కథలకు ఒక ఇల్లూ ఒక కుటుంబం!

katha3

 

– జగద్ధాత్రి

~

 

కథానిలయం గురించి అన్నీ  అందమైన జ్ఞాపకాలే!

అసలు కమ్మని జ్ఞాపకాలు కాక కథానిలయం గురించి ఏముంటాయి చెప్పండి. ఇది తెలుగు రచయితలను పాఠకులను కథా నిలయం ఎరిగిన ప్రతి వారూ రాయగలరు, ఎన్నెన్నో చెప్పగలరు. పద్ధెనిమిది  సంవత్సరాలనుండి ఫిబ్రవరి రెండవ శని ఆదివారాలలో కథా నిలయం శ్రీకాకుళo వెళ్ళడం ఒక ఆనవాయితీగా తెలుగు సాహిత్య ప్రేమికులందరికీ అలవాటే. నాకున్న అనుభూతులను కొన్ని మీతో ముచ్చటించుకుంటాను.

కథానిలయం వార్షికోత్సవం అంతే అందరూ కలుసుకునే ఒక పెద్ద పండుగ. అసలీ జ్ఞాపకాలను ఎక్కడనుండి మొదలుపెట్టను? కథా నిలయానికి ఎప్పుడు వెళ్లినా కొంగు నిండా బోలెడు అందమైన జ్ఞాపకాలను కట్టి తెచ్చుకుంటూనే ఉంటాను.

 

ముందు కథా నిలయం వార్షికోత్సవాలా జ్ఞాపకాల పూలు కాసిన్ని మీకోసం….

విరసం రచయిత అర్నాద్ కి “రావిశాస్త్రి” పురస్కారం ఇవ్వడం, ఆ వేడుక లో రచయితను గూర్చి ప్రసంగించడానికి రామతీర్థని ఆహ్వానించారు. ఇది 2004 అనుకుంటాను. ముందు రోజు మధ్యాహ్నం నుండి వచ్చిన వారందరివీ పరస్పర పరిచయాలు, కొన్ని ప్రసంగాలు అన్నీ అవుతాయి అని అందరికీ తెలిసిందే కదా. అబ్బా అందరినీ కలుసుకోవడం ఎంత సరదా , మా నాయుడు బావులందరూ, మా ఉత్తరాంధ్ర ‘బుదడు’ ఛాయారాజ్, కవన శర్మగారు, ఇలా ఎంతమందినో పేరు పేరునా చెప్పలేను కానీ ఎన్నెన్ని హాస్యాలు కబుర్లు. మరుసటి రోజు కార్యక్రమం అయ్యాక భోజనం . నీళ్ళు పేకెట్లు ఇచ్చారు. అప్పుడే గౌరునాయుడు బావు ‘నదిని దానం చేశాక’ కవితా సంపుటి ప్రచురించాడు. ‘ఏటి బావు నదిని దానం సెసీసినావనేటి నీళ్ళ పేకెట్టిచ్చినావు’ అని నేను అల్లరిగా అంటే అవును తల్లే మరి నదిని దానం సెసీసినామ్ కావా అని నవ్వుతూ గౌరునాయుడు బావు సమాధానం చెప్పడం. ఛాయారాజ్ గారు తో కాస్త పొగ బండిని తగ్గించండి సారూ అని ఆప్యాయంగా మందలింపుగా అంటే ‘అదే మరి కొంచం కష్టం అవుతోంది’ అని ఆయన సమాధానం.

బావూ తెల్ల మిరియం బావు(అది రామతీర్థ తొలి కవితా సంపుటి) ఇరగదీసీసినావు అంటూ హాస్యవల్లరి వెదజల్లిన మా చింతా అప్పల్నాయుడు బావు.

మరో ఏడాది నేను , రామ తీర్థ, స్వామి గారు వెళ్ళాం. ముందు రోజు కారా దంపతులకు అభినందన సత్కారం మాస్టారికి ముందు చెప్పకుండా ఏర్పాటు చేసేరు. అప్పుడే ఆయనకేదో పురస్కారం వచ్చింది. బహుశా తెలుగు విశ్వవిద్యాలయం వారిది అనుకుంటాను. నేను రామినాయుడు కలిసి మాస్టారికి అమ్మ కి పూల దండ వేయడం ఒక అందమైన జ్ఞాపకం. తన సాహితీ జీవనం సాఫల్యంగా సాగడానికి కారణం సంసారానికి తాను కెప్టెన్ గా తన గృహిణి నడపడమే అని అర్ధాంగిని గూర్చి ఆర్ద్రంగా చెప్పేరు మాస్టారు. ఆయనకి తనకు సాధ్యమైన సహాయం చేయడమే ఆయనని రాసుకోనివ్వడమే తప్ప తాను చేసినదింకేమీ లేదని వినమ్రంగా చెప్పిన ఆ సాహితీ మూర్తి అర్ధాంగి సీత మహాలక్ష్మి వినయానికి మేమందరము ఆశ్చర్యానందం చెందేము.

అప్పుడే రచన శాయి గారిని, రఘోత్తమరెడ్డి గారిని చూడటం జరిగింది. అక్షర వాచస్పతులందరి హాస్యాల విరి జల్లుల్లో తడుస్తూ మురుస్తూ ఎన్నెన్ని మాటలో!

katha1

2013 కథానిలయం స్వీట్ సిక్స్టీన్  వార్షికోత్సవం లో సాహితి మిత్రురాలు డాక్టర్ అయ్యగారి సీతారత్నం పుస్తకం “కూరాకుల మడి” ని వోల్గా అరవయ్యవ జన్మదినోత్సవానికి కానుకగా ఆమెకు అంకితమిస్తూ మాస్టారి చేతుల మీదుగా ఈ పుస్తకాన్ని కథా నిలయం లో ఆవిష్కరించారు. ఆ పుస్తకాన్ని పరిచయం చేసే భాగ్యం నాకు కలిగింది. కథానిలయం లో ప్రేక్షకురాలిగా కాక ప్రసంగం చేసే అవకాశం అంది పుచ్చీసుకున్నాను ఆ రోజు.

