తాతరాయి చెప్పిన చరిత్ర

Tatarai Cheppina Katha

అప్పటికి కొంతకాలమైంది నేను నా కొండ నుంచి విడిపడి. పక్కనే వున్న అడ్డరాయితో బాగా పరిచయం కుదిరింది. ఎన్నాళ్ళ నుంచి అలా వుందో కానీ బాగా నునుపుతేలి మిలమిల మెరుస్తూ వుంటుంది. ఆ రోజు కూడా ఎండ నా ఒళ్ళు చుర్రెక్కిస్తుంటే, అడ్డరాయితో పిచ్చాపాటి మాట్లాడుతున్నాను. సరిగ్గా అప్పుడే ఓ చిన్న గులకరాయి దొర్లుకుంటూ వచ్చి మా ముందర ఆగింది. నేనేమో అంత ఎత్తు ఇంత లావు వుంటాను. నా ముందు ఆ గులకరాయి ఏ పాటిది. నేను పెద్దగా పట్టించుకోలేదు.

“ఏంట్రా అబ్బాయిలూ మాట్లాడుకుంటున్నారు” అంటూ అటూ ఇటూ దొర్లింది గులకరాయి.

ఆ మాటతీరు అదీ నాకు బాగా చిరాకు కలిగించాయి. ఏదో పెద్దబండవాళ్ళం మాట్లాడుకుంటుంటే, మా మధ్యలో చేరి అలా మాట్లాడినందుకు నాకు చాలా కోపం వచ్చింది.

“ఏయ్… నీకు చిన్నంతరం పెద్దంతరం లేదా? ఏమిటా మాటలు?” గద్దించాను. చిన్నరాయి గరగరా నవ్వింది.

“ఎవరు? నువ్వు పెద్దా? నిన్నగాక  మొన్న పుట్టావు… అంతెత్తున శారీరం వుంటే సరిపోయిందా? వయసు బట్టి గౌరవం కానీ ఒడ్డుపొడవు బట్టి కాదోయ్..” అంది గులకరాయి.

నా కోపం ఇంకా పెరిగిపోయింది. “అయితే నీ వయసు నా వయసు కంటే ఎక్కువంటావు?” అన్నాను.

“ఓరి నీ బండపడ… కనిపించేదాన్ని బట్టి అంచనాలు వెయ్యకూడదురా… సరిగ్గా చూస్తే నేను మీకు తాతనవుతాను” అంటూ తన మీద పడ్డ ఎదురెండ నా ముఖానికి తిప్పికొడుతూ నిలబడిందా గులకరాయి.

అడ్డరాయి భళ్ళున నవ్వింది. “మేము గట్టిగా దొర్లితే భూమిలోకి దిగిపోతావు… నువ్వు మా తాతవా” అంది నవ్వలేక ఒగురుస్తూ.

“సరే, నా చరిత్ర చెప్తా వినండి. తాతనో కాదో మీరే చెప్పండి.” అని కథ మొదలుపెట్టింది. “మా ముత్తాత ఇరవై వేల ఏళ్ళ క్రితం ఒక పెద్ద కొండగా వుండేవాడు. అప్పుడప్పుడే మనుషులుగా మారుతున్న కొన్ని కోతులు ఆ కొండ మీద వుండేవంట. వాళ్ళు తల దాచుకోడానికి, అక్కడక్కడ సేకరించిన తిండి, జంతుకళేబరాలు పెట్టుకోడానికి మా తాతని తొలిచి ఒక గుహ చేసుకున్నారంట. ఆ కాలంలో అట్టా ఏర్పాటు చేసుకున్నోళ్ళే లేరని ఇప్పటికి కూడా చెప్పుకుంటారు. మా తాత ఒంటిమీద ఏందేందో బొమ్మలు కూడా గీసినారంట ఆ మనుషులు.

కొన్నాళ్ళకి మా తాత ఆ కొండ నుంచి విడిపడి చదరంగా వుండే నేల మీద స్థిరపడ్డాడు. ఇంకొన్ని వేల ఏళ్ళ తరువాత ఓ ఎండాకాలం అనుకోకుండా ఓ చినుకు పడి రెండు ముక్కలయ్యాడు. వాళ్ళే మా పెదనాయన, మా నాయన. వాళ్ళిద్దరూ  ఓ శిల్పి కంట్లో పడ్డారు. ముందు మా నాయనని ఆయన చెక్కి చెక్కి ఓ శిల్పంగా మార్చాడు. అయితే దానికన్నా పెద్దది కావాలని రాజుగారు చెప్పాడంట. మా నాన్నని వదిలేసి పెదనాన్నని పెద్ద శిల్పంగా చేశారట. ఆయన్ని ఆ తరువాత దేవుడు అని పూజలు చేశారు. మతం అని ఒక కొత్త మంత్రం చదివారు. అదో రకం విప్లవం. అయితే పెద్దగా పనికిరాలేదంట.

ఇక్కడ మా నాన్న ఎండకి ఎండి, వానకి నాని నాన్న ఎన్నో ముక్కలయ్యాడు. నేనూ, ఇంకోంతమంది తమ్ముళ్ళు ఈ లోకంలో పడ్డాం. ఆ తరువాత ఒక చోటని లేదు, ఒక ఊరని లేదు. తిరిగి తిరిగి, అరిగి అరిగి అదిగో ఆ లారీలో పడి ఇక్కడికి వచ్చాను” అని చెప్పి కాస్త సర్దుకునిందా రాయి.

“అట్నా. అయితే నువ్వు ఖచ్చితంగా మా తాతవే… అయితే నాలాంటి పిల్లరాయికి నీ లాంటి తాతరాయి దగ్గర నేర్చుకోవాల్సిన విషయాలు చాలా వుంటాయే… అవన్నీ నాకు నేర్పించు తాతా…” అని మనవడి గోమంతా పడ్డాను నేను.

“అలాగే చెప్తాలే కానీ మనవడా… ఇంతకీ మీరంతా ఎవరు? మిమ్మల్ని ఎవరు పుట్టించారు? ఆ కథలు చెప్పండి ముందు” అంటా పక్కనే వున్న మెత్తటి గడ్డి మీద కుదురుకున్నాడు తాతరాయి.

“మాదేముంది తాతా! అదిగో కొంచెం అవతలగా రాళ్ళని పగలగొడుతూ కొన్ని వింత జంతువులు తిరుగుతున్నాయే అక్కడ వుండేవాళ్ళం. అందరం కలిసి వున్నప్పుడు కొండగుట్ట అనేవాళ్ళు.”  అని నా పక్కనున్న అడ్డరాయి చెప్తుంటే నేను మధ్యలో అందుకున్నా.

“మధ్యలో ఆ వింత జంతువులు పైన ఎక్కి కొంత మనుషులు వచ్చారు. అప్పుడె తెలిసింది వాటిని మెషీన్లంటారని. ఏదో డెవలప్మెంట్ అంటా తలా ఒక జంతువుని మా మీదకు ఎక్కించి గడగడ మంటూ మమ్మల్ని ఇట్టా పుట్టించారు” అన్నాను.

“డెవలప్మెంటా?” అన్నాడు తాతరాయి ఆశ్చర్యంగా. ముసిలిరాయి చాదస్తం చూస్తే మా ఇద్దరికీ నవ్వొచ్చింది.

“నీకు తెలవదులే తాతా… డెవలప్మెంట్ అంటే అభివృద్ధి” అంది అడ్డరాయి అర్థం చెప్తూ.

తాతరాయి గడ్డి మొత్తం గిరగిరా దొర్లుకుంటూ నవ్వాడు. కాస్త ఆగి మళ్ళీ వెనక్కి దొర్లుకుంటూ నవ్వాడు. “ఈళ్ళకి ఇంకా ఈ అభివృద్ధి పిచ్చి చావలేదా?” అన్నాడు ఆగాక.

“అదేంది తాతా? వీళ్ళ అభివృద్ధి గురించి నీకు తెలుసా?” అన్నాను నా నీడ తాతరాయి మీద పడేలా సర్దుకుంటూ.

“తెలియకేం మనవడా… నేను చెప్పానే మా తాత, ఆయన కూడా ఈ అభివృద్ధి గురించి మా నాయనకి చెప్పాడంట. అంటే పదివేల ఏళ్ళ క్రితం సంగతి. ఆ కథ మీక్కూడా చెప్పమంటారా?” అన్నాడు

మేమంతా “చెప్పు తాతా, చెప్పు తాతా” అంటూ అటూ ఇటూ దొర్లాము. తాత కథ చెప్పడం మొదలుపెట్టాడు.

“ఒకప్పుడు… అంటే మా తాత కాలంలో కూడా ఈ మనుషులు వుండేవాళ్ళు…!! వాళ్ళు ఎప్పుడూ వుంటార్లే. చచ్చేవాళ్ళు చస్తుంటే, పుట్టేవాళ్ళు పుడుతుంటారు… అందువల్ల మునుషులు చచ్చినా మనిషి అనే ప్రాణి బతికే వుంటదంట. మనలాగ కాదు… సరే ఏం చెప్తున్నాను… ఆ… ఆ కాలంలో వాళ్ళు అడవుల్లో బతుక్కుంటా, చెట్టుచేమా ఎక్కుతా దిగుతా, కాయదుంప తినుకుంటా వుండేవాళ్ళు. ఒకోసారి గుంపులు గుంపులుగా పోయి, మీ లాంటి రాళ్ళ వెనక నిలబడి ఏదైనా జంతువు దొరికితే వేటాడి, దాన్ని తిని హాయిగా వుండేవాళ్ళు.” మధ్యలో ఆపి అటూ ఇటూ చూసి కొనసాగించాడు తాతరాయి –

“కొన్నాళ్ళయ్యాక ఒక పెద్ద విప్లవం వచ్చింది. దాన్ని ఇప్పటివాళ్ళు వ్యవసాయ విప్లవం అంటున్నారంట కానీ అప్పట్లో దానికేమీ పేరుండేది కాదు… ఏదైతేనేంది మనుషులందరూ, వేటాడ్డం మానేసి వడ్లు, గోధుమలు, దుంపలు పెంచడం మొదలుపెట్టారు. రాన్రాను పరిస్థితి మారిపోయింది. ఎకరాలకెకరాలు అవే వడ్లు, అవే గోధుమలు, అయ్యే దుంపలు… ఎక్కడో చీకటి రాజ్యంలో మొదలైందంట. ఆ తరువాత ఒక రాజ్యామని లేదు, దేశమని లేదు, నదని లేదు, సముద్రమని లేదు …అన్నింటినీ దాటుకోని పొయ్యినాయి. ఎక్కడ చూసినా అవే. ఓ వందా నూటాభై ఏళ్ళు గడిచినాయి. కావల్సినంత పంట, తిన్నంత తిండి… అప్పటిదాకా ఏడాడో తిరిగిన మనుషుల జాతి ఒక చోట కుదురుకున్నారు. గూడేలు, రాజ్యాలు, దేశాలు పుట్టుకొచ్చినాయి. అదే అభివృద్ధి అని పాటలు గట్టి పాడుకున్నారు..”  నేను ఏదో అడగబోతున్నానని తెలిసి అక్కడ ఆపాడు తాత.

నేను అడిగా –“తాతా! నువ్వు చెప్పినట్లు అభివృద్దే జరిగింది కదా… మరి ఆ మాట విని ఎందుకు నవ్వావు?” అన్నాను.

“నీక్కూడా మనుషుల్లానే తొందర ఎక్కువున్నట్లుందే మనవడా ఒక్కరవ్వ ఆగు… చెప్తున్నా కదా… ఎందాక చెప్పాను? ఆ… ఆపాట్న… అందరూ వ్యవసాయ విప్లవం వచ్చిందని సంబరపడ్డారు. నీలాగా నా లాగా కదలకుండా అంతా చూస్తున్న రాయి రప్పా గట్టిగట్టిగా నవ్వుకున్నాయంట. మా తాత (అప్పటికి ఇంకా పిల్లాడే) ఇదంతా చూసి, నీలాగే – “రాళ్ళల్లారా రప్పల్లారా ఎందుకు నవ్వుతున్నారు? అభివృద్ధి జరిగిన మాట నిజమే కదా” అని అడిగినాడంట.

అప్పుడు ఆ పెద్ద పెద్ద రాళ్ళు మళ్ళీ నవ్వేసి – “ఒరేయ్ నాయనా… వాళ్ళకంటే బుద్ధి లేక అనుకుంటున్నారు. నువ్వు ఎందుకు వాళ్ళ మాట నమ్ముతున్నావు?” అని అడిగినాయంట. ఇంకా వివరంగా చెప్పమని అడిగితే అయ్యి చెప్పడం మొదలెట్టినాయంట.

“ఒరేయ్ నాయనా… నువ్వింకా చిన్నరాయివి… సుత్తి దెబ్బకు, ఉలిదెబ్బకి తేడా తెలియనివాడివి. వాళ్ళు చెప్పగానే అభివృద్ధి జరిగిపోయిందని నమ్మితే ఎట్లా? ఒక్కసారి వాళ్ళని చూడు. ఇంతకు ముందు పూటకో రకం తినేవాళ్ళు. ఒకపూట ఆకులు, ఇంకోపూట తేనే, ఇంకోరోజు మాంసం, మళ్ళి ఒకరోజు పండ్లు ఇట్టా అన్ని రకాలు తినేవాళ్ళు, ఇప్పుడు చూడు పొద్దున బియ్యం, మధ్యాన్నం బియ్యం, రాత్రికి బియ్యం… ఇదీ ఒక తిండేనా? ఇట్టా తిని తిని, ఏదో ఒకరోజు శరీరానికి సరిపోయే పోషకాలు అందటంలేదని వాళ్ళే ఏడుస్తారు చూడు” అంది ఓ పెద్దతలరాయి.

“అంతేనా… అప్పుడు ఒకచోటని కాకుండా నాలుగు చోట్ల తిరిగే వాళ్ళు… ఆడవాళ్ళు కూడా అడవుల్లో, గుట్టల్లో తిరిగేవాళ్ళు. అట్టా తిరగడానికి బిడ్డలు ఎక్కువుంటే కష్టమని ఒక బిడ్డకి నడకొచ్చిందాకా ఇంకో బిడ్డని కనకుండా వుండేవాళ్ళు. మరి ఇప్పుడు? ఇల్లు కట్టుకున్నారు. చాటు మాటు కుదిరింది. పంటలు పండించేదానికి ఇంకో రెండు చేతులు వస్తాయిలే అని ఒకళ్ళ తరువాత ఒకళ్ళని కంటూనే వున్నారు. జనాభా పెరిగింది. చేతులున్నోళ్ళకి నోళ్ళు కూడా వుంటాయిగా… దానికోసం ఇంకా ఎక్కువ వడ్లు, గోధుమలు పండిస్తున్నారు…  దానికింకా నేల కావాల. ఇది నాదంటే ఇది నాదంటున్నారు. రేపు ఆ నేలకోసం తలకాయలు పగలగొట్టుకుంటారు…” అన్నాడు ఓ రాయప్ప.

తాతరాయి అక్కడ ఆపి కాస్త ఊపిరి తీసుకున్నాడు.

“ఇట్టా వ్యవసాయ విప్లవం గురించి మా తాతకు కథలు కథలుగా చెప్పాయి ఆ రాయీ రప్పా. ఆ కథలే మా తాత నాకు చెప్పాడు. నేను మీకు చెప్పాను” అన్నాడు తాతరాయి

“ఒక్క విప్లవం వెనక ఇన్ని కథలు వుంటాయా తాతా?” అన్నాను నేను ఆశ్చర్యంగా.

Kadha-Saranga-2-300x268

తాతరాయి నవ్వేసి – “అక్కడితో కథ అయిపోలేదు మనవడా… కాలం గడిచి, మా నాయన ఎదిగేసరికి ఇంకా చానా విషయాలు తెలిసాయి. అంతకు ముందు ఎక్కడ పడితే అక్కడ తిరిగేవాళ్ళు, పంటలు పండిచడం మొదలుపెట్టాక ఒకే చోట కుదురుకున్నారు… ఆ పొలం చుట్టూ కాపలా వుండాలికదా… అందుకే ఒకళ్ళ పక్కన ఒకళ్ళు, ఒకళ్ళ పక్కన ఒకళ్ళు ఇళ్లు కట్టుకున్నారు. అక్కడే తినడం, అక్కడే పిల్లలు, అక్కడే జంతువులు… అప్పటిదాక లేని అంటు రోగాలు మొదలైనాయి. అట్టా కొంతమంది చస్తా వుంటే ఇంకొంత మంది ఇంకో రకంగా చచ్చేవాళ్ళు.

అడవుల్లో వున్నప్పుడు ఇంకో జాతి జనం కొట్లాటకి వస్తే చేతనైతే తిరగబడేవాళ్ళు, చేతకాకపోతే పారిపోయేవాళ్ళు. ఇప్పుడు పారిపోవటం ఎట్లా? పొలం, పాడి, కొంప, గోడు… అన్నీ అక్కణ్ణే వున్నాయయ్యపోయె..!! కాపాడుకోవాల… కాదని పోతే పస్తులుండి చావాల… కొంతమంది కొట్లాడి చచ్చినారు, ఇంకొంత మంది పస్తులుండి చచ్చినారు. ఎప్పుడన్నా వరి మింగే పురుగొచ్చిందంటే వాళ్ళ దిగుబడి తగ్గి చచ్చినారు…”

“అదేంది తాతా… అంతకు ముందు ఒక పండు దొరకకపోతే ఇంకో కాయో, ఆకో, జంతువో తినేవాళ్ళు కదా?”

“అప్పుడు తినేవాళ్ళురా… విప్లవం దెబ్బకి అయన్నీ మర్చిపోయారు… అదే మనిషికి వుండే శాపం. అభివృద్ధి అభివృద్ధి అని అనుకుంటూ ముందుకు పోతాడా… ఇంక అంతే… చానా దూరం పొయ్యాక వెనక్కి వచ్చే దారి మర్చిపోతాడు. కష్టమో నష్టమో కానీలే అనీ అక్కడే పడి కొట్టుకుంటా వుంటాడు… అదే అభివృద్ధి అని పాటలు కట్టి పాడుకుంటా వుంటాడు. అసలు ఇంకో రహస్యం చెప్పనా?”

“చెప్పు చెప్పు” అన్నాం మేమిద్దరం

“మనిషి అందరికన్నా తెలివైనవాణ్ణని అనుకుంటాడు కానీ వాడంత ఎర్రోడు ఎవరూ లేరు…”

“అదేంది తాతా అంత మాట అన్నావు?” అని ఆశ్చర్యపోయాను.

“చెప్తా చూడు… ఈ వరి, గోధుమలు పెంచడం మొదలయ్యాక ఇదంతా జరుగుతోంది కదా. ఆ వరి మొలకల్లో ఏదో రహస్యం వుందని, అదేందో తెలుసుకుందామని చాలా సార్లు పొలాల్లోకి దొర్లుకుంటూ పొయ్యాను.”

“కనుక్కున్నావా?”

“యాడ కనుక్కునేది… నన్ను పొలంలో వుండనిస్తే కదా మనిషి… రాత్రి పగులు పొలం మీదే కదా వాడి ధ్యాస… నేను కనపడగానే ఎత్తి అవతలకి పారేసేవాడు. ఆ మొక్కలని ఎంత జాగ్రత్తగా చూసుకునేవాడని… నీళ్ళు తెచ్చి పోస్తాడు, మందు తెచ్చి చల్లుతాడు, రాయి రాకూడదు, పురుగు రాకూడదు ఆ పంటకి కుక్క కాపలా కాసేవాడనుకో…” అన్నాడు తాతరాయి.

“తాతా… అంతా బాగానే వుంది కానీ… కుక్క కాపలా అంటావే? కుక్కని మనిషి పెంచుకున్నాడు. అందుకని అది విశ్వాసంగా మనిషిని చూసుకుంది… వరిని గోధుమని కూడా మనిషే పెంచుకున్నాడు కదా…” చెప్పింది అడ్డరాయి.

“అక్కడే బురదలో పడుతున్నావు. ఎంతసేపు మనిషి వైపు నుంచే చూస్తే ఎట్లా? ఒకసారి ఆ మొక్కల వైపు నుంచి ప్రపంచాన్ని చూడు. అసలు రహస్యం ఏంటో తెలుసా… గోధుమని, వరిని మనిషి పెంచలేదు. గోధుమలు, వరి ప్రపంచమంతా పాకడానికి మనిషిని వాడుకున్నాయి. వాడి బతుకేదో వాడు బతక్కుండా, వాటి మాయలో పడ్డాడు తెలివితక్కువ మనిషి. మనిషి కుక్కని పెంచితే అది అడవి నుంచి వచ్చి మనిషి దగ్గర బతికింది. అట్టాగే అడవిలో వుండాల్సిన మనిషి అడవి వదిలేసి, వరి చేలు పక్కన ఇల్లు కట్టుకుంటే ఎవరు ఎవరిని పెంచుకున్నట్లు?” అన్నాడు తాతరాయి. ఆయన చెప్పింది అర్థం చేసుకోడానికి ప్రయత్నిస్తుంటే మమ్మల్ని తొక్కుకుంటూ ఎవరో వచ్చారు. సరిగ్గా మా ముందు నిలబడి దూరంగా వున్న నేలని చూపిస్తూ మాట్లాడుకుంటున్నారు.

“అదిగో సార్… అక్కడ టెక్నో పార్క్ వస్తుంది. రోబోటిక్స్ ఇక్కడ, ఎనలటిక్స్ ఈ పక్క. అవర్ కంపెనీ విల్ రెవెల్యూషనైజ్ టేక్నాలజీ. ఈ భూమి మీద మనుషుల లైఫ్ మారిపోతుంది మన ప్రాడక్ట్స్ తో…” అంటున్నాడతను.

నేను తాతరాయి వైపు చూసేసరికి ఆయన దూరంగా దొర్లుకుంటూ వెళ్ళిపోతున్నాడు.

***

అబ్సలీట్ రియాలిటీ

 

satyaprasadచాలా సాధారణమైన ప్రశ్న అడిగింది. – “మీరేం అమ్ముతారు?” అని

నిజం చెప్పాలంటే చాలా అమాయకంగా వుందా ప్రశ్న.

పెళ్ళి చూపులులో భాగంగా, అబ్బాయి అమ్మాయి మాట్లాడుకుంటారేమో అంటూ మమ్మల్ని ఏకాంతంగా ఇంటి మేడ పైన వదిలేశారు. చల్లగాలి. చొరవ చెయ్యాలా వద్దా అన్న చిన్న బెదురు. ఎదురుగా అరుదుగా కనిపించే అందం. అదీ ఆకుపచ్చని చీరలో. ఏం మాట్లాడాలా అని తటపటాయిస్తున్న క్షణాలు.

సరిగ్గా అప్పుడే ఆమె అడిగిన ప్రశ్న. “మీరేం అమ్ముతారు?” అని.

“నేను టీవీ ఛానెల్ లో పని చేస్తాను. అమ్మడం ఏమీ వుండదు” అన్నాను నేను.

“టీవీలో చేస్తారని చెప్పారులెండి. అక్కడ మీరేం అమ్ముతారు అనే అడుగుతున్నాను.” అంది. అమాయకత్వమా అజ్ఞానమా? అనుకున్నాను.

“మీరు టీవీలో చూస్తుంటారే… “మధ్యాహ్నం మహిళ”, “కొడితే కోటి రూపాయలు” ఈ షోలకి నేనే ప్రోగ్రామ్ ప్రొడ్యూసర్” అన్నాను

“నేను టీవీ చూడను”

అరుణ చెప్పిన ఈ మాట చాలా విచిత్రంగా అనిపించింది. “టీవీ చూడకపోవటమేమిటి? గేమ్ షోలు సరే… సీరియల్స్?”

“ఊహు”

“సినిమాలు? స్పోర్ట్స్? న్యూస్?”

“అసలు టీవీ ముఖమే చూడను మహాప్రభూ. మా ఇంట్లో అందరూ చూస్తారు” అన్నది. ఇంకేం చెప్పాలి?

“మీ నాన్నగార్ని, మీ అన్నయ్యలను చూసి నేను కూడా సేల్స్ ఉద్యోగం అనుకుంటున్నారా? నా ఉద్యోగం అలా కాదు” అన్నాను.

అరుణ నవ్వింది. నెమ్మదిగా నడుస్తూ మేడ మీదకు పాకిన కాగడామల్లెల తీగ నుంచి ఒక సన్నటి మొగ్గని తుంచి గాఢంగా వాసన చూసింది. ఆ తరువాత నా వైపు చూసి “కాదా?” అంది.

“కానేకాదు. నాది క్రియేటివ్ జాబ్” అన్నాను నేను. నా వైపు ఓ అర సెకను నిశ్చలంగా చూసింది. పిల్ల తెమ్మరలాంటి చూపు. ఆ చూపులో మెల్లెపూల సువాసనలు. కానీ ఆమె మాటల్లో…

“నా దృష్టిలో వుద్యోగాలన్నీ అమ్మకాలే. మీరు కూడా ఏదో అమ్ముతుంటారు. అదేంటో మీకే తెలియటంలేదు.” అంది చిరునవ్వు చెరగకుండా. పెళ్ళి చూపులు అయిపోయాక అమ్మాయి అబ్బాయి ఏకాంతంగా మాట్లాడుకోవడం అంటే కుటుంబం గురించో, అభిరుచుల గురించో, ఆర్థిక విషయాల గురించో మాట్లాడుకుంటారని ఇన్నాళ్ళు అనుకునేవాడిని. ఇక్కడ వ్యవహారం ఏదో తేడాగా వున్నట్లు అనిపించింది.

“మీకు అలా ఎందుకు అనిపిస్తోందో కానీ, అన్నీ వుద్యోగాలు సేల్స్ వుద్యోగాలు కావండీ…” అన్నాను ఆమె కళ్ళలోకే చూస్తూ. సిగ్గో, నా చూపులో వున్న చొరవో తెలియదు కానీ, ఆమె కళ్ళతోనే నవ్వేసి, పిట్టగోడ పట్టుకోని కొంచెం ముందుకు వంగుతూ మాట్లాడింది.

“ఏం కాదు. ఇప్పటి ప్రపంచంలో ప్రతి ఉద్యోగం ఏదో ఒకటి అమ్మడానికే కల్పించబడింది. ప్రతి ఉద్యోగీ నేరుగా అమ్మకపోవచ్చు, కానీ ఏదో రకంగా అమ్మకానికే దోహదం చేస్తారు. ఒకోసారి ఆ ఉద్యోగం చేసే వాళ్ళకి కూడా తెలియదు వాళ్ళేమి అమ్ముతున్నారో” అంది.

“మరి స్కూల్ టీచర్ వున్నాడనుకోండి. ఆయనేం అమ్ముతున్నట్లు?”

Kadha-Saranga-2-300x268

“టీచర్లలో రకాలు వున్నాయి లెండి… ఒక రకం ర్యాంకులు, ఐఐటీ సీట్లు తద్వారా రాబోయే పెద్ద పెద్ద ఉద్యోగాలు, పెద్ద పెద్ద జీతాలు… ఇంకో రకం ఉన్నారు పాపం వీళ్ళు జ్ఞానాన్ని, మన మీద మనకి నమ్మకాన్ని, జీవితం గురించి భరోసాని అమ్మాలనుకుంటారు. పాపం వాళ్ళ సరుకు అమ్ముడుపోదు…” కిసుక్కున నవ్వింది.

“చిత్రంగా మాట్లాడుతున్నారే… మరి గుళ్ళో పూజారి?”

“అమ్మో, ఆయన లిస్ట్ చాలా పెద్దది… భయం, భక్తి, ఆశ, దురాశ, స్వర్గం, నరకం…”

“సరే… సరే… మొత్తం మీద నేను చేసేది కూడా సేల్స్ ఉద్యోగమే అంటారు? పైగా నేను అమ్ముతున్నదేంటో నాకే తెలియదంటారు? అంతేనా” అన్నాను కాస్త తీవ్రంగా.

“అవును… మీరు అమ్మేదేంటో మీకు తెలియదు కాబట్టి… ఒక పందెం” కావాలనే అక్కడ ఆపింది. నేను అలాగే చుస్తూ వున్నాను. “ఏం. లేదు. మీరు అమ్మే ప్రాడక్ట్ ఏమిటో తెలుసుకోని నాకు చెప్పాలి… మన పెళ్ళి లోగా” అంటూ చీర కుచ్చిళ్ళని పైకి పట్టుకోని పరుగు లాంటి నడకతో మెట్లు దిగేసింది. మేడ పైన నేనూ, కాగడామల్లెతీగ మిగిలాము.

***

“ఏరా ఏమంటావ్?” అన్నాడు నాన్న కారు ఊరు దాటిన తరువాత.

ఆ అమ్మాయి మాటలు మళ్ళీ గుర్తుకువచ్చాయి. “మన పెళ్ళి లోగా…” అన్నదంటే ఆ అమ్మాయికి నచ్చినట్లే..! చెప్పకుండానే చెప్పేసింది! గడుసుదనం!!

“ఏరా? సమాధానం చెప్పవే?” నాన్న మళ్ళీ అడిగాడు.

“ఇంకేంటి చెప్పేది… అన్నయ్య అప్పుడే ఆ అమ్మాయితో డ్యూయెట్లు ఊహించుకుంటున్నాడు..” అంది చెల్లెలు శ్వేత.

“నాకు ఓకే నాన్నా… కాకపోతే కొంత టైం కావాలి” అన్నాను. ముందు సీట్లో డ్రైవర్ పక్కన వున్నాను కాబట్టి వెనక కూర్చున్నవాళ్ళ  ముఖాల్లో భావాలు తెలియట్లేదు. నా ముఖంలో వున్న భావాలు కూడా వాళ్ళకు కనపడవు కాబట్టి నా ఆలోచనలు వాళ్ళకు అర్థం కావు. “కోడితే కోటి రూపాయలు” గేమ్ షోలో కోటి రూపాయల ప్రశ్న దగ్గర ఆగిపోయిన అభ్యర్థిలా వుంది నా పరిస్థితి.

“ఇంకా టైం ఎందుకురా? నచ్చితే వచ్చే నెల్లోనే చేసేద్దామని వాళ్ళ నాన్నే చెప్పాడు” అమ్మ తన ఆతృతని బయటపెట్టింది.

“అది కాదులే అమ్మా… ఆ అమ్మాయి ఒక ప్రశ్న అడిగింది. పెళ్ళిలోగా సమాధానం చెప్పాలి” అన్నాను నేను.

“పెళ్ళిలోగా చెప్పాలా? లేక సమాధానం చెప్తేనే పెళ్ళి లేకపోతే లేదు అన్నదా మా వదిన” అంది శ్వేత ఉత్సాహంగా.

శ్వేత మాటల్లో కూడా నిజముందేమో అనిపించింది నాకు. ఇది ప్రశ్నా? లేకపోతే పరీక్షా?

“వాళ్ళ నాన్న ఇన్సూరెన్స్ అమ్ముతాడు, పెద్దన్నయ్య కార్ షోరూమ్ లో కార్లు అమ్ముతాడు, చిన్నన్నయ్య సరే సరి బట్టల షాపు కదా… అలాగే నా ఉద్యోగంలో కూడా నేను ఏదో అమ్ముతానట. అదేంటో కనుక్కోని చెప్పమంది” అన్నాను నేను.

“టీవీ ఛానల్లో అమ్మేదేముంటుంది?” ఆశ్చర్యపోయాడు నాన్న. నాన్నకు ఈ ప్రశ్నకు సమాధానం తెలిసే అవకాశంలేదు. దూరదర్శన్ కాలం నాటి మనిషి, అంతే ఆలోచించగలడని నాకూ తెలుసు.

“ఏముందిరా అన్నయ్యా! టీవీ ఛానల్ అంటేనే ఎంటర్టైన్మెంట్. నువ్వు ప్రోగ్రాములు ప్రొడ్యూస్ చేస్తావు కదా… అదే నీ ప్రాడక్ట్… అదే అమ్ముతున్నావు.” అంది శ్వేత చాలా సులభైన పరిష్కారం కనుక్కున్నట్లు.

నిజమే కదా? ప్రేక్షకులే నా కస్టమర్స్ అనుకుంటే, వాళ్ళని అలరించే విధంగా ప్రోగ్రామ్ డిజైన్ చెయ్యడమే కదా నా పని. అంటే నా షోలో కంటెంటంటే కదా నేను అమ్మేది. అంతే! ఫోన్ చేశాను.

“ఇంత త్వరగా ఫోన్ చేస్తారని అనుకోలేదు” అంది అరుణ. ఆమె గొంతు వినగానే ఏదో మధురభావన.

“కనుక్కున్నాను” అన్నాను క్లుప్తంగా.

“ఏమిటి?” అందామె.

“అదే నేను అమ్మేది.”

“చెప్పండి మరి”

“ఎంటర్టైన్మెంట్!” చెప్పాను.

“ఎంటర్టైన్మెంట్ అమ్ముతున్నారా? ఎవరికీ?”

“ప్రేక్షకులకి”

“అంటే ప్రేక్షకులే మీ కస్టమర్స్ అన్నమాట”

“అంతే కదా?” నా వెనకే కూర్చున్న శ్వేత ఉత్సాహంగా ముందుకు వంగి నా భుజం మీద తట్టింది.

“మరి కస్టమర్స్ అంటే మీరు అమ్మే వస్తువునో, సేవలనో డబ్బులు ఇచ్చి కొనుక్కోవాలి కదా? మరి మీ ప్రేక్షకుడు కూడా ఇస్తున్నాడా?”

“ఇస్తున్నాడు కదా? కేబుల్ టీవీ ఆపరేటర్ కి…”

“అది కేబుల్ కనెక్షన్ ఇచ్చినందుకు, సర్వీస్ చేస్తున్నందుకు. అయినా ఆ డబ్బులు టీవీ ఛానల్ దాకా రావు కదా?”

“అవును నిజమే”

“తొందరపడకూడదు… నెమ్మదిగా ఆలోచించి, పది మందిని అడిగి సమాధానం చెప్పాలి.. ఏం?” అంటూ పెట్టేసింది. చివర్లో నవ్విందా? నవ్వలేదా? నేనే అట్లా అనుకున్నానా? ఏమైనా ఆ అమ్మాయి నవ్వు మనోహరంగా వుంటుంది వినడానికి కూడా.

శ్వేత పిలుపుతో మళ్ళీ ఈ లోకం లోకి వచ్చాను. “ఏమనింది వదిన?” మళ్ళీ అడిగింది.

“కాదటమ్మా… అమ్మకం అంటే ఒక కస్టమర్ వుండాలి, అతను డబ్బులు ఇచ్చి మన దగ్గర్నుంచి ఏదైనా తీసుకోవాలి. అదీ ట్రాన్జాక్షన్ (transaction)… లావాదేవి. అలా జరిగితేనే అమ్మకం జరిగినట్లు.”

“అలా అని వదిన చెప్పిందా?” అడిగింది. నేను తలాడించాను. “అయితే కరెక్టే అయివుంటుంది” నవ్వేసింది.

***

“అయితే నువ్వు వెళ్ళింది పెళ్ళి చూపులకి కాదన్నమాట… స్వయంవరం” అన్నాడు శ్రీకాంత్ నవ్వుతూ.

“ఏంట్రా? నువ్వేదో హెల్ప్ చేస్తావని అడిగితే నా మీదే జోక్ చేస్తున్నావా?” అన్నాను నేను ఉక్రోషంగా. ఇరానీ చాయ్ ఘుమఘుమల మధ్య వేడిగా వాడిగా చర్చ జరుగుతోంది. మాతో ఛానల్ లోనే పనిచేసే వంశీ, శివరావ్ కూడా వున్నారు.

“అయినా కొశ్చన్ ఇంటరస్టింగా వుంది బ్రో” అన్నాడు శివరావ్

“నేనొకటి చెప్పనా?” అన్నాడు వంశీ. విషయాన్ని ముక్కలు ముక్కలుగా చెప్పడం న్యూస్ రీడర్ గా వాడికి కొట్టినపిండి. తరువాత వాక్యం కోసం అందరూ ఎదురుచూశారు. “ఇవన్నీమార్కెటింగ్ కి సంబంధించిన విషయాలు. మన ఇస్మాయిల్ ని అడిగితే చెప్పేస్తాడు” అన్నాడు. ఒకేసారి నా కళ్ళు పెద్దవి చేసి, చిరునవ్వు నవ్వుతూ నిటారుగా కూర్చున్నాను. అరుణతో పెళ్ళికి రెండు క్యూబికల్స్ దూరమే వున్నట్లు ఒక చిత్రమైన ఫీలింగ్. ఇస్మాయిల్ క్యాబిన్ లోకి వెళ్ళాను.

“కన్ఫూజ్ చెయ్యకు భాయ్. మనం ప్రేక్షకులకు అమ్మేదేంటి? ఎమోషన్స్… ఎంటర్టైన్మెంట్… ఆనందం, బాధ, టెన్షన్, కోపం, అసహ్యం, జుగుప్స…” చెప్పాడు

“అవన్నీ ఎక్కడున్నాయి ఇస్మాయిల్?”

“మన సీరియల్స్ లో, క్రైమ్ కథల్లో…. న్యూస్ పోగ్రామ్స్ లో ఎలాగూ తప్పదు” అన్నాడు నవ్వుతూ.

“కానీ ప్రేక్షకులు మన కస్టమర్స్ కాదంటోందే మా ఆవిడ” అన్నాను. ఆవిడ అన్న పదం నోరు జారింది కానీ అందులోనూ ఒక థ్రిల్ అనిపించింది. ఇస్మాయిల్ వెంటనే పట్టేశాడు.

“అరేయ్ భాయ్… అప్పుడే ఆవిడనేస్తున్నావే… కంగ్రాట్స్” అన్నాడు. ఆ తరువాత కాస్సేపు ఆలోచించి చెప్పడం మొదలుపెట్టాడు. “మనకి ఆదాయాన్ని ఇచ్చేవాడు కస్టమర్ అయితే, ప్రేక్షకుడు మనకి ఏ రూపంలోనూ డబ్బులు ఇవ్వటం లేదు కాబట్టి ప్రేక్షకుడు మన కస్టమర్ కాదు. అంటే ప్రేక్షకుడే కస్టమర్ అన్న భ్రమలో మనం వున్నాం. భలే పాయింట్ కదూ?” అన్నాడు.

“అయితే మన ఛానల్ కి డబ్బులు ఇచ్చేది ఎవరు?” అడిగాను ఆతృతగా. ఇస్మాయిల్ నవ్వాడు.

“అడ్వర్టైజ్మెంట్ ఇచ్చే ఏజన్సీలు, కంపెనీలు…” మార్కెటింగ్ అనుభవమంతా కనపడింది అతని మాటల్లో. సమాధానం దొరికింది.

వెంటనే నా కాబిన్ లోకి వచ్చాను. మొబైల్ చేతిలోకి తీసుకోని ఫేవరెట్స్ లో మొదట వున్న అరుణకి ఫోన్ చేశాను.

“అపూర్వ ప్రశ్నల అరుణాదేవీ… తెలిసిపోయింది”

“అయితే చెప్పేయ్యండి రాకుమారా..” అంది నవ్వేస్తూ.

“మా కస్టమర్ ప్రేక్షకుడు కాదు, కార్పొరేట్ సంస్థలు, యాడ్ ఏజన్సీలు…” అన్నాను ఆవేశంగా.

“నాకు తెలుసు మీరు కనిపెడతారని. కానీ, నేను అడిగింది మీరు అమ్మేదేంటి అని కదా. మీరు ఎవరికి అమ్ముతున్నారో చెప్పారు” అంది అరుణ కాస్త వ్యంగం ధ్వనిస్తున్న గొంతుతో.

“వాళ్ళకి అమ్మేదేముంది… అడ్వర్టైజ్మెంట్ స్లాట్… అదే కదా వాళ్ళకు కావాల్సింది…” అన్నాను

“ఇంకేముంది… గెలిచినట్లే… కాకపోతే అడ్వర్టైజ్మెంట్ స్లాట్ అమ్మడానికి మీ ప్రోగ్రామ్ లకి సంబంధం ఏమిటి? రోజు రెండు గంటలో, మూడు గంటలో అడ్వర్టైజ్మెంట్లే ఒక కార్యక్రమంలా వేయచ్చు కదా?” అంది. ఆమెకు కావాల్సిన సమాధానం ఇంకా రాలేదని అర్థం అయ్యింది. ఆ విషయం నేరుగా చెప్పకుండా ప్రశ్నలతో సమాధానం రాబట్టాలని చూస్తున్నట్లుంది.

“చెప్పండి… సాయంత్రం ప్రోగ్రామ్ మధ్యలో అడ్వర్టైజ్మెంట్ కి ఒక రేటు, మధ్యాహ్నం కార్యక్రమానికి ఒక రేటు ఎందుకుంటుంది?” మళ్ళీ అడిగింది.

“అది చూసే జనాన్ని బట్టి మారుతుంది. దాన్నే టీఆర్పీ అంటారు. ఎక్కువమంది చూసే టైమ్ ఎక్కువ విలువైంది. తక్కువ ప్రేక్షకులు చూసే టైమ్ లో అడ్వర్టైజ్మెంట్ అంటే తక్కువ రేటుకే…” ఆగిపోయాను నేను. ఏదో కొత్త విషయం తెలుస్తున్నట్లు అనిపించింది. అవతల వైపు నవ్వు.

“కాబట్టి ఇప్పుడు చెప్పండి. మీరు మీ ఉద్యోగంలో ఏం అమ్ముడానికి సహాయపడుతున్నారు?” అడిగింది చివరగా.

“ఐబాల్స్… ప్రేక్షకుల సమయం. మంచి ప్రోగ్రామ్ చెయ్యడం ద్వారా, ఎక్కువ మంది ప్రేక్షకులు చూసేలా చేసి, అలా చూస్తున్నారు కాబట్టి ఎక్కువ డబ్బులు వసూలు చేసి మరీ ఆ సమయాన్ని అడ్వటైజర్లకు అమ్ముతున్నాము.” అన్నాను ఆలోచనతో పాటే మాట్లాడుతూ.

“అంతేనా, టమాటాలు గ్రేడింగ్ చేసినట్లు ప్రేక్షకుల సమయాన్ని గ్రేడింగ్ చేసి దానికి టీఆర్పీ అని పేరు పెట్టి, ప్రైమ్ టైమ్, స్లాక్ టైమ్ అని విభజించి అమ్ముతున్నారు…”

“అవును నిజమే…”

“ఇప్పుడు అర్థం అయ్యిందా నేను ఎందుకు టీవీ చూడనో… నాకు ప్రోగ్రామ్ అనే ఎరవేసి నా సమయాన్ని దొంగిలించి గ్రేడ్ చేసి అమ్ముకునేవాళ్ళకు సహకరించడం నాకు ఇష్టం లేదు. పైగా అలా మోసపోడానికి నేనే కేబుల్ చార్జెస్ రూపంలో ఎదురు డబ్బులు ఇవ్వాలి…”

నేను చాలాసేపు సమాధానం చెప్పలేదు. నేను చేస్తున్న ఉద్యోగాన్ని ఈ కోణంలో చూడటం కొత్తగా వుంది. ఇప్పటిదాకా నాది క్రియేటివ్ జాబ్ అనుకున్నాను, నన్ను వాడుకుంటున్నారని అర్థం అవటం అప్పుడే మొదలైంది.

“ఏంటి ఆలోచిస్తున్నారు?”

“ఉద్యోగం చెయ్యక తప్పదు కదా… ఇప్పట్లో వదిలెయ్యలేనేమో…”

“వదిలెయ్యమని నేను చెప్పలేదే… కాకపోతే మీ చేత ఏం పని చేయిస్తున్నారో తెలుసుకోని వుండాలి కదా?”

“అవును. అన్నట్లు ఒకటి మాత్రం చెయ్యగలను. మనింట్లో టీవీ వుండదు…”

“అయ్యో టీవీ లేకపోతే ఎలా? టీవీ వుండాలి… కేబుల్ అఖర్లేదు. అప్పుడప్పుడు మనిద్దరికీ నచ్చిన సినిమాలు డీవీడీ వేసుకోని చూడటానికి, మన పెళ్ళి వీడియో మళ్ళీ మళ్ళీ చూసుకోడానికి…” అంటూనే నవ్వేసింది అరుణ. నేనూ ఆమెతో శ్రుతి కలిపాను. ఛానల్ ఆఫీస్ లో ఎవరి హడావిడిలో వాళ్ళున్నారు. వాళ్ళా అరుపుల్లో, నా నవ్వు ఎవరికీ వినపడట్లేదు.

***

 

పరాయి దేవుడు

Parayi

చిత్రం: మహీ బెజవాడ

మిస్టర్ బ్లూమ్ ఆ వినాయకుడిని చూసేదాకా ఎలాంటి ఒడిదుడుకులు లేని జీవితం గడిపాడు. బ్లూమ్ లాంటి వాళ్ళంతా ఇంతే. మనసులో సుదూర దేశాలకు ప్రయాణం చెయ్యాలన్న కోరిక బలంగా వున్నా అమ్మ చెప్పిన మాట విని ఆప్థమాలజీ (కంటి వైద్యం) కాలేజీలో చేరతారు. ఇదిగో ఇలాంటివాళ్ళే స్పైస్ ద్వీపాలకో, అందమైన మైదానాలకో వెళ్ళాలని కలలు కంటూనే టెల్మా లాంటి మందుల గుట్టలో పడి బతికేస్తుంటారు.

