఉత్సాహంగా ఎదురు చూసేలా చేసిన నవలే!

బహుమతికి ఎట్టి పరిస్థితిలోనూ ఇది అర్హమైన నవల. రచయిత్రి ఆచూకీ తెలిసి ఉంటే ఈ నవల గురించి మరిన్ని విశేషాలు తెలిసి ఉండేవి.

ఎక్కడైనా పాత పుస్తకాలమ్మే చోట్ల దొరికితే తప్పక చదవండి

*

ప్రేమ పల్లకీ

లోగో: భవాని ఫణి

లోగో: భవాని ఫణి

 

థ లేకుండా కేవలం ఒక కొత్త జంట మధ్య జరిగే సరదా సన్నివేశాలతో ఒక నవల రాయడం చాలా కష్టం. అది శ్రీరమణ ఎంత సక్సెస్ ఫుల్ గా చేశారంటే,ఆయన ఈ నవలని పెద్దగా నచ్చక పోయినా, పాఠకుల్లో యూత్ అబ్బాయిలంతా అప్పట్లో  హీరోయిన్ గీతను అమాంతంగా ప్రేమించేశారట. ఈ నవల గురించి విశేషాల కోసం శ్రీరమణ గారిని కదిలిస్తే చాలా సంగతులు చెప్పారు. 1976 లో ఆంధ్ర జ్యోతిలో సీరియల్ వచ్చిన ఈ నవలను ఆయన ఆట్టే ఆసక్తి గా ఏమీ మొదలు పెట్టలేదాయన. ఫుల్ టైమ్ గా పని చేస్తూ రెండు చేతుల్తో  బిజీగా ఉన్న ఆ పాతికేళ్ళ వయసులో, టీ కప్పులో సూర్యుడు, రంగుల రాట్నం వంటి ఫేమస్ ఫీచర్లతో అతి బిజీగా ఉంటూ పురాణం సుబ్రహ్మణ్యం గారి కోరిక మేరకు  ఏ వారానికి ఆ వారం హడావుడికి  రాసిచ్చేస్తూ ప్రేమ పల్లకీ ని అలంకరించారు. ఆయన రాసిన ఏకైక నవల ఇది! పైగా ఆయనకు పెద్దగా నచ్చని, తృప్తినివ్వని నవల. అయినా పాఠకులు గీతను తమ ఇంటి పిల్లగా చేసుకుని సూపర్ హిట్ చేసి కూచోబెట్టి అందమైన నేత చీరతో సారె పెట్టారు. 

 aamani1
అందంగా, తెలివిగా ఉంటూ, ఆ తెలివిని అవసరమైన చోట వాడుతూ,  మొగుడి గారి ఇగో గాయపడకుండా చాకచక్యంతో కథ నడిపించి ఎప్పటికప్పుడు గట్టున పడేస్తూ ఉండే గీతకి అసంఖ్యాకంగా ప్రేమికులు ఏర్పడిపోయారు ఆ రోజుల్లో! కుర్రాళ్లంతా , చేసుకుంటే అలాటి పిల్లను చేసుకోవాలని తెగ ఉవ్విళ్ళూరారట. బాపు రమణలకు కూడా  గీత తెగ నచ్చేసింది . అందుకే మిస్టర్ పెళ్ళాం, పెళ్ళి పుస్తకం హీరోయిన్లలో గీత  ప్రతిఫలించేలా చూసుకున్నారు. ముఖంగా మిస్టర్ పెళ్ళాం లో! ఆ సినిమా  చూసినపుడు, ఆమని పాత్ర చాకచక్యం, తెలివీ, పని తనం  ఎక్కడో చూశా ఈ పిల్లను అనిపించేది గానీ ఆ పిల్ల “గీత” అని తట్టనే లేదు. మొన్న శ్రీరమణ గారు చెబుతుంటే “అవును, గీతే సుమా ” అనిపించింది. బహుశా గీతను నేను ఆమని రూపంలో కాక మరో రకంగా మనసులో చిత్రించుకుని ఉంటాను  
 
అన్ని పుస్తకాలూ ఒకే రకంగా నచ్చవు. కొన్ని మెదడులో రగిలించే ఆలోచనలతో పరుగులు పెట్టించి నచ్చితే, మరి కొన్ని చల్లని పడవ ప్రయాణంలా సాగుతూ ఆ పయనం వల్ల నచ్చుతాయి. మరి కొన్ని మరో రకంగా! శ్రీరమణ గారి రచనలెప్పుడూ రెండో రకమే! 
sreeramana
 
మిధునం, బంగారు మురుగు, ధనలక్ష్మి,సోడా నాయుడు.. ప్రతి కథా అంతే! నాకు బుచ్చి లక్ష్మి కంటే ధనలక్ష్మి ఎంతో ఇష్టమైన పాత్ర! ఆ కథను ఎన్ని సార్లు చదివానో లెక్కే లేదు. ఇంట్లో మగవాళ్ల అహాన్ని  తృప్తి పరుస్తూనే మరో వైపు కాడికి రెండు వైపులా తనే ఇద్దరై మోస్తూ.. సంసారాలను కల్పవృక్షాలుగా చేసిన ధనలక్ష్ములు మన చుట్టూరానే ఎంతోమంది ఉంటారు. అలాటి వాళ్ళందరినీ ఆ పాత్ర లో ప్రతిష్టించారు రచయిత.  ఆ భర్తలకు కూడా తెలుసు , భార్యలు తమ అహాన్ని తృప్తి పరుస్తున్నారని, వాళ్ల సామర్థ్యంతో తాము తూగలేమనీ!  
 
శ్రీరమణ రచనలతో ఎక్కడో సున్నితంగా కనెక్ట్ అయిపోతూ… ఆ బంధాలతో మనం కూడా బంధం పెంచేసుకుంటాం.  ఏ రచన అయినా , చదివాక , అక్కడ పడేసి లేచెళ్ళి పోలేం! అపురూపంగా  ఆ రచనను మళ్ళీ మళ్ళీ గుర్తుకు తెచ్చుకుంటూ హాయిగా వెనక్కు వాలి కాసేపు స్థిరంగా దాన్ని అనుభూతించాలని అనిపిస్తుంది. అదెలా ఉంటుందంటే దీపావళి రోజు అమెరికాలో కూచుని ఇండియాలో వెలిగే దీపాల్ని, పేలే టపాసులని దిగులుగా ఊహించుకున్నట్టు .
 
నాలుగు  దశాబ్దాలకు ముందు ఆంధ్ర జ్యోతి వార పత్రికలో సీరియల్ గా వచ్చిన ఈ నవల తర్వాత విడి నవల గా పబ్లిష్ అయింది.ఆ నవల సీరియల్ గా వచ్చినన్నాళ్ళూ, సస్పెన్స్, ఉత్కంఠ రేకెత్తించే అంశాలు ఏవీ లేక పోయినా, గీత రాంపండు ల  ప్రేమప్రయాణం ఈ వారం ఆ పల్లకీ లో ఎలా సాగిందో తెల్సుకోవాలన్న ఉత్సుకతతో పాఠకులంతా ఎదురు చూసే వాళ్లట. 
 
శ్రీరమణ గారి రచనల్లో పాత్రలన్నీ సగటు పాఠకుడికి ఎక్కడో ఒక చోట తారస పడేవే. కానీ వాళ్ళని రచయిత మళ్ళీ మనకు పరిచయం చేస్తుంటే, కొత్తగా అర్థమవుతుంటాయి. మనం మిస్ అయిన కోణాన్ని రచయిత పట్టుకుని మనకు సున్నితంగా అందించేసి నిశ్శబ్దంగా తప్పుకుంటారు.పాఠకుడు మాత్రం ఆ అనుభూతిలో చాలా సేపు ఉండి పోతాడు. 
 
ఈ నవల్లో కథ అంటూ ప్రత్యేకంగా ఏమీ ఉండదు నిజానికి. ఒక కొత్త జంట, పెళ్ళయి ఎనిమిది నెల్లలంటే ఎనిమిది నెలలైన ఒక కొత్త జంట సరి కొత్తగా కల్సి మొదలెట్టిన ప్రణయ నౌకా విహారమే ఈ నవల. చిలిపి కజ్జాలూ, అలకపాన్పులూ, సరదాలూ, కూసింత జీవితం, వీళ్ల చుట్టూ నలుగురు మనుషులూ, వాళ్ల మనస్తత్వాలూ, కొన్ని ప్రేమలూ, పచ్చని తాటాకు పందిరిలో పెళ్ళి వాతావరణంలో చోటు చేసుకునే హాస్యాలూ , పెదవులపై అవి పూయించే చిరునవ్వులూ.. ఇంతే!
 
గీత, రాంపండు(aka రామకృష్ణ) కాపురముంటున్న అద్దె కొంప కి రైలు పెట్టెల్లా వరసాగ్గా మూడు గదులు.  అలాగని ఎవరైనా “ఎంతైనా ఈ ఇంట్లో గాలీ వెలుతురూ తక్కువే” అనంటే ఆ ఇంటి ఓనరు ఉగ్రుడై పోయి “అవును, మాది గాలి కొంప కాదు” అంటాట్ట. రాంపండు మొహమాటమనే కవచంతో పుట్టిన మనిషి. గీతేమో గల గల పారే సెలయేరు.రాంపండుకి  ఎవరితో ఎక్కడ ఏం మాట్లాడాలో బొత్తిగా అర్థం కాదు, తెలీదు. అసందర్భంగా ఏదో ఒకటి అనేసి నిలువునా దొరికి పోతుంటాడు. గీత భగవద్గీతలా రాంపండు  వెనకాలే ఉండి, అతని మొహమాటం వల్ల వచ్చే కష్టాల్ని  ఎప్పటికప్పుడు సాల్వ్ చేసేసి, గట్టెక్కించి “ఆన్సర్ చూసుకో”అన్నట్టు మొహం పెడుతుంది.   
 
 చల్లగా సంసారం సాగి పోతున్నా రాంపండుకి మనసులో ఏదో అసంతృప్తి.  ఏదో షాపులో సేల్స్ గాల్ తో క్లోజ్ గా మాట్లాడుతున్న అబ్బాయిని చూసి “వాళ్ళిద్దరూ లవర్సు! అందుకే అంత క్లోజ్ గా మాట్లాడుకుంటున్నారు. “అని తనే తీర్మానించుకుంటాడు. తనకు “లవర్ లైఫ్” లేకుండానే పెళ్ళై పోయిందని మనసులో ఉన్నా గీత ముందు బయట పడడు. ఆవలింత రాబోతుండగానే పేగులు లెక్కెట్టే గీతకు రాంపండు మనసులో ఏముందో కనుక్కోడం పెద్ద కష్టం కాదు. 
 
రాంపండు కి ఇలా తీరకుండానే మిగిలిపోయిన అతి చిన్న కోరికల్లో పెళ్ళిలో “పల్లకీ” ఎక్కి వూరేగాలని! పాపం అతని పెళ్ళిలో మునసబు గారి ఇంజను లేని కార్లో నెట్టుకుంటూ శక్తి కొద్దీ, స్థోమత కొద్దీ గీతా వాళ్ళు ఊరేగింపు ముచ్చట కూడా తీర్చారు కానీ, ఇంజను లేని  కార్లో ఊరేగింపు అని తల్చుకున్నపుడల్లా రాంపండు ఒళ్ళు జల్దరిస్తూ ఉంటుంది.  
prema-pallaki-cover-page 
రాంపండు ఆఫీసులో పని చేసే చలాకీ భానుమతి, ఆవిడ మొగుడూ వీకెండ్స్ ఇంట్లో బోరు కొట్టించుకోకుండా స్టార్ హోటల్ లో రూము తీసుకుని జాలీగా గడిపేస్తారని తెలుసుకున్న రాంపండు కి స్టార్ హోటల్లో గది ఎలా ఉంటుందో చూడాలని తపన పట్టుకుంటుంది. హోటల్ కి వెళ్ళాక రిసెప్షన్ లో స్కర్ట్ వేసుకున్నమాయి తో ఏం మాట్లాడాలో తెలీక ముందే, ఆ పిల్ల రిజిస్టర్ తీసి “ప్లీజ్” అనగానే , నేను రూము చూడ్డానికొచ్చానని చెప్పడానికి మొహమాటం అడ్డం పడి “సింగిల్ రూం” అంటాడు. రూము బుక్కై పోతుంది. జేబులో డబ్బుల్లేవు. “తర్వాత పంపిస్తాను” అని రూములోకి వెళ్తే, మతి  పోతుంది భయమేస్తుంది. స్కర్టమ్మాయి చూడకుండా బయట పడతాడు గానీ గీతకి చెప్పాలంటే దడ. పాల పాకెట్ కోసం చిల్లర కోసం జేబువెదికిన గీతకు రసీదు దొరికితే.. గీత, అనుమాన పడదు. రాంపండు వ్యవహారం తెలిసిందే కాబట్టి తనే వెళ్ళి రూము డబ్బు కట్టేసి కీ ఇచ్చేసి వచ్చి “ఆన్సర్ చూసుకో” అని మొహం పెడుతుంది.
 
పైకి డాబుగా కనిపిస్తూ, విలాసాల్లో మునిగి తేలే మొగుడూ పెళ్ళాలు మూర్తీ హేమా చీటికీ మాటికీ రాంపండూ గీతల దగ్గర దర్జాగా అప్పులు దబాయించి పట్టుకెళ్తారు. వీళ్ళిద్దరికీ వాళ్ళిద్దరూ చెరో కథా చెప్పేసి బాంక్ లోన్ మీద సంతకాలు పెట్టేస్తారు.వీళ్ళు షాపింగ్ చేసిన వస్తువుల్ని “మేము నిన్ననే సెలెక్ట్ చేసి పెట్టుకున్నాం” అని జబర్దస్తు గా లాక్కు పోతుంది హేమ. సినిమాకెళ్తున్నామంటూ వీళ్ళని కూడా లాక్కు పోయి ఖర్చంతా పెట్టిస్తారు. రాంపండు మొహమాటాన్ని గీత తిట్టదు, విసుక్కోదు. నవ్వుతూనే అతని వెనకాలే ఉంటూ భరిస్తుంది. వీలైనంత వరకూ ప్రతి సమస్యనూ చాక చక్యంగా తేల్చేస్తుంది. 
 
రాంబాబు మనసులో ఉన్న “ప్రేమికుల” కోరికను గీత ఆ మాత్రం  గ్రహించలేదా ? అందుకే ఒక రోజు లంచ్ బాక్స్ తెరిర్చే సరికి “రేప్పొద్దున నుంచీ ప్రేమికులుగా మారి పోదాం, పెళ్ళయిన సంగతి మర్చిపోండి” అని చీటీ కనిపిస్తుంది. ఈ ఎదురు చూడని సర్ప్రైజ్ బాగానే ఉంటుంది కానీ అనుభవంలోకొచ్చాక రాంపండుకి ఒళ్ళు మండేలా చేస్తుంది. గీత “ఏవండీ”లు మనేసి “ఏమోయ్” లోకి దిగుతుంది. ఇంట్లో ఒక ఫుల్ టైమర్ పని పిల్లను పెడుతుంది. “ప్రేమికులన్నాక పొద్దూకులు ఇంట్లో పన్లు చేసుకుంటూ ఉండరు! ఒక ఫుల్ టైమర్ ఉండాలి” అంటుంది. ఆర్భాటంగా ఇంట్లోనే బర్త్ డే చేస్తుంది రాంపండు కి. అదేమంటే “ప్రేమించిన పిల్ల తలంటు పోయడం ఎక్కడైనా ఉందా అసలు ? మనం లవర్స్  కదా “
 
 బట్టలు తనే సెలెక్ట్ చేసి ఖరీదైన టైలర్ దగ్గర బెల్ బాటంస్ కొలతలు ఇస్తుంది. “నువ్వు చాలా హడావుడి చేస్తున్నావ్ గీతా” అని విసుక్కోగానే ” ఇప్పుడు మనం యంగ్ లవర్స్ మి కదా, గుండె కి గుండె అడగ్గానే ఇచ్చి పుచ్చేసుకున్న వాళ్ళం, ఇలాటి చిన్న విషయాల్లో వెంకాడ్డం బాగోదు” అంటుంది. 
 
గీత చెల్లెలు సీత పెళ్ళి  నవలను సరదాగా నడిపే మరొక ఎపిసోడ్. పెళ్ళికి ఇచ్చే బహుమతి మన అభిరుచిని ప్రతిబింబించేలా ఉండాలని రాంపండు అంటే గీత “స్టీలు కంచం కూడా బాగానే “ప్రతిబింబిస్తుంది” పోనీ అది కొందాం” అంటుంది.`
 
గీతా వాళ్ళ వూర్లో రాంపండుని అందరూ “అతనే గీత మొగుడు” గా చెప్పుకోడం రుచించదు. తనకి కొత్త గాజులు తెమ్మని అతన్ని బజారుకి పంపిన గీత అతను వీధిలో పదడుగులు నడిచాక వీధి అరుగు మీద నిలబడి ” కెంపు రంగు గాజులు తీస్కోండి. నిండు నీలం అయినా పర్లేదు, గానీ మెరుపులు వద్దు.” అని అరిచరిచి చెప్పడం రాపండుకి ఉడుకుమోత్తనం తెప్పిస్తుంది. ఆడంగి పన్లు చెప్పడమే కాక అవి నలుగురికీ తెలిసేలా కేకలు.  సిటీ బస్సెక్కితే, తను ఆడవాళ్ళ సీట్ల వైపు వెళ్ళి కూచుని, వెనక సీట్ల వైపు వెళ్ళిన కండక్టర్ కి “గళ్ల చొక్కాకి ఇక్కడ తీసుకున్నాం” అనగానే బస్ లో అన్ని తలకాయలూ రాంపండు గళ్ళ చొక్కా వైపు తిరుగుతాయి.  
 
ఇలాటి చిన్న సైజు అవమానాలు రాంపండుకి చాలానే జరుగుతాయి. . “ఈ గాజులు మా వారు తెచ్చారు” అని గీత అందరికీ చూపిస్తుంటే వినడానికి బాగానే ఉంటుంది కానీ తన్ని “గాజులు తెచ్చే మగాడి కింద కడతారేమో” అని భయమేస్తుంది. కొత్తగా కొన్న రీలు కెమెరాతో రాంబాబు బల్లలు, కుర్చీలు ఎక్కి పెళ్ళి ఫొటోలు తీస్తుంటే అందరూ వింతగా చూస్తుంటే రాంపండు గొప్ప ఫొటోగ్రాఫర్ గా ఫీలవుతాడు. స్టూడియో ఫొటోగ్రాఫర్ రాగానే గీత అందరి ముందూ “అమ్మయ్య,వచ్చారా?రక్షించారు” అనడం పాపం మింగుడు పడదు గానీ మింగక తప్పదు 
 5th-photo-220x300
 “బాత్ రూంలో కొత్తయ్య గారు స్నానం చేస్తున్నారు, మిమ్మల్ని బావి గట్టు దగ్గర చెయ్యమన్నారు” అని పని మనిషి చెప్పగానే గొప్ప రెస్పెక్ట్ పోయినట్టు ఫీలింగ్. సబ్బు కాస్తా జారి బావి లో పడిపోగానే పని పిల్ల ” అయ్యగారు సబ్బు బావిలో పడేశారు” అని పెద్దగా అరవగానే అందరూ బావి చుట్టూ చేరడం, వాళ్ల మధ్య  టవల్ కట్టుకుని  దోషి లా రాంపండు! “సబ్బు పోతే సరే, ఇప్పుడు వంటకి నీళ్ళు పక్కింటి బావి నుంచి తేవాల్సిందే” అని నిర్మొహమాటంగా విసుక్కుంటుంది పని పిల్ల! 
  
ఈ అవమానం నుంచి బయట పడదామని చూస్తుండగానే , దెబ్బ మీద మరో దెబ్బ! మధ్యాహం వేళ ఒక పదేళ్ల పిల్ల వచ్చి “గీతత్తయ్య నిన్ను రమ్మంది” అని చెప్పగానే గీత ఎక్కడుందో తెలుస్కుని మర్యాదగా వెళ్లాలా? ఆ పిల్లని ముద్దు చేస్తూ “ఎవర్నీ? నన్నా? నన్నే రమ్మందా మీ గీతత్తయ్య” అని సాగదీస్తుంటే “సబ్బు మావయ్యంటే నువ్వేగా?” అందా పిల్ల! ఒళ్ళు జల్దరిస్తుంది రాంపండుకి
 
“సబ్బు మావయ్యని రమ్మను” అని చెప్పి పంపిందా గీత! అందరూ తనకి ఆ పేరు పెట్టారా? మళ్ళీ అవమానం
 
మరదలి శోభనం ఏర్పాట్లు జరుగుతోంటే రాంపండుకి తన శోభనం గుర్తొస్తుంది. పాపం అదేమీ రస కావ్యం కాదు. ఫస్ట్ క్లాసు కూపే లో గీతతో కల్సి మద్రాస్ వెళ్దామని ప్లాన్ చేసి రైలెక్కాక, చివరి నిమిషంలో వచ్చిన గీతావాళ్ళ చుట్టాలాయన ఆరేళ్ళ పిల్లకాయని అప్పగించి “ఈ భడవని గూడూరులో వాళ్ళ నానొచ్చి దింపుకుంటాడు, తీసుకుపోండి, ప్రాణాలు తోడేస్తున్నాడు” అని అరటిక్కెట్టు కొని అప్పగించాడాయె, వాడు తెల్లవార్లూ పెట్టిన చిత్ర హింసలకి రాంపండు కలలన్నీ ఆవిరై పోయాయి. 
 
 సీత, సీత మొగుడూ వీళ్ళింటికి వచ్చినపుడు “మీ బావగారికి కజ్జికాయలు, కొబ్బరుండలు, పూతరేకులూ ఇష్టం” అని గీత చెప్పడం నచ్చదు. వెధవ పల్లెటూరి పిండివంటలన్నీ తనకు నచ్చుతాయని దేశమంతా చాటింపేయాలా?
 
“సీత మొగుడితో కాస్త మాట్లాడండి పాపం, ఆ అబ్బాయికి కొత్త కదా, మీరే కలుపుగోలుగా ఉండాలి” అని గీత చెప్పాక రాంపండు తోడల్లుడితో మాట్లాడే మాటలు
 
“మీరు గెజిటెడ్ రాంక్ లో ఉన్నారు కదండీ,మీ ట్రూ కాపీల మీద మీరే అటెస్టేషన్ సంతకాలు పెట్టుకోవచ్చు ఎంచక్కా”
 
ఆఫీసులో అతి సామాన్యుడు గా, అర్భకుడుగా కనిపించే శాస్త్రి పక్కింటి మేష్టారి అమ్మాయిని ప్రేమవివాహం చేసుకున్నాడని తెలిసి ఆశ్చర్య పోతాడు రాంపండు.  హేమ మూర్తీ తాను అనుకున్నంత సంతోషంగా లేరనీ, నిత్యం చలాకీ గా కనిపించే స్టెనో భానుమతి జీవితంలో కనిపించని సుడి గుండాలున్నాయనీ గ్రహిస్తాడు. గీతతో చెప్తే “ఇవన్నీ నాకెప్పుడో” తెల్సంటుంది.
 
“మా శాస్త్రి ఆదర్శ వివాహం చేసుకున్నాడు గీతా”
 
“అంటే పల్లకీ పెళ్ళా?”
  
“పల్లకీ లో ఏం లేదు గీతా”
 
“ఎన్నాళ్ళకి సత్యం బోధ పడింది స్వామీ “
 
నిజానికి గీత మొదటి నుంచీ రాంపండుకి అనుక్షణం అనుభవంలోకి తేవాలని ప్రయత్నిస్తున్నది ఇదే
 
ఇలా చిన్న చిన్న సరదా సంఘటనలూ, వాటిలో దాగున్న అతి సూక్ష్మమైన సూత్రాలతో హాయిగా సాగి పోతుంది గీత రాంపండుల ప్రేమ పల్లకీ ! చివర్లో రచయిత అంటారు “ఈ కథ పూర్తి కాదు. ఏ కథయినా అంతే!పెళ్ళయ్యాక ప్రేమ కథలు పల్లకీ దిగితే కానీ బయట పడవు. గీత రాంపండులు ఎవర్ గ్రీన్ దంపతులు. ఆ మాటకొస్తే మీరు మాత్రం కారేమిటి?కొన్నాళ్లు ఆగితే వాళ్ళిద్దరూ ఏ కథలు చెప్తారో, మనం కాస్త ఆగాల్సిందే”  
 
అయితే ఆ తర్వాత గీత రాంపండులో లేక శ్రీరమణ గారో  బిజీ అయిపోయినట్టున్నారు. ఏ కథలూ చెప్పలేదు. ఆ పాత్రలతో శ్రీరమణ గారు మరో కథ రాయడం గానీ, దీనికి సీక్వెల్ రాయడం గానీ చేయలేదు.
 
ఒక మిడిల్ క్లాస్ జంట వాళ్ళిద్దరూ! కాలంతో పాటూ మిడిల్ క్లాస్ కి నిర్వచనం మారి పోయింది అనివార్యంగా! రాంపండు వాళ్ళుండే అద్దె కొంపను వర్ణిస్తూ రచయిత ఇలా రాస్తారు.”ఇంట్లో ఉన్న కొద్ది పాటి విలాస వస్తువులనీ మధ్య గదిలో పెట్టుకుని ఆనందిస్తున్నారు. ఒక టేబుల్ ఫాను, పోర్టబుల్ రేడియో,అలారం టైం పీసు,చిన్న సైజు ఇనప బీరువా,దాని మీద రెండు సూట్ కేసులూ, ఒక ఆఫీసు టేబులు, ఇవి కాక డబుల్ కాట్ బెడ్….” ఆ మధ్య గదిలో వొదిగిన విలాస వస్తువుల జాబితా ఇది. అవసరం కొద్దీ కొనడం, అవసరమైనవి మాత్రమే కొనడం అనేవి ఇవాళ్టి జీవితాల్లోంచి మాయమై చాలా కాలమైంది. అందుకే నలభయ్యేళ్ళ క్రితం నాటి ఆ విలాస వస్తువుల్ని చూసి, ఒక్క క్షణం కాంటెంపరరీ పాఠకుడు అబ్బుర పడతాడు.
 
మధ్యతరగతి జీవన సౌందర్యం అనుభవంలోకి వస్తే గానీ తెలియని ఒక గొప్పసత్యం .  ఎంతో శాంతి, పరిపూర్ణత్వం, సమతుల్యం, నిబ్బరం ఇవన్నీ మధ్య తరగతి జీవితం సంపాదించుకున్న ప్రత్యేకతలు, మనిషికి నేర్పే లైఫ్ స్కిల్స్ కూడా  ! 
 
నటి భానుమతి రచయిత్రి జలంధర గారికి చెప్పారట ” మీ ఆయన ఎంత సంపాదించినా సరే, జీవితంలో అప్పర్ మిడిల్ క్లాసు జీవన శైలిని కోల్పోవద్దు” అని!(సారంగలోనే మైథిలి అబ్బరాజు గారు జలంధర గారిని చేసిన ఇంటర్వ్యూలో) ఆ వాక్యాలు ఎంత ఆకట్టుకుంటాయంటే ప్రతి ఒక్కరూ వాటిని ఒక జీవన వేదంగా స్వీకరించాలనిపిస్తుంది . బాపు, రమణలు, శ్రీరమణ గారు కూడా మధ్యతరగతి జీవితాన్ని తాము అనుభవించడమే కాక, దాన్లోని సౌందర్యాన్ని పాఠకులందరిలోనూ నింపి, అవగతం చేసి పాఠకుడి నట్టింట్లో దానికి మాంచి నరసరావు పేట పడక్కుర్చీ వేసి కూచోబెట్టారు. 
 
ఈ నవల్లోని ప్రతి సంఘటనా మిడిల్ క్లాస్ ఇళ్ళలో అందరికీ ఎక్కడో ఒక చోట ఎదురయ్యే ఉంటుంది. భానుమతీ, శాస్త్రీ,మూర్తీ, హేమా,అందరూ మన ఎరికలో వాళ్ళే అనిపిస్తుంది.   అందుకే 1976 నుంచీ ఇవాళ్టి ఉదయం వరకూ కూడా గీత రాంపండు ఎవర్ గ్రీన్ జంటగానే ఉండి పోయారు. ఉండి పోతారు కూడా! నలభయ్యేళ్ళ క్రితం కొత్తగా పెళ్ళాడి విజయవాడ లాంటి సిటీలో కాపరం పెట్టిన ఆ జంటకి ఈ నాటికీ, ఏ నాటికీ వయసు పాతిక, ముప్ఫయి లోపే! 
 
నవలను నవోదయ విజయవాడ వాళ్ళు వేశారు, కవర్ పేజీ బాపూ! ఈ కవర్ పేజీని అడగ్గానే సంతోషంగా పంపిన శ్రీరమణ గారికి చాలా ధన్యవాదాలు చెప్పుకుంటున్నాను. ఎందుకంటే నా దగ్గర ఎప్పటి నుంచో ఉన్న ఈ నవలకు అప్పటి నుంచీ కవర్ పేజీ లేకుండానే అనేక సార్లు చదివాను, కవర్ పేజీ ఏమై ఉంటుందా అని ఊహించుకుంటూ.
 నవల బయట షాపుల్లో దొరక్క పోవచ్చు కానీ ఆన్ లైన్లో ఒక చోట ఉందని సమాచారం ఉంది . ప్రయత్నించవచ్చు
 *

 రెండు నాల్కల బతుకు మీద బ్రహ్మాస్త్రం!

 

లోగో: భవాని ఫణి

లోగో: భవాని ఫణి

 

దహన సంస్కారాలు జరగవలసిన ఒక శవం ఎదురుగా ఉన్నపుడు, సాటి మనిషి ఆలోచనల్లో ఏముంటుంది? అది ఒక బ్రాహ్మణ అగ్రహారంలో జరిగితే అగ్రహారీకుల స్పందన ఏమిటి? ఆ మరణించిన వ్యక్తి ఒక బ్రాహ్మణుడై ఉండి, బ్రాహ్మణ్యాన్ని తుంగలో తొక్కిన వాడైతే? ఒక వేశ్యను తెచ్చి ఇంట్లో ఉంచుకుని, ముసల్మానుల్ని హిందూ ఆలయంలోకి తీసుకుపోయి కోనేరు లోని”దేవుడి చేపల్ని” పట్టి ఇంట్లో వండి, వాళ్లతో కలిసి తిన్నవాడైతే? నిత్యం మద్యం తాగకుండా రోజు గడపని వాడైతే?  జంధ్యం తీసి పారేసి ఇంట్లోని సాలగ్రామాన్ని ఎత్తి తుంగభద్రలో పడేయడానికి సిద్ధపడ్డ వాడైతే ? ఆ శవానికి సదాచార సంపన్నులుగా పేరుపడ్డ ఇతర బ్రాహ్మలు దహన సంస్కారం చెయ్యాలా వొద్దా? మరణించిన వ్యక్తి బ్రాహ్మణ్యాన్ని వదిలేసినా, బ్రాహ్మణ్యం అతడిని వదిలేస్తుందా?వదిలేయదా?

అతడు బతికుండగా అగ్రహారం మొత్తం అతడిని వెలి వేసినట్టే చూశారు. మరి అతడి సంస్కారం జరిగేదెలా? భార్యా పిల్లలు లేని ఆ వ్యక్తి శవానికి దహన సంస్కారం ఎవరు చేయాలి?  ఎలా తెగుతుంది ఈ సమస్య?

కన్నడ సాహిత్యంలో  గొప్ప విద్యా వేత్త, అత్యంత శక్తి వంతమైన భావజాలంతో రచనలు చేసిన వ్యక్తిగా, జ్ఞానపీఠం అవార్డీ గా అనంత మూర్తి సుప్రసిద్ధుడు. అంతకు మించి హిందుత్వం మీద ఆయన చేసిన విమర్శలు, లోక ప్రసిద్ధం!

ఆయన రచనల్లో అన్నిటికంటే పేరు తెచ్చుకుంది, వివాదమైంది, సినిమాగా నిషేధించబడిందీ, బ్రాహ్మల ఆగ్రహానికి గురైందీ, అన్నిటికీ మించి లక్షల మెదళ్ళలో కోట్ల ఆలోచనలని రేకెత్తించింది “సంస్కార” నవల!

 

పడమటి కనుమల మధ్య, తుంగభద్ర ఒడ్డున ఉన్న ఒక మధ్వ బ్రాహ్మణ అగ్రహారంలో నడిచే ఈ కథ ఒక బ్రాహ్మడి శవం చుట్టూ, దానికి జరగబోయే దహన సంస్కారం చుట్టూ తిరుగుతుంది. దహనమయ్యే లోపు, దహనమయ్యాకా  కథ అనేక మలుపులు తిరుగుతుంది. పరిస్థితుల ప్రభావంతో ఒక్కొక్కరి మనసులో ఎలాటి ఆలోచనలు రేగుతాయో, సందర్భాన్ని బట్టి మనుషులు ఎంత స్వార్థంతో ప్రవర్తిస్తూ, తమ ప్రవర్తన సహజమేననీ ఎదుటి వ్యక్తులే బొత్తిగా న్యాయం తప్పి ప్రవర్తిస్తున్నారనీ ఎలా నిస్సిగ్గుగా ఆరోపణలు చేస్తుంటారో..వీటన్నిటినీ అనంత మూర్తి  పాత్ర చిత్రణల ద్వారా మానవ సహజ ప్రవర్తనలని బట్టలు విప్పి నగ్నంగా నిల్చోబెట్టేస్తాడు ఈ నవల్లో

నారాయణప్ప చావుతో మొదలవుతుంది ఈ నవల. ఈ కథలో నారాయణప్ప శవంగానే మనకు పరిచయం అయినా కథ మొత్తం అతని చుట్టూనే నడుస్తుంది. దుర్వాసపురం అగ్రహారంలో పరమ నిష్టగా బతికే బ్రాహ్మణుల మధ్య అన్నిటినీ అతిక్రమించి ఇష్టం వచ్చినట్టు బతికేసే నారాయణప్ప  మరణ వార్తను అతను తెచ్చి ఇంట్లో పెట్టుకున్న వేశ్య చంద్రి,ఒక ఉదయాన్నే పరుగున వచ్చి అగ్రహారానికి  పెద్ద దిక్కు అయిన పరమ పూజ్యుడు ప్రాణేశాచార్యుడికి చెపుతుంది. శివ మొగ్గ నుంచి చంక కింద పెద్ద గడ్డతో వచ్చాడని, తీవ్ర జ్వరంతో బాధ పడి చనిపోయాడని వార్త!

అగ్రహారీకులంతా తరతరాలు గా వస్తున్న ఆచారాలను పాటించడమే తప్ప, వాటి పర్యవసనాలు, ఫలితాలు, వాటి మీద ప్రశ్నలూ, మీమాంసలూ ఎరిగిన వారు కాదు!  ఒకరి శాఖ మీద మరొకరు బురద జల్లుకోడానికి మాత్రం తోసుకుని వచ్చి ముందు లైన్లో నిల్చుంటారు.  బ్రాహ్మణ్యాన్ని వదిలేసిన నారాయణప్పను బ్రాహ్మణ్యం వదిలేస్తుందా? ఇప్పుడా శవానికి అంతిమ సంస్కారం ఎవరు చేస్తారు? కుల భ్రష్టుడు కాబట్టి ఎవరూ ముందుకు రారు. నిజానికి నారాయణప్ప తోడల్లుడు లక్ష్మణా చార్యులు, జ్ఞాతి గరుడా చార్యులు ఇద్దరూ అగ్రహారీకులే! అయినా వాళ్ళూ ముందుకు రారు. బతికున్నపుడు నారాయణప్ప చేసిన పనులన్నీ ఒక్కొక్కరు గుర్తు చేసుకుని మరీ ఏకరువు పెట్టి, తాము ఈ పనికి తెగబడేది లేదని కుండబద్దలు కొట్టేస్తారు.

ఇంతలో చంద్రి తనకు తెలీకుండానే అగ్రహారీకుల సహజ మానవ నైజానికి, స్వార్థానికి  ఒక సవాలు విసురుతుంది! తన ఒంటి మీద ఉన్న నగలన్నీ తీసి కుప్పగా ప్రాణేశాచార్యుల ముందు పెట్టి దహన సంస్కారాలకు వాడమని, ప్రాధేయపడుతుంది.

చంద్ర మనఃపూర్వకంగానే ఆ పని చేసినా అగ్రహారీకులు ఈ దెబ్బకు గింగిరాలు తిరిగి పడతారు. రెండువేల రూపాయలు (ఇప్పట్లో అయితే లక్షల మాటే)  విలువ చేసే బంగారం! ఎవరు అంతిమ సంస్కారం చేస్తే వారికి దక్కుతుంది. చాలీ చాలని సంపాదనతో, సంభావనల్తో  అర కొరగా బతుకులీడుస్తున్న బ్రాహ్మలందరికీ సహజంగానే దాని మీద ఆశ పుడుతుంది. సహజ మానవ స్వభావంతో  బంగారం నాకు దక్కాలంటే నాకు దక్కాలనే స్వార్థం జడలు విప్పుతుంది.

samskara

నెమ్మదిగా మెత్తబడి మాట్లాడతారు. ఎదుటి వాడు ఒప్పేసుకుంటాడేమో అని ఇద్దరి గుండెలూ దడ దడ లాడతాయి. “ఎంత కాదనుకున్నా నా తోడల్లుడు కదా! నిజానికి ఆ బంగారమంతా నా మరదలు కి దక్కాల్సింది. ” అని లక్ష్మణా చార్యులు, “వాడు మనల్ని కాదనుకున్నా, మనం వాడిని కాదనుకోగలమా? ” అని గరుడా చార్యులూ సంస్కారం చేసే అవకాశం తమకు దక్కాలంటే తమకు దక్కాలని దేవుడిని ప్రార్థిస్తుంటారు.  ఇద్దరూ ఒకరి ముందు ఒకరు బయట పడక పోయినా ప్రైవేట్ గా వెళ్ళి ప్రాణేశాచార్యులను అంతిమ సంస్కారం చేయడానికి తాము సిద్ధమంటారు. అంతకు ముందు ఆ బాధ్యత నుంచి తప్పించుకోవాలనుకున్న వారినే ఇపుడు ఆ పని కోసం తన్నుకునేలా బంగారం ప్రేరేపిస్తుంది.

ఈ లోపు అగ్రహారం మరొక ఆలోచన చేస్తుంది. పొరుగున ఉన్న పారిజాత పుర అగ్రహారీకులెవరైనా ఈ పనికి ఒప్పుకుంటారేమో కనుక్కోవాలని. ఎందుకంటే వారు స్మార్తులు కాబట్టి, పైగా అక్కడ నారాయణప్ప కు చాలా మంది మిత్రులున్నారు కూడా ! స్మార్తులు  తమ కంటే తక్కువ కాబట్టీ వాళ్లకి పట్టింపు లేదనీ! వెళ్ళి అడిగాక.. వాళ్ళు అందుకు ఒప్పుకోరు. భ్రష్టుడైన వ్యక్తి శవానికి సంస్కారం చేయడానికి ఒప్పుకుంటే మధ్వుల ముందు తాము తలొగ్గినట్టే అని వాళ్ళ ఆలోచన !

అగ్రహారంలో ఎంత మూర్ఖత్వమూ, అజ్ఞానమూ  రాజ్యమేలుతూ ఉంటుందంటే, శవం ఒక పక్క కుళ్ళిపోతూ ఉంటుంది. ఇళ్ళలో వంటా, తిండీ ఉండవు. మరొక పక్క ఎలుకలు కుప్పలు కుప్పలుగా చచ్చి పడుతుంటాయి. అయినా దాన్ని భయంకరమైన అంటువ్యాధి ప్లేగు గా గుర్తించరు. ఆ ఎలుకల కోసం కాకులూ గద్దలూ ఇళ్ళ మీద వాలుతుంటే అరిష్టం చుట్టుకుందని శంఖాలు పూరించి వాటిని వెళ్ళగొట్టే ప్రయత్నం చేస్తూ హడలి పోతారు తప్ప గ్రామం లోకి ప్లేగు వ్యాపించిందని తెలుసుకోరు.

ప్రాణేశుడు నగల మూట చంద్రికి తిరిగిచ్చేసి  తన దగ్గరే ఉంచుకోమని చెప్తాడు

ఆ తర్వాత ఏం చేయాలో తోచని స్థితిలో అతడు ధ్యానంలో కూచుని ఆంజనేయుడి నుంచి సందేశమేమైనా లభిస్తుందేమో అని చూస్తాడు గానీ ప్రయోజనం ఉండదు. ప్రాణేశాచార్యుడు నిండా నలభయ్యేళ్ళైనా నిండని యువకుడు . బెనారస్ లో చదువుకుని వేద విద్యనార్జించిన జ్ఞాన వృద్ధుడు, అన్నీ తెల్సిన వాడు. ఏరి కోరి సంసార జీవితానికి పనికి రాని రోగిష్టి స్త్రీని వివాహమాడి ఆమెకు సేవ చేస్తూ ఇహ లోక సుఖాలకు అతీతంగా జీవిస్తున్న పరమ పురుషుడూ, పూజ్యుడూ ఆ అగ్రహారంలో! ఎవరూ  ఆయన మాటకు ఎదురు చెప్పరు కదా, ఆయన మాటనే శిరోధార్యంగా పాటిస్తారు.

