ఎంతకాలం పరిగెడతావ్ ?

unnamed

 

ఒక  మాట:

chuckChuck Palahniuk 1996 లో రాసిన పుస్తకం Fight Club నుంచి ప్రేరణ పొంది David Fincher అదే పేరు తో 1999 లొ సినిమా తీసాడు. ఇందులో పాత్రలు Tyler Durden (Brad Pitt), Narrator (Edward Norton), జీవితం మీద అసహ్యం తో ఉన్నవారి కోసంఒక recreational fight club ని మొదలుపెడతారు. క్లబ్ వారితో కలసి Project Mayhemపేరుతో క్రెడిట్ కార్డ్ కంపెనీస్ మీద అట్టాక్  ప్లాన్ చేస్తారు. విజయం సాధించినతరువాత Tyler Durden ఎవరికీ  కనపడడు.    

 

‘Fight Club’ లో

తగిలిన నా దెబ్బలు మానిపోతున్నాయి. Project Mayhem పూర్తయ్యింది.

Tyler Durden ఏమయ్యాడు? ఎక్కడున్నాడు?

_____________________________________________________________________________________________

నీ కుట్ర  బయటపడింది.   అందకుండా  పారిపో , పరిగెత్తు !

వాళ్ళకి నచ్చేది నువ్వు  చెప్పకపోతే కోపం. వాళ్ళకి తెలియనిది నీకు తెలిస్తే ఈర్ష్య. నువ్వు అనుకునేదే నిజం అంటే ‘ ఎవరికి , ఎప్పుడు, ఎలా’ అని ప్రశ్నలు. పోనీ నీ గదిలో నువ్వు ఉండిపోదామంటే సన్నని గోడ లోంచి వినపడే శబ్దాలు, అశాంతి. అలా కాదు,  వదిలేసి ఎక్కడికైనా వెళ్ళిపోదాం అనుకుంటే , వెనకే వస్తారు, అరిస్తే నవ్వుతారు , ఏడిస్తే దగ్గరకు చేరతారు. నువ్వు వారిని నమ్మే సమయానికి – నీ నిగ్గు తేల్చి సమాజానికి నువ్వో కలుపు మొక్కవని నిరూపించే బాధ్యతని కిరోసిన్ లాగా వాళ్ళ మీద పోసుకుని నిన్ను అగ్గిపుల్ల అడుగుతారు. లేదు, ఇవ్వనంటే వారి కడుపుమంట తో నీకు నిప్పు పెడతారు. ప్రాణమున్న నీ ఉద్దేశాలు ఒక్కొకటీ కాలిపోతుంటే చలి కాచుకుంటారు. సిగరెట్ వెలిగించుకుంటారు. నీ తప్పులకి శిక్షలు గరుడపురాణం లో వెతికి చంకలు గుద్దుకుంటారు.

” మా మీద వాలండి ,  వీలుగా  ఉంటుంది ” , ” ఇలా రండి కూర్చోండి ఎందుకు నిలబడతారు ” అని ఆశలు పెడతారు. నువ్వు వంగక పోతే, నిద్ర పోనివ్వరు, నీ స్థిమితం చెడగొట్టే సంఘాలు ఏర్పరచి సమావేశాలు జరుపుతారు. నీకు వచ్చే ప్రశ్నల్లో, కలల్లో జొరబడి వాటి నిజమైన జవాబులు ఈదలేని మహాసముద్రం లో విసిరేస్తారు. వారికి తట్టే జవాబులని నీ మొహాన విసిరేస్తారు. పొంతన కుదరక నువ్వు తికమక పడుతుంటే ఆశ్చర్యపడతారు.  తప్పులని నువ్వు కేకలు పెడితే జాలిపడతారు. పిచ్చాసుపత్రిలో చేర్పిస్తారు.

నీ పక్క నించునేది ఎవరు ?  నువ్వు చెప్పేది వినేదెవరు ?  నువ్వు చచ్చేప్పుడు తప్ప     వినే తీరిక   ఉండదు జనానికి. స్వార్థాసక్తి. పోయేవాడు ఏం చెప్పి పోతాడో అనే జిహ్వచాపల్యం. నిన్ను వదలరు. రోజూ వచ్చి, దగ్గర కూర్చుని కాలక్షేపం చేస్తారు.    నీ కథ ని అందరికీ చెప్పి , వచ్చే సానుభూతి  నీకు చేరకుండా మధ్యలో దారిదోపిడీ చేసి గాని సుఖించరు. నువ్వు మాట్లాడే మాటలకి ఇచ్చే విలువని నువ్వు బతికున్నావా చస్తూ ఉన్నావా అన్న స్థితి మీద తూచుతుంటారు. అదే వారు నీకిచ్చే గౌరవం. నీ దౌర్భాగ్యం .

అన్నిటినీ తప్పించుకుంటూ, అధిగమించి , పునర్జన్మించావ్. సమాధానాల కవచకుండలాలతో. ఇప్పుడు వీళ్ళంటే భయం లేదు. అసహ్యాన్ని కప్పిపుచ్చి అవసరాన్ని పైకి తేల్చావ్. వాస్తవాల ప్రచారానికి, లోకాల కల్యాణానికి. ఒక్కో ఏరూ దాటాక అబద్ధపు తెప్పలని నిర్భయంగా తగలేశావ్. గానుగెడ్లను విడిపించావ్. కొరడాలతో కొడుతున్నవారిమీదకే వాటి కసి తీరా వదిలేశావ్. హేతువు కోసం కరిగిపొమ్మన్నావ్ , చచ్చిపొమ్మన్నావ్, సమాధులు కట్టించావ్, స్తవాలు పాడించావ్. చచ్చిపోయిన దేవుడి స్థానం నీదేనని అనుకున్నావ్.  ఒక్కసారే విశ్వమంతటికీ మరమ్మత్తు ప్రారంభించావ్. యజ్ఞాన్ని సంకల్పించావ్. నీ జ్ఞానపు ముడులు  విప్పి  చండ మారుతాలు తెచ్చి ఖాండవాగ్ని సృష్టించావ్. నక్కి ఉన్న చుంచెలుకల కలుగులలో కాగడాలు విసిరేశావ్.

ఎలుకలు చచ్చి బయట పడ్డాయ్. ప్లేగు రేగింది. వాన కురిసింది.  నిజాన్ని వెంటాడే మత్తు జనానికి దిగిపోయింది. పాత సుఖం వైపు మనసు మళ్ళిపోయింది. ఆత్మత్యాగాలకి అర్థాలు వెతుకుతున్నారు. వారు కూర్చున్న కొమ్మలని నరికింది నువ్వేనని తేల్చుకున్నారు.  వారి అరచేతులని బలవంతం గా తలలమీద పెట్టబోయావని  నిర్ధారించారు. మరపు నీచుల నైజం. అవిగో, నిజాల్లాగా పొర్లుతున్న అబద్ధాలు విను. నీకు నిప్పు పెట్టే కొరువులు బయల్దేరాయి చూడు. చూసి సగం చచ్చిపో.

గుర్తు చెయ్యటానికి ప్రయత్నించకు, బోధపడదు వాళ్ళకి. చెయ్యని తప్పు ఒప్పుకుని ఆగకు , నీ మోకాళ్ళు విరిచి ఈడ్చుకుపోతారు. వాళ్ళకి అర్థం కావాలంటే నువ్వు మళ్ళీ అజ్ఞానిగా జన్మ ఎత్తాలి. ఉన్న జ్ఞానం తో బతికిపోగలవు .   దొరక్కుండా పారిపో.  నీ కొత్త నిజాల  గుడిసెలు ఎవరికి   ?  ఒక్కొక్కరికీ ఒక్కొక్క అబద్ధపు మేడ ఉంది.

వారి సుఖం కోరిన నిర్దాక్షిణ్యం నీది. నిన్ను కూడా చంపుకునే హంతకుడివి నువ్వు . ఉన్మాదివి, ఎవరూ లేని ఏకాకివి.

ఎంతకాలం పరిగెడతావ్ ?   అలిసిపో. ఆగిపో. దొరికిపో. చచ్చిపో.  ఆ నీచత్వం లో  కలిసిపో . వర్ధిల్లు.

*

అక్కడి గార్బేజ్…ఇక్కడి హెరిటేజ్!!

 

 

ఏ దేశమేగినా పొగడరా నీ తల్లి భూమి భారతిని అని రాయప్రోలు ఏ కోశాన అన్నారో తెలీదు. దాన్ని అనేక రకాలుగా అన్వయించుకునే వారు పెరిగిపోయారు. భూమి భారతిని పొగడడం అంటే వెనుకబాటు తనాన్ని పొగుడుకోవడం కాదు. నలుగురి దృష్టిలో నవ్వుబాటు కావడం కాదు. సంస్కృతి సంప్రదాయాల పేరుతో పాత చెత్తనంతా నెత్తికెత్తుకుని ఊరేగడం కాదు. కానీ కొందరు సంస్కృతీ రక్షకులు విదేశీ గడ్డమీద చేస్తున్నదేమిటి? మా మూలాలు ఇవి మా సంస్కృతి ఇది అంటూ హేయమైన ఆచారాలను ప్రదర్శిస్తూ భారత్‌ అంటే ఇంకా ఈ స్థితిలో ఉన్న దేశమా అని అంతా నోరెళ్లబెట్టేట్టు చేస్తున్నారు.

విదేశీ గడ్డమీద అడుగుపెట్టి అక్కడ జీవనం సాగిస్తున్నవారికి సొంత మూలాలకు సంబంధించిందేదో ప్రదర్శించుకోవాలని ఉంటుంది. తప్పులేదు. కానీ ఈ మూలాల కోసం కాలంలో వెనక్కు ప్రయాణించనక్కర్లేదు. సొంత గడ్డమీద కూడా ఎబ్బెట్టు అనిపించే విషయాలను పరాయి గడ్డమీద పదిమంది ముందు చాటాల్సిన అవసరం లేదు. మిగిలిన అన్ని అంశాల్లాగే సంస్కృతి సంప్రదాయాలు కూడా ప్రవహిస్తూ ఉంటాయి. పురోగామి అంశాలు, ఆహ్వానించ దగిన అంశాలు కూడా మన సంస్కృతిలో ఉంటాయి. అవి వదిలేసి ఆధిపత్య చిహ్నాలైన వాటిని అవమాన కరమైన వాటిని ప్రదర్శనకు పెట్టి ఇవి మా మూలాలు అంటే ఎలా అర్థం చేసుకోవాలి? ఎంతో చదువుకుని దేశాలు దాటిన వారి ప్రపంచం విస్తృతమవుతుందని ఎవరైనా ఆశిస్తాం. కానీ ఇక్కడ సాగుతున్న కొన్ని పరిణామాలు చూస్తే ఎవరికైనా ఆశ్చర్యమనిపిస్తుంది.నమ్మాలని పించదు. ఇది అవసరమా, ఇది దేశభక్తా, తెలుగు సంస్కృతి అంటే ఇదేనా! అని చర్చించుకోవాల్సిన అంశాలు ఉన్నాయి. ఆ రకమైన చర్చ కోసమే అమెరికాలో ఉద్యోగం చేస్తున్న ఒక ఎన్‌ఆర్‌ఐగా ఒక అనుభవాన్ని ఇక్కడ నలుగురితో పంచుకోవాలనుకుంటున్నాను.

నీకు మైల ఉందా! ఈ హఠాత్ ప్రశ్నకు ఒక్క క్షణం ఊపిరాడలేదు. ఇది సాధారణమే అనుకునే వారు కూడా ఉండొచ్చు. అది వారి సంస్కృతి. అమెరికాలో ఇక్కడ …సంస్థలో సాంకేతికంగా ఉన్నతమనుకునే …ఇండస్ర్టీలో ఈ మాట వినిపించడం నాకైతే షాక్‌. ఆరోజు గురువారం. ఆ మాట వినిపించిన వైపు చూశాను. ఫ్యాంటు, చొక్కా, చెవులకు జుంకీలు , మెళ్లో నల్లపూసలు , నుదుటన ఇంత పెద్దబొట్టు, దాన్ని డామినేట్‌ చేస్తూ దేవుని కుంకుమ, వెరసి ఆవిడ పేరు ఎక్స్‌ అనుకుందాం. పేరు బయటపెట్టి ఆమెను ఇబ్బంది పెట్టడం ఇష్టం లేదు. సాయి భక్తురాలు. భక్తి ఉండడం లేకపోవడం వారి వైయక్తిక విషయం. ఆవిడ మైల భక్తి కూడా ఉండవచ్చును. కానీ ఆఫీసులో పదిమంది ముందు అంత గట్టిగా నీకు మైల ఉందా అని వినిపిస్తే ఏమనుకోవాలి?

ఆగండి.

కథ ఇంతటితో అయిపోలేదు. ఈ ప్రశ్న ఎందుకొచ్చిందో మూలాల్లోకి పోవాలి. ఆవిడకు కూడా ఒక లాజిక్‌ ఉంటుంది కదా! మనం ఎవరినైనా విమర్శిస్తున్నామంటే వారి కోణాన్ని కూడా అర్థం చేసుకుని విమర్శించడమే న్యాయం. ఆవిడ ప్రతి గురువారం సాయి ప్రసాదం తీసుకువస్తారు. ఆ ప్రసాదం పంచేముందు అడిగే ప్రశ్న ఇది. ఎవరు పంచమన్నారు? మేము అడిగామా! అంత గట్టిగా అడుగుతుంటూ పదిమంది ముందు అందులోనూ మగవారి ముందు ఎంత ఎబ్బెట్టు అని ఆలోచించే జ్ఞానాన్ని ఆ మైల తాలూకు భక్తీ భయం మింగేశాయి. ఇక్కడ తెలుగువారు ఎక్కువే. అందులోనూ మగవాళ్లున్నారు. ఈ బాధితురాలిని నేనొక్కదాన్నే కాదు. ఇంకా భారతీయులు ఉన్నారు. ఈ మైల గొడవ పశ్చిమదేశాల వారికి లేదు కాబట్టి బతికిపోయారు. చివరకు గురువారం వచ్చిందంటే ఆమె రాకను చూసి తప్పించుకోవాల్సి వచ్చేది. నాలాంటి వారంతా అదే పనిచేయడం కూడా గమనించాను. ఇది ఒక తరహా.

ఇపుడు ఇంకో “వై” దగ్గరికి వద్దాం. ఈ “వై”లు ఒకరు కాదు. అనేక “వై”లున్నారు. వీరు పెద్ద ముత్తయిదువ బాపతు. వీరు ఏకంగా ఆఫీసులోనే వ్రతాలు నోములు జరిపించేవారు. పశ్చిమదేశాల వారు ఇది భక్తికి సంబంధించిన వ్యవహారం కాబట్టి గౌరవం తోనో సహనం తోనే ఉండిపోయేవారు. కన్నడిగులైతే మంగళవారాలు, తెలుగువారైతే శ్రావణ శుక్రవారాలు. ఈ వైలలో ఒక పెద్ద ముత్తయిదువ అయితే ఏకంగా ఇంకో అడుగు ముందుకేసింది. ఆఫీసులో ఇద్దరు మగవాళ్ల భార్యలు గర్భం దాలిస్తే ఆమె పట్టుబట్టి వారిద్దరికీ బేబీ షవర్‌ జరిపించింది. వాళ్లిద్దరూ ఎంత సిగ్గుపడిపోయారో తల్చుకుంటే సిగ్గేస్తుంది.

ఇంకొందరు. భర్తతో పాటు వస్తారు. గ్రీన్‌ కార్డ్ వచ్చాక క్యుఏ ట్రైనింగ్‌ క్లాసులకు వెళ్లి ఎలాగోలా ఉద్యోగంలో చేరిపోతారు. తప్పేమీ లేదు. ఆర్థిక స్వతంత్రం ఆహ్వానించదగిన అంశం. కానీ ఏం చేస్తారు? తెలుగు సీరియల్స్ లో లాగా అమ్మలక్కల కబుర్లు మొదలెడతారు. అన్నీ మానవసంబంధాల చర్చలే. తామెంత పతివ్రతలు-అవతలివారు ఎంత అపతివ్రతలు. అంతా తెలుగులోనే. ఆఫీసుకు సంబంధించిన అంశాలు కూడా తెలుగులోనే మాట్లాడతారు. పరాయివాళ్లు కలిసిన గ్రూప్‌లో మాట్లాడుతున్నపుడు అందరికీ
అర్థమయ్యే భాష మాట్లాడాలనే కనీస ఇంగితం ఉండదు. చివరకు మీటింగ్స్లో కూడా తెలుగులోనే మాట్లాడతారు. ఇంగ్లిష్‌ మాట్లాడడం గొప్ప అని కాదు. కాకపోతే ఇక్కడ ఉద్యోగ అవసరం కదా! ఎక్కువ మంది తెలుగువాళ్లు ఉండడం వల్ల జరిగిపోతుందనే నమ్మకం. ఒక టీమ్‌ లీడర్‌ ఇంగ్లిష్‌లో మాట్లాడమని రిక్వెస్ట్‌ చేస్తే నువ్వొక్కడివి తెలుగు నేర్చుకుంటే ఖతం అనేశారు. అతను నాదగ్గరకి వచ్చి తెలుగు ఎలా నేర్చుకోవాలి అని అడిగాడు. ఎందుకు నీకు అంత కస్టం అంటే ఐ నీడ్‌ దిష్‌ జాబ్ అనేశాడు. అలాఉంటుంది కథ.

ఈ వైలలోనే ఇంకో పులిహార బ్యాచ్‌ఉంది. బాస్‌లను మేనేజ్‌ చేయొచ్చు ఇంప్రెస్‌ చేయొచ్చు అని నమ్ముతారు.తప్పుగా అనుకోకండి. ఒకావిడ ప్రతి శుక్రవారం మేనేజర్‌కు పులిహోర పట్టుకువస్తుంది. పైగా క్రిస్‌కి నా పులిహోర చాలా ఇష్టం అంటుంది. క్రిస్‌ వెజిటేరియన్‌ కాబట్టి ఇంకో ఆవిడ ఎగ్‌ లెస్‌ కేక్‌ చేసి తరచుగా పట్టుకు వస్తుంది.

ఈ ఆచారాలు అనే కాదు. ఈ పెద్ద ముత్తయిదువల్లో మరి కొందరున్నారు. వారు సలహాలివ్వడం తమ హక్కు- పాటించడం ఎదుటివారి బాధ్యత అని స్థిరంగా నమ్ముతారు. వయోధిక్యాన్ని ఆధిక్యంగా మార్చుకుని ప్రదర్శిస్తుంటారు. ఫలానా అమ్మాయి, బ్యాడ్‌-మగవాళ్లతో మాట్లాడుతుంది-ఆమెతో మాట్లాడొద్దు అని డిక్రీ జారీచేస్తూ ఉంటారు. వినకపోయామో మనపేరు కూడా ఆ అమ్మాయి పేరు పక్కన జత చేస్తారు.

ఒక అమ్మాయి గురించి చెప్పాలి ఇక్కడ. తను కష్టజీవి. మంచుకురిసే కాలంలో కూడా ఎన్నడూ లేట్‌కాకుండా గడియారానికే టైం నేర్పుతున్నట్టు ఠంచన్‌గా వస్తుంది. కొత్తగా జాయిన్‌ అయిన వారికి చాలా చాలా సాయం చేస్తుంది. డిగ్రీ అవగానే పెళ్లి చేశారు. భర్త శాడిస్ట్‌. కూతురు పుట్టాక విడాకులు తీసుకుంది. వేరే దేశస్తున్ని పెళ్లి చేసుకుని ఇక్కడ స్థిరపడింది. అదో పెద్దనేరం మనవాళ్ల దృష్ఠిలో. పెద్ద ముత్తయిదువులకు ఆమె ఒక విలన్‌. పాత సినిమాల్లో చేతిలో సిగరెట్‌ పట్టుకుని డాన్స్‌ వేస్తూ మామయ్య వస్తే పనిమనిషి అని పిలిచే కోడలు ఉంటుందే అలాంటి దర్శకుల ప్రతిభ వీళ్లలో పుష్కలంగా ఉందన్నమాట. ఆమెను బిచ్‌ అని బ్యాడ్‌ అని ఏమేమో అనేవారు. అందరూ నీవెనుక ఇలా అనుకుంటారు ఎందుకు అయినా అందరితో మంచిగా ఉంటావు. సాయం చేస్తావు అంటే ఆ అమ్మాయి చెప్పిన మాట ఇది. వాళ్లు నన్ను అలాగే పిలుచుకుంటారు అని తెలుసు. ఇలా ఉండడం వల్ల పాజిటివ్‌ స్పిరిట్ తో గతకాలపు గాయాలను మర్చిపోగలుగుతున్నా. ఇలా ఉండడమే బిచ్‌ అయితే “ఎస్‌ ఐయామ్‌ బిచ్‌ ” అని చెప్పింది. “ఐ యామ్‌ ప్రౌడ్‌ టు బి ఎ బిచ్‌ రాదర్‌దాన్‌ ఏ పతివ్రత” అని కూడా చెప్పింది. సూటిగా స్పష్టంగా. ప్రాజెక్ట్‌ అయ్యాక మిగిలిన వాళ్లు అలా ఇలా వెతుక్కుంటూ ఉంటే ఆ అమ్మాయికి మూడు ఆఫర్లు వచ్చాయి.

అందరికీ ఇలాంటి అనుభవాలు లేకపోవచ్చు. కానీ ఈ అనుభవాలు అయితే నా జీవితంలో నేను కళ్లెదురుగా చూసినవి. ఇది ఏ సంస్కృతి. ఏ సంస్కృతిని మనం అక్కడినుంచి మోసుకొచ్చాం. ఇది మనకు గౌరవం తెచ్చే సంప్రదాయాలా!వాస్తవానికి ఇవాళ భారత్‌లో కూడా ఆఫీసుల్లోకి ప్రసాదం తెచ్చి అందరి ముందూ నీకు మైల ఉందాఅని అడుగుతూ పోయే ఆడవాళ్లని ఊహించుకోలేమని అక్కడివారు చెపుతున్నారు. అక్కడ మహిళలు ఎంతో కొంత పురోగతి సాధిస్తూ ఉంటే ఎంతో ఎదిగామని రెక్కలు కట్టుకుని వచ్చి ఇక్కడ వాలిన వాళ్లు సంస్కృతి పేరుతో ఆచారాల పేరుతో అక్కడ గార్బేజ్‌లో వదిలేసిన సంస్కృతిని జాగ్రత్తగా ఏరుకుని మూటగట్టుకుని ఇక్కడకు తెచ్చి అందరిముందూ ప్రదర్శనకు పెట్టడాన్ని ఎలా అర్థం చేసుకోవాలి?

*

ఎప్పుడూ వెంట వచ్చే వసంతం!

 

-కుప్పిలి పద్మ

~

 ప్రేమ!!! .

పసివసంతాల సంభ్రమాశ్చర్యాల యింద్రజాలం. గిలిగింతల మాఘపరాగ లేతచల్లదనం. పరవశించే ఫాల్గుణపూలతేనే గాలుల తీయదనం. రంగురంగుల పత్ర సోయగాల శిశిరపు వెచ్చదనం. తడి మెరిసే శ్రావణపు తేమదనం. ఆరు రుతువుల విలక్షణ  దివ్యానుభూతిరాగంతో  మదిచెవిలో మనసుచిలుకలు పాడే మృదుగీతం.

మన అనుభవంలోకి వచ్చే తొలి ప్రేమానుభవం కళ్ళు వీప్పి విప్పగానే అమ్మ స్పర్శా లాలిత్యం.  పలరింపుగా  చిటికలేస్తూ ప్రేమ స్వరాన్ని నాన్న పరిచయం చెయ్యటం తొలి సురాగానుభావం. బంధువులు ఆప్తులు తోడబుట్టిన వాళ్ళు యిరుగుపొరుగు వొక్కరేమిటి అంతా ముద్దల జాతరే … వావ్…  పసితనపు  యీ  జీవితోత్సాహపు  అసలు పేరు  ప్రేమ అని తెలుసుతుంది మనకి మెల్లమెల్లగా. మనం పెంచబడే కొద్దీ ప్రేమ వొక వ్యక్తిగత రాజకీయాల సాలెగూడని అనుభవపూర్వకంగా తెలుసుతుం టుంది. నిదానంగా మనలో దొంతరుదొంతర్లుగా యేర్పడే ఖాళీలు మనకి వొక essential being  తప్పనిసరి అన్వేషణైనప్పుడు మరి కొన్ని కొత్త  ప్రేమల వైపు మనసు మరలుతుంది.

ఆకుపచ్చని  ప్రేమలకి  ప్రాచీనారణ్యంలోకి వనవాసిలమై  – సుశాంతి ప్రేమలకి యుద్ధాలని దాటుకుంటూ నటాషాలమై – నిలకడైన ప్రేమలకై  సందిగ్ధ తెరలని  తొలగించుకొంటూ స్కార్లెటై  –   నవసమ జీవనపు ఆకాంక్షలకి నారుపోయాలని  అంటరాని వసంతాలని ప్రశ్నించే రూతులమై – ప్రేమంటే  గులకరాళ్ళ శబ్ధపు రియాలిటి షో కాదని  మంత్రనగరి సరిహద్దులలో నువ్వూ నేను మనమయ్యే వో సరికొత్త ప్రేమహృదయాన్ని రచిద్దాం.

యేక కాలంలో వంద తలలు నరికే మగధీరుని భుజశక్తీ – బాహ్యాకారపు బాహుబలుల బాహువులెంత  విశాలమైన వారి మనసులపై వాలడానికైనా  హత్తుకోడానికి కురచవే అని నిట్టూర్చ క్కరలేదు. ‘సడేలేని అలజడి యేదో యెలా మదికి వినిపిస్తుందో’ అని యవ్వనాశ్చర్యాలకి లోనవుతూ కంచెలని తొలగిద్దామనే  మనసులమై  నిర్భయంగా నిజాయితీగా చెంపల్లో సిగ్గుల ముద్దులవుదామా!

ప్రేమ జైంట్ వీలే కాని దానిని తిప్పే చేతికి  యెక్కడ ఆపాలో యెక్కడ జోరుగా తిప్పాలో యెక్కడ జర్క్ యివ్వాలొ సరిగ్గా  తెలిస్తే వొళ్ళంతా నిలువెల్లా తుళ్ళింతే. లంగరేసే ప్రేమ కథల ముచ్చట యెప్పుడు వొక్క లానే వుంటుంది. వాటిని వదిలేసి  ప్రయాణించే ప్రేమ కథలని కాసేపైన నెమరేసుకుందాం. మనకి తెలీయకుండానే మనందరం ప్రేమని వ్యక్త పరిచే సాధనం వొక్కటే.   ప్రేమని వ్యక్త పర్చటానికి  క్రియేటివిటి కావాలి. యెప్పటికప్పుడు కొత్త ఆనవాలు కావాలి. మనం హృదయం ప్రేమని  వ్యక్త పరిచడానికి సంసిద్ధ మైనప్పుడు మన కోసం వేచి వుండే వొక హృదయముంటే మన మనోసరోవరం చుట్టూ జీవన పువ్వులు సీతాకోక చిలుకలై తేనె జల్లులని కురిపించవా… మన యెద దోనెలో ముద్దులు చినుకులై కురిసి దేహాలు యేక ముత్యమై మృదువు గా  వికసించవా…

valentine

వొక్క ప్రేమ అనేక ముఖాలు. ప్రేమకి కులం వుంటుంది.  మతముంటుంది. వర్గముటుంది. ప్ర్రాంత ముంటుంది. సరిహద్దులుంటాయి. ఆయా ప్రాతిపదికలపై ప్రేమరంగులరాట్నం తిరుగుతుంటుంది. యివేవి లేని లేకుండా  స్వయంప్రకాశియై మెరిసే  ప్రేమ సుదూర స్వప్నం. రెప్పపాటులో వాస్తవమైతే మనశ్శరీరాలు కావా రంగురంగుమైదానావనాలు.

ప్రేమ !!!

వొక అనుమానాల చీమల పుట్ట. అవసరాల ఆయుధాగారం. ఆపదల వడగళ్ళ వాన. అసూయభరిత  పడగనీడ. పొగ చూరిన విలువల భాంఢాగారం. పగిలిన నత్తగుల్లజ్ఞాపకాల రణరణ ధ్వని. మనసులని కలుషితం చేసే విధ్వంస ఫీలింగ్.

ప్రేమ సాగరమై మనల్ని కమ్ముకోవటం వొక నిస్సహాయ అపచారం. ప్రేమ సుడిగుండంలో చిక్కుకోవటం పొరపాటు అంచన. ప్రేమ సునామియై మింగైటం కోరుకొని  భీభత్సం.  ప్రేమ వాయుగుండమై చుట్టుకోవటమొక అనుకోని వుపద్రవం. యీ ఆత్యాధునిక కాలంలో ప్రేమ యాసిడ్ మచ్చలై , పరువు వేటలై,  కత్తుల కాట్లై చెలరేగుతోంది. యీ భయకంపిత ప్రేమల కోసం యెవరు మనసులని తెరచి పెట్టుకోరు. కాని పెద్దపులి నోట్లో మనసు పెట్టి వేటాడే లేడి పిలైయింది ప్రేమ.  అలాంటి ప్రేమలని పెంచే అమానుషపు విషయాల రెక్కలని మనం అడ్డుకోవాలి యీ  ప్రపంచాన్ని ప్రేమించేవారిగా.

ప్రేమ కోసం కత్తి పట్టిన వీరులు – ప్రేమ కోసం సప్తసముద్రాలు దాటే  సాహసవంతులు పోయి   ప్రేమించమని మారణాయుధాలు చేత బూనినవారు సంచరించే యీ కాలంలో ‘నీ సుఖమే కోరుకుంటా’ అని పాడుకునే హృదయాలని ఆశించటం అత్యాశే మాత్రమే బరువు కూడ. ఆల్ యీస్ వెల్ – ఆల్ హాప్పీస్ అయితే మనసు సంతోషపడుతుంది. నిజానికి  ప్రేమేమి మరీ అరుదు కాదు. యెడారి వోయాసిసేం కాదు. Come… fall in Love’  అంటూ రైలు బండినెక్కించే ప్రేమ మనలని పచ్చగా మైమరిపిస్తూనే వుంది. ‘జొన్నకంకి ధూళి పడినట్టు కన్నులలో దూరి తొలచితివే’ అని మన హృదయం తీయని డిస్ట్రబెన్స్ ని హమ్ చేస్తూనే వుంటుంది.  కళ్ళతో మాటడే  ఓకే బంగారం  చాల యెక్కువ కదా  యీ గజిబిజి  మెట్రోలో.  అసలంటూ హృదయంలో ప్రేమనే జీవధార వుంటే జీవితపు అన్ని ప్రయాణాలని  అన్ని వేళలా పచ్చగా విరపూయిచగలం.

Diamonds are forever – అది వొక మిత్ అని తెలుసు. కాని ప్రతిదాన్ని జల్లెడేసి తూర్ర్పార పడితే అందమైన  భ్రమలు కూడ మిగలవ్. ప్రేమగా మరింత ప్రేమగా మనం మనసులని ప్రేమగా ముద్దు పెట్టుకుందాం.  Love forever మాత్రం మిత్ కాదని  మరలమరల హత్తుకోవలసిన అందించాల్సిన అందుకోవలసిన  ప్రాణవాయువని మనకి మనమే యెప్పటికప్పుడు  మన మనసులని తట్టి చెప్పు కోవాలి…

ప్రేమిద్దాం  రహస్యంగా నంగినంగి కాదు. వెలుగంత ప్రకాశవంతంగా…

*

పరిచిత అపరిచితుడు

 

-పూడూరి రాజిరెడ్డి

~

rajireddi-1అతడిని నేను మొదటిసారి ఎప్పుడు చూశానో గుర్తులేదు. నిజానికి, ‘మొదటిసారి’ అని ఎప్పుడు గుర్తు చేసుకుంటాం? ఆ పరిచయం ఎంతో కొంత సాన్నిహిత్యానికి దారి తీసినప్పుడు కదా! కానీ ఇక్కడ సాన్నిహిత్యం అటుండనీ, కనీస పరిచయం కూడా లేదు. కాకపోతే ఎక్కువసార్లు తటస్థపడుతున్న వ్యక్తిగా ఇతడు నాకు ‘పరిచయం’. అంతకుముందు కూడా కొన్నిసార్లు చూసేవుంటాను! కానీ, ఏదో ఒక ‘చూపు’లో- ‘ఈయన్ని నేను ఇంతకుముందు కూడా చూశాను,’ అని గుర్తు తెచ్చుకున్నాను.

అతడు మా కాలనీకి ఎగువవైపు ఉంటాడనుకుంటాను. నేను పొద్దున పిల్లల్ని స్కూలుకు తోలుకు పోయే సమయంలో, అతడు మెయిన్ రోడ్డు ఎక్కడానికి అడ్డరోడ్డు దాటాలి గనక, అలా దాటుతూ ఎదురుపడతాడు. ఒక్కోసారి నేను పిల్లల్ని స్కూల్లో ‘పడగొట్టాక’- తిరిగి మూలమలుపు తిరుగుతున్నప్పుడు, అతడు ఏటవాలు రోడ్డు మీద నడుస్తూ వస్తూంటాడు. ఆ జారుడు మీద కాలిని అదిమిపట్టడానికి వీలుగా మోకాళ్లను కాస్త వంచి నడవడం నాకు తెలుస్తూవుంటుంది.

అతడిది అటూయిటూగా నా వయసే అని సులభంగానే అర్థమవుతుంది. టక్ చేసుకుంటాడు. షూ వేసుకుంటాడు. ఇవి రెండూ నేను కొన్ని ‘సిద్ధాంత కారణాల’ వల్ల వదులుకున్నవి! సిద్ధాంత కారణాలు అంటే, మరీ గంభీరమైనవేం కావు. టక్ చేసుకున్నప్పుడు నా పృష్టభాగపు ఉనికి వెనకవారికి ఇట్టే తెలిసిపోతుందని నాకు తెలియడం; కాలికి రిలీఫ్ ఇవ్వగలిగే పనిలో ఉన్నవాడికి- షూ అనవసరపు ఉక్క అని అర్థం కావడం!

అతడు కూడా నాలాగే వేగంగా నడుస్తాడు. దాదాపుగా ప్రతిసారీ చేతిలో లంచ్ బ్యాగ్ ఉంటుంది కాబట్టి, అతడు ఏ ఆఫీసుకో వెళ్తూవుండాలి!

ఈ ఆఫీసు ఆహార్యంలో కాకుండా, కొంత ‘స్పోర్టీ’గా అతడు ఒకట్రెండు సార్లు కాలనీలో ఉన్న చిన్న పార్కులో దాదాపుగా చీకటి పడే వేళలో ఎదురుపడ్డాడు. అప్పుడు అర్థమయ్యిందేమిటంటే, అతడికి పెళ్లయిందీ, నాలాగే ఇద్దరు పిల్లలూ! కాకపోతే ఇద్దరూ అబ్బాయిలే కాదు; ఒక పాప, ఒక బాబు.

ఇంకొకసారి, వచ్చిన అతిథిని కావొచ్చు, సాగనంపుతూ ఎదురయ్యాడు.

ఇన్నిసార్లలో ఏ కొన్నిసార్లయినా అతడి గమనింపులోకి నేను వెళ్లివుంటానని నాకు అర్థమవుతోంది. అయినా మేము పరిచయం కాబడటానికి ఇంకా ఏదో కావాలి. లేదా, మాకు పూర్తి భిన్నమైన స్థలంలో ఎదురుపడటమో జరగాలి. విచిత్రంగా, రెండు తెల్ల బొచ్చు కుక్కపిల్లలతో ఇలానే తరచూ ఎదురుపడే తెల్లజుట్టు పెద్దమనిషితో కూడా నాకు ఏ పరిచయమూ లేదు; కానీ కొన్నిసార్ల తటస్థత తర్వాత ఒక పలకరింపు నవ్వు అలవాటైపోయింది. బహుశా, పిల్లలు నా పక్కనుండటం ‘తాత’ వయసు ఆయనకు ఆ నవ్వును సలభతరం చేసివుంటుంది.  కానీ ‘అతడు’ దీనికి భిన్నం. అతడు నా ఈడువాడు. ఇంకా చెప్పాలంటే, దేనికోసమో తెలియని పోటీదారు!

కొంతకాలానికి అతడు నడకలో ఎదురుపడటం పోయి, బండిమీద కనబడటం మొదలైంది. బ్లాక్ రోడియో తీసుకున్నట్టు అర్థమైంది. దుమ్ము నుంచి రక్షణగా కావొచ్చు, నల్ల కళ్లద్దాలు పెట్టుకోవడం ప్రారంభించాడు. ఇక్కడొక అపనమ్మకంగా కనబడే విషయం చెప్పాలి. ‘చూశావా, నేను బండి తీసుకున్నాను,’ అని చెప్పీ చెప్పనిదేదో, ఇంకా చెప్పాలంటే, నాపైన అతణ్ని ఒక పెమైట్టు మీద ఉంచుతున్న చిరుస్పర్థ లాంటిదేదో అతడు అనుభవిస్తున్నాడేమోనని నేను నిజంగా ఫీలయ్యాను. అదే అతణ్ని ‘పరిచిత’ అపరిచితుడిగా నిలబెడుతోంది.

దీనికి ముగింపేమిటో నాకు తెలియదు. ఈ పరిచయం ఎటో దారి తీయాలని నేనేమీ ప్రత్యేకంగా కోరుకోవడం లేదు. కానీ ఎటు దారితీస్తుందో చూడాలన్న కుతూహలం మాత్రం ఉంది.

* * *

నిజానికి మొదలుపెట్టిన అంశం పైనే ముగిసిపోయింది. కానీ ఇది ఊరికే అపరిచిత్వం భావనకు కొంచెం కొనసాగింపు. అది ఇంకా ఎన్ని రకాలుగా ఉండగలదు! మా ఎదురుగా ఉండే ఇంటిని కూల్చి, అపార్ట్‌మెంట్ కట్టారు. ముందుగా కనబడే వాచ్‌మన్ తప్ప, లోపల ఎవరుంటారో నాకు తెలియదు.

అంతెందుకు, మా ఆఫీసులో పనిచేసేవాళ్లు అనేది చాలా పెద్ద మాట, మా ఫ్లోర్లోనే ఉత్తరం వైపు పని చేసేవాళ్లలో చాలామంది నాకు తెలియదు. అంటే, ముఖాలుగా తెలుస్తారు; కానీ, ఆలోచనలుగా తెలియరు.

చూడండి గమ్మత్తు! ఎక్కడో ప్రారంభమై, ఎక్కడో చదివి, ఎక్కడెక్కడో ఉద్యోగాలు మారి, తీరా ఒకే సంస్థలో ఒకే లిఫ్టు బటన్ నొక్కడమనే ఉమ్మడితనంలోకి ప్రవేశిస్తాం. అయినా అపరిచితులుగానే ఉండిపోతాం. బహుశా పండగల పరంగానో, సినిమాల పరంగానో, పుస్తకాల పరంగానో, రాజకీయాల పరంగానో, భావజాలాల పరంగానో ఏదో ఉమ్మడితనం అనుభవిస్తూనే ఉంటాం కావొచ్చు; అయినా అనుభవిస్తున్నట్టుగా తెలియకుండానే ఉండిపోతాం. అదే కదా పరిచయం కావడానికీ కాకపోవడానికీ మధ్య తేడా!

*

ఏంజేత్తదో ఎవలకెరుక..

-కందికొండ

(సినీ గేయ రచయిత)

~

IMG-20151112-WA0010

 

kandiమా అవ్వ బతుకమ్మ పండుగకు ఊరికి రమ్మని ఫోన్ జేసింది . నేనన్నా ‘మా ఇద్దరిపోరగాండ్లకు మాకు ఇంటినలుగురికాకం కలిపి రానుపోను,ఇంటికచ్చినంక పండుగ ఖర్సు కలిపి ఓ నాలుగైదు వేలయితై ఎందుకులే ’  అన్న. ‘రేపు మేం సచ్చినంక మీరు వచ్చేది రాంది మేం సూత్తమాగని  మా జీవి వున్న నాల్గు రోజులన్నవచ్చిపోరాదుండ్లి, మీ పోరగాండ్లు కండ్లల్ల మెరుత్తాండ్లు’ అన్నది. మారు మాట్లాడకుంట ఊరికిపోయినం!

బతుకమ్మ పండుగ బాగనే జరిగింది. దసరా పండుగనాడు ఓ యాటపోగు తీసుకున్నం . మా మచ్చిక లక్ష్మణ్ గౌడ్ చిచ్చా ఇద్దరు రెగ్యులర్ “వాడిక” దార్లకు ఎగ్గొట్టి వాళ్ళ బాపతి కల్లు నాకు పోషిండు. తాగి అబద్దమెందుకు ఆడాలె గని ఉన్న నాలుగు రోజులు కడుపునిండ కల్లు తాగిన. పండుగ సంబురంగనే జరిగింది . కానీ, ఒక్కటే బాధ! ఈ బాధ ఇప్పడిదికాదు ఆరేడు సంవత్సరాలనుంచైతాంది . మా ఇంట్లనుంచి బయటికెల్లంగనే కుడిచేయి రోకు పెసరు కొమ్మాలు ఇల్లు ఉంటది. నేను ఆయనను పెద్దనాయిన అని పిలుస్త. మా నాయిన కన్నా రెండు మూడు సంవత్సరాలు వయసులో పెద్దోడు. వాళ్ళు మా కులపోళ్ళో,సుట్టాలో కాదుగనీ మంచి కలుపుగోలు మనుసులు.వాళ్ళ శిన్నకొడుకు శీనుగాడు నేను సాయితగాండ్లం .

ఆయనకు ఆరేడు సంవత్సరాల కిందట పక్షవాతం (పెరాలసిస్) వచ్చి నోరు కాళ్ళు  చేతులు పడిపోయినై . ఊళ్లే ఆ పెద్దనాయిన తోటోళ్లే కాదు ఆయనకన్నా పెద్దోళ్ళు కూడా ఎవల పని వాళ్ళు చేసుకుంటాండ్లు,మంచిగనే ఉన్నరు.  పాపం పెద్దనాయిన పరిస్తితి అట్లయ్యింది .కొంచం దూరం కూడా నడువలేడు .ఆయన పనులుగుడ ఆయన శేసుకోలేడు. మూత్రం దొడ్డికి అన్నీ మంచం పక్కేనే… ఖాళీ స్థలం లో . అది కూడా ఎవలన్నఆసరుండాల్సిందే,లేకపోతే అన్నీ మంచంలనే. పాపం పెద్దవ్వ పెసరు ఈరలచ్చమ్మ భూదేవసొంటిది,మస్తు ఓపికతోని దొడ్డికి ఎత్తిపోసేది. సుట్టుపక్కల ఊడ్సేది,బట్టలల్ల మూత్రమో దొడ్డికో పోతే బట్టలన్నీ తెల్లగ పిండేది. రెండు మూడు సంవత్సరాల కిందట ఆ పెద్దవ్వ సచ్చిపోయింది. కొడుకులు కోడండ్లు మనవండ్లు మనవరాండ్లు ఉన్నరు,బాగానే అర్సుకుంటరు . కానీ, అన్నీ వుండిలేమి  కుటుంబాలే కదా..కూలికో నాలికో పోకపోతే ఇంట్లకెట్లెల్లుద్ది . వాళ్ళు పనికిపోయేటప్పుడు ఇంత అన్నం, మంచినీళ్లు పెట్టిపోతరు.

పెద్దనాయిన పాత కుమ్మరి గూనపెంక ఇంటి ముందు,చింతచెట్టుకింద ఓ పాత నులక మంచమేసుకుని వచ్చి  పోయేటోళ్లను సూసుకుంట మందలిచ్చి మాట్లాడుకుంటా రోజును ఎళ్లదీత్తడు .రోజెళ్లదీసుడేంది అట్లా ఏడు సంవత్సరాలనే ఏళ్లదీసిండు. ఒకవేళ, ఆదాట్నవానత్తె  తడవాల్సిందే,బాగా ఎండత్తే  ఎండాల్సిందే,సలిపెడితే వణుకాల్సిందే.ఇంకొకల ఆసరా లేకుండా కదలలేడు. పెద్దనాయిన పరిస్తితి సూత్తాంటే నాకు శ్రీ శ్రీ “జయభేరి” కవితల “ఎండాకాల మండినప్పుడు గబ్బిలం వలె క్రాగిపోలేదా! వానకాలం ముసిరిరాగా నిలువు నిలువున నీరు కాలేదా ! శీతాకాలం కోతపెట్టగ కొరడు కట్టి ఆకలేసి కేకలేశానే!” అనే పంక్తులు గుర్తుకచ్చి అవి పెద్దనాయిన కోసమే శ్రీ శ్రీ రాసిండా ఏంది ! అనిపిచ్చేది.

ఒకప్పుడు ఇరవై అయిదు ముప్పై సంవత్సరాల కిందట… నేను చిన్నపోరగాన్ని, టూపులైటు లాగులేసుకుని ఎగిడిశిన భూతంలెక్క ఊళ్లె  తిరిగేటోన్ని. అప్పుడు పెద్దనాయిన ఎట్లుండేటోడు పులి లెక్క ! పెసరు కొమ్మయ్య అంటే ఒక ఆట, పెసరు కొమ్మయ్య అంటే ఒక పాట,పెసరు కొమ్మయ్య అంటే ఒక కోలహలం …ఒక కోలాటం. అప్పటి రోజులు నాకింకా గుర్తున్నాయి. ఎండాకాలం,సలికాలం,ఎన్నెల ఎలుగులల్ల నాలుగుబాటల కాడ కమ్యూనిష్టు పార్టీ జెండా గద్దె ముందు రాత్రి ఏడెనిమిది గంటలకు ఊరోళ్ళంతా ఇంత తినచ్చి కూసునేది .

పెద్దనాయిన రాంగనే సందడి మొదలయ్యేది. అందరూ పక్కన పెట్టుకున్న ‘పట్నం తుమ్మ’ కోలలు తీసుకుని గుండ్రంగా నిలబడేటోల్లు ,పెద్దనాయిన కాళ్ళకు గజ్జెలు కట్టుకుని, చేతిల చిరుతలు పట్టుకుని మధ్యల నిలబడి పాట పాడుకుంటూ చిందేసేది. నాకయితే సినిమాలల్ల కైలాసంల శివుడు నాట్యం శేత్తానట్టు అనిపిచ్చేది.ఆ చిందేసే కాళ్ళు అసలే ఆగకపోయేది. చేతుల చిరుతలు రికాం లేకుండ (నాన్ స్టాప్ గా) మోగేటియి . పెద్దనాయిన పాడుతాంటే సుట్టున్నోళ్ళు కోరస్ పాడుకుంట ఎగిరేటోళ్లు . గుండ్రగ నిలబడి కోలాటమెసేటోళ్ళల్ల ఎవ్వలకన్న దమ్మత్తే(ఆయాసం)వాళ్ళ కోలలు వేరేటోళ్లకిచ్చి వాళ్ళు కూసోని మొస్స తీసుకునేటోళ్లు .కానీ పెద్దనాయిన కాలు నిలవకపోయేది. నోటెంట పాట ఆగకపోయేది. అట్ల ఆగకుండా గంటలకొద్ది చిందులేసిన కాళ్ళు ఇప్పుడు సచ్చుబడిపోయినాయి. గల్లుగల్లున చిరుతలు మొగిచ్చిన చేతులు ఆయన పని ఆయనే చేసుకోవటానికి సహకరిస్తలేవు.

నాలుగు బాటల కూడలిలో గొంతెత్తి పాటపాడితే వాడకొసలకు ఇనచ్చేది,ఊరు మారు మొగిపోయేది. అసోంటి గొంతు బాధైతే చెప్పుకునేదానికి,ఆకలైతే అన్నమడగటానికి కూడా లేత్తలేదు. పెద్దనాయిన పరిస్తితి పగోనికి కూడా రావద్దనిపిస్తది. ఆయన బాధ సూత్తాంటె సూత్తాంటనే నాకు తెలవకుంటనే నా కండ్లల్ల నీళ్ళు కారినయి. ఏడుపచ్చింది. అట్లాంటి పెద్ద నాయినలు ఊరికి ఎంతమంది ఉన్నారో కదా…

జీవితం ఎప్పుడు ఎవల్ను ఏంజేత్తదో ఎవలకెరుక. అందుకే రిచర్డ్ డేవిడ్ బాక్ అనే రచయత ఇట్లన్నట్టున్నది…. “Life does not listen to your logic; it goes on its own way, undisturbed. You have to listen to life”.

*

 

ధ్యానముద్రలోని తపస్వినిలా త్రిపుర!

 

చింతలచెరువు  సువర్చల

         పేరుకి భారతదేశంలో ఉన్నా  ఏడుగురు అక్కచెల్లెళ్లు, వారి కష్టసుఖాలు వారివే! వారి సాధకబాధకాలని వారే పరిష్కరించుకోవాల్సిందే! ఆ ఏడుగురిలో ఒకరైన “త్రిపుర”.. పచ్చాపచ్చని కొండలు, పురాతన రాజభవనాలతో, నొక్కులజుత్తు జడలో తెల్లచేమంతులచెండుని తురుముకున్న అమ్మాయిలా ఉంటుంది . రాచరికపు కళ ఉట్టిపడుతున్నప్పటికీ అదంతా గతకాలపు వైభవమే అని స్పష్టమౌతూనే ఉంది.  1949 అక్టోబర్‌లో  భారత దేశములో విలీనమయ్యేవరకు గిరిజన రాజులు మాణిక్య అనే పట్టముతో త్రిపురను శతాబ్దాలుగా పరిపాలించిన సామ్రాజ్యమిది.

త్రిపురని సందర్శించాలన్న ఆలోచన వచ్చినప్పుడు చిన్ననాట  ఎక్కడో చూసిన తెల్లని బొమ్మ లీలగా గుర్తుకువస్తుంది. పచ్చని కొండ కనుమల్లో పెద్ద తెల్లని భవనం! వెంటాడే తలపే త్రిపుర వెళ్లాలన్న ఆపేక్ష ని పెంచింది.

త్రిపుర రాజధాని అగర్తలాకి కలకత్తా మహానగరమునుండి విమానంలో పొద్దున తొమ్మిది గంటలకల్లా వెళ్లాం మేమూ మా పిల్లలు.  మేము ముందుగానే త్రిపుర ప్రభుత్వ టూరిజం లో మా యాత్రాఏర్పాట్లు చేసికొని ఉండటం వల్ల విమానాశ్రయానికి కారు తీసుకుని డ్రైవర్/గైడ్  బాదల్ దాసు వచ్చాడు.

అగర్తలా లో ముందుగా ఉజ్జయంత ప్యాలెస్ ని చూద్దురుగానీ అంటూ దాసు  నగరం నడిబొడ్డునే ఉన్న ఈ రాయల ప్యాలెస్ కి  కారుని నడిపించాడు.   దారిలో దాసు చెప్పిన మాట విని నా మనసు ఆప్లావితమైంది. అదేంటంటే ఉజ్జయంత ప్యాలెస్ కి ఆ పేరు రవీంద్రనాథ్ టాగోర్ పెట్టారుట. ఆయన తరచూ త్రిపురకు వచ్చేవారుట. రాజకుటుంబం తో   తాతగారైన ద్వారకానాథ్ ఠాగోర్ తరం నుంచీ స్నేహసంబంధాలు ఉండటమే అందుకు కారణం. రవీంద్రుని కుటుంబంతో త్రిపుర రాజ కుటుంబానికి సన్నిహిత స్నేహసంబంధాలు ఉండటం త్రిపుర చరిత్రలో స్థిర స్థాయిగా నిలిచిపోయిన ఒక ప్రత్యేక అధ్యాయం అని చెప్పుకోవాలి.  

ఉజ్జయంత ప్యాలెస్ త్రిపుర రాజధాని అగర్తలా లోని గొప్ప వాస్తుకళ ఉన్న అధునాతన రాజభవనం.  ఇది నియొ క్లాసికల్ నిర్మాణము. అంటే గ్రీకు, రోము నగర భవనాల సారూప్యతను పోలి ఉంది. దీన్ని 1901 లో అప్పటి రాజు  రాధా కిశోర మాణిక్య కట్టించాడు . అప్పుడు దీనికి అయిన ఖర్చు ఒక మిలియన్ రూపాయలు(పది లక్షలు). దీన్ని నిర్మాణాన్ని  కలకత్త మహానగరంలోని Martin & Brun Co అనే ప్రసిద్ధ భవన నిర్మాణపు సంస్థ కి అప్పగించారు. 1972 లో త్రిపుర ప్రభుత్వం, రాజకుటుంబం నుంచి రెండున్నర మిలియన్లకి(25 లక్షలతో) కొన్నది. ఈ లెక్కల ప్రకారం ఇప్పుడు మధ్యతరగతి వాళ్లు ఒక చిన్న ఫ్లాట్ ని సామాన్య పట్టణాలలో కొనుక్కొనేంత విలువ మాత్రమే!

ఇప్పుడు ఉజ్జయంత ప్యాలెస్ ని త్రిపుర ప్రభుత్వం మ్యూజియం గా మార్చివేసింది. ఇప్పటికీ రాజపరివారము, భవనపు కుడివైపునున్న చిన్న భాగంలో ఉంటోంది.

ఇది మూడు గోపురాలుండే రెండంతస్తుల ప్రాసాదం. దీనికి ఎదురుగా  రెండు కొలనులు స్వాగతం  పలుకుతున్నాయి. మేము రాజప్రాకారంలోకి అడుగు పెట్టగానే మనసుకు ఆహ్లాదాన్నిగొలుపుతూ  ప్రాంగణం లో మొఘల్ గార్డెన్స్ ని పోలిన ఉద్యానవనము, నీటి చిమ్మెరలు (fountains)ఉన్నాయి. ఓ కమ్మగాడ్పు మనసులను స్పృశించినట్లైంది. విశాలమైన మెట్లను ఎక్కి ప్యాలెస్ లోపలికి అడుగుపెట్టగానే   నూకమాను,(రోజ్ ఉడ్) శాక మాను (టేకు)  కలపలతో చెయ్యబడి,  నగిషీ చెక్కిన  వాసాలు, దర్వాజాలు, ఆర్నమెంటల్ ఫర్నీచర్ (మేజా బల్లలు, కుర్చీలు) మనోహరం గొల్పుతున్నాయి.  సమావేశ మందిరం, కొలువు మందిరం, (దర్బార్ హాల్) గ్రంధాలయం, చైనీస్ గది, ఆతిథ్య మందిరం తమ మనసుల్ని కూడా విశాలంచేసుకుని అతిథులను ఆహ్వానిస్తున్నట్లుగా కనిపించాయి. అవును మరి ఎన్ని సమావేశాలకు, అతిథి సత్కారాలకు కొలువైనవో కదా! తమ అసలు స్వభావాన్ని ఎల్లప్పుడూ ప్రకటిస్తూ, ప్రకాశిస్తూనే  ఉంటాయి మరి!

suvar1

పై అంతస్తులో ఉన్న పెద్ద హాలు అత్యంత ఆకర్షణీయం. రాజ్యాన్ని పాలించిన పూర్వ రాజులు, ఆ కుటుంబీకుల నిలువెత్తు చిత్ర పటాలు హాలంతా ప్రత్యేకతను సంతరించుకొన్నాయి. ఈ తైలవర్ణ చిత్రాలన్నింటినీ రాజకుటుంబం ఈ మ్యూజియానికి ఇచ్చివేశారు.

ఈ మ్యూజియం లో 16 కొలువుకూటములు (Galleries)ఉన్నాయి. ప్రతి ఒక్క గదీ త్రిపుర  ముఖవైఖరులని చాటిచెపుతోంది.  ఇవన్నీ ఈశాన్య భారతదేశపు కళ, సంస్కృతి, సంప్రదాయం, చారిత్రక సంఘటనల నమూనాలు, పత్రాలు,   త్రిపుర నైసర్గిక స్వరూపము, అటవీ సంపద, సామాజిక జీవన శైలి, ఇక్కడ నివసించే విభిన్న గిరిజన తెగల గురించి చాటిచెప్తున్నాయి. శిల్పాలు, నాణాలు, కాంస్య విగ్రహాలు, చేనేత వస్త్రాలు, బంకమట్టి(టెర్రకోట) మూర్తులు, తైల చిత్రాలు, చిత్ర పటాలు, గిరిజనుల ఆభరణాలు, సంగీత పరికరాలు, జానపద కళారూపాలు, హస్తకళలు ప్రదర్శన లో ఉంచారు.

ఈ ప్యాలెస్ కి ఎదురుగా ఉన్న కొలను పక్కనే జగన్నాథ స్వామి  బరి (బడి గా ఉచ్చరిస్తారు)ఉంది.  ఈ గుడిని కూడా మాణిక్య రాజులే కట్టించారు. ఇది పైకి ఇస్లామిక్ ఆర్కిటెక్చర్ తోను, ఆలయం లోపలిభాగమంతా హిందూ శిల్ప నైపుణ్యంతోనూ కనిపిస్తుంది.  మొత్తమ్మీద హేమద్ పంత్, అరబిక్ శైలి ల సంగమంగ రూపొందించబడింది. (హేమద్ పంత్ 13 వ శతాబ్దపు కన్నడవాడు, మహారాష్టలోని దేవగిరిని పాలించిన యాదవ వంశపు రాజాస్థానంలో మహామంత్రి. ఆయన మంచి అడ్మినిస్ట్రేటరే కాదు. గొప్ప ఆర్కిటెక్ట్ కూడా! కొన్ని ప్రసిద్ధ ఆలయాల రూపశిల్పి ఆయన)   పూరీలోని నీల మాధవుని విగ్రహం ఈ ఆలయం నుండే ఇవ్వబడిందట.  జగన్నాథుడు, సుభద్ర, బలరాముడు పూజింపబడే ఆలయమిది.భక్తులు విరివిగా సందర్శిస్తున్నారు.

ప్రతిఏటా రధయాత్ర జరుపుతారు. ఆవరణలోనే రధము కూడా ఒక నిలువైన మంటపములో ఉంది. చందన పుకూర్ అనే కోనేరు కూడా ఉంది. ఇక్కడ రాధా మదనమోహనుని మందిరం కోనేటి మధ్యలో ఉంది. హంస పడవలో రాధా, మదనమోహనలు విహారం చేయించే తెప్పోత్సవాన్ని  పూజారులు నిర్వహిస్తారు. చైతన్య గౌడ్య మఠము, శ్రీల పరమదేవుని భజన కుటీరం, నాట్య మందిరం, బ్రహ్మచారులు,సాధువులుండే గదులు, భక్తుల సౌకర్యార్ధం విశ్రాంతి గదులు ఉన్నాయి. గోశాల కూడా ఉంది..   చైతన్య మఠం బ్రహ్మచారి ఒకరు మమ్మల్ని ఆదరంగా ఆహ్వానించారు. అతనికి పాతికేళ్లు కూడా ఉండవు . తెల్లని ధోవతి, బొత్తాములున్న తెల్లని కుర్తా, కొద్దిగా క్రాఫ్, పిలక తో ఉన్నాడు. ఆలయంలో అడుగుపెడుతూనే మమ్మల్ని వేరే భాషా ప్రాంతం వాళ్లమని గ్రహించి మా దగ్గరికి వచ్చి మమ్మల్ని పలకరించాడు తమ నివాస మందిరానికి తీసుకుని  వెళ్లి మఠం గురించి, హరినామ సంకీర్తన, వైష్ణవ తత్వాన్ని, క్రిష్ణభక్తిని ప్రచారం చేయటం, భగవద్గీత, వేదాలు,ఉపనిషత్తుల సమగ్ర అధ్యయనం, పర్యావరణం లో గోవుల మహోపకారం , గో సం రక్షణ  గురించి వివరించారు. దేశవ్యాప్తంగా ఈ మఠం ఢిల్లి, హైదరాబాద్, చండీగఢ్, మధుర, అస్సాం, పశ్చిమ బెంగాల్, ఒరిస్సా, ఉత్తరాఖండ్ మొదలైన చోట్ల తమ శాఖలు విస్తరించి ఉన్నాయని చెప్పారు.  ఇస్కాన్ కంటే ఈ చైతన్య మఠమే ముందు నెలకొన్నదని చెప్పారు. వైష్ణవ మత ప్రచారమే వీరి ముఖ్యోద్దేశం.  ఎదుటివారికి హాని చేయని , తమని తాము మూఢంగా చేసుకోనిది ఏ మతమైనా సమ్మతమే! సార్వజనీనమే కదా!