ఆ రోజే ఎప్పుడూ కథల పుస్తకాలు తప్ప ఆవిష్కరించని కథానిలయం లో మాష్టారి చేతుల మీదుగా కుమార వర్మ కవితా సంపుటి ‘రెప్పల వంతెన’ ఆవిష్కరణ కూడా జరిగింది. ఆ రోజే మాస్టారి తమ్ముడు కీ.శే. కృష్ణా రావు గారి కవితా సంపుటిని కూడా ఆవిష్కరించారు. తన తమ్ముడే గనుక కుటుంబ బాధ్యతను స్వీకరించి తనకు స్వేచ్ఛనివ్వక పోతే తాను ఇంత రచన చేయగలిగేవాడిని కాను అని మాస్టారు ఎంతో ప్రేమగా తన జ్ఞాపకాలను మాతో పంచుకున్నారు. ఆయన కళ్లలోని తడిని చూసి మా అందరి గుండెలూ చెమ్మగిల్లాయి.  మరుసటి రోజు సతీష్ చందర్ , నండూరి రాజగోపాల్ అతిథులుగా వార్షికోత్సవ ప్రసంగాలు సాగాయి. ఇవి కొన్ని వార్షికోత్సవ ముచ్చట్లైతే ఇక మామూలుగా ఎన్నో సార్లు కథా నిలయం కి వెళ్ళడం , ఎవరైనా ఆత్మీయ మిత్రులు వచ్చినప్పుడు తీసుకెళ్ళడం పరిపాటి.

అలా ఈ మధ్య వచ్చిన ఖమ్మం మిత్రులు , మువ్వా శ్రీనివాసరావు, సీతారాం,ఆనందాచారి , కపిల రామ్ కుమార్ , ప్రసాద మూర్తి, అందరం కలిసి మాస్టారిని చూడటానికి వెళ్ళడం ఒక మరుపు రాని అనుభూతి. అక్కడ మా అప్పల్నాయుడు బావు , రామారావు నాయుడు గారు , అందరం కలుసుకుని మాస్టారికి నేను , సీతారాం, మువ్వ శ్రీనివాసరావు మా పుస్తకాలు ఇచ్చి ఆశీర్వాదం తీసుకున్నాం. అందరం కలిసి ఆ మధుర క్షణాలని మా కెమెరాల్లో బంధించి తెచ్చుకుని అపురూపంగా దాచుకున్నాం.

మాస్టారు భలే మాటన్నారు ఆరోజు. చెప్తా వినండి. మాస్టారు తొంభయ్యవ పుట్టినరోజు నాడే చెప్పేరు నన్ను ఇంకెక్కడికీ పిలవకండి శరీరం సహకరించడం లేదు రాలేను అని. అయినా పిలిస్తే  నాకెంత కష్టమవుతుందో మీకు తెలీదు. ఈసారి నన్ను బలవంత పెట్టారా మీ అందరికీ పూర్ణాయుష్షు దీవించేయ్గలను అని బెదిరించారు. అదేంటి మాస్టారు అంటే పూర్ణాయుష్షు అంటే 120 సంవత్సరాలు వృద్ధాప్యం లో ఎక్కడికైనా వెళ్లాలంటే ఎంత కష్టమో మీకు తెలిసొస్తుంది అప్పుడు అన్నారు. హాయిగా నవ్వేశాం అందరం.

ఈ మధ్యనే సాహితీ స్రవంతి వారి కార్యక్రమంలో మాస్టారిని మళ్ళీ దర్శించుకున్నాం. ఆయన ఆనంద భాష్పాలను చూసాము. శివారెడ్డి గారు, తెలకపల్లి రవి గారు అందరూ వేదిక మీద ఉండటం ఆరోజు విశేషం.

ఇక అన్నిటికంటే అపురూపమైన జ్ఞాపకం మీతో చెప్తాను ఇప్పుడు ఇది అందుకే చివరికి పెట్టాను.

2013 ‘తొంభాయిల్లోకి మన కారా’ ఒక పెద్ద సాహిత్య కార్యక్రమం తలపెట్టింది విశాఖలో మోజాయిక్. నవంబర్ 9 న మాస్టారు జన్మ దినోత్సవం నాడు చాలా మంది రచయితలతో , చాగంటి తులసి గారు మాస్టారు, ఏం ఎల్ సి శర్మ గారు ఇంకా అందరం ఒక వందమందిమీ కలిసి మా అందరి నడుమ గులాబీ దండతో కూర్చున్నతొంభై యేళ్ళ నవ యవ్వనుడు మాస్టారితో గ్రూప్ ఫోటో తీయించుకున్నాం. అది మా అందరికీ ఒక మధురస్మృతి.

సరే ఇంతకీ నే చెప్పొచ్చేది ఇది కూడా కాదు ఇంకా ఆనందమైన విషయమేమిటంటే ఆ కార్యక్రమానికి కొన్ని రోజుల ముందు నేను రామతీర్థ మాస్టారిని కలుసుకుని ఇంటర్వ్యూ చేయడానికి అనుమతి తీసుకుని కథా నిలయానికి వెళ్ళాం. మన తెలుగు వారి అదృష్టం కొద్దీ అప్పుడు మన శ్రీరామచంద్ర మూర్తి గారు హెచ్ ఏం టీవి లో ఉన్నారు. వారు వారి కెమెరా బృందాన్ని ఆ ఇంటర్వ్యూ మొత్తం చిత్రీకరించమని పంపించారు. ఇక ఆ రోజు చూడాలి మా ఆనందం. వెళ్ళేసరికి పదకొండున్నరైంది. మాస్టారు, వారి అబ్బాయి సుబ్బారావుగారు, వివిన మూర్తి గారు కూడా ఉన్నారు. ఆరోజు నిజంగా మా జీవితాల్లోనే కాదు తెలుగు సాహితీ చరిత్రలోనే మధురాతి మధురమైన స్మృతులుగా రాబోవు తరాలకు శాశ్వతీకరించగలిగే అదృష్టం మాకు కలిగింది. దాదాపు మూడు గంటల పాటు మాస్టారు మాతో మటాడేరు, భోజనానికి కూడా వెళ్లలేదు. మొత్తం ఇంటర్వ్యూ పూర్తయ్యే వరకు కదలలేదు.  ఆయన జీవిత, సాహిత్య విషయాలు ఎన్నెన్నో మాకు చెప్పేరు. రామతీర్థ నేను వేసిన ప్రశ్నలన్నిటికీ ఎంతో ఓపికగా హుషారుగా సమాధానాలు చెప్పేరు.

