మాలిష్…మాలిష్!

 

రచన – ఇస్మత్ చుగ్తాయీ

అనువాదం – కె. బి. గోపాలం

~

 

బహుశ ముఠ్ఠీ మాలిష్ అనే ఈ కథ 1956 ప్రాంతంలో ప్రచురితమయింది. బొంబాయిలోని బడుగు వర్గాల స్త్రీల పరిస్థితి ఈ కథలో చిత్రింపబడింది. కథ చెపుతున్న ఆడమనిషితోబాటు రత్తిబాయి. గంగబాయి అని రెండు పాత్రలు ఇందులో కనబడతాయి. తరువాత ఈ కథను ముగ్నీ తబస్సుం, వహీద్ అన్వర్ గారల సంపాదకత్వంలో వచ్చిన కహానియా సంపుటి 1 లో ప్రచురించారు. అయితే అక్కడ తేదీ ప్రసక్తి కనబడదు. ఆ సంపుటి బహుశ 1975 ప్రాంతంలో వచ్చి ఉంటుంది. వహీద్ అన్వర్ గతించారు. ముగ్నీ తబస్సుం గారికి కథ వచ్చిన తేదీగానీ సంచికగానీ గుర్తు లేవు. అదే ప్రచురణకర్తలు,  ఉర్దూ క్లాసిక్స్ వారు 1985లో కహానియా రెండవ సంపుటాన్ని ప్రచురించారు. పోలింగ్‌ స్టేషన్‌ దగ్గర తొక్కిడిగా జనం ఉన్నారు. అక్కడికేదో సినిమా మొదటి దినం లాగ! లైను కొన కనిపించకుండా ఉంది. అయిదేండ్ల కింద కూడా అచ్చం ఇట్లాగే లైను ఉంది. అక్కడ తిండిగింజలు చవకగా పంచిపెడుతున్నట్టు! ఓట్లేయడానికి  వచ్చినట్టు మాత్రం కాదు. అందరి ముఖాల్లోనూ ఆశాభావం కనపడుతున్నది. లైను ఎంత పొడుగు ఉంటేనేమి, ఎప్పుడో ఒకసారి మన అవకాశం రానే వస్తుంది. ఇక చూచుకోండి, ఆ తరువాత కట్టలు కట్టలుగా పైసలు! అతను మాకు బాగా నమ్మకం ఉన్న మనిషి. మొత్తానికి మనవాడు ఎన్నికవుతాడు. కష్టాలన్నీ తీరిపోతయి.

*

Spring Explosive‘బాయీ, ఓ బాయీ! ఎట్లున్నవు?’ మాసిపోయిన చీర చుట్టుకున్న ఒక ఆడమనిషి తన పసుపు గారపళ్లను బయటపెట్టి  ఇకిలిస్తూ, నా చేయి పట్టుకున్నది.

‘ఓ నీవా? గంగాబాయి….’

‘కాదమ్మా, రత్తిబాయిని! గంగబాయి వేరె. సచ్చిపాయెగద, పాపం’

‘అయ్యో, అట్లనా….’

ఒక్కసారి నా మెదడు అయిదు సంవత్సరాలు వెనుకకు వెళిపోయింది. ‘రుద్దుడా? గుద్దుడా?’ అడిగాను.

‘రుద్దుడే’ రత్తిబాయి కన్ను గీటింది. ‘ఒద్దే అని చెప్తనే ఉన్న. అది ఇంటదా? బలుపు ఆడిది. బాయి, ఓటు ఎవర్కి  ఏస్తున్నవ్‌?’

‘మరి నీవు? ఎవరికేస్తవ్‌?’ ఒకరినొకరు అడుక్కున్నాము.

‘మా కులపాయన ఉన్నడు. మాతాననే ఉంటడు.’

‘అయిదేండ్లకింద గూడ మీరంత కులపాయనకే ఓటేస్తిరి. కాదు?’

‘అవును బాయి. కానీ, ఆడు దొంగముండకొడుకు. ఏం పనిజెయ్యలే’ ముఖం వేలవేసి అన్నదామె.

‘ఇగ ఇప్పుడు ఈయనగూడ మీ కులపాయననేగద?’

‘ఈయన శాన మంచోడు. అవును బాయి, సూస్తవ్‌గద. మాకంత పొలాలిప్పిస్తడు.’

‘అంటే, నీవింక ఊరికివొయ్యి వొడ్లు దంచుతవు.’

‘ఔ, బాయి’ ఆమె కళ్లు మెరిశాయి.

