గ్రీన్ గేబుల్స్ ఇంట్లో ఆన్ – 18

 

 

  Anne Of Green Gables By L.M.Montgomery

 మర్నాడు మధ్యాహ్నం ఆన్ వంటింటి కిటికీ పక్కన కూర్చుని బొంత కుట్టుకుంటోంది. డయానా వాగు పక్కని పల్లం లో నిలుచుని రహస్యంగా చెయ్యి ఊపటం కనిపించింది. ఆన్ ఒక్క తృటిలో అక్కడికి చేరింది…ఆశా ఆశ్చర్యమూ  కళ్ళలో గంతులేస్తున్నాయి..అయితే , దిగులుగా ఉన్న డయానా మొహం చూడగానే అవి ఆవిరైపోయాయి.

” మీ అమ్మగారు ఇంకా సర్దుకోలేదా ? ”

డయానా తల అడ్డంగా ఊపింది.

” లేదు…ఇంకెప్పుడూ నీతో మాట్లాడద్దంది. ఎంత ఏడ్చానో – నీదేం తప్పే లేదని , ఏమీ కరగలేదు. ఎంతో బతిమాలితేనే గాని  నీకు ఇలా వీడ్కోలు చెప్పేందుకు ఇక్కడికి రావటానికి ఒప్పుకోలేదు. పదంటే పదే నిమిషాలలో వచ్చేయాలట- గడియారం పక్కన పెట్టుకు కూర్చుంది ”

” పదినిమిషాలు ! ఎప్పటికీ విడిపోబోతుంటే ఏం సరిపోతాయి .. ” ఆన్ గొంతు బొగురు పోయింది – ” నన్ను మర్చిపోవు కదూ డయానా ? నీకు ఇంకా..మంచి స్నేహితులు దొరికాక కూడా ?? ”

” ఎందుకు మర్చిపోతాను..” డయానా ఏడుస్తోంది – ” ఇంకెవరూ నాకు ప్రాణ స్నేహితురాలు అవలేరు…ఎవ్వ- రూ ! ఇంకెవరినీ నిన్ను ప్రేమించినట్లు ప్రేమించనేలేను ”

” ఓ..డయానా ! నీకు నేనంటే అంత ప్రేమా ? ”

” అవును కదా..నీకు తెలీదా ? ”

” ఊహూ. తెలీదు ..నేనంటే ఇష్టం అనుకున్నాను నీకు ..ఇంత ప్రేమ ఉందని నిజంగా  అనుకోలేదు డయానా ! అసలు..అసలు నన్నెవరైనా ప్రేమించగలరనే నేను అనుకోలేదు …చాలు. ఇక అంతా చీకటైపోతున్నా ఈ కాంతికిరణం ఒకటీ జీవితాంతం చాలు ! ఏదీ..మళ్ళీ చెప్పవూ ఆ మాట ? ”

 

” నువ్వంటే నాకు చాలా చాలా ప్రేమ ఆన్ ! ఏనాటికీ..ఏమాత్రం సందేహం అక్కర్లేదు నీకు  ” – డయానా అమిత స్థిరంగా చెప్పింది.

” నాకూ అంతే- మనం ఆఖరిసారి చదువుకున్న కథలో లాగా..నీ స్మృతి నా జీవితాంతమూ  వెలిగే నక్షత్రం నాకు . నీ జుట్టులో ఒక కుచ్చుని కత్తిరించి ఇవ్వవా నాకు..నీ జ్ఞాపకంగా దాచుకుంటాను ”

” నీదగ్గరేమైనా ఉందా , కత్తిరించేందుకు ? ” డయానా కళ్ళు తుడుచుకుంటూ అడిగింది.