katha2మీ తొలి నాటి కథల్లో ‘రేవతి నుంచి’ అని ఉత్తరాల రూపం లో సీత అనే అమ్మాయికి రాసినట్టుగా కథలు ఉంటాయి కదా ఆ ఏడాదే మీ పెళ్లి సీతామహాలక్ష్మి గారితో అయింది కదా అయితే ఈ కథ అంతకు ముందే ప్రచురితమైంది అంటే మీకు అప్పటికే సీత గారు తెలుసా అన్న రామతీర్థ చిలిపి ప్రశ్నకు చూడాలి మాస్టారి మొహం లో నవ్వు. పేరు తెలుసు బాబు అప్పటికి అంటూ సమాధానం చెప్పేరు. రేవతి అన్నది తన జన్మ నక్షత్రమని ఆ పేరునే తన కలం పేరుగా వాడుదామా అని కూడా ఆలోచన ఉండేదని కూడా చెప్పేరు. ఈ ఇంటర్వ్యూని మొత్తం రామతీర్థ అక్షరీకరించి 2014 కారా తొంభయొకటవ జన్మదినాన సాక్షి లో ప్రచురించారు.   ఎప్పుడు సీతామహాలక్ష్మి గారి గురించి ప్రసక్తి వచ్చినా మా గృహిణి అనడమే తప్ప పేరు పెట్టి కూడా ప్రస్తావించని మహానుభావుడు.

తన జీవితం లోని చాలా ముఖ్యమైన సంగతులు , తన రచనా లోకం గురించి ఎన్నో మూచ్చట్లు చెప్పారు మాస్టారు. ఆ కార్యక్రమం నుండి కొంత ముఖ్యమైన భాగాన్ని “90 ఏళ్ల కుర్రాడు కారా’ పేరిట హెచ్ ఏం టి వి లో న్వంబర్ 9 నా కారా పుట్టినరోజు నాడు ప్రసారం చేసేరు. తాను రాసిన ఒక్కో కథకు గల నేపథ్యాన్ని రాయాలని ఉందని, దేహం సహకరించక రాయలేకపోతున్నాను అని చెప్పేరు. ఒక పెద్ద నవల రాయాలని ఉన్నదని కూడా చెప్పేరు. ఆత్మ కథ రాసే ఉద్దేశం ఉందా మాస్టారూ అని అడిగితే దానిలో ఏదైనా సమాజానికి ఉపయోగ పడేది ఉంటే తప్ప ఆత్మ కథ రాయాల్సిన అవసరం లేదు అన్నది తన నమ్మకం అని స్పష్టంగా చెప్పేరు. సాహిత్యం ముఖ్యంగా కథలు సమాజం లో చైతన్యాన్ని తీసుకొస్తాయని సంపూర్ణంగా నమ్ముతాను అని చెప్పేరు.  ప్రపంచం లో ఎక్కడా ఒక సాహిత్య ప్రక్రియ కు ఒక నిలయం అంటూ లేదు ఇప్పటివరకు అలాంటి గొప్పతనం మన కథా నిలయానికే ఉంది అనడానికి మన తెలుగు వారందరూ గర్వించాలి. తెలుగులో ప్రచురితమైన ప్రతి కథా కథానిలయం లో చోటు చేసుకుంటుంది.

తనకు నచ్చిన తాను గురువులుగా భావించే గురజాడ, కొడవటిగంటి కుటుంబరావు, రావి శాస్త్రి ల పెద్ద చిత్రపటాల సాక్షిగా కథానిలయం లో మాస్టారితో బాటు కూర్చుని ఆయన చెబుతున్న జీవిత సాహిత్య విశేషాలను తెలుసుకోవడం నా జీవితం లో సాటి లేని మధురానుభూతి. మన తెలుగు సాహిత్యం ఆంగ్లం లోకి తీసుకెళ్ళండి బాబు అందుకు కృషి చేయండి అని చెప్పేరు. తన రచనలను వ్యాసాలను ఏది సమాజానికి ఉపయోగిస్తుందో అవి అన్నీ అందరికీ ఇతర భాషల్లోకి, ముఖ్యంగా ఆంగ్లం లోకి వెళ్లాలని అది ఒక లక్ష్యంగా పెట్టుకుని మీరిద్దరు చేయాలని నాకు రామతీర్థ కి నవంబర్ 9, 2014 న చెప్పేరు. సాహిత్యమే లేకుంటే తన జీవితం శూన్యమని, ఎటువంటి కష్టాన్నైనా మరిపించగలది పుస్తకమేనని అందుకే ఒక కన్ను కనిపించక పోయినా ఇప్పటికీ రోజుకి ఐదారు గంటలు చదువుతానని చెప్పేరు కారా.

అంతటి సాహితీ మూర్తి తో శాశ్వతంగా ఒక చిత్రం లో ఉండగలగడం అదృష్టమన్న పదానికన్న మించినదేదో అయి ఉండాలి అన్నది నా భావన.