అగ్రహారీకులు భార్యా పిల్లలని పుట్టిళ్ళకు పంపి, ధర్మ స్థలంలోని మధ్వ మఠంలో గురువు గారు ఈ విషయంలో ఏమి చెప్తే అలా చేయాలని గుంపుగా బయలు దేరతారు.

pranesha-and-chandri

****

అనుకోని విధంగా కథ ఇక్కడే మలుపు తిరుగుతుంది. అడవిలోని ఆంజనేయుడి గుడిలో ధ్యానంలో కూచున్న ప్రాణేశుడు సందేశం దొరకక నిరాశతో లేచి చీకటి పడ్డాక ఇంటికి బయలు దేరతాడు. ఆకలికి తాళలేని చంద్రి తుంగభద్ర ఇసక తిప్పల్లోని అరటి తోటలో పండ్లు కోసుకోడానికి వెళ్తుంది. చీకట్లో తిరిగి వస్తున్న ప్రాణేశుడిని గుర్తించి ఆయన కాళ్ళ మీద పడుతుంది. వివాహమైనా స్త్రీ స్పర్శ గానీ, సౌఖ్యం గానీ ఎరగని ఆజన్మ బ్రహ్మ చారి ప్రాణేశుడు చంద్రి స్పర్శతో అనుకోని ఉద్రేకానికి, ఉద్వేగానికి లోనై లోనవుతాడు. ఆ వేసవి చీకటి రాత్రి, అడవిలో ఆరుబయట  చంద్రి పరిష్వంగంలో మరే ఆలోచనకూ తావులేని క్షణాల్లో కరిగి ఆమె అందించిన సౌఖ్యానికి దాసోహమంటాడు.

అది ఎలా సాధ్యపడుతోందన్న ఆలోచన ఇసుమంతైనా కలగని అమోఘమైన, అద్భుతమైన క్షణాలవి అతనికి!  జాడ లేకుండావిచక్షణ అదృశ్యమైన క్షణాలవి!

చంద్రిది ఆవేశం కాదు. పదేళ్ళు నారాయణప్పతో కల్సి జీవించినా ఆమెకు సంతానం కలగలేదు. తన తల్లి చెప్పిన సలహా ఏమిటంటే , సంతానం పొందాలనే ఆలోచన కలిగితే సతుపురుషుల వల్లే పొందాలి తప్ప ఎవరి వల్ల బడితే వాళ్ళ వల్ల కాదని!

ఆ ఉద్రేక క్షణాలు కరిగి కదిలి పోయాక ఈ లోకంలోకి వచ్చిన ప్రాణేశుడు చింతనలో పడతాడు. తానెరగని ప్రపంచం ఒకటుందనే ఎరుక ఆవహిస్తుంది.  చంద్రితో అంటాడు “పద, ఇద్దరం కలిసే వెళ్దాం వూళ్ళోకి, జరిగిందంతా చెప్పేద్దాం” అని!  చంద్రి స్థిర చిత్తంతో అతని వెనుకగా వూర్లోకి బయలు దేరుతుంది గానీ అనుసరించదు.  ఆ అర్థరాత్రి నారాయణప్పతో తనకు గల బంధం పట్ల నిబద్ధతతో తన బాధ్యతను నిర్వర్తించడానికి వెళ్తుంది చంద్రి.  ఒక సాయిబుల బండి వాడిని బతిమిలాడి, డబ్బులిచ్చి మూడో కంటికి తెలీకుండా ఇంట్లో ఉన్న కట్టెలతో సహా శవాన్ని స్మశానానికి తీసుకు పోయి దహనం చేయించి, ఆవేదనతో ఆ వూరు విడిచి కుందాపురం వెళ్ళిపోతుంది.  దాంతో చంద్రి ప్రసక్తి నవలలో ముగిసి పోతుంది. మరో పక్క మఠానికి  బయలు దేరిన అగ్రహారీకుల్లో కూడా ప్లేగు తో  కొందరు మరణిస్తారు దార్లో ప్రాణేశుడు ఇంటికి చేరిన కాసేపటికి అతడి రోగిష్టి భార్య తీవ్ర జ్వరంతో, ప్లేగు గడ్డతో కన్ను మూస్తుంది. ఏ వికారాలూ తనకు అంటవనుకున్న ఆ పండితుడు భార్యతో మొదటి నుంచీ ఎలాటి శారీరక బంధం లేక పోయినా, మానసిక బంధంతో దుఃఖిస్తూ అంతిమ సంస్కారం పూర్తి చేస్తాడు. వూర్లో ఎవరూ లేరు. అందరూ మధ్వ మఠానికి వెళ్లారు. ఏం చేయాలి ఆ వూరులో! ఇప్పుడు తాను నారాయణప్ప శవాన్ని దహనం చేయడానికి అర్హుడేనా? మఠానికి వెళ్ళిన వాళ్ళు తిరిగొస్తే? ఏం చేయాలో తోచని ఒక అగమ్య గోచరమైన స్థితిలో  ఆ వూరు నుంచి దిక్కు తెలీని గమ్యాన్ని అన్వేషిస్తూ బయలు దేరతాడు.

snehalatha

ఎక్కడికో  తెలీదు! నడుస్తూ వెళ్తుంటే దార్లో అతడికి పుట్టన్న అనే బోయవాడు కలుస్తాడు ప్రయాణంలో! అతడి తండ్రి బ్రాహ్మడే అయినా తల్లి బోయజాతి స్త్రీ!  కల్లా కపటం తెలీని పుట్టన్న  విరామం లేకుండా ప్రాణేశుడితో కబుర్లు చెప్తూ అతనికి కొత్త లోకాలు చూపిస్తాడు.

ఆ ప్రయాణంలో ప్రాణేశుడు కొత్తగా తిరిగి జన్మిస్తాడు పుట్టన్న తెచ్చిన కొబ్బరి బెల్లం తీసుకుంటాడు తినడానికి. మడీ, ఆచారాలతో నిత్యం జ్వలిస్తూ ఉండే ఆచార్యుడు సంతలో కాఫీ తాగుతాడు. భార్య పోయిన మైలలో ఉండీ, దేవాలయ ప్రవేశం చేసి సంతర్పణ భోజనానికి కూచుంటాడు.  పద్మావతి అనే దేవదాసి పుట్టన్న దగ్గరకు తీసుకెళ్తే, చంద్రి ఇచ్చిన అనుభవం తాలూకు స్మృతులతో పద్మావతిని  చూసి మోహంలో పడతాడు మళ్ళీ! దేవాలయ సంతర్పణ తర్వాత ఆమె దగ్గరకు తిరిగి వెళ్ళాలనే కాంక్షిస్తాడు.

మరో పక్క అతనిలో ఆలోచనలు అంతూ పొంతూ లేకుండా ఉత్పన్నం అవుతుంటాయి. తానెన్నడూ చూడని జీవితాన్ని చూస్తూ, కలలోనైనా ఊహించని మనుషులని తాకుతూ, వారి మధ్య నడుస్తూ తిరుగుతున్నా అతనిలో అంతర్మధనం మాత్రం ఆగదు. గుడిలో ఎవరో బ్రాహ్మడు తన కూతురికి సంబంధం చూడమని అడుగుతాడు. సంభావనల కోసం, ఒక పూట చారుతో కూడిన సాధారణ భోజనం కోసం వచ్చిన బీద, సామాన్య బ్రాహ్మల మధ్య కూచుని ఎన్నో ఆలోచనలు చేస్తాడు. వడ్డన చేస్తున్న బ్రాహ్మల్లో ఒకడు “అయ్యో, మీరు దుర్వాస పుర అగ్రహారం ప్రాణేశాచార్య కదూ! ఈ పంక్తి మీ వంటి వారికి కాదు, లేవండి, వేరే పంక్తికి తీసుకెళ్తా పదండి” అనే సరికి ఉలిక్కి పడి, ఇంకా స్పష్టంగా చెప్పాలంటే బెదిరి పోయి లేచి పోతాడు.

ఇటువంటి పరిస్థితుల్లో ప్రాణేశుడుఅకస్మాత్తుగా మేల్కొంటాడు.  తానేం చేస్తున్నదీ, ఎటు పోతున్నదీ తోచదు. భోజనానంతరం పద్మావతి దగ్గరికి తీసుకెళ్తానన్న పుట్టన్న మాటలు మరి చెవిన పెట్టక ప్రాయశ్చిత్తం చేసుకోవాలనే ఉద్దేశంతో దుర్వాస పురం అగ్రహారం దారి పడతాడు. మొత్తం చెప్పేసి అగ్రహారం ముందు తన భారం దించుకోవాలని సంకల్పిస్తాడు.

ఆ తర్వాత  ఏమవుతుంది? ఆయన తప్పుని అగ్రహారం ముందు ఒప్పుకుంటాడా? ఆయన తప్పుని అగ్రహారం క్షమిస్తుందా? అసలు ఆయన చేసింది తప్పేనా? లేక ప్రకృతి సహజమా?మధ్వ శాఖకే మణికిరీటమై భాసిల్లిన ఆయన పెద్దరికం ఈ దెబ్బతో మట్టి కొట్టుకు పోయిందా?

ఈ ప్రశ్నలన్నిటికీ జవాబు లేదు! ఎందుకంటే ఆ తర్వాత ఏమవుతుందనే ప్రశ్నతోనే నవల ముగిసి పోతుంది. ప్రాణేశుడి పయనం మాత్రం సాగుతుంది దుర్వాసపురానికేసి.

ఈ నవలను అనంత మూర్తి విదేశాల్లో పి హెచ్ డీ చేస్తున్నపుడు రాశారు. 1965 లో పబ్లిష్ అయిన ఈ నవల 1970 లో ఇది సినిమా గా రూపు దిద్దుకుంది. పెళ్ళి నాటి ప్రమాణాలు భాగ్య చక్రం లాటి సినిమాలకు నిర్మాత గా వ్యవహరించిన తిక్కవరపు పట్టాభిరామి రెడ్డి నిర్మాతగా దర్శకుడుగా ఈ నవలను పార్లల్ సినిమాగా తెరకెక్కించారు. ప్రాణేశుడిగా గిరీష్ కర్నాడ్, పఠాభి భార్య స్నేహలత ఈ సినిమాలో చంద్రిగా నటించారు. కుల విభేదాలని రేకెత్తించేది గా  ఉందన్న కారణంతో మొదటి ఈ సినిమాని  సెన్సార్ బోర్డు నిషేధించినా, తర్వాత విడుదలై జాతీయ అంతర్జాతీయ అవార్డులు  సైతం గెల్చుకుంది.

నవల విషయానికొస్తే సాహిత్య అకాడమీదీన్ని  తెలుగులో ప్రచురించింది. తెలుగు లోకి అనువదించింది శిష్ట్లా లక్ష్మీ పతి శాస్త్రి. ఒరిజినల్ నవల చదువుతున్నట్టే ఉంటుంది తప్ప ఇది అనువాదమని పసిగట్టలేం! ప్రస్తుతం తెలుగు కాపీలు అందుబాటులో లేవు. ఇంగ్లీష్ లో చదవాలనుకునే వారు చదవవచ్చు. నవలగా కూడా ఇది అనేక విమర్శలకు గురైంది. అనంత మూర్తి స్వయంగా బ్రహ్మణుడై ఉండి, బ్రాహ్మణ్యం మీద చేసిన విమర్శలు, చాలా మందికి బొత్తిగా మింగుడు పడలేదు. నిజానికి ఆయన మనుషుల సహజ స్వభావాలు ఎలా ఉంటాయన్న విషయానికే ప్రాధాన్యం ఇచ్చి, వాళ్ళ హిపోక్రసీ పరిస్థితులను బట్టి ఎలా జడలు విప్పుతుందో ఎద్దేవా చేస్తూ రాసినా, కథ,  పాత్రలు బ్రాహ్మణాగ్రహారానికి చెందడం వల్ల సహజంగానే బ్రాహ్మణుల ఆగ్రహానికి గురైంది ఈ నవల. కానీ నిజం మాట్లాడాలంటే ఈ నవల్లో అనత మూర్తి పాత్రల ద్వారా చెప్పించిన మాటలు గానీ,చేసిన విమర్శలు గానీ నోరు మూసుకుని ఒప్పుకుని తీరవలసినవే!  భుజాలు తడుముకుని ఊరుకోవాల్సిందే . అందులో రెండో మాటకు తావు లేదు.

నవలను రెండు విభాగాలుగా చూడవచ్చు. ఒకటి నారాయణప్ప దహన సంస్కారం అయితే రెండోది ఒక వేద పారంగతుడైన ఒక బ్రాహ్మడు ధర్మ సంకటంలో పడి చేసుకున్న ఆత్మ విమర్శ! ఈ రెండో విభాగం నవలకు చాలా కీలకం.

ప్రాణేశాచార్య అంతరంగ మథనాన్ని అనంతమూర్తి రచయిత స్థానంలో ఉండి పరిశీలిస్తూ, అత్యంత అద్భుతంగా చిత్రీకరిస్తాడు.

చంద్రి సాంగత్యానికి ముందు, ఆ తర్వాత అతని ఆలోచనల్లో ఏర్పడిన మార్పు, ఒప్పుకోలు, కొంత పశ్చాత్తాపం, తనను తానే మోసగించుకోవడం, అంతలోనే కాదు కాదని సర్ది చెప్పుకోవడం..ఇవన్నీ స్పష్టంగా గోచరిస్తాయి.

అగ్రహారంలో అందరికీ మార్గదర్శకంగా , దారి చూపిస్తూ ఉండే ప్రాణేశుడు తీరిక వేళల్లో పురాణాలు  శృంగార కావ్యాలు చదివి విపులంగా విశదీకరించి, అగ్రహారీకులకు రసానందం కలిగిస్తూ ఉండేవాడు. ఆయన కావ్యాల్లోని వర్ణనలను మరింత విశదీకరించి చెప్తుంటే ఎంతోమంది అక్కడ గుమికూడే వారు వినడానికి. వారిలో లక్ష్మణా చార్యుడి అల్లుడు కూడా ఉండేవాడు. అతడిని భార్యతో కూడకుండా అత్తగారు అడ్డుపడుతూ ఉంటుంది. అలా కొన్నాళ్ళు చేస్తే, ఇక కొంగున కట్టుబడి ఉంటాడ్దని ఆవిడ ప్రగాఢ విశ్వాసం! ఎన్నో సార్లు భార్యను చేరబోయి భంగపడిన అతడు, ఒకనాడు ప్రాణేశాచార్యుడు మత్స్యగంధిని గురించి చేసిన వర్ణనలను విని ఉత్తేజితుడై, ఆ ఉద్రేకంలో వెళ్ళి, తుంగభద్రలో స్నానం చేస్తున్న మాల పిల్ల బెల్లీతో గడుపుతాడు. ఇలాటి వాటిని శరీర ధర్మాలు గా  భావించే బెల్లీ అభ్యంతరం చెప్పదు. పైగా బ్రాహ్మల అయ్యోరు కదాని భయ భక్తులతో ఉంటుంది.

ఈ సంగతి తెలిశాక ప్రాణేశాచార్యులు కొంత కలరవర పడి, శృంగారం బొత్తిగా లేని భక్తి రస ప్రధా కావ్య పఠనం మొదలు పెడితే.. పాపం శ్రోతల సంఖ్య బహు స్వల్పం!  శ్రోతలెక్కువమంది లేక పోయే సరికి ప్రాణేశుడికి సైతం ఆసక్తి లేకుండా పోతుంది. (ఇలాటి సంఘటనలను వాస్తవంగా చిత్రిస్తూనే అనంతమూర్తి వ్యంగ్యం దట్టిస్తాడు).

girish-karnad

ఇప్పుడు అవన్నీ గుర్తుకొస్తున్నాయి ప్రాణేశుడికి. రస రమ్యంగా తాను కావ్యాలను వర్ణిస్తుంటే యువకుల మనఃస్థితి ఎలా ఉండేదో, వర్ణనల ద్వారా వాళ్లను ఎలా ఉద్రేక పరిచాడో తనకు ఇప్పుడు అవగతమైందనుకుంటాడు.  “నిజానికి అవన్నీ శ్రోతలకు మాత్రమే చెప్తున్నాననీ, తనకలాటి విషయ వాసనలేవీ అంటకుండా ఉన్నాయని తాను భ్రమించాడే తప్ప, తనలో ఆ కోరికలూ ఆ వాసనలూ పెద్ద పులిలా లోపల పొంచే వున్నాయి. సరైన అవకాశం కోసం వేచి చూస్తోంది ఆ పెద్ద పులి. చంద్రి స్పర్శ తగలగానే అది బయటికి దూకింది.” అని ఒప్పుకుంటాడు.

అయినా, వేద వేదాంగాలు చదివిన పండితుడిగా తన పేరు చుట్టు పక్కల గ్రామాల్లో పరిచితం కాబట్టి ఎక్కడికెళ్ళినా ఎవరైనా తనను పడతారేమో’ అన్న శంకతో దాగి దాగి తన  అస్తిత్వాన్ని మరుగు పరచుకుంటాడు. ఎవరినో పిలుస్తున్నా, తననే అని ఉలిక్కిపడతాడు.

రోగిష్టి భార్యకు సేవ చేయడాన్ని తన అదృష్టంగా భావిస్తుంటాడు. తాను ఇహ లోక సౌఖ్య భావనలన్నిటినీ అధిగమించానని భావిస్తుంటాడు కానీ అది అబద్ధమని చంద్రి సౌందర్యం, సాంగత్యం రుజువు చేస్తుంది.

దేవాలయంలో సంతర్పణ పంక్తిలో కూచున్నా, అతని కళ్ళ ముందు అగ్రహారం, నారాయణప్ప శవం, ఇవే! తాను, చంద్రి నెరపిన అద్భుత శృంగారం మరో పక్క వెంటాడుతుంది. ఈ సంఘర్షణలో అతనికి మాల పిల్ల బెల్లీ మట్టి రంగు శరీర వర్ణం గుర్తొస్తుంది. ఆ పిల్ల శరీర సౌష్టవాన్ని కూడా  తాను పరికించి చూశానన్న సంగతిని మనస్సాక్షి ముందు ఒప్పుకుంటాడు.

తనలో పశ్చాత్తాపం అంటే భయం ఎక్కువగా ఉన్నదని గ్రహిస్తాడు “ఒకవేళ నేను నిజం బయట పెట్టక పోతే, నారాయణప్ప శవానికి సంస్కారం చేయక పోతే భయం నుంచి తప్పించుకోవడం సాధ్యం కాదు!  నేనొక అభేద్యము, అమోఘమూ అయిన సంపూర్ణ నిర్ణయానికి రావాలి. పరోక్షంగా ఉన్న విషయాలన్నీ ప్రత్యక్షంగా తీసుకురావాలి. సూటిగా మనుషుల కళ్లలోకి చూడగలిగి ఉండాలి. విషయాలు దాచి పెడితే జీవితాంతం భయం పిశాచానికి బద్ధుడినై ఉండాలి.  బహిర్గతం చేస్తే ఇన్నాళ్ళు నా సనాతన ధర్మ బద్ధతకు ఔన్నత్యం కల్పిస్తున్న బ్రాహ్మణ్యం ముందరే నిజం బయట పెట్టి, బ్రాహ్మణ్యం ముందే దుమ్ము పోసిన వాడినవుతాను.  నా నిశ్చితార్థం తో ఇతరుల జీవనాన్ని ముడి పెట్టడానికి నాకేం హక్కుంది?  పరంధామా ! నిర్ణయమూ తీసుకోలేకుండా ఉన్నాను. రోజు రాత్రి అడవిలో నా ప్రమేయం లేకుండా కూడా, నీవు నా నిర్ణయాన్ని విధంగా విధించావో, అదే విధంగా ఇప్పుడు కూడా నీవు నా నిర్ణయాన్ని విధించు. జరగవలసిందేదో ఒక్కసారిగా జరగనీ ! …” 

 ఇంతటి భయం నాకెప్పుడూ కలగలేదు.రహస్యం బయటపడుతుందేమో అని భయం! ఒకవేళ పడకపోయినా అబద్ధాన్ని బొడ్లో దాచుకుని మొహంతో అగ్రహారంలో ఎలా ఉండగలనుఅని ప్రశ్నించుకుంటాడు.

మరోపక్క చంద్రితో తాను గడిపిన ఆ క్షణాలు దైవనిర్ణయాలు, అందులో తన ప్రమేయం లేదని సర్దిచెప్పుకోడానికి ప్రయత్నిస్తాడు. ఆ స్థితిలో నారాయణప్పను అర్థం చేసుకోవడానికి ప్రయత్నిస్తాడు. మూర్ఛ రోగిని నారాయణప్పకు కట్టబెట్టి అతని సహజ వాంఛలను తీరకుండా చేసిన బంధువుల చర్యను తాను ఒక్కనాడైనా మనసులోనైనా ఖండించలేదు.  నారాయణప్ప కు మాత్రం శృంగారం అవసరం లేదా?  ఎప్పుడూ నారాయణప్పకే నీతులు బోధించి మార్చడానికి ప్రయత్నించాడే!

జీవితాంతం నారాయణప్పని మార్చడానికి ప్రయత్నించిన ప్రాణేశాచార్య , అతను మరణించాక అతని వైపునుంచి ఆలోచిస్తాడు!

ఆలోచనలతో అతడి మెదడు హోరెత్తుతుంది.

ఆంజనేయ స్వామి నన్ను దారి తప్పించాడు. నారాయణప్ప నా మీద పగ సాధించాడు.  దుర్వాసపురం బ్రాహ్మణులు  బంగారానికి వాచి పోయారు. చంద్రి చీకట్లో వేచి ఉండి తనకు కావలసిన దాన్ని పొంది వెళ్ళిపోయింది. భాగీరథి (భార్య) బాధతో ఆర్తనాదం చేసి చచ్చి పోయింది. మరి నేను?”

అని ఆలోచిస్తుండగానే పుట్టప్ప పద్మావతి ప్రసక్తి తీసుకురాగానే మళ్ళీ మనసు చంచలం!

image1-2

వెళ్తాను. దుర్వాస పురానికి తిరిగి వెళ్తాను. ఇక్కడి జీవనానికి దూరంగా, జీవిత విన్యాసంలో నగ్న సత్యం మాదిరి బెదిరి పోయిన బ్రాహ్మణుల మధ్య వ్యక్తమవుతాను. ఇంతవరకూ వాళ్ళ ముందు ఒక గురు తుల్యుడిని, పెద్దను, అర్థ రాత్రికల్లా కొత్త మనిషిగా మారతా! బహుశా అగ్ని జ్యోతి నారాయణప్ప శరీరం మీద నాలుకలు జాపి నాట్యం చేస్తుంటే నా మనసు స్థిమిత పడవచ్చు. వాళ్లకు నా సంగతి అంతా చెప్పేటపుడు నాలో పిసరంతైనా పశ్చాత్తాపం ఉండకూడదు. నేనొక పాపం చేసి విచారిస్తున్నానేమో అన్న అనుమానం రవ్వంతైనా ఉండరాదు. లేక పోతే సంఘర్షణ లో నేను ద్వంద్వాతీతుణ్ణి కాలేను.మన మనసులో యే రూపాలు భావించుకుంటామో అవన్నీ నిస్స్సందేహంగా సత్స్వరూపాలే… ” ఇలా ఆలోచనల ప్రవాహం సాగాక మొదటి సారి అతడు పుట్టన్న భుజం మీద ఆప్యాయంగా చేయి వేసి మాట్లాడతాడు. అతడి హృదయం తేలిక పడుతుంది. మనసుని పట్టి ఉన్నదేదో వీడి పోతుంది.

ఇలా ప్రాణేశుడి అంతరంగ మథనం సాగుతుంది. అనంతమూర్తి అగ్రహార బ్రాహ్మల్లోని ద్వంద్వ ప్రమాణాలను కుండ పగలేసినట్టు బయట పెట్టి అనేక మందిని ఉలిక్కి పడేలా చేస్తాడు. దుర్వాస పురం అగ్రహారం లోని ఏకైక స్మార్తుడు దుర్గా భట్టు ప్రతి విషయంలోనూ మధ్వ సంప్రదాయాలకు  అనుగుణంగా మధ్వుల ప్రవర్తన ఉందాలేనా అని కొలతలేసి ఎంచుతుంటాడు. నారాయణప్ప వేశ్యాలోలుడు కాబట్టి దాన్ని అలుసుగా తీసుకుని “దక్షిణ కన్నడంలో బస్రూరు సంగతి అందరికీ తెలిసిందే కదా, అక్కడి బ్రాహ్మలు అంతా భోగం కొంపల చుట్టూ తిరిగే వారేగా? వాళ్లను బ్రాహ్మలు కాదన్నారా ఏంటి నారాయణప్పను తప్పు పట్టేందుకు” అంటాడు “మీ మధ్వులంతా తిరుగుబోతులే ” అనాలన్న ఉద్దేశంతో .

మధ్వులను వెక్కిరిస్తున్నాడని మండిన గరుడాచార్యులు “మీ శంకరాచార్యులు కూడా సంపూర్ణ అనుభవాలు కావలసిన ఆశ కొద్దీ రాజుగారి బొందిలో ప్రవేశించి రాణీగారి సహవాసం లో లేడా” అని బదులు తీర్చుకుంటాడు. దుర్గాభట్టుకి ఇదంతా మధ్వుల ఆంతరంగిక వ్యవహారం. ఏదో మాట కలిపాడు కానీ నిజానికి అతడు వచ్చింది చంద్రిని చూడ్డానికి. నారాయణప్ప ప్రాపకంలో ఉండగా చంద్రి ఎన్నడూ బయటికి వచ్చింది కాదు. మధ్వుల నీతి గురించి తానేదో నీతిపరుడైనట్టు మాట్లాడిన భట్టు అటువంటి పరిస్థితిలో కూడా చంద్రిని అణువణువూ తనకు తనే వర్ణించుకుంటూ చూస్తాడు.  “ఎంతటి అందమైన సౌష్టవం ? నారాయణప్ప పడి చచ్చాడంటే చావడూ “అని లొట్టలు వేస్తాడు .

ఇహ పారిజాత పురంలోని స్మార్తులు తక్కువేమీ కాదు ! ఇప్పటికే తమను మధ్వులు తక్కువగా చూస్తున్నారు , ఎంత మిత్రుడైనా తాగుబోతు , మాంసాహారి , వేశ్యాలోలుడు అయిన నారాయణప్ప శవానికి సంస్కారం చేయడానికి ఒప్పుకుంటే ఇంకా లోకువైపోతామని, అందుకు ఒప్పుకోరు . పైగా అక్కడి స్మార్త ప్రముఖుడు మంజయ్య ” ఖర్చులకు ఇబ్బంది పడకండి ! దానాలు ఇతర ఖర్చులన్నీ నేను చూస్తాను , దహనం మీరే కానివ్వండి ” అంటాడు , మధ్వుల లోభ గుణాన్ని ఎత్తి పొడుస్తూ !

తిండికి మొహం వాచీ ఉండేమరొక బ్రాహ్మడు దాసాచార్యుడు శవం అగ్రహారంలో ఉండగా , ఆకలికి తాళ లేక పారిజాత పురం వెళ్లి మంజయ్య ఇంట్లో , నారాయణప్ప దహన సంస్కారాల గురించి మాట్లాడ్డానికి వచ్చినట్టు ఆ మాటా ఈ మాటా చెప్పి వాళ్ళు పెట్టిన ఉప్మా కడుపునిండా భుజిస్తాడు . అతడు తిండికోసమే వచ్చాడని గ్రహించలేని దద్దమ్మ కాదు మంజయ్య! తమకంటే అధిక శాఖ బ్రాహ్మడు తన ఇంట్లో తిన్నాడని ఎగతాళి గా నవ్వుకుంటాడు ! దాసాచార్యుడు భ్రష్టుడైతే తనకు ఆనందమేగా

ఈ విధంగా అనంతమూర్తి చెయ్యని వ్యంగ్యం లేదు, బయటపెట్టని బండారమూ లేదు ఈ నవల్లో !

anantamoorthy

లక్ష్మణా చార్యుడి అల్లుడు శ్రీపతి మాలపిల్ల బెల్లీతో గడుపుతాడు తప్ప ఆమె తో కనీసం ఒక మాట మాట్లాడాలని తోచదు. వూరునుంచి తిరిగొస్తూ బెల్లీ దగ్గరికి వెళ్ళి ఆమె శరీరం మీద తన దండయాత్ర కొనసాగిస్తాడు తప్ప “వూర్లో ఏదో మహమ్మారి రోగం వచ్చిందయ్యా” అని బెల్లీ చెప్పబోతుంటే వినడు. అతనికి ఆమె శరీరంతోనే పని. “బెల్లీ పడుకోడానికి మాత్రమే బావుంటుంది, మాట్లాడ్డానికి కాదు” అంటాడు అనంతమూర్తి అక్కడ!

కులం వల్ల తమకు సంక్రమించాయని చెప్పుకుంటున్న ఉత్తమ సుగుణాలూ, ధార్మిక లక్షణాలూ, నైతికతా ఇవన్నీ అబద్ధాలు, పరిస్థితులకు అనుగుణం గా మారే మనిషి ప్రవర్తన మాత్రమే నిజం!ఇదే ఈ నవల మొత్తం వ్యాప్తమై కనిపిస్తుంది.

ఒక మనిషి బతికుండగా ఎలాటి వాడైనా, ఏ కులానికి చెందిన వాడైనా , ఏ ధర్మాన్ని పాటించిన వాడైనా , మరణించాక అతడు బ్రాహ్మడూ కాదు , శూద్రుడూ కాదు ! అదొక దేహం మాత్రమే ! దాన్ని గౌరవంగా ఈ లోకం నుంచి సాగనంపాల్సి ఉంటుంది . శవానికి కులమేమిటి ? ఈ విషయం మీద ఈ నవలలో జరిగిన చర్చ చాలా రోజులు వెన్నాడుతుంది !

భారతీయ  నవలా సాహిత్యంలో ఎంచి చెప్పుకోదగ్గ నవలగా సంస్కార స్థానం చాలా స్థిరమైనది.

సినిమా ఆన్ లైన్లో అందుబాటులో ఉంది.

అయితే నవలలో ఉన్న చిక్కదనం సినిమాలో కనిపించక, కొంత నిరాశ పరిచింది నన్ను! ప్రాణేశుడి అంతరంగ మథనం దృశ్యరూపం దాల్చడంతో రచయితగా అనంతమూర్తి అదృశ్యమై ,నటుడిగా గిరీష్ కర్నాడ్, దర్శకుడిగా పఠాభి మాత్రమే అక్కడ  కనిపిస్తారు. చాలా గొప్ప నవలలు సినిమా దాకా వచ్చే సరికి ఎలా తేలిపోయాయో అలాగే సంస్కారకీ మినహాయింపు లేదనిపిస్తుంది

అద్భుతమైన కథా వస్తువు, అమోఘమైన పాత్ర చిత్రణలతో  మూఢ సంప్రదాయాల మీదా , మనుషుల ద్వంద్వ ప్రమాణాల మీదా మీద అనంతమూర్తి సంధించిన  బ్రహ్మాస్త్రమే “సంస్కార”

తెలుగులో లభ్యం కాకపోయినా ఇంగ్లీష్ లో రామానుజన్ అనువాదం అందుబాటులో ఉంది! వీలు చేసుకుని చదవదగిన గొప్ప నవల

 

*

 

 

 

 

 

వింత వర్ణాల “పులి ముగ్గు”

puli3

విశ్వనాథ సత్యనారాయణ రాసిన గ్రాంథిక నవల మహా చమత్కారి అయిన ఆయన కొడుకు పావని శాస్త్రి

రీ టెల్లింగ్ చేస్తే అదెలా ఉంటుంది? అందునా ఇది తెలుగులో మొట్ట మొదటి రీటోల్డ్ నవల అని పావని శాస్త్రే స్వయంగా చెప్పారు. అదలా ఉంచితే ఈ నవలకు విశ్వనాథ ఎన్నుకున్న అంశం వింతైనది, కొత్తది, పైగా జానపదం!! మనిషి పులిగా మారే విద్య మీద రాసిన నవల

ఖడ్గ విద్య లో ఎదురు లేని ఒక క్షత్రియ తాపసి, అంతులేని స్త్రీ వాంఛతో అసంబద్ధమైన శృంగార పరమైన కోరిక కోరి నాశనమైన రాజు.., నీచుడైన తండ్రికి తగిన పాఠం చెప్పిన కొడుకు… ఇలాటి పాత్రలతో  ఆద్యంతం ఉత్కంఠ గా సాగే నవల పులి ముగ్గు!

విశ్వనాథ సత్యనారాయణ “పురాణ గ్రంథ వైరి మాల” అనే గ్రంథ సంపుటిని 16 సంపుటాలు వెలువరిద్దామని సంకల్పించి, 12 సంపుటాలతోనే ముగించారు. అవి

భగవంతుని మీద పగ,

నాస్తిక ధూమము,

ధూమ రేఖ,

నందో రాజా భవిష్యతి,

చంద్రగుప్తుని స్వప్నము,

అశ్వమేథము,

అమృత వల్లి,

పులి మ్రుగ్గు,

నాగసేనుడు,

హెలీనా,

వేదవతి,

నివేదిత.

వీటిలో   “పులి మ్రుగ్గు” ని పావని శాస్త్రి “పులి ముగ్గు” గా అతి సరళమైన (అందులోనూ ఆయన బహు చమత్కారి, హాస్య ప్రియుడూనూ) తెలుగులో తిరగరాశారు.

నవల ప్రారంభిస్తూ  “పొద్దు నడిమింటికి వచ్చినది” అని విశ్వనాథ రాస్తే, పావని శాస్త్రి “బారలు చాచి దూకుతున్న పెద్ద పులి లాగా సూర్యుడు నడి నెత్తికొచ్చాడు” అంటాడు. ఎండతో మండి పడుతున్న సూర్యుడిని కథలో అడుగడుగునా ఎదురు పడే పులి రో రిలేట్ చేసి, కథకూ పులికీ సంబంధం ఉందని ముందే ఉత్సుకత రేకెత్తిస్తాడు రచయిత. అలాటి చమత్కారంతో మొదలైన నవల కథాంశం కూడా ఆసక్తి కరమే!

కథ ప్రారంభమే మగధ సామ్రాజ్య సేనాధిపతి శ్రీముఖ శాతకర్ణీ, అతనికి పరిచయస్తుడైన తోహారు అనే ఒక ఆటవికుడూ కలిసి, సగం మనిషీ సగం పులి గా మారిన ఒక ప్రాణి కోసం అన్వేషణ సాగిస్తూ ఒక కారడవి లో పయనించడం తో మొదలౌతుంది. నిజానికి వాళ్ళు అన్వేషిస్తున్న వ్యక్తి వెనుక కాళ్ళు మనిషి కాళ్ళు గా ఉంటాయి తప్ప మిగతా మొత్తం పులిగా మారగలడు. మరి కొంత సాధన మిగిలి పోయి వెనుక కాళ్ళు మాత్రం మనిషి కాళ్ళుగానే ఉండి  పోయిన మనిషి  .అంటే మనిషీ పులీ కలగల్సిన ఒక వింత వ్యక్తి కోసం వాళ్ల అన్వేషణ

ఆ జీవి కోసం ఓపిగ్గా తిరిగి తిరిగి  అలసిన  ఇద్దరూ ఒక పెద్ద తటాకం ఒడ్డున పులి,మనిషి పాదాల గుర్తులు గమనించి, అక్కడ ఒక చెట్టెక్కి మాటు వేస్తారు. తెల్లవారు జామున వాళ్ళెదురు చూస్తున్న పులి రానే వస్తుంది. తుప్పల్లో దాచిన కొయ్య తెప్పను తీసి, దాన్ని తోసుకుంటూ నీళ్ళలో ప్రయాణం ప్రారంభిస్తుంది.శ్రీముఖుడు (ఇతన్ని నవల్లో సిముఖ శాతకర్ణి గా సంబోధిస్తాడు రచయిత) అలా మైళ్ళ కొలదీ నీళ్ళలో తెప్ప నడుపుకుంటూ పోతున్న పులిని నిశ్శబ్దంగా ఈదుతూ అనుసరిస్తాడు. చివరికి తెల్లవారాక పులి ఆ తెప్పను ఒడ్డున వదిలి సమీపంలోని గుహ లోకి పోతుంది. దాని వెనకాలే వెళ్ళిన సిముఖ శాతకర్ణికి అక్కడ పులి కనిపించదు కానీ నేల మీద తీర్చి దిద్ది ఉన్న వింత రంగు రంగుల ముగ్గులో పడుకుని ఉన్న ఒక మనిషి కనిపించి “ఎవర్నువ్వు? ఎందుకొచ్చా”వని ప్రశ్నిస్తాడు.

“మనిషి కాళ్ళున్న పులిని చూశాను, దాని కోసమే వచ్చాను”

“ఇక్కడే పులీ , గిలీ లేదు లేదు, చుశావు గా, నేనే ఉన్నాను, వెళ్ళొచ్చు”

“లేదు, ఆ పులి ఈ గుహలోకే వచ్చింది, నేను చూశాను”

ఇలా కొంత సేపు వాదన జరిగాక ఆ పులి వ్యక్తి శ్రీముఖుడి చరిత్ర గురించి మొత్తం చెప్పడం తో, శ్రీముఖుడు అతడిని చిన్నపుడే నగర బహిష్కరణకు గురై వెళ్ళి పోయిన తన గురువు జయద్రధుడి గా గుర్తిస్తాడు. అతడే పులిగా మారే విద్యను అభ్యసించి దాన్ని సాధించాడని గ్రహిస్తాడు. కానీ ఎందుకు? ఎందుకు పులిగా మారడం? ఎవరికి ప్రయోజనం ? ఏమిటీ వింత పని?

***

 

లోగో: భవాని ఫణి

లోగో: భవాని ఫణి

ఆంధ్రుల రాజధాని ధాన్య కటకం! రాజుకెంతమంది కొడుకులున్నా పెద్దవాడే రాజవుతాడు. మిగతావాళ్లంతా రాజ పుత్రులు. తర్వాత దాయాదులు, తాతా సహోదరులు (తాతలు అన్నదమ్ములు), జ్ఞాతులు.. చివరికి ఎవరికి వారే! అలా తరతరాలుగా జ్ఞాతులైన అనేక రాజ కుటుంబాల వాళ్లు ధాన్యకటకంలో అనేక కుటుంబాల వాళ్ళున్నారు.

కథా కాలం నాటికి చంద్ర శేఖర శాతకర్ణి ఆంధ్ర రాజు. అతని తాతా సహోదరుడు గోముఖ శాతకర్ణి (అంటే గోముఖ శాతకర్ణి తాత, చంద్ర శేఖర శాతకర్ణి తాతా అన్నదమ్ములు). గోముఖ శాతకర్ణికి ఒక్కడే కొడుకు శ్రీముఖ శాతకర్ణి. చంద్ర శేఖర శాతకర్ణి కి పిల్లలు లేరు. వేటకెళ్ళిన చంద్ర శేఖర శాతకర్ణికి జయద్రధుడు మొదటి సారి అడవిలో కలుస్తాడు. ఇద్దరి మధ్యా కత్తియుద్ధం జరుగుతుంది.  రాజు ఓడాడు.జయద్రధుడి షరతు, తాను రాజ్యానికి వచ్చి రాజ్యంలోని రాజ కుటుంబాల పిల్లలందరికీ ఖడ్గవిద్య నేర్పిస్తాననీ,అందుకు రాజు ఒప్పుకోవాలనీ! పలు విధాలుగా ఆలోచించినా దాని వల్ల ప్రమాదమేమీ కనపడదు రాజుకు. తనేదైనా తప్పు చేస్తే రాజ్య బహిష్కరణ చెయ్యొచ్చని జయద్రధుడే రాజుకి సూచిస్తాడు.

తాను ప్రయోగించిన రహస్య విద్యకు కూడా తిరుగుడు ప్రయోగించిన జయద్రధుడు గొప్ప ఖడ్గ విద్యా పారంగతుడు కాబట్టి వాడు తన రాజ్యానికి వచ్చినా నష్టం లేదని, రాజ కుమారులందరికీ విద్య నేర్పవచ్చని రాజ్యానికి తీసుకొస్తాడు చంద్ర శేఖర శాతకర్ణి

రాజ యువకులందరికీ విద్య నేర్పిన జయద్రధుడికి శ్రీముఖ శాతకర్ణి ప్రియ శిష్యుడయ్యాడు. అతడిలో ఉన్న అహంకారాన్ని, కొంత నాస్తిక దృక్పథాన్నీ జయద్రధుడు పెంచి పోషించాడు. దాంతో శ్రీముఖుడు మరింత అహంకారిగా తయారై, రాజుని లెక్క చేయకుండా తిరగడం మొదలు పెట్టాడు.వాడి నిర్లక్ష్య ధోరణి ని రాజు సహిస్తూ వచ్చాడు చాలా రోజులు!

ఆ రాజ్యంలోనే నీలాంబర శాతకర్ణి అనే రాజ కుటుంబీకుడున్నాడు. అతనికి జయద్రధి అనే కూతురుంది. ఆమె కూడా జయద్రధుడి వద్ద ఖడ్గ విద్య నేర్చుకుంది. జయద్రధుడు ఆమెతో ప్రేమాయణం నడిపి ఆమె గర్భానికి కారణమవుతాడు. ఆమెను వివాహం చేసుకోమని ఆమె తండ్రి కోరితే జయద్రధుడు తిరస్కరిస్తాడు, తాను తాపసినే తప్ప సంసారిని కాలేనని చెబుతాడు!

గురువు అండతో రెచ్చి పోతున్న శ్రీముఖుడిని అణచడానికి చంద్ర శేఖర శాతకర్ణికి ఒక అవకాశం దొరింది. అతడు జయద్రధుడు చేసిన తప్పుకు దేశ బహిష్కరణ విధించాడు. ఆ కారణంగా విప్లవాన్ని లేవదీసిన శ్రీముఖుడికి కూడా దేశ బహిష్కరణ విధించి ఇద్దరి పీడా ఒకటే సారి వదుల్చుకున్నాడు.

శ్రీముఖుడు వెళ్ళి మగధ సైన్యంలో చేరి సేనాధిపతి అయి, సుశర్మ రాజయ్యాక తనే మంత్రిగా కూడా బాధ్యతలు చేపట్టాడు. రాజంటే విపరీతమైన భక్తి.

ఇలా ఉండగా, ధాన్యకటకంలోని ఉత్తమ రాజ కుటుంబీకుల్లో ఒకడైన గంగాధర శాతకర్ణి కి శ్రీముఖుడి కార్యకలాపాల పట్ల ఆందోళన కలుగుతుంది. అతడికి జయద్రధుడంటే ఏ మాత్రం గౌరవమూ లెక్కా జమా లేదు! వాడొక క్షుద్ర విద్యోపాసకుడని, మంత్రాలతో ఖడ్గ విద్యను అనుసంధానం చేసే క్షుద్రుడని భావిస్తాడు. శ్రీముఖుడు మగధ కు మంత్రయ్యాక అతడికి ఆందోళన పెరుగుతుంది.

