ఏ నిమిషానికి…

 

భూపతిరాజు త్రిలోచనరాజుగారి ఇంటి దగ్గర ఆగిన వేగిరాజోరి మట్ట,  ప్రహారీ ముందు కాస్సేపు అలాగే  నిలబడి, అయోమయంగా తల గోక్కున్నారు.

‘ తూర్పా, పడమటా? పడమటా, తూర్పా?  ఉత్తరవా, దచ్చిణవా? దచ్చిణవా, ఉత్తరవా? ‘ ఈరోజు త్రిలోచనరాజుగారు ప్రహారీకి ఏ దిక్కునున్న తలుపు  తీయించి ఉంటారు? అనే అనుమానంతో మట్ట చేతులు అలా అసంకల్పిత ప్రతీకార చర్యలా  తలలోకి పోయి గోకడం మొదలెట్టాయి.

‘ కాళ్ళుపీకేలా ఇక్కడెందుకు నిలబడ్డం?  ఇంటి చుట్టూ ఓ ప్రదక్షిణ చేసి వచ్చేస్తే, అదే తెలిసిపోతుంది కదా?’ అనుకొని  ఆ పనిలో పడ్డారు మట్ట.

నెమ్మదిగా నడచి వెళ్తున్న మట్ట మొహాన్ని, తెరలు తెరలుగా వచ్చిన గాలి అలలు అలలుగా మారి చాచిపెట్టి కొట్టింది.

‘ ఇదేంటిది? ఇదేం గాలిది? ‘ అనుకున్న ఆయన, నడవడం ఆపి అటు ఇటూ పైకీ కిందకీ ఓసారి చూసారు. చుట్టూ చాలా చెట్లున్నా… ఎక్కడా ఏ చెట్టుకున్న ఆకూ అల్లల్లాడ్డంలేదు.

‘మరి ఈ మాయముండా గాలి ఎక్కడ్నుంచి ఊడి పడినట్టో? ‘ ఎందుకో కానీ మట్ట వళ్ళు జలదరించింది.

ఎందుకో ఏమిటి? అది భయం ముందర వచ్చే గగుర్పాటు.

‘చర చర, జర జరా ‘ మని… పెద్ద కాలనాగు కాళ్ళ పక్కనుంచే పాక్కుంటూ పోతున్న చప్పుడు ఆయన చెవులకి తాకింది. అది నాగా? కాదా? అని తల వంచి చూసే సాహసం చెయ్యలేకపోయారు.వెన్నులో సన్నగా  మొదలయిన వణుకు, కాళ్ళలోకి పాకి ఇక కదలవద్దంటూ బంధనం వేసేసింది.

‘ ఎప్పుడూ లేంది? ఏంటియ్యాల!’ భయంతో… ఆయన గొంతులోంచి ఓ వెర్రికేక, దిక్కులు పిక్కటిల్లేలా బయటపడాలని ఆరాటపడింది. కానీ అంతలోనే…

‘ మ.మ..మ…హహ్హహ్హహ్హ…హాట్టా…ట్టా…ట్టాట్టా ‘

‘ ??????????? ‘

‘ అటు… టూ.టూ..టూ… ‘

‘ ??????????? ‘

‘ ఆ ఆ ఆ… తూ.తూ..తూ…ర్ ర్ ర్పు వేపు  రా రా రా ‘ అంటూ చడీ చప్పుడు కాకుండా వచ్చిన ఇంకో గాలి, చెవిలో ఈలలా గోల చేసి వెళ్ళిపోయింది.  ఆ గాలి స్వరం భాస్వరంలా, అచ్చం త్రిలోచనరాజుగారి కంఠస్వరంలాగా ఉంది.

‘ భ్రమా? భ్రాంతా? గాలి మాట్టాడ్డం ఏంటి? నా తలకాయ్’ అనుకున్న మట్ట… ఒక్క సారిగా శక్తిని కూడదీసుకొని, తూర్పుగుమ్మం వైపు పరుగు లంకించుకున్నారు.

గుమ్మం ముందు పరుగు ఆపి, ఒకింతసేపు ఆయాసం తీర్చుకొన్నాకా… స్థిమితపడి, దానికి వున్న పెద్ద ఇనపతలుపుని లోపలకి త్రోసారు.

‘ కిర్ర్… ర్ ‘ అందే కానీ… అది కొంచెం కూడా కదల్లేదు.

‘ ఊప్ ‘ బలాన్నంతా ప్రయోగించి రెండు చేతులతోనూ ఇంకోసారి ప్రయత్నించారు.

‘కిర్ర్. ర్రు.. ర్రూ…ర్ర్ ర్ ‘ మని మొండికేస్తూనే ఎలుగుబంటి ఆవులించినట్టు,  ఎడమ వైపు ఉన్న సగం తలుపు లోపలకి  తెరుచుకుంది.

‘ ఎంతైతే ఏంటి? ఎంతో కొంత… తెరుచుకుందిలే, దూరడానికి సందు దొరికింది కదా… అదే బ్రహ్మాండం ‘ అనుకున్న మట్ట ‘శ్రీ ఆంజనేయం, ప్రసన్నాంజనేయం ‘అని చదువుకుంటూ  ఒక్క ఉదుటున లోపలకి  గెంతి, ఎదురుగా ఉన్న బంగాళా పెంకుల పెద్దింటి వైపు,  తేరిపార చూసారు.

మాయామహల్ అంటే ఇదేనేమో అనిపించింది ఆయనకి. ‘ మాయలూ, మంత్రాలూ వచ్చినోళ్ళుండే ఇల్లు మాయామహల్లా కాకుండా, లీలా మహల్ సినిమాహాల్లా ఉంటదేటీ?’ అనుకొని, వెనక్కి తిరిగి తలుపుని యధాప్రకారం  త్రోసేసారు.

లోగడ ఇద్దరు, ముగ్గురు తమకి ఇలాంటి జడుపు అనుభవాలు ఎదురయ్యాయని చెప్పారు కానీ మట్ట వాటిని పట్టించుకోలేదు.

ఇవన్నీ త్రిలోచనరాజుగారు తమ ఇంటి చుట్టూ కాపలా పెట్టుకున్న అదృశ్య శక్తులు చేసే అరాచకాలూ, విపరీత చేష్టలూనట. మరి ఆ గాలి మాటలేంటి? అచ్చం త్రిలోచనరాజుగారి మాటల్లాగే ఎందుకు ఉన్నాయి. బాబోయ్ ఇంక అలోచించకూడదు. ఆలోచిస్తే తల పగిలిపోయేలా ఉంది అనుకున్న మట్ట, మనస్సులో మళ్ళీ ఆంజనేయదండకం  మొదలెట్టారు.

***

మట్ట అసలుపేరు వేగిరాజు పెద చంద్రరాజు. చిన్నప్పుడు, అయనా, ఆయనగారి తమ్ముడు బలబద్ర రాజూ క్రికెట్ ఆడుకోవటానికి, బ్యాటూ బంతీ బదులు కొబ్బరిమట్టా, కొబ్బరిపుచ్చులని వినియోగించేవారట. దానితో పెద్దవారు మట్టగానూ, చిన్నవారు పుచ్చుగానూ ప్రసిధ్ధికెక్కారు. మట్టా పుచ్చూ అనటమే కానీ, వాళ్ళ అసలు పేర్లు ఎవరికో గానీ పూర్తిగా తెలీవు. వాళ్ళ కుటుంబంలో ఇంకా పెద్దమట్టా చిన్నపుచ్చూ,  పెద్దపుచ్చూ చిన్నమట్టా కూడా ఉన్నారు. ఈ మధ్యనే ఓ బుజ్జిమట్టో, బుల్లిపుచ్చో కూడా పుట్టినట్టున్నారు. నిన్నో మొన్నో ఊరంతా బిడ్డసారిగా, చలివిడీ సునిపిండీ  పంచిపెట్టారు. భవిష్యత్ లో పుచ్చూ మట్టా అనేవి  వారి ఇంటి పేర్లుగా మారిపోయినా ఆశ్చర్య పోనక్కరలేదు. అలాంటి దృష్టాంతాలు రాచ కుటుంబాల్లో అనేకం ఉన్నాయి.

***

మాయా మహల్ లాంటి భూపతిరాజు త్రిలోచనరాజుగారి ఇల్లు, రెండెకరాల కొబ్బరితోటలో ఉంది. తోట చుట్టూ ఎత్తైన ప్రహారీ, ఇంటి చుట్టూ పిట్టగోడ. పిట్టగోడకీ ప్రహారీకి మధ్య పెద్ద దూళ్ళచావిడి. పశువులని లంకల్లో మేతకోసం, గోదారి దిగ్గొట్టడంతో దూళ్ళచావిట్లో లేగదూడలు మాత్రమే కనిపిస్తున్నాయి.  ప్రహారీకి నాలుగు వేపులా నాలుగు పెద్ద పెద్ద గుమ్మాలూ వాటికి ఇనప తలుపులూ వున్నాయి. త్రిలోచనరాజుగారికి గ్రహఫలాలూ, వాస్థు పట్టింపులూ చాలా ఎక్కువ. తిధి,వార, నక్షత్రాల ప్రకారం, ఒక్కో రోజున ఒక్కో దిక్కున ఉన్న ప్రహారీతలుపులు తీసి మసులుతుంటారు ఇంట్లో వాళ్ళు .  తెరిచిన ఆ గుమ్మం మినహా, ఆరోజుకి మిగతా మూడు దిక్కుల్లోని  గుమ్మాలతలుపులూ మూసేసి, లోపలకి తాళాలు బిగించేసి ఉంటాయి. ఇంటి పిట్ట గోడకి కూడా నాలుగు వైపులా నాలుగు చిన్న చిన్న గుమ్మాలున్నాయి. వాటికి ఇరుప్రక్కలా, నాలుగు రెళ్ళు ఎనిమిది దీప స్థంభాలు ఠీవిగా నిలబడి ఉన్నాయి.

