కొమ్మ చాటు కోకిల ఎమిలీ డికిన్సన్

 

 

    – నాగరాజు రామస్వామి

~

ఏభై ఆరేళ్ల జీవిత కాలంలో 1800 లకు పైగా ఆణిముత్యాల లాంటి  కవితలు రాసి, కేవలం ఏడింటిని మాత్రమే ప్రచురించుకున్న 19 వ శతాబ్ది అమెరికన్ కవయిత్రి ఎమిలీ  డికిన్ సన్. తన యావజ్జీవితాన్ని నాలుగు గోడలకే పరిమితం చేసుకొని, కొమ్మల్లోంచి బయటకు రాని కోకిల ఎమిలీ. ఆమె మరణానంతరం ఆమె సోదరి లవీనియా కలుగజేసుకొని, చిత్తుకాగితాలలో దాగిన కవన స్వరాలను ఆవిష్కరించకుండా ఉంటే, బహుశ, ఆ అభినవ కోకిల గొంతు కొమ్మల్లోనే సద్దుమణగి పోయేదేమో.

ఎమిలీ – ఏమిలీ ఎలిజబెత్ డికిన్సన్ (1830 – 1886 ) – అమెరికా లోని ఆమర్స్ట్ (Amherst ) లోని క్రైస్తవ సాంప్రదాయ కుటుంబంలో జన్మించింది. ఆమర్స్ట్ అకాడమీ లో తెలివైన విద్యార్థినిగా పేరు పోందింది. 17 ఏళ్లకే చదువు చాలించి, తండ్రి కట్టిన ఇల్లు హొమ్ స్టెడ్ లో  శేష జీవితాన్ని ఒంటరిగా గడిపింది. ఒకటి రెండు సార్లు వాషింగ్టన్ డి.సి, ఫిలడల్ఫియా, బోస్టన్ కు మాత్రమే వెళ్లింది. అడపాదడపా కలిసే ఒకరిద్దరు మిత్రులు తప్ప చెప్పుకోదగిన ఆత్మీయులు లేరు. పెళ్లిచేసుకోకుండా ఉండి కన్య గానే మరణించింది. ఎప్పుడో గాని చర్చికి వెళ్లేది కాదు. తెల్లని దుస్తులే ధరించేది. ఎవరితోనూ కలుపుగోలుగా ఉండక ఏకాకిగా బతికేది. కనుకనే ఆమెను మిథ్ (myth) అని అంటుండే వారు. రాసిన కవితలలో సింహభాగం మృత్యువు సంబంధమైనవే అయినందున ఆమెను మార్బిడ్ (Morbid) పోయెట్ అనేవాళ్లు. ఫోటో పంపమని అడిగిన సంపాదకులకు ‘I am small like the wren, and my hair is bold, like chestnut bar – and my eyes like the sherry in the glass, that the guest leaves ‘ అని చెప్పిందే కాని ఫోటో పంప లేదు. ఎక్కడో దొరికిన ఏదో ఒక Daguerreotype ముతక ఫోటోతో వాళ్లు సరిపుచ్చుకోక తప్పలేదు.

మానవ సంబంధాలకూ, ప్రపంచ రీతులకూ దూరంగా ఉన్న ఆ ఒంటరి జీవి అన్ని కవితలు ఎలా రాయగలిగిందో,  ‘ America’s true poetic genius ‘ గా ఎలా ఎదుగ గలిగిందో ఆలోచిస్తే వింతగా ఉంటుంది. ఆమెను అంటిపెట్టుకున్న పలు పుస్తకాలే అందుకు దోహదం చేసి ఉండవచ్చు. ఆమెను ప్రభావితం చేసిన కవులలో పోయెట్ ఎలిజబెత్ బార్రెట్ బ్రౌనింగ్, హాతోర్న్, థోరో, ఎమెర్సన్, లాంగ్ ఫెలో, షేక్స్ పియర్,జాన్ కీట్స్ , జార్జ్ ఇలియట్ ముఖ్యులు.
వర్డ్స్ వర్త్, కోలరిడ్జ్, కీట్స్, బైరన్, షెల్లీ, బ్లేక్  ప్రభృతులతో  ప్రారంభమైన కాల్పనిక సాహిత్యోద్యమ కెరటం ( Romantic Movement ) పలు ప్రపంచ దేశాలను చుట్టి 19 వ శతాబ్దం నాటికి అమెరికా తీరాన్ని తాకింది. రష్యాలో Pushkin, స్పేన్ లో Jose de Espronceda, పోర్చ్ గల్ లో Almeida Garette, ఇటలీ లో Ugo Foscolo, అర్జెన్టీనా లో Esteban Echeverria, బ్రాజిల్ లో Jose de Alenar  వంటి వాళ్లను  ప్రభావితం చేసిన రొమాంటిక్ కవిత్వం అమెరికా లో  విలియమ్  బ్ర్యంట్, వాల్ట్ విట్మన్, ఎమిలీ డికిన్ సన్ లను సృష్టించింది. అమెరికా జాతీయ అధునిక సాహిత్య నుడికార  సృష్టి కర్తలుగా పరిగణించ బడుతున్న ఇద్దరి లో ఒకరు వాల్ట్ విట్మన్, మరొకరు కవయిత్రి  ఎమిలీ డికిన్ సన్. విట్మన్ ది బైబల్ సంబంధిత దీర్ఘ పంక్తుల కవిత్వ మైతే, డికిన్ సన్ ది ప్రొటెస్టంట్ భావ సాంద్ర మైన లఘు వాక్యాల కవిత్వం. విట్మన్ లో విస్పష్ట భావోద్వేగం పొంగి పొరలుతే, డికిన్ సన్ లో వికల భావ అస్పష్టత దోబూచులాడుతుంది. అమెరికా లో పరిఢవిల్లుతున్న నేటి ఆంగ్ల కవితా అధునిక చైతన్య ధారకు వీళ్లిద్దరు మూలభూతులు అనడంలో సందేహం లేదు.