సుశర్మ సర్వ భారత చక్రవర్తి. సుశర్మ  తర్వాత శ్రీముఖుడు రాజైతే , కేవలం రాజై వూరుకుంటాడా? తప్పక ధాన్యకటకం మీద దాడి చేసి తమ కుటుంబాలన్నిటి మీదా పగ సాధిస్తాడు. కాబట్టి వాడిని ఎదుర్కోవాలంటే సుశర్మ దగ్గర తమ మనిషి ఎవరైనా ఉండాలి” అని ఆలోచించి, తన ఏకైక కుమార్తె, అందాల బొమ్మ పద్మ రాణిని సుశర్మ వద్దకు పంపిస్తాడు. సుశర్మ చూస్తే బ్రాహ్మణ రాజు, తాము క్షత్రియులు! అందుకే వివాహం పేరు ఎత్తకపోయినా “వివాహం జరగాలనే” ఆకాంక్ష తోనే పద్మ రాణిని, సకల సంభారాలతో, వివాహానికి కావలసిన వస్తువులతో సుశర్మ దగ్గరికి పంపుతాడు.

సుశర్మ, పద్మ రాణి పీకల్లోతు ప్రేమలో మునిగి పోతారు

పద్మ రాణి అతనికి ప్రియురాలై పోయింది. వివాహం కాలేదు. కానీ వారిద్దరీ ఆ తేడాయే లేదు. ఒకరంటే ఒకరు ప్రాణంగా ఉన్నారు

శ్రీముఖుడు పద్మ రాణిని గుర్తించినా పెద్ద ప్రమాద కారిగా భావించడు. సుశర్మ అంటే అతనికి ఎనలేని గౌరవం. అతనికి ద్రోహం తలపెట్టే ఆలోచన ఏ కోశానా లేదు!

పద్మరాణి వచ్చాక సుశర్మ రాజ్య పరిపాలన మొత్తం శ్రీ ముఖుడికి వదిలి రాణితో గడపటమే లోకంగా ఉన్నాడు

ఇవన్నీ పరిశీలించిన జయద్రధుడు చక్రం తిప్పదల్చాడు. అతడి ప్రకృతి విచిత్రమైంది. అతడు, అతడి పూర్వీకులు వేద మత విరోధులు. దాని కోసమే వాళ్ళు ఖడ్గ విద్యా సాధన కూడా చేస్తారు ప్రస్తుత ఆంధ్ర పాలకులు బౌద్ధులు.వాళ్లకి వేదాల మీద అంత గౌరవమేమీ లేదు. వాళ్లని సర్వ భారత చక్రవర్తులు  గా ప్రతిష్టిస్తే దేశన్ని మొత్తాన్ని వేద విరోధంగా తయారు చేయొచ్చు!

అతడి ఆలోచన ఇదీ!

కానీ అందుకు చంద్ర శేఖర శాతకర్ణి పనికి రాడు. అందుకే తాను ఖడ్గవిద్యతో పాటు నాస్తిక భావనలని శ్రీముఖుడి లో నాటి పెంచాడు. ఎలాగూ వాడు ఈనాటికి మగధ రాజ్యానికి మంత్రిగా ఉన్నాడు. కాబట్టి వాడిని రాజును చెయ్యాలి . వాడు రాజు కావాలంటే సుశర్మను చంపాలి.

చంపాలనుకుంటే ఏదో ఒక రకంగా చంపవచ్చు జయద్రధుడు. కానీ అతగాడి ప్రవృత్తి విచిత్రమైంది కదా! అందుకే ఎత్తు వేసి పద్మరాణిని చూసే నెపంతో మగధకు వచ్చాడు.

రాణి ద్వారా రాజుని కలిశాడు. రాజుతో చెప్తాడు”నా శిష్యుడు శ్రీముఖుడిని మంత్రిగా చేసి ఆదరించావు కాబట్టి నీకు రహస్యమైన తీరని కోరిక ఏదైనా ఉంటే చెప్పు! నేను తీరుస్తాను” అని

రాజు అంతకంటే మూర్ఖుడు. “నాకు ఎంతమంది భార్యలూ, ప్రియురాళ్ళూ, పరిచారికలూ ఉన్నా, ఎంతమంది కొత్తగా వస్తున్నా, ఈ స్త్రీ వాంఛ తీరడం లేదు. అసలు ఈ శృంగారం విషయంలో విపరీతమైన ఆలోచనలు వస్తున్నాయి. నా సహచరి జంతువై, నేను మనిషిగానే ఉండి ఆమెతో కూడితే ఎలా ఉంటుందో అనుభవంలోకి తెచ్చుకోవాలని ఆశగా ఉంది. నా పద్మ రాణిని పులిగా మార్చి నన్ను మనిషిగానే ఉంచండి. ఆ అనుభవం ఎలా ఉంటుందో చూడాలని ఉంది” అని అభ్యర్థిస్తాడు

నిజానికి జయద్రధుడు వాంఛిస్తున్నదీ ఇదే! వెంటనే ఒప్పుకుని, బలిమఠం (తన గుహ ఉన్న అడవి) అడవిలో ఒక పెద్ద భవనం నిర్మించమని, దీనికి సంబంధించిన సాధన మొత్తం అక్కడే జరగాలనీ, రాజ్యం శ్రీముఖుడికి అప్పగించి రమ్మనీ రాజునీ, పద్మ రాణినీ కోరతాడు. పద్మరాణి మొదట భయపడుతుంది. “నేను పులిగా మారాక జ్ఞానం లేక  రాజుని, చంపితే?” అనడుగుతుంది.” చంపవు, నీకు మనిషిని అనే జ్ఞానం ఉంటుంది. అది లేక పోతే తిరిగి మనిషిగా ఎలా మారగలవు?” అని ఒప్పిస్తాడు జయద్రధుడు.

రాజు తల్చుకుంటే దేనికైనా కొదవా? భవనం సిద్ధం! పరిచారికలతో సహా రాజు రాణి అక్కడికి పయనం

puli2

ఈ లోపు కథలో మరో పాత్ర పరిచయం అవుతుంది. జయద్రధుడి వల్ల నీలాంబర శాతకర్ణి కుమార్తె జయద్రధికి పుట్టిన కొడుకు. తమ ఇద్దరి పేర్లు గుర్తుగా వాడికి కూడా  జయద్రధుడనే పేరు పెట్టింది తల్లి. పద్ధెనిమిదేళ్ళ ఆ యువకుడు తండ్రి గురించి తెలుసుకోవాలని చిన్నప్పటి నుంచీ ఎంత ప్రయత్నించినా లాభం లేక పోయింది. అతడొక మార్మికుడు, సిద్ధుడు, ఖడ్గవిద్యలో తిరుగు లేదు అంతకంటే ఏమీ తెలీదు, అని చెప్పిన వారే అంతా! తల్లేమీ చెప్పదు. తాతగారి వద్ద నేర్చిన శ్రీకృష్ణ మంత్రాన్ని ఉపాసిస్తూ, స్వచ్చంగా పెరుగుతాడు. తండ్రి జాడ కనుక్కోవాలని ఎవరికీ చెప్పకుండా బయలు దేరి చూచాయ గా విన్న సమాచారాన్ని బట్టి ఫలానా అడవుల్లో వెదకాలని బయలు దేరతాడు. అనుకోకుండా వాడికి తోహారు జతపడతాడు. ఇద్దరూ కల్సి తండ్రి జాడ వెదకాలని నిశ్చయించుకుంటారు. ఎందుకంటే శ్రీముఖ శాతకర్ణికి జయద్రధుడే పులి అని తెలిశాక తోహారుతో ఇదీ విషయం అని చెప్పడు. కాబట్టి తోహారు చిన్న జయద్రధుడితో కల్సి పెద్ద జయద్రధుడిని వెదకడానికి బయలు దేరతాడు.

ఈ లోపు వాళ్ళిద్దరికీ అడవిలో నిర్మితమైన భవనం, అందులో ఏదో మార్మికంగా జరుగుతున్న సంగతీ తెలుస్తుంది. అక్కడికి వెళ్ళి వాకబు చేస్తే ఎవరో సిద్ధుడు వచ్చి వెళ్తున్న సంగతి తప్ప ఇంకేమీ తెలీదు. పద్మరాణి పుట్టింటి చెలికత్తె చంద్ర రేఖ చిన్న జయద్రధుడిని గుర్తించి “ఆ తండ్రే ఏదో మాయ చేసి రాజును చంపాలని చూస్తున్నాడేమో అని భయంగా ఉంటే, ఈ కొడుకు కూడా వచ్చాడే! ఇదేదో వినాశనానికే దారి తీస్తుంది లా ఉంది” అని పద్మరాణి తో చెబుతుంది.

అసలు ఈ పులిగా మారి శృంగారం నెరపడం పద్మరాణికి సుతరామూ ఇష్టం లేక పోయినా రాజు మీద ప్రేమతో అంగీకరించిదాయె! ఏదైనా  కీడు జరుగుతుందేమో అని లోలోపల భయపడుతూనే ఉంటుంది. కానీ కొడుకు తండ్రి వంటి వాడి కాదనీ, మంచివాడనీ గ్రహించిన మీదట చంద్ర రేఖ ఎలాగైనా రాజునీ రాణినీ ఈ మాయోపాయం నుంచి రక్షించడానికి వాడి సాయం కోరుతుంది.

తోహారు తో కలిసి చిన్న జయద్రధుడు తటాకం వద్ద మాటు వేసి , పులిగా మారి తెప్ప ఎక్కి పోతున్న తండ్రి ని అనుసరించి పోయి అతన్ని కలుసుకుంటాడు. పెద్ద జయద్రధుడు కొడుకుని చూసి ఏమీ స్పందించడు. పైగా కొంత శక్తి తగ్గినట్టు, సూటిగా చూస్తూ మాట్లాడక, మాట తప్పించి డొంక తిరుగుడు గా మాట్లాడతాడు. ఎంతటివారినైనా మాటలతో తలొగ్గేలా చేసే అతడు కొడుకుతో మాత్రం వాదన పెట్టుకోడు. కొంత లొంగుబాటు స్వభావంతో ప్రవర్తిస్తాడు. అదంతా తన కృష్ణ మంత్ర జప ఫలితమేనని భావిస్తాడు చిన్న జయద్రధుడు.

చివరికి ఆ రోజు రానే వస్తుంది. దీపాలు ఆర్పేసిన ఆ భవనంలోకి ఆ క్షుద్ర కార్యం జరగకుండా అడ్డుకోడానికి చిన్న జయద్రధుడు అత్యంత శక్తివంతమైన గ్రాహక శక్తితో ప్రవేశిస్తాడు. చంద్ర రేఖ చెప్పిన ప్రకారం రాజు, రాణి,తన తండ్రి ఏ యే గదుల్లో ఉన్నారో ఆయా గదుల్లోకి ప్రవేశించి అటకమీద చేరి గమనిస్తాడు. రాణి గదిలో రాణి వివస్త్రగా మారి జయద్రధుడు వేసిన పులిముగ్గులో పడుకుని పులిగా మారి మారి రాజు గదిలో ప్రవేశిస్తుంది. అక్కడ రాజు ఉండడు. కానీ, జయద్రధుడు మాత్రం ఆమె తిరిగి తన గదిలోకి వెళ్ళే మార్గం లేకుండా మధ్య తలుపు మూసేసి, ఆమె గదిలో వేసి ఉన్న పులిముగ్గుని చెరిపేస్తాడు. అంటే ఆమె తిరిగి మనిషిగా మారలేకుండా! నిర్ఘాంత పోయిన రాణి చాలా సేపు అటూ ఇటూ తిరిగి, నిర్ణీత సమయం మించి పోవడం తో  ఏమీ చేయలేక పులి రూపంలోనే శాశ్వతంగా అడవిలోకి పారిపోతుంది కిటికీ లోంచి దూకి. రాజ్య బహిష్కరణ విధించిన శాతకర్ణులమీద పగతో తనను నిత్య వ్యాఘ్రంగా మార్చాడనీ, నాస్తికుడైన శ్రీముఖుడికి రాజ్యాన్ని కట్టబెట్టడానికి సుశర్మను చంపబోతున్నాడనీ తెలిసినా, గ్రహించినా ఏమీ చేయలేని నిస్సహాయ.. పైగా జంతువు గా ఉంది తానప్పుడు. గత్యంతరం లేని స్థితిలో అడవిలోకి వెళ్ళి పోతుంది.

జరిగింది చూసిన చిన్న జయద్రధుడికి తండ్రి పథకం అర్థమవుతుంది. వాడు తన తండ్రి గదిలోకి వెళ్ళి అక్కడ వేసి ఉన్న పులిముగ్గుని చెరిపి వేస్తాడు. పెద్ద జయద్రధుడు రాజ సంహారం రం తర్వాత తిరిగి వచ్చి, జరిగింది గ్రహించి నిర్విణ్ణుడవుతాడు. తాను పద్మ రాణిని నిత్య వ్యాఘ్రంగా మారిస్తే , తనను ఇంకెవడో నిత్య వ్యాఘ్రంగా ఉంచేశాడని అర్థమవుతుంది.

అంతటి కఠినుడూ, మాయలమారీ తన దుస్థితి తల్చుని దుఃఖంతో గర్జిస్తాడు. సమయం మించి పోతే తానికి ఎప్పటికీ పులిగా ఉండిపోవలసిందే పద్మరాణి లాగే! మతి పోయి కోపంతో గర్జిస్తున్న తండ్రిని చూసి చిన్న జయద్రధుడికి మెరుపు లా ఒక ఆలోచన వస్తుంది. తోహారు తో పాటు ఆపకుండా తటాకం వైపు పరుగు తీస్తాడు. అతడు చేయదల్చుకున్న పనొక్కటే అతడి తండ్రిని నిత్య వ్యాఘ్రంగా ఉంచెయ్యడానికి మార్గం దొరికించుకోడమే! అతను తోహారుతో కల్సి తటాకం వైపు ఎందుకు పరిగెత్తాడో ఊహించి చూడండి. సమాధానం తెలుస్తుంది. పద్మరాణి ఏమైంది? జయద్రధుడికి ఎదురు పడిందా? పడితే ఏమి జరిగి ఉండొచ్చు?

ఇంతకీ చిన్న జయద్రధుడు చేసిందేమిటి? ఇవన్నీ ఊహించి చూడండి!  ఈ నవల ప్రస్తుతం ఎక్కడా అందుబాటు లో లేదు. మహా అయితే విజయవాడ పాత పుస్తకాల షాపుల్లో దొరుకుతుంది. నాకు అక్కడే దొరికింది.

పావని శాస్త్రి విషయానికొస్తే, ఆయన సహజంగానే హాస్య ప్రియుడు, చమత్కారంగానూ రాస్తారూ కనుక, గ్రాంథికంలోని నవలను అతి సరళమైన తెలుగులోకి అద్భుతంగా మార్చారు .

జయద్రధుడి పాత్ర మొదట మొదట్లో నిజంగా గొప్ప వాడా, లేక దుష్టుడా వీడు అన్న ధోరణి లో కొంత తికమక పెట్టేలా నడుస్తుంది. వాడి ఆహార్యం, వ్యవహారం మొత్తం పులితో పోలిక తో సాగుతుంది. అడవిలో రాజు కి ఎదురు పడినపుడు ఎంతో దర్పంతో లెక్క లేనట్టు ప్రవర్తిస్తాడు. “ఏమోయ్, నేను చంద్ర శేఖర శాతకర్ణిని,ఇటొక పులి వచ్చింది చూశావా?” అని అడిగితే “ఆంధ్ర క్షమా మండల భర్త అయినా, సర్వ భారత చక్రవర్తి అయినా, వాడి బాబైనా తన రాజధానిలో ఉన్నపుడు, సైన్యమూ పరివారమూ వెంట ఉన్నపుడే రాజు, నట్టడవిలో ఏకాకిగా ఉన్నపుడు ఒట్టి మనిషే! రాజువి కదాని ఈ క్షణం లో పంచ భ్యక్ష్య పరమాన్నాలు తినగలవా? వృధాగా ఏమోయ్ గీమోయ్ అని నీ బోడి రాచఠీవి ప్రదర్శించకు” అని దులిపేస్తాడు.

ఆ తర్వాత అదే రాజు “మీ రాజ్యానికి వచ్చి మా రాజకుమారులందరికీ విద్య నేర్పాలన్న కోరిక మీకెందుకు కల్గింది?” అనడిగితే “మీ(ఆంధ్రులు) జాతి వివక్ష లేని జాతి! దేని వెంటబడితే దాని వెంటబడి పోయే జాతి. సృష్టిలోని సర్వ వివేకమూ,సర్వ అవివేకమూ కూడా మీ జాతిలోనే ఉంది” అంటాడు ఎటూ తేల్చకుండా

నవల ప్రారంభం నుంచీ, చివరి వరకూ ప్రతి సూక్ష్మనైన అంశాన్నీ రచయిత ఎంత వివరంగా విశ్లేషించుకుంటూ పోతాడంటే, కథను విజువలైజ్ చేసుకోకుండా చదవలేం!నవల మొదట్లో శ్రీముఖుడూ, తోహారూ కల్సి నది దాటే సన్నివేశం, చివర్లో పులి ముగ్గు వేసి పద్మ రాణిని పులిగా మార్చేటపుడు చిన్న జయద్రధుడు దాన్ని భంగ పరిచే పతాక సన్నివేశమూ ఇందుకు రెండు ఉదాహరణలు.

భవనం డిజైన్ ఎలా ఉంది, ఆ కటిక చీకట్లో జయద్రధుడు ఏ గదిలోంచి ఏ గదిలోకి ఎలా వెళ్ళాడన్నదీ అంగుళం కూడా వదలకుండా వర్ణిస్తూ ఆ చీకటిలోనే వాడితో పాటు మనమూ శ్రమించి ఆ దృశ్యాన్ని మొత్తం గాంచేలా చేస్తాడు రచయిత.

జయద్రధుడు పులిగా మారే విద్యను అభ్యసించాడని తెలుసుకున్న శ్రీముఖుడు అంతకు మించి వివరాలు తీసుకోడు. తను సుశర్మను వధించి రాజునయ్యే ప్రసక్తి లేదని స్పష్టంగా చెప్పేస్తాడు జయద్రధుడికి!అయితే జయద్రధుడు తన రాజ్యానికి వచ్చి రాజుతో పద్మరాణి తో మంతనాలు జరుపుతున్నా, అడవిలో సౌధం నిర్మించి ప్రయోగాలు జరుగుతున్నా శ్రీముఖుడేమయ్యాడో ఆచూకీ ఉండదు. రాజ్య పరిపాలన చూస్తున్నాడనుకోవాలి!

అందుకు సాక్ష్యంగా రచయిత ముందుగానే శ్రీముఖుడి ప్రకృతి గురించి కొంత వివరిస్తారు కూడా! మరెవరి కోసమో వడ్డించిన విస్తరి మీద శ్రీముఖుడికి ఆశ లేదు. దాని కోసం ఇక మరెవరూ రారు, అది తనదే అన్న భరోసా కలిగితే తప్ప దానికేసి చూడనైనా చూడడు అని!

puli1నవల ముగిశాక చివరి మాట గా పావని శాస్త్రి (దీనికి ఆయన “పులి ముగ్గింపు” అని పేరు పెట్టారు) పులిగా మారే విద్య అనేది ఒకప్పుడు నిజంగానే జరిగిందనడానికి  ప్రచారం లో ఉన్న ఒక కథని కూడా చెప్తారు. ఒంగోలు ప్రాంతంలో పెద్ద ఆరకట్ల, చిన్న ఆరకట్ల అనే రెండు గ్రామాల్లో దాదాపు మూడొందల యేళ్ల క్రితం పులిగా మారే విద్య తెలిసిన కుటుంబాలుడేవట. అలాటి కుటుంబాల్లో ఒకాయన కూతురు పురిటికి వచ్చింది. బిడ్డ పుట్టాక తిరిగి భర్తతో అత్తారింటికి వెళ్లే సమయంలో బండి అడవి దారిన పోతుండగా భర్త అడిగాడు “మీ ఇంట్లో పులిగా మారే విద్య తెలుసటగా ? నీకూ తెలుసేంటి?” అని! ఆమె  నోరు జారి “తెలుసు” అన్నది

ఇంకేముంది? ఎలా మారతారో చూపించమని పీకల మీద కూచున్నాడు! ఎంత చెప్పినా వినక ఏం చెప్పినా వినక మారి చూపించక పోతే చస్తానని బెదిరించాడు. పులిగా మారాక నాకు మనిషిననే జ్ఞానం ఉండదన్నా వినిపించుకోలేదు.  విధి లేక  కొంచెం విభూది మంత్రించి ఇచ్చి, పిల్లాడితో చెట్టెక్కి కూచోమనీ, కాసేపయ్యాక విభూది తన మీద చల్లమని చెప్పి పొదల్లోకి వెళ్ళి పులిగా మారి గర్జిస్తూ బయటకు వచ్చింది. ఆయన ఎన్నడూ పులిని గానీ, పులి చేసే హడావుడి గానీ చూసిన వాడు కాదు. హడలి పోయి విభూది సంగతి మర్చిపోవడమే కాక పిల్లాడిని జారవిడిచాడు. పులి కాస్తా పిల్లాడిని నోట కరుచుకుని అడవిలోకి పారి పోయింది.

కొంత సేపయ్యాక చెట్టు దిగి ఏడ్చుకుంటూ మామగారింటికి పోయి ఈ విషయం చెప్పగా మావగారు ,”ఎంత పని చేశావు రా మూర్ఖుడా? పులిగా మారాక ఆహారం స్వీకరిస్తే ఇహ మళ్ళీ మనిషిగా మారే అవకాశం లేదు” అంటూనే అడవికి వచ్చి ఎంత వెదికినా కూతురు పులి కనిపించలేదు. చేసేది లేక అల్లుడిని కూడా పులిగా మార్చి అడవికి పంపాడట. ఇంటికి వచ్చి కూతురి కథ చెప్పి ఇక పైన ఆ విద్య  తాలూకు మంత్రోపదేశం ఎక్కడా ఎవరూ ఎవరికీ  చేయ  కూడదని ఆంక్ష విధించి మరణించాడు. ఈ కథ ఆధారంగానే విశ్వనాథ  పులి ముగ్గు వేశారని పావని శాస్త్రి చెప్తారు. అంతే కాదు, తెలుగులో తొలి “హ్యూమన్ మెంటమార్ఫసిస్ ” నవల ఇదేననీ, తొలి రీటోల్డ్ నవల కూడా ఇదేననీ అంటారు. 1960 లో విశ్వనాథ రాసిన పులి మ్రుగ్గుని పావని శాస్త్రి 1985,86 లో పల్లకి వార పత్రిక కోసం సీరియల్ గా అందించారు.

మనిషి వాస్తవంలో పులిగా మారగలడా లేదా అనేది సత్యం కాక పోయినా, పులుల కంటే  కౄర ప్రవృత్తి గల మనుషుల్ని నిత్యం వార్తల్లో దర్శిస్తూనే ఉన్నాం. జాన పద నవలగా పులి ముగ్గుని హాయిగా ఆస్వాదించవచ్చు

ఇంతకీ, చిన్న జయద్రధుడు, తోహారు కల్సి తటాకం వైపు ఎందుకు పరిగెత్తారో, పెద్ద జయద్రధుడు, పద్మ రాణి ఏమయ్యారో ఊహించారా?

ఊహిస్తే సరే, లేదంటే ఈ నవల PDF చేసి పంచక తప్పేట్టు లేదు!

*

 

 

 

 

 

 

ఒక మామూలు అమ్మాయి అమామూలు కథ!

 

లోగో: భవాని ఫణి

లోగో: భవాని ఫణి

 

నవలా రచయిత్రి గా దశాబ్దాల తరబడి నిలిచి ఉండటం ఎంతటి గొప్ప విజయం? అభిమానులు పాఠకుల్లోంచి ప్రేక్షకుల్లోకి కూడా చేరడం, ఎప్పుడు ఆమె నవల సినిమాగా వస్తుందా అని ఎదురు చూడ్డం, తీస్తే సినిమాగా ఆమె నవలే  తీయాలని టాప్ నిర్మాతలు తహ తహ లాడటం, ఈ విజయాలన్నీ ఆరెకపూడి కౌసల్యా దేవి కీ, యద్దనపూడి సులోచనా రాణి కే సొంతం!  సినిమాగా తీసిన ఒక్కొక్క నవలా సూపర్ హిట్టే తప్ప మరో మాట లేదు. అలాటి నవలల్లో నవల గానూ సినిమాగానూ సూపర్ హిట్ అయింది “మీనా”

మీనా పట్నంలో పెరిగిన ఒక సహృదయ! డబ్బులో పుట్టి పెరిగినా , డబ్బు గర్వం అంటని మంచి వ్యక్తిత్వం ఉన్న అమ్మాయి. అప్పట్లో మీనా లాంటి అమ్మాయిలు చాలా మంది. మీనాలో తమని చూసుకున్న ఎంతో మంది స్త్రీలు మీనా ని ఇంట్లో కూడా చూసుకోవాలనుకున్నారు ! మీనా నవల సీరియల్ గా వస్తున్నపుడు తెలుగిళ్ళలో పుట్టిన ఆడపిల్లల్లో చాలా మంది మీనాలున్నారు!! అలాటి ముద్ర వేసింది మీనా.

నిజానికి ఈ నవల గురించి, సినిమా గురించి కలిపి రాద్దామని నవల చదువుతున్నపుడు (నిజంగా నేను మీనా నవల ఇంతకు ముందు చదవలేదు నేను.  తెలుగు సాహిత్యం నాకు డైరెక్ట్ గా కుటుంబరావు , చలం, రంగనాయకమ్మ , చాసో లతో పరిచయం కావడం తో నేను యద్దనపూడి నవలలు ఆసక్తి గా ఎప్పుడూ చదవలేదు. చదివిన నవలల సంఖ్య కూడా స్వల్పమే! )మీనా గురించి వినడమే తప్ప చదవలేదు కాబట్టి అంత హిట్ ఎందుకయిందో తెలుసుకోవాలని, దాని గురించి రాయాలని చదివాను. రాద్దాం అని మొదలు పెట్టబోతుండగా త్రివిక్రం సినిమా విడుదల!

అ ఆ !

మీనా మీనా మీనా అని ప్రేక్షక లోకమంతా గగ్గోలెత్తి పోయింది. యూ ట్యూబ్ లో మీనా సినిమాని వెదికి చూసిన వాళ్ల సంఖ్య రెండు వారాల్లోనే లక్ష దాటిందట.

meena-1

ఈ హడావుడి అంతా తగ్గాక, ఫ్రెష్ గా ఇంకో సారి నవలనీ సినిమానీ తల్చుకోడం బావుంటుందని వాయిదా వేస్తే ఇన్నాళ్లకు కుదిరింది.

రచయిత్రిగా యద్దనపూడి పాఠకుల నాడి ఎలా పట్టుకున్నారో, దర్శకురాలిగా విజయనిర్మల కూడా సగటు ప్రేక్షకుల నాడి అలాగే పట్టుకున్నారనిపిస్తుంది చాలా సినిమాల విషయంలో! మీనా,కవిత వంటివి అలాటి సినిమాలే!

మీనా కథ కాంప్లెక్స్ కాదు. డబ్బు తేడాలతో, తద్వారా పుట్టిన అపార్థాలతో విడి పోయిన రెండు కుటుంబాలను కలపడానికి ప్రయత్నించే అమ్మాయి కథ! మీనా అందం సంగతి కూడా పెద్దగా వర్ణన ఉండదు నవల్లో! చదువు లో అంతంత మాత్రమే అని, కళలూ గిళలకు అంటని సగటు తెలుగమ్మాయని నవల్లోనే చెప్పేస్తారు రచయిత్రి.   మీనా తండ్రి ఏకంగా “మంచి గృహిణి కావడం తప్ప మీనా పారేందుకూ పనికి రాదు ” అని ప్రకటిస్తాడు కూడా ! డబ్బున్నా, దాని తాలూకు హంగులకు అంటని అమ్మాయిగా మీనాని రచయిత్రి ఎంతో సింపుల్ గా చూపిస్తారు. తల్లి అతిశయం అంతక పోవడం అటుంచి , మీనాకు పిరికితనం, టెన్స్ కాగానే గోళ్లు కొరకడం , సర్కిల్ ఉన్నా , సోషల్ గా మూవీ అవలేక పోవడం ఇలాటి లక్షణాలు అదనం ! మీనా రాసి దశాబ్దాలు గడిచి పోయాయి కాబట్టి , ఆనాటికి ఇవన్నీ పెద్దగా చెప్పుకోదగ్గ అవలక్షణాలు కాదు! నిజానికి ఇలాటి లక్షణాలు గల అమ్మాయిలకు కాల మాన పరిస్థితులతో సమబంధం లేదు. సున్నితమైన మనస్తత్వం గల అమ్మాయిలకు ఏ కాలం లో అయినా కొదవేముంది?

ప్రారంభం లో మీనా తల్లి డబ్బు గర్వం గురిచి ముందు కొంత వర్ణన, అందుకు తగ్గ వాతావరణం నవలలో కనిపిస్తుంది. కానీ సినిమా నవలకు కీలక ఘట్టమైన ప్రయాణం తో మొదలవుతుంది. మీనా తల్లి డార్జిలింగ్ ప్రయాణం కావడం! ఆ సమయంలోనే తమ ఇంటికి రాబోతున్న సారథిని తప్పించుకునేందుకు మీనా మేనత్త వూరుకు ప్రయాణం కావడం తో కథ మొదలు!

meena-2

అక్కడి పల్లె వాతావరణం తోనూ, ఆ మనుషుల మనసులతోనూ మీనా ప్రేమలో పడటం , వాళ్లని చూశాక తన ఇంటి వాతావరణం మరింత దుర్భరంగా తోచడం, వాళ్లమ్మ తెచ్చిన సారధిని ఇష్టపడలేక పోవడం, మేనత్త కొడుకును ఇష్ట పడటం, అతనికి కొన్ని కమిట్మెంట్స్ తో అంతకు ముందే వేరే పిల్లతో పెళ్ళి నిశ్చయం కావడం, అనుకోకుండా మీనా వల్ల ఇటు రాజీ పెళ్ళి, అటు కృష్ణ పెళ్ళి కూడా కాన్సిల్ కావడం, రాజీని మీనా ఇంటికి తీసుకు రావడం, సారధికి పల్లెటూరి రాజీ నచ్చడం, మధ్యలో అనేక మలుపులు, తల్లికి చెప్పకుండా మీనా ఇంట్లోంచి వెళ్ళి పోయి కృష్ణను గుళ్ళో పెళ్ళి చేసుకోవడం, అహంకారపు తల్లిని పల్లె బంధువులు ప్రేమతో గెలవడం.. !

మీనా నవల గా వచ్చాక ఎన్ని ముద్రణలు పడిందో రచయిత్రి కే గుర్తు లేదట, ముందు మాట లో చెప్తారు.మీనా 1968 జులై నెల నుంచి యువ మంత్లీ లో సీరియల్ గా మొదలై 1971 అక్టోబర్ లో ముగిసింది.అంటే మూడేళ్ళ మూడు నెలలు! కథంతా  సంఘటనల సమాహారంగా సాగుతూ పోయినా, అప్పటి ట్రెండ్ ప్రకారం అది ఓకే కాబట్టీ, నెలకోసారి వచ్చే సీరియల్ కాబట్టీ పాఠకులు మీనా ని విపరీతంగా ఆదరించారు. నెల నెలా యువ కోసం కళ్ళు కాయలు కాచేలా ఎదురు చూశారట అప్పట్లో! మీనాతో చాలా మంది అమ్మాయిలు బాగా కనెక్ట్ అయిపోయారన్నమాట అప్పుడు! తన నవల మీద తన అభిప్రాయాలని తెలిపే ఒక కాలం లో యద్దనపూడి మీనా గురించి తానే ఆశ్చర్యపోతూ రాశారు. “మీనాని ప్రత్యేక లక్షణాలున్న ఒక అమ్మాయిగా సృష్టించాను అనుకున్నాను కానీ, యువలో సీరియల్ గా వస్తున్నపుడు అమ్మల వయసులో ఉన్న వాళ్ళు కూడా ఎవరికి వాళ్లు మీనాలో తమను చూసుకున్నారు.” అని చెప్తారు. మీనా నవల సమయంలో మీనా వయసులో ఉండి, తల్లి లో కృష్ణ వేణమ్మని చూస్తూ , తల్లిని విసుక్కున్న ఒకమ్మాయి, ఇన్నాళ్ల తర్వాత తాను కూడ ఇప్పుడు తన కూతురి పట్ల అతి జాగ్రత్త తో కృష్ణ వేణమ్మ లాగే ప్రవర్తిస్తున్నానని తనతో చెప్పుకున్న సంగతిని కూడా సులోచనా రాణి ప్రస్తావిస్తారు.

meena3

ఈ నవల్లో కథ పక్కన పెట్టి, మీనా ని యద్దన పూడి చాలా ప్రత్యేకంగా సృష్టించారనే చెప్పాలి.  మిగతా నవలల్లో హీరోయిన్ల మల్లే మీనా అద్భుత సౌందర్యం, అంతులేని ఆత్మ విశ్వాసం, అహంకారం ఇలాటి లక్షణాలేవీ లేని మామూలు అమ్మాయి. బోల్డు డబ్బున్నా,  సోషల్ సర్కిల్ ఉన్నా స్నేహితులుండరు, ఏ యాక్టివిటీ మీద పెద్దగా ఆసక్తి చూపించదు.  సారథి లాంటి హై ప్రొఫైల్ వ్యక్తి ముందు తను తేలి పోతానని , తనకంత తెలివి తేటలు లేవని భయపడుతూ, టెన్షన్ రాగానే గోళ్ళు కొరుకుతూ, తల్లికి  విపరీతంగా భయపడుతూ  పిరికి గా ఉండే మీనా చివర్లో సంబంధాలు నిలబెట్టుకోవడం కోసం, ప్రేమ కోసం , తల్లికి చెప్పకుండా గుళ్ళో పెళ్ళి చేసుకునే నిర్ణయం వరకూ ఎదుగుతుంది. మార్పు చెందుతుంది. ఈ పరిణామ క్రమం అంతా జరగడానికి సమయం పట్టినా మీనా , తనకు ఎదురైన కష్టాల్ని సమర్థంగా ఎదుర్కొని, అన్నీ ఒక కొలిక్కి తెస్తుంది.

నవల 71 లో ముగియగానే సినిమా మొదలై 1973 లో విడుదల. ఆ తర్వాత మీనా ఎన్ని ఎడిషన్లు పడినా మీనా అంటే విజయనిర్మల తప్ప మరొక విధంగా ఊహించుకునే అవకాశమే లేకుండా పోయింది పాఠకులకి. అంత గా ఆ పాత్రలో అమరి పోయింది విజయనిర్మల.

సీరియల్ ముగిసిన వెంటనే కొందరు పాఠకులు “ఇది తప్పకుండా ఎవరో ఒక్ నిర్మాత తీసుకుని సినిమా గా తీసేస్తా” రనే భరోసాతో యువ కి ఉత్తరాలు కూడా రాశారు.  చాలా మంది విచార పడి పోయారు సీరియల్ ముగిసి పోయిందని.

meena-4

ముందు మాటలో సులోచనారాణి ఇలా అంటారు “నాకు చాలా ఆశ్చర్యం వేసేది ఒకటే! విలువలు నశించాయి, మార్పులు వచ్చేశాయి అని అందరూ తల్లడిల్లుతున్న ఈ కాలంలో కూడా నాలుగున్నర దశాబ్దాల కాలం నాటి మన కుటుంబాలు పట్టుదలలు, కోపాలు, త్యాగాలు ప్రతిబింబించే మీనా నవలను ఇప్పటికీ పాఠకులు అభిమానిస్తున్నారంటే ఆ విలువల్ని ఆ విలువల్ని ప్రేమించేవాళ్ళు ఇంకా మనలో ఉన్నారన్నమాటే” అని!

నిజానికి ఆ విలువల్ని ప్రేమించే వారు ఏ తరంలోనూ పూర్తిగా లేకుండా పోరు. ఎందుకంటే అవన్నీ మానవ ప్రవృత్తి లో ఓక భాగం! ప్రదేశాలు, బాక్ డ్రాప్ లు మారతాయి తప్పించి, కోపతాపాలు, త్యాగాలు , అభిమానాలు ఇవనీ ఎప్పుడూ సమాజంలో, మానవ జీవితంలో అవిభాజ్యాలే!

అందుకే అ ఆ సినిమా , మీనాకి రీ మేక్ అన్న టాక్ రాగానే మీనా నవల కావాలని పుస్తకాల షాపుల్లో పాఠకులు అడిగారని ఈ మధ్య తెలిసింది. నా దగ్గర పి డి ఎఫ్ వెర్షన్ ఉందా అని కూడా కొంతమంది వాకబు చేశారు. ఆ అభిమానాలు త్యాగాలు ఈనాటి త్రివిక్రం ఎలా కమర్షియలైజ్ చేసి చూపాడో చూశాక, ఈ తరం ప్రేక్షకులు సైతం ఆ నాటి విజయ నిర్మల వీటన్నిటినీ ఎలా చిత్రించిందో, (అదీ దర్శకురాలిగా ఆమె మొదటి సినిమాలో) చూడాలనే ఉత్సుకతతో యూ ట్యూబ్ లో చూశారు. కొత్త సినిమాలు తప్ప పాత బ్లాక్ అండ్ వైట్ సినిమాల జోలికి పోని 18+ ప్రేక్షుకుల్ని కొందరిని (అమ్మాయిలు అబ్బాయిలు ఇద్దర్నీ) మీనా ఎలా ఉందని అడిగితే ” చాలా సింపుల్ గా, అనవసరమైన హడావుడి లేకుండా ఉందనీ, మనుషులు ఎంత్ సింపుల్ గా బతకొచ్చో, బతికేవారో ఆ సినిమా చూస్తుంటే అర్థమైందనీ అన్నారు. ముఖ్యంగా, మీనా పాటలు వాళ్ళకి భలే నచ్చాయి. శ్రీరామ నామాలు, మల్లె తీగ వంటిది మగువ జీవితం,పెళ్ళంటే నూరేళ్ళ పంట పాటలు! “పెళ్ళంటే నూరేళ్ళ పంట , సడన్ గా మొదలయ్యే ఆ సీక్వెన్స్ చాలా టచింగ్ గా ఉంది” అని అమ్మాయిలు ఆ సీక్వెన్స్ ని అభిమానించారు.

meena5

నిజానికి నవల సినిమాగా మారినపుడు , నవల లో ఉండే డెప్త్ కొంత పలచబడటం ఖాయం. ఈ విషయం గురించి కొందరు రచయిత్రులు రాసిన అభిప్రాయాల వ్యాసం ఒకటి (విజయచిత్ర లోది) చదివాను(ఎవరికైనా కావాలంటే షేర్ చేస్తాను). అందులో ఆరెకపూడి కౌసల్యా దేవి తన నవలలు సినిమాగా తీసినపుడు కొన్ని సార్లు పాత్రల స్వభావాలే పూర్తిగా మారి పోయాయని బాధ పడ్డారు. మీనా సినిమా గురించి యద్దన పూడి సులోచనా రాణి తన అభిప్రాయాన్ని చెప్పలేదు గానీ, మాదిరెడ్డి సులోచన మాత్రం మీనా ని నవల చెడకుండా తీశారని, హిందీలో పరిణీత, గబన్ సినిమాలు ఎంత ఎఫెక్టివ్ గా తీశారో, అంత ఎఫెక్టివ్ గానూ మీనా సినిమా రూపు దిద్దుకుందని అన్నారు. నిజానికి నవల లో సాగదీసినట్టుండే సంభాషణలు, మనోభావాల విశ్లేషణా ఇవన్నీ ఏ నవల సినిమాగా మారినా ఎగిరి పోయి సినిమా నిడివి కి తగ్గట్టు దృశ్య రూపం లోకి మారి క్లుప్తతను  సంతరించుకుంటాయి. ఆ పని ని విజయనిర్మల చాలా చక్కగా చేసింది! నిజానికి మీనా నవల్లో ఈ తరానికి బోరింగ్ గా అనిపించే సీక్వెన్స్ లు చాలా ఉంటాయి. వాటిలో ముఖ్యమైనవాటిని ఏరుకుని, స్క్రీన్ ప్లే ని రూపొందించడం ఆమెకు సులభంగానే తోచి ఉండాలి.

మొత్తం మీద, మీనా ని అసాధారణమైన లక్షణాలున్న సాధారణమైన అమ్మాయిగా చెప్పుకుంటే చక్కగా సరి పోతుంది.

*

 

 

 

 

 

 

 

నిషేధంతో వెలిగిన ‘మరీచిక’                 

                                                                                    

 

“ఈ పుస్తకం ఎవరూ చదవడానికి వీల్లేదు” అని ఒక పుస్తకాన్ని ప్రభుత్వం నిషేధించడం, చాలా అస్తవ్యస్తమైన సమాజంలో జరిగే పనిలా కనిపిస్తుందా లేదా? ఈ పుస్తకం చదవడానికి వీల్లేదు, నువ్విలా రాయడానికి వీల్లేదు, ఈ సినిమా నువ్వు చూడ్డానికి వీల్లేదు, ఈ సినిమా నలుగురిలోకీ రావడానికి వీల్లేదు___________ఈ ధోరణి నిరంకుశమే కాదు, ఇది పాఠకుల, ప్రేక్షకులను వ్యక్తిగతంగా వారి ఆలోచనా శక్తిని అవమానించే ధోరణి కూడా! ఏ సమాజంలో అయినా సరే –

మరీచిక నవలని అలాగే ఆంధ్ర ప్రదేశ్  ప్రభుత్వం ఆరునెల్ల పాటు నిషేధించింది. ఎప్పుడో మాల పల్లి నవల తర్వాత కొన్ని దశాబ్దాలకు ప్రభుత్వ ఆగ్రహానికి ఆ పైన నిషేధానికి గురైన తెలుగు నవల.

