గ్రీన్ గేబుల్స్ ఇంట్లో ఆన్ -13

 

       [ Anne Of Green Gables By L.M.Montgoemry ]

                                   [ గత సంచిక తరువాయి ]

  ఆగస్ట్ నెల మధ్యాహ్నం. బంతిపువ్వు రంగు ఎండలో పరిసరాలన్నీ జోగుతున్నాయి. బయటికి ఒకసారీ గడియారం వైపు ఒకసారీ చూసి మెరిల్లా అనుకుంది – ” ఆన్ ఈ పాటికి వచ్చేసి కుట్టు పని మొదలెట్టుకోవద్దూ ? డయానా తో ఆడుకుంటూ అసలే అరగంట ఆలస్యం గా వచ్చింది..సరాసరి లోపలికి రాకుండా ఆ కట్టెల మోపుల  మీద కూర్చుని మాథ్యూ తో కబుర్లు మొదలెట్టింది ! ఏముంటాయో అన్నేసి మాటలు..గంటలు గంటలు దొర్లిపోతూ…ఆ మాథ్యూ అంతకన్నా –  అది ఏం చెప్పినా చెవులు దోరబెట్టుకు వింటుంటాడు. దాని కబుర్లు ఎంత పిచ్చిగా ఉంటే అంత సంతోషపడిపోతాడేమిటో…

‘’   ఏయ్ ఆన్ షిర్లే !! వినిపిస్తోందా ? రా ఇక్కడికి ” – పడమటి కిటికీ మీద టపటపా కొట్టింది. ఆన్ వచ్చింది…ఉత్సాహానికి కందిపోయిన బుగ్గలేసుకుని, తళతళ మనే కళ్ళతో  గంతులేసుకుంటూ  – జడలు ఊడిపోయిన జుట్టు ఆమె వెనకాల ఎగురుకుంటూ లోపలికి  వచ్చింది.

” ఓ మెరిల్లా…తెలుసా…వచ్చే ఆదివారమటా, పిక్ నిక్ అట…!!!! ప్రకాశమాన సరోవరం పక్క..నే – మిస్టర్ హార్మన్ ఆండ్రూస్ పొలం లేదూ..అక్కడంట. మిసెస్ బెల్ల్ , మిసెస్ రాచెల్ కలిసి ఐస్ క్రీ మ్   తయారు చేసి తెస్తారట …ఐస్ క్రీ మ్ …!!!!! నేను వెళ్ళొద్దా ?? ”

మెరిల్లా ఏం తొణకలేదు – ” ఒకసారి గడియారం చూడు తల్లీ, ఎంతైందీ ? నేను ఎన్నింటికి రమ్మన్నాను నిన్ను ? ఆ.. ? ”

” రెండింటికి. పిక్ నిక్ ఉండటం ఎంత…బావుందో కదా …ఎప్పట్నుంచో కలలు కంటున్నాను దాని    గురించి….మం..చిదానివి కదూ మెరిల్లా..పంపించవా నన్ను ? ”

” సరిగ్గా రెండు గంటలకి రమ్మన్నాను నిన్ను- ఇప్పుడు రెండూ ముప్పావు అయింది ..నా మాటెందుకు వినలేదో చెప్పు ముందు ”

” వద్దామనే అనుకున్నాను మెరిల్లా , డయానా వాళ్ళ తోటలో కొత్త పువ్వులు పూశాయి గదా అని  చూస్తుంటే ఆలస్యమైపోయింది.  తర్వాతేమో మాథ్యూ కి పిక్ నిక్ గురించి చెప్పాను ఇప్పటిదాకా …నేను వెళ్ళద్దా చెప్పు , దయచేసి…”

” నీ ఉబలాటాలు కొంచెం తగ్గించుకుంటే సంతోషిస్తాను ..రెండు గంటలూ అంటే రెండు గంటలే అని అర్థం , అరగంట తర్వాత అని కాదు. పిక్ నిక్ – ఆ , వెళ్ళచ్చులే, ఆదివారం బడికి ప్రతివారమూ వెళతావుగా , దీనికి వెళ్ళకపోతే బావుండదు ”