మహాత్మాగాంధీకి ప్రియమైన గీతం,  గుజ రాతీ కవి నరసింహ మెహతా రచించిన

“వైష్ణవ జనతో తేనే కహియే

జే పీడ పరాయీ జాణే రే” గుర్తొచ్చింది.

ఈ గీతానికి అర్ధం చూడండి. అందుకే గాంధీగారిని అంతగా ఆకట్టుకుంది.

“పరుల బాధలను అర్ధం చేసుకొన్న వాడే పరమేశ్వరు డైన విష్ణువుకు పరమ ఆప్తుడు .

ఇలాంటి విష్ణు జనులు విశ్వం లో అందర్నీ గౌరవిస్తారు. పర దూషణ చేయరు ,విమర్శించరు .

అందర్ని సమదృష్టి తో చూస్తారు . పర స్త్రీలు అతనికి మాత్రు సమానం . వైష్ణవ జనులు అసత్యమాడరు. పర ధనా పేక్ష లేకుండా జీవిస్తారు. వారు  సంగత్వం ,నిస్సంగత్వాలకు అతీతులు. నిస్సంగత్వం లోను స్తిర చిత్తం తో వ్యవ హరిస్తారు . వారికి ఆశా, మోసం, వంచన తెలియవు . భోగాన్ని ,కోపాన్ని విసర్జిస్తారు . అలాంటి వ్యక్తియే భగ వంతుని అర్చించ టానికి అర్హుడు .అతడే సకల మానవ జాతి ని ఉద్ద రించగలడు.”

ఈ వైష్ణవ జనులు  ప్రతిఫలాపేక్ష లేకుండా ఇక్కడ  చేస్తున్నదిదే అనిపించకమానదు .

గుడి ప్రాంగణమంతా వృద్ధులైన స్త్రీలు శుభ్రం చేస్తూ కనిపించారు.  కొంతమంది పూలమాలలు అల్లుతూ కనిపించారు. వంటశాల దగ్గర మరికొంత మంది స్త్రీలు కూరలు తరుగుతూ కనిపించారు.  స్త్రీలు, పురుషులు వృధ్ధులై, నిస్సహాయులై ఇక్కడ ఆశ్రయం పొందుతున్నారు. బహుశ జగన్నాధుడు ఎంతమంది నిరాశ్రయులకు ఆశ్రయమిచ్చి కాపాడుతున్నాడో కదా అనిపించింది. దేవాలయ ప్రాంగణం లో మానవత తో  నిరాశ్రయుల్ని ఆదరిస్తున్న ఈ మఠం వారి ఔదార్యం చూస్తే వీరు భగవంతుని ప్రతిరూపాలే అనిపించకమానదు.

దర్శనం చేసుకున్నాక భోజనం చేసే వెళ్లమని మరీ మరీ చెప్పారు. అలాగేనని చెప్పి   మేము అతన్నుండి సెలవు తీసుకుని ప్రధాన ఆలయం వైపుకి వచ్చాం.  భోజనం సమయము ఇంకా కానందున , ఇంకా వేరే ప్రదేశాల్ని చూసే సమయం అవటంతో ప్రసాదం మాత్రమే తీసుకున్నాం. ఆపిల్, సొరకాయ ముక్కలతో చేసిన పెసరపప్పన్నం ప్రసాదం. (పప్పొంగలి, కదంబం ఈ రెండింటి మిశ్రమంలా ఉంది. ) చాలా రుచిగా ఉంది.

suvar2

ఉజ్జయంత ప్యాలెస్ కి ఒక కిలోమీటర్ దూరంలో కుంజబన్ ప్యాలెస్ ఉంది. మొదట దీనికి పుష్పబంత ప్యాలెస్ అని పేరు. దీన్ని మహారాజా బీరేంద్ర కిశోర్ మాణిక్య కట్టించారు. మహారాజు కళాత్మక హృదయుడు. ఈ ప్యాలెస్ రూపాన్నిఆయనే చిత్రించి మరీ  కట్టించారట. ఈ ప్యాలెస్ ప్రాంగణంలో  ఉద్యానవనాలు, పచ్చిక మైదానాలు ఉన్నాయి. ఆయన ఆహ్లాదపు విడిదిగా దీన్ని నిర్మించుకున్నారు. తమ ఆతిథ్యాలకు, ఆరామాలకు, షికార్లకు, విందులు, వినోదాలకు ఈ అంతఃపురము నెలవై ఉండేది. రవీంద్రుడు వచ్చినప్పుడు ఇక్కడే ఉండేవారు. ఈ రాజభవనపు కుడివైపు నుంచి ఉండే వలయాకారపు వసారా దీని ప్రత్యేకత. ఈ వరండా రవీంద్రుడి అద్బుతమైన గీతాలు ఎన్నింటికో పుట్టిన వేదికైంది. ఈ భవనం విశ్వకవి సృజనాత్మకతకు  సాక్షిగా, శ్రోతగా నిలిచింది.

ఈ ప్యాలెస్ ని త్రిపుర ప్రభుత్వం ఆధీనం చేసుకుంది. ప్రస్తుతానికిది రాష్ట్ర గవర్నర్ నివాసంగా మార్చారు. సందర్శకులకు అనుమతిలేదు.

ఈ భవనం పక్కనే మలంచా నివాస్ అనే భవనం కూడా ఉంది. దీనిలో భూమి లోపలి గదులు కూడా ఉన్నాయిట.

దీనికి దక్షిణంగా రబీంద్ర కానన్ అనే ఉద్యానవనం ఉంది. దీన్ని అందరూ సందర్శించవచ్చు.

ఇక్కడ రిక్షాలు చాలా తిరుగుతున్నాయి. నగరం లో అన్నీ ప్రదేశాలు అంతంత దూరంకాకపోవటంతో రిక్షాలలోనూ తిరగొచ్చు.

జగన్నాథుని మందిరం పక్కనే ఉన్న ఓ హోటెల్లో మధ్యాహ్న భోజనం చేశాక, దాసు ఉదయపూర్ కి   బయలుదేరుతున్నామని చెప్పాడు. త్రిపురలో 60 శాతం కొండలు, అడవులే ఉన్నాయి. అడవుల మధ్యలో తారురోడ్డు మీదుగా ఉదయపూర్ వైపుకి ప్రయాణం సాగుతోంది.  రోడ్లన్నీ మెత్తగా సాగే ప్రయాణానికి సానుకూలంగా ఉన్నాయి. వీటిని  “బార్డర్ రోడ్స్ ఆర్గనైజేషన్”(B.R.O) వారు నిర్మించినవని దాసు చెప్పాడు.  దారిపొడవునా మంద్రంగా వినిపించే రవీంద్రుని సంగీతం. దాసు అభిరుచిని మెచ్చుకోకుండా ఉండలేం!

మధ్యలో విశ్రాం గంజ్ అనే చిన్న బస్తీ వచ్చింది. అక్కడ  తేనీరు కోసం ఆపాడు దాసు. ఇక్కడ తేనీరు తాగేదేమిటి అంటూ క్రిష్ణ రసగుల్లాలు కొనుక్కొస్తానంటూ వెళ్లారు. ప్రద్యుమ్న వాళ్ల నాన్నననుసరించాడు.ఆ చిన్న హోటెల్ పేరుని చదవాలని ప్రయత్నించాము నేను, విభావరి.  త్రిపురలో విభిన్న తెగల వారు, విభిన్న భాషలవారు   నివసిస్తున్నప్పటికీ ఎక్కువశాతం  బెంగాలీలే ఉండటం వల్ల ప్రధాన భాష బెంగాలీ నే! “కొక్ బొరొక్” భాష ఇక్కడి ట్రైబల్ లాంగ్వేజ్. మణిపురి వారు కూడా ఉండటంతో ఆ భాష కూడా ఇక్కడ ఉంది.  అయితే  షాప్స్, హోటెల్స్, కార్యాలయాలన్నిటికీ బెంగాలీ లిపిలోనే బోర్డ్స్ పై పేర్లు రాసుంటాయి.  బెంగాలీ లో రాధా అర్ధం అవుతోంది కానీ పక్కనున్న మూడు అక్షరాలేమిటో ఎంతకీ బోధపడలేదు. కృష్ణ అయితే కాదు రెండక్షరాలే కాబట్టి. “మోహన్, మాధవ్ “…అలా కనిపించటంలేవు ఆ అక్షరాలు. బెంగాలీ “మ” అక్షరం హింది “మ” కి దగ్గరగా ఉంటుంది కాబట్టి, పరిచయమే!  బుర్ర చించుకొని చించుకొని ఇక లాభంలేదని అప్పుడే వచ్చిన దాసుని అడిగాం. అది రాధా- “గోవింద్” అని చెప్పాడతను. ఆ ఆధారంతో మరికొన్ని అక్షరాలు గుర్తుపట్టే ప్రయత్నం చేస్తూ, రసగుల్లాలు ఆరగిస్తూ మళ్లీ ప్రయాణం కొనసాగించాం . సాయంత్రానికి ఉదయపూర్ తీసుకుని వచ్చాడు దాసు. ఉదయపూర్ ఒకప్పటి రాజధాని అని చెప్పాడతను.  అగర్తల రాజధానిగా మారక ముందు  గోమతీ నది తీరాన రంగమతిగా పేరుపొందిన  ఉదయపూర్ మాణిక్య రాజవంశీకులకు అధికార నివాసంగా ఉండటమే కాకుండా రాజధానిగా కూడా వ్యవహరించింది.

అతను ప్రభుత్వ అతిథిగృహం దగ్గరకు తీసుకొచ్చాడు. అదే గోమతీ నివాస్. గోమతి నది ఒడ్డున ఉన్న పట్టణం కాబట్టి దానికి గోమతీనివాస్ అని పేరు పెట్టారన్నమాట!  గోమతీ నివాస్ లో మా బస.  వెనుకవైపు చిన్న బాల్కనీ,  కొలను ముఖముగా ఉంది. రాత్రికి అన్నంలోకి బంగాళాదుంపలు చెక్కుతీయకుండానే చేసిన కూర, ఆవ పెట్టిన రుచి వచ్చింది. పెరుగు, ఏదో ఊరగాయ. పర్వాలేదు భోజనం ఆ మాత్రం దొరకటం అపురూపమని దాన్నే తృప్తిగా తిన్నాం. అక్కడ ఒక రెసెప్షనిస్ట్, ఒక అటెండర్ మాత్రమే ఉన్నారు. స్ఫోటకం మచ్చలతో, మెల్లకన్నుతో రిసెప్షనిస్ట్ భయం కలిగించేలా ఉన్నాడు. కానీ అతను మాకు అన్నం దగ్గరుండి కొసరి కొసరి వడ్డించాడు. చాలా మృదు స్వభావి. అతనికి హింది, ఇంగ్లీష్ రాదు. మాకు బెంగాలీ రాదు. మా చిరునవ్వు పలకరింపుకి, మా కృతఙ్ఞతాపూర్వక అభివాదాలకి  అతని చూపులు, ముఖాభినయంతో మార్దవంగా బదులివ్వలేకపోవచ్చు గానీ, అతని స్వభావశైలి ఆదరంగా ఉంది.

ఉదయపూర్ చాలా చిన్న పట్టణం. అంతగా ఏ సౌకర్యాలూ లేని ప్రాంతం. ఉదయాన్నే ఫలహారంకోసం అదే వీధిలో ఉన్న ఒక చిన్న హోటెల్ కి నడుచుకుంటూ  వెళ్లాం.  తండ్రీ, కొడుకులు నడుపుతున్నారా హోటెల్. ఆ అబ్బాయి 14 ఏళ్లవాడు. స్కూల్ లో చదువుకుంటున్నాడు . ఈ చిన్న హోటెల్ లో వాళ్ల నాన్నకు సాయం కూడా చేస్తాడు. అంత చిన్న వయసులో అంత బాధ్యతని ఫీల్ అవుతున్నందుకు ముచ్చటగా అనిపించింది మాకు. న్యూస్ పేపర్ని చింపిన ముక్కలలో  ప్లెయిన్ పరాటాలను పెట్టిచ్చారు. చిన్న స్టీలు పళ్లెంలో క్యాలీఫ్లవర్, కాబేజీ, దుంపలు, టమాటాల కలిపి చేసిన కూర పెట్టిచ్చారు. పరాటాలు ఎన్ని కావాలో అన్ని తినొచ్చు. మళ్లీ మళ్లీ అడిగారు. రసగుల్లాలు, సందేష్ స్వీట్స్ ఉండనే ఉన్నాయి మరి! అక్కడున్న ఒక్కటే ఒక్క చెక్కబల్లపై కూర్చుని తినేశాం. ఇవన్నీ కలిపి రెండువందల రూపాయిలు దాటలేదు. ఇదే ఆహారం మనం స్టార్ హోటల్స్ లో తింటే మనల్ని బిల్లుతో బాదేయటం ఖాయం.  మనం ఆహారాన్నే కాదుకదా అక్కడి వాతావరణాన్నీ ఆ కొద్దిసేపూ  కొనుక్కుంటాం కదా మరి!

ఫలహారం చేయటం అయిపోగానే ప్రయాణం మొదలైంది. బాదల్ దాస్ మమ్మల్ని గోమతీనది వైపుకి తీసుకెళ్లాడు. ఆ  నది ఒడ్డున శిధిలమైపోయిన ఒక కోట దగ్గర ఆపాడు. విస్మయం కలిగించిన విషయమేంటంటే  అది  మహాభారత కాలమునాటిది.  అప్పటి రాజు, సైన్యం మహాభారత యుద్ధములో కౌరవల పక్షాన పోరాడారట.

ఈకోట దగ్గరే  భువనేశ్వరి దేవి ఆలయం ఉంది. దీన్ని  17 వ శతాబ్దం లో మహారాజా గోవింద మాణిక్య నిర్మించారు.  నోబుల్ పురస్కార గ్రహీత రవీంద్రనాథ్ ఠాగూర్ చే ‘రాజర్షి  ‘ అనే నవలలో మరియు ‘బిశర్జన్’ ( విసర్జన్) అనే నాటకం లో భువనేశ్వరి ఆలయం సజీవం గా చిత్రింపబడింది.   భువనేశ్వరీ దేవికి తరచూ మనుష్యులను బలి ఇస్తుండటం చేత రవీంద్రుడు ఆ మూఢాచారాన్ని రూపుమాపాలన్న సత్సంకల్పంతో ఈ నాటకాన్ని రచించాడు. రాజావారి సహాయం తో ఆ నాటకాన్ని ప్రదర్శించి ప్రజలను చైతన్య పరచి, చివరకు అమ్మవారి విగ్రహాన్ని అక్కడి గోమతీ నదిలో విసర్జించారు.   మనుష్యులను సాటి మనుస్యులే అమానుషంగా, మూఢభక్తితో నరబలి ఇవ్వటం ఎంత హేయం! ఒక కవికి తన ఊహల్లోను, రచనల్లోనే కాదు, లౌకిక వ్యవహారాల్లోనూ, తోటి జీవులపట్లా కారుణ్యం ఉండాలి.  రవీంద్రుడు దయామూర్తి గా ఇక్కడ కనిపిస్తారు మనకు.

ఈ ఆలయం మూడు అడుగుల మేర ఎత్తు కలిగిన వేదికపైన నిర్మించబడింది. నాలుగు భాగాల పైకప్పు, ప్రవేశ ద్వారం వద్ద స్తూపం, గర్భగుడి  ఈ ఆలయ నిర్మాణం లో ముఖ్యమైనవి. పుష్పం లా తీర్చిదిద్దబడిన రూపకాలు (Motifs), ఈ ఆలయం స్తూపాలు ఇంకా స్థంబాలు  ప్రధాన ఆకర్షణలు .గుడిలో అమ్మవారి విగ్రహం లేకపోవటం తో అప్పటినుంచి పూజల నిర్వహణా ఆగిపోయింది. ఒట్టి గుడి మాత్రమే నిలిచి చరిత్రలో ఒక సత్కార్యానికి గుర్తుగా ఉండిపోయింది.

గుడి ఎత్తైన భాగం లో ఉండటం వల్ల వెనుక భాగమంతా ఓ కోనలా ఉంది. మరి ఆ కోన నిండా కొబ్బరి చెట్లు. ఆకాశంతో కబుర్లు చెప్తున్నట్లు, పక్కనే ఉన్న గోమతీ నది నెమ్మది ప్రవాహంలో  వయ్యారంగా తమ ముస్తాబును చూసుకుంటున్నట్లు ఉన్నాయి. ఇంత పచ్చదనం త్రిపురంతా కనిపిస్తుంది మనకు.

ఇంత పచ్చని త్రిపుర పేదగానే ఎందుకు ఉండిపోయింది అన్న అనుమానం వచ్చింది నాకు. దానికి సమాధానం మధ్యాహ్నానికిగానీ తెలియలేదు. ఉదయపూర్ నుంచి నీర్ మహల్ కి వెళ్లేటప్పుడు మళ్లీ విశ్రాం గంజ్ ద్వారానే వెళ్లాల్సివచ్చింది. అక్కడ క్రిష్ణ పనిచేసే సిండికేట్ బ్యాంక్ తాలూకు ఒక శాఖ ఉంది. మేము అక్కడ ఆగాం. అందరం బ్యాంక్ లోకి వెళ్లాం. బ్రాంచ్ మేనేజర్ కలకత్తా వారు. మమ్మల్ని నవ్వుతూ ఆహ్వానించారు. టి తెప్పించారు మాకోసం  మాటల మధ్యలో అక్కడి రైతులు, ఋణాల గురించి అడిగారు క్రిష్ణ. ఆయన చెప్పిన విషయం ఆశ్చర్యం వేసింది. పంటలు అంతంత మాత్రం పండుతాయి. పాడి పరిశ్రమ చాలా తక్కువ. నీటి సమస్య పుష్కలం. ఒక్క రబ్బరు మొక్కల పెంపకం మాత్రం విరివిగా ఉంది. దానిమీదనే రైతులు లోన్లు తీసుకుంటున్నారు.

suvar3

ఉదయపూర్ కు దగ్గరలో రాధా కిషోర్ పూర్ అనే గ్రామం ఉంది .ఇక్కడే త్రిపుర సుందరీ దేవి ఆలయం ఉంది .మహా శక్తి పీఠాలలో ఒకటిగా ప్రాముఖ్యం పొందిన ఆలయం. ఇక్కడే అమ్మవారి కుడి పాదం  పడటం వల్ల శక్తి పీఠమైంది .. 1501 లో దేవా మాణిక్య వర్మ మహా రాజు ఈ ఆలయాన్ని నిర్మించి నట్లు తెలుస్తోంది .అమ్మవారి పీఠం కూర్మం ఆకారం లో ఉండటం విశేషం .అందుకని కూర్మ పీఠం లేక కూర్మ దేవాలయం అనే పేరు కూడా ఉంది .   శ్రీ త్రిపుర సుందరీ దేవి విగ్రహం సుమారు 7 అడుగుల ఎత్తులో ఉన్న భారీ విగ్రహం .ఈ విగ్రహానికి దగ్గరలో అమ్మవారిదే రెండడుగుల చిన్న విగ్రహం ఉంది .దీనిని “చోటే మా” అని భక్తులు పిలుస్తారు . ఇక్కడి ప్రసాదం-ఆవుపాలను మరగకాచి గోధుమ రంగుగా మార్చి పంచదార కలిపి చేసిన  “దూద్ పేడ్ “. యెర్ర గోగు పూలు అమ్మవారికి ప్రీతికరం గా భావించి సమర్పిస్తారు . గుడి ప్రాంగణంలో మేకలు ఉన్నాయి. బాధ కలిగించే విషయమేమంటే ఇంకా జంతు బలి ఆచారం ఉంది.

దేవాలయానికి వెనుక కళ్యాణ సాగరం అనే పెద్ద సరోవరం ఉంది ఈ సరస్సు పెద్ద ఆకర్షణ గా నిలుస్తుంది .ఇందులో లెక్కలేనన్ని తాబేళ్లు చేపలు కనిపిస్తాయి. యాత్రీకులందరూ వీటికి ఆహారంగా చిన్న చిన్న గోధుమపిండి ముద్దలు,  మరమరాలు వేస్తారు. అవి సరస్సు ఒడ్డునే అమ్ముతారు.  అక్కడ అమ్ముతున్న వారిని మనం వ్యతిరేకించాల్సిన అవసరం లేదు. మూఢ నమ్మకాలని పెంచుకుని నీటిని కలుషితం చేసేది భక్త నామధేయులే!

తర్వాత మేము సందర్శించాల్సినది నీర్ మహల్. ఇది రాజా వారి వేసవి విడిది. ఇది మేలాఘర్ అనే ప్రాంతంలో  రుద్రసాగర్ అనే పెద్ద కొలను మధ్యలో ఉంది. ఈ మేలాఘర్ లో బోట్ రేస్ జరిగే జాతర ప్రతి ఏటా నిర్వహిస్తారు ఇక్కడి బెంగాలీ ప్రజలు. జాతర అంటే.. మేలా.  మేలా చేసే ప్రాంతం కాబట్టి ఈ ప్రాంతాన్ని మేలాఘర్ అన్నారని అనుకోవచ్చు. ఉదయపూర్ నుంచి తిన్నగా ఇక్కడికి వచ్చాం. సాయంకాలం అవటంతో, ఈ సమయంలో అక్కడికి అనుమతించరనీ, రేపు ఉదయం దాని సందర్శనానికి వెళ్లొచ్చని చెప్పాడు దాసు. ఒడ్డునే ఉన్న సాగర్ మహల్ టూరిస్ట్ లాడ్జ్ కి తీసుకుని వెళ్లాడు. ఇది కూడా త్రిపుర టూరిజం వారిదే! దీన్ని కొత్తగా కట్టించారులా ఉంది. రూములన్నీ విశాలంగానూ, శుభ్రంగానూ ఉన్నాయి. కొన్ని గదులు నీర్ మహల్ కనిపించే విధంగా ఉన్నాయి. మేము గదిలోనుంచి బయటికి వచ్చి భోజన శాల ముందు ఆరుబయట మాకై  వేసిన నాలుగు కుర్చీల్లో కూర్చున్నాం. సాగర్ మహల్ భోజనశాల ఇంకొంచెం ముందుకు, కొలను ఒడ్డుకి దగ్గరగా ఉంది.  దీపాలు పెట్టే వేళ అయింది.  కొలను మధ్యలో ఉన్న నీర్ మహల్,  దీపాలకాంతితో నీటిమీద తేలియాడు ప్యాలెస్ లా, అదో కలల దీవిలా కనిపించింది. ఆ వెలుగులన్నీ కొలనులో కార్తీకదీపాల్లా నిర్మలంగా, నిమ్మళంగా ప్రజ్వలిస్తున్నట్లున్నాయి. ఆ దీపశిఖలకు నీలాకాశం ఎర్రబారుతోందనిపించింది. కొద్దిసేపు చూస్తూనే ఉంటే.. నిరీక్షిత లా కనిపిస్తున్న ఆ సౌధం ఏకాంతంగా తపస్సు చేసుకుంటున్న మనస్వినీలా  అనిపించింది.  ఆ అనుభూతికి సాటి అయినది మరొకటి చెప్పలేం మన మాటల్లో!  ఆ భావుకత తీవ్రతనుండి బయట పడ్డాక, నిజంగా అక్కడేమి ఉందోగానీ అంతా మన మనసులోనే ఉంది అనుకొని నవ్వుకున్నాను.  ఏదేమైనా సరే, ఎవరైనా సరే ఈ సౌందర్యాన్ని చూడాలంటే ఓ సాయంకాలం నుండి ఉండితీరాలి.

రాత్రి భోజనం తయారని చెప్పటంతో లోపలికి వెళ్లాం. అక్కడ మాకు రొట్టెలు, మిక్స్డ్ వెజ్ కూరతో బాటు, కొద్దిగా అన్నం అందులోకి ఆవకాయ..నిజమండీ ఆంధ్రా ఆవకాయ ప్రియ వారిది వడ్డించాడు. బంగాళాదుంప కారప్పూస  కూడా వడ్డించాడు. తెలుగువాళ్లు వేపుడు, ఆవకాయ తింటారని విని ఉన్నాడట. ఆమాత్రం అతనికి తెలిసినందుకు అతన్ని మెచ్చుకోవాల్సిందే!  ఇక మన ఆవపెట్టిన కూరలు, కొబ్బరి తురుము వేసిన కూరలు,అన్ని రకాల పప్పులు, చారు,  పప్పులుసు, దప్పళం, రోటి పచ్చళ్లు, పులిహోర, చక్ర పొంగలి, పూర్ణాలు, బొబ్బట్లు ఇంకా చెప్పుకుంటూ పోతే అంతే ఉండదు.  ఇవన్నీ తింటామని తెలిసున్నట్లైతే అతనికిక  సన్మానం చేసెయ్యొచ్చు. స్వర్ణ కంకణం తొడగవచ్చు మరి!

ఉదయాన్నే చపాతీల ఫలహారం పెట్టారు. తినేసి రుద్రసాగర్ ఒడ్డుకి వెళ్లాం. మోటారుబోటులున్నాయిగానీ, మేము మామూలు పడవనే మాట్లాడుకున్నాం. పడవవారికి, వీటిని నడపటం, ఆ కొలనులో చేపలు పట్టటం జీవనభృతి. అక్కడే అమ్ముతున్న రేగుపండ్లు కొనుక్కొని పడవెక్కాం. రెండు కిలోమీటర్ల ప్రయాణం నీటిలో. రాత్రి అందంగా కనిపించిన కొలను నీళ్లు ఎంతో మురికిగా కనిపించాయి.  ఆ నీళ్లను ఎక్కడా తాకేలా అనిపించలేదు. ఎక్కడచూసినా చేపల వలలు, బురద మేటవేసిన కొలను.  రాజా తన వేసవి విడిదిగా నిర్మించిన ఈ భవనం చుట్టూ ఇంత పెద్ద కొలనుని తవ్వించాడట. రాజ పరివారం ఆహ్లాదంగా తమ స్వంత బోటుల్లో జలవిహారం చేసిన కొలను! జనాలకు చల్లటి గాలిని వీచిన కొలను!  తాగునీటిగా, చుట్టూ పొలాలకు పంట నీరుగా ఉన్న ఈ నీరు ఇప్పుడు కలుషితం. ఈ సరస్సు ఇప్పుడు చాలా నిస్సారమైపోయింది. ఇదే కొనసాగితే పర్యావరణం, టూరిజం రెండూ నష్టపోయే అవకాశం ఎక్కువగానే ఉంది. ఈ సరస్సుని ప్రక్షాళన చేయాల్సిన అవసరం ఎంతో ఉందని అనిపించింది.

భవనం దగ్గర పడే కొద్దీ కొద్దిపాటి ఉద్విగ్నత ఉన్న మాట వాస్తవం. దర్పంగా నిలిచిఉన్న ఈ హర్మ్యాన్ని తలెత్తి చూడాల్సిందే. నీటి మధ్యలో కట్టిన నాటి వాస్తు కళా శిల్పుల నైపుణ్యానికి హాట్సాఫ్!      రాజా బీర్ విక్రం మాణిక్య డిజైన్ చేసి కట్టించిన ఈ ప్యాలెస్ కూడా  హిందూ, ముస్లిం మిశ్రమ శైలి నిర్మాణానికి ప్రతీక. ఎరుపు తెలుపుల మిశ్రమవర్ణాలతో కనిపించే ఈ భవనం ప్రధాన ద్వారం గుండా వెళితే పడమటి వైపు అందర్ మహల్. ఇందులో రాజ పరివారం నివసించేందుకు వీలుగా 24 గదులున్నాయి. కుడివైపు సాంస్కృతిక కార్యక్రమాలకోసం కట్టించబడిన ఓపెన్ ఎయిర్ థియేటర్. రాజ సైనికులు ప్రహరా కాసేందుకు వీలుగా బురుజులు, రాజ పరివారం సరస్సులో బోటులో విహారం చేసేందుకు లోపలినుంచి ఉన్న రాజఘాట్.  బురుజులు, సౌధపు పై మేడ పై కొద్దిసేపు తిరిగాం. పాతబడిన ఈ మేడ పై, పిట్టగోడనానుకుని చుట్టూ వరిపొలాలని చూస్తుంటే నా చిన్ననాట  పల్లెటూరులోని మా ఇంటి మేడపై పిట్టగోడనానుకుని మావూరి వరిపొలాలు చూసిన అనుభూతి మెదిలింది. కొన్ని అనుభూతులు అంతే..కాలంతోబాటు మనల్ని వెన్నంటే ఉంటాయి. ఏ కొద్దిపాటి సారూప్యత కనబడినా చాలు మనల్ని కదిలిస్తాయి.

ఈ భవనపు ప్రాంగణంలో కూడా మొఘల్ గార్డెన్ ఉంది. దీనికి కూడా నీర్ మహల్ అని రవీంద్రుడే పేరుపెట్టారు. ఇక్కడ జనరేటర్లు కూడా ఉన్నాయి. లైట్ & సౌండ్ షో కూడా ఇక్కడ ఏర్పాటు చేశారు .కానీ ప్రస్తుతం దాన్ని ఆపివేశారట. భవనం కూడా శిధిలావస్థలో ఉంది. కాపాడుకోవల్సిన అవసరం ప్రభుత్వానికి ఎంతైనా ఉంది. త్వరగా పునరుధ్ధరణ పనులు చేపడితేనేగానీ రాయల్ హెరిటేజ్ కి గుర్తుగా మిగిలిన ఈ ప్యాలెస్ శోభ కలకాలం నిలువగలదు.

పడవదిగి ఇవతలికి రాగానే ఒక ప్రభుత్వ ఉన్నతాధికారి కనబడ్డారు. మేము హైదరాబాద్ నుంచి వచ్చామని తెలిసి చాలా సంతోషపడ్డారు. “మా త్రిపుర చాలా అందంగా ఉంటుంది. ఇక్కడి ప్రజలు నిజాయితీగా ఉంటారు” అని చెప్తుంటే ఆయన కళ్లల్లో మెరుపు, గర్వం కనిపించాయి. అవును, పుట్టిన గడ్డపై గర్వం, గౌరవం చూపించాలి!

పక్కనే వెదురు బొంగులతో చేసిన డబ్బాలు, ఫ్లవర్ వేజ్ లు, పెన్నులు, గ్లాసులు, బొమ్మలు అమ్మే దుకాణం ఉంది. దాంట్లో అతి తక్కువ ధరకే అమ్ముతున్నారు. ఎటువంటి బేరం ఆడాల్సిన అవసరం లేదు. వారి కష్టానికి ఆమాత్రం మూల్యం చెల్లించాల్సిందే! అదే మన నగరాలలో పెట్టే హ్యాండిక్రాఫ్ట్స్ ప్రదర్శనలలో ఇంతకు నాలుగింతల ధరలని చెప్తారు. వస్తువులకు ముచ్చటపడితే మారుమాటాడకుండా కొనుక్కోవాల్సిందే! ఇక్కడ ఎంతో ఓపికగా వారు చేసిన కళాకృతులను చూపించాడు దుకాణాదారుడు. అతని పనితీరుని అభినందించి, చెప్పిన ధరనే చెల్లించి,  బంధువులకు, మిత్రులకు కానుకలు కొని బయటికొచ్చాం.

అక్కడ్నుంచి సెఫాహీజల వెళ్లటం కోసం ముందుకు కొనసాగాం.. సేఫాహీ జల వచ్చిందని రోడ్డు మీదనే కారాపేశాడు దాసు. అక్కడ్నుంచి లోపలికి అడవి లోనే  వేసిన తారు రోడ్డుపై నడకసాగించాం. ఒక క్రోసెడు దూరం ఆ దారిగుండా నడిచాక పేద్ద గేటు వచ్చింది. అప్పుడే డ్యూటీకి వచ్చిన అక్కడి అటెండర్ గేటు తీయగానే విశాలంగా ఆకాశంలా పరచుకున్న సరస్సు, అందులో  రోజా,ఊదా రంగుల కలబోతతో పూసిన తామరపూలు.  ఒక్కసారిగా  దేవలోకానికి తీసుకెళ్లినట్లు అనిపించింది.  అది ఓ సహజసిద్ధమైన సరస్సు. ఆ సరస్సులో కొద్దిసేపు బోటులో విహారం చేయాలనిపించింది.  అటెండర్ మాకు బోటు ఎక్కటానికి సహాయంచేశాడు. మా కలకలం వినగానే ఒక్కసారిగా ఎగిరిన పక్షి సమూహాలు  కనిపించేంత మేరకు సరసుపై ఓ అద్భుత చిత్రాన్ని రచించాయి. వింత ద్వనుల సందడిని చేస్తూ అవతలి ఒడ్డువైపుకు తరలిపోయాయి. సరసుకి ఆవలి ఒడ్డు మళ్లీ అడవే!   దూరంగా కనిపించి మురిపించిన తామరపూవులు మా విహారంలో ఎదురొచ్చి స్వాగతం చెప్తున్నట్లు తోచింది. స్త్రీ హృదయం కదూ పూవులను చూడగానే దయలేనివారిగా మారిపోయేవారం కదూ నాకూ, విభావరికి వాటిని స్వంతంచేసుకోవాలనిపించింది.  ఇవి సుకుమార పూబాలలేగానీ, వాటిని కోయాలంటే చాలా  కష్టం. సుకుమారంగా కనిపించే స్త్రీలు ఎంత ధృఢచిత్తులో, అటువంటివారికి ప్రతీకగా అనిపిస్తాయి ఇవి. బలమంతా ఉపయోగించి పీకితేగానీ రాలేదు. ప్రద్యుమ్న కోసి చెరొక కమలాన్ని ఇచ్చాడు.  మురిపెంగా అందుకున్నా. విరిసీ విరియని తామరలు ముద్దొచ్చేట్లు ఉన్నాయి. ఒక్క క్షణం మైమరచినా తర్వాత అనిపించింది …చూసినప్పటి మానసిక సంతోషం చేతికి అందాక అంత ఉండదని! కొన్నింటిని అలాగే చూసి ఆనందించాలి. పంకిలాన్ని అంటని పూలు, నీటి బొట్టుని అంటించుకోని ఆకులు!! ఎంత ఫిలాసఫీని నేర్చుకోవాలి మనం వీటి  భాష ఎరుగని బోధనలతో!

అక్కడ్నుంచి కమలా సాగర్ వైపుకి వెళ్తున్నామని చెప్పాడు దాసు.దారిపొడవునా విశాలమైన ముంగిళ్లతో, వెదురు కంచెలతో పూరిళ్లు , వాలుగా కప్పిన  రేకుల ఇళ్లు. నిజానికి రూరల్ త్రిపుర మొత్తం ఇలాంటి ఇళ్లే!  ప్రతి ఇంటి ఆవరణలో అరటి, పోక, పనస, కొబ్బరి చెట్లు.  ఇంకా పూరిళ్ల లోగిళ్లలో ముగ్గులు. దక్షిణభారతదేశంలోలా ఇక్కడా ముగ్గులు పెడతారా అని దాసు ని అడిగాను. సంక్రాంతి సమయంలో పెడతారని చెప్పాడు. అవును మేము వెళ్లింది సంక్రాంతి సమయంలోనే!

కమలాసాగర్ ఇండోబంగ్లా సరిహద్దులో ఉన్న ఒక గ్రామం. ఇక్కడ కాళికా మాత ఆలయం, దాని కెదురుగా కమలాసాగర్ అనే పెద్ద కొలను ఉన్నాయి. ఈ కమలా సాగర్ నిండా రోజా రంగులో సంభ్రమం గొలుపుతూ కమలాలు!  విచిత్రం ఏమంటే   ఆ కమలా పుష్పాలలో సగం మన దేశానివి. మిగతా సగం బంగ్లాదేశ్ వి.  అవునండీ సరిహద్దు రేఖ అలాగే నిర్ణయించింది మరి! అక్కడే కొమిల్లా వ్యూ పాయింట్ అని టూరిజం వారి వసతి గృహం. అమ్మవారి దర్శనం చేసుకున్నాక ఈ వసతి గృహం డాబా మీదకు వెళ్లాం. పక్కనే ఉన్న ఓ డాబా ఇల్లు, మామిడి చెట్టుని చూస్తూ నిల్చున్నాం. ఇంతలో అతి సమీపంగా రైలు శబ్దం వినిపిస్తే పక్కకు తిరిగిచూశాం. అతి దగ్గరగా వెళ్తున్న ఓ గూడ్స్ బండి..అది నిజానికి మన దేశం లోది కాదు. బంగ్లాదేశ్ లోది. పక్కనే ఇనుప రాడ్స్ తో సరిహద్దు కంచె అప్పుడుగానీ  కనిపించలేదు.   కిందకుదిగి భోజనానికి వచ్చాం. అన్నంలోకి మళ్లీ బంగాళాదుంపల కూర టమాటాతో కలిసి. ముఖం మొత్తిపోయింది. టమాటా పచ్చడి తియ్యగా ఉంది. అస్సలు తినలేకపోయాం. ఏంచేస్తాం?  .  ఇంట్లో అంతగా అనిపించకపోయినా ఇలాంటప్పుడే బయట ప్రదేశాలలో మాత్రం నాకు అనిపిస్తుంది. గోంగూర, చింతకాయో, మాగాయ, ఆవకాయో వేసుకుని ఇంత అన్నం తినాలని.  లేదూ, పండ్లు మాత్రమే ఆహారంగా తీసుకోవాలనిపిస్తుంది.  అదే చేశాం. గోధుమ వన్నెలో ఉన్న పాలకోవా, అరటిపండ్లు కొనుక్కుని తిని. కొబ్బరి బోండాలు తాగి కడుపు నింపుకున్నాం.  నిజానికి బెంగాలీ ప్రాంతాలలో శాకాహారులకు సరైన ఆహారం ఉండదనే చెప్పాలి. శాకాహారులం అని చెప్పినప్పటికీ ఎక్కడ జలపుష్పాలను వడ్డిస్తారేమోననే కంగారు.  సరే ఆ విషయం వదిలేస్తాను.

తిరిగి అగర్తలాకి వచ్చేశాం. నగరంలోకి రాగానే ఇదే S.D బర్మన్ ఇల్లు అని చూపించాడు దాసు. ప్రముఖ సంగీత దర్శకుని ఇల్లు అది. S.D బర్మన్ కొడుకు R.D బర్మన్. ఈయన త్రిపురలో ఒక రాజ కుటుంబానికి చెందినవారు. ఖగేశ్ దేవ్ బర్మన్ కూడా త్రిపుర రాజ కుటుంబానికి, బర్మన్ వంశానికీ చెందినవాడు. ఈయన ఎస్.డి బర్మన్ (సచిన్ దేవ్ బర్మన్)పై రాసిన పుస్తకం “సచిన్ కర్తార్ ఘనేర్ భుబన్” దీనికి త్రిపుర ప్రభుత్వం “సచిన్ సమ్మాన్” అనే గౌరవ పురస్కారాన్ని ఇచ్చింది. The world right of this book has been taken up by Penguin India.

చంద్రకాంత్ మురసింగ్ కూడా త్రిపురలో ప్రఖ్యాతిగాంచిన కవి. ఈయన ఇక్కడి ట్రైబల్ లాంగ్వేజ్ అయిన కోక్ బొరొక్ లో చాలా పుస్తకాలు రాశారు.  ట్రైబల్ జానపద సంస్కృతి  త్రిపురకు విశిష్టతను చేకూర్చినదని చెప్పొచ్చు.

 

ఇక త్రిపురని మాణిక్య రాజులు పరిపాలించినట్లే, త్రిపుర ప్రతిష్టని పెంచినవారు మరో మాణిక్యం..మాణిక్య సర్కార్. ముఖ్యమంత్రిగా అవినీతి రహితంగా, నిజాయితీగా, నిరాడంబరం గా ఉండే ఈయన ప్రజలు మెచ్చిన మనీషి.  దేశం మొత్తం గర్వించదగ్గ, అనుసరించాల్సిన నాయకుడు.  పుత్రోత్సాహాన్ని కలిగించిన త్రిపుర మాత ముద్దుబిడ్డ. ఈయన భార్య పాంచాలీ భట్టాచార్య ఇంటిపనులకై రిక్షాలో వెళ్తుందని అందరికీ తెలిసిన విషయమే!

సరే అసలు విషయంలోకి వస్తాను. బర్మన్ ఇంటిముందునుంచి వెళ్లి రాజా మహా బీర్ బిక్రం కట్టించిన M.B.B కాలేజ్ ముందు కొద్దిసేపు కారు ఆపాడు దాసు. పిల్లలిద్దరూ కొన్ని ఫొటోస్ తీసుకున్నారు. పాత భవనం విశాలమైన ప్రాంగణంతో, చెట్ల ఛాయల మధ్య వెలిగిపోతూ ఉంది.  ఇది 264 ఎకరాల్లో నెలకొలబడిన కళాశాల.  ఇక్కడి లైబ్రరీలో  గ్రంధాలు, జర్నల్స్ లేనివి లేవు. ప్రయోగ శాలలు, సాంస్కృతిక సమావేశాల వేదికలతో “విద్యామృతమస్నుతే” (Knowledge is the key to immortality అనే మోటో తో సాగుతున్న ఈ విద్యాలయాన్ని కలకత్తా యూనివర్శిటికీ అనుసంథానం చేసిన ఘనత త్రిపుర మాణిక్య రాణీ “కాంచన ప్రభాదేవి” దే! మహారాజు,  యువకులను మేథావంతుల్ని చేయాలన్న సత్సంకల్పానికి ఈవిడ మరింత కృషి చేశారు. ఈమె బీర్ బిక్రం మహారాజు భార్య. భారతదేశం లో విలీనమయ్యే కాలంలో త్రిపురని పరిపాలించిన ధీర! భారత విభజన సమయం లో త్రిపుర లో శరణార్ధులకు పునరావాసాల్ని కల్పించి ఈమె కీలకమైన పాత్రని పోషించింది. ఈ ధీరోదాత్త గురించి వింటుంటేనే మనసు పులకితమయింది. ఇక్కడ కాలేజీకి సంబంధించే ఈ రాజా వారు పెద్ద క్రికెట్ మైదానం కూడా ఏర్పాటుచేశారు.

అక్కడ్నుంచి వేణూబన్ విహార్ కి వెళ్లాం.

వేణుబన్ విహార్..పేరు వినగానే ఇది ఖచ్చితంగా వేణుమాధవుని ఆలయమనుకుంటారు. అవునా? కాదు. ఇది బుద్ధదేవుని మందిరం. చాలా విశాలంగా, ప్రశాంతంగా ఉంది. తీర్చిదిద్దినట్లున్న పచ్చని మొక్కలు, పసుపుపచ్చని సువర్ణగన్నేరు పూలు ఏదో దివ్యరాగానికి తలలూపుతున్నట్లున్నాయి. ఆ నిర్మలచిత్తుని నుంచి ప్రసరించే తరంగాలు ఆవరణంతా ఆవరించాయనిపించింది. కొద్దిసేపు కూర్చుని అక్కడి శాంతాన్ని మనసుకు పట్టించుకునే ప్రయత్నంలో పడ్డాం.

అక్కడ్నుంచి మా కోరికమీద “పూర్భష” కి తీసుకెళ్లాడు దాసు. అది ప్రభుత్వ చేనేత, హస్త కళాకృతుల ఎంపోరియం. పట్టు, నేత వస్త్రాలు మాత్రమే చూడాలనుకున్నాం. వస్త్ర విభాగంలోకి వెళ్లాం. ఇక్కడి ట్రైబల్ నేసిన వస్త్రాలు ప్రత్యేకతను కలిగి ఉంటాయి. వీరి చేనేత పని విభిన్నంగ ఉంటుంది. కొంత షాపింగ్ చేసి బయటకు బలవంతంగా వచ్చాం. అంత బాగున్నాయక్కడ. ఏది కొనుక్కోవాలో, ఏది వదలాలో తెలియదు. ఏ ప్రాంతానికి వెళ్తే ఆ ప్రాంతపు సంస్కృతికి సంబంధించిన విశేషమైనవాటిని  కొనుక్కోటం ఆచారంగా చేసుకున్నవారిలో మేమూ ఉన్నాం. సరదాగా అంటున్నానులేండి.

ఇంకా ఇక్కడ పాత అగర్తలా చూడాలి అంటూ రాజా వారి పాత హవేలి, చతుర్దశ దేవతా ఆలయం అవీ చూపించాడు దాసు. ఈ 14 దేవతా విగ్రహాలను ఉదయపూర్ నుండి అగర్తలాకు మహారాజా వారు తరలివచ్చేటప్పుడు ఇక్కడకు వాటినీ తెచ్చి ప్రతిష్ట చేశారట.

ఆ రోజుకిక గీతాంజలి గెస్ట్ హౌస్ లో బస. ఇది అధునాతన భవనం. కుంజబన్ ప్యాలెస్ కి దగ్గరలోనే ఉంది. చాలా బాగుంది. వసతి, భోజనం అన్నీ బాగున్నాయి.

త్రిపురలో ప్రభుత్వ టూరిజం వారి వసతి గృహాలలో ఉంటూ, వారి ప్యాకేజ్ టూర్లలో వెళ్లొచ్చు. ఎటువంటి ఇబ్బందీ కలుగనీయకుండా వారు చూస్తారు.

త్రిపుర అంతా జీవ వైవిధ్యమున్న అటవీప్రాంతం. జంపూ హిల్, త్రిష్ణ  వైల్డ్ లైఫ్ సాంక్చురీలు, బర్డ్ సాంక్చురీ,   ఉనకొటి లాంటి బౌద్ధ విహారాలు ఇంకా చూడాల్సినవి ఉన్నాయి.  సమయాభావం వల్ల వెళ్లలేకపోయాం. బాదల్ దాస్  మమ్మల్ని విమానాశ్రయం దగ్గర దించాడు. అతనికి కృతఙ్ఞతలు చెప్పి,  త్రిపురని సెలవిమ్మని అడిగి విమానమెక్కేశాం. గూటికి చేరాం .

ఇంటికి వచ్చాక నెమరువేసుకుంటే ..

త్రిపుర మొత్తం కొండ-కోన, కొలను-కోటల సమాహారం. వీటన్నిటి చాయలలో ఈ బుజ్జి రాజ్యం ధ్యానముద్ర లోని ఓ తపస్వినిలా   అనిపించింది.

 

*****

 

ఆ హిమాలయమే రమ్మని పిలిచిన వేళా…!

సాహిత్ యలమంచి
సవాళ్ళు విసురుతూ , ఆత్మ స్థైర్యాన్ని దెబ్బతీయడానికి యత్నిస్తూ ప్రకృతి ఆడే ఆటలో,  మంచు చరియలు ఎప్పుడు  విరిగిపడి తమలో కలిపేసుకుంటాయో తెలియని ప్రాంతంలో ముందుకు సాగడం అంటే అదో పెను సవాల్. అది దాటి మాచ్రా పూచ్రే బేస్ క్యాంప్ చేరడం గొప్ప సాహసమే. అదీ వాతావరణం అంతగా అనుకూలంగా లేని సమయంలో.

కళ్ళముందు కదలాడే హిమ పర్వత అందాల కంటే ముందు నాలుగు ముక్కలు నా ప్రయాణపు నేపథ్యం మీ ముందు పెట్టొచ్చా .. అయితే సరే ..
అద్భుత సౌందర్యంతో మనసును లాక్కెళ్ళిపోయి కట్టిపడేసే హిమాలయ పర్వత శిఖరాలు నన్ను రా రమ్మని ఆహ్వానిస్తున్నట్లుగా ఉండేది వాటి ఫోటోలు చూసినప్పుడల్లా.  అక్కడికి వెళ్ళిరావాలన్న ఇష్టాన్ని తట్టిలేపుతూ,  మరింత గట్టిబరుస్తూ నా మనసునాక్రమించి అందుకు సన్నద్ధం కమ్మని నన్ను పోరు బెడుతూ…  ఏనాటికైనా..  ఒక్కసారైనా వాటిని తాకిరావాలన్న కోరిక మనసు పొరల్లోంచి ఉవ్వెత్తున ఎగుస్తూ …  కలలు కనడం కాదు ఆ కలల్ని సాకారం చేసుకొమ్మని నన్ను నేను ఉత్సాహపరుస్తూ .. రోజులు, నెలలు, సంవత్సరాలు గడిచిపోయాయి.

పర్వతారోహణ మాత్రమే కాదు, నిరంతర బాటసారిలా అలా ప్రపంచమంతా చుట్టేసి రావాలని పిచ్చి కోరిక.  అదీ ఒంటరిగా.  నేను గమ్యం గురించి ముందే తెలుసుకోవడం కాకుండా, ఎలాంటి ముందస్తు ఏర్పాట్లు లేకుండా సాగిపోవాలని అనుకునే వాడిని.  కారణం ముందే తెలిసి ఉంటే కొత్తదాన్ని చూస్తున్నానన్న ఉద్వేగం, ఉత్సాహం మాయం అయిపోతాయేమోనన్న భావన కావచ్చు.  లేదా నేను చూసే దృష్టికోణం మారుతుందన్న ఆలోచన కావచ్చు.  నేను కోరుకున్న అనుభూతులకు భిన్నంగా ఉంటే నిరాశ కల్గొచ్చు.  ప్రతి ప్రదేశాన్ని ఆ ప్రత్యేకతలను ఆస్వాదిస్తూ, అనుభూతి చెందుతూ సాగడంలో ఉండే థ్రిల్ కోల్పోకూడదు అని అనుకునే వాడిని .
మార్గమధ్యలో ఎలాంటి అవాంతరాలు, అడ్డంకులు  ఎదురైనా వాటిని ఎదుర్కొంటూ ముందుకు సాగిపోవడమే నా ధ్యేయంగా పెట్టుకోవాలి వగైరా వగైరా … గజిబిజిగా సాలెగూడులా ఆలోచనలు కలుగుతుండేవి.  ట్రావెలింగ్ చేయాలన్న ఆలోచన మొదట్లో వచ్చింది చెన్నై లో నేను ఇంజనీరింగ్ చదివేప్పుడు.   అసలు అంతకు ముందే ట్రెక్కింగ్ చేయాలన్న కోరిక ఉండేది. బహుశ ,  నేను 6తరగతిలో ఉండగానో ఇంకా ముందేనో ఆ కోరికకు బీజం పడిందనుకుంటా..   ఆ కలను నిజం చేసుకోవాలి. ఎలా ..? తెలిసేది కాదు . నాలో నేనే మదనపడుతూ ఉండేవాడిని.
యునివర్సిటి ఆఫ్ ఇల్లినాయిస్ లో ఎమ్మెస్ పూర్తి చేసి ఉద్యోగంలో చేరిన తర్వాత నా కలకి రెక్కలు వచ్చాయి.  కలను సాకారం చేసుకొమ్మని నా లోపల్నుంచి ఒకటే పోరు. అప్పటివరకూ నాలో నేను కలలు కనడమే గానీ ఎప్పుడూ ఎవరితోనూ వాటిని పంచుకోలేదు.  ఈ విషయం ఇంట్లో చెబితే ఎలా స్పందిస్తారోనన్న సంశయం. చివరికి నాకు ప్రపంచ యాత్ర చేయాలన్నఆలోచన ఉన్న విషయం మా ఇంట్లో వాళ్లతో చర్చించాను. నా ప్రపోజల్ విని ముందు భయపడ్డారు. బాధపడ్డారు. ఉద్యోగం వచ్చింది. ఇక జీవితంలో స్థిర పడతావనుకుంటే ఈ వింత ఆలోచనలు ఏమిటని దిగులుపడ్డారు.  ప్రమాదకరమైన ప్రాంతాలకి ఒక్కడినే వెళ్ళాలని అనుకోవడం కూడా వాళ్ళ భయాలకి కారణం కావచ్చు.   వాళ్లకి అర్ధమయ్యే విధంగా నేను  చెప్పగలిగానో లేక వాళ్ళకి ఇష్టం ఉన్నా లేకపోయినా నా సంతోషాన్ని కాదనలేకో గానీ ఒప్పుకున్నారు.
పూన్ హిల్ దగ్గిర...

పూన్ హిల్ దగ్గిర…

నా కుటుంబ సభ్యులు మనస్పూర్తిగా సరే అన్నాక పెద్ద రిలీఫ్.  వాళ్ళు వద్దన్నా నేనువెళ్ళవచ్చు. కానీ నాకలా ఇష్టం లేదు. అలా నాకల సాకారం చేసుకోవడానికి ఒక అడుగు ముందుకు పడింది.  అందుకు కావలసిన ఆర్ధిక వనరులన్నీనేనే సమకూర్చుకోవాలనుకున్నా.  అప్పటి నుండి నా సన్నాహాలు మొదలయ్యాయి. మిత్రులతో చెప్పాను . కొందరు పిచ్చా మంచి ఉద్యోగం వదిలి వెళ్తావా అని  అంటే కొందరు ఆ భావం చూపుల్లో చూపించారు.  కొన్నాళ్ళు ఆగితే తానూ నాతో వస్తానన్నాడు ఓ మిత్రుడు.
నాకు అలా ఇష్టం లేదు. నాకు నచ్చిన విధంగా నేను వెళ్ళాలి. ఒక ప్రేంలో నన్ను నేను ఇముడ్చుకోవడం లేదా ఇతరుల ప్రేం లో ఒదిగిపోవడం నాకు నచ్చదు.  ఓపెన్ గా ఉండడం నాకిష్టం .    నా ప్రతి చర్యకి కర్త కర్మ క్రియ అన్నీ నేనే కావాలి. మరొకరి ప్రమేయం ఉండకూడదు అనుకున్నాను.   ఒక చోటునుండి మరో చోటుకి వెళ్ళడానికి కూడా నేను ఎక్కడా  టైం లిమిట్ పెట్టుకోదలుచుకోలేదు.  అదే విధంగా ముందే టికెట్లు బుక్ చేసుకోవడం వంటి ఏర్పాట్లేమీ లేకుండా అప్పుడున్న పరిస్థితిని బట్టి స్పందించి నిర్ణయాలు తీసుకోవడం, అలా వెళ్తూ అప్పటికప్పుడు పరిస్తితికనుగుణంగా వ్యవహరించడమే అని నాకు నేను చెప్పుకున్నాను. అదే విధంగా ఎలాంటి లగ్జరీ లేకుండా అతి సామాన్యంగా ఉండాలనుకున్నాను. నాకంటూ ఏ కష్టాలూ లేకుండా పెరిగాను.  క్యుబికల్స్ మధ్య కూర్చొని డబ్బులు సంపాదించడమే జీవితమా ..పెళ్లి , పిల్లలు, ఇల్లు , ప్లాట్లు లగ్జరీ కార్లు..  ఇదేనా జీవితం?  అన్న ప్రశ్నలు ఉద్యోగంలో జేరిన తర్వాత మొదలయ్యాయి.  నా ప్రయాణం, నాకల నేరవేర్చుకోవడం కోసమే కాదు.  జీవితం అంటే..? నాలోంచి వచ్చే ప్రశ్నకి అన్వేషణ కూడా అని తర్వాత అర్ధమయింది.

నా ప్రయాణానికి ఏర్పాట్లంటే మరేమీ లేదు లైట్ వెయిట్ ఉండే లాప్ టాప్,  సోనీ 6000 కెమెరా ..బ్యాక్ ప్యాక్ వంటివి కొన్నాను. . ట్రెక్కింగ్ కి మార్చి చివరి నుండివాతావరణం  అనుకూలంగా ఉంటుందని ముందే తెలుసు.  అందుకే చేస్తున్న ఉద్యోగం ఫిబ్రవరి రెండో వారంలో వదిలేసి రెక్కలు కట్టుకుని ఇండియాలో వాలిపోయాను.  వచ్చే దారిలో చిన్న హాల్ట్ దుబాయ్ లో.  ఆకాశ సౌధం బుర్జ్ ఖలీఫా 148 అంతస్తు లోంచి దుబాయ్ నగర అందాలను చూడడం వింత అనుభవం.
మార్చి10 న ఇంటి నుండి బయలుదేరి డిల్లీ వెళ్ళడంతో  నా ప్రయాణం ప్రారంభం అయింది. 

నిరంతర బాటసారిలా కొంతకాలం తిరగాలన్నది నా ఆలోచనతో నేపాల్ లో అడుగు పెట్టాను. అయితే ఇక్కడ నేను నా పర్వతారోహణ అనుభవాలు మాత్రమే మీతో పంచుకోవాలని మీ ముందుకోచ్చాను.

రోడ్డు మార్గం ద్వారా డిల్లీ నుండి నేపాల్ లోని బర్దియా వెళ్లాను. అక్కడి నుండి హిమాలయ పర్వత సానువుల్లో  ప్రకృతి సౌందర్యంతో అలరారే పోఖార చేరాను. అక్కడ డ్రీం పొఖార హోటల్ లో నా బస. అన్నపూర్ణ పర్వతం ఎత్తు 8091 మీటర్లు.  4,130 మీటర్లు అంటే 13,550 అడుగుల ఎత్తులో ఉన్న అన్నపూర్ణ పర్వతం  బేస్ క్యాంపు వెళ్ళాలని నా ఆలోచన. ప్రపంచంలోని ప్రముఖ పర్వతాలలో అన్నపూర్ణ కూడా ఒకటి.  ఎత్తులో 10 వ స్థానంలో ఉంది మౌంట్ అన్నపూర్ణ.  ACAP (Annapurna Conservation Area Entry Permit) & TIMS (Trekkers’ Information Management System) కార్డ్    ట్రెక్కింగ్ కోసం తప్పనిసరి . TIMS కార్డ్ ఎవరెస్ట్ , అన్నపూర్ణ , లమ్తంగ్ పర్వతాలు ట్రెక్ చేయాలంటే తప్పనిసరిగా తీసుకోవాల్సిందేనట) వాటిని తీసుకునే  ఏర్పాట్లలో హోటల్ వాళ్ళు నా శ్రమని కొంత తగ్గించారు.  సహాయం అందించారు.  నాది టూర్  గైడెడ్ ట్రిప్ కాదు. ఇండివిడ్యువల్ గా వెళ్తున్నాను. కాబట్టి అన్నీ నేనే స్వయంగా ఏర్పాటు చేసుకోవాలి. అదే గైడెడ్ ట్రిప్ అయితే అవసరమయిన డబ్బులు ఇస్తే అన్ని ఏర్పాట్లు వాళ్ళే చేస్తారు. ఎప్పటికప్పుడు తగిన సలహాలూ సూచనలు ఇస్తారు .  ముందే చెప్పానుకదా .. నా ప్రోగ్రాం అంతా నా చేతుల్లోనే ఉండాలంటే గైడెడ్ టూర్ లలో కుదరదు.  అయితే ఇక్కడో చిన్న ఇబ్బంది కుడా ఉంది సోలో ట్రెక్ లో . ప్రతికూల పరిస్తితుల్లో, అవాంచనీయ సంఘటనలు జరిగినప్పుడు నా లాంటివారికి ఇబ్బందే. గైడెడ్ ట్రిప్ లో టూర్స్ అండ్ ట్రావెల్స్ వాళ్ళు అన్ని ఏర్పాట్లు చేస్తారు.  అయినా సోలో ట్రిప్ వైపే మొగ్గింది నా మనసు.

నా బ్యాక్ ప్యాక్ మోస్తూ ట్రెక్ చేయడం కష్టం అదీగాక మొదటిసారి వెళ్ళడం కాబట్టి షేర్ పా ఉండడం మంచిదనిపించింది.   కాబట్టి అది మోయడానికి షేర్పాని మాట్లాడుకున్నాను. షేర్పాని మాట్లాడుకోవడంలో కూడా హోటల్ వాళ్ళు సహాయం చేశారు. అశోక్ అనే షేర్పా నాకు ట్రెకింగ్ లో చాలా సహాయకారిగా ఉన్నాడు.