***

మట్ట, కొబ్బరితోట మధ్యలో ఉన్న  ఎర్రకంకర కాలిబాట మీదుగా, త్రిలోచనరాజుగారి ఇంటి వేపు నడుస్తున్నారు.బాటకి ఇరుప్రక్కలా ఎత్తుగా ఏపుగా పెరిగిన కొబ్బరి చెట్లు, తోటకి గొడుగులు పడుతున్నట్లుగా ఉన్నాయి. దాంతో తోటలోపల పట్టపగలే చిరుచీకటి అలుముకున్నట్టుగా ఉంది. ఉండుండి సన్నటి చలి కూడా వేస్తోంది. మంద్రంగా కీచురాళ్ళ రొద తప చుట్టూ అంతా నిశ్శబ్దంగా ఉండడంతో, చెప్పుకాళ్ళ కింద విరుగుతున్న ఎండుపుల్లల చప్పుడు మట్టకే కర్ణకఠోరంగా వినిపిస్తోంది.

మేతకోసం వెతికి వేసారి అలసిపోయిన ఓ ముసలి కాకి, ఏమూలనుంచో ‘కా, కా’ అని నీరసంగా ఆకలి కేకలు వేస్తోంది. వెనక వైపు తోటలోంచి కాబోలు, నకనకలాడే ఆకలితో ఉన్న నాగుపాము ఆత్రంగా మింగేసిన కప్ప ఒకటి, రక్షించండ్రోయ్, రక్షించండిరా అన్నట్టు  ‘ కెక్, బెక్, కెక్బెక్ బెక్… ‘ అంటూ కప్పభాషలో వికృతంగా ఆర్తనాదాలు చేస్తోంది.

అకస్మాత్తుగా అన్ని వైపుల నుంచీ వస్తున్న ఆ శబ్దాలకి మట్ట గుండె దడదడలాడ్డం మొదలెట్టింది. వీటికి తోడు ఎండిన కొబ్బరాకు ఒకటి ‘ దబ్బు ‘ మని దారికి అడ్డంగా రాలి పడ్డంతో ‘ హమ్మో ‘ అంటూ పక్కకి గెంతారు ఆయన. అలా గెంతడంవల్ల తృటిలో పెద్ద ప్రమాదం తప్పిపోయింది కానీ…  లేకపోతే కొబ్బరి మట్ట, మట్టగారి మెడని విరగ్గొట్టేసేదే.

‘తుప్ తుప్’ అంటూ గుండెలమీద ఊసుకొని, వీపుమీద తనకి తానే చెళ్ళు చెళ్ళుమని చేత్తో కొట్టుకొని, అప్పటివరకూ ఉన్న నడకని పరుగులాంటి నడకగా మార్చారు మట్ట.

గాలిలో తేలివచ్చిన పనసపండు వాసన గమ్ముగా ముక్కుకి తగలడంతో, మౌనంగా ఆంజనేయదండకం చదువుకుంటున్న ఆయన… నడుస్తూ నడుస్తూనే అలవోకగా తలతిప్పి ఓరగా అటువైపు చూసారు.

జుట్టు విరబోసుకున్న దయ్యంలా ఉన్న… ఓ పెద్ద చింతచెట్టు పక్కనే, గుబురుగా పెరిగిన చిన్న పనస చెట్టు కనిపిచింది. దాని  కిందినుంచి పై దాకా, ఎక్కడా కాయ కాదు కదా! చిన్న పిందె కూడా లేదు. కాయలు లేకుండానే పండు ముగ్గిన వాసన ఎలా వస్తోంది?’ అంటూ అంత భయంలోనూ ఆశ్చర్య పోయారు మట్ట. ‘ కొంపదీసి, ఏ కామినీ పిశాచమో! పనసపండుని ఎరవేసి, తనని వశీకరణం చేసేసుకోవాలని ప్రయత్నిస్తుందో ఏమిటో? ఖర్మ ‘  అన్న అనుమానమూ  కలిగింది.

‘చేత్తే… చెయ్యనీవోయ్? నాకేవన్నా భయవా? దాని ముక్కు పిండి, ముంతలో పెట్టి మూత మూసెయ్యడానికి మా పెదబాజ్జీ లేరా ఏమిటీ?’ అని బింకంగా  ధైర్యం చెప్పుకుని, ఇల్లు దగ్గర పడుతుండంతో నడక వేగాన్ని ఇంకా ఇంకా పెంచారు.

ఇంటి పిట్టగోడ మీద నుంచి లోపలకి చూచే సరికి, అరుగు మీద మోచేతిని మెడకింద దాపెట్టుకొని, అనంత పద్మనాభస్వామిలా పరుపు మీద పవలించివున్న త్రిలోచనరాజుగారు కనిపించారు.దానితో అప్పటివరకూ మట్టలో ఉన్న భయాంధోళనలు మటు మాయమయ్యాయి.అక్కడ పెద్దాయన తప్ప ఇంక ఎవరూ లేక  పోవడంతో ఆయన  తేలిగ్గా ఊపిరి పీల్చుకున్నారు.

‘ హమ్మయ్య, భయం ఏత్తే ఏసింది!  చుట్టూ పోరంబోకు సంత ఎవరూ లేకుండా! ఇన్నాళ్ళకి పెద్దబాజ్జీ ఒక్కరే ఒంటరిగా దొరికారు’అనుకొని, ఒకింత ఉత్తేజంతో పిట్టగోడకి ఉన్న ఒంటితలుపునితోసి, అంతకు రెండింతలు రెట్టించిన ఉత్సాహంతో లోపలకి అడుగు పెట్టారు. గుమ్మం మెట్ల దగ్గర చెప్పులు విప్పేసి, అక్కడే వున్న బిందెలోంచి ఓ చెంబుడు నీళ్ళు తీసి, శుభ్రంగా కాళ్ళు కడుక్కొన్నారు. తర్వాత సడి చెయ్యకుండా వెళ్ళి, త్రిలోచనరాజుగారికి పరుపుకి ఎదురుగా, కుడివేపు అరుగుమీద వేసివున్న తుంగచాప మీద… బాసింపట్టేసుకొని కూర్చున్నారు.

ఎడమ వైపు అరుగుమీద పరిచివున్న పరుపులమీద, కళ్ళుమూసుకొని పడుకున్న త్రిలోచనరాజుగారికి  అటు పక్కన, తెల్లటి మల్లుగుడ్డతో ముడేసి కట్టిన తాళపత్రగ్రంధాలు గోడకి చేర్చి వరసగా పేర్చి ఉన్నాయి.

పెరట్లో జాబుల కిందవున్న జట్టీపుంజులు కొక్కొరోకో అంటూ పోటాపోటీగా కూస్తున్నాయి.

***

“ఆ మంతనోరి రామం ఎంత పనిచేసాడనుకున్నారూ? తవరి దాకా వచ్చిందా పెద బావజ్జీ ఈ గొడవ? ” అంటూ వచ్చీరాడంతోనే… కూర్చునీ కూర్చోవడంతోనే తోక భారతం విప్పారు మట్ట.

” ఏ రామం వాయ్? పెద రామమా? చిన రామమా? ” అడిగారు. కళ్ళు మూసుకొని సావకాశంగా పడుకున్న, త్రిలోచనరాజుగారు సాలోచనగా.

ఊరిలో రాజుల ఇళ్ళకీ, త్రిలోచనరాజుగారి ఇంటికీ… పద్దతిలో చాలా తేడాలు వుంటాయి.

మిగతా రాజుల ఇళ్ళల్లో వున్నట్టు, త్రిలోచనరాజుగారి ఇంటికి వచ్చిన అతిధులు కూర్చోవడానికి కుర్చీలూ, బల్లలూ కనిపించవు. ఎంతటివారైనా తుంగచాపల మీద ఆసీనులు కావాల్సిందే. ఎడమ వేపు అరుగుమీదకి… త్రిలోచనరాజుగారికి తప్ప మరెవరికీ ప్రవేశం ఉండదు.

త్రిలోచనరాజుగారు గడ్డం, మీసం నున్నగా గీయించుకొని ఉన్నారు.లుంగీ కట్టుకొని, పైన ఖద్దరుతో కుట్టిన జబ్బల బనీను తొడుక్కున్నారు. తల్లీ, తండ్రీ లేకపోతే మీసం తీయించేసుకొనే వెసులుబాటు రాజులకి ఉంది. త్రిలోచనరాజుగారి నుదుటి మీద అడ్డంగా  ఆరేడు సన్నటి ముడతలు ఉన్నాయి. వాటిమీద ఎర్రటి, సన్నటి తిలకంబొట్టు తిన్నగా ఉంది.

” పెదరామవే… చినరామం అయితే ఎందుకు చెబుతానండీ తవకి? ఆడింకా చిన్నపిల్లోడే కదా!”

” పెదరామం అంటే, పొడుగ్గా తెల్లగా ఉంటాడు వాడా? నల్లగా, లావుగా నీలా ఉంటాడు వాడా?” కళ్ళుమూసుకొనే అడిగారు త్రిలోచనరాజుగారు.

ఆయన ఎప్పుడో కానీ కళ్ళు తెరవరు. అదేమని అడిగితే యోగనిద్ర అంటారు. అదేమిటో?. కళ్ళుమూసుకునివున్నా, ఆయనకి అంతా కనిపిస్తూనే ఉంటుందట. ఎవరు వస్తున్నారు? ఎవరు పోతున్నారు? ఏం చేస్తున్నారు? మనస్సులో ఏమనుకుంటున్నారు? ఇలా  సమస్తం తెలిసి పోతూనే ఉంటుందిట.

త్రిలోచనరాజుగారికి ఏవో మంత్రసిద్దులు ఉన్నాయని, అందుకే ఆయనకి అవన్నీ అలా సాధ్యం అవుతుంటాయని చెవులుకొరుక్కుంటూ ఉంటారు అన్ని రాచపల్లెల్లోనూ.

కళ్ళు మూసుకొని వుండే ఆయనతో మాట్లాడ్డమంటే… మనిషితో మాట్లాడినట్టు కాకుండా, ఏ మొక్కతోనో, దుక్కతోనో మాట్లాడుతున్నట్టుగా ఉంటుంది. కానీ ఎవరూ ఏమీ అనలేరు.కళ్ళు మూసుకొని  వింటున్న లేదా మాట్లాడుతున్న ఆయన మొహంలో ఎలాంటి హావభావాలూ ఎదుటి వాళ్ళకి కనపడవు.అది ఇబ్బందిగానే వున్నా… ఆయనతో పని మీద వచ్చేవాళ్ళకి తప్పదు.