MythiliScaled

” అది కాదు మెరిల్లా.. డయానా చెప్పిందీ , ప్రతి వాళ్ళూ ఒక్కొక్క బుట్టతో తినుబండారాలు తీసుకెళ్ళాలట – నాకు వంట చేయటం రాదుగా మరి… బుట్ట చేతులు లేకుండా బడికైనా వెళ్ళచ్చుగానీ తినేవేమీ  లేకుండా పిక్ నిక్ కి వెళితే ఏమీ బావుండదేమో కదా , ఇందాకట్నుంచీ ఇదే ఆలోచిస్తూ ఉన్నాను ”

” అంత కంగారేం పడక్కర్లేదులే. బిస్కెట్ లూ  కేక్ లూ బేక్ చేసి ఇస్తాను –  బుట్టనిండుగా పట్టుకుపోదువుగాని ”

” మెరిల్లా..మెరిల్లా…ఎంత మంచిదానివి ! ఎంత గొప్పదానివి !! నన్నెంత బాగా చూస్తున్నావు !!!!! ”  చుట్టూ చేతులు వేసి బుగ్గ మీద ముద్దు పెట్టుకుంది ఆన్.  మెరిల్లా ని చిన్న పిల్లెవరైనా ముద్దు పెట్టుకోవటం ఆమె జీవితం లో అదే మొదటిసారి – ఆనందం పొంగుకువస్తున్నా పైకి తేలకుండా బింకం గా –

” ఆ..చాలు చాలు…పిచ్చి హడావిడి చెయ్యకు. చెప్పింది చెప్పినట్లు చేస్తే అంతే చాలు .  నీకు వంట నేర్పుదామనే నా ప్రయత్నం ..ఏదీ , నీ బుద్ధికి కుదురు ఉంటే కదా ? పొయ్యి మీద ఏదో పెట్టినప్పుడే నీకు ఎక్కడెక్కడి ఊహలూ ఆలోచనలూనాయె…సరేలే, ఆ బొంత కుట్టే పని వదిలేసి పోయావుగా ఇందాక, పూర్తి చేసెయ్యి ఇప్పుడు ”