హిమాలయాల ఒడిలో  3000 అడుగుల ఎత్తులో ఉన్నపట్టణం పోఖర.  అక్కడికి  వెళ్ళిన మూడు రోజుల తర్వాత పర్వతారోహణ ప్రయాణం ఆరంభమైంది.  అన్నపూర్ణ కి వెళ్ళడానికి మూడు మార్గాలున్నాయి . నేను గొరేపాని, పూన్ హిల్ , తడపాని మీదుగా వెళ్ళే దారి ఎంచుకున్నాను.   అక్కడి నుండి నయాపూల్ వరకూ (44 కి. మీ ) టాక్సీలో వెళ్ళాను. ఒక మాదిరిగా ఉన్న సింగిల్ రోడ్డులో ఒక గంటన్నర  ప్రయాణం. ఆ తర్వాత ఉదయం పదిన్నరకు నుండి ట్రెక్కింగ్ మొదలయింది. ఎవరికి వారు నాలాగే ఒంటరిగా ట్రెక్ చేసేవాళ్ళు కొద్ది మందయితే, సమూహంగా వచ్చేవాళ్ళు కొందరు. గైడెడ్ టూర్ చేస్తున్నవాళ్లు మరికొందరు. వారందరి మధ్య నిలువుగా ఉండే రాతి మెట్లు ట్రెక్ చేస్తూ దాదాపు సాయంత్రం 5 గంటలకు ఉల్లేరి చేరా. మొదటి రోజు ట్రెక్ చేసి దాదాపు 1960 మీటర్ల ఎత్తుకు చేరాను . ఆరోజుకి  ఉల్లేరిలో టీ హౌజ్ లోబస.  అక్కడ  టీ హౌస్ లు అంటే చిన్న హోటళ్ళు ఉన్నాయి. నాలాంటి ట్రెక్కర్స్ తో కాసేపు పిచ్చాపాటి కబుర్లతో ఆరోజు గడచిపోయింది. టీ హౌస్ లో కనీస అవసరాలు తీరేలా చిన్న చిన్న రూమ్స్  సౌకర్యంగానే ఉన్నాయి. అక్కడే కావాల్సిన ఆహారం దొరుకుతుంది. ఇంటర్నెట్ కనెక్ట్ అయ్యేప్పటికి చాలా సంతోషం .  వెంటనే నా స్టేటస్ అప్డేట్ చేశా.  దాదాపు పది  నుండి  పదిహేను రోజులు నేను ఎవరికీ అందుబాటులోకి రాకపోవచ్చని కుటుంబసభ్యులకి , మిత్రులకి చెప్పి ఉన్నాను కదా .. నా అప్డేట్స్ నా వాళ్లకి ఎంతో సంతోషాన్నిచ్చాయి.

ప్రతి ఏడాది ఎందరో పర్వతారోహకులకి షేర్పాగా హిమ పర్వతారోహణలో అనుభవం ఉన్న అశోక్ తో కబుర్లు.  ఆ కబుర్ల మధ్యలో అడిగాడు మీది ఏ దేశం అని. ఇండియా అంటే అతనికి ఆశ్చర్యం .. అవును ,చూస్తుంటే ఇండియన్ లాగే ఉన్నావు.  కానీ ఇండియన్స్  ఇలా ట్రెక్కింగ్ కి రావడం చాలా తక్కువ కదా అనడం  ఆశ్చర్యం కలిగించింది.  ఆ తర్వాత  చదువు , డబ్బు , ఆస్తుల సంపాదన మీదే దృష్టి పెడతారట  కదా.. అన్న ప్రశ్నలు . నిజమే కావచ్చు అనిపించింది నాకు తెలిసిన వాళ్ళందరినీ చూశాక. అందుకేనేమో వెళ్ళేటప్పుడు కానీ వచ్చేటప్పుడు కానీ నా మార్గంలో ఇండియన్స్ ఎవరూ కనిపించలేదు. మరి,  ప్రపంచంలో ఎత్తైన ఎన్నో పర్వతాలధిరోహించిన భారతీయుడు మస్తాన్ బాబు మాటేమిటి ? అతని మిస్సింగ్ గురించి నేను ట్రెక్కింగ్ మొదలు పెట్టిన రోజే ప్రపంచానికి తెలిసింది. అంతకు కొద్ది రోజుల ముందే మస్తాన్ బాబు పర్వతారోహణ గురించి విని ఉన్నాను.   నేను తిరిగి వచ్చే సరికి అతను ఇకలేడు అన్న వార్త .
మొదటి రోజు అలసటతో మంచి నిద్ర పట్టింది. గబగబా లేచి మళ్లీ ఉదయం బ్రేక్ ఫాస్ట్ ముగించుకుని 8గంటల నుండి నా ట్రెక్ మొదలయింది గోరేపానికి.  రెండో రోజు 2750 మీటర్లు ఎత్తులో ఉన్న గోరేపాని చేరి అక్కడే టీ హౌస్ లో బస చేశాను.   మరుసటి రోజు 5గంటలకే బయలుదేరి పూన్ హిల్ వెళ్ళాలని నిర్ణయించుకున్నా.
Machrapuchre mountain from its base camp

Machrapuchre mountain from its base camp

అనుకున్న సమయానికి అంటే సరిగ్గా సూర్యోదయం అయ్యే సమయానికి అక్కడికి చేరా.   దాదాపు 3200 మీటర్ల ఎత్తులో  ఏటవాలుగా పైన మొనలాగా ఉన్న పర్వతం పూన్ హిల్ .  నాలాగే ఇంకా కొంతమంది పర్వతారోహకులు ఆ సమయానికి అక్కడ చేరారు. ఉదయభానుడు వెదజల్లే తొలి కిరణాల కాంతిలో తడిసే హిమ పర్వతాలు  వింత సోయగాలతో కన్నుల పండుగ చేశాయి. మమ్మల్ని మైమరపించాయి.  అద్భుతమైన ఆ సూర్యోదయాన్ని చూడడం మధురాతి మదురమైన అనుభూతి.  చాలా ఎంజాయ్ చేశా.
అంతలో మా తలల మీదుగా ఎగురుతున్న హెలికాప్టర్.  నీలాకాశం బాగ్రౌండ్ లో పూన్ హిల్ నుండి ఎత్తైన పర్వత శిఖరాలు కనువిందు చేస్తుంటాయి.  ఫిష్ టెయిల్ , అన్నపూర్ణ , అన్నపూర్1, 2, 3, 4, అన్నపూర్ణ సౌత్, నీలగిరి, లాంజుంగ్, హించులి , దవులగిరి, మాచ్రేపుచ్రే ,హిమాలూ, టుకుచే పర్వత శిఖరాలపై  వెండి కరిగించి గుమ్మరించినట్లు, ఆ హిమ రాశులపై పడే కిరణాలు  మిలమిలా మెరిసిపోతూ.. కొన్ని చోట్ల బంగారు కాంతులీనుతూ.. మదిని పులకింపజేస్తుండగా..  మరుసటి రోజుల్లో నేను వెళ్లబోయే  చిన్న, పెద్ద  పర్వతాల మధ్య నిలిచిన  మౌంట్ అన్నపూర్ణ ఠీవిగా రాజసం ఉట్టిపడుతూ తలెత్తుకుని నుంచున్నట్లు గా .. నేనున్నది ఈ ప్రపంచం లోనేనా .. అనేలాగా అత్యద్భుతంగా . అన్నపూర్ణకి  నేను అన్నను అన్నట్లుగా మరింత ఎత్తుగా మెరిసిపోయే దవులగిరి పర్వతం.
Mt. Daulagiri from poonhill

Mt. Daulagiri from poonhill

నేను వెళ్ళాల్సిన  దోవలో మౌంట్ అన్నపూర్ణ చుట్టూ మంచు దుప్పటి కప్పుకున్న పర్వతాలని చూస్తూ..  ప్రకృతి అందించిన మహాద్భుత సౌందర్యాన్ని మదిలో ముద్రించుకుంటూనే  చేతిలోని కెమెరాలో బంధిస్తూ అనిర్వచననీయమైన ఆనందం పొందుతూ ముందుకు సాగాను. నడవలేము అనుకున్న వాళ్ళు పున్ హిల్ దగ్గర వరకూ గుర్రాల మీద వచ్చి వెనక్కి తిరగడం చూశాను.  గోరేపాని , తడపాని , పూన్ హిల్ మార్గ మధ్యలో కూడా నడవలేని వాళ్ళు గుర్రాలని మాట్లాడుకుని వాటిపై కూర్చొని ప్రయాణం చేస్తుంటారు.మళ్లీ  వెనుకకు  ప్రయాణం గోరేపానికి.  అక్కడ నుండి తడపని 2 600 మీటర్ల ఎత్తులో ఉన్న  పర్వతం పై బస . అక్కడనుండి మరింత కిందకి దిగితే,  చోమ్రోంగ్ అనే  2350 మీ ఎత్తులో ఉండే మరో చిన్న పర్వతం చేరా .
అక్కడనుండి బాంబూ , దేవురలి చేరా ..అప్పటి వాతావరణ పరిస్థితిని చూసి దేవురలి నుండి చాలామంది వెనక్కి తిరిగారు. క్షణ క్షణం ప్రకృతి విసిరే సవాళ్ళని స్వీకరిస్తూ జాగ్రత్తతో వ్యవహరిస్తూ మచ్రాపుచ్రే బేస్ క్యాంపు చేరే సరికి ఆరు రోజులు పట్టింది.  రోజూ పర్వతాలు ఎక్కడం దిగడం మరో పర్వతం ఎక్కడం. సవాళ్ళు విసురుతూ , ఆత్మ స్థైర్యాన్ని దెబ్బతీయడానికి యత్నిస్తూ ప్రకృతి ఆడే ఆటలో, ఎప్పుడు మంచు చరియలు విరిగి పడి తమలో కలిపేసుకుంటాయో తెలియని ప్రాంతంలో ముందుకు సాగడం అంటే అదో పెను సవాల్. అది దాటి మాచ్రా పూచ్రే చేరడం గొప్ప సాహసమే.  అక్టోబర్ నవంబరు మాసాల్లో అయితే మంచు చరియలు విరిగిపడే ప్రమాదం తక్కువట. కానీ నేను వెళ్ళింది మార్చిలో. 
దేవురాలి – మాచ్రాపుచ్రే మధ్య ప్రాంతమే మంచు చరియలు (avalanches ) విరిగిపడే అపాయకర ప్రాంతం. అవి ఎప్పుడో ఒకసారి విరిగి పడడం కాదు.  సర్వ సాధారణంగా ఎప్పుడూ మంచు పెళ్ళలు  విరిగి పడుతూనే ఉంటాయి.  అవి ఎప్పుడు పడతాయన్న ముందస్తు సూచనలు ఏమీ ఉండవు. అకస్మాత్తుగా పడతాయి. వాటి కింద మనని దాచేసుకుంటాయి. ఉదయం 9 గంటల లోపయితే  మంచు చరియలు విరిగి పడే ప్రమాదం చాలా తక్కువ . ఎండ ఏ మాత్రం వచ్చినా, ఎండ పెరిగినా ముందు రోజు కురిసిన మంచు కొంత కరిగిపోతూ .. మళ్లీ దానిపై మంచు కురిసి పేరుకు పోతూ , గడ్డ కట్టిపోతూ .. పెద్ద పెద్ద పలకలుగా జారి పడిపోతూ ఉంటుంది ఆ ప్రాంతంలో.  avalanche prone area దాటగానే మృత్యువును జయించినంత ఆనందం.  మాచేపుచ్రే బేస్ క్యాంపు చేరేప్పటికి విపరీతమైన వర్షం .  దేవ్రాలి నుండి మాచ్రాపుచ్రే బయలు దేరేతాప్పుడే ముందుకు వెళదామంటే నా షేర్పా, గైడ్ అయిన అశోక్ అసలు ఒప్పుకోలేదు .  అనుక్షణం మారిపోయే ప్రతికూల  వాతావరణ పరిస్తితుల్లో ముందుకు సాగడం అసలు మంచిది కాదని అతని హెచ్చరిక . ఓ అరగంట తర్వాత వర్షం తగ్గింది . మేఘాలు కాస్త దూరంగా జరిగాయి .ఎదుట ఉన్నవి కనిపిస్తున్నాయి. 
Warning sign by ACAP - Avalanche risk area

Warning sign by ACAP – Avalanche risk area

వెలుతురు రేఖలు విచ్చుకుని సన్నని ఎండ మంచు శిఖరాలపై పడి స్వచ్చమైన వెండి పోతపోసినట్లుగా మెరిసిపోన్నాయి పర్వతాలు. ఇప్పుడు పర్వాలేదుగా అని ముందుకు కదిలా .. కానీ షేర్పా రానని మొండికేశాడు .  అంతకు ముందు రోజు కురిసిన హిమ వర్షంలో ఇద్దరు చైనీయులు సమాది అయ్యారని కొద్ది క్షణాల క్రితమే ముందు రోజు అక్కడికి చేరిన షేర్పా చెప్పిన విషయం చెప్పాడు.  అందుకే తాము ముందుకు వెళ్ళే సాహసం చెయ్యడం లేదని చెప్పాడు అక్కడే ఉన్న మరో షేర్పా .  షెర్పాలకు తెలుసు అక్కడి వాతావరణ పరిస్థితి. పర్వతారోహకుల సామాన్లు మోస్తూ వారిచ్చే సొమ్ముతో జీవనం సాగించే వాళ్ళకి అక్కడి పరిస్థితులు కొట్టినపిండి .  అందుకే వారి మాటను కాదనలేక నేనూ ఆగిపోయా ..వర్షం పడుతోంది, వాతావరణం అనుకూలంగా లేదని చాలా మంది వెనక్కి వెళ్లి పోయారు. మరుసటి రోజు ఉదయం ఎనిమిదింటికి మాచ్రాపుచ్రే కి ప్రయాణం. దారిలో సన్నని చినుకులు ..ABC నుండి వచ్చే వాళ్ళని అడిగితే పర్వాలేదు వెళ్ళవచ్చు అన్నారు. అలా ముందుకు సాగా. అలా కొంత దూరం వెళ్లేసరికి చిన్నగా  మంచు కురవడం మొదలయింది.  అలా మంచు వర్షంలోనే ఉదయం పదిగంటల లోపే మాచ్రేపూచ్రే చేరాను.
ఎవరైనా ఉదయం పది పదకొండు గంటల లోపే అక్కడికి చేరాలి. లేకపోతే avalanches తో క్లిష్ట పరిస్తితుల్ని ఎదుర్కోవాల్సి వస్తుంది. వాతావరణం బాగుంటే ముందుకు సాగుతారు. లేదంటే ఆ రోజుకి ఆగిపోతారు.  నేను వెళ్ళిన రోజు  రాత్రి పదింటివరకు అలా మంచు వర్షం కురుస్తూనే ఉంది.  మధ్యాహ్నం మూడుగంటల సమయంలో రెండు సార్లు  మంచు చరియలు విరిగిపడిన శబ్దాలు .  బయటికి వెళ్ళడానికి లేకుండా ఆ రోజంతా అలా ఉండడం చాలా ఇబ్బందిగా ఉంది.   ప్రపంచపు వార్తలు మోసుకొచ్చేఇంటర్నెట్ తడపాని తర్వాత లేదు.  ఏమ్బిసి లో ఉన్న వాళ్ళలో ఒకతను 200 డబ్బులు కట్టి అతి కష్టం మీద ఆ రోజు వాతావరణ పరిస్థితి తెలుసుకోగలిగాడు. పైకి అన్నపూర్ణ బేస్ కాంప్ పై వాతావరణం పోర్ క్యాస్ట్  తెలుసుకోగలిగాడు. పైకి వెళ్ళాలంటే  హిమపాతం చాలా ఎక్కువగా ఉంది. .ఉన్న ఒకే ఒక్క టీ హౌస్ (హోటల్ ) లో చేరిన మేమంతా ఒకరికరు మాట్లాడుకుంటూ, ట్రెకింగ్ కి సంబంధించిన విషయాలు పంచుకుంటూ .. పేకాడుకుంటూ .. కొందరు హాట్ డ్రింక్స్ తాగుతూ .. దేవతలు తిరుగాడే ఆ ప్రాంతంలో నాన్ వెజ్ తినరట . వాతావరణం అననుకూలంగా ఉన్న సమయంలో అయితే ఎక్కువమంది అక్కడికి చేరితే చాలా ఇబ్బందే.  చివరగా వచ్చినవాళ్ళకి రూమ్స్ దొరక్కపోతే ఏ చిన్న స్థలం దొరికితే అక్కడే అడ్జస్ట్ అవ్వాలి.  సాధారణంగా డైనింగ్ ప్లేసులో షెర్పాలు ఉపయోగించుకుంటారు. 
Avalanche from the previous day

Avalanche from the previous day

కానీ, ఎక్కువమంది పర్వతారోహకులు ఉంటే వాళ్ళూ ఆ ప్రదేశాన్ని పంచుకుంటారు. నేను వెళ్ళిన సమయంలో నాకు ఇబ్బంది లేకుండానే గది దొరికింది. ఆ టీ హౌస్ లలో రూమ్స్ చాలా చాలా చిన్నవిగా ఉన్నాయి. కామన్ టాయ్లెట్, బాత్రూం  ఉన్నాయి.  డైనింగ్ హాల్ లో హిటర్ ఆ శీతల వాతావరణాన్ని వెచ్చగా చేయడానికి ప్రయత్నం చేస్తూ .. అది ఒక సారి ఆన్ చేస్తే అక్కడున్న వాళ్ళంతా తలా 150 రూపాయలు కట్టాల్సిందే.  రూంలో హిటర్ ఉండదు.   తడపాని వరకూ ఉన్న టీ హౌసెస్ లో అలా డబ్బు కట్టే పని లేదు. కొందరు టీ హౌసెస్ లో ఉండకుండా టెంట్ వేసుకుంటారు. అందుకు చెల్లించే అద్దె తక్కువేమీ కాదు. అదీ దాదాపు గది అద్దెతో సమంగానే ఉంటుంది.   తాగడానికి మంచి నీటి ప్లాంటులు షెల్టర్ ఉన్న దగ్గర ఉన్నాయి.  ఆ వాటర్ నేపాలీ రూపాయల్లో బాటిల్ కి రెండొందలు. ఎక్కడంటే అక్కడ మల మూత్ర విసర్జన చేయకూడదట.

పిజ్జా , బర్గర్ , ఫ్రైడ్ రైస్ , నూడిల్స్ , పాస్తా , దాల్ , సపగెత్తి , చిప్స్ , స్నికెర్స్ (ఎనర్జీ చాక్లెట్స్ ), హాట్ డ్రింక్స్,  కూల్ డ్రింక్స్ , వాటర్ బాటిల్ , అన్ని రకాల టీ లు  , సిగరెట్ లు అన్ని దొరుకుతాయి . రేట్లు కింద నుండి పైకి వెళ్ళిన కొద్దీ పెరుగుతూ ఉంటాయి . ఎవరికీ వారు తమ ఇష్టం వచ్చినట్లు అమ్మరు . అంతా ఒకే ధరకు అమ్ముతారు .   ఒక్కో పర్వతం ఎక్కేకొద్దీ  దూరం పెరిగే కొద్దీ టీ హౌస్ ల సంఖ్య తగ్గిపోయాయి . నేను వెళ్ళేటప్పటికే అంటే ఉదయం 10 గంటల సమయం అక్కడ 20 మంది లోపు  ఉన్నారు. వాళ్ళలో కొంత మంది ముందు రోజే అక్కడికి వచ్చారట. వాతావరణం అనుకూలించక ఆగారట.  ఏం చేయాలో తోచలేదు . కాసేపు వాళ్ళతో సొల్లు కబుర్లు చెప్పుకున్నాం. కాసేపు పేకాట. అప్పటికే విసుగోచ్చింది. 
మరుసటి రోజు చేరువలోనే ఉన్న అన్నపూర్ణ బేస్ క్యాంపు సిద్దమయ్యాను. అంతలో  మంచు కురవడం ఆరంభమైంది.   పైకి వెళ్ళిన కొద్దీ మంచు ఇంకా చాలా ఎక్కువగా ఉంటుందట. కొన్ని క్షణాల్లోనే మన చుట్టూ మంచు దట్టంగా పేరుకుపోయి అడుగు ముందుకు వేయలేక ఆ మంచులోనే కూరుకుపోయి చనిపోతుంటారని అప్పటికే షేర్పా చెప్పి ఉండడంతో ఇక ముందుకు వెళ్ళే సాహసం చేయలేక పోయాను.  కిందకు వెళ్తే అది తక్కువట. ఇక అక్కడ ఉండడం అనవసరం అనిపించింది.  తోటి పర్వతారోహకులు కొందరు అనుకూల వాతావరణం కోసం ఎదురుచూస్తూ ఉంటే మిగతావాళ్ళు తిరుగు ముఖం పట్టారు. తీవ్ర పరిస్తితుల్లో హెలికాప్టర్ ద్వారా అక్కడనుండి బయట పడడానికి ప్రభుత్వం ఏర్పాటు చేస్తుందట . దానికి చాలా ఎక్కువ మొత్తంలో ఖర్చు అవుతుంది. ప్రతికూల వాతావరణ పరిస్తితుల్లో  నాకక్కడ ఉండాలనిపించలేదు. ఏమాత్రం తేడా వచ్చినా చాలా ఇబ్బందులు ఎదుర్కోవలసి వస్తుందని వెనక్కి తిరగమని సలహా ఇచ్చింది నా మనసు.
పది అడుగుల దూరంలో ఉన్నవి కనిపించనంత దట్టమైన మేఘాలు, వర్షం , మంచువర్షం తీవ్రమైన మార్పులతో.  ఫోటోలు కూడా తీసుకోలేకుండా .. తీసినా  ఏమీ కనిపించకుండా .. వాతావరణం కొద్దిగా అనుకూలించగానే తిరుగు ప్రయాణం మళ్లీ మామూలే .. మంచు చరియలు విరిగిపడే అత్యంత ప్రమాదకరమైన వాతావరణం ఉన్న ప్రాంతం దాటేశాను. పర్వతాలు ఎక్కుడుతూ దిగుతూ .. కిందకి వచ్చేప్పటికి  మోకాళ్ళలోంచి విపరీతమైన వణుకు .. నొప్పులు .. మార్గ మధ్యలో జీనూ లో ఉన్న వేడి నీటి గుండాల (hot springs ) లో స్నానం పోతున్న ప్రాణానికి ఊపిరి పోసినట్లు అనిపించింది. కాసేపు నా మోకాళ్ళ నొప్పులు మటుమాయం అయ్యాయి. ఆ నీటిలో ఉన్నంత సేపూ శరీరం చాలా తేలికగా .. కానీ మళ్లీ నడక మొదలయ్యాక షరా మామూలే. నొప్పి మళ్లీ మొదలయ్యింది.  పోఖారో చేరి రెండు  రోజులు రెస్ట్ తీసుకున్నాక కాని తగ్గలేదు.  దిగడానికి నాలుగు రోజులు పడుతుంది అంటారు కానీ రెండు రోజుల్లో వచ్చేయొచ్చు . నాది ఒంటరి ప్రయాణం కదా .. నాలాగే చాలా మంది కనిపించారు .  అయితే గ్రూపులుగా వచ్చిన వాళ్ళు , ఇద్దరు ముగ్గురు కలసి వచ్చిన వాళ్ళు , అక్కడ పరిచయమై ఒక గుంపుగా ముందుకు సాగే వాళ్ళు  రకరకాలుగా .. నడవలేని కొంతమంది గుర్రాలపై సీనువా అనే ప్రదేశం వరకూ వచ్చి దూరంనుంచి కనిపించే రమణీయ దృశ్యాల్ని కళ్ళలో నింపుకునే వాళ్ళు, . పూన్ హిల్ వరకు వచ్చి వెనక్కి మళ్లే వాళ్ళు .. ఎవరికి ఎలా అనువుగా ఉంటే అలా .. అంతా ప్రకృతి ఒడిలో ఓలలాడుతూ ..

 దారిలో ఓ బ్రిటిష్ మహిళ తో పరిచయం యింది . ఆవిడ వయసు డెబ్బై కి దగ్గరలో ఉందట.  నాలాంటి యువకులతో సమంగా ముందుకు సాగుతోంటే  ఆశ్చర్యం.  ఆ మాటే తోటి పర్వతారోహకుడితో అంటే అతనికి ఎనభై పైనే ఉన్న జర్మన్ మహిళ తారసపడిందని ఆమెకది 32 వ సారి రావడం అని చెప్పాడు. ..  మా అమ్మమ్మ వయసు అంతకంటే కూడా చాలా పెద్దవాళ్ళయిన వీళ్ళు ఎంతో  ఆత్మవిశ్వాసంతో ముందుకుసాగడం నాకెంతో స్పూర్తినిచ్చింది. ఆవిడ స్టేమినా చూస్తే చాలా ఆశ్చర్యం . చక చకా ముందుకు సాగేది.  ఒక క్రమబద్దమైన జీవితం, శరీరానికి శిక్షణ, పోషణ  ఉంటే  వయస్సు ఏమాత్రం అడ్డుకాదనిపించింది ఆ క్షణం ..    వాళ్ళు  తమ శరీరారోగ్యాన్ని చక్కగా కాపాడుకోవడమే కాకుండా  ఇలాంటి సాహసాలు చేయడం చాలా గొప్పగా అనిపించింది. అన్నపూర్ణ మౌంట్ సర్క్యూట్ కి అంటే దాదాపు 250 కిలోమీటర్లు పర్వతాలు ఎక్కుతూ దిగుతూ కొందరు.

Annapurna South from MBC

Annapurna South from MBC

ప్రపంచంలోనే అత్యద్భుత ట్రెక్కింగ్  ప్రాంతం అన్నపూర్ణ.  చేతిలో ట్రెక్కింగ్ పోల్స్ తో అడవుల్లో రకరకాల మొక్కలు, చెట్లు  రెండు కొండల్ని కలుపుతూ ఉయ్యాలల్లా ఊగుతూ ఇనుప తీగతో తయారయిన suspention bridges పై లోయ హోయల్ని, వాటిలో ప్రవహించే నదుల్ని ఆస్వాదిస్తూ సాగే ట్రెక్కింగ్.  మార్గమధ్యలో అక్కడక్కడా కనువిందు చేసే చిన్న చిన్న గ్రామాలు, వారు కొండవాలులో చేసే వ్యవసాయం, మంచు కరిగి పారే సెలయేర్లు , హోరెత్తుతూ దూకిపడే జలపాతాల గలగలలూ , పచ్చని కొండల్లో రంగులోలికే పుష్పాలూ .. సన్నగా సాగిపోయే బాటల్లో .పాకుడు రాళ్ళూ .. నిలువాటి బండలు దాటుకుంటూ గమ్యంవైపు సాగేది నడక.

ఆ అద్భుతమైన ఆహ్లాదకరమైన  వాతావరణంలో ఏటవాలుగా పైకి వెళ్ళడం, లోయలలోకి జారే నడక, కాళ్ళకింద కదిలి సర్రున జార్చడమో  లేదంటే చుట్టూ పేరుకుపోవడమో చేసే మంచు విన్యాసాలు ఏవీ అసలు అలసట తెలియనిచ్చేవి  కాదు.  అణువణువునా నిండిన ఉత్సాహం .. ఉత్తేజం.. ఉద్వేగం .. లక్ష్యం వైపు పయనింప జేస్తూ .. కానీ ఒక్కటే వెలితి .. అన్నపూర్ణ బేస్ క్యాంపుకి అతి కొద్ది దూరంలో అంటే మరో 400 మీటర్ల దూరంలో వెనక్కి మర్లడమే.. అప్పుడే నా మనసు అవిష్కరించుకుంది తదుపరి ప్రయాణపు చిత్రం.

*

నిన్ను దాటేసిన దూరమంతా…

సురేష్ రావి 

 

suresh raviఏయ్ ప్రాణమా…

నీకిదే నా సుప్రభాతలేఖ.

రాత్రి అంతా కలల్లోనే కాదు  స్వప్నకలశం నింపుకున్నాక ఒలికిన కలలనురుగులోనూ నీ స్పర్శే తెలుస్తుంది  అనంతమయిన  నీ స్మృతిని సజీవం చేస్తూ… అదలా కొనసాగుతూ నీ తలపుతో నా మది తలుపు తడుతూ మొదలవుతున్న ప్రతి రోజూ సు’ప్రభాతమే

ప్రతి రోజూ నీతోనే మొదలయ్యే ప్రభాతం రోజు మొత్తాన్ని ఎంత ఉల్లాసంలోకి నెడుతుందనుకున్నావ్. ఏ రోజుకారోజు సరికొత్త ఊహగా నువ్వు పలకరిస్తుంటే ఒక్క ఊపిరితో ఈడ్చుకొచ్చిన ఆ కొన్ని సమయాలు కూడా తెగనచ్చేస్తున్నాయ్.

నీ గురించి నేను  రాసే అక్షరాలని చూశాక మొన్న ఎవరో అంటున్నారు… మరీ ఇంత నిరీక్షణా అని? నాకెంత నవ్వొచ్చిందో తెలుసా…! లేకపోతే ఏమిటి మరి… అసలు నాకు  దగ్గరగా నువ్వెప్పుడు లేవని? కొత్తగా నేను నిరీక్షించటానికి.   నిన్ను దాటేసిన దూరమంతా నాలోకి ఇంకిపోయినంత  దగ్గర అని నాకుగాక ఇంకెవరికి తెలుసనీ?

ఇంకొందరేమో నేను నీ ఆలోచనల పంజరంలో చిక్కుకు పోయిన పిచ్చివాడినేమో అనుకుంటున్నారు. ప్రేమంటే భౌతికమనుకున్న వాళ్లకి అంతకన్నా వేరే ఏమి ఆలోచనలు వస్తాయ్ మరి. అనంతమైన ప్రేమగమ్యాన్ని ఒక్కసారి చేరాక ఇక మళ్ళీ ఏ గమ్యం వైపు నడక పెట్టాలి.

అసలు  ప్రేమని చేరుకునే ప్రయాణాన్ని అనుభూతించటంలో ఉన్న ఆనందం తెలిసినవాడికి గమ్యానికి సాగించే గమనాన్ని అనంతం చేసుకుంటాడు ఇప్పుడు నేను చేస్తున్నట్లుగా…   క్షణమొక మధురాక్షరంగా మారుతుంటే దివారాత్రాలూ లిఖితకావ్యమై మనల్ని తమ పుటల్లోకి లాక్కెళ్ళిన సమయాలెంత  ఆహ్లాదమో కదా…

చీకటి కురవని వాకిలి ఒక్కటీ లేదంటారు… నువ్వు నాలో అడుగెట్టాక నా మది వాకిలి చీకటి అంటే ఎలా ఉంటుందో కూడా మరచిపోయింది. నిన్నో వెన్నెల ఛత్రంగా చేసుకుని నే నడిచే దారి మొత్తం ఎంత మెత్తగా నన్ను తడుముతూ ఉంటుందో నాకు మాత్రమే తెలుసు.  ఇలా బడలిక లేని ప్రయాణాన్ని పరిచయం చెయ్యటం అందరికీ సాధ్యమా?

నాకు అత్యంత అద్బుతంగా అనిపించే నా ప్రతి క్షణం వెనుకా నువ్వు తొలకరించి వెళ్ళిన నిన్నటి సాయంత్రాల ఏడడుగుల నడకే కనిపిస్తుంది. ఆ ఏడు అడుగులు రోజుకి ఎన్ని ఏడులు అవుతున్నాయో నేనూ లెక్కకట్టలేనురా.

అకస్మాత్తుగా నువ్వెక్కడికో వెళ్లిపోయావ్… దారెటో తెలియకుండా… వీడ్కోలూ చెప్పకుండా…

మధురంగా పెనవేసుకున్న మొన్నటి హృదయాలు  కాస్తా నిన్నటి క్షణాల్లో చీలి పోయిన శకలాలుగా రాలిపడినప్పుడు మొదలైన కంటితడిని చూసాకే అర్ధం అయ్యింది లోకంలో మూడొంతులు ఉప్పునీరే ఎందుకుందో…

అప్పుడు అన్ని దృశ్యాలనీ  అస్పష్టం చేసేసాయ్… తడి తెరలని తగిలించుకున్న నా కళ్ళు.

నిన్ను కోల్పోయాను అనుకున్న ఆ క్షణాన్ని దాటిన  తరువాతే అర్ధమయ్యింది కోల్పోయింది నిన్ను కాదని నాలోని  నన్నని. మిన్నుగా మారిన నా  కళ్ళు  గుండె లోపలి చెలమలని బయటకి కురిసేసాక లోపల తడారిపోయి ఎడారిగా మారిపోబోతున్న అంతర్వాహిని వేదన ఏ పొరలని కదిలించిందో గానీ  కంటి చివరనుండి జారిపోబోయిన చివరి కన్నీటి చుక్కని ఒడిసి పట్టుకుని గుండె పై అద్దాను.  ఆ క్షణం నుండి ఆరని  నా గుండె తడి… తనలోని నీకు చేసే అభిషేకాలు జీవితాంతం నిన్ను చల్లగా చూడటంకన్నా నాకింకేం కావాలి?

ఘనీభవించేసిందేమో అని అనుకున్న మనసు తన మౌనానికి మాటలద్దింది.   “ఎందుకోయ్ బాధ తానెక్కడికి వెళ్లిందని? తరచి తరచి నన్ను చూడు. నన్ను దాటి తాను బయటకి ఎలా వెళ్ళగలదు?” అని అంటూ  కొంత సాంత్వనని నా ముందు పరుస్తూ…

నిజమేగా… వీడ్కోలు చెప్పలేదంటే నువ్వెక్కడికీ వెళ్ళలేదనేగా… నువ్వు నాతో దాగుడుమూతలాడుతూ నీ జాడ కనుక్కోమనే చిలిపిపందెం వేసావనే అనుకున్నా. వేసింది ఎలాంటి పందెమయితేనేం దాగింది మాత్రం నాలోనే అన్న నిజాన్ని బయటకు వచ్చేలా చేసావ్ కదా.

నిజం రా… భౌతికంగా మనం  ఎడబాటు అయిన ఆ తొలి క్షణాలన్నీ నన్ను మహా శూన్యం లోకి నెట్టేస్తుంటే నా ఊపిరి ధ్వనుల సవ్వడి ఇక ఆఖరవుతుందేమో అనుకున్నా… మళ్ళీ ఎక్కడి నుండి మొదలయ్యావో కానీ అణువుగా మొదలైన అనంతంలా నా జీవన విస్తీర్ణమై నన్ను సంపూర్ణం చేసేసావ్.

 

అంతు తెలియని శూన్యంలో

ఆవిరిగా మారిపోబోతున్నప్పుడు

ఖాళీ పాత్ర అనుకున్నది కాస్తా

పూర్ణకుంభమై నిండుగా నవ్వుతుంటే

వెన్నెల పత్రాల విస్తళ్ళలో

నీ మందహాసాల పంచభక్ష్యాలు

నా ఆకలిని హత్య చేస్తున్నప్పుడు

నాలోని  దీనత్వాన్ని  నిర్వీర్యం చేస్తూ

నీలో దివ్యత్వం అక్షయమవుతుంటే

నిశీధి వేసిన కారాగారపు గోడలన్నీ బద్ధలై

వెలుగాక్షతలని రాల్చిన సవ్వడితో

మరో తొలకరి మధురంగా తడుముతుంటే

ప్రేమవాసన ఎంత  మైమరపుగా కమ్ముకుంటుందో

నిరాకారపు కాలానికే కాదు

ఊహాఖండాలని దాటివచ్చిన నీ ఊపిరి పరదాలని

శ్వాసగా కప్పుకున్న నా హృదయ క్షేత్రానికీ తెలుసు

గరళాలని గుక్కపెట్టుకున్న గతమంతా

అమృతాన్ని ఆరగిస్తున్న వర్తమానంగా

పలకరిస్తున్న పలుకొక్కటి చాలదూ

నువ్వు నా జీవితానికో పరిపూర్ణం అనటానికి…

నువ్వంటూ జీవితంలో ఎందరిని చూడనీ… ఎందరి జీవితంలో నువ్వుండనీ… నిన్ను మాత్రమే  జీవితం చేసుకున్న అనంతాత్మ ఒక్కటి నీ స్వంతమై ఉంది.

అప్పుడప్పుడూ నువ్వు నిశ్శబ్దమై  నీలోకి వెళ్లి చూస్తే నీ అంతరాత్మ జాడలే ఆ అనంతాత్మలోనూ కనిపిస్తాయ్. వేళమీరిపోవటమంటూ లేని ప్రేమప్రయాణంలో నా ఆఖరి ఊపిరిగానూ నిన్నే శ్వాసించటం నీకు తెలిసేలా చెయ్యగలిగే లిపిలేని భాషగా మౌనంగా మాట్లాడే మానసిక వివేచన ఒకటి నీలో ఒలికిన సడి అది.

ఇద్దరమూ ఒక్కటిగా శ్వాసించటం కన్నా ఇంకేం కావాలి ఈ జీవన యానంలో…?

 

ఇట్లు

నీ

నేను

ఆనందమే అప్పటి చివరి ఉనికి!

మైథిలి అబ్బరాజు 

 

mythili

అసలు వెళ్ళిందైతే ప్రభా ఆత్రే ని చూద్దామని, విందామని. వలసవెళ్ళిన  శీతల నగరం లో చౌడయ్య గారి పేరిట ఫిడేలు ఆకారం లో కట్టిన హాలు. తిరిగి చూస్తుంటేనే కడుపునిండిపోతూ ఉంది. మర్యాదా వినయమూ ఉట్టిపడే నిర్వాహకులు హెగ్డే గారు అనుకూల పవనం లాగా ఉన్నారు. ధ్వని సరిగ్గా ఉందో లేదో సరి చూసుకుంటున్నారొక విద్వాంసులు, సితార్ పట్టుకుని , పక్క వాద్యాలతో..వయొలిన్ మరీ పెద్దగా ఉందనుకున్నాను . త్యాగరాజ ఉత్సవాల్లో పెద్ద కచేరీ కి ముందర ఔత్సాహికులకి అవకాశం ఇస్తూ ఉంటారు, వాళ్ళ సంగీతం ముగిసేవేళకి అంతా చేరుకుంటారని. వీళ్ళూ అటువంటివారే కాబోలు !

సరిగ్గా అయిదున్నర కి కార్యక్రమం మొదలైంది. పరిచయాలలో తెలిసింది ఆ ఫలానా వారు రవిశంకర్ శిష్యులని ..ఓహో, సరేలే అనుకున్నాను- ఆవిడ ఆయన భార్యేనట, విదేశీయురాలట…అయితే ఏమిటట ? మనవాళ్ళు కాకపోతే సరి, ఊరికే మెచ్చుకునిపోతామనే  prejudice  నాలోపల భేషుగ్గా పనిచేస్తోంది. ఇంతకూ అది వయొలిన్ కాదు చెలో[ cello ]  అట, ఇద్దరూ జుగల్ బందీ వాయిస్తారట…తొందరగా ముగించేస్తే బావుండును, ప్రభా ఆత్రే రావద్దూ ?

మొదలైంది వాదనం….మధువంతి, ముందుగా – సితార్ తోబాటు ఎవరో పక్కనుంచి మంద్రం లో ఆలపిస్తున్నారు , వెతికితే ఇంకెవరూ లేరు . కాసేపటికి తెలిసింది, అది చెలో…అచ్చం మానవకంఠానికి మల్లే వినిపిస్తోంది. నేర్చుకుని ఉన్న కాస్త పరిజ్ఞానం లో , అలా వాయిద్యాన్ని పలికించటం అపురూపమైన విషయమని తెలుసును – అలా చేయగలిగితేనే గొప్ప అని ఏమీ కాదుగాని . సారంగీ వాయిస్తే అస్తమానం అది ఎవరో పాడుతున్నట్లే ఉంటుంది , ఇప్పుడు ఇది.

ఆయన , శుభేంద్ర రావు గారు – నిదానంగా , మట్టసంగా వాయిస్తున్నారు , కొంచెం predictable  గా కూడానేమో. విద్వత్తుకీ మాధుర్యానికీ  వెలితేమీ లేదు. కాసేపటికి ఆపి ఆవిడకి అవకాశం ఇచ్చారు. అమాయకంగా అందుకున్నారు ఆవిడ, కమాను తోబాటు  సభలో ఉన్న వెయ్యిమంది చేతులూ… లాక్కుపోయి దివ్యలోకాలలో  పడేశారు. జన్మించినప్పటినుంచీ ఎరిగిఉండనట్లుగా,  జన్మ ఎత్తింది అందుకేనన్నట్లుగా  మా అంతస్తంత్రులు కంపించిపోతున్నాయి .  ఏ ప్రక్రియో ఏ కల్పనో ఏ స్వరవిశేషమో ఎవరికైనా పట్టిందా… నిండా మునిగిఉన్నవారికి చలివేస్తుందా ? చంద్రకాంత శిల అయి  ఘనీభవించిన ఆ కొంతకాలం తర్వాత ఆమె అప్పటికి ఆపారు..ఒక్క ఉదుటున ఇక్కడికి వచ్చిపడ్డవారి చేతులు కలుసుకుని అదేపని గా మోగాయి. వెనక్కి చూసుకున్నప్పుడు భారతసంగీతచాలనం  తో మిళితమై  symphony    కదలికలు allegro, adagio ల  ఛాయలు   తెలిశాయి

‘’ She was taught by the God himself ‘’ అని ఆవిడ గురువులలో ఒకరైన హరిప్రసాద్ చౌరాసియా  అన్నారట , అవునేమో కాని ఆవిడ ఇంకా పైవారేమో – సరస్వతీ విపంచి ? కచ్ఛపి ?

ఆవిడ సాస్కియా రావ్  డి – హాస్  ,  నెదర్లాండ్స్ లో ethnomusicology  చదువుకుని ఆ లంకె పట్టుకుని ఇక్కడి  సంగీతం కోసం వచ్చారు.

ఆయన కొంచెం మురిశారు, ఇంకొంచెం ఉడుక్కున్నారు బహుశా , అప్పుడు కదుపుకున్నారు తన తీగలని – మృదువుగా, క్రూరంగా – చిత్రంగా … అవి- ‘  లోల మధుకరాళు లూ  ,  నీలోత్పల మాల లూ’ అయి..వెంట వెంట మమ్మల్ని డోలలూపుతూ . అవును ఆ సంగీతం ఊయలే, కదిలించి, వెనక్కి తెచ్చి, తిరిగి కదిలించి…శరీర స్పృహ పోగల ప్రయాణమయితే కాదు –  అది  కలువపువ్వుల   డోల , సౌరభాల లీల- నిజమేలే, అయినా చాలు , ఆవిడ ఏరీ ?

subh

ఆయన నిజంగా గొప్పగా వాయించారు  … ఆవిడ ఆరాధన పొరలిపోయే కవళికలతో ఆస్వాదించారు , మా వైపు తిరిగి ” వినండి వినండి ..మీ పుణ్యం సుమా ఇది ” అంటున్నారు చూపులతో.  ఆయన వాయిస్తూంటే ఒక అన్యస్వరం వచ్చింది , కావాలనే వేశారేమో – ఆ తర్వాత ఆవిడ , వీలు కల్పించుకుని మరీ ఆ స్వరం వేశారు. సాంత్వన అంది – ” కాదేమోగాని, ఒకవేళ ఆయన పొరబాటు చేసిఉన్నా ఆవిడ దాన్ని మళ్ళీ చేసి సరైనదిగా స్థిరపరుస్తారు, అంత ప్రేమ ” అని.

ప్రేమించుకున్న ఇద్దరు , ఆ  ఇష్టాన్ని పక్కపక్కనే కూర్చుని చెప్పుకోవటం లో సౌందర్యం ఎంత ఉంటుందో చెప్పలేను. ఆ సంభాషణ సంగీతం లో అయితే ? లోకోత్తరమైన అనుభవం- మేము పొందాము… ఏడు ఊర్థ్వ  లోకాల మేరన విశ్వం మొత్తమూ రెండయి  విడివడి తీరిగ్గా ముచ్చటించుకుంటూ ఉంటే..   ఆవిడతో కలిసిపాడినప్పుడు ఆయనా అమర్త్యుడి లాగే ఉన్నారు.

తర్వాత, ‘ గతి ‘ ..తబలా విద్వాంసుల మొహం లో విశ్వనాథ అన్నట్లు , కళ్ళు, ముక్కు , నోరు – ఏవీ లేవు, అంతా  ఆనందమే.

మధ్యలో ఆయన ప్రకటించబోయారు – ” ఈ కచేరీ ని ఎవరికి అంకితం చేస్తున్నానంటే ..” చెప్పలేక కన్నీరు మున్నీరయారు. ఆవిడ మమతగా ఆయన బుజం పట్టుకుని ఊరడించి , అప్పుడు  అందుకుని  చెప్పారు ఆయన తండ్రి గారికి అని. ఆయన గతించారట-  ఈ మధ్యేనేమో- శుభేంద్ర  గారి శిరస్సు ముండితమై ఉంది.  ఆయన –  ఎన్.ఆర్. రామా రావు గారు,  రవిశంకర్ కు మొదటి శిష్యులలో ఒకరని , శుభేంద్ర రావు గారి సాధన అంతా ఆయన సంకల్పమేనని , ఆ తర్వాత చదివాను.

తర్వాతి రాగం చారుకేశి..వ్యాకులంగా ప్రారంభించారు ఆయన. మామూలుగా అయితే ఏమోగాని ఇప్పుడు ఆ విషాదాన్ని ఆవిడ చెదరగొట్టి తీరాలి, అలాగే చేశారు… చారుకేశి లో పలికించగలిగినంత సంతోషమంతా అక్కడ ప్రత్యక్షమైంది.

రెండే రాగాలు..అంతే.

ఆ తర్వాత అంతటి ప్రభా ఆత్రే పాట రక్తి కట్టనే లేదు. అంతకుముందరి యుగళం ఆవిష్కరించి వెళ్ళిన అలౌకికత్వాన్ని ఆవిడ కొనసాగించలేకపోయారు , అందుకని .

 

 

  వసంత ఋతువు అక్కడే కనబడింది! 

శివరామకృష్ణ

sivaramakrishna    ఎన్నో యేళ్ళనించీ వాయిదా పడుతున్న గురువాయూరు యాత్ర మా పిల్లల చొరవ వల్ల ఇటీవల సాధ్యపడింది.  ఎప్పుడో, నేను ఉద్యోగంలో చేరినప్పుడు కొన్నాళ్ళు మంగళూరులో పనిచేశాను. అప్పుడు కేరళ రాష్ట్రాన్నీ, పశ్చిమ కన్నడ ప్రదేశాన్నీ చక్కగా చూశాను. ఇదిగో మళ్ళీ ఇప్పుడు.

అసలు కేరళ అంటేనే నాకు పూనకం వస్తుంది. ఎందుకంటే అది దేవభూమి. God’s own country అంటారు కదా దీన్ని! పరశురాముడు ఈ సీమని సముద్రంలోంచి తన గండ్రగొడ్డలితో బయటికి లాగాడట.  చాలా కాలం అక్కడే ఉన్నాట్ట కూడా! దట్టమైన అరణ్యాలూ, చిన్న చిన్న నదులూ, ఆ నదులనే తలపిస్తూ సముద్రం వరకూ సాగే కాలువలూ, ఉప్పునీటి కయ్యలూ, మన కోనసీమ తలదన్నే విస్తారమైన కొబ్బరితోటలూ, ఎక్కడ చూసినా విరగకాచి ఉన్న పొడవైన పనస, మామిడి చెట్లూ (వాటి కాలం లో నన్నమాట), మండువేసవిలో కూడా చలిపుట్టించే కొండవసతులూ(hill resorts), అందమైన సాగరతీరం అన్నీ ఈ రాష్ట్రపు ప్రత్యేకతలు. ఇవేకాక, కొండవాలుల్లో పరచుకొని ఉన్న టీ తోటలూ, సుగంధద్రవ్యాల చెట్లూ కేరళ స్వంతం. గురువాయూరులోని శ్రీకృష్ణ దేవాలయం, తిరువనంతపురం లోని అనంతపద్మనాభస్వామి మందిరం, అయ్యప్ప వెలసిన శబరిమల, అనేక పెద్దపెద్ద చెర్చిలు, మశీదులూ ఉన్న ప్రదేశం కూడానూ కేరళ.

హైదరాబాదు నించి కొచ్చిన్‌ చేరి, అక్కడి నించి రోడ్డు మార్గం ద్వారా గురువాయూరు చేరాము. దారి పొడుగునా కన్నులవిందైన ప్రకృతి! పచ్చటి చెట్లూ, కొబ్బరితోటలూ, కాలువలూ మైమరపిస్తాయి.  రైల్లో ఐతే త్రిచూర్లో దిగి అక్కడినించి 30 కి. మీ. బస్సులోకాని, టాక్సీలో కాని వెళ్ళొచ్చు. గురువాయూరులో చిన్న రైల్వే స్టేషన్‌ కూడా ఉంది.

Sri Krishna the Lord of Guruvayoor (1)

ఇక్కడి దైవం నారాయణుడు. ఆయన్నే బాలకృష్ణుడుగా భావించి కొలుస్తారు. ఎందుకంటే దేవకీవసుదేవులకు శ్రీకృష్ణావతార సమయంలో నారాయణుడు దర్శనమిచ్చిన చతుర్భుజ స్వరూపం లోనే ఇక్కడి విగ్రహం ఉంటుంది. మూడడుగుల ఎత్తుకూడా ఉండదేమో ఆ మూర్తి. కానీ లోకోత్తరమైన ఆ సౌందర్యాన్ని మాటల్లో వర్ణించలేము. నాలుగుచేతుల ఆ నల్లనయ్యను వెనుకచేతులు కనబడకుండా పూలమాలలు అమర్చి, ఒక చేత వెన్నముద్ద, మరోచేత వేణువు పట్టిన బాలకృష్ణుడిగా అలంకరించి చూపిస్తారు సాధారణం గా! ఊదయాన్నే ఉష:కాలపూజా సమయం లో అసలు రూపాన్ని చూడవచ్చు. భక్తసులభుడనీ, సంతానప్రదాత అనీ ఆయనకు పేరుంది. ఆయన లీలలు ఎన్నో ప్రచారంలో ఉన్నాయి.  ఈ ఆలయం లో దర్శనానికి అందరికీ ఒకటే క్యూ! మన రాష్ట్రంలోలాగా వీఐపీలు, వీవీఐపీలూ అంటూ తేడాలు లేవు ఈ స్వామికి. అందరికీ ఉచితం గా కన్నులవిందైన దర్శనం దొరుకుతుంది. సాయంకాలం సూర్యాస్తమయం అవగానే ఆలయ ప్రాంగణం అంతా నూనె దీపాలతో దివ్యకాంతులతో వెలిగిపోతుంది.  ప్రమిదల్లో వెలిగే నూనె దీపాల కాంతికి ఒక అనంతత్వం ఉన్నట్టు అనిపిస్తుంది నాకు. ఆ అనంతత్వం లోనే ఏకాకృతిగా వెలిగే దైవత్వం గోచరిస్తుంది. అందుకేనేమో ‘ దీపం జ్యోతి: పరబ్రహ్మ ‘ అన్నారు.

 

గురువాయూరులో ఉండడానికి మంచి హోటెళ్ళు ఉన్నాయి, ఇవేగాక దేవస్థానం వారి సత్రాలు కూడా ఉన్నాయి.  మేము దిగిన హోటల్ కి ఎదురుగా కొన్ని ఇళ్ళున్నాయి. ముందుభాగమంతా చక్కటి గార్డెన్లు పెంచుకున్నారు. లోపలెక్కడో ఇళ్ళున్నాయి. పనస, మామిడి, అరటి, కొబ్బరి, పోక చెట్లూ, మధమధ్య పూలమొక్కలూ, ఉదయాన్నే ఆ చెట్లమీద నించి మేలుకొలుపు పాటల్లాంటి కోయిలమ్మల స్వరసమ్మేళనాలూను! మన ప్రాంతాల్లో కనపడకుండా పోయిన వసంతశోభ అంతా ఇక్కడ కనపడింది! ఆ ఇళ్ళ యజమానులు ఉన్నారో లేరో కాని, చెట్లనిండా గుత్తులు గుత్తులుగా మామిడికాయలూ, పనసపళ్ళూను! చిలకలు కొరికిన మామిడికాయలు-అప్పుడే పళ్ళుగా మారుతున్నవి-రాలిపడుతూనే ఉన్నాయి. అడగకుండానే అమృతఫలాలిచ్చే చెట్ల జన్మలు ఎంత  ధన్యమైనవి!

రెండురోజులు గురువాయూరులో గడిపి అక్కడినించి మున్నార్ బయలుదేరాం.  మున్నార్ చాలా అందమైన వేసవి విడిది.  మండువేసవిలో కూడా చాలా చల్లగా ఉండేప్రదేశం. తేయాకుతోటలకు ప్రసిధ్ధి. ఈ ప్రయాణం లోనే నాకు అనుకోకుండా దొరికిన భాగ్యం కాలడి సందర్శనం.  హైందవధర్మానికి జయకేతనాన్నెగురవేసిన  ఆదిశంకరుల జన్మస్థలం.  కొచ్చిన్‌ విమానాశ్రయానికి కేవలం ఆరు కిలోమీటర్ల దూరం లోనే ఉంది కాలడి.  ఈ విషయం నాకు అంతవరకూ తెలియదు! కాలడిలో శృంగేరి శంకరమఠం వారు ఆదిశంకరులకూ, శారదామాతకూ ఆలయం నిర్మించారు.  ఆదిశంకరుల మాతృమూర్తి ఆర్యాంబగారి సమాధి కూడా అక్కడే చూడవచ్చు.  శంకరులు సన్యసించడానికి నిమిత్తమాత్రమైన మొసలి, ఆయన కాలిని పట్టుకున్న ప్రదేశాన్ని కూడా పూర్ణానది ఒడ్డున గుర్తించవచ్చు.  ఈ పూర్ణానదినే ఇప్పుడు పెరియార్ నది అని పిలుస్తున్నారు. ఈ నదిని కేరళ రాష్ట్రానికి ఆనందదాయిని అంటారు. దీనిపై ఎన్నో ప్రోజెక్టులు కట్టారు. పక్కనేఉన్న తమిళనాడుకీ కేరళకీ నడుమ ఈ ప్రోజెక్టులపైనే వివాదాలున్నాయి.

 

Munnar

కాలడి నించి మళ్ళీ బయలుదేరి దారిలోనున్న అందమైన ప్రకృతినిని తనివితీరా చూస్తూ, రోడ్డుకి ఆనుకొని ప్రతీ రెండు మూడు కిలోమీటర్లకీ ఒకటిగా ఉన్న గ్రామాలను దాటుకొని కొత్తమంగళం అనే చిన్న పట్టణాన్ని చేరాం. ఈ వూరి వింత అక్కడున్న ఫర్నిచరు దుకాణాలు. ఊరి పొడుగు సుమారు రెండు కిలోమీటరులుంటే, ఆ రెండు కిలోమీటర్లూ రోడ్డుకి రెండువైపులా ఈ దుకాణాలే! ఊరు మాత్రం ఈ రోడ్డు పొడుగంతే ఉంది. భలే కొత్తకొత్త డిజైన్లలో ఆని రకాల ఫర్నిచరు సామాన్లూ ఉన్నాయి. మా డ్రైవరు ప్రదీప్   కేరళ రాష్ట్రం అన్నిప్రాంతాలనించీ వచ్చి ఇక్కడ ఫర్నిచర్ కొనుక్కుంటారని చెప్పాడు.  చుట్టుపక్కలి అడవుల్లో దొరికే మంచి కలపతో వీటిని చేస్తారట. తరువాత ఆడిమలి అనేచోట మధ్యాహ్న భోజనాలు కానిచ్చి మున్నారుకు చేరువయ్యాం. ఆడిమలి దాటాకా రోడ్డుకి ఇరువైపులా స్పైస్ గార్డెన్‌లు కనబడ్డాయి. వాటిని చూడ్డానికి మనిషికి వంద రూపాయలు టిక్కెట్టు. మనం రోజూ వాడే సుగంధ ద్రవ్యాల  మొక్కలూ, చెట్లూ అన్నీ అక్కడున్నాయి. లవంగం, యాలకులు, జాజికాయ-జాపత్రి, దాల్చినచెక్క (దీని ఆకులే బిర్యానీలో వాడే ఆకులు) మొదలైనవన్నీ ఉన్నాయి. ఇంకా కాఫీ, రబ్బరు చెట్ల వంటివీ ఉన్నాయి. స్ట్రాబెర్రీలు, కోకో కూడా పండిస్తున్నారక్కడ.   మాకు వీటిని చూపించిన గైడు ఆశా మీనన్‌ అనే మళయాళీ అమ్మాయి గడగడా తెలుగు – మళయాళీయాసలో – మట్లాడేస్తుంటే ముచ్చటేసింది. గైడువృత్తికాబట్టి, అన్ని భాషలవారికీ అర్థమయ్యేలా చెప్పాలి కాబట్టి నేర్చుకున్నానంది.

ఇక అక్కడినించి బయలుదేరాకా ప్రకృతి సౌందర్యంవిశ్వరూపంచూపడంమొదలయింది. కొండలూ, వాటి లోయలూ, లోయల అడుగున మైదానాలూ, వాటిలో ఏవేవో చిన్న చిన్న గ్రామాలూ, అక్కడక్కడ సెలయేళ్ళూ, ఇవన్నీ చాలవన్నట్టు కొండవాలుల్లో టీ తోటలూ!  కొన్ని చోట్ల అసలు కొండే కనబడకుండా పచ్చటి టీ మొక్కలు వరసలు వరసలుగా పెంచారు-ఆకుపచ్చటి తివాచీలు పరిచినట్టు! మధ్య మధ్యలో పాపం పిల్లమొక్కలకి ఎండసోకకుండా మేమున్నాం అన్నట్టున్న వెండిగొడుల్లాంటి సిల్వర్ ఓక్ చెట్లు! ఈ సిల్వర్ ఓక్ లను రోడ్డు మీదనించి చూస్తూ ఉంటే కొండవాలుల్లో అంతా తెల్లటి పొగమేఘాలు కమ్ముకున్నాయా అన్నట్టున్నాయి. సిల్వర్ ఓక్ కలపతో ఫర్నిచర్ తయారు చేస్తారు.  ఒక చోట ఒక పుష్పవనం ఉంది. రకరకాల పూలమొక్కలు పెంచారు.  దాని అందం చూడవలసిందే!  వసంతవాటిక లంటే ఇవేకదా అనిపించింది. గులాబీలు, రంగురంగుల మందారాలూ, డైసీలూ, చామంతులూ , వయొలెట్లూ, ఐరిస్ జాతులూ అన్నీ ఉన్నాయి అక్కడ. Land lotus పేరు విన్నాను కాని ఇక్కడ చూసాను దాన్ని.

Land lotus

అక్కడినించి బయలుదేరి మున్నారు చేరాము.  హోటల్ రూము లో సామాన్లు పెట్టుకుని, రెఫ్రెష్ అయి, అక్కడికి సమీపం లో ఉన్న ఏనుగుల పార్కుకి వెళ్ళాము.  వంద రూపాయలిస్తే గజారోహణం చేయిస్తున్నారు.  ఇదివరలో మహానుభావులను గజారోహణ సన్మానం తో గౌరవించేవారు. ఇప్పుడు వందరూపాయలకే స్వీయసన్మానం చేసుకోవచ్చన్నమాట! అక్కడి పార్కులు వగైరాలు చూసుకొని చీకటిపడ్డాక రూముకి చేరాం.  చలి కొరికేస్తోంది.  రూములో ఏసీ ఉందేమో, ఆపేద్దామని చూస్తే కనబడలేదు. ఓహో, హిల్ స్టేషన్‌ కదా, ఇక్కడ అవి ఉండవని గుర్తుతెచ్చుకున్నాం.  కాలు కిందపెడితే జివ్వుమనేలా ఉంది. అందుకే రూమంతా తివాచీ పరచి ఉంది.