ఏదో అక్కడక్కడ దొరికినవి ఏరుకున్న నాలుగు పొగడ పూల లాంటి మాటలు చెప్పేనేమో ఇంకా చెప్పాలంటే బోలెడున్నాయి. ఎంత చెప్పినా తక్కువే. ఇలా నాకే కాదు అందరికీ ఉంటాయి అన్నది నిజం. ఇలా అందరం కలిసి రాసిన ఈ మధురానుభూతులన్నీ ఒక దరికి చేరిస్తే ఇదో పెద్ద పుస్తకమౌతుంది అనడం లో సందేహమే లేదు. కథా నిలయం వార్షికోత్సవం మళ్ళీ వచ్చింది పండుగ వచ్చిందోయ్ మాకు అన్నట్టు ఈ ఫిబ్రవరి లో కూడా ప్రతి ఏడు లాగే వార్షికోత్సవం జరుపుకుంటున్న కథా నిలయానికి , ఆ కథా నిలయ సంస్థాపకులు ఫీల్డ్ మార్షల్ కారా మాస్టారికి మనస్ఫూర్తిగా నమస్కారం!

*

 

 

మాష్టారి కథ – అదొక యజ్ఞం, ఒక జీవధార, ఒక ఆశీర్వచనం

With Kara mastaru

2006 సంవత్సరం.

రాయకుండా ఉండలేనంతగా ఏదైనా ఇతివృత్తం మనసుని ఆక్రమించి ఉంటే తప్ప, సాహితీ వ్యాసంగం పట్ల అంతగా శ్రద్ధ పెట్టని రోజులవి. ఒకరోజు కారా మాస్టారి నించి వచ్చిన ఫోన్ నాలో ఎంతో మార్పు తెచ్చింది. అప్పటికే  ఒక గేయ సంపుటీ ‘ఆలంబన’ కథాసంపుటి వెలువరించి ఉన్నా, నాలో రచన పట్ల అనురక్తి అంతగా ఉండేది కాదు. కౌముది  జాల పత్రికలో బహుమతి పొంది, రచనలో ప్రచురితమైన నా కథ ‘ఆసరా'(http://www.siliconandhra.org/monthly/2005/oct05/index.html) చదివి మాష్టారు చేసిన ఫోన్ అది. అప్పటికి కారా మాష్టారి కథలు కూడా  నేను చదివి ఉండలేదు.

ఫోనెత్తి హలో అనగానే, “నా పేరు కాళీపట్నం రామారావు అంటారమ్మా, నేను శ్రీకాకుళం లో ఉంటాను” అంటూ పరిచయం చేసుకున్నారు మాష్టారు!

ఒక సంచిక మొత్తం ఆయనకే అంకితం చేస్తూ, రచన పత్రిక వెలువరించిన వ్యాస పరంపరని ఆ నెలలోనే, అంతకు ముందే చదివి ఉండడంతో “నమస్కారం మాష్టారు” అన్నాను సంభ్రమంగా.

ఎంతో  వాత్సల్యంగా పలకరించి,  ‘ఆసరా’  కథని మెచ్చుకుని, నా కుటుంబం గురించీ, నేపధ్యం గురించీ అడుగుతూ చాలాసేపు మాట్లాడారు. అంతటితో ఆగిపోకుండా మళ్ళీ మర్నాడు ఫోన్ చేసి ” అమ్మా! నీ కథ నన్ను వెంటాడుతోందమ్మా” అని, ఒక మంచి రచయిత్రి నిలదొక్కుకోవాలంటే  అవసరమయ్యే  సహకారం గురించి నా భర్తతో మాట్లాడాలని ఉందని చెప్పినపుడు నాకు కలిగిన ఆశ్చర్యం అంతా  ఇంతా కాదు. అన్నట్లుగానే  ఒక రచయితకి ఎదురయ్యే సవాళ్ళ గురించీ, సహచరుల నించి అందవలసిన సహకారం గురించీ నా భర్తతో ఆయన చెబుతుంటే వింతగా విభ్రాంతిగా అనిపించింది.

ఆ తర్వాత ఆయన రచనల  సంగ్రహం కొని చదివాను. యజ్ఞం, మహదాశీర్వచనం, జీవధార ఒకటేమిటి మాష్టారు రాసిన ఏ కథ చదివినా, అందులో ఒక జీవధార తోణికిస లాడుతూ  కనిపించింది, తెలుగు కథ కొక ఆశీర్వచనం వినిపించింది, కథా రచననొక యజ్ఞంగా భావించిన మాష్టారి నిబద్ధత గోచరించింది.

 

తర్వాత కొన్నాళ్ళకి ఆయన హైదరాబాద్ రావడం, నాతో  మాట్లాడడం కోసం మా ఇంటికి రావడం ఎప్పటికీ మర్చిపోలేని జ్ఞాపకం. అప్పుడు  నన్నుగేయ రచన, చిత్రలేఖనం వదిలిపెట్టి, కథ మీద శ్రద్ధ పెట్టమని సూచించారు. ఆ సంఘటన గురించి నేను రాసిన వ్యాసం, న్యూజెర్సీ లోని తెలుగు జ్యోతి వారి సావెనీర్ లో ‘కథ కోసం కారా మాష్టారు’ పేర ప్రచురితమైంది (http://www.tfas.net/prema/web/kathakosam_varanasi.pdf). ఆ వ్యాసంలో రాసిన విషయాలే మళ్ళీ ఇక్కడ ప్రస్తావించడం సరికాదు కనుక అవి వదిలేస్తున్నాను. తర్వాత ఆయన నించి రెండు మూడు లేఖలు అందాయి. కొన్నిసార్లు ఫోన్లో కూడా మాట్లాడేవారు. నన్నే కాక ఇంకా ఎందరో కొత్త కథకులని  మాష్టారిలా ప్రోత్సహించారని విన్నాను.