ఇలాంటివాళ్ళే – చివరికి రిటైరైన కంటి డాక్టర్ లెఫ్కోవిజ్ కూతురు ఎంత లావుగా వున్నా సర్దుకుపోయి పెళ్ళి చేసుకుంటారు. బ్లూమ్ లాంటి వాళ్ళే నీరు కారే కళ్ళని పరీక్షించడం అనే పనిని రోజూ చేస్తూనే సంసారాన్ని ఈదేస్తుంటారు. కుటుంబంతో కలిసి బంగారం రంగు ఇసుక వున్న బీచ్‌కి వెళ్ళాలని, అక్కడ చొక్కా లేకుండా నిలబడి సముద్రపు గాలిని పీల్చాలనీ, మనిషి నడవని చోట నడవాలని, ఏ మనిషీ ప్రేమించనంతగా మరొకరిని ప్రేమించాలనీ  అనుకుంటూ, అవేమీ చెయ్యకుండానే సంవత్సరాలు గడిపేస్తుంటారు.

అలా గడపటం కొంత మందికి అసంతృప్తి ఇవచ్చుగాక, కానీ కొంతమందికి అలా బ్రతకడంలోనే తృప్తి వుంటుంది. సరిగ్గా అలాంటి తృప్తి కలిగివున్న జీవితం గడుపుతున్న బ్లూమ్‌కి ఆ వినాయకుడి ప్రతిమ దొరకటమే ఆశ్చర్యం.

ఆ రోజు అతను గాజులు, చీరలు, అగరుబత్తీలు అమ్ముతున్న ఒక దుకాణం దగ్గర నిలబడ్డాడు. వాటన్నింటి మధ్యలో అనుకోకుండా కనపడిందా విగ్రహం. నాలుగు చేతుల మనిషి శరీరానికి ఏనుగు తల వుందా? లేక ఏనుగుకి మనిషి శరీరం అతికించారా? అని పరిశీలనగా చూశాడు. మెరిసిపోయే గులాబి రంగు శరీఅం, కరుణ కురిపించే కళ్ళు, బంగారు కిరీటం. ఒక చేయ్యి చూపుడు వేలుతో ఏదో సైగ చేస్తున్నట్లు వుంటే, రెండొవది దగ్గరకు రావద్దని వారిస్తున్నట్లు కనపడింది. చూడగానే అది దేవుడి బొమ్మ అయ్యివుంటుందని వూహించాడు బ్లూమ్.

“కాకపోతే మరేమిటి? ఒకేసారి భయం భక్తి రెండూ కలుగుతున్నాయంటే ఆయన ఖచ్చితంగా దేవుడే అయ్యుంటాడు” అనుకుంటూ ఆ నునుపైన విగ్రహాన్ని వేళ్ళ చివర్లతో సుతారంగా అందుకున్నాడు. అది చూసి ఆ పక్కనే నిలబడి స్టాల్ చూసుకుంటున్న కుర్రవాడు ముందుకొచ్చాడు.

“ఏంటి తాతగారూ? జాగ్రత్తగా పట్టుకోండి… బొమ్మ పగలకొట్టినా డబ్బులు కట్టాలి.. అర్థం అయ్యిందా?” అన్నాడతను.

పూర్వం విగ్రహారాధన చేసే తండ్రిని ఎదిరించిన అబ్రహాం కథ గుర్తుకొచ్చింది బ్లూమ్‌కి. చిన్నతనంలోనే దేవుడు సర్వవ్యాప్తమై వున్నాడన్న సత్యం తెలుసుకున్న అబ్రహాం తన తండ్రి పూజించే విగ్రహాలని అన్నింటినీ పగలగొట్టాడు.

“నేను కాదు నాన్నా పగలకొట్టింది.. ఇదంతా ఆ పెద్ద విగ్రహం చేసిన పని. ఆ బొమ్మే కర్ర తీసుకోని మిగిలిన అన్నింటినీ పగలగొట్టింది..” అన్నాడు.

“విగ్రహాలు ఎక్కడైనా కదులుతాయట్రా?” అన్నాడు తండ్రి మరింత కోప్పడి.

“మరి కదలలేని విగ్రహాలకు పూజలెందుకు నాన్నా” అంటూ సమాధానం చెప్పాడు అబ్రహాం.

ఆ కథ అంతటితో అయిపోయింది. ఆ ప్రశ్నతో ఆ తండ్రికి జ్ఞానోదయమైందో లేక తన నమ్మకాల్నే ప్రశ్నించిన కొడుకుని మరింతగా కొట్టాడో తెలియదు. అందులోనూ, ఆ కాలంలో నమ్మకాలు ఇప్పటికన్నా పవిత్రంగానూ బలంగానూ వుండేవి కదా.

వినాయకుడి విగ్రహం చేతిలో పెట్టుకోనే ఇదంతా ఆలొచించాడు బ్లూమ్. ఆ ప్రతిమ అర్థ మిళిత నేత్రాలతో ప్రేమని కురిపించేలా వున్నాయి. ఆయన శరీరం ఎంత దృఢంగా  వుందంటే, ఆ బొమ్మే మన పక్కన వుంటే విజయం తధ్యమని అనిపిస్తోంది. నిజానికి  బ్లూమ్ ఇలాంటి ప్రతిమల్ని ఏనాడూ ముట్టుకోను కూడా లేదు. మతపరంగా నిషేదించిన విగ్రహారాధన చేస్తే ఏ పాపం చుట్టుకుంటుందో అని అతని భయం. ఇప్పుడు చేతిలో వున్న వినాయకుడి వైపు మళ్ళీ చూశాడు. గుండ్రంగా తిరుగుతూ బలంగా వున్న తొండం వైపు చూశాడు. సరిగ్గా అప్పుడే ఒక నిర్ణయానికి వచ్చాడు.

“నాకు ఇది కావాలి” అన్నాడు స్థిరంగా.

***

ఆ విగ్రహాన్ని తీసుకోని ఇంటికి వెళ్ళిన తరువాత ఎక్కడైనా దాచేయ్యాలని అనుకున్నాడు. ఆ బొమ్మని కళ్ళద్దాలు తుడుచుకునే మెత్తటి గుడ్డలలో చుట్టి, ప్లాస్టిక్ సంచిలో పెట్టి స్టోర్ రూమ్‌లో ఒక అరమర కింద భాగంలో, పగిలిపోయిన పాత్రల వెనక దాచిపెట్టాడు. కాని ఫలితం లేకపోయింది. అతని భార్య నిముషానికి ఒకసారి అదే అరమర తెరిచి ఏదో ఒక వస్తువు తీసుకోవడమో, లేకపోతే పిల్లలు ఆడుకుంటూ ఆ తలుపులు తీసి వదిలేయడం చేస్తుండటంతో దాన్ని అక్కడి నుంచి తీసేయ్యాలనుకున్నాడు. ఆ గది దగ్గరకు వెళ్ళినప్పుడల్లా చుట్టిపెట్టిన సంచీ చిరుగులలోంచి వినాయకుడి తొండం బయటికి వచ్చి, తననే పిలుస్తున్నట్లుగా అనిపించేది.

“ఆయన పూజలు కావాలని అడుగుతున్నట్లున్నాడు” అనుకున్నాడు బ్లూమ్. “దేవుడు కదా… అలాంటి కోరిక వుండటం సహజమే” అని సర్ది చెప్పుకున్నాడు.

“అయితే ఆయన్ను ఎలా పూజించాలి?” బ్లూమ్ కి ఏం తోచలేదు. ఇంతకు ముందెపుడూ విగ్రహాన్ని పూజించనే లేదు కదా. అసలు ఎలా చెయ్యాలో కూడా తెలియదైపోయే. బైబిల్ తీసి ఒకసారి తిరగేశాడు. “దేని రూపమునైననూ విగ్రహమైనైననూ నీవు చేసికొనకూడదు; వాటికి సాగిలపడకూడదు. వాటిని పూజింపకూడదు” అని వుంది. ఇంకొక చోట “మంటి (మట్టి) బలిపీఠమును నా కొరకు చేసి, దాని మీద నీ దహన బలులను, సమాధాన బలులను నీ గొర్రలను నీ ఎద్దులను అర్పింపవలెను” అని కూడ వుంది.  బ్లూమ్ దగ్గర గొర్రలూ లేవు, ఎద్దులూ లేవు. అలాగని వృత్తిపరంగా వాటికి సమానమైనవి బలిగా తగలపెట్టడం భావ్యం కాదనిపించింది. ఒకసారి పొరపాటున ఒక జత కళ్ళద్దాలు తగలబడితేనే వాటి వాసననే భరించలేకపోయాడు. అంతకన్నా శిరస్సు వంచి నమస్కరించి ప్రార్థించడమే తేలిక అని అనిపించింది.

బ్లూమ్ ఆ స్టోర్ రూమ్‌ లోకి ఎవరూ రాకుండా తలుపులు వేశాడు. ఆ వినాయకుణ్ణి తీసి అక్కడే వున్న ఒక వెదురు స్టూల్ మీద వుంచాడు. అప్పుడే వినాయకుడి కళ్ళలో సంతోషం, తను చెయ్యబోతున్న పనికి ఆమోదం కనిపించాయి ఆతనికి. జాగ్రత్తగా మోకాళ్ళ నొప్పులు బాధించకుండా మోకరిల్లి, ముందుకు వంగి నుదిటిని నేలకి ఆనించి తన ప్రార్థన మొదలుపెట్టాడు.

“ఓ గణేశా… నీ రాకతో మా ఇంటిని పావనం చేసిన నీకు నా కృతజ్ఞతలు అర్పించుకొనుచున్నాను. ఈ ఇంటిలో వున్నవారందరినీ నీవు ఆశీర్వదించాలని వేడుకుంటున్నాను. మరీ ముఖ్యంగా చెప్పేది ఏమిటంటే మా అమ్మాయి జూడీ లా పరీక్షలలో నీవు సహాయము చెయ్యాలి. ఆ పిల్లకి ఆ లా పుస్తకాలు, సెక్షన్లు అవీ కష్టం అనిపిస్తున్నాయట… ఓ వినాయకా..” అంటూ ఇంకా ఏదో చెప్పాలని అనుకుంటూనే మళ్ళీ మోకాళ్ళ మీదకు లేవబోయాడు. అతని నడుము మాత్రం అతని ప్రార్థనకి సహకరించలేదు. ఎడమ వైపు నడుముకి కొంచెం కింద నరం పట్టేసినట్లై కలుక్కుమనడంతో మళ్ళీ ముందుకే వంగాడు. ఇక లేవనూ లేడు, అలా వుండనూ లేడు. ఓ ఇరవై నిముషాల తరువాత అతని భార్య వచ్చి చూసేదాకా అలాగే, అదే భంగిమలో వున్నాడు  బ్లూమ్.

“బ్లూమ్…!! ఏం చేస్తున్నావక్కడ?” అంటూ అరిచింది ఆమె.

“శాండ్రా… సమయానికి వచ్చావు… నా నడుము మళ్ళీ పట్టేసింది. ఆ అమృతాంజనం తెచ్చిస్తావా” అన్నాడతను. ఆమె అటు వెళ్ళగానే పాక్కుంటూనైనా సరే ఆ వినాయకుణ్ణి మళ్ళీ అలమరలో దాచేయ్యాలని అతని ఆలోచన. కానీ శాండ్రా అతనికంటే రెండాకులు ఎక్కువే తిన్నట్లుంది.

Akkadi MeghamFeatured

“బ్లూమ్… అది విగ్రహమే కదూ. నువ్వు మన ఇంట్లో విగ్రహారాధన చేస్తున్నావా? ఒక పక్క నేను అంట్లు తోముకుంటూ, అతిధులు వస్తారని పరుగులు తీస్తుంటే నువ్వు ఇక్కడ..” అంటుండగానే అందుకున్నాడు బ్లూమ్.

“శాండ్రా… ఎందుకు ఎలా అనుకుంటున్నావు? నేను విగ్రహానికి ఎందుకు మొక్కుతాను? ఈ విగ్రహం బజార్లో అమ్ముతుంటే చూశాను. ఇదిగో ఈ గది గోడలకి వేసిన రంగులకి మంచి మాచింగ్ అవుతుందని కొన్నాను…” అన్నాడు. ఇరవై ఏళ్ళ సంసారంలో  బ్లూమ్ ఇలాంటి ఇంటి విషయాలు పట్టించుకున్నదే లేదు. అలాంటప్పుడు మిసెస్ బ్లూమ్ అతని మాటల్ని ఎలా నమ్ముతుంది? అయినా అతను వదల్లేదు. “ఇది ఎక్కడపెడదామా అని చూస్తూ వున్నాను.. ఇంతలో తూలి ముందుకు పడ్డాను… నడుం పట్టేసింది..” అన్నాడు.

శాండ్రా నమ్మీ నమ్మనట్లు తలాడించింది.

” ప్లీజ్ శాండ్రా… అమృతాంజనం…” అన్నాడతను మాట మారుస్తూ. శాండ్రా మాట కరుకేకానీ మనసు వెన్న. అందుకే అమృతాంజనం తీసుకురావాలని బాత్రూమ్ వైపు పరుగెత్తింది.

ఇదే అవకాశం అని వినాయకుడి బొమ్మని తీసి ఇంతకు ముందున్న సంచిలో పెట్టాలని వ్యర్థ ప్రయత్నం చేశాడు బ్లూమ్. అప్పటికే చిరిగిపోయిన ఆ సంచిలో నున్నగా జారిపోతున్న బొమ్మ పట్టలేదు. శాండ్రా తిరిగి వచ్చేసరికి వినాయకుడి బొమ్మ ఇంకా అక్కడే నేలమీదే వుంది. పాపం ఆమె బ్లూమ్ నడుము మీద అమృతాంజనం పూసి నెమ్మదిగా మర్దనా చేస్తూ వినాయకుడి బొమ్మ వైపే చూస్తూ వుండిపోయింది. చివరికి ఘాటైన అమృతాంజనం వాసన వస్తున్న చేతులతోనే వినాయకుడి బొమ్మను తీసుకోని పరీక్షగా చూసింది.

“నాకు తెలిసి ఈ బొమ్మ హాల్లో పెడితేనే బాగుంటుందనుకుంటా… చాలా ప్రాచీనంగా కనిపిస్తోంది కదా, అక్కడ బాగుంటుంది…” అంది.

అలా ఆ వినాయకుడి స్థానం ఆ ఇంటి నట్టింట్లోకి మారింది.

***

అందరి పిల్లల్లాగే వాళ్ళ పిల్లలు కూడా అభ్యంతరం చెప్పారు.

“ఆ బొమ్మ నన్నే చూస్తున్నట్లు అనిపిస్తోంది…” అంది జూడీ మర్నాడు బ్రెడ్ బ్రేక్‌ఫాస్ట్ చేస్తున్నప్పుడు.

డెవిడ్ స్కూల్ బాగ్ అందుకుంటూ వేలితో బొమ్మని తాకి – “దీని నిండా మురికి వున్నట్టుంది..” అన్నాడు.

“ఆ విగ్రహం లోపలంతా ఖాళీ… ఏం వుండదు… ఆయన పేరు గణేశ” చెప్పాడు బ్లూమ్. అందమైన పసిపిల్లల్ని ఇలాంటి మాటలనే టీనేజర్లుగా ఎందుకు మారుస్తావు భగవంతుడా అనుకున్నాడు మనసులో.

డేవిడ్ చిత్రంగా కళ్ళు తిప్పాడు. జూడీ నిట్టూర్చింది. ఇద్దరూ స్కూల్‌కి బయల్దేరారు. బ్లూమ్ బ్రేక్‌ఫాస్ట్ గిన్నెలు వంటింటిలోకి తీసుకెళ్తూ ఒక్క క్షణం వినాయకుడి బొమ్మ దగ్గర ఆగాడు. ఒక చిన్న బ్రెడ్ ముక్కను తుంచి ఆ ప్రతిమ దగ్గర సాసర్‌లో వుంచి, తల వంచి నమస్కరించాడు.

ఆ వినాయకుడి బొమ్మ వచ్చిన తరువాత అతని జీవితం బాగున్నట్టు గుర్తించాడు. మిసెస్ రోసెన్‌బ్లట్ అని పెద్ద డ్రై ఫ్రూట్ కంపెనీ అధిపతి భార్య, నాలుగుదఫాలుగా వస్తానని రాకుండా ఎగ్గొడుతోంది. బ్లూమ్ ఆమెకు ఫోన్ చేసినప్పుడు కోపంతో అరిచి బెదిరించలేదు. మనసులో ఒక ప్రశాంతత, స్థిరత్వం ధ్వనిస్తుండగా ఏ మాత్రం జంకకుండా మాట్లాడటం మొదలుపెట్టాడు.

“మిసెస్ రోసెన్‌బ్లట్, మీ అపాయింట్‌మెంట్ సాయంత్రం నాలుగున్నరకి మార్చబడింది. సరిగ్గా నాలుగున్నరకి నా షాప్ ముందు మీరు లేకపోతే బ్లూమ్ ఆప్టిసియన్ మీకు ఎలాంటి సహాయము…”

“అది కాదండీ…” మధ్యలో మాట్లాడబోయింది ఆమె.

“మీరేం చెప్పాల్సిన పనిలేదు…”

“లేదండీ… హలో…”

“థ్యాంక్ యూ, గుడ్ డే…” పెట్టాశాడు బ్లూమ్. సరిగ్గా నాలుగున్నరకి ఠంచనుగా, బిక్కు బిక్కు మంటూ వచ్చింది మిసెస్ రోసెన్‌బ్లట్. ఆమెను కళ్ళు పరీక్షించే టెస్టింగ్ రూమ్‌కి పంపిస్తూనే, నిశబ్దంగా వినాయకుడికి మొక్కాడు.

క్రమంగా ఆ కుటుంబం మొత్తం ఆ దేవుడి మీద ఇష్టం పెంచుకోవడం మొదలైంది. ఆ గణేషుడి చల్లని చూపులు ఆ ఇల్లు మొత్తం ప్రసరిస్తూ వుండేవి. ఇప్పుడు శాండ్రా తో పాటు పిల్లలు కూడా ఎక్కువ సమయం ఆ గదిలోనే గడుపుతున్నారని బ్లూమ్ గ్రహించాడు. జూడీ ఇప్పటికీ నమ్మనట్టే వుంటోంది కానీ మాడ్యూల్ పరీక్షలు రాయటానికి వెళ్ళే రోజు వుదయం మాత్రం తన కోటుపైన బాడ్జి తీసి వినాయకుడి ముందు వుంచింది. ఆ విషయాన్ని బ్లూమ్ గమనిస్తే, ఏమీ ఎరగనట్టు భుజాలు ఎగరేసి – “లక్ కోసం నాన్న” అంది. అయితే ఆ పరీక్షలలో జూడీ ఆమె టీచర్లు అనుకున్నదానికన్నా బాగా రాయటంతో ఆ నమ్మకం ఇంకా బలంగా తయారైంది. ఆమే కాదు, కుటుంబం మొత్తం ఆ వినాయకుడి ప్రతిమని భక్తిగా చూడటం మొదలుపెట్టారు.

మొదట్లో బ్లూమ్ కుటుంబ సభ్యులెవరూ వినాయకుడి గురించి బయట ఎక్కడా అనలేదు. కానీ వాళ్ళుండే హెండన్ ప్రదేశంలో రహస్యాలకు చోటే లేదు. బహుశా జూడీ స్నేహితురాలు మికైలా ఇంటికి వచ్చినప్పుడు, జూడీ హోంవర్క్ చెయ్యడానికి ముందు ప్రతిసారీ ఆ దేవుడి ముందు గుప్పెడు బ్రెడ్ ముక్కలు నైవేద్యం పెట్టడం చూసినట్లుంది. డేవిడ్ స్నేహితుడు బెంజీ కూడా, కప్యూటర్ టెన్నిస్ గేం ఆడుతూ ఫైనల్ రౌండ్‌కి వచ్చిన ప్రతిసారీ డేవిడ్ ఆ విగ్రహాన్ని తాకుతున్న సంగతి గమనించాడు. ఇంకేముంది.. ఒకరి నుంచి ఒకరికి అక్కడి నుంచి ముగ్గురికి అలా అలా హెండన్ మొత్తానికి తెలిసిపోయింది. “ఆ బ్లూమ్స్ లేరూ – అదే కళ్ళజోళ్ళు అమ్మే బ్లూమ్ కుటుంబం… అవును శాండ్రా బ్లూమ్ అనే ఆవిడ, అదే వాళ్ళాబ్బాయి డేవిడ్ బ్లూమ్ అనే పిల్లాడు… వాళ్ళేనండీ – వాళ్ళింట్లో ఒక విగ్రహముందట.”

ఒక సాంప్రదాయకుడైన యూదుని ఇంట్లోకి విగ్రహాన్ని తీసుకురావటాన్ని క్షమించిన దాఖలాలు బైబిల్‌లో లేవు. అందుకే కదా బంగారు ఆవుదూడ విగ్రహానికి పూజ చేశారని 3000 మందిని పొట్టనపెట్టుకున్నారు? జెస్‌బెల్ ఇలాంటి తప్పు చేసినందునే కదా కిటికీ గుండా గిరాటు వేసి కుక్కలకు బలి చేశారు. ఇక్కడ వున్న కౌన్సిల్ కూడా ఈ విషయంలో రాజీ పడే అవకాశమేలేదు.  బ్లూమ్ ఇలా అనుకున్నాడో లేదో ఆ రాత్రే అతనికి ఫోన్ వచ్చింది. చర్చిలో వుండే రబ్బీ (మతపెద్ద)ని వీలైంనంత త్వరగా వచ్చి కలవాలన్నది ఆ ఫోన్ సారాంశం.

***

ఆ వూరి రబ్బి చాలా చిన్నవాడు. ఈ మధ్యనే అతని మతపరమైన విద్యాభ్యాసం పూర్తైంది. అయినప్పటికీ అతను కుదురుగా పెంచిన గడ్డంతో, హుందాగా ఎంతో మర్యాదస్తుడిలా కనిపించాడు బ్లూమ్‌కి.

పిలిపించాడేకానీ మాట్లాడటానికి చాలా సేపు తటపటాయించాడు రబ్బీ. – “అదే.. మీతో ఒక విషయం గురించి మాట్లాడాలని పిలిపించాను… అదే ఆ విగ్రహం గురించి..” అన్నాడు

“సరే మాట్లాడండి” అన్నాడు బ్లూమ్. అతను ఏ మాత్రం ఖంగారు పడలేదు. వినాయకుడి విగ్రహం అతని జీవితంలోకి వచ్చిన దగ్గర్నుంచి ఇలాంటి విపర్యాలకి అతను ఏ మాత్రం చెలించడంలేదు.

“అవును అదే… విషయం ఏమిటంటే బ్లూమ్‌గారూ… బయట చాలామంది అనుకుంటున్నారు, మీకు తెలిసే వుంటుంది లెండి… అంటే నేను అవన్నీ పట్టించుకుంటున్నానని కాదు కానీ మీలాంటి బాధ్యత కలిగిన వాళ్ళు… పైగా మీరు మన ఆరాధనా సమాజానికి ట్రస్టీ కూడా కదా…” అన్నాడు రబ్బి తడబడుతూ.

“మీరు చెప్పాలనుకున్నది స్పష్టంగా చెప్పండి” అన్నాడు బ్లూమ్ మరింత స్థిరంగా.

బ్లూమ్ తీరు మరింత ఖంగారు పెట్టడంతో రబ్బీ గబగబా మాట్లాడటం మొదలుపెట్టాడు.

“అదే అదే.. ఆ విగ్రహం గురించి.. మిస్టర్ బ్లూమ్ మీలాంటి ఆరాధనా సమాజం సభ్యుల వద్ద అలాంటిది వుండకూడదు..”

“ఏది?”

“అదే”

“వినాయకుడా?” రెట్టించాడు బ్లూమ్.

“కాదు విగ్రహం… మీలాంటి పెద్దమనుషులు అలాంటివి ఇంట్లో వుంచుకోకూడదు… దాన్నీ తీసిపారేయండి” చెప్పడాయన.

బ్లూమ్ క్షణ కాలం వినాయకుడు తన ఇంటికి వచ్చిన తరువాత వచ్చిన మార్పులను గుర్తుచేసుకున్నాడు. అక్కడికేదో అద్భుతాలు జరిగాయని కాదు. ఇప్పటికీ అతని కుటుంబ సభ్యులు పోట్లాడుకుంటారు, అరుచుకుంటారు, అప్పుడప్పుడూ అపశృతులు వుంటూనే వుంటాయి. కానీ ఆ గజముఖుడు ఉండటం వల్ల కుటుంబం మొత్తంలో ఏదో శక్తి ప్రవేశించినట్లు అనిపిస్తోంది. అది అతని వూహే అయ్యివుండచ్చుగాక అయినా సరే ఆ దేవుణ్ణి వదులుకోవడం ఇష్టం లేదు అతనికి.

“నేను ఆ విగ్రహాన్ని తీసెయ్యలేను” స్థిరంగా చెప్పాడు రబ్బీతో.

రబ్బీ ఆ మాట వింటూనే కళ్ళు చిట్లించి అపనమ్మకంగా ముందుకు వంగాడు.

“అలాకాదు మిస్టర్ బ్లూమ్ మనం కలిసి దీనికి సమాధానం వెతుకుదాం… అయినా నాకూ తెలుసు మీకూ తెలుసు… విగ్రహం ఇంట్లో వున్నంత మత్రాన మీరు దానికేం పూజలు చెయ్యరనుకోండి, అయినా చూసేవారికి ఇదంతా పెద్ద తప్పులా అనిపించకుండా ఏదో ఒక ప్రయత్నం చెయ్యాలి కదా..” అనూనయించబోయాడు.

“నేను చేస్తున్నానుగా” చెప్పాడు బ్లూమ్

“ఏమిటి? అలాంటి ప్రయత్నం చేస్తున్నారా?” అన్నాడు రబ్బీ తృప్తిగా.

“నేను చెప్పేది ప్రయత్నం చేస్తున్నానని కాదు… పూజ చేస్తున్నానని చెప్తున్నాను” సరి చేశాడు  బ్లూమ్.

ఆ మాటలు ముఖానికి కొట్టినట్లు అనిపించండంతో ఏం పాలుపోక వెనక్కి జారిగిలపడ్డాడు రబ్బీ. చాలా సేపు ఏం మాట్లాడకుండా వుండి తరువాత – “ఈ విషయం గురించి మనం మళ్ళీ చర్చించాలి. రేపు ఒకసారి రాగలరా?” అన్నాడు నీళ్ళు నములుతూ.

ఆ మర్నాడు రబ్బీ  బ్లూమ్‌కి మళ్ళీ ఫోన్ చేసి మధ్యాహ్నంగా ఆరాధనా మందిరానికి పిలిపించాడు.

“మిస్టర్ బ్లూమ్ మీతో దేవుడి గురించి చర్చించాలి” అన్నాడు ఖంగారుగా. బ్లూమ్ చిన్నగా నవ్వి –

“అది మీకు బాగా తెలిసిన సబ్జక్ట్ రబ్బీగారూ, నాకేం తెలుసు” అన్నాడు. దానికి రబ్బీ కూడా చిన్నగా నవ్వాడు.

“సరే సరే.. కాకపోతే మిస్టర్ బ్లూమ్…  ప్రభువు విగ్రహారాధన గురించి ప్రత్యేకంగా చెప్పియున్నాడు. రెండొవ ఆజ్ఞ గుర్తులేదా? ‘మీకు నేను తప్ప మరొక దేవుడు లేడు’, ‘దేని రూపమునయనను విగ్రహమైనయినను నీవు చేసికొనకూడదు’ అని చాలా స్పష్టంగా చెప్పబడివుంది.”

బ్లూమ్ సన్నగా తలవూపాడు.

“అలాంటిది మీరు ఆ విగ్రహానికి పూజలు చేస్తానని చెప్తూ ఈ సమాజం బోర్డులో ఎలా వుంటున్నారో నాకర్థం కావటంలేదు… ఇలాగైతే మిమ్మల్ని ఈ ఆరాధనా సమాజంలోనికి రానివ్వడం కూడా కుదరకపోవచ్చు..”

“అదేమిటండీ… నేను అన్ని నియమాలు పాటిస్తున్నాను. ప్రభువునీ ఆరాధిస్తున్నాను. నా మతం ఇప్పటికీ యూదు మతమే కదా” అన్నాడు  బ్లూమ్ కొంచెం ఆవేశంగా.

రబ్బి అందుకు సమాధానంగా నవ్వి చేతులు వెడల్పుగా చాస్తూ బైబిల్‌లోని మరో వాక్యాన్ని చదివాడు. “మీ దేవుడను యావేను అయిన నేను అసూయగలవాడను”

బ్లూమ్ ఒకసారి వినాయకుణ్ణి, అతని కరుణ పూరితమైన కళ్ళను గుర్తుచేసుకున్నాదు.

“దేవుడు నిజంగా గొప్పవాడైతే… ఆయనకు అసూయ ఎందుకు వుంటుంది? ఇలాంటి రాగద్వేషాలకు అతను అతీతుడు కదా?” సూటిగా అడిగాడు.

రబ్బీ ముఖం పాలిపోయింది. “ఈ విషయం గురించి మనం ఇంకా మాట్లాడాలి మిస్టర్ బ్లూమ్.. రేపు మళ్ళీ కలుద్దాం” అన్నాడు.

మూడోరోజు  బ్లూమ్‌కి మళ్ళీ ఫోన్ వచ్చింది. అదీ తెల్లవారుఝామునే. అంత పొద్దున్నే ఫోన్ చేసినందుకు రబ్బీ క్షమాపణ అడిగి చెప్పాడు –

“మిస్టర్ బ్లూమ్.. మీరు చెప్పిన విషయం గురించి రాత్రంతా తీవ్రంగా ఆలోచించాను. నేను ఒకసారి ఆ విగ్రహాన్ని చూడాలి. మీరు ఇప్పుడు ఆ విగ్రహాన్ని తీసుకోని మన ఆరాధనా మందిరానికి రాగలరా? అలా చేస్తే అన్ని సమస్యలను అక్కడే పరిష్కరించుకుందాం..”

బ్లూమ్ అందుకు అంగీకరించాడు. ఎన్ని వివాదాలైన తను ఒక యూదుడే కదా, ఆ ప్రార్థనా మందిరం వల్ల, రబ్బీ వల్ల ఎన్నో ప్రయోజనాలు పొందిన మాటకూడా నిజమే. ఆ విగ్రహం విషయంలో రబ్బీ ఎన్ని అభ్యంతరాలు చెప్పినా అతనికి గౌరవభంగం కలిగించే పని చెయ్యకూడదని అనుకున్నాడు.

ఆ వినాయకుడి విగ్రహాన్ని మెత్తటి దుప్పటిలో చుట్టి, చిన్న చేతి సంచిలో పెట్టాడు బ్లూమ్. అలా చుడుతున్నప్పుడు కూడా వినాయకుడి నున్నని తోండాన్ని ఒక్కసారి ప్రేమగా నెమిరాడు. బైబిల్ కథల్లో ఎలీజా అనే మేధావిలా రబ్బీ కూడా దేవుడితో వాదప్రతివాదాలు చేస్తాడా అని అనుమానం వచ్చింది. అలా నిజంగా జరిగితే దేముడు ఏం సమాధానాలు చెప్తాడో అని ఆసక్తి కలిగింది.

బ్లూమ్ ప్రార్థనామందిరానికి చేరేసరికే రబ్బీ గుమ్మంలో నిలబడి ఎదురుచూస్తున్నాడు. ఎన్నో ఎళ్ళుగా ప్రార్థనలు, గీతాలను తనలో నిక్షిప్తం చేసుకున్న ఆ పురాతన మందిరంలోనికి  బూమ్‌ను తీసుకెళ్ళాడు. మామూలుగా వసారాగుండా ప్రధాన మందిరంలోకి వెళ్లే దారిలో కాకుండా, దేవదారు మెట్లద్వారా పై అంతస్తులోని పాటకులు కూర్చుండే గదిలోకి తీసుకెళ్ళాడు. సరిగ్గా పవిత్రమైన గదికి పైన వున్న ఆ గదిలోనే పాతనిబంధనము తాలూకు వ్రాతప్రతులు వుంచబడ్డాయి. అక్కడి నుంచి చూస్తే చర్చిలోని ప్రార్థనా మందిరం మొత్తం, అక్కడ వేయబడిన కుర్చీలతో సహా స్పష్టంగా కనిపిస్తున్నాయి. శుక్ర శనివారాలలో ఆ కుర్చీలు మొత్తం భక్తితో వచ్చే వందలాది యూదులతో నిండిపోయి వుంటాయి.

రబ్బీ ఆ పాటకులగది కిటికీ తలుపులు బయటకు తెరిచి గట్టిగా రెండు మూడుసార్లు శ్వాస తీసుకోని ఆ తరువాత బ్లూమ్ వైపు తిరిగాడు. “ఆ విగ్రహాన్ని తీసుకొచ్చారా?” అడిగాడు. బ్లూమ్ అవునన్నట్లు తలాడించాడు. రబ్బీ మనసులో కూడా అలజడి తగ్గి స్థిరంగా వున్నట్టు బ్లూమ్ గుర్తించాడు.

“ఏది నన్ను చూడనివ్వండి” అన్నాడు రబ్బీ.

బ్లూమ్ తన చేతిసంచిలో వున్న దేవుణ్ణి బయటకు తీసి, చుట్టివున్న మెత్తటి గుడ్డని తొలగించి, వినాయకుణ్ణి సుతారంగా పట్టుకున్నాడు. కొన్న రోజుకన్నా ఈ రోజు విగ్రహం బరువు పెరిగినట్లుగా అతనికి అనిపించింది.

రబ్బి భృకుటి ముడిపడింది.

“ఇది కేవలం ఒక మనిషి తయారు చేసిన బొమ్మ. ఆ విషయం మీకు అర్థం అవుతోందా మిస్టర్ బ్లూమ్? ఇందులో చైనా మట్టి, పెయింటు తప్ప ఇంకేమి లేదు. మనకి మనమే తయారు చేసుకున్న ఇలాంటి వస్తువుకి మనం ఎలా మొక్కగలం చెప్పండి?” అన్నాడు.

రబ్బీకి అర్థం అయ్యేలా సమాధానం చెప్పడం అసాధ్యమనిపించి బ్లూమ్ భుజాలు ఎగరేశాడు. చివరికి ఎదో ఒక సమాధానం చెప్పాలని – “నా కళ్ళను, మనసును నమ్మి పని చేస్తున్నాను అంతే..” అన్నాడు. అనడానికైతే అన్నాడు కానీ, తను చెప్పాలకున్నదాంట్లో కనీసం పదోవంతు కూడా చెప్పలేకపోయాడని అతనికి అర్థం అయ్యింది.

చాలా సేపు రబ్బీ బ్లూమ్ వంకే చూస్తూ వుండిపోయాడు. ఆ తరువాత చిన్న చిరునవ్వుతో అతని దగ్గరకు వచ్చి అతని భుజాలమీద చెయ్యివేసి నడిపించుకుంటూ కిటికీ దగ్గరకు తీసుకొచ్చాడు. ఆ ప్రార్థనామందిరం ఎత్తైన ప్రదేశంలో కట్టబడటం వల్ల ఆ మరకలు పడ్డ కిటికీ అద్దాలలోంచి చూడగలిగితే హెండన్ నగరం మొత్తం కనపడుతుంది.

“ఆ దేవుడు మిమ్మల్ని ప్రేమిస్తున్నాడని మీకు తెలుసుకదా?” అడిగాడు రబ్బీ.

బ్లూమ్ నిశబ్దంగా తలాడించి ప్రశాంతమైన వినాయకుడి ముఖం వైపు చూశాడు.

“ఇలాంటి సమస్య నాకు ఎప్పుడూ ఎదురుకాలేదు… అందుకే నిర్ణయం తీసుకునే ముందు నా కన్న పెద్దవాళ్ళను కూడా సంప్రదించాల్సి వచ్చింది..” చెప్పుకుపోతున్నాడు రబ్బి. బ్లూమ్ తలాడిస్తూనే వున్నాడు.

“పెద్దలంతా ఒకే అభిప్రాయం తెలిపారు. మీరు అర్థం చేసుకోవాలి మిస్టర్ బ్లూమ్.. మేం తీసుకున్న నిర్ణయం మీకు మంచే చేస్తుంది..” అన్నాడతను. అంతే… అప్పటిదాకా నెమ్మదిగా మట్లాడుతున్నవాడల్లా ఒక్క ఉదుటున, బ్లూమ్‌కి ప్రతిఘటించే అవకాశం కూడా లేకుండా చప్పున ఆ విగ్రహాన్ని లాగేసుకున్నాడు. ఆ విగ్రహాన్ని ఒక్క క్షణంపాటు తన శరీరానికి దగ్గరగా హత్తుకున్నాడు. ఆ తరువాత కిటికీకి వున్న చిన్న ఖాళీలోనుంచి ఆ విగ్రహాన్ని కిందకి జారవిడిచాడు. భళ్ళున పగిలిన శబ్దం. ఆ కిటికీ కింద వున్న ప్రాంతంలో వినాయకుడి విగ్రహం వెయ్యి ముక్కలై పరుచుకుంది.

“మిస్టర్ బ్లూమ్ ఇప్పుడు ఆ తిరుగుబాటు చిహ్నం బద్దలైపోయింది… మీకు కూడా ప్రశాంతంగా అనిపిస్తోందా?” అడిగాడు రబ్బీ దగ్గరగా వచ్చి.

బ్లూమ్ సమాధానం చెప్పలేదు. కిటికీ దగ్గరగా వెళ్ళి కిందకి తొంగి చూశాడు. వినాయకుడు కింద పడిన చోటు చుట్టూ గులాబి రంగు శకలాలు పరుచుకోని మెరుస్తూ కనిపించాయి. రబ్బీని తప్పించుకుంటూ ఆ కిటికీ నుంచి దూరంగా జరిగి ఇంటి వైపు అడుగులేశాడు బ్లూమ్.

***

గత కొన్ని సంవత్సరాలుగా ఆ ప్రార్థనా మందిరానికి కోశాధికారిగా వ్యవహరించిన బ్లూమ్ అప్పటికి ఏం మాట్లాడకుండా వున్నా ఆ తరువాత, బాగా చీకటిపడిన తరువాత మందిరం వెనుక వున్న ఇనుప గేటు తీసుకోని నిశబ్దంగా అడుగుపెట్టాడు. వచ్చేటప్పుడు ఇంటినుంచి తనతోపాటు గుడ్డ బ్రష్, నగిషీలు చెక్కిన చిన్న చెక్క పెట్ట, ఇంకా సంచిలో ఏవో బరువైన వస్తువులు తెచ్చుకున్నాడు. వినాయకుడు పడి పగిలిపోయిన చోట చుట్టూ తిరుగుతూ బ్రషతో ముక్కలను చెక్కపెట్టలోకి చేర్చుకున్నాడు. ఆ తరువాత ఆ పక్కనే వున్న పూలమొక్కల మధ్యలో ఒక చిన్న గుంత తొవ్వి అందులో ఆ పెట్టను వుంచి మట్టితో కప్పేశాడు. అక్కడే నిలబడి వినాయకుడితో ఏదన్నా చెప్పాలా అని ఆలోచింఛాడు కానీ, ఏం చెప్పాలో తెలియక మిన్నకున్నాడు.

ఆ తరువాత అలాగే చప్పుడు చెయ్యకుండా నెమ్మదిగా నడుస్తూ ప్రధాన ద్వారం తెరిచి ప్రార్థనా మందిరంలోకి జారుకున్నాడు. ఇంత రాత్రివేళ ఒంటరిగా అదీ ఎలాంటి స్పష్టమైన అవసరం లేకుండా ఈ మందిరంలో అడుగుపెట్టడం అతనికి ఇదే మొదటిసారి. ఒక్క క్షణం అక్కడే ఆగి ఆ ప్రాంతం అతనికి ఎన్ని గంటల ప్రశాంతతనిచ్చిందో గుర్తుచేసుకున్నాడు. తన సంతోషంలో, బాధలో ఇదే ప్రదేశంలో విన్న ప్రార్థనలు, ప్రత్యేక స్వరంలో పాడిన గీతాలు అన్నీ జ్ఞప్తికి వచ్చాయి.

మర్నాడు ఉదయం ఆ మత పెద్దలు అక్కడికి వచ్చేసరికి తలుపులు తాళాలు వేసి వుండటం, ఆ తాళాలకు మైనం కూరి వుండటం చూసి ఆశ్చర్యపోయారు. ఏదో అనర్థం జరిగి వుంటుందని వూహిస్తూనే తాళాలు బాగుచేసేవారిని పిలిపించి ఆ తాళాలను పగులకొట్టించారు. అప్పటికే అక్కడ జరిగే వింత చూడటానికి గుమికూడిన జనంతో సహా ఆ పెద్దలంతా లోపలికి అడుగుపెట్టి, లోపల జరిగింది చూసి నిశ్చేష్టులైయ్యారు.

లోపల అంతా విధ్వంసం జరిగినట్టు వుంది. అక్కడ బల్లలు విరిగిపోయి, కర్టన్లు చినిగిపోయి, దీపపుసెమ్మలు వంగిపోయి, అద్దాలు పగిలిపోయి వున్నాయి. వాటన్నింటి మధ్యలో చేతిలో గొడ్డలితో అలసిపోయి ఆయాసపడుతూ వున్నాడు – బ్లూమ్. చమటతో అతని బట్టలు తడిసిపోయి వున్నాయి.

“ఇదంతా నువ్వే చేశావా?” ఆడిగారు వాళ్ళు.

“నేనా? నేను కాదు.. ఇదంతా ఆ భగవంతుడు చేశాడు..” చెప్పాడతను.

వాళ్ళు మళ్ళీ చుట్టూ కలియచూశారు. విరిగిన బల్లలన్నింటి మీద గొడ్డలి గుర్తులు కనిపిస్తున్నాయి. పరదాలన్నింటి పైనా ఒక మనిషి అరచేత్తో చించినట్లు గుర్తులున్నాయి.

“దేవుడు చేశాడా? దేవుడు ఇలాంటివి ఎలా చెయ్యగలడు?” అడిగారు వాళ్ళు.

“ఇది కూడా చెయ్యలేని దేవుణ్ణి కొలవాల్సిన పనేముంది?” ప్రశ్నించాడు అతను.

ఇంతవరకే తెలుసు. అతను అడిగిన ఈ ప్రశ్నవల్ల అక్కడున్న మనుషులకు జ్ఞానోదయం అయ్యిందా లేదా అనే విషయం మాత్రం తెలియలేదు.

 మూలం: నయోమి ఆల్డర్మెన్

అనువాదం: అరిపిరాల సత్యప్రసాద్

  64_1naomi_aldermanలండన్ లో పుట్టిన నయోమి ఆల్డర్మెన్  ఆక్స్ ఫర్డ్ విశ్వవిద్యాలయంలో చదువుకున్నారు. ఆ తరువాత సాహిత్యంలో పట్టభద్రులై ప్రస్తుతం బాత్ స్పా యూనివర్సిటీలో కాల్పనిక సాహిత్యం బోధిస్తున్నారు. 2007లో ఈమె సండే టైమ్స్ పత్రిక “యంగ్ రైటర్ ఆఫ్ ద ఇయర్” అవార్డును సాధించి, ఆ తరువాత వాటర్ స్టోన్స్ సంస్థ ప్రకటించిన “25 రైటర్స్ ఫర్ ది ఫ్యూచర్” జాబితాలో స్థానం సంపాదించారు. ఈమె రాసిన నవలలో “డిస్ ఒబీడియన్స్”, “ది లయర్స్ గాస్పెల్” వంటివి ఈమెకు పేరుతో పాటు ఎన్నో వివాదాలను కూడా అందించాయి. ప్రస్తుతం మీరు చదవబోయే “పరాయిదేవుడు” కూడా అలాంటిదే. 2009 రాసిన ఈ కథ ఆ సంవత్సరం బీబీసి నేషనల్ స్టోరీ అవార్డ్ గెలుచుకుంది.

ఏడో చేప

aripiralaమా పెంచెలయ్యమామ కలిసినాడంటే ఇహ సందడే సందడి. ఓ సీసాడు సరుకు, నాలుగు చేకోడి పొట్లాలు, జంతికల చుట్టలు ఉంటే చాలు. ఇంకేమీబళ్లా. మందల చెప్పడం మొదలైందంటే ఆపేదిల్యా. చెసేది పోలీసు వుద్యోగంగదా ఇంగ కథలకు కొరతేముందా?. మొన్న పండగకని నెల్లూరు పోయున్నానా అప్పుడు ఇట్టాగే ఓ పూట కుదిరింది.