” బొంత కుడుతూ వచ్చేశానుగా, ఆ కత్తెర నా జేబులోనే ఉంది ” – ఆన్ దాన్ని బయటికి తీసి డయానా గిరజాలలో ఒక చిన్న దాన్ని జాగ్రత్తగా కత్తిరించి భద్రంగా జేబులో పెట్టుకుంది –  ” ఇక సెలవు నేస్తం ! పక్క పక్క ఇళ్ళలో ఉన్నా ఇక మనం అపరిచితుల్లాగే ఉండాలి కదా.. నా హృదయం మాత్రం ఎప్పుడూ నీదే, నీకే ”

డయానా కనుచూపుమేర దాటిపోయేదాకా ఆన్ అక్కడే నిలబడిఉంది. డయానా వెనక్కి వెనక్కి చూస్తూ, చెయ్యి ఊపుతూ వెళ్ళిపోయింది. అప్పుడిక ఆన్ కూడా  భారంగా అడుగులేసుకుంటూ ఇంటికి బయల్దేరింది-

” అంతా అయిపోయింది మెరిల్లా ” ప్రకటించింది . ” నాకిక ఎవ్వరూ స్నేహితులు దొరకరు. ఇదివరకైతే కాటీ మారిస్, వయొలెట్టా అయినా ఉండేవాళ్ళు – అదే మెరిల్లా, నా ఊహా సఖులు. ఇప్పుడు వాళ్ళు మళ్ళీ వచ్చినా అప్పటిలాగా ఉండదు, నిజంగా ఉన్న అమ్మాయితో స్నేహం చేశాక. మేమిద్దరం వీడ్కోళ్ళు చెప్పుకున్నాం- ఆ మాటలు ఎప్పటికీ నాకు పవిత్రంగా మిగిలిపోతాయి. డయానా జుట్టు కొంచెం కత్తిరించి తెచ్చుకున్నాను- చిన్న గుడ్డసంచీలో వేసి కుట్టుకుని నా మెళ్ళోనే ఉంచుకుంటాను, అస్సలు తీయను. నేను పోయాక నాతోబాటు దాన్ని కూడా సమాధి చెయ్యి మెరిల్లా. నేనిక ఎక్కువ కాలం బతకననే అనిపిస్తోంది. నేను చచ్చిపోయి చల్లగా గడ్డకట్టి ఉన్నప్పుడైనా – నన్ను చూసి మిసెస్ బారీ మనసు కరుగుతుందేమో , డయానాని నా అంత్యక్రియలకి రానిస్తుందేమో ”

” నువ్వనుకునేవేమీ జరగవులే , నాకేం నమ్మకం లేదు ” – బాఢలోంచి వచ్చిన చిరాకు మెరిల్లాకి.

మరసటిరోజు పొద్దున- ఆన్ పుస్తకాలు చేత్తో పుచ్చుకుని బడికి బయల్దేరింది- పట్టుదలగా  మొహం పెట్టుకుని. మెరిల్లా ఆశ్చర్యపోయింది.

” మళ్ళీ బడికి వెళ్తాను ”  ప్రకటించింది – ” నాకిక మిగిలింది అదొక్కటే. డయానాని దూరం నుంచయినా చూసి తృప్తిపడతాను  ”

 

” కాస్త పాఠాల మీద కూడా ధ్యాస పెట్టు ” మెరిల్లా తన సంతోషాన్ని దాచుకుంటూ అంది . ” మనుషుల తలలమీద పలకలు బద్దలు కొట్టే కార్యక్రమాలూ అవీ మళ్ళీ పెట్టుకోవని ఆశిస్తాను.  నోరు మూసుకుని టీచర్ చెప్పినట్లు విను ”

MythiliScaled

” ఆదర్శ విద్యార్థిని గా ఉండేందుకు ప్రయత్నిస్తాను ” ఆన్ నిస్తేజం గా చెప్పింది- ” అలా ఉండటం ఏమంత  బావుంటుందనుకోను. మిన్నీ ఆండ్రూస్ ‘ ఆదర్శ విద్యార్థిని ‘ అని మిస్టర్ ఫిలిప్స్ అంటుంటారు , ఆమెకి పిసరంత ఊహాశక్తి కూడా లేదనిపిస్తుంది. ఎప్పు- డూ నీరసంగానో లేకపోతే ముళ్ళమీద కూర్చున్నట్లో ఉంటుంది.  ఇప్పుడు నేను ‘ క్రుంగిపోయి ‘ ఉన్నాను గనుక అలా ఉండటం నాకూ కుదురుతుందేమోలే. వెళ్ళొస్తాను మెరిల్లా, చుట్టు దారిలోంచి వెళతాను, బర్చ్ దారిలోంచి వెళ్ళను – డయానా లేకుండా ఒక్కదాన్నే అటు వెళితే తట్టుకోలేను ”