మరునాడు ఉదయమే లేచి చూసేసరికి కిటికీ అద్దాలన్నీ మంచుతో నిండిపోయిఉన్నాయి. మళ్ళీ బయలుదేరి టీతోటలన్నీ తిరిగి చూసాం.  మున్నార్ కి సమీపం లో ‘మట్టుపెట్టి’ డాము ఉంది.  మేము దాన్ని ‘మట్టుపట్టి’ అని అంటువుంటే మా డ్రైవరు మట్టుపెట్టి అనాలి, మళయాళం లో పట్టి అంటే కుక్క అన్నాడు.  మట్టుపెట్టి అంటే మా తెలుగులో అర్థం భయంకరంగా ఉంటుంది లేవయ్యా అన్నాను. పేరెలాఉన్నా, అది చాలా అందమైన ప్రదేశం. దానికి దగ్గరలోనే Echo Point అని ఒకటిఉంది. అక్కడి నది ఒడ్డున నిలబడి అరిచినా, చప్పట్లుకొట్టినా ఆ శబ్దం చుట్టూఉన్న కొండల్లో ప్రతిధ్వనించి మనకు వినబడుతుంది.  అరవడానికి ఐదు రూపాయలు టిక్కెట్టు కూడా ఉంది! ఆ నదిలో నౌకావిహారానికి కూడా ఏర్పాటు ఉంది-పెడల్ బోట్లున్నాయి. అక్కడి నించి బయలుదేరి కానన్‌దేవి హిల్స్ మీదుగా ప్రకృతిసౌందర్యాలను ఆస్వాదిస్తూ కొత్తమంగళం మీదుగా తిరిగి కాలడి వీధుల్లో ప్రయాణించి కొచ్చిన్‌ చేరుకున్నాము. అక్కడినించి మళ్ళీ హైదరాబాద్‌ షంషాబాదు!  చూసి, ఆస్వాదించిన సౌందర్యమంతా ఇంకా స్మృతిపథంలోనే విహరిస్తోంది.  ఈ అందాన్ని మించిన గురువాయూరు కృష్ణుడి అందం స్థిరంగా హృదయం లో నాటుకుపోయింది!

Silver oak

అసలు కేరళరాష్ట్రమంతా ప్రకృతిసౌందర్యాలకు ఆలవాలమే! కుమరకోమ్‌ (కుమరగొమ్‌ అంటారు స్థానికులు) లో నౌకాగృహాల్లో ఉప్పునీటికాలువల్లో (backwaters) విహారం, కొచ్చిన్‌ నగరంలో మరైన్‌డ్రైవ్‌, హార్బరు, బేకాల్‌, కోవలం, త్రిచూర్ సమీపం లోని చవక్కాడ్‌ బీచిలూ, తిరువనంతపురం లోని అనంతపద్మనాభస్వామి ఆలయం, శబరిమల అన్నీ అద్భుతమైనవే! అష్టముడి లో పడవల పోటీలు జగద్విఖ్యాతిమైనవి. ఇక్కడ చెప్పుకోదగ్గది ప్రజల మతసహనం. హిందువులూ, మహమ్మదీయులూ, క్రైస్తవులూ అందరూ సమపాళ్ళలోనే ఉన్నట్టుంది ఇక్కడ. ఎప్పుడూ ఎలాంటి మతకలహాలూ జరిగినట్టు వినలేదు.  మన ఆలయాలను మించిపోయేలా ఉన్నాయి ఇక్కడి చర్చిలు. ఇక్కడి చర్చిల్లో చాలావాటిలో మన ఆలయాల్లోలాగే ధ్వజస్థంభాలుండడం విచిత్రంగా తోచింది నాకు.

కష్టపడి పనిచెయ్యడం ఎలాగో తెలిసిన వారు కేరళీయులు. మనదేశంలోనే కాదు, ప్రపంచం లో ఏ మూల చూసినా కనీసం ఒక్కడైనా ఈ ప్రదేశానికి చెందిన వ్యక్తి ఉంటాడు.  నేను చూసిన దాన్నిబట్టి చెప్పాలంటే, ఇక్కడి ప్రజలు అత్యధికభాగం ధనసంపన్నులు. కుటుంబానికి ఒకరైనా విదేశాల్లో ఉండి సంపాదించేవారే! ఎక్కువమంది మధ్యప్రాచ్య దేశాల్లో (Gulf countries) ఉన్నారు.  అందుకే అక్కడి గ్రామాలూ పట్టణాలూ చక్కటి ఇళ్ళతోనూ, విశాలమైన రోడ్లతోనూ చూడముచ్చటగా ఉన్నాయి. విద్యావంతులు అత్యధికంగా ఉన్నరాష్ట్రం కాబట్టి సంపాదించిన ధనాన్ని తమ ఇళ్ళనూ, ఊళ్ళనూ, రాష్ట్రాన్నీ అభివృధ్ధిపథం లో నడుపుకోడానికి సక్రమ పధ్ధతిలో ఉపయోగించుకుంటున్నారు.

***

వంశీ: మాస్టర్ ఆఫ్ యాంత్రొపాలజీ

 29810_367552823325631_1651324620_n
జిలిబిలి పలుకులు సెలయేటి తళుకులు అందమైన వేళ్ల మధ్య చిక్కుపడ్డ కళ్లు. విశాలనేత్రాలతో విస్తరించిన తెర. అన్నా! గోదావరి నీ వంశధారా? నొకునొక్కుల జుట్టు తెలుసుగానీ నొక్కివదిలిన చమక్కుల సంగీతం మాత్రం నీతోనే పరిచయమైంది. సెకనుకు ఇరవైనాల్గు ఫ్రేముల్ తెలుసుగానీ ఫ్రేములకొలదీ విస్తరించిన సొంపు నీతోనే పరిచయమైంది. మీ మనోనేత్రాలు రమణీయభరితాలు. ఎందుకని సౌందర్యశాస్త్రం నీకు ఇంత వశమైంది? ఏ నీరు తాగితే వచ్చెనింత కళాకావరము. ఇదంతా నాకే ఉంటేనా ఎంత విర్రవీగేవాడినో నీకేం తెలుసు.
 
వంశీ నిన్ను ఏకవచనంలో పిలవకపోతే కలం పలకడం లేదు. గాలికొండలూ, అరకు రైలుపట్టాలూ పట్టాలమీద తీగలూ తీగలమీద వాలిన పిట్టలూ పిట్టల కూతలూ కిటకిట తలుపులు కిటారి తలుపులు మూసినా తెరిచినా చూసేవాడి గుండెల్లో చప్పుళ్లు. పచ్చగడ్డిమీద పరుచుకున్న మంచుతెరలు. వెండితెరపై తరలి వచ్చిన తెమ్మెరలు. కధను ప్రకృతి ఒడిలో పవళింపజేసి పాత్రలను సెట్‌ప్రాపర్టీలా మలచి నువు దృశ్యమానం చేసిన చలనచిత్రాలు మా ఈస్థటిక్స్ కు ఆమ్‌లజనితాలు.
ఎందుకిదంతా అంటే చెప్పలేను. ఈ ఉదయం వంశీ ఫోన్ చేశాడు. ఇరవైఅయిదో సినిమాకు పాటలు చేయించుకోడానికి ఇళయరాజా దగ్గరకు వెళ్తున్నానని చెప్పాడు. ఇన్సిడెంటల్లీ ఇళయరాజా కూడా వెయ్యి సినిమాలు పూర్తిచేసుకున్నాడు. పలకరించాడు కదా మరి కొన్ని జ్ఞాపకాలు ముసురుకోవా. పాటలే కాదుకదా చెప్పుకోవాల్సిన మాటలెన్నో! అందుకే ఇదంతా.
చూసే కళ్లుండాలేగానీ అందమంతా ముందరే ఉన్నది. చెప్పే నేర్పుండాలేగానీ కధలన్నీ నీ కళ్లముందే ఉన్నాయి. వంశీలో పెద్ద మాన్ వాచర్ ఉన్నాడు. నీలోనాలో లేనోడు. మనుషులు. ముక్కోటి రకాల మానవుల జాడలన్నీ వంశీ కనుగొనే పాత్రల్లోనే పరిచయమైపోతారు. పరిచయమైన మరుక్షణమే వీడా మా నారిగాడే కదా అని స్ఫురించేస్తారు. అలా మనతో కనెక్టయిపోతారు.
unnamed
డెస్మండ్ మోరిస్-మాన్ వాచింగ్ అనే పుస్తకం రాశాడు. రైల్వేస్టేషన్‌లో, మార్కెట్‌లో, కాంపస్‌లో, ఆఫీస్‌లో ఎక్కడపడితే అక్కడ కూర్చుని వచ్చేపోయే జనాన్ని చూస్తూ కాస్తూ వడపోస్తూ పరిశోధిస్తూ ఓ మహాగ్రంధమే రాశాడు. మాన్ వాచింగ్ ఈజ్ ఎ హాబీ. వంశీ కూడా పుట్టంగానే బట్టకట్టంగానే మాన్ వాచింగ్ మొదలుపెట్టుంటాడు. కాకపోతే మనుషుల్నీ వాళ్ల యాంబియెన్స్‌నూ కలిపి శోధించడమే మోరిస్‌కీ వంశీకీ మధ్య డివైడింగ్ లైన్. కల్చర్ ఈజ్ మాన్ మేడ్ ఎన్విరాన్‌మెంట్ అన్నాడు మలినోస్కి. మనుషులలోనే సాక్షాత్కరించే సంస్కృతికి సహజావరణాన్ని జోడించి సెల్యులాయిడ్‌పై అద్దే చిత్రకారుడు వంశీ. తెలిసిన మనుషుల్లో తెలియని కోణాలను కొత్తగా దర్శనం చేయిస్తూ మనలాంటి ఎంతోమంది భావప్రపంచంలో సన్నిహితంగా సంచరించే అదృశ్య స్నేహితుడు వంశీ. ప్రేక్షకుడిని స్థలకాలాలలోకి వేలుపట్టుకుని నడిపించే శక్తి వంశీది.
తనచుట్టూ నిండిన ఆవరణాన్నీ అందులో జీవించే మనుషులనూ చదువుతూ గడపడంలోనే చదువు కొనసాగించాడు. వాడు లోకమనే పాఠశాల చదువరి. వసంతకోకిలను మినహాయిస్తే భావసూచిక లాంటి టైటిల్స్ పెట్టిన తెలుగు దర్శకులెవరూ పెద్దగా గుర్తుకురారు. కానీ మంచుపల్లకి టైటిల్‌తోనే వంశీ తనలోని కవితాత్మను లోకానికి ఒక ప్రకటనలా విడుదల చేశాడు. డ్రాన్ ద ఐ బాల్స్. ఐ బాల్స్ అంటే కనులు. మన మనసులతో కలిసి టపటపలాడే కళ్లు. భానుప్రియ, శోభన, అర్చన, మాధురి. కళ్లుండీ చూడలేకపోయిన కళ్లని పరిచయం చేసిన కళ్లు వంశీవి. లేడీకి కళ్లుంటే చాలు. లేడి కళ్లుంటే చాలు. ఫిదా.
7445_482346638512915_139863931_n
మనకు అతిసాధారణమనిపించే సంగతుల్లో అత్యంత విశేషాలను ఒడిసిపట్టుకోగలగడమే వంశీ నైపుణ్యం. చెట్టుకింద ప్లీడర్‌నూ రికార్డింగ్ డ్యాన్సర్‌నూ లేడీస్‌టైలర్‌నూ మన సామాజిక సంబంధాల్లో భాగమైన నానారీతుల, వృత్తుల మనుషులను హోల్‌సమ్‌గా కధానాయకులను చేసి, సన్నిహితమైన జీవితాన్ని అంతే సన్నిహితంగా చూస్తున్న అనుభూతిని కలిగించడమే వంశీ చేసే ఫీట్.
సెమీరూరల్, సబర్బన్ సముదాయాల్లోని సోషల్ నెట్‌వర్క్ ప్రతికధలోనూ నేపథ్యం కావడం తనుమాత్రమే స్పెషలైజ్ చేసిన టెక్నిక్. ఓ నైబర్‌హుడ్- ఎయిటీస్ నాటి ఎస్సార్‌నగరో, రాజమండ్రి రైల్వే క్వార్టరో, రాజోలు మెయిన్‌రోడ్డో, గోదావరి లంకో-ఓ హేబిటాట్‌ను కధలో భాగంచేసి పాత్రల జీవితాలను అల్లికచేసి తెరకెక్కించడంలో కేవలం చిత్ర దర్శకుడిగానే కాదు, మానవనిర్మిత పరిసరాలను డాక్యుమెంట్ చేసిన సాంస్కృతిక చరిత్రకారుడిగా కూడా వంశీ నిలిచిపోతాడు.
హైదరాబాద్‌లో ఒకనాటి హౌసింగ్ కాలనీ ఇరుగుపొరుగు ఎలా ఉండేది. మారేడుమిల్లో, పేరంటపల్లో, గోదావరిలంకల్లో జీవితమెలా సాగేది. అమెరికా వెళ్లకముందు ఊళ్లో వెలిగిన జమిందారుగారి మేడ గోడలెక్కడ. టీవీ లేకముందు, జబర్దస్త్ ప్రోగ్రామ్ రాకముందు ఊరి జాతరలో సాగిన రికార్డింగు చిందులెలా ఉండేవి. రెడీమేడ్ షాపులు రోడ్లంతా బారులు తీరకముందు ఊరి టైలర్‌తో జనం అనుబంధమెలా ఉండేది. అంతెందుకు తెలుగు మహిళా బహిర్భూమికి ముందు కాలకృత్యపు కాలక్షేపంలో నెరపే సామాజిక కలాపమేమిటి. అన్నీ రికార్డు చేసే ఉంచాడు. వంశీ అన్నీ సెల్యులాయిడ్‌మీద భద్రపరిచాడు. సమకాలీన సమాజాన్ని సమకాలికంగా రికార్డ్ చేస్తున్న వంశీని కేవలం ఓ ఫిలిం మేకర్‌లా చూడలేం. వంశీ ఒక కల్చరల్ సైంటిస్ట్. ఎన్ ఆంత్రోపాలజిస్ట్.
సందర్భం వేరే ఏంలేదు. ఇరవైఅయిదో సినిమా! వంశీ కమ్ముకున్నాడు. అంతా గుర్తుచేశాడు. అందుకే ఈ కాస్త!
-అరుణ్‌సాగర్
arun sagar

ఖేల్ ఖతమ్

ఆ రోజు మధ్యాన్నం మిడిమేలపు ఎండ మనిద్దరి మధ్యా చిచ్చు రేపినపుడు ఎడ తెగిన యాత్ర చేస్తున్న మనిద్దరిలో నువ్వు సందు మలుపుని స్టీరింగ్ తో అదుపు చేస్తూ, ఒక మాటన్నావు. మాట నోటి నుంచి, భావం నొసటి నుంచీ దూకుతుండగా ” ఏం దొరుకుతుందని ఇలా నువ్వు తనతో! “అనేసావు. నీ ప్రతి కదలికలో పోటెత్తిన అసహనపు అలల్ని కళ్ళు విప్పార్చి చూడడం తప్ప నాకేం సమాధానం తెలుసు! నిజమే! ఏం దొరుకుతుందని ఇలా నేను తనతో? నాకయినా నీకయినా మరెవరికయినా ఎవరితోనయినా ఏం దొరుకుతుందని ఇలా మనం!

మరీ ముఖ్యంగా

నీలాంబరం పువ్వుల్ని శిరస్సున దాల్చి

నాగు పాముల్ని మెడకు చుట్టుకుని

శిధిల భస్మాన్ని మేన అలదుకుని

జీవన కాంక్షల్ని లయించే

జగమంత కుటుంబపు ఏకాకుల వద్ద, సంచారుల వద్ద

ఏం దొరుకుతుందని ఇలా తనతో నేను !

నువ్వు కాస్త తమాయించుకుని చెట్ల నీడ పక్కన కట్టు గుంజకి యాత్రని కట్టేసి ఆగిన కాలాన్ని సహనంగా నిమురుతూ చాలా సేపే ఉండిపోయావు. విచారంతో రూపు మారిన పెదాలను సాగదీస్తూ మెల్లగా వినపడీ పడనట్లు ఏవేవో అంటూ ఆగుతూ చివరికి గుండెలోంచి వాక్యాన్ని పెకలిస్తూ ” లోకం బతకనిస్తుందా నిన్ను?” అనేసావు. నీ ప్రతి కదలికలో రాలిపడిన కారుణ్యపు పుప్పొడిని కళ్ళు విప్పార్చి చూడడం తప్ప నాకేం తెలుసు సమాధానం! అయితే యుగాలను క్షణాలు చేసే మాయావులు నన్నెట్లా బతికిస్తాయో మాత్రం చెప్పాలనుకున్నాను

10689498_410546562429558_680862155996552773_n

రైలు కిటికీ నుంచి జారి పడే

రెండు కన్నీటి చుక్కలని దోసిలి పట్టడానికి

ఒక మహా పర్వతమే దిగివచ్చి

కొత్తగా మొలిచిన కాళ్ళతో పరుగులు తీస్తుంది

కలియ వచ్చిన పరవళ్ళను

ప్రేమతో నిమిరి పంపి

గుణభద్రా..తుంగభద్రా అంటూ

ఏకాంత సంద్రం ఘోష పెడుతుంది

తన కుంభ స్థలాన్ని కొట్టిన

చిన్ని గువ్వని పైకెత్తుకుని

మనో వీధుల్లో ఊరేగిస్తూ ఒక ఏనుగు

లోకానికి నాలుగు పూలగుత్తుల్ని ఇస్తుంది

వచ్చింది వటువే కదాని

మనసా వాచా కర్మణా

మూడడుగులు ఇచ్చి ఇష్టంగా

ఆక్రమణను ఆహ్వానిస్తాడు బలి చక్రవర్తి

యక్షుడూ యక్షిణీ

చెరొక వియోగ శిఖరం మీదా కూచుని

మేఘమాలలతో జీవితమంతా

అప్పండవున్ చేయిస్తారు

లోకముతో మనకేటికి లోలాక్షీ! రా పోదమని గుప్పిట మూసి అద్భుతాలను కల గంటూ ఉంటానని కదా అనుకుంటున్నావు. జ్ఞానమూ,దంతమూ వస్తూ వస్తూ తెచ్చే నెప్పి బాధించిన అనంతరం ఇక కలలు కలయికలు విరామాలు విడిపోడాలు ఉండవు. తను, నాకు ఉండడం కాదు తనంటూ ఈ లోకంలో ఉండడమే ఒక సెలబ్రేషన్ అయినాక గుప్పిట తెరిచి చూసాను. నన్ను కమ్మేస్తూ చుట్టూ అనుభవాలే. నీకయినా నాకయినా ఎవరికయినా మరెవరితోనైనా దొరికేవి అనుభవాలే..జరిగినవి జరగబోయేవి మెచ్చినవి నచ్చనివి దీర్ఘమైనవి ఇట్టే కరిగేవి గట్టిగా పట్టుకునేవి వేధించేవి నవ్వించేవి…మాయావులు మాయా తావులు మహానేర్పరులు అనుభవాలు…ఆది మధ్యాంత రహితాలు.

– కృష్ణవల్లి

ఒక పెయింటింగ్ అంటే వెయ్యి పేజీల పుస్తకమే!

Rorich "compassion"

Rorich “compassion”

‘‘ఎప్పుడూ ఆ పాడుబొమ్మలేమిట్రా.. కూటికొస్తాయా, కురాక్కొస్తాయా?’’

నేను చిన్నప్పుడు బొమ్మలేసుకునేప్పుడు ఇంట్లోవాళ్లు చిన్నాపెద్దా తేడా లేకుండా తరచూ ఇచ్చిన ఆశీర్వాదమిది. చిన్నప్పుడే కాదు పెద్దయి, పెళ్లయ్యాక కూడా ఇవే దీవెనలు. కాకపోతే దీవించేవాళ్లే మారారు. నాకు బొమ్మలు వెయ్యడం రాదని నాకే కాకుండా మా వాళ్లందరికీ గట్టి నమ్మకం మరి.

‘‘ఎప్పుడూ ఆ పాడు పుస్తకాలేమిట్రా.. క్లాసు పుస్తకాలు చదువుకో, బాగుపడతావు!’’

చిన్నప్పుడు చందమామ, బాలమిత్రలు, పెద్దయ్యాక స్వాతి, ఆంధ్రభూమి వగైరా పత్రికలు, ఇంకొంచెం పెద్దయ్యాక శ్రీ శ్రీ, ఆరుద్ర, చలం పుస్తకాలు చదువుకునేప్పుడు అందిన మరో ఆశీర్వాదం.

‘‘ఎప్పుడూ ఆ పిచ్చిబొమ్మల పుస్తకాలు చదవకపోతే డీఎస్సో గీయస్సో రాయొచ్చుగా. ఈ పాడు రేత్రి ఉజ్జోగం ఇంకెన్నాళ్లు?’’

బొమ్మలు రావని తెలిసి బొమ్మలేంటో తెలుసుకోవడానికి ఇప్పుడు ఆర్ట్ పుస్తకాలు చదువుతూ ఉంటే ఇల్లాలు చేస్తున్న హితబోధ ఇది. వచ్చే జన్మంటూ ఉంటే జర్నలిస్టును పెళ్లి చేసుకోనని ఆమె మంగమ్మ శపథం పట్టింది.

వాళ్లకు జీవితానుభవం మెండు. రియలిస్టు చిత్రకారుల్లాంటి వాళ్లు. మరి నేను?

నేను భూమ్మీదపడి ముప్పైయారేళ్లు. ఊహ తెలియని రోజులు తప్ప ఊహ తెలిసిన కాలమంతా పుస్తకాలు, బొమ్మలే లోకం. అలాగని నేను పండితుడినీ కాను, కళాకారుడినీ కాను. నిజానికి సృజనలోకంటే ఆస్వాదనలోనే చాలా సుఖముంది. రచయితలూ, కళాకారులు వాళ్ల తిప్పలేవో వాళ్లు పడతారు. మనం వాటిని హాయిగా కూచుని, ఎలా పడితే అలా పడుకుని, నుంచుని ఆస్వాదించొచ్చు. తినడం కంటే వండడం కష్టం కదూ, అదీ రుచిగానూ.

ఎందుకో తెలియదు కానీ బొమ్మల్లేని పుస్తకాలు నచ్చవు నాకు. కవితయినా, కథయినా, నవలైనా, వ్యాసమైనా బొమ్మ ఉంటే దాని అందం వేరు. బొమ్మలేని పుస్తకం ఉప్పులేని కూర. అక్షరాలకు బొమ్మ తోడుంటే పఠనం విసుగెత్తించదు. వాక్యాలు ఇబ్బందిపెట్టినప్పుడు బొమ్మ ఊరటనిస్తుంది. పిండారబోసిన వెన్నెల్లో చందమామలాంటిది బొమ్మ. ఉడుకుడుకు రాగిసంకటి ముద్దలో కాసింత నేతిబొట్టు, వెల్లుల్లికారం పూసిన ఎండుచేప లాంటిది బొమ్మ. నీది పిల్లతనం అంటారు మిత్రులు. తెలివిమీరిన పెద్దతనానికంటే అదే మంచిదంటాను నేను. చిన్నప్పుడు కథల కోసం కాకుండా బొమ్మలు చూడ్డానికే చందమామ, బాలమిత్రలు కొనేవాడిని, చిరుతిళ్లు మానుకుని. కథ కోసం కాకుండా బొమ్మల కోసమే సినిమాలకు వెళ్లేవాడిని.

Hokusai boy on the tree

Hokusai boy on the tree

నాకు తెలియకుండానే బొమ్మలకు బానిసనయ్యాను. దేన్ని చూసినా, దేన్ని చదివినా రంగురూపాల తపనే. ఎంత పిచ్చో ఒక ఉదాహరణ చెబుతాను. కాళహస్తీశ్వర మాహత్మ్యంలోని విచిత్ర సరోవర సందర్శనం విభాగంలో ఓ వచనం నాకు అచ్చం ఎంసీ ఈషర్ వేసిన చేపలు పక్షులుగా మారే చిత్రాన్ని గుర్తుకు తెచ్చింది. ఆ వచనం చదవండి..

నత్కీరుడు ఓ మర్రిచెట్టు కిందికెళ్లి..  ‘తదీయ శాఖాశైత్యంబున కత్యంత సంతోషంబునొంది, కూర్చుండి, తద్వటంబుననుండి రాలిన పండుటాకులు బట్టబయటఁ బడినయవి విహంగంబులు, జలంబునం బడినయవి మీనంబులునైపోవ, నందొక్క పలాశంబు జలాశయంబున సగమును, దట ప్రదేశంబున సగమును బడి, మీనపక్షిత్వంబులఁ గైకొని, లోపలికిన్వెలుపలికిం దివియు చమత్కారంబు నత్కీరుండు చూచి, యద్భుతరసపరవశుండై యుండె..’’

ఇప్పుడు ఈ వ్యాసంలోని ఈషర్ బొమ్మను చూడండి. ధూర్జటి వచనంతో పోల్చుకోండి!!

Escher "birds fish"

Escher “birds fish”

మా ఊరు కడప జిల్లా ప్రొద్దుటూరు. ఊరిలో ఓ బక్కపల్చని ముస్లిం(మతంతో గుర్తింపునిచ్చే నా నిమిత్తం లేని నా మెజారిటీతనానికి సిగ్గుపడుతున్నా) తోపుడు బండిలో పాతపుస్తకాలు అమ్మేవాడు. నాకప్పుడు పన్నెండేళ్లనుకుంటా. మూడు రూపాయలిచ్చి రామకృష్ణ పరమహంస జీవితచరిత్ర కొన్నాను. మూడునాలుగు వందల పేజీల పుస్తకం. అందులో చక్కని నలుపుతెలుపు ఫొటోలు.. పరమహంసవి, శారదమాతవి, వివేకానందుడివి చాలా ఉన్నాయి. బొమ్మలున్నాయి కనుకే కొన్నాను. నా జీవితంలో చూసిన అతి పెద్ద తొలి పుస్తకం. ఎంతో గర్వంతో స్కూలుకు తీసుకెళ్లి క్లాసులో అందరికీ చూపించాను. గుర్తులేదు కానీ, వెర్రివాడినన్నట్టే చూసుంటారు. ఆ పుస్తకాన్ని డిగ్రీకి వచ్చేంతవరకు జాగ్రత్తగా దాచుకున్నా, కాలేజీ రోజుల్లో ఆలోచనలు మారి, ఆ పుస్తకంతో ఏకీభావం లేకపోయినా. మాకు సొంతిల్లు లేదు కనుక ఇళ్లు మారడంలో అదెక్కడో పోయింది. లేకపోతే ఇంట్లోవాళ్లు పడేసుంటారు.

విశాలాంధ్ర వాళ్ల వ్యాను మా ఊరికీ వచ్చేది. అదొచ్చిందంటే కాళ్లు నిలిచేవికావు. దాచుకున్న, ఇంట్లో దోచుకున్న డబ్బులు, స్కాలర్ షిప్ డబ్బులు పట్టుకెళ్లి కొనేసేవాడిని. బొమ్మల పుస్తకాలకే ప్రాధాన్యం. తెలుగులో అలాంటివి చాలా తక్కువ కనుక సోవియట్ పుస్తకాలపై పడేవాడిని. దిండులాంటి రష్యన్ కథలూ గాథలూ, ప్రాచీన ప్రపంచ చరిత్ర, కుప్రీన్ రాళ్లవంకీ, నొప్పి డాక్టరు, మొసలి కాజేసిన సూర్యుడు, లెనిన్ జీవిత చరిత్ర.. ఇంకా గుర్తులేని బొమ్మల పుస్తకాలు కొని చాటుమాటుగా ఇంటికి తెచ్చేవాడిని. సంగతి తెలియగానే తిట్లు, శాపనార్థాలూ. తొమ్మిదిలోనో, పదిలోనో ఉండగా, పాతపుస్తకాలాయన వద్ద మార్క్సూ, ఎంగెల్స్ లపై వాళ్ల మిత్రుల స్మృతుల పుస్తకం దిండులాంటిదే ఇంగ్లిష్ ది దొరికింది. అప్పటికి మార్క్స్ ఎవరో,  ఎంగెల్స్ ఎవరో తెలియదు. ఆ పుస్తకంలో చక్కని ఇలస్ట్రేషన్లు, ఫొటోలు ఉన్నాయి కనుక కొన్నాను అంతే.  జీవితపు అసలు రుచి చూపిన ఆ మహానుభావులు తొలిసారి అలా తారసపడ్డారు బొమ్మల పుణ్యమా అని. అయితే ఇలాంటి ‘పిచ్చి’ పుస్తకాలు ఎన్ని చదివినా పరీక్షలకు రెండు మూడు నెలల ముందు మాత్రం క్లాసు పుస్తకాలు దీక్షగా చదువుతూ క్లాసులో ఫస్ట్ వస్తూ ఉండడం, ఏడు, పదిలో స్కూలు ఫస్ట్ రావడం, ఇంటర్, డిగ్రీ, పీజీల్లో ఫస్ట్ క్లాసులో పాసవడంతో ఆ తిట్ల తీవ్రత తగ్గుతూ వచ్చేది.

తర్వాత రాజకీయాలు ముదిరి లెఫ్ట్ ను మించిన లెఫ్ట్ లో ‘పక్కదోవ’ పట్టాక బొమ్మల పిచ్చి మరింత ఎక్కువైంది.  ఎస్వీ యూనివర్సిటీలో కామర్స్ పీజీ చేస్తున్నప్పుడు నా చిత్రలోకం పెద్దదైంది. స్కాలర్ల రిఫరెన్స్ విభాగంలోకి పగలు పీజీ వాళ్లను రానిచ్చేవాళ్లుకారు. అందుకే సాయంత్రం ఆరుకెళ్లి రాత్రి మూసేవరకు ఫైనార్ట్స్ పుస్తకాలతో కుస్తీ పట్టేవాడిని. అప్పటికి అరకొరగా తెలిసిన డావిన్సీ, మైకెలాంజెలో, రాఫేల్, పికాసో, డాలీలు మరింత దగ్గరయ్యారు. కూర్బె, మిలే, డామీ వంటి రియలిస్టులు, మానే, మోనే వంటి ఇంప్రెషనిస్టులు, వాన్గో, గోగా, సెజాన్ వంటి పోస్ట్ ఇంప్రెషనిస్టులు, ఫావిస్టులు, క్యూబిస్టులు, డాడాయిస్టులు, సర్రియలిస్టులు, ఫ్యూచరిస్టులు, సోషల్ రియలిస్టులు.. నానాజాతి కళాకారులు దోస్తులయ్యారు. పనిపైన హైదరాబాద్ కు వచ్చినప్పుడు సండే మార్కెట్లో అందుబాటు ధరకొచ్చిన ఆర్ట్ పుస్తకాన్నల్లా కొనేవాడిని. అనంతపురం ఎస్కే వర్సిటీలో ఉంటున్నప్పుడు స్నేహితులను చూడ్డానికి బెంగళూరుకు వెళ్లేవాడిని. హైదరాబాద్ లో దొరకని పుస్తకాలు కనిపించేవి. సిగ్గు వదిలేసి డబ్బులడుక్కుని కొనేవాడిని.

తెలుగు సాహిత్యం చదువుకుంటూనే, బొమ్మలూ అర్థం చేసుకుంటూ ఉండేవాడిని. అదొక ఒంటరి లోకం. కథలూ కాకరకాయలపై మాట్లాడుకోవడానికి బోలెడంత మంది. కానీ బొమ్మల గురించి మాట్లాడుకోవడానికి ఎవరున్నారు? పుస్తకాల్లో చూసిన ఇంప్రెషనిస్టుల చెట్లను, దృశ్యాలను వర్సిటీ ఆవరణలోని, అడవుల్లోని చెట్లతో, కొండలతో పోల్చుకుని వాటితో ముచ్చటించేవాడిని. చేతకాకున్నా ఉద్యమ పత్రికల కోసం ‘ఎర్ర’ బొమ్మలను వేసేవాడిని. చిత్రంగా అప్పుడు చూసిన చిత్రాలు, చదివిన ఆర్ట్ పుస్తకాలు దాదాపు అన్నీ పాశ్చాత్య కళవే. జపాన్, చైనాలవి ఉన్నా తక్కువే. భారతీయ కళవి అయితే రెండోమూడో. అవి కూడా నేషనల్ బుక్ ట్రస్ట్, లలితకళల అకాడెమీ వాళ్లు వేసినవి. ఎస్కే వర్సిటీలోని తరిమెల నాగిరెడ్డి పుస్తకాల్లో ఆయన సంతకంతో చైనా చిత్రకళపై పుస్తకం కనిపించడం ఒక వింత.

‘పక్కదోవ’లో నడిచే ధైర్యం లేక ‘సరైన దారి’కి మళ్లాకా బొమ్మల పిచ్చి పోలేదు. తిండితిప్పలు మానేసి, వేల రూపాయలు అప్పులు చేసి ఆర్ట్ పుస్తకాలకు తగలేసిన సందర్భాలు అనేకం. ఒకప్పుడు నావద్ద నాలుగైదు వందల తెలుగు సాహిత్య పుస్తకాలు, ఐదో ఆరో ఆర్ట్ పుస్తకాలు ఉండేవి. ఇప్పుడు ఆ అంకెలు తారుమారయ్యాయి. ఊళ్లు మారడం వల్ల చాలా తెలుగు పుస్తకాలను లైబ్రరీలకు, మిత్రులకు ఇచ్చేశాను. ఇప్పుడు ఆర్ట్ పుస్తకాలు రెండు మూడువందలున్నాయి. వాటి మధ్యన తెలుగు పుస్తకాలు ఐదో పదో బిక్కుబిక్కుమంటున్నాయి.  కళపై, కళాకారులపై నేను రాసిన వ్యాసాలు, సొంతంగా అచ్చేసిన ‘పికాసో’, ‘డావిన్సీ’ పుస్తకాలు నా జ్ఞానానికో, అజ్ఞానానికో ఉదాహరణలు.

ఇప్పుడు.. అంటే సాహిత్యం, బొమ్మలూ పరిచయమై, అనుభవంలోకి వచ్చిన పదిహేనేళ్ల తర్వాత ఒకసారి వెనక్కి తిరిగి చూసుకుంటే… నా సాహిత్య ప్రయాణం, కళాధ్యయనం కలసి సాగినట్టు అనిపిస్తోంది. బొమ్మల జోలికి వెళ్లకపోయుంటే సాహిత్యంలో నాకంటూ ఓ స్థానం దక్కేదేమోననిపిస్తోంది. అయినా చింతలేదు. మహా రచయితల పుస్తకాల్లోని సారాంశాలను మహాచిత్రకారుల బొమ్మల్లో పట్టుకోగల దారి నాకు ఆర్ట్ పుస్తకాలు చూపించాయి. సాహిత్యం చూపలేని నానా దేశాల, నానా జాతుల నిసర్గ సౌందర్యాన్ని అవి నాకు పరిచయం చేశాయి.

బొమ్మ రాతకంటే ముందు పుట్టింది. అది సర్వమానవాళి భాష. వెయ్యిపేజీల పుస్తకం చెప్పలేని భావాన్ని అది చక్కగా చెబుతుంది. ఒకవేళ బొమ్మ చెప్పలేని భావాన్ని చెప్పే పుస్తకం ఉంటేగింటే, దానికి బొమ్మ కూడా జతయితే ఇక అర్థం కానిదేమీ ఉండదు.

నింగికి, నేలకు మధ్య హద్దులు చెరిపేసిన ఫుజీ మంచుకొండ ముందు, వాగుపై వాలిన ఒంటరి చెట్టుపై కూచుని పిల్లనగోవి ఊదుతున్న హొకుసాయ్ జపాన్ కుర్రకుంకనూ, ఎన్నో ఏళ్ల తర్వాత ఇంటికి తిరిగొచ్చిన రష్యన్ రాజకీయప్రవాసిని మాటలకందని ఆశ్చర్యానందంతో చూస్తున్న రెపిన్ మనుషులను, రోరిక్ కుంచెలో రంగులద్దుకుని మెరిపోయే హిమాలయాలను, హిమాలయాల పాదపీఠంలో పేదరికంతో మగ్గే, చలితో ముడుచుకుపోయే అమృతా షేర్గిల్ పల్లె పడచులను, కడుపుతీపిని, కడుపుకోతను గుండెలు చెదిరేలా చూపే క్యాథే కోల్విజ్ జర్మన్ తల్లులను, దేవుడంటూ ఒకడుంటే, అతనికంటే అద్భుతమైన కళాసృజన చేసిన ఇటాలియన్ పునరుజ్జీవన చిత్రకారులను, ఆత్మలను ముఖాలపైకి తెచ్చుకుని చీకట్లో కాంతిపుంజాల్లా తొంగిచూసే రెంబ్రాంత్ డచ్చి జనాన్ని,  కళ్లు తిప్పనీయని ప్రాచీన గ్రీకు శిల్పాలు, నమ్మశక్యంకాని ఈజిప్ట్ పిరిమిడ్లు, స్తంభాలు, పురాతన ఉద్వేగాలను అంటిపెట్టుకున్న ప్రీకొలంబియన్ కుండలను… ఇంకా ఎన్నింటినో ఆర్ట్ పుస్తకాలు నాకు పరిచయం చేశాయి. నా చేతులు పట్టుకుని ఆదిమానవులు ఎద్దుల, మేకల బొమ్మలు గీసిన లాక్సా గుహల దగ్గర్నుంచి నవనాగరిక ఇన్స్ స్టలేషన్ కర్రల, కడ్డీల ఆర్ట్ వరకు నడిపిస్తూ ఉన్నాయి.

                                                                                            -పి. మోహన్

P Mohan

 

అవును! పుస్తకం కూడా ప్రేమిస్తుంది!

అవును ! పుస్తకం కూడా ప్రేమిస్తుంది. ఆ ప్రేమ నేను ఎరుగుదును. జీవితం చీకట్లు కమ్మేసినప్పుడు గుడ్డి దీపమై దారి చూపింది పుస్తకమే. ఆశయాలలో ఆవేదనలో తోడై నిలిచి, పెను బాధ శరద్రాత్రి చలి లాగ హృదయాన్ని గడ్డ కట్టిస్తుంటే నులి వెచ్చని నిప్పు కణికల్లాంటి భావాలు మనసులో రాజేసింది పుస్తకమే. ఎదురు దెబ్బలు తిని అలిసి ఉన్న మనసుకు “సాంత్వన” అనే పదం యొక్క నిజ జీవిత అర్థం చెప్పింది పుస్తకమే.

పుస్తకాలకి నా జీవితం లో ప్రత్యేకమైన స్థానం ఉంది. నేను చదివిన పుస్తకాలు లేకపోతే నేను లేను. నా వ్యక్తిత్వానికీ, నా భావాలకీ, నా అలోచనలకీ, అన్నిటికీ పుస్తకాలే ప్రేరణ. నా జీవితంలోని ప్రతి మలుపు, ప్రతి సంఘటన నేను చదివిన ఏదో ఒక పుస్తకంలోని ఏదో ఒక సన్నివేశం తో రిలేట్ అవుతూ ఉంటుంది.

image1 నాకు చిన్నప్పటి నుంచి చదవడం ఒక వ్యసనం. అదీ ఇదీ అని లేదు, ఏది దొరికితే అది చదివేసేవాడిని. వారపత్రికలు మొదలు మా స్కూలు లైబ్రరీ, తిరువూరు లైబ్రరీ లో ఉన్న పుస్తకాలన్నీ దాదాపు చదివేసాను. కోలాహలం లక్ష్మణరావు, ధనికొండ హనుమంతరావు లాంటి వాళ్ళు అప్పట్లో బాగా రాసేవారు. ఇప్పటివాళ్ళకి వీళ్ళ పేర్లు కూడా తెలియవు అనుకోండి, అది వేరే సంగతి. 9th క్లాసు కి వచ్చే సరికే నేను చాలా ఫాస్ట్ రీడర్ ని (Fast Reader). పుస్తకం లో ఉన్నదంతా యధాతథంగా చదవడం టైం వేస్ట్ అనుకునేవాడిని. వర్ణనలు ఉపోద్ఘాతాలు పక్కన పడేసి సూటిగా కథ చదవడం అలవాటు అయ్యింది. డిటెక్టివ్ నవలలు రీడింగ్ హ్యాబిట్ పెంచడం లో బాగా ఉపయోగపడతాయి. మధుబాబు, గిరిజశ్రీ భగవాన్, జై భగవాన్ వంటి వాళ్లని బఠాణీలు నవిలినట్టు నవిలేశాను. రోజుకి కనీసం పది నవలలు. నేనే సొంతగా ఒక డిటెక్టివ్ నవల కూడా రాయడానికి ట్రై చేశా. నా డిటెక్టివ్ పేరు Turner. (వాడు enter అవ్వడం తోటే స్టోరీ Turn అయిపోతుందని ఆ పేరు పెట్టా).

ఇలా అనర్గళంగా సాగిపోతున్న నా పుస్తక భక్షణ కి మొదటిసారి అడ్డుకట్ట వేసిన వాడు చలం. అప్పట్లో చలం పుస్తకం కనపడగానే అందరూ మొహం చిట్లించుకునేవారు. 8th క్లాసు లో మొదటిసారి చలాన్ని చదివాను. మైదానం – సూటిగా కథ కోసం వెతుకుతూ, సంభాషణలు మాత్రమే చదవడం వల్ల ఆ పుస్తకం నాకు ఏమీ అర్థం కాలేదు. దాన్ని అర్థం చేసుకోడానికి నేను తన్నుకుంటున్న సమయంలో మా నాన్న నా లోపాన్ని ఎత్తి చూపించారు. “రచయిత భావాలని చదవాలి రా. ఉత్త కథ మాత్రమే చదవడం వల్ల ఏ ఉపయోగమూ ఉండదు.” అని చెప్పారు. అప్పుడే మొదటిసారిగా ప్రతి రచయితా తన పుస్తకాల ద్వారా కొన్ని భావాలని ప్రతిపాదిస్తాడనీ, ఆ భావాలకి చాలా importance ఉందనీ తెలిసింది నాకు. అప్పటిదాకా నేను చదివింది అంతా కాలక్షేపం సాహిత్యమే అని కూడా అర్థమయిపోయింది. అప్పటినుంచే పుస్తకాన్ని జీవితానికి దగ్గరగా తీసుకోవడం మొదలుపెట్టాను.

నా జీవితం మీద బలమైన ప్రభావం చూపిన మొదటి పుస్తకం సోవియట్ పుస్తకం “తిమూర్ – అతని దళం”. సోవియట్ సాహిత్యం ఆదరణ బాగున్న రోజుల్లో మా ఊరికి విశాలాంధ్ర పుస్తకాల వ్యాన్ వచ్చేది. image2ఆ వ్యాన్ దగ్గర పాటలు పాడినందుకు బహుమతి గా ఇచ్చారా పుస్తకం. ఆ పుస్తకం ఎక్కడో మిస్ అయ్యింది. ఎన్నో రోజులు వెతికాను. ఈ మధ్యనే అనిల్ బత్తుల గారి పుణ్యమా అని ఇప్పుడు PDF రూపంలో మళ్లి దొరికింది. గ్రామానికి సేవ చెయ్యడం కోసం ఒక దళం తయారు చేసుకుంటాడు తిమూర్. ఆ పుస్తకం ఇచ్చిన స్పూర్తితో “చిల్డ్రన్ జన సేవా దళ్” అనే పేరుతో ఒక సంఘం పెట్టాము. ఊళ్లో వాళ్ళ కి పనులు చేసిపెట్టేవాళ్ళం, కలిసి పుస్తకాలు అధ్యయనం చేసేవాళ్ళం. ఆ తరవాత దాని పేరు లెనిన్ బాల సంఘంగా మార్చాము. అప్పట్లో “భూభాగోతం” నాటకం ఒక సంచలనం. మా పిల్లల దళం రాష్ట్రం మొత్తం తిరిగి 425 పైగా ప్రదర్శనలు ఇచ్చింది.

నా బాల్యంలో ఎక్కువ భాగం పినపాక లో మా మామయ్య వాళ్లింట్లో గడిచింది. అక్కడ పేరు తెలియని బండ పుస్తకం ఒకటి ఉండేది. ఎప్పటిదో అట్ట చిరిగిపోయిన పాత పుస్తకం అది. అది ఎన్ని సార్లు చదివానో నాకే గుర్తులేదు. image3అందులోని ప్రతి సన్నివేశం ప్రతి వాక్యం నాకు బాగా గుర్తు. పొయ్యిలోకి కట్టెలు మండనప్పుడల్లా మా అత్త అందులోంచి నాలుగు పేజీలు చింపి పొయ్యిలో వేస్తుండేది. 1975లో ఇంటర్మీడియట్ చదువుతున్నప్పుడు మళ్లి పినపాక వెళ్ళినప్పుడు చాలా రోజుల తర్వాత ఆ పుస్తకం నా కంట పడింది. వందల పేజీల పుస్తకం లో 40 పేజీలే మిగిలాయి. దాని పేరు తెలుసుకోవాలని బలమైన కోరిక పుట్టింది. ఆ బతికిపోయిన 40 పేజీలు పట్టుకుని బెజవాడంతా తిరిగా. లైబ్రరీలు, పాత పుస్తకాల కొట్లు దేన్నీ వదిలిపెట్టలేదు. లాభం లేకపోయింది. చాలా నిరాశ చెందాను.

నూజివీడు కాలేజీలో డిగ్రీ లో చేరాను. ఊరు మారినా వ్యసనాలు మారవు. సంవత్సరంలో సగం రోజులు లైబ్రరీలోనే గడిపేవాడిని. ఆనందనిలయం లాంటి 1000 పేజీల పుస్తకాలు అలా చదివినవే. ఆ సమయం లో చదివిన స్పార్టకస్ , ఏడు తరాలు నా భావాల పైన పెను ప్రభావం చూపాయి. మామూలు నవలే అయినా మేనరికాల మీద కొమ్మూరి వేణుగోపాలరావు రాసిన “ఒకే రక్తం-ఒకే మనుషులు” నవల నా మీద ఎక్కువ ప్రభావం చూపింది. సోవియట్ లిటరేచర్, 2వ ప్రపంచ యుద్ధం గురించి వచ్చిన ప్రతి పుస్తకం చాలా ఆసక్తి తో చదివాను. image4తిరువూరు విద్యార్థి ఉద్యమంలో చేరాక మంచి ఉపన్యాసకుడిగా గుర్తింపు రావడంలో ఈ పుస్తకాలన్నీ దోహదం చేశాయి.

చదువయిపోయింది. ఆర్ధిక పరిస్థితుల సహకరించకపోవడంతో ఉద్యమం నుంచి పక్కకి వచ్చి విజయవాడ KVR ట్రావెల్స్ లో పనికి చేరాను. 2 సంవత్సరాలు ఉద్యమాలకి, చదవడానికి దూరంగా గడిచిపోయాయి. చాలా వెలితిగా ఉండేది. ఆర్థికంగా ఎంత బాగున్నప్పటికీ అక్కడ ఎక్కువరోజులు ఇమడలేకపోయాను.
దాసరి నాగభూషణం గారి ప్రోద్బలం మేరకు విశాలాంధ్ర బుక్ హౌస్ లో సేల్స్ మాన్ గా చేరాను. తిరుపతిలో పోస్టింగ్. విజయవాడ చంద్రం బిల్డింగ్స్ లో ట్రైనింగ్. అక్కడ ఉన్న అన్ని విభాగాలలో తిరుగుతూ గోడౌన్ దగ్గర ఆగిపోయాను. అదొక పెద్ద పుస్తకాల సముద్రం లాగా ఉంది. ఎక్కడలేని ఆనందం కలిగింది. ఎన్ని రోజులైందో అన్ని పుస్తకాలు ఒకే సారి చూసి. సంవత్సరాల తరబడి ఎడారిలో తిరుగుతున్న Cow Boy కి నిధి దొరికినట్టు అయ్యింది.

కొత్తవీ పాతవీ ఎన్నో పుస్తకాలు ఉన్నాయి అక్కడ. ఇక నేను ఆ సముద్రంలో ఈదడం మొదలుపెట్టాను. నాలుగో అలమారలో పై వరస లో ఉన్న పాత పుస్తకాలని కదిలిస్తున్నప్పుడు చెయ్యి జారి రెండు పుస్తకాలు కింద పడ్డాయి. అందులో ఒకటి విచ్చుకుంది. నేను నిచ్చెన దిగుతూ ఆ పుస్తకం కేసి చూస్తున్నాను. దగ్గరవుతున్నా కొద్దీ ఆ పుస్తకంలోని వాక్యాలు స్పష్టంగా కనపడుతున్నాయి. అందులోని ఒక వాక్యం చదవగానే నా గుండె ఝల్లుమంది. “తనొచ్చిందే గాక తన లంజని కూడా తెచ్చాడు. image5ఏదీ.. ఆ కర్ర ఇలా ఇవ్వు. వీడి బుర్ర బద్దలు గొడతాను” పావెల్, మొట్కా మధ్య సంభాషణ. ఎన్నో సంవత్సరాల జ్ఞాపకాల తెరల కింద శిథిలమైపోయిన ఒక చిరిగిపోయిన పుస్తకం నా కళ్ళ ముందు కదిలింది. అదే.. అదే… పేరు కనుక్కోవడానికి నేను విజయవాడ లో కాళ్ళు అరిగేలా తిరిగిన పుస్తకం ఇదే. ఈ పుస్తకంలో పేజీలు పొయ్యిలో వేసిందనే మా అత్తని నేను రకరకాలుగా తిట్టుకుంది. “కాకలు తీరిన యోధుడు” పుస్తకం పేరు. నికోలాయ్ వొస్త్రోవ్స్కీ రచయిత. పరమానందం కలిగింది. ఎగిరాను, గంతులేసాను, గట్టిగా నవ్వాను. నా ఆనందానికి నాకే ఆశ్చర్యమేసింది. పుస్తకానికీ నాకూ ఉన్న Bonding బలమెంతో అప్పుడే అర్థమయ్యింది నాకు.

విశాలాంధ్రలో పని చాలా తృప్తిగా ఉండేది. ఆర్థికంగా పెద్ద ప్లస్ ఏం కాకపోయినా నాకు నచ్చిన పుస్తకాల మధ్యే నా పని. కాకపొతే షాపులో కూచుని పుస్తకాలు చదువుకోకూడదని రూలు. అదొక్కటే బాధ.

image6పెళ్లి అయిన కొత్తలో ఒక స్లోగన్ పెట్టుకున్నా. “జీతం తప్ప ఏమొచ్చినా పుస్తకాలకే !!” అలోవెన్సులు, బోనస్ లు, O.T లు ఇలా ఏది వచ్చినా సరే. ఇంట్లో గుట్టలు గుట్టలు పుస్తకాలు పేరుకున్నాయి. నాకంటూ సొంత లైబ్రరీ తయారయింది. అన్ని సబ్జెక్టుల్లో క్లాస్సిక్స్ అన్నీ కలెక్ట్ చేశా. రానురాను పుస్తకాలు కొనడం తగ్గించాల్సోచ్చింది. నెలకి 525 రూపాయలతో ఇద్దరం బతకాలి కదా!

1980 ప్రాంతంలో చలాన్ని రెండవ సారి చదవడం మొదలుపెట్టాను. అప్పటికి నా ఆలోచనలలో పరిణితి బాగా వచ్చింది. నాకంటూ కొన్ని భావాలూ రూపుదిద్దుకున్నాయి. చిన్నప్పుడు చదివినవి అన్ని మళ్లి చదివాను. ఈ సారి అధ్యయనం కోసం చదివాను. అప్పుడు అర్థం కాని విషయాలు ఎన్నో ఇప్పుడు అర్థమయ్యాయి. ఈ సారి కొత్తగా రంగనాయకమ్మ, రావి శాస్త్రి, చాసో, బీనాదేవి, తిలక్, శ్రీశ్రీ పరిచయం అయ్యారు. ఏ ఊరు వెళ్ళినా సంచిలో ఒక పుస్తకం పెట్టుకోవడం అలవాటయ్యింది – ప్రయాణం బోర్ కొట్టకుండా.

నా వృత్తి – ప్రవృత్తి ఒకటే కావడంతో నేను నా పని లో ఎంతో చొరవ చూపించగలిగాను. తిరుపతి లో పేరున్న రచయితలతో కలిసి చాలా సంవత్సరాలు “సాహిత్య వేదిక” నిర్వహించాము. రచయితలతో వ్యక్తిగత పరిచయాలు బాగా పెరిగాయి. చాసో, రాంభట్ల, వి.ఆర్.రాసాని, మధురాంతకం నరేంద్ర, ఆంవత్స సోమసుందర్, త్రిపురనేని, పాపినేని .. ఇలా అన్ని రకాల రచయితలతో స్నేహం కుదిరింది. అన్ని రకాల సాహిత్యంతో ప్రేమ కుదిరింది. అభ్యుదయ రచయితల సంఘంతో ప్రయాణం కూడా ఆ క్రమం లోనే మొదలయ్యింది. ఇంకా కొనసాగుతూనే ఉంది. సమాజానికి ఉపయోగపడే భావాలు ప్రచారం చెయ్యడం కోసం ఈ మధ్యనే “అభ్యుదయ” ని అంతర్జాల పత్రిక రూపంలో తీసుకువచ్చాము. (www.abhyudayaonline.com). దాని బాధ్యతలని కూడా స్వీకరించాను.

ఇన్ని సంవత్సరాల తరవాత ఇవన్నీ నెమరు వేసుకుంటుంటే ఏ మనిషి జీవితం తో అయినా పుస్తకానికి ఉండే అనుబంధం ఇంతే గొప్పగా ఉంటుంది కదా అనిపిస్తుంది. ఒక మంచి పుస్తకం దాన్ని ప్రేమించే పాఠకుడికి చేరకపోతే ఎంత బాధ! ఇప్పుడు మరి నా పిల్లలు తెలుగు పుస్తకాలే దొరకని ప్రదేశాల్లో ఉంటున్నారు, ఉద్యోగాలు చేసుకుంటున్నారు. వాళ్లకి ఈ అనుబంధం రుచి ఎలా చూపించాలి? చదువుకోవడానికి పుస్తకాలే లేకపోవడం ఎంత భయంకరం.!

image7అందుకే మంచి పుస్తకాలకీ పాఠకులకీ మధ్య వారధి నిర్మించాలని అనుకున్నాను. అలా పుట్టినదే www.AnandBooks.com.

ఆధునిక సామాజిక జీవితం గతంలో ఎప్పుడూ లేనంత సంక్లిష్టంగా, వైవిధ్యాలతో (వైరుధ్యాలతో) నిండి ఉంది. అర్థం చేసుకోవటానికి ఒక ‘వ్యక్తి గత’ జీవిత అనుభవం చాలదు. అందరి జీవితానుభావాల్నీ రంగరించిన పుస్తకాలే, అధ్యయనమే అందుకు మార్గం.

మన పిల్లలు ప్రపంచంలో ఎక్కడ ఉన్నా వాళ్లకి మన సాహిత్యం అందాలి. వాళ్ళ మనసుల్లో మంచి భావాలు మొలకెత్తాలి, వ్యక్తులుగా మహావృక్షాలు అవ్వాలి. మార్పు వైపు సాగే పురోగమనంలో భాగస్వాములు కావాలి. మంచిని పంచే మనిషితనంతో ఎదగాలి. ‘ఆస్తి’ తత్వం కంటే, పంచుకునే మనస్తత్వం కావాలి. నాకైతే ఈతరంతో కూడా గౌరవించబడే జీవితం కావాలి…. అంతే.

 

 

(ఈ ఆర్టికిల్ కి బొమ్మలు వేసి పెట్టిన మా అబ్బాయి వినోద్ అనంతోజు కి కృతఙ్ఞతలు)

-ఎ.ఎం.ఆర్.ఆనంద్

Nanna

అపురూపం

Apuroopam
గీస్తున్న గీత చేరవలసిన గమ్యం తాలుకు విసురులో ఏమాత్రం తొట్రుపడినా, నన్ను భారం కమ్ముకుంటుంది, అనేకానేక ఆలోచనల మధ్య తాత్కాలికంగా విషయం మరిచిపోయినా దాని తాలూకు బరువు రోజంతా వెంటాడూతూనే వుంటుంది, ఇది దేని తాలూకు వేదనబ్బా ! అని పని గట్టుకు వెనక్కువెళ్ళి దుఖాన్ని మళ్ళీ తొడిగేస్తాను ఉపశమనం కోసం కుదరని బొమ్మే మళ్ళీ మళ్ళీ కుదర్చడానికి ప్రయత్నం జరుగుతుంది అప్పటికీ కుదరకపోతే చివరకి బొమ్మ ముక్కలు ముక్కలుగా చిరిగి పోవడం.

బొమ్మ పోతుంది కాని అది చేసిన గాయం?

కుదిరిన బొమ్మల తాలూకు అనుభూతులు ఎప్పుడూ గుర్తుకు వుండి చావవెందుకో! అపజయాల్ని మళ్ళీ మళ్ళీ వెతుక్కుని మరొక అపజయంకోసం సిద్దమైనవాడ్ని నా కాలంలోనే కాదు ఏ కాలంలో నైనా అన్వర్ అనే అంటారేమో?

బొమ్మల పట్ల ఎందుకని నీకంత జాగ్రత్త? ఏమిటా అపురూపం? అని ? ఒక్క బొమ్మలే కాదు, ప్రపంచంలో ప్రతీది అపురూపంగా ఫీలయ్యే సెన్స్ ని పెంచుకోవాలని
అనుకుంటాను, రోజు ఎన్ని సార్లు ఎంతమందికి థేంక్స్ చెబుతావు, థేంక్స్ చెప్పిపుడు నిజంగా ఆ కృతజ్ఞత హృదయంలోంచి బయలి గొంతులోంచి మెత్తగా ఎదుటి వారిని తాకుతుందా ! థాంక్ యు … ఎంత కరుణ కల్గిన మాట ,బొమ్మలు సాధన చేసినట్టు ధేంక్స్ అనే మాట కృతజ్ఞత నింపుకుని బయటకు రావడానికి ఎన్ని జన్మల సాధన అవసరం! నా ఈ జీవితంలో నా థేంక్స్ నిజంగా ఏ ఒక్కరినైనా తాకగలిగిందా? వెల్తున్నవాడు నా థేంక్స్ కి ఆగి పోయి నా ప్రేమను తాకి మరొక ప్రేమను నవ్వుగా ఇచ్చాడా?

ఒక్క బొమ్మలే కాదు, ప్రపంచంలో ప్రతీది అపురూపంగా ఫీలయ్యే సెన్స్ ని పెంచుకోవాలి , ఎందుకంటే ఒక రోజు వస్తుంది ఆ దినం చేతుల్లో కుంచెని ఎత్తేంత బలం మిగలదు, అ దినం చిన్న చుక్క కూడా పెట్టలేని వణుకు వ్రేళ్ళను ఆవరించేస్తుంది, ఆ రోజుకు ముందే గీయవలసినదంతా గీసేయ్యి , అందుకని బొమ్మలు అపురూపం.

ఒక రోజు వస్తుంది నా కాళ్ళకు అప్పుడు అడుగులు వేయడం తెలిసిన రోజు లుండేవి , ఆ నడవాల్సిన దినాల్లో నడుము పడక్కి ఆనించి పెట్టాను అదే సుఖమనుకున్నా కాని ఈ రోజు చిన్న నడక కోసం తపించి పోతున్నా కాని నడవడానికి కాళ్ళేవి? అందులో బలమేది ?
అందుకని నడక అపురూపం.

కార్టూనిస్ట్ శేఖర్ గారు చివరి రోజుల్లో ఒక పైప్ ద్వారా ఆహారం తీసుకునే వారు, ఆయన నాకు పంటి కింద మెత్తగా నలిగే అన్నం మెతుకు శబ్దం వినడానికి ప్రయత్నించమనే పాఠం నేర్పకనే నేర్పారు, అన్నాన్ని నాలిక ద్వారా లోపలికి తీసుకొవడానికి మించిన అదృష్టమేముంది అనిపించింది నాకా సమయంలో. తెలిసీ తెలీక ఒకనాడు విసిరి కొట్టిన అన్నపు పళ్ళెం నన్ను రోజూ భయపెడుతుంది. అందుకని అన్నం అపురూపం.