“రేయ్ నర్సిమ్మా… నీకో కత చెప్తాగానా అది నువ్వు రాసి ఏ పత్రికకైనా పంపాల్రా..” అన్నాడు.
“అట్నేలే మామా.. ముందు కథ చెప్పు” అన్నా. ప్లాస్టిక్ గ్లాసు కడాకు లేపి గుటకేసి, నాలిక బయటికి చాపి “హా..” అని ఆమేన మొదలెట్టాడు.
“అనగనగనగా హైదరాబాదు అమీర్ పేట్ లో ఓ బాయిస్ హాస్టల్ ఉండాది. రాజుగోరి ఏడు చేపల్లాగ అందులో ఏడుగ్గురు పిలకాయలు ఉండారు..”
నేను ఆమంతనే ఆపినా. “ఏంది మామా కథంటే ఇట్టానేనా మొదలెట్టేది? మరీ చిన్నపిల్లల కథలాగుందే” అనిన.

“సరే అయితే ఈ సారి తిరగేసి చెప్తాలే గానీ నువ్వు మధ్యలో ఆపబాక” అంటూ ముందరే నా నోటికి తాళం వేసి మళ్ళీ మొదలుపెట్టినాడు.

“పోయినసారి రొట్టెలపండగ టైములో హైదరాబాద్ లో వెంగళ్రావునగర్ దగ్గర ఒక ఇసిత్రం జరిగింది. ఆక్కడ్నే ఒక చిన్న సందులో, రేత్రిపూట చీకట్లో ఎవరో ఆడకూతురు పోతావుంణ్ణింది. రైయ్యి మంటా ఇద్దరు పిలకాయలు బండేసుకోని పోతా పోతా ఆయమ్మి మెళ్ళో దండ, పుస్తెలతాడు పుట్టుక్కున తెంచి నూక్కబోయారు.. ఆ యమ్మి లబోదిబోమంటా పోలీసు స్టేషన్ కి వచ్చింది. మా వోళ్ళు అవీ ఇవీ కొచ్చెన్లేసి, ఆడా ఈడ తచ్చాడి చివరికి వల్లగాదని చేతులెత్తేశారు. ఆ పొద్దుకి సరిగ్గా మూడు రోజుల పోయినాక ఇక్కడ నెల్లూరు చిన్నబజారులో ఎవుడో దొంగసరుకు అమ్మతన్నాడని నాకు తెలిసింది. పొయ్యి జూస్తే చైను, పుస్తెలతాడు. అవి అమ్మతావున్న పిలకాయల్ని తీసకపోయి స్టేషన్లో కూర్చోబెట్టి అడిగితే వెంగళ్రావునగర్లో ఆయమ్మి మెళ్ళోంచి లాక్కోబోయింది మేమేనని ఒప్పుకున్నారు.

“హైదరాబాదు అమీర్ పేట హాస్టల్లో వుండారని చెప్పానే.. ఏడు చేపల్లాగ.. ఆ ఏడు చేపల్లో ఓ చేపగాడు కూడా వున్నాడు. ఏం చదువుకున్నావురా అంటే ఇంజనీరన్నాడు. నేను బిత్తరపొయినా.

“చేపా చేపా ఇంజనీరింగు చదివి ఈ దొంగతనం ఎందుకు చేశావే? అని అడిగా. అప్పుడు వాడు భోరుమని కాలుగంట ఏడ్చి విషయం చెప్పకొచ్చినాడు.
“సార్… మూడు సంవత్సరాలు అయ్యిందిసార్… అల్లూరు నుంచి హైదరాబాద్ పొయ్యి. ఒక ఏడాది పొడవతా మా నాయన డబ్బులు పంపినాడు. ఆ తరువాత నీ బతుకేదో నువ్వే బతకరా ఎదవా అన్నాడు… రెండేళ్ళు నేను చెయ్యని పని లేదు సార్… కాల్ సెంటర్లో పనిచేశా, కోచింగ్ సెంటర్లో చెప్పా, చిన్నచిన్న పిలకాయల ఇస్కూల్లో అయ్యోరిలెక్క చదువులు కూడా చెప్పినా సార్… డబ్బులు జాలక ఈ పని చేశాను సార్..” అంటా మళ్ళా ఏడుపెత్తుకున్నాడు. సరే వాళ్ళ నాయనతో మాట్లాడదాలెమ్మనుకున్నా..

“నాయనా నాయనా… కన్న కొడుకుగదంటయ్యా? ఏమంట డబ్బులు పంపించేదానికి?” అని అడిగా
“ఎందాకని పంపించేది సామీ… నెల నెల నాలుగైదువేలంటే ఎట్టోకొట్ట తెచ్చి పోస్తిని. ఆ నా కొడుకు ఏదో పెద్ద ఉద్యోగం ఊడపెరుకుతానని చెప్పి నా ఇల్లు తనకా పెట్టి రెండు లక్షలు గుంజకపోయినాడు. అయన్నీ లెక్క అజం లేకుండా పాయ.. మళ్ళా డబ్బులంటే యాడ తెచ్చేది సామీ…” అన్నాడు.

వొరెవొరెవొరె.. ఇదేదో తిరగొట్టిన బంతిలాగా మళ్ళీ పిల్లోడి దగ్గరికే వచ్చిందే అని మళ్ళా చేప పిల్లోడి దగ్గరకే పొయినా.,.
“ఏమిరా చేపపిల్లోడా మీ నాయన దగ్గర రెండు లక్షలు గుంజకపోయినావంటనే? అయ్యన్నీ ఏం జేసినా?” అని అడిగా. ఆ పిలకాయ మళ్ళీ ఓ కాలుగంట ఏడస్తావుణ్ణేడు. ఆమేన అసలు జరిగిందేందో చెప్పకొచ్చినాడు.

“సార్ నిజమే సార్. రెండు లక్షలరూపాయలు తెచ్చింది నిజమే. ఎందుకు తెచ్చినానో తెలుసా? మాదాపూర్లో క్యూజెడ్ టెక్నాలజీస్ అని ఓ కంపెనీ వుంది. రెండు లక్షలు జమ జేస్తే వాళ్ళే ట్రైనింగ్ ఇచ్చి వుద్యోగం ఇస్తామన్నారు సార్. నేను మాములుగైతే నమ్మేవాణ్ణి కాదు సార్.. నాతో పాటు వున్న ఆరుగ్గురిలో నలుగురు అట్టానే వుద్యోగానికి కుదురుకున్నారు. పెద్ద బ్యాంకులో సాలరీ అకౌంట్ తెరిపించారు. నెలాఖరున ఖంగు మని మొబైల్ మోగింది. పాతికవేలు సార్.. జీతం. మా ఆరుగ్గురు చేపలకీ కంప్యూటర్ స్పెల్లింగ్ కూడా రాద్సార్. అట్టాంటి ఎండు చేపగాళ్ళకే వస్తే నాకెందుకు రాదు? ఎట్లాగైనా అదే కంపెనీలో చేరాలనుకున్నాను సార్…”
ఆ పిలగాడు ఇట్టా చెబతావుంటే మధ్యలో ఆపినాను నేను.

Kadha-Saranga-2-300x268

“ఒరే అబ్బిగాడా… ఏదైనా వుద్యోగంలో చేరే ముందు మంచి చెడ్డా, ముందు ఎనక చూసుకోబళ్ళేదా? ఎవుడో అత్తరబిత్తరగాడు కంపెనీ పెడితే వాడి ఎదాన రెండులక్షలు ఎట్టా పెట్టావు?” అన్నా. దానికి ఆ పిల్లకాయ –

“సార్.. ఎట్టాగైనా వుద్యోగం సంపాదించాలి సార్. బ్యాక్ డోర్ కూడా ట్రై చేశా. ఫేకులు పెట్టి చూశా. ఏదీ కుదర్లేదు. చివరాకరికి రెండు లక్షలు ఇచ్చైనా వుద్యోగం తెచ్చుకుందాం అనుకున్నాను. అప్పటికీ ఆ కంపెనీ గురించి ఎంక్వైరీ చేశాను సార్. నా హాస్టల్లో నాతోపాటే వున్న ఆరుగురు చేపగాళ్ళలో నలుగురు అక్కడే పంజేస్తున్నారు కదా. హైటేక్ సిటీకి పొయ్యి మరీ ఆళ్ళ ఆఫీసు చూసొచ్చినా. ఏసీ గదులు, పట్టపగల్లా మెరిసిపోయే లైట్లు, గుండ్రంగా తిరిగే సీట్లు, ఒకటే జనం అటూ ఇటూ తిరగతా.. అబ్బో గొలగమూడి తిరణాలేసార్.. అదంతా చూసేకొద్ది నాకు అందులో ఎలాగైనా చేరాలనిపించింది. నాయన సంగతి తెలిసి కూడా వేధించి డబ్బులు తెచ్చుకున్న. ఉద్యోగంలో చేరినాక నెలనెలా డబ్బులు చేర్చిపెట్టి నాయనకి ఇద్దామనే అనుకున్నా. నాకేం తెలిసు నా లాంటి వాళ్ళని ముఫై మందిని మోసం చేసి బోర్డు తిప్పేస్తాడని.” అన్నాడు.

“బోర్డు తిప్పేశాడా?” అని ఆశ్చర్యపోయా

“అవున్సార్.. డబ్బులు తీసుకోని రసీదు కూడా ఇచ్చారు. రెండు రోజుల్లో వచ్చి ఆఫర్ లెటర్ తీసుకోమని చెప్పారు. వెళ్ళేసరికి ఎవరూ లేరు. ఏసీ గదులు, లైట్లు, సీట్లు అన్నీ వున్నాయి కానీ మనుషులే లేరు” అంటా మళ్ళీ ఓ కాలుగంట ఏడ్చాడా పిల్లకాయ.

ఇవరం కనుక్కుంటే ఆ కంపెనీ మొదలెట్టినోడు జైల్లోనే వున్నాడని తెలిసింది. ఇట్టగాదులెమ్మని నేను వాడి దగ్గరకు పొయినా – “కంపెనీ బాబు కంపెనీ బాబూ ఎందుకు బోర్డు తిప్పేశా?” అన్నా –

వాడు దిగాలుగా జైలు పైకప్పు వైపు చూసి పొడుగ్గా నిట్టూర్చి చెప్పడం మొదలుపెట్టినాడు.

“సార్.. కంపెనీ పెట్టింది నిజమే. డబ్బులు తీసుకుంది కూడా నిజమే సార్. మాకు ఓ అమెరికా కంపెనీతో టైఅప్ సార్. వాళ్ళకి పని చేసిపెట్టే మనుషులు కావాల్సార్. మన దగ్గర జనాన్ని చూపిస్తే వాడికి సరిపోలా. అందుకని కొంత మంది పిల్లల్ని పోగేసి ట్రైనింగ్ ఇచ్చి వాళ్ళ దాంట్లో చేర్పించమని వాళ్ళే చెప్పారు. మన మైత్రీవనంలో ఇంకో ఆఫీస్ ఓపెన్ చేసి తూ అంటే తా రాని ప్రతివాడికి ట్రైనింగ్ ఇచ్చాము సార్. ఇన్ని చేసినా ఆ అమెరికావాడికి కావల్సినట్టు తయారు చెయ్యలేకపోయాము”
“ఒరేనాయనా.. నాకేం అర్థం కావడంల్యా… కావాల్సినట్లు తయారు చేసేదేందియా? ఇదేమన్నా రాధామాధవ్ సెంటర్లో దోసెల బండా ఎట్టా కావాల్నంటే అట్టా తయారు చేసేదానికా?” అన్నాను

“అట్టాకాదు సార్… అమెరికాలో వుండే వాళ్ళు అన్ని పనులు చేసుకోరు సార్. ముఖ్యమైన పనులన్నీ వాళ్ళు చేసుకోని, పనికిరాని పనులన్నీ పరాయిదేశాల వాళ్ళకి చేసి పెట్టమని పడేస్తారు. ఇక్కడైతే రోజు కూలీ తక్కువని అట్లా చేస్తారు. అట్టా మా ముఖాన కూడా ఓ పని పడేశారు. కోవా అని ప్రోగ్రామింగ్ చెయ్యాలి. కానీ ఆ పని చెయ్యాలంటే ఎంతో కొంత కోవా తెలిసుండాలి కదా… మన దగ్గర అది తెలిసినోళ్ళు బాగా పెద్ద పెద్ద కంపెనీలో పని చేస్తున్నారు. మా దగ్గర పని చెయ్యడానికి ఎవరూ రాలేదు. అందుకని అమీర్ పేటలో హాస్టళ్ళల్లో వుండే పిల్లల్ని పోగేసి ట్రైనింగ్ ఇచ్చి, పని నేర్పించి వాళ్ళ చేత పని చేయించుకుందాం అని అనుకున్నాను. తీరా చూస్తే ఒక్కడంటే ఒక్కడికి అక్షరం ముక్క రాదు. పేరుకేమో ఇంజనీర్లు. ఎంత ట్రైనింగ్ ఇచ్చినా అమెరికా వాడికి నచ్చలేదు. కాంట్రాక్ట్ కేన్సిల్ అన్నాడు. ఏం చేసేది సార్.. ఈ చదువురాని ఇంజనీర్లతో… ఇట్టాంటోళ్ళకి ఇంజనీరింగ్ పట్టా ఇచ్చిన కాలేజీ వాళ్ళని చంపినా పాపంలేదు..” అంటూ అక్కసంతా కక్కాడు.

fish pic

కథ కాలేజీలకి మారింది. సరే అట్టనే కానీ అని ఓ కాలేజి డైరెక్టర్ ని పట్టుకున్నా.

“డైరెక్టరా డైరెక్టరా… హైదరాబాదులో ఓ చేప చైన్ స్నాచింగ్ చేసింది. అదేమంటే ఉద్యోగం పేరుతో ఎవడో మోసజేడంట. ఆణ్ణి ఎందుకు మోసంజేశావురా అంటే ఆయబ్బి కాలేజీలలో చదువు చెప్పకపోతే నేనేం చేసేది అంటన్నాడు. ఏమబ్బా.. కాలేజీ పెట్టినాడివి చదువులు జెప్పేదానికేమి రిమ్మతెగులు?” అంటా తెగేసి అడిగినా.

ఆ డైరెక్టరు అటూ ఇటూ చూసి, బోరుమంటా ఏడ్సినాడు. టై ఎత్తి ముక్కు చీదినాడు.
“నీ పాసుగోల ఇందేందయ్యా ఇట్టాగ ఏడస్తన్నావా?” అని మళ్ళీ అడిగా. ఆయన నిదానించి చెప్పడం మొదలు పెట్టినాడు.

“అయ్యా… ఏం చెప్పేది మా ఖర్మ. “హైదరాబాద్ కి పొయ్యి గట్టిగా ఇంజనీరింగ్ కాలేజి పెట్టాలనుకుంటున్నామహో” అని అరిస్తే చాలు ప్రభుత్వం లైసెన్స్ ఇచ్చేసింది. సర్లే అట్లాగే కానీ లెమ్మని కాలేజీ తెరిచాము. తీరా చూస్తే మా ఇంటెనక రెండు కాలేజీలకు, మా కాలేజి ముందు మూడు కాలేజీలకు పర్మిషన్లు వున్నాయి. ఊరు మొత్తం వైన్ షాపులు, ఇంజనీరింగ్ కాలేజీలే పుట్టగొడుగుల్లా వీధికి రెండు చొప్పున వున్నాయి. ఇట్టాంటప్పుడు ఎవరైనా ఏం చేస్తారో మేమూ అదే చేశాం..”

“ఏందది” అన్నా

“మా కాలేజీలో చేరినవారికి ఒక లేప్ టాప్ ఫ్రీ అన్నాము, ముగ్గురు చేరారు. పుస్తకాలు ఫ్రీ అన్నాం, ఇంకో ఆరుగ్గురు చేరారు. కేంపస్ ప్లేస్ మెంట్ అన్నాం ఇంకో ఇద్దరు చేరారు. ఇక లాభంలేదని మొదటి సంవత్సరం ఫ్రీ అన్నాం… అప్పుడు జనం ఓ ఇరవైమంది వచ్చారు. వాళ్ళతో కాలేజీ మొదలెట్టాము..”
“ఫ్రీగా చదువులు చెప్పావా? మా గొప్ప పని చేశావే” అన్నాను నేను.

“గొప్పా పాడా… చేరినవాడు మొదటి సంవత్సరం చదవటం ఆయిపోగానే గవర్నమెంటు ఫీజు మొత్తం తిరిగి ఇచ్చేస్తానంది. అదే ఫ్రీ..”
“ఏదో ఒకటి. మంచిదే కదా” అనబోయా.

“ఊరుకోండి సార్.. మీకేం తెలియట్లేదు. అట్టా చేరిన పిల్లలు అందరు కలిసి మాట్లాడుకున్నారు. – మనం పాస్ అయితే తప్ప కాలేజీకి డబ్బులు రావు. పైగా మనం ఫెయిల్ అయితే కాలేజీకి చెడ్డపేరు. కాబట్టి ఈ కాలేజి వాళ్ళే ఎట్లైనా మనల్ని పాస్ చేస్తారు – అని తెలుసుకున్నారు.”

“ఆమేన?”
“ఇంకేముంది? క్లాస్ మొదలవ్వగానే లేచి వెళ్ళిపోతారు. లెక్చెరర్ “ఏందిరా” అంటే “ఏందిరా” అంటం మొదలుపెట్టారు. వాళ్ళు రాకపోయినా అటెండెన్స్ వెయ్యాల్సిందే. అంటెండెన్స్ లేకపోతే పాస్ కారు. పాస్ కాకపోతే మాకు గవర్నమెంటు నుంచి డబ్బులు రావు. అందుకని వచ్చినా రాకపోయినా, చదివినా చదవక పోయినా అందరినీ పాస్ చెయ్యడమే ఒక పని అయిపోయింది. గవర్నమెంటు సంవత్సరం అయిపోయినాక ఫీజులు ఇస్తుంది. మరి సంవత్సరం అంతా మా ఖర్చుల మీదే నడపాలి.”
“అవును కదా.. అట్టా ఎట్టా గిట్టుబాటు అవతాంది మీకు?” అడిగా అమాయకంగా.
“ఏం చెప్పేది సార్. బిల్డింగ్ ఖర్చులు, కరెంట్ ఖర్చులు, లంచాల ఖర్చులు ఇట్టాటివన్నీ తగ్గేవి కావు కదా. మేము తగ్గించుకోగలిగిన ఖర్చు ఒకటే వుంది”
“ఏంటది?”
“ఫేకల్టీ ఖర్చులు”
“అంటే చదువు చెప్పేవాళ్ళ జీతాలు తగ్గిస్తాన్నారా ఎట్టా?”
“కాదండీ.. జీతం తక్కువ తీసుకునేవాళ్ళకే ఉద్యోగం ఇస్తున్నాం”
“అంటే?”
“ఏముందిసార్.. మా కాలేజిలో చదువు అయిపోయిన వాళ్ళను తరువాత సంవత్సరం మా కాలేజిలోనే ఉద్యోగం ఇస్తాం. మా దగ్గర చదువుకున్న పిల్లలే కాబట్టి కంట్రోల్ లో వుంటారు. చెప్పిన చోటల్లా సంతకం పెడతారు.”
“ఓరినీ పాసుగోల, ఇట్టాటి అయ్యోర్లను పెట్టుకుంటే పిల్లలికి చదువెట్టా వచ్చుద్ది సామీ… సరే కథ ప్రకారం నేను వాళ్ళతో గూడా మాట్లాడాలగానె ఒకసారి రమ్మనదరాదా..” అన్నాను. మొత్తం పదిగేను మంది వుండారన్నాడు. పిలిత్తే పదమూడు మందే వచ్చారు.
“మిగతా ఇద్దరు ఏరి సామీ” అన్నా.
“రేయ్.. ఆ ప్యూను సాంబయ్యగాణ్ణి, డ్రైవర్ సైదులుగాణ్ణి పిలవండ్రా” అని నా వైపు చూడలేక తల దించుకున్నాడు.
***
మామ ఇక్కడ దాకా కథ చెప్పంగనే ఇంక ఉగ్గబట్టుకోలేక ఆపేశా..
“ఏంది మామా? ఏడ మొదలెట్టావు ఏడకి పొయ్యావు? ప్యూనేంది? డ్రైవరేంది?”అన్నాను.
“ఒరే అల్లుడా, ఆపద్దని ముందేజెప్పినానా… ఇంక నేజెప్పను ఫో…” అన్నాడు.
“మామా..మామా… జెప్పుమామా… ఇంగ మాట్టాడితే ఒట్టు” అన్నా.
“సరే ఇను అయితే” అని మళ్ళీ మొదలుపెట్టాడు మామ.

***
ఏడు సేపల కథలో సివరాఖరు సీను – నేను మా వూరి ఎమ్మెల్యే, ఎడుకేషన్ మంత్రి రంగనాయకులు దగ్గరికి పొయినా. టోపీ తీసి దణ్ణమెట్టి నిలబడినా.
“ఏందిరా?” అన్నాడు

“అయ్యా చేప చైను లాగింది, అడిగితే ఉద్దోగం లేదన్నాడు, ఆడినడిగితే పిల్లలకి చదువు లేదన్నాడు, కాలీజీకి పోతే రీయంబర్సుమెంటు కత చెప్పి పనికిమాలినోళ్ళనందరినీ చూపించి అయ్యోర్లని చెప్తా వున్నాడు, అదేమిరా అంటే ఈధికో కాలేజి వుంటే ఏం జెయ్యమంటున్నాడు. అసలిట్టా ఇన్నేసి కాలేజీలు ఎందుకు తెరిచినారు తవరే సెప్పాల” అన్నాను.
మంత్రిగారు పొట్ట ఊపుకుంటా నవ్వాడు.
“నువ్వు దగ్గరోడివి కాబట్టి ఒగ రగస్యం జెపతన్నా. మా రాజకీయలోళ్ళ సంగతి తెలుసు కదా? డబ్బులొస్తాయంటే కాలేజీలు కాకపోతే కల్లు షాపులు… పర్మిట్లదేముంది. కానీ, ఇన్నేసి కాలేజీలు పెట్టేదానికి ఇంత మంది మాకు డబ్బులిచ్చి మరీ ఎందుకు ఎగబడతన్నారో తెలుసా? ఆళ్ళు పెట్టే కాలీజీల్లో చేరేదానికి కావల్సినంతమంది పిల్లలున్నారని నమ్మకం ఉండబట్టే కదా. అదట్టా ఎందుకో తెలుసా?” అని మంత్రిగారు మళ్ళీ నవ్వారు.
చీమ ఎందుకు కుట్టిందో తెలిసిపోయే సివరాఖరుకు వచ్చేశానని అర్థమయ్యి చెవులు కిక్కిరించా
“ఆశ. ఈ జనానికి ఆశరా… పెతోడు వాడి పిల్లకాయలు పెద్ద ఇంజినీర్లు అయిపోయి, అమెర్కా ఎల్లిపోయి లచ్చలు లచ్చలు అంపేయాలని ఆశ. పెజెల్లో ఇట్టాటి ఆశ పెరిగిపోయింది కాబట్టే ఇంత కతా జరిగింది” అన్జెప్పి మంత్రిగారు పెజాసేవకి ఎల్లిపోయారు.
***
కత అయిపోయినట్లు మామ ఆపేయడంతో అందరం చేతుల్లో గళాసులవైపు చూసుకున్నాం. కొసరూ అరా ఏమన్నా వుంటే అట్నే తాగేసి ఎవరింటికి వాళ్ళం ఎలబారినాం.
***

ఆమె అంతరంగం, అతని కథనం!

nadustunna katha

 మే నెల కథలు

మే నెలలో కథల సంఖ్య బాగా పెరిగింది.ఈ వ్యాసం రాస్తున్న ముగ్గురం కలిపి సుమారు 200 కథలు చదివాము. ఒక నెలలో ఇన్ని తెలుగు కథలు వస్తున్నాయా అన్న ఆశ్చర్యం, ఆనందం కథల నాణ్యత విషయంలో కలగటం లేదు. కొన్ని పత్రికలలో వార్తలు, వ్యాసాలు కథలుగా చలామణీ కాగలగడం సంపాదకుల అభిరుచిలేమిని సూచిస్తోందా లేక రచయితలలో అవగాహనాలేమిని సూచిస్తోందా అని బాధపడాల్సిన పరిస్థితి. మొత్తం మీద మొదటి వడపోతలో 26 కథలను ఎన్నుకోని, వాటి గురించి మేము ముగ్గురం కలిసి చర్చించాము. ఆ చర్చల పర్యవసానమే ఈ వ్యాసం. (మా దృష్టికి రాని మంచి కథ ఏదైనా వుంటే సూచించండి. ఈ నెల (జూన్) కథల గురించి మేము జరుపబోయే చర్చలో పాల్గొనాలనుకునేవారికి, సాదర ఆహ్వానం. ఫేస్ బుక్ ద్వారా మమ్మల్ని సంప్రదించండి)

మే నెలలో కొన్ని చిత్రాలు జరిగాయి. కొంత మంది పురుష రచయితలు స్త్రీల సమస్యను కథాంశంగా ఎన్నుకోని కథలు రాశారు. కాండ్రేగుల శ్రీనివాసరావు “జీవన మాధుర్యం” అన్న కథలో వక్షోజాల కేన్సర్ గురించి రాస్తే, కె. వి. నరేందర్ “డబ్బుసంచీ” అన్న కథలో గర్భసంచి తొలగింపు గురించి రాశారు. “మరుగు” కథలో కూడా స్త్రీల సమస్యనే ప్రస్తావించారు వాణిశ్రీ. అలాగే డా. వి. ఆర్. రాసాని “తృతీయ వర్గం” గురించి కూడా రాయడం గమనింఛవచ్చు.

గత మాసం (ఏప్రిల్ 2014) ప్రముఖ రచయితలు పాత్రలుగా రెండు కథలు వచ్చిన సంగతి ప్రస్తావించాము. ఈ నెల కూడా అలాంటి కథ ఒకటి వచ్చింది. భగవంతం రాసిన “గోధుమరంగు ఆట” కథలో త్రిపుర ఒక కనిపించని పాత్రధారి.

ఇక ఈ నెల కథల్లోకి వెళ్దాం –

సాక్షి: శిరంశెట్టి కాంతారావు

టెక్నాలజీ పెరిగిపోతున్న కారణంగా, సాంప్రదాయక వృత్తుల వాళ్ళు పనులు కోల్పోవడం గత కొన్నేళ్లుగా జరుగుతూ వస్తోంది. అలా వృత్తిని కోల్పోయి, అప్పులు మాత్రం మిగుల్చుకున్న ఓ కాటికాపరి కథ ఇది. ఇలాంటి కథాంశాలపైన గతంలో ఎన్నో కథలు వచ్చినా ఇంతకు ముందూ ఏ రచయితా ఎన్నుకోని కులవృత్తిని ఎన్నుకోవటం వల్ల ఈ కథ కొంతవరకు ప్రత్యేకంగా మారింది. మంచి కథనం, ఇతివృత్తానికి అనుగుణమైన మాండలికం మరింత బలాన్ని ఇచ్చింది. అయితే అవసరాన్ని మించి నిడివి వున్నట్లనిపించింది.

 

మరుగు: వాణిశ్రీ

బలాత్కారం నుంచి తప్పించుకుందో అమ్మాయి. ఆ విషయం పంచాయితీకి వచ్చినప్పుడు అవతలి పక్షం రాజీ కోరారు. దెబ్బతిన్న ఆత్మగౌరవానికి వ్యక్తిగత స్థాయిలో వెల కట్టడం ఎలా? ఈ కథలో సీతారత్నం పాత్ర అలా వ్యక్తిస్థాయిలో ఆలోచించలేదు. ఇలాంటి అవాంఛనీయ సంఘటనలు ఎందుకు జరుగుతున్నాయో ఆ కారణాల్లోకి వెళ్ళింది. వెళ్ళి, అందరికీ పనికివచ్చే పరిష్కారాల అమలు తనకు చెల్లించాల్సిన మూల్యం అని స్పష్టం చేస్తుంది. వ్యక్తిగత స్థాయిలో జరిగిన అన్యాయానికి సామాజిక స్థాయిలో పరిష్కారాన్ని కోరడమనే కొత్త పరిహారాన్ని చూపించిన కారణంగా, ఇది నలుగురూ చదవాల్సిన కథ అయ్యింది. మంచి ఎత్తుగడ, ముగింపు, సామాజిక స్పృహ, ఇతివృత్తంలో సమకాలీనత, క్లుప్తత. చదివించే కథనం. అందరూ చదవదగ్గ కథ.

 

జీవన మాధుర్యం: కాండ్రేగుల శ్రీనివాసరావు

బ్రెస్ట్ కాన్సర్ కారణంగా ఒక వక్షోజాన్ని తొలగించడంతో వకుళలో అంతర్మథనం మొదలౌతుంది. ఈ అసమగ్ర రూపంలో భర్త తనను ఎలా చూస్తాడు అన్నది ఆమెని వేధించే ప్రశ్న. అయితే, భార్య పోగొట్టుకున్న భౌతికమైన విషయాన్ని లెక్కచేయనంత విశాలహృదయం భర్తకి ఉంది కాబట్టి కథ సుఖాంతంగా ముగుస్తుంది. దానిలో సంభావ్యతే ప్రశ్నార్ధకం. కథలో చూపించినది ఆదర్శవంతమైన పరిష్కారమే అయినా, అలా కాకపోతే ఎమౌతుందీ అన్న కోణం ఎవరికి వారు ఆలోచించుకోవచ్చు. ఒక వినూత్నమైన అంశాన్ని, ఇంకో సున్నితమైన అసంతృప్తి కోణంతో ముడిపెట్టి రాసిన మంచి కథ. వాస్తవికతని కొంచెం హద్దులు దాటించి శృంగారపరమైన అంశాలు స్పృశించడంతో వస్తువులో ఉన్న గాంభీర్యం కొంత చెదిరిపోవడం ఈ కథలో మనం గమనించవచ్చు.

 

సంస్కృతం మాష్టారు ఇస్మాయిల్: సాయి బ్రహ్మానందం గొర్తి

భాషకీ మతానికీ సంబంధం లేదని ఒక వైపు చెపుతూనే – మతం శాశ్వత అనుబంధాల ఏర్పాటుకు ఎలా ఆటంకమవుతుందో చెప్పటానికి ప్రయత్నించిన కథ. ఇస్మాయిల్ అనే ముస్లిం కుర్రవాడు తెలుగుకంటే సంస్కృతమే నయమని విశ్వం మాస్టారి దగ్గర చేరి సంస్కృతం భాషాజ్ఞానమే కాకుండా ఆయన ప్రేమాభిమానాలనీ సంపాదించి చివరకు సంస్కృతంలో ఉన్నత విద్యాభ్యాసం చేస్తాడు. విశ్వం మాస్టారికి ఇస్మాయిల్ అంటే ఎంత అభిమానం అంటే, చివరికి తన మనవడికి ‘ఇస్మాయిల్’ అనే పేరు పెడతారు. అయితే ఈ మనవడు, ఇస్మాయిల్ కూతుర్ని ప్రేమించడంతో మాస్టారు ‘నానా యాగీ’ చేసి శిష్యుణ్ణి దూరం పెడతారు. ఇరుమతాల మధ్యన ప్రేమ, అభిమానాలు ఉండగలిగిన అవకాశాలు ఉన్నా, మతం అనే సరిహద్దు దగ్గర అవన్నీ కనుమరుగైపోతాయన్న కుదుపు లాంటి వాస్తవికతని కథ పాఠకుడికి స్ఫురింపజేస్తుంది. ఈ వాస్తవికతని పట్టుకురావడమే కథలోని మంచి విషయం అనుకుంటూ ఉండగా, కథ ఒక ‘కొసమెరుపు’ లాంటి ఒక అందమైన విషయంతో ముగుస్తుంది. వాస్తవికత వేరు, ప్రేమాభిమానాలు వేరు అని పాఠకుణ్ణి రెండోసారి కుదుపుతుంది. మంచి కథాంశం, వాస్తవిక కథనం. మొదలు ముగింపులలో రచయిత చాకచక్యం గమనించతగ్గవి..

 

డబ్బు సంచీ: కె వి నరేందర్        

కడుపునొప్పికి పరిష్కారంగా గర్భసంచీని తొలగించాలని డాక్టర్లు మాధవికి చెప్పారు. మిత్రురాలి సలహా మీద ఓ ఆయుర్వేద వైద్యుణ్ణి సంప్రదిస్తే, ముందు కొంత వైద్యం చేసి చూద్దాం అంటాడాయన. ఇలా వైద్యం చేద్దామన్న ధోరణి లేకపోగా, సమస్య ఉన్న ప్రతివాళ్ళకీ గర్భసంచీలు తొలగించడం వెనకాల కుట్ర ఏదైనా ఉందా? ఆరోగ్యశ్రీ పథకాలు ఇలా అమలవుతున్నాయా? మరికొంత సమాచారం తెలుసుకున్న మాధవి, దీన్ని రిపోర్ట్ చేసి దర్యాప్తు చేయించాలనుకుంటుంది. శరీరంలోని సమస్యలని వ్యవస్థలోని లొసుగులతో ముడిపెట్టి, సామాజికమైన పరిష్కారం వైపుగా మాధవి ఆలోచించడం బావుంది. కానీ, కథలో కొంత భాగం వ్యాస రూపం సంతరించుకుంది. ఒక వార్త ఆధారం చేసుకుని కొన్ని గణాంకాలను దృష్టిలో పెట్టుకుని రాయడం వల్ల ఈ కథ కొన్ని కథా లక్షణాలను కోల్పోనట్లైంది. ఆ గణాంకాలలో కూడా శస్త్రచికిత్సల సంఖ్యే చెప్పారు తప్ప అవసరం లేకుండా చేసినవెన్ని అనే ముఖ్యమైన విషయంపై దృష్టి పెట్టకపోవడం మరో లోపం.వస్తువు పరంగా ఆలోచింపజేసే కథ అయినా, రూపం విషయంలో మరింత శ్రద్ధ వహించి ఉంటే, కథ స్థాయి చాలా పెరిగి ఉండేది.

 

దో దివానే దో షెహర్ మే: పూర్ణిమ తమ్మిరెడ్డి

మధ్యతరగతి భారతీయుడి సొంతింటి కల! ఆ కల సాధారణ స్థాయిలో ఉన్నా, ఉన్నదానికీ కొనవలసినదానికీ ఉండే గాప్ ఉండనే ఉంటుంది. ఆ కల స్థాయి పెరిగే కొద్దీ ఈ గాప్ పెరుగుతూ ఉంటుంది. అలాంటి ఓ పెద్ద కల కన్న నేటి తరం భార్యాభర్తలు, పెళ్లి అయ్యీ అవగానే, లోన్ వాయిదాలు కట్టడానికి మరింత సంపాదన కావాలి కాబట్టి అలా సంపాదించడం కోసం చెరో దేశంలో ఉంటారు. ప్రేమించి పెళ్ళిచేసుకున్న ఆ జంట మధ్య దూరం తెచ్చిన వ్యధ, కన్నీళ్ళు మిగతా కథ. కథనం చాలా గొప్పగా ఉన్నా, భార్యాభర్తలు స్కైప్ ద్వారా మాట్లాడుకుంటున్నట్లు సృష్టించడం వల్ల, కథంతా ఆ మూసలో ఒదిగే క్రమంలో క్లుప్తత లోపించినట్లుగా అనిపిస్తుంది. కథాంశంలో ఉన్న సంక్లిష్టత స్థాయికి తగ్గట్టుగా కథ నిడివి కూడా వుండి వుండుంటే బాగుండేది.

 

అమ్మ కడుపు చల్లగా: విజయ కర్రా

ఈ కథ గురించి మాట్లేడే ముందు, ఈ కథ వెనుక కథని కూడా తెలుసుకోవడం అవసరం. ఒక రచయిత ఇచ్చిన ఆలోచన ఆధారంగా మరో రచయిత సృష్టించిన కథ ఇది. ప్రక్రియపరంగా కొత్తగానూ, క్లిష్టంగానూ వున్నా విజయ కర్రా ఈ కథని సమర్థవంతంగా చెప్పడమే కాకుండా, మరో రచయిత ఇచ్చిన సమస్యకి ఆశావహమైన, సార్వజనీయమైన పరిష్కారాన్ని ఇవ్వగలిగారు. ఈ ప్రక్రియ ఫేస్ బుక్ లోని “కథ” గ్రూప్ లో జరిగింది.

 

ఓ చిన్న సమస్య మనసులో దూరి, మనసుని తొలుస్తూ మెలిపెడుతూ – మానవత్వపు ప్రాథమిక విలువలని గురించి ప్రశ్నిస్తూ వేధిస్తుంటే? ఓ తాతకి రెండు రూపాయలు దానం చేయలేని రాజుకి పట్టుకున్న సమస్య ఇది. సమస్య పెరిగి పెద్దదైపోయి పెనుభూతమైపోయి, జ్వరం తెచ్చుకొని కలవరించేదాకా వస్తుంది పరిస్థితి. ఈ సమస్య గురించి భార్య తెలుసుకొని, దానికి పరిష్కారం చూపించడం కథాంశం. ఇవ్వకపోవడానికి లక్ష కారణాలుండవచ్చు గానీ, ఇవ్వదలచుకుంటే ఇవ్వాలనే ఒక్క కారణం చాలు అన్న అంశాన్ని చాలా సున్నితంగా చెప్పిన కథ ఇది. కథకి మూల కారణం వృద్ధుడు – కానీ రచయిత్రి అతడి గతం గురించి ఒక్క పేరా మాత్రమే రాస్తుంది. కారణం కథకి వృద్ధుడి వర్తమానం ముఖ్యం. గతం కాదు. అది రచయిత్రి గ్రహించటం, అంతవరకే రాసి వదిలేయటం ఆ పాత్ర చిత్రీకరణంలో ఆమె చూపించిన జాగ్రత్తకి నిదర్శనం. అదే జాగ్రత్త – చంద్రంలో జాలిగుణం, అతడిలో సంఘర్షణ, దాని పట్ల భార్య సహానుభూతి – ఒక పద్ధతి ప్రకారం మోతాదు మించకుండా చిత్రించటంలో కనపడుతుంది. ‘అత్తత్తత్తా అని పగలంతా (చిన్నపిల్లవాడి) ఒకటే పాట, రాత్రేమో తాత.. తాత.. అని నీ కలవరింతలు’ లాంటి సందర్భోచితమైన వాక్యాల కథనం కథకి సరీగ్గా జతపడింది. కథలో చూపించిన పరిష్కారం, జీవితాల్లో చాలా విషయాలకి అన్వయించుకోదగ్గది కావడం వల్ల మంచి కథలని గుర్తుపెట్టుకొనే వాళ్ళ మనసుల్లో కొన్నాళ్ళపాటు ఈ కథ నిలిచి ఉంటుంది.

 

ఇరుకు పదును: బి పి కరుణాకర్

మరణించిన స్నేహితుడి భార్య అంటే రచయితకి ఒక సాఫ్ట్ కార్నర్. కానీ ఆమెకి తన భర్త మీద సదభిప్రాయం ఉండదు. భర్త ప్రవర్తన మీద రకరకాల అనుమానాలతో, కొన్ని ఆధారాలు తెచ్చి భర్త వ్యక్తిత్వం గురించి రచయిత దగ్గర కూపీలు లాగటానికి ప్రయత్నిస్తుంది. తమ స్నేహం కారణంగానో, లేక స్నేహితుడితో సంబంధం వున్న మరో మనిషి పక్కనే వుండటం వల్లో రచయిత ఆ విషయాలు చెప్పడు. కానీ కథ జరుగుతూ ఉండగా స్నేహితుడి భార్య పట్ల రచయిత అభిప్రాయం మారటం చూచాయగా పాఠకుడికి తెలుస్తుంది. ఇన్ని రకాల మానసిక కోణాలకి కథనం తావు ఇచ్చినా ఒక్క కోణం కూడా రచయిత నేరుగా పాఠకుడికి చెప్పకపోవటం కథలో ప్రత్యేకత.

 

చిన్న కథలో రచయిత ప్రతిభావంతంగా చొప్పించిన ప్రశ్నలను గమనించిండి.

 

అత్యంత విషాదకరమైన సన్నివేశంలో ఓ వ్యక్తిని చూసి, మనస్సులో ఎక్కడో ఏర్పరచుకున్న సానుభూతి – ఆ తరువాత ఎప్పుడో ఆ మనిషితో సంభాషించే క్రమంలో ఆవిరైపోతూ ఉండటం ఎలా ఉంటుంది? చనిపోయిన మనిషి గురించి సాక్షాత్తూ ఆ వ్యక్తి భార్యే నిందిస్తూ మాట్లాడుతూ ఉంటే దాన్ని స్వీకరించడం ఎలా ఉంటుంది? చనిపోయిన వ్యక్తితో సంబంధం ఉన్న మరో మహిళ ఇవన్నీ అక్కడే కూచుని వినడం ఎలా ఉంటుంది? అసలు ఇన్ని ఆరోపణలు ఎదుర్కొంటున్న ఆ చనిపోయిన వ్యక్తి నిజంగా చేసిన తప్పులేవిటి? ఇప్పుడు అన్నీ అయిపోయాక, ఏది తప్పు, ఏది ఒప్పు? మనుషుల్ని మనం చూసే దృష్టికోణాలు రియల్ టైమ్ లో డైనమిక్ గా మారిపోవడం ఎలా ఉంటుంది? ఇలాంటి ప్రశ్నలకీ; ముగింపు వ్యూహాత్మకంగా, పాఠకుడికి ఊహాత్మకంగా వదిలివేసినందువల్ల ఉత్పన్నమయ్యే మరిన్ని ప్రశ్నలకి ఈ కథలో పాఠకుడే జవాబులు వెతుక్కోవాలి. అది రచయిత, పాఠకుడి తెలివితేటల మీద ఉంచిన నమ్మకం!

 

ఇవి కాక వస్తుపరంగానో, శైలి పరంగానో ప్రస్తావించదగ్గవిగా మేము భావించిన కథలు కొన్ని –

 

24.05.14 త్రిపుర వర్ధంతి సందర్భంగా భగవంతం రాసిన కథ “గోధుమరంగు ఆట”. రచయిత పేరు త్రిపుర పాత్రల్లో ఒకటి కావటం – రచయిత పై త్రిపుర ప్రభావం ఎంతగా ఉందో చెప్పకనే చెపుతుంది. అది అబద్ధం కాదన్నట్లు ఈ కథ పోకడ రుజువు చేస్తుంది. గొప్ప కథనం. అందుకనే కథలో ఇతివృత్తం ఏంటో (అసలు ఉందా?) కథనం తెలియనివ్వదు. ఇది కథకి బలమా?కాదా? అన్న మీమాంస వదిలేస్తే మంచి అనుభూతిని కలగచేసిన ప్రయత్నం. త్రిపుర కథల స్ఫూర్తితో, ‘భగవంతం కోసం‘ కథ ధోరణిలో రాయబడ్డ కథ. త్రిపుర స్మృతికి అంకితం చేయబడ్డ కథ. “ఆకాశంలో నక్షత్రపు జల్లు. భగవంతం రాడు. అట్నుంచి ఏడో నంబర్లోనూ రాడు, ఇట్నుంచి పదమూడో నంబర్లోనూ రాడు. నా పిచ్చి గాని.” అన్న నిరాశతో ముగిసిన ఆనాటి కథ, ఇవాళ రూపాంతరం చెంది “.. కానీ బయట ఆకాశం కింద ఒక అనంతమైన కాల్పనిక వేడుక నాకోసం ఎదురుచూస్తూ ఉంటే – మాటల్తో కాలాన్నెందుకు వృధా చేయడం అనుకుని – హోటల్లోంచి బయటకొచ్చేశాను” అనే నవీన స్ఫూర్తితో ముగియడం ఒక విశేషం!

 

ఈ నెలలోనే వచ్చిన మరో రెండు కథలను కథాప్రేమికులు పరిశీలించాలి. ఈ రెండు కథలు ప్రతీకాత్మకంగా రాసినవి కావటం మాత్రమే ఈ రెండింటి మధ్య వున్న సామీప్యం. వివిన మూర్తి రాసిన “జ్ఞానం కనిపించటం లేదు” కథ సామాజిక పరిస్థితుల మీద చేసిన వ్యాఖ్య అయితే, పూర్ణిమ తమ్మిరెడ్డి రాసిన “ఏనాడు విడిపోని ముడివేసెనే” కథ భార్యాభర్తల మధ్య పల్చబడే అనుబంధం గురించి వివరిస్తుంది.