ఆన్ ని బళ్ళో పిల్లలందరూ చేతులు చాపి ఆహ్వానించారు.  ఆన్ కొత్త కొత్త ఆటలు కనిపెడుతుండేది , గొంతెత్తి భావస్ఫోరకంగా పాడుతుండేది ,  నాటకీయంగా పద్యాలు చదివేది – వాటన్నిటినీ గుర్తు చేసుకుని ఇన్నాళ్ళూ అందరూ నొచ్చుకునేవాళ్ళు , ఆన్ రావటం మానేశాకే ఆమె విలువ హెచ్చినట్లయింది. ఒక్కొక్కళ్ళూ యథాశక్తి ఆన్ ని సంతోషపెట్టే ప్రయత్నం చేశారు. రూబీ గిల్లిస్ తను తెచ్చుకున్న మూడు ప్లమ్  పళ్ళనీ ఆన్ కి ఇచ్చేసింది. ఎల్లా మెక్ ఫర్సన్ దగ్గర చాలా అందమైన పువ్వుల పుస్తకం ఉంది – అందులోంచి పెద్ద , పసుప్పచ్చటి పాన్సీ పువ్వుని కత్తిరించి ఆన్ కి బహూకరించింది. సొఫీ స్లోన్ కి లేస్ అల్లికలో ఒక సొగసైన పద్ధతి తెలుసు – అది ఇంకెవ్వరికీ రాదు – ఆన్ కి అది నేర్పిస్తానని వాగ్దానం చేసింది. కాటీ బట్లర్ తన దగ్గరున్న  ఖాళీ సెంట్ సీసా లో నీళ్ళు నింపి ని ఆన్ చేతిలో పెట్టింది- వాటిని ‘ పలక కడిగే నీళ్ళు ‘ గా వాడితే ఆన్ పలక పరిమళాలు వెదజల్లింది. జూలియా బెల్ ఒక లేత గులాబి రంగు కాయితాన్ని హృదయాకారం లో  కత్తిరించి దాని అంచు వెంబడి ఈ అక్షరాలు రాసింది – [ రూబీ చేతిరాత చాలా బావుంటుంది ]

” పొద్దువాలుతూన్నప్పుడు ..నింగి తన సిగలో నీలి తారకను తురుముకునేప్పుడు – నీ ఈ ప్రియసఖిని గుర్తు చేసుకుంటావు కదూ –   వెంటనే ఉన్నా, దూరాన ఉన్నా ”

” అందరిలో ఇలా మెప్పు పొందటం బాగుంది నాకు ” – ఆ రాత్రి మెరిల్లాకి ఆన్ ఆనందంగానే చెప్పింది.

ఆన్ తిరిగివచ్చినందుకు సంతోషించింది ఆడపిల్లలొకరే కాదు . మిస్టర్ ఫిలిప్స్ ఆన్ ని ఏమీ అనలేదు , మిన్నీ ఆండ్రూస్ పక్కన కూర్చోబెట్టాడు – భోంచేసేందుకు వెళ్ళొచ్చేసరికి ఆ డెస్క్ మీద పెద్ద ఆపిల్ పండొకటి ఉంది. దాన్ని స్ట్రాబెర్రీ ఆపిల్ అంటుంటారు. ఆన్ కి నోరూరి తీసుకుని కొరకబోతూ ఉండగా- అటువంటి పళ్ళు కేవలం గిల్బర్ట్ బ్లైత్ వాళ్ళ తోటలోనే పండుతాయని గుర్తొచ్చింది. చటుక్కున దాన్ని డెస్క్ మీద పెట్టేసి చేతిగుడ్డతో వేళ్ళు గట్టిగా తుడిచేసుకుంది. మర్నాటి పొద్దునవరకూ ఆ పండు అక్కడే ఉంది… పొద్దునే గదులు ఊడ్చే తిమోతీ ఆండ్రూస్ కి సొంతమయేవరకూ. ఆ రోజు బళ్ళో ఆన్ కి మరొక కానుక పంపబడింది. అది ఎరుపూ పసుపూ రంగు కాయితాలు చుట్టి ఉండే ‘ ప్రత్యేక బలపం ‘ . మామూలు బలపాలు ఒక సెంటు ఖరీదు ఉంటే దీని ఖరీదు రెండు సెంట్లు. పంపినవాడు చార్లీ  స్లోన్. ఆన్ దాన్ని ప్రీతితో అందుకుని చార్లీ కి ఒక చిరునవ్వు కూడా అందజేసింది. పాపం- కుర్రాడు సంతోషం తో తలతిరిగి డిక్టేషన్ మొత్తం తప్పులు రాశాడు – బడి వదిలాకా  ఇంకో గంట  అక్కడే కూర్చుని పదిసార్లు అదే మళ్ళీ మళ్ళీ రాసే శిక్షని మిస్టర్ ఫిలిప్స్ నుంచి స్వీకరించాడు.