“ది స్ట్రయిట్ స్టొరీ” అనే సినిమాలోని సన్నివేశం – దాదాపు 80 సంవత్సరాల ‘ఆల్విన్ స్ట్రయిట్’ చుట్టూ చేరిన నవ్వే కుర్రాళ్ళు, తుళ్ళే కుర్రాళ్ళూ , నర నరాన పచ్చీస్ ప్రాయం నింపుకున్నవారు , వారిలో ఒకడు ఆల్విన్ ని అడుగుతాడు వృద్దాప్యం లో అన్నిటికన్నా ఎక్కువ బాధించేది ఏదీ అని, వాడి ఉద్దేశంలో అది కాళ్ళ నొప్పా, కంటి చూపు మందగించడమా లేదా మరొటీ మరొటా అని. దానికి ఆ వృద్దుడి సమాధానం ” నాకు ఒకప్పుడు యవ్వనం ఉండేది అనే విషయం గుర్తు వుండడం”అంటాడు. చూస్తున్న సినిమా పాజ్ చేసి అలా మూగ గా ఐపోలా ! అలా ఒక రోజు మనకూ వస్తుంది , ఆప్పుడు మనకు వేళ్ళు వుండేవి గీయవలసినదంత గీయవలసింది! నడక వుండేది నడవవలసిన దార్లన్ని నడవవలసినది! చేతులు వుండేవి కలిసిన ప్రతి చేతిని అపురూపంగా చేతుల్లొకి తీసుకొవలసినది….క్షమించండి ఒక్క క్షణం ఇది ఆపుతాను నా చెవుల్లొ ఎవరో పాడుతున్నారు “కిసీకి ముస్కురాహటోంపె హో నిసార్ ” అని.

కాబట్టి ఇదంతా గ్రాంటెడ్ కాదు, నా ప్లేట్ లొకి వచ్చే ప్రతి మెతుకు, నా వంటిన తగిలే గాలి, నన్ను స్నేహించే ప్రతి మనిషి, దీవించే ప్రతి దీవెన ………. నాకు తెలుసు బొమ్మ ఏనాటికి నాదాకా వచ్చేది కాదు కాని ఓపికగా సహనంగా సాధన చేస్తే ప్రేమ రావచ్చు , జీవితాంతం నాతో వుండొచ్చు నా తరువాత కూడా నాగురించీ మీలో వుండొచ్చు కాని ప్రేమకు బదులుగా ఇవ్వడానికి నాదగ్గర నాదికాని బొమ్మ వుంది, ఈ రోజు నా అనుకునే ప్రతీదాని వెనుక బొమ్మ వుంది అందుకే బొమ్మ నాకు అపురూపం బొమ్మ నా జాగ్రత్త.

నేనేం మాట్లాడుతున్నాను?

ఒక మనిషికి, తన స్నేహితులతో- అది ఒక్కరో, ఇద్దరో, నలుగురో- లేదా తనకు చెందిన రోజువారీ గుంపుతో మాట్లాడటంలో ఏ ఇబ్బందీ ఉండదు. కానీ అదే మనిషి, ఒక పదిమంది తననే గమనిస్తున్నారని తెలిసినప్పుడు మాట్లాడటానికి తడబడతాడు. ఎందుకంటే అది తనకు అసహజమైన స్థితి. అలాంటి స్థితిలో కూడా సహజంగా మాట్లాడగలిగేవాళ్లే ఉపన్యాసకులుగా రాణిస్తారు.

కానీ నేను మాత్రం అలా మాట్లాడలేను. మాట్లాడటానికి ఉపక్రమించగానే నా చేతులు వణుకుతాయి, లోపలి నరాలు ఊగుతాయి. దీన్నే చాలామంది స్టేజ్ ఫియర్ అంటారు. అందుకే ఎక్కడైనా నాకు ఆవేశం తన్నుకొచ్చినప్పుడు కూడా మాట్లాడటానికి జంకుతాను. అలా మాట్లాడాలనిపించీ, ఎందుకొచ్చిందిలే అని వదిలేసిందాన్ని ఇక్కడ రాయడం కోసమే ఇదంతా చెప్పడం!

మొన్న మే 31, జూన్ 1 (2014) తేదీల్లో కర్నూలు ‘కథాసమయం’ మిత్రులు ఒక సమావేశం ఏర్పాటుచేశారు. అందులో విడతలుగా చర్చకు పెట్టిన కొన్ని అంశాలు ఉన్నాయిగానీ దానికంటే ముఖ్యమైంది ఆంధ్రప్రదేశ్ విభజనకు ముందు జరిగిన చివరి సమావేశం కావడం దాని ప్రత్యేకత! దానికి అన్ని ప్రాంతాలవాళ్లూ వచ్చారు. కొందరు కొత్తగా పరిచయమయ్యారు; మరికొందరు పేర్లుగా మాత్రమే తెలిసినవాళ్లు ముఖాలుగా పరిచయమయ్యారు. ఈ పర్యటనలో నావరకూ ముఖ్యాంశం: కర్నూలు నగరాన్ని మొదటిసారి చూడటం! కొండారెడ్డి బురుజును ఎక్కకుండా తిరిగిరాకూడదనుకున్నాను, ఎక్కాను. టీజీ వెంకటేశ్ కోటలాంటి ఇంటిగోడలు చూడకుండా సంపద స్వరూపం అర్థం కాదన్నారు, కాబట్టి వెళ్లాను. మద్రాసు నుంచి విడిపోయాక ఏర్పడిన ఆంధ్రరాష్ట్రానికి రాజధాని కర్నూలు కాబట్టి, అప్పుడు తాత్కాలికంగా గుడారాలు వేసి పనులు నడిపించిన స్థలాన్ని చూసుకుంటూ వెళ్లాను. పూర్వస్థితిలోలాగా కర్నూలును రాజధాని చేయమని పట్టుబట్టడానికి కావాల్సినంత చారిత్రక హేతువుండగా, సీమవాళ్లు ఎవరూ దాని ఊసు ఎందుకు ఎత్తడంలేదన్న ప్రశ్న సమావేశాల్లోనే వచ్చింది. ‘కానీ ప్రశ్నించగలిగేవాళ్లేరి?’ అన్న నిరాశే జవాబుగా ఎదురైంది. చివరగా, సాయంత్రం పూట- నక్షత్రాకార సాయిబాబాలయం పక్కన పారుతున్న తుంగభద్ర నీటిపాయలో కరిగిపోయిన సూర్యుడినీ చూశాను. థాంక్స్ టు విజయసారథి! బహుశా, ఇకముందునుంచీ కర్నూలు అంటే నాకు గుర్తుండబోయే ఇమేజ్ ఇదే!

*

నిజానికి భావనలు చాలా బలహీనమైనవి. అయినాకూడా ఒక నిర్దేశిత సమయంలో అవి చాలా ప్రభావం చూపిస్తాయి కాబట్టి, మళ్లీ బలమైనవి కూడా! రెండు వేడి వేడి దోసెలు తిని, ఉడుకుడుకు చాయ్ తాగాక- మా పొద్దుటి సమావేశంలో ఒక విడత మొదలైంది. ‘రాయలసీమ కథ అస్తిత్వం: వైవిధ్యాలు, వైరుధ్యాలు’ మీద వెంకటకృష్ణ మాట్లాడారు. అక్కడి కథ అందుకోవలసిందీ చెప్పారు; సీమ కథ అనగానే కరువు తప్ప మరొకటి గుర్తుకురానివ్వకుండా చేసిన ‘తామందరినీ’ నిందించుకున్నారు. అలాగే సాఫల్యతను ప్రస్తుతించారు. చాలా ఉటంకింపులతో ఆవేశంగా సాగిన ఆ మాటలు ఎక్కడ ఆగాయంటే… సీమరచయితలకు తగిన గుర్తింపు లేదని!

వెంకటకృష్ణ మాటలకు స్పందనగా నేను కొన్ని పాయింట్స్ ఏవో చెబుదామనుకున్నాను. ‘ఎందుకొచ్చిందిలే’ అని వదిలేశాను. సభాభయం ఒకటి ఉందిగా! పైగా నేనేమీ అకడెమిక్ కోణంలో చెప్పలేను. దీనికి అంత ప్రాధాన్యత ఉండదులే, అని కూడా నేను ఆగిపోవడానికి మరో కారణం. అయితే, తర్వాతి విడత చర్చలో, (ఈసారి కోడికూర, గోంగూర భోజనం తర్వాత- మనుషులు మాంసాహారులుగా, శాకాహారులుగా వేరుపడటం ఏంటబ్బా అనుకున్నాం… నేనూ, నా పక్కనే కూర్చున్న దగ్గుమాటి పద్మాకరూ!) సుభాషిణి మాటల్లో కూడా ఇలాంటి భావనే వ్యక్తమైంది. తమ సీమకథకూ, సీమభాషకూ మన్నన లేదని!

 

వాళ్లు లేవనెత్తినట్టుగా ఈ రాయలసీమ కథకుల్ని ఎవరు గుర్తించాలి? బహుశా, తెలంగాణవాళ్లు సీమవాళ్లను కలుపుకొనే పోతారనుకుంటాను. మరి వీళ్లను గుర్తించ నిరాకరిస్తున్నది ఎవరు?

అలాగే, తెలంగాణవాళ్లు కూడా ఇన్నేళ్లుగా మాట్లాడుతున్నది తమను ప్రధాన స్రవంతి సాహిత్యంలో చేర్చుకోరనే. రాయలసీమ వాళ్లు చెబుతున్న భాష సమస్యే తెలంగాణకూ ఉంది. రెండు ప్రాంతాలూ ఒకే బాధను ఎదుర్కొంటున్నాయి. మరి వీళ్లను గుర్తించాల్సింది ఎవరు? అది ఒక ప్రత్యేక సమూహమా?

(ఉత్తరాంధ్ర తరఫున ఎవరూ ఆ సమావేశంలో మాట్లాడలేదుగానీ వాళ్లకూ ఈ బాధే ఉందేమో! )

ఇక విషయాన్ని నేననుకున్నట్టుగా కోస్తావారివైపే డ్రైవ్ చేస్తున్నాను. ఇండ్లదిండ్ల ప్రకాశం, నెల్లూరు జిల్లాలవారికి కొన్ని మినహాయింపులున్నాయి. సీమతో వారికున్న సరిహద్దులవల్ల కావొచ్చు.

వీటిని తీసేస్తే మిగిలినవి ఉభయ గోదావరులు, గుంటూరు, కృష్ణా. అంటే, ఈ నాలుగు జిల్లాల గుర్తింపే అందరికీ కావాలా? సమావేశానంతరం, నలుగురం- అజయ్‌ప్రసాద్, జీఎస్ రామ్మోహన్…- సేదతీరుతున్నప్పుడు, గోదావరి వాడైన ఒమ్మి రమేశ్‌బాబుతో ఇదే విషయం నవ్వుతూ అన్నాను: ‘మాకందరికీ దండలు వేయాల్సిన చాలా పెద్ద బాధ్యత మీమీద ఉంది’.

మొదటే చెప్పాల్సిన డిస్‌క్లెయిమర్ ఇప్పుడు చెబుతున్నాను. నాది చాలా పరిమితమైన భాష, ప్రాంత జ్ఞానం. పైగా ఇదేమీ థియరీ కాదు. నా మానసిక అలజడిని తగ్గించుకోవడానికి నేను పూసుకుంటున్న లేపనం మాత్రమే.

10409245_10103692712795837_3125675474451956223_n

ఒకరు మనల్ని గుర్తించాలి, అనుకోవడంలోనే ఒక న్యూనత ఏదో ఉంది. ఇది భాషతో ముడిపడిన వ్యవహారంగా బయటికి కనబడుతోందంతే! ఎవరితో గుర్తింపబడాలనుకుంటామో వాళ్లు ఆర్థికంగానో, సాంస్కృతికంగానో బలవంతులై ఉంటారు. భాష అనేది ఆధిపత్యానికి ఒక రూపం మాత్రమే! అయితే, ఇదంతా చెప్పుకున్నంత కాంక్రీటుగా ఉండే విషయమేనా!

సమావేశాల్లోనే ఒక రాత్రి- విశాలమైన గార్డెన్‌లో అందరమూ గుండ్రంగా కూర్చునివున్నాం… ఇనాయతుల్లా మంచి నటుడు! ఏకపాత్రాభినయాలతో నవ్వించారు. దుర్యోధనుడికైతే చప్పట్లే చప్పట్లు!! ఆయన అనుకరించిన పల్లీయుల గొంతుల్లో ‘వచ్చాండా’, ‘పోతాండా’ లాంటి ఎన్నో మాటలు దొర్లిపోయాయి. అలాగే, కర్నూలు జిల్లాలోనివే అయిన నంద్యాల, ఆదోని యాసలు ఎలా వేరుగా ఉంటాయో మాట్లాడి వినిపించారు. అయితే, ‘రాయలసీమ యాస’ అని దేన్నయితే అనుకుంటామో, అక్కడి రచయితలెవరూ మాట్లాడలేదు. అందరూ ప్రామాణికభాష అని నిందిస్తున్నదాన్నే మాట్లాడారు. అంటే ఏ యాస అయితే ఇనాయతుల్లా నోట్లోంచి రావడం వల్ల నవ్వు పుట్టిందో, ఆ దశను వీళ్లందరూ దాటేశారు. అందులో అసహజం ఏమీ లేదనే అనుకుంటాను.

*

నేను ఆరో తరగతి చదవడానికి మా ఊరినుంచి మేడ్చల్‌కు వచ్చాను. బడి ప్రారంభం కావడానికి ముందే, మామయ్య వాళ్లు వేసవి సెలవుల్లో మా ఊరికి వచ్చినప్పుడు నన్ను తోలుకొచ్చారు. మళ్లీ నేను మా ఊరెళ్లింది దసరా సెలవులకే. ఆ ఆరేడు నెలల కొత్త వాతావరణం నన్నెలా మార్చిందంటే, ‘రాజిరెడ్డి బాగ శానికచ్చిండు; మన మాటే మాట్లాడుతలేడు,’ అన్నారు మా వదినలు. ‘అత్తన్నా’కు బదులుగా ‘వస్తున్నా’ అని బదులిచ్చివుంటాను. అదే వాళ్లు ప్రేమగా నిందించిన నా శానితనం!

ఇప్పుడు తెలంగాణ రచయితలు కూడా నిజజీవిత వ్యవహారంలో ‘అచ్చిన’ అనరు; ‘వచ్చిన’ అనే అంటారు. ఇందులో ఏది మరింత తెలంగాణ? పాతకాలపువాళ్లు, ఇప్పటి యువకులు; చదువుకున్నవాళ్లు, చదువుకోనివాళ్లు; ఆ కులంవాళ్లు, ఈ కులంవాళ్లు; ఆ జిల్లావాళ్లు, ఈ జిల్లావాళ్లు; హైదరాబాద్‌తో సంపర్కం ఉన్నవాళ్లు, లేనివాళ్లు; ఇలా తెలంగాణ భాష ఎన్నో రకాలుగా విభజించబడివుంది. అన్నింటినీ కలిపే అంతస్సూత్రం ఒకటి ఉంటూనే, మళ్లీ వేరుగా ఉండటం! ఇదే భాషలోని వైవిధ్యం.

నా వరకు నేను కనీసం నాలుగైదు రకాలుగా మాట్లాడుతాను. అంటే మా ఊరికి వెళ్లినప్పుడు మా తాత, పెద్దనాన్న వరస వారితో ఒకలాగా మాట్లాడతా. కొంచెం చదువుకున్న వాళ్లతో ఒకలాగా, నాకు పరిచయమున్న తోటి తెలంగాణ ఉద్యోగులతో ఒకలాగా, ఇతర మిత్రులతో ఒకలాగా. కార్టూనిస్టు శంకర్‌తో ‘ఏమన్నా ఏడున్నవే,’ అంటాను. జూకంటి జగన్నాథంతోనూ, దేశపతి శ్రీనివాస్‌తోనూ మొదటిసారి మాట్లాడినప్పుడు కూడా నేను సార్ అనలేదు; ‘నమస్తేనే’ అని పలకరించాను. అదే, వాళ్లిద్దరికంటే ఎంతో ఎక్కువ పరిచయమున్న సురేంద్రరాజును ఇన్నేళ్లయినా ‘ఏమే, ఏందే’ అనలేదు. ఏ కొంత చనువు తీసుకోదలిచినా నేను ఏత్వం ఉపయోగిస్తాను. ఏత్వం ఉపయోగించడం, నా దృష్టిలో దగ్గరితనమూ, అదేసమయంలో కొంతమేరకైనా తెలంగాణీయత!

అయితే, తుమ్మేటి రఘోత్తమ్ సార్‌ను ఏకవచనంలో సంబోధించలేను. ఆయన కూడా ‘రాజిరెడ్డి గారు’ అనే పిలుస్తారు, రాజిరెడ్డి అంటే సరిపోతుందని చెప్పినా! అలాగే, తెలంగాణలో జన్మించని అన్వర్‌ను వయసుతో నిమిత్తం లేకుండా ‘ఏం సార్, ఎక్కడున్నారు?’ అని పలకరిస్తాను. వయసులో పెద్దవాళ్లయినప్పటికీ తెలంగాణలో పుట్టని మాధవ్ శింగరాజుతోగానీ, నరేష్ నున్నాతోగానీ, అనంతుతోగానీ వాళ్లు నాకు పరిచయమైన తొలిరోజునుంచీ ఏకవచనంలోనే మాట్లాడుతున్నాను. వాళ్లతో ఈ చనువు తీసుకోవడానికి కారణమైందేమిటో నాకు అంతుపట్టదు. అదే చినవీరభద్రుడితోనో, వి.చంద్రశేఖరరావుతోనో మాట్లాడినప్పుడు, నా గొంతు మరింత మర్యాదను అరువు తెచ్చుకుంటుందనుకుంటాను!

అవతలివారిని బట్టి, నా నాలుక ‘వచ్చిండ్రా’ అనేది ‘వచ్చారా’ అనేస్తుంది. ఈమాత్రమేనా యాసల గొడవ అనిపిస్తుంది. గొడవ స్థానంలో లొల్లి రాయలేకపోవడం కూడా ఒక గొడవ! అంతోటి కాళోజీ కూడా ‘నా గొడ’వే అన్నాడుగానీ ‘నా లొల్లి’ అనలేదు.

నా భార్య మొన్నోసారి మావాణ్ని ‘పోయిండు’ బదులుగా ‘వెళ్లాను’ అనిపిస్తోంది. ‘ఏందే?’ అంటే, పార్కులో ఒకామెకు అలా అంటే అర్థం కాలేదట! ఆమెకు అర్థంకాకపోతే రెండ్రోజుల్లో అలవాటవుతుందిలేగానీ అంత నాలుకను మలుచుకోవాల్సిన పనిలేదని చెప్పాను. మరి ఈ తెలంగాణ-ఆంధ్ర స్పృహ లేనప్పుడు, నాకున్న ఆంధ్ర రూమ్మేట్స్ సాయితోగానీ, సుధాకర్‌తోగానీ నేనెలా మాట్లాడానో, అసలు వాళ్లు నాతో ఎలా సంభాషించారో నాకు గుర్తులేదు. ఈ స్పృహ జొరబడ్డాక, నా నాలుకను ఎక్కడ స్థిరం చేసుకోవాలో తెలియక కొంత తికమకపడ్డాను. అందుకే ఒక్కోసారి నా నాలుక మాటల్ని కాక్‌టెయిల్ చేస్తుంది. డబుల్ యాక్షన్ చేస్తుంది.

నిజానికి ఒక మనిషికి నాలుగు నాలుకలు ఉండటం… తన భాష తాను మాట్లాడలేకపోవడం కూడా న్యూనతే! కానీ ఏది నా ఒరిజినల్ భాష? అది ఎక్కడుంది? ఇప్పుడు నేను రాస్తున్నది కూడా ఏ భాష? మాట్లాడినట్టుగా రాయాల్సివచ్చిన ‘పాత్రోచిత సందర్భం’ అయితే తప్ప… లేదంటే ఈ ఆర్టికల్‌లో మీరు చదువుతున్నట్టుగానే రాస్తున్నాను. ఆ పాత్రోచితం అనుకునేదాన్ని కూడా నేను తెలంగాణ యాస అనడానికి సాహసించను. అది మా నర్సింగాపురం యాస మాత్రమే!

*

మావాణ్ని స్కూల్లో వేస్తున్నప్పుడు, పర్మనెంట్ అడ్రస్ రాయాల్సివచ్చింది. డిస్ట్రిక్ట్: కరీంనగర్ అని రాసింతర్వాత, స్టేట్: ‘ఎ’ అని రాయబోయి, ‘టి’తో ప్రారంభించాను. కొత్త సంవత్సరపు తొలివారంలో అలవాటుగా పాత ఏడాదే వేస్తుంటాంకదా, అలాగ!

ఇప్పుడు తెలంగాణ రాష్ట్రం ఏర్పడింది కాబట్టి, ‘అండి’, ‘గారు’ పోవాలని నేను కోరుకోవడం లేదు. అది రిఫైన్డ్ లాంగ్వేజ్. నా వయసువాళ్లు ఎవరైనా మా బాపును ‘రాంరెడ్డీ’ అని పిలిస్తే నా ప్రాణం చివుక్కుమంటుంది. ఏకవచనాన్ని ఏకవచనంలా కాకుండా పలికించడం చాలామందికి తెలియదు. ‘ఓ పెద్దబాపు ఎటువోయినవే?’, ‘ఓ బావా కనవడుతలేవేంది?’, ‘మామా ఎట్లున్నవే’… అన్నీ ఏకవచనమే. కానీ పిలుపులో ఆత్మీయత ఉంది. అయితే, మనకు వరుస తెలియనివారితో కూడా వ్యవహారం చేసే జీవనశైలిలోకి ప్రవేశించాం కాబట్టి, మర్యాదను ప్రకటించడానికి నిర్దిష్టమైన రూపం కావాలి. ఆహారమూ, వ్యవహారమే కదా మన నాగరికతను తెలియజేసేవి!

ఆహారం గురించి కూడా రెండు మాటలు చెప్పాలి. మా ఇంట్లో(ఊళ్లో) పప్పుచారు తప్ప నాకు సాంబారు తెలీదు. హైదరాబాద్ వచ్చేదాకా నేను ఇడ్లీ, దోశ చూడలేదు. ఇప్పటికైనా ఈ రెండూ నా పిల్లలమ్మ చేస్తుందేగానీ మా అమ్మ చేయదు. అమ్మ చేసేవల్లా సర్వపిండి, ఉప్పుడువిండి, వరిరొట్టె, అట్లు. ఇవన్నీ నాకిష్టమే. అయినంతమాత్రాన ఇడ్లీ తినడానికి నాకు ఎందుకు అభ్యంతరం ఉండాలి?

నేను చిన్నప్పుడు అంగూర్లు తినేవాణ్ని. మా అత్తమ్మ మమ్మల్ని చూడ్డానికి వచ్చినప్పుడు కేలాపళ్లు తెచ్చేది. ఇక నాకు డబల్‌రొట్టె అయితే దానికోసం జ్వరాన్ని కోరుకునేంత ఇష్టం. ఇప్పుడా పదాలు వాడే మా అత్తమ్మల తరం పోతోంది. అందుకే, నేను నా పిల్లలకు అంగూర్లకు బదులుగా ద్రాక్షల్ని తినిపిద్దామనుకునేలోపే, వాళ్లు గ్రేప్స్ కోసం మారాం చేస్తున్నారు. హిందూ పేపర్ మాస్టర్‌హెడ్ మీది బొమ్మను చూసి బడికి వేయని చిన్నోడు ఏనుగనీ, స్కూలుకు వెళ్తున్న పెద్దోడు ఎలిఫెంటనీ కొట్లాడుతున్నారు. తెలుగు భాషే మునిగిపోతున్న స్థితిలోవుంటే, ఏ నిర్దిష్ట రూపమూ లేని తెలంగాణ భాష ఇంకెలా మనగలుగుతుంది?

నాకు కొంతకాలం ‘ఆనిగెపుకా’యే అనాలన్న పట్టింపుండేది. సొరకాయ అనకుండా ఉండటానికి ప్రయత్నించేవాణ్ని. కానీ ఇప్పుడది చాలా మామూలుగా నోట్లోకి వచ్చేస్తోంది. ఇది రుద్దడమే అనుకుందాం. అసలు ప్రతిదీ రుద్దడమే. మన భాష, మన మతం, మన ఆహారపుటలవాట్లు, ప్రాంతపు స్పృహ, సంప్రదాయాలు, దేశభక్తి, అంతెందుకు, చివరికి మన పేరు కూడా! అలవాటయ్యేకొద్దీ ఏదైనా మనదవుతుంది. కనీసం ఒక తరంలో రుద్దింది, తర్వాత తరానికి ‘వాళ్ల’దయిపోతుంది.

ఉర్దూ రాజ్యమేలితే చచ్చినట్టు ఉర్దూ నేర్చుకుంటాం. ఇంగ్లీషు ఏలుతోంది కాబట్టి దాన్ని నేర్చుకుంటున్నాం. ఒక కృష్ణా జిల్లా అమ్మాయి, రాయలసీమకు చెందిన మా భారతి మేడమ్ మాటల్ని అనుకరించడం నేను విన్నాను. అందుకే కోస్తాధిపత్యాన్ని అబద్ధం అనాలనే ఉంది నాకు. ఎందుకంటే కోస్తావారిలో కూడా అందరి భాషా ఒకటే అయే అవకాశమే లేదుకదా! అది కూడా పేదలుగా, ధనికులుగా, పల్లీయులుగా, నగరవాసులుగా, కులాలుగా, జిల్లాలుగా విభజించబడే ఉంటుంది కదా! అసలు ప్రమాణం అనుకునేదే ఒక ప్రమాణంలోకి ఒదిగేది కాదు. దీన్ని ఇలాగే అంగీకరిస్తే, ఇక ఈ ఐటెమ్ చెప్పవలసిందేదో చెప్పకుండానే ముగిసిపోతుంది.

 

మరి వెంకటకృష్ణ పెయిన్ అబద్ధమా? తెలంగాణ మిత్రుల వాదన నిజం కాదా? అంతెందుకు, నాకు నేను నాలుగు నాలుకలుగా చీలిపోయిందంతా ఊరికే జరిగిపోయిందా?

నేననుకోవడం- ఇదంతా కూడా ఒక ప్రాక్టికల్ వాల్యూతో ముడిపడివుంటుంది. ఆ విలువే మన జీవితాన్నీ, ప్రపంచాన్నీ నడుపుతుంది. మాకు ఆతిథ్యమిచ్చిన ‘ఇండస్ పబ్లిక్ స్కూల్’ ముందుభాగంలో ‘జీపీఏ 10/10’ సాధించిన పదో తరగతి విద్యార్థిని ముకుంద ప్రియ పేరు, ఫొటోతో కూడిన ఫ్లెక్సీ వేలాడదీసివుంది. బహుముఖీనంగా ఉండే ప్రాక్టికల్ వాల్యూకు ఇదొక రూపం. ఏ తల్లో ఆ పాపలాగే తన కూతురినీ చదివించాలనుకుంటుంది. ‘సమాజం’ ఏయే కారణాలవల్ల ఏయే విలువల్ని పోషిస్తుందో, అవే కారణాలవల్ల మిగిలినవాళ్లందరూ వాటిని అందుకోవడానికి ప్రయత్నిస్తారు. అలా తెలుగువారందరికీ బహుశా ఆ ప్రాక్టికల్ వాల్యూ కోస్తా దగ్గర ఉందేమో! ఇదే ప్రపంచం మొత్తానికైతే ఆ వాల్యూ అమెరికా దగ్గర ఉండొచ్చు. అందుకే ప్రపంచదేశాలు అమెరికాను అనుసరించినట్టుగానే, మిగిలిన తెలుగు ప్రాంతాలు కోస్తాను అనుకరించక తప్పదేమో! ఇందులో మంచీ లేదూ చెడూ లేదు. అనివార్యం! రేపెప్పుడైనా ఇదంతా మారిపోయి, ఇంకో విలువ పైకితేలితే లోకం దాన్నే అనుసరిస్తుంది. ఆ విలువ ఎలా, ఎందుకు, ఎవరివల్ల పైకి లేస్తుందన్నది నమోదుకాబోయే చరిత్ర!

(జూన్ 2014లో రాసిన ఆర్టికల్)

-పూడూరి రాజిరెడ్డి

rajireddi-1

కవిత్వపు తోటలో పాటల చెట్టుతో ఓ సాయంత్రం

gorat1

కవిత్వపు తోటలో విహరించడమే ఒక వరమైతే… అందులో పాటల చెట్టు ఎదురైతే.. అంతకన్నా అదృష్టం మరేముంటుంది. అదే ఈ సాయంత్రం. మరపురాని అనుభూతుల్ని మిగిల్చిన సాయంత్రం.

జీవితమనే ప్రయాణంలో ఎంతోమంది కలుస్తుంటారు. కొంతమంది కలయిక మనలో నూతన చైతన్యాన్ని, ఉత్సాహాన్ని, ఒక్కొక్కసారి గుర్తింపుని ఇస్తుంది. అలా ఎంతోమంది యువకవుల్లో చైతన్యాన్ని, ఉత్సాహాన్ని నింపుతూ…. గుర్తింపు దిశగా అడుగులు వేయిస్తున్న మార్గదర్శి కవి యాకూబ్.

ప్రవహించే జ్ఞాపకాలతో ఎడతెగని ప్రయాణం చేస్తూ… సరిహద్దు రేఖల్ని దాటుకుంటూ కవిత్వలోకంలో విహరిస్తున్న విహంగం అతడు. తనతోపాటు ఎంతోమందిని తన దారిలో నడిపిస్తున్న కవిత్వప్రేమికుడు. జీవితపు అవతలి తీరాన్ని చూపిస్తున్న దిక్సూచి.

ఎన్నో నెలలుగా తన ఇంటికి ఆహ్వనిస్తున్నా… పని ఒత్తిడులతో వెళ్లలేని పరిస్థితి. ఆయన రమ్మనడం… నేను ఏదో ఒకరోజు వస్తాననడం పరిపాటిగా మారింది. ఇక ఈ రోజు ఎలాగైనా వెళ్లాలని నిర్ణయించుకొని, ఫోన్ చేశా… అవతలివైపునుండి ‘నమస్తే అన్న’ అని తీయని పలకరింపు… సార్ మీరు నన్ను ‘అన్నా’ అనడమేంటి అని అడిగా… మా కవిత్వంకోసం ప్రతినెలా మీ వేదికను మాకిస్తున్నారు, నువు నాకు అన్నవి కాక మరేంటి అంటూ నవ్వులతో సమాధానం.

సార్ మీ ఇంటికి వస్తున్నా అనగానే.. అలాగే నాన్న.. తప్పకుండా.. అంటూ ఇంటి అడ్రస్ చెప్పారు. తెలియదు సార్ అంటే ఏంపర్లేదు.. చైతన్యపురి బస్టాప్ కి రా అక్కడినుండి నేను తీసుకెల్తాగా అన్నారు. మొదటిసారి తన ఇంటికి వెల్తున్నాకదా… ఇంకెవరైనా తోడుంటే బాగుండు అనిపించింది. మిత్రులు కట్టా శ్రీనివాసరావు గారు కూడా కలుస్తానన్నవిషయం గుర్తొచ్చి తనకి ఫోన్ చేయగా.. ఆయనా సై అన్నారు. హమ్మయ్య… ఒక పనైపోయింది అనిపించింది.

అప్పటికి సమయం 4.30ని.లు. నేను ఉన్నది అబిడ్స్. బస్ లో ప్రయాణం. ఆలస్యమవుతుందేమోనన్న టెన్షన్. మొదట కోఠికి వచ్చాను. అక్కడ చాలామంది జనం. 10ని.లు ఎదురుచూపు. ఆతర్వాత వచ్చిన హయత్ నగర్ బస్ ఎక్కాను. మండే ఎండలో, కిక్కిరిసిన బస్ లో శరీరం వేడెక్కుతున్నా… ఈ సాయంత్ర విశేషాన్ని ముందే పసిగట్టిందేమో… మనసు మాత్రం ఉల్లాసంగానే ఉంది.

5.30ని.లకు చైతన్యపురిలో దిగి, కట్టాగారికి ఫోన్ చేస్తే.. మరో 15ని.లు పడుతుందన్నారు.

5.45 అయింది. కాని రాలేదు. ఇంతలో యాకూబ్ గారినుండి ఫోన్. బస్టాప్ లో ఉన్నా అని చెప్పగానే.. 5 ని.లో బైక్ తో ప్రత్యక్షం. ఇద్దరం కల్సి ఇంటికి పయనమయ్యాం.

*****

ఇంటి ఆవరణలోకి ప్రవేశించగానే ఏదో కొత్త అనుభూతి. కవిత్వపు తోటలోకి విహారానికి వచ్చినట్లనిపించింది…. చల్లని పందిరిపై ఉన్న మల్లెతీగ తన కొమ్మలను పందిరంతా పరచుకొని, తన పూల సువాసనతో నాకు స్వాగతం పలికింది. ఆ పరిమళాన్ని ఆస్వాదిస్తూనే గుమ్మం దగ్గరికి వెళ్లా…ఎదురుగా ఉన్న గోడకి ఒక పోస్టర్. దానిపై

‘‘గొప్పవారు కావడానికి డబ్బుకాదు ముఖ్యం

కష్టించి పనిచేసే తత్వం. ఉన్నత వ్యక్తిత్వం

ఈ రెండూ ఉంటే అవకాశాలు మనల్ని వెతుక్కుంటూ వస్తాయి

ధైర్యంగా ఒక అడుగు ముందుకు వేస్తే

విజయం పది అడుగులు ముందుకు వేస్తుంది’’

అన్న ఠాగూర్ మాటలు కనిపించాయి. ఆహా… ఎంత చక్కటి ప్రేరణ. గుమ్మంలోనే యాకూబ్ గారి స్పూర్తి తెలిసిపోతుంది. అందుకేనేమో యాకూబ్ గారి ఇంటికి యువకవులంతా దారులు కడతారు.

ఇంటిలోనికి అడుగుపెట్టగానే లోపల సాహిత్య వారధలు శిలాలోలిత గారు, కట్టా శ్రీనివాసరావు గారు, బేబి రక్షిత సుమలు నాకోసం ఎదురుచూపు. కుశల వివరాలు, టీ స్నాక్స్ తో 15 ని.లు గడిచింది. ఆ సమయంలో యాకూబ్ గారు తనకు వచ్చిన జ్ఞాపికలను చూపిస్తూ… వాటి నేపథ్యాన్ని వివరించారు.

6గం.లకు వికీపీడియాలో ఎడిటింగ్ ప్రారంభించాం. కట్టా శ్రీనివాసరావు గారికి లాప్ టాప్ అప్పగించి, వికీలో యాకూబ్, శిలాలోలిత గార్ల గురించిన వ్యాసాలను రాశాము.

సమయం 9 గం.లు. బయటిరూంలో ఎవరో వచ్చిన శబ్దం వినిపించింది. ఆ వ్యక్తి ఎవరో అని చూడగా… ఎదురుగా పాటల చెట్టు గోరటి వెంకన్నభోజనం చేస్తూ కనిపించారు. ఎంత అదృష్టం. ఇప్పటివరకు టి.విల్లో చూసిన ఆయన ఈరోజు నాముందు, నాకు దగ్గరగా ఉండడం. చిన్నప్పుడు ఆయన పాటలు విని, పుస్తకాల్లో రాసుకొని, పాడుకునేవాణ్ణి.

 

వికీపీడియా పని పూర్తిచేసి, కట్టా గారితోకల్సి హాల్లోకి వచ్చాను. యాకూబ్, వెంకన్నలుకబుర్లలో ఉన్నారు. అపుడు సమయం 9.30ని.లు. ఇంకా ఆలస్యమైతే బస్సులుఉండవన్న ఆందోళన ఒకవైపు, వెళ్లిపోతే ఈ వాతావరణాన్ని మిస్ అవుతానన్న ఆలోచనమరోవైపు. ఉండడానికే మనసు మొగ్గుచూపింది. అందరం కల్సి ఫోటోలు దిగాము.

యాకూబ్, వెంకన్నలుకల్సి కవిత్వాలు, చీమకుర్తి వారి పద్యాలు పాడుతున్నారు. వాళ్ల ప్రవాహానికి అడ్డుగా ‘సార్ లేటవుతుంది. ఇక వెల్తాను’ అన్నాను. ‘లేదు లేదు తిని వెళ్లాలి’ అని అమ్మగారి ఆర్డర్. ‘మొదటిసారి మా ఇంటికొచ్చావ్, భోజనం చేయకుండా వెల్తావా’ అని యాకూబ్ గారి ప్రశ్న.

క్షణాల్లో భోజనం ప్లేట్లతో మేం సిద్ధమవగా… తన గానంతో వెంకన్న సిద్ధం. మీకు అన్నంతోపాటు నా పాటల్నికూడా రుచిచూపిస్తా అంటూ మొదలుపెట్టాడు. ఇంతకుముందు తను రాసిన పాటలు పాడుతూ.. అందులో వచ్చిన పదాలతో అప్పటికప్పుడు ఆశుగా పాటలుపాడుతూ మమ్మల్ని గానలోకంలో విహరింపజేస్తున్నాడు.

ఆహ… ఆ అనుభూతే వేరు. వేడి వేడి అన్నంలో పప్పు, ఆవకాయ, నెయ్యి కలిపి తింటున్న రుచి ఒకవైపు… వెంకన్న గానం మరో వైపు. ఇంతకంటే స్వర్గం మరోటి ఉంటుందా అనిపించింది.

అపుడు లచ్చువమ్మా పాట పాడాలని యాకూబ్ గారు కోరగా…

‘‘పారే ఏటి అలలమీదా పండుటెన్నెల రాలినట్లు

ఊరే ఊటా సెలిమలోనా తేటనీరు తోలకినట్లు

వెండి మెరుపుల నవ్వునీదో లచ్చువమ్మో

నీవింత సక్కని రూపమేమో లచ్చువమ్మా……

మంచె ఎక్కి కేకబెడితే కంచిమేకలు సుట్టూ జేరును

నీ అల్లరిని ఆలేగదూడలు ఒళ్లేకొచ్చి ఒదిగిపోవును

పాలిపోయిన కందిసేనే లచ్చువమ్మో

నువు పాట పాడితే పూతబడుతది లచ్చువమ్మా….

కోడికూతకు ముందూలేసి పేడనీళ్ల కళ్లాపి జల్లి

ముచ్చటొలుకా ముగ్గూలేసే మునివేలి గోరుపైనా

ఆ పొద్దే ముద్ద గోరింటైతది లచ్చువమ్మో

పొడ ఎండ నీ మెడలారమైతది లచ్చువమ్మా…..

నీ కాలిఅందెల సవ్వడికి తాబేళ్లు ఇసుకల గంతులేస్తవి

జాలిగల నీ చూపులకు తోడేళ్లు సాధు జీవులైతవి

దారిలో పల్లేరు ముళ్లే లచ్చువమ్మో

నువు కాలు మోపితే మల్లెలౌతవి లచ్చువమ్మా…..’’ అంటూ

లచ్చువమ్మ పాటను అందుకున్నాడు వెంకన్న. ఆయన పాడుతున్న తీరు చూస్తుంటే ఆ లచ్చువమ్మ నేపథ్యం మా కళ్లముందు కదలాడింది. చక్కని పదాలతో, అంతకంటే చక్కని పోలికలతో లచ్చువమ్మని వర్ణించడం అద్భుతం అనిపించింది. అలా మా భోజనం తృప్తిగా ముగిసింది.

ఇక మళ్లీ కచేరి. మేంఅందరం వెంకన్న చుట్టూ చేరి ఒక్కో పాటను అడుగుతున్నాము. తను కూర్చున్న సోఫాపై దరువులు వేస్తూ పాడుతున్నాడు. అది చూసిన యాకూబ్ చిన్న టేబుల్ తెచ్చాడు. అపుడు ఆ టేబుల్ పై దరువులు వేస్తూ…

 

‘‘పల్లె కన్నీరు పెడుతుందో కనిపించని కుట్రల

నా తల్లీ బందీ అయిపోతుందో కనిపించని కుట్రల…….

 

కుమ్మరి వామిలో తుమ్మలు మొలిచెను

కమ్మరి కొలిమిలో దుమ్ము పేరెను

పెద్దబాడిస మొద్దు బారినది

సాలెల మగ్గం సడుగులిరిగినవి

చేతి వృత్తుల చేతులిరిగిపాయే నా పల్లెల్లోనా

అయ్యో గ్రామ స్వరాజ్యం గంగలోనపాయే ఈ దేశంలోనా…

 

మడుగులన్ని అడుగంటి పోయినవి

బావులు సావుకు దగ్గరైనవి

వాగులు వంకలు ఎండిపోయినవి

చాకలి పొయ్యిలు కూలిపోయినవి

పెద్దబోరు పొద్దంతా నడుస్తుందో బలిసీన దొరలది

మరి పేద రైతు బావులెందుకెండే నా పల్లెల్లోనా…..’’ అంటూ గ్రామంలో కూలిపోతున్న బతుకుల గురించి చిన్నచిన్న పదాలతో కూడిన శబ్ధసౌందర్యం మరింత అందానిచ్చిన ఈ పాటను వింటున్నంతసేపు ఒక చక్కని అనుభూతిని కలిగించింది. యాకూబ్ గారితోపాటు మేం కూడా శృతి కలిపాం…

అలా అలా సాగుతున్న పాటల ప్రవాహంలో మధ్యమధ్యలో తమ అనుభవాలను, వాటిద్వారా వచ్చిన పాటల, కవిత్వాల గురించి గోరటి వెంకన్న, యాకూబ్ లు వివరించారు.

ఇతర రచయితలు, వారి సాహిత్యంపై కూడా తన ప్రసంగాన్ని వినిపించాడు వెంకన్న. ఏ రచయిత శైలి ఏవిధంగా ఉంటుందో వివరిస్తుంటే… ఇంతమందిని చదివాడా అని ఆశ్చర్యం వేసింది. అలా అలా తన ప్రవాహం ప్రవహిస్తునే ఉంది.

gorat2

కొంతసేపటితర్వాత తన ఎడతెగని ప్రయాణం పుస్తకంలో వెంకన్న గురించి రాసిన కవిత్వాన్ని,

‘‘అతడిరాకను ఇట్టే గుర్తుపట్టగలను…

దూరంనుంచే ముక్కుపుటాల్ని చేరుకునే

స్నేహగంధం నాకుముందే అతడిరాకను చేరవేస్తుంది

మనదగ్గరున్నదేదో మనమే విసిరేసి

తిరిగి దానికోసమే యుగాలుగా వెతుక్కుంటున్నట్లు

అతడి సమక్షాన్ని గుర్తుపట్టకుండా

అతడి కోసం ఎదురుచూస్తూ గడిపేస్తుంటాం

గుర్తుకొస్తూ మరపులోకి వేగంగా జారిపోయే

మాఊరి కొండల వెనుక దాచివుంచిన

నా బాల్యపు సంపాదనంతా తాను చూసివచ్చి

నాకే ఎరుక పరుస్తున్న అతడి రుషిత్వం అబ్బురపరుస్తుంది’’

శిలాలోలిత గారు స్నేహితుని గురించి రాసిన కవిత్వాన్ని యాకూబ్ గారు మా అందరికి వినిపించగా… యాకూబ్ గారి ఊరైన రొట్టమాకు రేవు, దాని చెరువు గట్టు గురించి వెంకన్న అప్పటికప్పుడు కవిత్వాన్ని అల్లి వినిపించాడు.

బేబి రక్షిత సుమ రాసిన కవిత్వాలను కూడా చూసి, ‘ఇంత చిన్నవయసులోనే ఎంతగా ఆలోచిస్తున్నావ్ తల్లీ’ అంటూ అభినందించారు.

సమయం 10.30ని.లు అవుతుండగా అందరం వాకిట్లోకి వచ్చాం. ముందుగా వెంకన్న గారు బయలుదేరగా… కట్టా గారు తర్వాత బయలుదేరారు. ఇక మిగిలింది నేనే. యాకూబ్ గారు నాకోసం బైక్ తీసారు. అమ్మగారి దగ్గర సెలవు తీసుకోని బయలుదేరాను.

ఎంతో ఆనందాన్ని, ఎన్నో అనుభూతుల్ని మిగిల్చిన ఈ సాయంత్రం… నాకెంతో అపురూపం.

-ప్రణయరాజ్ వంగరి

వూస బియ్యం..అనపకాయలు…నిన్నటి తీయని తలపులు!

Grain_millet,_early_grain_fill,_Tifton,_7-3-02

వూస బియ్యం…!

మీరు ఈ పేరు ఎప్పుడైనా విన్నారా..??

ఇది పల్లె టూర్లో  పుట్టి పెరిగిన వారికి మాత్రమే అర్ధమయ్యే మాట. అదీ మాగాణి భూముల్లున్న వారు కాకుండా ,మెట్ట పంటలు పండించే వారికి మాత్రమే తెలుస్తుంది. అవును..మళ్ళీ మెట్ట పంట లేంటీ అనే ప్రశ్న వచ్చింది కదా.. బాగా నీటి వసతి, కాలువలు, చెరువులూ, నదీ తీరాల్లో ఉన్నవారికి  వరి పంట పండుతుంది. లేదా వాణిజ్య పంటలు పండిస్తారు. కానీ నీటివసతి సరిగ్గాలేనివారు , వర్షాధార పంటలు , మెట్ట పంటలు పండిస్తారు. మెట్ట పంటలంటే వేరు శనగ , జొన్న, మొక్కజొన్న, సజ్జ ,కంది ,పెసర ,మినుము ఇలా అన్నమాట. మాకు మావూర్లో నీటి పారుదల లేదు. చిన్న చెరువు ,వర్షాధారం , మోట భావుల ద్వారా మాత్రమే పంటలు పండేవి. ప్రతి వారూ, వారికి సం.నికి సరిపడా వరి పంట వేసుకొని , మిగిలిన భూముల్లో మెట్ట పంట వేసుకొనేవారు అన్నమాట.

మా నాన్న గారూ కూడా అలాగే చేసేవారు. అందుకే మాకు కొద్దిగా వరి , వేరు శనగ, జొన్న ,సజ్జ, కంది ,పెసర , కొద్దిగా మిర్చి పండేవి. వేరు శనగ కాస్త ముదరగానే.. జీతగాళ్ళ ద్వారా అమ్మ ఇంటికి తెప్పించి, పచ్చికాయలు ఉప్పు వేసి ఉడికించడం , లేదా శనగ చెట్లు (ఎండినవి ) వేసి కాల్పించేది. వాళ్ళు ఇంటివెనుక మంటవేసి కాయలు కాలుస్తూ, కర్రతో మంట సరిచేస్తూ, కాయలు మాడకుండా తిప్పుతూ వుంటే , మేం చుట్టూ కూర్చుని కమ్మటి వాసన పీలుస్తూ కూర్చునేవాళ్ళం.  “దూరం జరగండి అమ్మాయి గారూ.. నిప్పురవ్వ ఎగిరొచ్చి మీద పడతుంది..” అన్నా వినేదాన్ని కాదు.నాకూ అలా కర్రతో విన్యాసం చెయ్యాలని వుండేది. కానీ ఇచ్చేవారు కాదు. భయం కదా..మా నాన్న అంటే..”దొర సంపేస్తాడు..నిప్పు తో చెలగాటం అమ్మాయిగారూ ..” అంటూ..అంతాకాల్చాక.. నీళ్ళు పల్చగా చల్లి నిప్పు ఆర్పి , చాటలోకి ఎత్తి, బొగ్గు, నుసి ,బూడిద చెరిగి అమ్మకు ఇచ్చేవాళ్ళు.

download

అమ్మ పేపర్ ముక్కలు చింపి వాటిల్లో కాల్చిన పల్లీలు , తలా ఒక బెల్లం ముక్క ఇచ్చేది..ఆ కమ్మటి  వాసన ,రుచి..ఆ పచ్చికాయలు కాల్చిన రుచి..ఇక జన్మలో తినగాలనా..ఉహూ..నమ్మకం లేదు..అవి గతకాలపు తీపి గుర్తులు మాత్రమే..నాకు ఉడక బెట్టిన పల్లీలు కూడా చాలా ఇష్టం. ఇప్పుడు రైతుబజార్ లలో పచ్చికాయలు దొరుకుతాయి అప్పుడప్పుడు..అవి ఉడకపెడతాను ,ఉప్పేసి కుక్కర్లో..కానీ ఆ రుచి..నా చిన్నప్పుడు అమ్మ కట్టెల పొయ్యి మీద ,ఇత్తడి గిన్నెలో ఉడికించిన రుచి..మళ్ళీ ఎలావస్తుంది..?
మీకు వూస బియ్యం గురించి కదా చెప్తాను అన్నాను.. అక్కడికే వస్తున్నా.. జొన్న , సజ్జ కంకులు వేసి గింజ పట్టి కొద్దిగా గింజ గట్టి పడగానే వాటిని ‘పాల కంకులు’ అంటారు. అంటే గింజలు తియ్యగా , నమిలితే పాల లాగా ఉంటాయన్నమాట. అప్పుడు కూడా అమ్మ కంకులు తెప్పించేది. పనివాళ్ళు వాటిని రెండు చేతులతో నలిచేవారు. అప్పుడు కంకులనుండి గింజలు రాలినా ,వాటికి నుసి వుండేది..అది గొంతులో గుచ్చుకుంటుంది. మళ్ళీ బాగా నలిచి, చెరిగి, పూర్తిగా నుసి పొయ్యాక మాత్రమే తినాలి. ఆ గింజలని “వూసబియ్యం “ అంటారు. వాటిని అలా తిన్నా..ఎంత తియ్యగా ఉంటాయో..నాకు సజ్జ వూసబియ్యం చాలా ఇష్టంగా ఉండేవి. వాటిలో కొద్దిగా చక్కర వేసి తింటే..ఆ రుచి ఎలా చెప్పను…??? నేను తినే ..దగ్గర దగ్గర 39,40 సం. అయ్యింది. ఇప్పటి వారికి సజ్జ , జొన్న ఎలావుంటాయో కూడా తెలియదు..ఇక వాటి రుచి తెలిసే అవకాశం శూన్యం… పైగా పంటలు రాగానే, మా అమ్మ సజ్జన్నం, జొన్నన్నం వండేది..గోంగూర పచ్చడి , దోసకాయ పప్పు, వెన్న, ఉల్లికారం కాంబినేషన్స్ తో..అసలు అలాంటి విందు భోజనాలూ ,రుచులూ ఎంత మందికి తెలుసు..?తిన్నవారు వుంటే..చెప్పండి ..విని ఆనందిస్తాను.
అలాగే మరో రుచి..నాకు ఎప్పుడూ గుర్తుకొచ్చేది..మేం కోదాడ కి వచ్చేటప్పటికే నాకు దొరకని ఆ రుచి..ఉడకబెట్టిన ‘అనపకాయలు’… అబ్బ.. నాకు విపరీతమైన ఇష్టం ..అవి మాకు పండేవికాదు…అవి పొలం గట్లమీద తీగల్లాగా వేసుకొనేవారు..చిక్కుడు కాయల్లగేవుంటాయి. గింజలు కూడా చిక్కుడు గింజల కన్నా కాస్తపెద్దగా ,ఆకుపచ్చగా..ఉండేవి. కాయలతోసహా తంపెట (నీళ్ళలో ఉడికించడం ) పెట్టేవారు..స్కూల్లో కొందరు అమ్మాయిలు తెచ్చేవారు. నాకు ఇష్టమని ఇచ్చేవారు..కానీ నాకు మాఇంట్లో ఎక్కువగా తినాలని ఆశ. బయట తిన్నానని చెపితే తిట్టేది అమ్మ. అలా ఎవరు పడితే వాళ్ళు పెట్టినవి తినకూడదు అని..( అప్పటి సాంప్రదాయాలకి బద్దులు ).., కానీ నేను తినేదాన్ని. మా రెండో అన్నయ్య ,ఇంటికి వచ్చి అమ్మకి చెప్పేవాడు.అమ్మ తిట్లు..అయినా షరా మామూలె అనుకోండి.. మా ఇంట్లో అవి  ఉడకబెట్టడం మాత్రం జరగలేదు..నాకు పదేళ్ళు దాటాక వాటిని తినలేదు కూడా మళ్ళీ..కానీ నాకు వాటి వాసన , రుచి మాత్రం గాఢ౦ గా గుర్తుండిపోయింది. ‘అనపకాయలు ‘ ఎవరికైనా తెలుసా..? అసలు ఇప్పుడు పండుతున్నాయో లేదో కూడా తెలీదు..

-ఉషారాణి నూతులపాటి

10014699_686488301403306_267157800_n

అంట్లు.. పాచి… కూసింత ఆత్మీయత!

amma and satavathi

పనిమనిషి, పనమ్మాయి మా ఇంట్లో వినిపించనేకూడని ఒకేఒక్క పదం.