 

ప్రతీకలతో కథ నడపడం కత్తి మీద సాములాంటిదని ఈ రెండు కథలు చెప్పకనే చెబుతున్నాయి. కత్తి మీద సాము ఎందుకంటే – జటిలంగా ఉన్న ప్రతీకలు సంక్లిష్టమైన పజిల్ లా తయారై, కథ పాఠకుడికి దూరం అవుతుంది. సులభంగా ఊహించగల ప్రతీకలు కథ మీద పాఠకుడికి ఉన్న ఉత్సాహాన్ని నీరుకారుస్తాయి. ప్రతి అంశానికీ ఒక ప్రతీక చొప్పున వాడుకుంటూ పోవడం వల్ల మొత్తం ప్రక్రియ పలుచబారే ప్రమాదం ఉంది. ప్రతీకలతో వున్న మరో సమస్య ఆ ప్రతీకలకు లేని అర్థాన్ని ఆపాదించే ప్రయత్నం. చిత్రకళ నుంచి సాహిత్యంలోకి వచ్చిన ఈ ప్రక్రియలో కొన్ని కొన్ని విషయాలకు ప్రతీకలు దాదాపు నిర్థారితంగా వున్నాయి. వాటిని వేరే అర్థంలో వాడటం వల్ల తెలివిడి కలిగిన పాఠకులకు కూడా కథ కొరుకుడు పడకపోయే సమస్య వుంటుంది. శిల్పంలో విభిన్నమైన ప్రక్రియగా వీటిని వాడటం ముదావహమే గానీ, కథలని ఇంత అస్పష్టంగా చెప్పడం వల్ల ప్రయోజనం ఏముంటుందన్నది పెద్ద ప్రశ్న. (ఏది ఏమైనా ఈ కథలను పాఠకులు చదివి, వారికి స్ఫురించినంత మేర సారాన్ని గ్రహించే అవకాశం వుంది కాబట్టి ఈ కథలు చదివి/చదివిన వారు తమ అభిప్రాయాలను వ్యాఖ్యల రూపంలో చెప్పాలని మనవి)

 

ఈ నెల ఉత్తమ కథ

ఇద్దరి మనుషుల సంభాషణల్లో – వ్యక్తం అయ్యే అంశాలు, అవ్యక్తంగా ఉంచబడ్డ విషయాల మధ్య ఓ సున్నితమైన గాప్ వస్తుంది. ఈ గాప్ ఆ సన్నివేశంలో ఉన్న వ్యక్తులకి అవగాహనలోకి వస్తే, ఆ సంభాషణల్లో ఓ ఇబ్బంది వచ్చిచేరుతుంది. ఇదీ ఈ కథలోని ప్రాథమిక చిత్రం. ఆ సన్నివేశంలో ఇంకో వ్యక్తి కూడా ఉంటేనూ, మరో వ్యక్తి కనబడకుండా ఉంటేనూ ఆ ఇబ్బంది స్థాయి ఇబ్బడిముబ్బడిగా పెరిగిపోతుంది. ముఖ్యంగా – ఆ నలుగురు వ్యక్తుల మధ్యనా కొన్ని సంబంధాలో బాంధవ్యాలో మరోటో ఉన్నప్పుడు. ఇదొక సంక్లిష్టమైన చిత్రం. కథగా చెప్పడం కష్టం, చెప్పి ఒప్పించడం ఇంకా కష్టం. అలాంటి బాధ్యతని ప్రతిభావంతంగా నెరవేర్చారు బి పి కరుణాకర్ గారు ‘ఇరుకు పదును’ కథలో. ఎంతవరకూ చెప్పాలో దానికి కొంచెం తక్కువగానే చెప్పి, ఈ కథలో కరుణాకర్ గారు అటు క్లుప్తతనీ ఇటు అనుభూతి ఐక్యతనీ ఏకకాలంలో సాధించగలిగారు. అందువల్లా, పైన చెప్పిన ఇతర కారణాల వల్లా ఈ నెల వచ్చిన కథలలో “ఇరుకు పదును” ఉత్తమకథగా మేము భావించడం జరిగింది.

 

కథా రచయిత బి.పి. కరుణాకర్ గారికి అభినందనలు!! కరుణాకర్ గారితో “ఇరుకు పదును” గురించి సంభాషణ వచ్చేవారం.

 

ఈ వ్యాసంలో ప్రస్తావించిన కథలు:

సం. కథ రచయిత (త్రి) పత్రిక లింక్
1 అమ్మ కడుపు చల్లగా విజయ కర్రా ఆదివారం ఆంధ్రజ్యోతి, మే 4 http://goo.gl/3oY7up
2 ఇరుకు పదును బి. పి. కరుణాకర్ ఆదివారం ఆంధ్రజ్యోతి, మే 18 http://goo.gl/xxUKc5
3 ఏ నాడు విడిపోని ముడి వేసెనే పూర్ణిమ తమ్మిరెడ్డి ఈమాట – మే/జూన్ http://goo.gl/CPe5p6
4 గోధుమరంగు ఆట భగవంతం ఆదివారం ఆంధ్రజ్యోతి, మే 25 http://goo.gl/Adb8oF
5 జీవన మాధుర్యం కాండ్రేగుల శ్రీనివాసరావు నవ్య, మే 14 http://goo.gl/ixJHPR
6 జ్ఞానం కనిపించటంలేదు వివినమూర్తి అరుణతార, మే
7 డబ్బు సంచి కె. వి. నరేందర్ నమస్తే తెలంగాణ, మే 4 http://goo.gl/nsCq6P
8 తృతీయ వర్గం డా. ఆర్. వి. రాసాని నవ్య, మే 21 http://goo.gl/ZZ2TfQ
9 దో దీవానే దో షహర్ మే పూర్ణిమ తమ్మిరెడ్డి కినిగే పత్రిక, మే http://goo.gl/XZ1EpG
10 మరుగు వాణిశ్రీ నవ్య, మే 7 http://goo.gl/LJHBxF
11 సంస్కృతం మాష్టారు ఇస్మాయిల్ సాయిబ్రహ్మానందం గొర్తి ఈమాట, మే/జూన్ http://goo.gl/E5AuQy
12 సాక్షి శిరంశెట్టి కాంతారావు కౌముది, మే http://goo.gl/xiLhrE

– అరిపిరాల సత్యప్రసాద్, ఎ.వి. రమణమూర్తి, టి. చంద్రశేఖర రెడ్డి

aripirala02. T Chandra Sekhara Reddy01. Ramana Murthy

మన కథలలో రాశి తప్ప వాసి ఎక్కడ?

 

nadustunna katha

నడుస్తున్న కథ ఏప్రిల్ కథలు:

ఏప్రిల్ నెల కథల సమీక్ష మీరు ఇప్పుడు చదవబోతున్నారు. ప్రతి నెలా కథలను చదివి ఆ పై నెలలో ఆ కథల సమీక్ష రాయాలని మా సంకల్పం. అయితే కథల సంఖ్య పెరగటం; వ్యక్తిగత, ఉద్యోగ కారణాలవల్ల మా ముగ్గురికి ఏప్రిల్ కథల గురించి చర్చించే అవకాశం కుదరలేదు. ఏ నెలకానెల పాఠకుల పఠనానుభూతి జ్ఞాపకంలో వుండగానే వాటి సమీక్ష చదివితే వారి అనుభవాలనీ, అనుభూతులనీ మా అభిప్రాయాలతో పోల్చుకునే అవకాశం ఈ సందర్భంగా కోల్పోతున్నందుకు మాకూ బాధగానే వుంది. అందుకు పాఠకులకు క్షమాపణలు చెప్పుకుంటూ, రాబోయే వ్యాసాలు సకాలంలో అందించేందుకు కృషి చేస్తామని మనవి చేస్తున్నాము.

 

ఏప్రిల్ నెలలో వచ్చిన దాదాపు నూట డెబ్భై ఐదు కథలను పరిశీలిస్తే ఇప్పుడొస్తున్న తెలుగు కథలు రాశికే కానీ వాసి లెక్కకు రావన్న దిగులు మళ్ళీ కమ్ముకుంటోంది. నెల నెలా పది నుంచి పదిహేను కథలను మంచి కథలుగా పరిచయం చేస్తున్న మేము, ఈ నెల ఆ సంఖ్యను ఏడుకు మించి ఎంత ప్రయత్నించినా పెంచలేకపోవటం బాధాకరం. మా దృష్టిలోకి రాని మంచి కథలు ఒకటో రెండో వున్నా, మా అభిప్రాయాలతో విభేదించి మరో ఒకటి రెండు కథలను పాఠకులు సూచించినా, అవన్నీ కలుపుకుంటే కూడా మొత్తం కథలలో పది శాతం కూడా వుండదు కాబట్టి మేము పైన చెప్పిన వాక్యంలో ఏ మార్పు రాదు. ఇది తెలుగు కథకులు సమీక్షించుకోవాల్సిన విషయం.

 

ఈ నెల వచ్చిన కథలను పరిశీలించే ముందు ఏప్రిల్ నెలలో కొన్ని విశేషాలను గుర్తుచేసుకుందాం –

ఈ నెలలో గురజాడ ఒక పాత్రగా ఒక కథ (తనకు నచ్చిన కానుక: అనంత సురేష్, ఆదివారం ఆంధ్రజ్యోతి 4 ఏప్రిల్), శ్రీపాద ఒక పాత్రగా ఇంకో కథ (“మహావృక్షం”: సింహప్రసాద్, తెలుగువెలుగు) వచ్చాయి. అయితే, ఈ ప్రత్యేకత మినహా కథలు మాత్రం సాధారణంగానే వున్నాయి. అలాగే, ఒకే కథ ఇదే నెలలో రెండు ఇంటర్నెట్ పత్రికలలో రావటం కూడా గుర్తించవచ్చు.

 

ఇక మంచి కథల గురించి –

ఈ నెలలో వచ్చిన మంచి కథలలో వస్తుపరంగా వైవిధ్యం స్పష్టంగా కనపడుతోంది. “పరబ్రహ్మ”, “స్పార్క్” కథలు మంచి కథాంశాన్ని ఎన్నుకోని, ఆ నేపధ్యంలో మనుషుల మధ్య సంబంధాల గురించి చెబితే, “అస్తిత్వం”, “నేను నాన్న బిర్యాని”, “వెడ్డింగ్ ఇన్విటేషన్” వంటి కథలు అనుభూతి ప్రధానంగా నడిచాయి. ఈ కథలలో వున్న కథాంశం చాలా స్వల్పమైనదైనా కథని నడిపించిన విధానంలో ప్రతిభ వల్ల చదవతగ్గ కథలైనాయి. “పేరున్న రాజ్యం”, “తలుపులు” కథలువర్తమాన రాజకీయ పరిస్థితులమీద సంధించిన కథాస్త్రాలు. ఈ కథలన్నింటి గురించి స్థూలంగా పరిచయం చేసుకుందాం.

పరబ్రహ్మ: సింహప్రసాద్

గురువు నేర్పిన చదువుతో గురువునే మించి పోయాననుకునే శిష్యుడు మళ్ళీ గురువు గొప్పదనాన్ని తెలుసుకోవడం కథాంశం. స్వాతి కథల పోటీలో బహుమతి పొందిన ఈ కథని పరిశీలిస్తే కథాంశం పాతదైనా ఒక చెయ్యి తిరిగిన రచయిత చేతిలో ఎంత చక్కగా రూపుదిద్దుకోగలదో అర్థం అవుతుంది. ఇతివృత్తంలో నేటి గురువుల ట్రెండ్ ను ప్రస్తావించటం వల్ల సమకాలీన పరిస్థితులను సూచిస్తోంది. అయితే,కథ ప్రధమార్థంలో శిష్యుడికి గురువు లెక్కలు నేర్పే ప్రక్రియ అవసరాన్ని మించి జరిగిందేమో అనిపించింది.

 

అస్తిత్వం: శిరీష్ ఆదిత్య

ఢిల్లీ నగరంలో ఒంటరిగా వుంటున్న ఓ తెలుగు యువకుడు తెలుగు మాట్లాడే ఓ హోటల్ సర్వర్ తో పరిచయం పెంచుకుంటాడు. ఓనర్ కి తెలియకుండా అతనికి టిప్ ఇవ్వలేని చిన్న డైలమా. అది ఇవ్వకముందే సర్వర్ చనిపోవటం – ఇదీ కథాంశం. జీవితం తాలూకు అభద్రత, అజ్ఞానం, అనిశ్చితీ అసలే కుదిపేస్తున్న ఆ సమయంలో – వెంకటప్ప మరణం జీవితపు క్షణికత్వాన్ని కథకుడికి ఆవిష్కరింపజేసి, నాస్తికుడిగా ఉన్నవాడిని గుడి మెట్ల మీద నిలబెడుతుంది. ఈ కథ కూడా ముందే చెప్పినట్లు మంచి భాష, కథనం వల్ల చదివించేస్తుంది. చివర్లో యువకుడు వేసుకునే ప్రశ్నలు, మధ్యలో వెంకటప్ప వేసే ప్రశ్నలు ఆలోచనలు రేకెత్తిస్తాయి. కథాంశంలో మరి కొంత కసరత్తు చేసివుంటే కథకు కండపుష్టి కలిగుండేది.

 

స్పార్క్ : విజయభాను కోటే

ఒక వైపు నుంచి చూస్తే బాల్యంలో లైంగిక దురాచారానికి బలైన అమ్మాయి ఆత్మస్థైర్యంతో నిలబడిన కథ. అలాంటి పరిస్థితులు ఆ అమ్మాయిల్లో ఎలాంటి నిర్వికారాన్నీ, వ్యధనీ కలగజేస్తాయో వాస్తవికంగా పట్టుకోవడానికి మంచి ప్రయత్నం చేసిన కథ. మరో వైపు నుంచి చూస్తే ఓ కుర్రాడి ఏక పక్ష ప్రేమ కథ. తాను ప్రేమించే అమ్మాయి తిరిగి ప్రేమించకపోతే కోపం తెచ్చుకోకుండా ఎందుకని ఆలోచించిన ప్రేమికుడి కథ. నిజమైన ప్రేమ అంటే అదే అని చాలామంది గ్రహించక పోయినా ఈ కథలో హీరో గ్రహించటం ఈ కథలో విశేషం. ముగింపును కూడా రచయిత్రి అటో ఇటో తొందరపడి తేల్చదు. ప్రయత్నం లేకుండా ఫలితం రాదు కదా అని ప్రశ్నార్ధకంతో వదిలేస్తాడు. అబ్రప్ట్ గా మొదలైన కథ ఇన్‌కంక్లూసివ్ గా ముగియటం కొంత వెలితి అనిపించినా – ‘సర్వ’పాత్ర మనస్తత్వం, జీవన నేపథ్యం దృష్టిలో పెట్టుకుంటే కథకు అంతకన్నా ఆచరణాత్మకమైన ముగింపు సాధ్యం కాదేమో అనిపిస్తుంది.

 

పేరున్న రాజ్యం: పాలపర్తి జ్యోతిష్మతి

సుస్థిర రాజ్యం ఏర్పరచుకున్న ప్రభువులు – అధికారమే పరమావధిగా ప్రజలని ఎలా మభ్యపెట్టి మోసం చేస్తూ ఉంటారనే విషయాన్ని ప్రతీకాత్మకంగా రాసిన కథ. చివరికి విసుగెత్తిన ప్రజలు ఏం చేస్తారన్నది ముగింపు. చాలా విచిత్రంగా, ఈ కథ వచ్చిన కొద్ది రోజులకే మన దేశపు రాజకీయాల్లో ఇలాంటి పరిణామం సంభవించడం కాకతాళీయమే అయినా, ఒక రచన చూడగల వాస్తవ దృష్టికోణాన్ని అది స్పష్టపరుస్తోంది. తను చెప్పదలుచుకున్నది సూచ్యంగా తప్ప వాచ్యంగా చెప్పకూడదనుకున్న రచయిత్రి తనమీద తాను విజయవంతంగా ప్రయోగించుకోగలిగిన నియతి. అంతర్లీనంగా దాగి ఉన్న దారపు పోగును పట్టుకోగలిగితేనే మంచికథ. లేకుంటే మామూలు కథగా అనిపించి బురిడీ కొట్టించగలిగిన కథ.

 

నేను, నాన్న, బిర్యానీ: ఇండ్ల చంద్ర శేఖర్

బిర్యానీ తినాలన్న బలమైన కోరికతో ఇస్మాయేల్ హోటల్ చేరిన ఓ మాష్టారుకి అక్కడ తండ్రి కనిపించడం, ఆయనకు ఆ రోజు ఉదయమే డబ్బులేదని చెప్పిన కారణంగా ఆయన్నుంచి తప్పించుకోవాల్సిన అవసరం. ఈ పరిస్థితిలో కొడుకు ఇంకా ఏమీ తినలేదని తెలుసుకున్న తండ్రి అతన్ని మరో హోటలుకి తీసుకెళ్ళి బిర్యానీ తినిపిస్తాడు. తండ్రి ప్రేమ కలిసిన ఈ బిర్యానీనే అద్భుతంగా అనిపిస్తుంది మేష్టారికి. ‘ఎదిగిన కొడుకు – నిర్లక్ష్యం చేయబడ్డ తండ్రి’ ఇతివృత్తంతో ఇపుడు తామర తంపరగా వస్తున్న కథల్లో ఒక కొత్త కోణం ఆవిష్కరించిన కథ. కొడుకు నిర్లక్ష్యం చేసినా తండ్రి ప్రేమ చెక్కు చెదరదని చెప్పిన కథ. క్లుప్తతతో కథకు ప్రాణం పోసిన రచయిత తాను చెప్పదలుచుకున్నదాన్ని సూచ్యంగా చెప్పటం కథలో విశేషం.

అయితే, మేష్టారు తన ఇన్నేళ్ళ జీవితంలో తండ్రి ప్రేమని ఎప్పుడూ తెలుసుకోలేదా? అలా స్వార్థపరుడిగా ఎందుకు ఉన్నాడు? లాంటి ప్రశ్నలకి ఎలాంటి కార్యకారణసంబంధమూ చూపించకుండా సన్నివేశాలని తనకు కన్వీనియెంట్ గా రచయిత మలచుకోవడం వల్ల కథ తాలూకు సంపూర్ణత్వం కొంత దెబ్బతింది. ఆ విషయాలనీ కథ పరిధిలోకి తీసుకొని వస్తే, అనుభూతిని ఇంకొంచెం ఎక్కువ పండించగలిగి ఉండేది.

 

వెడ్డింగ్ ఇన్విటేషన్: డా. వంశీధర్ రెడ్డి

కథకుడిలో కథని ప్రతిభావంతంగా చెప్పగలిగిన నేర్పు ఉంటే, దానికి ఎక్కడా తడుముకోవాల్సిన అవసరం లేని భాషమీద పట్టు తోడైతే సూది అంత ఇతివృత్తంతో గడ్డిమోపంత కథ ఎలా సృష్టించవచ్చు అనటానికి మంచి ఉదాహరణ. గొప్ప వైవిధ్యం ఉన్న వాతావారణం, దానికి అత్యంత సహజమైన కథన ధోరణీ, కథ చెప్పడంలో అనుసరించిన ఒక మోనోలాగ్ లాంటి ప్రక్రియా, అందులో చెణుకులూ మరికొన్ని మెరుపులూ – ఇవన్నీ కథని నిస్సందేహంగా ఒక గొప్ప కథగా మలిచాయి.

విమర్శకులలో, విశ్లేషకులలో తప్పకుండా చర్చ లేవనెత్తే కథ ఇది. కథలో సహజత్వాన్ని ఇంకొంచెం పొడిగించి వాడిన బూతులు కథకి అవసరమా కాదా అన్న అన్ని చర్చల్లోనూ ఈ కథని ఉదహరించుకుండా వుండలేము. సభ్యత ముసుగు వేసుకుని చూస్తే అభ్యంతరకరంగానూ, కథనంలో సహజత్వాన్ని కోరుకునే వారికి ఆశ్చర్యకరమైనంత సహజంగా కనిపించే కథ. డాక్టర్ వంశీధర్ రెడ్డిని కథారూపం పరంగా ప్రత్యేకంగా ప్రశంసించాల్సిన కథ.

ఇన్ని విశేషణాలున్న ఈ కథ, ఒక విధివిలాసపు కథ కాకుండా, ఒక నిర్దుష్టమైన ప్రయోజనాన్ని, జీవితానికి సంబంధించిన ఏదైనా విశేషాన్ని అందించగలిగిన ఉద్దేశాన్నీ కూడా కలగలపుకొని ఉన్నట్టయితే, ఇంకొంత మంచి కథ కచ్చితంగా అయి ఉండేది.

 

తలుపులు: పెద్దింటి అశోక్ కుమార్

తెలంగాణ ఉద్యమం విజయవంతమైన తరువాత జరిగిన ఎన్నికల నేపధ్యంలో రాయబడిన కథ. కథకు సహజమైన తెలంగాణ మాండలికంలో రాయబడింది. పేదరికంతో పాటుతుఫాను చలిగాలి కూడా కమ్ముకున్న ఒక కుటుంబం గురించిన కథ. ఆ చలినుంచి చెల్లెల్ని కాపాడటం కోసం ఒక ఫ్లెక్సీని దొంగతనంగా తీసుకొచ్చి, తలుపుల్లేని ఆ ఇంటికి కొంత రక్షణ కల్పించాలి అనే ఆలోచనలో ఉన్న ఒక అన్న కథ. తీరా దాన్ని తెంపుకొని వచ్చాక, సదరు రాజకీయ పార్టీ కార్యకర్తలు నానా యాగీ చేసి ఆ కుర్రాణ్ణి కొట్టి ఫ్లెక్సీ లాక్కెళ్తారు. మంచి ఎత్తుగడ, పాఠకుడి దృష్టిని పక్కకు పోనివ్వని ముగింపు. ఇతివృత్తంలో సమకాలీనత. దానికి అనుగుణమైన భాష, కొరడా కొసలా చెళ్లుమనే ముగింపు. మంచి కథకి ఉండాల్సిన లక్షణాలు అన్నీ పుణికిపుచ్చుకున్న కథ.

 

ఇవీ ఏప్రిల్ లో వచ్చిన కొన్ని మంచి కథలు. ఈ కథలలో ఉత్తమమైన కథ కోసం పరిశీలించినప్పుడు, ఈ వ్యాసకర్తలు ముగ్గురూ ఏకగ్రీవంగా ఎన్నుకున్న కథ తలుపులు”.అశోక్ కుమార్ గారి రచన ఆ ఉద్యమస్ఫూర్తిని సజీవంగానే వుంచుతూ, ఉద్యమానంతర పరిస్థితిని ఎంతో బాధ్యతతో గుర్తు చేస్తుంది.

ఈ కథలో ఆయివు పట్టు ఆ ఫ్లెక్సీ మీద వున్న బొమ్మ. ఏ పసిపిల్లాడు చెల్లెలిని చలినుంచి కాచడానికి ఫ్లెక్సీ దొంగతనం చేశాడో ఆ పిల్లాడి తండ్రి బొమ్మే ఆ ఫ్లెక్సీ మీద వుంటుంది. ఆ కుటుంబం తెలంగాణా పోరాటంలో అమరుడైన ఓ వీరుడిది. ఈ విషయం ఎంత బలమైనదంటే కథని ఈ వాక్యంతో ముగించి ఒక ఆశ్చర్యాన్ని, రాజకీయనాయకుల పైన కసిని పాఠకుల మదిలో రగిలించి ముగించవచ్చు.

కానీ, అశోక్ కుమార్ గారు కథని అలాంటి ఒక టెక్నిక్ తో ముగించడానికి ప్రయత్నించలేదు. అదీ ఈ కథలోని నిజాయితీ! గొడవ చేసిన రాజకీయ పార్టీల వాళ్ళు వెళ్ళిపోయాక, తల్లి కొడుకు తల నిమురుతూ, “వీడి పోరాటం ఇంకా మిగిలే ఉంది” అనడంతో కథ ముగుస్తుంది. పోరాటాల వల్ల సాధించాల్సింది సాధించినా, పోరాటాల అనంతరం అందుకోవాల్సిన ఎత్తులు ఇంకా మిగిలే ఉంటాయన్న అన్యాపదేశం ఈ కథ సారాంశం. తెలంగాణా సాధనతో ఆగకుండా రాష్ట్ర నిర్మాణానికి, పేదరిక నిర్మూలనకీ సమాయత్తమవమని స్ఫూర్తిని రగిలిస్తుంది. అందుకే ఈ కథ తెలంగాణ నేపధ్యంలో రాయబడ్డ కథే అయినా అన్ని ప్రాంతాల వారికీ అన్వయం అవుతుంది. ఆ సార్వజనీతే ఈ కథని ఉత్తమ కథగా నిలబెట్టింది.

పెద్దింటి అశోక్ కుమార్ గారికి మరోసారి అభినందనలు!!

 

ఇక చివరిగా – ఈ వ్యాసంలో చర్చించిన కథల లిస్టూ,వీలైనచోట లింకులూ:

తలుపులు: పెద్దింటి అశోక్ కుమార్ (నమస్తే తెలంగాణ బతుకమ్మ, 27 ఏప్రిల్)http://goo.gl/WvdUpt

 

వెడ్డింగ్ ఇన్విటేషన్: వంశీధర్ రెడ్డి (కినిగే పత్రిక, ఏప్రిల్)http://goo.gl/Ud2D9g

 

నేను నాన్న బిర్యాని: చంద్రశేఖర్ ఇండ్ల (సాక్షి ఫన్ డే, 13 ఏప్రిల్)http://goo.gl/uhHZnC

 

పేరున్న రాజ్యం: పాలపర్తి జ్యోతిష్మతి (చినుకు, ఏప్రిల్)

 

స్పార్క్: విజయభాను కోటే(సాహితీ ప్రస్థానం, ఏప్రిల్)http://goo.gl/G69HD8

 

అస్థిత్వం: శిరీష్ ఆదిత్య (కినిగే పత్రిక, ఏప్రిల్)http://goo.gl/k9NkHD

 

పరబ్రహ్మ: సింహప్రసాద్ (స్వాతి వారపత్రిక, 11 ఏప్రిల్)

 

శిల్పం మీద మరీ ఎక్కువ ధ్యాస పెడ్తున్నామా?!

2 (1)

ముందుమాట

ముచ్చటగా మూడో నెలలోకి వచ్చాక ఇప్పుడు ముందుమాటేమిటని ఆశ్చర్యపోకండి. మంచో చెడో మూడు నెలలు గడిచాయి. చాలా వరకు మా శ్రమని గుర్తించి వచ్చిన అభినందనలు, అడపాదడపా కథల గురించి విమర్శలు వచ్చాయి. మమ్మల్ని తిట్టే వాళ్ళు ప్రైవేటుగా తిట్టారు. కారణాలు రెండు – ఒకటి మేము చేస్తున్నది గడ్డిమేటలో సూదిని వెతకడమనీ, రెండోది చివరికి ఇది గొంగలిలో అన్నం తింటూ వెంట్రుకలు వచ్చాయని తిట్టుకునే పరిస్థితికి దారి తీస్తుందని. తెలుగు కథలో మంచి కథలు గగన కుసుమాలని చాలా మంది అభిప్రాయం. మేము ఆ అభిప్రాయాన్ని సగౌరవంగా తిరస్కరిస్తున్నామని చెప్పడానికే ఈ ముందుమాట.

విషయానికి వద్దాం. ఈ మూడు నెలలలో మేము చేతనైనంత వరకు అన్ని కథలు చదవాలనే ప్రయత్నం చేశాము. బ్లాగులు, ఒక ప్రాంతంలో మాత్రమే దొరికే పత్రికలు మినహాయించి అందిన ప్రతి కథా చదివాము. వీటిని ఏ ప్రాతిపదికన విశ్లేషించి, మంచి ముత్యాలను వెలికి తీయాలని అన్న విషయంలో మాలో మాకు చాలా చర్చలు జరిగాయి. అవగాహన కుదిరాక, ప్రతి కథని విశ్లేషించేందుకు వీలైయ్యేట్లుగా ఒక మూల్యాంకనా విధానాన్ని తయారు చేసుకున్నాం. సబ్జెక్టివ్ గా ఉండగలిగిన విషయాలని చర్చకు పెట్టి, తద్వారా ఆ అంశ ప్రభావాన్ని చాలా వరకు నియంత్రించే ప్రయత్నం జరుగుతూ వస్తోంది. ఆ వివరాలన్నీ మరోసారి చెప్పుకుందాం. ఈ మూడు నెలలలో మేము గమనించిన కొన్ని ముఖ్యమైన విషయాలు మననం చేసుకుందాం.

స్థూలంగా నూటాయాభై కథలు ప్రతి నెలా తెలుగుసాహిత్యంలో వచ్చి కలుస్తున్నాయి. ఏ రకంగా చూసినా ఇది చాలా ఆనందదాయకమైన సంఖ్య. అందులో పది మంచి కథలను వెతకటం మాకు ఏమంత కష్టం కూడా కావటంలేదు. ఇంకొంచెం ముందుకెళ్తే, మంచి కథలు కాకపోయినా మరో పది దాకా కథలలో ఏదో ఒక మంచి అంశం వుండటం వల్ల (వస్తువో, శిల్పమో మరొకటో) ఇక్కడ ప్రస్తావించగలిగినవిగా ఉంటున్నాయి. ఇక ఆ పైన ఇక మంచి కథ దొరకడం కష్టంగా వుంటోంది. మరో రకంగా చెప్పాలంటే నూటాయాభై కథలలో సుమారు పదిహేను నుంచి ఇరవై మంచి కథలు వస్తున్నాయి. (మంచి నిర్వచనం కాస్సేపు పక్కన పెడదాం). అయితే ఇవన్నీ అద్భుతమైన కథలేనా అంటే ఒప్పుకోవడం కష్టం. కొన్ని కథలు వస్తుపరంగా గొప్పవిగా వుండి శిల్పంలోనే, నిర్మాణంలోనో, సమకాలీనతలోనో కుదేలౌతున్నాయి.

మరి కొన్ని కథలు కేవలం పదాడంబరమూ, శైలీ, శిల్పాలమీద ఎక్కువగా ఆధారపడి, వస్తువును విస్మరిస్తున్నాయి. ఈ రెండవ రకం క్రమంగా పెరుగుతున్న ట్రెండ్ గా కనిపిస్తున్నప్పటికీ, ఇదో కొత్త మలుపుగా గుర్తించడానికి ఇంకొంచం సమయం పట్టవచ్చు. ఈ ట్రెండ్ మరీ ముఖ్యంగా వెబ్ పత్రికల్లో కనపడుతోంది. రైతులు, పిల్లలు వదిలేసిన తల్లిదండ్రులు, లాంటి కథాంశాలు ఇప్పటికీ కథలలో సింహభాగాన్నిఆక్రమిస్తున్నాయి. కానీ, చాలా కోణాల్లోంచి ఇప్పటికే చర్చించబడ్డ ఆ వస్తువుల్లోంచి ఎలాంటి నవ్యతనైనా రాబట్టడంలో మాత్రం ఎక్కువ కథలు విఫలమవుతున్నాయి. వాటితో పాటుగా మారుతున్న ప్రపంచ ఆర్థిక పరిస్థితులు, గ్లోబలైజేషన్/కన్సూమరిజం, అస్తిత్వవాదం, ఉద్యోగాలలో స్త్రీలు, కార్పొరేట్ ప్రపంచంలోని నీలి నీడలు – ఇలాంటి వైవిధ్యమైన, సమకాలీనమైన కథలు కూడా వస్తున్నాయి! ఆయా వర్గాల గొంతులు వినిపిస్తూనే ఉన్నాయి!

పెంచి పెద్ద చేసిన తల్లిదండ్రుల పట్ల వాళ్ళ వృద్ధాప్యంలో సంతానం చూపే నిర్లక్ష్య ధోరణి కథా వస్తువుగా ఎక్కువ మంది రచయితలు/రచయిత్రులు స్వీకరించడం కనిపిస్తోంది. ఇంక రసం ఏ మాత్రం మిగలని ఈ చెరుకుగడని వదిలేసి కొత్త సమస్యల వైపు తెలుగు కథ దృష్టి సారిస్తే కథలకి మరింత వైవిధ్యం సమకూరుతుందేమోనని మా అభిప్రాయం. అలాంటి కథలే రాయాలనుకున్నా – కనీసం “పరువు” (వాణిశ్రీ, ఆంధ్రభూమి మాసపత్రిక, మార్చ్ 2014) లాంటి కథల్లో ప్రయోగించిన నవ్యతనైనా ప్రదర్శించగలగాలి.

చాలా కథలు పూర్తిగా అపరిపక్వ స్థాయిలో కనిపిస్తున్నాయి. అసలు ఇవి కథలేనా అని శంకించాల్సిన పరిస్థితి! వాటిని చదివిన పాఠకులుగా మా అభిప్రాయం లేదా అనుమానం – కొంత మంది రచయితలు/రచయిత్రులు కథ రాసిన వెంటనే పత్రికలకి పంపిస్తున్నారేమోనని. మా దృష్టిలో ఏ కథకూ మొదటి సారి రాసిన వెంటనే సమగ్ర స్వరూపం సిద్ధించదు. రాసిన తర్వాత రాసిన వాళ్ళే ఒకటికి రెండు సార్లు తమ రచనని తామే పాఠకులుగా మారి చదివితే రచనలో లోపాలు వాళ్ళకే స్ఫురిస్తాయి. ఒక అనవసరమైన వర్ణన, ఇతివృత్తానికి అనవసరమైన ఒక సంఘటన, చెప్పదలుచుకున్నదంతా చెప్పిన తర్వాత ముగింపు దగ్గరకొచ్చేసరికి అనవసరం అనిపించే పొడిగింపు – ఇలాంటివి. అవి సరిచేసి ప్రచురణకి పంపటం వల్ల మంచికథ రాసిన తృప్తి రాసినవాళ్ళకీ, చదివిన తృప్తి పాఠకులకీ కనీసం కొన్ని కథల విషయంలోనైనా పాఠకులకి దొరుకుతుంది.

 

మార్చి కథలు

ఫిబ్రవరి నెలతో పోలిస్తే మార్చ్ నెల కొంతవరకు సంతృప్తికరంగా ఉంది. అయితే, బాగున్న కథలు మాత్రం పరిమితంగానే ఉంటున్నాయి. ముందుగా – టాప్ పది కథలలోకి దాదాపు చేరబోయి అడుగు దూరంలో ఆగిపోయిన కొన్ని కథలను గురించి –

ఒక ఆదివారం ప్లాట్ఫామ్ బెంచ్ మీద (స్వాతికుమారి బండ్లమూడి, ఈమాట), అనగనగా ఒక రాత్రి (పూర్ణిమ తమ్మిరెడ్డి, ఈమాట), మనిషివిత్తనం (వి. ప్రతిమ, చినుకు), నడుస్తున్న చరిత్ర (ఆదెళ్ళ శివకుమార్, గో తెలుగు 23 మార్చ్), పౌరుషం (సతీష్ పోలిశెట్టి, కినిగె పత్రిక) – ఈ ఐదు కథలలోనూ శిల్పపరంగానో, వస్తుపరంగానో చెప్పుకోదగ్గ విషయాలు వున్నాయి. మొదటి నాలుగు కథలలో శిల్పం చాలా గొప్పగా వున్నప్పటికి ఇతర విషయాలలో నిరుత్సాహపరిచాయి.

“ఒక ఆదివారం..” కథలో రచయిత్రి స్వగతం ఒక ప్రవాహంలా సాగిపోయింది కానీ ఆగి చూస్తే అందులో కథ చాలా పల్చగా వున్నట్లు తోచింది. అలాగే “అనగనగా..” కథలో కూడా ఒక ఫోక్ లోర్ లాంటి కథను అన్వయం చేస్తూ ఓ స్త్రీ కథ చెప్పే ప్రయత్నంలో కొన్ని విషయాలు స్పష్టపరచకపోవడం వల్ల కథ అసమగ్రంగా వున్నట్లు అనిపిస్తుంది. “నడుస్తున్న చరిత్ర” కథ చదవడానికి బాగున్నా దానిని కథగా అంగీకరించవచ్చా అన్నదే పెద్ద ప్రశ్న (ఇలాంటిదే “గింజలు” – ఆరి సీతారామయ్య, సారంగ 13 మార్చ్ కూడా) . ఆ ప్రశ్నపక్కనపెట్టి పరిశీలిస్తే ఎన్నెన్నో సంబంధిత సంఘటనలను తెచ్చి ఒకే కథలో పెట్టాలనుకోవడమనేది కధకు ఉండాల్సిన క్లుప్తత అనే స్ఫూర్తిని దెబ్బతీస్తుంది. “మనిషివిత్తనం” చాలా చర్చకు అవకాశం ఇచ్చే కథ. సంతానం కోరుకుంటున్న భర్త లోపాన్ని తెలుసుకోని, అందుకు అక్రమసంబంధం పెట్టుకోవడం కథాంశం. ఇందులో ఆ స్త్రీకి పరాయి వ్యక్తి పైన ప్రేమ వున్నట్లు చెప్పినా, ఒక సమస్యకి ఇలాంటి ఆమోదయోగ్యం కాని పరిష్కారం ఇవ్వడం సబబుకాదేమో ఆలోచించాల్సిన విషయం. ప్రేమ, నైతికానైతికాలు, జీవితం – ఇత్యాది విషయాలు కూడా కథలో సంతృప్తికరంగా చోటుచేసుకున్నట్లయితే, ఇది మంచి కథ అయి ఉండేది. అయితే ఈ కథను ద్వితీయ పురుషలో ప్రతిభావంతంగా రాయడం వల్ల పఠనానుభూతి బాగుంది. “పౌరుషం” కథ వస్తువు పరంగా బానేవున్నా, కొన్ని చోట్ల దారి తప్పటం, హడావిడి ముగింపు వల్ల అందుకోదగ్గ ఎత్తుకు ఎదగలేదు.

ఈ నెలలో వచ్చిన మంచి కథలు అన్నింటినీ కలిపి వ్యాఖ్యానం చేసే బదులు ఒక్కొక్క కథను విడిగా విశ్లేషించాలని అనుకున్నాము. విశ్లేషణ ఒక్కో కథకీ విడివిడిగా చేయడం వల్ల కథలు చదవదలచుకున్నవాళ్ళకి ఎక్కువ ఉపయోగకరంగా ఉంటుంది అని కొంతమంది పాఠకులు చేసిన సూచన మేరకు ఈ పనిని కూడా చేపట్టాం. ఈ పని చేస్తున్న మేము ముగ్గురం మేధావులమనో, గొప్ప విశ్లేషకులమనో కాక కాస్త తెలివిడి ఉన్న పాఠకుల చర్చలోని సారాంశాన్ని పొందుపరుస్తున్నామని ఈ వ్యాసం చదువుతున్న రచయితలు, పాఠకులు గుర్తించగలరు!

తప్పు – పి. రామకృష్ణ (ఆదివారం ఆంధ్రజ్యోతి, 2 మార్చ్):వివాహానికి ముందే శృంగారం వల్ల నెల తప్పిన ఒక స్త్రీ భావ సంచలనం. తప్పు జరిగింది. తప్పు ఏ పరిస్థితుల్లో జరిగిందో, అది జరిగాక అబ్బాయి ప్రవర్తనా, సంస్కారం ఏ పాటి ఉన్నాయో తనకి తెలుసు. ఈ ఆలోచనల్లోనే, ఆమెకు ఆ చిన్న ఇంట్లోనే రెండు ప్రపంచాలు ఉన్నట్టు అర్థమయ్యింది. “అడుసు తొక్కినప్పుడు కాళ్ళు కడుక్కోవాలిగానీ నరుక్కోకూడదు కదా!” అనే ఒక గొప్ప వాక్యంతో కథ ముగుస్తుంది. జ్యోతి పాత్ర అంతరంగ చిత్రణా, ‘ఆప్యాయతలు వెల్లివిరుస్తున్నాయి’ అనుకునే ఇంట్లో మనుషుల ఆలోచనల మధ్య వైరుధ్యాలూ ఇవన్నీ చాలా అద్భుతమైన స్థాయిలో చిత్రింపబడ్డ కథ. అయితే, ఇది ఎందుకో ఒక కథ రూపాన్ని సంతరించుకోలేకపోయింది. దీనికి కారణం – రచయిత ముగింపు వాక్యం మీదే ఆధారపడటం తప్పించి కథలోంచి ఏ విశేషమూ బయటపడకపోవడం కావచ్చు.

చెలికాడు – అలపర్తి రామకృష్ణ (స్వాతి వీక్లీ, 14 మార్చ్):ఉద్యోగం చేస్తున్న భార్య, ఉద్యోగం వదులుకున్న భర్త. ఈ పరిస్థితుల్లో భర్త చేసేవన్నీ పనికిమాలిన పనులలాగా, ఖర్చుదారీ వ్యవహారాల్లాగా, అతని ఆత్మవిశ్వాసం అనవసరమైన పొగరులాగా భార్యకి కనిపిస్తూ ఉంటాయి. కానీ అతను మాత్రం మారడు. అదే చిరునవ్వూ, అదే ప్రేమ, అదే నిజాయితీ, అదే కన్సర్న్. కథ చివర్లో అతనికి ఇంకొంచెం మంచి ఉద్యోగం రావడం అనేది కొంచెం నాటకీయమూ, కొంచెం యాదృచ్ఛికమూ అయినప్పటికీ – అతని పాత్రని చిత్రించిన తీరు మాత్రం ప్రశంసార్హం.

నమూనా బొమ్మ – బి. రమాసుందరి (తెలుగు వెలుగు, మార్చ్):“నీ మీద నేను జాలి పడగలిగిన పరిస్థితుల్లో నువ్వున్నంత కాలం నీ మీద నాకు అభిమానం ఉంటుంది. ఆ పరిస్థితుల్లోంచి నువ్వు ఏ మాత్రం ఎదిగినా నువ్వంటే ఏవగింపు కలుగుతుంది” – అన్న కోణాన్ని ప్రతిభావంతంగా ఆవిష్కరించిన కథ. సునిశితమైన పరిశీలన, కథనం మీద నియంత్రణం ఉన్న రచన. పాత్రల ప్రవర్తనలో అంతరార్థాన్ని సూచనప్రాయంగా చెప్పడం, భావాల్ని వ్యక్తీకరించడానికి వాడుకున్న వినూత్న ప్రతీకలు రచయిత్రి నేర్పుని తెలియజేస్తాయి. అయితే, కథ ముగిసిన తరువాత కూడా మరి కొంచెం సాగడం వల్ల ముగింపు బలహీనపడింది.

రచ్చబండ తీర్పు – డా. జి.వి. కృష్ణయ్య (చతుర, మార్చ్):మంచి కథ. నిడివి కొంచెం ఎక్కువేమో అన్న సందేహం వచ్చినా, కథ నడిపిన తీరు దాన్నిమర్చిపోయేలా చేస్తుంది. అట్టడుగు వర్గం మహిళని బలాత్కారానికి గురైతే, ఆ విషయం రచ్చబండకి రావడం కథాంశం.అది కేవలం “పిల్లల తప్పు” కింద భావించిన పెద్దలు ఓ అయిదువేలు నష్టపరిహారం ఇచ్చిన తీర్పుని గర్హిస్తూ బాధితురాలి భర్త “ఆ డబ్బు తీసుకొని మా ఆడోళ్ళ మానానికి వెలకట్టలేం. రేపొకరోజునమదమెక్కిన మగోడల్లా వచ్చి మా ఆడోళ్ళ రేటడుగుతాడు. అదింకా సిగ్గుమాలినతనం” అన్న మాటలు అన్యాయపు తీర్పుల్నీ, ఆడవాళ్ళంటే గౌరవంలేని పెద్దల్నీ, అలాంటి పెద్దలు నిర్వహించే రచ్చబండల్నీ – అన్నింటినీ ప్రశ్నిస్తాయి. రచయిత కథ నిడివి పట్ల ఇంకొంచెం శ్రద్ధ వహించగలిగి ఉంటే బాగుండేది.

బల్లిఫలితం – వేమూరి వెంకటేశ్వరరావు (ఈ మాట, మార్చ్): తెలుగులో అరుదుగా వచ్చే వైజ్ఞానిక కాల్పనిక రచన. ఇలాంటి కథలను మిగతా కథలను కొలిచినట్లు కొలిచి చూడలేము. సమకాలీనత, సామాజికత వంటి అంశాలు వుండకపోవచ్చు. కేవలం ప్రత్యేకంగా ప్రస్తావించాలి. కానీ ఈ కథ అలా చూసినా నిలబడుతుంది. సైన్స్ వెర్సస్ నమ్మకాల విషయంలో కథ ఎలా రాయబడాలో అలానే రాయబడింది – మంచి ఎత్తుగడ. బిగువైన కథనం. ముగింపులో చమత్కారం! గోపాలకృష్ణ వంటి అనవసరపు పాత్రలు, వివరాలను ఇంకొంచెం తగ్గించి ఉంటే కథలో గందరగోళం కొంచెం తగ్గి, చదువుకోవడానికి మరికొంచెం బాగుండేది.