డయానా మాత్రం తనవైపయినా చూడకపోవటం ఆన్ ని బాధపెట్టింది.

” కొంచెం నవ్వనైనా నవ్వచ్చు కదా నన్ను చూసి..” మెరిల్లా దగ్గర వాపోయింది.

అయితే ఆ మర్నాడు బడికి వచ్చేసరికి  డెస్క్ మీద బాగా మెలితిప్పి ఉన్న కాయితమూ చిన్న బంగీ – కలిసి ఆన్ కి ప్రత్యక్షమయాయి.

 

అందులో ఇలా ఉంది

” ప్రియమైన ఆన్ ! బళ్ళో కూడా నీదగ్గరికి రాకూడదనీ మాట్లాడకూడదనీ అమ్మ హెచ్చరించింది ..నా తప్పేమీ లేదు, కోపం తెచ్చుకోకు. నీకు కాకపోతే ఎవరికి చెప్పుకోవాలి నా రహస్యాలు ?? నా పక్కన కూర్చునే గెర్టీ పై నాకేమీ నచ్చనేలేదు. నీకోసం ఎర్ర టిష్యూ కాయితం తో ఈ బుక్ మార్క్ తయారు చేశాను.  మన బడి మొత్తం లో ముగ్గురికే ఇలాంటివి చేయటం వచ్చు. తీసుకో- నీ నిజమైన మిత్రురాలిని తలచుకో – ఇట్లు డయానా బారీ ”

ఆన్ ఆ ఉత్తరాన్నీ బుక్ మార్క్ నీ ముద్దుపెట్టుకుని అప్పటికప్పుడు జవాబు రాసి పంపింది .

anne18-2

” ప్రియాతి ప్రియమైన డయానా ! నీ మీద నాకేం కోపం లేదు – మీ అమ్మగారి పట్ల నువ్వు విధేయురాలిగా ఉండాలి కదా ! మన ఆత్మలు మాట్లాడుకుంటూనే ఉంటాయి సుమా ! నీ కానుకను అతి భద్రంగా దాచుకుంటాను. నా పక్కన కూర్చునే మిన్నీ ఆండ్రూస్ మంచిదే..పెద్ద ఊహాశక్తీ అదీ లేకపోయినా..కాని నేను డయానా కి మాత్రమే మిత్రురాలిని, మిన్నీ కి స్నేహితురాలిని ఎన్నటికీ కాలేను.

ప్రాణమున్నంతవరకూ నీదాన్ని

ఆన్/కార్డీలియా షిర్లే.

 

షరా : నీ ఉత్తరాన్ని దిండుకింద పెట్టుకుని పడుకుంటాను ఈ రాత్రి – ఎ లేదా సి.ఎస్. ”