                 ఐతే మా ఇంట్లో ఎవరూ పనిచేయరని కాదు. పనిచేస్తారు. సబ్బు లక్ష్మి, సముద్రం(మనిషి పేరు), సిరి, నాగవేణి, నాగమణి, సత్యవతి-ఇలా ఎందరు మా ఇంట్లో పనిచేసినా పేర్లతో పిలవడమే తప్ప “మా పనమ్మాయి” అని ఎప్పుడూ అమ్మ అన్నది లేదు. మేము “పనమ్మాయి వచ్చిందమ్మా” అని చెప్తే ఊరుకున్నదీ లేదు. స్వావలంబన, సమానత్వం, వ్యక్తి గౌరవం లాంటి పెద్ద పదాల గురించి మా అమ్మ చదివినట్టు లేదు కానీ నాకు తెలిసినంతలో వాటి స్పృహ, ఆచరణల్లో ఆమెని మించినవారిని నేనెన్నడూ చూడలేదు. ఇంకో విశేషమేంటంటే మా అమ్మ సహృదయత, సంస్కారం మా చుట్టపక్కాలకే కాదు మాకే స్పష్టంగా తెలిసేది కాదు. కొడుకును కాబట్టి అమ్మ ఆచరణను దగ్గరనుంచి చూస్తూండగా ఏళ్లకేళ్లలో నాకు అర్థమైంది మా ఇంట్లో పనులు చేసేవాళ్లను ఆమె చూసుకునే పద్ధతి. అమ్మా నువ్విలా చేస్తున్నావు తెలుసా అంటే ఆమె కూడా ఆశ్చర్యపోయిందంటే చూడండి.
                అమ్మ నాకు మా తాతముత్తాతల గురించీ,పెదనాన్నలు, అత్తయ్యల గురించి తెలుసుకున్న విశేషాలు(పుకార్లు చెప్పేది కాదు. కచ్చితంగా తెలిసినవే చెప్పేది), వాళ్ల జీవితంలో చీకటివెలుగులు చెప్తూంటుంది. అలాంటి వాటిలో ఒకటి మా పెదనాన్న-అతని నౌకరు కథ. మా తల్లిదండ్రులది మేనరికం. మా నాన్నారి అక్కకూతురు మా అమ్మ. ఇద్దరూ మేనమామ-మేనకోడళ్లు. పైగా ఆమె బాల్యం చాలావరకూ(దాదాపు ఆమె 10ఏళ్ల వయసు వరకూ) మా పెదనాన్నలు, పెద్దమ్మలు, అత్తయ్యలు, నాన్నమ్మలతో మా స్వగ్రామంలో ఉమ్మడి కుటుంబంలోనే గడిచింది. మా పెదనాన్న(అంటే అమ్మకి పెదమావయ్య) గ్రామ కరణం. బహుశా ఈ కథ 1975-80 కాలంలోనిది. ఓరోజు నౌకరు కొడుకు వెంకడు(పేరుమార్చాను) మా ఇంటికి వచ్చాడట. అతనిదీ చాలా చిన్న వయసే. మా అమ్మ బయటకి వచ్చి “పెదమావయ్య స్నానం చేస్తున్నాడు. అలా అరుగు మీద కూచో” అందట. మంచినీళ్లేమైనా కావాలా అనడిగి, పెద్దాయనకి చెప్పేందుకు వెళ్ళింది. స్వతహాగా మా పెదనాన్నది ప్రథమకోపం.
అరుగుమీడకి వచ్చీరాగానే పిచ్చగా తిడుతూ కొట్టినంత పని చేసాడు.  అతని మాటల్లోనే తేలిన విషయమేమిటంటే- కచేరీ చేసే అరుగు మీద నౌకరు కొడుకు కూర్చోవడమేంటి? ఊళ్ళో రాజులేవరైనా చూస్తే మళ్లీ మా అరుగెక్కుతారా? నిజానికి మా అమ్మ అప్పటికి చాలా చిన్నది. ఇలా కూడా ఉంటుందా లోకం అని కొత్తగా తెలిసింది ఆమెకి. ఐతే మా అమ్మ కథ ఇక్కడితో ఆపలేదు. ఓ పదేళ్లు తిరిగేసరికి వెంకడల్లా గ్రామనౌకరుగా ప్రభుత్వంచే నియమింపబడ్డాడు. మా పెదనాన్న ఉద్యోగం సక్రమంగా చేయాలంటే నౌకరు చక్కగా సహకరించాలి కదా. పైగా నాటికి సాంఘికమైన కొన్ని కట్టుబాట్లు, మూర్ఖపు పట్లు పలచబడ్డాయి. వెంకడితో మండల కేంద్రానికి వెళ్ళే పని పడింది. పాత విషయాలేవీ గుర్తులేని ఆయన “రా ఎక్కు” అని (మోటారు)బండి ఎక్కమని పిలిచాడు. అతను గతం మర్చిపోలేదు. “మీ బండి ఎక్కితే పెద్దమనుసులు ఎవురైనా మళ్లీ ఎక్కుతారాండీ” అని గతం గుర్తుచేసుకుని బాధపడ్డాడు. మా పెదనాన్న అయ్యో ఏదో అప్పుడు అలా జరిగిపోయింది లే బాధపడొద్దని సముదాయించాడు. ఆ తర్వాత అతను రెవెన్యూ ఉద్యోగి కూడా అయ్యాడు. అప్పుడు కూడా “మీ అరుగు మీదకి నేనెక్కితే పెద్దమనుషులు ఎవరైనా మీ అరుగు తొక్కుతారాండీ” అని వేళాకోళంగా అనేవాడు. గతం తిరగదోడాడు. అప్పటికి మా అమ్మకి పెళ్లయింది, దీనికీ అమ్మ ప్రత్యక్ష సాక్షిగా నిలిచింది. ఇలాంటివి ఎన్నో ఆమె దృక్పథం వెనుక ఉండి ఉంటుంది. “పనివాళ్లయితే మనుషులు కాదా. జరుగుబాటు లేని ఇళ్ళలో వాళ్ళు పుట్టారు. ఎంతో కొంత జరుగుబాటున్న ఇంట్లో మనం పుట్టాం. అంతే కదమ్మా తేడా” అంటుంది అమ్మ. అందుకే మా ఇంట్లో పనిమనుషులన్న మాట చాలా తప్పు మాట.
                           అమ్మ పెళ్ళవగానే “ఎంప్లాయర్” అయ్యింది; మా అమ్మ దగ్గర పని చేసిన మొదటి పనిమనిషి పేరు సబ్బు లక్ష్మి. పల్లెటూళ్ళో కాపురం. 2 పెద్ద అరుగులు, కాఫీ వసారా, ఉత్తరంపు వసారా, విశాలమైన చావిడి, వంట గది, పూజగది, తూర్పువైపు గది, పెద్ద మెట్టు(వీధి వైపుంటే అరుగంటారు అది మగాళ్ల సామ్రాజ్యం, మరి ఏ వైపున్నా మెట్టంటారు. అక్కడ అమ్మలక్కల కబుర్లు సాగుతూంటాయి).బయట దస్త్రాల గదితో సహా 500గజాల్లో ఉండే పేద్ద ఇల్లు అంతా మా అమ్మ చక్కబరుచుకోవాల్సి వచ్చేది. మిగిలిన పెద్దనాన్నలు ఇల్లు వాటా వేసుకున్నా ఊళ్ళో ఒకరు, పక్కూరిలో మరొకరు, హైదరాబాదులో ఇంకొకరు అద్దెకుండేవారు. దాంతో మా అమ్మ వాళ్ళ వాటాలతోపాటు ఇల్లంతా తుడిచి,అలికి,బాగుచేసుకోవాల్సి వచ్చింది. మాకు పనిచేసే లక్ష్మి ఈ భారమంతా తన మీద వేసుకునేదిట. మొత్తం ఇల్లంతా ప్రతీ నెల రెండుసార్లు అలికి, రోజూ తుడిచి, పండగ వచ్చినపుడల్లా బూజు దులిపేది. మిగతా అంట్లు, చుట్టూ ఉన్న మరో 500గజాల స్థలం ఊడ్పులు సరేసరి. అలికినప్పుడు మా అమ్మే లక్ష్మి వాళ్ల ఇంటిలో పొయ్యి వెలిగే పనిలేకుండా వంట చేసేది.
                            అలాంటి లక్ష్మికి ఓరోజు పెద్ద కష్టం వచ్చిపడింది. తాగుడికి డబ్బులివ్వడం లేదని, పుట్టింటివాళ్ళతో తనకెన్ని గొడవలున్నా లక్ష్మి పుట్టింటికి వెళ్తూనే ఉందని, ఇలా చిన్నా చితకా, పెద్దా పరకా గొడవలతో లక్ష్మి భర్త ఆమెతో పెద్ద దెబ్బలాట పెట్టుకున్నాడు. తిట్టుకున్నంత సేపు ఇద్దరూ సమ ఉజ్జీలుగానే ఉన్నారు గానీ అతను లక్ష్మిని రోకలిబండ పుచ్చుకుని కొట్టాకా ఆమె ధైర్యం సడలిపోయింది. దానికితోడు లక్ష్మిని చంపుతానంటూ కత్తి పట్టుకుని వెంటపడ్డాడు. పారిపోతూ రక్షణ కోసం ఊరంతా తిరిగింది. “ఆడు కత్తి పట్టుకుని తిరుగుతున్నాడంటే నిన్నేమీ నరికేస్తానికి కాదు. ఏదో భయపెడతన్నాడు అంతే”, అని కొందరు “మొగుడూ పెళ్ళాలు మళ్ళీ ఒకటవుతారు. మధ్యలో చేడేది మేమే” అని ఇంకొందరు.
ఆ స్థితిలో 19ఏళ్ల వయసున్న మా అమ్మ(చిన్నవయసు పెళ్లి లెండి తనది) ఆమెని దాచిపెట్టింది. ఊళ్ళో కావాల్సినవాళ్లు”వాడు పెద్ద పిచ్చెదవ. పసిపిల్లలు ఉన్నదానివి నీకెందుకీ గొడవ. దాన్ని వదిలెయ్” అన్నారు, ఇరుగుపొరుగు “మీకెందుకు సాయి గారో ఈ గోల. ఆళ్ళూ ఆళ్లు ఒకటైపోయి మీకు సెడ్డ పేరు మిగులుద్ది” అని సలహాలిచ్చారు.   లక్ష్మి భర్త రోజూ కత్తి పట్టుకుని,”లచ్చీ బైటికి రా. కరణం గారింటో ఉంటే ఏటీ సెయ్యలేనని అనుకుంటన్నావేమో. నీ సంగతేంటో సూత్తాన”ని బెదిరించేవాట్ట. కానీ మా అమ్మ లక్ష్మిని ఆమె మొగుడి చేతికి వదలలేదు.
                      మా నాన్నగారేమీ అడ్డు చెప్పలేదట కానీ నిర్ణయమూ, నిర్వహణా పూర్తిగా మా అమ్మదే. రోజుకో గదిలో దాచిపెట్టి, పొద్దుట కాఫీ నుంచి రాత్రి భోజనం వరకూ అమ్మ లక్ష్మికి గదిలోకే పట్టుకెళ్లేది. కాలకృత్యాలు, స్నానం లాంటివాటికైతే అదాటున పరుగెత్తి బాత్రూంలో దూరి, ముగించుకుని టకీమని మళ్లీ ఇంట్లోకొచ్చేసేదట. అమ్మ చీరలే మూడురోజులు కట్టేది. మూడు రోజులు అలా గడుస్తూండగా మా అమ్మ ముందు ఇంక రంకెలు చెల్లవని అర్థం చేసుకుని లక్ష్మి భర్త పెద్దమనుషులతో మా ఇంటికొచ్చాట్ట. తాగనని పోలేరమ్మ మీద, పెళ్లాన్ని కొట్టనని వాళ్ళ అమ్మ మీద, లక్ష్మి డబ్బు పాములా చూస్తానని ఒట్టు పెట్టుకుంటే తప్ప లక్ష్మిని పంపనని తెగేసి చెప్పింది అమ్మ. బెట్టు చేసి, బెట్టు చేసి చివరకు తలొగ్గి ఒట్లు పెట్టి, లక్ష్మిని తీసుకెళ్ళాడట. దేవతలకీ, ప్రమాణాలకి జడిసే రకం కాబట్టి ఇంకెపుడూ ఆ పనులు చెయ్యలేదు. అయితే “సాయి గారు ఊరుకుని ఉంటే నేను ఇలా అయిపోయేవోణ్ణి కాదు. ఇంకెప్పుడూ ఆరింట్లో పనికి ఎళ్లొద్దని”, భార్యపై ఆంక్ష పెట్టాడు. కళ్ల నీళ్ల పర్యంతమై ఆ మాట మా అమ్మకి చెప్పి మా ఇంట్లో కొలువుకి సెలవు పుచ్చుకుంది సబ్బు లక్ష్మి.  ఆ తర్వాత పల్లె నుంచి పట్నం వచ్చేవరకూ పదేళ్లకు పైగా అంతటి ఇల్లంతా మా అమ్మే అలికింది అక్కడ ఉన్నన్నాళ్లూ. విచిత్రం ఏంటంటే లక్ష్మి భర్తకి మా అమ్మ మీద ఉన్న కోపం కోపమే కానీ మళ్లీ “ఆరోజు సాయిగారు ఆపకపోతే మా లచ్చిని ఆ ఊపులో నరికేద్దునో ఏమో” అని కృతజ్ఞతగానూ మాట్లాడతాడు.
                  పల్లెటూళ్ళో చంద్రమ్మ, పట్టణం వచ్చాకా సముద్రం, నాగవేణి, నాగమణి, సత్యవతి ఇలా చాలామంది పనిచేశారు కానీ  సబ్బు లక్ష్మిలా ఇంట్లో మనిషల్లే చేసిన వాళ్లు ఇంకెవరూ లేరు అంటుంది మా అమ్మ.
                  మా అమ్మ నన్ను కడుపుతో ఉండగా ముమ్మరమైన చలికాలంలో “మామిడిపళ్ళ”డిగిందట. మా నాన్నగారు తణుకు, అత్తిలి, భీమవరం తెగతిరిగి చివరికి ఓ జ్యూస్ షాపులో మామిడిపళ్లు పట్టకున్నారట. జ్యూస్ షాపు వాడు జ్యూసులే తప్ప పళ్లు ఇవ్వం అని పట్టుపట్టాడు. నానా రకాల ప్రయత్నించి కళ్లుతిరిగే రేటుకు ఓ మూడు మావిడి పళ్లు కొని మా అమ్మకి ఇచ్చారట నాన్నారు. సంగతేమిటంటే మా అమ్మ నుంచి కడుపులో ఉన్ననాడే మా చెల్లెళ్లకి, నాకూ మావిడి పళ్లంటే పిచ్చి ఇష్టం పట్టుకుంది. ప్రతీ వేసవికీ అన్ని రకాల మావిడిపళ్లు కొనిపెడుతూ ఆ పిచ్చిని ఆనందంగా భరించిన మా నాన్నారు ఓ వేసవిలో మాత్రం కొనితేలేదు. మా నాన్నమ్మకు విపరీతమైన అనారోగ్యం చేస్తే మా అమ్మానాన్నలే ఆర్థికంగా, శారీరికంగా పనిచేయడం వల్ల, మేము చదువులకు ఎదిగి రావడం, అప్పుడే మా ఇల్లు కట్టుకోవడం వంటివి ఆర్థికంగానూ, మానసికంగానూ మా నాన్నారిని ఉక్కిరిబిక్కిరి చేశాయి. ఆ హడావుడి రోజుల్లో మావిడి పళ్ళు లాంటి చిన్న చిన్న సరదాల కోసం పర్సు తీయలేకపోయారు. పాపం ఏమనుకున్నారో వేసవి ముగుస్తుండగా ఓ పరక మంచి రసాలు కొని తీసుకువచ్చారు. “పోనీలే పిల్లలు ఒకటికి మూడు తిననీ” అనుకుని ఉంటారు. పెద్దవాళ్ళకి చెరో పండు, పిల్లలకు చెరి 3పళ్ళు వాటా పెట్టాల్సింది పోయి మా ముగ్గురికీ రెండేసి పళ్లే పంచింది. తనకి ఒక్కపండూ అక్కరలేదని మొత్తం నాలుగు పళ్ళూ ఇంట్లో పనిచేసే నాగవేణికి మా చేత్తోనే ఇప్పించింది. “ఇంటిల్లి పాదీ చెరో పండు తినండి”అని పంపింది నాగమణిని.
                     అలా ఇచ్చేందుకు మాకు ముందే చెప్పి ఒప్పించింది అమ్మ. “మీరు కొంచెం పెద్ద పిల్లలు కదా మీకే ఇంతగా తినాలనిపిస్తూ ఉంటే, పాపం నాగవేణి పిల్లలు చాలా చిన్నపిల్లలు కదా మరి వాళ్ళు ఎంత మొహం వాచి ఉంటారో కదా. మనలాంటి ఉద్యోగస్తులమే కొనలేకుండా ఉన్నామే, ఇళ్లల్లో పనిచేసే నాగవేణి ఏమి కొనిపెడ్తుంది. మన ఇంట్లో డస్ట్ బిన్ ఖాళీ చేసేప్పుడు మావిడి టెంకలు చూస్తె పిల్లల్ని తలుచుకుని ఎంత బాధపడుతుంది”అంటూ మాకు సర్ది చెప్పే చేసింది అమ్మ. ఇది ఓమారు మా ఇంట్లో ఆర్థికంగా ఇబ్బంది కలిగిన సమయంలో జరిగిన కథ. ఐతే అంతకు ముందూ, ఆ తరువాతా కూడా ప్రతి వేసవి కాలంలోనూ మా అమ్మ రహస్యంగా నా చేత కనీసం రెండు పరకలు మామిడిపళ్లు తను కష్టపడి తేనెటీగలా కూడబెట్టిన డబ్బులు వాడి తెప్పించేది. అప్పుడు మా ఇంట్లో ఎవరు పనిచేస్తే వారికే ఇప్పించేది. రహస్యం ఎందుకూ అంటే ఇంట్లో ఎవరికైనా తెలిస్తే ఇల్లు గుల్లవుతోంది అంటారేమోనని.
మా నాన్నమ్మ జీవించి ఉన్నన్నాళ్ళూ ఇంట్లో పనిచేసే అమ్మాయికి కాఫీ, నీళ్లు ఇచ్చేందుకు వేరే గ్లాసులు, టిఫిన్ పెట్టేందుకు వేరే ప్లేట్ పెట్టాలనే పధ్ధతి ఉండేది. మా అమ్మకి అలా వాళ్లని అవమానించడం ఇష్టం ఉండేది కాదు. ఎవరినీ ఇబ్బందిపెట్టడం ఇష్టంలేక తాను ఆ గ్లాసుని, ప్లేటునీ వాళ్లకే ఇచ్చి కాఫీకి వచ్చినప్పుడల్లా తెచ్చుకోండి అనకుండా మా అమ్మే రహస్యంగా మెయింటైన్ చేసేది. మా అమ్మ చేతికి పూర్తిగా ఇంటి వ్యవహారం వచ్చిన తర్వాత మొదట చేసిన పని ఆ గ్లాసుల పధ్ధతి మానెయ్యడమే. ఇప్పుడు మా ఇంట్లో వేరే గ్లాసుల పధ్ధతి లేదు.
                మరోమాటు మా అమ్మ వీధిలోకి వచ్చి “బాబూ! చేపలూ ఇటు రా” అని పిలిచింది. వీధి వీధంతా బిత్తరపోయింది శుద్ధ శాకాహారులమైన మా ఇంటి నుంచి ఆ పిలుపు విని. ఆ చేపల బుట్ట ముంగిట్లోకి వచ్చాకా మా వంటింట్లో పనిచేస్తున్న నాగమణిని పిలిచి “ఎలాంటి చేపలు కావాలో ఏరుకో. డబ్బులు గురించి ఆలోచించకు. ఇవన్నీ నీ జీతంలో కొయ్యను. బహుమతి అనుకుని తీసుకో” అంది. జీవితంలో ఎప్పుడూ అలాంటివి ఎరగదో ఏమో ఆమె చాలా కరిగిపోయింది. అసలేం జరిగిందంటే-మేము మూడంతస్తుల బిల్డింగులో మొదటి అంతస్తులో ఉండేవాళ్లం. మా ఇంటి వాకిట్లో నిలబడ్డ మా అమ్మ నాగవేణి కిందకి తొంగి చూడడం చూసింది. మళ్లీ తలతిప్పేసుకుని లోపలికి వచ్చేస్తున్న ఆమెని ఆపి అలా ఏం తొంగి చూసి వస్తున్నావని అడిగింది చాలా మామూలుగా మా అమ్మ.
ఆమె ఇబ్బందిగా, సిగ్గుగా, అవమానభారంతో “ఏం లేదమ్మా” అనేస్తుంటే ఏదో ఉందనుకుని కిందికి వంగి చూసింది అమ్మ. అప్పుడే చుట్టుపక్కల వాళ్ళు చేపల బేరం చేసి ముగించుకుని చేపలతో కింది ఫ్లోర్ వాళ్లూ, పక్కింటివాళ్లూ ఇళ్లలోకి వెళ్తున్నారు చేపలబుట్టతో అమ్మే అతను వీధిదాటి వెళ్లిపోతున్నాడు. “ఏమ్మా చేపలు చూసి ఎందుకలా వచ్చేస్తున్నావు?” అంది అమ్మ. “ఏమీ లేదమ్మా ఊరికే కొందామని…” అంటూ అర్థోక్తితో ఆగిందామె. “అదే ఎందుకు కొనలేదు?” “డబ్బులెక్కడివమ్మా..” అంటూ నవ్వులో బాధని కలిపేసే ప్రయత్నం చేస్తూ చెప్పిందామె.
                 ఇక మా అమ్మ ఆగలేదు స్వయంగా పిలుచుకొచ్చి ఇంటిముందు తొలిసారి చేపలబుట్ట దింపించింది. ఆమె మొత్తానికామె ఓ చేప తీసుకుంది. మా అమ్మకు అంచనా తెలియదు కానీ ఒకటి ఇంట్లోవాళ్లకి సరిపోతుందా అని అనుమానమొచ్చి చేపలతన్నే అడిగితే ఇద్దరికైతే సరిపోద్దండీ నలుగురైతే సరిపెట్టుకోవాలని చెప్పాడు. “మీ పిల్లలు ఇంకాస్త కూర వెయ్యి అని అడిగితే ఏం చేయ్యగలవు? అసలు పెట్టకపోయినా పర్లేదుగానీ పసివెధవల్ని అర్థాకలితో లేపి ఏడిపించకూడదు. ఇంకో చేప తీసుకో” అని బలవంతాన ఒప్పించింది. వీటితో కూర ఐపోదు కదాని ఉల్లిపాయలు, బియ్యం, ఇతర దినుసులు కూడా మా ఇంటి నుంచే ఇచ్చింది ఏమేమి అవసరమౌతాయో పక్కింట్లో మా అమ్మ ఫ్రెండ్ ఒకావిణ్ణి అడిగి తెలుసుకుని. మా ఇంట్లో లేని కొన్ని మసాలా దినుసుల్ని వాళ్ళింట్లో అరువడిగి ఇప్పించింది.
నాగవేణి భర్త ఇదంతా తెలుసుకుని “ఏదో ఆరు కొనిపెట్టారే అనుకో ఇదే అదునని ఒకటికి రెండు తీసేసుకుంటావా?” అని తిట్టాట్ట.
               కొసమెరుపేమిటంటే- “సాయిగారు చేపల బుట్టని పిలిచేరేంటి. ఆళ్లు బ్రేమ్మలు కదా” అని చాలామంది అడిగారట నాగవేణిని. ఇలా నాకోసం అని చెప్తే ముక్కున వేలేసుకుని, మా అమ్మ దగ్గరకి వచ్చినప్పుడు “పనోళ్లని మరీ అంత ఇదిగా చూడకూదదండీ. లోకువకట్టేత్తార”ని బోధించే ప్రయత్నం చేశారు. “జరుగుబాటు లేక కానీ వాళ్లకీ కొనుక్కోవాలనే ఉంటుంది కదండీ. నేనేం వాళ్ల జీవితాలు బాగు చేసెయ్యలేను. ఏవో చిన్న సరదాలు తీర్చాను. మీ ఇంట్లో చేపలు రుద్దేప్పుడు మాకు లేవే అని బాధపడితే మంచిదా ఏంటి?” అని చెప్పుకొచ్చింది. వాళ్ల గొడవ అమ్మకి పట్టదు. అమ్మ లెక్క వాళ్లకి రాదు. అయినా మా అమ్మకి పనిచేసే వాళ్ల మనసులు చివుక్కుమన్న చప్పుడు కూడా వినిపిస్తుంది.
                       సత్యవతి మా ఇంట్లో పనిచేసేప్పుడు “సత్య.. సత్య” అని పిలిచేది ఆమెని. అలా కాలేజి పిల్లలా సత్య అని పిలిపించుకోవాలని ఆమె ఆశట. నీకు ఎలా పిలిస్తే ఇష్టం అని తెలుసుకుని మరీ అలా పిలిచేది అమ్మ. అప్పుడే మాటలు వస్తున్న మా మేనకోడలి చేత కూడా “సత్య”(సచ్చ అని పిలవడమే వచ్చేది తనకి) అని పిలిపిస్తే సత్యవతి “మాయమ్మే ఎంత ముచ్చటగా పిలుస్తున్నావమ్మా” అని మురిసిపోయేది. చాన్నాళ్ళు మా ఇంట్లో పనిచేశాకా  మేము ఇల్లు మారిపోతే రెండు కిలోమీటర్లకు పైగా దూరం నుంచి నడిచి వచ్చేది. చివరకి “మిమ్మల్ని వదల్లేక పోతున్నానండీ సాయి గారూ” అనంటూనే మానేసింది సత్య.
              నాగలక్ష్మి పిల్లలు కాన్వెంట్లో పనిచేస్తోంటే మా నాన్నారి పరిచయాలు ఉపయోగించి ఫీజులు బాగా తగ్గించడం లాంటివి మొదలు చిన్నవీ చితకవీ ఇంకా చాలానే ఉన్నాయి గానీ విషయం మాత్రం ఒకటే. అన్నం ఉడికిందో లేదో తెలియాలంటే రెండు మెతుకులు ముట్టుకుంటే చాలు కదా.
santhosh-సూరంపూడి పవన్ సంతోష్

పుస్తకాల్లో చెదలు…

M_Id_223298_Books_eaten_by_termites_at_Government_Divisional_Library_at_Vishrambaug_wada 

నా పుస్తకాలలోకి చెద పురుగులు ప్రవేశించాయి.

దాదాపు నలభై సంవత్సరాలుగా కూడబెట్టుకుంటున్న పుస్తకాలు.

ఎన్నెన్నో జ్ఞాపకాలూ ఉద్వేగాలూ అనుభవాలూ కన్నీరూ నెత్తురూ కలగలిసిన పుస్తకాలు.

చదివి ఇస్తామని తీసుకుపోయి తిరిగి ఇవ్వని మిత్రులతో తగాదాలు తెచ్చిన పుస్తకాలు. దూరం పెంచిన పుస్తకాలు.

మిత్రులనైతే పుస్తకాలు తిరిగి ఇమ్మని వేధించాను. ఇవ్వకపోతే గొడవపడ్డాను. శత్రువులను చేసుకున్నాను. వందలాది పుస్తకాలు పోగొట్టుకున్నాను. నిజమైన ఆసక్తితో తీసుకుపోయి చదివి, నమ్మకంగా తిరిగి ఇచ్చేవాళ్లతో కూడ ఆ అనుభవంతో కటువుగా మాట్లాడాను. చదివి ఇస్తామని చెప్పి తీసుకుపోయి తిరిగి ఇవ్వనివాళ్లమీద, పరిశోధకులమని చెప్పి పుస్తకాలు ఎత్తుకు పోయినవాళ్ల మీద చాల కోపం తెచ్చుకున్నాను.

పాపం, ఈ చెదల ముందర వాళ్లెంత నయం! పుస్తకాన్ని ఎక్కడో ఒకచోట మిగిల్చారు. నాదగ్గర లేకపోయినా ఆ పుస్తకం ఎక్కడో ఒక అలమరలో భద్రంగానే ఉంది.

మరి ఈ చెదపురుగులను ఏం చేయగలను? లెక్కలేనన్ని పుస్తకాలను నుసిగా, మట్టికుప్పగా, కన్నీటిముద్దగా  మార్చేసిన, ఖండఖండాలుగా విమర్శించి అదృశ్యం చేసిన చెదపురుగులను ఏం చేయగలను? మహావిశ్వమంత పుస్తకాన్ని మటుమాయం చేసిన ఇసుకరేణువంత సన్నని క్రిమిని ఏమనగలను?

నాలుగు ఊళ్లూ, డజను అద్దె ఇళ్లూ, డజన్ల కొద్ది మిత్రులూ వడపోయగా మిగిలిన పుస్తకాలు సొంత ఇంట్లో గోడలకే  షెల్ఫులు పోయించుకుని పెట్టుకున్నాను. ఒక్కవరస పెట్టుకోగలిగితే బాగుండునని ఎంత అనుకున్నా మూడు నాలుగువందల అడుగుల పొడవైన పుస్తకాలు రెండు వరుసలూ మూడు వరుసలూ పెట్టుకోక తప్పలేదు. గోడలకు ఆనుకుని ఉండే వెనుక వరుసలలో ఏ రసాయనిక ప్రక్రియలు జరుగుతున్నాయో తెలియని స్థితిని చేజేతులా తెచ్చిపెట్టుకున్నాను. గోడలలో చెమ్మ పెరిగి చెదలు పుట్టాయి. నాలుగువేల రకాల చెదపురుగులున్నాయట, ఒకరకం చెదపురుగు రోజుకు ఇరవై, ముప్పైవేల గుడ్లు కూడ పెడుతుందట. అలా క్షణక్షణాభివృద్ధి అయ్యే చెదల ప్రధాన ఆహారం సెల్యులోజ్ కుప్పలు కుప్పలుగా పుస్తకాల రూపంలో ఆ గోడల పక్కనే ఉంటే వాటికింకేం కావాలి?

అలా పుస్తకాల మీద ఆహార ఆసక్తితోనో అకడమిక్ ఆసక్తితోనో చెద పురుగులు పుస్తకాలలోకి తొంగిచూశాయి. ఒక్కొక్క పేజీనీ, వాక్యాన్నీ, అక్షరాన్నీ కూడ విమర్శించడం మొదలుపెట్టాయి. కొన్ని నెలల కింద ఏదో పుస్తకం కోసం వెతుకుతుంటే చెద పురుగులు అప్పటికే నాలుగైదు పుస్తకాలను సంపూర్ణంగా చదివేసి తమ నిశిత విమర్శతో తుత్తునియలు చేశాయని బయటపడింది.

నాకు దుఃఖం మొదలయింది గాని అది ఇంగ్లిషు నవలల సెక్షన్ కావడంతో సరే పోనీలే అనుకున్నాను. చెదలు వచ్చే అవకాశం ఉన్నదని నేను అమాయకంగా నమ్మిన రెండు మూడు సెక్షన్లు తీసి అటకెక్కించాను.

చెదలు దావానలంలా వ్యాపిస్తాయని విని ఉన్నాను గనుక వెంటనే ఒక పురుగుల మందుల దుకాణానికి వెళ్లి చెదల మందు అడిగితే కాలకూట విషంలా కనబడే డబ్బా ఒకటి కొనిపించారు. దానితోపాటు ఒక స్ప్ర్రే కూడ కొనిపించారు. ఇంట్లో ఎవరూ లేకుండా చూసి ఆ విషం డబ్బా విప్పి స్ప్రేలోకి దాన్ని ఒంపబోతే ఒకటి రెండు చుక్కలకే కళ్లు బైర్లు కమ్మాయి. ఇంటినిండా భరించలేని వాసన వ్యాపించింది. చెదలే మేలు అనుకుని డబ్బా మూతపెట్టి పైన పడేశాను.

కాని రాత్రీ పగలూ కళ్లముందర చెదలే చెదలు. ఓరోజు మళ్లీ ఇంట్లో ఎవరూ లేకుండా చూసి చెదల మందుల ప్రకటనలు వెతికి పట్టుకుని ఫోన్ చేస్తే పాముల నర్సయ్య లాగ చెదల బాబూరావు ఆపద్బాంధవుడిలా వచ్చాడు. ఒకటి రెండు గంటలలో అయిపోతుందనుకున్న పని ఏడెనిమిది గంటలు పట్టింది.

చెద పురుగులు పుస్తకాలు చదవడమూ విమర్శించి ఖండఖండాలుగా మార్చడమూ మాత్రమే కాదు ప్లైవుడ్ చట్రాలలోకి ప్రవేశించి చెక్కపని కూడ మొదలుపెట్టాయి. కన్నీళ్లే మిగిలాయి గాని పుస్తకాలు మిగలలేదు. చెదల మందు ఘాటు వాసనకు కాదు, పుస్తకాలు పోయినందుకు కళ్ల వెంట ధారాపాతంగా దుఃఖం. అంత దుఃఖంలోనూ ఒక ఆశ్చర్యకరమైన సంగతి చెదపురుగులు అన్ని సెక్షన్ల పుస్తకాల మీద అంతో ఇంతో చేయి (నోరు కావచ్చు) చేసుకున్నాయి గాని, అన్నిటి కన్న పెద్దదయిన తెలుగు కవిత్వం సెక్షన్ వైపు మాత్రం చూడనైనా చూడలేదు!!

reading1

సెకండ్ హాండ్ పుస్తకాల దుకాణాలూ ఫొటో కాపీయింగ్ సౌకర్యాలూ స్కానింగూ డిజిటలైజేషనూ వచ్చిన తర్వాత, అన్నిటికన్న మిన్నగా మరొకరి దగ్గర ఆ పుస్తకం ఉంటే తస్కరణ సౌకర్యమూ ఉన్నాక పుస్తకాలు పోతే ఏడవనక్కర లేదని అనిపిస్తుందేమో.

పుస్తకం మళ్లీ సంపాదించవచ్చు గాని ఆ పుస్తకంతో కలిసి ఉన్న అనుబంధాలను తిరిగి ఎట్లా సంపాదించగలం?

ఒక్కొక్క పుస్తకం వెనుక, వెనుక మాత్రమేకాదు అట్టమీదా, అట్టవెనుకా, లోపల పేజిపేజికీ ఒక్కొక్క గాథ ఉంటుంది. ఆ అచ్చు పంక్తుల కింద మనం గీసుకున్న గీతలు ఉంటాయి. ఆ పంక్తుల పక్కన అంచులలో మనం చేసిన వ్యాఖ్యలుంటాయి. కొత్త పుస్తకం దొరుకుతుంది గాని ఆ గాథలన్నీ ఎక్కడ దొరుకుతాయి?

ముప్పై ఏళ్ల కింద, ఇరవై ఏళ్లకింద, పదేళ్ల కింద ఏదో ఒక ఊళ్లో ఏదో ఒక దుకాణంలో ఏదో ఒక బుక్ ఫెయిర్ లో ఆ పుస్తకం కొని పేజీలు తిప్పి వాసన చూసి, మొదటి పేజీలో చేసిన సంతకపు ఆ తొలియవ్వన, గరుకు అక్షరాల ఉత్సాహ సంభ్రమాలు మళ్లీ ఎక్కడ ఎట్లా దొరుకుతాయి?

పుస్తకం పోవడమంటే పుస్తకం మాత్రమే పోవడం కాదు. ఒక పుస్తకం వెనుక ఉన్న అనేక జ్ఞాపకాలు పోవడం. పుస్తకాల ఫొటో కాపీలు సంపాదించవచ్చు గాని ఆ జ్ఞాపకాలను ఎట్లా సంపాదించగలం?

నిజంగానే నాదగ్గర ఉన్న వేల పుస్తకాలలో ప్రతి ఒక్కటీ నాలో ఒక జ్ఞాపకాన్ని ప్రేరేపిస్తుంది. ప్రతి ఒక్క పుస్తకంతోనూ నాకొక ప్రత్యేక అనుబంధం ఉంది. అది కొన్ని చోటు, అది కొనడానికి పడిన తపన, అది కానుకగా ఇచ్చిన మిత్రుల జ్ఞాపకం, అది చదువుతున్నప్పుడు, దాని మీద మాట్లాడినప్పుడు అనుభవించిన ఉద్వేగాలు….ఎన్నెన్ని!

ఎప్పుడో 1981లో మొదటిసారి మద్రాసు వెళ్లినప్పుడు మూర్ మార్కెట్ లోకి వెళ్లి ఒక పూటంతా గడిపి కొన్న సెకండ్ హాండ్ పుస్తకాలు, అందులో ముఖ్యంగా ‘ఏపియార్ కు అభిమానంతో మహీధర’ అని రామమోహనరావు గారు స్వయంగా సంతకం చేసి ఇచ్చిన ‘మృత్యువు నీడల్లో…’ ఇప్పుడెక్కడ దొరుకుతుంది? ఆ ఏపీయార్ ‘ఆదర్శజీవులు’ అనువాదం చేసిన అట్లూరి పిచ్చేశ్వరరావు గారు కావచ్చునని ఊహించి పొందిన ఉద్వేగాన్నీ ఆనందాన్నీ ఇప్పుడెట్లా తిరిగి తెచ్చుకోగలను? ఆ మద్రాసు లేదు, చెన్నై అయిపోయింది. ఆ మూర్ మార్కెట్ లేదు, దాన్ని తగలబెట్టి రియల్ ఎస్టేట్ చేసి సెకండ్ హాండ్ పుస్తకాలకు కట్టించి ఇచ్చిన అగ్గిపెట్టెల్లాంటి కొట్లలో ‘అచటి బహుజన రక్త చిహ్నముల యందు నాది ఇదని గుర్తేమిసామి’?’

అలాగే 1982 నుంచి ఇప్పటిదాకా హైదరాబాద్ రోడ్లమీద కొన్న వందల సెకండ్ హాండ్ పుస్తకాల జ్ఞాపకాలు మళ్లీ ఎక్కడ దొరుకుతాయి? మొదటి రోజుల్లో ప్రతి ఆదివారమూ ఎవరో ఒకరికి ప్రేమతో హరీంద్రనాథ్ ఛటోపాధ్యాయ సంతకం చేసి ఇచ్చిన పుస్తకాలు దొరికేవి. ముల్క్ రాజ్ ఆనంద్ ఎవరికో సంతకం చేసి ఇచ్చిన అపాలజీ ఫర్ హీరోయిజం దొరికింది. 1983 మధ్యలో కోటీ ఫుట్ పాత్ ల మీద హఠాత్తుగా వేలాది కమ్యూనిస్టు పుస్తకాలు ప్రత్యక్షమయ్యాయి. వాటిలో 1940లలో అచ్చయిన తొలి కమ్యూనిస్టు పుస్తకాలు, 1950లలో, 60లలో ప్రపంచ ప్రధాన నగరాలన్నిట్లోనూ కొన్న పుస్తకాలు, ప్రతి పుస్తకం మీద ఎం కె సేన్ అని సంతకం, ఒక తేదీ, ఆ ఊరి పేరుతో సహా దొరికేవి. మొహిత్ సేన్ పుస్తకాలవి.

అంతకు పది, పదిహేను సంవత్సరాల ముందునుంచే జీవితం పుస్తకాల మధ్య, కాగితాల మధ్య గడుస్తోంది. కాని ఎమర్జెన్సీలో, ఇంటర్మీడియెట్ లో నాకన్న చిన్నపిల్లలకు ట్యూషన్లు చెప్పి సంపాదించుకుంటున్న నాలుగు రాళ్లతో పుస్తకాలు కొనడం మొదలయింది. వరంగల్ విశాలాంధ్రలో అలా కొన్న పుస్తకాలు, అందులోనూ సోవియట్ పుస్తకాలు ఇప్పుడు చెదలు తినేస్తే ఆ పుస్తకాలూ రావు, ఆ జ్ఞాపకాలూ రావు. ఆ తర్వాత సాహిత్యలోకంలోకి ప్రవేశించాక ఎంతోమంది కవిమిత్రులు, రచయితలు కానుకగా ఇచ్చిన తమ పుస్తకాలు, ఆవిష్కరణ సభల్లో మాట్లాడడం కోసం ఇచ్చిన పుస్తకాలు, ఆ పుస్తకాలలో నేను రాసుకున్న మార్జినల్ నోట్స్… చెద పురుగుల మీద ఎంత కోపం వచ్చినా, సర్పయాగాన్ని మించిన చెదల యాగం చేసినా, ఆ పుస్తకాలైతే తిరిగి రావు గదా…

  ఎన్ వేణుగోపాల్

venu

ఆ రోజు ఏం జరిగిందంటే

kasmir11kasmir6

మా వాహనం శ్రీనగర్ నుండి జమ్మూ వయిపుకి హైవే లో జెట్ వేగంతో దూసుకు పోతోంది.    హిమపర్వత సానువుల్లో ఒదిగి వెండి దుప్పటి కప్పుకొని మిలమిలా మెరుస్తూ ఎంతసేపైనా చూడాలనిపించే   మనసును కట్టిపడేసే ఒడుదుడుకుల  పర్వతశ్రేణులు, .. రాతి ద్రోణులు .. వాటిని వెన్నంటి ఉండే ,  హిమానీనదాలు ..స్వచ్చమైన  నీటి పాయాలూ.. ఏర్లు .. సెలయేర్లు, సరస్సులు.. జలపాతాలూ ..ఆకాశాన్ని అందుకోవాలని ఉబలాట పడుతూ ఎదిగి పోతున్న దేవదారు వృక్షాలూ, అక్కడక్కడ దట్టమైన అడవులూ, వృక్షాలు, పచ్చని తివాచీ పరచినట్లు పచ్చికబయళ్ళు .. వాటిపై అక్కడక్కడ గొర్రెలమందలతో తెల్లగా బక్కగా పాల బుగ్గల
పసివాళ్ళు .. అందమైన కాశ్మీరు లోయలో పేదరికాన్ని , వెనుకబాటు తనాన్నితెలియజేస్తూ .. నా ఆలోచనల్లో నేను.  ఎవరికి వారు కాశ్మీరు లోయ అందాలకి పరవశిస్తూ .. ఆ అద్భుత దృశ్యాలని మా మదిలోనూ, కెమెరాల్లో బంధిస్తూ..  ఆప్రాంతాన్ని వదిలి రావాలని లేక పోయినా తప్పదుగా ..అనుకుంటూ

‘కాశ్మీరు కొండల్లో అందాలకి .. కొత్త అందాలిచ్చారు
కాశ్మీరు వాగుల్లో పరుగులకి .. కొత్త అడుగులిచ్చారు ”  మౌన రాగానికి బ్రేక్ వేస్తూ రాగం అందుకుంది మృదుల .

కాశ్మీరు లోయలో .. కన్యాకుమారిలో .. ఓ సందమామ , ఓ సందమామ ‘ పోటీగా సంగీత.  ఆమెకు జత కలుస్తూ మాలిని, కవిత .

‘ప్రేమ యాత్రలకు బృందావనము, కాశ్మీరాలు ఏలనో ..’  మరో పాట అందుకుంది మృదుల

మన  కవులు  ఈ అందాలపై ఎన్ని పాటలు కట్టారు ..!  కవితలు అల్లారు ..!

అమరనాథ యాత్ర, గుర్రాలపై ప్రయాణం, నడవ లేక డోలి ఎక్కినా వైనం, గత వారం రోజులుగా అనుభవించిన అద్భుతమైన మధురానుభూతులను నెమరు వేసుకుంటూ ..అడుగడుగునా కనిపించే సెలయేటి గలగలలు .. జలపాతాల సవ్వడులు .. పక్షుల కిలకిలలు .. ప్రకృతి అందమంతా కుప్ప పోసినట్లుగా .. తడిసి ముద్దాయి పోతూ .. మేం .

“నాకయితే ఇక్కడే ఎప్పటికీ ఉండిపోవాలనిపిస్తోంది’ ముందు సీటులో కూర్చొని భూతల స్వర్గం గురించి ఆలోచిస్తోన్న మాధురి.

‘ఆ..  నాకూను.   నేను మనసులో అనుకున్నా . నువ్వు పైకి చెప్పేశావ్  ‘వంత పాడింది కవిత.

‘అబ్బ ఎంత ఆశ.  మనని ఇక్కడ ఉండనిచ్చేది ఎవరట ?’ నవ్వుతూ నేను.

‘ ఉండనిచ్చేది ఏమిటి ఉండాలనిపిస్తే ఉండడమే .’ మాలిని

‘అలా ఇక్కడ ఉండకూడదు.’ నొక్కిచేప్పా

‘అదేంటి? ఎందుకు ఉండకూడదు? మనం భారతీయులం .   ఈ దేశంలో ఎక్కడైనా ఉండవచ్చు’  తెలిసినట్లుగా మాలిని.

‘ఆ పప్పులేవి ఇక్కడ వుడకవమ్మ ‘ ఉడికిస్తూ నేను

‘ఆ ఎందుకనీ .. ‘ రవిత్రేయిని చేతిలో ఉన్న తమ  జమాఖర్చుల పుస్తకాన్ని మూసి మాలిని  చేతిలో పెడుతూ.

‘ఏం వీసా కావాలా.. ‘ మృదుల గాలికి రివ్వున ఎగురి మొహాన్ని కమ్మేస్తున్నముంగురుల్ని సవరించుకుంటూ.

‘వీసా తీసుకుని అమెరికా లాంటి దేశాల్లో పౌరసత్వం తీసుకొని స్థిరనివాసం ఏర్పరచుకోవచ్చు.  కానీ కాశ్మీరులో  మాత్రం కుదరదు. శ్రీనగర్లో మనం ఉన్నాం చుడండి  అలాంటి బోటు హౌస్ లే గతి మనలాంటి వాళ్లకి  .  ఇక్కడి చట్టాల ప్రకారం కాశ్మీరు ప్రాంతేతరులు ఇక్కడ భూమి కొనలేరట.  బోట్ హౌస్ లో మాత్రం ఉండవచ్చట.’ ఈ యాత్ర కి వచ్చేముందు   వికిపీడియా లో చుసిన విషయం చెప్పా.

kasmir5
‘అవునా! ‘ రవిత్రేయిని  ఆశ్చర్యంగా

‘బోట్ హౌస్ అయితేనేమి..? ఎంచక్కా స్వచ్చమైన నీటిలో తేలియాడుతూ ఊయలలూగే ఇల్లు..  ఆనందించక’  కవిత కంచు కంఠంతో కరచినట్లుగా

‘పర్యాటక లోకాన్ని రా రమ్మని పిలుస్తోన్న సుందర కాశ్మీరంలో ఈ అల్లకల్లోలం ఏంటో .. ‘ తమ రాకకి కొద్దిగా ముందు బారాముల్లా లో జరిగిన అల్లర్లు .. శ్రీనగర్లో కర్ఫ్యూ గుర్తొచ్చిన రవిత్రేయిని .

‘కాశ్మీరులో జరిగే అల్లర్ల గురించి మేం పుట్టినప్పటి నుండి వింటున్నాం. అసలు కారణం ఏమిటి ‘ డ్రైవర్ని అడిగింది మాధురి.

అంతా ఏమి చెబుతాడోనని ఆసక్తిగా అతని కేసి చూస్తూ .. కొద్ది క్షణాలు ఆలోచించి ‘దేశ విభజన సమయంలో కాశ్మీరు సంస్థానం మహారాజ హరిసింగ్ సారధ్యంలో  భారత దేశంలో విలీనం అయింది.  అయితే, అప్పట్లో కాశ్మీరు భూభాగం ఒక ప్రత్యేక స్థానాన్ని పొంది ఉండేది.  మహారాజ హరిసింగ్ భారత దేశంలో చేరే విధంగా పావులు కదపడం గిట్టని బ్రిటిష్ వారే పాకిస్తాన్ ను కాశ్మీరు దురాక్రమణకు ప్రేరేపించారట మేడం.  అంతేకాదు మేడం,  పాకిస్తాన్ తరపున భారత దేశానికి వ్యతిరేకంగా పోరాటం చేశారట.  అలా తెల్లవాళ్ళ సాయంతో 1948లో కాశ్మీరులో కొంత భాగాన్ని పాకిస్తాన్ ఆక్రమించుకొందట. అప్పటినుండే మాకు ప్రశాంతత లేకుండా పోయిందని మా తాతలు అంటుండేవారు మేడం’ మాధురి ప్రశ్నకి జవాబు గా తనకు తెలిసింది చెప్పాడు డ్రైవర్.

‘అగ్గిపెట్టెలో పట్టే చీరలంటే ఏమో అనుకునే దాన్ని .  నిజంగా కాశ్మీరీ సిల్క్ చీరలు నా మనసు దోచేశాయి.’ ఆ  టాపిక్ మారుస్తూ మాలిని.  నిన్నసాయంత్రం శ్రీనగర్ లో చేసిన షాపింగ్  చీరలు, శాలువాలు, వాటిపై ఉన్న
కాశ్మీరీల చేతి పనితనం, స్టోల్స్, గాజులు , కుంకుమ పువ్వు , ఆప్రికాట్స్, మొఘలుల ఉద్యానవనాలు, కోటలు   ఇలా  మాటల గలగలలు ..సాగిపోతూ..  మేం కొన్న గాజులూ, పర్సులు అందుబాటులో ఉన్న  వాటిని ఒకరికొకరం చూపుకొంటూ.. ధరలు.. బేరీజు వేసుకుంటూ..

మేం ప్రయాణిస్తున్న వాహనం  స్లో అయింది.    ఆగింది.  ఎదురుగా వచ్చే వాహనదారులు డ్రైవర్తో ఏదో కశ్మీరీలొ మాట్లాడాడు.  ఆ తర్వాత ఎవరితోనో ఫోనులో మాట్లాడాడు.  ఆ తర్వాత మా వాహనం ప్రధాన రహదారి లో కాకుండా దారి మళ్ళింది.  గ్రామాల్లో ఉండే కచ్చా రోడ్డులో మేం.  ఆ గతుకుల కుదుపులకు ఒక్కసారిగా స్పృహలోకి వచ్చాం.  అసలేం జరుగుతోంది.  శ్రీనగర్ నుంచి జమ్ముకి ఉన్న హైవే లో కాకుండా మేం ఈ రోడ్డులోకి రావడమేమిటి ..?  మాటల్లో పడి  గమనించనే లేదు.  అందరిలో తెలియని ఆందోళన.

‘భయ్యా.. ఏమిటిది ? రహదారి ఉండగా ఈ దారిలో ..? అర్దోక్తిగా హైదరాబాదీ హిందీలో మాలిని.

‘ముందు రెండు చోట్ల హర్తాల్ జరుగుతోందట’  డ్రైవర్ తల ఇసుమంతైనా కదల్చకుండా.. మా వేపు దృష్టి మరల్చకుండా

‘ఎందుకు?’ గాబరాగా సంగీత

‘మొన్న బారాముల్లా దగ్గర జరిగిన కాల్పులలో సాధారణ పౌరులేవరో చనిపోయారట. అందుకు  నిరసనగా’ చెప్పాడు డ్రైవర్. అంతా ఉలిక్కి పడ్డాం.

‘ఇది నిజమేనా .. ‘ మాలిని సందేహం

‘ఏమో.. అసలే మనమంతా ఆడవాళ్ళం  ‘ భయంగా సంగీత

‘ఇతని మాటలు నమ్మదగ్గట్టుగానే ఉంది అతని వాలకం’ మృదుల.

రకరకాల సందేహాలు మా మనస్సులో.  అప్పటివరకూ ఉన్న ఉత్సాహం .. కబుర్ల స్థానే కలవరం..  భయం .  ఏం జరగబోతోంది.. ఉత్కంట . అన్ని వైపులా తేరిపార జూస్తూ .. అప్రమత్తంగా ..
kasmir7
ప్రతికూల పరిస్థితుల్లో, ఉగ్రవాద బూచి ఉందంటూన్న సమయంలో  ఈ ప్రయాణం అవసరమా అంటూ ఇంట్లోవాళ్ళు బయటివాళ్ళు మమ్మల్ని నీరస పర్చచూశారు. భయపెట్టారు.  అయినా అవేవి లక్ష్య పెట్టక రెండునెలల క్రితమే ప్లాన్ చేసుకున్న విధంగా మా యాత్ర సాగించాం. అమరనాథుని దర్శనం చేసుకుని శ్రీనగర్ చేరాం. వైష్ణోదేవిని దర్శించాం.  అంతా అనుకున్న విధంగా సవ్యంగా సాగిందన్న ఆనందంతో ఉన్న మాకు షాక్ కలిగిస్తూ..

పది నిముషాలు కచ్చా రోడ్లో ప్రయాణం తర్వాత ఓ చిన్న గ్రామంలో ప్రవేశించాం.  వీధుల్లో కొద్ది మంది యువకులు తప్ప  ఊళ్లో   ఉండే సందడే లేదు. అకస్మాత్తుగా మా వాహనం ఆగింది.  డ్రైవర్ దిగిపోయాడు. అతడెందుకు ఆపాడో అర్ధం కాక మేం అడిగే లోపే అతను వడివడిగా అడుగులేస్తూ .. కుడి  వేపుగా ఉన్న మసీదు కేసి నడుస్తూ ..

పట్టేసిన కాళ్ళని సాగదీస్తూ మధ్యలో ఉన్న నేను, మృదుల, సంగీత దిగబోయాం. ‘ఎందుకు దిగుతున్నారు .. వద్దు.  అసలీ డ్రైవర్ మనతో ఏమీ చెప్పకుండా వెళ్ళడం ఏమిటి ?’ వారిస్తూ  మాలిని.

మేం దాటి వచ్చిన యువకులు మమ్మల్నే చూస్తూ ఏదో అరుస్తున్నారు .. మాకేం అర్ధం కాలేదు. ఎందుకైనా మంచిదని మేం మా వాహనం ఎక్కబోతుండగా,  రోజాలో ఉన్నాడేమో నమాజ్ కోసం  వెళ్లి కాళ్ళు చేతులు కడుక్కుంటున్న డ్రైవర్ కి ఏం కనిపించిందో  కంగారుగా పెద్ద అరుపు ఎక్కండంటూ. అంతలోనే ఆ యువకుల గుంపు నుంచి ఓ గులక రాయి మా వయిపు దూసుకొచ్చి మాకు అతి సమీపంలో పడింది.

పట్టుకోండి .. తన్నండి .. తరమండి .. రాళ్ళ వర్షం మాకు దగ్గరవుతూ .. పరుగు పరుగున వచ్చిన డ్రైవర్ బండిని ముందుకు ఉరికించాడు.  ఆ అల్లరి మూకని, రాళ్ళనీ తప్పించుకుంటూ సందులు గొందులు తిప్పి ఎలాగయితేనేం ఆ ఊరు దాటించాడు.  ప్రాణాలు అర చేతిలో పెట్టుకొని మేం.  ఏ ప్రమాదం ఎటు నుంచి ముంచుకొస్తుందోనన్న భయంతో.. మరో ఊరు .. మరో ప్రదేశం అక్కడా వాతావరణం తుఫాను వచ్చేముందు ప్రశాంతతలా .. కర్ఫ్యుని తలపిస్తూ .. మధ్య మధ్యలో మా వాహనం ఆపే BSF జవానులు.

ఏదో జరుగుతోంది.  మా ప్రయాణం ఏ మాత్రం సురక్షితం కాదని తెలుస్తోంది.  ఆపద ముంచుకొస్తోంది .. ఏం చేయాలో దిక్కు తోచని స్థితి.

‘ క్యా భయ్యా క్యా హువా ‘  రవిత్రేయిని

‘ఏమో .. ఈ బండి జమ్మూ రిజిస్ట్రేషన్ కదా .. మనం ఉన్నది కాశ్మీర్లో .. ముందుకు వెళ్ళడం కష్టమే . ఎక్కడైనా ఆగాల్సిందే . ‘ డ్రైవర్ మధ్య మధ్యలో ఎవరితోనో ఫోనులో మాట్లాడుతూనే ఉన్నాడు తమ భాషలో.

‘అదేంటి .. నువ్వు ఈ రాష్ట్రానికి చెందిన  వాడివే కదా ..’ కవిత

రంజాన్ ఉపవాసంలో ఉన్న అతను నమాజ్ చేసుకోవడానికి ఎక్కడా కుదరలేదు. చివరికి కూర్చున్న చోటే నమాజ్ కానిచ్చాడు.  ఓ గ్రామంలో పరిస్థితి చెప్పి తమకి ఆశ్రయం కోరాడు.  ఎవరూ ఒప్పుకోలేదు.  చివరికి  ఓ ఇంటి పెద్ద సరేనన్నాడు.  మా వాహనం రోడ్డు మీద ఉంటే ప్రమాదమని రెండు ఇళ్ళ మధ్య ఉన్న సందులో ఎవరికీ కనపడకుండా పెట్టించాడు.  మా అందరినీ తమ ఇంట్లోకి తీసుకెళ్ళి ప్రధాన ద్వారం మూసేశాడు. వీళ్ళంతా ముస్లింలు. ఇది ఏ తీవ్రవాదులకో సంబందించిన స్థలం కాదు కదా .. ! మమ్మల్ని ఇక్కడ బంధించారా .. ఏమో .. ఏ పుట్టలో ఏ పామున్నదో .. ఎవరికి  తెలుసు ? అసలు నిజంగా హర్తాల్ జరుగుతోందా .. ఈ డ్రైవర్ మధ్య మధ్య ఫోన్ మాట్లాడుతూనే ఉన్నాడు.  తీవ్రవాదులతో కాదు కదా .. ? ఇందాక ఈ ఇంటి యజమాని చెప్పినట్లు మేము దాటి వచ్చిన ఆ గ్రామం పాకిస్తానీ ఉగ్రవాదుల్ని కాల్చివేసిన ప్రదేశమేనా ..? మదిని తొలిచేస్తూ ..

మేం క్షేమంగా ఉన్నామా .. లేక పెనం మీద నుంచి పొయ్యిలో పడ్డామా .. అనుమానపు చూపులతో మేం.  డ్రైవర్ జమ్ముకి చెందిన ముస్లిం, ఈ ఇల్లు కాశ్మీరీ ముస్లిం వ్యక్తిది. మేమంతా హిందువులం . తప్పదు .. ఇప్పుడు
ఏమనుకొని ఏమీ లాభం లేదు.  ప్రతి క్షణం అప్రమత్తంగా ఉండాలి. ఏది జరిగితే అది జరుగుతుంది అని మమ్మల్ని మేం సన్నద్మము చేసుకుంటూ .. ఎదురయ్యే పరిస్థితులని ఎదుర్కోవడానికి సమాయత్తమవుతూ .. గుండె దిటవు చేసుకుంటూ ..

‘ఈ ప్రాంతంలో వాళ్లకి హిందువులంటే గిట్టదట ‘  ఏదో గుర్తొచ్చినట్లు మృదుల చెవిలో గొణిగింది సంగీత.

‘చుప్’   కళ్ళతో వారిస్తూ .. మృదుల

భారత్ -పాకిస్తాన్ ల మధ్య జరిగిన మూడు యుద్దాలకు, కాశ్మీరీ లోయలో ఉగ్రవాదానికి మా ఈ విపత్కర పరిస్థితికి మేమే కాదు మాలాంటి ఎందఱో పర్యాటకుల ఇబ్బందులకు   కారణం కాశ్మీరు వివాదమే.  కాశ్మీరు మనదేశంలో అంతర్భాగం అని మనం అనుకుంటున్నాం.  పాక్ లో ఉన్న కాశ్మీరి భూభాగాన్ని  పాక్ ఆక్రమిత కాశ్మీర్ అంటున్నాం.  మన లాగే  పాకిస్తాన్ వాళ్ళు కాశ్మీర్ తన దంటున్నారు.  భారత్ లో ఉన్న కాశ్మిరీ భూభాగాన్ని భారత్ ఆక్రమిత కాశ్మీర్ అంటున్నారు. మా ఈ స్థితికి మూలాలను వెతుకుతూ  నా ఆలోచనలు
kasmir9
మా బృంద సభ్యులంతా మనసులో ఏ భయాలున్నా కనిపించనీయకుండా ఆ ఇంటివాళ్ళతో మాట్లాడుతున్నారు.  ఆ ఇంటి పెద్ద అబ్దుల్లా చాల స్నేహంగా ఉన్నాడు.  గలగలా మాట్లాడుతున్నాడు.  లోపలున్న భార్యని, కోడల్ని , కూతుర్ని పిలిచి మా విషయం చెప్పాడు. మేం హైదరాబాద్ నుండి అని చెప్పగానే చాలా ఆశ్చర్యం వారిలో.  అంత  దూరం నుండి చూడడానికి వచ్చారా.. అందులోనూ అంతా ఆడవాళ్ళు అని .  ఇంటి యజమాని తమ్ముడు హైదరాబాదులోనే  మిలిటరీ శిక్షణ తీసుకున్నాడని వచ్చేటప్పుడు చేతి గడియారాలు తెచ్చాడని చెప్పారు. వాళ్ళ మాటల్లో హైదరాబాద్ అంటే అభిమానం కనిపించింది.  అంతా కుర్చోన్నాం.  సుహృద్భావ
వాతావరణంలో సాగుతున్న సంభాషణల మధ్య నిశ్చలంగా ఉన్న బావిలో రాయి వేసి కంపనాలు సృష్టించినట్లు అయింది మా పని మాలిని కొద్దిగా పక్కకు వెళ్లి చేసిన ఫోన్ తో.

మాకు ఎదురైన క్లిష్ట పరిస్థితి, మేం తలదాచుకున్న విధం, మేమున్న ప్రదేశం, ఇంటి యజమాని పేరు అన్నీ వాళ్లయనకు  ఫోన్ చేసి చెప్పింది.  ఎందుకయినా మంచిదని.  ఆ ఇంటి వారి మొహాల్లో మారిన రంగులు. భ్రుకుటి  ముడుస్తూ పెద్దాయన.  మమ్మల్ని అనుమానాస్పదంగా చూస్తూ .. అసహనంగా కదులుతూ .  ముక్కూ మొహం తెలియని వారికి ఆశ్రయం ఇచ్చి తప్పు చేశామా అన్న భావన వారి కళ్ళలో ప్రతిఫలిస్తూ ..
సహజమే కదా .. వారిని తప్పుపట్టలేం.  అప్పటివరకూ మాకు తెలిసిన హిందీలో మాట్లాడిన  మా మాటలు విన్న వారికి ఒక్క సారిగా తెలుగు వినడం అది వారికి అర్ధం కానిది కావడం, మధ్య మధ్యలో వారి ఉరి పేరు, ఇంటి యజమాని పేరు రావడం అకస్మాత్తుగా వారి అనుమానానికి కారణమయ్యి ఉండొచ్చనిపించింది .  పురుషులు లేకుండా మీరే వచ్చారా అని మమ్మల్ని ఆశ్చర్యంగా, అబ్బురంగా.. ఆరాధనా పూర్వకంగా చుసిన ఆ ఆడ వాళ్ళలో కన్పిస్తున్న భయం ఆందోళన…  ఈ సంకట పరిస్థితినుండి ఎలా బయటికి రావాలి..  తూటాల్లా తాకుతున్న చూపులనుంచి ఎలా తప్పించు కోవాలి

‘హైదరాబాద్ లోను ఇంకా  చాలా ప్రాంతాల్లోనూ ఉర్దూ మాట్లాడతారు.  అదే మీతో మాట్లాడాం.  మా రాష్ట్రం లో మా మాతృభాష తెలుగు. మేం ఇంట్లో మాట్లాడేది తెలుగులోనే.   ఇక్కడ అలజడుల గురించి వార్తల్లో చూస్తే మా వాళ్ళు కంగారు పడతారు కదా అందుకే మేం అంతా క్షేమంగా ఉన్నాం.  మా గురించి ఆందోళన వద్దు. ఓ పెద్ద మనిషి పెద్ద మనసుతో మాకు ఆశ్రయం ఇచ్చారని మాలిని వాళ్ళాయనకి చెప్పింది’ అని చెప్పాను .

అవునన్నట్లుగా తలలూపారు మిగతావాళ్ళు.  మా అందరినీ నఖశిఖ పర్యంతం పరీక్షగా చూసిన ఆ ఇంటి పెద్ద, ఇతర కుటుంబ సభ్యుల మొఖాల్లో ప్రసన్నత నిదానంగా చోటు చేసుకుంటూ.. హమ్మయ్య వాళ్ళు మామూలయ్యారు అనుకున్నాం.  కాసేపు మాట్లాడిన తర్వాత అత్తా కోడళ్ళు సాయంత్రపు పనిలో నిమగ్నమయ్యారు.

ఆ పెద్దాయన కాశ్మీరీల పేదరికం, పిల్లల చదువు, పాకిస్తానీ ఉగ్రవాదులు స్థానికులను ప్రేరేపించి, డబ్బుల ఎర చూపి అక్కడి  యువతకి శిక్షణ ఇస్తున్నారని,  ఉగ్రవాదం వైపు మళ్ళిస్తున్నారని దాదాపు 50 వేల మంది
ఉగ్రవాదం వల్ల ప్రాణాలు కోల్పోయారని చెప్పాడు.   1990 తర్వాత తీవ్ర వాదం వల్ల హిందువులపై దాడులు పెరగడంతో హిందువులు కాశ్మీరు ప్రాంతాన్ని వదిలి ప్రాణాలు గుప్పెట పట్టుకుని పోయారని, ఇప్పుడు 5% కూడా హిందువులు లేరనీ అన్నాడు.  ఇప్పుడు తమ గ్రామంలోనూ ఒకే ఒక కాశ్మీరి పండిట్ కుటుంబం ఉందనీ తాము ఎంతో స్నేహంగా ఉంటామని చెప్పాడు.  కాశ్మీర్ భూభాగంలో కొంత ఆక్సాయ్ చిన్ భాగం చైనా అధినంలో ఉందనీ .. పాకిస్తాన్ ఆక్రమణలో ఆజాది కాశ్మీర్ ఉందనీ, ఆ బందులు, హర్తాల్ లు.. కాశ్మీర్ లోయ దద్దరిల్లి పోవడం .. పాలకులు  ప్రజల మనో భావాల్ని పట్టించుకోకపోవడం గురించి చాలా చెప్పాడు.

భారతసైన్యం వేరు, కాశ్మీరు ప్రజలు వేరు అనే స్థాయిలో పరిస్థితులు చేయిదాటిపోతున్నాయి. భద్రతా బలగాలు మా  పాలిట యమకింకరులుగా తయారయ్యాయి. అత్యంత సున్నితమైన ఈ సరిహద్దు ప్రాంతంలో ప్రజల మనోభావాలను పట్టించుకోరు.  మా పాలకులకి ప్రజలని సానుకూలంగా మలుచుకోవడం తెలియదు. ఉత్తర,దక్షిణ కాశ్మీరు జిల్లాల్లో మునుపెన్నడూలేని రీతిలో ప్రజలు భద్రతా బలగాలపై విరుచుకు పడుతున్నారు. మేం  ఉగ్రవాదం మినహా జీవితంలో సుఖం, సంతోషం, సమైక్య జీవనం, విద్య, విజ్ఞాన వినోదాలు వంటి వాటితోపాటు సామాజిక జీవితాన్ని కోల్పోతున్నాం.  రోడ్డుపై వెళ్ళే ఎవరికీ భద్రత లేదు. మా పిల్లల  చదువులు కొండెక్కాయి.  ప్రజలు స్వేచ్ఛ కోల్పోయారు. సాయంత్రమైతే భయంగా ఇంట్లోనే ఉండిపోవాలి. అర్థ రాత్రి తలుపులు తట్టేది ఉగ్ర వాదులో, పోలీసులో తెలియదు, ఒకరికోసం ఒకరు వెతుక్కుంటూ వస్తారు. ఇద్దరివల్లా చిత్రహింసలకు మేం గురికావల్సిందే. ఇంకా చెప్పాలంటే కాశ్మీరులో మత కలహాలు లేవు. ఉగ్రవాదులకు, భద్రతా బలగాలకే పోరు. ఎప్పుడో ఒకప్పుడు ఈ  మంచుపర్వతాలు బద్దలై, ఆ మంటలు ఎప్పుడు భగ్గున భారత ప్రభుత్వాన్ని చుట్టుముడతాయా ? అని పాకిస్థాన్‌ కాచుకుని కూర్చుంది ఆవేదనతో చెప్పుకోచ్చాడతను.