 

ఆయన సృష్టించిన సాహిత్యం, ఆయనలో నాకు కనిపించిన వ్యక్తిత్వం .. దేనివల్ల నేనెక్కువ ప్రభావితమయ్యానో చెప్పడం కష్టం. తన జీవితాన్ని ఈ ఉద్యమానికి అంకితం చేసిన మాష్టారి మాటలు, తెలుగు కథ సర్వతోముఖంగా వికసించడం కోసం ఆయన పడుతున్న ప్రయాస, నా మీద చూపిన ప్రభావం లోతైనది. ఆయన కలగన్న లాంటి సాహిత్యాన్ని సృష్టించడంలో నేను సఫలం కాలేకపోవచ్చుగాని ఆయన తాపత్రయం నన్నెంతగానో  కదిలించింది.

 

తర్వాత కొన్నాళ్ళకి భాగ్యనగరంలో, త్యాగరాయ గాన సభలో, వంగూరి చిట్టెన్ రాజు గారి అధ్వర్యంలో తెలుగు మహాసభలు మూడు రోజులపాటు జరిగాయి, ఒక పెళ్ళిలాగా, పండగ లాగా.  ఎందరో రచయితలూ, కళాకారులూ అందులో పాల్గొన్నారు. ఈ మధ్య కాలంలో, అంటే మాష్టారు మా ఇంటికి వచ్చి వెళ్ళిన తర్వాత,  కొన్ని కవితలూ, పాటలూ రాశాను గాని చెప్పుకోదగ్గ కథలేమీ రాయలేదు  నేను.

 

సభ మొదలవబోతుండగా హాలులో కూర్చుని ఉన్న నా దగ్గరకి ఎవరో ఒక అభిమాని వచ్చి ఆటోగ్రాఫ్ తీసుకున్నారు. మరికొద్దిసేపటికి కారా మాష్టారు అటుగా వచ్చారు. నేను ఉత్సాహంగా ఆయన దగ్గరకి వెళ్లేసరికి చాలామంది ఆయన చుట్టూ మూగి ఆటోగ్రాఫ్ అడుగుతున్నారు. ఒక పుస్తకంలో తన సంతకం చేస్తూ, అదే పేజీలో పైనున్న ఆటోగ్రాఫ్ చూసి, ” ఈ పిల్ల నీ కెక్కడ దొరికింది? కథల మీద దృష్టి పెట్టవమ్మా అంటే వినకుండా అన్నిట్లోనూ వేలు పెడుతుంది ? ” అని విసుక్కుంటున్నారు. ఆ మాటలు ఎవరి నుద్దేశించి అన్నారా అని చూస్తే, ఆ పుస్తకం అంతకు ముందు నా ఆటోగ్రాఫ్ తీసుకున్నావిడది.

 

” మాష్టారూ ఇక్కడే ఉన్నా” అన్నా. “ఏమిటమ్మానువ్వు? ఒక ప్రక్రియలో ఉన్నత స్థానానికి వెళ్ళాలంటే దానిమీదే దృష్టి పెట్టాలి. మిగిలినవన్నీ వదిలి కథ మీద శ్రద్ధ పెట్టమని చెప్పాను కదా” అన్నారు. ఆయనలో ఒక ఉద్యమకారుడి తాపత్రయం, లక్ష్య శుద్ధి కనిపించి చకితురాలినయ్యాను. నేరం చేసినట్టు ఒక గిల్ట్ ఫీలింగ్ నన్నావహించింది.

 

ఆ తర్వాత నాలో కథ పట్ల కొంత శ్రద్ధ పెరిగింది. కౌముది, ఆంధ్రభూమి కథల పోటీలలో రెండు కథలకి  ప్రధమ బహుమతి లభించింది . మాష్టారు గుర్తొచ్చారు కానీ ఫోన్ చేయలేదు. ” నీ రచనలొ శైలి ఉంది , వేగం ఉంది , సామాజిక స్పృహ ఉంది , ఈ లక్షణాలన్నీ ఉన్నాయి కనక నువ్వు బాగా రాయాలి , రాసిలో కాదు వాసిలో. ఇలా అన్నానని నువ్వేది రాసినా నాకు పంపి ‘మాష్టారూ నా కథ ఎలా ఉంది’ అని అడగకు. అది మంచి కథ అయితే నా దగ్గరకి అదే వస్తుంది ” అన్న ఆయన మాటలు గుర్తొచ్చి మౌనంగా ఉండి పోయాను.

 

మళ్ళీ కొన్నాళ్ళకి త్యాగరాయ గాన సభలో ఒక కార్యక్రమానికి ఆయన వచ్చారు. పొత్తూరి విజయలక్ష్మి నన్నెవరికో పరిచయం చేస్తూ ‘కారా మాష్టారు మెచ్చిన రచయిత్రి’ అంటుంటే ఆ పక్కనే మాష్టారు ఉండడంతో నేను మొహమాట పడిపోయి , ‘కారా మాష్టారు మెచ్చిన ఒక కథ రాసిన రచయిత్రి’అని సరి చేశాను. ఆయన మనసారా నవ్వుతూ ‘నేను కూడా ఒక్క యజ్ఞమే రాశాను తల్లీ’ అన్నారు.

 