” ఇలా  అతుకులు పెట్టి కుట్టటం నాకేం నచ్చలేదు ” – ఆన్ నసపెట్టుకుంటూ పనిమొదలెట్టింది. ” కొన్ని రకాల కుట్టుపనులు  బాగానే ఉంటాయి గాని  ఇందులో ఊహించుకుందుకు ఏ..మీ ఉండదు..ఒక గుడ్డ ముక్క ని ఇంకొకదానికి అతికించి కుట్లు వేయటం తప్ప ! అయినా పర్వాలేదులే , ఇంకెక్కడో ఉండి రోజంతా ఆడుకోవటం కంటే గ్రీన్ గేబుల్స్ లో ఉండి బొంత కుట్టటమే నయం. అయినా..డయానా తో ఆడుకునేప్పుడు కాలం ఎంత గబ గబా  గడిచిపోతుందో ..ఇప్పుడసలు కదలదేం ??? అక్కడ ఎంత బాగా గడిచిందో తెలుసా మెరిల్లా ? ఊహించటం నాకు బాగా వచ్చు, అదే చేస్తూ ఉంటాను – తక్కినవన్నీ డయానా బ్రహ్మాండంగా చేసేస్తుంది.మన చోటుకీ డయానా వాళ్ళదానికీ మధ్యలో , వాగు పక్కన చిన్ని , సన్నటి చోటుంది చూడు , మిస్టర్ విలియం బెల్ వాళ్ళది – అక్కడొక మూల బర్చ్ చెట్లు గుండ్రం…గా పెరిగాయి. మేమిద్దరం అక్కడ బొమ్మరిల్లు కట్టాం… దానిపేరు ‘ తీరిక గూడు ‘ ..బావుందా ? నేనే పెట్టాలే అది…రాత్రంతా మేలు కుని..సరిగ్గా నిద్రపోబోయే ముందర తట్టింది .   నువ్వొకసారి వచ్చి చూడు మెరిల్లా.. పెద్ద పెద్ద రాళ్ళున్నాయి, వాటి మీద మెత్త..గా నాచు కూడా ఉంది, అవి మా కుర్చీలు. చెట్టునుంచీ చెట్టుకి అడ్డంగా కొమ్మలున్నాయి , వాటి మీద మా గిన్నెలూ అవీ పెట్టుకుంటామన్నమాట. అన్నీ కొంచెం పగిలిపోయిన గిన్నెలే ననుకో, బాగున్నట్లు ఊహించుకోవటం ఏం కష్టం చెప్పు ? ఒక పింగాణీ పళ్ళెం మీదయితే తెలుపూ ఎరుపూ తీగలు …ఎంతో అందంగా ఉంది అది. ఇంకో గాజు గిన్నె కూడా ఉంది మాకు  ..అది అచ్చం గంధర్వులది లాగా ఉంటుంది…కలల్లో మటుకే కనిపించేలాగా.   దాని మీద చిట్టి చిట్టి ఇంద్రధనుస్సులు…అంటే పిల్లవి అన్నమాట, ఇంకా పెద్దవి అవలేదు. వాళ్ళింట్లో వేలాడే గాజు దీపం ఉండేదట –  దాన్లోంచి ఊడిపడిందని డయానా వాళ్ళ అమ్మ చెప్పారు… కాని ఎవరో గంధర్వకన్యలు వెన్నెట్లో నాట్యం చేసుకుంటూ మర్చిపోయారనుకుంటున్నాం మేము ..ఇలాగే బావుంది కదా ?

anne13-2

అక్కడ వేసుకుందుకు మాథ్యూ మాకొక చిన్న బల్ల తయారుచేసి ఇస్తానన్నాడు. అక్కడొక కొలనుంది కదా, దానికి విల్లోమియర్ అని పేరు పెట్టాను. డయానా నాకొక పుస్తకం ఇచ్చిందిలే, అందులో దొరికింది ఆ పేరు. భలే పుస్తకం అది మెరిల్లా, అందులో అమ్మాయిని ఏకంగా అయిదుగురు ప్రేమిస్తారు..నాకైతే ఒక్కళ్ళు చాలనుకో…మరి నీకు ? ఆ అమ్మాయి గొ..ప్ప సౌందర్య రాశి అట,  ఊరూరికే మూర్ఛ పోతూ కూడా ఉంటుంది. నేనిప్పటి వరకూ ఒక్కసారి కూడా  మూర్ఛ పోలేదు , పోగలితే ఎంచక్కానో ఉంటుంది ..కదా మెరిల్లా ? నేను సన్నగా ఉన్నా చాలా ఆరోగ్యం గా ఉన్నాను ..అందుకని మూర్ఛపోననుకుంటా. అయినా నేను లావవుతున్నట్లున్నాను ఈ మధ్య..కదా ? పొద్దుటే లేవగానే నా మోచేతులు బొద్దుగా అయి సొట్టలు పడుతున్నాయేమోనని చూసుకుంటుంటాను. డయానా , మోచేతుల దాకా చేతులున్న గౌన్ లు కుట్టించుకుంటోందట, ఒకటి ఆదివారం పిక్ నిక్ కి వేసుకొస్తుందట…పిక్ నిక్ బుధవారమే అయితే బావుండేది… ఒకవేళ ఏమైనా జరిగి ,  నేను వెళ్ళలేకపోతే నా ఆశాభంగాన్ని భరించలేను మెరిల్లా ! ఆ తర్వాత జీవించి ఉంటానేమో గాని నాకు అది ఆజన్మ శోకం అవుతుంది…ఆ తర్వాత ఇంకో వంద పిక్ నిక్ లకి వెళ్ళినా సరే , ఆ బాధ తగ్గదు ! పిక్ నిక్ లో ప్రకాశమాన సరోవరం లో పడవల మీద వెళతామట..చెప్పారు..ఐస్ క్రీమ్  తింటూ అట. నేనింతవరకూ తినలేదు..డయానా అది ఎలా ఉంటుందో వివరించబోయింది , కాని ఊహ కి కూడా అందని సంగతుల్లో ఐస్ క్రీమ్   ఒకటి అనిపించింది… ‘’