ఇది కాలేజీలో ఉండగా చదివినపుడు దీన్ని ఎందుకు నిషేధించారో బొత్తిగా అర్థం కాలేదు. ఇందులో అంతగా రక్తాన్ని మండించి నక్సలైట్లలోకో, లేక హిప్పీల్లోకో తోసి అటేపు పరిగెత్తించే అంశాలేవీ కనిపించలేదు, 90 లలోని పరిస్థితుల ప్రకారం !  కానీ నవలా కాలం 1978 కాబట్టి అప్పటి సాంఘిక  వాతావరణం ప్రకారం దీన్ని అర్థం చేసుకోవాలి

సాంఘిక సమస్యల గురించి రాసి, తద్వారా ఆ నవల నిషేధానికి గురవడం వల్ల వాసిరెడ్డి సీతాదేవి ఒక ప్రత్యేక గౌరవాన్ని పొందినట్టే! ఆ సమయంలో ఆమెకు పాఠకులు, ప్రజా సంఘాల మద్దతు పుష్కలంగా లభించింది. మహా కవి నుంచి మామూలు పాఠకుడి వరకూ అఖిల భారత స్థాయిలో సీతాదేవి కి తోడుగా నిలబడి గొంతెత్తారు.

అసలింతకీ మరీచిక ను ఎందుకు నిషేధించినట్టు? అందులో అంత నిషేధించాల్సిన అంశాలేమున్నాయి? ఎవరిని ఏ వైపుగా ప్రేరేపించగలిగి ఉండేదని ప్రభుత్వం భావించింది? సవాలు చేసిన సీతాదేవి కి కోర్టులో ఏం దొరికింది? నిషేధమేమైంది?

ఈ నవల ప్రారంభానికి ముందు సీతాదేవి ఇది ఇంత సంచలనం సృష్టిస్తుందని ఊహించి ఉండరు బహుశా! రెండు కుటుంబాలకు చెందిన ఇద్దరు అమ్మాయిల రెండు కథల కథ ఇది. బాగా డబ్బున్న కుటుంబం  నుంచి వచ్చిన శబరి, పట్టుమని పద్ధెనిమిదేళ్లు కూడా నిండని పసిది. డబ్బులో పుట్టి డబ్బులో  పెరగడం వల్ల సామాన్యమైన జీవితం ఎలా ఉంటుందో,ఆకలి ఎలా ఉంటుందో, కష్టం ఎలా ఉంటుందో,శ్రమ ఎలా ఉంటుందో  అనుభవం లోకి రాని  సుకుమారి . బాధ, కనీసం ఆకలి, అవసరం   ఎలా ఉంటాయో చవి చూడాలని, డబ్బు, నగలు, విలాసాలతో నిండి కుళ్ళి రొటీన్ కంపు కొడుతున్న జీవితం నుంచి బయట పడాలని అమాయకంగా ప్రయత్నించే అమ్మాయి. మరో వైపు ఆమె స్నేహితురాలు మిడిల్ క్లాస్ జ్యోతి,వ్యవస్థను నిశితంగా పరిశీలిస్తూ, ఆలోచనలన్నీ విప్లవోద్యమాల వైపు పయనిస్తుంటే, అటు వైపు మళ్ళే దారిలో ఉంటుంది.

లోకాన్ని పూర్తిగా అర్థం చేసుకోలేని శబరి కి డబ్బు పిచ్చిలో పడి కొట్టుకునే తల్లిదండ్రులు! తెలిసిన వాళ్ళలో బాగా డబ్బున కుర్రాడిని చూసి వాడికి శబరిని ఇచ్చి పెళ్ళి చేసేయాలనే తొందరలో ఉంటారు తప్ప కూతురు కాలేజీలో ఏం చదువుతోందో కూడా పట్టించుకునే ఆసక్తి  ఉండదు వాళ్లకి . వాడంటే శబరికి ఏ ఇంటరెస్టూ ఉండదు. ఎప్పుడూ చెదరని బట్టల్లో, ఖరీదైన అలంకరణలో డబ్బుకు ప్రతీక గా కనపడే అతడంటే శబరికి చీదర.

ఆ పిల్ల సర్కిల్లో ఎటు చూసినా డబ్బు, దాని వల్ల వచ్చే విలాసాలు , డబ్బులో పొర్లే మనుషులూ! వీటన్నిటికీ దూరంగా వేరే జీవితం, మామూలుగా హాయిగా, హడావుడి లేని జీవితం కావాలి! ఉక్కిరికి బిక్కిరి చేసే ఈ డబ్బు లేకుండా హాయిగా ఊపిరి పీల్చుకునే వెసులుబాటు కావాలి. అది ఎక్కడ దొరుకుతుందో తెలీదు. ఎవరి దగ్గరికి పోతే దొరుకుతుందో తెలీదు.

ఎటూ కాని వయసులో ఉన్న పిల్లలు ఎలాటి పరిస్థితుల్లో బురదలో అడుగేస్తారో సరిగ్గా, శబరి కోసం కూడా అలాటి అవకాశం ఒకటి వెదుక్కుంటూ వస్తుంది. కాలేజీ నుంచి కార్లో ఇంటికి వస్తూ, దార్లో మత్తులో పడి పిచ్చి పిచ్చి గా ప్రవర్తిస్తున్న ఇద్దరు యువతీ యువకుల్ని చూస్తుంది. ఒంటి మీద బట్టలూ, సరైన స్పృహా రెండూ ఉండవు వాళ్ళిద్దరికీ!

తెలీని ఉత్సుకతతో వాళ్లతో మాట్లాడ్డానికి ప్రయత్నిస్తే వాళ్ళు మత్తుతో ఏవేవో మాట్లాడ్డమే కాక కాక ఇంకో సారి రమ్మని, స్వర్గానికి తీసుకుపోతామని చెప్తారు. ఫలితంగా మరో సారి వాళ్ల దగ్గరికి వెళ్ళి మొదటి సారిగా LSD టాబ్లెట్ వేసుకుని మాదక ద్రవ్యం అనుభవాన్ని చవి చూస్తుంది. . శబరిని తమ హిప్పీ గ్రూప్ లోకి లాగాలనే వాళ్ల ప్రయత్నం సఫలమవుతుంది.  పెళ్ళి కొద్ది రోజుల్లో ఉందనగా, శబరి నగలు డబ్బు తీసుకుని జాన్ అనే హిప్పి తో పారి పోతుంది. పోయే ముందు “తాను ఆత్మ హత్య చేసుకుంటున్నాని”ఉత్తరం  రాసి పెట్టి,కట్టుకున్న చీర చెప్పులు కాలవొడ్డున విడిచి పోతుంది.

లోగో: భవాని ఫణి

లోగో: భవాని ఫణి

ఆ తర్వాత గుర్తు తెలీని శవమేదో కుళ్ళి పోయి దొరికితే అదే శబరి అనుకుని సంస్కారాలు చేస్తారు కుంగి పోయిన ఆ తల్లి దండ్రులు! (హిప్పీల వ్యవహారం కొంత తీవ్రంగానే ఉండుండాలి నవలా కాలం లో). బాంబే లో రోడ్ల వెంట పిచ్చి వాళ్లలా ఒంటి మీద స్పృహ లేకుండా తిరిగే హిప్పీలను,వాళ్లలో రకాలని చూసి తెల్సుకుని భయపడి పోతుంది. తప్పటడుగు వేశానని గ్రహిస్తుంది.  ఇంటికెళ్ళి పోతానని ఏడుస్తుంది. పోనివ్వరు వాళ్ళు . కానీ అలా ఏడ్చి గొడవ చేసినపుడల్లా ఒక మత్తు టాబ్లెట్టో పాకెట్టో ఇచ్చి ఆ పిల్లను మత్తులోకి తోసి అక్కడే ఉంచేస్తారు వాళ్ళు.

మరో పక్క జ్యోతి, సమాజంలో అసమానతలను  చూస్తూ భరించలేక వాటిని రూపు మాపడానికి ఏదో ఒకటి చేయాలనుకుంటుంది. శబరి తో హిప్పీలను కలవడానికి వెళ్ళినపుడు , తన వాదనతో వాళ్లని మార్చి తన మార్గం వైపు తీసుకురావాలనుకుంటుంది. అది సాధ్యం కాక తిరిగి వచ్చ్చేస్తుంది. కొన్నాళ్ళకి , విప్లవోద్యమం వైపు వెళ్ళక తప్పదని నిశ్చయించుకుని, తను నక్సలైట్లలో చేరుతున్నానని తండ్రికి ఉత్తరం రాసి పెట్టి వెళ్లి పోయి ఉద్యమంలో చేరుతుంది.

నెమ్మదిగా అక్కడి కఠిన జీవితానికి అలవాటు పడుతుంది. ఎవడో ఒక భూకామందుని చంపే ఆపరేషన్ లో అవకాశం పొంది సత్యం అనే తన సహ నక్సలైట్ తో కల్సి వెళ్తుంది. కానీ ఆపరేషన్ ఫెయిలై పోలీసుల కాల్పుల్లో సత్యం గాయపడతాడు.అతడిని తీసుకుని కొండల్లో పడి పారి పోతుంది. అలా మైళ్ళ కొద్దీ నడిచాక, పోలీసులు దరి దాపుల్లోనే కనిపిస్తారు కొండ మలుపులో! ఇక తప్పించుకోవడం అసాధ్యమని గ్రహించి సత్యం , ఆమెను వెళ్ళిపొమ్మని తను పోలీసులు చేతిలో మరణిస్తాడు. జ్యోతి అడవి దాటి గ్రామంలో అడుగు పెట్టడం తో కథ సమాప్తం!

నవల నిషేధానికి గురి కాకపోయి ఉంటే, ప్రభుత్వం దృష్టితో చూసినా  పాఠకులకు ఇందులో నిషేధించాల్సిన తీవ్రమైన అంశాలున్నాయని తోచదు. అయితే 1978-82నాటి సాంఘిక వాతావరణాన్ని బట్టి ఈ నవలను దాని నిషేధాన్ని చూడాలి కాబట్టి, ఇప్పటి ధోరణుల్ని బట్టి అంచనా వేయడం కష్టమే! నవల విడుదల అయ్యాక ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం 1982 ఫిబ్రవరిలో నిషేధం విధించగా, ఆర్నెల్ల తర్వాత 1982 ఆగస్ట్ 10 న హైకోర్టు ధర్మాసనం నవలపై నిషేధం చెల్లదని తీర్పు ఇచ్చింది. కట్లు తెంచుకుని మరీచిక మళ్ళీ స్వేచ్చగా  రెక్కలు విదుల్చుకుని  బయటికి వచ్చింది. ఈ ఆర్నెల్ల  కాలం లో  పౌర హక్కుల సంఘాలే కాక సామాన్య పాఠకులు, ప్రజాస్వామిక వాదులు, పాఠకులు ఎందరో మరీచిక ను విడుదల చేయాలని నిరసనలు చేశారు. అరసం, విరసం,విశ్వసాహితి, జనసాహితి,హిందీ లేఖక్ సంఘ్,వంటి సంస్థలన్నీ సీతాదేవికి సంఘీభావాన్ని ప్రకటించాయి. సహజంగానే నిషేధం ఎత్తి వేశాక పుస్తకం కోసం పాఠకులు ఎగబడ్డారు.అంతకు ముందు పెద్దగా పట్టించుకోని వారు సైతం కొని చదవడం తో అమ్మకాలు ఒక్కసారిగా పెరిగాయి.

బోయి భీమన్న, శ్రీ శ్రీ, కె. రామ లక్ష్మి,కన్నాభిరన్ వంటి పలువురు ప్రముఖులు నిషేధం పై, పోలీసు వైఖరి పై తీవ్ర వ్యాఖ్యలతో నిరసన వ్యక్తం చేశారు

ఈ నవల్లో నక్సలిజం  పట్ల సీతాదేవి అటు సానుభూతి గానీ, ఇటు వ్యతిరేకత గానీ, ప్రకటించినట్లు స్పష్టంగా ఏమీ కనిపించదు. నవల చివర్లో జ్యోతిని గ్రామం వైపు వెళ్ళిపొమ్మని సత్యం బలై పోతాడు. జ్యోతి గ్రామం వైపు వెళ్ళింది అంటే జన జీవన స్రవంతి లో కలవడానికి వెళ్ళిందని అర్థం కాదు.పైగా నవల ముందు మాటలో సీతాదేవి “జ్యోతి ప్రజా జీవనాన్ని ఊపిరిగా పీలుస్తూ, రైతు కూలీల మధ్య ఉండే ఉంటుందనే అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తారు. అంతే కాక జ్యోతి పాత్రతో మరో నవల రాస్తానని కూడా పాఠకులకు మాట ఇచ్చారు. నక్సలిజం వైపు మళ్ళేటపుడు, దుందుడుకు స్వభావంతో తాత్కాలికావేశంతో నిర్ణయాలు తీసుకోడం పనికి రాదనే సందేశం మాత్రం అందుతుంది.

వర్గ శత్రువులను హత్యలు చేయడం ద్వారా నవ సమాజం నిర్మాణం జరగదని, ఒకడు చస్తే వేల మంది పుట్టుకొస్తూనే ఉంటారని, క్షేత్ర స్థాయిలో ప్రక్షాళన జరగాలనీ జ్యోతికి వచ్చిన కల ద్వారా రచయిత్రి సూచిస్తారు. ఈ కలలో జ్యోతి తన గ్రూప్ తో కల్సి భూషయ్యను చంపడానికి వెళ్తుంది. స్వయంగా జ్యోతే వాడి తల  నరికి పారేస్తుంది. అయితే ఆ తెగి పడిన తల జ్యోతితో మాట్లాడుతుంది.”నన్ను చంపావు సరే, నా కొడుకున్నాడు గా. వాడు కూడా రేపు నాలాగే భూస్వామే అవుతాడు.నువ్విప్పుడు దోచుకెళ్ళే డబ్బుని వాడు ఏడాది తిరక్కుండానే మళ్ళీ సంపాదిస్తాడు” అని ఎద్దేవా చేస్తూ, వ్యవస్థ లో మార్పు రానంత వరకూ వ్యక్తిగత హత్యల వల్ల ప్రయోజనం లేదని కథానాయిక కు క్లాస్ తీసుకుంటుంది.

ఆరుద్ర ఈ నవల కు ముందుమాట గా రాసిన వ్యాసంలో “సీతాదేవి కి నక్సలిజం  పై ఎంత సానుభూతి ఉన్నా, ఆమె దానికి సంపూర్ణంగా వ్యతిరేకి” అని, “నక్సలిజం  వైఫల్యాన్ని ఆమె సంపూర్ణంగా నవల్లో చిత్రించారు” అనీ అంటారు.. ఒక ఆపరేషన్ విఫలమైతేనో, ఒక సత్యం మరణిస్తేనో నక్సలిజం  విఫలమైనట్టు కాదని, జ్యోతి తిరిగి గ్రామం వైపు నడవడం ద్వారా రచయిత్రి సూచిస్తారు.  కానీ ఒక ఇంటర్వ్యూలో స్వయంగా వాసి రెడ్డి సీతాదేవే నవల నక్సలిజం వైఫల్యాన్నే చర్చిస్తుందని అంగీకరించారు. నవల లోని నిషేధిత భాగాలు ఏ విధంగా యువతను నక్సలిజం వైపుగా ఏ విధంగా ప్రేరేపిస్తాయనే విషయాన్ని నిషేధించేటపుడు ప్రభుత్వం ప్రజలకు వివరించాలని ఆమె ఆభిప్రాయ పడ్డారు.

Vasireddy_sithadevi

ప్రభుత్వం నిషేధించిన పేజీల్లో మాత్రం కొంత చర్చ, సంభాషణల రూపం లో నడుస్తుంది.  ఆ పేజీల్లో అప్పుడు వార్తా పత్రికల్లో రోజూ నడుస్తున్న భూస్వాముల హత్యలూ, గిరిజనుల ఆక్రోశాలూ, వాటి మీద రఘురాం, మూర్తి, సతీష్ పాత్రల మధ్య సంభాషణలున్నాయి.యువతీయువకులు అటువైపు ఆకర్షితులు కావడానికి ఏ యే అంశాలు ఆలోచనలు రేకెత్తిస్తాయో, వారి రక్తాన్ని ఉరకలు పెట్టించే అంశాలేంటో సతీష్ చేత చెప్పిస్తారు రచయిత్రి. ప్రభుత్వాన్ని కలవర పెట్టిన అంశాలివే అప్పట్లో!  ఆ నాడు ఉనికిలో ఉన్న సాంఘిక పరిస్థితుల మూలాన ఆ సంభాషణ యువతను చెడు దారి పట్టించేలా ఉందని ప్రభుత్వం భావించిందన్నమాట.

ఆరుద్ర ఒక వాలిడ్ పాయింట్ లేవనెత్తారు. ఈ నవల్లో హిప్పీల జీవితాలు, వాళ్ళు వాడే మాదక ద్రవ్యాల వివరాలు, వాటి పేర్లు మొత్తం వివరిస్తారు రచయిత్రి. “ప్రభుత్వానికి హిప్పీ పిల్ల కథ గురించి ప్రభుత్వం వారికి ఏ విధమైన అభ్యంతరం లేదని వారు ఉటంకించిన పేజీల సంఖ్య చూస్తే తెలుస్తుంది. సాంఘిక దురన్యాయాలకు ఎదురొడ్డి పోరాడాల్సిన యువత హిప్పీలలో చేరి క్షీణించి పోతే పాలకవర్గీయులకు పబ్బమే! ఎటొచ్చీ విప్లవకారులైతేనే తంటా” అంటారు . ఈ నవల రాస్తున్నపుడు సీతాదేవి ఆంధ్ర ప్రదేశ్ యువజన సర్వీసుల విభాగంలో డైరెక్టర్ స్థాయిలో ఉన్నతోద్యోగిగా ఉన్నారు. డిపార్ట్మెంటల్ గొడవలకు ఆమె సాహిత్య శిశువును బలి చేయడం తగదని రాస్తూ ఆరుద్ర ఈ నవల నిషేధానికి ఇతరత్రా కారణాలున్నాయనే హింట్ కూడా ఇచ్చారు

ఈ నవల్లో మొత్తం అక్కడక్కడా 20 పేజీల్లో అభ్యంతర కర విషయాలున్నాయని పేర్కొంటూ ప్రభుత్వం దాన్ని నిషేధించింది. ఏ యే  పేజీలు అభ్యంతరకరమో గవర్నమెంట్ గెజిట్ ఆర్డర్ లో వివరంగా ఆ పేజీలు ప్రింట్ చేసి మరీ ఇచ్చారని విన్నాను. అంటే నవల నిషేధంలో ఉన్నా, ఆ నిషేధించిన పేజీల్లో ఏముందో ప్రభుత్వ గెజిట్ చూసి చదివి తెలుసుకోవచ్చన్నమాట! ప్రభుత్వ గెజిట్ అందరికీ అందుబాటులోనే ఉంటుంది :-) ! అలా ఉంటాయన్నమాట నిషేధాల ప్రహసనాలు !

ప్రశ్నించిన వాళ్ళని, గొంతెత్తిన వాళ్లని నిషేధించడం, నిర్మూలించడం చరిత్రలో ఎంత సహజమో నిషేధం పట్ల నిరసనా, తిరుగుబాటూ అంతే సహజమూ , ప్రజాస్వామ్య వ్యవస్థలో అది అనివార్యమూ కనుక ప్రజా సంఘాలు, సాహితీ సంఘాలు ,పాఠకులు కళాకారులు, రచయితలు పెద్ద ఎత్తున నిరసనలు చేసి కోర్టుకెళ్ళారు. న్యాయం కావాలని గొంతెత్తి వాసి రెడ్డి సీతాదేవి తరఫున నిలబడ్డారు. నిలబడి గెలిచారు.

పుస్తకాల నిషేధం గురించి రంగనాయకమ్మ విలువైన, ఆలోచించ దగ్గ అభిప్రాయాలను మరీచిక నిషేధానికి ముందే ఒక చోట వ్యక్తపరిచారు . యండమూరి తులసి దళం మీద తీవ్ర స్థాయిలో విమర్శలు చేసినా, ఆ నవలను నిషేధించాలనలేదు ఆమె !

‘ఆదివారం ’ అనే వారపత్రిక  13-9-1981 సంచికలో ఆమె పుస్తకాల నిషేధం గురించి  తన అభిప్రాయాలను ఇలా చెప్పారు-

‘‘ఒక రచనని నిషేధించడం అంటే , దాన్ని ప్రచురించకుండా ఆపుతారు. అప్పటికే ప్రచురణ అయిన పుస్తకాల్ని పోలీసులు పట్టుకుపోతారు. ఆ నిషేధ రచనల్ని చదివే పాఠకుల్ని అరెస్టులు చేసి, లాకప్పుల్లో పెట్టి వారి నించీ లంచాలు లాగుతారు. చివరికి వారి మీద కేసులుపెట్టి శిక్షలు వేస్తారు.  ఇది ఏ రకంగానూ ఆర్గ్యుమెంటకి నిలబడే విషయం కాదు.

ఎందుకంటే-

 పాఠకులు ఒక ‘రచన’ను చదవడానికి  సిద్ధంగా వున్నప్పుడు ఒక ‘చట్టం’ వచ్చి వారిని

దండించాలనడం  పరమ హాస్యాస్పదమైన, ప్రజాస్వామ్య వ్యతిరేకమైన విషయం. మనుషుల్ని భయపెట్టి  ఒక పని నించీ ఆపగలమనుకోవడం మనుషుల శక్తీ, మనుషుల ప్రత్యేకతా తెలియని వాళ్ళు చేసే ఆలోచన.   ‘భయం’ అనేదానికి జంతువులు లొంగుతాయి గానీ మనుషులు లొంగరు. లొంగకూడదు.

…. ..

ఒక పుస్తకాన్ని నిషేధించడం అంటే కొందరు ‘మేధావులు’ మొదట దాన్ని చదివి- ‘ఇది చెడ్డ పుస్తకం,  మిగతా వాళ్ళంతా దీన్ని చదవకూడదు’ అని నిర్ణయించడమే. ఆ మేధావులు, ‘మేధావులు కాని’ వారితో  ఇలా అంటారు- ‘‘ఫలానా పుస్తకం మీరు చదవకండి, చెడిపోతారు. మేం మొదట చదివి చూశాం. మేం  మేధావులం కదా? అంచేత ఎంత చెడ్డ పుస్తకాలు చదివినా మేం చెడిపోం. మీరున్నారే, మీరు మాలాగా  మేధావులు కారు గదా, ఇలాంటి పుస్తకాలు చదివితే మీరు చాలా చెడిపోతారు. కాబట్టి ఏది మంచి పుస్తకమో,   ఏది చెడ్డ పుస్తకమో మేం చదివి మీకు చెపుతూ వుంటాం…

 

ఈ రకంగా ఏది మంచో ఏది చెడ్డో మేధావులే నిర్ణయిస్తూ వుంటారు.

కొందరు మేధావులు చేసే నిర్ణయాలకి కోట్ల కోట్ల మంది జనం కట్టుబడివుండాలనడం మేధావుల దురహంకారం తప్ప  ఇంకేమీ కాదు.

ఫలానా  పుస్తకాన్ని ప్రచురించకూడదనీ, చదవకూడదనీ చట్టం వచ్చినంతమాత్రాన దాన్ని ప్రచురించడమూ ఆగదు,  దాన్ని చదవడమూ ఆగదు. కాక పోతే రహస్యంగా…..బహిరంగ రహస్యంగా!

అందుచేత నిషేధాలకన్నా సరియైన, బలమైన, ఆయుధం ఏమిటంటే ఆవిషయంలో పాఠకులకు సరియైన   అభిప్రాయాలు కలిగిస్తూ ‘ఎడ్యుకేట్’ చెయ్యడం. పాఠకుల్ని హేతుబద్ధంగా ఆలో్చించేటట్టు చేసే మార్గం ఒక్కటే  ఈ విషయంలో    సరైన మార్గం.’’

నిషేధం సంగతి పక్కన ఉంచి,నవల కంటెంట్ విషయానికొస్తే నవల గబ గబా నడిచి పోయిన అనుభూతి కల్గుతుంది. రెండు సీరియస్ ఇష్యూలను తీసుకున్న రచయిత్రి వాటి మీద  సీరియస్ గా కాన్సంట్రేట్ చేయలేదనిపిస్తుంది కొన్ని చోట్ల.

శబరి జీవితం అలా ముగిసి పోవాల్సిందేనా? ఆ పిల్ల హిప్పీల్లో కల్సి పోయి ఉంటుందనే సందేహం డ్రైవర్ మాటల వల్ల తండ్రికి వచ్చి అది ధృడపడినా, ఆ వైపుగా ఆమె ఆ ఆచూకీ కనుక్కునేందుకు గట్టి ప్రయత్నాలేమీ సాగవు. అలాటి పిల్లను మళ్ళీ ఇంటికి తీసుకు రావడానికి భయపడ్డారా? ఒక్కగానొక్క కూతురు! నవల చివర్లో శబరి ఆచూకీ కనుక్కునేందుకు కొంత ఆసక్తి చూపిస్తాడు తప్ప, మరేదో పని వచ్చి దాన్ని పక్కకు పెడతాడు తండ్రి! అది చాలా అసహజంగా కనిపిస్తుంది. ఇహ ఆ తర్వాత అమాయకంగా వెళ్ళి ఇష్టం లేకుండా హిప్పీల్లో ఇరుక్కు పోయిన శబరి జీవితం, పద్ధెనిమిదంటే పద్ధెనిమిదేళ్ళ శబరి జీవితం అలా అంతమై పోవలసిందేనా?

ఇక జ్యోతికి విప్లవ భావాలు ఏర్పడడానికి, నక్సలిజం వైపు మళ్ళాలన్నంత తీవ్రంగా ఆ ఆలోచనలు  డెవలప్ కావడానికి గట్టి బేస్ దొరకదు నవల్లో! విప్లవోద్యమ నాయకుల్ని ప్రత్యక్షంగా కల్సుకున్నట్టు గానీ, విప్లవ సాహిత్యం విరివిగా చదివినట్టు గానీ ఉండదు. ఎక్కడికో వెళ్ళొస్తున్నట్టు మాత్రం చూపించి వదిలేస్తారు రచయిత్రి. అన్నిటికంటే ఘోరంగా అనిపించే విషయం, మాట్లాడితే విప్లవ సూక్తులు వల్లించే జ్యోతి, శబరి పట్ల అసలు బాధ్యత లేకుండా ప్రవర్తిస్తుంది నవల్లో! శబరి హిప్పీల వైపు మళ్ళుతోందని జ్యోతికి తెలుసు. హిప్పీల దగ్గరికి తను కూడా వెళ్ళి మాట్లాడుతుంది. వాళ్ళని తన వైపు తిప్పుకోవడం అసంభవం అని గ్రహించగానే విసుగు చెంది వాళ్లను వదిలేసి వస్తుంది తప్ప శబరిని అటు వైపు వెళ్లకుండా, ఆ ఉచ్చు లో పడకుండా ఆపాలని ఏ ప్రయత్నమూ గట్టిగా చెయ్యదు. తను చెయ్యడం అటుంచి “మీ అమ్మాయి యాక్టివిటీస్ ఇలా ఉన్నాయి” అని శబరి తల్లి దండ్రులకు కూడా సమాచారం ఇవ్వదు. విప్లవ నినాదాలు చేసుకుంటూ నక్సలైట్లలో కల్సి పోతుంది. తర్వాత శబరి కొంపదీసి హిప్పీల్లొ గానీ కల్సి పోయిందా అనే ఆలోచన అయినా రాదు .

సాటి స్నేహితురాలి జీవితం నాశనం కాబోతున్నదని తెలిసీ ఆ వైపుగా ఏ బాధ్యతా చూపించని జ్యోతి విప్లవోద్యమాల్లో ఏ మాత్రం బాధ్యత వహిస్తుందనే ప్రశ్న అప్పుడే తలెత్తుతుంది. దానికి తగ్గట్టే,చివర్లో ఆమె గాయపడిన సత్యాన్ని పోలీసులకు వదిలేసి (అదొక్కటే మిగిలిన చాయిస్ అనుకోండి)గ్రామం వైపు వెళ్ళి పోతుంది. ఆమె పలాయనం చిత్తగించిందా లేక గ్రామం లో పీడిత వర్గాలను ఉత్తేజితం చెయ్యడానికి వెళ్ళిందా అనే సందేహానికి జవాబు మన ఉహకు వదిలేస్తారు రచయిత్రి .

రచయిత్రి మాత్రం జ్యోతి రైతు కూలీల కోసమే పని చేస్తూ ఎక్కడో ఉండే ఉంటుందని నమ్ముతారు. తిరిగి ఆమె పాత్రను కొనసాగిస్తూ మరో నవల రాయాలని కూడా అనుకున్నారు

రెండు తీవ్ర సమస్యల్ని చర్చించి, వాటి వల్ల కంటే నిషేధం వల్ల జనాకర్షణ పొంది, సంచలనం సృష్టించిన మరీచీక నవల ఆన్ లైన్లో ఉచితంగానే దొరుకుతుంది. నవల పై ప్రభుత్వం విధించిన నిషేధాన్ని ఎత్తి వేస్తూ హై కోర్టు ఇచ్చిన తీర్పు కూడా ఆన్ లైన్లో చదవొచ్చు

వెదికి చదవడమే తరువాయి

 

చిన్న సరదా కొసమెరుపు:

ఆంధ్ర జ్యోతి 1982 దీపావళి సంచిక  వాసిరెడ్డి సీతా దేవి కి ఒక సరదా బిరుదునిచ్చింది “నిషిద్ధ నవలా శోభిత” అని :-)

 

*

 

 

 

 

 

 

కొత్త బాటలో నాటా సాహిత్య సభలు!

 

-సుజాత 

~

nata1

సంస్కృతి, సాహిత్యం అవిభాజ్యాలు! నివాసం విదేశాల్లోనే అయినా సంస్కృతి వేళ్ళు ఎక్కడ పాదుకున్నాయో, అక్కడికి హృదయాలు తరచూ ప్రయాణించడం, ఆ సువాసనల్ని ఇక్కడ ప్రోది చేసుకోవాలని ప్రయత్నించడం , మొగ్గ వేసినంత సహజం, పువ్వు పూసినంత సహజం! అందుకే ప్రవాస సాంస్కృతిక సంఘాలు ఎప్పుడు, ఎక్కడ సభలు నిర్వహించుకుని అంతా ఒక చోట చేరినా, సాహిత్యానికి తొలినాటి నుంచీ పెద్ద పీట వేస్తూనే ఉన్నాయి. మెమోరియల్ వీకెండ్ -మే 27,28 న జరగబోయే నాటా సభల్లో కూడా సాహిత్య వేదిక ప్రధాన భూమిక పోషించబోతోంది.

ప్రవాస తెలుగు సాహిత్యాభిమానులు, రచయితలు కవులు అంతా కల్సి సాహితీ సౌరభాలు పంచుకోడానికి రంగం సిద్ధం అయింది. కథ, కవిత, నవల, అవధానం వంటి ప్రక్రియల్లో నిష్ణాతులైన వారి ప్రసంగాలు, సభికులు కూడా పాలు పంచుకోనున్న చర్చలు ఈ సాహిత్య వేదికలో ప్రథానాంశాలు గా రూపు దిద్దుకున్నాయి. అన్ని విభాగాల్లోనూ నూతనత్వాన్ని స్పృశిస్తూ ఎంచుకున్న అంశాల మీద కవులు రచయితల ప్రసంగాలు సాగనున్నాయి.

నాటా సాహిత్య కమిటీలో కొందరు...

నాటా సాహిత్య కమిటీలో కొందరు…

శనాదివారాలు మొత్తం నాలుగు విభాగాలుగా జరగనున్న ఈ కార్యక్రమాల్లో శనివారం మధ్యాహ్నం ఒంటి గంట నుంచి మూడున్నర వరకూ జరగనున్న కథా వేదికలో “తెలుగు కథ-ఒక సమాలోచన” కార్యక్రమానికి ప్రముఖ రచయిత చంద్ర కన్నెగంటి సంచాలకులుగా వ్యవహరిస్తారు. “సరైన దారుల కోసం – కొత్త కథకుడి రచనా స్ఫూర్తి” అనే అంశం మీద  మధు పెమ్మరాజు, “ఇండియన్ డయాస్ఫోరా లో తెలుగు డయాస్ఫోరా స్థానం” గురించి గొర్తి సాయి బ్రహ్మానందం, “అమెరికా కథా వస్తువులు, లోపించిన వైవిధ్యత” అనే అంశం మీద వంగూరి చిట్టెన్ రాజు, “సమకాలీన కథ పై ఇంటర్నెట్ ప్రభావం” అనే అంశం మీద రచయిత్రి కల్పనా రెంటాల, ఇంకా , “కథలెందుకు చదవాలి?” అనే అంశం మీద మెడికో శ్యాం ప్రసంగిస్తారు. ఆ తర్వాత “తెలుగు కథ-దశ, దిశ” అనే అంశం పై చర్చా కార్యక్రమం ఉంటుంది. ఇవన్నీ సాహిత్య వేదికలపై ఇంతకు ముందు పెద్దగా చర్చంచని వినూత్నతను ఆపాదించే, కొత్త ఆలోచనల వైపు అడుగులు వేయించే అంశాలే!

మధ్యాహ్నం  3-30 నుంచి 5 గంటల వరకూ ఉత్తర టెక్సాస్ తెలుగు సంఘం (TANTEX) ఆధ్వర్యంలో నెల నెలా తెలుగు వెన్నెల కార్యక్రమం లో భాగంగా “తెలుగు నవల- చారిత్రక నవల ” అంశం మీద  మంథా భానుమతి ప్రసంగం, “తెలుగు నవలా పరిణామ క్రమం (బుచ్చిబాబు)” అనే అంశం మీద  దాసరి అమరేంద్ర, ఆ తర్వాత “తెలుగు నవల-సినిమా” అనే అంశం మీద బలభద్ర పాత్రుని రమణి ప్రసంగం ఉంటాయి .

 

ఆదివారం ఉదయం సాహితీ ప్రియులంతా ఎంతో ఆసక్తి తో ఎదురు చూసే ప్రధాన కార్యక్రమం అష్టావధానం! అవధాన కంఠీరవ నరాల రామారెడ్డి గారి అష్టావధానానికి సంచాలకులుగా వద్దిపర్తి పద్మాకర్ గారు వ్యవహరిస్తారు. పృచ్చకులుగా జువ్వాడి రమణ, పూదూరి జగదీశ్వరన్ మరికొంత మంది సాహితీ ప్రియులు పృచ్చకులుగా పాల్గొంటారు. ఉదయం 9 నుంచి మధ్యాహ్నం 12 వరకూ మూడు గంటల పాటు ఉత్సాహభరితంగా సాగే ఈ కార్యక్రమం ఆదివారం నాటి ప్రధానాకర్షణ గా నిలవబోతోంది.

మధ్యాహ్నం జరిగే కవిత్వ విభాగ కార్యక్రమం మరింత ఆసక్తి గా ఉండబోతోంది. “తెలుగు కవిత-ఓ నూతన దృక్కోణం” శీర్షికన జరిగే ఈ కార్యక్రమానికి అఫ్సర్ సంచాలకులుగా వ్యవహరించనున్నారు . ఈ కార్యక్రమంలో కవులు కవయిత్రులు ఎంచుకున్న అంశాలన్నీ ఇంతకు ముందు ప్రవాస తెలుగు సాహితీ సభలో చర్చకు రాని సమకాలీన నూతనాంశాలే!

“కవిత్వానికి ప్రేరణ”  అనే అంశం మీద పాలపర్తి ఇంద్రాణి,”కవిత్వంలో ప్రయోగాలు” అన్న అంశాల మీద విన్నకోట రవిశంకర్ ప్రసంగించనుండగా, “కవిత్వంలో ప్రాంతీయత” అనే సరికొత్త అంశం మీద వెంకటయోగి నారాయణ స్వామి, “భిన్న అస్తిత్వాలు-వస్తురూపాలు” అనే వినూత్నాంశం గురించి కొండేపూడి నిర్మల ప్రసంగిస్తారు.

హుషారుగా సాగబోయే ఆ తర్వాత చర్చా కార్యక్రమం “తెలుగు సినిమా పాటల్లో సాహితీ విలువలు”! ఈ కార్యక్రమం లో సినీ గీత రచయితలు చంద్రబోస్, వడ్డెపల్లి కృష్ణ, సంగీత దర్శకులు కోటి, దర్శకులు వి.ఎన్ ఆదిత్య పాల్గొంటారు. మాడ దయాకర్ సంచాలకులుగా వ్యవహరిస్తారు

nata

చివరగా నాలుగున్నర నుంచి ఐదున్నర వరకూ మనబడిలో తెలుగు నేరుస్తున్న చిన్నారుల  “ఒనిమా”- ఒక్క నిముషం మాత్రమే పోటీ ల ఫైనల్స్ సాహిత్య వేదిక మీద జరుగుతాయి. తల్లిదండ్రులు కూడా ఉత్సాహంగా వీక్షించబోయే ఈ కార్యక్రమం  ఆదివారం నాటి సాహిత్య కార్యక్రమాలలో చివరిగా తెలుగు భాషా ప్రేమికులకు అందనున్న బోనస్

సాహిత్యాభిమానులను సరికొత్త అంశాలతో, వినూత్న చర్చలతో అలరించనున్న  సాహిత్య వేదిక సభికులతో కళ కళలాడుతుందని నాటా ఆశిస్తోంది.

కొత్త ఆలోచనల సరికొత్త వేదిక: ఇస్మాయిల్ పెనుకొండ (సాహిత్య విభాగం చైర్)

ismail

 

“సమకాలీన సాహిత్యానికి సంబంధించి అన్ని కోణాలు ఒక కొత్త దృక్పథం నుంచి వీక్షించే వీలు కలిగించేట్టుగా నాటా సాహిత్య సభల్ని తీర్చిదిద్దుతున్నాం. ప్రసిద్దులంతా ఒక వేదిక మీద కనిపించడం ఒక ఎత్తు అయితే, వారు భిన్నమైన అంశాల మీద – ముఖ్యంగా ఇప్పటి కాలానికి అవసరమైన వాటి మీద మాట్లాడబోవడం, ఇది ఒక ప్రయోజనకరమైన చర్చకి దారి తీస్తుందన్న నమ్మకాన్నిస్తుంది. కథ, కవిత్వం, అవధాన, సినిమా సాహిత్యం- వీటన్నిటితో పాటు బుచ్చిబాబు శతజయంతి సందర్భంగా కేవలం నవల మీద ప్రత్యేకించి ఒక సభ నిర్వహించడం కూడా విశేషమే!”

*

 

 

 

సైంటిఫిక్ మిస్టీరియస్ “అగ్నిగీతం”

 

 

 

పాత కాలపు మాస పత్రికలకు, ఒక మంచి అలవాటుండేది. ఇప్పుడూ ఉందేమో తెలీదు. బుల్లి బుల్లి అనుబంధ నవలలను పత్రికతో పాటు అందించడం. అప్పటి మాస పత్రికల్లో వినూత్నంగా చాలా యేళ్ళు నడిచింది విజయబాపినీడు సంపాదకత్వం లో “విజయ”! నాలుగు విభాగాలుగా (కథ, సినిమా,హాస్యం, అనుబంధ నవల) ఉండి, ఏ పార్టు కి ఆ పార్టి విడదీసి చదువుకోడానికి వీలుగా ఉండేది . ఎప్పుడు మూత పడిందో గుర్తు లేదు కానీ మా ఇంట్లో చాలా రోజులు పాత కాపీలు ఉండేవి. వాటిలో దొరికింది ఈ అగ్నిగీతం నవల అప్పట్లో! ఆ తర్వాత కాల క్రమేణా అది ఎవరో తీసుకుని ఇవ్వడం మర్చి పోయి వాళ్ల లైబ్రరీలో దాచుకున్నారని లేటుగా గ్రహించాము. డాక్టర్ ముదిగొండ శివ ప్రసాద్ రాసిన అనేక నవలలు మార్కెట్లో దొరుకుతున్నాయి గానీ ఇది మాత్రం దొరకలేదు. విజయ అనుబంధ నవలగా రెండు భాగాలు గా వచ్చాక, ఎప్పుడో మీనా పబ్లిషర్స్ అనే వాళ్ళు దీన్ని డైరెక్ట్ నవలగా వేశార్ట గానీ అది ప్రస్తుతం ఎక్కడా అందుబాటు లో లేదు. నిజానికి నాకు ఒక మూడేళ్ళ క్రితం ఈ నవల మిత్రుల సాయంతో PDF గా దొరికింది. ఒకసారి మళ్ళీ చదివితే, పరిచయం చేయదగిన మంచి పుస్తకమేననిపించింది.

ఈ నవల రెండు దారుల్లో నడుస్తుంది. ఆశయ సాధనకు మార్గం కూడా ఉత్తమంగా ఉండాలా లేక సాధనే గమ్యం కాబట్టి ఏ మార్గమైనా పర్లేదా అనే అంశం ఒక వైపూ, ధ్వని కాలుష్యం వల్ల మనుషులు చిత్త చాంచల్యానికి లోనై ప్రవరిస్తారనే సైంటిఫిక్ (అదే సమయంలో మిస్టీరియస్ కూడా) అంశాన్ని మరో వైపు చర్చిస్తూ కథ నడుస్తుంది.

కథ మొత్తం 70 ల్లోని హైద్రాబాద్ నగర వాతావరణం లో! వేణుగోపాల రావనే మామూలు ఉద్యోగి భార్య, అణకువ, అమాయకత్వాలే ఆభరణాలుగా కల అతని భార్య దమయంతి సడన్ గా ఒక చల్లని సాయంత్రం దెయ్యం పట్టిన  అవతారం ఎత్తడం తో నవల మొదలు!