త్రిలోచనరాజుగారికి బంగారం తయారు చేసే విద్య కూడా వచ్చంటారు. అందులో నిజం ఎంతో? ఉట్టిది ఎంతో? ఎవరికీ తెలీదు.  ఆయన దగ్గరనుంచి ఆ విద్యని ఎలాగైనా సరే నేర్చుకు తీరాలని, ఊరిలో చాలా మంది ప్రయత్నాలు చేస్తున్నారు. అయితే అది  ఎవరికీ సాధ్యం పడడం లేదు. త్రిలోచనరాజుగారు ఒక పట్టాన ఎవరికీ తమ దగ్గర చనువు ఇవ్వరు.

ఆయన మనస్సుకి దగ్గరైన కుర్రాళ్ళు ఊరిలో ఎవరైనా ఉన్నారూ అంటే, అది ఒక్క మట్టగారు మాత్రమే. ఇంకో ఇద్దరు ముగ్గురు కుర్రాళ్ళు ఉన్నారు కానీ,  వాళ్ళు మట్టంత దిట్టలు కారు. మట్టకి అర్ధణా గాలి దొరికితే చాలు, దాన్ని ఆరణాల దుమారంగా మార్చెయ్యగలరు.

ఆ ఇద్దరు, ముగ్గురికీ ఇంకా ఈ అద్భుతకళ వంటపట్టకపోవడంతో… పూర్తిగా పెద్దాయన్ని ప్రసన్నం చేసుకోవడంలో విఫలమై పోయారు పాపం.

” నాకు మంత్రాలూరావూ, నా మాటలకి చింతకాయలూ రాలవు.  నేను చేసేవి మాయలూ కాదు, మహాత్యాలూ అసలేకాదు నన్నొదిలెయ్యండిరా బాబోయ్. పంచేంద్రియాలనీ అదుపు ఆజ్ఞల్లో  పెట్టుకుంటే,  అందరూ ఎన్నో కొన్ని  చిన్నా చితకా శక్తులని సాధించవచ్చు” అంటూ  తనకి మంత్రశక్తులు ఉన్నాయన్న పుకార్లని  త్రిలోచనరాజు గారు చాలా సార్లు కొట్టి పడేసారు. కానీ దాన్ని ఎవరూ విశ్వసించడంలేదు.

ఆ విద్యలు నేర్పమని అందరూ అడిగేస్తున్నారన్న భయంతోనే… వాటిని ఎవరికీ నేర్పడం ఇష్టంలేక, ఆయన అలా అబద్దం ఆడుతుంటారని ఊరిలో అంతా అనుకుంటూ ఉంటారు.

త్రిలోచనరాజుగారు ప్రతిరోజూ రాత్రి దయ్యాలతోనూ, భూతాలతోనూ చెట్టాపట్టాలేసుకొని… తోటలో వనవిహారం చేస్తారన్న అనుమానంకూడా చాలామందిలో వుంది. పగలంతా తోటలో, ఆ చెట్లమీదా ఈ చెట్లమీదా విశ్రాంతి తీసుకునే దయ్యాలు… ఊరంతా నిద్రపోయాకా లేచి, త్రిలోచనరాజుగారితో అచ్చికబుచ్చికలాడుతూ… కోతీకొమ్మచ్చీ, తొక్కుడుబిల్లాట ఆడుకుంటూ ఉంటాయట. ఇద్దరు ముగ్గురు ఆ దృశ్యం తమ కళ్ళతో స్వయంగా చూసారట కూడాను. ఆ దయ్యాల భయంతోనే త్రిలోచనరాజుగారి తోటలోకి, ఒంటరిగా రావడానికి అంతా భయపడుతూ ఉంటారు. ఒకవేళ వచ్చినా, ఏ చెట్టు మీదనుంచి ఏ దయ్యం దూకుతుందోనన్న బెదురుతో  బిక్కుబిక్కుమంటూ గడుపుతుంటారు.

“పొడుగ్గా తెల్లగా ఉండే రామం అల్లూరోరిరామం, నల్లగా పొట్టిగా ఉండేరామం ముదునూరోరి రామం.  ఆడికీ ఈళ్లకీ అస్సలు  సమ్మంధం లేదు. నేను  చెప్పిన రామం… ఇంతింత బుగ్గమీసాలేసుకొని, విత్తనాల పోతులా ఉంటాడు చూడండి. ఆడు… ”

” సరి సరి, నువ్వుచెప్పొచ్చేది మంతెన గరుత్మంతరాజుగారబ్బాయి… మీసాల రామంగాడి గురించి అయి ఉంటుందిలే ”

” అయ్యో పెదబాజ్జీ, ఆయన పేరు గరుత్మంతరాజో, గండభేరుండరాజో కాదు మంతెన గంగాధర రాజు. గంగాధరరాజుగారబ్బాయి  మీసాల రామంగాడు కాదు, ఆడు సీసాల రామం గాడు ”

” సీసాలోడు ఎందుకొచ్చాడు? మజ్జలో, మీసాలోడి గురించి కదా మనం మాట్లాడుతుంట? ” గద్దించారు త్రిలోచనరాజు గారు.

” ఆడు రాలేదు, తవరే రప్పించారు ”

” నేను రప్పించడం ఏవిట్రా బడుద్దాయ్? నిన్నో మొన్నో వాడే వచ్చి… నువ్వు కూర్చొన్న చోట్లోనే కూర్చున్నాడు ”

” ఆడే వచ్చేడా? ఏ దయ్యాన్నో ఉస్కో… మని ఉసిగొలిపెయ్యాల్సింది.పీడా పోను? అయినా ఆడిక్కడికి… ఎందుకొచ్చినట్టు?  ” ఆరా  తీసారు మట్ట.

” ఎందుకొచ్చాడంటే, ఎందుకొచ్చాడు చెప్మా? ఆం… పేకముక్కల్లో, చుక్కలు మార్చే మంత్రం ఉంటే ఉపదేశించమని వచ్చాడురా ”

“ఓహ్! అదా? అలా అయితే, తవరి దగ్గరకొచ్చింది సీసాల రామం కాదు.సీసాల రామంగాడికి మందుకొట్టడవే తప్ప పేకాటాడ్డం రాదు ”

” సరి సరి… వీడు వాడు కాకపోతే? ఆ వచ్చినోడు ఎవడంటావ్ మరి? ”

” మోసాల రామంగాడు అయి ఉంటది. పేకాటలో దొంగాటలాడి ఎదవ్వేషాలు ఎయ్యబోతే, నిన్న మైనర్ గారింటి దగ్గర…తాతబాబు తన్న బోయాడట? సుబ్బన్నయ్య అడ్డుపడబట్టి బతికిపోయాడని… ఊరంతా కోడై కూస్తోంది! ”

” అయ్యే ఉంటుందిలే? వాడి వాలకం చూస్తే… అచ్చం నీ వాలకం లానే వుంది. ఇంతకీ… ఈ రామంగాడి తోబుట్టువునేనా? అద్దరిని మురమళ్ళో ఏదో ఊరు ఇచ్చినట్టున్నారు ”

” అద్గదీ… ఇప్పుడొచ్చారు దారికి, అది మోసాలరామంగాడి తోబుట్టువు కాదు. నేను చెబ్తున్న మీసాలరామం గాడి తోబుట్టువు ” చెప్పారు మట్ట.

పెదబాజ్జీ తనని మోసాలరామంగాడితో పోల్చి నందుకు మొహం మాడ్చుకుని. ఆయన మొహం మాడ్చుకుంటే ఏంటి? పేల్చుకుంటే ఏంటి? త్రిలోచనరాజుగారు కళ్ళు తెరిస్తే కదా కనిపించటానికి.

” ఆ పెళ్ళికి, వెళ్ళినట్టు గుర్తులేదురా… పిలిచేరా మన్ని?”

” భలేటోరే,  పిలాపోవటం ఏంటి? ఇంటింటికీ పరక పరక మావిడిపళ్ళు పంచి… మరీ పిలిచారు ఉభయులూ ”

” ఏం కాయలంటావ్రా… చక్రపానీయా? అమృతపానీయా?”

” అదేంటండి బాబూ… బోడిగుండుకీ మోకాలికీ ముడేసినట్టు, అంటిపళ్ళుని మాడిపళ్ళుతో ముడెడ్తన్నారు ”

” అవును సుమా! చెరుకురసమా? పంచదారకలిసా? అని అడగబోయి… ఇలా అడిగినట్టున్నాను.ఈ మధ్య జ్ఞాపకశక్తి కాస్త  తగ్గిందోయ్ ” అన్నారు త్రిలోచనరాజుగారు రెండో వైపుకు వత్తిగిల్లుతూ.

” అదెప్పుడి గొడవండిబాబూ? ఐదేళ్ళో ఆరేళ్ళో  అయ్యింది. అప్పుడు తవరు ఏ మేరుపర్వతాలకో, మందర పర్వతాలకో పోయుంటారు ”

” అవి మేరు పర్వతాలో, మందరపర్వతాలో కాదురా దద్దమ్మా! హిమాలయపర్వతాలు ”

” హిమాలయాలంటే గుర్తొచ్చింది పెదబాజ్జీ, తవకి గ్నాపకసత్తి నిజంగానే మందగించి పోయిందా ?  మీకొచ్చిన ఆ మాయ మంత్రాలు  కానీ మర్చిపోలేదుకదా? కొంపదీసి ” ధైర్యంగా అడిగేసారు మట్ట.

‘ అనవసరంగా అడిగేనేమో? పెదబాజ్జీ ఇప్పుడు ఏం చివాట్లేస్తారో, ఏంటో?’ అని మనస్సులోనే భయపడ్డం మొదలెట్టారు. కానీ త్రిలోచనరాజుగారి ‘ వీపు ‘ దాన్ని పట్టించుకున్నట్టు కనిపించలేదు. దాంతో ఇంకాస్త ధైర్యం చేసి…

” పెదబాజ్జీ, మీ కోడలు ఎప్పట్నుంచో వడ్డోణం చెయ్యించమని చంపుకు తినేత్తంది. ఆబంగారం చేసే విజ్జేదో నాకు చెప్పి పుణ్యం కట్టుకుందురూ…తవరుగానీ మర్చిపోతే, మళ్ళీ ఆ విజ్జ మీతోనే అంతవైపోయే పెమాదం ఉంది ” అంటూ మనస్సులోని మాటని చాకచక్యంగా బయట పెట్టేసారు.

