వలస బతుకులోని కొన్ని కోణాలు!

-బూర్ల చంద్రశేఖర్

~

(‘‘కెన్యా టు కెన్యా’’ ఆవిష్కరణ సభ నవంబర్ 1 డెట్రాయిట్ లో)

చంద్రశేఖర్విదేశాలలో  స్థిరపడిపోయినవారి జీవిత చరిత్రలను ‘‘కెన్యా టు కెన్యా’’ కథల రూపంలో చిత్రించిన వారు ఆరి సీతారామయ్యగారు. ప్రాచీన కాలం నుండి భారతదేశంలో ఉన్న సంప్రదాయిక, సాంస్కృతిక వారసత్వాన్ని నింపుకొని విదేశాలకు విద్యా, ఆర్థికావసరాలరిత్యా వలస పోయి అక్కడే స్థిరనివాసులుగా మారిన తరాలని, వారి తరువాతి తరాలని గురించి, వారు విదేశాలలో అనుభవిస్తున్న జీవిత పార్శ్వాలని మన కళ్ళముందుంచే ప్రయత్నం చేస్తాడు రచయిత.

వీరి కథల్లోని వస్తువంతా విద్యా,ఆర్థికావసరాల కోసం విదేశాలకు వలస వెళ్ళిన వారి జీవితాలు, అనుభవాలు. అలా వలస వెళ్ళిన వారు అక్కడి పరిస్థితులను ఎదుర్కొంటూ, తమ ఉనికిని కాపాడుకుంటూ జీవనం కొనసాగించి, చివరకు భారతీయ ఆత్మ విదేశీ ఆచ్చాదనను ఎలా జీర్ణించుకోలేదో, అలాంటి జీవనం గడుపుతున్నవారు ఎలాంటి తాత్త్విక ధోరిణికి గురౌతారో చాలా చక్కగా వివరిస్తాడు రచయిత. వలసలు పోయిన భారతీయులు అక్కడి పరిసరాలు, సంస్కతులకు అనుసందానమయ్యే స్థితిలో వారి మానసిక సంఘర్షణలు, వాటితో నిరంతర పోరాటం ఎలా ఉంటుందో ఈ కథలలో మనకు కనిపిస్తుంది. వలస జీవిత వ్యథల్ని కథలరూపంలో చెప్పాలనుకోవడం రచయిత ఉద్దేశం లాగా అనిపిస్తుంది.

‘సుచిత్రాచంద్ర’ కథలో భారతదేశ సంప్రదాయిక వివాహ వ్యవస్థ విరుద్ధంగా ఉన్న సహజీవనం (డేటింగ్) విధానాన్ని తెలుపుతాడు రచయిత. వివాహవ్యవస్థలోని అవస్థలను తెలుపుతూనే, ఆధునిక కుటుంబ జీవన శైలి అయిన సహజీవనంలోని లోటు పాట్లను కూడా అంతర్నిగూఢంగా వివరిస్తాడు. ఇలాంటి విదేశీ సంస్కృతి వల్ల భారతీయతరం ఎంత సంఘర్షణకులోనౌతుందో, అయినా ఆ జీవన శైలి ఎంత అనివార్యమో కూడా ఈ కథ ద్వారా తెలుపుతాడు రచయిత. ఈ కథలో మొఖానికి ముసుగు వేసుకోవడానికి ఇష్టపడని ఒక సాధికారికత కలిగిన ఆధునిక స్త్రీ పాత్రగా సుచిత్రను పరిచయం చేస్తాడు రచయిత. అనివార్యంగా సహజీవనం చేసే పురుషునిగా చంద్రం పాత్ర కనబడుంతుంది. మారుతున్న కాలానికి మారుతున్న జీవనావసారాలు కూడ ముఖ్యమే అని చివరకు పాఠకుడనుకునేలా చేస్తాడు రచయిత.

గింజలు అనే కథలో గింజలను డాలర్లకు ప్రతీకగా, పక్షిని ఆర్థికావసరాల నిమిత్తం విదేశాలకు వలసపోతున్న వారిలాగా వర్ణిస్తూ కథారచన సాగుతుంది. స్వదేశంలో ఉన్నవారు విదేశాలకు వలస పోయిన వారికోసం నిరీక్షంచే సంఘటన ఎంత హృదయ విదరకంగా ఉంటుందో ఇందులో వర్ణితం.

ప్రయాణం అనే కథలో ఆర్థికావసరాలు మానవ, సంస్కృతిక సంబంధాలను ఎలా పేలవం చేస్తాయో చూపిస్తాడు రచయిత.

కెన్యా టు కెన్యా అనే కథలో మనిషి మనుగడ స్వేచ్ఛాయుతమే అయినా అంతిమంగా ఉండే అవసరాలు మనుషుల మధ్యనున్న బంధాలను ఎలా త్రుంచగలవో తెలుపుతాడు రచయిత.