సాయంత్రం సినిమాకెళ్దామనే ఊహల్లో ఇంటికొచ్చిన వేణు కి ఇదొక షాకు! కిటికీ ఎక్కి కూచుని నానా గోలా చేసిన దమయంతి సొమ్మసిల్లి నిద్ర పోతుంది. ఆ తర్వాత ఒక గంటకి లేచి కూచుని “కథ చెప్తా వింటావా వేణు గోపాల్రావ్?” అని అడగటం తో వణికి పోతాడు!

కథేంటి ? ఎవరి కథ ? వింటాననాలా వొద్దా ?

ఇతడి అవును, కాదులతో సంబంధం లేకుండా దమయంతి ఒక కథ చెప్పడం మొదలు పెడుతుంది. ఆ కథని ప్రతి రోజూ ఎపిసోడ్స్ వారీగా చెప్పడం కొనసాగిస్తుంది దమయంతి.

కథలో నాయిక కామేశ్వరి! కామేశ్వరి స్వీయ కథే అది !

అసలా కథ ఎవరిది, దమయంతికెలా తెలుసు? రోజంతా మామూలుగా ఉండే దమయంతి ఇలా రాత్రిళ్ళు ఇలా ట్రాన్స్ లోకి పోయి కథ చెప్పడమేంటో అంతు బట్టదు వేణుకి! దమయంతి అన్న డాక్టర్ త్రిమూర్తికి కబురంపి రమ్మంటాడు. త్రిమూర్తి ఈ కథలో లేక పోతే నవల సగానికి సగం చప్పబడి పోయేదేనేమో! అనుక్షణం ఛలోక్తులు చమత్కారాలు వేస్తూ త్రిమూర్తి నవల మొత్తం నవ్విస్తూ ఉంటాడు.

త్రిమూర్తి వచ్చాక అతనికీ ఆశ్చర్యం వేస్తుంది. ఇది ఏమిటి ఇంతకీ?

ఏదైనా దెయ్యం పట్టుకుందా? దెయ్యాలున్నాయా నిజంగానే ? లేక దమయంతే కామేశ్వరా ? తన పూర్వకథనే చెప్తోందా అనే సందేహాలు వదలవు వేణుని

కథలో పాత్రలన్నీ నిజమా లేక కల్పితాలా? ఈ కథ దమయంతికెవరు చెప్పారు?

వేణుకీ , త్రిమూర్తికీ మనకీ కూడా సందేహాలే

Agni001

స్వయంగా త్రిమూర్తే డాక్టర్ కనుక వేరే డాక్టర్ దగ్గరికి తీసుకెళ్లాలనే ఆలోచన మానుకుని తార్కికంగా ఆలోచించడానికి పూనుకుంటారు. మొత్తానికి దమయంతి మానసికారోగ్యం కొంత సంతులనం లేకుండా ఉంది,  విహార యాత్రలు చేసి వస్తే వాతావరణం లో మార్పు వల్ల ఏదైనా గుణం కనిపిస్తుందేమో అన్న ఆలోచనతో గుళ్ళూ గోపురాలే కాక ప్రకృతి రమణీయకత ఉండే ప్రాంతాలు తిరగడానికి బయలు దేరతారు. ఐతే అడపా దడపా దమయంతి ఆ యాత్రల్లో సైతం పగలు మామూలుగానే ఉన్నా రాత్రిళ్ళు మాత్రం అలౌకికావస్థకు గురై కథ చెప్తూనే ఉంటుంది.  నవలలో ఈ కథంతా ముక్కలు ముక్కలుగా నడుస్తుంది.నవలా గమనం కొంత వర్తమానం లోనూ, మరి కొంత దమయంతి చెప్పే కథలోనూ నడుస్తుంది.

దమయంతి చెప్పే కథ! కథ పేరు అగ్నిగీతమని దయమంతే చెప్తుంది.

తల్లి లేని కామేశ్వరిని తండ్రి గారాబంగా పెంచగలుగుతాడే తప్ప సంఘంలో ఉన్న పరిస్థితులని తనకు తోచిన విధంగా అవగాహన చేసుకునే తీరుని ప్రభావితం చెయ్యలేక పోతాడు. దానికి తోడు యుక్తవయసు కి వచ్చాక కామేశ్వరికి ఎదురైన పరిస్థితులు కూడా ఆమెను మరింత గందర గొళానికి గురి చేసేవే ! దగ్గరిగా చూసిన ఇద్దరు స్త్రీల జీవితాలు ఆమె కళ్ళ ముందే కాలి బూడిద అవుతాయి ! అందుకు వాళ్ల భర్తలే ప్రధాన కారణం. టాంక్ బండ్ మీదనుంచి దూకి ఆత్మ హత్య చేసుకోబోయిన జానకీ, స్త్రీలోలుడైన ప్రొఫెసర్ తీరుని సహించలేక ఆత్మ హత్య చేసుకున్న అతని భార్య నీరజా, కామేశ్వరిలో రేగే జ్వాలకు ఆజ్యం పోసిన వాళ్ళవుతారు ! పురుషుల పట్ల, సమాజం పట్లా కసిని పెంచుతారు. నీరజ మరణం తో కదిలి పోయిన కామేశ్వరి లో నీరజ మరణం ప్రతికారాన్ని రగిలిస్తుంది

ఎంత తీవ్రంగా అంటే నీరజ చితా భస్మాన్ని ధరించి నేటి నుంచీ మగ పశువు నా పాదాల వద్ద బానిస. నా కాళ్ల కింద నలిగే పురుగు!పతితుడు , ఇదే నా ప్రతిజ్ఞ ! నీకు ఆత్మ శాంతి కల్గించే ప్రతిజ్ఞ” అని ప్రతిజ్ఞ పూనుతుంది. తీవ్రమైన దుఃఖం , వేదన ఒత్తిడి నుంచి ఆమె  గమ్యాన్ని నిర్దేశించుకుంటుంది అందులో వివేచన తక్కువ.

మగవాళ్ల మీద పగబడుతుంది! పగ తీరాలంటే హై సొసైటీ తో పరిచయాలు పెంచుకుని, అక్కడి మగవాళ్ళను వీధికి ఈడ్చాలి! అందుకే పరిచయాలు పెంచుకోడానికి పేరున్న సంగీత కారుడు వైణికుడు పుండరీకాక్షుణ్ణి రిజిస్టర్ వివాహం చేసుకుంటుంది

కథలో మరో పాత్ర పుండరీకాక్షుడి తమ్ముడు దయానంద్! ఆర్య సమాజ్ సంప్రదాయాలకు ఆకర్షితుడై వాళ్ల గురుకులంలోనే చదువుకుంటాడు. సమాజంలో నేర ప్రవృత్తి, మనుషుల దృక్కోణాలు, ప్రవర్తన మారాలంటే ఆత్మ సంస్కారం అవసరమని, మూలాల నుంచి ప్రక్షాళన అవసరమనీ భావిస్తాడు ! అది సరైన విద్య ద్వారానూ, శారీరక మానసిక సంతులనం ద్వారానూ మాత్రమే సాధ్యమవుతుందని ఆ విధంగా సంఘం లో సత్ప్రవర్తనను పెంచి తద్వారా ప్రక్షాళన జరగాలని ఆకాంక్షిస్తూ విద్య పూర్తి చేసి, హైద్రాబాద్ నగరంలో అడుగు పెడతాడు.

సమాజంలో ఎటు చూసినా కుళ్ళు, దుర్మార్గం, అవినీతి, దౌర్జన్యం, హింస ! నిజానికివి ఎప్పటికపుడు సమాజంలో వివిధ స్థాయిల్లో ఉంటూనే ఉంటాయి కదా ! ఎలా వీటిని ఎదుర్కొని దారిలో పెట్టాలో తీవ్రంగా ఆలోచిస్తూ ఒక పార్కులో కూచుని ఉండగా అతనికి పరిచయమవుతాడు అగ్ని మిత్రుడు.

ఎలాగ? లంచం తీసుకోమని భర్తను వేధిస్తున్న ఒక స్త్రీ మీద దౌర్జన్యం చేసి చేయి,చేసుకుంటూ!

నివ్వెర పోయిన దయానంద్ అదేమని ప్రశ్నిస్తే, కురుపు లేస్తే దాన్ని కత్తిరించి తొలగించి పారేయాలనే జవాబు వస్తుంది.  ఆ తర్వాత సినిమా హాల్లో ఒక ఆడపిల్లను వేధిస్తున్న అబ్బాయిలను కూడా చితగ్గొడుతూ అగ్నిమిత్రుడు  దయానంద్ కళ్ళబడతాడు. అతడి గమ్యం ఏమిటో తెలుసుకోవాలని అతడిని కల్సి దయానంద్ తన ఇంటికి తీసుకెళ్తాడు

“ఆశయం ఉత్తమం కావొచ్చు, కానీ దాని ఆచరణ మార్గం మాత్రం ఇది కాకూడదు” అని ఎంత చెప్పినా అగ్నిమిత్రుడు నిర్లక్ష్యంతో ” నీ దారిన నువ్వు వెళ్ళు, నా దారిన నేను వెళ్తాను.” అంటాడే తప్ప దయానంద్ మార్గంలోకి రావడానికి ఇష్ట పడడు. “నీ హృదయాన్ని ప్రేమిస్తున్నాను! కానీ నీ మస్తిష్కాన్ని వ్యతిరేకిస్తున్నాను “అని స్నేహ హస్తాన్ని చాస్తాడు దయానంద్

“నాది అగ్ని ప్రకృతి! నన్ను నేను దహించుకుంటూ వేడినిస్తూ ఉంటాను” అని అగ్నిమిత్రుడంటే “నాది చందన ప్రకృతి. నన్ను నేను అరగదీసుకుంటూ ఉపయోగపడతాను” అంటాడు దయానంద్!

“నా దృష్టి లో మనుషులంటే శిలలు! కొన్ని కొండలలోని బండలు. కొన్ని గనులలోని రత్నాలు.మరి కొన్ని నదీ పరివాహక ప్రాంతాల సాలగ్రామాలు.దేని గౌరవం దానిదే! ఇలాటి గౌరవాలను పొందలేని గ్రానైట్ రాయి సైతం భవనాల పునాదుల్లో పడి భవనాన్ని నిలబెడుతోంది .రత్నం ఎంత గొప్పదో, గ్రానైట్ రాయి అంతకంటే లక్ష రెట్లు త్యాగమయమైందే.ఎవరూ జన్మిస్తూనే గొప్పవారు కాలేరు” ఇదీ దయానంద్ ఫిలాసఫీ

మార్గాలు వేరైనా గమ్యాలు ఒకటే కాబట్టి ఇద్దరికీ స్నేహం కలుస్తుంది.

మరిది దయానంద్ ని, అతని ఆశయ కార్యాచరణను చూసి కామేశ్వరి ఎద్దేవా చేస్తుంది. పాదాలకు నమస్కారం చేస్తే “మగ వెధవలు, ఆ వంకతో ఐనా ఎక్కడో ఒక చోట తాకొచ్చనే ఆశ” అని మండి పడుతుంది! కానీ అతనంటే చెప్పలేని ఆకర్షణ ఏదో ఆమె లోలోపల కలుగుతుందనే విషయాన్ని గ్రహించలేక పోతుంది.

స్త్రీలకు అనాదిగా జరుగుతున్న అన్యాయాల గురించి ఇద్దరికీ వాదోపవాదాలు జరుగుతాయి. కామేశ్వరి దయానంద్ మీద క్రోధం పెంచుకుంటుంది. ఆమె క్రోధాన్నిదయానంద్ శాంతం తో ఎప్పటికప్పుడు జయిస్తూ ఉండటం వల్ల కాబోలు ,ఆమె లోలోపల ఎక్కడో ఆ ఆకర్షణ ఎంత వద్దనుకున్నా పెరుగుతూ పోతుంది

హైద్రాబాద్ లో దయానంద్ తన ఆశయ సాధనకు విద్యా కేంద్రాలు నెలకొల్పుతాడు. “సమాజం నేడు చెట్టు కొమ్మల వంక చూసి పళ్ళు లేవే” అని నిరాశ చెందుతోంది. నేను చెట్టు కొమ్మల మీద గాక,వేళ్ళ మీద దృష్టి పెట్టాను. సమాజ వృక్షపు వేళ్లకు ఎరువులు వేస్తాను.ఫలాలు నేడు కాక పోతే రేపటి తరానికి అందుతాయి! కురుపు ఉన్న చోట మందు వేయడం కాదు, లోపలకి పడాలి మందు” అంటాడు దయానంద్!

యోగా, ప్రకృతి వైద్యం, మార్షల్ ఆర్ట్స్,వంటివి అతని విద్యా కేంద్రంలో కొన్ని బోధనాంశాలు!

రాను రాను అతని విద్యా కేంద్రానికి ఆదరణ పెరిగి ఆర్థికంగా కూడా సహాయం అందుతుంది.ఏ యే దేశాల నుంచో హైద్రాబాద్ వచ్చి యోగా, ధ్యానం వంటి వాటిని డబ్బు పోసి నేర్చుకుంటున్న వాళ్లెందరో దయానంద్ విద్యాకేంద్రం వైపు మళ్ళుతారు!

Agni222

నగరంలోని ఒక ప్రముఖ వ్యాపారి కోట్నీస్ ఇంటికి పాద పూజానంద స్వామి అనే స్వామీజీ వస్తాడు. అక్కడ కచేరీ కోసం పుండరీకాక్షుడూ, అతని ద్వారా గొప్ప వాళ్ల గోత్రాలు సేకరించాలని కామేశ్వరీ, అతడిని అల్లరి చేయాలని అగ్ని మిత్రుడూ, అతనేమి చెప్తాడో విందామని దయానందూ అంతా ఎవరి కారణాలతో వాళ్ళు వస్తారు. దయానంద్ కీ   పాద పుజానంద స్వామి కీ జరిగిన వాదం లో దయానంద్ ది పై చేయి అవుతుంది. దాంతో కోట్నీస్ అనుచరులు అతన్ని “నీకేం తెలీదు, కూచో !స్వామిజీ దేవుడు” అని దౌర్జన్యం చేయడానికి ప్రయత్నిస్తారు.అప్పటికే సభలో ప్రేక్షకుల రూపంలో ఉన్న తన అనుచరులతో అగ్నిమిత్రుడు అందర్నీ చితగ్గొట్టి భీతావహ పరిస్థితులు సృష్టిస్తాడు.ఆ తర్వాత కోట్నీస్ నల్ల వ్యాపారాల గురించీ, కళావని అనే సాంస్కృతిక సంస్థ ముసుగులో ఆడపిల్లని ఇతర దేశాలకు అతని సహకారంతో ఎగుమతి జరుగుతున్న సంగతినీ వివరిస్తాడు దయానంద్ కి!

మర్నాడు కామేశ్వరి కళావని మీటింగ్ కి వెళ్ళి దాన్ని నడిపే జాకబ్ తో కొద్ది పాటి చనువు వెలగబెట్టి, అతడికీ అతడి భార్య కీ గొడవ వచ్చేలా చేసి వాళ్లిద్దరి చేతా వాగించి అది మొత్తం ఆడియో రికార్డ్ చేస్తుంది. ఒక్కొక్కటిగా ఆ విషయాలన్నీ బయటకు వచ్చేలా చేయాలని ఆమె పథకం

కామేశ్వరి, దయానంద్, అగ్ని మిత్రుడు.. వీళ్ల ముగ్గురి ప్రయాణాలూ నిజానికి ఒక చోటికే అని ప్రారంభిస్తారు వేర్వేరు దారుల్లో! ఒకరి దారంటే ఒకరికి గిట్టదు. అసలు గమ్యాల పట్ల , దారుల పట్ల ఎవరికి స్పష్టమైన అవగాహన ఉందనే విషయం నవలలో చర్చనీయాంశం !

అనుకోని పరిస్థితుల్లో కోట్నీస్ ని హత్య చేస్తాడు అగ్నిమిత్రుడు! విషయం దయానంద్ కి చెప్పి తాను లొంగి పోదల్చలేదనీ, ఇంకా చేయాల్సిన పనులున్నాయనీ చెప్పి పారి పోతాడు! నేరం తన మీద వేసుకుని శిక్షకు సిద్ధమవుతాడు దయానంద్! చివర్లో అగ్నిమిత్రుడు వచ్చి నిజం చెప్పి తన నేరాన్ని అంగీకరించడం తో అతనికి ఉరి శిక్ష అమలవుతుంది.

ఆ తర్వాత కామేశ్వరి దయానంద్ ల జీవితాల్లో ఒక నాడు పెను మార్పు సంభవిస్తుంది. ఆ మార్పు పర్యవసనాలేమిటి? కామేశ్వరి ఏమైంది? దయానంద్ జీవితం ఏ మలుపు తిరిగిందనేది నవలలో చదివితేనే బావుటుంది.

వర్తమానానికి వస్తే, పుణ్య క్షేత్రాలన్నీ తిరుగుతున్న త్రిమూర్తి కామేశ్వరి ఆ కథ అంతా ఒక ప్రత్యేక వాతావరణ పరిస్థితిలో చెపుతున్నదని గ్రహిస్తాడు. గుడిలో భజనలూ, మంగళ వాద్యాలూ, డోళ్ళూ, దరువులూ లేదా రోడ్డు పక్కనే వెళ్తున్న రణ గొణ ధ్వనులూ ఇవన్నీ ఉన్న నేపథ్యంలోనే ఆమె ఈ కథ చెప్తున్నదని గ్రహిస్తాడు. అరగొండలోని ఒక స్నేహితుల ఇంటికి వెళ్ళినపుడు ఆ రాత్రిని వాళ్లు చల్లని పౌర్ణమి వెన్నెలను ఆస్వాదిస్తూ చెరకు తోటల మధ్య సన్నగా ప్రవహిస్తున్న నదీ తీరంలో ప్రశాంతంగా గడిపిన రాత్రి ఎంత ఎదురు చూసినా దమయంతి కథ చెప్పదు.

అప్పుడు అర్థమవుతుంది త్రిమూర్తిలోని డాక్టర్ కి , ఆమెకు శబ్ద కాలుష్యం వల్ల మెదడు మీద ఏర్పడిన వత్తిడి ఆమెలో ఎక్కడో దాగి ఉన్న భావాలను, అణచి పెట్టిన విషయాలను వెలికి తీసి బయటికి పంపేస్తోందని!

అప్పుడు గుర్తు చేసుకుంటారు, రామ నగర్ గుండు దగ్గర నివసించే వేణుగోపాల రావు ఇంటి ముందే మెయిన్ రోడ్డూ, వస్తూ పోతూ ఉండే వాహనాల ధ్వనులే కాక, ఇంటి పక్కనే ఉన్న కమ్మరి కొలిమి నుంచి నిరంతరం పరిమితి మించిన ధ్వనుల్ని, శబ్ద కాలుష్యాన్ని సృష్టిస్తూనే ఉంటాయని! 150 డెసిబెల్స్ దాటిన ఆ ధ్వనులు దమయంతి మెదడును బాగా డిస్టర్బ్ చేశాయని అర్థమవుతుంది వాళ్లకి

సరే, అంత వరకూ బాగానే ఉంది.మరి ఈ కామేశ్వరి ఎక్కడి నుంచి వచ్చింది?

దమయంతి చెప్పే కథలో చివర్లో చెప్తుంది “ఆ తర్వాత డైరీలో కొన్ని లైన్లు కొట్టి వేయబడి ఉన్నాయి. కొన్ని పేజీలు చింపేశారు! అంతా గజిబిజిగా ఉంది”

త్రిమూర్తి దీన్ని మొత్తం విశ్లేషించి ఆ డైరీ తన సవతి సోదరిదని గ్రహిస్తాడు. తన తండ్రి మొదటి భార్యకు పుట్టిన సంగీతే కామేశ్వరి అని, ఆమె డైరీని తండ్రి దమయంతికి ఇచ్చి ఉంటాడని వేణుతో చెప్తాడు.

తర్వాత వాళ్ళు కామేశ్వరి కి ప్రకృతి చికిత్స చేయించే ఉద్దేశంతో వికారాబాద్ సమీపంలోని అడవుల్లో ఉన్న ఒక ఆశ్రమానికి వెళ్తారు. అక్కడ పెద్ద శబ్దాలన్నీ నిషిద్ధం! ఉన్నదల్లా మొక్కలూ చెట్లూ ప్రకృతీ, సేంద్రియ వ్యవసాయమూ, సంగీతంతో పెరిగే మొక్కలూ, ఆముదం దీపాలూ, చెరువులూ, కలువలూ బాతులూ ఇవే!

అక్కడ అందరూ ఎలాటి కల్మ్షమైన ఆలోచనలూ లేని సోదర సోదరీ బంధాలే . మానవత్వపు బంధాలు తప్ప ఇంకే రకమైన సంబంధాలూ లేని ఆశ్రమం అది! అక్కడ దమయంతికి ప్రకృతి వైద్యం జరుగుతుంది. కామేశ్వరి డైరీ గురించి అందులోని పాత్రల గురించి చెప్పినపుడు ఆ ఆశ్రమానికి పెద్దన్నయ్యగా వ్యవహరిస్తున్న వ్యక్తి నివ్వెర పోతాడు. తాను అగ్ని మిత్రుడి ప్రథమ అనుచరుడిగా ఎన్నో హత్యలు చేశాననీ,దొంగనని , అగ్ని మిత్రుడి ఉరి తర్వాత, గమ్యమే కాక మార్గం కూడా ఉత్తమంగా ఉండాలనే విషయం గ్రహించి అందరం దయానంద్ శిష్యులుగా మారి పోయామనీ చెప్తాడు.

ఆ ఆశ్రమాన్ని స్థాపించి నడిపిస్తున్నది కూడా కామేశ్వరి కథలోని ప్రధాన పాత్రే! ఆ పాత్ర ఎవరు, ఆ కథలో చివరికి జరిగిందేమిటి?

ఇవన్నీ నవలలో చదివి తెలుసుకుంటే కొంత ఉత్కంఠ గా ఉంటుంది.

ఈ నవల రెండు భాగాలుగా వచ్చినపుడు విజయ పాఠకులు ఉర్రూతలూగి పోయారట.

ఇక రచన విషయానికొస్తే నవల పూర్తిగా పాత్రల ప్రమేయంతోనే నడుస్తుంది తప్ప ఎలాటి స్థితి లోనూ రచయిత ఎక్కడా కథను తన చేతిలోకి తీసుకుని నడిపించడు. నవల్లో త్రిమూర్తి పాత్ర చాలా సహాయకారిగా ఉంటుంది. కథాగమనాన్ని కొంత వరకూ సపోర్ట్ చేసే పాత్ర ఇది. త్రిమూర్తి వాగుడూ జోకులూ అక్కడక్కడ చివరికి మిగిలేది లో జగన్నాధం పాత్రని తలపిస్తూ ఉంటాయి. అప్పుడప్పుడూ తనలో తను మాట్లాడుకుంటూ ఉండటమూ,కొన్ని కల్పితాలను నిజ జీవితంలో జరిగినట్టు గా వేణుకి చెప్పడమూ  చేస్తుంటాడు. . నగరంలో ధనికురాలైన ముంతాజ్ బేగం వైద్యం కోసం తను వెళ్ళినపుడు ఆమె తనను ప్రేమించిందనీ, త్వరలో తామిద్దరూ పెళ్ళి చేసుకోబోతున్నామనీ చెప్తాడు వేణుకి. కానీ చివర్లో అదంతా కల్పితమని తేలుతుంది. ఇలాటి చిత్త చాంచల్యాలు అనువంశికంగా సంక్రమిస్తాయని ఆశ్రమంలో వైద్యులు వివరించినపుడు దయమంతి తాను చదివిన డైరీని కథగా చెప్పడానికీ, త్రిమూర్తి కథల్ని సృష్టించడానికీ మధ్య రక్త సంబంధపు లింకు దొరుకుతుంది.

దమయంతి చెప్పే కథ కు బ్రేక్ వచ్చి వర్తమానంలోకి నవల వచ్చినపుడల్లా పాఠకుడికి త్రిమూర్తి పాత్ర చాలా రిలీఫ్. అలవోకగా , ఆశువు గా వేసే  త్రిమూర్తి చలోక్తులు కథకు అడ్డు రాకపోగా కామేశ్వరి కథకు బ్రేక్ వచ్చిందనే విషయాన్ని గుర్తించకుండా చేస్తాయి. సంబంధం లేని సందర్భాలను, వ్యక్తులనూ కలేసి మాట్లాడే త్రిమూర్తి చమత్కారాలు మంచి ఎంటర్టైన్మెంట్

త్రిమూర్తి జోకుల్లో సమకాలీన పరిస్థితుల మీద సెటైర్లు బాగా పడతాయి. బాసర కు వెళ్ళినపుడు అక్కడి సరస్వతిని త్రిమూర్తి సమకాలీన కవిత్వం మీద మంటతో ఇలా ప్రార్తిస్తాడు

 

“అంత్య ప్రాసే కవిత

అని భ్రమించే నేటి

తెలుగు కవి గొర్రె తల

తొలగించు మా తల్లి

ఓ బాసరమ్మా ”

“సంబంధం లేకుండా మాట్లాడతావేం” అని విసుక్కుంటే “సంబంధం ఉండక్కర్లేదు. మాట్లాడే దానికి వ్యాకరణ సూత్రాలు కూడా ఏమీ ఉండక్కర్లేదు. బస్సులో కూచుని భగవంతుడిని గురించి, శోభనం గదిలో చార్వాకుడిని కూడా గురించి మాట్లాడవచ్చు. “సంభాషణా క్రమంలో ఒక్కొక్కప్పుడు కాంటాక్ట్స్ లేకుండా మాట్లాడ్డమే గొప్ప ఆర్ట్” అని నాట్యముని  భరతుడు తన వాత్సాయన కామ సూత్రాల్లో నిర్వచించాడు, కావాలంటే చూసుకో” అని వింత కాంబినేషన్స్ సృష్టిస్తాడు

“అన్నయ్యా ఇహ నీ కవిత్వాలూ అపుతావా” అని దమయంతి నవ్వితే “ఇది నాది కాదమ్మా, వేములవాడ భీమకవి తన క్రీడాభిరామం లో రాశాడు” అంటాడు నిర్వికారంగా!

కామేశ్వరి తీవ్ర స్వభావాన్ని కూడా ముదిగొండ అలవోకగా చిత్రిస్తూ పాఠకుడికి కొంత హింట్ కూడా ఇస్తారు. కామేశ్వరికి తల్లి చిన్నప్పుడే చనిపోయి, తండ్రి చేతుల్లో పెరుగుతుంది. అందువల్ల ప్రకృతి లోని , సమాజం లోని కొన్ని సున్నితమైన విషయాలను అర్థం చేసుకునే కోణం పూర్తిగా మారి పోయి, extremist గా మారుతుంది. తల్లి ఉండి ఉంటే “ఇది కాదు బతికే విధానం” అని ఇందిర ప్రకాశానికి చెప్పినట్టు మందలించి “ఇది కాదు ఆలోచించే విధానం, ఇది కాదు నువ్వు ఫలానా విషయాన్ని అర్థం చేసుకునే రీతి” అని అర్థమయ్యేలా చెప్పగలిగేదేమో అనిపిస్తుంది!

చిన్నపుడు తండ్రి ముద్దు పెట్టుకుని చాక్లెట్ ఇస్తే, తర్వాత స్కూల్లో ఒక కుర్రాడికి “పోనీ ముద్దు పెట్టుకుని చాక్లెట్ ఇవ్వు, మా నాన్న అలాగే చేస్తాడు”అంటుంది.  సెక్స్ కోసం మగాళ్ళు దేన్నైనా సరే ఎర వేసి సాధించుకుంటారనే ఆలోచన రాను రాను ఆమె లో పెరుగుతుంది. సినిమాలు చూసి బోల్డు ప్రశ్నలొస్తాయి కామేశ్వరికి చిన్నపుడు.అర్థ నగ్నంగా పొలాల్లో డ్యూయెట్లు పాడే హీరో హీరోయిన్లను చూసి ” వాళ్ళు రైతులా నాన్నా,ఎందుకు పొలాల్లో పరిగెడుతున్నారు?” అనడుగుతుంది. లాభం లేదని పౌరాణిక సినిమాలకు తీసుకు పోతే దేవతా స్త్రీలంతా వక్ష స్థలాలు ప్రదర్శిస్తూ వేష ధారణలు! వాటి మీద కామేశ్వరికి ప్రశ్నలు!!

కాలేజీ రోజుల్లో అష్ట విధ నాయికల గురించి పాఠం విని “ఈ నాయికలు చేసే పన్లని తెలుగులో చెప్తే మొరటుగా ఉంటుంది. సంస్కృతం లో చెప్తే కావ్యాలై కూచుంటాయి”అని తెలుగు మాష్టారిని ప్రశ్నలు వేస్తుంది.

“ఇదంతా రస సిద్ధాంతం, పవిత్రం” అని చెప్తే ” ఓహో ,సెక్స్ పరమ పవిత్రం” అనుకుంటుంది ఎదిగీ ఎదగని కామేశ్వరి.

ఎటూ కాని సందిగ్ధ పరిస్థితుల్లో కొట్టు మిట్టాడుతున్న ఆమెకు ఎదురైన మనుషులూ వాళ్ల కష్టాలూ కూడా ఆమెలో ఎక్కడో రగులుతున్న అశాంతిని ఎగదోసేవిగానే ఉంటాయి తప్ప సమాధాన పరిచేవిగా ఉండవు.

అందుకే కామేశ్వరి గమ్యమూ అస్పష్టమే , అందుకు ఆమె ఎంచుకున్న దారి కూడా అస్పష్టమూ ఆమోద యోగ్యమూ కానిదిగానే ఉంటుంది.

ఈ నవల గురించి విశేషాలేమైనా చెబుతారేమో అని రచయిత ముదిగొండ ని కదిలించాను. చాలా కాలం నాటి నవల కావడం తో ఆయన నవలకు దారి తీసిన నేపథ్యం గురించి ఏమీ గుర్తు చేసుకోలేక పోయారు. అయితే కామేశ్వరి పాత్ర గురించి ఇదే అభిప్రాయం వ్యక్తం చేశారు.

“కొందరికి ఆశయమూ గొప్పదే, ఆచరణా గొప్పదే అయి ఉంటాయి. మరి కొందరికి ఆశయం గొప్పదైనా, ఆచరణ మార్గం ఉత్తమమైంది ఎంచుకోరు. కొందరికి ఆశయం పట్లా స్పష్టత ఉండదు, అందుకు ఎంచుకునే మార్గం పట్లా స్పష్టత ఉండదు, ఉదాహరణ కామేశ్వరి” అన్నారు.

అప్పట్లో ఈ నవల బాగా ప్రజాదరణ పొందిందని చెపుతూ ఆ రోజుల్లో తాను ఆర్య సమాజ్ కార్య కలాపాల పట్ల కొంత ఆకర్షితుడిని కావడం వల్ల దయానంద్ పాత్రను ఆ ప్రేరణ తోనే సృష్టించానని వివరించారు.

దయానంద్ పాత్ర మాత్రం మొదటి నుంచీ ఒక స్పష్టతతో సాగుతుంది. ఆత్మ పరిశీలన, బుద్ధి వికాసం అనే రెండు లక్ష్యాలతో పని చేసే అతడు ఏ క్షణం లోనూ నియంత్రణ కోల్పోకుండా ప్రవర్తిస్తాడు. అగ్ని మిత్రుడు చేసిన హత్య  అమాయకత్వంతో తొందర పాటుతో చేసిందిగా భావించి ఆ నేరం తన మీద వేసుకోడానికి కూడా వెనుకాడనంత పరిణతి చూపిస్తాడు. చివరికి కామేశ్వరి వలన అతను ఆత్మ త్యాగం చేసి కామేశ్వరిలో సైతం పశ్చాత్తాపాన్ని రగిలిస్తాడు.

గమ్యం దాదాపుగా ఒకటే అయినా ముగ్గురు వ్యక్తుల జీవితాలు మూడు రకాలుగా ముడివడి చివరికి ఏమయ్యాయో ఉత్కంఠ భరితంగా చిత్రిస్తుందీ నవల.

శబ్ద కాలుష్యం , మనిషి మెదడు మీద అవి చూపించే ప్రభావం వంటి సైన్స్ కోణం పక్కన పెడితే,  కామేశ్వరి డైరీ చదివిన దమయంతి ఆ కథను ట్రాన్స్ లో ఉండి పాఠకుడికి చెప్పడం నవలను మిస్టీరియస్ గా  చివరి వరకూ ఉంచుతుంది. అయితే దమయంతి, త్రిమూర్తి,కామేశ్వరి ల మధ్య బంధాలు ఎలా ఉండేవి అనేది రచయిత ఎక్కడా చెప్పడు. కామేశ్వరి డైరీలో కూడా దమయంతి ప్రస్తావన గానీ, త్రిమూర్తి ప్రస్తావన గానీ ఉండదు.

ముదిగొండ శివ ప్రసాద్ గారు రాసిన చారిత్రక నవలలో కొన్ని చదివినా ఎందుకో ఈ నవల ప్రత్యేకత దీన్ని ఏళ్ళుగా గుర్తుండి పోయేలా చేసింది.

సామాజిక దృక్పథం తో సినిమాలు కొత్తగా పరిచయమవుతున్న ఆ రోజుల్లో మంచి దర్శకుడి చేతిలో పడితే ఇదొక మంచి సినిమా గా కూడా తయారైఉండేదేమో!

మంచి చర్చకు దారి తీసే టాపిక్ తో రాసిన మంచి నవల. ఆశయాలుండగానే సరి కాదు, వాటితో వాస్తవాలను బేరీజు వేసుకుని వాటికనుగుణంగా నడవలేక జీవితాలను నాశనం చేసుకున్న ముగ్గురు యువతీ యువకుల కథ గా ఈ నవల నాకు చాలా ఇష్టమైనది . చారిత్రక నవలా చక్రవర్తి గా పేరొందిన రచయిత రాసిన సైంటిఫిక్ మిస్టీరియస్ సాంఘిక నవలగా దీన్ని చెప్పడం బాగానే ఉంటుందనుకుంటాను

నవలలోని ప్రధాన పాత్రలు మూడింటిలోనూ ఉన్నది అగ్ని ప్రవృత్తే! వెలుగునివ్వడానికీ దహించి సర్వం బూడిద చేయడానికీ కూడా అగ్నే మూలం! ఈ అగ్నిలోనే వాళ్ల జీవితాలు ఎలా ఆహుతి అయిపోయాయో సూచించేందుకే అగ్నిగీతం అని ఈ నవలకు పేరు పెట్టి ఉంటారు బహుశా!

“మీ పుస్తకాలన్నీ మళ్లీ వేశారు కదా , ఇది మాత్రం ఎందుకు వేయలేదు ” అని అడిగితే డాక్టర్ ముదిగొండ “దానిదేముందమ్మా , ఎప్పుడు కావాలంటే అప్పుడు వేయొచ్చు కొన్ని కాపీలు ” అన్నారు. శ్రీలేఖ, శ్రావణి వంటివి రీ ప్రింట్ అయ్యాయి గానీ ఇది మాత్రం 3 దశాబ్దాలుగా ప్రచురణకు రానే లేదు.

ఆయన ఎప్పుడు వేస్తారో తెలీదు కాబట్టి , అందుబాటులో ఉన్న సోర్స్ వెదకడం మంచిది. ఈ నవల దగ్గర ఉన్న వాళ్లలో నేనొకరిని :-)

 

peepal-leaves-2013

 

 

 

 

మంచి పుస్తకానికి తోడూ నీడా!

 

 

-సుజాత 

~

 

నవోదయ షట్టర్లు దించేశారనే వార్త “ది హిందూ” లో చూసి అక్కడ పుస్తకాలు కొని ఉన్న వాళ్లమంతా ఉలిక్కి పడి విషాదంలో మునిగి పోయి ఫేస్బుక్ గోడల మీద విచారాలు వ్యక్తం చేశాం మూకుమ్మడిగా !

వార్తలో చివరి లైన్లోని ముక్కలు (షాపు వెనక సందులో చిన్న షాపు తీసుకుంటున్నామనీ, అక్కడ పుస్తక విక్రయం కొనసాగుతుందనీ) కాస్త సందేహాన్ని మిగల్చడం తో ,దాన్ని నివృత్తి చేసుకునే దాకా నిద్ర పట్టక నవోదయ రామ్మోహన రావు గారికి, వాళ్లబ్బాయి సుధాకర్ గారికి ఫోన్ చేశాను.

అమ్మయ్య, రామ్మోహనరావు గారి నోటి వెంట “ఏం, కంగారు పడద్దు, నవోదయ మూత పడలేదు. మూత పడింది రిటెయిల్ సేల్స్ షాపు మాత్రమే” అన్న మాట వినపడింది.

ఆయన మాటల్లోనే “కొత్త పుస్తకాలు వేయడం మానేసి చాలా రోజులైందిగా? కేవలం అమ్మకాలు మాత్రమే సాగిస్తున్నాం కదా! ఇప్పుడు మూసేసింది రిటెయిల్ సేల్స్ కౌంటర్ మాత్రమే! నవోదయ ఇంకా ఉంది. వెనక షాపు తీసుకున్నాం కదా! ఎవరికి ఏ తెలుగు పుస్తకం కావాలన్నా, ఈ మెయిల్ ద్వారా ఆర్డర్ పంపినా సరే, మా దగ్గర లేక పోతే సేకరించైనా సరే అందించడానికి సిద్ధంగా ఉన్నాను. త్వరలో మాదిరెడ్డి సులోచనవి 60, 70 పుస్తకాలు కొత్తవి వేయాలనే ఆలోచన కూడా ఉంది! ఏం చేద్దాం, పుస్తకాలు చదివే అలవాటు చాలా వరకూ తగ్గి పోయింది జనంలో! ఆన్ లైన్లో పుస్తకాలు అందుబాటులో ఉండటం, ఈ బుక్స్ రావడం ఇవన్నీ కూడా ఇలాటి పరిస్థితికి కారణాలే! దేన్నీ కాదనలేం”

షాపు మూసేసినట్లు అద్దె షాపు తాలూకు తాళాలు కూడా ఓనర్ కి ఇచ్చేసినట్టు చెప్పిన సుధాకర్ “నాన్నగారికి పుస్తకమే జీవితం. అందుకే ఆయన దీన్ని కొనసాగిస్తారు, కాక పోతే వెనక చిన్న షాపులో” అని చెప్పారు.

ఇదంతా అలా ఉంచితే,

పూలమ్మిన చోటే కట్టెలు అమ్మడమనే సామెత పబ్లిషర్ , పుస్తకాలు వేయడం మాని కేవలం పుస్తక విక్రేత గా మిగిలి పోవడానికి కూడా వర్తిస్తుందేమో! ఏ వ్యాపారమైనా ఏదో ఒకనాటికి మూత పడటానికి దాని కారణాలు దానికి ఉంటాయి. పాఠకుల పఠనాభిరుచి మీద ఆధారపడి నడిచే పుస్తక ప్రచురణ మూత పడటానికి ఆర్థిక కారణాలెన్నున్నా, వాటికి దారి తీసేవి మాత్రం సాంస్కృతిక కారణాలే! గత పదిహేను, ఇరవయ్యేళ్ళుగా పుస్తకాలు చదవడం అనేక కారణాల వల్ల గణనీయంగానే పడి పోయింది.   సిలబస్ తప్ప వేరే పుస్తకాలు ముట్టడానికి సమయం లేని టెక్నికల్ చదువుల్లో విద్యార్థులు మునిగి పోవాల్సి రావడం,మధ్య  తరగతి లివింగ్ రూములోకి టీవీ ప్రవేశించి పఠనాభిరుచిని హత్య చేయడం, ఆక్టోపస్ లా చుట్టూ అల్లుకున్న సోషల్ నెట్ వర్క్ .. కారణం ఏదైనా కానివ్వండి పుస్తకాల సంఖ్య జీవితంలోంచి నెమ్మది నెమ్మదిగా తగ్గి పోవడానికి వీటన్నిటి ప్రమేయం ఉంది!

నవోదయ విశాలాంధ్ర లాంటి గట్టి సంస్థలు కొన్ని తప్పించి అనేక ప్రచురణ సంస్థలు ఏ నాడో మూత పడ్డాయి.

విజయవాడ ఏలూరు రోడ్ లో పుస్తకాల షాపులన్నీ చూసుకుంటూ తిరగడం నవోదయలోనో విశాలాంధ్రలోనో గంటల కొద్దీ పుస్తకాలు తిరగేస్తూ, ఏ పుస్తకం కొనుక్కోవాలో తేల్చుకోలేక, అన్నీ కొనాలని ఉన్నా, డబ్బులు చాలవని దిగులు పడిన రోజులు మన గత చరిత్రలో ఉండటం ఒక గొప్ప గౌరవమూ గర్వకారణమూ! స్మార్ట్ ఫోన్లు లేక ఎన్ని సెల్ఫీలు మిస్ అయి పోయామో ఆ రోడ్డులో!

ఎమెస్కో పాఠకుల కోసం “ఇంటింటా గ్రంథాలయం” పేరుతో బుక్ క్లబ్ నడిపింది చాలా యేళ్ళు. అందులో స్కూలు రోజుల నుంచీ సభ్యత్వం, ఎన్నో పుస్తకాలను నా లైబ్రరీలో చేర్చింది. నెల నెలా 20 లేక 30 రూపాయలు కడితే ప్రతి నెలా ఇంటికో పుస్తకం వచ్చేది పోస్టులో .(నా సభ్యత్వ నంబర్ EBC 7463) వాళ్లెంత మంచి వాళ్లంటే, నెల నెలా వాళ్ళు వేసే పుస్తకం మనకి నచ్చకపోతే వేరే పబ్లిషర్ వేసిన పుస్తకం కావాలంటే తెప్పించి మరీ పంపే వాళ్ళు. ఆ అవకాశాన్ని వాడి అరుణా పబ్లిషింగ్ హౌస్ నుంచి చలం, రంగనాయకమ్మ గారి పుస్తకాలన్నీ ఎమెస్కో బుక్ క్లబ్ నుంచి కొన్నవే!