బళ్ళో కొత్త ఉత్పాతాలు జరుగుతాయని మెరిల్లా భయపడింది , నమ్మింది కూడా- కాని అలా ఏమీ జరగలేదు. మిన్నీ ఆండ్రూస్ పక్కన కూర్చోవటం వల్లనో ఏమోగాని – ఆన్ చాలావరకు ఆదర్శ బాలిక గా ప్రవర్తించింది- మిస్టర్ ఫిలిప్స్ తో గొడవలు పెట్టుకోకపోగా అతను మెచ్చుకునేవరకూ వచ్చింది- అంత బాగా చదవటం మొదలుపెట్టింది. గిల్బర్ట్ బ్లైత్  తో ప్రతీ సబ్జెక్ట్ లో పోటీ పడింది. వాళ్ళిద్దరి మధ్యనా స్పర్థ ఉండటం స్పష్టం గా తెలిసిపోయేది. గిల్బర్ట్ వైపునుంచి ఆ స్పర్థలో సుహృద్భావం ఉండేది కాని ఆన్ వైపునుంచి కోపమూ కసీ మాత్రమే కనిపించేవి. అతనితో పోటీ పడుతున్నానని ఎప్పుడూ ఆన్ తన నోటితో అనేది కాదు, ఎవరైనా అన్నా పట్టించుకునేది కాదు – అతనొకడు ఉన్నాడని గుర్తించటమే ఆమెకి ఇష్టం ఉండేది కాదు.  స్పెల్లింగ్ లో గిల్బర్ట్ ని కొట్టేవారు లేరు, ఆన్ అతన్ని పడగొట్టింది. ఒక రోజు అన్ని లెక్కలూ సరిగ్గా చేశాడని గిల్బర్ట్ పేరు బోర్డ్ మీద రాయబడితే ఆ మర్నాడు ఆన్ పేరు అక్కడ దర్శనమివ్వాల్సిందే. ఒక్కోసారి ఇద్దరూ మాన నమై రెండు పేర్లూ బోర్డ్ మీద ఉండేవి – అప్పుడు గిల్బర్ట్ కి తృప్తి, ఆన్ కి మంట. రాత పరీక్షల్లో అయితే , పేపర్ లు ఇచ్చేవరకూ క్లాస్ లో విపరీతమైన ఉత్కంఠ. ఒక నెల పరీక్షల్లో గిల్బర్ట్ మూడు మార్కుల తేడాతో మొదటి వాడుగా వచ్చాడు- తర్వాతి నెల పరీక్షల్లో ఆన్ కి అయిదు మార్కులు ఎక్కువ వచ్చాయి. గిల్బర్ట్ హృదయపూర్వకంగా ఆన్ ని అభినందించాడు – అతను ఓడిపోయానని గింజుకుంటుండి ఉంటే ఆన్ కి సంతోషమయేది – ఇదేమీ రుచించలేదు.

ఆ టర్మ్ పూర్తయేసరికి ఆన్, గిల్బర్ట్ – ఇద్దరినీ పై తరగతికి పంపారు. లాటిన్, జామెట్రీ, ఫ్రెంచ్, ఆల్జీబ్రా వంటి ‘  ప్రధానాంశాలు ‘ వాళ్ళు చదవాల్సి ఉంది. జామెట్రీ తో ఆన్ భీకరంగా పోరాడింది.

” చాలా దరిద్రగొట్టు సబ్జెక్ట్ మెరిల్లా ఇది ” – ఆక్రందించింది . ” నాకసలు దీని తలా తోకా తెలియటం లేదు…ఊహాశక్తికి ఇందులో ఎంతమాత్రం చోటు లేదు. గిల్ – అదే, కొంతమందికి బ్రహ్మాండంగా వచ్చేస్తోంది – అది ఇంకా , చచ్చేంత- బాధగా ఉంది.. డయానాకి కూడా  నా కంటే బాగా వస్తోంది – అయితే డయానా చేతిలో ఓడిపోవటం నాకేం బాధగా ఉండదు – తన మీద నా ప్రేమ ఎప్పటికీ తరిగిపోదు, మాట్లాడుకోక పోయినా సరే. మాట్లాడుకోనందుకు ఒక్కోసారి చాలా దిగులుగా ఉంటోంది గానీ…..”

 

[ ఇంకా ఉంది ]

 

 

 

 

 

మీ మాటలు

  1. ” పదినిమిషాలు ! ఎప్పటికీ విడిపోబోతుంటే ఏం సరిపోతాయి .. ” నిజమే కదా ..’ పోద్దువాలుతున్నప్పుడు ..నింగి తన సిగలో నీలి తారకని తురుముకొనేటప్పుడు నా ప్రియ సఖీ నన్ను గుర్తుచేసుకుంటావు కదూ ! ‘ కధలో వచన కవిత్వమే మెరుస్తోంది మైథిలీ Mam :) very happy for Anne, Tqqq

  2. హమ్మయ్య ఎటువంటి గొడవా లేకుండా ఈ పసిపిల్ల చదువులో పడిందండీ, చాలా బాగా రాశారు, వచ్చే భాగం దాకా ఆగడమే కష్టం :)

మీ మాటలు

*