అయిదు సంవత్సరాల క్రితం ఆసుపత్రిలో ఉన్నాను. మా మున్నీ పుట్టిన కాన్పు కొరకు. రత్తిబాయి తమ కులపాయనకు ఓటేసేందుకు పోతున్నట్లు చెప్పడం గుర్తుంది. వేలమంది ముందు ఆయన ఎన్నో వాగ్దానాలు చేశాడు. అధికారంలోకి వచ్చిన మరుక్షణం గొప్ప మార్పు చేస్తానన్నాడు. పాలు నదుగా పారుతాయని, బతుకంతా తేనె అవుతుందని అన్నాడు. అయిదేండ్ల తరువాత, ఇవాళ రత్తిబాయి చీర మరింత మురికిగ ఉంది. తల మరింత పండింది. కళ్లలో మెరుపు తగ్గింది. ఈసారి వినిపించిన వాగ్దానాలను ఊతం కర్రగా పట్టుకుని నడుస్తూ, ఆమె మళ్లీ ఓటెయ్యడానికి వచ్చింది.

……..

Akkadi-MeghamFeatured-300x146

‘బాయి, ఆ లంజెముండతోటి అంతగనము ఎందుకు మాట్లాడ్తవ్‌?’ రత్తిబాయి తన సలహాల మూట విప్పుతూ,  బెడ్‌పాన్‌ను నా మంచం కింద నెట్టింది.

‘ఏమి? ఏం సంగతి?’ ఏమీ తెలియనట్టు నేను అడిగాను.

‘చెప్తిగద. అది మంచి ఆడిదిగాదు. పాడు మనిషి. లంజె.’

రత్తిబాయి రావడానికి కొంచెం ముందే, గంగాబాయి సరిగ్గా ఇదే మాటలతో ఈమె గురించి తన అభిప్రాయం చెప్పింది. ‘రత్తిబాయి అస్సలు దొంగది’ అన్నదామె. ఆస్పత్రిలో ఉన్న ఈ పనివాళ్లు ఇద్దరికి ఒకరంటే ఒకరికి పడదు. అప్పుడప్పుడు గుద్దులాట దాకా వస్తారు. నాకు వాళ్లతో మాట్లాడడం సరదాగా ఉండేది.

‘ఆ శంకర్‌గాడు ఉన్నడుగదా, దాని అన్న కానేకాడు. దానికి మిండగాడు! వాని దగ్గర అది పండుతది’ గంగాబాయి చెప్పింది.

రత్తిబాయి మొగుడు దూరంగా ఒక పల్లెలో ఉంటాడు. ఉన్న కొంచెం పొలానికి అంటుకుని ఉంటాడు. పండినదంతా  అప్పు తీర్చడానికే సరిపోతుంది. కొంచెమేదో మిగిలితే, తొందరలోనే తీరుతుంది. అప్పుడు ఆమె పోయి ఆనందంగా పిల్లలతో ఉంటుంది. ఒడ్లు దంచి, ఉనుక వేరు చేస్తుంది. ఆ ఇద్దరు ఆడంగులు, ఆనందమయిన బతుకు గురించి, వడ్లు దంచడం గురించి కలలుగంటారు. మరెవరో పారిస్‌ గురించి కన్నట్టు!

‘కానీ రత్తిబాయి, పైసలు సంపాయించేందుకు నీవు పట్నం ఎందుకు వచ్చినవు? నీవుగాక మీ ఆయన వచ్చి ఉంటే, బాగుండునేమో?’

‘ఓ బాయి! ఆయనెట్లొస్తడు? పొలము పనిజేయాలి గద? ఎగుసము నా నుంచి అయితదా?’

‘మరి మీ పిల్లలను ఎవ్వరు చూస్తరు?’

‘ఒక లంజె ఉన్నది.’ ఆమె తిట్ల దండకం మొదలు పెట్టింది.

‘నీ మొగడు పెండ్లిజేసుకున్నడా ఎట్ల?’

‘దొంగ కొడుకు, గంత దైర్యమున్నాది? ఉంచుకున్నడు.’

‘నీవు లేనిదిజూచి ఇంటిపెత్తనము అది అందుకుంటె?’

‘అదెట్ల? తిత్తిదీసి గడ్డినింపుతా. అప్పుదీరెనా అంటె, నేను మళ్లవోతగద!’

 

రత్తిబాయి తన మొగడు,పిల్లలకు చాకిరిచేసేటందుకు ఆడ మనిషిని తానే ఎంపిక చేసిందని తరువాత అర్థమయింది. పొలం మీద అప్పు తీరితే, ఆమె ఇంటికి  వెళ్లిపోతుంది. ఇల్లాలుగా మారి వడ్లు దంచుతుంది. ఇక మరి ఆ ఉంపుడుగత్తె ఏమవుతుంది? ఆమెకు, పెండ్లాము పట్నం పోయిన మరొక మనిషి దొరుకుతడు. ఆ యింట్లో పిల్లలను సాకే పని దొరుకుతుంది.