బుక్ క్లబ్ లే కాదు, చాలా చాలా వార పత్రికలు, మాస పత్రికలు కూడా అంతర్థానమై పోయాయి. యువ, జ్యోతి, వనిత,విజయ, పల్లకి, ఈ మధ్య నాటిదే హాసం, బాల్యపు అద్దం చందమామ, మరెన్నో!

పుస్తకాలని వ్యసనంగా మార్చిన లెండింగ్ లైబ్రరీలు, సర్క్యులేషన్ కాన్సెప్టూ మాయం! వర్తమానం లోంచి జ్ఞాపకాలు గా మారి చరిత్రలో కల్సి పోయాయి. శాఖా గ్రంథాలయాల్లో కొత్త పుస్తకాలు శూన్యం!

మార్పు ఏ సమాజంలో అయినా అనివార్యం! ఐతే అది అభివృద్ధికి దార్లు వేస్తుందా, సాంస్కృతికి విషాదానికి దారులు తీస్తుందా  అనేది అది ప్రయాణించే మార్గం నిర్ణయిస్తుందేమో బహుశా! ఆర్ట్సు గ్రూపులు పనికి రానివి గా ముద్ర వేసుకుని చదువుల్లోంచి దాదాపుగా అంతర్థానం అయ్యాయి! బుర్ర కథ, హరికథ వంటి కళారూపాలు వాస్తవం లోంచి జారి పాఠ్యాంశాల్లో ప్రస్తావనలు గా మారాయి. తోలు బొమ్మలాట అంతరించి తోలు బొమ్మలు వాల్ డెకార్లు గా, టేబుల్ లాంపులు గా అవతరించాయి,   కళల్ని, సంస్కృతిని చంపుకునే వాళ్లని ఎవరు బాగు చేస్తారు? రేపటి రోజున పత్రికలు ఆగి పోయినా, పుస్తక ప్రచురణ సంస్థలు మూత పడినా ఆశ్చర్యపోకుండా ఆమోదించే స్థాయికి మనమే చేరాలి!

కానీ పుస్తకం మాత్రం చావకూడదు. రూపం మారినా , అది పాఠకుల చేతిలోనే ఉండాలెప్పుడూ! పబ్లిషర్స్ అందరికీ ఆశ కల్గించేది ఏటా జరిగే బుక్ ఫెయిర్లే! ఒక పుస్తక విక్రేత హాస్యానికిలా అన్నారు నాతో “చదువుతారో లేదో తెలీదు కానీ, ఫేస్బుక్ లో ఫోటో పెట్టడానికైనా సరే, కొంటున్నారు పుస్తకాలు” ఇది వినోదమో విషాదమో గానీ పుస్తకాల అమ్మకాలకి ఆ రోజుల్లో ఢోకా లేదు

మధ్య తరగతి జీవితంలోంచి పుస్తక పఠనం నిష్క్రమిస్తోందని బాధ పడ్డా, పుస్తకానికెప్పుడూ మంచి రోజులే అని భరోసాగా రామ్మోహనరావు గారు మాట్లాడ్డం చాలా రిలీఫ్ ని ఇచ్చింది.  కానీ ఇకపై దుమ్ముతో రద్దీతో కిట కిట లాడే ఆ ఏలూరు రోడ్ లో ఇక నవోదయ బోర్డు కనిపించదు. ఎక్స్ ప్రెస్ బస్సు ఎక్కక పోతే ఆదా చేయగలిగే పధ్నాలుగు రూపాయలతో ఏ పుస్తకం అదనంగా కొనచ్చనే ఆలోచనలతో స్నేహితులతో పాసెంజర్ ట్రైన్ ఎక్కి పుస్తకాల కోసం విజయవాడకు చేసిన ప్రయాణాలే ఇక జ్ఞాపకాల్లో మిగిలేవి!

నవోదయ వెనక సందులోకి మారినా, ఆ బొర్డు కనిపించక పోయినా, రేపో మాపో అసలు మూత బడే పోయినా, ఎవరు మాత్రమేం చేయగలం? చూస్తూ “ఎటు పోతున్నాం” అని రొటీన్ ప్రశ్న వేసుకోడం తప్పించి!

 

*

 

 అడవి పిలిచింది

 

                      

 

నేను మట్టి కావడం కంటే బూడిద కావడానికే ఇష్ట పడతాను . కుళ్ళి కృశించి నశించడానికి బదులు నాలోని ప్రతి అణువూ భగ భగ మండే మంటల్లో ఆహుతవాలనుకుంటాను !మందకొడి గా ఒక శాశ్వతమైన గ్రహంగా ఉండటం కంటే దేదీప్యమానం గా వెలిగి పతనమయ్యే అద్భుతమైన ఉల్క గా మారాలనుకుంటాను ! మనిషన్న వాడు జీవించాలి . బతుకీడ్చడం కాదుజాక్ లండన్

ఈ మాటలు చదువుతుంటేనే రక్తం పరుగులు పెడుతుంది ! ఇలా బతకడం ఎంతమందికి సాధ్యం అవుతుంది ? జాక్ లండన్ అలాగే బతికాడు . జీవితంలోని ప్రతి క్షణాన్ని అద్భుతమైన అనుభవంగా మార్చుకుంటూ , వాటిని పోగు చేసుకుంటూ మంట లా మండుతూ వెలుగుతూ బతికాడు !

jack london2

జీవితాన్ని ఒక మహోధృత తరంగం లా జీవించి ప్రతి క్షణాన్నీ అనుభూతి చెంది, ఇక చివరి క్షణాల్లో “అప్పుడలా చేసుంటే బాగుండేది, ఆ నెల్లో అలా చేయకుండా ఉండుంటే బాగుండేది” అని పశ్చాత్తాపాలు, నెమరేసుకోడాలూ లేకుండా బతికినన్నాళ్ళూ జీవించడం మాత్రమే తెల్సిన వ్యక్తులు లోకంలో ఎంతమంది ఉంటారో గానీ సరిగ్గా అలాటి మనిషే జాక్ లండన్ ! బోల్డు పుస్తకాలు రాశాడని అందరికీ తెల్సిందే!

వాటిలో అన్నిటికంటే నాకు బాగా నచ్చింది “కాల్ ఆఫ్ ది వైల్డ్”! దీన్ని మొదటి సారి నేను పీకాక్ క్లాసిక్స్ వాళ్ళు వేసింది “అడవి పిలిచింది” గా చదివాను. అది చదివాక వైట్ ఫాంగ్, సీ వుల్ఫ్, ( ఇలా కుక్కలు తోడేళ్ళ మీద పుస్తకాలు రాసినందుకే ఆయన్ని ఆక్స్ స్నేహితుడు “ఉల్ఫ్ మాన్” అని పిలిచేవాడట )  To build a fire ఇంకా Star Rover చదివాను. వైట్ ఫాంగ్, సీ వుల్ఫ్ కూడా వైల్డ్ లైఫ్ కి సంబంధించే సాగుతాయి, కాల్ ఆఫ్ ది వైల్డ్ లాగే! టు బిల్డ్ ఎ  ఫైర్, మొత్తం పూర్తి చేసి గానీ కదిలే పుస్తకం కాదు. నిజానికి, అతి మామూలు సంఘటనల్ని కూడా ఉత్కంఠ  రేకెత్తించేలా జాక్ లండన్ మాజిక్ చేయగలడు. ఆ కథలోకి మనల్ని తీసుకు పోయి అక్కడ పారేస్తాడు ! ఇహ మన ఖర్మ , తర్వాత వెనక్కి రావాలంటే దారి మనమే వెదుక్కోవాలి !

జాక్ లండన్ తెలుగు పుస్తకం తో నాకు పరిచయం ఐనా, మిగతా పుస్తకాలు కూడా చదివించాడు. ఈ తెలుగు “అడవి పిలిచింది” చదువుతుంటే మనల్ని పిచ్చిగా ప్రేమించి, మన మీద అంతటి మమకారం పెంచుకుని మన కోసం ప్రాణాలైనా ఇవ్వగలిగేంత ప్రేమను పంచే బక్ లాంటి కుక్కను, మన జోలికి ఎవరైనా వస్తే వాళ్ల రక్తం కళ్ల జూసే బక్ లాంటి కుక్కని.. పెంచుకోవాలనే కోరిక బలీయంగా కలుగుతుంది ఎవరికైనా !  విశ్వాసం, ప్రేమ చూపడం ఒక్కటే బక్ లక్షణం కాదు !  సాహసం, జీవితం మీద ప్రేమ, ఉత్సాహం ఇవన్నీ దాని ప్రత్యేక లక్షణాలు ! ఇది తోడేలు జాతికి చెందిన బలిష్టమైన కుక్క!

విధి వశాత్తూ రాజా లాంటి విలాసమైన బతుకు లోంచి అతి హీనమైన బతుకు లోకి జారి పడ్డ దగా పడిన కుక్క ఇది

అమెరికాలొని కాలిఫోర్నియా లో  నివసించే ఒక  జడ్జి గారింట్లో సకల రాజ భోగాలనుభవిస్తూ పెరిగే బక్ అనే ఈ కుక్కే ఈ నవల్లో హీరో! జాక్ లండన్ ఇతర నవలల్లాగే, మొదలు పెట్టాక ఏక బిగిన చదివించే ఈ నవల్లో బక్ జీవితం మొత్తం ఆవిష్కృతమవుతుంది.

Buck

“బక్ పత్రికలు చూడదు ” అంటూ నవల ప్రారంభం అవుతుంది . ఒక గొప్ప ప్రారంభం ఇది !

విలాసవంత మైన జీవితం, దాని వల్ల అయాచితంగా వచ్చి పడ్డ దర్పం తో బక్ రాజ ఠీవి తో జడ్జి గారింట్లో ఉంటుంది. ఎంతో గంభీరంగా, గర్వంగా బతుకుతున్న బక్,  ఏదో జడ్జి గారి మనవలు కాబట్టి వాళ్లని తన జూలు తో ఆడుకోనిస్తుంది. కానీ అది పత్రికలు చూడక పోవడం వల్ల దానికి రాబోతున్న కష్టం అది గ్రహించలేక పోతుంది.

ఆ సమయం లో  అలాస్కా ప్రాంతం  లో బంగారు గనుల్లో బోల్డంత బంగారం దొరుకుతోందనీ, అందువల్ల  జనం అంతా కట్టలు గట్టుకుని అక్కడికి పోతున్నారనీ, మంచు తప్ప మరేమీ లేని ఆ ప్రాంతం లో ప్రయాణించడానికి  స్లెడ్జ్ బళ్ళు కావాలనీ, వాటిని ఈడ్చడానికి  మంచు ని తట్టుకునే జూలు కల్గిన  బలమైన కుక్కలు అవసరమనీ పత్రికల్లో వచ్చుండచ్చు, వస్తుండచ్చు గానీ పత్రికలు చూడక పోవడం వల్ల మనిషికి ఆ పచ్చని లోహం మీద ఉన్న ప్రేమానురాగాలు దానికి తెలీవు.  అంతే కాక జడ్జి ముల్లర్ ఇంట్లో పని చేసే మాన్యూల్  కి ఉన్న చైనా లాటరీ జూదం వ్యసనం గురించి దానికేమీ అవగాహన లేదు.  ఇవన్నీ బక్ పత్రికలు చూడక పోవడం వల్ల దానికి తెలీవు. కాబట్టి, మాన్యూలు గాడు తనని ఒక పరాయి మనిషికి అమ్మబోతున్నాడని గ్రహించలేకపోయింది. వాడిని నమ్మి వాడితో బయటికి ఎప్పట్లాగే వెళ్ళి, వేరే వాడికి అమ్ముడై పోతుంది.

మాన్యూలు తన మెడ పట్టీని అపరిచితుడికి అప్పగిస్తుంటే కూడా , ఆ పరాయి వాడు మాన్యూలు కి తెలిసిన వాడే గదాని కాస్త గుర్రుమన్నా ఆమోదిస్తుంది! వాడు గోనె సంచిలో మూటగట్టి తీసుకుపోతుంటే “ఏదో జరిగింది” అని తప్ప ఏం జరిగిందో దాని కుక్క బుర్రకి తట్టదు. ఎన్నడూ ఆలోచించాల్సిన అవసరమే రాని బుర్రాయె!

అలా తీసుకుబోబడ్డ బక్ తన జీవితంలో ఎన్నడూ ఎదురు చూడని భయంకరమైన జీవితాన్ని చూస్తుంది. ఒక బోనులో పడేసి బొత్తిగా బక్ అంటే మర్యాద లేకుండా ప్రవర్తిస్తూ రైల్లో తీసుకు పోతారు.

అక్కడి నుంచి అది చాలా మంది చేతులు మారి , సుదీర్ఘ ప్రయాణాలు చేసీ దానికి జీవితంలో “దుడ్డు కర్ర న్యాయాన్ని” పరిచయం చేసిన ఎర్ర స్వెటర్ వ్యక్తి చేతికి వస్తుంది. ఈ మధ్యలో ఎదురైన ప్రతి మనిషి పైనా బక్ ,చంపాలన్నంత కోపంతో తిరగబడి కరిచి రక్తం కళ్ల జూస్తుంది. రచయిత మాటల్లో చెప్పాలంటే “బందీ అయిన రాజుగారికి” వచ్చే కోపాన్ని చూపిస్తుంది. చివరికి బక్ ఎర్ర స్వెట్టర్ వాడి చేతిలో పడ్డాక వాడు “మాట వినడం, వినయంగా ఉండటం” అనేవి ఎలా సాధ్య పడతాయో దానికి రుచి చూపిస్తాడు, దుడ్డు కర్రతో!

తన దర్పాన్నీ, శౌర్యాన్నీ, బలాన్నీ మాత్రమే నమ్ముతూ వాటిని ప్రదర్శించాలని చూసిన బక్ కి ఎర్ర స్వెట్టర్ వాడి దుడ్డు కర్ర మాడు పగల గొట్టి, ఒక్క కుదుపు ఇస్తుంది. బక్ శరీరమే కాక, అభిమానం కూడా తిన్న మొదటి దెబ్బ అది!  దెబ్బ తిన్న బక్ అంత బాధని మొదటి సారి చవి చూసినా, తిరిగి వాడి మీద తిరగబడాలనే చూసి పన్నెండు సార్లు అతడి మీద దాడికి ప్రయత్నించి పదమూడో సారి కొట్టిన అతి బలమైన దెబ్బకి , తల వంచి శక్తి చచ్చి నిస్సహాయురాలై పోతుంది. వాడంటాడు ఏం బిడ్డా బక్? మన సంఘర్షణ అయిపోయింది. నీ స్థానం నువ్వు తెలుసుకుంటే మంచిది. నాది నేనెరుగుదును. ఇంతటితో పోనివ్వడం మంచిది

బక్ కి తన స్థానమేంటో తెలిసి వస్తుంది మొదటి సారి! తాను ఓడిపోయిందని గ్రహిస్తుంది గానీ లొంగి పోదల్చదు . అక్కడి నుంచీ బక్ “ఎదురు తిరిగితే” , తన తిరుగుబాటు న్యాయమైనదైనా  సరే, దెబ్బలు తినక తప్పదని అర్థం చేసుకుంటుంది. ఎర్ర స్వెటర్ వాడి నుంచి చేతులు మారి కెనడా దేశపు అధికారిక ఉత్తరాల బట్వాడా కోసం ప్రాన్సోయ్, పెరాల్ట్ అనే ఇద్దరు వ్యక్తుల వద్దకు చేరుతుంది బక్.నిత్యం కష్టమే,నిత్యమూ శ్రమే ! కానీ బతకాలంటే వాటికి తల వంచాలి !

ఇక్కడి నుంచీ బక్ కి అసలైన జీవితం మొదలవుతుంది. జీవితం మామూలుగా నడిచి పోవాలంటే ఎన్ని జిత్తులు చేయాలో, ఎన్ని కుట్రలు చేయాలో,  ఎలా చేయాలో , ఎలా చేస్తారో అన్నీ తెలుస్తాయి. బతకడం కోసం అది అన్నీ నేర్చుకుంటుంది. మంచంటే తెలీని బక్ కి మంచు లో మైళ్ళ కొద్దీ స్లెడ్జ్ బండి లాగడం, మంచులో గుంట తవ్వుకుని పడుకోడం అన్నీ అలవాటు అవుతాయి. జీవితం లాగి పెట్టి  తన్ని మరీ నేర్పిస్తుంది. ఒకరి నాయకత్వం కింద పని చేయడమూ, పని సరిగా చేయలేనపుడు నోర్మూసుకుని భరించడమూ, ఇవన్నీ బక్ అంగీకరిస్తుంది.

ఎస్కిమో కుక్కలు వచ్చి పడితే వాటిని ఎదుర్కోవడమూ, తోటి కుక్కలు మోసం చేస్తే బుద్ధి చెప్పడమూ అలవాటు చేసుకుంటుంది. దాని జీవితం సినిమాల్లో మాదిరిగా క్షణాల్లో సింహాసనం మీది నుంచి పాతాళం లోకి జారి పడ్డట్టు అయినా, బక్ దాన్నుంచి తేరుకుని దొరికిన జీవితాన్ని అంగీకరిస్తుంది.

పని చేయడానికే తనను అక్కడికి తెచ్చారని  అర్థం చేసుకుని బతుకు దెరువు కోసమన్నట్టుగా అది త్వరగానే పని నేర్చుకుని స్లెడ్జ్ బళ్ళు లాఘవంగా లాగుతుంది.

కలలోనైనా ఊహించని కష్ట జీవితం!

ఉత్తరాల బట్వాడా పన్లు చూసే ప్రాన్సోయ్, పెరాల్ట్ బక్ ని బాగా మెచ్చుకుంటారు ఒళ్లు దాచుకోదని!

కష్ట జీవితం అలవాటయ్యాక బక్ లోని సున్నితత్వమూ, పెంపుడు జంతువుకు ఉండే నాగరికతా, మొహంలో ప్రశాంతతా అన్నీ ఒక్కొక్కటీ మాయమై పోతాయి.అది జీవితం మీద పగ బట్టినట్టు ప్రవర్తిస్తుంది. తనపై ఆధిపత్యాన్ని చూపబోయే స్పిట్జ్ కుక్క రక్తం కళ్ల జూస్తుంది. మోసం, దొంగతనం నేర్చుకుంటుంది. అదను చూసి దాడి చేసే విద్య నేరుస్తుంది. నిజాంకి ఇవన్నీ అక్కడ బతకాలంటే ఉండాల్సిన కనీస అర్హతలనుకోవచ్చు! అది రాక్షసి లాగా మారినా, ఆ రాక్షసత్వాన్ని కప్పి పైకి మామూలుగా కనిపించే యుక్తిని కూడా నేర్చుకుంటుంది.

కొన్నాళ్లు గడిచాక ,  ఉత్తరాల బట్వాడా పని పూర్తయ్యాక అది మరొకరి చేతిలో పడి, అక్కడి నుంచి అదృష్ట వశాత్తూ జాన్ టారంటన్ (Thornton )ఆశ్రయాన చేరుతుంది. అతడు దాన్ని చావగొడ్తున్న వాడిని బెదిరించి కాపాడతాడు ! టారంటన్ ని  చూస్తుంటే జాక్ లండనే తన పాత్రను పెట్టాడేమో అనిపిస్తుంది. అతని వద్దకు చేరాక నిరంతర శ్రమ కారణంగా  డస్సి పోయున్న బక్ తనకు అనుకోకుండా లభించిన ఈ అవకాశానికి ఆశ్చర్య పోతూనే కొంతకాలం పాటు తిండి,మంచి విశ్రాంతి, ప్రకృతి విహారం వీటితో కోలుకుని పోయిన తన శక్తిని కూడగట్టుకుంటుంది. ఈ బ్రేక్ లో దానికి ముందెన్నడూ లేని అనుభవం .. అవధులు లేని ప్రేమ జాన్ టారంటన్ తో కలుగుతుంది. జడ్జి మిల్లర్ ఇంట్లో రాజభోగాలు వెలగబెట్టినపుడు పది కుక్కల్లో బక్ ఒక ప్రత్యేక ఠీవీ తో ఉండటం, దాన్ని పని వాళ్ళు జాగ్రత్తగా చూసుకోడం తప్ప ఇలాటి ప్రేమను పంచిన వాళ్లెవరూ లేరు. అది అతన్ని ఎంతగా ప్రేమించేదంటే జాన్ దాన్ని ముద్దు చేస్తుంటే గుండె వేగం పెరిగి పోతుంది.  పిచ్చి మమకారం పెంచుకుంటుంది!

అలాగని అది మిగతా కుక్కలా లాగా ఎగబడి ఆ ప్రేమను చూపించదు! పైకి పెద్దగా తేలకుండానే మూగగా ఆరాధిస్తుంది ! ప్రేమలో బెట్టుసరి గా ఉంటుంది . తన మమకారాన్ని జాన్ గ్రహిస్తున్నాడని తెల్సు ! కానీ ఎగబడితే కొంత చులకనై పోతానని బెట్టు ! దటీజ్ బక్ !

Call of the wild cover pageజాన్ ని అంటిపెట్టుకుని అహర్నిశలూ ఉంటూ, అతన్ని కాపాడ్డం తన విధిగా భావిస్తుంది.రెండు సార్లు అతన్ని ప్రమాదాల నుంచి కాపాడి ప్రాణ దానం చేస్తుంది. అతన్ని పందెం లో గెలిపించడానికి స్లెడ్జి బండితో సహా వెయ్యి పౌన్లు బరువు లాగుతుంది. జాన్ కోసం ప్రాణమిస్తుంది.

అయితే జడ్జి మిల్లర్ ఇంట్లోంచి కిడ్నాప్ అయింది లగాయతూ బక్ కి దొరికింది స్వేచ్చ మాత్రమే కాదు.దాని లోని ఆటవిక శక్తులేవో నెమ్మది నెమ్మదిగా జూలు విదిల్చి నిద్ర లేస్తాయి. అందుకే అది స్లెడ్జ్ బళ్లు లాగే ఇతర కుక్కల దగ్గర అతి సులువుగా వేగంగా కుయుక్తులు, కుట్రలు నేర్చుకుంటుంది. చివరికి అది మిగతా కుక్కల కన్న శక్తివంతంగా తయారై వాటన్నిటి మీదా ఆధిపత్యం సంపాదిస్తుంది. ఇవన్నీ చేస్తున్నపుడే దాన్లోని ఏదో ఒక ప్రవృత్తి దాన్ని కొంత ఉద్వేగానికి గురి చేస్తూ, ఎక్కడికో వెళ్ళి పోవాలన్న భావోద్రేకాన్ని కల్గిస్తూ ఉంటుంది.

తెల్లని మంచు లోంచి పచ్చని అడవిలోకి వచ్చి పడ్డాక, టారంటన్ వద్ద ఉంటున్నపుడు ఈ ప్రవృత్తి మరింతగా ప్రకోపిస్తుంది! ఏ గత జన్మ జ్ఞాపకాలో వేధిస్తుంటాయి. ప్రకృతి నుంచి ఏవో పిలుపులు అందుతుంటాయి. ఆ పిలుపులు విన్నపుడు వెర్రి ఆవేశం దాన్ని ఆవహిస్తుంది. అది వినగానే బక్ అడవిలోకి పోయి తిరిగి తిరిగి తను కూడా మొరిగి, అడవి పాట పాడి వస్తుంది.

ఒక అర్థరాత్రి నాడు అడవి నుంచి వినిపించిన పిలుపుకు స్పందించిన బక్ అడవిలోకి పరుగు తీసి ఆ పిలుపు ఎక్కడి నుంచి వస్తుందీ తెలుసుకుంటుంది. ఆ తోడేలుని తన బంధువు గా గుర్తించినట్టుగా ,  బక్ దాంతో పోట్లాడక స్నేహం చేస్తుంది.దానితో పాటు అడవిలో పిచ్చిగా తిరిగి ఆడుతుంటే, దానికి గత జన్మ గుర్తొచ్చినంత పనవుతుంది. ఈ తోడేళ్ళ స్నేహం కోసమే తాను వచ్చినట్టు అనుభూతి చెందుతుంది ! ఇలాటి ఉద్రేకంలోనూ అది టారంటన్ ని మర్చి పోక వెనక్కి తిరిగొస్తుంది.బక్ కి ఈ అడవి పిలుపు , అది సాగించే వేటా ఇవన్నీ ఎక్కడో ఇంతకు ముందు తనకు జరిగినవే, తనకు అనుభవం లోకి వచ్చినవే అని తోస్తుంది (దేజా వు అన్నమాట )! అది తన తోడేలు జాతి రక్తం లో నుంచి మరుగుతున్న జ్ఞాపకాల మంట గా అది గుర్తించలేదు గానీ అనుభవానికి తోస్తుంది !

ఈ క్రమంలో అది రాక్షసం గా ఆటవిక తత్వాన్ని అలవర్చుకుంటుంది. ఎలుగు బంట్లను కూడా వేటాడుతుంది. డజన్ల కొద్దీ తోడేళ్ళను అవలీలగా ఎదుర్కొని రక్తం కళ్ల జూస్తుంది. ఒక గొప్ప అతిశయమూ, దాని వల్ల సమకురిన ఆటవిక సౌందర్యం వల్ల బక్ సౌందర్యం, ఠీవీ ఇనుమడిస్తాయి.ముట్టె మీదా, కళ్ళ పైనా ఉన్న నల్లని మచ్చలతో అది దాదాపూ ఒక బలమైన తోడేలు వలే కనిపిస్తుంది. పొంచు వేయడం,నిశ్శబ్దంగా పాములా పాకి దెబ్బ కొట్టడం ఇలాటివన్నీ బక్ నేర్చుకుని గొప్ప జీవ శక్తి తో అత్యంత శక్తివంతమైన ఆటవిక మృగం గా రూపొందుతుంది.

ఈ సమయంలోనే టారంటన్ బృందం బంగారు గనుల నుంచి చాలా బంగారాన్ని సాధిస్తారు.ఒక దుర్దినాన బక్ ఒక దుప్పిని  మహోత్సాహం తో వేటాడుతూ ఉన్నపుడు  ఈహాట్ తెగకు చెందిన రెడ్ ఇండియన్లు టారంటన్ శిబిరం మీద పడి అందర్నీ చంపి బంగారం దోచుకుంటారు. అందర్నీ చంపాక వాళ్లు ఆనందంతో నృత్యం చేస్తున్న సమయంలో బక్ అక్కడికి వచ్చి జరిగిన ఘోరాన్ని గుర్తించి, వీరావేశంతో విధ్వంసం సృష్టించి కన పడ్డ వాళ్లందర్నీ చంపి పారేస్తుంది. అదొక కుక్క అని కూడా గ్రహించే టైము వాళ్ళకి ఇవ్వదు !  భయం తో వాళ్ళంతా కకావికలైపోతారు. ఒక పెద్ద భూతం వచ్చి పడిందనుకుంటారు

జాన్ టారంటన్ నీళ్ళ మడుగు వరకూ పరిగెత్తి అక్కడ చని పోయాడని బక్ అర్థం చేసుకుంటుంది.బక్ ఆ సంఘటన జరిగినపుడు అక్కడ ఉండుంటే అంత జరిగేది కాదు. టారంటన్ మరిక లేడనే విషయాన్ని అర్థం చేసుకుంటున్న కొద్దీ దాని కడుపులో గుండెలో దుఖం తో  ఒక డొల్ల తనం ఏర్పడుతుంది. ఆ ఖాళీ మరిక పూడేది కాదు ఎన్నటికీ ! అది బాధను దిగమింగుతుంది.

కానీ పగను కాదు!

బక్ వెళ్ళి తోడేళ్ళ గుంపులో చేరి వాటన్నిటి మీదా ఆధిపత్యం సంపాదిస్తుంది. ఆ తర్వాత కొన్నాళ్ళకి అడవి తోడేళ్ళ సంతానం లో ముట్టెమీదా నెత్తి మీదా కపిల వర్ణపు మచ్చలు గల వాటిని ఈహాట్లు గుర్తిస్తారు.వాళ్లకు ఆ దెయ్యం కుక్క అంటే దడ. వాళ్ళ శిబిరాల్ని అది ఆ తర్వాత కూడా ధ్వంసం చేస్తుంది, శిబిరాల్లోంచి వెళ్ళిన వేట గాళ్ళు తిరిగి శిబిరం చేరకుండా దొరికిన వాళ్లను దొరికినట్టు చంపేస్తుంది. వాళ్ల శవాల పక్కన బక్ పాదాల గుర్తులు! వాళ్ళు ఎక్కడ కనిపిస్తే అక్కడ వేటాడి చంపుతుంది

ఇంత రాక్షసి గా మారిన బక్ ప్రతి వేసవి లోనూ ఆ లోయలోకి వచ్చి అక్కడ బంగారం నేలలోకి ఇంకి పోయి గడ్డి మొలిచిన ఆ ప్రాంతాల్లో ఎవర్నో గుర్తు చేసుకుని సుదీర్ఘంగా ఏడ్చి వెళ్ళి పోతుంది.

Prakriti pilupu_Jack London,(Tr)Kodavatiganti -19591

నవల ఆది మధ్యం అంతం మొత్తం బక్ దే! జాక్ లండన్ ఎంతటి ఉద్వేగ భరిత శైలి లో రాశాడో, అది ఏ మాత్రం లుప్తం కాకుండా దీన్ని కొడవటి గంటి కుటుంబ రావు అనువదించారు. నవల మొత్తం బక్ విశ్వరూపాన్ని, దాని జీవన వైవిధ్యాన్ని, భావోద్వేగాలని అత్యద్భుతంగా చిత్రీకరించారు.

అసలు బక్ ని ఒక మనిషి పాయింటాఫ్ వ్యూలో అర్థం చేసుకొవాలనిపిస్తుంది. ఈ మాట డోనాల్డ్ పైజర్ అనేసాహిత్య కారుడు కూడా నొక్కి వక్కాణిస్తాడు. బక్ అనుభవించి, మనం చదివేదంతా మానవ జీవితంలో ఎదురయ్యే క్లిష్ట పరిస్థితులే! పరిస్థితులకు అనుగుణంగా దర్జా వెలగబెట్టడమూ, హీన దశలో గతి లేక లొంగి ఉండాల్సి రావడమూ, తర్వాత ఆటవికంగా ప్రవర్తించాల్సి వచ్చి, ఆధిపత్యం చూపించే అవకాశం వచ్చినపుడు దాన్ని అంది పుచ్చుకునే స్వభావమూ ఇది మొత్తం అట్టర్ హ్యూమన్ నేచర్! బక్ తన అనుభవాల నుంచి పాఠాలు నేర్చుకుని అందుకు అనుగుణంగా ప్రవర్తిస్తూ ఈ మధ్య అదేదో సినిమాలో చెప్పినట్టు ఎక్కడతగ్గాలో  అక్కడ తగ్గి ప్రవర్తిస్తుంది.చిత్రంగా నవల మొదటి సారి చదువుతున్నపుడు నాకు సీతారామా రావు గుర్తొచ్చాడు. అతను కూడా డబ్బు చేతిలో ఉన్నపుడు తన్ను తాను మహరాజు గా భావించుకుంటూ దర్పంగా ఉంటాడు. బోల్డు కబుర్లు చెపుతాడు. బక్ నుంచి సీతారామా రావులు చాలా నేర్చుకోవాలి! పరిస్థితి చేజారగానే చతికిల బడి డిప్రెషన్ లోకి పోయి తనను తాను చంపుకుంటాడు. బక్ అలా చేయదు. గడ్డి పోచలా తుఫాన్ వచ్చినపుడు వంగి, అది పోగానే తలెత్తుతుంది. ఈ క్రమంలో అది తన స్వాభిమానాన్ని, సహజ విశ్వాస స్వభావాన్ని,అంతకు మించి అనువంశికంగా ప్రాప్తించిన ఆటవికత్వాన్ని ఏ మాత్రమూ వదులుకోదు!సమయం కోసం వేచి చూస్తుందంతే!

ఎర్ర స్వెటర్ వాడు పరిచయం చేసిన దుడ్డు కర్ర న్యాయాన్ని అది చిటికె లో గ్రహించి ఆ పాఠాన్ని చివరి వరకూ గుర్తు పెట్టుకుంటుంది. అధికారం చేతిలో ఉన్నవాడిదే రాజ్యం!వాడి చేతిలో కర్ర ఉన్నంత వరకూ, మనకు ప్రాణం మీద ఆశ ఉన్నంత వరకూ దుడ్డుకర్రను గౌరవించక తప్పదు. ఈ పాఠాన్ని మనుషులు అందరూ నేర్చుకోలేరు. నేర్చుకున్నా మానవ సహజమైన ఉద్వేగాలతో అనువు గాని చోట సామెత లా ప్రవర్తించి, భంగ పడతుంటాం మనం, అది సహజం కూడానూ! కానీ గెలవాలంటే వేచి చూడక తప్పదని, నెగ్గాలంటే తగ్గక తప్పదని బక్ చెప్తుంది.అలాగే బక్ కొన్ని జీవిత సత్యాలు తన శ్రామిక జీవితంలో నేర్చుకుంటుంది. బలమున్న వాడిదే రాజ్యం అనే ఎర్ర స్వెటర్ వాడి పాఠమే దీనికి కూడా మూలం! ప్రాణాలు నిలబెట్టుకుని తీరాల్సిన పరిస్థితిలో మోసం తప్పదు! తీరీ తీరని ఆకలి తీరాలన్నా దొంగ తనం చేయక తప్పదు. బక్ లో ఉత్తమ లక్షణం అదే! నేర్చుకున్న పాఠాల్ని మర్చే పోదు! తనకు పోటి గా తయారైన స్పిట్జ్ అనే కుక్క దాష్టీకాన్ని అది చాలా రోజులు భరిస్తుంది . దాని నాయకత్వం లో పని చేస్తుంది !గాయ పడుతుంది . మొదట్లో చాలా సహనం వహిస్తుంది . కాల క్రమేణా అది దాని సహజ ఆటవిక ప్రవృత్తిని  స్వీకరించాక , స్పిట్జో తనో తేలి పోవాల్సి వచ్చిన రోజు, ఉగ్ర రూపం ధరించి దాని అంతు చూసేస్తుంది ! ఎవరో ఒకరు గెలాల్సిన రేసులో ప్రాణాలు పోగొట్టుకోడానికి కూడ సిద్ధమై ప్రాణాలు తీయడానికి  తెగబడుతుంది ! తెగబడక పొతే స్పిట్జ్ ఆ చాన్స్ తీసుకుంటుంది మరి !

బ్రాహ్మణీకం లో చలం ఒక మాటంటాడు “ఔన్నత్యంలో ఉన్నన్నాళ్ళూ, మనుషులు తమ స్వభావంలోనూ ఔన్నత్యం ఉందనుకుంటారు” అని! బక్ కూడా జడ్జి గారింట్లో ఉన్నన్నాళ్ళూ తానొక రాజ వంశానికి చెందిన దాన్నని ఊహించుకుంటూ దర్పం చూపిస్తుంది. కానీ వాస్తవం మరో లోకం లో పడేసి ఈడ్చి తన్నే సరికి, ముందు నిర్ఘాంత పోయినా త్వరలోనే తేరుకుని జీవితంతో రాజీ పడుతుంది. ఒళ్ళు దాచుకోక పని చేస్తుంది.అలా దాచుకునే ఇతర స్లెడ్జ్ కుక్కల్ని సహించదు.అడవిలోకి వచ్చాక, సహజ గుణం ప్రకారం ఆహారం కోసం మాత్రమే వేటాడుతుంది. వినోదం కోసం కాదు! ఇలా ఎక్కడికక్కడ బక్ నీళ్ళు అది పోసిన పాత్రను బట్టి తన స్వరూపాన్ని మార్చుకున్నట్టు ప్రకృతికి అనుగుణంగా, జీవితానికి అనుగుణంగా అడ్జస్ట్ అవుతూ, ఎలా జీవించాలో సహజం గా చెప్తుంది మనకి . “నాగరికత నుంచి తిరిగి ప్రకృతికి ప్రయాణం ” అనే కాన్సెప్ట్ అమెరికా సాహిత్యం లో ఒక ప్రత్యేక ప్రక్రియ గా చెప్పవచ్చు . మార్క్ ట్వైన్ హకెల్ బరీ ఫిన్ కూడా ఈ కోవకు చెందిందే !

Prakriti pilupu_Jack London,(Tr)Kodavatiganti -195997

బక్  స్వామి భక్తి కూడా విశేషం! టారంటన్ జోలికి ఎవడు వచ్చినా రక్తం కళ్ల జూస్తుంది. వాళ్లిద్దరి బంధాన్ని, మమకారాన్ని జాక్ లండన్ చాలా ప్రత్యేకించి వివరిస్తాడు. టారంటన్ దాని తల మొరటు గా పట్టుకుని వూపుతూ దాన్ని నానా తిట్లూ తిడతాడు. అవన్నీ ముద్దు మాటలని దానికి తెలుసు! అతనలా ప్రేమ చూపిస్తుంటే ఆనందంతో దాని గుండె బయటికి వచ్చేస్తుందన్నంత గాఢంగా దాన్ని అనుభవిస్తుంది. అంత ఉద్రేకం!

పైగా బక్, హచి లాంటిదో (అదీ గొప్పదే)మరోటో కాదు! అది ఎక్కడైనా సరే సంరక్షణ బాధ్యత తీసుకునే రకం!తనను ప్రేమించిన వారిని అంతకంటే పిచ్చిగా ప్రేమించే రకం!

దాని వేటను రచయిత ఎంత ఉద్వేగ భరితంగానో వర్ణిస్తాడు. గడ్డ గట్టిన మంచు మీద తేలిక పాటి అడుగులతో పారిపోయే ఒక నీటి కుందేలును అది వేటాడే తీరు అద్భుతం! అది ఎంతటి ఉన్నతమైన enthusiasm తో వేటాడుతుందో రచయిత కళ్లకు కడతాడు.

జీవితపు అత్యున్నత స్థాయిని  అందుకుని, మళ్ళీ అలాటి దశ జీవితంలో రాదేమో అన్నపుడు గొప్ప ఆవేశం కలుగుతుందిజీవితపు ఉచ్చదశలో కలిగే ఆవేశం అదేం చిత్రమో జీవితాన్నే విస్మరింప జేస్తుంది. తాను జీవించి ఉన్నట్టు కూడా తెలియనివ్వని ఆవేశం కళాకారుడికి అనుభవమైనపుడు ఒక మహా జ్వాలతో పైకి లేస్తాడు.సైనికుడికి ఆవేశం వచ్చినపుడు యుద్ధోన్మాదానికి వశుడై ప్రాణాలకు తెగించి పొరాడతాడు.బక్ సరిగ్గా ఇప్పుడు అలాటి ఆవేశానికి చిక్కింది. జీవితోద్వేగం దాన్ని ఆవహించింది. దాని నర నరానా ఆనందం ఉబుకుతున్నదిఒక కుక్క వేట దృశ్యం ఇది!

ప్రకృతి గురించి, వైల్డ్ లైఫ్ గురించి తీరిగ్గా ఆలోచించే సమయం, కోరిక, తీరిక మనకు ఉండక పోవచ్చు గానీ, దానితో మమేకమై తిరిగితే, గడిపితే ఎన్నెన్ని రహస్యాలు ఆవిష్కృతమవుతాయో! ఎన్ని జంతు హృదయాలు మనతో మాట్లాడతాయో! పశువులు మనుషులకంటే నయమని ఎంతగా అర్థమవుతుందో ! అన్ కండిషనల్ గా ప్రేమించగలిగేది జంతువులు మాత్రమేనని అందరమూ ఒప్పేసుకుంటామేమో!

జాక్ లండన్ అలా , విచ్చలవిడి నగ్న ప్రకృతి లో, జంతువులని చూస్తూ, చెట్లతో, సముద్రం తో మాట్లాడుతూ బతికాడు,  గడిపాడు. ఈ నవల, ఇంకా మరి కొన్ని అతని నవలలు అలా పుట్టినవే! తోడేళ్లనీ కుక్కల్నీ, ఎస్కిమోలనీ, రెడ్ ఇండియన్లనీ గమనిస్తూ, చదువుతూ మంచు గుట్టలు పేరుకునే స్థలాల్లో తిరిగాడు. అక్కడ గుడారం వేసుకుని, పుస్తకాలు చదువుతూ  గడిపాడు! అతని జీవితంలో తిండి, నిద్ర , డబ్బు వంటి వాటికి ఎలాటి ప్రాముఖ్యం లేదు!  అవన్నీ తాత్కాలిక అవసరాలంతే ! సాహసం , గొప్ప ప్రేమ , తీవ్రమైన పాషన్ , వ్యామోహం , ప్రయాణం , ప్రకృతి, సముద్రం , అడవి ఇవన్నీ కలిస్తే జాక్ లండన్ జీవితం! ఆయన ఇదంటూ ఒక వృత్తి ని ఎంచుకోలేదు . ఓడ కూలి, చాకలి,ముత్యప్పు చిప్పల్ని దొంగిలించడం ,చిన్నా చితకా కూలి పన్లు చేశాడు ! అట్లాంటిక్ మంత్లీ లో రాతలు రాశాడు! చిన్న తనంలోనే సాహసాలూ సముద్ర యాత్రలూ, అన్వేషణలూ వర్ణించే పుస్తకాలు చదివి జీవితం అంటే సాహసం, రొమాంటిసిజం అని నిర్వచించేసుకున్నాడు! ఆ నిర్వచనం ప్రకారమే బతికాడు! తెప్ప కట్టుకుని శాన్ ఫ్రాన్సిస్కో సముద్రం లో పడి తిరిగే వాడు.చిల్లర నేరస్తులంతా స్నేహితులు! దొంగతనాలు మొహం మొత్తాక దొంగల్ని పట్టుకునే ఉజ్జోగం కూడా చేశాడు. రెండూ ఎలా ఉంటాయో చూద్దామని “కిక్” కోసం చేసిన పన్లే!