సాలోచనగా ఓ నిమిషంపాటు మౌనం వహించిన త్రిలోచనరాజుగారు…

” చెబ్తాను, చెబ్తాను. ముందు  నువ్వు ఇది చెప్పేడు. కణుజు మాంసంకూర నువ్వొక్కడవే దొబ్బి తినేయా పోతే, అయ్యో! మా పెదబాజ్జీకి ఎంతిష్టవో? అని ఓ మట్టుగిన్నెడు కూర పట్రావాలన్న ఇంగితం లేపోయిందిరా నీకు? ” అన్నారు తీవ్ర స్వరంతో.

ఆయన మాటలతో పక్కలో పిడుగు పడినట్టు ఉలిక్కి పడ్డారు మట్ట .

పొద్దున్న వాళ్ళావిడ,  పుట్టినిల్లు తేటగుంట నుంచి వస్తూ వస్తూ… కణుజు మాంసం తేవడం మాట నిజమే. కానీ ఆ సంగతి ఆ మొగుడూ పెళ్ళాలిద్దరికీ తప్ప మరో కంటికి తెలీదు. అరిచి చచ్చినా ఇంకో కంటికీ, ఇంకో కంటికీ తెలిసే అవకాశం అస్సలు లేదు. ఎందుకంటే? ఆమె ఊరినుంచి వచ్చేసరికి, పనిమనిషీ పాలేరూ ఇంట్లో లేరు.

తమ వంటింటి రహస్యం… కళ్ళు మూసుకుని, ఇక్కడ అటుతిరిగి పడుకుని ఉన్న ఈ పెద్దమనిషికి ఎలా తెలిసిపోయింది? అన్న భయాంధోళనలు మట్టని పట్టి కుదిపేసాయి. గాభరాగా చేత్తో మొహం తుడుచుకుంటుంటే…  కణుజు మాంసం కూర వాసన ఎక్కిరిస్తూ  గుప్పున ముక్కుకి  తగిలింది.

ఉదయం ఆ భార్యాభర్తల మధ్య పెదబాజ్జీకి కూర పట్టుకు వచ్చే అంశం ఎడతెగని చర్చకి దారి తీసింది.

***

” సరే… తెచ్చిన మాంసం ఎలాగూ తెచ్చావు, గబుక్కున కూరొండి పడేస్తే, మా పెద బాజ్జీకిచ్చేసి వస్తాను. ఆయనకి ఏట మాంసాలంటే  చచ్చేంత ఇట్టం ” అన్నారు మట్ట.

” అబ్బ ఉరుకోండె, ఏదీ కానేళ గేదె ఈన్నట్టుంది మీసంబరం. ఎప్పుడో తెల్లారగట్ట మొదలెట్టిన ప్రెయాణం ఇప్పుడుకి తెమిలింది. వళ్ళు హూనవైపోయింది. నాఅద్రుష్టంకొద్దీ, ఇంజరం వంతెన దగ్గర నావ దొరకబట్టి  గమ్మున ఇంటికి రాగలిగేను.లేపోతేనా… ఏ మజ్జాన్నం పొద్దుకో తగలడేదాన్ని.

ఇప్పటికిప్పుడు ఈ దాకడు కూరకీ ఉల్లి రుబ్బడాలు, మసాలాలు నూరడాలు నావల్ల కాదు బాబూ. మీరో చెయ్యేత్తే, మనిద్దరి  మట్టుకూ ఓ నాలుగు ముక్కలు ఇగరబెట్టేత్తాను. సాయంకాలానికి నిమ్మలంగా వండి, అపుడు పట్టుకెలుదురు లెద్రూ. అయినా ఈపాటికి మీ పెదబాజ్జీ భోంచేసేసే ఉంటారు.

నేను రాననుకుందో ఏవిటో? ఆ సుబ్బులు ఇంకా ఊడి పడ్లేదు. ఏదో కాకి చేత దానికి ఓ కబురంపుదురూ. ఈ ఉల్లీ, మసాలాల గొడవ చూసుకొంటుంది ” అంటూ నచ్చచెప్పారు. మట్టగారి పట్టపురాణి పార్వతి తమ శ్రీవారికి.

పార్వతిగారి అభ్యర్ధన మేరకి, వంటలో చిన్నో చితకో సహాయం చేద్దామనివున్నా, ‘ గబుక్కున ఎవరైనా పనిమీద ఇంటికి వస్తే?… ఆ వచ్చినోళ్ళు తను వంట చెయ్యడం చూస్తే?… ఎంత పరువుతక్కువ ‘ అని ఆలోచించలోచించిన మట్ట, గోడ తలుపులూ, గుమ్మం తలుపులూ మూసేసి వచ్చి…కానీ వంటలో వ్రేలు పెట్టలేదు.

” యావండీ… మీ పెదబాజ్జీని ఏవన్నా కదిపేరా? ఆ పరశురామ విజ్జ నేర్పమని?” అడిగారు పార్వతి. మాంసం కొయ్యడానికి కత్తిపీట మీద కూర్చుంటూ.

” పరసురామ విజ్జేవిటీ…?” ఆశ్చర్యంగా అడిగేరు మట్ట.

” మీ మతిమరుపూ  మీరూనూ అదేనండీ… ఆ బంగారం చేసే విజ్జ ” విడమరిచారు పార్వతి.

” నీ మొకం అది పరశురామ విజ్జ కాదు. పరసవేదో? పనసభేదో? అలా ఏదో అంటారు దాన్ని” అంటూ సరిదిద్దారు మట్ట. ఉల్లిపాయలు వొలుస్తూ.

” వేదవో! నాదవో! ఏదైతే ఏవిటి లెండి. అదే… దానిగురించే కదలేసారా? అని ”

” ఎక్కడ కుదిరేడుస్తోంది? ఎప్పుడూ ఎవలో ఒకళ్ళు… కర్ణ పిశాచాల్లా ఆయన చుట్టూ కూచ్చొని ఉంటన్నారు పనీ పాటాలేని రాజులు ”

” చాల్లెద్దురూ బడాయి? ఆ కాడకేదో మీకు పెద్ద పనున్నట్టు? అంత పనున్న పెద్దమనిషైతే కర్రట్టుకుని ఆ పొలం గట్టున నిలబడితే ఆ కౌలు గింజలేవో… మనకే మిగులునా? ”

ఒక్కసారిగా మట్ట కళ్ళల్లో నీళ్ళు తిరిగాయి.

ఖంగారు పడకండి… ఆ నీళ్ళు పార్వతిగారు దెప్పి పొడిచినందుకు కాదు వొస్త. నీరుల్లిపాయలని గిల్లడం వల్ల తిరిగాయి అవి.

” పోనీ, ఈలోగా బంగారం చైటాకి కావాల్సిన సరుకుల చిట్టా అన్నా కూపీ లాగ లేపోయేరూ. అన్నీ అమారులో ఉంటే, తర్వాత పని తేలికవుతుంది కదా! ”

” అయ్యన్నీ… మనకి తెలిసినియ్యే లేవే. ఆమాత్రం ఈమాత్రం ఆవుపేడలో పెదబాజ్జీ చెప్పే ఆకుపసర్లు బాగా కలిపి పిసికేసి, నాలుగు మంత్రాలు చదివేసి…  టపటపా గోడకి పిడకల్లా కొట్టేయడవే. అయ్యి బాగా ఆరేకా,  పీకి ఎండబెట్టేత్తే ఎండేకొద్దీ మేలిం బంగారం చాయొచ్చేత్తాయి. ఎటొచ్చీ పేడ  మేలుజాతి దేశవాళీ ఆవు పున్నం రోజుల్లో ఏసిందై ఉండాలంట ”

” కొంపముంచేసారు కదండీ? ” అదిరిపడ్డారు పార్వతిగారు. ఆవిడ చేతిలోని పొత్రం రుబ్రోల్లో…ఉల్లిని రుబ్బడం మానేసింది.

” ఏం ఏమయ్యిందేమి? ఏలు కానీ నలగ్గొట్టుకున్నావా? ” అనుమానంగా ప్రశ్నించారు మట్ట, గిన్నెలో వున్న మాంసాన్ని కడగడం ఆపేసి.

” ఏలూ నలగలేదు! కాలూ నలగ లేదు! మనింట్లో  గేదెలు తప్ప, ఆవులెక్కడియ్యండీ మహానుభావా? సమయానికి మా పుట్టింట్లో కూడా గేదెలే ఉండి చచ్చాయ్. తోలి తెచ్చుకుందావన్నా… ” అన్నారు పార్వతి. నలిగీనలగని ఉల్లిని బోడిగిన్నెలోకి తీస్తూ. ఆమె మొహాన అసహనం ఆవరించింది.

” నిజమేనేవ్! మరేం జెయ్యాలిప్పుడు ” పొయ్యిమీద వేడెక్కిన దాకలో, నూనె పోస్తూ అడిగారు మట్ట.

” కాస్సేపుండండి ఆలోసింతనాను కదా! ఈలోగా… మీరు  ప్లేట్లో ఉన్న  లవంగాలూ, మరాఠీమొగ్గలూ ఆ మందార చెట్టుకిందున్న సన్నికల్లు మీద నూరుకొచ్చెయ్యండి బేగా ” ఆదేశించారు ఆవిడ.

పొయ్యిమీద కూర  కుతకుత ఉడుకుతుంటే, కూరలో గరిటె తిప్పుతున్న పార్వతి గారి తలలో ఆలోచనలు చక చకా చక్కర్లు కొడుతున్నాయి.

” ఏం ఏవన్నా తోచిందా? ” అడిగారు మట్ట, మసాలాగుండ తీసిన  ప్లేటుని తెచ్చి ఆవిడ పక్కన పెడుతూ.

” ఏం తట్టి చావడం లేదు.  రెండు ఎల్లుల్లి రేకలు తీసి చిదగ్గొట్టండి. ఈ కూరముండ మొకాన, ఓ తాళింపు పిసరు పడేస్తే… ఏదో ఉపాయం అదే వచ్చేడుద్ది ”

గదులపెట్టెలోంచి రెండు వెల్లుల్లిపాయలు తీసి, వాటిని  అమాన్దస్తాలో రేకలు రేకలుగా విడదీసి పడేసి, బండతో రెండు పోట్లు పొడిచి, అర్ధాంగికి అందించారు మట్ట.