‘ఆమెకు మొగడు లేడా?’ అడిగాను.

‘ఉన్నడు.’

‘మరి, ఆయన దగ్గర ఉండదా?’

‘వాని పొలము మందికి పొయ్యింది. వాడు జీతం చేస్తడు. యాడాదిలో ఎనిమిది నెలలు దొంగతనాలు చేస్తడు. పట్నముల తిరుగుతడు. దొంగపనులు చేసుకుంటు బతుకుతడు.’

‘ఆమెకు పిల్లలున్నరా?’

‘ఉండకేమి? నలుగురున్నరు. ఒగడు ఈ పట్నములనె పోగొట్కపోయిండు. దొర్కనే లేదు. ఇద్దరాడి పిల్లలు పారి పోయిన్రు. చిన్న పిలగాడు మాత్రము తండ్రితాన ఉన్నడు.’

‘నీవు ఊరికి ఎన్ని పైసలు పంపుతవు?’

‘మొత్తం నలబై ఒకటి.’

‘మరి నీ సంగతి?’

‘మా యన్న ఉన్నడుగద’ గంగాబాయి చెప్పిన అన్న ఆయనే!

‘మీయన్నకు పెండ్లాం పిల్లలు లేరా?’

‘ఉండకేమి?’

‘ఎక్కడున్నరు? ఊర్లనా?’

‘ఔ. శాన దూరం ఊరు. వాండ్లన్న ఎగుసము జేస్తడు.’

‘ఎవరు? మీ పెద్దన్ననా?’ ఆటపట్టించడానికి అడిగాను.

‘అగజూడు. ఇగ ఉండని. వాడు నాకెట్ల అన్న అవుతడు? ఓ బాయి, నన్నేమి గటువంటి ఆడిది అనుకున్నవా ఎట్ల?  నేను గంగబాయి అసువంటి దాన్నిగాను. తెలుసునా బాయి, నీ తాన ఉన్న పాత శీరలుగట్ల ఆ పాడుముండకు మాత్రం ఇయ్యకు. నాకే ఇయ్యి. సరేనా?’

‘రత్తిబాయి’

‘ఔ బాయి.’

‘మీయన్న నిన్ను కొడ్తడా?’

‘ఆ దుడుక గంగబాయి, అదే చెప్పుంటది. లేదు బాయి, అంతగనం ఏమి కొట్టడు. జర తాగుడు ఎక్కువయితె మాత్రమె. మళ్ల ఎన్కనె మారిపోతడు.’

‘ప్రేమ జూపుతడా?’

‘ఎందుకు జూపడు?’

‘కాని, రత్తిబాయి?, ఆ గాడిదిని అన్న అని ఎందుకంటవు?’

ఆమె నవ్వడం మొదుపెట్టింది. ‘బాయి, మా మాటలే అంత’

‘కానీ రత్తిబాయి? నలభయి ఒక్క రూపాయు వస్తయిగదా? మళ్ల ఈ లంజె తనమెందుకే?’

‘ఇగ మరి ఎట్ల గడవాలె? ఇంటికి పైసలు గావాలె. అది ఇల్లా? ఎలుకలగూడు. మీనికెల్లి దల్లాలుకు అయిదు రూపాయిలియ్యాలె.’

‘ఎందుకంటని?’

‘గాడ ఉన్న ఆడోండ్లు అందరు ఇయ్యాలె. లేకుంటె ఎలగొడ్తడు.’

‘అక్కడ ధంద చేస్తున్నందుకా?’

‘ఔ బాయి.’  ఆమె కొంచెం విస్తు పోయింది.

‘ఇగ మీయన్న. ఆయనేం జేస్తడు?’

‘బాయి, చెప్పగూడదు. ఆడు జేసేడిది లంగదందా. పోలీసోండ్లకు పైసలియ్యకుంటె ఎలగొడ్తరు.’

‘అంటె, పట్నము నుంచా?’

‘ఔ బాయి.’

ఈలోగా గదిలోకి ఒక నర్సు దూసుకువచ్చింది. తిట్లు మొదలుపెట్టింది. ‘ఇక్కడేమి ముచ్చట్లు పెట్టినవు? రూము నంబరు పదిలో బెడ్‌పాన్‌ మార్చాలె. పో’ అన్నది నర్స్‌. ఆమె నా పాపను ఊయల నుంచి ఎత్తుకుని వెళ్లిపోయింది.

………

 

ఆ సాయంత్రం గంగాబాయి డ్యూటీలో ఉంది. కనీసం బెల్‌ కూడ మోగించకుండ నా గదిలోకి వచ్చేసింది.

‘బాయి, బెడ్‌పాన్‌ కొరకు వచ్చిన.’

‘అదేమి గంగబాయి, కూచో.’

‘సిస్టరు తిడతది. దొంగముండ! నీకేంజెప్పింది?’