పెద్దరికం అంటే – గంటి భానుమతి (ఆంధ్రభూమి మాస పత్రిక, మార్చ్): ఉరుకులు పరుగుల మధ్య తల్లిదండ్రుల దగ్గర్నుంచి సరైన అటెన్షన్ దొరకక ఏకాంతాల్లోకి దిగజారుతున్న కూతురి కథ. పిల్లల్లో ఆత్మవిశ్వాసం, సరైన దృక్పథం, ఉత్తరోత్తరా తల్లిదండ్రుల పట్ల గౌరవం ఇవన్నీ తల్లిదండ్రుల పెంపకంలో నుంచే వస్తాయి. ఇది ప్రస్తుత సమాజానికి చెప్పాల్సిన కథ. సమస్య మూలాల్లోకి వెళ్ళిన కథనం, ఒక అంగీకారయోగ్యమైన పరిష్కారం దిశగా కథ మళ్లింపు ప్రతిభావంతంగా వున్నాయి. నిడివి, తల్లి పాత్ర చిత్రణలో నాటకీయత మినహాయిస్తే ఇది మంచి కథ.

విషయవలయాలు – జి. ఉమామహేశ్వర్ (సాహిత్య ప్రస్థానం, మార్చ్): అర్థరాత్రి న్యూస్ ఛానల్లో ప్రసారమయ్యే అశ్లీల కార్యక్రమాలను చాటుగా చూసే కొడుకుని చూసి బాధపడే తల్లి కథ. చాలా సున్నితమైన, సమకాలీనమైన సమస్య. టీవీ ఛానెల్ వాళ్ళని ప్రమీల కలవటం లాంటి అనవసర సన్నివేశాలు నిడివిని పెంచాయి. ఇలాంటి కథలకు ప్రత్యేకంగా ముగింపు అంటూ ఉండదు కాబట్టి, కథ ముగిసే సమయానికి పైన చెప్పిన క్లుప్తతా రాహిత్యం వల్ల బలహీనపడి, మంచి వస్తువు అయివుండీ పాఠకుల మనస్సులో బలంగా నాటుకోదు.

 గౌతమి – రాధా మండువ (ఈ మాట, మార్చ్):తెలిసీ తెలియని వయసులో ప్రేమ-ఒక అమ్మాయి వైవాహిక జీవితంపై దాని ప్రభావం. ఇదీ వస్తువు. పాత్ర చిత్రణలో కథనంలో భాషా పరంగా ప్రతి వాక్యంలో రచయిత్రి ప్రతిభ కనపడుతోంది. కాకపోతే కథానాయక పిచ్చిదానిలా నటించడం, భర్త మితిమీరిన మంచితనం కథని వాస్తవానికి దూరంగా తీసుకెళ్తుంది. కథా రచనలో గుర్తించదగిన ప్రావీణ్యం ప్రదర్శించిన రచయిత్రి ఇతివృత్తంలో ఈ loose ends వైపు దృష్టి పెట్టివుంటే బాగుండేది.

సందల్ ఖోడ్ – ఇబ్రహీం(ఆదివారం ఆంధ్రజ్యోతి, 23 మార్చ్): కనిపించని గంధపుచెక్కని వెతకడం కథాంశం. అంతేనా అంటే అంతమాత్రమే కాదు. కుటుంబం కోసం అహర్నిశలూ శ్రమించే తల్లి, గుర్తించని తండ్రి, ఈ రెండూ గుర్తించిన కొడుకు. హృద్యమైన కథ, అందమైన కథనం, అమ్మ గొప్పదనాన్ని చాలా లలితంగా మరోసారి చెప్పిన సందర్భం. కుటుంబ సభ్యులందరికీ అహర్నిశలూ సేవ చేస్తూ తాను గంధపు చెక్కలా కరిగిపోతూ తన వాళ్ళకి జీవన పరిమళాలని అద్దిన తల్లి. తాను పగలంతా వెతికినా దొరకని గంధపు చెక్కని తన తల్లిలో కొడుకు చూసుకోగలగటం కథ ముగింపు. అనుభూతి ప్రధానమైన కథ అన్నది మామూలు సందర్భాల్లో ప్రశంస గానూ, నాలుగు కథల మధ్యనుంచి దాన్ని ఎన్నుకోవడానికి పరిమితిగానూ పరిణమిస్తుంది. అలాంటి పరిమితులు నిజానికి తాత్కాలికమే – కొన్నేళ్ళ తర్వాతయినా ఎవరైనా అమ్మ మీద మంచి కథని ఒకటి చెప్పండీ అంటే, మనం అందరం “ఇబ్రహీంగారు రాసిన సందల్‌ఖోడ్ ఉందండోయ్!” అని మనస్ఫూర్తిగా చెప్పేయవచ్చు!

ముసుగు వేయొద్దు మనసుమీద – కొల్లూరి సోమశంకర్ (కినిగే పత్రిక, మార్చ్): అరిచి చెప్పినంతమాత్రాన బలంగా చెప్పినట్టు కాదు. కథల విషయంలో అయితే, ఎంత చెప్పీ చెప్పనట్టుగా చెబితే, ఆ విషయానికి అంత పదును. ఈ సూత్రాన్ని చాలా ఎఫెక్టివ్ గా తన కథలో వాడిన రచయిత కొల్లూరి సోమశంకర్. నిరంతరం మారిపోతూ ఉన్న ఈ టెక్నాలజీ ప్రపంచంలో పాత తరానికి చెందిన కొందరు పరిగెత్తలేక, శక్తిసామర్ధ్యాలు లేక వెనకబడిపోవడం, ఉన్న ఉద్యోగం ఉంటుందా ఉండదా అన్న అనిశ్చితితో, అవమానంతో లోపల్లోపలే కుమిలి కమిలిపోవడం నేటి వాస్తవం. అలాంటి ఒక వర్గాన్ని పట్టుకోవడమే రచయిత వస్తువు పట్ల ప్రదర్శించిన ప్రతిభ. అంతే కాకుండా, ఆ వర్గ ప్రతినిధిని రోజువారీ కూలికి రకరకాల జంతువుల ముసుగులు వేసుకొని పిల్లలకి వినోదం కలిగించే వీరేశానికి పరిచయం చేసి, ఇద్దరి జీవితాల అనిశ్చితుల మధ్యా పోలిక తీసుకువచ్చి – జీవితం పట్ల ఉన్న ఆశ, పాజిటివ్ దృక్పథం జీవితాన్ని వెలిగించడానికి సరిపోతాయీ అన్న చిన్న సూచనతో కథ ముగించడం – చాలా బాగుంది. కథ చదివే పాఠకుడిలో సమస్య పట్ల సానుభూతి కలిగించే దిశగా ఎలాంటి వాక్యాలూ కనిపించవు. క్లుప్తత. ఒక్కరోజు సాయంత్రం జరిగే కథ. కథా ప్రారంభంలో అసంతృప్తితో పరిచయమయిన పాత్ర, “లైఫ్ అన్నాక ఫైట్ చేయాలి కదా” అని లైవ్లీగా మాట్లాడే వీరేశంల మధ్య భిన్నత్వం. పరిష్కారం దిశగా ఒక ఆశావహమైన ముగింపు. ఇవీ ఈ కథను నిలబెట్టిన అంశాలు.

ఈ మాసం ఉత్తమ కథగా ఎన్నుకోవడంలో “సందల్ ఖోడ్”, “ముసుగు వేయద్దు మనసు మీద” ఈ రెండింటినీ పరిశీలించాము. సమగ్రంగా జరిగిన చర్చలోని సారం స్థూలంగా చెప్పాలంటే – “సందల్ ఖోడ్” ఒక అనుభూతిని మాత్రమే ఇస్తే, “ముసుగు వేయద్దు..” ఒక ఆచరణీయమైన సందేశాన్ని ఇస్తోంది. అందువల్ల ప్రయోజనకరమైన కథాంశంతో, వస్తువు-శిల్పం-కథనాల మధ్య మంచి సమతుల్యతతో నడిచిన “ముసుగు వేయద్దు మనసు మీద” కథను ఈ మాసం ఉత్తమ కథగా నిర్ణయించాము.

 

ఉత్తమ కథ: ముసుగు వేయొద్దు మనసు మీద

రచయిత: కొల్లూరి సోమశంకర్

ప్రచురణ: కినిగే పత్రిక, మార్చ్-2014

 

సోమశంకర్ గారితో ఇంటర్వ్యూని తరువాతి భాగంలో ప్రచురిస్తాము!

 

కొసరు మెరుపు

పాతకథలని ప్రచురించే సంప్రదాయాన్ని తెలుగు వెలుగు, స్వాతి (మాస), గోతెలుగు.కామ్, విపుల వంటి పత్రికలు పాటిస్తున్నాయి. స్వాతి మాసపత్రికలో వచ్చిన “శత్రువు” (చలసాని ప్రసాదరావు),“గోతెలుగు.కామ్” 14.03.2014 సంచికలో వచ్చిన వెయిటింగ్ ఫర్ యాద్గిరి (భగవంతం) చదవదగ్గ కథలు. ఇవి కాక,మేఘాపహరణం (మాలతీచందూర్),మేలుమరువని కన్నీరు (కవికొండలవెంకటరావు),వారసత్వం (చొప్పదండి సుధాకర్),వెలుగు-నీడలు (ఇంద్రగంటిహనుమచ్ఛాస్త్రి),సుఖం (కె వి ఎస్ వర్మ) కథలు కూడా ప్రచురింపబడ్డాయి.

 

ఫిబ్రవరి: హాస్య కథల హవా!

 2 (1)

 

 

[ఫిబ్రవరి కథలలోకి వెళ్ళే ముందు ఓ చిన్నమాట. జనవరి నెల కథల పరిశీలనలో రెండు మంచి కథలు మా దృష్టిని దాటిపోయాయి. అవి – హిట్లర్ జ్ఞాపకాలు (డా. వి. చంద్రశేఖరరావు, పాలపిట్ట), చావుదేవర (రమాసుందరి, పాలపిట్ట). “హిట్లర్ జ్ఞాపకాలు” లేయర్డ్ గా సాగే కథనంతో కాలేజీ కేంపస్ లోని రాజకీయాలను పరిచయం చేస్తే, “చావుదేవర” సొగసైన ఒంగోలు మాండలికంలో సాగిన ఇద్దరాడవాళ్ళ కథ. రెండింటిలోనూ ప్రతీకాత్మకంగా రెండు జంతువులుండటం, రెండింటిలోనూ మిస్టిక్ లక్షణం వుండటం ఓ చిత్రమైన సామీప్యం. గత మాసంలో ప్రకటించిన జనవరి మంచి కథల జాబితాలో ఈ రెండు కథలూ తప్పకుండా చేర్చతగినవి. జరిగిన పొరపాటు సహృదయంతో అర్థం చేసుకోని క్షమించగలరని ఈ ఇద్దరు రచయితలను, పాఠకులను కోరుతున్నాము. మేము వీలైనంత సమగ్రంగా పరిశీలించే ప్రయత్నం చేస్తున్నప్పటికీ మాకున్న పరిమితుల వల్ల ఏవైనా కథలు/పత్రికలు మా దృష్టిని దాటిపోతే పాఠకులు సూచించడం ద్వారా ఈ కృషిని సమిష్టిగా, సమగ్రంగా చేయగలరని మళ్ళీ కోరుతున్నాము.]

 

ఇక ఫిబ్రవరి కథలలోకి వద్దాం –

ఫిబ్రవరి కథలలో రెండు ప్రత్యేకతలు వున్నాయి. మంచి కథల జాబితాలో చేర్చతగిన కథలలో చాలా వరకు హాస్యకథలు వున్నాయి. ఇది చాలా “ఆనందకరమైన” పరిణామం. రెండవది – చాలావరకు మంచి కథలు వెబ్ పత్రికలలో రావటం. సంఖ్యాపరంగా వెబ్ పత్రికలన్నీ కలిపితే కొన్ని కథలే వస్తున్నప్పటికీ వాటిలో మంచి కథల శాతం, ప్రింటు పత్రికలలో వస్తున్న మంచి కథల శాతం కన్నా ఎక్కువ వుండటం మరో పరిణామం. ఇది విస్తరిస్తున్న వెబ్ సాహిత్యానికి నిదర్శనమా లేక ప్రింటు పత్రికలలో క్షీణిస్తున్న ప్రమాణాలకు చిహ్నమా అన్నది మరింత లోతుగా పరిశీలించవలసి వున్నది. మరి కొన్ని నెలల పరిశీలన తరువాత ఈ విషయం గురించి మరింతగా మాట్లాడుకుందాం.

ఇందాక చెప్పినట్లు ఈ నెల హాస్య కథల హవా నడిచింది. ఓ అంతర్జాల పత్రిక హాస్య కథల పోటీ నిర్వహించి అందులో బహుమతి పొందిన కథలను ప్రకటించడం అందుకు ముఖ్యకారణం కావచ్చు. అయితే తెలుగు సాహిత్యంలో హాస్య కథల విషయంలో ఓ చిన్న చూపు వుంది. ప్రముఖ వార్షిక సంకలనాలలో హాస్యకథలు అరుదుగా చోటు చేసుకుంటాయి. ఎక్కడో సెటైర్ కథలలో తప్ప కథాంశంలో బలం వుండదనీ, పాఠకులను నవ్వించడమే తప్ప ఇలాంటి కథలతో సామాజిక ప్రయోజనం పెద్దగా వుండదనీ కారణం చెప్తారు. పాఠకులను నవ్వించడమే ఓ సామాజిక ప్రయోజనమనే వాదన కూడా వుంది. ఏది ఏమైనా హాస్య కథ రాయడం కష్టమైన పని. మంచి పరిశీలన (వస్తువు కోసం), మంచి వాక్య నిర్మాణం (శైలి) వుంటే తప్ప హాస్యకథలు పండవు. అందుచేత ఈ నెల హాస్య కథలను ప్రత్యేకంగా ప్రకటిస్తున్నాము. ఇవేవీ కాకపోయినా మిగిలిన (సో కాల్డ్ సీరియస్) కథలు ఇచ్చే నిరుత్సాహం నుంచి కాస్త తెరిపిగానైనా వీటిని చదువుకోవచ్చు.

ఇక మిగిలిన కథల గురించి –

గత మాసం చెప్పినట్లుగానే తెలుగు కథకులలో వస్తు వైవిధ్యం కోసం ప్రయత్నం ప్రస్ఫుటంగా కనిపిస్తోంది. సమకాలీన అంశాలకు కథా రూపం ఇచ్చే ప్రయత్నాలు చాలా మంది చేస్తున్నారు. రైతు కష్టాలు, పిల్లలు వదిలేసిన తల్లిదండ్రులు వంటి నిలవ కథాంశాలు అడపాదడపా కనపడుతున్నా వాటి సంఖ్య తగ్గుముఖం పట్టింది. వర్తమాన వస్తువులతో కథలు వస్తున్నా ఆ వస్తువు లోతుల్లోకి వెళ్ళే విషయంలో కొంత అలసత్వం కనిపిస్తోంది. వస్తు వైవిధ్యం ప్రోత్సహించవలసినదే కానీ, వస్తువు పట్ల మరికొంత గాఢమైన పరిశీలన లేకపోవడం లేదా అది కథలో ప్రతిఫలించలేకపోవడం మాత్రం హర్షించదగ్గ విషయం కాదు. ఓ గంభీరమైన విషయాన్ని కథలో ప్రవేశపెట్టినంత మాత్రాన అది గంభీరమైన కథ అయిపోదు. ఆ విషయం తాలూకు విభిన్న కోణాలు కథలో సూత్రామాత్రంగానైనా స్పృశించబడాలి.

ఫిబ్రవరిలో చెప్పుకోదగ్గ కథలను చూద్దాం –

“సుపుత్రుడు” (బి. గీతిక, స్వాతి మాసపత్రిక) కథ రొటీన్ అనాధ వృద్ధుల కథ అయినప్పటికీ ఓ అనాథను తెచ్చి పెంచుకోవడంతో ముగిసే విభిన్నమైన ముగింపు ఉన్న కథ. “శివుడి పెళ్ళి” (జయంతి వెంకటరమణ, నవ్య వారపత్రిక) కథకు (పెళ్ళికి) ఆడపిల్లలు దొరకకపోవటం అన్న అంశం మీద ఆధారపడింది. ఇది సమకాలీనమే అయినా ఆ అంశం గురించి తక్కువ మాట్లాడటం వలనా, ఒక వ్యక్తి అనుభవంలా మాత్రమే మిగిలిపోవటం వలన చిక్కదనం కొరవడింది. “వెలుగు రేఖలు” (రాజేష్ యాళ్ళ, ఈనాడు ఆదివారం), “ఓటమి” (సనిహిత్, కౌముది) కథలు కార్పొరేట్ ప్రపంచంలోని ఉరుకులు పరుగుల గురింఛిన కథలు. రెండింటిలోనూ నాటకీయత ఎక్కువైనప్పటికి ఇప్పటి సందర్భానికి చెప్పవలసిన కథలు. “ఇదో రకం పోరాటం – ఈ నాటి పోరాటం” (గంటి భానుమతి, భూమిక) కథలో కూడా కార్పొరేట్ ప్రపంచం నేపధ్యం. అయితే అందులో స్త్రీ ప్రత్యేకమైన సమస్యలను ప్రతిపాదించారు. అలాగే “గడువు” (ప్రతాప వెంకట సుబ్బారాయుడు, స్వాతి వారపత్రిక) అదే ప్రపంచంలో నుంచి ఓ personality development కథను రాయగలిగారు. దొరికినదల్లా ’వాడుకునే’ లక్షణం గురించి “కొత్త పరుగు” (సి.యస్. రాంబాబు, సారంగ), అందినంతవరకు దోచుకునే లక్షణం గురించి “గుడి” (భువనచంద్ర, స్వాతి వారపత్రిక) ప్రస్తావించాయి. మనిషి యొక్క మౌలికమైన స్పందనలు – దయ, ఆశ, మోసం, మోహం వంటి గుణాలను విశ్లేషిస్తూ “వజ్రం” (జి. వెంకటకృష్ణ, ఆదివారం ఆంధ్రజ్యోతి), “కురిసిన మనసు” (జి. వెంకటకృష్ణ, నవ్య) కథలు కనిపిస్తాయి. చాలా పాత (సినిమా) కథాంశాన్ని కొత్తగా చెప్పిన “ముళ్ళగులాబి” (పులిగడ్డ విశ్వనాథరావు, తెలుగువెలుగు), కొంత అసహజంగా వున్నా ఆశావహంగా వున్న కథ “జనాగ్రహం” (డా. జి.వి. కృష్ణయ్య, స్వాతి వీక్లి) చెప్పుకోదగ్గవి.

వస్తుపరంగా చెప్పుకోదగ్గ ముఖ్యమైన కథ “టైలర్ శీను” (ప్రసాదమూర్తి, సారంగ). తెలంగాణ, సీమాంధ్ర ఉద్యమాల నేపథ్యంలో రాసిన ఈ కథ వర్తమానంలోనే వుంది. అయితే వివిధ వృత్తుల గురించి వాటిని కోల్పోవడం గురించి మొదలైన ఈ కథ, క్రమంగా చెప్పదల్చుకున్న సమస్యలోకి వెళుతుంది. అందువల్ల చెప్పదల్చుకున్న సమస్య కొత్తగా వచ్చి చేరినట్లు, కథ దిశ మారినట్లు అనిపించే ప్రమాదం వుంది.

ఇక భాష, కథనపరంగా చెప్పుకోవాల్సిన కథలు కొన్ని వున్నాయి. పైన ప్రస్తావించిన “టైలర్ శీను” కథే కాకుండా, “తరళ మేఘచ్ఛాయ, తరువాతి ఎడారి” (వై. విశారద, కినిగె పత్రిక), “ఓ చిత్ర కథ” (పూర్ణిమ తమ్మిరెడ్డి, కినిగె పత్రిక) కథలు విశేషంగా చెప్పుకోదగినవి. కవితాత్మక ధోరణిలో సాగే వాక్యాలు “టైలర్ శీను” కథకు కొత్త అందాన్ని ఇచ్చాయి. “తరళ మేఘచ్చాయ..” చాలా పెద్ద కథ అయినప్పటికీ శైలి పరంగా చాలా మంచి అనుభూతి మిగిల్చింది. “ఓ చిత్ర కథ” ఓ చక్కని ఫోక్ లోర్ కథని అన్వయిస్తూ సాగింఛిన కథనం బాగుంది. అయితే “తరళ మేఘచ్ఛాయ, తరువాతి ఎడారి” కథలో వస్తు బలం లేకపోవటం; “టైలర్ శీను”, “ఓ చిత్ర కథ” కథలలో ఫోకస్ మారిపోవడం వంటి సమస్యలవల్ల కథ ప్రారంభంలో ఒక మంచి కథ చదవబోతున్నామన్న నమ్మకాన్ని కలిగించినా, కథ గడిచే కొద్దీ ఆ నమ్మకం పల్చబడినట్లు అనిపిస్తుంది.

మొత్తంగా చూస్తే కథలన్నింటిలోనూ నాటకీయత ఎక్కువగా కనపడుతోంది. కథల్లో కనిపించే పాత్రలూ, జరిగే సంఘటనలూ మన చుట్టుపక్కల సాధారణంగా కనిపించేవీ, జరిగేవీ అయినప్పుడు మాత్రమే పాఠకులకి ఆ కథ నమ్మశక్యంగానూ, ఆలోచించదగినదిగానూ అనిపిస్తుంది తప్ప, కేవలం కథని నడపడం కోసమే పాత్రలనీ, సన్నివేశాలనీ సృష్టిస్తే అవి అసహజంగానూ, నాటకీయంగానూ కనిపిస్తాయి. పాఠకుడు అలాంటి కథని చదివిన వెంటనే మర్చిపోతాడు.

“శివుడి పెళ్ళి”, “సుపుత్రుడు”, “కురిసిన మనసు”, “గుడి” వంటికి కథలల్లో నాటకీయత పాళ్ళు కాస్త తూకం తప్పితే, “జనాగ్రహం”, “వెలుగురేఖలు”, “ఓటమి” వంటి కథల్లో దాదాపు అసహజత్వానికి దగ్గరగా వెళ్ళిపోయాయి. ఇది తెలుగు రచయితలు సమీక్షించుకోవాల్సిన అంశం. ఈ అసహజత్వానికి మరింత దోహదపడుతున్నవి సంభాషణలు. మామూలుగా మనం మాట్లాడుకునే విధానం కథలలో అరుదుగా కనపడుతోంది. చివర్లో ప్రసంగంలాంటి సంభాషణలు (ఇదో రకం పోరాటం…, వెలుగు రేఖలు మొదలైనవి), ఈ ప్రసంగం వల్ల ప్రధాన పాత్రలో తక్షణం మార్పు రావటం జరుగుతోంది. పాఠకుడికి కథా నేపథ్యం చెప్పడం కోసం పాత్రలు తమకు తెలిసిన విషయాలను vocalగా సంభాషించడం చాలా కథల్లో జరుగుతోంది. ఈ విషయం గురించి కూడా మరింతగా చర్చించాల్సిన అవసరం ఉన్నది.

వస్తుపరంగా బాగున్న కథలు కథనంలో వెనుకబడటం, కొన్ని కథలలో కథనం బాగున్నా వస్తు బలం లేకపోవటం, కథ తాలూకు లక్ష్యం స్థిరంగా లేకపోవటం, సహజత్వాన్ని దూరం చేసే నాటకీయత – ఈ నెల కథలలో ప్రధాన సమస్య. ఈ కారణంగా మొత్తం కథలలో ఉత్తమ కథ అంటూ ఏ ఒక్క కథ ఉండేందుకు ఆస్కారం లేదని మేము భావిస్తున్నాము.

 

ఫిబ్రవరి నెల హాస్యకథలు

వ్యాసం మొదట్లో ప్రస్తావించినట్టు, ఈ నెలలో కొన్ని మంచి హాస్యకథలు రావడం కొంత రిలీఫ్ కలగజేసింది. ఆ కారణం గానూ, రచయితల ప్రయత్నాన్ని అభినందించడానికి గానూ, ఒక్కో కథనీ పరిచయం చేస్తున్నాం!

ఆనందబాష్పాలు (గోతెలుగు, ఫిబ్రవరి) :: పి వి సాయిసోమయాజులు

మండుతున్న ఉల్లిపాయల ధరల గురించి. హాస్యకథ గా పర్వాలేదనిపించింది.

 

సాఫ్ట్ వేర్ ఇంజనీర్ (గోతెలుగు, ఫిబ్రవరి) :: అశోక్ పొడపాటి

సాఫ్ట్ వేర్ ఇంజనీరే తన అల్లుడు కావాలని పట్టుబట్టిన మామ కథ. కథనంలో మంచి హాస్యాన్ని అందించగలిగారు.

 

సుబ్బారావూ, బ్యాంకు అకౌంటూ (గోతెలుగు, ఫిబ్రవరి) :: రాజేష్ యాళ్ళ

ఇంటింటికీ తిరిగి ఎకౌంట్లు ఓపెన్ చేసే ఓ బాంకు పెట్టిన కష్టాల కథ. వాస్తవానికి చాలా దగ్గరగా ఉన్న మంచి హాస్యకథ.

 

 

ఫిబ్రవరి నెల కథలు

పైన వ్యాసంలో ప్రస్తావించిన ఫిబ్రవరి నెల కథలు ఇవి. చదివి, మీరూ వాటి మంచిచెడ్డల గురించి ఆలోచించదగ్గ కథలు.

కథ

రచయిత

పత్రిక

సంచిక

ఇదోరకం పోరాటం – ఈనాటి పోరాటం గంటి భానుమతి భూమిక ఫిబ్రవరి
ఓ చిత్ర కథ పూర్ణిమ తమ్మిరెడ్డి కినిగె పత్రిక ఫిబ్రవరి
ఓటమి సన్నిహిత్ కౌముది ఫిబ్రవరి
కురిసిన మనసు జి. వెంకటకృష్ణ నవ్య 19 ఫిబ్రవరి
కొత్తపరుగు సి. యస్. రాంబాబు సారంగ ఫిబ్రవరి
గడువు ప్రతాప వెంకట సుబ్బారాయుడు స్వాతి వారపత్రిక 7 ఫిబ్రవరి
గుడి భువనచంద్ర నది మాసపత్రిక ఫిబ్రవరి
జనాగ్రహం డా. జి.వి. కృష్ణయ్య స్వాతి వీక్లీ 14 ఫిబ్రవరి
టైలర్ శీను ప్రసాదమూర్తి సారంగ ఫిబ్రవరి
తరళ మేఘచ్చాయ, తరువాతి ఎడారి వై. విశారద కినిగె పత్రిక ఫిబ్రవరి
ముళ్ల గులాబి పులిగడ్డ విశ్వనాథరావు తెలుగు వెలుగు ఫిబ్రవరి
వజ్రం జి. వెంకటకృష్ణ ఆదివారం ఆంధ్రజ్యోతి 16 ఫిబ్రవరి
వెలుగు రేఖలు రాజేష్ యాళ్ళ ఈనాడు ఆదివారం 16 ఫిబ్రవరి
శివుడు పెళ్ళి జయంతి వెంకటరమణ నవ్య 26 ఫిబ్రవరి
సుపుత్రుడు బి. గీతిక స్వాతి  మాసపత్రిక ఫిబ్రవరి

(అకారాది క్రమంలో..)

—అరిపిరాల సత్యప్రసాద్, ఏ. వి. రమణమూర్తి, టి. చంద్రశేఖర్ రెడ్డి

02. T Chandra Sekhara Reddy

 01. Ramana Murthy03. Aripirala

రాయకుండా ఉండలేనితనం వచ్చేదాక రాయను: పెద్దింటి

ప్రతి నెల వచ్చిన కథలన్నీ చదివి, మేము నిర్ణయించుకున్న ప్రాతిపదికల ఆధారంగా మిగిలిన కథలకన్నా ఉత్తమంగా వున్న కథను ఎంపిక చేసి మీకు పరిచయం చేసే ప్రయత్నం ఇది. అంటే మేము ప్రకటించే కథ ఉత్తమకథా లక్షణాలన్నింటినీ పుణికిపుచ్చుకుందని కాదు. కేవలం సాపేక్షంగా మిగిలిన కథల కన్నా బాగుందని మాత్రమే దాని అర్థం. ఇందులో మరో కోణం వుంది. మేము నిర్ణయించుకున్న ప్రాతిపదికలు కొంత మారిస్తే మరో కథ మంచి కథగా అనిపించే అవకాశం వుంది. అలాంటి ఇబ్బంది లేకుండా బాగున్నాయనిపించిన కథలను అన్నింటినీ ప్రకటిస్తున్నాము. అందువల్ల ఏ ప్రాతిపదికన చూసినా ఆ నెలకి ఉత్తమ కథ ఏదైనా ఈ లిస్టులో వుండే తీరుతుందని మా నమ్మిక. మా అభిప్రాయంతో విభేదించి, విశ్లేషణలతో మరో మంచి కథని పాఠకులు పరిచయం చేయగలిగితే మా ప్రయత్నం మరింత సఫలవంతమైందని మేము భావిస్తాము. అలాంటి చర్చకు తలుపులు తెరవడమే మా ముఖ్యోద్దేశ్యం.

img3

 

గతవారానికి కొనసాగింపుగా – జనవరి నెల కథగా ఎన్నికైన ‘ప్లాసెంటా’ (రచయిత: శ్రీ పెద్దింటి అశోక్ కుమార్)  గురించి చర్చిద్దాం.

ఉమ్మడి కుటుంబాలు అరుదైన నేపథ్యంలో – భార్యాభర్తలిద్దరూ ఉద్యోగస్తులు కావడం, తమ తమ ఉద్యోగం నిలబెట్టుకోవడానికి లేదా ఉద్యోగస్థాయి పెంచుకోవడటానికి వాళ్ళు పడే తాపత్రయం ఒక స్త్రీ జీవితంలో ఎలాంటి సమస్య సృష్టించింది ఆ సమస్యనుంచి బయటపడటానికి ఆమె ఏ మార్గాన్ని ఎన్నుకున్నది, దాన్ని ఎలా అమలు పరచిందీ అన్నది కథా వస్తువు. అంతేకాకుండా, వ్యక్తిగత స్థాయిలో తీసుకునే ఇలాంటి నిర్ణయాలకి ఫేస్ బుక్ లాంటి వేదికలలో గుంపు మనస్తత్వాల ప్రోత్సాహం ఎలా ఉంటోందో చెప్పిన కథ కూడా. ఇతివృత్త పరంగా సమకాలీనత ఉన్న ప్రధాన సమస్యలని అనుసంధానించి నడిపిన కథ కనుక, ‘ప్లాసెంటా’ ఒక విభిన్నమైన కథగా అనిపించింది.

పరిష్కారం కచ్చితంగా చెప్పలేని కథలని నడపడం అంత తేలికైన పని కాదు. ఇలాంటి కథల్లో వస్తువు తాలూకు విభిన్న పార్శ్వాలని ప్రతిభావంతంగా చూపించి, పాఠకులు ఒక సమగ్ర అవగాహనకి రాగలిగిన పరిస్థితిని కలగజేయాలి. కానీ, కథ మళ్ళీ చర్చలాగానో, వ్యాసంలాగానో అనిపించకూడదు. వస్తువులోని గాంభీర్యతకీ, పఠనీయతలోని సౌకర్యానికీ మధ్య సరైన బ్రిడ్జ్ ఉంటేనే ఇలాంటి కథలు నప్పుతాయి. గుర్తుండిపోతాయి. మరి ఈ కథ ఎంతవరకూ ఈ విషయంలో సఫలమైంది?  చూద్దాం.

మంచి కథ ప్రారంభంలోనే కథ పట్ల ఉత్సుకతని కలిగించి పాఠకుడిని తనతో కథ చివరిదాకా ప్రయాణానికి మానసికంగా ఆయత్తం చేయగలగాలి. ప్లాసెంటా కథ ఎత్తుగడ, కొన్ని గందరగోళాల మధ్య దురదృష్టవశాత్తూ పాఠకుడికి ఈ సౌకర్యం కల్పించలేక పోయింది.

సమస్యని ఎదుర్కొనే వ్యక్తి మనస్తత్వాన్ని బట్టి, ఆ వ్యక్తి జీవన పరిస్థితిని బట్టి ఎన్నుకొనే పరిష్కారాలు మారుతుంటాయి.  ‘ఈ పరిష్కారం ఆమోదయోగ్యం కాదు’, ‘ఫలానా పరిష్కారమే సరైనది’ అని కచ్చితంగా నిర్ణయించటం కష్టం. సుజన ఉద్యోగపరంగా విదేశాలకి పోవటం ఒక అరుదైన అవకాశంగా భావించింది. శైశవదశలో ఉన్న కన్నబిడ్డకి దగ్గరగా ఉండటంకన్నా అతడ్ని విడిచి వెళ్లటం వైపే ఆమె మనసు మొగ్గు చూపింది. కానీ బాబుని దూరం చేసుకోవటం కోసం ఆమె ఎన్నుకున్న మార్గం, అది అమలు పరచిన తీరు చాలా క్రూరంగా ఉంది.

కథనంలో ఎక్కడ కూడా సుజన బాబుని వదిలిపెట్టటానికి బాధ పడినట్లు మానసిక సంఘర్షణ అనుభవించినట్లు కనపడదు. వదిలించుకోవడానికి పడ్డ బాధే కనపడుతుంది. అవసరం బాధ్యతని ఎంత మర్చిపోయేలా చేసినా,  ఒక స్త్రీ తన మాతృత్వలక్షణాలని పూర్తిగా విస్మరించి ప్రవర్తించిన తీరు ఆమోదయోగ్యమా అన్నది ప్రక్కన పెడితే – అసహజంగా, నమ్మశక్యంగా అనిపించకపోవడం కథలో కొట్టొచ్చినట్లు కనపడే లోపం.  ఓ పాత్రని సహజత్వానికి దూరంగా కర్కశంగా చిత్రీకరించడం ద్వారా అనుకున్న ముగింపు వైపు కథని నడపడం అనేది రచయిత తనకి అనువుగా కథని డిజైన్ చేసుకోవడమే!

కథ చెప్పడంలో ఇలాంటి లోటుపాట్లు ఉన్నప్పటికీ, పాఠకుడిలో ఆలోచన రేకెత్తించడంలోనూ, ఓ వర్తమాన సమస్యని చర్చకి తీసుకురావడంలోనూ ఈ కథ మిగిలిన (జనవరి) కథలకన్నా ముందు వుండటం వల్ల ఈ కథని ఉత్తమ కథగా నిర్ణయించడం జరిగింది. ఈ కథ విషయమై రచయిత పెద్దింటి అశోక్ కుమార్ గారితో సంభాషణ జరిపినప్పుడు ఆయన ప్రస్తావించిన అనేక కోణాలు ఇలాంటి చర్చకు సంబంధించినవే. అయితే – ఈ సంభాషణలో ఉన్నంత స్పష్టంగా ఆ అంశాలు కథలో ప్రతిఫలించి ఉన్నట్టయితే, ఈ కథ ఇంకొంత మంచి కథ అయివుండేది!

peddinti

ప్లాసెంటా కథా రచయిత శ్రీ పెద్దింటి అశోక్ కుమార్ గారితో సంభాషణ:

ఈ కథా నేపధ్యం వివరించండి. ముఖ్యంగా ఈ ఆలోచన ఎలా వచ్చింది అది కథగా ఎలా రూపు దిద్దుకుంది?

 

ఇది ప్రస్తుతం అన్ని కుటుంబాల్లో ఉన్న సమస్య. ఏ ఇంటికి వెళ్ళినా ఎదురయ్యే సమస్య. ఎవరైనా రిటైర్మెంట్ తీసుకుని తీరిగ్గా ఉన్నారంటే వారింట్లో ఓ చిన్నపిల్ల తప్పకుండా ఉంటుంది. ఉద్యోగం చేసే మహిళలకు ఇది తప్పనిసరి. మెటర్నిటీ సెలవులు ఎక్కువగా ఉండవు. సెలవు పెట్టే వీలుండదు. ఉద్యోగం చేయక తప్పని పరిస్థితి. అందుకని ఈ పరిస్థితి.

 

నేను టీచర్ ను. మా కొలీగ్ ఒక అమ్మాయి మెటర్నిటీ లీవ్ నుంచి స్కూల్లో జాయిన్ అయింది. స్కూల్ కు బాబును తీసుకొచ్చింది. రెండు వారాల తరువాత బాబును తీసుకురాలేదు. ఎందుకని అడిగితే అమ్మ వద్దకు పంపానని చెప్పింది. కారణం అడిగితే DL కోసం ప్రిపేర్ కావాలంది. ఆ నేపధ్యంలోంచి ఈ కథ పుట్టుకొచ్చింది.

 

ఈ కథలో మీరు రాసిన సమస్య ఈ తరానికి చాలా అవసరమైనది, ప్రస్తుతాన్వయం (relevant) చేయతగినది కూడా .మీ కథా వస్తువులో సమకాలీనత వుండేలే మీరు ఎలాంటి ప్రయత్నాలు చేస్తారు.

 

పరిశీలన చేస్తాను. అధ్యయనం చేస్తాను. వర్తమాన సమస్యలనే వస్తువుగా స్వీకరిస్తాను. సమస్య ఎక్కడుందో అక్కడ నిలబడి విశ్లేషణ చేస్తాను.

 

వస్తువు విషయంలో చాలా వర్తమానతని పాటించే మీరు, కథ నిర్మాణ వ్యవహారంలో తీసుకునే జాగ్రత్తలు ఎలా ఉంటాయి? కథ డిజైన్ ని పూర్తిగా ముందే ప్లాన్ చేసుకుంటారా, లేక మనసుకి తోచింది రాసుకుంటూ పోతారా?

 

కథ మెదటి నుండి చివరి వరకు టైటిల్ తో సహా మనసులో అనుకున్నాకనే కథను రాస్తాను. అది కూడా అనుకోగానే కాదు. మనసులో ఉడికి ఉడికి కథను రాయకుండా ఉండలేనితనం వచ్చేదాక కథ గురించే ఆలోచిస్తుంటాను. రాసేప్పుడు కొత్త ఆలోచనలు వస్తే చిన్న చిన్న మార్పులు చేస్తాను. ఇంత ప్లాన్ వేసుకున్నా సింగిల్ సిటింగ్ లో ఎప్పుడూ కథను రాయలేదు. కనీసం రెండు మూడు రోజులైనా పడుతుంది.

 

ఇక కథలోకి వద్దాం –

సుజన మీద పాఠకులకి కొంత విముఖత ఏర్పడేటట్టుగా కథనాన్ని నడిపించారు. ఆమె వ్యవహరశైలి, ఆమెకు ఇతర మిత్రుల ప్రోత్సాహంఇదంతా ఒక కర్కశమైన లక్షణాలను ప్రదర్శించింది. ఇలా ఎందుకు చేశారు?

 

సబ్జెక్ట్ అలాంటిది. ఆమె కెరీర్ కోసం అమెరికా వెళ్లాలి. ఇంట్లో చిన్నబాబు ఉన్నాడు. అతనితో బాగా attachment ఉన్నది. ఇది నేటి ఆధునిక మహిళలకు జీవన్మరణ సమస్య. దేనిని ఎంచుకోవాలనే దాని మీద సంఘర్షణ. ఇది ఎవరికి వారే నిర్ణయించుకోవాల్సిన సమస్య. అయినా సామాజిక సమస్య. సుజనను వ్యతిరేకించిన తండ్రి ఉన్నాడు. అంటి ముట్టనట్టు ఉన్న భర్త ఉన్నాడు. ప్రోత్సహించిన మిత్రులు ఉన్నారు. ఎవరి ఆలోచనా పరిణితిలో వారి దీనిని విశ్లేషించారు. ఇదంతా కథా వస్తువులో ఒక భాగం.

 

సుజన తను చేసిన పనిని ఫేస్ బుక్ లో పెట్టినపుడు పలువురు లైక్ చేసినట్లు, అభినందించినట్లు రాశారు. సోషల్ నెట్ వర్కింగ్ ఆచారాలు అలవాటుగా, దురలవాటుగా, వ్యసనంగా మారిపోతున్న ఈ రోజుల్లో ఒక “లైక్” వెనకాల నిజమైన స్ఫూర్తి, సమర్థన ఉందని మీరు అనుకుంటున్నారా

అనుకుంటున్నాను. కొంతయినా స్పూర్తి ఉంటుంది. వ్యసనంగా కాక అవసరంగా చూసేవాళ్ళు కూడా చాలా ఉంటున్నారు. సోషల్ నెట్ వర్క్ అలవాటుగా కాకుండా అవసరంగా మారింది ఈ రోజుల్లో. వంద లైక్ ల వెనకాల ఆకతాయితనం ఉన్నా సగమైనా నిజమైన స్పందన ఉందనుకుంటున్నాను. ఒక అభ్యర్థికి రక్తం కావాలని పోస్ట్ చేస్తే ఇవ్వడానికి వందల మంది ముందుకువచ్చారట. ఆర్థిక సహాయం కావాలని టీవీల్లో ప్రకటిస్తే వెల మంది స్పందించి విరాళాలు అందించిన సందర్భాలున్నాయి. చదువుకోలేని ఆర్థిక పరిస్థితి గురించి జిల్లా ఎడిషన్ పేపర్లో వచ్చినా విరాళాలు ఇస్తున్నారు. అందుకని ఒక లైక్ వెనక ఎంతో కొంత నిజమైన స్పందన ఉందనే అనుకుంటున్నాను.

 

స్త్రీలు కూడా సమానావకాశాలు అందిపుచ్చుకుంటున్న ఈ రోజుల్లో – వాళ్ళు కెరీర్ నీ, ఫామిలీ లైఫ్ నీ ఎలా బాలెన్స్ చేసుకోవాలి అని మీరు అభిప్రాయపడుతున్నారు. ఒకదానికోసం మరొకటి నిర్లక్ష్యం చేయాల్సిన పరిస్థితే వస్తే…?

స్త్రీ అప్పటికీ ఇప్పటికీ బాధితురాలే. సమాన అవకాశాలు అనేది వాస్తవం కాదు. ఈ రోజు అన్ని రంగాలో స్త్రీలు ప్రవేశిస్తున్నారని ఇదే సమాన అవకాశాలని మనం అనుకుంటున్నాం. కానీ అవకాశాల పేరున ఆమె మీద మరింత పీడనను పెంచుతున్నాం. ఇంట్లో నిశ్చింతగానో (పురుషుడు ఉన్నంతగా) ఇవతల భద్రంగానో ఆమె ఉంటుందని చెప్పగలమా? ఒక పురుషుడు జీవించినంత స్వేచ్ఛగా, రంధి లేకుండా స్త్రీ బతుకుతుందని చెప్పగలమా? అలాంటప్పుడు సమాన అవకాశమెలా అవుతుంది. అవకాశమంటే పొదటం ఒకటే కాదు. పొందినదాన్ని సమానస్థాయిలో అనుభవించడం కూడా.

 

వాళ్ళకూ కెరీర్ ముఖ్యమే. కానీ మాతృత్వమనే ఒక సమాజ నిర్మాణ బాధ్యత వాళ్ళ మీద ఉంది. ఇది చాలా సున్నితమైన సమస్య. చట్టాలో, నిర్బంధాలో ఈ సమస్యని పరిష్కరించలేవు. పురుష సమాజం అంతా ఆమెకు సహకరించాలి. బాధ్యత కొంతైనా పంచుకోవాలి. ఒకదాని కోసం ఒకటి అన్నప్పుడు దేనికి ప్రాధాన్యత ఇవ్వాలన్న క్రమాన్ని సమస్యను బట్టి వారే నిర్ణయించుకోవాలి.

 

ప్రస్తుత యువతరం – వాళ్ళ బాధ్యతలని మర్చిపోయి కేవలం డబ్బు సంపాదన ధ్యేయాలతో తమ ఉనికిని కోల్పోతున్నారని మీరు అనుకుంటున్నారా?

లేదు. సమాజంలో మంచి – చెడు, బాధ్యత లేకుండా తిరగడం – బాధ్యతతో ఉండడం ఎప్పుడూ ఎక్కువనో తక్కువనో ఉన్నదే. కాకుంటే ఇప్పటి యువతరం కొంత ఎక్కువగానే బాధ్యతా రాహిత్యంగా డబ్బు మత్తులో ఉన్నారు. అందుకు కారణాలు అనేకం. వేగవంతమైన ప్రపంచం, అందుబాటులో సాంకేతిక పరిజ్ఞానం, డబ్బు అవసరం ఇలాంటివి. ముఖ్యంగా పిల్లలకు విలువలు నేర్పే ఇల్లు, పాఠశాలలు ఆరోగ్యంగా లేకపోవడం ఇందుకు ప్రధాన కారణం. ఈ కథకు మూలం అదే.

 

పసి పిల్లల మనసు తెల్లకాగితం లాంటిదని శాస్త్రవేత్తలంటారు. పైగా శిశువు మూర్తిమత్వానికి పునాదులు తల్లి గర్భంలో ఉన్న ఆరు నెలలు, బయటకు వచ్చాక రెండేళ్ళ కాలమే ముఖ్యం. ఈ కాలంలో మెదడులో ఫీడయిన అంశాలతోనే శిశువు వ్యక్తిత్వ నిర్మాణం మొదలవుతుంది. ఇక్కడ తగిన జాగ్రత్తలు తీసుకుంటే ఆరోగ్యకరమైన సమాజ నిర్మాణం జరుగుతుంది. ఇక్కడ నిర్లక్ష్యంగా తల్లిదండ్రులూ, సమాజం వ్యవహరించి బాధ్యత గల యువతరం కోసం చూస్తే వేప చెట్టు నాటి మామిడి పండ్ల కోసం ఎదురు చూసినట్లే.