పొడవాటి గుంటగరిటలో నూనె పోసి, దాన్ని పొయ్యిలోపల సలసల మరగబెట్టి, అందులో కరేపాకు, ఎండిమిర్చిముక్కలూ,వెల్లుల్లి రేకలూ వేసి దోర దోరగా ఏగనిచ్చి, పొయ్యిమీద ఉడుకుతున్న కూరలో ‘ సుయ్ ‘ మంటూ తాళింపు వేసి చటుక్కున మూతెట్టేసారు పార్వతిగారు.

ఆవిడ వేసిన తాళింపు  ఘాటుకి మొగుడూ పెళ్ళాలు ఇద్దరికీ దగ్గొచ్చి, కళ్ళల్లో నీళ్ళు తిరిగి…ముక్కులోంచి కారడం మొదలెట్టాయి.

కూర వాసనకి… మట్టకి నోట్లో నీళ్ళు ఊరుతుంటే, పార్వతి గారికి తలలో ఆలోచనలు మొగ్గతొడుగుతున్నాయి.

పార్వతిగారు అన్నం వండడానికి… పొయ్యిమీద తెపాలాతో ఎసరు పడేసారు.

మట్ట, పొగలు కక్కుతున్న రెండు కణుజు మాంసం ముక్కలు స్వయంగా ప్లేట్లో వడ్డించుకొని, ‘ఉపూ ఉపూ’ అని ఊదుకుంటూ రుచి చూడ్డం మొదలు పెట్టారు.

” ఓ పని చేద్దావండీ… దేవుడు చిట్టిబాబు గారింట్లో ఓ గంగిగోవుంది.చూడ్డానికి కామధేనువే అనుకోండింక. గోపూజ చేసుకుంటామని వంకెట్టి, ఓ పదేను రోజులిమ్మని అడుగుదాం. ఆళ్ళకీ… పూజలూ పునస్కారాలూ ఎక్కువే కాబట్టి… నేనడిగితే బంగారు కన్నమ్మ కాదనలేరు. ఎటొచ్చీ, ఆ టైంలో వరాలప్ప ఉండకూడదు  అక్కడ. ఆవెకి ఆరాలు ఎక్కువ. ఇంతకీ ఆవిడ ఇక్కడున్నారో? కత్తిపూడిలో ఉన్నారో? పూర్ణ ఉన్నా ఫర్వాలేదు లేండి. అదివేం పట్టించుకోదు. ఏవంటారు?” ఉపాయం చెప్పి కరణేషు మంత్రి అయ్యారు పార్వతిగారు.

” బెమ్మాండం, పోయి అడిగేసిరా అయితే. రోజూ పొద్దున్నే… ఆళ్ళు పాలు తీసేసుకున్నాకా నేనే సొయంగా తోలుకొచ్చి, సాయంత్రం పాలు  తీసే ఏలకి నేనే సొయంగా  తోలుకెళ్ళి కట్టేసొత్తాను ” అన్నారు మట్ట వ్రేళ్ళు నాక్కొంటూ.

” ఇప్పుడెక్కడకెల్తాను? భోజనాలయ్యాకా, కాస్సేపు నడుం వాల్చి, లేచాకా ఓ మాటెల్లొస్తాను. రోజుకి రెండు మూడు వీసెల పేడన్నా ఎయ్యదంటారా? ఆ ఆవు. చూడ్డానికి పుష్టిగా బాగానే ఉంటది ” అడిగారు పార్వతిగారు అన్నం వారుస్తూ.

” ఎందుకెయ్యదూ? దాని బాబదే ఏస్తుంది.లేపోతే రెండ్రోజుల్చూసి, చిట్టు తవుడూ దండిగాపెట్టడవే! పోతే పోయాయి పది రూపాయలు   అనుకొని ”

” మీకూ బుర్ర బానే పని చేత్తందండోయ్ రాజుగారూ ” మెచ్చుకొన్నారు పార్వతిగారు. పెళ్ళయిన ఇన్నేళ్ళలో, మట్టకి ఇదే ఆవిడ మొట్ట మొదటి మెచ్చుకోలు.

” వడ్డించేత్తావా? తినేత్తే, ఓ పనయిపోద్ది” అన్నారు మట్ట.

” ఓ క్షణం ఉండండి, ఎప్పుడూ తిండి యావే. అసలు విషయం చెప్పడం మర్చిపోయాను. ఆవుని తోలుకొచ్చేప్పుడు, ఆ సిరంజీవిగాన్ని ఓ కంట కనిపెడుతుండండి. మా ఆవు, మా ఆవు అని తోకలా కూడా వచ్చేత్తాడు. ఆడసలే గడుసుగోదారి లాటోడు. ఆవు ఆవులిస్తే చాలు, దాని కడుపులో ఎంత పేడుందో కనిపెట్టేస్తాడు. అదోటి జార్త పడాల మనం ”

” ఆడి గొడవ నాకొదిలెయ్యి… ఏదో బొమ్మల పుత్తకం పడేత్తే ఇంక దాన్నట్టుకు ఏలాడతాడు. నేను చూసుకుంటాను కదా అయ్యన్నీ ” అంటూ లేచి వెళ్ళి, కాళ్ళు చేతులూ కడుక్కొని వచ్చారు మట్ట .

” వీసెడు పేడకి, నికరంగా ఏమాత్రం బంగారం దిగుద్దంటారూ? ” పీట వేసి గిన్నెలు సర్దుతూ అడిగారు పార్వతి.

” తడి పేడకీ, ఎండి పిడకలకీ మజ్జ బరువు… సగానికి సగం తేడా ఉంటదనుకో. ఎంత చెడ్డా, ఈసెడు పేడకి పదలం బంగారం ఎక్కడికీ పోదు నాకు తెలిసి. ఎందుకన్నా మంచిది. రేపోసారి ఎంత పేడకి ఎన్ని పిడకలు దిగుతున్నాయో? దిగిన పిడకలు ఎండిన తర్వాత ఒక్కోటీ  ఎంత బరువు తూగుతుందో? తల్లమ్మ కొట్లో తూకం  ఎయ్యించేసొస్తే సరి ”

” అదీ ఒకందుకు మంచిదే, మీరన్నట్టు చిట్టూ తవుడుకి తోడు, ఓ అడ్డుడు ఉలవలు ఉడకేసి పడేత్తే, ఇంకో ఏబులం బంగారం ఎటూ పోదు  ఏవంటారు? ”

” బంగారం వొత్తాదంటే ఎవరొద్దంటారే? ఎర్రిమొహవా! ఎంత చెట్టుకి అంత గాలన్నట్టు, ఎంత తిండికి అంత పేడ ”

” పదలం బంగారం ఏం ధర పలుకుద్దో?  ఓమాటు ఆరా తియ్యండీ ”  శ్రీవారి కంచంలో ఇంకొంచెం కూర వడ్డిస్తూ… భోజ్యేషు మాత అయ్యారు పార్వతిగారు.

” తులవో, కాసో అయితే ఎవలో ఒకలు చెప్పగల్రు.పదలాలు, ఏబులాల లెక్కన బంగారం ఎవరు కొనగల్రు ఈ రోజుల్లో. ఏ రాంపురమో, కాకినాడో ఎళ్ళి కనుక్కొని రావాలి మరి, కాదూ కూడదంటే… ”

” నేను ముందే చెప్పేస్తనా, ఆరేడీసెల బంగారంతోనన్నా… నేను ఏడోరాల నగలు చేయించుకుంటాను. తర్వాత మీరు టేట్ అంటే కుదరదు. పదలం బంగారంతో వడ్డాణ్ణం చెయ్యిస్తే ఆనుద్దంటారా? పైన ఓ పంపుడన్నా ఎయ్యాలంటారా? ” భవిష్య కార్యాచరణ ప్రకటించి, కార్యేషు దాసి అయ్యారు పార్వతి గారు.

” పిండికొద్దీ రొట్టె. అయినా అన్నీ నీకేనా? నాకూ పిల్లలకీ ఏం వొద్దా?” అనుమానంగా అడిగారు మట్ట.ఇద్దరు పిల్లలనీ సెలవులకి…    తేటగుంట అమ్మమ్మగారింట్లో దింపి, పొద్దున్నే వొస్తూ వొస్తూ కణుజు మాంసం పట్టుకొచ్చేరు పార్వతి గారు.

” బంగారాలూ సింగారాలూ మొగోళ్ళకెందుకండీ.ఏ పేకాటకో తాకట్టెట్టేత్తారు. మరీ కాదూ కూడదూ అంటే ఓ అరకాసెట్టి రెండేళ్ళకీ రెండుంగరాలు  చేయించుకుందురుగాని లెండి. ఓటి ఎంకన్నబాబుదీ,ఇంకోటి ఆంజనేయస్వామిదీని ” దయ తలిచారు పార్వతిగారు.

” పాపం , సుబ్బులుకి కూడా ఓ వడ్డాణ్ణం చెయ్యిందామే? అంతక్కాపోతే మజూరీ దాన్నే… పెట్టుకోమందాం. నీ అంత లావు ఉండదు  కాబట్టి, ఆబక్క నడానికి ఓ పంపు బంగారం అయితే ఎక్కితిక్కలయిపోద్ది” ఓ సలహా పడేసారు మట్ట, తిన్న చేతిని పల్లెంలో కడుక్కుంటూ.

ఆ సలహాతో పార్వతిగారు శివాలెత్తిపోయారు.

” ఏం తలతిరుగుతోందా? గుంట గరిటి కానీ తిరగేసెయ్యనా? ” అంటూ మట్టమీదకి ఒంటి కాలి మీద లేచారు. ఆవిడ మాటల్లో మునుపటి మర్యాద మచ్చుకైనా కనపడలేదు.

” ఇప్పుడు, నేనేవన్నానే బాబూ. పేడ పిసికి బంగారం పిడకలు వేసేదానికి, ఆ మాత్రం చెయ్యా పోతే నలుగురూ నానా మాటలూ అంటారని… అన్నాను గానీ, నీకిట్టం లేపోతే వద్దులే ” నచ్చ చెప్పారు నాలుక్కరుచుకున్న మట్ట.

” తగుదునమ్మా అని మీరేం సొంత పెత్తనాలకి పోకండి. అందరిముందూ బంగారం చేస్తే, పాళ్ళు ఆళ్లందరికీ తెల్సిపోవా? మీరు పేడ పిసకండి. నేను పిడకలు కొడతా. మధ్యలో ఇంకో పిట్టపురుగు ఉండానికి నేనొప్పుకోను జార్త ” హెచ్చరించారు పార్వతి గారు.