‘సిస్టరా? నన్ను రెస్టు దీసుకోమన్నది.’

‘కాదు, గా సిస్టరుగాదు. రత్తిబాయి సంగతి.’

‘గంగబాయిని వాండ్లన్న బాగ గొడ్తడని చెప్పింది.’ ఆటపట్టించాను.

‘దొంగముండ, తియ్యి. వానికంత దైర్యమా?’ గంగాబాయి నెమ్మదిగా నా కాళ్లమీద పిడికిళ్లతో కొట్టడం మొదలు పెట్టింది.

‘బాయి, నీ పాత చెప్పులు ఇస్తనంటివి.’

‘సరే. అట్లనెదీస్కో. కానీ నీ మొగనిదగ్గరి నించి ఉత్తరం వచ్చిందా? చెప్పు.’

‘ఔను. గా సిస్టర్‌ లంజె సూసిందంటె, పెద్ద లొల్లి లేప్తది. ప్రతిదాన్కీ లొల్లె’ అంటూనే గంగాబాయి నా చెప్పు మీదికి దాడి చేసింది.

‘గంగాబాయి.’

‘ఔ బాయి.’

‘నీవు మళ్ల ఊరికి ఎప్పుడు ఓతవు?’

నల్లగా మెరిసే గంగ కళ్లు దూరాన ఉన్న పచ్చని పొలాల మీదకు మళ్లాయి. ఒక్కసారి ఊపిరిపీల్చి మెత్తగా మాట్లాడసాగింది. ‘దేవుని దయతోని ఈసారన్నా పంటలు బాగ పండాలె. ఇగ బాయి, నేను ఎల్లిపోత. పోయినసారి ఒడ్లన్ని  వానలల్లనే పాడయిపోయినయి.’

‘గంగబాయి,  నీ మొగనికి నీ దోస్తు సంగతి తెలుసునా?’ తరిచి అడిగాను.

‘ఏమంటున్నవు బాయి?’ ఆమె ఒక్కసారి మూగబోయింది. కొంచెం విస్తుపడినట్టు కనిపించింది. విషయం మార్చాని ప్రయత్నించింది. ‘బాయి, ఇద్దరు ఆడిపిల్లలె పుట్టిరి. సేటుకు కోపమొచ్చుండాలె. ఒచ్చిందే?’

‘సేటెవరు?’ తికమకపడి అడిగాను.

‘నీ మొగడు. కోపమొచ్చి ఇంకొగ పెండ్లి చేస్కుంటె!’

‘చేస్కుంటె, నేనొక మొగణ్ణి ఎతుక్కుంట.’

‘మీరు గూడ అట్లజేస్తరా బాయి. పెద్ద కులపోళ్లయితిరి?’ ఆమె పెద్ద కులాలను ఎద్దేవా చేస్తున్నదని నాకు అర్థమయినట్టే ఉంది. నేను అర్థం చేయించడానికి ప్రయత్నించాను. అయినా సరే, రెండవసారి కూడా ఆడపిల్లను కని నేను తన్నులు తిన్న వలసినంత తప్పు చేశానని, ఆమె గట్టిగ నమ్ముతున్నది. మా సేటు నన్ను చావగొట్టకపోతే, అతను మంచి సేటే కాదు!

…….

 

ఆసుపత్రిలో ఉండడమంటే ఒంటరిగా జైల్లో ఉండడానికి తక్కువేమీకాదు. మిత్రులు, పరిచయస్తులు సాయంత్రం పూట రెండు గంటలపాటు చూడవస్తారు. మిగతా సమయమంతా, నేను గంగాబాయి, రత్తిబాయితో మాట్లాడుతూ గప్పాలు కొడుతూ కాలం గడపాలి. వాళ్లు లేకుంటే, నేను ఎప్పుడో పిచ్చెత్తి చచ్చి ఉండేదాన్ని. కొంచెమేదో లంచం ఇస్తే చాలు, ఒకరి గురించి ఒకరు బోలెడు సంగతులు చెప్తారు. అవి నిజాలా, అబద్ధాలా అన్నది వేరే సంగతి. ఒకనాడు నేను  రత్తిబాయిని ఒక ప్రశ్న అడిగాను. ‘నీవు మిల్లులో పనిజేస్తుంటవి గద. ఎందుకు ఇడిసిపెట్టినవ్‌?’

‘ఓ బాయి, ఆ మిల్లు పెద్ద గడుబడ!’

‘ఏమట్లా?’

‘ఓ బాయి. ఒక్కటేందంటే, పని శాన కష్టం. అయినా మానె. చెయ్యొచ్చు. కానీ, ఆ కొడుకు రొండు నెలలు గాంగనె ఎలగొడ్తడు.’

‘ఎందుకని?’