ఆమె ఎన్నోమరపు రాని ప్రణయ కవితలను, వెంటాడే మత సంబంధిత గీతాలను, ‘Master Letters’ అని కొనియాడబడిన  ఉత్తరాలు రాసింది. డికిన్ సన్ జీవితం ఎంత చిత్రమైందో, ఆమె కవిత్వం అంత అసాధారణ మైంది. భాషను కొత్త పుంతలు తొక్కించే స్వేచ్ఛాధోరిణి. వ్యాకరణ సూత్రాలను లెక్కచేయని స్వైర  ప్రయోగాత్మకత. ఆమెది ఒకవిధంగా  capre diem poetry – శక్తివంతమైన వర్తమాన క్షణాలను పొదవి పట్టుకొని ‘Seize the day’, ‘ Live-in-the-moment’, ‘Dwell in the possibility’ అంటూనే లౌకిక సీమలను అధిగమించే ఆత్మ భావన. ‘Bring me the sunset into my cup’ – అన్న ఆమె కవితా పంక్తులు అధునికత గత శతాబ్దంలోనే కవిత్వ భూములలో అడుగిడిందనటానికి ఆనవాలు. ఆమె వాక్య నిర్మాణం నవీనం. వ్యాకరణం ఆమోదించని విరామ చిహ్నాలను, డాష్ లను ఇచ్ఛానుసారం వాడుతుంటుంది అనడానికి నా ఈ యథాతథ అనువాదాలు :
             నేను నివసించేది సంభవంలో —
వచనం కన్నా అందమైనది —
దానికి కిటికీలు అనేకం —
ద్వారాలు ఉత్కృష్టం —
గట్టి కర్ర తో కట్టినవి —
కనుచూపుకు గహనమైనవి —
శాశ్వతమైన పైకప్పు కోసం
ఆకాశపు వసారాలు వాల్చబడ్డవి —
సందర్శకులు — సజ్జనులు —
వాళ్లు ఉండేందుకు — ఇది–
స్వర్గాన్ని పోగుచేసుకునేందుకు
చాచిన నా బాహువులు —

ఆమె కవితలకు శీర్షిక లుండవు. రూపం ( Form ) లోనూ, ఉత్ప్రేక్షల వినియోగం లోనూ ఆమెది అసాంప్రదాయ కవిస్వేచ్ఛ ( Poetic license ) :
             మేధ — ఆకాశం కన్నా విశాలం —
పక్క పక్కన పెడితే —
దాంట్లో రెండోది అవలీలగా ఇముడుతుంది —
మరి నీకూ ఉంటుంది పక్కన చోటు —
మెదడు సముద్రం కన్నా లోతైంది —
నీలిమనూ నీలిమనూ —
పట్టుకొని చూడు —
అది రెండో దాన్ని ఇట్టే పీల్చేసుకుంటుంది–
స్పాంజ్ — బకెట్ లా–
మస్తిష్కం బరువు దేవుని అంత —
తూచి చూడు– పౌండు కు పౌండు —
భేదం అంటూ ఉంటే–
అది ఉచ్ఛారణకూ శబ్దానికి ఉన్నంత —