anne13-3

ఎట్టకేలకి , అప్పటికి ఆన్ ఉపన్యాసం ముగిశాక –  మెరిల్లా అంది – ” ఆపకుండా పదినిమిషాలు మాట్లాడావు , లెక్కపెట్టాను నేను. అంతే సేపు నోరు మూసుకుని ఉండగలవా..చూద్దాం ? ”

” ఎదురుచూస్తూ ఉండటమే సగం సంతోషం కదా మెరిల్లా…ఆ తర్వాత అనుకున్నట్లు జరగకపోయినా కూడా, అనుకుంటూ ఉండటం ఎంత సరదాగా ఉంటుందో ! మిసెస్ రాచెల్ అన్నారు  – ‘ ఏమియును ఆశించనివారు ధన్యులు , వారు ఆశాభంగమును పొందరు ‘ .  కానీ  , ఏమీ ఆశించకుండా ఉండటం కంటే ఆశాభంగాన్ని పొందటం చాలా చాలా నయమనిపిస్తుంది ”

 

అమెథిస్ట్ జాతి రాళ్ళు  తాపడం చేసిన పిన్ ఒకటి మెరిల్లా దగ్గర ఉంది. ప్రతి ఆదివారమూ చర్చ్ కి వెళ్ళేప్పుడు మెరిల్లా దాన్ని తన గౌన్ కి పెట్టుకుంటుంది. దాన్ని మర్చిపోయి వెళ్ళటం బైబిల్ ని మర్చిపోయి వెళ్ళటం లాగా ఉంటుంది ఆమెకి. నౌకల్లో పనిచేస్తూ ఉండే బాబాయి ఒకరు మెరిల్లాకి దాన్ని బహూకరించారట. పాతకాలపుదిగా, పూల గుత్తి  ఆకారం లో  ఉంటుంది –  మధ్యని పెద్ద అమెథిస్ట్ కింద మెరిల్లా వాళ్ళ అమ్మ జుట్టుని కొంచెం అమర్చారు [ పాశ్చాత్యులలో గతించిన ఆప్తుల జ్ఞాపకం గా అలా ఉంచుకుంటారు ] , చుట్టూ చిన్న చిన్న రాళ్ళు మిలమిలమంటూ ఉంటాయి. మెరిల్లా కి వాటి విలువా నాణ్యమూ పెద్దగా తెలియవుగానీ తన మట్టి రంగు గౌన్ మీద వాటి ఊదా రంగు మెరుపు అందంగా ఉందనుకుంటుంది.

దాన్ని ఆన్ మొట్టమొదట చూసినప్పుడు సంతోషం తో తలమునకలైంది.

” ఎంత అద్భుతంగా ఉంది మెరిల్లా ! ఇలాంటిది పెట్టుకుని ఉంటే చర్చ్ లో ప్రార్థనలమీద ధ్యాస ఉంటుందో లేదో నాకైతే తెలీదుగాని..గొప్పగా ఉంది ఇది. వజ్రాలు ఇలా ఉంటాయేమో అనుకుంటుండేదాన్ని. చాలా రోజుల కిందట  వజ్రాలు  చూశాను. చూడకముందంతా ఊహించునేదాన్ని ఎలా ఉంటాయోనని –  ఇలా గాఢమైన ఊదా రంగులో మెరిసిపోతాయనుకునేదాన్ని … చివరికి ఒకావిడ ఉంగరం లో ఉన్నాయంటే దగ్గరికి వెళ్ళి చూశాను…ఆశాభంగం తో ఏడుపు వచ్చింది నాకు. చాలా అందంగానే ఉన్నాయనుకో , కాని  – ‘ అలా ‘  ఉంటాయని అనుకోలేదు . ఒక్కసారి చేత్తో పట్టుకు చూడద్దా  మెరిల్లా ? పుణ్యం చేసుకున్న  వయొలెట్ పువ్వుల ఆత్మలే అమెథిస్ట్ లు అవుతాయేమో , కదా ? ”