అక్కడి వ్యవసాయం, పంటలు మధ్యలో చిన్న చిన్న ప్రశ్నలు మినహా మేం మాట్లాడింది తక్కువ.  అబ్దుల్లా ద్వారా కాశ్మీర్ బాహ్య సౌందర్యమే కాదు. ఆ ప్రజల అంత; సౌందర్యమూ  అర్థమయింది. కల్లోల  కాశ్మీర్ ని మరో కోణంలో చూసే అవకాశం కలిగింది .      దాదాపు నాలుగైదు గంటలు ఇట్టే కరిగిపోయాయి. మా అనుమానాలు, భయాలు నీలాకాశంలో ఎగిరిపోతున్న దూది పింజల్లా ఎగిరిపోయాయి.   ఆ ఇంటావిడ ఇచ్చిన కాఫీ మమ్మల్ని తేలిక పరిచింది.   బయటకు చూస్తే చీకటి ముసుగు వేస్తోంది.

ఈ సమయంలో మీరు ఎలాంటి ఇబ్బంది లేకుండా వెళ్ళవచ్చు.  మా వాళ్ళంతా ఉపవాసంలో ఉంటారు కదా.  ఉపవాసం వదిలేముందు నమాజ్ కి వెళతారు.  ఆ తర్వాత భోజనం వేళ .. ఇప్పుడయితేనే మిమ్మల్ని ఎవరూ  .. పట్టించుకోరు.  ఎలాంటి అవరోధం కల్గించరు  అని చెప్పాడు అప్పుడే వచ్చిన వాళ్ళబ్బాయి ఇంతియాజ్.  దాదాపు మరో రెండున్నర గంటలు  ప్రయాణం చేస్తే కాశ్మీరు లోయ వదిలి జమ్మూ ప్రాంతంలోకి అడుగు పెడతారు అని డ్రైవర్కి జాగ్రత్త గా తీసుకెల్లమని జాగ్రత్తలు జెప్పాడు అబ్దుల్లా. ఆ కుటుంబానికి ధన్యవాదాలు తెలిపి, నిన్న మేం కొన్న వాటిల్లోంచి గిఫ్ట్ ఇవ్వబోతే వద్దని వారించాడు పెద్దాయన. అయినా వినకుండా మాదగ్గర ఉన్న చాక్లెట్లు, డ్రై ఫ్రూట్స్ , గాజులు, పర్సులు ఇచ్చాం.

మా ఆదిలాబాద్ జిల్లాలోని భైంసాలో మతకల్లోలాలు జరిగినప్పుడు ఓ సాధారణ హిందూ వనిత తుల్జాబాయి దాడికిలోనైన కొందరు ముస్లింలకు ఆశ్రయం యిచ్చిన విషయం,  హైదరాబాద్‌లో  55 ఏళ్ళ షాహీన్‌ సల్తానా 1980లో మత కల్లోలాల్లో జరిగిన భయంకరమైన హింసని చూసి,  ఆమె మత సామరస్యం కోసం కృషి చేస్తోన్న విధం చెప్పాం.

అందరం భాయీ భాయీ గా ఉండాలనే వాదాన్ని ప్రోత్సాహిద్దాం. దేశమంతటా వ్యాపింపజేద్దాం అంటూ మరో మారు ఆ కుటుంబానికి మనస్పూర్తిగా ధన్యవాదాలు తెలుపుకుని, వారి మానవత్వాన్ని అభినందించి బయలుదేరాం .

 

శాంతి ప్రబోధ

శాంతి ప్రబోధ

  వి. శాంతి ప్రబోధ

 

మూడు జ్ఞాపకాలు- మూడు సాహసాలు!

ఈ రోజెందుకో బాల్యంనాటి సాహసాలు గుర్తుకు వచ్చాయి. నిజానికి అవి సాహసమేమీ కావు. అయినా ఆ వయసురీత్యా సాహసమనే చెప్పాలి.

అలాంటి మూడు సంఘటనలు.

నిజానికి ఇవి ఏకోవలోకి వస్తాయో  అని ఎప్పుడూ సందేహమే!

1

వయస్సు సరిగ్గా  గుర్తులేదు. బహుశ ఇంకా స్కూలుకు వెళ్ళటంలేదు. అప్పట్లో వయస్సు ఆరో సంవత్సరం వస్తేగాని బడిలో చేర్చుకునేవారు కాదు.

స్థలం మాత్రం పోలవరం (పశ్చిమగోదావరి జిల్లా). మా రూతు ఆంటీ 12వ తరగతి చదువుతుండేది. మా యిల్లు ఉన్నతపాఠశాల ఎదురుగా వుండటంవల్ల ఆంటీ వాళ్ళ స్నేహితురాళ్ళు తరచూ వచ్చి మంచినీళ్ళు త్రాగి వెళ్ళేవారు. అలా వచ్చేవాళ్ళలో   పురుషోత్తపట్నానికి చెందినవారు వుండేవారు. పురుషోత్తపట్నం (తూర్పు గోదావరి జిల్లా)  అంటే పోలవరం గోదావరికి ఆవలి ఒడ్డునవుంది. ఆ గ్రామంనుండి  ప్రతిరోజూ పడవపై వచ్చి,  వెళ్ళేవారు.

ఓ రోజు ఒకరి ఇంట్లో ఎదో కార్యక్రమం (నాకు సరిగ్గా గుర్తులేదు) ఉండటంవల్ల అందరూ కలిసి వెళ్ళాలని మాట్లాడుకుంటున్నారు. అందులో ఆహ్వానం మా ఆంటీకి కూడా వుంది. ఆ మాటలు విన్న నేను, నేనూ వస్తానని  చెప్పాను. నువ్వు సిద్ధంగావుండు మేము వచ్చి తీసుకెళతాము అని చెప్పి వెళ్ళిపోయారు. నాకు పడవ ప్రయాణం అంటే మహా సరదా. పోలవరం (పశ్చిమగోదావరి జిల్లా) పురుషోత్తపట్నం (తూర్పు గోదావరి జిల్లా) రెండు ఎదురెదురు ఒడ్డుల మధ్య ఎక్కువ వెడల్పువున్న రేవులని చెబుతారు. కొవ్వూరు రాజమండ్రిల మధ్య వెడల్పు ఎక్కువవున్నా రేవులు మాత్రం ఎదురెదురుగా లేవు.  ఇంతకుముందు ఒకసారి ఆంటీయే తన క్లాస్మేట్ ఇంటికి తీసుకెళ్ళింది.  అందుకని చకచకా సిద్దమయ్యి, చాలాసేపు ఎదురుచూసాను. ఎవ్వరు రాలేదు. ఒకవేళ నన్ను మర్చిపోయి పడవల రేవుకు వెళ్ళారా అని సందేహమొచ్చింది. సరే! అక్కడికి వెళ్ళి  చూద్దాం  అని బయలుదేరాను.  నేను అక్కడికివెళ్ళిన సమయానికి ఒక పడవ వెళ్తూ కనిపించింది. అందులో కొంతమంది విద్యార్థునులు  కనిపించారు. నన్ను మర్చిపోయారేమో అనే సందేహం ఎక్కువయ్యింది. అక్కడే చాలాసేపువున్నాను.solo-boat-journey

 

అప్పట్లో అటువైపునుండి ఒక  పడవ ఇటువస్తే, ఇటునుంచి ఒక పడవ అటువెళ్ళేది. అలా అటువైపు పడవ వచ్చింది. పడవవాళ్ళు లంగరులు వేసి బయలుదేరేలోపు వారి వారి పనుల్లో పడిపోయారు. నేను పడవ ఎక్కి కూర్చున్నాను. టిక్కెట్టు ఎమీ ఇవ్వకపోయినా పడవ ఎక్కిన వారిని లెక్కించుకుని, రుసుము వసూలు చేసేవారు. ఇంకా  సరుకులు, సామానులు చూసుకొని  బయలుదేరారు. ఆవలి ఒడ్డు రాగానే  నేను పరుగెట్టుకుంటూ నాకు తెలిసిన ఇంటికి వెళ్ళాను. అక్కడ సందడైతే వుంది కాని, వీళ్ళు ఇంకా రాలేదని తెలిసింది. వస్తారులే అనే ధీమా ఒకవైపు, వస్తారా రారా అనే సందేహం మరోవైపు. అలా ఆ వీధిలో నాలుగు అడుగులు వేసేసరికి గోళీలు ఆడుతూ కొందరు పిల్లలు కనిపించారు. అక్కడికి పడవరేవు కనబడుతూనేవుంది. అటువైపు ఓ కన్నేస్తూనే  మెల్ల మెల్లగా వారితో కలిసిపోయాను. ఎంతసేపు అలా ఆడుతూ ఉన్నానో గుర్తులేదు గానీ కొంచెం చీకటి పడుతున్న సమయంలో ఒక పడవ వచ్చింది. అందులో మా ఆంటీ ఇంకా తన స్నేహితురాళ్ళు ఉన్నారు. నన్ను అక్కడ చూసి ఆశ్చర్యపోయారు.  ఆంటీకి భయం మొదలయ్యింది ఇంటి దగ్గర నా గురించి ఏమి కంగారు పడుతున్నారోనని. తన ఫ్రెండ్సు అనునయిస్తున్నా భయంగానే సమయం గడిపింది.

ఆఖరి పడవకు పురుషోత్తపట్నంనుండి  పోలవరం వచ్చేసాము. ఇంటికి వెళ్తే ఎవ్వరు కంగారు పడటంలేదు ఎందుకంటే నేను ఆంటీతోనే వెళ్ళానని అనుకున్నారు. అప్పుడు ఆంటీ స్థిమితపడింది.

నాకు మాత్రం పడవ ప్రయాణం అనగానే అదే గుర్తుకొస్తుంది.

 

2

1966, పాత పట్టిసం, పోలవరం తాలూకా, పశ్చిమ గోదావరి జిల్లా.

గోదావరిలో శివాలయంవున్న ఊరుగా ప్రసిద్దమైనది.

అక్కడ ఎలిమెంటరీ స్కూలు ఉంది. బహుశ 3వ తరగతి చదువుతున్నాను. అందులో మా పెద్ద ఆంటీ  కటాక్షమ్మ ఉపాద్యాయురాలుగా పనిచేస్తుండేది. నేను చిన్నక్క మేరీ సలోమి, 5వ తరగతి చదువుతూ ఆమెవద్ద ఉండేవాళ్ళం.  అదే బడిలో ఆంటీతో పాటు  శ్రీమతి శాంతమ్మ, లిల్లీ  అని ఇద్దరు  ఉపాద్యాయురాళ్ళు వుండేవారు.

మంగళవారం 4కి.మీ. దూరంలోవున్న పోలవరంలో సంత జరిగేది. అందుకని మంగళవారం స్కూలుకు మధ్యాహ్నంనుండి శెలవు వుండేది.

లిల్లీ గారు తన తమ్ముడు వివాహానికని పత్రిక ఇచ్చి పెళ్ళిపనుల నిమిత్తం శెలవుపెట్టారు.

ఆ రోజు మంగళవారం. మధ్యాహ్నం బడినుంచి వచ్చి కొద్దిసేపు ఆడుకున్నాక స్నానంచేసి మంచి బట్టలు వేసుకున్నాను. అంతలో ఆంటీ శాంతమ్మగారి ఇంటికివెళ్ళి ఎదో తెమ్మని పంపించింది. వారి ఇల్లు ఊరికి ఆ చివరవుండేది. నేను వెళ్ళేసరికి వారి ఇంటికి తాళంవేసివుంది. ప్రక్కన అడిగితే పెళ్లికి వెళ్ళారు అనిచెప్పారు. వెంటనే నాకు లిల్లీ టీచర్ వాళ్ళ తమ్ముడు పెళ్ళి రేపే అని గుర్తుకువచ్చింది. అక్కడికే వెళ్ళివుంటారని  అనుకున్నాను. ఆ పెళ్ళి కొత్త పట్టిసీమ అక్కడికి ఓ మూడు నాలుగు కిలోమీటర్లు వుంటుంది. గోదావరి గట్టు వారగా వుంటాయి ఆ గ్రామాలు. అప్పటికి ఇంకా చీకటి పడకపోవడంతో సరదాగా నడుచుకుంటూ వెళ్ళాను. ఇల్లు ఎలా కనుక్కున్నానో గుర్తులేదుగాని పెళ్ళి ఇంటికివెళ్ళాను    కొద్ది సేపటికి  లిల్లీ టిచరు కనిపించి  ఆంటీగురించి అడిగి తన పనుల్లో తాను కలిసిపోయింది. పెళ్ళి పందిరివేయడం, దాని డెకరేషను పనుల్లో, కాగితాలు అంటించటంలో నేనూ కొద్దిగా సహాయంచేసాను. చీకటి ఎప్పుడుపడిందో తిన్నానో లేదో తెలియదు.  కొద్ది రాత్రి అయ్యాక పెళ్ళికూతురు వచ్చింది. విడిది ఇల్లు ఇచ్చారు. ఏవేవో కార్యక్రమాలతో కొద్దిసేపు సమయం గడిచిపోయింది. విడిది ఇంటికి, పెళ్ళి ఇంటికి మధ్య తిరుగుతుంటే మగ  పెళ్ళివారు నేను ఆడపెళ్ళివారి తరుపున అనుకున్నారు.   ఆడ పెళ్ళివారు నేను మగపెళ్ళివారి తరుపున అనుకున్నారు, పెళ్ళి తంతులో పడి నాకు ఇల్లు గుర్తురాలేదు. ఆ రాత్రి పెళ్ళి పందిరిలోవున్న ఓ బెంచీపై నిద్రపోయాను.

ఉదయమే పెళ్ళి సందడి. అక్కడ నన్ను గుర్తుపట్టేవారు ఎవ్వరూ లేరు. గుర్తుపట్టగలిగే ఒక్క టీచరు చాలా పనుల్లో హడావిడిగావుంది.

పెళ్ళికూతురు తెల్లటి వస్త్రాలు, మేలిముసుగు (వెయిల్) బ్యాండు మేళాలతో పందిరిలోకి తీసుకెళ్ళడం నన్ను అబ్బుర పరిచాయి.

పెళ్ళి అయిపోయింది, భోజనాల దగ్గర శాంతమ్మ టీచరు భర్త వెంకన్న గారు (ఆయనా టీచరే) కనిపించి పలకరించారు.  ఆంటీ రాలేదా? వస్తే ఎక్కడా అని. అప్పుడు గుర్తుకువచ్చింది ఇల్లు. భోజనాల తర్వాత వెళ్ళిపోదాము అనుకున్నా. ఇంతలో వధూవరులిద్దరూ బ్యాండు మేళాలతో వీధిలో ఊరేగింపు వెళ్ళడం కనిపించింది. కొందరు పిల్లలు ఊరేగింపువెనుక నడుస్తున్నారు  ఆ గుంపులో చేరిపోయాను. ఎంత సమయం గడిచిందో గాని, వాళ్ళు వెళ్ళిపోయారు. ఇక ఇంటికి వెళ్ళాలనే ద్యాస పుట్టింది. మెల్లగా గోదావరి గట్టు ఎక్కాను. కొద్దిగా ప్రొద్దు గ్రుంకుతున్నది. గట్టువారగా చింతచెట్లు, మరికొన్ని చెట్లు వుండేవి.     కొన్ని చెట్లపై బ్రహ్మజెముడుపక్షి  (గబ్బిలాలు లాంటివి) వున్నాయి. అవి సాయత్రము చెట్లపై ఎగురుతూ, వాలుతూ వుంటాయి. అవి చూసేసరికి కొంచెం భయం మనసులో మెదిలింది.

ఆ భయానికి తోడు ఇంటి దగ్గర ఆంటీ కొడుతుంది అనే భయంకూడా మొదలయ్యింది. అలా భయం, భయంగా నడుస్తున్నాను. ఇంతలో మా వూరి అతను ఒకరు సైకిలుపై వెళూ నన్ను చూసి, ఇక్కడ వున్నావు ఏంటి? నీకోసం ఊరంతా వెదకుతున్నారు అని, తన సైకిలిపై ఎక్కించుకుని ఇంటికి తీసుకెళ్లాడు.

ఆంటి ఈ వేళ నా తోలుతీస్తుంది అనుకుంటూ సైకిలుదిగుతుండగా నన్ను చూసి ఒకాసారిగా  పరుగెత్తుకునివచ్చి గట్టిగా పట్టుకుని ఏడ్వడం మొదలుపెట్టింది.  ఆ వెనకే నా చిన్నక్క వచ్చి తను ఏడ్వటం మొదలయ్యింది. కొడతారనుకున్న నేను ఒక్కసారిగా బిత్తరపోయాను.

 

ఇక ఇంటి దగ్గర  ఏమయ్యిందంటే :

మా వీధిలో కొందరితో కలిసి ఆంటీ పోలవరంలో వున్న, భానుథియేటర్లో సినిమాకు వెళ్ళడాన్కి  పథకం వేసుకున్నారు. నడిచివెళ్ళడం, సినిమా అయిన తర్వాత నడిచి రావడం కాబట్టి నన్ను తీసికెళ్తే నిద్రపోతే అవస్థ అవుతుందని నన్ను శాంతమ్మగారి ఇంటికి వెళ్ళి రమ్మన్నారు. నేను వెళ్ళి వచ్చేలోగా వాళ్ళు వెళ్ళిపోవాలని పథకం. అలాగే నేను వెళ్ళాక వాళ్లు వెళ్ళిపోయారు. ఇంటివద్ద వున్న చిన్నక్క నేను ఆంటీతో వెళ్ళాను అనుకుంది.

రాత్రి మొదటి ఆట చూసుకొని ఇంటికివచ్చేసరికి ఇంటివద్ద నేను లేకపోయేసరికి ఖంగారు పడ్డారు. వెదకడం మొదలు పెట్టారు. చుట్టు ప్రక్కల ఇళ్ళు, తర్వాత వీధులు. గ్రామాలు అప్పటికే నిద్రలో జోగుతుండేవి.

అప్పుడే ఒక విషయం తెలిసింది. అదేమంటే గోదారిలోవున్న గుడికి ఆ రోజు వుదయం సినీనటుడు ఎన్.టి. రామారావు వచ్చి వెళ్ళాడని. ఆయన్ని చూడడాన్కి   జనాలు ఎగబడ్డారని. అందరిలో ఒక భయం పొడసూపి పలు అనుమానాలు తలెత్తాయి. గోదావరిలో గాని నేను పడిపోయానేమో అనే అనుమానంతో  వెదకులాట గోదావరి తీరాలగుండా సాగింది.

అప్పట్లో మరోవదంతులు కూడా వుండేవి. పిల్లల్ని ఎత్తుకుపోయే వాళ్ళు తిరుగుతున్నారని. ఇలాంటి రద్దీ సమయాలలో వారి చేతివాటం చూపిస్తున్నారని.

చుట్టు ప్రక్కల మాకు బంధువులు వుండే, దొండపూడి, పోలవరం నేను ఆంటి తరచూ వెళ్ళే గృహాలన్నింటికి వెళ్ళి అక్కడికి గాని వెళ్ళానేమోనని వెదికారు.

లిల్లీ టీచరు గారి తమ్ముడి పెళ్ళివిషయం వారికి గుర్తుకు రాలేదు. ఇంతకుముందెప్పుడూ వారి ఇంటికి వెళ్ళలేదు కాబట్టి సందేహం కూడా రాలేదు.

 

3

1969 కొవ్వూరు, పశ్చిమగోదావరి జిల్లా.

నాన్న గారికి కొవ్వూరు బదిలీ అయిన తర్వాత స్కూలు సీట్ల సర్దుబాటు తర్వాత మొత్తం కుటుంబం, రైల్వే స్టేషను దగ్గర్లోని నాదెండ్లవారి వీధిలో అద్దెకు  వుండే వాళ్ళం.

పెద్ద అన్నయ్య రాజమండ్రి , ఆర్ట్స్ కాలేజీలో బి.ఎ. చదువుతుండేవాడు. కొవ్వూరునుండి రోజూ రైలులో వెళ్ళేవాడు.

పెద్దక్క సునీతి, చిన్న అన్న లింకన్ 8వ తరగతి, చిన్నక్క 7వ తరగతి హైస్కూలులో జాయిన్ అయ్యారు.  నన్ను దుంపల బడి అని ఒక స్కూలు 5వ తరగతి లో చేర్చారు (ఈ సంగటన జరిగిన తర్వాత నన్ను మళ్ళీ పట్టిసం పంపేసారు, అందువల్ల స్కూలు పేరు గుర్తులేదు)

కొవ్వూరుకు ప్రక్కనేవున్న   పశివేదలలో మావయ్య వుండేవారు.  ఆయన రైల్వేలో పనిచేసేవారు.

ఓ రోజు మధ్యాహ్నం మావయ్య మాయింటికి వచ్చారు. పెద్దక్క, చిన్న అన్నయ, చిన్న అక్క పశివేదల వస్తామని మావయ్యకు చెప్పారు. సాయంకాలం స్టేషనుకు వచ్చేయండి అక్కడనుండి కలిసివెళదాం అనిచెప్పి మావయ్య వెళ్ళిపొయాడు. అక్క వాళ్ళతో నేనూ వస్తానని చెప్పాను. సరే తయారయ్యివుండు,  బజారుకు వెళ్లి వస్తాము అని వెళ్ళిపోయారు. నేను సిద్దపడి ఎదురుచూడటం మొదలుపెట్టాను.  ఎంతసేపటికి రాకపోయేసరికి స్టేషనుకు వెళ్దామని బయలుదేరి వెళ్ళాను. నేను వెళ్ళేసరికి మేము  వెళ్దామనుకున్న పాసింజరు రైలు అప్పుడే వెళ్తూ కన్పించింది. ఆ రైలులో వెళ్ళిపోయివుంటారని అనుకున్నాను. నన్ను వదిలి వెళ్ళిపోయాయారు అని ఏడ్పువచ్చింది. రైలుపట్టాలవెంట నడిచివెళ్తే మూడు కిలోమీటర్లు వుండవచ్చు. ఇంతకుముందు ఒకసారి వెళ్ళిన గుర్తు. వెళ్దామని పట్టాలవెంట నడక మొదలుపెట్టాను. మద్యలో కొంగలబాడవ అనే వంతెన వుంది దానిపై దాటదానికి భయంవేసి ఆగిపోయాను. కొద్దిసేపటికి ఒకామె(బహుశ నర్సు అనుకుంట) డ్యూటీనుంచి వస్తూ, రైలు దాటిపోవడంవల్ల ఆమె నడిచి వెళ్తుంది. ఆమె నన్ను వంతెన దాటించింది.

పశివేదల స్టేషనులో దిగితే ప్రక్కనేవున్న రైల్వేక్రాసింగు  గేటు ముందుగా వెళ్తారు అందరు. అక్కడ బంధువు ఆయన కూడా (మావయ్య వరుస)  వుండేవారు. ఆయన గేటు ఆజమాయిషీతోపాటు, టిక్కెట్లను వసులు, తనిఖీ చేసేవాడు.

నేను రైలుపై రాలేదు కాబట్టి అడ్డదారిలో ఇంటికి వెళ్లిపోయాను.  అత్తయ్య గాని, మావయ్య గాని నా రాకను పెద్ద అనుమానంగా చూడలేదు. మిగతా పిల్లలు ఎందుకు రాలేదో రేపు అటువైపు వెళ్ళినప్పుడు కనుక్కుంటాలే అన్నాడు. అలాగే ఉదయమే ఆయన డ్యూటీకి, అత్తయ్య కూడా పనిలోకి వెళ్ళిపోయారు. నా వయసుదే అయిన వదిన కూడా బడికి వెళ్ళిపోయింది. నేను వచ్చినది  సాయంకాలం అవటంవల్ల రెండు రాత్రులు గడిచాయనుకుంట.

ఒక్కడ్నే గదిలో కూర్చొని ఆడుకుంటున్నాను. ఇంతలో పెద్ద అన్నయ్య, పెదనాన్నగారి అబ్బాయి ఇద్దరూ కలిసి వచ్చారు. ఒక్కసారిగా నన్నుచూసి ఆశ్చర్యపోయారు. వెంటనే నన్ను తీసుకొని కొవ్వూరు ఇంటికి వెళ్ళారు.

 

 

ఇక ఇంటి దగ్గర  ఏమయ్యిందంటే :

అక్కవాళ్ళు బయటికివెళ్ళి వచ్చేసరికి సమయం లేకపోవడంవల్ల ఆ రోజుకు ప్రయాణాన్ని వద్దు అనుకొని ఇంటికి వచ్చేసారు.  మొదట పిల్లలతో ఆడుకోవట్డానికి ఎటైనా వెళ్ళివుండవచ్చనుకున్నారు. చీకటైనా రాకపోయేసరికి ఆందోళన మొదలయ్యింది. అందులోనూ పిల్లల్ని ఎత్తుకెళ్ళేవాళ్ళు రకరకాల రూపంలోనూ, సాధువులుగానూ తిరుగుతున్నారనే రకరకాల పుకార్లు వుండేవి. అవి నిజమో కాదో నాకు అంతగా గుర్తులేదు.

మొదట మా చుట్టుప్రక్కల వీధుల్లో వెదికారు. కొవ్వూరులొనే లూథరన్ చర్చి దగ్గరలో  మా పెదనాన్నగారు వుండేవారు.  అక్కడికి గాని వెళ్ళానేమో అని చూసారు. అక్కడ కనబడలేదు. పశివేదల వెళ్ళేవిషయం తెలిసేసరికి వెళ్ళివుంటే గేటు దగ్గర వుండే మావయ్యకు కనబడతారు కదా అందుకని కొవ్వూరు స్టేషను నుంచి ఫోను చేయించి  అడిగితే నేను చూడలేదు అని, వస్తే కన్పడకుండా ఎలావెళ్తాడు అని  చెప్పారట. దానితో పశివేదల రాలేదని అనుకున్నారు.

పెద్దన్నయ్య, మోషే, లివింగష్టన్ (ఇద్దరూ పెదనాన్న గారి పిల్లలు) అన్నయ్యలు మిగతా స్నేహితులు కలిసి రాత్రంతా వీధి, వీధి వెదికారు.

గోదావరి ఒడ్డున గోపాదాల రేవు వద్ద కొన్ని గుడులున్నాయి. అక్కడ సాధువులు, బిచ్చగాళ్ళు రాత్రిళ్ళు పడుకునేవారు. ఒకొక్కరిని లేపి, ముసుగుతీసి మరీ వెదికారట.  ఎవరెవర్నె లేపారో, దుప్పటి లాగి చూసారో చాలా కాలం కథలు కథలుగా చెప్పుకునేవారు మా అన్నయ్య వాళ్ళ స్నేహితులు

మరసటిరోజు పోలీసు కంప్లయింటు ఇచ్చారట. కొవ్వూరు రైల్వేస్టేషను, రాజమండ్రిలోని గోదావరి, రాజమండ్రి స్టేషనులోనూ వెదికారట.

నిడవోలులో రైల్వేస్టేషనులో ఓ పిల్లాడు దొరికాడని బాగా ఏడుస్తున్నాడని తెలిసిందట. ఆ సమయంలో కొవ్వూరునుండి నిడదవోలుకు రైలు ఏవీ లేకపోవడం, మా అన్నయ్య వాళ్ళు పశివేదలవచ్చి కొంచెం ఏదైనా తిని, ఓ గంట తర్వాత వున్న రైలుకు వెళదాం అని పశివేదల వచ్చారు.

అలా వచ్చిన వాళ్ళు ఆశ్చర్యపోక ఏమి చేస్తారు.

***

ఇక్కడే కొవ్వూరులో వుంటే మళ్ళీ ఏమి చేస్తాడొనని మళ్ళీ నన్ను కటాక్షమ్మ ఆంటీ దగ్గరకు పాత పట్టిసం పంపేసారు.

– జాన్ హైడ్ కనుమూరి

john hyde

డైరీలో ఒక పేజీ

 

వినోద్ అనంతోజు

వినోద్ అనంతోజు

 

 

 

 

 

 

 

అనుషాని పిక్ చెస్కోడానికి బెంగళూరు రైల్వే స్టేషన్ కి వెళ్ళాను. సరిగ్గా సంవత్సరం క్రితం చూశాను తనని.

ఎన్నో రోజుల తరవాత కలుస్తున్నాను. ఏదో ఆత్రుత, ట్రైన్ టైమ్ కి గంట ముందే వచ్చేశాను స్టేషన్ కి. స్టేషన్ బయట ఒక ౩౦ ఏళ్ల ఆవిడ నీరసంగా, చిన్న చిన్న దెబ్బలతో పడి ఉంది. చిరిగిపోయిన బట్టలతో, వొళ్ళంతా దుమ్ముతొ. ఆమె పక్కన ఆమె తాగుబోతు మొగుడు నలుగురితో గోడవపడుతున్నాడు. వాళ్ళ సంభాషణ అంతా కన్నడ లో జరుగుతోంది. నాకు అర్థమైనదాన్ని బట్టి వాడు ఆమెని కొడుతుంటే అటుగా వెళ్తున్న కొంతమంది అతన్ని ఆపి వాదులాటకి దిగారు. 

“నా భార్య నా ఇష్టం” అన్నాడు వాడు. ఆది విని కొంత మంది వెళ్ళిపోయారు అదేంటో..!! ఇద్దరు మాత్రం అతన్ని రెండు దెబ్బలు వేసి తరీమేశారు. వాళ్ళు కుడా వెళ్ళిపోయారు. ఆమె అక్కడే పడుంది. బలహీనంగా మూలుగుతోంది. జనం వస్తున్నారు, పోతున్నారు. కొందరు ఆమెని సరిగా గమనించకుండానే, అడుక్కునే ఆవిడ అనుకుని చిల్లర వేసిపోతున్నారు. నేను ఆ పక్కనే నిలబడి చూస్తున్నాను. ఇంతలో ఆ మొగుడు ఎక్కడినుంచో వచ్చి ఆవిడ ముఖం మీద బలంగా గుడ్డాడు. ఆవిడ గట్టిగా రోదించడం మొదలుపెట్టింది. అటు ఇటు పొర్లుతోంది. తాగుబోతు ఏదో గట్టి గట్టి గా అరుస్తూ అటు ఇటు తులుతూ తిరుగుతున్నాడు. జనం ఆవిడని దాటుకుని, తప్పుకుని వెళ్ళిపోతున్నారు. 25 ఏళ్లు ఉండే ఒకావిడ ఆమె భర్తతో అటుగా వెళ్తూ ఆగి ఆవిడతో మాట్లాడాలని ప్రయత్నించింది. మంచి నీళ్ళు తాగించింది. ఏదో జరుగుతోందని జనం గుమిగూడి చూస్తున్నారు. ఆవిడ కన్నడలొ ఏవో ప్రశ్నలడిగింది. ఆమె రోదిస్తూ సమాధానం చెప్తోంది. ఇంతలో అందరు తాగుబోతు మొగుడిని తిట్టడం మొదలుపెట్టారు. పోలీసాయన్ని పిలిచి అతని గురించి చెప్పారు. వాడు పోలీసు ని చూడగానే పారిపోయాడు. పోలీసాయన వెనకే పరిగెత్తాడు. ఆవిడని ఏం చెయ్యాలి అనే ప్రశ్నకి సమాధానం ఇవ్వకుండానే వెల్లిపొయాడాయన. నేను ఆ 25 ఏళ్ల ఆవిడని అడిగాను.

“డూ యూ నో కన్నడ? ”

“యస్”

“వాట్ ఇస్ షీ సేయింగ్?”

“ఈ డిడ్ నాట్ గెట్ హర్. షీ ఇస్ క్రైయింగ్ ఏ లాట్.”

ఆవిడ భర్త వచ్చెయ్యమని ఇందాకటి నుంచి లాగుతున్నాడు. కొద్దిసేపు నిలబడింది. ఎం చెయ్యాలో తోచక తన వాటర్ బాటల్ ఆమెకిచ్చేసి వెళ్లిపోయింది. జనం మళ్లీ ఎవరిదారిన వాళ్ళు వెళ్లిపోవడం మొదలుపెట్టారు. అప్పటిదాకా అక్కడ నిల్చున్న ఒకతన్ని ఏమైందని అడిగాను.

“వదిలెయ్యండి సార్… మనమేం చెయ్యలేము.. వాళ్ళ పాపాన వాళ్లే పోతారు !! ” అన్నాడు.

నేనిక చూడలేక పోయాను. వెళ్ళి ఆమెని అడిగాను.

“అమ్మా తెలుగొచ్చా?” వచ్చు అని చెప్పింది.

ఆవిడది మదనపల్లి అంట. మొగుడు పిల్లలు అక్కడే ఉన్నట్టున్నారు. ఈ తాగుబోతు ఈమెని ఇక్కడికి తీస్కొచ్చాడట. అక్కడే స్టేషన్ దగ్గరే అడుక్కుంటూ ఉంటారట. రోజూ తాగొచ్చి తంతూ ఉంటాడట. ఈ రోజు ఎందుకో నువ్వు ఛస్తే డబ్బులొస్తాయి అని ఛంపుతానని కొడుతున్నాడట. నేను ఆమెతో మాట్లాడుతుంటే ఏదో జరుగుతోందని జనం గుమిగూడారు.

చాలా నీరసంగా ఉంది ఆమె. చేతులు కదిలించడం కూడా కష్టంగా ఉంది ఆమెకి. మాటలు కూడా స్పష్టం గా అర్థం కావడంలేదు. ఆమె ముఖం మీద దెబ్బల నుంచి బాగా రక్తం కారుతోంది. రైల్వే స్టేషన్ లో క్లినిక్ ఏదైనా ఉందేమో అని ఒకతన్ని అడిగాను.

ఫర్స్ట్ ప్ల్యాట్‌ఫార్మ్ మీద ఉంది కానీ ఎలా తీస్కెళ్తాము అన్నాడు. స్ట్రెచర్ ఏమైనా ఉంటుందేమో చూద్దాము అన్నాను. వీల్ ఛైర్ ఒకటుంది. దాన్నే తీస్కొచ్చాం. ఆవిడని ఎత్తి దాంట్లో కుచోబెట్టాలి. ఆడమనిషిని ముట్టుకోవడం సరికాదన్నాడు ఒకడు. నాకు ఆవిడ ఒక దీనురాలు అంతే. ఆడా మగా సమస్య కాదు. ఆమె చేతులు పెట్టుకుని పైకి లేపడానికి ప్రయత్నించాను. అందరు నిలబడి నిశ్చేష్ఠులై చూస్తున్నారు కానీ ఎవరూ ఆమెని ముట్టుకోడానికి ముందుకి రాలేదు.

పక్కనే ఒక కార్పెట్ ఉంటే తీస్కొచ్చి పరిచాను. ఇద్దరు ముగ్గురు సాయం పట్టారు. ఆమెని కార్పెట్ లో పడుకోబెట్టి, ఎత్తి ఛైర్ లో కూచోపెట్తి తీస్కెళ్తున్నాం. ఆ తాగుబోతు భర్త మళ్లీ వచ్చాడు. తాను కూడా క్లినిక్ కి వస్తా అన్నాడు. ఛైర్ నెడుతున్నాడు. ఆవిడ వాడిని చూడగానే భయపడి ఏడుస్తోంది. వద్దని చెప్తోంది. నేను అతనిని తెలుగులో వెళ్ళిపొమ్మని చెప్పాను. వాడికి అర్థం కాలేదు. పక్కన ఉన్న ఒకాయనకి చెప్పాను అతనిని పంపించెయ్యమని.

“ఎంతైనా మొగుడు కదా.. రావోద్దని ఎలా చెప్తాం” అన్నాడు.ఆ మాట విని నాకు ఒక్క క్షణం మతిపోయింది. మొగుడు ఎంత నీచుడైనా భార్య మీద అన్ని అధికారాలు ఉంటాయి అని నమ్మడం, హు.. మధ్యయూగాల వాసన ఇంకా అలానే ఉంది. ఇంతలో ఆ పోలిసాయన అటుగా వచ్చాడు. ఆ తాగుబోతు పారిపోయాడు అక్కడ్నుంచి.

 

ఒక ఐదుగురం కలిసి ఆవిడని వీల్ ఛైర్ మీద క్లినిక్ కి తీస్కెళ్తున్నాం. జరుగుతున్నదంతా గమనించి ఒక 20 ఏళ్ల కన్నడ యువతి కూడా మాతో జాయిన్ అయ్యింది. ఏం జరిగింది అని నన్ను అడిగింది. జరిగిందంతా ఇంగ్లీష్ లో చెప్పాను. ఆ అమ్మాయి ఆవిడతో కన్నడలొ ప్రేమగా మాట్లాడి ధైర్యం చెప్పింది. నీకేం కాదు, మేమంతా ఉన్నాం అని చెప్పింది నాకు ఆ అమ్మాయి మీద గౌరవం కలిగింది.

 R_Tagore_Veiled_Woman

క్లినిక్ లో 25 ఏళ్ల కుర్ర డాక్టర్ ఉన్నాడు. లోపలికి తీస్కెళ్లగానే ఆవిడని చూసి కొంచం ఆశ్చర్యపొయినప్పటికీ, ఎటువంటి ఏవగింపు లేకుండా ఆ దెబ్బలకి మందు పూయడం మొదలుపెట్టాడు. “ఈమె ఫుల్ గా తాగి ఉంది” అని చెప్పాడు.

“ఏమ్మా ఫుల్ గా తాగావా?” అడిగాడు.

ఆవిడ సత్య ప్రమాణంగా తాగలేదని చెప్పింది. అతను వెటకారంగా నవ్వి “ఇది మాములే సార్.. ప్ల్యాట్‌ఫార్మ్ మీద అడుక్కోవడం, రాత్రికి తాగి తన్నుకోవడం. మీరంతా ఎందుకు సార్ అనవసరంగా టైమ్ వేస్ట్ చేసుకున్నారు.” అన్నాడు.

అక్కడున్న వారంతా ఈ మాట విని ఏదో పెద్ద సానుభూతి భారం గుండెల మీద నుంచి దిగిపోయినట్టు రిలీఫ్ గా ఫీల్ అయ్యారు.

నేనేం మాట్లాడలేదు. ఆ కన్నడ యువతి ఇంగ్లీష్ లో అంది “వీళ్ళకి తినడానికి డబ్బులుండవు గాని .. తాగడానికి మాత్రం ఉంటాయి.”

 

ట్రీట్‌మెంట్ అయిపోయింది. డాక్టర్ దెబ్బలకి కట్టు కట్టాడు. ఇప్పుడామెని ఎం చెయ్యాలి అనేది ప్రశ్న.

బయట వదిలేస్తే మళ్లీ ఆ తాగుబోతు మొగుడు వస్తాడు. క్లినిక్ లోపల ఉంచడానికి కుదరదు.

ఆవిడని అడిగాను. “అమ్మా.. ఎక్కడికెళ్తావు?” అని.

సగం మూసుకుపోతున్న కళ్ళతో, నీరసంగా ఏమో అన్నట్టు చెయ్యి ఉపింది. నాకు కళ్ళలో నీళ్ళు తిరిగాయి.

నా మనసులో కలుగుతున్న భావాన్ని జాలి అనాలో, సానుభూతి అనాలో, వ్యవస్థ మీద కోపం అనాలో అర్థం కావట్లేదు.

“మదనపల్లి వెళ్తావా” అని అడిగాను. డబ్బుల్లెవు అంది. తమిళాయాన భోజనం పార్సల్ తీస్కొచ్చాడు. ఆవిడని ప్ల్యాట్‌ఫార్మ్ మీదనే ఒక చోట కూచొపెట్టి ఎవరికి తోచినంత వాళ్ళిచ్చారు. ఆ కన్నడ యువతి ట్రైన్ టైమ్ అవుతోందని చెప్పి వెళ్లిపోయింది.

ఆవిడకి చెప్పాను ” అమ్మా ఈ డబ్బులు జాగ్రత్త. ఆ తాగుబోతు వాడికి చూపించొద్దు. ముందు భోజనం చేసి కొంచం శక్తి వచ్చాక మదనపల్లి ట్రైన్ ఎక్కెయ్యండి.” ఆవిడకి నేను చెప్పింది ఎంతవరకూ బుర్రకెక్కిండో తెలియదు. ఏడుస్తూ దండం పెట్టి కాళ్ళు పెట్టుకొబోయింది. ఆపి, వద్దని చెప్పి, జాగ్రత్త అని చెప్పి లేచాను.

మొదట్నుంచి మాతోపాటు ఉన్న ఒక తెలుగాయన వాష్ బేసిన్ చూపిస్తూ “చేతులు శుభ్రంగా కడుక్కోండి సార్” అని చెప్పాడు. నాకేం అర్థం కాలేదు.

“ఆహా… అదంతా పట్టుకున్నారు కదా… చేతులు కడుక్కోండి.” అన్నాడు. సరే అన్నట్టు తల ఊపాను.

అనూష వచ్చే ట్రేన్ అనౌన్స్మెంట్ వచ్చింది. వెనక్కి తిరిగి ఆవిడని చూస్తూనే ముందుకి నడిచాను. ఎన్నో సమాధానం చిక్కని ప్రశ్నలు మనసుని ముసురుతూండగానే అనుషాని రిసీవ్ చేస్కున్నాను. తను ఏదో మాట్లాడుతోంది గాని, నా మనసు అక్కడ లేదు. తిరిగి ప్ల్యాట్‌ఫార్మ్ 1 మీదుగా వస్తూ ఆవిడ కోసం వెతికాను. కనిపించలేదు.

 

ఒక్క గంటలో ఎన్ని రకాల మనుషులని, ఎన్ని రకాల మనస్తత్వాలని చూసాను.

ఆ దీనురాలి సమస్య కి పరిష్కారం ఏమిటి? దాన్ని పరిష్కారం చేసేవారెవరు?

ఆ సమస్యని నెత్తికెత్తుకుని ఆమె జీవితాన్ని చక్కదిద్దే స్థోమత, శక్తి నాకున్నాయా?

ఆవిడని అలా ప్ల్యాట్‌ఫార్మ్ మీద వదిలేసి రావడం సరైన పనేనా? నాతో పాటు ఉన్నవాళ్ల ప్రవర్తన సమంజసమేనా?

ఆవిడ తాగి ఉంది అనగానే ఆమె పట్ల, ఆమె పరిస్థితి పట్ల చులకన భావం ఎందుకు కలిగింది?

ఆమె సంస్కారహీనతని లోపం గా చూపి, తమ బాధ్యత నుండి తప్పించుకునే ప్రయత్నం కాదా ఆది?

చిన్నప్పటి నుండీ రోజూ కడుపునిండా తిండితో, తీరైన పోషణతో, ఉన్నతమైన చదువులు చదువుతూ పెరుగుతాం మనం. మనకి మంచేదో చెడేదో ముందుగానే ప్రిడిఫైన్ చెయ్యబడి ఉంటాయి. ఎవరితో ఎలా మాట్లాడాలి, గౌరవం ఎలా ఇవ్వాలి, మర్యాద ఎలా సంపాదించుకోవాలో పెంపకంతోపాటే నేర్చుకునే మనకు ఒక సంస్కార స్థాయి ఉంటుంది.

రోడ్ల మీద పుట్టి, రోడ్ల మీద పెరిగినవాళ్ళు, ఏరోజుకారోజు ఉనికి సమస్యనెదుర్కునేవాళ్ళు, జీవితంలోని అన్ని రకాల దౌర్భాగ్యాలని, దుర్మార్గాలని ఎదుర్కుంటూ పెరిగినవాళ్ళు, ఎక్కడికెళ్లినా అవమానాలు, ఛీత్కారాలు, రుచిచుసే వాళ్ళు, మాంచేదో చెడేదో చెప్పే దిక్కులేనివాళ్ళు అలా కాక ఇంకెలా ఉంటారు? వాళ్ళకి కూడా మనకున్న సంస్కార స్థాయి ఉండాలనుకోవడం తప్పు. ఆ మాటకొస్తే.. పదిమందిలో ధైర్యంగా, బాధ్యతగా నిలబడి ఒక దీనురాలికి సహాయం చేస్తున్న భార్యని వెనక్కి లాగిన భర్తదేమి సంస్కారం?

రోడ్డు మీద ఒక మనిషి వేదనలో ఉంటే ఆడమనిషి కాబట్టి ముట్టుకోను అనడం ఏం సంస్కారం? అడుక్కునే ఆవిడ అయినంతమాత్రాన ముట్టుకున్నాక చేతులు కడుక్కోమని సలహా ఇచ్చిన పెద్దమనిషిది ఏం సంస్కారం?

ఒక మనిషి సమస్య మనం అర్థం చెస్కోవాలంటే ఆ సమస్య  సామాజిక మూలం గ్రహించగలగాలి. ఆది గ్రహించలేకపోతే ఆ మనిషి బ్రతుకు మనకి అర్థం కానట్టే. ఆ దీనురాలి పరిస్థితి ని అర్థం చెస్కోవాలంటే ఆమె స్థానంలో, ఆమె స్థాయిలో నిలబడి ఆలోచించాలి. ఆమె అనుభవిస్తున్న వేదన మనమూ అనుభవించాలి, ఆమె మోస్తున్న సామాజిక భారాన్ని మనమూ మొయ్యాలి, ఆమె అవివేకాన్ని మనమూ పంచుకోవాలి. దీన్నే సానుభూతి (సః అనుభూతి) అంటారు అనుకుంటాను.

నాలో ఆ సానుభూతే కలిగింది. అంతకంటే ఎక్కువగా కోపం కలుగుతోంది. వ్యవస్త మీద. జరిగిన దాంట్లో నాకు మొత్తం హింసే కనపడుతోంది. భార్య మీద భర్త చేసిన హింస కాదు. వాళ్ళిద్దరి జీవితాల మీద సమాజం చేస్తున్న హింస. వాళ్ళ ఈ పరిస్థితికి కారణం ఆ హింసే కదా. సమాజం లో అడుగడుగునా వేళ్ళూనుకుపోయిన హింసాస్వభావమే కాదా.

 

“ఏంటి అలా ఉన్నావ్?” అమాయకంగా అడిగింది అనూష. నా మనసు తన మీద లేదని గమనించింది కాబోలు. ఏమని చెప్పను తనకి. నాలో కలుగుతున్న ఆగ్రహం తనకి అర్థమౌతుందా. నా మూడ్ బాలేదు అనుకుంటుంది. నిజానికి నా మూడ్ ఇప్పుడే బాగుంది. ఏదో ఒక పనికొచ్చే ఆలోచన వైపు పరుగులు తీస్తోంది.

“ఏం లేదే… బానే ఉన్నా…!! నువ్వే జిడ్డు మొహం వేస్కుని ఉన్నావ్..!” :P

“20 గంటలు జర్నీ బాబూ..”

– వినోద్ అనంతోజు

 

 

వినాయకచవితి జ్ఞాపకం: మాష్టార్ని చూస్తే దిగులు!

నామాల మురళీధర్

నామాల మురళీధర్

“ఒరేయ్ పిల్ల రాక్షసుల్లారా! వినాయకచవితంటే పిల్లల పండగరా. వినాయకుడు విద్యలకు అధిపతి. ఇళ్ళళ్ళోనే కాదు బడిలో కూడా పూజలు చేయాలి. వినాయకుడ్ని కాదంటే చదువబ్బక మొద్దు వెధవల్లా తయారవుతారు.

ఒరేయ్ పిలక పంతులు, మీ గుడికి కొబ్బరికాయలు, అంటిపళ్ళొచ్చాయంట కదా. ఒకటో,రెండో కొబ్బరికాయలు ఒక అరడజను అంటిపెడ పట్రా. ఒరేయ్ కరణంగారబ్బాయ్ మీ ఇంటికి వెల్ల వేస్తున్నారంట కదా. సాయంత్రం కాస్త పట్టుకొచ్చి మన బడిగోడకి కొట్టెయండ్రా” అని ఇంకా ఏదో చెబుతున్న సూర్నారాయణ మాష్టారి మాటలకు అడ్డుపడుతూ కరణంగారబ్బాయ్ లేచాడు.

“పంతులుగారూ, ఇంటి నుండి వెల్ల తీసుకొచ్చి వేస్తే మా నాన్న తంతాడండి” అని వినయంగా విన్నవించుకున్నాడు.

“ఒరేయ్ సన్నాసి, మా ఇంటికొచ్చి వెల్లవెయ్యమన్నానా? బడికే కదా. రోజూ మీరే కదరా ఈ స్కూల్లో కూర్చుని చదువుకునేది. మీ నాన్న ససేమిరా అంటే ఏ సాయంత్రమో ఎవరూ చూడకుండా పట్టుకొచ్చెయ్యాలి కానీ, ఇవన్నీ నేను చెప్పాలట్రా మీకు?” అని లౌక్యం చెప్పారు మాష్టారు.

“దొంగతనం తప్పు కదండీ” అన్నారెవరో వెనకనుండి. పిల్లలంతా గొల్లుమన్నారు.

“ఆ తప్పండి. ఎవడ్రా ఆ అడ్డగాడిద ఆ కిరాణకొట్టు కిష్టి గాడేనా? ఏరా పక్కింటి పంతులమ్మగారి దొడ్లోకి దూరి జాంకాయలెత్తుకు రావటం మాత్రం తప్పు కాదేం? నువ్వు మీ కొట్లో నుండి బియ్యం, పప్పులు పట్రాపో అప్పుడు చెప్తాను వెధవ” అని వెక్కిరిస్తూనే వాడి వాటా ఏంటో చెప్పేసారు మాష్టారు.  “ఒరేయ్ నామాలవారబ్బాయ్ పసుపులు,కుంకుమలులాంటి పూజసామాన్లు ఇంటి నుండి పొట్లాలు కట్టి నువ్వు పట్రా” అని నా సంగతి తేల్చారు.

“మరి పూలు,పత్రి ఎవరు తెస్తారర్రా?” అని అందరిని చూస్తూ అడిగారు.

“పంతులుగారూ, ఆ ఢిల్లీ బామ్మగారింటి పెరట్లో చాలా రకాల పూలున్నాయండి. సాయంత్రం చేసి చీకట్లో కోసుకొచ్చేస్తాను” అన్నాడు తుంటరి పరమేశంగాడు.

మాష్టారు విలాసంగా నవ్వారు. అంతలోనే ఏదో గుర్తొచ్చి “ఒరేయ్ కోతి వెధవ దొరికిపోతే నా పేరు గానీ చెప్పావ్. తాటతీస్తాను” అని హెచ్చరించారు. ఆ అలవాటేనేమో ఇప్పటికీ ఒక పువ్వో, కొమ్మో ఏదో ఒకటి దొంగతనంగా ఎత్తుకొచ్చి వినాయకుడికి పెట్టకపోతే, ఎంత పూజ చేసినా తృప్తే ఉండదు.

ఇన్నేళ్ళొచ్చి ఇంట్లో ఎంత ఘనంగా చేసుకున్నా వినాయకచవితంటే చప్పున గుర్తొచ్చేది మాత్రం పొడుగ్గా, సన్నగా చెఱుకుగడలా ఉండి, తెల్ల జుబ్బా వేసుకుని, షోడా బుడ్డి కళ్ళద్దాలు పెట్టుకుని తిట్లతో అందరికీ తలంటు పోస్తూ, తాను నవ్విస్తూ, మా అందరినీ నవ్వించిన సూర్నారయణ మాష్టారే. తుప్పుపట్టిన పాత సైకిల్‌కి ఒక సంచి తగిలించుకుని తిరిగే సూర్నారయణ మాష్టారే.

ఇలా దసరా అనో, వినాయక చవితనో ప్రతి పండగకి పంతులుగారి భత్యాలని ఏదో ఒకటి తెమ్మంటున్నారని మాష్టారంటే చిన్నప్పుడు చాలా కోపం ఉండేది. కొంతమంది తల్లిదండ్రులు బడికొచ్చి మాష్టార్ని నిలదీసేవాళ్ళు కూడా. పాపం మాష్టారు మా దగ్గరే తప్ప ఊర్లో నోరెత్తేవారు కాదు. ఎవరైనా వచ్చి అడిగితే తడబడిపోయి నీళ్ళు నములుతూ నేల చూపులు చూసి వారికి ఏదో సర్దిచెప్పేవారు. అదేంటో గమ్మత్తుగా మాష్టారి మీద అంతవరకూ ఉన్న కోపం పోయి మా మాష్టార్ని ఇలా అందరిముందు నిలదీస్తారా అని ఉక్రోషం వచ్చేసేది. తల్లిడండ్రుల్ని బడికి తీసుకు వచ్చినవాడితో పిల్లలంతా ఒక జట్టుగా కొన్నిరోజులు మాట్లాడకుండా వేలేసేవాళ్ళం.

మాష్టారు అది గమనిస్తే “ఒరేయ్ బడుద్దాయిల్లారా, ఏం పనిరా ఇది? వాడేం చేస్తాడు కుంక. బ్రతకలేక బడిపంతులని, బడిపంతుల మీదకంటే ప్రతివోడు చొక్కా మడతెట్టుకొస్తాడు. సరి సరి వాడినేం అనకండి పాపం” అని వాడిని దగ్గరకి తీసుకునేవారు.

ఆ చిన్న వీధిబడిలో మాష్టారు మాకేం గొప్ప చదువులు చెప్పెయ్యలేదు. కాసిన్ని అక్షరాలు నేర్పారు. అంతకంటే ఎక్కువ చదువు ఆయనకి వచ్చో రాదో నాకిప్పటికీ తెలియదు. కానీ ఆయనకొచ్చినవి, మాకు అక్కరకొచ్చేవి ఆయినా ఆ కాసిన్ని అక్షరాలు, పద్యాలు ఎంతో శ్రద్ధగా చెప్పారు. ఒత్తులు, దీర్ఘాలు స్పష్టంగా పలికేంత వరకూ వల్లెవేయించేవారు.

ఆయనకి అప్పటికే పెళ్ళికెదిగిన కూతురు, ఉద్యోగం లేని కొడుకు ఉండేవారు. పాపం మాష్టారికొచ్చే ఆ గొఱ్ఱెతోక జీతంతోనే కుటుంబాన్ని లాక్కొచ్చేవారు. అది సరిపోక సాయంత్రం ఇంటి దగ్గర మాకు ప్రైవేటు కూడా చెప్పేవారు. పంతులుగారి పెళ్ళప్పుడు కట్నంగా వచ్చాయని చెప్పే ఫ్యాను, రేడియో తప్ప ఇంటిలో పెద్దగా వస్తువులేవీ ఉండేవి కాదు. ఆ పసిప్రాయంలో మా బుర్రలకు తట్టలేదు కానీ ఆ పండగ మామూళ్ళన్నీ ఆ బండెడు కుటుంబాన్ని లాగటానికి ఏమూలకి సరిపోతుంది. “అయ్యవారికి చాలు అయిదువరహాలు. పిల్లలకు చాలు పప్పు బెల్లాలు” అని ఎంతపాడినా అయ్యవారికి అయిదు వరహాలిచ్చే వెర్రిబాగులాడెవడున్నాడు ఆ ఊరిలో.

13_10

వినాయక చవితిరోజు మాష్టారు చెప్పినవన్నీ తీసుకురాకపోయినా, వీలయినవి తీసుకుని వెళ్ళేవాళ్ళం. మాష్టారు “ఏమిరా ఇలా చేసారు” అని కాసేపు నసిగినా అందరిని బుద్దిగా, శ్రద్ధగా కూర్చోబెట్టి నిదానంగా పూజ చేసేవారు. అందరి పేర్లు, గోత్రాలు చెప్పించేవారు. చివర్లో వినాయక వ్రతకథ చెప్పి, అందరి తలల మీద అక్షింతలు చల్లేవారు. పిల్లలు ఎవరూ చెప్పకుండానే వెళ్ళి మాష్టారి కాళ్ళు మొక్కేవారు. మాష్టారు మురిసిపోతూ “ఒరేయ్ బడుద్దాయిలు, పెద్దవాళ్ళయి పెద్ద ఆఫీసర్లయిపోయి ఈ పంతుల్ని, బడిని మర్చిపోకండి” అని మనస్పూర్తిగా దీవించేవారు.

ఉద్యోగంలో చేరాక కూడా ఎప్పుడయినా ఊరు వెళితే రోడ్డు మీద పాత సైకిల్‌తో కనిపించేవారు మాష్టారు. కొడుకుకి పెళ్ళయితే అయ్యింది కాని ఇంకా ఏ పనిలోనూ కుదురుకోలేదు. ఈ వయసులో కూడా కాస్త చత్వారంతో బాధపడుతూ నలుగురైదుగురు పిల్లల్ని వెంటేసుకు తిరుగుతున్న మాష్టార్ని చూస్తే దిగులుగా అనిపిస్తుంది. ప్రైవేట్ కాన్వెంట్‌లు ఎక్కువయిపోవటంతో పంతులుగారి దగ్గరకి పిల్లలని ఎవరూ పంపటంలేదు కానీ మాష్టారి హస్తవాసి మంచిదని అక్షరాభ్యాసం చేసాక ఆయన చేత అక్షరాలు దిద్దించటానికి ఆయన పూర్వ విధ్యార్ధులు తమ పిల్లలను తీసుకు వచ్చి తృణమో, పణమో ఇచ్చి వెళ్తున్నారు.

“వీడిని నా దగ్గరకు పంపకూడదురా నాలుగు రోజులు అక్షరాలు నేర్చుకోవటానికి” అని అక్షరాలు దిద్దుంచుకోవటానికి వచ్చిన ఎవరినైనా మాష్టారు చనువుగా అడిగితే, “మాష్టారూ, ఈ రోజుల్లో చదువులు ఎలా ఉన్నాయో మీకు తెలియదా? పద్యాలు పాతబడిపోయాయి. ఇప్పటి నుండే ఇంగ్లీష్ నేర్పించాలి” అని చెప్పి ఇంకాసేపుంటే ఏమడిగేస్తారో అన్నట్టు అక్కడి నుండి వెళ్ళిపోతున్నారు.

ఇన్నాళ్ళుగా జీవితమనే యుద్దాన్ని పోరాటానికి వేలమంది దండుని తయారు చేసిన మాష్టారు, యుద్ధమే మారిందో, తన విద్యలే పాతబడిపోయాయో తెలియని వృద్ధ సైనికుడిలా మిగిలిపోయారు. అందమైన అక్షరాల్లో పెట్టలేకో, అమ్ముకోవటం చేతకాకో మరుగునపడిపోయిన ఇలాంటి బీద బడిపంతుల్ల ఆత్మకథలన్నీ మధురకావ్యాలే.

సూర్నారయణ మాష్టారూ, ఆ విద్యలకు అధిపతైన గణపయ్య, విద్యే జీవితంగా గడిపిన మీకు చల్లగా చూడాలని ప్రార్ధిస్తున్నా.

 

ఓ.. చెప్పలేదు కదూ తన పేరు “అలవి”..!

రఘు

రఘు

(కొన్ని అనుభవాలూ జ్ఞాపకాలూ ఏ సాహిత్య ప్రక్రియలోనూ ఇమడవు. అందుకే, చలం ‘మ్యూజింగ్స్’ రాసుకున్నారు. సంజీవదేవ్, ఆచంట జానకి రాం వంటి రచయితలూ తెగిన జ్ఞాపకాలు రాసుకున్నారు. అలాంటి అనుభూతులకూ, జ్ఞాపకాలకూ ఒక వేదిక ‘న్యూ మ్యూజింగ్స్’ అనే ఈ శీర్షిక. ఈ శీర్షిక మీ అందరిదీ. ఎవరయినా రాయవచ్చు. ఎలాంటి అనుభూతికయినా ఇక్కడ చోటుంది. మీ అంతరంగ కథనాలన్నీ…మీ మనసు ముడతల్లో దాక్కున్న అనుభూతులన్నీ ఇక్కడ ఆవిష్కరించండి…ఈ వారం రఘు మాందాటి ఏమంటున్నారో వినండి !)