‘వేరెటోండ్లను పెట్కుంటరు.’

‘ఎందుకట్ల జేస్తరు?’

‘ఎందుకేంది? ఆరు నెలలు నౌకరి జేస్తే, మరి గట్టి చెయ్యాలెగద?’

‘ఓ, అర్తమయింది.’

మరో మాటలో చెప్పాలంటే, అప్పుడప్పుడు మొత్తం సిబ్బందిని మార్చేస్తారు. ఒకే మనిషి ఎక్కువ కాలం పనిలో ఉంటే, సిక్‌ లీవ్‌, మెటర్నిటీ లీవ్‌ అన్నీ చట్టం ప్రకారం ఇవ్వాలి. అందుకే, రెండు నెలలకొకసారి సిబ్బందిని మారుస్తారు.  ఆ పద్ధతిని ఒక మనిషికి ఏటా నాలుగు నెలలు మాత్రమే పని దొరుకుతుంది. ఆ మధ్యకాలంలో ఆడవాళ్లు పల్లెకు వెళిపోతారు. అది కుదరనివాళ్లు మిగతా కార్ఖానా చుట్టూ పని కోసం తిరుగుతారు. లేదంటే, రోడ్డు పక్కన కూరలు అమ్ముతూ బతుకుతారు. అక్కడ తిట్ల పోటీలు, సిగపట్ల పోటీలు ఉంటాయి. లైసెన్స్‌ లేకుండా వ్యాపారం చేస్తున్నందుకు పోలీసువాళ్లకు మామూళ్లు ఇవ్వాలి. ఇచ్చినా సరే, మళ్లీ ఒక కొత్త ఆఫీసరు వస్తే, గోల మొదవుతుంది. మూట సర్దుకుని కొంతమంది పక్క సందులోకి జారుకుంటారు. కొంతమంది పట్టుబడి గొంతు చించుకుని ఏడుస్తారు. పోలీసు వాళ్లను స్టేషన్‌కు లాక్కుపోతారు. చూస్తూండగానే మళ్లీ తిరిగి వస్తారు. చింపు బొంత పరిచి మళ్లీ సంతపెడతారు. తెలివిగలవారు  నాుగు నిమ్మకాయలు లేదా మక్క బుట్టలు మూటగట్టుకుని తాము కొనవచ్చినవాళ్లలాగ, తచ్చాడతారు. పక్కనుండే వారితో గుసగుసగా ‘అన్నా, మక్కబుట్టలు. ఏకానకు ఒకటి.’ అంటూ గుసగుసపోతారు. వాళ్ల దగ్గర వస్తువు కొనడం అంటే కలరాను ఇంటికి తెచ్చుకున్నట్టే లెక్క.

మరీ అన్యాయమయినవాళ్లు బిచ్చమెత్తుతారు. వీలయినచోట చేతివాటం చూపించడానికి కూడా వెనకాడరు. నోట్లో ఉన్న పొగాకును నములుతూ, రైల్వేస్టేషన్‌ పరిసర ప్రాంతాల్లోని చీకటి సందుల్లో తిరుగుతూ ఉంటారు. కస్టమర్‌ నడిచి వస్తాడు. కళ్లచూపుతోనే మాట్లాడుకుని బేరాలు కుదుర్చుకుంటారు. పై ఊరు నుంచి వచ్చిన పాలవాళ్లు, పెళ్లాం  ఊళ్లలో ఇళ్లలో ఉన్న కూలీవాళ్లు, నిరంతర బ్రహ్మచారులు వీళ్లకు కస్టమర్లు. ఆ మురికి గొందులే వాళ్లకు ఇళ్లు.

…….

ఒకనాడు ఉదయాన వరండాలో ఇద్దరు బాయీలు యుద్ధానికి దిగారు. రత్తిబాయి, గంగాబాయి కొప్పును ఒడిసి పట్టుకున్నది. గంగాబాయి, రత్తిబాయి మంగళసూత్రాన్ని తెంపింది. అక్కడితో తనకు వైధవ్యం వచ్చినట్టు, ఆ ఆడమనిషి ఆగకుండ ఏడుపు లంకించుకున్నది. వాళ్ల కొట్లాటకు కారణం వెతికితే, కడుపుతో ఉన్న ఆడవాళ్లు వాడిపడేసిన లేదా గాయాలు తుడిచి పడేసిన కాటన్‌ పాడ్స్‌ దాకా కథ వెళ్లింది. చట్టం ప్రకారం ఆ దూదిని కాల్చేయాలి. కానీ, ఈ బాయీలు ఇద్దరూ, ఆ కాటన్‌ను తీసికెళ్లి శుభ్రం చేసి ఇంటికి ఎత్తుకుపోతున్నారట! ఈ మధ్యన ఇద్దరికీ తగాదాలెక్కువయి సంగతిని  గంగాబాయి సూపర్‌వైజర్‌ చెవిన వేసింది. రత్తిబాయి తిట్లు మొదుపెట్టింది. త్వరలోనే ముష్టియుద్ధం మొదలయింది.  ఇద్దరి ఉద్యోగాలు ఊడవసిందే. కానీ, కాళ్లు గడ్డం పట్టుకున్న తరువాత సూపర్‌వైజర్‌ వ్యవహారాన్ని కప్పి ఉంచాడు.