కిందటి సంవత్సరం నవ్యలో నా కథ  ‘పుష్య విలాసం’ (http://vanalakshmi.blogspot.in/search?updated-min=2013-01-01T00:00:00%2B05:30&updated-max=2014-01-01T00:00:00%2B05:30&max-results=13)  వచ్చిన వెంటనే మాష్టారి నించి ఫోన్ వచ్చింది  “కథ బాగుందమ్మా కానీ ..” అంటూ. బాగుందన్న మాటకి ఆనందిస్తూ  ‘కానీ..’ విషయంలో ఆత్రుతగా చెవి ఒగ్గితే, ” పేరు misleading గా ఉందమ్మా. వైద్య లక్ష్మి  అని పెట్టి ఉంటే బావుండేది” అన్నారు. ” కథ మొదలవుతూనె మొదటి మూడు నాలుగు వాక్యాలలో పాఠకుడు  కథ లోకి లాగబడాలి. ఈ కథలో ఎత్తుగడ వాక్యాలలో ఉన్న పుష్యమాస వర్ణన వల్ల అలా జరగకుండా పోయింది” అన్నారు. తన రచనా సంగ్రహం లో ఉన్న కథా రచన గురించిన వ్యాసావళిని, ప్రత్యేకించి కథలో వర్ణనలకి సంబంధించిన వ్యాసాన్ని చదవమని చెప్పారు. ఆయన ఆరోగ్యం గురించి విచారిస్తే ఒక కన్ను మాత్రమే పని చేస్తోందనీ, అయినా రోజుకి కనీసం ఎనిమిది గంటలైనా సాహిత్యం చదవకుండా ఉండలేననీ చెప్పారు. హుద్ హుద్ తుఫాను తర్వాత ఫోన్ చేసి  కుశలం అడిగితే, ప్రస్తుతం శ్రీకాకుళం వచ్చేశాననీ, తుఫాను ప్రభావం విశాఖపట్నంలో ఉన్నంతగా ఇక్కడ లేదనీ చెప్పారు.

 

కారా మాష్టారు విలక్షణమైన వ్యక్తి. ఆయనతో కొద్దిపాటి పరిచయం ఉన్నవాళ్ళకైనా ఆయన గొప్ప కథకులు గానే కాక, అపూర్వమైన కథా ప్రేమికునిగా గోచరిస్తారు. ఒక మంచికథ ప్రచురితమయిందంటే చాలు ఆ రచయిత గురించి తెలుసుకుని, వీలయితే స్వయంగా కలుసుకునో , లేదా ఫోను ద్వారానో ఆకథలోని మంచినంతా హృదయపూర్వకంగా మెచ్చుకుని, ఇంకా ఎన్నో మంచి మంచి రచనలు రాసేవిధంగా ఆ రచయితని ప్రోత్సహిస్తారు. ఆయన ఎంత మృదుభాషణులో అంతే నిక్కచ్చిమనిషీ, నిగర్వీ కూడా. ఎంతసేపూ ఇంకా ఇంకా మంచి కథలు రావాలనీ, అవన్నీ ఇతర భాషల్లోకి అనువదించబడాలనీ, ఇంకా కొత్త కొత్త కథకులు పుట్టాలనీ, వాళ్ళ రచనలు ఇంకా ఇంకా మెరుగులు దిద్దుకోవాలనీ ఆయన ఆశ. తన సమస్తమూ కథానిలయానికే సమర్పించి, తెలుగులో వచ్చిన ప్రతి కథా అందులో పదిలమవాలని ఆకాంక్షించే మాష్టారికి  కథ పట్ల ఎంత మమకారమో ! తొంభయ్యవ పడిలో కూడా తన ఫోన్ లో, ఏ రచయితదైనా  మిస్డ్ కాల్ కనిపిస్తే,  చిన్నా పెద్దా అని చూడకుండా, తిరిగి ఫోను చేసి మాట్లాడే మాష్టారి సంస్కారం గురించి వేరే చెప్పేదేముంది ?

 

కారా మాష్టారి తొంభయ్యవ పుట్టినరోజు సందర్భంగా సారంగ జాల పత్రిక వారు ఆయన మీద ఒక ప్రత్యేక సంచిక వెలువరిస్తున్నారనీ, మాష్టారి తో నాకున్న స్వల్ప పరిచయాన్ని పురస్కరించుకుని ఒకటి  రెండు పేజీల వ్యాసాన్ని అందించమనీ  రమాసుందరి గారు అడిగినపుడు ఇంత చక్కని ఆలోచన చేసిన సారంగ పత్రికకి మనసులో జోహార్లు చెప్పుకున్నా. మామూలుగా అయితే బతికి ఉన్న వ్యక్తుల విలువ మనకి సరిగా అర్ధం కాదు. ఎంత మహానుభావుడైనా సరే మనం గుర్తించం. అందులో ఆ వ్యక్తికి పేరు ప్రఖ్యాతులమీద వ్యామోహం లేకపోతే, తనంత తానుగా అందుకోసం ప్రయత్నించే లక్షణం లేకపోతే ఇంకెవరికీ ఆ సంగతి పట్టదు.

 

కారా మాష్టారు మనకిచ్చినదంతా తెలుగు వారికే సొంతమైన వారసత్వ సంపద. ఆ సంపదని  పరిరక్షించే మహత్కార్యంలొ ‘నేను సైతం’ అంటూ ముందుకొచ్చిన సారంగకి అనేక అభినందనలు.

పుట్టినరోజు పండగే అందరికీ. తను పుట్టింది ఎందుకో తెలిసిన కొందరిలొ ఒకరైన మాష్టారికి పూర్ణాయుష్షు, ఆరోగ్యం లభించాలని కోరుతూ శుభాకాంక్షలు  తెలియజేసుకుంటున్నాను.

 

  • vnl 1వారణాసి నాగలక్ష్మి

 

కారా మాస్టారు – కొన్ని జ్ఞాపకాలు

T Krishna Bai

తెల్ల మల్లు కట్టు పంచె, అర చేతుల చొక్కాతో సైకిల్ మీద సాయంకాలాలు పిల్లలకి పాఠాలు చెప్పేందుకు వెళ్ళే కారా మాస్టారిని 1960లలో విశాఖ ఎల్లమ్మతోటలో ఎరుగని వారుండరు. సెయింట్ ఆంథోని హైస్కూల్లో లెక్కల పాఠాలు చెప్పి, సాయంత్రాలు ప్రైవేట్లు చెప్పేవారు. జీవిక కోసం రేయింబవళ్ళు అంత కష్ట పడుతూ కుటుంబ భారాన్ని మోస్తూ కూడా సాహిత్యానికి అంత సమయం ఎలా కేటాయించేవారో ఆశ్చర్యం!