 

ఈ కథలో ప్రథాన సమస్యతో పాటు మీరు మరి కొన్ని ప్రస్తావించారు. పాల సీసాల కుట్ర, కులం-జండర్ వగైరాలు. ఇవి మీరు చెప్పదలచుకున్న విషయానికి అడ్డంకుల్లాగానీ, లేకపోతే బలవంతపు జస్టిఫికేషన్లు అని కానీ అనిపించలేదా?

లేదు. కథలో ఒక భాగమే. ముందే చెప్పుకున్నట్టు నవజాత శిశువు, శిశువు దశలోనే అనేక అంశాలు పిల్లల మెదట్లో స్ఠిరపడిపోతాయి. అవి పరిసరాల వల్ల, కుటుంబం, తల్లిదండ్రులు ముఖ్యంగా తల్లి వల్ల జరిగే ప్రక్రియలు. మేం స్కూల్లల్లో మూడు నాలుగేళ్ళ పిల్లలను చూస్తాం. ఆ వయసులోనే ఆడపిల్లలు ఒదిగి ఉంటారు. మగపిల్లలు స్వేచ్ఛగా ఉంటారు. అలవాట్లలో కూడా తేడా ఉంటుంది. తర్వాత వాళ్ళు ఏ సామాజిక వర్గం నుంచి వచ్చారు, ఏ కుటుంబాల నుంచి వచ్చారు అన్నది అద్దంలా కనిపిస్తుంది. అది వారికి ఎవరూ అంతవరకు బోధించలేదు. కానీ పరిసరాల నుంచి వారి మెదట్లో ఫీడయిన అంశలు అవి. భవిష్యత్ లో ఆ పిల్లలను నడిపించే అంశాలు అవి. తండ్రి కూతుళ్ళ మధ్య ఆలోచనా, పరివర్తనలో తేడాలను చూపిస్తున్నప్పుడు సమాజం, బహుళజాతి కంపెనీలు తల్లి బిడ్డలను ఎలా వేరు చేసి వ్యాపారం చేస్తున్నాయని చెప్పే క్రమంలో పాలసీసా అంశం వచ్చింది.

 

ఒక సరదా ప్రశ్న – ఇదే వస్తువుని, మనకన్నా ఓ రెండు మూడు తరాల ముందున్న రచయిత/త్రులలో (వారిప్పుడు మనమధ్యన లేకున్నా…) – ఎవరైతే బాగా రాయగలరని మీ ఉద్దేశం? అదే – వర్తమాన రచయిత/త్రులలో?

ఈ సమస్యను ఒక్క కోణంలో కాదు. అనేక కోణాల్లోంచి చూడవచ్చు. ఒకరు సెంటిమెంట్ గా చూడవచ్చు. ఒకరు స్త్రీ హింస కోణంలోంచి చూడవచ్చు. ఈ సమాజ నిర్మాణమనేది ఒక స్త్రీ మూర్తి ప్రసాదించిన భిక్షనే కాబట్టి ఒకరు త్యాగమే కోణం లోంచి, మరొకరు స్త్రీ చైతన్య కోణంలోంచి, ఇంకొకరు పురుషుడికి ఈ బాధ్యతలు ఏవీ లేవు కాబట్టి ఆ కోణంలోంచి, ఇంకో అడుగు ముందుకు వేసి తల్లి బిడ్డల మధ్య జరిగిన కుట్రల కోణంలోంచి మరొకరు ఇలా అనేక మంది గొప్పగా ఆవిష్కరించవచ్చు. కొత్తతరంలో అయితే గీతాంజలిగారు, కుప్పిలి పద్మగారు, ప్రతిమగారు ఇంకా చాలా మంది ఈ సున్నితమైన సమస్య గురించి అద్భుతంగా రాయగలరు.

 

ఇందులో చర్చించిన సమస్యని అధిగమించే దిశగా మనం ఏం చెయ్యాలి?

సమస్త మానవాళికి, సమాజ నిర్మాణానికి తొలి అడుగు తల్లి. అది ప్రకృతి సిద్ధం. చెట్టు మీద పువ్వు పూసి కాయ కాసినంత ప్రశాంతంగా తల్లిబిడ్డల మధ్య సంబంధం ఉండాలి. అందుకు తగిన విధంగా చట్టాలు, సమాజం రూపొందాలి. పురుషుడు మారాలి. నవజాత శిశుదశ శిశువు వ్యక్తిత్వ నిర్మాణంలో అత్యంత కోలకమైనది కాబట్టి ఈ వయసులో పిల్లలు తల్లిదండ్రులతోనే ఉండేట్లు జాగ్రత్తలు తీసుకోవాలి. పిల్లల భవిష్యత్ కోసమే కష్టపడి డబ్బు సంపాదిస్తున్నామన్న తల్లిదండ్రులు పిల్లల భవిష్యత్ అనేది తమ పెంపకం వల్ల కూడా ఉంటుందన్న విషయం గుర్తించాలి.

మంచి కథల కోసం ఒక అన్వేషణ!

2 (1)

ఇది ప్రస్తుతం వస్తున్న కథల గురించి మాటా మంతీ. ఒక నెలలో వచ్చిన కథలన్నీ పరిశీలించి, అందులో కొన్ని ఉత్తమమైన కథలని ఎన్నుకోవడం, ఆ కథలను, కథకులను అభినందించుకోవడం ఈ శీర్షిక ప్రధాన ఉద్దేశ్యం.

ఈ పనిని మేము నిర్వహించడానికి కొన్ని ముఖ్యమైన కారణాలున్నాయి.

వాటిల్లో ముఖ్యమైనదీ, మొట్టమొదటిదీ – ఇలాంటి ప్రయత్నం ఈ మధ్య ఏ పత్రికలోనూ జరగకపోవడం! ఏడాది తరువాత కొన్ని పత్రికలు ఒక సింహావలోకనాన్ని వెయ్యడం, కొన్ని సంవత్సర సంకలనాలలో సమీక్షా వ్యాసాలు రాయడం జరిగినప్పటికీ వాటికి ఎక్కువ కథలను స్పృశించే అవకాశం తక్కువ.

ప్రస్తుతం ఉన్న రకరకాల ప్రింట్ పత్రికల్లోనూ, ఆన్‌లైన్ పత్రికల్లోనూ కలిపి సగటున నెలకి దాదాపు నూట యాభై కథల దాకా వస్తున్నాయి. ఏ కథలో ఏముందో, ఏ కథ ఎవరు రాశారో, ఏ మంచి కథ ఎందులో వచ్చిందో, అసలు ఏ పత్రిక ఎప్పుడు వస్తోందో – ఈ విషయాలన్నీ పాఠకులకి ఓ పద్ధతి ప్రకారం చేరడం లేదని కొంతకాలంగా గమనిస్తూనే ఉన్నాం. అసలు పత్రికలు దొరకబుచ్చుకోవటమే ఓ శ్రమగా మారిన తరుణంలో మంచి కథ వచ్చిందని తెలియడం, ఆ పత్రిక కోసం ప్రయత్నం చేసి చదవడం పాఠకుడు చేస్తాడని అనుకోవడం అత్యాశే అవుతుంది. అదీగాక, ఇన్ని వందల కథలని దాటుకునిగానీ ఒక మంచి కథని అందుకునే దాకా పాఠకుడికి ఓపిక ఉంటుందా? అన్నది మరో ప్రశ్న. ఓ మంచి కథ పాఠకుడికి తెలియకుండానే మరుగున పడిపోవడం ఆ కథకీ, రచయితకే కాదు సాహిత్యానికీ సమాజానికి కూడా చెడు చేసినట్లే కదా? అలాంటి ఒక వెలితిని పూరించడం మా ప్రయత్నం తాలూకు మరో లక్ష్యం.

అంతే కాదు – కథల గురించిన మంచీ చెడ్డా మాట్లాడటం ఎవరో ఒకరు మొదలెడితే, అలాంటి సంప్రదాయాన్ని మిగతా పత్రికలు కూడా అనుసరిస్తే – ‘మంచి కథ’ గురించి ఆలోచనా, అవగాహనా, స్పృహా, అభిరుచీ అటు రచయితల్లోనూ, ఇటు పాఠకులలోనూ పెరిగి – మంచి కథలు మరిన్ని రావడానికి దోహదపడగలదన్న ఒక చిరు ఆశ కూడా మా ఈ ప్రయత్నానికి ఒక కారణం.

మంచి కథల వార్షిక సంకలనాలని ప్రచురిస్తున్నవారు, ఆన్‌లైన్ పత్రికల్లో వస్తున్న కథలని ప్రస్తుతం పరిగణనలోకి తీసుకోవడం లేదు. రాసిన కథకి డబ్బు రూపంలో ప్రతిఫలాన్ని ఆశించకుండా ఈ పత్రికలకి రాస్తున్న రచయిత/త్రులకి కనీసం గుర్తింపు రూపంలోనైనా సరైన న్యాయం జరగడం లేదన్న ఉద్దేశంతో, వాటిని కూడా మేము పరిశీలించాలీ అన్న సదుద్దేశంతో కూడా ఈ శీర్షిక ప్రారంభిస్తున్నాం.

***

 

ఇలాంటి ప్రయత్నాన్ని ఏ ఒక్కరో చేస్తే, వ్యక్తిగతమైన మమకారావేశాల వల్ల నిర్ణయాల్లో కొన్ని లోటుపాట్లు జరిగే అవకాశం వుంటుంది. అలాంటి అవాంఛనీయమైన పరిస్థితులు తలెత్తకుండా ఉండటం కోసం ముగ్గురం కలిసి కథలని విడివిడిగా చదివి; వస్తువు, కథానిర్మాణం, శైలి వగైరా అంశాల మీద మార్కులు వేసుకొని; తుది దశలో కథల బాగోగులు చర్చించుకొని మరీ మంచి కథలని నిర్ణయించడం జరుగుతోంది. ఈ మొత్తం ప్రక్రియలో – సబ్జెక్టివిటీ అనే అంశాన్ని పూర్తిగా పక్కన పెట్టినట్టేనని మేము భావిస్తున్నాం!

ఇంత చేసినా ఇది ముగ్గురి సమిష్టి అభిప్రాయమే తప్ప ఏ విధంగానూ యావత్ పాఠకలోకానికో, సాహితీ ప్రపంచానికో ప్రాతినిధ్యం వహించే నిర్ణయం కాకపోవచ్చు. అలాగే కొన్ని పరిమితుల కారణంగా ఏదైనా మంచి కథ/పత్రిక మా పరిశీలనలోకి రాకపోయే అవకాశం లేకపోలేదు. అంచేత మీ దృష్టిలోకి వచ్చిన మంచి కథ/పత్రికలను మాకు ప్రతిపాదించి మా ప్రయత్నాన్ని ప్రోత్సహించాల్సిందిగా కోరుతున్నాము.

 

***

జనవరి కథలు

జనవరి నెలకు గాను దాదాపు 140 కథలని పరిశీలించడం జరిగింది. ఈ క్రింది పత్రికల్లోని కథలని పరిగణనలోకి తీసుకోవడం జరిగింది:

ఆదివారం అనుబంధాలు: ఈనాడు, ఆంధ్రజ్యోతి, ప్రజాశక్తి, విశాలాంధ్ర, నమస్తే తెలంగాణ, ఆంధ్రప్రభ, ఆంధ్రభూమి, సాక్షి, వార్త

 

వారపత్రికలు: జాగృతి, ఆంధ్రభూమి, స్వాతి, నవ్య

 

మాసపత్రికలు: రచన, నది, ఆంధ్రభూమి, చినుకు, తెలుగు వెలుగు, పాలపిట్ట, మిసిమి, స్వాతి, చిత్ర, విపుల, ప్రస్థానం, స్వప్న, ఆంధ్రప్రదేశ్

 

అంతర్జాల పత్రికలు: కౌముది, సారంగ, ఈమాట, వాకిలి, విహంగ, కినిగె, గోతెలుగు

 

కథలన్నీ చదివితే ముందు మన దృష్టిని ఆకర్షించేది – విభిన్నమైన వస్తువులని ఎంచుకోవడంలో రచయితలు చూపిస్తున్న ఆసక్తి. ఈ పరిణామం ముదావహం. సామాజిక నేపథ్యాలు నిరంతరం మారుతూ ఉండే పరిణామక్రమంలో తరచి చూస్తే, కొత్త కొత్త సామాజికాంశాలూ, వైరుధ్యాలూ, మానసిక కోణాలూ కనిపించక మానవు. అలాంటి వస్తువులని ఎన్నుకొని కథల చట్రంలో ప్రతిభావంతంగా బిగించగలిగిననాడు ‘కథ’ అనేది వర్తమానాన్ని అర్థవంతంగా విశ్లేషించుకోవడానికి ఉపయోగపడగల మాధ్యమం అవుతుంది. అలాగే వస్తువు పాతదైనా అందులో కొత్త కోణాన్ని ఆవిష్కరించే ప్రయత్నం కూడా గుర్తించతగినదే.

చిత్రం: కృష్ణ అశోక్

చిత్రం: కృష్ణ అశోక్

ఇప్పుడున్న సంక్లిష్టమైన, సందిగ్ధమైన సామాజిక నేపధ్యం అలాంటి వస్తువులనే ఇస్తుంది. అందువల్ల అవి రచయిత అధ్యయనశీలతనీ, శిల్ప సామర్ధ్యాన్నీ పరీక్షకు పెడుతున్నాయి. అయితే, చాలా మంది రచయితలు కొత్త కథాంశాలను అందిపుచ్చుకుంటున్నా, పూర్తిస్థాయి అధ్యయనం లేకపోవడం వల్లో, అనివార్యమైన మమకారావేశాల వల్లనో ఆ కథాంశాలను చిక్కగా, సమగ్రంగా అందిచలేకపోతున్నట్లుగా తోస్తోంది.

 

ఈ నెల వచ్చిన కథలలో చెప్పుకోదగ్గ కథలను విశ్లేషిస్తే –

 

“ప్లాసెంటా” – పెద్దింటి అశోక్ కుమార్ (అమెరికా ఉద్యోగం కోసం చంటి బిడ్డను వదిలించుకోవాలని ప్రయత్నం చేసే తల్లి), “సహజాతాలు” – విహారి (చదువులు, దొరకని ఉద్యోగాలు వల్ల డిప్రెషన్ లు, కొన్ని తప్పని నిర్ణయాలు)  “డేగలు తిరిగే ఆకాశం” – అరిపిరాల సత్యప్రసాద్ (పీడోఫైల్ ప్రపంచంలో ఓ తండ్రి ఆవేదన), “ఇద్దరు బిడ్డల తల్లి” – వేంపల్లె షరీఫ్ (ప్రాంత, మత జనిత ఉచ్ఛారణా దోషాలు కూడా వివక్షకి కారణమే) ఇవన్నీ వస్తువైవిధ్యాలకి ఉదాహరణలుగా నిలిచే కొన్ని కథలు.

 

కథ ప్రయోజనాల అంశాలని కాసేపు పక్కన పెట్టగలిగితే, ప్రశంసార్హమైన కథనశైలితో కథను నడిపిన ఉదాహరణలు కూడా కొన్ని కనిపించాయి. “సాంత్వనములేక” – తాడికొండ కె శివకుమార్ శర్మ (ముక్తపదగ్రస్త అలంకారంలా దుమికే కథనం), “నిద్రకు మెలకువకూ మధ్య” – పలమనేరు బాలాజీ (మిస్టిక్), “అసమయాల అమావాస్య” – సాయిపద్మ (మాంత్రిక వాస్తవికత), “మంచు” – మూలా సుబ్రమణ్యం (మిస్టిక్ మనిషి ప్రధానపాత్రగా). ఈ కథలలో శైలిశిల్పాలు ఎంత బలంగా వుండి చదివించాయో కథాంశం కూడా అంతే బలంగా వుండుంటే అద్భుతమైన కథలుగా మారే అవకాశం వుండేది. శివకుమార్ శర్మ కథ గొప్ప కథకు అడుగు దూరంలో ఆగిపోయింది. ఎంచుకున్న అంశాలను అన్నింటిని ముడి పెట్టడంలో కాస్త జారు ముడి పడిందని మా అభిప్రాయం.

 

కేవలం కథా కథనాలే కాకుండా సామాజిక/వ్యక్తిగత ప్రయోజనం రీత్యా ప్రస్తావించతగ్గ కథలు కొన్ని ఈ నెలలో కనిపించాయి. “ఆకలి” – పెద్దింటి అశోక్ కుమార్, “వారసులు” – జి. ఉమామహేశ్వర్, “ఇదేన్రీ హింగాయ్తూ” – ఓలేటి శ్రీనివాసభాను మెదలైనవి ఈ కోవకు చెందినవే. పాత కథా వస్తువు, సాధారణమైన కథనం ఉన్నప్పటికీ “సొంత సౌఖ్యము కొంత చూసుకు” – సింగరాజు రమాదేవి, (నవ్య, జనవరి 8), “పర్ణశాల” – దర్భా లక్ష్మీ అన్నపూర్ణ (స్వప్న మాసపత్రిక)  వంటి కథలలో పరిష్కారాన్ని కొత్త పుంతలు తొక్కించారు.

 

మొత్తం మీద చాలా కథలు ఆశావహ దృక్పధంతో ముగిసినట్లు, జనవరి కథలు ఆశావహంగానే అనిపించాయని చెప్పి ముగిస్తున్నాం.

 

జనవరి కథలని అనేక అంశాల ప్రాతిపదికన బేరీజు వేసుకుంటూ పోతే, ఈ కథ మా సమిష్టి అధ్యయనంలో జనవరి-2014 కథలలో ఉత్తమమైన కథగా నిలిచింది!

 

ప్లాసెంటా

తెలుగు వెలుగు

రచయిత: పెద్దింటి అశోక్ కుమార్

ఈ కథ గురించి మా విశ్లేషణ, రచయితతో ముఖాముఖి వచ్చే వారం…

 

మంచి ప్రయత్నం చేసిన ఇతర కథలు, పాఠకులు చదివి విశ్లేషించుకోగల వీలుగల మరికొన్ని కథలు:

  • సాంత్వనము లేక తాడికొండ కె. శివకుమార్ శర్మ (వాకిలి, జనవరి)
  • ఆకలి పెద్దింటి అశోక్ కుమార్ (నవ్య 22, జనవరి)
  • నిద్రకు మెలకువకూ మధ్య పలమనేరు బాలాజీ (నవ్య, 22 జనవరి)
  • డేగలు తిరిగే ఆకాశం అరిపిరాల సత్యప్రసాద్ (ఆదివారం ఆంధ్రజ్యోతి, 26 జనవరి)
  • అసమయాల అమావాస్య సాయిపద్మ (ఈమాట, జనవరి ఫిబ్రవరి సంచిక)
  • వారసులు జి. ఉమామహేశ్వర్ (ఆదివారం ఆంధ్రజ్యోతి, 19 జనవరి)
  • ఇద్దరు బిడ్డల తల్లి వేంపల్లె షరీఫ్ (నవ్య, 8 జనవరి)
  • ఇదేన్రీ హింగాయ్తూ ఓలేటి శ్రీనివాసభాను (నవ్య, 15 జనవరి)
  • సహజాతాలు విహారి (నవ్య, 1 జనవరి)
  • మంచు మూలా సుబ్రమణ్యం (ఈమాట, జనవరి-ఫిబ్రవరి)

– అరిపిరాల సత్య ప్రసాద్, ఎ.వి. రమణ మూర్తి, టి. చంద్ర శేఖర రెడ్డి.

   (లోగో :మహీ బెజవాడ)

02. T Chandra Sekhara Reddy03. Aripirala01. Ramana Murthy

నాకు నచ్చిన చాసో కథ: “ఎందుకు పారేస్తాను నాన్నా?”

images

చాసోని కథకుల కథకుడుగా వర్ణించారు కొకు. ఆ మాటేమో నిజమే. కానీ అందుకు నిదర్శనం? చాసో ఏ కథ తీసుకున్నా అందుకు నిదర్శనం కనపడుతుంది. ముఖ్యంగా ఆయన శిల్పాన్ని గమనిస్తే అందుకు తార్కాణాలు కథ కథలోను కనిపిస్తాయి. “వాయులీనం”, “ఏలూరెళ్ళాలి”, “బొండుమల్లెలు”, “ఎంపు”, “కుంకుడాకు” ఇంకా ఎన్నో…! ప్రతి కథలో ఓ వైవిధ్యమైన కథా వస్తువు, అలవోకగా సాగిపోయే నడక, అమాంతంగా వచ్చి మీదపడే ముగింపు. ఇవన్నీ గమనించుకుంటూ చదివితే ప్రతి కథకుడూ ఓ మెట్టు పైకెక్కడం ఖాయం. అలా ఎదిగిన ప్రతి కథకుడూ మళ్ళీ అదే మాట అంటాడు – “చాసో కథకుల కథకుడు” అని.

చాసో కథలలో బాగా నచ్చిన కథ ఏది అంటే చెప్పటం చాలా కష్టం. “ఎంపు” నేను మొట్టమొదట చదివిన చాసో కథ. అందులో నిష్కర్షగా, కఠోరంగా ఓ చెప్పిన జీవిత పాఠాన్ని ఆకళింపు చేసుకోడానికి గడిపిన ఒంటరి రాత్రి గుర్తొస్తుంది. “వాయులోనం” కథ చదవడం అయిపోయినా అందులో లీనమై బయటపడలేక గిలగిలలాడిన సందర్భం గుర్తుకొస్తుంది. కనీసం పది కథలు గుర్తొస్తాయి. అయితే ఇవన్నీ పాఠకుడిగా. ఈ మధ్యకాలంలో ఓ కథకుడిగా ఆయన్ని మళ్ళీ చదివినప్పుడు నాకు చాసోలో కనపడ్డవి జీవిత పాఠాలే కాదు, కథా రచన పాఠాలు కూడా. ఆ దృష్టికోణంలో చూస్తే నాకు చాలా బాగా నచ్చినది, ప్రభావితం చేసినది “ఎందుకు పారేస్తాను నాన్నా” అనే కథ.

(కథ చదవనివారుంటే ఆ కథని చదివి ఈ వ్యాసం కొనసాగించగలరు. ఇక్కడినుంచి తొలిపఠనానుభూతిని తగ్గించే సంగతులు వుండగలవు)

కృష్ణుడనే కుర్రవాడు. చదవాలని ఆశ. పేదరికం వాడి చదువుని మింగేసిన భూతం. తండ్రి చుట్టలు తెమ్మంటాడు. బడిమీదుగా పోక తప్పదు. నామోషీగా అటు వైపు వెళ్తాడు. నరిశింహం, శకుంతల అనే సహాధ్యాయులతో మాట్లాడతాడు. బడి మొదలైనా అక్కడి వరండాలో స్తంభానికి జేరబడి వుండిపోతాడు. తండ్రి వెతుక్కుంటూ వస్తాడు. కొడుకు బాధని తెలుసుకుంటాడు. కొడుకు బాధని తనూ పడతాడు. చుట్టాలు తెమ్మని ఇచ్చిన డబ్బులు వున్నాయా పారేశావా అంటాడు. – “ప… ప్ప… ప్పారీలేదు. జేబులో ఉన్నాయి… ఎందుకు పారేస్తాను నాన్నా?” అంటాడు కృష్ణుడు.

ఆ వాక్యంతో కథ అయిపోయింది. అదే వాక్యంలో మాట కథకి శీర్షిక అయ్యింది.

అదలా పక్కనపెడదాం. ఏమిటీ కథలో గొప్పదనం? చెప్పాలనుకున్న విషయం చిన్నదే. స్పష్టంగా చెప్పేడు కూడా. “ఎందుకు పారేస్తాను నాన్నా?” అన్న ఒక్క ప్రశ్న ఎన్ని ప్రశ్నలు పుట్టిస్తుంది? “ఎందుకు పారేస్తాను? ఎలా పారేస్తాను? నాకు బాధ్యత తెలుసు కదా నాన్నా. నా చదువాపేసిన పేదరికం గురించి కూడా తెలుసు కదా నాన్నా. ప్రతి రూపాయినీ పారేయకుండా ఉంచుకుంటే అవి నా పుస్తకాలకు పనికొస్తాయనీ తెలుసు కదా నాన్నా..” అంటూ పిల్లాడు అడిగనట్లు అనిపిస్తుంది. అంతకు ముందే పుస్తకం కొంటానని మాట ఇచ్చిన నాన్న, చుట్టలు మానేస్తే కృష్ణుడి జీతానికి సరిపోతుందనుకున్న నాన్నా, పిల్లాడు పారేయకుండా వుంచిన డబ్బుతో అప్పటికప్పుడు ఇంగ్లీషు పుస్తకం కొన్నాడా? ఎమో తెలియదు. కానీ తెలుసుకోవాలనిపిస్తుంది. కథ అయిపోయిన తరువాత ఏం జరిగుంటుందో అన్న ఆలోచనపుడుతుంది. ఇలా జరిగి వుంటే బాగుంటుంది అన్న ఆలోచన వచ్చేదాకా వెంటాడుతుంది. అదీ గొప్ప ముగింపు లక్షణం. చాసొ ప్రతి కథలో, (ప్రత్యేకించి ఈ కథలో) ఇలాంటి ముగింపులే వుంటాయి. తెలుగు కథలలో వచ్చిన అత్యుత్తమ ముగింపు వాక్యాలు రాస్తే అందులో పదింట అయిదు చాసోవి వుండితీరాల్సిందే..!

ముగింపుకు అంత బలం ఎక్కడ్నుంచి వచ్చింది? కథ మొదటి ముగింపుకి బలాన్ని ఇస్తూనే వుంటాడు చాసో. వాతావరణ చిత్రణ, పాత్ర చిత్రణ అన్నీ క్రమంగా ఈ సొరంగం తొవ్వుతున్నట్లు నిర్దేశించిన ముగింపు వైపు వెళుతూనే వుంటాయి. పాఠకుడి గమనించినా గమనించకపోయినా.

(కేవలం ఆరు పేజీల కథ ఇది. నేను పూర్తిగా విశ్లేషిస్తే అంతకన్నా ఎక్కువే అవుతుందేమో)

chaganti somayajulu copy

కృష్ణుడి పాత్రని తీసుకుందాం –

మూడో వాక్యంలోనే అనేస్తాడు – “కృష్ణుడి వీధి ముఖం చూడకుండా, మొగుడు చచ్చిన విధవలాగ ఇంట్లో దూరి కూచుంటున్నాడు” అని. చదువు మానేయడం వల్ల కలిగిన నామోషి కారణంగా బయటికి వెళ్ళని కుర్రాడు. ఇది కథ మొదలౌతూనే పాఠకుడి తెలిసేలా చెప్పేశాడు కథకుడు. తరువాత కథలో కృష్ణుడి మానసిక స్థితిని వర్ణిస్తాడు -కళకళలాడుతున్న “బడి చూడగానే బెంగ పట్టుకుంది”. ఒక చోట “నామోషి” అయితే మరో చోట “నామర్దా” అంటాడు. “చదువుతున్న కుర్రాళ్ళమీద ఈర్ష, తనకి చదువులేకుండా పోయిందన్న దుఃఖము – రెండూ రెండు లేడిక పాములై అతని బుర్రని కరకర లాడిస్తున్నాయి” అంటాడు. “తనకు చదువుపోయింది కదా అని కుమిలిపోతున్నాడు”. “(డిస్కంటిన్యూడ్ అన్న..) పదం జ్ఞాపకం రాగానే అతనికి దుఃఖము పొర్లుకుంటూ వచ్చింది…” ఇలా అడుగడుగునా కృష్ణుడి బాధని మన బాధ చేసేస్తాడు కథకుడు.

నరిశింహంతో మాట్లాడినప్పుడు కృష్ణుడు వాడి ముందు ఎంత అల్పుడో చెప్తాడు. నరిశింహం వేసుకునే డబుల్ కప్పు చెక్కా, హవానా పేంటు గురించి చెప్పి కృష్ణుడి నిక్కరులో వున్న పోస్టాఫీసు, చినిగిపోతే కుట్టగా బుట్టలా భుజాలు పైకి లేచే చొక్కా గురించి చెప్తాడు. అక్కడితో ఆగకుండా – “పేంటుకైతే బట్ట ఎక్కువ పడుతుంది. బట్ట ఎక్కువైతే డబ్బు ఎక్కువవుతుందని వాడికి తెలుసు” అంటాడు. ఈ వాక్యాన్ని కథ ముగింపు వాక్యంతో కలిపి చదవండి. ఆర్థిక అవసరాలు, డబ్బుల విలువ తెలుసుకున్న పిల్లాడు కృష్ణుడు. కాదూ పేదరికం నేర్పించిన పాఠాలను ఆకళింపు చేసుకున్నవాడు. వీడు కథానాయకుడు.

మరో నాలుగు వాక్యాలు ప్రయాణించగానే నరిశింహం ముందు అల్పుడిలా కనపడ్డ కృష్ణుడ్ని వెంటనే వామనావతారంలా పెంచేస్తాడు. “కృష్ణుడు మార్కుల గొడవ తేగానే గొప్పవాడైపోయాడు. తెలివైనవాడు కాబట్టే నలుగురూ గౌరవిస్తున్నారు” అంటాడు. తెలివితేటలు వుండి చదువుకోలేని అశక్తత ప్రదర్శించడం వల్ల ఆ పాత్ర మీద సింపతీ పెరుగుతుంది కదా..! అక్కడ్నుంచి కథంతా అదే ప్రదర్శన కొనసాగుతుంది.

enduku

శకుంతల కూడా తెలివైనదే. ఆ పిల్ల ఇంగ్లీషులో ఫస్టు. కృష్ణుడు తెలుగులో, లెక్కల్లో ఫస్ట్. గమనించండి లెక్కల్లో ఫస్ట్. డబ్బుకి లెక్కలకి వున్న సంబంధం డబ్బు పట్ల వుండే జాగ్రత్తే కదా..!! లెక్కలు బాగా వచ్చిన పిల్లాడికి డబ్బు విలువ తెలియకుండా ఎలా వుంటుంది. కలిసిన ఇద్దరు పిల్లలూ బడిలోకి రమ్మంటారు. కృష్ణుడి రానని చెప్పడు. అప్పటికే తన తల్లి తండ్రికి నచ్చజెప్పినా, తండ్రిమాటే నెగ్గుతుందనీ “చదువుకి స్వస్తి చెప్పడమే ఖాయమనీ” అప్పటికే నిర్థారించుకోని వుంటాడు. అయినా కలిసిన పిల్లలతో (ఒకటికి రెండుసార్లు) సోమవారం నుంచి బళ్ళో చెరుతానని చెప్తాడు. తన మనసులో వున్న ఆశని వాళ్ళ మీద ప్రొజెక్ట్ చేస్తాడు. ఓ క్షణం శకుంతలని వెనక్కి పిలిచి చెప్పేయబోతాడు కానీ తమాయించుకుంటాడు.

బళ్ళో వొంటరిగా స్తంభానికి జేరిబడి కూర్చోని తాను లేకుండా జరిగిపోతున్న క్లాసులను వింటాడు. గత సంవత్సరం జరిగిన క్లాసుల్లో తన ప్రతిభను గుర్తుచేసుకుంటాడు. స్కూలు మానేసిన మరో కుర్రవాడి పేరు కొట్టేసి “డిస్కంటిన్యూడ్” అని రిజిస్టర్లో రాసిన సంగతి గుర్తు చేసుకుంటాడు. తన భవిష్యత్తు ఏమిటా అని ఆలోచిస్తాడు. జరిగింది, జరుగుతున్నది, జరగబోయేది.. మూడింటిని కలిపితే “దుఃఖం పొర్లుకుంటూ” వస్తుంది.

“నేను ఇంటికి వెళ్ళను” అని అనుకుంటాడు. ముక్కు దిబ్బడేసిపోతుంది. “ముక్కుని ఎగబీల్చుకుంటూ పొంగుకొస్తున్న దుఃఖానికి ఆనకట్టలు” వేస్తాడే తప్ప ఏడవడు. మరెప్పుడు ఏడుస్తాడు? వాళ్ళ నాన్న వచ్చాక.

“వాళ్ళంతా బడికెళ్ళారు!”

“వెర్రి నాగమ్మా. అదిరా” అన్నాడు తండ్రి.

అప్పుడు ఏడ్చాడు. “వెక్కి వెక్కి చుట్టుకుపోతూ ఏడుపు మొదలెట్టాడు. కొడుకు బాధంతా తండ్రికి బోధపడ్డాది. కొడుకు బాధంతా తండ్రి పడ్డాడు.” అంటాడు చాసో. ఒక్క వాక్యం. ఆ ఒక్క వాక్యంతో కృష్ణుడు ఆపుకున్న ఏడుపుకి ఓ ప్రయోజనం చేకూరుస్తాడు.

ఈ కథలో విలన్ ఎవరు? మనకి బాధ కలుగుతుంది నిజమే. కోపం కూడా వస్తుంది. ఎవరి మీద? తెలియదు. పరిస్థితులా? పేదరికమా? అసమానతలా? ప్రభుత్వమా? తెలియదు. కోపం ఎవరి మీదో తెలియక అది కూడా దుఃఖంగా మారుతుంది.

తండ్రి మీద కోప్పడగలమా?

“చదువు మానిపించానని అంత బాధపడుతున్నావా? బడి వరండాలు పట్టుకుని దేవుళ్ళాడుతున్నావా నాయనా? పద ఇంటికి” అన్న తండ్రి మీద మీకు కోపం వస్తోందా?

“(పుస్తకాలు) కొందాం, పద. ఏడవకు నాయనా, నే చచ్చిపోయాను, ఏడవకు!” అని తండ్రిని చూస్తే మీకు ఏడుపొస్తుందా కోపం కలుగుతుందా?

అదే తండ్రి తాగుబోతు అయ్యింటే? కొడుకు అత్తెసరు విద్యార్థి అయితే? ఏ పాత్ర ఎలా వుండాలో. ఏ వాక్యం ఎంత వుండాలో. ఏ పదం ఎక్కడ వెయ్యాలో. ఏ అక్షరం ఏ భావాన్ని కలిగిస్తుందో – తూకం వేసినట్లు రాయటమే చాసో గొప్పదనం.

ఇలా లెక్కలు వేసి కథలు రాయవచ్చు. ఆలోచించి కథని అల్లవచ్చు. కానీ చాసో లెక్కలు వెయ్యలేదు. ఆలోచించి రాయలేదు. వాటంతట అవే వచ్చి అలా కూర్చున్నాయి. ఇప్పుడు మనం వాటినికి “బైసెక్ట్” చేసి వాటిని ఫార్ములా కనిపెట్టుకోడానికి వాడుకుంటున్నాం. అంచేత, చాసో కథకుల కథకుడే కాదు. కథకుల పాలిటి ఓ లైబ్రరీ, ఓ లాబరేటరీ కూడా.

– అరిపిరాల సత్యప్రసాద్

aripirala

బోలెడు కరుణ…కొంచెం ఆగ్రహంతో…!

25VZVIJREG2WRIT_25_1309849e

(ప్రసిద్ధ కథా రచయిత పెద్దిభొట్ల సుబ్బరామయ్య గారి 75 వ పుట్టిన రోజు : డిసెంబర్ 15)

ఓ బోయవాడు బాణం వదిలాడు. పూర్వాశ్రమంలో దొంగగా బతికిన ఓ వ్యక్తి అక్కడ నిలబడి జంట పక్షుల్లో ఒకటి నేలకొరగడం చూశాడు. తోడు కోల్పోయిన రెండో పక్షి కన్నీరులో కరిగాడు. కరుణరసాత్మకమైన ఓ కావ్యానికి బీజం పడింది. ఇది మనందరికీ తెలిసిన వాల్మీకి కథ. జాగ్రత్తగా గమనించండి. వాల్మీకికి అప్పుడు కలిగిన భావన కేవలం కరుణేనా? బాణం వేసిన బోయవాడి మీద కోపం రాలేదా? ప్రాణాలని కబళించి మిగిలిపోయినవారికి విషాదాన్ని మిగిల్చే మృత్యువు మీద ఆగ్రహం కలగలేదా? ప్రేమ జంట తనని వీడిపోయిందని ఏడుస్తున్న పక్షి కన్నీరు తుడవలేని అశక్తతని తలుచుకోని వాల్మీకికి అసహనం కలగలేదా? ఒకవేళ అలాంటి ఆగ్రహం, అసహనం కలిగివుంటే వాల్మీకి రాసిన కావ్యం ఎలా వుండేది?

నేను చెప్పనా?

అప్పుడు కూడా రామాయణం కరుణరసాత్మకంగానే వుండేది. ఆ వాల్మీకి పెద్దిభొట్ల సుబ్బరామయ్య అయితే. ఆగ్రహానికీ కరుణకు ఏమిటీ సంబంధం? తెలుసుకోవాలి. తెలుసుకునే ప్రయత్నమైనా చెయ్యాలి. ఎలా? పెద్దిభొట్ల కథలు చదవాలి. “ద్రణేవుడు” ఎవరు? ఎవరో వుండే వుంటారు. వెతకాలి. వెతుకుతూనే వుండాలి. తెలుసుకుంటే జ్ఞాని అవుతాడు. తెలుసుకోలేనివాడు “ఇంగువ” అంటే ఏమిటో ఎరగని వాడిలా జీవితాన్ని చాలిస్తాడు. ముగిసిపోయేది కాదు జీవితం అంటే, తెలుసుకోవాలని ప్రయత్నం చేస్తావే అదీ జీవితం అంటే..

అలా కాదు నీకు తెలిసిందే ప్రపంచం అనుకుంటావా… ఆల్ రైట్… గాటానికి కట్టిన ఎద్దులా గిరా.. గిరా.. గిరా… బావిదాటని కప్పలా బెక బెక బెక బెకా…! తనకు తెలియని కొత్త ప్రపంచం ఒకటుందని, అందులో కనుచూపు సాగినంత మేర “నీళ్ళు” వుంటాయని తెలియని వాడు ఏమౌతాడు? మంచినీళ్ళు కనిపిస్తే అవురావురంటూ తాగుతాడు. గంటలుగంటలు స్నానాలు చేస్తాడు. చివరికి ఓ ముహూర్తాన నీళ్ళలోనే పడి చస్తాడు. మరి అతను తెలుసుకోవాల్సిందేమిటి? ఓ వూరిలో నీళ్ళు లేక ఛస్తుంటే మరో వూర్లో నీళ్ళలో మునిగి చస్తుంటారు. ఈ వైరుధ్యాన్నే తెలుసుకోవాలి. ఈ వైరుధ్యం పేరు కూడా జీవితమే.

అయితే ఈ జీవితం గురించి మనకి చెప్పేది ఎవరు? నేను చూడని కొత్తకోణం వైపు బైనాకులర్స్ పెట్టి చూపించేది ఎవరు? ఒక పుస్తకం. ఒక జిజ్ఞాస. ఒక ప్రశ్న. ఇదిగో అలాంటి ప్రశ్నలన్నింటినీ తలకెత్తుకోని తిరిగే పెద్దమనిషి ఒకాయన వున్నాడు. పెద్దిభొట్ల సుబ్బరామయ్య అంటారు ఆయన్ని. మృత్యువుని రక్తం రంగులో కళ్ళారా చూసినవాడు. తల్లిప్రేమని అభద్రత రూపంలో అనుభవించిన వాడు. కష్టాన్ని కన్నీటి రుచిలో తెలుసుకున్నవాడు. జీవితం అంటే కషాయం అని కనిపెట్టిన మానసిక శాస్త్రవేత్త. ఆ కషాయాన్ని ఏ మిశ్రమాలలో కలపాలో తెలుసుకున్న సరికొత్త రసవాది. కథ అనే అంబులపొదిలో అక్షయతూణీరాల్లాంటి పాత్రల్ని పెట్టుకోని మనసుని కరుణాస్త్రబద్ధుల్ని చేయగల విలుకాడు.

కవిసామ్రాట్ దగ్గర శిష్యరికం చేసినవాడు పోనీ కవిత్వం రాసి వుండచ్చుగా? కథని పట్టుకున్నాడు. కథ ఆయన్ని పట్టుకుంది. కథల్లో వర్ణన చూడండి. ఒకో కథలో ఒకలాగ వుండే వాతావరణం చూడండి. నిప్పుల మీద నుంచి వీస్తున్నట్లుగా వేడిగాలులు, బాగా బలిసిన ఏనుగుల్లా మబ్బులు, వాన జల్లులు, ముసురు పట్టడాలు, గుడ్డివెన్నెలలు, తెల్లటి వెండి కంచంలాంటి చంద్రుడు, వేప చెట్లు అబ్బో.. ఇంకా చాలా వున్నాయి. ఇవన్నీ కథలోకి వచ్చి ఏం చేస్తున్నాయి? చదివిస్తున్నాయి. అంతే. ఏ వాక్యాన్ని విత్తనంగా వేస్తే ఏ అనుభూతి మొలకెత్తుతుందో తెలియడమే రచన. అదే కదా కావాల్సింది.

వుద్యోగంలో చేరాల్సినరోజే ఎగ్గొట్టి “పథేర్ పాంచాలి” చూసినవాడు పోనీ సినిమా అయినా తీసుండచ్చుగా? లేదు. మళ్ళీ కథలోకే వచ్చాడు. సినిమా చూపించాడు. కావాలంటే అయన రాసిన తొలి కథల్లో ఒకటైన “భయం” (1960) చూడండి. ఓ పిల్లవాడు గోడగడియారం బద్దలుకొట్టాడు. నాన్న వస్తే బెత్తం విరిగేట్లు కొడతాడని భయం. అదే కథ. అంతే కథ. ఆ పిల్లాడి భయం చెప్పాలంటే వాడి మనసులో దూరి తెరలు తెరలుగా వున్న భయాన్ని పొరలు పొరలుగా వ్యాక్యాలలో చెప్పాలా? ఊహు.. అలా కాదు. ఎండ, ఎండుటాకులు, టెలిగ్రాఫ్ తీగలమధ్య చిక్కుకున్న గాలిపటాలు, వీధి చివర తోలుతిత్తి వొత్తుతుంటే వచ్చే ’గుఫ్ గుఫ్’ చప్పుడు, మొక్కజొన్న పొత్తులు కాల్చి అమ్ముతున్న ముసల్ది, దూదేకులవాడు ఏకుతున్న దూది, ఓ ఇంటి పంచాలో ఓ చిన్నపిల్ల వూదుతూ పగలగొట్టిన బెలూన్, ఆ చప్పుడుకి ఏడ్చిన చంటిపిల్లాడు… ఏమిటిదంతా? సంబంధంలేనివేవో చూపిస్తూ ఆ పిల్లాడి మనసులో భయాన్ని పరిచయం చేస్తాడు. ఈయనెవరు సైకాలజిస్టా? దాదాపు అలాంటిదే – స్కూల్ మేష్టరు.

“నేను ఏదీ టెక్నిక్ ప్రకారం రాయలే”దని. “కథకి మేథమేటిక్స్” వుండదని చెప్పిన రచయితేనా రాసింది? అవున్నిజమే. ఆయన టేక్నిక్ అనుకోని రాయడు. అది రాసిన తరువాత ఆ టెక్నిక్ గురించి మనం తెలుసుకుంటాం.

కథలన్నీ కరుణరసం అన్నామా? మరి మనసుల్ని తాకేవి, పిండేవి, కాల్చి నుసి చేసేవి రాసాడా? అదీ లేదు. మరేం చేశాడు?చెప్పదల్చుకున్నది మూడు పేజీలలో తేల్చేశాడు. ఆ మూడు పేజీల్లోనే ఓ సస్పెన్స్ థ్రిల్లర్ తయారు చేశాడు. కరుణరసాత్మకమైన కథలో ఓ సస్పెన్స్ థ్రిల్లర్? ఇదెలాగా? అదలాగే. ఏ వాక్యమైతే కథకి మూలమో ఆ వాక్యాన్ని గుండెకి దగ్గరగా పెట్టుకోని, షో చెప్పేముందు విసిరే ట్రంప్ కార్డులా విసిరి కథ ముగిసిందంటాడు. అదేమి చిత్రమో మన మనసులో కథ అప్పుడే మొదలౌతుంది. “అన్నదాత సుఖీభవ” కథ చూడండి. పురుషోత్తం అనే వ్యక్తి కథ చెబుతుంటాడు. ఎక్కడో సత్రంలో తప్పక అన్నదాన పంక్తిలో భోజనం చెయ్యాల్సివచ్చిన సంగతి అది. తీరా తిన్నాక అక్కడ బోర్డుమీద వున్న పేరుని చూసి కన్నీళ్ళు పెట్టుకున్నానంటాడు. ఆ పేరేమిటో చెప్పడు. ఆ తరువాత మూడు పేరగ్రాఫుల సమయం గడిచాక, పక్కనున్న మిత్రుడు అడిగితే గాని ఆ పేరు ఎవరిదో పాఠకుడికి తెలియదు. ఆ తరువాత లైనుకి కథ అయిపోతుంది. ఇది కొసమెరుపుతో ముగించడం కాదు. ఒక మెరుపుని కొసదాకా లాక్కొచ్చి పడేయడం. ఆయన రాయడానికి కలం వాడుతారా? ఉలి వాడుతారా? తెలుసుకోవాలి. తెలుసుకోకపోతే ఎలా?మధ్యతరగతి జీవితాలని కాచి వడబోసిన కషాయం కనిపెట్టిన కథకుణ్ణి తెలుసుకోవద్దూ? అర్థంకాని లిపిలో దేవుడు రాసిన జీవితమనే కావ్యాన్ని అలతి తెలుగుపదాలలోకి మార్చిన అనువాదకుణ్ణి తెలుసుకోవద్దూ? అగ్రవర్ణం అని పిలవబడే జాతిలోకూడా అస్పృశ్యుడైన దళితుణ్ణి పరిచయం చేసిన మనిషిని గురించి తెలుసుకోవద్దూ? ఆటల్ని కూడా కథలుగా మార్చగలిగిన రచయితని తెలుసుకోవద్దూ? మీరే చెప్పండి – తెలుసుకోవాలా లేదా? మరింకెందుకాలస్యం తెలుసుకోండి –

ఇంతకీ ఇంగువ ఏమిటి? తెలుసుకున్నారా? “అది చెట్టు నుంచి వొస్తుందా? ఏదైనా రసాయనిక పదార్థమా? లేక ఒక రకం రాయి వంటిదా? అది గాక ఏదన్నా జంతువుకు సంబంధించినదా?” తెలుసుకున్నారా?లేక తెలియకుండానే..???

