దృశ్యాదృశ్యాలు

Sreekanth

 

 

 

 

 

ఆకాశంలో తారల వైపు చూసి
ఆశువుగా కవిత్వం చెప్పమన్నాడో మిత్రుడు

ఆకాశనికుంజంలో
అందంగా విరిసిన జాజిమల్లి జాబిలైతే
విరిసీ విరియని మొగ్గలే తారలు
వాలిపోయే తుమ్మెదలే కరిమబ్బులు

కలువరేకుల నా చెలికన్నుల్లో
కొలువుదీరాయి నిండుపున్నిమలు
ఆకాశమా అసూయపడకు
అమావాస్యనిశి నాకిక లేదు !

వెన్నెలవాగులో
వ్యాహ్యాళికెళ్దాం సఖీ !
నెలవంక నావనెక్కి
నక్షత్ర సుమాలు ఏరుకొంటూ..

ఈ చీకటి నీటిగుంతలో
ఏ చిన్నారి విడిచిన కాగితపు పడవలో ఈ తారలు
కాలం కెరటాలపై స్నిగ్ధంగా సోలిపోతూ
కూతురి బాల్యచేష్టల్ని కళ్ళెదుటే నిలుపుతున్నాయ్

కొట్టుకుపోయిన కొత్త తార్రోడ్డుపై
కకావికలైన గులకరాళ్ళ మధ్య
మూతబడని మ్యాన్‌హోల్‌లా మూగగా చంద్రుడు
దశాబ్దాల నీ ప్రగతికి దేశమా !
దారుణ ప్రతీకలివే !!

కుంభకోణాల కమురుతెట్టులో
వేగిపోతున్న వ్యంజన పదార్థాలు
మినుకుబిక్కుమంటూన్న ఈ మామూలు మనుషులు
నవ్వీ నంజుకునే నేతల పీతలే అన్ని వేపులా !

సమస్య ఉప్పెనలో సర్వం కోల్పోయి
కెరటాల మబ్బులకు కృంగీ ఎదురీదీ
శరణార్థియై తరలిపోతున్నాడు శుష్కచంద్రుడు
నక్షత్రసంతతిని నడిపించుకుంటూ

విసిరేసిన పులి విస్తట్లో
విరిగిపోయిన చుక్కల పుల్లల మధ్య
వెలిసిపోయిన జాబిలిముద్దను చూసి
పెదవి తడుపుకున్నాడో పరమనిర్భాగ్యుడు

కాముకుడి కర్కశత్వానికి
కుమిలిపోతున్న కన్నెపిల్లలా
వొళ్ళంతా మరకలతో
వికృతంగా రోదిస్తున్నది ఒంటరి రాత్రి !

చీకటి ఉరికొయ్యల క్రింద చివరి శ్వాస పీల్చి
చిరాయువులై వెల్గుతున్నారెందరో పుణ్యమూర్తులు
క్రాంతిరేఖల వారి మార్గమే
శాంతిపుంజాల భావి ఉషస్సులకు నాంది

విబేధాలు విస్మరించి
విషాదాలు పెల్లగించి
సౌహార్ద్రత పరిఢవిల్లి
సర్వజనాళి ఏకమైతే
వాస్తవం కాదా వసుధైక కుటుంబం !
వాకిట్లో వెలిగించిన ప్రేమామృతదీపాలు కావా
వినువీధిలో తారాతోరణం !!

భావావేశం అందరిలో ఉంది
బ్రతుకులో తారతమ్యాలే
భావనలో ప్రతిఫలిస్తాయి
స్పందించే మనసుంటే
సాక్షత్కరించే దృశ్యాలెన్నెన్నో

-బెల్లంకొండ లోకేష్ శ్రీకాంత్.