కవితకు సరిపడదేమో అన్నట్టుంటుండే ఆమె ఉన్న ఫళంగా వాడిన ఆరంభ వాక్యం ఊహకు పొసగదు. Humming Bird ను ఉద్దేశించిన కవిత తొలి పంక్తి  ‘మాయ మయ్యే మార్గం’ – ‘A route of Evanescence’. కాని, ఆ కిటుకు తెలిసాక, పాఠకుకునికి సంభ్రమాశ్చర్యం తప్పదు :
  చిటికెలో మాయమయ్యే మార్గంలో
గిర్రున తిరిగే చక్రం —
పచ్చలను అనునదించే కంపనం —
ఆరుద్ర అరుణిమల శీఘ్ర గమనం —
ఆ రంగుల ఉరవడికి
వాల్చిన తలను సవరించు కుంటుంది
పూలపొద మీది ప్రతి పుష్పం
ఆది
దూరదేశం నుండి దూసుకొచ్చిన జాబేమో,
కన్వేగు వేళ హాయిగొలిపే  కాలి నడకేమో —         

ఒక్కో చోట వ్యాకరణ విరుద్ధంగా  capital letter వాడుతుంది. ఇక్కడ పువ్వు – Flower ( F in upper case) ! పైగా ఆ పువ్వు సంతోషం గా ఉన్న పువ్వు !
           ఆటకోలు మంచు
యాదృశ్ఛికంగా
తన తలను ఖండించినా
సంతోషంగా ఉన్న ఏ పువ్వూ
ఆశ్చర్య పడినట్టు లేదు —
ఆ అందాల హంతకి
అలవోకగా కదలి పోతుంటుంది —
చలించని సూర్యుని దినచర్య
యథావిధి కొనసాగుతుంటుంది —
ఆమోదించే దేవుని కోసం .

వాక్యాల వింత విరుపులతో, భావావరణాల కుదింపులతో కూడిన అందమైన అస్పష్టత :
           ఘోర విషాదం పిదప
మామూలై పోయిన స్తబ్ద యాంత్రికత —
నరాలు ఆచార్య పీఠం వేసుకొని కూర్చుంటవి — సమాధుల్లా,
బిగుసుకు పోయిన హృదయం ప్రశ్నిస్తుంటుంది
అతడేనా భరించింది ?
మరి ఇది నిన్నమొన్ననాటిదా  లేక శతాబ్దాలకు ముందుదా?’ అని–
కలప బాట మీదో, గాలిమీదో, దేనిమీదో
కాళ్లు యాంత్రికంగా కదలాడుతుంటవి —
లోన ఏదీ పట్టని బండబారిన నిర్లక్ష్య స్ఫటిక  నిశ్చలత —
సీసంలా ఘనీభవించిన సమయం —
చలి బారికి బతికి బయట పడి గడ్డ కట్టినా
మంచునే స్మరించే మనుషులు —
మొదట చలి, పిదప దిగ్భ్రాంతి,
ఆపిదప వదలివేత — అనాసక్త స్వేచ్ఛ —

చిత్రమైన భ్రాంతి మెలకువల సందిగ్ధ భావ చిత్రం . మన ఊహకే వదిలివేయబడిన అర్ధాంతర ముగింపు :
         నా తలలో ఒక శవయాత్ర కదలిక ,
నా మెదడులో  ఒక అంతిమ క్రియాకాండ —
సంతాపకులు అదేపనిగా అటూ ఇటూ తిరుగుతూ,
నా ఆలోచనను ఆసాంతం అణగదొక్కుతూ —
సందడి.
ఆ తతంగం అంతా ఒక భరించరాని ఢంకా మ్రోతలా ఉన్నది
ఎడతెగని ఆ కఠోర ధ్వనికి నా తల దిమ్మెక్కేట్టున్నది.
వాళ్లు ఆ శవపేటికను ఎత్తేటప్పుడు
కీచు శబ్దమేదో నా గుండెల్లోంచి దూసుకు పోతున్నది,
వాళ్ల ఇనుప బూట్ల తొక్కిడికి లోని నేల కూలు తున్నది.
స్వర్గసీమలన్నీ కలసి  ఒక పెద్ద ఘంటగా మారినట్టు,
నా అస్తిత్వం అంతా వెరసి అది వినేందుకే ఉందన్నట్టు,
నేనూ నా నిశ్శబ్దం ఏదో వింత ఒరిపిడికి విరిగి ఒరిగినట్టు ,
ఇక్కడ నేను ఒంటరినై మిగిలి పోయినట్టు —  ఉన్నది.
నా కాలికింది కలప పగిలి నేను పడిపోతున్నాను —
కిందకు – మరింత కిందకు —
ఒక్కో పతనంలో ఒక్కో ప్రపంచపు తాకిడి,
ఒక్కో తాకిడితో ఒక్కో శిథిలమైన ఎరుక మరపు —
– – –
మరి ఆవెనుక – – – –