రత్తిబాయి కాస్త బొద్దుగా ఉంటుంది. కనుక చెయ్యివాటం బాగా చూపగలిగింది. గంగాబాయి ఆ తరువాత బెడ్‌ పాన్‌ మార్చడానికి వచ్చినప్పుడు ముక్కు వాచి కనిపించింది. ‘ఆ దూదితో ఏం చేస్తారు, రత్తిబాయి?’ నేను అడిగాను.

‘కడిగి ఎండబెడితే, మళ్ల పనికొస్తది.’

‘ఎట్ల?’

‘దూది కొనెటోండ్లు ఉంటరు.’

‘గంత మురికి దూదిని ఎవరు గొంటరు?’

‘పరుపు కుట్టెటోండ్లు. సోఫలు బాగజేసేటోండ్లు.’

‘ఓయమ్మో!’ నా వొళ్లు జదరించింది.  ఇంట్లో పేము సోఫాలోని దిండ్లను మళ్లా కుట్టించాలని తీసినప్పుడు వాటిలోని దూది నల్లని నలుపుగా ఉండడం గుర్తుకువచ్చింది. అంటే, ఆసుపత్రుల్లో వాడి పడేసిన దూది అక్కడికి వచ్చిందా ఏమిటి? నా బిడ్డ పడుకున్న పరుపులో దూది ఎక్కడిది? పువ్వులాంటి నా కూతురు క్రిముల మీద పడుకున్నదా? ఈ గంగాబాయి పాడుబడ! రత్తిబాయిని దేవుడు ఎత్తుకుపోను!

ఇద్దరూ చెప్పుతోటి కొట్టుకునే వరకు వచ్చారు గనుక రత్తిబాయి కడుపులో రగిలిపోతున్నది. గంగాబాయి వయసులో చిన్నది. కనుక అది మరింత ఎక్కువ పాపం చేస్తున్నదని రత్తిబాయి అభిప్రాయం. అగ్గిలో నెయ్యిపోసినట్టు, ఆ మనిషి గంగబాయి కస్టమర్లను మరల్చుకున్నది. గంగాబాయికి ఎన్ని అబార్షన్స్‌ జరిగినయో. ఒకసారి బతికి ఉన్న బిడ్డను చెత్త కుప్ప మీద పడేసిందట! నోట్లో ఏవో కుక్కినా, ఆ బిడ్డ కదులుతూనే ఉన్నదట. జనమంతా అక్కడ పోగయ్యారు. రత్తిబాయి తలుచుకుంటే, సంగతి బయటపెట్టి ఉండేదే. కానీ, రహస్యాన్ని ఎదలో దాచుకున్నది. మరిప్పుడేమో ఆ పాపి మనిషి ఏ పాపమూ ఎరగనట్టు దారి పక్కన కూచుని పచ్చి రేగుకాయలు, జామకాయలు అమ్ముతున్నది.

‘దోస్తీ సంగతి సరేగాని రత్తిబాయి, ఏమన్న అయితే ఏంజేస్తరు? దవఖానకు పోవొచ్చుగద?’

‘ఎందుకు పోవాలె? మా బాయిలల్ల డాక్టర్లకంటె తెల్విగలోండ్లు ఉన్నరు.’

‘కడుపు పడేందుకు మందులిస్తరా?’

‘ఔ ఇస్తరు. ఏమనుకున్నవు? ఇగ పిడికిళ్లు ఉండనే ఉండె. మాలిషు మరింత బాగ పనిచేస్తది.’

‘పిడికిళ్లేంది? మాలిషేంది?’

‘బాయి, నీకు దెల్వది.’  రత్తిబాయి ముఖం కొంచెం ఎర్రనయింది. ఆమె నవ్వు మొదలు పెట్టింది. కొంతకాలంగా ఆమె నా పౌడరు డబ్బా మీద కన్ను వేసింది. దాన్ని ముట్టుకున్నప్పుడల్లా, ఒక చిటికెడు తీసి అరచేతిలో వేసుకుని బుగ్గకు రుద్దుకుంటుంది. ఆ డబ్బా ఇస్తే సంగతి మొత్తం తెలుసుకోవచ్చునని నాకు తోచింది. నేను ఇవ్వజూపే సరికి, ఆమె భయపడింది.