Prakriti pilupu_Jack London,(Tr)Kodavatiganti -1959189

సాహసాన్ని మనసు తీరా అనుభవించేందుకు  అప్పట్లో (1896-1899) అలాస్కా ప్రాంతంలో జరిగిన బంగారం అన్వేషణ కి బయలు దేరాడాయన . జీవితానుభవాన్ని పొందిన సమయం అది. “It was in the Klondike, I found myself” అంటాడు.మంచు తప్ప ఏమీ లేని చోట ఒక ఏడాది పాటు నివసించాడు. ఎండ మొహం చూడక పోవడం వల్ల స్కర్వీ రోగం వచ్చి, బంగారం అన్వేషణ మొదలయ్యే సమయానికి ఆ స్థలం వదిలి తిరిగి కాలిఫోర్నియా రావాల్సి కూడా వచ్చింది !నిజానికి లండన్ అన్వేషణ బంగారం కోసం కాదు కాబట్టి అతనికి పోయిందేమీ లేదు, ఆరోగ్యం తప్ప! ఈ అలాస్కా జీవితంలోనే అతనికి ఈ నవలకు కావలసిన ముడి సరుకు దొరికింది! స్లెడ్జ్ బళ్ళు లాగే ఎన్నో కుక్కల్ని చూసివాటి లోంచే ఆయన బక్ ని సృష్టించాడు !

అతనికొక ఉద్రేక పూరితమైన  జీవితం కావాలెపుడూ! బంగారం అన్వేషణ లో జబ్బు పడి వచ్చాక ఆ అనుభవాల డైరీ తోనే పూర్తి స్థాయి రచయితగా మారాడు  ! అందుకే అతని ప్రతి రచనా చదువర్లను కూడా ఉద్వేగం అంచున నడిపిస్తుంది

ఈ నవల చదివాక అనిపిస్తుంది, “లండన్ నిజంగానే బక్ అనే కుక్కని ఊహించుకుని ఎక్కడో ఒక చోట బక్ నిజంగానే ఉందని నమ్మి ఉంటాడా?” అని!

ఈ నవలను 1959 లో కొడవటి గంటి కుటుంబరావు గారు ప్రకృతి పిలుపు అనే పేరుతో అనువదించగా దేశీ కవితా మండలి విజయవాడ వాళ్లు వేశారు. చాలా రోజులకు అది అందుబాటు లో లేకుండా పోయింది. మంచి పుస్తకాలకు కేరాఫ్ అడ్రస్ గా ఉండే పీకాక్ క్లాసిక్స్ ఈ పుస్తకాన్ని మళ్ళీ 2003 లో “అడవి పిలిచింది” పేరుతో అందుబాటు లోకి తెచ్చింది . కాపీ రైట్ సమస్యల వల్ల కుటుంబరావు  గారి అనువాదాన్నే గాంధీ కొంత సంక్షిప్తం చేసి ప్రచురించారు. 2003 నుంచి పది  సార్లు ముద్రణకు వచ్చింది. మొదటి ప్రచురణ లో ఇది కొడవటి గంటి కుటుంబరావు గారి అనువాదానికి సంక్షిప్తం అనే విషయం ముందుమాట లో ప్రస్తావించారు (గాంధీ గార్ని కనుక్కున్నాను) గానీ తర్వాత తర్వాత ప్రచురణల్లో ఈ విషయం లేక పోవడం వల్ల ఈ మధ్య కాలంలో కుటుంబరావు గారి అనువాదం అందరికీ అందుబాటులోకి వచ్చే దాకా నేను అది గాంధీ గారు చేసిన అనువాదమనే అనుకున్నాను. ఒరిజినల్ నవలను సంక్షిప్తం చేసి గాంధీ అనువదించారని భావించాను.

 

పైగా “కొ కు అనువదిస్తే అచ్చం ఇలాగే ఉండేది. ఎంత సజీవమైన భాష వాడారో” అనుకున్నాను కూడా :-) ! ఒక చోట కుక్క ధర మాట్లాడే విషయంలో “నూరుకు ఠోలీ తక్కువైతే వీలు కాదు పొమ్మన్నాడు” అనే వాక్యం లో “ఠోలీ” అనే మాట విని అసలు ఎన్నాళ్ళయిందో అనిపించింది !

గాంధీ ఇంకో మంచి పని కూడా చేశారు. ఈ పుస్తకాన్ని పిల్లల కోసం  బొమ్మలు చేర్చి “బక్” అనే పేరుతో మరో ఎడిషన్ వేశారు!

పీకాక్ క్లాసిక్స్ కి ఈ విషయంలో ఎన్ని కృతజ్ఞతలు  చెప్పినా చాలదు. జాక్ లండన్ అనేవాడొకడున్నాడని, జీవితాన్ని అత్యద్భుతంగా దాని దారిన దాన్ని నదిలో వదిలేసిన పడవలా పోనిస్తూ, ఆయన అనుభవాలన్నీ నవలలుగా లోకానికి అందించాడని నాకు పీకాక్ క్లాసిక్స్ ద్వారానే తెల్సిందని చెప్పడానికి ఇష్టపడుతున్నాను, ప్రఖ్యాత రచయిత నాకు అప్పటి వరకూ పరిచయం కాలేదని చెప్పడానికి సిగ్గు పడటం లేదు.

gandhi

“పీకాక్” ప్రచురణల గాంధి

కొన్ని పుస్తకాల ప్రభావం బలంగా ఉంటుంది. రచయిత మీద మమకారమో ప్రేమో, హద్దులు దాటిన అభిమానమో పెంచుకునేలా చేస్తుంది. శాన్ ఫ్రాన్సిస్కో వెళ్ళినపుడు ఆ అగాథ జలాల్లో బోటు మీద తిరుగుతూ “జాక్ లండన్ తిరిగిన ఈ నీళ్ళలోనే నేను కూడా షైర్లు కొడుతున్నా” అనుకుని సంతోష పడ్డాను! కట్టుకుంటున్నపుడే తగలబడి శిధిలాలుగా మిగిలిన అతని ఇల్లు ఒక సజీవ జ్ఞాపకం!

ఉద్వేగపుటలల్లో సాహసాల దారిలో లాక్కుపోయే ఈ నవల ఇంగ్లీష్ లో ఉచితంగానే డౌన్లోడ్ కి దొరుకుతుంది! తెలుగు వెర్షన్ కుటుంబరావు గారిది కూడా నెట్ లో ఉంది. వెదికి కనుక్కొని చదవండి :-)

ప్రకృతి తో బతకాలి, ప్రకృతి లో బతకాలి ! ప్రకృతి తో మమేకమై బతకాలి !

ప్రకృతి ఆహ్వానిస్తే తప్పక బయలు దేరాలి ! ఇదే జాక్ లండన్ జీవితం , రచనలూ !

*

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

మెరుపై మెరిసిన మహేంద్ర!

 

కొందరు వ్యక్తులు కొద్దిలోనే అద్భుతాలు చేస్తారు. “అబ్బ,ఎక్కడి నుంచి వచ్చాడితను” అని మనం ఆ చాతుర్యానికి, నైపుణ్యానికి అబ్బుర పడి పలకరించబోయే లోపుగానే  కళ్ళ ముందే అదృశ్యమై పోతారు. అయ్యో ఇలా జరిగిందేంటని మనం ఎంతనుకున్నా లాభం లేదు. అలా వెలుగులు చిమ్ముతూ రాలి పోయిన ఒక నక్షత్రమే మహేంద్ర! మధురాంతకం రాజారామ్ గారి అబ్బాయి! అతను బతికుండగా రచయితగా నాకు పరిచయం కాలేదు. అతను రాసిన ధారావాహిక ఒక వార పత్రిక లో వస్తున్నపుడు కూడా చదవలేదు ! బహుశా  స్కూలు రోజులే కావడం  వల్లనేమో అంత సీరియస్ సాహిత్యం చదివే జ్ఞానం, ఎరుక లేక పోయుండాలి !  1991 లో అది నవల గా వచ్చినపుడు విశాలాంధ్ర లో కొన్నాను!

అంతటి అద్భుతమైన కథని సీరియల్ గా వచ్చినపుడు వారం వారం ఉత్కంఠ గా ఎదురు చూసి చదవలేక పోయానని పశ్చాత్తాప్పడ్డాను

మహేంద్ర గొప్ప కథకుడు! టెక్నిక్ తెల్సిన వాడూ, రచన గమ్యం పట్ల  స్పృహ కల్గిన వాడూ, రాయలసీమ ప్రాంతం పట్ల ప్రేమా, ఆ ప్రాంతపు సమస్యల పట్ల అవగాహన ఆందోళన, ఆ జీవనయానం మీద గౌరవమూ ఉన్నవాడు , ఇంకా ,మనిషి మీద, జీవితం మీద లోతైన ఆలోచన, పరిశోధన ఉన్నవాడు. అందుకే మహేంద్ర రాసిన కవితైనా కథైనా ఒక పట్టాన వదిలి పోదు పాఠకుడిని! జీవితం యవ్వన ప్రాయంలోనే వాడి రాలి పోవడం వల్ల అతను రాసిన కొద్ది రచనలతోనే అభిమాన పాఠకులు సరి పెట్టుకోవాల్సి వచ్చింది గానీ, మరో 20 ఏళ్ళైనా జీవించి ఉంటే ఇంకెన్ని ఆణిముత్యాలు అందించే వాడో అనే ఆలోచన దిగులు పుట్టిస్తుంది  అతని రచనలు చదువుతుంటే !

ఈ నవల “స్వర్ణ సీమకు స్వాగతం” చాలా చిన్న నవలే! కొద్ది గంటల బస్సు ప్రయాణాన్ని అత్యద్భుతంగా వర్ణిస్తూ సాగే నవల.  పుస్తకం పట్టుక్కూచుంటే గట్టిగా రెండు గంటల్లో చదివేయగలం! కానీ ఆ రెండు గంటల తర్వాత కనీసం రెండు రోజులైనా నవల్లోని పాత్రలూ, మహేంద్ర చెక్కిన వాక్యాలూ మన వెనకాలే మాట్లాడుతూ తిరుగుతాయి.

mahendra

జీవన యానం లో ఎవరి దార్లు వాళ్లవి. ఎవరి గమ్యాలు వాళ్లవి. ఒకరి బాగోగులు మరొకరికి పట్టవు. చూడ్డానికి అందరం ఒకటే దార్లో వెళ్తున్నట్టే ఉంటుంది కానీ మధ్యలోనే దిగి పోయే వాళ్ళు కొందరైతే, చివరి వరకూ ప్రయాణించే వాళ్ళు కొందరు! దారి ఒకటే అయినా గమ్యాలు వేరు! ఈ క్రమంలో సమాజమే పెద్ద పర్తి గుంట బస్సుగా అవతరిస్తుంది నవల్లో!

చిత్తూరు జిల్లా కుప్పం బస్టాండ్ లో ఎర్రని ఎండలో మొదలయ్యే కథ మరి కొద్ది గంటల్లోనే పెద్దపర్తి గుంట  చేరకుండానే కటిక చీకట్లో ఇసక లో దిగబడి ఆగి పోతుంది. గమ్యం చేరిన వాళ్ళు చేరగా నిమిత్త మాత్రులైన డ్రైవర్, కండక్టర్లు కాక అందులో మిగిలిన ఇద్దరూ గమ్యం చేరని నిర్భాగ్యులై మిగిలి పోతారు.

ఆ ఇద్దర్లో ఒకడు డెబ్భై ఏళ్ళు దాటిన వృద్ధుడు తిమ్మరాయప్ప! యాంత్రిక నాగరికతా ప్రస్థానం లో మానవత్వం అనుభవిస్తున్న సంక్షోభానికి ప్రతీకగా అన్ని రకాలుగానూ దగా పడి ఒట్టి చేతులతో మిగిలి పోయే తిమ్మరాయప్ప!  రెండో వాడు విజయవాడ కు చెందిన జర్నలిస్ట్ రమణ మూర్తి !  ఈ సంక్షోభాన్ని, సుభద్ర  మొదలుకుని దివాణం రాజా వారు వసంత నాయని వారు , తిమ్మరాయప్ప, రమణ మూర్తి,భాగ్యమ్మ , అత్తినీరాలు  ఇంకా ఇతర బలహీన, నిర్భాగ్య  జీవితాల ద్వారా కళ్లకు కట్టినట్టు మహేంద్ర ఆవిష్కరిస్తాడు.

చిగుర్ల గుంటలో కొత్తగా మొదలైన బంగారు గనుల గురించి మానవాసక్తి కర కథనాన్ని పత్రికకు రాయాలని విజయవాడ నుంచి వచ్చిన విలేకరి రమణ మూర్తీ, జ్వరం తో ఉన్న బిడ్డను పట్నంలో డాక్టర్ కి చూపించుకోడానికి వచ్చి తిరుగు ప్రయాణమైన సుభద్ర, ఆమె వాలుచూపుల కోసం ,పడిగాపులు కాసే వెంకట పతీ, చితికి పోయిన జమీందారు వసంత రాయని వారూ, అతని సేవకుడైన లింగయ్య , లీడరు అతని అనుచరులు, తాగుబోతు అత్తినీరాలు, భాగ్యమ్మ ఆమె ప్రియుడు వెంకట స్వామి వీళ్లందరి ఎదురు చూపులూ పెద్దపర్తి గుంట బస్సు కోసమే! బస్సు రాక ముందు, వచ్చాక, ఎక్కాక వీళ్ళందరి ప్రవర్తనలూ ఎన్ని రకాలుగా మార్పు చెందుతాయో మహేంద్ర అలవోకగా చిత్రించి ఔరా అనిపిస్తాడు.

Swarnaseemaku Swaagatam_Mahendra1నవలకు ముందు మాట రాసిన ఆర్. ఎస్. సుదర్శనం ఇలా అంటారు.”ప్రగతి అంటే మిథ్య కాదు. అది పెద్దపర్తి గుంట బస్సు. అందరూ దాని కోసమే ఎదురు చూస్తారు. తొక్కిసలాటలో కండబలం కలవాళ్ళు సీట్లు సంపాదిస్తారు.కొందరు కిక్కిరిసి నిల్చుంటారు. మరికొందరు టాపు మీదైనా చోటు సంపాదిస్తారు.ఎక్కడ దిగవలసిన వాళ్ళు అక్కడ దిగిపోగా బస్సు గమ్యం చేరుతుందా లేదా ఎవరికీ పట్టదు”.

తిమ్మరాయప్ప తోనే నవల ప్రారంభమై అతనితోనే ముగుస్తుంది. పంటలు పండక, నీళ్ళకోసం సొరంగం లాంటి బావి తవ్వి,దానికోసం ఉన్న డబ్బంతా పోగొట్టుకుని,భూముల్ని పాడుబెట్టి,అప్పులపాలై, అందర్నీ పోగొట్టుకుని చివరికి తాకట్టు పెడదామని కుప్పం తీసుకెళ్ళిన మనవరాలి ఒక్క నగనీ, ఎవరూ డబ్బు ఇవ్వకపోవడంతో ఇంటికి తిరిగొస్తూ కిక్కిరిసిన బస్సు ప్రయాణంలో పోగొట్టుకుని జీవచ్ఛవంలా విలపిస్తూ మిగులుతాడు. అతని బాధకి ప్రత్యక్ష సాక్షిగా ..నాగరిక సమాజంలో నలిగిపోతున్న రమణమూర్తి!

నవల చదువుతున్నంత సేపూ మనసులో ఏ మూలో బాధా వీచికలు కదుల్తూ ఉంటాయి. పాఠకులుగా స్పందిస్తున్నా, నిజానికి ఆ బస్సులో మనమూ ఉంటే ఏ ప్రయాణీకుడికీ భిన్నంగా ప్రవర్తించం! మహేంద్ర రచయిత మాత్రమే కాదు, కవి కూడా!  స్పందన కల్గిన అందరు కవుల్లాగే అతను కూడా యదార్థ జీవిత వ్యధార్త దృశ్యానికి చలిస్తాడు. స్పందిస్తాడు ! అతని  స్పందనను  అద్భుతంగా చిత్రిస్తూ , అసామాన్యమైన మాటల్లో పేనుతూ ,కుప్పం బస్టాండ్ లో పాఠకుడినీ ఒక పక్కగా నిలబెట్టి ప్రత్యక్ష సాక్షి గా చేస్తాడు. వాళ్లందరితో పాటే మనల్నీ బస్ ఎక్కించి అందరూ దిగి పోయాక, బస్సు ఇక ముందుకు కదలనని మొరాయించాక ఆ నిశీధి లో తిమ్మరాయప్ప కీ రమణ మూర్తికీ తోడుగా వదిలి పెడతాడు!!

మహేంద్ర దృష్టి ఎంత సునిశితమంటే, బస్టాండ్ లో గానీ బస్ లో  గానీ ఏ చిన్న అంశాన్నీ వదిలి పెట్టకుండా వర్ణిస్తాడు. టీ బాయిలర్ నుంచి రాలి పడే బూడిద నుంచీ, బస్టాండ్ లోని టాయిలెట్ల మీద ఔత్సాహిక కళాకారులు చిత్రించిన సృష్టి రహస్యాల వరకూ ప్రతి సూక్ష్మాంశాన్నీ ఏ మాత్రం విసుగు పుట్టించకుండా చిత్రిస్తూ పోతాడు. నిత్యం మనం చూసే సన్నివేశాలను మనకే కొత్తగా పరిచయిస్తాడు !

కుప్పం చుట్టు పక్కల పల్లెల జనం అంతా డొక్కు ఎర్ర బస్సు ఎక్కడానికి పడే పాట్లన్నిటినీ మహేంద్ర ఏవగింపుతో కాక ఎంతో గౌరవం తో వారి బతుకు పోరాటం లా అభివర్ణిస్తూ వీరోచిత కార్యం లా భావిస్తూ రాస్తాడు.

ఎంతో ఎదురు చూడగా చూడగా వచ్చిన ఆ బస్సులో కొందరు  సీట్లో చోట్లో సంపాదిస్తారు. తిమ్మరాయప్ప లాంటి నిర్భాగ్యులు సీటు కాదు కదా రెండు కాళ్ల మీద నిలబడేంత చోటు కూడా సంపాదించలేక, ఎవరి సానుభూతినీ పొందక ఎలాగో బస్సులో చేరామనిపించుకుంటారు. నిండుగా జనంతో అటూ ఇటూ ఊగిపోతూ బయలు దేరిన పెద్ద పర్తి గుంట బస్సు బయలు దేరాక దాని ప్రయాణం, అది గమ్యం చేరకుండానే ఆగిపోవడం వరకూ దాని ప్రస్థానాన్ని మహేంద్ర చిత్రించిన తీరు అనన్య సామాన్యం.  అక్కడున్న బస్సుల్లోకెల్లా కాస్త మెరుగ్గా ఉన్న బస్సు ఆగమనాన్ని “సింహమున్న గుహలోకి సింధూరము జోచ్చినట్టు, వీధి నాటకం లోకి కీచకుడు వచ్చినట్టు   ఆరెమ్మెస్  బస్ కుప్పం రాజ వీధుల గుండా వస్తోంది” అని దాని దర్పాన్ని చమత్కరిస్తాడు.

కండక్టర్ ని మహేంద్ర ఎలా వర్ణిస్తాడో చూడండి!

.”ఈ జనసంక్షోభంలో అతడు కొమ్మలమీదినుంచి దూకే కోతిలా, బొరియల్లో దూరే సర్పంలా,గాలిలో వలయాలు తిరిగే తూనీగలా ప్రయాణీకుల్లోకి ప్రవేశించాడు..ఆ సమయంలో సాగర మథనంలో హాలాహలంలా పుట్టుకొచ్చాడు.అతడు మనుషుల శరీరాల మధ్య పాతిపెట్టినట్టుగా ఇరుక్కుపోయి కండరాల మధ్య రక్తనాళంలా కదులుతున్నాడు.అత్యుష్ణ పూరితమైన పరిశ్రమలో పని చేస్తున్నట్లు అతడి శరీరం చెమటతో దొప్పదోగుతోంది.అతడు రెండు చేతుల్తోనూ జనాన్ని వెనక్కి తోసుకుంటూ జనజలధిని ఈదుకుంటూ ముందుకు వెళ్తున్నాడు.ఒక చేత్తో క్రెడిల్ నుంచి టికెట్లను చింపుతున్నాడు. మరో చేత్తో నోట్లను లెక్కెడుతున్నాడు. ఒక చేత్తో టికెట్లను పంచ్ చేస్తున్నాడు. మరో చేత్తో చిల్లరడబ్బులను తోలు సంచీ లోంచి చిల్లర గలగరించి తీస్తున్నాడు. …”

బస్సు బయలు దేరాక ,

“బస్సు మెయిన్ రోడ్డు దిగి పెద్దపర్తి గుంట మట్టిబాట లోకి వెళ్ళే లంబకోణపు మలుపు తిరగడానికి నానా యాతనలూ పడుతోంది. ఈ కార్యక్రమంలో యధావిధిగా మలుపులోని పెంకుటింటి తాలూకు మరో రెండు పెంకులు రాలి పడ్డాయి.ఇంటిగల వాళ్ళు వెలుపలికి వచ్చి ఈ బస్సులకెప్పుడు పోయే కాలం వస్తుందో కానీ తమ ఇల్లు కూల్చకుండా అవి నిద్రోయేటట్లు లేవని పాపాల భైరవుడు సత్తార్ సాహెబ్(బస్సు డ్రైవరు) ని అతడి సకల స్త్రీ జనాల శీలాలను శంకిస్తూ బూతులు తిట్టసాగారు.

“ఇంతలో ఒక స్త్రీ తనకు బస్సెక్కితే వాంతులవుతాయనీ,తనకు సీటు ఇవ్వని పక్షంలో ఎవరి మీదనైనా వాంతి చేసుకోగలననీ భయపెట్టసాగింది.కేవలం సీటుకోసమే ఆమె దొంగెత్తు వేస్తోందని కొందరు ఆమె కోరికను వీటోచేయ జూసారు గానీ ఆమెకు దగ్గరగా ఉన్నవారు ఆమె ముఖకవళికలను జాగ్రత్తగా పరిశీలించసాగారు..”

Swarnaseemaku Swaagatam_Mahendra108 - Copyబస్సు అటూ ఇటూ వొరిగినపుడల్లా పక్కన ఉన్న ఆడవాళ్ల మీద పడి అంతటి చెమట, ఉక్క,దుమ్ములో కూడా పర స్త్రీ స్పర్శా సౌఖ్యాలను పొందాలని చూసే వాళ్ల నుంచీ , ఏదో ఒక  రకంగా దిగే లోపైనా సీటు సంపాదించాలని చూసే వాళ్ల వరకూ అందర్నీ మహేంద్ర సహానుభూతి తో పలకరిస్తాడు.  ఎవరి మీదా ఫిర్యాదుగా మాట్లాడడు. వాళ్ల బలహీనతలని, స్వార్థాలను విపరీత ప్రవర్తనలను  సైతం కేవలం ” స్వభావాలు గా, అవసరాలు గా ,సహజ ప్రవర్తనలు గా ”  గుర్తించి అంగీకరిస్తాడు. ఎవరినీ అసహ్యించుకోడు.

ఏ చిన్న విషయాన్నీ వదలక మనిషిగా,పాలకుల నిర్లక్ష్యం వల్ల బీడుగా మారిన ప్రాంతపు మనిషిగా రచయిత పరిస్థితుల పట్ల స్పందించే తీరు భిన్నంగా ఉంటుందిక్కడ!

రైల్వే లైను వద్ద గేటు పడి బస్సు ఆగాల్సి వచ్చినపుడు మహేంద్ర ఆ మామూలు సన్నివేశాన్ని కరువు ప్రాంత ప్రతినిధిగా పరిచయం చేస్తాడు.

రెండు నవ నాగరీక నగరీక నగరాలు బెంగుళూరు, మద్రాస్ నగరాల మధ్య ప్రయాణించే రైల్వే లైను పక్కనే ఉండే  పల్లెలు  మాత్రం అభివృద్ధికి గానీ నాగరికతకు గానీ నోచుకోలేదంటాడు.

“నాగరికతల్ని మోసుకుని రైళ్ళు అయోమార్గం మీద ప్రతి దినం పహారా చేస్తున్నా, మధ్యనున్న గ్రామాలూ పల్లెలూ ఇంకా జడం గానూ నిస్తేజంగానూ అనాగరికంగానూ ఉన్నాయి.దారి పొడవునా వ్యాపించిన వందల వేల బీడు భూములు బహుశా రైలులో ఏసీ కోచ్ ల లోనూ, ఫస్ట్ క్లాస్ కంపార్ట్మెంట్లలోనూ ప్రయాణిస్తున్న ఏ రాజకీయ నాయకుడికి గానీ, ఏ విద్యాధికుడైన ఏ  ఉన్నతాధికారికి గానీ ఆనినట్టు లేదు! ఎక్స్ ప్రెస్ రైలు మార్గాల పక్కనే పూడిక పడి పోతున్న బావులున్నాయి. రాత్రింబవళ్ళు పని చేసినా ఆ బావుల నుంచి చాలినంత నీటిని తోడలేని ఏతాలున్నాయి. అర్థ రాత్రి చలి లోనూ మధ్యాహ్నపు టెండల్లోనూ అంతంత మాత్రపు ఆచ్చాదనలతో ఏతాలు తొక్కే బక్క మనుషులున్నారు (రచనా కాలం 1985 అని గుర్తుంచుకోవాలి) ఒకనాడు పట్నాల్లో మంచి బతుకే బతికి, ఇప్పుడు ముసలి వగ్గులైపోయినవై , ఇప్పుడు పూర్వ జన్మ ప్రాప్త స్వీయ దుష్కర్మ ఫలితాలను అతి దారుణంగా అనుభవిస్తూ రైళ్ళ రాక కోసం గంటల తరబడి క్రాసింగుల వద్ద గంటల తరబడి పడిగాపులు కాసే బస్సులున్నాయి” అంటూ బస్సుల దుస్థితిని  కూడా గుర్తించి  చేసి జాలి పడతాడు.  రైళ్ళలో ప్రయాణించే నాగరీకులకు వీటన్నిటినీ పట్టించుకునే తీరిక లేదంటూ ఆవేదన చెందుతాడు.”వారి కాలక్షేపానికి, జల్లు కురిసిన ఉదయం దిబ్బలపై లేచే పుట్టగొడుగుల్లా దిన వార పక్ష మాస పత్రికలుంటాయి. జోలారు పేట, వైట్ ఫీల్డ్ మొదలైన స్టేషన్లలో లభించే పాప్ కార్న్, బఠాణీలు, శీతల పానీయాలుంటాయి. అపరిచిత వ్యక్తులతో ప్రేమ ప్రహసనాలకిదే సమయం. రాజకీయ నాయకులకు కొత్త పార్టీ ఏర్పాట్లకిది నిరపాయకరమైన చోటు. తత్వ వేత్తలకిది తమ తత్వ జిజ్ఞాసను నిశిత పరచుకోడానికి అనువైన స్థలం ” అని, తత్వ వేత్తలతో సహా ఏ ఒక్కరూ ఆ ప్రాంతాలకు జరిగే అన్యాయాన్ని గురించి ఆలోచించరని ఎత్తి చూపుతాడు.

నీటి చుక్క దొరకడం కష్టమైన ఆ పల్లెల్లో, రైలు కోసం ఎదురు చూస్తూ బస్సు ఆగిన ఆ చీకట్లో, నిశ్శబ్దంలో ఎవరో ఎక్కడో బోరింగ్ పంపు కొడుతున్న శబ్దం వినగానే ఒంటిపల్లె కోమలమ్మ గుండెల్లో నొప్పి ప్రారంభమయ్యే సన్నివేశం ఆ వూళ్ళలోని దుర్భరమైన కరువుకు అద్దం పడుతూ, గుండె చిక్కబట్టేలా చేస్తుంది . 15 మంది గల ఇంటి నీటి అవసరాల  కోసం నిత్యం గంటల కొద్దీ పంపు కొట్టే కోమలమ్మకు గుండె నొప్పి ఆ బోరింగ్ ప్రసాదించిందే!

బస్సెక్కిన ప్రతి ఒక్కరి గురించీ మహి శ్రద్ధగా పట్టించుకుంటాడు . బస్ లోని ప్రయాణీకులంతా ఒక్కో వర్గానికి ప్రతినిధులు!ఒకరిద్దరు తప్ప అంతా జీవితాన్ని అతి కష్టం మీద ఈదుతున్న వాళ్ళే! వాళ్ళంతా మహేంద్రకు ప్రియమైన వాళ్ళే!

సరే, మరి తర్వాతేంటి?

అనేక విషమ పరిస్థితుల్ని దాటుతూ బస్సు ప్రయాణిస్తుంది. ఒకరి బాగు,సంక్షేమం మరొకరికి పట్టని ఈ ప్రయాణంలో , ఒకరినొకరు దగా చేసుకోడానికి సీటు సంపాదించడానికి అందరూ శాయ శక్తులా ప్రయత్నిస్తారు.  కొన్ని పల్లెలు దాటాక చాలా మంది దిగిపోయాక పెద్దపర్తి గుంటదాకా పోని బస్సు ఒక ఇసగవాగులో దిగబడి ఆగిపోగా అందులో మిగిలిన ప్రయాణీకులు విలేకరి రమణమూర్తి, దగాపడ్డ వృద్ధుడు తిమ్మరాయప్ప.

బంగారు గనులు మైనింగ్ కాంప్ గురించి ఎటువంటి సమాచారమూ దొరకని రమణమూర్తి చివరకు ఆ బస్సులో మిగిలిన తిమ్మరాయప్ప మీదే ఆధారపడతాడు. అరిచి గీపెట్టి అధికార పక్షం తరహాలో “బంగారు గనులిక్కడ పడటం వల్ల మీ బతుకులు బాగుపడ్డాయి కదూ? మీకు జీవనోపాధి దొరుకుతోంది కదూ”అని “హింట్” ఇస్తూ అడుగుతాడు. దానికి తిమ్మరాయప్ప ఇచ్చిన సమాధానమే ఈ నవల ఆత్మ!

“అదేమో సామీ, ఈ నేల్లో బంగారం దొరకతాదని శానా మంది కార్లలో జీపుల్లో వచ్చి పొతా ఉండారు!  ఈ నేల్లో బంగారు గన్లు వాళ్ళే పెట్నామంటూ మా దగ్గర ఓట్లేసుకోని పోతా ఉండారు. ఇంకొంత మంది ఈ నేల్లోనుంచి బంగారం దీస్తామని ఇనప రేకుల్తో ఇండ్లేసుకుని ఈడనే కాపురం పెట్టేసి మా దగ్గర అన్ని కూలి పన్లు చేయించుకుంటా ఉండారు. వాళ్ళొచ్చిన కాడ్నించి మా సేద్యాలు మూల బడి పోయినాయి!పోన్లే ఆ గెన్లో పనికే పోనీ అనుకుంటే,ఆ గెనిలో  పని అంటే మిత్తవ తో పోరినట్టే!  పోయిన పండగ నెల్లో ఆ సొరంగల్లో నేల ఉల్లుకోని ముగ్గురు ఒకేనాడు కాలమై పోయిరి!

Swarnaseemaku Swaagatam_Mahendra72ఈ నేల్లోనే మేము పుట్నాము. మా తాతల కాలం నుండీ ఈ నేలనే నమ్ముకోని బతకతా ఉండాము! . ఆ గెన్లో  పడే  కష్టం బూమ్మీదనే పడితే రాజనాలు పండు.అయినా బంగారం మీద జనాలకెందుకింత బ్రెమో తెలవటం లేదు. అదేమన్నా కూట్లోకి వస్తాదా,కూర్లోకి వస్తాదా? సేతుల కష్టంతో వడ్లు పండించు, టెంకాయ చెట్లు బెట్టు,మామిడితోపులు పెట్టు, ఊరు నాడంతా పచ్చగ కళ కళ లాడతాది. గురిగింజంత బంగారం కొసం ఎకరాలు ఎకరాలుగా బీడుపెట్టేసినారు. ఈడకొచ్చిన ప్రతి మనిషీ ఈడ బంగారం దొరకతాదా అని అడగతాడే గానీ ఈడ తాగేదానికి నీళ్ళు దొరకతా ఉండాయా అని ఒక్కడైనా అడగతా ఉండాడా?భూమండలానికి సొరంగాలు యోజనాలుగా తవ్వి కేజీ ఎఫ్( కోలార్ గోల్డ్ ఫీల్డ్స్ ) కి దీసుకోని బోతా ఉండారే గానీ మంచినీళ్ళు తాగను సేదబావులు తవ్వాలని ఎవరైనా అనుకుంటా ఉన్నారా? నీటికరవు లేని కాలాల్లో పైర్లు పండే కాలంలో మా ఆడోళ్లంతా బంగారం నగలు దిగేసుకోనుండ్రి. ”  అంటూ బంగారమంటే లోహం కాదనీ, పచ్చని పంటలనీ , జనం మొహాన కదలాడే చిరునవ్వులని తనకు తెలీకుండానే నిర్వచిస్తాడు. కష్టంలో పుట్టి, కష్టంలో బతికి, కష్టం లోనే చావుకు దగ్గరయ్యే వయసు దాకా ఈదిన అతని ప్రసంగం ఆవేదన పొర్లుతూ సాగుతుంది !

అది  చదివాక, ఇక ముందుకు పోబుద్ధి పుట్టదు. తిమ్మరాయప్ప మాటల్లోని కఠోర సత్యాన్ని, ఆ అతి చేదు నిజాన్ని ఇష్టంగా ఆస్వాదించడానికి సిద్ధమై, కళ్ళలో నిండే చెమ్మను రెప్పలు టప టప లాడించైనా విదుల్చుకోవాలనే స్పృహ కూడా తెలీదు.

రమణమూర్తి పరిస్థితి వర్ణనాతీతం! అనేక వ్యయ ప్రయాసలకోర్చి  మట్టిలో నుంచి బంగారం తీసి జనుల భవితవ్యాన్ని సుసంపన్నం చెయ్యడం కోసం వందలాది కార్మికులు నవీన యంత్రాల తోడ్పాటు తో కఠోర శ్రమ సల్పుతున్న ఆ భూమి లోనే ఒక నిర్భాగ్యుడైన ముసలి వాడు విగత జీవిగా మారిపోతున్న అతడి మనసుని కలచి వేస్తుంది. అతడి మెదడు నిండా మానవ సమాజం, దాని ప్రస్తానం, దాని వికటాట్ట హాసాల గురించిన ప్రశ్నలే !

ఆదిమ శిలా యుగం నుంచీ అంతరిక్షం దాకా విస్తరిల్లిన మానవ నాగరికతా ప్రస్థానానికి గమ్యం ఏమిటి?

ఈ నిరంతర స్పర్థాయుత క్షణ క్షణ సంఘర్షణామయ సతత అనిషిత అపాయకర సుదీర్ఘ పథంలో చివరకు దొరికేదేమిటి? అది మిగిలేదెవరికి? అన్న అంతుచిక్కని ప్రశ్నలతో నవల ముగుస్తుంది.

Swarnaseemaku Swaagatam_Mahendra40 - Copy

రాయల సీమ రచయితల సాహిత్యం లో ఈ నవలది ఒక ప్రత్యేక స్థానం గా తోస్తుంది. మహేంద్ర కథకుడు గా మాండలికం జోలికి పోడు. కథను ప్రామాణికమైన తెలుగులో చెప్తూనే, పాత్రల చేత చిత్తూరు మాండలికం మాట్లాడిస్తాడు . అంతే కాదు, ప్రతి అధ్యాయానికీ తనదైన శైలి లో చమత్కారంగా శీర్షికలు పెట్టాడు.

“శంకా-సువార్త”

“ది కంగుంది టైంస్ ”

“గుణ సంగ్రామ పరిషత్”

“లీడరోద్యోగ పర్వము”

“ఇతి మనుష్యాణాం”

ఇలా సాగించి  చివరి అధ్యాయానికి “స్వర్ణ సీమకు స్వాగతం”  పెట్టి అని ముగిస్తాడు.

మహేంద్ర ప్రామాణిక మైన తెలుగుగా  స్థిర పడిన  భాషను  నేరేషన్ కి వాడటానికి కారణం ఆ రోజుల్లో మాండలికాలకు ఇప్పుడున్న ఆదరణ లేక పోవడమే కావొచ్చేమో!  రచయిత సింగమనేని నారాయణ ఒక వ్యాసంలో ఇలా అంటారు ” రాయలసీమ రచయితలకు  తమ ప్రాంతపు మాండలిక భాష పట్ల తమకే అనుమానం. దీనికి సాహిత్య గౌరవం లభించదేమోనన్న భయం! ఇక కథ రాయటానికి కొత్తగా ఒక భాషను నేర్చుకోవాల్సిన విచిత్ర పరిస్థితి ఏర్పడింది. అప్పటికే పత్రికా భాషగా, రచనా భాషగా స్థిరపడివున్న కోస్తాంధ్రభాషను నేర్చుకొని కథలు రాయాల్సిరావటం వల్ల కూడా, రాయలసీమలో కథావేగం కొంత మందగించింది.”   ఆయన మాటల్లో నిజముంది ! ఇది కోస్తాయేతర రచనలన్నిటికీ వర్తిస్తుందేమో కూడా !

మహేంద్ర మరణించిన తర్వాత అతను డైరీలో రాసుకున్న కవితలన్నీ ఆయన సోదరుడు మధురాంతం నరేంద్ర “పర్వవేలా తరంగాలు”  ( పౌర్ణమి, అమావాస్య రోజుల్లో ఆటు పోట్ల వల్ల వచ్చే ఉధృతమైన తరంగాలు )  అనే పేరుతో  సంకలనంగా ప్రచురించారు. వివిధ పత్రికల్లో వచ్చిన మహేంద్ర కథలు “కనుపించని కోయిల” పేరుతో కథా నిలయం లో అందుబాటులో ఉన్నాయి. కథా నిలయం వెబ్ సైట్  లో ఒక కథ మాత్రం (అతడి పేరు మనిషి)  PDF గా చదవడానికి దొరుకుతుంది.

మహేంద్ర మరి కొన్నేళ్ళు జీవించి ఉంటే, రాయల సీమ వెతలగురించి అసంఖ్యాకంగా కథలు రాసిన రాజారాం గారి వారసుడి గా ఎన్నో రచనల్ని అందించి ఉండేవాడనే విషయం స్పష్టం!

ఈ నవలను తిరిగి సరి కొత్తగా, చక్కటి రూపం లో ప్రచురిస్తామని మధురాంతకం నరేంద్ర అంటున్నారు. దీనితో పాటే మహేంద్ర కథా సంకలనాన్ని కూడా!

మహేంద్ర రచయిత, కవి మాత్రమే కాదు, చిత్ర కారుడు కూడా! ఈ నవలకు వేసిన ఇలస్ట్రేషన్స్ మొత్తం ఆయనవే.

చదివి తీరవలసిన ఈ నవల కోసం ,మధురాంతకం  నరేంద్ర గారు తిరిగి ప్రచురించే వరకూ ఎదురు చూడటమే మార్గం.

 

(మహేంద్ర ఫొటో అడగ్గానే ఇచ్చినందుకు నరేంద్ర గారికి ధన్యవాదాలు )

ఆ  పొలాల పచ్చని పిలుపు వినిపిస్తోందా?

 

~

 

శాఖా గ్రంథాలయాల్లో పుస్తకాలు చదివేటపుడు వెనక చివరి పేజీ వరకూ పుస్తకం మిగిలి ఉందా లేదా చెక్ చేసుకుని చదవాలని చాలా పుస్తకాలు అసంపూర్ణంగా మిగిలి పోయినా నేను నేర్చుకోని పాఠం! అలా ఏళ్ల తరబడి అసంపూర్తి గా మిగిలి పోయిన వాటిలో ఈ “మరల సేద్యానికి” ఆ నవల కోసం చాలా ఏళ్ళు అన్వేషించినా ఫలితం లేక పోయింది. బెంగుళూరు లో ఒక స్నేహితుల ఇంట్లో “మరళి మణ్ణిగె” అని కన్నడ ఒరిజినల్ కనిపించింది. ఎదురుగా మంచి నీళ్ళున్నా దాహం తీరే వీలు లేదన్నమాట! కన్నడం రాదుగా! ఇంగ్లీష్ అనువాదం ఉందని తెల్సింది. చదవాలని పీకింది కానీ, తెలుగులోకి తిరుమల రామ చంద్ర అనువదించారు కాబట్టి, అది పూర్తిగా తెలుగులోనే చదవాలని కోరిక! ఇంగ్లీష్ వెర్షన్ తర్వాత ఆప్షన్ గా పెట్టుకున్నాను.

చివరికి హైద్రాబాద్ లోనే మిత్రుల సహాయంతో దొరికింది. అమ్మయ్య.. చదివేశాను వారం  రోజుల్లో! నిజానికి అది వారం లో  పూర్తయ్యే ఆషా మాషీ నవల కాదు. అది చదివేశాక, ఎన్నాళ్ల నుంచో ఉన్న ఖాళీ ఏదో పూడినట్లయి, వారం పది రోజుల పాటు ఎవ్వరినీ విసుక్కోకుండా సంతోషంగా ఉండాలనిపించింది.

నా ఇంటి లైబ్రరీ కోసం ఆ పుస్తకం కోసం ప్రయత్నిస్తుండగా, హైద్రాబాద్ బుక్ ట్రస్ట్ ఆ పుస్తకాన్ని తిరిగి వేస్తూందని తెల్సి చాలా సంతోషం వేసింది.  పుస్తకం చేతికి వచ్చాక, వచ్చాక  “మూడు తరాల కథని, వందేళ్ల కథని, ఇన్ని పాత్రలతో, నిత్య జీవితంలోని ఏ ఒక్క సంఘటనీ  వదలకుండా ఇంత విస్తారంగా అల్లుకుంటూ పేనుకుంటూ ఎలా రాశాడీ కారంత్?” అని అబ్బురం కల్గింది.

శివరామ కారంత్ జ్ఞానపీఠ్ తో పాటు ఎన్నో అవార్డులు పొందిన రచయితగా కన్నడ సాహిత్య ప్రపంచంలో అగ్రస్థాయి రచయిత గా అందరికీ పరిచయమే!  1941 లో రాసిన  ఈ నవల పేరు కన్నడ లో “మరళి మణ్ణిగె” ! అంటే “తిరిగి మట్టికి” ( వ్యవసాయానికి) అని అర్థం. అయితే మట్టికి మరలడమనే మాట తెలుగులో అంత అర్థవంతంగా లేదు కాబట్టి  దాన్ని “మరల సేద్యానికి” అని అనువదించారు తిరుమల రామ చంద్ర! నవల రాసిన 36 ఏళ్ళ తర్వాత 1977 లో ఇది తెలుగులోకి అనువాదమైంది.