ఆమె ఒక విధంగా మత విశ్వాసాల కవయిత్రే. వ్యక్తిగత జూడీ-క్రిస్టియన్ నమ్మకాలకూ శుద్ధ భగవత్ తత్వ భావానికీ మధ్య నున్న లంకె కోసం ఆన్వేషించింది. ‘ Hope is the thing with feathers ”అనే కవితలో అమూర్త అంశాలకూ భౌతిక విషయాలకూ మధ్య నున్న సమగ్రతను పట్టుకోవడం కోసం పరితపించింది. ఆమె కవితా ప్రక్రియ ఎంత జటిలమైందో, ఆమె మత పరమైన భావధార కూడా అంత క్లిష్టమైంది. స్వీయాత్మ చింతనా నేపథ్యంలో, దేవున్ని కరుణ హీనునిగా చిత్రించింది.చర్చికి వెళ్లడం మానేసింది. ‘ Tell the Truth, but, tell it slant ‘లో పరోక్షంగా దూషించినా,’ My Life has stood — A loading gun ‘వంటి  కవితలలో నేరుగా దేవున్ని క్రూరునిగా దుయ్యబట్టింది. అయితే, ఆమెను నాస్తికురాలని అనలేము. ఆమెకు తనదైన స్వయంకపోలకల్పిత  దైవీయ భావన ఆమెకుంది – A home-spun theology of her own.
డికిన్సన్ ను విశిష్ట కవయిత్రిగా నిలిపింది మాత్రం ఆమె అసాంప్రదాయ అధునిక శైలీ శిల్పాలనే చెప్పాలి. భావ గాఢతను మించిన శైలీ విన్యాసం. Style is the poetry అన్నంతగా రచనలు చేసింది. పదాల పోహళింపును  (Syntax) తలకిందులు చేసి, అసంబద్ధ పదబంధాలను, విరోధాభాస (Paradox) పదాలను పక్క పక్కన పేర్చి    ( Parataxis technic  ), కామాలటో, డాష్ లతో, ఊహించని పునరుక్తులతో, అసదృశ Word Play తో తనదైన విశిష్ట వైయక్తిక శైలిని ( Ideosyncracy ) సంతరింప  జేసుకుంది కనుకనే అమెరికన్ అంగ్ల అధునిక సాహితీ వైతాళిక కవయిత్రిగా ఆమెకు స్థానం స్థిరపడింది. అయితే, ఆమె లోని ఈ వినూత్న విశిష్ట వైకృతులకు అనితర సాధ్యమైన అభివ్యక్తీకరణ సత్తా  ఉన్నందువల్లనే ఆమె నూత్న ప్రక్రియ అంతగా రాణించింది. డికిన్సన్ చూపిన అధునిక సృజన వైఖరి వల్ల అమెరికన్ ఆంగ్ల సాహిత్యం కొత్త మలుపులు తిరిగింది. ఆమె నవ్య ధోరిణికి ప్రభావితమైన వర్ధమాన కవితాలోకం నవనవంగా వర్ధిల్లింది. ‘డికిన్స్ ప్రభావిత కవిత’ పేర ప్రతి సంవత్సరం Poetry Society of America బహుమతి ప్రధానం చేస్తున్నది. అది ఆమెకు అమెరికా ఇస్తున్న సృజన నివాళి.