‘ఒద్దు బాయి, సిస్టర్‌ జంపుతది.’

‘ఏం గాదు. వాసన నచ్చక నేనే ఇచ్చిననని చెప్త.’

‘అగో, వాసన ఎంత బాగున్నది? ఓ బాయి, తిక్కగాని లేచిందా ఏమి?’

చాలాసేపు పోరాడిన తరువాత ఆమె రుద్దుడు, గుద్దుడు గురించి వర్ణించి వివరం చెప్పింది.

‘రుద్దుడు’ పద్ధతి కడుపు వచ్చిన మొదటి దశలో పనిచేస్తుంది. డాక్టర్‌ పద్ధతిలో అది ఫస్ట్‌ క్లాస్‌ అట! కడుపొచ్చిన మనిషిని పడుకోబెడతారు. పై కప్పులోని దూలం నుంచి కట్టిన ఒక తాడు పట్టుకుని ఆమె కడుపు మీదకు బాయి ఎక్కు తుంది. ‘ఆపరేషన్‌’ ముగిసేదాకా కాళ్లతో రుద్దుతుంది. లేదంటే మరొక పద్ధతి ఉంది. బాయి తన జుట్టును తడి నెత్తిన కొప్పుగా కట్టుకుంటుంది. ఆడమనిషిని గోడకు నిలబెడుతుంది. తన జుట్టుమీద ఆవనూనె పోసుకుంటుంది. దాంతో ఆడమనిషి కాళ్లను కుమ్ముతుంది. కొంతమంది ఆడవాళ్లకు ఈ పద్ధతితో పని జరగదు. అప్పుడు గుద్దుడు మొదవుతుంది.  చేతులను నూనెలో ముంచి కడుపు రుద్ది పనికానిస్తారు.

మొదటి దాకిడితోనే, చాలా సందర్భాలో ఆపరేషన్‌ అంతమవుతుందట! పనిలోకి దిగింది అనుభవంలేని మనిషి అయితే, కాలు చెయ్యి విరిగే అవకాశం ఉందట. అయితే, మాలిష్‌ అనే రుద్దుడు పద్ధతితో ఎక్కువమంది చావరు. కాకుంటే, వాళ్లకు రకరకాల రోగాలు పట్టుకుంటాయి. ఒంట్లో భాగాలు వాపు చూపుతాయి. ఆ తరువాత చచ్చినా చావచ్చు.  గుద్దుడు పద్ధతిని ఎప్పుడో మాత్రం వాడరట! మిగతా పద్ధతులు పనిచేయకుంటేనే వాడతారు. బతికి బయటపడ్డవాళ్లు నడక చేతగాక కష్టపడతారు. నాలుగేళ్లు బతికి ఆ తరువాత పోతారు.

 

నాకు కడుపులో తిప్పి వాంతి వచ్చింది. వివరం వర్ణిస్తున్న రత్తిబాయి భయపడి పారిపోయింది. ఆసుపత్రి ప్రశాంతత నన్ను మరింత కుదిపింది. మరొక జీవాన్ని ఈ ప్రపంచంలోకి తెచ్చినందుకు ఇంతటి భయంకరమయిన శిక్షలా? నేను శూన్యంలోకి కదిలిపోతూ, ఆలోచించాను.

నా వొళ్లంతా భయంతో వణికిపోయింది. రత్తిబాయి జీవం నింపుతూ, చిత్రించిన రంగు బొమ్మలు నా కళ్ల ముందు మెదిలాయి. కిటికీ కర్టెన్‌ నీడలు గోడమీద కదులుతున్నయి. అది త్వరలోనే నాకు రక్తం నిండిన శవంలా కనిపించ సాగింది. గంగాబాయి రుద్దుడు పద్ధతికి గురయిన శవం అది. గోళ్లలో మురికి నిండిన ఒక పిడికిలి నా మెదడులో దిగబడింది.  చిన్ని వేళ్లు, వేలాడుతున్న మెడ రక్తం మడుగులో, జరిగిన పద్ధతికి బహుమతి అన్నట్టు కళ్లముందు కదలాడింది. నా గుండె దిగజారిపోయింది. మెదడు మొద్దుబారింది. గొంతెత్తి ఎవర్నయిన అరిచి పిలవాలని ఉంది. కానీ, నా నోట మాట రావడం లేదు. బెల్‌ మోగించాలి అనుకున్నాను. చెయ్యి కదడంలేదు. నా యెదలో మూగ అరుపులు గజిబిజిగా వినపడుతున్నాయి.

ఆసుపత్రి నిశ్శబ్దంలో ఒక్కసారిగా హత్యకు గురయిన ఎవరో అరిచినట్టు ఉంది. ఆ ఎవరో నా గదిలోనే ఉన్నట్టు ఉంది. కానీ నాకు వినిపించడం లేదు. ఆ అరుపు నా గొంతులోనే వస్తున్నట్టున్నాయి. కానీ వినిపించడం లేదు.