ఒక వందేళ్ళలో సాగిన మూడు తరాల కథ ఇది! ఈ మూడు తరాల జీవితాల్లోని ప్రతి సంఘటననీ, ప్రతి మలుపునీ, ఏ సూక్ష్మాంశాన్నీకూడా వదలక చిత్రీకరించిన  సుదీర్ఘమైన నవల! అయినా ఎంతో ఆసక్తితో చదివించే పుస్తకం కూడా!

marali mannige

దక్షిణ కర్ణాటక లో ఉడుపికి సమీపంలో, ఒక వైపు పడమటి కనుమలు, మరో వైపు సముద్రం పరచుకున్న చోట కోడి అనే చిన్న గ్రామం! అందరూ పేదవాళ్ళే! కొద్ది మంది బ్రాహ్మలూ, మిగతా కులాల వాళ్ళూ!కథా కాలం 1850 నుంచి మొదలవుతుంది. అంటే పూర్తిగా బ్రిటిష్ పాలన సమయం! ఐనా ఆ మారు మూల గ్రామం మీద దాని ప్రభావం ఏమీ కనిపించదు.రోజువారీ జీవితం లో శ్రమించడం, సముద్ర తీరంలో ఉన్న ఆ ఇసుక నేలల్లో వ్యవసాయం చేయడం, పక్క గ్రామాలకు నడిచి వెళ్ళడం, నది లో పడవైనా వాడక దాటి వెళ్ళడం ఇదే దినచర్య!

ఇది దాదాపు వందేళ్లలో నడిచిన ఒక మూడు తరాల కథ! మొదటి తరం వైదిక పురోహితుడు రామైతాళుడి తో మొదలవుతుంది. పౌరోహిత్యం చేస్తూనే తనకున్న పొలాన్ని భార్య పారోతి (పార్వతి) , వింతంతువై ఇల్లు చేరిన చెల్లెలు సరసోతి (సరస్వతి) తో కల్సి సాగు చేసి వ్యవసాయం కూడా ప్రధాన వృత్తిగా జీవిస్తుంటాడు. వరి, అనుములు, ఉలవలు ఇవే అక్కడ పండేవి. ఇసుక మేటలు వేసే ఆ పొలాన్ని బాగు చేయడం, చెరువు పూడిక మట్టి పొలాల్లోకి తెచ్చి నింపడం, చెరువు నీళ్ళు తోడి పొలాలకు పెట్టడం వంటి పనులన్నీ ఎక్కువగా సరసోతి, పారోతి వీళ్ళిద్దరే చేస్తుంటారు. పొదుపుకీ పిసినారి తనానికి మధ్యలో జీవించే రామైతాళుడు పొలాలు, తోటలు కొనడం, డబ్బు మూటలు గోడల్లో దాచడం లో తీరిక లేకుండా ఉంటాడు. ఎదురింటి మరో బ్రాహ్మడు శీనమయ్యరు , రామైతాళుడు ఒకరి ఎదుగుదల చూసి ఒకరు ఓర్చుకోలేరు.

ఐతాళుడు సంతానం కోసం రెండో పెళ్ళి చేసుకుంటాడు. పెళ్ళి రోజు వచ్చేదాకా ఇంట్లో ఆడంగులకు కూడా చెప్పడు. కొడుకు లచ్చడు పుట్టాక వాడిని వైదిక విద్యకు పంపాలా వద్దా అనే ఆలోచన!! శీనమయ్యరు కొడుకులు బెంగుళూరు లో హోటళ్ళు పెట్టి రెండు చేతులా డబ్బు సంపాదిస్తుంటే మత్సరం పాలై, తన కొడుకుని వకీలు చేసి డబ్బు సంపాదించాలని నిశ్చయించుకుని వాడిని కుందాపురం ఉడిపి ల్లో ఇంగ్లీష్ విద్యకు పంపిస్తాడు. అది మొదలు తాను పోయే దాకా లచ్చడి గురించే బెంగ పెట్టుకుని ఆస్తి  లచ్చడి చేతిలో నిలబడదని గ్రహించి మొత్తం కోడలు నాగవేణి పేరున రాసి కాలం చేస్తాడు.

రెండో తరం లచ్చడిది. వాడు కోడి గ్రామం వదిలి స్కూలు విద్యకు కుందాపురం వెళ్ళగానే రెక్కులు విప్పుకున్న స్వేచ్చ వాడి సొంతమై పోతుంది. ఎన్నడూ చూడని అర్బన్ ప్రపంచం వాడి కట్లు తెంపేస్తుంది. ఇంట్లో చదువుకున్న వారెవరూ లేక పోవడం వల్ల  వాడి మీద అజమాయిషీ కూడా లేక పోవడం తో చదువుకుంటూనే మరో పక్క తోటి పిల్లలతో పాటు వ్యసనాలతోనూ స్నేహం కుదుర్చుకుని, హైస్కూలు దాటకుండానే స్త్రీ సాంగత్యం కూడా సంపాదిస్తాడు. జూదం, వ్యభిచారం ఈ రెండూ అలవాటై వాటికి కావలసిన డబ్బు కోసం అబద్ధాలు అలవాటు అనివార్యమవుతాయి.

IMG_2443

పెళ్ళి చేసుకున్న నాగవేణి మీద వాడికి ప్రత్యేకానురాగం ఏమీ ఉండదు. మంగుళూరులో మామగారింట్లో ఉండి చదువుకుంటూనే, తన వ్యాపకాల్లో తాను బిజీగా ఉంటాడు. తన సరసోల్లాస జీవితం తాలూకూ రోగ బంధాలు నాగవేణికి కూడా ప్రసాదించి, మామగారింట మర్యాద పోగొట్టుకుంటాడు. నాగవేణి కోడి గ్రామం చేరాక లచ్చడు కేవలం డబ్బు కావాల్సి వస్తే తప్ప కొంప మొహం చూడడు. తండ్రి పోయాక, నమ్మించి ఆస్తి మొత్తం నాగవేణి చేత రాయించుకుని దాన్ని అనతి కాలంలోనే స్వాహా చేస్తాడు.చిన్నప్పటి నుంచీ నిర్లక్ష్యం గానే పెరిగిన లచ్చడు కుందాపురం , ఉడిపి ల్లో విశ్వరూపం చూపిస్తాడు . పేకాట , హైస్కూలు దాటకుండానే స్త్రీలు , ఇతర వ్యసనాలు … ప్రతి దాన్నీ సహజంగా అనుసరించి ఇష్టం వచ్చిన లైఫ్ స్టైల్ ని స్వీకరిస్తాడు . ఈ క్రమం లో ఉచితానుచితాలు ఎలాగూ ఉండవు కాబట్టి , స్నేహితుడి భార్య  జలజతో సైతం సంబంధం నెరపడానికి వెనకాడడు  ! కొడుకన్నా వాడికి ప్రేమ లేదు.తండ్రి పోయినా తల్లి పోయినా, ఎలాటి బాధా ఉండదు. ఎక్కడెక్కడో తిరిగి డబ్బంతా పోయి, చివరకు తనతో పాటు శీనమయ్యరు కొడుకు ఒరటమయ్యర్ ని కూడా పతనం చేసి అనామకుడై పోతాడు. అయినా వాడిలో ఇసుమంతైనా పశ్చాత్తాపం ఉండదు. కారంత్ కి కూడా లచ్చడి మీద కోపమేమో,  మిగతా పాత్రలకు ఉన్న ప్రాధాన్యం  గానీ, వర్ణన గానీ, వాడి ఉత్థాన పతనాలు గానీ ఏవీ కారంత్ పట్టించుకోడు. వాడి ప్రస్తావన వచ్చినపుడల్లా క్లుప్తంగా ఇదీ సంగతి అన్నట్టు చిత్రిస్తాడు తప్ప వాడి వెర్షన్ గానీ, మనో భావాలు గానీ, పోనీ కుట్ర తాలూకు వాడి పథక రచన గానీ వేటినీ వివరంగా చెప్పడు.

డబ్బు, సెక్స్ ఇవే లచ్చడి గమ్యాలు! తన కొడుకు రాముడు పెద్దవాడై అతడిని చూడ్డానికి వెళ్తే “ఎందుకొచ్చాడటా?” అని పక్క వాడిని అడిగి రాముడి మనసులో రేకెత్త బోతున్న ప్రేమను నిర్దాక్షిణ్యంగా కట్ చేస్తాడు. అంతటితో ఆగక ఆ ముసలి వయసులో కూడా రాముడి హోటల్లో స్నేహితులతో సహా వచ్చి పడి  తిని బిల్లు చెల్లించకుండా, నిర్లక్ష్యంగా ప్రవర్తించి కొడుకు మనసులో శాశ్వతం గా చోటు పోగొట్టుకుంటాడు . అందుకు సూచనగా అక్కడితో నవల్లో లచ్చడి ప్రస్తావన ముగిసి పోతుంది కూడా!

మూడో తరం ఐతాళుడు, తాత పేరు పెట్టుకున్న రాముడు ! వీడే కథను తీరం చేర్చే నాయకుడు. ఆధునిక భారత దేశం నిర్మితమవుతున్న వేళ , ఆత్మ విశ్వాసానికి, ఆదర్శ యువతకు ప్రతీక గా రాముడి పాత్ర సాగుతుంది.     పుట్టేనాటికే ఆస్తి మొత్తం పోయి దరిద్రం లో ఉన్న కుటుంబం, ఒక పూట తింటే రెండో పూట పస్తులు! తల్లి తప్ప ఎవరూ లేని జీవితంలో వాడికి తల్లే గొప్ప స్నేహితురాలు! చింకి బట్టలేసుకున్నా, అటుకులు నీళ్లతో కలిపి తిన్నా, సముద్రం ఒడ్డున ఆడుకున్నా తల్లే వాడికి తోడు. మేనమామల నిరాదరణ వాడికి అర్థం అవుతునే కోడి కి వచ్చేయడానికి సిద్ధమవుతాడు. తల్లికి ఏ మాత్రం కష్టం కలక్కూడదని పట్నంలో ట్యూషన్లు చెప్పి చదువుకుంటాడు. పినతల్లి ఇంట్లో కూడా ఉచితంగా తినడానికి ఒప్పని ఆత్మాభిమానం.

ఒకప్పుడు తనకు గొప్ప ఆస్తి  ఉండేదనీ, తండ్రి అది పాడు చెయ్యబట్టే తనీ దీన స్థితిలో ఉన్నాననే ఆలోచన ఒక్కసారైనా వాడి మనసులోకి రాదు . రేయింబవళ్ళు కష్టపడుతున్నా, చేతిలో పైసా లేక పోయినా ఉసూరుమనడు. ఆశను పోగొట్టుకోడు. వాడు ముంబాయి లో ఉద్యోగం కోసం పడే ఇబ్బందులు చదువుతుంటే భిభూతి భూషణ్ అపరాజితుడు గుర్తొస్తాడు. అలుపెరుగని యాత్రికుడు రాముడు.

వీటన్నిటి వెనుకా దాగి ఉండేది రాముడి కళా హృదయం! అంతకు మించి సముద్రం మీద ప్రేమ! పసి తనం నుంచే కోడి గ్రామపు సముద్రంతో వాడికి ప్రేమ! మంగుళూరులో సముద్రాన్ని చూసి “మన వూరి సముద్రం లా లేదేంటమ్మా” అని అసంతృప్తి పాలవుతాడు. చెన్నైలో సముద్రమూ వాడికి నచ్చదు. ఎలాటి హడావుడీ లేని ప్రశాంతమైన, ప్రకృతి నగ్న సౌందర్యాన్ని నిండా నింపుకున్న సముద్రం కావాలి వాడికి! వూరికి రాగానే బట్టలైనా మార్చుకోకుండా సముద్రం దగ్గరికి పరిగెట్టే పిచ్చి ప్రేమ! అందుకే వాడు చిత్రకారిణి  నోవాకి ప్రామిస్ చేసిన సముద్ర సౌందర్యాన్ని తన పెయింటింగ్ ద్వారా చూపించాలని నిశ్చయించుకున్నపుడు, కోడి సముద్ర తీరంలో మమేకమై గడుపుతాడు. ఎంత చూసినా తనివి తీరని ఆ అద్భుత సౌందర్యాన్ని  చిత్రించడం అసలు సాధ్యమేనా అని దిగులు పడతాడు. వాడి జీవితం పూర్తిగా అస్థిరమై, గతి లేని పరిస్థితుల్లో భోజన హోటల్లో పని చేయాల్సి వచ్చి, అమ్మను వూర్లో ఒంటరిగా వదిలి, స్థిరత్వం లేని పరిస్థితుల్లో సముద్రం సాన్నిహిత్యంలో సేద తీరగలుగుతాడు గానీ ఆ సౌందర్యాన్ని చిత్రించగలిగే హృదయం, శాంతి, మనస్థిమితం  లేక అశక్తుడై పోతాడు.

 

తిరుమల రామచంద్ర

తిరుమల రామచంద్ర

అమ్మ దగ్గరికి తిరిగి వచ్చేసి ఆ పల్లెలోనే ఉండాలని, వ్యవసాయాన్ని కొనసాగించాలని నిర్ణయించుకున్న తర్వాత రాముడికి దక్కిన ప్రశాంతతను, శాంతిని వాడే స్వయంగా నిర్వచించుకోలేడు.  గమ్యం చేరిన స్థిర భావం, వాడిలో! ఎన్నడెరగని సంతోషం! కడుపు నిండా తిని కంటి నిద్ర చుట్టూ ఉన్నవాళ్లతో కల్సి తన సొంత పొలం లో తాను పంచుకున్న శ్రమ, తాను నీళ్ళు తోడిన పొగాకు తోట, తాను  పండించిన పంట, ఆ బెస్తవాళ్ళతో సాహచర్యం…రాముడి హృదయాన్ని నింపేస్తాయి. ఆ ప్రశాంతతలో ఆ నిండు తనంలో వాన కురిసి వెలసిన ఒక సాయంత్రం ఒక వైపు రౌద్రం, మరో వైపు ప్రశాంతత నిండిన తీరంలో ఆ కోడి సముద్రం అనంత సౌందర్యాన్ని వాడి కుంచె పట్టుకోగలుగుతుంది. అపూర్వమైన చిత్రాన్ని నోవాకి కానుక గా  పంపిస్తాడు.

పిల్లలందరికీ చదువు చెప్పాలనీ, బెస్త వాళ్లందరిలో తాగుడు మానిపించాలనీ, వరి, అపరాలు వంటివి కాక పొగాకు లాంటి వ్యాపార పంటలు వేసి సంప్రదాయం లోనే కొంత ఆర్థిక కోణాన్ని చూడాలని, గ్రామాలన్నీ వికాసం పొందాలని రాముడి అభిమతం! ఇవన్నీ ఆచరణ లో చూపిస్తాడు !

తండ్రి పోగొట్టిన బంధాలన్నీ తిరిగి సంపాదించి, బంధువులని సంపాదించుకోవాలని తాపత్రయ పడతాడు. సుబ్బత్త చెప్పిన సంబంధాన్ని చూడ్డాని వెళ్తాడు. తల్లి పెళ్ళి ప్రస్తావన తెస్తే “ఆ అమ్మాయి పొగాకు తోటలకు నీళ్ళు మోస్తుందటనా మరి?” అని తన శ్రమను పంచుకునే భాగస్వామి కావాలని సూచిస్తాడు. పెళ్ళి కూతుర్ని అలంకరించి చూపిస్తే “ఇందాక  ఆ డ్రెస్ లోనే (వాకిట్లో కళ్లాపి చల్లేటపుడే ) అందంగా ఉందే” అని చమత్కరిస్తాడు.

ప్రతి పాత్రనూ కారంత్ ఎంతో సవిస్తరంగా చిత్రించినా, మనసుకు హత్తుకు పోయి గౌరవాన్ని కల్గించేవి మాత్రం సరసోతి, నాగ వేణి, మూడో తరం రాముడి పాత్రలే!

ఈ నవల్లో స్త్రీ పాత్రల్లో రెండింటికి తప్ప మిగతా వాళ్ళకి పెద్ద ప్రాధాన్యం ఉండదు. ఆ ఇద్దరూ సరసోతి, నాగవేణి! 1950 ప్రాంతాల్లో సరసోతి లాటి స్త్రీ పాత్రని ఒక సంప్రదాయ కుటుంబంలో, అందులోనూ వింతంతువు విప్లవమే !! ! పుట్టింటితో బంధం పోకూడదని , అత్తగారింటి భరణం తో అన్న గారింట్లో ఉంటున్న సరసోతి ని రెబెల్ గా గుర్తించాల్సిందే! రెక్కులు ముక్కలయ్యేలా పొలం పని, చెట్లు కొట్టడం, మైళ్ల కొద్దీ దూరాలు నడిచి బరువులు మోసుకు రావడం వంటి బండ పన్లన్నీ సుకుమారాలు పోకుండా చేస్తుంది. న్యాయం అనుకున్న మాట మొహాన్నే కుండ బద్దలు కొడుతుంది. ముసుగేసుకుని తిరిగే ఆ ముప్పయ్యేళ్ల ధీర సరసోతి , అన్నిటికీ మించి అన్నగారి బుద్ధిని, కుటిలత్వాన్ని ఎప్పటికప్పుడు ఎండగట్టి పారేస్తుంది. పండిన పంట నాలుగు మూటలు ఎక్కువ వస్తే తమకు చెప్పకుండా దాచిన రామైతాళుడిని ” ఏం? రెక్కలు ముక్కలు చేసుకోడానికి పనికొస్తాం గానీ, పంట ఎక్కువొచ్చిందని చెప్పడానికి ఆడ వాళ్ళం పనికి రామా?” అని నిలదీసినా , పొరుగింటి వాడి పంట వానకు మురిగి పోతే “రంకున పుట్టె, జగడాన చచ్చె అన్నట్టు, పోతే పోయింది లే వూరికే వచ్చిన డబ్బేగా?” అని మత్సరం చూపించే అన్నని “పరాయి వాడిని చూసి ఎందుకంత మత్సరం అన్నా నీకు? నీకు మాత్రం ఊరికే వచ్చింది కాదూ? దక్షిణలు కూడేస్తే వచ్చిన డబ్బేగా, నీకు ఎక్కువొస్తే గర్వమూ, ఎదుటివారికి పోయిందని  సంతోషమూనా” అని చీవాట్లు వేసినా సరసోతి కే చెల్లు!

Return to earth

తనకు పారోతికీ చెప్పకుండా సంబంధం కుదుర్చుకుని వచ్చిన అన్న మీద మండి పడుతుంది. “ఇంట్లో ఆడవాళ్ళకు చెప్పే పనే లేదా”  అని శీనమయ్యరు ముందే నిలదీస్తుంది. అప్పట్లో రెండో పెళ్ళి మామూలు విషయమే కాబట్టి దాన్ని అంగీకరిస్తూనే, పారోతి గౌరవానికి భంగం వహిస్తే సహించనని అన్నకు స్పష్టం చేస్తుంది. కొత్త పెళ్ళి కూతురికే కాదు, పారోతికి కూడా నగలు చేయించాల్సిందే అని పట్టుబడుతుంది.నిజానికి ఆ ఇంటికి ఒక ఒంటి స్థంభం లా చివరి వరకూ సరసోతి నిలబడుతుంది.  పారోతి మీద చివరి వరకూ శ్రద్ధ చూపేది సరసోతి ఒక్కతే ! నవల సాగుతూ పోతుంటే సరసోతి మీద అభిమానం పెరిగి పోతూ ఉంటుంది .

నాగవేణి నవల చివరి వరకూ ఉండే పాత్ర! కొడుకు కి గొప్ప స్నేహితురాలు. కష్టాలు చుట్టు ముట్టి, ఒంటరిదైనా ఫిడేలు సాయంతో ఊరట పొందుతూ, అన్నిటినీ ఆత్మ గౌరవంతో  అధిగమిస్తుంది.

ఈ మూడు తరాల కథను కారంత్ 30 అధ్యాయాల్లో అదీ 30 రోజుల్లో ముగించారట. అది ఆయనకు ఎలా సాధ్యమైందో గానీ ఈ నవలను వేగంగా చదవలేం ! నెమ్మదిగా, నవల లోని జీవన విధానానికి తగ్గట్టుగానే, ఎలాటి తొందరా లేకుండా తాపీగా నడుస్తూ పోతుంది ఈ కథ. పారోతి, సరసోతి ల దిన చర్య ను, సంఘటనల వారీ గా పూర్తిగా వివరిస్తాడు రచయిత. కట్టెలు ఎండబెట్టుకోడం, పొన్న కాయలను నూనె గానుగ కు పంపి దీపాలకు నూనె ఏర్పాట్లు చూడటం, వేసవి లో మైళ్ళ కొద్దీ నడిచి సరసోతి మామిడి కాయలు ఊరగాయ కోసం తీసుకు రావడం, కొద్దిలో జరిగే వంట, ఏ కాలక్షేపమూ లేని వాళ్ల జీవితాల్లో పని మాత్రమే కాల క్షేపంగా సమయం గడిచి పోవడం..ఇదంతా సవిస్తరంగా చిత్రిస్తాడు. ఎలాటి హడావుడి లేని ఆ రోజుల ప్రశాంత జీవితంలోని ప్రతి రోజుని, ప్రతి సంఘటననూ రచయిత వర్ణిస్తూ, వివరిస్తూ పోయినా ,అది ఎంత నెమ్మదిగా సాగినా పాఠకులకు ఆసక్తి కల్గిస్తూ పోతుందే తప్ప విసుగు పుట్టదు. అనుక్షణం వినిపిస్తూ ఉండే ఆ పడమటి సముద్రం హోరు, వదలని ముసురు వాన, ఇంటి ముందు చెరువు, సముద్రంలో కలిసే ఆ నది, కొబ్బరి, పనస, పొన్న చెట్లు ఇవన్నీ వాళ్ల జీవితం లో ఒక భాగంగా కల్సి పోయి నవల పొడుగునా పాఠకుడితో ప్రయాణిస్తుంటాయి. నవల లో కాలం  నడుస్తూ ముందుకు కదలడంతో పాటే కథలో , సమాజం లో వచ్చే మార్పులు అత్యంత సహజంగా కథతో పాటే జరిగి పోతాయి. కథే మారుతున్న సమాజాన్ని కళ్ళకు కడుతుంది.  సముద్ర తీరపు ఇసుక నేలల్లో వ్యవసాయం  ఎంత కష్టమైనా, అక్కడ ఏది పండించాలన్నా ఎలాటి ఆధునిక పని ముట్లూ లేని కాలం లో ఎంతటి శరీరక శ్రమతో కూడిన పనో అయినా ఎవ్వరూ వెనుకాడరు . పంట పొలాల్లో పేరుకున్న ఇసుక ఎత్తి పోయడం, చెరువు పూడిక మట్టిని తట్టలతో తెచ్చి పొలాల్లో నింపడం ,నీటి వసతి లేని ఆ పొలాలకు చెరువు నుంచి కడవలతో నీటిని తెచ్చి పోయడం  వీటన్నిటిలో రామైతాళుడి  కంటే ఆ ఇంటి ఇద్దరు స్త్రీలే ఎక్కువగా పాలు పంచుకుంటారు . వాళ్లతో పాటే వాళ్ళ పాలికాపు కుటుంబమూ  రెక్కలు ముక్కలు చేసుకుంటే కానీ నాలుగు గింజలు పండే పరిస్థితి ఉండదు . ఏవి వస్తువో,సేవో కొనుక్కున్నా వడ్లు కొలిచే రోజులు కావడం వల్ల పండించక తప్పదు!

ఈర్ష్యాసూయలు కాలాతీతాలు! అందుకే కులానికి ఒకటే అయినా శీనమయ్యరూ, రామైతాళులూ ఒకరి అభివృద్ధిని మరొకరు ఓర్వలేకపోతుంటారు. శీనమయ్యరు కొడుకులు బెంగుళూరు లో హోటళ్ళ వల్ల డబ్బు సంపాదిస్తున్నారని తెలిసి “అన్నం అమ్ముకుని బతికే గతి మనకేమి?” అని రామైతాళుడు ఎద్దేవా చేస్తే , లచ్చడిని వకీలు చేద్దామన్న రామైతాళుడి ప్రయత్నాల్ని శీనమయ్యరు నలుగురి ముందూ ఎగతాళి చేస్తుంటాడు.  ఉడుపి లో హోటల్ నడిపే బ్రాహ్మడు కిట్టు ఉపాధ్యాయ భార్య జలజ లచ్చడు, అతని స్నేహితులు మరి కొందరితోనూ శారీరక సంబంధాలు పెట్టుకుని నైతిక విలువల నిర్వచనం ఏ కాలం లో అయినా సాపేక్షం  మాత్రమే అని రుజువు చేస్తుంది.

ఎలాటి సద్దూ లేని ప్రశాంతమైన ఆ పల్లె నుంచి లచ్చడు కుందాపురం, ఉడిపి లకు చదువు కోసం చేరినపుడు అక్కడి వాతావరణం, స్నేహితులు, హాస్టలు వసతిలో ఉండటం ఇలాటివి నెమ్మది నెమ్మదిగా పల్లె పట్నం వైపు జరిగి పోవడాన్ని చిత్రిస్తూ పోతాయి. అందుకే లచ్చడు సెలవులకు ఇంటికి వచ్చినా వాడికి ఇల్లు నచ్చదు. ఈ విపరీత ధోరణి గమనించే సరసోతి అంటుంది “ఇంగ్లీషు చదివితే ఇంటివారే పరాయి వారవుతారు” అని!  నిజానికి సరసోతి అమాయకత్వం వల్ల ఇంగ్లీషు చదువుని ఆక్షేపించడమే గానీ, అది పట్న వాసపు పోకడలకు సంబంధించిన మాటే! నాగరీక జీవితం అనేది నాగరికంగా ఉంటుందో ఉండదో గానీ, స్వచ్చత మాత్రం లోపించే తీరుతుందని లచ్చడే రుజువు చేస్తాడు.

లచ్చడి నిర్వాకాల వల్ల ఆస్తి మొత్తం పోయిన తర్వాత అందర్నీ పోగొట్టుకున్న నాగవేణి కొడుకుతో మంగుళూరు చేరిన కాలానికే మనుషుల మధ్య బంధాల నిర్వచనాలు నెమ్మదిగా మారి పోతుంటాయి. చెల్లెలే  ప్రాణంగా మెలిగిన సదాశివుడు, అతడి తమ్ముడూ  కొంత ఉదాసీనంగా వ్యవహరించడం, ఖర్చుల విషయంలో కొంత నిక్కచ్చిగా ఉండటమూ, మేనల్లుడి చదువు ఖర్చు విషయమై ఇద్దరూ వంతు వేసుకున్నట్టు ప్రవర్తించడమూ జరుగుతుంది. తండ్రి పోయాక నాగవేణిని బాబాయి నారాయణయ్యరు తమ ఇంట్లో ఉండమంటే ఆయన కొడుకులు, ఒకప్పుడు నాగ వేణితో ఆడి పాడి ఒక కుటుంబంగా కల్సి ఉన్న వాళ్ళే, నాగవేణిని ఉండమని బలవంతం చేయొద్దని కరాకండీ గా చెప్పేస్తారు తండ్రికి! నగర జీవితపు పోకడలు బంధుత్వాలను తేలిక పరుస్తుంటాయి.

ఎప్పటికీ మారక విశ్వాసంగా ఉండేది ఐతాళుల ఇంటి ముంగిట ఉన్న పాలి కాపులే! చివరి వరకూ వాళ్ళే నాగ వేణికి, ఆమె కొడుక్కి కూడా అండగా నిలుస్తారు.

Sivarama karanthనవల మొత్తం మీద కథతో పాటే ప్రయాణిస్తూ ఉండేది మాత్రం సముద్రం! కోడి గ్రామంలో ఇంటికి వంద గజాల దూరంలోనే సముద్రం! కథంతా నిత్యం ఆ హోరులోనే, సముద్రం మీద నిండైన సూర్య చంద్రుల అందాలతో, పట్నం మాలిన్యం, కాలుష్యమూ అంటని స్వచ్చమైన సముద్రం, దగ్గర్లోని కొబ్బరి తోటల టప టపలతో హోరు మిళితమైన సుందర సంగీతం నేపథ్యంలో ఆ నిశ్శబ్ద గ్రామం సైతం కువ కువలాడేలా చేస్తుంది. మంగుళూర్లో సముద్రం, రాముడు మద్రాసు వెళ్తే అక్కడా వదలని దక్షిణ సముద్రం! అందుకే రాముడు తన పసి తనం లోనే సముద్రంతో ప్రేమలో పడతాడు.

నవలా కాలం 1850 నుంచి మొదలు కావడం వల్లనేమో ప్రాచీన  దక్షిణ కర్ణాటక సంస్కృతి, ఆచార వ్యవహారాలు విస్తృతంగా కనిపిస్తాయి! కన్నడ బ్రాహ్మల తిండి అలవాట్లు (మనకు పరిచయం లేక పోవడం వల్ల)కొంత వింతగానూ, మరి కొంత ఆసక్తి గానూ తోస్తాయి. ఇంటికి వచ్చిన వాళ్ళకి మంచినీళ్లతో పాటు బెల్లం ముక్క ఇవ్వడం, లేదా ఆకులో పెట్టిన వూరగాయ ముక్క తో మంచి నీళ్ళు ఇవ్వడం, నీళ్లలో నానేసిన అటుకులు తినడం, కాఫీకి బదులుగా పెసర గంజి ఇవ్వడం వంటివి! చిరుతిండి గా కోడి గ్రామంలో కేవలం అప్పడాలు వడియాలు మాత్రమే కనిపిస్తుంటాయి. పెళ్ళి చూపులకు వచ్చిన వాళ్లకు కూడా అవే!

అనేక చోట చామ కూర అట్లు, పనసకాయ, గెనుసు గడ్డ (చిలగడ దుంప) అప్పడాల ప్రస్తావన వస్తుంది. పనసకాయతో అప్పడాలు ఎలా చేస్తారో అర్థం కాలేదు గానీ, మొత్తానికి అవి నాకు కూర్గ్ లో ఒక స్నేహితుల ఇంట దొరికాయి.

అప్పటి ఆచార వ్యవహారాలు, పట్టింపులు అన్నీ నవల్లో సుస్పష్టం. లచ్చడు ఉడిపి లో హోటల్ లో తిన్నాడని తెల్సి “ఆ కామత్ ల హోటల్లో తిని ఆచారం మంట పెడతావా”అని సరసోతి మండి పడుతుంది.

అసలు మొత్తం మీద కర్నాటక బ్రాహ్మల్లో చాలా మందికి భోజన హోటల్ పెట్టడం ఒక రివాజైన కొలువుల్లో ఒకటి గా అర్థమవుతుంది. శీనమయ్యరు కొడుకులు బంధువుల హోటల్లో పని చేసి ఆ పైన సొంత హోటల్ పెడతారు. వేద పాఠశాల నడిపే సుబ్రాయ ఉపాధ్యాల కొడుకు కిట్టు ఉపాధ్యాయ కూడా  కుందాపురం లో చిన్న పాటి హోటల్ ప్రారంభిస్తాడు ! ఆస్తి మొత్తం తీసుకు పోయిన లచ్చడు కూడా హోటల్ పెట్టి నష్ట పోతాడు. ఒరటమయ్యరుదీ అదే దారి! చివరికి రాముడు కూడా హోటల్లో పని చేయక తప్పదు.

ఇంత పెద్ద నవలను  కారంత్ 30 రోజుల్లో రాయడం ఒక ఎత్తైతే, డాక్టర్ తిరుమల రామచంద్ర దాన్ని అంత అద్భుతంగానూ తెలుగులోకి అనువదించడం విశేషం! ఈ నవల్లోని దక్షిణ కర్నాటక మాండలికాలకు నిఘంటువుల్లో కూడా సరైన అర్థాలు దొరకని పరిస్థితిలో ఎంతో శ్రద్ధగా వాటి అర్థాలను అన్వేషించి కన్నడం నుంచి నేరుగా తెలుగులోకి అనువదించారు. ఇంగ్లీష్ లోకి ఈ నవల మొదట ఈ నవల వెలువడిన పధ్నాలుగేళ్ళకి ఏ. ఎన్ మూర్తీ  “Return to Earth ” పేరుతో అనువదించారు. అయితే అది కొంత సంక్షిప్త రూపంలో ఉండటం తో పద్మా రామ చంద్ర శర్మ  అనే ఇంగ్లీష్  టీచర్ (ఈమె ఆఫ్రికా దేశాల్లో కూడా పని చేశారు) తిరిగి ఆ నవలను ఆంగ్లం లోకి అనువదించారు

అంత విస్తారమైన నవలను సంక్షిప్త రూపంలో చిన్న పిల్లలకు కథ చెప్పినట్లు సరిపెడితే కుదరదంటారామె! అందుకే ఆ దక్షిణ కర్ణాటక మాండలికాల్ని వెదికి పట్టుకుని , రోజువారీ దినచర్య లోనీ ప్రతి ఘట్టాన్నీ వర్ణన అనే భావనకు అతీతంగా చిత్రిస్తూ పోయిన కారంత్ శిల్ప చాతుర్యాన్ని తానూ వీలైనంత సవిస్తరంగాగే అనువదిస్తూ, మూలం లోని flavor  పోకుండా చూడ్డానికే ప్రయత్నించానంటారు . అనువాదకుల సృజనాత్మకత అనువాదం లో కనిపించవచ్చని అంగీకరిస్తూనే “అనువాదకుడు గాలి పటం లాటి వాడు. ఎంత ఎత్తైనా స్వేచ్చగా ఎగరొచ్చు గానీ, అదుపులో మాత్రం ఉండాలి ” (మూలం నుంచి దూరంగా జరగ కూడదని)అని పద్మ అంటారు. ఆ పనిని తిరుమల రామ చంద్ర అక్షరాలా నెరవేర్చారు. కన్నడ సువాసనలు ఏ మాత్రం తగ్గకుండానే రామైతాళుడిని, నాగవేణి, సరసోతి, పారోతి, రాముడు, పాలి కాపు సూరడు, అతడి కోడలు బచ్చి.. అందర్నీ తెలుగు వాకిట్లోకి తెచ్చి మనతో చేతులు కలిపిస్తారు. సరసోతి ని అభినందిస్తూ, నాగవేణి తో సహనుభూతి పొందుతూ, రాముడితో పాటు ప్రయాణిస్తూ వాడి కష్టాలు చూసి చివుక్కుమన్నా, వాడు చేరుకున్న పచ్చని గమ్యం చూసి పాఠకుడు హాయిగా నిట్టూర్చేలా ,  నవలంతా తానై పరుచుకుని ఈ మూడు తరాల జీవన ప్రయాణానికి సాక్షిగా నిల్చిన కోడి గ్రామపు సముద్రానికి వీడ్కోలు చెప్పి పుస్తకం మూసేలా చేస్తారు.

వనవాసి నవల్లో భిభూతి భూషణ్ లాగే కారంత్ కూడా వ్యవసాయ వృత్తిని వదిలి పట్నం వైపు పరుగులు తీస్తున్న వారి గురించి ఏమీ గగ్గోలు పెట్టరు నవల్లో! పట్నం చేరి పతనమై పోతున్న లచ్చడిని,శీనమయ్యరు పిల్లల్ని చూస్తున్న పాఠకుడు “అయ్యయ్యో, వ్యవసాయం వదిలి, పల్లె వదిలి ఎంత పని చేశారు వీ”ళ్ళనే ఆందోళన చెందేలా చేస్తారు.

ప్రకృతికి శ్రమను ధార పోయడంలో రాముడు పొందిన సంతోషం, తృప్తి చూస్తున్నపుడు , వాడు తన తాతగారి జీవన శైలికి,వ్యవసాయానికి తిరిగి వచ్చినపుడు.. తెలీని రిలీఫ్ ని పాఠకుడు పొందుతాడు. వ్యవసాయాన్ని పునరుద్ధరించడమే కాదు, ఆర్థిక స్వావలంబన కూడా అందులో ఒక అంశంగా ఉండాలంటాడు కారంత్! అందుకే రెండు తరాలకు కింద రెక్కలు ముక్కలు చేసుకుని ఆ ఇసుక నేలల్లో సరైన ఎరువులు కూడా లేకుండా వరి, ఉలవలు,మినుములు దోసకాయలు పండించిన రామైతాళుడి కుటుంబం లో రాముడి తరం పొగాకు పండిస్తుంది.

బెస్త వాళ్ళు పట్టిన చేపల్ని చూడ్డానికి సైతం “ఛీ “అనుకునే ఆ కుటుంబం లో రాముడు పొగాకు పంటకు “చేపల ఎరువు” వేస్తాడు. పని చేయడానికి మాత్రమే పాలికాపుని ఉపయోగించుకున్న రామైతాళుడి తరం వాళ్ళు అంతకు మించి సూరడి కుటుంబంతో పెద్దగా  మాటలు నెరపరు. “మీ శూద్రుల రాత అంతేరా ! బ్రాహ్మల ఇంటి  పాయసానికి నాలుకు పీక్కుంటారు గా ” అని మాట్లాడతాడు కూడా !! రాముడు ఇరవయ్యేళ్ళకే జీవితంలో ఎంతో చూసిన వాడు కాబట్టి , పట్న వాసం చేసి వచ్చిన వాడు కాబట్టి ఆ నాటి ఆచారాలను ఎంత వరకూ పాటించాలో, ఏది మూర్ఖత్వమో గ్రహించిన వాడూ కాబట్టి పాలి కాపుతో హాస్యాలు చమత్కారాలు ఆడుతూ వాళ్లతో కల్సి పని చేస్తాడు. బెస్తల కుటుంబాల తో కల్సి తిరిగి ఎర్ర సీసాలు (తాగుడు) మానమని ప్రోత్సహిస్తాడు

“నా కొడుక్కి రాసేది చదివేది నేర్పు దొరా! నాకు చూడు చదువు రాక ఎంత కష్ట పడుతున్నానో” అని బెస్తల చెన్నడు అంటే, “అది రాకుంటేనే నయం రా! మా నాన్నకు చదువు వచ్చే, ఆస్తి ఉడుపి కోమట్ల వశమైంది” అని హాస్యాలాడతాడు.

“నాకూ ఫిడేలు నేర్పుతారా” అని చెన్నడు అడిగితే “సరే, ముయ్యి కి ముయ్యి(చెల్లుకు చెల్లు), నీవు నాకు వలలు పన్నేది నేర్పు, నీకు నేను ఫిడేలు నేర్పుతా”నంటాడు.

రాముడి లా ఆలోచించి, వ్యాపారాలు, ఉద్యోగాలు వదిలి పెట్టి పచ్చని ప్రకృతి వొడి వైపు పరుగులు తీసే యువత అక్కడక్కడా మనకి కనిపించక పోరు.ఫేస్బుక్ లో దీప్తి రెడ్డి వంగల అనే అమ్మాయి ని చూస్తుంటాను.ఎకరాల కొద్దీ సేంద్రియ (organic ) వ్యవసాయం అలవోక గా చేస్తూ, పంటల్ని బళ్ళకెత్తుతూ ఉంటుంది.  ఈనాడు నుంచి వుద్యోగం విరమించిన హేమ సుందర్ అనే పాత్రికేయుడు , వ్యవసాయం వైపు మరలి , డయాబెటిక్ బియ్యాన్ని పండిస్తున్నారు ! అమెరికా నుంచి తిరిగొచ్చిన మరో మహిళ శ్రీకాకుళం దగ్గర, ఇంజనీరింగ్ చదిన కుర్రాడొకడు, సాఫ్ట్ వేర్ ఉద్యోగాన్ని వదిలి మరొకరు.. ఇలా వ్యవసాయం మీద ఆసక్తి చూపిస్తున్న వాళ్ల గురించి ఈ మధ్య ఒక టీవీ కార్య క్రమంలో చూసి ఎంతో సంతోషం వేసింది. ఈ క్రమంలో పట్నం నుంచి పల్లెలకు మళ్ళిన యువ రైతులెవరైనా ఇంకా ఉన్నారా అని “young farmers in AP and Telangana అని వెదికితే, లెక్కకు మించి యువరైతుల ఆత్మ హత్యల వార్తలు పేజీల కొద్దీ ప్రత్యక్షమై బెంబేలెత్తించాయి :-( ! కొత్తగా వ్యవసాయం మొదలు పెట్టినా పెట్టక పోయినా, వ్యవసాయం కుటుంబాల నుంచి వచ్చిన వారు సొంత గానో , కనీసం కౌలుకి ఇచ్చో వ్యవసాయాన్ని కూలి పోకుండా కాపాడితే ఎంత బావుంటుంది !! రియల్ ఎస్టేట్ డెవలప్మెంట్ కి పంట భూముల్ని ఇవ్వాలనే ఆలోచన ఎంత దుర్మార్గం ! భూమిని  నిలువునా హత్య చేయడం ఎంతటి నేరం !!

రాజధానుల పేరుతోనో , రియల్ ఎస్టేట్ పేరుతోనో ప్రపంచకీరణ వైపుగా పయనిస్తూ , వ్యవసాయ భూములన్నీ మాయమై కాంక్రీటు అడవుల్లా మారి పోతున్న కాలంలో, వ్యవసాయం చేయలేక పిట్టల్లా రాలి పోతున్న రైతుల ఆత్మ హత్యల కాలంలో.. చదువుకుని, పట్నంలోని శూన్యాన్ని , అనుభవంతో అవగతం చేసుకుని సేద్యానికి తిరిగి మరలిన రాముడే ఇప్పుడు కావలసిన మోడల్! వ్యవసాయాన్ని మర్చి పోయి నిర్లక్ష్యం చేస్తున్న ప్రతి ఒక్కరూ తిరిగి ఆ వైపుగా, సేద్యానికి మరలి వెళ్లాలన్నదే ఈ నవల ఇచ్చే పిలుపు! మనకిప్పుడు వందలమంది రాముళ్ళు కావాలి !!

___