ఈ పుడమి కవిత్వం ఆగదు: జాన్ కీట్స్

 నాగరాజు రామస్వామి

          ప్రకృతి  పౌరాణికతకూ (మిథ్ కు), మిత్  కవిత్వానికీ జన్మనిస్తుందని విశ్వసించిన మహాశయుడు 18వ శతాబ్ది ఆంగ్లేయ కవి జాన్ కీట్స్. 18 -19 వ శతాబ్దాల మధ్య కాలంలో వర్ధిల్లిన అలనాటి కాల్పనికవాద (రొమాంటిక్) కవిత్వపు ఆధునిక కవులలో కీట్స్ ఆఖరి వాడు. సాహిత్య పునరుజ్జీవన (Renaissance) రొమాంటిక్ ఉద్యమంలో వరుసలో ఆఖరివాడే కాని, వాసిలో ఆఖరివాడు కాదు కీట్స్. సాంప్రదాయ కవితా రీతులను మరువ కుండానే, నవ్య సాంప్రదాయ పథాలను విడువ కుండానే  క్రమానుగత పరిణతతో అలనాటి ఆంగ్ల కవితాకాశంలో కాల్పనిక కవిత్వ కాంతులు నించి అర్ధాంతరంగా రాలిన నవ నక్షత్రం కీట్స్!  అతను మొగ్గల్లో చొరబడిన సౌకుమార్యమై, మబ్బులలో తేలే ప్రణయ సౌందర్యమై, ప్రవహించిన కొండ వాగై, ప్రకృతి గంధమై, సృజన పక్షమై కొత్త గాలులలో రెక్కవిప్పిన  నవకవన హృదయం! జన్మరాహిత్య సాఫల్య స్వప్నౌన్నత్య స్తరాలకు భావయానం చేసిన ఆత్మిక చైతన్య చింతనాత్మక కవితాత్మ ! “A great poetic genius”! “The Human Friend Philosopher”!
          జననం :  31 అక్టోబర్ 1795 ( లండన్ )
          మరణం : 23 ఫిబ్రవరి 1821 ( రోమ్ )
       కీట్స్ 25 వ ఏటనే ఈ ‘సత్యసౌందర్యాల’ పృథివిని విడిచి పెట్టి ఆతని ఊహలలోని ఊర్ఠ్వ లోకాలకు నిష్క్రమించాడు . అనుకూల పవనాలు ఎన్నడూ వీయలేదు అతని జీవితంలో. 9వ ఏట తండ్రి, 10 వ ఏట తాత, 15వ ఏట తల్లి స్వర్గస్థులయ్యారు. అనివార్య కారణాల వల్ల వారససత్వంగా రావలసిన డబ్బు చేతికందలేదు. ఇష్టంలేని వైద్య వృత్తిని  ఎన్నుకోవలసి వచ్చింది. అతనికి సంక్రమించిన క్షయ వ్యాధి కారణంగా కోరుకున్న యువతి ఫానీ భార్య కాలేక పోయింది. ఆనాడు రాజ్యమేలుతున్న కవుల కుపిత రాజకీయ కూటాలు(‘ugly clubs’) అతని కవిత్వాన్నికలసికట్టుగా అడ్డుకున్నాయి. ముఖ్యంగా  ‘బ్లాక్ వుడ్స్ ” పత్రిక పనిగట్టుకొని కీట్స్ ను, కీట్స్ కవిత్వాన్ని నిర్దాక్షిణ్యంగా ఖండించింది. ప్రసిద్ధ గ్రీకు పౌరాణిక గాధ ‘ఎండీమియన్’ కు కీట్స్ రాసిన నాలుగువేల కవితా వాక్యాల బృహత్ కావ్యాన్ని ఒక మారుమూల మాండలిక పేలవ రచనగా (Cockney school poetry) పేర్కొంది! అలనాటి ఛాందస వృద్ధ కవి కూటమి కూడా “Imperturbable driveling ideocy of Endymion” అంటూ నిరసించింది. “I can’t exist without poetry, the eternal poetry!” అని జీవితాంతం తలపోస్తూ వస్తున్న కీట్స్  కవితావైభవ ప్రతిభ ఆతని మరణానంతరం గాని వెలుగులోకి రాలేదు! తన సమాధి మీద చెక్కమని చెప్పిన  స్మృతివాక్యం (Epitaph) -“Here lies One Whose Name was writ in Water”-అందుకు సాక్షం!