 

శ్రీకాకుళం జిల్లా మురపాకలో పుట్టిన కాళీపట్నం రామారావు గారు భీమిలిలో టీచర్ ట్రైనింగ్ తీసుకుని, విశాఖలో లెక్కల మాస్టారుగా పనిచేశారు. క్రమంగా విశాఖ రచయితల సంఘం సభ్యుడిగా, రచయితగా ప్రసిద్ధి పొందారు. అప్పట్లో ‘చిత్ర గుప్త’లో ‘కార్డు కథలు’ పేరుతో చిన్న కథలు రాసేవారు. తోటి టీచర్ మసూనా ఆయనకి సాహిత్యరీత్యా కూడా మిత్రుడే.

రాచకొండ విశ్వనాథ శాస్త్రి గారు కారాని చాలా గౌరవించేవారు. ఆయన, ఐ. వి. సాంబశివరావు, ఎన్నెస్ ప్రకాశరావులు మాస్టారికి మార్క్సిజాన్ని పరిచయం చేశారు. కారా కిళ్ళీ ప్రియుడైన మాస్టారి గురించి ఎన్నెస్ లాంటి మిత్రులు చాలా ఛలోక్తులు విసిరేవారు. “ఆయన్ని ఏదయినా సందేహం అడిగితే వీధి చివరికి వెళ్లి నోట్లోని ఊట ఊసి తిరిగొచ్చి జవాబు చెప్తారు. ఈలోగా ఆయనకి ఆలోచించుకునే వ్యవధి వుంటుంది “, అంటూ ఎగతాళి పట్టించేవారు. విప్లవం రేపే వస్తుందంటే ప్రముఖులు ఎలా స్పందిస్తారనే ఊహల్లో కూడా, మాస్టారయితే, “ఆగండి , మరో నాలుగు ట్యూషన్లు చెప్పుకొచ్చేస్తాను” అంటారని విసుర్లు!

 

రామారావుగారి అర్ధాంగి సీతమ్మగారు చాలా సౌమ్యురాలు, ఓర్పుమంతురాలు. మాస్టారు చిరాకుపడితే కూడా ఆమె తొణికేవారు కాదు. ఆమె పిల్లల్ని కసురుకోవడం ఎన్నడూ చూడలేదు. ఆమె పోయాక పిల్లలు మాస్టారికి చేదోడువాదోడుగా వుంటూ ఆయన బాగోగులు చూసుకుంటున్నారు. ముఖ్యంగా సుబ్బారావు రచయితగా, ప్రసాద్ లెక్కల మాస్టారుగా ఆయన వారసత్వాన్ని పుణికిపుచ్చుకున్నారు.

 

కారా కథలని 1970కి ముందు, వెనకలుగా విభజించ వచ్చు. ఎందుకంటే, అప్పట్లో దేశాన్ని కుదిపేస్తున్న నక్సల్బరీ శ్రీకాకుళ పోరాట ప్రభావానికి లోనుగాని మేధావులు, పీడిత ప్రజల పక్షపాతులు ’70 లలో లేరనే చెప్పాలి. మాస్టారు కూడా ఆ ప్రభావానికి అతీతులు కారు. అందుకే ఆయన ’70 తరువాత రాసిన కథల్లో వర్గ విశ్లేషణ పూసల్లో దారంలా కనిపిస్తూనే వుంటుంది.

 

యాభై , అరవై దశకాల్లో అయన రాసిన కథల్లో లోతయిన జీవితాన్ని పరిచయం చేశారు. ఆయన పెరిగిన వాతావరణానికి, ఆ కథల వాతావరణానికి పోలిక లేదనిపిస్తుంది. అట్టడుగు వర్గాల జీవితాన్ని అంత సునిశితంగా ఎలా పరిశిలించారా అని అబ్బురమనిపిస్తుంది. ఆ జీవిత విశ్లేషణకి మార్క్సిజం తోడయ్యాక ఆయన దృష్టి కోణం విస్తరించింది. అప్పుడు వెలువడిన కథలు ఉన్నత శిఖరాలని చేరుకున్నాయి.

 

అగ్రవర్ణంలో పుట్టినా దళిత జీవిత మూలాన్ని కారా అంత చక్కగా ఎలా చిత్రించగలిగారా అని ఆశ్చర్యం వేస్తుంది. ‘రాగమయి’ లాంటి కథల్లో  అచ్చం మధ్యతరగతిని చూపిస్తే, ‘చావు’ కథలో దళిత జీవితాల్లోని దైన్యాన్ని చూపించారు. ముసలమ్మ దహనానికి కట్టెలు లేని పరిస్థితిని వివరిస్తూనే, ఆ కట్టెలు నిలవున్న చోటినించి వాటిని తెచ్చుకునే సాహసాన్ని కూడా ప్రదర్శింపచేశారు.

 

1964 లో రాసిన ‘యజ్ఞం ‘ కథ అర్ధం కావాలంటే తన ‘అప్రజ్ఞాతం ‘ చదవాలంటారు కారా. దాదాపు నలభై సంవత్సరాల కాలగమనం లో, స్వాతంత్ర్యానికి ముందు వెనుక, గ్రామాల్లో వచ్చిన మార్పుల్ని  ఎంతో గాడంగా  విశ్లేషించారు. కానీ ముగింపు మాత్రం  కార్మికవర్గ దృష్టి నించి కాక మధ్యతరగతి దృక్పధం నించి రాశారని మార్క్సిస్టులు విమర్శించారు.