(ఒక కథకుణ్ణి నేను ఎందుకు అభిమానిస్తున్నాను అన్న ప్రశ్నకి నేను వెతుక్కున్న జవాబులే రాశాను తప్ప సమీక్షలు చేసే అర్హత నాకు లేదని నా విశ్వాసం – రచయిత)

– అరిపిరాల సత్య ప్రసాద్

అరిపిరాల సత్యప్రసాద్

అరిపిరాల సత్యప్రసాద్

తొలి అడుగులలో నాలుగు అచ్చు, పధ్నాలుగు రొచ్చు…!!

 

అరిపిరాల సత్యప్రసాద్

అరిపిరాల సత్యప్రసాద్

నిజం చెప్పద్దూ, మా ఇంట్లో వెనక ఏడు తరాలు చూసుకున్నా రచయితలు ఎవరూ లేరు. దూరపు చుట్టాలలో సంగీతజ్ఞులు, ఇదే ఇంటిపేరుతో కొంతమంది రచయితలు వున్నా వారితో అనుబంధం తక్కువ. మరి నాలో ఈ సాహిత్యాభిలాష ఎక్కడిదా అని వెతుక్కుంటూ నాలోకి నేనే చూసుకుంటే –

ముందు మా అమ్మ జ్ఞాపకం వస్తుంది. గత పాతికేళ్ళుగా ఆమె జ్ఞాపకంగానే మిగిలింది. పాత సినిమాపాటలో, లలిత సంగీతమో బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ గా లేకుండా ఆమె నాకు గుర్తుకురాదు. రేడియో పాడుతుంటే, ఆమె పనులు చేసుకోవటం ఆమె గురించి గుర్తున్న సంతోషకరమైన జ్ఞాపకాలలో ఒకటి.

ఇక అదే రేడియోలో ఏ రాత్రిపూటో నాన్న పెట్టే కర్ణాటక సంగీతం – తెలియకుండానే త్యాగరాజునీ, శ్యామదాసునీ, పురంధరదాసునీ పరిచయం చేసేవి. సుబ్బలక్ష్మి, శమ్మంగుడి, మహారాజపురం, కున్నకూడి, పట్టమ్మాళ్ ఇలా ఒక్కొక్కళ్ళే మా గోడమీద చెక్కస్టాండ్ స్టేజి పైకి ఎక్కి టేప్ రికార్డర్ రూపేనా కచేరీలు చేస్తుండేవాళ్ళు. వీళ్ళంతా నాన్న సేకరించిన వందలకొద్ది సంగీతం క్యాసెట్లలో సంగీత సామ్రాట్టులు. వీరందరి మధ్యలో అక్కడక్కడ కనిపించే నాలుగైదు సినిమా పాటల క్యాసెట్లలో నుంచి ఎ.ఎమ్.రాజా, ఘంటసాల, లీల, సుశీల గొంతు సవరించేవాళ్ళు. వీళ్ళంతా అమ్మకోసం నాన్న రికార్డ్ చేయిస్తే ఇంటికి వచ్చిన అతిథులు. ఈ సంగీతం, సినీగీతం మధ్యలో ఎక్కడో కళల గురించి ఆసక్తో, అభిరుచో మొదలైంది.

వేమన్నని, పోతన్నని పరిచయం చేసింది మేనత్త. తొలి అడుగులు వేస్తున్నప్పుటి నుంచే తెల్లవారుఝామున లేపి, నీళ్ళు పోసి, దేవతార్చనకి పూలు కోసే నెపంతో నన్ను పక్కింటికి తీసుకెళ్ళి “శుక్లాంబర ధరం”తో మొదలుపెట్టి, “ఇంతింతై వటుడింతై” అంటూ పోతనని పలకరించి, ఆ తరువాత పాడ్యమి విదియ తదియలు, ప్రభవ విభవలు చెప్పించేది. తెల్లవారుఝామున చెప్పిన పద్యాలు, చదివిన చదువులు, నందివర్ధనం చెట్టు మీద నుంచి రాలిపడిన మంచుబిందువులంత స్పష్టంగా గుర్తున్నాయి. అక్కడ తెలుగుతో పరిచయం అయ్యింది.

“నానమ్మా కథ చెప్పవూ” అనే మాటతోనే రాత్రుళ్ళు మొదలయ్యేవి మాకు. రాజకుమారుడు, తెల్లగుర్రాలు, పూటకూళ్ళపెద్దమ్మలు, కాశీమజిలీలు, భోజరాజు కథలు, విక్రమార్కుడు… నిద్ర… కథ…! వింటూ నిద్రపోతూ, కథల్లో తూగుతూ, కలల్లో కథని చూస్తూ, మనమే యువరాజులై గుర్రం పైన స్వారీ చేస్తూ వుంటే… ఇంతలో రాక్షసుడొస్తే పక్కనే ధైర్యం చెబుతూ నానమ్మ. కొంత వూహ తెలిసాక రామాయణం, మహాభారతం ఆ తరువాత ధృవుడు, ఇంకోరోజు హరిశ్చంద్రుడు… “లోహితా, లోహితా” అంటూ హరిశ్చంద్రుడు ఎంత ఏడ్చాడోకానీ, నానమ్మ ఆ కథ చెప్పిన ప్రతిసారీ ఏడవడం ఒక ఆశ్చర్యకరమైన జ్ఞాపకం. కథతో, అందులో వుండాల్సిన ఎమోషన్ తో తొలి పరిచయం.

ఆ తరువాత ఇంకేముంది – మనకి చదవటం వచ్చేసింది. పాఠ్య పుస్తకాలలో – మొక్కపాటి, పానుగంటి, జాషువా, కరుణశ్రీ, సర్ ఆర్థర్ కానన్ డాయల్, సోమర్ సెట్ మామ్, బయట పుస్తకాలలో – యండమూరి, మల్లాది, సూర్యదేవర, యద్దనపూడి వీళ్ళందరూ పరిచయం అయ్యారు. వీళ్ళందరినీ చదివి అవన్నీ చాలక కనపడ్డ పుస్తకమల్లా నమిలేస్తూ, నెమరేస్తూ – కిరాణా కొట్టులో కట్టిచ్చిన పొట్లాల కాగితంతో సహా చదివేసి తృప్తిగా తీరుబడిగా కూర్చున్నాక ఒక శుభముహుర్తాన శ్రీశ్రీ కనపడ్డాడు. ఆయన వెంట మొదలుపెట్టిన పరుగు “కలం కల” అంటూ కవితై మయూరి వారపత్రికలో అచ్చైంది. ఆ తరువాత కథలు – 1995 తొలికథ ఆంధ్రప్రభ ఆదివారం పత్రికలో దీపావళి కథలపోటీలో సాధారణ ప్రచురణ. అప్పుడే రైల్వే జూనియర్ కళాశాలలో ఉపాధ్యాయ దినోత్సవం సందర్భంగా నిర్వహించిన కథలపోటీలో మొదటి బహుమతి. తొలి అడుగులలో నాలుగు అచ్చు, పధ్నాలుగు రొచ్చు…!!

Cover

సాహితీవైద్యం కోసం వసుంధరగారికి రాయచ్చో రాయకూడదో అనుకుంటూ, ఒక రోజు ధైర్యం కూడగట్టుకోని “ఈరేశంగాడి ముచ్చట” పంపించాను. “కథాంశం బాగుంది. మీకంటూ ఒక శైలి ఏర్పడాలంటే మీరు ఎక్కువగా చదవా”లని వారి నుంచి ఉత్తరం. పెద్దల మాట చద్దన్నం మూట అని నాన్నమ్మ చెప్పిన మాట. అప్పుడే మరిన్ని పుస్తకాలు చదవాలని నిర్ణయించుకున్నాను!

అదే మొదలు. ఇట్నుంచి షిడ్నీ షెల్డన్, అగాథా క్రిస్టీ అట్నుంచి ముళ్ళపూడి, కొకు, బుచ్చిబాబు, చలం…. చదువుతున్నకొద్దీ కుచించుకుపోయి, నేను రాసినవీ కథలేనా అని ఆ మహామహుల రచనలలో ఆవగింజంతైనా అందుకునేదాకా రాయకూడదని ఆరేడు సంవత్సరాలు అజ్ఞాతవాసం. నేను రాసేది నాకు నచ్చేదాకా చదవటమే ఒక పని (ఇప్పటికీ కొనసాగుతోంది). గుజరాత్ లో చదువులు ఆ తరువాత కార్పొరేట్ వుద్యోగం. వుద్యోగం వూళ్ళు తిప్పింది. కొత్త ప్రాంతాలు, కొత్త మనుషులు, కొత్త పుస్తకాలు… కొత్త కొత్త కథలు. ఇందోరులో వున్నప్పుడు ఉజ్జైనిలో మంచినీటి కటకట గురించి పేపర్లో చదివిన తరువాత మళ్ళీ కలం కదిలింది. కొత్తగా పరిచయమైన టెక్నాలజీ సాయం తీసుకొని బ్లాగులు, అంతర్జాల పత్రికలకే పరిమితమై వుండిపోయాను.

ఆ తరువాత పరిచయమైన సాహితీ మిత్రులు వెన్నుతట్టి ప్రోత్సహించారు. బ్లాగుల్లో గుట్టుగా వున్న నన్ను అచ్చోసిన రచయితని చేశారు.

వసుంధరగారిని మళ్ళీ పలకరించాను. “మీ కథలకి ఇక సాహితీవైద్యం అవసరంలేదు. పుష్టిగా వున్నా”యన్నారు. పత్రికలో నా కథ వచ్చినప్పుడల్లా చదివి అభినందించారు, ఆశీర్వదించారు. ఆ ఆశీర్వాదం ఇచ్చిన ధైర్యం తోనే ఈ పుస్తకానికి వాళ్ళనే ముందుమాట అడిగేదాకా తీసుకొచ్చింది. వారి వాత్సల్యానికి, ప్రోత్సాహానికి నా సగౌరవనమస్సులు.

ఈ పుస్తకంతో నా సాహితీ ప్రస్థానం మొదలైంది.

***

చివరిగా ఒక్క మాట – ఇదంతా సోత్కర్షలా వుంటుందని తెలిసినా చెప్పే ధైర్యం చేశాను. చెప్పాల్సిన అవసరం వుందనిపించింది కాబట్టే ఆ సాహసం.

తెలుగు భాషని మరుగుపరుస్తున్నారన్న అపవాదు మోసే తరంలో వాడిని నేను. ఆంగ్లమాధ్యమంలో చదువులు, కార్పొరేట్ వుద్యోగాల పరుగుల మధ్యలో తెలుగు భాషాభిమానాన్ని, సాహితీ ఆసక్తిని సజీవంగా వుంచుకోవచ్చని చెప్పడానికి నేను ఒక చిన్న ఉదాహరణ మాత్రమే. నాలాంటివారు ఎందరో వున్నారు. తెలుగు భాష అంతరించిపోతోందని బాధపడటం వల్ల ప్రయోజనం లేదు. మన ప్రయత్నం మానకూడదు. రేపటి తరానికి రెండు కథలు, నాలుగు పద్యాలు, కాసిన్న సామెతలు చెప్పి తెలుగు భాషని రుచి చూపించండి. ఆ తరువాత పఠనాసక్తిని కలిగించి వదిలిపెట్టండి. ఏ మాధ్యమంలో చదివినా, జీవనానికి మరే భాష అవసరం అయినా తెలుగు మీద మక్కువ ఎక్కడికీ పోదు. అందుకు నేనే సాక్ష్యమని చెప్పడానికే ఈ ముందుమాట.

 

భవదీయుడు

అరిపిరాల సత్యప్రసాద్

final invi

ప్రశ్నలు లేని జవాబులు

satyaprasad “రేపు ఒక కాన్పరెన్స్ కోసం హైదరాబాద్ వస్తున్నాను. కుదిరితే డిన్నర్ కి కలవగలవా?”

ఎన్నిసార్లు ఆ మెసెజ్ చూసుకున్నావో లెక్కేలేదు. అందులో ఒక్కొక్క అక్షరం నీలో ఎన్నో జ్ఞాపకాలను కదిలిస్తోంది. అక్కడికి రమణిని మర్చిపోయావని కాదు. గుర్తుకువచ్చేది. నువ్వు రమణిని వద్దనుకున్న కొత్తల్లో చాలా తరచుగా గుర్తుకువచ్చేది. కానీ నీ చదువులు, ఉద్యోగం, పెళ్ళీ వీటన్నింటి మధ్యలో రమణి జ్ఞాపకం ఎక్కడో తప్పిపోయింది. నువ్వు వూరు వెళ్ళినప్పుడో, రమణితో కలిసి చూసిన పాత సినిమాలు టీవీలో చూసినప్పుడో, ఏదో ఒక అర్థరాత్రి కలలో ఆమె కనిపించినప్పుడో ఒక్కసారిగా అన్నీ గుర్తొచ్చి నిన్ను అతలాకుతలం చేసేవి.

చిన్నప్పుడు గుడి ముందర ఆడిన ఆటలు – దాగుడు మూతలు దండాకోర్ – పిల్లి వచ్చె ఎలకా భద్రం – ఎక్కడి దొంగలు అక్కడనే గప్ చుప్ సాంబార్ బుడ్డి..

ఆ తరువాత ఆటలతో పాటు తొండి చెయ్యడం కూడా నేర్చుకున్న రోజులు. ఇంటికి వచ్చే ముందు చీకట్లో దొంగిలించిన ముద్దులు. ఆటలు ఆడుతూ ఆడుతూ జారిపోయిన బాల్యం. రమణిలో కొత్తగా పూసిన రంగులు, సిగ్గులు. ఆ తరువాత తల్లిదండ్రుల కనుసన్నలలో కట్టడైన తొలి యవ్వనం. తొలిప్రేమ – మొదలు ఎక్కడో తెలియని మనసుల కలయిక. ఒకే బస్సులో కాలేజీ ప్రయాణాలు, ఆ కాలేజీలో ప్రణయాలు. ఒకరికొకరు ప్రేమించుకుంటున్నామని చెప్పుకొకుండానే, అసలు ఆ విషయం తెలియకుండానే మునిగితేలిన ప్రేమానుభూతులు. ఇవన్నీ కలగాపులగం అయిపోయి ఒక కొలాజ్ లా నిన్ను కుదిపేసేవి.

నీ కార్పొరేట్ వుద్యోగంలో, నీ ఉరుకుల పరుగుల జీవితంలొ, నీ సంసార వ్యవహారాల్లో ఎక్కడో తప్పిపోయిన అందమైన కల రమణి. చిన్నప్పటి పుస్తకాలను తిరగేస్తుంటే కనపడే నెమలిపింఛెం లా ఈ మెసేజ్ రూపంలో మళ్ళీ నీ ముందుకి వచ్చింది.

కలిసినప్పుడు రమణి అడగబోయే ప్రశ్నలకు నీ దగ్గర జవాబు లేదని నీకు తెలుసు. ఆమె చూసే చూపులను తట్టుకునే శక్తి నీకు వుండదనీ తెలుసు. అయినా వెళ్ళాలి అనుకున్నావు.

“తప్పకుండా వస్తాను..” రిప్లై పంపించి మర్నాడు సాయంత్రం కోసం ఎదురుచూస్తూ వున్నావు.

***

అన్నేళ్ళక్రితం ఎలా వుండేదో అలాగే వుంది. కొంచెం వళ్ళు చేసింది. కళ్ళకు అద్దాలు. ఆమెను చూడగానే నువ్వు కలవరపడటమో, కన్నీళ్ళు పెట్టడమో చెయ్యలేదు. అలా జరగకుండా జాగ్రత్తపడ్డావు. వయసుతో పాటు నీకు మెచ్యూరిటీ వచ్చిందనుకున్నావు. అయినా నీ మనసు మాత్రం పదహారేళ్ళ పసి వయసు వైపు పరుగులు పెడుతోంది. ఆ సంగతి నీకు మాత్రమే తెలుసు.

డిన్నర్ చేసినంతసేపు చిన్నప్పుడు ఆడిన ఆటల గురించి, అప్పటి స్నేహాల గురించి సరదాగా మాట్లాడావు. పన్నెండేళ్ళ క్రితం వదిలేసిన కథని కొనసాగించినట్లే వుండాలని నీ ఆశ. అన్నేళ్ళు మీ ఇద్దరి మధ్య నిలిచిన మౌనవారధి ఎప్పుడు కూలిపోయిందో తెలియలేదని సంబరపడ్డావు. ఆమె ఆ ప్రశ్న అడిగే వరకు.

“పెళ్ళి చేసుకున్నావా?”

ఏ ప్రశ్నకి సమాధానం చెప్పడం నీకు ఇష్టం లేదో అదే ప్రశ్న వేసింది. తలూపావు.

“నా సంగతి తెలుసుగా. పెళ్ళి, విడాకులు..!! ఐ యామ్ హాపీ దట్ ఐ యామ్ ఔట్ ఆఫ్ ఇట్..! పీఎచ్.డీ చేశాను. ఇప్పుడు హాయిగా వుంది.” అంది. నీకు ఆమె మాటల్లో వినపడిందంతా ఒక అవకాశం. ఒక ఆహ్వానం మాత్రమే.

“ఒంటరితనం నాకు తెలుసు రమణీ. సరోజ చనిపోయి ఐదేళ్ళైంది. ఎండిపోయిన చెట్టులా పడివున్నాను” అంటూ విషాదాన్ని ఒలకబోశావు. ఆమె నుంచి ఎలాంటి సానుభూతి మాటలు లేవు.

“అయినా ఫర్లేదు… కార్పొరేట్ వుద్యోగం.. పదవి.. హోదా.. ఏదో ఒక వ్యాపకం కావాలి కదా? మూడు బంగళాలు, నాలుగు ఫ్లాట్లు, కార్లు… జీవితాన్ని పూర్తిగా అనుభవిస్తున్నాననుకో..” గర్వం గొంతులోకి వచ్చేలా చెప్పావు. ఆమె కళ్ళలో ఆశ్చర్యమో, ఆరాధనో కనపడాలని నీ తాపత్రయం. ఆమె నవ్వింది.

డిన్నర్ పూర్తైంది. నన్ను ఎందుకు వదిలేశావు అని ఆమె నిన్ను అడగలేదు. నువ్వు పెళ్ళి చేసుకోను అని చెప్పిన తరువాత ఆమె ఎంత బాధ పడిందో చెప్పలేదు. అసలేం జరగనట్లే వుంది. పాత స్నేహితుణ్ణి కలిసినట్లే మాట్లాడింది. నీ కారు దాకా వచ్చి నిన్ను సాగనంపి హోటల్ లో తన రూమ్ కి వెళ్ళిపోయింది.

***

రమణి అడగాల్సిన ప్రశ్నలు అడిగివుంటే నీ దగ్గర సమాధానాలు సిద్ధంగా వున్నాయి. కానీ ఆమె అడగలేదు, నీ సమాధానాలు బయటపడలేదు. సమాధానాలు వున్నాయి. ప్రశ్నలే లేవు.

రాత్రంతా కలత నిద్ర. తెల్లవారగానే ఫోన్ చేశావు.

“మరో గంటలో బయల్దేరుతున్నాను” చెప్పింది చల్లగా.

“నేను వస్తున్నాను. డ్రాప్ చేస్తాను.” అన్నావు చొరవగా.

“వద్దు. టాక్సీ బుక్ చేశాను.” అన్నదామె కటువుగా.

వొప్పించేదాకా నువ్వూరుకుంటావా?

బీయండబ్లూ నడుపుతున్న గర్వం నీ కళ్ళలో వుంది కానీ అది ఎక్కిన ఆనందం ఆమె ముఖంలో కొంచెమైనా లేదు. నీకెందుకో అసహనం.

దారిలో చాలా విషయాలు మాట్లాడావు. నీ పెళ్ళి శుభలేఖ ఆమెకి పంపించావని అబద్ధం చెప్పావు.

“అందలేదు..” అంది ఆమె.

“నీ శుభలేఖ అందింది కానీ రావాలనిపించలేదు” అని చెప్పాలనుకున్నావు. “కుదరలేదు” అని మాత్రం చెప్పగలిగావు. మళ్ళీ మౌనవారధి ఇద్దరి మధ్య.

“ఒంటరి బ్రతుకు చాలా దారుణంగా వుంటుంది రమణీ” చెప్పావు. ఆమె విన్నదో లేదో తెలియలేదు. కానీ నువ్వు మాట్లాడటం మాత్రం ఆపలేదు.

నీ చుట్టూ వున్న కార్పొరేట్ ప్రపంచం ఎంత నిర్దయగా వుందో చెప్పావు. జ్ఞాపకాలలో శిధిలమైన రమణి స్నేహాన్ని గుర్తించానని చెప్పావు. రమణి ఇప్పుడు నీకు ఎంత అవసరమో చెప్పావు. అయినా ఆమె మాట్లాడలేదు. కనీసం ఏమైనా అడుగుతుందేమో అని నీకు ఆశ. ఆ ప్రశ్నలు సంధిస్తే నీ సమాధానాలు తయారుగా వున్నాయి.

ఆమె అడగలేదు. నీ అసహనం తగ్గలేదు. నీకు తెలియకుండానే నీ కళ్ళలో నీరు.

ఎయిర్ పోర్ట్ లో కారు ఆపి కిందకు దిగి లగేజ్ దింపావు. ఒక్కసారి ఆమె నిన్ను చిన్నగా హత్తుకుంది.

“టచ్ లో వుంటావు కదూ” అన్నావు.

ఆమె నవ్వింది.

“నువ్వు పూర్తిగా మారిపోయావు రమణీ” అన్నావు.

“నువ్వు ఏ మాత్రం మారలేదు ప్రదీప్…” అంది నవ్వి

“అంటే?”

“నువ్వు సమాధానం చెప్పాల్సిన ప్రశ్నలు చాలా వున్నాయని నీకు తెలుసు… అవి అడిగే అవసరం లేకుండా చేశావు. నీ గురించి కాకుండా నిన్ను ప్రేమించేవాళ్ళ గురించి ఆలోచించడం నేర్చుకో… బై.” అని చెప్పింది రమణి.

“ఫోన్ చేస్తావు కదూ..” అన్నావు వెనకనుంచి.

ఆమె నుంచి సమాధానం లేదు.

నువ్వు వెనక్కి తిరిగావు. ఆమె ముందుకు సాగిపోయింది.

[ *** ]

–అరిపిరాల సత్య ప్రసాద్

బియాండ్ కావలి… బియాండ్ ఖదీర్!

 

అరిపిరాల సత్యప్రసాద్

అరిపిరాల సత్యప్రసాద్

 

ఏం చెప్పాలి? ఎలా చెప్పాలి?

ఈ రెండు ప్రశ్నలకి సరైన జవాబు తెలుసుకోగలిగినవాడే గొప్ప రచయిత అవుతాడు. ముఖ్యంగా కథల విషయంలో ఈ ప్రశ్నల ప్రాధాన్యత అంతా ఇంతా కాదు. మనకన్నా ఇంకాస్త ఎక్కువ చదువుకున్నవాళ్ళు ఈ ప్రశ్నలనే మరో రకంగా “వస్తువు, శిల్పం/శైలి” అంటారు. అనేదేదైనా కథకుడు ఆలోచించి తీరాల్సిన రెండు ప్రశ్నలు అవే – ఏం చెప్పాలి? ఎలా చెప్పాలి? చెప్పాలనుకున్న వస్తువును ఆధారం చేసుకోని శైలి వుండాలనేది అందరూ ఒప్పుకునే సత్యం. ఈ రెండింటి సమన్వయం కుదిరితే ఆ కథ గొప్ప కథ అయ్యే అవకాశాలు మెండుగా వుంటాయి.

పై విషయాలు మనందరికీ తెలిసిన విషయాలైనా మళ్ళీ ఎందుకు చెప్పానంటే ఖదీర్ బాబు కొత్త పుస్తకం “బియాండ్ కాఫీ” గురించి చెప్పడానికి. ఈ పుస్తకంలో వున్న చాలా వరకు కథలను విశ్లేషించే ముందు వస్తువు, శిల్పం గురించి ఒకసారి పునశ్చరణ చేసుకోవడం అవసరం. సరే అదలా పక్కన పెడదాం.

కథకుడు ఖదీర్ బాబు పేరు చెప్పగానే నెల్లూరు జిల్లా కావలిలోని పేద కుటుంబాలు, మరీ ముఖ్యంగా ముస్లిం కుటుంబాలు గుర్తుకొస్తాయి. పేదరికం ముఖం మీదకి ఆత్మవిశ్వాసాన్నో, చిరునవ్వునో అయుధంగా విసిరి గెలిచిన వీరుల కథలు ఆయన “దర్గామిట్ట కతలు”, “న్యూ బాంబే టైలర్స్” సంపుటాలలో కనిపిస్తాయి. నామిని కథల స్పూర్తిగా ఆత్మకథల కథలు విరివిగా వస్తున్న సంగతి మనకి తెలుసు. అలాంటి కథలే “దర్గామిట్ట కతల”ని ఖదీర్ స్వయంగా చెప్పుకున్నాడు కూడా.

  ఇలాంటి కథలు రాయడంలో ఒక సౌకర్యం వుంటుంది. తాము (ముఖ్యంగా చిన్నప్పుడు) చూసిన జీవితాన్ని ఇప్పుడు వెనక్కి తిరిగి చూసుకోని రాయడం వల్ల ఎక్కువగా ఊహించాల్సిన పని వుండదు. చెప్పే విధానం (శైలి/శిల్పం) మీద మాత్రమే దృష్టి నిలిపితే స్వతాహాగా వున్న వస్తు బలం వల్ల కథలకి మంచి పేరొస్తుంది. అందువల్ల ఇలాంటి కథలు రాయడం సుళువని నా ఉద్దేశ్యం. ఇదే విషయాన్ని ఖదీర్ బాబు కూడా ఒక చోట ప్రస్తావించారు – “రాయగా రాయగా మంచినీళ్ళు తాగడం కన్నా ఈ కతలు రాయడమే సులువుగా అనిపించింది నాకు” అని.

ఇలాంటి కథలు పాఠకులని మెప్పించే విషయంలో కూడా కొంత సౌలభ్యం వుంది. వీటిల్లో nostalgic effect వుండటం వల్ల “ఒకసారి మనూరు వెళ్ళి చూసొద్దాం” అన్నంత చనువుగా పుస్తకంలోకి వెళ్ళిపోతాం. అక్కడికి ఈయన రాసిన కథలు గొప్పవి కాదని నేను అనటంలేదు. ఈ సౌలభ్యాలని దాటి, ఇంతకంటే కష్టమైన ప్రయోగం చేశాడు కాబట్టి post facto  చూస్తే పెద్ద గీత ముందు చిన్న గీతలా ఈ కథలు ఆయన సులభంగానే రాసేసివుంటాడు అనిపిస్తుంది. అలా అనిపించడానికి దోహదం చేసిన కథల సంపుటి – “బియాండ్ కాఫీ”

***

beyond kaafee

ఖదీర్ బాబు ఈ పుస్తకం కోసం కావలి దాటి వచ్చేశాడు. ఇప్పటి దాకా మనకి పరిచయమున్న ఖదీర్ ని కూడా దాటి వచ్చేశాడు. కథా వస్తువును ఎన్నుకోవడంలోనే ఇప్పటి కథకులను దాటి నాలుగడుగులు ముందుకేసేశాడు.

ప్రస్తుతం మనం బతుకుతున్న ప్రపంచం ఎన్నో సంక్లిష్టమైన సమస్యలను మన ముందు ముళ్ళలా పేరుస్తోంది. పారిశ్రామీకరణలు, ప్రపంచీకరణలు దాటి సాంకేతిక విప్లవాలు, సమాచార విప్లవాల మీదుగా ద్రవాధునికతలోకి (liquid modernity) ప్రయాణిస్తున్నాం. మార్పు అనివార్యమైపోతోంది. మార్పుకి మార్పుకి మధ్య సమయం కుచించుకుపోతోంది. ఈ పరిస్థితుల్లో పుట్టుకొస్తున్న కొత్త ధోరణులను కథా వస్తువుగా కథలు రావాల్సిన అవసరం చాలావుంది. ఆ కథాంశాలతో కథలు రాసే సాహసం ఖదిర్ బాబు చేశాడు.

సాహసం ఎందుకంటే – ఇప్పటిదాకా ఖదీర్ బాబు అంటే వున్న ఇమేజ్ వేరు. ఆయన “సులభంగా” రాసేసినా బాగా పేరుపడ్డ కథలలా ఈ కథాంశాలకు ఆ ఎట్రాక్షన్ లేదు. పైగా ఈ కథలు మన ఉరుకుల పరుగుల జీవితాన్ని, మంచి చేడుల మధ్య లోలకంలా ఊగిసలాడే మన విలువలని నిర్లజ్జగా నగ్నంగా నిలబెడతాయి. ఇది చదివి కొంతమంది ఇలాంటి జీవితం జీవిస్తున్నామా అని అనుకోవచ్చు. ఇదంతా ట్రాష్… మన జీవితాలేం ఇంత దారుణంగా లేవని ఇసకలో తల పెట్టుకు బతికేయచ్చు. నిక్కచ్చిగా చెప్పే నిజాన్ని నిజం అని ఒప్పుకునే ధైర్యం అందరిలో వుండకపోవచ్చు. అయినా సరే ఇలాంటి కథలను రాసి, (ఏ పత్రికలోనో కాకుండా) నేరుగా పుస్తకంగా వెయ్యగలగడం సాహసం అని కాక ఇంకేమనగలం?

సరే, కథాంశాలు ఇలా వుంటే దానికి తగ్గ శైలి వుండాలని ముందే అనుకున్నాం కదా? ఖదీర్ బాబు అదే చేశాడు. ఇప్పటిదాకా సొగసుగా పలికిన నెల్లూరు జిల్లా యాసని వదిలిపెట్టాడు. ఆ వాక్య నిర్మాణ పద్ధతిని విడిచిపెట్టాడు. కొత్తగా కలం పట్టినంత సుళువుగా కొత్త వాక్యాలని నిర్మించాడు. ప్రపంచీకరణ, సమాచార విప్లవాల అనంతరం ఏర్పడిన “నియో రిచ్” మానసిక స్థితిని చెప్పడానికి ఒక కొత్త పరిభాషని అందుకున్నాడు. ఇది చూడండి –

నలుగురు వచ్చారు.

ఆగింది.

ముప్పయ్ రెండేళ్ళ స్త్రీ – ఒక సమస్య వల్ల సతమతమవుతూ ఆ సమస్యకు –

ముందుకు వచ్చారు.

భయపడింది.

ముప్పయ్ రెండేళ్ళ స్త్రీ – ఒక సమస్య వల్ల సతమతమవుతూ –

చుట్టుముట్టారు.

ముప్పయ్ రెండేళ్ళ స్త్రీ –

అబ్బ.. అబ్బ… ఏముందిరా.

ముప్పయ్ రెండేళ్ళ –

ఆత్రపడ్డారు (ఇంకోవైపు)

(ఇలాంటి వాక్యాలు ఈయనతోనే మొదలు అనేంత దుస్సాహసం నేను చెయ్యడం లేదు. ఇలాంటి వాక్యాలు ఖదీర్ బాబుకి కొత్త అని మాత్రమే నేను అంటున్నాను.)

దాదాపు అన్ని కథలలోనూ స్త్రీలను ముఖ్యపాత్ర చేశాడీయన. నేను పైన ప్రస్తావించిన పోస్ట్ గ్లోబలైజేషన్ – ద్రవాధునిక జమానాలో అన్ని కోణాలనుంచి ఒత్తిడికి లోనౌతున్నది స్త్రీ. ఉరుకుల పరుగుల మధ్య భర్తకి ఉదయాన్నే కారియర్ అందించే వంటమనిషిగానో, వారాంతంలో శృంగారావసరాలకి మాత్రమే పనికొచ్చే ఆటబొమ్మగానో మిగిలిన భార్యలు ఇప్పుడు మనకి కొత్తకాదు. అయితే పేరుకు కుటుంబం వున్నా ఒంటరైపోయిన ఇలాంటి వాళ్ళ జీవితంలోంచి కథలు తీసుకురావడంలో రచయిత సఫలీకృతులయ్యాడు. ముఖ్యంగా ఇలాంటి వాళ్ళ జీవితాలలో వున్న స్తబ్దతని, అనిశ్చితిని, నైరాశ్యాన్ని వాక్యాలతో నిర్మించిన తీరు చాలా గొప్పగా వుంది. (టాక్ టైమ్, మచ్చ, బియాండ్ కాఫీ). ఇది శైలి గురించి

మొత్తం మీద చెప్పేదేమిటంటే – ఈ పుస్తకంలో కొత్త వస్తువుతో, కొత్త శైలితో ఖదీర్ కొత్తగా పుట్టాడు.

***

ఇందులో పది డైరెక్ట్ కథలు (ఏ పత్రికలోనూ అచ్చు కానివి) వున్నాయి. అందులో “వహీద్” కథ ఒక్కటే Odd man out గా వుండిపోతుంది. మిగిలిన కథలన్నీ పోస్ట్ మోడరన్ సిటీలలో జరిగితే ఈ కథ ఒక్కటే నోస్టాల్జిక్‍గా వెనక్కి వెళ్తుంది. కథలో కొంత లిబరల్ అంశం వున్నా అది చాలా పల్చగా వుండటం వల్ల బహుశా ఈ సంకలనంలో వుండదగినది కాదేమో అనిపిస్తుంది. ఆ ఒక్క కారణం తప్పితే కథ బాగానే వుంది. మిగిలిన కథలన్నీ చదవాల్సినంత బాగున్నాయి. మనం బతుకున్న సమాజాన్ని ఒకసారి మనం అద్దంలో చూసుకోవాల్సిన అవసరం వల్ల చదవాలి.

అయితే ఈ కథలు చదివిన తరువాత కొంత అసహ్యం కలగవచ్చు, కొంత అసహనం కలగవచ్చు. నిక్కచ్చిగా నిజం తగిలిన చోట కోపం రావచ్చు. బహుశా రచయిత కోరుకుంది కూడా అదేనేమో..??

– అరిపిరాల సత్యప్రసాద్

(ఖదీర్ పుస్తకం కినిగె లో దొరుకుతోంది)

ఎర్ర అట్ట డైరీలు

తెల్లటి వెన్నెల. చల్లటి గాలి. చాలా రోజుల తర్వాత నాకెందుకో అలా బయట తిరిగొస్తే బాగుండుననిపించింది. అనుకున్నదే తడవుగా బయల్దేరి మా ఇల్లు దాటి అలా వీధి చివరికి వెళ్ళానో లేదో కాస్త దూరంగా కనిపించాడు వాడు. ముందు వాడేనా కాదా అని అనుమానం కలిగింది. రోడ్డు పక్కగా వున్న చెట్టు నీడలో చీకటి చూసుకోని అక్కడే నిలబడి చూశాను. వాడు ఇంకొంచెం ముందుకు రాగానే నిర్థారణ అయిపోయింది. వాడే..!! చారిగాడు..!!

చటుక్కున వెనక్కి తిరిగి గబగబ అడుగులు వేసుకుంటూ దాదాపు పరుగెత్తినంత పని చేశాను. చల్లగాలి ఎటుపోయిందో తెలియదు. వెన్నల తెల్లగా పరుచుకోని నా ఉనికిని వాడికి ఎక్కడ చూపిస్తుందో అని భయంగా వుంది. వాడు నన్ను చూడలేదనే అనుకున్నాను. చూస్తే తప్పకుండా కేకేసేవాడు కదా!

ఇంట్లోకి దూరి తలుపులు వేసేసి సోఫాలో కూలబడ్డాను.

“ఏమైంది? ఏదో ఈవినింగ్ వాక్ అంటూ వెళ్ళారుగా?” అడిగింది రాధిక. నా నుంచి ఏ సమాధానం రాకపోవటంతో మళ్ళీ తనే అంది – “శకునం బాలేదా ఏమిటి?” నవ్వుతూ అంటూనే వంటింటిలోకి వెళ్ళిపోయింది.

“దాదాపు అలాంటిదే” అన్నాను నేను నెమ్మదిగా. నా కళ్ళ ముందు వాడే కనపడుతున్నాడు. ఆ చారిగాడు..!!

అయినా ఈ వేళప్పుడు ఇటెందుకు వస్తున్నాడు? కొంపదీసి నన్ను కలవడానికి ఇక్కడికే వస్తున్నాడేమో? ఆ ఆలోచన రావటమేమిటి బయట గేటు చప్పుడైంది. అనుమానమే లేదు వాడే అయ్యింటాడనుకున్నాను.

“ఇదిగో రాధా.. ఆ చారిగాడు వస్తున్నట్లున్నాడుగానీ… నేను ఇంట్లో లేనని చెప్పు..” సోఫాలోంచి దూకి పడగ్గదిలోకి వెళ్తూ అరిచాను.

“చారిగారా? ఆయనొస్తే మీరు లేరని..??” ఏదో అడగబోయింది కానీ మధ్యలోనే ఆపేశాను నేను.

“అబ్బా.. అనవసరపు ప్రశ్నలన్నీ అడక్కు… నేను చెప్పినట్లు చెప్పు.. అంతే” అంటూ పడగ్గదిలోకి అడుగుపెట్టాను. మరుక్షణం కాలింగ్ బెల్ మోగింది.

రాధిక వెళ్ళి తలుపు తీయటం – “మీరా.. బాగున్నారా? ఆయన లేరండీ..” అంటూ చెప్పడం వినపడుతూనే వుంది. పడగ్గది తలుపు దగ్గరే నిలబడి వచ్చిన వాళ్ళు ఎవరో వినాలని ప్రయత్నం చేస్తున్నాను.

“అలాగా.. సరేలేమ్మా.. ఫోన్ చేస్తుంటే ఎత్తటంలేదు.. సరే ఒకసారి కలిసిపోదామని వచ్చాను..” వాడే.. ఆ చారిగాడి గొంతే అది.

“ఆఫీసులో పని ఎక్కువైందండీ… ఫోన్ మాట్లాడే తీరికెక్కడిదీ?” చెప్పింది రాధిక.

’ఫర్వాలేదు బాగానే కవర్ చేసింది’ అనుకున్నాను. ఆ తరువాత ఏ మాటలూ వినపడలేదు. వాడు వున్నట్లా వెళ్ళిపోయినట్లా? ఒక వేళ చొరవగా వచ్చి లోపల కూర్చోనుంటే? నేను వచ్చేదాకా వుంటానని అని అక్కడే తిష్ట వేసి వుంటే? చెవులు కిక్కరించి వుంటున్నాను.

“డాడీ..!!” పిలుపు వినిపించి అదిరిపడ్డాను. అప్పటిదాకా మంచం మీద పడుకోని వున్న బంటిగాడు కాలింగ్ బల్ చప్పుడుకి లేచునట్లున్నాడు. నేను తలుపు దగ్గర చాటుగా నిలబడి ఏం చేస్తున్నానో అర్థం కాక అయోమయంగా చూస్తున్నాడు.

“ఏం చేస్తున్నావు డాడీ..” అంటూ అడగబోయాడు.

“ఇష్షూ.. ఇష్ష్..” అంటూ అమాంతం మంచం మీదకి దూకు వాడి నోరు మూసేశాను. విషయం అర్థంకాక వాడి భయం భయంగా నా వైపు చూశాడు.

పడగ్గది తలుపు తెరుచుకుంది. ఎదురుగా రాధిక. బంటి మీద దాదాపు పడిపోయి వాడి నోరు నొక్కేస్తున్న నన్ను విచిత్రంగా చూసింది. నేను ఇంకా విచిత్రంగా నవ్వుతూ వుండిపోయాను.

“ఏమిటిది? మీ ఫ్రెండ్ వెళ్ళిపోయాడు గానీ.. ఇంక చాలించి రండి” అంటూ హాల్లోకి నడిచింది. బంటిని వదిలిపెట్టి భయపడాల్సిన పనిలేదని నచ్చజెప్పి, వాణ్ణి మళ్ళీ పడుకోపెట్టి నేనూ హాల్లోకి వచ్చాను.

“ఏమిటి సంగతి?” అన్నట్టు కళెగరేసింది రాధిక. ఏమీ లేదన్నట్టు తలాడించి కూర్చున్నాను. అంత సులభంగా వదిలిపెడుతుందా రాధిక?

“మీ ఫ్రెండ్ గానీ ఇన్సూరెన్స్ ఏజంట్ అయ్యడా?” అంది

“అబ్బే.. లేదు లేదు…”

“అయితే మల్టీలెవల్ చెయిన్ మార్కెటింగ్ లాంటివి ఏమైనా..”

“ఊహూ..”

“మరెందుకు ఆయనొస్తే దాక్కున్నారు?”

గట్టిగా నిట్టూర్చాను. రాధికతో నిజం చెప్పాలనిపించింది. మొదలుపెట్టాను.

 ***

చారి అని పిల్చుకునే ఆచారిగాడు నాకు మంచి స్నేహితుడే. చిన్నప్పటి క్లాస్ మేట్. తర్వాత నేను వైజాగుకి చదువుకోడానికి వెళ్ళిపోయాను. ఆ తరువాత చాలా కాలానికి మళ్ళీ గుంటూరు వచ్చి స్థిరపడ్డాము. అనుకోకుండా ఒకరోజు సాయంత్రం శంకర్ విలాస్ సెంటర్ దగ్గర కనిపించాడు. వాడే గుర్తుపట్టాడు. వాడి గుండు, వాలకం చూస్తి గుర్తుపట్టడం కాస్త కష్టమే అయ్యింది. పలకరింపులు అవీ అయ్యాక “నెల క్రితం నాన్నగారు పోయార్రా” అంటూ తల తడుముకున్నాడు.

“అరెరే.. సారీ.. తెలుగు మాష్టారు కదూ ఆయన..?” అడిగాను గుర్తుతెచ్చుకోని.

“అవును.. తెలుగు సంస్కృతం చెప్పేవారు. పదేళ్ళనుంచి అది కూడా మానేసి జాతకాలు అవీ చెప్పడం మొదలుపెట్టాడు. ఏ మాటకా మాట చెప్పుకోవాలి. మాస్టర్ గా కన్నా జ్యోతిష్యుడిగానే బాగా సంపాదించాడు. డబ్బు.. పేరు కూడా” అన్నాడు.

“అలాగా? ఆయన జాతకాలు అవీ చెప్తారని నాకెప్పుడూ చెప్పలేదే..” అన్నాను నేను. నాక్కూడా జాతకాలు వెయ్యడం చూడటం తెలుసు. ప్రావీణ్యం లేదు కానీ ప్రవేశం అయితే వుంది.

ఆ తరువత పిచ్చాపాటి మాట్లాడుకోని, అక్కడి దగ్గర్లోనే బ్రాడీపేటలో వున్న వాళ్ళింటికి తీసుకెళ్ళాడు. ఇంటి బయట “ఓంశ్రీ జోతిష్యాలయం, దైవజ్ఞ: హయగ్రీవాచారి” అని  బోర్డు వుంది. నెల క్రితం మనిషి పోయిన దుఖం ఇంకా ఆ ఇంటిని అంటిపెట్టుకోని వున్నట్లు కనపడుతోంది. ఇంట్లోకి వెళ్ళగానే వాడి భార్య వచ్చి మంచినీళ్ళు ఇచ్చి వెళ్ళింది. చారి వెళ్ళి వాళ్ళమ్మని వెంటబెట్టుకొచ్చాడు.