          కీట్స్ ప్రతిభను గుర్తించిన తొలి సాహితీ బంధువు లీహంట్. అతను షెల్లీ, విలియమ్ గాడ్విన్, బాసిల్, హాజ్లిట్, లాంబ్ వంటి కవులకు కీట్స్ ను పరిచయం చేశాడు. కీట్స్ తొలి కవిత “O Solitude”ను తన పత్రిక ‘Examiner’ లో ప్రచురించి ప్రోత్సహించాడు. ఆ  రోజులలో లండన్ లోని  లీహంట్ గృహం కవుల కలివిడి స్థలం; కీట్స్ సాహితీ ఆశ్రయం. అక్కడే కవులు షెల్లీ, వర్డ్స్ వర్త్, లార్డ్ బైరాన్, చిత్రకారుడు జోసెఫ్ సీవేర్న్ వంటి పలు వర్ధమాన కవులూ కళాకారులూ కీట్స్ కు పరిచయమయ్యారు. వాళ్ళ ప్రోత్సాహం తోనే మరో బృహత్తర గ్రీకు పౌరాణిక గ్రంధం ‘హైపీరియన్’ వెలువడి కత్తికోతల విమర్శలకు గురైంది. తాను ఎదుర్కొన్న విమర్శల రాపిడిలో అతను రాటు దేరాడు. షెల్లీ, బైరన్ వంటి కవిమిత్రుల సహవాసంలో అతడు లోతైన సాహిత్య అధ్యయనం చేయ సాగాడు. సిసలైన కవిత్వ స్వరూపం గూర్చిన ప్రయోగాలు, తన కిష్టమైన సానెట్ కు కొత్త రంగులు అద్దే ప్రయత్నాలు ముమ్మరం చేసాడు. అక్కడే ఫానీ బ్రోవే అతనికి చేరువయింది. అతని కవిత్వం లో అనురాగ అంతర్ధార అయింది.
       imageకీట్స్ ప్రేమ జీవనమూ విఫల మైనదే. కీట్స్ ఆరాధ్య ప్రేయసి ఫానీ విడిపోక తప్పని పరిస్థితులలో  పన్నెండేళ్ళు వేచిఉన్నా ఫలితం దక్కలేదు. క్షయ వ్యాధి వాళ్ల పాలిటి శాపమయింది! క్షయ వ్యాధితో క్షీణిస్తున్న కీట్స్ ను చికిత్సకై రోమ్ కు తీసుకువెళ్ళిన మిత్రుడు సీవర్న్ చేతులలో కీట్స్ అంతిమశ్వాస వదిలాడు. సేవేర్న్ తన మిత్రులకు, కీట్స్ ప్రేయసి (ఫియాన్సీ) ఫానీ బ్రోవే కు రాసిన ఉత్తరాలే కీట్స్ ఆఖరి రోజులను తెలిపే ఆధారాలు. షెల్లీ, సేవేర్న్, కీట్స్ సమాధులు రోమ్ లోని  Protestant Cemetary లో ఇప్పటికీ ఉన్నవి పక్క పక్కనే.
      ‘ మిత్ ‘ను మించిన మానవ నిజజీవన అనుభవ సారం అతని కవిత్వం. ప్రకృతి సౌందర్యం, ప్రణయ మాధుర్యం కలసి పారిన పాట అతని రమణీయ అభివ్యక్తి ! పూర్వ ఆంగ్ల కవి శేఖరులు వెలుగుతున్న కీర్తి శిఖరాలలో తానూ శాశ్వతంగా నిలిచి పోవాలన్న ఆతని అనంత తృష్ణ అతన్ని నిరంతరం తొందరించింది. కేవలం ఆఖరు రెండేళ్లలోనే ఆతని అంతరాంతరాలలో మాగిన అనంత పరణిత కవిత సృజన సౌందర్యమై ఆవిష్కరించబడింది!