ఆర్ధిక శాస్త్రం మూల వస్తువుగా ‘తీర్పు’ కథ వుంటుంది. ‘కుట్ర’ కథ నిజానికి ఒక డాక్యుమెంట్. కుట్ర అనదగ్గదేదైనా జరిగితే రాజ్యాంగం రాసిన కాడే జరిగుండాల. పంచవర్ష ప్రణాళికలు ఏసిన్నాడు డెఫినెట్ గా జరిగింది”, అంటూ చాలా వివరంగా కుట్రని బయట పెట్టారు మాస్టారు. ఈ కథ 1972 విరసం ప్రత్యేక సంచిక ‘నిజం’లో వచ్చింది. ఆయన కథలు అర్థం చేసుకోవాలంటే అలవోకగా చదవడం కాదు. ఒకటికి నాలుగు సార్లు చదవాలి. అంత నిగూఢంగా, గాఢంగా రాస్తారాయన. ‘కుట్ర’ అయితే పదిసార్లు చదవాలి తాపీగా – రాజకీయపరంగా , సైద్ధాంతికంగా అద్భుతంగా చిత్రించారు పరిస్థితుల్ని.

 

చిన్న కథ నించి పెద్ద కథ వరకు సునాయాసంగా రాయగల కారా, ఆయన చెప్పదలుచు కున్న విషయం కోసం, వివరించవలసిన జీవితం కోసం, విశ్లేషించవలసిన ప్రపంచం కోసం  పెద్ద కథనే ఎంచుకున్నారు. కానీ ఏ ప్రక్రియకైనా దాని ప్రత్యేకతలు ఉంటాయని ఆయన నమ్ముతారు.

‘బారెడు పొద్దెక్కింది’ అని రాయాలంటే, ఆ వేళకి ఎండ ఎక్కడి దాకా వస్తుందో అడుగులు వేసుకుని కొలిచే మాస్టారి పద ప్రయోగాలు కూడా అబ్బుర పరుస్తాయి.

“పువ్వప్పుడే మిడిసిపడితే పిందప్పుడే రాలిపోతాదని సామెత ”

“పొద్దల్లా అమ్మేది ముత్తువైతే , పొద్దోయి అమ్మేది పొందుం ”

“ఒళ్లెరబెట్టి ఆణ్ణి తెచ్చుకోడమయితే నా సేత కాదు”

“వరి కంప మీద పట్టు కోక తీసినా దక్కదు, తియ్యకున్నా దక్కదు” వంటి పదాల్లో   పల్లెల సువాసన గుబాళిస్తుంది.

 

‘హింస’ కథ చిన్నదే కానీ చిత్రణ అమోఘం. అక్క స్నానం చేస్తుంటే చూసిన చెల్లి, “అప్ప వీపు, భుజాలు కూడా తెల్లగా వున్నాయి. కోవటి బామ్మర్లలా రైకలేస్తాది కావాల!” అనుకుంది. ఉత్తరాంధ్ర శ్రామిక స్త్రీలు రైకలేసుకోరు. ఆ చెల్లి కథ చివరలో చూపించే ఆవేశం మనకి అర్ధం కావాలంటే ఆమె స్థానంలో మనముండాలి, ఆమె గుండె మనకుండాలి అంటారు మాస్టారు.

 

 

మాండలికం మీద వాదోపవాదాలు జరుగుతున్న కాలంలో మాస్టారు ఎన్నో విలువైన ప్రతిపాదనలు చేశారు. ఆయనకి భాష మీద వున్న పట్టు గొప్పది. కొత్త రచయితలకి ఆ కిటుకులు నేర్పేవారు. ‘బండోడు’ అనే మాటని రాసి పలకమనేవారు ‘బండివాడు’, ‘బండవాడు’ అనే రెండు అర్థాలు మౌఖికంగా మాత్రమే ఎలా స్ఫురిస్తాయో వివరించేవారు. అలానే సమకాలీన ప్రపంచ సాహిత్యాన్ని అధ్యయనం చేసి వస్తువు, శిల్ప వైవిధ్యాలను చూడమనేవారు. దాని కొనసాగింపుగానే ‘నేటి కథ’ పేరుతో కొత్త కథకులని ప్రోత్సహించారు.

 

ఒకసారి మాస్టారు సంక్రాంతి మిత్రుల సమావేశానికి కృష్ణా జిల్లా వచ్చి దివి తాలూకా పర్యటించారు. దళితుల జీవితాలు అన్నిచోట్లా ఒకేలా, ఊరి బయట నికృష్టంగా ఉన్నాయని వాపోయారు.

ఆయనకి జీవితం పట్ల ప్రేమ , ఆశ, ఎలాంటి విపత్కర పరిస్థితిలోనైనా జీవించగలననే ధీమా, పరిస్థితుల్ని సానుకూలంగా మలచుకోగాలననే తపన. అందుకే – “బజ్జీలు అమ్ముకునయినా బతికేస్తాను” అనేవారు.

 

ప్రజలు, ప్రజా పోరాటాల పట్ల ఆయన నిబద్ధత ఆయన కార్యాచరణలో తెలుస్తుంది. విశాఖ రచయితల సంఘం నించి విప్లవ రచయితల సంఘం వరకు ఆయన చేసిన ప్రయాణంలో కూడా ఆయన ఎదుగుదల కనిపిస్తుంది. వ్యక్తిగత కారణాల వల్ల  1975లో విరసానికి రాజీనామా చేసినా, సంస్థ అంగీకరించక పోవడం వల్ల ’80 ల దాకా ఆయన విరసం సభ్యులే ! ఆ తరువాత కూడా కారా గారు, రావి శాస్త్రి గారూ కూడా విరసం నిర్మాణంలో లేక పోయినా, విరసం తోనే ఉన్నామని బహిరంగంగా ప్రకటించారు. ప్రజల పక్షానే నిలిచారు.

 

తెలుగు కథ గురించి పూర్తిగా తెలుసుకోవాలంటే కారాగారి వైపు, ‘కథా నిలయం’ వైపు చూడాల్సిందే.  కొత్త తరాలకి ఊపిర్లు పోసి ప్రోత్సహించే మాస్టారు ఇంకా ఎంతోమంది కథకులకి బాసటగా నిలిచి తెలుగు సాహిత్యాన్ని పరిపుష్టి చేయాలని కోరుకుంటూ ఆయనకి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను.

 

 

—  కృష్ణా బాయి 

    25-10-2014