సాధారణంగానే ఏ అంచనాలు లేకుండా ఏ బంధం మొదలవ్వదేమో. కాలానికెప్పుడు నన్ను తర్కించే పనే.. ఎందుకో మరి ఎవ్వరికి అర్ధంకకపోవడం అనే ముద్ర మంచిదే అయ్యింది.. అందుకే ఇప్పటికి నేనందరికీ దూరం.మనుషుల మధ్య ఒంటరిగా నడుస్తూ గడపడం నాకో అలవాటైన వ్యసనం. ఏంటో నాకు సంబంధం లేని మనుషులని వారి సహజమైన భావాల్ని దగ్గరినుండి చూసే అవకాశం ఉంటుందనే రద్దీగా ఉన్న చోటులో గడుపుతుంటాను. ఇక అలా గడపొచ్చు అనే ఉద్దేశంతోనే సంతకు చేరుకున్నా. సంతలో చుట్టూ జనాలతో ఇరుపక్కల చిన్న చిన్న షాపులతో కిక్కిరిసిపోయింది. జనాల మధ్య ప్రతి పది పదిహేను సెకన్లకి తళుక్కుమని మాయమవుతోంది తను. ఇక తనని చూసాక మొట్టమొదట మనసులో కలిగిన బావం తనని తనివితీరా చూడాలని. ఏంటో కళ్ళతో పాటే అడుగులు అందరిని తోసుకుంటూ తనని చేరుకున్నాయి. నా అడుగుల్లో వేగం తగ్గింది. ఇక తనకి నేను ఏ మాత్రం దూరం లో లేను. రెండే రెండు అడుగుల దూరం నుండి తన వెంట నడుస్తున్నాను. సాధారణంగ ఏ అమ్మాయిని కూడా ఇంత తపనతో వెంట పడింది లేదు.

నా వయసు వాళ్ళందరు అమ్మాయిల వెంట పరుగులు పెడుతుంటే అర్ధమే కాలేదు ఇంత కాలం.. 
 
నల్లగా నిగనిగలాడుతు చక్కగా అల్లుకున్న జడ అడుగు అడుగుకు ఆగకుండా జడ గంటలు సుతారంగా ఎత్తు వంపులను తగులుతూ…
అంత గోలలో కూడా పాదానికి హత్తుకున్న అందెలు జిల్లు జిల్లు మంటున్నాయి.
తలలో గులాబీ పువ్వు దానిని ఆనుకుంటూ మూరెడు మల్లెలు. ఊగుతున్న కమ్మ బుట్టాలు. పిచ్చెక్కిస్తున్న నడుము వంపు. కనకాంబరం రంగు లంగా తెల్లని ఓణి ఏ మాత్రం ఒంపులను నా కంటపడకుండా దాచలేక పోతున్నాయి..
ఇప్పుడిక దూరం మరింత దగ్గరయ్యింది తన కంట పడకుండా తనని ఎదురుగా చూసేందుకు నలుగురైదుగురిని పక్క పక్కగా దాటుకుంటూ తన కన్నా కాస్త ముందుకు చేరుకొని వెనక్కి తిరిగి చూసా..
నా కళ్ళకి ఒక్క సారిగా మైకం.. తన నిలువెత్తు దేహంలో ప్రతి కదలిక వర్ణనాతీతం.
తన అందాల సుగంధాలు మత్తెక్కిస్తున్నాయి.
ఏదో వింతైన రసాయన చర్య ఒంట్లో జరుగుతున్నట్టు అనిపిస్తోంది.
తాను దగ్గరవుతున్న కొద్ది వింత ప్రకంపనలు అల్లకల్లోలం చేస్తున్నాయి.
లాభం లేదు తనతో ఎలాగైనా మాటలు కలపాలి కానీ ఎలా?
చాల సేపు గమనించాను తానొక్కతే సంతకి వచ్చినట్టుంది. తన పని తాను చేసుకొని ఇక సంత బయటకు అడుగులేస్తోంది. ఆ అడుగుల వెంటే నా అడుగులు. ఆకాశం మబ్బులని వడ్డించింది. వీస్తున్న గాలి చల్లదనాన్ని విసురుతోంది. జన సందోహాన్ని చీల్చుకుంటూ సాగుతున్న మా నడకలు చివరికి మమ్మల్ని మాత్రమే మిగిల్చాయి. 
 
ఇప్పుడు తన ప్రతి అడుగు స్పష్టంగా వినిపిస్తోంది. ఉన్నపళాన చినుకులు మట్టిలో దాగిన సుగంధాన్ని తవ్వుతున్నాయి. చల్లని తుంపర్లు గిలిగింత పెడుతూన్నాయి. కొద్ది కొద్దిగ తుంపర్లు కలిసిగట్టుగా జల్లుల రూపాంతరం చెందింది. తన ఓణీని ముని వేళ్ళతో పైనుండి అందమైన భంగిమలో తలమీద పరుచుకొని పట్టులంగా కింద తడవనీకుండా పైకెత్తుకొని నడక కాస్త పరుగుగా మారింది. పచ్చని పైరుని నీలాకాశాన్ని కురుస్తున్న జల్లులో తడిచిన కనకాంబరం పట్టులంగాలో పరుగెడుతున్న తను…..
ఆ దృశ్యం మనసు క్యాన్వాస్ పై వర్ణ చిత్రమై  దిద్దుకుంది. అల చూస్తూ నడుస్తున్న నేను ఎప్పుడు తడిచానో తెలీనే లేదు.
దూరాన రెండు ఈత చెట్ల కింద తడిసి ముద్దవుతున్న చిన్న పాక. ఆమె పరుగు లాంటి నడకతో అందులోకి చేరుకుంది. నెమ్మదిగా నా అడుగులకి వేగం అందించి చిన్న పరుగుతో చేరుకున్న. నలుగురు కూర్చోడానికి రెండు బల్లలేసిన చిన్న టీ కొట్టు. అందులో యాబై ఏళ్ళ ముసలమ్మా పొయ్యిమంట పెడుతూ పాల గిన్నెతో కుస్తీ పడుతూ..
పాకలో చిన్న కర్ర గుంజను ఆనుకొని చిన్న బల్లపై కూర్చొని తడి కొంగును దులుపుకుంటూ తను. తడిచిన జడలోని మల్లె పూలు మరింత తెల్లగా.. గులాబి రేకులో బందిలై మెరుస్తున్న చినుకులు. నొసటి నుండి కంటిని దాటుతూ పెదాలకు అడ్డుపడుతున్న వెంట్రుకల నుండి ఒక్కో చుక్క మెడను దాటుతూ హృదయం పై పడుతూ ఆ హృదయాన్ని దాచుకున్న రవికతో పాటు నా మనసుని కూడా తడుపుతూ..
ఎప్పుడు గమనించిదో తను
..ఓయ్ పిల్లోడ.. ఎంటా చూపు..
ఉలిక్కిపడ్డాను.
కళ్ళను నేలకు వేసుకొని ఎం చేయాలో అర్ధం కాక అది..  అది..  అంటూ ఎం చెప్పాలో తెలియట్లేదు.
మరోసారి నెమ్మదిగా చూసా..
తన జుట్టు విప్పుకుంటూ సూటిగా నా కళ్ళలోకి బొమ్మలెగిరేస్తూ తన చూపులు ప్రశ్నార్ధకంగా గుచ్చుకుంటున్నాయి. కాని తను నన్నలా చూడడం తనని నేనలా  చూడడం చాల ఆనందంతో చిత్రంగా ఉంది.  చల్లని ఈదురు గాలికి నడుం వంపులో చెక్కుకున్న తెల్లని కొంగు ఉండలేక పైపైకి రెపరెప లాడుతూ ముసుగేసుకున్న నాబి తెరని ఎత్తి చూపుతోంది. గోదుమ బంగారు పసుపు రంగులు కలబోసుకొని ఓ సరి కొత్త రంగులో తన దేహ ఛాయా. మునుపెన్నడూ చూడని ఆ అందం కను రెప్పని వేయనీయలేకపోతోంది. నా వాలకం చూస్తుంటే కామందుడిగా  మారుతున్నానా?? ఎప్పుడు గమనించిందో చట్టుక్కున తెర దించి కొంగుని లంగాలోకి మళ్ళి చెక్కుకుంది అయినా తడిచిన ఓణిగుండా మసగ్గా ఇంకా మైమరిపిస్తూనే ఉంది.
ఓయ్ పిల్లోడా.. ఏ ఊరి మీది. అడిగేది నిన్నే…!! కిక్కురు మనట్లేదు. సంతలో నుండి చూస్తున్న నువ్ నా వెంట బడటం..

Alavi

ఇదిగోవే పిల్ల వేడి వేడి గ కాస్త చాయ్ నీళ్ళు గొంతులో పోసుకో చలి వణుకు ఆగిపోద్ది అని ముసలవ్వ తన చేతిలో పెట్టింది. రెండు చేతులకి కొంగు సాయంతో దోసిలితో అందుకొని గుంజకి ఆనుకొని దగ్గరికి ముడుచుకొని వణుకుతూ ఒక్కో గుటక గొంతులోకి దింపుకుంటూ సేద తీరిన ములుగుతో ఆహ: ఒసే ముసల్దాన నువ్వు సూపరు..
నోరు మూసుకోవే నువ్వు నీ వాలకం.
పాడు వాన తగ్గేటట్టు లేదు ఇదిగో నాయన నువ్వు కూడా తాగు అనడంతో తీసుకున్నాను..
తాగు పిల్లోడ.. ఈ ముసల్దాని చాయ్ సూపర్ గుంటది.
పిల్లోడ పిల్లోడ అని ఏంటే ఆ మాటలు, ఒంటి మీదకు వయసొచ్చిన పెద్దంతరం చిన్నంతరం లేకుండా. ముక్కు మొహం తెలియకుండా ఏంటే అవి.  రాను రాను దీని ఆగడాలు ఎక్కువైతున్నాయి. ఓ మొగుణ్ణి కట్టబెడితే గాని దీని తిక్క కుదరదు.
మొగుడా…!! ఒసేయ్ ముసల్దాన నీకే తీసుకోస్తా మొగుణ్ణి.
ఆ అదొక్కటే తక్కువ నాకు..
నువ్వు తాగు బిడ్డ ఈ పోరి పెద్ద వాగుబోతు. నువ్వేం పట్టించుకోకు. మాకిది మామూలే..
చలాకి పిల్ల. పిల్లేం కాదు దగ్గరి దగ్గరగా ఓ ఇరవై యేండ్లు ఉంటుంది కావచ్చు.. ఎందుకో ఆ చలాకీతనం నాకు నచ్చింది..
ఒసేయ్ బట్టలు మార్చుకోవే చలి బట్టలతో ఎంత సేపని ఉంటావు. చలి ఆగక పోతే దా ఈ పొయ్యి కాడికి.. కాస్త సెగ అంటుకో.. నువ్ గూడ రా బాబు.
అగొ… రా బాబు ముసల్ది పిలుస్తోంది. అంటూ వెకిలి భంగిమ పెడుతూ నవ్వుతు పిలిచింది.
ప్రేమ పుస్తకాలు ఎన్నో చదివా ఎన్నో సినిమాలు చూసా కాని ప్రత్యక్ష అనుభవం కలో నిజమో ఏమి అర్ధం కాకుండా చిత్రంగా, కొత్తగా గిలిగింత పెడుతోంది. దానికి తోడు చల్లని ఈదురు గాలులు, వర్షంలో తడిచిన ప్యాంటు షర్టు చలిని రెట్టింపు చేసింది. ఇక చలిని భరించడం నా వళ్ళ కాదనుకుంటూ ఒంటిని కాపుకునేందుకు పొయ్యిమంట  దగ్గర తిష్టేసా.. వెచ్చటి సెగ నెమ్మదిగా ఒళ్ళునంత తాకేసింది కాస్త కుదుట పడింది.
నెమ్మదిగా లేచి పాక బయటికి  తొంగి చూసా కోరస్ పాడుతున్నట్టు వర్షం. తెలీకుండానే పాక చుట్టూ, ఆకాశం నిండా చీకట్లు అలుముకున్నాయి. వర్షం తగ్గేలా లేదు. ఎం చేయాలో తోచట్లేదు.. ఒక్కోసారి మనసు మన మాట వినదు అనుకోడానికి ఇది సరైన నిదర్శనం. ప్రతి మగాడు అమ్మాయికి ఆకర్షింప పడతాడు ఇది సృష్టి ధర్మం అంటారు. ఆకర్షింప పడేది అందానికా? మనసుకా? మనసుకు ఆకర్షింపబడడం కన్నా ముందు నన్నడిగితే అందమే. ఆ అందమే ఎంతటి మగాన్నైన వెంట పడేలా చేస్తుంది.. ఇక మనసుతో మొదలయ్యే బంధాలు శరీరంతో పనిలేనట్టుగా నటిస్తూ గడుస్తాయి. అయిన ఏ బంధమైన ఒకరికొకరై ఇష్టపూర్వకంగా మమేకమైనపుడే బంధానికి పరిపూర్ణమైన అర్ధం చేకూరుతుంది. అర్ధం అనే దానికన్నా వేరే పేర్లని ఎన్నో పెట్టుకోవచ్చు. ఇలాంటి స్టేట్ మెంట్ లని చలం ఎప్పుడో ఇచ్చే ఉన్నాడు. అయినా ఎవరు ఏం చెప్పిన ఎవరికి వారికి ఎదురైన సంఘటన సారాంశం మీదే లేదా వారి కోరికల ఉహ జనితంగా నిర్మించుకున్న సౌదాలపై ఆధార పడి ఉంటుంది వారి వారి నిర్వచనాలు.
ఓయ్ పిల్లోడా..
వెనక్కి తిరిగి చూసా.. లాంతరు వెలుతుర్లో. నేనెన్నడు ఊహించని మైమరిపించే అందం ఇలా కళ్ళముందు నన్ను కలవరిస్తూ చూస్తుంటే. గుండెలో తెలియని వింత భావమేదో నన్ను శిలను చేసేస్తోంది. మాట పెగలనివ్వట్లేదు.
ఓయ్ పిల్లోడా.. ఆడ పిల్లను ఎప్పుడు చూడనట్టు మింగేసే ఆ చూపేంది..
అవునా..! నిజంగానే నా చూపు అలా ఉంటుందా.. ఏమో? ఈ అమ్మాయి చెప్పే తీరును చూస్తే అలానే ఉండి ఉంటుంది. అందరు నా నవ్వు బావుంటుంది. కళ్ళు కలవరపెడతాయి. అంటూ క్లాస్ మేట్స్  సరదా పట్టించేవారు. నా ప్రయాణం అమ్మాయిలు లేక ఒంటరిగా ఏం సాగలేదు అలా అని అమ్మాయిలతోనే సాగలేదు. ఒక్క మాటలో చెప్పాలంటే ఏ అమ్మాయి నన్ను ఆకర్షించలేదు. ఆ విషయం గురించి పెద్దగ ఆలోచించ కుండానే రోజులు అలా  గడిచిపోయాయి. కాని ఈ అమ్మాయిని చూడగానే తెలియకుండానే నరనరాలు వేడెక్కుతున్నాయి.. తెలియని వైబ్రేషనల తో అమాంతం శరీరం అంత ఊగిపోతున్నట్టు తలపు. ఒక్కసారిగా తనలోకి దూకేయ్యలన్న ఆత్రుత.. ఈ క్షణంలో ఆలోచనలకు కోరికలు ఊతమిస్తూ శరీరాన్ని బలోపేతం చేస్తూ ఇంచుమించు వ్యవసున్ని చేస్తున్నాయి.. అయిన ఈ చర్య ఏది బయటికి కనపడనీకుండా ఎంత నిశబ్దంగా ఉండాలని ప్రయత్నించిన ఏం లాభం నా కళ్ళు యిట్టే బయట పెడుతున్నాయి.. ఈ అమ్మాయికి నా బాష కళ్ళతో అర్ధమైనట్టుంది ఇక తప్పదన్నట్టు చూపును పక్కకి తిప్పుకున్న..
లాంతరులో మిలుమిలుకు మంటు చిన్ని దీపం చీకట్లతో సాధ్యమైనంత యుద్ధం చేస్తూ తన అస్తిత్వంతో ఆమె అందానికి మరింత అందాన్ని ముద్దుగా అద్దుతోంది..  చల్లని గాలులు తన కురుల కొసలను లాక్కెల్లె ప్రయత్నం చేస్తున్నాయి.. నుదిటి పై ఎర్రని సింధూరం. కనుబొమలు ఎగిరేస్తున్న ప్రతిసారి నన్ను గట్టిగ ప్రశ్నిస్తున్నట్టు. గుండ్రటి కళ్ళు ఎప్పుడు చూసిన నన్ను తన వైపుకు లాగుతున్నట్టు. ఆ కను రెప్పల పై అక్కడక్కడ తడికి చెదిరిన కాటుక గుర్తులు.  ఆ పెదాల అంచున మకరందాన్ని దాచిన పుప్పొడి గుత్తులా.. ఎగిసిపడుతున్న తడి ఆరిన కురులతో, లాంతరు పట్టిన చేతి మణికట్టుకు మెరుస్తున్న మెరుపు గాజులు బహుశా సాయంత్రం సంతలో కొన్నవే అనుకుంటా..
మగాడి మనసు పారే నీరు. అంచనా మానసికమైన మరే రకమైనదైన ఎప్పుడు నా కోణాల్లో నుండి తర్కిస్తూ బేరీజు వేస్తూ క్షణ క్షణానికి అభిప్రాయపడుతూ, అర్ధం చెసుకుంటున్నట్టు  అనంతమైన అనుభూతి యేదో ఉందని భ్రమ పడుతూ, తృప్తిని పొందలేకపోయినా, ఇవ్వలేకపోయినా అంతర్గతంగా సాగుతున్న ఈ వింత అలజడులను ఇంతకు ముందెన్నడు పొందలేదు. బహుశ నాది మోహమో లేక కామమో కాక ప్రేమో ఏమో…
ఏంటోయ్ పిల్లగా ఏం మాట్లాడట్లేవ్ ఏంది సంగతి?
 
మాటలా ఎందుకు మాట్లాడట్లేదు కొన్ని గంటలుగా నాలో నేను నాలోని నీతో ఎన్నో ఎన్నెన్నో మాట్లాడుతూనే ఉన్నా వాటిని మౌనంగా నువ్వు పసిగడుతున్నవన్న సంగతి కుడా నాకు తెలుసు. ఇక తెలుసుకోవాల్సింది తేల్చుకోవాల్సింది ఏమైన మిగిలి ఉందంటే నీకు నాకు నడుమ మిగిలిన ఈ అడుగు దూరమే.. నిజాన్ని నిర్బయంగా ఈ క్షణం అనుభావిస్తున్ననా లేక అనుభవంలోనే ఉన్నానన్న భ్రమలో ఉన్నానా! కళ్ళముందు యాంత్రికంగా గడిచిపోయే క్షణం నాకోసం కల్పితమై కళాత్మకమై చిలిపిగా కలవరపెడుతున్నదా! ఇలాంటి కాదు కాదు ఈ అనుభవాన్నేనా ఎన్నాళ్ళనుండో నేను కోరుకుంటున్నది. ఏమో.. కావచ్చు మనసులోని వింత ప్రేలాపనలా ప్రేరేపణల వాలకాన్ని చూస్తుంటే నిజమే అనిపిస్తోంది.
మగాడికి కావాల్సిన ప్రపంచమే అమ్మాయికి ఆయుధం. మగాడిని మించిన ధైర్యం కాని భయం కాని మరోటి తన ప్రపంచంలోనే లేదు.
చీకట్లో కప్పలు తమ సామర్ధ్యాన్ని కలిసిగట్టుగా వినిపిస్తున్నాయి.. వాటికి ఏవో కీటకాలు శృతి కలిపాయి.. చల్లని తుంపర్లతో కూడుకున్న వర్షపు గాలులు నన్ను తన మీదకు నెడుతున్నాయి. కళ్ళెదురుగా నిలువెత్తు అందం అందంగా నన్ను అలాగే గమనిస్తోంది.
దా.. వానా ఇప్పుడప్పుడే తగ్గదు గాని లోనికి రా.. నోట్ల నాల్క లేనట్టు జేస్తున్నావ్ నేనోకధాన్ని ప్రశ్న మీద ప్రశ్న అడుగుతున్న ఉలుకతలేవ్ పలుకుతలేవ్ ఏందో ఈ పిలగాని సంగతి. రా…  
 
అంటూ తన కుడి చేయి లాంతర్ని కిందికి దించుతు ఎడం చేయితో నా కుడి భుజం పట్టుకొని లోపలికి జరుపుతు ముందుకు నెట్టింది. 
ప్రశ్న నాకు నేనే ఒక పెద్ద ప్రశ్న సమాధానం కోసం వెతుకుతూ వెతుకుతూ ప్రశ్నల సాగరంలో సమాధాన తీరం కోసం శక్తినంత ఉపయోగిస్తూ చిల్చుకు పోతున్నా చిత్రం ఏంటో గాని తీరం కనపడితే ఒట్టు. నింగి నీరు కలియపడుతున్న చోట నాలో జ్ఞాన వెలుగును వెలిగించుకునేందుకు నన్ను నేను ప్రశ్నల మంటలో కాల్చుకుంటూ కాలానికి సాక్ష్యంగా ఏకాంతంగా అర్ధంకాని ఓ అజ్ఞాత సమిధనై ఇంకా మిగిలి ఉన్న.. ఇక తను అడిగే ప్రశ్నకు సమాధానాన్ని తయారు చేసుకోక తప్పదు. నిజమే తనని చూసినప్పటి నుండి ఇప్పటి వరకు తనను చూడడమే తప్ప తనతో పలికింది లేదు.
 
ఊగుతున్న లాంతరు నా నీడను కూడ అటు ఇటు ఊపేస్తుండగా మెల్లిగా అడుగులు వేస్తూ లోపలి నడిచా నా వెనకాలే వయ్యారంగా లాంతరుతో తాను. లంగా ఓనిలో కాస్త పిల్ల చేష్టలు కనిపించిన ఆ పిల్ల చేష్టలను వానలో తడిసిన లంగా ఓనిలో దాచేసి మిగిలిన నున్నటి శిల్పానికి లేత పసుపు రంగు నార చిరని బిగుతుగా చుట్టేసి విశాలమైన ఆడతనాన్ని కొంగుతో కప్పేసి పరమార్ధపు నడుం వంపులో గాలికి ఎగిరిపోకుండా జాలువారుతూ మిగిలిన కొంగుని చెక్కుకొని ఓ నూతనత్వాన్ని ఆపాదించుకొని పరిపూర్ణమైన కన్యతనానికి చిరునామై నృత్య భంగిమలో హొయలుగొలుపు సుతి మెత్తని చిరు మెలికల కదలికలతో అడుగులోన అడుగువేస్తు వెళ్లి నేను కూర్చున్న ఎదురు బల్లపై కర్ర గుంజకి వీపుని ఆనించి అదే గుంజకి పొడుచుకుంటూ ముందుకు సాగిన కర్ర వంపులో లాంతరును వేలాడించింది. తన మోకాళ్ళని గుండె ధరి దాపుకు వచ్చేదాక ముడుచుకొని ఎడమ చెయ్యితో మొకాళ్ళని చుట్టేసి కుడి చేతిని నడుము వెనక బల్లపై పెట్టి వెన్నుతో పాటు తలని కూడా కర్రగుంజకి ఆనించి చాల నిశ్శబ్దంగా ప్రశాంతంగా అలిసిన ప్రకృతి సొమ్మసిల్లి సేద తీరుతున్నట్టుగా కూర్చున్న తనపై లాంతరు వెలుతురు పోటి పడి మరి తన లోని ఒక వైపుని అమాంతం వాటేసుకొని ప్రతి కదలికల వంపులో ఓ సరికొత్త సౌందర్యాన్ని పూత పోసి ఇక కళాకారుడి కుంచెలో మమేకమవడానికి పూర్తిగా తనని సంసిద్ధం చేసేసింది. తనను సుతిమెత్తగా హత్తుకుంటున్న లాంతరు వెలుతురుకున్న స్వాత్రంత్రం ఇంకా నా ముని వేళ్ళకి ఎప్పుడొస్తుందో.. తన ఉచ్చ్వాస నిశ్వాసలకు లయబద్దంగా గుండెపై పరుచుకున్న ఆడతనం ఊయలలూగుతోంది. ఆ ఊయలపై పిల్లాడిల తలవాల్చుకొని ప్రియసఖుడినై నను చూసే ఆ చూపుల దారులగుండా తన మనసులోకి తొంగి చూడాలని ఏంటో ఏవో ఏవేవో అర్ధం కాని నా ఆలోచనలను అర్ధవంతం చేసుకోవాలనే తపనతో తన చుట్టే పరిభ్రమింపచేస్తూ, ఇక  మౌనంగా మిగిలిన నా దేహాన్నిబల్లపై జీవమున్న శవంలా బంధించేసా…
చుట్టూ పరుచుకున్న నల్లని చీకట్లు వీస్తున్న చల్లగాలులు కురుస్తున్న వర్షం వెలుగుతున్నలాంతరు తనకు నాకు నడుమన మిగిలిన ఘడ సౌందర్యనిశ్శబ్ధం హ్మ్… నా చుట్టూ, నాలో గడుస్తున్నఅందమైన భావ క్షణానికి ఇవే సాక్ష్యాలు. ప్రతి ఒక్కరు దేనికోసం పరితపిస్తారో నాకు తెలీదు. ఇంతకాలం నేను దేనికోసం తపిస్తున్నానో అర్ధమే కాలేదు. తమ కోసం, తమను తాము త్రుప్తి పరుచుకోవడం కోసం అవగాహన లేని యాద్రుచిక దారుల్లో గుడ్డిగా ప్రయాణం చేస్తుంటారు. కొన్ని ప్రయాణాల్లో ఆది నుండి అంతం వరకు వేటికి నిర్వచనాలు ఉండవు. ఇలాంటి ప్రయాణాల్లో చివరికి మిగిలేది అనుభవం అనుభూతి మరియు ఎప్పటికి అర్ధం కాకుండా ఓ ప్రశ్నలా మరో ప్రయాణానికి సిద్దంగా మిగిలిపోయే మనం. బహుశ ఇప్పుడు నేను అనుభవిస్తున్న ఈ అనుభూతి ఇంచు మించు అలాంటి ఓ అరుదైన ప్రయాణమే.. కాని ఆదికి అంతానికి నడుమ అర్ధం కాకుండా శిలల ఉండిపోవడం ఎందుకో బావుంది.
ఓ పొల్ల పడుకున్నావే..! అంటూ ముసలావిడ లోపలి నుండి వచ్చింది. పాక చిన్నదే పాక గోడలు వెదురు తడకలతో తాయారు చేసుకున్నట్టుంది.  ఆ పాకలో నలబై శాతంలో తడకలనే అడ్డు పెట్టి అందులో మల్లి రెండు చిన్న చిన్న అర్రలుగా విడదీసి ఒక దాంట్లో పొయ్యి గిన్నెలు పెట్టుకుంది. ఇంకో అర్ర పట్టె మంచం బట్టలు పెట్టుకోడానికి. చీకటిలో అంత స్పష్టంగా కనిపించట్లేదు కాని పోల్చుకొగలిగాను. పొయ్యి మీద వంట పూర్తి చేసుకొని ఇప్పుడో రేపో చిరిగిపోతుంది అన్నట్టుండే చీర కొంగుకు తడి చేతులు తుడుచుకుంటూ తన దగ్గరికి వచ్చింది.
లేవే లే.. అనడంతో ఉలిక్కి పడి లేచింది.
ఎంటే..  ముసల్దానా! మంచి నిద్రను పొట్టన బెట్టుకున్నావ్. అని ముసలావిడ మీదకు విరుచుకు పడింది.
అబ్బో సాల్లే.. నీ పొట్టలో ఇంత కూడేయ్యలని లెపినానె.. లే లెగు ఇంత సల్లబడు. అంటూ రెక్క పట్టి లేపే ప్రయత్నం చేస్తోంది.
అయ్యో పిల్లోడ నువ్వింకా బొలెధా..? అని నిద్ర కళ్ళతో ప్రశ్నించింది. నాకు ఆశ్చర్యమేసింది.
యాడికి బోతాడే బయట వాన ఎట్లగోడ్తాంది సుషినవా? ఇంకా నయం తుఫాను గట్ర ఐతే మాత్రం ఈ గూడు గూడ నిలవదు. ఇంత సీకట్ల ఈ వానల యాడికి బోతావ్ ఈ రేత్రి యిన్నే ఉండు బిడ్డ. వాన తగ్గేకా తెల్లారగట్ల బొదువు లె..
లేవే పొల్ల లే.. లేచి అబ్బాయి చెయ్ గడుక్కోనికి ఇన్ని నీళ్ళు ఇవ్వు. తొరగా రండి నేను బోయి పళ్ళెం లో అన్నం తోడుతా..
ముసలావిడ పొయ్యి మీద నుండి వంట కుండలు, పళ్ళాలు, కూచోడానికి పీటలు సిద్దం  చేస్తోంది. తను సర్వలో నీళ్ళు పట్టుకొచ్చింది. నెమ్మదిగా ఇద్దరం పాక బయటికి చేతులు పెట్టి కడుక్కున్నం.
ఇగో… నేను ఇగ నీతో మాట్లాడను పిల్లగా. అంటూ నా వైపుకు చూసింది.
ఏ ఎందుకండి.
అబ్బ. ముత్యాలే రాలుతున్నాయి. ఎందుకలా మూతి ముడ్చుకొని ఉంటావ్. సంధిస్తే ఎక్కడలేని సోదంత వాగుతారు అబ్బాయిలంత. నువ్వేంటయ్య ఇలా.. అమ్మాయిని అందులో మాంచి అందగత్తెని నన్ను ఎదురుగా పెట్టుకొని ఎక్కడెక్కడో అలోసిత్తున్నావ్..
అదేం కాదండి. వర్షం ఎప్పుడు తగ్గుతుందా అని.
ఒక్క సారిగా నావైపు చూసి చేతిలో ఉన్న సర్వని ధడాల్న కింద పడేసి. కోపంతో
మరి నా యెంట ఎందుకొచ్చినావ్? అట్నుండి అటే ఎల్లలేకపోతివా.. ఛీ పో.. అంటూ టక టక లోపలికి వెళ్ళింది. నేనక్కడే ఉండిపోయా.. ఏమనుకుందో ఏమో..
ఆన్నే ఏం జేస్తున్నావ్ చెయ్యి బట్టి గుంజుకు రావాల్నా?  దా తొరగా..  అంటూ ధబాయించింది. ఇక తన వెంటే వెళ్లి నాకోసం సిద్దం చేసిన  పళ్ళెం ముందు కూచున్న. నాకు దాదాపుగ పక్కనే తను కూచుంది. ముసలావిడ కుండలో నుండి చేపల పులుసు గంటెతో వంపుతోంది.
ఓయ్ పిల్లగా అలగకుండా గులగకుండా కడుపునిండా తిను. మా ముసల్దాని చేప పులుసు తినే అద్రుష్టం నీకు దొరికింది. తినిసూడు ఇగ నువ్వు మరిసిపోతే ఒట్టు.
నువ్ నోర్ముయ్యవే అబ్బాయిని తినని ఎప్పుడు ఏందో వాగుతావ్..
ఏందే ముసల్దాన నా మీదకి ఎగురుతున్నావ్ పళ్ళెం ఎత్తేస్తా జాగర్త..
అబ్బో దీనికేం తగ్గువలేదు రోజురోజుకి గారవం చేత్తుంటే నెత్తికెక్కుతాంది. నీకిప్పుడు తెల్వది ఆగు.
ఇక వాళ్ళిద్దరూ గొడవపెట్టుకోకుండా క్షణం ఉండలేరని అర్ధమయ్యింది.
నెమ్మదిగా పొగలు గక్కుతున్న అన్నంలో కమ్మని చాపల పులుసు. పైగా కడుపులో పేగులు నకనక లాడుతున్నాయి. ఇక ఆగలేక గబా గబా కలుపుకొని ఒక్కో బుక్క నములుతుంటే నిజంగానే స్వర్గం కనపడుతోంది.
కాసేపటివరకు ఏ మాటలు లేకుండా ప్రశాంతంగా ముగ్గురం తినే పనిలో మునిగిపోయాం..
చాల కాలానికి రుచికరమైన బోజనాన్ని శ్రద్దగా తినడంతో నొసటిపై చిరు చెమటలు పట్టాయి. వేడి వేడి పొయ్యి మంట వద్ద కూచొని తినడంతో ఒళ్ళంతా వేడిగా మారింది. భయటికొచ్చి నిల్చున్న చేతులు కడుక్కున్నాను. తల అటు తిప్పుకొని చెయ్ తుడుచుకో అంటూ తన కొంగును అందించింది. ఇక తన కొంగుతో చేయి తుడుచుకోకపోతే మళ్ళీ ఏమంటుందో అని తుడుచుకున్నాను. వర్షం తన అస్తిత్వాన్ని ఇంకా వీడలేదు చల్లని గాలుల సైన్యాన్ని వెంటేసుకొని నేలపై ఆగకుండా బాణాలను విసురుతూనే ఉంది. ఆ చల్లగాలుల కౌగిలింతలు ఆహ్లాదాన్ని పంచుతున్నాయి. బహుశా ఆ మధురిమలు తనను కూడ గిలిగింత పెడుతున్నట్టున్నాయి. ఏదో కూని రాగం తీస్తూ చేయి ముందుకి చాచి పాక అంచులనుండి సన్నగా జాలువారుతున్న ధారని అరచేతిలో నింపుకుంటోంది. అరచేతిలో పడుతున్న చల్లనిదార గిలిగింత పెడుతున్నట్టుంది. చిలిపిగా తనలో తాను నవ్వుకుంటోంది. తననలా చూస్తున్నాను. ఓ సారి అలా నా వైపుకు తొంగి చూసింది. నేనింక తనని అలానే చూస్తున్న. తన అరచేతిలో నిండిన ధారా చేతిలోనుండి పొంగి పోర్లుతోంది. ఉన్న పలానా నా మీదకి విసిరింది. ఆకస్మిక చర్యకి ఉలిక్కిపడ్డాను. తను ఫక్కుమని నవ్వుతోంది. ఆనందంగా నవ్వుతోంది. నా ముఖాన చిమ్మిన చల్లని నీళ్ళతో ఒళ్ళు పులకరించింది. తిరిగి తానే తన కొంగు అంచుతో నెమ్మదిగా నవ్వుతు తుడుస్తోంది. తన చిలిపి పని నాక్కూడా నవ్వు తెప్పించింది. చిన్నగా నవ్వాను.
అబ్బో సొట్టబుగ్గలా…
తనలా అంటుంటే కాస్త కొత్తగా అనిపిస్తోంది.
ముఖాన్ని నెమ్మదిగా కొంగుతో తుడుస్తోంది. అప్పుడప్పుడు తన వేళ్ళు నా నుదిటిని, చెంపని, పెదాల్ని తగులుతోంది. ఏ అమ్మాయిని ఇంత వరకు నేను తాకింది లేదు, నన్నెవరు తాకింది లేదు. కాని ఎన్నడు ఎరగని ఈ అనుభూతి వీస్తున్న చల్ల గాలుల కన్నా మరింత ఎక్కువ  హాయినిస్తోంది. ఒళ్ళు పులకరిస్తోంది చెప్పాలంటే చేతులపై రోమాలు నిక్కపోడుచుకున్నాయి.
కళ్ళు మూసుకున్నాను ఇంకా ఆ హాయి మాయలోనే తచ్చాడుతున్నా.
ధ్యాన ముద్రలో ఉచ్చ్వాస నిశ్వాసలు ఏకమైన చోట తెలియని ఓ తేలికతనం మది చుట్టూ దేహం చుట్టూ అల్లుకుంటుంది దేని అవసరం లేనంతగా చివరికి శ్వాస కూడా. అలాంటి స్వచ్చమైన తేలికైన స్థితికి నెట్టుకొని ఎల్లలు లేని విశాల గగనంలో ఇప్పుడు సాగిపోతున్న..
అనంత దూరాలను, కొండలను, జలపాతాలను, కండలు తిరిగిన మేఘాలను, చల్లని తుంపర్లను, మంచు  బిందువులను, పూలను, పక్షులను, మైదానాలను, హరిత వనాలను, రక రకాల వర్ణాలను, ఇంద్రధనస్సును అన్నిటిని దాటుతూ దాటుతూ నీలాకాశాన్ని చిమ్మ చీకటిని చుక్కల్ని నక్షత్రాలని పాలపుంతలని కూడా దాటేస్తూ శూన్యాన్ని నిశ్శబ్దాన్ని చేరుకున్న అక్కడే ఎక్కడో మరింత దూరాన ఎవరిదో కూని రాగం. ఆ రాగానికి దగ్గరగా మరింత దగ్గరగా..
శృతులన్ని ఒలికినట్టున్నాయి ఒక్కో శృతి ఏరుతూ ఏరుతూ ఎవరిదో నీడ హా అవును నీడే…  ఆశ్చర్యం చిమ్మ చీకట్లో సైతం ప్రకాశంగా వెలుగుతున్న నీడ. శృతులని ఏరుకునే పనిలో అందెల మువ్వలు ఒక్కోటి అదే శూన్యంలో శూన్యానికే తగులుతూ ఘల్లుమని రాలుతున్నాయి. రాలిన మువ్వ ఓరగా నను చూస్తూ జాలిగా నవ్వుతోంది.
పారాణి దిద్దుకున్న పాదం అడుగు తీయగానే నీటిలో పడిన రంగు చుక్కలా పారాణి  ఇదే శూన్యంలో చెదిరిపోతోంది. వెలుతురు కూడా లేని ఈ శూన్యంలో రంగు ఎలా మొలిసిందో.. ఊగిసలాడుతూ పలుచని తెర దేనికో అడ్డంగా ఉంది.  తెరను తాకాలని కదిలా కదులుతున్నకొద్దీ తెర దగ్గరవుతున్న కొద్ది ఏవో సుగంధాలు కనిపించకుండా నా చుట్టూ నాట్యం చేస్తున్నాయి.
పలుచని తెర, రెప రెప లాడుతూ తెర, అలల్లా పొర్లుతున్న తెర, తెల్లని తెర, ఆ తెర అంచుల చివరి కొనదారాలు నా నుదిటిని కళ్ళను దాటాయి. చేతితో పట్టుకొనే ప్రయత్నంలో ఎవరో ఆ తెరని లాగుతూన్నట్టు చేజారి పోయింది. మిగిలిన మువ్వలు చేసే అలజడులతో అందెలు గుర్తులు పెడుతున్నాయి అడుగు వేసిన చిరునామాని నాకు తెలిసేట్టుగా..
అలజడి ఆగింది. తెర పారిపోవడం కూడా ఆగింది. నేను ఆగిపోయా..  ఎక్కడినుండో ప్రయాణమవుతూ తెరని చేరిన నెమలికన్ను. ఒకటి కాదు రెండు కాదు కొన్ని వందల వేల కొలది కన్నులు తెరను చుట్టుకున్న నీడ చుట్టూ గుండ్రటి గోళంలా అల్లుకున్నాయి. ఆ నీడకు నాకు తెలీకుండానే రంగులద్దుకున్నాయి. రక రకాల రంగులతో రంగుల శిలల ముద్రించుకుంది. శిల చుట్టూ గుండ్రటి నెమలికన్నుల విశాల  గోళం. ఆ గోళం చుట్టూ పచ్చదనం దానికి పైన నీలం ఒక్కొక్కటిగా చుట్టూ ఇంద్రధనస్సు రంగు పరుచుకుంది. మధ్యలో రంగులు దిద్దుకున్న శిలకు  దగ్గరవుతూ మరింత దగ్గరగా రంగు రంగుల అందమైన పూలు గుత్తులు గుత్తులుగా వేల సంఖ్యలో ఎదురుపడగ వాటిలో ఈదుకుంటూ కనిపిస్తున్న వందలకొలది రామ చిలుకలు  ఒకేచోట తమ రెక్కలు రెపరెపలాడిస్తున్నాయి. వాటిని దాటుకుంటూ రంగుల శిల్పానికి చేరువవుతున్నాను. మరింత దగ్గరగా  సుగంధపు పరిమళాలను హత్తుకుంటూ చేరాను. మేలి ముసుగు తొడిగిన రంగుల శిల్పం వయ్యారంగా నిల్చొని కుడి పాదం బొటన వేలు శూన్యంలో అటు ఇటు అంటూ ఏదో రాస్తోంది. ఆ రాతలోనుండి రక రకాల రంగుల పొడులు విబిన్న రూపాల్లో వేవేల తరంగాలై నా చుట్టూ అల్లుకుంటున్నాయి.
చిత్రంగా నేనింక  సీతాకోకల రెక్కలతో అల్లుకున్న మేలి ముసుగు వెనకాల దాగిన రూపాన్ని చూసేందుకు వేచి చూస్తున్న. నెమ్మదిగా తన మెలి ముసుగు తీసింది. నేను ఊహించిన రూపమే తానే అవును తానే తన అంగాంగము ప్రకృతిలో కలగలసి ఓ వన కన్యలా…  చక్కని పలువరుస కూడిన నవ్వుతో నావైపే చూస్తోంది. ఇది కల కాదు నా ఎదురుగానే ఉంది. మరి మా ఇరువురి చుట్టూ అల్లుకున్న ఈ వింత ప్రపంచం ఇది కూడా కల కాదేమో ప్రతిది అనుభూతి చెందుతున్నాను. మాయ కూడా కాదు ఆణువణువూ నన్నల్లుకొని ఆత్మతో సంబాషిస్తోంది.
వన కన్యై తాను నా ముందుకొచ్చి ముని వేళ్ళతో జుట్టు నిమురుతోంది. నొప్పి పెట్టెల బుగ్గను గిల్లింది ఉలిక్కి పడి కళ్ళు తెరిచా..
ఏంటి పిల్లోడా కళ్ళు మూసుకొని కల గంటున్నావా!
అవును కలే అంతరాంతరాల్లో మేలుకున్న వాస్తవమెరుగని అస్తిత్వాన్నికూడబెట్టుకున్న సజీవ కల దాన్ని నేను కంటున్నాన లేదు దానికదే పురుడు పోసుకుంది నీ స్పర్శతో. నిజం నీ స్పర్శకు నిజంగానే కలలను పురుడు పోయించే శక్తి ఉంది. ఇంతకి ఎవరు నువ్వు. నీ స్పర్శే నన్నిలా చేస్తుందా లేక నేనే భ్రమ పడుతూ ఊహిస్తున్ననా. ఏమో ఏది అర్ధం కాకుండా చిత్రంగా ఉంది. నీ వైపుకు నను లాగుతున్న ఆ అనుకూల భావనలను చదవలేకపోతున్న ఆ భావనకు తగిన నీ ప్రతిస్పందనలను కలో నిజమో తెలియని సందిగ్ధంలో సతమతమౌతూ నీ ముందిలా మూగావాన్నిగా నిలబెడుతున్నాయి.. ఇప్పటికి అదే ప్రశ్న ఎవరు నువ్వు. కలవా కల్పనవా లేక నాకోసమే వేచి చూస్తూన్న నా ప్రియ సఖివా..
భలే ఉన్నాయే..
నిజంగానా
ఔనూ…  చొట్ట బుగ్గలతో చాల అందంగున్నావ్..
అవును పిల్లగా నిన్నోటి అడగనా నిన్ను పిల్లగా పిల్లగా అని విసిగిస్తున్నాను కదా నా మీద కోపం రాట్లేదా..
కోపమా అదేమి లేదు. నువు మాట్లాడుతుంటే అలాగే వింటూ ఉండాలనిపిస్తుంది.
అబ్బో మస్తు పటాయించుతున్నావ్ గా.. ఏంది సంగతి నేను నచ్చినాన!!!
చిలిపిగా తాను అడిగిన ప్రశ్నకు చిన్న నవ్వుతో తననే దీక్షగా చూస్తున్నా..
ఏమని చెప్పాలి ఎంత నచ్చావని చెప్పాలి. నచ్చే కదా నీ వెంట వచ్చింది అని చెప్పాలా. నిన్ను అనుక్షణం చూస్తూనే ఉండిపోవాలని ఉంటుంది అని చెప్పనా. నా బిగి కౌగిల్లో నిను ఉక్కిరి బిక్కిరి చేసెయ్యాలని ఉందని చెప్పనా.. ఏమని చెప్పాలి..
మనసు కన్నులు తెరుచుకొని చూస్తే జీవితాలను చదవడం పెద్ద కష్టమేమి కాదు. ఒక్కో జీవితం చరిత్రను సృష్టించక పోయిన ఒక్కోసారి గగుర్బాటు కలిగిస్తే, మరోసారి జాలి, ఇంకోసారి కోపం, అసహనం, రకరకాల రసాలతో కూడి నాటకీయం అనిపించినా జీవితం తెర మీద రక్తి కట్టించే చర్మం తొడుక్కున్న తోలు బొమ్మలం మనుషులం. ఆడించే వాడి గురించి పక్కన పెడితే నిజం చెప్పాలంటే మనిషిగా మనిషి జీవితాన్ని చదవగలిగితే అంతకు మించిన పట్టా మరోటి ఉండదేమో. సమాజంలో జరుగుతున్న ప్రతి విషయం మనకు సంబంధం లేనట్టుగా ఎలాంటి స్పందనలే లేనట్టుగా అదో సాధారణ విషయంల బావించడం నిత్యం మనకొక అలవాటైన విషయం. కాని కాని నేను గడిపిన జీవితం నేర్పిన ఫిలాసఫీ అంత ఒక్క క్షణం లో  ఎదురుగా పరుచుకున్న నీ అందం ముందు అంత మటు మాయం.
ఈ నిశ్శబ్దం ఇరువురికి చక్కగా అర్ధమయ్యే పాటంలా ఇక చదవాల్సింది ఏమి మిగిలి లేదన్నట్టుగా ఒకరికొకరం ఇంచు మించు అర్ధం వొడిలోకి జారుకున్నామనే అనిపిస్తోంది.
తన చేయి నా బుజం మీద నెమ్మదిగా వేసింది ఒక్కసారిగా ఆకాశాన్ని చిల్చుతూ విల్లులా మెరుపు. మెరుపు వెలుగు తన అణువణువును ముద్దాడుతూ ఒక్క సెకను నన్ను నేను తన మిరుమిట్లు గొలిపే అందం మైకంలో కమ్ముకుపోయాను.
మెరుపు వెలుతురుకు ఉలిక్కిపడి లోపలికి వెళ్ళింది. ఇంతలో ఆకాశంలో మరో మెరుపు ఆ మెరుపులో జోరుగా కురుస్తు గాల్లో నిండుగా పరుచుకున్న వర్షం వజ్రాల్ల తలుకుమంటూ ఎన్నడు చూడని వింత వెలుగు  బీకరంగా బయపెట్టింది. ప్రకృతికి నాకు ఎడ తెరిపి లేని యుద్ధం ఎన్నో ఏళ్లుగా.  నన్ను ప్రకృతి తన దోసిల్లో దాచుకొని నాతో ఆడుకుంటున్నట్టు అనిపిస్తుంటుంది. మనసుని అమాంతం ప్రకృతి మొత్తాన్ని తెగ చుట్టేస్తూ కంటికి కనిపించిన అందాన్ని మనసులో బంధించేందుకు వీరుడిలా ఆలోచనల గుర్రంపై సవారి చేస్తూ ఒకటే ప్రయాణం చిత్రంగా ఎంత ప్రయాణించిన ఆలోచనల గుర్రానికి, అంతమెరుగని ప్రకృతికి రెంటికి అలసట అనేదే రాదూ.
ఓయ్ పిల్లగా లోనకు రా. పిడుగ్గిట్ల బడ్తది అంటూ పిలుస్తూ లోపలి నుండి కొడవలి తెచ్చి పాక ముందు పడేసింది.
ఏం చేస్తున్నావ్?!
కొడవలి జూసి పిడుగు పారిపోద్ది. ఇంగ మనకేం బయ్యం లేదు దా పిలగా..
మెల్లిగా తనతో లోపలికి నడిచా.. కనిపించి కనపడని చికట్లతో లాంతరులో తలెత్తుకు నిలుచున్న దీపం నుండి పొంగుతున్న బంగారు రంగు వెలుతురు ఇప్పుడు నాకు అమితంగా నచ్చే గొప్ప అంశం. అదే గనక లేక పోతే కళ్ళతో తన అందాన్ని బంధించుకునేవాన్నా లేదు. వంపు తిరిగిన నడుంను చూస్తున్న కొద్ది దాని  చుట్టూ నా చేతులని పెన వేయాలని లోలోనా ఎంతో ఆరాటం ఆగని వర్షపు శబ్దంలో కూడా పెరిగిన నా గుండె సవ్వడి స్పష్టంగా వినిపిస్తోంది.
నెమ్మదిగా లాంతరును కర్ర గుంజకి వేలాడేసి లోపల పొయ్యి దగ్గరికి వెళ్ళింది.
ఒసేయ్ ముసల్దాన పడుకున్నవానే…! అనడిగింది. ముసలావిడ పడుకున్నట్టుంది. నెమ్మదిగా అర్రలో నుండి లుంగీ బనియన్ టవల్ తీసుకొచ్చి లాంతరు వెలుతురును చిన్నగా చేస్తూ అవి నా చేతి కిచ్చింది.
తొరగా ఆ బట్టలు మార్సుకో. కింద సల్లగుంది లోపల అర్రలో మంచం మీన పడుకో నేను ముసల్దాని పక్కన పడుకుంటా..
ఏం చేయాలో తోచట్లేదు.  ఆలోచిస్తుండగానే అమాంతం లాంతరు వెలుతురును ఎవరో మింగేసి వదిలేసిన ఆనవాలే ఈ చీకట్లు. చీకటి అది ఇప్పుడోక అర్ధం కాని వివరం లేని వింత వర్ణం. ప్రపంచాన్ని ఈ చీకటే మింగేస్తే ఇంకేముంది కలవరించడానికి. చీకట్లు సృష్టించిన విద్వంసం అంత ఇంత కాదు ఒక్కసారిగా ఏదో ఊబిలో మునిగి మనసుకు తన అందం శ్వాస అందక ఉక్కిరి బిక్కిరవుతు కొట్టుమిట్టాడుతోంది.
ఏంది పిలగా మార్సుకున్నవ? లేదా? ఇంకెంత సేపు ఈ సీకట్లుండాలి.
ఓ చీకట్లో పడి మరిచేపోయా
ఆ ఆ మార్చుకుంటున్నా.. ఒక్క నిమిషం
ఏంది ఒక్క నిమిషం నువ్వేమైన చీర గట్టుకుంటున్నవా గింత సేపు జేస్తున్నావ్.
ఓ. కే. మార్చుకున్న ఇక దీపం వెలిగించు.
చిన్ని దీపం వెలిగించగానే పాయలు పాయలుగా తనను కమ్మేసిన చీకట్లను చీల్చుకుంటూ సుతారంగ తన మోము నిండా పరుచుకున్నాయి. తనతో నా మనసులో నిండిన తన నిలువెత్తు అందాన్ని సైతం. గుండ్రటి విశాలమైన కను పాపలు చిలిపిగా రెప్ప వాల్చకుండా నా వంకే చూస్తున్నాయి.
అబ్బొ.. పర్లేదు పిల్లగా తెల్లగనే ఉన్నావ్. ఏంది ఆ జబ్బలు.. ఇంగ సరే ముందు తడకలు అడ్డం పెట్టి నేను పడుకుంటా నువ్వు గూడ లోపలికి బోయి పడుకో.
ఏంటి అప్పుడే నిద్రోస్తుందా..
ఏంది పిల్లగా ఏం మాట్లాడ్తలెవ్ ఇంగ నిద్ర రాక ఏమొస్తది.
నాకు నిద్ర రావట్లేదు.
ఎట్టోస్తది నిద్ర ఇంత రాతిరి నాలాంటిదాన్ని ముందు బెట్టుకొని. అవును పిల్లగా నా ఎంట రానికి నీకెట్ల ధైర్నం  బుట్టింది.
ఏమో..
సరేలే ఏమైతేంది నువ్వైతే గీ బనీన్ల మస్తుగోడుతున్నావ్ సాన సక్కగున్నావ్. వ్యంశాల గిట్ల బోతవ ఏంది మస్తు కండలు పెంచినవ్. ఔనోయ్ నేను గిట్ల మాట్లాడుతాంటే గిదేంది ముక్కు మొహం తెలినోడి తోటి గింత బరితెగించినట్టు మాట్లాడుతోంది అననుకుంటున్నావ్ గదా..
ఛ ఛ అదేం లేదు.
సరే ఆ బెంచి మీన కూర్సో నేను తడ్కలు అడ్డం బెడ్త లేక పోతే రాతిరంతా ఈదురు గాలికి సర్ధైతది ముక్కులు దిబ్బలు బడ్తై. అంటూ చిన్న చిన్న అడుగులతో వయ్యారంగా నడుం వంపు కింది ఎత్తులను పైకి కిందకు ఊగిసలాడుతుండగా నాలుగు మూరెలా జడ ఒక్కో ఎత్తుపై లయగా తాలం వేస్తుండగా నాకు తెలీకుండానే అడుగులు తనే వెంటే పడుతున్నాయి. తడకలను పాకకు ఆ మూల నుండి ఈ మూల వరకు అడ్డు పెడుతోంది.
ఓయ్ పి ల గా… ఏంది? కొంగు ఇడువూ..
తన కొంగు వైపు చూసా పాపం తనకు తెలీకుండా తన కొంగు అంచు తడకలో చిక్కుకుంది. తనేమో నేనే పట్టి లాగుతున్నానని అనుకోని మళ్ళీ
నిన్నే వదలయ్య  అనుకుంటూ వెనక్కి తిరిగి చూసింది.
తననే చూస్తూ చేతులు కట్టుకొని నేను.
నా వైపుకి, ఇరుక్కున్న కొంగు వైపుకి చూసి విసురుగా తడకలో చిక్కిన కొంగు అంచును పర్రున లాగి ముందుకు నడిచింది. నడుస్తు తను ఒక్క అడుగు అల వేసిందో లేదో నా చెయ్యితో తన చెయ్యి మని కట్టును దొరకబుచ్చుకున్నా. దొరకడమే ఆలస్యంగా వెనక్కి లాగా…  తాను ఊహించని నా చర్యకి పట్టు సడిలి ఒక్కసారిగా కంగారుగా వెనక్కి వాలింది. వెంటనే మరో అడుగు వెనక్కి వేసి నా వైపుకు తిరిగింది. మరో సారి లాగాను ఈ సారి అమాంతం కిందకు వాలిపోయే క్షణం లో తన వాలు జడతో పాటు తన వెన్ను నా చెయ్యి ఆసరలో ఒదిగింది. ఒక్కసారిగా తన తల వెనక్కి వాలడంతో బంగారు రంగు తన మెడ దాని కిందుగా తెల్లని పర్వతపు లోయ మొదలు నుండి ఘనంగా వెలువడుతున్న సుగంధాలు తనలోని మనసు గమ్యానికి నన్ను చేర్చుకునేందుకు నా ప్రయాణానికి సిద్దం చేస్తోంధన్నట్టు తలపిస్తున్నాయి. తన కళ్ళలో భయమో అత్రుతో ఆరాటమో ఆప్యాయతో ఆశ్చర్యమో ఏమో రక రకాల అర్ధాలు కలగాపులగంగా కనిపిస్తుంటే ఏది సత్యమో ఏది అసత్యమో ఏది భ్రమో ఏది నిజమో  అర్ధం కాని సతమతపు ఆలోచనలతోనే ఎక్కడో అధిమిపట్టిన భరించలేని వేడి కోరిక నా వైపుకి విసురుతున్న ఆ చూపులకి అదుపు తప్పేలా ఉంది. ఐన మా చుట్టూ ఇంకా వర్షపు గాలుల నిశబ్ధం తాండవం చూపుతూనే ఉంది. జరుగుతున్న తత్తంగానికి తన మరో చేతిలోని లాంతరు సైతం భయంతో ఊగిపోయింది. దానికి తోడు మా ఇరువురి నీడలు కూడా చిత్రంగా నేలపై అటు ఇటు ఊయలలూగుతున్నాయి. వెలుగుకెంత అస్తిత్వమో మా నీడలు చాటి చెప్పుతున్నాయి.
తన ముని వెళ్ళు నా జుట్టులోకి పంపించి దగ్గరగా లాక్కుంది. ఇప్పుడు తన హృదయం పై వాల్చుకొని సేద తీరుతున్న నా తల, తలతో పాటు నా ఆలోచనలు. ఐనా గుండెలో ఇంకా ఆగని వేగం. కొద్ది కొద్దిగా కౌగిల్లో బందినవుతుంటే గుండెవేగం స్థిమిత పడింది.  ఈ సారి మరింత గట్టిగా దూరాన్ని చేరిపెసాను.. పరిమళాన్ని ఆస్వాదిస్తూ తన మెడపై నా తల. ఎం జరుగుతుందో ఆలోచించడానికి ఆలోచనలు కూడా కరువయ్యాయి. రెప్ప తెరిచి చూస్తే నులక మంచంలో తానో నేనో లేక మేమిద్దరమో కాకా ఏకమైన మెమో ఏమి అర్ధంకాకుండా మసక వెలుతురు చీకట్లలో పోటి పడుతూ, పడుతూ లేస్తూ తిరిగి మమేకమవుతూ… ఓహ్… ఏంటి ఈ వింత నేనెన్నడు ఎరగని ఓ తాత్వికానంధపు శ్రుతులు ఇరువురి ఆణువణువును అదుముకున్నాయి..
కను మూసినా కను తెరిచినా ఒకే అనుబూతి ఆనందానుభూతి.. ఈ స్థితిని చేరుకునేందుకేనేమో ఇంత కాలం నా మనసు తపిస్తున్నది.
ఎప్పుడు నిద్ర లోకి జారుకున్నమో గుర్తేలేదు.  గుర్తు చేయడానికనేనేమో నాటు పుంజు కూత ఎక్కడో కూసిన, నా చెవి దగ్గరే కూసినట్టు  ఉలిక్కిపడి లేచా.. గోధుమ బంగారు రంగు కలోబోసుకున్న నున్నటి మెత్తని శిల్పం ఇంకా నను వాటేసుకొని అమాయకంగా సేద తీరుతోంది. నాక్కూడా లేవాలనిపించలేదు. మునివేళ్ళు నా ప్రమేయం లేకుండానే మెత్తని శిల్పం పై సుతారంగా మీటుతుంటే.. తన పెదాల అంచున సన్నని చిరునవ్వు. కళ్ళు తెరవకుండానే.. నా గుండెపై ముద్దు పెట్టింది.
అర్ధం కాకపోయినా అర్ధాలు వెతుక్కోవడం మాని చాల కాలమే అయ్యింది. జరుగుతున్న అనుభూతికి అర్ధాలు వెతుక్కునే అవసరం కూడా లేదనిపించింది..
ఓయ్ పిల్లగా నేనెలా ఉన్నాన్రా.. నీకు నచ్చినానా.. ఏయ్ ఏం ఆలోచిస్తున్నావ్.. నాకు తెలుసులే..
చెప్పలేని మాటలన్నీ పెదాల అంచున అల నిలబడి పోయాయి.  గడుస్తున్న అనుభవం మాటలుగా మారలేకపోతున్నాయి..
ఆ మూగ స్థితిలో ఆనందపు జడి వానలో కలో మాయో తెలీని సందిగ్ధంలో ఆశ్చర్యంగా ఆలోచనలతో పాటే దేహం కూడా పరుగులు పెట్టింది. చిత్రంగా నా వెంటే తాను కుడా కాదు కాదు తన వెంటే నేను కుడా..
ఇప్పటికి ఎన్ని వసంతాలను మా కౌగిల్లో బంధించామో లెక్క లేదు. అంతేనా లెక్కలేనన్ని చినుకుల జడి వానలో ఎన్ని సార్లు తడిసి ముద్దయ్యామొ…
నన్ను ఆటపట్టిస్తూ తాను..
తనకై తపిస్తూ, ఆరాదిస్తూ, ఆనందిస్తూ నేను..
ఓ.. చెప్పలేదు కదు తన పేరు “అలవి”..