        బౌద్ధిక పరిమితులను, సాంఘిక అవరోధాలను అధిగమించగల అతిలోక సామర్థ్యం మనిషికి సహజ సిద్ధంగా లోన ఉంటుందని, అది జ్ఞాన సృజనల ద్వారా బహిర్గతం కావడం సాధ్యమని కీట్స్ ప్రసిద్ధ స్వీయ సిద్ధాంతం (Doctrine of Negative Capability). ఎదుటి వారి సంశయానిశ్చయతలను, దృక్కోణాలను, సానుభూతితో అంగీకరించడం నెగటివ్ కాపబిలిటి కలిగిన సృజనాత్మక భావ హృదయానికే సాధ్యమని అతని నమ్మకం.
సౌందర్యమే సత్యమనీ, సత్యమే సౌందర్య మనీ , అంతిమంగా ఈలోకంలో తెలుసుకో వలసిందీ, తెలుసుకో గలిగిందీ ఇంతేననీ అతని దృఢ విశ్వాసం.
అతని కవితా వస్తువును పదచిత్రాలతో, భావ ప్రతీకలతో, శ్రావ్యశబ్ద మాధుర్యంతో అందగించాడు. అతని కవితా దృష్టి ప్రత్యేకం. వికసించే ముందు నేల తాలూకు సహజ ప్రకృతిని పూవు ఆస్వాదించక తప్పదంటాడు. మసక బారిన సాగరం మధ్య అలరారుతున్న ద్వీప ఖండాలు తీరం మీద భావ చిత్రాలు అల్లుతున్న కవి హృదయవాంఛా ప్రతీకలే అంటాడు. ‘చెట్టు ఎంత  సహజం గా చిగురిస్తుందో అంత సహజంగా రావాలి కవిత్వం ; అలా కాని పక్షంలో అది రాకున్నా పరవాలేదు’ అని అతని అభిప్రాయం. ‘సంద్ర సాగరతీరాల’ సందిగ్ధత (Sea-Shore dichotomy) అతని కవిత్వం నిండా పరచుకున్నది. పరిమిత వాస్తవికత అపరిమిత ఊహాత్మకమై ఎల్లలు దాటింది! ‘ ప్రణయం-విషాదం’, ‘అందం-అల్పజీవనం’, ‘సుఖం-దుఃఖం’, ‘జీవనం-మరణం’, – ఇలా పరస్పర విరుధ్ధమైన జీవిత ద్వంద్వాలు జంటగా ప్రతి ఆనందం అట్టడుగున ఉండి తీరుతాయని విశ్వసించాడు. భావి ఆశకూ వర్తమాన వాస్తవికతకూ కవితా వారధి అయ్యాడు కీట్స్. భౌమ్యాతీత అమర్త్య భవ్య శిఖరాలకులకు చేరవేసే భావ పక్షాలను ఆన్వేషించాడు. బైరన్, టెన్నిసన్ చేరిన ఔన్నత్యాలను మించిన అనంతత్వాలకు ఎగరాలని ఆరాట పడ్డాడు.
         సౌందర్యదర్శన సందర్భంలో జారిన నైతికతకూ, తాత్విక విచార ధారతో ముడివడిన నైతికతకూ మధ్య నున్న సూక్ష్మ సంబంధాన్ని నిశితంగా పరిశీలించేవాడు. వైయక్తిక పరిపూర్ణత, ఆత్మనిర్మాణ నైతికత, దైవీయతేజ అస్తిత్వ అనుసంధానత కై అహరహం తపించేవాడు. స్వయంగా కవి అయిన కీట్స్ కు కవితా సౌందర్యం కన్నా తాత్విక సత్యమే మిన్న!
fannysm