” సర్లే, అలాగే కానిద్దాం. నువ్వు భోంచేసి, ఆ ఆవు గొడవ చూడు.నేనలా పెదబాజ్జీ దగ్గరకెల్లొత్తాను ” చెప్పారు మట్ట.

” ఆ ఎల్లేటప్పుడు కాస్త పెన్సిలూ, కాయితంముక్కా పట్టుకెళ్ళండి. గుడ్డెద్దు చేలో పడ్డట్టు ఆయన చెప్పింది ఇనేసి వచ్చెయ్యకుండా, ఆ ఇవరాలన్నీ కాగితం మీదెట్టండి ”

” అలాగలాగే ” అంటూ గదిలోకి వెళ్ళి ఓ పెన్సిలూ, కాగితం ముక్కా చొక్కా జేబులో పెట్టుకున్న మట్ట ఇంట్లోంచి బయటపడ్డారు.

ఆ పడ్డం పడ్డం ఇదిగో ఇలా త్రిలోచనరాజుగారి నోట్లో పడ్డారు.

***

ఉదయం నుంచీ జరిగిందంతా ఓ సారి గుర్తు చేసుకుని, పెద్దాయనకి కూర గురించే తెలిసిందా? లేక  వంటింట్లో చేసిన మొత్తం కుట్రంతా తెలిసిపోయిందా? అన్న అనుమానంలో ఉన్న మట్ట కాస్త తేరుకుని…

” అయ్ బాబోయ్ పెదబాజ్జీ అది,  పొద్దున్నయితే తవ భోజనానికి ఆలీసవైపోద్దని,   మీ కోడలూ నేనూ నాలుగు ముక్కలు వండుకు           తినేసాం. సాయంత్రానికి, వండి అట్టిపెట్టమన్నాను. నేను వెళ్ళి పట్టుకొస్తాన్లెండి. అయినా తవకీ సంగతి ఎలా తెల్సిపోయిందండీ? ” సంజాయిషీ ఇచ్చుకుంటూ అడిగారు మట్ట.

” అదంతే, అలా తెలిసి పోతుందిలే. అదలా ఉంచి, ఆ ఉత్తరం వేపునుంచి గడ్డి మోఫెత్తుకుని ఆడమనిషి వస్తంది కదా? ఏ రంగు కోక కట్టింద్రా అది, ఆకుపచ్చదా? ఎరుపుదా? రెండింటి కలబోతా? ” ప్రశ్నించారు త్రిలోచనరాజుగారు. ఆయన అటు తిరిగే వున్నారు.

” ఆడమనిషా? ఎక్కడా? ఆడమనిషి కాదు కదా! ఆడపురుగు కూడా కనపడ్డంలేదిక్కడ ” అన్నారు మట్ట అటూ ఇటూ పరికించిచూసి.

” ఇక్కడ కాదోయ్, అయోమయం గాడిదా! అలా ఆ ప్రహారీ దాకా వెళ్ళి చూసిరా ” పురమాయించారు త్రిలోచనరాజుగారు.

యాభై ఎకరాల ఆసామీ అయిన త్రిలోచనరాజుగారు, వాస్థు కోసం కొబ్బరితోట చుట్టూ  కట్టిన ప్రహారీ గోడ ఎత్తు ఏడడుగులు పైనే. ఆ మొత్తం ప్రహారీ అంతటికీ సిమ్మెంటు పూత పెట్టించారు.ఆ సిమ్మెంటు తాపడం కింద ఉన్న ఇటుకలన్నీ… బంగారం ఇటుకలే అని ఊళ్ళో వాళ్ళందరికీ బలమైన నమ్మకం. త్రిలోచనరాజుగారు బంగారం తయారీలో  చెయ్యి తిరిగిన మనిషి కాబట్టి… ఆయన చేసుకొన్న బంగారాన్నంతా ఇటుకలరూపంలో అలా దాచుకున్నారన్న అనుమానాలు కూడా ఉన్నాయి. ఉట్టిదో? నిజమో? గునపంతో ఓ పోటు పొడిచి చూద్దామంటే… అలా చేసిన వాళ్ళని త్రిలోచనరాజుగారి బాణం ఎక్కడ ఉన్నా వెతికి వేటాడేస్తుందన్న భయంతో ఎవరూ సాహసించ లేకపోతున్నారు. అదీ కాకపోయినా…  ఆయన ప్రహారీకి  కాపలా పెట్టుకున్న అదృశ్య శక్తులు అలాంటి నేరం జరుగుతుంటే  చూస్తూ ఊరుకొంటాయేమిటి? బోర కొరికి చంపేయవూ.

‘ఏంటో చాదస్తం కాపోతేను, అటు తిరిగి పడుకొన్న పెద్దమనిషికి ఏడడుగులెత్తు గోడమీంచి… బయట ఎవరెళ్తున్నారో,ఎవరొస్తున్నారో కనిపించేత్తందా? అసలు ఎలా కనిపించేత్తాదని? అడిగే వాడు లేక ఈయన ఆటలు ఇలా సాగుతున్నాయి గానీ.ఇప్పుడక్కడిదాకా ఎళ్లి ఎనక్కి రావాలంటే ఎన్ని చంకలు నాకాలో?’ అనుకుంటూ ఈసురోమని అరుగు దిగి… భయం భయంగా నడుచుకుంటూ వెళ్ళిన మట్ట,  ఇనప తలుపు బలంగా లోపలికి లాగి, తల ఒక్కటే బయట పెట్టి  అటూ ఇటూ కళ్ళు మిటకరించి చూడసాగారు . అలా చూస్తున్న మట్ట… తన కళ్ళని తనే నమ్మలేకపోయారు.

మట్ట ఇంట్లో… పనిచేసే సుబ్బులు,  నెత్తిన పచ్చగడ్ది గడ్డిమోపు ఎత్తుకొని వయ్యారంగా నడుచుకుంటూ వస్తోంది.గడ్డిమోపు అడ్డంగా ఉండడంతో, ముందు అది ఎవరో ఆయన పోల్చుకోలేకపోయారు. కానీ గుమ్మానికి అడ్డంగా ఉన్న మట్టని చూసి ” ఏటండయ్యగోరూ గేటుకి గబ్బిలంలా ఏల్లాడత్నారు? నా కోసం బెంగెట్టేసుకున్నారేటీ అప్పుడే? ” సరసం ఒలకపోస్తూ సుబ్బులు పలకరించడంతో… మట్ట మొహాన చిరు చెమట్లు అలుముకున్నాయి.

పెదబాజ్జీ చెప్పినట్టే… సుబ్బులు ఆకుపచ్చ కోక కట్టి, ఎర్రటి జబ్బలరైక తొడుక్కుని ఉంది. ఆ కోక కూడా అటుమొన్న మధ్యాహ్నం, ముచ్చటపడి తను రాంచంద్రపురంనుంచి   కొని తెచ్చిందే.

” ఎల్లహే… ఇల్లు కాలి ఒకడేడుత్తుంటే, ఇంకేదో కాలి ఆడెవడో ఏడ్చాడని, ఇంతోడి అందగత్తె మాకు దొరకదని? ఇక్కడ ఏళ్ళాడత్నాం అనుకున్నావా? మీ అయ్యగారు ఊర్నించి వచ్చేసింది. నువ్వు ఎదవ్వేషాలెయ్యకుండా బేగా ఇంటికిపో. అది చెప్పడానికే ఇక్కడ కాపేసా ” ఖంగారు ఖంగారుగా అబద్దం చెప్పారు మట్ట.

” అల్లయితే, మాపిటికి యర్రపోతారం సినిమా లేనట్టేనా? హుహుం ” మూతి తిప్పుకుంటూ పోయింది సుబ్బులు.

వెనక నుంచి దాన్ని కాస్సేపు అలా మురిపెంగా  చూసుకుని, మతిపోబొట్టుకోబోయిన మట్ట…పెదబాజ్జీ దివ్యదృష్టి గుర్తుకురావడంతో గేటు మూసేసి ,అది నిజమో కాదో పరీక్షించడానికి… ఏదో ఆలోచన వచ్చినట్టుగా కాలికివున్న చెప్పులు విప్పేసి, వాటిని చేత్తో పట్టుకొని, మెల్లిగా పిల్లిపిల్లలా చడీ చప్పుడు చేయకుండా, అడుగులో అడుగు వేసుకుంటూ వచ్చి ఇందాకటి నుంచీ తను కూర్చున్న చోటనే కూర్చున్నారు.

త్రిలోచనరాజుగారు ఇందాకటి భంగిమలోనే, అటు తిరిగి పడుకున్నవారు… ఇంకా పడుకొన్నట్టే ఉన్నారు.

” ఏమోయ్  పచ్చకోకా? ఎర్రకోకా? ” ప్రశ్నించారు కదలకుండానే ఆయన.

పడుకున్న ఆయన్ని… భూతాన్ని చూసినట్టు చూసారు మట్ట.’ నేను తిరిగొచ్చినట్టు ఈయనకెలా తెలిసిపోయింది. వీపుక్కానీ కళ్ళున్నాయా? ‘ అనుకొని…

” ప …ప్ప… పచ్చకోకా ఎర్రజాకెట్టూను ” అని చెప్పారు.

‘ఈయనకి ఈ కోక రంగొక్కటే తెలుసా? లేపోతే సుబ్బులుకీ తనకీ మధ్య ఉన్న చుట్టరికం కూడా తెలుసా? ‘ అన్న కొత్త భయం మట్టలో మొదలయ్యింది.

” పెప్పెప్పెద బాజ్జీ, నిజంగా మీరు మాంత్రికులే కదా? ” అన్నారు వణికే స్వరంతో.

” భయపడి చావకు. ఇది మాయాకాదూ మర్మం కాదు. దీన్నే గంధవేది అంటారు.వాసనలని బట్టి ప్రాణులని కనిపెట్టడం అన్నమాట. ఈ భూమ్మీద పుట్టిన ప్రతి ప్రాణికీ… ఒక్కో వాసన ఉంటుంది. కొంత అభ్యాసం చేస్తే గాలిలో  తేలి వచ్చే వాసనలని బట్టి వచ్చేది మనిషా? మృగమా? పశువా? పక్షా? అన్నది చెప్పెయ్యొఛ్చు. ఈ శక్తి ఎక్కువగా కుక్కల్లో  ఉంటుంది. అన్నారు వెల్లకిలా తిరుగుతూ.