ఇక కథలలోని శిల్పం గురించి తెలిపినట్లైతే రచయిత  కథను అంత సులభంగా నడిపిస్తున్నట్లనిపించదు. కథలోని పాత్ర, ఆ పాత్ర చుట్టూ పెనవేసుకున్న పరిస్థితులను కూలంకషంగా చర్చిస్తూ, వర్ణిస్తూ పాఠకుడికి తను ఏం చెప్పదల్చుకున్నాడో అంతర్నిగూఢంగా వివరిస్తాడు. అంతేకాకా కథలోని పాత్ర ఏదైన ఉద్యోగం చేస్తున్నట్లైతే ఆ ఉద్యోగానికి సంబంధించిన సమగ్రజ్ఞానాన్ని, లోతైన సంఘటనలను వివరించ ప్రయత్నం చేస్తాడు కవి. ఉదా: ‘సుచిత్రాచంద్ర’ కథలో సుచిత్ర ఉద్యోగ జీవితాన్ని, ‘కెన్యా టు కెన్యా’ కథలో  స్టిఫెన్ ఉద్యోగ విషయాలను, ‘ప్రయాణం’ కథలో జర్మణి ఉద్యోగి ఖర్చులను మొదలగు విషయాలను చాలా లోతుగా అందించడం కనిపిస్తుంది.

ari

కథ ఎత్తుగడ నుంచే పాత్రల ప్రవేశం కనిపిస్తూ ఆయా పాత్రలగురించి పరిపూర్ణంగా పరిచయం చేయడం కనిపిస్తుంది. ఆయా పాత్రలు ఏ సంఘటనల్లో, సందర్భాల్లో చిక్కుకున్నాయో పాఠకునికి స్పష్టంగా తెలియాలి అన్న ఆలోచనాధోరణి రచయితలో కనిపించడం ఇందుక్కారణం కావచ్చు. కథల్లో ‘ఏకాంశ వ్యగ్రం , స్వయం సమగ్రం’ అనే  లక్షణాలుండాలి వీరి కథల్లో ఈ లక్షణాలు పరిపూర్ణంగా కనిపిస్తాయి. కథలకు సంక్షిప్తతత కూడా మరో లక్షణం. అయితే ఈ లక్షణం కొన్ని కథల్లో కనిపించదు. కొన్ని కథలు స్కోప్ (పరిధి) దాటి నవలికకు దగ్గరగా వెళుతున్నట్లనిపిస్తుంది. ఉదా: సుచిత్రాచంద్ర, కెన్యా టు కెన్యా. శిల్పరిత్యా చూస్తే ప్రతీకాత్మకంగా రాసిన ‘గింజలు’ అనే కథా కవిత్వానికి దగ్గరగా ఉన్న కథలాగా అనిపిస్తుంది.

వీరి కథలలో వినూత్నమైన, టక్కున మలుపు తిరిగే విధంగా సాగిపోయే ధోరణి కనిపించదు. చాలా నిదానంగా కథ సాగుతూ ఉంటుంది. కథలోని పాత్రల భౌతికావసరాల కోసం మానసిక సంసిద్ధతలను ఏర్పరుస్తూ, ఏదీ కూడా తను నిర్ణయాధికారిగా వ్యవహరించకుండా చివరకు పాఠకుని ఊహకు వదిలేస్తాడు. భాషా విషయంలో చాలా సులభమైన శైలినే వాడడం కనిపిస్తుంది. వాక్యాలలో గాని, పదాలలో గాని కాఠిన్యత, నిర్వచించలేని గూఢత అంతగా కనిపించవు. రచయిత ఎక్కువ శాతం సంభాషణాత్మకంగానే కథను నడిపిస్తాడు.

‘‘కెన్యా టు కెన్యా’’ కథల సంపుటిలో 15 కథలున్నాయి. ఇందులోని కథలన్నిటినీ  రచయిత తన చుట్టూ ఉన్న ఎన్నో జీవితాలను అధ్యయనం చేసి రాసాడనిపిస్తుంది. విదేశాలలో పనిచేసే వారి జీవితాలు చాలా సౌఖర్యవంతంగా (లెగ్జరీగా) ఉంటాయని మన దేశం వారు భావిస్తారు. కాని వారి ఉద్యోగ, ఆర్థిక, కుటుంబ జీవన భద్రత విషయాలను చాలా దగ్గరనుండి గమనించిన వాళ్ళకే తెలుసుంది అందులోని నిజమెంతో. పైన తెలిపిన విషయాలన్నింటిని చాలా చక్కగా కథలలో నిక్షేపించాడు రచయిత. రచయిత విద్యా, వృత్తి అంతా కూడా విదేశాలలో కొనసాగింది, కొనసాగుతుంది. ఈ కథలలోని వస్తువులకు వారు జీవిస్తున్న ప్రాంతీయ నేపథ్యం, వారు చూసిన సంఘటనలు ఆధారం కావచ్చు.

*