“వీడు గుర్తున్నాడా అమ్మా? సుందరం.. పోస్ట్ మాస్టర్ గారి అబ్బాయి” అంటూ గుర్తు చేశాడు. ఆమె నీరసంగా చూసింది.

“బాగున్నావా?” అంది.

“బాగున్నానండీ” అన్నాను. కొంత నిశబ్దం తరువాత – “నాకు ఇప్పుడే తెలిసిందీ..” అన్నాను ఊరడింపుగా. అంతే ఆమె ఒక్కసారిగా ఏడ్చేసింది. నాకు ఏం చెయ్యాలో తెలియక ఇబ్బందిగా కదిలాను.

“ఊర్కొ అమ్మా… ఊర్కో..” అంటూ వాడు ఆమెను లోపలికి పంపించాడు. తిరిగి వచ్చి –

“పదరా.. నాన్న రూములో కూర్చోని మాట్లాడుకుందాం” అన్నాడు. ఇద్దరం ముందు వైపు వున్న గదిలోకి వెళ్ళాం.

వాళ్ళ నాన్నగారు అక్కడే జాతకాలు అవీ చెప్పేవాళ్ళని అర్థం అయ్యింది. లోపలికి అడుగుపెట్టగానే ఎదురుగా కనపడేటట్లు ఒక కుర్చీ, దాని ముందు ఒక టేబుల్. ఆ టేబుల్ మీద ఏవో పుస్తకాలు, కాగితాలు, దేవుడి బొమ్మలు వున్నాయి. ఒక మూలగా చిన్న మందిరం అందులో ఇరుకిరుగ్గా చాలామంది దేవుళ్ళు. ఒక గొడకి మొత్తం పుస్తకాల రాకు, అందులో రకరకాల పుస్తకాలు.

ఇద్దరం ఆ గదిలో చాలాసేపు కూర్చోని పిచ్చాపాటి మాట్లాడుకున్నాం. వాడు ఎక్కువసేపు వాళ్ళ నాన్న గురించే తల్చుకోని బాధపడ్డాడు.

“చాలా పుస్తకాలు వున్నాయిరా..” అన్నాను నేను అటు చూస్తూ.

“అన్నీ లైబ్రరీకి ఇచ్చేయమని చెప్పాడాయన.. రేపో ఎల్లుండో వచ్చి తీసుకెళ్తారు..” అన్నాడు.

“అరెరే.. ముందే తెలిసి వుంటే నేనే తీసుకునేవాణ్ణి..” అని వెంటనే అన్నాను కానీ, అన్ని పుస్తకాలు నా ఇంట్లో పట్టవన్న సంగతి అన్న తరువాతే గుర్తుకొచ్చింది.

“వాళ్ళకు చెప్పేశాను కదా.. అయినా నీకు ఏమన్నా కావాలంటే తీసుకో…” అన్నాడు.

వాడు అన్నదే తడవుగా ఆ పుస్తకాల దగ్గరగా వెళ్ళి ఎగాదిగా చూశాను. చాలా వరకు జోతిషంకి సంబంధించినవి, వాస్తు సంబంధిచినవీ ఉన్నాయి.  ఓ ఇరవై దాకా ఆంగ్ల పుస్తకాలు, ఓ పది ఆత్మకథలు, అరడజను దాకా కథల పుస్తకాలు.. అంతే. వాటన్నింటి మధ్యలో మూడు ఎర్ర అట్ట డైరీలు కనిపించాయి. అవి తీసి చూశాను.

అన్నీ చేతిరాతలో రాసున్నాయి. ఒక్కొక్క పేజీ తిప్పి చూస్తే అవి హయగ్రీవాచారి గారు రాసినట్లు అర్థం అయ్యింది. చాలా వరకు ఆయన దగ్గరకు వచ్చి జాతకం చెప్పించుకున్న వారి వివరాలు వున్నాయి. ఒక ఇరవై ఏళ్ళ వ్యక్తి ఆయన దగ్గరకు జాతకం చెప్పించుకునేందుకు వస్తే నలభై ఏళ్ళకు తీవ్ర అనారోగ్యం వచ్చే అవకాశం వుందని తెలుసుకోని, దానికి తగ్గట్టుగా డబ్బులు ఇప్పటి నుంచే ఎలా ముదుపు చెయ్యాలి, హెల్త్ ఇన్సూరెన్స్ ఎలాంటిది తీసుకోని జాగ్రత్తపడాలి ఇలాంటి విషయాలు వాళ్ళకు చెప్పినట్లు రాసి వున్నాయి. జాగ్రత్తగా గమనిస్తే అన్నింటిలో ఇదే తరహా వివరాలు వున్నాయి. ఒక జాతకం ద్వారా ఒక మనిషి ఆర్థిక స్థితిగతుల్ని అంచనా వేసి ఆ జాతకునికి ఏ సమయంలో ఎంత మొత్తంలో డబ్బు అవసరం అవుతుందో లెక్కలు గట్టి, ఆ రోజుకి సరిపోయేలా డబ్బు సమకూర్చుకునేందుకు సూచనలు వున్నాయి. జోతిష్యశాస్త్రానికి, ఆర్థికశాస్త్రానికి లంకె పెట్టాడా మహానుభావుడు.

సమకాలీన కథ లో బలమైన స్వరం సత్యప్రసాద్
  aripiralaనెల్లూరులో పుట్టి గుంటూరులో పెరిగిన అరిపిరాల సత్యప్రసాద్ ఇప్పుడు తెలుగు కథా లోకంలో కనిపిస్తున్న సరికొత్త సంతకం.  విభిన్న శైలి, సరికొత్త కథన పద్ధతి ఉన్న రచయిత అరిపిరాల. ఇంగ్లీష్ చదువు చదివి, కార్పొరేట్ ఉద్యోగం చేస్తున్న కూడా సాహిత్యంమీద అభిరుచితో మంచి రచనలు చేస్తున్నారు. తొలికథ “రిక్షావాడు” 1993 లో  ప్రచురితమైంది. ఇంతవరకు 60 కథలు రాసారు. చాలా అనువాదాలు చేసారు. వివిధ పోటీల్లో ఈయన కథలకు బహుమతులు లభించాయి. త్వరలో “ఊహాచిత్రం” పేరుతో కథల సంపుటి వెలువరించనున్నారు. ఉద్యోగ రీత్యా హైదరాబాద్ లో ఉంటున్నారు.–వేంపల్లె షరీఫ్

నేను ఇలా చూస్తుండాగానే చారి మిగిలిన డైరీలను చూశాడు.

“నాన్న ఇలా రాసి పెట్టుకున్నాడని మాక్కూడా తెలియదురా..” అంటూ ఆ అక్షరాలను అపురూపంగా తడిమాడు. “అమ్మకి చూపిస్తా”నని లోపలికి పరిగెత్తాడు.

కాస్సేపటికి లోపలినుంచి మళ్ళీ గట్టిగా ఏడుపు వినపడింది. ఆ తరువాత మరికొంత సేపటికి వాడు తిరిగి వచ్చాడు. ఈ సారి వాడు కూడా ఏడ్చినట్లు వాడు కళ్ళు చెబుతున్నాయి.

“చాలా విలువైన సమాచారం వుందిరా ఈ పుస్తకాలలో.. నీకేమీ అభ్యంతరం లేకపోతే ఒక్క పదిరోజులు నాకిస్తావా? నేను అవసరమైనవి అన్నీ రాసుకోని మళ్ళీ ఇచ్చేస్తాను?” అడుగాను నేను కాస్త మొహమాటపడుతూనే.

“భలేవాడివే.. దానికింత అడగాలా? నీకు ఉపయోగపడుతాయంటే తప్పకుండా తీసుకెళ్ళు” అన్నాడు వాడు.

“పదిరోజుల్లో ఖచ్చితంగా తెచ్చిస్తా” అంటూ భరోసా ఇచ్చాను వచ్చేముందు.

“సర్లేరా” అన్నాడు వాడు.

అంతవరకు అంతా బాగానే వుంది. ఆ తరువాతే అసలు సమస్య వచ్చిపడింది. పదిరోజులు కాదు కదా నెల రోజులైనా ఆ పుస్తకాలను తెరిచే అవకాశమే రాలేదు నాకు. ఆ తరువాత ఇల్లు మారాము. మారిన కొత్తింట్లో సామాన్లు సర్దుకోవటం వగైరా పనులతో అదో హడావిడి. ఈ హడావిడిలో పడి ఆ పుస్తకాల సంగతే మర్చిపోయాను. నా పుస్తకాలు సర్దుకునేటప్పుడు కూడా ఆ పుస్తకాలు లేవన్న సంగతి గమనించలేదు.

ఇక ఆ తరువాత ఇంకేముంది.. కంగారు మొదలైంది. మొత్తం వెతికాను. ఇంట్లో ప్రతిమూలా చూశాను. ఎక్కడా కనపడలేదు.

పుస్తకాలు కనపడటం లేదని నిర్థారణకి వచ్చాక కంగారు స్థానే భయం మొదలైంది. చారి ఏమంటాడో అన్న భయం. చనిపోయిన తండ్రి తాలూకు జ్ఞాపకాలు కనపడకుండా పోయాయంటే చారి వూరుకుంటాడా? అన్న భయం. దాంతో భయం కాస్తా పశ్చాత్తాపంగా మారింది.

వాడు నా అజాగ్రత్తని తిట్టచ్చు, కోప్పడచ్చు, గొడవ పడచ్చు. మాధ్య ఇప్పటిదాకా వున్న స్నేహమే లేకుండా పోవచ్చు. ఈ ఆలోచనలతో సతమతమైపోయాను. రెండ్రోజులు తిండి సయించలేదు. వాడిని కలిసేందుకు ధైర్యం కలగలేదు. ఇక అప్పటి నుంచి వాడుంటే బ్రాడీపేట వైపు వెళ్ళడం మేనేశాను. వాడి ఫోన్ ఎత్తడం మానేశాను. ఎలాగైనా సరే వాడికి కనపడకూడదన్న ప్రయత్నం మొదలుపెట్టాను. తప్పించుకు తిరుగుతున్నాను.

***

“ఇదీ జరిగింది” చెప్పాను రాధికతో.

“బాగానే వుంది.. పుస్తకాలు పోయాయి నిజమే.. అలాగని ఎంతకాలం ఇలా తప్పించుకు తిరుగుతారు?” అంది.

“ఏం చెయ్యమంటావు చెప్పు… గిల్టీ ఫీలింగ్.. అసలు నేను వాడింటికి ఎందు వెళ్ళాల్సిరావాలి? పెద్ద చదివేవాడిలాగా ఆ పుస్తకాలు ఎందుకు తీసుకోవాలి? సరిగ్గా అవే కనపడకుండా ఎందుకు పోవాలి?” తల పట్టుకోని అన్నాను.

“మీరు అనవసరంగా ఫీల్ అవుతున్నట్టున్నారు..” అని ఊరుకుంది రాధిక.

ఆమెకి ఏం అర్థం అవుతుంది నా బాధ? పుస్తకాలంటే నాకు ప్రాణం. ఎవరికైనా ఇవ్వాల్సి వస్తే నా ప్రాణం గిలగిల లాడుతుంది. అలాంటిది చారిగాడు అడాగ్గానే “దానికేం తీసుకోరా” అన్నాడు. ఎంత నమ్మకంగా ఇచ్చాడు? వాడు అంత నమ్మకంతో ఇచ్చినప్పుడు వాటి జాగ్రత్తగా చూసుకోని, భద్రంగా తిరిగి ఇవ్వాల్సిన బాధ్యత నాపైన లేదూ? అలాంటిది ఇప్పుడు ఆ పుస్తకాలు పోయాయంటే అది తప్పే కదా!

సరే నా సంగతి పక్కన పెట్టండి. వాళ్ళ నాన్నగారు ఎంతో కష్టపడి సేకరించి రాసుకున్న విషయాలు. చారిగాడికి అపురూపంగా మిగిలిన జ్ఞాపకాలు. అవి నేను వాడికి కాకుండా చేశానంటే వాడెంత బాధపడతాడు? నాతో వున్న స్నేహం కారణంగా ఏమో అనకపోవచ్చుగాక. కానీ నన్ను పురుగును చూసినట్టు చూస్తే భరించగలనా? చారిగాడి అమ్మ.. ఆమె ఏమంటుందో? “జాగ్రత్తగా వుండాల్సింది బాబూ..” అని ఒక్క మాట అంటే చాలదూ. తప్పు చేసిన ముద్దాయిలాగా ఆమె ముందు నిలబడగలనా?

పోనీ అవన్నీ పక్కనపెట్టండి. నాకు నేను సర్ది చెప్పుకుంటాను. మా స్నేహాన్ని అడ్డంపెట్టుకుంటే ఆ చారిగాడు నన్ను క్షమిస్తాడనే అనుకుందాం. కానీ ఆ సమాచారం. ఏళ్ళ తరబడి ఎన్నో పుస్తకాలు మధించి ఆయన తయారు చేసుకున్న నోట్సు. బహుశా ఒక పుస్తకంగా వేయాలని ఆయన ఆలోచన అయ్యింటుంది. అలాంటి విలువైన సమాచారం పోగొట్టానే..! దానికైనా బాధ్యత వహించద్దూ..! ఇవన్నీ రాధికకి చెప్పినా అర్థం కావు.

ఏదో పాపం చేసినవాడిలా బాధపడ్డాను. ఏదో శాపం తగిలినవాడిలా నిరాశపడ్డాను. చారిని తల్చుకుంటేనే ఖంగారు, భయం, బాధ… ముఖ్యంగా పశ్చాత్తాపం. అది అనుభవించాలే కానీ మాటల్లో చెప్పలేని భావన. ఎవరో చొక్కాపట్టుకోని నా చెంపలు రెండూ ఎడాపెడా వాయించేస్తున్నట్టు, నన్ను అతలాకుతలం చేసేసిన బాధ. అలాగే కొంతకాలం గడిచింది.

అన్ని రోజులు మనం అనుకున్నట్టు వుండవుగా! వారం పది రోజుల తరువాత ఓ రోజు ఉదయం పూట అనుకోని పరిస్థితిలో వాడికి దొరికిపోయాను. కూరగాయల మార్కెట్ లో కావాల్సినవి కొనుక్కోని బయటికి వచ్చి రోడ్డు పక్కనే వున్న షాపులో అల్లం టీ చెప్పాను. ఇంతలో నా భుజం మీద చెయ్యి వేసి బలంగా వెనక్కి తిప్పాడు వాడు.

“మొత్తానికి దొరికావురా..” అన్నాడు.

హతోస్మి. వాడే.. చారిగాడు. ఎవరికైతే నా ముఖం కనిపించకూడదని తప్పించుకోని తిరుగుతున్నానో వాడి దగ్గర తప్పించుకోలేని విధంగా దొరికిపోయాను. వాడి వైపు చూశాను. వాడి ముఖం స్థానంలో పుస్తకాలు కనిపిస్తున్నాయి. ఎర్ర అట్ట డైరీలు.. గిర గిరా తిరుగుతూ కనిపిస్తున్నాయి.

ఉన్నట్టుండి అక్కడి నుంచి పరుగెత్తి పారిపోతే? అనిపించింది. మళ్ళీ బాగుండదని వూరుకున్నాను. అసలా అవకాశం లేకుండా అడ్డంగా నిలబడ్డాడు వాడు.

“ఏమైపోయావురా ఇంత కాలం? ఒక ఫోన్ లేదు, మాటలేదు? నేను చేస్తే పలకవు, వస్తే ఇంట్లో వుండవు..” వాడిపాటికి వాడు ఏదో అడుగుతున్నాడు. నా దగ్గర సమాధానం లేదు. వాడు అడగబొయే ప్రశ్న నా దగ్గర సమాధానం లేదు. నా మనసు చుట్టూ కందిరీగల్లా ఎర్ర అట్ట డైరీలే ముసురుకున్నాయి.

“ఏంట్రా ఏమడిగినా మాట్లాడవు?” అన్నాడు వాడు.

ఏం మాట్లాడగలను? కులాసాలు అయిపోయాక వాడు ఎలాగూ అడగక మానడు. నాకు చెప్పకా తప్పదు. తప్పు చేసిన తరువాత చెప్పుకోడనికి భయమెందుకు అనుకున్నాను. గట్టిగా ఊపిరినీ, ధైర్యాన్ని పీల్చుకోని నోరు విప్పాను.

“అరేయ్ చారి.. నన్ను నువ్వు క్షమించాలిరా..” అన్నాను.

“అదేంట్రా? అలాగంటావు?” ఆశ్చర్యపోయాడు వాడు.

“నేను ఒక తప్పు చేశానురా… మీ నాన్నగారి పుస్తకాలు ఎక్కడో పోగొట్టాను… పూర్తిగా నా అజాగ్రత్తే కారణం… దీనికి నువ్వు ఏ శిక్ష వేసినా సరే… నాకు తెలుసు అవి నీకు ఎంత ముఖ్యమైనవో..” ఏదేదో సంబంధం లేకుండా మాట్లాడేస్తున్నాను.

“రేయ్.. ఏంట్రా.. ఏ పుస్తకాల సంగతి నువు చెప్పేది?” అన్నాడు వాడు. నేను తలెత్తి ఆశ్చర్యంగా చూశాను.

“అదేంట్రా.. మీ నాన్నగారు రాసి పెట్టుకున్నవి.. ఎర్ర అట్ట డైరీలు.. నాకు ఇచ్చావు కదా?”

“ఓహ్.. అవా… నాకసలు గుర్తే లేదు… సరే పోతే పొయ్యాయిలే…” అని వాడంటుంటే నాకు ఆశ్చర్యంతో పాటు కోపం కూడా వచ్చింది.

“అదేంటి చారీ అలాగంటావు… ఎంత విలువైన సమాచారం వుందో తెలుసా అందులో..”

“ఏమోరా.. నాకు ఆ జాతకాలు అవీ అర్థం కావు.. ఇంక ఆయన రాసుకున్నవి నాకేం వుపయోగపడతాయి..”

“చాలా దారుణంగా మాట్లాడుతున్నావు… కనీసం మీ నాన్న చేతి రాత కోసమైనా అవి విలువైనవి అనిపించలేదా..”

“చేతిరాత… ఎందుకూ.. వున్నాయిగా ఆయనగారు స్వయంగా రాసుకున్న దస్తావేజులు, వీలునామా… ఛస్తున్నాం వాటి సంగతులు తేలక… అన్నట్టు వీలునామా అంటే జ్ఞాపకం వచ్చింది… నీకు తెలిసిన మంచి లాయర్ వుంటే చెప్పరా.. అసలు అందుకే నేను నీ కోసం వెతుకుతున్నాను…” వాడేదో చెప్తూనే వున్నాడు, నేను మాత్రం వినడం మానేశాను.

అలాగే నిలబడిపోయాను. అన్ని రోజులు పడ్డ ఆదుర్దా మొత్తాన్ని ఆవేదన లాంటిదేదో కమ్మేసినట్లైంది.

వాడు నా కోసం ఫోన్లు చేసింది, ఇంటికి వచ్చింది వాళ్ళ నాన్న సమపార్జించిన జ్ఞానమనే ఆస్థి కోసం కాదా….?? అంతేలే చలం ఇల్లు పాడుబడితే ఎవరికి పట్టింది? గాంధీ వస్తువులు వేలంపాటలు వేస్తే ఏ వారసుడికి నొప్పి పుట్టింది? ఆస్థికి వారసులు వేరే, అత్మకి వారసులు వేరే..!!

“ఏరా ఏమంటావ్?” కదిలించాడు వాడు.

“మళ్ళీ కలుస్తారా” అని ఆటో ఎక్కేశాను.

ఆ తరువాత మరో మూడు రోజులకి అనుకోకుండా బంటిగాడి బొమ్మల బాక్స్ లో ఎర్ర అట్ట డైరీలు కనపడ్డా, ఆ విషయం చారికి చెప్పలేదు. వాడు అడగనూ లేదు. అయితే ఇప్పటి కూడా వాణ్ణి కలవకుండా వుండటానికే ప్రయత్నిస్తున్నాను.

ఒక బొమ్మ వెనక కథే…ఈ “ఊహాచిత్రం” !

satyaprasadప్రతి కళలో కొంత కష్టం వుంటుంది. ఆ కష్టం పేరు పురిటి నొప్పులు.

ప్రతి కళాకారుడికీ ఒక సుఖం వుంటుంది. ఆ సుఖం పేరు కూడా పురిటి నొప్పులే.

ఏదో చేసెయ్యాలన్న తపన వుంటుంది. ఏవేవో తలపుకొస్తుంటాయి. ఎన్నెన్నో తొలుపుకొస్తుంటాయి. ఒక కథ రాయాలన్నా, ఒక కవిత రాయాలన్నా, ఒక బొమ్మ వెయ్యాలన్నా అవి ఒక రూపాన్ని సంతరించుకునే వరకూ ఒక అసహనం, ఒక తపన, ఒక ట్రాన్స్ లాంటి మెలకువ కళాకారులందరికీ అనుభవమే. నిద్ర, ఆకలి లేకపోవటంతో పాటు మిగతా శరీరావయాలు పనిచెయ్యడం మానేసే సందర్భాలు. పక్కనే ఎవరో పిలుస్తున్నా వినపడదు, కళ్ళ ముందు టీవీ నడుస్తున్నా అది మెదడుదాకా వెళ్ళదు. ఇలాంటి ఒక సంధి కాలాన్ని అక్షరబద్ధం చెయ్యాలని చాలా రోజుల్నుంచి అనుకుంటూ వున్నాను.

ఒక మిత్రుడి (ప్రముఖ చిత్రకారుడు)తో పిచ్చాపాటి మాట్లాడుతున్నప్పుడు ఆయన ఇలాంటి పరిస్థితిని యథాలాపంగా ప్రస్తావించారు. “ఏదో చెయ్యాలని ప్రయత్నం చేస్తున్నాను. అది చేసే లోపే నేను పోతే..” అన్నారు. అక్కడ కథకి బీజం పడింది. ఆయనతో మాట్లాడినప్పుడు దొర్లిన ఆర్టిస్ట్ కు సంబంధించిన అంశాలు కొంత ముడి సరుకును ఇచ్చాయి.

ఒక మాస్టర్ పీస్ పుట్టడం వెనక ఇంత తపన, ఇంత వేదన వున్నా అంత వేదనలో నుంచి పుట్టిన ఆ కళని గుర్తించడంలో ఈ ప్రపంచం విఫలం కావచ్చు. కనీసం ఆ కష్టాన్ని కూడా గుర్తించకపోవచ్చు. ఆ గుర్తించని ప్రపంచంలో పాఠకులు వుండచ్చు, స్నేహితులు వుండచ్చు, తల్లీదండ్రీ ఆఖరుకు భార్యాబిడ్డలు కూడా వుండచ్చు. కానీ కళాసృష్టి వెనక జరిగే మధనాన్ని మరో కళాకారుడు తప్పకుండా గుర్తిస్తాడు. ఆలా గుర్తించిన సాటి కళాకారుడి అభినందన మించిన అవార్డు వుండదేమో ఈ ప్రపంచంలో. ఇది కథలో కొసమెరుపు అయ్యింది.

కథానాయకుడు చిత్రకారుడు కాబట్టి కథ కూడా ఒక సర్రియల్ చిత్రంలా వుండాలని అనుకున్నాను. కొంత చైతన్య స్రవంతి ధోరణిలో సాగినా, కాస్త రీసెర్చ్ చేసి అరువు తెచ్చుకున్న ’ఆర్ట్’ సంబంధించిన సాంకేతిక పదాలు వున్నా  సామాన్య పాఠకుడికి కూడా అర్థం అయ్యేలా రాయాలనుకున్నాను. అందుకు కొంత పాశ్చాత్య సాహిత్యం చదివిన అనుభవం ఉపయోగపడింది.

చివరగా ఈ కథ ప్రచురించబడినప్పుడు ఎందరో చిత్రకారులు నాకు ఫోన్ చేసి అభినందించడం, ఫోన్ చేసిన ప్రతి ఒక్కరు “మీరు బొమ్మలు కూడా వేస్తారా?” అని అడగటం ఆనందాన్ని ఇచ్చింది. కీర్తిశేషుడైన ఓ చిత్రకారుడి భార్య ఫోన్ చేసి ఆయన అసంపూర్ణంగా వదిలేసిన బొమ్మలను నాకు ఇస్తానని అనడం ఈ కథకు నాకు లభించిన అతి పెద్ద అవార్డు.

***

ఊహాచిత్రం

నేను లేచాను. ఇంకా మత్తుగా వుంది. లేచిన చోట అలాగే కూర్చుని గట్టిగా కళ్లు నులుపుకొని కిందకి చూశాను. కాళ్లకింద ఆ బొమ్మ … “ఆన్ క్రాస్” చార్‌కోల్ ఆన్ తార్ రోడ్. దాదాపు ఇరవై సంవత్సరాల క్రితం నేను గీసిన బొమ్మ లాగానే వుంది. ఇంకా ఇలా రోడ్డు మీద వుండటమే ఆశ్చర్యం. దీనంగా గీసిన క్రీస్తు ముఖంలో చిన్న చిరునవ్వు … నన్ను ఆహ్వానిస్తున్నట్టు నవ్వు. నేనున్న చోటు నుంచి ఆ బొమ్మని చెరపకుండ వుండాలని జాగ్రత్తగా కదిలాను. అదృష్టవశాత్తు పాదాలు నేలకి ఆనడం లేదు.

ఎదురుగా ఏముందో కనపడటం లేదు … మొత్తం మంచుతెర. మసక మసకగా ఎక్కడో దూరంగా ఏదో జరుగుతున్నట్టు అలికిడి. మంచు కరుగుతోంది … అలా ముఖం మీద రంగులై జారుతోంది. అంతా ఏదో సర్రియలిజం పెయింటింగ్‌లాగా … ఇంకా చెప్పాలంటే మాస్ సర్రియలిజంలాగా కనపడుతూ … కరుగుతోంది …!

ఎదురుగా ఒక టీ బండి. అలాగే చూస్తూ వుండిపోయాను. అదేదో కలిసిపోయిన రకరకాల పెయింటింగ్స్ గేలరీలాగా వుంది. ఆ గోడని చూస్తుంటే అక్కడక్కడ పెచ్చులూడి, రంగులు వెలసి ఒక అబ్‌స్ట్రాక్ట్ ఎక్స్‌ప్రెషనిజం … అదిగో అక్కడ గోడ కిందుగా ఆ మరకలు. అవి ఒంటికాలిపైన నిలబడి టీ తాగుతూ, రెండో కాలు గోడ మీద ఆనుకునే మనుషుల రకరకాల బూటు గుర్తులు, చెప్పు గుర్తులు … వాటిపైన ఎవరో పాన్ తిని వూసిన గుర్తులు. చూస్తుంటే డెభ్బైల్లో వచ్చిన ఏదో మినిమలిజం తాలూకు పెయింటింగ్ లాగా వుంది. జామెట్రిక్ అబ్స్‌ట్రిక్ట్ అన్నా కాదనలేను కాకపోతే ఆ మరకల్లో సిమెట్రీ లేదు! ఆయన పేరేంటి … అదే జామెట్రిక్ అబ్స్‌ట్రాక్ట్ కనిపెట్టిన రష్యన్ … కాజిమీర్ … కాజిమీర్ … ఏదో వుండాలి! “ఒక టీ” చెప్పాను బండి వాడితో.

పక్కనే ఒక పెద్ద రాయి. దాని మీద కూర్చున్నాను. రాయి చాలా మెత్తగా వుంది. నా వెనక గోడ మీద సగం చించేసిన సినిమా పోస్టర్. చించేసిన సగంలోనుంచి వారం క్రితం అంటించిన మరో పోస్టర్ కనపడుతోంది. కొలాజ్ …’రివీలిజం’ అనొచ్చా … అట్లాంటిది ఒకటి వుందా? ఏమో తెలియదు… టీ అమ్మే అతని వైపు చూశాను. నేనొకణ్ణి ఉన్నానన్న స్పృహే లేకుండా తన పని తాను చేసుకుంటూ పోతున్నాడు. ప్రత్యేకమైన ముఖం. మా గురువుగారు చెప్పినట్లు వృత్తం, త్రిభుజం, చతుర్భుజం ఈ మూడిటితోనే అతని ముఖం తయారైంది. రోజులో సగం కూడా గడవలేదు కాబట్టి … ఇంకా ఫ్రెష్‌గానే వున్నాడు. సాయంత్రం వచ్చి అతను చెమటతో తడిసిపోయి వున్నప్పుడు ఒక లైవ్ ఆర్ట్ చెయ్యాలి.

తల తిప్పి మళ్లీ ఎదురుగా చూశాను. నేను దాటి వచ్చిన కిటికీ ఎక్కడో దూరంగా వుంది. చూస్తుండగానే వెనక్కి వెనక్కి వెళ్లిపోయింది. ఎదురుగా జనం … పెద్ద గుంపుగా జనం. ఎంత అద్భుతంగా వుందో చెప్పలేను. అసలు జనాన్ని చూడటమే ఒక అద్భుతమైన అనుభవం. ఇంతింత చిన్న చిన్న ముఖాలలో ఎన్ని వేల ఎక్స్‌ప్రెషన్లు వుంటాయో! అదుగో అటు చూడండి … కూరగాయలకోసం వచ్చి అదంతా మర్చిపోయి గుంపు మధ్యలోకి తొంగి చూస్తున్న బట్టతలాయన … ఆయన ముఖంలో ఆత్రుత … ఆదుర్దా! ఆయన చెయ్యి పట్టుకొని “వెళ్దాం” అంటూ లాగుతున్న మూడేళ్ల పిల్ల. ఆ పిల్ల ముఖంలో చిరాకు, తొందర. పక్కనే వున్న ఆ అమ్మాయిని చూశారా … అహహ … ఆమె కాదు … ఆ లావుగా, మెరూన్ కలర్ చీర పక్కన … ఆ అదే ఆ కుక్కపిల్ల. ఆ అమ్మాయి కట్టుకున్న ఎర్ర రంగు చీరచెంగు గాలికి ఎగిరి పక్కనే వున్నాయన నల్లటి పాంట్‌మీద పడుతుంటే భలే వుంది. ఎరుపు నలుపు కాంబినేషనే అంత…!

ఇలాగే ఈ గుంపుని బొమ్మ గీసేస్తే బాగుంటుందేమో అనిపిస్తోంది … క్యూబిజంలో అయితే బాగుంటుందేమో … ఆ అమ్మాయిని మాత్రం క్యూబిజంలో ఇరికించేసి అన్ని వైపుల్నించి ఆ అమ్మాయి ముఖం గీసేస్తే … అబ్బా … మాస్టర్ పీస్ చెయ్యొచ్చు!
“ఎంతసేపు టీ ఇవ్వడానికి?” గట్టిగా అరిచి మళ్లీ గుంపువైపు తిరిగాను.

గుంపు మధ్యలోనించి ఏదో కదులుతూ బయటికి వస్తోంది. రంగు … ఎర్రటి రంగు … ఆ రంగుని చూడగానే మనసు వురకలేస్తోంది… క్యూబిజం పక్కన పెట్టి క్లాసికల్ రియలిజం వైపు మనసు పోతోంది. అవును అలాగే వెయ్యాలి. అప్పుడే నా ప్రతిభ తెలుస్తుంది … రియలిజం … నియోక్లాసిజం కలిపి … అవును నా బ్రష్‌లు ఎక్కడ పెట్టాను? నా ఇంట్లోకి ఎలా వెళ్లాలి? నల్లటి వర్షం మొదలైంది.

ఎన్ని నీళ్ళు పడ్డా ఆ ఎర్రరంగుకి ఏం కావడం లేదు… అది రంగు కాదు … నా కర్థమైంది … రక్తం! గుంపు మధ్యలో ఎవరిదో రక్తం … ఆదుర్దాగా లేచాను… పరిగెత్తాను. ఆ గుంపుని చీల్చుకొని లోపలికెళ్లి చూశాను.

ఆ శవం … ఆ శవం …

నాదే …!!

నేనే అక్కడ పడివున్నాను … ముదురు గోధుమరంగు ముఖం నాది … నా ముఖం మీద ఎర్రటి రక్తం … ఎంతైనా చెప్పండి … కాంబినేషన్ కుదరలేదు … వర్షం పచ్చగా మారింది.

***

akbar“నువ్వు నారాయణగారి పెయింటింగ్ వెయ్యాలి…”

ఈ మాట వినగానే ఎగిరి గంతేసాను. నా చేత్తో మా గురువుగారి బొమ్మగీసే భాగ్యం … అంత కన్నా ఇంక కావాల్సిందేముంది …! ఆయనంటే నాకెంత అభిమానమో చెప్పలేను…!

అసలు మొదటిసారి ఆయన్ని చూసినప్పుడు కత్తి తీసుకొని పొడిచేద్దామనిపించింది … చంపేస్తే ఏమౌతుంది? అని ఒక క్షణం ఆలోచన వచ్చింది … ఈర్ష్య సార్ … మహా చెడ్డది ఈ ఈర్ష్య!

ఆయన వయసు అరవై దాటుతోంది! అయినా ఏదైనా బొమ్మని చూస్తే ఇంకా పిల్లాడే …! ప్రతి బొమ్మనీ, ప్రతి గీతనీ ఆ కళ్లద్దాల సందుల్లోంచి తదేకంగా చూస్తుంటాడు … ఎంత చిన్న పిల్లాడు గీసిన బొమ్మైనా సరే … అది తినేసే చూపు! ఆ తరువాత తను గీస్తాడు … మళ్లీ మళ్లీ గీస్తాడు. తాను చూసిన ఆ ఆర్ట్ ఏదైనా సరే … తనకి పట్టుబడేదాకా వూరుకోని పట్టు వదలని విక్రమార్కుడు … అందుకే పోర్ట్రేట్స్ దగ్గర్నుంచి అబ్స్‌ట్రాక్ట్స్ దాకా, ఇలస్ట్రేషన్స్ నుంచి క్యారికేచెర్స్ దాకా అన్నీ చేశాడు. ఇంకా చేస్తూనే వున్నాడు.

“ఆకలి చాలా ముఖ్యం … ఆకలికి దాసోహమనని కళ లేదు” అన్నాడొకసారి.

“అవును వ్యాన్‌గో అంత గొప్ప బొమ్మలు గీసాడంటే పాపం కడుపులో రగుల్తున్న ఆకలే కారణం … కదా గురువుగారూ?” అన్నాను అజ్ఞానంగా. ఆయన నవ్వేశాడు.

“నేను చెప్పేది ఆ ఆకలి గురించి కాదు … కొత్తది ఏమైనా నోర్చుకోవాలనే ఆకలి … అది మనసులో భగభగ మండుతుంటే ఇలాంటివి ఇంకా ఎన్నో నేర్చుకోవాలనిపిస్తుంది …” చెప్పాడాయన. ఆ తరువాత తెరిచాడు ఆయన సేకరించిన రకరకాల బొమ్మల ప్రపంచాన్ని.

ఎక్కడో చైనాలో గీసిన అబ్స్‌ట్రాక్ట్ బొమ్మలు, జర్మనీ పత్రికల్లో వచ్చిన కార్టూన్ స్ట్రిప్స్, ఇంకెక్కడో మధ్యప్రాచ్యంలో గీసిన పోస్టర్ డిజైన్స్ … ఇలాంటివి ఎన్నో . ఒక్కొక్క బొమ్మ ప్రత్యేకతని, ఆ గీతల నైపుణ్యాన్నీ చూపిస్తుంటే … ఆయనలో మరింత వుత్సాహం … నాలో నైరాశ్యం! ఆ ప్రపంచాన్ని వదిలి ఏ రాత్రి వేళో ఇల్లు చేరాక నా మీద నాకే అసహ్యం వేసింది. అన్ని బొమ్మలు చూశాక, అంత మంది ఆర్టిస్టులను కలిశాక ఇంక నన్ను నేను ఆర్టిస్ట్‌నని చెప్పుకోడానికి అర్హత లేదనిపించింది. నా ఎదురుగా వున్న నాలుగు పెయింటింగ్స్ … నేను గీసినవే … నన్ను వెక్కిరిస్తున్నట్లు. వాటి మీద కసి కొద్దీ రంగులు చల్లేశాను. ఎర్రరంగు ఇండియన్ ఇంక్ బాటిల్ మొత్తం కుమ్మరించాను.

***

ఎర్రటి రక్తం రోడ్డు మీద పరుచుకుంటోంది. ఆ రక్తం నాదే … నా శవానిదే. నేను చచ్చిపోయాను అని తెలియగానే భలే ఏడుపొచ్చింది. నా భార్యా పిల్లలు గుర్తుకు రాలేదు. అమ్మా, నాన్న, బంధువులు, మిత్రులు … వీరెవ్వరూ గుర్తుకు రాలేదు! మా గురువుగారు కూడా గుర్తుకు రాలేదు.

నా కళ్లముందు అస్పష్టంగా కనిపించింది. నేను వేస్తున్న నారాయణగారి పోర్ట్రెయిట్ పెయింటింగ్! ఇంకా పూర్తి కాలేదు … స్ట్రక్చెర్ అయిపోయింది … బేస్ కలర్స్ వేసేశాను … ఇంకా చెయ్యాల్సిన పని చాలా వుంది. అదంతా ఎవరు పూర్తిచేస్తారు అనిపించింది. అసలు పూర్తి చేస్తారా? అని అనుమానం వచ్చింది. నా వూహల్లో తయారైన చిత్రం … దానికి ఈ భూమిమీద పుట్టే అవకాశం లేకపోయింది … నా చావుతో … ఆ బొమ్మ పుట్టకముందే చచ్చిపోయింది.

ఇలాంటిదొకటి మొదలు పెట్టానని ఎవరికీ తెలిసే అవకాశం కూడా లేదు. నాకు అడ్వాన్స్ ఇచ్చిన వ్యక్తి ఆ డబ్బుల కోసం వస్తాడేమో కాని, నేను గీసి సగంలో ఆగిపోయిన బొమ్మని తీసుకెళ్లడానికి మాత్రం రాడు … ఆ బొమ్మ అలా దీనంగా ‘ది క్రయింగ్ చైల్డ్’ బొమ్మలాగా అలా ఒక మూలన పడుండాల్సిందే.

ఏదో ఒక రోజు మా ఆవిడకి అదంతా అడ్డంగా తోస్తుంది. ఆ రోజు ఏ పాత సామాన్ల బండిమీద పడిపోతుందో … అంతకన్నా ఏం చెయ్యగలదు చెప్పండి … అంటే నా భార్యకి బొమ్మలంటే ఇష్టంలేదని కాదు, బొమ్మ మొత్తం గీస్తే అది బాగుందో లేదో చెప్పగలదు గానీ, ఏం బాగుందో చెప్పలేదు. అలాంటప్పుడు పూర్తిగా గీయని బొమ్మను చూసి, అది అర్థాంతరంగా ముగిసిపోయిన మాస్టర్‌పీస్ అని గుర్తించడం అసంభవం.

“ఏమిటా ఆ పరధ్యాన్నం” అంటుండేది అప్పుడప్పుడు.

“అబ్బే ఏం లేద”నే చెప్పాను చాలాసార్లు. అంతకన్నా ఏం చెప్తాను? నా మనసులో ఏదో మూల ఒక రష్యన్ చిత్రకారిణి గీసిన పెన్సిల్ ఆర్ట్ తొలుస్తోందని చెప్పనా? డావించీ కుంచె నా గుండెల్లో కస్సున దిగి రంగులు పులుముతోందని చెప్పనా … లేకపోతే నేను గీయబోతున్న బొమ్మ తాలూకు పురిటి నొప్పుల గురించి వివరించనా.

“ఇదిగో … ఒక కాలికి ఒక రకం చెప్పు, రెండో కాలికి ఇంకో రకం చెప్పు వేసుకున్నారు” చెప్పింది నేను బయలుదేరినప్పుడు.

కాళ్లవైపు చూసుకున్నాను. అవును కరెక్టే. ఇందాక వేసుకునేటప్పుడే అనుకున్నాను సిమెట్రీ లేదు అని.

నవ్వేసి “మా గురువుగారింటికి వెళ్లొస్తా …” అన్నాను చెప్పులు మార్చుకుంటూ.

“అలా ఏదో ఆలోచిస్తూ బండి నడపకండి …” జాగ్రత్త చెప్పింది పాపం.

ఆ మాటలు విన్నాను … కానీ ఆలోచనలు వూహలు కలలు మన చేతుల్లో లేవు కదా! అవి వచ్చి నన్ను కమ్మేసి ముద్దుల్లో ముంచేస్తుంటే … అరెరే నేను కుడి వైపు సందులోంచి వెళ్లాల్సింది. మాటల్లో పడి మర్చిపోయాను. కొంచెం ముందుకు వెళ్లి టర్నింగ్ తీసుకోవాలి. గురువుగారి పెయింటింగ్ ఎలా వెయ్యాలో దాదాపు ఖరారైంది … కొన్ని రిఫరెన్స్‌లు తీసుకోడానికి గురువుగారి దగ్గరకే వెళ్తున్నా. ఆయనకి బాగా పేరుతెచ్చిన మేజిక్ రియలిజం స్టైల్లో ఆయన బొమ్మ గీయాలి. దాటేస్తున్నా … దాటేస్తున్నా … మర్చిపోయి మళ్లీ కుడివైపుకి తిరగడం మర్చిపోయి, వున్నట్టుండి తిప్పడం … ఆ వెనకే వస్తున్న లారీ ఢీ కొట్టడం … అసలు ఎప్పుడు జరిగిందో తెలిసేలోగా నేను నేలమీద పడ్డాను …! నా బొమ్మ అనాథ అయిపోయింది.

***

నేనొక పిచ్చోణ్ణి. నా ముందు మసక మసకగా వున్న చిత్రాన్ని చూసి సర్రియలిజమో ఇంకేదో అనుకున్నా … ఆత్మలకి అలాగే కనిపిస్తాయేమో! పైగా టీ ఇవ్వలేదని కోపమొకటి! అలా ఎంతసేపు పెయింటింగ్‌కి పోజిచ్చినవాడిలా కూర్చోవాలో మరి. ఆత్మ అంటే ఎగురుకుంటూ పైకి వెళ్లి ఆకాశంలో కలిసిపోవాలి కదా!

నా శవం చుట్టూ జనం పెరుగుతున్నారు.

“అరెరే … హెల్మెట్ పెట్టుకోకపోతే చూశారూ …” ఆయనెవరో నీతి సూత్రం చెప్తున్నాడు.

“నేను చూస్తూనే వున్నా … అడ్డదిడ్డంగా నడుపుకుంటూ వస్తున్నాడు… తాగున్నాడేమో అనుకున్నా … వున్నట్టుండి తిప్పాడు” మరో ప్రత్యక్ష సాక్షి.

నాకు అక్కడ వుండబుద్ధి కావటం లేదు. కాని ఈ ప్రపంచాన్ని వదిలి వెళ్దామంటే వెళ్లనివ్వకుండా ఏదో పట్టి లాగుతోంది.

భూమ్మీదే ఏదో శక్తి ఆపుతోంది.

పోలీసులు వచ్చారు. నా మొబైల్ తీసుకొని అందులో నెంబర్లకి ఫోన్‌లు చేస్తున్నారు. నాకు అర్థమయ్యింది. నా భార్యాపిల్లల్ని చూసుకోవాలనే అనుకుంటా నా ఆత్మ ఆరాటం.

అంబులెన్స్ వచ్చింది. నా భార్యాపిల్లలూ వచ్చారు. ఆమె ఒకటే ఏడుపు. నాకు ఏడుపు రాలేదు … ఎందుకో!

ఇంక అయిపోయింది. ఇంకాసేపట్లో తీసేస్తున్నారు. ఇకనైనా నా ఆత్మ కదలాలి … లేదే … ఇంకా ఏదో ప్రతిబంధకం!!

“ఏమైంది?” గుంపు చివర నిలబడి పక్కనే వున్న కుర్రాణ్ణి అడిగాడు ఒక ముసలాయన.

“ఏక్సిడెంట్ …. స్పాట్‌లో పోయాడు …” ఎవరో చెప్తున్నారు.

“అయ్యయ్యో … ఎవరో తెలిసిందా?”

“ఎవరో బొమ్మలేస్తాడట … ఆర్టిస్ట్” చెప్పాడతను. ముసలాయన గుంపును తోసుకొని లోపలికి వెళ్లాడు. నా శవం వైపు చూస్తూ చేతులు జోడించి నిలబడ్డాడు.

“ఏం బొమ్మ నీ కళ్లముందు కనపడతా వుండిందో నాయనా … నీ సావు నీకు కనపడలా…” అని బయటికి వచ్చాడు అతను. అదే నేను వినాలనుకుంది. నా చావుతో నా బొమ్మ మిగిలిపోయింది. నా వూహలో బొమ్మ అర్థాంతరంగా ఆగిపోయింది. కానీ, కనీసం ఒకరికైనా నా చావుకు కారణం తెలిసింది. అదే నేను వినాలనుకున్నది. నా ఆత్మ గాల్లోకి లేచింది.

ఆ ముసలాయన రోడ్డు మీద గీసిన క్రీస్తు బొమ్మపైన చిల్లర ఏరుకుంటున్నాడు.