‘ఏమిటమ్మా, కల వచ్చిందా?’ ఇంజక్షన్‌ గుచ్చుతూ నర్స్‌ అడిగింది.

‘సిస్టర్‌, వద్దు. అటుచూడు, గంగాబాయి రుద్దిన శరీరం శవమై శిలువమీద నిలబడి ఉంది. దాని అరుపులు నా గుండెను బల్లాలతో పొడుస్తున్నాయి. ఎక్కడో కాలువలోపడ్డ చిన్న ప్రాణం ఏడుపు నా మెదడు మీద సుత్తెతో బాదుతున్నాయి.  మార్ఫీన్‌ ఇచ్చి నా మెదడును నిద్రపుచ్చకు. రత్తిబాయి పోలింగ్‌ బూతుకు పోతుంది. కొత్తగా ఎన్నికయిన మంత్రి వాళ్ల కులం వాడే. ఆమె అప్పు వడ్డీతో సహా తీరుతుంది. గంగాబాయి ఆనందంగా వొడ్లు దంచుతుంది. నా మెదడుమీద నుంచి ఈ నిద్ర తెరను ఎత్తేసెయ్‌. నన్ను మెలుకువగా ఉండనీ. తెల్లని దుప్పటి మీద గంగాబాయి రక్తం మరకలు వెడల్పు అవుతున్నాయి.  నన్ను మెలుకువగా ఉండనీ’.

…….

బల్ల వెనుక కూచున్న మనిషి నా ఎడమచేతి వేలి మీద ఇంకు చుక్కతో గుర్తు పెడుతూ ఉంటే, నాకు మళ్లీ ప్రపంచం తెలిసింది.

‘నీ ఓటు మా కులపాయనకు ఎయ్యి, అట్లనేనా?’ రత్తిబాయి గట్టిగా చెప్పింది.

రత్తిబాయి కులపాయన బ్యాలెట్‌ పెట్టె ఒక పెద్ద పిడికిలిలా పైకి లేచి మొత్తం బలంతో నా గుండె, మెదడు మీద దాడి చేసింది. నేను నా ఓటు అందులో వేయలేదు.

……………

 

 

అనువాదకుని గురించి –

డాక్టర్ కె. బి. గోపాలం ఉస్మానియా యూనివర్సిటీ నుంచి పి. ఎచ్ డి పట్టం పొందారు. కొంతకాలం ఉపాధ్యాయుడుగా పని చేసిన తరువాత ఆకాశవాణిలో హైదరాబాద్ లో సైన్స్ కార్యక్రమాల అధికారిగా చేరారు.

గోపాలం నిర్వహించిన కార్యక్రమాలకు మంచి గుర్తింపు, బహుమతులు వచ్చాయి.

స్టేషన్ డైరెక్టర్ స్థాయిలో ఉండగా ఉద్యోగం వదిలేసి సంగీత సాహిత్య సేవలో కొనసాగుతున్నారు.

 

వైవిధ్యాన్ని ఇష్టపడే వ్యక్తిగా గోపాలం ఎన్నో రకాల పనులను తలకెత్తుకుని విజయాలు సాధించారు.

 

పుస్తకాలు చదవడం తనకు ఇంచుమించు వ్యసనం అంటారాయన. సమీక్షించడమూ అంతే ఇష్టమంటారు.

ఎన్నో విషయాలను గురించి పత్రికలలో, పుస్తకాలుగానూ రాశారు, రాస్తున్నారు.

ఉత్తమ పాపులర్ సైన్స్ రచయితగా గుర్తింపు, అవార్డులూ అందుకున్నారు.

ఎన్నో అనువాదాలు కూడా చేశారు.

ఇంటర్నెట్ లో వీరి బ్లాగులు చాలా పేరు పొందాయి.

దూరదర్శన్ లో గోపాలం నిర్వహించిన క్విజ్ కార్యక్రమం శాస్త్ర ఎంతో పేరు పొందింది. ఈ కార్యక్రమానికి గాను గోపాలం నంది అవార్డు అందుకున్నారు.

 

కర్ణాటక సంగీత రంగానికి చేసిన సేవలకు గుర్తింపుగా కూడా అవార్డులు అందుకున్నారాయన. సంగీతం సేకరించడం ఆయన పెట్టుకున్న పనులలో ముఖ్యమయినది.

 

సైన్స్ ఇంకా సంగీతం అంటే ప్రాణం పెట్టే రచయిత, పాఠకుడు, పరిశీలకుడు అయిన గోపాలం చేయవలసింది మరెంతో మిగిలి ఉంది అంటుంటారు.