 

                                                                      [ ఇంకా ఉంది ]

 

మీ మాటలు

  1. “ఇంకో గాజు గిన్నె కూడా ఉంది మాకు ..అది అచ్చం గంధర్వులది లాగా ఉంటుంది…కలల్లో మటుకే కనిపించేలాగా. దాని మీద చిట్టి చిట్టి ఇంద్రధనుస్సులు…అంటే పిల్లవి అన్నమాట, ఇంకా పెద్దవి అవలేదు. వాళ్ళింట్లో వేలాడే గాజు దీపం ఉండేదట – దాన్లోంచి ఊడిపడిందని డయానా వాళ్ళ అమ్మ చెప్పారు… కాని ఎవరో గంధర్వకన్యలు వెన్నెట్లో నాట్యం చేసుకుంటూ మర్చిపోయారనుకుంటున్నాం మేము ..”

    “పుణ్యం చేసుకున్న వయొలెట్ పువ్వుల ఆత్మలే అమెథిస్ట్ లు అవుతాయేమో , కదా ? ”

    చాలా బావున్నాయి కథకు తగిన కథనం, దానికి తగిన కవితాత్మక అనువాదం! అభినందనలు మైథిలి గారూ!

    • Mythili Abbaraju says:

      ధన్యవాదాలండీ..అసలు ఆన్ కి అలాంటి ఆలోచనలు ఎలా వస్తుంటాయో…:)

  2. ఉమారవి నీలారంభం says:

    అదేమిటో శివరామక్రిష్ణకి నచ్చిన లైన్లే నాకూ నచ్చాయి. పుణ్యంచేసుకున్న వయొలెట్ పూలనీ చూపించారు. వాటి ఆత్మల్నీ చూపించారు. ఆ అమెథిస్ట్ కాంతుల్ని కలబోసుకుంటే గాజువెన్నెల కెరటాలవుతాయి కాబోలు! అద్భుతమయిన ఊహాలోకం! అత్యద్భుతమయిన అనువాదపటిమ! మనసుల్ని కట్టిపడేయడం కాదు. విహారాలు చేయిస్తున్నారు. ఆ పిక్నిక్కి ఎప్పుడు వెళ్తామో ఏమిటో!

    • Mythili Abbaraju says:

      ధన్యవాదాలు ఉమాదేవి గారూ …నాకు కూడా ఆ వాక్యాలే నచ్చాయి ఒరిజినల్ లో ..

      వచ్చేవారం వెళ్ళిపోదాం పిక్ నిక్ కి ..:)

  3. ఉత్సాహానికి కందిపోయిన బుగ్గలేసుకుని, తళతళ మనే కళ్ళతో గంతులేసుకుంటూ .. :) “ఎదురుచూస్తూ ఉండటమే సగం సంతోషం కదా మెరిల్లా…ఆ తర్వాత అనుకున్నట్లు జరగకపోయినా కూడా, అనుకుంటూ ఉండటం ఎంత సరదాగా ఉంటుందో !” … ఈ వారం సంభాషణలు రాబోయే ఉత్సవాన్ని ఆన్ తో కలిసి ఊహించుకున్నంత సంబరంగా వుంది Mam :) !!

    • Mythili Abbaraju says:

      థాంక్ యూ రేఖా……కనిపిస్తోంది కదా కళ్ళకి ?

  4. నాకూ పైన చెప్పిన వాక్యాలు భలే నచ్చాయండి.

మీ మాటలు

*