ఫానీ

          కీట్స్ 19వ ఏట రాసిన మొట్ట మొదటి కవిత “An Imitation of Spencer”. తొలి ప్రచురిత కవిత “O Solitude”. ఆఖరు కవిత “The Bright Star”.  అతడు రాసిన ఉత్తరాలు అతని కవిత లంత ప్రసిద్ధం.కీట్స్ రాసిన ముఖ్యమైన ఓడ్స్: Ode to Nightingale, To Autumn, Ode to Grecian Urn, Ode to melancholy, Odeto Apollo, Ode to Psyche.
ఓడ్స్ మాత్రేమే కాదు అతడు సానెట్లు, లఘు కవితలు, దీర్ఘ కవితలు, గ్రీకు మిత్ ఆధారిత బృహత్ కావ్యాలూ రాశాడు. ఒక్కొక్కటీ ఒక్క ఆణిముత్యం. మచ్చుకు కొన్ని (నేను అనువదించిన) కవితా పంక్తులు :
        చిట్టి అడవుల హరిత పత్ర ఛత్రాలు , / మధుశీథువు చిలకరించే కస్తురి రోజాలు
        మన అవిశ్రాంత మనసుకు ఆటవిడుపులు.
        నిరంతర అమృత ధార వంపుతున్నది / స్వర్గం మన మీద.  -(A Thing of Beauty).
        తాకు తున్నవి ఋతుశీల స్పర్శలై / తమసు పులుముకున్న పొదల మృదుల తావులు,
        మధు శీధువు నిండిన వనకస్తురి రోజా పరిమళాలు, /  రెల్లు గరికల, రేగు పళ్ళ, రేతిరి పూల
        సుగంధాలు.    -Ode to Nightingale
        మలిసంజలో వికసిస్తున్నవి మేఘ మాలికలు / పశ్చిమాకాశం లో పూస్తున్నవి గులాబీలు
        ఏటి గట్టున చిమ్మటల చిరు బృందగానం! / కొండ కొమ్మున గొర్రెపోతుల కోలాహలం !
        గుబురు పొదలలో గొల్లభామల గీతం! / ఈల వేస్తున్నది పాటకోకిలం
        అవును, నీకూ ఉన్నది నీ హేమంత గీతం .  – Ode to Autumn .
        ఓ వైణవికా! ఆపకు నీ పిల్లనగ్రోవి పాటను, / సుస్వరాలకు అందని నీ నిశ్శబ్ద ఆత్మ గీతాలను;
        వినిపించే శ్రవణ సంగీతం కన్నా శ్రావ్యం / వినిపించని నీ నిశ్చల హృదయ రాగం!
                                                                  -Ode to Grecian Urn.
        ఈ పుడమి కవిత్వం ఆగదు ; / శీతల హేమంతాల ఒంటరి సాయంత్రాలు
        మంచు పూల మౌనాన్ని చెక్కుతున్న వేళ / గొంతు విప్పుతుంటుంది పొదరిండ్ల మాటున
        గొల్లభామ కీచు స్వరాల వెచ్చని గీతిక. -To the Grasshopper and the cricket .
        వచ్చేయి నాతో నే నధిరోహించే ప్రకృతి శిఖరాలకు / పూల వాలులోయల పర్వత సానువులకు
        స్పటిక స్వచ్ఛ నదీ జల తరంగాల చేరువకు / చెంగలించే లేడి పరుగులకు చెదరుతున్న
        తేనీగల తిరిగే పుప్పొడి దొన్నెల పూల తావులకు /  భ్రమరాల పొదరిండ్ల రహః స్థావరాలకు .
                                                                     –  ( To solitude )
        ఇటలీ లోని మంచు మైదానాలలో కరుగుతున్న / ఆర్నో నది స్వప్నసౌందర్యంలా
        ఎప్పటికీ ఆమె / నా చిర స్మృతుల తేజోచక్రమే!   – (Fill for  Me a Brimming Bowl)
        ఈ మనోహర వనస్థలిలోనే కదా కవనావేశంతో కవి / భౌమ్యాతీత ప్రకృతి కృతులను గానం
        చేసింది! ఆ అదృశ్య లోకాలనుండి  నక్షత్రాకృతులను తెంపి తెచ్చుకొని /
        పూల పొదల ఆత్మగీతాల దృశ్యమాలిక లల్లింది! – I stood tip-toe upon a little hill.
        నా ఎడద ప్రణయ పక్షాలను తొడుక్కున్నప్పుడు/ దివ్య మైనది
        నా పంచ రంగుల పరవశభావం!
        అనంత సాగర కెరటాల మీద ఎద రెక్కవిప్పినప్పుడు
        కలసి ఎగసే అద్వైత హృదయం నా భావావేశం!   –  Lines To Fanny .
        అతడు వర్డ్స్ వర్త్ వంటి ప్రకృతి కవి! ప్రణయ రాగాల గీతకోకిలం! ఆంగ్లేయ కవితాకాశంలో ఆచంద్రార్కం వెలిగే అసదృశ జ్వలిత నక్షత్రం కీట్స్!
        కీట్స్ అంతటి గొప్ప కవి పాతిక సంవత్సరాలకే మృత్యువాత పడడం దురదృష్టకరం! ఆశించిన ఖ్యాతి  జీవితకాలంలో రాక నైరాశ్యంలో కీట్స్ క్రుంగి పోవడం, ఇంత  గొప్ప ఖ్యాతి మరణానంతరం వస్తుందని అతనికి తెలిసిరాకపోవడం బాధాకరం!
                                                                           *.

మరో తీరంలో….

Scan 2

రెండు భూఖండాలను
రెండు భుజాలమీద మోస్తున్న సముద్రం
ఉచ్ఛ్వాస  నిశ్వాసలైన ఖండాంతర పవనం

ఒక చేతిలో సూర్యుడు ఒక చేతిలో చంద్రుడు
బంతాట ఆడుతున్న ఆకాశం

కదలటమొక్కటే తనకు తెలిసిన విద్య అన్నట్టు
నిద్ర నటిస్తున్న కాలప్రవాహం

గంటలను సాగదీస్తున్న గడియారం
పడమటి గాలిలో పడిలేస్తున్న పండుటాకు
మలిసంజ వలస జీవన శ్వాస –

ఒక అనల నిస్వసనం , ఒక అనిలోత్సాహం
అలల మీద తేలుతున్న ముసలి ఓడ
పడమటి నింగిలో మబ్బు పడవ

వలస తుఫాన్లలో తలమునకలౌతున్న నావ
ఇరు తటాలను ఒరుసుకుంటూ కళాసి పాట
సాగర మథనంలో సతమతమౌతున్న నాగరాజు
పవనపుత్రుని రెక్కల మీద రామయతండ్రి

ఒక కన్ను కడుపు తీపి , ఒక నయనం నాస్టాల్జియా
చూపు తీగను లాగుతున్న ఎదురు తీరాలు
కలువల కొలనులో పడ్డ గులక రాయి

అక్షరాలలో మునిగిన దుబాసి ప్రవాసి అదృష్టజీవి !

 (Sidebar painting: Mandira Bhaduri)