***

త్రిలోచనరాజుగారు పడుకున్న పరుపుకి పైన… ఆయన తలవైపున గోడమీద దిగ్గొట్టిన మేకుకి ఓ విల్లు వ్రేళ్ళాడుతోంది. పక్కనే మరో మేకుకి తగిలించిన పొడవాటి ఈతాకులబుట్టలో నాలుగో ఐదో బాణాలు ఉన్నాయి. ఆ విల్లుతో ఆప్పుడప్పుడూ, ఆయన మిత్రులతో కలిసి అడవిలోకి వేటకి వెళ్తుంటారు. వెళ్ళినప్పుడల్లా ఏదో పిట్టనో, పెట్టనో కొట్టి తెస్తుంటారు.

గోడమీద విల్లూ బాణాలు ఉన్నాయి కాబట్టి, కధ అయిపోయే లోపు ఎవరో ఒకరు బాణం వేయాల్సిందే కదా?

నిన్న త్రిలోచనరాజుగారి చిన్నకొడుకు వెంకట బంగార్రాజుకి… పెద్దకొడుకైన బుచ్చిత్రిలోచనరాజు ఆ  బాణాలతో కాస్సేపు సరదాగా ఆడుకున్నాడు. బుచ్చి రామచంద్రపురంలో తల్లిదండ్రుల దగ్గర ఉండి చదువుకుంటున్నాడు. తాతయ్యనీ నాన్నమ్మనీ చూసిపోదామని వచ్చిన ఆ బుచ్చిత్రిలోచనుడు తాతయ్యని ఏమార్చి… విల్లునీ బాణాన్నీ తోటలోకి పట్టుకుపోయి, ఆకాశం వైపు ఎక్కుపెట్టి ఎగురుతున్న ఓ అడవిపావురాన్ని గురిచూసి కొట్టాడు. గురి తప్పి దూసుకు పోయిన ఆ బాణం, ఎటుపోయిందో పోయి అదృశ్యం అయిపోయింది.

బహుశా ఏదో చెట్టుమీద  సుఖంగా విశ్రాంతి తీసుకుంటున్న  త్రిలోచనరాజుగారి ఏ పెంపుడు దయ్యానికో, భూతానికో అది తగిలివుంటుంది. దాన్ని పట్టేసుకున్న అవి చెవిలో పెట్టుకుని చమ్మగా తిప్పుకుంటున్నాయో? ఏమో… కొట్టి పడెయ్యలేం బాబూ.

ఒకవేళ బాణం క్రింద ఎక్కడైనా పడిందేమోనని, బుచ్చిత్రిలోచనరాజు తోటంతా తిరిగి వెదికాడు.అయినా ప్రయోజనం లేకపోయింది.ఎందుకొచ్చిన గొడవలే… తాతయ్య కానీ వచ్చి చూస్తే తాట తీసేస్తారు. అని తలచి వాటిని, ఏమీ ఎరగనట్టు  యధాస్థానంలో పెట్టేసాడు.

తెల్లవారు జామునే లేచిన అతను, ఇంజరం వంతెన వరకూ పాలేరుచేత సైకిల్ మీద దిగబెట్టించుకున్నాడు. అక్కడ నుంచి  బస్సు ఎక్కి రామచంద్రపురం చక్కా పోయాడు.

***

” పెదబాజ్జీ కొంచెం ఆ బంగారం చేసే కిటుకేదో చెప్పేస్తే, తవరి శిష్యుడిగా కీర్తి గడిస్తూ… చచ్చి మీ కడుపునపుడతాను ” ఆశగా అడిగారు మట్ట.

” సరే అయితే ” అంటూ ఆయన పరుపుమీదనుంచి లేచి, అరుగుమీదనుంచి మెట్లమీదకి కాళ్ళు వేళ్ళాడేసి కూర్చున్నారు. అప్పటి వరకూ టెక్కా మీద కప్పి ఉన్న కండువా అందుకుని, చెవుల మీదుగా తలపాగా చుట్టుకున్నారు.

” కన్నమ్మని అడిగి మంచినీళ్ళు తెమ్మన్నారా?” అంటూ లేచారు మట్ట.

” వద్దు… ఆ గుమ్మందగ్గరకి వెళితే ఓ దయ్యం నీకో మరచెంబు ఇస్తుంది. దాన్ని నాకు ఇచ్చి మళ్ళీ వెళితే ఇంకో భూతం తెచ్చి నీ చేతికి టీ గ్లాసులు ఇస్తుంది. అయ్యందుకో చాలు” అని  ” జాగ్రత్తరోయ్… వాటిని చూడాలని ప్రయత్నించకు.  తల్లో కొమ్ములూ నోట్లో కోరలూ మొలిచెయ్యగలవు” లో గొంతుతో హెచ్చరించారు త్రిలోచనరాజు గారు.

మట్ట పై ప్రాణాలు పైనే పోయాయి.తలుపువెనక నుంచి గాజుల శబ్దం వినిపిస్తోంది.దానితో పాటే కిసుక్కున నవ్విన చప్పుడు కూడా.

”  బాబోయ్ నాకు భయం. చంపేత్తాయేమో? నాకేం… నేను తేను ” అన్నారు మట్ట. అరుగు చివరికి దేకుతూ.

” ఏం ఫర్వాలేదు లేవోయ్! నేనున్నానుగా ఆటి ముక్కు పిండి… ముంతలో పెట్టి మూత పెట్టడానికి ” ధైర్యం చెప్పారు.

ఆయన మాటలు వినగానే మట్టకి భయం మరీ ఎక్కువయ్యింది. ‘ఇందాకా తోటలోంచి నడుస్తూ తను ఏమనుకున్నాడో? అవే మాటలని… తిరిగి ఆయన తనకి అప్ప చెబుతున్నారు.

కాదు, లేదంటున్నారు కానీ నిజంగా పెదబాజ్జీ మాంత్రికుడే. మంత్రగాడే కాదు పెద్ద మాయల ఫకీర్ కూడా అయ్యుంటారు. అందులో ఎంత మాత్రం సందేహం లేదు. అందుకే అప్పుడప్పుడూ హిమాలయాలకి పోయొత్తుంటారు’  అని తనలో తనే తీర్మానించుకున్న మట్ట కళ్ళు పెద్దవి చేసుకొని…

భయంభయంగా తలుపు దగ్గరకి వెళ్ళేసరికి  త్రిలోచనరాజుగారు చెప్పినట్టే ఏదో అదృశ్యహస్తం  ఆయన చెప్పిన అన్నిటినీ సమకూర్చింది. తల అటు తిప్పకుండానే కళ్ళు మూసుకుని మట్ట వాటిని వణికే చేతులతో అందుకున్నారు.

మట్ట ఇత్తడి గ్లాసులో ఉన్న వేడి వేడి టీని చప్పరిస్తుంటే… త్రిలోచనరాజుగారు మరచెంబులోని మంచినీళ్ళు పుక్కిలించి ఊసి,  తర్వాత  వెండి గ్లాసులో ఉన్న టీ పుచ్చుకొని లేచి నిలబడ్డారు.

” పెదబాజ్జీ మరి ఆ విజ్జ కొంచెం ” అంటూ నసుగుతూ లేచిన మట్ట… జేబులోంచి ఓ తెల్ల కాగితాన్నీ, చిన్న పెన్సిల్ ముక్కనీ తీసి త్రిలోచనరాజుగారి కళ్ళ ముందు ఆడించారు. చెబితే రాసుకుంటాను అన్నట్టు.

” కంగారేవిట్రా నడు… అలా తోటలో చల్లగాలికి తిరుగుతూ చెబ్తాను. అసలు నేను కలగ జేసుకోకపోతే నువ్వు ఈపాటికి చచ్చూరుకుందువు ఆ సంగతి నీకు తెలుసా? ” అంటూ అరుగు దిగి కాళ్ళకి చెప్పులు వేసుకుని… అరుగుకి జారేసిన చేపాటి కర్రని చేతిలోకి తీసుకున్నారు త్రిలోచనరాజుగారు.

” ఏంటీ నేను చచ్చిపోదునా? ఏం అంటున్నారు తవరు? హాస్యానికి కూడా హద్దూ పద్దూ ఉండొద్దా?” ఆయన మాటలు పూర్తి అవ్వకుండానే కీచుగా అరిచారు మట్ట. ఏడుపొక్కటే తక్కువ ఆయనకి.

” నేను అబద్దం ఎందుకు చెబుతానురా? ఏబ్రాసీ… నువ్వు ఇందాకా ప్రహారీగోడ చుట్టూ ప్రదక్షిణ చేస్తున్నప్పుడు నీ కాళ్ళ దగ్గర నుంచి పెద్ద త్రాచుపాము పాక్కుంటూ పోయిందా? లేదా?

” నిజవే! అదీ పామో? కాదో నేను చూల్లేదు ” మట్ట గొంతు తడారిపోతోంది.

” భయంతో నువ్వు చూల్లేదు కానీ…, దాన్ని నువ్వు తొక్కేసి ఉంటే కాటు వేసేదా? లేదా? కాటేస్తే ఏమవును చెప్పు? అసలు ఏమవునంటావ్? నిన్ను దాని మీద కాలు వెయ్యనీయకుండా… ఒరే మట్టా ఆ తూర్పుగేటు నుంచి రారా అని పిలిచానా లేదా?” చిరునవ్వుతో అడిగారు.

త్రిలోచనరాజుగారు చెప్పేది వింటుంటే మట్టకి నవనాడులూ కృంగిపోయాయి. ఆయన్ని అంతులేని నీరసం ఆవహించింది.

‘అవును నిజవే. పెదబాజ్జీ చెప్పేదంతా నిజవే. అమ్మ బాబోయ్ నేను చచ్చిపోతే నా పెళ్ళాం పిల్లలు ఏవైపోదురు?’ నాలుకతో పెదాలు తడుపుకున్నారు.

” ఓపక్క మాయలు లేవు, మంత్రాలు లేవు అంటారు. ఇయ్యన్నీ తవరికెలా తెలిసాయండీ” మాటలు కూడబలుక్కొని ఉక్రోషంగా అడిగారు మట్ట.

” భయపడకురా సన్నాసీ. భయమే… మనిషిని సగం చంపేస్తుంది.దీన్నే శబ్దవేది అంటారు.శబ్దాన్ని బట్టి ప్రమాదాలని పసిగట్టడవన్న మాట. నీ విషయంలో అక్కరకి వచ్చిందా కదా? ”

” మరి ఆ కామినీ పిశాచం పనసపండు ఏసాలేవిటీ? ఆ తలుపెనకాల దెయ్యాల దొంగాట ఏంటి?”

” తలుపు వెనకాల దయ్యం మీ కన్నమ్మేరా? నేను పడుకొని లేచే వేళలు వాళ్ళకి తెలీవురా? ఇంక పనస వాసన అంటావా? నడు చూపిస్తా! అది నేల పనస. భూమిలోనే కాస్తుంది. పక్వానికి వచ్చాకా నెర్రలు తీసి కాయలు బయటకి వస్తాయి ”

” అలాగా? ”

” స్పృహలోనే ఉన్నావు కదా? నడు ”

” ఏం స్పృహ అండీ, చచ్చి బతికితేనీ. నాకియ్యాళ మీరు ఆ బంగారం చెయ్యడం నేర్పాపోతే… ఎప్పుడూ మీ గుమ్మం మెట్టు ఎక్కనింక ” గారం గుడుస్తూ శఫధం చేసారు మట్ట.

” సరే… రా రాసుకుందీ గాని  ” అన్నారు త్రిలోచనరాజుగారు ముందు నడుస్తూ.

పెన్సిల్ ముక్కా కాగితం పట్టుకొని… మట్ట ఉత్సాహంగా ఆయన్ని అనుసరించారు.ఆయన మొహంలోకి మళ్ళీ మునుపటి జీవ కళ వచ్చి చేరింది.

***

‘ మట్టగారూ త్రిలోచనరాజుగారూ… వీళ్ళిద్దరూ ఇక్కడ ఉల్లాసంగానే ఉన్నారు’

‘పార్వతిగారు అక్కడ ఆవుకోసం వరాలప్పని ఉబ్బేస్తూ… పక్షంరోజులపాటూ ఆవుని ఎలా ఎత్తుకెళ్ళాలా అని ఎత్తులకి పై ఎత్తులు వేస్తూ ఆవిడా బాగానే వున్నారు’

‘సినిమా యవ్వారం చెడిపోయినా, సాయంత్రం కణుజు మాంసం కూర దొబ్బితిందామన్న ఆశతో సుబ్బులూ కులాసాగానే ఉంది’

‘తాతయ్యనుంచి తన్నులు తప్పించుకోవటానికి పొద్దున్నే రామచంద్రపురం పోయిన  బుచ్చి త్రిలోచనరాజు మిగతా కుర్రోళ్లతో కలిసి కిరికెట్టు ఆడుకుంటూ అతనూ బాగానే ఉన్నాడు’

‘ఎక్కడ ఉన్నాడో గానీ ఆ మంతెనోరి రామంగాడు కూడా బాగానే ఉండుంటాడు.బాగోకపోవడానికి అతనికి తిన్నది అరగట్లేదా ఏమన్నానా?’

‘ ఎటొచ్చీ ఈ కధ చెబ్తున్న నేనే బాగాలేను. అవును అస్సలు ఏం బాలేను ‘

‘గోడ మీద ఉందన్న విల్లు  నాకు మహ గొప్పగొడవ తెచ్చి పెట్టేసింది. త్రిలోచనరాజుగారు ఆ విల్లుని అలాతీసి… కనీసం ఇలా ఓసారి తుడిచేసి గోడకి తగిలించేసినా నాకు పెద్ద ఇబ్బంది లేకపోను. ఆయనేమో తన మానాన తాను మట్టని వెంటేసుకొని కొబ్బరి తోటలో విహారానికి పోయారు.

బంగారం చేసే విద్య నేర్చేసుకొని… మణుగులకొద్దీ బంగారం తయారు చేసేసుకొని మట్ట మహారాజైపోతారు.ఆయన మహారాజైతే… పార్వతిగారు ఎలాగూ ఇంక మహారాణే కదా.అంతే ఇంకేముంది…శుభం. కధకంచికి మనం ఇంటికి.

ఇలా అని సరి పెట్టేసుకుంటే పాఠకులనిపించుకుంటారా మీరు?

ఏంటిది? గోడమీద విల్లుందన్నాడు. పెద్ద పెద్ద బాణాలు ఉన్నాయన్నాడు. నిన్నో మొన్నో ఎవడో ఓ కుర్రకుంక గురిలేని బాణం వదిలి… పొద్దున్నే పారి పోయాడని చెప్పి, చేతులు దులిపేసుకుంటే సరా? అలాంటప్పుడు ఇవాల్టి కధలో  దాని ఊసు ఎందుకెత్తినట్టు? కధా నియమం పాటించనక్కర్లేదా? చేతకాకపోతే చేతకానట్టుండాలి.హత్తెరి అంటూ తయారైపోకూడదు. అని మీరు వేలెత్తి చూపించకుండా ఉండగలరా? అప్పుడు నా పరువు ఏంకావాలి?  కధ చెప్పే… నా మర్యాద ఏవన్నా మిగులుద్దా?’

***

‘ ఏంటో?పిచ్చెక్కిపోతోంది. ఏ నిమిషానికి ఏం జరుగుతుందో? నాకే అర్ధం కావడం లేదు ‘

నడుస్తూ నడుస్తూ వున్న త్రిలోచనరాజుగారు ఎందుకో గానీ వెనక్కి తిరిగారు.

‘ కళ్ళుమూసుకుని… అన్నీ తెలిసేసుకునే ఆయన, నా బాధని కనిపెట్టేసారా ఏమిటీ? ‘

‘ …….’

‘అదిగో ఆయన వెనక్కి తిరిగారు. ఇటే…నావైపే ఒక్కో అడుగూ వేస్తూ వస్తున్నారు ‘

‘ఇక్కడికి వస్తారు… వచ్చి ఈ గోడమీద ఉన్న విల్లూ బాణాలూ తీసుకెళ్తారు’

‘బాణం ఎక్కుపెట్టి ఏదో పావురాన్నో, పిట్టనో కొట్టకపోరు! నా మర్యాద నాకు దక్కించక పోరు ‘

????????????????

‘ క్షణాలు నిమిషాలవుతున్నాయి… నాలో ఉత్కంఠ పెరిగిపోతోంది ‘

‘ఆయన వస్తున్నారు’

‘వచ్చేస్తున్నా…రు ‘

‘ వచ్చేస్తు…న్నారు ‘

‘ వచ్చే…స్తున్నారు ‘

‘ వ…చ్చేస్తున్నారు ‘

‘ …చ్చేస్తున్నారు ‘

‘చ. చచ… అక్కడి దాకా వచ్చి, అక్కడే ఆగిపోయారేంటీ? కిందకి వంగి ఏదో మొక్కని పీకి మట్టకి చూపిస్తున్నారు.బంగారం తయారీలో వాడే ఆకుపసరు అదే అయి ఉంటుందా? ఏమో… అయ్యే వుంటుంది. ఆ మొక్కని పట్టుకొని…  మట్టతో కలిసి మళ్ళీ ముందుకు నడవడం మొదలెట్టారు.

‘ఇక లాభం లేదు? నాకు నా పరువు మర్యాదలు నా గౌరవం ముఖ్యం.  ఏం చేసి అయినా సరే… వాటిని నిలబెట్టుకుని తీరాల్సిందే. అందుకు కోసం  నేను ఖూనీ చెయ్యడానికైనా  సిద్దమే ‘

వెళ్లి గోడనున్న విల్లుని, ఓ బాణాన్ని విసురుగా చేతిలోకి తీసుకున్నాను.

త్రిలోచనరాజుగారి వైపు కోపంగా బాణం గురి పెట్టాను.

ఒకటీ.

ఓ కన్ను మూసి చూస్తున్నాను.

రెండూ..

ఏంటీ… గురి కొబ్బరిగెల మీదకి వెళుతోంది.చెయ్యికానీ… వణుకుతోందా?

మూడూ…

వింటి నుంచి బాణం వె.లు..వ…డిం………………………

కొబ్బరి చెట్ల కిందనుంచి నెమ్మదిగా నడచి వెళ్తున్న త్రిలోచనరాజుగారి తలమీద అమాంతంగా వచ్చి ఓ కొబ్బరిగెల దబ్బునపడింది. పడిన కొబ్బరిగెలతోపాటూ ఆయనా కిందపడిపోయారు.ఆయనకి ఏంజరిగిందో తెలియదు.తలచుట్టూ రక్తం మడుగులు కట్టింది. ఈ విషయం ఆయనకి తెలిసే అవకాశమే లేదు.

ఆయన వెనకే నడుస్తున్న మట్ట ఏంజరిగిందో గ్రహించి… దూరంగా పరిగెత్తి పారిపోయారు.

ఆయన చేతిలోని తెల్లకాగితం గాల్లో ఎగురుతూ గిరికీలు కొడుతోంది.పెన్సిల్ ముక్క ఎగిరి వెళ్ళి ఎక్కడో పడిపోయింది.

కిందపడ్డ కొబ్బరిగెల తొండానికి ఓ బాణం గుచ్చుకొని ఉంది.

వీధివైపు గెలపడ్డ పెద్ద చప్పుడు వినిపించడంతోనే… త్రిలోచనరాజుగారి పెరట్లో పనిచేస్తున్న పనివాళ్ళు ఏమయ్యిందోనని చూడ్డానికి ఖంగారుగా వీధిలోకి పరిగెత్తుకుంటూ వస్తున్నారు.

నేను ఇంక ఇక్కడ ఉండడం అంత మంచిదికాదు.గబ గబా విల్లూ చేతిలోని బాణాన్ని ఎక్కడనుంచి తీసానో అక్కడే పెట్టేసి అక్కడనుంచి నిష్క్రమించాను.

ఇంతజరిగాకా కూడా, అసలు ఆ మంతెనోరి రామం ఏం చేసాడూ? అని  మీరు  నన్ను అడుగుతారని అనుకోను.

దివ్య దృష్టితో అడ్డుగోడల అవతల ఏంజరగబోతుందో చెప్పగలిగే త్రిలోచనరాజుగారికి… ఆ మంతెనోరి రామం ఏం చేసాడో?  తెలీకుండా  ఉంటుందా?

అయినా… మంతెనోరి రామం గురించి మట్ట చెప్పాలనుకున్నది  నాకూ మీకూ కాదు కదా!త్రిలోచనరాజుగారికే గానీ.